1. శ్రీరామకృష్ణుల సేవలో గృహస్థ భక్తుల పాత్ర
పైన పేర్కొన్న రీతిలో శ్రీరామకృష్ణుల చికిత్సకూ, పథ్యపానాదులకూ, అహర్నిశల సేవకూ తగిన ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తులు నిశ్చింతులు కాలేకపోయారు. ఎందుకంటే, కలకత్తాలోని పేరుమోసిన వైద్యులు శ్రీరామకృష్ణుల గొంతువ్యాధి నయంకాదని ఘంటాపథంగా చెప్పకపోయినా, ఆ వ్యాధి చికిత్స ఎంతో కష్టమనీ, ఆయనకు ఆ వ్యాధి నుండి ఉపశమనం కలగడానికి సుదీర్ఘకాలం పడుతుందనీ తెలిపారు. అందువల్ల ఆయన పూర్తిగా కోలుకొనే వరకూ సేవ శుశ్రూషాదులకు అవసరమయ్యే ఖర్చును ఏ రకంగా భరించాలో భక్తులు తర్జనభర్జన పడసాగారు. అది సహజమే కదా! బలరాం, సురేంద్ర, రాంచంద్ర, గిరీష్‌చంద్ర, మహేంద్రనాథ్, తదితర గృహస్థ భక్తులు, తమ కుటుంబాలను పోషించుకొంటూ, గురుదేవుల చికిత్స తదితరాదులకయ్యే ఖర్చులను ఏ ఒక్కరూ పూర్తిగా తామే భరించ గల స్థోమత ఉన్నవారు కారు. అయినా గురుదేవుల పవిత్ర సాన్నిధ్యం కారణంగా తమ హృదయాలలో శాంత్యానందాలు నిండిపోగా భక్తి ప్రేరితులై భవిష్యత్తు గురించి మరో ఆలోచన చేయకుండా సేవాకార్యంలో నిమగ్నులైపోయారు. కాని వారి హృదయాలలో పొంగిపొరలే ప్రవాహానికి ఆటుపోటులు లేకుండా పోలేదు. భవిష్యత్తు గురించిన ఆలోచన మనస్సులో మెదలీమెదలగానే వారి శాంత్యానందాలు ఠక్కున సమసిపోవడం కద్దు. నిజానికి ఆ ప్రవాహం సదా సమానంగా ప్రవహించడం లేదు కూడా. అయినా అటువంటి సమయాలలో గురుదేవుల అద్భుత ఆధ్యాత్మిక అభివ్యక్తీకరణను వారు చవిచూడడంతో ఆ ఆందోళన ఆసాంతం అదృశ్యమై మళ్ళీ వారి హృదయాలు శక్త్యుత్సాహాలతో నిండిపోయేవి.
ఏదో అనిర్వచనీయమైన పరమానందం, మేధకు అందని ఒక ఉన్నతోన్నత భూమికి వారిని గొనిపోయేది. అక్కడి దివ్యప్రకాశంలో వారికిది ద్యోతకమైంది: ఎవరిని తమ జీవిత పరమ లక్ష్యంగా స్వీకరించారో, ఆయన కేవలం మానవ మాత్రుడే కాక ఆధ్యాత్మిక జగత్తు యావత్తుకీ ఆశ్రయ స్వరూపుడూ, సంసార సాగరంలో మునిగిపోతున్న జీవుల పరమగతీ, మానవదేహధారి అయిన సాక్షాత్తు నారాయణుడని తేటతెల్లమైంది. అట్టి గురుదేవుల జన్మ, చేతలు, తపశ్చర్యలు, ఆహారవిహారాదులు, అంతెందుకు శారీరక రుగ్మతతో బాధననుభవించడం – ఇవన్నీ మానవాళి హితం కోసమే, వారి ఉద్ధరణ నిమిత్తమేనని వారికి స్పష్టమైంది. లేకుంటే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోషాదులకు అతీతుడైన ఆ సత్యసంకల్పునికి, ఆ పరమపురుషునికి శారీరక రుగ్మత వాటిల్లడం ఏమిటి? సేవించడానికి తమ భక్తులకు ఒక చక్కని అవకాశం ఇవ్వడం నిమిత్తమే ప్రస్తుతం వ్యాధిగ్రస్థునిగా ఉండడం, దక్షిణేశ్వరం దాకా వెళ్ళి ఆయనను దర్శించుకొని వచ్చే ఆస్కారమూ, తీరికా లేని జనుల హృదయాలలో ఆధ్యాత్మిక జ్యోతిని రగిలింప ఆయన ఇప్పుడు వారి మధ్యనే నివసించడంగా వారికి గోచరించింది. పాశ్చాత్య విద్యాప్రభావంతో జడవాదులైన మనుషులలో, ఏ విజ్ఞానశాస్త్రాన్ని ఆధారం చేసుకొని తాము సర్వజ్ఞులమనీ, తమకే భయం లేదనీ భావిస్తూ, లౌకిక భోగాలను ఈడేర్చుకోవడం ఒక్కటే జీవిత పరమోద్దేశమనుకొంటూవున్న అజ్ఞానులలో భగవత్సాక్షాత్కారమనే దివ్యజ్యోతిని రగిలించి దాని ప్రకాశంలో తమ పూర్వ భావాలు ఎంత నిమ్నమైనవో గ్రహించేలా చేసి, వారి జీవితాలను త్యాగపథంలో నడిపించడం కోసమే శ్రీరామకృష్ణులు ఇప్పుడు రుగ్మతతో ఉన్నారని ద్యోతకమయింది.
అటువంటప్పుడు ధనం కొరత గురించి వారు సంశయించడం ఎందుకు? ఎవరు తమకు సేవించే అవకాశాన్ని కల్పించారో వారే ఆ కొరతను తీర్చగల శక్తిని తమకు ప్రసాదిస్తారని భక్తులు దృఢంగా విశ్వసించసాగారు.
2. గృహస్థ భక్తుల పరిత్యాగం
పై వ్యాఖ్యానాలు మా భావోద్వేగ జనితాలని పాఠకులు భావించరాదు. కేవలం సత్యసమన్వితాలుగా గ్రహించగలరని భావిస్తున్నాం. శ్రీరామకృష్ణుల దివ్యసాన్నిధ్యంలో భక్తులు పరస్పరం చర్చించుకొన్న పై విషయాలు స్వయంగా మేం విన్నవే. ధనం కొరత కారణంగా గురుదేవుల సేవలో లోటు జరుగుతుందేమోనని భక్తులు ఎన్నోసార్లు ఆందోళన చెంది, పరస్పరం సంప్రదించుకోవడమూ, ప్రతిసారీ పైన పేర్కొన్నట్లు తమ హృదయాలలో అద్భుత భావప్రేరణను పొంది, ఊరడిల్లడం కళ్ళారా మేం చూసి ఉన్నాం. ఒక భక్తుడు ఒకసారి “శ్రీరామకృష్ణులు తమ ఏర్పాట్లను తామే చూసుకోగలరు. ఒకవేళ చూసుకోలేకపోయినా మిన్ను విరిగి మీద పడదులే! ఒక ఇటుకపై మరొక ఇటుక పేర్చబడి ఉన్నంత వరకూ (తన స్వగృహాన్ని చూపుతూ) ఎటువంటి ఆందోళనా చెందనక్కర్లేదు. నా ఇంటిని తనఖాపెట్టి ఆయన సేవలకయ్యే ఖర్చును భరిస్తాను” అని అన్నాడు. మరొక భక్తుడు “నా పిల్లల వివాహాలకూ లేదా వారు జబ్బుపడినప్పుడూ నేనెలా ఆ ఖర్చును భరించగలిగానో అట్లే గురుదేవుల సేవకయ్యే ఖర్చును నేను చూసుకొంటాను. నా భార్య ఒంటిమీద నగానట్రా ఉన్నంత వరకూ అందు గురించి ఆందోళన చెందపనిలేదు” అని చెప్పాడు. మరొక వ్యక్తి నోరు తెరచి ఏదీ వ్యక్తం చేయకపోయినా తన కుటుంబ ఖర్చులను బాగా తగ్గించివేసి, తద్ద్వారా పొదుపు చేసిన సొమ్మును గురుదేవుల సేవకై వినియోగించసాగాడు. ఆ భావస్ఫూర్తితోనే సురేంద్ర ఇంటి అద్దెను తానొక్కడే భరించాడు. బలరాం, రాంచంద్ర, మహేంద్రనాథ్, గిరీష్‌లు కలిసి గురుదేవులను, ఆయనను సేవించే వారి అవసరాలను చూసుకోసాగారు.
3. గురుదేవుల వ్యాధి భక్తులను ఒక సంఘంగా పెనవేయడం
భక్తులు తమ హృదయాలలో చవిచూస్తూన్న దివ్యానందానికి ఆలంబన శ్రీరామకృష్ణులు. అదే ఆలంబన ఇప్పుడు వారిని ఎంతో సన్నిహితులుగా చేర్చి, ప్రేమ అనే త్రాటితో బంధించివేసింది. శ్రీరామకృష్ణుల భక్త సంఘమనే వృక్ష బీజం దక్షిణేశ్వరంలోనే నాటబడినప్పటికీ, అది శ్యాంపుకూర్ కాశీపూర్ ఉద్యానాలలో మొలకెత్తి, శ్రీరామకృష్ణులు వ్యాధి గ్రస్థులవడం ఇలా జరగడం నిమిత్తమే అని పలువురు భక్తులు నమ్మేటంత సత్వరం ఆ మహావృక్షం విస్తృతించింది.
4. శ్రీరామకృష్ణులను గురించి భక్తుల మూడు భావనలు
శ్రీరామకృష్ణులు వ్యాధిగ్రస్థులు కావడానికి కారణం, అట్లే మళ్ళీ ఎప్పుడు ఆయన స్వస్థులు కాగలరో అనే విషయాల గురించి ఇదివరలో భక్తులకున్న ఇతమిత్థం కాని ఆలోచనలు, ఊహలు రోజులు గడిచే కొద్దీ స్థిరమైన రూపు దిద్దుకోసాగాయి. అవి వారిని కొన్ని కోవలుగా విభజించాయి. గురుదేవుల జీవితంలో గతంలో జరిగిన అద్భుత సంఘటనలే భక్తుల ఆ అభిప్రాయాలకూ, ఊహలకూ మూలకారణమనే విషయం సుస్పష్టం. ఒక కోవకు చెందిన భక్తులు, యుగావతారులైన శ్రీరామకృష్ణుల శారీరక రుగ్మత నిజమైన వ్యాధి కాదనీ, అది ఒక కల్పన అనీ అనుకోవడమే కాక, అదే విషయాన్ని బాహాటంగా వెల్లడించారు కూడా. పూర్తిగా తెలిసే ఏదో ఒక విశేష కార్యాన్ని సాధించే నిమిత్తమే ఆ వ్యాధిని కల్పించుకొన్నారు. కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ పూర్వం మాదిరే స్వస్థులు కాగలరని వారు భావించసాగారు. ఈ అభిప్రాయం గల భక్తులకు గిరీష్చంద్రఘోష్ నాయకుడు.
ఎవరి అనుల్లంఘనీయమైన ఇచ్ఛాశక్తికి పూర్తిగా లోబడి ఉంటూ, జీవితంలో ప్రతి ఒక్క పనిని నెరవేర్చుతూన్నారో ఆ జగజ్జనని జగత్కళ్యాణం నిమిత్తం నిగూఢమైన తన ఒకానొక కార్యం కోసం గురుదేవులను కొంతకాలం వ్యాధిగ్రస్థులను చేసిందనీ – ఆ ఉద్దేశం శ్రీరామకృష్ణులు స్వయంగా ఎరిగివున్నారో లేదో చెప్పలేం కాని – ఆమె ఉద్దేశం ఫలించిన తక్షణం ఆయన స్వస్థులు కాగలరనీ కొందరు భక్తులు ప్రగాఢంగా నమ్మారు.
ఇక మరికొందరు భక్తుల అభిప్రాయం : జనన మరణ జరా వ్యాధులన్నీ శారీరక సహజ ధర్మాలు. శరీరం నిలిచి ఉన్నంతవరకూ ఇవన్నీ సంభవిస్తాయి. అటువంటప్పుడు దీని వెనుక నిగూఢమైన ఏదో రహస్యం ఒకటి ఉందని ఊరకే అపోహపడవలసిన అవసరంలేదు. కళ్ళారా చూస్తున్నంత వరకు శ్రీరామకృష్ణుల గురించిన ఏ విషయాన్ని సైతం తర్కయుక్తంగా విశ్లేషించి అర్థం చేసుకోనంతదాకా మేం ఏమీ అంగీకరించం. గురుదేవులు స్వస్థత పొందేవరకు ప్రాణాలర్పించి సేవించడానికి మేం సదా సంసిద్ధులం. అలాగే ఏ ఉన్నత జీవితాదర్శాన్ని ఆయన మాకు చూపారో ఆ మూసలో మా జీవితాలను మలచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం. శ్రీరామకృష్ణుల యువశిష్యులకు ప్రతినిధిగా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వ్యక్తి నరేంద్రుడు.
5. భక్తుల పరస్పర ప్రేమాభిమానాలు
శ్రీరామకృష్ణుల భక్తులు విభిన్న మనస్తత్వాలూ, విభిన్న అభిప్రాయాలూ గలవారై నప్పటికీ ఒక్క విషయంలో మాత్రం వారంతా ఏకీభావంతో ఉన్నారు. గురుదేవుల ఉదార బోధనల మేరకు తమ జీవితాలను తీర్చిదిద్దుకోగలిగితే, హృదయ పూర్వకంగా తమ సేవలను అర్పించి ఆయన అనుగ్రహానికి పాత్రులైతే మానవ జీవితపరమావధిని పొందగలమనే ప్రగాఢ విశ్వాసం ఆ భక్తులందరిలో పాదుకొని ఉందనడం నిర్వివాదాంశం. అందువల్లే ఒక వర్గంవారు గురుదేవులు యుగావతారులనీ, మరికొందరు జగద్గురువులనీ, ఇంకొక వర్గంవారు మానవరూపంలోని దైవమనీ నమ్మినప్పటికీ పరస్పర ప్రేమాభిమానాలకు వారిలో కొదువలేదు.
6. శ్రీరామకృష్ణులలో విశేష ఆధ్యాత్మిక అభివ్యక్తతను భక్తులు అనుభూతి చేసుకోవడం
శ్రీరామకృష్ణుల వివిధ రకాల ఆధ్యాత్మిక అభివ్యక్తీకరణలను ధ్రువీకరించే స్వయంగా మేం చూసిన కొన్ని సంఘటనలను ఇక్కడ పాఠకుల సౌకర్యార్థం పొందుపరుస్తున్నాం. శిష్యులుగా వర్గీకరించబడని దర్శనార్థులు కూడా ఆ సంఘటనలు జరగడం చూసివున్నారు.
7. శ్రీరామకృష్ణుల పట్ల డాక్టర్ సర్కార్ ఆకర్షితులు కావడం
శ్రీరామకృష్ణుల చికిత్స బాధ్యతను చేగొన్న డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ ఆయనకు స్వస్థత చేకూర్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. శ్రీరామకృష్ణులను పరీక్షించడానికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రోజూ మూడుసార్లు రాసాగాడు. ప్రతి రోజు పరీక్ష పూర్తిచేసి ఔషధ నిర్ణయం చేశాక కొంతసేపు శ్రీరామకృష్ణులతో ఆధ్యాత్మిక విషయాల గురించి ముచ్చటించేవాడు. అలా రోజులు గడిచేకొద్దీ శ్రీరామకృష్ణుల ఉదార ఆధ్యాత్మిక భావాల పట్ల డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్‌కు విశేష ఆకర్షణ ఏర్పడింది. దాంతో తీరిక లభించినప్పుడల్లా రెండు మూడు గంటల పర్యంతం గురుదేవుల సాన్నిధ్యంలో గడిపి వెళ్ళేవాడు. విలువైన అతడి సమయంలో ఎంతోసేపు తమ వద్ద గడుపుతూన్నందుకు ఒక రోజు శ్రీరామకృష్ణులు కృతజ్ఞతలు తెలుపబోతూండగా, డాక్టర్ సర్కార్ గబుక్కున ఆయన్ను వారించి, “మీ కోసం మాత్రమే నేనింత సమయం ఇక్కడ గడుపుతున్నానని భావిస్తున్నారా? దీన్లో నా స్వార్థమూ ఉంది. మీతో మాట్లాడుతూంటే నేనెంతో ఆనందం పొందుతున్నాను. గతంలో మిమ్మల్ని చూసినప్పటికీ పనుల హడావిడి కారణంగా మిమ్మల్ని సన్నిహితంగా తెలుసుకొనే అవకాశం అప్పుడు లేకపోయింది. మీ సత్యసంధత కారణంగా నాకు మీరెంతో నచ్చారు. సత్యం అని తెలిసిన విషయం నుండి మాటల ద్వారా కాని, చేతల ద్వారాగాని మీరు వెంట్రుక వాసి కూడా వైదొలగరు. ఎక్కడ చూసినా చెప్పేదొకటీ, చేసేది మరొకటిగా నాకు కనిపిస్తున్నది. కించిత్తు కూడా ఆ వైఖరిని నేను సహించలేను. నేను మిమ్మల్ని శ్లాఘిస్తున్నానని అనుకోకండి. నేను అటువంటి వ్యక్తిని కాను. ఏదో సామెత చెప్పినట్లు ‘తండ్రిని చెరిపే పుత్రుణ్ణి’ నేను. తండ్రి తప్పు చేసినా సూటిగా నిలదీసి అడిగే మనిషిని నేను. అందుకే నోటి దురుసు వాణ్ణని పేరుగాంచాను” అని విన్నవించుకున్నాడు. ఆ మాటలు విని శ్రీరామకృష్ణులు నవ్వుతూ, “అవును, దానిని గురించి విన్నాను; కాని చాలాకాలం నుండి వస్తున్నప్పటికీ దానికి ఇంతవరకు నిదర్శనం దొరకలేదు” అని అన్నారు.
8. డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ సత్యనిష్ఠ
డాక్టర్ కూడా నవ్వుతూ ఇలా అన్నాడు : “అది మనిద్దరి అదృష్టం. లేకుంటే తప్పు ఏదైనా కానవస్తే మహేంద్రలాల్ సర్కార్ సహించే మనస్తత్వం లేనివాడని మీకు ఎప్పుడో తెలిసేది. అయినప్పటికీ సత్యం పట్ల నాకు మక్కువ లేదని భావించకండి. నేను ఏది సత్యమని భావిస్తానో, దాన్ని ఆచరించడానికి జీవితాంతం ప్రయత్నిస్తాను. అందుకే హోమియోపతి వైద్యం చేపట్టాను. అందుకే ‘విజ్ఞానాభివృద్ధి సంస్థ’ ను నెలకొల్పాను. నా పనులన్నీ ఆ సత్యం నిమిత్తమే.”
9. పరావిద్య : అపరావిద్య
ఆ మాటలు విని డాక్టర్ సత్యనిష్ఠుడవడం నిజమైనా అతడి నిష్ఠ అపరా (ప్రాపంచిక) విద్య కోవకు చెందిన సాపేక్ష సత్యాల పట్ల గల నిష్ఠ అనీ, కాని శ్రీరామకృష్ణుల సత్యనిష్ఠ యావజ్జీవితం పరా (బ్రహ్మ) విద్యకు చెందినది అనీ మాలో ఒకరు సూచించడం మాకు జ్ఞాపకం వుంది.
అతడి మాటలు విని కాస్త ఉత్తేజితుడైన డాక్టర్ ఇలా అన్నాడు : “ఇదే మీకున్న రోగం. జ్ఞానపరంగా చూస్తే పరా ఏమిటి, అపరా ఏమిటి? సత్య ప్రకటనలో ఎక్కువ తక్కువలనడం అర్థంపర్థం లేని మాటలు. ఒకవేళ అటువంటి భేదం ఉన్నా అపరా విద్య మూలంగానే పరావిద్యకు చేరకతప్పదని అంగీకరించాలి. ఈ సృష్టికి మూలకారకుడైన భగవంతుణ్ణి ప్రకృతి విజ్ఞానం ద్వారా ఆవిష్కృతమైన ప్రత్యక్ష సత్యాల మూలంగానే స్పష్టంగా తెలుసుకోగలం. అయినా నాస్తిక వైజ్ఞానికులను నేను ఖాతరు చేయను. వారు చెప్పేది ఏమిటో కూడా నాకు అర్థంకాదు. వారు కళ్ళుండీ గుడ్డివారు. కాని ఆద్యంతాలు లేని భగవంతుణ్ణి పరిపూర్ణంగా అవగతం చేసుకొన్నానని ఎవరైనా చెబితే వాడొక అబద్ధాలకోరు, వంచకుడు. ఉన్మత్త శరణాలయమే అతడికి తగిన చోటు.”
10. భగవంతుడు అనంతుడు
ఇది విని ప్రసన్నంగా డాక్టర్‌ను చూస్తూ, “నువ్వన్నది నిజం. భగవంతుణ్ణి పరిమితం చేసే వ్యక్తులు నిమ్నమనస్కులు. వారి మాటలను నేను సహించలేను” అన్నారు శ్రీరామకృష్ణులు నవ్వుతూ.
11. బుద్ధికి అవగతమైనా హృదయం అంగీకరించదు
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు భక్తశ్రేష్ఠుడైన రాంప్రసాద్ రచించిన ‘ఎరుగగ తరమె ఏరికినైనా, తల్లి కాళి నిజతత్వ మించుక? షడ్దర్శనములె శక్తిహీనములు, తల్లి విషయము తెలియజేయుటకు’ అనే పాటను, మాలో ఒకరిని పాడమన్నారు.
మాలో ఎవరో ఆ పాటను ఇలా పాడారు :
ఎరుగగ తరమె ఏరికినైనా
తల్లి కాళి నిజతత్త్వ మించుక?
షడ్దర్శనములె శక్తిహీనములు
తల్లి విషయము తెలియచేయుటకు ॥ ఎ ॥
అంతర మందున ఆత్మానందము
ఆస్వాదించెడు ఆత్మయోగికి
ఆమెయె వెల్గును అంతరాత్మయని
సర్వశాస్త్రములు సన్నుతిజేయును ॥ ఎ ॥
ఎల్లప్రాణుల యుల్లమునందున
ఆమె వసించును ఐచ్ఛికముగనే
ఆమె గర్భమున అమరియున్నవి
అండాండంబులు బ్రహ్మాండంబులు ॥ ఎ ॥
అంత విశాలము ఆమె గర్భము
నీవు దానిని అవలోకింతువే?
మూలాధార సహస్రారముల
ఆమెను యోగి ధ్యానము సేయును ॥ ఎ ॥
ఆమె ఎట్టిదో అసలు ఎవ్వరో
శివుడుగాక మరి ఎవరు చూచెదరు
పద్మవనములో పతి సన్నిధిలో
హంసి హంసతో ఆటలాడును ॥ ఎ ॥
అమ్మ నెరుగ నెవడాశించినను
రవ్వ చేయును రామప్రసాదు
ఆమె నెరుగవలె ననుచు తలచుట
నవ్వులాట సాగరము నీదుట ॥ ఎ ॥
హృది ఎరిగినను మది ఎరుగక
అందమైన యా చందమామను
పట్టుకొనుటకై కొట్టుకొనెడు మరు
గుజ్జు వానివలె కోరుచున్నది ॥ ఎ ॥
ఆ పాటను వింటూ శ్రీరామకృష్ణులు మధ్యమధ్యలో చరణాల అర్థాన్ని డాక్టర్‌కు హీనస్వరంలో వివరించసాగారు. గాయకుడు ‘హృది ఎరిగినను మది ఎరుగక’ అని పాడినప్పుడు, శ్రీరామకృష్ణులు చప్పున అతణ్ణి ఆపి, “తల్లక్రిందులైంది. ‘మది ఎరిగినను హృది ఎరుగక’ అని ఉండాలి.’ భగవంతుణ్ణి తెలుసుకోగోరినప్పుడు అనంతుడైన ఆయనను తెలుసుకోవడం తనకు అసాధ్యమని అతడి బుద్ధి సులభంగానే గ్రహిస్తుంది. కాని అతడి హృదయం మాత్రం అందుకు సమ్మతించదు. ఆయనను పొందడానికి సతతం ప్రయత్నిస్తూనే ఉంటుంది” అని చెప్పారు.
శ్రీరామకృష్ణుల పై వ్యాఖ్యానం విని డాక్టర్ ముగ్ధుడై ఇలా అన్నాడు : “నిజం చెప్పారు. బుద్ధి చాలా చెడ్డది. ఏదైనా రవ్వంత అడ్డమొచ్చినా, ‘ఇక ముందుకు పోవడం చేతకాదు’ అని చతికిలపడుతుంది. కాని హృదయం మాత్రం ససేమిరా అలా ఒప్పుకోదు. ఇన్ని ఆవిష్కరణలకు, మున్ముందు చేయబోయే ఆవిష్కరణలకు (ఆ హృదయమే) కారణం.”
12. భావసమాధిలోని బాలభక్తుల నాడి పరీక్షించడం
ఆ పాట వింటూ ఒకరిద్దరు యువకులు భావపారవశ్యంలో బాహ్య స్మృతిని కోల్పోవడం చూసి డాక్టర్ వారి వద్దకెళ్ళి వారి నాడిని పరీక్షించి, గురుదేవులతో, “మూర్ఛపోయిన వారిలా వీరు బాహ్యస్మృతి పూర్తిగా కోల్పోయినట్లు కనిపిస్తున్నారు” అని అన్నాడు. శ్రీరామకృష్ణులు వారి ఛాతీని తమ చేత్తో నిమురుతూ, మెల్లగా వారి చెవులలో భగవన్నామం ఉచ్చరించగానే వాళ్ళు బాహ్యస్మృతిని పొందడం గమనించి డాక్టర్ మళ్ళీ గురుదేవులతో, “ఇదంతా మీ లీలలా కనిపిస్తూన్నది” అని అన్నాడు. గురుదేవులు నవ్వి ఇలా అన్నారు : “ఇది నా లీల కాదు, భగవత్సంకల్పం. భార్య బిడ్డలు, పేరు ప్రతిష్ఠలు, ధనం ఇత్యాదితో వారి మనస్సులు ఇంకా సావధానతను కోల్పోలేదు. సంకీర్తన వింటూ మనస్సును భగవంతునిలో లీనం చేయగలగడానికి అదే కారణం.”
13. విద్య గర్వాన్ని కలిగిస్తుంది
వెనుకటి అంశం మళ్ళీ ప్రస్తావనకు వచ్చింది. “స్వయంగా మీరు భగవంతుణ్ణి నమ్ముతున్నా, ఆయనకు పరిమితులు కల్పించకపోయినా, అనేకమంది విజ్ఞానవేత్తలు భగవంతుణ్ణి త్రోసిరాజంటారు. మరికొందరు భగవంతుని ఉనికిని విశ్వసించినా ఆయన తాము భావించే మేరకే ఘనుడనీ, తాము ఆయనకు ఆపాదించిన మేరకే శక్తిమంతుడనీ ఎలుగెత్తి చాటుతారు” అని భక్తులు కొందరు డాక్టర్‌తో చెప్పారు. అందుకు డాక్టర్ ఇలా అన్నాడు : “మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం. జ్ఞానం కారణంగా అలా అంటున్నారని మీరు భావిస్తున్నారా? కాదు. అదంతా విద్య మూలంగా కలిగే గర్వం. జీర్ణం కాని జ్ఞానం. ఆయన సృష్టించిన ఏవో అల్పమైన వాటిని కనుగొన్నామని ఎంచి, విశ్వరహస్యమంతా తెలిసిపోయిందని విఱ్ఱవీగుతారు. ఈ కోవకు చెందిన వారు గొప్ప విద్యావంతులే అయినప్పటికీ అనుభవశూన్యులు. కాని ఈ రెండు అర్హతలు సంతరించుకొన్న వారిలో ఈ విపరీత వైఖరి ఉండదు. నా మటుకు నేను ఎన్నటికీ ఆ రీతిలో యోచించను.”
ఆ జవాబు విని శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు : “నువ్వన్నది నిజం. జ్ఞానంతోపాటు, ‘నేను పండితుణ్ణి, నేను అవగతం చేసుకొన్నదే సత్యం; ఇతరుల అభిప్రాయాలు తప్పు’ అనే అహం కూడా అబ్బుతుంది. మనిషి నానాబంధనాలతో కష్టపడుతూ ఉంటాడు. విద్యాహంకారం దాన్లో ఒకటి. నువ్వు గొప్ప విద్యావంతుడివి, అదృష్టవశాత్తు నువ్వు ఆ రకం అహం నుండి తప్పించుకొన్నావు. అందుకు భగవంతుని అనుగ్రహమే కారణం.”
14. డాక్టర్ వినమ్రత
గురుదేవుల వచనాలు విని డాక్టర్ ఒకింత ఉత్తేజితుడై ఇలా పలికాడు: “నాకు తెలిసింది, అర్థమైంది ఎంతో తక్కువ, అసలు ఏమీ లేదనే చెప్పవచ్చు. ఇంకా నేను తెలుసుకోవలసింది ఎంతో ఉంది. నిజానికి ప్రతి వ్యక్తికీ తెలిసిన అనేక విషయాలు నాకు తెలియవు. కనుక ఎవరివద్దనుండైనా నేర్చుకోవడానికి ఏమాత్రం సంకోచించను. వీరి నుండి (మమ్మల్ని చూపుతూ) కూడా నేను తెలుసుకోవలసిన విషయాలు అనేకం ఉన్నాయని తోస్తోంది. ఆ కోణం నుండి చూస్తే సర్వుల పాదధూళిని స్వీకరింప నేను సిద్ధం.”
15. ‘డాక్టర్లో సారం ఉంది’
ఆ మాటలు విని గురుదేవులు (మమ్మల్ని చూపుతూ), “వీరితో, ‘మిత్రమా బ్రతికి ఉన్నంత వరకు నేర్చుకొంటూనే ఉంటాను’ అని నేను చెబుతూంటాను” అన్నారు. తరువాత డాక్టర్‌ను చూపుతూ శ్రీరామకృష్ణులు “ఈయన ఎంత నిరహంకారో మీరు గమనించారా? ఆయనలో సారం ఉండబట్టే అటువంటి వైఖరి ఉంది” అని కొనసాగించారు. ఆ తరువాత డాక్టర్ సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు.
16. ఆధ్యాత్మిక పథంలో డాక్టర్‌ను గురుదేవులు నడిపించడం
తమ పట్ల విశ్వాసమూ, ప్రేమా డాక్టర్లో ఇనుమడించేకొద్దీ, శ్రీరామకృష్ణులు ఆయనను ఆధ్యాత్మిక మార్గంలో ముందంజ వేయించడంలో ఎంతో శ్రద్ధ వహించసాగారు. పైగా సంస్కారవంతులు, సంస్కార వంతులతోనే మాట్లాడడానికి ఇష్టపడతారనే విషయం ఎరిగివున్న శ్రీరామకృష్ణులు, అప్పుడప్పుడు మహేంద్రనాథ్ (‘మ’), గిరీష్‌చంద్ర, నరేంద్ర మొదలైన శిష్యులను విద్యావంతుడైన డాక్టర్‌తో మాట్లాడడానికి పంపేవారు. గిరీష్‌తో ఆ రీతిలో పరిచయం ఏర్పడ్డాక, డాక్టర్ ఒక రోజు గిరీష్ ప్రదర్శించే ‘బుద్ధచరిత్ర’ అనే నాటకాన్ని తిలకించి, ఆ నాటకాన్ని ఎంతో ప్రశంసించాడు. అట్లే గిరీష్ రచించి, ప్రదర్శించిన మరికొన్ని నాటకాలను తిలకించాడు.
అదేవిధంగా నరేంద్రుని సంభాషణా చాతుర్యానికి ఎంతో ముగ్ధుడైన డాక్టర్ అతణ్ణి ఒక రోజు భోజనానికి ఆహ్వానించాడు. నరేంద్రునికి సంగీతంలో ఎంతో ప్రావీణ్యం ఉందని తెలుసుకొని, తన కోసం ఒక రోజు కొన్ని భక్తిగీతాలు పాడమని డాక్టర్ అతణ్ణి కోరాడు. అలా కోరిన కొన్ని రోజుల తరువాత, ఒకనాటి మధ్యాహ్నం గురుదేవులను పరీక్షించడానికి డాక్టర్ వచ్చినప్పుడు, నరేంద్రుడు రెండు మూడు గంటలసేపు పాడి, ఆయన కోర్కెను తీర్చాడు. నరేంద్రుని పాటలు విని డాక్టర్ పరమానందభరితుడయ్యాడు. గురుదేవుల వద్ద సెలవు పుచ్చుకోబోతూ, నరేంద్రుణ్ణి ఆశీర్వదించి, కౌగిలించుకొని, ముద్దాడి శ్రీరామకృష్ణులతో, “ఇటువంటి యువకుడు భగవత్సాక్షాత్కార మార్గం అనుసరించడం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఇతడొక రత్నం. తాను చేగొన్న ప్రతి పనిలోను ఇతడు రాణిస్తాడు” అని అన్నాడు. శ్రీరామకృష్ణులు, సంతోషంతో నరేంద్రుణ్ణి పరికిస్తూ, “అద్వైత గోస్వామి ఆర్తనాదాలు విని గౌరాంగుడు నదియాకు వచ్చాడని చెప్పుకొంటారు. ఈసారి ఇక్కడ (ఆయన అవతారం గురించి తెలియచేస్తూ) జరిగేదంతా అతడి (నరేంద్రుని) కోసమే” అని అన్నారు. ఆనాటి నుండి గురుదేవులను పరీక్షించడానికి వచ్చినప్పుడల్లా, ఆ సందర్భంలో నరేంద్రుడు కనుక అక్కడ ఉండడం తటస్థిస్తే, నరేంద్రుని భక్తిగీతాలు కొన్ని వినకుండా మాత్రం డాక్టర్ సెలవు పుచ్చుకొని వెళ్ళేవాడు కాడు.
17. ఔషధాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో డాక్టర్ ఆందోళన
అది శరత్కాలం. వంగదేశంలో దుర్గాదేవి ఉత్సవాల సమయం. ఆ సమయంలో గురుదేవుల వ్యాధి కొన్ని రోజులు తగ్గుముఖం పడుతూ, మరి కొన్ని రోజులు ప్రకోపిస్తూ అటూ ఇటూగా ఊగసాగింది. చికిత్స వలన చెప్పుకోదగ్గ గుణం ఏమీ కానరాలేదు. ఒక రోజు డాక్టర్ పరీక్షించి, వ్యాధి ప్రకోపించడం గమనించి “పథ్యంలో ఏదో అవకతవక జరిగినట్లుంది. ఈ రోజు మీరు ఏం తిన్నారో చెప్పండి” అని ప్రశ్నించాడు. తాము ఆ రోజు ఏం తిన్నారో శ్రీరామకృష్ణులు తెలిపారు. ఆ రోజు ఆయన మామూలుగానే బియ్యంజావ, చారు, ఉదయాన పాలు పుచ్చుకొన్నారు. సాయంత్రం పాలు, బార్లీనీరు పుచ్చుకొన్నారు. డాక్టర్ ఆయన పుచ్చుకొన్న ఆహార వివరాలు విని, “మీరు చెబుతున్నది నేను నమ్మను; నేను చెప్పిన పథ్యంలో ఏదో మార్పు జరిగింది. సరే, చారులో ఏం కూరగాయలు వినియోగించారో చెప్పండి?” అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, “బంగాళాదుంపలు, అరటికాయలు, వంకాయలు, ఒకటి రెండు కాలీఫ్లవర్ ముక్కలు” అని జవాబిచ్చారు.
ఆ జవాబు వినగానే డాక్టర్, “అదీ సంగతి. మీరు కాలీఫ్లవర్ తిన్నారన్న మాట! ఇలా చూడండి, పథ్యంలో ఎంతో అవకతవక జరిగింది. కాలీఫ్లవర్ ఎంతో వేడిచేస్తుంది, పైగా జీర్ణం చేసుకోవడమూ కష్టమే. ఎన్ని ముక్కలు తిన్నారు?” అని ప్రశ్నించాడు. “ఒక్క ముక్క కూడా నోట పెట్టలేదు. కాలీఫ్లవర్ ముక్కలు చారులో వేసివుండడం చూశాను” అని గురుదేవులు సుతిమెత్తగా ప్రతిఘటించే ధోరణిలో జవాబిచ్చారు. అందుమీదట డాక్టర్, “తిన్నా తినకపోయినా ఒక్కటే; కాని కాలీఫ్లవర్ సారం చారులో కలిసింది. కనుక మీ జీర్ణశక్తి మందగించింది. ఫలితంగా రోగం నేడు ప్రకోపించింది” అంటూ విశ్లేషించాడు. శ్రీరామకృష్ణులు ప్రతిఘటిస్తూ “అదెలా? నేను కాలీఫ్లవర్ పుచ్చుకోనూ లేదు, నా జీర్ణశక్తి మందగించనూ లేదు. కాలీఫ్లవర్ సారం కించిత్తు చారులో కలిసినంత మాత్రాన రోగం ప్రకోపించిందనడం నేను ససేమిరా అంగీకరించను” అని అన్నారు.
18. కించిత్తు నియమ భంగం ఎంతో హానికరం
డాక్టర్ ఇలా కొనసాగించాడు : “కించిత్తు నియమభంగం ఎంత హానికి దారితీస్తుందో మీకెవరికీ అర్థం కావడం లేదు. నా జీవితంలో జరిగిన ఒక సంఘటనను విశదీకరిస్తే మీకు పై విషయం బాగా అర్థమౌతుంది. చిన్నప్పటి నుండి నా జీర్ణశక్తి అంతంత మాత్రమే. అప్పుడప్పుడు నేను అజీర్ణంతో బాధపడడం కద్దు. అందువలన ఆహార విషయంలో నేను ఎంతో జాగ్రత్త వహిస్తాను, పథ్య నియమాలు పాటిస్తాను. బజారు నుండి తెచ్చిన వేటినీ నేను తినను. నెయ్యి, నూనె ఇంట్లోనే తయారు చేయిస్తాను. అయినప్పటికీ ఒకానొక సందర్భంలో నాకు జలుబు చేసి, అది శ్వాసనాళం వాపుకు దారితీసి, ఏ చికిత్సకూ నయం కాలేదు. నా ఆహారంలో ఏదో పొరపాటు జరిగి ఉంటుందనే ఆలోచన అప్పుడు కలిగింది. కాని క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ నా దైనందిన ఆహారంలో ఎలాంటి దోషమూ కనిపించలేదు. కొన్ని రోజుల తరువాత హఠాత్తుగా మా ఆవుకు పొట్టి చిక్కుడుకాయలు మా పనివాడు తినిపించడం నా కళ్ళబడింది. ఆ ఆవు పాలనే నేను నిత్యం త్రాగుతాను. వాకబు చేయగా కొన్ని మణుగుల ఆ చిక్కుడుకాయలను ఒక ఫలానా చోటు నుండి కొనుగోలుచేసి తెచ్చారని తెలియవచ్చింది. ఆ చిక్కుడు కాయలను తింటే జలుబు చేస్తుందని ఎవరూ తినకపోయేసరికి, వాటిని ఆవుకు మేతగా పెట్టసాగారు. ఆవు ఆ చిక్కుడు కాయలను తినడం, నాకు జలుబు చేయడం, రెండూ ఏక కాలంలో జరిగాయి. దానిని రూఢి చేసుకొనే నిమిత్తం ఆవుకు చిక్కుడుకాయలు తినిపించడం ఆపేశాను, నా ఊహ ప్రకారమే నా జలుబు తగ్గసాగింది. ఆ సందర్భంలో జలుబు నుండి పూర్తిగా కోలుకోవడానికి నాకు చాలాకాలం పట్టింది. వాతావరణ మార్పుకు, తదితర ప్రక్రియలకు నాలుగైదు వేల రూపాయలు ఖర్చు పెట్టాకనే, నాకు జలుబు నుండి పూర్తి విముక్తి లభించింది.”
డాక్టర్ చెప్పింది విని, శ్రీరామకృష్ణులు మందహాసం చేస్తూ, “అమ్మో! చింతచెట్టు క్రింద నడిచినంత మాత్రాన జలుబు పట్టుకొన్న వ్యక్తి కథలా ఉందే ఇది!” అని అన్నారు. అందరూ నవ్వారు. డాక్టర్ సూచించిన కారణం కొంత సంశయాత్మకమే అయినప్పటికీ, ఆయనకున్న ప్రగాఢ విశ్వాసాన్ని గురించి ఎవరూ ఆక్షేపణ లేవదీయలేదు. ఆయన నిషేధాన్ని అంగీకరించి గురుదేవుల వంటలో కాలీఫ్లవర్ వాడకాన్ని ఆపివేశారు.
19. శ్రీరామకృష్ణుల పట్ల డాక్టర్ గౌరవం ఇనుమడించడం
శ్రీరామకృష్ణులు తన పట్ల వ్యక్తం చేసే ప్రేమ, ఆయన సరళమైన నడవడిక, ఆయన ప్రగాఢ ఆధ్యాత్మికత డాక్టర్‌ను ఆయన పట్ల ఆకర్షితుణ్ణిగా చేసాయి. క్రమంగా డాక్టర్ హృదయంలో శ్రీరామకృష్ణుల పట్ల గౌరవం ఇనుమడించసాగింది. డాక్టర్ మాటలు, చేతలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఆయన శ్రీరామకృష్ణుల పట్ల మాత్రమే కాక, భక్తులపట్ల కూడా ఎంతో అభిమానం కనబరచసాగాడు. శ్రీరామకృష్ణులను భక్తులు అంధులై ఆరాధ్యమూర్తిగా సేవించడం లేదని డాక్టర్‌కు గట్టి నమ్మకం ఏర్పడింది. కాని గురుదేవుల పట్ల వారి భక్తిప్రపత్తులను డాక్టర్ ఏ దృష్టితో పరికించాడో చెప్పడం అంత సులభం కాదు. అతడికి అది కాస్త అతిగా కనిపించి ఉండవచ్చు. అయినప్పటికీ భక్తులు స్వార్థం నిమిత్తంగా గాని లేదా గొప్పకోసం గాని తమ భక్తిప్రపత్తులను చూపడం లేదని మాత్రం డాక్టర్ చక్కగా గ్రహించాడు. అయినా భక్తుల ప్రవర్తన ఒక నిగూఢ రహస్యంగానే మిగిలిపోయింది. భక్తులతో ఆయన సన్నిహితంగా మెలగుతూ ఉన్నప్పటికీ డాక్టర్ కుశాగ్రబుద్ధికి అది అంతుబట్టలేదు. భగవద్విశ్వాసం గలవాడైనా, పాశ్చాత్య విద్యా ప్రభావం వల్ల కేవలం ఒక మానవమాత్రుణ్ణి, ఆ వ్యక్తిలో ఎంతటి దివ్యశక్తి అభివ్యక్తీకరిస్తున్నప్పటికీ, గురువుగా లేదా అవతారపురుషునిగా ఆరాధించడం డాక్టర్‌కు అర్థం కాని విషయంగానే మిగిలిపోయింది. తనకు ఈ విషయం అవగతం కాలేదు కనుక ఆ వైఖరికి అతడు విముఖుడైనాడు. ఆధునిక విద్యావంతుల మాదిరి విరోధించడానికి కారణం ఉంది కూడా. అదేమిటంటే : లోకంలో అవతార పురుషులుగా పరిగణింపబడి ఎవరు ఆరాధింపబడుతూ వస్తున్నారో వారి శిష్య ప్రశిష్యులు తెలివితక్కువతనంతో ఆ అవతార పురుషులను గురించి ఎంత అతిగా ప్రచారం చేశారంటే, ఆ అవతార పురుషుల యథార్థ స్వభావాన్ని ఇప్పుడు గుర్తించడమే ఎంతో కష్టమైపోయింది. తాము ఆరాధించే వారి మహత్త్వాన్ని ప్రచారం చేయాలనే అనుయాయుల ఉత్సుకతే అందుకు కారణం. ఈ మోతాదు మించిన భక్తుల ఉత్సుకతే సామాన్యులలో విరోధాన్ని జనింపచేసింది.
పై విషయాన్ని గురించి డాక్టర్ ఒక రోజు సూటిగా శ్రీరామకృష్ణులతో ఇలా చెప్పాడు : “భగవంతుణ్ణి ఆరాధించడం, పూజించడం మొదలైనవి చేయడం నేను అర్థం చేసుకోగలను. కాని అనంతుడైన ఆ భగవంతుడు మానవమాత్రుడిగా జన్మించాడని చెప్పడంలోనే వస్తుంది పేచీ అంతా. ఆయన యశోదానందనుడుగా, మేరీ తనయుడిగా, శచీనందనుడుగా* అవతరించాడనే విషయం అర్థం చేసుకోలేం. ఈ ‘నందను’ ల గుంపే దేశాన్ని సర్వనాశనం చేసింది.” డాక్టర్ మాటలు విని నవ్వి, గురుదేవులు మాతో, “ఆయన ఏమంటున్నాడు? అయినా మందమతులైన మతమౌఢ్యులు వారిని (అవతార పురుషులను) మహిమాన్వితులుగా కానవచ్చేలా చేయగోరి అలా ప్రవర్తించినందు వల్లనే జనుల మనస్సులలో ఇటువంటి ప్రతి చర్యలు సహజంగా జనించాయన్న మాట నిజం” అని అన్నారు.
20. భగవదవతారం గురించి డాక్టర్ అభిప్రాయం
అవతార పురుషుల గురించి డాక్టర్‌కు ఉన్న అభిప్రాయం చూసి గిరీష్, నరేంద్రులు ఆయనతో పలుమార్లు వివాదించారు. ఫలితంగా బాగా యోచించకుండా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం సరికాదని డాక్టర్ జాగ్రత్తపడ్డాడు. నిజానికి అవతారతత్త్వానికి వ్యతిరేకంగా అనేక యుక్తియుక్త వాదాలు ప్రకటించవచ్చు. కాని తర్కం సాధించ లేని పనిని ప్రేమ సాధించిందన్న విషయం ఇలా నిరూపించబడింది:
శ్రీరామకృష్ణుల అసాధారణ ప్రేమ, ఆయనలో అభివ్యక్తమౌతున్న అద్భుత ఆధ్యాత్మికత క్రమంగా డాక్టర్ పై అభిప్రాయాన్ని చాలావరకు మార్చసాగాయి. ఆ సంవత్సర దుర్గాపూజా సమయంలో, సంధిపూజా కాలంలో హఠాత్తుగా శ్రీరామకృష్ణులలో అద్భుత శక్తి అభివ్యక్తీకరించడం మేమంతా చూశాం. దాన్ని చూసి, పరీక్షించే అవకాశం అప్పుడు డాక్టర్‌కు లభించింది. ఆయన ఆ రోజు మరో డాక్టర్ మిత్రుడితో వచ్చాడు. భావపారవశ్యంలో ఉన్న శ్రీరామకృష్ణుల హృదయ స్పందనాదులను వైద్య పరికరాలతో డాక్టర్ పరీక్షించాడు. ఆయన మిత్రుడు శ్రీరామకృష్ణుల కళ్ళు మూతలుపడతాయో లేదో అని పరీక్షించడానికి తెరచివున్న ఆయన కళ్ళలో వ్రేళ్ళను పెట్టడానికి కూడా వెనుకాడలేదు. అలా పరీక్షించి వాళ్ళు నివ్వెరబోయారు; అన్ని రకాలా బాహ్యంగా మరణించిన వ్యక్తిలా కానవచ్చే శ్రీరామకృష్ణులు పొందిన సమాధి స్థితిని గురించి తమ విజ్ఞానశాస్త్రం ఏమీ చెప్పలేకపోతున్నదని వాళ్ళు అంగీకరించక తప్పలేదు. ఇక పాశ్చాత్య మానసిక శాస్త్రవేత్త సమాధిస్థితిని కేవలం చైతన్యరహిత అవస్థగా భావించడం అతడి అవివేకాన్ని, బేసబబైన హఠాన్ని ప్రదర్శిస్తూన్నది. భగవంతుని సృష్టిలో అనేక విషయాల మర్మాన్ని ఇప్పటి వరకు పాశ్చాత్య విజ్ఞానమూ, తత్త్వశాస్త్రమూ వివరించ లేకపోయాయి. భవిష్యత్తులో సైతం ఆ మర్మాన్ని విశదీకరించడం కూడా సందేహాస్పదమే. బాహ్యంగా మృతుడుగా కానవచ్చినా ఆ సమాధి స్థితి, శ్రీరామకృష్ణుల మానసికానుభూతులు ఎంత యథార్థాలో అనే విషయం ఇదివరకే చర్చించాం.
21. వ్యాధి ప్రకోపించడం
ఆశ్వయుజ మాసం గడిచి కార్తీకం వచ్చింది, కాళీపూజా దినం దగ్గర పడింది. కాని శ్రీరామకృష్ణుల దేహ పరిస్థితిలో మెరుగు కనిపించ లేదు. చికిత్స ప్రారంభమైనప్పుడు కనిపించిన గుణం నానాటికీ తగ్గి, వ్యాధి తీవ్రతరమౌతోందనే భయం కలుగసాగింది. కాని శ్రీరామకృష్ణుల ఆనందం ప్రసన్నత మాత్రం తగ్గడానికి బదులుగా ఇనుమడిస్తున్నట్లు భక్తులకు కనబడింది. డాక్టర్ సర్కార్ తరచు ఆయనను పరీక్షిస్తూ, మందులు మార్పు చేస్తున్నప్పటికీ ఆయన ఆశించిన ఫలితం కనబడకపోవడంతో, బహుశా ఋతువు మార్పే అందుకు కారణమని భావించాడు. శీతకాలం చలి కాస్త ఎక్కువకాగానే పరిస్థితి మెరుగుపడుతుందని అనుకొన్నాడు.
22. కాళీపూజ సమయంలో శ్రీరామకృష్ణుల అద్భుత భావసమాధి
దుర్గాపూజ సందర్భంలో జరిగినట్లే కాళికాదేవి పూజా సందర్భంలో కూడా శ్రీరామకృష్ణులలో అద్భుత ఆధ్యాత్మిక అభివ్యక్తీకరణ దివ్యత్వాన్ని భక్తులు చూశారు. ఒకప్పుడు దేవేంద్రనాథ్ అనే భక్తునికి కాళీ విగ్రహాన్ని తెచ్చి పూజించాలనే ఆకాంక్ష కలిగింది. శ్రీరామకృష్ణుల, ఆయన భక్తుల సమక్షంలో తన కోర్కె ఈడేరితే అంతకు మించిన ఆనందం ఉండదని భావించి కాళీవిగ్రహాన్ని శ్యాంపుకూర్ ఇంటికే తెచ్చి అక్కడే పూజించాలనే తన ప్రతిపాదనను విన్నవించాడు. శ్రీరామకృష్ణుల సమక్షంలో పూజ నిర్వహిస్తే అది చూసి ఆయన దేహం ఉత్సుకతతో మరింత నీరసిస్తుందని భక్తులు అతణ్ణి ఆ విషయంగా ప్రోత్సహించలేదు. భక్తులు తనను ప్రోత్సహించకపోవడం దేవేంద్రుడికి సబబుగానే తోచి, అతడు తన ఉద్దేశాన్ని మార్చుకొన్నాడు.
కాని కాళీపూజకు ముందురోజు హఠాత్తుగా కొందరు భక్తులను పిలిచి శ్రీరామకృష్ణులు, “సంక్షిప్తంగా పూజ నిర్వర్తించడానికి కావలసిన సరంజామాను సేకరించి తీసుకురండి. రేపు కాళీమాతను తప్పక పూజించాలి” అని చెప్పారు. ఆయన మాటలు విని భక్తులు ఆనందించి తమలో తాము సంప్రదించుకోసాగారు. పూజా ఏర్పాట్ల గురించి ఆయన ఎటువంటి ఆదేశాలు ఇవ్వనందున భక్తులు తర్జనభర్జన పడసాగారు. పూజ పదహారు ఉపచారాలతో చేయాలా లేదా పంచ ఉపచారాలతోనా? పూజలో అన్నభోగం అర్పించాలా, లేదా? పూజ ఎవరు చేస్తారు? ఇటువంటి సంశయాలతో వాళ్ళు ఏ నిర్ణయానికీ రాలేకపోయారు. గంధం, పువ్వులు, ధూపం, దీపం, పండ్లు, మిఠాయిలు సిద్ధం చేసుకొని ఉంచాలని చివరికి తీర్మానించారు. ఆ తరువాత గురుదేవులు ఎలా చేయాలని ఆదేశిస్తారో అలాగే చేయవచ్చునన్న నిర్ణయానికి వచ్చారు. పూజ రోజు ఉదయం వరకూ శ్రీరామకృష్ణులు వారికి ఎటువంటి ఆదేశమూ ఇవ్వలేదు.
23. పూజ ఏర్పాట్లు
అప్పుడు సమయం రాత్రి ఏడు గంటలయింది. శ్రీరామకృష్ణులు అప్పటికీ పూజ గురించి ఏం చెప్పకుండా ప్రశాంతంగా తమ మంచం మీద కూర్చుని ఉన్నారు. భక్తులు ఆయన మంచానికి తూర్పు వైపు నేలను శుభ్రం చేసి, సేకరించిన పూజా ద్రవ్యాలు తెచ్చి, అక్కడ ఉంచారు. దక్షిణేశ్వరంలో ఉంటున్నప్పుడు గంధపుష్పాదులతో శ్రీరామకృష్ణులు కొన్ని సందర్భాలలో తమను తామే పూజించుకొనేవారు. అలా ఆయన చేయడం కొందరు భక్తులు చూసివున్నారు. ఈ రోజు కూడా ఆయన తమ మనశ్శరీరాలనే ప్రతీకల ద్వారా విశ్వచైతన్యాన్ని, దాని శక్తిని పూజిస్తారేమో లేదా జగజ్జననితో తాదాత్మ్యజ్ఞానం పొంది శాస్త్రానుసారం ఆత్మపూజను నిర్వర్తిస్తారేమోననే నిర్ణయానికి వచ్చారు భక్తులు. అందుకే పూజోపకరణాలను గురుదేవుల మంచం ప్రక్కన అమర్చారు. వారలా అమరుస్తున్నా శ్రీరామకృష్ణులు వారిని వారించలేదు.
24. శ్రీరామకృష్ణులు మౌనంగా కూర్చోవడం
క్రమంగా పూజాద్రవ్యాలన్నీ అక్కడ అమర్చిపెట్టారు. ధూపం వేసి, దీపాలు వెలిగించారు. గది అంతా కాంతితో, సుగంధ వాసనలతో నిండిపోయింది. శ్రీరామకృష్ణులు మౌనంగా నిశ్చలంగా కూర్చుని ఉండడం చూసి భక్తులు ఆయన ప్రక్కన కూర్చున్నారు. కొందరు ఆయన ఆదేశానికి నిరీక్షిస్తూ తదేకంగా ఆయన వైపే చూస్తున్నారు. మరికొందరు జగజ్జననిని ధ్యానించసాగారు. ఆ విధంగా గదిలో నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. గదిలో ముప్ఫై మందికి పైబడే ఉన్నప్పటికీ, గది ఖాళీగా ఉన్నట్లుగా తోస్తున్నది. ఆ విధంగా కొంతసేపు గడిచింది. కాని శ్రీరామకృష్ణులు స్వయంగా తామే పూజ ప్రారంభించడంగాని లేదా పూజ చేయమని మాలో ఎవరికైనా పురమాయించడం గాని చేయక అప్పటికీ నిశ్చలంగా కూర్చుండిపోయారు.
25. భావసమాధిమగ్నులైన శ్రీరామకృష్ణులను, గిరీష్ ఘోష్ పూజించడం
యువభక్తులతో పాటు మహేంద్రనాథ్, రాంచంద్ర, దేవేంద్రనాథ్, గిరీష్ ఘోష్ వంటి పెద్దలైన భక్తులు కూడా అప్పుడు అక్కడున్నారు. పూజ గురించి శ్రీరామకృష్ణులు మౌనంగా ఉండిపోవడం వీరిలో అనేకులను ఆశ్చర్యపరచింది. ‘ఐదు పావలా ఐదణాల’ విశ్వాసం ఉందని శ్రీరామకృష్ణులు తరచు అభివర్ణించే గిరీష్ మనసులో మాత్రం వేరే ఆలోచనలు మెదలాయి. ‘తమ నిమిత్తం కాళీపూజను చేసే అవసరం ఆయనకు లేదు. ఒకవేళ అహేతుక భక్తి ప్రేరణతో పూజ చేయాలనే ఆకాంక్ష ఆయనకు జనించిందనుకొంటే, మరి ఆయన ఊరకే ఎందుకు కూర్చుండి పోయారు? మరేదో కారణం ఉండివుండాలి. తమ దేహాన్ని సజీవ జగజ్జనని ప్రతిమగా ఎంచి, భక్తులు పూజించి తరించాలనే ఉద్దేశంతోనేనా ఈ పూజ ఏర్పాట్లు? తప్పకుండా ఇదే అయివుండాలి’ అనే తలంపుతో అతడిలో ఉత్సాహం ఉరకలు వేసింది. తక్షణం ఎదురుగా అమర్చివున్న గంధపుష్పాదులను చేతుల్లోకి తీసుకొని ‘జై మా’ అంటూ శ్రీరామకృష్ణుల పాదపద్మాలకు వాటిని అర్పించాడు. అతడు అలా చేసిన క్షణంలోనే శ్రీరామకృష్ణులు రోమాంచితులై, ప్రగాఢ సమాధి మగ్నులైనారు. ఆయన వదనం దివ్యజ్యోతిలా ప్రకాశించసాగింది, పెదవులపై దివ్యదరహాసం చిందులు వేస్తున్నది. రెండు చేతులూ వరద, అభయ ముద్రలు దాల్చాయి. ఆయనలో జగజ్జనని అభివ్యక్తీకరణ స్పష్టంగా కానవస్తున్నది.
శ్రీరామకృష్ణులు భావపారవశ్యులైన తరువాతే గిరీష్ పుష్పాదులు అర్పించాడని పలువురు భక్తులు భావించారు. అంటే పై సంఘటనలు తృటిలో జరిగిపోయినట్లు తెలియవస్తున్నది. కాస్త దూరంలో ఉన్న మరికొందరికి దేదీప్యమానంగా ప్రకాశిస్తూన్న దేవీమూర్తి హఠాత్తుగా గురుదేవులుగా ఆవిర్భవించినట్లు అనిపించింది.
26. భక్తులు కూడా శ్రీరామకృష్ణులను అర్చించడం
ఇక భక్తుల ఆనందానికి అవధుల్లేవు. అక్కడున్న ప్రతి ఒక్కరూ పళ్ళెరం నుండి గంధపుష్పాదులను తీసుకొని తమ ఇష్టమంత్రాన్ని ఉచ్చరిస్తూ జయజయధ్వానాలతో గురుదేవుల పాదపద్మాలను అర్చింప సాగారు. అలా కొంతసేపు గడచిపోయిన తరువాత శ్రీరామకృష్ణుల భావపారవశ్యం ఉపశమించి ఆయన పాక్షిక బాహ్యస్మృతిని పొందారు. అప్పుడు పూజ నిమిత్తం తెచ్చిన పండ్లు, మిఠాయిలు మొదలైన వాటిని ఆయనకు సమర్పించారు. ఆయన వాటిలో ఒకింతమాత్రం స్వీకరించి భక్తి-జ్ఞానాలు ఇనుమడించాలని వారిని ఆశీర్వదించారు. పిదప గురుదేవుల ప్రసాదాన్ని భక్తులు ఆరగించి, రాత్రి బాగా ప్రొద్దుపోయే దాకా మహోత్సాహంతో దేవీమాహాత్మ్యాన్ని, నామాన్ని కీర్తిస్తూ భక్తిగీతాలు పాడారు. ఆ సంవత్సరం కాళీపూజ నాడు భక్తులు పొందిన ఆనందం వర్ణనాతీతం. ఇంతకు మునుపు ఎన్నడూ వారంతటి ఆనందాన్ని చవిచూసి ఎరుగరు. ఈ ఆనందోత్సాహం వారి మదిలో శాశ్వతంగా నిలిచి పోయిందని చెప్పడం అతిశయోక్తికాదు. కష్టాలు ఎదురైనప్పుడు, మనస్సును నిరాశానిస్పృహలు ఆవరించినప్పుడల్లా ఆ నాటి దివ్య మందహాసంతో ప్రకాశించే గురుదేవుల ప్రసన్న వదనం, వరాభయ ముద్రలు దాల్చిన కరకమలాలతో కూడిన ఆ దివ్యమంగళమూర్తి వారి హృదయాలలో స్ఫురించేవి. తత్ఫలితంగా భగవంతుని పరిరక్షణలో తాము ఉన్నామనే విశ్వాసం వారిలో మరింత బలపడింది.
27. శ్రీరామకృష్ణులలో దివ్యశక్తిని ఒక్క విశేష పర్వదినాలలో మాత్రమే కాక భక్తులు తరచూ అనుభూతి చేసుకొనేవారు
శ్యాంపుకూర్లో నివసిస్తూ ఉన్నప్పుడు కేవలం విశేషమైన పండుగ రోజులలో మాత్రమే భక్తులు శ్రీరామకృష్ణులలో దివ్యశక్తి అభివ్యక్తం కావడం అనుభూతి చేసుకొన్నారనడం సబబు కాదు. కాని, రోజు సమయం అనే తారతమ్యం లేకుండా ఆయనలో ఆ దివ్యశక్తి అభివ్యక్తం కావడం భక్తులు చూసేవున్నారు. ఫలితంగా భక్తులలో గురుదేవులు మానవరూపంలోని దేవుడనే విశ్వాసం నానాటికీ బలపడసాగింది. కాని, ఒక దివ్య అభివ్యక్తీకరణలు ఎప్పుడూ అందరి ముందూ జరిగేవని అనుకోరాదు. కొద్దిమంది భక్తులకే వాటిని ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం కలిగేది. తరువాత వీరి నుండి ఆ సంఘటనలను గురించి విన్న ఇతర భక్తులలో ఆ నమ్మకం బలపడసాగిందనే విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. పై విషయాన్ని స్పష్టం చేసే కొన్ని ఉదాహరణలు ఇక్కడ పొందుపరుస్తున్నాం.
28. శ్రీరామకృష్ణులతో బలరాం సాన్నిహిత్యం పట్ల ఆతడి బంధువుల అనిష్టత
బలరాం బోస్‌కు సంబంధించిన కొన్ని విషయాలు ఇదివరకే ప్రస్తావించి ఉన్నాం. శ్రీరామకృష్ణుల పట్ల అతడూ, అతడి కుటుంబమూ భక్తిప్రపత్తులు చెల్లిస్తున్నందున అతడి బంధువులు అతడి పట్ల గుఱ్ఱుగా ఉన్నారు. అందుకు కారణం లేకపోలేదు. వీరంతా వైష్ణవులు కావడం వల్ల ఆ కాలంలో ప్రాబల్యంలో ఉన్న దీక్షాదులు స్వీకరించారు. అందువలన వీరి మతం కొంత సంకుచితంగా ఉండటంచేత వారు బాహ్యవిధులనే అధికంగా పాటించేవారు. కాబట్టి వారు అన్ని మతాలూ, సంప్రదాయాలూ భగవత్సాక్షాత్కారానికి మార్గాలే అనే శ్రీరామకృష్ణుల ఉదార సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేకపోయారు. పైగా శ్రీరామకృష్ణులు మత చిహ్నాలను కూడా ధరించరు. పరమ ఛాందసులైన వీరి అవగాహనకు ఇవన్నీ అతీతమైనవి. అందువలననే శ్రీరామకృష్ణుల సాంగత్య ఫలితంగా, ఆయన అనుగ్రహ ఫలంగా నానాటికీ ఉదార భావసంపన్నుడౌతున్న బలరాంను చూసి అతడు నాస్తికుడుగా మారిపోతున్నాడని ఆ బంధువులు అపోహపడసాగారు.
సంపద, గౌరవం, కులీనజన్మ తదితర లౌకిక ఆధిక్యతలు తరచు మనిషిలో ఒక విచిత్రమైన గర్వాన్ని, అహంకారాన్ని జనింపచేయడం కద్దు. బలరాం బంధువులు కూడా ఈ బలహీనతను సంతరించుకొన్న వ్యక్తులే. సుప్రసిద్ధుడైన కృష్ణరాం బోస్ వంశంలో జన్మించడం వలన తాము కూడా ఘనులమనుకుని వారు గర్వించేవారు. అటువంటప్పుడు వంశగౌరవాన్ని విస్మరించి సామాన్యవ్యక్తిలా ఆధ్యాత్మిక విషయాలలో ఉపదేశార్థం ఎప్పుడంటే అప్పుడు దక్షిణేశ్వరానికి శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళడం, అంతటితో ఆగక భార్య, కుమార్తె, ఇతర కుటుంబ స్త్రీలను ఆయన వద్దకు తోడ్కొని పోవడానికి వెనుకాడకపోవడం – ఇవన్నీ బలరాం బంధువులకు అవమానకరంగా తోచాయి. కాబట్టి ఎలాగైనాసరే బలరాంను, గురుదేవుల వద్దకు వెళ్ళనివ్వకుండా అడ్డుకోవాలని ఆ బంధుగణం కంకణం కట్టుకొంది.
29. బలరాంను వారు నిరోధించడం
సన్మార్గంలో తమ ఉద్దేశం నెరవేరకపోతే అహంకారపూరితులైన వ్యక్తులు చెడు మార్గాలను అవలంబించడం పరిపాటి. బలరాం బంధువులలో కొందరు ఆ కోవకు చెందుతారు. కాల్నాకు చెందిన సుప్రసిద్ధ వైష్ణవుడైన భగవాన్‌దాస్ బాబాజీ యొక్క భగవద్భక్తి, విశ్వాసాలను గుర్తుచేసీ, తమ వంశ గౌరవానికి భంగం వాటిల్లేలా వ్యవహరించవద్దని బలరాంకు నూరిపోసీ, అతణ్ణి శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళకుండా చేయాలని శతవిధాల ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో శ్రీరామకృష్ణుల పట్ల ద్వేషం పూని అవకాశం లభించినప్పుడల్లా ఆయనను దుమ్మెత్తి పోయసాగారు. అయినా శ్రీరామకృష్ణులు తమ ఇష్టదైవం అయిన విష్ణువు పట్ల ఏకాగ్రభక్తి లేనివారని, తినడం త్రాగడం మొదలైన వాటి పట్ల సంప్రదాయ వ్యతిరేకియని, తిలకనామాల చిహ్నాలు ధరించే వైష్ణవ సంప్రదాయానికి వ్యతిరేకులని ఇతరుల నుండి వినే బలరాం బంధువులు గురుదేవులను గురించి పై అభిప్రాయానికి వచ్చారని చెప్పక తప్పదు. తమ ప్రయత్నాలన్నీ వమ్ముగావడంతో, ఆఖరి ప్రయత్నంగా శ్రీరామకృష్ణ బలరాంల గురించి వికృత కథనాలు కల్పించి తమ దాయాదులైన నిమాయ్ చరణ్ బోస్, హరివల్లభ్ బోస్ చెవులలో ఊదరగొట్టసాగారు.
30. బలరాం తొలి జీవనం
కారుణ్యం, త్యాగస్ఫూర్తి, అనాసక్తత అనే సుగుణాలు సంతరించుకొన్న బలరాం జమీలూ, ఇతర ఆస్తులూ సముచితంగా నిర్వహించాలంటే కొన్ని సందర్భాలలో క్రూరంగా వ్యవహరించక తప్పదని ఎన్నడో గ్రహించాడు. కనుక తన జమీను, ఇతర ఆస్తులను నిమాయ్ బోస్ నిర్వహణలో అప్పగించి వచ్చాడు. తన ఆస్తిపాస్తులపై నిమాయ్ పంపే ఆదాయం అతడి అవసరాలన్నిటికీ సరిపోకపోయినా, బలరాం ఎలాగో అలా కుటుంబాన్ని గడుపుకొస్తున్నాడు. ఆస్తిపాస్తులను స్వయంగా చూసుకోగల శారీరకదార్యం బలరాంకు లేదు. యౌవన తొలిదశలో అతడు అజీర్ణ రోగంతో ఎంతో బాధపడ్డాడు. ఫలితంగా పన్నెండు సంవత్సరాల పర్యంతం అన్నం తినకుండా, బార్లీనీరు, పాలతో గడపవలసి వచ్చింది. ఆరోగ్యం పుంజుకొనే నిమిత్తం చాలాకాలం అతడు పూరీలోనే గడిపాడు. ఆ కాలఘట్టాన్ని అతడు జపధ్యానాలతో, సాధుసాంగత్యంతో, నిత్యం జగన్నాథ దర్శనంతో గడిపివున్నాడు. వైష్ణవ సమాజంలో ఉన్న గుణదోషాలను గ్రహించే సదవకాశం అప్పుడు అతడికి కలిగింది. కలకత్తా వదలివెళ్ళిన చాలాకాలం తరువాత ఏదో పనిమీద మళ్ళీ కలకత్తాకు వచ్చిన సందర్భంలో అతడు శ్రీరామకృష్ణులను కలుసుకోవడం తటస్థించింది.
31. శ్రీరామకృష్ణులను బలరాం కలుసుకోవడం
తన జ్యేష్ఠపుత్రిక వివాహ సందర్భంగా కొన్ని వారాలకోసం బలరాం కలకత్తాకు రావలసివచ్చింది. కాకపోతే పూర్తి పదకొండు సంవత్సరాలు అతడు పూరీలో శాంతియుతంగానే గడిపాడు. బలరాం కలకత్తాకు తిరిగి వచ్చిన కొద్దికాలంలోనే అతడి దాయాది హరివల్లభ్ బోస్, 57 రమాకాంతబోస్ వీథిలో ఒక ఇల్లు కొనుగోలు చేశాడు. పూరీలో వసిస్తున్నప్పుడు బలరాం సాధువులతో ఎంతో సన్నిహితంగా మెలగడం చూసి, సంసారాన్ని త్యజించి అతడెక్కడ సన్న్యాసం పుచ్చుకొంటాడన్న భయంతో అతడి తండ్రి, దాయాదులు రహస్యంగా సంప్రదించుకొని బలరాంను కలకత్తాలో కొనుగోలు చేసిన ఇంట్లో వసించమని చెప్పారు. సాధుసాంగత్యం, నిత్య జగన్నాథ దర్శనం రెండింటినీ కోల్పోయిన బలరాం దుఃఖభారంతో కలకత్తాకు వచ్చి నివసించ సాగాడు. ఏదో రకంగా కొన్ని రోజులు కలకత్తాలో గడిపి మళ్ళీ పూరీకి వెళ్ళగలనని మొదట్లో అతడు అనుకొన్నాడు. కాని శ్రీరామకృష్ణులను కలుసుకొన్నాక ఆ అభిప్రాయాన్ని మార్చుకొని కలకత్తాలోనే శాశ్వతంగా ఉండిపోవాలని తీర్మానించుకొన్నాడు.
కాబట్టి హరివల్లభ్ కలకత్తా ఇంటిని ఖాళీ చేయమని చెప్పినా లేదా నిమాయ్ బోస్ జమీని, ఇతర ఆస్తిపాస్తులను చూసుకోవడానికి కొఠార్కు (బలరాం స్వస్థలం) రమ్మని చెప్పినా శ్రీరామకృష్ణుల సాంగత్యాన్ని తానెక్కడ కోల్పోతానో అనే ఆందోళనతో ఇప్పుడు బలరాం కొట్టుమిట్టాడుతున్నాడు.
32. బలరాం దాయాది హరివల్లభ్ కలకత్తాకు రావడం
ఆందోళన కలిగించే ఆలోచనలు ఒక్కొక్కప్పుడు భవిష్యత్ సంఘటనలను సూచిస్తాయి. బలరాం విషయంలో ఇప్పుడు అదే జరిగింది. అతడు భయపడుతున్నదంతా నిజమైంది. బంధువుల దుష్ప్రేరణతో బలరాం దాయాదులు ఇద్దరూ అతడిపట్ల అసంతుష్టులైనట్లు సూచిస్తూ ఉత్తరాలు వ్రాశారు. పైగా ఏదో కొన్ని ముఖ్య విషయాల పరిష్కారం గురించి బలరాంను సంప్రదించడానికి హరివల్లభ్ త్వరలో కలకత్తాకు వచ్చి కొన్ని రోజులు బలరాం ఇంట్లో బస చేస్తాడనే వార్త కూడా చేరింది. తాను ఏ తప్పు చేయలేదే అని బలరాం ధీమాగా ఉన్నప్పటికీ, విధివశాత్తు ఎక్కడ శ్రీరామకృష్ణులను విడిచిపెట్టి పోవలసి వస్తుందోననే చింత అతణ్ణి వేధించసాగింది. ‘ఇతరుల మాటలు నమ్మి దాయాదులు తనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొన్నా, వ్యాధిగ్రస్థులై ఉన్న శ్రీరామకృష్ణులను ఈ సమయంలో విడిచిపెట్టి వెళ్ళను’ అనే తీర్మానానికి అతడు ఎంతో తర్జనభర్జనానంతరం వచ్చాడు. ఇంతలో హరివల్లభ్ కలకత్తాకు రానేవచ్చాడు. తనతో ఉంటున్నప్పుడు దాయాదికి ఎటువంటి అసౌకర్యమూ కలుగకుండా చక్కని ఏర్పాట్లు బలరాం చేశాడు. ఏమాత్రం భయాందోళనలు చెందకుండా తన సంకల్పాన్ని ఏమాత్రం సడలించకుండా ఇదివరలో మాదిరే శ్రీరామకృష్ణుల వద్దకు రాకపోకలు సాగిస్తూనే వచ్చాడు.
33. హరివల్లభ్ను శ్రీరామకృష్ణులు చూడగోరడం
మనస్సును ప్రతిఫలించే శ్రేష్ఠమైన అద్దం ముఖమని అంటారు. హరివల్లభ్ కలకత్తాకు వచ్చిన రోజున బలరాం తమ వద్దకు రాగానే అతడి ముఖాన్ని చూసి అతడి మనస్సులోని సంఘర్షణను శ్రీరామకృష్ణులు అవగతం చేసుకొన్నారు. బలరాంను తమ సొంతమనిషిగా ఆయన పరిగణించేవారు. అతడి ఆ దురవస్థలో సానుభూతి వహించి, ప్రక్కకు పిలిచి, అతణ్ణి అనేక రీతుల ప్రశ్నించి అసలు పరిస్థితిని తెలుసుకొన్నారు. తరువాత ఆయన, “అతడు ఎలాంటి వ్యక్తి? ఒకరోజు అతణ్ణి ఇక్కడకు తోడ్కొని రాగలవా?” అని బలరాంను అడిగారు. అందుకు బలరాం “మనిషిగా మాత్రం చాలా మంచివాడు. విద్యావంతుడు, తెలివిగలవాడు, ఉదారుడు, దానశీలుడు. సంపన్నులందరిలో సామాన్యంగా కానవచ్చే లోపం అతడిలోనూ ఉంది. చెప్పుడు మాటలు ఇట్టే నమ్మేస్తాడు. ఇతరులు చెప్పిన మాటలు విని నా గురించి తప్పుడు అభిప్రాయానికి వచ్చాడు. కేవలం నేను ఇక్కడకు వస్తున్నాననే అతడు నా పట్ల అసంతుష్టుడై ఉన్నాడు. కాబట్టి నేను రమ్మంటే అతడు ఇక్కడకు రావడం సందేహమే” అని జవాబిచ్చాడు. ఆ జవాబు విని శ్రీరామకృష్ణులు, “అలా అయితే నువ్వు అతణ్ణి అడగనవసరంలేదు. గిరీష్‌ను ఇక్కడికి రమ్మను” అని చెప్పారు.
గిరీష్ వచ్చి, హరివల్లభ్ను శ్రీరామకృష్ణులుకు పరిచయం చేయడానికి సంతోషంగా అంగీకరించాడు. అతడు ఇలా అన్నాడు : “నేనూ హరివల్లభ్ చిన్ననాటి సహాధ్యాయులం. కాబట్టి అతడు కలకత్తాకు వచ్చాడని తెలియగానే నేను వెంటనే వెళ్ళి అతణ్ణి కలుసుకోవడం కద్దు. కనుక అతణ్ణి తోడ్కొనిరావడంలో నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఈ రోజే వెళ్ళి అతణ్ణి కలుసుకొంటాను.”
34. శ్రీరామకృష్ణుల వద్దకు హరివల్లభ్ను గిరీష్ తోడ్కొని రావడం
మర్నాడు సాయంత్రం ఐదు గంటల సమయంలో గిరీష్, హరివల్లభ్ను తోడ్కొని వచ్చి, శ్రీరామకృష్ణులకు పరిచయం చేశాడు. “ఇతడు నా బాల్య మిత్రుడు, హరివల్లభ్ బోస్. కటక్‌లో ప్రస్తుతం ప్రభుత్వ న్యాయవాదిగా ఉంటున్నాడు. మిమ్మల్ని చూడడానికి వచ్చాడు” అని ఆయనతో గిరీష్ చెప్పాడు. శ్రీరామకృష్ణులు అతణ్ణి ఆప్యాయంగా ఆహ్వానించి తన ప్రక్కన కూర్చోబెట్టుకొని “నిన్ను గురించి అనేకుల మూలంగా విన్నాను; నిన్ను చూడాలనే కోర్కె కలిగింది. నీకు లెక్కలుగట్టే స్వభావం ఉందేమోనని భయపడ్డాను. (గిరీష్‌తో) నా భయం నిరాధారమైందని ఇప్పుడు తేలింది. (హరివల్లభ్ను చూపుతూ) ఇతడు బాలుడివంటసరళస్వభావి. (గిరీష్‌తో) ఇతడి కళ్ళను గమనించావా? అంతరంగం భక్తిపూరితం కాకపోతే ఇటువంటి కళ్ళు ఉండడం అసంభవం. (హఠాత్తుగా హరివల్లభ్ను స్పృశిస్తూ) అవును, నాకు ఎంతో ఆప్తుడిలా అనిపిస్తున్నావు. నీ నుండి ఎడంగా ఉండాలని నేను అనుకోలేక పోతున్నాను” అని అన్నారు. గురుదేవుల ఆ పలుకులు విని హరివల్లభ్ ఆయనకు ప్రణామం చేసి, పాదధూళి స్వీకరించి, “అదంతా మీ అనుగ్రహమే” అని అన్నాడు.
తరువాత గిరీష్ ఇలా అన్నాడు : “దైవభక్తి ఇతడికి ఉండడం సహజమే; ఎందుకంటే, సుప్రసిద్ధ భక్తుల కుటుంబంలో ఇతడు జన్మించాడు. కీర్తిశేషులైన కృష్ణరాం బోస్ భక్తిని గురించి జనులు ఎంతగానో ప్రశంసిస్తారు. అతడు ప్రాతఃస్మరణీయుడు. అతడి దైవభక్తి ఈ ప్రాంతానికి కీర్తిప్రతిష్ఠలను కొనితెచ్చిందంటే అతిశయోక్తి కాదు. అటువంటి వంశంలో జన్మించిన వాడు భక్తుడు కాకుంటే మరెవరు భక్తుడౌతాడో చెప్పండి?”
ఆ తరువాత దైవభక్తిని గురించి చర్చ ప్రారంభమైంది. భగవంతుని పట్ల విశ్వాసం, భక్తి, కేవలం ఆయనపైనే ఆధారపడి ఉండడం – ఇవి సంతరించు కొంటేనే మానవ జీవితం సార్థకమౌతుందంటూ, భక్తి గురించిన వివిధాంశాలు ముచ్చటించారు శ్రీరామకృష్ణులు. అలా మాట్లాడుతూన్నప్పుడే ఆయన భావ పారవశ్యమగ్నులైనారు. కాసేపటికి పాక్షిక బాహ్యస్మృతిలోకి వచ్చిన తరువాత మాలో ఒకరిని ఒక భక్తిగీతం పాడమన్నారు. ఆ పాటలోని అర్థాన్ని హీనస్వరంతో హరివల్లభ్కు విశదీకరిస్తూ మళ్ళీ ఆయన ప్రగాఢ భావావస్థలోకి వెళ్ళిపోయారు. పాట పూర్తి అవుతూండగానే అక్కడున్న వారిలో ఇద్దరు ముగ్గురు యువభక్తులు కూడా భావసమాధిమగ్నులైనారు. ప్రతి ఒక్కరి హృదయాలను కదలించివేసిన శ్రీరామకృష్ణుల వచనాలకు ఎంతో ముగ్ధుడైన హరివల్లభ్ కళ్ళలో ప్రేమాశ్రువులు స్రవించాయి. సూచనసమయం అయిన కాసేపటికి శ్రీరామకృష్ణుల నుండి సెలవు పుచ్చుకొని హరివల్లభ్ వెళ్ళిపోయాడు.
35. శ్రీరామకృష్ణుల స్పర్శ : తత్ప్రభావం
దక్షిణేశ్వరంలో ఉంటున్నప్పుడు ఆయన దర్శనార్థం వచ్చిన నూతన వ్యక్తి ఎవరైనా ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకంగా వాదించబోయినప్పుడు లేదా ఏదో ఒక కారణంతో ఎవరైనా ఆయనను వ్యతిరేకించాలనే ఉద్దేశంతో వచ్చినప్పుడు నేర్పుగా ఆయన వారిని స్పృశించడం తరచు మేం చూసివున్నాం. ఆ స్పర్శ ప్రభావంతో తక్షణమే ఆ దర్శనార్థులు పూర్వపు వారి మానసిక స్థితి మార్పుచెంది ఆయన ఉపదేశాలకు అనుకూలంగా స్పందించేవారు. అంటే వచ్చిన వారందరినీ అలా స్పృశించేవారని భావించరాదు. ఎవరిని చూస్తే ఆయన మనస్సు ప్రసన్నమయ్యేదో అటువంటి వ్యక్తులను మాత్రమే శ్రీరామకృష్ణులు స్పృశించేవారు. అలా స్పృశించడానికి కారణం ఏమిటో తమంత తామే ఆయన ఒక రోజు “అహంకారానికి వశవర్తులయ్యో లేదా ఆత్మన్యూనతా భావంతోనో మనుషులు ఇతరుల వచనాలను అంగీకరించడానికి ఇష్టపడరు. (తమ శరీరాన్ని చూపుతూ) కాని ఈ లోపల ఉన్న వ్యక్తిని అటువంటి వ్యక్తులు తాకిన మరుక్షణమే దైవీశక్తి ప్రభావం వలన ఆ అహంకారం మళ్ళీ తలెత్తదు. పడగెత్తి బుసలు కొడుతున్న పాము ఒక ప్రత్యేక వనమూలిక స్పర్శచేత ఎలా తల దింపివేసుకొంటుందో అలాగే ఇదీను. మాటల సందర్భంలో నేర్పుగా నేను అటువంటి వారిని స్పృశించడానికి కారణం అదే” అని తెలియజెప్పారు.
అంతకు ముందు తనలో ఉన్న వైఖరికి పూర్తి విరుద్ధంగా, శ్రీరామకృష్ణుల పట్ల అమిత గౌరవభావంతో, నాడు శ్రీరామకృష్ణుల వద్ద సెలవు పుచ్చుకొని వెళుతున్న హరివల్లభ్ను చూసి శ్రీరామకృష్ణుల పై వచనాలు మాకు చటుక్కున జ్ఞప్తికి వచ్చాయి. శ్రీరామకృష్ణులను దర్శించడంలో బలరాం తప్పు చేస్తున్నాడనే ఆలోచన అతడి దాయాదుల మనస్సులలో మళ్ళీ తలెత్తలేదు.
36. భక్తుల సంఖ్య అధికరించడం
శ్యాంపుకూర్లో ఉంటున్నప్పుడు శ్రీరామకృష్ణుల శారీరక పరిస్థితి క్షీణించ సాగింది; దాంతోబాటు ఆయనను దర్శించి అనుగ్రహం పొందాలని వచ్చే భక్తుల సంఖ్య అధికం కాసాగింది. హరీశ్చంద్ర ముస్తఫి, మణీంద్ర కృష్ణ గుప్త* మొదలైన గృహస్థభక్తులు, యువభక్తులైన శారదా ప్రసన్న (కాలాంతరంలో స్వామి త్రిగుణాతీతానంద) వంటి తదితరులు శ్రీరామకృష్ణులను ప్రప్రథమంగా ఇక్కడే చూశారు. మళ్ళీ స్వామి అభేదానంద మొదలైన వారు ఒకటి రెండుసార్లు శ్రీరామకృష్ణులను దక్షిణేశ్వరంలో చూసినప్పటికీ, ఆయనతో సన్నిహిత సాంగత్యం కలిగే అవకాశం వారికి ఇక్కడే లభించింది. ఇలా క్రొత్తగా వచ్చిన వారి గత సంస్కారాలను, నైజాన్ని గమనించి శ్రీరామకృష్ణులు వారికి భక్తిప్రధాన మార్గాన్నో లేదా జ్ఞానంతో కూడిన భక్తిమార్గాన్నో నిర్దేశించేవారు. అవకాశం లభించినప్పుడల్లా వారికి ఏకాంతంలో ఉపదేశాలిచ్చి ఆధ్యాత్మిక మార్గంలో వారు పురోగమించేలా ప్రేరేపించేవారు.
ఒక రోజు శ్రీరామకృష్ణులు ఒక యువకునికి భగవంతుని సాకార, నిరాకార రూపాలలో ధ్యానించడానికి యోగ్యమైన ఆసనాదులను ప్రదర్శించి చూపిన విషయం మాకు తెలుసు. పద్మాసనం వేసుకొని ఎడమ చేతిమీద కుడిచేయి ఉంచి, రెండు చేతులను ఛాతీదాకా ఎత్తి, కళ్ళు మూసుకొని ఆయన, “సాకార భగవంతుని ధ్యానించడానికి ఈ ఆసనం ఎంతో యోగ్యమైనది” అని అన్నారు. తదుపరి పద్మాసనం వేసుకొని కుడి ఎడమ చేతులను కుడి ఎడమ మోకాళ్ళపై ఉంచి చూపుడు వ్రేలును బొటనవ్రేలితో జతచేసి (జ్ఞానముద్రా), దృష్టిని భ్రూమధ్యంలో స్థిరం చేసి, “ఇది నిరాకార ధ్యానానికి శ్రేష్ఠమైన ఆసనం” అని ఆయన తెలిపారు. అలా చెబుతూ ఉండగానే ఆయన సమాధిమగ్నులయ్యారు. కాసేపయ్యాక బలవంతంగా మనస్సును మామూలు స్థితికి దింపి, “ఇక చూపడం సాధ్యం కాదు. ఇలా కూర్చోగానే నా మనస్సు తన్మయమై, సమాధిలో లీనమైపోతూన్నది, దేహంలోని వాయువులు ఊర్ధ్వగాములు కావడం వలన పైకెగసి గొంతులోని గాయాన్ని బాధిస్తున్నాయి. అందుకే సమాధి స్థితిలోకి పోకుండా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ మరీమరీ హెచ్చరించాడు” అని చెప్పారు.
శ్రీరామకృష్ణుల మాటలు విని ఆ యువకుడు ఎంతో బాధపడి, “ఇవన్నీ ఎందుకు ప్రదర్శించి చూపించారు? నేను అడగలేదు కదా!” అని అన్నాడు. అందుకు ఆయన, “అది నిజమే. కాని ఒకింత అయినా ప్రదర్శించి చూపకుండా, వివరించకుండా ఉండగలనా?” అని జవాబిచ్చారు. శ్రీరామకృష్ణుల అపార కరుణను, భావపారవశ్యాన్ని అమితంగా ఇష్టపడే ఆయన మనస్సును గురించి ఆలోచించిన ఆ యువకుడు విస్తుపోయాడు.
37. శ్రీరామకృష్ణుల చేతలలోని మాధుర్యం పట్ల అందరు ఆకర్షితులవడం
శ్రీరామకృష్ణుల చేతలన్నింటిలోను ఒక అనుపమానమైన మాధుర్యం ఏ మేరకు కానవచ్చేదంటే క్రొత్తగా వచ్చే అనేకులు దానిని చూసి ఇట్టే ఆకర్షితులై పోయేవారు. ఇందుకు ఉదాహరణగా ఒక సంఘటనను పొందుపరుస్తున్నాం. ఈ సంఘటనను గురించి మేం గిరీష్‌చంద్ర తమ్ముడైన అతుల్‌చంద్ర ఘోష్ నుండి విన్నాం. అతడికి మిత్రులంటే పంచప్రాణాలు. ఆ సంఘటనను అతడి మాటలలోనే పొందుపరచడానికి ప్రయత్నిస్తాం. “ఉపేంద్ర నా ఆప్తమిత్రుడు. ఇతడు సబ్జడ్జిగా మరో రాష్ట్రంలో పని చేస్తూండేవాడు. శ్రీరామకృష్ణులతో నాకు పరిచయం కలిగిన తరువాత, ‘ఈసారి నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నీ కొక అద్భుతం చూపిస్తాను’ అని అతడికి ఉత్తరం వ్రాశాను. అతడు క్రిస్మస్ సెలవులలో ఇంటికి తిరిగివచ్చినప్పుడు ఆ సంగతి నాకు జ్ఞాపకం చేశాడు. అప్పుడు అతడితో ‘శ్రీరామకృష్ణ పరమహంసగారిని నీకు పరిచయం చేయాలనుకొన్నాను. కాని ఆయన ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో శ్యాంపుకూర్లో ఉంటున్నారు. డాక్టర్లు ఆయనను మాట్లాడకూడదని నిషేధించారు. నువ్వా కొత్తవాడివి. కనుక నిన్ను అక్కడికి ఎలా తోడ్కొనిపోగలను?” అని అన్నాను. ఆ రోజు గడిచి పోయింది. మరో రోజు ఉపేంద్ర మా అన్నను (గిరీష్) చూడడానికి వచ్చాడు. మాటల సందర్భంలో శ్రీరామకృష్ణుల ప్రస్తావన వచ్చింది. ‘అతుల్‌తో ఒక రోజు కలిసి వెళ్ళి ఆయనను నువ్వు ఎందుకు చూసిరాకూడదు?’ అన్నాడు మా అన్న. అందుకు ఉపేంద్ర, ‘ఆరు నెలల నుండి నన్ను అక్కడకు తీసుకుపోతానని చెబుతూనే ఉన్నాడు. కాని ఇక్కడకు నేను వచ్చిన తరువాత దానిని గురించి జ్ఞాపకం చేస్తే, ఇప్పుడు సాధ్యం కాదంటున్నాడు’ అని చెప్పాడు. ఆ మాట విని నేను మా అన్నతో, ‘ప్రస్తుతం మనలను కూడా ఎప్పుడంటే అప్పుడు ఆయన వద్దకు అనుమతించడం లేదు. అటువంటప్పుడు ఒక క్రొత్తవ్యక్తిని నేనెలా తోడ్కొనిపోగలను?’ అని చెప్పాను. ‘ఏది ఏమైనప్పటికి ఇతణ్ణి ఒకసారి తీసుకువెళ్ళు. అదృష్టం బాగుంటే గురుదేవులు దర్శనం ఇచ్చి ఆదరిస్తారు’ అన్నాడు మా అన్న.
38. శ్రీరామకృష్ణులను ఉపేంద్ర దర్శించడం
“ఆ తరువాత ఒక రోజు మధ్యాహ్నం ఉపేంద్రను అక్కడకు తీసుకువెళ్ళాను. రెండు పెద్ద చాపల మీద కూర్చున్న భక్తులతో శ్రీరామకృష్ణుల గది క్రిక్కిరిసిపోయి ఉంది. చిత్రకళ (ప్రఖ్యాత చిత్రకారుడు అన్నదా బాగ్చి ఆ రోజు అక్కడే ఉన్నాడు), స్వర్ణకారుల అంగడిలో బంగారాన్ని కరిగించడం* వంటి అనేక మామూలు విషయాలు గురించి మాటలు సాగుతున్నాయి. చాలాసేపు మేం అక్కడ కూర్చున్నప్పటికీ అటువంటి వ్యర్థప్రసంగాలతోనే కాలం గడిచింది. అప్పుడు నేనిలా ఆలోచించాను: ‘ఈ రోజు ఈ క్రొత్త వ్యక్తిని తోడ్కొని వచ్చాను. ఈ రోజే వ్యర్థ ప్రసంగాలతో కాలం గడిచిపోతున్నది. గురుదేవులను గురించి ఇతడు (ఉపేంద్ర) ఏమనుకొంటాడు?’ అని నేను విసుగు చెందసాగాను. మధ్యమధ్యలో నా మిత్రుడి వంక బెరుకుగా చూడసాగాను. కాని అతడి ముఖంలో ఆ ప్రసంగాలను ఆనందంగా వింటున్న ధోరణి ద్యోతకమైంది. ఇక పోదామని అతడికి సైగ చేశాను. కాని కాసేపు ఉండమని అతడు సైగ ద్వారా తెలిపాడు. రెండు మూడుసార్లు నేను సైగ చేసిన తరువాత, అతడు లేచి నా వద్దకు వచ్చాడు. అప్పుడతణ్ణి, ‘ఇంతసేపటి నుండి ఏం వింటున్నావు? ఏముంది ఆ మాటల్లో వినడానికి? నిన్ను ‘బాంగాల్’ అని మేం ఊరకేనా పిలుస్తున్నాం?’ అని అడిగాను. అలా మేం అతణ్ణి సంబోధించడానికి కారణం అతడి నుదుటి మీద పచ్చబొట్టు ఉండడమే. అందుకు అతడు, ‘కాదు, వినడానికి ఎంతో ఇంపుగా ఉంది. విశ్వజనీన ప్రేమను గురించి నేను ఇంతకు మునుపు విని ఉన్నాను. కాని ఎవరిలోను దాని అభివ్యక్తీకరణను ఎన్నడూ చూడలేదు. అటువంటి చిన్నచిన్న విషయాలలో అంత ఆనందం పొందుతూన్న ఈయనలో (శ్రీరామకృష్ణులలో) దానిని నేడు చవిచూశాను. మళ్ళీ ఒకసారి రావాలి; ఆయనను మూడు ప్రశ్నలు అడగాలి’ అని జవాబిచ్చాడు.
“మరునాటి ఉదయం నేను మళ్ళీ ఉపేంద్రుణ్ణి తీసుకొనివెళ్ళాను. ఆ సమయంలో గురుదేవుల వద్ద దాదాపు ఎవరూ లేరనే చెప్పాలి. ఒకరిద్దరు సేవకులు మా బావ మల్లిక్ మాత్రం ఉన్నారు. బయలుదేరే ముందే ‘అడగ వలసిందేమిటో నువ్వే అడుగు. అప్పుడే నీకు తృప్తికరంగా జవాబులు లభిస్తాయి. మరెవరి మూలంగాను మాత్రం ప్రశ్నలను అడిగించవద్దు’ అని పదేపదే ఉపేంద్రను హెచ్చరించాను. కాని అతడు బిడియపడే నైజం గలవాడు. వద్దని చెప్పిన పనే చేశాడు. మల్లిక్ ద్వారా తన ప్రశ్నలను అడిగించాడు; గురుదేవులు ఏదో సమాధానం చెప్పారు. ఆ సమాధానం అతడికి సంతృప్తి కలిగించలేదని అతడి ముఖమే చెప్పక చెప్పింది. అప్పుడతడితో మెల్లగా, ‘మరింకేమౌతుంది! నిన్నే అడగమని పదేపదే చెప్పలేదా? నువ్వే స్వయంగా ఆయనను ఎందుకు ప్రశ్నించవు? నీ ప్రశ్నలు అడగడానికి ఒక న్యాయవాదిని నియమించుకోవాలా?’ అని అన్నాను.
39. భగవంతుడు సాకారుడు, నిరాకారుడు కూడా
“ఉపేన్ ధైర్యం పుంజుకొని స్వయంగా శ్రీరామకృష్ణులను, ‘మహాశయా! భగవంతుడు సాకారుడా లేదా నిరాకారుడా? ఆయన రెండూ అయిన పక్షంలో ఏకకాలంలో పరస్పర విరుద్ధమైన స్వభావాలను ఎలా కలిగి ఉంటాడు?’ అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు వెంటనే శ్రీరామకృష్ణులు, ‘మంచుగడ్డ, నీరులా భగవంతుడు సాకారుడు, నిరాకారుడు కూడా’ అని జవాబిచ్చారు. ఉపేన్ కళాశాలలో విజ్ఞానశాస్త్రం అభ్యసించాడు. కాబట్టి ఆ ఉదాహరణ అతడికి ఎంతో తృప్తినిచ్చింది. గురుదేవులిచ్చిన జవాబును విజ్ఞానశాస్త్ర సహాయంతో అవగతం చేసుకొని ఉపేంద్ర ఎంతో సంతోషించాడు. ఆ ఒక్క ప్రశ్నే అడిగి అతడు ఊరకుండి పోయాడు. పిదప గురుదేవులకు ప్రణామం చేసి, సెలవు పుచ్చుకొని బయటకు వచ్చేశాడు. బయటకు రాగానే, ‘ఉపేంద్రా, మూడు ప్రశ్నలు అడుగుతానన్నావు కదా! ఒక్క ప్రశ్నే అడిగి ఎందుకు వచ్చేశావు?’ అని అడిగాను. అందుకు అతడు, ‘అర్థం కాలేదా? ఆ ఒక్క జవాబు లోనే నా మూడు ప్రశ్నలకూ సమాధానం లభించింది’ అని చెప్పాడు.
40. రాంచంద్ర మాటలతో అతుల్ చికాకుపడడం
“సోదరుడైన రాం (రాంచంద్ర దత్త) పెందలకడనే భోజనం చేసి ఆఫీసు దుస్తులను సంచీలో వేసుకొని తరచు శ్రీరామకృష్ణుల వద్దకు వస్తూవుండడం బహుశా మీకు జ్ఞాపకం ఉండవచ్చు. అలా వచ్చి ఒకటి రెండు గంటలు అక్కడ గడిపి, తరువాత ఆఫీసు దుస్తులు ధరించి, వెళ్ళిపోయేవాడు. ఆ రోజు గురుదేవులు ఉపేంద్రుని ప్రశ్నకు సమాధానం చెబుతున్నప్పుడు హఠాత్తుగా రాం అక్కడకు వచ్చి ఆఫీసు దుస్తులు ధరిస్తూ గురుదేవుల మాటలు విన్నాడు. తరువాత మే మిద్దరం బయటకు రాగానే రాం, ‘సోదరా, అతుల్! ఉపేన్‌ను నా వద్దకు తోడ్కొనిరా. అతడి ప్రశ్నకు గురుదేవులు ఇచ్చిన జవాబును అతడు అర్థం చేసుకోలేడు. శ్రీరామకృష్ణుల వచనాలను అవగతం చేసుకోవాలంటే నా ‘తత్త్వప్రకాశిక’ పుస్తకాన్ని అతడు చదవాలి’ అని చెప్పాడు. అతడి మాటలు నాకు చిరాకు పుట్టించాయి. నేను నిస్సంకోచంగా, ‘మా కంటే ఏడు సంవత్సరాల ముందు నుండే మీరు గురుదేవుల వద్దకు వస్తూ ఉన్నది నిజమే కదా! శ్రీరామకృష్ణుల వచనాల నుండి అతడు సత్యాన్ని అర్థం చేసుకోలేడనీ, మీ పుస్తకం నుండి మాత్రమే గ్రహించగలడనీ ఎలా చెప్పగలుగుతున్నారు? గురుదేవులు విశదీకరించలేని విషయాన్ని మీ పుస్తకం విశదీకరిస్తుందా? ఎంత విపరీత ధోరణి! కాని మీ పుస్తకాన్ని ఉపేంద్రకు నిరాక్షేపణీయంగా ఇవ్వండి. అది వేరే విషయం’ అని చెప్పాను. ఆ మాటలతో రాం సిగ్గుపడి, పుస్తకాన్ని ఉపేంద్రకు ఇచ్చాడు.”