1. శ్రీరామకృష్ణుల యోగ శక్తుల గురించి వినే జనసామాన్యం ఆయన పట్ల భక్తిప్రపత్తులు చూపించేవారు
శ్రీరామకృష్ణుల దివ్యప్రవృత్తిని గురించి అనేకులు, అనేక విధాలుగా మాట్లాడుతుంటారు. తరచి చూసినప్పుడు అత్యధిక సంఖ్యాకులు శ్రీరామకృష్ణుల పట్ల కనబరిచే భక్తిప్రపత్తులకు కారణం ఆయన అలౌకిక యోగిక శక్తులే అని తెలియవస్తుంది, ‘ఆయనను మీరెందుకు గౌరవిస్తున్నారు?’ అని ఒక వ్యక్తిని అడిగినప్పుడు, ఆ వ్యక్తి జవాబు ఈ తీరులో ఉంటుంది: దక్షిణేశ్వర కాళికాలయంలో కూర్చుని సుదూరాలలో జరిగే సంఘటనలను ఆయన చూశారు; స్పర్శ మాత్రంతో కొన్ని సమయాలలో శారీరక రుగ్మతలను నయం చేశారు; దేవీదేవతలను సదా దర్శిస్తూ, వారితో సంభాషిస్తారు; ఆయన వాక్కు బ్రహ్మవాక్కు, ఆయన వచిస్తే అసంభవం సైతం బాహ్యప్రకృతి నియమాలను ఉల్లంఘించి జరిగే తీరుతుంది. మరణశిక్ష పొందిన వ్యక్తి కూడా ఆయన అనుగ్రహానికి కించిత్తు పాత్రుడైతే, మరణశిక్ష నుండి తప్పించుకోవడమే కాక ప్రత్యేక గౌరవాన్ని కూడా పొందుతాడు; అలాగే ఎర్రని పువ్వులను మాత్రమే పూచే చెట్టు ఆయన వాక్కు ప్రభావంతో తెల్లని పువ్వులు పూస్తుంది. లేదా శ్రీరామకృష్ణులు ఎదుటి వ్యక్తి ఆలోచనలు చదవగలరని కొందరంటారు; ఆయన అంతర్దృష్టి స్థూల ఆవరణాన్ని ఛేదించి వ్యక్తి అంతరంగంలోని ఉద్దేశాలను పసిగట్టగలరు; ఆయన సుతిమెత్తని చేతి స్పర్శమాత్రాన అల్లకల్లోలితమైన భక్తుల మనస్సులు ఉపశమించి, వారికి ఇష్టదేవతా మూర్తుల దర్శనం కలిగి, వారి ధ్యానం ప్రగాఢమౌతుంది; యోగ్యులైన కొందరికి ఆయన సంకల్ప మాత్రంచే నిర్వికల్ప సమాధి ద్వారం తెరచుకొంటుంది.
కొందరు ఇలా అంటారు : “ఆయన పట్ల మాకు భక్తిప్రపత్తులు ఎందుకున్నాయో మాకు తెలియదు. ఆయనలో మేం ఎంతటి అద్భుత సమగ్ర భక్తిజ్ఞానాలను చూశామో కదా! అటువంటి మరొక వ్యక్తిని లోకం ఆరాధించే వారిలోగాని, వేద పురాణాదులు ఉత్కృష్టంగా శ్లాఘించిన మహనీయులలోగాని మేం చూడడం అసంభవం; ఇక సమకాలీనులలో చూడగలమని చెప్పడం అనవసరం! శ్రీరామకృష్ణులతో పోల్చి చూసినప్పుడు పైన పేర్కొన్న వారు వెలవెలబోతారనడం అతిశయోక్తి కాబోదు! ఇలా భావించడం మా భ్రమో కాదో తేల్చి చెప్పలేకపోతున్నాం; కాని ఒక్కటి మాత్రం నిజం. ఆ దివ్యప్రకాశం చూసి మా కళ్ళు బైర్లుక్రమ్మాయి; మా మనస్సులు ఆయన ప్రేమలో శాశ్వతంగా లీనమై పోయాయి; వెనక్కు మరలించాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడంలేదు. జ్ఞానం, తర్కం, హేతువాదం స్తంభించిపోయాయి. ఇంత మాత్రమే చెప్పగలం :
‘ఓ దయానిధీ, జన్మ జన్మలకు నేను నీ దాసుణ్ణి
నా గమ్యమేమిటో నే నెరుగను
నా గతి ఏమిటో అదీ తెలియదు
తెలుసుకోవాలనే ఆకాంక్ష సైతం లేదు
నీ ఆదేశంతో భుక్తిని ముక్తిని భక్తిని
జప తప భజన సాధనల నన్నిటినీ త్రోసిరాజన్నాను
ఉన్నది కేవలం ఒక్క కోర్కె – నిన్ను తెలుసుకోవాలని
దానికి కూడా అతీతంగా నన్ను తీసుకెళ్ళు, ‘ప్రభూ!’”*
కనుక పైన పేర్కొన్న చివరి కోవలోని కొద్దిమంది విషయం వదలిపెడితే, తక్కిన వారందరికీ శ్రీరామకృష్ణుల పట్ల అంతటి భక్తివిశ్వాసాలు ఏర్పడడానికి నిజమైన కారణం ఆయనకు గల అలౌకిక యోగిక శక్తులే అన్న విషయం సుస్పష్టమౌతున్నది. శ్రీరామకృష్ణుల పట్ల భక్తిప్రపత్తులు కలిగి ఉంటే తమ రుగ్మతలు నయమౌతాయనో లేదా కష్టకాలం ఎదురైనప్పుడు తమకు అనుకూలంగా పరిస్థితులు చక్కబడతాయనో మందబుద్ధులు భావించడం పరిపాటి. నిజాయతీతో ఒప్పుకోకపోయినా ఆ సదరు వ్యక్తులలో స్వార్థమనే ప్రవాహం పరవళ్ళుత్రొక్కి ప్రవహిస్తూందనే విషయం తెలుసుకోవడానికి ఎక్కువ కాలం పట్టదు.
ఇక ఇంతకంటే సూక్ష్మబుద్ధులు కొందరున్నారు. దూరశ్రవణం మొదలైన అణిమాది సిద్ధులను పొందడానికి లేదా ఆయన అనుయాయులలో ఒకరై గోలోకమో, వైకుంఠమో చేరుకొని అక్కడ ఉండిపోవడానికి వీరు శ్రీరామకృష్ణులను ఆరాధిస్తారు.
లేదా బుద్ధిశక్తి మరింత సూక్ష్మమైనవారు శ్రీరామకృష్ణులను ఉపాసించి సమాధిస్థితి పొందాలనే, లేదా జననమరణ చక్రం నుండి ముక్తి పొందాలనే అభిలాష గలవారై కనిపిస్తారు. వీరి విశ్వాసానికీ వెనుక స్వార్థపరత్వం ఉందని సులభంగానే అర్థం చేసుకోవచ్చు.
శ్రీరామకృష్ణుల దివ్యశక్తులను చాటే దృష్టాంతాలు అనేకం; తమ కోర్కెలు ఈడేర భక్తులు ఆయనను సకామభక్తితో ఆరాధించినా కూడా తద్ద్వారా వారికి ఎంతో మేలు కలగడమన్నదీ సత్యమే; అయినప్పటికీ ఈ విషయాలను చర్చించడం మా ఉద్దేశం కాదు. శ్రీరామకృష్ణుల వైశిష్ట్య మానవ ప్రవృత్తిని చిత్రీకరించడమే మా ఉద్దేశం.
2. సకామభక్తి ఆధ్యాత్మిక పురోగతికి హానికరం
సకామభక్తి, అంటే ఏవైనా కోర్కెలను తీర్చుకోవాలనే ఉద్దేశంతో శ్రీరామకృష్ణుల పట్ల భక్తి కలిగివుండడం; ఇది సత్యసాక్షాత్కార అధిరోహణకు ఆటంకంగా నిలుస్తుంది. స్వార్థపరత్వం సదా భయాన్నే కలిగిస్తుంది, భయమే సత్వరం మనిషిని దుర్బలుణ్ణి చేసివేస్తుంది. మళ్ళీ స్వార్థసిద్ధి మనిషి మనస్సులో అహంకారాన్ని, అట్లే ఒక్కొక్కప్పుడు సోమరితనాన్ని పెంచి, అతడి కళ్ళను కప్పివేస్తుంది. కాబట్టి అతడు సత్యాన్ని దర్శించలేడు. అందువలననే తమ భక్తులలో ఈ లోపం రాకూడదనే ఉద్దేశంతో శ్రీరామకృష్ణులు ఒక కంట వారిని గమనిస్తూనే ఉండేవారు. ధ్యానాదులు అనుష్ఠిస్తున్న ఫలితంగా తమ భక్తులలో ఎవరిలోనైనా దూరదర్శనం లేదా దూరశ్రవణం ఇత్యాది శక్తులు అభివ్యక్తమౌతున్నాయని చూచాయగా తెలుసుకొన్న తక్షణం ఆ భక్తుడి మనస్సులో అహంకారం తలెత్తి భగవత్సాక్షాత్కార లక్ష్యం నుండి అతణ్ణి వైదొలగ చేస్తుందని, వారిని కొంతకాలం దాకా ధ్యానాదులు అనుష్ఠించడం ఆపమని నిషేధించేవారు. ఆయన అలా చేయడం మేం ఎన్నోసార్లు చూశాం. ఇటువంటి శక్తులను పొందడం మానవ జీవిత పరమావధి కాదని పదేపదే ఆయన వక్కాణించడం మేం వినివున్నాం.
అయినా దుర్బలుడైన వ్యక్తి అటువంటి మాటలను వింటాడా? లాభ నష్టాలు బేరీజు వేయకుండా ఎవడైనా ఏదైనా చేస్తాడా? ఎవరినైనా గౌరవిస్తాడా? త్యాగవైరాగ్యాలకు ప్రతిరూపులైన శ్రీరామకృష్ణుల జీవితాన్ని చూసి త్యాగగుణాన్ని అలవరచుకోవడానికి మారుగా తన స్వార్థసిద్ధి కోసమే ఆయనను ఆశ్రయిస్తాడు. శ్రీరామకృష్ణుల త్యాగవైరాగ్యాలు, అసాధారణ సాధనానుష్ఠానాలు, సత్యసంధత, పిల్లవాడి వంటి సరళత్వం, భగవద్విశ్వాసం – ఇవన్నీ తన కోర్కెలు తీర్చడం కోసమేనని దుర్బలుడైన భక్తుడు భావిస్తాడు. ఈ వైఖరికి కారణం మానవ దౌర్బల్యమే. కాబట్టి శ్రీరామకృష్ణుల మానవ ప్రవృత్తిని గురించి చర్చించడం మనకెంతో మేలు ఒనగూరుస్తుంది.
3. యథార్థభక్తి ఉపాసకుని ఉపాస్యుని వలే మారుస్తుంది
కొద్దిపాటి భక్తినైనా నిష్ఠతో అనుష్ఠిస్తే అది భక్తుణ్ణి అతడి ఇష్టదేవతలా మార్చివేస్తుంది. లోకంలోని అన్ని మత గ్రంథాలూ ఈ విషయాన్ని చాటి చెప్పడం సువిదితమే. శిలువ వేయబడిన ఏసుక్రీస్తును ధ్యానిస్తూ ఏకాగ్రచిత్తులైన క్రైస్తవ భక్తుల కాళ్ళ నుండి, అరచేతుల నుండి రక్తం స్రవించడం; శ్రీకృష్ణ విరహిణియైన రాధాదేవిని తదేక చిత్తంతో ధ్యానించిన ఫలితంగా శ్రీచైతన్యులు తన దేహంలో భరించలేని మంటను అనుభవించడం, అదే విధంగా ఒక్కొక్కప్పుడు కళేబరంలా పడివుండడం; నిశ్చల ధ్యానమగ్నుడైన బుద్ధదేవుని విగ్రహం ఎదుట కూర్చుని ఆయనను తదేకంగా ఎంతో సేపు ధ్యానిస్తూ నిశ్చల భంగిమలో ఉండిపోయే బౌద్ధభక్తులు – పై విషయానికి కొన్ని దృష్టాంతాలుగా చెప్పవచ్చు.
అలాగే ఎవరో ఒక ప్రత్యేక వ్యక్తిని గాఢంగా ప్రేమించి సదా ఆ వ్యక్తిని గురించే ధ్యానిస్తూ, ధ్యానిస్తూ తనకు తెలియకుండా క్రమంగా తన ప్రేమాస్పదుడిలా మారిపోవడమే కాక ఆ వ్యక్తి హావభావాలూ, ఆలోచనా సరళి కూడా అట్లే సంతరించుకోవడం మేం కళ్ళారా చూసివున్నాం. కాబట్టి మనకు శ్రీరామకృష్ణుల పట్ల కించిత్తు అయినా భక్తిప్రేమలుంటే మన దైనందిన జీవితం ఏ కొంతమేరకైనా ఆయన మాదిరి కాక తప్పదు. అలా కాకపోతే అవి యథార్థ భక్తిప్రేమలు కావు అనే నిర్ణయించాలి.
ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తవచ్చు: “అలాంటప్పుడు మనలో ప్రతి ఒక్కరం ఒక శ్రీరామకృష్ణ పరమహంస కాగలమా? ఒక వ్యక్తి, సంపూర్ణంగా మరొక వ్యక్తిలా కావడం ఈ ప్రపంచంలో చూసివున్నామా?” ముమ్మూర్తులా కాకపోయినా ఒకే మూసలో పోతపోసిన వారిలా తప్పక మారగలరని మేం భావిస్తాం. ఆధ్యాత్మిక జగత్తులోని ప్రతి మహాత్ముడు ఒక్కో ప్రత్యేకమైన మూసవంటివారు. ఆ మూసలలో పోతపోయబడిన వారి శిష్యప్రశిష్యులు ఆ విభిన్న మూసలను నేటిదాక పదిల పరుస్తూ వస్తున్నారు. మనిషి శక్తి స్వల్పం; జీవితాంతం ప్రయత్నించి కూడా తమ జీవితాలను ఆ నమూనాల మాదిరి మలచుకోవడం సాధ్యంకాదు. అదృష్టవశాత్తు ఎవరైనా అలా మలచుకోగలిగితే అటువంటి వారిని మనం సిద్ధపురుషులుగా ఆరాధిస్తాం. అటువంటి సిద్ధపురుషుడి మాట, చింతన, ప్రవర్తన మొదలైన భౌతిక మానసిక క్రియలన్నీ అతడు అనుసరించే ఆ మహాపురుషుడి మాదిరిగా మారిపోతాయి. ఏ మహాశక్తి ఆ ఆదర్శ మహాపురుషుడిలో మొట్టమొదటిసారిగా అభివ్యక్తమై లోకాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిందో, ఆయనను అనుకరించిన సిద్ధ పురుషుడి మనస్సులో దేహంలో అభివ్యక్తమై, దానిని ఇతరులకు పంచి ఇవ్వగలిగే పరికరంగా వికాసం చెందుతుంది. అనాది నుంచి ఇలా ఎందరో మహాత్ముల, అవతార పురుషుల ఆధ్యాత్మిక శక్తులు, వారి శిష్యప్రశిష్యుల మూలంగా పరిరక్షితమై వస్తూన్నాయి.
4. అవతార పురుషుల జీవితాలను అధ్యయనం చేసినప్పుడు గోచరించే అపూర్వ విషయాలు
ఆధ్యాత్మిక జగత్తులో ఏ మహాత్ములు తమ జీవితాలలో కొంగ్రొత్త మూసలను, అంటే ఆదర్శాలను ప్రకటించిపోతుంటారో వారే ‘అవతార పురుషులు’ గా పూజింపబడుతున్నారు. ఈ అవతార పురుషులు క్రొత్త ఆధ్యాత్మిక సత్యాలను, మార్గాలను ఆవిష్కరిస్తారు. కేవలం స్పర్శమాత్రాన వీరు ఇతరులలో ఆధ్యాత్మిక శక్తిని అందించగలరు. ఈ అశాశ్వత లోకంలోని కామకాంచనాదులకై వారు తమ శక్తిని వ్యయం చేయరు. భగవత్సాక్షాత్కార మార్గాన్ని ఇతరులకు చూపడం కోసమే వారు జన్మిస్తారనే విషయం వారి జీవితాలను అధ్యయనం చేసినప్పుడు మనకు స్పష్టమౌతుంది; స్వీయ సుఖం లేదా ముక్తి వారి లక్ష్యం కానే కాదు. ఇతరుల దుఃఖాలను చూసి జాలిపడి వారి పట్ల ప్రవహించే అనంత ప్రేమే ఈ మహాపురుషులను కార్యక్షేత్రంలోకి ఉరికిస్తుంది, దుఃఖనివృత్తి మార్గాన్ని ఆవిష్కరించి వారికి దోహదం చేస్తారు.
శ్రీరామకృష్ణుల దివ్యరూప సందర్శనం మాకు కలిగేటంత వరకు శ్రీకృష్ణుడు, బుద్ధుడు, ఏసుక్రీస్తు, శంకరుడు, చైతన్యుడు మొదలైన అవతార పురుషులలో దాగివున్న ఆధ్యాత్మిక శక్తుల గురించి బొత్తిగా మాకు తెలియదనడం అతిశయోక్తి కాదు. వారి జీవితాలలో జరిగిన అలౌకిక సంఘటనలు, తమ సంప్రదాయాలను బలపరచుకోవడం కోసమే వారి శిష్యప్రశిష్యులు కల్పించిన కథలుగా మేం భ్రమపడేవారం. అవతార పురుషులు కూడా నేటసభ్యసమాజం నమ్మలేని కాల్పనిక జీవులనే భావించేవారం. లేదా భగవంతుడు అవతరించడం సంభవమని నమ్మినా, మనలో మాదిరే వారిలోనూ మానవ ప్రవృత్తులుంటాయనే నమ్మకం కలిగేది కాదు. వారి దేహాలలో కూడా మనలోలాగానే రోగాలు జనిస్తాయని, వారి మనస్సులలో కూడా సుఖదుఃఖాలు ఉంటాయని, సరిగ్గా మనలో మాదిరే వారిలోను దేవుడు – సైతాన్ (దయ్యం) మధ్య పోరాటం జరుగుతూ ఉండవచ్చుననీ మేం నమ్మేవారం కాదు. కాని శ్రీరామకృష్ణుల పావన సాంగత్యం వలన అలా జరగడం సత్యమనే విషయం మేం గ్రహించగలిగాం.
అవతార పురుషులలో దేవ–మానవ ప్రవృత్తులు ఎంతో అద్భుత రీతిలో సామరస్యం చెందివుంటాయని మనం చదివో లేక వినో ఉంటాం. కాని శ్రీరామకృష్ణులను దర్శించడానికి ముందు ఏ వ్యక్తిలోనూ బాలక భావం, కఠోర నియమాల పురుషభావం రెండూ సామరస్యం చెందివుండగలవని మేం నమ్మేవారం కాము.
శ్రీరామకృష్ణుల సరళ శిశు స్వభావమే తమను ఎంతగానో ఆకర్షించిందని ఎంతోమంది చెబుతూంటారు. అమాయకుడైన బాలుడు అందరి ప్రేమను సహజంగానే చూరగొంటాడు; అతణ్ణి కాపాడే వారంతా తమంతట తాముగానే ముందుకొస్తారు. కాస్త వయస్సు పైబడ్డప్పటికీ శ్రీరామకృష్ణులను చూసిన వారి మనస్సులలో కచ్చితంగా అటువంటి భావమే ఉదయించేది. అందువలన వారు ముగ్ధులై ఆయన పట్ల ఆకర్షితులయ్యేవారు. కొంతమేరకు ఈ విషయం నిజమే; కాని కేవలం ఈ ప్రవృత్తి మాత్రమే జనసామాన్యాన్ని ఆకర్షించిందని మేం అనుకోం. ఎందుకంటే, ఆయనను దర్శించినప్పుడు పొందిన ప్రేమ, ఆనందాలతోపాటు అదే సమయంలో ఆయన పట్ల భక్తివిశ్వాసాలు కూడా ఉదయించేవని మేం అనుభవపూర్వకంగా గ్రహించాం. కుసుమకోమలమైన శిశుస్వభావం అనే ముసుగు కప్పివుంచిన ఆయనలోని మహాశక్తే ఆ ఆకర్షణకు కారణం. శ్రీరాముడి అలౌకిక శీలాన్ని సుప్రసిద్ధ కవివరేణ్యుడైన భవభూతి ఇలా అభివర్ణించాడు :
వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి ।
లోకోత్తరాణాం చేతాంసి కోను విజ్ఞాతుమర్హతి ॥
వజ్రం కంటే కఠోరంగానూ, పువ్వుల కంటే మృదువుగానూ లోకోత్తర పురుషుల మనస్సులు ఉంటాయి; అటువంటి వారిని తెలుసుకోవడం ఎంత కష్టమో!
శ్రీరామకృష్ణుల విషయంలోను పై విషయం యథాతథంగా వర్తిస్తుంది. అలౌకిక సంఘటనలను పరిశీలించే వారికి శ్రీరామకృష్ణుల శిశు స్వభావం ఒక సరిక్రొత్త అనుభవం. ప్రగాఢ విశ్వాసం, ఎల్లలెరుగని సరళత్వం, సత్యనిష్ఠ ఆయన మనస్సులో సదాసర్వదా అభివ్యక్తమౌతూ ఉంటాయి; కాని లౌకికులు ఆయనలో లోకజ్ఞానం కొరవడడం మాత్రమే గమనించేవారు. అందరి మాటలను ముఖ్యంగా మత చిహ్నాలను ధరించే వారి మాటలను ఆయన విశ్వసించేవారు. దేశంలో, తమ స్వగ్రామంలో ప్రచారంలో ఉన్న భావాలు శ్రీరామకృష్ణుల అద్భుత శిశుస్వభావ ప్రవృత్తి పూర్ణవికాసానికి ఎంతో దోహదం చేశాయి.
5. కామార్పుకూర్ – శ్రీరామకృష్ణుల జన్మస్థలం
విస్తృతమైన ఆకుపచ్చని వరిపొలాలతో ఆకుపచ్చ సముద్రంలా కాన వస్తున్న సువిశాల ప్రదేశం; సముద్రంలోని చిన్నిచిన్ని ద్వీపాలలా కానవస్తున్న వెదురు, మర్రి, ఖర్జూరం, మామిడి, రాగి వంటి చెట్ల క్రింద శుభ్రమైన కృషీవలుల పూరిళ్ళు; ఎత్తైన ఈత చెట్లతో ఆవృతమైన హాల్దార్పుకూర్ వంటి పెద్ద చెరువులు; ముదురు నీలిరంగు ఆకులతో కప్పబడివున్న ఆ చెరువుల నీలిజలం; చిన్నవైనా సుప్రసిద్ధమైన ‘వృద్ధ శివుని’ వంటి దేవుళ్ళను ప్రతిష్ఠించిన గుళ్ళు; శిథిలావస్థలో అనతి దూరాన కనిపిస్తున్న మందారన్ కోట; గ్రామ శివార్లలో తాతముత్తాతల ఎముకలు చెల్లాచెదరై పడి ఉన్న శ్మశానవాటికలు; వాటి ప్రక్కన పచ్చికబయళ్ళు; కాస్త దూరంలో దట్టమైన మామిడి తోపు; తోపు చుట్టూ వంకరటింకరగా ప్రవహిస్తూన్న ‘భూతి’ అనే వాగు; బర్ద్వాన్ నుండి పూరీకి తీసుకుపోయే, సదా రద్దీగా ఉండి దాదాపు గ్రామాన్ని చుట్టుకొనిపోయే కాలిబాట – ఇదే కామార్పుకూర్, శ్రీరామకృష్ణుల జన్మస్థలం.
6. బాల రామకృష్ణుల అద్భుత ప్రవర్తన
చైతన్య మహాప్రభువు స్థాపించిన వైష్ణవ మతమే ఈ ప్రాంతాలలో అధికంగా అనుసరింపబడుతూన్నది. రైతులు పొలాలలో పనిచేస్తూనో లేదా సాయంత్రం పనులన్నీ పూర్తయ్యాకనో భగవత్సంకీర్తనం చేస్తూ తమ శ్రమను మరచిపోయేవారు. సరళ విశ్వాసమే వీరి మతానికి మూలం. మనుగడకోసం పెనుగులాటకు దూరంగా ఉన్న ఆ ప్రశాంత గ్రామ వాతావరణానికి, ఆ సరళ విశ్వాసానికి పసిహృదయం కూడా అనుకూల రంగమౌతుంది. బాల శ్రీరామకృష్ణుల విషయంలో అట్లే జరిగింది; ఆయన బాలుని వంటి ప్రవర్తన ఒక అద్భుతంగా అక్కడ పరిగణింపబడేది. ఆయన అద్భుత చేతలను అవగతం చేసుకోలేకపోయినా ఆయన ఉత్కృష్ట లక్ష్యాన్ని, ఆ లక్ష్యం పట్ల కనబరిచే ఏకాగ్రతను చూసి ప్రతి ఒక్కరూ విస్తుపోయేవారు. ‘రామ నామం మనిషిని పవిత్రునిగా చేస్తుంది’ అనే విషయం హరిదాసుని ముఖతా విని అప్పుడప్పుడు బాల రామకృష్ణులు, ‘అదే నిజమైతే హరిదాసుగారు ఇప్పటికీ ఆచమనాదులు చేయడం ఎందుకో?’ అని ప్రశ్నించేవారు. అలాగే ఒక పౌరాణిక నాటకాన్ని ఒక్కసారి వినగానే, అతడికది కంఠస్థమయ్యేది. తరువాత ఆ ఊరి మామిడితోపులో నేస్తాలతో కలిసి ఆ నాటకాన్ని ప్రదర్శించేవాడు. ఆ దారినే పోతున్నవారు ఆ పిల్లలు ప్రదర్శిస్తున్న నాటకాన్ని చూసి, వారు ఆలాపిస్తున్న భక్తిగీతాలు విని ముగ్ధులై, తమ ప్రయాణాన్ని మరచిపోయి అక్కడే ఆగిపోవడం కద్దు. ఆ బాలుడి తెలివి ఇతర విషయాలలో కూడా అభివ్యక్తమయ్యేది. విగ్రహాలను తయారుచేయడంలో, దేవతామూర్తులను చిత్రించడంలో, అనుకరించడంలో, సంగీత సంకీర్తనలలో, రామాయణ భారత భాగవతాలను కేవలం విని వాటిని కంఠస్థం చేయడంలో, ప్రకృతి సౌందర్యానుభవంలో తన్మయత్వం పొందడంలో బాలరామకృష్ణుల కౌశలం వ్యక్తమయ్యేది. కారుమబ్బుల ఆకాశంలో తెల్లని కొంగలు బారులుతీరి ఎగిరిపోవడం చూసి ప్రప్రథమంగా తాను భావపారవశ్యం పొందానని స్వయంగా ఆయన ముఖతా మేం వినివున్నాం. అప్పుడాయన వయస్సు ఆరేడేళ్ళు.
ఎప్పుడు ఏ భావం ఉదయిస్తుందో అప్పుడు ఆ ఒక్క భావంలో మాత్రమే లయమైపోవడం ఆ బాలుని విశిష్ట లక్షణం. ఇందుకు నిదర్శనంగా ఒక వర్తకుని ప్రాంగణాన్ని చూపుతూ ఇప్పటికీ ఇరుగుపొరుగులు ఇలా చెబుతూవుంటారు: ‘శివ పార్వతుల సంవాదం’ అనే నాటకంలో శివుని పాత్రధారికి హఠాత్తుగా జ్వరం రావడంతో, అతడి స్థానే ఆ శివుని వేషం ధరించమని బాల రామకృష్ణులను అందరూ బ్రతిమాలగా, అందుకు అంగీకరించి శివవేషం ధరించాడు. అప్పుడు శివభావంలో తన్మయుడై బాహ్యస్మృతిని చాలాసేపటి వరకు కోల్పోయాడు. వయస్సులో పిల్లవాడే అయినా పిల్లతనపు చాంచల్యం అతణ్ణి స్పృశించలేదు. తాను చూసినటువంటి లేదా విన్నటువంటిదేదైనా అతణ్ణి ఆకర్షిస్తే అది ఎంత గాఢంగా అతడి హృదయంలో హత్తుకుపోయేదంటే ఆ విషయంలో పరిపూర్ణతను సాధించి, దానిని వినూత్న రీతిలో వ్యక్తం చేసేవరకు అతడి మనస్సు కుదుటపడేది కాదు.
7. బాల రామకృష్ణుల సత్యాన్వేషణ
పుస్తకజ్ఞానం కొరవడినా బాహ్యజగత్తు సాంగత్యంతో బాలరామకృష్ణుల ఇంద్రియాలు సత్వరమే వికాసం చెందాయి. ఆయన జీవిత మూలసూత్రం ఇది : “ఏది సత్యమో దానిని క్షుణ్ణంగా పరీక్షించిన తరువాతే అంగీకరిస్తాను. పరీక్షకు అది నిలబడితే, దానిని ఆచరణలో పెడతాను. అసత్యంగా ఋజువు కాని దేనినైనా గర్హించకూడదు.”
బాల్యంలో అద్భుత జ్ఞాపకశక్తి, తెలివితేటలు గల శ్రీరామకృష్ణులను చదువు నిమిత్తం బడికి పంపారు; కాని ఆయన విచిత్ర బాలకభావం మారలేదు. “ఇంత కష్టపడి ఇదంతా నేర్చుకోవడం, అర్ధరాత్రి దాకా మేల్కొని భాష్యకారుల టీకాలను, వ్యాఖ్యానాలను నెమరువేయడం – ఇదంతా ఏ ప్రయోజనార్థం? సత్యాన్ని ఆవిష్కరించుకోవడంలో ఇది నాకు దోహదం చేస్తుందా?” అని ఆలోచించాడు. ఆ రకమైన విద్యను ఉత్పన్నం చేసిన బడి పంతులును చూసి, అతడి మనస్సు ఇలా చెప్పింది : “మహా అయితే నువ్వు కూడా అతడిలా సరళమైన పదాలకు మేధోపరమైన అర్థాలను జోడించగలవు; సంపన్నులను పొగిడి రెండు కాసులు గడించి ఎలాగో సంసారాన్ని నెట్టుకురాగలవు; అతడిలా నుమ్వా శాస్త్రాలలోని పరమ సత్యాలను చదివి, వాటిని ఇతరులకు బోధించగలవు; కాని ‘చందన కట్టెలను మోసే గాడిద’ లా ఆ పరమ సత్యాలను నీ జీవితంలో అనుభూతం మాత్రం చేసుకోలేవు.” విచక్షణాయుతమైన అతడి బుద్ధి ఇలా చెప్పింది : “ఈ పొట్టకూటి విద్యవలన ఏ ప్రయోజనమూ లేదు. మానవ జీవిత నిగూఢ రహస్యాలను ఆవిష్కరించుకోగల ఆ ‘పరావిద్య’ ను మాత్రమే నేర్చుకోవడానికి ప్రయత్నించు.”
శ్రీరామకృష్ణులు బడికి వెళ్ళడం మానుకొన్నారు; ఆనందమయి అయిన జగజ్జననిని ఆరాధించడంలో మనస్సును లగ్నం చేశారు. దానిలో సైతం ప్రశాంతత లభించిందా? అతడి మనస్సు ఇలా ప్రశ్నించింది : “నిజంగానే ఆమె ఆనందమయి అయిన జగజ్జననియా? లేదా వట్టి రాతి విగ్రహమేనా? నిజంగానే ఈమె భక్తులు అర్పించే ఫలపుష్పాదులను స్వీకరిస్తుందా? ఈమె కృపాకటాక్ష వీక్షణంతో మనిషి సమస్త బంధాల నుండి ముక్తుడై దివ్యజ్ఞానాన్ని సంతరించుకోగలగడం నిజమేనా? లేదా, యుగాల పర్యంతం పోగైవస్తున్న ఆచారాలకు, ఊహలకు మూఢనమ్మకం జతయై రూపొందించిన అవాస్తవిక, ఛాయామాత్ర రూపమా ఇది? ఆ రీతిలో మనిషి అనాది నుండి ఆత్మవంచన చేసుకొంటున్నాడా?” ఈ సంశయాలను నివృత్తి చేసుకోవడానికి ఆ బాలుడి హృదయం తపించింది. దానితో పాటు ఆ సరళహృదయంలో తీవ్ర వైరాగ్యమనే మొలక మెల్లగా చిగురించసాగింది.
తరువాత ఆయన వివాహం జరిగింది. కాని పై సమస్యల పరిష్కార అన్వేషణకు ఈ వివాహం ఆటంకం కాలేదు; నానా విధాలుగా ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలలో ఆయన మనస్సు లీనమైపోయింది; ఆ ప్రయత్నంలో భార్య, సంసారం, లౌకిక వ్యవహారాలు, ధనసంపాదన, సుఖం, చివరకు అత్యావశ్యకాలైన అన్నపానీయాదులు – ఇవన్నీ నిష్ప్రయోజన స్మృతులుగా ఆయన మనస్సులో నిలిచిపోయాయి. సుదూరంలో ఉన్న కామార్పుకూర్లో ఎవరి బాలక భావం లౌకికులకు హాస్యాస్పదంగా తోచిందో, శ్రీరామకృష్ణుల ఆ బాలకభావం దక్షిణేశ్వరంలో మరింతగా వికాసం చెంది ప్రాపంచికుల దృష్టిలో పిచ్చితనంగా పరిగణింపబడింది.
కాని ఆ బాలకభావంలో అసంబద్ధత గాని, ఉద్దేశరాహిత్యం గాని కనిపిస్తున్నాయా? ‘ఇంద్రియాతీతమైన ఆ పరమ సత్యాన్ని ప్రత్యక్షం చేసుకొంటాను, స్పృశిస్తాను, పరిపూర్ణ రూపంలో చవిచూస్తాను’ – ఆ వెర్రితనపు విశిష్ట లక్షణం ఇది కాదా? ఏ వజ్రసంకల్పం, ఏ నిరంతర పట్టుదల, ఏ శ్రద్ధ, ఏ ఏకాగ్రత కామార్పుకూర్లో బాల రామకృష్ణుల బాలక భావంలో ఒక సరిక్రొత్త అందాన్ని సంతరించుకొన్నదో, అదే ఇప్పుడు మళ్ళీ దక్షిణేశ్వరంలో యువ రామకృష్ణుల పిచ్చితనంగా రూపుదిద్దుకొన్నది. ఎటువంటి అసాధారణ సంఘటన!
ఆ ఉన్మత్తత, ఒక ఝంఝామారుతంగా పన్నెండేళ్ళ పాటు విజృంభించి ఆయన మనస్సును కలచివేసింది. సంశయం, అపనమ్మకం అనే తరంగాలలో తలక్రిందులవుతూ శ్రీరామకృష్ణుల జీవననావ దాదాపు మునిగిపోయే స్థితికి చేరింది. కాని వీరహృదయం తన లక్ష్యాన్ని ఎన్నడూ వదలిపెట్టదు; సద్యోమరణాన్ని చూసి భయపడదు. కేవలం భగవత్ప్రేమ విశ్వాసాలే ఏకైక ఆసరాగా తన గమ్యపథంలో శ్రీరామకృష్ణుల మనస్సు పురోగమించసాగింది. సాంసారిక జీవితంలో కామకాంచనాలు ఉత్పన్నం చేసే కోలాహలం, లోకులు మంచిచెడులు, ధర్మాధర్మాలు, పాపపుణ్యాలుగా ఎంచే సమస్తం అట్టడుగుకు వెళ్ళిపోయాయి. ఆయన మనస్సును ఆ మహా భావతరంగాలు మందకొడి జీవిత అల్ప కలహాలకు ఎంతో ఎత్తులో, అతి ఊర్ధ్వలోకానికి తీసుకువెళ్ళాయి. అసాధారణ నిరంతర భావోద్వేగాలూ, తీవ్ర తపశ్చర్యలూ బలిష్ఠమైన శ్రీరామకృష్ణుల మనశ్శరీరాలను చెల్లాచెదరు చేసివేశాయి; అదే సమయంలో వాటికి వినూత్న రూపాన్ని, అందాన్ని సంతరింపచేశాయి. ఈ విధంగా మహాభావాన్ని (భగవత్ప్రేమ పరాకాష్ఠ స్థితి) ఇముడ్చుకోగల, ఆధ్యాత్మిక మహోన్నత సత్యాలను వివరించి అందించే సమగ్రమైన పరికరంలా శ్రీరామకృష్ణుల మనశ్శరీరాలు రూపుదిద్దుకొన్నాయి.
8. ఆ సత్యాన్వేషణ ఫలితం
ఓ పాఠకుడా, శ్రీరామకృష్ణుల ఈ వీరగాథను నువ్వు అవగతం చేసుకోగలవా? నీ స్థూలదృష్టికి ఒక వస్తువు విలువ పెరిగేది దాని పరిణామం బట్టే కదా! అటువంటి ఏ దివ్యమహాశక్తి స్వార్థపరత్వాన్ని సమూలంగా నాశనం చేసి, అహంకారాన్ని కూకటివ్రేళ్ళతో పెకలించివేసి, మనశ్శరీరాలను ఇకపై కించిత్తు స్వార్థ కార్యాన్ని చేయడానికి సైతం అసమర్థం చేస్తుందో, ఆ మహాశక్తి కనీసం నీ ఊహకు సైతం అందుతుందా? శ్రీరామకృష్ణుల హస్తాలు స్పృహతోనో లేదా స్పృహలేకుండా ఏ లోహాన్ని స్పృశించినా తక్షణమే ఆ చేతులు కర్రలా బిగుసుకుపోయేవి. అటువంటప్పుడు దానిని తీసుకోవడం ఆయనకు ఎలా సాధ్యమౌతుంది? తెలిసో తెలియకో ఎవరికి చెందినవో వారి అనుమతి లేకుండా ఆకులు పువ్వులు వంటి అతిసామాన్య వస్తువులను ఆయన ఎప్పుడైనా తీసుకున్నా, చక్కగా తెలిసిన దారి కూడా ఆయన తప్పిపోయేవారు; ఆ అల్ప వస్తువును తిరిగివెళ్ళి తెచ్చిన చోటనే పడేసిన తరువాతే ఆయనకు దారి స్పష్టంగా కనిపించేది. సామాన్య వస్తువులను మూటకట్టితే సరే, ఆ మూట విప్పనంత వరకు ఆయనకు శ్వాసక్రియ స్తంభించిపోయేదంటే అతిశయోక్తి కాదు! అపవిత్రురాలైన స్త్రీ ఎవరైనా ఆయనను తాకిన తక్షణమే, తాబేటి అవయవాల మాదిరి ఆయన పురుషాంగం పూర్తిగా కుంచించుకుపోయేది. జన్మాదిగా స్వార్థానికి మాత్రమే ఆలవాలమైన మనిషి కళ్ళు ఏ పరమ పవిత్ర మానసిక స్థితులకు ఆ శారీరక వికారాలన్నీ చిహ్నాలో, వాటిని ఎలా చూడగలవు? ఎలా అర్థం చేసుకోగలవు? మన కాల్పనిక ఊహాశక్తి సైతం ఈ విశుద్ధ భావరాజ్యంలోకి ఎలా ప్రవేశించగలదు? పుట్టింది లగాయతు మన అంతరంగంలోని అపవిత్ర భావాలను కప్పిపుచ్చి, మనలను పవిత్రతకు ప్రతిరూపాలుగా చిత్రించుకోవడం మనకు వెన్నతోపెట్టిన విద్య. నిజాన్ని దాచిపెట్టి వంచనతో ధనికులం కాగల లేదా సుప్రసిద్ధులం కాగల అవకాశం లభిస్తే మనలో ఎంతమంది అందుకు వెనుకాడతాం? ధైర్యసాహసాల విషయమూ అటువంటిదే. ఒక దెబ్బకు బదులుగా పది దెబ్బలు వడ్డించే సాహసం లేకపోయినా లేదా ఒక్క పరుగులో వెళ్ళి అగ్ని జ్వాలలను క్రక్కుతున్న ఫిరంగిని హస్తగతం చేసుకోలేకపోయినా, లేదా మన చిరకాల వాంఛితమైన వస్తువు ప్రాప్తికై ప్రాణాలనొడ్డే ధైర్యం మనకు లేకపోయినా, ఇతరులెవరైనా ధైర్యసాహసాలు ప్రదర్శించి అలా చేస్తే మనం గర్విస్తాం, వారిని ప్రశంసిస్తాం.
కాని ఏ సాహసంతో శ్రీరామకృష్ణులు ఇహపర సుఖభోగాలనన్నిటినీ పరిత్యజించారో, లోకానికి అజ్ఞాతం అజ్ఞేయం అయిన ఏ అతీంద్రియ సత్యం నిమిత్తం తమ మనశ్శరీరాలను సైతం పణంగా పెట్టారో, అట్టి ధైర్యసాహసాలను కించిత్తు అయినా అవగతం చేసుకోవడం మనకు సాధ్యమా? పాఠక మహాశయా! అవగతం చేసుకోగలిగితే మృత్యుంజయత్వం సంతరించుకొన్న వాడిగా మాచే, లోకంచే కొనియాడబడతావు.
9. శ్రీరామకృష్ణుల సరళ వచనాలలోని గూఢార్థం
శ్రీరామకృష్ణుల అతిసామాన్య వచనాలలో, చేతలలో ఎటువంటి గూఢార్థం ఇమిడివుంటుందో స్వయంగా ఆయనే వివరించకపోతే, ఎవరూ అర్థం చేసుకోలేరు. భావసమాధి స్థితి నుండి దిగివచ్చాక పరిచితులైన వ్యక్తుల పేర్లను లేదా వస్తువులను గురించి ప్రస్తావించేవారు లేదా వారిని స్పృశించేవారు; లేదా కొన్ని తినుబండారాలను పేర్కొని వాటిని తినగోరేవారు లేదా త్రాగగోరేవారు. ఎందుకలా చేసేవారో ఒక రోజు ఆయనే మాకు ఇలా విశదపరిచారు : “సామాన్య జనుల మనస్సులు సర్వసాధారణంగా గుదం, లింగం, నాభి కేంద్రాలలోనే తిరుగుతూ ఉంటాయి. మనస్సు కాస్త పవిత్రమైనప్పుడు కొన్నిసార్లు అది హృదయం దగ్గరి అనాహత చక్రం వరకు ఎగసి జ్యోతి దర్శనాన్నో లేదా జ్యోతిర్మయ రూప దర్శనాన్నో పొంది, ఆనందం అనుభవిస్తుంది. తరువాత సాధన చేస్తూచేస్తూ ఏకనిష్ఠను సంతరించుకొని మనస్సు కంఠ ప్రదేశంలోని విశుద్ధచక్రానికి ఎగసి వెళుతుంది. అటువంటి స్థితిలో ఏ ధ్యేయవస్తువు మీద దానికంత నిష్ఠ జనించిందో దానిని గురించి తప్ప ఇతరత్రా వేటి గురించి ప్రసంగించడం దాదాపు ఆ మనస్సుకు అసంభవమౌతుంది. ఇంత ఉన్నత స్థానానికి మనస్సు ఎగసి వెళ్ళినప్పటికీ, అది మళ్ళీ నిమ్నచక్రాలకు దిగిపోయి తన ఆదర్శాన్ని పూర్తిగా విస్మరించడం కద్దు.
“కాని తీవ్రనిష్ఠ, సాధన సహాయంతో ఒక్కసారి భ్రూమధ్యంలో ఉండే ఆజ్ఞాచక్రానికి కనుక మనస్సు చేరగలిగితే, సాధకుడికి సమాధి స్థితి కలుగుతుంది; అతడక్కడ ఎంత ఆనందాన్ని చవిచూస్తాడంటే దిగువ చక్రాల వద్ద లభించే ఆనందాలన్నీ ఎంతో అల్పంగా తోస్తాయి. ఇక్కడకు (ఆజ్ఞాచక్రం) చేరిన వాడు దిగువకు పడిపోవడమంటూ ఉండదు. సాధకుడికి ఈ స్థితిలో (లాంతరు లోపల వెలిగే దీపంలా) ఎంతో సన్నని ఆవరణతో కప్పబడిన పరమాత్ముని జ్యోతి అభివ్యక్తమౌతుంది. అతడికీ పరమాత్మకీ కించిత్తు ఎడం ఉన్నప్పటికీ, ఈ భూమిని చేరిన వ్యక్తికి అద్వైతానుభూతి లభిస్తుంది. ఇక ఈ చక్రాన్ని ఛేదించగలిగితే భేదాభేదాల జ్ఞానంకూడా ఆమూలాగ్రం నశించి, పరిపూర్ణ అద్వైతావస్థ సిద్ధిస్తుంది.
“మీకు బోధించే నిమిత్తమే నా మనస్సు కంఠం వద్దనున్న విశుద్ధచక్రం వరకూ దిగుతూ ఉంటుంది. ఎంతో నిర్బంధం మీదటే మనస్సును అక్కడ నిలప గలుగుతాను. ఆరు నెలలపాటు నిర్వికల్ప సమాధిలో, సంపూర్ణ అద్వైత స్థితిలో ఉండిపోయిన కారణంగా, మనస్సు ఆ దిశవైపుకే సహజంగా వెళ్ళగోరుతుంది. ‘ఇది చేస్తాను’, ‘అది తింటాను’, ‘ఈ వ్యక్తిని చూడాలి’, ‘అక్కడకు వెళ్ళాలి’ మొదలైన చిరుకోర్కెలు కల్పించుకోకపోతే, మనస్సును ఆ ఊర్ధ్వస్థితి నుండి దిగువకు తీసుకు రావడం అసాధ్యం. మనస్సు క్రిందికి దిగిరాకుంటే తినడం, తిరగడం, మాట్లాడడం, దేహాన్ని సజీవంగా ఉంచడం మొదలైనవన్నీ చేయడం అసాధ్యమే ఔతుంది. కాబట్టే భావసమాధిలోకి పోతున్న సమయంలో, ‘నేను పొగత్రాగుతాను’, ‘ఫలానా చోటికి వెళతాను’ ఇత్యాది చిరు కోర్కెలను కల్పించుకొంటాను. అయినప్పటికీ ఆ కోర్కెలను పదేపదే మననం చేసుకొంటేనే తప్ప మనస్సు క్రిందికి దిగిరాదు.”
10. శ్రీరామకృష్ణుల దైనందిన అలవాట్లు, ఇష్టానిష్టతలు
“సమాధిస్థితి పొందడానికి మునుపు సాధకుడు ఏ పరిస్థితులలో, స్థితులలో ఉండివుంటాడో, సమాధిని పొందిన తదనంతరం ఎంతో శక్తిమంతుడైనప్పటికీ ఆ వెనుకటి పరిస్థితులను మార్చాలనే ఆకాంక్ష అతడికి ఉండదు. ఒక్క బ్రహ్మవస్తువు తప్ప తక్కినవన్నీ అతడికి తుచ్ఛంగా కనిపిస్తాయి” అని పంచదశీకారుడు ఒక చోట వచించాడు. శ్రీరామకృష్ణుల జీవితంలో ఈ సత్యం ఋజువైంది. భగవత్ప్రేమ అనే ఝంఝామారుతం ఆయనలో చెలరేగడానికి మునుపు ఆయన అలవాట్లు, జీవన విధానాలు ఎలా ఉండేవో, తదనంతరం కూడా అట్లే ఉండిపోవడం మనం గమనించవచ్చు. ఆ అలవాట్లు కొన్నిటిని ఇక్కడ పేర్కొంటున్నాం:
తన దేహాన్ని, దుస్తులను, పరుపు మొదలైన వాటిని ఎంతో శుభ్రంగా ఉంచుకోవడం ఆయన అలవాటు. వస్తువులను వాటి సముచిత స్థానంలోనే ఉంచేవారు, ఇతరులనూ అలాగే చేయమని బోధించేవారు; ఎవరైనా అందుకు విరుద్ధంగా చేస్తే ఆయన చిరాకుపడేవారు. ఎక్కడకన్నా వెళ్ళబోతున్నప్పుడు తువ్వాలు, చిన్నసంచి, తదితర అవసర సామగ్రి వెంట తీసుకువస్తున్నారో లేదో స్వయంగా కనుక్కొనేవారు. అలాగే తిరిగి వచ్చేటప్పుడు పట్టుకెళ్ళిన ఏ వస్తువునూ మరిచిపోకుండా తీసుకురావలసిందిగా తమతో వచ్చిన శిష్యులకు జ్ఞాపకం చేసేవారు. ప్రతి పనిని వేళతప్పకుండా చేయడానికి ఆరాటం చెందేవారు. ఒక పని చేస్తానని వచిస్తే, ఆ పనిని తప్పకుండా నిర్వర్తించేవారు. ఒక ఫలానా వ్యక్తి నుండి ఒక వస్తువు పుచ్చుకుంటానని చెబితే, ఆ వస్తువును అతడి నుండి మాత్రమే పుచ్చుకొనేవారు; ఇతరుల నుండి పుచ్చుకొంటే అసత్య దోషానికి పాల్పడినట్లవుతుంది కదా! అటువంటి విషయాలలో హఠం పట్టి ఆయనకు ఎంతో అసౌకర్యం కలిగినా ఆయన దానిని భరించేవారే తప్ప తన మాటను జవదాటేవారు కారు. ఎవరినైనా చిరిగిన దుస్తులతో, గొడుగుతో, చెప్పులతో ఆయన చూస్తే, వీలైతే క్రొత్తవి కొని ధరించమని అతడికి చెప్పేవారు; ఆ వ్యక్తి పేదవాడైతే కొన్ని సమయాలలో ఆయనే స్వయంగా వాటిని కొనియిచ్చేవారు. “చిరిగిన దుస్తులు మొదలైనవి ఉపయోగించే వ్యక్తిపై లక్ష్మీకటాక్షం ప్రసరించదు” అని ఆయన తరచూ చెప్పేవారు.
గర్వం, అహంకారం సూచించే వచనాలు ఆయన నోటి నుండి ఎన్నడూ వెలువడవు. తమ భావాన్ని లేదా అభిప్రాయాన్ని చెప్పవలసివస్తే తమ శరీరాన్ని చూపుతూ, ‘ఇక్కడి భావం’ లేదా ‘ఇక్కడి అభిప్రాయం’ అనే మాటలే వాడేవారు. తమ శిష్యుల చేతులు, కాళ్ళు, ముఖం, కళ్ళు మొదలైన అంగాలను, వారి ప్రవర్తన, తినే, త్రాగే, నడిచే, నిద్రించే విధానాలను సూక్ష్మాతిసూక్ష్మంగా పరిశీలిస్తూండేవారు. తద్ద్వారా వారి మానసిక స్థితిగతులు, వారి పురోగతి చక్కగా ఆకళింపు చేసుకోగలిగేవారు. వ్యక్తులను గురించి ఆయనకు ఏర్పడిన అభిప్రాయాలు తప్పుకావడం మేమెన్నడూ చూడలేదు.
శ్రీరామకృష్ణులను దర్శించుకొన్న వారిలో అత్యధిక సంఖ్యాకులు ఆయన తమనే అధికంగా అభిమానించేవారని భావించడం కద్దు. ప్రతివ్యక్తి సుఖదుఃఖాల పట్ల ఆయన కనబరిచే ప్రగాఢ సానుభూతియే వారలా భావించడానికి కారణంగా మాకు తోస్తుంది. బాహ్య లక్షణాలను బట్టి రెండూ ఒకేలా కనిపించినప్పటికీ కూడా సానుభూతి, ప్రేమ – ఇవి రెండూ విభిన్నమైనవి, కాబట్టి సానుభూతిని ప్రేమగా జమకట్టడంలో వింతలేదు. ఎప్పుడు దేనిని గురించి ఆలోచించేవారో అప్పుడు దాన్లోనే పూర్తిగా లీనమైపోవడం శ్రీరామకృష్ణుల స్వాభావిక మనోవైఖరి. ఆయనలో ఈ విశేషగుణం ఉండడం వలన తమ ప్రతి శిష్యుని మనోస్థితిని యథాతథంగా తెలుసుకోగలిగి, ఆ శిష్యుని ఉన్నతికి సరైన మార్గాన్ని నిర్ణయించేవారు.
శ్రీరామకృష్ణుల బాలక ప్రవృత్తిని వివరిస్తున్నప్పుడు చిన్ననాటి నుండే తమ కళ్ళు, చెవులు మొదలైన ఇంద్రియాలను సరైన పరిశీలనలో ఎలా పూర్తిగా ఉపయోగించుకోవడం నేర్చుకొన్నారో చూపడానికి ప్రయత్నించాం. తమ శిష్యులలో కూడా ఈ విశేష గుణాన్ని పెంపొందింప ఆయన గట్టిగా ప్రయత్నించారు. చేతలను కార్యరూపంలో పెట్టడానికి మునుపే ‘విచారణ’ ను ఉపయోగించమని శిష్యులకు ఆయన ఉపదేశించేవారు. ‘విచారణ’ ఒక్కటే ప్రతిదాని మంచి చెడులను వెల్లడించి, మనస్సును నిజమైన పరిత్యాగం వైపుకు తీసుకుపోతుందని పదేపదే ఆయన వక్కాణించేవారు. మూర్ఖుణ్ణి, సంకుచిత మనస్కుణ్ణి ఆయన ఎన్నడూ ఇష్టపడేవారు కాదు. తరచు ఆయన ఇలా చెప్పగా వినేవాళ్ళం : “నువ్వు భక్తుడివి, నిజమే. అంతమాత్రాన మూర్ఖుడవు కావడమెందుకు? ఒకే ఒక్క భావాన్ని అనుసరించే సంకుచిత మనస్కుడవు కావద్దు; అది ‘ఇక్కడి’ (అంటే తమ) వైఖరి కాదు. ఒకే ఆహారపదార్థాన్ని పలు రకాల భక్ష్యాలుగా వండితే తింటాను. (అంటే భగవంతుణ్ణి రకరకాలుగా, అనంత భావాల ద్వారా పొందడం). ఇదే ఇక్కడి వైఖరి.” ఒకే ఒక్క భావం మాత్రమే నిజమని చెప్పడాన్ని ఆయన మందకొడి వైఖరిగా పేర్కొనేవారు. తమ శిష్యుడెవరైనా ఏదేని భగవంతుని విశేష భావాన్ని ఆనందించలేకపోతే, ‘ఎంత అల్పబుద్ధికలవాడివి!’ అంటూ మందలించేవారు. ఆ మందలింపు విని ఆ శిష్యుడు సిగ్గుతో తలవంచుకోవలసి వచ్చేది. అటువంటి మహోదార, విశ్వజనీన భావప్రేరణ వలననే శ్రీరామకృష్ణులు అన్ని మత సంప్రదాయాల సాధనలను అనుష్ఠించి, ‘మతాలెన్నో మార్గాలన్ని’ అనే మహోన్నత సత్యాన్ని ఆవిష్కరించారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
11. ఆధ్యాత్మిక చైతన్య జాగృతీమూర్తి శ్రీరామకృష్ణులు
పుష్పం వికసించింది. అన్ని దిశల నుండి తుమ్మెదలు మధువును వెర్రిగా ఆస్వాదింప పరుగెత్తుకొని రాసాగాయి. దినకరుని స్పర్శతో హృదయం పూర్తిగా వికసించిన పద్మం వాటి వాంఛలను పూర్తిగా తీర్చడానికి వెనుకాడదు. అదే విధంగా శ్రీరామకృష్ణులు తమ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచడంలో ప్రయత్నలోపం చేయలేదు. ఎవరికి పాశ్చాత్య విద్యను గురించిన ఎరుక లుప్తమో, కొందరు ఆధునికులు మూఢనమ్మకాల కుప్పగా ఎంచే సనాతన ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఎవరు తమ జీవితాన్ని రూపుదిద్దుకొన్నారో, అటువంటి శ్రీరామకృష్ణులు ఏ ఆధ్యాత్మిక అమృతాన్ని లోకానికి పంచి ఇచ్చారో, అటువంటి అమృతాన్ని ప్రపంచం మరెన్నడైనా చవిచూసి ఉందా? శ్రీరామకృష్ణులు సంచయం చేసి, తమ శిష్యులకు అందించిన ఆ మహా ఆధ్యాత్మిక శక్తి లీలను లోకం ఇంతకు మునుపు ఎన్నడైనా చూసివుందా? ఆ మహాశక్తి ప్రేరణతో ఆధునిక విజ్ఞానం వెలుగు ప్రసరిస్తూన్నప్పటికీ లోకులు ఆధ్యాత్మికత అన్నది ఒక ప్రత్యక్షానుభూతిగా అవగతం చేసుకోవడం, అన్ని మతాలలోను అపరివర్తనీయమైన ఒక సనాతన సత్యం ప్రవహిస్తూ ఉండడం మునుపు ఎన్నడైనా లోకం చూసివుందా?
ఒక పువ్వు నుండి మరో పువ్వుకు సంచరించే మలయమారుతంలా ఒక సత్యం నుండి మరో సత్యానికి పయనిస్తూన్న మానవ జీవనం క్రమక్రమంగా, నెమ్మదిగా అపరివర్తనీయమైన ఆ అద్వైతసత్యం వైపుకే పురోగమిస్తున్నది; అంతేకాక ఒకానొక రోజు తప్పకుండా అది ఆ అపార అనంత అవాఙ్మానసగోచరమైన పరమసత్యాన్ని చేరుకొంటుంది అనే అభయవాణి మునుపు ఎన్నడైనా పలకడం ఈ లోకం చూసివుందా?
భారతావనిలో అవతరించిన శ్రీకృష్ణుడు, బుద్ధుడు, శంకరుడు, రామానుజుడు, చైతన్యుడు; అట్లే ఇతర దేశాలలో ఉద్భవించిన ఏసుక్రీస్తు, మహమ్మదు మొదలైన మతాచార్యులు ఆధ్యాత్మిక జగత్తులోని ఏ మతసంకుచితత్వాన్ని నిర్మూలించలేకపోయారో, విద్యావిహీనుడైన ఈ బ్రాహ్మణ బాలుడు తన జీవితంలో దాన్ని ఆమూలాగ్రం నిర్మూలించి, పరస్పరవిరుద్ధమైన మతాలన్నిటి మధ్య అద్భుత సామరస్యమనే అసాధ్యాన్ని సాధ్యం చేయగలగడం ఎవరైనా ఎన్నడైనా కనీవినీ ఉన్నారా?
ఆధ్యాత్మిక జగత్తులో శ్రీరామకృష్ణుల స్థానాన్ని ఎవరు నిర్ణయించగలరు? మేం ఆ సాహసం చేయలేం. కాని ఇంతమటుకు చెప్పగలం. నిర్జీవమైన భారతదేశం ఆయన పావన పదస్పర్శతో మరింత పావనత్వాన్ని సంతరించుకొన్నది, జాగృతమైంది; ప్రపంచ దేశాలలో అది వైభవ స్థానాన్ని ఆక్రమించడం తథ్యం; లోకానికి భారతదేశం ఆశను, ఆశీస్సులను ఇవ్వనున్నది; ఆయన మానవరూపంలో అవతరించిన కారణంగా మనిషి సైతం దేవతలకూ పూజనీయుడు అయ్యాడు అనడం అతిశయోక్తి కాదు; అంతేకాక, శ్రీరామకృష్ణులు జాగృతం చేసిన అద్భుత శక్తి ప్రకటన, ఈ లోకం స్వామి వివేకానంద రూపంలో చూసింది. అయితే ఇది ప్రారంభం మాత్రమే.
గురుభావం సమాప్తం