అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ॥ – భగవద్గీత. 9–22
సంపూర్ణ నిష్ఠతో, నేను తామే అయినట్లు భావిస్తూ, సర్వంలో నన్ను ఉపాసిస్తూ ఉండేవారి యోగక్షేమాలను నేను వహిస్తాను.
1. బలరాం బోసు ఇంట్లో రథయాత్రోత్సవం
కామార్హాటి బ్రాహ్మణికి బాలగోపాల రూపంలో భగవద్దర్శనం కలిగిన కొంతకాలం తరువాత బలరాంబోసు ఇంట్లో రథం తిరిగివచ్చే సందర్భం పురస్కరించుకొని ఉత్సవం జరిపారు. ఆ ఉత్సవంలో పాల్గొనడానికి శ్రీరామకృష్ణులు, అతడి ఇంటికి విచ్చేశారు. ఎందరో భక్తులు కూడా ఆ ఉత్సవంలో పాల్గొన్నారు. బలరాం ఆనందానికి అవధులు లేవు. వచ్చిన భక్తులనందరినీ సాదరంగా ఆహ్వానించాడు. బలరాం భక్తుల కుటుంబంలో జన్మించాడు. ఒక్క తరమే కాదు, తరతరాలుగా అతడి వంశస్థులందరూ భక్తులే. కాబట్టే అతడిపట్ల, అతడి కుటుంబంపట్ల శ్రీరామకృష్ణులు అనుగ్రహ వృష్టి కురిపించారు.
2. శ్రీరామకృష్ణులు : శ్రీచైతన్యుల సంకీర్తనం
శ్రీచైతన్య మహాప్రభువుల నగర సంకీర్తనం చూడాలనే ఆకాంక్ష ఒకప్పుడు తమకు జనించిందనీ, తదనంతరం ఒకసారి ఆ దివ్యదర్శనం కలిగిందనీ శ్రీరామకృష్ణులే స్వయంగా మాకు చెప్పారు. అదొక అద్భుత దృశ్యం. ఇసుక పోసినా రాలనంత జనం హరినామ స్మరణతో ప్రేమోన్మత్తులై ఉన్నారు. ఇక ఆ మహోన్మాద భక్తి ప్రవాహంలో ఉన్మాదులై ఉన్న శ్రీ చైతన్యుల ఉన్మత్త ఆకర్షణ శక్తి చెప్పనలవి కానిది. అసంఖ్యాక జనం నెమ్మదిగా పంచవటి వైపు నుండి కదలి శ్రీరామకృష్ణుల గది ముందు నుండి పోసాగింది. ఆ సంకీర్తన బృందంలో భక్తితో ప్రకాశిస్తూన్న బలరాంబాబు ముఖాన్ని తాము చూశామని శ్రీరామకృష్ణులు చెప్పారు. ఆయనను ఆకట్టుకొన్న కొద్దిమంది ముఖాలలో బలరాం బోస్‌ది ఒకటి; ఆ ముఖం ఆయన జ్ఞాపకాలలో అట్లే నిలిచిపోయింది. మొట్టమొదటిసారి బలరాం దక్షిణేశ్వరానికి వచ్చి గురుదేవులను దర్శించిన మరుక్షణమే, శ్రీరామకృష్ణులు ఆ నగర సంకీర్తన బృందంలో తాను చూసిన వ్యక్తి ఇతడే అని గుర్తించారు.
3. బలరాం భగవత్సేవలు
ఒరిస్సాలోని కొఠార్ అనే ప్రాంతంలో బలరాం బోస్‌కు ఒక జమీ ఉంది. అక్కడ శ్యాంచంద్ (శ్రీకృష్ణుని) విగ్రహానికి పూజాది సేవలు ఒనరించేవారు. బలరాంకు బృందావనంలో ఒక లతాగృహం ఉంది; అక్కడ శ్యామసుందరుని పూజ, సేవలు జరిగేవి. అట్లే కలకత్తాలోని అతడి బాగ్‌బజార్ ఇంట్లో ‘జగన్నాథుని’ కి పూజాసేవాదులు జరిపించేవారు. ఈ జగన్నాథ విగ్రహాన్ని తదనంతర కాలంలో కొఠార్కు తరలించారు. అతణ్ణి గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు : “బలరాం సమర్పించే ఆహారం ఎంతో పవిత్రమైనది. తరతరాలుగా ఆ కుటుంబం వారు భగవంతుణ్ణి, అతిథి అభ్యాగతులను, సాధువులను సేవిస్తూ వస్తున్నారు. అతడి తండ్రి సర్వసంగపరిత్యాగం చేసి బృందావనంలో హరినామస్మరణలో కాలం గడుపుతున్నాడు. అతడు అర్పించే ఆహారాన్ని నేను నిస్సంకోచంగా, ఆనందంగా స్వీకరిస్తాను. ఆ ఆహారాన్ని నోట పెట్టగానే అలవోకగా లోపలకు వెళ్ళిపోతుంది.” నిజానికి అంతమంది భక్తులలో బలరాం బోస్ ఒసగే ఆహారాన్ని మాత్రమే శ్రీరామకృష్ణులు అత్యంత ప్రీతితో ఆరగించడం మేం గమనించి ఉన్నాం. ఉదయం వేళ శ్రీరామకృష్ణులు కలకత్తాకు వచ్చినప్పుడల్లా నాటి మధ్యాహ్నం బలరాం ఇంట్లోనే భోజనం చేసేవారు. బ్రాహ్మణులైన భక్తుల ఇళ్ళలో తప్ప ఇతర భక్తుల ఇళ్ళలో ఆయన భోజనం చేయడం అనుమానాస్పదమే. కాని ప్రసాదం విషయంలో మాత్రం ఆ విచక్షణ లేదు. నారాయణ ప్రసాదం లేదా ఇతర దేవతలకు నైవేద్యం చేసిన ప్రసాదాన్ని మాత్రం ఆయన ఎవరి ఇళ్ళలోనైనా నిరభ్యంతరంగా స్వీకరించేవారు.
4. శ్రీరామకృష్ణులకు, బలరాం ఒనర్చిన అసాధారణ సేవానిరతులు – నలుగురు సరఫరాదారులు
మహాపురుషుల అతిసామాన్యమైన దైనందిన చేతలలో సైతం వివరింప నలవిగాని అలౌకిక అంశం ఇమిడి ఉంటుంది. శ్రీరామకృష్ణుల సాంగత్యంలో కేవలం ఒక్క రోజు గడిపిన వ్యక్తి కూడా పై ప్రకటనలోని సత్యాన్ని ఇట్టే గ్రహించగలడు. బలరాం అర్పించే ఆహారాన్ని గురుదేవులు స్వీకరించే విషయాన్ని కాస్త విశ్లేషించి చూస్తే ఈ విషయం మనకు స్పష్టమౌతుంది. సాధన చేస్తున్న కాలంలో ఒకానొక సందర్భంలో శ్రీరామకృష్ణులు జగజ్జననిని, “అమ్మా, నన్ను శుష్క సాధువుగా రూపొందించవద్దు. కనీస అవసరాలకు కొరత రానివ్వకు” అని ప్రార్థించారు. ఆమె కూడా ఆయన భోజన సామగ్రి సరఫరాకై నలుగురు భక్తులు నియమింపబడినట్లు తెలియచేసింది. ఆ నలుగురిలో రాణీరాస్మణి అల్లుడైన మథుర్నాథ్ మొట్టమొదటి వాడు; శంభుమల్లిక్ రెండవ వాడు. సిమ్లా పేటకు చెందిన సురేంద్రనాథ్ మిత్ర (ఇతణ్ణి శ్రీరామకృష్ణులు సురేందర్ లేదా సురేశ్ అని పిలిచేవారు) అర్ధ సరఫరాదారు అని స్వయంగా శ్రీరామకృష్ణులే చెప్పేవారు.
మథుర్నాథ్, శంభుమల్లిక్లు శ్రీరామకృష్ణులకు ఒనరించిన సేవలను ప్రత్యక్షంగా చూసే అదృష్టానికి మేం నోచుకోలేదు. ఎందుకంటే మేం శ్రీరామకృష్ణుల వద్దకు రావడానికి ఎంతోకాలం క్రితమే వారిద్దరూ మరణించారు. కాని వారు ఒనరించిన అద్భుత సేవలను గురించి గురుదేవుల ముఖతా మేం వినివున్నాం. తమ సరఫరాదారులలో బలరాం బోస్ కూడా ఒకడనే విషయం ఆయన ఎన్నడూ ప్రస్తావించినట్లు మాకు జ్ఞాపకం లేదు. కాని శ్రీరామకృష్ణులను అతడు అద్భుత రీతిలో సేవించడం మేం ప్రత్యక్షంగా చూసివున్నాం. మథుర్బాబు సేవానిరతికి తప్ప, ఇతర సరఫరాదారుల సేవకు బలరాం సేవ ఏమాత్రం తీసిపోదని మేం ఘంటాపథంగా చెప్పగలం. ఈ విషయాలను గురించి మరో సందర్భంలో వివరించడానికి ప్రయత్నిస్తాం. కాని బలరాంబాబు దక్షిణేశ్వరానికి వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించుకొన్న నాటి నుండి, గురుదేవులు మహాసమాధి పొందిన నాటి వరకు ఆయనకు ఆవశ్యకమైన బియ్యం, పటికబెల్లం, సగ్గుబియ్యం, బార్లీ, సేమ్యా మొదలైన ఆహార దినుసులను అతడే సరఫరా చేస్తూ వచ్చాడు. సురేంద్రుడు (లేదా సురేశ్ మిత్ర) గురుదేవుల సేవ నిమిత్తం దక్షిణేశ్వరంలో రాత్రిళ్ళు బసచేసే భక్తుల ఆహారం, పడక ఏర్పాట్లు చూసుకొనేవాడు.
శ్రీరామకృష్ణులతో ఈ వ్యక్తులకు ఎలాటి నిగూఢ బాంధవ్యం పెనగొని ఉందో ఎవరికెరుక? వారికి ఇటువంటి దుర్లభమైన సేవాధికారం లభించడానికి కారణాన్ని ఎవరు వివరించగలరు? వీరు అదృష్టవంతులని, ప్రత్యేకంగా జగజ్జననియే వీరిని నియమించిందని మాత్రమే మేం అవగతం చేసుకొన్నాం. లేకపోతే లోకోత్తర పురుషులైన శ్రీరామకృష్ణుల ప్రస్తుత లీలకు దోహదకారులుగా వీరు జన్మించి ఉండేవారే కాదు. లేకుంటే శుద్ధ బుద్ధ ముక్తమైన శ్రీరామకృష్ణుల మానసంలో వీరి ముఖాలు ప్రగాఢంగా నిలిచిపోయి, చూడగానే వీరిని గుర్తించి, “వీరు ఇక్కడికి (తమకు) చెందినవారు, ఈ విశేష సేవాధికారాన్ని పొందేవచ్చారు” అని ఆయన చెప్పి ఉండేవారే కాదు.
5. శ్రీరామకృష్ణులు ‘నేను’, ‘నాది’ అనే మాటలు ఎన్నడూ ఉపయోగించి ఎరుగరు
‘వీరు నా వాళ్ళు’ అని అనకుండా, ‘ఇక్కడికి చెందినవాళ్ళు’ అనేవారు శ్రీరామకృష్ణులు. అత్యంత పునీతమైన ఆయన మానసంలో లవలేశమైనా ‘అహం’ కూడా చోటు చేసుకోకపోవడమే అందుకు కారణం. కాబట్టే ‘నేను’, ‘నాది’ అని పేర్కొనడం ఆయనకు అసాధ్యమయ్యేది. అసాధ్యం అనడమెందుకు?ఆ రెండు పదాలను ఆయన ఉపయోగించలేకపోయేవారు అనడం సబబు. ఎప్పుడైనా అగత్యంలేక వాడవలసివస్తే ‘నేను జగజ్జనని సేవకుణ్ణి, బిడ్డను’ అనే అర్థంలో వాడేవారు. అది కూడా అంతకు ముందునుండే ఆ భావం మనస్సును పూర్తిగా ఆక్రమించిన స్థితిలో మాత్రమే. కాబట్టే మాటల సందర్భంలో ఎప్పుడైనా ‘నాది’ అని అనవలసివస్తే శ్రీరామకృష్ణులు తమ దేహాన్ని చూపుతూ ‘ఇక్కడిది’ అనే మాటనే సదా సర్వదా వాడేవారు. భక్తులు కూడా ఆయన అభిప్రాయాన్నే అర్థం చేసుకొనేవారు. ఉదాహరణకు, ఫలానా వ్యక్తి ‘ఇక్కడి వాడు’ కాదు, లేదా ఆ వైఖరి లేదా భావన ‘ఇక్కడిది’ కాదు అంటే ఆ ఫలానా వ్యక్తి తమకు చెందిన వాడు కాదని, ఆ వైఖరి లేదా భావన తమది కాదని చెబుతున్నారని గ్రహించాలి.
6. ఎప్పుడు ఏ విధంగా ఆయన సరఫరాదారులు శ్రీరామకృష్ణులను సేవించారు
శ్రీరామకృష్ణుల సరఫరాదారుల గురించి ఇక్కడ కొంత ముచ్చటించనున్నాం. శ్రీరామకృష్ణుల మొదటి సరఫరాదారు మథుర్బాబు. శ్రీరామకృష్ణులు ప్రప్రథమంగా కాళికాలయంలో అడుగిడినప్పటి నుండి ఆయన సాధనలు ముగిసే వరకు, అంటే పధ్నాలుగు సంవత్సరాల కాలంపాటు, మథుర్ ఆయనను ఎంతో ఆప్యాయంగా సేవించాడు. రెండవ సరఫరాదారు శంభుమల్లిక్. ఇతడు మథుర్ మరణానంతరం నుండి కేశవచంద్ర సేన్ తదితర భక్తులు గురుదేవుల వద్దకు రావడానికి ముందు కొద్దికాలం వరకు, అంటే తను సజీవుడై ఉన్నంత వరకు శ్రీరామకృష్ణులను సేవించుకొన్నాడు. ఇక అర్ధ సరఫరాదారుడైన సురేశ్ బాబు, శ్రీరామకృష్ణుల మహాసమాధికి ఆరేడేళ్ళ ముందు నుండి, ఆయన మహాసమాధి పొందిన నాలుగు ఐదు సంవత్సరాల వరకు జీవించి ఆయనను, ఆయన సన్న్యాస శిష్యులను సేవించాడు. ప్రారంభంలో శ్రీరామకృష్ణ మఠం బారానగరానికి చెందిన మున్షీబాబు పాడుబడ్డ ఇంట్లో 1886 వ సం ॥ స్థాపించబడింది. (ఈ బారానగర మఠం తదనంతరం బేలూర్కు తరలించబడింది.) బారానగర మఠ స్థాపన సురేశ్‌బాబు విన్నపం మేరకే స్థాపించబడింది; ఆ మఠ నిర్వహణ ఖర్చులు అతడే భరించేవాడు.
శ్రీరామకృష్ణులు వచించిన నలుగురు సరఫరాదారులలో రెండున్నర మంది పోగా మిగిలిన ఒకటిన్నర మంది ఎవరు?… బేలూర్ మఠం కోసం స్థలం కొనుగోలు చేయడంలో, ఆ మఠ నిర్మాణంలో స్వామి వివేకానందకి ఆర్థికంగా ఎంతో సహాయం చేసిన అమెరికా వాస్తవ్యురాలు శ్రీమతి సారా సి. బుల్, మనం ప్రస్తుతం ప్రస్తావిస్తున్న బలరాంబోస్ – బహుశా వీరిద్దరూ ఆ ఒకటిన్నర సరఫరాదారు లేమో! శ్రీరామకృష్ణులు, స్వామి వివేకానంద (స్థూలరూపంలో) ఇప్పుడు లేనందున ఆ ప్రశ్నకు జవాబు ఎవరు చెప్పగలరు?
7. అమిత భక్తి ప్రపత్తులున్న బలరాం కుటుంబం
దక్షిణేశ్వరానికి వెళ్ళి శ్రీరామకృష్ణులను దర్శించుకొన్న నాటినుండి బలరాం బోస్ ప్రతి సంవత్సరం తన ఇంట్లో జరిగే రథోత్సవానికి ఆయనను ఆహ్వానించేవాడు. అతడి ఇల్లు (నిజానికి ఆ ఇల్లు కటక్‌లో సుప్రసిద్ధ న్యాయవాదియైన అతడి సోదరుడు రాయ్ హరివల్లభ బోస్ బహదూర్‌ది) బాగ్‌బజార్‌లోని రమాకాంత్ బోసు వీథిలో ఉంది. బలరాం తన సోదరుడి ఇంట్లో నివసించేవాడు. ఆ ఇంటి నెంబరు 57. ఈ ఇంటిని శ్రీరామకృష్ణులు ఎన్నిసార్లు పావనం చేశారో చెప్పలేం! ఇక్కడ శ్రీరామకృష్ణులను దర్శించుకొని తమ జీవితాన్ని ధన్యం చేసుకొన్న వారెందరో చెప్పడం ఎవరి తరం? శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు దక్షిణేశ్వర కాళికాలయాన్ని ‘కాళీమాత కోట’ గా చమత్కరించేవారు. బలరాం ఇంటిని కాళీమాత రెండవ ‘కోట’ గా పేర్కొనడం అతిశయోక్తి కాబోదు. “బలరాం కుటుంబ సభ్యులందరూ ఒకే రాగం ఆలపిస్తారు” అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. ఇంటి యజమాని, గృహిణి నుండి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరూ శ్రీరామకృష్ణుల భక్తులే. భగవన్నామ జపం చేయనిదే వారెవ్వరూ కనీసం నీళ్ళు కూడా పుచ్చుకొనేవారు కారు. పూజ, పారాయణ, సాధుసేవ, దానధర్మం మొదలైన ధార్మిక కార్యాలను ప్రతి ఒక్కరూ పాటించేవారు. అనేక కుటుంబాలలో ఒకరిద్దరు ఆధ్యాత్మిక పరులైతే, తక్కినవారు పరమ లౌకికులై ఉండడం కద్దు. కాని ఈ కుటుంబం తద్విరుద్ధం; అందరూ భక్తిభావప్రపూర్ణులే. నిస్వార్థ ధార్మికత గల కుటుంబాలు ఎంతో అరుదు; కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒకే ధ్యేయం పట్ల అనురక్తి గలవారై, ఆ ధ్యేయాన్ని చేరుకోవడంలో పరస్పరం సహకరించుకోవడం మరీ అరుదైన విషయం. అటువంటప్పుడు బలరాం బోస్ ఇల్లు (కుటుంబం) శ్రీరామకృష్ణులకు రెండవ ‘కోట’ కావడంలో, అక్కడకు వచ్చి ఆయన ఆనందించడంలో వింత ఏమీలేదు.
8. బలరాం బోస్ ఇంట్లో జరిపే రథోత్సవం అతడి భక్తిని చాటుతుంది
బలరాం ఇంట్లో జగన్నాథుని నిత్యసేవ జరిగేదని ఇంతకు మునుపే తెలిపివున్నాం. రథోత్సవ సమయంలో ఒక రథాన్ని లాగేవారు. అయినా ఈ ఉత్సవంలో ఎలాంటి బాహ్యాడంబరమూ ఉండేది కాదు; మేళతాళాలూ, అలంకారాలూ, కోలాహలం ఉండేవి కావు; కేవలం అది భగవద్భక్తిని చాటే ఉత్సవంగా ఎంతో నిరాడంబరంగా జరిగేది. అతడి ఇంటి మొదటి అంతస్తులో చతుష్కోణాకృతి వసారా ఉంది. రథాన్ని ఈ వసారా చుట్టూ లాగుతూంటే కీర్తన బృందంవారు సంకీర్తనం చేసేవారు. శ్రీరామకృష్ణులు, భక్తులు వారితో కలిసి పాడేవారు.
బలరామ్ బోస్ (1848-1890)
వందసార్లు పైగా శ్రీరామకృష్ణులు విచ్చేసిన కలకత్తా, బాగ్‌బజార్‌లోని బలరామ్ బోస్ గృహం.
ఆ ఉత్సవం అంత నిరాడంబరంగా జరిగినా, వెల్లివిరిసే అంతటి ఆనందం, పొంగిపొరలే భగవద్భక్తి, భగవదోన్మత్త భావం, శ్రీరామకృష్ణుల మధుర నృత్యం మరెక్కడ లభిస్తాయి? ఆ సాత్త్విక కుటుంబం వారి విశుద్ధ భక్తికి ప్రసన్నుడై స్వయంగా జగన్నాథుడు రథంలోని ప్రతిమలోను, అట్లే శ్రీరామకృష్ణుల శరీరంలోను అభివ్యక్తుడైనాడంటే అతిశయోక్తి కాదు! అదొక అపూర్వమైన సన్నివేశం. ఆ విశుద్ధ భక్తి ప్రవాహంలో కొట్టుకొనిపోతే పాషాండుని కర్కశ హృదయం కూడా ద్రవించిపోతుందంటే, ఇక భక్తుల గురించి ప్రత్యేకించి చెప్పాలా? కొన్ని గంటలు ఆ విధంగా సంకీర్తన కొనసాగేది. తరువాత అన్నభోగం జగన్నాథునికి నివేదించాక శ్రీరామకృష్ణులు భోజనం చేసేవారు; పిదప భక్తులు ప్రసాదం పుచ్చుకొనేవారు. రాత్రి చాలా పొద్దుపోయేదాక ఆ ఆనందోత్సాహం కొనసాగేది. ఏదో ఇద్దరు ముగ్గురు భక్తులు తప్ప తక్కిన వారంతా ఇళ్ళకు తిరిగి వెళ్ళిపోయేవారు. ఈ ఆనందోత్సవంలో పాల్గొనే భాగ్యం ఈ రచయితకు (స్వామి శారదానంద) ఒకే ఒక్కసారి కలిగింది. 1885 వ సం ॥ రథం తిరిగి వచ్చే సందర్భంలో జరిగిన ఉత్సవ వేడుకల్లో ఈ రచయిత పాల్గొన్నాడు. శ్రీరామకృష్ణుల ఆనతి మేరకు గోపాలుని తల్లిని కూడా ఆ ఉత్సవానికి ఆహ్వానించారు. శ్రీరామకృష్ణులు ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని బలరాం ఇంటికి విచ్చేసి రెండు పగళ్ళు, రెండు రాత్రుళ్ళు అక్కడే గడిపి, మూడవ రోజు ఉదయం ఎనిమిది లేదా తొమ్మిది గంటలకు పడవలో బయలుదేరి దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళారు.
శ్రీరామకృష్ణులు ఆ రోజు ఉదయమే బలరాం ఇంటికి విచ్చేశారు. బయటి గదిలో కొంతసేపు కూర్చున్న తరువాత, ఫలహారం చేయడానికి ఆయనను లోపలికి తోడ్కొని వెళ్ళారు. ఈలోపు ఇద్దరు ముగ్గురుగా భక్తులు వచ్చి బయటి గదిలో సమావేశమయ్యారు; ఇరుగు పొరుగు ఇళ్ళలో నుండి భక్తురాండ్రు లోపలి గదిలోకి వచ్చారు. వీరిలో చాలామంది బలరాం బంధువులు లేదా పరిచయస్థులు. శ్రీరామకృష్ణులు తన ఇంటిని పావనం చేసినప్పుడల్లా బలరాం ఆహ్వానం పురస్కరించుకొని వీరంతా బలరాం ఇంటికి వచ్చేవారు. అలాగే బలరాం దక్షిణేశ్వరానికి పోతున్నప్పుడు వీరిని తన ఇంటికి రప్పించి, తనతోపాటు వీరిని గురుదేవుల వద్దకు తీసుకువెళ్ళేవాడు. భావిని, అసీమ్ తల్లి, గణు తల్లి, అమ్మమ్మ లేదా ఆతడి తల్లి, అత్త, ఇంకొకరి ఆడపడుచు, వారి పొరుగింటి స్త్రీ – ఇలా అనేకమంది భక్తురాండ్రు ఆ రోజు అక్కడకు వచ్చారు.
9. భక్తురాండ్రతో శ్రీరామకృష్ణులకు గల అద్భుత బాంధవ్యం
పవిత్ర మనస్కులూ, సుగుణ సంపన్నులూ అయిన ఈ భక్తురాండ్రతో, పరిపూర్ణ కామగంధరహితులైన శ్రీరామకృష్ణులకు గల మధుర బాంధవ్యాన్ని మేం మాటల్లో వివరించలేం. వారిలో అనేకులు శ్రీరామకృష్ణులను తమ ఇష్టదైవంగా ఆరాధించేవారనడం అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరికీ శ్రీరామకృష్ణుల పట్ల ప్రగాఢ భక్తి విశ్వాసాలు ఉండేవి. వారిలో గోపాలుని తల్లి వంటి కొద్దిమంది భాగ్యశాలురు ప్రత్యక్ష దివ్యదర్శనాదుల మూలంగా ఈ విషయాన్ని గ్రహించారు. కాబట్టే శ్రీరామకృష్ణులను తమ సొంత మనిషి కంటే అత్యంత సన్నిహితులుగా పరిగణించి, ఆయన సమక్షంలో బిడియం, సంకోచం చెందేవారు కారు.
ఇంట్లో మంచి వంటకం ఏదైనా తయారుచేస్తే ముందుగా దాన్లో కొంతభాగం శ్రీరామకృష్ణుల కోసం ప్రత్యేకంగా కేటాయించి, ఆ తరువాతే తాము తినేవారు; ఆ వంటకాన్ని ఎవరి ద్వారానన్నా పంపడమో లేదా తామే స్వయంగా తీసుకువెళ్ళో శ్రీరామకృష్ణులకు ఇచ్చేవారు. గురుదేవుల జీవితకాలంలో ఈ భక్తురాండ్రు ఎన్నిసార్లు దక్షిణేశ్వరానికి, తిరిగి తమ ఇళ్ళకు కాలినడకన వెళ్ళి వచ్చారో చెప్పలేం. కొన్ని సందర్భాలలో వాళ్ళు సూర్యాస్తమయం తరువాత, మరికొన్ని సమయాలలో రాత్రి పది గంటలకు, కొన్ని వేళల్లో కీర్తన, ఉత్సవం పూర్తయ్యాక ఏ అర్ధరాత్రో తిరిగి ఇళ్ళకు వెళ్ళి ఉండవచ్చు. శ్రీరామకృష్ణులు చిన్న పిల్లవాడిలా వారిలో కొందరిని తమ కడుపు రుగ్మతకు ఔషధం గురించి సంప్రతించడం కద్దు. అది చూసి ఎవరైనా హేళనపూర్వకంగా నవ్వితే, ఆయన వెంటనే, “మీకేం తెలుసు? ఆమె ఘనవైద్యుడి భార్య కదా! తప్పకుండా ఆమెకు కొన్ని మందుల గురించి తెలిసే ఉంటుంది” అనేవారు. వారిలో ఒకరి తీవ్ర భక్తి భావం గమనించి, “ఈమె కృపాసిద్ధురాలైన గోపిక” అని చెప్పేవారు. మరొక భక్తురాలు వండిన వంటకం రుచి చూసి, “ఈమె వైకుంఠంలోని వంటగత్తె, కాకరకాయ పులుసు వండడంలో నేర్పరి” అని చెప్పేవారు.
10. గోపాలుని తల్లిని తోడ్కొని రమ్మని శ్రీరామకృష్ణులు భక్తురాండ్రకు చెప్పడం
ఫలహారం ఆరగిస్తూ శ్రీరామకృష్ణులు భక్తురాండ్రతో గోపాలుని తల్లి మహద్భాగ్యాన్ని గురించి ముచ్చటించారు. ఆప్యాయత ఉట్టిపడే స్వరంలో వారితో ఇలా చెప్పారు : “కామార్హాటనుండి గోపాలభావం సంతరించుకొని వచ్చే ఆ బ్రాహ్మణికి వివిధ దివ్యదర్శనాలు కలిగాయి. తన నుండి ఆహారం పుచ్చుకోవడానికి గోపాలుడు చెయ్యి చాపుతాడని ఆమె చెబుతూంటుంది. ఆ రోజు అటువంటి అనేక దివ్యదర్శనాల అనుభూతి పొందడంతో ప్రేమోన్మత్తురాలై ఇక్కడకు (దక్షిణేశ్వరానికి) వచ్చింది. నేనేదో కాస్త తినిపించిన తరువాత ఆమె ఆ ఉన్మాదావస్థ కొంత ఉపశమించింది. ఆ రాత్రి దక్షిణేశ్వరంలోనే ఉండిపొమ్మన్నాను గాని, ఆమె బస చేయలేదు. తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అదే ప్రేమోన్మాదావస్థ కొనసాగింది. కట్టుకొన్న చీర వదులై నేలమీద పారాడడం కూడా ఆమె గమనించే స్థితిలో లేదు. నేను చీరను సరిచేసి, ఆమెను శాంతపరచడానికి నా చేతిని ఆమె తల మీద వేసి అనునయంగా నిమరసాగాను. ఆమె భక్తి సాటిలేనిది, ఆమె ఎంతో ఉత్తమురాలు. ఆమెను తోడ్కొని రాకూడదా?”
ఈ మాట చెవిన పడగానే, కామార్హాటి నుండి గోపాలుని తల్లిని తోడ్కొని రావడానికి బలరాం ఒక వ్యక్తిని పంపించాడు. శ్రీరామకృష్ణులు నాడు, మర్నాడు కూడా అక్కడే ఉంటారు కనుక, ఆమె రావడంలో జాప్యమైనా ఫరవాలేదు. ఫలహారం ఆరగించి శ్రీరామకృష్ణులు వెలుపల గదిలోకి వచ్చి భక్తులతో ముచ్చటించసాగారు.
11. శ్రీరామకృష్ణుల భావావస్థ:గోపాలుని తల్లి రాక
వేళకాక మునుపే శ్రీరామకృష్ణులు మధ్యాహ్న భోజనం ముగించారు. భక్తులు కూడా భోజనాలు చేశారు. తదనంతరం ఆయన కాసేపు విశ్రాంతి తీసుకొని చావడిలోకి వచ్చి భక్తులతో వివిధ ఆధ్యాత్మిక అంశాలపై మాట్లాడసాగారు. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ సంధ్యాసమయం కానున్నప్పుడు ఆయన భావ పారవశ్యం పొందారు. దోగాడుతూ, కుడి చేతిని ఏ తినుబండారాన్నో అడుగుతున్న ధోరణిలో పైకెత్తి, ఎవరి ముఖం వైపుగానో చూస్తున్నట్లు తన ముఖాన్ని పైకెత్తి, కళ్ళు ఆనందాన్ని వ్యక్తీకరించే భంగిమలో బాలగోపాలుని ప్రతిమను మనమంతా చూసేవుంటాం. భావావేశమగ్నులైన శ్రీరామకృష్ణుల దేహం, అవయవాలు అచ్చం అదే భంగిమను సంతరించుకున్నాయి. కాని ఒక్క తేడా మాత్రం ఉంది. ఆయన కళ్ళు సగం మూతబడి ఉన్నాయి; బాహ్యదృష్టి లేదు, దృష్టి అంతర్ముఖమై ఉంది.
శ్రీరామకృష్ణులకు భావపారవశ్య స్థితి ప్రారంభమైన తక్షణమే గోపాలుని తల్లి వచ్చిన బండి బలరాం బోస్ ఇంటి గుమ్మం ముందు ఆగింది. బండి దిగి మేడ మీదకు వచ్చి తన ఇష్టదేవతారూపంలో ఉన్న శ్రీరామకృష్ణులను ఆమె చూసింది. గోపాలుని తల్లి మహాభక్తే శ్రీరామకృష్ణులకు ఆ విధంగా హఠాత్తుగా గోపాలభావం జనించడానికి కారణమని భక్తులు గ్రహించారు. ఆమె ఎంత అదృష్టవంతురాలో అని అనుకొంటూ, అక్కడున్న వారంతా ఆమెను పూజ్యభావంతో చూడసాగారు. “ఆహా, ఆమెది ఎంత అద్భుతమైన భక్తి! ఈమె భక్తి ప్రేరణతోనే శ్రీరామకృష్ణులు సాక్షాత్తు గోపాల రూపాన్ని దాల్చారు!” అని చెప్పసాగారందరూ.
కాని గోపాలుని తల్లి మాత్రం ఇలా అన్నది : “భావ పారవశ్యంలో అలా కొయ్యదుంగలా బిర్రబిగుసుకుపోవడం నాకు నచ్చలేదు. నా గోపాలుడు నవ్వుతాడు, ఆడతాడు, నడుస్తాడు, పరుగెత్తుతాడు. అయ్యో! ఇదేమిటి? కొయ్య దుంగలా బిర్ర బిగుసుకుపోయిన భంగిమ! ఇటువంటి గోపాలుణ్ణి చూడడం నాకు ఇష్టంలేదు.”
ఇంతకు మునుపు భావసమాధిలో శ్రీరామకృష్ణులు పూర్తిగా బాహ్యస్మృతిని కోల్పోవడం మొట్టమొదటిసారి చూసినప్పుడు ఆమె భయంతో ఎంతో కంగారుపడి, “నాయనా, ఎందుకు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు?” అంటూ, ఆయన దేహాన్ని కుదిపింది. ఈ సంఘటన శ్రీరామకృష్ణులు కామార్హాటికి మొదటిసారి వెళ్ళినప్పుడు జరిగింది.
12. భావసమాధి మగ్నులైనప్పుడు శ్రీరామకృష్ణులలోని ఆకర్షణ
మొట్టమొదటిసారి మేం శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళినప్పుడు, ఆయన వయస్సు దాదాపు నలభై తొమ్మిదేళ్ళు, బహుశా ఐదారు నెలలు తక్కువ ఉండవచ్చు. గోపాలుని తల్లి కూడా ఇదే సమయంలోనే ఆయన వద్దకు రాసాగింది. శ్రీరామకృష్ణులను కలుసుకోవడానికి ముందు మేం ఇలా అనుకొనేవారం: అమాయకులైన పసిపిల్లల చేష్టలు, నృత్యం చూడముచ్చటగా ఉంటుంది గాని, యుక్తవయస్కుడు అలా చేస్తే చిరాకు వస్తుంది లేదా పరిహాసాస్పదంగా ఉంటుంది. స్వామి వివేకానంద, “ఖడ్గమృగం నాట్యకత్తెలా నృత్యం చేయడం ఎవరైనా ఆనందిస్తారా?” అని చెప్పేవారు. కాని శ్రీరామకృష్ణుల విషయంలో మా అభిప్రాయాలను మార్చుకోక తప్పలేదు. కాస్త వయస్సు పైబడ్డా కూడా శ్రీరామకృష్ణులు నృత్యం చేసేవారు, వివిధ అభినయాలు చూపేవారు – ఆహా! అవి ఎంత రమ్యంగా ఉండేవో! “మధ్య వయస్కుడు నృత్యం చేసేటప్పుడు ఇంత అందంగా ఉంటాడని కలలో సైతం ఊహించలేదు” అని గిరీశ్ఘోష్ చెప్పేవాడు.
ఈ రోజు బలరాం ఇంట్లో గోపాల భావావస్థ ప్రభావంలో శ్రీరామకృష్ణుల అంగభంగిమల తీరుతెన్నులు ఎంత రమ్యంగా ఉన్నాయో కదా! ఆ తీరుతెన్నులు ఎందుకంత అందంగా కనిపించాయో మాకప్పుడు అర్థంకాలేదు. ఆ తీరుతెన్నులు అందంగా ఉన్నాయని మాత్రమే అప్పుడు అనుకొన్నాం, అంతే. ఇప్పుడిప్పుడే మాకు అర్థం కాసాగింది. ఎప్పుడు ఏ భావం ఆయనలో జనించేదో, అప్పుడు ఆ భావంలో పరిపూర్ణంగా ఆయన లీనమైపోయేవారు; మరే ఇతర భావానికీ ఆయన మనస్సులో చోటువుండేది కాదు. దానిలో పూర్తిగా లీనం అయిపోయేవారు. ఆ తాదాత్మ్యం ఎంత పరిపూర్ణంగా ఉండేదంటే, మధ్యవయస్సు దాటిన ఒక వ్యక్తి ఆ భావప్రేరణలో ఒక పిల్లవాడిలా లేదా ఒక స్త్రీలా ప్రవర్తించడం ఎవరికీ విలక్షణంగా కనిపించేది కాదు. శ్రీరామకృష్ణుల మనస్సును ఆవరించిన భావతరంగాలు పొంగిపొరలి, ఆయన దేహాన్ని ఆ భావానికి అనుగుణంగా పూర్తిగా మార్చి, కొత్తరూపాన్ని దాల్చేట్లు చేసేవి.
13. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగిరావడం
ఆ సందర్భంలో శ్రీరామకృష్ణులు, భక్తుల సాంగత్యంలో బలరాం ఇంట్లో రెండు పగళ్ళు, రెండు రాత్రుళ్ళు ఆనందంగా గడిపారు. ఇది మూడవ రోజు, ఇక ఆయన దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళవలసివుంది. ఉదయం ఎనిమిది లేదా తొమ్మిది గంటలకు ఘట్టం వద్ద ఆయన తిరిగి వెళ్ళడానికి ఒక పడవ సిద్ధంగా ఉంది. గురుదేవుల సేవ నిమిత్తం ఆయనతో పాటు వచ్చిన ఒకరిద్దరు యువభక్తులతో పాటు గోపాలుని తల్లి, మరో భక్తురాలు (గోలాప్మా) ఆ పడవలోనే దక్షిణేశ్వరానికి వెళ్ళనున్నారు. బహుశా కాళీ (స్వామి అభేదానంద) వారిలో ఒకడై ఉంటాడు.
శ్రీరామకృష్ణులు ఇంటి లోపలికి వెళ్ళి జగన్నాథునికి మొక్కి, ఆ భక్త కుటుంబం ప్రణామాలు స్వీకరించి, వెళ్ళి పడవలో కూర్చున్నారు. గోపాలుని తల్లి, ఇతర భక్తులు కూడా ఆయనను అనుసరించి వెళ్ళి పడవలో కూర్చున్నారు.
గోపాలుని తల్లికి వస్త్రాలు, వంటకు ఉపయోగపడే గరిట, పట్టకారు, మరికొన్ని సామానులు బలరాం కుటుంబ సభ్యులు ఎంతో భక్తిప్రపత్తులతో సమర్పించారు. వాటిని ఒక మూటగా కట్టి, ఆ మూటను కూడా పడవలో పెట్టారు. పడవ బయలుదేరింది.
14. గోపాలుని తల్లి తీసుకువస్తున్న మూటను చూసి శ్రీరామకృష్ణులు చిరాకుపడడం
పడవలో పోతున్నప్పుడు శ్రీరామకృష్ణుల దృష్టి ఆ మూటమీద పడింది. ఆ మూట గోపాలుని తల్లిదని ఆయనకు తెలియవచ్చింది. బలరాం కుటుంబంవారు ఆ మూటలోని వస్తువులను ఆమెకు ఇచ్చారని ఆయన తెలుసుకోగానే ఆయన ముఖం గంభీరముద్ర దాల్చింది. సూటిగా గోపాలుని తల్లిని సంబోధించకుండా, ‘గోలప్మా’ తో త్యాగ వైరాగ్యాలను గురించి మాట్లాడసాగారు : “పరిత్యాగాన్ని సంతరించుకొన్న వ్యక్తే భగవత్సాక్షాత్కారం పొందగలడు. ఎవడు పరాయివారి ఇళ్ళలో భోజనం చేసి ఉత్తచేతులతో (అంటే ఏమీ స్వీకరించకుండా) తిరిగి వస్తాడో ఆ వ్యక్తి మాత్రమే భగవంతుణ్ణి ఆనుకొని కూర్చోగలడు (అంటే భగవంతుడిపై ఒత్తిడి తేగలడు).” దారిలో ఆయన గోపాలుని తల్లితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు సరికదా అప్పుడప్పుడు ఆ మూట వంకే దృష్టిని సారించారు. శ్రీరామకృష్ణుల ఆ వైఖరి చూసి గోపాలుని తల్లి, ‘మూటను గంగలో పారేస్తే బాగుంటుంది’ అని అనుకొన్నది. శ్రీరామకృష్ణులు ఐదేళ్ళ పిల్లవాడిలా భక్తులతో పరిహాసమాడుతూ, ఆడుతూ పాడుతూ మెలగేవారు; కాని అవసరమైనప్పుడు వారితో కఠినంగా కూడా వ్యవహరించేవారు. ఎవరైనా కించిత్తు అనుచితంగా ప్రవర్తించినా ఆయన సహించలేకపోయేవారు. ఎంత చిన్న విషయం కూడా ఆయన దృష్టిలో పడకుండా తప్పించుకోలేదు. ఎవరైనా రవంత అనుచితంగా ప్రవర్తించిన మరుక్షణమే తన సునిశిత దృష్టిని ఆ వ్యక్తిపై పరపేవారు; ఆ వ్యక్తి వెంటనే తన తప్పిదాన్ని దిద్దుకోడానికి తీవ్రంగా ప్రయత్నించేవాడు. ఆ వ్యక్తిలో దిద్దుబాటు తేవడానికి ఆయన గట్టిగా ప్రయత్నించనవసరంలేదు. ఎందుకంటే, తీక్షణంగా చూస్తూ, కాసేపు ఆ వ్యక్తితో మాట్లాడకపోతే చాలు – తప్పు చేసిన ఆ వ్యక్తి కంగారుపడి, తన తప్పుకు పశ్చాత్తాపం చెందేవాడు. అప్పటికీ బుద్ధిరాకపోతే, ఆయన ముఖతా వెలువడ్డ రెండు మూడు మందలింపు మాటలు చాలు, అతడిలో పరివర్తన తేవడానికి. శ్రీరామకృష్ణులు ప్రతి భక్తునితో వ్యవహరించే పద్ధతి, బోధించే విధానం కూడా అనుపమానంగానే ఉండేవి. ముందుగా ఆయన తమ అనంత ప్రేమతో భక్తుని హృదయాన్ని చూరగొనేవారు, ఆ తరువాత కొద్ది మాటలతో అతడికి ఉపదేశించి, అతడిలో పరివర్తన తెచ్చేవారు.
15. గోపాలుని తల్లి పశ్చాత్తాపం
దక్షిణేశ్వరం చేరుకోగానే గోపాలుని తల్లి ఆతురతతో నహబత్లో ఉంటున్న మాతృదేవి వద్దకు వెళ్ళి, ఇలా అన్నది : “ఓ కోడలా, ఈ సామగ్రి మూటను చూసి గోపాలుడు ఎంతో ఆగ్రహించాడు; ఇప్పుడు ఏం చెయ్యాలి? వీటిని ఇక్కడే పంచిపెట్టి పోతే మంచిది అనిపిస్తోంది”. కరుణా స్వరూపిణియైన మాతృదేవి ఆ వృద్ధురాలు బాధపడడం చూసి, ఆమెను ఊరడిస్తూ ఇలా అన్నారు : “అమ్మా, ఆయన ఏమైనా చెప్పనివ్వు. వీటిని ఇవ్వడానికి నీకు ఇంకెవరున్నారు? ఈ పరిస్థితిలో నువ్వు మాత్రం ఏం చేయగలవు? అవసరం ఉండబట్టే కదా నువ్వు పుచ్చుకొన్నావు?”
మాతృదేవి అంతగా చెప్పినప్పటికీ గోపాలుని తల్లి ఒక వస్త్రాన్ని, ఒకటి రెండు సామాన్లను అక్కడే పంచిపెట్టింది. ఆ తరువాత హృదయం తడబడుతూంటే స్వయంగా ఒకటి రెండు కూరలతో వంట చేసి, భోజనం పెట్టడానికి శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళింది. అందరి హృదయాలను ఇట్టే తెలుసుకోగల శ్రీరామకృష్ణులు, ఆమె పశ్చాత్తాపపడడం గమనించి, ఆ విషయం గురించి మరేమీ వ్యాఖ్యానించలేదు. మునుపటి మాదిరే ఆమెతో నవ్వుతూ మాట్లాడారు. దాంతో గోపాలుని తల్లి కూడా కుదుటపడింది. శ్రీరామకృష్ణులకు భోజనం తినిపించి, తేలికపడ్డ హృదయంతో సాయంత్రం కామార్హాటికి తిరిగి వెళ్ళిపోయింది.
తాను మొదటి దర్శనం పొందినప్పటి నుండి గోపాలుని తల్లి తన ఇష్టదైవమైన బాలగోపాలుణ్ణి రెండు నెలలపాటు అనవరతం దర్శించసాగిందని ఇంతకు మునుపే తెలిపివున్నాం. తరువాత ఆమెకు ఆ నిరంతర దర్శనాలు కలగడం తగ్గాయి. అలా అని రెండు నెలల తరువాత ఎప్పుడోగాని ఆమెకు ఆ దర్శనాలు కలిగేవి కావని భావించరాదు. ప్రతి రోజు, ఎప్పుడు ఆమె కోరుకొంటే అప్పుడు గోపాలుడు సాక్షాత్కరించేవాడు. ఎప్పుడన్నా ఆమెకు ఏదైనా బోధించవలసివస్తే గోపాలుడు హఠాత్తుగా ఆమె ముందు కనిపించి సంజ్ఞల ద్వారానో లేదా మాటల ద్వారానో లేదా తాను స్వయంగా చేసి చూపో ఆమెకు ఆ విషయం బోధపరచేవాడు. మళ్ళీ మళ్ళీ శ్రీరామకృష్ణుల పునీత దేహంలో లీనమైపోతూ, తానూ శ్రీరామకృష్ణులూ అభిన్నులమనే సత్యాన్ని ఆమెకు గ్రహింపచేశాడు. తనకు ఇది కావాలి, అది తిన గోరుతున్నాను అని ఆమెను అడిగి పుచ్చుకొని, తననెలా సేవించాలో కూడా ఆమెకు నేర్పాడు. అలాగే శ్రీరామకృష్ణులు, కొందరు విశిష్ట భక్తులతో ఆమె సమక్షంలో కలిసి పచార్లు చేస్తూ, ‘భగవంతుడు – భక్తుడు’ తాను (గోపాలుడు) తన భక్తులు అభిన్నులమనే విశ్వాసాన్ని ఆమెలో పాదుగొలిపారు. దాంతో ఆ భక్తులు స్పృశించిన ఆహారాన్ని తినడంలో ఇదివరలో ఆమెకున్న సంకోచం క్రమంగా సమసిపోయింది.
16. గోపాలుని తల్లి మానసిక వైఖరి
శ్రీరామకృష్ణులే తన ఇష్టదైవమని గోపాలుని తల్లిలో ప్రగాఢ విశ్వాసం కుదిరిన తరువాత, గోపాలరూప దర్శనం తరచు ఆమె పొందడంలేదు. అందుకు బదులుగా ఆమెకు తరచు శ్రీరామకృష్ణుల రూపదర్శనమే కలుగసాగింది. ఆ రూపం ద్వారానే గోపాల రూపుడైన భగవంతుడు ఆమెకు అవసరమైనదంతా బోధించసాగాడు. గోపాలరూప దర్శనం కలగడం తగ్గిపోవడంతో మొదట్లో ఆమె ఎంతో బాధపడి, ఒక రోజు శ్రీరామకృష్ణుల వద్దకెళ్ళి ఏడుస్తూ, “గోపాలా, నన్నెందుకిలా చేస్తున్నావు? నేనేం తప్పు చేశాను? ఇంతకు ముందులా నీ దర్శనం (అంటే గోపాల రూపంలో) నాకు కలగడం లేదు, ఎందుకు?” అని అడిగింది. అందుకు శ్రీరామకృష్ణులు ఇలా జవాబిచ్చారు: “ఈ కలియుగంలో అటువంటి దర్శనాలు అనవరతం కలిగితే, దేహం నిలవదు. ఇరవై ఒక్క రోజుల తరువాత దేహం ఎండుటాకులా రాలి పోతుంది.” నిజానికి మొదటి దర్శనానంతరం రెండు నెలల వరకు గోపాలుని తల్లి భావావస్థ ప్రభావంలోనే ఉండిపోయింది. వంట, స్నానం, తినడం, జపించడం, ధ్యానించడం మొదలైన పనులన్నీ అలవాటు మేరకు, కర్తవ్యం మేరకు మాత్రమే నిర్వర్తించిందని మాత్రమే చెప్పాలి. పాత అలవాట్ల కారణంగానే ఆమె దేహం యాంత్రికంగా ఈ పనులను చేసుకుపోయేది. కాని ఆమె మాత్రం సదా సర్వదా ఆధ్యాత్మిక భావోన్మత్తతలోనే నెలకొని ఉండేది. ఈ విధంగా ఉంటే దేహం ఎంతకాలం నిలుస్తుంది? రెండు నెలలకాలం దేహం నిలిచి ఉండడమే ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. రెండు నెలలు పూర్తయ్యే సమయానికి ఆ భావోన్మత్త ప్రభావం ఎంతో మేరకు తగ్గిపోయింది. కాని మునుపటిలా గోపాలుణ్ణి దర్శించలేకపోవడం వలన, పదేపదే గోపాల దర్శనం పొందాలనే తీవ్ర వ్యాకులత ఆమెలో జనించింది. తత్ఫలితంగా దేహంలో వాయుధాతువు ప్రకోపించి గుండెలో ఆమె ఎంతో బాధను అనుభవించసాగింది. అందుకే ఆమె శ్రీరామకృష్ణులతో, “వాయువు ప్రకోపించడం వలన నా గుండెను రంపంతో కోస్తున్నట్లు అనిపిస్తోంది” అని చెప్పింది. శ్రీరామకృష్ణులు ఆమెను అనునయించి, ఆప్యాయంగా, “ఇది ఉత్త వాయువు కాదు, హరి వాయువు. అది తొలగిపోతే నీ జీవితానికి ఇక ఆసరా ఏమిటి? అది ఉండడమే మంచిది. బాధ ఎక్కువైనప్పుడు ఏదైనా కాస్త తిను” అని చెప్పారు. అలా అంటూ ఆయన ఆ రోజు రుచికరమైన తినుబండారాలను ఆమె చేత తినిపించారు.
17. మార్వాడీ భక్తులు శ్రీరామకృష్ణుల దర్శనార్థం రావడం
కలకత్తా వాస్తవ్యులైన (బెంగాలీలు) మా వంటి అనేకమంది ఎలా శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చేవారమో, అట్లే మార్వాడీ స్త్రీ పురుషులు అనేకులు ఆయన దర్శనార్థం అప్పుడప్పుడు వచ్చేవారు. వారు అనేక బళ్ళు కట్టుకొని దక్షిణేశ్వరానికి వచ్చేవారు. గంగలో స్నానం చేసి, పువ్వులు సేకరించి శివుణ్ణి, తదితర దైవాలను ఆరాధించి పంచవటిలో సమావేశమయ్యేవారు. అక్కడ పొయ్యి రాజేసి రొట్టెలు, పప్పు, కూరలు వండి దేవుడికి నైవేద్యం పెట్టేవారు. తరువాత తాము వండి నైవేద్యం పెట్టిన ఆహారంలో ముందుగా ఒక వంతు శ్రీరామకృష్ణులకు సమర్పించి, తదనంతరం తాము భుజించేవారు. వారిలో పలువురు గురుదేవులకు పటికబెల్లం, ద్రాక్షపళ్లు, బాదం, ఖర్జూరాలు, పిస్తాపప్పు, జామపళ్ళు, దానిమ్మపళ్ళు, తమల పాకులు మొదలైనవి సమర్పించి, ప్రణామం చేసేవారు. వారు మనలోని అత్యధిక సంఖ్యాకులవంటివారు కారు; సాధువుల ఆశ్రమాలకు లేదా దేవాలయాలకు రిక్తహస్తాలతో వెళ్ళరాదనే ఆచారం వారికి బాగా తెలుసు. కాబట్టి వచ్చేటప్పుడు తప్పకుండా ఏదో ఒకటి తమతోపాటు తీసుకువచ్చేవారు. కాని శ్రీరామకృష్ణులు మాత్రం ఏ ఒకరిద్దరు మార్వాడీలను మినహాయించి తక్కినవారు సమర్పించే వేటినీ స్వీకరించేవారు కారు. ఆయన ఇలా చెప్పేవారు : “వారు నాకిచ్చే తమలపాకు చుట్టలో, ‘న్యాయస్థానంలోని నా వ్యాజ్యెం గెలవాలి’, ‘నా రోగం నయం కావాలి’, ‘నా వ్యాపారంలో బాగా లాభం రావాలి’ మొదలైన పదహారు కోర్కెలు జోడించి కట్టిపెడతారు.”
18. కానుకల పట్ల శ్రీరామకృష్ణుల వైఖరి
శ్రీరామకృష్ణులు వారిచ్చే ఆహార పదార్థాలు తాము తినరు, తమ భక్తులకు సైతం తినడానికి ఇచ్చేవారు కారు. కాని కొన్ని సందర్భాలలో ఆ మార్వాడీవారు వండి, దేవుడికి నైవేద్యం చేశాక తమకు సమర్పించిన ఆ ఆహారాన్ని ప్రసాదంగా కాస్త తినేవారు, మాకు కూడా తినడానికి ఇచ్చేవారు. మార్వాడీలిచ్చే పటికబెల్లం, పండ్లు వగైరాలను స్వీకరించే అర్హతవున్న ఏకైక వ్యక్తి నరేంద్రనాథ్. శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు : “సదా ఒర నుండి దూసిన జ్ఞానఖడ్గం అతడి వద్ద సిద్ధంగా ఉంది. వీటిని తిన్నా అతడికెలాంటి దోషమూ అంటదు. అతడి ఆధ్యాత్మిక అంతర్దృష్టి ఎన్నటికీ మందగించదు.”
19. కానుకలను నరేంద్రుడి ఇంటికి పంపించడం
శ్రీరామకృష్ణులు ఆ తినుబండారాలను ఆ సమయంలో అక్కడున్న ఎవరైనా భక్తులకిచ్చి వాటిని నరేంద్రుడి ఇంటికి పంపించేవారు. భక్తులెవరూ ఆ సమయంలో అక్కడ లేనప్పుడు కాళికాలయ పూజారియైన రాంలాల్ (తమ అన్నగారి కుమారుడు) ద్వారా పంపించేవారు. ఒక రోజు ఈ విషయం ప్రస్తావిస్తూ సోదరుడు రాంలాల్ మాతో ఇలా చెప్పాడు :
రాంలాల్‌తో పనిపడినప్పుడు శ్రీరామకృష్ణులు మధ్యాహ్న భోజనానంతరం అతణ్ణి పిలిచి, “కలకత్తాలో నీకేం పని లేదా?” అని అడిగేవారు. అతణ్ణి పదేపదే అలా పనికట్టుకొని ఆ వస్తువులను ఇచ్చిరావడానికి పంపితే అతడెక్కడ చిరాకుపడతాడోనని ఇలా ప్రారంభించేవారు. “ప్రస్తుతం కలకత్తాలో నాకేం పని లేదు. కాని మీరు వెళ్ళిరమ్మంటే వెళ్ళివస్తాను” అని రాంలాల్ జవాబిచ్చేవాడు. అందుకు శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు: “అబ్బే, ఊరకే అడిగాను. నువ్వు కలకత్తాకు వెళ్ళి చాలా రోజులైంది కదా! వెళ్ళాలనివుంటే ఒక్కసారి వెళ్ళిరాకూడదా? వెళ్ళేటప్పుడు ఆ పెట్టెలో డబ్బులున్నాయి, తీసుకో. బారానగర్ నుండి బాడుగ బండిలో వెళ్ళు. ఎండలో నడిస్తే నీకు జబ్బు చేస్తుంది. వెళ్ళేటప్పుడు ఈ పటికబెల్లం, బాదంపప్పు మొదలైనవి తీసుకెళ్ళి నరేంద్రుడికి ఇవ్వు. అతడి సమాచారం కనుక్కొనిరా. అతడు ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. అతడి క్షేమసమాచారాలు వినాలని ఆతురతగా ఉంది.”
“ఆహా, నే నెక్కడ విసుక్కొంటానోనని ఎంత తటపటాయింపో!” అని సోదరుడు రాంలాల్ జవాబిచ్చేవాడు.
సోదరుడు రాంలాల్ అటువంటి అవకాశాలను పురస్కరించుకొని కలకత్తాకు వెళ్ళి భక్తుల ఆనందాన్ని ఇనుమడింప చేసేవాడని చెప్పనవసరం లేదు.
ఒక రోజు దక్షిణేశ్వరానికి పలువురు మార్వాడీలు వచ్చారు. మామూలు ప్రకారం ఆ రోజు శ్రీరామకృష్ణుల గదిలో పటికబెల్లం, పండ్లు వగైరాలు గుట్టలా ప్రోగయ్యాయి. ఆ సమయంలో తలవనితలంపుగా గోపాలుని తల్లి, కొందరు భక్తురాండ్రు శ్రీరామకృష్ణులను చూడగోరి వచ్చారు. ఆయన గోపాలుని తల్లిని చూసి, ఆమె ప్రక్కకు వచ్చి నిలబడ్డారు. బిడ్డ తల్లిని చూసినప్పుడు తన ప్రేమను వ్యక్తంచేసే రీతిలో ఆయన ఆమెను తాకుతూ తమ ప్రేమను వ్యక్తం చేయసాగారు. గోపాలుని తల్లి శరీరాన్ని చూపుతూ అక్కడున్న అందరితో, “ఈ గలీబు హరితో నింపబడివుంది; ఈ శరీరం హరిమయం” అని చెప్పారు. గోపాలుని తల్లి అవాక్కయి నిలబడిపోయింది, శ్రీరామకృష్ణులు ఆమె కాళ్ళను తాకినా ఆమె కుంచించుకుపోలేదు. ఆ తరువాత గదిలో ఉన్న మంచి తినుబండారాలన్ని తెచ్చి ఆమెకు తినిపించసాగారు. ఆమె దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడల్లా శ్రీరామకృష్ణులు అలాగే ప్రవర్తించేవారు, ఆమెకు అట్లే తినిపించేవారు. ఒక రోజు ఆమె, “గోపాలా, నాకు ఇలా తినిపించడం నీకెందుకంత ఇష్టం?” అని అడిగింది.
శ్రీరామకృష్ణులు: గతంలో నువ్వు నా కెంతో తినిపించావు కాబట్టి.
గోపాలుని తల్లి: గతంలోనా? ఎప్పుడు నీకు తినిపించాను?
శ్రీరామకృష్ణులు: వెనుకటి ఒక జన్మలో.
ఆ రోజంతా గోపాలుని తల్లి దక్షిణేశ్వరంలో గడిపింది. కామార్హాటికి తిరిగి వెళ్ళిపోవడానికి ఆయన వద్ద సెలవు పుచ్చుకొంటున్నప్పుడు, శ్రీరామకృష్ణులు మార్వాడీలు సమర్పించిన పటికబెల్లమంతా ఆమెకిచ్చి, తీసుకువెళ్ళమన్నారు. “ఇంత పటికబెల్లం నాకెందుకు ఇస్తున్నావు?” అని ఆమె అడిగింది. అందుకు శ్రీరామకృష్ణులు (ఆమె చుబుకం పుచ్చుకొని ఆప్యాయంగా), “మొదట్లో నువ్వు బెల్లానివి; తరువాత నువ్వు పంచదారవైనావు. ఇప్పుడు నువ్వు పటికబెల్లంగా మారావు. ప్రస్తుతం పటికబెల్లంగా మారావు కనుక పటికబెల్లం తిని, ఆనందించు” అని అన్నారు.
20. మార్వాడీలు సమర్పించిన పటికబెల్లమంతా గోపాలుని తల్లికి శ్రీరామకృష్ణులు ఇచ్చివేయడం
మార్వాడీ భక్తులు సమర్పించిన పటికబెల్లమంతా శ్రీరామకృష్ణులు, గోపాలుని తల్లికి ఇవ్వడం చూసి భక్తులందరూ ఆశ్చర్యపోయారు. ఆయన అనుగ్రహంతో ఆమె మనస్సు ఇకపై మలినత నొందదని వారు గ్రహించారు. ఇక ఏ దారి కానరాక చివరకు ఆమె ఆ పటిక బెల్లాన్ని స్వీకరించింది. లేకుంటే ఏం చెయ్యగలదు? తీసుకోకపోతే తన గోపాలుడు (శ్రీరామకృష్ణులు) వదలిపెడతాడా? పైగా దేహం ఉన్నంత వరకు అన్ని వస్తువుల అవసరం ఉండనే ఉంటుంది. దానిని గురించి గోపాలుని తల్లి అప్పుడప్పుడు మాతో, “శరీరం ఉన్నంత వరకు అన్నీ, చివరకు జీలకర్ర, మెంతులు కూడా అవసరమే. ఎంత విచిత్రమైన స్థితో కదా!” అని వాపోయేది.
21. స్వీయ దివ్యదర్శనాలను గురించి ఇతరులకు వెల్లడించకూడదు
జపధ్యానాదులు అనుష్ఠిస్తున్నప్పుడు తనకు కలిగే అనుభూతులనన్నిటినీ శ్రీరామకృష్ణుల వద్దకొచ్చి ఆయనకు తెలిపే అలవాటు మొదటి నుండి గోపాలుని తల్లికి ఉంది. “అలా కలిగే దర్శనాలను గురించి ఎవరికీ చెప్పకూడదు. అలా చెప్పే పక్షంలో అవి ఆగిపోతాయి” అని శ్రీరామకృష్ణులు ఆమెతో చెప్పారు. అలా ఆయన చెప్పడం చూసి గోపాలుని తల్లి ఒక రోజు, “ఎందుకు చెప్పకూడదు? అవన్నీ నీకు సంబంధించిన దర్శనాలే, మరెవరివో కావు కదా! వాటి గురించి నీతో కూడా చెప్పకూడదా?” అని ఆయనను అడిగింది. అందుకు శ్రీరామకృష్ణులు, “ఆ దర్శనాలు ‘ఇక్కడకు’ చెందినవైనా, వాటి గురించి నాతో కూడా చెప్పరాదు” అని నిష్కర్షగా జవాబిచ్చారు. “అవునా!” అందామె. ఆ తరువాత తనకు కలిగే దివ్యదర్శనాలను గురించి ఏదో అరుదైన సందర్భాలలో తప్ప, ఎవ్వరికీ ఆమె వెల్లడించలేదు. శ్రీరామకృష్ణులు ఏం చెప్పినా, దాని పట్ల ఆమె పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండేది. మరి సందేహాస్పదులమైన మనమో? శ్రీరామకృష్ణుల వచనాలలోని సత్యాన్ని పరీక్షించడంలోనే మన బ్రతుకులు తెల్లారిపోతాయి. కాబట్టి ఆ వచనాలను విశ్వసించి, ఆచరణ రూపంలో పెట్టి తత్ఫలితాలను ఆనందంగా అనుభవించే భాగ్యానికి మనం నోచుకోలేదు.
22. గోపాలుని తల్లిని స్వామి వివేకానందకి పరిచయం చేయడం
ఒక రోజు గోపాలుని తల్లి, నరేంద్రుడు ఒకే సమయంలో దక్షిణేశ్వరంలో ఉండడం తటస్థించింది. అప్పటికి నరేంద్రుడికి బ్రహ్మసమాజ సిద్ధాంతమైన నిరాకారతత్వం మీదే ఎక్కువ మొగ్గు ఉండేది. విగ్రహారాధన పట్ల అప్పటికి అతడికెంతో అయిష్టత ఉండేది. అయినా విగ్రహారాధకులు కూడా క్రమక్రమంగా సకల జీవులలో వెలసివున్న నిరాకార భగవంతుణ్ణి చేరుకోగలరనే నమ్మకం అప్పటికే అతడిలో జనించింది.
శ్రీరామకృష్ణులు హాస్యప్రియులు. సకల సుగుణాన్వితుడూ, గొప్ప మేధావీ, మహాపండితుడూ, చర్చల పట్ల ఎంతో అభిలాషగలవాడూ, భగవద్భక్తుడూ అయిన నరేంద్రుడు ఒక వైపు; నిరుపేద, నిరక్షరాస్యురాలు, తర్కవిచారాలంటే ఏమిటో తెలియని అజ్ఞానురాలు, సరళ విశ్వాసంతో కేవలం ఒక్క భగవన్నామం ఆధారంగా భగవంతుని అనుగ్రహాన్ని, దర్శనాన్ని పొంద ప్రయత్నిస్తున్న వృద్ధురాలు గోపాలుని తల్లి మరొకవైపు. ఈ ఇరువురిని ఒకచోట చేర్చి శ్రీరామకృష్ణులు వినోదించసాగారు. మొట్టమొదట బాలగోపాల రూపంలో భగవంతుడు ఆమెకెలా సాక్షాత్కరించాడో, నాటి నుండి తన దివ్యలీలను ఆమెతో ఎలా సలుపుతున్నాడో – ఈ విషయాలను నరేంద్రుడికి చెప్పమని శ్రీరామకృష్ణులు గోపాలుని తల్లిని అడిగారు. అప్పుడామె, “గోపాలా, అలా చెప్పడంలో దోషమేమీ లేదు కదా?” అని అడిగింది. దోషం లేదని శ్రీరామకృష్ణులు భరోసా ఇచ్చాక ఆమె గద్గద స్వరంలో, కళ్ళు ఆర్ద్రం కాగా, బాలగోపాల రూపంలో మొట్టమొదటిసారిగా భగవంతుడు దర్శనమిచ్చి, అప్పటి నుండి రెండు నెలల పర్యంతం తనతో సలిపిన దివ్యలీలా విలాసాలను పూసగుచ్చినట్లు నరేంద్రుడికి చెప్పసాగింది. గోపాలుడెలా తన భుజం మీద తల ఆన్చి కామార్హాటి నుండి దక్షిణేశ్వరానికి వచ్చాడో, తన వక్షం మీదుగా అతడి రెండు ఎర్రని పాదాలు వ్రేలాడడం తను ఎలా స్పష్టంగా చూసిందో, అప్పుడప్పుడు అతడెలా శ్రీరామకృష్ణుల దేహంలో లీనమైపోయి బయటికి వచ్చాడో, నిద్రించ డానికి దిండు లేదని ఎలా సణుక్కొన్నాడో, వంట కోసం ఎండు పుల్లలను ఎలా ప్రోగుచేశాడో, తిండి కోసం ఎలా చిలిపిగా ప్రవర్తించాడో – ఈ సంఘటనలన్నీ విశదంగా చెప్పింది. ఈ సంఘటనలను విశదీకరిస్తున్నప్పుడు ఆ వృద్ధురాలు ఉద్వేగంలో పులకాంకితురాలై భగవంతుణ్ణి బాలగోపాల రూపంలో దర్శించసాగింది.
నరేంద్రుడు బయటకు కరడుగట్టిన హేతువాదిగా కనిపించినా, నిజానికి అతడి అంతరంగం మాత్రం పరిపూర్ణ భగవద్భక్తితో నిండి ఉంటుంది. ఆ వృద్ధురాలి భావసమాధి గురించి, దివ్యదర్శనాలను గురించి వింటూ అతడు కళ్ళనీళ్ళను ఆపుకోలేకపోయాడు. తన కథనం వివరిస్తూ ఆమె, అమాయకంగా, “నాయనా, నువ్వు విద్యావంతుడివి, బుద్ధిశాలివి; నేను అనాథను, అజ్ఞానిని; నా కేమీ తెలియదు, అర్థం కూడా కాదు. నా ఈ అనుభవాలు కేవలం భ్రమలో లేదా యథార్థాలో దయచేసి చెప్పు” అని నరేంద్రుణ్ణి పదేపదే అడగసాగింది. ఆమెను ప్రతిసారి ఊరడిస్తూ నరేంద్రుడు, “లేదమ్మా, భ్రమ కాదు, నువ్వు చూసినదంతా సత్యమే”* అని చెప్పసాగాడు. ఇంతకు ముందులా అనవరతం తాను గోపాలుని దర్శనం పొందకపోవడం వలన, ఆరాటంతో గోపాలుని తల్లి, నరేంద్రుణ్ణి అలా ప్రశ్నించి ఉండవచ్చు.
23. కామార్హాటీ ఉద్యానంలో శ్రీరామకృష్ణులు పిశాచాన్ని చూడడం
ఈ సమయంలోనే ఒక రోజు శ్రీరామకృష్ణులు, రాఖాల్తో (స్వామి బ్రహ్మానంద) కామార్హాటికి వెళ్ళారు. అప్పుడు ఉదయం పది గంటలు అయి ఉంటుంది. స్వహస్తాలతో షడ్రసోపేతంగా వంటచేసి ఆయనకు తినిపించాలని గోపాలుని తల్లికి ఒక గొప్ప కోర్కె ఉంది. ఆ కారణంగానే నాడు శ్రీరామకృష్ణులు అక్కడకు వెళ్ళారు. ఆయన రాకకు ఆమె పరమానందం చెందింది. వాళ్ళు రాగానే ఫలహారం పెట్టి, యజమానుల ఇంట్లో వారి విశ్రాంతికి పడక నేర్పాటు చేసి, నడుం బిగించి వంటకు ఉపక్రమించింది. అంతకు మునుపే ఇతరుల నుండి మంచి పదార్థాలను సేకరించి తెచ్చింది. ఆమె వివిధ రకాల వంటకాలను తయారుచేసి, మధ్యాహ్నం తన సంతృప్తి మేరకు ఆయనకు తినిపించింది. భోజనం కాగానే ఇంటి మొదటి అంతస్తులోని దక్షిణపు గదిలో విశ్రాంతికై తన బొంతపై బాగా ఉతికిన దుప్పటి పరిచి పడకను సిద్ధం చేసింది. రాఖాల్ కూడా, గురుదేవుల పక్కనే పడుకొన్నాడు. శ్రీరామకృష్ణులు, రాఖాల్ను తమ మానసపుత్రునిగా పరిగణించి, అట్లే చూసుకోవడమే అందుకు కారణం.
శ్రీరామకృష్ణులు అప్పుడా గదిలో ఒక విచిత్రం చూశారు. స్వయంగా ఈ విషయం ఆయన ముఖతా వినడం వలన ఆ సంఘటనను సాహసించి ఇక్కడ పొందుపరుస్తున్నాం. లేకుంటే పేర్కొనేవారం కాదు. పగలు రాత్రి కలిపి శ్రీరామకృష్ణులు కొద్దిసేపు మాత్రమే నిద్రించేవారు. కాబట్టి అప్పుడాయన కేవలం ఊరకే పడుకొని ఉన్నారు. రాఖాల్ ఆయన ప్రక్కనే నిద్రపోతున్నాడు. ఆ సంఘటన గురించి గురుదేవులు ఇలా చెప్పారు : “అప్పుడు భరించలేని దుర్వాసన రాసాగింది. అప్పుడు గది ఒక మూలలో రెండు ఆకృతులను చూశాను. అవి పరమ వికారంగా కనిపించాయి. వాటి పొట్టల నుండి ప్రేగులు వ్రేలాడుతున్నాయి. వాటి ముఖం, కాళ్ళు, చేతులు వైద్యకళాశాలలో నేనొకసారి చూసిన మానవ అస్తిపంజరాల మాదిరే ఉన్నాయి. అవి ఎంతో దీనంగా నాతో, ‘మీరిక్కడ ఎందుకు ఉన్నారు? ఇక్కడ నుండి దయచేసి వెళ్ళిపోండి. మిమ్మల్ని చూస్తే మాకెంతో బాధగా ఉంది (బహుశా తమ దుస్థితిని తలచుకొంటూ)’ అన్నాయి. ఒక ప్రక్క అవి కాళ్ళావ్రేళ్ళా పడుతూంటే, మరోప్రక్క రాఖాల్ నిద్రపోతున్నాడు. నా ఉనికి వాటికి కష్టంగా ఉందని గ్రహించి, నా చిన్నసంచి తువ్వాలు పుచ్చుకొని నేను బయటకు రాబోతుంటే, రాఖాల్ లేచి, ‘ఎక్కడకు వెళుతున్నారు?’ అని అడిగాడు. ‘తరువాత చెబుతాలే’ అంటూ అతడి చెయ్యి పుచ్చుకొని, క్రిందికి దిగాను. తరువాత మేం ఆ వృద్ధురాలి నుండి సెలవు పుచ్చుకొన్నాం. అప్పుడే ఆమె భోజనం తినడం పూర్తిచేసింది. పడవలో కూర్చున్న తరువాత, రాఖాల్కు ఇలా చెప్పాను : ‘అక్కడ రెండు పిశాచాలు ఉన్నాయి. కామార్హాటి మిల్లు ఉద్యానానికి ప్రక్కనే ఉంది. అక్కడ నివసించే ఆంగ్లేయులు తిని పారేసే మాంసం, ఎముకల వాసనతో (పిశాచాల పరిభాషలో వాసన అంటే తినడమని అర్థం) అవి ఆ గదిని ఆశ్రయించి ఉన్నాయి.’ సదాసర్వదా ఆమె ఒంటరిగానే ఆ ఇంట్లో జీవిస్తోంది కనుక, ఎక్కడ భయపడుతుందోనని ఈ విషయం ఆ వృద్ధురాలికి మాత్రం చెప్పలేదు.”
24. గోపాలుని తల్లికి శ్రీరామకృష్ణులు తినిపించడం
సుసంపన్నుడూ, సుప్రసిద్ధ కలకత్తా వాస్తవ్యుడూ అయిన కీ.శే. మతిలాల్ సీల్ ఉద్యానానికి ఎదురుగా మతి చెరువు ఉంది. దాని ప్రక్క నుండి ఉత్తరం వైపుగా గంగాతీరం వెంబడి బారానగర్ బజార్‌ను దాటివెళ్ళే ఒక వీథి ఉంది. కీ.శే.లాలాబాబు, రాణి కాత్యాయనిల అల్లుడైన కృష్ణగోపాల్ ఘోష్ ఉద్యానగృహం ఈ వీథిలోనే ఉన్నది. ఈ ఉద్యానగృహంలోనే 1885 వ సం ॥ డిసెంబర్ మధ్య నుండి 1886 వ సం ॥ ఆగష్టు 16 వ తేదీ వరకు దాదాపు ఎనిమిది నెలలు (కంఠ వ్రణంతో బాధపడుతూ) శ్రీరామకృష్ణులు నివసించి, భక్తుల స్థూలదృష్టి నుండి కనుమరుగయ్యారు. కాశీపూర్ ఉద్యానవనంగా పేర్కోబడే ఈ ఉద్యానమే ఆ భక్తుల హృదయాలలో (గురుదేవుల అంత్యలీలను స్మరించుకొని) దుఃఖాన్ని, అదే సమయంలో హర్షాన్ని ఉత్పన్నం చేస్తుందో కదా! శ్రీరామకృష్ణులు రోగగ్రస్థులు కావడం వలన భక్తులు దుఃఖీంచారనడం సబబే; కాని ఈ విషాద పరిస్థితిలో భక్తులు ఎలా ఆనందం పొందారో అన్న ప్రశ్న తలెత్తక మానదు.
శ్రీరామకృష్ణుల దివ్యదేహంలో ఆ రోగం బాహ్యంగా వ్యక్తమై ఆయన భక్తులనందరినీ అద్భుత ప్రేమబంధంలో పెనవేయడానికి దారితీసింది. అంతేగాక ఆంతరంగిక భక్తులు, సాధారణ భక్తులు, కాబోయే సన్న్యాసులు, గృహస్థులు, జ్ఞానులు ఇలా వీరందరిని వివిధ కోవల క్రింద వర్గీకరించడానికి కూడా దారితీసింది. వారిలోని తారతమ్యాలు ఈ కాలఘట్టంలోనే స్పష్టంగా తెలియవచ్చాయి. తామంతా ఒకే ఆధ్యాత్మిక కుటుంబానికి చెందిన వారమనే విశ్వాసానికి అంకురార్పణ జరిగింది ఇక్కడే. అంతేగాక ఎంతమంది ఆధ్యాత్మిక పిపాసువులు ఇక్కడకు వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించుకొని అపరోక్షానుభూతి మార్గంలో పురోగమించారో లెక్కించడం ఎవరి తరం? కఠోర సాధన ఫలితంగా నరేంద్రుడు నిర్వికల్ప సమాధిని పొందింది ఈ కాశీపూర్లోనే! నరేంద్రుడితో సహా పన్నెండు మంది యువకులు శ్రీరామకృష్ణుల పావన హస్తాల నుండి కాషాయాంబరాలను స్వీకరించిందీ ఇక్కడే.
1886 వ సం ॥ జనవరి నెల మొదటి తేది మధ్యాహ్నం (3–4 గం ॥ మధ్య) తోటలో పచార్లుచేస్తూ శ్రీరామకృష్ణులు అక్కడ గుమిగూడిన భక్తులను చూసి అసాధారణ భావపారవశ్య స్థితిని పొంది, “మీకిక చెప్పడానికి ఏముంది? మీ అందరికీ ఆధ్యాత్మిక జాగృతం కలుగుగాక!” అని దీవిస్తూ, వారందరి హృదయాలను తన పావన హస్తాలతో స్పృశించి, వారిలో ప్రత్యక్షంగా ఆధ్యాత్మిక శక్తిని ప్రసారం చేసింది ఇక్కడే!
దక్షిణేశ్వరంలో మాదిరిగానే ప్రతి రోజు అనేకమంది భక్తులు కాశీపూర్‌కు కూడా రాసాగారు. ఇక్కడ కూడా మాతృదేవి, గురుదేవులకు వంటచేయడం, ఇతరమైన ఇంటి పనులలో పూర్తిగా నిమగ్నమైంది. గోపాలుని తల్లి, ఇతర భక్తురాండ్రు ఇక్కడకు వచ్చి గురుదేవులను సేవిస్తూ, భక్తుల అవసరాలను చూసుకోసాగారు. వీరిలో కొందరు వీలైనప్పుడల్లా ఒకటి రెండు రాత్రుళ్ళు అక్కడే సేవలో గడిపి ఇళ్ళకు తిరిగి వెళ్ళేవారు. కాబట్టి కాశీపూర్ ఉద్యానగృహంలో ఆ భక్తబృంద అద్భుత సమావేశాన్ని పరికించి చూస్తే ఏదో ఒక అజ్ఞాత మహత్కార్య నిర్వహణార్థమే జగజ్జనని శ్రీరామకృష్ణుల పావనదేహంలో ఆ వ్యాధిని కల్పించిందని మనకు తోస్తుంది.
ప్రతి రోజు గురుదేవుల దివ్యలీలలను దర్శిస్తూ, కొత్త భక్తులు రావడం చూసి, గురుదేవుల ఆనందమయమూర్తిని, ఆ మూర్తి నుండి అభివ్యక్తమౌతున్న అపూర్వ శక్తి వికాసాన్ని గమనించి లోకహితార్థం ఆయన ఆ వ్యాధిని నటిస్తూన్నారే గాని, సంకల్పమాత్రాన ఆ వ్యాధిని నిర్మూలించి, స్వస్థులు కాగలరని చిరకాలంగా వస్తున్న భక్తులు భావించారు.
కాశీపూర్ ఉద్యానవనంలో ఉంటున్నప్పుడు శ్రీరామకృష్ణులు బార్లీనీరు, సేమియా జావ మొదలైన ద్రవపదార్థాలను మాత్రమే పుచ్చుకొన్నారు. కాని ఒక రోజు కచ్చూరం (Zedoary) పొడి కలిపిన జున్నుపాలు పుచ్చుకోగోరారు. ప్రత్యేక సందర్భాలలో ఆహ్వానితులై వచ్చిన అతిథులకు సామాన్యంగా కలకత్తా గృహస్థులు ఈ జున్నుపాలను ఇస్తారు. బార్లీ, జావ మొదలైనవి పుచ్చుకొంటున్నప్పుడు జున్నుపాలు పుచ్చుకోవడం అంత హానికరం కాదని భావించి, శ్రీరామకృష్ణులు జున్నుపాలు పుచ్చుకోవడం గురించి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కాబట్టి మర్నాడు ఉదయం యోగేన్ (స్వామి యోగానంద) కలకత్తాకు వెళ్ళి అంగడి నుండి జున్నుపాలు కొని తీసుకురావాలని తీర్మానించారు.
యోగేన్ మర్నాటి ఉదయం బయలుదేరాడు. దారిలో ఆలోచనలో పడ్డాడు : ‘అంగడిలో లభించే జున్నుపాలలో కచ్చూరం పొడితో పాటు నానా రకాలూ వేసి కల్తీచేస్తారు. దాన్ని గురుదేవులు తింటే రోగం ప్రకోపించదా?’ శ్రీరామకృష్ణులను, భక్తులందరూ తమ ప్రాణంలో ప్రాణంగా చూసుకొంటారు. కాబట్టి ప్రతి భక్తుని మనస్సులో ఒకేఒక్క ఆలోచన ‘ఆయన స్వస్థులు కావాలి’ అన్న ఆలోచనే మెదిలేది. ఆ కారణంగానే యోగేన్ అలా ఆలోచించాడని కచ్చితంగా చెప్పవచ్చు. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు : ‘బయలుదేరడానికి ముందు ఈ విషయం గురించి గురుదేవులను అడగలేదే! కనుక ఏ భక్తుల ఇంట్లోనైనా జున్నుపాలు తయారుచేయించి తీసుకుపోతే ఆయన చిరాకుపడరా?’ ఈ తీరులో ఆలోచించి బాగ్‌బజార్‌లోని బలరాం ఇంటికి యోగేన్ వెళ్ళాడు. తన రాకకు గల కారణాన్ని వారికి చెప్పాడు. యోగేన్ చెప్పింది విని, అక్కడున్న భక్తులు ఇలా అన్నారు : “అంగడి జున్ను తీసుకుపోవడ మెందుకు? మేమే తయారుచేసి ఇస్తాం. కాని వెంటనే తీసుకుపోవడం కుదరదు. తయారు చేయడానికి ఆలస్యమౌతుంది. కనుక నువ్వు ఇక్కడే భోజనం చెయ్యి. ఈలోపు పాలు కాచి, సిద్ధపరుస్తాం. మధ్యాహ్నం మూడు గంటలకు నువ్వు పట్టుకుపోవచ్చు.” అందుకు యోగేన్ అంగీకరించాడు. కాబట్టే అతడు ఇంట్లో తయారుచేసిన జున్నును తీసుకొని సుమారు సాయంత్రం నాలుగు గంటలకు కాశీపూర్‌కు తిరిగి వెళ్ళగలిగాడు.
కాని శ్రీరామకృష్ణులు జున్నుపాలను మధ్యాహ్నం పుచ్చుకోవాలను కొన్నారు. దాని కోసం ఎంతోసేపు ఎదురుచూసి, చివరకు మాములుగా భోజనం చేసేశారు. తరువాతే యోగేన్ తిరిగి వచ్చాడు. జరిగిందంతా అతడి నుండి విని ఆయన ఎంతో చిరాకుపడి, అతడితో ఇలా అన్నారు : “అంగడి నుండి కొని తీసుకురమ్మని నీతో చెప్పారు. అంగడి జున్ను పాలను త్రాగాలనుకొన్నాను. భక్తుల ఇంటికి వెళ్ళి వాళ్ళనెందుకు ఇబ్బందిపెట్టావు? పైగా ఈ పాలు మరీ చిక్కగా ఉంటాయి, జీర్ణించుకోవడం కష్టం కూడా. అటువంటప్పుడు దీనిని పుచ్చుకోవచ్చా? నేను దీన్ని పుచ్చుకోను.” నిజానికి ఆయన దాన్ని ముట్టను కూడా ముట్టలేదు. మాతృదేవిని పిలిచి, ఆ జున్నుపాలనంతా గోపాలుని తల్లికి ఇవ్వమని, “దీనిని భక్తులు ఇచ్చారు; ఆమె హృదయంలో గోపాలుడు వాసం చేస్తున్నాడు. ఈ పాలను ఆమె త్రాగడం, నేను త్రాగడమే అవుతుంది” అని చెప్పారు.
25. గోపాలుని తల్లికి విశ్వరూప దర్శనప్రాప్తి
శ్రీరామకృష్ణుల నిర్యాణానంతరం గోపాలుని తల్లి పొందిన అశాంతత అంతా ఇంతా కాదు. చాలాకాలం వరకూ ఆమె కామార్హాటిని విడిచి బయటకు వెళ్ళలేదు. ఆమె ఏకాంతవాసం చేసింది. తరువాత మునుపటిలా శ్రీరామకృష్ణుల దర్శనాలు పొందసాగాక, ఆమె మనస్సు కుదుటపడింది. శ్రీరామకృష్ణుల మహాసమాధి అనంతరం ఆమెకు కలిగిన దివ్యదర్శనాలను గురించి మేం చాలా వినివున్నాం. గంగకు అవతలి వైపునవున్న మహేశుని రథయాత్రోత్సవాన్ని ఆమె తిలకించడానికి వెళ్ళినప్పుడు కలిగిన అద్భుత దర్శనం వాటిలో ఒకటి. ఆ సందర్భంలో తన ముందు ఉన్న సమస్తంలో తన ఇష్టదైవమైన గోపాలుని దర్శించి వర్ణనాతీతమైన పరమానందాన్ని ఆమె చవిచూసింది. అప్పుడు ఆ రథం, రథంలోని జగన్నాథుడు, ఆ రథాన్ని లాగుతున్నవారు, ఉత్సవాన్ని దర్శిస్తున్న ఆ జనసమూహం – ఈ యావత్తు తన గోపాలునిలా కనిపించిందని ఆమె చెప్పింది. కాని ఆ గోపాలుడు విభిన్న రూపాలను దాల్చివున్నాడు; ఈ విధంగా భగవంతుని విశ్వరూప దర్శనాన్ని పొంది ప్రేమానురాగాల ఉన్మత్తతలో ఆమె బాహ్యస్మృతిని కోల్పోయింది. ఒక సందర్భంలో తన మిత్రురాలికి దీనిని గురించి తెలియచేస్తూ గోపాలుని తల్లి, “అప్పుడు నేను నేను కాదు; నవ్వుతూ, నాట్యంతో గందరగోళాన్ని సృష్టించాను” అని చెప్పింది.
26. బారానగర మఠంలో గోపాలుని తల్లి
అప్పటి నుండి మనస్సు అల్లకల్లోలంగా ఉన్నప్పుడల్లా శ్రీరామకృష్ణుల సన్న్యాస శిష్యులు నివసిస్తూన్న బారానగర మఠానికి గోపాలుని తల్లి వచ్చేది. అక్కడ ఆమె మనస్సు కుదుటపడేది. అటువంటి సందర్భాలలో ఆ సన్న్యాసులు ఆమెను స్వహస్తాలతో వండి శ్రీరామకృష్ణులకు ఆ ఆహారాన్ని నివేదించమని కోరేవారు. ఆమె కూడా ఎంతో సంతోషించి ఒకటి రెండు కూరలు వండి, వాటిని గురుదేవులకు నైవేద్యంగా అర్పించేది. ఆ తరువాత మఠం మొదట్లో ఆలంబజారుకు, పిదప గంగకు ఆవలి వైపున ఉన్న నీలాంబరబాబు ఇంటికి మార్చబడింది. గోపాలుని తల్లి ఈ స్థలాలకు కూడా వచ్చి పగటిపూట పూర్తిగా ఎంతో ఆనందంగా అక్కడ గడిపేది. రాత్రిపూట కూడా అక్కడ గడిపిన సందర్భాలు ఒకటి రెండు లేకపోలేదు.
27. పాశ్చాత్య మహిళలతో గోపాలుని తల్లి
వివేకానందస్వామి అమెరికా నుండి తిరిగి వచ్చినప్పుడు ఆయనతోపాటు సారా (శ్రీమతి సారా సి.బుల్), జయ (కుమారి మాక్లౌడ్), నివేదిత కూడా భారతదేశానికి వచ్చారు. ఒక రోజు వారంతా గోపాలుని తల్లిని చూడడంకోసం కామార్హాటికి వెళ్ళారు. ఆమె మాట తీరుకు, కనబరచిన మర్యాదామన్ననలకు వారెంతో సంతోషించారు. వారిలో కూడా తన గోపాలుణ్ణి ఆమె చూసింది. వారి చుబుకాలను స్పృశించి, ఆప్యాయంగా వారిని ముద్దుపెట్టుకోవడం మాకు జ్ఞాపకమే. వారిని తన మంచంమీద కూర్చోపెట్టి తినడానికి అటుకులు, కొబ్బరి ఉండలు మొదలైనవి ఇచ్చింది. వారు కోరగా తనకు కలిగిన దివ్యదర్శనాలను గురించి ఒకింత చెప్పింది. ఆ పాశ్చాత్య మహిళలు వాటిని ఎంతో సంతోషంగా తిని, ఆమె మాటలను ముగ్ధులై విన్నారు. అమెరికాకు తీసుకుపోవడానికి ఆమెనడిగి కొంచెం అటుకులను పుచ్చుకున్నారు కూడా.
28. గోపాలుని తల్లి సోదరి నివేదిత ఇంట్లో నివసించడం
గోపాలుని తల్లి అద్భుత జీవిత కథను విని, సోదరి నివేదిత ముగ్ధురాలైంది. 1904 సం ॥ గోపాలుని తల్లికి బాగా జబ్బుచేసి, స్వయంగా ఏమీ చేసుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆమెను బలరాంబాబు ఇంటికి తోడ్కొని వచ్చారు. అప్పుడు సోదరి నివేదిత ఆమెను బాగ్ బజార్‌లోని, నెం 17, బోస్పారాలోని తన ఇంటికి తీసుకు వెళ్ళాలని ఆరాటపడింది. ఆమె ఆరాటాన్ని చూసి గోపాలుని తల్లి కూడా ఏమాత్రం సంకోచించకుండా, అందుకు అంగీకరించింది. ఎందుకంటే, ఆమె మనస్సులోని విచక్షతలనన్నింటినీ గోపాలుడు ఏనాడో తొలగించివేశాడు కదా! ఇందుకు ఉదాహరణగా మాకొక సంఘటన జ్ఞాపకం వస్తున్నది.
ఒక రోజు దక్షిణేశ్వరంలో నరేంద్రుడు, కాళీమాతకు నివేదించిన ప్రసాదాన్ని తిని, చేతులు కడుక్కోవడానికి బయటకు వెళ్ళాడు. అతడు తిన్న స్థలాన్ని శుభ్రం చేయమని అక్కడున్న ఒక భక్తురాలికి శ్రీరామకృష్ణులు చెప్పారు. గోపాలుని తల్లి అప్పుడు అక్కడే ఉంది. శ్రీరామకృష్ణులు అలా చేయమని చెప్పగానే గోపాలుని తల్లి స్వహస్తాలతో ఆ స్థలాన్ని శుభ్రం చేసింది. ఆమె అలా చేయడం చూసి శ్రీరామకృష్ణులు ఎంతో సంతోషించి, వేరొక భక్తురాలిని ఉద్దేశిస్తూ, “నానాటికీ ఈమె ఎంత ఉదారంగా వ్యవహరిస్తున్నదో చూడండి” అని అన్నారు.
29. గోపాలుని తల్లి మరణం
అప్పటి నుండి గోపాలుని తల్లి సోదరి నివేదిత ఇంట్లోనే నివసించ సాగింది. స్వామి వివేకానంద మానస పుత్రికయైన నివేదిత ఆమెను తన కన్న తల్లిలాగానే సేవించింది. ప్రక్కనే ఉన్న ఒక బ్రాహ్మణ కుటుంబం వారిచే ఆమెకు భోజనాదికాలు ఏర్పాటు చేయించింది. ప్రతి రోజు పగటిపూట గోపాలుని తల్లి అక్కడకు వెళ్ళి అన్నం తినివచ్చేది. రాత్రి పూట ఆ కుటుంబంలోని ఎవరో ఒకరు ఆమె గదికి కొన్ని లూచీలు, ఇతర పదార్థాలు తెచ్చి ఇచ్చేవారు. ఈ విధంగా గోపాలుని తల్లి రెండు సంవత్సరాలు జీవించి, గంగాతీరంలో మరణించింది. అంతిమ దినాలలో హైందవ ఆచారం మేరకు ఆమెను గంగాతీరానికి* మోసుకు వెళ్ళారు. సోదరి నివేదిత స్వహస్తాలతో ఆమె మంచాన్ని పువ్వులతో, పువ్వుల మాలలతో, గంధమాల్యాదులతో చక్కగా అలంకరించింది; సంకీర్తన బృందాన్ని ఏర్పాటు చేసి, కన్నీరుమున్నీరై కాలినడకన గంగాతీరానికి వెళ్ళింది. గోపాలుని తల్లికి ప్రాణం ఉన్న రెండు రోజులు నివేదిత రాత్రిళ్ళు అక్కడే గడిపింది.
గోపాల్మా చివరి రోజులు. ఎడమ: గోపాల్మా శిష్యురాలు కుసుమకుమారి. కుడి: నివేదిత (స్వామి వివేకానంద ఐరిష్ శిష్యురాలు)
1906, జూలై ఎనిమిదవ తేది వేకువజామున, తూర్పుదిశ, బాలభానుని అరుణారుణ కిరణాలతో రాగరంజితం కాసాగింది. ఆకాశంలో కొన్ని నక్షత్రాలు ఇంకా మిణుకు మిణుకుమంటూ ఉన్నాయి. హిమగిరి నందన గంగానదీమ తల్లి తెల్లని తరంగాలతో తీరాలను ముంచెత్తుతూ మర్మర ధ్వనితో ప్రవహిస్తూన్నది. అట్టి పవిత్ర ముహూర్తంలో గోపాలుని తల్లి దేహాన్ని భక్తిప్రపత్తులతో గంగాజలాలలో సగం వరకు ముంచి ఉంచారు. కొన్ని క్షణాలలోనే ఆమె పంచప్రాణాలు భగవంతుని పాదపద్మాలలో లీనం కాగా, ఆ మహా భక్తురాలు అభయపద ప్రాప్తి పొందింది.
ఆమె బంధువులెవరూ ఆ సమయంలో అక్కడ లేకపోవడం వలన బేలూరు మఠానికి చెందిన ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి ఆమెకు అంత్యక్రియలు జరిపి, శాస్త్రాల నిర్దేశం మేరకు పన్నెండు రోజులు హవిష్యాన్నం తింటూ శ్రాద్ధాది కర్మలను నిర్వర్తించాడు.
శోకసంతప్తయైన సోదరి నివేదిత ఆ పన్నెండు రోజులు గడిచాక, గోపాలుని తల్లికి బాగా పరిచయస్థులైన స్థానిక మహిళలను ఆహ్వానించి, తన పాఠశాల భవనంలో సంకీర్తన, సమారాధన మొదలైన పాటించవలసిన విధులను నిర్వర్తించింది.
చనిపోవడానికి ముందు గోపాలుని తల్లి తాను ఎంతో కాలం నుండి పూజిస్తూవచ్చిన శ్రీరామకృష్ణుల చిత్రపటాన్ని* బేలూరు మఠ ఆలయంలో పదిలపరచమని, మఠం వారికి ఇచ్చింది. ఆ సందర్భంలోనే శ్రీరామకృష్ణుల పూజ, సేవాదుల నిమిత్తం రెండు వందల రూపాయలు కూడా సమర్పించింది.
చివరి పన్నెండు సంవత్సరాల శేషజీవితాన్ని తనను ఒక సన్న్యాసినిగా పరిగణించుకొని, కాషాయాంబరాలనే ధరించిన గోపాలుని తల్లి ధన్యజీవి.