నవీన నీరద శ్యామం నీలేందీవరలోచనం ।
పల్లవీ నందనం వందే కృష్ణం గోపాల రూపిణం ॥
స్ఫురద్బర్హదలోద్బద్ధ నీలకుంచిత మూర్ధజం । – గోపాల స్తోత్రం 1, 2, 6
నవీన నీరద శ్యామునికి, నీలికమల నేత్రునికి, గోపికానందప్రదాయకునికి, నీలిరంగు శిరోజాలపై చక్కని నెమలిఫించాన్ని ధరించిన వానికి, గోపాల రూపియైన శ్రీకృష్ణునికి ప్రణతులు.
యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయాఽర్చితు మిచ్ఛతి ।
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ ॥ – భగవద్గీత 7–21
శ్రద్ధతో ఏఏ భక్తుడు ఏఏ దేవతామూర్తిని ఆరాధింపగోరతాడో, ఆయా భక్తునికి ఆయా మూర్తియందే సుస్థిర శ్రద్ధను నేను అనుగ్రహిస్తాను.
And whoso shall receive one such little child in my name receiveth Me. – Matthew 18 : 5
నా పేరిట అటువంటి బిడ్డను ఒక్కడినైనా స్వీకరించిన నాడు నన్నే స్వీకరించిన వాడవుతాడు.
– క్రొత్త నిబంధన, మాథ్యూ 18 : 5
‘గోపాలుని తల్లి’* (గోపాలేర్ మా) ప్రప్రథమంగా శ్రీరామకృష్ణులను ఎప్పుడు కలుసుకొన్నదో మేం కచ్చితంగా చెప్పలేం. కాని 1885 మార్చి లేదా ఏప్రిల్ నెలలో మేం ఆమెను మొట్టమొదటిసారి దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల వద్ద చూశాం. అప్పటికే ఆమె ఆరు నెలల నుండి ఆయన వద్దకు వస్తూవున్నదని తెలియవచ్చింది; ఆయనతో బాలగోపాలుని భావంలో దివ్యలీల జరుపుతూ వస్తున్నది. ఆ సందర్భంలో ఆమె శ్రీరామకృష్ణుల గదిలో ఆగ్నేయ ముఖంగా (అంటే శ్రీరామకృష్ణుల వైపుగా), గంగాజలం కూజా ఉన్న చోటు ప్రక్కన కూర్చుని ఉన్నట్లు మాకు జ్ఞాపకం. అప్పటికి ఆమెకు అరవై ఏళ్ళు ఉండవచ్చు; కాని అంత వయస్సు ఉన్నట్లు కనపడలేదు. అందుకు కారణం ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరిసి ఉండడమే! మమ్మల్ని పరిచయం చేసినప్పుడు, ఆమె ఇలా అన్నది : “నువ్వు జి – కుమారుడివా? అయితే నువ్వు మా వాడివే! ఆహా, జి–కుమారుడు భక్తుడయ్యాడే! గోపాలుడు* ఈసారి ఎవ్వరినీ విడిచిపెట్టడు. (అంటే అందరినీ భగవంతుని వద్దకు తీసుకువెళతాడు) ఒక్కొక్కరిగా అందరినీ ఆకర్షిస్తాడు. సరే, మంచిది. నీతో లౌకికపరమైన బంధుత్వం ఇంతకు ముందు నుంచి ఉన్నది. ఇప్పుడు దాని కంటే అత్యంత సన్నిహితమైన (ఆధ్యాత్మిక) బంధుత్వం ఏర్పడింది.”
1. శ్రీరామకృష్ణులను మొట్టమొదటిసారి గోపాలుని తల్లి కలుసుకోవడం
1884 డిసెంబర్ నెల. ఆకాశం వినిర్మలంగా ఉంది. ఆ సంవత్సరం నవంబర్ నెల ఆరంభం నుండి కొంచెం చలి మొదలవడం మాకు జ్ఞాపకమే. అంత ఎక్కువ చలిగాని ఎండగాని లేని ఈ హేమంత ఋతువులోనే గోపాలుని తల్లి ప్రప్రథమంగా శ్రీరామకృష్ణులను దర్శించుకొనే భాగ్యం పొందిందని మేం భావిస్తున్నాం.
గంగాతీరాన ‘కామార్హాటి’ అనే గ్రామం ఉంది. పాటల్డాంగా వాస్తవ్యుడైన కీ.శే. గోవిందచంద్ర దత్తకు ఆ గ్రామంలో ఒక దేవాలయం, ఉద్యానం ఉన్నాయి. ఆ ఆలయ ఉద్యానం నుండే ‘వారు’ శ్రీరామకృష్ణుల దర్శనార్థం పడవలో వచ్చారు. ‘వారు’ అని ఎందుకు చెబుతున్నామంటే, ఆ రోజు గోపాలుని తల్లి ఒంటరిగా రాలేదు. పైన పేర్కొన్న గోవిందచంద్ర దత్త వితంతుమా, ఆమెకు దూరపు బంధుమా అయిన కామిని అనే స్త్రీతో కలిసివచ్చింది. శ్రీరామకృష్ణుల గురించి అప్పటికే కలకత్తాలో అనేకులు ఎరిగివున్నారు. కాబట్టి ఈ స్త్రీలిద్దరు కూడా ఆయనను గురించి విన్నప్పటి నుండి, ఆ అద్భుత మూర్తిని చూడాలని తహతహ చెందసాగారు. ప్రతి ఏటా నవంబర్నెలలో గోవిందచంద్రుని గుళ్ళో విశేషపూజ చేయడం ఆనవాయితీ. అందుకోసం గోవిందచంద్రుని భార్య ఆ సమయంలో కామార్హాటి గ్రామంలోనే బస చేసి, ఆ పూజ ఏర్పాట్లు స్వయంగా చూసుకొనేది. పైగా కామార్హాటి గ్రామం దక్షిణేశ్వరానికి కేవలం రెండు మూడు మైళ్ళ దూరంలోనే ఉండడం వలన, అక్కణ్ణుండి దక్షిణేశ్వరానికి రావడం ఎంతో అనుకూలం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ‘కామార్హాటి గృహిణి’ గా పేరుపొందిన కామిని, గోపాలుని తల్లి దక్షిణేశ్వరంలోని కాళికాలయానికి వచ్చారు.
ఆ రోజు శ్రీరామకృష్ణులు, ఆ స్త్రీలను సాదరంగా తమ గదిలో కూర్చోబెట్టి, భక్తిమార్గం గురించి వారికి ఎన్నో ఉపదేశాలిచ్చారు; వారి కోసం భక్తిగీతాలు ఆలాపించారు. తరువాత మళ్ళీ రావలసిందని చెప్పి, వారికి సెలవిచ్చారు. వాళ్ళు సెలవు పుచ్చుకొంటున్నప్పుడు, కామార్హాటిలోని తమ ఆలయానికి ఒకసారి రావలసిందని కామిని, ఆయనను ఆహ్వానించింది. వీలు చూసుకొని అలాగే వస్తానన్నారు శ్రీరామకృష్ణులు. ఆయన గోవింద చంద్రుని భార్యను, గోపాలుని తల్లిని ఎంతగానో ప్రశంసించారు. ఆయన ఇలా అన్నారు : “ఆహా, వారి కళ్ళలో, ముఖాలలో ఎంత చక్కని భావం వెల్లివిరుస్తున్నదో కదా! భగవద్భక్తి అనే ప్రవాహంలో వాళ్ళు తేలియాడుతున్నారు; కళ్ళు తీవ్ర భక్తితో తొణికిసలాడుతున్నాయి. వారి నుదుట తిలకం కూడా చక్కగా నప్పింది.” అంటే వారి వేషభాషాదులు, ప్రవర్తన సహజ రీతిలో వారి అంతరంగ భక్తినే అభివ్యక్తం చేస్తున్నాయి; లోకానికి చాటిచూపాలనే కించిత్తు ప్రయత్నం కూడా వారిలో కానరాలేదు.
2. పాటల్డాంగా వాస్తవ్యుడైన గోవింద చంద్ర దత్త ఉదంతం
పాటల్డాంగా వాస్తవ్యుడైన గోవిందచంద్ర దత్త కలకత్తాలో పేరుమోసిన ఒక విదేశీయ వాణిజ్యసంస్థకు దళారిగా వ్యవహరించేవాడు. దక్షత, నిరంతర పరిశ్రమల కారణంగా త్వరలోనే అతడు గొప్ప ధనవంతుడయ్యాడు. కాని పక్షవాతం వాతబడడంతో చేస్తున్న వృత్తిని కొనసాగించలేకపోయాడు. ఇది జరగడానికి మునుపే అతడి ఏకైక పుత్రుడు మరణించాడు. ఇక బ్రతికి ఉన్నవారు అతడి కుమార్తెలు యజ్ఞేశ్వరి, నారాయణి, వారి సంతానమూ. ఆస్తిపాస్తులు బాగానే ఉండడం వలన తన శేషజీవితాన్ని ఆధ్యాత్మిక చింతనలోను, ఆధ్యాత్మిక కార్యకలాపాలలోను గోవిందచంద్రుడు గడిపాడు. పండితులను ఆహ్వానించి ఇంట్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను చెప్పించడం, కామార్హాటీ ఉద్యానంలో రాధాకృష్ణుల విగ్రహాలను వైభవోపేతంగా ప్రతిష్ఠించడం, భాగవతాది శాస్త్రాలను పారాయణ చేయించడం, భార్యతో పాటు తులాభారంగా* బ్రాహ్మణులకు పేదలకు విలువైన వస్తువులను దానం చేయడం మొదలైన పుణ్యకార్యాలు చేశాడు. విశేషంగా కామార్హాటిలో ప్రతిష్ఠితమైన రాధాకృష్ణుల ఆలయంలో తరచు ఏదో ఒక ఉత్సవం జరిపిస్తూ, అక్కడకు వచ్చే అతిథులకు, పేదసాదలకు కడుపార రాధాకృష్ణుల ప్రసాదంతో అన్నసంతర్పణ చేసేవాడు.
గోపాలేర్మాగా పేర్కొనబడే, అఘోరమణి దేవి (1822-1906).
గోపాలేర్మా 30 సం ॥ సాధనలు అనుష్ఠించిన కామార్హాటి ఆలయ ఉద్యానంలోని గది.
3. భక్తురాలైన అతడి భార్య
గోవిందచంద్రుని మరణానంతరం పరమసాధ్వియైన అతడి భార్య చాలా కాలం వరకు భగవత్సేవను వైభవోపేతంగా జరుపుతూ వచ్చింది. ఆ తరువాత కారణాంతరాల వలన ఆస్తిలో చాలాభాగం వారు కోల్పోయారు. అందువలన రాధాకృష్ణుల సేవకు ఎక్కడ ఉపేక్ష ఏర్పడుతుందోనని ఆమె కామార్హాటీలోనే నివసిస్తూ, పూజాది కార్యకలాపాల పర్యవేక్షణను స్వయంగా తానే చూసుకోసాగింది. ఆమె పాతకాలంనాటి మనిషి, జీవితంలో అనేక కష్టనష్టాలు అనుభవించింది. కనుక ఆధ్యాత్మిక జీవితంలో తప్ప నిజమైన శాంతి మరెక్కడా లభించదనే సత్యాన్ని ఆమె హృదయాంతరాళాలలో గ్రహించింది. కాని ఈ పనికిమాలిన సంసారాన్ని అంత సులభంగా వదిలిపెట్టడం సాధ్యమా? కూతుళ్ళు, అల్లుళ్ళు, సమాజం, హోదా, గౌరవం, ఇతర లౌకిక ఆసక్తులను పట్టించుకోవాలి కదా! కాని ఆమె భర్త మరణించిన నాటి నుండి కఠోర బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించసాగింది. నాటి నుండి కటిక నేలమీద పడుకోవడం, రోజుకు మూడుసార్లు స్నానం చేయడం, ఒక్కపూట మాత్రమే తినడం, వ్రతం పూజ ఉపవాసం రాధాకృష్ణుల సేవ జపం ధ్యానం దానధర్మాలు చేయడం – వీటితోనే కాలం వెళ్ళబుచ్చసాగింది.
4. ఆమె పురోహితుల కుటుంబం : బాల వితంతువు అఘోరమణి
గోవిందచంద్రుని పురోహిత కుటుంబం కామార్హాటి దేవాలయానికి సమీపంలోనే నివసించేది. పురోహితుడైన నీలమాధవ్ బంద్యోపాధ్యాయ్ గౌరవనీయుడైన వ్యక్తి. అఘోరమణి దేవి (కాలాంతరంలో ‘గోపాలుని తల్లి’) అతడి చెల్లెలు. బాలవితంతువు కావడం వలన జీవితాంతం ఆమె పుట్టింట్లోనే గడిపింది. గోవిందుని భార్యను అందరూ ‘గిన్నీ’, అంటే గృహిణి అని పిలిచేవారు. గృహిణితో సన్నిహిత పరిచయం ఏర్పడినప్పటి నుండి అఘోరమణి తన సమయాన్నంతా రాధాకృష్ణ విగ్రహాల సేవ, పూజాదులలోనే గడపసాగింది. భగవద్భక్తి పెంపొందే కొద్దీ గంగాతీరంలోని ఆ ఆలయంలోనే జీవించాలనే బలమైన కోరిక ఆమెలో కలుగసాగింది. దాంతో గృహిణి అనుమతి పొంది స్త్రీలు వసించే ఒక గదిలో ఆలయ ఆవరణలోనే నివసించసాగింది. రోజుకు ఒకటి రెండుసార్లు మాత్రం పుట్టింటికి వెళ్ళివచ్చేది; తక్కిన సమయాన్నంతా దేవాలయంలోనే పావన విధుల నిర్వహణలో గడిపివేసేది.
‘గృహిణి’ లా కఠోర బ్రహ్మచర్య వ్రతాన్ని, ధార్మిక అనుష్ఠానాలను అఘోరమణి పాటించేది. ఆ కారణంగా వారిద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు ఒకే తీరులో ఉండేవి. అయినా ఒక తేడా ఉంది. ‘గృహిణి’ సంపన్నురాలు కావడం వలన బాహ్యంగా తన సామాజిక స్థాయికి తగినట్లు వ్యవహరించవలసి వచ్చేది. ఈ ఇబ్బందులేవీ లేనందున అఘోరమణి మరింత స్వేచ్ఛగా వ్యవహరించేది. పైగా బాలవితంతువు కాబట్టి బిడ్డలు లేనందున ఆమెకు కుటుంబ బాధ్యతలంటూ ఏవీ ఉండేవి కావు. ఆమెకున్నదంతా తన ఆభరణాలు అమ్మగా వచ్చిన ఆరు లేక ఏడు వందల రూపాయలే. ఆ మొత్తాన్ని కూడా గృహిణికిచ్చి ప్రభుత్వ ఋణపత్రాలలో పెట్టించింది. ఆ మొత్తం మీద వచ్చే వడ్డీతో ఆమె సామాన్య జీవనం సాగిపోయేది; అత్యవసరమైనప్పుడు మాత్రం దాచుకొన్నదాని నుండి కొద్దిగా తీసుకొనేది. గోవిందుని భార్య కూడా ఆమెకు, ఆమె అన్నకు అన్ని విషయాలలోను చేదోడువాదోడుగా ఉండేది.
5. అఘోరమణి భక్తి, ఆచార నిష్ఠలు
బాలవితంతువు కావడం వలన అఘోరమణి దాంపత్య సుఖాన్ని ఏనాడూ చవిచూసింది లేదు. “బాలవితంతువులు మడిని ఎంతగా పాటిస్తారంటే, ఉపయోగించే ముందు ఉప్పును కూడా కడుగుతారు” అనడం కద్దు. అఘోరమణి కూడా పెరిగి పెద్దయ్యాక ఆ విధంగానే తయారైంది. మడి, నిష్ఠలను తు.చ. తప్పక పాటించేది. ఒక రోజు అన్నం కుండనిండ వండి, శ్రీరామకృష్ణుల కంచంలో అన్నం వడ్డిస్తున్నప్పుడు ఆయన గరిటెను స్పృశించడం తటస్థించింది. కుండలో మిగిలిన అన్నం తినలేదు సరికదా, గరిటెను గంగలోకి విసిరి పారేసింది. ఈ సంఘటన శ్రీరామకృష్ణుల దర్శనార్థం ఆమె వస్తూన్న తొలినాళ్ళలో జరిగింది.
మాతృదేవి నివసించే వాద్యమందిరంలో (నహబత్లో) రెండు మూడు వంటపొయ్యిలు ఉండేవి. అనేక సందర్భాలలో కాళీమాతకు అన్నప్రసాదం నివేదించడంలో చాలా జాప్యం జరిగేది; ఒక్కోసారి మధ్యాహ్నం ఒంటిగంటన్నర దాటేది. శ్రీరామకృష్ణులు అస్వస్థులుగా ఉన్నప్పుడు, మాతృదేవి ఆయన కోసం అన్నం, చారు పెందలకడనే వండిపెడుతూండేవారు. శ్రీరామకృష్ణులను చూడడానికి వచ్చి అప్పుడప్పుడు రాత్రుళ్ళు అక్కడే బసచేసే భక్తుల కోసం చపాతీలు, పప్పు ఆ పొయ్యిల మీదే మాతృదేవి వండేవారు. అలాగే కలకత్తా, తదితర ప్రాంతాల నుండి శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చి రోజంతా మాతృదేవితో గడిపి, కొన్ని సందర్భాలలో రాత్రుళ్ళు నహబత్లో ఆమెతో గడిపే భక్తురాండ్రకు కూడా మాతృదేవి ఆ పొయ్యిల మీదే వంటచేసి పెట్టేవారు. ఒక రోజు అఘోరమణి లేదా ‘కామార్ హాటి బ్రాహ్మణి’ (ప్రారంభంలో శ్రీరామకృష్ణులు ఆమెను ఇలా సంబోధించేవారు) శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చినప్పుడు, మాతృదేవి పొయ్యిని మూడుసార్లు ఆవుపేడ, గంగాజలం మొదలైన వాటితో శుద్ధిచేసిన తరువాత, ఆమె తన అన్నం వండే కుండను పొయ్యిమీద పెట్టింది. ఆమె మడి, ఆచారాలను అంత సునిశితంగా పాటించేది.
6. గోవిందచంద్రుని ఆలయంలో వసిస్తూ, అఘోరమణి తపస్సు చేయడం
చిన్నప్పటి నుండి కామార్హాటి బ్రాహ్మణి సున్నిత మనస్కురాలుగానే పెరిగింది. సహాయం చేయమని ఎవరినైనా ప్రాధేయపడడం మాట అలావుంచితే, ఎవరైనా సంకుచితంగా ఒక్క మాట పలికినా ఆమె సహించేది కాదు. పైగా ఎవరైనా తప్పు చేయడం కంటపడితే చాలు, నిర్మొహమాటంగా అతడి ముఖం మీదే ఆ తప్పు ఎత్తి చూపడానికి జంకేది కాదు. అందువల్ల ఆమె ఎవరితోను సఖ్యంగా మసలుకోలేకపోయేది. గోవింద చంద్రుని భార్య ఆమెకు ఆలయ ఆవరణలో ఇచ్చిన గది ఉద్యానానికి దక్షిణ సరిహద్దున ఉంది. ఆ గదికి దక్షిణాన ఉన్న మూడు కిటికీల నుండి గంగానదిని చక్కగా తిలకింపవచ్చు. గదికి ఉత్తరంగా ఒకటి, పశ్చిమంగా మరొకటి, రెండు వాకిళ్ళు ఉన్నాయి. అఘోరమణి ఆ గదిలో కూర్చుని, గంగా ప్రవాహాన్ని చూస్తూ, రేయింబవళ్ళు జపం చేస్తూ ఉండేది. కష్టసుఖాలలో ముప్ఫై సుదీర్ఘ సంవత్సరాల కాలం పాటు ఆ గదిలో గడిపిన తదనంతరమే ఆమె మొట్టమొదటిసారి శ్రీరామకృష్ణులను దర్శించింది.
కామార్హాటి బ్రాహ్మణి పుట్టింటివారు బహుశా శాక్తేయులై ఉండవచ్చు. ఆమె మెట్టినింటివారు ఏ సంప్రదాయస్థులో తెలియరావడం లేదు. కాని ఆమె వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించింది; గురువు నుండి ‘బాలగోపాల’ మంత్రదీక్షను పుచ్చుకొన్నది. ఇందుకు ‘గృహిణి’ తో ఆమెకున్న సాన్నిహిత్యం కూడా బహుశా ఒక కారణమై ఉండవచ్చు. ఎందుకంటే గోవిందచంద్రుని గురువు వంశస్థులు ‘మాల్పార’ కు చెందిన గోస్వాములు కనుక. వారు కృష్ణారాధకులు. రాధాకృష్ణ ఆలయం కట్టినప్పటి నుండి ఆ వంశస్థులలో ఒకరిద్దరు తరచు కామార్హాటిలో నివసిస్తూ ఉండడం పరిపాటి.
అఘోరమణి బాలవితంతువు కావడం వలన, ఆమెకు బిడ్డలు లేరు; కాబట్టి బిడ్డల మీద తల్లికి ఎటువంటి ప్రేమ ఉంటుందో ఆమెకు అనుభవమైన విషయం కాదు. అయినప్పటికీ భగవంతుడి మీద ఆమెకంత వాత్సల్యభక్తి ఎలా కలిగిందో చెప్పడం కష్టం. పూర్వజన్మ సంస్కారమే అందుకు కారణమని అనేకులు చెబుతారు. ఏది ఏమైనా ఆమెకంత ప్రగాఢ భక్తి ఉందనడం మాత్రం యథార్థమే.
7. ప్రాచ్య పాశ్చాత్య మహిళలలో ఆధ్యాత్మికత
తీవ్రమైన దుఃఖం వాటిల్లినప్పుడు లేదా మరే కారణంగానో ఇంగ్లండు లేదా అమెరికాకు చెందిన మహిళలలో ఆధ్యాత్మిక పిపాస జనించినప్పుడు ఇతరులకు ఉపకారం చేయడం లేదా పేదలకు, బాధితులకు సేవచేయడం రూపంలో ఆ ఆధ్యాత్మికత అభివ్యక్తమౌతుంది. రేయింబవళ్ళు ఇతరులకు మంచి చేయడమే వారి ఏకైక లక్ష్యంగా మారిపోతుంది. కాని మనదేశంలో అందుకు పూర్తి విరుద్ధం. కఠోర బ్రహ్మచర్య వ్రతం అవలంబించడం, జపతపాదులు అనుష్ఠించడం, నిష్ఠగా ఆచారాలను పాటించడం రూపంలో మన దేశ మహిళల ఆధ్యాత్మికత అభివ్యక్తమౌతుంది. ఈ సాధనానుష్ఠానాలు తీవ్రతరమయ్యే కొద్దీ, పరిత్యాగ స్ఫూర్తి వారిలో ఉదయించి, వారు జీవితంలో మరింతగా అంతర్ముఖులవుతారు. మానవ జీవిత పరమోద్దేశం భగవత్సాక్షాత్కారమని, దానిలోనే నిజమైన శాంతి నెలకొని ఉందనే భావన భారతదేశంలోని ప్రతి స్త్రీ పురుషుల నరనరాల్లో జీర్ణించుకొనిపోయింది. కాబట్టి ‘కామార్హాటి బ్రాహ్మణి’ ఏకాంతవాసం, సాధనానుష్ఠానాలు ఇతర దేశస్థులకు విడ్డూరంగా తోచవచ్చునేమో గాని, ఈ దేశంలో అది వింతేమీ కాదు.
శ్రీరామకృష్ణులను మొట్టమొదటిసారి చూసినప్పటి నుండి కామార్హాటి బ్రాహ్మణికి ఆయన పట్ల ఎనలేని ఆకర్షణ ఏర్పడింది. అలా జరగడానికి కారణం ఏమిటో, భవిష్యత్తులో ఈ ఆకర్షణ దేనికి దారితీస్తుందో ఆమెకప్పుడు చూచాయగా కూడా తెలియరాలేదు. ఆయన పట్ల ఆకర్షితురాలై ఇలా అనుకోసాగింది! ‘ఈయన ఎంతో ఉత్తములు, నిజమైన సన్న్యాసి, భక్తుడు. అవకాశం చూసుకొని మళ్ళీ ఈయన వద్దకు రావాలి’. గోవిందచంద్రుని భార్యకు కూడా శ్రీరామకృష్ణుల పట్ల అదేవిధమైన ఆకర్షణ ఏర్పడింది. కాని మళ్ళీ ఆమె ఎన్నడూ దక్షిణేశ్వరానికి వెళ్ళలేదు; బహుశా సమాజం ఎక్కడ తనను తప్పుగా భావిస్తుందోనని జంకి ఉంటుంది. అదేకాక తన కూతుళ్ళ, అల్లుళ్ళ నిమిత్తం ‘పాటల్డాంగా’ ఇంట్లోనే ఎక్కువ కాలం గడపవలసిన అగత్యం వచ్చింది. అక్కడ నుండి దక్షిణేశ్వరం చాలా దూరంలో ఉండడం వలన, ఆమె రావాలనుకొంటే అందరికీ చెప్పి అవసరమైన ఏర్పాట్లు చేసుకొని మరీ రావలసి వచ్చేది. కాబట్టి ఈ పరిస్థితుల రీత్యా ఆమె మళ్ళీ ఎన్నడూ దక్షిణేశ్వరానికి వెళ్ళలేదని భావించవచ్చు.
8. శ్రీరామకృష్ణులను రెండవసారి అఘోరమణి దర్శించడం
అఘోరమణికి అటువంటి చిక్కులు ఏవీ లేవు. కొన్ని రోజులు గడిచాక ఒక రోజు జపం చేస్తూవుండగా శ్రీరామకృష్ణులను చూడాలనే ఆకాంక్ష ఆమెకు కలిగింది. వెంటనే రెండు మూడు కాసులతో నాసిరకం సందేష్ అనే తీపి తినుబండారాన్ని కొనుక్కొని, దక్షిణేశ్వరానికి వెళ్ళింది. ఆమెను చూసీచూడగానే శ్రీరామకృష్ణులు బిగ్గరగా, “ఓ, నువ్వు వచ్చావా! నా కోసం ఏం తెచ్చావో ఇవ్వు” అని అన్నారు. “ఎందరో ఎన్నో మంచి తినుబండారాలు తీసుకువచ్చి ఆయనకు తినిపించడం చూసి అటువంటి నాసిరకం సందేష్ తెచ్చినందుకు నేను కుంచించుకుపోయాను. పైగా నేను వచ్చీరాగానే ఆయన ఆ నాసిరకం మిఠాయిని తినాలనగానే, నా పరిస్థితిని మీరు ఊహించుకోవచ్చు” అని ఆ సంఘటన గురించి తదనంతర కాలంలో ఆమె చెప్పేది. సిగ్గు, సంకోచాలతో ఆమె ఏం మాట్లాడలేక తను తెచ్చిన సందేష్ను ఆయనకు ఇచ్చింది. ఆయన ఎంతో ఆనందిస్తూ ఆ మిఠాయిని తింటూ, “డబ్బు ఖర్చుపెట్టి సందేష్ను ఎందుకు తెచ్చావు? కొబ్బరి ఉండలను చేసి ఉంచుకొని, ఇక్కడకు వచ్చేటప్పుడు ఒకటి రెండు పట్టుకురా. లేదంటే నువ్వు వండిన సొరకాయ కూరో, బంగాళాదుంపలతో వండిన వంకాయకూరో, పులుసో ఏదోకటి పట్టుకురా. నీ చేతి వంటకాన్ని తినాలని నా కెంతో కోర్కెగా ఉంది” అని అన్నారు.
గోపాలుని తల్లి ఇలా చెప్పేది : “ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడలేదు. కేవలం తినడం గురించే సంభాషణ సాగింది. అప్పుడు నేను ఇలా అనుకొన్నాను : ‘తిండి, తిండి గురించే మాట్లాడే వింత సాధువును చూడడానికి వచ్చినట్లుంది. నిర్ధనురాలైన నేను ఈయనకు ఎక్కడ నుండి అంతతెచ్చి తినిపించగలను? మళ్ళీ ఇక్కడకు రానుగాక రాను.’ కాని తిరిగిపోతున్నప్పుడు దక్షిణేశ్వర ఆలయ ముఖద్వారం దాటానో లేదో వెనుక నుండి ఆయన నన్ను ఆకర్షిస్తున్నట్లు అనిపించింది. ముందుకు అడుగు వెయ్యలేకపోయాను. మనస్సుకు ఎంతో నచ్చచెప్పుకొని కాళ్ళీడ్చుకొంటూ ఎలాగో కామార్హాటి చేరాను.”
ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత బ్రాహ్మణి ‘ఆకుకూర’ పుచ్చుకొని మూడు మైళ్ళ దూరం నడిచి పరమహంస దేవులను చూడడానికి వచ్చింది. ఆమె రాగానే, మొదటి మాదిరిగానే శ్రీరామకృష్ణులు ఆమెను అడిగి తీసుకొని ఆ ఆకుకూరను తింటూ, “ఆహా, ఎంత బాగా వండావో! ఇది అమృతం, అమృతం!” అంటూ ఆనందించసాగారు. ఆయన ఆనందాన్ని చూసి గోపాలుని తల్లి కళ్ళు చెమ్మగిల్లాయి. ‘తాను పేదరాలు కావడం వలన ఆయన ఈ సామాన్యమైన వంటకాన్ని అతిగా ప్రశంసిస్తున్నారు’ అని ఆమె అనుకొన్నది.
ఈ రీతిలో రెండు మూడు నెలలలో గోపాలుని తల్లి దక్షిణేశ్వరానికి అధికంగా రాసాగింది. క్రమంగా తాను వండిన రుచికరమైన వంటకాలను చేత పుచ్చుకొని కామార్హాటి నుండి దక్షిణేశ్వరానికి తీసుకువచ్చేది. శ్రీరామకృష్ణులు వాటిని తనివితీరా ఆరగించేవారు. మళ్ళీ ఆయన సామాన్యమైన కూరనో, ఆకునో వండి తీసుకురమ్మని ఆమెతో చెప్పేవారు. ఎప్పుడూ ‘ఇది పట్రా, అది పట్రా. ఇది తింటాను, అది తింటాను’ అనే విన్నపాల బాధతో అప్పుడప్పుడు గోపాలుని తల్లి ఇలా అనుకొనేది : ‘గోపాలా! ఇంతకాలంగా నిన్ను పూజిస్తూ వచ్చినందుకు ఫలితం ఇదా? సదా తిండి తిండి అనే సాధువు వద్దకు నన్ను తీసుకొనివచ్చావు. ఇక మీదట రాను బాబు!’ మళ్ళీ అదే తిరుగులేని ఆకర్షణ! ‘ఎప్పుడు, ఎంత త్వరగా అక్కడకు మళ్ళీ వెళతాను?’ అనే ఆలోచనే మళ్ళీ ఆమెను తలచివేసేది.
9. గోవిందచంద్రుని ఉద్యానానికి శ్రీరామకృష్ణులు వెళ్ళడం
ఈలోపు శ్రీరామకృష్ణులు ఒకసారి కామార్హాటిలోని గోవిందచంద్రుని ఉద్యానానికి వచ్చి, ఆలయంలో నిర్వర్తింపబడుతున్న పూజాదికాలను చూసి ఎంతో సంతోషించారు. ఆ సందర్భంలో ఆయన భక్తిగీతాలు విగ్రహాల ఎదుట ఆలాపించారు. పిదప ప్రసాదం స్వీకరించి దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు. పాటలు పాడుతూన్నప్పుడు ఆయన పొందిన భావపారవశ్యాన్ని చూసి గృహిణి మొదలైన వారంతా ఎంతో ముగ్ధులయ్యారు. కాని తమ ప్రాబల్యం ఎక్కడ తగ్గిపోతుందోనని గోస్వాముల (పురోహితుల) మనస్సులలో అసూయాద్వేషాలు ఒకింత రగిలాయో లేదో చెప్పలేం. యథాతథంగా ఇట్లే జరిగిందని మాత్రం మేం విన్నాం.
రోజూ వేకువన రెండు గంటలకు నిద్రలేచి, కాలకృత్యాలు ముగించుకొని, మూడు గంటలకు జపానికి కూర్చోవడం ‘కామార్హాటి బ్రాహ్మణి’ సుదీర్ఘకాల అలవాటు. ఉదయం ఎనిమిది లేక తొమ్మిది గంటలకు జపం పూర్తిచేసి, స్నానం చేసేది. తరువాత ఆలయంలోకి వెళ్ళి రాధాకృష్ణులను దర్శించి, ఆలయ సేవలలో పాల్గొనేది. ఆలయంలో పూజ, నైవేద్యాదులు పూర్తికాగానే, మధ్యాహ్నం పన్నెండు గంటలకు తన వంటను చేసుకొనేది. పిదప భోజనం చేసి, కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ జపానికి కూర్చునేది. సాయంత్రం మళ్ళీ ఆలయంలోకి వెళ్ళి సంధ్యాహారతి దర్శించుకొని వచ్చి, రాత్రి బాగా ప్రొద్దుపోయే వరకు జపం చేసేది. తరువాత కాసిని పాలు త్రాగి నిద్రకు ఉపక్రమించేది. ఆమె శరీర నిర్మాణంలో వాయుధాతువు అధికం. కనుక ఆమె చాలా తక్కువ సేపు మాత్రమే నిద్రించేది. అప్పుడప్పుడు గుండెదడ ఎక్కువై ఏదో అస్పష్టమైన వ్యాకులతకు గురి అయ్యేది. ఈ విషయం విని శ్రీరామకృష్ణులు ఆమెతో ఇలా చెప్పారు : “నీ శరీరంలోని ఆ వాయుధాతువు శ్రీహరిపై ధ్యానం చేస్తున్నందు వలన కలిగింది. దాన్ని నయం చేస్తే, నీ జీవితానికి ఇక ఆసరా ఏముంటుంది? ఆ వ్యాకులత ఏర్పడినప్పుడు ఏదైనా కాస్త తిను, తగ్గుతుంది.”
10. అఘోరమణి బాలగోపాలుని దివ్యదర్శనం పొందడం
అది 1884 వ సంవత్సరం. శీతాకాలం గడిచిపోయింది. వసంత ఋతువు ఏతెంచింది. కొంగ్రొత్త చిగుళ్ళతో, పువ్వులతో, పక్షుల కిలకిలారావాలతో నిండిన పృథివి ఒకరకం దివ్యోన్మత్తతను అనుభవిస్తూ, మేల్కొన్నది. జీవులు తమ గత సంస్కార ప్రవృత్తుల మేరకు అనుభవించే మంచి, చెడు అనే భేదం ఈ దివ్యోన్మత్తతలో కానరావడం లేదు. సజ్జనులలో ఆ ప్రకృతి సత్సంస్కారాలను, దుర్జనులలో విపరీత భావనలను జాగృతం చేస్తుంది. అదే తేడా.
అటువంటి వసంత ఋతువు సమయంలో ‘కామార్హాటి బ్రాహ్మణి’ ఒకనాడు వేకువజాము మూడు గంటలకు జపం చేయడానికి కూర్చుంది. జపం ముగించి, జప ఫలాన్ని ఇష్టదేవతకు సమర్పించే ముందు ప్రాణాయామం చేయసాగింది. అప్పుడు తనకు ఎడమ వైపున శ్రీరామకృష్ణులు కూర్చుని ఉండడం చూసింది. ఆయన కుడిచెయ్యి పిడికిలి బిగిసివుంది. స్పష్టంగా, సజీవమూర్తిగా దక్షిణేశ్వరంలో తాను చూసినట్లే ఆయన కనిపించారు. ‘ఇదేమిటి? ఈవేళప్పుడు ఈయన ఇక్కడికి ఎలా వచ్చారు?’ అని అనుకొని ఆమె ఆశ్చర్యపోయింది.
గోపాలుని తల్లి తన అనుభవాన్ని ఇలా వర్ణించింది: “నేను విస్తుబోయి అలా అవాక్కయి చూస్తూ, ఆలోచిస్తూన్నప్పుడు ‘గోపాలుడు’ (శ్రీరామకృష్ణులను ఆమె అలా పేర్కొనడం రివాజు) కూర్చుని, చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఆ తరువాత గుండె దడదడలాడుతూండగా నా చేత్తో గోపాలుని (శ్రీరామకృష్ణుల) ఎడమ చేతిని పుచ్చుకొన్న మరుక్షణమే ఆ మూర్తి అదృశ్యమైపోయాడు. ఆ స్థానే పది నెలల బాలగోపాలుడు, నిజంగానే (చేతులతో చూపుతూ) ఇంత పెద్దవాడు, ఆ మూర్తినుండి బయల్వెడలి ప్రాకుతూ, ప్రాకుతూ చేయెత్తి నా వంకే చూస్తూ, ‘అమ్మా! వెన్న తినిపించు’ అని అడిగాడు. ఆ విచిత్ర అనుభవంతో విస్తుబోయాను. పెద్దగా కేకలుపెట్టాను.
ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఉండివుంటే వాళ్ళు పరుగెత్తుకొని అక్కడకు వచ్చేవారు. నేను విలపిస్తూ, ‘నాయనా! ఏమీలేని అభాగ్యురాలిని. నీకు ఏమి తినిపించగలను? నాయనా, ఎక్కణ్ణుండి వెన్న, పాలు తెచ్చియివ్వగలను?’ అని అన్నాను. ఆ విచిత్ర గోపాలుడు నా మాటలు పట్టించుకొంటాడా? ‘తినేందుకు ఏమన్నా పెట్టు’ అని సతాయిస్తూనే ఉన్నాడు. నేనేం చేయగలను? ఏడుస్తూ లేచి నిలబడి, ఎండుకొబ్బరి ఉండను తెచ్చి అతడి చేతిలో పెట్టాను. తరువాత, ‘నాయనా, గోపాలా! ఈ పనికిమాలిన పదార్థాన్ని తినడానికి ఇచ్చానని చెప్పి నాకు మాత్రం అటువంటిది తినడానికి ఇవ్వవద్దు’ అని చెప్పాను.
11. ఆ పరిస్థితిలోనే ఆమె శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళడం
“మరిక జపం విషయమో? జపం ఎలా చేస్తాను? గోపాలుడు వచ్చి, ఒళ్ళో కూర్చుని జపమాలను లాగేశాడు. నా భుజాల మీదకెక్కాడు, గది చుట్టూ ప్రాకాడు. తెల్లారగానే పిచ్చిదానిలా పరుగెత్తుకొని దక్షిణేశ్వరానికి వెళ్ళాను. గోపాలుడు నా చంకనెక్కి, తలను నా భుజాల మీద ఆన్చాడు. అతణ్ణి వక్షానికి హత్తుకొని, ఒక చెయ్యి అతడి పిరుదుల మీద, మరొక చెయ్యి అతడి వీపు మీద వేసుకొని, కాలినడకన వెళ్ళాను. గోపాలుడి వంగవన్నె పాదాలు నా వక్షస్థలం మీద వ్రేలాడడం నేను స్పష్టంగా చూశాను.”
తన ఇష్టదైవ దర్శనం పొందడం వలన కలిగిన భగవత్ప్రేమోన్మాదంలో అఘోరమణి ఆనాటి ఉదయం కామార్హాటి ఉద్యానం నుండి, దక్షిణేశ్వరానికి నడిచి వచ్చింది. మాకు తెలిసిన మరొక భక్తురాలు ఆ సమయంలో అక్కడ ఉండడం తటస్థించింది. ఆ భక్తురాలి నుండి మేం విన్న కథనాన్ని పాఠకులకు ఇప్పుడు తెలుపుతున్నాం. ఆమె ఇలా చెప్పింది:
“నేనప్పుడు శ్రీరామకృష్ణుల గదిని ఊడ్చి, శుభ్రం చేస్తున్నాను. అప్పుడు ఉదయం ఏడు లేక ఏడున్నర గంటలు అయివుండవచ్చు. ఎవరో, ‘గోపాలా, గోపాలా’ అని కేకలువేస్తూ శ్రీరామకృష్ణుల గది వైపుకు రావడం వినవచ్చింది. ఆ గొంతు పరిచయం ఉన్న వారిదేననిపించింది. తీరా చూద్దును కదా, వచ్చింది గోపాలుని తల్లి. అస్తవ్యస్తంగా చీర ధరించి పిచ్చిదానిలా కనిపించింది. కనుగుడ్లు నుదుటకెక్కాయి, చీర చెంగు నేలమీద ఈడుస్తుంది చుట్టుపట్ల ఏముందో అన్న ధ్యాస కూడా ఆమెకు లేనట్లే ఉంది. ఆ స్థితిలో తూర్పు వాకిలి నుండి ఆమె గురుదేవుల గదిలోకి వచ్చింది. అప్పుడు ఆయన తన చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు.
“గోపాలుని తల్లిని ఆ స్థితిలో చూసి నేను విస్తుబోయాను; ఆమెను చూసి శ్రీరామకృష్ణులు భావసమాధి మగ్నులైనారు. ఈలోపు గోపాలుని తల్లి ఆయన ప్రక్కన వచ్చి కూర్చుంది; శ్రీరామకృష్ణులు చిన్న పిల్లవాడిలా వెళ్ళి ఆమె ఒళ్ళో కూర్చున్నారు. ఆమె రెండు కళ్ళ నుండి అశ్రువులు ప్రవహిస్తున్నాయి. అప్పుడామె తనతో పాటు తెచ్చిన వెన్న, మీగడలను స్వహస్తాలతో ఆయనకు తినిపించసాగింది. ఆ దృశ్యం చూసి నేను సంభ్రమాశ్చర్యభరితనైనాను. శ్రీరామకృష్ణులు భావావస్థలో ఏ స్త్రీనిగాని స్పృశించగా ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు. కాని ఆయన గురువైన భైరవీ బ్రాహ్మణికి అప్పుడప్పుడు యశోదాభావం కలిగేదనీ, ఆ సమయంలో గురుదేవులు గోపాల భావంలో ఆమె ఒడిలో కూర్చునే వారనీ మాత్రం నేను విన్నాను.
“ఏది ఏమైనా గోపాలుని తల్లి అవస్థను, శ్రీరామకృష్ణుల ఆ భావాన్ని చూసి నేను తెల్లబోయాను. కాసేపటికి ఆ భావం ఉపశమించగా శ్రీరామకృష్ణులు లేచి వెళ్ళి తమ మంచం మీద కూర్చున్నారు. కాని గోపాలుని తల్లి ఆ మానసిక వైఖరి మాత్రం ఉపశమించలేదు. పట్టరాని ఆనందంతో ఆమె లేచి నిలబడి, ‘బ్రహ్మ నృత్యం చేస్తున్నాడు, విష్ణువు నృత్యం చేస్తున్నాడు’ అంటూ పిచ్చిదానిలా గదిలో నృత్యం చేయసాగింది. శ్రీరామకృష్ణులు అదంతా చూసి నవ్వుతూ నాతో, ‘అలా చూడు, ఆమెలో పరమానందం పొంగిపొరలుతూన్నది. ఆమె మనస్సు ప్రస్తుతం గోపాలుని లోకానికి వెళ్ళిపోయింది’ అని అన్నారు. ఆ తరువాత కూడా గోపాలుని తల్లికి భావావస్థలో అటువంటి దివ్యదర్శనాలు కలిగేవట; ఆ సమయంలో ఆమె మరో వ్యక్తిగా మారిపోయేది. మరో సందర్భంలో భుజించేటప్పుడు ఆధ్యాత్మిక భావోద్వేగంలో మమ్మల్నందరినీ గోపాలురుగా పిలుస్తూ, తన స్వహస్తాలతో మాకు అన్నం తినిపించింది. నా కుమార్తెను మా స్థాయికంటే తక్కువ స్థాయి పిల్లవాడికిచ్చి పెళ్ళి చేశానని ఆమెకు మనస్సులో నా పట్ల కొంత అయిష్టత ఉండేది. కాని ఆ రోజు తన అయిష్టతకు ఎంతో వినయంగా క్షమాపణ చెప్పుకొంది! ఆమె ఇలా చెప్పింది : ‘నీలో ఇంత భక్తివిశ్వాసాలు ఉన్నాయని మునుపు తెలిసిందా? భావావస్థలో ‘గోపాలుడు’ (శ్రీరామకృష్ణులు) దాదాపు ఎవరినీ స్పృశించలేడు. కాని ఈ రోజు అతడు భావావస్థలో నీ వీపుమీది కెక్కి కూర్చున్నాడే! నువ్వు సామాన్యురాలవా?’” నిజానికి శ్రీరామకృష్ణులు ఆ రోజు గోపాలుని తల్లిని చూసి భావపారవశ్యంలో మొట్టమొదట ఆ భక్తురాలి వీపుమీద కూర్చుని, ఆ తరువాత గోపాలుని తల్లి ఒడిలో కొంతసేపు కూర్చోవడం జరిగింది.
అఘోరమణి భావావస్థలో ఆ రోజు అలా దక్షిణేశ్వరానికి వచ్చి, భావ పారవశ్యంలో కన్నీరుమున్నీరై శ్రీరామకృష్ణులతో అనేక విషయాలు చెప్పింది. ఆమె ఇలా చెప్పింది : “నా ఒడిలో గోపాలుడు, అదుగో నీలో ప్రవేశించాడు… ఇదుగో మళ్ళీ బయటకు వస్తున్నాడు. రా నాయనా, ఈ పేదతల్లి ఒళ్ళో వచ్చి కూర్చో.” ఆ చపల గోపాలుడు ఒకసారి శ్రీరామకృష్ణుల శరీరంలో లీనమై పోయేవాడు, మరొకసారి తేజస్వియైన బాలుని రూపంలో ఆమె వద్దకు వచ్చేవాడు. అతడి పిల్లచేష్టలకు అంతే లేదు. ఆ భావోద్వేగంలో ఆమె మునిగి పోయింది; ఆమె తన నియమ నిష్ఠలన్నిటినీ విస్మరించింది; అవన్నీ కొట్టుకొనిపోయాయి. భావతరంగాల ఉప్పెనలో మునిగిపోయినప్పుడు ఎవరు మాత్రం తమను అదుపులో ఉంచుకోగలరు?
12. ఆమె భావావస్థను శ్రీరామకృష్ణులు ప్రశంసించడం
ఆనాటి నుండి అఘోరమణి నిజంగానే ‘గోపాలుని తల్లి’ గా మారింది. శ్రీరామకృష్ణులు ఆమెను ఆ పేరుతోనే పిలువసాగారు. అసాధారణమైన ఆమె భావావస్థను చూసి శ్రీరామకృష్ణులు పరమానందభరితులయ్యారు. ఆమెను శాంతింప చేయడానికి తన చేత్తో ఆమె మేనును నిమురసాగారు. గదిలో ఉన్న మంచి భక్ష్యాలను ఆమెకు తినిపించారు. తింటూ తింటూ భావ పారవశ్యంలో ఆమె, “గోపాలా, నాయనా, దీనురాలైన నీ తల్లి తన జీవితాన్ని కష్టాలలోనే గడిపింది; రాట్నంతో వడికిన నూలు విక్రయించి భారంగా జీవనం సాగిస్తున్నది. అందుకేనా నువ్వు ఈ రోజు ఆమెను ఇంత అభిమానంగా చూసుకొంటున్నావు?” అని అన్నది.
ఆ రోజంతా ఆమెను, శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలోనే ఉండమన్నారు. ఆమె అక్కడే స్నానం చేసి, భోజనం చేసింది. ఆమెను మరింత శాంతపరచి సూర్యాస్తమయానికి మునుపే కామార్హాటికి పంపించివేశారు. భావపారవశ్యంలో కానవచ్చిన బాలగోపాలుడు ఆమె చంకనెక్కి ఆమెతో పాటు కామార్హాటికి వెళ్ళాడు. ఇంటికి తిరిగి వెళ్ళగానే గోపాలుని తల్లి అలవాటు ప్రకారం జపానికి కూర్చుంది. కాని జపం చేయడం సాధ్యమా? ఎవరి నిమిత్తం జపం చేస్తూన్నదో, ఎవరిని ధ్యానిస్తూ ఉందో, ప్రార్థిస్తూ ఇంతకాలం గడిపిందో సాక్షాత్తు అతడే తన కళ్ళముందు నానారకాల చిలిపిచేష్టలు చేస్తూ, గారాలు పోతుంటే జపం సాగుతుందా! చివరకు బ్రాహ్మణి లేచి గోపాలుణ్ణి తీసుకొని మంచం మీద తన ప్రక్కన పడుకోబెట్టుకొన్నది. ఆమెకు పరుపు, కనీసం దిండు కూడా లేవు. మెత్తని తలగడ లేనందున గోపాలుడు సణుగుడు మొదలుపెట్టాడు. దాంతో ఆమెకు నిద్రపట్టలేదు. ఇక చేసేదిలేక బ్రాహ్మణి తన ఎడమ చేతిని అతడి తలక్రింద పెట్టి జోకొడుతూ ఇలా చెప్పింది : “నాయనా, ఈ రోజు ఎలాగో నిద్రపో. తెల్లవారగానే కలకత్తాకెళ్ళి భూత (యజ్ఞేశ్వరి, కామార్హాటి గృహిణి పెద్దకుమార్తె) నడిగి మెత్తని దిండు చేయించి తీసుకువస్తానులే.”
గోపాలుని తల్లి స్వయంగా వంట చేసుకొని, మానసికంగా గోపాలుడికి తినిపించి, పిదప దానిని ప్రసాదంగా స్వీకరించేదని ఇంతకు మునుపే తెలిపి ఉన్నాం. మర్నాడు తన నిజమైన గోపాలునికి త్వరగా వంటచేసి తినిపించడానికి, ఎండుకట్టెల కోసం ఉద్యానానికి వెళ్ళింది. గోపాలుడు కూడా తనతో వచ్చి ఎండు పుల్లలు ఏరడం ఆమె కంటపడింది. ఆ విధంగా తల్లీ కుమారులు ఎండు పుల్లలు ప్రోగుచేసుకొన్న తరువాత వంట మొదలైంది. చిలిపి గోపాలుడు ఊరకే కూర్చుంటాడా? ఒకసారి ఆమె ప్రక్కన కూర్చుని, మరొకసారి ఆమె వీపు మీదికెక్కి ఆమె వంటచేసే తీరును పరికించసాగాడు. మధ్యమధ్యలో వ్యర్థప్రసంగం చేస్తూ, అదీ ఇదీ కావాలని మారాం చేయసాగాడు. తీయని మాటలతో, సుతిమెత్తని చీవాట్లతో అతడి అల్లరిని బ్రాహ్మణి అదుపులో పెట్టడానికి ప్రయత్నించసాగింది.
13. “నువ్వు సమస్తం సాధించావు” – శ్రీరామకృష్ణుల ప్రశంస
ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత గోపాలుని తల్లి ఒక రోజు దక్షిణేశ్వరానికి వచ్చింది. శ్రీరామకృష్ణులను దర్శించుకొని, మాతృదేవి వసించే నహబత్కు వెళ్ళి, జపం చేయడానికి కూర్చుంది. నియమం మేరకు జపం పూర్తి చేసుకొని, భగవంతునికి ప్రణామాలర్పించి లేవబోతున్నప్పుడు పంచవటి నుండి శ్రీరామకృష్ణులు అక్కడికి వచ్చారు. గోపాలుని తల్లిని చూడగానే ఆయన, “ఇప్పుడు కూడా నువ్వు అంతసేపు జపం చేయడం ఎందుకు? ఇప్పటికే నువ్వు ఎంతో సాధించావు కదా!” అని అన్నారు.
గోపాలుని తల్లి : జపం చేయనవసరం లేదా? సమస్తం సాధించానా?
శ్రీరామకృష్ణులు : అవును, నువ్వు సమస్తం సాధించావు.
గోపాలుని తల్లి : సమస్తం?
శ్రీరామకృష్ణులు : అవును, సమస్తం.
గోపాలుని తల్లి : మీరు ఏమంటున్నారు? నేను సమస్తం ప్రాప్తించుకొన్నానా?
శ్రీరామకృష్ణులు : అవును, సమస్తం. నువ్వు చెయ్యవలసినంత జపం, తపం, సాధనలు పూర్తిచేశావు. కాని నీకు ఇష్టమైతే జపతపాదులను దీని (తమ శరీరం చూపుతూ) క్షేమం కోసం చేయవచ్చు.
గోపాలుని తల్లి : అయితే ఇప్పటి నుండి నేను చేసే జపతపాదులన్నీ నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే.
పై సంఘటనను ప్రస్తావిస్తూ గోపాలుని తల్లి మాతో అప్పుడప్పుడు ఇలా చెబుతూండేది : “ఆ రోజు గోపాలుని ముఖతా ఆ మాట విన్న తరువాత జపమాల, సంచి మొదలైన వాటిని గంగలో పారేశాను. అప్పటి నుండి గోపాలుని క్షేమం కోసం వ్రేళ్ళమీద లెక్కిస్తూ జపంచేయసాగాను. చాలాకాలం తరువాత మళ్ళీ జపమాలను వాడడం మొదలుపెట్టాను. నేను ఇలా అనుకొన్నాను- ‘ఏదో ఒకటి చెయ్యాలి. ఇరవై నాలుగు గంటలు గడపడం ఎలా?’ కాబట్టే గోపాలుని హితం కోసం జపమాలలోని పూసలను లెక్కించసాగాను.”
అప్పటి నుండి గోపాలుని తల్లి జపతపాదులన్నీ ఆగిపోయాయి. శ్రీరామకృష్ణుల దర్శనార్థం ఆమె తరచు దక్షిణేశ్వరానికి వెళ్ళసాగింది. ఆహారాది విషయాలలో ఇంతకుముందు ఆమెకున్న ఆచారనిష్ఠలు ఆ మహాభావ ప్రవాహంలో పడి కొట్టుకుపోయాయి. గోపాలుడే ఆమె మనస్సును, హృదయాన్ని పూర్తిగా ఆక్రమించివేశాడు. నానా రీతులలో గోపాలుడు ఆమెకు బోధించసాగాడు. అటువంటప్పుడు ఆమె తన నియమనిష్ఠలను ఎలా పాటించగలుగుతుంది? వేళాపాళా లేకుండా గోపాలుడు తినగోరతాడు. తాను తింటూన్నది అమ్మ నోట్లో కుక్కుతాడు. దానిని తిరస్కరించగలదా? పైగా, తిరస్కరిస్తే అతడు ఏడ్చేవాడు. ఈ అసాధారణ భావకెరటాలపై తేలుతున్నప్పటి నుండి, “ఇదంతా శ్రీరామకృష్ణుల క్రీడ అని, తన ‘నవీన నీరద శ్యాముడు, నీలకమల నేత్రుడు’ గోపాలరూపంలో ప్రత్యక్షమౌతున్న తన కృష్ణుడు మరెవరో కాదు శ్రీరామకృష్ణులే” అని ఆమెకు అవగతమైంది. కాబట్టే ఆయన కోసం వండి, ఆయనకు తినిపించి, ఆ ప్రసాదాన్ని తను పుచ్చుకోవడానికి ఆమె కించిత్తు కూడా సంకోచించేది కాదు.
గోపాలరూపుడైన కృష్ణుణ్ణి ఒకప్పుడు చంకనెత్తుకొంటూ, మరొకప్పుడు వక్షానికి హత్తుకొంటూ కామార్హాటి బ్రాహ్మణి ఎడతెగకుండా రెండు నెలలు గడిపింది. భావరాజ్యంలో ఆ విధంగా అంత దీర్ఘకాలం వసిస్తూ, ‘చిన్మయ నామం, చిన్మయ ధామం, చిన్మయ శ్యాముని’ ప్రత్యక్షంగా దర్శించే అవకాశం అరుదుగా ఏ కొద్దిమంది అదృష్టవంతులకో గాని లభించదు.
నిజానికి ఈ ప్రపంచంలో భగవంతుణ్ణి వాత్సల్యభావంతో చూడడమన్నది ఎంతో అరుదైన విషయం. ఎందుకంటే, భగవంతుని శక్తి గురించి కించిత్తు ఎరుక ఉన్నా వాత్సల్యభక్తి జనించడం అసంభవం కాబట్టి. ఇక అసదృశమైన భక్తి తోడ్పాటుతో, అది ఘనీభవించడం ద్వారా భగవంతుని అలా ప్రత్యక్షంగా దర్శించగలగడం మరెంత అరుదైన విషయమో సులభంగా ఊహించుకోవచ్చు. ‘కలౌ జాగర్తి గోపాలః, కలౌ జాగర్తి కాళికా’ అనే లోకోక్తి ఉంది. (అంటే కలియుగంలో గోపాలుడు, కాళీ – ఈ ఇద్దరూ జాగ్రద్దేవతలు అని అర్థం). బహుశా అందుకే కాబోలు భగవంతుడు ఈ రెండు రూపాల్లో నేడు కూడా అలా అప్పుడప్పుడు ప్రత్యక్షమౌతున్నాడు.
శ్రీరామకృష్ణులు, గోపాలుని తల్లితో ఇలా చెప్పారు : “నువ్వు ఎంతో సాధించావు. అటువంటి అవస్థ దీర్ఘకాలం కొనసాగితే ఈ కలియుగంలో శరీరం నిలవదు.” లోకహితార్థం వాత్సల్యభక్తికి ఆదర్శ దృష్టాంతంగా ఈ పేద బ్రాహ్మణి పావనదేహం మరికొంత కాలం ఈ లోకంలో నిలిచి ఉండాలన్నదే శ్రీరామకృష్ణుల సంకల్పమై ఉండవచ్చు. కాబట్టే ఎడతెగకుండా రెండు నెలలు అలా గోపాలుని దర్శించిన తరువాత, గోపాలుని తల్లి దర్శనాదులు క్రమంగా తగ్గిపోసాగాయి. అయినప్పటికీ కాసేపు నిశ్చలంగా కూర్చుని మనస్సును గోపాలుని మీద ఏకాగ్రం చేయగానే వెనుకటి మాదిరే ఆమెకు గోపాలుని దర్శనం కలిగేది.