క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి ।
కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి ॥ –భగవద్గీత. 9.31
నన్ను ఆశ్రయించిన వాడు (మునుపు ఘోర పాపాత్ముడై ఉన్నప్పటికీ) సత్వరమే ధర్మాత్ముడౌతాడు, శాశ్వతశాంతిని పొందుతాడు. ఓ అర్జునా, నా భక్తుడు ఏనాడూ చెడిపోడని ఢక్కా మ్రోగించి చాటిచెప్పు.
భావముఖంలో సుప్రతిష్ఠితులైన శ్రీరామకృష్ణుల అద్భుత వ్యక్తిత్వాన్ని ఏ కొంచెమైనా అవగతం చేసుకోగోరితే, భక్తుల సాంగత్యంలో ఆయన మెలిగే తీరును గమనించవలసి ఉంటుంది. వివిధ ప్రవృత్తులు గల భక్తులతో అనునిత్యం ఆయన ఎలా కలసిమెలసి తిరిగేవారో, ఎలా మాట్లాడేవారో, ఎలా తమాషాగా వ్యవహరించేవారో, భావపారవశ్యంలో ఎలా ప్రవర్తించేవారో నిశితంగా పరిశీలించి, ఆనుపానులను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఆ దివ్యలీల మార్మికత కించిత్తు అవగతమౌతుంది. భక్తుల సాంగత్యంలో ఆయన సలిపిన అటువంటి ఒక లీలా కథనాన్ని ఇక్కడ పాఠకులకు విశదీకరిస్తున్నాం:
1. శ్రీరామకృష్ణులలో దివ్య, మానవ ప్రవృత్తుల సామరస్యం
మేం గమనించినంత మేరకు ఈ అద్భుత మహాపురుషుని అతి సామాన్యమైన చేతలు సైతం ధ్యేయరహితాలై, ప్రయోజనరహితాలై ఉండలేదు. ఒకే వ్యక్తిలో దివ్య, మానవ నైజాలు ఇంత అద్భుత సామరస్యంలో మేళవించి ఉండడం ఎంతో అరుదైన విషయం. గత ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో మేం పర్యటించినప్పుడు కూడా అటువంటి మరొక వ్యక్తి మాకు తారసపడలేదు. “పళ్ళు (దంతాలు) ఉన్నంత వరకు వాటి విలువ తెలుసుకోలే” మనే సామెత ఒకటి ఉంది. శ్రీరామకృష్ణులకు సంబంధించినంత వరకు మా విషయంలో ఈ సామెత నిజమైంది. కంఠవ్రణంతో బాధపడుతున్నప్పుడు చికిత్స నిమిత్తం శ్రీరామకృష్ణులను శ్యాంపుకూర్‌కు తోడ్కొని వచ్చినప్పుడు, ఒక రోజు ఆయనను దర్శింపవచ్చిన విజయకృష్ణగోస్వామి మాతో ఈ క్రింది విధంగా చెప్పారు :
2. విజయకృష్ణ గోస్వామి దివ్యదర్శనం పొందడం
కొన్ని రోజుల క్రితం ఢాకాలో బసచేసి ఉన్నప్పుడు గది తలుపులన్నీ మూసి విజయకృష్ణ గోస్వామి ధ్యానానికి కూర్చున్నాడు. అతడికి అప్పుడు శ్రీరామకృష్ణుల దివ్యదర్శనం కలిగింది. తాను చూస్తున్నది నిజమో లేక భ్రమో అని తేల్చుకోవడానికి తన ముందు కానవస్తున్న మూర్తి అవయవాలన్నిటిని అతడు పదేపదే తడవి చూశాడు. ఈ సంఘటనను గురించి బాహాటంగా ఆ రోజు గురుదేవుల వద్ద, మా వద్ద విజయకృష్ణగోస్వామి ప్రస్తావించాడు. విజయ్ ఇలా చెప్పాడు: “దేశంలో వివిధ ప్రాంతాలలో పర్యటించాను; కొండలు పర్వతాలు తిరిగి ఎందరో మహాత్ములను సందర్శించాను. కాని ఇటువంటి (శ్రీరామకృష్ణులను చూపుతూ) వారిని నేను ఎక్కడా చూడలేదు. కొన్ని చోట్ల రెండణాలు, మరికొన్ని చోట్ల ఒక్క అణా, కొన్నిచోట్ల ఒక్క కాణి, మరి కొన్నిచోట్ల ఒక్క దమ్మిడీ (ఆధ్యాత్మికశక్తి) కనిపించింది. చివరకు కనీసం నాలుగు అణాలు కూడా ఎక్కడా కనిపించలేదు. కాని ఇక్కడో, పూర్తిగా పదహారణాలు! పరిపూర్ణ ఆధ్యాత్మికశక్తి ఇక్కడ మాత్రమే అభివ్యక్తమౌతున్నది.” శ్రీరామకృష్ణులు నవ్వుతూ, “అతడు ఏమంటున్నాడు?” అని మమ్మల్ని అడిగారు. అందుకు విజయ్ ఇలా జవాబిచ్చాడు : “మిమ్మల్ని ఢాకాలో దర్శించాను, మీరు ‘అసంభవం’ అన్నా మీ మాటను నమ్మను. ఇంత సునాయాసంగా (అందరికీ) లభించే మీరు ఇంత గందరగోళాన్ని ఎందుకు సృష్టించారు? దక్షిణేశ్వరం, కలకత్తాకు అతి సమీపంలో ఉంది; ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వచ్చి మిమ్మల్ని దర్శించుకోగలం. కావలసినన్ని పడవలు, గుర్రబ్బళ్ళు లభించడం వలన ఏ ఇబ్బందీ లేకుండా ఇక్కడకు రావచ్చు. ఇంటి ప్రక్కనే మీరింత సులభంగా లభిస్తున్నారు కనుకనే మీ విలువను మేం అర్థం చేసుకోలేకపోతున్నాం. మీరు ఏ పర్వత శిఖరం మీదో వసిస్తున్నారనుకోండి, ఎంతోదూరం నడిచి, తిండీ తిప్పలు లేకుండా, చెట్లవ్రేళ్ళను ఆసరగా పుచ్చుకొని పర్వతాన్ని అధిరోహించి చివరకు మీ దర్శనం చేసుకొన్నప్పుడు, బహుశా మీ విలువను అర్థం చేసుకుంటామేమో! కాని ఇప్పుడు అద్వితీయ మహాపురుషుడు ఇంత సామీప్యంలో వసించడం వలన, ఎక్కడో సుదూర ప్రాంతాలలో ఇంతకంటే గొప్ప మహాత్ములు ఉండివుంటారని మేం భ్రమపడుతూవుంటాం. అందువలననే ఇక్కడికి, అక్కడికి పరుగులుపెట్టి నిరంతర ప్రయాసలకు సిద్ధపడతాం.”
3. శ్రీరామకృష్ణుల అసాధారణ ప్రవర్తనకు భక్తులు స్పందించిన తీరు
పైన చెప్పింది ముమ్మాటికీ నిజం. కరుణార్ద్రహృదయులైన శ్రీరామకృష్ణులు తమ వద్దకు వచ్చిన యావన్మందినీ తమ సొంతవారిగా పరిగణించేవారు; ఒక్కసారి అలా పరిగణించిన తరువాత ఇక ఆయనను విడిచిపెట్టి వెళ్ళడానికి ఆ భక్తులు ఎంత ప్రయత్నించినా, గురుదేవులు మాత్రం వారి సాంగత్యాన్ని విడిచిపెట్టలేకపోయేవారు. ఒక్కొక్కప్పుడు చిరునవ్వుతో, మరొకప్పుడు కఠోర శాసనంతో ఆ భక్తులు గత జన్మల నుండి సంచితం చేసుకొన్న సంస్కారాలనన్నీ తుడిపివేసి, తాము రూపొందించిన అనుపమాన మూసలలో వారిని కొంగ్రొత్తగా పోతపోసి వారికి శాశ్వత శాంతిని ప్రసాదించేవారు. భక్తులు తమ స్వీయ జీవిత కథలను దాపరికం లేకుండా విప్పి చెప్పినప్పుడు పై విషయం తేటతెల్లమౌతుంది. ఒకప్పుడు నరేంద్రుడు చెప్పనలవిగాని లౌకిక కష్టనష్టాలకు గురైనాడు; ‘ఇంతకాలం నుండి తాను భగవంతుణ్ణి నమ్మి, శరణు వేడినప్పటికీ ఆయన కానరాలేదే? గురుదేవులు కూడా తన నిమిత్తం ఈ విషయంలో ఏమీ చేయలేదే!’ అనుకొని అభిమానం దెబ్బతినగా చెప్పాపెట్టకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోవాలని తీర్మానించుకొన్నాడు. కాని శ్రీరామకృష్ణులు అతణ్ణి అలా చేయనివ్వలేదు. దివ్యశక్తితో నరేంద్రుడి ఉద్దేశం గ్రహించి, అతడికి ఎంతో నచ్చచెప్పి ఆ రోజు తమతో దక్షిణేశ్వరంలోనే బస చేయించారు. తరువాత అతణ్ణి ప్రేమ పూర్వకంగా నిమురుతూ, భావావేశపరులై, “ఓ రాయ్! (అంటే రాధా) నీతో మాట్లాడాలన్నా భయమే, మాట్లాడకుండా ఊరకే ఉండాలన్నా భయమే! నిన్నెక్కడ కోల్పోతానో అనే శంకతో నా మనస్సు భీతి చెందుతున్నది సఖీ!” అనే గీతం పాడసాగారు శ్రీరామకృష్ణులు. అనేక విధాల అనునయించి సంసార పరిత్యాగం చేయనివ్వకుండా నరేంద్రుణ్ణి తమ వద్దే ఉంచుకోగలిగారు.
ఇక గిరీశ్ ఉదంతం – తన భారాన్నంతా (ముక్త్యారునామాను) గురుదేవులకు అర్పించి కృతార్థుడైనా కూడా తన పూర్వకర్మ సంస్కారాలను గుర్తుకు తెచ్చుకొని నిశ్చింతగా ఉండలేక ఎంతో భయపడుతున్న గిరీశ్చంద్ర ఘోష్‌ను చూసి అతడికి అభయప్రదానం ఇస్తూ శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు : “ఓ మందమతీ! నిన్ను పట్టుకొన్నది నీటిపాము అనుకొంటున్నావా? ఇది నాగుపాము. తప్పించుకొని కలుగులోకి పారిపోయినా చావక తప్పదు. నీటిపాములు, కప్పలను పట్టుకొంటే వెయ్యిసార్లు బెకబెకమని అరిచి కప్పలు చావడం నువ్వు గమనించలేదా? కొన్ని తప్పించుకొని పారిపోవడం కద్దు. కాని నాగుపాము లేదా త్రాచుపాము పట్టుకొంటే మూడు బెకబెకలకే కప్ప చస్తుంది. ఎంతో అరుదుగా ఏదో ఒక కప్ప తప్పించుకొని పారిపోయినా, కన్నంలో దూరిన తక్షణమే చావడం తథ్యం. ఇక్కడి విషయం కూడా అటువంటిదే అని తెలుసుకో.”
కాని శ్రీరామకృష్ణుల పలుకుల అర్థాన్ని, ఉద్దేశాన్ని, చేతలను అప్పుడెవరు అర్థం చేసుకోగలిగారు? శ్రీరామకృష్ణుల వంటి వ్యక్తులు సర్వత్రా ఉంటారని బహుశా అందరూ భావించి ఉంటారు. ఆయనలా ప్రతి ఒక్కరి చపలతలకు వినోదిస్తూ, కోరకుండానే వరాభయహస్తాలతో ఇంటింటికీ తిరిగే వ్యక్తులు సర్వత్రా ఉంటారని భావించడమే ఇందుకు కారణం. కరుణామయులైన శ్రీరామకృష్ణులు చూపే ఆప్యాయతానురాగాల తరుచ్ఛాయలో భక్తులు ఎంత ధైర్యాన్ని పొందేవారో, ఎన్ని గారాలు పోయేవారో, ఎంత సులభంగా వారి అభిమానం దెబ్బతినేదో చెప్పడం కష్టం! ఆధ్యాత్మికతను ఆచరణలో చూపడం ఏమంత కష్టమైన పని కాదని దాదాపు వారందరూ భావించారనడం అతిశయోక్తి కాదు. ఆధ్యాత్మిక జగత్తులో ఏ భావాన్ని అయినా లేదా దివ్యదర్శనాన్ని అయినా తాము కోరినప్పుడల్లా, ఏ సమయంలోనైనా అనుభూతం చేసుకోగలమని వారికి రూఢి అయింది. శ్రీరామకృష్ణులను కాస్త ఆతురతతో దాని కోసం ప్రాధేయపడితే చాలు, వెంటనే ఆయన తమ స్పర్శతోనో లేదా ఆశీర్వాదంతోనో లేదా కేవలం సంకల్పంతోనో దానిని ప్రసాదించగలరు. అలా జరిగిన సంఘటనలు అనేకం. వాటినన్నింటినీ పేర్కొనడం సాధ్యంకాదు.
4. స్వామి ప్రేమానంద : సమాధి స్థితి
కాలాంతరంలో స్వామి ప్రేమానందగా పేర్కొనబడిన బాబూరాంకు భావ సమాధి స్థితిని పొందాలనే ఆకాంక్ష కలిగింది. అతడు శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళి “నాకు భావసమాధి స్థితి కలిగేట్లు చేయండి” అంటూ విలపిస్తూ, ఆయనను అర్థించాడు. అందుకు ఆయన “సరే, అమ్మను అడుగుతాను. నాయనా, నా సంకల్పంతో ఏమైనా జరుగుతుందా?” అంటూ అతణ్ణి అనునయించారు. కాని శ్రీరామకృష్ణుల మాటలను అతడు వింటే కదా! “నాకు భావసమాధి స్థితి కలిగేట్లు చేయండి” అవే మాటలు బాబూరాం మళ్ళీ వల్లించాడు. గురుదేవులను అలా ప్రార్థించిన కొన్ని రోజుల తరువాత ఏదో పని మీద బాబూరాం తన స్వగ్రామమైన ఆంట్పూర్కు వెళ్ళవలసి వచ్చింది. అది 1884 వ సంవత్సరం. ఈలోపు శ్రీరామకృష్ణులు, బాబూరాంకు భావసమాధి స్థితి ఎలా కలుగుతుందా అని ఆందోళన చెందసాగారు. తారసపడ్డ వారందరితో ఆయన ఇలా చెప్పసాగారు : “ఊరికి వెళ్ళేముందు బాబూరాం భావసమాధి కలగాలని ఏడుస్తూ అర్థించాడు. ఏం జరుగుతుందో? అతడికి భావసమాధి స్థితి కలుగకుంటే, అతడికి ఇక్కడి (అంటే తమ) మాటల మీద గురి ఉండదు.” తదనంతరం ఆయన జగజ్జననిని, “అమ్మా, బాబూరాంకు కించిత్తు అయినా భావసమాధి స్థితి లేదా ఇతర ఆధ్యాత్మిక అనుభూతి ప్రాప్తించేలా చూడు” అని ప్రార్థించారు. అందుకు అమ్మ, “అతడికి భావం కలుగదు. జ్ఞానం ప్రాప్తిస్తుంది” అని జవాబిచ్చింది. జగజ్జనని ఆ వచనాలు వినగానే శ్రీరామకృష్ణులు మళ్ళీ ఆందోళన చెందారు. మాలో కొందరితో తీవ్ర ఆందోళనకు గురైన వ్యక్తిలా ఇలా అన్నారు: “బాబూరాం అడిగిన విషయం అమ్మకు తెలిపాను. ‘అతడికి భావం కలుగదు, జ్ఞానం ప్రాప్తిస్తుంది’ అని అమ్మ చెప్పింది. కనీసం అదన్నా పొందితే, అతడి మనస్సు శాంతిస్తుంది, అదే పదివేలు. అతడి కోసం ఎంతో దిగులుపడ్డాను. ఊరికి వెళ్ళేముందు ఎంతగానో విలపించాడు.” ఆహా! ఎలాగైనాసరే బాబూరాంకు ఏదో ఒక ఆధ్యాత్మికానుభూతి కలగాలని శ్రీరామకృష్ణులు పడిన ఆందోళన అంతా ఇంతా కాదు! ఆందోళన ఉట్టిపడే స్వరంలో ఆయన, “అతడికి భావం కలుగకుంటే ఈ నోటి (తమ) మాట మీద అతడికి ఏమాత్రం గురి ఉండదు” అని మళ్ళీ చెప్పారు. శ్రీరామకృష్ణుల జీవితం యావత్తు ఏదో బాబూరాం ఆయన మాటలను పట్టించుకోవడం లేదా పట్టించుకోకుండా ఉండడం మీదే ఆధారపడినట్లు ఆయన మాటలు ధ్వనించాయి.
5. భక్తుల గురించి శ్రీరామకృష్ణులు ఎందుకు ఆందోళన చెందేవారు?
అప్పుడప్పుడు ఆయన బాలభక్తుల గురించి ప్రస్తావిస్తూ, “సరే గాని, వీరందరి కోసం అంతగా ఎందుకు ఆందోళన చెందుతానో తెలుసా? ఒకడు ఏం అనుభూతి పొందాడో మరొకడు ఏం పొందలేదో అని ఎందుకు యోచిస్తూ ఉంటాను? వీళ్ళంతా ‘స్కూల్ బాయిస్’* , దమ్మిడీ లేనివారు; ఒక చిల్లి కాణీ మిఠాయి కొని తెచ్చి ఇచ్చే స్తోమత కూడా వాళ్ళకు లేదు. అయినా కూడా వాళ్ళ కోసం నేనంతగా ఎందుకు ఆందోళనపడుతున్నాను? వాళ్ళలో ఎవరైనా రెండు రోజులు రాకపోతే నా ప్రాణం విలవిల్లాడిపోయేది, అతణ్ణి చూడాలని తహతహలాడి పోయేది. అతడు ఎందుకు రాలేదో తెలుసుకోవాలని ఆరాటపడేవాణ్ణి. అలా అవడానికి హేతువు ఏమిటి?” అని చెబుతూ ఉండేవారు. ఈ ప్రశ్న అడగబడిన బాలుడు, “నాకు తెలియదండీ. కాని తప్పకుండా వారి మేలు కోసమే మీరలా ఆందోళన చెందుతారనుకొంటాను” అని జవాబిచ్చాడు!
శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు : “కారణం ఇది – వీరందరూ అతి శుద్ధసత్త్వ సంపన్నులు. కామకాంచనాలు వీరిని ఇంతవరకు స్పృశించలేదు. వీరిప్పుడు భగవంతుడి మీద మనస్సు లగ్నంచేస్తే భగవత్సాక్షాత్కారం పొందగలరు. నాది గంజాయి త్రాగే వ్యక్తి స్వభావం. గంజాయి త్రాగేవాడు తానొక్కడే త్రాగడంతో తృప్తి చెందడు; తాను మత్తును అనుభవించాక ముంతను ప్రక్కవాడికి అందిస్తేనే తృప్తి చెందుతాడు. నా స్వభావమూ అటువంటిదే. బాలురందరి పట్ల ఇది వర్తించినా, ఇతరులందరి కంటే నరేంద్రుడి గురించే నేను అధికంగా తహతహ చెందుతాను. రెండు రోజులు అతడు రావడం ఆలస్యమైతే, నా హృదయాన్ని తడి తువ్వాలు మెలిపెట్టి పిండుతున్నట్లుగా బాధపడేవాణ్ణి. అది చూసి లోకులు ఏమనుకొంటారోనని సరుగుడు తోపుకు* పోయి వెక్కివెక్కి ఏడ్చేవాణ్ణి. ఒకప్పుడు హాజ్రా చూసి, ఇలా అన్నాడు : ‘మీ స్వభావం ఎంత విచిత్రం! మీది పరమహంస అవస్థ కదా! మనస్సును ఏకాగ్రం చేసి సమాధిమగ్నులై భగవంతుడితో తాదాత్మ్యం చెంది ఉండడానికి బదులుగా, నరేంద్రుడు రాలేదని యోచిస్తూ బాధపడతారెందుకు? భవనాథ్కు ఏమౌతుంది? ఇలా ఏమేమో ఆలోచిస్తూ ఉంటారెందుకు?’ ఆ మాటలు విని అతడు చెబుతున్నది నిజమే కదా, ఇక మీదట అలా చేయకూడదు అని అనుకొన్నాను. సరుగుడు తోపు నుండి తిరిగి వస్తున్నప్పుడు, ‘కలకత్తా నగరం స్పష్టంగా నా ముందు కనిపించి, జనమంతా రేయింబవళ్ళు కామ కాంచనాలలో మునిగిపోయి ఎంతో బాధను అనుభవిస్తూన్న దృశ్యం’ జగజ్జనని నాకు చూపించింది. అది చూసి నా హృదయం ద్రవించిపోయింది. ‘వీరికి మేలు ఒనర్ప, వీరిని ఉద్ధరింప కోటిరెట్ల బాధను అనుభవించాల్సి వచ్చినా ఆనందంగా అనుభవిస్తాను’ అని అనుకొన్నాను. వెనక్కు తిరిగి వెళ్ళి హాజ్రాతో, ‘నేను వారిని గురించే చింతన చేస్తూంటే, నీకేం పట్టిందిరా మందమతీ’ అని గట్టిగా చెప్పాను.”
6. ఈ అంశంపై నరేంద్రుడి అభ్యంతరం
“ఒక సందర్భంలో నరేంద్రుడు ఇలా అన్నాడు : ‘నరేన్, నరేన్ అంటూ సదా ఎందుకంత వాపోతున్నారు? విపరీతంగా అట్లే యోచిస్తూ ఉంటే, మీరూ నరేన్లా మారిపోవలసి వస్తుంది. జడభరతుడు ఎడతెగక లేడిని గురించే చింతన చేసినందున లేడిగా జన్మించాల్సి వచ్చింది.’ నరేంద్రుడి మాటలపై నాకు గట్టి నమ్మకం ఉందని మీకు తెలుసుకదా! కాబట్టి అతడి మాటలు విని జంకాను. అమ్మకు ఈ విషయం విన్నవించాను. అందుకు ఆమె, ‘అతడు చిన్నపిల్లవాడు. అతడి మాటలను ఎందుకు పట్టించుకొంటావు? నువ్వు అతడిలో నారాయణుణ్ణి చూస్తున్నావు. కాబట్టే అతడి పట్ల నీకంత ఆకర్షణ కలిగింది.’ ఆ మాటలు విని నా మనస్సు కుదుటపడింది. తిరిగి వచ్చి నరేంద్రుడితో, ‘నీ మాటలు నేనంతగా పట్టించుకోను. నీలో నారాయణుణ్ణి చూసి నీ పట్ల ఆకర్షితుడనైనానని అమ్మ తెలిపింది. ఏ రోజు నీలో నారాయణుని చూడలేనో, ఆ రోజు నీ ముఖం వంక కూడా చూడను, ధూర్తుడా!’ అని అన్నాను.”
కనుక అద్భుతమూర్తులైన శ్రీరామకృష్ణుల ప్రతిచర్య మాకు విచిత్రంగా తోచినప్పటికీ, దానిలో నిగూఢార్థం ఉండే ఉంటుంది. దానిని అపార్థం చేసుకోవడంతో మాకు ఎక్కడ హాని వాటిల్లుతుందోనని గురుదేవులు దానిని విపులీకరించి చెప్పేవారు.
7. యోగ్యులైన అందరినీ శ్రీరామకృష్ణులు గౌరవించేవారు
సద్గుణ సంపన్నులనందరినీ శ్రీరామకృష్ణులు సదా గౌరవించడం మేం చూసివున్నాం. ఆయన ఇలా అనేవారు : “పరమ సద్గుణవంతుల పట్ల మర్యాద మన్ననలు కనబరచకుంటే భగవంతుడు అసంతృప్తి చెందుతాడు. వారు అంతవారు కావడానికి ఆయన శక్తే కారణం; ఆయనే వారిని అలా రూపొందించాడు. అందువల్ల వారిని అగౌరవించడం, సాక్షాత్తు భగవంతుణ్ణి అగౌరవించడమే అవుతుంది.” కాబట్టి సద్గుణ సంపన్నుడైన వ్యక్తి చుట్టుపట్ల వసిస్తూన్నాడని తెలియగానే, ఏదో విధంగా ఆ వ్యక్తిని కలుసుకోవాలని శ్రీరామకృష్ణులు ఆతురత చెందేవారు. ఆ వ్యక్తే సరాసరి శ్రీరామకృష్ణుల వద్దకు వస్తే సరేసరి; లేకపోతే ఆయనే ఆ వ్యక్తి వద్దకు ఆహ్వానం లేకపోయినా సరే వెళ్ళి, నమస్కరించి ముచ్చటించి, తృప్తిచెంది తిరిగి వచ్చేవారు. బర్ద్వాన్ రాజుగారి ఆస్థాన పండితుడైన పద్మలోచన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, సుప్రసిద్ధ కాశీ వీణా వాద్యకారుడైన మహేశ్, సఖీభావంలో సిద్ధురాలైన బృందావన వాసిని గంగామాయి, బ్రహ్మసమాజ నాయకుడైన కేశవచంద్ర సేన్ మొదలైన వ్యక్తుల విశిష్ట గుణసంపత్తిని గురించి విని, వెతుక్కుంటూ వారి ఇళ్ళకు వెళ్ళి శ్రీరామకృష్ణులు వారిని చూసివచ్చారు.
8. అహంకార నిర్మూలనకై శ్రీరామకృష్ణులు చేపట్టిన తీవ్ర ప్రక్రియలు
ఆహ్వానం లేకపోయినా శ్రీరామకృష్ణులు ఆ విధంగా ఇతరుల ఇళ్ళకు వెళ్ళడంలో ఆశ్చర్యం ఏమీలేదు. ‘నేను ఎంతో గొప్ప వ్యక్తిని’ లేదా, ‘ఇలా ఎవరి ఇంటికి పడితే వారింటికి పోతే ఇతరుల దృష్టిలో చులకనైపోతాను’ లేదా, ‘నా కిచ్చే మర్యాద తగ్గిపోతుంది’ – ఇటువంటి అహంకారపూరిత భావాలు ఎన్నడూ ఆయన మనస్సులో మెదలేవి కావు. అహంకార ఆత్మాభిమానాలను ఆయన ఎన్నడో సమూలంగా దగ్ధం చేసి వేశారు. అహంకారాన్ని కూకటివ్రేళ్ళతో నిర్మూలించడానికి ఆయన చేసిన సాధన లెన్నో కదా! కాళికాలయంలో ముష్టివాళ్ళ ఎంగిలి విస్తరాకులను తమ తలమీద పెట్టుకొని అవతల పారేసి వచ్చేవారు. తిరిగి వచ్చి వాళ్ళు తిన్న చోటును శుభ్రపరిచేవారు. అంతేకాక వారిని సాక్షాత్తు నారాయణ స్వరూపులుగా ఎంచి, ఒకసారి వారి ఎంగిలిని ప్రసాదంగా కూడా ఆరగించారు. కాళికాలయ పరిచారకుల మరుగుదొడ్డిని శుభ్రంగా కడిగి, తమ దీర్ఘ శిరోజాలతో* తుడిచి, జగజ్జననిని హృదయపూర్వకంగా, “అమ్మా! వీరి కంటే నేను అధికుడననే భావన నా మదిలో ఎన్నడూ తలెత్తకుండా చూడు” అని ప్రార్థించారు.
శ్రీరామకృష్ణులలో ఈ అభిమానరాహిత్యం ఎంత అద్భుతం, సహజం అయిందంటే, దానిని కళ్ళారా చూసిన తరువాత కూడా మనకు ఎటువంటి ఆశ్చర్యమూ జనించదు. కాని మరెవరిలోనన్నా ఈ అభిమానరాహిత్యం కించిత్తు అయినా కనిపించగానే ‘ఎంత ఆశ్చర్యం!’ అనే మాటలు అనివార్యంగా మన నోటి నుండి వెలువడతాయి. నిజానికి, మనందరిలా శ్రీరామకృష్ణులు ఈ లోకానికి చెందినవారు కారు సుమా!
9. డా. కైలాస్, త్రైలోక్య బాబులకు సంబంధించిన సంఘటనలు శ్రీరామకృష్ణుల అభిమానరాహిత్యానికి దృష్టాంతాలు
తమ ధోవతి క్రింది అంచును భుజం మీద వేసుకొని శ్రీరామకృష్ణులు ఒకసారి కాళికాలయ తోటలో నడుస్తున్నారు. అటువైపు పోతున్న ఒక పెద్దమనిషి (డా. కైలాస్) ఆయనను తోటమాలిగా ఎంచి, “ఏమోయ్, ఆ పువ్వులు కోసి ఇవ్వు” అని అడిగారు. శ్రీరామకృష్ణులు మారుమాట్లాడక, పువ్వులు కోసి ఇచ్చి, చల్లగా అక్కడ నుండి జారుకొన్నారు. మరొక సందర్భంలో మథుర్బాబు కీర్తిశేషుడైన తరువాత, అతని కుమారుడు త్రైలోక్యబాబు ఏదో కారణంగా హృదయ్ మీద విసుక్కొని, ఆలయం నుండి వెళ్ళిపొమ్మని అతణ్ణి ఆజ్ఞాపించాడు. కోపోద్రేకంలో త్రైలోక్యబాబు, ఇక మీదట శ్రీరామకృష్ణులు కూడా ఆలయంలో బసచేయరాదని సూచనప్రాయంగా తెలిపాడు. ఈ సమాచారం చెవిన పడగానే శ్రీరామకృష్ణులు కండువా భుజం మీద వేసుకొని, నవ్వుతూ బయటకు నడిచిపోసాగారు. ఆయన దాదాపు ఆలయ సింహద్వారం వద్దకు చేరుకోగానే, ఆయన అలా వెళ్ళిపోతే ఏదో కీడు మూడుతుందని భయపడి, ఒక్క పరుగులో అక్కడికొచ్చి, “మీరు వెళ్ళిపోవాలన్నది నా ఉద్దేశం కాదు. ఎందుకు వెళ్ళిపోతున్నారు?” అని, ఆయనను వెళ్ళవద్దని త్రైలోక్యుడు ప్రార్థించాడు. శ్రీరామకృష్ణులు నవ్వుకొంటూ, ఏమీ జరగనట్లే తమ గదిలోకి వచ్చి తాపీగా కూర్చున్నారు.
10. తద్విరుద్ధమైన లౌకికుల ప్రవర్తన
అటువంటి దృష్టాంతాలు ఎన్నింటినో పేర్కొనవచ్చు. శ్రీరామకృష్ణులు ఆ తీరులో ప్రవర్తించడం మనకంత ఆశ్చర్యం కలిగించదు. కాని మరో గొప్ప వ్యక్తి పూర్తిగా ఆయనలా కాకపోయినా, ఏదో కొంతలో కొంత ఆయనలా ప్రవర్తిస్తే, వెంటనే ఆ వ్యక్తిని మనం ఆకాశానికి ఎత్తుతాం. ఎందుకంటే, నోరు తెరిచి ఏమీ చెప్పకపోయినా మనస్సులో మనం ఈ విషయం పాదుగొలుపుకొని కూర్చున్నాం : లోకంలో బ్రతికి ఉండగోరితే స్వార్థాన్నే పరమార్థంగా చేసుకోక తప్పదనీ, బలహీనులను ప్రక్కకు నెట్టి మన దారిని సుగమం చేసుకోక తప్పదనీ, ఇతరుల దృష్టి నుండి మన తప్పిదాల నన్నింటిని కప్పిపుచ్చి మన కీర్తిని మనమే చాటుకోవాలనీ భావిస్తాం. తన మతాన్ని ఎవరు చిత్తశుద్ధితో ఆచరిస్తాడో, భగవంతుడిపై, పూర్తిగా ఎవరు ఆధారపడి ఉంటాడో, అటువంటి వ్యక్తిని నిష్ప్రయోజకుడిగా పరిగణిస్తాం.
అయ్యో లోకమా! నీ రాజనీతి, సామాజిక శిష్టాచారం, వ్యక్తిగత నీతి, అంతర్జాతీయ విధానాలు ఇత్యాదులు సర్వత్రా ఇటువంటివే కదా! నీ ‘ఢిల్లీ లడ్డు’* ను తినని వాడూ, తిన్నవాడూ ఇద్దరూ పశ్చాత్తాపపడతారు.
11. శ్రీరామకృష్ణుల దివ్యత్వం పూర్తి వికాసం – మతోద్యమాలు వ్యాపించడం
అది 1885 వ సంవత్సరం. శ్రీరామకృష్ణులు అప్పటికే సుప్రసిద్ధులైనారు. శ్రీరామకృష్ణుల పట్ల ఆకర్షితులై నిత్యం అనేకమంది కొత్తవారు దక్షిణేశ్వరానికి వచ్చి, ఆయనను దర్శించుకొని ధన్యులు కాసాగారు. అప్పటికే కలకత్తా నగరంలోని ఆబాలవృద్ధులందరూ ‘దక్షిణేశ్వర పరమహంస’ పేరు విని ఉన్నారు, వారిలో అనేకులు ఆయనను దర్శించారు కూడా. అవ్యక్తమైన ఆధ్యాత్మిక ప్రవాహం ఒకటి ఆ రోజుల్లో కలకత్తా జనానికి హృదయ సీమలలో ప్రవహించసాగింది. హరిసభలు, బ్రహ్మసమాజం, సంకీర్తన బృందాలు, ప్రవచన సమాజాలు – ఇలా వివిధ మతశాఖలు కలకత్తా నగరమంతటా వ్యాపించి ఉన్నాయి. ఇలా ఈ మతశాఖలు ఆ సమయంలో హఠాత్తుగా వ్యాప్తిగాంచడానికి కారణం ఏమిటి? ఇతరులెవరికీ ఆ కారణం తెలియకపోయినా శ్రీరామకృష్ణులకు మాత్రం అసలు కారణం తెలుసు. దానిని గురించి ఆయన అప్పుడప్పుడు మాతోను, ఇతర భక్తులతోను, భక్తురాండ్రతోను చెప్పి ఉన్నారు.
ఈ సందర్భంగా తనతో ఒక రోజు శ్రీరామకృష్ణులు చెప్పిన విషయం గురించి, ఒక భక్తురాలు మాతో ఇలా చెప్పింది : “నీకు కనబడుతున్న ఆ హరి సభలూ, ఇతర మతసంస్థలూ పుట్టుకు రావడం (తమ శరీరాన్ని చూపుతూ) దీని మూలంగానే అని తెలుసుకో. అవి పూర్వం ఉన్నాయా? అన్నీ నిర్జీవస్థితిలోనే ఉండేవి. కాని ఇది (తన శరీరాన్ని చూపుతూ) వచ్చినప్పటి నుండీ మళ్ళీ అవి సజీవాలైనాయి, ఉపరితలానికి కాస్త క్రిందగా ఒక ఆధ్యాత్మిక ప్రవాహం పారసాగింది.”
మరొక సందర్భంలో శ్రీరామకృష్ణులు మాతో ఇలా చెప్పారు : “మీరు చూసే ‘యంగ్ బెంగాల్’ (అంటే యువతరం) భక్తి మొదలైన వాటిని ఖాతరు చేస్తారా? తలవంచి ప్రణామం చేయడం కూడా వారికి తెలియదు. నేను తలవంచి వారికి ప్రణామం చేయడం వలన, క్రమేణా వాళ్ళు ప్రణామం చేసేటప్పుడు ఎలా తలవంచాలో నేర్చుకొన్నారు. కేశవ్‌ను చూడడానికి అతడి ఇంటికి వెళ్ళాను. అప్పుడతడు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. తలవంచి అతడికి ప్రణామం చేశాను. అందుకు బదులుగా అతడు తల ఊపాడు. తిరిగి వచ్చేటప్పుడు సాష్టాంగ ప్రణామం చేశాను. అప్పుడతడు చేతులు జోడించి, చేతులతో ఒకసారి తలను స్పృశించాడు. మా మధ్య పరిచయం పెరిగేకొద్దీ, నా మాటలను అతడు మరింతగా వినసాగాడు; తలవంచి నేను ప్రణామం చేసేకొద్దీ, అతడూ తలవంచి ప్రణామం చేయడం ప్రారంభించాడు. లేకుంటే భక్తి ఇత్యాదుల గురించి వారికి ఏమన్నా తెలుసా లేక వాటిని లక్ష్యపెట్టేవారా ఏమిటి?”
12. కలకత్తాలో శశధర పండితుడు
బ్రహ్మసమాజపు ఒక మతశాఖ అయిన ‘నవవిధాన్’* శ్రీరామకృష్ణుల సాంగత్య లబ్ధితో ఉర్రూతలూగసాగింది. పెద్ద ఎత్తున ప్రార్థనా సభలను నిర్వహించసాగింది. అటువంటి సమయంలో శశధర పండితుడు కలకత్తాకు వచ్చి, హిందూమతాన్ని గురించి ప్రసంగాలివ్వసాగాడు. పాశ్చాత్య వైజ్ఞానిక దృక్పథం నుండి హిందూమత దైనందిన అనుష్ఠానాలను ఎంతో చక్కగా విశదీకరించసాగాడు.
ప్రతి ఒక్క విషయంలోను ‘ఒక్కో ఋషిది ఒక్కో అభిప్రాయం’ అనే లోకోక్తి ముమ్మాటికీ నిజమే. హిందూ మతాన్ని గురించి పండితుడు చేస్తున్న వైజ్ఞానిక పరమైన వివరణకు కూడా పై సత్యమే వర్తిస్తుంది. అయినప్పటికీ అతడి ప్రసంగాలకు శ్రోతల కొదువ లేదు. కార్యాలయాల నుండి తిరిగివచ్చే గుమాస్తాలు, పాఠశాల కళాశాల విద్యార్థులు గుంపులు గుంపులుగా అతడి ప్రసంగాలకు రాసాగారు. సనాతన హిందూమతం మీద అతడు ప్రసంగించే ‘ఆల్బర్ట్ హాలు’ శ్రోతలతో క్రిక్కిరిసిపోయేది. పండితుడి వైజ్ఞానికపరమైన వివరణను వినడానికి ప్రతి ఒక్కరూ ఉత్సుకత కనబరచేవారు. ఒక రోజు మేం కాస్సేపు నిలబడి ప్రసంగం వినడం మాకు గుర్తుంది. ఒక సందర్భంలో ఎంతో కష్టంతో మా తలలను లోపలకు దూర్చి నల్లని గడ్డంతో, రుద్రాక్షమాలలు వ్రేలాడుతున్న మెడతో, అందమైన ముఖారవిందంతో ప్రకాశిస్తూన్న వయోవృద్ధుడైన పండితుణ్ణి చూడగలిగాం. ఆ సమయంలో కలకత్తాలో ఎక్కడ చూసినా పండితుడి మత ప్రసంగం గురించే జనం మాట్లాడుకొంటున్నారనడం అతిశయోక్తి కాదు.
13. శశధర్ను చూడాలని శ్రీరామకృష్ణులు ఆకాంక్షించడం
‘వార్తలు ఆ నోట ఈ నోట ప్రాకుతాయి’ అనే సామెత ఉంది. దక్షిణేశ్వర మహాపురుషుని గురించిన సమాచారం పండితుడికి, పండితుడి సాధనల గురించి శ్రీరామకృష్ణులకు చేరడానికి ఎంతో కాలం పట్టలేదు. కొందరు భక్తులు శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి ఇలా చెప్పారు : “శశధర్ గొప్ప పండితుడు, గొప్ప వక్త కూడా. మొన్న ఆయన ముప్ఫై రెండు అక్షరాలతో కూడిన హరి నామాన్ని దేవీపరంగా ఎంత బాగా విశదీకరించాడంటే, విన్నవారంతా ‘శభాష్’ అంటూ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.” ఆ మాటలు విని శ్రీరామకృష్ణులు, “అలాగా! ఒకసారి ఆయన చెప్పింది వినగోరుతున్నాను” అని అన్నారు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు భక్తులతో, పండితుణ్ణి చూడాలనే తన కోర్కెను వెలిబుచ్చారు.
14. శ్రీరామకృష్ణుల పవిత్ర మానసంలో కలిగిన ఆకాంక్షలన్నీ నెరవేరతాయి
శ్రీరామకృష్ణుల పావన మానసంలో జనించే ఆకాంక్ష ఏదో విధంగా ఫలించే తీరేది. ఏదో ఒక అదృశ్యశక్తి అడ్డంకులన్నింటినీ తొలగించివేసి, మార్గాన్ని సుగమం చేసి ఆ ఆకాంక్షను ఫలింపచేసేది. మనోవాక్కాయాల ద్వారా సదాసర్వదా సత్యనిష్ఠ పాటిస్తూ, పావన జీవితం గడిపే వ్యక్తి క్రమేణా ఎంతగా ప్రయత్నించినప్పటికీ మనస్సులో అసత్యానికి చోటు ఇవ్వలేడనీ, అటువంటి వ్యక్తి మనస్సులోని సంకల్పాలన్నీ ఈడేరతాయనీ మేం ఇంతకు మునుపు వినివున్నాం. సైద్ధాంతికంగా దీనిని అంగీకరించినప్పటికీ, ఒక వ్యక్తి జీవితంలో యథార్థంగా ఇలా జరుగుతుందని మేం ఎన్నడూ నమ్మిందిలేదు. కాని శ్రీరామకృష్ణుల మనోసంకల్పాలు పదేపదే అనుకోని రీతులలో ఈడేరడం చూసిన తరువాత అది సత్యమేనని క్రమంగా మేం అంగీకరించాం. అయినప్పటికీ ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన వచనాల పట్ల మేం పరిపూర్ణ విశ్వాసం వహించి ఉన్నామా? లేదు. ఆయన ఇలా చెప్పేవారు: “కేశవ్, విజయ్‌లలో జ్ఞానజ్వాలలు దీపాలలా మినుకుమినుకు మనడం నేను చూశాను. కాని నరేంద్రుడిలో జ్ఞానభాస్కరుణ్ణే చూశాను!” మళ్ళీ ఆయన కొనసాగించారు : “ఒక్క శక్తితో కేశవ్ ప్రపంచాన్ని కుదిపివేస్తే, నరేంద్రుడిలో అటువంటి పద్ధెనిమిది శక్తులు ఉన్నాయి.” గురుదేవుల పై వచనాలు సామాన్యమైన ఊహ లేదా పరిశీలన ద్వారా చెప్పిన మాటలు కావు; భావసమాధి అనుభవాల మూలంగా సంతరించుకొన్నవి. అప్పటికీ ఆయన వచనాలను మేం పూర్తిగా విశ్వసించామా? కొన్ని సమయాలలో మేం, ‘బహుశా నిజమేనేమో! ఆయన వ్యక్తుల హృదయాలను చదవగలరు. ఆయన అలా చెబుతున్నప్పుడు, దానిలో ఏదో రహస్యం దాగి ఉంటుంది’ అని అనుకొనేవారం. మళ్ళీ కొన్ని సమయాలలో కాస్త సందేహం కలిగేది. ‘మహావక్తగా జగద్విఖ్యాతుడైన భక్తశిఖామణి కేశవ్ ఎక్కడ? పాఠశాల బాలుడైన నరేంద్రుడెక్కడ? వీరిద్దరి గురించిన శ్రీరామకృష్ణుల అభిప్రాయం నిజమేనా?’ గురుదేవుల అనుభవాలను గురించి మాకు అలాంటి సందేహాలు కలుగుతున్నప్పుడు, ‘నాకీ కోర్కె ఉంది’ అని సరళరీతిలో ఆయన వెలిబుచ్చిన ఆకాంక్షలు ఈడేరి తీరతాయి అని మేం నిస్సందేహంగా నమ్మేవారమని ఎలా చెప్పగలం?
15. 1885 వ సంవత్సర యాత్ర ఉత్సవంలో శ్రీరామకృష్ణులు దర్శించిన ప్రదేశాలు
శశధర్ పండితుణ్ణి గురించి శ్రీరామకృష్ణులు ప్రస్తావించిన కొన్ని రోజుల తరువాత ‘జగన్నాథ రథయాత్ర’ ఉత్సవం వచ్చింది. ఈ రథయాత్రోత్సవం తొమ్మిది రోజుల పాటు జరుపుకొంటారు కనుక దీనిని ‘నవయాత్ర’ గా పేర్కొంటారు. 1885 వ సంవత్సర ఈ నవయాత్రోత్సవ సందర్భంలో శ్రీరామకృష్ణులకు సంబంధించి జరిగిన సంఘటనలెన్నో మాకు జ్ఞాపకం వస్తున్నాయి.
‘ఠన్ఠనియా’ ప్రాంతంలో నివసించే ఈశాన్చంద్ర ముఖోపాధ్యాయ్ ఆహ్వానాన్ని మన్నించి, రథం బయలుదేరే పండుగ నాటి ఉదయమే శ్రీరామకృష్ణులు అతడి ఇంటికి వెళ్ళారు. అక్కడ నుండి మధ్యాహ్నం వేళ శశధర్ పండితుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళారు. పిదప ఆ సాయంకాలం బలరాం బాబు ఇంట్లో జరుగుతున్న రథోత్సవంలో పాల్గొని, నాటి రాత్రి అక్కడే బసచేశారు. మర్నాడు కొందరు భక్తులతో కలిసి పడవలో దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు. ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత ధార్మిక ప్రసంగం చేయడానికి శశధర్ ఆలంబజార్కు రావలసి వచ్చింది. ప్రసంగం ముగించి శ్రీరామకృష్ణులను దర్శింప ఆయన దక్షిణేశ్వరానికి వచ్చాడు. తదనంతరం రథం తిరిగి వచ్చే రోజు శ్రీరామకృష్ణులు మళ్ళీ బలరాం ఇంటికి వెళ్ళి, భక్తుల సాంగత్యంలో మహదానందంగా ఆ రోజు, మరుసటి రోజు అక్కడే గడిపారు. మూడవ రోజు ఉదయం ‘గోపాలుని తల్లి’, తదితర భక్తులతో కలిసి పడవలో దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు. రథం తిరిగి వచ్చే రోజు శశధర్ పండితుడు, బలరాం ఇంటికి వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించాడు. చేతులు జోడించి, కన్నీటితో ఆయన, “వేదాంత చర్చలతో నా గుండె ఆర్చుకుపోయింది; దయచేసి ఒక్క భక్తి బిందువును ప్రసాదించండి” అని శ్రీరామకృష్ణులను ప్రార్థించాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు భావసమాధి మగ్నులై పండితుడి హృదయాన్ని స్పృశించారు. ఆ సందర్భంలో జరిగిన సంఘటనల వివరాలను ఇక్కడ పొందుపరచడం అసంగతం కాబోదు.
16. ఈశాన్చంద్ర ముఖోపాధ్యాయ్ గురించి
రథం ముందుకు బయలుదేరిన నాటి ఉదయమే శ్రీరామకృష్ణులు ఠన్ఠనియాలో వసిస్తూన్న ఈశన్చంద్ర ముఖోపాధ్యాయ్ ఇంటికి వెళ్ళారని ముందే చెప్పాం. అప్పుడు ఆయనతోపాటు యోగేన్ (స్వామి యోగానంద), హాజ్రా, కొందరు భక్తులు ఉన్నారు. దయాళువు, ఉదారుడు, భగవంతుని పట్ల ప్రగాఢ విశ్వాసం గలవాడు అయిన ఈశాన్ వంటి వ్యక్తులు లోకంలో ఎంతో అరుదు. ఆయన ముగ్గురు లేదా నలుగురు కుమారులూ మంచి విద్యావంతులు. మూడవ కుమారుడైన సతీష్, నరేంద్రుడి సహాధ్యాయి. పక్వాజ్ (ఒక రకమైన మద్దెల)ను వాయించడంలో ప్రావీణ్యం కలవాడు. అందుచేత తరచూ నరేంద్రుడు తన మధుర కంఠంతో ఆ ఇంట్లో పాటలు పాడగా సతీష్ పక్వాజ్ను వాయించేవాడు. ఈశాన్ దయాగుణం, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ దయాగుణానికి దీటైనదని ఒక రోజు స్వామి వివేకానంద మాతో చెప్పారు. అనేక సందర్భాలలో తాను తినబోతున్న భోజనాన్ని బిచ్చగాళ్ళకిచ్చి, ఆయన దాదాపు పస్తుండిపోవడం కళ్ళారా స్వామి వివేకానంద చూసేవున్నారు. అంతేగాక ఇతరులు బాధపడుతుండడం చూసి, ఆ బాధను తీర్చలేని తన శక్తిహీనతకు ఈశాన్ కన్నీరుమున్నీరవడం తాను చూసానని కూడా స్వామి వివేకానంద చెప్పివున్నారు. ఈశాన్ దయాగుణం గలవాడు మాత్రమే కాదు, జపం పట్ల మహానిష్ఠ గలవాడు కూడా. నియమానుసారం ఆయన సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు దక్షిణేశ్వరంలో జపం చేస్తూవుండడం మాలో అనేకులకు తెలిసిన సంగతే. పరమ నిష్ఠాభక్తులతో జపం చేసే ఈశాన్, శ్రీరామకృష్ణులకు ప్రీతిపాత్రుడు కావడంలో వింత ఏమీ లేదు.
ఒక రోజు ఈశాన్ జపం పూర్తిచేసుకొని శ్రీరామకృష్ణులకు ప్రణామం చేయడానికి వచ్చినప్పుడు, ఆయన భావపారవశ్యంలో తమ పావన పాదారవిందాలను ఈశాన్ తలపై పెట్టడం మాకు జ్ఞాపకం ఉంది. బాహ్యస్మృతి కలిగిన తరువాత శ్రీరామకృష్ణులు, “ఓ బ్రాహ్మణుడా, మునుగు, లోతుగా మునుగు!” (అంటే సచ్చిదానంద సాగరంలో మునుగు అని అర్థం) అని ఈశాన్తో నొక్కి వక్కాణించారు. ఆ రోజులలో ఈశాన్ ఉదయకాల పూజ, జపం ముగిసేటప్పటికి సాయంత్రం నాలుగు గంటలయ్యేది. తరువాత అతడు కాస్త ఫలహారం తినేవాడు. సంధ్యాసమయం వరకు ఇతరులతో ఆధ్యాత్మిక ప్రసంగాలలోనో లేదా భక్తి గీతాలు వినడంలోనో గడిపేవాడు. ఆ తరువాత కొన్ని గంటలసేపు జపం చేస్తూ కూర్చునేవాడు. అతడి లౌకిక వ్యవహారాదులనన్నింటిని కుమారులే బాధ్యతాయుతంగా నిర్వర్తించేవారు. శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు ఈశాన్ గృహాన్ని పావనం చేసేవారు. కలకత్తాలో బసచేసి ఉన్నప్పుడు ఈశాన్ తరచు దక్షిణేశ్వరానికి వచ్చి గురుదేవులను దర్శించుకొనేవాడు; లేదా దేవాలయాలను లేదా పుణ్యక్షేత్రాలను దర్శించుకొంటూ, ఆధ్యాత్మిక సాధనలలో కాలం గడుపుతూండేవాడు.
1885 వ సం ॥ రథయాత్రోత్సవం నాడు శ్రీరామకృష్ణులు, ఈశాన్ గృహాన్ని పావనం చేసి, భాట్పాడాకు చెందిన కొందరు పండితులతో ఆధ్యాత్మిక విషయాల గురించి ముచ్చటించారు. ఆ సమయంలో శశధర పండితుడు అక్కడికి సమీపంలోనే బసచేసి ఉన్నాడని నరేంద్రుడు గురుదేవులకు చెప్పాడు. ఆ సమాచారం విని శ్రీరామకృష్ణులు, శశధర్ను చూడడానికి వెళ్ళారు.
ఎవరి సాదర ఆహ్వానం పురస్కరించుకొని శశధర పండితుడు ధార్మిక ప్రసంగాలు చేయడానికి ఏతెంచాడో, వారితో నరేంద్రుడికి పరిచయం ఉంది, పైగా కళాశాల వీథిలోని వారి ఇంటికి నరేంద్రుడు తరచు వెళ్ళేవాడు కూడా. అందువలన శశధర్ కలకత్తాలోనే ఉన్నాడని నరేంద్రుడికి తెలియవచ్చింది. శశధర్ పండితుడి ఆధ్యాత్మిక ప్రసంగ వ్యాఖ్యానంలో అనేక తప్పులు దొర్లుతున్నాయని నరేంద్రుడు గ్రహించాడు. కాబట్టి తర్కయుక్తులతో ఆ వ్యాఖ్యానంలోని తప్పులను పండితుడికి సూచించాలనే ఉద్దేశంతో నరేంద్రుడు మరింత తరచుగా ఆ ఇంటికి వెళ్ళేవాడు. నరేంద్రుడికి పండితుణ్ణి గురించి ఎన్నో విషయాలు తెలుసుననీ, వాటిని గురుదేవులకు తెలిపాడనీ, నరేంద్రుడి విన్నపం మేరకు గురుదేవులు అతడితో కలిసి పండితుడి వద్దకు వెళ్ళారనీ, పండితుడికి ఆ సందర్భంలో అమూల్యమైన ఉపదేశాలు ఇచ్చారనీ స్వామి బ్రహ్మానంద చెప్పేవారు.
జగజ్జనని నుండి ఆదేశం పొందకుండా, అధికారపత్రాన్ని సంతరించుకోకుండా ధర్మోపదేశం చేయడం వ్యర్థమనీ, పైపెచ్చు అది అహంకారాన్ని, గర్వాన్ని పెంచి, కొన్ని సందర్భాలలో అతడి పతనానికి దారి తీస్తుందనీ ప్రథమ సమావేశంలోనే శ్రీరామకృష్ణులు, శశధర్ పండితునికి తెలియచెప్పారు. శ్రీరామకృష్ణుల ఉపదేశవచనాల ప్రభావ ఫలితంగా కొద్దికాలంలోనే శశధర పండితుడు ధార్మిక ప్రసంగాలకు స్వస్తి చెప్పి, తపశ్చర్యాదులలో కాలం గడపడానికి కామాఖ్య (అస్సాం లోని) పీఠానికి వెళ్ళిపోయాడు.
17. స్వామి యోగానంద పూర్వాచార్ పరాయణత్వం
శ్రీరామకృష్ణులు ఆనాటి సాయంత్రం పండితుడి వద్ద సెలవు పుచ్చుకొని యోగేన్తో (స్వామి యోగానంద) కలిసి బాగ్‌బజార్‌లోని బలరాం బాబు ఇంటికి వెళ్ళారు. యోగేన్ ఎంత పూర్వాచారపరాయణుడంటే ఇతరుల ఇళ్ళలో నీరు సైతం పుచ్చుకొనేవాడు కాడు. అందువలన ఆ రోజు బయలుదేరడానికి ముందు ఇంట్లోనే ఫలహారం చేసివచ్చాడు. యోగేన్ ఆచార నిష్ఠలు శ్రీరామకృష్ణులకు తెలియనివి కావు. కాబట్టి ఆయన కూడా పరాయి ఇళ్ళకు వెళ్ళినప్పుడు ఏదన్నా తినమని అతణ్ణి ఎన్నడూ బలవంతంచేసేవారు కారు. బలరాం బోస్‌కు భగవద్భక్తి, గురుదేవుల పట్ల భక్తిప్రపత్తులు ఉండడం వలన, యోగేన్ ఆయన ఇంట్లో పళ్ళు, పాలు, మిఠాయిలు నిరభ్యంతరంగా పుచ్చుకొనేవాడు. ఈ విషయం శ్రీరామకృష్ణులకు తెలుసు. అందువలన బలరాం ఇంటికి చేరుకొన్న కాసేపటికి శ్రీరామకృష్ణులు, “ఈ రోజు యోగేన్ ఏమీ తినలేదు. తినడానికి అతడికి ఏదన్నా ఇవ్వండి” అంటూ బలరాంను పురమాయించారు. వెంటనే బలరాం ఆప్యాయంగా యోగేన్ను ఇంటి లోపలకు తోడ్కొనివెళ్ళి ఫలహారం పెట్టించాడు. శ్రీరామకృష్ణులు తరచు భావపారవశ్య స్థితిలో మగ్నులై ఉన్నప్పటికీ, భక్తుల మానసిక శారీరక స్థితిగతులను ఎంత సునిశితంగా పరిశీలిస్తారో తెలుపడానికే ఈ సంఘటనను ఇక్కడ ప్రస్తావించాం.
18. బలరాం బోస్ ఇంట్లో రథోత్సవం
బలరాం బోస్ ఇంట్లో నిర్వహించే రథోత్సవంలో శ్రీరామకృష్ణులు పాల్గొనడంతో అక్కడ పరమానంద ప్రవాహం కట్టలు తెంచుకొని ప్రవహించింది. సూర్యాస్తమయం కాగానే జగన్నాథ ప్రతిమను చందనమాల్య వస్త్రపతాకాదులతో అలంకరించి, ఇంటిలో నుండి తీసుకువచ్చి, అలంకరించి సిద్ధంగా ఉన్న చిన్న రథంలో కూర్చోబెట్టి మళ్ళీ పూజించారు. శ్రీరామకృష్ణుల పట్ల భక్తిప్రపత్తులు ఉన్నవాడూ, బలరాం పురోహిత వంశజుడూ అయిన ఫకీర్ పూజను నిర్వర్తించాడు.
ఫకీర్ పేదవాడవడం వలన బలరాం బోస్‌నే ఆశ్రయించి చదువుకొన్నాడు. అతడు ఆచారవంతుడు, భక్తినిష్ఠలు ఉన్నవాడు. బలరాం బోస్ ఏకైక పుత్రుడైన రామకృష్ణుని చదువు సంధ్యలను అతడే చూసుకొనేవాడు. మొదటిసారి శ్రీరామకృష్ణులను చూసినప్పటి నుండి ఆయన పట్ల ఫకీర్ గొప్ప భక్తిప్రపత్తులు పెంపొందించుకొన్నాడు. ఫకీర్ పాడే స్తుతులను శ్రీరామకృష్ణులు ఇష్టంగా వినేవారు. ఒక రోజు శంకరభగవత్పాదులు రచించిన కాళీస్తోత్రాన్ని నెమ్మదిగా, ప్రతి పదాన్ని స్పష్టంగా ఉచ్చరిస్తూ ఎలా స్తుతించాలో శ్రీరామకృష్ణులే స్వయంగా ఫకీర్‌కు నేర్పారు. ఆనాటి సంధ్యాసమయంలో శ్రీరామకృష్ణులు తాను వసించే గదికి ఉత్తరం వైపున ఉన్న వసారాలోకి ఫకీర్‌ను తోడ్కొని వెళ్ళి, భావపారవశ్యంలో అతణ్ణి స్పృశించి, ధ్యానం చేయమని చెప్పారు. తత్ఫలితంగా ఫకీర్‌కు అద్భుత దర్శనాలు, అనుభూతులు కలిగాయి.
భగవత్సంకీర్తనం చేస్తూ రథాన్ని ముందుకు లాగుతున్నారు. స్వయంగా శ్రీరామకృష్ణులు రథానికి కట్టిన తాడు పుచ్చుకొని ఒకింత సేపు రథాన్ని లాగారు. తదనంతరం భావపారవశ్యంలో ఉన్మత్తులై తాళానుసారంగా నృత్యం చేశారు. పారవశ్యంలో ఉత్తేజభరితంగా పెడుతున్న కేరింతలు, ఆయన చేస్తున్న నృత్యం చూసి అక్కడ సమావేశమైవున్న అందరూ ముగ్ధులై, తమ ఉనికినే విస్మరించి, భగవద్భక్తిలో ఉన్మత్తులైపోయారు. ఇంటి మొదటి అంతస్తులోని వసారాలో పదేపదే రథాన్ని లాగుతూ నృత్యగానాలతో భక్తులు చాలాసేపు గడిపారు. తదనంతరం జగన్నాథునికీ, రాధాదేవికీ, చైతన్యులకూ, ఆయన ఆంతరంగిక భక్తులకూ జయ జయ ధ్వానాలు చెప్పి, ప్రణామాలర్పించి నాటి సంకీర్తన ముగించారు. పిదప జగన్నాథుని పావన ప్రతిమను రథం నుండి క్రిందికి దింపి, రెండవ అంతస్తుకు దారితీసే మెట్ల వరుస పైనవున్న ఒక చిన్నగదిలో ప్రతిష్ఠించారు. ఏడు రోజులపాటు జగన్నాథుని ప్రతిమను ఈ గదిలోనే ఉంచుతారు. అంటే జగన్నాథుడు రథమెక్కి మరొక చోటికి వెళ్ళినట్లు, ఏడు రోజుల తరువాత మళ్ళీ స్వస్థానానికి తిరిగి వచ్చేటట్లుగా భావించుకోవాలి. జగన్నాథుని ప్రతిమను అలా ఆ చిన్నగదిలో ప్రతిష్ఠించిన తదుపరి, ఆయనకు అన్నభోగం నివేదించారు. తదనంతరం అన్నప్రసాదాన్ని ముందుగా శ్రీరామకృష్ణులకు, తరువాత తక్కిన భక్తులకు పెట్టారు. గురుదేవులు, యోగేన్ నాటి రాత్రి బలరాంబాబు ఇంట్లోనే గడిపారు. తక్కిన భక్తులలో అనేకులు తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళిపోయారు.
19. శ్రీరామకృష్ణుల పట్ల భక్తురాండ్ర భక్తిప్రపత్తులు
మర్నాడు ఉదయం ఎనిమిది లేదా తొమ్మిది గంటల సమయంలో శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళడానికి ఒక పడవను ఏర్పాటు చేశారు. పడవ రాగానే శ్రీరామకృష్ణులు ఇంటిలోపలకు వెళ్ళి జగన్నాథునికి ప్రణామం చేశారు. అక్కడున్న భక్తుల ప్రణామాలు స్వీకరించి, ఆయన బయటకు రాసాగారు. భక్తురాండ్రు కూడా ఆయనను అనుసరించి బయటి వసారావరకు వచ్చి, గురుదేవులను సాగనంపి, బరువెక్కిన హృదయాలతో వెనుదిరిగారు. కళ్ళకు కనిపించే ఆ అద్భుత సజీవదైవం సాంగత్యాన్ని ఎవరు మాత్రం విడిచిపెట్టి ఉండగలుగుతారు? ఆ విధంగా భక్తురాండ్రు వలయాకారంలో ఉన్న ఆ వసారా వాకిలి వరకు వచ్చి వెనక్కు తిరిగారు. కాని వారిలో ఒక స్త్రీ మాత్రం మైమరచిపోయి గురుదేవులను అనుసరించి బయటి వసారా దాకా వచ్చింది. అపరిచితులైన పురుషులు అక్కడ ఉన్నారని ఆమెకు కించిత్తు కూడా స్ఫురించినట్లులేదు.
20. తన్మయ స్థితిలో ఉన్న శ్రీరామకృష్ణులను, ఒక భక్తురాలు అనుసరించడం
భక్తురాండ్ర వద్ద సెలవు పుచ్చుకొని భావపారవశ్యంలో, అంతర్ముఖులై ఆయన బయటకు నడవసాగారు. ఆ స్థితిలో భక్తురాండ్రు కొంతదూరం వరకు తనను అనుసరించి వచ్చారనీ, వారిలో ఒక స్త్రీ ఇంకా తనను అనుసరించి వస్తూనే ఉందనీ ఆయనకు తెలియదు. ఆ తీరులో శ్రీరామకృష్ణులు నడిచిరావడం కళ్ళారా చూసిన వారు మాత్రమే, దాన్లోని అసాధారణ భావాన్ని అవగతం చేసుకోగలరు. ఇతరులకు దాన్ని విపులీకరించడం అసాధ్యం.
పన్నెండు సంవత్సరాల పర్యంతం, కేవలం పన్నెండు సంవత్సరాలనే అనడమెందుకు? జీవితాంతం ఏకాగ్రతను అభ్యసించిన ఫలితంగా శ్రీరామకృష్ణుల మనస్సు ఏ మేరకు ఏకాగ్రమయ్యేదంటే, ఆయన దానిని ఎప్పుడు, ఎక్కడ, ఏ పనిలో నియుక్తం చేస్తారో, అది అక్కడే ఆ పనిలోనే మగ్నమై ఉండిపోయేది; అటూ ఇటూ తొంగిచూడడం కూడా ఉండదు. ఎప్పుడు ఏ భావం ఆయన మనస్సులో జనించేదో, అప్పుడు ఆయన మనశ్శరీరాలు ఆ భావాన్ని మాత్రమే అభివ్యక్తం చేసేవి. ఆయన మనశ్శరీరాలు ఆయనకు అంతగా వశవర్తులై ఉండేవంటే, అది అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. దీనిని విశదీకరించడం ఎంతో కష్టం. మన మనస్సులను పరికించి చూస్తే రకరకాల భావనలు ఏకకాలంలో అక్కడ రాజ్యం చేస్తూవుండడం, అభ్యాస ఫలితంగా వాటిలో ఏది బలీయమై ఉంటుందో, అదే భావన మనం ఎంత అణగద్రొక్క ప్రయత్నించినా ఫలితం లేకుండా, దాని ప్రకారం అది నడచుకొని శరీరానికి, ఇంద్రియాలకు కూడా వశం కాకుండా పోతుంది. శ్రీరామకృష్ణుల మనో నిర్మాణం మన మనస్సుల కంటే ఎంత విభిన్నమైనదో కదా!
21. శ్రీరామకృష్ణుల అంతర్ముఖత్వానికి మరికొన్ని దృష్టాంతాలు
పై విషయాన్ని తేటతెల్లపరిచే మరెన్నో దృష్టాంతాలను పేర్కొనవచ్చు. ఒక రోజు శ్రీరామకృష్ణులు కాళీమాతకు ప్రణామం చేయడం కోసం తమ గది నుండి బయలుదేరారు. తమ గది నుండి తూర్పు వసారా వద్దకొచ్చి, మెట్లు దిగి, ఆలయ ప్రాంగణం గుండా తిన్నగా కాళికాలయానికి వెళ్ళారు. కాళికాలయానికి వెళ్ళే దారిలోనే రాధాగోవిందాలయం ఉంది. కాళికాలయానికి వెళుతున్నప్పుడు, ఆయన అనుకొని ఉంటే ముందుగా రాధాగోవిందాలయాన్ని దర్శించుకొని, తరువాత కాళికాలయానికి వెళ్ళి ఉండవచ్చు. కాని ఎన్నడూ ఆయన అలా చేయలేకపోయేవారు. తిన్నగా కాళికాలయానికే వెళ్ళేవారు. వెనక్కు తిరిగి వస్తున్నప్పుడు మాత్రమే ఆయన రాధాగోవిందాలయాన్ని సందర్శించేవారు. కాళీమాత పట్లే ఆయనకు అపరిమితమైన భక్తిప్రపత్తులు ఉండడం వల్లనే ఆయన అలా చేస్తున్నారని ఆ రోజులలో మేం భావించేవారం. ఒక రోజు ఆయనే మాతో ఇలా చెప్పారు : “ఎందుకు ఇలా జరుగుతున్నదో మీరు చెప్పగలరా? కాళీమాత దర్శనానికి వెళ్ళాలని అభిలషించగానే, తిన్నగా అక్కడకే వెళ్ళవలసి వచ్చేది. అటూ ఇటూ కాసేపు పచార్లు చేసి లేదా రాధాగోవిందాలయాన్ని సందర్శించుకొన్నాక కాళికాలయానికి వెళ్ళడం నాకు అసాధ్యంగా తోచేది. ఎవరో నా కాళ్ళు పట్టుకొని తిన్నగా కాళికాలయానికే తోడ్కొని పోతున్నట్లు అనిపించేది; అటూ ఇటూ కాళ్ళు తిప్పడం కూడా నాకు సాధ్యం కాకపోయేది. కాళీమాత సందర్శనానంతరం మాత్రమే ఎక్కడికైనా పోగలిగేవాణ్ణి. ఎందుకు అలా జరుగుతున్నదో చెప్పగలరా?”
మా అజ్ఞానాన్ని ఒప్పుకొని లోపల ఇలా అనుకొన్నాం : ‘ఇలా కావడం సాధ్యమా? ఇష్టపడితే ముందే రాధాగోవిందులకు మ్రొక్కి, పిదప కాళికాలయానికి వెళ్ళవచ్చు కదా! కాళీమాతను దర్శించాలనే ఆకాంక్ష బలీయమైనదవడం వలన బహుశా అలా చేయలేక పోతున్నారు కాబోలు.’ కాని మా ఆలోచనలను మాటల ద్వారా ఒకేసారి వ్యక్తం చేయలేక పోయాం. శ్రీరామకృష్ణులే అప్పుడప్పుడు పై ప్రశ్నలకు ఇలా సమాధానం చెప్పేవారు: “ఏమిటో తెలుసా? ఎప్పుడు ఏది చేయాలనే సంకల్పం నాలో జనిస్తుందో, తక్షణమే దానిని చేసే తీరాలి, ఒక్క క్షణం ఆలస్యమైనా మనస్సు సహించదు.” ఏకాగ్రత సంతరించుకొన్న మనస్సు అటువంటి అవస్థను పొందుతుందనే విషయం మేం అప్పుడు గ్రహించామా ఏమిటి? ఎంతో కాలానికి మునుపే శ్రీరామకృష్ణుల మనస్సు పరిపూర్ణ ఏకాగ్రత స్థితిని చేరిందనీ, దాన్లో ఇక తద్భిన్నంగా ఎటువంటి భావాలూ జనించే అవకాశమే లేదనే విషయం మాకు అప్పుడు అవగతమైందా ఏమిటి?
అప్పుడప్పుడు మళ్ళీ ఆయన ఇలా చెప్పేవారు : “ఇలా చూడండి. నా మనస్సు నిర్వికల్ప స్థితిలో నెలకొని ఉన్నప్పుడు, నువ్వు–నేను, చూడడం–వినడం, మాట్లాడడం–మౌనం వహించడం… ఇత్యాదులన్నీ లుప్తమైపోతాయి. ఆ స్థితి నుండి రెండు మూడు మెట్లు దిగి వచ్చిన తరువాత కూడా పలువురితో లేదా పలు వస్తువులతో వ్యవహరించడం సాధ్యం కానంత ప్రగాఢ దివ్యపారవశ్యం నాలో నెలకొనే ఉంటుంది. ఆ స్థితిలో భోజనానికి కూర్చుంటే, యాభై రకాల వంటకాలు నా ముందు వడ్డించివున్నా, నా చేయి వాటన్నిటి వైపుకూ పోలేదు; ఒక్క వంటకాన్నే అందుకోగలుగుతుంది. అటువంటి అవస్థలు కలిగినప్పుడు అన్నం, పప్పు, కూరలు, పాయసం అన్నీ కలగాపులగం చేసి తినవలసి వచ్చేది.” నిర్వికల్పావస్థ నుండి రెండు మూడు మెట్లు క్రిందికి దిగివచ్చిన స్థితి వర్ణన విని మేం విస్తుపోయాం.
మళ్ళీ శ్రీరామకృష్ణులు ఇలా కొనసాగించేవారు : “ఎవరినీ స్పృశించలేని మరొక అవస్థ కూడా అప్పుడప్పుడు కలిగేది. ఆ స్థితిలో వీరెవరైనా (భక్తులను చూపుతూ) నన్ను స్పృశిస్తే బాధతో అరవవలసి వచ్చేది.” అటువంటి అవస్థలో శ్రీరామకృష్ణుల మనస్సులో శుద్ధసత్త్వగుణం ఎంత ఉద్ధృతమౌతుందంటే, కించిత్తు అపవిత్రతను సైతం స్పృశించడానికి ఆ మనస్సుకు అసంభవమని అప్పుడు మాలో ఎవరైనా అర్థం చేసుకోగలిగామా ఏమిటి? మళ్ళీ ఆయన ఇలా చెప్పేవారు: “మరొకప్పుడు భావపారవశ్యంలో అతణ్ణి (బాబూరాంను చూపుతూ) మాత్రమే స్పృశించగల స్థితి నాకు కలిగేది. ఆ సమయంలో అతడు నన్ను ఆసరాగా పట్టుకొన్నా* , నాకు బాధ కలిగేది కాదు. అతడు తినిపిస్తే తినగలిగేవాణ్ణి.”
22. ఒక భక్తురాలిని దక్షిణేశ్వరానికి రమ్మని శ్రీరామకృష్ణులు ఆహ్వానించడం
అన్యమనస్కులై శ్రీరామకృష్ణులు క్రితం రోజు రథాన్ని త్రిప్పిన వలయాకార వసారాలో పచార్లు చేయసాగారు. అప్పుడు హఠాత్తుగా ఆయన వెనక్కు తిరిగి, ఆ భక్తురాలు తనను అనుసరించి రావడం చూశారు. ఆమెను చూసిన తక్షణమే, ఆయన నిలబడిపోయి, “అమ్మా ఆనందమయీ, అమ్మా ఆనందమయీ” అంటూ పదేపదే ఆమెకు నమస్కారం చేయసాగారు. ఆ భక్తురాలు కూడా తన తలను ఆయన పాదాల మ్రోల వాల్చి, ఆయనకు ప్రణామం చేసింది. ఆమె అలా చేయగానే, శ్రీరామకృష్ణులు ఆమె ముఖంకేసి తేరిపార చూసి, “రాకూడదా, అమ్మా, నాతో రాకూడదా?” అని అన్నారు. ఆయన పలికిన తీరుకు ఆమె ఒక అపూర్వ ఆకర్షణకు లోనైంది. ముఫై ఏళ్ళ వయస్కురాలైన ఆమె పల్లకీలో తప్ప ఎక్కడికీ వెళ్ళి ఉండలేదు. అటువంటిది ఏ ఆలోచనా లేకుండా శ్రీరామకృష్ణుల వెంట దక్షిణేశ్వరానికి బయలుదేరింది. బయలుదేరే ముందు ఇంట్లోకి పరుగున వెళ్ళి బలరాం బోస్ భార్యతో, “గురుదేవులతో పాటు దక్షిణేశ్వరానికి వెళుతున్నాను” అని చెప్పివచ్చింది. ఈ భక్తురాలు దక్షిణేశ్వరానికి వెళుతున్నదని విని, మరొక భక్తురాలు చేస్తున్న పనులన్నిటిని విడిచిపెట్టి ఈమెతో పాటు తాను కూడా బయలుదేరింది. ఆ భక్తురాండ్రను తనను అనుసరించి రమ్మని చెప్పి, శ్రీరామకృష్ణులు అదే భావపారవశ్య స్థితిలోనే యోగేన్, చిన్ననరేంద్రుడు, ఇతర బాలభక్తులతో తిన్నగా వెళ్ళి పడవలో కూర్చున్నారు. ఆ భక్తురాండ్రు ఇద్దరూ పరుగెత్తి వెళ్ళి, కాన్వాస్ కప్పుకు వెలుపలనున్న కొయ్యగచ్చు మీద కూర్చున్నారు. పడవ బయలుదేరింది.
23. పడవలో భక్తురాలు అడిగిన ప్రశ్నకు శ్రీరామకృష్ణుల సమాధానం: గాలికి ఎగిరే విస్తరాకులా మసలుకో
అలా పడవలో వెళుతున్నప్పుడు ఆ భక్తురాలు, శ్రీరామకృష్ణులతో ఇలా చెప్పింది: “మనస్ఫూర్తిగా ఆయనను (భగవంతుణ్ణి) ప్రార్థించాలనే కోర్కె నాకు కలిగింది. కాని ఎంత ప్రయత్నం చేసినా ఈ పనికిమాలిన మనస్సు వినడం లేదు! నేను ఏం చెయ్యాలి?” శ్రీరామకృష్ణులు ఆప్యాయంగా ఇలా అన్నారు: “ఆయనను ఎందుకు శరణు కోరరాదు? గాలిలో ఎగిరే విస్తరాకులా సంసారంలో మసలుకోవాలి. ఎలాగో తెలుసా? పారేసిన విస్తరాకు తన ప్రమేయం లేకుండా గాలి ఎక్కడకు ఎగురవేస్తుందో అక్కడకు పోతుంది. ఇదీ అలాగే. అదే విధంగా భారమంతా భగవంతుని మీదే వేసి, జీవించాలి; దివ్య చైతన్య వాయువు మనస్సును ఏ వైపుకు త్రిప్పుతుందో, ఆ వైపుకే తిరగాలి, అంతే!”
ఇలా మాట్లాడుతూండగా పడవ కాళికాలయ ఘట్టాన్ని చేరింది. పడవ నుండి దిగగానే శ్రీరామకృష్ణులు తిన్నగా ‘కాళీగృహం’* లోకి వెళ్ళారు. ఆలయ ఆవరణకు ఉత్తర దిశన ఉన్న నహబత్లో* మాతృదేవి అప్పుడు నివసిస్తూన్నారు. ఈ భక్తురాండ్రు మాతృదేవిని దర్శింప అక్కడకు వెళ్ళారు. ఆమెకు ప్రణామం చేసి తదుపరి కాళికాలయానికి వెళ్ళారు. ఈలోపు శ్రీరామకృష్ణులు బాలభక్తులతో కలిసి కాళికాలయానికి వచ్చి, జగజ్జననిని దర్శించి, ప్రణామం చేశారు. తరువాత ఆలయానికి ఎదురుగా ఉన్న నాదమందిరానికి వెళ్ళి అక్కడ కూర్చుని, భావ పారవశ్యంలో సుమధురంగా పాడసాగారు :
(భువన్ భులాయివి మా భవమోహిని)
అమ్మా, లోకాన్నంతా మాయతో కప్పిపుచ్చావే, మూలాధార చక్రంలో,
పెద్ద పద్మంలో కూర్చుని వీణ వాయిస్తూ ఆనందిస్తూవుంటావు.
ఈ దేహంలో ఉంటూ ఈ దేహాన్నే వాద్య పరికరంగా మార్చి,
త్రిగుణాలనే మూడు స్వరాలలో సంచరిస్తూ ఇడ, పింగళ, సుషుమ్నా
అనే మూడు తంతువులను మీటుతూ ఆనందించే నువ్వు మహామంత్ర స్వరూపిణివి.
అమ్మా, మూలాధారంలో ‘భైరవ’ రాగంగా, ఆరు దళాల
స్వాధిష్ఠానంలో ‘శ్రీరాగం’ గా, మణిపూరంలో ‘మల్లార’ రాగంగా,
అనాహతంలో ‘వసంత’ రాగంగా అభివ్యక్తమౌతూ హృదయాన్ని
ప్రకాశింప చేస్తూవుంటావు.
అట్లే విశుద్ధ చక్రంలో ‘హిందోళ’ రాగంగా, ఆజ్ఞాచక్రంలో
కర్నాటక’ రాగంగా అభివ్యక్తమౌతుంది.
గుణత్రయ మనే మాయ జీవుని దృష్టిని కప్పివేయడంచేత
‘ఆ పరతత్త్వం మరుగున పడింది.’*
24. దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులు భావ సమాధి పొందడం
కాళీమాతకు ఎదురుగా, నాదమందిరంలో కూర్చుని శ్రీరామకృష్ణులు పై పాటను పాడసాగారు. కొందరు భక్తులు కూర్చుని, నిలబడి ఆ పాటను ముగ్ధులై వినసాగారు. పాడుతూ పాడుతూ భావసమాధి మగ్నులై శ్రీరామకృష్ణులు హఠాత్తుగా లేచి నిలబడ్డారు. పాట ఆగిపోయింది. ఆయన పెదవులపై వెల్లివిరిసిన అద్భుత మందహాసం ఆ మందిరాన్ని ఆనందంతో నింపివేసింది. చేష్టలు దక్కి భక్తులు ఆ పావనమూర్తిని తిలకించసాగారు. అటువంటి అవస్థలో శ్రీరామకృష్ణుల శరీరం ఒకింత వంగడం గమనించి చిన్న నరేంద్రుడు, ఎక్కడ పడిపోతారోనన్న భయంతో ఆయనను పట్టుకోవడానికి ముందుకు వెళ్ళాడు. కాని అతడు గురుదేవులను తాకిన మరుక్షణమే ఆయన విపరీతమైన బాధతో అరిచారు. తాను అలా స్పృశించడం అప్పుడు ఆయన భరించలేకున్నారని గ్రహించి చిన్ననరేంద్రుడు కాస్త ఒదిగి నిలబడ్డాడు. ఇంతలో శ్రీరామకృష్ణులు అలా బాధతో అరవడం ఆలయంలోని రాంలాల్ విని ఒక్క పరుగులో అక్కడకు వచ్చి ఆయనను పొదివి పట్టుకొన్నాడు. కొంతసేపటి వరకు శ్రీరామకృష్ణులు అదే స్థితిలో ఉండిపోయారు. పిదప భగవన్నామాన్ని వింటూ వింటూ క్రమేణా బాహ్యస్మృతిలోకి వచ్చారు. కాని అప్పటికీ ఆ ‘భావానందం’ లోనే ఉండడం వలన మామూలు తీరులో నిలబడలేక పోయారు. ఆయన కాళ్ళు తడబడుతున్నాయి.
అటువంటి స్థితిలోనే ప్రాకుతూ ప్రాకుతూ నాదమందిరం మెట్లను దిగుతూ చిన్నపిల్లవాడిలా, “అమ్మా, పడిపోనులే, నువ్వు ఏమంటున్నావు?” అంటూ మాట్లాడసాగారు. అప్పుడు ఆయనను చూస్తే మూడు నాలుగేళ్ళ పిల్లవాడని ఎవరికైనా అనిపిస్తుంది. తల్లిని చూస్తూ మాట్లాడుతున్నట్లు, ఆమెనే తేరిపార చూస్తున్నట్లు ఆయన నిబ్బరంగా మెట్లు దిగసాగారు. ఇంత చిన్న విషయంలో సైతం భగవంతుణ్ణి ఈ విధంగా ఆసరా చేసుకొనే వైఖరి మరెక్కడైనా మనం చూడగలమా?
25. కుండలినీ దర్శనం – భావావస్థలో మాట్లాడడం
శ్రీరామకృష్ణులు మెట్లు దిగి, ఆలయ ప్రాంగణాన్ని దాటి తమ గదికి పశ్చిమంగా ఉన్న వసారాలోకి వచ్చి, అక్కడ కూర్చున్నారు. ఆయన ఇంకా భావ పారవశ్యంలోనే ఉన్నారు. ఆ భావపారవశ్యం ఆయనను వదలిపెట్టేట్లు లేదు. అది ఎంతో కొంత ఉంటూనే ఉంది. కొంతసేపు అదే స్థితిలోనే ఉండిపోయి, తన ప్రక్కనే ఉన్న భక్తులతో ఆ భావపారవశ్యంలోనే, “మీరు సర్పాన్ని (కుండలినీ) చూశారా? అది నన్నెంతో ఇబ్బంది పెడుతోంది” అని చెప్పసాగారు. మళ్ళీ, వెంటనే భక్తుల విషయం మరిచిపోయి, సర్పాకృతిలో ఉన్న ఆ కుండలినీని ఉద్దేశించి (భావావస్థలో ఆయన కుండలినీని అప్పుడే దర్శించారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు), “ఇప్పుడు వెళ్ళిపో, నేను పొగ త్రాగి, ముఖం కడుక్కోవాలి; పళ్ళు తోముకోవాలి” అని అన్నారు. ఇలా ఒకసారి భక్తులతోను, మరొకసారి భావావస్థలో దర్శిస్తూన్న ఆ మూర్తితోను మాట్లాడుతూ మాట్లాడుతూ శ్రీరామకృష్ణులు క్రమంగా సహజావస్థలోకి వచ్చారు.
26. సహజ స్థితిని చేరుకొన్న శ్రీరామకృష్ణులు, భక్తుల ఆహార విషయమై ఆందోళన చెందడం
శ్రీరామకృష్ణులు మామూలు స్థితిలో ఉన్నప్పుడు భక్తుల నిమిత్తం ఆందోళన చెందేవారు. తమతో పాటు వచ్చిన భక్తుల ఆహారం కోసం ఇప్పుడాయన ఆరాటపడ్డారు. కూరగాయలు ఏవైనా నిల్వ ఉన్నాయేమోనని తెలుసుకు రమ్మని మాతృదేవి వద్దకు ఒకరిని పంపారు. కూరగాయలు ఏవీ లేవని ఆమె నుండి జవాబు వచ్చింది. ఎవరు అంగడికెళ్ళి కూరగాయలు కొని తెస్తారోనని మళ్ళీ శ్రీరామకృష్ణులు ఆందోళన పడ్డారు. అంగడి నుండి కూరగాయలు కొని తీసుకు రాకపోతే, కలకత్తా నుండి వచ్చిన భక్తులకు, భక్తురాండ్రకు భోజనం పెట్టడం ఎలా అనే చింతనలో పడ్డారు శ్రీరామకృష్ణులు. కాసేపు యోచించి చివరకు ఆ ఇద్దరు భక్తురాండ్రను, “మీరు బజారు కెళ్ళి కూరగాయలు కొని తీసుకురాగలరా?’ అని అడిగారు. వాళ్ళు “సరే” నని వెంటనే బజారుకెళ్ళి ఆకుకూరలు, బంగాళాదుంపలు, రెండు పెద్ద వంకాయలు కొని తెచ్చారు. మాతృదేవి వాటి నన్నింటిని వండారు. ఆలయం నుండి శ్రీరామకృష్ణులవంతుగా ఒక పళ్ళెం నిండా మామూలుగా వచ్చే కాళీమాత ప్రసాదం కూడా వచ్చింది. శ్రీరామకృష్ణులు భోజనం చేసిన తరువాత, భక్తులందరూ కూర్చుని ప్రసాదాన్ని ఆరగించారు.
భావపారవశ్యంలో శ్రీరామకృష్ణులను చిన్న నరేంద్రుడు తాకినప్పుడు ఆయన బాధతో అరవడానికి కారణం ఏమిటో తరువాత తెలియవచ్చింది. చిన్న నరేంద్రుడి ఎడమ కణత మీద చిన్న కురుపు లేచి క్రమంగా పెద్దది కాసాగింది. తదనంతరం ఆ కురుపు మరింత బాధాకరంగా తయారవుతుందని, వైద్యులు మందులు పూసి దానిని పుండులా చేశారు. ఒంటి మీద పుండు ఉన్నప్పుడు దేవతామూర్తులను స్పృశించరాదనే విషయం మేం ఇంతకు మునుపే విని ఉన్నాం. కాని ఆ లోకోక్తి మా కళ్ళముందే సత్యమని ఋజువవుతుందని ఎవరు కలగన్నారు? భగవద్భావంలో తన్మయులై సంపూర్ణ బాహ్యస్మృతి కోల్పోయిన పరిస్థితిలో కూడా అంతర్నిహితంగా ఉన్న ఆ దివ్యశక్తి ఆయనను అలా ప్రవర్తింప చేయడం మనం అవగతం చేసుకోలేకపోయినా, శ్రీరామకృష్ణులు బాధపడడం మాత్రం సందేహాతీతమే. చిన్న నరేంద్రుడి పవిత్రత పట్ల గురుదేవులకు ఎంత ఉన్నత అభిప్రాయం ఉందో మేం ఎరిగేవున్నాం. సామాన్య అవస్థలో ఉన్నప్పుడు అతడి శరీరంలో పుండు ఉన్నప్పటికీ, ఇతరులందరి మాదిరిగా చిన్ననరేంద్రుణ్ణి తాకే వారు, తమ పాదాలను స్పృశింపనిచ్చేవారు, అతడితో కలసిమెలసి ఉండేవారు. అటువంటప్పుడు భావావస్థలో మాత్రం తన స్పర్శను పుండు కారణంగా శ్రీరామకృష్ణులు సహించలేరనే విషయం పాపం చిన్ననరేంద్రుడు ఎలా తెలుసుకోగలడు? ఆ తరువాత పుండు తగ్గిపోయేవరకు, శ్రీరామకృష్ణులను భావావస్థలో చిన్ననరేంద్రుడు స్పృశించలేదు.
శ్రీరామకృష్ణులు చేస్తున్న వివిధ భగవత్ప్రసంగాలను వింటూ, ఆ రోజంతా ఎలా గడిచిపోయిందో ఎవరికీ తెలియరాలేదు. సాయంకాలం సమీపించడంతో భక్తులు తమ ఇళ్ళకు బయలుదేరారు. ఆ ఇద్దరు భక్తురాండ్రు శ్రీరామకృష్ణుల వద్ద, మాతృదేవి వద్ద సెలవు పుచ్చుకొని కాలినడకన కలకత్తాకు బయలుదేరారు.
27. శ్రీరామకృష్ణుల బాలక స్వభావం
పై సంఘటన జరిగిన రెండు మూడు రోజులు గడిచాక ఒకనాటి మధ్యాహ్నం శశధర పండితుడు శ్రీరామకృష్ణుల దర్శనార్థం దక్షిణేశ్వరానికి రానున్నాడని తెలియవచ్చింది. ఎవరైనా ప్రముఖ వ్యక్తి తమను చూడడానికి వస్తున్నాడని వింటే బాలక స్వభావులైన శ్రీరామకృష్ణులు అనేక సందర్భాలలో భయపడడం కద్దు. తమకు చదువు సంధ్యలు లేవని సంకోచపడేవారు. అంతేగాక ఎప్పుడు భావసమాధి కలుగుతుందో తమకే తెలియదాయె; ఎప్పుడు బాహ్యస్మృతి కోల్పోతారో, కట్టుబట్ట సైతం ఊడిపోతుందో ఆయనకే తెలియరాదు. అటువంటి పరిస్థితిలో క్రొత్తగా వచ్చిన వ్యక్తి తమను చూసి ఏమనుకొంటాడు, ఏమంటాడు? అని ఆందోళన చెందేవారు.
ఆయన అలా కంగారుపడడం చూసి మాలో మేం, ‘క్రొత్తగా వచ్చే వ్యక్తి తమను గురించి ఏమనుకొంటే ఏమిటి? ఏమంటే ఏమిటి? దానిని గురించి ఆయనెందుకు అంతగా కంగారుపడాలి?’ అని అనుకొనేవారం. ఆయనే స్వయంగా అనేకులకు, “లోకులు కేవలం పురుగులు. సిగ్గు, ద్వేషం, భయం ఉన్నంత వరకు ఆధ్యాత్మికత కించిత్తూ ఒంటపట్టదు” అని ఉపదేశించడం కద్దు. అటువంటప్పుడు ఆయన కూడా పేరుప్రతిష్ఠల కోసం ప్రాకులాడుతున్నారా ఏమిటి?
కాదు. బాగా పరిశీలించి చూస్తే కనిపించేది ఏమిటి? చిన్నపిల్లవాడు క్రొత్తవ్యక్తిని చూసినప్పుడు భయంతో, సిగ్గుతో కుంచించుకుపోతాడు. కాని ఒకింత పరిచయం ఏర్పడ్డాక ఆ వ్యక్తి ఒళ్ళోకి ఉరుకుతాడు, భుజాలపైకెక్కి తల వెంట్రుకలను పుచ్చుకొని లాగుతూ, చిలిపి చేష్టలు చేస్తాడు. శ్రీరామకృష్ణుల వైఖరికూడా సరిగ్గా అలాగే ఉండేది. నిజానికి ఆయన పేరుప్రతిష్ఠల కోసం ప్రాకులాడే వ్యక్తే అయిన పక్షంలో మహారాజా యతీంద్రమోహన్, సుప్రసిద్ధుడైన కృష్ణదాస్ పాల్ వంటి వ్యక్తులతో ఆయన అసలు ఆ తీరుతో మాట్లాడి ఉండేవారా ఏమిటి!*
మళ్ళీ తమను చూడడానికి వచ్చిన వారికెక్కడ కీడు వాటిల్లుతుందోనని శ్రీరామకృష్ణులు కొన్ని సందర్భాలలో భయపడడం కద్దు. ఎందుకంటే, తమ ప్రవర్తన, వ్యవహరించే తీరు ఆ క్రొత్తవ్యక్తి ప్రశంసించినా లేకున్నా ఆయన అసలు పట్టించుకోరు. కాని తమను అవగతం చేసుకోలేక దూషించిన ఆ క్రొత్త వ్యక్తికి కీడు వాటిల్లడం తథ్యం; అందుకే ఆయన భయపడేవారు. ఒక సందర్భంలో గిరీశ్ చంద్రఘోష్ అభిమానం దెబ్బతినడంతో కోపంలో శ్రీరామకృష్ణులను ఆయన సమక్షంలో నానా దుర్భాషలాడాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు, “చూడండి, అతడు నన్ను గురించి ఏమన్నా అననివ్వండి. మా తల్లిని దుర్భాషలాడనంత వరకు ఫరవాలేదు” అని అన్నారు.
28. శశధర పండితుడు శ్రీరామకృష్ణులను రెండవ సారి కలుసుకోవడం
శశధర పండితుడు తమను చూడడానికి వస్తున్నాడని విన్నప్పటి నుండి శ్రీరామకృష్ణుల భయానికి అంతులేకపోయింది. తమ వద్దనే ఉన్న యోగేన్, చిన్ననరేంద్రుడు తదితర భక్తులతో ఆయన, “పండితుడు వచ్చినప్పుడు మీరందరూ కూడా ఇక్కడే ఉండండి” అని అన్నారు. అలా చెప్పడంలో ఆయన ఉద్దేశం ఇది: తాము నిరక్షరాస్యులు కనుక విద్యావంతుడైన పండితుడితో సముచిత రీతిలో మాట్లాడలేరు. కాబట్టి వాళ్ళంతా అక్కడే ఉండి పండితుడితో మాట్లాడి తమను ఆ ఇబ్బంది నుండి గట్టెక్కించాలి. ఆహా, చిన్నపిల్లవాడిలా ఆయన ఇలా భీతి చెందడం గురించి ఇతరులకు వివరించడం ఎంత కష్టం! కాని శశధర్ రాగానే శ్రీరామకృష్ణులు మరో రకంగా మారిపోయారు. చిరునవ్వు చిందిస్తూ, అర్ధ బాహ్యావస్థకు చేరి, ఆప్యాయంగా పండితుడితో, “మీరు పండితులు. దయచేసి ఏమైనా సెలవియ్యండి” అని అన్నారు.
శశధర్ : మహాశయా! వేదాంత అధ్యయనంతో నా గుండె ఆర్చుకు పోయింది. అందుకే భక్తిరసం కించిత్తు గ్రోలాలని మీ వద్దకు వచ్చాను. కనుక మీరే ఏమైనా సెలవియ్యండి, వింటాను.
29. పై సంఘటనను స్వయంగా శ్రీరామకృష్ణులు ఒక భక్తుడికి వర్ణించిన తీరు
శ్రీరామకృష్ణులు (ఆప్యాయంగా): నేనేం చెప్పగలను? సచ్చిదానందం ఎటువంటిదో చెప్పడానికి ఎవరికీ సాధ్యం కాదు. అందుకే మొదట్లో ఆయన అర్ధనారీశ్వరుడైనాడు. ఎందుకని? ఎందుకంటే పురుషుడు, ప్రకృతి – రెండూ తానే అని చూపడం కోసం. తదనంతరం ఆ అవస్థ నుండి ఒక మెట్టు క్రిందికి దిగి పురుషుడు వేరుగా, ప్రకృతి వేరుగా అయ్యాడు. ఆ విధంగా నిగూఢ ఆధ్యాత్మిక తత్త్వాలను వివరిస్తూ శ్రీరామకృష్ణులు ఉత్తేజభరితులై లేచి నిలబడి శశధర్ను ఉద్దేశిస్తూ ఇలా చెప్పసాగారు : “మనస్సు సచ్చిదానందంలో లీనం కానంత వరకు భగవంతుణ్ణి ప్రార్థించడం, లౌకిక విధులు నిర్వర్తించడం కొనసాగుతాయి. మనస్సు పరమాత్మలో లీనమైపోయిన తదుపరి లౌకిక విధులను నిర్వర్తించే అవసరం ఇక ఉండదు. ఉదాహరణకు ‘నా నితాయ్ మదపుటేనుగు’ (నితాయ్ ఆమార్ మాతా హాతీ) అనే పాటను తీసుకోండి. పాట ప్రారంభమైనప్పుడు పాటలోని పదాలు, లయ, తాళం, రాగం, అర్థం – వీటన్నిటి మీద అధిక శ్రద్ధ వహించి పాడతాం. అలా పాడుతూ పాడుతూ మనస్సు, పాట భావంలో లీనం కాసాగగానే కేవలం ‘మదపు టేనుగు, మదపు టేనుగు’ అని మాత్రం ఉచ్చరిస్తాం. తదనంతరం భావంలో మనస్సు మరింత ప్రగాఢంగా లీనమైనప్పుడు ‘ఏనుగు, ఏనుగు’ అనే పదాలే వెలువడతాయి. చివరకు భావం తీవ్రమైనప్పుడు ‘ఏ, ఏ’ అని ఉచ్చరిస్తూ నోరు తెరచుకొని ఉంటాం. (మౌనం దాలుస్తాం)
భావావస్థను గురించి అలా వర్ణిస్తూ వర్ణిస్తూ ‘ఏ’ అని ఉచ్చరిస్తూ భావావస్థ పొంది, శ్రీరామకృష్ణులు నోట మాటరాక దాదాపు పదిహేను నిమిషాల పాటు అట్లే నిలబడిపోయారు. ఆ సమయంలో ఆయన ప్రసన్న వదనం దేదీప్యమానంగా ప్రకాశించసాగింది. ఆ భావావస్థ కొంత ఉపశమించిన తరువాత, బాహ్యస్మృతి పొంది మళ్ళీ శశధర్తో ఆప్యాయంగా మాట్లాడనారంభించారు.
శ్రీరామకృష్ణులు : ఓ పండితుడా, నీ (భూతభవిష్యత్తు లన్నింటినీ) లోపలి యావత్తు చూడగలిగాను. నువ్వు సజ్జనుడివి. వంట మొదలైన గృహకృత్యాదులన్నింటిని పూర్తిచేసి, అందరికీ భోజనం వడ్డించి గృహిణి భుజం మీద తువ్వాలు వేసుకొని స్నానం, బట్టలు ఉతకడం కోసం చెరువుకు వెళుతుంది; మళ్ళీ వంటింటికి తిరిగి రాదు. అదే విధంగా నువ్వు కూడా భగవంతుణ్ణి గురించి అందరికీ చెప్పిన తరువాత వెళ్ళిపోతావు, మళ్ళీ ఎన్నటికీ తిరిగిరావు.
శ్రీరామకృష్ణుల వచనాలు విని శశధర్, “ఇదంతా తమ అనుగ్రహమే” అంటూ పదేపదే ఆయన పాదధూళిని స్వీకరించాడు. శ్రీరామకృష్ణుల వచనాలు విస్తుబోయి విని, ఇంతవరకూ తనకు భగవదనుభూతి కలుగలేదే అని చింతన చేస్తూ, కంట తడిపెట్టుకొన్నాడు.
శశధర్ దక్షిణేశ్వరానికి వచ్చిన మర్నాడు మా ఆప్త స్నేహితుడు ఒకడు శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చాడు. అతడితో శ్రీరామకృష్ణులు క్రితం రోజు జరిగిన సంఘటనను వర్ణించిన తీరును మేం ఇక్కడ పొందు పరుస్తున్నాం.
శ్రీరామకృష్ణులు (ఆప్యాయంగా) : ‘ఇక్కడ’ (తమకు) పాండిత్యం వంటివి ఏవీ లేవని నీకు తెలుసు కదా! చదువు సంధ్యలు లేని వ్యక్తిని! నన్ను చూడడానికి పండితుడు వస్తున్నాడని విని ఎంతో భయపడ్డాను. కట్టుబట్ట ఉందో లేదో అనే ధ్యాస కూడా ఉండదు. అయుక్తంగా ఏమైనా మాట్లాడతానేమో నని భయంతో కుంచించుకుపోయాను. నేను అమ్మతో, ‘అమ్మా, నువ్వు తప్ప నాకు శాస్త్రాలూ గీస్త్రాలూ ఏవీ తెలియవు. నువ్వే నన్ను కాపాడాలి’ అని అన్నాను. ఆ తరువాత ఎవరితోనో, ‘మీరు ఇక్కడే ఉండండి’ అని చెప్పాను. ‘నువ్వు నా కూడా ఉంటే నాకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది’ అని మరెవరితోనో చెప్పాను. పండితుడు వచ్చి కూర్చున్న తరువాత కూడా భయం పోలేదు. మౌనంగా కూర్చుని, అతడి వైపే చూస్తూ, అతడి మాటలనే వినసాగాను. అప్పుడే అతడి అంతరంగాన్ని చూడగలిగాను. కేవలం శాస్త్రాధ్యయనం వలన ఏమీ ప్రయోజనం లేదని అమ్మ నాకు దర్శింపచేసింది. వివేకం, వైరాగ్యం లేని శాస్త్రాధ్యయనం నిష్ప్రయోజనం. తక్షణమే సర్రున (తమ శరీరాన్ని చూపుతూ) ఏదో (కుండలినీ) తల వైపుగా ప్రాకింది, భయం మటుమాయమైంది. ముఖం పైకి లేచింది; నోటి నుండి మాటలు ఎగజిమ్ముకొంటూ వస్తున్నట్లు అనిపించింది. మాటలు బయటకు వచ్చేకొద్దీ, లోపల నుండి ఎవరో అందించి నెట్టుతూన్నట్లు మాటలు ప్రవాహంలా రాసాగాయి. ఆ ప్రాంతంలో (కామార్పుకూర్) ధాన్యం కొలిచేటప్పుడు ‘ఒక సేరు, రెండు సేర్లు’ అంటూ ఒకడు కొలుస్తూవుంటే, అతడి వెనుక నుండి మరొకడు ధాన్యం కుప్పను ముందుకు నెట్టుతూవుంటాడు. నా నోటి నుండి మాటలు రావడం కూడా అలాగే ఉంది. నేను ఏం చెబుతున్నానో నా కేమీ తెలియడం లేదు. కాస్త బాహ్యస్మృతి వచ్చాక చూద్దును కదా, అతడు (పండితుడు) ఏడుస్తున్నాడు, పూర్తిగా మారిపోయి కనిపించాడు. భయం కారణంగా ఇటువంటి అవస్థ అప్పుడప్పుడు కలుగుతుంది, అప్పుడు పదేపదే నేను సరుగుడు తోపుకు (శౌచం నిమిత్తం) పోవలసివస్తుంది. పడవలో గంగా విహారానికి నన్ను తోడ్కొని వెళ్ళడానికి, ఒక ఆంగ్లేయుడితో (కైస్తవ ప్రచారకుడు జోసఫ్ కుక్) వస్తున్నట్లు కేశవ్ కబురు పంపిన సందర్భంలో కూడా నాకు ఇటువంటి అవస్థ కలిగింది. వాళ్ళు వచ్చాక నేను పడవలో కూర్చోగానే అదే అవస్థలో నోట మాటలు ప్రవహించాయి. ఆ తరువాత వాళ్ళు (మమ్మల్ని చూపుతూ), ‘మీరు ఎంతో ఉపదేశించారు’ అని చెప్పారు. చూడండి! కాని, నాకు మాత్రం అసలు ఏమీ తెలియదు.”
30. ఇతర అవతారమూర్తుల పట్ల విశ్వాసం ఏర్పడడానికి శ్రీరామకృష్ణుల జీవితం దోహదం చేసింది
శ్రీరామకృష్ణుల అలౌకికావస్థల గురించి మనం ఏం అవగతం చేసుకోగలం? వాటిని గురించి విశదీకరించడం లేదా మా అనుభూతులను వెలిబుచ్చడం ఎలాగో తెలియక స్తబ్ధులమై, ఆశ్చర్య చకితులమై ఉండిపోవలసిందే. అద్భుతమైన ఏదో ఒక శక్తి ఆయన మనశ్శరీరాలను ఆశ్రయించి, తమకే తెలియని ఒక మహాకర్షణతో తనకు నచ్చినవారిని దక్షిణేశ్వరానికి తోడ్కొనివచ్చి, వారిని ఆధ్యాత్మిక ఉన్నతభూములను అధిరోహింపచేసి అసాధారణ రీతులలో క్రీడిస్తుంది. ఇటువంటసంఘటనలను కళ్ళారా చూస్తూన్నా వాటిలోని మార్మికత అవగతం కాదు. కాని ఫలితాల నుండి పరికించి చూస్తే ఆ అద్భుత సంఘటనలు జరిగాయని అంగీకరించక తప్పదు. అంతకుమించి ఎవ్వరూ తెలుసుకోలేరు.
ఆహా! దురుద్దేశాలతో ఎంతమంది దుష్టులు గురుదేవుల వద్దకు రావడం, భావావస్థలో ఆయన వారిని స్పృశించడం, ఫలితంగా ఆ క్షణంలోనే వారి నైజం యావత్తు ఆమూలాగ్రం మారిపోయి, సరిక్రొత్త జీవితాన్ని పొందడం మేం ఎన్ని సందర్భాలలో చూడలేదు!
కేవలం స్పర్శ మాత్రం చేత ఏసుక్రీస్తు, మేరీ అనే దుఃఖీతురాలికి సరిక్రొత్త జీవితాన్ని అనుగ్రహించాడు. భావపారవశ్యంలో ఒకానొకడి భుజాల మీదికి ఎక్కి కూర్చున్నాడు చైతన్య మహాప్రభువు; ఫలితంగా అతడి మనస్సులోని సంశయాలూ, అపనమ్మకాలు తొలగిపోయి, ఆ స్థానాన్నే భక్తి ఉదయించింది.
అవతారమూర్తుల జీవితాలలో జరిగిన ఇటువంటి సంఘటనలను గురించి చదివి, వారి వారి శిష్యప్రశిష్యులు తమ తమ సంప్రదాయాలను అసంఖ్యాకులు అనుసరించాలనే ఉద్దేశంతో ఈ కట్టుకథలను అల్లారనీ, నిజమైన ఆధ్యాత్మిక సత్యాలను సాక్షాత్కరించుకొనే మార్గంలో ఇవన్నీ అడ్డంకులనీ మేం ఇంతకు మునుపు భావించేవారం.
నవవిధాన్ (బ్రహ్మ) సమాజం వారు ప్రచురించిన భక్తి చైతన్య చంద్రిక అనే పుస్తకంలో శ్రీహరి నామాన్ని వింటూ చైతన్యులు బాహ్యస్మృతి కోల్పోయేవారని వ్రాసివుండడం చూసి, ఆ రచయితకు మతిచెడి ఉండాలని మేం భావించిన విషయం మాకు జ్ఞాపకం ఉంది. ఎంతటి కూపస్థమండూకాలమై ఉండి ఉండేవారమో! శ్రీరామకృష్ణుల సందర్శన భాగ్యమే మాకు దక్కకుంటే మాకు ఎటువంటి దుర్గతి పట్టేదో కదా! ‘ఇల్లు కట్టలేకపోయినా కట్టడంలోని లోపాలను గ్రహించగలిగే జ్ఞానాన్ని’ శ్రీరామకృష్ణుల సందర్శన భాగ్యం వలన సంతరించుకొన్నాం. మా దౌర్భాగ్య సందేహాస్పద మనస్సులు ఎన్ని సంశయాలు లేవనెత్తినా లేదా మోసగాళ్ళు ఏదంటే దాన్ని మతంగా ప్రచారం చేసినా తక్షణమే అంగీకరించక, అది నిజమైన మతమో కాదో గ్రహించి వారి బారి నుండి తప్పించుకోగల జ్ఞానమైనా మాకిప్పుడు ఉదయించింది.
సాధారణ వస్తువుల్లా భక్తి విశ్వాసాదులను సమర్థుడైన వ్యక్తి ఇతరులకు ప్రత్యక్షంగా అందించవచ్చునని ఇప్పుడు తెలుసుకొన్నాం. అహేతుక కృపాసాగరులైన శ్రీరామకృష్ణుల ఒక్క అనుగ్రహ బిందువును పొంది అమరులం అవడం తథ్యం అనే ఆశ మా హృదయాలను నింపివేసింది.