యద్యద్విభూతి మత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా ।
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోఽంశసంభవమ్ ॥ –భగవద్గీత, 10.41
మహిమాన్వితమూ, ఐశ్వర్యయుక్తమూ అయిన వస్తువు ఏదైనా సరే అది నా తేజస్సులోని అంశం వలననే కలిగిందని గ్రహించు.
భావముఖంలో నెలకొని గురుభావ ప్రేరణతో ఎన్నోచోట్ల, ఎందరో భక్తులతో అనేక రీతులలో శ్రీరామకృష్ణులు సలిపిన దివ్యలీలలను అభివర్ణించడం ఎవరి తరమూ కాదు. ఆ దివ్యలీలలను కించిత్తు ఇంతకు మునుపే పాఠకులకు తెలిపివున్నాం. అదే గురుభావ ప్రేరణతో ఆయన తీర్థయాత్రలు చేశారు. ఆ విశేషాలను ఇక్కడ పొందుపరుస్తున్నాం.
1. నిరుపమానమైన శ్రీరామకృష్ణుల జీవితం
మేం గమనించినంత వరకు శ్రీరామకృష్ణుల ఏ చర్యా ఉద్దేశరహితమూ, నిరర్థకమూ అయివుండలేదు. విశేష సంఘటనల మాట అటుంచితే, ఆయన మామూలు దైనందిన చర్యలలో కూడా, తరచి చూస్తే గంభీర అంతరార్థం కానవస్తుంది. ఈ ఆధునిక యుగంలో ఆధ్యాత్మిక రంగంలో అటువంటి అసామాన్య సంఘటనలతో నిండిన జీవితం మరొకటి కానరాదు. యావజ్జీవితం సాధనలు అనుష్ఠించి కూడా మనిషి భగవంతుడి అనంత భావాలలో ఏ ఒక్క భావాన్ని సైతం పరిపూర్ణంగా అనుభూతం చేసుకోలేడు. అటువంటప్పుడు విభిన్న మతాలు, మతశాఖలు వెలిబుచ్చే వివిధ భావాలలో భగవదనుభూతిని పొంది, వాటిలోని సత్యాలను బోధించడంలో సామర్థ్యం సంతరించుకోవడం అసంభవమని ప్రత్యేకంగా చెప్పాలా? అందువల్ల ఆధ్యాత్మిక రంగంలో శ్రీరామకృష్ణులు అనుపమానులై నిలిచిపోయారు; వారికి వారే సాటి.
ప్రాచీనకాలపు ఆధ్యాత్మిక గురువరేణ్యులు సాధారణంగా ఏదో ఒక ఆధ్యాత్మిక భావానుసారంగా సాధనలు అనుష్ఠించి, తదనుగుణంగా భగవత్ సాక్షాత్కారం పొందారు; తాము అవలంబించిన ఆ సాధన మార్గం మాత్రమే భగవత్సాక్షాత్కారానికి దారితీస్తుందని వాళ్ళు ప్రచారం చేశారు. భగవంతుణ్ణి ఇతర వివిధ భావాల ద్వారా కూడా పొందవచ్చుననే విషయం గురించి వారికి తెలియదు. లేదా స్వయంగా వారు ఆ సత్యాన్ని దాదాపుగా అవగతం చేసుకోగలిగినప్పటికీ దానిని జనసామాన్యంలో ప్రచారం చేస్తే, అది వారి ఇష్టనిష్ఠకు హాని కలిగిస్తుందేమోనని, తద్ద్వారా వారి ఆధ్యాత్మిక పురోగతికి విఘాతం కలిగిస్తుందనే అభిప్రాయంతో సకల మతాలూ సత్యాలే అని బాహాటంగా ఆ ప్రాచీన ఆచార్యవరేణ్యులు ప్రచారం చేయలేదు. వారి ఉద్దేశం ఏమైనప్పటికీ గురువులుగా వారు ప్రచారం చేసింది కేవలం ఏకపక్షమైన ధార్మిక సిద్ధాంతాలనే అనడానికి చరిత్రే సాక్ష్యం. తత్ఫలితంగా కాలక్రమాన ఆ సిద్ధాంతాలు అసూయకూ, ద్వేషానికీ, అనేక సందర్భాలలో రక్తపాతానికీ మూలకారణాలుగా పరిణమించాయి.
2. శ్రీరామకృష్ణులు బోధించిన ఉదార భావాలు – భవిష్యత్తులో ప్రచారం కానున్నాయి
అంతే కాదు. అటువంటి సంకుచిత మతభావ ప్రచారం పరస్పర విరుద్ధమైన ఎన్నో సిద్ధాంతాలను ఉత్పన్నం చేసి భగవత్సాక్షాత్కార మార్గాన్ని ఎంతో జటిలం చేసింది; ఆ జటిలతను తొలగించుకొని సత్యస్వరూపుడైన భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడం అసంభవమనే దురభిప్రాయాన్ని జనసామాన్యంలో కలిగించింది. ఇదే అదనుగా ఈ లౌకిక జీవితమూ, సుఖభోగాలే జీవన సర్వస్వమనీ, ఇంతకంటే మరేమీ లేదని చాటే పాశ్చాత్య జడవాదం తిరుగులేని శక్తితో విద్యావిధానం అనే ముసుగులో భారతదేశంలో ప్రవేశించింది. అలా ప్రవేశించిన పాశ్చాత్య విద్యావిధానం, యౌవనస్థితికి ఎదుగుతున్న పిల్లల, యువకుల మనస్సులను ప్రలోభపెట్టి కలుషితం చేయసాగింది; యావత్తు దేశాన్ని నాస్తికత, భోగలాలసత అనే విదేశీ విషతుల్య భావాల ఆదర్శాలతో కలుషితం చేయసాగింది. పవిత్రతకూ, పరిత్యాగానికీ, భగవత్ప్రేమకూ జాజ్వల్యమాన సోదాహరణమై, అద్భుతమూర్తులై విరాజిల్లిన శ్రీరామకృష్ణులు అవతరించి మతాన్ని పునరుద్ధరించకపోతే ఎంత దుర్గతి కలిగేదో ఎవరికెరుక?
స్వయంగా శ్రీరామకృష్ణులు అన్ని మతాలనూ, సాధన మార్గాలనూ అనుష్ఠించారు. భారతదేశంలోను, ఇతర దేశాలలోను ప్రాచీనకాలపు మహాత్ములు, ఋషులు, ఆచార్యులు, అవతార పురుషులు ఏ ఏ మార్గాలను, భావాలను అనుసరించి భగవత్సాక్షాత్కారం పొందారో, వాటిలో ఏ ఒక్కటీ అసత్యం కాదని శ్రీరామకృష్ణులు అనుష్ఠాన పూర్వకంగా చాటిచూపారు. శ్రద్ధాళువైన సాధకుడు, ఆ ప్రాచీనులు చూపించిన ఆయా మార్గాలలో ఏ ఒక్కటి అనుసరించి అయినా ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించి నేడు కూడా భగవత్సాక్షాత్కారం పొందగలరని ఆయన ప్రత్యక్షంగా చూపించారు.
పరస్పర విరుద్ధమైన సామాజిక ఆచారాల సంప్రదాయాల కారణంగా భారతదేశంలోని హిందువులు, మహమ్మదీయుల మధ్య పర్వతం వంటి పెద్ద అడ్డుగోడ నిలిచి ఉన్నప్పటికీ, ఆ రెండు మతాలూ సత్యాలే అని అనుష్ఠానపూర్వకంగా ప్రదర్శించి శ్రీరామకృష్ణులు చూపారు. ఇద్దరూ ఒకే భగవంతుణ్ణి విభిన్న భావాలతో ఉపాసిస్తూ, విభిన్న మార్గాలలో పురోగమించినప్పటికీ కాలక్రమాన భగవత్ ప్రేమలో ఒకటైపోతారని, పాత వైషమ్యాలు మరచిపోతారని ఆయన ప్రకటించారు. పరిత్యాగం లేకుండా శాంతి లభించదనీ, ఆ శాంతి ఏసు క్రీస్తుతో సహా ప్రాచీన ఋషుల, అవతారపురుషుల ఆధ్యాత్మిక సందేశం పట్ల విశ్వాసం కలిగి ఉండడం మూలంగానే కలుగుతుందనీ ప్రాపంచిక జనావళికి ఆయన హెచ్చరిక చేశారు. అద్భుతమైన శ్రీరామకృష్ణుల జీవితాన్ని మరింత ప్రగాఢంగా అధ్యయనం చేసేకొద్దీ ఆయన ఏ ప్రత్యేక దేశానికీ, సంప్రదాయానికీ, జాతికీ, మతానికీ చెందినవారు కారని తేటతెల్లమౌతుంది. శాంతిని పొందే మార్గంలో ప్రపంచం యావత్తు శ్రీరామకృష్ణుల ఉదార సిద్ధాంతాలను ఏదో ఒక రోజు ఆశ్రయించక తప్పదు.
భావముఖంలో సుస్థిరులై శ్రీరామకృష్ణులు ఉదార భావాల (ఆశయాల) రూపంలో అన్ని శాఖలలో ప్రవేశించి, అన్ని సంకుచితతత్త్వాలు ఉత్పన్నం చేసే పరిమితులను విచ్ఛిన్నం చేసి, వారందరినీ సరిక్రొత్త మూసలో పోతపోసి, కనీవినీ ఎరుగని రీతిలో ఐక్యత అనే త్రాటితో బద్ధులను చేశారు.
3. పై దానికి నిదర్శనం
పరస్పర విరుద్ధ మత సంప్రదాయాలకు చెందిన సాధకులు ఎంతోమంది శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చేవారు; ఆయనలో తమ తమ ఆధ్యాత్మిక భావాల పరిపూర్ణ ఆదర్శాన్ని చూసి, ఆయన కూడా తమ సాధన మార్గంలోనే పయనిస్తున్నారని ప్రగాఢంగా విశ్వసించేవారు. మేం పైన చెప్పిన విషయానికి ఇది నిదర్శనం. ఈ విధంగా భారతీయ మత సంప్రదాయాలన్నింటిలోను ఒక సమైక్యభావాన్ని కల్పించాలని గురుభావంలో శ్రీరామకృష్ణులు చేపట్టిన కార్యం, మొట్టమొదట భారతదేశంలోనే ప్రారంభమైనా అది భారతదేశ ఎల్లలలోనే ఆగిపోలేదు; ఆసియాతోనూ ఆగిపోలేదు. పాశ్చాత్యంలో వ్యాప్తిగాంచిన మతద్వేష నాస్తిక శక్తులతో శ్రీరామకృష్ణుల ఉదార ఆధ్యాత్మిక భావాలు తలపడి, ఎన్నడూ చరిత్ర చవిచూడని శాంతిశకానికి యావత్ప్రపంచంలో నాంది పలికాయి. శ్రీరామకృష్ణుల నిర్యాణానంతరం ఆ పని ఎంత చురుగ్గా సాగుతున్నదో మీరు గమనించలేదా? పూజ్య స్వామి వివేకానంద ద్వారా శ్రీరామకృష్ణుల భావాలు, బోధనలు అమెరికా, ఐరోపాలలో ప్రవేశించి ఈ స్వల్పకాలంలోనే చింతనాశీల ప్రపంచంలో ఎంత విప్లవాన్ని తీసుకువచ్చాయో మీరు గమనించలేదా? తిరుగులేని కాలగతిలో ఓటమిలేని ఈ భావరాశి సమస్త ప్రజానీకంలో, సకల మతాలలో, సమస్త సమాజాలలో తన ప్రభావాన్ని విస్తరింపచేసి ఒక అద్భుత విప్లవాన్ని తీసుకురావడం తథ్యం. దాని పురోగతిని నిరోధించే శక్తి ఎవరికి ఉంది? అసదృశ పావనత్వం, శుద్ధ సత్త్వ ప్రభావం, తీవ్ర తపోసాధనల ఫలితంగా వెలువడిన తేజోదీప్తమైన ఆ భావరాశి ప్రభావాన్ని ప్రతిఘటించి ఎవరు నిలవగలరు? శ్రీరామకృష్ణుల భావరాశిని ప్రచారం చేస్తున్న శిష్యులు కాలాంతరంలో కనిపించకపోవచ్చు. అనాసక్తతను అలవరచుకొని అనేకులు ఈ భావరాశి మూలాన్ని బహుశా అవగతం చేసుకోలేకపోవచ్చు. అయినప్పటికీ అనంత మహిమోపేతులూ, భావమయులూ అయిన శ్రీరామకృష్ణుల దివ్యభావరాశిని ప్రపంచంలోని యావన్మందీ తమ హృదయాలలో పదిలపరచుకొని, ఆ బోధనలను వారి జీవితాలలో అనుష్ఠించి పరస్పర విరుద్ధ మతాల సామరస్య పథాన్ని దేదీప్యమానం చేస్తారనడం ఖాయం.
4. శ్రీరామకృష్ణుల భావాల పరివ్యాప్తి
కాబట్టి వివిధ భారతీయ మత సంప్రదాయాలకు చెందిన సాధకులనేకులు శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి, ఆయన తోడ్పాటుతో యథార్థ ఆధ్యాత్మిక అనుభూతిని పొందడం గురించి మేం చెప్పిన ఉదంతాలను కేవలం కల్పిత కథలుగా ఎంచకండి. ముందుగా శ్రీరామకృష్ణులు నెలకొన్న భావముఖ స్థితి, ఆధ్యాత్మిక ప్రగాఢతను స్పష్టంగా అవగతం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆయన మనస్సులో అభివ్యక్తమైన దివ్యభావరాశి ఆ భావముఖ స్థితి నుండే ఉత్పన్నమైనదని గ్రహించండి. ఆ తరువాత ఇక్కడ వివరించిన సంఘటనలను లోతుగా తరచి పరికించండి. శ్రీరామకృష్ణులు కేంద్రంగా ఒక భావ ఉద్యమం ఎలా పెంపొందినదీ, మొదట పూర్వాచార పరాయణులలో, పిదప ఆధునిక విద్యావంతులలో, ఆ తరువాత యావత్ ప్రపంచంలో అది తన ప్రభావాన్ని విస్తృతం చేస్తూ, మానవచింతనా ధోరణిలో ఒక విప్లవంగా ఎలా రూపుదిద్దుకొంటూవున్నదో మీకు అర్థమౌతుంది.
5. దక్షిణేశ్వరానికి వచ్చిన అన్ని సంప్రదాయ సాధువులలోను, తీర్థయాత్రలో పరిచయమైన సాధువులలోను శ్రీరామకృష్ణుల భావాలూ, ఆదర్శాలూ మొట్టమొదట ప్రచారమైనాయి
వివిధ ప్రాచీన సంప్రదాయాలకు చెందిన సాధకులలో మొట్టమొదట శ్రీరామకృష్ణుల భావరాశి వ్యాప్తి గాంచింది. ఇది ఎలా జరిగిందో ఇంతకు మునుపే కొంతవరకు విశదీకరించాం. శ్రీరామకృష్ణులు ఒక ప్రత్యేక భావ మార్గంలో సాధనను అనుష్ఠించి దాన్లో పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకోగానే, ఆ మార్గావలంబులైన సాధకులు ఎందరో తమంతట తామే ఆయన వద్దకు రావడం తటస్థించేది; ఆయనలో తమ భావాల పరిపూర్ణ ఆదర్శాన్ని వారు కనుగొనేవారు. తరువాత తమ ఆధ్యాత్మిక పురోగతికి అవసరమైన సహాయం ఆయన నుండి పొంది, తమ దారిన తాము వెళ్ళిపోయేవారు. అంతేగాక మథుర్బాబు, శ్రద్ధాళువైన అతడి భార్య జగదంబాదాసిల విన్నపంతో శ్రీరామకృష్ణులు బృందావనం దాకా తీర్థయాత్ర చేశారు. కాశీ, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలో సాధువులకు, భక్తులకు కొదవ ఉండదు. కాబట్టి ఆ క్షేత్రాలలో వసిస్తూన్న సాధువు లెందరికో శ్రీరామకృష్ణులను కలుసుకొనే అవకాశం అప్పుడు లభించింది. ఇది మా ఊహ ఎంత మాత్రమూ కాదు; స్వయంగా శ్రీరామకృష్ణుల ముఖతా విన్న విషయమే. ఆ పుణ్యక్షేత్రాలలో వసించిన సుప్రసిద్ధ సాధకులు ఆయనను కలుసుకొని గురుభావంలోని ఆయన సహాయాన్ని పొంది, తరించారు. ఆయన ముఖతా మేం విన్న విషయాలను కొంతలో కొంత ఇక్కడ పొందుపరచడం అవసరంగా భావిస్తున్నాం.
6. వివిధ ఆధ్యాత్మిక స్థితుల, అనుభూతుల మూలంగా శ్రీరామకృష్ణుల అసాధారణ బోధనాశక్తి వికాసం
శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు: “(వైకుంఠపాళి ఆటలో) పావు అన్ని గళ్ళనూ దాటుకొంటూ వచ్చిన తరువాతే ‘పరమపద’ స్థానం చేరుతుంది. పాకీవాడి స్థితి నుండి చక్రవర్తి పదవి వరకు అన్ని స్థితుల అనుభవాలను చవిచూసి, వాటి నిరర్థకతను నిజంగా గుర్తించిన తరువాతే మనిషికి నిజమైన పరమహంస స్థితి కలుగుతుంది, యథార్థ బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. చరమ జ్ఞానం పొంది తరించగోరేవారు పాటించవలసిన నియతి ఇదే.” కాని నిజంగా జగద్గురువులు కాగోరే వారి గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు : “ఆత్మహత్య చేసుకోవడానికి గోటి కత్తెర చాలు; కాని ఇంకొకరిని (శత్రువును) చంపాలంటే కత్తి, డాలు వగైరా ఆయుధాలు అవసరం.” నిజమైన ఆధ్యాత్మిక గురువు కాగోరితే అన్ని రకాల అనుభవాలు చవిచూసి, జనసామాన్యం కంటే అత్యధిక శక్తిసంపన్నుడై ఉండాలి. శ్రీరామకృష్ణులు పదేపదే మాతో ఇంకా ఇలా చెప్పేవారు: “అవతారపురుషుడు, సిద్ధపురుషుడు, జీవుడు – ఈ ముగ్గురిలో తేడాను కల్పించేది వారిలోని శక్తి తారతమ్యం ఒక్కటి మాత్రమే.” ఉదాహరణకు ఈ వ్యవహార ప్రపంచంలో కూడా ఇలాగే జరగడం కద్దు. గొప్ప రాజనీతి కోవిదులైన బిస్మార్క్, గ్లాడ్‌స్టోన్ వంటి వారు గతంలోని, వర్తమానంలోని తమ దేశ సామాజిక రాజకీయ సంఘటనల మీద దృష్టి పరపి, సామాన్య ప్రజానీకం కంటే ఎంతో ముందుచూపు పెంపొందించుకొని గొప్పవారవడం మీరు గమనించలేదా? ఈ కారణం వలననే వాళ్ళు రాబోయే యాభై సంవత్సరాలలో ప్రస్తుత భావాలు, ఉద్యమాలు కొనితెచ్చే లబ్ధికర, వినాశకర ఫలితాలను అంచనా కట్టగలిగారు. కాలక్రమంలో దుష్ఫలితాలను కొనితెచ్చే హానికర భావాల, ఉద్యమాలను అరికట్టే ప్రయత్నం చేయగలిగారు. ఇదే నియమం, ఆధ్యాత్మికతలో కూడా వర్తిస్తుందని గ్రహించాలి. ప్రాచీన ద్రష్టల జీవితాల, బోధనల నుండి ఉత్పన్నమైన భావాల, ఉద్యమాల పనితీరుతెన్నులను జాగ్రత్తగా అధ్యయనంచేసి, సరైన అవగాహనకు వచ్చిన తదనంతరమే అవతార పురుషులు కొత్త ఉద్యమాలకు ఉపక్రమించాలి; ప్రాచీన ద్రష్టలు బోధించిన మూల భావాలు శతాబ్దాల కాలగతిలో ఏ మార్పులకు గురి అయినవో వీరు గుర్తించాలి; ఆ మార్పులు లోకుల జీవితాలపై ఎటువంటి మంచి లేక చెడు ప్రభావాన్ని తెచ్చాయో పరికించాలి; ఆ భావాలు ఏ మేరకు భ్రష్టుపట్టాయో తరచి చూడాలి. క్రొత్తగా ప్రచారం చేయబోయే నూతన భావాలు శతాబ్దాల కాలగతిలో ఏ పెడదారులకు దారితీస్తాయో ఊహించాలి; ప్రస్తుతం ప్రచారంలో ఉన్న భావాల కంటే ఈ నూతన భావాలు మరింత హాని కలిగిస్తాయేమోనని యోచించి గమనించాలి. అవతార పురుషులు ఈ విధమైన ఆలోచనా సరళితో అప్పుడు నెలకొన్న స్థితిని అంచనా వేయాలి. వారు ఈ అంశాలను కచ్చితంగా ఆకళింపు చేసుకోలేని పక్షంలో జనం ప్రస్తుత పరిస్థితిని, మార్పు తీసుకురావలసిన ఆవశ్యకతను వాళ్ళు ఎలా అవగతం చేసుకోగలరు? రోగాన్ని కచ్చితంగా నిర్ధారణ చేయలేనప్పుడు, రోగ ఉపశమనానికి ఔషధాన్ని ఎలా నిర్ణయించ గలుగుతారు? కాబట్టి ఈ అవతార పురుషులకు, ఆచార్యపురుషులకు తీవ్ర తపశ్చర్యాదులు అనుష్ఠించి ఔషధ నిర్ణయ శక్తిని సముపార్జించడంతో పాటు, లోకంలో నెలకొనివున్న వైవిధ్య పరిస్థితులను చవిచూసి, ఇతరులందరికంటే ఎంతో అనుభవం గడించవలసి ఉంటుంది. జీవితంలో ఎన్ని రకాల స్థితిగతులను శ్రీరామకృష్ణులు అనుభవించ వలసివచ్చిందో మీరు చూడలేదా? నిరుపేద కుటుంబంలో జన్మించి, చిన్నతనంలో ఆయన కటిక దారిద్ర్యం అనుభవించారు; దక్షిణేశ్వర కాళికాలయంలో పూజారి బాధ్యతను స్వీకరించారు; యౌవనంలో మరొకరి క్రింద పనిచేసే హీన స్థితిని గడపవలసి వచ్చింది; సాధనావస్థలో భగవత్సాక్షాత్కారానికై పరితపిస్తూ బంధువుల, అపరిచితుల అపహాస్యాలకూ, తిరస్కారాలకూ గురి కావలసి వచ్చింది. సాధనఘట్టం తొలి రోజులలో పిచ్చివాడిగా నిందింపబడ్డారు; ఈ దురవస్థ ఒక ప్రక్క ఇలా ఉండగా మరొక ప్రక్క ఐశ్వర్యవంతుడైన మథుర్బాబు వంటి వారినుండి రాచమర్యాదలూ మన్ననలూ పొందారు; విభిన్న సంప్రదాయాలకు చెందిన సాధకులు, భక్తులు ఆయనను సాక్షాత్తు భగవదవతారంగా పరిగణించి, ఆరాధించారు. ఈ విధంగా పరస్పర విరుద్ధమైన ఈ అనుభవాలను చవిచూడడంలో ఆయన స్థితప్రజ్ఞులై విరాజిల్లారు.
అనన్యమైన వారి భగవత్ప్రేమ, భగవత్సాక్షాత్కారం కోసం అసాధారణ కఠోర తపశ్చర్యాదులలో నిమగ్నం చేసి, ఒకవైపు యోగజనితమైన అతీంద్రియ సూక్ష్మ దృష్టిని ఆయనలో పూర్తిగా తెరిపించింది. మరో వైపు సంసారంలోని నానా అవస్థలతోను ఆయనకు పరిచయం గావించింది. అలాగే బాహ్య ప్రపంచంలోని, జనసామాన్యంలోని నానా అవస్థలను చక్కగా ఆకళింపుచేసుకొనే శక్తిని జనింపచేసి, వారితో చక్కగా వ్యవహరించగలిగే కౌశలాన్ని సంతరింపచేసింది. అలాగే జనసామాన్యం పట్ల, సుఖదుఃఖాల పట్ల సానుభూతిపరులుగా ఒనర్చింది. బాహ్యాభ్యంతరమైన ఆ నానా అవస్థల గుండా శ్రీరామకృష్ణుల గురుభావం లేక ఆచార్యభావం నానాటికీ మరింతగా వికసిస్తూ, అభివ్యక్తం కావడమే ఇందుకు కారణం.
7. జనసామాన్యం స్థితిగతులను అవగతం చేసుకోవడంలో తీర్థయాత్రలు దోహదపడడం
పైన వివరించిన ఫలితాలు శ్రీరామకృష్ణుల జీవితంలో ఆయన చేసిన తీర్థయాత్రల వలన కలిగాయనడంలో సందేహానికి తావులేదు. జనసామాన్యం ఆధ్యాత్మిక స్థితులను గురించి తెలుసుకోవలసిన అవసరం యుగాచార్యులైన శ్రీరామ కృష్ణులకు కలిగింది. మథుర్ బాబుతో కలిసి ఆయన చేసిన తీర్థయాత్రల ద్వారా ఈ అవసరం చాలా వరకు తీరిందనే చెప్పాలి. శ్రీరామకృష్ణుల జ్ఞాననేత్రం ఆంతరిక జగత్తులోని మాయావరణాలన్నింటిని ఛేదించి అందరిలో నిహితంగా ఉన్న ఆ ‘ఏకమేవాద్వితీయం’, ఆ బ్రహ్మవస్తువును, ఆ అఖండ సచ్చిదానంద స్వరూపుణ్ణి సదా ప్రత్యక్షంగా దర్శించగలిగేది, స్పర్శించగలిగేది. అలాగే అదే నేత్రం బాహ్యప్రపంచంలో దైనందిన జీవితంలో లౌకికుల ఒకటి రెండు మాటలు వినీ వినగానే వాళ్ళ మనోవైఖరిని చూడగలిగేది. అంతేగాక నిత్యం జరుగుతున్న కొన్ని సంఘటనలను గమనించగానే సామాజిక పరిస్థితులను, దేశ స్థితిగతులను ఆకళింపు చేసుకోగలిగేది. పై వర్ణనలు శ్రీరామకృష్ణుల సాధారణ బాహ్యచైతన్య స్థితికే వర్తిస్తాయని గ్రహించాలి. యోగశక్తితో ఆయన ఉన్నత భూములను అధిరోహించినప్పుడు ఆయన దివ్యదృష్టి సంపన్నులయ్యేవారు. ఆ దివ్యదృష్టితో ఆయన వ్యక్తి లేక సమాజ లేక దేశ స్థితిని ప్రత్యక్షంగా చూడగలిగేవారు; దానితోపాటు ఆ రుగ్మతలు తొలగిపోయే మార్గాన్ని రూఢిపరచుకొనేవారు. అటువంటి దివ్యావస్థలో సామాన్యులలా పరిస్థితులను పరికించి, ఇతరత్రా పోల్చి, యోచించి ఏదైనా నిర్ణయానికి వచ్చే అగత్యం ఆయనకు ఉండేదికాదు.
దివ్యపురుషులైన శ్రీరామకృష్ణులు సాధారణ బాహ్యదృష్టి, అసాధారణ యోగదృష్టి సహాయంతో అన్ని విషయాల తత్త్వనిరూపణకు వస్తూవుండడం మేం గమనించాం. కాబట్టే ఆయనలోని దివ్య, మానవ భావాలను పాఠకులకు విశదీకరించకపోతే, ఆ దివ్యపురుషుని సమగ్ర స్వరూపాన్ని పాఠకులకు అందించని వారమే అవుతాం. అందువలననే ఆయన జీవితాన్ని ఈ రెండు, దివ్య మానవ భావాల వెలుగులో అధ్యయనం చేయడానికి ఈ పుటలలో ప్రయత్నిస్తున్నాం.
8. మహాపురుషుల తీర్థయాత్రల గురించి శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి
శాస్త్రదృష్టితో పరికించినప్పుడు శ్రీరామకృష్ణుల తీర్థయాత్రకు మరొక కారణం తెలియవస్తుంది. భక్తిజ్ఞానాలలో పరిపూర్ణతను సంతరించుకొన్న సాధుపుంగవులు పుణ్యక్షేత్రాలను సందర్శించడం, ఆ క్షేత్ర పావనత్వాన్ని ఇనుమడింప చేయడానికే అని శాస్త్రాలు వచిస్తున్నాయి. సాధుపుంగవులు పుణ్యక్షేత్రాలకు వచ్చి, విశిష్ట భగవద్దర్శనార్థం వ్యాకులతతో అక్కడ వసించి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు భగవంతుని విశిష్ట భావాల నూతన అభివ్యక్తీకరణలను వదలిపోతారు; లేదా అక్కడ అప్పటికే నెలకొన్న అభివ్యక్తీకరణలను మరింత తేజోవంతం చేసి వెళతారు. కనుక ఇతరులు ఆ పుణ్యక్షేత్రాల సందర్శనానికి వచ్చినప్పుడు ఆయా భగవద్భావాలను కించిత్తు సులభంగా అనుభూతం చేసుకోగలుగుతారు. సామాన్య సాధుపుంగవుల సందర్శనం చేతనే పుణ్యక్షేత్రాల పావనత్వం ఇంతగా ఇనుమడిస్తున్నప్పుడు, శ్రీరామకృష్ణుల వంటి అవతార పురుషుల పుణ్యక్షేత్రాల సందర్శన ప్రభావం ఎంత శక్తిమంతమై ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? అనేక సందర్భాలలో పుణ్యక్షేత్రాల గురించి పైన తెలిపిన విషయాలను అతి సరళంగా శ్రీరామకృష్ణులు మాకు విశదీకరించేవారు. ఆయన ఇలా చెప్పేవారు: “నాయనలారా! భగవత్ సాక్షాత్కారార్థం ఏ ప్రదేశంలో జనులు సుదీర్ఘకాలం జపం, ధ్యానం, ప్రార్థన, ఉపాసన, తపస్సు మొదలైనవి అనుష్ఠించారో, ఆ ప్రదేశంలో భగవంతుని అభివ్యక్తీకరణ విశేషంగా ఉంటుందని కచ్చితంగా తెలుసుకోండి. భగవంతుని పట్ల గల భక్తి కారణంగా వారి భగవత్ చింతనలు, ఒక రకంగా చెప్పాలంటే ఘనీభవిస్తాయి. అందుకే భగవద్భావ ఉద్దీపన, భగవద్దర్శనం సులభంగా పొందతరమౌతుంది. భగవత్ సాక్షాత్కారార్థం యుగాల పర్యంతం అసంఖ్యాక సాధువులు, భక్తులు, సిద్ధపురుషులు ఈ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూంటారు. సమస్త కోర్కెలను విడనాడి హృదయ పూర్వకంగా భగవంతుణ్ణి అక్కడ ప్రార్థిస్తూ ఉంటారు. సర్వత్రా భగవంతుని ఉనికి సమానంగా ఉన్నప్పటికీ ఆ స్థలాలలో విశిష్టమైన భగవత్ అభివ్యక్తీకరణ పాదుకొని ఉంటుందనడం నిస్సందేహం. నేలపై ఎక్కడ త్రవ్వినా నీరు లభిస్తుంది. కాని బావులు, గుంటలు, చెరువులు మొదలైన చోట్ల త్రవ్వనవసరం లేకుండానే నీరు లభిస్తుంది కదా! అదే విధంగా భగవంతుని అభివ్యక్తీకరణ విషయం పుణ్యక్షేత్రాలకు వర్తిస్తుంది.
9. పుణ్యక్షేత్ర సందర్శనానంతరం ‘నెమరు వేసుకోవడం’ గురించి ఉపదేశం
భగవంతుడు విశేషంగా అభివ్యక్తమయ్యే పుణ్యక్షేత్రాలను సందర్శించి తిరిగి వచ్చాక ‘నెమరు వేసుకోవాలి’ అని చెబుతూ “పశువులు కడుపు నింపుకొన్న తదనంతరం, నిశ్చింతగా ఒక చోట కూర్చుని తాపీగా ఆహారాన్ని నెమరువేస్తాయి. అలాగే దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించిన తరువాత, ఏకాంత ప్రదేశంలో కూర్చుని, ఆ పవిత్ర ప్రదేశాలలో మదిలో మెదలిన పవిత్ర భావాలను నెమరు వేసుకొని, వాటిలో పూర్తిగా లీనమైపోవాలి. పుణ్యక్షేత్రాలను సందర్శించి రాగానే రూపరసాది లౌకిక విషయాలను మనస్సులోకి రానివ్వకూడదు. అలా చేస్తే ఆ పుణ్యక్షేత్రాలలో సంతరించుకొన్న భగవద్భావాలు మనస్సు మీద శాశ్వత సత్ఫలితాలను ఉత్పన్నం చేయవు” అని శ్రీరామకృష్ణులు తెలియజేసేవారు.
ఒక సందర్భంలో శ్రీరామకృష్ణులతో పాటు మాలో కొందరు జగన్మాతను సేవించడం కోసం కాళీఘాట్‌కు వెళ్ళాం. పీఠస్థానం కావడం వలన కాళీఘాట్‌లో జగజ్జనని అభివ్యక్తీకరణ విశేషంగా ఉంటుంది. ఆ అభివ్యక్తీకరణ, శ్రీరామకృష్ణుల మనశ్శరీరాలలో జగజ్జనని సజీవ అభివ్యక్తీకరణతో ఏకమై భక్తుల హృదయాలలో మహదానందాన్ని కలిగించాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాళీఘాట్ నుండి తిరిగి వచ్చేటప్పుడు ఒక భక్తుడు అనివార్య కారణాల వలన ఆ నాటి రాత్రి అత్తగారి ఇంట్లో గడపవలసివచ్చింది. మర్నాడు అతడు గురుదేవుల వద్దకు వచ్చినప్పుడు, “గతరాత్రి ఎక్కడ గడిపావు?” అని ఆయన అడిగారు. అతడు రాత్రి అత్తగారి ఇంట్లో గడిపాడని తెలుసుకోగానే, ఆయన ఇలా అన్నారు : “అదేమిటి? జగజ్జననిని సేవించుకొని వచ్చావు కదా! జగజ్జనని దర్శనాన్ని, ఆమె గురించిన భావాలను నెమరువేసుకొంటూ గడపడానికి బదులుగా లౌకికుల మాదిరి రాత్రంతా అత్తగారి ఇంట్లో గడిపి వచ్చావే? దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు కలిగే భగవద్భావాలను తప్పక నెమరు వేసుకొంటూ ఉండాలి. అలా చేయకపోతే ఆ భగవద్భావాలు మనస్సులో ఎలా పాదుకొని ఉంటాయి?” అని అన్నారు.
10. మనస్సులో భక్తిభావం జనించినప్పుడే పుణ్యక్షేత్రాలు దర్శించాలి
ముందుగానే భగవద్భక్తిని, భగవద్భావాలను పెంపొందించుకోకుండా పుణ్యక్షేత్రాలను సందర్శించినా విశేష ఫలితం లభించదని శ్రీరామకృష్ణులు అనేక సందర్భాలలో మాకు చెబుతూ ఉండేవారు. తీర్థయాత్రలు చేసి రావాలన్న మా ఆకాంక్షను ఆయనతో విభిన్న సమయాలలో వ్యక్తం చేసేవారం. అప్పుడు ఆయన ఆప్యాయంగా మాతో ఇలా చెప్పేవారు: “నాయనలారా, ఇక్కడ (అంటే హృదయంలో భక్తి) ఉన్నవారికి అక్కడా ఉంటుంది. ఇక్కడ (హృదయంలో) ఏమీ లేనివారికి అక్కడా మృగ్యమే.” ఇంకా ఆయన ఇలా కొనసాగించేవారు: “ఎవరి హృదయంలో భక్తి భావం సహజంగా పాదుకొని ఉంటుందో, పుణ్యక్షేత్రాల సందర్శనతో ఆ భక్తిభావం మరింత ఇనుమడిస్తుంది. కాని భక్తిభావశూన్యులు పుణ్యక్షేత్ర సేవనంలో ఎటువంటి ప్రత్యేక లబ్ధినీ పొందలేరు. ఫలానావారి అబ్బాయి కాశీకో లేక మరో పుణ్యక్షేత్రానికో పారిపోయాడని తరచు వింటూ ఉంటాం. కొద్దికాలంలోనే ఉద్యోగం సంపాదించుకొన్నాడని ఉత్తరం కూడా వ్రాసి కొంత డబ్బు కూడా పంపాడని వినవస్తుంది. అనేకులు పుణ్యక్షేత్రాలలో నివసించాలనే తపనతో అక్కడకు వెళతారు; కాని అక్కడకు వెళ్ళగానే వ్యాపారాదులు ప్రారంభిస్తారు. మథుర్బాబుతో కలిసి నేను భారతదేశ వాయవ్య ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నవే, అక్కడా ఉన్నాయి, ఎలాంటి తారతమ్యమూ కనిపించలేదు. అన్నిచోట్ల ప్రపంచం ఒకే తీరులోనే ఉంది. అదే మామిడి చెట్లు, చింతచెట్లు, వెదురు పొదలు ఇక్కడ ఉన్నట్లే అక్కడా అలాగే ఉన్నాయి. అదంతా పరికించి హృదయ్‌తో ఇలా అన్నాను: ‘ఒరే హృదూ! ఏం చూడాలని ఇక్కడకు వచ్చాను? అక్కడ ఏం ఉందో ఇక్కడా అదే ఉంది. కనబడుతున్న వ్యత్యాసం ఒక్కటే. బయలు ప్రదేశాలలో కానవచ్చే విసర్జనను బట్టి చూస్తే ఈ ప్రాంతస్థులకు అక్కడివారి కంటే జీర్ణశక్తి ఎక్కువని తెలియవస్తోంది.’”
11. బుద్ధగయకు తీర్థయాత్ర చేయగోరిన స్వామి వివేకానందకు శ్రీరామకృష్ణుల ఉపదేశం
కంఠవ్రణంతో బాధపడుతున్న శ్రీరామకృష్ణులను చికిత్స కోసం భక్తులు మొదట శ్యాంపుకూర్లోని ఒక బాడుగ ఇంటికీ, తరువాత కాశీపూర్ ఉద్యాన గృహానికీ తరలించారని ముందే చెప్పాం. కాశీపూర్ ఉద్యాన గృహానికి శ్రీరామకృష్ణులను తరలించిన కొద్ది రోజులకే స్వామి వివేకానంద ఎవరికీ చెప్పకుండా ఇద్దరు సోదర శిష్యులతో పాటు బుద్ధగయకు వెళ్ళారు. ఆ సమయంలో బుద్ధుడి అసాధారణ వైరాగ్యం, తపశ్చర్యలతో కూడిన ఆయన జీవితం గురించి రేయింబవళ్ళు మేం చర్చించుకొనేవారం. ఉద్యానగృహం క్రింది అంతస్తులో దక్షిణం వైపు ఒక చిన్నగదిలో మేం ఉండేవాళ్ళం. ఆ గది గోడమీద బుద్ధుని దృఢసంకల్పాన్ని వ్యక్తం చేసే లలితవిస్తారంలోని ఈ క్రింది శ్లోకాన్ని రాసాం:
ఇహాసనే శుష్యతు మే శరీరం త్వగస్థిమాంసం ప్రలయంచ యాతు ।
అప్రాప్యబోధిం బహుకల్ప దుర్లభాం నైవాసనాత్ కాయమతశ్చలిష్యతే ॥
[ఈ శరీరం, ఆసనం మీదనే శుష్కించిపోవుగాక; ఎముకలు, మాంసంతో కూడిన ఈ చర్మం నశించిపోవుగాక; యుగాల పర్యంతం సాధన చేసినా దుర్లభమైన ఆ సత్యసాక్షాత్కారం (జ్ఞానోదయం) లభించనంత వరకు ఈ (నా) శరీరం ఈ ఆసనం నుండి కదలదు.* ]
ఈ వచనాలే మా కళ్ళముందు రేయింబవళ్ళు మెదలుతున్నాయి. భగవత్ సాక్షాత్కారార్థం మా జీవితాలను పరిత్యజించాలని ఈ వచనాలు మాకు పదేపదే జ్ఞాపకం చేయసాగాయి.
బుద్ధుడి వైరాగ్యం గురించి ఎడతెగని చర్చల మధ్య స్వామీజీ హఠాత్తుగా బుద్ధగయకు వెళ్ళిపోయాడు. ఎక్కడకు వెళుతున్నాడో, ఎప్పుడు తిరిగివస్తాడో ఎవరికీ చెప్పలేదు. బహుశా ఆయన ఇక సంసారంలోకి తిరిగి రాడేమోననీ, మళ్ళీ మేం ఆయనను చూడలేమేమోననీ మాకు అనిపించింది. కాషాయాంబరాలు ధరించి స్వామీజీ బుద్ధగయకు వెళ్ళాడని తదనంతరం మాకు తెలియవచ్చింది. కనీసం ఒక గంట సేపయినా ఆయన ఎడబాటును భరించలేనంతగా మా మనస్సులను ఆయన ఆకట్టుకొన్నారు. కాబట్టి మేం ఎంతో అశాంతికి గురి అయ్యాం; ఆయన వద్దకు, బుద్ధగయకు వెళ్ళాలనే బలీయమైన కోర్కె మాలో చెలరేగింది. క్రమంగా ఈ సంగతి శ్రీరామకృష్ణుల చెవిన పడింది. మాలో ఒకరు స్వామీజీ వద్దకు పోవాలని సంకల్పించుకోవడం తెలిసి స్వామి బ్రహ్మానంద ఒక రోజు ఈ విషయాన్ని గురుదేవులకు విన్నవించాడు. అందుమీదట శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు : “ఎందుకు కలత చెందుతారు? నరేంద్రుడు ఎక్కడకు పోతాడు? ఎంతకాలం దూరంగా ఉండగలడు? త్వరలోనే అతడు తిరిగి రావడం మీరు చూస్తారు కదా!” ఆ తరువాత నవ్వుతూ ఇలా చెప్పారు : “ప్రపంచం యావత్తు ఆధ్యాత్మికత కోసం అన్వేషించినా మీకు ఏమీ (అంటే నిజమైన ఆధ్యాత్మికత) లభించదు. అక్కడ ఉన్నదంతా, ఇక్కడ (తమ శరీరాన్ని చూపుతూ) కూడా ఉంది.” ‘ఇక్కడ’ అనే మాటను శ్రీరామకృష్ణులు రెండు అర్థాలలో వాడినట్లు తెలుస్తోంది. మొదటి అర్థం – ఆ కాలంలో తనలో అభివ్యక్తమయ్యే ఆధ్యాత్మికశక్తి కంటే మించిన ఆధ్యాత్మిక శక్తి అభివ్యక్తీకరణ మరెక్కడా ఎవరూ కనుగొనలేరని సూచిస్తుంది. రెండవ అర్థం – భగవంతుని ఉనికి ప్రతి ఒక్కరిలోను ఉంది; భగవంతుడి పట్ల భక్త్యనురాగాలను తమ హృదయాలలో జాగృతం చేసుకోలేని వారు, బాహ్యంగా వివిధ ప్రదేశాలకు తీర్థయాత్రలు చేసివచ్చినా ఏ లాభమూ ఉండదని సూచిస్తుంది. శ్రీరామకృష్ణుల వచనాలలో రెండు, అంతకంటే ఎక్కువ అర్థాలు అంతర్నిహితంగా ఇమిడి ఉండడం కద్దు. ఒక్క శ్రీరామకృష్ణుల వచనాలలోనే కాదు, యుగయుగాలుగా ఈ ఇలలో అవతరించిన అవతార పురుషుల వచనాలలో ఎన్నో భావార్థాలు ఇమిడి ఉండడం చూడవచ్చు. జన సామాన్యం తమ వ్యక్తిగత ఇష్టం మేరకు లేదా పూర్వ సంస్కారాలను అనుసరించి అవతార పురుషుల వచనాలలోని ఏదో ఒక అర్థాన్ని గ్రహిస్తారు. శ్రీరామకృష్ణులు ఏ వ్యక్తిని ఉద్దేశించి పై మాటలు చెప్పారో ఆ వ్యక్తి ఆ మాటలలోని మొదటి అర్థాన్ని గ్రహించి, ఆధ్యాత్మిక అభివ్యక్తీకరణ శ్రీరామకృష్ణులలో కానవచ్చినంత మేరకు మరెక్కడా కానరాదని దృఢంగా విశ్వసించి, నిశ్చింతగా శ్రీరామకృష్ణుల వద్దే ఉండిపోయాడు. కొన్ని రోజులలోనే స్వామి వివేకానంద కాశీపూర్‌కు తిరిగి వచ్చేశారు.
12. ఎవరికి ఇక్కడ ఉన్నదో, వారికి అక్కడా ఉన్నది
శ్రీరామకృష్ణుల మహాసమాధికి కొద్దికాలం ముందు, శ్రద్ధాళువైన ఒక భక్తురాలు బృందావనానికి వెళ్ళి కొంతకాలం అక్కడ తపశ్చర్యాదులలో గడిపి రావాలనే తన ఆకాంక్షను గురుదేవులకు వ్యక్తం చేసింది. ఆమె కోర్కె వినగానే శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు : “ఓహ్! ఎందుకు అక్కడకు వెళ్ళాలి? అక్కడ ఏం చేస్తావు? ఇక్కడ (అంటే భక్తి) ఉన్నవారికి, అక్కడా ఉంటుంది. ఇక్కడ లేనివారికి అక్కడా ఉండదు.” బృందావనం పట్ల ఉన్న మక్కువ కారణంగా ఆ భక్తురాలు శ్రీరామకృష్ణుల మాటలు పట్టించుకోకుండా, ఆయన వద్ద సెలవు పుచ్చుకొని బృందావనానికి వెళ్ళింది. ఆ తీర్థయాత్ర పర్యటనలో తాను ఏమంత లబ్ధి పొందలేదని ఆమే మాకు తదనంతరం తెలిపింది. అంతేకాక చివరి రోజులలో శ్రీరామకృష్ణుల సాన్నిధ్యంలో ఉండే భాగ్యానికి కూడా ఆమె నోచుకోలేకపోయింది. ఆమె బృందావనానికి వెళ్ళిన కొద్దికాలానికే శ్రీరామకృష్ణులు మహాసమాధి పొందారు.
13. శ్రీరామకృష్ణుల విశ్వాసం: తీర్థయాత్రలు
మూర్తీభవించిన సమస్త ఆధ్యాత్మిక భావాల ప్రతిరూపులైన శ్రీరామకృష్ణులు ఒక విశిష్ట మనోవైఖరితో తాను తీర్థయాత్రలు చేశానని అనేక పర్యాయాలు మాతో చెప్పివున్నారు. ఆయన ఇలా చెప్పేవారు : “కాశీలో ప్రతి ఒక్కరూ ఇరవై నాలుగు గంటలూ శివుణ్ణి ధ్యానిస్తూ సమాధిమగ్నులై ఉంటారని అనుకొన్నాను; బృందావనంలో యావన్మందీ గోవిందుని సాంగత్యంలో భక్తి, దివ్యప్రేమలలో లీనమై ఉంటారని భావించాను. కాని నేను ఆ ప్రదేశాలకు వెళ్ళి చూసినప్పుడు అంతా తద్విరుద్ధంగానే కనిపించింది.” ఐదేళ్ళ బాలునిలా ప్రతి విషయాన్ని విశ్వసించే మనస్తత్వం గలవారు శ్రీరామకృష్ణులు. మేం చిన్నతనం నుండి ప్రతి వ్యక్తినీ, ప్రతి విషయాన్నీ సంశయాత్మక దృక్పథంతో చూడడం అలవాటు చేసుకొన్న వాళ్ళం. మా సంశయాత్మక మనస్సులలో ఆ రకం సరళ విశ్వాసం ఎలా చోటుచేసుకొంటుంది? ఎవరైనా సరళ మనస్తత్త్వంతో ప్రతి దానిని విశ్వసించడం కనుక మన కళ్ళబడితే అతడి నొక మూర్ఖుడిగా, బుద్ధిహీనుడిగా భావిస్తాం. ఆయన ఇంకా ఇలా కొనసాగించారు: “నాయనలారా! తపశ్చర్యలు, సాధనలు అనుష్ఠించిన ఫలితంగా వ్యక్తులు నిష్కపటులూ, ఉదారులుగా మారతారు. నిష్కాపట్యం సంతరించుకోకుండా భగవత్సాక్షాత్కారం పొందలేరు. ఇటువంటి నిష్కాపట్యం, సరళ విశ్వాసం ఉన్న వారికే భగవంతుడు తన యథార్థ నైజాన్ని అభివ్యక్తం చేస్తాడు.” పై విషయాన్ని మొట్టమొదటిసారిగా శ్రీరామకృష్ణుల నుండి మేం విన్నాం. సరళ విశ్వాసం ఉండాలంటే మూర్ఖులు కావాలేమోనని కొందరు అపార్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన ఇలా అనేవారు: “నువ్వు భక్తుడివి కావాలి, నిజమే; అలాగని మూర్ఖుడవు ఎందుకు కావాలి?” మళ్ళీ ఆయన ఇలా కొనసాగించేవారు : “నీ మనస్సులో ఏది నిత్యమో ఏది అనిత్యమో, ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో సదా విచారణ చేస్తూ ఉండాలి. అలా చేస్తూచేస్తూ చివరకు అనిత్యమైన వాటిని విడిచిపెట్టి, నిత్యమైన వాటి మీద మనస్సును ఏకాగ్రం చేయాలి” అని బోధించేవారు.
14. శ్రీరామకృష్ణులు, స్వామి యోగానందకు చేసిన ఉద్బోధ – భక్తుడవవు, మూర్ఖుడివి కాబోకు
శ్రీరామకృష్ణుల ఈ రెండు వచనాల సామరస్యాన్ని గ్రహించలేక అప్పుడప్పుడు ఆయన వద్ద ఎన్నోసార్లు చీవాట్లు తిన్నాం. అప్పటికి స్వామి యోగానంద ఇంకా సన్న్యాసం పుచ్చుకోలేదు. ఒక సందర్భంలో ఇంటికి ఒక మూకుడు కావలసి వచ్చి దానిని కొనడానికి బారానగర్ బజారుకు వెళ్ళాడు. అక్కడ అంగడి వాడికి అధార్మికంగా ప్రవర్తించడం వల్ల వాటిల్లే అనర్థాలను గుర్తుచేసి, “చూడవోయ్, వస్తువుకు న్యాయమైన ధర పుచ్చుకొని, మంచి మూకుడు ఇవ్వు. చిల్లులు పగుళ్ళు ఏవీ లేకుండా చూడు” అని అన్నారు. అందుకు అంగడివాడు, “నిశ్చింతగా ఉండండి, మంచి మూకుడు ఇస్తాను” అని చెప్పి, తనే ఒక మూకుడు ఎంపిక చేసి ఇచ్చాడు. స్వామి యోగానంద అంగడివాడి మాటలు నమ్మి, మూకుణ్ణి పరీక్షించకుండానే తీసుకున్నారు. కాని దక్షిణేశ్వరానికి వచ్చాక చూస్తే మూకుడులో పగుళ్ళు కనిపించాయి. ఈ విషయం శ్రీరామకృష్ణులకు తెలిసింది. అప్పుడాయన ఇలా అన్నారు : “అదేమిటి? పరీక్షించకుండా వస్తువును ఎలా కొనుక్కొని వచ్చావు? అంగడివాడు వ్యాపారం చేయడానికే కూర్చున్నాడుగాని ధార్మికతకు కంకణం కట్టుకొని కూర్చోలేదే? అతడి మాటలు నమ్మి ఎందుకు మోసపోయి వచ్చావు? నువ్వు నిస్సందేహంగా భక్తుడివే; అందుకని మూర్ఖునిలా వ్యవహరించవచ్చా? లోకుల చేతుల్లో నువ్వు మోసపోవాలా? ముందు ఇచ్చిన వస్తువు మంచిదో కాదో పరీక్షించి ఆ తరువాత అంగడివాడికి పైకం చెల్లించు. వస్తువు పుచ్చుకొనే ముందు తూకం సరిగా ఉందో లేదో చూడు. అలాగే కొన్ని వస్తువులు కొనుగోలు చేసినప్పుడు కొసరు ఇవ్వడం కద్దు. కొసరు పుచ్చుకోకుండా రాబోకు” అంటూ ఇలా లౌకిక విషయాల్లో కూడా హెచ్చరించేవారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో పేర్కొనవచ్చు. వాటిని ఇక్కడ పేర్కొనడం అప్రస్తుతం. అద్భుత నిరాడంబరతతో పాటు అసాధారణ వ్యవహారదక్షత శ్రీరామకృష్ణులలో ఎలా మేళవించి ఉన్నాయో తెలియజేయడానికే ఈ విషయం ప్రస్తావించాం.
15. పుణ్యక్షేత్రాలలో అపవిత్రత
ఆ తీర్థయాత్రలో మథుర్బాబు లక్ష రూపాయల కంటే ఎక్కువే ఖర్చు పెట్టాడని శ్రీరామకృష్ణుల నుండి మేం విన్నాం. కాశీకి రాగానే బ్రాహ్మణ పండితులను ఆహ్వానించి మథుర్ వారికి సంతర్పణ చేశాడు. ఆ తరువాత ఒక రోజు బ్రాహ్మణులను వారి కుటుంబాలతో సహా ఆహ్వానించి, తృప్తిగా వారికి భోజనం పెట్టించి ప్రతి ఒక్కరికి ఒక వస్త్రం, ఒక రూపాయి దక్షిణగా సమర్పించాడు. బృందావనం సందర్శించి తిరిగి వచ్చాక మళ్ళీ శ్రీరామకృష్ణుల ఆదేశానుసారం ఒకరోజు మథుర్ ‘కల్పవృక్ష’ మైనాడు. అడిగిన వారందరికీ పాత్రలు, వస్త్రాలు, దుప్పట్లు, చెప్పులు ఇత్యాదులు ఇచ్చాడు. సంతర్పణ చేసిన మొదటి రోజే బ్రాహ్మణులు తమలో తాము కలహించుకోవడం, గోలచేయడం, చివరకు కొట్లాడుకోవడం వరకూ పోవడం చూసి శ్రీరామకృష్ణులు ఎంతో కలత చెందారు. ఇతర ప్రాంతాలలో మాదిరి కాశీలో కూడా జనం కామినీకాంచనాల పట్ల ఎంతో అనురక్తి కలిగి ఉండడం చూసి ఆయన నిరాశానిస్పృహలకు లోనయ్యారు. కంట తడిపెట్టుకొని, “అమ్మా, నన్నెందుకు ఇక్కడకు తీసుకువచ్చావు? దక్షిణేశ్వరంలో ఆనందంగానే ఉన్నాను కదా!” అని జగజ్జననితో మొరపెట్టుకొన్నారు.
16. ‘స్వర్ణమయ కాశీని’ శ్రీరామకృష్ణులు దర్శించడం
పుణ్యక్షేత్రాలలో నివసించే జనంలో సైతం విషయాసక్తి తీవ్రస్థాయిలో ఉండడం చూసి శ్రీరామకృష్ణులు ఎంతో బాధపడ్డారు. అయినప్పటికీ ఆయనకు ఆ క్షేత్రాలలో అసాధారణ దివ్యదర్శనాలు, అనుభూతులు కలిగాయి. దానితో శివుడి మహిమ పట్ల, కాశీక్షేత్ర మాహాత్మ్యం పట్ల ఆయన విశ్వాసం మరింత ఇనుమడించింది. పడవ మీదుగా కాశీలో ప్రవేశించినప్పటి నుండి కాశీనగరం నిజానికి సువర్ణ నిర్మితమనీ, మన్ను, రాళ్ళతో అక్కడ ఏదీ నిర్మితం కాలేదనీ ఆయనకు యోగదృష్టిలో గోచరించింది. వాస్తవానికి యుగయుగాంతరాల నుండి విశ్వనాథుణ్ణి ఆరాధిస్తూ వస్తున్న సాధువుల, భక్తుల అమూల్య స్వర్ణమయోజ్జ్వల ఆధ్యాత్మిక భావరాశులు కుప్పలు కుప్పలుగా ప్రోగై, ఘనీభవించి ప్రస్తుత కాశీనగర రూపాన్ని సంతరించుకొన్నట్లుగా తోస్తున్నది. తేజోవిరాజమానమై ప్రకాశిస్తూ మూర్తీభవించిన ఆ ఆధ్యాత్మిక భావోద్వేగాలే కాశీక్షేత్ర అసలైన స్వరూపం. ఇక బాహ్యంగా కానవస్తున్నది దాని నీడ మాత్రమే.
17. ‘సువర్ణమయ’ కాశీగా పేర్కొనడానికి కారణం
స్థూలదృష్టితో పరికించినా కాశీక్షేత్రం ‘సువర్ణమయం’ అని ఎందుకు పేర్కొనబడుతూన్నదో అర్థం చేసుకోవడం ఏమంత కష్టం కాదు. గంగాతీరాన రెండు మైళ్ళ మేరకు విస్తరించిన కాశీ నగరం అసంఖ్యాక దేవాలయాలు, పెద్ద భవనాలు, విశాలమైన మెట్లతో నిర్మితమైన స్నానఘట్టాలు, చక్కని కాలిబాటలు, దర్వాజాలు, ఉద్యాన గృహాలు, మఠాలు, కాలువలు, కోనేరులతో, సాధువులకు, విద్యార్థులకు, పేదలకు ఉద్దేశించిన అన్నసత్రాలతో అలరారుతూ ఉంటుంది. ఈ వైభవాన్ని చూసి అతి ప్రాచీన కాలం నుండి భారతదేశ అన్ని ప్రాంతాల వారు ఈ శివపురిని నిర్మింప ఎడతెగని సువర్ణవర్షం కురిపించి ఉంటారని ఎవరు మాత్రం అంగీకరించకుండా ఉండగలరు? వంద కోట్ల భారతీయుల భక్తిప్రపత్తులు ఏకమై యుగాల పర్యంతం ప్రయత్నలోపం లేకుండా ఈ సుందర పుణ్యక్షేత్ర బాహ్య అభివ్యక్తీకరణకు దోహదం చేసివుంటాయనుకొని ఎవరు మాత్రం ఆశ్చర్యపోరు? ప్రబలమైన ఆధ్యాత్మిక భావప్రవాహాన్ని చూసి ఎవరు మాత్రం ముగ్ధులు కాకుండా ఉండగలరు? దాని మూలస్థానాన్ని కనుగొనే ప్రయత్నంలో ఎవరుమాత్రం మైమరచిపోరు? మహా మహిమోపేతమైన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి, భక్తితో హృదయం ద్రవించిపోగా, ఆశ్చర్య చకితులై, వినమ్రులై ఇలా అనకుండా ఎవరు ఉండగలరు? “నిజానికి ఇదొక అసదృశ సృష్టి. ఇది మానవనిర్మితం మాత్రం కాదు. నిస్సహాయుడైన జీవుడి దుర్దశ చూసి దీనవత్సలుడూ, ఆర్తత్రాణ పరాయణుడూ అయిన ఆ భగవంతుడి అనంత కరుణయే దీని ఉనికికి కారణం.” ఆ పరమేశ్వరుని శక్తే సాక్షాత్తు అన్నపూర్ణా దేవిగా వెలసి, జీవుల స్థూల సూక్ష్మ దేహాలను పరిపోషిస్తూ ఉన్నది. అన్నాన్ని వితరణ చేస్తూ జీవుడి అన్నమయ, ప్రాణమయకోశాలను; భక్తిజ్ఞానాలతో జీవుడి మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను పరిపోషిస్తూ, సత్వరమే జీవుడికి ముక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. కనుక సువర్ణమయ ఆధ్యాత్మిక భావాల రాశిగా కాశీని భావముఖంలో నెలకొని ఉన్న శ్రీరామకృష్ణులు గాంచడం వింతేమీ కాదు.
18. కాశీక్షేత్రం పట్ల శ్రీరామకృష్ణుల ప్రతిస్పందన
ప్రకాశించే వస్తువులు అన్నీ హిందువుల దృష్టిలో పవిత్రంగా, సత్త్వగుణోపేతమైనవిగా ఎంచబడతాయి. కాబట్టే జ్యోతి లేక వెలుగు తన ప్రకాశం కారణంగా సత్త్వగుణ వ్యక్తీకరణగా ఒప్పారుతున్నది. అందుకే శాస్త్రాలు దైవవిగ్రహాల ఎదుట దీప ప్రమిదను వెలిగించి ఉంచమని నొక్కివక్కాణిస్తున్నాయి; ఆ దీపాలను ఆర్పరాదనీ కట్టడి చేస్తున్నాయి. ఈ శాస్త్ర ఆదేశాల నుండి పై విషయం స్పష్టమౌతున్నది. బహుశా ధగధగ మెరిసే బంగారం వంటి వాటిని పవిత్ర వస్తువులుగా పరిగణించడానికి కారణం ఇదే కావచ్చు. అందుకే బంగారు ఆభరణాలను శరీరానికి దిగువ భాగంలో ధరించకూడదని శాస్త్రాలు వచించడానికి కూడా కారణం ఇదే అయి ఉండవచ్చు. కాశీక్షేత్రం స్వర్ణమయంగా కానరావడంచేత బాలక స్వభావులైన శ్రీరామకృష్ణులు అక్కడ మూత్రవిసర్జనాదులు చేస్తే అపవిత్రం చేసినట్లుగా భావించి, ఎంతో ఆందోళన చెందారు. మథుర్బాబు ఏర్పాటు చేయించిన పల్లకీలో ‘అసి’ నదిని దాటి దూరంగా పోయి అక్కడ మూత్ర విసర్జనాదులు పూర్తిచేసుకొని వచ్చేవారనే సంగతి స్వయంగా ఆయన ముఖతా మేం విన్నాం. కొన్ని రోజుల తరువాత ఆ భావం ఉపశమించాక, అలా నదిని దాటిపోవలసిన అవసరం తీరిపోయింది.
కాశీ విశ్వనాథ్ దేవాలయం
బృందావనంలోని ఒక ప్రాంతం
19. మణికర్ణికా ఘట్టంలో శ్రీరామకృష్ణుల అలౌకిక దర్శనం
కాశీలో ఆయనకు కలిగిన మరొక అద్భుత దర్శనం గురించి స్వయంగా ఆయనే మాకు చెప్పారు. కాశీకి తీర్థయాత్రకు వచ్చేవారిలో అనేకులు గంగా తీరంలోని మణికర్ణిక వంటి ఐదు పవిత్ర ప్రదేశాలను సందర్శింప పడవ మీదుగా వెళతారు. శ్రీరామకృష్ణులతో పాటు మథుర్ కూడా అదేవిధంగా పడవ మీద గంగలో ప్రయాణం చేశాడు. కాశీలోని ప్రధాన శ్మశానవాటిక మణికర్ణికకు సమీపంలోనే ఉంది. మథుర్బాబు పడవ మణికర్ణికా ఘట్టాన్ని సమీపించినప్పుడు, ప్రక్కనే ఉన్న శ్మశానంలో దహింపబడుతున్న మృతదేహాల చితుల నుండి ఎగసే పొగతో మణికర్ణిక పూర్తిగా ఆవరించిపోయి ఉంది. భావమయులైన శ్రీరామకృష్ణులు తన దృష్టిని ఆ వైపుకు పరపగానే పట్టరాని ఆనందంతో ఉప్పొంగిపోయారు, ఆయనకు రోమాంచనమైంది. గబగబ నడిచి పడవ అంచుమీద నిలబడి సమాధి మగ్నులయ్యారు. ఆయన ఎక్కడ నదిలో పడిపోయి, నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతారేమోనని భయంతో పడవవాళ్ళు, మథుర్తోబాటు వస్తున్న పండాలు, తదితరులు ఆయనను పట్టుకోవడానికి ముందుకు ఉరికారు. శ్రీరామకృష్ణులు ప్రశాంతంగా, స్థిరంగా నిలబడి ఉండడంతో ఆ అవసరం లేకపోయింది. అద్భుత తేజస్సు, దరహాసం ఆయన ముఖారవిందాన్ని దేదీప్యవంతం చేస్తూ, ఆ ప్రదేశాన్ని పవిత్రం, జ్యోతిర్మయం గావించసాగింది. హృదయ్, మథుర్లు, శ్రీరామకృష్ణులకు ఇరువైపులా నిలబడి జాగ్రత్తగా ఆయనను చూసుకోసాగారు. పడవవారు కాస్త దూరంలో నిలబడి ఆయన భావమయావస్థను విస్మయంతో చూడసాగారు. కొంతసేపటికి ఆయన భావమయావస్థ ఉపశమించింది. తరువాత వాళ్ళు మణికర్ణికా ఘట్టంలో దిగి, స్నానాదులు ముగించి, ఆచారకర్మలు నిర్వర్తించుకొని, ఇతర ప్రదేశాలు సందర్శింప మళ్ళీ పడవలో బయలుదేరారు.
త్రైలింగ స్వామి
వారణాసిలోని మణికర్ణిక శ్మశానం.
ఆ తరువాత తమకు కలిగిన దివ్యదర్శనాన్ని మథుర్ తదితరులకు ఆయన ఇలా వర్ణించి చెప్పారు : “పొడగరీ, పింగళవర్ణుడూ, జటాధారీ, శ్వేతకాయుడూ అయిన పురుషుడొకడు మెల్లగా నడుస్తూ శ్మశానంలోని ప్రతి చితి వద్దకు వెళ్ళి, ఒక్కొక్క జీవుణ్ణి జాగ్రత్తగా లేవదీసి చెవిలో తారక బ్రహ్మమంత్రాన్ని ఉపదేశించ సాగాడు. చితికి మరోవైపు సర్వశక్తిమంతురాలైన జగదంబ, మహాకాళిగా రూపుదాల్చి జీవుడి స్థూల సూక్ష్మ కారణ బంధనాలనన్నిటినీ త్రెంచివేసి, స్వయంగా మోక్ష ద్వారం తెరిచి, ఆ జీవుణ్ణి కైవల్యధామానికి పంపుతూవుంది. ఈ విధంగా ఎన్నో కల్పాల పర్యంతం కఠోర తపశ్చర్యాదులు అనుష్ఠించిన తరువాతే ఏ అద్వైతానుభూతి జీవుడికి లభిస్తుందో, దానిని విశ్వనాథుడు, జీవులకు క్షణమాత్రంలో ప్రసాదించి వారిని తరింపచేస్తున్నాడు”.
మథుర్‌తో పాటు వస్తూవున్న శాస్త్రాలలో ఆరితేరిన పండితులు శ్రీరామకృష్ణుల దివ్యదర్శన వర్ణన విని శాస్త్రాలతో పోల్చిచూసి విస్మయంతో ఇలా అన్నారు: “కాశీలో మరణించే జీవులకు శివుడు ముక్తిని ప్రసాదిస్తాడనే విషయం (లింగపురాణ అంతర్గతమైన) కాశీఖండం ఇదమిత్థంగా పేర్కొంటున్నది. కాని ఆయన ముక్తిని అనుగ్రహించే పద్ధతి మాత్రం వివరంగా వర్ణింపబడలేదు. గురుదేవుల దివ్య దర్శనం, అనుభూతి ఆ విషయాన్ని స్పష్టం చేయడమేకాక శాస్త్రాలలో నమోదైన విషయాలనూ మించిపోయాయి”.
20. శ్రీరామకృష్ణులు, త్రైలింగస్వామిని దర్శించడం
కాశీలో బసచేసినప్పుడు అక్కడ సుప్రసిద్ధ సాధు సన్న్యాసులను శ్రీరామకృష్ణులు దర్శించారు. వారిలో ఒకరైన త్రైలింగస్వామిని చూసి ఆయన ఎంతో ఆనందించారు. అప్పుడప్పుడు ఆయన త్రైలింగ స్వామిని గురించి మాతో ముచ్చటించేవారు. ఆయన ఇలా అనేవారు: “సాక్షాత్తు విశ్వనాథుడే తన అభివ్యక్తీకరణార్థం త్రైలింగస్వామి దేహాన్ని ఆశ్రయించి ఉన్నాడు. స్వామి ఉనికిచే కాశీ పావనత్వం మరింత ఇనుమడించింది. ఆయన ఉన్నతోన్నత జ్ఞానావస్థలో ఉన్నారు. ఆయన దేహస్మృతి రహితుడై ఉన్నాడు. మండుటెండలో ఎవరూ కాలు కూడా మోపలేనంత విపరీతమైన వేడిగా ఉండేది గంగాతీరం ఇసుక. కాని త్రైలింగస్వామి ఆ ఇసుకమీద హాయిగా పడుకొని ఉన్నారు. క్షీరాన్నం స్వయంగా వండి, తీసుకువెళ్ళి ఆయనకు తినిపించాను. ఆ సమయంలో ఆయన మౌనవ్రతంలో ఉన్నారు. నేను సంజ్ఞతో, ‘భగవంతుడు ఏకమా? అనేకమా?’ అని అడిగాను. ఆయన కూడా సంజ్ఞతో ఇలా జవాబిచ్చారు: ‘సమాధ్యవస్థలో ఉన్నప్పుడు భగవంతుడు ఏకమనే తెలియవస్తుంది; కాని నేను నువ్వు జీవుడు జగత్తు ఇత్యాది జ్ఞానం ఉన్నంత వరకు భగవంతుడు కూడా అనేకంగానే అను భూతమౌతూంటాడు.’ త్రైలింగస్వామిని చూపుతూ, ‘నిజమైన పరమహంస స్థితి అంటే ఇదే’ అని హృదయ్‌తో చెప్పాను.”
21. బృందావనంలో శ్రీరామకృష్ణుల భావసమాధి
కాశీలో కొద్ది రోజులు గడిపిన తరువాత శ్రీరామకృష్ణులు, మథుర్‌తో పాటు బృందావనం వెళ్ళారు. బృందావనంలో ‘బంకుబిహారి’ విగ్రహాన్ని చూడగానే ఆయన అద్భుత భావసమాధికి లోనైనారు; ఆ విగ్రహాన్ని ఆలింగనం చేసుకోవడానికి పరుగెత్తారని విన్నాం. మునిమాపువేళ గోపబాలురు ఆవులమందలను తోలుకొని తిరిగివస్తూ యమునానదిని దాటడం చూసి ఆ బాలురలో నెమలిపింఛధారియైన నీలమేఘశ్యాముణ్ణి దర్శించి ఆయన ఆధ్యాత్మిక భావోద్వేగంలో మునిగిపోయారు. శ్రీరామకృష్ణులు వ్రజభూమిలో నిధువనం, గోవర్ధనగిరి మొదలైన శ్రీకృష్ణుడు లీలలు సలిపిన స్థలాలు దర్శించారు. బృందావనం కంటే ఆయనకు ఈ స్థలాలే బాగా నచ్చాయి. ఈ స్థలాలలో వ్రజరాణియైన రాధాదేవి, శ్రీకృష్ణులను వివిధ రీతులలో దర్శించడం వలన ఆయన భగవత్ప్రేమ తీవ్రతరమైనదని మేం విన్నాం.
గోవర్ధనగిరి మొదలైన ప్రదేశాలను దర్శింప మథుర్ శ్రీరామకృష్ణులను పల్లకీలో పంపించాడని తెలియవస్తోంది. పల్లకీలో ఒక ప్రక్క ఒక వస్త్రం పరచి దానిమీద రూపాయలు, అర్ధరూపాయలు, పావలాలు, బేడలు (రెండణాలు) మొదలైన నాణాలను మథుర్ పేర్చాడు. దేవాలయాలలో బీదసాదలకు శ్రీరామకృష్ణులు దానధర్మం చేయడానికే మథుర్ ఆ ఏర్పాటు చేశాడు. కాని శ్రీరామకృష్ణులు ఆ నాణాలను చేతిలో పుచ్చుకోలేనంత భగవత్ప్రేమానురాగాలలో లీనమైపోయారు. వేరే గత్యంతరంలేక వస్త్రం ఒక అంచును శ్రీరామకృష్ణులు లాగేవారు. లాగడంతో నాణాలన్నీ ఆయా స్థలాలలో బీదసాదల మధ్య చెల్లాచెదురుగా పడేవి.
22. వ్రజభూమి పట్ల శ్రీరామకృష్ణుల ప్రగాఢ ప్రీతి
వ్రజభూమిలో సంసార పరిత్యాగులైన సాధకులెందరో పర్ణశాలలు వేసుకొని, తలుపు ముఖంగా తమ వీపులను త్రిప్పి బాహ్య విషయాలన్నింటి నుండి దృష్టిని మరలించి, జపధ్యానాదులలో మగ్నులై ఉండడం శ్రీరామకృష్ణులు చూశారు. వ్రజభూమి ప్రకృతి సౌందర్యం, తదితర దృశ్యాలు శ్రీరామకృష్ణులను ఎంతగానో ఆకట్టుకొన్నాయి. వ్రజభూమిలోని ఫలపుష్పాదులు, గోవర్ధనగిరి, నిస్సంకోచంగా సర్వత్రా తిరుగాడే లేళ్ళు, నెమళ్ళు, తపశ్చర్యలలో మునిగిపోయివున్న సాధువులు, నిరాడంబరులూ, కల్లాకపటం లేని వ్రజవాసులు – ఈ దృశ్యాలన్నీ శ్రీరామకృష్ణులను ఎంతగానో ఆకట్టుకొన్నాయి. అంతేగాక నిధువనంలో గొప్పతపస్వినీ, భగవదారాధకురాలూ, వయోవృద్ధురాలూ అయిన గంగామాయిని చూసి శ్రీరామకృష్ణులు ఎంతో ముగ్ధులయ్యారు. ఆ సాధ్విని సాంగత్యంలో ఆయన ఎంతగా ఆనందించారంటే, వ్రజభూమిని విడిచిపెట్టి ఎక్కడకూ వెళ్ళకూడదనీ, శేషజీవితమంతా అక్కడే గడిపివేయాలనీ దాదాపుగా నిశ్చయించుకొన్నారంటే అతిశయోక్తి కాదు.
నిధువనంలో రాధ మరియు ఆమె చెలికత్తెలు (ఆలయ విగ్రహాలు)
కృష్ణుడు గోపికలతో ఆటపాటలాడిన నిధువనం (బృందావనం).
23. గంగామాయి ఉదంతం
గంగామాయికి అప్పటికి అరవై ఏళ్ళు ఉంటాయి. సుదీర్ఘ కాలం నుండి వ్రజేశ్వరియైన రాధాదేవి, శ్రీకృష్ణుని పట్ల ఆమెకున్న ప్రగాఢ భక్త్యానురాగాలు చూసి రాధారాణి ప్రధాన చెలికత్తెయైన లలితాదేవియే ఏదో కారణంగా గంగామాయిగా మానవరూపం దాల్చి జీవులకు ప్రేమను బోధింప అవతరించిందని స్థానికులు భావించేవారు. చూసిన క్షణంలోనే రాధారాణి దేహంలో అభివ్యక్తమైన మహాభావం శ్రీరామకృష్ణులలో కూడా అభివ్యక్తమౌతూ ఉన్నదని గంగామాయి గ్రహించగలిగిందని ఆయన ముఖతా మేం విన్నాం. కాబట్టే, రాధారాణి శ్రీరామకృష్ణులుగా అవతరించిందని ఎంచి, ఆమె ఆయనను ‘దులారి’ (ముద్దులపట్టి) అని పేర్కొనసాగింది. అప్రయత్నంగా తన ‘దులారి’ దర్శనభాగ్యం లభించడంతో తాను తరించాననీ, తన చిరకాల ఆరాధన, సేవ, ప్రేమలు ఫలవంతమైనాయనీ గంగామాయి ఉప్పొంగిపోయింది. శ్రీరామకృష్ణులు కూడా ఆమెను చూడగానే తక్కిన విషయాలన్నీ మరిచిపోయారు; ఆమె తనకు ఎంతో చిరపరిచితురాలైనట్లు ఆయనకు అనిపించింది. ఆమె పర్ణశాలలో కొన్ని రోజులు గడిపారు. వారి పరస్పర ప్రేమానురాగాలు ఎంత ముగ్ధమనోహరం అయ్యాయంటే శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి రావడానికి నిరాకరిస్తారేమోనని మథుర్ తదితరులు భయపడ్డారని మేం విన్నాం. పరమ భక్తుడైన మథుర్ మనస్సు తన ‘బాబా’ తిరిగి తమతో రాడేమోననే తలంపుతో ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. కాని మాతృప్రేమ తలపుకు వచ్చి వ్రజభూమిలోనే ఉండిపోవాలన్న గురుదేవుల సంకల్పం చివరకు తల వంచింది. ఈ సందర్భాన్ని ప్రస్తావించినప్పుడు ఆయన మాతో ఇలా చెప్పారు: “వ్రజభూమికి వెళ్ళినప్పుడు నేను సర్వం మరచిపోయాను. కాని కొన్ని రోజులు గడిచాక మా అమ్మ జ్ఞాపకానికి వచ్చింది. ఈ వృద్ధాప్యంలో ఆమెను చూసుకొనేవారు, ఆమెకు సేవ చేసేవారు లేక ఎంత కష్టపడవలసి వస్తుందోననే తలంపు మదిలో మెదలింది. దాంతో అక్కడ ఉండడం నాకు అసాధ్యమైపోయింది” అని చెప్పారు.
24. శ్రీరామకృష్ణుల మాతృసేవాపరాయణత్వం
ఈ మహాపురుషుని పలుకుల, చేష్టల గురించి చింతన చేసేకొద్దీ, అంతగా బాహ్యదృష్టికి పరస్పర విరుద్ధాలుగా కానవచ్చే భావాలూ ఆశయాలూ ఆయనలో అద్భుతంగా సామరస్యం వహించి ఉండడం చూసి ఆశ్చర్యపోతాం. జగజ్జనని పాదపద్మాల వద్ద తన మనశ్శరీరాలను సమస్తాన్ని ఆయన అర్పించినా, సత్యనిష్ఠను మాత్రం ఆమెకు అర్పించలేకపోవడం మీరు గమనించలేదా? ప్రతి వ్యక్తితోను లౌకిక బాంధవ్యాన్ని విడిచిపెట్టినప్పటికీ, తల్లి పట్ల ప్రేమను, కర్తవ్యాన్ని ఆయన విస్మరించలేదు. తమ సతీమణితో ఎన్నడూ జాడమాత్రంగా కూడా లౌకిక సంబంధం పెట్టుకోకపోయినా, గురుభావంలో సదా ఆమెతో అనురాగ బాంధవ్యాన్ని నెరపడం మాత్రం మరచిపోలేదు. ఆయన అసాధారణ చేష్టితాలకు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చూపవచ్చు! గతంలో ఆవిర్భవించిన ఏ ఆధ్యాత్మిక ఆచార్యుని లేదా అవతారపురుషుని జీవితంలోనన్నా ఇన్ని పరస్పర విరుద్ధ భావాలూ ఆశయాలూ ఇంత మధురంగా సామరస్యం చెందివుండడం మనకు కానవస్తుందా? ఇటువంటి అసాధారణ ఘటనను ఎన్నడూ చూసివుండలేదని ఎవరు మాత్రం అంగీకరించరు? శ్రీరామకృష్ణులు అవతారపురుషులని అంగీకరించినా, అంగీకరించకపోయినా ఆధ్యాత్మిక జగత్తులో ఎంత వెతకినా ఆయనకు దీటైన మరో ఉదాహరణ కానరాదని మాత్రం అంగీకరింపక తప్పదు. వయోవృద్ధురాలైన శ్రీరామకృష్ణుల మాతృమూర్తి తన జీవిత అంతిమ సంవత్సరాలు దక్షిణేశ్వరంలోనే గడిపింది. అప్పుడు ఆమెకు సేవాశుశ్రూషలు స్వయంగా తానే నిర్వర్తించి, ధన్యులైనట్లు ఆయనే మాతో చాలా సార్లు చెప్పివున్నారు. ఆరాధ్యురాలైన ఆమె కాలధర్మం చేసినప్పుడు ఆయన అనుభవించిన దుఃఖం వర్ణనాతీతం. అప్పుడు ఆయన విలపించినంతగా లోకంలో ఏ కొద్దిమందో విలపించి ఉంటారని చెప్పడం అతిశయోక్తి కాబోదు. మాతృ వియోగంతో ఆయన చెప్పరాని దుఃఖం అనుభవించినప్పటికీ, తాను సన్న్యాసిని అనే విషయం క్షణమాత్రం కూడా ఆయన విస్మరించలేదు. సన్న్యాసి కావడం వలన తల్లికి శ్రాద్ధాది కర్మలు నిర్వర్తించరాదనే శాస్త్ర నిషేధాన్ని తు.చ. తప్పక పాటిస్తూ, శ్రీరామకృష్ణులు ఆ కర్మకాండను రాంలాల్* చేత చేయించారు. తాము ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఆమెకై విలపిస్తూ మాతృ ఋణాన్ని సాధ్యమైనంత వరకూ తీర్చుకొన్నారు.
అనేక సందర్భాలలో ఈ విషయం ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు మాతో ఇలా చెప్పేవారు: “నాయనలారా, లోకంలో తల్లిదండ్రులే పరమగురువులు. వారు జీవించి ఉన్నంత కాలం అందరూ తమ శక్తిమేరకు వారికి సేవాశుశ్రూషలు చేయాలి; వారి మరణానంతరం శక్త్యానుసారం శ్రాద్ధాది కర్మలు నిర్వర్తించాలి. శ్రాద్ధాది కర్మలు నిర్వర్తింప ఏమాత్రం స్తోమతలేని పేదలు అడవిలోకి పోయి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొని, వారికై విలపించాలి; ఈ విధంగా చేస్తేనే తల్లిదండ్రుల ఋణం తీరుతుంది. ఒక్క భగవంతుడి కోసం మాత్రమే తల్లిదండ్రుల మాటను జవదాటవచ్చు; అలా చేయడం దోషంగా పరిగణింపబడదు. తండ్రి నిషేధించినప్పటికీ ప్రహ్లాదుడు హరినామ స్మరణ విడిచిపెట్టలేదు. తల్లి ఎంత వలదని వారించినప్పటికీ వినకుండా ధ్రువుడు తపస్సు చేయడం కోసం అరణ్యాలకు వెళ్ళడం విరమించుకోలేదు. వాళ్ళు అలా చేయడం వలన ఏ దోషానికి గురికాలేదు.” ఈ విధంగా మాతృభక్తి మూలంగా కూడా శ్రీరామకృష్ణుల గురుభావ అద్భుత అభివ్యక్తీకరణ వికసించడం చూసి మేం తరించాం.
అతికష్టం మీద గంగామాయి నుండి సెలవు పుచ్చుకొని శ్రీరామకృష్ణులు, మథుర్తోపాటు కాశీకి తిరిగి వచ్చేశారు. కొన్ని రోజులు అక్కడ గడిపారు. తరువాత దీపావళి పండుగరోజు అన్నపూర్ణాదేవి సువర్ణ విగ్రహాన్ని దర్శించి భక్తిప్రేమలతో ఆయన ఉప్పొంగిపోయారు.
25. గయాక్షేత్రానికి వెళ్ళడానికి శ్రీరామకృష్ణులు నిరాకరించడం: తత్కారణం
కాశీ నుండి గయాక్షేత్రానికి వెళ్ళాలని మథుర్ అభిలాషపడ్డాడు. కాని శ్రీరామకృష్ణులు అందుకు అంగీకరించకపోవడంతో మథుర్ ఆ కోర్కె విడిచిపెట్టాడు. శ్రీరామకృష్ణుల తండ్రియైన క్షుదీరాం గయా క్షేత్రాన్ని సందర్శించినప్పుడు, ఆ క్షేత్ర అధిదేవుడైన గదాధరుడు ఆయనకు కలలో కనిపించి వారి కుటుంబంలో జన్మిస్తానని చెప్పినట్లుగా, స్వయంగా శ్రీరామకృష్ణులే మాతో చెప్పివున్నారు. ఆ కారణంగానే శ్రీరామకృష్ణులకు గదాధర్ అని నామకరణం చేశారు. గయకు వెళ్ళి గదాధరుని పాదపద్మాలను కనుక దర్శిస్తే, అప్పుడు జనించే ప్రేమోద్వేగంలో విడిగా తానొక మానవదేహంలో జీవిస్తున్నాననే విషయం పూర్తిగా మరిచిపోయి శాశ్వతంగా తాను గధాధరునిలో ఐక్యం అయిపోతానేమోననే భయంతో మథుర్‌తో పాటు గయాక్షేత్రానికి వెళ్ళడానికి నిరాకరించానని ఆయన అప్పుడప్పుడు మాకు చెప్పేవారు. గత యుగాలలో ఎవరు శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా, శ్రీ చైతన్యుడుగా అవతరించారో అతడే ప్రస్తుతం తమ దేహాన్ని ఆశ్రయించి ఈ ఇలలో అవతరించాడని శ్రీరామకృష్ణుల దృఢవిశ్వాసం. కాబట్టే తమ తండ్రిగారి కలలో తెలియచేయబడినట్లు తన మనశ్శరీరాల ఉత్పత్తికి మూలస్థానమైన గయాక్షేత్ర ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయనలో వర్ణనాతీతమైన భావోద్వేగం జనించడం మేం గమనించివున్నా. అలాగే అవతార పురుషులు ఏఏ స్థలాలలో తమ లీలా నాటకానికి తెరదించారో (అంటే తమ అవతారాలను చాలించారో) అటువంటి చోట్లకు వెళ్ళాలనే ప్రస్తావన వచ్చిన తక్షణమే శ్రీరామకృష్ణులలో అవ్యక్తమైన భావోద్వేగం జనించేది. అటువంటి స్థలాలకు కనుక వెళితే ఆ స్థలంతో తమ మనస్సు విలీనమైపోయి మళ్ళీ తిరిగి మర్త్యజగత్తులోకి దిగిరాలేదని ఆయన చెప్పేవారు. చైతన్యులు తమ అవతారాన్ని చాలించిన పూరీ క్షేత్ర (నీలాచలం) సందర్శనం చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు శ్రీరామకృష్ణులు అదే భావనను వ్యక్తం చేశారు. ఆయన పరంగా మాత్రమే అటువంటి భావనను వ్యక్తం చేసేవారు కాదు, కొందరి భక్తుల విషయంలో కూడా కొన్ని క్షేత్రాలకు వెళ్ళవద్దని వారిని నిషేధించేవారు. తమ భక్తులలో కొందరు దైవాంశ సంభూతులనే విషయం యోగదృష్టితో ఆయన తెలుసుకొనేవారు. ఆ సందర్భంలో వారు ఏ దైవాంశ సంభూతులో ఆ దేవత విశేషంగా అభివ్యక్తమయ్యే పుణ్యక్షేత్రాలకు ఆ భక్తులను వెళ్ళవద్దని నిషేధించేవారు. శ్రీరామకృష్ణుల ఆ మనోభావనను పాఠకులకు విశదీకరించడం ఎంతో కష్టం. శ్రీరామకృష్ణుల ఆ భావనను ‘భయ’ మని పేర్కొనడం సముచితం కాదు. ఎందుకంటే, స్వయంగా సమాధిస్థితి అనుభూతిని పొందిన సామాన్య సాధకులు కూడా మరణ సమయంలో జీవుడెలా దేహాన్ని విడిచిపోతాడో గుర్తించగలుగుతారు కాబట్టే చావు కూడా బాల్యం, యౌవనం, వృద్ధాప్యం వంటి ఫలానా శారీరక స్థితి మార్పు అని ఎరిగి మరణభయం లేనివారైపోతారు. సామాన్యులే ఇలా మరణంపట్ల నిర్భీతులు అవుతున్నప్పుడు సంకల్పమాత్రాన ప్రగాఢ సమాధ్యవస్థను పొందగలిగే అవతార పురుషులు మృత్యుంజయులై, నిర్భయులు అవుతారనడం ఆశ్చర్యం కాదు. ఆ భావనను జనసామాన్యంలా ఇంకా జీవించి ఉండాలి లేదా దేహాన్ని పరిరక్షించు కోవాలి అనే తపనగా చెప్పడం కూడా సబబు కాదు. ఎందుకంటే జన సామాన్యం బ్రతకాలని కోరుకోవడం భోగం కోసమూ, స్వార్థ సుఖం కోసమే కదా! కాని ఎవరి మనస్సుల నుండి స్వార్థపరాయణత్వం శాశ్వతంగా తొలగిపోయిందో, అటువంటి శ్రీరామకృష్ణుల విషయంలో ఈ వివరణ వర్తించదు.
అటువంటప్పుడు శ్రీరామకృష్ణుల భావనను మేం ఎలా విశదీకరించగలం? మన మనస్సులో వచ్చే భావాలను మాటలద్వారానే వ్యక్తపరుస్తాం. కాని శ్రీరామకృష్ణుల వంటి మహాపురుషుల దివ్యభావాలను వ్యక్తం చేయగల శక్తి మన పలుకులకు ఉన్నాయా? కాబట్టి పాఠక మహాశయా, ఈ పరిస్థితిలో వ్యర్థతర్కాల జోలికి పోకుండా, శ్రీరామకృష్ణులు వ్యక్తం చేసిన తమ భావనల పట్ల విశ్వాసం వహించి, మన ఊహాశక్తి తోడ్పాటుతో మనం గ్రహించినంత మేరకు ఆ దివ్యభావాల రూపురేఖలను చిత్రించుకోవడం తప్ప మరో గత్యంతరం మనకు లేదు.
26. కార్యం కారణంలో లయమయ్యే నియతి
ఒక స్థలం నుండి, ఒక వస్తువు లేదా వ్యక్తి నుండి ఉత్పన్నమైన దివ్య అభివ్యక్తీకరణ, ఆ మూలస్థానానికి అత్యంత సన్నిహితంగా చేరువైనప్పుడు, ఆ ఉత్పత్తి స్థానంలో విలీనమైపోతుందని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. శాస్త్రాలలో కూడా ఇందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. జీవుడు పరబ్రహ్మం నుండే ఉద్భవిస్తున్నాడు; ఎప్పుడు సరైన జ్ఞానాన్ని సంతరించుకొని ఆ పరబ్రహ్మాన్ని సమీపిస్తాడో, అప్పుడు దాన్లో జీవుడు లీనమైపోతాడు. అనంతమైన మనస్సు (లేదా విశ్వమానసం) నుండే నీది, నాది, ప్రతి వ్యక్తి పరిమిత మనస్సూ ఉద్భవిస్తుంది; అంటే ఆ విశ్వమానస అభివ్యక్తీకరణలే ఈ మనస్సులని అర్థం. మనలో ఏ ఒక్కరి అల్పమైన మనస్సు పవిత్రతను, అనాసక్తతను, కరుణను, తదితర ఉదాత్త సుగుణాలను పెంపొందించుకొంటూ చివరకు ఆ విశ్వమానసాన్ని సమీపించగలిగితే లేదా దానివంటిదే కాగలిగితే వెంటనే దాన్లో లీనమైపోతుంది. స్థూల ప్రపంచంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఈ భూమి ఉత్పన్నమైనది సూర్యుని నుండే. ఏదో శక్తి ద్వారానో లేదా మరో విధంగానో భూమి, సూర్యుణ్ణి సమీపించగలిగితే వెంటనే దాన్లో లీనమైపోతుంది. కనుక పైన పేర్కొన్న శ్రీరామకృష్ణుల ప్రగాఢ విశ్వాసం వెనుక మనకు తెలియని ఏదో ప్రత్యేక భావం ఉండి ఉంటుంది. గదాధర్ (గయలో వెలసిన దేవుడు) అనే వ్యక్తి నిజంగా ఉన్నట్లయితే, శ్రీరామకృష్ణుల మనశ్శరీరాలు ఏదో కారణంగా ఆ గదాధరుని నుండి అభివ్యక్తమైనాయనే విషయం యథార్థమైతే శ్రీరామకృష్ణుల ఆ ప్రగాఢ విశ్వాసం, అంటే ప్రేమ కారణంగా వారిద్దరూ పరస్పరం ఆకర్షితులై, ఇద్దరూ ఐక్యమై పోతారనే విశ్వాసం – యుక్తివిరుద్ధమని ఎలా చెప్పగలం?
27. అవతార పురుషుల జీవిత రహస్యాన్ని కర్మ సిద్ధాంతం విశదీకరించ లేదు : తత్కారణం
అవతార పురుషుల జీవితాలు, సామాన్య మానవుల జీవితాల వంటివి కావని వివరించడానికి ఊహగాని, తర్కంగాని ఉపయోగింపనక్కరలేదు. ఊహాతీతమైన మహాశక్తి వారిలో అభివ్యక్తం కావడం చూసి, సామాన్యులు పూజ్యభావంతో వారికి తల వంచి ప్రణామం చేస్తారు; హృదయ పూర్వకంగా వారిని ఆరాధించి, శరణు వేడుతారు. అసాధారణ శక్తి సంపన్నులైన అటువంటి అవతార పురుషుల జీవిత రహస్యాన్ని అవగతం చేసుకోవడానికి కపిలమహర్షి వంటి మేధావులైన దార్శనికులు, తత్త్వవేత్తలు ఎంతో కృషి చేశారు. సామాన్యులలో కంటే ఎంతో గొప్పశక్తి వీరిలో అభివ్యక్తం కావడంలోని మర్మాన్ని తెలుసుకోబోయినప్పుడు, సర్వులకూ వర్తించే కర్మ సిద్ధాంతం ఈ మర్మాన్ని విశదీకరించలేదని ఆదిలోనే వారు గ్రహించారు. ఎందుకంటే, సామాన్యులు చేసే శుభాశుభ కర్మలన్నీ స్వార్థ సుఖప్రాప్తి కోసమే కనుక. కాని ఈ అవతార పురుషుల కర్మలను గురించి అధ్యయనం చేసినప్పుడు, వాటిలో స్వార్థగంధం కించిత్తు కూడా కానరాదు. ఇతరుల కష్టాలను తీర్చాలనే ఆకాంక్ష వారిలో తిరుగులేని ప్రేరణను కల్పిస్తుంది. ఆ ఉదాత్త ప్రేరణ కారణంగా వారు సుఖసంతోషాలనన్నిటినీ పూర్తిగా త్యజిస్తారు. పేరుప్రతిష్ఠలు పొందాలనే ఆకాంక్ష వారిలో ఎన్నడూ కలగకపోవడం మనం చూడవచ్చు. ఇహలోక పేరుప్రతిష్ఠల, పరలోక సుఖసంతోషాల పట్ల వారికి ఎన్నడూ కోర్కె జనించదు; వాటిని వారు కాకిరెట్టలా ఎంచుతారు.
నర నారాయణులనే ఋషులిద్దరు బదరికాశ్రమంలో లోకకళ్యాణార్థం యుగాలపర్యంతం కఠోర తపస్సు చేయడం మీకు తెలియదా? తన ప్రజలను ధర్మనిరతులుగా తీర్చిదిద్దడానికి, రాజధర్మంగా శ్రీరామచంద్రుడు తన ప్రాణ సమానురాలైన, దోషరహితురాలైన సీతాదేవిని పరిత్యజించాడు. శ్రీకృష్ణుడు ఒనరించిన ప్రతి కార్యమూ సత్యధర్మాల ప్రతిష్ఠాపన కోసమే. జీవులను జన్మ జరా మరణాది దుఃఖాల నుండి ఉద్ధరించడం కోసం బుద్ధుడు ఒక సామ్రాజ్యాన్నే త్యజించాడు. దుఃఖమయ ప్రపంచంలో ప్రేమ స్వరూపుడైన తండ్రి స్వర్గరాజ్యాన్ని నెలకొల్పే ఉద్దేశంతోనే ఏసుక్రీస్తు శిలువ మీద ప్రాణాలు అర్పించాడు. అధర్మాన్ని అరికట్టడం కోసమే మహమ్మద్ కత్తిదూశాడు. అద్వైతానుభూతిలోనే నిజమైన శాంతి ఉందని తన యావచ్ఛక్తిని వినియోగించి శంకరాచార్యుడు ప్రజలకు బోధించాడు. జీవుణ్ణి సంసారం నుండి తరింపచేసే శక్తి ఒక్క శ్రీహరి నామంలోనే ఉందని గ్రహించి, తన సాంసారిక సుఖ సంతోషాలకు తిలోదకాలిచ్చి శ్రీచైతన్య మహాప్రభువు మహోత్సాహంతో శ్రీహరి నామాన్ని ఎడతెగని నృత్యగానాల ద్వారా ప్రచారం చేయడంలో నిమగ్నుడైనాడు. వ్యక్తిగత కష్టాలనే కొనితెచ్చిన ఇటువంటి కార్యాలకు అవతార పురుషులను ఏ స్వార్థం ప్రేరేపించింది?
28. అవతార పురుషుల గురించి సాంఖ్య సిద్ధాంతం ఏమి చెబుతోంది
అంతేకాదు. అసాధారణ ఆధ్యాత్మికానుభూతులను పొంది జీవన్ముక్తులైన మహాపురుషులలో ఎటువంటి లక్షణాలు అభివ్యక్తమౌతాయని శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయో ఆ లక్షణాలన్నీ అవతార పురుషుల జీవితాలలో కూడా కానరావడం గమనించారు మన దార్శనికులు. కనుక గత్యంతరం లేక అటువంటి మహాపురుషుల నందరినీ ఒక క్రొత్త కోవకు చెందిన వారుగా పరిగణించవలసివచ్చింది. అవతార పురుషులలో లోకకళ్యాణం ఒనగూర్చాలనే ఉదార ఆకాంక్ష ఉంటుందని సాంఖ్యదర్శనకారుడైన కపిలుడు వచించి ఉన్నాడు. కాబట్టే గత జన్మలలో కఠోర తపస్సు చేసి ముక్తులైనప్పటికీ వీరు నిర్వాణస్థితిని చేపట్టక, ప్రకృతిలీనులై ఉంటారు. అంటే సమస్త ప్రకృతిశక్తీ తమ శక్తే అనే ఎరుకతో ఒక కల్పాన్ని గడిపివేస్తారు. కాబట్టే ఇటువంటి ప్రకృతి లీనులలో ఏ మహాత్ముడు ఏ కల్పంలో తాను అటువంటి ప్రకృతిశక్తి సంపన్నుడనని భావిస్తాడో అతడు ఆ కల్పంలో జనసామాన్యానికి ‘ఈశ్వరుడు’ గా విరాజిల్లుతాడు. ఎందుకంటే, ప్రకృతిలోని యావచ్ఛక్తీ ‘తనదే’ అనే బోధ ఎవరికి ఉంటుందో అతడు ఆ యావచ్ఛక్తిని తన ఇచ్ఛమేరకు ఉపయోగించడమో లేదా ఉపసంహరించడమో చేయగలుగుతాడు కనుక. ఈ చిన్ని శరీరాలలోని ప్రకృతి శక్తులన్నీ ‘మనవే’ అని తెలుసుకోవడం చేత వాటిని మనం ఎలా ఉపయోగించుకొంటామో, అలాగే ‘ప్రకృతిలీన’ పురుషులు కూడా ప్రకృతి శక్తులన్నిటినీ ‘తమవి’ గా గ్రహించి సంకల్ప మాత్రాన వాటిని ఉపయోగిస్తూంటారు. సర్వకాల వ్యాపీ, ఏకమాత్రుడూ అయిన ఈశ్వరుడొకడు ఉన్నాడని నిజానికి సాంఖ్యదర్శనకారుడైన కపిలుడు అంగీకరించకపోయినా, ఒక కల్పకాలం వరకూ శాసించే సర్వశక్తిమంతులైన పురుషుల అస్తిత్వాన్ని అంగీకరిస్తాడు. అటువంటి వ్యక్తులను ఆయన ‘ప్రకృతి లీను’ లని పేర్కొంటాడు.
29. వేదాంతం ఈ ప్రకృతిలీన పురుషులను అధికారులుగా పేర్కొంటుంది – వీళ్ళను రెండు వర్గాలుగా విభజిస్తుంది
ఈ ఈశ్వర ఆవర్తన సిద్ధాంతాన్ని వేదాంతకారులు అంగీకరించరు. ఒక్కడే అయిన ఈశ్వరుడి నిత్య అస్తిత్వాన్ని వీరు అంగీకరిస్తారు. ఆ ఏకైక ఈశ్వరుడే మనకు కనిపించే ఈ ప్రపంచంగా, జీవులుగా అభివ్యక్తమౌతున్నాడనీ, విశేష శక్తిమంతులైన ఆ ఆధికారిక పురుషులందరూ కూడా నిత్య-శుద్ధ-బుద్ధ-ముక్త స్వరూపుడైన ఈశ్వరుడి విశేషాంశ సంభూతులనీ వీరు చెబుతారు. అంతేకాక ఆ ఆధికారిక పురుషులు జగత్కళ్యాణానికి దోహదం చేసే ఏదో ఒక విశేష కార్యాన్ని నిర్వర్తించడం కోసం అవసరమైనప్పుడల్లా జన్మిస్తూ ఉంటారనీ వీరు వచిస్తారు. ఆ కార్యాన్ని నిర్వర్తింప అవసరమైన శక్తిని సంతరించుకొనే వారు జన్మించడం వలన వేదాంతకారులు వారిని ‘ఆధికారికు’ లని పేర్కొంటారు. ‘ఆధికారికు’ డంటే అధికారం పొందిన వ్యక్తి లేదా ఏదో ఒక విశేష కార్యం నిర్వర్తింప అవసరమైన శక్తిసామర్థ్యాలు సంతరించుకొన్నవాడని అర్థం. ఇలా జన్మించే ఆధికారిక పురుషులలో కూడా శక్తితారతమ్యం, (ఎక్కువ తక్కువలు) ఉండడం గమనించి వీరిని మళ్ళీ రెండు తరగతులుగా వర్గీకరించారు – 1. అవతార పురుషులు 2. నిత్యముక్తులైన ఈశ్వరకోటులు. ఎవరి చేతలు లోకంలోని యావన్మందికీ శాశ్వతమైన మేలును ఒనగూరుస్తాయో వారు అవతార పురుషులుగా పేర్కొనబడతారు. ఎవరి చేతలు ఒక దేశానికి లేదా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై మేలొనరిస్తాయో వారు నిత్యముక్తులైన ఈశ్వరకోట్లు. ఈశ్వర కోట్ల కంటే అవతార పురుషులలో అభివ్యక్తమయ్యే ఆధికారికశక్తి అత్యంత అధికంగా ఉంటుంది. వేదాంతకారుల పై అభిప్రాయాన్ని ఆధారం చేసుకొని తమ ఊహాశక్తి దోహదంతో ప్రతి అవతార పురుషునిలో ఏ మేరకు భగవదంశం ఇమిడివుందో అంచనావేయడానికి పురాణకర్తలు ప్రయత్నించారు; ఆ అంచనా కట్టడంలో వారు అతిశయోక్తులను ఆశ్రయించడం కూడా కద్దు. “ఏతే చాంశకలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం”* అంటే ఇతర అవతారపురుషులందరూ భగవంతుని అంశమాత్రులు, కాని శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే! – ఇటువంటి అతిశయోక్తులు భాగవతంలో మనకు తారసపడతాయి.
గురుభావం స్వయంగా భగవంతుడి శక్తే అనే విషయం ఇదివరకే మరొక చోట* విశదీకరింప ప్రయత్నించాం. అజ్ఞాన భ్రాంతిలోపడి, ఎంత ప్రయత్నించినప్పటికీ దాన్నుండి బయటపడలేని జీవుణ్ణి చూసి అపార కరుణ వహించి అతణ్ణి ఉద్ధరింప భగవంతుడు ఆతురత చెందుతాడు. కరుణార్ద్రుడైన భగవంతుని ఆ ఆతురతే గురురూపంగా లేదా గురుభావంగా ఆవిర్భవించి వ్యక్తమౌతుంది. జనసామాన్యం గ్రహించి అవగతం చేసుకోవడానికి సుగమమౌతుందనే ఉద్దేశంతో భగవంతుని ఆ గురుభావం అప్పుడప్పుడు మానవరూపం దాల్చి అభివ్యక్తమౌతూ వస్తుంది. ఇది యుగాల పర్యంతంగా వస్తున్న విషయమే. అలా మానవరూపాలు దాల్చిన పురుషులనే అవతార పురుషులు లేదా ఆధికారిక పురుషులు అంటారు. వీరు జగత్పూజ్యులు, జగద్గురువులు. కాబట్టే అవతార పురుషులు మాత్రమే మానవాళికి నిజమైన గురువులనే విషయం సుస్పష్టమౌతున్నది.
30. అధికారిక పురుషుల యొక్క మనశ్శరీరాల అనుపమానత
మనశ్శరీరాల నిర్మాణంలో సామాన్యజీవులకూ ఆధికారిక పురుషులకూ ఎంతో వ్యత్యాసం ఉంటుంది. వారిలో అవి మహోన్నత భగవద్భావాలనూ, ప్రేమనూ, మహోన్నతశక్తినీ గ్రహించి వ్యక్తంచేయ సామర్థ్యం వహించి ఉంటాయి. సామాన్యుడికి కించిత్తు ఆధ్యాత్మికశక్తి, పర్యవసానంగా జనంలో కాస్త పూజ్యనీయత లభిస్తే, అతడి ఆనందానికి పట్టపగ్గాలుండవు, అహంకారంతో మిడిసిపడతాడు. కాని ఆధికారిక పురుషులు ఏమాత్రం చలించరు. వేయిరెట్ల ఆధ్యాత్మికశక్తి సంతరించుకొన్నప్పటికీ వారిలో అహంకారం, గర్వం జాడమాత్రంగా కూడా కనిపించవు. జీవుడు సకల బంధాల నుండి విముక్తుడై, ఆత్మజ్ఞానం చేకూర్చే సమాధి స్థితిని పొందగలిగితే, అతడు ఇక ఏ కారణం వలన కూడా ఈ సంసారంలోకి మళ్ళీ రావడానికి ఇష్టపడడు. కాని ఈ పరమానందాన్ని చవిచూసిన మరుక్షణమే ఇతరులతో దానిని పాలుపంచుకోవాలనే ఆతురత ఆధికారిక పురుషులలో జనిస్తుంది. భగవత్సాక్షాత్కారం పొందాక జీవుడికి ఇక ఏ కర్తవ్యమూ మిగిలి ఉండదు. కాని భగవత్సాక్షాత్కారం సంతరించుకొన్న తరువాతే ఆధికారిక పురుషుల కర్తవ్యం మొదలవుతుంది. అంటే వారు తమ జన్మోద్దేశం అవగతం చేసుకొని ఆ లక్ష్యసాధనకు ఉద్యుక్తులవుతారు. తాము జన్మించిన ప్రత్యేక లక్ష్యాన్ని సాధించే వరకు జీవించాలన్న ఆతురత వారిలో కానవస్తుంది. సామాన్య ముక్త పురుషులలా ‘ఈ క్షణంలో దేహం చాలించినా ఫరవాలేదు’ అన్న ఆలోచన ఆధికారిక పురుషులలో కనిపించదు. కాని అవతార పురుషులు బ్రతికి ఉండాలనే సంకల్పానికీ, సామాన్యజీవులు బ్రతికి ఉండాలనే సంకల్పానికీ మధ్య హస్తిమశకాంతరం ఉంది. పైగా తమ కర్తవ్య నిర్వహణ పూర్తి అయిందని గ్రహించగానే, మరొక్క క్షణం కూడా తాత్సారం చేయకుండా పరమానందంగా తమ దేహాలను సమాధి స్థితిలో త్యజించివేస్తారు. సామాన్యజీవులు సంకల్పమాత్రాన సమాధిలో దేహాన్ని త్యజించలేకపోవడమే కాక, తమ జీవిత కర్తవ్యాలు ఎప్పుడు ముగుస్తాయో కూడా వారు తెలుసుకోలేరు. పైగా తమ కోర్కెలు ఇంకా అనేకం ఈడేరలేదని భావిస్తారు, ఇంకా జీవించాలనే అప్రతిహతమైన వ్యాకులత వారిలో నెలకొనే ఉంటుంది. ఈ రీతిలో సామాన్యులకూ, అవతార పురుషులకూ మధ్య మరెన్నో విషయాలలో వ్యత్యాసాలు ఉండడం గమనించవచ్చు. సామాన్య జీవులకు వర్తించే మన ప్రమాణాలతో అవతార పురుషుల జీవిత లక్ష్యాలను, చేతలను నిర్ణయింప ప్రయత్నిస్తే మనం పప్పులో కాలువేసినట్టే.
ఈ శాస్త్రభావాల నేపథ్యంలోనే, ‘నేను గయాక్షేత్రాన్ని సందర్శిస్తే శరీరం నిలవదు’, ‘పూరీక్షేత్రానికి వెళితే నాకు శాశ్వత సమాధి స్థితి కలుగుతుంది’ మొదలైన శ్రీరామకృష్ణుల వచనాలను మనం అవగతం చేసుకోవలసి ఉంటుంది. కాబట్టే సంక్షిప్తంగానే ఆ అంశాన్ని మేం ఇక్కడ చర్చించాం. శ్రీరామకృష్ణుల ఏ భావమూ శాస్త్ర విరుద్ధమైనది కానేకాదన్న విషయం పై చర్చ నుండి పాఠకులు అర్థం చేసుకోగలరు.
మథుర్‌తో కలిసి గయాక్షేత్రాన్ని సందర్శింప శ్రీరామకృష్ణులు నిరాకరించారనే విషయం ఇంతకు మునుపే చెప్పివున్నాం. కాబట్టి ఆ పర్యటనలో ఎవరూ ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించలేదు. అందరూ వైద్యనాథం మీదుగా కలకత్తాకు తిరిగి వచ్చారు. కాశీకి పోతున్నప్పుడు ఈ వైద్యనాథం వద్దే ఒక ఫలానా కుగ్రామంలోని నిరుపేదలు అనుభవిస్తున్న కటిక దారిద్ర్యాన్ని చూసి, హృదయం ద్రవించిపోగా మథుర్కి చెప్పి శ్రీరామకృష్ణులు వారందరికీ కడుపారా తిండి పెట్టించి, బట్టలను ఇప్పించిన సంఘటనను మరొక చోట విపులంగా ప్రస్తావించాం* .
31. శ్రీరామకృష్ణుల నవద్వీప సందర్శనం
కాశీ, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించడంతో పాటు శ్రీరామకృష్ణులు ఒక సందర్భంలో చైతన్య మహాప్రభువు జన్మస్థలమైన నవద్వీపాన్ని కూడా సందర్శించారు. ఈసారి కూడా మథుర్బాబే ఆయనను తనతో అక్కడకు తోడ్కొని వెళ్ళాడు. అవతార పురుషుల మనస్సులకు సైతం అన్ని సత్యాలూ, అన్ని సమయాలలోనూ సాక్షాత్కరించవన్న విషయం, గౌరాంగుని గురించి ఒక సందర్భంలో శ్రీరామకృష్ణులు ముచ్చటిస్తున్నప్పుడు మాకు స్పష్టమైంది. కాని ఏ ఆధ్యాత్మిక సత్యాలను గురించి తెలుసుకోవాలని, అవగతం చేసుకోవాలని వారు ఆకాంక్షిస్తారో అవి మాత్రం సునాయాసంగా వారి బుద్ధికి గోచరిస్తాయి.
32. శ్రీచైతన్యుల అవతారం గురించి శ్రీరామకృష్ణుల అభిప్రాయాలు
గౌరాంగ మహాప్రభువును భగవదవతారంగా పరిగణించడంలో అప్పుడు మాలో అనేకులకు సందేహం ఉండేది. పైగా మాలో అనేకులం ‘వైష్ణవు’ డనే మాటను సంకుచితమైన వారికి పర్యాయపదంగా భావించేవారం. మా సందేహ నివృత్తికై దీనిని గురించి శ్రీరామకృష్ణులను అడిగాం. అందుకు జవాబుగా శ్రీరామకృష్ణులు మాకు ఇలా చెప్పారు: “నాకు కూడా అదే వైఖరి ఉండేది. మొదట్లో నేను ఇలా అనుకొనేవాణ్ణి- ‘భాగవతాది పురాణాదులలో జాడమాత్రంగా కూడా ప్రస్తావించని చైతన్యులు ఎలా అవతార పురుషుడవుతాడు? బోడితలల వైష్ణవులు ఆయనను అవతారపురుషుణ్ణిగా నెలకొల్పారు’ అనే భావంతో చైతన్యులను అవతారంగా విశ్వసించేవాణ్ణి కాదు. మథుర్‌తో పాటు నవద్వీపం వెళ్ళాను. చైతన్యులు నిజంగా అవతారపురుషుడే అయిన పక్షంలో ఆయన దివ్య అభివ్యక్తీకరణ శక్తి ఏదో కొంత మేరకు అక్కడ గోచరించాలనీ, ఆ స్థలం చూసినప్పుడు ఈ విషయం తెలియ వస్తుందనీ అనుకొన్నాను. ఆయన దివ్యత్య అభివ్యక్తీకరణ ఎక్కడన్నా కానవస్తుందేమోనని పెద్దగోస్వామి, చిన్నగోస్వామి ఇళ్ళకు, తదితర చోట్లకు నడక సాగించాను. కాని ఎక్కడా నాకు ఏ ప్రత్యేకతా కనిపించలేదు. ప్రతిచోట చేతులు ఎత్తి నిలబడివున్న కొయ్య విగ్రహాలే కళ్ళబడ్డాయి. వాటిని చూసి నిరుత్సాహపడ్డాను. అక్కడకు వెళ్ళినందుకు విచారించాను. ఆ తరువాత తిరిగి వెళ్ళడానికి పడవలో అడుగుపెట్టగానే నాకొక అద్భుత దర్శనం కలిగిందిసుకుమారులైన ఇద్దరు బాలురు* కనిపించారు. అంత అందమైన బాలురను నేనెన్నడూ చూసి ఉండలేదు. బంగారువర్ణం వంటి మేనిచాయ, తలమీద జ్యోతిర్మండలంతో వారు విరాజిల్లుతున్నారు. తలలు పైకెత్తి నా వంకే చూస్తూ ఆకాశ మార్గంలో నా వైపుగా పరుగెత్తుకొని రాసాగారు. ‘అదుగో వారొస్తున్నారు, వారొస్తున్నారు’ అంటూ కేకలు పెట్టాను. ఇలా కేకలు పెట్టసాగానో లేదో వాళ్ళు వచ్చి దీన్లో (తమ శరీరాన్ని చూపిస్తూ) ప్రవేశించారు. బాహ్య చైతన్యం కోల్పోయి, క్రిందపడిపోయాను. హృదయ్ ప్రక్కనే ఉండి పట్టుకోకపోతే నీళ్ళలో పడిపోయి ఉండేవాణ్ణి. ఇటువంటి దర్శనాలు ఎన్నో కలగడం వలన, వాస్తవానికి (చైతన్యులు) అవతారమనీ, భగవదంశసంభూతుడనీ నాకు నమ్మకం ఏర్పడింది.” చైతన్య మహాప్రభువుల నగర సంకీర్తన దివ్యదర్శనం కలిగిందని ఒక రోజు శ్రీరామకృష్ణులు మాతో చెప్పారు. ఈ దివ్యదర్శనాన్ని గురించి మేం మరొక చోట* విశదీకరించాం.
33. శ్రీరామకృష్ణులు కాల్నాను సందర్శించడం
పైన పేర్కొన్న పుణ్యక్షేత్రాలనేకాక శ్రీరామకృష్ణులు ఒక సందర్భంలో మథుర్బాబుతో కలిసి కాల్నాకు కూడా వెళ్ళారు. చైతన్య మహాప్రభువు పాదధూళి సోకడం వలన వంగదేశంలో గంగాతీర గ్రామాలు ఎన్నో పవిత్ర తీర్థాలుగా రూపొందాయి. వాటిలో కాల్నా ఒకటి. పైగా బర్ద్వాన్ రాజవంశీయులు నూట ఎనిమిది శివాలయాలను ఇక్కడ నెలకొల్పి కాల్నా కీర్తి వైభవాలను మరింత ఇనుమడింప చేశారనే విషయం యాత్రీకులందరికీ అనుభవైకవేద్యమే. కాని శ్రీరామకృష్ణులు కాల్నాకు వెళ్ళడంలోని ఉద్దేశం అది కాదు. ఆ ప్రాంతాలలోని సుప్రసిద్ధుడైన వైష్ణవ సాధువు భగవాన్‌దాస్ బాబాజీని సందర్శించడమే ఆయన ఉద్దేశం.
34. భగవాన్‌దాస్ బాబాజీ పరిత్యాగం, భక్తి, కీర్తిప్రతిష్ఠలు
అప్పుడు భగవాన్‌దాస్ బాబాజీ వయస్సు ఎనభై ఏళ్ళకు పైబడి ఉంటుంది. ఆయన ఎక్కడ జన్మించింది, వారి కుటుంబ వివరాలు ఏమీ మాకు తెలియదు. కాని ఆయన మహోన్నత పరిత్యాగం, వైరాగ్యం, భగవద్భక్తి గురించి మాత్రం వంగదేశంలోని ఆబాలగోపాలానికి సువిదితమే. పరమనిష్ఠతో కదలక మెదలక రేయింబవళ్ళు దీర్ఘకాలం ఒకేచోట పద్మాసనంలో కూర్చుని ఒకే భంగిమలో జపం ధ్యానం ధారణ తపస్సు చేసిన ఫలితంగా జీవిత చరమాంకంలో ఆయన కాళ్ళు రెండూ పక్షవాతంతో పడిపోయాయని విన్నాం. ఎనభై ఏళ్ళు పైబడ్డా, అంగవైకల్యం సంభవించినా హరినామ స్మరణ పట్ల ఉత్సుకత, దివ్యప్రేమ భావంలో ఆనందబాష్పాలు స్రవించడం మాత్రం ఏమాత్రం సన్నగిల్లలేదు; పైపెచ్చు అధికరించాయి.
కాల్నా ప్రాంతాలలోని వైష్ణవ సముదాయం, భగవాన్‌దాస్ బాబా తమ మధ్య వసించడం వలన క్రొత్త ఉత్తేజాన్ని సంతరించుకొన్నది. బాబా ఉజ్జ్వల ఆదర్శాన్ని సోదాహరణగా గైకొని, ఆయన ఉపదేశాలను అనుసరించి అనేకమంది వైష్ణవ సాధువులు తమ ఆధ్యాత్మిక జీవితాలలో పురోగతిని సాధించి ధన్యులయ్యారు. ఆ రోజుల్లో ఆయనను దర్శించుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ సుదీర్ఘకాలం బాబా అనుష్ఠిస్తూ వచ్చిన తపస్సు, పవిత్రత, భక్తి, వైరాగ్యాదుల ప్రభావాన్ని తమ అంతరాంతరాళాలలో అనుభూతం చేసుకొని, అపూర్వ ఆనందాన్ని పొందేవారనడం అతిశయోక్తి కాబోదు. శ్రీచైతన్య మహాప్రభువు ప్రచారం చేసిన భగవత్ప్రేమ అమోఘమైనదన్న ఆయన అభిప్రాయాలను అక్కడి ప్రజలు శిరసావహించి, అందరూ వాటిని పాటించేవారని మేం విన్నాం. కనుక సిద్ధపురుషుడైన బాబాజీ కేవలం సొంత సాధనలలోనే మునిగిపోలేదు; వైష్ణవ సముదాయానికి సంక్షేమం చేకూర్చే, వైష్ణవ సాధువులు వైరాగ్య ఆదర్శం మేరకు తమ జీవితాలను ఎలా రూపుదిద్దుకోవాలో, సంసార పంకంలో చిక్కువడిన సామాన్య జీవులు చైతన్యుల భక్తిమార్గంలో ఉత్సుకత పొంది తమ జీవితాలలో శాంతిని సంతరించుకొనే మార్గాలను గురించి చర్చిస్తూ, వాటిని ఆచరణయుతం చేయడంలో కూడా బాబా ఎంతో సమయాన్ని గడిపేవారు. వైష్ణవ సముదాయంలో ఎక్కడ ఏం జరుగుతున్నదో, సాధువుల మంచి చెడు ప్రవర్తనల గురించి జనం బాబాజీ దృష్టిలోకి తెచ్చేవారు. అదంతా విని ఆయన యోచించి, ఏం చేయాలో ఉత్తర్వులిచ్చేవారు. వైరాగ్యం, తపస్సు, ప్రేమలతో జీవితం గడిపే వారిలో తేజో వైభవం, సాధికారికత నెలకొని ఉంటాయి; జనం బాబా పలుకులను ఎంతో విధేయతతో శిరసావహించి, వాటిని తక్షణమే పాటింప ఆతురత కనబరిచేవారు. గూఢచారులు ఎవరూ లేకపోయినా, వైష్ణవ సముదాయంలో జరిగే ప్రతీదీ సిద్ధుడైన బాబాజీ కళ్ళకు గోచరమయ్యేది; ఆ సముదాయంలో ప్రతి వ్యక్తీ ఆయన ప్రభావానికి లోనయ్యేవాడు. ఆయన ప్రభావం పరపిన పరిరక్షక దృక్కుల ముందు సరళ హృదయుల భక్త్యుత్సాహాలు ఎలా నానాటికీ అధికరించేవో, అట్లే కపటవర్తనులు తెలియరాని భయం ఆవరించగా, సిగ్గుతో కుంచించుకుపోయి తమ దుష్ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నించడమూ కద్దు.
35. శ్రీరామకృష్ణుల సాధన కాలంలో ప్రారంభమైన మతోద్యమాలు
భగవత్సాక్షాత్కారార్థం పన్నెండు సంవత్సరాల కాలంపాటు అవిచ్ఛిన్నంగా శ్రీరామకృష్ణులు తీవ్ర సాధనలలో మునిగి ఉన్న కాలంలో, గురుభావం ఆయనలో సమగ్రంగా అభివ్యక్తం అయ్యే తరుణంలో భారతదేశంలో అనేక ప్రాంతాలలో ప్రధానమైన మతోద్యమాలు రూపుదిద్దు కోసాగాయి. వాటిలో కలకత్తా, దాని పరిసర ప్రాంతాలలో హరిసభలు, బ్రహ్మసమాజం; స్వామి దయానంద, పంజాబు, భారతదేశ వాయవ్య ప్రాంతాలలో మొదట్లో ‘వేదమతం’ గా తదనంతరం ఆర్యసమాజంగా ప్రచారం చేసిన మతోద్యమం; బెంగాల్లో పునరుజ్జీవనం పొందిన వేదాంత మతం, ‘కర్తభజా’ సంప్రదాయం, ఉత్తర భారతదేశంలో రాధాస్వాముల మతోద్యమం; గుజరాత్లో స్వామి నారాయణ మతోద్యమాలను ఉదాహరణలుగా చెప్పవచ్చు. పైన పేర్కొన్న మతోద్యమాలు పైన చెప్పిన కాల ఘట్టానికి కాస్త అటూ ఇటూగా స్థాపితమై ప్రచారం చేయబడినవే. ఈ మతోద్యమాలను, వాటి సిద్ధాంతాలను ఇక్కడ విశదీకరించడం మా ఉద్దేశం కాదు. కలకత్తాలోని కౌలటోలా ప్రాంతంలో నెలకొన్న ఒక హరిసభను శ్రీరామకృష్ణులు సందర్శించినప్పటి ఒక్క సంఘటనను మాత్రం వివరింపదలచాం.
36. కౌలటోలా హరిసభలో శ్రీరామకృష్ణులు
కౌలటోలా హరిసభ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఒక రోజు శ్రీరామకృష్ణులు హృదయ్‌ను వెంటబెట్టుకొని అక్కడకు వెళ్ళారు. ఇంతకు మునుపే మేం ప్రస్తావించిన వైష్ణవచరణ్ ఆ రోజు సభలో భాగవత పారాయణం చేసి విశదీకరిస్తారనీ, అది వినడానికే శ్రీరామకృష్ణులు అక్కడకు వెళ్ళారనీ కొందరంటారు. కాని శ్రీరామకృష్ణుల ముఖతా ఈ కారణంగా ఆయన అక్కడకు వెళ్ళినట్లు మేం వినలేదు. ఏది ఏమైనప్పటికీ భాగవత పారాయణం సాగుతుండగా అందరూ దానిని వినడంలో లీనమై ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు అక్కడకు వచ్చారు. శ్రోతల నడుమ కూర్చుని ఆయన కూడా వినసాగారు.
37. భాగవత పారాయణం
శ్రీచైతన్యుల పావన పాదపద్మాల వద్ద సంపూర్ణ శరణు పొందినట్లు ఆ హరిసభ సభ్యులు తమను పరిగణించుకొనేవారు. ఈ అంశాన్ని సదా జ్ఞాపకంలో ఉంచుకొనే ప్రయత్నంలో వాళ్ళు ఒక ఆసనాన్ని పరపి, చైతన్యదేవులు దానిపై ఆసీనులై ఉన్నట్లుగా ఎంచి, భాగవతాదుల పఠనం, ఆరాధన మొదలైనవి నిర్వర్తించేవారు. ఆ ఆసనాన్ని ‘శ్రీ చైతన్యుల ఆసనం’ అని పేర్కొనేవారు. భక్తి ప్రపత్తులతో అందరూ ఆ ఆసనం ముందు ప్రణామాలు చేసేవారు. ఆ ఆసనం మీద కూర్చోవడానికి ఎవరినీ అనుమతించేవారు కారు. పువ్వులు, పువ్వులమాలలతో అలంకరించబడిన ఆ ఆసనం ముందు భాగవత పారాయణం జరుగుతుంది; శ్రీచైతన్యులు ఆ ఆసనంలో కూర్చుని భాగవతం వింటారని భక్తులు భావిస్తూ, ఆయన దివ్యసన్నిధానంలో శ్రీహరి వచనామృతాన్ని తాము గ్రోలుతూ ఉన్నట్లుగా భావించేవారు. శ్రీరామకృష్ణుల ఆగమనంతో పారాయణం చేస్తున్న వ్యక్తి, శ్రోతల భక్తిభావం నూరురెట్లు ఇనుమడించిందని చెప్పనవసరం లేదు.
38. ‘శ్రీ చైతన్యుల ఆసనం’ పై శ్రీరామకృష్ణులు
భాగవత వచనామృతాన్ని గ్రోలుతూ శ్రీరామకృష్ణులు మైమరచిపోయారు. ఆ స్థితిలో హఠాత్తుగా ఆయన ‘శ్రీచైతన్యుల ఆసనం’ వైపుగా పరుగెత్తి, దాని మీద నిలబడి, ప్రగాఢ సమాధిలో మగ్నులైపోయారు; దేదీప్య మానంగా ప్రకాశిస్తూవున్న ఆయన ముఖారవిందాన వ్యక్తమౌతున్న అసాధారణమైన ప్రేమాస్పద దరహాసాన్ని, చిత్తరువులలో కానవచ్చే చైతన్యుల భంగిమలో నిలబడిన తీరునూ చూసి భక్తులు తమ హృదయాంతరాళాలలో భావముఖ స్థితిలోని శ్రీరామకృష్ణులు, చైతన్య దేవులతో తాదాత్మ్యం చెందినట్లుగా భావించసాగారు. బాహ్యదృష్టిలో శ్రీరామకృష్ణుల, చైతన్యుల మనశ్శరీరాల మధ్య దేశకాల పరిస్థితుల కారణంగా కానవచ్చే సుదూరం ఆ భావజగత్తులో పూర్తిగా అదృశ్యమైనదని, భావముఖంలో శ్రీరామకృష్ణులు ఆ ఎడబాటును అనుభవించడం లేదని భక్తులు గ్రహించారు. భాగవతం పారాయణ చేస్తున్న వ్యక్తి పారాయణ చేయడం ఆపి, ఆయన వంకే నిశ్చలంగా చూస్తూ ఉండిపోయాడు. శ్రోతలు, శ్రీరామకృష్ణుల భావసమాధి స్థితిని అవగతం చేసుకోలేకపోయినప్పటికీ, ఏదో ఒక అవ్యక్తమైన విస్మయంతో పరవశులై నిశ్చలంగా ఉండిపోయారు. మంచిగాని, చెడుగాని పలుకలేని స్థితిలో వారంతా ఉన్నారు. శ్రీరామకృష్ణుల శక్తిమంతమైన ఆధ్యాత్మిక భావ ప్రవాహంలో అందరూ అనిర్వాచ్య జగత్తుకు తాత్కాలికంగా కొట్టుకొనిపోయి అనిర్వచనీయ పరమానందం అనుభవించసాగారు. మొదట్లో ఏం చేయాలో వాళ్ళకు అర్థం కాలేదు; కాసేపు అయ్యాక అనిర్వచనీయ భావ ప్రభావానికిలోనై బిగ్గరగా ‘హరిబోల్’ అంటూ హరినామ సంకీర్తన ప్రారంభించారు.
ఏ భగవన్నామం ద్వారా మనస్సు సమాధిస్థితికి అధిరోహిస్తుందో ఆ నామం ద్వారానే మనస్సు, మళ్ళీ ఆ స్థితి నుండి మామూలు స్థితికి తిరిగి రాగలదని సమాధి తత్త్వాన్ని విశదీకరిస్తూ ఇంతకు మునుపే మరొక చోట* ప్రస్తావించి ఉన్నాం. శ్రీరామకృష్ణులలో నిత్యం ఇలా జరగడం మేం ఎన్నోసార్లు గమనించి ఉన్నాం. ‘హరి’ నామం చెవిన పడగానే శ్రీరామకృష్ణులకు ఒకింత శరీరస్మృతి కలిగింది. అప్పుడు ఆయనలో భగవత్ప్రేమభావం ఉప్పొంగగా, సంకీర్తన చేస్తున్న భక్తబృందంతో జతకట్టి మహోత్సాహంతో నృత్యం చేస్తూ చేస్తూ, భావాతిశయ పారవశ్యంలో చిత్తరువులా కదలక మెదలక నిలబడిపోసాగారు. శ్రీరామకృష్ణుల ఆ అవస్థను చూస్తూన్న భక్తుల భక్త్యుత్సాహాలు నూరింతలు అధికరించగా, వారందరూ సంకీర్తనలో తన్మయులైపోయారు. అటువంటి పరిస్థితిలో ‘శ్రీచైతన్యుల ఆసనం’ మీద శ్రీరామకృష్ణులు నిలబడడం సముచితమో కాదో నిర్ణయించే వారెవరున్నారు? ఆ రీతిలో మహోత్సాహంతో నృత్యం చేస్తూ శ్రీహరి, శ్రీచైతన్యుల గుణనామ కీర్తనం గావించిన తదనంతరం అందరూ ఏకస్వరంలో జయ జయ ధ్వానాలు చేసి నాటి ఉత్సవాన్ని ముగింపుకు తెచ్చారు. కొంతసేపయ్యాక శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళారు.
39. పై సంఘటన వలన వైష్ణవ సముదాయంలో చెలరేగిన సంక్షోభం
శ్రీరామకృష్ణుల నృత్యసంకీర్తనల దివ్య ప్రభావంలో తన్మయులై తాత్కాలికంగా ఉన్నత ఆధ్యాత్మిక భూములను అధిరోహించ గలిగారు ఆ భక్తులు. కాని తాత్కాలికంగా స్తబ్ధమైనా, ఇతరులలో తప్పులు పట్టడమే స్వాభావికమైన వారి దోషదృష్టి, శ్రీరామకృష్ణులు అక్కడ నుండి నిష్క్రమించిన తక్షణమే ‘పునర్మూషికం’ మాదిరిగా మళ్ళీ తప్పులు పట్టే స్థితికే దిగజారింది. నిజానికి జ్ఞానాన్ని పూర్తిగా ఉపేక్షించి కేవలం ఒక్క భక్తి ఆధారంతో మాత్రమే భగవత్సాక్షాత్కారం సిద్ధిస్తుందని ఉపదేశించే మతాలన్నింటిలోను ఈ దోషం కనబడుతుంది. భక్తిమార్గంలో సాగే సాధకులు శ్రీహరి సంకీర్తనాదుల తోడ్పాటుతో కొంతసేపు ఉన్నత ఆధ్యాత్మిక స్థితులను అలవోకగా అధిరోహించి పరమానందం అనుభవించగలిగినా, ఆ భావోద్వేగం అణగిపోయిన మరుక్షణమే నిమ్న స్థితులకు దిగజారిపోతారు. అది వారి తప్పు కాదు; ఉద్వేగంలో ఉత్తేజం చెందడం, అది చల్లబడిన తరువాత నీరసపడడం మనశ్శరీరాల ప్రకృతి ధర్మం. అంటే ఎంత ఉవ్వెత్తుకు అధిరోహిస్తామో, తరువాత అంతే అధోస్థితికి పడిపోతాం. అట్లే ఉత్తేజం అనంతరం బలహీనమవడం కూడా ప్రకృతి స్వభావమే.
ఇప్పుడు కూడా అలాగే జరిగింది. హరిసభకు చెందిన ఆ భక్తుల ఉన్నత ఆధ్యాత్మిక భావోద్వేగం తగ్గిపోగానే వారిలో పూర్వపు స్వభావ సంస్కారాలు మళ్ళీ తలెత్తి, శ్రీరామకృష్ణుల ప్రవర్తనను విమర్శించడంలో వారు మునిగిపోయారు. భావముఖ స్థితిలో శ్రీరామకృష్ణులు ‘శ్రీచైతన్యుల ఆసనాన్ని’ అధిష్ఠించడం సబబే అని ఒక పక్షం వారు అంగీకరించగా, మరొక పక్షం వారు అందుకు తమ తీవ్ర నిరసనను వెలిబుచ్చారు. ఆ రెండు పక్షాల మధ్య వాదోప వాదాలు తారాస్థాయిని చేరుకొన్నాయి. కాని చివరకు వారు ఎటువంటి నిర్ణయానికీ రాలేకపోయారు.
40. ఆ విషయం విని బాబాజీ కుపితుడవడం
ఈ వివాదం క్రమంగా ఆ నోట ఈ నోట వైష్ణవ సముదాయం అంతటా ప్రాకింది. భగవాన్‌దాస్ బాబాజీ చెవిన కూడా పడింది. అక్కడితోనే వ్యవహారం ఆగిపోలేదు; భవిష్యత్తులో భగవద్భావం కలిగినట్లు నటిస్తూ పేరుప్రతిష్ఠలను పొందే ఉద్దేశంతో నయవంచకులు, మోసగాళ్ళు ఆ ఆసనాన్ని అధిష్ఠిస్తారేమోనని భయపడ్డ హరిసభ భక్తులు, కొందరు బాబాజీని కలుసుకొని, అటువంటి సంఘటనలు ఇకపై జరగకుండా ఏం చేయాలో ఆయనను సలహా అడిగారు. శ్రీచైతన్యుల పాదాలను ఆశ్రయించి సిద్ధుడైన బాబాజీ తన అభీష్టదేవత ఆసనం మీద ఎవరో అనామకుడైన శ్రీరామకృష్ణులు నిలబడ్డారని వినగానే ఎంతో చిరాకుపడ్డారు. కోపంతో కళ్ళు మూసుకుపోగా శ్రీరామకృష్ణులను నానాదుర్భాషలాడారు, నయవంచకుడని అభివర్ణించడానికి కూడా వెనుకాడలేదు. తన వద్దకు వచ్చిన హరిసభ సభ్యులను చూడగానే బాబాజీ విసుగు, కోపం తారాస్థాయినందుకొన్నాయి. తమ కళ్ళముందే అలా జరిగినప్పుడు వాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోవడం మహాపరాధమని వాళ్ళపై భగ్గున మండిపడ్డారు. తరువాత కోపం తగ్గాక, భవిష్యత్తులో మరెవరూ అలాంటి పని చేయకుండా కట్టుదిట్టంగా ఉండడానికి ఏం ఏర్పాట్లు చేయాలో ఆదేశాలిచ్చారు. కాని ఈ గందరగోళానికంతా కారణం ఎవరో (అంటే శ్రీరామకృష్ణులు) వారికి మాత్రం ఇవేవీ తెలియవు.
41. భగవాన్‌దాస్‌ను సందర్శింప శ్రీరామకృష్ణులు వెళ్ళడం
ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత తమ ఇచ్ఛ మేరకు మథుర్, హృదయ్లతో కలిసి శ్రీరామకృష్ణులు కాల్నాకు వెళ్ళారు. వేకువజామునే వారి పడవ రేవును చేరింది. మథుర్ వసతి భోజనాల ఏర్పాట్లలో మునిగిపోయాడు. ఈలోపు శ్రీరామకృష్ణులు హృదయ్‌ను వెంటబెట్టుకొని ఊళ్ళోకి వెళ్ళారు. బాబాజీ చిరునామా దారిన పోయేవారి నుండి తెలుసుకొని ఆయన ఆశ్రమం వద్దకు వచ్చారు.
42. శ్రీరామకృష్ణుల గురించి బాబాజీకి హృదయ్ తెలియచేయడం
అపరిచితులను కలుసుకోబోయే ముందు పసిబిడ్డ స్వభావులైన శ్రీరామకృష్ణులు, వర్ణించనలవిగాని ఒక రకమైన భయం, సిగ్గులకు లోనయ్యేవారు. ఆయన అలా వ్యవహరించడం మేం ఎన్నోసార్లు గమనించాం. బాబాజీ వద్దకు వెళ్ళినప్పుడు కూడా ఆయన అలాగే సిగ్గు, భయాలకు లోనయ్యారు. హృదయ్‌ను ముందు వెళ్ళమన్నారు. ఆపాదమస్తకం ఒక వస్త్రం కప్పుకొని హృదయ్‌ను వెంబడించారు. హృదయ్ తిన్నగా బాబాజీ వద్దకు వెళ్ళి ప్రణామం చేసి, “భగవన్నామ సంకీర్తన చేస్తూ మా మామ మైమరచిపోతారు. సుదీర్ఘకాలం నుండి ఆయన ఈ స్థితిని అనుభవిస్తున్నారు. మిమ్మల్ని చూడగోరి ఇక్కడకు వచ్చారు” అని చెప్పాడు.
43. ఒక వైష్ణవ సాధువును బాబాజీ మందలించడం
బాబాజీని సమీపించగానే సాధనల ద్వారా ఆయన పొందిన ఆధ్యాత్మిక శక్తిని తాను గ్రహించానని హృదయ్ చెప్పేవాడు. ఎందుకంటే, తాను ప్రణామం చేసి నోరు విప్పడానికి ముందే “ఎవరో ఒక మహాపురుషుడు ఆశ్రమానికి వచ్చినట్లుందే” అన్న బాబాజీ పలుకులు అతడికి వినిపించాయి. ఇలా అంటూ బాబాజీ చుట్టూ చూశాడు. కాని ఎవరూ కనిపించలేదు, హృదయ్ తప్ప. దాంతో తన ముందున్న వ్యక్తులతో చర్చిస్తూన్న అంశం మీద మళ్ళీ దృష్టి మరల్చాడు. ఒకానొక వైష్ణవ సాధువు ఏదో తప్పు చేశాడు. ఆ తప్పుకు ఏం శిక్ష విధించాలి? అనే విషయంపై అప్పుడు చర్చిస్తున్నారు. ఆ సాధువు చేసిన అనుచిత కార్యానికి బాబాజీకి ఎంతో కోపం వచ్చింది. “నీ జపమాలను లాగేసుకొంటాను, సముదాయం నుండి నిన్ను వెలి వేస్తాను” అంటూ ఆ సాధువును తిట్టసాగారు. అదే సమయంలో శ్రీరామకృష్ణులు అక్కడకు వచ్చారు; బాబాజీకి నమస్కరించి, వినమ్రంగా ఒక ప్రక్కగా కూర్చున్నారు. ఆపాదమస్తకం వస్త్రంతో కప్పుకొని ఉండడం వలన ఆయన ముఖాన్ని ఎవరూ స్పష్టంగా చూడలేకపోయారు. శ్రీరామకృష్ణులు వచ్చి అలా కూర్చోగానే, హృదయ్ ఆయనను గురించి బాబాజీతో చెప్పాడు. ఆ మాటలు వినగానే బాబాజీ తన చర్చను ఆపి వేసి, శ్రీరామకృష్ణులకు హృదయ్‌కు ప్రతి నమస్కారాలు చేసి, వారిని గురించి వాకబు చేశారు.
44. లోకులకు బోధిస్తున్నాననే బాబాజీ అహంకారం
మాటల మధ్యలో బాబాజీ జపమాలను త్రిప్పుతూ లెక్కించడం గమనించి హృదయ్, “ఇప్పుడు కూడా మీకు మాలను త్రిప్పుతూ లెక్కిస్తూ జపం చేయవలసిన అవసరం ఏమున్నది? మీరు సిద్ధులయ్యారు కదా! అటువంటప్పుడు జపమాలను ఉపయోగించవలసిన అవసరం మీకు లేదు కదా?” అని అడిగాడు. శ్రీరామకృష్ణుల అభిమతం మేరకు హృదయ్ అలా ప్రశ్నించాడో లేదా తన ఇచ్ఛమేరకు అలా అడిగాడో ఇతమిత్థంగా తెలియరావడం లేదు. కాని తన ఇచ్ఛమేరకే అలా ప్రశ్నించాడని భావించవలసి వస్తోంది. ఎంతో కాలంగా శ్రీరామకృష్ణుల సేవలో నిమగ్నుడై ఉండడం వలన, ఆయన సాంగత్యంలో ఉత్తమ అధమ వ్యక్తులెందరితోనో కలసిమెలసి వ్యవహరించడం వలన హృదయ్‌లో సమయస్ఫూర్తి కొంతవరకు పెంపొందింది. హృదయ్ ప్రశ్న విని మొదట బాబాజీ ఎంతో వినమ్రతను వ్యక్తం చేశాడు. తరువాత, “వ్యక్తిగతంగా వీటి అవసరం నాకు లేకపోయినప్పటికీ, లోకులకు బోధించే నిమిత్తం నాకు ఇవి చాలా అవసరమై ఉన్నాయి. నేను అలా చేయకుంటే, లోకులు నన్ను అనుకరించి భ్రష్టులైపోతారు” అని అన్నారు.
45. బాబాజీ అహంకారాన్ని శ్రీరామకృష్ణులు విమర్శించడం
పిల్లవాడిలా ప్రతి విషయంలోను సదా సర్వదా జగజ్జనని మీదనే శ్రీరామకృష్ణులు ఆధారపడేవారు. చివరకు ఆ స్వభావం ఎంత సహజమైపోయిందంటే స్వకీయ అహంకారంతో ఏ పనైనా చేయడం మాట అటుంచి, మరెవరైనా అహంకార ప్రేరణతో అలా చేస్తూ ఉండటం చూసినా లేదా చేస్తానని చెప్పడం విన్నా ఆయన ఎంతో మధన పడేవారు. అందువలననే ఎంతో అరుదుగా భగవంతుడి దాసుణ్ణి అనే అర్థంతో ‘నేను’ అనే మాటను ఆధ్యాత్మిక భావస్థితిలో ఉన్నప్పుడు ఉపయోగించినా, సామాన్యంగా మనం ఉపయోగించే అర్థంలో ఆయన ఎన్నడూ, మరే అవస్థలోనూ “నేను” అనే పదం ఉపయోగించేవారు కారు. ఆయనను కొద్దిసేపు మాత్రమే చూసినవారు కూడా ఆయన నిరహంకార ప్రవృత్తిని చూసి ఆశ్చర్యపోయేవారు, ముగ్ధులయ్యేవారు; ‘నేను ఆ ఫలానా పనిని చేసేస్తాను’ అని ఎవరైనా అనడం వింటే ఆయన ఎంతో చిరాకుపడేవారు. దీన్ని చూసిన ఇతరులు, ‘ఈ మనిషి ఏమంత పాడుపని చేశాడని ఈయన ఇంతగా చిరాకుపడుతున్నారు?’ అని ఆశ్చర్య పోయేవారు.
శ్రీరామకృష్ణులు, భగవాన్‌దాస్ బాబాజీ వద్దకు వచ్చీరాగానే ఒక సాధువు జపమాలను లాక్కొని అతణ్ణి సముదాయం నుండి వెలివేస్తానని బాబాజీ అనడం విన్నారు. ఆ తరువాత లోకులకు మరింత బాగా బోధించే నిమిత్తమే తాను జపమాలను త్రిప్పుతూ లెక్కించడం, తిలకం నుదుట ధరించడం ఇంకా వదలి పెట్టలేదని బాబాజీ అనడమూ శ్రీరామకృష్ణులు విన్నారు. పదేపదే బాబాజీ ‘అతణ్ణి వెలివేస్తాను’, ‘లోకులకు బోధిస్తాను’, ‘తిలకం నుదుట ధరించడం మానుకోలేదు’ మొదలైన మాటలు అనడం విని, నిష్కపటులైన శ్రీరామకృష్ణులు విసుగును వ్యక్తం చేయకుండా ఉండలేకపోయారు. అటువంటి సందర్భాలలో సభ్యత గల వ్యక్తులం అనుకొనే మనం ఊరకనే ఉండిపోవడం కద్దు. శ్రీరామకృష్ణులు హఠాత్తుగా లేచి నిలబడి బాబాజీని ఉద్దేశించి ఇలా అన్నారు : “ఏమిటీ? ఇప్పటికీ నీలో ఇంత అహంకారమా? లోకులకు బోధించడానికి, వారిని బహిష్కరించడానికి, వారిని స్వీకరించడానికి లేదా వారిని తిరస్కరించడానికి నువ్వెవరివి? లోకులకు బోధించడానికి నువ్వెవరవు? ఈ లోకం ఎవరికి చెందిందో ఆయనే ఈ పనులు చేయగలడు. ఆయనే చేయలేకపోతే, ఆ కార్యాన్ని నువ్వు సాధించగలవా?” ఆయన ఇలా మందలిస్తూ ఉండగా ముసుగులా ఆయన శరీరాన్ని కప్పివేసిన వస్త్రం జారిపడిపోయింది; ఆయన ధరించిన ధోవతి సడలి, నడుంకట్టు నుండి జారింది; అప్పుడు ఆయన ముఖారవిందం అపూర్వ దివ్యతేజస్సుతో ప్రకాశించసాగింది. ఎవరితో, ఏం మాట్లాడుతున్నాననే స్పృహే ఆయనలో కానరాలేదు. ఈ నాలుగు మాటలు పలికీ పలుకుతూండగానే, భావావేశమగ్నులై, నిశ్చేష్టితులై శ్రీరామకృష్ణులు సమాధిస్థితులైనారు.
46. శ్రీరామకృష్ణుల పలుకులను సత్యమని బాబాజీ అంగీకరించడం
సాధన సిద్ధుడైన బాబాజీ పట్ల ఇంతకాలం వరకూ సర్వులూ ఎంతో భక్తిప్రపత్తులు నెరపుతూ వచ్చారు. అందుచేత ఆయన చెప్పిన దానికి నిరసన తెలిపే లేక ఆయనలో దోషాలు ఎత్తి చూపే సాహసం ఎవరికీ లేదనే చెప్పాలి. అటువంటప్పుడు శ్రీరామకృష్ణుల చర్యకు బాబాజీ మొదట్లో ఎంతో ఆశ్చర్యపోయారు. కాని అటువంటి పరిస్థితులలో సామాన్యులలా బాబాజీ కోపగించుకోలేదు, ప్రతీకారం తీర్చుకోవాలనీ అనుకోలేదు. ఆయనలో నొచ్చుకొన్న భావన ఏదీ వ్యక్తం కాలేదు; పైగా ప్రశాంతంగా ఉండిపోయారు. ఎంతోకాలంగా అనుష్ఠించిన తపశ్చర్యాదుల ఫలితంగా జనించిన నిజాయతీ ఇప్పుడు ఆయనకు శ్రీరామకృష్ణుల వచనాలలోని సత్యాన్ని అవగతం చేసుకోవడంలో దోహదపడింది. ‘నిజానికి భగవంతుడొక్కడే తప్ప రెండవ కర్త అంటూ మరెవరూ ఈ ప్రపంచంలో లేరు. అన్ని కార్యాలను తానే చేస్తున్నానని అహంకారపూరితుడైన మనిషి ఎంతైనా అనుకోవచ్చు. కాని నిజానికి అతడు పరిస్థితుల చేతిలో కీలుబొమ్మ మాత్రమే. అనుమతి పొందిన మేరకే అతడు నిర్వర్తించగలడు, అవగతం చేసుకోగలడు. లౌకికులు తమ స్వకీయశక్తితో, ఇచ్ఛమేరకు కార్యాలను చేస్తూవున్నట్లు భావించవచ్చు; కాని భక్తుడు, సాధకుడు క్షణకాలం కూడా అలా పొరపడరాదు, అలా పొరపడితే భ్రష్టుపట్టడం మాత్రం ఖాయం’ అని బాబాజీ అవగతం చేసుకొన్నారు. ఆ విధంగా శ్రీరామకృష్ణుల శక్తివంతమైన పలుకులు బాబాజీ అంతర్దృష్టిని విప్పారింపచేశాయి; అతడి దోషాలను ఎత్తిచూపాయి; అతణ్ణి వినమ్రునిగా, నిరాడంబరునిగా గావించాయి. పైగా శ్రీరామకృష్ణులలో అభివ్యక్తమయ్యే అద్భుత ఆధ్యాత్మిక భావాన్ని చూసి ఆయన సామాన్యులు కారని బాబాజీకి రూఢి అయింది.
47. వారి మధ్య హార్దిక సంభాషణ
తదనంతరం వారి మధ్య జరిగిన భగవత్ప్రసంగంతో అక్కడ దివ్యానందం ప్రవహించి ఉంటుందని మనం సులభంగానే ఊహించవచ్చు. సంభాషణ సాగుతూ ఉన్నప్పుడు మధ్యమధ్యలో శ్రీరామకృష్ణులు భావసమాధిమగ్నులై పరమానందాన్ని చవిచూడడం చూసి బాబాజీ ముగ్ధుడయ్యాడు. ఏ మహాభావాన్ని గురించి అవగతం చేసుకోవడానికి తానింత సుదీర్ఘకాలం శాస్త్రాధ్యయనం చేస్తూ వచ్చాడో, ఆ మహాభావం శ్రీరామకృష్ణులలో సదా అభివ్యక్తం కావడం చూసి బాబాజీ పరవశించిపోయాడు. అలా ప్రత్యక్షంగా చూశాక శ్రీరామకృష్ణుల పట్ల ఆయన భక్తిప్రపత్తులు ఎన్నోరెట్లు అధికరించాయి.
ఆ తరువాత కౌలటోలా హరిసభలో భావావేశంలో తన్మయులై ‘శ్రీచైతన్య ఆసనాన్ని’ అధిష్ఠించిన దక్షిణేశ్వరపు పరమహంస ఈయనే అని బాబాజీకి తెలిసింది. అన్యాయంగా ఆయనను దుర్భాషలాడినందుకు అప్పుడు బాబాజీ పడిన దుఃఖమూ, పశ్చాత్తాపమూ వర్ణనాతీతం. వినమ్రుడై బాబాజీ, శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి, క్షమించమని వేడుకొన్నారు. ఈ విధంగా శ్రీరామకృష్ణుల, బాబాజీల ఆనాటి ప్రేమ నాటకానికి తెరదిగింది. కొంత సేపయ్యాక హృదయ్‌ను వెంటబెట్టుకొని శ్రీరామకృష్ణులు, మథుర్ వద్దకు తిరిగివచ్చి జరిగిన వృత్తాంతమంతా పూసగుచ్చినట్లు అతడికి చెప్పారు; బాబాజీ అత్యున్నత ఆధ్యాత్మిక అవస్థ గురించి ప్రశంసిస్తూ తెలిపారు. అంతా విని మథుర్ కూడా బాబాజీని దర్శించడానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో వెలసిన దైవ ప్రతిమల సేవార్థం, ఒక రోజు విశేష ఉత్సవం జరపడానికి మథుర్ ఏర్పాటు చేయించాడు.