అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ।
ఇతి మత్వా భజన్తే మాం బుధా భావసమన్వితాః ॥ – భగవద్గీత, 10.8
తేషామేవానుకమ్పార్థమహమజ్ఞానజం తమః ।
నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వతా ॥ – భగవద్గీత, 10.11
సమస్తానికీ నేనే ఉత్పత్తి స్థానాన్ని. సర్వం నాలో నుండే ఉద్భవిస్తున్నది. అది తెలుసుకొని జ్ఞానులు సర్వదా నన్ను పరమ ప్రేమతో ఆరాధిస్తూ ఉంటారు. వారి పట్ల కరుణ వహించి, నేను వారి బుద్ధిలో నెలకొని, వారిలోని అజ్ఞాన అంధకారాన్ని తత్త్వజ్ఞానరూప దీప్తివంతమైన జ్యోతితో రూపుమాపుతాను.
1. శ్రీరామకృష్ణులు సాధువులను కలుసుకొన్న తీరు
ఒకసారి శ్రీరామకృష్ణులు మాతో ఇలా చెప్పారు : “కేశవ సేన్ ఇక్కడకు (తమ వద్దకు) రావడం మొదలుపెట్టిన తరువాత నుండే మీ వంటి ‘యంగ్ బెంగాల్’* (Young Bengal బృందం ఇక్కడకు రాసాగింది. అంతకు మునుపు ఇక్కడికి ఎందరు సాధువులు, సర్వసంగ పరిత్యాగులైన సన్న్యాసులు, విరాగులు, బాబాజీలు* వచ్చేవారో మీకు తెలుసా? రైళ్ళ రాకపోకలు మొదలయ్యాక ప్రస్తుతం వారు ఈ వైపు అంతగా రావడం లేదు. కాని అంతకు మునుపు సాధువు లందరూ గంగానది ప్రక్కగా వెళ్ళే కాలిబాట మీదుగా స్నానార్థం గంగాసాగరానికి, అట్లే జగన్నాథ దర్శనార్థం పూరీకి పోయేటప్పుడు ఇటువైపుగా వచ్చేవారు. అలా వచ్చినప్పుడు తప్పక రాణీరాస్మణి ఉద్యానవనంలో కొన్ని రోజులు బసచేసి, విశ్రాంతి తీసుకొనేవారు. వారిలో కొందరు దీర్ఘకాలమే ఇక్కడ గడిపి వెళుతూ ఉండేవారు. ఎందుకో తెలుసా? అన్నపానీయాలకు (భిక్ష), శౌచాదులకు ఏకాంత స్థలాల సదుపాయంలేని చోట సాధువులు తిష్ఠవేయరు. సాధువులు భిక్షాన్నంతో మాత్రమే శరీరాన్ని పోషించుకుంటారు. కాబట్టే అనాయాసంగా భిక్ష లభించే చోట్ల మాత్రమే సామాన్యంగా సాధువులు తిష్ఠవేయడం కద్దు.
2. నీరు, శౌచాదులకు ఏకాంత స్థలాల సదుపాయం ఉన్న చోట్లలోనే సాధువులు విశ్రమిస్తారు
“ప్రయాణాలలో అలసిపోయినప్పుడు, ఆ సాధువులు భిక్ష దుర్లభమైన చోట్ల కూడా ఒకటి రెండు రోజులు ఆగి, విశ్రమిస్తారు; కాని వారు ఎన్నడూ నీరు, ఏకాంత స్థలాలు లభించని చోట్లలో మాత్రం బస చేయరు. అందరూ ఉపయోగించే బహిర్భూములను గాని లేదా తాము ఇతరుల కంటపడే స్థలాలలోగాని ఉత్తమ సాధువులు శౌచాదులు నిర్వర్తించరు. వాటికై సుదూరాన ఉండే ఏకాంత స్థలాలకు పోతారు. సాధువు చెప్పిన ఒక కథ వినండి :
3. పై విషయం గురించి ఒక కథ
“ఒక ఫలానా వ్యక్తి సర్వసంగపరిత్యాగం చేసిన సాధువుకై అన్వేషించసాగాడు. ‘చూడు, ఏ సాధువు జనసంచారం నుండి దూరంగా పోయి శౌచాదులు నిర్వర్తించుకొంటాడో, అతడే నిజమైన పరిత్యాగి అని తెలుసుకో’ అని ఇతడు వినివున్నాడు. ఈ వ్యక్తి ఈ సంగతి జ్ఞాపకం పెట్టుకొని జనసంచారం లేని స్థలాలలో వెతకసాగాడు. ఇలా ఉండగా ఒక రోజు ఒక సాధువు శౌచాదులు తీర్చుకోవడానికి ఇతరుల కంటే చాలా దూరం వెళ్ళడం చూసి, ఈ వ్యక్తి అతణ్ణి కాస్త దూరంలో ఉండి అనుసరించసాగాడు. ఈలోపు మరొక సంఘటన జరిగింది. ‘నిజమైన యోగి పుంగవుణ్ణి వివాహం చేసుకొంటే సుపుత్రుడు జన్మిస్తాడు’ అన్న సంగతి ఆ దేశ రాజకుమార్తె విన్నది. ఎందుకంటే యోగుల వంశంలోనే సాధువులు జన్మిస్తారని శాస్త్రాలు వచిస్తున్నాయి కనుక, తనకు నచ్చిన వరుణ్ణి వెతకడం కోసం ఈ రాకుమార్తె సాధువులు బస చేసిన చోటుకు వచ్చింది. పైన పేర్కొన్న సాధువును ఎంపిక చేసుకొని, అంతఃపురానికి తిరిగి వచ్చి, ఆ సాధువునే వివాహం చేసుకొంటానని తండ్రితో చెప్పింది. రాజుకు కుమార్తె అంటే పంచప్రాణాలు. ఆమె పట్టుపట్టడంతో రాజు, ఆ సాధువును కలుసుకొని తన కుమార్తెను వివాహమాడమనీ, ఆమెతోపాటు అర్ధరాజ్యం కూడా ధారాదత్తం చేస్తాననీ పరిపరివిధాల ఒప్పించడానికి ప్రయత్నించాడు. కాని సాధువు ఈ ప్రలోభాలకు వశం కాలేదు. ఆనాటి రాత్రే ఎవరికీ తెలియకుండా ఎటో వెళ్ళిపోయాడు.
“నిజమైన సాధువు కోసం వెతకుతూన్న ఆ వ్యక్తి ఈ సాధువు ప్రవర్తన, అతడి అద్భుత పరిత్యాగం చూసి, ఆయనను నిజమైన బ్రహ్మజ్ఞానిగా గుర్తించాడు. వెంటనే ఇతడు వెళ్ళి ఆ సాధువును ఆశ్రయించాడు. సాధువు ఈ వ్యక్తిని కనికరించి, ఉపదేశం చేశాడు. ఆయన అనుగ్రహంతో ఈ వ్యక్తి నిజమైన భగవద్భక్తిని పొంది, తన జీవిత ధ్యేయాన్ని నెరవేర్చుకొన్నాడు” అని తెలియజేశారు.
4. దక్షిణేశ్వరానికి సాధువులు రావడానికి కారణాలు
“రాణీరాస్మణి ఉద్యానవనంలో భిక్ష సునాయాసంగా లభించేది. గంగమ్మ తల్లి అనుగ్రహంతో నీటికి ఎటువంటి ఎద్దడీ ఉండేది కాదు. సాధువులకు నచ్చే ఏకాంత ప్రదేశాలు కూడా చుట్టుపక్కల ఉన్నాయి. కాబట్టి ఆ రోజుల్లో సాధువులు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఇక్కడ బసచేసేవారు. దక్షిణేశ్వర ఉద్యానవనంలో లభించే సదుపాయాల గురించిన వార్త ఆ నోటా ఈ నోటా ప్రాకింది. గంగాసాగర్, పూరీ క్షేత్రాలకు తీర్థయాత్రలు చేసే సాధువులకు రాస్మణి ఉద్యానవనం చక్కని విశ్రాంతినిచ్చే బసగా క్రమేణా ప్రసిద్ధి కెక్కింది” అని శ్రీరామకృష్ణులు వివరించారు.
5. భిన్న సంప్రదాయాల సాధువులు విభిన్న సమయాల్లో రావడం
శ్రీరామకృష్ణులు మళ్ళీ కొనసాగించారు : “ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక వర్గాలకు చెందిన అనేకమంది సాధువులు ఇక్కడ గుమిగూడేవారు. ఒక్కో సమయంలో సన్న్యాసులు, పరమహంసలు వచ్చేవారు. పొట్టకూటి దేశదిమ్మరులు కారు వారు. (తమ గదిని చూపుతూ) రాత్రింబవళ్ళు ఆ గది సాధువులతో నిండిపోయి ఉండేది. బ్రహ్మం, మాయ, అస్తి, భాతి, ప్రియం మొదలైన వేదాంత అంశాల చర్చలో రేయింబవళ్ళు గడిచిపోయేవి.”
6. పరమహంసల వేదాంత విచారణ
అస్తి, భాతి, ప్రియం అనే వేదాంత పదాలను శ్రీరామకృష్ణులు ఇలా విశదీకరించేవారు: “ఈ పదాలు వేటిని సూచిస్తాయో మీకు తెలుసా? బ్రహ్మ స్వరూపాన్ని. వేదాంతం, బ్రహ్మ స్వరూపాన్ని ఇలా అభివర్ణిస్తున్నది – ఏ పరమాత్మ ‘అస్తి’ స్వరూపుడో, అంటే ఎవరు (సర్వకాల సర్వావస్థలలో ఏ మార్పూ లేకుండా) నిజానికి విరాజమానుడై ఉంటాడో అతడే ‘భాతి’ ; అంటే ప్రకాశిస్తూ లేదా అభివ్యక్తమౌతూ ఉంటాడు. అంటే అభివ్యక్తమవడం జ్ఞానం స్వభావం అన్నమాట. ఏ వస్తువును గురించిన జ్ఞానం మనకు కలుగుతుందో ఆ వస్తువే మనకు అభివ్యక్తమౌతుంది. దేనిని గురించి తెలియదో అది అభివ్యక్తం కాదు. కాబట్టే వస్తువు ‘ఉనికి’ మనకు తెలియవచ్చిన తక్షణం అది మనకు అభివ్యక్తం కావడం గురించి మనకు ఎరుక కలుగుతుంది; అంటే దాని జ్ఞాన స్వరూపం మనకు అవగతమౌతుంది. వెంటనే అది మనకు ‘ప్రియ’ మైనదిగా అనిపిస్తుంది. అంటే ఆ వస్తువులో ఉన్న ఆనంద స్వరూపం మన మనస్సులలో ‘ప్రియ’ భావాన్ని జనింపచేసి, దానిని ప్రేమించాలనే ప్రేరణను మనలో పురిగొల్పుతుంది. ఈ విధంగా దేనిని గురించి అయినా ‘అస్తి’ (ఇది ఉన్నది) అనే ఎరుక కలుగగానే దాని జ్ఞానస్వరూపం, ఆనంద స్వరూపాన్ని గురించిన ఎరుక కూడా కలుగుతుంది. అంటే ‘అస్తి’, ‘భాతి’, ‘ప్రియం’ – ఈ మూడూ సదా కలిసే అవగతమౌతాయి. కాబట్టే ‘అస్తి’ అనే భావనతో పాటు ‘భాతి’, ‘ప్రియం’ అనే ఎరుక, ‘భాతి’ అనే భావనతో పాటు ‘అస్తి’, ‘ప్రియం’ అనే ఎరుక, అట్లే ‘ప్రియం’ అనే ఎరుకతో ‘అస్తి’, ‘భాతి’ అనే ఎరుక కలుగుతాయని వేదాంతం మనకు బోధిస్తున్నది.
“ఎందుకంటే ఏ బ్రహ్మపదార్థం నుండి ఈ ప్రపంచమూ, ప్రపంచంలోని ప్రతి వ్యక్తీ, వస్తుమా ఉత్పన్నమైనాయో ఆ బ్రహ్మపదార్థ స్వరూపమే ‘అస్తి–భాతి–ప్రియం’ కనుక. లేదా దానికే మరో పేరు ‘సత్–చిత్–ఆనందం’. కాబట్టే నిజమైన ఆనందం కలిగినప్పుడు (దీనినే భగవత్సాక్షాత్కారం లేదా బ్రహ్మజ్ఞానం అంటారు) నీ మనస్సు అనురక్తి చెందిన ప్రతి వస్తువులోగాని లేదా వ్యక్తిలోగాని భగవంతుని ఉనికి నీకు తెలియవస్తుందని ఉత్తర గీత* వచిస్తున్నది.
“యత్ర యత్ర మనోయాతి తత్ర తత్ర పరం పదం” – ఎక్కడెక్కడకు మనస్సు పోతుందో అక్కడల్లా భగవంతుడు కనిపిస్తాడు.
“రూపరసాది భోగ్యవిషయాలు కూడా ఆనంద స్వరూపుడైన ఆ పరమాత్ముని అంశాలు కావడం చేతనే మనస్సు వాటి పట్ల ఆకర్షితమౌతుందని వేదాలూ వచిస్తున్నాయి.
“ఇటువంటి విషయాల మీద ఆ సన్న్యాసుల మధ్య తీవ్రంగా చర్చోప చర్చలు జరుగుతూ ఉండేవి. ఆ సమయంలో నేనూ తీవ్ర రక్తగ్రహిణితో బాధ పడుతున్నాను. ఎడతెగని విరోచనాలు. గదిలో ఒక మూల హృదయ్ ఒక మట్టి పాత్రను పెట్టాడు. ఒక ప్రక్క అలా రక్తగ్రహిణితో బాధపడుతూనే, మరో ప్రక్క వారి వేదాంత చర్చను వినేవాణ్ణి. ఏ విషయంలోనైనా వారు ఒక నిర్ణయానికి రాలేనప్పుడు (తమ శరీరాన్ని చూపుతూ) దీనిలో నుండి అమ్మ సరళమైన పరిష్కారాలను సూచించేది. ఆ పరిష్కారాలను నేను వారికి చెప్పగానే వారి భేదాభిప్రాయాలు సమసిపోయేవి.
7. పరమానందంలో మునిగి ఉన్న ఒక సాధువు మహోన్నత అవస్థ
“ఒకప్పుడు ఒక సాధువు ఇక్కడకు వచ్చాడు. ఆయన ముఖం దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది. ఆయన సదా ఒక చోట కూర్చుని, మందహాసం చేస్తూ ఉండేవాడు. ఉదయాన ఒకసారి, సాయంత్రం ఒకసారి ఆయన తన గది నుండి బయటకు వచ్చేవాడు. తన చుట్టూవున్న చెట్లను, మొక్కలను, గంగానదిని, ఆకాశాన్ని తేరిపార పరికించేవాడు; తరువాత ఆనందంలో మునకలు వేస్తూ రెండు చేతులూ పైకెత్తి నాట్యం చేసేవాడు. ఒక్కొక్కప్పుడు నేలమీద పడి దొర్లుతూ, పెద్దగా నవ్వుతూ, “శభాష్! ఎంత అద్భుతమైంది మాయ! ఎంతటి భ్రమ కల్పించబడింది!” అని అంటూ ఉండేవాడు. అంటే, భగవంతుడు ఎంతటి అందమైన మాయను ఆవిష్కృతం చేశాడని అర్థం. అదే అతడి ఉపాసన. అతడు పరమానందానుభూతిని పొందాడు.
8. జ్ఞానోన్మత్తుడైన ఒక సాధువును శ్రీరామకృష్ణులు దర్శించడం
“మరొక సందర్భంలో మరో సాధువు ఇక్కడకు వచ్చాడు. అతడు జ్ఞానోన్మత్తుడైన సాధువు. అతడు పిశాచంలా కనిపించాడు. అతడు నగ్నంగా ఉన్నాడు. ఒళ్ళంతా దుమ్మూధూళీ పట్టి ఉంది. పొడవైన గోళ్ళు, శిరోజాలు; పీనుగుల మీద నుండి ఏరుకు వచ్చిన చినిగి పేలికలైన బట్టను ఒంటి పైభాగాన ఆచ్ఛాదనగా వేసుకొని ఉన్నాడు. కాళికాలయం ముందు నిలబడి, కాళీ ప్రతిమను చూస్తూ స్తవం పఠించసాగాడు. అతడి స్తవగానానికి ఆలయం యావత్తు కంపించినట్లు అయింది. అది చూసి అమ్మ ప్రసన్నురాలై నవ్వినట్లుగా అనిపించింది. తరువాత అతడు పేదలు ప్రసాదం పుచ్చుకొనే చోటికి వెళ్ళి కూర్చోబోయాడు. ఆ పిశాచాకారాన్ని చూసి తమతో కూర్చోనివ్వకుండా వారు అతణ్ణి అక్కడ నుండి తరిమి వేశారు. తదనంతరం ఎంగిలాకులు పారవేసే చోట కూర్చుని కుక్కలతో పాటు ఆ ఎంగిలాకులలో మిగిలిన ఆహారాన్ని పంచుకొని తింటూ అతడు కనిపించాడు. ఒక కుక్క మెడ చుట్టూ చేయి వేసి, ఒకే ఎంగిలాకు నుండి అతడూ, ఆ కుక్కా కలిసి తినసాగారు. అపరిచిత వ్యక్తి ఎవరో తన మెడమీద చేతులు వేసినప్పటికీ ఆ కుక్క మొరగలేదు, పారిపోవడానికీ ప్రయత్నించలేదు. ఆ దృశ్యం చూసి చివరకు నాకూ అదే గతిపట్టి అతడిలా తిరగ వలసివస్తుందేమోనని భయపడ్డాను.
9. గంగాజలం, మురికి కాలువ నీటి మధ్య విభేదం బ్రహ్మజ్ఞానికి కానరాదు
“ఇదంతా చూసి నేను గబాగబా హృదయ్ వద్దకొచ్చి, ‘హృదూ! అతడిది సామాన్యమైన పిచ్చితనం కాదు; అది దివ్యోన్మాదం’ అని చెప్పాను. నా మాటలు విని హృదయ్ అతణ్ణి చూడడానికి పరిగెత్తాడు. అప్పటికే ఆ సాధువు ఉద్యానవనం దాటి వెళ్ళిపోతున్నాడు. హృదయ్ అతణ్ణి చాలా దూరం వరకు వెంబడించి, ‘మహరాజ్, భగవత్సాక్షాత్కారం పొందే ఉపదేశం కాస్త సెలవియ్యండి’ అని ప్రార్థించాడు. మొదట అతడేమీ బదులు పలుకలేదు. కాని హృదయ్ తనను వదలిపెట్టకుండా వెంబడించి రావడం గమనించి, కాలిబాట ప్రక్కన పారుతున్న మురికి కాలువ నీటిని చూపుతూ, ‘ఈ మురికి నీరూ, ఆ గంగాజలమూ సమానంగా పవిత్రమైనవనే జ్ఞానం నీలో ఎప్పుడు జనిస్తుందో అప్పుడు భగవదనుభూతి పొందగలవు’ అని చెప్పాడు. అంతే, ఇంకేమీ చెప్పలేదు. అయినా హృదయ్ ఇంకా అతడి నుండి వినాలని ప్రయత్నించాడు. ‘మహరాజ్! నన్ను మీ శిష్యునిగా స్వీకరించి, మీ వెంట తోడ్కొని వెళ్ళండి’ అని అడిగాడు. అందుకు ఆ సాధువు బదులేమీ చెప్పలేదు. అతడు మరికొంత దూరం వెళ్ళి వెనక్కు తిరిగి చూడగా, హృదయ్ ఇంకా వెంబడిస్తూ రావడం కంటబడింది. వెంటనే కళ్ళెర్ర చేసుకొని, ఇటుక ముక్కను పుచ్చుకొని విసరబోయినట్లు బెదిరించాడు. దాంతో హృదయ్ వెనుదిరిగి పారిపోయాడు. అలా హృదయ్ పారిపోగానే ఆ సాధువు ఇటుక ముక్కను క్రిందపడేసి, బాటను విడిచి మెల్లగా జారుకున్నాడు. మళ్ళీ ఆ సాధువు కనిపించలేదు. లోకుల సతాయింపుల నుండి తప్పించుకోవడానికి అటువంటి సాధువులు మారురూపంలో అలా సంచరిస్తూ ఉంటారు. ఈ సాధువు నిజమైన పరమహంస స్థితిలో ఉన్నాడు.
నిజమైన పరమహంసలు పిల్లల్లా, పిశాచాల్లా, పిచ్చివారిలా లోకంలో వ్యవహరిస్తూ ఉంటారని శాస్త్రాలు వచిస్తూన్నాయి. అందుకే పరమహంసవరేణ్యులు తమ చుట్టూ కొందరు పిల్లలను చేరదీసి, ఆ పిల్లలతో ఆడుకొంటూ వారిలా ప్రవర్తించడం నేర్చుకొంటారు. పిల్లలకు దేని పట్లా అనురక్తి ఉండని విధంగా వీరూ ప్రతి దాని పట్లా అనురక్తిని నిర్మూలించు కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తల్లి కొత్త బట్ట తొడిగినప్పుడు పిల్లవాడు ఎంత సంతోషిస్తాడో నువ్వు చూడలేదా? ‘ఆ బట్టను నా కివ్వమా?’ అని నువ్వు కనుక అడిగితే, వెంటనే అతడు, ‘ఉహూ, నేనివ్వను. అమ్మ నాకు ఇచ్చింది’ అని ఠక్కున జవాబిస్తాడు. ఇలా జవాబిచ్చి, బహుశా నువ్వు లాగివేస్తావేమో అనుకొని ఆ బట్టను గట్టిగా పట్టుకొని, భీతితో నీ వంకే చూస్తూవుంటాడు. ఆ బట్టనే తన ఆరవ ప్రాణంగా చూసుకొంటాడు. కాని ఆ తరువాత చిల్లిగవ్వ ఖరీదు చేసే బొమ్మ నీ చేతిలో ఉండడం చూసి, ‘దాన్ని నాకు ఇవ్వు, ఈ బట్టను నీకు ఇస్తాను’ అని అంటాడు. కాసేపయ్యాక బహుశా ఆ బొమ్మను విసిరివేసి ఒక పువ్వు కోసం పరుగెత్తుతాడు. బట్ట పట్ల అతడికెంత తక్కువ అనురక్తి ఉందో బొమ్మ పట్ల కూడా అంతే అనురక్తి ఉంది. బ్రహ్మజ్ఞానుల విషయం కూడా అంతే.
10. రామావత్ సాధువు దక్షిణేశ్వరానికి రావడం
“ఆ విధంగా కొంతకాలం జరిగింది. పరమహంసల రాక తగ్గిపోసాగింది. వారి స్థానే తీవ్ర వైరాగ్యవంతులు, శ్రద్ధాళువులూ, అనాసక్తిపరులూ అయిన రామావత్ బాబాజీలు* (శ్రీరాముణ్ణి ఆరాధించే సాధువులు) పలువురు రాసాగారు. ఆహా, వారి భక్తివిశ్వాసాలు ఎంత మహోన్నతం! భగవత్సేవలో ఎంతటి నిష్ఠాగరిష్ఠులు! అటువంటి రామావత్ సాధువులలో ఒకరి నుండి రాంలాలా* నా వద్దకు వచ్చి ఉండిపోయాడు. అదొక పెద్ద కథ.
11. రాంలాలా వృత్తాంతం
“ఆ బాబాజీ, (జటాధారి) రాంలాలా విగ్రహాన్ని చాలాకాలం నుండి పూజిస్తూన్నాడు. ఎక్కడకు వెళ్ళినా తనతోపాటు తీసికొని వెళ్ళేవాడు. భిక్ష ద్వారా లభించిన ఆహారాన్ని వండి రాంలాలాకు నైవేద్యంగా అర్పించేవాడు. అంతేకాదు. నిజంగా రాంలాలా ఆరగించడం లేదా ఏదైనా తింటానని మారాంచేయడం, పచార్లు చేసి రావాలని కోరడం, అల్లరి చేయడం మొదలైనవన్నీ ఆ సాధువు ప్రత్యక్షంగా దర్శించేవాడు. ఆ రాంలాలా సాహచర్యంలో ఆతడు సదా ఆనంద పారవశ్యంలో ఉండేవాడు. రాంలాలా అవన్నీ చేయడం నేను కూడా చూశాను. ఇరవై నాలుగు గంటల సేపూ జటాధారి వద్ద కూర్చుని, రాంలాలాను తదేకంగా చూస్తూ ఉండేవాణ్ణి.
“రోజులు గడిచేకొద్దీ, రాంలాలాకు నా పట్ల ప్రేమ అధికరించసాగింది. నేను జటాధారి వద్ద కూర్చుని ఉన్నంతసేపూ రాంలాలా ఆడుతూ, పాడుతూ ఆనందంగా అక్కడే ఉండేవాడు. కాని నేను నా గదికి బయలుదేరగానే నన్ను వెంబడించేవాడు. రావద్దని ఎంత కట్టడిచేసినా వినేవాడు కాదు. మొదట్లో ఇదంతా ఏదో నా మతిభ్రమ అనుకొనేవాణ్ణి. అంతగా తనను ప్రేమిస్తూ, ఎంతో కాలం నుండి ఆరాధిస్తూ సేవిస్తూ ఉన్న జటాధారి కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడా? అసంభవం! కాని అలా అనుకొన్నా ఏం ప్రయోజనం? యథార్థంగా, నా ముందున్న మిమ్మల్ని చూసినట్లే – బాలరాముడు నన్ను అనుసరిస్తూ నృత్యం చేస్తూ రావడం చూసేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు చంకన ఎత్తుకోమని మారాం చేసేవాడు. మరొకప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొంటే, స్థిమితంగా అక్కడ కూర్చుని ఉండేవాడు కాదు. అక్కడికీ ఇక్కడికీ పరుగెత్తేవాడు, ముళ్ళకంచెలలోకి పోయి పువ్వులు కోసేవాడు, లేదా గంగానదిలో దూకి ఈదుతూ, నీటిని ఎగజిమ్మేవాడు. నేను పదేపదే, ‘నాయనా! అలా చేయవద్దు. ఎండలో తిరిగితే కాళ్ళు బొబ్బలెక్కుతాయి. ఎక్కువసేపు నీళ్ళలో నానితే జలుబు చేసి జ్వరం వస్తుంది’ అని చెప్పేవాడిని. ఎంత చెప్పినా వినిపించుకొనేవాడు కాడు. మరెవరికో నేను చెబుతున్నట్లు అసలు పట్టించుకొనేవాడు కాడు. పద్మపత్రాల వంటి తన అందమైన కళ్ళతో నా వంకే చూస్తూ మందహాసం చేసేవాడు; నన్ను విసిగించాలని మరింత అల్లరి పనులు చేసేవాడు. మూతి ముడుచుకొని నన్ను వెక్కిరించేవాడు. నా కప్పుడు నిజంగా కోపం ముంచుకొచ్చేది. ‘వెధవా, ఉండు, ఈ రోజు బడితెపూజ చేస్తాను’ అని తిట్టేవాణ్ణి. ఇలా కేకలేసి ఎండలోనుండో లేదా నీళ్ళనుండో ఇవతలకు లాక్కొచ్చి అదీ ఇదీ ఇచ్చి బుజ్జగించి గదిలోనే ఆడుకొనేలా చేసేవాణ్ణి. అతడి చిలిపిచేష్టలు మితిమీరినప్పుడు ఒకటి రెండు వడ్డించేవాణ్ణి. దెబ్బలు తిన్నప్పుడు అతడి అందమైన పెదవులు కంపించేవి; ఏడుస్తూ నా వైపే చూస్తూ ఉండేవాడు. అతడు ఏడవడం చూసి నేనెంతో బాధపడేవాణ్ణి. వెంటనే ఆప్యాయంగా ఒళ్ళోకి తీసుకొని, బుజ్జగించేవాణ్ణి. ఇవన్నీ నిజంగానే జరిగాయి.
రామ్‌లాలా విగ్రహం, శ్రీరామకృష్ణులతో ఆటలాడిన బాల రామచంద్రుడు.
శ్రీరామకృష్ణులు స్నానం చేసిన దక్షిణేశ్వరంలోని చాందిని ఘాట్.
“ఒక రోజు స్నానం చేయడానికి నేను వెళుతూవుంటే, నాతో పాటు వస్తానని పట్టుపట్టాడు రాంలాలా. చేసేదిలేక నాతో కూడా తీసుకువెళ్ళాను. కాని ఎంతసేపటికీ నీళ్ళ నుండి బయటకు రాడే! ఎంత చెప్పినా వినిపించుకోడు. చివరికి నాకు కోపం వచ్చింది. అతణ్ణి నీళ్ళలో ముంచి, ‘ఇష్టం వచ్చినంతసేపు నీళ్ళలో ఉండు’ అని అన్నాను. అప్పుడతడు నిజంగానే ఊపిరాడక గిలగిల కొట్టుకోవడం చూసి, నేను చేసిన పనికి పశ్చాత్తాపం చెంది, నీళ్ళ నుండి బయటకు తీసి ఎత్తుకొన్నాను.
“మరో సందర్భంలో అతడి కోసం ఎంత బాధపడి విలపించానో చెప్పలేను. ఆ రోజు ఏదో తినాలని రాంలాలా మొండికేశాడు; పొట్టుతీయని అటుకులు ఇచ్చాను. ఆ అటుకులు తిని రాంలాలా నాలుక గీరుకుపోయింది. అది చూసి నేను పడిన బాధ ఇంతింత కాదు. వెంటనే అతణ్ణి నా ఒళ్ళోకి తీసుకొని, అతడి చుబుకాన్ని పుచ్చుకొని, ‘అయ్యో, ఎంత అనాలోచితంగా, మూర్ఖంగా ప్రవర్తించాను! తల్లి కౌసల్య వెన్నమీగడలను పెట్టిన నీ నోట్లో ఈ మోటు పదార్థాన్ని పెట్టాను గదా తండ్రీ!’ అని బిగ్గరగా ఏడుస్తూ చెప్పాను.” ఎన్నడో జరిగిపోయిన ఆ సంఘటన గురించి మాతో చెబుతూ ఉంటే శ్రీరామకృష్ణులలో గతశోకం పెల్లుబికింది. మా సమక్షంలో ఆయన బోరున ఏడ్చేశారు. రాంలాలాతో ఆయనకు ఏర్పడిన ఆప్యాయానురాగాల బంధం మాకు కించిత్తు కూడా అవగతం కాకపోయినా, ఆయన పట్ల సానుభూతితో మా కళ్ళు నీటితో నిండిపోయాయి.
12. రాంలాలా ఉదంతం పట్ల మేం స్పందించిన తీరు
మాయాపాశంలో కట్టువడిపోయిన అల్పజీవులమైన మేం రాంలాలాను గురించి విని స్తబ్ధులమయ్యాం. భక్తిపూర్వక భీతితో ఏమైనా (ఆతడి లీలలు) కనపడతాయేమోనని రాంలాలా ప్రతిమ వైపు ఆశాజనకంగా చూశాం. ఒట్టి లోహం తప్ప మా కేమీ కనిపించలేదు. ఎలా కనిపిస్తుంది? రాంలాలా పట్ల ప్రేమాకర్షణ ఆ మేరకు మాకు లేదే! శ్రీరామకృష్ణులలా శ్రీరామ చంద్రుని పట్ల ప్రేమ మాలో తీవ్రమై మా ప్రేమ నేత్రాలు విప్పారినప్పుడే కదా అంతరంగం లోనూ, బాహ్యంలోనూ సజీవుడైన రాంలాలాను చూడగలిగేది? భక్తిహీనులమైన మాకు కనిపించింది ఒక చిన్న ప్రతిమ మాత్రమే. దానిని చూసి ‘శ్రీరామకృష్ణులు చెప్పిన సంఘటనలు నిజంగా జరిగాయా? అలా జరగడం సంభవమేనా?’ అనే ఆలోచనలే తలెత్తుతాయి. ఆధ్యాత్మికపరమైన ప్రతి విషయంలోనూ మనకు ఇటువంటి సంశయమే ఎదురౌతుంది; దేనినీ విశ్వసించం. సంశయమనే భారాన్ని నెత్తిమీద పట్టుకొని చతికిలబడతాం.
‘సర్వం ఖల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన’* – అంటే ‘(ఓ మానవులారా!) ఈ ప్రపంచంలో ఒక్క సచ్చిదానంద బ్రహ్మ వస్తువు తప్ప మరేదీ లేదు; మీకు కనిపించే నానా వస్తువులలో, నానా వ్యక్తులలో దేనిలో కూడా సత్యత్వం అన్నదే లేదు. ఉన్నదంతా ఒక్క భగవంతుడు మాత్రమే’ అని బ్రహ్మజ్ఞులైన ఋషులు వచించడం నీకు తెలియదా? ఋషుల పై వచనాలు విని బహుశ అది నిజమేనేమో అనే సంశయం మెరుపుతీగలా మెరిసి మళ్ళీ మాయమైపోతుంది.
ఎందుకంటే వారి వచనాలు ఆలకించి ప్రపంచాన్ని పరికించి చూస్తే వారు వచించే ఆ ఏకమేవా-ద్వితీయం అనబడే బ్రహ్మవస్తువు నీడ అయినా ఎంత వెతికినా అసలు మనకు కానరాదు. ఒట్టి కర్ర, మన్ను, ఇళ్ళు, వాకిళ్ళు, మనుష్యులు, పశువులు – ఇలా వివిధ రంగుల, ఆకృతుల నానాత్వం మాత్రమే మనకు కనిపిస్తుంది. మహా అయితే అనంత తారకామండలంతో దీప్తమైన వినిర్మల నీలాకాశం, లేదా ఆ నీలాకాశాన్ని స్పర్శించ ప్రయత్నిస్తూ ఉన్నట్లున్న మంచుతో కప్పబడ్డ పర్వత శిఖరాలు; లేకుంటే ‘అంత గర్వం తగదు సుమా’ అని వాటిని హెచ్చరిస్తున్నట్లు జలజల సవ్వడితో వడివడిగా ప్రవహించే నిర్మలమైన సెలయేళ్ళు; లేదా ప్రచండ శక్తితో ఆకాశాన్నంటే ఉత్తుంగ తరంగాలతో పైకెగసి అంతటినీ మ్రింగివేయాలనే ఆశతో ముందుకు ఉరుకుతూ ఎంత ప్రయత్నించినా చెలియలికట్టను అతిక్రమించలేని సముద్రాలను – మహా అయితే ప్రకృతి అందించే ఈ సౌందర్యాలను మాత్రమే మనం తిలకించగలం. వీటిని చూసి, ‘ఈ ఋషులు ఏమైనా మత్తు ప్రభావంలో చూస్తూవున్న ప్రతిదీ బ్రహ్మమని చెప్పలేదు కదా!’ అని భావిస్తాం. మనం అలా సంశయించడం గమనించి, ‘నాయనలారా, మేం చెబుతున్నది నిజమే. ఆత్మసంయమాన్ని, పావనత్వాన్ని సంతరించుకోండి. మనస్సును ఏకాగ్రమూ, ప్రశాంతమూ చేసుకోండి. అప్పుడు మేం చెప్పింది అవగతం చేసుకోగలుగుతారు. నీ ఆలోచనల అభివ్యక్తీకరణే ఈ ప్రపంచమన్న నిజం నువ్వప్పుడు గ్రహించ గలుగుతావు. నీ మనస్సులో ‘నానాత్వం’ ఉండడం వల్లనే బాహ్యంలో కూడా నీకు నానాత్వం కనిపిస్తున్నది’ అని ఋషులు సమాధానం ఇచ్చినట్లు చెప్పవచ్చు.
అందుకు మనం ఇలా స్పందిస్తాం : “స్వామీ! బ్రతుకు తెరువు సముపార్జించు కోవడంతోను, ఇంద్రియాల నిరంకుశత్వంతోను మేం సతమతమౌతున్నాం. మీరు చెబుతున్న అనుష్ఠానాలు పాటించడంలో ఇక మాకు తీరిక ఎక్కడ ఉంటుంది?” లేదా ఇలా అంటాం: “మీరు పేర్కొనే ఆ బ్రహ్మాన్ని సాక్షాత్కారం చేసుకోవాలంటే నిర్వర్తించవలసిన విధుల జాబితాను కొన్ని రోజుల్లో లేదా కొన్ని నెలల్లో లేదా కొన్ని సంవత్సరాలలో పూర్తిచేయడం జరిగే పనికాదు. ఒక జీవిత కాలంలో సైతం పూర్తిచేయగలగడం సందేహమే. మీరు ఉపదేశించినట్లు మా మనస్సులను సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం మీద కేంద్రీకరింప ప్రయత్నించినప్పటికీ దాన్ని పొందడంలో విఫలులమైతే, చిట్ట చివరకు ఆ అనంత ఆనందానుభూతి సముపార్జన కేవలం అభూతకల్పనగా మిగిలిపోతుంది. రెంటికీ చెడ్డ రేవడి అవుతుంది. ఇహపరాలను రెండింటినీ కోల్పోతాం. ఇటు తాత్కాలికమైన లౌకిక సుఖాలనూ, అటు ఆ పరమానందాన్నీ చవిచూడలేం. అప్పుడు మా గతి ఏమిటి? వద్దు స్వామీ, వద్దు. ఆ అనంత ఆనందాన్ని చవిచూసే భాగ్యం మీకు కలిగితే మంచిది; మీ శిష్యప్రశిష్యులతో సహా దాన్ని అనుభవిస్తూ ఉండండి. రూపరసాదుల నుండి కళ్ళెదుట మాకు అందుతున్న ఈ సుఖాన్నే మమ్మల్ని అనుభవించనివ్వండి. పైకి సబబుగా తోచే తర్కవాదాలు చేసి మేం అనుభవిస్తున్న ఆ కించిత్తు సుఖాన్నీ చెడగొట్టకండి” అని అనగలం.
13. అధిక సుఖాలను అందిస్తుంది కాబట్టే మనం ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని ప్రశంసిస్తాం
విజ్ఞాన శాస్త్రవేత్త ముందుకొచ్చి మనతో ఇలా అంటాడు : “ఈ ప్రపంచంలోని పదార్థాలన్నిటిలో – ఇటుకలు, చెట్లు, మొక్కలు, మనుష్యులు, పశువులు – ఇలా ప్రతి ఒక్క దాన్లో సర్వత్రా వ్యాప్తమైన ఒకే ఒక్క చైతన్య శక్తి ఈ నానా వస్తువులుగా, వ్యక్తులుగా అభివ్యక్తమౌతూన్నదని, నేను నీకు ఆధునిక పరికరాల సహాయంతో ఋజువు చేసి చూపించ గలను.” ఆ వస్తువులన్నిటిలోను జీవం స్పందిస్తూ ఉండడం మనకు కూడా కానవస్తుంది. ఆ శాస్త్రవేత్తకు మా జవాబు : “శభాష్! నీ మేధస్సు పరిధి విస్తృతమైనదే! కాని కేవలం ఆ జ్ఞానం మాత్రమే ఉన్నందున ప్రయోజనం ఏమిటి? దాదాపు ఈ విషయాన్నే శాస్త్రకర్తలైన మా ఋషులు ఏనాడో చెప్పివున్నారు.* ప్రయోగాల ద్వారా ఆ విషయాన్ని నిరూపించి, నువ్విప్పుడు చూపించావని అంగీకరిస్తాం. కాని ఇది మా రూపరసాది సుఖభోగాలను పెంపొందిస్తుందని నువ్వు చెప్పగలవా? అప్పుడే నీ వివేకాన్ని మెచ్చుకో గలుగుతాం.” అందుకు ఆ విజ్ఞానవేత్త బహుశా ఇలా జవాబివ్వవచ్చు: “ఎందుకు కాదు? తప్పకుండా పెంపొందిస్తుంది. ఇలా చూడండి, విద్యుచ్ఛక్తి కనిపెట్టడంతో ప్రపంచం నలుమూలల నుండి వార్తలు తెలుసుకోవడం ఎంత సులువైనదో మీకు కనిపించడం లేదా? అలాగే ఆవిరిశక్తి కనుగొనడం వలన, ఆ శక్తితో నడిచే రైళ్ళు, ఓడలు, యంత్రాలు, కర్మాగారాలు మొదలైన వాటి ద్వారా నీ సమస్త సుఖాలకూ మూలకారణమైన ధనాన్ని ఆర్జించడం నీ కెంత సులభమైందో చూడు; అలాగే (తుపాకీ మందులాంటి) పేలుడు పదార్థాల రహస్యాలను ఆవిష్కరించుకొని, తుపాకులను, ఫిరంగులను తయారుచేసి వాటి ద్వారా నీ సుఖభోగాలకు అడ్డుపడే శత్రువులను నాశనం చేయడం నీకెంత సులభతరమైనదో గుర్తించలేదా? విజ్ఞానశాస్త్రం ద్వారా నేడు నీకు పరిచితమైన ఈ సర్వవ్యాపకమైన శక్తి భవిష్యత్తులో సత్ప్రయోజనాలకు నీకు తప్పక వినియోగపడుతుంది.” ఆ సమాధానంతో సంతృప్తి చెందక మనం ఇలా అడుగుతాం: “మంచిది. ఒక రకంగా నీ జవాబు సబబుగానే ఉంది. కాని సాధ్యమైనంత త్వరలో మా సుఖభోగాలకు పరాకాష్ఠయైన దానిని సృష్టించి ఇవ్వు. నువ్వు నూతనంగా ఆవిష్కరించిన శక్తి మా సుఖభోగాల పులకరింతకు మరింతగా దోహదం చేస్తుందా? అప్పుడు మాత్రమే నీ నూతనావిష్కరణ అభినందనీయమూ, నీ మేధస్సు ప్రశంసనీయమూ అవుతుంది. అప్పుడు మాత్రమే వేదపురాణాదుల కర్తలైన ఋషులలా మత్తు ప్రభావంలో నువ్వు పలకడంలేదని ఒప్పుకొంటాం.” విజ్ఞాన శాస్త్రవేత్త విని, మా ఆలోచనా సరళిని గ్రహించి, ‘తథాస్తు’ అని అంటాడు.
14. కాపాలికుల ఉద్బోధ:యోగభోగాల సహ అస్తిత్వం అసంభవం
వేదాలలోని పరబ్రహ్మ జ్ఞానాన్ని ప్రచారం చేసిన ఋషులు మాత్రం (విజ్ఞాన శాస్త్రవేత్తలలా భోగలాలసుల ఒత్తిడికి తల ఒగ్గి) ‘తథాస్తు’ అని చెప్పలేక పోయారు. కాబట్టే లౌకిక కోలాహలానికి సుదూరంగా పోయి దుర్గమారణ్యాలలో వాసం చేస్తూ, సంసార సుఖాల పట్ల విరక్తి చెందిన ఏ కొద్దిమంది సహచర్యంతోనో వారు సంతృప్తి పడవలసివచ్చింది. భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో పై రీతిలో ‘తథాస్తు’ అని ప్రాపంచికులకు తల ఒగ్గే ప్రయత్నం ఎక్కడా, ఏనాడూ చేసినట్లు కానరావడం లేదు. బౌద్ధయుగం చరమ దశలో జరిగిన దానిని కొంచెం జ్ఞాపకం తెచ్చుకో. ఆ సమయంలో తాంత్రిక కాపాలికుల ప్రభావం కొన్ని చోట్ల బాగా వ్యాప్తిగాంచింది. వీరప్పుడు మారణం, ఉచ్చాటనం, వశీకరణం* మొదలైన ప్రక్రియలను ప్రచారం చేయసాగారు. అలాగే శాంతి, స్వస్త్యయనాదుల* ద్వారా శారీరక, మానసిక రుగ్మతలను నివారించి తిరిగి ఆరోగ్యవంతులను చేయడం; అట్లే భూతప్రేతాదులను వదలగొట్టే ప్రయోగాలు… ఇవి బహుళ ప్రాచుర్యం పొందాయి. అలాగే కఠోర తపస్సు చేసి ఏదో ఒక అలౌకిక శక్తిని సముపార్జించి ప్రదర్శించకపోతే, తన అనుయాయుల విజయానికీ, సుఖాలకూ తానే కీలకం అనే అభిప్రాయాన్ని వారిలో పాదుకొల్పకపోతే ఆ రోజుల్లో ఎవరినీ ఆధ్యాత్మిక గురువుగా పరిగణించేవారే కారు. ఒక్కసారి అటువంటి పతనకాలపు సంగతులను జ్ఞాపకం తెచ్చుకో. ప్రాపంచికుల సుఖభోగాలకు తోడ్పడే శక్తి, సుఖభోగాలను మరింత అధికరించే శక్తి ఆధ్యాత్మిక సత్యాలలో నిహితమై ఉందని (అంటే ఆధ్యాత్మికత కేవలం యోగానికే కాక భోగానికి కూడా తోడ్పడగలదు) ఆ పతనావస్థలో ప్రచారం చేయబడింది.
అయినా ఏం ప్రయోజనం? ప్రచారం చేసినంత మాత్రాన సత్యం ఎన్నడన్నా అసత్యమౌతుందా? వెలుగు చీకట్లు ఏకకాలంలో ఉండడం సంభవిస్తుందా? యోగం భోగం కలిసి ఉండడం సంభవమా? ఈ సరళ సత్యాన్ని తాంత్రిక కాపాలికులు అవగతం చేసుకోలేక పోయారు. భోగాలను యోగంతో మిళితం చేసే తమ ప్రయత్నంలో అనతికాలంలోనే పతితులై, యోగభ్రష్టులై, భోగం అనే వలలో చిక్కువడిపోయారు. సంసార బంధాన్ని తొలగించే మతం పేరిట మనిషిని మరింత బంధనంలో తగుల్కొనేలా చేసే భోగవాసనలను గోప్యంగా ఆ కాపాలికులు ప్రచారం చేయసాగారు.
కాని వీరి ప్రయత్నాలు వివేకవంతులను మోసగించలేకపోయాయి. పరస్పర విరుద్ధాలైన యోగం, భోగం ఒకే చోట, ఏకకాలంలో కలసి ఉండడం ఎన్నటికీ పొసగదనే విషయం నిజమైన ధార్మిక చింతనాపరులు స్పష్టంగా అవగాహన చేసుకొన్నారు. అలా అవగతం చేసుకొని వారు మళ్ళీ మన ఋషులు, మునులు ఉపదేశించిన జ్ఞానమార్గాన్ని అవలంబించి, ఆ జ్ఞానానుభూతిని తమ జీవితాలలో పొందగోరారు.
15. శ్రీరామకృష్ణుల పరిత్యాగ ప్రబోధాన్ని చూసి లౌకికులు భీతి చెందడం
లౌకికుల అభిప్రాయాలతో ఏకీభవించి, వారి ‘తథాస్తు’ (అంటే ఫరవాలేదు, యోగం భోగం రెండూ సరేలే) తత్త్వాన్ని మేం ఎలా అంగీకరించగలం? ఎందుకంటే మేం చెబుతూన్న కథ శ్రీరామకృష్ణుల గురించినది కదా! ఆయన ఈ లోకానికి చెందినవారు కాదుకదా! గాఢనిద్రలో సైతం లోహ స్పర్శమాత్రాన ఆయన చేయి కొంకర్లు పోయేటంత పరిత్యాగ భావం ఆయనలో ప్రగాఢంగా పాదుకు పోయింది. ఆ సమయంలో శరీరంలో ఏదో గుచ్చుకొన్నంత బాధ కలిగి, ఆయన శ్వాసక్రియ స్తంభించిపోవడం కద్దు. ఏ స్త్రీమూర్తి కంటబడినా ఆమె జగజ్జనని ప్రతిరూపం అనే భావం ఆయనలో ఆ క్షణమే తళుక్కున మెరిసేది; ఎంతటి దురాకర్షణ సైతం ఆ భావాన్ని కించిత్తూ మార్చలేకపోయేదంటే అతిశయోక్తి కాదు. వేలాది రూపాయలు విలువచేసే ఆస్తిని ఒకప్పుడు మథుర్బాబు ఆయన పేరిట వ్రాసి ఇవ్వగోరాడు. ఆ ప్రతిపాదనను మథుర్ వ్యక్తం చేసీచేయగానే శ్రీరామకృష్ణులు ఎంతో క్షోభించి, అగ్గిమీద గుగ్గిలమై తన పట్ల అమిత భక్తి ప్రపత్తులు గల మథుర్ను కర్రపుచ్చుకొని కొట్టబోయారు. మరొక సందర్భంలో లక్ష్మీనారాయణ్ అనే మార్వాడీ భక్తుడు శ్రీరామకృష్ణులకు పదివేల రూపాయలు ఇవ్వగోరాడు. కాలాంతరంలో తమ శిష్యులకు ఆ సంఘటన గురించి చెబుతూ, తీవ్ర ఉద్వేగంతో తామెంత బాధపడ్డారో వివరిస్తూ, “నా తలను ఎవరో రంపంతో కోస్తున్నంతగా బాధపడ్డాను” అని చెప్పారు. రూపరసాది ఏ ప్రాపంచిక సుఖాలూ ఎన్నడూ ఆయనను ఆకర్షించ లేకపోయాయి, సమాధ్యవస్థలో కలిగే అతీంద్రియ ఆనందానుభవానికి అంతరాయం కలిగించలేకపోయాయి.
ప్రాపంచికులారా! అటువంటి అద్భుత త్యాగవైరాగ్యాలకు ప్రతిరూపులైన శ్రీరామకృష్ణుల కథను చెప్పపూనుకొన్న మేం అనేక దుర్భాషలకు, విమర్శలకు గురికావలసి వస్తుందని, మాకు ముందే తెలుసు. అంతే కాదు. మీ కుమారులలో, మనుమలలో, మిత్రులలో లేదా బంధువులలో ఎవరైనా ఆ అద్భుతమూర్తి గురించి మేం చెప్పిన విషయాలు విని, ప్రభావితులై భోగసుఖాలకు తిలోదకాలిచ్చి సంసార పరిత్యాగం చేయనున్నప్పుడు ఆ పవిత్రమూర్తి పట్ల అపనింద వేయడానికి మీరు ఏమాత్రం సంకోచించరనీ మాకు బాగా తెలుసు.
శ్రీరామకృష్ణుల దివ్యచరితాన్ని తెలుప పూనుకొన్న మాకు ఆ ప్రయత్నాన్ని విరమించడం గాని లేదా సత్యాన్ని పాక్షికంగా దాచిపెట్టడంగాని సాధ్యం కాదు. మాకు తెలిసినంత వరకు ఉన్నది ఉన్నట్టు చెప్పక తప్పదు. లేకపోతే మా మనస్సులు శాంతించవు. ఎందుకంటే ఎవరో బలవంతంగా మాచే మాట్లాడిస్తున్నారు. కాబట్టి మాకు తెలిసినంత వరకు ఆ అద్భుతమూర్తి దివ్యచరితాన్ని సవివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాం. ‘తల తోకను’* వదలిపెట్టి, జీర్ణం చేసుకొన్నంత మేర ఈ కథను అంగీకరించు. లేదా భంగు త్రాగినవాడు చెప్పే కట్టుకథలా భావించి ఈ పుస్తకాన్ని విసిరిపారేసి, విషయ సుఖాలనే కొంగ్రొత్త తేనెను గ్రోలడానికి ప్రతి రోజూ పరుగులు తీయి.
తదనంతరం ఎప్పుడైనా సంసారమనే ఘోరమైన సుడిగుండంలో పడి, నీ దురదృష్టమో (లేదా అదృష్టమా?) – ఫలితంగా వైరాగ్యం జనించినప్పుడు, ‘కామక్రోధాదులనే విషయ సుఖాలు విషతుల్యంగా’ తోచినప్పుడు, ఈ అలౌకిక మహాపురుషుని దివ్యజీవిత గాథను మరొకసారి చదివి అర్థం చేసుకో. అప్పుడు నీకు శాంతి లభిస్తుంది, శ్రీరామకృష్ణుల విలువ అవగతమౌతుంది.
16. శ్రీరామకృష్ణుల వద్దే రాంలాలా శాశ్వతంగా ఉండిపోయిన వైనం
రాంలాలా అద్భుత ప్రవర్తనను గురించి వర్ణిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు: “కొన్ని రోజులలో జటాధారి వంటచేసి రాంలాలాకు నివేదించబోతే, ఎంత వెదకినా కనిపించేవాడు కాడు. హృదయావేదనతో జటాధారి ఇక్కడకు (శ్రీరామకృష్ణుల గదికి) పరుగెత్తుకొని వచ్చేవాడు. రాంలాలా గదిలో ఆడుకొంటూ ఉండడం చూసేవాడు. అభిమానం గాయపడడంతో అతడు రాంలాలాను ఇలా చీవాట్లు పెట్టేవాడు : ‘ఎంతో ప్రయాసపడి వంటచేసి నీకోసం ఇక్కడ అక్కడా వెతుకుతున్నాను. కాని నువ్వు ఏమాత్రం పట్టించుకోకుండా ఎప్పుడూ ఇక్కడ ఉంటానంటావు. అసలు నిన్ను అని ఏం ప్రయోజనం? నీ స్వభావమే అంత. అసలు దయాదాక్షిణ్యాలు నీకు ఉంటే కదా! నీ తండ్రిని విడిచిపెట్టి వనాలకు పోయావు. కుమిలిపోయి తండ్రి మరణించినా చివరిచూపుకైనా నువ్వు తిరిగి పోలేదు.’ ఈ రకంగా చీవాట్లు పెట్టి రాంలాలాను లాక్కుపోయి, తినిపించేవాడు. రోజులు అలా గడిచిపోయాయి. రాంలాలా ఈ చోటును (అంటే తనను) విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడనందున అతడు చాలాకాలం ఇక్కడే గడిపాడు. తాను అమితంగా ప్రేమించిన రాంలాలాను విడిచిపెట్టి జటాధారి కూడా వెళ్ళలేక పోయాడు. ఇలా ఉండగా ఒక రోజు అతడు కన్నీరుమున్నీరై నా వద్దకొచ్చి ఇలా అన్నాడు: ‘రాంలాలాను ఎలా దర్శించాలని కోరుకొన్నానో ఆ రూపంలో దర్శనమిచ్చి నా జీవిత పిపాసను తీర్చాడు. ఇక ఇక్కడ నుండి కదలనని చెప్పాడు. నిన్ను విడిచి మరోచోటికి వెళ్ళడానికి అతడు ఇష్టపడడం లేదు. నా మనస్సులో ఎలాంటి విచారమూ, బాధా లేవు. నీ వద్దే సుఖంగా ఉంటూ హాయిగా ఆడుతూ పాడుతూ అతడు ఉండడమే నాకు ఆనందదాయకం. అతడి సుఖమే నా సుఖంగా భావిస్తున్నాను. కాబట్టి అతణ్ణి నీకు అప్పగించి, మరోచోటుకు వెళ్ళిపోతాను. నీతో అతడు సంతోషంగా ఉన్నాడని తెలిసి, నేనూ పరమానందభరితుడనౌతాను.’ ఇలా చెప్పి, జటాధారి, రాంలాలాను నాకు అప్పగించి నా వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. అప్పటి నుండి రాంలాలా ఇక్కడే ఉంటూ వచ్చాడు.”
17. శ్రీరామకృష్ణులు : నిస్వార్థ ప్రేమానుభూతి
అమోఘమైన శ్రీరామకృష్ణుల దివ్యసాహచర్య ఫలంగా జటాధారి మనస్సు స్వార్థగంధరహితమైన అత్యున్నత ప్రేమను చవిచూడగలిగిందని దీని నుండి మనం గ్రహించవచ్చు. అటువంటి ప్రేమశక్తిలో, తన ప్రేమాస్పదుడి నుండి ఎడబాటు కలిగే భయం ఉండదని అతడికి నమ్మకం ఏర్పడిందనీ మనం తెలుసుకోవచ్చు. తన ఇష్టదైవమూ, పరిశుద్ధప్రేమకు అపరావతారమూ అయిన రాంలాలా సదా సర్వదా తన వద్దే ఉన్నాడనీ, కోరిన తక్షణం ఆతడి దర్శనం పొందగలననీ జటాధారి చక్కగా గ్రహించి ఉంటాడు. అటువంటి నమ్మకం ఉండబట్టే తన ప్రాణంకంటే మిన్నయైన రాంలాలాను, జటాధారి విడిచిపెట్టి వెళ్ళగలిగాడనే విషయంలో ఎలాంటి సందేహానికీ తావులేదు.
18. రామనామం పట్ల అచంచల విశ్వాసం ఉన్న ఒక సాధువు
శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు : “ఒకానొక సందర్భంలో రామనామం పట్ల అచంచల విశ్వాసం ఉన్న ఒక సాధువు ఇక్కడకు రావడం తటస్థించింది. అతడు కూడా రామావత్ సంప్రదాయానికి చెందిన వ్యక్తే. అతడి వద్ద ఒక నీటి కూజా, ఒక పుస్తకం మాత్రమే ఉండేవి. ఆ పుస్తకం అతడికి ఆరోప్రాణం. నిత్యం అతడు ఆ పుస్తకాన్ని పువ్వులతో అర్చించేవాడు. ఒక రోజు ఆ పుస్తకాన్ని ఒకసారి నా కివ్వమని అడిగి, పుచ్చుకొన్నాను. ఆ పుస్తకాన్ని తెరిచి చూశాను; ఎర్రసిరాతో పెద్ద అక్షరాలలో కేవలం ‘ఓం రామః’ అని మాత్రమే వ్రాసి ఉంది. అప్పుడు ఆ సాధువు నాతో ఇలా అన్నాడు : ‘అనేక పుస్తకాలు చదవడం వలన ప్రయోజనం ఏమిటి? ఆ పరమాత్ముని నుండే కదా వేదాలూ, పురాణాలూ వెలువడ్డాయి. ఆయనా, ఆయన నామమూ ఒక్కటే. కాబట్టి నాలుగు వేదాలలో, పద్ధెనిమిది పురాణాలలో, ఇతర శాస్త్రాలన్నింట్లో ఏం ఉందో (సారం) అదంతా ఆయన నామంలో ఉన్నట్లే! అందుకు ఆయన నామమే నా ఏకైక తోడూ నీడా!’ భగవన్నామం పట్ల ఆ సాధువుకు ఉన్న అచంచల విశ్వాసం అటువంటిది!”
19. రామావత్ సాధువుల భక్తిగీతాలు
ఈ విధంగా అనేకమంది సాధువుల గురించి ఎన్నో విషయాలు శ్రీరామకృష్ణులు మాకు చెప్పారు. వారి నుండి తాము నేర్చుకొన్న భక్తిగీతాలను అప్పుడప్పుడు పాడి మాకు కూడా వినిపించేవారు. ఆ పాటలలో కొన్నింటిని క్రింద ఇస్తున్నాం:
- ఓ మనసా, నువ్వు (నా) రామచంద్రుని గుర్తించలేకపోయావు
మరప్పుడు ఏం గుర్తించావు? ఏం తెలుసుకొన్నావు?
ఎవడు రామ (నామ) రసాన్ని ఆస్వాదించాడో నిజమైన సాధువతడేగాని
విషయ సుఖాన్ని చవిచూసినవాడు సాధువా? (కాడు)
వంశాన్ని ఉద్ధరించే పుత్రుడే పుత్రుడుగాని
తక్కిన పుత్రులందరూ అప్రయోజకులు. - సీతాపతి రామచంద్రుని, రఘుపతి రామచంద్రుని
అయోధ్యనాథుని భజించు, మరెవ్వరినీ భజించకు!
రాముని దరహాసం, మాటలు, చేతలు, సుందర నయనాలు, నుదుట
శోభించే తిలకం, చక్కని నాసికతో అచ్చం బాలభానుని తలపిస్తాడు
మిరుమిట్లుగొలిపే కర్ణకుండలాలు, ఆయన విశాలవక్షంపై వ్రేలాడు
తారలలా ప్రకాశించే ముత్యాల హారం, హిమవత్పర్వత
శిఖరాన్ని తొలచుకొని వచ్చే గంగలా ఉంది
అటువంటి రఘుకుల తిలకుడు నేస్తాలతో కలిసి
సరయూ నదీతీరాన పచార్లు చేస్తూవుంటే
చూసిన తులసీదాసు* పరమానందంతో ఉక్కిరిబిక్కిరై
ఆ పావన పదధూళికోసం తహతహలాడుతున్నాడు. - రాముణ్ణి భజించే వాడొక్కడే
నిజానికీ జగత్తులో జీవించి ఉండేవాడు. - రాముడు తప్ప నన్ను తరింప చేసేవాడెవ్వడూ లేడు.
పైన పేర్కొన్న 3, 4 గీతాల మిగిలిన చరణాలు మాకు గుర్తులేవు.
శ్రీరామకృష్ణులు తరచు ఇలా చెప్పేవారు: “దొంగతనం, స్త్రీ సాహచర్యం, అసత్యం – ఈ మూడింటి బారి నుండి అప్రమత్తంగా ఉండాలని సాధువులు సదా ఉపదేశిస్తారు.” ఇలా చెబుతూ శ్రీరామకృష్ణులు, తులసీదాసు దోహా* ఏం తెలుపుతున్నదో వినమనేవారు. ‘సత్యనిష్ఠ, వినయం, పరధనం పట్ల అనాసక్తి – ఈ మూడు సద్గుణాల ద్వారా శ్రీహరి లభించకుంటే తులసీదాసు అబద్ధం చెప్పే వాడౌతాడు.’ పై దోహాను పాడి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు : “వినయం అంటే ఏమిటో తెలుసా? నమ్రత, అణకువ. సరైన నమ్రతాభావం జనించినప్పుడు, అహంకారం నశిస్తుంది, భగవత్సాక్షాత్కారం కలుగుతుంది. కబీరుదాస్ గీతంలో కూడా ఇదే భావం ఇమిడి ఉంది : ‘సేవ, ఆరాధన, వినయం ద్వారా రఘునాథుడు అలవోకగా లభిస్తాడు. (కనుక) సోదరా, ఆనందంగా (ఈ సద్గుణాలను) అలవరచుకొంటూ సాగు!”
20. సాధువులకు కావల్సిన ఆవశ్యకాలను శ్రీరామకృష్ణులు సరఫరా చేయించడం: రాజకుమార్ ఉదంతం
మరో సందర్భంలో శ్రీరామకృష్ణులు మాకు ఇలా చెప్పారు : “అన్ని సంప్రదాయాలకు చెందిన సాధువులకు వారి సాధనలకు ఆవశ్యకమైన సామగ్రిని సరఫరా చేయించాలనే ఆకాంక్ష ఒకప్పుడు నాలో కలిగింది. తమకు అవసరమైన సామగ్రి లభించగానే, ఆ సాధువులు నిశ్చింతగా సాధనానుష్ఠానాలు కొనసాగించుకోగలరన్నదే నా అభిప్రాయం. ఈ విషయంగా మథుర్ను సంప్రతించాను. అందుకు మథుర్, ‘దీనిలో శ్రమ ఏముంది బాబా? ఇప్పుడే అన్నీ సిద్ధం చేయిస్తాను. ఎవరికి ఏమి ఇవ్వదలచుకొన్నారో ఇచ్చెయ్యండి’ అని చెప్పాడు. అంతకు ముందు నుండే ఆలయ భాండారం నుండి బియ్యం, పప్పులు, పిండి మొదలైనవి సాధువులకు ఇచ్చే ఆనవాయితీ ఉంది. దానితోబాటు ఇప్పుడు మథుర్ సాధువులకు నీటి కూజాలు, కమండలాలు, దుప్పట్లు, ఆసనాలూ ఇచ్చే ఏర్పాటు చేశాడు; అంతేకాక గంజాయి త్రాగే సాధువులకు భంగు మొదలైన మత్తుపదార్థాలూ, తాంత్రిక సాధకులకు మద్యం వగైరా మత్తుపానీయాలు కూడా సమకూర్చే ఏర్పాటు చేశాడు. ఆ కాలఘట్టంలో తాంత్రిక సాధకులు అనేకమంది దక్షిణేశ్వరానికి వస్తూవుండేవారు; వారు శ్రీచక్రపూజను* చేస్తూవుండేవారు. వారి సాధనలకు అవసరమైన ఒలిచిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, వేయించిన మినపపప్పుతో కూడిన మరమరాలు మొదలైనవాటిని వారికి ఇప్పించేవాణ్ణి. వాటితో ఆ సాధకులు జగజ్జననిని ప్రార్థిస్తూ ఆరాధించడం నేను తదేకంగా చూసేవాడిని. అనేక సందర్భాలలో వారు నన్ను తమతోపాటు చక్రంలో కూర్చోబెట్టే వారు; పలుమార్లు నన్ను చక్రేశ్వరుణ్ణి* చేసేవారు. ‘కారణా’ న్ని* కూడా పుచ్చుకోమని బ్రతిమిలాడేవారు. కాని నేను కారణాన్ని పుచ్చుకోలేననీ, పుచ్చుకొనే అవసరమూ లేదనీ, భగవన్నామంతోనే నాకు ‘మత్తు’ కలుగుతుందనీ తెలుసుకొన్నాక వారు దాన్ని పుచ్చుకొమ్మని నన్ను బలవంతం చేసేవారు కారు. అయినా వారితో కలిసి కూర్చున్నప్పుడు ‘కారణం’ పుచ్చుకోవలసి వస్తుందని తలచి, మద్యాన్ని వ్రేలితో తాకి, నుదుటన బొట్టులా పెట్టుకొనేవాణ్ణి లేదా వాసన చూసేవాణ్ణి; లేదా మహా అయితే వ్రేలితో ఒక చుక్క నోట్లో చిలకరించుకొనేవాణ్ణి. తరువాత దాన్ని వారి పాత్రలలో పోసేవాణ్ణి. వారిలో కొందరు మద్యం పుచ్చుకోగానే మనస్సును జగజ్జననిపై లగ్నం చేసి, తన్మయులై ధ్యానించేవారు. మరికొందరు తల్లిని ధ్యానించడం విస్మరించి, తప్పత్రాగి చివరకు త్రాగుబోతులయ్యేవారు. ఇలా ఉండగా ఒక రోజు వాళ్ళు చాలా అసభ్యంగా ప్రవర్తించారు. దాంతో ఆ రోజు నుండి మద్యం వగైరాలను వాళ్ళకు ఇప్పించడం నిలిపివేయించాను.
కాని రాజకుమార్* మాత్రం మద్యం పుచ్చుకోగానే మనస్సును ఆలోచనా శూన్యం చేసుకొని జపానికి కూర్చోవడం సదా నేను గమనించేవాణ్ణి. కాని తదనంతర కాలంలో అతడు పేరుప్రతిష్ఠల కోసం ఎగబడ్డాడని తెలియవచ్చింది. అది సహజమే కదా! అతడికి భార్యాబిడ్డలున్నారు. కుటుంబ పోషణ నిమిత్తం ధన సముపార్జనలో పడివుంటాడు. ఏది ఏమైనప్పటికీ, సాధనకు ఉపకరిస్తుందనే ఉద్దేశంతో మాత్రమే అతడు మద్యం పుచ్చుకొనేవాడు. అతడు తప్పత్రాగడంగాని, అసభ్యంగా ప్రవర్తించడంగాని నే నెన్నడూ చూడలేదు.
21. ఆధ్యాత్మికం కాని సూచనల పట్ల సైతం శ్రీరామకృష్ణులు ఆధ్యాత్మికంగా స్పందించడం
‘కారణం’ (మద్యం) పుచ్చుకోవడంలో శ్రీరామకృష్ణులు అసక్తులనే విషయం గురించి ఎన్నో ఆలోచనలు మాలో చెలరేగేవి. అనేక సందర్భాలలో ‘భంగు’, ‘కారణం’ (మద్యం) వంటి పేర్లు సంభాషణ మధ్యలో దొర్లినప్పుడు, ఆయన దివ్యోన్మత్తులవడం, కొన్నివేళల్లో సమాధిమగ్నులు కావడం మేం కళ్ళారా చూసివున్నాం. పైకి సంస్కారవంతులుగా కనిపించే మనం, స్త్రీ జననేంద్రియం (యోని) పేరు వినబడగానే తుచ్ఛ ఆలోచనలు రేకెత్తగా కామవికారాలకు లోనవుతాం. అలాగే మరికొందరు తమ బలహీనతలను గుర్తించికూడా, తామేదో ఉత్తములమని చాటుకోవడానికి ‘యోని, గుహ్యేంద్రియం’ వంటి పదాలు చెవిన పడగానే, (తామేదో అశ్లీల, బూతు పదజాలం విని భరించలేని ఉత్తములలా) చెవులు మూసుకొని, అక్కడనుండి పారిపోతారు. కాని అద్భుత మూర్తులైన శ్రీరామకృష్ణులు ‘యోని’ అనే మాట చెవిన పడగానే సమాధిమగ్నులై పోవడం మేం అనేక సందర్భాలలో చూశాం! అట్టి సందర్భాలలో శ్రీరామకృష్ణులు సమాధ్యావస్థ నుండి క్రిందికి దిగి, కొంత మామూలు స్థితిలోకి వచ్చాక ఇలా అనడం మేం వినివున్నాం : “అమ్మా! యాభై ఐదు (అకారం నుండి క్షకారం వరకు) అక్షరాల స్వరూపిణివి నువ్వే కదా! ఏ అక్షరాల సముదాయంతో వేదవేదాంతమంతా అభివర్ణింపబడిందో బూతు, అశ్లీల పదజాలం కూడా ఆ అక్షరాల సముదాయంతో కల్పించబడినదే కదా! వేద వేదాంతాలు ఉపయోగించే ‘క, ఖ’ లు, అశ్లీల పదజాలంలోని ‘క, ఖ’ లు విభిన్నాలు కావు. వేదవేదాంతమంతా నువ్వే, అలాగే అశ్లీల పదజాలం అంతా నువ్వే.” ఇలా అంటూ మళ్ళీ ఆయన సమాధి మగ్నులయ్యేవారు.
ఆహా! లోకంలోని అన్ని – మంచి చెడు, శుభాశుభ – వస్తువులనూ ప్రకాశింపచేసే, మనబోటి వారి మనోబుద్ధులకు అతీతమైన, వర్ణింపనలవిగాని దివ్యజ్యోతి ఆ అద్భుతమూర్తి కళ్ళలో ప్రకాశిస్తూ ఉండడం ఎవరు తెలుసుకోగలరు? ఏ కళ్ళగుండా దివ్యలోకాలను ఆయన దర్శించారో, అటువంటి కళ్ళు ఎవరికి ఉన్నాయి? సావధానంగా వినండి. జాగ్రత్తగా ఆయన వచనాలను హృదయాలలో సభక్తికంగా పదిలపరచుకోండి. ఆ అద్భుతమూర్తి మానసిక పావనత్వం ఎంత దురవగాహమైనదో యోచించి చూడండి!
జగజ్జనని అనుగ్రహం పొందిన రాంప్రసాద్ ఇలా పాడేవాడు :
“సురా పాన్ కొరినా ఆమి సుధా ఖాఇ జై కాళీబోలే ।
ఆమార్ మన్మాతాలే మాతాల్ కొరే ।
జత మద్ – మాతాలే మాతాల్ బోలే ॥”
[ నేను మద్యం త్రాగను, ‘జై కాళీ’ అంటూ అమృతాన్ని ఆస్వాదిస్తూ నా మనస్సు భగవద్భావంతో మత్తెక్కుతుంది. మత్తిల్లిన నన్ను చూసి త్రాగుబోతులు నేను మద్యంత్రాగి ‘నిషా’ లో ఉన్నానని భ్రమిస్తారు.]
మద్యం వంటి మత్తు కలిగించే పదార్థాలను పుచ్చుకోకుండానే కేవలం భగవదానందంతో ఇంతటి ‘నిషా’ పొందవచ్చునని శ్రీరామకృష్ణులను చూడడానికి మునుపు, నిజం చెప్పాలంటే మేం కలలో కూడా ఊహించలేదు. శ్రీహరి నామాన్ని ఉచ్చరించినంతనే శ్రీచైతన్యులు బాహ్యస్మృతిని పూర్తిగా కోల్పేయేవారని ఒక రచయిత ఒక పుస్తకంలో వ్రాశాడు. ఆ విషయం చదివి ఆ రచయిత మూర్ఖుడనీ, మూఢనమ్మకం గలవాడనీ ఒక కాలఘట్టంలో మేం పరిగణించడం మాకు ఇంకా బాగా జ్ఞాపకం ఉంది. ఆ కాలఘట్టంలో నగరంలోని యువకులందరి మనస్సులలో ఆధ్యాత్మికతకు సంబంధించిన ప్రతి విషయంలోనూ అవిశ్వాసం, సందేహం గూడుకట్టుకొని ఉండేవి. ఆ తరుణంలోనే శ్రీరామకృష్ణులను మేం కలుసుకోవడం జరిగింది. కలుసుకోవడం మాత్రమే కాదు, మేం ఆయనను రేయింబవళ్ళు, సదా సర్వవేళలా సంశయ దృష్టితోనే పరిశీలించాం. భగవన్నామ కీర్తనం చేస్తూ మహోత్సాహంతో చేసే విశృంఖల నృత్యం, నృత్యం చేస్తూచేస్తూ పదేపదే బాహ్యస్మృతిని కోల్పోవడం మా కళ్ళారా చూశాం. నాణెంతో సహా ఏ లోహవస్తువు స్పర్శా (వాటి ఎరుక తెలియదు) ఆయన భరించలేకపోవడం; ‘సిద్ధి, కారణం’ వంటి మత్తునిచ్చే పదార్థాల పేర్లను వినగానే భగవదానందంతో ఉద్దీప్తులై తప్పత్రాగిన వారిలా నిషా పొందడం చూశాం. ఇక భగవన్నామం, రాముడు, కృష్ణుడు వంటి అవతారాల పేర్లు వినడం సంగతి ప్రత్యేకంగా చెప్పాలా? ఏ అశ్లీల పదాలు వినబడగానే ఇతరులలో కామభావాలే రేకెత్తుతాయో, అటువంటి పదజాలం ఆయనలో బ్రహ్మయోని, త్రిజగత్ప్రసవినీ, ఆనందమయి అయిన జగజ్జననీ భావాలను ఉద్దీపింప చేసి, అతీంద్రియ విమలానందంలో ఆయనను ముంచెత్తేవి.
పాఠక మహాశయా! ఈ అద్భుతమూర్తిని మా హృదయాంతరాళాలలో అవతార పురుషునిగా కొలుస్తున్నామని సమర్థించుకోవడానికి ఇంకా ఏ మహా సుగుణాన్ని సోదాహరణగా చూపించాలి?
22. (అ) మొదటి ఉదాహరణ: రామచంద్ర దత్త గృహంలో
రామచంద్ర దత్త, శ్రీరామకృష్ణుల పరమ భక్తుడు. అతడి ఇల్లు కలకత్తాలోని సిమ్లా అనే పేటలో ఉండేది. శ్రీరామకృష్ణులు తమ భక్తులతో కలిసి అక్కడకు ఎన్నోసార్లు వెళ్ళి, తమ ఆనందప్రద సాహచర్య లబ్ధిని అతడికి, అక్కడ సమావేశమైన భక్తులకూ ప్రసాదించి వెళ్ళేవారు. ఒక రోజు శ్రీరామకృష్ణులు, దత్త గృహంలో కొంతసేపు భగవత్ప్రసంగంతో గడిపి, తిరిగి దక్షిణేశ్వరానికి బయలుదేరారు. రామచంద్ర దత్త ఇల్లు మధురాయ్ సందులో ఉంది. ఇరుకు సందు కాబట్టి బళ్ళు ఇంటి ముందు వరకు రాలేకపోయేవి. అందుచేత ప్రధాన వీధిలో బళ్ళను ఆపి, కాస్తదూరం కాలినడకన రావలసి వచ్చేది. ఆ రోజు బండి శ్రీరామకృష్ణుల కోసం ప్రధాన వీధిలో పశ్చిమం వైపుగా వేచివుంది. శ్రీరామకృష్ణులు బండి వైపుగా నడవసాగారు. భక్తులు ఆయనను అనుసరించి వస్తున్నారు. భగవదానంద పారవశ్యంలో ఆయన తూలిపోతున్నారు; ఇతరుల ఆసరా లేకుండా ఆ నాలుగు అడుగులు కూడా వేయలేని స్థితిలో ఉన్నారు. ఇద్దరు భక్తులు ఆయనను రెండు వైపులా పుచ్చుకొని మెల్లగా నడిపించ సాగారు. ఆ సందు మలుపులో కొంతమంది జనం నిలబడి ఉన్నారు. శ్రీరామకృష్ణుల అవస్థ వారెలా అర్థం చేసుకోగలరు? వాళ్ళలో వాళ్ళు ఇలా మాట్లాడుకొంటున్నారు: “అబ్బ, ఎంత తప్ప త్రాగి ఉన్నాడో ఈ మనిషి!” అని మెల్లగా మాట్లాడినా ఆ మాటలు మా చెవిన పడ్డాయి. మాలో మేం ‘నిజమే’ అనుకొన్నాం.
22. (ఆ) రెండవ ఉదాహరణ: దక్షిణేశ్వరంలో శారదామాత ఎదురుగా
గురుదేవులు ఒక రోజు పగటిపూట పరమారాధ్యురాలైన మాతృదేవిని పిలిచి, తమ గదిని, పరుపును శుభ్రపరిచి, తమలపాకులు చుట్టి సిద్ధం చేయమని చెప్పి, కాళికాలయానికి వెళ్ళారు. మాతృదేవి ఆ పనులన్నీ సత్వరమే దాదాపుగా పూర్తి చేశారు. ఈలోగా శ్రీరామకృష్ణులు ఆలయం నుండి తిరిగి వచ్చారు. తప్ప త్రాగిన వ్యక్తిలా ఆయన తూలి పోతున్న స్థితిలో ఉన్నారు. కళ్ళు ఎర్రబారి ఉన్నాయి, అడుగులు తడబడుతున్నాయి. మాటలు అస్పష్టంగా, అర్థరహితంగా ఉన్నాయి. గదిలోకి ప్రవేశించి తూలుతూ తూలుతూ మాతృదేవి వద్దకు వచ్చారు. ఇంటి పనులలో మునిగిపోయి ఉన్న మాతృదేవి, ఆయన ఆ స్థితిలో రావడం గమనించలేదు. త్రాగిన వ్యక్తిలా ఆయన ఆమెను త్రోసి, “ఆఁ, నేను మద్యం త్రాగానా?” అని అడిగారు. ఆమె వెనక్కు తిరిగి ఆయన తన్మయత్వం చూసి విస్తుబోయారు. “లేదు, లేదు. మీ రెందుకు మద్యం పుచ్చుకొంటారు?” అని మాతృదేవి జవాబిచ్చారు. “మరి తూలిపోతున్నాను ఎందుకు?” అని శ్రీరామకృష్ణులు అడిగారు. అప్పుడు మాతృదేవి ఆయనను అనునయిస్తూ, “లేదు, లేదు. మద్యం మాత్రం కాదు. కాళీమాత ప్రేమామృతాన్ని త్రాగివున్నారు” అని చెప్పారు. అందుకు తమ సమ్మతి తెలుపుతున్న ధోరణిలో, “నువ్వు చెప్పింది నిజమే” అని అన్నారు.
22. (ఇ) మూడవ ఉదాహరణ: కాశీపూర్‌లో ఒక తాగుబోతును చూస్తున్నప్పుడు
కలకత్తా భక్తులు శ్రీరామకృష్ణులను దర్శించి ఆయన అనుగ్రహం పొందినప్పటి నుండి, కనీసం వారానికి ఒకటి రెండుసార్లు ఆయన ఎవరో ఒక భక్తుని ఇంటికి వెళ్ళివచ్చేవారు. తమ భక్తులలో ఎవరైనా నియమిత సమయంలో తమ వద్దకు రాలేకపోయినప్పుడూ, ఇతరుల నుండి ఆ వ్యక్తి క్షేమ సమాచారాలు తెలియనప్పుడూ దయాళువులైన శ్రీరామ కృష్ణులు స్వయంగా తానే ఆ వ్యక్తి వద్దకు వెళ్ళేవారు. సామాన్యంగా తరచు నియమిత సమయాలలో దక్షిణేశ్వరానికి వచ్చే భక్తుడు రానప్పుడు, ఆయన ఆందోళనపడి ఆ వ్యక్తిని చూడడానికి కలకత్తాకు వెళ్ళేవారు. ఆయన శుభాగమనం సర్వదా ఆయా భక్తుల శ్రేయస్సు కోసమే అన్న విషయం ముమ్మాటికీ నిజం. దాన్లో ఆయన స్వార్థం కించిత్తు కూడా ఉండదు.
వేణీ సాహా అనే వ్యక్తికి బారానగర్‌లో మంచి బాడుగ గుఱ్ఱబ్బళ్ళు ఉండేవి. శ్రీరామకృష్ణులు తరచు కలకత్తాకు వస్తూపోతూ ఉండడం వలన, ఆయన అవసరం మేరకు ఈ వ్యక్తి దక్షిణేశ్వరానికి ఒక బాడుగ బండిని పంపాలని ఏర్పాటు చేసుకొన్నారు. ఒకవేళ కలకత్తా నుండి బండి ఎంత ఆలస్యంగా తిరిగి వచ్చినా వేణీ సాహా అభ్యంతరం చెప్పకూడదు. అదనపు సమయం బండి వేచి ఉన్నందుకు అదనపు బాడుగ చెల్లించేవారు. బండి బాడుగలను మొదట్లో మథుర్ నాథ్, తరువాత పానీహాటీ వాస్తవ్యుడైన మణిసేన్, ఆ తరువాత శంభుమల్లిక్, తదనంతరం సిందూరియాపటికి చెందిన జయగోపాల్ సేన్ భరిస్తూ వచ్చారు. కాని ఆయన ఏ భక్తుని ఇంటికి వెళ్ళేవారో, ఆ రోజు బండి బాడుగ ఆ భక్తుడే తన స్తోమతను బట్టి చెల్లించేవాడు.
ఒక రోజు శ్రీరామకృష్ణులు కలకత్తాలోని యదుమల్లిక్ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. యదుమల్లిక్ తల్లి ఆయనకు పరమ భక్తురాలు. ఆమెను చూడగోరే ఆ రోజు కలకత్తా వెళ్ళాలనుకొన్నారు. చాలా రోజులుగా ఆ కుటుంబ క్షేమ సమాచారాలు ఆయనకు తెలియరాలేదు. శ్రీరామకృష్ణులు భోజనం చేశాక, గుఱ్ఱపు బండి వచ్చింది. అప్పుడే కలకత్తా నుండి పడవలో మా మిత్రుడు ‘అ–’ శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చాడు. ‘అ–’ ను చూడగానే ఆయన అతడి క్షేమసమాచారాలు విచారించారు. “నువ్వు రావడం మంచిదయింది. ఈ రోజు యదుమల్లిక్ ఇంటికి వెళుతున్నాను. దారిలో మీ ఇంటి వద్ద దిగి, ‘గి–’ ని చూసి పోతాను. పనుల ఒత్తిడి వలన తీరుబడిలేక అతడు చాలా రోజుల నుండి ఇక్కడకు రాలేదు. పద, మనం కలిసే పోదాం” అని ‘అ–’ తో చెప్పారు. అందుకు ‘అ–’ అంగీకరించాడు. శ్రీరామకృష్ణులతో పరిచయం ‘అ–’ కు అంతంత మాత్రమే. అతడు గురుదేవులను కొద్దిసార్లే, కొన్నిచోట్లలో చూసివున్నాడు. మనం ఏ వస్తువులను లేదా వ్యక్తులను చూసి రోతతో ఏవగించుకొంటామో, వాటినే చూసి అసాధారణ వ్యక్తులైన శ్రీరామకృష్ణులు భగవద్భావ ప్రేరణతో ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ భావసమాధిమగ్నులవుతారనే విషయం ‘అ–’ కు అంతగా తెలియదు.
శ్రీరామకృష్ణులు వెళ్ళి బండిలో కూర్చున్నారు. ఆయనను సేవిస్తున్న బాల భక్తుడు లాటూ (కాలాంతరంలో స్వామి అద్భుతానంద) గురుదేవుల సంచీ, తువ్వాలు మొదలైన అవసరమైన వస్తువులను తీసుకొని ఆయన వెనుకే వెళ్ళి బండిలో కూర్చున్నాడు. మా మిత్రుడు ‘అ–’ కూడా వెళ్ళి బండిలో కూర్చున్నాడు. బండి బయలుదేరింది. క్రమంగా బారానగర్ బజారు దాటి, మతి చెరువు ప్రక్క నుండి పోసాగింది. దారిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సంఘటన ఏదీ జరగలేదు. దారిలో అదీ ఇది చూస్తూ గురుదేవులు, లాటూనో, ‘అ–’ నో చిన్నపిల్ల వాడిలా వాటి గురించి అడగసాగారు; లేదా ఏదో ఒక అంశంపై ముచ్చటిస్తూ, మామూలు స్థితిలో ఉండే రీతిలో ఉల్లాసంగా ఉన్నారు.
మతి చెరువుకు దక్షిణం వైపు ఒక చిన్న బజారు వెలిసి ఉంది. దానికి మరింత దక్షిణం వైపు ఒక సారాయి దుకాణం, ఒక ఔషధశాల, ధాన్యం నిల్వ చేసుకొనే పెంకుటిళ్ళతో కూడిన గిడ్డంగి ఉన్నాయి. వీటికి దక్షిణంగా సుప్రసిద్ధ శ్రీసర్వమంగళ, చిత్రేశ్వరీ దేవాలయాలకు దారితీసే విశాలమైన మార్గం ఉంది. ఈ మార్గం గంగానది ఒడ్డు ప్రక్క నుండి పోతుంది. కలకత్తాకు పోవాలంటే ఈ మార్గానికి కుడివైపుగా వెళ్ళాలి.
కొందరు త్రాగుబోతులు ఆ సారాయి దుకాణంలో కూర్చుని త్రాగుతూ గోలచేస్తూ ఆనందిస్తున్నారు. వారిలో కొందరు ఆనందంగా పాడుతున్నారు, కొందరు చేతులూ కాళ్ళూ ఊపుతూ నాట్యం చేస్తున్నారు. ఆ అంగడి యజమాని, సారాయి అమ్మడానికి ఒక పనివాణ్ణి నియమించి, అంగడి వాకిలి వద్ద అన్యమనస్కంగా నిలబడి ఉన్నాడు. నుదుట పెద్ద సిందూరం బొట్టు పెట్టుకొని ఉన్నాడు. అదే సమయంలో శ్రీరామకృష్ణుల బండి ఆ అంగడి ముందు నుండి వెళ్ళసాగింది. ఆ అంగడి యజమాని, శ్రీరామకృష్ణులను చూడగానే చేతులెత్తి నమస్కారం చేశాడు; బహుశా ఆయనను గుర్తుపట్టి ఉంటాడు.
అంగడిలో జరుగుతున్న గోల శ్రీరామకృష్ణుల దృష్టిని ఆకర్షించింది. ఆ త్రాగుబోతులు తమ ఆనందాన్ని ఆ రకంగా వ్యక్తం చేయడం ఆయన గమనించారు. మద్యం (కారణం) త్రాగి అలా వాళ్ళు ఆనందించడం చూసిన తక్షణమే శ్రీరామకృష్ణుల మనస్సులో జగత్కారణమైన ఆనంద స్వరూపం ఉద్దీపనమైంది. కేవలం ఉద్దీపనమే కాదు, ఆయనకు ఆ అనుభూతే కలిగింది. వెంటనే పూర్తి నిషాలో మునిగిపోయారు, మాటలు అస్పష్టంగా రాసాగాయి. అంతే కాదు. తమ కుడి పాదాన్ని ముందుకు చాచి బండిని ఎక్కే మెట్టుమీద నిలిపి, కాస్త ముందుకు వంగి నిలబడ్డారు. అలా నిలబడి తప్పత్రాగిన వ్యక్తిలా ఆ త్రాగుబోతుల సంతోషాన్ని చూస్తూ, ఆనందంతో చేతులూ కాళ్ళూ ఊపుతూ, “శెభాష్, శెభాష్, ఎంతో బాగుంది” అంటూ బిగ్గరగా అరవసాగారు.
‘అ’ ఇలా అన్నాడు : “హఠాత్తుగా శ్రీరామకృష్ణులకు ఇటువంటి భావావస్థ ఏర్పడుతుందని సూచనప్రాయంగా కూడా మాకు తెలియలేదు. అప్పటిదాకా మామూలు సహజ స్థితిలోనే ఆయన మాట్లాడుతున్నారు. కాని ఆ త్రాగుబోతులను చూసీచూడగానే ఆ భావావస్థకు లోనయ్యారు. నేను భయంతో నిశ్చేష్టుణ్ణి అయ్యాను. బండిలోకి ఆయనను లాగివేయాలనే ఆతురతతో చేతులు చాచి, ఆయనను అందుకోబోయాను. అప్పుడు లాటూ కల్పించుకొని, ‘ఏమీ చేయనక్కరలేదు. ఆయన తనను అదుపులో పెట్టుకోగలరు, క్రింద పడిపోరు’ అని చెప్పాడు. ఆ మాటతో స్థిమితపడ్డాను. అయినా, కాస్సేపు నా గుండె తీవ్రంగా కొట్టుకోసాగింది. తరువాత ఇలా అనుకొన్నాను : ‘ఇటువంటి పిచ్చి మనిషితో కలిసి ఒకే బండిలో ప్రయాణం చేయడం ఎంత తప్పయింది. మరెన్నడూ ఇలా చేయను.’
“నిజానికి ఈ సంఘటనలన్నీ వివరించడానికి పట్టిన సమయం కంటే జరగడానికి స్వల్పవ్యవధే పట్టింది. ఈలోగా బండి మద్యం అంగడి దాటిపోయింది, శ్రీరామకృష్ణులు బండిలో ప్రశాంతంగా కూర్చున్నారు. ఆ తరువాత సర్వమంగళా దేవి ఆలయం చూసి, ‘అదుగో సర్వమంగళా దేవి. ఆమె జాగ్రద్దేవత. నమస్కరించు’ అని అన్నారు. ఇలా అంటూ ఆయన దేవికి నమస్కరించారు. వారిని అనుకరించి మేమూ దూరంనుండే దేవికి నమస్కరించాం. తరువాత నేను శ్రీరామకృష్ణుల వంక చూశాను. ఆయన మందహాసంచేస్తూ, మామూలు స్థితిలో కనిపించారు. ఆయన పడిపోయివుంటే, మరణించి ఉంటే అనే ఆలోచనతో నా గుండె చాలాసేపటివరకు కొట్టుకొంటూనే ఉండిపోయింది.
“తదనంతరం బండి ఇంటి గుమ్మం వద్దకొచ్చి ఆగగానే, ఆయన నాతో, ‘గి’ ఇంట్లో ఉన్నాడా? లోపలకు వెళ్ళి కాస్త చూడు” అని అన్నారు. నేను లోపలికి వెళ్ళివచ్చి, ‘గి’ లేడని చెప్పాను. సరే, ‘గి’ ని చూడలేకపోయాను. ఈ రోజూ బండి అదనపు బాడుగను అతణ్ణి చెల్లించమని అడుగుదామనుకొన్నాను. కాని నీతో పరిచయం అయింది కదా! ఒక రూపాయి ఇస్తావా? యదుమల్లిక్ పిసినారి అని నీకు తెలుసుకదా! అతడు బేరమాడుకొన్న రెండు రూపాయల నాలుగు అణాలకంటే చిల్లిగవ్వకూడా అదనంగా ఇవ్వడు. కాని భక్తులను కలుసుకొని తిరిగి వచ్చేసరికి రాత్రి ఎంత ఆలస్యమౌతుందో ఎవరికి తెలుసు? పైగా రాత్రి బాగా పొద్దుపోతే బండివాడు మమ్మల్ని బాగా సతాయిస్తాడు. కాబట్టి బండివాడికి మూడు రూపాయల నాలుగు అణాలు చెల్లిస్తే అతడు గోలచేయడని వేణీతో ఒక ఒప్పందం కుదుర్చుకొన్నాం. కనుక ఒక రూపాయ నువ్వు ఇస్తే ఈ రోజు బండి బాడుగకు ఇబ్బంది ఉండదు. ‘అందుకే నిన్ను అడగడం’ అని నాతో చెప్పారు. ఇదంతా విని లాటూ చేతికి ఒక రూపాయి ఇచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాను. ఆయన యదుమల్లిక్ను చూడడానికి వెళ్ళిపోయారు.”
బాహ్యదృష్టికి త్రాగుబోతులా కనిపించే స్థితి ఎప్పుడంటే అప్పుడు శ్రీరామకృష్ణులకు ఏర్పడేది. అటువంటి సంఘటనలు కోకొల్లలు. వాటిలో కొన్నిటిని మాత్రమే మేం పొందుపరచగలిగాం.
23. సాధువులకు శ్రీరామకృష్ణులు చేసిన ఆధ్మాత్మిక సహాయం
ఆ విధంగా అనేక సందర్భాలలో శ్రీరామకృష్ణులు మాకే కాక అనేకులకు దక్షిణేశ్వర కాళికాలయానికి విచ్చేసిన సాధువుల, సాధకుల గురించిన కథలు వివరించి చెప్పేవారు. ఆ సంఘటనలను స్వయంగా చూసిన వారు ఎందరో ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. మేం ఆ సమయంలో సెయింట్ జేవియర్ కళాశాలలో చదువుకొంటున్నాం. గురువారం, ఆదివారం కళాశాలకు సెలవు రోజులు. శని ఆదివారాలలో శ్రీరామకృష్ణుల వద్ద భక్తులు క్రిక్కిరిసి ఉండేవారు. కనుక మేం గురువారం నాడు కూడా ఆయన వద్దకు వెళ్ళేవారం. ఆయన జీవితంలో జరిగిన వివిధ సంఘటనలను ఆయన ముఖతా వినే సదవకాశం ఇందుమూలంగా మాకు కలిగింది. వాటవివరాల ద్వారా మాకొక విషయం స్పష్టంగా అవగతమైంది: భైరవీ బ్రాహ్మణి, తోతాపురి, మహమ్మదీయుడైన గోవింద, ఆరు నెలలపాటు ఎడతెగని పరిపూర్ణ నిర్వికల్ప సమాధిలో మగ్నులై ఉన్నప్పుడు శ్రీరామకృష్ణుల దేహాన్ని పరిరక్షించడానికి దైవవశాత్తు కాళికాలయానికి వచ్చిన సాధువు, అలాగే మరికొందరు సాధువులు,* వివిధ సంప్రదాయాలకు చెందిన ప్రతి సాధుమా, సాధకుడూ దివ్యులైన శ్రీరామకృష్ణుల సంసర్గంతో తమ ఆధ్యాత్మిక జీవితాలలో నూతన ప్రకాశాన్ని, నిర్దేశాన్ని పొందగలిగారు. ఆ విధంగా శ్రీరామకృష్ణుల తోడ్పాటుతో స్వయంగా తాము కృతార్థులు కావడమే కాక, తమ తమ సంప్రదాయాలకు చెందిన నిజమైన సాధకులకు, వారు అనుసరిస్తున్న మార్గాలలో భగవత్సాక్షాత్కారం ఎలా పొందవచ్చునో చూపించే అవకాశమూ వారికి కలిగింది. ఇటువంటి వారంతా కేవలం నేర్చుకోవడానికి మాత్రమే శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చారు. తమ జ్ఞానాన్ని సమగ్ర పరచుకొని తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఇదంతా ఆంగ్లవిద్యను అభ్యసించిన మావంటి శిష్యుల రాకకు ముందే జరిగింది.
భైరవీ బ్రాహ్మణి, తోతాపురి వంటి వారు కూడా పురాకృత సుకృత ఫలంగా శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక జీవితంలో దోహదం చేయడానికి వచ్చారు. అయినప్పటికీ సుదీర్ఘకాల సాధనానంతరం కూడా నిగూఢమైన ఏ మహోన్నత ఆధ్యాత్మిక సత్యాలను తమ జీవితంలో సాక్షాత్కరించుకోలేకపోయారో, ఆ సత్యాలను శ్రీరామకృష్ణుల దివ్యానుగ్రహ కటాక్షం ద్వారా సాక్షాత్కరించుకొని తరించారు.
24. శ్రీరామకృష్ణుల సాధనలు:సాధువుల ఆగమనం
దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చిన సాధువుల, సాధకుల వరుస క్రమాన్ని పరికిస్తే మరొక సత్యం మనకు స్ఫురిస్తుంది. ఈ అధ్యాయంలో ఆ సంఘటనలు జరిగిన వరుస క్రమాన్ని, శ్రీరామకృష్ణుల ముఖతా మేం విన్న మేరకు యథాతథంగా పొందుపరచడం వలన ఈ సాధకులు వచ్చిన వరుస క్రమాన్ని అధ్యయనం చేయడం అనుకూలమౌతుంది. ఎప్పుడెప్పుడు ఆయన ఒక ప్రత్యేక భావంలో భగవంతుణ్ణి ఉపాసించి, సాధన చేసి భగవంతుణ్ణి ఆయా ప్రత్యేక రూపంలో సాక్షాత్కరించుకొనేవారో, అదే సమయంలో అదే తీరులో భగవంతుణ్ణి ఉపాసిస్తూ, సాధన చేస్తున్న ఆయా సంప్రదాయాలకు చెందిన సాధకులు, బృందాల వారీగా ఆయన వద్దకు వచ్చేవారని స్వయంగా శ్రీరామకృష్ణుల ముఖతా మేం వినివున్నాం. వారితో ఆయా భావాలకు సంబంధించిన చర్చతో శ్రీరామకృష్ణులు రేయింబవళ్ళు గడిపేవారు.
శ్రీరామ మంత్రోపాసనలో సిద్ధి పొందగానే రామావత్ సంప్రదాయకులు అనేకులు ఆయన వద్దకు రావడం మొదలైంది. వంగదేశ వైష్ణవ మార్గానికి చెందిన శాంత దాస్యాది భావాలను అనుసరించి ఎప్పుడెప్పుడు శ్రీరామకృష్ణులు ఆయా భావాలలో సిద్ధి పొందారో, అదే సమయంలోనే ఆ భావమార్గాన్ని అనుసరించే సాధకులు రావడం తటస్థించింది. అలాగే భైరవీ బ్రాహ్మణి సహాయంతో అరవై నాలుగు తంత్రాల ప్రధాన సాధనలలో, అంటే శక్తిసాధనలో సిద్ధి పొందిన తక్షణమే తాంత్రికసాధనలలో సుప్రసిద్ధులైన సాధకులందరూ శ్రీరామకృష్ణుల వద్దకు రావడం జరిగింది. శ్రీరామకృష్ణులు అద్వైత తత్త్వంలో పరిపూర్ణులై నిర్వికల్పానుభూతి పొంది, బ్రహ్మజ్ఞానం సంతరించుకొన్న వెంటనే పరమహంస సంప్రదాయానికి చెందిన సాధకవరేణ్యులు అనేకులు ఆయన వద్దకు వచ్చారు.
25. అవతారపురుషుల ఆధ్యాత్మిక శక్తిలో తారతమ్యం
వివిధ సంప్రదాయాలకు చెందిన సాధకులు శ్రీరామకృష్ణుల దివ్య సాహచర్యం పొందే నిమిత్తం ఆ రకంగా వేర్వేరు సమయాలలో రావడంలో ఒక గూఢార్థం ఇమిడి ఉందని పిల్లవాడికి సైతం ఇట్టే అర్థమౌతుంది. గతంలో అవతార పురుషుల శుభావతరణంతో లోకంలో ఇలాగే జరిగింది, ఇక ముందు కూడా కచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఆధ్యాత్మిక జగత్తు నిగూఢ నియమాల మేరకు, ధర్మగ్లానిని తొలగించడం కోసమో లేదా దాదాపు ఆరిపోవనున్న ఆధ్యాత్మిక జ్యోతిని దేదీప్యమానంగా ప్రకాశింప చేయడం కోసమో ప్రతి యుగంలోను ఈ అవతారపురుషులు జన్మిస్తూ ఉంటారు.
కాని అవతార పురుషుల జీవితాలను అధ్యయనం చేసినప్పుడు వారి శక్తి అభివ్యక్తీకరణలో తారతమ్యం ఉండడం కానవస్తుంది. వీరిలో కొందరు దేశంలోని ఒక ప్రాంతాన్నో లేదా కొన్ని ప్రత్యేక మతసంప్రదాయాలనో ఉద్ధరించడానికీ, మరికొందరు లోకంలో ఆధ్యాత్మిక కొరతను తీర్చడానికీ ఏతెంచారన్న విషయం స్పష్టమవుతుంది. వీరందరూ తమ సొంత సిద్ధాంతాలను, తాము ఆవిష్కరించుకొన్న ఆధ్యాత్మిక సత్యాలను ప్రకటించడం కానవస్తుంది. కాని వీరు పూర్వ ఋషుల, ఆచార్యుల, అవతారపురుషుల యొక్క ఆ ఆధ్యాత్మిక బోధనల ప్రామాణికతను చెక్కుచెదరనివ్వకుండా పరిరక్షిస్తారు. తమ దివ్యయోగశక్తుల ద్వారా గతంలో వెలసిన ఆధ్యాత్మిక సిద్ధాంతాల, సంప్రదాయాల మధ్య అనుక్రమమూ, అంతఃసంబంధమూ ఉండినట్లు వారు చూడగలగడమే ఇందుకు కారణం. లౌకిక వస్తువుల పట్ల అనురక్తితో అంధత్వం పొందిన మన దృష్టికి, ఆధ్యాత్మిక జగత్తు చరిత్రా, ప్రాచీన మత సిద్ధాంతాల మధ్య నెలకొన్న అంతఃసంబంధమూ గోచరించవు. కాని గతంలో వెలసిన మత సంప్రదాయాల మధ్య ‘సూత్రే మణిగణా ఇవ’ – వివిధ మణులు ఒకే దారంతో కూర్చబడిన రీతిలో, ఒక సన్నిహిత సంబంధం ఉండడం ఆ అవతార పురుషుల అంతర్దృష్టికి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే తమ కొంగ్రొత్త ఆధ్యాత్మికానుభూతి అనే మణిని ఆ మణిహారానికి చేర్చి, దాని ప్రకాశాన్ని ఇనుమడింపచేసి వారు నిష్క్రమిస్తారు.
26. శ్రీరామకృష్ణుల, ఇతర అవతార పురుషుల ఆధ్యాత్మిక శక్తుల సాదృశ్యం
విదేశీయ మతాల చరిత్రను అధ్యయనం చేసినప్పుడు ఈ అంశం మనకు మరింత స్పష్టమౌతుంది. యూదీయ మతాచార్యులు ప్రచారం చేసిపోయిన ధార్మిక సత్యాలను ఏసుక్రీస్తు చెక్కుచెదరనివ్వక, తాను అనుభూతం చేసుకొన్న ధార్మిక సత్యాలను ప్రకటించడం ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. మళ్ళీ కొన్ని శతాబ్దాల తరువాత మహమ్మద్ ప్రవక్త ఏతెంచి ఏసుక్రీస్తు ప్రకటించిన సత్యానుభూతులను చెక్కుచెదరనివ్వక, తన సత్యావిష్కృతాలను ప్రచారం చేశాడు. ఈ విధంగా చూస్తే ప్రచారంలో ఉన్న పూర్వపు ధార్మిక సిద్ధాంతాలను, ఒక క్రొత్త ధార్మిక సిద్ధాంతం వచ్చి నిర్వీర్యం చేయదని తేటతెల్లమవుతుంది. ప్రాచీన యూదీయ ఆచార్యుల స్థానాన్ని ఏసుక్రీస్తు ఆక్రమించుకోలేదు; అదే విధంగా మహమ్మద్ ప్రవక్త, ఏసుక్రీస్తు స్థానాన్ని ఆక్రమించుకోలేదు. ఆధ్యాత్మిక జగత్తులో అన్నిచోట్ల ఇదే నియమం వర్తిస్తుంది. భారతీయ మత సంప్రదాయాలన్నింటి విషయంలో కూడా ఇదే నియమం అనువర్తిస్తుంది. మన వైదిక ఋషులు, ఆచార్యవరేణ్యులు, పురాణ తాంత్రిక గ్రంథకర్తలు వివిధ మతాలను, సంప్రదాయాలను ప్రచారం చేసిపోయారు. వారు రూపొందించిన సాధనా మార్గాలలో దేనినైనా ఎన్నుకొని, ప్రగాఢ విశ్వాసంతో అనుష్ఠిస్తే ఆ మార్గం ద్వారా నువ్వు కూడా భగవంతుణ్ణి ఆయా భావాలతో ప్రత్యక్షంగా సాక్షాత్కరించుకోగలవు. ఒకదాని తరువాత ఒకటిగా ఈ వివిధ మత సాధనలన్నిటినీ శ్రీరామకృష్ణులు అనుష్ఠించి, వాటిలో పరిపూర్ణత్వం సంతరించుకొని, తదనంతరం ఆ మహోన్నత సత్యాన్ని మాకు వెల్లడించి వెళ్ళిపోయారు.
27. అన్ని సంప్రదాయాలకు చెందిన సాధువులు, సాధకులు శ్రీరామకృష్ణుల వద్దకు రావడానికి హేతువు
“పువ్వులు వికసించిన తక్షణమే తుమ్మెదలు వ్రాలుతాయి.” ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఇదే నియమం వర్తిస్తుందని శ్రీరామకృష్ణులు మాతో అనేకసార్లు చెప్పి ఉన్నారు. ఈ నియమాన్ని అనుసరించే అవతార పురుషులు తమ జీవితంలో ఆధ్యాత్మిక సత్యాలను సాక్షాత్కరించుకొని సిద్ధి పొందిన తక్షణమే, ఆ సత్యాలను తెలుసుకోవడం కోసం ఆధ్యాత్మిక పిపాసకులు ఆకర్షితులై, వారి దరి చేరతారు. శ్రీరామకృష్ణుల వద్దకు ఒక్క సంప్రదాయానికి చెందిన సాధకులు మాత్రమే కాక, అన్ని సంప్రదాయాలకూ చెందినవారు బృందాలుగా వచ్చేవారు. ప్రతీ సాధన మార్గాన్ని అనుష్ఠించి, దాన్లో సిద్ధిపొంది ఆయా భగవద్భావాలను శ్రీరామకృష్ణులు సమగ్రంగా సాక్షాత్కరించుకోవడమే ఇందుకు కారణం. కాబట్టే ఆయా సాధన మార్గాలను గురించి ఆ మార్గాలను అనుసరించే సాధకులకు నిర్దిష్ట సమాచారం అందివ్వగలరనే వారందరూ ఒక అజ్ఞాత నియమానుసారం ఆయన వద్దకు వచ్చేవారు. కాని ఆయన వద్దకు వచ్చిన ప్రతీ సాధకుడూ తన మార్గంలో పరిపూర్ణతను సంతరించుకోలేదు; అలాగే శ్రీరామకృష్ణులను యుగావతార పురుషునిగా గుర్తించలేదు. వారిలో విశిష్ట సాధకులు మాత్రమే అలా చేయగలిగారు. కాని వారిలో ప్రతి ఒక్కరూ శ్రీరామకృష్ణుల దివ్యసాంగత్యం వలన తమ తమ మార్గాలలో మాత్రం పురోగమించ గలిగారు. అలా తమ మార్గంలో పురోగమిస్తూ ఉంటే సరైన సమయంలో తమకు భగవత్సాక్షాత్కారం కలగడం తథ్యమని వారు ప్రగాఢంగా విశ్వసించారు. తాము అనుసరించే మతం పట్ల, మార్గం పట్ల విశ్వాసాన్ని కోల్పోవడమే ధర్మగ్లానికి కారణమని, అట్టి విశ్వాసాన్ని కోల్పోయిన సాధకులు ఆధ్యాత్మిక సత్యాలను ఆవిష్కరించుకోలేరని చెప్పడం అనవసరం.
28. వారి రాక శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక జాగృతం నిమిత్తం కాదు
దక్షిణేశ్వరానికి విచ్చేసిన సాధువుల నుండే భగవత్సాక్షాత్కారానికి దారితీసే సాధన పద్ధతులను నేర్చుకొని, కఠోర తపశ్చర్యలు శ్రీరామకృష్ణులు ఆచరించారనే వదంతి ప్రచారంలో ఉంది. అలా ఆచరించినందున ఒకానొక సమయంలో ఆయనకు మతి చెడిందనీ, తీవ్రభావోద్వేగాల ప్రభావంతో బాహ్యచైతన్యాన్ని కోల్పోయే శాశ్వత భౌతిక రుగ్మత వాటిల్లిందనీ అనుకొనేవారు. హే భగవాన్! మనం ఎంత చదువుకున్న మూర్ఖులమో కదా! పరిపూర్ణ మనో ఏకాగ్రత ద్వారా సమాధి స్థితిలో లీనమైనప్పుడు బాహ్యచైతన్యం లుప్తమౌతుందని భారతీయ ఋషిపుంగవులు స్వానుభవపూర్వకంగా వేదపురాణాదుల మూలంగా వెల్లడించి ఉన్నారు. అంతేగాక ప్రపంచంలో ఏ ఇతర దేశస్థులకీ తెలియని సమాధి సంబంధిత శాస్త్రరహస్యాలనన్నిటినీ పూర్తి వివరాలతో మనకు వదలిపెట్టి వెళ్ళారు. అలాగే లోకంలో అవతార పురుషులుగా పరిగణింపబడుతూ ఎవరు మానవాళి అర్చనలు చూరగొంటూ వచ్చారో, ఆ మహాపురుషులందరూ తమ జీవితాలలో బాహ్యచైతన్యాన్ని కోల్పోవడం చవిచూసే ఉన్నారు. నిజానికి ఆ పరిణామం బాహ్యచైతన్యం కోల్పోవడం కాదనీ, అది ఆధ్యాత్మిక పురోగతి పరాకాష్ఠ అనీ వాళ్ళు పదేపదే మనకు వివరించి ఉన్నారు. ఇదంతా పరికించి కూడా మనం నిరర్థకమైన మాటలు వినడంగాని పలకడంగాని చేస్తూపోతే, ఇక ఆ భగవంతుడే మనకు దిక్కు! ఓ పాఠక మహాశయా! వారి అర్థరహితమైన విమర్శలను నువ్వు అంగీకరించే పక్షంలో ఒక్క నిజాన్ని మాత్రం తెలుసుకో; ఒక గ్రుడ్డి వ్యక్తిని అనుసరించిపోయే గ్రుడ్డివాళ్ళ ఉదాహరణ నీకూ వర్తిస్తుంది. నుమ్వా, నీ వంటి దృక్పథం ఉన్న ఇతరులూ వర్ధిల్లుగాక! కాని దైవోన్మత్తులైన అద్భుతమూర్తి పాదారవిందాల వద్ద కూర్చునే స్వేచ్ఛను మాత్రం దయచేసి మాకు వదలిపెట్టు. ఏదో ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చే ముందు మాత్రం నువ్వు కూడా ఈ ప్రశ్నను అవగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎంతో బాగుంటుంది. కాని నీ నిర్ణయం, ఈ క్రింది కఠోపనిషత్తు వచనాలు వివరించే దుర్గతికి దారితీయకుండా జాగ్రత్త వహించు.
అవిద్యాయామంతరే వర్తమానాః
స్వయంధీరాః పండితం మన్యమానాః ।
దంద్రమ్యమాణాః పరియన్తి మూఢాః
అంధేనైవ నీయమానా యథాంధాః ॥ – కఠోపనిషత్తు, 1.2.5
[గాఢమైన అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్న మూర్ఖులు తామే ప్రజ్ఞావంతులూ, మహా విద్వాంసులూ అనుకొంటూ గ్రుడ్డివాళ్ళ చేతనే నడిపించబడే గ్రుడ్డి వాళ్ళలా (సంసారంలో) తూలుతూ తడబడుతూ జననమరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు.]
శ్రీరామకృష్ణుల భావసమాధిని, రుగ్మతగా పేర్కొనడం క్రొత్త ఏమీ కాదు. శ్రీరామకృష్ణులు జీవించి ఉన్నప్పుడు పాశ్చాత్య విధానంలో విద్యను అభ్యసించిన పలువురు అలాగే పేర్కొన్నారు. కాని కాలం గడిచేకొద్దీ ఆ దివ్యోన్మత్త పురుషుని సంభాషణలు, భవిష్యద్వాణి విస్తృత ఆమోదాన్ని పొందడమే కాక, వాటి ప్రాముఖ్యం మరింతగా వెల్లడి కాసాగింది; దాంతో పై అభిప్రాయాలకు కాలదోషం పట్టింది. ప్రపంచ వ్యాప్తంగా జనులు ఉత్కంఠతో ఆయన అనుపమాన బోధనలను స్వీకరించసాగారు. ఆ విధంగా ఆయన భావసమాధిలో రుగ్మతను మాత్రమే చూడగలిగిన ఆ విమర్శకుల అవివేకం, అజ్ఞానం బట్టబయలైంది. వారి విమర్శలు చంద్రుడిపై విసిరిన పిడికెడు దుమ్ములాగైంది. ఆ విమర్శకుల కథనాలు భ్రమపూరితాలని చక్కగా తెలుసుకొని, జనులు శ్రీరామకృష్ణుల అనుభూతుల, బోధనల యథార్థాన్ని సమగ్రంగా అవగతం చేసుకోసాగారు. ఇదే ఇప్పుడూ జరుగుతున్నది, భవిష్యత్తులోనూ ఇదే జరుగనున్నది. ఎందుకంటే అగ్నిని బట్టలలో పెట్టి దాచడం ఎంత అసాధ్యమో, సత్యాన్ని దాచడమూ అంతే అసాధ్యం కనుక. కాబట్టి ఆ విషయాన్ని మరింత విశదీకరించనవసరం లేదు. ఈ విషయం గురించి స్వయంగా శ్రీరామకృష్ణులే వచించిన ఒకటి రెండు మాటలను ఉదహరిస్తే సరిపోతుందని భావిస్తున్నాం.
29. శ్రీరామకృష్ణుల సమాధ్యవస్థ రుగ్మత కాదు: శివనాథ్‌తో సంభాషించడం
మా మాన్యమిత్రులైన పండిత శివనాథ్ శాస్త్రి సాధారణ బ్రహ్మసమాజ ప్రచారకులలో ఒకరు. శ్రీరామకృష్ణుల భావ సమాధ్యవస్థను ఈయన నాడీ దుర్బలత కారణంగా ఏర్పడే అపస్మారం లేదా మూర్ఛరోగం అని మాలో కొందరితో, శ్రీరామ కృష్ణులు జీవించి ఉన్న కాలంలోనే చెప్పారు. ఈ వ్యాఖ్యానం క్రమంగా శ్రీరామకృష్ణుల చెవిన పడింది. శ్రీరామకృష్ణుల భావసమాధుల పట్ల శివనాథ్ శాస్త్రికి ఇటువంటి దృక్పథం ఉన్నప్పటికీ అతడు చాలాకాలం నుండి అప్పుడప్పుడు శ్రీరామకృష్ణుల దర్శనార్థం వస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజు శివనాథ్ శాస్త్రి దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు ఈ ప్రస్తావన తెచ్చి శ్రీరామకృష్ణులు అతడితో ఇలా అన్నారు : “ఇలా చూడు శివనాథ్! నువ్వు ఈ స్థితులను (భావసమాధులను) రుగ్మతలని పేర్కొంటున్నావట నిజమేనా? సమాధి సమయంలో నేను బాహ్యస్మృతిని కోల్పోతానని జనానికి చెబుతున్నావట! ఆహా, ఏం తర్కం! రేయింబవళ్ళు ఇటుక, కఱ్ఱ, మన్ను, డబ్బు ఇత్యాది జడపదార్థాలను గురించే చింతన చేసే మీరు బాగానే ఉంటారు, జాగ్రదావస్థలోనే ఉంటారు. కాని ఎవరి చైతన్యంతో ఈ విశ్వం యావత్తు చైతన్యమయమైనదో ఆయననే సదా సర్వదా చింతన చేస్తూ ఉన్న నేను మాత్రం చైతన్యరహితుణ్ణయ్యానా! నీ వివేకాన్ని ఎక్కణ్ణుండి ఎరవు తెచ్చుకొన్నావు?” అని ప్రశ్నించగా శివనాథ్ మౌనంగా ఉండిపోయాడు.
ఈశ్వరచంద్ర విద్యాసాగర్
(1820 -1891)
శివనాథ్ శాస్త్రి (1847-1919)
బ్రహ్మ సమాజ్ నాయకుడు.
30. సాధనా సమయంలో శ్రీరామకృష్ణులు పిచ్చివాడిగా ప్రవర్తించడానికి కారణం
మాతో శ్రీరామకృష్ణులు ప్రతిరోజు ‘దివ్యోన్మాదం’, ‘జ్ఞానోన్మాదం’ మొదలైన పదాలు ఉపయోగించి మాట్లాడేవారు. పన్నెండు సుదీర్ఘ సంవత్సరాల కాలంపాటు తమ జీవితంలో ఒక శక్తిమంతమైన భగవదనురాగమనే ‘తుఫాను’ చెలరేగిందని తరచు మా అందరితో చెబుతూ ఉండేవారు. ఆయన తరచు ఇలా చెప్పేవారు : “ఆహా! తుఫాను వీచినప్పుడు ఎలా దుమ్ము ధూళి చెలరేగి అన్నీ ఒక్కటిగా కనబడతాయో, మామిడి, పనస మొదలైన చెట్ల మధ్య వ్యత్యాసం ఎలా కానరాదో, నాకూ అటువంటి అవస్థే కలిగింది. మంచీ-చెడు, నిందా-స్తుతులు, పవిత్రత-అపవిత్రతల మధ్య వ్యత్యాసం ఈ అవస్థలో నాకు తెలిసేది కాదు. భగవత్సాక్షాత్కారం ఎలా పొందడం అన్న ఏకైక ఆలోచన, భావన మాత్రం నాలో మెదిలేది. ప్రతి క్షణం నా మనస్సులో భగవంతుని గురించిన ఆలోచనే ఉండేది. లోకులు, ‘ఈయన పిచ్చివాడయ్యాడు’ అనేవారు” అని చెప్పారు.
31. సాధకులకు శ్రీరామకృష్ణులు మంత్రదీక్ష నివ్వడం: ఉదాహరణకు నారాయణశాస్త్రి
తొలి రోజుల్లో దక్షిణేశ్వరానికి వచ్చిన పండితులైన సాధకులలో కొందరు శ్రీరామకృష్ణుల పట్ల మహాభక్తిపరవశులై ఆయన నుండి మంత్రదీక్షను, సన్న్యాసాన్ని సైతం స్వీకరించారు. వారిలో పండితుడైన నారాయణశాస్త్రి ఒకరు. ఆయన ప్రాచీన కాలంనాటి నైష్ఠిక బ్రహ్మచారిలా గురువుల ఇళ్ళలో నివసిస్తూ, అవిచ్ఛిన్నంగా ఇరవై ఐదు సంవత్సరాలపాటు వివిధ శాస్త్రాలు అధ్యయనం చేశాడని శ్రీరామకృష్ణుల ముఖతా మేం విన్నాం. అన్ని షడ్దర్శనాలను* ఔపోసనపట్టాలనే ప్రగాఢ ఆకాంక్ష ఆయనకు ఉండేది. అందుకోసం కాశీ, భారతదేశ వాయవ్య ప్రాంతంలోని కొన్నిచోట్ల విభిన్న గురువుల వద్ద వసిస్తూ ఐదు దర్శనాలలో పారంగతుడయ్యాడు. కాని వంగదేశంలోని నవద్వీపానికి చెందిన సుప్రసిద్ధ పండితుల వద్ద షడ్దర్శనాలలో ఆరవదైన న్యాయదర్శనాన్ని అధ్యయనం చేయకుంటే, షడ్దర్శనాలలో పారంగతుడయ్యానని ప్రకటించుకోలేడు కదా! అందువల్లనే ఆయన దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులను కలుసుకోవడానికి ఎనిమిది సంవత్సరాలకు మునుపే వంగదేశానికి వచ్చాడు. ఏడు సంవత్సరాలు నవద్వీపంలో వసించి న్యాయదర్శనం అధ్యయనం చేశాడు. అధ్యయనం పూర్తి కాగానే ఇంటికి తిరిగి వెళ్ళాలనుకొన్నాడు. మళ్ళీ ఈ ప్రాంతాలకు వచ్చే ఆస్కారం ఉందో లేదోననే సంశయం బహుశా అప్పుడు ఆయనలో తలెత్తి ఉంటుంది. కాబట్టి కలకత్తా చూడడానికి వచ్చాడు. కలకత్తా పరిసరాలలో ఆయన సందర్శించిన స్థలాలలో దక్షిణేశ్వరం కూడా ఉంది. దక్షిణేశ్వరంలోనే శ్రీరామకృష్ణులను దర్శించుకొనే భాగ్యం నారాయణశాస్త్రికి కలిగింది.
32. శాస్త్రిగారి పుట్టుపూర్వోత్తరాలు
న్యాయ దర్శన అధ్యయన నిమిత్తం వంగదేశానికి రావడానికి పూర్వమే నారాయణశాస్త్రి గొప్ప పండితుడిగా సుప్రసిద్ధుడు. ఆయన కీర్తి గురించి విని జైపూర్ మహారాజు ఒక సందర్భంలో తన ఆస్థాన పండితుడిగా పెద్ద వేతనంపై నియమించగోరి శాస్త్రిగారిని ఎంతో గౌరవంగా ఆహ్వానించాడన్న విషయం శ్రీరామ కృష్ణుల నుండి మేం విన్నాం. కాని శాస్త్రిగారి విద్యాతృష్ణ అప్పటికి ఇంకా తీరలేదు. షడ్దర్శనాలలో పారంగతుడు కావాలన్న ఆయన ఆకాంక్ష అప్పటికి నెరవేరలేదు. కాబట్టి ఆయన మహారాజుగారి ఆహ్వానాన్ని సాదరంగా తిరస్కరించాడు. శాస్త్రిగారు రాజపుటానాకు చెందిన వారని తెలియ వస్తోంది.
33. శ్రీరామకృష్ణులను ఆయన సందర్శించడం
నారాయణశాస్త్రిగారు సాధారణ పండితుల వంటి వారు కారు. శాస్త్ర జ్ఞానార్జన పెంపొందే కొద్దీ ఆయనలో క్రమంగా వైరాగ్య బీజాలు అంకురింప సాగాయి. వేదాంతాది శాస్త్ర మర్మాలను కేవలం అధ్యయనం చేయడంతో మాత్రమే ఎవరూ అర్థం చేసుకోలేరనీ, సాధన ద్వారా మాత్రమే వాటిని ఆకళింపు చేసుకోవచ్చుననీ శాస్త్రిగారు స్పష్టంగా అవగతం చేసుకొన్నారు. కాబట్టి శాస్త్రాధ్యయనం పూర్తికాని స్థితిలోనే ఆయనలో అప్పుడప్పుడు ఈ భావన మెదలేది : “ఈ తీరులో నేను సరైన జ్ఞానాన్ని గడించలేకపోతున్నాననే భయం కలుగుతోంది. కొంతకాలం సాధనలు అనుష్ఠించి, శాస్త్రాలు వాక్రుచ్చే విషయాలను అనుభూతం చేసుకోవాలి” అని అనుకున్నారు. కాని ఆయన సాధనాదులలో నిమగ్నమవ్వాలనే తన ఆకాంక్షను అణచిపెట్టేశారు; మళ్ళీ శాస్త్రాధ్యయనంలో పడ్డారు. రెంటికీ చెడ్డ రేవడిని అవుతానేమోనని భయపడడమే అందుకు కారణం. ఇప్పుడు షడ్దర్శనాలలో పారంగతుడు కావడమనే ఆయన చిరకాల మనోభీష్టం నెరవేరింది. ఇంటికి తిరిగి వెళ్ళాలనుకొన్నారు. ఇంటికి తిరిగి వెళ్ళాక యుక్తమైనది ఏదో చేయాలని అప్పటికే నిశ్చయించుకొన్నారు. అటువంటి శుభముహూర్తంలోనే శ్రీరామకృష్ణులను దర్శించుకొనే భాగ్యం ఆయనకు కలిగింది. శ్రీరామకృష్ణులను చూసిన క్షణంలోనే అంతుబట్టని రీతిలో ఆయన పట్ల ఆకర్షితుడైనాడు.
ఆ రోజుల్లో దక్షిణేశ్వర కాళికాలయంలో అతిథులకు, ఫకీరులకు, సాధువులకు, సన్న్యాసినులకు, పండితులకు చక్కని వసతి, భోజన సౌకర్యాల ఏర్పాటు ఉండేదని ఇంతకు మునుపే చెప్పుకున్నాం. కాబట్టి నారాయణ శాస్త్రిగారిని సాదరంగా ఆహ్వానించి ఇష్టమైనన్ని రోజులు అక్కడ బస చేయమని వారు చెప్పి ఉంటారనడంలో వింత ఏమీ లేదు. అందుకు కారణం ఆయన సుదూర ప్రాంతం నుండి వచ్చిన బ్రాహ్మణ బ్రహ్మచారి, మరోవంక గొప్ప పండితుడు కూడా అయి ఉండడమే. భోజనం, ఇతర అవసరాలు సమకూరుస్తూ, దివ్యమానవ సాంగత్యాన్ని కల్పించే ఆ స్థలం ఎంత సుందరమైనది! ఇదంతా చూసి శాస్త్రిగారు కొంతకాలం అక్కడ గడపాలని నిర్ణయించుకొన్నాడు. అలా కాక మరెలా నిర్ణయించుకొంటాడు? శ్రీరామకృష్ణులతో సాన్నిహిత్యం పెరిగేకొద్దీ ఆయన పట్ల శాస్త్రిగారికి ఒక రకమైన ప్రేమ, దానితోపాటు ఆయనను గురించి మరింత తెలుసుకోవాలనే ఆరాటం పెరగసాగాయి. సరళ హృదయుడూ, ఉదారచిత్తుడూ అయిన శాస్త్రిగారి సాంగత్యంలో శ్రీరామకృష్ణులు కూడా పరమానందభరితులై, భగవత్ప్రసంగాలు చేస్తూ ఆయనతో ఎంతోసేపు గడపసాగారు.
34. శ్రీరామకృష్ణుల సాంగత్య భాగ్యం పొందిన తరువాత శాస్త్రిగారి సంకల్పం
వేదాంత శాస్త్రాలు అభివర్ణించే సప్తభూముల గురించి శాస్త్రిగారు చదివారు. మనస్సు నిమ్నభూముల నుండి ఉన్నతోన్నత భూములకు అధిరోహించినప్పుడు, ఆ స్థితిలో అద్భుత అనుభూతులు, దర్శనాలు కలిగి చివరకు నిర్వికల్ప సమాధి సిద్ధిస్తుందని శాస్త్రిగారు శాస్త్రాధ్యయనం వలన గ్రహించారు. ఆ స్థితిలో మనిషికి అఖండ సచ్చిదానంద స్వరూపుడైన బ్రహ్మవస్తువు సాక్షాత్కారం కలిగి, దాన్లో లయమైపోతాడు; ఫలితంగా యుగ యుగాంతరాల పర్యంతం వస్తూన్న సంసార భ్రమ ఏకమొత్తంగా అదృశ్యమై పోతుంది. తాను శాస్త్రగ్రంథాలలో చదివి, కంఠస్థం చేసుకొన్న వీటిని శ్రీరామకృష్ణులు ప్రత్యక్షంగా సాక్షాత్కరించుకొన్నారని శాస్త్రిగారు గ్రహించారు. ‘సమాధి’, ‘అపరోక్షానుభూతి’ ఇత్యాది పదాలను తాను కేవలం ఉచ్చరిస్తున్నాననీ, అయితే శ్రీరామకృష్ణులు ఈ స్థితులను ప్రత్యక్షంగా రేయింబవళ్ళు అనుభవిస్తున్నారనీ శాస్త్రిగారు కనుగొన్నారు. అప్పుడు ఆయన ఇలా అనుకొన్నారు: “ఆహా, ఎంత అద్భుతం! శాస్త్ర నిగూఢ మర్మాలను బోధించి, విశదీకరించే వ్యక్తి నాకు ఇక్కడకాక మరెక్కడ లభిస్తాడు? ఈ అవకాశాన్ని జారవిడువరాదు. ఏ విధంగానైనా బ్రహ్మజ్ఞానాన్ని పొందే సాధనోపాయాన్ని వీరి నుండి తెలుసుకోవాలి. జీవితం అనిత్యం. ఎప్పుడు ఈ శరీరం రాలిపోతుందో ఎవరి కెరుక? సమ్యక్ జ్ఞానాన్ని పొందకుండానే మరణిస్తానేమో! అలా జరగడానికి వీల్లేదు. భగవత్సాక్షాత్కారార్థం చిత్తశుద్ధితో కనీసం ఒకసారైనా ప్రయత్నించాలి. ప్రస్తుతం ఇంటికి తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు” అని నిశ్చయించుకున్నారు.
35. శాస్త్రిగారిలో వైరాగ్యోదయం
శ్రీరామకృష్ణుల దివ్యసాంగత్య ఫలితంగా రోజులు గడిచేకొద్దీ శాస్త్రిగారిలో వైరాగ్యం, భగవత్సాక్షాత్కార పరితప్తత అధికం కాసాగాయి. ‘నా పాండిత్యంతో సర్వులనూ విస్మయపరుస్తాను’, ‘మహా మహోపాధ్యాయ బిరుదాంకితుడనై కీర్తిప్రతిష్ఠలు పొందుతాను’ మొదలైన ఆకాంక్షలు హేయమైన లక్ష్యాలుగా ఆయనకు ఇప్పుడు గోచరించసాగాయి; క్రమేణా అవి ఆయన మనస్సు నుండి అదృశ్యమై పోయాయి. శాస్త్రిగారు వినమ్రుడైన శిష్యుడిలా, శ్రీరామకృష్ణుల వచనామృతాన్ని సావధానంగా గ్రోలుతూ, తనలో ఇలా అనుకోసాగారు: “ఇకపై మనస్సును భగవంతునిపై తప్ప మరే ఇతర విషయాలపై నిమగ్నం చేయను. ఎప్పుడు ఎలా శరీరం రాలిపోతుందో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఇంకా వ్యవధి ఉన్నందున భగవత్సాక్షాత్కారానికై తీవ్రంగా కృషిచేయాలి.” మళ్ళీ శ్రీరామకృష్ణులను చూసి ఇలా అనుకొనేవారు : “ఆహా, ఈయన మానవజన్మ పొంది ఏం తెలుసుకోవాలో, దాన్ని పొంది ఎంత ప్రశాంతచిత్తులై జీవిస్తున్నారో కదా! ఈయన మృత్యుంజయులైనారు. మృత్యువు, ఆయన ముందు భయానక ‘కాళరాత్రి’ నీడను సైతం పడేటట్లు చేయలేకపోయింది. సరే, ఇటువంటి మహాపురుషులు సత్యసంకల్పులౌతారని ఉపనిషత్కారులు వచిస్తున్నారు కదా. వీరి అనుగ్రహం పొందగలిగితే, సంసార పరమైన వాసనలనన్నిటినీ లుప్తంచేసుకొని, బ్రహ్మజ్ఞానం సంతరించుకోవచ్చు. అటువంటప్పుడు ఆయన అనుగ్రహం కోసం ప్రార్థించి, ఆయనకు శరణాగతుడను ఎందుకు కాకూడదు?” ఈ విధంగా పర్యాలోచనలు చేస్తూ నారాయణ శాస్త్రిగారు దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల సాంగత్యంలో జీవించసాగారు. తనను అనర్హునిగా ఎంచి ఆశ్రయం ఇవ్వరేమోనని తలచి శాస్త్రిగారు, వెంటనే శ్రీరామకృష్ణులను ఏదీ అభ్యర్థించలేకపోయారు. కాలం అలా దొర్లిపోసాగింది.
36. మైఖేల్ మధుసూదన్‌తో మాట్లాడిన అనంతరం శాస్త్రిగారికి కలిగిన తిరస్కారభావం
నానాటికీ శాస్త్రిగారి మనస్సులో వైరాగ్యం తీవ్రం కాసాగిందనడానికి ఈ క్రింది సంఘటన తార్కాణం. మైఖేల్ మధుసూదన్ దత్త నాడు వంగదేశంలో సుప్రసిద్ధ కవి, పేరుమోసిన న్యాయవాది కూడా. ఆ సమయంలో అతడు రాణీరాస్మణి తరఫున ఒక వ్యాజ్యాన్ని నడిపిస్తున్నాడు. ఆ వ్యాజ్యెం గురించి కొన్ని వివరాలు కచ్చితంగా తెలుసుకోవడానికి ఒక రోజు అతడు, రాణి బంధువు లొకరితో దక్షిణేశ్వర కాళికాలయానికి వచ్చాడు. తన సంప్రతింపులు పూర్తయ్యాక, మాటల మధ్యలో శ్రీరామకృష్ణులు అక్కడ వసిస్తున్నారని తెలిసికొని, ఆయనను చూడాలనే కోర్కె వ్యక్తం చేశాడు. శ్రీరామకృష్ణులకు కబురు పంపగా, ఆయన మధుసూదన్‌తో మాట్లాడమని ముందుగా నారాయణశాస్త్రిగారిని పంపి, కాసేపయ్యాక స్వయంగా తాము వెళ్ళారు. మాటల సందర్భంలో శాస్త్రిగారు, హైందవమతాన్ని వదలి క్రైస్తవ మతాన్ని పుచ్చుకోవడానికి కారణం ఏమిటని మధుసూదన్‌ను ప్రశ్నించారు. ఆర్థిక ఒత్తిళ్ళ నిర్బంధం చేత తాను అలా చేయవలసి వచ్చిందని మధుసూదన్ సమాధానం చెప్పాడు. ఒక అపరిచిత వ్యక్తికి తన కథను వెల్లడించడం ఇష్టంలేక అలా జవాబు చెప్పివుంటాడేమో అన్న సంశయానికి తావులేకపోలేదు. కాని అతడు నిజాన్ని దాచి ఎగతాళికో లేక వ్యంగ్యానికో అలా చెప్పడం లేదనీ, యథార్థమే చెబుతున్నాడనీ శ్రీరామకృష్ణులూ, అక్కడున్న ఇతరులూ అనుకొన్నారు. ఏది ఎలావున్నా ఆ జవాబు విని శాస్త్రిగారు ఎంతో చిరాకుపడ్డారు. “ఏమిటి? క్షణభంగురమైన సంసారం కోసం స్వధర్మాన్ని విడిచిపెట్టడమా? ఎంత అల్పత్వం! ఏదో ఒక రోజు చావవలసిందే కదా! మతం మార్చుకోవడానికి బదులు నువ్వు చనిపోయివున్నా బాగుండేది!” అని అన్నారు. ఆ తరువాత, ‘అయినప్పటికీ లోకులు గొప్ప వ్యక్తిగా ఎంచి, ఇతడి రచనలను ప్రశంసిస్తూ చదువుతారే’ అని అనుకొన్నారు. శాస్త్రిగారి మనస్సు తిరస్కార భావంతో నిండిపోగా, ఆపైన అతడితో మాట్లాడడం ఆపేశారు.
37. శ్రీరామకృష్ణులు: మైఖేల్
శ్రీరామకృష్ణుల ముఖతా ధార్మిక ఉపదేశం వినాలనే ఆకాంక్ష మధుసూదన్ వ్యక్తం చేశాడు. “నా నోటిని ఎవరో బలవంతంగా అణచివేసినట్లయింది. ఏం మాట్లాడడానికి నోట మాట రాలేదు” అని గురుదేవులు ఆ సంఘటన గుర్తుకు తెచ్చుకొని మాతో చెప్పేవారు. హృదయ్, మరికొందరు ఇలా చెప్పారు: కాసేపటికి శ్రీరామకృష్ణులకు ఆ భావం తొలగిపోగా, రాంప్రసాద్, కమలాకాంత్ తదితర సుప్రసిద్ధ సాధకుల పాటలు తమ శ్రావ్యమైన కంఠంతో పాడి మధుసూదన్‌ను ఆహ్లాదపరిచారు. ఆ పాటల ద్వారా భగవద్భక్తే సంసారంలో అత్యంత ప్రధానమైనదని అతడికి సూచించారు.
38. తన అభిప్రాయాన్ని శాస్త్రిగారు గోడమీద వ్రాయడం
మైఖేల్ మధుసూదన్ సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాక కూడా అతడి ధర్మ భ్రష్టత్వాన్ని శాస్త్రిగారు నిరసిస్తూనే ఉండిపోయారు. అంతేగాక శ్రీరామకృష్ణుల గదికి దారితీసే తలుపుకు తూర్పు వైపున ఉన్న వసారా గోడమీద బొగ్గుతో పెద్దపెద్ద అక్షరాలతో శాస్త్రిగారు ఇలా వ్రాశారు: “ఆర్థిక అవసరాల ఒత్తిళ్ళకు తలవొగ్గి స్వధర్మాన్ని విడిచిపెట్టడం అతినీచమైన కార్యం.” బెంగాలీలో పెద్దపెద్ద అక్షరాలతో స్పష్టంగా శాస్త్రిగారు వ్రాసిన ఆ వాక్యాలు మా దృష్టిని ఆకర్షించి, మాలో కుతూహలం రేకెత్తించాయి. తరువాత ఒక రోజు విచారించగా జరిగినదంతా తెలియవచ్చింది. శాస్త్రిగారు వంగదేశంలో చాలాకాలం వసించినందున ఆయన బెంగాలీ భాషను క్షుణ్ణంగా నేర్చుకొన్నారు.
39. శాస్త్రిగారు సన్న్యాసం స్వీకరించడం
ఇక నారాయణశాస్త్రిగారి జీవితంలో మాకు తెలిసిన చివరి ఉదంతం. ఒక రోజు ఆయన శ్రీరామకృష్ణులను ఒక ఏకాంత ప్రదేశంలో కలుసుకొన్నారు. అదే మంచి తరుణంగా తన ఆంతరంగిక అభిలాషను వ్యక్తం చేసి, తనకు సన్న్యాస దీక్షను అనుగ్రహించమని గట్టిగా పట్టుపట్టారు. ఆయన ఉత్కంఠను గుర్తించి అందుకు శ్రీరామకృష్ణులు అంగీకరించారు; ఒక శుభదినాన ఆయనకు సన్న్యాసదీక్షను ఒసగారు. తదనంతరం శాస్త్రిగారు కాళికాలయాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వసిష్ఠ ఆశ్రమానికి పోయి, బ్రహ్మసాక్షాత్కారం లభించేటంత వరకు తీవ్రసాధనలలో మగ్నమై ఉంటానని వెళ్ళబోయే ముందు శ్రీరామకృష్ణులకు తెలిపారు. కళ్ళు చెమ్మగిల్లగా, శ్రీరామకృష్ణుల పాదపద్మాలకు మ్రొక్కి, ఆయన ఆశీర్వాదాలకై ప్రార్థించి శాశ్వతంగా దక్షిణేశ్వరం విడిచి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆయనను గురించి అంతగా ఏమీ తెలియరాలేదు; వసిష్ఠాశ్రమంలో* ఆరోగ్యం బాగా దెబ్బ తిని మరణం ఆసన్నమయ్యే వరకు తీవ్ర తపశ్చర్యలలో కాలం వెళ్ళబుచ్చారని మాత్రం తెలియవచ్చింది.
40. సాధువులను, సాధకులను శ్రీరామకృష్ణులు సందర్శించడం
ఎప్పుడైనా చుట్టుప్రక్కల ఏ సంప్రదాయానికి చెందిన సాధువులైనా, సాధకులైనా, భక్తులైనా బసచేసి ఉన్నారని తెలియవస్తే, వారిని చూడాలనే కోర్కె శ్రీరామకృష్ణులకు కలిగేది. అటువంటి కోర్కె జనించగానే ఆహ్వానం లేకుండానే వారి వద్దకు వెళ్ళి భగవత్ప్రసంగంలో కొంతసేపు వారితో గడిపి తిరిగి వచ్చేవారు. అలా ఆహ్వానం లేకుండా వెళితే లోకులు ఏమనుకొంటారో, అపరిచితులైన ఆ సాధకులు తన రాక పట్ల సంతోషిస్తారో లేదో, తన పట్ల సముచితంగా ప్రవర్తిస్తారో లేదో అన్న ఆలోచనలు ఎన్నడూ ఆయనలో తలెత్తేవి కావు. ఏదో విధంగా ఆ సాధకుల వద్దకు వెళ్ళి, వారు ఏ మార్గానికి చెందినవారో, తమ లక్ష్యం దిశగా వారెంత పురోగమించారో తదితర విషయాల గురించి సరైన అవగాహన కలిగే వరకు ఆయన మనస్సు కుదుటపడేది కాదు. అదే విధంగా శాస్త్ర పండితులైన సాధకులు ఎవరైనా ఉన్నారని తెలియవస్తే శ్రీరామకృష్ణులు పైవిధంగానే ప్రవర్తించేవారు. పండితుడైన పద్మలోచన్, దయానంద సరస్వతి మొదలైన వారిని ఆయన అదే విధంగా సందర్శించారు; వారి జీవిత కథలను అప్పుడప్పుడు మాకు చెప్పడం కూడా కద్దు. ముందుగా పద్మలోచన్ కథను పాఠకులకు ఇక్కడ వివరించనున్నాం.
41. వంగదేశంలో న్యాయదర్శనం
శ్రీరామకృష్ణులు అవతరించడానికి మునుపు వంగదేశంలో వేదాంత అధ్యయనం విస్తృతి గాంచలేదు. ఆదిశంకరులు అనేక శతాబ్దాలకు పూర్వం ఈ ప్రాంతంలోని తాంత్రికులను తర్కవాదంలో పరాజితులను చేశారు; కాని జన సామాన్యంలో మాత్రం ఆయన తమ అద్వైత సిద్ధాంతాన్ని పాదుకొల్పలేకపోయారు. పర్యవసానంగా అద్వైత సిద్ధాంత అత్యున్నత సూత్రాలను తాంత్రికులు అంగీకరించి తమ ఉపాసనా ప్రణాళికలలో వాటిని ప్రవేశపెట్టినప్పటికీ, అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న ఉపాసనా పద్ధతులనే కొనసాగించారు.
వంగదేశ పండితులు మాత్రం తమ మెదళ్ళను న్యాయదర్శన అధ్యయనంలోనే వినియోగించి, ‘నవ్యన్యాయ’ మనే కొత్తశాఖను రూపకల్పన చేసి దార్శనిక రంగంలో ఒక అద్భుత విప్లవాన్ని కొనితెచ్చారు. వంగదేశస్థులు న్యాయదర్శనాన్ని ఈ మేరకు ఉడుములా పట్టుకోవడానికి కారణం ఏదైనా ఉందా? తర్కవాదంలో ఆదిశంకరులచే పరాజితులై, పరాభవాన్ని పొందడమే ఇందుకు కారణమేమో ఎవరు చెప్పగలరు? ఏదైనా ఒక రంగంలో ఒక ఫలానా జాతి మరో జాతిచే పరాజయం చవిచూసినప్పుడు, పరాజయం పొందిన ఆ జాతి అభిమానంతో, బాధతో క్రుంగిపోయి, ఆ రంగంలో అందరినీ మించడానికి ప్రయత్నం చేయడం ప్రపంచ చరిత్ర పదేపదే చాటుతూనే ఉంది.
42. వేదాంత పండితుడు పద్మలోచన్
తంత్ర న్యాయ శాస్త్రాలకు పట్టుగొమ్మ అయిన వంగదేశంలో వేదాంత అధ్యయనం అరుదైనా, ఉదార వేదాంత నిర్ణయాల పట్ల ఆకర్షితులైన వారిలో పండితుడు పద్మలోచన్ ఒకరు. న్యాయదర్శనంలో కోవిదుడైన తరువాత వేదాంత అధ్యయనం చేయాలనే ఆకాంక్ష పద్మలోచన్కు కలిగింది. ఆయన కాశీకి వెళ్ళి సమర్థులైన గురువుల వద్ద సుదీర్ఘకాలం వేదాంతం అధ్యయనం చేశాడు. దానితో కొద్ది సంవత్సరాలలోనే ఆయన వేదాంత పండితుడిగా సుప్రసిద్ధుడైనాడు. తదనంతరం బర్ద్వాన్ మహారాజు ఆహ్వానం మేరకు, ఆయన ఆస్థానంలో పండితునిగా పదవి స్వీకరించాడు. పద్మలోచన్ అద్భుత పాండిత్య ప్రతిభ నానాటికీ ఇనుమడించడం చూసి, త్వరలోనే మహారాజు, ఆయనను ప్రధాన ఆస్థాన పండితునిగా నియమించాడు. క్రమంగా పద్మలోచన్ కీర్తి వంగదేశం నలుమూలలా వ్యాపించింది.
43. పద్మలోచన్ మేధాసంపత్తి
పద్మలోచన్ అద్భుత మేధాసంపత్తిని చాటే ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం అప్రస్తుతం కాబోదు. ఆధ్యాత్మికతకు చెందిన ఏ విషయంలోనైనా సంకుచిత అభిప్రాయాలను వ్యక్తం చేయడం నీచ ప్రవృత్తినే సూచిస్తుందని వ్యాఖ్యానిస్తూ శ్రీరామకృష్ణులు కొన్ని సందర్భాలలో ఈ అంశంపై పద్మలోచన్ వ్యాఖ్యానాలను ఉదహరించేవారు. శ్రీరామకృష్ణులు ఎప్పుడైనా ఎవరి నుండైనా ఉదార భావాలను వ్యక్తం చేసే పలుకులు విన్న పక్షంలో వాటిని సదా జ్ఞాపకంలో పెట్టుకొని మాటల సందర్భంలో వాటిని ఉదహరించడం కద్దు. ఆయన సత్యనిష్ఠకు తగ్గట్లు ఎవరి నుండి ఆ వచనాలు తాము మొదట విన్నారో వారి పేరును కూడా తప్పక తెలిపేవారు.
44. శివుడా, విష్ణువా ఎవరు గొప్ప?
ఒకప్పుడు బర్ద్వాన్ రాజాస్థానంలో ‘శివుడు గొప్పా, విష్ణువు గొప్పా?’ అనే వివాదం పండితుల మధ్య చెలరేగిందని శ్రీరామకృష్ణులు చెప్పారు. ఆ సమయంలో పద్మలోచన్ సభలో లేడు. ఆ వాగ్వాదంలో పాల్గొన్న పండితులు తమ శాస్త్రజ్ఞానంతో లేదా బహుశా తమ అభిమానం మేరకు కొందరు శివుడు గొప్పవాడని, మరికొందరు విష్ణువు గొప్పవాడని పేర్కొంటూ సభలో కలకలం లేవదీశారు. ఆ విధంగా మాటామాటా పెరిగి ఆ వాగ్వాదం రెండు వర్గాల (శైవుల, వైష్ణవుల) మధ్య దాదాపు కొట్లాటకు దారితీసింది. కాని సమస్యకు పరిష్కారం మాత్రం అంతుబట్టలేదు. అందువల్ల ఆస్థాన ప్రధాన పండితుణ్ణి రావించి, సమస్యకు పరిష్కారం తేల్చమన్నారు. పద్మలోచన్ సభకు వచ్చాడు. సమస్యను విని, సభను ఉద్దేశించి ఇలా చెప్పాడు: “నా పధ్నాలుగు తరాల వారిలో ఏ ఒక్కరూ శివుణ్ణిగాని, విష్ణువునుగాని ఎన్నడూ చూసిందిలేదు. అటువంటప్పుడు ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని నేను ఎలా నిర్ణయించి చెప్పగలుగుతాను? కాని శాస్త్రాలు ఏం చెబుతున్నాయో మీరు తెలుసుకోగోరితే, శైవ శాస్త్రాలు శివుడు గొప్పవాడని, వైష్ణవ శాస్త్రాలు విష్ణువు గొప్పవాడని పేర్కొంటున్నాయని మాత్రం చెప్పవలసి వస్తుంది. కాబట్టి తమ ఇష్టదైవమే, తక్కిన ఇతర దేవతలందరికంటే శ్రేష్ఠుడని భావించాలి.” ఇలా వ్యాఖ్యానించి పద్మలోచన్ శివ విష్ణువుల మహత్త్వాన్ని చాటే కొన్ని శ్లోకాలు ఉదహరించి, చివరకు వారిద్దరూ గొప్పతనంలో సరిసమానులే అని తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ నిర్ణయంతో పండితుల మధ్య చెలరేగిన కలహం సద్దుమణిగింది; అందరూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ దాపరికం లేని, సూటిగా తెలిపిన, వినమ్రతా శాస్త్రపరిజ్ఞానం ఆయన మేధాసంపత్తికి ప్రమాణమనీ, ఇదే ఆయన పేరు ప్రతిష్ఠలకు కారణమనీ ఈ సంఘటన నుండి మనం గ్రహించవచ్చు.
45. పద్మలోచన్ భగవదనురాగం
కేవలం శాస్త్రాల శబ్దజాలమనే మహారణ్యంలో సుదూరం చొచ్చుకుపోవడం వలన మాత్రమే పద్మలోచన్ సుప్రసిద్ధుడైనాడనడం సబబు కాదు. ఆయన జీవన విధానం, ప్రతిబింబించే ఉదారత, వైరాగ్యం, సత్ప్రవర్తన, తపశ్చర్యలు, ప్రగాఢ భగవద్భక్తి మొదలైన ఉదాత్త సద్గుణాలను పరికించి లోకులు ఆయనను అసాధారణమైన ఒక గొప్ప సాధకుడిగా, మహా భక్తుడిగా పరిగణించారు. నిజమైన పాండిత్యం, ప్రగాఢ భగవద్భక్తి ఏకకాలంలో ఒకే వ్యక్తిలో ఉండడం ఎంతో అరుదైన విషయం. ఏ వ్యక్తిలో ఈ రెండూ కలగలిసి ఉంటాయో ఆ వ్యక్తి పట్ల లోకులు ఆకర్షితులవడం సహజం. కనుక పండిత పద్మలోచన్ గురించి వినగానే శ్రీరామకృష్ణులకు అటువంటి సత్పురుషుణ్ణి సందర్శించాలనే ఆకాంక్ష జనించడంలో వింతేమీ లేదు. బర్ద్వాన్ రాజాస్థాన ప్రధాన పండితుడిగా చాలాకాలం పదవిని అలంకరించిన పద్మలోచన్ అప్పటికి కాస్త వయస్సు పైబడ్డ వ్యక్తే అయివుండాలి.
46. పద్మలోచన్ కలకత్తాకు రావడం
మనస్సులో ఏదైనా ఆకాంక్ష జనించగానే శ్రీరామకృష్ణులు, బాలుడి మాదిరి, దానిని నెరవేర్చుకోవడానికి ఎంతో ఆతురత చెందేవారు. ఈ విశిష్ట లక్షణాన్ని ఆయన బహుశా చిన్ననాటి నుండి అలవరచుకొని ఉండివుంటారు. “జీవితం క్షణభంగురం, కనుక చేయవలసింది వెంటనే చేసెయ్యి” – ఈ సూక్తిని ఆయన చిత్తశుద్ధితో తన జీవితంలో పాటించారు. అదే విధంగా తన ఆదర్శం పట్ల ప్రగాఢ నిష్ఠ, ఏకాగ్రతను అభ్యసించిన ఫలితంగా మనస్సు స్వభావం ఆ రీతిలో మారిపోతుందని కించిత్తు పర్యాలోచిస్తే మనం స్పష్టంగా గ్రహించవచ్చు.
ఏది ఏమైనప్పటికీ శ్రీరామకృష్ణుల ఆతురతను చూసి ఆయనను బర్ద్వానుకు పంపాలనుకొన్నాడు మథుర్బాబు. ఈలోపు దీర్ఘకాల అనారోగ్య కారణంగా పద్మలోచన్ను గంగాతీరంలోని అరియదాహలోని ఒక ఉద్యానగృహానికి తరలించారు. వాతావరణ మార్పు, స్వచ్ఛమైన గాలి పీల్చడం ఫలితంగా పద్మలోచన్ ఆరోగ్యం కొంత మెరుగుపడిందనే సమాచారం తెలియవచ్చింది. ఆ సమాచారం నిజమో కాదో తెలుసుకొని రమ్మని శ్రీరామకృష్ణులు, హృదయ్‌ను పంపారు.
హృదయ్ వెళ్ళి వచ్చి ఆ సమాచారం నిజమేనని రూఢిపరిచాడు. పద్మలోచన్ కూడా, శ్రీరామకృష్ణులను గురించి విని, ఆయనను చూడాలనే ఆతురతతో ఉన్నాడని తెలియవచ్చింది. శ్రీరామకృష్ణుల సమీప బంధువని తెలుసుకొని హృదయ్ పట్ల ఆయన ఎంతో గౌరవం చూపాడు. ఒక మంచిరోజు చూసుకొని పద్మలోచన్ను కలుసుకోవడానికి శ్రీరామకృష్ణులు బయలుదేరారు. హృదయ్ ఆయనకు తోడుగా వెళ్ళాడు.
47. శ్రీరామకృష్ణ, పద్మలోచన్ల ప్రథమ సమావేశం
మొట్టమొదటిసారి కలుసుకొన్నప్పుడు శ్రీరామకృష్ణులు, పద్మలోచన్ ఒకర్నొకరు చూసి ఎంతో ఆనందించారని హృదయ్ చెప్పేవాడు. చూడగానే పద్మలోచన్ సాధకుడైన ఉదారస్వభావుడనీ, మహా పండితుడనీ శ్రీరామకృష్ణులు గుర్తించారు. అలాగే శ్రీరామకృష్ణులు కూడా అత్యున్నత ఆధ్యాత్మికావస్థను సిద్ధించుకొన్న మహా పురుషులని పద్మలోచన్ గ్రహించాడు. సుమధుర కంఠంతో శ్రీరామకృష్ణులు జగజ్జననిని గురించి పాడిన పాటలు విని పద్మలోచన్ కళ్ళు బాష్పపూరితాలైనాయి. అంతేగాక సమాధ్యవస్థలో పదేపదే శ్రీరామకృష్ణులు బాహ్యస్మృతిని కోల్పోవడం చూసీ, ఆ అవస్థలో ఆయనకు కలిగే అనుభూతుల గురించి వినీ పద్మలోచన్ స్తబ్ధుడయ్యాడు. శాస్త్రకోవిదుడైన పద్మలోచన్ శాస్త్రాలలో నమోదైన ఆధ్యాత్మిక అవస్థలతో, శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మికావస్థలను పోల్చడానికి ప్రయత్నించే ఉంటాడు. అలా ప్రయత్నించినప్పటికీ అతడు ఆ రోజు ఎటువంటి నిర్ణయానికి రాలేక ఎంతో ఇబ్బందిపడి ఉంటాడనడం నిస్సందేహం. ఎందుకంటే శ్రీరామకృష్ణుల చరమానుభూతులను శాస్త్రాలలో నమోదైన వాటిలో కనుగొనలేక, శాస్త్ర వచనం నిజమో, లేదా శ్రీరామకృష్ణుల అనుభవాలు సత్యాలో తేల్చుకోలేక సతమతమై ఉంటాడు కనుక. శాస్త్రజ్ఞానం, సూక్ష్మబుద్ధి సహాయంతో ఆధ్యాత్మిక విషయాలన్నిటిలో కచ్చితమైన నిర్ణయాలు చేయగల పద్మలోచనుని వివేచనాత్మకమైన మనస్సు, నాడు పరమానందంలో సైతం వెలుగులో నీడలా ఇతమిత్థంగా తెలియని ఒక అశాంతిని పొందింది.
48. శ్రీరామకృష్ణుల పట్ల పద్మలోచన్లో భక్తిప్రపత్తులు పెంపొందడానికి కారణం
మొదటి పరిచయం నుండి ఒకరి పట్ల ఒకరికి ఏర్పడిన అభిమానం ఆకర్షణల కారణంగా శ్రీరామకృష్ణ పద్మలోచన్లు మరి కొన్నిసార్లు కలుసుకొన్నారు. పర్యవసానంగా శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక అవస్థ గురించి పద్మలోచన్కు ఏర్పడిన విశ్వాసం ప్రగాఢతరం కాసాగింది. ఆ విశ్వాసం ప్రగాఢతరం కావడానికి మరొక విశేష కారణం కూడా ఉంది. దానిని గురించి మేము స్వయంగా శ్రీరామకృష్ణుల ముఖతా విన్నాం. పండిత పద్మలోచన్ వేదాంత అధ్యయనం, బోధనతో పాటు తంత్ర శాస్త్రాలు నిర్దేశించిన సాధనలను కూడా చాలాకాలం నుండి అనుష్ఠిస్తూ వచ్చాడు. ఈ సాధనల ఫలితంగా అతడికి కొంత ఆధ్యాత్మికానుభూతి కూడా కలిగింది. కొన్ని ఆధ్యాత్మిక సాధనల మూలంగా పద్మలోచన్ సంతరించుకొన్న శక్తి రహస్యాన్ని జగజ్జనని తనకు వెల్లడించిందని శ్రీరామకృష్ణులు తెలిపారు. అతడి ఇష్టదైవమైన దేవి, అతడి సాధనల పట్ల ప్రసన్నురాలై అతడికి ఒక వరం ప్రసాదించిందని శ్రీరామకృష్ణులు తెలుసుకొన్నారు. తద్ద్వారా అనేక పండిత సదస్సులలో అజేయుడై తన శ్రేష్ఠత్వాన్ని పద్మలోచన్ పరిరక్షించుకొన్నాడు. సదా తన వద్ద ఒక తువ్వాలు, నీటితో నిండిన చెంబును పద్మలోచన్ ఉంచుకొనేవాడు. అతడు వాటిని చేత పుచ్చుకొని అటూ ఇటూ పచార్లు చేసి వచ్చి, ఆ నీటితో ముఖం కడుక్కొని, తల మీద నీరు చల్లుకొని ఆ తరువాత సమస్య పరిష్కారానికి పూనుకొనేవాడు. అలా చేసినప్పుడు మేధస్సు, శాస్త్రజ్ఞానం, దైవానుగ్రహ ప్రేరణలతో అతనికి పరిష్కారం లభించేది. ఇది అతడి అలవాటు. అతడి ఈ విచిత్ర అలవాటుకు కారణం ఏమిటో కనుగొనాలనే కుతూహలం ఎవరికీ కలగలేదు; దీని వెనుక ఏదో నిగూఢమైన ఉద్దేశం ఉంటుందనీ ఎవరూ ఊహించనూ లేదు. తన ఇష్టదైవం ఆజ్ఞ మేరకే తాను అలా చేస్తున్నాననే రహస్యం ఎవరికీ, చివరకు తన భార్యకు సైతం అతడు వెల్లడించలేదు. నాటి నుండి ఆ సలహాను తు.చ. తప్పక పాటిస్తూ, ఎవరికీ తెలియరాని రీతిలో సత్ఫలితాలను పొందుతూ వచ్చాడు.
49. పద్మలోచన్ అద్భుత శక్తిని గురించి శ్రీరామకృష్ణులకు తెలియడం
జగజ్జనని అనుగ్రహంతో పద్మలోచన్ శక్తి రహస్యం గురించి తెలుసుకోగలిగానని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. ఇలావుండగా ఒక రోజు అదను కనిపెట్టి గురుదేవులు, పండితుడి తువ్వాలు, నీటి చెంబు దాచేశారు. ఆ వస్తువులు లేక పోవడంతో చర్చిస్తూన్న సమస్య పరిష్కారంలో నాడు పద్మలోచన్ పాల్గొనక, ఆ వస్తువులను వెతకడంలో నిమగ్నుడయ్యాడు. ఆ తరువాత శ్రీరామకృష్ణులే వాటిని దాచిపెట్టారని తెలిశాక అతడి ఆశ్చర్యానికి హద్దు లేకపోయింది. తన రహస్యం తెలియడం వలననే శ్రీరామకృష్ణులు అలా చేశారని పండితుడు గ్రహించి, శ్రీరామకృష్ణులను తన ఇష్టదైవంగా ఎంచి ఆయనను స్తుతిపూర్వకంగా శ్లాఘించకుండా ఉండలేకపోయాడు. ఆనాటి నుండి పండితుడు శ్రీరామకృష్ణులను భగవదవతారంగా పరిగణించి, ఆయన పట్ల ఆ మేరకు భక్తిప్రపత్తులతో మెలగ సాగాడు. శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు: “పద్మలోచన్ అంత గొప్ప పండితుడైనప్పటికీ, దీని పట్ల (తన పట్ల) భక్తి విశ్వాసాలు కలిగి ఉండేవాడు. అతడు ఇలా అనేవాడు : ‘నా ఆరోగ్యం కుదుటపడ్డ తరువాత పండితులందరినీ సమావేశపరచి, మీరొక భగవదవతారమని వారికి చాటిచెబుతాను. నా మాటను ఎవరు ఖండిస్తారో చూస్తాను’ అని అంటూండేవాడ” ని చెప్పారు. మథుర్బాబు ఒక సందర్భంలో, ఏదో మరొక కారణంగా అనేకమంది పండితులను రావించి, ఒక పండిత సదస్సును దక్షిణేశ్వరంలో ఏర్పాటు చేయబోయాడు. పద్మలోచన్ లోభరహితుడూ, నిష్ఠాగరిష్ఠుడూ అయిన బ్రాహ్మణుడు కావడంచేత ఎన్నడూ నిమ్నకులస్థుడి నుండి ఎటువంటి కానుకా పుచ్చుకోడు. ఈ కారణంగా అతడు పండిత సదస్సుకు రాడేమోనని మథుర్ అనుమానించి, సదస్సుకు హాజరయ్యేలా పద్మలోచన్కు విజ్ఞప్తి చేయమని గురుదేవులను కోరాడు. మథుర్ కోర్కె మేరకు పద్మలోచన్ను ఆప్యాయంగా, ‘మీరు దక్షిణేశ్వరానికి రాగలరా?’ అని అడిగారు. అందుకు అతడు, ‘మీతో పాటు పాకీవారి ఇంటికి కూడా వచ్చి, అక్కడ భోజనం చేస్తాను. అటువంటప్పుడు నిమ్నకులాలవారి ఇంటికి వెళ్ళడం గురించి ప్రత్యేకంగా చెప్పాలా?’ అన్నాడు.
50. కాశీలో పద్మలోచన్ పరమపదించడం
కాని మథుర్ సమావేశపరచిన పండిత సదస్సుకు పద్మలోచన్ రాలేక పోయాడు. సదస్సు జరగడానికి ముందే ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. కంట తడిపెట్టుకొని శ్రీరామకృష్ణుల నుండి సెలవు పుచ్చుకొని కాశీకి వెళ్ళిపోయాడు. కొద్దికాలంలోనే అక్కడే ఆయన దివంగతుడైనాడని తెలియవచ్చింది. ఈ సంఘటన జరిగిన చాలాకాలం తరువాత కొందరు కలకత్తా భక్తులు శ్రీరామకృష్ణుల పాదపద్మాలను ఆశ్రయించి తరువాతి కాలంలో, భక్తిపారవశ్యంలో వారు బాహాటంగా ఆయనను భగవదవతారంగా అభివర్ణించేవారు. అప్పుడు పై విషయం తెలియరాగా, అలా అభివర్ణించవద్దని శ్రీరామకృష్ణులు వారిని కట్టడి చేశారు. కాని వారు అలా చాటడం మానలేదు. దానితో ఆయన విసుగుచెందే వారు. దానిని గురించి మాతో ఇలా చెప్పారు : “వారిలో ఒకరు వైద్యుడు, మరొకరు నాటకశాల కార్యనిర్వాహకుడు. వారు ఇక్కడకు అప్పుడప్పుడు వచ్చి నన్ను ఒక అవతారమూర్తిగా పేర్కొనేవారు. అలా పేర్కొని నన్నేదో గొప్పవాణ్ణి చేస్తున్నామని వారు భావించేవారు. కాని అవతారం అంటే ఏమిటో వారికి తెలుసా? వారు ఇక్కడకు వచ్చి నన్ను అవతారమూర్తిగా పేర్కొనడానికి చాలాకాలం మునుపే తమ యావజ్జీవితాలు ఇటువంటి విషయాలను అధ్యయనం చేయడంలో గడిపిన పద్మలోచన్ వంటి మహాపండితులు, షడ్దర్శనాలలో ప్రావీణ్యం సాధించినవారు, మూడు దర్శనాల్లో పారంగతులైన ఎంతో మంది సాధువులు ఇక్కడకు వచ్చి నన్ను అవతారంగా అభివర్ణించి వెళ్ళారు. అవతారం అని పేర్కొనబడడం నాకు రోతగా పరిణమించింది. అలా నన్ను పేర్కొనడంలో నాకు అదనంగా ఏం గొప్పతనం ఆపాదిస్తున్నారు?” అంటూ చిరాకుపడేవారు.
పద్మలోచనే కాకుండా అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులు, మరికొందరు సుప్రసిద్ధ పండితులను కూడా కలుసుకొన్నారు. మాటల సందర్భంలో అప్పుడప్పుడు మాతో, వారిలో తాను చూసిన విశేష సద్గుణాలను గురించి ఆయన చెప్పేవారు. అటువంటి సుప్రసిద్ధ వ్యక్తులలో కొందరిని గురించి ఇక్కడ ప్రస్తావించడం అసంగతం కాబోదు.
51. దయానంద సరస్వతిని గురించి శ్రీరామకృష్ణులు
ఆర్యసమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి. ఒకప్పుడు ఆయన తన పర్యటనలో వంగదేశానికి వచ్చాడు. ఉత్తర కలకత్తాలోని బారానగర్‌కు చెందిన సింథి అనే పల్లెలో, ఒక పెద్దమనిషి ఉద్యానవనంలో కొద్దిరోజులు బసచేశాడు. మహాపండితుడిగా అప్పటికే ఆయన సుప్రసిద్ధుడు. కాని అప్పటికి ఇంకా ఆయన ఆర్యసమాజాన్ని స్థాపించలేదు, తన మూలసిద్ధాంతాలను ప్రచారమూ చేయలేదు. ఆయన గురించి విని శ్రీరామకృష్ణులు ఒక రోజు ఆయనను చూడబోయారు. స్వామి దయానంద గురించి మాటల సందర్భంలో ప్రస్తావించి మాతో ఒక సందర్భంలో ఇలా చెప్పారు : “సింథి ఉద్యానవనంలో బసచేసి ఉన్న ఆయనను చూడడానికి వెళ్ళాను. ఆయన కొంత శక్తి సముపార్జించాడని కనుగొన్నాను. ఆయన రొమ్ము సదా ఎర్రబారి ఉండేది. వైఖరి* అవస్థలో ఉండి, రేయింబవళ్ళు శాస్త్రాంశాలను గురించి మాట్లాడుతూండేవాడు. వ్యాకరణ ప్రయోగాలతో అనేక పదాల అర్థాలను తలక్రిందులు చేసేవాడు. ‘నేను ఏదో చేస్తాను, ఒక సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తాను’ అనే అహం ఆయన మనస్సులో ఉండేది.”
52. జయనారాయణ్ పండితుడు
జయనారాయణ్ పండితుణ్ణి గురించి శ్రీరామకృష్ణులు చెప్పేవారు. “మహా పండితుడైనప్పటికీ, అతడిలో అహంకారం లేదు. తన మరణం గురించి అతడికి ముందుగానే తెలుసు; తాను కాశీకి వెళ్ళి అక్కడ మరణిస్తానని చెప్పేవాడు. నిజానికి అలాగే జరిగింది.”
53. భక్తుడైన కృష్ణకిశోర్
అరియదాహా వాస్తవ్యుడైన కృష్ణకిశోర్ భట్టాచార్యకు తమ పట్ల గల భక్తిప్రపత్తులను గురించి శ్రీరామకృష్ణులు అనేక సందర్భాలలో ప్రస్తావించేవారు. ఆయన అతడి ఇంటికి వెళ్ళివచ్చేవారు. మహాభక్తురాలైన కృష్ణకిశోర్ భార్య కూడా శ్రీరామకృష్ణుల పట్ల ఎంతో భక్తిప్రపత్తులు చూపేది. కృష్ణకిశోర్ భక్తివిశ్వాసాలు అసాధారణమైనవి. ‘రామ’ నామం పట్లనే కాక ‘మరా, మరా’ పట్ల కూడా కృష్ణకిశోర్‌కు ఎంతో భక్తి ప్రపత్తులుండేవి. అందుకు కారణం : రామ మంత్రాన్ని నారదమహర్షి, అప్పటికి దారి దోపిడీగాడైన వాల్మీకికి ఆ రీతిలో (‘మరా’ అని) ఉపదేశించాడని పురాణాలు వచిస్తున్నాయి. ఆ రామమంత్రాన్ని జపం చేస్తూ పోగా వాల్మీకి మనస్సులో శ్రీరామచంద్రుడి అద్భుత దివ్యలీల అభివ్యక్తమైంది. దాంతో ఆయన ఆదికవియై రామాయణాన్ని రచించాడు. కృష్ణకిశోర్ సంసారంలో ఎన్నో ఇక్కట్లకు, బాధలకు గురియైనాడు. యుక్తవయస్కులైన ఆయన ఇద్దరు కుమారులు అకాల మరణం పొందారు. పుత్రశోకం ఎంత ప్రగాఢమైనదంటే మహాభక్తుడైన కృష్ణకిశోర్ కూడా ఆ శోకాన్ని భరించలేక తల్లడిల్లిపోయాడని శ్రీరామకృష్ణులు చెప్పేవారు.
పైన పేర్కొన్న సాధకులనే కాక శ్రీరామకృష్ణులు మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మొదలైన వారిని కూడా కలుసుకొన్నారు. దేవేంద్రుని ఉదారభక్తిని గురించి, విద్యాసాగర్ దయాగుణం గురించి మాతో అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులు ప్రస్తావించేవారు.