సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ ।
వేదైశ్చసర్వైరహమేవవేద్యో
వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ ॥ –భగవద్గీత, 15-15
సర్వుల హృదయాలలోను నేను నెలకొని ఉంటాను. (పూర్వజన్మ) స్మృతి, (అతిలోక) జ్ఞానం – ఈ రెండింటి విస్మృతి, నా వలనే కలుగుతుంది; వేదాలన్నిటి వలన తెలుసుకోవలసిన వాడను నేనే; వేదాంత కర్తను నేనే; వేదజ్ఞుడను కూడ నేనే.
1. అవతార పురుషులు జన్మతః గురువులు
జగద్గురువులుగా జన్మించిన వారిలో చిన్ననాటినుండే దానిని సూచించే లక్షణాలు కనిపిస్తాయని మేం ఇంతకు క్రితమే (III.5.1) చెప్పాం. అలాంటప్పుడు అవతార పురుషుల విషయంలో దీనిని గురించి చెప్పడం అవసరంలేదు. లోకంలో ఏ ఆదర్శాలను స్థాపింప వారు జన్మించారో, వాటి మారు రూపాలుగా చిన్ననాటి నుండి వీరు కనిపిస్తారు. వారి మనశ్శరీరాలపై నియంత్రణ, దేశకాల పరిస్థితుల ప్రభావం చేత వారి జీవితంలో ధర్మాచరణ పూర్తిగా ప్రస్ఫుటమవుతుంది. కాని ఇవి వారు ప్రకటించే ఆధ్యాత్మిక సత్యాలకూ లేదా జగద్గురువులుగా వ్యక్తమయ్యే వారి సామర్థ్యానికీ హేతువులు కాబోవు. వారు ఈ సామర్థ్యంతోనే జన్మిస్తారు. ఈ విశ్లేషణ జగద్గురువులుగా పురోగమింప చేసిన శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక శక్తి విషయంలో కచ్చితంగా సరిపోతుంది. ఈ శక్తి అభివ్యక్తీకరణ ఆయన బాల్యంలో, సాధన కాలంలో, ఇతర కాల ఘట్టాలలో కానరావడం మనలను ఆశ్చర్యపరుస్తుంది. కానీ ఆయన జీవితంలో ప్రప్రథమంగా ఈ శక్తి ఎలా జనించిందో నిర్ధారణ చేయలేం. ఆయన బాల్యకాల సంఘటనలు ప్రస్తావించి ఈ పుస్తక పరిమాణాన్ని పెంచదలుచుకోలేదు. కాని జగద్గురువులుగా ఆయనను రూపొందించిన ఆధ్యాత్మిక శక్తుల అభివ్యక్తీకరణ జరిగిన ఆయన సాధన కాలాన్ని, ఆ ఘట్టంలో మథుర్బాబుతో సహా పలువురితో ఆయనకు కలిగిన సంబంధాన్ని గురించి ప్రస్తావించడం అప్రస్తుతం కాబోదు.
2. పలువురు గురువుల నుండి శ్రీరామకృష్ణులు దీక్ష పుచ్చుకోవడం
ఇష్టదేవత మంత్రాన్ని ఇచ్చే గురువు ఒక్కరే ఉండాలన్నప్పటికీ, అనేక సందర్భాలలో శ్రీరామకృష్ణులు భాగవతంలో పేర్కొన్న అవధూత కథను ప్రస్తావించి ఉపగురువులు పలువురు ఉండవచ్చని మాకు విశదపరచేవారు. ఒకరి తరువాత ఒకరుగా ఇరవై నాలుగు మంది ఉపగురువుల నుండి ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించి అవధూత సిద్ధిపొందాడని భాగవతంలో పేర్కొనబడి ఉంది. శ్రీరామకృష్ణుల జీవితంలోకూడ ఇటువంటి ఉపగురువులకు కొదువ లేదు; ప్రత్యేక ఆధ్యాత్మిక సాధనలు ఆయనచేత అనుష్ఠింపచేసి, ఆ సంప్రదాయంలో ఆయనను పరిపూర్ణులను గావించారు వీరు. కాని తరచూ ఆయన భైరవీ బ్రాహ్మణి, తోతాపురి, గోవింద (ఇస్లాం మత సాధన చేయించిన వ్యక్తి) – ఈ ముగ్గురి పేర్లనే ప్రస్తావించడం మేం విన్నాం. హైందవ ఉపశాఖల సంప్రదాయ రీతుల్లో ఆధ్యాత్మిక సాధనలను తన చేత అనుష్ఠింప చేసిన ఇతర గురువులను గురించి ఆయన బహు అరుదుగా ప్రస్తావించేవారు. ఆ ఇతర గురువుల నుండి తాము వారి శాఖాసంప్రదాయానుసారమైన ఆధ్యాత్మిక సాధనా విధానాలను నేర్చుకొని, ఆయా సాధనలలో పరిపూర్ణత్వాన్ని మూడు రోజులలోనే సంతరించుకొన్నానని మాత్రమే ఆయన చెప్పేవారు. వారి పేర్లను ఆయన ప్రస్తావించేవారు కాదు. వారి పేర్లను మరచిపోయారో లేదా వారు అంత ప్రముఖులు కారో ఇప్పుడు చెప్పడం కష్టం. కాని వారితో ఆయన సాంగత్యం స్వల్పకాలికమే అన్నది మాత్రం స్పష్టం. అందుచేతనే వారిని గూర్చి ఆయన ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు.
3. భైరవీ బ్రాహ్మణి
శ్రీరామకృష్ణుల గురువులందరిలోను భైరవీ బ్రాహ్మణి ఆయన సాంగత్యంలో ఎక్కువ కాలం వసించింది. కాని ఎంతకాలమో కచ్చితంగా చెప్పడం కష్టం. శ్రీరామకృష్ణుల చరణారవిందాలను మేం ఆశ్రయించడానికి మునుపే ఆమె దక్షిణేశ్వరం వదలి వెళ్ళిపోయింది. ఆ తరువాత శ్రీరామకృష్ణులు ఆమెను కాశీలో తపశ్చర్యలు చేస్తూ ఉన్నప్పుడు కలుసుకొన్నారు.
4. సాధనలో శ్రీరామకృష్ణులకు భైరవీ బ్రాహ్మణి సహాయం
భైరవీ బ్రాహ్మణి చాలాకాలం దక్షిణేశ్వర కాళికాలయంలోను, గంగాతీరం లోని దేవమండల్ఘాట్ తదితర చోట్ల వసించిందని శ్రీరామకృష్ణులు చెప్పగా మేం విన్నాం. తంత్రశాస్త్రం పేర్కొన్న అరవై నాలుగు సాధనలలో ప్రధానమైన వాటిని ఒకదాని తరువాత ఒకటిగా శ్రీరామకృష్ణుల చేత ఆమె అనుష్ఠింపచేసింది. ఆమె వైష్ణవశాస్త్రాలలో నిష్ణాతురాలు. సఖీభావం తదితర భక్తిభావ సాధనానుష్ఠానంలో శ్రీరామకృష్ణులకు కొన్ని ముఖ్య అంశాలలో ఆమె సహాయం చేసింది. ఆమె అందరి గౌరవమన్ననలకు పాత్రురాలైంది. ఆమె దాదాపు పన్నెండేళ్ళు, శ్రీరామకృష్ణుల సాధన కాలం పిదప కూడ అవసరమైనప్పుడు సహాయం అందిస్తూ దక్షిణేశ్వరంలో నివసించింది. శ్రీరామకృష్ణులు, హృదయ్లతో కలిసి ఆమె కామార్పుకూర్కు వెళ్ళి, ఆయన బంధువులతో కొంత కాలం అక్కడ గడిపింది. ఆనాటినుండి మాతృదేవి (శారదాదేవి) భైరవీ బ్రాహ్మణిని తన సొంత అత్తగారిలా గౌరవించి, ఆమెను ‘అమ్మ’ అని సంబోధించేవారు.
5. భైరవీ బ్రాహ్మణి అనుభూతులు: వైష్ణవ శాస్త్రాలు
భైరవీ బ్రాహ్మణి వైష్ణవీయ సాధనలు అనుష్ఠించి సఖ్య, వాత్సల్యాది భావాలలో ఉన్నతిని పొంది, తద్ద్వారా భజనానందాన్ని* (లేదా సాధనానందాన్ని) చవిచూసింది. అరియదాహా గ్రామంలోని దేవమండల్ ఘాట్ వద్ద వసించేటప్పుడు శ్రీరామకృష్ణుల పట్ల వాత్సల్యభావ పరవశురాలై చేత వెన్నముద్ద పుచ్చుకొని, ‘గోపాలా’, ‘గోపాలా’ అంటూ బిగ్గరగా, కట్టుబట్టలు కన్నీళ్ళతో తడిసిపోయేలా ఆమె విలపించేది. అదే సమయంలో దక్షిణేశ్వర కాళికాలయంలో ఉన్న శ్రీరామకృష్ణుల హృదయం ఆమెను చూడాలని తహతహలాడేది. అప్పుడాయన ఒక్క పరుగున తల్లి చెంతకు చేరే బిడ్డలా ఆ రెండు మైళ్ళ దూరాన్ని గమించి ఆమె వద్దకు వెళ్ళి, చెంత కూర్చుని ఆ వెన్నముద్దను తినేవారని మేము విన్నాం. ఆమె ఎక్కడ నుండో సేకరించి తెచ్చిన ఎరుపురంగు వారణాసి పట్టుచీర ధరించి, ఆభరణాలు అలంకరించుకొని, రకరకాల తినుబండారాలను పుచ్చుకొని, పాటలు పాడుకొంటూ, కొన్ని సమయాల్లో చుట్టుప్రక్కల స్త్రీలను తోడ్కొని శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చేది; ఆయనకు ఆ భక్ష్యాలను తినిపించి, తిరిగి వెళ్ళిపోయేది. ఆ సమయంలో విరబోసుకొన్న శిరోజాలతో, ఆధ్యాత్మిక భావోద్వేగాల కారణంగా ఉద్విగ్న స్థితిలో ఉన్న ఆమెను చూసి, బాలకృష్ణుని ఎడబాటుతో ఆందోళన చెందిన నందరాణి యశోదగా అంతా భావించేవారని శ్రీరామకృష్ణులు చెప్పేవారు.
6. మథుర్ సంశయాలు
అసాధారణ సౌందర్యాన్ని, సామర్థ్యాన్ని సంతరించుకొన్న వ్యక్తి బ్రాహ్మణి. మథుర్బాబు ఆమె శీలం గురించి శంకించాడని గురుదేవులు చెప్పగా మేం విన్నాం; ఎవరి తోడు లేకుండా ఒంటరిగా ఇష్టంవచ్చిన చోటుకు ఆమె పోతూవుండడం చూసి మథుర్ అనుమానించాడు. ఒక రోజు అతడు, “ఓ భైరవీ, నీ భైరవుడెక్కడ?”* అని హేళనగా అన్నాడట. అప్పుడు బ్రాహ్మణి, దేవిని దర్శించుకొని కాళికాలయం నుండి వస్తున్నది. అలా హఠాత్తుగా ప్రశ్నించినప్పటికీ ఆమె ఏమాత్రం కలవరపడలేదు. కోపగించుకోలేదు; ప్రశాంతంగా మథుర్ను చూసింది. తరువాత కాళీమాత కాళ్ళక్రింద శవరూపంలో పడివున్న శివుడి ప్రతిమను వేలితో సూచిస్తూ మథుర్కు చూపింది. సందేహప్రాణీ, ప్రాపంచికుడూ అయిన మథుర్బాబు అంత సులభంగా విషయం వదలిపెట్టే రకం కాదు. “కాని ఆ భైరవుడు చలనం లేనివాడే” అని అన్నాడు. తక్షణమే భైరవి, “అచలాన్ని చలింప చేయలేకపోతే నే నెందుకు భైరవినయ్యాను” అని తీవ్రస్వరంలో ప్రత్యుత్తరం ఇచ్చింది. బ్రాహ్మణి జవాబు విని మథుర్ సిగ్గుపడి, తత్తరపోయి నోట మాట రాక నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. తదనంతరం బ్రాహ్మణితో పరిచయం పెరిగేకొద్దీ ఆమె ఉదాత్త భావాలు, సద్గుణాలు అతడు తెలుసు కోగలిగాడు; ఆ సంశయం అతడిలో పూర్తిగా తొలగిపోయింది.
7. భైరవీ బ్రాహ్మణి పుట్టుపూర్వోత్తరాలు
భైరవీ బ్రాహ్మణి తూర్పు వంగదేశంలో (ప్రస్తుతం బంగ్లాదేశ్) ఎక్కడో జన్మించిందని శ్రీరామకృష్ణుల ముఖతా మేం విన్నాం. ఆమెను చూసిన ప్రతి ఒక్కరికీ ఆమె తప్పక ఒక గౌరవనీయ కుటుంబంలో జన్మించిందనే అభిప్రాయం నిస్సందేహంగా కలిగేది. నిజానికి ఆమె ఒక గౌరవనీయ కుటుంబానికి చెందిన వ్యక్తే. ఆమె ఏ గ్రామంలో, ఎవరి ఇంట జన్మించింది అన్న వివరాలు మేం ఎప్పుడూ శ్రీరామకృష్ణుల ముఖతా వినలేదు; కోడలిగా ఎవరి ఇంటినన్నా మెట్టినదా లేదా ప్రౌఢ వయస్సులో ఏ కారణంతో సంసారంపట్ల విరక్తి నొంది, సన్న్యసించి ఇలా పరివ్రాజిక జీవితం గడుపుతున్నదో మాకు తెలియరాలేదు. ఇంత శాస్త్ర పాండిత్యాన్ని ఆమె ఎక్కడ సంతరించుకొన్నదో, సాధనలో ఇంత పురోగతిని ఎక్కడ ఎప్పుడు సాధించిందో ఆ వివరాలు మాలో ఎవరికీ కించిత్తుకూడ తెలియవు.
8. భైరవీ బ్రాహ్మణి ఎంతో ఉన్నతదశ నొందిన సాధకురాలు
భైరవీ బ్రాహ్మణి సాధనలో ఎంతో పురోగతి సంతరించుకొన్న వ్యక్తి అని వేరే చెప్పనవసరం లేదు. భగవత్సంకల్పంతో శ్రీరామకృష్ణులకు గురువుగా ఆమె ఎంపిక చేయబడడమే ఈ విషయాన్ని స్పష్టంచేస్తుంది. తన జీవిత కాలంలో, ఆమె గురుదేవులను కలుసుకోవడానికి పూర్వమే ముగ్గురు సాధకులకు తాను తోడ్పడవలసి ఉంటుందని ఆమె యోగశక్తి మూలంగా తెలుసు కొన్నదని శ్రీరామకృష్ణుల ముఖతా మేం విన్నాం. ఆ ముగ్గురిలో శ్రీరామకృష్ణులు ఒకరు. ఆ ముగ్గురినీ విభిన్న ప్రదేశాలలో, విభిన్న సమయాలలో కలుసుకొన్న తక్షణమే వారిని గుర్తించి, వారికి తోడ్పడవలసి ఉంటుందని బ్రాహ్మణికి తెలుసునన్న విషయం గురుదేవులు చెప్పగా విన్నాం. బ్రాహ్మణి ఉత్కృష్ట ఆధ్యాత్మిక సాధకురాలనడానికి ఇదే ప్రమాణం.
9. బ్రాహ్మణి యోగ దృష్టి
శ్రీరామకృష్ణులను మొట్టమొదటిసారి కలుసుకొన్నప్పుడే తక్కిన ఇద్దరు సాధకులైన చంద్ర, గిరిజులను గురించి ఆమె ఆయనకు చెప్పింది. “నాయనా! వారిద్దరినీ ఇంతకు మునుపే కలుసుకొన్నాను. ఇంతకాలంగా వెతుకుతూన్న నిన్ను, నేడు కలుసుకోగలిగాను. వారిద్దరినీ నీకు తరువాత పరిచయం చేస్తాను” అని ఆయనతో చెప్పింది. తదనంతరం అన్నమాట ప్రకారమే ఆ ఇద్దరినీ దక్షిణేశ్వరానికి తోడ్కొనివచ్చి శ్రీరామకృష్ణులకు పరిచయం చేసింది. వారిద్దరు కూడా అత్యున్నత శ్రేణికి చెందిన సాధకులని గురుదేవులు చెప్పగా మేం విన్నాం. సాధన పథంలో వారు ఎంతో పురోగతి సాధించినప్పటికీ వారి భగవత్సాక్షాత్కార ఆకాంక్ష ఈడేరలేదు. కొన్ని అద్భుతశక్తులను వారు గడించారు; ఆ శక్తుల కారణంగా వారు పదభ్రష్టులైనారు.
10. చంద్రుని వృత్తాంతం
బ్రాహ్మణి శిష్యులలో ఒకడైన చంద్ర ధ్యానశీలి అనీ, భగవత్ భక్తుడనీ గురుదేవులు మాతో చెప్పారు. సాధనల ఫలితంగా అతడికి ‘గుటికా సిద్ధి’ కలిగింది. మంత్రపూరితమైన ఆ గుటికను (చిన్న ఉండ) శరీరం మీద తాయెత్తులా ధరించగానే, సామాన్యుల దృష్టికి అదృశ్యుడై ఎవరూ చొరరాని, జాగ్రత్తగా పరిరక్షిస్తున్న చోట్లకు కూడ సులభంగా రాకపోకలు చేయగలిగేవాడు. భగవత్సాక్షాత్కారానికి పూర్వమే ఇటువంటి అద్భుత శక్తులు సిద్ధిస్తే, బలహీనమైన మానసం అహంకారపూరితమౌతుంది. ఈ అహంకారమే మనిషిని కోరికలనే వలలో బంధించి, అతణ్ణి ఉన్నత లక్ష్యంవైపు సాగనివ్వదనీ, చివరకు ఆ అహంకారమే అతడి అధోగతికి కారణమౌతుందనీ చెప్పడం అనవసరం. పదేపదే ఇదే విషయాన్ని ఎన్ని విభిన్న రీతులలో గురుదేవులు మాకు విశదపరిచారో కదా! ఆయన ఇలా చెప్పేవారు: “అహంకారం పెరిగేకొద్దీ, పాపం పెరుగుతుంది, అది తగ్గేకొద్దీ పుణ్యం అధికరిస్తుంది. అహంకారం పెరిగేకొద్దీ, పుణ్యం క్షయిస్తుంది; అహంకార దగ్ధం భగవల్లాభాన్ని చేకూరుస్తుంది. స్వార్థపరత్వం పాపం, నిస్వార్థపరత్వం పుణ్యం. ‘నేను’ (అహంకారం) సమసి పోయినప్పుడు కష్టాలు, ఆటంకాలు తొలగిపోతాయి.” మళ్ళీ ఆయన ఇలా కొనసాగించేవారు: “అహంకారాన్ని శాస్త్రాలు ‘చిత్–జడ గ్రంథి’ గా పేర్కొంటున్నాయి. చిత్ అంటే జ్ఞానమే స్వరూపమైన ఆత్మ. జడం అంటే శరీరం, మనస్సు ఇత్యాదులు. అహంకారం ఈ రెండిటినీ ఒకటిగా ముడివేసి మనిషి మనస్సులో, ‘నేను దేహేంద్రియాలతో కూడుకొన్న జీవుణ్ణి’ అనే తీవ్రమైన భ్రాంతిని జనింపచేస్తుంది. ఈ పీట ముడిని విప్పుకోనంత కాలం ఎవరూ పురోగతి (భగవన్మార్గంలో) సాధించలేరు. ఈ అహంకారాన్ని వర్జించాలి. మరొక సంగతి. (అణిమాది) యోగసిద్ధులు మలమూత్రాదులవంటి హేయమైనవని ‘అమ్మ’ నాకు దర్శింప చేసింది. వాటిని గురించి అసలు పట్టించుకోకూడదు. శ్రద్ధతో సాధనలు అనుష్ఠిస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఈ యోగశక్తులు వాటంతట అవే సిద్ధిస్తాయి. కాని వాటి పట్ల లక్ష్యం వహించిన వ్యక్తి అక్కడే కూలబడి పోతాడు; భగవంతుని వైపుగా పురోగమించలేడు.”
11. అణిమాది సిద్ధులు ఆధ్యాత్మిక పతనానికి దారితీస్తాయి
స్వామి వివేకానంద జీవనసర్వస్వం ధ్యానం. తింటున్నా, పడుకొనివున్నా, తిరుగుతూవున్నా, అవసరమైన భౌతిక కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నా – సర్వకాల సర్వావస్థలలోను ఆయన తన మనస్సును భగవద్ధ్యానంలో నిలిపి ఉంచేవారు. స్వామి వివేకానందను ‘ధ్యాన సిద్ధు’ డని శ్రీరామకృష్ణులు తరచూ అభివర్ణించేవారు. ఒకరోజు స్వామీజీ ధ్యానంలో మగ్నులై ఉన్నప్పుడు హఠాత్తుగా ఆయనకు దూరదర్శన, దూరశ్రవణ శక్తులు సిద్ధించాయి. ధ్యానానికి కూర్చోగానే, ఆయన ధ్యానం ప్రగాఢం కాగానే, దూరంలోని వ్యక్తులను చూడగలగడం, వారి మాటలు వినగలిగే స్థాయికి ఆయన మనస్సు అధిరోహించేది. అలాంటి అనుభూతులు కలుగగానే, ఆ దృశ్యాల యాథార్థాన్ని తెలుసుకోవాలనే కోరిక ఆయనలో జనించింది. వెంటనే ఆయన ధ్యానాన్ని నిలిపి, ఆయా చోట్లకు వెళ్ళి చూడగా తాను ధ్యానంలో చూసిందీ, విన్నదీ యావత్తు అక్షరసత్యంగా కనుగొన్నాడు. కొన్ని రోజుల తరువాత ఈ ఉదంతం గురించి శ్రీరామకృష్ణులకు చెప్పగా, ఆయన, “అవన్నీ భగవత్సాక్షాత్కార మార్గంలోని ఆటంకాలు. కొన్ని రోజులదాకా ధ్యానం చేయవద్దు” అని స్వామీజీని నిర్దేశించారు.
12. చంద్రుని పతనం
‘గుటికా సిద్ధిని’ సంతరించుకొన్న చంద్రుడిలో అహంకారం మితిమీరి పోయింది. అతడిలో కామ కాంచనాసక్తి క్రమంగా పెరిగిపోయిందని శ్రీరామకృష్ణులు చెప్పగా విన్నాం. ఒక కులీన, సంపన్నుడి కుమార్తె మోజులోపడి తన ‘గుటికాసిద్ధి’ ప్రభావంతో ఎవరికంటా పడకుండా ఆ ఇంట్లోకి రాకపోకలు సాగించాడు. అలా అహంకారం, స్వార్థపరత్వం అతడిలో పెచ్చుపెరగడంతో క్రమంగా చంద్రుడు ఆ శక్తిని కోల్పోయి, నానా అవమానాల పాలయ్యాడని తెలియవచ్చింది.
13. గిరిజుని వృత్తాంతం
గిరిజుని వింతశక్తిని గురించికూడ శ్రీరామకృష్ణులు మాకు చెప్పారు. ఆయన ఒక రోజు గిరిజుడితో కలిసి, కాళికాలయ సమీపంలోని శంభుమల్లిక్ ఉద్యాన వనానికి వెళ్ళారు. శ్రీరామకృష్ణులను, శంభు ఎంతో అభిమానించేవాడు; ఆయనకు ఏ విధమైన సేవ చేయగలిగినా తన జన్మ తరించినట్లే భావించేవాడు. కాళికాలయానికి సమీపంలో రెండు వందల యాభై రూపాయలకు ఒక స్థలం కొని, మాతృదేవి నివాసార్థం ఆ స్థలంలో ఒక గదిని కట్టించాడు. ఆ కాలఘట్టంలో ఆమె ఆ గదిలో వసిస్తూ, అక్కడనుండి గంగకు వెళ్ళి స్నానం ఆచరించాక గురుదేవులను చూడడానికి వెళ్ళేవారు. అలా ఆ గదిలో బసచేసిన ఒకానొక సందర్భంలో ఒకసారి ఆమె తీవ్రమైన రక్తగ్రహణికి గురి అయింది. ఆమె చికిత్సకు, పథ్యపానాదులకు శంభుయే అన్ని ఏర్పాట్లు చేశాడు. అతడి భార్యకూడ భక్తిపరాయణురాలే; శ్రీరామకృష్ణులను, మాతృదేవిని ఆమె భగవదవతారాలుగా పరిగణించేది. మాతృదేవిని మంగళవారాల* నాడు తమ ఇంటికి తోడ్కొని వెళ్ళి, శంభు భార్య ఆమెను సాక్షాత్తూ జగజ్జననిగా ఆరాధించడం కద్దు. పైగా శ్రీరామకృష్ణులకు అవసరమైన ఆహారాదుల వ్యయం, కలకత్తాకు రాకపోకలు చేయడానికి బండి బాడుగ ఇత్యాది ఖర్చులు శంభు భరించేవాడు. ఆ విధంగా శ్రీరామకృష్ణులను సేవించుకొనే అవకాశం అతడికి మథుర్బాబు మరణించిన తరువాతే కలిగిందని మనం గ్రహించాలి. అతణ్ణి గురుదేవులు తమ రెండవ సరఫరాదారునిగా అభివర్ణించేవారు. ఆ రోజుల్లో శ్రీరామకృష్ణులు అతడి ఉద్యాన వనానికి వాహ్యాళిగా తరచూ వెళ్ళి, అతడితో కొన్ని గంటలు భగవత్ప్రసంగాలలో గడిపి తిరిగి వచ్చేవారు.
14. గిరిజుని అద్భుతశక్తి
ఒక రోజు శ్రీరామకృష్ణులు, గిరిజుడితో శంభుబాబు ఉద్యాన వనానికి వాహ్యాళిగా వెళ్ళారు. మాటల్లో అక్కడ చాలసేపు గడిపి, ఆయన ఇలా అన్నారు: “భక్తుల స్వభావం ఒక రకంగా గంజాయి త్రాగేవారిలా ఉంటుంది. గంజాయి త్రాగేవాడు ఘాటుగా ఒక పీల్పుపీల్చి, గొట్టాన్ని ప్రక్కవాడికిచ్చి నెమ్మదిగా పొగను వదలుతాడు. ఒక్కడే గంజాయిని పీలుస్తూ ఆస్వాదించలేడు. అదేవిధంగా భక్తులు సమావేశమైనప్పుడు ఒక భక్తుడు భగవద్భావంలో తన్మయత్వం చెంది, కాసేపు భగవత్ప్రసంగం చేసి, పరమానందభరితుడై మౌనంగా ఉండిపోతాడు; భగవత్ప్రసంగం చేయడానికి మరొక భక్తుడికి అవకాశం ఇచ్చి, శ్రోతగా పరమానందం అనుభవిస్తాడు.” ఆ రోజు శంభుబాబు, గిరిజ, శ్రీరామకృష్ణులకు భగవత్ప్రసంగంలో కాలం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. క్రమంగా చీకటిపడి, చాలా సేపయిన తరువాతనే శ్రీరామకృష్ణులకు తాము తిరిగిపోవాలనే స్ఫురణ కలిగింది. శంభుబాబు వద్ద సెలవు పుచ్చుకొని, గిరిజునితో సహా బయటకు వచ్చి ఆలయం వైపుగా బయలుదేరారు. అప్పుడు కటిక చీకటి ఆవరించి ఉంది. దారి ఏమీ కనబడకపోవడంతో శ్రీరామకృష్ణులు తడబడసాగారు. భగవత్ప్రసంగంలో పూర్తిగా లీనమై ఉండడంచేత బాగా చీకటిపడిందనిగానీ, శంభును అడిగి లాంతరు తీసుకోవాలని గానీ శ్రీరామకృష్ణులకు స్ఫురించలేదు. ఇప్పుడు ఏం చేయాలి? గిరిజుని చేయి పుచ్చుకొని తడుముకొంటూ నడవసాగారు. కాని అలా నడవడం ఆయనకు ఎంతో కష్టంగా ఉంది. ఆయన అలా కష్టపడడం చూసి గిరిజుడు, “కాస్త ఆగండి, అన్నా! మీకు వెలుగు చూపుతాను” అని అన్నాడు. అలా అంటూ వెనుకకు తిరిగాడు; అతడి వీపు భాగం నుండి దేదీప్యమానమైన వెలుగు ప్రసరిస్తూ కాలిబాటను ప్రకాశవంతం చేసివేసింది. “కాళికాలయం దాకా ఉన్న ఆ కాలిబాట ఆ దేదీప్యమానమైన వెలుగులో స్పష్టంగా కనిపించింది; నేను ఆ వెలుగులోనే నడిచి వెళ్ళగలిగాను” అని శ్రీరామకృష్ణులు చెప్పారు.
15. గురుభావంలో శ్రీరామకృష్ణులు చంద్ర, గిరిజుల అద్భుత శక్తులను దగ్ధం చేయడం
అలా చెప్పి, వెంటనే నవ్వుతూ శ్రీరామకృష్ణులు ఇలా కొనసాగించారు: “కాని ఆ అద్భుత శక్తులను ఎంతో కాలం వాళ్ళు నిలుపుకోలేకపోయారు. దీని (తమ) సాంగత్యంలో కొంతకాలం వసించినప్పుడు ఆ అద్భుత శక్తులు అదృశ్యమై పోయాయి.” మేం కారణం అడగగా, గురుదేవులు ఇలా అన్నారు: “వారి శ్రేయస్సు కోసమే అమ్మ వారి శక్తులనన్నిటినీ దీనిలోకి (తమ శరీరంలోకి) ఉపసంహరింప చేసింది. అది జరిగాక వారి మనస్సులు ఆ నిరర్థక విషయాలజోలికి పోక భగవంతుని దిశగా పురోగమించాయి.”
16. సిద్ధులు భగవన్మార్గంలో విఘ్నాలు
అలా అంటూ శ్రీరామకృష్ణులు ఇలా కొనసాగించారు: “ఆ శక్తులలో ఏం ఉంది? వాటిలో చిక్కువడి మనస్సు సచ్చిదానందం నుండి సుదూరంగా వెళ్ళిపోతుంది. ఒక కథ వినండి: ఒకప్పుడు ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులుండేవారు. పెద్ద కుమారుడికి యౌవనంలో వైరాగ్యం జనించింది. అతడు సన్న్యసించి ఇల్లు వదలి వెళ్ళిపోయాడు. చిన్న కుమారుడు చదువు సంధ్యలు నేర్చి, వివాహం చేసుకొని గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించసాగాడు. పన్నెండేళ్ళ తదనంతరం ఇష్టముంటే జన్మస్థలాన్ని సందర్శించుకోవచ్చు అనే సన్న్యాస సంప్రదాయం ఒకటి ఉంది. పైన పేర్కొన్న మన సన్న్యాసి ఆ సంప్రదాయం పాటించి తన జన్మస్థలానికి వచ్చాడు. తమ్ముడి పొలం, వ్యవసాయం, సంపద మొదలైనవి పరికించి అతడి ఇంటి ముందుకు వచ్చి తమ్ముణ్ణి పేరుపెట్టి పిలవసాగాడు. తనను ఎవరో పేరుపెట్టి పిలవడం విని, తమ్ముడు బయటకు వచ్చి అన్నగారిని చూశాడు. సుదీర్ఘకాలం తరువాత అన్నగారిని చూడడంతో తమ్ముడు పరమానందం చెందాడు. అన్నకు నమస్కరించి, ఇంట్లోకి తోడ్కొనిపోయి, నానావిధాల ఆయనను సేవించసాగాడు. భోజనానంతరం ఆ అన్నదమ్ములు ఇద్దరూ పిచ్చాపాటీ మాట్లాడుకోసాగారు. మాటల సందర్భంలో తమ్ముడు, అన్నగారిని ఇలా అడిగాడు: ‘అన్నా! సంసార సుఖాలనన్నిటినీ పరిత్యజించి సన్న్యాసం పుచ్చుకొని సుదీర్ఘ కాలం పర్యటించావు. దీని మూలంగా నువ్వు ఏం సముపార్జించావో దయచేసి చెప్పు.’ ఆ ప్రశ్న వినగానే అన్న, ‘నువ్వు దాన్ని చూడగోరతావా? అలా అయితే నా వెంట రా’ అని ఊరి ప్రక్కన ప్రవహిస్తున్న ఏటి ఒడ్డుకు తమ్ముణ్ణి తోడ్కొని వెళ్ళాడు. ‘ఇలా చూడు’ అంటూ వెంటనే ఏటి నీళ్ళ మీద నడుచుకొంటూ అవతలి ఒడ్డుకు వెళ్ళి, తమ్ముణ్ణి ఉద్దేశిస్తూ, ‘ఇది చూశావా?’ అని ఎలుగెత్తి పిలిచాడు. అప్పుడు తమ్ముడు అరకాసు చెల్లించి పడవ మీద ఏటి అవతలి ఒడ్డును చేరి, అన్న వద్దకెళ్ళి, ‘నేను ఏమీ చూడలేదే?’ అని అన్నాడు. అందుకు అన్న, ‘ఏమీ చూడలేదా! నేనిప్పుడు ఏటి నీళ్ళ మీద నడిచి రావడం చూడలేదా?’ అని అడిగాడు. ఆ మాట విని తమ్ముడు నవ్వి, ఇలా అన్నాడు: ‘అన్నా! నేను అరకాసు చెల్లించి ఈ ఏటిని దాటి రావడం నువ్వు చూడలేదా? ఈ పన్నెండు సుదీర్ఘ సంవత్సరాలలో నువ్వు ప్రయాసలకోర్చి సాధించింది ఇదేనా? నేను కేవలం అరకాసుతో అలవోకగా సాధించింది నువ్వు పన్నెండేళ్ళు కష్టించి సాధించగలిగావు.’ తమ్ముడి మాటలతో అన్నలో చైతన్యం జాగృతమైంది. ఆ తరువాత అన్న భగవత్సాక్షాత్కార సాధనలో తన మనస్సును లగ్నం చేశాడు.”
17. సిద్ధులు అహంకారాన్ని పెంచుతాయి: ఏనుగు దృష్టాంతం
ఆధ్యాత్మిక ప్రపంచంతో పోల్చి చూసినప్పుడు అటువంటి యోగశక్తులను, సిద్ధులను గడించడం పరమ హేయం, నిరుపయోగం అనే విషయాన్ని శ్రీరామకృష్ణులు చిన్నచిన్న కథల మూలంగా ఎన్నో రీతుల మాకు బోధించేవారు. అటువంటి ఒక కథను ఈ సందర్భంలో ఉదహరించకుండా ఉండలేకపోతున్నాం. ఒకానొక యోగికి యోగసాధన మూలంగా వాక్శుద్ధి కలిగింది. ఎవరికి ఏం చెప్పినా అది జరిగి తీరేది. ఎవరినన్నా ‘చావు’ అనగానే ఆ వ్యక్తి ఠక్కున చచ్చిపోయేవాడు; ఆ చచ్చిపోయిన వ్యక్తినే ‘బ్రతుకు’ అనగానే పునర్జీవించేవాడు. ఇలా ఉండగా ఒక రోజు ఈ యోగి ప్రయాణంలో ఒక సాధువును కలుసుకోవడం తటస్థించింది. ఆ సాధువు సదా భగవన్నామం స్మరిస్తూ, భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండడం మన యోగి గమనించాడు. ఆ సాధువు కొన్నేళ్ళుగా అక్కడే ఉంటూ అలా తపస్సు చేస్తున్నాడని ఈ యోగికి తెలియవచ్చింది. అహంకారియైన ఈ యోగి ఆ సాధువును చూసి, “చాలకాలంగా నువ్వు భగవన్నామాన్ని స్మరిస్తూ ఉన్నావు కదా! అందు మూలంగా నీకేమన్నా లభించిందా, చెప్పు” అని అడిగాడు. అందుకు ఆ సాధువు వినమ్రంగా, “ఏం లభించాలని ఆశించాను కనుక? భగవత్సాక్షాత్కారం తప్ప నాకు మరే ఆకాంక్షా లేదు. ఆయన అనుగ్రహం లేకుండా భగవత్సాక్షాత్కారం లభించదు. అందుకే నేను ఆయనను ప్రార్థిస్తూ ఇక్కడ పడివున్నాను. ఈ దీనాతిదీనుడి పట్ల ఎప్పుడో ఒకప్పుడు జాలి వహించి తప్పకుండా నన్ను అనుగ్రహిస్తాడు” అని అన్నాడు. వెంటనే యోగి, “ఏమీ లభించకుంటే ఎందుకు ఈ వృధా ప్రయాస? మరేదైనా పొందడానికి పాటుపడు” అని అన్నాడు. ఆ సలహా విని, సాధువు కాసేపు మౌనం పాటించాడు. కాసేపయాక ఆ యోగిని, “సరేగాని, మహాశయా! మీకు ఏం లభించిందో నేను తెలుసుకోవచ్చా?” అని అడిగాడు. అందుకు ఆ యోగి, “దానికేం భాగ్యం, ఇదుగో ప్రత్యక్షంగా చూడు” అంటూ పక్కనే ఒక చెట్టు కింద కట్టబడి ఉన్న ఒక ఏనుగును చూసి, “ఓ ఏనుగూ, చావు” అని పలికాడు. తక్షణమే ఏనుగు చచ్చిపడిపోయింది. గర్వంగా ఆ యోగి, “చూశావా? నా ప్రతాపం? మళ్ళీ ఇది చూడు” అని అన్నాడు సాధువుతో. ఇలా అంటూ ఆ ఏనుగును ఉద్దేశించి, “ఓ ఏనుగూ! పునర్జీవించు!” అని పలికాడు. మరుక్షణమే ఆ ఏనుగు బ్రతికింది, మునుపటిలా లేచి నిలబడింది. అప్పుడు ఆ యోగి విజయోత్సాహంతో, “ఇప్పుడు చూశావు కదా!” అని అన్నాడు. అప్పటి దాకా ఆ సాధువు మౌనంగానే ఉండిపోయాడు. కాని ఇప్పుడు, యోగితో ఇలా అన్నాడు: “బాగానే ఉంది, ఏనుగు చచ్చిపోవడం, మళ్ళీ పునర్జీవించడం తప్ప నేను చూసిందేమిటి? కాని దీనివల్ల నువ్వు సాధించింది ఏమిటి? ఈ శక్తి మూలంగా నువ్వు జనన మరణాల బంధనం నుండి విముక్తి పొందగలిగావా? జరావ్యాధుల వాతబడకుండా తప్పించుకోగలిగావా? అఖండ సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుడి దర్శనం కలిగిందా?” ఆ పలుకులు విని మన యోగి నోట మాటరాలేదు. అతడిలో చైతన్యం జాగృతమైంది.
చంద్ర* , గిరిజులు ఇద్దరూ భైరవీ బ్రాహ్మణి తోడ్పాటుతో భగవన్మార్గంలో పురోగమించినప్పటికీ, వారు ఆ ప్రయత్నంలో పరిపూర్ణులు కాలేకపోయారు. శ్రీరామకృష్ణుల పావన సాంగత్యం పొందిన తదనంతరం అహంకారంలో వేళ్ళూనిన వారి అద్భుత శక్తులన్నీ నశించి, శ్రీరామకృష్ణులలో కలిసిపోయాయి. ఆ విధంగా వారిలో చైతన్యం జాగృతమై, ద్విగుణీకృత శక్త్యుత్సాహాలతో ఆ ఇద్దరూ భగవన్మార్గంలో పురోగమించారు.
18. బ్రాహ్మణికి నిర్వికల్ప అద్వైత సాక్షాత్కారం లభించకపోవడం
భైరవీ బ్రాహ్మణి సాధనపథంలో ఎంతో పురోగమించిందన్న విషయం నిజమే అయినా ఆమెకు ఇంకా అఖండ సచ్చిదానంద దర్శనం లభించలేదన్నది మనకు స్పష్టమౌతున్నది. వేదాంతం పేర్కొనే చరమ భూమియైన నిర్వికల్పావస్థను చేరుకొన్న తోతాపురి తన తీర్థయాత్ర పర్యటనలో మొదటిసారి దక్షిణేశ్వర కాళికాలయానికి వచ్చేటప్పటికే, భైరవీ బ్రాహ్మణి తోడ్పాటుతో శ్రీరామకృష్ణులు తంత్రసాధనలన్నిటినీ అనుష్ఠించి వాటిలో పరి పూర్ణత్వాన్ని సంతరించుకొని ఉన్నారు. శ్రీరామకృష్ణులను చూసిన క్షణంలోనే వేదాంత మార్గానికి అత్యుత్తమ అధికారిగా ఆయనను తోతాపురి గుర్తించి, సన్న్యాస దీక్షనిచ్చి, నిర్వికల్ప సమాధిని పొందే ఉపదేశం ఇవ్వసాగాడు. అప్పుడు శ్రీరామకృష్ణులను ఆ వేదాంతమార్గం అనుసరించకుండా నిరోధించడానికి భైరవీ బ్రాహ్మణి ఎంతో ప్రయత్నించింది. శ్రీరామకృష్ణులను, “నాయనా! అతణ్ణి (తోతాపురిని) తరచూ కలుసుకోవద్దు; అతడితో కలసిమెలసి ఉండవద్దు. అతడి మార్గం నిస్సారమైంది. అతడితో కలసిమెలసి వ్యవహరిస్తే నీ భగవత్ భక్తి, ప్రేమలు అడుగంటిపోతాయి” అని ఆమె హెచ్చరించింది. పండితురాలైన బ్రాహ్మణి భక్తిమార్గంలో అగ్రగణ్యురాలే అయినా, వేదాంతం పేర్కొన్న ఏ నిర్వికల్పావస్థను ఆమె నిస్సారమార్గం అని భావించిందో, అదే పరాభక్తిని పొందడానికి ప్రథమ సోపానం అని ఆమెకు అవగతం కాలేదు. పావన హృదయులూ, ఆత్మారాములూ, పరిపూర్ణ వాసనారహితులూ అయిన వ్యక్తులే భగవంతుణ్ణి నిస్వార్థంగా ప్రేమించగలరనీ, ఆయనపట్ల భక్తిప్రపత్తులు చెల్లించగలరనీ, శ్రీరామకృష్ణులు తరచూ బోధించే పరాభక్తీ, పరాజ్ఞానమూ ఒక్కటే అనే విషయమూ కలలో సైతం బ్రాహ్మణి ఊహించలేకపోయింది. బ్రాహ్మణి ఈ విషయం అర్థం చేసుకోలేదనే మేం భావిస్తున్నాం. ఆమెకు ఇది అర్థం కాకపోవడం చేతనే, శిరోముండనం చేయించుకొని, కాషాయాంబరాలు ధరించి, తోతాపురి నుండి సన్న్యాస దీక్ష పుచ్చుకొని, నిర్వికల్ప సమాధిని పొందే సాధనలో మగ్నులు కావడం – కన్నతల్లికి సైతం తెలియకుండా ఎలా గోప్యంగా ఉంచారో అలాగే బ్రాహ్మణికికూడ ఈ విషయాలు ఏవీ చెప్పకుండా చేశారని మేం ఊహిస్తున్నాం. శ్రీరామకృష్ణులు వేదాంత సాధనలు చేస్తూన్న కాలఘట్టంలో వృద్ధురాలైన ఆయన తల్లి కాళికాలయానికి ఉత్తరం వైపున ఉన్న నహబత్లో వసించేవారని మేం వినివున్నాం. వేదాంత సాధనలో మగ్నులైన శ్రీరామకృష్ణులు మూడు రోజులపాటు ఎవరికంటా పడకుండా ఒక గదిలో ఉండిపోయారు. ఒక్క తోతాపురి మాత్రమే అప్పుడప్పుడు ఆ గదిలోకి వెళ్ళి ఆయనను చూసివస్తూ ఉండేవాడు. కనుక బ్రాహ్మణి సలహాను శ్రీరామకృష్ణులు పెడచెవిన పెట్టారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
19. తంత్రాలలో పేర్కొన్న పశు, వీర, దివ్య భావాలు
శ్రీరామకృష్ణులు చెప్పిన విషయాలను బట్టి చూస్తే భైరవీ బ్రాహ్మణి తంత్రాలలో పేర్కొన్న వీరభావ సాధనలో నిష్ణాతురాలని తెలియవస్తున్నది. భగవత్సాక్షాత్కారార్థమై అనుష్ఠించే సాధనలను తంత్రశాస్త్రాలు పశుభావం, వీరభావం, దివ్యభావం అని మూడు కోవలుగా సూచిస్తున్నాయి. ఏ సాధకుడిలో కామ క్రోధాది ప్రవృత్తులు అధికంగా ఉంటాయో అతణ్ణి పశుభావ సాధకునిగా అభివర్ణిస్తారు. కనుక అతడు ప్రలోభం కలిగించే భోగ్యవిషయాల నుండి చాలా దూరంగా ఉంటూ బాహ్యశౌచం, బాహ్యాచారాల పట్ల అధిక శ్రద్ధవహిస్తూ, భగవన్నామ స్మరణలో మగ్నుడై సాధన చేయాలి. ఇక ఎవరిలో కామ క్రోధాది ప్రవృత్తుల కన్నా భగవద్భక్తి, ప్రేమలు అధికంగా ఉంటాయో అతణ్ణి వీరభావ సాధకుడిగా పరిగణిస్తారు. కామకాంచనాల, రూపరసాదుల ఆకర్షణలు ఇతడిలో భగవదనురాగాన్నే ఇనుమడింపచేస్తాయి. కాబట్టి ఇతడు కామకాంచనాల వంటి ప్రలోభ విషయాల మధ్యే వసిస్తూ, అవి కల్పించే క్రియ – ప్రతి క్రియలలో చలనరహితుడై ఉంటూ, భగవంతుడికే తను మనః ప్రాణాలను అర్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. భగవదనురాగమనే ఉద్ధృత ప్రవాహం ఎవరి మనస్సు నుండి కామ క్రోధాది పశుభావాలను శాశ్వతంగా ప్రక్షాళన చేసివేసిందో, ఎవరిలో క్షమ, ఆర్జవం, దయ, సంతుష్టి, సత్యం మొదలైన సద్గుణాలు ఉచ్ఛ్వాసనిశ్వాసాల మాదిరి స్వాభావికమై ఉంటాయో, అటువంటి సాధకుడు మాత్రమే దివ్యభావ సాధనకు అర్హుడౌతాడు. ఇదమిత్థంగా ఆ మూడు భావాలను పై రీతిలో నిర్వచించవచ్చు. వేదాంత మార్గంలో పేర్కొన్న ఉత్తమాధికారిని తంత్రోక్త దివ్యభావ సాధకునితో, మధ్యమాధికారిని వీరభావ సాధకునితో, అధమాధికారిని పశుభావ సాధకునితో పోల్చవచ్చు.
20. దివ్యభావ సాధనకు భైరవీ బ్రాహ్మణి ఇంకా అర్హురాలు కాకపోవడం
వీరభావ సాధనలో అగ్రగణ్యురాలైనప్పటికీ, అప్పటి వరకూ భైరవీ బ్రాహ్మణి దివ్యభావ సాధనకు అర్హురాలు కాలేదు. కాని శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష దృష్టాంతాన్ని చూసి, ఆయన తోడ్పాటుతో దివ్యభావ మార్గాన్ని అనుసరించాలనే ఆకాంక్ష క్రమంగా ఆమెలో జనించింది. దివ్యభావంలో నెలకొన్న వ్యక్తిలోని ఈ క్రింది అనుపమాన లక్షణాలను ఆమె శ్రీరామ కృష్ణులలో చూసింది: సిద్ధి లేక కారణం* అనే పదాలు విన్నమాత్రానే (అవి పుచ్చుకోవడం కాదు) జగత్కారణుడైన భగవంతుడితో ఐక్యమైపోతున్న భావనలో ఆయన మగ్నులైపోయేవారు. ఏ స్త్రీనైనా, పవిత్రురాలినిగాని లేదా పతితురాలిని గాని చూడగానే జగజ్జనని సృష్ఠి లీలా కారిణి, ఆనందదాయిని భావాలు ఆయన హృదయంలో స్ఫురించగా, ఒక పసిబిడ్డ వైఖరి ఆయనలో జనించేది. గాఢ నిద్రలో ఉన్నప్పటికీ బంగారం వంటి లోహాల స్పర్శ ఆయన చేతులను, ఇతర అంగాలను ముడుచుకుపోయేలా చేసేది. ప్రజ్జ్వరిల్లే దివ్యప్రేమాగ్ని అనే శ్రీరామకృష్ణుల సాంగత్యంలో ఎవరి హృదయంలో ఆ అగ్ని రగుల్కొనదు? అశాశ్వత విలువగల సంపద, అధికారం మొదలైన వాటిపట్ల ఎవరికి మాత్రం అనిష్టత కలుగదు? భగవంతుడొక్కడే తన శాశ్వత బంధువనీ, తన ప్రాణానికి ప్రాణం అనీ ఎవరికి అనిపించదు? బ్రాహ్మణి విషయంలోనూ అలాగే జరిగింది. కనుకనే అప్పటి నుండి ఆమె తన శేష జీవితాన్ని తీవ్ర తపశ్చర్యలలో గడిపింది.
21. పై విషయానికి ఋజువు
శ్రీరామకృష్ణులు మరెవరితోనైనా కలసిమెలసి మెలగినా లేదా మరే ఇతర సాధకుడి పట్లగాని లేక భక్తుని పట్లగాని అధిక మర్యాద చూపినా బ్రాహ్మణి అసూయ చెందేదని ఆయన ముఖతా మేం విని ఉన్నాం. ఒక కుటుంబంలో చిన్న బిడ్డడు ఒకడున్నాడనుకోండి. అతడి నాయనమ్మ అతణ్ణి పెంచి పెద్దచేసిందనుకోండి. ఆ బిడ్డడు పెద్దవాడయ్యాక ఇంట్లో ఇంకెవరిమీదనన్నా ఎక్కువ ఆదరణ కనబరిస్తే, మన ఈ నాయనమ్మ కడుపు మండదా? దుఃఖీంచదా? బ్రాహ్మణి మనోవైఖరి కూడ కచ్చితంగా అలాగే ఉండి ఉంటుంది. కాని భైరవీ బ్రాహ్మణివంటి సమున్నత స్థితిలోని సాధకురాలు ఈ రకంగా వ్యవహరించడం సముచితం కాదు. రేయింబవళ్ళు సుదీర్ఘకాలం శ్రీరామకృష్ణులను, ఆయన చర్యలను అతి సన్నిహితంగా ఉంటూ పరికించిన బ్రాహ్మణి, ఆయన కనబరిచే ప్రేమ, మర్యాద మొదలైనవి ఇతరుల మాదిరి క్షణికాలు కావన్న సంగతి స్వయంగా గ్రహించే ఉండాలి. ఆయన ఆమె పట్ల చూపించిన ప్రేమ, గౌరవమర్యాదలు స్థిరమైనవనీ, వాటిలో ఆటుపోటులు ఉండవనీ ఆమె తెలుసుకొనే ఉండాలి. కాని, అయ్యో! ఓ లౌకిక ప్రేమా, ఓ స్త్రీ మానసమా! మీరెప్పుడూ మీ ప్రేమాస్పదుని సదా బంధించి ‘మీ’ దానినిగా సొంతం చేసుకోవాలని కోరుకొంటారు. కించిత్తు అయినా స్వతంత్రతను మీ ప్రేమాస్పదునకు ఇవ్వగోరరు. రవ్వంత స్వతంత్రత ఇస్తే, ఆ పైన ఆతడు మీ వాడై ఉండడనీ, మీకంటే అధికంగా మరెవరినైనా ప్రేమిస్తాడనీ రూఢిగా మీరు భావిస్తారు. మీ మానసిక బలహీనతే మిమ్మల్ని అలా భావింపచేస్తుందన్న విషయం మీకు అవగతం కాదు. స్వేచ్ఛను ఇవ్వగోరని ప్రేమ ప్రేమ కాదనీ, తనను తాను మరిచిపోయి ప్రేమాస్పదుని స్వేచ్ఛలో ఆనందించడం నేర్చుకోని, నేర్చుకోగోరని ప్రేమ సత్వరమే ఇంకిపోతుందనీ మీరు గ్రహించలేకున్నారు. కనుక హృదయపూర్వకంగా మీ ప్రేమను మరెవరికైనా అర్పించగలిగితే, ఇక ఏ భయమూ ఉండదు. మీ ప్రేమాస్పదుడు ‘మీ’ వాడుగానే ఉండిపోతాడనీ, స్వార్థరహితమైన పవిత్ర ప్రేమ చివరకు మీకే కాక, మీ ప్రేమాస్పదునికి కూడ భగవద్దర్శనం సైతం కలిగిస్తుందనీ, సమస్త బంధనాల నుండి విముక్తిని కలిగిస్తుందనీ నిస్సందేహంగా విశ్వసించండి.
22. తన లోటుపాట్లను బ్రాహ్మణి గుర్తించడం
సమున్నత స్థితికి చెందిన సాధకురాలూ, పరమ భక్తురాలూ అయినప్పటికీ బ్రాహ్మణి ఈ చిన్న విషయాన్ని అర్ధం చేసుకోలేకపోవడం లేదా ఒకవేళ అర్ధం చేసుకొన్నా జీర్ణించు కోలేకపోవడం ఎంతో ఆశ్చర్యకరమైన సంగతే! ఆమెలో ఆ దృఢవిశ్వాసం లేకపోవడమే అందుకు హేతువు. భాగ్యవశాన శ్రీరామకృష్ణులకు ఆధ్యాత్మిక గురువుగా స్థానం లభించడంచేత, ‘నేను అందరికంటే గొప్ప దానిని, వాళ్ళంతా నా మాట శిరసావహించాలి, లేకపోతే వారికి కీడు వాటిల్లుతుంది’ అనే భావాలు క్రమంగా ఆమె మనస్సులో బలపడసాగాయి. మాతృదేవికి అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులు బోధించడంకూడ ఆమెకు గిట్టేది కాదని మేం విన్నాం. ఆమె పట్ల మాతృదేవి సదా సంకోచంతో, భయంతో మెలగేవారని వినివున్నాం; బ్రాహ్మణి ధోరణి చూసి మాతృదేవి తనలో తాను ముడుచుకుపోవడం కూడా కద్దు. చిట్టచివరకు శ్రీరామకృష్ణుల అనుగ్రహం వలన బ్రాహ్మణి తన మానసిక బలహీనతను అవగతం చేసుకొన్నది. అటువంటి పరిస్థితులలో ఆయనకు దూరంగా ఉంటే తన బలహీనతల నుంచి బయటపడగలనని ఆమె గుర్తించింది; శ్రీరామకృష్ణుల పట్ల తనకు ఉన్న ఆకర్షణ ఎంత ఉదాత్తమైనదైనప్పటికీ, అదీ ఒక బంగారు సంకెలే అనీ, దానిని తెంచుకొని తాను ఎన్నుకొన్న మార్గంలో పురోగమించాలనీ బ్రాహ్మణి గ్రహించింది. కాబట్టే చివరకు ఆమె దక్షిణేశ్వరాన్ని, శ్రీరామకృష్ణుల పావన సాంగత్యాన్ని విడిచిపెట్టి, ‘తిరిగే సాధువు, పారే నీరు ఎన్నటికీ మలినం కావు’* అని తెలుసుకొని, తీర్థ యాత్రలు చేస్తూ, తపశ్చర్యలు అనుష్ఠిస్తూ తన శేషజీవితాన్ని గడిపిందని మనం స్పష్టంగా గ్రహించవచ్చు. శ్రీరామకృష్ణుల ‘గురుభావ’ దోహదంతోనే బ్రాహ్మణిలో ఆ ఆధ్యాత్మిక జాగృతం జనించిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
23. తోతాపురి వృత్తాంతం
శ్రీరామకృష్ణులకు అద్వైత వేదాంతం బోధించిన తోతాపురి వృత్తాంతం పరికిద్దాం. తోతాపురి పొడవరి, దృఢశాలి. నలభై ఏళ్ళపాటు నిస్సంగుడై వసిస్తూ ధ్యానధారణలు అనుష్ఠించిన ఫలితంగా సంపూర్ణ వృత్తిరహితమైన నిర్వికల్ప సమాధిని పొందాడు. అయినప్పటికీ ఆయన నిత్యం చాలాసేపు ధ్యాన సమాధులలోనే గడిపేవాడు. పిల్లవాడిలా సదా దిగంబరుడై ఉండడంచేత శ్రీరామకృష్ణులు ఆయనను ల్యాంటా (లేదా న్యాంగ్టా) అని పేర్కొనేవారు. బహుశా తమ గురువుల పేరును పలుకరాదు లేదా గురువులను పేరుతో సంబోధించరాదు అనే ఉద్దేశంతోనే శ్రీరామకృష్ణులు ఆయనను అలా పేర్కొనేవారని తోస్తున్నది. న్యాంగ్టా ఎన్నడూ ఇంట్లో వసించేవాడు కాదనీ, నాగా సంప్రదాయానికి చెందిన వ్యక్తి కావడంతో అనవరతం అగ్నిని సేవిస్తూ ఉండేవాడనీ శ్రీరామకృష్ణులు చెప్పేవారు. నాగా సాధువులు అగ్నిని పరమ పవిత్రంగా భావిస్తారు. కాబట్టే ఎక్కడ ఉన్నప్పటికీ ఎండుకట్టెలు ప్రోగుచేసి సర్వదా అగ్నిని తమ పక్కన రగిలించి ఉంచుతారు. సాధారణంగా ఈ అగ్ని ‘ధుని’ అని పేర్కొనబడుతుంది.
నాగా సాధువులు ఉదయం, సాయంత్రం ఈ ధునికి హారతి అర్పిస్తారు; భిక్షగా లభించిన ఆహారాన్ని ధునికి నివేదించిన తరువాతే తాము స్వీకరిస్తారు. కనుకనే దక్షిణేశ్వరంలో నివసించినంత కాలం ‘న్యాంగ్టా’ పంచవటి క్రింద తన ఆసనాన్ని పరచి, పక్కనే ధునిని రగిలించి ఉంచుకొనేవాడు. ఎండలోగాని, వానలోగాని ఆ ధుని ఒకే రీతిలో మండుతూ ఉండేది. ఆ ధుని పక్కనే న్యాంగ్టా భుజించేవాడు, విశ్రాంతి తీసుకొనేవాడు. అర్ధరాత్రి నిశ్చింతగా తల్లి ఒడిలో నిద్రించే పసిబిడ్డలా బాహ్యప్రపంచం యావత్తు విశ్రాంతిదాయిని అయిన నిద్రాదేవి ఒడిలో ఆదమరచి నిద్రిస్తూన్న సమయంలో న్యాంగ్టా లేచి, ధునిని ప్రజ్వలింపచేసేవాడు. పిదప మేరుపర్వతంలా అచలుడై స్థిరంగా ఆసనం మీద కూర్చుని, గాలిలేని చోట చలించని దీప జ్వాలలా మనస్సును సంపూర్ణంగా వృత్తిరహితం చేసి సమాధిలో లయం చేసేవాడు. పగటివేళ కూడ చాలాసేపు ఆయన ధ్యానంలోనే గడిపేవాడు. కాని చూసేవారికి దానిని గురించి తెలిసేది కాదు. దుప్పటితో దేహాన్నంతా కప్పుకొని శవం మాదిరి నిటారుగా ధుని ప్రక్కనే పడుకొని ఆయన ధ్యానం చేసేవాడు. చూసేవారికి ఆయన ఎప్పుడూ పడుకొని ఉండడం కనిపించేది; ఆయన నిద్రపోతున్నాడని వారు అనుకొనేవారు.
24. తోతాపురి, శ్రీరామకృష్ణుల మధ్య జరిగిన సంభాషణలు
న్యాంగ్టా తన పక్కనే ఒక నీటి చెంబును, పొడవైన ఒక చిమ్టా* ను ఉంచుకొనేవాడు. కూర్చోడానికి ఒక చర్మాసనం ఆయన వద్ద ఉండేది; ఎప్పుడూ ఒక ముతక దుప్పటితో దేహాన్ని కప్పుకొని ఉండేవాడు. ప్రతి రోజూ ఆ చెంబును, చిమ్టాను ధగధగ మెరిసేటట్లు తోముతూ ఉండేవాడు. ప్రతి రోజు ఆయన ధ్యానం చేస్తూ ఉండడం చూసి, ఒక రోజు శ్రీరామకృష్ణులు సూటిగా, “బ్రహ్మజ్ఞానం పొంది సిద్ధులైన మీరు ఇంకా ప్రతి రోజూ ధ్యానం ఎందుకు చేస్తున్నారు?” అని న్యాంగ్టాను అడిగారు. న్యాంగ్టా ప్రశాంతంగా శ్రీరామకృష్ణులను చూస్తూ, వ్రేలితో నీటి చెంబును చూపుతూ, “అది ఎలా ధగధగ మెరుస్తూ ఉందో చూశావా? దీన్ని రోజూ తోమకపోతే మకిలిపట్టదా? మనస్సు కూడా అటువంటిదే అని తెలుసుకో. ధ్యానాభ్యాసంతో మనస్సును నిత్యం తోమి శుభ్రపరచకపోతే అదీ మలినమవుతుంది” అని అన్నాడు. అంతర్దృష్టి సంపన్నులైన శ్రీరామకృష్ణులు గురువు అభిప్రాయాన్ని అంగీకరించి, పిదప ఇలా అడిగారు: “ఈ నీళ్ళచెంబు బంగారు చెంబు అయిన పక్షంలో ఏం జరుగుతుంది? ప్రతి రోజూ తోమవలసిన అగత్యం ఉండదుగా?” అందుకు న్యాంగ్టా నవ్వి, “అవును, నిజమే” అంటూ శిష్యుని అభిప్రాయంతో ఏకీభవించాడు. నిత్యం ధ్యానం చేయడంలోని ప్రయోజనాన్ని గురించి చెప్పిన గురువు వచనాలను శ్రీరామకృష్ణులు జీవితాంతం జ్ఞాపకం పెట్టుకొన్నారు; అనేక సందర్భాలలో మాతో ఆ వచనాలను ఉదాహరించేవారు. అలాగే “బంగారు పాత్ర ఎన్నటికీ మకిలి పట్టదు” అన్న శ్రీరామకృష్ణుల వచనాలు, తోతాపురి మనస్సులో శాశ్వతంగా హత్తుకుపోయి ఉంటాయని మేం అభిప్రాయపడుతున్నాం. శ్రీరామకృష్ణుల మనస్సు బంగారు పాత్రలా ఉజ్వలమైనదని న్యాంగ్టా తప్పక విశ్వసించి ఉంటాడు. ఆ విధంగా మొదటినుండి గురు శిష్యుల మధ్య భావాల ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతూనే వచ్చింది.
25. బ్రహ్మజ్ఞానుల నిర్భయత్వం, బంధవిముక్తి
బ్రహ్మజ్ఞానం సిద్ధించగానే మనిషి పూర్తిగా నిర్భయుడవుతాడని వేదాంత శాస్త్రాలలో పేర్కొనబడి ఉంది. సంపూర్ణ భయరాహిత్యాన్ని పొందడానికి అదే ఏకైక మార్గం. ముమ్మాటికీ ఇది నిజం. ఎందుకంటే స్వయంగా తానే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుణ్ణనీ, అఖండ సచ్చిదానంద స్వరూపుణ్ణనీ, సర్వాంతర్యామిననీ, జరామృత్యురహితుణ్ణనీ, ఆత్మస్వరూపుణ్ణనీ అవగతం చేసుకొన్న వ్యక్తి మనస్సులో భయం ఎలా కలుగుతుంది? ఎవరి నుండి కలుగుతుంది? తాను ‘ఒక్కడు’ తప్ప ఈ ప్రపంచంలో మరే వస్తువుగాని, వ్యక్తిగాని లేడనే సత్యాన్ని నిజంగా సాక్షాత్కరించుకొన్న వ్యక్తికి, సర్వదా తన హృదయాంతరాళాలలో ఆ అనుభూతి కలిగే వ్యక్తికి, ఎలా ఎక్కడనుండి భయం కలుగుతుంది? తినడం, త్రాగడం, తిరగడం, కూర్చోవడం, పడుకోవడం, మేల్కోవడం – సర్వకాల సర్వావస్థలలోను తానే సచ్చిదానంద స్వరూపుడు; సర్వత్రా, సర్వకాలాలలో, అందరిలోనూ తానే పరిపూర్ణుడై ఉన్నాడు; తనకు నిద్రాహారాలు లేవు; జాగ్రదవస్థ లేదు; సుఖదుఃఖాలు లేవు; జనన మరణాలు లేవు; భూతభవిష్యత్తులు లేవు; పంచేంద్రియాల ద్వారా, మనోబుద్ధుల ద్వారా మనస్సు దేనిని చూస్తుందో, వింటుందో, ఊహించుకొంటుందో – అవేవీ లేవు. ఇటువంటి అనుభూతినే శాస్త్రాలు ‘నేతి, నేతి’ – ఇది కాదు, ఇది కాదు – అనే విచారణ యొక్క చివరి అనుభూతిగా అభివర్ణిస్తున్నాయి. దీని తరువాత కలిగే అనుభూతినే భగవంతుడి ప్రత్యక్ష సాక్షాత్కారం కలిగే స్థితి అని శాస్త్రాలు చెబుతున్నాయి. అనవరతం ఈ ఆత్మసాక్షాత్కారం పొంది ఉండే స్థితినే ‘జ్ఞానావస్థ’ అని పేర్కొంటారు. ఈ జ్ఞానావస్థకు చేరుకొన్నప్పుడు మాత్రమే బంధనాలన్నీ సంపూర్ణంగా తెగిపోతాయి. శ్రీరామకృష్ణులు ఇలా చెబుతూ ఉండేవారు: “ఈ జ్ఞానావస్థలో సంపూర్ణంగా నెలకొనగలిగినప్పుడు జీవుడి శరీరం ఇరవై ఒక్క రోజులు మాత్రమే నిలిచి, ఎండుటాకులా రాలిపోతుంది. ఆ జీవుడికి మళ్ళీ ఈ నిమ్నాహంకారం జనించనందున, అతడు మళ్ళీ ఈ లోకంలోకి ఎన్నడూ తిరిగి రాడు. జీవన్ముక్తులకు ఈ ‘జ్ఞానావస్థ’ అనుభూతి లేదా పరమాత్మతో సంపూర్ణ ఐక్యానుభవం ఏదో ఒకప్పుడు ఏ కొద్దికాలం మాత్రమే కలుగుతూ ఉండి, చివరికి అది పూర్తిగా ఆత్మదర్శనంలో అంతమవుతుంది. అలాగే ఈశ్వరకోటులైన నిత్యముక్తులు – (వీరు కర్మ జన్ములు కారు, కారణ జన్ములు* ) బహుజనుల హితం కోసం ఏదో ఒక మహత్ సత్యాన్ని చాటడానికే ఈ లోకంలోకి వచ్చేవారు – కూడా బాల్యం నుండే అప్పుడప్పుడు ఈ ‘జ్ఞానావస్థ’ ను అనుభవిస్తూ, ఏ కార్యనిర్వహణార్థం ఇక్కడ జన్మించారో ఆ కార్యం నిర్వర్తించాక సంపూర్ణంగా ఆ జ్ఞానావస్థను చేరి దానిలో లయమైపోతారు. మానవాళిని ఉద్ధరించడానికి భగవంతుడు మానవరూపం దాలుస్తాడు. అతడొక అత్యద్భుత శక్తిసంపన్నుడైన మానవుడన్న విషయాన్ని గురించి ప్రపంచం ఎప్పటి వరకూ అవగతం చేసుకోలేక తికమకపడుతూ ఉంటుందో, ఆ అవతార పురుషులు, కేవలం వారు మాత్రమే బాల్యం నుండే ఆ పరిపూర్ణ జ్ఞానావస్థకు ఇచ్ఛామాత్రంగా చేరుకొని దానిలో నెలకొని, మళ్ళీ జన్మ, జరామరణ సుఖ దుఃఖమయమైన ఈ మలిన సంసారంలోకి దిగివస్తూ ఉంటారు.”
26. తోతాపురి మహోన్నత అవస్థ
శ్రీరామకృష్ణుల శిక్షణా గురువులైన తోతాపురి యతీంద్రుడు నలభై ఏళ్ళు కఠోర తపస్సు చేసిన ఫలితంగా పైన వర్ణించిన ఆ జీవన్ముక్త అవస్థ పొందాడు. కనుకనే ఆయన ఆహార విహారాదులవంటి చేతలు సామాన్యులవంటివిగా ఉండవు. స్వేచ్ఛగా వీచే వాయువులా సకలబంధ వినిర్ముక్తుడై యథేచ్ఛగా ఆయన విహరించసాగాడు. వాయువులా ఈ సంసారపు గుణదోషాలు ఆయనను స్పర్శించలేకపోయేవి; వాయువులా ఆయన ఏ చోటా నిబద్ధుడై ఉండలేకపోయేవాడు. మూడు రోజులకంటే ఎక్కువ కాలం ఆయన ఎక్కడా బస చేసేవాడు కారని శ్రీరామకృష్ణుల ముఖతా మేం విన్నాం. కాని అద్భుతమైన శ్రీరామకృష్ణుల దివ్యాకర్షణ కారణంగా తోతాపురి పదకొండు నెలలపాటు అవిచ్ఛిన్నంగా దక్షిణేశ్వరంలో వసించాడు. ఆహా! మంత్రముగ్ధులను చేసే శ్రీరామకృష్ణుల ఆకర్షణ ఎలాంటిదో కదా!
27. తోతాపురి నిర్భయత్వం
తొతాపురి భయరాహిత్యాన్ని గూర్చి శ్రీరామకృష్ణులు మాకు ఎన్నో విషయాలు చెప్పారు. వాటిలో భూతం గురించిన విచిత్ర సంఘటన ఒకటి. ఒక రోజు అర్ధరాత్రి తోతాపురి ధునిని మరింత ప్రజ్వలింప చేసి ధ్యానానికి కూర్చోబోతున్నాడు. చుట్టూ నిశ్శబ్దం ఆవరించి ఉంది. కీచురాళ్ళ రోద, ఆలయ గోపుర రంధ్రాలలో వసించే గుడ్లగూబల అరుపులు తప్ప మరే శబ్దమూ చెవులను సోకడం లేదు. హఠాత్తుగా పంచవటి చెట్ల కొమ్మలు అల్లల్లాడాయి; పొడవైన ఒక మానవాకృతి చెట్ల మీద నుండి నేలమీదకు దిగింది. తదేక దృష్టితో తోతాపురిని పరికిస్తూ నెమ్మదిగా అడుగులు వేస్తూ ధుని వద్దకొచ్చి అక్కడ కూర్చుంది. తన మాదిరే దిగంబరంగా ఉన్న ఆ వ్యక్తిని చూసి, ఆశ్చర్యపోయి, “నువ్వెవరు?” అని తోతాపురి అడిగాడు. అందుకు ఆ వ్యక్తి, “నేనొక భైరవుణ్ణి. ఈ పవిత్ర ప్రదేశాన్ని పరిరక్షించడానికి నేను ఆ చెట్టుమీద నివసిస్తున్నాను” అని జవాబు చెప్పాడు. తోతాపురి ఏమాత్రం భయపడక, “మంచిది. నువ్వూ, నేనూ ఒక్కరమే; నువ్వూ బ్రహ్మం యొక్క అభివ్యక్తీకరణవే, నేనూ బ్రహ్మం యొక్క అభివ్యక్తీకరణనే. రా! కూర్చుని ధ్యానించు” అని అన్నాడు. ఆ వ్యక్తి నవ్వి, గాలిలో అదృశ్యుడైపోయాడు. ఈ సంఘటనకు తోతాపురి ఏమాత్రం చలించలేదు; తన మనస్సును ధ్యానంలో లగ్నంచేశాడు. మర్నాటి ఉదయం ఈ సంఘటనను శ్రీరామకృష్ణులకు తెలిపాడు. అది విని శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “అవును, అది నిజం. అతడు ఇక్కడే నివసిస్తున్నాడు. చాలాసార్లు నేను అతణ్ణి చూశాను. భవిష్యత్తులో జరుగబోయే సంఘటనలను గురించి అతడు కొన్ని సందర్భాలలో నాతో చెప్పాడు కూడ. ఒక సందర్భంలో కంపెనీ (అప్పటి భారత ప్రభుత్వం) ఈ పంచవటి స్థలాన్ని అంతా స్వాధీనం చేసుకొని ఒక మందుగుండు కార్ఖానా స్థాపించడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నం గురించి విని నేను ఎంతో ఆందోళన చెందాను; ఈ లౌకిక కోలాహలం నుండి దూరంగా ఈ నిర్జన ప్రశాంత స్థలంలో కూర్చుని తల్లిని ప్రార్థించే ఆస్కారం ఇక లభించదేమో అని వ్యథ చెందాను. ఈ స్థలం స్వాధీనం చేసుకోకుండా రాణీ రాస్మణి తరపున ప్రభుత్వంమీద మథుర్ ఒక వ్యాజ్యెం వేశాడు. ఆ కాలఘట్టంలో ఒక చెట్టుమీద కూర్చుని ఉన్న భైరవుణ్ణి నేను చూశాను. కంపెనీ, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోలేదనీ, వ్యాజ్యెంలో పరాజయం పొందుతుందనీ ఒక సంజ్ఞతో అతడు నాకు తెలిపాడు. నిజానికి అలాగే జరిగింది.”
28. తోతాపురి గురువుల వృత్తాంతం
భారతదేశ వాయవ్య ప్రాంతంలో కచ్చితంగా ఎక్కడ తోతాపురి జన్మించారో అన్న విషయం మేం శ్రీరామకృష్ణుల నుండి విన్నది లేదు. ఈ విషయం గురించి ఆయనను అడగవలసిన అవసరం లేదని బహుశా శ్రీరామకృష్ణులు భావించి వుండవచ్చు. సాధారణంగా తమ పుట్టుపూర్వోత్తరాల గురించి సన్న్యాసులు చెప్ప ఇష్టపడరు. ‘అటువంటి ప్రశ్నలను సన్న్యాసులను అడగడంగాని, ఒకవేళ అడిగినా వారు అందుకు సమాధానం చెప్పడంగాని శాస్త్ర నిషేధం’ అని వారంటారు. అందువలననే బహుశా శ్రీరామకృష్ణులు, తోతాపురిని ఆ ప్రశ్న అడగలేదేమో! కాని శ్రీరామకృష్ణుల నిర్యాణానంతరం బేలూరు మఠంలోని ఆయన సన్న్యాస శిష్యులు భారతదేశ వాయవ్య భాగంలో పరివ్రాజకులుగా సంచరిస్తున్నప్పుడు అక్కడ వసించే వృద్ధసన్న్యాసులను ప్రశ్నించి తోతాపురి బహుశా పంజాబులో ఏదో ఒక చోటగాని లేదా పంజాబు సమీపంలోగాని జన్మించి ఉండవచ్చునని తెలుసుకొన్నారు. తోతాపురి గురువుగారి మఠం కురుక్షేత్రానికి* సమీపంలోని లూథియానాలో ఉండేది. ఆయన గురువు సుప్రసిద్ధుడైన ఒక యోగిపుంగవుడు. అక్కడే ఒక మఠం స్థాపించబడి ఉంది. తోతాపురి గురువుగారే స్వయంగా ఆ మఠాన్ని స్థాపించారో లేక ఆయన గురుపరంపరలో మరెవరైనా స్థాపించారో తెలియరావడం లేదు. కాని తోతాపురి గురువుగారు మాత్రం ఆ మఠానికి అధిపతులై (మహంత) ఉండేవారు. ఆయన గౌరవార్థం చుట్టుపక్కల గ్రామాల నుండి అనేకులు సమావేశమై ఏటేటా ఆ మఠంలో ఉత్సవం జరుపుకోవడమే ఇందుకు కారణం. తోతాపురి గురువు పొగాకు త్రాగేవారు. అందువలన ఈ ఉత్సవ సందర్భంలో జనులు పొగాకు తెచ్చి మఠం వారికి కానుకగా ఇవ్వడం పరిపాటి. గురువుల నిర్యాణానంతరం తోతాపురిగారే ఈ మఠాధిపతిగా ప్రతిష్ఠితులయ్యారు.
29. తమ సన్న్యాస సంఘం గురించి తోతాపురి చెప్పిన విషయాలు
స్వయంగా తోతాపురి చెప్పిన మాటలను బట్టి సన్న్యాసి మండలికి అధిపతులైన తమ గురువుగారి వద్దే బాల్యం నుండి ఆయన వేదాంతం అధ్యయనం చేశారని తెలియవస్తున్నది. చాలాకాలం గురువుల వద్దే నివసించి శాస్త్రాధ్యయనం చేస్తూ, సాధనలు అభ్యసించారు. ఆ మఠంలో దాదాపు ఏడు వందల మందిదాకా సన్న్యాసులు ఉండేవారనీ, గురువుల ఆదేశానుసారం వేదాంతంలో నిహితమై ఉన్న సత్యాలను జీవితంలో సాక్షాత్కరింప చేసుకోవడం కోసం వారందరూ నిత్యం ధ్యానాది ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తూ ఉండేవారని శ్రీరామకృష్ణులకు, తోతాపురి తెలిపి ఉన్నారు. వారి మఠంలో నేర్పే ధ్యానాది సాధనల విచిత్ర పద్ధతిని గురించి ఆయన శ్రీరామకృష్ణులకు చూచాయగా తెలిపారు కూడ. మా ఉపదేశార్థం శ్రీరామకృష్ణులు ఆ విషయం గురించి పలు సందర్భాలలో ప్రస్తావించారు. ఆయన ఇలా చెప్పేవారు: “తమ మఠంలో ఏడు వందల మంది సాధకులు ఉండేవారని ఆయన (న్యాంగ్టా) చెప్పేవారు. ధ్యానం నేర్చుకొనే ప్రారంభ దశలోని వారిని మెత్తని ఆసనం మీద కూర్చుని ధ్యానం అభ్యసించమనేవారు; ఎందుకంటే గట్టి ఆసనం మీద కూర్చుని ధ్యానంచేస్తే వారికి కాళ్ళు నొప్పిపుట్టి, అలవాటులేని వారి మనస్సులు భగవంతుణ్ణి తలచుకోవడానికి బదులుగా తమ దేహాలను గురించి తలచుకోవడం జరుగుతుంది కనుక. ఆ తరువాత ధ్యానం ప్రగాఢమయ్యేకొద్దీ గట్టి ఆసనాల మీద కూర్చుని ధ్యానం అభ్యాసం చేయమనేవారు. చివరకు వారు ఒక చర్మాసనం మీదనో లేక కటిక నేల మీదనో కూర్చుని ధ్యానం చేయవలసి ఉండేది. దైనందిన జీవితంలో ప్రతి విషయంలోను వారు కఠిన నియమాలను పాటించవలసి ఉండేది. వస్త్రధారణ విషయానికి వస్తే, శిష్యులు క్రమంగా దిగంబరులుగా ఉండిపోవడానికి అభ్యాసం చేయవలసి ఉండేది. సిగ్గు, ద్వేషం, కులం, వంశం, పదవి మొదలైన ఎనిమిది పాశాలతో మనిషి బంధితుడై ఉంటాడు. ఒక్కటొక్కటిగా ఆ అష్టపాశాలను త్రెంచుకొనే విధానం మఠవాసులకు నేర్పేవారు. మనోఏకాగ్రతను సంతరించుకొన్న పిదప వారు మొదట్లో ఇతర సన్న్యాసులతో కలిసీ, ఆ తరువాత ఒంటరిగానూ తీర్థయాత్రలు చేయడానికి వెళ్ళవలసి వచ్చేది. ఈ దిగంబర సన్న్యాసులకు ఇటువంటి నియమాలు ఉండేవి.”
ఆ సన్న్యాసి మండలి తమ అధ్యక్షుణ్ణి (మహంత) ఎన్నుకొనే వారని తోతాపురి, శ్రీరామకృష్ణులకు తెలిపారు. ఒక రోజు శ్రీరామకృష్ణులు మాటల సందర్భంలో మాతో ఇలా చెప్పారు: “మహంత పదవి ఖాళీ అయినప్పుడు, దిగంబరులలో నిజానికి ఎవరు పరమహంస స్థితిని సంతరించుకొని ఉన్నారో, వారిని దిగంబరులందరూ ఏకగ్రీవంగా మహంతగా ఎంపిక చేసుకొనేవారు. ఎన్నుకోబడిన వ్యక్తి పరమహంస కాని పక్షంలో అంత ధనాన్ని, గౌరవాన్ని, అధికారాన్ని చూసి తన ప్రతిజ్ఞలకు భంగం వాటిల్లకుండా వ్యవహరించ గలుగుతాడా? అతడి తల తిరిగిపోదూ! కనుకనే ధనాసక్తిరహితుడైన వ్యక్తినే మహంత స్థానంలో ఆసీనుణ్ణి చేస్తారు. ఆ వ్యక్తి అపార ధనం, ఆస్తిపాస్తుల బాధ్యత వహించాల్సి ఉంటుంది. అటువంటి వ్యక్తి మాత్రమే ఆ సంపదను భగవత్సేవలో, సాధుసన్న్యాసుల సేవలో సద్వినియోగం చేయగలుగుతాడు.”
30. తోతాపురి పుట్టుపూర్వోత్తరాలు
చిన్నతనం నుండీ మాయామోహాలతో, ఈర్ష్యాద్వేషాలతో కూడుకున్న ఈ సంసారానికి సుదూరంలో ఉన్న ఒక స్వర్గసీమలో గురువుల ప్రేమవాత్సల్యాల పరిపోషణలో పెరిగి పెద్ద వాడయ్యాడనే విషయం తోతాపురి స్వయంగా చేప్పిన మాటల నుండి స్పష్టమౌతున్నది. వాయవ్య భారతదేశంలో ఒక సంప్రదాయం ఉండేది. దంపతులకు చాలాకాలం వరకు సంతానం కలగనప్పుడు, తమకు జనించబోయే మగబిడ్డను భగవత్సేవార్థం సన్న్యాసిగా చేస్తామని మ్రొక్కుకొనేవారు. ఆ మ్రొక్కును తప్పక వారు చెల్లించేవారు. తోతాపురి కూడ ఆ విధంగానే గురువులకు సమర్పింపబడ్డాడేమో ఎవరికెరుక? తమ పూర్వాశ్రమ జీవితం గురించీ, తల్లితండ్రులు, సోదరీ సోదరులను గురించీ ఆయన ఎన్నడూ ప్రస్తావించకపోవడం చూసినప్పుడు, అలాగే జరిగి ఉంటుందని ఊహించవచ్చు.
31. తోతాపురి మానసం
పూర్వజన్మలో చేసిన బహుపుణ్య ఫలితంగా తోతాపురి మనస్సు కూడ అత్యంత సరళత్వాన్నీ, శ్రద్ధావిశ్వాసాలనూ సంతరించుకొన్నది. “మానవ జన్మ, మోక్షేచ్ఛ, మహనీయుల సాంగత్యం – ఈ మూడు లభించడం ఎంతో దుర్లభం. ఒక్క భగవత్కృపతో తప్ప అవి లభించవు”* అని శంకరాచార్యులు వక్కాణిస్తున్నారు. మహా భాగ్యవశాన తోతాపురి ఈ మూడింటిని ఒకేసారి పొందడమే గాక, తనకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మానవ జీవిత పరమ పురుషార్థమైన ముక్తిని సైతం పొందాడు. గురువుల ఉపదేశాలను చక్కగా జీర్ణించుకొని, వాటిని యథాతథంగా సదా ఆచరణలోకూడ చూపాడు. మనస్సు కల్పించే భ్రాంతి నుండి, వంచన నుండి ఆయన ఎక్కువగా బాధపడినట్లు కనిపించడం లేదు. వైష్ణవులలో ఒక సూక్తి ఉంది: “గురువు, భగవంతుడు, భక్తులు – ఈ ముగ్గురి అనుగ్రహం లభించినా ‘ఒక్కదాని’ దయలేకపోవడం వలన జీవుడు దుర్గతిపాలైనాడు.”* ‘ఒక్కదాని’ అంటే తన మనస్సు అని అర్థం. మనస్సు దయలేకపోవడం వలన మనిషి సర్వనాశనమైపోతాడు. అటువంటి ధూర్తమైన మనస్సు వాతబడి తోతాపురి బాధపడినట్లు అనిపించడం లేదు. సరళమైన ఆయన మనస్సు భగవంతుని పట్ల ప్రగాఢ విశ్వాసం ఉంచి, గురువులు నిర్దేశించిన గమ్యం వైపు క్రమంగా పురోగమించింది. అలా పయనిస్తూ పాప – ప్రలోభాలతో నిండిన ఈ సంసారం వైపుగా తనివి తీరని దృష్టితో ఒక్కసారైనా వెనుదిరిగి చూసి ఎరుగదు. కాబట్టే ప్రయత్నం, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో దేనినైనా సాధించవచ్చు అని తోతాపురి విశ్వసించాడు; ఆహా! మనస్సు కించిత్తు ఎదురు తిరిగి కూర్చుంటే ఆ ప్రయత్నమంతా మహాప్రవాహంలో కొట్టుకొనిపోయే గడ్డివామిలా కొట్టుకుపోతుంది. ఆ ఆత్మవిశ్వాసం, ఆ ఆత్మనిర్భరత్వానికి బదులుగా తన శక్తి మీద తనకు ఉన్న నమ్మకం ఎగిరిపోతుంది, పురుగుకంటే తనను బలహీనుణ్ణి చేసివేస్తుంది; ఈ విషయం పాపం ఆయన గ్రహించలేకపోయాడు. తన జీవిత పరిస్థితులు స్వతస్సిద్ధంగా తన ఆధ్యాత్మిక పురోగతికి సానుకూలంగా ఉండడం వలన, అటువంటి సానుకూల పరిస్థితి భగవత్కృప వలననే సుసాధ్యమౌతుందని ఆయన నమ్మి ఎరుగడు; ఆ భగవత్కృప లుప్తమైతే, మానవ ప్రయత్నాలన్నీ తద్విరుద్ధ ఫలాలను ఒసగడమే కాక అతణ్ణి భవబంధనాలలో చిక్కుకునేటట్టు చేస్తాయని ఆయన కలలోకూడ ఊహించలేకపోయాడు. ఆయన ఎందుకు అలా ఆలోచించ లేకపోయాడు? జీవితాంతం ఎప్పుడు ఏది సాధింప తలచాడో దానిని ఆయన చేయగలగడమే అందుకు కారణం. మానవ శ్రేయస్సుకు ఏది మంచిదని తలచాడో, దానినంతా ఆయన కార్యరూపంలో అనుష్ఠించ గలిగాడు. కనుకనే, ‘అసాధ్యం అని తెలిసినా విడువలేని’ విపరీతావస్థ ఒకటి మనిషికి కలుగుతుందని ఆయన ఊహించి ఉంటాడనడం కూడ సందేహాస్పదమే. తన ‘పలుకులు (చేష్టలు) తలపులకు అనుగుణంగా’ చేయజాలని అసమర్థుడై వేయి తేళ్ళు కుట్టుతున్న బాధను సదా లోలోపల అనుభవిస్తూ ఉంటాడనీ, అతడి మనస్సులోని వేయి ఆలోచనలు, వేయి అధికారుల పెత్తనం చలాయిస్తాయనీ, అతడి ఇంద్రియాలు తిరగబడి అతణ్ణి అధః పతనం చేయడానికి శతధా ప్రయత్నిస్తూంటాయనీ, అతణ్ణి నిరాశాంధకారంలో ముంచివేసి అంతులేని ఆవేదనల పాల్పడ చేస్తాయనీ, తోతాపురికి ఊహలోసైతం గోచరించి ఉంటాయనడం సందేహమే. ఒకవేళ ఊహించగలిగినా ఊహకూ, యథార్థానికీ హస్తిమశకాంతరం ఉంటుంది. అదే విధంగా ఆయన మనస్సులోని మనిషి పై అవస్థను గురించిన ఊహాచిత్రానికీ, వాస్తవంగా పైన వర్ణించిన నిరంతర బాధతో సతమతమౌతున్న వ్యక్తి మానసిక చిత్రానికీ మధ్య ఆకాశ పాతాళాలకున్నంత వ్యత్యాసం ఉంటుంది. కాబట్టే పరమేశ్వరుని శక్తియైన అనాది అవిద్యను గురించీ, దురంత ప్రభావశాలినియైన మహామాయా ప్రభావాన్ని గురించీ తోతాపురి పూర్తిగా అజ్ఞానంలోనే ఉండిపోయాడు. కనుకనే దుర్బలమైన మనిషి మనోదుష్కర్మలను ఆయన కఠోర తిరస్కార దృష్టితో తప్ప కారుణ్యంతో ఏనాడైనా చూడగలిగాడా అనే విషయమూ సందేహాస్పదమే. కాని శ్రీరామకృష్ణుల గురుభావ ప్రభావంతో ఆయనలోని ఆ లోపం తొలగిపోయింది. శ్రీరామకృష్ణుల సాంగత్యానుభవంతో చివరకు తోతాపురి భగవంతుని మాయాశక్తిని గుర్తించగలిగాడు, బ్రహ్మం బ్రహ్మశక్తుల అభేదం గ్రహించగలిగాడు. ఈ పాఠం నేర్చుకొని భక్తిపూర్ణ హృదయంతో జగజ్జననికి తల ఒగ్గి, దక్షిణేశ్వరం విడిచి వెళ్ళిపోయాడు. ఆ సంఘటనలను మేము ఇప్పుడు వివరించబోతున్నాం.
32. భక్తిమార్గం గురించి తోతాపురి అజ్ఞత
భైరవీ బ్రాహ్మణి, శ్రీరామకృష్ణులకు చెప్పినట్లు ఆజన్మ బ్రహ్మచారీ, పరమ వైరాగ్య సంపన్నుడూ అయిన తోతాపురికి నిజంగానే భక్తిమార్గం ఒక విడ్డూరం గానే కనిపించేది. భక్తి ప్రేమలన్నవి తన ప్రియతముని కోసం మనిషిని ప్రాపంచిక వస్తువులనన్నిటినీ ఆత్మతృప్తితో సైతం క్రమంగా పరిత్యజింప నేర్చి చివరకు భగవత్సాక్షాత్కారం కలిగిస్తాయనీ తోతాపురి గ్రహించలేకపోయాడు; నిజమైన భక్తిమార్గ సాధకుడు భక్తి పరాకాష్ఠను చేరినప్పుడు శుద్ధ–అద్వైత జ్ఞానానికి అధికారి అవుతాడని, అంటే బ్రహ్మజ్ఞానం సంతరించుకొంటాడని (పరమప్రేమ, పరమ జ్ఞానం ఒక్కటే అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు) ఆయన తెలుసుకోలేకపోయాడు; కనుక భక్తిప్రేమలకు దోహదం చేసే నామజపం, సంకీర్తనం, భజనలు ఉపేక్షింపదగినవి కావనే విషయం తోతాపురి అర్థం చేసుకోలేకపోయాడు. ఆ కారణం చేతనే భక్తిపారవశ్య ప్రభావంలో భక్తులు ఒనరించే చేష్టలను అప్పుడప్పుడు ఆయన ఎగతాళి చేయడం కూడ కద్దు. దీని నుండి పాఠకులు తోతాపురి ఒక రకమైన నాస్తికుడనిగాని లేదా భగవద్భక్తి లేనివాడనిగాని అపార్థం చేసు కోకూడదు. శమదమాది సాధన సంపత్తిని సముపార్జించి, శాంత స్వభావ సంపన్నుడైన తోతాపురి భక్తిభావంలోని ‘శాంత’ భావ సాధకుడు. కనుక ఆయన ఇతరులలోని ‘శాంత’ భక్తిని మాత్రమే అవగతం చేసుకోగలిగేవాడు. అయినా భక్తిమార్గంలో ఇంకా ఇతర భావాలు ఉంటాయనీ, జగత్కారణుడూ అనంతుడూ అయిన భగవంతుణ్ణి యజమానిగా, ప్రియమిత్రునిగా, పుత్రునిగా, స్త్రీస్వరూపునిగా (జగజ్జననిగా) లేదా ప్రాణప్రియుడైన భర్తగా – ఇలా ఎన్నో భావాల ద్వారా భజించి సాధకుడు అదే వేగంతో ఆయనను పొందగలడనే విషయం తోతాపురి బుర్రలో ఏనాడు జొరబడలేదు. భక్తిభావ ప్రభావంలో భక్తుని నిర్బంధపూర్వకమైన భగవత్ ప్రార్థనలు, ఆయనతోడి విరహం, ఆయన పట్ల వ్యాకులత, అభిమానం, అహంకారం వ్యక్తం చేయడం మొదలైనవి, అణచుకోలేని దివ్యభావ ప్రభావంలో భక్తుడు నవ్వడం, ఏడ్వడం మొదలైన చేష్టలను తోతాపురి వెర్రివాడి వికార చేష్టలుగా పరిగణించేవాడు. యోగ్యుడైన భక్తుడు దాస్య, సఖ్య, మధురాది వివిధ భావాల తోడ్పాటుతో సత్వరమే తన గమ్యాన్ని చేరుకోగలడనే వాస్తవాన్ని ఆ కఠోర సన్న్యాసి గ్రహించలేకపోయాడు. కాబట్టే బ్రహ్మశక్తి అయిన జగజ్జననికి పరిపూర్ణ హృదయంతో భక్తి సలపడం, తద్ద్వారా బహిర్గతమయ్యే విశృంఖల భావోద్వేగాల గురించి గురుశిష్యులైన తోతాపురి–శ్రీరామకృష్ణుల మధ్య అనేక సందర్భాలలో ప్రేమాస్పద వివాదాలు చెలరేగడం కద్దు.
33. అందుకు నిదర్శనాలు
చిన్నతనం నుండి శ్రీరామకృష్ణులకు ఒక అలవాటు ఉండేది. రోజూ ఉదయం, సాయంకాలం చప్పట్లు చరుస్తూ, ఒక్కో సందర్భంలో భావోన్మత్తులై నృత్యం చేస్తూ, ‘హరి బోల్, హరి బోల్’, ‘హరియే గురువు, గురువే హరి’, ‘శ్రీహరే నా ప్రాణం, గోవిందుడే నా జీవనం’, ‘మన్ కృష్ణుడు, ప్రాణ్ కృష్ణుడు, జ్ఞాన్ కృష్ణుడు, ధ్యాన్ కృష్ణుడు, వివేక్ కృష్ణుడు, బుద్ధి కృష్ణుడు’, ‘విశ్వం నువ్వే, నీలోనే విశ్వం’, ‘నేను యంత్రాన్ని – నువ్వు యంత్ర చోదకుడవు’ – ఇలా బిగ్గరగా పలుకుతూ ప్రార్థించేవారు. నిర్వికల్ప సమాధిస్థితి పొంది బ్రహ్మజ్ఞానంలో సుప్రతిష్ఠితులైన తదనంతరం కూడ నిత్యం ఆయన అలాగే చేస్తూవుండేవారు. ఒక రోజు మధ్యాహ్నం తోతాపురి వద్ద కూర్చుని వివిధ ఆధ్యాత్మిక విషయాల గురించి ఎంతోసేపు సంభాషించసాగారు. ఇంతలో సంధ్యాసమయం కావడంతో ఆయన సంభాషణ కట్టిపెట్టి తమ అలవాటు ప్రకారం చప్పట్లు చరుస్తూ భగవంతుని గుణనామ కీర్తన ప్రారంభించారు. శ్రీరామకృష్ణులు అలా చేయడం చూసి తోతాపురి విస్తుబోయాడు. ‘వేదాంత సాధనకు అత్యుత్తమాధికారి కావడం వలన కేవలం మూడు రోజులలోనే నిర్వికల్ప సమాధిని పొందగలిగిన వ్యక్తి, ఆధ్యాత్మిక పురోగతిలో అట్టడుగు దశలో ఉన్న సాధకుని మాదిరి ఇలా చప్పట్లు చరుస్తూ నామస్మరణ చేయడం ఎందుకో?’ అని తోతాపురి విస్మయుడయ్యాడు. తన తలంపును ఆయన వ్యంగ్యంగా, “అరే, రొట్టెలు ఒత్తుతున్నా వేమిటి?” అంటూ వ్యక్తంచేశాడు. భారతదేశ వాయవ్య ప్రాంతంలోని జనులు గోధుమ పిండిని చేతిలోకి తీసుకొని చేతులతోనే చప్పట్లలా చరుస్తూ అప్పడం మాదిరిగా రొట్టెలు ఒత్తుతారు. ఆ ప్రక్రియను సూచిస్తూ ఈ రకమైన భక్తిసాధనను తోతాపురి పరిహాసం చేశాడు. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, “ఎంత అవివేకం! నేను భగవన్నామ స్మరణ చేస్తూవుంటే, రొట్టెలు చేస్తున్నానంటారేమిటి?” అని అన్నారు. సూటియైన, సరళమైన శ్రీరామకృష్ణుల ఈ జవాబు విని తోతాపురి కూడ నవ్వాడు. కాని ఆయన ఈ చర్య అర్థ రహితమైనది కాదనీ, దాని వెనుక ఉన్న నిగూఢార్థం తనకు స్పష్టం కాలేదనీ తోతాపురి గ్రహించాడు. ఆయనకు అవగతం కాని విషయం మీద వ్యాఖ్యానించడం సబబు కాదు.
34. తోతాపురి క్రోధాన్ని విడిచిపెట్టడానికి దారితీసిన సంఘటన
శ్రీరామకృష్ణులు మరో సందర్భంలో తోతాపురి ధుని పక్కన కూర్చుని ఉన్నారు. భగవత్ప్రసంగంలో మునిగిపోయి ఉన్న ఆ గురుశిష్యులిద్దరి మనస్సులు అత్యున్నత స్థితిని అధిరోహించి, అద్వైత జ్ఞానంలో సంలీనం కాబోతున్నాయి. పక్కనే ప్రజ్వలిస్తూన్న ధుని అగ్నిరూపంలో ఉన్న ఆత్మ వారి ఇద్దరి ఆత్మలతో ఐక్యం చెందినదో అన్నట్లుగా వేయి నాల్కలతో ఆ అగ్ని తన సంతోషాన్ని వ్యక్తం చేయసాగింది. ఆ సమయంలో పొగత్రాగ గోరిన తోటమాలి ఒకడు హుక్కాను అంటించడం కోసం నెగడు నుండి నిప్పుకణికను తీసుకోవడానికి అక్కడకు వచ్చాడు. శ్రీరామకృష్ణులతో సంభాషణలో మునిగిపోయి, బ్రహ్మానందానుభూతిని ఆస్వాదిస్తూ వున్న తోతాపురి, తోటమాలి అక్కడకు రావడం, నిప్పుకణికను తీసుకొనిపోవడం గమనించలేదు. కాని అతడు పోతున్నప్పుడు అకస్మాత్తుగా ఆయన దృష్టి అతడి మీదకు మరలింది. జరిగిన విషయం గ్రహించి ఎంతో చికాకు, కోపం ముప్పిరిగొనగా అతణ్ణి తిడుతూ, తన చిమ్టాతో ఒకటి రెండు దెబ్బలు కొట్టేటట్లు బెదిరించారు. ఎందుకంటే నాగా సంప్రదాయ సాధువులు ధునిని పూజిస్తారు, మహాగౌరవంగా చూసుకొంటారని మునుపే చెప్పి ఉన్నాం కదా!
తోతాపురి కోపాన్ని చూసి శ్రీరామకృష్ణులు అర్ధబాహ్య అవస్థలో పకపకా నవ్వుతూ, “సిగ్గుచేటు, సిగ్గుచేటు!” అని పలుకుతూ నేలమీద దొర్లసాగారు. శ్రీరామకృష్ణుల ఆ భావావస్థను చూసి తోతాపురి తెల్లబోయాడు. “ఎందుకు అలా చేస్తున్నావు? ఆ మనిషి ఎంత తప్పు చేశాడో చూడలేదా?” అని అడిగాడు. “నిజమే. కాని అదే సమయంలో మీ బ్రహ్మజ్ఞానపు ప్రగాఢతనూ చూశాను కదా! ‘బ్రహ్మం తప్ప మరేదీలేదు, ప్రపంచంలోని సకల వస్తువులూ, వ్యక్తులూ ఆ బ్రహ్మం అభివ్యక్తీకరణలే!’ అని ఇప్పుడే మీరు చెప్పారు. కాని మరుక్షణంలోనే అంతా మరిచిపోయి ఆ వ్యక్తిని కొట్టబోయారే! కాబట్టే మాయ యొక్క సర్వతోముఖ శక్తిని తలచుకొని నవ్వాను” అని నవ్వుతూ చెప్పారు. ఆ మాటలతో తోతాపురి గంభీర ముద్ర వహించి, కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తరువాత ఇలా అన్నాడు: “నువ్వు చెప్పింది నిజమే. కోప ప్రభావంలో సర్వం మరిచి పోయాను. కోపం గర్హనీయమైంది. ఈ క్షణంలోనే దాన్ని విడిచివేస్తున్నాను.” నిజానికి ఆనాటి నుండి ఆయన కోపగించుకోగా ఎవరూ ఎన్నడూ చూడలేదు.
35. మాయ దారి విడువనంత వరకూ భగవత్సాక్షాత్కారం సాధ్యం కాదు
‘పంచభూతాలలో చిక్కుకుని బ్రహ్మకూడ విలపిస్తాడు’ అని శ్రీరామకృష్ణులు తరచూ చెప్పేవారు. కళ్ళుమూసుకొని ‘ముల్లు లేదు, గుచ్చుకోలేదు’ అని మనస్సుకు ఎంత చెప్పుకో ప్రయత్నించినా ముల్లు మీద చెయ్యి పడగానే నొప్పి పుట్టి, బాధతో అరుస్తావు. అదే విధంగా, ‘నాకు జనన మరణాలు లేవు, నిర్గుణుడను, సుఖదుఃఖాలు లేవు, ఆకలిదప్పులు లేవు, జనన మరణ జరారహితుడనైన సచ్చిదానంద స్వరూపుణ్ణి’ అని మనస్సుకు ఎంత నచ్చచెప్పుకున్నప్పటికీ ప్రయోజనం ఏమీ ఉండదు. కాని నీ శరీరం ఏదో ఒక రోగం బారినపడగానే పరివర్తనలేని ఆత్మ గురించి సర్వం మరిచిపోతావు. మనస్సు భోగవస్తువుల ప్రలోభాలచే ఆకర్షింపబడగానే లేదా కామకాంచనాల తాత్కాలిక సుఖంకోసం అర్రులు చాచగానే ఏదో పాడుపని చేసే నిర్బంధానికి గురి అవుతావు. భ్రాంతి, మానసిక క్షోభ, కష్టం మొదలైనవి తలెత్తి, నీ విచక్షణను, నిర్ణయాలను మరపింపచేసి, నిన్నెంతో బాధిస్తాయి. కనుక భగవదనుగ్రహం కలుగనంత వరకూ, మహామాయ వాకిలి తెరిచి వైదొలగనంత వరకూ ఎవరికీ ఆత్మజ్ఞానం కలుగదనీ, సంసార దుఃఖ విముక్తి కలుగదనీ తెలుసుకోండి. ‘సైషా ప్రసన్నా వరదా నృణాంభవతి ముక్తయే’ – అంటే తల్లి అనుగ్రహించి దారి విడువనంత వరకూ ఏదీ సాధ్యం కాదనీ, ఆమె కృపతోనే మనిషి ముక్తుడు కాగలడనీ చండి (దేవీసప్తశతి, 1.56) లో నువ్వు చదవలేదా?
36. అందుకొక ఉదాహరణ
“శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు అరణ్యమార్గంలో నడిచిపోతున్నారు. ఆ కాలిబాట ఎంతో ఇరుకైనది. ప్రక్కప్రక్కన ఇద్దరుకూడా నడిచిపోలేరు. శ్రీరాముడు ధనుర్బాణాలు ధరించి ముందు నడుస్తున్నాడు; ఆతడి వెనుక సీత, ఆమె వెనుక లక్ష్మణుడు ధనుర్బాణాలు చేతపుచ్చుకొని నడుస్తున్నారు. శ్రీరామునిపట్ల, లక్ష్మణుడికి ఎంతో భక్తి, ప్రేమ ఉన్నాయి. నవఘనశ్యాముడైన శ్రీరాముణ్ణి సదా దర్శిస్తూ ఉండాలని లక్ష్మణుడి అభిలాష. కాని మధ్యలో సీతాదేవి నడుస్తూ ఉండడంచేత శ్రీరాముణ్ణి చూడలేక అతడి మనస్సు క్షోభించసాగింది. సీతాదేవి, అతడి బాధను గమనించింది; లక్ష్మణుడి పట్ల కరుణ వహించి బాటకు ఒక ప్రక్కకు జరిగి ‘ఇప్పుడు చూడు’ అన్నది. అప్పుడు మాత్రమే తన ఇష్టదైవాన్ని తనివితీరా దర్శించగలిగాడు లక్ష్మణుడు. జీవుడికి దేవుడికి నడుమ మాయకు ప్రాతినిధ్యం వహించే సీతాదేవి అడ్డుగా నిలబడి ఉంది. జీవరూపుడైన లక్ష్మణుని పట్ల కృప వహించి ఆమె వైదొలగి దారి ఇవ్వకపోతే జీవుడు భగవంతుణ్ణి దర్శించలేడని గ్రహించాలి. ఆమె అనుగ్రహించిన మరుక్షణమే జీవుడికి రామరూపంలోని నారాయణుడి దర్శనం కలుగుతుంది, అతడు సకల బాధల నుండి విముక్తుడౌతాడు. ఆమె అనుగ్రహించకపోతే నువ్వు ఎంత విచక్షణ చేసినా, తార్కిక నిర్ణయాలు తీసుకొన్నా నిష్ప్రయోజనమే. ‘ఒక్క వాము గింజ వంద అన్నం మెతుకులను జీర్ణంచేస్తుంది; కాని కడుపులో అజీర్ణం పేరుకొన్నప్పుడు వంద వాము గింజలు కూడా ఒక్క మెతుకు అన్నాన్ని సైతం జీర్ణం చేయలేవు’ అనే లోకోక్తి ఒకటి ఉంది. ఇదొక చక్కని సాదృశ్యం.”
37. జగజ్జననిని గురించిన తోతాపురి అజ్ఞానం
పుట్టినప్పటి నుండీ తోతాపురి జగజ్జనని అనుగ్రహం పొందాడు. చిన్ననాటి నుండి సత్సంస్కారాలూ, చిత్తశుద్ధిగల మనస్సూ, సిద్ధుడైన యోగి సాంగత్యమూ, దృఢమైన శరీరమూ ఆయనకు లభించాయి. మృత్యుచ్ఛాయలా సర్వాన్నీ కబళించే తన కర్కశ కరాళ మహాభయంకరమూర్తిని భగవన్మాయ ఆయనకు ఎన్నడూ చూపలేదు; అవిద్యా ప్రభావంతో తన భువనమోహినీ మూర్తి అనే ఉచ్చులో ఆయనను ఏనాడూ పడత్రోయలేదు. కాబట్టే ప్రయత్నంతో, స్వప్రయత్నంతో తన లక్ష్యాన్ని చేరి నిర్వికల్ప సమాధిని, ఆత్మజ్ఞానాన్ని సంతరించుకొని భగవత్సాక్షాత్కారాన్ని సునాయాసంగా పొందగలిగాడు. ఆ మార్గంలో పురోగమిస్తున్నప్పుడు ఎదురయ్యే అన్ని అడ్డంకులను, విఘ్నాలను జగజ్జనని స్వహస్తాలతో తొలగించివేసి ఆయనకు దారి సుగమంచేసి, స్వయంగా తాను వైదొలగి దారి ఇచ్చిందని తోతాపురి ఎలా అర్థం చేసు కోగలడు? కాని చాలాకాలం గడిచిపోయాక జగజ్జనని ఆ విషయాన్ని ఇప్పుడు ఆయనకు వివరింప తలచింది. తన తప్పును గుర్తించే అవకాశం తోతాపురికి ఇప్పుడు లభించింది.
38. తోతాపురి అస్వస్థత
వాయవ్య భారత ప్రాంత జనులలో కానవచ్చే దేహదారుఢ్యం గలవారు తోతాపురి. అనారోగ్యం, అజీర్ణం వంటి దేహపరమైన రుగ్మతలంటే ఏమిటో ఆయన ఎరుగడు. ఏం తిన్నా జీర్ణం చేసుకోగలిగేవాడు. ఎక్కడ పడుకొన్నా గాఢంగానే నిద్రపోయే వాడు. ఆత్మజ్ఞానం పొంది, భగవత్సాక్షాత్కారం కలిగిన ఫలితంగా ఆయన మనస్సు సదా శాంత్యానందాలతో ఉప్పొంగుతూ ఉండేది. శ్రీరామకృష్ణులు చూపే ప్రేమ గౌరవాలపట్ల ఆకర్షింపబడిన తోతాపురి ఆయన సాంగత్యంలో దక్షిణేశ్వరంలో కొన్ని నెలలపాటు ఉండిపోయారు; కాని వంగదేశపు నీరు, తేమతో కూడిన సాంద్రవాయువు ఆయనను రోగగ్రస్తుణ్ణి చేశాయి. ఆయన తీవ్ర రక్తగ్రహణి వ్యాధికి గురియైనారు. రేయింబవళ్ళు ప్రేగులను మెలిపెట్టే బాధతో తోతాపురి ధీర, స్థిర, సమాధిమగ్నమైన మనస్సుకూడ బ్రహ్మతాదాత్మ్యం నుండి దిగజారి దేహం మీదికి మళ్ళింది. ‘పంచభూతాల వలలో చిక్కుకుంది బ్రహ్మ’ ! ఇప్పుడిక సర్వాన్ని పాలించే జగజ్జనని అనుగ్రహం తప్ప మార్గాంతరం ఏమున్నది?
39. మనోసూచనలను తోతాపురి నిర్లక్ష్యం చేయడం
వ్యాధిగ్రస్తుడు కావడానికి కొంతకాలం మునుపే బ్రహ్మనిష్ఠ కలిగిన ఆయన అప్రమత్తమైన మనస్సు శరీరం ఇక్కడ అంత ఆరోగ్యంగా ఉండడం లేదు కనుక ఎక్కువ కాలం తాత్సారం చేయవద్దని ఆయనను హెచ్చరిస్తూ వచ్చింది. కాని అలౌకికమూ, దుర్లభమూ అయిన శ్రీరామకృష్ణుల సాంగ త్యాన్ని విడిచి ఈ పాడు దేహం నిమిత్తం ఆయన వెళ్ళిపోగలడా? శరీరం కేవలం అస్థి మాంస పంజరం; చీము, నెత్తురు, మలం, మూత్రం, క్రిమికీటకాలతో దుర్గంధపూరితమైనది; రెండు నాళ్ళ అస్తిత్వం మాత్రమే కలిగింది. వేదాంత శాస్త్రాలు దీని అస్తిత్వాన్ని పదేపదే భ్రమగా వక్కాణిస్తున్నవి. అటువంటి తుచ్ఛ శరీరం మీద మమకారం ఉంచుకొని అనంతమైన ఆనందాన్ని పంచి ఇచ్చే ఆ దివ్యమానవుని (శ్రీరామకృష్ణుల) సాంగత్యాన్ని ఆదరాబాదరా విడిచిపెట్టి వెళ్ళడం తోతాపురికి సాధ్యమా? పైగా మరోచోటికి వెళ్ళినా దేహం రోగగ్రస్తం కాబోదని ఉత్తరవాదం ఏం ఉంది? ఒకవేళ రోగాదులు వాటిల్లినా ఆయనకు ఏం భయం? శరీరమే బాధపడుతుంది. చిక్కిపోతుంది, మహా అయితే నశించి పోతుంది; అలా జరిగినా ఆయనకు జరిగేది ఏముంది? తాను సంగరహితమైన నిర్వికార ఆత్మస్వరూపుడననీ, దేహంతో తనకు ఎలాటి సంబంధమూ లేనేలేదనీ తన స్వరూప జ్ఞానాన్ని ఆయన ప్రత్యక్షం చేసుకొన్నాడు కదా – కనుక ఆయనకు భయం ఎందుకు? ఇలా పలురీతులలో భావించి తన మనస్సును ఎలాంటి ఆందోళనలకూ తోతాపురి గురిచేయలేదు.
40. సెలవు పుచ్చుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నించడం – వ్యాధి తీవ్రత
క్రమంగా రుగ్మత ముదిరి నొప్పికూడ అధికరించడంతో ఆ చోటును వదలి వెళ్ళిపోవాలనే కోర్కె తోతాపురిలో జనించింది. శ్రీరామకృష్ణులనుండి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోవాలని పలుసార్లు ఆయన వద్దకెళ్ళినా, భగవత్ప్రసంగాలలో పూర్తిగా లీనమైపోయి ఆ విషయమే ప్రస్తావించడం మరచి పోయారు తోతాపురి. ఒక్కోసారి ఆ విషయం గుర్తుకు వచ్చినాకూడ ఎవరో తనలోనుండి ఆ సంగతిని చెప్పనివ్వకుండా బలవంతంగా ఆపుతున్నట్లు ఆయనకు అనిపించేది. ఆ విషయం ప్రస్తావింప సంకోచించి, మరునాడు చెప్పవచ్చులే అని అనుకొనేవారు. అలా భావించి, శ్రీరామకృష్ణులతో వేదాంతం గురించి కొంతసేపు చర్చించి తన నివాసానికి ఆయన తిరిగి వచ్చేసేవారు. ఇలా రోజులు గడిచి పోయాయి. తోతాపురి శరీరం క్రమంగా కృశింపసాగింది, వ్యాధి మరింత తీవ్రం కాసాగింది. తోతాపురి శరీరం రోజురోజుకూ కృశించిపోవడం గమనించిన శ్రీరామకృష్ణులు ప్రత్యేకంగా పథ్యపానాదులు, ఔషధ సేవన ఏర్పాటు చేశారు. అయినా లాభం లేకపోయింది, రోగం ముదరసాగింది. శ్రీరామకృష్ణులు అప్పుడు మథుర్కు చెప్పి విశేష ఔషధ పథ్యాదులను ఏర్పాటు చేయించి, శక్తిమేరకు ఆయనను సేవించసాగారు. అప్పటిదాకా తోతాపురి శారీరక బాధనే అనుభవించారు. పరిపూర్ణ మనశ్శాంతి పొందుతూ వచ్చారు. ఇచ్ఛామాత్రంగా మనస్సును సమాధిమగ్నంచేసి శారీరక బాధలనన్నిటినీ మరిచిపోయారు. అప్పటిదాకా తన మనస్సును ఆయన పూర్తిగా తన అధీనంలో ఉంచుకోగలగడమే అందుకు హేతువు.
41. గంగలో మునిగిపోవడానికి ప్రయత్నించడం: జగజ్జనని దివ్యదర్శనం
అది రాత్రివేళ. ఆయన పేగులలో నొప్పి భరించరానిదయింది. ఆ నొప్పి తోతాపురిని స్థిమితంగా పడుకోనివ్వలేదు. ఆయన పడుకోడానికి ప్రయత్నించారు కాని కుదరలేదు; వెంటనే లేచి కూర్చున్నారు. అప్పటికీ ఉపశమనం కలగలేదు. ‘శరీరానికి ఏదైనా జరగనీ, మనస్సును ధ్యానంలో మగ్నం చేస్తాను’ అని ఆయన అనుకొన్నాడు. కాని మనస్సును శరీరం నుండి వేరుచేసి ఏకాగ్రం చేశారో లేదో, ప్రేగుల బాధ మనస్సును తన వైపుకు లాగివేసింది. పదేపదే ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. శరీరస్మృతి తొలగిపోయే సమాధి భూమిని మనస్సు అధిరోహించిందో లేదో నొప్పి కారణంగా అది క్రిందికి దిగజారింది. ప్రయత్నించిన ప్రతిసారి ఆయన వైఫల్యాన్నే చవిచూశారు. అప్పుడు తోతాపురికి తన దేహం పట్ల విపరీతమైన విసుగు పుట్టింది. అప్పుడు ఆయన ఇలా తలపోశాడు: ‘ఈ రక్తమాంస పంజరం కారణంగా కదా ఈ రోజు నా మనస్సు వశం తప్పింది. నేనీ శరీరాన్ని కాదని నిస్సంశయంగా తెలుసుకొన్నాను; అలాంటప్పుడు ఈ తుచ్ఛ శరీరంలో ఉండి ఎందుకు ఇంత బాధపడాలి? దీన్ని ఇంకా పదిలపరుచుకోవడంలో ప్రయోజనం ఏమిటి? ఈ అర్ధరాత్రి దీన్ని గంగలో విసర్జించి ఈ బాధను అంతం చేస్తాను.’ అలా యోచించి ప్రయత్నపూర్వకంగా మనస్సును బ్రహ్మంలో లగ్నంచేసి నెమ్మదిగా గంగాజలాలలో పోసాగాడు. అయినా ఏం ఆశ్చర్యం! గంగానది నిజంగా ఈ రోజు ఇంకిపోయిందా? లేదా ఆయన మనోచిత్రమే బాహ్యంగా అలా వ్యక్తమౌతున్నదా? ఎవరీ మర్మాన్ని విప్పి చెప్పగలరు? తోతాపురి దాదాపు ఆవలి ఒడ్డును చేరినప్పటికీ మోకాలిలోతు కంటే ఎక్కువ నీరు కానరాలేదు. క్రమంగా ఆ చీకటిలోనే ఆవలి తీరపు ఇళ్ళు, చెట్లు నీడలలా కనిపించసాగాయి. అది చూసి తోతాపురి దిగ్భ్రాంతుడై ఇలా ఆలోచించాడు: ‘ఈ భగవన్మాయ ఎంత విచిత్రమైనది? కనీసం నీళ్ళలో మునిగిపోవడానికి సరిపడే నీరుసైతం నేడు గంగలో లేకుండాపోయిందే! కనీవినీ ఎరుగని భగవల్లీల?’ తక్షణం ఆయన లోపల నుండి ఎవరో ఆయన మనోపటలం పైనుండి తెరను తొలగించినట్లయింది ఆయన మనోనేత్రాన్ని ఒక దివ్యకాంతి మిరుమిట్లు గొలిపింది; ఆయన కొక అపూర్వ దర్శనం కలిగింది: “తల్లి, తల్లి, విశ్వజనని అయిన తల్లి, ఊహాతీత శక్తిరూపిణియైన తల్లి! నేలమీద తల్లి, నీళ్ళలో తల్లి! శరీరమే తల్లి, మనస్సే తల్లి; అనారోగ్యమే తల్లి, ఆరోగ్యమే తల్లి; జ్ఞానమే తల్లి, అజ్ఞానమే తల్లి; జీవమే తల్లి, మరణమే తల్లి; తాను చూస్తున్నది, వింటున్నది, ఊహిస్తున్నది సమస్తం ఆ తల్లే. సంభవాన్ని అసంభవం, అసంభవాన్ని సంభవం ఆమే చేస్తున్నది. దేహంలో ఉంటున్నంత వరకూ ఆమె ప్రభావాన్నుండి తప్పించుకొనే శక్తి ఎవరికీ లేదు; ఆమె సంకల్పించేటంత వరకూ ఎవరూ చావనుకూడా చావలేరు. శరీరానికీ, మనస్సుకూ, బుద్ధికీ అతీతమైనదీ, తురీయమైనదీ, నిర్గుణమైనదీ ఆమే! దేనిని ఇంతకాలం బ్రహ్మమని అనుభూతం చేసుకొంటూ తోతాపురి హృదయపూర్వక భక్తిప్రపత్తులు చెల్లిస్తూ వచ్చాడో ఆ బ్రహ్మం ఈ తల్లే! శివశక్తులు ఒకేచోట హరగౌరులుగా వ్యక్తమౌతున్నారు. బ్రహ్మం, బ్రహ్మశక్తీ ఒక్కటే, అభేదమైనవి.”
42. ఆత్మహత్యా సంకల్పాన్ని తోతాపురి విడనాడడం
ఆ రీతిలో నాటి రాత్రివేళ భక్తిపూరిత హృదయంతో జగన్మాత అవ్యక్త విశ్వదర్శనాన్ని గాంచుతూ, ‘అమ్మా, అమ్మా’ అనే హుంకారాలతో నలుదిక్కులనూ పిక్కటిల్లచేస్తూ జగజ్జనని పాదపద్మాల మ్రోల సంపూర్ణ ఆత్మసమర్పణ గావించుకొన్నాడు తోతాపురి. నది ఆవలి ఒడ్డువైపుగా వెళ్ళినట్లే నీళ్ళలో నడుస్తూ తోతాపురి మళ్ళీ వెనుదిరిగి వచ్చాడు. శరీరంలో బాధ ఉన్నప్పటికీ, ఇప్పుడు ఆయనకు అది అనిపించడం లేదు. తనకు కలిగిన ఆ సమాధి జ్ఞాపకం నుండి ఉత్పన్నమైన అపూర్వ పరమానందం ఆయన హృదయాన్ని నింపివేసింది. మెల్లగా పంచవటక్రింద ఉన్న ‘ధుని’ వద్దకు వచ్చి కూర్చున్నాడు. మిగిలిన రాత్రంతా జగజ్జనని జపధ్యానాలలో గడిపాడు తోతాపురి.
43. బ్రహ్మం, బ్రహ్మశక్తి అభేదమని తోతాపురి గ్రహించడం
తెల్లవారగానే తోతాపురి ఆరోగ్యం గురించి విచారించడానికి శ్రీరామకృష్ణులు వచ్చి చూడగా, ఆయన మునుపటి వ్యక్తిలా కనిపించలేదు. ఆయన వదనం పరమానందంతో ప్రకాశిస్తూన్నది, పెదవులపై చిరునవ్వు తాండవిస్తూంది, శరీరంలో ఏ రుగ్మతా కానరావడం లేదు. తన ప్రక్కన కూర్చోమని శ్రీరామకృష్ణులకు సంజ్ఞచేసి, మెల్లగా గతరాత్రి జరిగిన సంఘటనలన్నీ పూసగ్రుచ్చినట్లు వివరించి చెప్పాడు. పిదప ఆయన ఇలా అన్నారు: “ఈ రుగ్మతే నాకు మిత్రునిగా ఉపకరించింది. నిన్నటి రాత్రి జగజ్జనని దివ్యదర్శనం నాకు కలిగింది, ఆమె అనుగ్రహంతో రోగం నుండి విముక్తుడనైనాను. ఆహా! ఇంతకాలం ఎంత అజ్ఞానంలో పడివున్నాను! ఇప్పుడు నీ తల్లికి చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి నాకు సెలవు ఇప్పించు. ఈ సత్యం తెలుపడంకోసమే ఏదో విధంగా నన్నింతకాలం ఇక్కడ ఆపి ఉంచింది ఆమే అని అర్థమైంది. ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చాలాకాలం క్రితమే అనుకొని, పలుమార్లు నీ వద్దకు సెలవు పుచ్చుకోవాలని వచ్చానుకూడ. కాని ప్రతిసారి ఎవరో నీ నుండి సెలవు పుచ్చుకోనివ్వకుండా నా మనస్సును మరో విషయం మీదకు మళ్ళిస్తూ వచ్చారు.” ఆయన మాటలు విని శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఇలా అన్నారు: “ఇంతకు మునుపు మీరు అమ్మను అంగీకరించక నాతో ‘శక్తి మిథ్య’ అని వాదించేవారు. కాని ఇప్పుడు మీరే స్వయంగా ఆమెను దర్శించారు. ప్రత్యక్ష అనుభవం మీ వాదనలను త్రోసిపుచ్చింది. అగ్ని, దాని దాహకశక్తి ఒక్కటే అయినట్లు ‘బ్రహ్మం, బ్రహ్మశక్తి ఒక్కటే’ అని ఏనాడో అమ్మ నాకు వెల్లడించింది.”
44. జగజ్జననిని అంగీకరించడం – తోతాపురి నిష్క్రమించడం
నాదమండపం నుండి ప్రభాత సంగీతం వినరాగానే గురుశిష్య సంబంధంతో శివ – రాములలా కట్టుబడిన ఆ మహాపురుషులిద్దరూ జగజ్జనని ఆలయానికి వెళ్ళి తల్లి దివ్య విగ్రహం మ్రోల సాష్టాంగ ప్రణామం చేశారు. జగజ్జనని ప్రసన్నయై తోతాపురి సెలవు పుచ్చుకోవడానికి దయతో అనుమతించిందని వారిద్దరూ తమ హృదయాంతరాళాలలో తెలుసుకొన్నారు. కొన్ని రోజుల తరువాత శ్రీరామకృష్ణుల వద్ద సెలవు పుచ్చుకొని దక్షిణేశ్వర కాళికాలయాన్ని విడిచిపెట్టి తోతాపురి పశ్చిమదిశగా సాగిపోయాడు. దక్షిణేశ్వర కాళి కాలయాన్ని ఆయన సందర్శించడం ఇదే మొదటిసారి, చివరిసారి కూడ. మరెన్నడూ తోతాపురి అక్కడకు రాలేదు.
45. ‘రసవాద’ విద్య నెరిగిన తోతాపురి
మరొక్క విషయం చెబితే తోతాపురిని గురించి శ్రీరామకృష్ణుల నుండి మేం విన్న విషయాలన్నీ పాఠకులకు తెలిపినట్లే అవుతుంది. తోతాపురి ‘రసవాదం’ విశ్వసించేవాడు. కేవలం నమ్మడం మాత్రమే కాదు, ఆ విద్య సహాయంతో అనేక సందర్భాలలో రాగి మొదలైన అధమ తరగతి లోహాలను బంగారంగా మార్చగలిగానని శ్రీరామకృష్ణులతో ఆయన చెప్పాడుకూడ. తమ సంప్రదాయానికి చెందిన ప్రాచీన పరమహంసలకు ఆ ‘రసవాద’ విద్య తెలుసని, గురుపరంపరలో వచ్చిన తనకు ఆ విద్య వారసత్వంగా సంక్రమించిందనీ తోతాపురి చెప్పేవాడు. అంతేకాక ఆయన ఇలా చెప్పేవాడు: “ఈ రసవాద విద్యను స్వార్థంకోసం, స్వసుఖంకోసం ఉపయోగించడం పూర్తిగా నిషేధించబడింది. అలా చేసినవారికి గురువుల శాపం తగులుతుంది. కాని మా సన్న్యాసి మండలిలో ఎందరో సాధుపుంగవులుండేవారు; మండలేశ్వరుడు (అంటే మఠాధ్యక్షుడు) వారితోపాటు తీర్థయాత్రలకు వెళ్ళవలసి వచ్చేది. అటువంటి సమయాలలో వారి ఆహారాది ఆవశ్యకాలకు తగిన ఏర్పాట్లు చేయవలసి వచ్చేది. ఎప్పుడైన ధనావశ్యకత ఎదురైనప్పుడు, ఆ సందర్భంలో మాత్రమే ఆ విద్యను ఉపయోగించి ఆ అవసరాన్ని గడుపుకోవడానికి అనుమతి ఒసగేవారు.”
46. ముగింపు
ఈ విధంగా శ్రీరామకృష్ణుల ‘గురుభావ’ సహాయంతో భైరవీ బ్రాహ్మణి, బ్రహ్మజ్ఞుడైన తోతాపురి తమ తమ సాధన మార్గాలలో పరిపూర్ణత్వాన్ని సంతరించుకొని కృతకృత్యులయ్యారు. శ్రీరామకృష్ణుల ఇతర శిక్షణాగురువులందరూకూడ ఇదే విధంగా ఆధ్యాత్మిక సమగ్రతను సంతరించుకోగలిగారని దీనినుండి మనం చక్కగా ఊహించవచ్చు.
గురుభావం మొదటి భాగం సమాప్తం