అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః ।
అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవ చ ॥ –భగవద్గీత, 10–20
సకల ప్రాణుల హృదయాలలో ప్రత్యగాత్మగా నిలిచి ఉన్నది నేనే. సకల ప్రాణికోటి పుట్టుక, ఉనికి, అంతం కూడా నేనే.
1. శ్రీరామకృష్ణుల సాంగత్యంలో మథుర్ దుర్గాపూజ జరపడం
మథుర్బాబు జాన్బజార్ గృహంలో ఏటేటా దుర్గాపూజ ఉత్సవాన్ని ఆనంద ఉత్సాహాలతో జరుపుతారు. ఈ ఏడు ఆ పూజ విశేష ఆనందాన్ని కలిగించింది. అందుకు కారణం: ప్రతి సంవత్సరం జరిగే పూజోత్సవం ఆబాలగోపాలానికి ఎంతో ఆనందాన్ని కలిగించేదే అయినా, ఈ సంవత్సరం ‘బాబా’ కొద్ది రోజులుగా మథుర్ గృహాన్ని పావనం చేస్తూ ఆ ఆనందాన్ని వేయిరెట్లు ఇనుమడింపచేశారు. కాబట్టే అక్కడ విలసిల్లిన ఆనందానికి అవధి లేకపోయింది. తల్లివద్ద ఉన్న బిడ్డ ఆనందంతో ఉక్కిరిబిక్కిరై, నిర్భీతితో కేరింతలు కొడుతూ, మారాం చేస్తూ తిరుగుతాడు. అదే విధంగా ‘బాబా’ కూడా సతతం భావపరవశులై, దుర్గా ప్రతిమలో సాక్షాత్తూ జగన్మాత అభివ్యక్తీకరణను ప్రత్యక్షంగా దర్శిస్తూ, పిల్లవాడిలా ప్రవర్తించడం చూసి, ఆ దుర్గాప్రతిమ సజీవంగా విరాజిల్లుతూ తన బిడ్డడి చేష్టలు చూసి నవ్వుతూన్నట్లు కనిపించసాగింది. అలాగే ప్రతిమలో జగజ్జనని అభివ్యక్తీకరణ, శ్రీరామకృష్ణుల మనశ్శరీరాలలో అదే జగజ్జనని అభివ్యక్తీకరణ కలగలసి పూజా మండపాన్ని అనిర్వచనీయ వర్ణనాతీత దివ్య భావతరంగాలతో నింపినట్లు జడమనస్కునికి సైతం అనుభూతమైంది. ఈ దివ్యభావం పూజామండపాన్నేకాక, అక్కడ సమావేశమైన ప్రతి వ్యక్తి హృదయాన్ని, ఆ గృహం మూలమూలలను ప్రదీప్తమంతం చేసింది. సర్వత్రా దివ్యశోభ విరాజిల్లుతూన్నది.
మరి అలా జరగకుండా ఎలా ఉంటుంది? సుసంపన్నుడైన మథుర్బాబు రాజసికభక్తి పూజకు అవసరమైన సమస్త ఏర్పాట్లను లోటుపాట్లు లేకుండా చేయించారు. పువ్వులు, పండ్లు, మిఠాయిలు మొదలైనవన్నీ సమృద్ధిగా తెప్పించారు. దేవి ప్రతిమను అత్యంత విలువైన పట్టువస్త్రాలతోను, ఆభరణాలతోను అలంకరించారు. ఇంటి తలుపులు, గోడలు, నేల పచ్చని తోరణాలతో, పువ్వులతో, పతాకాలతో అలంకరించారు. వేణువు మొదలైన వాయిద్యాల సంగీతం ఏర్పాటు చేశారు. శ్రీరామకృష్ణుల అలౌకిక దివ్యభావం బయటి జడ వస్తువులనన్నిటిని స్పృశించి వాటిని సజీవం గావించింది. శ్రీరామకృష్ణుల సాంగత్యంతో అక్కడి వాతావరణం ఎంతగా మారిపోయిందో వర్ణించడం అసాధ్యం. చిరతుషారమండిత హిమశిఖర వక్షంలో దేవదారు తరుచ్ఛాయల అలౌకిక సౌందర్యం నడుమ తపోమగ్నులైన సాధుసన్న్యాసుల కాషాయాంబరాలు ఏ శాంతిపూర్ణ శోభను ఉద్దీపింప చేస్తాయో; ఒక తల్లి ఒడిలో తాపీగా కూర్చుని పాలు త్రాగుతున్న పసిబిడ్డ కోమలభావం ఏ సౌందర్యాన్ని ఉద్దీపింప చేస్తుందో; పవిత్ర భావనలు అందమైన ముఖారవిందాన ఏ అనుపమాన తేజస్సును ఉత్పన్నం చేస్తాయో – ఇవన్నీ కలగలిసి మథుర్బాబు గృహంలో ఒక అద్భుత వాతావరణాన్ని రూపొందించాయి. ఇదంతా మథుర్బాబు మహద్భాగ్య ఫలితమని వేరేగా చెప్పాలా? పూజోత్సవ ఏర్పాట్లలో పూర్తిగా తీరికలేని మథుర్ – జగదంబదాసి దంపతుల హృదయాలు అవ్యక్త దివ్యానందంలో పొంగిపొరలి, ఆ పవిత్ర వాతావరణ అనుగ్రహాన్ని తమ హృదయాంతరాళాలలో అనుభూతం చేసుకొన్నారని ప్రత్యేకంగా చెప్పాలా?
2. శ్రీరామకృష్ణుల వ్యక్తిత్వ సౌందర్యం
పగటి వేళ పూజాక్రమం పూర్తయింది. మథుర్, జగదంబదాసి దంపతులు ఎలాగో వీలుచూసుకొని ‘బాబా’, జగజ్జనని పవిత్ర పాదపద్మాలకు పరమానందంతో పుష్పాలు అర్పించారు. సంధ్యాసమయమైంది. దుర్గామాత ఆరతి ప్రారంభం కానున్నది. ఆ సమయంలో ‘బాబా’ భావోద్వేగంలో తానొక పురుషుడననే మాటే మరిచిపోయి, అంతఃపురంలో ఉన్నారు. జన్మజన్మాంతరాల నుండి, యుగయుగాల పర్యంతం తాను కేవలం జగజ్జనని సఖీననే భావం మాత్రమే ఆయన పలుకులలో, చేతలలో వ్యక్తం అవుతున్నది. తన మనోప్రాణాలు, తన సర్వస్వం కేవలం ఆ జగజ్జనని మాత్రమే; తన దేహం ఉన్నదనీ, తాను జీవిస్తున్నదీ ఆమెను సేవించడంకోసం మాత్రమే; జగజ్జనని పట్లగల భావోద్వేగ ప్రేమలతో ఆయన ముఖారవిందం ప్రకాశిస్తూన్నది. అనుపమాన దరహాస చంద్రికలు ఆయన పెదవులపై వికసిస్తున్నాయి. ఆయన దృక్కులు, చేతుల కదలికలు, నడక, హావభావాలు అచ్చం స్త్రీలా ఉన్నాయి. మథుర్ ఇచ్చిన పట్టువస్త్రాన్ని చీరలా కట్టుకొన్నారు. ఆయనను పురుషుడని ఎవరు అనగలరు? ఆ సమయంలో శ్రీరామకృష్ణుల మేనిఛాయ, సౌందర్యం సర్వత్రా పొంగిపొరలుతున్నాయి. ఆ మేనిఛాయ భావపారవశ్యంలో ద్విగుణీకృతమై ఆయన దేహం నుండి కాంతి విరజిమ్ముతున్నట్లుగా కనిపించసాగింది. ఆ సౌందర్యాన్ని జనం కళ్ళార్పకుండా తదేకంగా ఆశ్చర్యపోతూ చూడసాగారు. శ్రీరామకృష్ణులు ఆ కాలంలో బంగారు ఇష్టకవచాన్ని ధరిస్తూ ఉండేవారనీ, ఆయన మేనిఛాయ ఆ కవచం బంగారు రంగులో కలిసిపోయి ఉండేదని మాతృదేవి చెప్పగా మేం విన్నాం. స్వయంగా శ్రీరామకృష్ణుల ముఖతా మేం ఇలా విన్నాం: “ఆహా! ఆ కాలంలో ఇది (తమ శరీరం) ఎంత అందంగా ఉండేదంటే, జనం దీన్ని తేరిపార చూస్తూ ఉండిపోయే వారు. శరీరం నుండి కాంతి వెలువడుతున్నట్లుగా ఛాతీ, ముఖం సదా ఎర్రబారి ఉండేవి. ఎప్పుడూ నా దేహాన్ని దళసరి వస్త్రంతో కప్పుకొని ఉండేవాణ్ణి. అమ్మను విసిగించే ధోరణిలో, ‘అమ్మా, నీ బాహ్యసౌందర్యం ఇదిగో. దీన్ని వెనక్కు తీసుకొని, అంతఃసౌందర్యాన్ని నాకు ఇవ్వు’ అని అడిగేవాణ్ణి. ఒంటిని నిమురుతూ చరుస్తూ పదేపదే, ‘లోపలకు వెళ్ళు, లోపలకు వెళ్ళు’ అని చెప్పేవాణ్ణి. ఇలా చేయగా చేయగా కొంతకాలానికి మేనిఛాయ, ఇప్పుడు మీరు చూస్తున్న చామనఛాయకు మారింది.”
3. శ్రీరామకృష్ణుల రూపసౌందర్యాన్ని తిలకింప కామార్పుకూర్లో జనం గుమిగూడడం
శ్రీరామకృష్ణుల దేహసౌందర్యం గురించి మరొక సంఘటన మాకు జ్ఞాపకం వస్తున్నది. ఆ కాలంలో ఆయన ప్రతి ఏటా కామార్పుకూర్కు వెళ్ళి వర్షాకాలం మూడు నాలుగు నెలలు అక్కడ గడిపి, కలకత్తాకు తిరిగి వచ్చేవారు. కొన్ని సందర్భాలలో సిహోర్లోని హృదయ్ ఇంటికి వెళుతూవుండేవారు. ఆ దారిలోనే శ్రీరామకృష్ణుల అత్తగారి ఊరు జయరాంబాటి ఉంది. ఆ గ్రామస్థులు ఒకసారి ఆయనను కొన్ని రోజులు అక్కడ గడపమని పట్టుబట్టారు. అందుకు ఆయన సమ్మతించారు. ఆయన పట్ల అమిత భక్తి ప్రపత్తులున్న హృదయ్ సదా ఆయన వెంటనే ఉంటూ అన్నివిధాల సేవిస్తూ ఉండేవాడు.
కామార్పుకూర్లో బసచేసి ఉన్నప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయనను చూడడానికి, ఆయన ముఖతా రెండు మాటలు వినడానికి జనం ఎడతెగక గుమిగూడి ఉండేవారు. చుట్టప్రక్కల స్త్రీలు ఇంటి పనులు త్వరగా ముగించుకొని, స్నానంచేసి నీళ్ళు తీసుకురావడానికి చంకన బిందెలు పెట్టుకొని వచ్చేవారు. ఆ బిందెలన్నింటినీ శ్రీరామకృష్ణుల ఇంటి సమీపంలోని హాల్దార్ చెరువు గట్టుమీద పెట్టి ఛటర్జీల* ఇంటికి వచ్చి కూర్చునేవారు. ఒక గంట, గంటన్నరసేపు శ్రీరామకృష్ణులతోను, ఆ కుటుంబ స్త్రీలతోను మాటల్లో గడిపి తరువాత స్నానానికి వెళ్ళేవారు. ప్రతి రోజు ఇలాగే జరిగేది. గత రాత్రి తమ ఇళ్ళలో మిఠాయిలు చేసుకొంటే దాన్లో కొంతభాగం ఆయన కోసం ప్రత్యేకంగా కేటాయించి, ప్రొద్దున్నే వస్తున్నప్పుడు తీసుకువచ్చి శ్రీరామకృష్ణులకు ఇస్తూ ఉండేవారు. ఆ స్త్రీలు ఇలా తెల్లవారిందో లేదో రావడం చూసి వినోదప్రియులైన శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు చమత్కారంగా ఇలా అంటూ ఉండేవారు: “బృందావనంలో గోపికలు శ్రీకృష్ణుణ్ణి వివిధ సమయాలలో వివిధ రీతుల్లో కలుసుకొనేవారు. నదిలో నీళ్ళు తేవడానికి వెళ్ళినప్పుడు ‘గోష్ఠ కలయిక’, కృష్ణుడు గోవులను మేపి సాయంకాలం తిరిగి వస్తున్నప్పుడు, ‘గోధూళి కలయిక’, రాత్రివేళ యమునాతీరంలో కలిసినప్పుడు, ‘రాస కలయిక’ – ఇలా ఎన్నో ‘కలయికలు’. అలాగే ఇది కూడ మీ ‘స్నానవేళ’ సమావేశమా?” ఆ మాటలు విని ఆ స్త్రీలు కడుపుబ్బ నవ్వుకొనేవారు. ఆ స్త్రీలు వంటవార్పులకై ఇంటికి తిరిగి వెళ్ళిపోగానే ఆ గ్రామంలోని పురుషులు శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చేవారు. వాళ్ళు అక్కడ కూర్చుని తమ ఇష్టమొచ్చినంతసేపు ఆయనతో మాట్లాడి వెళ్ళిపోయేవారు. సాయంత్రం మళ్ళీ ఆ స్త్రీలు వచ్చేవారు. కొందరు పురుషులు మళ్ళీ రాత్రిపూట వచ్చేవారు. అలాగే దూరప్రాంతం నుండి వచ్చే స్త్రీ పురుషులు తరచూ మధ్యాహ్నం వేళ వచ్చి చీకటి పడక మునుపే వెళ్ళిపోయేవారు. ఆ విధంగా ‘రథోత్సవం’, ‘డోలోత్సవం’ వంటి పండుగ రోజులలో గుమిగూడే జనంలా శ్రీరామకృష్ణులను చూడడానికి జనం గుంపుగా వస్తూ ఉండేవారు.
4. శ్రీరామకృష్ణుల బాహ్యసౌందర్య తిరస్కృతి
కామార్పుకూర్లో శ్రీరామకృష్ణులు బస చేసి ఉన్న సందర్భంలో ఒకసారి సిహోర్ గ్రామానికి వెళ్ళే ఏర్పాట్లు చేశారు. సదా సర్వదా భావసమాధిమగ్నులై ఉంటున్న కారణంచేత శ్రీరామకృష్ణుల దేహం పిల్లవాడిలా, స్త్రీల శరీరంలా అమిత కోమలమై పోయింది. పల్లకీ లేదా బండి లేకుండా ఆయన కొద్దిదూరం కూడ నడిచి వెళ్ళలేకపోయేవారు. అందుచేత జయరాంబాటి మీదుగా సిహోర్ వెళ్ళడానికి పల్లకీ ఏర్పాటుచేశారు. హృదయ్ ఆయనతో వెళ్ళనున్నాడు. మధ్యాహ్న భోజనం ముగించి, ఎర్రని పట్టువస్త్రం ధరించి, చేతికి బంగారపు తాయెత్తు కట్టుకొని, నోట తమలపాకులు నములుతూ పల్లకీ ఎక్కడానికి శ్రీరామకృష్ణులు బయటకు వచ్చారు. పల్లకీ పక్కన ఎంతోమంది గుమిగూడి ఉండడం చూశారు. చుట్టూ పురుషులు స్త్రీలు నిలబడి వున్నారు. అది చూసి ఆశ్చర్యంతో, “హృదూ, ఎందుకు ఇంతమంది ఇక్కడ గుమిగూడారు?” అని హృదయ్‌ను అడిగారు.
హృదయ్: మరెందుకు? ఈ రోజు నువ్వు అక్కడకు వెళుతున్నావు కదా! వీరు (జనాన్ని చూపిస్తూ) ఇంకా కొన్ని రోజులదాకా నిన్ను చూడలేరు కదా! అందుకే నిన్ను చూడగోరి వచ్చారు.
శ్రీరామకృష్ణులు: కాని నన్ను రోజూ చూస్తూనే ఉన్నారు కదా! ఈ రోజు కొత్తగా చూడవలసింది ఏముంది?
హృదయ్: పట్టువస్త్ర ధారణలో నువ్వు చాలా అందంగా కనిపిస్తావు. తమలపాకులు వేసుకోవడంతో నీ పెదవులు ఎర్రబారి ఉంటాయి. అందుకే వాళ్ళు నిన్ను చూడాలని వచ్చారు. అది కాక మరేమిటి?
తక్షణం శ్రీరామకృష్ణుల మనస్సు ఒక అసాధారణ భావనకు లోనైంది. ‘అయ్యో! రెండు రోజులుండే ఈ బాహ్యరూపాన్ని చూడడంలోనే వీరంతా నిమగ్నులై ఉన్నారు. అంతరాన ఉన్నవాణ్ణి చూడగోరడం లేదే’ అనుకొని వాపోయారు. బాహ్య సౌందర్యం పట్ల మొదటి నుండే ఆయనకొక ఏహ్యభావం ఉంది. ఈ సంఘటనతో అది వేయిరెట్లు హెచ్చింది. “ఏమిటి? ఒక మనిషిని చూడడానికి ఇందరు గుమిగూడడమా! ఛీ, ఛీ. నే నెక్కడికీ వెళ్ళను. ఎక్కడకు వెళ్ళినా ఇలాగే గుమిగూడతారు” అంటూ ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయారు. పట్టువస్త్రం విప్పిపడేసి విచారంగా కూర్చుండిపోయారు. దైన్యమనస్కులై నాడు జయరాంబాటి, సిహోర్లకు వెళ్ళలేదు. హృదయ్, కుటుంబ సభ్యులు పరిపరి విధాల ఆయనకు నచ్చజెప్ప ప్రయత్నించారు కాని ఏమీ లాభం లేకపోయింది. ఈ దివ్యమానవుడు తన శరీరాన్ని ఎంత తుచ్ఛంగా, హీనంగా పరిగణించారో పాఠకులు ఊహించుకోగలరు. ఇక మనమో! ఈ దేహాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని పిచ్చి ప్రయత్నాలు చేస్తాం! ఆ రుద్దడాలు, ఒళ్ళు పట్టించుకోవడాలు, కళ్ళద్దాలు, దువ్వెనలు, అత్తర్లు, సబ్బులు, ఇత్యాదులకు అంతే ఉండదు. దీనికితోడు పాశ్చాత్య అనుకరణ మరొకటి! రక్తమాంసాదులతో కూడిన ఈ గూటినే మన సర్వస్వంగా భావించి, మన యావచ్ఛక్తులనూ ఈ ‘భ్రమ’ ను శాశ్వతం చేయడానికే పరుగులెత్తి సర్వనాశనమౌతున్నాం. శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, మనస్సును పవిత్రంగా ఉంచుకోవడం – ఇదొక విషయం. కాని యావచ్ఛక్తిని కేవలం దేహం మీదే నిలపడం మరో విషయం. ఈ రెంటిని ఒక్కటిగా భావించడం తప్పు కాదూ? ఈ ప్రస్తావన ఇక్కడితో చాలిద్దాం.
5. జగదంబ దాసి: శ్రీరామకృష్ణుల భావపారవశ్యం
జగజ్జనని సంధ్యా ఆరతి ప్రారంభం కానున్నది. కాని శ్రీరామకృష్ణుల భావపారవశ్యం మాత్రం తగ్గడంలేదు. ఆయనను ఏదో విధంగా మామూలు స్థితికి తీసుకొనివచ్చి, ఇతర స్త్రీలతో కలిసి ఆరతి చూడడానికి వెళ్ళాలనుకొన్నది మథుర్ భార్య శ్రీమతి జగదంబదాసి. కాని శ్రీరామకృష్ణుల భావ పారవశ్యం మాత్రం తగ్గకపోవడం చూసి, ఆయనను అలాగే ఒంటరిగా విడిచి వెళ్ళడం సబబు కాదనిపించింది ఆమెకు. కాని ఏం చేయాలో పాలుబోలేదు. ఆమె తనలో ఇలా తలపోయసాగింది: “నేనేం చేయాలి? ఎవరినైనా బాబా వద్ద విడిచివెళ్ళినా, ఆరతి నాదం ప్రారంభం కాగానే, ఆమె ఆయనను విడిచిపెట్టి తక్షణం పూజామండపం వద్దకు ఒక్క పరుగున వచ్చేస్తుంది. భావావస్థలో మగ్నులై ఉన్న బాబా తనను చూసుకొనే పరిస్థితిలో ఉండరు. ఒకసారి భావావస్థలో మగ్నులై ఉన్నప్పుడు బాహ్యస్మృతిలేక నిప్పులమీద పడిన విషయం కూడ ఆయనకు తెలియరాలేదు. చాలాకాలం జాగ్రత్తగా చికిత్స చేసిన తరువాతగాని ఆ పుండు మానలేదు. ఆయనను ఒంటరిగా విడిచి వెళితే పండుగ రోజు అలాంటి ప్రమాదం ఏదైనా వాటిల్లవచ్చునేమో! అలా ఏదైనా దుర్ఘటన జరిగితే నా భర్త ఏమనుకొంటాడు?” ఇలా ఆమె ఆలోచిస్తూండగా ఒక ఉపాయం తోచింది. వెంటనే ఆమె తాను ధరించిన ఆభరణాలను తీసి ఆయనకు అలంకరిస్తూ మెల్లగా, “బాబా, పద పోదాం; అమ్మ ఆరతి మొదలవుతున్నది. చామరంతో అమ్మకు వీయరా?” అని పదే పదే ఆయన చెవిలో చెప్పింది.
6. సమాధ్యవస్థ నుండి శ్రీరామకృష్ణులు దిగివచ్చే తీరు
భావపారవశ్యంలో శ్రీరామకృష్ణులు ఎంత బాహ్యస్మృతిరహితులై ఉన్నప్పటికీ, ఏ మూర్తిని ధ్యానిస్తూ, ఏ భావాన్ని చింతన చేస్తూ* ఆయన మనస్సు సమాధిమగ్నమౌతుందో – ఆ భావాలతో ఏ సంబంధమూలేని ఇతర వస్తువుల వ్యక్తుల భావాల నుండి ఆ మనస్సు ఎంత సుదూరమై ఉన్నప్పటికీ – ఆ మూర్తుల పేర్లనుగాని లేదా ఆ భావాలకు సంబంధించిన పలుకులనుగాని కొన్నిసార్లు శ్రీరామకృష్ణుల చెవుల దగ్గర వినిపించిన తక్షణం ఆయన మనస్సు ఆ పలుకులను గమనించేది, వాటిని అర్థం చేసుకోగలిగేది – సదా ఇలాగే జరిగేది. ఏకాగ్రమైన మనస్సు స్వభావం, ప్రవర్తన అలా ఉంటుందని పతంజలి ముని రచించిన యోగశాస్త్రాదులలో సవివరంగా పేర్కొనబడకపోయినా, క్లుప్తంగా పేర్కొనబడింది. కనుక శాస్త్రాలు అధ్యయనం చేసిన పాఠకుడికి శ్రీరామకృష్ణుల మనోప్రవర్తనను అవగతం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టదు. మరి బహుపుణ్య ఫలితంగా, అనేక సాధనలు చేసిన ఫలితంగా ఎవరు తమ మనస్సులను ఒకింతయైనా ఏకాగ్రం చేయడంలో సాఫల్యం పొందారో వారు ఈ విషయాన్ని అలవోకగా అర్థం చేసుకోగలరు. ఇక ఈ ప్రస్తావన ఇక్కడికి ఆపుదాం.
7. చెలికత్తెలా శ్రీరామకృష్ణులు దుర్గాదేవిని చామరంతో వీచడం
జగదంబదాసి పలుకులు శ్రీరామకృష్ణులకు వినిపించాయి. తక్షణమే ఆయనకు చాలావరకు బాహ్యస్మృతి రావడంతో, ఆనందంతో ఆమె వెంటబయలుదేరారు. వారు పూజామండపం చేరారో లేదో ఆరతి మొదలయింది. స్త్రీలు పరివేష్టించి ఉండగా ఆయన చామరంతో దుర్గాప్రతిమకు విసరసాగారు. ఆ మండపంలో స్త్రీలు ఒక వైపు, పురుషులు మథుర్బాబుతో సహా మరో వైపు నిలబడి ఆరతి తిలకిస్తున్నారు. అప్పుడు మథుర్ దృష్టి స్త్రీల వైపు తిరిగింది. అతడి భార్య ప్రక్కన ఎవరో నూతన స్త్రీ ఉండడం గమనించాడు. ఆమె వేషభూషణాదుల నుండి, మేని నుండి అద్భుత సౌందర్యం జాలువారుతున్నది. ఆమె చామరంతో* తల్లికి విసరుతున్నది. ఆమె ఎవరో అతడికి అంతుబట్టలేదు. పదేపదే చూసినప్పటికీ ఆమె ఎవరో అతడికి తెలియలేదు. ఆమె జగదాంబ ఆహ్వానించిన ఎవరో సంపన్నుని భార్య అయివుంటుందని చివరికి మథుర్ అనుకొన్నాడు.
ఆరతి ముగిసింది. స్త్రీలు జగజ్జననికి ప్రణమిల్లి ఇంటి లోపలికి వెళ్ళి, తమ పనులలో మునిగిపోయారు. అర్ధబాహ్యావస్థలో ఉన్న శ్రీరామకృష్ణులు కూడ మథుర్ భార్యతో ఇంట్లోకి వెళ్ళారు. నెమ్మదిగా మామూలు స్థితిలోకి వచ్చారు. పిదప అలంకారాదులన్నీ తీసివేసి, బయటకు వచ్చి పురుషులవద్ద కూర్చున్నారు. తదనంతరం చక్కని దృష్టాంతాలతో పారమార్థిక విషయాలను సరళరీతిలో విశదపరుస్తూ అందరినీ ముగ్ధులను చేయసాగారు.
8. శ్రీరామకృష్ణులను, స్త్రీ వేషధారణలో గుర్తించలేకపోవడం – తెలుసుకోవాలని మథుర్ ఉత్సుకత
కాసేపయ్యాక మథుర్బాబు అంతఃపురంలోకి వెళ్ళాడు. మాటల సందర్భంలో భార్యతో, ఆరతి సమయంలో ఆమె ప్రక్కన నిలబడి దేవికి చామరం వీచిన స్త్రీ ఎవరని అడిగాడు. మథుర్ భార్య నవ్వి, ఇలా జవాబు చెప్పింది: “ఆమెను మీరు గుర్తుపట్టలేకపోయారా? ‘బాబా’ భావావస్థలో దేవికి చామరం వీస్తూవున్నారు. అలా గుర్తించలేకపోవడం సహజమే. స్త్రీల మాదిరి వేషభూషణాదులు ధరించినప్పుడు ఎవరూ ఆయనను పురుషులని తెలుసుకోలేరు.” ఇలా అంటూ ఆమె జరిగింది పూసగుచ్చినట్లు మథుర్కు చెప్పింది. మథుర్ తెల్లబోయి ఇలా అన్నాడు: “అందుకే కదా ‘చిన్నచిన్న విషయాలలోకూడ ఆయన బయటపడకపోతే, ఆయనను గుర్తించడం ఎవరి తరం?’ అని నేనంటాను. నువ్వు చూశావు కదా! ఆయనతోబాటే ఇరవై నాలుగు గంటలూ గడిపే నేను సైతం ఈ రోజు ఆయనను గుర్తించలేకపోయాను.”
9. విజయదశమి
సప్తమి, అష్టమి, నవమి రోజులు ఎంతో ఆనందంగా గడిచిపోయాయి. నేడు విజయదశమి పర్వదినం. పూజారి జగజ్జనని పూజను త్వరత్వరగా ముగిస్తున్నాడు. ఎందుకంటే నిర్ణీత సమయంలోగా దర్పణ – నిమజ్జన* కార్యాన్ని పూర్తిచేయాలి కనుక. సాయంత్రం దేవీప్రతిమను నిమజ్జనం చేస్తారు. మథుర్ కుటుంబ సభ్యులందరి హృదయాలలో ఏదో తెలియని విషాదం అలముకొంది. తమకు అత్యంత ప్రియమైన ఒక వ్యక్తి నుండి కలుగనున్న అనివార్యమైన తక్షణ ఎడబాటు వారిని వర్ణనాతీతమైన బాధకు గురిచేసింది. ఈ లోకంలో లభించే విశుద్ధ ఆనందం సైతం సదా ఒక విషాదఛాయతో కలిసే ఉంటుంది. మహాభక్తుల జీవితాలలో కూడ భగవద్విరహం నుండి జనించే బాధ అప్పుడప్పుడు కలగడం బహుశా ఈ నియతి కారణంగానేమో! ఈ విజయదశమి నాడు దేవి ప్రతిమను నిమజ్జనం చేయబోయినప్పుడు మనవంటి కఠిన హృదయాలు సైతం ద్రవించి పోతాయి. అటువంటప్పుడు మథుర్ భార్య సంగతి వేరే చెప్పాలా! ప్రొద్దుట నుండి తన పనులలో మునిగి ఉన్నప్పటికీ, ఆపుకోలేని కన్నీటిని ఆమె మాటిమాటికీ తన చీరచెంగుతో తుడుచుకోసాగింది.
10. దేవీ ప్రతిమను నిమజ్జనం చేయడం విస్మరించిన మథుర్
మథుర్కు మాత్రం ఈ రోజు దేవీప్రతిమను నిమజ్జనం చేయాలనే స్ఫురణే లేదు. మునుపటి మాదిరే అతడి హృదయం ఆనందంతో ఉప్పొంగుతూన్నది. జగజ్జననిని తన ఇంటికి తీసుకువచ్చి, ‘బాబా’ అసాధారణ సాంగత్యాన్ని కారుణ్యాన్ని చవిచూసి ఆనందంతో వివశుడై మైమరచిపోయాడు మథుర్. అటువంటప్పుడు బయట ఏం చేయాలో చేయకూడదో కనుగొనే వారెవరున్నారు? అలా కనుగొనవలసిన అవసరం మాత్రం ఏమున్నది? ‘తల్లి’ తోను, ‘బాబా’ తోను తన రోజులు ఇలా గడిచిపోతాయి కదా! ఆ సమయంలో నిమజ్జన తంతు జరుగబోతున్నదన్న కబురు పంపించాడు పూజారి. బాబు (మథుర్) కిందికి పూజామండపానికి వచ్చి ప్రణామాలు చేయగోరతాడో లేదో పూజారి తెలుసుకోగోరాడు.
11. నిమజ్జన తంతుకు మథుర్ నిరసన
విషయం ఏమిటో మథుర్ మొదట అర్థం చేసుకోలేకపోయాడు. అక్కడున్న వారిని అడిగి విషయం తెలుసుకొన్నాక నాడు విజయ దశమి అని అతడికి స్ఫురించింది. విషయం స్ఫురించగానే తలమీద గట్టి దెబ్బ తగిలిన వాడిలా నిర్ఘాంత పోయాడు. దుఃఖీస్తూ అతడు ఇలా అనుకొన్నాడు: “తల్లిని నేడు నిమజ్జనం చేయాలా? ఎందుకు? ‘బాబా’, జగన్మాతల కృపతో నా కేమీ కొదువ లేదే! ఇంతకు ముందులా కాక, నా గృహానికి జగజ్జనని ఆగమనంతో, నా మనస్సు పరమానందంతో నిండిపోయింది. అటువంటప్పుడు అమ్మను నిమజ్జనం చేసి దుఃఖాన్ని ఆహ్వానించడం ఎందుకు? ఊహు, ఈ ఆనందాన్ని చెల్లాచెదురు కానివ్వను. ‘తల్లి’ నిమజ్జనం అన్న తలంపే నన్ను ఊపిరాడకుండా చేసివేస్తోంది.” ఇలాంటి ఆలోచనలలో మునిగిపోయిన మథుర్ కళ్ళు చెమ్మగిల్లాయి.
ఈలోపు సమయం మించిపోతున్నది. “బాబూ, ఒక్కసారి రండి, ‘తల్లి’ నిమజ్జనం జరిగిపోవాలి” అంటూ పదే పదే పూజారి కబురు చేస్తున్నాడు. దాంతో మథుర్ బాగా చికాకుపడి ఇలా కబురు పంపాడు: “తల్లి నిమజ్జనానికి నేను ససేమిరా సమ్మతించను. పూజ ఇలాగే కొనసాగుతుంది. నా అనుమతి లేకుండా ఎవరైనా నిమజ్జనం చేశారో దారుణ పర్యవసానాన్ని చవిచూడవలసి ఉంటుంది. రక్తపాతం కూడ జరగవచ్చు.” ఇలా అంటూ మథుర్ గంభీరముద్ర వహించి, కూర్చున్నాడు. యజమాని విచిత్ర ప్రవర్తన చూసి బెదిరిపోయిన పనివాడు గబగబా పూజా మండపానికి వెళ్ళి జరిగినదంతా పూజారికి చెప్పాడు. అందరికీ ఊపిరి ఆగిపోయినంత పని అయింది.
12. నచ్చజెప్పబోయిన వారికి మథుర్ సమాధానం
అందరూ సంప్రతించుకొని, మథుర్ గౌరవించే కుటుంబాలలోని కొందరిని అతడికి నచ్చచెప్పడానికి పంపారు. వాళ్ళు అతడికి ఎంతగానో నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కాని మథుర్ మనస్సు మారలేదు. వాళ్ళ మాటలను అతడు పెడచెవిన పెట్టి, ఇలా అన్నాడు: “ఎందుకు? నేను అమ్మను నిత్యం పూజిస్తాను. ఆమె అనుగ్రహంతో అలా పూజించే తాహతు నాకు ఉన్నప్పుడు, ఆమెను ఎందుకు నేను నిమజ్జనం చేయాలి?” ఈ పరిస్థితిలో వాళ్ళు మటుకు ఏం చేయగలరు? వాళ్ళు వెనక్కు తిరిగి వచ్చేశారు. వారందరూ మథుర్కు మతి చెడిందనే నిర్ణయానికి వచ్చారు. వారందరూ ఆ నిర్ణయానికి వచ్చినా, ప్రస్తుతం దారేది? మథుర్ తొందరపాటు ఎవరికీ తెలియనిది కాదు. అతడికి కోపం వస్తే అతడిలో యుక్తాయుక్తత నశిస్తుంది. అతడి అనుమతి లేకుండా ప్రతిమ నిమజ్జనానికి ఆదేశించి అతడి కోపానికి గురయ్యేవారెవరు? కనుకనే ఎవ్వరూ ముందుకురాలేదు. గోరంతలు కొండంతలై ఈ సమాచారం గృహిణికి (జగదంబదాసికి) అందింది. ఆమె భయంతో బెదిరిపోయి, తన భర్తకు నచ్చచెప్పమని ‘బాబా’ ను వేడుకొంది. ఈ అపాయం నుండి వారిని ‘బాబా’ తప్ప కాపాడగలవారెవరు? మథుర్ మతి నిజంగా చెడలేదని ఎవరికి తెలుసు?
13. శ్రీరామకృష్ణులు మథుర్కు నచ్చజెప్పడం
శ్రీరామకృష్ణులు, మథుర్ వద్దకు వచ్చారు. ఆలోచనలో మునిగివున్న మథుర్ గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. శ్రీరామకృష్ణులను చూడగానే గబగబా ఆయన వద్దకొచ్చి, “బాబా! వాళ్ళు ఏమన్నా చెప్పనివ్వండి; నా బొందిలో ప్రాణం ఉండగా నేను తల్లిని నిమజ్జనం చేయనివ్వను. నిత్యం ఆమెను పూజిస్తానని వారందరితో చెప్పాను. ఆమె లేకుండా అలా ఎలా చేయగలను?” అని మథుర్ అన్నాడు.
శ్రీరామకృష్ణులు అతడి ఛాతీని నిమురుతూ, ఇలా పలికారు: “ఓహో! ఇదా నీ భయం? అమ్మను విడిచి నిన్ను ఎవరు ఉండమన్నారు? పైగా, నిమజ్జనం చేసినప్పటికీ ఆమె ఎక్కడకు పోతుంది? బిడ్డను వదలిపెట్టి తల్లి ఎక్కడైనా ఉండగలదా? ఈ మూడు రోజులూ మండపంలో ఆసీనురాలై అమ్మ నీ పూజను స్వీకరించింది. ఈ నాటి నుండి ఆమె నీకు మరింత చేరువైంది. నీ హృదయంలో ఆసీనురాలై నీ పూజను స్వీకరిస్తుంది.”
14. శ్రీరామకృష్ణుల స్పర్శ, పలుకుల అద్భుత శక్తి
శ్రీరామకృష్ణుల స్పర్శలో, పలుకులలో ఎటువంటి అద్భుతశక్తి ఉందో వర్ణించి చెప్పడం ఎవరి తరం! దర్శనార్థులెవరైనా ఏదైనా విషయం గురించి ఆయనతో గట్టిగా వాదించి, ఆయన నిర్ణయాన్ని ససేమిరా అంగీకరించకపోవడం ఎన్నోసార్లు మేం చూశాం. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు తెలివిగా ఆ వ్యక్తిని స్పృశించేవారు. తక్షణం అతడి మనోభావం పూర్తిగా మారిపోయేది. ఏ సంస్కారాల ప్రాబల్యంచేత అతడు విరుద్ధ వైఖరిని అవలంబించాడో ఆ సంస్కారాలు సమసి పోయి, వాదనను కట్టిపెట్టి శ్రీరామకృష్ణుల దృక్పథాన్ని అతడు నిస్సంకోచంగా ఆమోదించేవాడు. ఇలా ఎన్నోసార్లు జరిగింది. ఈ విషయంగా శ్రీరామకృష్ణులే స్వయంగా మాలో కొందరికి ఇలా చెప్పారు: “నేను మాట్లాడుతున్నప్పుడు ఎందుకలా వ్యక్తులను స్పృశిస్తానో మీకు తెలుసా? ఏ కారణంగా వాళ్ళలో ఆ మొండితనం ఉంటుందో అది తగ్గిపోయి వాళ్ళు సత్యాన్ని కచ్చితంగా అర్థం చేసుకోగలగడానికే అలా స్పృశిస్తాను.” ఈ రీతిలో కేవలం స్పర్శమాత్రం చేత, సత్యాన్ని యథాతథంగా తెలుసుకోనివ్వకుండా సాధన మార్గంలో పెద్ద ఆటంకాలుగా అడ్డుపడే శక్తుల ప్రాబల్యాన్ని తగ్గించడం లేదా వాటిని శాశ్వతంగా నాశనం చేసిన అనేక సంఘటనలను చూశాం, వినీ ఉన్నాం. అలా స్పృశించి ఆయన ఆ ఆటంక శక్తులను తమలోకి లాగుకొనేవారు. అలాగే ఏ పలుకులు ఇతరుల నోట వెలువడి ఎవరి మనస్సులను కించిత్తు కూడ ప్రభావితం చేయలేకపోయినవో, అవే పలుకులు శ్రీరామకృష్ణుల ముఖతా వెలువడి శ్రోతలను ఎంతో ప్రభావితం చేసేవి. ఆ క్షణమే వారి జీవన గమనం పూర్తిగా మారిపోయేది. ఈ సంఘటనల గురించి మరో సందర్భంలో ప్రస్తావిస్తాం. ఇక మథుర్బాబు కథ కొనసాగిద్దాం.
15. మథుర్ మామూలు స్థితిలోకి రావడం
శ్రీరామకృష్ణుల పలుకులతో, స్పర్శతో మథుర్ మెల్లగా మామూలు స్థితిలోకి వచ్చాడు. ఆయన స్పర్శతో, సంకల్పంతో మథుర్ ఏదో దివ్యదర్శనం పొందే అలా మామూలు స్థితిలోకి వచ్చాడేమో మాకు తెలియదు. బహుశా అలా జరిగి వుండవచ్చు. జగజ్జనని ఒక అపూర్వ దివ్యజ్యోతితో తన హృదయాన్ని ప్రకాశింపచేస్తూ ఆసీనురాలై ఉండడం దర్శించి, మథుర్ ఆనందం శతాధికమై దేవీ ప్రతిమ నిమజ్జనానికి ససేమిరా ఒప్పుకోని అతడి సంకల్పాన్ని సడలించిందని మనం ఊహించవచ్చు. నిజమైన గురువు ఉన్నత లక్ష్యంపైకి శిష్యుని దృష్టిని మరల్చినప్పుడు నిమ్న భావాలూ, స్థాయిలూ సహజంగానే శిష్యుడి మనస్సు నుండి అదృశ్యమైపోతాయి.
16. పరీక్షల కారణంగా మథుర్ విశ్వాసం ప్రగాఢం కావడం
శ్రీరామకృష్ణుల పట్ల మథుర్కు ఉన్న భక్తివిశ్వాసాలు మనకు విచిత్రంగా కనిపించవచ్చు. కాని అది అతడు ఎన్నో రీతుల ఆయనను పరీక్షించిన ఫలితమే అనే విషయం నిస్సందేహం. ఆయనకు సంపదనివ్వ ప్రయత్నించాడు, అందమైన స్త్రీల ప్రలోభానికి గురిచేయ యత్నించాడు, తనపైన తన కుటుంబంపైన అపరిమిత ఆధిపత్యం ఒసగాడు, హృదయ్ వంటి శ్రీరామకృష్ణుల బంధువుల కోసం ధనం వెచ్చించాడు. ఇలా మథుర్, శ్రీరామకృష్ణులను పరీక్షించిన తదనంతరం ఇతరుల్లా ఆయన ఏ ప్రలోభానికీ లొంగరని తెలుసుకొన్నాడు. బాహ్యంగా కనబరచే కపట భక్తివిశ్వాసాలు ఆయన దృష్టి నుండి తప్పుకోలేవని అతడు గ్రహించాడు. పైగా హత్యలవంటి మహాపాపాలకు ఒడిగట్టి కూడ ఎవరైనా పరిపూర్ణ విశ్వాసంతో ఆయనను శరణు వేడితే, వారి దుష్కృత్యాలనన్నింటిని క్షమించి ప్రేమతో వారిని ఆదరించడమే కాక, క్రమంగా ఉన్నతమైన ఆదర్శాలను గ్రహించే శక్తిని సైతం అనుగ్రహిస్తారని మథుర్ తెలుసుకోగలిగాడు. ఇలా అసంభవాన్ని సంభవం చేసే ఏదో ఒక అపూర్వశక్తి, శ్రీరామకృష్ణులే అని మథుర్ గ్రహించగలిగాడు.
17. భావసమాధి పొందాలన్న మథుర్ ఆకాంక్ష
శ్రీరామకృష్ణుల సాంగత్య లబ్ధి పొందుతూ, భావసమాధిలో ఆయన పొందే అపరిమిత ఆనందాన్ని చూసి, స్వయంగా తాను అటువంటి భావసమాధి పొందాలన్న ఆకాంక్ష, ప్రాపంచికుడైన మథుర్కు ఒకప్పుడు కలిగింది. సంకల్పమాత్రం చేత అందరికీ అటువంటి సమాధి అనుభూతిని శ్రీరామకృష్ణులు కలిగించగలరనే ప్రగాఢ నమ్మకం మథుర్కు ఉంది. ఎందుకంటే శివుడు, కాళీ, కృష్ణుడు, రాముడు అందరూ స్వయంగా ఆయనే కదా! అలాంటప్పుడు దివ్యదర్శనాలు కలిగించడంలో కష్టం ఏముంటుంది? అయినప్పుడు తాను కోరిన ఏ రూపంలో అయినా ఆయన తమ దర్శనాన్ని ఇవ్వగలరనడంలో వింతేమీ లేదు. నిజానికి ఇటువంటి విశ్వాసం కలిగి ఉండడం సామాన్యమైన విషయం కాదు. శ్రీరామకృష్ణులతో సన్నిహితంగా మెలగిన ప్రతి ఒక్కరికీ సంకల్పమాత్రాన ఆయన అసాధ్యాలను సాధ్యాలు చేయగలరనీ, ఇచ్ఛామాత్రాన ఎవరికైనా ఆధ్యాత్మిక సత్యాల అనుభూతి కలిగించగలరనే ప్రగాఢ విశ్వాసం కలిగేది. తన పవిత్రతతో, ఆధ్యాత్మిక శక్తితో ఒక్కరికైనా అటువంటి అనుభూతుల నివ్వడం సామాన్యుడైన గురువుకు సాధ్యం కానప్పుడు, అనేకులకు ఆధ్యాత్మికానుభూతి కలిగించడం అసాధ్యం అనే సంగతి మనం అర్థం చేసుకోవచ్చు. అవతారపురుషులకు మాత్రమే అలా చేయడం సాధ్యం. అవతారపురుషులనడానికి ఉన్న ప్రత్యేక నిదర్శనాలలో ఇదొకటి. కాని అవతారపురుషుల పేరిట వంచన, మోసం, స్వార్థంతో కూడిన ఈ లోకంలో ‘మేం అవతారపురుషుల’ మని మోసం చేసేవారు ఎందరో ఉంటారని ఆ అవతారపురుషులకు చక్కగా తెలుసు. కనుకనే వారు ఇలా ప్రకటించి ఉన్నారు: “నేను ఇక్కడ నుండి నిష్క్రమించిన తరువాత, ‘నేను భగవదవతారాన్ని, దుర్బల జీవులకు శరణ్యుడను, ముక్తి ప్రదాతను’ అని ప్రకటించే నయవంచకులు అనేకులు మీ ముందు ప్రత్యక్షమౌతారు. వారి నుండి జాగ్రత్తపడండి.”*
18. భావసమాధికై మథుర్, శ్రీరామకృష్ణులను ప్రార్థించడం
ఆ కోర్కె మనస్సులో తలెత్తగానే మథుర్ వెంటనే శ్రీరామకృష్ణుల వద్దకెళ్ళి మొండిగా, “బాబా! నాకు భావసమాధి కలగడానికి ఏదో ఒకటి చేసిపెట్టు” అని అడిగాడు. అటువంటి సందర్భాలలో శ్రీరామకృష్ణులు ఇతరులకు ఏం చెప్పివుంటారో అదే మథుర్కు కూడ చెప్పి ఉంటారని మనం ఊహించుకోవచ్చు. “ఓహ్, సరైన సమయంలో అది తప్పక కలుగుతుంది. నాటిన వెంటనే విత్తనం మొలకెత్తి, పెరిగి చెట్టయి వెంటనే తినడానికి పళ్ళను కాస్తుందా? ఎందుకు? నువ్విప్పుడు బాగానే ఉన్నావు కదా! భగవంతుడు, సంసారం రెండింటి మధ్య చక్కని సమతుల్యం పాటిస్తున్నావుగా. నీకు అవన్నీ (భావసమాధులు మొదలైనవి) కలిగితే, నీ మనస్సు సంసారాన్ని త్యజిస్తుంది. అటువంటప్పుడు నీ జమీని, ఇతర ఆస్తిపాస్తులను దక్షతతో ఎవరు చూసుకొంటారు? నీ ఆస్తిపాస్తులను అందరూ కొల్లగొట్టి అనుభవించడం తథ్యం. అప్పుడు నువ్వు ఏం చేస్తావు?”
19. మథుర్ను శ్రీరామకృష్ణులు నిరుత్సాహపరచడం
కాని ఆ మాటలు పట్టించుకునేదెవరు? బాబా తనకు భావసమాధి కలిగించాలని మథుర్ పట్టుబట్టాడు. ఎంత నిరుత్సాహపరచినా ఫలితం లేకపోయేసరికి శ్రీరామకృష్ణులు ప్రసంగాన్ని మరోమెట్టు పైకి తీసుకువెళ్ళి, ఇలా అన్నారు: “ఆహా, భక్తులు భగవంతుణ్ణి దర్శించగోరతారా? లేదు. ఆయనను సేవించడమే వారి అభీష్టం. దర్శన అనుభూతులు, భగవత్ శక్తుల ఎరుక ద్వారా భీతిని ఉత్పన్నం చేస్తాయి; పర్యవసానంగా భగవత్ప్రేమ అణగిపోతుంది. శ్రీకృష్ణుడు మథురానగరానికి వెళ్ళిన తరువాత కృష్ణ విరహంతో గోపికలు ఎంతో వ్యధను అనుభవించారు. వారిని స్వాంతనపరచడానికి కృష్ణుడు వారి వద్దకు ఉద్ధవుణ్ణి పంపించాడు. ఉద్ధవుడు వేదాంతాన్ని అవపోశన పట్టినవాడు. కృష్ణుడికి తినిపించడం, అలంకరించడం, అతడికై కన్నీరు కార్చడం మొదలైన బృందావన గోపికల సభక్తిక వైఖరులను ఉద్ధవుడు మెచ్చుకోలేకపోయాడు. గోపికల విశుద్ధ ప్రేమ ఉద్ధవుడికి హీనమైందిగా, మాయకు లోనైనదిగా గోచరించింది. గోపికల ప్రేమ ఉద్ధవుడి కొక గుణపాఠం కాగలదనే ఉద్దేశంతో కూడా శ్రీకృష్ణుడు అతణ్ణి బృందావనానికి పంపి ఉండవచ్చు.
“ఉద్ధవుడు, గోపికలను అనునయించసాగాడు: ‘పదే పదే మీరు ‘కృష్ణా! కృష్ణా!’ అంటూ ఎందుకు వాపోతున్నారు. ఆయన పరమాత్ముడనీ, సర్వాంతర్యామి అనీ మీకు తెలియదా? ఆయన కేవలం మథురానగరంలోనే ఉన్నాడు, బృందావనంలో లేడని అనుకోవడం సబబా? నిరాశా నిస్పృహలతో దుఃఖీంచడం మాని, కళ్ళుమూసుకొని చూడండి: మీ నీలమేఘశ్యాముడు, మీ వనమాలి, పిల్లనగ్రోవిని వాయిస్తూ మీ హృదయంలోనే విరాజిల్లడం మీరు దర్శించగలరు.’ ఆ పలుకులు విని గోపికలు ఇలా అన్నారు: ‘ఉద్ధవా! నువ్వు కృష్ణుడి మిత్రుడవు, గొప్ప జ్ఞానివి. నువ్వే ఇలా పలకడం సముచితమా? ధ్యానం చేసినవారమా, జ్ఞానులమా మేము? లేదా ఋషులు, మునులలా జపతపాదులు అనుష్ఠించి మేం ఆయనను పొందామా? నిజానికి మేం ఆయనను అలంకరించాం, తినిపించాం, లాలించాం. అవన్నీ ఇప్పుడు మళ్ళీ మేం ధ్యానంలో చేయాలా? మేం అలా చేయగలమా? ధ్యానం, జపం చేయగల మనస్సులు మాకు ఉన్నాయా? శ్రీకృష్ణ పాదారవిందాల చెంత మా మనస్సులను ఏనాడో అర్పించివేశాం. ‘మాది’ అన్నది ఏదైనా మాకు ఉన్నప్పుడే కదా దాన్లో ‘నేను’ అనే భావాన్ని ఆరోపించి జపధ్యానాదులు చేయగలగడం?’
“గోపికల మాటలు విని ఉద్ధవుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడతడికి గోపికలకు శ్రీకృష్ణునిపట్ల ఉన్న ప్రేమ ప్రగాఢత, స్వభావం అర్థమయ్యాయి. వారిని గురువులుగా ఎంచి, ప్రణామం చేసి తిరిగి వెళ్ళిపోయాడు. యోచించి చూడు, నిజమైన భక్తుడు భగవంతుణ్ణి చూడగోరతాడా? భక్తుని పరమానందం అంతా ఆయనను సేవించడంలోనే ఉంది. అంతకు మించి, దర్శనాదుల వంటివి అతడికి అవసరంలేదు. ఇవి భగవత్ప్రేమకు అవరోధాలు.”
భావసమాధిని కోరవద్దని ఎంతచెప్పినా మథుర్ వినకపోవడంతో, చివరికి శ్రీరామకృష్ణులు, “సరే! నాకేమీ తెలియదు. అయినప్పటికీ అమ్మకు చెబుతాను. ఆ పైన ఆమె ఇష్టం” అని అన్నారు.
20. మథుర్ భావ సమాధి: శ్రీరామకృష్ణులను ప్రార్థించడం
ఇది జరిగిన కొన్ని రోజులకు మథుర్ భావసమాధిని పొందాడు. ఆ విషయంగా శ్రీరామకృష్ణులు మాతో ఇలా చెప్పారు: “నాకు కబురు పంపారు. నేను వెళ్ళి చూద్దును కదా, మథుర్ భిన్న వ్యక్తిలా కనిపించాడు. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి, కన్నీరు ధారగా ప్రవహిస్తున్నది. భగవంతుణ్ణి గురించి ప్రసంగిస్తూ ఉంటే కన్నీరు ప్రవాహంలా స్రవిస్తూన్నది. అతడి హృదయం అమితవేగంగా కొట్టుకొంటున్నది. నన్ను చూడగానే నా కాళ్ళమీద పడి ఇలా వాపోయాడు: ‘క్షమించు బాబా! తప్పుచేశానని ఒప్పుకొంటున్నాను. మూడు రోజులుగా ఇదే స్థితిలో ఉన్నాను. ఎంత ప్రయత్నించినా నా జమీ వ్యవహారాలలో మనస్సును నిలపలేకపోతున్నాను. పర్యవసానం అంతా అస్తవ్యస్తమైపోతున్నది. నువ్విచ్చిన ‘పారవశ్యాన్ని’ తిరిగి తీసుకో. నాకది వద్దు.’ అందుకు నేను, ‘ఎందుకు? కావాలని నువ్వు అడిగిందే కదా?’ అని అన్నాను. అప్పుడతడు, ‘అవును, నేను అడిగిన మాట నిజమే. దీనిలో పరమానందం కూడ ఉంది. కాని ప్రయోజన మేమిటి? ఇటుప్రక్క సర్వనాశనమైపోతున్నది. ఈ భావపారవశ్యం బాబా, నీకు మాత్రమే చెల్లుతుంది. ఇటువంటివన్నీ మాకు అవసరంలేదు. కరుణించి, దాన్ని వెనక్కు తీసుకో’ అని అన్నాడు. నేనప్పుడు నవ్వి, ‘ముందుగానే ఈ సంగతి చెప్పానుకదా!’ అని చెప్పాను. ‘అవును, బాబా! అయినా ఇది నన్ను దయ్యంలా ఆవహిస్తుందనీ, ఇరవై నాలుగు గంటలూ దాని చెప్పుచేతల్లో పడివుండాలనీ, కావాలనుకొన్నా ఏమీ చేయలేకపోతాననీ నేనప్పుడు స్పష్టంగా గ్రహించలేకపోయాను’ అని అన్నాడు. అప్పుడు నేను అతడి ఛాతీని నెమ్మదిగా నిమిరాను.”
21. త్యాగ పురుషులు తప్ప భావసమాధిని ఎవరూ నిలుపుకోలేరు
భావసమాధి కలిగినంత మాత్రాన సరిపోదు. దాని ఉద్ధృతిని ఎంతమంది తట్టుకోగలరు? దానిని నిలుపుకోవడం ఎందరికి సాధ్యపడుతుంది. లౌకిక వాసనలు కించిత్తు సైతం ఉన్నంతవరకు దానిని నిలుపుకోవడం అసంభవం. అందుచేతనే ప్రారంభం నుండి వాసనారహితులై ఉండాలని భగవన్మార్గగాములను, శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. ‘త్యాగేనైకేన అమృతత్త్వమానశుః’* – కేవలం త్యాగం, వైరాగ్యం మాత్రమే అమృతత్త్వాన్ని ఇవ్వగలవు.’ తాత్కాలికంగా జనించే భావోద్వేగం ద్వారా నిమ్నస్థాయి సమాధి కలుగవచ్చు. కాని సంపద, పేరు ప్రతిష్ఠలు మొదలైన వాటిపట్ల కోర్కెలు ఉన్నంత వరకు సమాధ్యవస్థ ఎక్కువకాలం నిలవదు. ఇటువంటి వారిని గురించి శంకరాచార్యులు ఇలా అంటున్నారు:
ఆపాతవైరాగ్యవతో ముముక్షూన్
భవాబ్ధిపారం ప్రతియాతుముద్యతాన్ ।
ఆశాగ్రహో మజ్జయతేఽన్తరాళే
నిగృహ్య కణ్ఠే వినివర్త్య వేగాత్ –వివేకచూడామణి. 79
[మందవైరాగ్యం గల వ్యక్తి భవసాగరాన్ని దాటడానికి ప్రయత్నిస్తే, కోర్కె అనే మొసలి అతడి కంఠం పుచ్చుకొని భవసాగరంలో ముంచివేస్తుంది. అంటే పరిపూర్ణ వైరాగ్యంలేని వ్యక్తికి ముక్తి లేదని భావం.]
22. ఒక యువకుడి దృష్టాంతం
శ్రీరామకృష్ణుల సాన్నిధ్యంలో ఉంటున్నప్పుడు మేం చూసిన ఇటువంటి అనేక నిదర్శనాలలో ఒకటి ఇక్కడ పొందుపరుస్తున్నాం. అప్పుడు శ్రీరామకృష్ణులు కాశీపూర్ ఉద్యాన గృహంలో ఉంటున్నారు. ఒక రోజు కొందరు వైష్ణవ భక్తులు ఒక మతిమరుపు యువకుణ్ణి తోడ్కొని వచ్చారు. మేం వారిని అంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఆ యువకుణ్ణి శ్రీరామకృష్ణులకు చూపించి, హఠాత్తుగా అతడికి కలిగిన ఆధ్యాత్మికావస్థను గురించి ఆయన అభిప్రాయం తెలుసుకోవడానికి వారు వచ్చారు. శ్రీరామకృష్ణులకు వారి రాక తెలిపారు. ఆయన వచ్చి ఆ యువకుణ్ణి చూశారు. ఆ యువకుడి ముఖం, ఛాతీ ఎర్రబారి ఉన్నాయి. అతడు వినమ్రంగా అందరి పాదధూళీ తీసుకొంటున్నాడు. అతడు భగవన్నామ స్మరణ చేస్తూవుంటే అతడి శరీరం కంపిస్తున్నది, గగుర్పాటు చెందుతున్నాడు. కన్నీరు సదా స్రవిస్తూండడంచేత రెండు కళ్ళూ ఎర్రబడి, ఉబ్బివున్నాయి. అతడిది చామనఛాయ రంగు. అటు లావు ఇటు సన్నంగాని మధ్యరకంగా ఉన్నాడు. తల మీద శిఖ ఉంది. అతడి ముఖం, అవయవాలు పొందికగా ఉన్నాయి. అంచులేని కాస్త మాసిన తెల్లపంచె ధరించి ఉన్నాడు. ఉత్తరీయం లేదు, కాళ్ళకు చెప్పులు లేవు. తన దేహం పట్ల పూర్తి నిర్లిప్తత ఉన్న వ్యక్తిలా కనిపించాడు. ఒక రోజు హరినామ సంకీర్తన చేస్తూ ఉండగా హఠాత్తుగా అలాంటి ఉద్రేకావస్థ అతడికి కలిగిందని విన్నాం. ఆనాటి నుండి ఒక రకంగా చెప్పాలంటే అతడికి నిద్రాహారాలు దాదాపు లేవనే చెప్పాలి. పైగా భగవద్దర్శనం కలుగలేదే అని రేయింబవళ్ళు విలపిస్తూ, నేలమీద దొర్లుతున్నాడట. అతడు కొద్దిరోజులుగా ఆ స్థితిలోనే ఉన్నాడట.
23. ఆధ్యాత్మిక భావోద్వేగాన్ని గుర్తించే శ్రీరామకృష్ణుల శక్తి
ఆధ్యాత్మిక భావోద్వేగాలు ఉత్పన్నం చేసే భౌతిక వికారాలను గుర్తించి, కనుగొన గల శక్తి శ్రీరామకృష్ణులకు తప్ప మరెవరిలోనూ మేము చూడలేదు. గురుగీత వంటి గ్రంథాలు గురువును ‘భవరోగ వైద్యు’ డని అభివర్ణిస్తున్నాయి. దానిలో ఇంత నిగూఢార్థం ఇమిడి ఉంటుందని గురుదేవులను దర్శించడానికి మునుపు మేం కించిత్తయినా అర్థం చేసుకోలేదు. నిజానికి గురువు మానసిక రుగ్మతలకు వైద్యుడు. విభిన్న ఆధ్యాత్మిక ఉద్వేగాల ప్రభావంచేత మనిషి మనస్సులో చెలరేగే పరిణామాలను చూసిన తక్షణమే గుర్తించగల వ్యక్తి. పైగా బాహ్య లక్షణాలను పరికించి, అవి అతడికి సానుకూలమైనవై ఉంటే, అతణ్ణి మరింత ఉన్నత ఆధ్యాత్మిక స్థాయికి తీసుకువెళ్ళే మార్గాన్ని నిర్దేశిస్తాడు. ఒకవేళ అవి అతడికి ప్రతికూలమైనవి అయిన పక్షంలో, అవి అతడికి ఎలాంటి హాని చేయకముందే క్రమంగా అవి తొలగిపోయే విధానాన్ని నిర్దేశిస్తాడు. గురుదేవులు ప్రతి రోజు ఇలా చేయడం కళ్ళారా మేం చూడడం వలనే మాకు ఈ విషయంలో ప్రగాఢ విశ్వాసం కలిగింది.
స్వామి వివేకానంద మొట్టమొదటిసారి నిర్వికల్ప సమాధి పొందినప్పుడు, వెంటనే శ్రీరామకృష్ణులు అతణ్ణి ఇలా నిర్దేశించారు: “కొన్ని రోజుల దాకా ఎవరి చేతి నుండీ ఆహారం స్వీకరించవద్దు. నువ్వే వండుకొని తిను. ఈ అవస్థలో మహా అయితే కన్నతల్లి వండింది తినవచ్చు. ఇతరులు వండిన ఆహారం భుజిస్తే ఈ భావావస్థ తొలగిపోతుంది. క్రమంగా ఆ భావావస్థ సహజమైపోతే, ఆ తరువాత ఇక భయం ఉండదు.” శరీరంలో వాతం అధికరించి ఎంతో బాధపడుతున్న గోపాల్ తల్లికి ఆయన ఇలా చెప్పారు: “ఆ వాతం ఉందే, అది శ్రీహరి వాయువు.* అది పోతే ప్రొద్దు ఎలా గడుపుతావు? అది ఉండడం మంచిదే. అయినా నొప్పి ఎక్కువైనప్పుడు ఏదో కొంచెం తిను.” ఫలానా ఒక భక్తుడికి బాహ్యశౌచం మీద ఎంతో నిష్ఠ ఉన్న కారణంగా, దేహబుద్ధిని మరిచి అతడి మనస్సు భగవంతునిలో లీనం కావడం లేదు. అది చూసి శ్రీరామకృష్ణులు గోప్యంగా అతణ్ణి ఇలా నిర్దేశించారు: “జనం మలమూత్రాదులు విసర్జించే చోట మట్టితో బొట్టు పెట్టుకొని భగవంతుణ్ణి ప్రార్థించు.” సంకీర్తన చేస్తూ చేస్తూ అదుపు చేసుకోలేని శారీరక వికారాలకు లోనయ్యే మరొక వ్యక్తిని చూసి, ఆ వికారాలు అతడి ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధాలవుతాయని గమనించి, అతణ్ణి మందలించి శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “ధూర్తుడా! నీ ఆధ్యాత్మిక ఉద్వేగాల బడాయిని నా ముందు ప్రదర్శించాలని వచ్చావా? నిజమైన ఆధ్యాత్మిక ఉద్వేగాలు ఎన్నడైనా ఇటువంటి వికారాలను కలిగిస్తాయా? ఆ సమయంలో పూర్తిగా భావావస్థలో లీనమైపోయి, నిశ్చలుడైపోతాడు. కాని ఈ గంతులన్నీ ఏమిటి? స్థిమితపడు. (ఇతరులతో) ఈ భావోద్వేగాలు ఎలాంటివో మీకు తెలుసా? పావు సేరు పాలను ఒక బానలోపోసి కాయడం వంటిది. చూసినవారు బాననిండా పాలున్నాయని భావిస్తారు. తరువాత బాన దింపిచూస్తే చుక్కపాలు కూడ కనిపించవు. ఉన్న కాసిని పాలు బాన ప్రక్కలకు అంటుకొనిపోయి ఉంటుంది.” అలాగే మరో వ్యక్తి మనోవైఖరిని గ్రహించి ఆయన ఇలా అన్నారు: “ధూర్తుడా! సంతృప్తిగా అనుభవించు. దాన్నంతా ఆధ్యాత్మిక కర్తవ్యం కింద ఎంచి చేస్తున్నానని మాత్రం భావించకు.”
24. ఆ యువకుడి స్థితి గురించి శ్రీరామకృష్ణుల అభిప్రాయం
ఆ యువకుణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “ఇది మధురభావ ప్రాథమిక అవస్థగా* కనిపిస్తున్నది. అయినా ఈ అవస్థ ఎల్లకాలం నిలవదు. ఇతడు దీన్ని నిలుపుకోలేడు. ఈ అవస్థను నిలుపుకోవడం ఎంతో కష్టం. ఈ అవస్థలో (కామభావంతో) ఏ స్త్రీని అయినా తాకితే ఆ భావాన్ని పూర్తిగా కోల్పోడం ఖాయం.” శ్రీరామకృష్ణుల మాటలతో ఆ యువకుడికి మతి చెడలేదని తెలుసుకొని ఆ వైష్ణవ భక్తులు ఊరట చెంది వెళ్ళిపోయారు. తరువాత కొన్ని రోజులకు శ్రీరామకృష్ణులు చెప్పినట్లే జరిగిందన్న సమాచారం తెలియవచ్చింది. ఆ యువకుడు పతనమయ్యాడు. క్షణిక సంకీర్తనపు ఉద్వేగంలో అదృష్టవశాన అతడెంత ఉచ్చస్థితిని పొందాడో, ఆ ఉద్వేగపు పొంగు చల్లారగానే అంతే అగాధంలో పడిపోయాడు. తాత్కాలిక భావోద్వేగాలు ఇటువంటి పతనాన్ని కలిగిస్తాయనే భయంతోనే స్వామి వివేకానంద వివేచనాత్మక భక్తినే సమర్థించేవారు. అటువంటి భక్తినే పాటించమని ఆయన బోధించేవారు. లేకుంటే ఇటువంటి పతనావస్థ తప్పదని ఉద్ఘాటించేవారు.
25. మథుర్ పట్ల శ్రీరామకృష్ణుల నిర్మొహమాట ప్రవర్తన
బాబా వద్ద దాచవలసింది ఏదీ మథుర్కు లేనట్లే, ఒక్క భావసమాధిలో నెలకొని ఉన్నప్పుడు తప్ప మథుర్ వద్ద దాచవలసిందేదీ బాబాకూ ఉండేది కాదు. తల్లి పట్ల బిడ్డ, మిత్రుని పట్ల మిత్రుని ధోరణిలో వారిమధ్య అరమరికలు ఉండవు. ప్రతి విషయం గురించి మథుర్‌తో మాట్లాడేవారు, అతణ్ణి సంప్రతించేవారు, అతడి సలహా పాటించేవారు, ఆతడి ఆప్యాయ పూరితమైన సంరక్షణ అభిలషించేవారు. పరావిద్య చిట్టచివరి మెట్టును అధిరోహించిన వ్యక్తి సామాన్యుల దృష్టికి పిచ్చివాడిగానో, పిశాచంగానో లేదా చిన్నపిల్లవాడిగానో కనిపిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయని ఇంతకు మునుపే తెలిపివున్నాం. అటువంటి బ్రహ్మజ్ఞాని అతులిత రాజభోగాలలో తేలిపోతూ ఉన్నా లేదా కౌపీనమాత్రుడై భిక్షాన్నంతో కాలం గడుపుతున్నా, సామాన్యుల దృష్టిలో ఆనందాన్ని అనుభవిస్తున్నా లేదా యాతనావస్థలో ఉన్నా అతడెప్పుడూ నిశ్చలమనస్కుడై, సదా ఆత్మానందంలో నెలకొని ఉంటాడని జగద్గురువులైన శంకరాచార్యులు అంటున్నారు:
క్వచిన్మూఢో విద్వాన్క్వచిదపి మహారాజవిభవః
క్వచిద్భ్రాన్తః సౌమ్యః క్వచిదజగరాచారకలితః ।
క్వచిత్పాత్రీభూతః క్వచిదవమతః క్వాప్యవిదిత
శ్చరత్యేవం ప్రాజ్ఞః సతతపరమానన్దసుఖీతః ॥ –వివేకచూడామణి, 542
“ఇటువంటి మహాత్ముడు ఒకప్పుడు మూర్ఖుడిలా, మరొకప్పుడు మహా విద్వాంసుడిలా తిరుగుతూ ఉంటాడు. ఇంకొకప్పుడు మహారాజ వైభవాలలో మునిగి ఉంటాడు. ఒకప్పుడు పిచ్చివాడిలా, మరొకప్పుడు శాంతమూర్తిగా కనబడతాడు. ఒక్కొక్కప్పుడు కొండచిలువ మాదిరి యాదృచ్ఛికంగా లభించిన ఆహారం తిని జీవిస్తూంటాడు. ఒక్కోసారి మహత్ గౌరవాలు పొందుతూ, మరోసారి అవమానాల పాలబడుతూ, మరికొన్నిసార్లు అజ్ఞాతంగా ఉంటూ జీవిస్తాడు. ఏ అవస్థలో ఉన్నప్పటికీ అతడు సర్వదా ఆత్మానందంలో ఉంటాడు.”
జీవన్ముక్తులైన పురుషుల విషయమే ఇలా ఉన్నప్పుడు, మహామహిమోపేతులైన అవతార పురుషులు సదా సర్వావస్థలలోనూ నిశ్చలంగా, పిల్లల మాదిరి మెలగుతుంటారని వేరే చెప్పాలా? కనుక మథుర్‌తో శ్రీరామకృష్ణులు అలా వ్యవహరించడంలో ఆశ్చర్యంలేదు. కాని ఆయనతో అంత సన్నిహితంగా, అంత దీర్ఘకాలం గడపడం మథుర్బాబు మహద్భాగ్యం అనడం అతిశయోక్తి కాబోదు.
26. మథుర్ సంక్షేమం పట్ల శ్రీరామకృష్ణుల అక్కర
ఆహా, శ్రీరామకృష్ణ – మథుర్బాబుల మధ్య ఎంతటి సుమధుర బాంధవ్యం నెలకొని ఉందో కదా! శ్రీరామకృష్ణుల సాధన కాలంలోనూ, తదనంతరమూ ఏం కావలసివచ్చినా ఆయన మథుర్ను అడిగేవారు. అలాగే తాము చూసిన దివ్య దర్శనాలు, అనుభూతం చేసుకొన్న భావావస్థల గురించి మథుర్ను, “అలా ఎందుకు జరిగిందో కాస్త చెప్పగలవా? దానిని గురించి నువ్వు ఏమనుకొంటున్నావు?” అని అడిగేవారు. మథుర్ సంక్షేమం ఒక కంట కనిపెట్టే ఉండేవారు. అతడి ధనం సద్వినియోగం కావాలనుకొనేవారు. ఆలయానికి చెందిన ధనంతో దేవుని సేవ, తద్ద్వారా అతిథులు, బీదసాదలు, సాధుసన్న్యాసుల పోషణ చక్కగా జరిగితే మథుర్కు పుణ్యం, పురుషార్థం కలుగుతాయని ఆయన ఆకాంక్ష. గుణవంతులైన రాణీ రాస్మణి, మథుర్బాబులు గతించిన చాలాకాలం తర్వాత, మేం ఆయనతో వసిస్తున్న కాలంలో కూడ అప్పుడప్పుడు ఆయన ఇలా వ్యవహరించడం చూశాం. ఇందుకు ఒక ఉదాహరణను ఇక్కడ పొందుపరచడం అప్రస్తుతం కాబోదు.
27. ఆలయ ప్రసాదంలో తమ వంతు ప్రసాదాన్ని సాధికారికంగా అడగడం
కాళీ, రాధా – గోవిందుల పూజ నైవేద్యాలు ముగిసిన తరువాత రెండు పళ్ళెరాలలో అన్నప్రసాదం, పళ్ళు, మిఠాయిలు, తినుబండారాలు శ్రీరామకృష్ణుల గదికి పంపే ఆనవాయితీ మథుర్ కాలం నుండి వస్తూవుంది. అలా పంపిన ప్రసాదాన్ని ఆయన, తదితరులు భుజించేవారు. దీనితో పాటు కాళీమాతకు, రాధా – గోవిందులకు పండుగ రోజులలో ప్రత్యేకంగా నివేదించిన నైవేద్యాలలో కొంత భాగం ఆయన గదికి పంపేవారు. అది వర్షాకాలం. ఆ రోజు ఫలహారిణీ కాళీపూజ పర్వదినం. ఆలయంలో ప్రతీ ఏటా ఈ పూజను జరిపించడం ఆనవాయితీ. ఆ రోజు జగజ్జననికి ప్రత్యేక పూజలు జరిపి, వివిధ ఫలాలు నైవేద్యంగా అర్పిస్తారు. ఆ రోజు కూడా అలాగే పూజ జరిపించారు. నహబత్ నుండి వినవచ్చే చక్కని సంగీతం వీనులవిందు చేసింది. ఆ రోజు శ్రీరామకృష్ణులతో స్వామి యోగానంద తదితర భక్తులు ఉన్నారు.
28. విశేష సందర్భాలలో శ్రీరామకృష్ణులలో విభిన్న భావసమాధ్యవస్థలు
విశేషమైన పర్వదినాలలో శ్రీరామకృష్ణుల మనశ్శరీరాలలో విభిన్న ఆధ్యాత్మిక భావాలు ఉదయించేవి. వైష్ణవ పర్వదినాలలో వైష్ణవ భావాలు, శాక్తుల పర్వదినాలలో శక్తికి సంబంధించిన భావాలు ఆయనలో అభివ్యక్తమయ్యేవి. దుర్గాపూజా సమయంలో, విశేషంగా సంధిపూజ ఆసన్నమై నప్పుడు లేదా కాళీపూజా సమయంలో శ్రీరామకృష్ణులు జగన్మాతృ భావంలో తాదాత్మ్యం చెందేవారు. ఆ సమయంలో ఆయన నిశ్చలులై ఉండేవారు; కొన్ని సందర్భాలలో వరాభయముద్ర వహించేవారు. అదేవిధంగా జన్మాష్టమి వంటి పండుగ రోజులలో శ్రీకృష్ణుడు, రాధాదేవి భావంలో తన్మయులై ఉండేవారు. అలాంటి సందర్భంలో ఆయనలో కంపనం, గగుర్పాటు వంటి ఎనిమిది సాత్త్విక వైష్ణవ లక్షణాలు వ్యక్తమయ్యేవి. అప్రయత్నంగా వాటంతట అవే ఈ ఆధ్యాత్మిక భావాలు ఆయనలో కలిగేవి. అటువంటి విశేష పర్వదినాలలో మాతో మాట్లాడుతూ ఆ రోజు ఆ విశేష పర్వదినమన్న సంగతే పూర్తిగా మర్చిపోయేవారు. అటువంటప్పుడు ఎవరో బలవంతంగా చేయించినట్లు హఠాత్తుగా ఆయన మనస్సు బయటి వ్యవహారం నుండి వెనక్కు మరలి ఆయా భగవద్భావాలలో తాదాత్మ్యం చెందడం మేం కళ్ళారా చూశాం. శ్యాంపుకూర్లో ఆయన వసించినప్పుడు ఇటువంటి సంఘటనలను ఎన్నో చూశాం. దుర్గాపూజల్లో ఒక రోజు డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ మొదలైన పలువురు ఆయన గదిలో సమావేశమయ్యారు. వారితో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ సంధిపూజా సమయం ఆసన్నమైన తక్షణం జగన్మాతృ భావంలో మగ్నులైపోయారు. చిరునవ్వు చిందిస్తూ, దేదీప్యమానంగా ప్రకాశిస్తూన్న ఆయన వదనాన్ని అప్పుడు చూసినప్పుడు కొన్ని క్షణాల క్రితం రోగంతో బాధపడుతూ మానవదనులైన వ్యక్తే ఈయన అని ఎవరు చెప్పగలరు? ఆయన తీవ్రరోగంతో బాధపడుతున్నారని ఎవరు అనుకుంటారు?
ఫలహారిణీ కాళీపూజ పర్వదినం అయిన ఈనాడు కూడ శ్రీరామకృష్ణుల మనశ్శరీరాలలో దివ్యభావం అభివ్యక్తమైంది. పరమానందం పొంగిపొరల ఆయన అప్పుడు అయిదేళ్ళ పిల్లవాడిలా తల్లిని గూర్చి పాడుతూ, నృత్యం చేయసాగారు. అసాధారణ దివ్యసౌందర్యం వెదజల్లుతున్న ఆయన ముఖారవిందాన్ని అందరూ రెప్పలార్పక చూస్తూ, ముగ్ధులవుతున్నారు. ఆ దివ్య–మానవుడి దివ్య సాంగత్య ప్రభావంచేత అక్కడున్న అందరూ తమ తమ హృదయాలలో వివిధ అద్భుత దివ్యభావోద్వేగాలను అనుభవిస్తున్నారు. ఫలహారిణీ కాళీపూజ పూర్తి అయ్యేసరికి రాత్రి దాదాపు గడిచిపోయింది. కనుక ఎవరూ కాస్త విశ్రాంతి కూడ తీసుకోలేకపోయారు. ఇంతలో తెల్లవారింది.
ఉదయం తొమ్మిది గంటలయినా ఆనవాయితీగా ఆయనకు పంపే ప్రత్యేక ప్రసాదంలో భాగం రాలేదు. కాళికాలయ పూజారీ, తమ అన్నగారి కుమారుడూ అయిన రామ్‌లాల్‌ను పిలిచి, ప్రసాదం తమకు పంపకపోవడానికి కారణం ఏమిటని అడిగారు. కాని అతడు కారణం ఏమీ చెప్పలేక ఇలా అన్నాడు: “ప్రసాదం అంతా మామూలుగానే ఆలయ ప్రధానోద్యోగి వద్దకు పంపాం. అక్కడ నుండి ఆనవాయితీ ప్రకారం ఎవరి వాటా వారికి పంపిణీ చేయబడుతుంది. ఇక్కడకు ఇంతవరకూ ఎందుకు పంపలేదో నాకు తెలియదు.” ఆ మాటలు విని ఆయన వ్యాకులత చెంది పలువురిని ఒకరి తరువాత ఒకరిగా “ఆలయ కార్యాలయం నుండి ప్రసాదం ఇంకా ఎందుకు రాలేదు?” అని ప్రశ్నించసాగారు. ఆయన కాసేపు వేచి చూశారు. అయినా ప్రసాదం రాకపోయేసరికి చెప్పులు ధరించి స్వయంగా ఆయనే ఆలయ ప్రధానోద్యోగి వద్దకు వెళ్ళి ఆ అధికారిని ఇలా అడిగారు: “ఏమోయ్! ఆ గదికి (తమ గదిని చూపుతూ) పంపాల్సిన ప్రసాదం ఇంకా ఎందుకు రాలేదు? ఏదైనా పొరపాటు జరిగిందా? చాలాకాలం నుండి వస్తున్న ఆనవాయితీని ఇలా పాటించకపోవడం తప్పు.” ఆ ఉద్యోగి చిన్నబుచ్చుకొని, “ఇంకా అందలేదా? చాలా పొరపాటయింది. ఇప్పుడే పంపిస్తాను” అని అన్నాడు.
29. శ్రీరామకృష్ణులు సాధికారికంగా ప్రసాదాన్ని అడగడంపై స్వామి యోగానంద తలంపు
అప్పటికి స్వామి యోగానంద బాలుడు. కులీనులైన సావర్ణ చౌధురీల వంశంలో పుట్టినందున అతడిలో కాస్త గర్వం ఉండేది. అందుచేత ఆలయోద్యోగులు, పూజారుల పట్ల అతడికి చిన్నచూపు ఉండేది. కాని శ్రీరామకృష్ణుల ప్రేమకు, అహేతుక కృపకు అతడు పూర్తిగా వివశుడై ఆయన పాదపద్మాలను శరణుజొచ్చాడు. అతడి ఇల్లు కాళికాలయానికి సమీపంలో ఉండడం చేత శ్రీరామకృష్ణులను ప్రతి రోజు దర్శించుకోవడం అతడికి ఎంతో అనుకూలంగా ఉండేది. అతడు ఆయనను దర్శించుకోకుండా ఎలా ఉండగలడు? శ్రీరామకృష్ణుల విచిత్ర ఆకర్షణ అతణ్ణి నియమిత సమయానికి ప్రతి రోజు అలా ఈడ్చుకొని వచ్చేసేది. శ్రీరామకృష్ణుల పట్ల అంత గౌరవం వహిస్తున్నప్పటికీ, అతడు ఆలయోద్యోగులతో పరిచయాన్ని పెంచుకోలేదు. అటువంటప్పుడు ప్రసాదం రానందుకు శ్రీరామకృష్ణులు ఆతురత చెందడం చూసి, “ప్రసాదం రాకపోతే ఏమైపోతుంది, మహాశయా! అదేమంత అమూల్యమైనదా ఏమిటి? పైగా ఏదంటే అది మీ ఒంటికి పడదుకూడ. ప్రసాదం వచ్చినా మీరు తినరు కదా! ఈ పరిస్థితుల దృష్ట్యా వారు ప్రసాదం పంపించకపోయినా ఫరవాలేదుగా” అని నిష్కర్షగా అన్నాడు. కాని అతడి మాటలు పట్టించుకోకుండా ఆయన ఆలయ ప్రధానోద్యోగి వద్దకెళ్ళారు. అప్పుడు యోగీన్ ఇలా అనుకొన్నాడు: ‘ఎంత చోద్యం! సామాన్యమైన పండ్లు, మిఠాయిల కోసం ఈయన ఎందుకు ఇంత ఆతురత చెందుతున్నారు? ఈ రోజు ఈయన ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఏ పరిస్థితులలోను ఈయన ఇంత ఆందోళన చెందడం నేను చూడలేదు.’ ఇలా ఆలోచించి కూడ అతడు ఏ కారణం కనుక్కోలేక, చివరికి ఈ నిర్ణయానికి వచ్చాడు: “ఆ, అర్థమైంది. దేవుడైనా కావచ్చు, గొప్ప వ్యక్తి అయినా కావచ్చు, సంస్కారం అన్నది ఎక్కడకు పోతుంది? వంశపారంపర్యంగా ‘పప్పు, బియ్యం’ మూటగట్టుకొనే పూజారుల ఇంట్లో జన్మించిన వారు; ఆ వంశ సంప్రదాయం కొద్దోగొప్పో ఈయనకు అంటకుండా ఉంటుందా? లేకపోతే ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు? పెద్దపెద్ద విషయాలలో కూడ ఈయన వ్యాకులత చెందరే? కాని ఈ స్వల్ప విషయంలో ఎందుకింత ఆతురత పడ్డారు? తాను భుజించని ఆ ప్రసాద భక్ష్యాలకోసం ఆయన అంతగా ఆరాట పడడానికి ఆ వంశ సంప్రదాయమే కారణమై ఉంటుంది. పూర్వీకుల నుండి సంక్రమించిన ఆ అలవాటే ఇందుకు కారణం.’
30. తమ ఆతురతకు శ్రీరామకృష్ణుల విశదీకరణ
యోగీన్ (స్వామి యోగానంద) చివరకు ఆ నిర్ణయానికి వచ్చి, గదిలో ఆయన కోసం వేచి ఉన్నారు. శ్రీరామకృష్ణులు తిరిగి వచ్చి, అతడితో ఇలా అన్నారు: “నే నెందుకు అలా చేశానో నీకు తెలుసా? భగవంతునికి నైవేద్యం అర్పించాక సాధు సన్న్యాసులు, భక్తులు ఆ ప్రసాదం స్వీకరించాలనే ఉద్దేశంతోనే రాణీ రాస్మణి అంత ఆస్తిపాస్తులను ఆలయానికి దానంగా వ్రాసి పోయింది. భక్తులు, ఈ ఆలయాన్ని దర్శించుకొనే సాధకులే ఇక్కడకు పంపే ఆ ప్రసాదాన్ని ఆరగిస్తారు. అలా జరిగినప్పుడే రాణి దానానికి సార్థకత చేకూరుతుంది. కాని వాళ్ళు (ఆలయ పూజారులు) ప్రసాదాన్ని ఎలా వినియోగిస్తున్నారో నీకు తెలుసా? వాళ్ళు అన్న ప్రసాదాన్ని విక్రయించి డబ్బుచేసుకొంటున్నారు. వాళ్ళలో ఉంపుడుగత్తెలను ఉంచుకొన్నవారు కొందరున్నారు. ఈ పళ్ళు, మిఠాయి ప్రసాదాన్ని వాళ్ళ కోసం తీసుకుపోతారు. రాస్మణి అభిమతం కొంతలో కొంతైనా ఈడేరాలనే ఉద్దేశంతోనే నేను ఇంతగా పోరాడాను.” ఆ మాటలు విని స్వామి యోగానంద ఆశ్చర్యపోయాడు; ‘శ్రీరామకృష్ణుల ఈ చిన్ని చర్యలో కూడ ఇంత నిగూడార్థం ఉందా!’ అని అతడనుకొన్నాడు.
31. శ్రీరామకృష్ణ – మథుర్ల మధ్య నెలకొన్న అద్భుత బాంధవ్యం
ఆహా, శ్రీరామకృష్ణులు, మథుర్‌తో అలా ఎంతటి మాధుర్య అనుబంధాన్ని నెలకొల్పుకొన్నారు! శ్రీరామకృష్ణుల అహేతుక కృప కారణంగా మథుర్ ఆయనను తన ప్రాణంకంటే మిన్నగా ప్రేమించాడనడం స్పష్టమౌతుంది. అందుకుతోడు శ్రీరామకృష్ణుల పిల్లవాడి వంటి ప్రవర్తన మథుర్ను ఎంతగానో ఆకర్షించింది. ప్రాపంచిక విషయాలేవీ తెలుసుకోజాలని అమాయక పిల్లవాణ్ణి ప్రేమించని వ్యక్తి ఎవరైనా ఉంటారా? ప్రక్కనే ఉండి ఆటల్లో మునిగివున్న బిడ్డడు ఎక్కడ పడిపోతాడోనని వేయికళ్ళతో పరికిస్తూ, అతడి ముద్దులొలికే నడకలను గమనిస్తూ, అవసరమైతే అతణ్ణి రక్షించడానికి పరుగున వెళ్ళని వ్యక్తి ఎవరైనా ఉంటాడా? శ్రీరామకృష్ణుల బాలక నైజంలో కించిత్తయినా కృత్రిమత్వం లేదు. ఆయన ఆ భావంలో నెలకొని ఉన్నప్పుడు తనను తాను కాపాడుకోలేని పిల్లవాడి మాదిరే కనిపించేవారు. అటువంటప్పుడు తెలివైనవాడూ, శక్తిశాలీ అయిన మథుర్లో, సర్వావస్థలలో శ్రీరామకృష్ణులను రక్షించాలనే అభిలాష స్వతహాగా జనించడంలో వింత ఏమీ లేదు. ఈ విధంగా మథుర్ ఒక వంక ఎలా శ్రీరామకృష్ణుల దివ్యశక్తి మీద ఆధారపడి ఉన్నాడో, అలాగే మరొక ప్రక్క ‘బాబా’ ఏమీ తెలియని బాలుడని గ్రహించి అనవరతం ఆయనను రక్షించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఈ విధంగా సర్వజ్ఞుడైన గురుభావం, అల్పజ్ఞుడైన శిశుభావం – పరస్పర విరుద్ధంగా కానవచ్చే ఈ రెండు భావాలూ – ‘బాబా’ లో చేరువ కావడం మథుర్కు ద్యోతకమైంది. అందుచేత సమస్త ప్రాపంచిక విషయాలలో, ఆయన శరీర రక్షణతో సైతం ‘బాబా’ ను పరిరక్షించాలనే నిర్ణయానికి మథుర్ వచ్చాడు. ఇంద్రియాతీతమైన సూక్ష్మ పారమార్థిక విషయాలలో ‘బాబా’ తనను రక్షిస్తాడని మథుర్ భావించాడు. కనుక ఏకకాలంలో దేవుడు – మానవుడు, సర్వజ్ఞుడు – అల్పజ్ఞుడు – ఇలా జటిలమూ, పరస్పర విరుద్ధమూ అయిన భావాలకు అపురూప సమ్మేళనమైన ఈ ‘అద్భుత బాబా’ పట్ల మథుర్ అనురాగం కూడ జటిలతను సంతరించుకొన్నదనే విషయం మనం స్పష్టంగా గమనించవచ్చు. భావముఖంలో నెలకొని వరాభయ ముద్రలు దాల్చిన ‘బాబా’ మథుర్బాబు ఉపాస్య ఇష్టదైవంగా ఉన్నప్పటికీ, బాలభావమూర్తులై అమాయకత్వానికి, పరాధీనతకు అపరావతారమైన అదే ‘బాబా’ ను కొన్ని సమయాలలో అనునయించడం కూడ చేసేవాడు.
32. శ్రీరామకృష్ణులను, మథుర్ ఊరడించడం
మథుర్కు ఆయన మీద గల ప్రేమ మూలంగా ‘బాబా’ కు కలిగే అనుమానాలకూ, ఆయన అడిగే ప్రశ్నలకూ ‘తగిన’ సమాధానాలిచ్చి ఆయనను ఊరడించే శక్తి కలిగింది. ఒక రోజు మథుర్‌తో మాట్లాడుతూ మాట్లాడుతూ హఠాత్తుగా బయటకు వెళ్ళి, దిగాలుపడిన ముఖంతో ఆయన తిరిగి వచ్చి మథుర్ను ఇలా అడిగారు: “ఈ రోగం ఏమిటో నువ్వు చెప్పగలవా? మూత్రవిసర్జనతోపాటు లోపల నుండి పురుగు ఒకటి బయటకుపోయింది. ఎవరి దేహంలోనూ ఇటువంటి పురుగులు ఉండవని నాకు కచ్చితంగా తెలుసు. నాకేం జరిగింది?” కొన్ని నిమిషాల క్రితమే నిగూఢ ఆధ్యాత్మిక సత్యాల గురించి వివరించి ప్రతి ఒక్కరినీ ముగ్ధులను చేస్తున్న ఈ ‘బాబా’ యే ఇప్పుడు పిల్లవాడి మాదిరి లేనిపోని ఆందోళనలకు లోనౌతున్నారు. పైగా పూర్తిగా మథుర్బాబు తెలివితేటలమీద, భరోసా మీద ఆధారపడుతున్నారు. ఆ పలుకులు వినగానే మథుర్ ఇలా జవాబిచ్చాడు: “అది మంచికే జరిగింది, బాబా! ప్రతి ఒక్కరిలోను కామాన్ని ఉత్పన్నం చేసే పురుగు ఒకటి ఉంటుంది. ఈ పురుగు ఆ వ్యక్తిలో వివిధ దురాలోచనలను రేకెత్తించి, అతడిచేత దుష్కార్యాలను చేయిస్తుంది. అమ్మ కృపతో ఆ కామపురుగు నీ దేహం నుండి వైదొలగిపోయింది. దానిని గురించి ఇంతగా ఎందుకు ఆందోళన?” ఆ మాటలు వినగానే ‘బాబా’ ఊరడిల్లి, “ఆహా! నువ్వు చెప్పింది నిజమే! నిన్ను అడగడం మంచిదే అయింది” అని అన్నారు. అలా అంటూ పిల్లవాడిలా ఆయన సంతోష పడ్డారు.
33. తమ ఆంతరంగిక భక్తుల రాక గురించి మథుర్‌తో, శ్రీరామకృష్ణులు ప్రస్తావించడం
ఒక రోజు మాటల సందర్భంలో శ్రీరామకృష్ణులు, మథుర్‌తో ఇలా అన్నారు: “చూడు, పలువురు నా ఆంతరంగిక భక్తులను అమ్మ నాకు దర్శింపచేసింది. వారందరూ ఇక్కడకు వస్తారు. వచ్చి, ఇక్కడ (తమ) నుండి భగవంతుణ్ణి గురించి విని, తెలుసుకొంటారు; భగవదనుభూతి పొందుతారు, భగవత్ప్రేమను జ్ఞానాన్ని సంతరించుకొంటారు. ఈ ఒరతో (తమ శరీరాన్ని చూపిస్తూ) అమ్మ నానారకాల లీలలను జరుపుతుంది. తద్ద్వారా అనేకులకు మేలు ఒనగూరుతుంది. అందుకే ఆమె ఇంకా ఈ ఒరను చింపలేదు. ఏమంటావు? ఇదంతా కేవలం నా మతిభ్రమా లేక నిజమేనా? చెప్పు.”
ఆ పలుకులు విని మథుర్ ఇలా అన్నాడు: “అదంతా మతిభ్రమ ఎలా అవుతుంది, బాబా? ఇప్పటి వరకు అమ్మ నీకు ఎలాంటి భ్రాంతినీ చూపించలేదు కదా! అలాంటప్పుడు ఇదొక్కటి మాత్రం భ్రాంతి ఎలా అవుతుంది? ఇదీ నిజమే అని ఋజువవుతుంది. కాని వాళ్ళ రాకలో జాప్యం ఎందుకు? వాళ్ళంతా సత్వరమే రావచ్చు కదా! మనం అప్పుడు వారందరితో కలిసి సంతోషంగా గడపవచ్చు కదా!”
అప్పటికి జగజ్జనని తమకు దర్శింపచేసింది యథార్థమే అన్న విశ్వాసం బాబాకు కలిగింది. అప్పుడాయన, “వాళ్ళు ఎప్పుడు వస్తారో నాకు తెలియదు. కాని అమ్మ, వాళ్ళు వస్తారని చెప్పింది. ఆమె సంకల్పమే జరిగి తీరుతుందని ఆమె తెలిపింది” అని అన్నారు.
34. శ్రీరామకృష్ణుల బాలక స్వభావం: ఆకుకూర సంఘటన
రాణీ రాస్మణికి మగ సంతానం లేదు, నలుగురూ కుమార్తెలే. మథుర్ మూడవ కుమార్తెను వివాహం చేసుకొన్నాడు. ఆమె మరణానంతరం చివరి కుమార్తెను వివాహం చేసుకొన్నాడు. తెలివైన రాణి తను బ్రతికి ఉన్నప్పుడే ప్రతి అల్లుడికీ తన జమీలో వాటాలు పంచిపెట్టిపోయింది. లేకుంటే అల్లుళ్ళ మధ్య జమీ గురించి తగాదాలు తలెత్తుతాయని ఆమెకు తెలుసు. జమీ పంపకం జరిగిపోయిన తరువాత ఒక రోజు మథుర్ భార్య జగదంబ దాసి మరొకరి వాటాకు చెందిన చెరువులో స్నానం చేయడానికి వెళ్ళింది. అక్కడ ఏపుగా పెరిగిన తోటకూర మొక్కలను చూసి, వాటిలో కొన్నిటిని పీకి తనతో తీసుకుపోయింది. ఆమె అలా చేయడం శ్రీరామకృష్ణులు మాత్రమే చూశారు. ఆమె అలా చేయడం చూసి ఆయన ఎంతో విచారించి, ఇలా అనుకొన్నారు: “ఈమె మరొకరికి చెందిన వస్తువులను వారి అనుమతి లేకుండా తీసుకుపోయిందే! ఇది అవినీతికరమైన పని. ఇతరుల వస్తువును వారికి తెలియకుండా ఇలా తీసుకెళ్ళడం దొంగతనం క్రిందకి వస్తుందని ఈమె గ్రహించినట్టు లేదు. ఇతరుల వస్తువు పట్ల ఈమెకెందుకు అంత దురాశ?” ఆయన అలా ఆలోచిస్తూండగా ఆ చెరువు ఎవరి వాటాకు చెందిందో ఆమె (రాణి ఆ ఫలానా కుమార్తె) తటస్థపడింది. వెంటనే శ్రీరామకృష్ణులు ఆమెకు జరిగింది చెప్పారు. అది వినీ, తన చెల్లెలు ఏదో తప్పు చేసిందనే భావంలో ఉన్న శ్రీరామకృష్ణులను చూసీ ఆమె నవ్వును ఆపుకోలేకపోయింది. ఆమె తమాషాగా “నిజంగానే నా చెల్లెలు తప్పుపని చేసిందా, బాబా!” అని అంది. అదే సమయంలో మథుర్ భార్య జగదంబ కూడ అక్కడకు రావడం తటస్థించింది. ఆమె కూడ అక్క నవ్వడానికి కారణం తెలుసుకొని, “బాబా, నా గుట్టు ఇలా రట్టు చేయవచ్చా? ఆమె చూస్తుందేమో అనేగా ఆ తోటకూర కాడలను దొంగిలించి, రహస్యంగా పట్టుకుపోయాను. ఇలా ఇప్పుడు నన్ను రచ్చ కీడ్చారే బాబా!” అంది. ఆ అక్కాచెళ్ళెళ్ళిద్దరూ పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వసాగారు. వాళ్ళ వ్యవహారం చూసి శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “మీ లౌకిక పోకడలు నాకేమీ తెలియవు. ఆస్తి పంపకాలు జరిగిపోయాక, అలా చెప్పాపెట్ట కుండా తీసుకోవడం మంచిపని కాదు. జరిగింది ఆమెకు తెలుపడానికే అలా చెప్పాను. ఆ పైన ఆమె ఇష్టం.” ‘బాబా’ పలుకులు విని రాణి కుమార్తెలు మరీమరీ నవ్వుకున్నారు. బాబా ఎంత సరళ స్వభావో, ఎంత నిర్మొహమాటపు వ్యక్తో అని వారు అనుకొన్నారు.
35. విపత్కర సమయాలలో శ్రీరామకృష్ణులను, మథుర్ శరణుజొచ్చడం
ఒక వంక మథుర్ మీద పూర్తిగా ఆధారపడే పసిబాలుని స్వభావం గల శ్రీరామకృష్ణులు, మరోప్రక్క విపత్కర పరిస్థితులనుంచి మథుర్ను రక్షిస్తూ కనిపించేవారు. ఒకసారి మథుర్కు, మరొక జమీందారుకు మధ్య కలహం చెలరేగింది. మథుర్ అనుచరులు, శత్రుపక్ష అనుచరులపై దాడికి దిగడంతో ఒక వ్యక్తి మరణించడం జరిగింది. అప్పుడు మథుర్ పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాడు. పరుగున శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి ఆయన కాళ్ళమీద పడిపోయి, “బాబా, కాపాడు” అంటూ ప్రార్థించాడు. బాబా ముందు భగ్గుమని మండిపోయి మథుర్ను తిట్టారు: “ధూర్తుడా! ప్రతి రోజూ ఏదో ఒక తంటా నెత్తిన పెట్టుకువచ్చి రక్షించమని కాళ్ళు పుచ్చుకొంటావు. వెళ్ళి, పర్యవసానం అనుభవించు. నాకేం తెలుసు?” తరువాత మథుర్ మరీ మరీ బ్రతిమాలుకోవడంతో ఆయన అతడి ప్రార్థనను మన్నించి, “సరే. తల్లి సంకల్పం ఎలా ఉంటే అదే జరుగుతుంది” అని అన్నారు. మొత్తానికి మథుర్ ఆ ప్రమాదం నుండి తప్పించుకొన్నాడు.
36. శ్రీరామకృష్ణుల నిమిత్తం మథుర్ నిస్సంకోచంగా ధనం వెచ్చించడం
శ్రీరామకృష్ణుల వ్యక్తిత్వంలోని ఈ రెండు భావాలను వెల్లడించే ఉదాహరణలు కోకొల్లలు. తన సంపద, పేరు, ప్రతిష్ఠ ఇత్యాదులన్నీ సర్వతోముఖులైన ‘బాబా’ అనుగ్రహం చేతనే నెలకొని ఉన్నాయని ఈ అనుభవాల మూలంగా మథుర్కు గట్టి నమ్మకం ఏర్పడింది. కనుక బాబాను సాక్షాత్తూ భగవదవతార రూపులుగా భావించి మహారాజ గౌరవాన్ని ఆయనకు అర్పించి, ఆయనపట్ల అచంచల భక్తిప్రపత్తులనూ విశ్వాసాన్నీ చూపాడంటే ఆశ్చర్యపోనవసరం లేదు. తాము భక్తి చూపే వ్యక్తుల కోసం వారు ఖర్చుపెట్టే ధనాన్ని బట్టి ఈ ప్రాపంచికుల భక్తిని అంచనా కట్టవచ్చు. ఇది ముఖ్యంగా తెలివిగల పిసినారులైన మథుర్లాంటి వారికి వర్తిస్తుంది. కనుక శ్రీరామకృష్ణుల పట్ల మథుర్ పెంపొందించుకొన్న ప్రగాఢ భక్తివిశ్వాసాల కారణంగానే ఆయనకోసం అతడు నిస్సంకోచంగా ధనం ఖర్చు చేయగలిగాడు. ఒకసారి శ్రీరామకృష్ణులకు అతి విలువైన దుస్తులు ధరింపచేసి ‘యాత్ర’ (నాటకం) ప్రదర్శన తిలకించడానికి ఆసీనులను చేశాడు మథుర్. ఆయన ముందు నూరు రూపాయల కంటె ఎక్కువ మొత్తాన్ని పది రూపాయల కాగితాలుగా మార్చిపెట్టాడు. ఆ ‘యాత్ర’ లో పాల్గొన్న గాయకులను, నటులను ఆయన చేతుల మీదుగా సత్కరించడానికి అలా మథుర్ చేశాడు. శ్రీరామకృష్ణులు ‘యాత్ర’ ను తిలకిస్తూ ఒక పాటను వినిగాని, ఒక దృశ్యాన్ని చూసిగాని ప్రగాఢ ఆధ్యాత్మిక భావోద్వేగాన్ని పొందినప్పుడు ఆ డబ్బు కుప్పను ఆయా గాయకుల లేదా నటుల ముందుకు తమ చేతులతో త్రోసివేశారు. ఇది చూసి మథుర్ కించిత్తు కూడ చికాకుపడలేదు. పైగా తన ఆనందాన్ని మథుర్, “ఆ సత్కారం బాబా పెద్ద మనస్సుకు తగినట్లే ఉంది” అంటూ వ్యక్తం చేశాడు. ఆయన ముందు నాణాలను వరుసలుగా పేర్చిపెట్టాడు. ‘రూపాయి మన్ను, మన్ను రూపాయి’ అంటూ సాధనచేసి పరిపూర్ణంగా లోభశూన్యులై భావముఖంలో నెలకొన్న బాబా ముందు ఆ డబ్బు ఎంతసేపు ఉంటుంది? బహుశా మళ్ళీ దివ్యభావోద్వేగంలో మునిగి అంతా మరచి ఆ డబ్బునంతా ఒకేసారి ఒక్కరికే ఇచ్చివేసారు. తరువాత ఇవ్వడానికి డబ్బు ఏదీ లేకపోవడంచేత తాము ధరించిన అతి విలువైన శాలువా, దుస్తులను సైతం గాయకులకు ఇచ్చివేసి కేవలం దివ్యభావాంబరులై (అంటే నగ్నులై) నిశ్చల సమాధిలో మగ్నులై ఉండిపోయారు. తన ధనం సద్వినియోగమైందని మథుర్ పరమానందభరితుడై విసనకర్ర పుచ్చుకొని ‘బాబా’ కు విసరసాగాడు.
37. ఈ విషయంగా ఇతర దృష్టాంతాలు
శ్రీరామకృష్ణుల ప్రసన్నతకై పిసినారియైన మథుర్ చూపిన ఉదారతకు అనేక దృష్టాంతాలు ఉన్నాయి. మథుర్ తనతోబాటు ‘బాబా’ ను కాశీ, బృందావనం మొదలైన పుణ్యక్షేత్రాలకు తోడ్కొని వెళ్ళాడు. కాశీలో ‘బాబా’ మాటను ఆజ్ఞగా శిరసావహించి కల్పతరువులా ఉదారంగా కానుకలు చెల్లించాడు. ప్రతి ఒక్కరికీ వారు కోరిన వస్తువులను లేదనకుండా ఇచ్చాడు. ఆ సందర్భంలో శ్రీరామకృష్ణులను కూడా ఏదైనా అడిగి తీసుకోమని మథుర్ ప్రార్థించాడు. కాని ఆయనకు ఏదీ అవసరంగా కనిపించలేదు. “ఒక కమండలాన్ని ఇవ్వు” అని మాత్రం అన్నారు. శ్రీరామకృష్ణుల త్యాగబుద్ధిని చూసి మథుర్ కళ్ళు చెమ్మగిల్లాయి.
38. వైద్యనాథంలో మథుర్ చేసిన దరిద్ర నారాయణ సేవ
మథుర్‌తో కలిసి కాశీ, బృందావనం మొదలైన పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి పోతున్నప్పుడు దారిలో వైద్యనాథం సమీపంలోని ఒక గ్రామం గుండా వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఆ గ్రామస్థుల కటిక దారిద్ర్యాన్ని చూసి ‘బాబా’ హృదయం కారుణ్యంతో ద్రవించి పోయింది. మథుర్ను పిలిచి అతడితో ఇలా అన్నాడు: “నువ్వు కేవలం అమ్మ ఆస్తిపాస్తుల్ని చూసుకొనే కార్యనిర్వాహకుడివి. ఈ గ్రామస్థులకు తలకు రాసుకోవడానికి తగినంత నూనె, ప్రతి ఒక్కరికి ఒక వస్త్రం ఇవ్వు; ఒక రోజు కడుపార వీరికి అన్నం పెట్టించు.” మొదట మథుర్ కాస్త తటపటాయించి ఇలా అన్నాడు: “తీర్థయాత్ర పూర్తిచేసి రావడానికి చాలా డబ్బు అవసరం, బాబా. ఇక్కడ చాలామంది ఉన్నట్టున్నారు. ఇదంతా చేస్తే, తరువాత మనకు డబ్బు కొరత ఏర్పడవచ్చునేమో! ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో చెప్పండి?” ఆ జవాబు శ్రీరామకృష్ణులకు రుచించలేదు. ఆ గ్రామస్థుల దుఃస్థితి చూసి ఆయన కళ్ళు ధారగా స్రవించసాగాయి; హృదయం కారుణ్యంతో పొంగిపొరలసాగింది. అప్పుడు మథుర్‌తో: “ధూర్తుడా, నీ కాశీకి నేను రాను. వీళ్ళతో ఇక్కడే ఉండిపోతాను; ‘నా’ అని చెప్పుకొనేవారు ఎవరూ వీరికి లేరు. వీరిని వదలిపెట్టి, ముందుకు కదలను.” అని చెప్పి పిల్లవాడిలా హఠంపట్టి ఆ గ్రామస్థుల మధ్య కూర్చుండిపోయారు. ఆయనలోని అపార కరుణను చూసి వెంటనే మథుర్బాబు కలకత్తా నుండి ‘తానుల’ కొద్దీ బట్టలు తెప్పించి, ‘బాబా’ చెప్పినట్లు చేశాడు. ఆ గ్రామస్థుల ఆనందాన్ని చూసి, ‘బాబా’ కూడా పరమానందభరితులై మథుర్‌తో కాశీకి బయలుదేరారు. మరొక సందర్భంలో మథుర్‌తో కలిసి వెళుతున్నప్పుడు రాణాఘాట్‌కు సమీపంలో అతడి జమీలోని ఒక గ్రామ ప్రజల దీనావస్థకు ఆయన హృదయం కరుణతో ద్రవించిపోయిందనీ, మథుర్కు చెప్పి అప్పుడు కూడ అన్నవస్త్రాలను ఆ పేదలకు ఇప్పించారని మేం విన్నాం.
39. మథుర్ పూర్వజన్మ గురించి శ్రీరామకృష్ణుల సూచన
గురుభావంతో తాదాత్ములైన శ్రీరామకృష్ణులు ఈ రీతిగా మథుర్ను ఒక తీయని అనుబంధంతో పెనవేశారు. సాధన చేస్తున్న సమయంలో ఒకసారి శ్రీరామకృష్ణులలో ఒక విచిత్ర భావం మెదలి, తల్లిని ఇలా ప్రార్థించారు: “అమ్మా నన్ను, శుష్కసాధువును చేయవద్దు. జీవితాన్ని ఆనందించేలా ఉంచు.” ఆ ప్రార్థనా ఫలితమే మథుర్‌తో ఏర్పడ్డ ఈ సంబంధం! ఎందుకంటే ఆ ప్రార్థనాఫలితంగా ఆయన దేహరక్షణాదుల కోసమైన అవసరాలు తీర్చడానికి ఆయనతోపాటు నలుగురు సరఫరాదారులు పంపబడ్డారని, ఆ నలుగురిలో మథుర్ ప్రథముడూ అగ్రగణ్యుడూ అని జగజ్జనని శ్రీరామకృష్ణులకు ఒక దివ్యదర్శనంలో చూపించింది. దైవ నిర్ణయం కాకపోతే ఆ సంబంధం అంతకాలం ఆ విధంగా పటిష్ఠంగా నిలువగలిగేదా? అయ్యో! ఓ లోకమా, ఇప్పటి వరకు ఇటువంటి పరిశుద్ధమైన, తీయని అనుబంధాలను ఎన్నిటిని చూశావు?
ఓ భోగవాసనా! నువ్వు ఎంతటి కఠోర సంకెళ్ళతో మనిషిని బంధించివేశావు కదా! శుద్ధ బుద్ధ ముక్త స్వభావులూ, అహేతుక దయాసింధుమా, మూర్తీభవించిన విశుద్ధ ప్రేమమూర్తీ అయిన ఈ అద్భుత గురుదేవులను దర్శించి, వారితో అనుబంధాన్ని నెలకొల్పుకొన్న మా మనస్సులు ఇప్పటికీ నిమ్న వస్తువుల వైపు దృష్టిని సారించకుండా ఉండలేకపోతున్నవే! ఒక రోజు మా మిత్రుడొకడు శ్రీరామకృష్ణుల ముఖతా మథుర్బాబు కథను శ్రద్ధగా, ఆశ్చర్యపోతూ వింటున్నాడు. అలా వింటూ, మథుర్ పొందిన మహద్భాగ్యాన్ని కొనియాడేరీతిలో శ్రీరామకృష్ణులను, “మహాశయా! మరణానంతరం అతడి గతి ఏమైంది? మళ్ళీ జన్మించవలసిన అగత్యం అతడికి ఉండివుండదు గదా!” అని అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, “ఎక్కడో అక్కడ రాజుగా జన్మించే ఉంటాడు. భోగవాసనలు అతడిలో సమసిపోలేదు* ” అని జవాబిచ్చి ఆయన వేరొక విషయంపై ప్రస్తావించడం మొదలుపెట్టారు.