హన్త తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః ।
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యన్తో విస్తరస్య మే ॥ –భగవద్గీత, 10–19
అర్జునా! నా దివ్య విభూతులకు అంతమన్నది లేదు. అయినా వాటిలో ప్రధానమైన వాటిని నీకు తెల్పుతున్నాను.
1. పెద్దపువ్వు వికసించడానికి చాలాకాలం పడుతుంది
శ్రీరామకృష్ణుల జీవితంలో గురుభావం క్రమంగా అభివ్యక్తం కావడం చాలావరకు రాణీ రాస్మణి, మథుర్బాబు కళ్ళ ముందే జరిగిందని ఇంతకు మునుపే చెప్పివున్నాం. ఉన్నత ఆధ్యాత్మిక భావ వికాసం గురించి, “పెద్దపువ్వు వికసించ డానికి చాలాకాలం పడుతుంది. చేవగల చెట్టు పెరగడానికి చాలాకాలం పడుతుంది” అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. అట్లే ఆయన జీవితంలో ఈ అపూర్వ గురుభావం వికసించడానికి చాలాకాలం పట్టింది, సాధనలు అవసరమయ్యాయి. అవిచ్ఛిన్నంగా పన్నెండు సంవత్సరాలపాటు కఠోర సాధన చేయవలసి వచ్చింది. ఆ సాధనలను వర్ణించడానికి ఇది అనువైన చోటు కాదు. జ్ఞాన భాస్కరుని కాంతిలో చక్కగా వికసించిన గురుభావ పుష్పం గురించి మేం ఇక్కడ ప్రస్తావించాలి. కాని ప్రారంభం నుండి చివరి వరకు ఆ గురుభావ అభివ్యక్తీకరణను గురించి వివరిస్తున్నప్పుడు ఇతర విషయాల ప్రస్తావన రాక తప్పదు. శ్రీరామకృష్ణులలో గురుభావం వికసిస్తున్నప్పుడు దానితో సంబంధం గల భక్తుల ప్రస్తావన తేవడం కూడ అనివార్యమే.
2. మథుర్తో గల శ్రీరామకృష్ణుల విచిత్ర సంబంధం
మథుర్బాబుతో శ్రీరామకృష్ణులకు ఏర్పడిన సంబంధం విచిత్రమైనది. మథుర్ సంపన్నుడు, ఉదారుడు. ప్రాపంచికుడే అయినప్పటికీ అతడు భక్తుడు. శాశ్వత అశాశ్వతాల మధ్యగల తేడాను గుర్తించగల వివేచనాపరుడైనప్పటికీ ప్రాపంచిక సుఖాలను ఇష్టపడేవాడు. కోపం, తొందరపాటు ఉన్నప్పటికీ సహనం, దృఢసంకల్పం ఉన్న వ్యక్తి. ఆంగ్లవిద్య నభ్యసించినవాడు, ఆంగ్లేయుల జీవన దృక్పథం తెలిసినవాడు. ఎంతో వాదించే గుణం ఉన్నప్పటికీ యుక్తియుక్తతకు చోటిచ్చేవాడు. భగవంతునిపట్ల విశ్వాసం ఉన్న భక్తుడే అయినప్పటికీ, గురువు మాటను సైతం వివేచన చేయకుండా అంగీకరించని వ్యక్తి. ఉదారుడే అయినప్పటికీ లౌకిక వ్యవహారాదులలో మోసానికి గురి అయ్యే వ్యక్తి మాత్రం కాడు. పైగా సంపదలను పెంపొందింప జమీందారులు ప్రయోగించే కుటిల రాజకీయాలు, అన్యాయానికి వెనుకాడని వారి తత్త్వం కొన్ని సందర్భాలలో మథుర్లో కానవస్తాయి. మగ సంతతి లేని రాణికి, తక్కిన అల్లుళ్ళు ఉన్నప్పటికీ చివరి అల్లుడైన మథుర్బాబే జమీందారీ వ్యవహారాలలో కుడిభుజమైనాడు. ఆ విధంగా అత్తా–అల్లుళ్ళ ప్రతిభ కలగలసినందునే రాణీ రాస్మణి ఆనాడు సుప్రసిద్ధురాలైంది.
3. రాణీ రాస్మణి, మథుర్లు శ్రీరామకృష్ణులలో గురుభావ వ్యక్తీకరణకు వారికి తెలియకనే దోహదం చేసారు
బహుశా పాఠకుడు, “వడ్లు దంచుతూ మధ్యలో శివుని పాట ఎందుకు?* శ్రీరామకృష్ణుల గురుభావం గురించి ముచ్చటిస్తున్నప్పుడు మథుర్ ప్రస్తావన ఎందుకు?” అని అడగవచ్చు. దీనికి జవాబు: శ్రీరామకృష్ణులలో అభివ్యక్తం కాబోయే భావి గురుశక్తిని చూచాయగా చూసి, దాని వికాసం నిమిత్తం పరిరక్షింప సహకరింప ముందుకు వచ్చింది ఈ మథుర్బాబే! దీనిని సీతాకోక చిలుక పట్టుపురుగుగా తన గూట నుండి బయటపడ నారంభించిన స్థితితో పోల్చవచ్చు. అద్వితీయ మైన ఆ (అంటే శ్రీరామకృష్ణుల) గురుశక్తి పూర్తిగా అభివ్యక్తమయ్యే నిమిత్తం అతిపావన, పరిశుద్ధ ప్రేరణచే అనువైన ఒక స్థలాన్ని రాణీ రాస్మణి నిర్మించింది. అటువంటి ఉదాత్త ప్రేరణచే ఆ గురుశక్తి వికసింప అవసరమైన వాటినన్నిటిని మథుర్ సరఫరా చేశాడు. అయినా ఈ విషయాన్ని మనం ఇప్పుడు, అంటే అనేక సంవత్సరాలు గడిచిపోయిన తరువాతనే అవగతం చేసుకోగలుగుతున్నాం. అట్లే రాణి, మథుర్లిద్దరూ ఈ విషయాన్ని అప్పుడప్పుడు కించిత్తు గ్రహించగలిగినప్పటికీ, తామెందుకు శ్రీరామకృష్ణులకు తోడ్పడుతున్నారో వారికి పూర్తిగా తెలిసినట్లు కనిపించడం లేదు. గత యుగాలలో అవతరించిన మహాత్ముల జీవితాలను అధ్యయనం చేసినప్పుడు ఇట్లే జరిగి ఉండడం గ్రహించవచ్చు. ఏదో ఒక అజ్ఞాతశక్తి ప్రతి విషయంలోనూ ఆ మహాత్ముల మార్గాలను సుగమం చేస్తూ సర్వకాల సర్వావస్థలలో సర్వతోభావంగా వారిని రక్షిస్తూ, ఇతరులను వారి ప్రభావంలోకి తీసుకువచ్చి, వారిపట్ల భక్తివిశ్వాసాలు ప్రకటించేలా చేయడం మనం చూడవచ్చు. అయినా ఆ అవతార పురుషుల మీది ప్రేమతోగాని లేదా ద్వేషంతోగాని, ఏ ఉద్దేశంతో చేసినా సరే తాము చేస్తున్న పనులన్నీ ఆ మహాత్ముల నిమిత్తమేనని, వారి జీవితోద్దేశ సాఫల్యానికి దోహదం చేయడానికేనని, ఆ అవతారపురుషుల మార్గంలోని ఆటంకాలను తొలగించి వారిలోని శక్తి అభివ్యక్తీకరణకు తోడ్పడడం కోసమేనని – వారికి తోడ్పడే ఇతరులు ఒకింత కూడ అర్థంచేసుకోలేరు. ఎంతోకాలం గడిచిపోయిన తరువాత మాత్రమే ఈ విషయాన్ని లోకులు గ్రహించి ఆశ్చర్యపరవశులవుతారు. ఉదాహరణకు, కైకేయి శ్రీరామచంద్రుణ్ణి అరణ్యవాసానికి పంపిన ఫలితంగా ఏం జరిగిందో చూడండి! దేవకీ వసుదేవులను కారాగారంలో బంధించి ఉంచడానికి కంసుడు చేసిన ప్రయత్నాలకు ఫలితం ఏమైందో చూడండి! సిద్ధార్థుడు అనాసక్తత చెంది ఎక్కడ సన్న్యసిస్తాడో అన్న భీతితో శుద్ధోధనుడు అతడికోసం ఆనందవనాన్ని నిర్మించాడు. కాని ఫలితం ఏమైంది? క్రూర కాపాలికుడు అభిచార మంత్రాలతో శంకరాచార్యులను చంపడానికి చేసిన ప్రయత్నం ఎలా పరిణమించిందో చూడండి! చైతన్య మహాప్రభువుల భక్తిభావ ప్రచారంలో విఘ్నాలు కల్పింప చేసిన నవాబు ప్రభుత్వాధికారుల ప్రయత్న ఫలితాలు ఎలా బెడిసికొట్టాయో గమనించండి! మహిమాన్వితుడైన ఏసుక్రీస్తుకు మిథ్యాదోషాన్ని అంటగట్టి ఆయనను శిలువవేయ పరిణామం ఏమైందో చూడండి. తాను అనుకొన్నదొకటి జరిగింది మరొకటి అయినట్లు పై ప్రతి ఉదంతంలోనూ ఫలితం, ‘రామా! అపార్థం చేసుకొన్నావే’* అనే కథలోలా అనుకొన్నదానికి విరుద్ధంగానే పరిణమించింది. అవతారపురుషులతో సంబంధంగల మహాపరాక్రమవంతులైన శత్రువులు, స్నేహపరవశులైన మిత్రులు తమ బుద్ధిని, చాకచక్యాన్ని ‘మరొక విధంగా’ భావించి మరేదో ఉద్దేశంతో చేసినా కూడ వారి ప్రతి కార్యమూ ఆ అవతారపురుషుల జీవితోద్దేశానికే తోడ్పడ్డాయి. గతకాలంలో అలాగే జరిగింది, ఇక ముందు కూడ అట్లే జరుగనున్నది. కాని శత్రువులు, మిత్రుల ఇద్దరి పనులలో, ఫలితాలలో ఒక్క తేడా మాత్రం కనిపిస్తుంది. భాగవతాది పురాణాలలో పేర్కొనబడినట్లు ఆ తేడా ఏమిటంటే, శత్రుభావంతో పనిచేసేవారు అవతారపురుషులలో అభివ్యక్తమయ్యే దివ్యశక్తి ఉద్దేశం, చేతల గురించి పూర్తిగా అజ్ఞానులై ఉంటారు. కాని భక్తిప్రపత్తులున్న ఇతరులు తమ శక్తి మేరకు దోహదం చేస్తూఉండడం చేత ఆ దివ్యశక్తిని గురించి అప్పుడప్పుడు చూచాయగా తెలుసుకోగలుగుతారు. వారిద్దరి మధ్య కనబడే తేడా ఇంతే. అలా చూచాయగా తెలుసుకోవడం ద్వారా వారు క్రమక్రమంగా వాసనారహితులౌతారు. పవిత్రులవుతారు. చివరకు ముక్తి పొంది శాశ్వత శాంతికి అర్హులౌతారు. శ్రీరామకృష్ణుల పట్ల మథుర్బాబు వ్యవహరించిన తీరు అవతారపురుషులకు తోడ్పడే మిత్రుల కోవకు చెందుతుందని సుస్పష్టమౌతున్నది.
4. సర్వుల జీవితాలలో దివ్యశక్తి లీల కానవస్తుంది
కేవలం అవతారపురుషుల జీవితాలలో మాత్రమే ఆ దివ్యశక్తి లీల గోచరిస్తుందనడం సబబు కాదు. నిజానికి వారి జీవితాలలో ఆ దివ్యశక్తి లీలను సుస్పష్టంగా మనం చూడగలం, చూసి ఆశ్చర్యచకితులమౌతాం. కాని మన దైనందిన జీవితంలో, నిత్యవ్యవహారాలలో సైతం ఆ దివ్యశక్తి లీల సూచనప్రాయంగా కానవస్తుంది. అనేకమంది జీవితాలను శ్రద్ధగా అధ్యయనం చేసినప్పుడు ఆ దివ్యశక్తి చేతిలో మనిషి కేవలం ఒక ‘కీలుబొమ్మ’ అనే గట్టి నమ్మకం కుదురుతుంది. ఈ విధంగా అవతారపురుషులకు, మహాపురుషులకు, మనబోటి సామాన్యులకు మధ్య ఒక సాదృశ్యం ఉండడంలో వింత లేదు. వారి అలౌకిక జీవితాలే సామాన్యుల జీవితాలు రూపుదిద్దు కోవడంలో నమూనాలు లేదా మూసలుగా ఉపకరిస్తాయి. అందువల్లనే సామాన్యుల జీవితాలలో ఈ అవతారపురుషులు ప్రాధాన్యం వహిస్తారు. నానా జాతులకు, నానా సంస్కృతులకు కాణాచి అయిన ఈ విశాల భారతదేశ ప్రజాజీవనంపై శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, చైతన్యుడు వంటి మహాపురుషులు పట్టుగొమ్మగా నిలిచి ఉండడం నీకు కనిపించడం లేదా? వెనుకటి యుగాల ఆ అవతారపురుషుల ఆదర్శాలన్నీ ఒకచోట మిళితమై అనుపమాన రూపం సంతరించుకొని ప్రస్తుత యుగంలో శ్రీరామకృష్ణుల ఆదర్శ జీవితంగా అభివ్యక్తమై సత్వరమే పరివ్యాప్తి గాంచుతూ నేటి భారతీయ స్త్రీ పురుషులందరి జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తూ ఉండడం కానవస్తున్నది. కాలక్రమంలో ఆ ప్రభావం ఏ మేరకు వ్యాపిస్తుందో, ఓ పాఠక మహాశయా, నువ్వే ఊహించుకో. ఆ ప్రభావం గురించి ఊహించడంగాని, వ్యక్తం చేయడంగాని మాకు సాధ్యంకాని పని.
5. భక్తుడైనా మథుర్ మూర్ఖుడు కాడు
మథుర్ స్వభావంలోని మరో అంశాన్ని విశదీకరించవలసిన అవసరం ఉంది. మథుర్, శ్రీరామకృష్ణుల పట్ల ‘ఐదు పావలా ఐదణాల’ భక్తి కలిగి ఉండేవాడు. ఈ విషయం వినగానే మనబోటి సందేహప్రాణులు ఇలా ప్రతిస్పందిస్తాయి: “ఈ మథుర్ పరమ మూర్ఖుడిలా కనబడుతున్నాడే! లేకపోతే ఒక వ్యక్తి మరొక వ్యక్తిపట్ల అంతటి భక్త్యనురాగాలు చూపగలడా? మేమే కనుక ఆ స్థానంలో ఉండివుంటే ఇలా గుడ్డిగా ప్రేమ, విశ్వాసం ప్రకటించక, అడుగడుగునా తన మహత్త్వాన్ని ఋజువు చేయమని శ్రీరామకృష్ణులను సవాలు చేసివుండేవారం.” ఆహా! హృదయంలో భక్త్యానురాగాలు జనించడం విషయాసక్తులకు నేరంలా తోస్తుందేమో! మథుర్ గురించి శ్రీరామకృష్ణుల నుండి మేం విన్నదాన్నిబట్టి చూస్తే అతడు అనుకొన్నంత సరళుడు, అమాయకుడు మాత్రం కాడని తేలుతుంది. తెలివితేటలలోగాని, విమర్శనాత్మకతలోగాని అతడు మనకు ఏమీ తీసిపోడు. మథుర్ ప్రప్రథమంలో శ్రీరామకృష్ణుల విచిత్ర నైజాన్ని, చేతలను సందేహించి, అడుగడుగునా ఆయనను పరీక్షించాడు. కాని ఎంత పరీక్షించినా ఏం లాభం? విజ్ఞానమనే గర్జారావంతో, ప్రేమ, భక్తి అనే తరంగాలతో సమున్నత ఆధ్యాత్మిక శిఖరాలను దుమికి పొంగిపొర్లుతూ ప్రవహించసాగిన మందాకినీ ప్రవాహాన్ని ఇంతకుముందు యుగాలలో లేనంతగా మథుర్బాబు సంశయాలు ఎంతకాలం ఎదుర్కొని నిలబడగలవు? అనతి కాలంలోనే ఆ సంశయాలు బలహీనమై, అణచివేయబడి నామరూపాలు లేకుండా చూర్ణమై ఎక్కడకో తిరిగిరాని చోటుకు కొట్టుకుపోయాయి. ఆ విధంగా మథుర్లోని సంశయాత్మకత నిర్మూలమైంది. ఈ విషయంలో పూర్తిగా పరాజితుడైన మథుర్, శ్రీరామకృష్ణుల పావన పాదపద్మాలను మనఃస్ఫూర్తిగా ఆశ్రయించాడు. కాబట్టి ఇక్కడ మథుర్బాబు ప్రస్తావనను తీసుకువచ్చినా నిజానికి శ్రీరామకృష్ణుల గురుభావాన్నే విశదీకరిస్తున్నామని గ్రహించడానికి ఎంతో సమయం పట్టదు.
6. శ్రీరామకృష్ణుల పట్ల మథుర్బాబు ఆకర్షణ
శ్రీరామకృష్ణుల పసిబాలుని వంటి సరళ నైజం, ముక్కుసూటి ప్రవర్తన, సుందరరూపం చూసి ప్రప్రథమ వీక్షణలోనే మథుర్ ఆయన పట్ల ఆకర్షితుడైనాడు. ఆ తరువాత, సాధన ప్రారంభదశలో దివ్యపారవశ్యంలో కొన్ని సమయాల్లో ఉన్మాదులై తమను తాము అదుపు చేసుకోలేని స్థితికి వచ్చారు. ఆ అవస్థలో పూజిస్తూ పూజిస్తూ మైమరచిపోయి తమ అంతరంగంలో జగజ్జననిని దర్శించి తమను తామే పూజించుకోసాగారు. వారి ఉద్ధృత భగవదనురాగ ప్రవాహం ఆ సమయాన వైధీభక్తి అనే పరిధిని దాటగా, సామాన్యుల దృష్టికి అశాస్త్రీయంగా, అర్ధంపర్ధం లేనివిగా గోచరించే మహాభక్తిపూరిత కార్యకలాపాలు ఆచరిస్తూ ఆలయ సిబ్బంది నిరసనకు, అనుమానానికి గురయ్యారు. అటువంటప్పుడు లౌకికుడైనా మథుర్బాబు సునిశిత బుద్ధి, న్యాయవర్తన దృష్టి అందుకు విరుద్ధంగా, “ప్రథమ వీక్షణలోనే ఎవరు ముక్కుసూటి ప్రవర్తన, సరళనైజం గలవారని నేను భావించానో అటువంటి వ్యక్తి చేష్టలు స్వయంగా నా కళ్ళతో చూడకుండా ఆయనకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయం తీసుకోను” అని సలహా ఇచ్చింది. అందుకే మథుర్ రహస్యంగా కాళికాలయానికి వచ్చి శ్రీరామకృష్ణుల చేష్టలను నిశితంగా పరిశీలించాడు. ఆ తరువాత, “మూర్తీభవించిన భగవద్భక్తి, ముక్కుసూటి ప్రవర్తన, అపరిమిత భక్తివిశ్వాసాల కారణంగానే యువకుడైన గదాధర్ ఇలా ప్రవర్తిస్తున్నాడు” అనే నిర్ణయానికి వచ్చాడు. అందుకే లౌకికుడైనా వివేకియైన మథుర్, శ్రీరామకృష్ణులకు ఇలా నచ్చజెప్ప ప్రయత్నించాడు: “తనకు అనుకూలించింది కలకాలం నిలవగలిగితే దాన్ని ఆచరించడం మంచిదే. భక్తివిశ్వాసాలు ఉండడం మంచిదే. కాని మైమరచిపోవడం సరా? దీని కారణంగా ఇతరుల నిరసనకు గురికావడం తథ్యం. జనం చెబుతున్నది పట్టించుకోక, ఇచ్ఛ మేరకు ప్రవర్తిస్తే మతి చలించే ఆస్కారం ఉంది.” కాని అతడు అలా ఆయనకు నచ్చజెప్ప ప్రయత్నించినా, మథుర్లో నిద్రాణమై ఉన్న భక్తిభావం సాధుసాంగత్యం చేత జాగృతం కావడంతో కొన్ని సమయాల్లో హఠాత్తుగా అతడు బిగ్గరగా ఇలా అనేవాడు: “కాని రాంప్రసాద్లాంటి తొలినాటి సాధకులు కూడ భక్తిపరవశులై పిచ్చివారిలా ఇలాగే ప్రవర్తించేవారని వినికిడి. గదాధర్ ఈ అవస్థ, ప్రవర్తన ఆ కోవకు చెందినవేమో?” అందుచేత శ్రీరామకృష్ణుల ఆచరణకు ఎలాంటి ఆటంకాలూ కల్పించకుండా, మున్ముందు అది ఏ విధంగా పరిణమిస్తుందో వేచి చూడాలని, యుక్త సమయంలో తగిన రీతిలో వ్యవహరించవచ్చునని మథుర్ నిశ్చయించుకొన్నాడు. లౌకిక వ్యవహారాలలో దిట్టయైన ఒక యజమాని తన కింద పనిచేస్తున్న ఒక సామాన్య పూజారిపట్ల ఆ విధంగా ప్రవర్తించాడంటే, అది అతడి సహనశీలతను సూచిస్తుంది.
7. భక్తి ప్రభావమే మథుర్లో మార్పుకు హేతువు
భక్తికి సంక్రమించే శక్తి ఉంది. శరీరంలో కలిగే మార్పుల మాదిరిగా మానసిక భావాలు సైతం సంక్రమించడం మనం నిత్యం చూస్తూంటాం. బాహ్యాభ్యంతర ప్రపంచంలో కానవచ్చే వికారాలన్నీ ఒకే ఒక్క మూలపదార్థం యొక్క పరిణామాలనీ, కాబట్టి అవన్నీ ఒకే నియమానుసారం పాలింప బడుతున్నాయనే విషయం నిరూపింప మన వైదిక ఋషుల అతీంద్రియానుభవాలు ఇక అవసరంలేదు. ఇప్పుడు ఆధునిక విజ్ఞానశాస్త్రం ఆ విషయాన్ని దాదాపు ధ్రువీకరించే చూపుతున్నది. కనుక భక్తి అనే మానసిక భావం జాగృతమైనప్పుడు అది ఇతరులలో నిద్రాణమై ఉన్న భక్తిభావాన్ని జాగృతం చేయగలదనడంలో ఆశ్చర్యం ఏమీలేదు. ఆధ్యాత్మిక భావాలను ఉద్దీపింపజేయడానికి సాధుసాంగత్యం ఎంతో దోహదం చేస్తుందని శాస్త్రాలు ఇంతగా నొక్కి వక్కాణించి చెప్పడానికి కారణం ఇదే. భాగ్యవశాన మథుర్కు ఇటువంటిదే (అంటే శ్రీరామకృష్ణుల సాంగత్యం) కలిగిందని మనం ఊహించవచ్చు. శ్రీరామకృష్ణుల చేతలను, ప్రవర్తనను రోజూ అతడు పరిశీలించేకొద్దీ అతడికి ఎరుక లేకుండానే అతడిలో నిహితంగా ఉన్న భగవద్భక్తి జాగృతం కాసాగింది. మథుర్బాబు క్రమానుగత కార్యకలాపాల ద్వారా ఈ సంగతి మనకు స్పష్టమౌతుంది. చాలాకాలం వరకు మథుర్ మనస్సు సైతం, లౌకికుల మనస్సు ప్రథమంలో ఎలా ప్రవర్తిస్తుందో అలా, అంటే ఈ క్షణంలో భక్తి విశ్వాసాలు, మరుక్షణంలో సందేహం – వీటి మధ్య ఊగిసలాడే రీతిలో ప్రవర్తించేది. శ్రీరామకృష్ణుల పట్ల భక్తివిశ్వాసాలు దృఢంగా పాదుకొన్న పిదప ఈ ఊగిసలాట నిలిచి పోయింది. కనుక ప్రారంభంలో శ్రీరామకృష్ణుల అసాధారణ మానసికస్థితికి కారణం అపరిమిత భక్తిభావమే అని మథుర్ భావించినప్పటికీ, ఆ తరువాత తన మనస్సు మార్చుకొని, ‘ఈయన పిచ్చివాడు కావడం లేదుకదా!’ అని అనుమానించసాగాడు. అయినా ఈ అనుమానం మథుర్లో శ్రీరామకృష్ణుల పట్ల కరుణనే ప్రేరేపించింది. అందుచేతనే ఒక మంచి వైద్యుణ్ణి రప్పించి శ్రీరామకృష్ణుల శారీరక, మానసిక ఆరోగ్యాలను పెంపొందింప మథుర్నిశ్చయించాడు.
8. ప్రకృతి నియతులలో మార్పు: ఎర్రమందారం సంఘటన
మథుర్కు ఆంగ్లభాష బాగానే వచ్చు. అందుచేత పాశ్చాత్య విద్యావిధానం సాధారణంగా ఉత్పన్నం చేసే స్వీయ ప్రాధాన్యం, స్వతంత్ర దృక్పథం మథుర్ సంతరించుకొన్నాడు. కాబట్టే అతడు భగవదనురాగంతో మైమరచిపోరాదని, దేనినైనా అతిగా చేయడం మంచిది కాదని యుక్తితర్కాల ద్వారా శ్రీరామకృష్ణులకు నచ్చజెప్ప ప్రయత్నించినట్లు కనబడుతోంది. అందుకు ఉదాహరణగా భగవంతుడు సైతం తాను విధించిన ప్రకృతి నియమానుసారంగా వ్యవహరించాలా, లేదా అనే అంశంపై వారి మధ్య జరిగిన ఒక సంభాషణను పేర్కొనవచ్చు.
ఆ సంభాషణ గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు:
“ ‘భగవంతుడు కూడ తను విధించిన నియమాలకు తల ఒగ్గవలసిందే. తను ఒకసారి విధించిన నియమాలను త్రోసిపుచ్చే శక్తి ఆయనకు లేదు’ అని మథుర్ అన్నాడు. అందుకు నేను, ‘నువ్వు ఏమంటున్నావు? నియమాన్ని విధించేవాడు కావాలనుకొంటే దాన్ని రద్దుపరచగలడు లేదా దానికి బదులుగా మరో నియమం ప్రవేశపెట్టగలడు’ అని అన్నాను. కాని నా మాటను మథుర్ ససేమిరా ఒప్పుకోలేదు. ‘ఎర్రపువ్వులు పూచే మొక్క ఎర్రపువ్వులనే పూస్తుంది, ఎన్నటికీ అది తెల్లపువ్వులు పూయించదు. ఎందుకంటే అది భగవన్నియమం కనుక. ఏదీ, ఎర్రపువ్వులు పూచే మొక్కకు తెల్లపువ్వులను ఎలా పూయించగలడో చేసి చూపమనండి, చూస్తాను’ అని మథుర్ అన్నాడు. ‘ఆయన సంకల్పంతో ఏదైనా సంభవమే. ఇది కూడ సాధ్యమే’ అని నేను అన్నాను. ఈ ప్రతిపాదనను అతడు అంగీకరించలేదు. మర్నాడు మలవిసర్జనకై తోపు వైపు వెళ్ళాను. అక్కడ చూశాను కదా, ఎర్రమందార మొక్కకు ఒకే కొమ్మకు చెందిన రెండు రెమ్మలకు రెండు పువ్వులు – ఒకటి ఎర్రది, రెండవది మచ్చుకైనా ఎరుపుజాడ సైతంలేని మంచులాటి తెల్లది – పూసి ఉండడం చూశాను. తక్షణం ఆ పువ్వులతో సహా కొమ్మలను తుంపి, తీసుకువచ్చి మథుర్ ముందు పెట్టి, ‘ఇదుగో చూడు’ అన్నాను. అప్పుడు మథుర్, ‘అవును, బాబా! నేను ఓడిపోయాను’ అని అన్నాడు.” శ్రీరామకృష్ణులకు శారీరక రుగ్మత మూలంగా మానసిక వికలత ఏర్పడిందని, అది భక్త్యావేశంగా అభివ్యక్తమైందని మథుర్ నమ్మకం. కాబట్టే తమ భక్తిపారవశ్యాన్ని అదుపులో ఉంచుకోవలసిందని యుక్తితర్కాలతో అతడు శ్రీరామకృష్ణులకు నచ్చజెప్ప ప్రయత్నించి ఉంటాడు.
9. శ్రీరామకృష్ణుల ఆరోగ్యం పట్ల మథుర్ అక్కర
ఈ విధంగా కొంత కుతూహలంతో, కొంత దయతో లౌకికుడైన మథుర్, శ్రీరామకృష్ణుల అవస్థను గురించి చర్చిస్తూ ఆయనతో అధిక సమయం గడిపే వాడు. కాని అదే సమయంలో శ్రీరామకృష్ణులలో తాను చూస్తూన్న పరిణామాలకు కారణం భగవత్ భక్తే అనే భావన కూడా అతడిలో లేకపోలేదు. పొంగిపొరలే తీవ్ర దైవభక్తి ప్రాబల్యంచే విపరీతంగా ప్రవర్తించే శ్రీరామకృష్ణుల చర్యలు ప్రతిరోజు మథుర్కు తెలియవచ్చేవి. దాంతో ఆయన శారీరక మానసిక ఆరోగ్యాల గురించి మథుర్ మరింత ఆందోళన చెందేవాడు. ఉదాహరణకు: ఒక రోజు పూజాసనం మీద కూర్చుని, తమలోనే జగజ్జననిని దర్శించి పూజోపకరణాలతో తమను తామే పూజించుకోసాగారు. అంతకు ముందురోజు ఎడతెగకుండా మూడు గంటలసేపు సంధ్యా ఆరతి నిర్వర్తించి ఆలయోద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేశారు. మరొక రోజు భగవద్దర్శనం కాలేదని నేల మీద పడి పొర్లాడుతూ, ముఖాన్ని నేలకేసి రుద్దుతూ దీనంగా విలపిస్తూ ఉంటే, చుట్టూ జనం మూగారు. ఆహా, ఆయన జీవితంలో జరిగిన అటువంటి సంఘటనలను ఎన్నింటి గురించి ఆయన ముఖతా మేం వినలేదు!
10. శివమహిమ్నస్తోత్ర పారాయణ సంఘటన
శ్రీరామకృష్ణులు ఒక రోజు శివాలయంలోకి* వెళ్ళి శివుని మహిమను అభివర్ణించే సుప్రసిద్ధ ‘శివమహిమ్న స్తోత్రం’ పారాయణ చేయసాగారు. అలా చేస్తూ ఈ క్రింది శ్లోకాన్ని పారాయణ చేస్తున్నప్పుడు దాని భావంలో లీనమై భావ పారవశ్యులయ్యారు.
అసితగిరిసమం స్వాత్ కజ్జలం సింధుపాత్రే
సురతరువరశాఖా లేఖీనీ పత్రముర్వీ ।
లిఖతి యది గృహీత్వా సారదా సర్వకాలం
తదపి తవ గుణానామీశ పారం న యాతి ॥
[సముద్రమే సిరా సీసాగా, నీలపర్వతమే సిరాగా, పారిజాతచెట్టు పెద్ద కొమ్మే కలంగా చేసుకొని, భూమి అనే కాగితం మీద స్వయంగా సరస్వతీదేవియే నీ గుణమహిమలను అనంతకాలంగా వ్రాస్తూవున్నా, ఓ శివా, వాటికి అంతం లేదు కదా!]
పై శ్లోకాన్ని పారాయణ చేస్తూండగా పరమేశ్వరుని మహిమ శ్రీరామకృష్ణుల హృదయంలో ప్రజ్జ్వలంగా ప్రదీప్తం కాగా, ఆయన మైమరచిపోయారు; దాంతో స్తోత్రాన్ని, భాషను, స్తోత్ర క్రమాన్ని సర్వం మరచిపోయి, “ఓ మహాదేవా! నీ గుణగణాలను నేనెలా వర్ణించగలనయ్యా” అంటూ బిగ్గరగా కేకలు వేయసాగారు. ఆయన కళ్ళనుండి నీరు ధారలుకట్టి వక్షస్థలం, కట్టుబట్టలను, నేలను సైతం తడిపివేశాయి. గద్గదస్వరంలో ఆయన పెట్టిన కేకలు విని, విచిత్ర ప్రవర్తన చూసి ఆలయోద్యోగులు పరుగున అక్కడకు వచ్చారు. అలా భావపరవశులైన శ్రీరామకృష్ణులను చూసి కొందరు ఆశ్చర్యపోయి, “ఓహో! ఇదంతా చిన్న భట్టాచార్యుల పిచ్చే” అంటూ, ఏం జరుగుతుందో చూద్దామని వేచివున్నారు. వారిలో ఒకరు, “నేడు ఆయన పిచ్చి ముదిరింది కాబోలు” అన్నాడు. మరొకరు, “శివుడి భుజాల మీదకెక్కి కూర్చోడు కదా? ఏమంటారు? ఆయనను బయటకు లాక్కువస్తే మంచిదేమో!” అన్నాడు. అలాంటి వ్యాఖ్యానాలు కొనసాగాయి. మరికొందరికి ఇదంతా వేడుకగా కనిపించిందనడంలో సందేహం లేదు.
కాని శ్రీరామకృష్ణులు పూర్తిగా బాహ్యచైతన్యరహితులై ఉన్నారు. శివమహిమానుభవంతో తన్మయులైన ఆయన మనస్సు ఈ బాహ్యప్రపంచాన్ని దాటి, ఈ జగత్తుకు చెందిన మలిన భావనలు, మాటలు ఏనాటికీ చేరజాలని అతి ఉన్నతోన్నత స్థితినిచేరింది. అలాంటప్పుడు ఆలయ సిబ్బంది కారుకూతలు ఆయన చెవిని ఎలా చేరగలవు?
దక్షిణేశ్వరంలోని ద్వాదశ శివాలయాలు, శ్రీరామకృష్ణులు స్నానమాచరించిన చాందిని ఘట్టం
దక్షిణేశ్వరంలో కొలువైన శివలింగం
ఆ సమయంలో మథుర్ కాళికాలయంలో ఉన్నాడు. భట్టాచార్యులకు సంబంధించిన ఆ గడబిడ విని అక్కడికి వచ్చాడు. గౌరవపూర్వకంగా ఆలయ సిబ్బంది అతడికి దారి ఇచ్చారు. మథుర్ భావసమాధిమగ్నులైన శ్రీరామకృష్ణులను చూసి ముగ్ధుడయ్యాడు. ఆలయ సిబ్బందిలో ఒకరు బలవంతంగా శ్రీరామకృష్ణులను శివాలయం నుండి లాగివేయాలని సూచించగా, మథుర్బాబు మండిపడి, “ఆయనను ఏకాంతంగా ఉండనివ్వండి. ఆయన విషయంలో ఎవరైనా జోక్యం చేసుకొంటే, మెడ మీద తలకాయ ఉండదు” అని హెచ్చరించాడు. దాంతో ఆలయ సిబ్బంది నోళ్ళు మూతపడ్డాయి. కాసేపయ్యాక శ్రీరామకృష్ణులకు బాహ్య చైతన్యం కలిగింది. మథుర్ను, ఆలయ సిబ్బందిని అక్కడ చూడగానే పిల్లవాడిలా భీతితో, “వివశుడనై ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేశానా?” అని అడిగారు. మథుర్ ఆయనకు నమస్కరించి, “లేదు బాబా! నువ్వు స్తోత్ర పారాయణ చేస్తున్నావు. అనాలోచితంగా ఎవరైనా నీ పనికి విఘ్నం కలిగిస్తారేమో అని నేను ఇక్కడ నిలబడ్డాను” అని అన్నాడు.
11. శ్రీరామకృష్ణుల సాంగత్యంలో ఇతరులలో సత్వర ఆధ్యాత్మిక పురోగతి
సాధనకాలం నాటి తమ పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని శ్రీరామకృష్ణులు ఒక రోజు మాతో ఇలా చెప్పారు: “ఆ సమయంలో (సాధనకాలంలో) ఇక్కడకు వచ్చి దీని (తమ) సాంగత్యం చేసిన వారిలో భగవదుద్దీపన సత్వరమే జనించేది. ఇద్దరు యువకులు బారానగర్ నుండి వస్తూవుండేవారు. వారు నిమ్నకులానికి చెందిన బెస్తవారో లేక తామ్లీలో అయివుండవచ్చు. వారు సజ్జనులు. దీని (తమ) పట్లగల భక్తిప్రపత్తుల కారణంగా తరచూ వచ్చేవారు. ఒక రోజు వారితోబాటు నేను పంచవటి క్రింద కూర్చుని ఉన్నప్పుడు వారిలో ఒకరికి ఒక రకమైన అవస్థ కలిగింది. అతడి ఛాతీ ఎర్రబారింది, కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రబడ్డాయి. కళ్ళనుండి నీరు ధారకట్టింది. రెండు సీసాల మద్యం త్రాగినవాడిలా నోట సరిగ్గా మాటరాని, తిన్నగా నిలబడలేని స్థితిలో ఉన్నాడు. ఆ స్థితికి అంతం ఉన్నట్లు కనిపించలేదు. నేను భయపడి, అమ్మను ఇలా ప్రార్థించాను: ‘అమ్మా! ఏం చేశావు అతడికి? నేనే ఏదో చేసి అతణ్ణి ఆ స్థితికి తెచ్చానని లోకులంటారు. అతడికి తల్లిదండ్రులున్నారు. ఇప్పుడే అతడు ఇంటికి వెళ్ళాలి.’ ఇలా అమ్మను ప్రార్థిస్తూ నా చేత్తో అతడి ఛాతీని నిమరసాగాను. తరువాత అతడి ఆ అవస్థ తగ్గుముఖం పట్టింది. కాసేపయ్యాక ఇంటికి వెళ్ళాడు.”
12. శ్రీరామకృష్ణులలో శివ – శక్తులను ఏకకాలంలో మథుర్ దర్శించడం
శ్రీరామకృష్ణుల సాంగత్యంలో మథుర్బాబుకు కూడ ఒకానొక సమయంలో అద్భుత ఆధ్యాత్మిక అవస్థ కలగడం, తద్ద్వారా అతడి భక్తిప్రపత్తులు వేయిరెట్లు అధికరించిన వైనం స్వయంగా గురుదేవుల ముఖతా మేం విన్నాం. శ్రీరామకృష్ణుల గదికి ఈశాన్యం వైపునున్న పొడవైన వసారాలో ఒక రోజు శ్రీరామకృష్ణులు దివ్య భావపారవశ్యంలో పచార్లు చేస్తున్నారు. ఆ సమయంలో మథుర్బాబు ఆలయానికి, పంచవటికి మధ్య ఉన్న ‘యజమానుల భవంతి’ లో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. మథుర్ కూర్చున్న చోటుకు, శ్రీరామకృష్ణులు పచార్లు చేస్తున్న చోటు బాగానే కనిపిస్తుంది. తన భవిష్యత్ లౌకిక వ్యవహారాలను గురించి యోచిస్తున్న మథుర్, అంతర్ముఖులై శ్రీరామకృష్ణులు ఆ వసారాలో పచార్లు చేయడం మధ్య మధ్యలో గమనిస్తున్నాడు. కాని శ్రీరామకృష్ణులకు, మథుర్ అలా గమనిస్తున్నాడన్న ధ్యాసే లేదు. ఒకవేళ అలాంటి ధ్యాస ఉంటే మటుకు జరగబోయేది ఏమిటి? లౌకికంగా, సామాజికంగా, ఏ దృష్టితో చూసినా పరస్పరం పట్టించుకోనంత అంతరం వారి మధ్య నెలకొనివుంది. ఒకవేళ అలా పట్టించుకోవలసి వస్తే శ్రీరామకృష్ణులే పట్టించుకోవలసి వచ్చేది. మథుర్ తనను గమనిస్తున్నాడనే ఎరుక ఉండివుంటే ఆయనే అక్కడ నుండి నిష్క్రమించి ఉండేవారు. కాని అంతర్ముఖులై ఉండడం చేత అలా చేయలేకపోయారు. అతిసామాన్యులు, నిరర్థకులు, పేద పూజారి, లోకుల దృష్టిలో పరిహాసానికి గురైనవారు అయిన శ్రీరామకృష్ణులు, సుసంపన్నుడు, గౌరవనీయుడు, పెద్దమనిషి, ఆలయ యజమాని అయిన మథుర్ సమక్షంలో సంకోచం లేకుండా ఎలా ఉండగలరు? ఉదార భావనతో శ్రీరామకృష్ణులపట్ల మథుర్ వ్యవహరించడమే, ఆయనకు ఇప్పటిదాకా ఆలయం నుండి ఉద్వాసన చెప్పకపోవడానికి కారణం. కాని ఇప్పుడు జరుగనున్న సంఘటన ఊహాతీతమైనది, అగ్రాహ్యమైనది కూడ. ఎందుకంటే, హఠాత్తుగా మథుర్ సుడిగాలిలా వచ్చి శ్రీరామకృష్ణుల మ్రోల పడిపోయి, ఆయన రెండు కాళ్ళు చేతులతో పుచ్చుకొని వలవల ఏడ్వసాగాడు, కనుక.
దానిని గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు: “ ‘ఏమిటిది? నువ్వేం చేస్తున్నావు? నువ్వు యజమానివి, రాణి అల్లుడివి. నువ్వు ఇలా చేయడం చూస్తే లోకులు ఏమనుకొంటారు? శాంతించి, లే’ అని అన్నాను. నా మాటలు వింటేగా! కాస్సేపయ్యాక ఊరట చెంది, జరిగింది యావత్తూ పూసగుచ్చినట్లు నాకు చెప్పాడు. అతడికి ఒక విచిత్ర దర్శనం కలిగింది. అతడిలా చెప్పాడు: “బాబా, నువ్వు నేనున్న దిశగా పచార్లు చేస్తున్నప్పుడు, నువ్వు కాక ఆలయంలో వెలసిన నా తల్లి (కాళీమాత) వస్తున్నట్లు తోచింది. వెనుకకు తిరిగినప్పుడు నువ్వు సాక్షాత్తు శివుడిగానే నాకు కనిపించావు. మొదట దృష్టిభ్రమయేమో అనుకొన్నాను. బాగా కళ్ళు నులుముకొని మరీ చూశాను. అదే దర్శనం. చూసినప్పుడల్లా అదే దృశ్యం కనిపించింది.’ పదేపదే అదే విషయం చెబుతూ మథుర్ ఏడవసాగాడు. ‘అసలు నాకు అదేం తెలియదే’ అని నేనన్నాను. అతడు వింటేగా! ఇదంతా చూసి ఎవరైనా రాణికి వెళ్ళి చెబుతారేమోనని నేను భయపడ్డాను. ఆమె ఏమనుకొంటుంది? బహుశా మథుర్ మీద నేనేదో వశీకరణం ప్రయోగించానని ఆమె అనవచ్చు. మథుర్ నాకింత చేయడం, నన్నింతగా అభిమానించడం కేవలం ఊరకేనా? ‘దీని’ (తనను) గురించి అమ్మ అనేక దర్శనాలు, అనుభూతులు అతడికి అనుగ్రహించింది. అతడి ఇష్టదైవం అయిన జగజ్జనని అతడి పట్ల కారుణ్యం వహించి తాను ఒక దేహధారియై అతడిని అనుసరిస్తూ, అతణ్ణి సదా రక్షిస్తూ ఉంటుందని మథుర్ జాతకంలో వ్రాసి ఉంది.”
13. ఆ దర్శన ఫలితం
నాటి నుండి మథుర్ విశ్వాసం ప్రగాఢమైంది. మొట్టమొదటిసారి శ్రీరామకృష్ణులు అసాధారణ వ్యక్తి అని అతడికి సూచనప్రాయంగా తెలియవచ్చింది. మొదటిసారి చూడగానే తానెవరిపట్ల ఆకర్షితుడైనాడో, ఇతరులు ఖండిస్తున్నప్పటికీ ఎవరి మానసిక ధోరణులను తరచూ గుర్తించి అవగతం చేసుకొన్నాడో, ఆ వ్యక్తి దేహంలో తన పట్ల కారుణ్యం వహించిన జగజ్జనని వసిస్తూ ఉన్నదని మథుర్ ఇప్పుడు అర్థంచేసుకొన్నాడు. ఆనాటి నుండి ఆలయంలో విగ్రహ రూపంలో వెలసివున్న మూర్తి, తన జాతకంలో చెప్పబడినట్లు, దేహాన్ని ధరించి తన వెనువెంట తిరుగుతున్నదని మథుర్కు నమ్మకం కుదిరింది. అప్పటి నుండి శ్రీరామకృష్ణులతో అతడి సాంగత్యం మరింత సన్నిహితం కాసాగింది.
14. మథుర్ మహద్భాగ్యం
నిజానికి మహద్భాగ్యం మథుర్ను వరించింది. దేహం ఉన్నంత వరకు సామాన్యజీవులే కాక, జీవన్ముక్తులైన మహాపురుషులు సైతం సత్కర్మ–దుష్కర్మల ఫలితాలను అనుభవిస్తూ ఉండవలసిందే. కాని సామాన్యజీవులు తమ కర్మఫలాలను తామే అనుభవిస్తారు. అయితే జీవన్ముక్తుల శరీరాల ద్వారా పాపపుణ్యాలను అనుభవించేదెవరు? అనే ప్రశ్న ఎదురౌతుందిక్కడ. ఎందుకంటే కర్మమూలంగా కలిగే సుఖ దుఃఖాలను అనుభవించవలసివస్తే అహంకారం, అభిమానం అవసరం కనుక. కాని జీవన్ముక్తులలో ఇవి ఎప్పుడో జ్ఞానంచేత దగ్ధమైపోయాయి. అలాంటప్పుడు ఆ సుఖదుఃఖాలను ఎవరు అనుభవిస్తారు? కాని కర్మఫలం అనివార్యం. జీవన్ముక్తుల దేహాలు ఎండుటాకులా రాలిపడిపోయేటంత వరకు మంచి చెడు కర్మలను కొన్నింటిని చేయవలసే ఉంటుంది. కాబట్టే శాస్త్రాలు పై ప్రశ్నకు ఇలా జవాబిస్తున్నాయి: ఏ బద్ధజీవులు, ఆ జీవన్ముక్తులను సేవిస్తూవుంటారో ఆ ముక్తపురుషుల సత్కర్మ ఫలాన్ని వీరు పొందుతారు. అలాగే ఎవరు ఆ జీవన్ముక్తులను ద్వేషిస్తారో, ఆ ముక్తపురుషుల దుష్కర్మ ఫలాలను వీరు పొందుతారు.* సామాన్య జీవన్ముక్తులను సేవించడం ద్వారానే ఇలాంటి పుణ్యఫలాన్ని పొందుతున్నప్పుడు ఇక భగవదవతారపురుషులను భక్తిప్రపత్తులతో సేవించడం మూలంగా ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో ఎవరు చెప్పగలరు?
15. శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక అనుభూతులు: వాటి పరీక్షానంతరం రూఢియైన మథుర్ విశ్వాసం
రోజులు గడిచేకొద్దీ మథుర్బాబుకు, శ్రీరామకృష్ణులలో గురుభావం సుస్పష్టంగా కానరాసాగింది. ఆయన పట్ల భక్తిప్రపత్తులు సుదృఢం కాసాగాయి. ఈ లోపు ఎన్నో సంఘటనలు జరిగిపోయాయి. భగవద్విరహంతో శ్రీరామకృష్ణుల దేహంలో భరింపరాని మంట మొదలవడం, అందుకు చికిత్స; భైరవీబ్రాహ్మణి దక్షిణేశ్వర ఆగమనం, మథుర్ ఏర్పాటు చేసిన పండిత సమావేశంలో వైష్ణవ భక్తిగ్రంథాలను ఉదాహరిస్తూ శ్రీరామకృష్ణులు అవతారపురుషులని ఋజువు పరచడం; మహాజ్ఞాని, వేదాంతీ అయిన తోతాపురి రాక, ఆయననుండి శ్రీరామకృష్ణులు సన్న్యాసం పుచ్చుకోవడం; వృద్ధురాలైన తల్లి చంద్రాదేవి దక్షిణేశ్వరానికి వచ్చి నివసించసాగడం – ఈ సంఘటనలన్నీ జరిగిపోయాయి. మథుర్ ఏ రోజు శ్రీరామకృష్ణులలో శివ–శక్తుల అద్భుత దర్శనం పొందాడో ఆ రోజు నుండి అతడు నిత్యం ఆయన జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నింటితో సన్నిహిత సంబంధం కలిగివున్నాడు. శ్రీరామకృష్ణుల చికిత్సకోసం అతడు కలకత్తాలో సుప్రసిద్ధ వైద్యులైన గంగాప్రసాద్ సేన్, మహేంద్రలాల్ సర్కార్లను నియోగించాడు. ఉత్తరప్రదేశ్ స్త్రీలు ధరించే అందెలు మొదలైన ఆభరణాలతో జగజ్జననిని అలంకరించాలనే ఆకాంక్ష శ్రీరామకృష్ణులకు ఒకసారి కలిగింది. వెంటనే మథుర్ ఆ ఆభరణాలను చేయించాడు. అలాగే వైష్ణవ భక్తిశాస్త్రాలు నిర్దేశించే ‘సఖీ’ భావ (అంటే తాను జగజ్జనని చెలికత్తెననే భావం) సాధన అనుష్ఠిస్తున్నప్పుడు స్త్రీల వేషభూషణాదులను ధరించాలనే కోరిక ఆయనకు కలిగింది. వెంటనే మథుర్ వజ్రాలు పొదిగిన ఆభరణాలు, వారణాసి చీర, శాలువ మొదలైన వాటిని తెప్పించి ఇచ్చాడు. అలాగే ‘పానీహాటీ’ వైష్ణవ మహోత్సవాన్ని శ్రీరామకృష్ణులు తిలకించగోరుతున్నారని తెలియగానే మథుర్ అందుకు కావలసిన ఏర్పాట్లు అన్నీ చేయించాడు. అంతేకాదు; జనసమూహంలో శ్రీరామకృష్ణులకు అసౌకర్యం కలుగకుండా చూడాలనే ఉద్దేశంతో ఒక అంగరక్షకుడితోపాటు తనుకూడ మారువేషంలో ఆయనను అనుసరించాడు. ఈ విధంగా మథుర్, శ్రీరామకృష్ణులకు ఒనరించిన అద్భుత సేవలు ఒక వంక విన్నాం. మరోవంక శ్రీరామకృష్ణుల మనస్సులో అపవిత్ర భావాలు ఏవైనా ఉదయిస్తాయో లేదో పరీక్షించడానికి వేశ్యలను ఆయన వద్దకు పంపించాడని శ్రీరామకృష్ణుల ముఖతా మేం విన్నాం. అలాగే కాళికాలయ యావదాస్తి పాస్తులను ఆయన పేరిట మార్చి వ్రాసి ఇవ్వాలని మథుర్ ప్రతిపాదించాడు. ఆ ప్రతిపాదన తెలిసి శ్రీరామకృష్ణులు భావావస్థలో కోపోద్రిక్తులై, “ఏమిటి? నన్ను లౌకికుణ్ణి చేయగోరతావా?” అంటూ అతణ్ణి కొట్టబోయినంత పని చేశారు. ఒకసారి తన జమీలో జరిగిన కొట్లాటలో అవతలి వ్యక్తి మరణించడంతో న్యాయస్థానం ఖూనీ నేరం కింద మథుర్ను కఠినంగా శిక్షించబోయింది. ఆ ప్రమాదం నుండి తప్పించు కోవడానికి అతడు శ్రీరామకృష్ణులతో తాను చేసినదంతా ఒప్పుకొని, ఆయనను శరణుజొచ్చాడు. ఈ సంఘటనలను బట్టి చూసినప్పుడు శ్రీరామకృష్ణుల పట్ల మథుర్ భక్తిప్రపత్తులు క్రమంగా వేళ్ళూనసాగినవని తెలియవస్తుంది. అలా కాకుండా మరో విధంగా ఎలా జరుగుతుంది? అద్భుతమూ, అలౌకికమూ అయిన శ్రీరామకృష్ణుల దివ్యత్వం ఒక వంక మథుర్ పరీక్షల నన్నింటినీ తట్టుకొని నానాటికి తేజో విరాజమానంగా ప్రకాశిస్తూ ఉంటే, మరొక వంక ఆయన నిస్వార్థ, అహేతుక ప్రేమ మథుర్ హృదయాన్ని పూర్తిగా ఆకట్టుకొంది. లక్షల విలువైన ఆస్తిపాస్తులను ఇవ్వనున్నా పరిత్యాగమార్గం నుండి ఆయనను కించిత్తు కూడ మళ్ళించలేకపోయాడు. సుందరాంగులైన అతివలను పురమాయించి కూడా ఆయన మనస్సులో లేశమైనా వికారం కలిగించలేకపోయాడు. లౌకిక గౌరవమర్యాదలు (ఒక మనిషి మరొక మనిషిని దైవంగా భావించి పూజించడం కంటే పెద్ద గౌరవం మరేముంటుంది?) శ్రీరామకృష్ణులలో అహంకారాన్ని జనింపచేయడంగాని లేదా ఆయనను పదభ్రష్టుని చేయడంగాని చేయలేకపోయాయి. తన కోసం ఆయన దేనినీ కోరి ఎరుగరు. శ్రీరామకృష్ణులకు, తనలోని బలహీనతలు తెలిసి కూడా తనను పరమ ఆప్తునిగా ప్రేమిస్తూ, పదేపదే ప్రమాదాల నుండి తనను రక్షిస్తూ, సదా అన్నివిధాల తన శ్రేయస్సు గురించే యోచిస్తూంటారన్న సంగతి మథుర్కు తెలుసు. ‘ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయి?’ అని మథుర్ తనను ప్రశ్నించుకొన్నాడు. మానవదేహం ధరించినప్పటికీ శ్రీరామకృష్ణులు, ఈ లోకానికి చెందినవారు (తేజోమయ పురుషుడు) కారనీ, ఆయన పరిత్యాగం, ఆత్మసంయమనం, జ్ఞానం, భక్తి, చేతలు అన్నీ అద్భుతాలనీ, వీటన్నిటికి మించి దుర్బలులైన తనబోటి అహంకార జీవుడి పట్ల ఆయన కనబరచే ప్రేమానుగ్రహాలు మరింత అపురూపమనీ మథుర్ అవగతం చేసుకొన్నాడు.
అదే సమయంలో మథుర్ అంతరాంతరాళాలలో శ్రీరామకృష్ణుల అనుపమాన వ్యక్తిత్వ మాధుర్యాన్ని చవిచూశాడు. ఆయనలో అపూర్వ దివ్యశక్తి అభివ్యక్తీకరణ ఉన్నప్పటికీ శ్రీరామకృష్ణులు నిరాడంబర బాలునిలానే ఉండిపోయారు. ఆయనలో మచ్చుకైనా అహం లేదు. ఎంత ఆశ్చర్యం! అయిదేళ్ళ బాలునిలా తన మనస్సులోని ఆలోచనలను ఏమాత్రమూ దాచుకొనేవారు కారు. లోపల బయట ఒకే రీతిలో ఉంటారు. మనస్సులోనిది యావత్తు ఆయన వచనాలలోను, చేతలలోను అభివ్యక్తం అయ్యేది. తాము బాధను అనుభవించ వలసివచ్చినా సరే, ఆయన ఇతరులకు కీడు కలిగించే దేనినీ వ్యక్తం చేసేవారు కారు. ఒక సాధారణ మనిషి ఈ విధంగా ప్రవర్తించిన దాఖలాలు ఏమైనా చూశామా?
16. పూజారి హాల్దార్ ఈర్ష్యాసూయలు
కాళీఘాట్ పూజారియైన హాల్దార్, మథుర్బాబు కుటుంబ పురోహితుడు. శ్రీరామకృష్ణుల పట్ల మథుర్బాబు వహిస్తున్న ప్రగాఢ భక్తిప్రపత్తులు చూసి ఇతడిలో ఈర్ష్యాసూయలు రగులుకొన్నాయి. ఏదో ఆవాహన చేసి శ్రీరామకృష్ణులు, మథుర్ను వశీకరించుకొన్నారని ఇతడు భావించాడు. పైగా ఇలా అనుకొన్నాడు కూడా: “ఆహా, ఈ ధూర్తుడు మథుర్ను నా చెప్పు చేతల్లోకి తీసుకురావాలని చాలాకాలంగా నేను చేస్తున్న ప్రయత్నాలను వమ్ము చేయనున్నాడు. పైగా నోట్లో వేలువేస్తే కొరకలేని పిల్లవాడిలా నటిస్తాడు. ఏదీ, నిజంగానే అంత నిరాడంబరుడైతే వశీకరణ మంత్రాన్ని నాకు వెల్లడించమను చూస్తాను. నాకు తెలిసిన మాయా మంత్రాలన్నీ మథుర్ మీద ప్రయోగించి దాదాపుగా అతణ్ణి వశబరచుకోవడంలో కృతకృత్యుడనయ్యాను. కాని ఇప్పుడు శనిగ్రహంలా మా మధ్య ఇతడు ఊడిపడ్డాడు.”
శ్రీరామకృష్ణుల పట్ల మథుర్ భక్తిప్రపత్తులు పెంపొందేకొద్దీ, ఆయనను మరింతగా సేవించుకోవాలనీ, సదా ఆయన సాంగత్యంలో గడపాలనే ప్రగాఢ ఆకాంక్ష మథుర్లో కలుగసాగింది. అందుచేత అప్పుడప్పుడు జాన్బజార్లోని తన ఇంటికి శ్రీరామకృష్ణులను మారాం చేసి తోడ్కొనివచ్చి ఆయన సాంగత్యంలో ఆనందంగా గడిపేవాడు. మధ్యాహ్నంపూట ఆయనను తన బండిలో ఈడెన్ ఉద్యానవనం మొదలైన ఆసక్తికరమైన చోట్లకు తీసుకువెళ్ళేవాడు. ‘ఏది పడితే వాటిలో ‘బాబా’ కు తినిపించడం సబబు కాదు’ అని భావించి ఆయన కోసం ప్రత్యేకంగా బంగారం, వెండితో పళ్ళెరాలు మొదలైనవి చేయించి వాటిలో ఆయనకు ఆహారం అందించేవాడు. ఆయనచేత మంచి బట్టలు ధరింప చేసి, ఇలా అనేవాడు: “బాబా, వీటన్నింటికీ (తన జమీ, ఇతర ఆస్తిపాస్తులు) సొంతదారుడివి నువ్వే. నేను కేవలం నీ దివానును మాత్రమే. ఇదుగో చూడు, ఈ బంగారు పళ్ళెరాలు, వెండిగిన్నెలు గ్లాసులలో నువ్వు తిని త్రాగాక కనీసం వాటి వంక చూడకుండా లేచి వెళ్ళిపోతావు. వాటిని నువ్వు మళ్ళీ ఉపయోగించడం కోసం నేను వాటిని శుభ్రంగా తోమించి పదిలపరుస్తాను. అంతేకాదు, అవి విరిగిపోకుండా, దొంగిలింపబడకుండా చూసుకొనే కర్తవ్యం కూడ నాదే.”
17. వారణాసి శాలువల దుర్గతి
ఆ సమయంలో మథుర్బాబు కొన్న వెయ్యి రూపాయల విలువైన ఒక జత వారణాసి శాలువాల దుర్గతి కథనం శ్రీరామకృష్ణుల ముఖతా మేం విన్నాం. ఇంతటి విలువగల శాలువాలను కానుక చేయడానికి శ్రీరామకృష్ణులు తప్ప మరెవరూ యోగ్యులుకారని భావించి, ఆయన పవిత్ర దేహాన్ని వాటితో నిండుగా కప్పి, మహదానందం పొందాడు. నిజానికి ఆ శాలువాలు అతి విలువైనవి. ఆనాడే వాటి ఖరీదు ఎంతో ఎక్కువ. బహుశా ఇప్పుడు అటువంటివి లభించవు. ఆ శాలువాలను ఒంటిచుట్టూ కప్పుకొని మొదట్లో శ్రీరామకృష్ణులు పిల్లవాడిలా సంతోషంగా అటూ ఇటూ తిరిగారు. పదే పదే వాటివైపే చూస్తూ, అందరిని పిలిచి వాటిని చూపిస్తూ మథుర్ ఎంతో ఖర్చుపెట్టి వాటిని తనకోసం కొన్నాడని చెప్పసాగారు. కాని చిన్న పిల్లవాడిలా మరుక్షణమే ఆయన మనోభావాలు మారిపోయాయి. ఆయన ఇలా అనుకొన్నారు: ‘వీటిలో ఏముంది? నాణ్యమైన ఉన్ని తప్ప మరేముంది? అన్ని వస్తువులూ తయారయ్యే ఆ పంచభూతాల పరివర్తనే కదా ఇవి కూడ. ఇక చలికోసం అయితే, దుప్పట్లు, బొంతలు సరిపోతాయి కదా! ఇతర అన్ని వస్తువుల మాదిరి భగవత్సాక్షాత్కారానికి ఇవి సైతం దోహదకారులు కావు. పైగా ఇవి ధరించినప్పుడు ఇతరుల కంటే ఘనుడననే అహం, గర్వం పెచ్చు పెరిగి, మనస్సును భగవంతుని వైపు నుండి తిప్పివేస్తాయి. ఆహా, వీటిలో ఎన్ని లోపాలున్నాయి!’ ఇలా భావిస్తూ, శాలువాలను నేలమీద విసిరికొట్టి, “సచ్చిదానంద అనుభూతిని కలిగించడంలో ఇవి దోహదం చెయ్యవు. వీటి మీద ఉమ్ముతాను” అంటూ, నిజంగానే వాటిమీద ఉమ్మివేయసాగారు. వాటిని నేలమీది దుమ్ముధూళితో రుద్దసాగారు. చివరకు ఆయన వాటిని తగులబెట్టబోయారు. కాని అప్పుడు అక్కడకు వచ్చిన ఎవరో వాటిని ఆయన చేతుల నుండి లాగివేశారు. మథుర్కు ఈ విషయం తెలిసి అతడు బాధపడలేదు. తద్విరుద్ధంగా, “బాబా మంచిపనే చేశారు” అని అన్నాడు.
18. శ్రీరామకృష్ణుల అనాసక్తత
అనేక సౌకర్యాలు, సుఖాల మధ్య శ్రీరామకృష్ణులను ఉంచడానికి మథుర్ ప్రయత్నిస్తున్నప్పటికీ అనవరతం ఆయన మనస్సు సమున్నత భూములలోనే నెలకొని ఉండేది. ఈ విషయం మనకు పై సంఘటనలనుండి స్పష్టమౌతుంది. కాని ఆయన మనస్సు ఎక్కడ నెలకొని ఉన్నప్పటికీ అది సదా పారవశ్యంతో పొంగిపొరలేది. ఇతరుల మనస్సు గాఢాంధకారాన్ని మాత్రమే చూడగలుగుతున్నచోట శ్రీరామకృష్ణుల మనస్సు ఏ కాంతి అయితే ఎల్లప్పుడు ప్రజ్వలిస్తూ ఉంటుందో, ఏ కాంతి ముందు సూర్యచంద్రులు, నక్షత్రాలు, మెరుపుతీగల కాంతి సైతం వెలవెలబోతుందో – అటువంటప్పుడు అగ్ని గురించి చెప్పడం అనవసరం* – ఆ దివ్యకాంతిని మాత్రమే చూసేది. అటువంటి దివ్యకాంతియుత రాజ్యంలోనే ఆయన మనస్సు సదా వసించేది. మరి ఇక హింసతో, ద్వేషంతో, కాపట్యంతో, కామక్రోధాదులతో నిండివున్న ఈ అంధకారమయ రాజ్యాన్ని చూసి, జాలిచెంది రెండు రోజుల కోసం ఆయన మనస్సు కిందికి దిగివచ్చేది. కాబట్టే మితిమీరిన సౌకర్యాలతో సుఖభోగాలతో నిండి ఉన్న మథుర్బాబు జాన్బజార్ ఇంట్లో నివసిస్తూన్నా శ్రీరామకృష్ణులు అనాసక్తితో, అహంకారరహితులుగా తమదే అయిన దివ్యభావంలో రేయింబవళ్ళు తన్మయులై, అదే శ్రీరామకృష్ణులుగా జీవించసాగారు.
19. పూజారి హాల్దార్ దుష్ప్రవర్తన
ఇలా ఉండగా ఒకరోజు శ్రీరామకృష్ణులు సంధ్యాసమయానికి కాస్త ముందు అర్ధబాహ్య దివ్యావస్థలో పడుకొని ఉన్నారు. ఆయన భావపారవశ్యం నుండి మెల్లగా అప్పుడే తేరుకొంటున్నారు. బాహ్యస్పృహ కొద్దికొద్దిగా కలుగుతున్నది. అప్పుడు కాళీఘాట్ పూజారి హాల్దార్ అక్కడకు రావడం తటస్థించింది. ఏకాంతంలో ఆ స్థితిలో శ్రీరామకృష్ణులను చూడగానే ఇదే మంచి అదను అనుకొన్నాడు. మెల్లగా శ్రీరామకృష్ణులను సమీపించి, అటూ ఇటూ చూసి ఆయనను పట్టుకొని ఊపుతూ పదేపదే, “ఏయ్! మథుర్బాబును నీ వశం ఎలా చేసుకొన్నావో చెప్పు? అమాయకుడిలా నటిస్తూ, నోరు మెదపవెందుకని? ఆయనను ఎలా వశపరచుకొన్నావు? చెప్పు” అని అడిగాడు. ఆ స్థితిలో శ్రీరామకృష్ణులకు మాట్లాడే శక్తి లేనందున, ఆయన ఏమీ బదులు చెప్పలేదు. అప్పుడు హాల్దార్ కోపోద్రిక్తుడై, “ధూర్తుడా! నాకు చెప్పవా!” అంటూ బలంగా కాలితో ఆయనను తన్ని, వెళ్ళిపోయాడు. మథుర్కు ఈ విషయం తెలిసివస్తే హాల్దార్కు కఠిన శిక్ష తప్పదని ఎంచి ఆత్మాభిమానశూన్యులైన శ్రీరామకృష్ణులు ఈ సంఘటన గురించి మథుర్ వద్ద ప్రస్తావించలేదు. ఈ సంఘటన జరిగిన కొద్దికాలంలోనే హాల్దార్ పూజారి ఏదో అపరాధంచేసి మథుర్ కోపానికి గురై, పనినుండి తొలగించబడ్డాడు. ఆ తరువాత ఒక రోజు మాటల సందర్భంలో శ్రీరామకృష్ణులు, మథుర్కు పై సంఘటన గురించి తెలిపారు. ఆ సంఘటన గురించి విని మథుర్ వ్యధతో, కోపంతో, “బాబా, నాకీ సంగతి అప్పుడే తెలిసివుంటే అతగాడి తల నిజంగానే నేలరాలేది” అని అన్నాడు.
20. మథుర్ కుటుంబంతో శ్రీరామకృష్ణుల ఆత్మీయత
శ్రీరామకృష్ణుల నుండి జాలువారే అనంత అనుగ్రహాన్ని మథుర్, అతడి భార్య తమ అంతరాంతరాళాల్లో అనుభూతం చేసుకొన్నారు. తత్ఫలితంగా ఆ దంపతులు ఆయనను ప్రత్యక్షదైవంగా శరణుజొచ్చారు. తమను గురించి వారు శ్రీరామకృష్ణుల ఆత్మీయత ఏనాడు ఏ విషయాన్ని ఆయననుండి దాచకపోవడమే వారి ఈ వైఖరికి నిదర్శనం. వారిద్దరూ ఇలా అనేవారు: “బాబా, మానవమాత్రులు కారు (సాక్షాత్తు భగవంతుడే)! ఆయన నుంచి ఏ విషయాన్నయినా దాచడంలో ప్రయోజనం ఏమిటి? ఆయనకు అన్నీ తెలుసు, అంతరాంతరాళాలలోని రహస్యాలు సైతం.” ఇవి కేవలం నోటిమాటలు కావు; వాటి ప్రకారమే వారు వ్యవహరించేవారు. తినడం, త్రాగడం, పడుకోవడం మొదలైనవి ఆయనతో కలిసి చేసిన సందర్భాలు కోకొల్లలు. వారి అంతఃపురంలోకి ‘బాబా’ స్వేచ్ఛగా రాకపోకలు చేస్తే మటుకు ఏమిటి? ఆయన అలా చేయకపోతే మటుకు ఏమిటి? ప్రతి ఒక్కరి మనస్సులో జనించే ప్రతి ఆలోచన ఆయనకు తెలుస్తుందనడానికి అనేక సందర్భాలలో వారికి నిదర్శనాలు కనిపించాయి. ఇక స్త్రీ పురుషులు యథేచ్ఛగా కలసిమెలసి తిరగడానికి ఏది ముఖ్య కారణమో, ఆ ముఖ్యానర్థం, కామం అనే ఆ వికారానికి సంబంధించినంత వరకు ‘బాబా’ ను ఒక గోడగానో లేక రాయిరప్పగానో పరిగణించవచ్చు. పరాయి మగవాళ్ళను చూసినప్పుడు కలిగే సిగ్గు బిడియాలు, ‘బాబా’ ను చూసినప్పుడు మథుర్ కుటుంబ స్త్రీలకు కలిగేవికావు. ఆయనను వారు తమలో ఒకరి గానో లేక ఐదేళ్ళ బాలునిగానో భావించేవారు. ఎందుకంటే జగజ్జనని చెలికత్తెననే భావంలో దీర్ఘకాలం సాధన చేసిన ఫలితంగా ఆయన స్వభావం అన్ని రీతుల స్త్రీ స్వభావంగానే మారిపోయింది కనుక. మథుర్ కుటుంబంతో (స్త్రీలతో సహా) శ్రీరామకృష్ణులకు కలిగిన అద్భుత అనురాగబాంధవ్యం గురించి ఎన్నో కథనాలు ఆయన ముఖతా మేం విని, ఆశ్చర్యపోయాం. దుర్గాపూజ సమయంలో సఖీ భావంలో తన్మయులై స్త్రీల వేషభూషణాదులు దాల్చి, మథుర్ కుటుంబ స్త్రీలతో కలిసి ఇంటప్రాంగణంలో ప్రతిష్ఠితమైన దుర్గా ప్రతిమ వద్దకొచ్చి చామరంతో దేవికి వీచేవారు. మళ్ళీ కొన్ని సందర్భాలలో మథుర్ కుమార్తె భర్త వచ్చినప్పుడు, ఆమెను స్వయంగా శ్రీరామకృష్ణులు అలంకరించి, భర్తతో మెలగవలసిన విధానం తెలిపి, ఆమెను పడకగది వరకు దిగవిడిచి వచ్చేవారు. ఆయనలో అభివ్యక్తమౌతున్న గురుభావాన్ని చూసి ఆయన సాక్షాత్తూ భగవంతుడనే విశ్వాసం ఆ కుటుంబ స్త్రీల హృదయాలలో ప్రగాఢమైపోయింది ఒక వంక! మరో వంక ఆయన నిస్వార్థప్రేమ అనుభూతం చేసుకొని ఆయనను తమవారికంటే కూడ పరమ ఆప్తునిగా భావిస్తూ, ఎలాంటి సంకోచమూ లేకుండా ఎంత స్వేచ్ఛగా మెలగేవారంటే దానిని ఊహించు కోవడం కూడా సాధ్యం కాదేమో!
కలకత్తా జాన్బజార్లోని రాణీరాస్మణి ఆవాసం, శ్రీరామకృష్ణులు అనేక పర్యాయాలు ఇక్కడికి విచ్చేశారు, దుర్గాపూజలో పాల్గొన్నారు.
21. ఏకకాలంలో శ్రీరామకృష్ణులలో విరుద్ధ భావాలు నెలకొని ఉండడం
మథుర్ కుటుంబ స్త్రీల పట్ల నిస్వార్థ, కామగంధరహితమైన ‘చెలికత్తె’ లాంటి ప్రేమ పరిపూర్ణంగా ఒకవైపు వ్యక్తమౌతూ ఉండేది. మరొక వైపు పురుషులు, పండితుల సాహచర్యంలో అదే శ్రీరామకృష్ణులు సాటిలేని మేథస్సుతో, అంతర్దృష్టితో వ్యవహరించేవారు. పరస్పర విరుద్ధమైన ఈ భావాలు ఒకేచోట శ్రీరామకృష్ణులలో ఎలా నెలకొని ఉన్నాయో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. విరుద్ధ భావాల సామరస్యంతో బహుముఖ వ్యక్తిత్వాలు సంతరించుకొన్న శ్రీరామకృష్ణులు నిజానికి ఎవరు?
22. ‘విరిగిపోయిన విగ్రహం’ గురించి దక్షిణేశ్వరంలో పండిత సదస్సు
దక్షిణేశ్వర విష్ణుమందిరంలో రాధా గోవిందుల విగ్రహాలు ప్రతిష్ఠింపబడి, నిత్యం పూజింపబడుతున్నాయి. గర్భమందిరానికి ప్రక్కనే శయన మందిరం ఉంది. రోజూ తెల్లవారుజామునే ఈ రెండు విగ్రహాలను పడకగది నుండి తీసుకువచ్చి గర్భమందిరంలోని సింహాసనం మీద అమర్చేవారు. పూజ నైవేద్యాదులు ముగిశాక మధ్యాహ్నం విశ్రాంతికై మళ్ళీ విగ్రహాలను పడకగదిలోకి తీసుకుపోతారు. మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు గర్భమందిరానికి విగ్రహాలను తీసుకువస్తారు. సంధ్యా ఆరతి, రాత్రి నైవేద్యం ముగిశాక యథాప్రకారం శయన మందిరానికి తీసుకువెళతారు. ఇది ప్రతిరోజూ జరిగే కార్యక్రమం. ఒకరోజు పూజారి గోవింద విగ్రహాన్ని శయన మందిరానికి తీసుకు పోతుండగా చలువరాతి నేల తడిగా ఉండడంచేత కాలుజారి పడ్డాడు. విగ్రహం కాలు ఒకటి విరిగిపోయింది. అప్పుడు ఆలయంలో కలకలం చెలరేగింది. పూజారి కూడ గాయపడ్డాడు. భయంతో వణకిపోతున్నాడు. ఈ వార్త ఆలయ యజమానులకు అందింది. వారికి పరిష్కరించ లేని సమస్య ఎదురైంది. విరిగిన విగ్రహం పూజకు పనికి రాదు. ఇప్పుడిక మార్గం ఏమిటి? రాణీ రాస్మణి, మథుర్బాబులు ఈ పరిస్థితిలో అనుసరించవలసిన పద్ధతి తెలుసుకోగోరి కలకత్తాలోని సుప్రసిద్ధ పండితులను ఆహ్వానించి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి కారణాంతరాల వలన రాలేని పండితుల లిఖీతాభిప్రాయాలను సేకరించారు. అదొక సంచలనాత్మక సంఘటన. ఆహ్వానితులై వచ్చిన పండితులకు వారి స్థాయికి తగ్గట్లు కానుకలు చెల్లించడంచేత ఆ పండిత సమావేశానికి ఎంతో ఖర్చయింది. పండితులు పుస్తకాలు తెరిచి, ఘాటుగా నశ్యం పీల్చారు. తదుపరి ఈ సమస్యకు పరిష్కారం ఇలా తెలియచేశారు: “విరిగిపోయిన విగ్రహాన్ని గంగలో నిమజ్జనం చేయాలి. దానికి బదులుగా మరొక కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి.” వెంటనే కొత్త విగ్రహాన్ని మలచడానికి ఒక శిల్పికి ఉత్తర్వు ఇచ్చారు.
23. ఈ సమస్యకు శ్రీరామకృష్ణులు ఇచ్చిన సమాధానం
పండిత సమావేశం పరిసమాప్తం కాబోతున్నప్పుడు మథుర్బాబు తన అత్తగారైన రాణీ రాస్మణితో, “ఈ విషయంలో ‘బాబా’ ను (శ్రీరామకృష్ణులను) సంప్రదించలేదే! ఆయన ఏం చెబుతారో తెలుసుకోవాలి” అని అన్నాడు. ఇలా అంటూ అతడు శ్రీరామకృష్ణులను ఆయన అభిప్రాయం గురించి అడిగాడు. అప్పుడు భావసమాధిమగ్నులై శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “రాణిగారి అల్లుళ్ళల్లో ఎవరైనా కిందపడి కాలు విరగగొట్టుకొంటే అతడిని అలాగే వదలివేసి అతడి స్థానాన్ని మరో వ్యక్తితో భర్తీచేస్తారా? లేక సముచిత చికిత్సకు ఏర్పాటు చేస్తారా? అదే పద్ధతిని ఇక్కడ కూడ అనుసరించాలి కదా! విగ్రహం కాలును జాగ్రత్తగా అతికించి యథాప్రకారం పూజ కొనసాగించాలి. విగ్రహాన్ని పరిత్యజించవలసిన అగత్యం ఏముంది?” శ్రీరామకృష్ణుల నిర్ణయ విధానం విని అంతా తెల్లబోయారు. ఇంత సహజోపాయాన్ని కనుగొనే బుద్ధి ఎవరికీ లేకపోయింది. ఎందుకంటే ఆ విగ్రహం గోవిందుని దివ్య అభివ్యక్తీకరణతో సజీవమై ఉందని అంగీకరిస్తే, ఆ అభివ్యక్తీకరణ భక్తుని ప్రగాఢ భక్తిప్రపత్తుల మీద ఆధారపడి ఉంటుంది కనుక; భక్తుడి ప్రగాఢ భక్తిప్రపత్తులను బట్టే భగవంతుడు అతడి పట్ల కరుణించి అతణ్ణి అనుగ్రహించడానికి ఆ విగ్రహంలో అభివ్యక్తమౌతాడు. అటువంటప్పుడు హృదయంలో ప్రగాఢ భక్తిప్రపత్తులు ఉన్నంతవరకు భగవంతుడు ఆ భగ్న విగ్రహంలో ఎందుకు అభివ్యక్తం కాడు? భౌతికమైన ఆ విగ్రహంలోని లోటుపాట్లు ఆ అభివ్యక్తీకరణను ఏ రకంగానూ ఆటంకపరచవు. పైగా ఏ విగ్రహంలో భగవంతుణ్ణి ఇంతకాలంగా పూజిస్తూ, భక్తిప్రపత్తులు చెల్లిస్తూ వస్తున్నారో ఆ విగ్రహానికి ఇప్పుడు అంగవైకల్యం ఏర్పడితే భక్తుడి ఆ భక్తిప్రపత్తులు తక్షణం అదృశ్యమైపోతాయా! భక్తులు, భగవంతుణ్ణి తమతో సమానంగా సేవించాలని వైష్ణవాచార్యులు ఉపదేశిస్తున్నారు కూడా. ఏ అవస్థలోనైనా ఏం చేయడానికి తాము ఇష్టపడతారో భగవంతుడికి కూడ అదే ఇష్టమని భావించి ఆయనను అలాగే సేవించాలి. కనుక భక్తులు భగవంతుని ప్రతిమలో సాక్షాత్తూ భగవంతుడే అభివ్యక్తమై ఉన్నాడని ఎంచి శ్రద్ధాభక్తులతో పూజిస్తూ, సేవించాలి. ఈ దృక్కోణం నుండి పరికించినా విగ్రహాన్ని విసర్జించాలనే నిర్ణయం సబబు కాదు. (అయితే స్మృతులు భగ్నవిగ్రహాలను పూజించకూడదని నిషేధించడానికి హేతువు?) ఎవరిలో ఇంకా భగవత్ప్రేమ ఉదయించలేదో, ఎవరు ఇప్పుడిప్పుడే భక్తిమార్గంలో కాలుపెట్టారో అటువంటి అపక్వసాధకుడికే పై నిషేధం వర్తిస్తుందని గ్రహించాలి.
ఏది ఏమైనా శాస్త్రాహంకారపూరితులైన పండితులు కొందరు శ్రీరామకృష్ణులు వెలిబుచ్చిన అభిప్రాయంతో ఏకీభవించలేదు. కానుకలపై వేటు పడుతుందేమో అన్న కారణంగా కొందరు పండితులు తమ అభిప్రాయాలను స్పష్టంగా వెలిబుచ్చలేదు. కాని శాస్త్రాధ్యయనం చక్కగా చేసి నిజమైన జ్ఞానాన్ని, భక్తిని కొద్దో గొప్పో పొందిన పండితులు కొందరు శ్రీరామకృష్ణుల మీమాంసను అవగతం చేసుకొని ఆయనను ఎంతో శ్లాఘించారు.
ఆ తరువాత శ్రీరామకృష్ణులే స్వయంగా విరిగిన కాలును, విగ్రహానికి చక్కగా అతికించారు. పూజ యథాప్రకారం కొనసాగింది. శిల్పి నూతన విగ్రహాన్ని మలచి తెచ్చాక, ఆ విగ్రహాన్ని గర్భగుడిలో ఒక పక్కన అమర్చారు తప్ప శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించలేదు. రాణీ రాస్మణి, మథుర్ల మరణానంతరం వారి వారసులు ఆ నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠింప అప్పుడప్పుడు ప్రయత్నాలు చేశారు. కాని ప్రతి సందర్భంలోను ఏదో ఒక అవాంతరమో, దుర్ఘటనో జరగడంతో ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. కనుక గోవిందుని ఆ నూతన విగ్రహం గర్భగుడిలో ఒక ప్రక్కన అమర్చబడిన అదే స్థితిలో ఇప్పటికీ ఉంది.