ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం
మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ।
ఆశ్చర్యచచ్చైన మన్యః శృణోతి
శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్ ॥ –భగవద్గీత 2.29
ఈ ఆత్మను ఒకడు ఆశ్చర్యమైనదానిగా చూస్తాడు, మరొకడు ఈ ఆత్మను విస్మయంతో వర్ణిస్తాడు, ఇంకొకడు ఈ ఆత్మ గురించి విస్మయంగా వింటాడు.మరొకడెవడో దానిని చూసి, చెప్పి విని కూడా తెలుసుకోలేకున్నాడు.
1. ‘గురువు’, ‘బాబా’, ‘కర్తా’ అంటూ తమను ఎవరైనా సంబోధించినప్పుడు శ్రీరామకృష్ణులు చికాకుపడేవారు. అలాంటి ఆయనలో ‘గురుభావం’ ఉండడం ఎలా సాధ్యం?
ఎవరు శ్రీరామకృష్ణులను ఒకటి రెండుసార్లు మాత్రమే చూసివున్నారో, ఎవరికి ఆయనతో సాన్నిహిత్యం కలుగలేదో, ఏదో పైపై సంసర్గం మాత్రమే ఏర్పడిందో, అట్టివారు గురుభావంలో శ్రీరామకృష్ణులు తమ ఆంతరంగిక భక్తులతో ఒనరించిన దివ్యలీలలు గురించి ఎవరి ముఖతా అయినా వింటే ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి పచ్చి అబద్ధం చెబుతున్నాడనుకొంటారు. అయినా అనేకులు అదే విషయం చెప్పడం వినవస్తే, అప్పుడూ తమలో వారిలా అనుకొంటారు: “ఈ భక్తులంతా కలిసి కట్టుగా ఒక పథకం మేరకు శ్రీరామకృష్ణులను దేవునిగా మార్చ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉన్న మూడు వందల ముప్ఫై మూడుకోట్ల దేవతలకు మరొకరిని చేర్చనున్నారు. ఎందుకు, అంతమంది దేవతలు మీకు సరిపోరా? వారిలో నుండి ఎవరో ఒకరినో లేదా కావలసినంత మందినో ఎంపిక చేసుకోరాదా? దేవతల సంఖ్యను పెంచడం ఎందుకు? ఆహా! ఏం వింత! వీరి అబద్ధాలు బట్టబయలైనప్పుడు అంతటి పావనాత్ముని (శ్రీరామకృష్ణుల) పట్ల లోకులకు ఉన్న గౌరవం తరిగిపోతుందని కూడా యోచించరే! మేం ఆయనను చూడలేదా? ఎంత వినమ్రత, ఎంత విధేయత, ఎంత సహనం, ఎంత అహంకారరహితం! ఎంత దీనాతిదీనునిగా పరిగణించుకొనేవారు! పైగా ఈ సంగతీ మీరు చెబుతూనే ఉన్నారు, కళ్ళారా మేం చూశాం: ఎవరైనా తమను ‘గురువ’ ని, ‘బాబా’ అని, ‘కర్తా’* అని సంబోధిస్తే ఆయన భరించలేకపోయే వారు. వెంటనే ఆయన ఇలా కేకలు పెట్టేవారు: ‘భగవంతుడు ఒక్కడు మాత్రమే గురువు, తండ్రి, కర్త. నేను హీనాతిహీనుణ్ణి, దాసానుదాసుణ్ణి, నీ దేహంమీది వెంట్రుకకు – అదీ పెద్దది కాదుసుమా, అతిచిన్న వెంట్రుకకు – సమానుణ్ణి.’ ఇలా అంటూ తమను అలా సంబోధించిన వ్యక్తి పాదధూళి తీసుకొని తన తల నిడుకొనేవారు. ఇటువంటవినమ్రతను ఎవరైనా చూసివున్నారా? అటువంటి వ్యక్తినా వారందరూ గురువుగా, దేవుడిగా రూపొందిస్తున్నారు!”
2. సర్వులలోను భగవంతుని గాంచడం చేత, ఆయన సర్వులకూ దాసుడు
ఇటువంటి వివాదాలు అంతం లేకుండా కొనసాగే ఆస్కారం ఉండడం చేత శ్రీరామకృష్ణుల గురుభావం గురించి మేం ప్రత్యక్షంగా చూసింది, ఇతరుల ముఖతా విన్నది ఇక్కడ వివరిస్తున్నాం. బ్రహ్మనుండి గడ్డిపోచ వరకు జీవులందరిలో నారాయణుడే వసిస్తూన్నాడనే జ్ఞానం వాస్తవానికి శ్రీరామకృష్ణుల సాధారణావస్థలోనూ ఎంతో ప్రగాఢమై ఉండేది. అలాంటప్పుడు, ఇక మనుష్యుల మాట చెప్పనవసరంలేదు. సాధారణ ప్రాణులన్నింటి పట్ల కూడా ఆయనలో ‘దాస్యభావం’ అభివ్యక్తమయ్యేది. నిజానికి సాధారణ స్థితిలో ఆయన తమను హీనాతిహీనునిగా, దీనాతిదీనునిగా పరిగణించుకొంటూ, అందరి పాదధూళి గ్రహించే వారు. ఆ స్థితిలో వారిని ఎవరైనా గురువు, బాబా, కర్త అని సంబోధిస్తే సహించలేకపోయేవారు. అయినా సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఆయన అలా వ్యవహరించడం నిజమైనా, గురుభావంలో శ్రీరామకృష్ణులు ఒనరించిన అపూర్వ దివ్యలీలలను ఎలా కాదనగలం?
3. ఆయనలో నిత్యం అభివ్యక్తమయ్యే గురు భావశక్తి పట్ల భక్తుల ప్రతిస్పందన
తమలో అభివ్యక్తమయ్యే దివ్యశక్తి ప్రభావం చేత సహజంగానే గురుభావ వ్యక్తీకరణ కనిపించేది. అప్పుడు కేవల స్పర్శ మాత్రాన ఎవరికైనా సమాధిని, ప్రగాఢ ధ్యానాన్ని లేదా ఎన్నడూ పొందనట్టి దివ్యానంద మత్తతను* ఒసగేవారు. అభివ్యక్తమయ్యే గురు భావశక్తి లేదా ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తితో సాధకుల మనస్సులోని పట్ల భక్తుల ప్రతిస్పందన తమోగుణాన్ని లేదా మాలిన్యాన్ని ఏ మేరకు తొలగించ గలిగేవారంటే తక్షణమే వారు మునుపు ఏనాడూ అనుభవింపని మానసిక ఏకాగ్రతను, పవిత్రతను, ఆనందాన్ని పొంది, తాము తరించినట్లు భావించుకుంటూ శ్రీరామకృష్ణుల పాదపద్మాల మ్రోల ఆత్మార్పణ చేసుకొనేవారు. ఇటువంటి సమయాలలో చూసినప్పుడు శ్రీరామకృష్ణులు ఇక వెనుకటి దీనాతిదీనులైన శ్రీరామకృష్ణులు కారని, వీరిలో ఏదో ఒక దివ్యశక్తి స్వేచ్ఛతో, లీలా స్వరూపంతో ప్రకటితమై వారిచే అలా చేయిస్తున్నదని అనిపిస్తుంది; వాస్తవానికి ఆయన అజ్ఞాన తిమిరనాశ స్వరూపులని, తాపత్రయాలతో* తల్లడిల్లిపోతూ* , గురువులని, రక్షకులని, భగవంతుని పరమ పదానికి మార్గదర్శకులని అనిపిస్తుంది. శ్రీరామకృష్ణుల ఈ దివ్యావస్థను ఉద్దేశించే భక్తులు ఆయనను గురువు, కృపామయుడు, భగవాన్ అని సంబోధించేవారు. పరస్పర విరుద్ధాలుగా కానవస్తున్నా నిజమైన భక్తుడికి ఉండే వినమ్ర భావం, దివ్యభగవద్గురుభావం – ఈ రెండూ ఏకకాలంలో ఒకే వ్యక్తిలో అభివ్యక్తం కావడం నేటి కాలంలో మేం భగవాన్ శ్రీరామకృష్ణులలో నిజంగానే చూశాం. చూడడం చేతనే అవి రెండూ ఒకే మనస్సులో ఎలా ఉండగలిగాయో అన్న విషయం గురించి మాకు అవగతమైనంత వరకు పాఠకులకు ఇక్కడ తెలుప ప్రయత్నిస్తున్నాం.
4. ఎల్లలెరుగని శ్రీరామకృష్ణుల భావాలు
అలా ప్రయత్నిస్తున్నా మేం అర్థం చేసుకొన్న ఆ కొద్దిమాత్రాన్నైనా సరిగా వివరింపగలమో లేదో తెలియదు. చక్కగా వివరించడానికిగాని, సరిగా అర్థం చేసుకోవడానికి గాని రచయితకు, పాఠకునికి – ఇద్దరికీ అసాధ్యమే. అందుకు కారణం భావముఖంలో వసిస్తూన్న శ్రీరామకృష్ణులలో అభి వ్యక్తమయ్యే భావాలకు పరిమితి లేదు కనుక. “భగవంతునికి పరిమితి అన్నది లేదు” అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. అట్లే ఈ లోకోత్తర మహాపురుషుని భావాలకు పరిమితి అన్నది లేకపోవడం మా స్వీయ అనుభవం.
5. భక్తి మార్గాన్నే శ్రీరామకృష్ణులు అనుసరించారు; జ్ఞానమార్గం కాదు అని భావించే సాధారణ మానవులు
శ్రీరామకృష్ణులు ఎడతెగని ‘భావముఖం’ లో నెలకొని ఉండేవారని విన్న తక్షణమే జనసామాన్యం ఆయన ‘జ్ఞాని పురుషులు’ కారనే తప్పుడు నిర్ణయానికి రావడం కద్దు. భగవత్ప్రేమ, విరహం ద్వారా మనస్సులో ఎగసే పరమానంద, మహాదుఃఖతరంగాలపై సదా తేలుతూ ఉంటారని వారు భావిస్తారు. కాని ‘భావముఖం’ లో వసించడం అంటే ఏమిటో, ఏ పరిస్థితులలో అది సాధ్యమో మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే ప్రస్తుత విషయాన్ని సరిగా గ్రహించ గలుగుతాం. కనుక ‘భావముఖం’ లో వసించడం అనే విషయాన్ని ఇక్కడ మరో దృక్కోణం నుండి క్లుప్తంగా చర్చిద్దాం. కేవలం మూడురోజులు మాత్రమే సాధన చేసి వారు నిర్వికల్ప సమాధి పొందారన్న విషయం మొదట సాధకుడు జ్ఞప్తికి తెచ్చుకోవాలి.
6. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, సుషుప్తి
ప్రశ్న: నిర్వికల్పసమాధి అంటే ఏమిటి?
జవాబు: మనస్సును పూర్తిగా సంకల్ప వికల్ప రహితమైన అవస్థకు తీసుకురావడం.
ప్రశ్న: సంకల్ప వికల్పాలంటే ఏమిటి?
జవాబు: బాహ్యజగత్తులోని రూపరసాది విషయాల (అంటే సమస్త విషయాల) జ్ఞానం లేదా అనుభవం, తద్ద్వారా మనస్సులో కలిగే సుఖదుఃఖాది భావాలు, కల్పనాశక్తి, విచారణశక్తి, ఊహాది మానసిక క్రియలు, ‘ఇది చేస్తాను, దానిని అర్థంచేసుకొంటాను, దీన్ని అనుభవిస్తాను, దానిని పరిత్యజిస్తాను’ మొదలైన మనస్సులో జనించే వృత్తులన్నిటినీ సంకల్ప వికల్పాలని పేర్కొంటారు.
ప్రశ్న: దేని ఆధారంగా, అంటే ఏది ఉంటే ఈ వృత్తులన్నీ ఉదయించడం సాధ్యమో ఆ వస్తువేది?
జవాబు: ‘నేను’, ‘నేను’ (అహం) అనే జ్ఞానం లేదా బోధ. ‘నేను’ అనే జ్ఞానం అదృశ్యమైతే లేదా కొంతసేపటి వరకు సమసిపోతే, ఆ సమయంలో ఏ వృత్తులైనా మనస్సులో ఉదయించడంగాని, మనస్సు మీద ఆధిపత్యం చలాయించడంగాని జరుగదు.
ప్రశ్న: అలా అయితే మూర్ఛలోగాని లేదా సుషుప్తిలోగాని ‘నేను’ అనే జ్ఞానం ఉండదు గదా? అలాంటప్పుడు నిర్వికల్ప సమాధి కూడా ఇదే రకమైనదేదో అని అంటారా?
జవాబు: లేదు. మూర్ఛలోగాని, సుషుప్తిలోగాని ‘నేను’ అనే జ్ఞానం లుప్తం కాదు, అంతరంగంలో కొనసాగుతుంది. మనస్సుకు చైతన్యం కల్పించే మెదడనే పరికరం జడమై కొంతసేపటి వరకు నిర్వ్యాపారంగా ఉండిపోతుంది; జరిగేది అదే. వృత్తులన్నీ మనస్సు అట్టడుగున గుమిగూడతాయి. శ్రీరామకృష్ణులు చెప్పిన ఉదాహరణ చూడండి: “పావురాళ్ళు బటాణీ గింజలను గొంతు ఉబ్బేటట్లు మెక్కి కూతలు పెడుతుంటాయి. వాటి గొంతుల్లో ఏమీ ఉన్నట్లుగా అనిపించదు. కాని గొంతు నొక్కి చూస్తే లోపల గింజలన్నీ ‘కరకర’ మంటూ ఉంటాయి.”
ప్రశ్న: మూర్ఛలో లేదా సుషుప్తిలో ‘నేను’ అనే జ్ఞానం అలా ఉంటుందని ఎలా అర్థం చేసుకోవడం?
7. నిజమైన సమాధి ఫలాలు
జవాబు: ఫలితాన్ని చూసి! ఉదాహరణకు అట్టి సందర్భాలలో హృదయ స్పందన, నాడి కొట్టుకోవడం, రక్తప్రసరణ మొదలైనవన్నీ ఆగవు. ఈ శారీరక క్రియలన్నీ ‘నేను’ అనే జ్ఞానాన్ని ఆశ్రయించే జరుగుతాయి. మరో విషయం: మూర్ఛ లేదా సుషుప్తి బాహ్యలక్షణాలు ఒకింత సమాధి లక్షణాల మాదిరిగా కనిపించినా మనిషి ఆ రెండు అవస్థల నుండి మామూలు జాగ్రదావస్థకు తిరిగి వచ్చాక అతడి మనస్సులోని జ్ఞానం, ఆనందం మునుపటి మాదిరిగానే ఉండిపోతాయి. అవి ఒకింత ఎక్కువ తక్కువలు కావు. ఉదాహరణకు కాముకుని కామం అట్లే ఉండిపోతుంది; కోపిష్ఠివాడి కోపం, లోభికున్న లోభం యథారీతిగానే ఉండిపోతాయి. పిసరంత కూడా తగ్గవు. కాని నిర్వికల్ప సమాధి పొందిన తదనంతరం ఆ వృత్తులన్నీ ఇక తలెత్తవు. అపూర్వ జ్ఞానం, అపరిమిత ఆనందంతో మనస్సు పరిపూర్ణమైపోతుంది. అంతేగాక జగత్కారణుడైన భగవంతుని ప్రత్యక్ష సాక్షాత్కారం కలుగుతుంది; తదుపరి ఇక పరలోకం ఉందా, లేదా? దేవుడున్నాడా, లేడా? అనే సంశయాలన్నీ శాశ్వతంగా సమసిపోతాయి.
ప్రశ్న: సరే, మంచిది. శ్రీరామకృష్ణులు నిర్వికల్ప సమాధిలో నెలకొని ఉన్నప్పుడు ‘నేను’ అనే జ్ఞానం కొంతకాలం వరకు లుప్తమైపోయింది. ఆ తరువాత?
జవాబు: ఆ రీతిలో ‘నేను’ అనే జ్ఞానం లుప్తమైపోయిన తరువాత జగత్కారణ రూపిణి అయిన జగజ్జనని ప్రత్యక్ష సాక్షాత్కారం కలిగింది. కాని ఆ మూడు రోజుల ప్రత్యక్ష దర్శనంతోనే ఆయన తృప్తి చెందక అనవరతం ఆ అవస్థలో నెలకొని ఉండడానికి ప్రయత్నించసాగారు.
ప్రశ్న: ఆ ప్రయత్న ఫలితంగా శ్రీరామకృష్ణులకు ఎటువంటి మానసిక అవస్థ ఏర్పడింది? ఆ అవస్థను సూచిస్తూ ఆయన శరీరంలో అభివ్యక్తమయ్యే లక్షణాలేవి?
8. అప్పుడు వారికి కలిగిన దర్శనాలు, అనుభవాలు
జవాబు: కొన్ని వేళలలో ‘నేను’ అనే జ్ఞానం పూర్తిగా లుప్తమైపోగా, ఆయన బాహ్య శరీరంలో మృతుని లక్షణాలన్నీ పొడసూపేవి. కాని లోపల మాత్రం పరిపూర్ణ రూపంలో జగజ్జనని ప్రత్యక్ష దర్శనం కొనసాగుతూనే ఉండేది. మళ్ళీ కొన్ని సమయాల్లో ఏ కొద్దిగానో ‘నేను’ అనే జ్ఞానం వ్యక్తమై సజీవ లక్షణాలు కొద్దిగా శరీరంలో కనబడేవి. అలాంటప్పుడు సత్త్వగుణాంశం అత్యంత అధికంగా ఉండడం చేత శుద్ధ పవిత్రమైన మనస్సు అనే అడ్డు లేదా తెర గుండా, అంటే ఈ తెర అనే అడ్డుతో ఏ కొద్దిగా మాత్రమో జగన్మాత అస్పష్ట దర్శనం కలిగేది. ఈ రీతిలో ఒకప్పుడు అహంబోధ పూర్తిగా లుప్తం కావడం, మనోవృత్తులన్నీ అంతం కావడం, జగజ్జనని పరిపూర్ణ సాక్షాద్దర్శనం; మరొకప్పుడు కాస్త అహంబోధ ఉదయించడం, దానితో మనోవృత్తులు కొద్దిగా వ్యక్తం కావడం, వెంటనే జగజ్జనని అస్పష్ట దర్శనం – ఈ విధంగా పదేపదే (ఆరు నెలలపాటు) శ్రీరామకృష్ణులకు ఆ స్థితులు అనుభూతమైనాయి.
ప్రశ్న: వారికి ఇలా ఎంతకాలం జరిగింది?
జవాబు: అవిచ్ఛిన్నంగా ఆరు నెలలపాటు.
9. అంత దీర్ఘకాలం ఆయన దేహం ఎలా నిలవగలిగింది?
ప్రశ్న: ఆరు నెలలా! ఆయన శరీరం ఎలా నిలవగలిగింది? ఆరు నెలలపాటు ఆహారం లేకుండా మానవ దేహం నిలిచి ఉండలేదే! ‘నేను’ అనే ఈ శరీర బోధ ఆయనలో అప్పుడప్పుడు ఏదో కొద్దిమాత్రంగా కలిగినా కూడ, ఎంత మేరకు కలిగితే తినడం త్రాగడం వంటి శరీర క్రియలను చేయడం సాధ్యమో అంతమాత్రంగానైనా శరీరబోధ శ్రీరామకృష్ణులకు ఆ సమయంలో కలుగలేదని మళ్ళీ మీరే చెబుతున్నారు కదా? మరి అలాంటప్పుడు ఆయన దేహం ఎలా నిలవగలిగింది?
జవాబు: నిజానికి శ్రీరామకృష్ణుల దేహం నిలిచివుండేది కాదు. దేహం కొంతకాలం నిలబడాలనే ఆకాంక్ష కించిత్తు కూడ ఆయన మనస్సులో అప్పుడు జనించలేదు. జగజ్జనని తన అద్భుత ఆధ్యాత్మిక శక్తిని ఆయన దేహం ద్వారా అభివ్యక్తంచేసి తద్ద్వారా లోకకళ్యాణం చేకూర్చే నిమిత్తమే ఆయన దేహాన్ని ఆమె నిలిపి ఉంచింది.
ప్రశ్న: కావచ్చు. కాని జగజ్జనని స్వయంగా ఏదో ఒక రూపం దాల్చి వచ్చి, బల వంతంగా శ్రీరామకృష్ణులకు ఆరు నెలలపాటు ఆహారం తినిపించిందా, ఏమిటి?
10. శ్రీరామకృష్ణుల స్థితిని అవగతం చేసుకొని, బలవంతంగా ఒక యోగి ఆయనకు ఆహారం తినిపించడం
జవాబు: అవును, అటువంటిదే జరిగింది. తలవని తలంపుగా ఎక్కడనుండో ఒక సాధుపుంగవుడు ఆ సమయంలో అక్కడకు వచ్చాడు. మృత లక్షణాలు కానవస్తున్న శ్రీరామకృష్ణుల శరీరాన్ని చూసిన తక్షణం యోగసాధన ద్వారా లేదా భగవంతునిలో మనస్సు పూర్తిగా ఐక్యమవడం ద్వారా ఆయనకు అట్టి అవస్థ ఏర్పడిందని ఆ సాధుపుంగవుడు గ్రహించాడు. ఆరు నెలలపాటు కాళికాలయంలోనే వసించి, అవసరమైతే అప్పుడప్పుడు శ్రీరామకృష్ణుల దేహాన్ని చిన్నబెత్తంతో కొడుతూ ఒకింత శరీరస్మృతి కలిగింప నిత్యం ప్రయత్నించసాగాడు. కాస్త బాహ్యచైతన్య లక్షణాలు కనిపించగానే ఒకటి రెండు ముద్దల అన్నం శ్రీరామకృష్ణుల నోట్లో కుక్కేవాడు. పూర్తిగా అపరిచితుడు, జడప్రాయుడు, దాదాపు మృతప్రాయుడు అయిన ఒక వ్యక్తిని ఆ విధంగా సజీవునిగా ఉంచాలనే అసాధారణ తహతహ, అనూహ్య ఆసక్తి ఆ సాధువుకు ఎందుకు జనించిందో మాకు తెలియరావడం లేదు. కాని ఇటువంటి సంఘటనలు భగవత్సంకల్పం మేరకు జరుగుతాయని చెప్పడం కద్దు. కనుక జగజ్జనని సంకల్పం, శక్తి ద్వారానే శ్రీరామకృష్ణుల దేహాన్ని సజీవంగా నిలిపి ఉంచాలనే అసాధ్య ఘటన సుసాధ్యమైనదని తప్ప మేం ఇంకేం చెప్పగలం?
ప్రశ్న: ఓహో, అలాగా! ఆ తరువాత?
11. ‘భావముఖంలో నెలకొని ఉండు’ – జగజ్జనని ఆదేశం
జవాబు: ఏ విరాట్ చైతన్యం, ఏ విరాట్ శక్తి, ఈ ప్రపంచంగా అభివ్యక్తమై, జడ చేతన చరాచరం యావత్తు ఓతప్రోతంగా ప్రవేశించి, పరివ్యాపించి, అనంత నామరూపాలుగా క్రీడిస్తూ ఉన్నదో ఆ విరాట్ చైతన్యాన్నే, శక్తినే భగవంతుడనిగాని, జగజ్జనని అనిగాని పేర్కొంటాం. ఈ జగజ్జననియే తదుపరి శ్రీరామకృష్ణులను “భావముఖంలో నెలకొని ఉండు” అని ఆదేశించింది.
ప్రశ్న: భావముఖం అంటే ఏమిటి?
12. సగుణ–నిర్గుణ బ్రహ్మం, విరాట్ అహంకారం, ఈశ్వరుడు, జగజ్జనని
జవాబు: చెబుతాను విను. ‘భావముఖం’ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలంటే ఊహించి సాధ్యమైనంత వరకు శ్రీరామకృష్ణుల అప్పటి అవస్థను గురించి అవగతం చేసుకోవడం అవసరం. ఆ సమయంలో (నిర్వికల్ప సమాధిలో ఆరు నెలల కాలం వసించినప్పుడు) ఆయన ‘అహం’ బోధ ఒక్కొక్కప్పుడు పూర్తిగా లుప్తమైపోయేదని, ఒక్కో సమయంలో ఏదో కించిత్తు వ్యక్తమయ్యేదని మునుపే చెప్పివున్నాం. కించిత్తు ‘అహం’ బోధ వ్యక్తమైన సమయాలలో సైతం ఈ ప్రపంచం మనకు కనిపించే తీరులో ఆయనకు కనిపించేది కాదు. ఒక విరాట్ మనస్సులో అనంత భావతరంగాలు లేస్తూ, ఉప్పొంగుతూ, లయమౌతూన్నట్లుగా ఆయనకు కానవచ్చేది. తమ శరీరం, మనస్సు, అహం – ఇవన్నీ కూడ ఆ విరాట్ మానసంలోని ఒక సంకీర్ణ తరంగంగానే శ్రీరామకృష్ణులకు కనిపించేది. జడవాదులైన పాశ్చాత్య పండితమన్యులు ఏ జగచ్చైతన్యాన్ని, శక్తిని తమ బుద్ధిబలంతో, యాంత్రిక పరికరాల సహాయంతో కొలవ ప్రయత్నిస్తూ, ‘అది ఒకటి అన్నది నిజమే కాని అది జడవస్తువు* ’ అనే నిర్ణయానికి వచ్చారో, శ్రీరామకృష్ణులు ఆ అవస్థకు చేరి, దాని స్వరూపాన్ని సాక్షాత్కరించు కొన్నారు; ఏది సజీవమో, జాగృతమో, ఏకమేవాఽద్వితీయమో, ఏ దివ్యశక్తి సకల ఇచ్ఛాక్రియలను సృజిస్తూన్నదో, అనంత కృపామయి అయిన ఆ జగచ్ఛక్తిని, జగజ్జననిని ప్రత్యక్షంగా దర్శించారు ఆ అవస్థలో! అంతేగాక ఆ ఏకమేవాఽద్వితీయంలో – సగుణమని, నిర్గుణమని తనను తాను రెండుగా విభజించుకోవడం వలన ఈ భేదాన్నే శాస్త్రాలు స్వగతభేదం* అని పేర్కొంటున్నాయి. ఆబ్రహ్మస్తంభపర్యంతం (అంటే సమస్త జగత్తులో) వ్యాపించివున్న ఒక విరాట్ అహం అభివ్యక్తమౌతూ ఉండడం శ్రీరామకృష్ణులు దర్శించారు. అంతేకాక ఈ విరాట్ అహంకారం ఉండడం చేతనే ఆ విరాట్ మనస్సులో అసంఖ్యాక భావతరంగాలు ఉదయిస్తూన్నాయనీ, ఈ భావతరంగాలు ఎక్కువగానో తక్కువగానో, పరిమితమైనవిగా మాత్రమే చూడడంచేత మానవుల క్షుద్రాహంకారాలు వాటినే బాహ్యజగత్తుగా, ఆ జగత్తులోని విభిన్న పదార్థాలుగా భావిస్తూ, తినడం వినడం వంటి దైనందిన వ్యవహారాలను నెరవేరుస్తూ ఉండడం సైతం ఆయన దర్శించారు; అంతేగాక ఈ పరిమిత ‘అహం’ శక్తితోనే మానవుల క్షుద్రాహంకారాలు నిలిచి ఉన్నాయని, తమ తమ పనులను నెరవేర్చ గలుగుతున్నాయని, ఆ విరాట్ అహంకారాన్ని చూడలేనందుననే ఈ క్షుద్రాహంకారాలు భ్రమలోపడి తమకు స్వాధీనమైన ఇచ్ఛ, క్రియాశక్తి కలిగి ఉన్నవని అనుకొంటాయని – ఈ అంధత్వాన్నే అవిద్య అని, అజ్ఞానమని శాస్త్రాలు పేర్కొంటున్నాయని శ్రీరామకృష్ణులు గ్రహించారు.
13. ఈ విరాట్ అహంకారానికే ‘భావముఖం’ (భావాలన్నిటికీ ఆలవాలం) అని పేరు
ఈ విధంగా ఆ నిర్గుణ సగుణాల రెండింటికీ మధ్య ఏ విరాట్ అహంకారం ఉంటుందో దానికే ‘భావముఖం’ అని పేరు. ఎందుకంటే దీన్ని ఆశ్రయించే, దీనినుండే విరాట్ మనస్సులో అనంత భావాలు ఉదయిస్తాయి. ఈ విరాట్ అహంకారమే జగజ్జనని లేదా ఈశ్వరుని అహంకారం. ఈ విరాట్ అహంకారాన్నే గౌడీయ వైష్ణవాచార్యులు వర్ణింప ప్రయత్నించి దానిని అచింత్యా భేద – అభేద స్వరూపుడు, చిద్ఘనమూర్తి, భగవాన్ శ్రీకృష్ణుడు అని పేర్కొన్నారు.
14. నిర్వికల్పస్థితిలో, సవికల్ప లేక భావముఖ స్థితిలో శ్రీరామకృష్ణుల అనుభూతి
శ్రీరామకృష్ణుల అహం బోధ ఎప్పుడు సంపూర్ణంగా లుప్తమైపోయేదో అప్పుడు ఆయన ఈ విరాట్ అహం అనే పరిమితిని అతిక్రమించి, జగన్మాత నిర్గుణ స్వరూపంలో లీనమై ఉండేవారు. ఈ స్థితిలో దేనిని మనం ప్రపంచం అని పిలుస్తూంటామో ఆ ‘విరాట్ అహం’, దానినుండి ఉదయించే అనంత భావతరంగాలు పూర్తిగా లుప్తమైపోయేవి; వీటి అస్తిత్వం ఒకింతైనా ఆయనకు అనుభూతమయ్యేది కాదు. మళ్ళీ ఆయనకు ఈషణ్మాత్రంగా ‘అహం’ – నేను – అనే జ్ఞానం కలిగినప్పుడు జగదంబ నిర్గుణ భావంతో సంయుక్తమైన ఈ సగుణభావం* , ఈ విరాట్ అహం, దాని అనంత భావతరంగాలు అనుభూతమయ్యేవి. మనస్సు నిర్గుణ స్వరూపంలో లీనమైనప్పుడు ఆ ‘ఏకమేవా-ద్వితీయం’ లో కనిపించే సగుణ, నిర్గుణమనే స్వగతభేదానుభవం సైతం శ్రీరామకృష్ణుల నుండి పూర్తిగా లుప్తమైపోయేది; కాని ఆయనకు ఎప్పుడు ఆ సగుణ విరాట్ అహంబోధ అనుభూతమయ్యేదో అప్పుడు – ఎవరు బ్రహ్మమో అతడే శక్తి* అని, ఏది నిర్గుణమో అదే సగుణమని, ఎవడు పురుషుడో అతడే ప్రకృతి అని, పాము స్థిరంగా ఉన్నా, మెలికలు తిరుగుతూ ప్రాకుతున్నా అదే పాము అని, స్వరూపంలో ఎవడు నిర్గుణుడో అతడే లీలలో సగుణుడనే విషయం అనుభూతమయ్యేది. జగజ్జనని నిర్గుణ – సగుణాలనే ఈ రెండు రకాల స్వరూప పూర్ణ సాక్షాత్కారం పొందిన తరువాతే శ్రీరామకృష్ణులను తల్లి, ‘భావముఖంలో నెలకొని ఉండు’ అని ఆదేశించింది. అంటే ‘నేను’ జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోయి కేవలం నిర్గుణావస్థలోనే నివసించవద్దు; కాని ప్రపంచమనే అనంత భావాలు దేనినుండి ఉత్పన్నమౌతున్నాయో ఆ ‘విరాట్ అహంకారమే’ నువ్వనీ, దాని సంకల్పం నీ సంకల్పమనీ, దాని కార్యాలే నీ కార్యాలనీ తెలుసుకొని (అంటే నువ్వు జగన్మాతలో లీనమై జగన్మాత చేతిలో కేవలం యంత్ర స్వరూపుడవనే భావనతో) – సదా ఈ భావాన్నే పరిపుష్టంచేస్తూ జీవించు, జనానికి మేలొనరింప ప్రయత్నించు అన్న కార్యాన్ని వివరించింది.
15. ‘భావముఖంలో నెలకొని ఉండు’ అన్న ఆదేశ తాత్పర్యం
కాబట్టి అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో సర్వతోభావంగా ఆ ‘విరాట్ అహం’, ఆ ‘పెద్ద నేనునే’, ఆ ‘పక్వాహంకారాన్నే’ నేనుగా అనుభవిస్తూ, వ్యవహరిస్తూ ఉండడమే ‘భావముఖంలో నెలకొని ఉండు’ అనే దానికి తాత్పర్యం. ఈ భావముఖావస్థకు చేరినప్పుడు ఇక ‘నేను ఫలానా వారి కుమారుణ్ణి’, ‘ఫలానా వాడి తండ్రిని’, ‘నేను బ్రాహ్మణుణ్ణి’, ‘నేను శూద్రుణ్ణి’ – ఇత్యాది భావనలన్నీ మనస్సు నుండి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. అందుకు బదులుగా ‘విశ్వవ్యాప్తమైన అహాన్ని నేను’ అన్నదే సదా అనుభూతమౌతూ ఉంటుంది. అందుకే శ్రీరామకృష్ణులు పదేపదే మాకు ఇలా ఉపదేశించేవారు: “నాయనలారా, ‘నేను ఫలానా వారి కుమారుణ్ణి’, ‘నేను ఫలానా వాడి తండ్రిని’, ‘నేను బ్రాహ్మణుణ్ణి’, ‘నేను శూద్రుణ్ణి’, ‘నేను పండితుణ్ణి’, ‘నేను సంపన్నుణ్ణి’ – ఇత్యాదులన్నీ అపక్వాహంకారాలు. అవి బంధాన్ని కల్పిస్తాయి. వీటిని విడిచిపెట్టి, ‘నేను ఆయన (భగవంతుని) భక్తుణ్ణి’, ‘ఆయన బిడ్డను’, ‘ఆయన అంశను’ అని భావిస్తూ ఉండాలి. ఈ భావాలను నీ మనస్సులో స్థిరపరచుకో.” లేదా, “అద్వైతజ్ఞానం కొంగున కట్టుకొని నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో” అని చెప్పేవారు.
16. ఆధ్యాత్మిక పురోగతి మేరకు ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత స్థితులు ఏర్పడతాయి
పాఠకులు బహుశా ఇలా చెప్పవచ్చు: “శ్రీరామకృష్ణులు నిజమైన అద్వైతవాదులు కారా? శంకరాచార్యులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచానికి అస్తిత్వమే లేదు. మరి శ్రీరామకృష్ణులు ఈ సిద్ధాంతాన్ని అంగీకరించడం లేదే! ఎందుకంటే జగజ్జనని లోపల కానవచ్చే స్వగత భేదాన్ని అంగీకరించి, నిర్గుణంలోను అట్లే సగుణంలోను – ఈ రెండు అవస్థలలోను ఆమె అభివ్యక్తం కావడం వారికి అనుభవమే కదా! అలాంటప్పుడు ఆయనను అద్వైతమార్గ అనుయాయులని చెప్పటం ఎలా పొసగుతుంది?” ఇది సరికాదు. శ్రీరామకృష్ణులు అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం – అన్ని భావాలను, అన్ని మార్గాలను అంగీకరించారు. కాని ఆయన ఇలా చెబుతూండేవారు: “సాధకుడి ఆధ్యాత్మిక ప్రగతిలో ఇవి క్రమావస్థలు; ఇవి ఒకటి తరువాత మరొకటిగా వచ్చి అనుభూతమౌతాయి. ఒక అవస్థలో ద్వైతభావం అంగీకారం పొందుతుంది; ఆ స్థితిలో ఇతర రెండు అవస్థలు మిథ్యలుగానే తోస్తాయి. ఆధ్యాత్మిక పురోగతిలో ఉన్నతదశకు చేరుకొన్నప్పుడు విశిష్టాద్వైతం నిజమని సాధకుడు గ్రహిస్తాడు. అప్పుడు అఖండ నిర్గుణ పరమాత్మ లీలలో సగుణుడుగా (అనంత కల్యాణ గుణసాగరుడుగా) అనుభూతి చెందుతాడు; ఈ స్థితిలో ద్వైతం మిథ్యగా అనిపించడమేకాక, అద్వైతవాదంలో సత్యం నిహితంగా ఉందనే విషయం సైతం అతడికి స్ఫురించదు. సాధన అనుష్ఠిస్తూ పోగాపోగా సాధకుడు ఆధ్యాత్మిక పురోగతి పరాకాష్ఠను చేరాక జగజ్జనని కేవల నిర్గుణ భావాన్నే అనుభూతం చెందుతూ, ఆ అద్వైతస్థితిలో వసిస్తాడు.* ఆ స్థితిలో నేను – నువ్వు, జీవుడు – జగత్తు, బంధం – ముక్తి, పాపం – పుణ్యం, ధర్మం – అధర్మం – ఇవన్నీ ఒక్కటైపోతాయి.”
17. ఈ విషయంపై ఆంజనేయుని అభిప్రాయం
ఈ సందర్భంగా దాస్యభక్తికి మహోజ్జ్వల నిదర్శనమైన మహాజ్ఞాని ఆంజనేయుని అనుభవాన్ని శ్రీరామకృష్ణులు ప్రస్తావించేవారు. ఆయన ఇలా చెప్పేవారు: “ఒకప్పుడు శ్రీరామచంద్రుడు తన దాసుడైన హనుమంతుణ్ణి, ‘నా పట్ల నీ వైఖరి ఏమిటి? ఏ విధంగా భావిస్తావు? ఎలా ఆరాధిస్తావు?’ అని అడిగాడు. అందుకు హనుమంతుడు ఇలా జవాబిచ్చాడు: ‘ఓ రామా! నాకు దేహబుద్ధి ఉన్నంతవరకు, అంటే ఈ దేహాన్నే నేను అనే జ్ఞానం నాకున్నప్పుడు నువ్వు ప్రభువ్వి, నేను దాసుడను; నువ్వు సేవ్యుడవు, నేను సేవకుణ్ణి; నువ్వు పూజ్యుడవు, నేను పూజారిని అని భావిస్తాను. మళ్ళీ మనోబుద్ధులతో కూడిన జీవాత్మను నేను అనే జ్ఞానం నాకు కలిగినప్పుడు నువ్వు పూర్ణుడవు, నేను నీ అంశను అని భావిస్తాను. కాని సమాధిలో మగ్నుడనై నిరుపాధికమైన శుద్ధ ఆత్మస్వరూపుడననే జ్ఞానం నాలో ఉదయించినప్పుడు నువ్వెవరవో నేనూ అతణ్ణే, నువ్వు నేను ఇద్దరం ఒక్కరమే, ఏ భేదం లేదని నాకు దృఢవిశ్వాసం కలుగుతుంది.”
18. బ్రహ్మం యొక్క నిత్యం, లీలలను అంగీకరించాల్సిన అవసరం
శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు: “అద్వైత సాక్షాత్కారం పొందిన వ్యక్తి మౌనంగా ఉండిపోతాడు. అద్వైత స్థితి వర్ణనాతీతం. దాన్ని గురించి మాట్లాడ ప్రయత్నించిన లేదా చెప్ప ప్రయత్నించిన మరుక్షణమే ద్వైతం వచ్చిపడడం అనివార్యం. భావించడం, ఊహించడం వంటివి జరుగుతున్నంతసేపు మనస్సులో ద్వైతం ఉండే తీరుతుంది; అద్వైతజ్ఞానం ఇంకా పొందబడలేదు. ఈ లోకంలో ఉచ్ఛిష్టం (ఎంగిలి) కాకుండా ఉన్నది ఒకే వస్తువు – పరబ్రహ్మం లేదా జగజ్జనని నిర్గుణ స్వరూపం.” అంటే మనిషి మాటల్లో అదెప్పుడూ ప్రకటితం కాలేదు; ఆ సత్యం మనోబుద్ధులకు అతీతమైనది. అలాంటప్పుడు దాన్ని మాటల మూలంగా వ్యక్తం చేయడంగాని లేదా వివరించడంగాని ఎలా సాధ్యం? అందుకే, “నాయనలారా, అది చిట్టచివరి స్థితి” అని అద్వైతస్థితిని గురించి శ్రీరామకృష్ణులు చెప్పేవారు. కనుకనే ఆయన ఇలా చెబుతూవుండేవారు: “ఎంత కాలం ‘నువ్వు’, ‘నేను’ అనే భావనలు, మాట్లాడడం, నడవడం వంటి దేహవ్యాపారాలు సాగుతాయో అంతకాలం నిర్గుణ–సగుణ భావాలు, భగవంతుని నిత్య–లీల అనే రెండు భావాలను స్వీకరింపక తప్పదు; అంతకాలం అద్వైత తత్త్వాన్ని గురించి ఎంతగా మాట్లాడుతున్నప్పటికీ, ఆచరణీయ ప్రయోజనాల దృష్ట్యా నువ్వొక విశిష్టాద్వైతవాదివి.” ఈ విషయాన్నే మరెన్నో ఉదాహరణలతో ఆయన విశదపరచేవారు.
19. పై విషయంగా కొన్ని ఉదాహరణలు అ. సంగీత స్వరాల ఆరోహణ, అవరోహణ క్రమాలు
ఆయన ఇలా చెప్పేవారు: “ఉదాహరణకు సంగీతంలో స్వరాల ఆరోహణ, అవరోహణాలను తీసుకోండి – స రి గ మ ప ద ని స అని స్వరం పైకి చేరిన తర్వాత మళ్ళీ స ని ద ప మ గ రి స అంటూ క్రిందిస్థాయికి దిగిరావాలి. అదే రీతిగా సమాధిలో అద్వైతానుభవం పొందాక మళ్ళీ క్రిందికి దిగివచ్చి ‘నేను’ అనే (పక్వాహంకారంతో) జ్ఞానంతో వసించాలి.
ఆ. రెండవ ఉదాహరణ – మారేడుపండు
“మారేడు పండును చేతపుచ్చుకొని చిప్ప, గింజలు, గుజ్జు – వీటిలో ఏది మారేడుపండు? అని నిర్ధారించడం వంటిది. మొదట చిప్పను, తరువాత గింజలను సారపదార్థాలు కావని వదలివేస్తాం. చివరకు గుజ్జును వేరుపరచి, అదే నిజమైన మారేడుపండని నిర్ణయిస్తాం. కాని తదుపరి విచారించి చూసినప్పుడు దేనితో గుజ్జు రూపొందినదో దానికే చిప్ప, గింజలు చెందుతాయని, చిప్ప, గింజలు, గుజ్జు – ఇవన్నీ కలిసే మారేడుపండు అవుతుందని నిశ్చయిస్తాం. అట్లే భగవంతుని నిర్గుణావస్థను దర్శించాక ఎవడు నిత్యుడో అతడే లీలా మయుడై జగత్ రూపంలో అభివ్యక్త మౌతున్నాడని తెలియవస్తుంది.
ఇ. మూడవ ఉదాహరణ– అరటి ఊచ
“అలాగే అరటిచెట్టు బోదెను తీసుకొని ఒకదాని తరువాత ఒకటిగా పొరలను ఒలిచి, అరటిదవ్వను చేరి అదే అరటిచెట్టు సారం అని అనుకొంటాం. కాని తరువాత దవ్వ పొరలకు చెందుతుందని, పొరలు దవ్వకు చెందుతాయని అనుభూతమౌతుంది; ఈ రెండు కలిసే బోదెను రూపొందిస్తాయని అవగతమౌతుంది.
ఈ. నాలుగవ ఉదాహరణ – నీరుల్లి
“అలాగే ఉల్లిపాయ పొరలను ఒకటొకటిగా ఒలుస్తూ పోతే, చివరకు ఏమీ మిగలదు. అదే రీతిగా ‘నే నెవరి’ ననే విచారణ చేస్తూచేస్తూ శరీరాన్ని కాదు, మనస్సును కాదు, బుద్ధిని కాదు – ఇలా ఒక్కటొక్కటిగా విడిచిపెడుతూపోతే ‘నేను’ అనే ప్రత్యేకమైన వస్తువేదీ మిగలదు; సర్వం ‘అతడు’ ‘అతడు’ అంటే (పరమాత్మ) ఒక్కడే మిగిలిపోతాడు; గంగానదిలో ఒక చిన్నస్థలం చుట్టూ కంచెవేసి, ‘ఇది నా గంగ’ అన్నట్లుగా ఉంటుంది.”
20. భావముఖ అనుభూతి వివరణ
భావముఖావస్థలో విరాట్ అహంతో ఏకత్వానుభూతి పొంది వసిస్తున్నప్పుడు, ‘ఒకటి నుండి అభివ్యక్తమైన ఈ అనేకత్వాన్ని’ దర్శిస్తూ, జగజ్జనని నిర్గుణ స్వరూపానికి కాస్త దిగువనున్న ‘విద్యామాయ’* రాజ్యంలో శ్రీరామకృష్ణులు విహరిస్తూ ఉండేవారనే విషయం వేరే చెప్పనక్కరలేదు. కాని ఈ ఏకత్వ వికాసం, అనుభూతి ఆయనకు ఎంత అధికంగా కలిగేదంటే, ఈ జగత్తులో ఎవరు ఏం చేస్తున్నా, ఆలోచిస్తున్నా, పలుకుతున్నా వాటినన్నింటినీ నేనే చేస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేనే పలుకుతున్నాను అనే ఐక్యబోధ పూర్తిగా ఆయనకు అనుభవమయ్యేది. భావావస్థలో కలిగే ఈ ఏకత్వానుభవం, అంటే సమస్త జగత్తుతో ఐక్యత్వాన్ని అనుభవించడం ఏ కొద్దిగానైనా, చూచాయగానైనా కలిగినాసరే అది మహాద్భుతంగా గోచరిస్తుంది. అట్టి ఒక సంఘటన గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు: ఒక రోజు ఒక వ్యక్తి పచ్చిక మీద నడిచిపోతున్నప్పుడు అతడు తన ఛాతీ మీద నడుస్తూన్నట్లు అనిపించి, ఎంతో బాధపడ్డారు. నిజానికి ఆయన ఛాతీ మీద రక్తం గడ్డకట్టి, నల్లని మచ్చలు ఏర్పడి విపరీతమైన బాధతో నాడు ఆయన సతమతమయ్యారు.
21. విద్యామాయ : ‘నేను దాసుడను, భక్తుడను, బిడ్డను, అంశను’ అనే అనుభూతి
పైన పేర్కొన్న ‘విరాట్ అహం’ స్థితినుండి విద్యామాయ రాజ్యంలోకి మరింత దిగివచ్చి ఉంటున్నప్పుడు శ్రీరామకృష్ణుల మనస్సులో, ‘నేను జగజ్జనని దాసుణ్ణి, భక్తుణ్ణి, పుత్రుణ్ణి, అంశను’ అనే భావం సదా జాగృతమై ఉండేది. దీనికి దిగువనున్న దశ అవిద్యామాయకు చెందిన కామ క్రోధాది ప్రాపంచిక బంధనాలు కల్పించే స్థితి. ఎడతెగని సాధనానుష్ఠానంచేత ఆయన మనస్సు ఏనాడు ఆ అవిద్యా మాయ దశకు దిగలేదు. మరో రకంగా చెప్పాలంటే జగజ్జనని ఆయనను ఆ దశకు దిగ జారనిచ్చేది కాదు. “తల్లి మీద పూర్తిగా ఆధారపడిన వ్యక్తిని ఆమె తప్పటడుగు వేయనివ్వదు” అని శ్రీరామకృష్ణులు తరచూ చెప్పేవారు.
22. విరాట్ ‘పక్వాహంకారం’ గురుదేవులు సంక్రమించుకోవడం: గురుభావంలో దీని అంతస్సూచన
కనుక నిర్వికల్ప సమాధి పొందిన పిదప శ్రీరామకృష్ణుల పరిమిత లేదా అపక్వాహంకారం (అవిద్యాహంకారం) పూర్తిగా అదృశ్యమైపోయిందనేది స్పష్టమౌతున్నది. అప్పుడు మిగిలివున్న కించిత్తు ‘అహం’, విరాట్ అహంకారంతో లేదా పక్వాహంకారంతో శాశ్వతంగా ఐక్యమై పోయింది. ఆ స్థితిలో ఒక్కొక్కప్పుడు తమను తాము విశ్వవ్యాపి అయిన ఆ విరాట్ అహంకారంలో అంశగా భావిస్తూండేవారు; మరొకప్పుడు ఆ విరాట్‌కు అతి సమీపంగా పోయి దాన్లో పూర్తిగా సంలీనమై పోయేవారు. ఈ పద్ధతి ద్వారానే లోకంలోని ప్రతి మానసంలో ఉదయించే ప్రతి భావం ఆయన తెలుసుకోగలిగేవారు. ఎందుకంటే ఈ విరాట్ అహంకారం నుండే ప్రపంచంలోని అందరి మనస్సులలో మనోభావాలు ఉద్భవిస్తాయి కనుక. ఈ విరాట్ అహంకారంలో సదా తాదాత్మ్యం చెందివుండడం చేతనే శ్రీరామకృష్ణులు ఆ విశ్వమానసంలో ఎగసే భావతరంగాలను అన్నింటినీ తెలుసుకొని, అవగతం చేసుకోగలిగే వారు. ఇటువంటి సమున్నత స్థితిలో ‘నేను భగవంతుని అంశను’ అనే భావం సైతం శ్రీరామకృష్ణులలో క్రమేణా అదృశ్యమైపోయేది. అప్పుడు ‘విరాట్ అహం’ లేదా జగజ్జనని అహం ఆయనద్వారా అభివ్యక్తమై అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసే సమర్థుడైన గురురూపంగా* విరాజిల్లేది. అలాంటి సమయాలలో శ్రీరామకృష్ణులను చూసినప్పుడు ‘దీనాతిదీనులు’ గా అగపడరు; అందుకు బదులుగా ఆయన కదలికలు, ఇతరులతో మెలగడం ఇత్యాది వ్యవహారాలన్నీ విభిన్న రూపాన్ని సంతరించుకొంటాయి. ఆయన అప్పుడు కల్పవృక్షంలా ‘ఏం కావాలో కోరుకోండి’ అని తమ భక్తులను అడిగేవారు. తమ విశిష్ట భక్తులను ఆ రీతిగా అనుగ్రహించే నిమిత్తం దక్షిణేశ్వరంలో దాదాపు ప్రతిరోజు ఆయన అలా గురుభావం వహించడం మేం ప్రత్యక్షంగా చూశాం. అదే విశేష భావంలో ఆయనను 1886 వ సం ॥ జనవరి 1 వ తేదీనాడు కాశీపూర్ ఉద్యాన గృహంలో చూశాం. ఆనాడు శ్రీరామకృష్ణులు గురుభావం వహించి ఆ సమయంలో అక్కడ చేరిన భక్తులనందరిని స్పృశించి వారిలో ఆధ్యాత్మిక శక్తిని ప్రసారం చేశారు. వారిలో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక భావాలను జాగృతం చేశారు. అదొక అద్భుత గాథ. ఇక్కడ దాన్ని ప్రస్తావించడం అసంగతం కాబోదు.
23. 1886 వ సం ॥ జనవరి 1 వ తేదీన జరిగిన సంఘటన, స్పర్శ మాత్రాన ఇతరులలో ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేయగల శ్రీరామకృష్ణుల శక్తి
అది 1886 వ సం ॥ జనవరి ఒకటవ తారీకు, పుష్యమాసం. శ్రీరామకృష్ణుల గొంతులో క్యాన్సర్ వ్యాధి మొదలైంది. రెండు వారాల క్రితం డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ సలహా మేరకు ఉత్తర కలకత్తాలోని కాశీపూర్‌కు, రాణి కాత్యాయని అల్లుడైన గోపాల్‌బాబు ఉద్యానగృహానికి శ్రీరామకృష్ణులను భక్తులు తరలించారు. కలకత్తా గాలికంటే కాశీపూర్ ఉద్యానగృహ ప్రాంతపు గాలి నిర్మలమైనదని, అందుచేత శ్రీరామకృష్ణులు ఇక్కడ ఉండడం మూలంగా వారి వ్యాధికి కొంచెం ఉపశమనం కలుగవచ్చునని డాక్టర్ చెప్పాడు. శ్రీరామకృష్ణులు ఉద్యానగృహానికి వచ్చిన కొద్ది రోజుల పిదప రాజేంద్రలాల్ దత్త అనే హోమియోపతి వైద్యుడు ఆయనను పరీక్షించి, లైకోపోడియం 200 ఔషధం పుచ్చుకోమన్నాడు. ఆ ఔషధం సేవించాక గొంతువ్యాధి ఒకింత ఉపశమించింది కూడ. శ్రీరామకృష్ణులు ఈ ఉద్యాన గృహానికి వచ్చిన తరువాత ఒక్క రోజుకూడ మొదటి అంతస్తునుండి క్రిందికి దిగిరాలేదు, ఉద్యానవనంలో కాసేపు నడిచిందీ లేదు. ఆ రోజు ఆయన బాగా తేటగా కనిపించారు. మధ్యాహ్నం తోటలో కాస్సేపు విహరింప గోరారు. అందుచేత భక్తులు నాడు ఎంతో సంతోషించారు.
స్వామి వివేకానంద అప్పుడు తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయి, లౌకిక సౌభాగ్యపరమైన కోరికలనన్నింటినీ త్యజించి శ్రీరామకృష్ణుల వద్దే ఉంటూ, ఆయన ఉపదేశానుసారం భగవత్సాక్షాత్కారార్థం వివిధ ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించసాగాడు. ఏ చెట్టు క్రిందో కూర్చుని ధుని రగిలించి రాత్రుళ్ళు పూర్తిగా జప ధ్యాన భజన పఠనాదులలో గడపసాగాడు. చిన్నగోపాల్, కాళీ (అభేదానంద) తదితర భక్తులు అవసరమైన సామగ్రి తీసుకువచ్చి అతడి సాధనకు తోడ్పడుతూ, తాము సైతం తమ శక్తిమేరకు జపధ్యానాదులు అనుష్ఠింపసాగారు. గృహస్థ భక్తులు, ఉద్యోగులు కావడంచేత సదా శ్రీరామకృష్ణులను కనిపెట్టుకొని అక్కడే ఉండలేకపోయారు. కాని తీరిక దొరికినప్పుడల్లా వచ్చి, గురుదేవుల సేవలో సదా అక్కడే బసచేస్తున్న శిష్యుల భోజనాది సౌకర్యాల ఏర్పాట్లు చూసుకొనేవారు. ఒక్కొక్కప్పుడు ఒకటి రెండు రోజులు అక్కడే బస కూడ చేసేవారు. నాడు ఆంగ్ల సంవత్సరాది కావడంచేత సెలవు దినం. కనుక భక్తులనేకులు ఉద్యానగృహానికి వచ్చివున్నారు.
అప్పుడు మధ్యాహ్నం మూడు గంటలు. ఎర్రంచు ధోవతి ధరించి, చొక్కా, ఎర్రంచు మందమైన శాలువా, చెవులను కప్పివుంచే టోపీ పెట్టుకొని, చెప్పులు ధరించి స్వామి అద్భుతానంద సహాయంతో మేడమీద నుండి నెమ్మదిగా శ్రీరామకృష్ణులు క్రిందికి దిగివచ్చారు. దిగి క్రింద ఉన్న చావడిని పరికించి, దాని పశ్చిమ ద్వారం గుండా తోటలో ప్రవేశించి నడవ సాగారు. శ్రీరామకృష్ణులు అలా నడవడం చూసి గృహస్థ భక్తులు కొందరు సంతోషంతో ఆయనను అనుసరించసాగారు. అప్పుడు యువశిష్యులైన స్వామి వివేకానంద ప్రభృతులు గత రాత్రంతా మేల్కొని ఉండడంచేత, అలసిపోయి చావడి ప్రక్కనే ఉన్న చిన్న గదిలో నిద్రిస్తున్నారు. అలా శ్రీరామకృష్ణులు వెంట భక్తులు రావడం చూసి చావడి బైటవున్న తటాకం దక్షిణం వైపు వరకు లాటు (స్వామి అద్భుతానంద) శ్రీరామకృష్ణులతో నడిచి, తాను వారితో వెళ్ళడం అనవసరమని వెనుదిరిగాడు. ఇదే అదనుగా అతడు మరో యువ భక్తుణ్ణి* తోడ్కొనిపోయి పై అంతస్తులోని శ్రీరామకృష్ణుల గదిని ఊడ్చడం, శుభ్రం చేయడం, ఆయన పరుపును ఎండలో పడేయడం వంటి పనుల్లో మునిగిపోయాడు.
గృహస్థ భక్తులందరిలోకంటే అప్పుడు గిరీశ్ఘోష్కు భగవంతునిపట్ల అనురాగం మెండు. ఒక సందర్భంలో శ్రీరామకృష్ణులు అతడి అద్భుత విశ్వాసాన్ని ప్రశంసిస్తూ, ఇతర భక్తులతో ఇలా చెప్పారు: “గిరీశ్‌కు ఐదుపావలా ఐదణాల (నూరు శాతం కంటే ఎక్కువ) విశ్వాసం ఉంది. ఇకమీదట అతడి ఆధ్యాత్మిక పురోగతిని చూసి లోకులు ఆశ్చర్యపోతారు.” భక్తి విశ్వాసాల ప్రేరణతో అతడు జీవులను ఉద్ధరింప కృపాపరవశులై మానవ రూపంలో అవతరించిన సాక్షాత్తు భగవంతునిగా శ్రీరామకృష్ణులను భావించేవాడు. తన ఈ ప్రగాఢ విశ్వాసాన్ని శ్రీరామకృష్ణులు వారించినప్పటికీ వినక అందరిముందు బాహాటంగా చాటసాగాడు. నాడు గిరీశ్కూడ ఉద్యానానికి వచ్చివున్నాడు. మామిడిచెట్టు నీడన కూర్చుని అతడు రామచంద్రదత్త, ప్రభృత భక్తులతో మాట్లాడుతున్నాడు.
భక్తులతో పరివేష్టితులై శ్రీరామకృష్ణులు నెమ్మదిగా తోటలోని విశాలమైన దారిగుండా తోట ముఖద్వారం కేసి నడిచిపోతూ, మామిడి చెట్టు సమీపానికి వచ్చి దాని నీడన కూర్చునివున్న రామచంద్రదత్తను, గిరీశ్‌ను చూశారు. పిదప గిరీశ్‌ను ఉద్దేశించి, “గిరీశ్! బాహాటంగా అందరితోను (నా గురించి) ఏమేమో (అవతారమని, భగవంతుడని) చాటుతూన్నావట. (నాలో) ఏం చూశావు?” అని అడిగారు.
అకస్మాత్తుగా అలా ప్రశ్నింపబడినప్పటికీ గిరీశ్ విశ్వాసం సడలలేదు. ఆరాధనాభావం పొంగిపొరలగా, ఆదరాబాదరాగా లేచి నిలబడి, గిరీశ్ చేతులు జోడించుకొని శ్రీరామకృష్ణుల పాదాలవద్ద మోకరిల్లి గద్గదస్వరంలో, “వ్యాసుడు, వాల్మీకి సైతం ఎవరి మహిమను కించిత్తు కూడా వర్ణించడంలో విఫలులయ్యారో ఆయనను గురించి నేను అధికంగా ఏం చెప్పగలను” అని అన్నాడు.
గిరీశుని ఆ అద్భుత విశ్వాసపూరిత వచనాలు విని శ్రీరామకృష్ణుల శరీరం రోమాంచితమైంది. ఆయన మనస్సు సమున్నత ఆధ్యాత్మిక భూములను అధిరోహించి, సమాధిమగ్నులయ్యారు. ఆ స్థితిలో దివ్యజ్యోతిలా దేదీప్యమానంగా ప్రకాశిస్తూన్న శ్రీరామకృష్ణుల ముఖమండలాన్ని చూసి, మహదానందంతో గిరీశ్, ‘జై రామకృష్ణ’, ‘జై రామకృష్ణ’ అంటూ బిగ్గరగా ఉచ్చరిస్తూ పదేపదే ఆయన పాదధూళిని తీసుకోసాగాడు.
ఈలోపు శ్రీరామకృష్ణులు అర్ధబాహ్య దివ్యచైతన్యంలో అందరిని పరికిస్తూ, చిరునవ్వుతో, “మీకు ఇక చెప్పవలసిన అవసరం ఏముంది? మీ అందరిలో ఆధ్యాత్మికత జాగృతం అవుగాక!” అని అన్నారు. భక్తులు ఆ అభయవాణిని విని ఆనందంతో, ‘జై రామకృష్ణ’ అంటూ జయజయ ధ్వానాలు చేశారు. కొందరు ప్రణమిల్లారు, కొందరు పుష్పవృష్టి కురిపించారు, మరికొందరు ఆయన పాదాలు స్పృశించారు. మొట్టమొదటి భక్తుడు ఆయన పాదాలు స్పృశించి లేచి నిలబడగానే, ఆ అర్ధబాహ్యావస్థలో ఆయన తమ చేతితో క్రిందినుండి పైదిశగా అతడి ఛాతీపై స్పృశిస్తూ, ‘జాగృతమగుగాక’ అని పలికారు. రెండవ వ్యక్తి వచ్చి ప్రణామం చేసి నిలబడగానే ఆయన అట్లే అతణ్ణి స్పృశించి ఆశీర్వదించారు. మూడవ వ్యక్తిని, నాలుగవ వ్యక్తిని అదే రీతిలో ఆశీర్వదించారు. ఆ విధంగా తమ వద్దకు వచ్చిన ప్రతి ఒక్క భక్తుణ్ణీ స్పృశించసాగారు. ఆయన అద్భుత స్పర్శతో ప్రతి ఒక్కరి మనస్సులో ఒక అపూర్వభావం ఉత్పన్నమైంది. తత్ఫలితంగా కొందరు నవ్వసాగారు, కొందరు విలపించసాగారు, కొందరు ప్రగాఢ ధ్యానమగ్నులైనారు, మరికొందరు అహేతుక దయాసముద్రులైన శ్రీరామకృష్ణుల అనుగ్రహం పొంది తరించే నిమిత్తం ఇతరులనందరినీ రమ్మని ఎలుగెత్తి పిలువసాగారు. వారి అరుపుల, జయజయ ధ్వానాల చప్పుడు విని నిద్రిస్తున్న శ్రీరామకృష్ణుల భావి సన్న్యాస శిష్యులు కొందరు నిద్రనుండి లేచారు. తక్కినవారు తాము చేస్తున్న పనిని ఆపేశారు. వీరంతా పరిగెత్తుకొని వచ్చి, తోట దారిమధ్యలో శ్రీరామకృష్ణులను పరివేష్టించి ఉన్మత్తులలా వ్యవహరిస్తున్న ఆ భక్తులను, ఆ దృశ్యాన్ని చూశారు. దక్షిణేశ్వరంలో కొందరు విశిష్ట భక్తులను అనుగ్రహింప దివ్యభావావేశపరులై శ్రీరామకృష్ణులు ఏ అపూర్వ లీలాభినయం చేస్తూవుండేవారో అదే అభినయం నేడు ఇక్కడ జరుగుతున్నదని, అయితే ఈ రోజు అది అందరి మీద కృపను వర్షింప ప్రతి ఒక్కరి ముందు ప్రదర్శితమౌతున్నదన్న విషయాన్ని గ్రహించారు. ఆయన భావిసన్న్యాస శిష్యులు అలా అక్కడికి వచ్చారో లేదో శ్రీరామకృష్ణుల ఆ దివ్యభావం మారిపోయింది, ఆయన మాములు స్థితిలోకి వచ్చేశారు.
24. శ్రీరామకృష్ణుల స్పర్శ ఫలితంగా భక్తులు పొందిన అనుభూతులు
తరువాత వాకబు చేయగా శ్రీరామకృష్ణుల అనుగ్రహం పొందిన భక్తులకు అద్భుత అనుభూతులు, దర్శనాలు కలిగాయని తెలియవచ్చింది. భంగు సేవించినప్పుడు కలిగే ఒక రకమైన మత్తు, ఆనందం ఒకరు పొందారు; మరో భక్తునికి ఆనందంతో కూడిన ఏదో తెలియరాని శక్తి దేహంలో ప్రాకిన అనుభూతి కలిగింది; ధ్యానం చేయడానికి కూర్చుని ఏ దేవతా మూర్తిని స్పష్టంగా దర్శింప అనునిత్యం ప్రయత్నించి కూడా విఫలమయ్యారో, నాడు గురుదేవుల దివ్యస్పర్శ ఫలితంగా కళ్ళు మూసుకొన్న తక్షణమే తమ ఇష్టదేవతామూర్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఎదుట స్పష్టంగా కానరావడం కొందరికి అనుభూతమైంది; మరికొందరికి కళ్ళు మూసుకొన్న తక్షణమే పూర్వం ఎన్నడూ అనుభవంలోకి రాని ఒక దివ్యజ్యోతి దర్శనం కలిగింది; ఈ విధంగా ప్రతి ఒక్కరి దర్శనాలు, అనుభూతులు విభిన్నాలైనా శ్రీరామకృష్ణుల దివ్యస్పర్శ ఫలితంగా ప్రతి ఒక్కరి హృదయం ఒక వర్ణనాతీత దివ్యానందంతో పొంగిపొర్లడం మాత్రం అందరికీ అనుభూతమైంది. అంతేకాక శ్రీరామకృష్ణుల మానవాతీతశక్తి ఆ స్పర్శ ద్వారా ప్రసారమై తమలో అసాధారణ మానసిక పరివర్తన లేదా అనుభూతిని కలిగించిందనే సంగతి భక్తులందరూ గ్రహించగలిగారు.
25. శ్రీరామకృష్ణులు ఎప్పుడు ఎవరిని అనుగ్రహించేవారో తెలిసేదికాదు
ఆ రోజు అక్కడ సమావేశమైన భక్తులలో ఇద్దరిని మాత్రం, “ఇప్పుడు కాదు” అని ఆయన స్పృశించలేదు. ఆనందం వెల్లివిరిసిన ఆనాడు వారిద్దరు మాత్రమే తమను దురదృష్ట వంతులుగా ఎంచి, ఖీన్నులయ్యారు.* పై సంఘటన నుండి ఒక విషయం స్పష్టమౌతున్నది. ఎవరిని ఎప్పుడు అనుగ్రహింప శ్రీరామకృష్ణులలో ఆ దివ్యశక్తి అభివ్యక్తమయ్యేదో నిశ్చయంగా తెలిసేది కాదు. మామూలు స్థితిలో ఉన్నప్పుడు గురుదేవులు సైతం ఆ విషయం గ్రహించగలిగేవారో లేదో అన్నది సందేహాస్పదమే.
26. ‘అపక్వాహంకారం’ లుప్తమైనప్పుడే ‘గురుభావం’ అభివ్యక్తమౌతుంది
తమ అపక్వాహంకారాన్ని లేదా క్షుద్రాహంకారాన్ని పూర్తిగా పరిత్యజించారు కనుకనే శ్రీరామకృష్ణులు ‘విరాట్ అహంకారం’ లేదా జగజ్జనని శక్తి ప్రకటనకు ఒక గొప్ప పరికరంగా పరిణమించారనే విషయం విశదమౌతున్నది. ఆ అపక్వాహం కారాన్ని పూర్తిగా పరిత్యజించి వాస్తవానికి ‘దీనాతిదీనులు’ గా తమను మలచుకోగలగడం చేతనే శ్రీరామకృష్ణుల ద్వారా జగజ్జనని జగద్గురుభావ అపూర్వ వికాసం సాధ్యమయింది. క్షుద్రాహంకారం ఈ రీతిలో నశించడం ద్వారానే ప్రతి మతంలోని ప్రతి అవతారపురుషుని జీవితంలో గురుభావం లేదా గురుశక్తి అభివ్యక్తమైనదనే యథార్థానికి ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్ర శాశ్వత సాక్ష్యంగా నిలిచిపోతున్నది.
27. జగజ్జనని ఒక అభివ్యక్తీకరణే ‘గురుభావం’
గురువును సాధారణ మనిషిగా పరిగణిస్తే ఆధ్యాత్మిక అనుభూతి లేదా భగవత్సాక్షాత్కారం ప్రాప్తించదనే విషయం అనాదినుండి వింటూవస్తున్నాం. మనకు మంత్రదీక్ష నిచ్చిన గురువును, ‘గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః’ అంటూ సదా విశ్వాసంతోనో లేదా విశ్వాసరహితంగానో స్తుతిస్తూ ఉంటాం. పాశ్చాత్య విద్యామోహంలో పడి అనేకులు తమ జాతీయ సంస్కృతి, విద్యలను విడనాడి, ఒక ప్రత్యేక మానవమాత్రుణ్ణి దైవసమునిగా పరిగణించి స్తుతించడం మహాపాపం అని భావిస్తూ, దాన్ని గురించి వాదించ వెనుకాడరు. ఎందుకంటే కొందరి మనశ్శరీరాలను యాంత్రికంగా చేసుకొని వాటి ద్వారా అభివ్యక్తమౌతున్న గురుభావం లేదా గురుశక్తి అన్నది నిజానికి మానవుల భావరాజ్యంలోకి అసలు చేరిందే కాదు అనే సంగతిని ఆ సమయంలో ఎవరు గ్రహించగలిగారు? సకల జీవుల శరీరాలను సజీవంగా ఉంచేటందుకై ఆహారం, నీరు, గాలి వంటి నిత్యావశ్యకాలను ఎలా సృజించిందో, అదేరీతిగా మాయాపాశంలో చిక్కువడి, తాపత్రయాలతో కష్టపడుతున్న మానవుల సమస్త బాధలను తొలగించి, శాంతిని అనుగ్రహించే నిమిత్తం స్వయంగా జగజ్జనని, పునీతమైన, జాగృతమైన, అహంకార రహితమైన మనస్సుగుండా పూర్ణరూపంలో అభివ్యక్తమౌతుందనే సంగతి అప్పుడు ఎవరికి అర్థమైంది కనుక? ఎవరి మనస్సు ఏ మేరకు తన అహంకారాన్ని, అంటే క్షుద్రాహంకారాన్ని విడనాడగలుగుతుందో ఆ మేరకు అది ఆ (గురు) భావాన్ని లేదా శక్తిని అభివ్యక్తం చేయగలుగుతుందనే విషయం అప్పుడు ఎవరు గ్రహించగలరు? సాధారణంగా జీవన్ముక్తులలో ఈ దివ్యభావం కించిత్తు మాత్రమే అభివ్యక్తం అవుతుంది. ఆ అభివ్యక్తీకరణ అత్యంత స్వల్పం కావడంచేత మన అవగాహనకు అంతుబట్టదు. కాని గత యుగాలలో ఉద్భవించిన శ్రీకృష్ణుడు, బుద్ధుడు, చైతన్యుడు, శంకరాచార్యులు, ఏసుక్రీస్తువంటి అవతార పురుషులలోను, అట్లే ఈ యుగంలో అవతరించిన శ్రీరామకృష్ణులలోను అభివ్యక్తమైన ఆ దివ్యశక్తి అపూర్వలీలావిలాసాన్ని బహుజన్మ పుణ్యఫలితంగా ఎవరన్నా చూడగలిగితే, అతడు మాత్రమే తన హృదయాంతరాళంలో ఆ దివ్యశక్తి మానవమాత్రునికి చెందినది కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడిది మాత్రమే అని అవగతం చేసుకోగలడు. గమ్యాన్ని కోల్పోయి భవరోగగ్రస్తుడైన జిజ్ఞాసువు మనోమాలిన్యం అప్పుడు మాత్రమే తొలగిపోతుంది. అప్పుడే అతడు ఆనందం పట్టలేక, “హే గురుదేవా, నువ్వు ఎన్నటికీ మానవమాత్రునివి కావు, నువ్వు అతడివి (భగవంతుడవు)” అని కేకపెడతాడు. అందుచేతనే జగజ్జనని దివ్యశక్తిగా అభివ్యక్తమై, ఆధ్యాత్మిక అజ్ఞానంచే మానవులలో ఏర్పడే మనోమాలిన్యాలను తొలగించి వేస్తుందని మనం గ్రహిస్తాం. ఆ శక్తినే గురుభావం లేదా గురుశక్తి అని పేర్కొంటారు. ఈ శక్తినే శాస్త్రాలు గురువుగా అభివర్ణిస్తున్నాయి; ఈ శక్తి (గురువు) పట్ల హృదయపూర్వక భక్తిప్రపత్తులు చూపవలసిందని అవి నిర్దేశిస్తున్నాయి.
28. భగవద్భక్తి, గురుభక్తి ఒక్కటే. ఎందుచేత?
కాని స్థూలప్రపంచాన్ని మాత్రమే ఎరిగిన మనిషి బుద్ధి, భక్తిప్రపత్తులనే మొట్టమొదటపాఠాన్ని ఇప్పుడిప్పుడే నేర్వ మొదలుపెట్టిన స్థూలబుద్ధి, శరీరాతీతం ఇంద్రియాతీతం అయిన ఆ దివ్యభావాన్ని అంత సులువుగా గ్రహింపజాలదు, ప్రేమించ ఒక్కటే. ఎందుచేత? జాలదు; కాబట్టే మంత్రదీక్ష ఒసగిన వ్యక్తిని గురువుగా భావించి, అతడిపట్ల భక్తి కలిగివుండాలని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. ‘అసలైన గురుభావం పట్ల మేం భక్తిప్రపత్తులు చూపగలంగాని ఏ మానవమాత్రుని దేహాన్ని ఆశ్రయించి ఆ గురుభావం అభివ్యక్తమౌతున్నదో ఆ వ్యక్తిమాత్రునిపట్ల మాత్రం మేం భక్తిప్రపత్తులు ఎలా చూపగలం?’ అని అధిక్షేపించే వారికి మా సమాధానం ఇది: ఆ గురుశక్తి లేదా గురుభావం ఒక వ్యక్తిమాత్రునిది కాదే! సోదరా, నిజానికి ఆ గురుశక్తికి, అది దేని ద్వారా అభివ్యక్తం అవుతూన్నదో ఆ మానవ దేహానికి – ఈ రెండింటికీ మధ్యగల వ్యత్యాసాన్ని నిజంగా వేరుపరచే శక్తి నీకుంటే అట్లే చెయ్యి, మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కాని ఆత్మవంచన చేసుకోవద్దు, జాగ్రత్త సుమా! గురుభావం, గురుశక్తి, దేని ద్వారా ఆ శక్తి అభివ్యక్తమౌతుందో అది – ఈ రెండు వేర్వేరుగా ఉండడం నువ్వెప్పుడైనా ఎక్కడైనా చూశావా? అగ్ని, దాని దాహక (దహించే) శక్తి వేర్వేరుగా ఉండడం నువ్వెప్పుడన్నా చూశావా? అలా అయినప్పుడు గురుభావాన్ని, గురుదేహాన్ని వేరుపరచి ఒకదాని పట్ల భక్తిప్రపత్తులు చూపడం, మరోదాన్ని విడనాడడం నువ్వెలా చేయగలవో మాకు అంతుబట్టడం లేదు. ఒక వ్యక్తి తాను ప్రేమించే, ఆరాధించే వ్యక్తి ఉపయోగించిన ఒక అల్పవస్తువు పట్ల సైతం ప్రత్యేక అనురక్తిని కల్పించుకొంటాడు. తాను ఆరాధించే వ్యక్తి స్పృశించిన ఒక పుష్పం, ధరించిన వస్త్రం, ఉపయోగించిన ఒక చిన్ని వస్తువును సైతం మహాపవిత్రంగా ఎంచుతాడు. తన ప్రేమాస్పదుడు నడిచివెళ్ళిన నేల అతడికి అమూల్యంగా, ప్రియమైనదిగా కానవస్తుంది. అలాంటప్పుడు ఆ ప్రేమాస్పదుడు ఏ దేహాన్ని ఆశ్రయించి పూజను స్వీకరిస్తాడో, ఆ భక్తుని అనుగ్రహిస్తాడో ఆ దేహం పట్ల, ఆ భక్తునికి భక్తిప్రపత్తులు సహజంగా కలుగుతాయనే విషయం విశదపరచడం అవసరమా? ఇందుకు అసమ్మతి తెలిపేవారికి గురుభావం లేదా గురుశక్తి అంటే ఏమిటో ఏమాత్రం అర్థంకాదు. గురుభావం లేదా గురుశక్తి పట్ల నిజమైన భక్తిప్రపత్తులే కాక, ఆ గురుభావం అభివ్యక్తమయ్యే దేహం పట్లకూడ భక్తిప్రపత్తులు తప్పక కలిగి ఉంటాడు.
29. విభీషణుని గురుభక్తిని చాటే కథ
ఈ అంశాన్ని స్పష్టంచేసే నిమిత్తం శ్రీరామకృష్ణులు, విభీషణుని కథను ఉదహరించేవారు. “ఒకప్పుడు, శ్రీరాముని అవతార పరిసమాప్తి అయిన చాలకాలం గడిచిన తదనంతరం, సముద్రం మీద పోతున్న ఒక పడవ మునిగిపోయి, అలలచే ఒక వ్యక్తి లంక ఒడ్డుకు కొట్టుకురాబడ్డాడు. విభీషణుడు చిరంజీవి; రావణుని మరణానంతరం మూడు యుగాలుగా అతడు లంకను పరిపాలిస్తూన్నాడు. అతడికి ఈ వార్త అందింది. చాలకాలం తరువాత రుచికరమైన మృదువైన నరమాంసం దక్కనున్నదని సభలో కూర్చున్న అనేకమంది రాక్షసుల నోళ్ళు ఊరసాగాయి. కాని ఈ సమాచారం విభీషణ మహారాజులో మాత్రం ఒక అపూర్వ మనోభావాన్ని కల్పించింది. భక్తితో కంఠం గద్గదమైపోగా, ఆనందాశ్రువులు ప్రవహిస్తూవుండగా అతడు పదే పదే, “ఓ, ఏం భాగ్యం నాది! నేటికి కదా నా పుణ్యం ఫలించింది” అని పలుకసాగాడు. రాక్షసులు ఆతడి మనోభావాన్ని అర్థంచేసుకోలేక అవాక్కైపోయారు. పిదప విభీషణుడు వారికి ఇలా విశదీకరించాడు: “ఏ మానవదేహం దాల్చి నా రామచంద్రుడు ఈ లంకాద్వీపంలో అడుగిడి నన్ను అనుగ్రహించాడో, అట్టి మానవరూపాన్ని సుదీర్ఘకాలం తరువాత నేడు నేను చూడగలుగుతున్నాను కదా! సాక్షాత్తు రామచంద్రుడే ఆ విధంగా వస్తున్నాడేమో అని నాకు అనిపిస్తున్నది.” ఇలా అంటూ విభీషణుడు, మంత్రులతో సభాసదులతో సముద్రతీరానికి వెళ్ళి భక్తిప్రపత్తులతో పరమానందంతో ఆ మనిషిని తన రాజప్రాసాదానికి తోడ్కొనివచ్చాడు. ఆ తరువాత ఆ వ్యక్తిని తన సింహాసనం మీద ఆసీనుణ్ణిచేసి, సకుటుంబంగా అతణ్ణి ఆరాధిస్తూ సేవకునిలా సేవించసాగాడు. కొంతకాలం ఆ వ్యక్తిని లంకలో భోగభాగ్యాలలో తులతూగించి, ఆ తరువాత అమూల్య రత్నరాసులను బహూకరించి, సెలవిచ్చి, తన భటులను తోడిచ్చి అతణ్ణి సురక్షితంగా ఇంటికి పంపించాడు.”
30. సామాన్య విషయాలలో సహితం భక్తి భావం జనించడం- చైతన్యుల
పై కథ పూర్తిచేసి, శ్రీరామకృష్ణులు ఇలా వ్యాఖ్యానించారు: “నిజమైన భక్తి ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది. అతి సామాన్య విషయాలు సైతం భగవంతుణ్ణి జ్ఞప్తికి తెస్తాయి, భక్తి పారవశ్యం పొందుతాడు. ‘ఈ మట్టితోనే మద్దెలలు తయారు చేయబడతాయి’ అంటూ చైతన్య మహాప్రభు భావసమాధి మగ్నుడయ్యాడని మీరు వినలేదా? ఒకప్పుడు చైతన్యుడు ఒక ఫలానా గ్రామంగుండా పోతున్నప్పుడు, హరిసంకీర్తన సమయంలో వాయింపబడే మద్దెలలు ఆ గ్రామపు మట్టితోనే తయారు చేయబడతాయని, ఆ గ్రామస్థుల జీవనోపాధి అదేనని విన్నాడు. ఆ మాట వినీవినగానే, ‘ఆహా, మద్దెలలు చేయబడేది ఈ మట్టితోనే’ అని కేకపెడుతూ బాహ్యస్మృతి కోల్పోయి భావసమాధి మగ్ను డయ్యాడు. ఎందుకంటే ఆయనలో మెదలిన భావాలు ఇవి: ‘ఈ మట్టితో మద్దెలలు తయారు చేయబడతాయి. ఆ మద్దెలలతో హరిసంకీర్తన చేస్తారు. అందరికీ శ్రీహరే అంతరాత్మ, అందమైన వాటికన్నిటికంటే అందమైనవాడు.’ ఈ భావాలన్నీ ఆయన మదిలో చెలరేగి, మనస్సు హరిలో పూర్తిగా లగ్నమైపోయింది. అదేవిధంగా ఎవరికి గురువుపట్ల అమిత భక్తిప్రపత్తులు ఉంటాయో అతడికి తన గురువు బంధువులను చూడడంతో మాత్రమేగాక, గురువుగారి గ్రామస్థులను ఎవరిని చూసినాసరే గురువుపట్ల ఉన్న గౌరవంతో ఆ గ్రామస్థునికి ప్రణామంచేసి, అతడి పాదధూళి స్వీకరించి, భోజనం పెట్టి అతణ్ణి సేవిస్తాడు. ఈ స్థితిని చేరినప్పుడు గురువులో ఎలాంటి లోపాలూ కనుగొనలేడు. అప్పుడతడు,
యద్యపి ఆమార్ గురు శుడీబాడి జాయ్ ।
తథాపి ఆమార్ గురు నిత్యానందరాయ్ ॥
‘సారాయి దుకాణానికి పోతున్నా నా గురువు నాకు నిత్యానంద స్వరూపుడే’ అని చెప్పగలుగుతాడు. లేకుంటే లోపాలు లేని మనిషి ఎక్కడ లభిస్తాడు? కాని సాధకుడు ఆ అవస్థకు చేరుకొన్నప్పుడు, వెల్లువలా భగవద్భక్తి పొంగిపొరలినప్పుడు, పచ్చకామెర్ల రోగికి సర్వం పసుపుపచ్చగా కనబడే రీతిలో, గురువులో మనిషినికాక భగవంతుణ్ణే దర్శిస్తాడు. అప్పుడు అతడిలో పొంగిపొరలిన భక్తి, భగవంతుడే ఈ యావత్తు విశ్వంగా రూపొందినట్లు కనబరుస్తుంది. ఆ అవస్థలో భగవంతుణ్ణే తల్లి, తండ్రి, గురువు, మనిషి, పశువు, జడం, చేతనంగా సాక్షాత్కరించుకొంటాడు.
31. అర్జునుని గురుభక్తి చాటే కథ
ఒకరోజు దక్షిణేశ్వరంలో నిష్కపటి అయినా అహంభావియైన యువ భక్తుడొకడు* శ్రీరామకృష్ణులు అతడితో చెబుతున్న విషయాలపై ఆక్షేపణలు లేవదీయసాగాడు. పలుమార్లు ఆయన అతడికి ఆ విషయం చెప్పినప్పటికీ అతడు తన వాదం కొన సాగించడంతో, గురుదేవులు అతణ్ణి సుతిమెత్తగా మందలించే ధోరణిలో, “ఎలాంటి మనిషివయ్యా నువ్వు? పదే పదే నీకు చెబుతున్నా నువ్వు వినకున్నావే” అని అన్నారు. ఆ పలుకులు ఆ యువకుడి హృదయాన్ని స్పృశించడంతో, “మీరు చెప్పే విషయం నేను తప్పక అంగీకరిస్తాను. వాదించాలనే ఉద్దేశంతోనే అలా నేను మాట్లాడాను” అని అన్నాడు.
ఆ మాటలు విని హర్షం వ్యక్తంచేస్తూ, చిరునవ్వుతో ఆయన ఇలా అన్నారు: “గురుభక్తి ఎటువంటిదో నీకు తెలుసా? గురువు సూచించే విషయం తక్షణమే అతడికి గ్రాహ్యమౌతుంది. అర్జునుడికి అట్టి గురుభక్తి ఉండేది. ఒకరోజు అర్జునుడితో కలిసి రథంలో పోతున్నప్పుడు శ్రీకృష్ణుడు ఆకాశంకేసి చూసి, ‘మిత్రమా! ఆకాశంలో ఎగిరిపోతున్న ఆ పావురాలు ఎంత అందంగా ఉన్నాయో కదా!’ అని అన్నాడు. అర్జునుడు ఆకాశంకేసి తేరిపార చూసి, ‘అవును మిత్రమా! నిజంగానే ఎంత అందమైన పావురాలు’ అన్నాడు తక్షణమే. మరుక్షణమే శ్రీకృష్ణుడు ఆకాశం వైపు మళ్ళీ దృష్టిసారించి, ‘ఎంత వింత మిత్రమా! అవి పావురాలు కావు’ అని అన్నాడు. అర్జునుడు వాటిని చూసి, ‘అది నిజమే, అవి పావురాలు కానేకావు’ అని పలికాడు. విషయం అర్థంచేసుకోవడానికి ప్రయత్నించు. అర్జునుడి సత్యనిష్ఠ నిరాక్షేపణీయమైనది; ముఖస్తుతి నిమిత్తం ఎన్నటికీ శ్రీకృష్ణుడితో అలా చెప్పడు. శ్రీకృష్ణుని పలుకుల పట్ల అర్జునుడికి ఎంత అచంచల భక్తివిశ్వాసాలు ఉన్నాయంటే, శ్రీకృష్ణుడు వర్ణించింది, నిజమో కాదో అనే విచక్షణ కూడ లేకుండా అట్లే తన కళ్ళతో చూశాడు.”
32. ఈ సామాన్య గురుభావన వెలుగులో సొంత గురుభక్తి స్థానం: హనుమంతుని ఉదాహరణ
అజ్ఞానాంధకారాన్ని ఎవరు పారద్రోలుతారో అతడే గురువు అని శాస్త్రాలు వచిస్తున్నాయి. కాబట్టి పైన పేర్కొన్న మానవదేహం ద్వారా అభివ్యక్తమయ్యే ఈ గురుశక్తి వాస్తవానికి భగవంతుని శక్తే అని అంగీకరించినప్పుడు, మరో విషయంకూడ అంగీకరించక తప్పదు. అది ఏమిటంటే : గురువు ఒక్కరేగాని పలువురు కారు. ఆధారం లేదా ఏఏ దేహాల ద్వారా భగవంతుని ఆ గురుభావం అభివ్యక్తమౌతుందో అవి వేర్వేరైనప్పటికీ, నీ గురువు నా గురువు వేరు కారు. శక్తిస్వరూపులుగా అందరూ ఒక్కరే. గురువుగా ఎంచుకొన్న ద్రోణాచార్యుని మట్టిప్రతిమను పరమభక్తితో ఆరాధించి ఏకలవ్యుడు మేటి విలుకాడైనట్టి మహాభారత కథను ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. సహేతుకంగా పై విషయం యథార్థమే అయినప్పటికీ, హృదయపూర్వకంగా దానిని స్వీకరించడానికి దీర్ఘకాలం సాధన చేయాల్సిన అవసరముంది. మళ్ళీ గురువులందరూ ఒక్కరే అనే విషయం నిండు హృదయంతో అర్థంచేసుకొన్న మనిషికి శరీరబోధ ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఏ శరీరం ద్వారా గురుశక్తి అతణ్ణి అనుగ్రహిస్తుందో ఆ గురుదేవుని శరీరాన్నే గురువుగా భావించి ఆరాధించడం అనివార్యం. ఇందుకు తార్కాణంగా శ్రీరామకృష్ణులు, నిష్ఠాభక్తికి అపరావతారమైన హనుమంతుని ఉదంతం చెప్పేవారు. ఆయన ఇలా చెప్పేవారు: “లంకాయుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సందర్భంలో మహావీరుడైన మేఘనాథుడు నాగపాశం ప్రయోగించి శ్రీరాముణ్ణి, లక్ష్మణుణ్ణి బంధించాడు. ఆ నాగపాశం నుండి విడివడ శ్రీరాముడు అప్పుడు పాములకు ఆగర్భశత్రువైన గరుత్మంతుణ్ణి స్మరించాడు. గరుత్మంతుడు అక్కడకు రాగానే పాములన్నీ భీతితో వాటికి తోచిన దిక్కుకేసి పారిపోయాయి. గరుత్మంతుని భక్తి ప్రపత్తులకు ప్రసన్నుడైన శ్రీరాముడు, అతడు నిత్యం ఆరాధించే విష్ణురూపంలో సాక్షాత్కరించి, తానే ప్రస్తుతం శ్రీరాముని రూపంలో అవతరించాననే విషయం గరుత్మంతునికి వెల్లడించాడు. కాని ప్రక్కనే ఉన్న హనుమంతునికి మాత్రం శ్రీరాముడు, విష్ణురూపం దాల్చడం సుతరామూ నచ్చలేదు. అతడి మనస్సులో ఎంత త్వరగా ఆయన మళ్ళీ రాముని రూపం దాలుస్తాడో అనే ఆలోచనే మెదలసాగింది. హనుమంతుని మనోభావం పసిగట్టడంలో శ్రీరాముడు జాప్యం చేయలేదు. గరుత్మంతునికి సెలవిచ్చి పంపించిన మరుక్షణమే మళ్ళీ రామునిరూపం దాల్చి, హనుమంతునితో ఇలా అన్నాడు: ‘వత్సా! నన్ను విష్ణురూపంలో చూసి నువ్వెందుకు అశాంతి చెందావు? నువ్వు మహాజ్ఞానివి కదా! రాముడు – విష్ణువు ఇద్దరూ ఒక్కరే అని నీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదుకదా!” అందుకు హనుమంతుడు వినమ్రంగా ఇలా పలికాడు: ‘ప్రభూ!
శ్రీనాథే జానకీనాథే అభేదః పరమాత్మని ।
తథాపి మమ సర్వస్వం రామః కమలలోచనః ॥
పరమాత్ముడే – శ్రీనాథుడు, జానకీనాథుడనే రెండు రూపాలను దాల్చాడన్నది నిజమే. కాని నా మనస్సు సదా జానకీనాథుని పాదపద్మాలను మాత్రమే దర్శించాలని ఆతురత చెందుతుంది; ఆయనే నా సర్వస్వం. ఆ రూపం ద్వారానే భగవంతుని అభివ్యక్తీకరణను చూడగలిగాను, నా జీవితం తరించింది.’
33. మానవులందరిలోను గురుభావం నిద్రాణ స్థితిలో ఉంటుంది
ఆ విధంగా గురువు ద్వారా అభివ్యక్తమయ్యే శక్తి జగన్మాత శక్తి అన్న విషయం స్పష్టమౌతున్నది; ఆ గురుశక్తి మానవులందరిలోను నిద్రాణ స్థితిలోనో లేక జాగృతమైన స్థితిలోనో నెలకొని ఉంటుంది. కాబట్టే గురుభక్తి పరాయణుడైన సాధకుడు చిట్టచివరకు ఆ గురుశక్తి స్వయంగా అతడిలోనే అభివ్యక్తమై నిగూఢ ఆధ్యాత్మిక సంక్లిష్ట తత్త్వాలను అతడికి విశదపరిచే స్థితికి చేరుతాడు. తన ఆధ్యాత్మిక సంశయ నివృత్తికై సాధకుడు ఇక ఏ బయటి వ్యక్తిని అడిగే అవసరం ఉండదు. భగవద్గీతలో భగవానుడు అర్జునుడికి ఇలా చెప్పాడు:
యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి ।
తదా గన్తాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ॥ –భగవద్గీత. 2.52
‘నీ బుద్ధి మోహమనే ఊబినుండి పూర్తిగా బయటబడినప్పుడే నీవు విన్న, వినబోయే ఇహపరలోక సంబంధ విషయాల పట్ల ఉపేక్ష వహిస్తావు.’
గురుభక్తిపరాయణుడైన సాధకుడు చిట్టచివరికి ఈ స్థితికి చేరతాడు.
34. శ్రీరామకృష్ణుల ఉవాచ: ‘చిట్టచివరకు మనస్సే గురువుగా వ్యవహరిస్తుంది’
ఈ పై స్థితిని ఉద్దేశించే శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు: “చిట్టచివరకు మనస్సే గురువుగా మారి, గురువుగా వ్యవహరిస్తుంది. మానవమాత్రుడైన గురువు మంత్రాన్ని చెవిలో ఉచ్చరిస్తాడు, జగద్గురువు మంత్రాన్ని ఆత్మపరం చేస్తాడు.” కాని అట్టి మనస్సుకు సాధారణ మనస్సుకు హస్తిమశకాంతరం ఉంది. శుద్ధసత్త్వ స్థితికి చేరిన మనస్సు పావనమై భగవంతుని సమున్నత శక్తి అభివ్యక్తీకరణకు యంత్రంగా రూపొందుతుంది; కాని సాధారణ మనస్సు లౌకిక సుఖభోగాలలో కామక్రోధాదులలో మగ్నమై ఉండగోరి, భగవంతుడి వైపు నుండి మరలిపోతుంది.
35. గురువు చెలికత్తెవంటవాడు
“గురువు చెలికత్తెవంటి వాడు; రాధాదేవిని శ్రీకృష్ణునితో జతకలిపే వరకు చెలికత్తెకు తీరిక ఉండదు. అట్లే సాధకుణ్ణి ఇష్టదేవతతో ఏకంచేసే వరకు గురువు పని పూర్తికాదు” అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. మహామహిమాన్వితుడైన గురువు, సత్యం తెలుసుకోగోరి తహతహలాడుతున్న శిష్యుని చేయి పుచ్చుకొని ఆధ్యాత్మిక రాజ్యపు సమున్నత భూములకు తోడ్కొనిపోయి, చివరకు అతణ్ణి ఇష్టదేవత ముందుకు తీసుకుపోయి, ‘నాయనా, అదుగో చూడు’ అని పలికి, అదృశ్యుడౌతాడు.
36. శిష్యుని ఇష్టదేవతలో చివరకు గురువు లీనమైపోతాడు
శ్రీరామకృష్ణులు అలా చెప్పడం విని ఒక గొప్పభక్తుడు ఒక రోజు, ‘అయితే ఏదో ఒక రోజు గురువు నుండి ఎడబాటు అనివార్యం’ అని తలపోసి, విషణ్ణ హృదయంతో శ్రీరామకృష్ణులను, “మహాశయా! గురువు అప్పుడు ఎక్కడికి పోతాడు?” అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు ఇలా జవాబిచ్చారు: “గురువు ఇష్టదేవతలో లీనమైపోతాడు. గురువు, కృష్ణుడు (ఇష్టదైవం), వైష్ణవుడు (భక్తుడు) – (అంటే భక్తుడు, భగవంతుడు, గురువు) ఈ ముగ్గురూ ఒక్కరే, ఒక్కరే ఆ ముగ్గురూ.”