యే చైవ సాత్త్వికాభావాః రాజసాస్తామసాశ్చ యే ।
మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి ॥
త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ ।
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ ॥ భగవద్గీత: 7:12–13
సాత్త్విక రాజసిక తామసిక భావాలు ఏవేవి ఉన్నవో – అవన్నీ నా నుండే జనించినవని తెలుసుకో. అవి నాలో ఉన్నా, నేను వానిలో లేను.
ఈ త్రిగుణాల నుండి పుట్టిన భావాలచే ఈ సమస్త ప్రపంచం మోహవశమై ఉన్నది. కనుకనే ఈ గుణాలకు అతీతుడను, అవ్యయుడను అయిన నన్ను ఈ ప్రపంచం తెలుసుకోలేకున్నది.
1. శ్రీరామకృష్ణులమాటలలోని గూఢార్థం
పన్నెండు సంవత్సరాలపాటు అవిచ్ఛిన్నంగా అసామాన్య సాధనలు అనుష్ఠించిన పిదప, “భావముఖంలో నెలకొని ఉండు” అన్న జగజ్జనని ఆదేశాన్ని శ్రీరామకృష్ణులు పాటించారని అనేకులు ఇప్పుడు తెలుసుకొన్నారు. కాని భావ ముఖంలో నెలకొని ఉండడం అంటే ఏమిటో వివరించడమూ, దాని గూఢార్థం తెలుసుకోవడమూ అంత సులభం కాదు. ఇరవై ఎనిమిది సంవత్సరాల మునుపు, స్వామి వివేకానంద ఒక మిత్రునితో* ఇలా చెప్పారు: “శ్రీరామకృష్ణులు వచించిన ప్రతి వాక్యం నుండి బుట్టలకొద్దీ తాత్త్విక గ్రంథాలు రచించవచ్చు.” ఆ మిత్రుడు ఆ మాటలు విని ఆశ్చర్యపోయి, “అవునా? ఆయన వచనాలలో అంతటి గూఢార్థం ఇమిడి ఉంటుందని మేం గ్రహించలేదే. ఆయన వచనాలలో ఒకదాన్ని తీసుకొని ఆ రీతిలో నాకు వివరించి చెప్పగలవా?” అని అడిగాడు.
స్వామీజీ : “అర్థం చేసుకోగల బుర్ర ఉంటే నీకు అర్థమయ్యేది. గురుదేవుల ఏదో ఒక ఉపదేశాన్ని తీసుకో, నేను వివరిస్తాను.”
మిత్రుడు : “సరే. సకల జీవులలో నారాయణునే దర్శించడం గురించి ఉపదేశిస్తూ ‘ఏనుగు నారాయణుడు – మావటి నారాయణుడు’ అనే కథను శ్రీరామకృష్ణులు చెప్పారే, దాన్లోని గూఢార్థాన్ని నాకు వివరించు.”
వెంటనే స్వామీజీ ‘స్వాధీన ఇచ్ఛ – అదృష్టవాదం’ లేదా ‘పురుష ప్రయత్నం – భగవత్సంకల్పం’ అనే సిద్ధాంతాలను ప్రస్తావనకు తెచ్చారు. ప్రాచ్య పాశ్చాత్య దేశాలలోని ఆ రెండు పక్షాలకు చెందిన పండితులు అనాది నుండి వివాదిస్తూ ఉన్నప్పటికీ ఏ స్థిరనిర్ణయానికీ రాలేకపోవడం గురించి తెలిపి, పైన పేర్కొన్న శ్రీరామకృష్ణుల నీతికథ ఆ వివాదానికి ఎలా అద్భుత పరిష్కారం కాగలదో సరళంగా మూడురోజుల పాటు ఆ మిత్రుడికి వివరించారు స్వామీజీ.
2. అవతార పురుషుల వచనాల్లో సారూప్యం
బాగా విచారించి చూసినప్పుడు శ్రీరామకృష్ణుల దైనందిన జీవితవర్తనంలో, ఆయన ఉపదేశాలలో అటువంటి గూఢార్థం ఇమిడి ఉండడం చూసి ఆశ్చర్యపడకతప్పదు. అవతార పురుషులందరి విషయంలోను ఇది నిజమే. వారి జీవితాలను అధ్యయనం చేసినప్పుడు ఈ నిజం తేటతెల్లమవుతుంది. ప్రతిపక్షం వారి కుతర్కాలను చీల్చిచెండాడడం ద్వారా ధర్మ సంస్థాపన చేయవలసివచ్చిన శ్రీ శంకరాచార్యుల వంటి ఏ ఒకరిద్దరు మహాపురుషులను మినహాయిస్తే తక్కిన మహాపురుషుల జీవితాలలో మనకు ద్యోతకమయ్యేది వారు బోధింపదలచిన సత్యాలను తేటతెల్లని మాటలలో, హృదయాన్ని స్పృశించే చిన్నికథల దృష్టాంతాలు, రూపకాల ద్వారా వివరించి ఉండడమే. పెద్దపెద్ద మాటలు, దీర్ఘసమాసాలు, చెవులు గింగురుమనే వాగ్ధాటి – ఇవన్నీ వారిలో కానరావు. అయినా వారి ఆ సామాన్య పదజాలంలో, అరమరికలు లేని చిరునవ్వులలో సామాన్యులను సైతం ఉన్నత ఆదర్శాలను సంతరించుకొనేలా చేయగలిగిన గూఢార్థమూ, శక్తీ ఇమిడివున్నవి. అంతేకాదు వేల సంవత్సరాల పర్యంతం ప్రయత్నించి, ఇప్పటికీ మనం వారి వచనాలలోని పూర్తి అర్థాన్ని, వాటి శక్తి పరిమితిని గ్రహించలేదనే చెప్పాలి. వాటిని అధ్యయనం చేసేకొద్దీ వాటిలోని ప్రగాఢమైన అర్థాలు మనకు స్ఫురిస్తాయి. ఆ బోధనలను మనం తరచి తరచి యోచించేకొద్దీ మన మనస్సు ‘అనిత్యం అసుఖం’* అయిన ఈ నశ్వర జగత్తును పరిత్యజించి ఉన్నతోన్నత భావ భూములను ఆరోహిస్తుంది. ఇలా పరమపదప్రాప్తి లేదా బ్రాహ్మీస్థితి లేదా ముక్తి లేదా భగవద్దర్శనం (నానారూపాలలో దర్శించిన ఒకే స్థితిని మహాపురుషులు విభిన్న నామాలతో పేర్కొంటారు.) వైపుగా ఎవరెంతగా పురోగమిస్తారో అంతగా వారు తమ అంతరాంతరాళాల్లో ఆ మహానుభావుల సరళ వచనాల ప్రగాఢ మహత్వాన్ని గ్రహించుకొంటారు.
3. ఒక ఉదాహరణ – గిరీశ్ ముక్త్యారునామా
సర్వత్రా ఇదే నియమం. శ్రీరామకృష్ణుల పలుకులలో, ప్రవర్తనలో కూడ ఈ నియమానికి మినహాయింపు కానరాదు. ప్రప్రథమంలో ఆయన పలుకులు విన్నప్పుడు అవి అంత అర్థవంతాలుగా వ్యక్తం కావు. కాని కాలం గడిచేకొద్దీ ఆ పలుకుల విస్తార అర్థం వెల్లడవుతుంది. అందునిమిత్తం ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తే చాలనుకొంటాం. కొన్నిసార్లు శ్రీరామకృష్ణులను సందర్శించిన పిదప శ్రీ గిరీశ్చంద్ర ఘోష్ పూర్తిగా తనను ఆయనకు అర్పించుకొని, ఒకరోజు, “ఇప్పటి నుండి నన్ను ఏం చెయ్యమని సెలవిస్తారు?” అని అడిగాడు.
శ్రీరామకృష్ణులు: ఇంత కాలంగా ఏం చేస్తున్నావో, అదే కొనసాగించు. ఒక చేత్తో భగవంతుని పట్టుకో, మరో చేతిని సంసారంలో ఉంచు. సంసారం వదిలిపోయాక ఏం జరగాలో అదే జరుగుతుంది. కాని ప్రతి ఉదయం, సాయంత్రం భగవంతుని స్మరణ మననాలు కొనసాగించు.
ఇలా పలికి ఆయన, గిరీశ్ కేసి చూశారు, జవాబుకై నిరీక్షిస్తూన్నట్లు.
ఆ మాటలు విని గిరీశ్ ఖీన్నుడై, ఇలా తలపోశాడు: “నా దైనందిన భౌతికావసరాలైన తినడం, త్రాగడం, నిద్రించడం వంటి వాటి విషయాలలోనే నేను నియమిత కాలాన్ని పాటించను; అలాటిది నేను చేస్తున్న పని. భగవంతుని ఉదయ సాయంత్రాలలో స్మరింప మరచిపోవడం తథ్యం. ఏం కష్టం వచ్చిపడింది! గురూపదేశాన్ని ఉల్లంఘించడం మహాదోషం, హానికరం కూడ. కనుక చెప్పినట్లు చేస్తానని మాట ఎలా ఇవ్వగలను! ఈ ప్రపంచంలో ఎవరికైనా వాగ్దానం చేసి, దాన్ని భంగపరిస్తే ఎంత తప్పు! అలాంటప్పుడు ముక్తికి దారి చూపించే సాక్షాత్తు గురువుకు వాగ్దానం చేసి దాన్ని పాటించకపోవడం గురించి వేరేగా చెప్పాలా!”
4. గిరీశ్ మానసిక స్థితి
తన ఆలోచనలను వ్యక్తం చేయడానికి గిరీశ్ సంకోచించసాగాడు. నిజానికి శ్రీరామకృష్ణులు తనను ఎంతో కష్టమైన పనికి పురమాయించలేదని గిరీశ్ ఆలోచించసాగాడు. మరెవరినన్నా అలా చేయమని ఆయన పురమాయించి ఉంటే, అతడు తక్షణమే అంగీకరించేవాడు. కాని గిరీశ్ ఏం చెయ్యగలడు? పూర్తిగా బహిర్ముఖమైన తన మానసిక స్థితిని చక్కగా ఎరిగివున్న గిరీశ్, ప్రతినిత్యం తనకు పురమాయింపబడిన ఆ చిన్ని ఆధ్యాత్మిక సాధనకూడ తన శక్తికి మించిన పని అని భావించడం తప్ప! మళ్ళీ తన ప్రవృత్తిని గురించి పర్యావలోచన చేశాడు. ఏ రకమైన ప్రతిజ్ఞకైనా, నియమానికైనా జీవితాంతం కట్టుపడి ఉండడం అనే ఆలోచన సైతం అతణ్ణి ఊపిరాడకుండా చేసివేస్తుంది; ఆ ప్రతిజ్ఞ లేక నియమాన్ని భంగం చేసేవరకు అతడి మనస్సు స్థిమితపడదని అతడికి బాగా తెలుసు. అతడి జీవితంలో ఇది అక్షరసత్యం. మంచినిగాని చెడునుగాని స్వేచ్ఛాపూర్వకంగా చేయడంలో ఎలాంటి కష్టమూ ఉండదు; కాని ఒక ఫలానా పనిని విధిగా చేయాలి అనే ఆలోచన మెదలగానే అతడి మనస్సు తిరుగబడేది. తన ఈ దుర్బల, నిస్సహాయ స్థితిని తలచుకొని గిరీశ్ కుమిలిపోయి, కిమ్మనలేదు. తను చేయగలననిగాని, చేయలేననిగాని ఏ జవాబు చెప్పలేకపోయాడు. అటువంటి సులువైన పనిని తాను నిర్వర్తించలేనని సిగ్గువిడిచి అతడెలా చెప్పగలడు? ఒకవేళ అలా చెప్పినప్పటికీ, శ్రీరామకృష్ణులు, అక్కడున్న ఇతరులు తనను గురించి ఏమనుకొంటారు? బహుశా వారు అతడి నిస్సహాయ పరిస్థితిని అవగతం చేసుకోలేక, బయటకు వ్యక్తం చేయకపోయినా అతడు నటిస్తున్నాడని భావించవచ్చు.
నాటక ప్రయోక్త గిరీష్ చంద్ర ఘోష్ (1844-1912)
గిరీశ్ మౌనం వహించడంతో అతడి భావాలు గ్రహించి శ్రీరామకృష్ణులు అతణ్ణి పరికించి ఇలా అన్నారు: “మంచిది. అలా చేయలేకుంటే భోజనానికి ముందు, నిద్రించడానికి ముందు దేవుణ్ణి స్మరించుకో.”
గిరీశ్ మౌనమే వహించాడు. ‘అంతమాత్రమైనా చేయగలనా?’ అని తనను తానే ప్రశ్నించుకొన్నాడు. అతడు కొన్ని రోజులు ఉదయం పది గంటలకు భోజనం చేస్తాడు, మరికొన్ని రోజులు సాయంత్రం ఐదు గంటలకు తింటాడు. రాత్రి భోజన విషయంలోనూ ఇదే అస్తవ్యస్తత. భోజనం చేస్తున్నాననే ఎరుకే లేకుండా భోజనం చేసిన సందర్భాలు ఎన్నో. న్యాయస్థానాలలో నడుస్తున్న వ్యాజ్యాల గురించిన చిక్కులు, క్లేశాలే ఇందుకు కారణం. ‘తాను న్యాయవాదికి పంపిన పైకం ఆయనకు సకాలంలో ముట్టినదో లేదో అన్న సంగతి తనకు తెలియరాకపోవడం, వ్యాజ్యం విచారణకు వచ్చే రోజున న్యాయవాది హాజరు కాని పక్షంలో అది ఎంత ప్రమాదానికి దారితీస్తుందో ఏమో!’ ఇలాంటి ఆలోచనలలో మునిగి పోయేవాడు. పనుల ఒత్తిడిలో అలాంటి రోజు మళ్ళీ రావచ్చు, అలా రావడం అసంభవం కాదు; అలా జరిగితే ఆ రోజున భగవంతుని స్మరించడం మరచిపోవడం తథ్యం. అయ్యో, ఇంత సులువైన పని చెయ్యమని గురుదేవులు చెబుతున్నా ‘చేస్తా’ నని చెప్పలేకున్నానే! గిరీశ్ విషమ సందిగ్ధావస్థలో పడి చేష్టలుదక్కి, మూగవోయాడు. కాని అతడి హృదయంలో ఆదుర్దా భీతి నిరాశలతో కూడిన తుపాను చెలరేగింది. శ్రీరామకృష్ణులు గిరీశ్కేసి దృక్కులు పరపి, నవ్వుతూ, “ ‘ఇది కూడ నాకు సాధ్యం కాని పనే’ అని చెప్పబోతున్నట్లున్నావు. మంచిది. అలాగైతే ‘నీ ముక్త్యారునామా’* ను నా కివ్వు” అంటూ శ్రీరామకృష్ణులు అర్ధబాహ్య పారవశ్య స్థితిని పొందారు.
5. ముక్త్యారునామా ఇచ్చాక గిరీశ్ మానసిక స్థితి
ఈ సూచన గిరీశ్‌కు నచ్చింది. ఇప్పుడు అతడి మనస్సు ప్రశాంతతను సంతరించు కొంది. శ్రీరామకృష్ణుల ఆసరాకై, అపార కృపకై గిరీశ్ హృదయంలో మితిమీరిన ప్రేమ పెల్లుబికింది. మహాభయానకమైన బంధనమనే నియమం శాశ్వతంగా వదలినందుకు గిరీశ్ బ్రతుకుజీవుడా అనుకొన్నాడు. ఇప్పుడు తాను ఏం చేసినప్పటికీ తమ దివ్యశక్తితో గురుదేవులు ఏదో రకంగా తనను రక్షిస్తారు అనే ప్రగాఢ విశ్వాసం గిరీష్లో ఉదయించింది. ముక్త్యారునామం అంటే అన్ని బాధ్యతలను గురుదేవులకు సమర్పించడమే అనుకొన్నాడు గిరీశ్. స్వప్రయత్నంతోనే లేదా సాధనాదులు అనుష్ఠించాల్సిన అవసరమో లేదా దేనినైనా విడిచిపెట్టే అవసరమో లేదని; గురుదేవులే తమ శక్తితో తన మనస్సులోని విషయ వాసనలను తొలిగించి వేస్తారని గిరిశ్ అప్పుడు భావించాడు.
6. ముక్త్యారునామాను ఇవ్వడం ఒక ప్రేమ బంధనం
నియమాలనే బంధనాన్ని మెడచుట్టూ తగిలించుకోవడమే భరించలేని గిరీశ్ అందుకు బదులుగా అంతకంటె వందరెట్లు బలీయమైన ప్రేమ అనే ఉచ్చును బుద్ధిపూర్వకంగా మెడకు తగిలించుకొన్నట్లు అప్పుడు గ్రహించలేకపోయాడు. తాను చేగొన్న పనియొక్క ప్రాధాన్యం, లోతులను అతడు తరచి చూడలేదు. తనకు అనుకూల లేక ప్రతికూల, కీర్తి లేక అపకీర్తి, సుఖం లేక దుఃఖం కలిగించే పరిస్థితులు ఏవి ఎదురైనా తాను మారు మాట్లాడక, సణుగుకోక వాటిని భరించవలసి ఉంటుందని అతడప్పుడు గ్రహించలేకపోయాడు. ఇతర ఆలోచనలన్నీ అతడి మనస్సు నుండి మాయమైపోయాయి. అంతులేని శ్రీరామకృష్ణుల అనుగ్రహానికి అతడు పాత్రుడై ఉన్నాడు. అంతేగాక ఇప్పుడు అతడిలో శ్రీరామకృష్ణులను ఆశ్రయించానన్న ‘అహం’ జనించి, ఉద్ధృతం కాసాగింది. లోకంపట్ల అతడిలో ఒక రకమైన తిరస్కారభావం పొడచూపింది; అతణ్ణి గురించి లోకం ఏం మాట్లాడినా, చివరకు ఈసడించుకొన్నా అతడికి అప్రస్తుతం; ఏ పరిస్థితిలోనైనా, ఏ సమయంలోనైనా నిస్సంశయంగా శ్రీరామకృష్ణులు తన మనిషే అనే భరోసాతో ఉన్నాడతడు. భక్తిశాస్త్రాలలో* భగవదాశ్రితమైన ఈ ‘అహంకారం’ ఆధ్యాత్మిక సాధనలలో అత్యుత్తమమైన ఒకానొక సాధనగా పరిగణింపబడుతూన్నదనీ, అదృష్టవంతులైన మనుష్యులనే వరిస్తుందనీ అప్పుడతడు గ్రహించలేకపోయాడు. ఏది ఎలావున్నా గిరీశ్ ఇప్పుడు నిశ్చింతగా ఉన్నాడు. తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు లేక ఏ పనిలో నిమగ్నమై ఉన్నా, ‘శ్రీరామకృష్ణులు నా పూర్తి బాధ్యతను వహించారు’ అనే ప్రగాడ విశ్వాస పూరిత ఒక్క ఆలోచనే అతడి మదిలో సదా మెదలేది. ఆ ఆలోచన క్రమంగా ప్రగాఢమై అతడిపై ఆధిపత్యం వహించి అప్రయత్న పూర్వకంగా శ్రీరామకృష్ణులనే ధ్యానింప చేయిస్తూ అతడి భావాలలో, చర్యలలో ఆమూలాగ్రంగా పరివర్తనం తీసుకురాసాగింది. ఇదంతా గ్రహించక పోయినప్పటికీ, గిరీశ్ హృదయం ఆనందంతో నిండిపోయింది. శ్రీరామకృష్ణులు తనను ప్రేమించడం, తన సొంతమనిషి కంటే ఆయన తనకు ఆప్తులవడం అని గిరీశ్ తలచడమే ఇందుకు కారణం.
7. గిరీశ్‌కు శిక్షణ ఇచ్చిన విధానం
“ఎవ్వరి మనోగత ఆధ్యాత్మిక వైఖరిలోనూ జోక్యం చేసుకోరాదు” అని శ్రీరామకృష్ణులు సదా బోధించేవారు. ఆ మేరకే ఆయన భక్తులతో వ్యవహరించే వారు. గిరీశ్ ఆధ్యాత్మిక మనోభావాన్ని చక్కగా ఎరిగివున్నవారు కావడం చేత, ఆ మనోభావం మేరకే అతడికి ఉపదేశాలిచ్చేవారు. ఒకరోజు ఏదో సామాన్య విషయంలో శ్రీరామకృష్ణుల సమక్షంలో, “దాన్ని నేను చేస్తాను” అన్నాడు గిరీశ్. హఠాత్తుగా శ్రీరామకృష్ణులు ఆక్షేపణీయంగా, “అదేమిటి? నేను చేస్తానని అంటావెందుకు? ఒకవేళ నువ్వు చెయ్యలేకపోతే! అప్పుడేమిటి? భగవత్సంకల్పం ఉంటే చేస్తానని చెప్పాలి” అని అన్నారు. అప్పుడు గిరీశ్ ఇలా అనుకొన్నాడు: “ఆయన చెప్పింది నిజమే. నా పూర్తి బాధ్యతను భగవంతునిపై మోపాను, ఆయన నా భారం వహింప సమ్మతించారు. ఒక ఫలానా పని సముచితమైనదని, నాకు మేలు ఒనగూరుస్తుందని ఆయన భావించి, నాకు అనుమతి ఇస్తేనే దాన్ని నేను చేయగలను. నా స్వశక్తితో అన్యథా దాన్ని నే నెలా చెయ్యగలుగుతాను?” పై విషయం అర్థం చేసుకొని క్రమంగా గిరీశ్ ‘నేను చేస్తాను’, ‘నేను వెళతాను’ అని చెప్పడం మానుకొన్నాడు.
8. ముక్త్యారునామాను ఇవ్వడంలోని ప్రాధాన్యాన్ని గిరీశ్ అవగతం చేసుకోవడం
ఇలా రోజులు దొర్లిపోయాయి. కాలక్రమంలో శ్రీరామకృష్ణులు మహాసమాధి చెందారు. ఈలోపు గిరీశ్ అనేక దుర్ఘటనలు ఎదుర్కొన్నాడు; అతడి భార్య, కుమారుడు తదితరులు మృతిచెందారు. కాని ప్రతిసారీ అతడి మనస్సు ఇలా సమర్థించుకోసాగింది: “ఆయన (శ్రీరామకృష్ణులు) ఈ సంఘటనలు నీ మేలు కోసమే జరుగనిస్తున్నారు. నీ బాధ్యతను ఆయనకు అప్పగించావు, దాన్ని ఆయన స్వీకరించారు; కాని నిన్ను ఫలానా మార్గంగుండా తీసుకుపోతానని ఆయన ఎలాంటి హామీ ఇవ్వలేదు కదా. ఈ మార్గం నీకు సుగమంగా ఉంటుందని ఈ మార్గంగుండా నిన్ను తోడ్కొని వెళుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ నువ్వు సణుగుకోవడం, చిరచిరలాడడం తగదు. అలాంటప్పుడు నీ ముక్త్యారునామాను లేదా నీ బాధ్యతను ఆయనకు అప్పగించడం కేవలం ఉత్త నోటిమాటే కదా!” ఇలా రోజులు గడిచేకొద్దీ ముక్త్యారునామాను ధారాదత్తం చేయడంలోని అంతరార్థం గిరీశ్‌కు విస్పష్టం కాసాగింది. దాని పూర్తి అర్థం చివరికైనా అతడికి అవగతమైందా? దానిని గురించి ప్రశ్నించినప్పుడు, గిరీశ్ ఇలా అన్నాడు: “ఇప్పటికీ గ్రహించవలసింది ఎంతో ఉంది. ముక్త్యారునామాను అలవోకగా ఇచ్చివెయ్యడంలో ఇంత నిగూఢత ఉంటుందని అప్పుడు నాకు తెలుసా ఏమిటి? ఏదో ఒక సమయంలో జపతపాదుల భజనల పారమార్థిక సాధనలకు ముగింపు అనేది ఉంటుంది. కాని ముక్త్యారునామాను ఇచ్చివేసిన వ్యక్తి కర్మ కలాపాలకు అంతం అంటూ ఉండదని నే నిప్పుడు తెలుసుకొన్నాను.” ఇలా అనడానికి కారణం: తన అన్ని ఆలోచనలకు, చేష్టలకు ఆయన (భగవంతుడు) పైన, ఆయన శక్తిపైన తాను ఆధారపడి ఉన్నాడో లేక తన దిక్కుమాలిన ‘అహం’ పైన ఆధారపడి ఉన్నాడో ప్రతి అడుగులోను, ప్రతి శ్వాసలోను తాను పరికించవలసి ఉందని అతడు గ్రహించడమే.
9. అవతారపురుషులు మాత్రమే ముక్త్యారునామాను అంగీకరించగలరు
ముక్త్యారునామాను అంగీకరించడానికి సంబంధించి మన మనస్సులో అనేక ఆలోచనలు తలెత్తుతాయి. ఏసుక్రీస్తు, చైతన్య మహాప్రభువు వంటి అవతారపురుషులకు మాత్రమే కొన్ని సందర్భాలలో కొందరికి ఈ రకం అభయప్రదానం ఇవ్వడం చెల్లిందని ప్రపంచ చరిత్రలో మనకు కానవస్తుంది. సామాన్య గురువులకు అలా చేసే శక్తిగాని సమర్థతగాని లేదు. వారు మహా అయితే వేటి ద్వారా తాము ఆధ్యాత్మికోన్నతిని పొందగలిగారో అటువంటి మంత్రాలను, ప్రత్యేక సాధనలను బోధించడం మాత్రం చేయగలరు; లేదా తాము పావనజీవనం గడుపుతూ తద్ద్వారా జనులను ఆధ్యాత్మిక జీవితం వైపుగా ఆకర్షించగలరు. కాని నానారకాల లౌకిక బంధనాలలో చిక్కుకుపోయి మనిషి పూర్తిగా అసహాయస్థితికి దిగజారినప్పుడు ఒక చిన్నపనిని నిర్వర్తించమన్నా దాన్ని చేయడానికి అతడు తన అశక్తతను వ్యక్తంచేసి నిస్పృహతో సహాయాన్ని కోరతాడు. అతడికి తోడ్పడడం సామాన్య గురువుల శక్తికి మించిన పనే అవుతుంది. ‘నీ పాప చర్యల భారాన్నంతా నేను పుచ్చుకొంటాను; ఆ పాప ఫలాన్ని నీ తరఫున నేను అనుభవిస్తాను’ అని ఒక వ్యక్తి మరో వ్యక్తితో చెప్పడంగాని, అలా చేయడం గాని ఒకరికి శక్తికి మించిన పనే అవుతుంది. లోకంలో అటువంటి ధర్మగ్లాని ఏర్పడిన సమయంలో కృపాళువైన భగవంతుడు అవతరిస్తాడు. మానవుల పాపచర్యల ఫలాన్ని వారి తరఫున స్వయంగా తానే అనుభవించి వారిని బంధ విముక్తులను చేసి ఉద్ధరిస్తాడు. అలా చేసినప్పటికీ ఆయన మనిషిని పూర్తిగా దుఃఖవిముక్తుణ్ణి చేయడు. అతడికి గుణపాఠం నేర్పడానికి అతడి ద్వారా ఏ కొద్దిగానైనా స్వప్రయత్నం చేయిస్తాడు. ఈ సందర్భంగా శ్రీరామకృష్ణులు, “వారి (అవతారపురుషుల) అనుగ్రహంతో మనిషి పది జన్మలు అనుభవించవలసిన కర్మఫలాన్ని ఒక్క జన్మలోనే తీర్చేసుకొంటాడు” అని చెప్పేవారు.
10. ఉదాహరణ
పైన తెల్పిన విషయం వ్యక్తిపరంగా ఎంత నిజమో జాతిపరంగాను అంతే నిజం. ఈ విషయమే భగవద్గీతలో (11.8) ‘విశ్వరూపదర్శనార్థం అర్జునుడికి దివ్యచక్షువు ఒసగడం’ అనీ, పురాణాలలో ‘భగవంతుని అనుగ్రహం పొందడం’ అనీ, గౌడీయ వైష్ణవశాస్త్రాలలో ‘జగాయ్ – మధాయ్లను ఉద్ధరించడం’ లేదా ‘వారిలోని నీచప్రవృత్తిని తొలగించడం’ అనీ, క్రైస్తవ శాస్త్రాలలో ‘ఏసుక్రీస్తు ఇతరుల పాపాన్ని తాను భరించి వారికి బదులుగా ప్రాయశ్చిత్తం చేయడం’ అనీ పేర్కొనబడుతోంది. శ్రీరామకృష్ణుల జీవితంలో దీనిని గురించిన సూచన గ్రహించలేకపోయి ఉంటే ఆ విషయంలో సత్యం ఉన్నదనే సంగతి అనుభూతం చేసుకోలేకపోయేవారం.
11. ‘ముక్త్యారునామా’ ను అంగీకరించడంలో శ్రీరామకృష్ణుల అంతర్దృష్టి
చికిత్స నిమిత్తం శ్రీరామకృష్ణులు శ్యాంపుకూర్లో బసచేసి ఉన్నప్పుడు ఒకరోజు తమ సూక్ష్మదేహం స్థూలశరీరం నుండి బయటకు వచ్చి అటూ ఇటూ పచార్లు చేయడం ఆయన దర్శించారు. ఈ దర్శనం గురించి ఆయన ఇలా చెప్పారు: “దాని వీపు పుళ్ళమయంగా ఉండడం చూశాను. ఆ పుళ్ళు ఎలా ఏర్పడ్డాయో అని ఆశ్చర్యపోయాను. రకరకాల పాపకృత్యాలు చేసిన జనం వచ్చి నన్ను తాకుతారు, వారి వేదనలకు కరిగిపోయి వారి పాప కృత్యాల ఫలాలను తీసుకోవలసి వచ్చినందున నాకు ఆ పుళ్ళు ఏర్పడ్డాయని జగజ్జనని నాకు దర్శింపచేసింది. అందుకే (తమ గొంతు* చూపుతూ) ఈ రోగం. కాకుంటే, ఈ శరీరం ఎన్నడూ ఏ తప్పూ చేయకపోయినా ఎందుకు ఇంత బాధను అనుభవిస్తూన్నది?” మేం అవాక్కయి ఇలా అనుకొన్నాం: ‘నిజంగానే ఒక వ్యక్తి ఇతరులు చేసిన పాపకృత్యాల ఫలాన్ని తాను అనుభవిస్తూ వారికి ఆధ్యాత్మిక పురోగతి కల్పింప వారిని విముక్తులను చేయించగలడా?’ శ్రీరామకృష్ణుల పలుకులు విని, ఆయనపట్ల ఉన్న ప్రేమతో అనేకులం ఇలా భావించాం: ‘అయ్యో, అబద్ధాలాడడం మోసగించడం ఇత్యాది అనేక పాపకృత్యాలకు ఒడికట్టి మే మెందుకు గురుదేవులను తాకాము? ఆయన ఎంతో బాధపడుతున్నారు, నొప్పిని అనుభవిస్తున్నారు. ఇకపై మళ్ళీ ఎన్నడూ ఆయన దివ్యశరీరాన్ని స్పృశించకూడదు.’
12. బొల్లివ్యాధిని శ్రీరామకృష్ణులు నయం చేయడం
ఈ సందర్భంగా శ్రీరామకృష్ణులు మరో సందర్భంలో అన్న మాటలు మాకు గుర్తుకు వస్తున్నాయి. ఒకప్పుడు బొల్లివ్యాధిగ్రస్థుడైన ఒక వ్యక్తి వచ్చి, శ్రీరామకృష్ణులు తమ చేతిని తన వ్యాధిగ్రస్త శరీరంపై నిమిరితే ఆ రోగం నయమౌతుందని దీనంగా ఆయనను ప్రార్థించాడు. శ్రీరామకృష్ణులకు అతడిపట్ల దయ జనించి, ఇలా అన్నారు: “మంచిది. నువ్వు ఏం చెబుతున్నావో నా కేమీ తెలియదు. కాని నువ్వు కోరుతున్నావు కాబట్టి నా చేత్తో నిమురుతాను. జగజ్జనని సంకల్పం ఉంటే, నయం అవుతుంది.” ఇలా అంటూ ఆయన తన చేత్తో అతడి దేహాన్ని నిమిరారు. ఆ రోజంతా చెయ్యి నొప్పితో ఆయన ఎంతో అశాంతికి గురై జగజ్జననికి, “మళ్ళీ ఎన్నడూ అలాంటి పని చేయను తల్లీ” అని విన్నవించారు. తరువాత శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “అతడి రోగం నయమైపోయింది. కాని ఆ బాధ యావత్తు (తమ శరీరాన్ని చూపుతూ) ఇది అనుభవించింది.” ఈ యుగంలో వేదాలు, బైబిల్, ఖురాన్, పురాణాలు, మంత్రతంత్రాది శాస్త్రాలను శ్రీరామకృష్ణుల జీవన ప్రకాశంలో అధ్యయనం చేస్తే తేలికగా అవగతమౌతాయని ఆయన జీవితంలోని ఈ సంఘటనలు చెప్పక చెబుతున్నాయి. శ్రీరామకృష్ణులు కూడా మాతో, “నాయనలారా, నవాబుల కాలంలో చలామణిలో ఉన్న నాణాలు బాదుషాల కాలంలో చెల్లుబడి కావు” అని చెప్పేవారు.
13. ‘ముక్త్యారునామా’ ను ఇవ్వడంలోని క్లిష్టత
బాహ్యదృష్టికి ‘ముక్త్యారునామా’ ను ఇవ్వడం అన్నది చాల సులువైన పనిగా, మరొకరికి బదిలీ చేయడానికి అది వేచి సిద్ధంగా ఉన్నంత సులువైనదిగా గోచరిస్తుంది. మనిషి తన ఇష్టాలకు బానిస, మత ఆచరణలో సైతం అతడు ఆనుకూల్యాలను ఎదురుచూస్తాడు. అతడు రెంటినీ, అంటే ఒక వంక ప్రాపంచిక సుఖాలనూ, మరోవైపు భగవద్దర్శన ఆనందాన్నీ చవిచూడ నెంచుతాడు. ప్రాపంచిక సుఖాలు అతడికి ఎంత తియ్యగా అమృతప్రాయంగా కనిపిస్తాయంటే, వాటిని త్యజించాలనే తలంపే ఆతడిలో తీవ్రఅలజడిని కలిగిస్తుంది. అలా కనుక చేస్తే పిదప తన జీవితానికి ఆలంబన ఏది అని అతడు ఆశ్చర్యపోతాడు. కనుకనే ఆధ్యాత్మిక జగత్తులో ‘ముక్త్యారునామా’ ను ఇవ్వడం చలామణి అవుతుందని విన్న తక్షణమే ఎగిరి గంతులు వేస్తాడు. అతడు ఇలా అనుకొంటాడు: “మంచిది, ఎంత దివ్యంగా ఉంటుంది! దొంగతనం, మోసం, దోపిడీ ఇత్యాదులు చేసి తృప్తిగా సుఖాలను అనుభవిస్తాను. శ్రీచైతన్యులో, ఏసుక్రీస్తో లేదా శ్రీరామకృష్ణులో నేను పరలోకంలో సుఖంగా ఉండేటట్లు చూసుకొంటారు. పరలోకం అని ఎందుకు అన్నానంటే, ఏదో ఒక రోజు నేను చావాలి కదా!” తానొక మూర్ఖుడనని, అలా భావించడం కేవలం ఆత్మవంచన అని, తన మనస్సు సదా తనను అట్లే మోసగిస్తూ వస్తూన్నదని పాపం అప్పుడతడు అర్థం చేసుకోడు. తాను అలా భావించడం తాను చేసిన పాపకృత్యాల ఫలితంగా వాటిల్లబోయే భయంకర దుఃస్థితి చిత్రీకరణలను చూడ భయపడి తన కళ్ళను తానే మూసుకోవడం అని, తలక్రిందులుగా పడి అధఃపతనం అవుతున్న దృశ్యాన్ని తన మనస్సు నుండి తొలగింప తన దుష్ట మనస్సు చేస్తున్న ప్రయత్నం అనీ గ్రహించడు. బలవంతంగా తన కళ్ళు తెరవబడే ఒకానొక రోజు రాబోతుందని, అప్పుడు తీరంలేని సముద్రం ఒక్కటే తన ఎదుట కనబడుతుందని అతడికి ఇప్పుడు అర్థం కాదు. తదనంతరం ఒక వంచకుడు ఇచ్చిన ‘ముక్త్యారునామా’ ను ఎవ్వరూ అంగీకరించరని అతడికి అవగతమౌతుంది. ఆహా! మనిషీ, నీవు విజయం సాధించావనుకొంటూ నిన్ను నువ్వు ఎన్ని విధాలుగా వంచించుకొంటున్నావు. మనిషి మనస్సులో మహా భ్రాంతిని కల్పిస్తున్న మహామాయకు జయహో! ఆ మహామాయను సంబోధిస్తూ శ్రీరామప్రసాద్ తన పాటలో చెప్పింది అక్షరాల సత్యం:
శాభాష్ మా దక్షిణా కాళీ, భువన్ భేల్కీ లాగియే దిలి,
తోర్ భేల్కీర్ గుటి చరణగీ దూటి భవేర్ భాగ్యేఫేలే దిలి ।
ఏమన్ బాజికరేర్మేయే, రాఖ్లి బాజారే పాగల్ సాజాయే,
నిజే గుణమయీ హొయే పురుష్ ప్రకృతి హొలి ।
మనేతే తాయి సంద్కరి, జే చరణగీ పాయిని త్రిపురారి,
ప్రసాద్రే సేయి చరణపాబి? తుయి ఓ బుఝి పాగల్ హోలి ॥
భావం: అమ్మా, దక్షిణ కాళీ, శబాష్! ప్రపంచమంతటా ఇంద్రజాలాన్ని పరపావు. కాని ఈ ఇంద్రజాలాన్ని పటాపంచలు చేయగలిగే నీ పాదపద్మాలు రెంటినీ శివుని అదృష్ట ఫలంగా ఆయన కిచ్చావు. నువ్వు ఎలాంటి ఐంద్రజాలికుని కుమార్తెవంటే లోకపిత అయిన పరమశివుణ్ణే పిచ్చివానిగా చేశావు. త్రిగుణమయివై నువ్వే పురుష ప్రకృతులుగా అభివ్యక్త మౌతున్నావు. అటువంటప్పుడు (అంటే మరి వేరెవరో కాక నువ్వే ఇంద్రజాలంగా వ్యక్తమౌతున్నప్పుడు) నా మనస్సులో సందేహం తలెత్తుతున్నది. అది: ఏ పాదపద్మాలను త్రిపురారి కూడ పొందలేకపోయాడో వాటిని ఓ (రాం) ప్రసాదూ, నువ్వు పొందగలవా? నీ కేమైనా పిచ్చి కనుక పట్టలేదు కదా!
14. ‘ముక్త్యారునామా’ ను ఇవ్వగల మానసిక స్థితి
అభిలషించిన మాత్రానే ‘ముక్త్యారునామా’ ను ఇవ్వలేం. నియమనిష్ఠలతో దీర్ఘకాలం సాధనలు అనుష్ఠించిన ఫలంగా ఇవ్వగలిగిన స్థితికి మనస్సు చేరుకొన్నప్పుడు మాత్రమే ‘ముక్త్యారునామా’ ను యుక్తంగా ఇవ్వవచ్చును. అప్పుడు మాత్రమే భగవంతుడు దాన్ని అంగీకరిస్తాడు. సుఖపడాలనే ఆశతో మనిషి విషయవస్తువుల వెంట పరుగులు తీసి చివరకు తాను పొందింది “మరుమరీచిక’ అనే నిజాన్ని ఎప్పుడు గ్రహిస్తాడో; అట్లే ఎన్ని ఆధ్యాత్మిక సాధనలు జపతపాదులు అనుష్ఠించినా అనంతుడైన భగవంతుణ్ణి పొందడానికి ఇవన్నీ ఏపాటికీ చాలవని ఎప్పుడతడు అంతరాంత రాళాలలో అవగతం చేసుకొంటాడో; పర్వతాలను పెళ్ళగింప నానావిధానాల పద్ధతులను ఒక్కటీ విడువక ప్రయత్నించి చివరకు ఒక పూచికపుల్లను కదలించే శక్తి సైతం తనకు లేదని ఎప్పుడతడికి చక్కగా అర్థమౌతుందో, అటువంటప్పుడు, ‘కలడు కలండనెడి వాడు కలడో లేడో, ఉంటే రక్షించు’ అని ఎలుగెత్తి మొరపెట్టుకొంటాడో, అప్పుడు మాత్రమే భగవంతుడు అతడి ‘ముక్త్యారునామా’ ను పుచ్చుకొంటాడు.
15. మనస్సు కల్పించే భ్రమ నుంచి జాగ్రత్త వహించు
అందుకు విరుద్ధంగా మనస్సు విపరీత ధోరణి వహించి, “ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించడంలో లేక భగవంతుని స్మరించడంలో నాకు ఆనందం కలగడం లేదు. కాని పట్టపగ్గాలు లేకుండా నా చాపల్యాలను తీర్చుకోవడంలోనే నాకు ఆనందం కనిపిస్తుంది కనుక నేను అట్లే వర్తిస్తాను” అని అంటుంది. ఈ వైఖరికి ఆక్షేపణ తెలిపితే, అందుకు తక్షణ జవాబుగా ఇలా అంటుంది: “ఎందుకు, భగవంతునికి నేను నా ముక్త్యారునామాను ఇచ్చివేశాను కదా! ఈ విధంగా ఆయన నన్ను చేయనిస్తుంటే నేను ఏం చేయగలను? ఆయన నా మనస్సును ఎందుకు మార్చలేడు?” అప్పుడు ఇలా ఇవ్వబడిన ముక్త్యారునామా కేవలం తనను తాను మోసపుచ్చుకోవడానికి, ఇతరులను మోసగించడానికి మాత్రమే పనికి వస్తుంది. దీని ఫలితం ‘ఇతో నష్టః తతో భ్రష్టః’ – ‘రెంటికీ చెడ్డ రేవడి’ గతి మాత్రమే.
16. మరో దృక్పథం
మరో దృక్పథం నుండి వివేచించి చూస్తే పై విషయం మరింత బాగా అవగతం అవుతుంది. సరే, నువ్వు ‘ముక్త్యారునామా’ ఇచ్చేశావనే ఒప్పుకొందాం అనుకో. కనుక భగవంతుని ప్రార్థించడం గాని, ఏ రకమైన ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించే అవసరంగాని నీకు లేదని అనుకొందాం. కాని నిజంగా నువ్వు ‘ముక్త్యారునామా’ ను భగవంతునికి ఇస్తే, ఆయన నిరవధిక కరుణ గురించి సదా నీ అంతరాంతరాళాలలో యోచిస్తూనే ఉంటావు. అప్పుడు నువ్వు తీరంలేని ఈ సంసారసాగరంలో పడి ఇంతకాలం కొట్టుమిట్టాడుతున్నావనీ, తన అనుగ్రహంతో ఆయన నిన్ను ఉద్ధరించాడనే తలంపు నీలో మెదలుతుంది. అలా నువ్వు భావించినప్పుడు ఆయన పట్ల నీ కెంత భక్తిప్రేమలు కృతజ్ఞత పెల్లుబుకుతాయో కాస్త ఊహించి చూడు. అలాంటప్పుడు సదా ఆయన గురించి యోచిస్తూ, ఆయన నామస్మరణ చేయమని నీకు వేరే చెప్పాల్సిన అవసరం ఉంటుందా! ఆయన పట్ల ప్రేమతో నిండిపోయిన నీ హృదయం సహజంగా అలా చేయకుండా ఉండగలదా? విషజంతువు వంటి సర్పం సైతం తనకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిపట్ల కృతజ్ఞతా భావంతో వానపాముగా వ్యవహరించి ఇంట్లోని వారెవరికీ హాని కలిగించదు. మరి నీ హృదయం దానికంటే క్షుద్రమైనదా? నీ ఇహపరాల బాధ్యతనంతా స్వీకరించిన ఆయన పట్ల కృతజ్ఞతతో, ప్రేమతో నీ హృదయం పులకించిపోదా? కనుక నువ్వు ‘ముక్త్యారునామా’ ను ఇచ్చేశాక కూడ భగవంతుణ్ణి ప్రార్థించడంలో నీకు ఎలాంటి ఆనందం కలుగకుంటే, నువ్వు సముచితంగా నీ ‘ముక్త్యారునామా’ ను ఆయనకు సమర్పించలేదని, ఆయన కూడ నీ బాధ్యతను స్వీకరించలేదని కచ్చితంగా గ్రహించు. ‘ముక్త్యారునామా’ ను ఇచ్చివేశానని ఇకపై నిన్ను నువ్వు వంచించుకోవద్దు; నిష్కళంకుడు పాపరహితుడైన భగవంతునిపై నీ పాపకృత్య ‘మరక’ ను పులమడానికి ప్రయత్నించకు. అలా చేయచూస్తే నీకే మహాహానికరంగా పరిణమిస్తుంది. శ్రీరామకృష్ణులు చెప్పిన గోహత్యకు పాల్పడిన బ్రాహ్మణుని కథ జ్ఞాపకం చేసుకో.
17. గోహత్యకు పాల్పడిన బ్రాహ్మణుని కథ
ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు ఎంతో శ్రమించి ఒక అందమైన తోటను పెంచాడు. వివిధ రకాలైన పళ్ళ, పువ్వుల మొక్కలను నాటి అవి ఏపుగా పెరగడం చూసి అమితానంద భరితుడయ్యాడు. ఇలావుండగా ఒక రోజు తోట ద్వారం తెరిచి వుండడంతో ఒక ఆవు తోటలోకి ప్రవేశించి మొక్కలను మేయసాగింది. ఆ సమయంలో బ్రాహ్మణుడు ఏదో పనిమీద బయటకు వెళ్ళివున్నాడు. తిరిగి రాగానే ఆ ఆవు ఇంకా మొక్కలను మేస్తూనే ఉండడం అతడి కంటబడింది. దానితో అతడు కాలరుద్రుడై ఒక బడితె పుచ్చుకొని దాన్ని చావబాదాడు. దెబ్బ తగలరాని చోట తగలడంతో ఆవు చచ్చిపోయింది. ఆవు చావడం చూసి బ్రాహ్మణుడు భయంతో వణకిపోయాడు. ‘అయ్యో, బ్రాహ్మణుడనైన నేను మహాపాతకమైన గోహత్యకు పాల్పడ్డాను గదా!’ అన్న ఆలోచనతో సతమతమయ్యాడు. ఆ బ్రాహ్మణుడు కాస్త వేదాంతం చదివి ఉండడంతో మనిషి ఇంద్రియాలు, తమ శక్తిని ప్రత్యేక దేవతల నుండి పొందుతాయని అతడికి జ్ఞప్తికి వచ్చింది. ఉదాహరణకు: కంటికి చూసేశక్తి సూర్యుని నుండి, చెవికి వినేశక్తి దిగ్దేవత నుండి, చేతులకు పనిచేసే శక్తి ఇంద్రుని నుండి లభిస్తాయి. బ్రాహ్మణుడికి ఇప్పుడు ఆ వేదాంత వచనాలు జ్ఞప్తిలోకి వచ్చాయి. అతడు ఇలా ఆలోచించాడు: “అలా అయితే ఆ ఆవును చంపింది నేను కాదు. నా చేతికి కదలిక కల్పించింది ఇంద్రుని శక్తి; కాబట్టి ఆవును చంపింది ఇంద్రుడే!” ఇలా తర్కించుకొని ఆ బ్రాహ్మణుడు స్థిమితపడ్డాడు.
18. శ్రీరామకృష్ణుల బోధనలోని గంభీరార్థం
ఇంతలో గోహత్యాపాతకం బ్రాహ్మణుడి దేహంలో ప్రవేశింప వచ్చింది, కాని అతడి మనస్సు దాన్ని పారద్రోలింది. అతడు ఇలా అన్నాడు: “వెళ్ళిపో, నీ కిక్కడ స్థానం లేదు; గోహత్యను చేసింది ఇంద్రుడు! వెళ్ళి ఆయననే పట్టుకో.” అప్పుడు ఆ పాతకం ఇంద్రుణ్ణి పట్టుకోవడానికి వెళ్ళింది. అప్పుడు ఇంద్రుడు ఆ పాతకంతో, “కాస్త ఆగు. నేను వెళ్ళి బ్రాహ్మణుడితో మాట్లాడి తిరిగి వస్తాను. అప్పుడు కావాలంటే నన్ను పట్టుకుందువుగాని” అని అన్నాడు. ఇలా అంటూ ఇంద్రుడు మానవరూపం దాల్చి బ్రాహ్మణుడి తోటలోకి వెళ్ళాడు. మొక్కలను, చెట్ల ప్రక్క నిలబడి వాటిని పరికిస్తూన్న ఆ బ్రాహ్మణుణ్ణి, ఇంద్రుడు చూశాడు. బ్రాహ్మణుడికి వినబడేట్లుగా ఇంద్రుడు ఆ తోట అందాన్ని తెగ పొగుడుతూ, అతణ్ణి సమీపించి, “ఆహా! ఎంత అందమైన తోట! మొక్కలు చెట్లు సముచిత స్థానాలలో నాటబడి తోట యజమాని చక్కని అభిరుచిని చెప్పక చెబుతున్నాయి” అని అన్నాడు. పిదప ఆ బ్రాహ్మణుణ్ణి ఉద్దేశించి, “మహాశయా! ఈ తోట ఎవరిదో చెప్పగలరా? ఆ మొక్కలను చెట్లను ఇంత అందంగా, పొందికగా ఎవరు నాటారు?” అని అడిగాడు. తన తోటను అలా ప్రశంసించడంతో ఆ బ్రాహ్మణుడు సంతోషంతో తబ్బిబ్బిపోయి, “అయ్యా, ఈ తోట నాదేనండి; ఈ మొక్కలనన్నిటిని నేనే నాటానండి. రండి, తోటంతా తిరిగి చూద్దురుగాని” అని అన్నాడు. తోట గురించి అనేక విషయాలు ముచ్చటిస్తూ ఆత్మస్తుతి చేసుకొంటూ ఇంద్రుడికి తోటంతా తిప్పి చూపుతూ, ఆవు చచ్చిపడివున్న చోటుకు పొరపాటున వచ్చాడు. ఇంద్రుడు అక్కడ చచ్చిపడివున్న ఆవును చూసి ఉలిక్కిపడినట్లు నటిస్తూ, “రామరామ! ఈ గోహత్యను చేసిన వాడెవడు?” అని అడిగాడు. అప్పటిదాకా తోటకు చెందిన అన్ని విషయాలలోను, ‘ఇది నేనే చేశాను’, ‘నేనే స్వయంగా దీన్ని నాటాను’ అని చెప్పుకొంటూ వచ్చిన ఆ బ్రాహ్మణుడు, ఆ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తెలియక మౌనం వహించాడు. ఇంద్రుడప్పుడు స్వీయరూపాన్ని దాల్చి, బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు: “ఓరీ నయవంచకా! ఈ గోహత్యాపాతకం మాత్రం నాకు వర్తిస్తుంది. అంతేనా? ఇదుగో నీ గోహత్యాపాతకం. దాన్ని అందుకో.” ఇలా అంటూ ఇంద్రుడు అంతర్ధానమయ్యాడు; గోహత్యాపాతకం బ్రాహ్మణుడి శరీరాన్ని ఆవహించింది.
19. యుక్త సమయంలో అవగాహన కలుగుతుంది
ఇక ‘ముక్త్యారునామా’ విషయం ఆపి, ప్రధాన విషయంలోకి వద్దాం. శ్రీరామకృష్ణుల భక్తులను ఎవరినైనా అడిగినప్పుడు వారు నిస్సంకోచంగా వారి వచనాలను మొదట కొద్దిగా అర్థంచేసుకోగలిగాం. ‘కాలం గడిచేకొద్దీ ఆయన అనుగ్రహంతో, ఆయన వచనాల ప్రగాఢఅర్థాన్ని మేం తెలుసుకోగలుగుతున్నాం’ అని ప్రకటిస్తారు. శ్రీరామకృష్ణుల వ్యక్తిత్వానికి ముగ్ధులమై వారి వచనాలను, చర్యలను కేవలం విన్నప్పుడు లేక చూసినప్పుడు అవి మాకు స్పష్టమైన అర్థాన్ని స్ఫురింప చేయలేదు. కాని ఇప్పుడు వాటిలో ఇమిడివున్న అద్భుత భావాలు కనుగొని ఆశ్చర్యపోతున్నాం. ఆయన ఇలా అనేవారు: “నాయనలారా! మీరు సరైన సమయంలో సాధిస్తారు, యుక్తకాలంలో మీకు అవగతమౌతుంది. విత్తనం నాటిన వెంటనే ఫలం లభిస్తుందా? మొదట అంకురం, పిదప మొలక, తదనంతరం మొక్కగా ఎదుగుతుంది; ఆ తరువాత పువ్వులు పూస్తుంది, చివరకు పళ్ళను కాస్తుంది; అది పద్ధతి. పట్టువిడువక నిరంతరం శ్రమించాలి. ఈ పాట ఏ భావాన్ని తెలుపుతున్నదో వినండి.” ఇలా అంటూ సుమధుర కంఠంతో శ్రీరామకృష్ణులు ఈ క్రింది పాటను పాడేవారు:
హరిషే లాగి రహో రే భాయి
తేరా బనత్ బనత్ బనిజాయ్ – తేరా బిగడ్ బాత్ బనిజాయ్
అంకా తారే బంకా తారే తారే సుజన్ కసాయీ
(జౌర్) శుగా పడాయకే గణికా తారే, తారే మీరాబాయి
దౌలత్ దునియా మాల్ ఖజానా, బేనియా బియేల్ చలాయీ
(ఔర్) ఏక్ బాత్కో డాణ్టో పడే తో ఖోజ్ ఖబర్ నా పాయీ
అయిసీ భక్తి కర్ ఘట్ భీతర్, ఛోడ్ కపట చతురాయీ
సేవా వన్ది ఔర్ అధీనతా సహజ్ మిలి రఘురాయీ.
భావం: సోదరా! భగవంతుని ఆశ్రయించు సంతోషంతో సాధన చేస్తూపో సరైన సమయంలో సిద్ధిని పొందగలవు
తప్పులన్నీ క్రమంగా ఒప్పులౌతాయిలే
అంకా తరించాడు బంకా తరించాడు
కసాయి సుజన్కూడా తరించాడు
చిలుకకు మాటలు నేర్పి వేశ్య తరించింది
మీరాబాయి కూడ తరించింది
ప్రపంచంలోని సంపదలన్నీ తనవైనా
వర్తకుడు ఇంకా ఎడ్లబండిని తోలుతూనే ఉంటాడు
కాని తప్పని ఆ చివరిక్షణం వచ్చినప్పుడు
అవన్నీ ఎక్కడ మాయమౌతవో ఎవరికీ తెలియదు
కనుక కాపట్యాన్ని, జిత్తులమారితనాన్ని వీడు
ఈ హృదయం లోపల ప్రగాఢభక్తిని సంపాదించుకో
భక్తుల సేవ, భగవంతునికి వందనం, శరణాగతి
ఈ సద్గుణాలుంటే రఘునాథుడు అతి సులభంగా లభిస్తాడు.
20. పట్టువిడువని సాధనానుష్ఠాన ఆవశ్యకత
ఈ పాట పాడిన తరువాత ఆయన ఇలా అనేవారు: “భగవత్సేవ, ఆరాధన, శరణాగతి – అంటే వినమ్రత; వీటిని విశ్వసించి అవలంబిస్తే సమస్తం లభిస్తుంది; భగవత్సాక్షాత్కారం కలగడం తథ్యం. కాని వాటిని వదలిపెడితే పురోగతి ఆగిపోతుంది. ఒకప్పుడొక వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఎంతో శ్రమపడి కాస్తకాస్తగా డబ్బు పొదుపుచేయసాగాడు. ఇలా ఉండగా ఒక రోజు లెక్కపెట్టగా చూస్తే, వెయ్యి రూపాయలు పొదుపు చేసినట్లు తెలియవచ్చింది. వెంటనే సంతోషాతిశయంతో భుజాలు ఎగురవేస్తూ ఇలా అనుకొన్నాడు: ‘ఇక మీదట ఉద్యోగం చేయాల్సిన అగత్యం నాకేముంది? ఇప్పటికే వెయ్యి రూపాయల నిల్వ ఉందికదా! ఇంకా అవసరం ఏముంటుంది?’ ఇలా భావించి అతడు ఉద్యోగం వదలిపెట్టాడు. అల్ప మనిషి, అల్ప లక్ష్యం! ఆ కొద్ది మొత్తానికే తబ్బిబ్బయిపోయి అతడికి కళ్ళు నెత్తికెక్కాయి. కాని వెయ్యి రూపాయలు ఖర్చు కావడానికి ఎంత సమయం పడుతుంది! కళ్ళుమూసి తెరిచేలోపుగా ఆ మొత్తం ఖర్చయిపోయింది. మళ్ళీ గడ్డురోజుల్లో పడ్డాడు; కార్యాలయ అధికారుల కాళ్ళావేళ్ళాపడసాగాడు. కనుక ప్రయత్నం వదలిపెట్టడం సబబు కాదు. ఆయన (భగవంతుడి) వాకిలి వద్ద సహనంతో వేచివుండాలి. అలా సిద్ధపడి చేయగలిగినప్పుడు మాత్రమే విజయం ప్రాప్తించుకోవచ్చు.”
21. మందభక్తిని వీడు!
మళ్ళీ ఒక్కోసారి, “తేరా బనత్ బనత్ బనిజాయ్ – అంటే క్రమేపి సాధనలు చేసుకొంటూ పోతే ఎప్పుడో అప్పుడు సిద్ధిని పొందుతావు’ అనే చరణం పాడుతూ, హఠాత్తుగా, “ఛీ! ఛీ! ధూర్తుడా! ఎప్పుడో సిద్ధిని పొందుతావా? అటువంటి మందభక్తి కలిగి ఉండకూడదు. ఆత్మ విశ్వాసంతో మనస్సును పటిష్టం చేసి ఇప్పుడే సాక్షాత్కారం పొందాలి. ఈ క్షణంలోనే ఆయనను నేను దర్శించుకోవాలి. హృదయపూర్వకత కొరవడిన భక్తి భగవత్సాక్షాత్కారానికి దోహదం చేయగలదా?”
22. శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక భావనలకు అనుగుణంగా వారి శారీరక మార్పులు
శ్రీరామకృష్ణులను తేరిపారచూసినప్పుడల్లా ఆయన ఆధ్యాత్మిక భావనల మూర్తి అని మాకు అనిపించేది; ఆధ్యాత్మిక భావనలన్నీ ఆయనలో సంఘటితమై ఆకృతిని సంతరించు కొన్నాయని భావించేవారం. మానసిక భావనల మార్పుకు అనుగుణంగా ఏకకాలంలో శారీరక మార్పులు కలుగుతాయని మనం ఊరకే చెప్పుకోవడం కద్దు; కాని నిజానికి అటువంటి పరివర్తనను కళ్ళారా చూడడం ఎంతో అరుదు – ఎప్పుడో కాని అట్టి అసాధారణ ఘటన తారసపడదు. కాని మనస్సులో ప్రచండ భావతరంగాలు చెలరేగినప్పుడు శరీరంలో ఎంతో మార్పును (శ్రీరామకృష్ణుల విషయంలో మాదిరి,) తీసుకు వస్తాయనే విషయం కలలో సైతం ఊహించుకోలేం. నిర్వికల్పసమాధి స్థితిలో ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులలో ‘నేను’ అనే ఎరుక పూర్తిగా అదృశ్యమయ్యేది. ఏకకాలంలో ఆయన నాడి, హృదయ స్పందన ఇత్యాదులు ఆగిపోయేవి. శ్రీ మహేంద్రలాల్ సర్కార్ తదితర వైద్యులు వైద్య పరికరాల సహాయంతో ఆయనను పరీక్షించి గుండె స్పందన సూచనలు ఏవీ కానరాకపోవడం కనుగొన్నారు.* ఆ పరీక్షతో తృప్తిచెందని మహేంద్రలాల్ సర్కార్ వైద్య మిత్రుడొకడు శ్రీరామకృష్ణుల కంటిగ్రుడ్డును తన వేలితో స్పృశించి చూశాడు. మరణించిన వ్యక్తిలో మాదిరి అది మొద్దుబారి ఉండడం గమనించాడు. ‘సఖీభావ’ సాధన అనుష్ఠిస్తూ ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు సదా తనను శ్రీకృష్ణుని చెలికత్తెలలో ఒకతెగా భావిస్తూ, ఆ భావనలో తాదాత్మ్యం చెంది ఉండేవారు. అప్పుడు ఆయనలో స్త్రీ ప్రవర్తన, స్త్రీలు నిలబడే, నడిచే, కూర్చునే, మాట్లాడే తీరుతెన్నులు స్వాభావికంగా అభివ్యక్తం అయ్యేవి. నిరంతరం ఆయనతో కలసిమెలసి ఉండే శ్రీ మథురనాథ్ తదితరులు అనేక సందర్భాలలో ఆయనను అతిథిగా వచ్చిన స్త్రీగా పొరబడ్డారు.* ఇటువంటి అనేక సంఘటనలను మేం కళ్ళారా చూశాం, ఆయన ముఖతా విన్నాం కూడ; దాదాపుగా నిర్ధారణ గావింపబడ్డ ఆధునిక మనస్తత్వశాస్త్ర, శరీర ధర్మశాస్త్ర నియమాలు పునః ప్రతిపాదింపబడవలసి ఉన్నవేమో! ప్రజలకు ఈ సంఘటనలను గురించి తెలిపితే, వాటిని వారు నమ్మగలరా?
23. సర్వులలోని సమస్త భావాలను గ్రహించగల శ్రీరామకృష్ణుల శక్తి
కాని అన్నిటికంటే శ్రీరామకృష్ణులలో కొట్టొచ్చినట్లు మాకు కనిపించే విషయం – భావరాజ్యంలో సర్వత్రా యథేచ్ఛగా విహరించే ఆయన శక్తి! పిన్నలలో పెద్దలలో, సన్న్యాసులలో గృహస్థులలో, భక్తులలో, వేదాంతులలో, స్త్రీలలో, పురుషులలో – ఇలా ప్రతి ఒక్కరిలోని గొప్ప, స్వల్ప భావాలను అవగతం చేసుకొనే శక్తిసమన్వితులాయన! ప్రతి ఆధ్యాత్మిక సాధకుని అంతరంగ భావాలను అవగాహన చేసుకొనే శక్తి ఆయనకు ఉంది. ఆధ్యాత్మిక రాజ్యంలో ఆ సాధకుని పురోగతి, అతడు ఎంచుకొన్న సాధనాపథం, అతడి పురోగమనానికి ప్రస్తుత ఆవశ్యకతలు తెలుసుకొనే శక్తి సమర్థులాయన. సాధకునికి సానుకూలమైన అనుష్ఠానమార్గం నిర్దేశించే ఆయన అద్భుతశక్తి గణనీయమైనది. ఈ విషయాలను గురించి మేం గాఢంగా తరచి చూసినప్పుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలపు యావత్తు భావాలనూ మినహాయింపులేక ఆయన తన జీవితంలో అప్పటికే అనుభూతి చేసుకొన్నారని మాకు అనిపించేది. ప్రతి భావ ప్రాదుర్భావం నుండి అది కనుమరుగయ్యే కాలంవరకు దాని యావత్తు చరిత్ర వివరాలు ఆయన జ్ఞప్తిలో ఉన్నవనడం అతిశయోక్తి కాబోదు. ఈ కారణం చేతనే కాబోలు ఎవరైనా ఆయనతో తన మానసిక అవస్థను గురించి చెప్పినప్పుడు, అతడి స్థితిని గ్రహించి దానిని తన మదిలో నిల్వచేసిన అనుభవాలతో పోల్చిచూసి, అప్పటికప్పుడే ఆ వ్యక్తికి సముచిత విధానాన్ని తెలిపేవారు. ప్రతి విషయంలోనూ ఆయన ఈ నియమాన్ని పాటించేవారు. తీవ్ర లౌకిక అనురక్తి, సాంసారిక సంక్షోభం, పరిత్యాగానికి ప్రతికూలమైన భావం లేక ఉద్వేగం సదా మెదలుతూ ఉండే స్థితి ఇత్యాదులు ప్రతిఘటించినప్పుడు, దారితెన్ను కానరాక ఎవరైనా జిజ్ఞాసువు వినమ్రంగా ఆయన వద్దకు వస్తే ఆయన ఆ వ్యక్తికి సముచిత విధానాన్ని నిర్దేశించేవారు. అంతేగాక అటువంటి పరిస్థితులలో తన స్వీయ అనుభవాలను తెలిపి ఆ వ్యక్తిలో ఉత్తేజం పాదుగొలిపేవారు. “నాయనా! అప్పుడు ఫలానా ఫలానా సంఘటన జరిగింది, నేను ఫలానా ఫలానా విధానాన్ని పాటించాను” అని ఆయన చెప్పేవారు. శ్రీరామకృష్ణులు అలా చెప్పాక ఆ జిజ్ఞాసువు మనస్సు ఎంతటి ఆశతో నిండిపోయేదో, అతడు ఎంతటి విశ్వాసంతో పట్టుదలతో ఆయన నిర్దేశించిన పథంలో పురోగమించాడో ఇక్కడ ప్రస్తావించడం అనావశ్యకం. అంతేకాదు; శ్రీరామకృష్ణులు తమ ఆంతరిక రహస్యాలను అతడితో చెప్పడంతో, ఆయనకు అతడిపట్ల ఉన్న అత్యంత ప్రేమ ఆ వ్యక్తికి అనుభూతమయ్యేది. ఒకటి రెండు దృష్టాంతాలు పై విషయాన్ని స్పష్టీకరిస్తాయి.
24. మొదటి దృష్టాంతం: మణిమోహన్ పుత్రశోక ఉదంతం
కలకత్తాలోని సిందూరియాపాటి వాస్తవ్యుడైన మణిమోహన్ మల్లిక్ కుమారుడు వృద్ధిలోకి వస్తున్నవాడు మరణించాడు. కుమారుని దహన సంస్కార విధులన్నీ నిర్వర్తించగానే తిన్నగా అతడు శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చాడు. ఆయనకు నమస్కరించి, దుఃఖభారంతో గదిలో ఒక మూలగా కూర్చున్నాడు. అప్పుడు ఆ గదిలో జిజ్ఞాసువులైన పలువురు భక్తులు, సత్యాన్వేషకులు, స్త్రీలు పురుషులు కూర్చుని ఉన్నారు; శ్రీరామకృష్ణులు వారితో వివిధ ఆధ్యాత్మిక అంశాల గురించి మాట్లాడుతున్నారు. మణిమోహన్ కూర్చున్న కాస్సేపటికే శ్రీరామకృష్ణుల దృష్టి అతడిమీద పడింది. తల ఊపి, “మంచిది, ఈ రోజు ఎందుకు అంత విచారంగా కనిపిస్తున్నావు?” అని ఆయన అడిగారు. గద్గద స్వరంలో మణిమోహన్, “(తన కుమారుడి పేరు చెప్పి) ఈ రోజు అతడు మరణించాడు” అని జవాబు చెప్పాడు. బడలికచే నీరసపడిన అతడి ఆకృతిని చూసి, గద్గదమైన అతడి కంఠస్వరం విని ఆ గదిలో ప్రతి ఒక్కరూ నోట మాటరాక, మూగవోయారు. మణిమోహన్ హృదయాన్ని కుదిపివేస్తున్న బాధ, మానసిక వ్యధ కేవలం ఊరడింపు మాటలతో చల్లారవని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఐనప్పటికీ వాళ్ళు అతణ్ణి ఈ విధంగా ఊరడింప ప్రయత్నించారు: ‘సంసారం మూడు నాళ్ళ ముచ్చట. ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరూ మరణించ వలసినవారే కదా! ఎంతగా విలపించినా పోయినవాళ్ళు మళ్ళీ తిరిగివస్తారా! కనుక దుఃఖం వీడి, సహనం వహించు.’ సృష్ట్యాదినుండి శోకసంతప్తులైన స్త్రీ పురుషులను ఇటువంటి వచనాలతోనే ఊరడిస్తూ వస్తూన్నారు. కాని అటువంటి ఊరడింపు వచనాలతో ఎందరి హృదయాలు స్థిమితపడ్డాయి! ఎలా స్థిమితపడతాయి? మనోవాక్కాయ కర్మలు మూడు ఏకీకృతమైనప్పుడే కదా మన సాంత్వన వచనాలు ఇతరుల హృదయాలను స్పృశించి అక్కడ అదే రకమైన భావనలను ఉత్పన్నం చేయగలవు? కాని అటువంటి సుగుణం మనలో పూర్తిగా కొరవడిందే! ‘సంసారం అనిత్య’ మని వక్కాణిస్తున్నా, మన ప్రతీ ఆలోచన, చేసే ప్రతీ పని ఆ భావనకు తద్విరుద్ధమైనదే; సంసారాన్ని ఒక పీడకలగా పరిగణించమని మనం ఇతరులకు ఒక వంక ఉపదేశిస్తూ, మరోవంక మన హృదయాంతరాళాల్లో సంసారాన్ని నిత్యమైనదిగా ఎంచి, కలకాలం ఇక్కడే జీవింప ఏర్పాట్లు చేసుకొంటాం. అలాంటప్పుడు మన మాటలు ఎలా శక్తిమంతాలవుతాయి?
అలా అందరూ మణిమోహన్‌ను అలవాటయిన ఓదార్పు వచనాలతో ముంచెత్తుతూ ఉన్నా, శ్రీరామకృష్ణులు మాత్రం చాలాసేపటి వరకు అతడి శోకాలాపాలను మౌనంగా వింటూ కూర్చుండిపోయారు. ఆయన ఆ ఉదాసీన వైఖరిని చూసి, ‘ఈయన ఎంత కాఠిన్య హృదయులు, కరుణాశూన్యులు’ అని తలపోస్తూ, వాళ్ళు ఆశ్చర్యపోయారు.
ఆ వృద్ధుడి మాటలు వింటూ క్రమేణా శ్రీరామకృష్ణులు అర్ధబాహ్య సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. హఠాత్తుగా ఆయన మల్లవీరుని భంగిమలో తన కుడి అరచేతితో ఎడమ భుజాన్ని చరచుకొని, లేచి నిలబడి గంభీరంగా మణిమోహన్ని ఉద్దేశిస్తూ పాటపాడ నారంభించారు:
జీవ్ సాజ్ సమరే, ఎదేఖో రణబేశే కాల్ ప్రబేశే తోర్ఘరే ।
అరోహణగీ కరి మహాపుణ్య రథే, భజన్ సాధన్ దూటీ అశ్వ్ జుడే తాతే
దియే జ్ఞాన్ ధనుకే టాన్, భక్తి బ్రహ్మకూరా సంయోగ్ రే ।
ఆర్ ఏక్ యుక్తి ఆఛే సునో సుసంగతి, సబ్ శత్రు నాశేర్ చాయినే రథరథీ ।
రణభూమీ జది కొరేన్ దాశరథి* భాగీరథీర్ తీరే ॥
భావం:
జీవుడా! యుద్ధానికి సంసిద్ధుడవవు
అదుగో చూడు, యుద్ధ విన్యాసంలో మృత్యువు నీ ఇంట (దేహంలో) ప్రవేశిస్తూన్నదో
సాధన, భజనలనే రెండు గుర్రాలను పూన్చి
మహాపుణ్య మనే రథాన్ని అధిరోహించి
జ్ఞానమనే వింటికి భక్తి అనే బ్రహ్మాస్త్రాన్ని సంధించు (మృత్యువనే శత్రువు నెదుర్కో) కాకుంటే రథం, రథి – ఏవీ లేకున్నా శత్రువులనందరినీ నిర్జించే ఉపాయం మరొకటి ఉంది, విను గంగాతీరాన్నే* దాశరథి యుద్ధరంగంగా చేసుకోవడమే (ఆ ఉపాయం).
మహోద్ధతిని సూచించే ఆ పాట రాగం, అందుకు అనుగుణమైన అంగ భంగిమలు, శ్రీరామకృష్ణుల కళ్ళు ప్రసరించిన వీరోచిత వైరాగ్య స్ఫురిత దృక్కులు కలగలసి అప్పుడు ఆ గదిలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలోను అద్భుత శక్తిని, ఆశాభావాన్ని ఉత్పన్నం చేశాయి. ప్రతి ఒక్కరి హృదయం భ్రాంతి దుఃఖాల ఆవరణం నుండి పైకెగసి విమల దివ్యానందంతో నిండిపోయింది; ఆ దివ్యానందం ఇంద్రియాతీతం, సంసారాతీతం అయినది. మణిమోహన్ సైతం ఆ దివ్యానందాన్ని చవిచూశాడు; మానసిక వ్యథ, దుఃఖాలను మరచిపోగలిగాడు. పరిపూర్ణ శాంతితో, గంభీరముద్రతో స్థిమితపడ్డాడు.
పాట పూర్తయింది. కాని ఆ చిరుపాటతో శ్రీరామకృష్ణులు ఉత్పన్నం చేసిన దివ్యభావతరంగాలు ఆ గదిని చాలాసేపటి వరకు నింపివేశాయి; అందరూ వాటి ఉనికిని అనుభూతం చేసుకొన్నారు. ‘భగవంతు డొక్కడే మన సొంతం; మన హృదయాలను, జీవితాలను ఆయనకే అర్పిద్దాం. మన పట్ల కరుణ వహించి ఆయన మనకు దర్శనం ఇస్తాడుగాక!’ అనే దివ్యభావనలో తన్మయులై ఆ గది లోని వారంతా నిశ్చల స్థితిలో ఉండిపోయారు. కాస్సేపటికి శ్రీరామకృష్ణులు సమాధిస్థితి నుండి బాహ్యస్మృతిలోకి వచ్చి, మణిమోహన్ చెంత కూర్చుని ఇలా పలుకసాగారు: “ఆహా! పుత్రశోకంతో సమానమైన దహించివేసే బాధ మరొకటి ఈ లోకంలో ఉందా? ఈ ఒర (దేహం) నుండి జన్మించినవాడు పుత్రుడు; అంతే కదా! కాబట్టి ఈ దేహం ఎంతకాలం నిలిచివుంటుందో అంతవరకు అతడి తోడి సంబంధం ఉండనే ఉంటుంది.” ఇలా అంటూ శ్రీరామకృష్ణులు, మణిమోహన్కు ఒక ఉదాహరణగా అక్షయ్ మరణం గురించి మనస్సును కదలించివేసే తీరులో వివరించసాగారు. అక్షయ్ మరణ దృశ్యాన్ని ఆయన ప్రత్యక్షీకరించుకొంటున్నట్లుగా అప్పుడు కనిపించారు. పిదప ఆయన ఇలా అన్నారు: “అక్షయ్ మరణించాడు. అప్పుడు నా కేమీ అనిపించలేదు. మనిషి ఎలా మరణిస్తాడో నేను నిలబడివుండి చూశాను. ఒరలో ఉంచిన కత్తిని బయటకు లాగినట్లుగా నేను గాంచాను. కత్తిలో ఎలాటి మార్పూ లేదు. ఉన్నది ఉన్నట్లే ఉండిపోయింది; ఒర క్రింద పడివుంది. దాన్ని చూసి నా కెంతో ఆనందంవేసింది. నేను నవ్వాను, పాడాను, నాట్యం చేశాను. తరువాత వాళ్ళు ఆ దేహాన్ని దహనం చేసి తిరిగివచ్చారు. మర్నాడు నేను అక్కడ (తమ గదికి తూర్పుగా కాళికాలయ ప్రాంగణం వైపుగా ఉన్న వసారాను చూపుతూ) నిలబడి ఉన్నాను. అప్పుడు నాకు ఏం అనిపించిందో తెలుసా? తడిబట్టను పిండుతూన్నట్లు నా హృదయాన్ని ఎవరో మెలిపెట్టి పిండుతున్నట్లు అనిపించింది. అక్షయ్ మరణంతో నా కంతటి భరించరాని బాధ కలిగింది. అప్పుడు ఇలా అనుకొన్నాను: “అమ్మా, దీనికి (తమ దేహానికి) కట్టుబట్టతోసైతం ఎలాటి సంబంధమూ లేదే; అలాంటప్పుడు అన్నగారి కుమారుడితో ఏం సంబంధం పెనగొని ఉంటుంది? అయినా దీనికే (తమకు) ఇంతటి బాధ కలుగుతున్నప్పుడు ఇక గృహస్థులు ఎంతటి మనోవ్యధ అనుభవిస్తారో కదా! అమ్మా! వారు పడే బాధను నా కిలా తెలియజేస్తున్నావా?”
కాస్సేపయ్యాక శ్రీరామకృష్ణులు కొనసాగించారు: “కాని ఒక విషయం నీకు తెలుసా? ఎవరైతే ఆయన (భగవంతుణ్ణి) శరణు వేడుతారో వారు ఇట్టి భరింపరాని దుఃఖంలో పూర్తిగా మునిగిపోరు. కొన్ని ఎదురుదెబ్బలు తగిలినా తిరిగి నిలకడ స్థితిని పొందుతారు. అల్పశక్తి ఉన్నవారు మాత్రం చిన్నతెప్పల్లా, అదుపుతప్పి తలక్రిందులై పూర్తిగా మునిగిపోతారు. గంగానదిలో స్టీమర్ పోతున్నప్పుడు వాటి ప్రక్కనున్న చేపలుపట్టే చిన్న పడవల గతిని నువ్వు గమనించలేదా? అవి అదుపుతప్పి కనుమరుగు కావడమూ, కొన్ని సందర్భాలలో నదిలో మునిగిపోవడమూ కద్దు. కాని వేలకొద్దీ మణుగుల బరువు సరకులను మోసుకుపోయే ఓడలకు కుదుపులు ఏర్పడ్డా, అవి వాటిని తట్టుకోగలవు. కాని అవి సైతం ఒకటి రెండు పర్యాయాలు అల్లల్లాడవలసే ఉంటుంది.”
ఆ విషాదభరిత వాతావరణం అలా కాస్సేపు గడిచాక మళ్ళీ శ్రీరామకృష్ణులు కొనసాగించారు: “సంసారంలో వీరందరితోటి (భార్య బిడ్డలు మొదలైనవారితో) బాంధవ్యం ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది? సుఖీంచాలనే కోర్కెతో మనిషి సంసారంలో ప్రవేశిస్తాడు; వివాహం చేసుకొంటాడు, కుమారుణ్ణి కంటాడు; కుమారుడు పెరిగి పెద్దవాడవుతాడు; కుమారుడికి వివాహం జరిపిస్తాడు; ఆ రకంగా కొన్నిరోజులు ఆహ్లాదంగా గడచిపోతాయి. తదనంతరం ఒకడు రోగగ్రస్తుడవుతాడు, మరొకడు మరణిస్తాడు, ఇంకొకడు భ్రష్టుడవుతాడు; ఇటువంటి క్లేశాలు, ఆరాటాలతో మనిషి సతమతమౌతాడు. నిరాశానిస్పృహలు అధికరించేకొద్దీ విలాపాలు తీవ్రస్థాయిని చేరుతాయి. మిఠాయిలు తయారుచేసే వాడి పొయ్యిలో పచ్చికట్టెలు ఎలా మండుతాయో నువ్వు గమనించలేదా? మొదట అవి చక్కగా మండుతాయి. తరువాత కట్టెలు మండేకొద్దీ లోనున్న తేమంతా వాటి వెనుక భాగానికి స్రవిస్తుంది. తదనంతరం నురుగులా రూపొంది, బుడగలై పగిలి చుయ్మనే శబ్దం వినవస్తుంది. ఈ సంసారమూ అటువంటిదే.” ఆయన ఈ విధంగా సంసారపు అనిత్యత్వం, సారహీనత్వం, భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించుకోవడం మాత్రమే సుఖ కారణమనే వివిధ అంశాలను ప్రస్తావిస్తూ మణిమోహన్‌ను ఓదార్చసాగారు. కాస్సేపటికి మణిమోహన్ తేరుకొన్నాడు. పిదప, “ఇందుకే కదా మీ వద్దకు పరుగెత్తుకొని వచ్చాను. ఈ క్లేశాగ్నిని మరెవరూ చల్లార్చలేరని తెలిసే ఇక్కడకు వచ్చాను” అని అన్నాడు.
మేం అప్పుడు శ్రీరామకృష్ణుల అసాధారణ ప్రవర్తన చూసి ఆశ్చర్యచకితులమై ఇలా అనుకొన్నాం: “కఠిన హృదయులూ, ఉదాసీనులూ అని కాస్సేపటి క్రితం మేం భావించింది వీరిని గురించేనా? నిజమైన మహాపురుషుల చిన్నచిన్న పనులు సైతం జనసామాన్యం రీతిలో ఉండవు. ప్రతి చిన్న పెద్ద కార్యంలోను ఆయన మహత్వం వెల్లడవుతుంది. కాస్సేపటి క్రితం సమాధిమగ్నులై భగవత్సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఎవరి హృదయ స్పందన ఆగిపోయిందో, వీరేనా వారు? మణిమోహన్ దుఃఖాన్ని చూసి సానుభూతి వహించి సామాన్యునిలా వ్యవహరించిన అదే వ్యక్తి వీరేనా? ఇదంతా కేవలం భ్రాంతి అనే వచనాలతో ఆ వృద్ధుని పలుకులన్నీ కొట్టిపారేసి ఉండగలిగేవారు; అలా చేసే శక్తి ఆయనకు లేదని కాదు. తమ మహత్వాన్ని ఆయన అలా ప్రకటించివుంటే, వారు గొప్ప ఆధ్యాత్మిక గురువో లేక మరేదో అయివుండవచ్చు కాని కచ్చితంగా ఈ ప్రపంచానికి చెందినవారు కారని మాత్రం భావించేవారం; సామాన్యుల మానసికావస్థలను గ్రహించే శక్తి వీరికి లేదనుకొనేవారం. పైగా, ‘భార్యాబిడ్డల పట్ల అనురక్తి కారణంగా మనలాంటి దుర్బలులు నిస్సహాయ పరిస్థితిలో పడే రీతిలో, వీరు కనుక కేవలం ఒక్కసారి నిస్సహాయ స్థితిలో పడివుంటే ‘మాయ లీల’ పట్ల ఎలా ఉదాసీన వైఖరి వహించేవారో మేం చూసివుండేవారం’ అని అనేవాళ్ళం.”
25. రెండవ ఉదాహరణ: కామాన్ని జయించడంపై శ్రీరామకృష్ణులు
బహుశా మరుక్షణమే ఒక యువకుడు కుంగిపోయి వచ్చి, “మహాశయా, కామం నుండి విముక్తి ఎలా లభిస్తుంది? మోహాలు, చెడు తలంపులు చెలరేగి నా మనస్సును కలచివేసి నన్ను వ్యాకులపరుస్తున్నాయి” అని అడిగాడు. శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “ఆహా! భగవత్సాక్షాత్కారం కలిగే వరకు కామం పూర్తిగా నశించదు. భగవద్దర్శనానంతరం కూడ దేహం ఉన్నంతవరకు కించిత్తు ఉండనే ఉంటుంది; కాని అది తల ఎత్తలేదు. నేను సైతం కామం నుండి పూర్తిగా విముక్తుడనయ్యానని నువ్వు తలుస్తున్నావా? ఒకసారి, కామాన్ని జయించాననే భావన నాలో మెదలింది. పిదప పంచవటి క్రింద కూర్చుని ఉండగా, నేను అణచుకోలేనేమో అన్నంత కామోద్రేకం నన్ను ముంచెత్తివేసింది. నేను విలపించాను; నేలపై నా ముఖాన్ని రుద్దుతూ, “అమ్మా! నేనొక ఘోరాపరాధం చేశాను. కామాన్ని జయించాననే భావనను మళ్ళీ ఎన్నడూ మదిలోకి రానివ్వను” అని అమ్మకు చెప్పుకున్నాను. ఆ తరువాత కామం మటు మాయమైంది. నీకు తెలుసా, నువ్విప్పుడు యౌవన ప్రవాహపు పోటులో ఉన్నావు. అందుచేతనే దాన్ని అరికట్టలేకపోతున్నావు. పోటు ఏర్పడినప్పుడు గట్టును లక్షిస్తుందా? అది పొంగిపొర్లి గట్టును తెంచుకొని తీవ్రగతితో ముందుకు ఉరుకుతుంది తరువాత వరిచేలలో వెదురుబొంగు లోతున నీళ్ళు నిలబడిపోతాయి. కాని కలికాలంలో మానసిక పాపం, పాపం క్రిందికి రాదంటారు. అవాంఛనీయ భావన మదిలో ఒకటి రెండుసార్లు తలెత్తినంత మాత్రాన, దాన్ని గురించి నువ్వెందుకు బాధపడాలి? అవి శరీర విధులుగా వస్తూపోతూ ఉంటాయి. మల మూత్రాదుల వంటివే అని వాటిని గురించి భావించుకోవాలి. మలమూత్రాదుల వంటి దేహవిధులు నిర్వర్తింపబడినప్పుడు జనులు బాధపడతారా? అదే విధంగా ఈ కామ భావనలను అల్పమైనవిగా, నిరర్థకమైనవిగా ఎంచి, వాటిని పట్టించుకోకూడదు. అంతేకాక, హృదయ పూర్వకంగా భగవంతుణ్ణి ప్రార్థించు, సదా హరినామాన్ని జపించు, ఆయనను ధ్యానించు. అవి వస్తూపోతూవున్నా వాటిని లక్షించవద్దు. మెల్లగా అవి అదుపులోకి వస్తాయి.” తానే యువకుడై, మరో యువకునితో మాట్లాడుతున్నారేమో అనిపించింది.
26. మూడవ ఉదాహరణ: పై విషయంలో యోగానందస్వామికి శ్రీరామకృష్ణుల ఉపదేశం
ఈ సందర్భంలో యోగానందస్వామి విషయం మాకు జ్ఞాపకం వస్తున్నది. కామాన్ని జయించినట్లుగా మాకు తెలిసిన అరుదైన వ్యక్తులలో యోగానందస్వామి ఒకరు. ఒకరోజు అతడు అదే ప్రశ్నను దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులను అడిగాడు. అప్పుడతడి వయస్సు బహుశా పద్నాలుగు లేక పదిహేనేళ్ళు ఉండవచ్చు. కొద్ది కాలం క్రితంనుండే అతడు శ్రీరామకృష్ణుల దర్శనార్థం వస్తున్నాడు. ఆ సమయంలో నారాయణ అనే హఠయోగి ఒకడు దక్షిణేశ్వరంలోని పంచవటి క్రింద ఒక కుటీరంలో నివసిస్తూ నేతి, ధౌతి* హఠయౌగిక ప్రక్రియలు ప్రదర్శిస్తూ చూపరుల ఉత్సుకతను ఆకర్షించసాగాడు. ఆ చూపరులలో తానుకూడ ఒకడినని, హఠయోగి ప్రదర్శిస్తున్న ఆ ప్రక్రియలను చూసి వాటిని అనుష్ఠించకుంటే బహుశా కామం నశించదని, భగవద్దర్శనం కాదేమోనని తాను భావించినట్లు చెప్పాడు. కాబట్టి కామాన్ని జయింప శ్రీరామకృష్ణులు కూడ ఏదో ఒక ఆసనం–గీసనం వేయమనో, లేదా కరక్కాయనో మరొకటో తినమనో, లేదా ప్రాణాయామాది ఏదో ఒక సాధనను బోధిస్తారనో ఎంతో ఆశతో ఆయనను ఆ ప్రశ్న అడిగాడు. అప్పుడు ఏమైందో యోగానందస్వామి ఇలా చెప్పాడు:
“ ‘శ్రద్ధతో హరి నామాన్ని జపించు, అది (కామం) నశిస్తుంది. మరేదీ ఇక అవసరం లేదు.’ ఆ జవాబు నాకు సుతరామూ నచ్చలేదు. నేను ఇలా అనుకొన్నాను: ‘ఎటువంటి ప్రక్రియా ఈయనకు తెలిసి ఉండదు. అందుకే నిష్ప్రయోజనమైనది ఏదో ఒకటనాకు ఉపదేశించారు. హరి నామస్మరణతో కామం నశిస్తుందా? అనేకులు హరినామం జపిస్తున్నారు కదా! వాళ్ళలో కామం ఎందుకు నశించిపోలేదు?’ మరో రోజు నేను కాళికాలయానికి వచ్చి, తిన్నగా శ్రీరామకృష్ణుల వద్దకు పోకుండా పంచవటి వద్దనున్న హఠయోగి సమీపంలో నిలబడి, అతడి సంభాషణను ఉత్కంఠతో వింటున్నాను. హఠాత్తుగా అక్కడకు శ్రీరామకృష్ణులు రావడం తటస్థించింది. నన్ను అక్కడ చూసీచూడగానే పిలిచి, నా చేతిని పుచ్చుకొని తమ గదికి తీసుకువెళ్ళి, ‘నువ్వు అక్కడకు ఎందుకు వెళ్ళావు? అలా వెళ్ళకు. హఠయోగ ప్రక్రియలను నువ్వు అభ్యసించే పక్షంలో నీ మనస్సు పూర్తిగా శరీరం మీదనే కేంద్రీకృతమౌతుంది. భగవంతుని వైపుగా పోదు’ అని అన్నారు. ఆ మాటలు విని, ‘తమ వద్దకు రావడం మానుకొంటానని కాబోలు ఈయన నాతో ఇలా అంటున్నా’ రని నేననుకొన్నాను. నా తెలివితేటలపై నాకు గట్టి నమ్మకం ఉంది. నా వివేకానికి ఎలాంటి విచ్చలవిడి కళ్ళాన్ని వేసాను! నేను ఆయన వద్దకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయనకు ఒరిగేది ఏమీ లేదన్న సంగతి నాకప్పుడు స్ఫురించలేదు. ఆహా! ఎలాటి ధూర్త, సందేహాస్పద మనస్కుణ్ణి నేను! శ్రీరామకృష్ణుల కృప ఎల్లలెరుగనిది. ఇటువంటి అనుచిత భావనలకు మనస్సులో స్థానం కల్పించినప్పటికీ నాకు ఆయన ఆశ్రయం* ఇచ్చారు. ఆ తరువాత, ‘ఆయన చెప్పినట్లు చేసి ఏం జరుగుతుందో చూడవచ్చు కదా!’ అనే ఆలోచన నాలో మెదలింది. అలా అనుకొని తదేకచిత్తంతో హరినామాన్ని జపింప నారంభించాను. నిజం చెప్పాలంటే, శ్రీరామకృష్ణులు తెలిపిన ఫలితాలు క్రమేణా నేను ప్రత్యక్షంగా చవిచూశాను.”
27. నాలుగవ ఉదాహరణ: మణిమోహన్ బంధువు ఉదంతం
ఈ రీతిలో ప్రతి ఒక్కరి మానసిక అవస్థ ఆవశ్యకాలనూ ఆకళింపు చేసుకొనే శ్రీరామకృష్ణుల శక్తికి అనేక ఉదాహరణలు పేర్కొనవచ్చు. సిందూరియాపటి వాస్తవ్యుడైన మల్లిక్‌ను ఇంతకు మునుపే పరిచయం చేసివున్నాం. అతడి బంధువైన ఒక భక్తురాలు తరచు శ్రీరామకృష్ణుల దర్శనార్థం వస్తూ ఉండేది. ఒకరోజు, ఆమె శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి, భగవద్ధ్యానానికి కూర్చున్నప్పుడు లౌకిక భావనలు, ఒకరి మాటలు, మరొకరి ముఖం ఇత్యాదులు తన మనస్సును ఆక్రమించుకొని తనను అశాంతికి గురిచేస్తున్నాయని వినమ్రంగా ఆయనతో చెప్పింది. తక్షణమే శ్రీరామకృష్ణులు ఆమె భావాన్ని అవగతం చేసుకొన్నారు. ఆమె ప్రేమించే వ్యక్తి పలుకులు, ముఖం ఆమె మనస్సులో మెదలుతున్నాయని ఆయన గ్రహించారు. “సరే, ఎవరి ముఖం నీ మనస్సులో ద్యోతకమవుతున్నది? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు?” అని ఉట్టిపడే అనురాగంతో ఆమెను అడిగారు. తాను పెంచుతున్న తన చిన్ని మేనల్లుణ్ణి ప్రేమిస్తున్నానని ఆమె బదులు చెప్పింది. అప్పుడాయన ఇలా అన్నారు: “సరే, మంచిది. ఆ పిల్లవాడు బాలగోపాలుడనే భావనతో అతడికి అన్నం తినిపించడం, దుస్తులు వేయడం మొదలైన పనులు చేస్తూవుండు. అతడిలో భగవంతుడు, గోపాలుని రూపులో నెలకొని ఉన్నాడనే వైఖరి అవలంబించు. ఆ గోపాలునికే నువ్వు అన్నం తినిపించడం ఇత్యాది సేవలు ఒనరుస్తున్నావని భావించుకో. ఈ సేవలన్నీ ఒక మానవమాత్రుడికి ఒనరిస్తున్నావని నువ్వెందుకు అనుకొంటావు? భావానికి అనుగుణంగానే ఫలప్రాప్తి కలుగుతుంది.” ఆయన సూచించినట్లు చేసిన ఫలితంగా కొద్దికాలంలోనే ఆమె ఆధ్యాత్మిక పురోగతిని సాధించిందని, భావసమాధిని సైతం ఆమె పొందగలిగిందని మాకు తెలియవచ్చింది.
28. స్త్రీల నానా మానసిక అవస్థలను గ్రహించగల శ్రీరామకృష్ణులశక్తి
స్వయానా ఆయన పురుషదేహం ధరించివున్నారు కాబట్టి పురుషుల మనోభావాలను గ్రహించి, అవగతం చేసుకోగల శక్తి శ్రీరామకృష్ణులకు ఉన్నదని స్పష్టంగా చెప్పవచ్చు. కానీ కోమలత్వాన్ని, బిడ్డలపట్ల వాత్సల్యానురాగాదులు ఇత్యాదులు చవిచూడ స్త్రీలకు భగవంతుడు మరో లక్షణాన్ని అనుగ్రహించి ఉన్నప్పుడు, శ్రీరామకృష్ణులు స్త్రీల సమస్త భావాలను కచ్చితంగా ఎలా ఎరిగివున్నారో అని యోచించి చూసినప్పుడు ఆశ్చర్యపోక తప్పదు. భక్తురాండ్రు ఇలా అనేవారు: “శ్రీరామకృష్ణులు పురుషులన్న ఆలోచనే సామాన్యంగా మాకు వచ్చేదికాదు. ఆయన మాలో ఒకరిగా అనిపించేవారు. అందుచేతనే ఆయన సమక్షంలో మేము కించిత్తుకూడ లజ్జ, సంకోచమూ పడేవారంకాము. బహు అరుదుగా అవి కలిగినా తక్షణమే మరచిపోయి మా మానసిక భావాలను ఎలాటి సంకోచమూలేక ఆయన ముందు వ్యక్తం చేసేవారం.”
29. అందుకు కారణం
‘నేను శ్రీకృష్ణుని చెలికత్తెను లేదా దాసిని’ అనే భావనలో సుదీర్ఘకాలం లయమై ‘నేను పురుషుడను’ అనే విషయం శ్రీరామకృష్ణులు పూర్తిగా విస్మరించడమే ఇందుకు కారణమేమో! పతంజలి మహర్షి తమ యోగసూత్రాలలో ఇలా పేర్కొన్నారు: “పరులకు హాని కలిగించాలనే భావన పూర్తిగా నీ మనస్సులోనుండి తొలగి పోయినప్పుడు, పెద్దపులులు, పాములతోసహా ప్రపంచంలో మరెవరూ నీకు హాని తలపెట్టరు. నిన్ను చూసినా హాని చేయాలనే తలంపే వాటికి కలుగదు.”* కామక్రోధాది ఇతర మనోప్రవృత్తుల విషయంలోకూడ ఇట్లే జరుగుతుందని గ్రహించాలి. పురాణాలలో ఈ యథార్థం గురించి ఎన్నో ఉదాహరణలు కానవస్తాయి. ఒక్క ఉదాహరణ పేర్కొంటే చాలునేమో! నిష్కళంకుడు, మాయకు అతీతుడు, సదా బ్రహ్మభావంలో మగ్నమైన యువ శుకదేవుడు సంసారాన్ని త్యజించి వెళ్ళిపోసాగాడు. పుత్రమోహంతో గుడ్డివాడైన వృద్ధుడైన అతడి తండ్రి వ్యాసుడు విలపిస్తూ, “కుమారా! ఎక్కడకు వెళ్ళిపోతున్నావు?” అంటూ అతడి వెంట పరుగెత్తసాగాడు. దారిలో ఒక సరోవరంలో అప్సరసలు తమ బట్టలు ఒడ్డున పడేసి స్నానం చేస్తున్నారు. యువకుడైన శుకుణ్ణి చూసికూడ వాళ్ళు సిగ్గుపడక, సంకోచించక అట్లే స్నానం చేయసాగారు. కాని వృద్ధుడైన వ్యాసుడు అటుకేసి రాగానే హుటాహుటిన బట్టలు తీసి ఒంటికి చుట్టుకొన్నారు. ఈ విషయం గమనించి వ్యాసుడు, ‘ఇదేం చోద్యం! యువకుడైన నా కుమారుడు వాళ్ళ ముందునుంచి వెళ్ళినా కనీసం వాళ్ళు కదల్లేదు. కాని వృద్ధుడనైన నన్ను చూసి వారి కింత సిగ్గు ముంచుకొచ్చిందే!’ అని అనుకొన్నాడు. అందుకు కారణం ఏమిటని వ్యాసుడు అడిగిన ప్రశ్నకు ఆ అప్సరసలు ఇలా జవాబిచ్చారు: “శుకుడు ఎంత పవిత్రుడంటే, ‘తాను ఆత్మ’ ననే భావం మాత్రమే సర్వదా అతడిలో మెదలుతూ ఉంటుంది. తనకున్నది పురుష దేహమో లేక స్త్రీశరీరమో అనే ధ్యాస సైతం అతడిలో లేదు. అందుచేతనే అతణ్ణి చూసినప్పటికీ మాకు ఎలాంటి సిగ్గూ జనించలేదు. కానీ నీవు వృద్ధుడవు, స్త్రీల అంగవిన్యాసాలు, క్రీగంటిచూపులు చక్కగా ఎరిగినవాడవు. పైగా వారి రూపలావణ్యాదులను విస్తృతంగా వర్ణించిన వాడవు. శుకునిలా నీకు స్త్రీపురుషుల పట్ల ఆత్మదృష్టి లేదు; అది రాదు కూడ. అందుచేతనే నిన్ను చూడగానే పురుషుడవనే ఎరుక మాలో కలిగింది, సిగ్గు ముంచుకువచ్చింది.”
30. శ్రీరామకృష్ణుల సమక్షంలో స్త్రీలు అరమరికలు లేకుండా మెలగడానికి హేతువు
శ్రీరామకృష్ణుల పట్ల కూడ పై భావనే మాకు స్ఫురిస్తుంది. దేదీప్యమానమైన వారి ఆత్మజ్ఞానం, స్త్రీ పురుషులందరిపట్ల ఆయనకు ఉన్న ఆత్మదృష్టి, వారి సమక్షంలో ఉన్నంతసేపు ‘నేను పురుషుడను’, ‘ఆమె స్త్రీ’ మొదలైన భావనలు సామాన్యంగా జనించనంతటి ఉన్నత స్థితికి ప్రతి వ్యక్తి మనస్సును తీసుకు పోతుంది. అందుచేతనే పురుషులలా స్త్రీలుకూడ ఆయన సమక్షంలో సిగ్గు పడేవారుకారు. అంతేకాదు; శ్రీరామకృష్ణుల సాంగత్యంలో ఉన్నప్పుడు వారిలో ఆత్మదృష్టి వ్రేళ్ళూనేది. అప్పుడు తాము సంకటమైనవని పరిగణించే పనులను సైతం శ్రీరామకృష్ణుల విజ్ఞప్తి మేరకు వాళ్ళు ఏ సంకోచం లేకుండా అనాయాసంగా చేసేవారు. మరెవరు కోరినా ఇట్టి పనులను చేయడానికి వారు నిరాకరించే వారని చెప్పనవసరంలేదు. గుర్రపుబండ్లు, పల్లకీలలో తప్ప ఎన్నడూ ఎక్కడకూ ప్రయాణం చేయని గౌరవనీయ కుటుంబాలకు చెందిన స్త్రీలు* సైతం శ్రీరామకృష్ణుల విజ్ఞప్తి మేరకు పగటివేళ కాలినడకన గంగాతీరం వరకు వచ్చి, పడవలలో దక్షిణేశ్వర కాళికాలయానికి రావడంకద్దు. పైగా, అక్కడకు వెళ్ళాక బహుశా శ్రీరామకృష్ణుల కోర్కెమేరకు దగ్గరలోని బజారుకు వెళ్ళి ఆయనకు అవసరమైన సరకులు కొని తెచ్చేవారు. అట్లే సాయంత్రం మళ్ళీ కాలినడకన కలకత్తాకు తిరిగి వెళ్ళిపోయేవారు. ఒకటి రెండు ఉదాహరణలు పేర్కొంటే ఈ విషయం తేట తెల్లమౌతుంది.
31. మొదటి ఉదాహరణ
అది 1884 వ సంవత్సరం. ఆ సమయంలో మాతృదేవి (శ్రీ శారదాదేవి) జయరాంబాటిలోని తమ పుట్టింట్లో ఉన్నారు. బలరాంబోసు తన తండ్రితోపాటు బృందావనానికి వెళ్ళివున్నాడు. వారితోపాటు రాఖాల్ (స్వామి బ్రహ్మానంద), గోపాల్ (స్వామి అద్వైతానంద), పలువురు భక్తులు, భక్తురాండ్రు వెళ్ళారు. ఆ సమయంలో బాగ్‌బజార్ వాస్తవ్యులైన ఒక గౌరవనీయ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ, శ్రీరామకృష్ణులను గురించి విన్నది, కాని ఎన్నడూ ఆయనను చూడలేదు. దక్షిణేశ్వరానికి వచ్చి ఆయనను దర్శించుకోవాలనే తీవ్ర ఆకాంక్ష ఆమెకు కలిగింది. అప్పటికి రెండు సంవత్సరాలనుండి తరచూ శ్రీరామకృష్ణులను దర్శించుకొంటూ వస్తున్న తనకు పరిచయస్థురాలైన ఒకామెతో, ఈమె తన ఆకాంక్షను వెలిబుచ్చింది. అనుకొన్న ప్రకారం ఆ స్త్రీ లిద్దరూ మర్నాటి మధ్యాహ్నం దక్షిణేశ్వరం చేరుకొన్నారు. శ్రీరామకృష్ణుల గది తలుపులు మూసివుండడం చూశారు. గది ఉత్తరపు గోడలోని చిన్ని రంధ్రాలగుండా తొంగిచూశారు; శ్రీరామకృష్ణులు విశ్రాంతిగా పడుకొనివున్నారు. అందుచేత మాతృదేవి నివసించే నహబత్కు వెళ్ళి, అక్కడ కూర్చుని నిరీక్షించసాగారు. కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు లేచి ఉత్తరపు గది తలుపు తెరిచి చూడగా, ఆ భక్తురాళ్ళు నహబత్ మొదటి అంతస్తు వసారాలో కూర్చుని ఉండడం గమనించారు. వాళ్ళను తమ వద్దకు రమ్మని పిలిచారు. ఆ భక్తురాండ్రు ఆయన గదిలోకి వచ్చి కూర్చోగానే శ్రీరామకృష్ణులు మంచం నుంచి దిగి, తమకు పరిచయస్తురాలైన స్త్రీ ప్రక్కన కూర్చున్నారు. శ్రీరామకృష్ణుల ఆ చర్యకు ఆమె సిగ్గుపడి కాస్త ఒదిగి కూర్చుంది. అప్పుడు శ్రీరామకృష్ణుల, “ఎందుకింత సిగ్గు? సిగ్గు, ఏవగింపు, భయం ఉన్నంతవరకు భగవత్సాక్షాత్కారం కలుగదు. (చేతిని ఊపుతూ) నిజానికి నేనూ మీవంటి వాడినే. కాని (తన గడ్డం చూపుతూ) ఈ గడ్డం ఉండడంచేత కదా మీకు సిగ్గు కలుగుతున్నది?” అని అన్నారు.
అలా అంటూ వెంటనే భగవత్ప్రసంగం చేస్తూ వారికి ఎన్నో ఉపదేశా లిచ్చారు. ఆ భక్తురాళ్ళు కూడ స్త్రీ పురుషుల మధ్యనున్న విభేదాన్ని విస్మరించి ఎలాంటి సంకోచమూలేక ప్రశ్నలువేస్తూ, జవాబులు వినసాగారు. సుదీర్ఘ సంభాషణానంతరం వాళ్ళు సెలవు పుచ్చుకొని వెళ్ళబోయేముందు శ్రీరామకృష్ణులు, “వారానికి ఒక్కసారన్నా రండి. ప్రారంభంలో తరచూ ఇక్కడకు వస్తూవుండండి” అని అన్నారు. ఆ స్త్రీలు గౌరవనీయ కుటుంబాలకు చెందినప్పటికీ వారు పేదవారని బండిబాడుగ సదా భరించలేరనీ తెలిసి శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “మీరు ఇక్కడకు వచ్చేటప్పుడు ముగ్గురు నలుగురు కలిసి పడవలో రండి. తిరిగి వెళ్ళేటప్పుడు బారానగర్ వరకు నడిచి అక్కడ కలిసికట్టుగా బండిని మాట్లాడుకోండి.” అప్పటినుండి ఆ భక్తురాండ్రు ఆయన సలహా ప్రకారమే వ్యవహరించారని వేరేగా చెప్పాలా!
32. పై విషయం గురించి రెండవ ఉదాహరణ
మరో భక్తురాలు (గోలాప్ మా) మాతో ఒక రోజు ఇలా చెప్పింది: “ప్రసిద్ధిచెందిన భోలా మిఠాయి దుకాణంలో ‘సర్’* అనే మంచి మిఠాయి లభిస్తుంది. శ్రీరామకృష్ణులకు ‘సర్’ అంటే ఇష్టమని తెలిసి ఒకరోజు పెద్ద ‘సర్’ ముక్కను కొన్నాం. చెప్పాపెట్టక మేం ఐదుగురం కలిసి పడవ మాట్లాడు కొని దక్షిణేశ్వరానికి వెళ్ళాం. అక్కడకు వెళ్ళాక శ్రీరామకృష్ణులు కలకత్తాకు వెళ్ళారని తెలిసి, హతాశులమయ్యాం. ఏం చేయాలో పాలుబోలేదు. అప్పుడు రాంలాల్ దాదా (శ్రీరామకృష్ణుల అన్నగారి కుమారుడు) అక్కడున్నాడు. గురుదేవులు కలకత్తాలో ఎక్కడకు వెళ్ళారని అతడిని అడిగాం. కంబులేటోలాలోని ‘పంతులు’* గారి ఇంటికి వెళ్ళారని అతడు చెప్పాడు. ఆ జవాబు విని ‘అ’ తల్లి, ‘ఆ ఇల్లు నాకు తెలుసు, మా తండ్రిగారి ఇంటికి సమీపంలోనే ఉంది. వెళదామా? పోదాం పదండి. ఇక్కడ వేచివుండి ఏం ప్రయోజనం?’ అని అన్నది. అందుకు అందరం సమ్మతించాం. మేం తీసుకువచ్చిన ‘సర్’ మిఠాయిని రాంలాల్ చేతికిచ్చి, ‘శ్రీరామకృష్ణులు తిరిగి వచ్చాక ఆయనకు అందించండి’ అన్నాం. అప్పటికే మేం వచ్చిన పడవను పంపేశాం. కాలినడకన బయలుదేరాం. కాని గురుదేవుల సంకల్పమేమో, ఆలంబజార్ వరకు కొద్దిదూరం వచ్చామో లేదో, కలకత్తానుండి ఖాళీగా తిరిగి వస్తున్న ఒక బండి దొరికింది. ఆ బండిని మాట్లాడుకొని మేం శ్యాంపుకూర్ చేరాం. అక్కడ మరో కొత్త సమస్య ఎదురైంది. ‘అ’ తల్లి ఆ ఇంటిని గుర్తుపట్టలేకపోయింది. అటూ ఇటూ తిప్పి బండిని తన తండ్రిగారి ఇంటి ముందు ఆపమన్నది. ఇంట్లోనుండి ఒక పనివాణ్ణి పిలుచుకు వచ్చింది. అతడు మాతో వచ్చి ‘పంతులు’ గారి ఇల్లు చూపాడు. మొత్తానికి ‘పంతులు’ గారి ఇంటిని చేరుకొన్నాం. ఇందులో ‘అ’ తల్లిని ఎలా తప్పుపట్టగలం? మాకంటే ఆమె నాలుగైదేళ్ళు చిన్నది. అప్పుడు ఆమెకు ఇరవై ఆరు లేక ఇరవై ఏడేళ్ళు ఉండవచ్చునేమో! ఆమె కేవలం ఒక ఇంటి కోడలు, ఎన్నడూ బయటకు వెళ్ళిందికాదు. పైగా ఆ ఇల్లు ఒక చిన్న సందులో ఉండడంచేత ఆమె ఎలా గుర్తుపట్టగలదు!
“చివరికి ఎలాగో వచ్చి చేరుకొన్నాం. అప్పటికి పంతులుగారి కుటుంబంతో మాకు పరిచయం లేదు. ఇంట్లోకి వెళ్ళాం. ఒక చిన్న గదిలో చిన్న కొయ్యమంచం మీద శ్రీరామకృష్ణులు కూర్చుని ఉన్నారు. ఆయన ప్రక్కన ఎవరూ లేరు. మమ్మల్ని చూడగానే ఆయన నవ్వి, ఆప్యాయంగా, ‘ఆహా! మీరిక్కడకు ఎలా వచ్చారు?’ అని అడిగారు. మేం ఆయనకు ప్రణామం చేసి, జరిగింది పూసగుచ్చినట్లు చెప్పాం. ఆయన ఎంతో సంతోషించారు. మమ్మల్ని కూర్చోమని, అనేక విషయాలపై మాట్లాడసాగారు. స్త్రీలను దరిదాపులకు రానివ్వరని, తమను స్పృశించ నివ్వరని ప్రతి ఒక్కరూ చెబుతూంటారు. ఆ విషయం విని మాకు నవ్వు వచ్చింది. ‘మేం ఇంకా చనిపోలేదు’ అని అనుకొన్నాం. ఆయన ఎంత దయార్ద్రహృదయులో ఎవరి కెరుక? స్త్రీ పురుషుల పట్ల ఆయనది ఒకే వైఖరి. కాని స్త్రీలు కనుక ఎక్కువసేపు తమ సమీపంలో ఉండి పోతే, ‘ఆహా! ఇప్పుడు ఆలయాలకు వెళ్ళి దైవదర్శనం చేసుకోండి’ అని చెప్పేవారు. పురుషులను సైతం అట్లే చేయమని ఆయన చెప్పడం మేం వినివున్నాం. ఏది ఏమైనప్పటికీ మేం కూర్చుని, ఆయనతో మాట్లాడుతున్నాం. మాలో కొంచెం వయస్సు పైబడ్డ ఇద్దరు తలుపు ప్రక్కన, తక్కిన ముగ్గురం గదిలో ఒక మూల కూర్చున్నాం. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు ‘లావు బ్రాహ్మణు’ డని పిలిచే ప్రాణకృష్ణ ముఖోపాధ్యాయ ఆకస్మికంగా అక్కడకు వచ్చాడు. మేం బయటకు వెళ్ళిపోవాలా? అలా వెళ్ళే దారిలేదు. మరి మేం ఎక్కడకు వెళ్ళగలం? తలుపు ప్రక్కన ఒక కిటికీ ఉంది. వయస్సు పైబడ్డ స్త్రీలిద్దరూ ఆ కిటికీ వద్ద కూర్చున్నారు. తక్కిన మేం ముగ్గురం శ్రీరామకృష్ణులు కూర్చున్న మంచం దిగువన చేరి పడుకొన్నాం. దోమలు కుట్టడంతో మా ఒళ్ళంతా వాచిపోయింది. మేం ఏం చెయ్యగలం! కదలడానికి కూడ ఆస్కారంలేదు. నిశ్చలంగా పడుకొనివున్నాం. ఆ బ్రాహ్మణుడు శ్రీరామకృష్ణులతో ఒక గంటసేపు మాట్లాడాక వెళ్ళిపోయాడు. పిదప మేం నవ్వుకొంటూ బయటకు వచ్చాం.
“ఆ తరువాత భోజనం పెట్టడానికి శ్రీరామకృష్ణులను ఇంటి లోపలికి తోడ్కొని వెళ్ళారు. మేం ఆయనను అనుసరించాం. కాస్సేపయ్యాక శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం తిరిగి వెళ్ళడానికి బండి ఎక్కారు. పిదప మేమందరం కాలినడకన ఇళ్ళకు చేరుకొన్నాం. అప్పుడు రాత్రి తొమ్మిది గంటలయింది.”
33. స్త్రీలపై సమాన కృపను శ్రీరామకృష్ణులు వర్షించడం
“మర్నాడు మళ్ళీ మేం దక్షిణేశ్వరానికి వెళ్ళాం. మేం అక్కడకు వెళ్ళగానే ఆయన మా ప్రక్కకు వచ్చి, ‘ఆహా! మీరిచ్చిన ‘సర్’ ను దాదాపు పూర్తిగా నేనే ఆరగించాను; దాన్లో కాస్త మాత్రమే మిగిలింది. తిన్నందువలన ఏ జబ్బూ చేయలేదు, పొట్టమాత్రం కాస్త భారంగా ఉండడం తప్ప’ అని అన్నారు. ఆ మాట విని నేను ఆశ్చర్యపోయాను. ఆయన సున్నితమైన కడుపుకు ఏదీ పెద్దగా పడదు. ఏకమొత్తంగా ‘సర్’ ను తినేశారంటే ఊహకు అందడంలేదు! భావావస్థలో దాన్ని తినేశారని తెలిసింది. శ్రీరామకృష్ణులు ‘పంతులు’ గారి ఇంట్లో భోజనంచేసి రాత్రి పదిన్నరకు దక్షిణేశ్వరం చేరుకొన్నారని తెలియవచ్చింది. వచ్చిన కాస్సేపటికి భావసమాధి మగ్నులై రాంలాల్‌ను పిలిచి, ‘బాగా ఆకలిగా ఉంది. గదిలో ఏముందో పట్రా’ అని చెప్పారు. వెంటనే రాంలాల్ ‘సర్’ మిఠాయినంతా ఆయన ముందు పెట్టాడు. అప్పుడాయన దాన్ని దాదాపు పూర్తిగా తినేశారు. భావావస్థలో ఆయన అప్పుడప్పుడు విపరీతంగా తిని జీర్ణించుకోవడం కద్దు అని మాతృదేవి నుండి, లక్ష్మి అక్క నుండి విన్న సంగతి నాకు జ్ఞప్తికి వచ్చింది. ఆహా! శ్రీరామకృష్ణుల ఎంతటి అనుగ్రహానికి మేం పాత్రులమయ్యాం! ఆ కరుణ వర్ణనాతీతం. ఎంతటి ఆకర్షణ! ఆయన వద్దకు మేం ఎలా వెళ్ళి, అవన్నీ నిర్వర్తించేవారమో మాకే తెలియరాదు, అర్థం కాదు. అలా కాలినడకన ఎక్కడకైనా పరిచయస్థులు కాని వారి ఇళ్ళకు ఆ రీతిలో సాధుసన్న్యాసులను దర్శించుకోవడానికి లేక వారి ఆధ్యాత్మిక వచనాలను వినడానికి ప్రస్తుతం మేం వెళ్ళలేం. ఎవరి శక్తితో మేం అలా చేయగలిగేవారమో ఆ శక్తి ఆయనతోబాటే అదృశ్యమైంది. ఆయనను కోల్పోయి మేం ఇంకా ఎలా బ్రతికివున్నామో మాకే అర్థంకావడం లేదు.”
ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా పేర్కోవచ్చు. ఏనాడూ తమ గడప దాటి బయటకు అడుగుపెట్టి ఎరుగని వారిని అంగడికి పంపి సరకులు కొనుగోలు చేయించారు. అభిమానం, అహం నశింపచేసే ఉద్దేశంతో ఇంటింటికి భిక్షకై పంపించారు. అట్లే తమతో ‘పానీహాటీ’ ఉత్సవానికి వారిని తోడ్కొనిపోయారు. అక్కడ ఆ భక్తురాండ్రు మహదానందంతో సంకోచపడక శ్రీరామకృష్ణుల అనుజ్ఞ మేరకు చెప్పింది చేయడం జరిగింది. కాస్త దీర్ఘంగా యోచించిచూస్తే ఇది స్వల్ప విషయంగా కనిపించదు. ఆధ్యాత్మిక చైతన్య తరంగాల ప్రభావంలో జాతి, లింగ, అంతస్తు ఇత్యాది వ్యత్యాసాల కారణంగా జనించే సంకోచ భావాలన్నీ తాత్కాలికంగా సమసిపోయేవి. దివ్యచైతన్యం మూర్తీభవించిన శ్రీరామకృష్ణులలో ప్రతి ఒక్కరూ తమ తమ భావాల పరిపూర్ణ ఆదర్శాన్ని కాంచగలిగి తమ జీవితం కృతార్థమైనట్లు భావించేవారు. పురుషులు ఆయనలో పరిపూర్ణ పురుషత్వ ప్రకాశాన్ని కాంచి తలలొగ్గారు. స్త్రీలు ఆయనలో ఉదాత్త స్త్రీభావాలు పరిపూర్ణంగా అభివ్యక్త మైనట్లు కనుగొని, ఆయనను తమ పరమ ఆప్తునిగా పరిగణించి ఎటువంటి సంకోచమూ లేకుండా ఆయనతో మెలగేవారు.
34. స్త్రీల హావభావాలను శ్రీరామకృష్ణులు అనుకరించడం
స్త్రీలకు సహజమైన హావభావాలను, అంగభంగిమలను అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులు అనుకరించి మమ్మల్ని వేడుక పరిచేవారు. ఆ అనుకరణ అంత కచ్చితంగా ఉండడం మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తేది. ఒక సందర్భంలో ఒక భక్తురాలు మాతో ఇలా చెప్పింది: “పురుషులు ఎదురుపడినప్పుడు స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారో మా సమక్షంలో శ్రీరామకృష్ణులు అభినయించి చూపసాగారు. తలమీద ముసుగును సరిచేసుకోవడం, చెవుల ప్రక్క ముంగురులను సవరించుకోవడం, పైటను రొమ్ములపై నిండుగా కప్పుకోవడం, అర్థంపర్థంలేక మాట్లాడడం – కచ్చితంగా స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారో అలా చేసి చూపారు. అది చూసి మాకు నవ్వు ఆగలేదు. కాని ఆయన ఆ విధంగా స్త్రీలను కించపుచ్చుతున్నారని అంతరంగంలో అవమానంతో బాధపడ్డాం. ‘స్త్రీ లందరూ అట్లే ఉంటారా?’ అన్న ఆలోచన మాలో మెదలింది. ఏది ఏమైనా మేం స్త్రీలమే కదా! ఎవరైనా స్త్రీలను అలా అనుకరించి చూపితే మేం సహజంగా బాధపడతాం కదా! ఆహా! తక్షణమే శ్రీరామకృష్ణులు మా అవస్థను అవగతం చేసుకొన్నారు. ‘మంచిది, ఇది మిమ్మల్ని గురించి కాదు. మీరు అవిద్యాశక్తులు కారు కదా! ఆ ప్రవృత్తిగల స్త్రీలు మాత్రమే అలా ప్రవర్తిస్తారు’ అని ఆప్యాయంగా మాతో అన్నారు.”
35. స్త్రీ పురుషుల నైజాలు రెండూ శ్రీరామకృష్ణులలో మేళవించి ఉండడం
స్త్రీ పురుష నైజాలు శ్రీరామకృష్ణులలో సరిసమంగా అభివ్యక్తం కావడం భక్తు లందరూ దాదాపు చూసివున్నారు. అట్టి అనుభవం గిరీశ్ చంద్రఘోష్ ఒక రోజు చవిచూసి, కాస్త చొరవచేసుకొని శ్రీరామకృష్ణులను, “మహాశయా! మీరు పురుషులా లేక స్త్రీయా?” అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వి, “నాకు తెలియదు” అని జవాబు ఇచ్చారు. ఆయన ఆ మాట ఏ అర్థంలో, అంటే ఆత్మజ్ఞులైన పురుషులు, ‘నేను పురుషుణ్ణి కాను, స్త్రీని కాను’ అని చెప్పేటట్లు ఆత్మదృష్టితో పలికారో లేక తమలో ఇద్దరి నైజాలూ సామరస్యంతో మేళవింపబడి ఉండడం చూసి అలా పలికారో తేల్చిచెప్పలేం.
36. భావముఖ స్థితిలో వసించడంచేత శ్రీరామకృష్ణులు సర్వుల భావాలూ అవగతం చేసుకోగలిగారు
అనంత భావమయులైన శ్రీరామకృష్ణులు ఈ విధంగా ‘భావముఖం’ లో నెలకొని స్త్రీల వద్ద స్త్రీగాను, పురుషుల వద్ద పురుషునిగాను వర్తిస్తూ ప్రతి ఒక్కరి యావత్తు భావాలూ యథాతథంగా అవగతం చేసుకోగలిగే వారు. ఈ విషయం స్వయంగా ఆయనే మాలో కొందరి వద్ద వ్యక్తం చేశారు. పరమ భక్తురాలైన ఒక స్త్రీ* , శ్రీరామకృష్ణులు ఒక రోజు తనతో ఇలా చెప్పారని మాకు తెలిపింది: “కేవలం ఒక్క చూపుతోనే ఒక వ్యక్తి నైజం తెలుసుకోగలను; సజ్జనుడెవడో దుర్జనుడెవరో, కులీనుడెవడో కానివాడెవడో, జ్ఞాని ఎవడో భక్తుడెవడో, ఎవడికి భగవత్సాక్షాత్కారం లభిస్తుందో, ఎవడికి లభించదో నేను గ్రహించగలను. కాని వారు బాధపడతారని ఆ విషయం వ్యక్తం చేయను.” ఆయన సదా భావముఖంలో నెలకొని ఉండడం చేత జగత్తు యావత్తు ప్రతిక్షణం భావమయంగా ఆయనకు కానవస్తూవుంటుంది. స్త్రీలు, పురుషులు, ఆవులు, గుర్రాలు, చెట్టు, మన్ను అన్నీ విశ్వమానసంలో విభిన్న భావతరంగాల సమష్టిగా మునిగి లేస్తూ ఉన్నట్లు, ఈ భావాలనే ఆవరణాల ద్వారా ఆ అనంత అఖండ సచ్చిదాకాశం – ఒక్కోచోట చిన్నదిగా, మరోచోట విస్తృతంగా, ఒక్కోచోట ఆవరణం ఎంత దట్టమంటే సచ్చిదానందాకాశం అసలక్కడ లేదేమో అన్నట్లు – శ్రీరామకృష్ణులకు సర్వదా అనుభూతమయ్యేది. ఆనందమయి నిష్కళంక మానసపుత్రులైన శ్రీరామకృష్ణులు స్వచ్ఛందంగా తమ తను మనః చిత్తవృత్తులను, తమ సర్వస్వాన్ని జగజ్జనని పాదపద్మాలకు అర్పించి, సమాధి స్థితి మూలంగా బ్రహ్మానందానుభవాన్ని పొంది, నిరంతరం ఆమెలో తాదాత్మ్యం చెందనారంభించారు. కాని అక్కడకు చేరుకొన్నాక జగజ్జనని సంకల్పం మరో రీతిలో ఉందని ఎరిగి, ఆమె ఆజ్ఞను శిరసావహించి, ద్వైత–అద్వైత విలీనం, అనిర్వచనీయం అయిన అవస్థలో లీనమైవున్న తమ మనస్సును బలవంతంగా మళ్ళీ విద్యామాయ అనే ఆవరణంతో కప్పి, తల్లి ఆజ్ఞను పాటించసాగారు. అనంత భావమయురాలైన జగజ్జనని కూడ వారిపట్ల ప్రసన్నురాలై ఆయనను దేహధారిగా ఉంచినప్పటికీ సర్వదా ఆయన మనస్సును ఆ ఏకత్వంలో ఎంత సమున్నత స్థానంలో నిలిపి ఉంచేదంటే ఆ అనంత విశ్వమానసంలో ఏఏ భావాలు ఉదయించేవో అవన్నీ కూడ తమవే అయినట్లుగా ఆయన అనుభూతం చేసుకొనేవారు. అంతేగాక అవన్నీ ఎంతవరకు తమ అధీనంలో ఉన్నట్లు ఆయన అనుభూతం చేసుకొనేవారంటే, ఆయనను చూసిన వారందరికీ – ఎవరు తల్లో ఆమే బిడ్డగా, ఎవరు బిడ్డో అతడే తల్లిగా (అంటే సాక్షాత్తు జగన్మాతే శ్రీరామకృష్ణులుగా, శ్రీరామకృష్ణులే జగన్మాతగా) అనిపించేది. ‘చిన్మయ ధామం, చిన్మయ నామం, చిన్మయ శ్యాం’ – అంటే భగవంతుడు, అతడి నామం, అతడి నెలవు – ఈ మూడు ఒక్కటే.
తెలిసినంత మేరకు మేం తెలియజేశాం; పాఠకమహాశయులారా! అనంత భావమూర్తియైన ఈ శ్రీరామకృష్ణులు ఎవరో మీరే ఆలోచించి నిర్ణయించుకోండి.