ఆచండాలాప్రతిహతరయో యస్య ప్రేమప్రవాహః
లోకాతీతోఽ ప్యహహ న జహౌ లోకకల్యాణమార్గమ్ ।
త్రైలోక్యేప్యఽ ప్రతిమ మహిమా జానకీప్రాణబన్ధో
భక్త్యా జ్ఞానం వృతవరవపుః సీతయా యో హి రామః ॥
స్తబ్ధీకృత్య ప్రళయకళితం వాహవోత్థం మహాంతం
హిత్వా రాత్రిం ప్రకృతి సహజామంధతామిస్రమిశ్రామ్ ।
గీతం శాంతం మధురమపి యః సింహనాదం జగర్జ
సోఽయం జాతః ప్రథితపురుషో రామకృష్ణస్త్విదానీం ॥
ఎవరి ప్రేమ ప్రవాహం ఆచండాల పర్యంతం అప్రతిహతంగా ప్రవహించినదో, ఎవరు లోకాతీతుడై ఉండీ లోకశ్రేయస్సులోనే నిరతుడై ఉండిపోయాడో, ఎవరి మహిమ ముల్లోకాలలో అసదృశమో, ఎవరు జానకీప్రాణనాథుడో, జ్ఞానమయమైన ఎవరి దేహం సీతాదేవి అనే భక్తితో ఆవృతమై ఉండిపోయిందో, ఎవరు శ్రీరామచంద్రుడుగా అవతరించాడో; అతడే శ్రీకృష్ణుడుగా అవతరించి కురుక్షేత్ర రణరంగంలో చెలరేగిన ప్రళయకాల కోలాహలాన్ని అణచివేశాడు. అతడే శాంతమూ మధురమూ ఆయన భగవద్గీతను సింహగర్జారావంతో ఆలపించి ప్రకృతి సహజమైన అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేశాడు. సుప్రసిద్ధుడైన ఆ దివ్యమూర్తి మళ్ళీ ఈ యుగంలో శ్రీరామకృష్ణులుగా అవతరించారు.
శాస్త్రం అనే మాట ఆద్యంతాలు లేని వేదాలను సూచిస్తుంది. ఈ వేదాలే ధార్మిక బోధనకు యోగ్యమైనవి.
స్మృతి అంటే పురాణాలు, మనుధర్మశాస్త్రాది గ్రంథాలని గ్రహించాలి. వేదాలను ఇవి అనుసరించే మేరకే వాటికి సాధికారికత ఉంటుంది.
సత్యం రెండు రకాలుగా ఉంటుంది. 1. మానవుల పంచేంద్రియాల ద్వారా గ్రహింపబడేది. ఊహతో సిద్ధాంతీకరింపబడేది. 2. యోగాభ్యాసం మూలంగా జనించిన సూక్ష్మశక్తుల ద్వారా గ్రహించేది.
మొదటి పద్ధతి ద్వారా సంతరించుకొన్న జ్ఞానానికి విజ్ఞానశాస్త్రం (Science) అని పేరు; రెండవ విధానం ద్వారా సముపార్జించుకొన్న జ్ఞానం ‘వేదం’.
వేదం అని పేర్కొనబడే ఈ ఆద్యంతాలు లేని అనంత జ్ఞానరాశి శాశ్వత సత్యాలు. స్పష్టికర్త స్వయంగా ఈ అతీంద్రియ వేదజ్ఞాన సహాయంతో ఈ బ్రహ్మాండాన్ని సృజిస్తూన్నాడు, పోషిస్తూన్నాడు, నశింప చేస్తూన్నాడు.
ఈ అతీంద్రియశక్తి ఏ వ్యక్తిలో అభివ్యక్తమౌతుందో ఆ వ్యక్తినే ఋషి అంటారు; ఆ శక్తిద్వారా ఆయన ఏ అలౌకిక సత్యాలను అనుభూతం చేసుకొంటాడో వాటికే వేదాలని పేరు.
వేద జ్ఞానాన్ని సంతరించుకొన్న ఈ ఋషిత్వాన్ని లేక ద్రష్టత్వాన్ని సిద్దించుకోవడమే యథార్థ మతానుభూతి. సాధకుని జీవితంలో ఈ ప్రత్యక్షానుభూతి కలగనంతవరకు మతం కేవలం అర్థంపర్థం లేని పదజాలంగానే మిగిలిపోతుంది. ఆధ్యాత్మిక సీమ గడపపైన సైతం అతడు అడిగిడలేదనే చెప్పాలి.
వేదాల సాధికారికత దేశకాల పాత్రల ప్రసక్తి లేనిదై విరాజిల్లుతుంది; అంటే వాటి సాధికారికత ఒక ప్రత్యేక కాలానికి, దేశానికి, వ్యక్తికి పరిమితమై ఉండదు.
విశ్వజనీన మతాన్ని వివరించగలిగేవి వేదాలు మాత్రమే. ఈ అలౌకిక అనంత జ్ఞానంలో ఏదో కించిత్తు భాగం మన ఇతిహాస, పురాణాదులలోను, విదేశాల మత గ్రంథాలలోను కానవస్తున్నది. అయినా కూడ ఈ అనంత అలౌకిక జ్ఞానరాశి ప్రప్రథమంగా, పరిపూర్ణంగా, మార్పుచేర్పులేక లభ్యమైనదిగా ఎంచబడి ఆర్యజాతిలో ‘వేదం’ పేరిట ప్రసిద్ధమై నాలుగు భాగాలుగా (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం – ఒకే వేదం వేదవ్యాసులచే నాలుగు భాగాలుగా విభజింపబడి, నాలుగు పేర్లు సంతరించుకొన్నది) విభజన పొందినది. ఈ విధంగా నాలుగు వేదాలలో లభ్యమౌతున్న అక్షరరాశి యావత్ప్రపంచానికి ఆరాధనీయమై, భారతీయ లేక విదేశీయ శాస్త్రాలన్నిటిలో వ్యక్తమయ్యే సత్యానికి చరమ నిదర్శనమై సర్వోన్నత స్థానాన్ని పొంద అర్హమై ఉన్నది.
ఆర్యులచే ఆవిష్కరింపబడిన ఆ ‘వేదం’ అనే అక్షరరాశి గురించి మరో విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆ రాశిలో ఏది లౌకికం కాదో* , ఏది అర్థవాదం కాదో* , ఏది ఐహిత్యం కాదో* అది మాత్రమే వేదం. (అంటే అతీంద్రియ పారమార్థిక సత్యాలకు మాత్రమే వేదం అని పేరు.) ఈ వేదరాశి జ్ఞానకాండ, కర్మకాండ అని రెండు భాగాలుగా విభజింపబడింది. కర్మకాండలో వివరింపబడిన క్రియాకలాపాలు, వాటి ఫలితాలు మాయచే ఆవరింపబడిన ఈ ప్రపంచంలో సర్వకాలాలలో నిలిచి ఉంటాయి. కనుకనే దేశకాల పాత్రాదులలో మార్పులు ఏర్పడుతూ ఉండడం చేత తదనుగుణంగా వీటిలోను మార్పులు వచ్చాయి, వస్తున్నాయి, వస్తాయి. సామాజిక ఆచార వ్యవహారాలు ఈ కర్మకాండ మీదనే ఆధారపడి ఉండడం చేత వాటిలో కూడ మార్పులు రావడం తప్పనిసరి. అదేవిధంగా సాంప్రదాయికంగా వస్తూవున్న ఆచారవ్యవహారాలన్నీ కూడ శాస్త్ర విధులకు, సదాచారుల వర్తనకు ప్రతికూలం కానంత వరకు కాలానుగుణంగా అంగీకారం పొందుతాయి. వేదాలకు, వేదాలను అనుసరించే స్మృతుల ప్రభృత శాస్త్రాలకు ప్రతికూలమైన, సత్పురుషుల ఆచరణకు విరుద్ధమైన లౌకిక ఆచారాలనే వేదబోధనలుగా ఎంచి వాటిని పాటించడమే ఆర్యజాతి అధఃపతనానికి ముఖ్యకారణం.
వేదాలలోని జ్ఞానకాండకే మరొక పేరు వేదాంతం. నిష్కామకర్మ, మనో ఏకాగ్రత, భక్తి, ఆత్మజ్ఞానం – వీటి సహాయంతో ఈ వేదాంతం అనాది పర్యంతం మానవులను మాయాసాగరాన్ని దాటించి ఆవలి ముక్తిపదానికి చేరుస్తూ వస్తూన్నది. దేశకాలపాత్రలు ఈ వేదాంతంపై ఏపాటి ప్రాబల్యమూ చూపలేవు కనుక, సకల ప్రజానీకానికీ సకల కాలాలకూ సకల దేశాలకూ విశ్వజనీన మతాన్ని బోధింప అది మాత్రమే అర్హతను సంతరించుకొని ఉన్నది.
వేదాలలోని కర్మకాండను ఆధారం చేసుకొని వ్రాయబడిన మనుధర్మ శాస్త్రాల వంటి ఇతర విషయాలతోబాటు దేశకాలపాత్రల కనుగుణంగా సమాజ సంక్షేమానికి దోహదం చేసే కర్మలను కూడ పేర్కొని ఉన్నవి. ఇక పురాణాల వంటివి వేదాంతంలో నిగూఢంగా ఉన్న సత్యాలను విశదంగా వర్ణించాయి. భగవంతుని అసంఖ్యాక అంశలలో ఏదో ఒక అంశకు మూర్తిభావం వహించిన అవతారమూర్తుల మహోన్నత గుణగణాలను అభివర్ణిస్తూ పై సత్యాలను పురాణాదులు ఉద్ఘాటించేందుకు ప్రయత్నించాయి.
కాని కాలక్రమంలో ఆర్యసంతతివారు సదాచారమార్గం నుండి భ్రష్టులై, వైరాగ్య రహితులై వ్యాప్తిలోవున్న ఆచారాలనే పాటిస్తూ క్రమంగా వివేకశూన్యులయ్యారు. వేదాంతం ప్రసక్తే లేదు, కనీసం పురాణాలనన్నా వారు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే: సూక్ష్మాతిసూక్ష్మమైన వైదాంతిక సత్యాలను అల్పబుద్ధులైన సామాన్యులకు విశదపరచడం కోసం స్థూలంగా, నిర్దుష్టంగా వర్ణించడం చేత, భగవంతుని విభిన్నభావాలను బోధించడం చేత అవి పరస్పర విరుద్దంగా ఉన్నట్లే కానవస్తాయి.* తత్ఫలితంగా అనంతభావ సమష్టియైన అఖండ సనాతన వైదికధర్మాన్ని అనేక విభాగాలుగా విడగొట్టి మత వైషమ్యాలను రగిలించి, ఒకర్ని ఒకరు ఆ దావానలంలో పడత్రోయడానికి సదా ప్రయత్నిస్తూ వచ్చారు. ధర్మానికి ఆలవాలమైన భారతదేశాన్ని ఆ రీతిలో వారు దాదాపు నరకతుల్యంగా మార్చివేశారు. అలాంటి పరిస్థితిలో ఆర్యుల నిజమైన మతం ఏమిటో, సదా కలహించుకొంటూ స్థూలదృష్టికి శాఖోపశాఖలుగా కానవస్తూ, ఎక్కడ చూసినా విపరీత ఆచార సంప్రదాయాలతో కూడుకొని స్వదేశీయులకు భ్రాంతి జనితమై, విదేశీయులకు తిరస్కారస్థానమై, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా నానామతాలుగా, సంప్రదాయాలుగా, మతశాఖలుగా చీలిపోయిన మన సనాతన వైదిక మతంలో నిజమైన ఐక్యత ఎక్కడ ఎలా ఉన్నదో చూపించడానికి, కాలానుక్రమంగా కోల్పోయిన సనాతన ధర్మం యొక్క విశ్వజనీనతను స్వీయజీవితంలో ప్రత్యక్షంగా అభివ్యక్తం చేసి ఆ సనాతన మతానికి సజీవ ఉదాహరణమై భగవాన్ శ్రీరామకృష్ణులు ఈ ఇలలో అవతరించారు.
శాశ్వతత్వం సంతరించుకొని సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరునికి తోడ్పడుతూవున్న ఈ వేదశాస్త్రం వాసనారహితం గావించబడిన ఋషి హృదయంలో ఎలా వెల్లడవుతుందో చూపించడానికి, శాస్త్రాల సత్యత్వం ఈ రీతిలో నిరూపణమైనప్పుడు మతం లేదా ధర్మం పునఃస్థాపితమవుతుంది, పునః ప్రకటితమవుతుంది అనే ఉద్దేశంతోనే వేదమూర్తియైన భగవంతుడు ఈ ప్రస్తుత అవతారంలో బాహ్యవిద్యాశిక్షణకు దాదాపు ఉపేక్ష వహించాడు.
అసలు మతమైన వేదాన్ని, ఆ మత బోధకుడైన బ్రాహ్మణుని పరిరక్షించడానికి భగవంతుడు పదేపదే అవతరిస్తాడని స్మృతుల వంటి గ్రంథాలు చాటిచెప్పడం సువిదితమే.
నదీప్రవాహం ఏటవాలు ప్రదేశం నుండి క్రింద పడుతున్నప్పుడు వేగాన్ని సంతరించుకొనేట్లుగా, క్రిందపడి పైకి ఎగసే అల మరింత ఎత్తును సంతరించు కొనేట్లుగా ఆర్యసమాజం తన రుగ్మతలను వదలగొట్టుకొని, భగవంతుని కరుణా కటాక్షంతో మరింత వైభవోపేతంగా శక్తియుక్తంగా రూపొందడం చరిత్ర ప్రసిద్ధం.
ప్రతి పతనావస్థ నుండి పైకి వచ్చిన మన సమాజం అంతర్నిహితమై ఉన్న తన సనాతన పరిపూర్ణత్వాన్ని మరింతగా ప్రకటిస్తూ వస్తూన్నది. సకల భూతాంతర్యామియైన భగవంతుడు కూడ తన ప్రతి అవతారంలోను ఆత్మస్వరూపాన్ని అధికారికంగా అభివ్యక్తంచేస్తూ వస్తున్నాడు.
పదే పదే ఈ భరతభూమి పతనావస్థకు చేరుకొన్నప్పుడు, భగవంతుడు మళ్ళీ మళ్ళీ అవతరించి ఆత్మప్రకటన ద్వారా దానిని పునఃజాగృతం చేసి ఉన్నాడు.
కాని గతంలో దుఃఖమనే ఏ అమావాస్య రేయీ ఈ పావన భూమిని ఇప్పటి రేయి క్రమ్మినంత గాఢాంధకారాన్ని ఆవరించి ఉండలేదు. ఆ రాత్రి దాదాపు గడచిపోయింది, చరమాంకంలో ఉంది. అయినప్పటికీ ఈ ప్రస్తుత అగాధ పతనంతో పోల్చిచూస్తే వెనుకటి పతనాలు గోష్పదతుల్యంగానే కనిపిస్తాయి.
కనుక ప్రస్తుత ఆర్యసమాజ సముజ్జ్వల జాగృతంతో గతకాలపు జాగృతాలు పోల్చితే ప్రచండ సూర్యుని ఎదుట మినుకు మినుకు మనే నక్షత్రాల్లా కాంతివిహీనాలనే చెప్పాలి. అట్లే ప్రస్తుత పునఃజాగృత శక్తితో పోల్చి చూసినప్పుడు వెనుకటి యుగాల సంభవాలు పిల్లల ఆటగా ద్యోతకమౌతాయి.
ఈ పతనాన్ని నిరోధించగలిగే యోగ్యపురుషులు కొరవడడం చేత ప్రస్తుత పతనావస్థలో సనాతన ధర్మంలో నిహితమైన భావసమిష్టి తునకలై నలుదిక్కులా శాఖోపశాఖలుగా చెదిరిపోయింది. కొన్ని ప్రాంతాలలో అది పాక్షికంగా పదిలమై ఉన్నప్పటికి ఇతరచోట్ల పూర్తిగా లుప్తమైపోయింది.
ఈ పునర్జాగృతి నుండి లభించే నూతన బలం ద్వారా త్రాణ పొంది మనుష్యులు ముక్కలు ముక్కలై చెల్లాచెదరైన ఆధ్యాత్మిక జ్ఞానరాశిని సమష్టీకరించడమే కాక లుప్తమైన వివిధ కళలను, విజ్ఞానశాస్త్రాలను మళ్ళీ ఆవిష్కరించుకొని, ఆ భావాలను, ఆదర్శాలను సముచిత అవగాహనతో అనుభూతం గావించుకొని తమ జీవితాలను సుసంపన్నం చేసుకోగలందులకై పరమ కారుణ్యమూర్తియైన భగవంతుడు ఇతర యుగాలన్నిటికంటే ప్రస్తుత యుగంలో సమథిక సంపూర్ణంగా, సకలభావ సమన్వితుడై, సకల విద్యాసహాయకుడై పైన చెప్పినట్లు యుగావతారునిగా (శ్రీరామకృష్ణులుగా) ఉద్భవించారు.
కాబట్టే ఉదాత్త భావాల, ఆశయాల సామరస్యం ఈ మహాయుగ అరుణోదయ కాలంలోనే ప్రచారం కాబడుతూన్నది. సనాతన వేదాలలో, సనాతన ధర్మంలో తాపడం చేయబడి మరుగున ఉన్న ఈ అనంత, శాశ్వత మహదాశయం సమాజంలో ఉచ్చస్వరంలో చాటబడుతూన్నది.
ఈ నవీన యుగధర్మం సమస్త ప్రపంచానికి, ప్రత్యేకంగా భారతదేశానికి ఫలవంతమైన ఆధారం కాగలదు; ఈ నవీనయుగ ధర్మప్రచారకులైన భగవాన్ శ్రీరామకృష్ణులు గత యుగాలలో జన్మించి యుగధర్మాన్ని ప్రచారం చేసిన అవతార మూర్తుల రూపుదిద్దుకొన్న అభివ్యక్తీకరణే. ఓ మనిషీ! ఈ సత్యాన్ని విశ్వసించి, గ్రహించు.
ఓ మనిషీ! మరణించిన వ్యక్తి తిరిగి రాడు, గడిచిపోయిన రాత్రి మళ్ళీ రాదు; మానసిక ఉద్వేగం ఎంత ఆవేశభరితమైనదైనప్పటికీ మళ్ళీ అదే రూపుదాల్చదు; అదే విధంగా జీవుడు రెండుసార్లు ఒకే దేహాన్ని పొందలేడు. కనుక గతాన్ని ఆరాధించడం ఆపి, ప్రస్తుతాన్ని పూజించడానికి మేం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. గతించిన దానికోసం దుఃఖీంచడం మాని ప్రస్తుతానికి పాటుపడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. కనుమరుగైన మార్గాలను కనుగొనడంలోనే మీ శక్తులన్నిటిని వృథాచేయక కొత్తగా నిర్మితమైన సమీపంలో ఉన్న ఈ విశాల మార్గంలో అడుగిడమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. బుద్ధిమంతుడా! ఈ సూచనను స్వీకరించు.
నవజాగృతమైన ఏ శక్తి చూచాయగా మాత్రమే ప్రకటితమై దిగ్దిగంతాలు వ్యాపించి ప్రతిధ్వనులతో నిండిపోతున్నదో, ఆ మహాశక్తి ఇక పరిపూర్ణంగా అభివ్యక్తమైతే ఏం జరుగుతుందో ఊహించి, అనుభూతం చేసుకో. ఇక నిరర్థక సంశయాలను విడిచిపెట్టు; దుర్బలత్వాన్ని విడనాడు; బానిస జాతులకు సహజమైన అసూయాద్వేషాలను వదలి ఈ మహాయుగ ధర్మచక్ర పరివర్తనానికి చేయూత ఇవ్వు.
మేం భగవంతుని దాసులం, భగవత్పుత్రులం, భగవంతుని లీలలో సహాయకులం – అనే విశ్వాసాన్ని హృదయంలో గాఢంగా పాదుగొల్పుకొని కార్యరంగంలో అడుగిడు.
వివేకానంద