1. కామార్పుకూర్లో శ్రీరామకృష్ణులు
దక్షిణేశ్వరాలయంలో శ్రీరామకృష్ణులు పూజాకార్య కలాపాలను వదిలిపెట్టారన్న వార్త కామార్పుకూర్లో ఉన్న తల్లి, చిన్నన్నలకు తెలిసింది. అది తెలిసి వారెంతగానో ఆందోళన చెందారు. రాంకుమార్ చనిపోయి రెండేళ్ళయినాకాలేదు, అంతలోనే శ్రీరామకృష్ణులకు పిచ్చెక్కిందనే వార్త వారినెంతో కలవరపరిచింది. మనిషిని దురదృష్టం వెన్నాడుతుంటే, ఆపదలన్నీ ఒక్కుమ్మడిగా వస్తాయి. ఒకదాని తర్వాత ఒకటిగా కష్టంపైన కష్టం వచ్చి, మనిషిని బాధలపాలు చేస్తాయి అనే నానుడి వీరి జీవితంలో నిజమై కూర్చుంది. వయస్సు మీరిన సమయంలో చంద్రాదేవికి గదాధర్ జన్మించాడు. అందుచేత సహజంగానే ఆ పిల్లవాడు ఆమె కెంతో ప్రీతిపాత్రుడయ్యాడు. ఆమె శ్రీరామకృష్ణుల స్థితి గూర్చి విని ఆగలేక వెంటనే వారిని కామార్పుకూర్కు రప్పించుకుంది. శ్రీరామకృష్ణులు అక్కడికి వచ్చినా, ఆయనలో ఏ మార్పూ కనిపించలేదు. సర్వదా ఉదాసీనులై, ఏదో కోల్పోయినట్లు, దేన్నో వెతుకులాడుతున్నట్లు, అశాంతచిత్తంతో ఉండేవారు. ఆతురతతో దీనంగా “అమ్మా – అమ్మా” అని విలపించేవారు. ఇవన్నీ చూసి తల్లి చంద్రాదేవి ఎంతో ఆందోళన చెందింది. కుమారుడికి ఉపశమనం కలగడానికి ఎన్నో రీతుల ప్రయత్నించింది. మందులూ, మాకులూ ఇప్పించింది. మంత్రతంత్రాది కర్మలు చేయించింది. భూతవైద్యం చేయించింది. తనకు తెలిసిన అన్నిరకాల చికిత్సలూ చేయించింది.
ఈ సంఘటనలు 1858 వ సంవత్సరాంతంలో జరిగాయి.
2. శ్రీరామకృష్ణులను భూతం ఆవహించిందన్న వదంతి
ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత శ్రీరామకృష్ణులు వెనుకటిలా మామూలుగా ప్రవర్తిస్తున్నా, అప్పుడప్పుడు పరమ వ్యాకులతతో “అమ్మా – అమ్మా” అని విలపిస్తూ ఉండేవారు. ఒక్కోమారు భావపారవశ్యంతో బాహ్యస్మృతి కోల్పోయే వారు. ఆయన ప్రవర్తన ఒక్కోసారి అందరిలా మామూలుగా ఉండేది. మరొకప్పుడు అందుకు పూర్తి భిన్నంగా ఉండేది. ఒక ప్రక్క ఆయన దైవభక్తి, మాతృభక్తి సరళ అమాయక వ్యవహారం, స్నేహితులతో ప్రేమపూరిత వర్తనం పూర్వంలాగే వ్యక్తమవుతుండేవి. ఇతర సమయాల్లో సమస్త ప్రాపంచిక విషయాలపైన సంపూర్ణ నిర్లిప్తత, సామాన్యులకు తెలియనిదేదో ఒకదాన్ని పొందడానికై మహావ్యాకులత, లజ్జ, భయం, ఘృణ లాంటివి ఎరుగని హృదయంతో తన అభీష్ట లక్ష్యాన్ని చేరడం కోసం ప్రచండ ప్రయత్నం వారిలో ఎల్లప్పుడూ కనిపిస్తూ ఉండేవి. గదాధర్లోని ఈ విచిత్ర వ్యవహారం చూసి, లోకుల మనస్సులో ఇతణ్ణి ఏదో భూతం ఆవహించిందన్న విచిత్ర అభిప్రాయం కలిగింది.
3. మంత్రవేత్త ‘చండ’ ను ఆవాహన చేయడం
అమాయకురాలు, కల్లాకపటం ఎరుగనిది అయిన చంద్రాదేవి మనస్సులో కూడ అప్పుడప్పుడు ఇలాంటి అనుమానమే కలుగుతుండేది. ఇప్పుడు ఇతరులు కూడ అదే మాట మంత్రవేత్త ‘చండ’ ను అనడంతో, ఆమె అనుమానం దృఢపడింది. అందుచేత మంత్ర ఆవాహన చేయడం వేత్తను పిలిపించింది. ఆ సంఘటన గూర్చి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు: “ఒకరోజు ఒక మంత్రవేత్త వచ్చాడు. మంత్రించిన ఒక వత్తిని కాల్చి, నన్ను దాన్ని వాసన చూడమన్నాడు. అలాచేస్తే ‘ఆవహించిన భూతం పారిపోతుం’ దని చెప్పాడు. నేను వాసన చూశాను. అయినా ఏమీ కాలేదు. మరొకనాటి రాత్రి కొంతమంది మహా మంత్రవేత్తలు చేరారు. వారంతా కలిసి ‘చండ’ అనే క్షుద్రశక్తిని ఆవాహన చేశారు. పూజాబలులు ఇచ్చారు. చండ వాటితో ప్రీతి చెంది ‘అతణ్ణి ఏ భూతమూ పూనలేదు. అతడికి ఏ గాలీ సోకలేదు’ అని వారితో చెప్పింది. తర్వాత నాతో ‘గదాయ్! నువ్వు సాధువు కాగోరుతున్నావు కదా! అయితే మరి నువ్వు అంతగా వక్కలు తింటావేమిటి? అవి కామాన్ని ప్రకోపింప చేస్తాయి సుమా!’ అని అందరిముందే చెప్పింది. నిజంగానే నేను వక్కలు ఎక్కువగా తినేవాడిని. అవంటే నాకెంతో ఇష్టం. చండ అలా చెప్పిన తర్వాత వాటిని తినడం మానేశాను.”
4. శ్రీరామకృష్ణుల బంధుగణం అభిప్రాయం
అప్పటికి శ్రీరామకృష్ణులకు ఇరవై మూడు సంవత్సరాలు నిండనున్నాయి. కామార్పుకూర్లో ఆయన కొన్ని నెలలున్నారు. అప్పుడు ఆయన చాలావరకు మామూలు స్థితిలోనే ఉండేవారు. ఆయనలోని వ్యాకులత, ఆవేదన ఎలా తగ్గాయో, ఆయన మళ్ళీ మామూలు మనిషిగా ఎలా అయ్యారో దానికి కారణం ఉండే ఉంటుంది. జగన్మాత దర్శనాలను పదేపదే పొందడం దానికి కారణం కావచ్చు. ఈ కాలంలో జరిగిన విషయాలను ఎన్నింటినో మేము ఆయన బంధువుల నుండి వినివున్నాం. కాబట్టే ఆ అభిప్రాయం మాకు కలిగింది. వారు చెప్పిన విషయాలను కింద వివరిస్తాము.
కామార్పుకూర్కు పశ్చిమంలో ‘భూతిర్ఖాల్’, ఈశాన్యం వైపు ‘భూధుయ్మోరల్’ అనే రెండు శ్మశానాలుండేవి. శ్రీరామకృష్ణులు చాలావరకు రాత్రింబవళ్ళు ఎక్కువకాలం ఈ శ్మశానాల్లోనే గడుపుతుండేవారు. ఈ కాలంలో ఆయనలో అద్భుతశక్తులు అప్పుడప్పుడు అభివ్యక్తమవుతూ ఉండేవి. వాటిని ఆయన బంధువులు గమనించి ఉన్నారు. వారు మాకిలా చెప్పారు:
ఆ రెండు శ్మశానాల్లో నక్కలు, క్షుద్రశక్తులు ఉండేవి. ఆ ఆత్మీయులు వాటిని అప్పుడప్పుడు ‘బలి’ ద్వారా తృప్తిపరుస్తూ ఉండేవారు. ఒక కొత్త కుండలో ‘మిఠాయి’ మొదలైన తినుబండారాలు పెట్టి, దాన్ని శ్మశానంలోకి తీసుకెళ్ళి బలిగా అర్పించేవారు. అలా అర్పించిన వెంటనే, అన్నివైపుల నుంచి నక్కలు గుంపులు గుంపులుగా వచ్చేవి. వాటిని తినిపోయేవి. క్షుద్రదేవతలకు అర్పించిన ఆహారం కుండతో సహా గాలిలోకి పైకి ఎగిరి వెళ్ళేది. అదృశ్యమై పోయేది. ఆ క్షుద్ర దేవతలను ఆయన చాలాసార్లు చూడగలిగేవారు.
శ్రీరామకృష్ణులు అర్ధరాత్రి దాటినా శ్మశానాన్ని వదిలి వచ్చేవారు కారు. అప్పుడాయన చిన్నన్న రామేశ్వర్ ఆ శ్మశానం వద్దకు వెళ్ళి బిగ్గరగా తమ్ముణ్ణి పిలిచేవాడు. ఆ పిలుపు విని వెంటనే, అన్నను హెచ్చరిస్తూ, “అన్నా! వస్తున్నాను. నువ్వింక ముందుకు రాకు. వీరు (క్షుద్రదేవతలు) నీకు హాని కలిగిస్తారు” అని చెబుతూ వచ్చేవారు. ‘భూతిర్ఖాల్’ శ్మశానంలో ఈ సమయంలో ఆయన ఒక బిల్వ విత్తనాన్ని నాటారు. శ్మశానంలోని పెద్ద మర్రిచెట్టు కింద కూర్చుని చాలా సమయాన్ని జపధ్యానాదుల్లో గడిపేవారు. జగన్మాతను చూడాలన్న కోరికతో వారంతకు పూర్వం తీవ్ర పరితాపంతో బాధపడుతూ ఉండేవారు. ఈ కాలంలో ఆయన కొన్ని అపూర్వ దివ్యదర్శనాలను, అనుభవాలను పొందడంచేత ఆ పరితాపం చాలావరకు ఉపశమించింది.
ఈ కాలంలోని వారి జీవితాన్ని గనుక మనం పరిశీలిస్తే, ఒక విషయం స్పష్ట మవుతుంది. వారిప్పుడు ఖడ్గపాలధారిణి, వరాభయకరీ, సాధకానుగ్రహకారిణి అయిన జగన్మాత చిన్మయమూర్తిని దాదాపు అనవరతం దర్శిస్తూ ఉండేవారు. తన కర్తవ్యాన్ని గూర్చి ఎప్పటికప్పుడు అమ్మ నడిగి, ఆమె చెప్పినట్లు జీవితాన్ని మలచుకోసాగారు. జగజ్జనని అఖండ చిన్మయ దర్శనభాగ్యం తమకిక త్వరలోనే లభించగలదన్న విశ్వాసం ఈ కాలం నుండి ఆయన హృదయంలో సుస్థిరమైనదనే మనం అనుకోవచ్చు.
5. శ్రీరామకృష్ణులలో యోగశక్తులు వ్యక్తం కావడం
‘భవిష్యత్తులో జరగబోయే విషయాలను తెలుసుకోవడం’ లాంటి యోగశక్తులు ఈ కాలంలో శ్రీరామకృష్ణులలో వ్యక్తం కాసాగాయి. హృదయరామ్, కామార్పుకూర్ – జయరామ్బాటీలకు చెందిన అనేకులు ఈ విషయం ధ్రువీకరించారు. స్వయంగా గురుదేవులు కూడ ఈ విషయాన్ని గురించి మాకు అప్పుడప్పుడు వివరించేవారు. ఈ క్రింది కొన్ని సంఘటనలు ఈ అంశాన్ని విశదపరుస్తాయి.
6. శ్రీరామకృష్ణులకు వివాహం చేయాలని బంధువులు నిర్ణయించడం
శ్రీరామకృష్ణుల ప్రవర్తన, చేష్టలను చూసి దేవుని దయ వల్ల వారి ‘పిచ్చి’ నయమైందని చంద్రాదేవి తదితర బంధువులు అనుకున్నారు. శ్రీరామకృష్ణులు ఇప్పుడు వ్యాకులుడై విలపించడం లేదు. భోజనాదులు మామూలుగానే చేస్తున్నారు. ఇతర వ్యవహారాలన్నీ కూడ సక్రమంగానే చేస్తున్నారు. కాబట్టి ఆయన మామూలు మనిషయ్యారని వారికి నిశ్చయం కలిగింది. కాని ఆయన శ్మశానాలకు వెళ్ళడం, ఎవరి మాటా లెక్కచేయకుండా అప్పుడప్పుడు బట్టలను, జందేన్ని తీసివేసి ధ్యానాదులు చేయడం, ఎప్పుడూ జప ప్రార్థనలలోనే తమ కాలాన్ని గడపడం – ఇలాంటివన్నీ చేసేవారు. ఇవి మామూలు మనిషి చేసే పనులు కాకపోయినా, బాల్యం నుంచి అలాగే చేస్తూ వస్తున్నారు కాబట్టి, వీటిని వారు పిచ్చి లక్షణాలుగా పరిగణించలేదు. కాని ప్రాపంచిక విషయాలపైన పూర్తి ఉదాసీనతను, ఆయనలోని అంతర్ముఖత్వాన్ని చూసి వారి బంధువులంతా చింతాక్రాంతులయ్యేవారు. శ్రీరామకృష్ణుల దృష్టి పూర్తిగా సంసారం మీదికి మరలనంతవరకూ, మొదట కనిపించిన పిచ్చి మళ్ళీ తిరగబెట్టే ఆస్కారముందని ఆ బంధువులు భావించసాగారు. అలాంటి ప్రమాదంలో శ్రీరామకృష్ణులు మళ్ళీ పడకుండా చేయాలన్న ఉద్దేశంతో ఆయనకు వివాహం చేయదలిచారు. చంద్రాదేవి, అన్న రామేశ్వర్ ఇద్దరూ అతడికి తగిన అమ్మాయితో వివాహం చేయడానికి నిశ్చయించుకొన్నారు. ‘పెళ్ళి చేస్తే పిచ్చి కుదురుతుంది’ అన్నది వారి అభిప్రాయం. కాబట్టి సద్వంశీయురాలు, సుశీల, సుందరి అయిన భార్య ప్రక్కనే ఉంటే మనస్సు ఇతర మార్గాల వెంట పరుగులు పెట్టదని, సంసారంలోనే కుదుటపడుతుందని వారి నమ్మకం.
7. ఎందుకు శ్రీరామకృష్ణులు వివాహానికి అంగీకరించారు?
ఈ పెళ్ళి విషయం ‘గదాయ్’ కు తెలిస్తే, అడ్డుపడతాడనుకొని వారు రహస్యంగానే సంబంధాలు చూడసాగారు. కాని గదాధర్కు ఈ విషయం త్వరలోనే తెలిసిపోయింది. అయినా అతడు ఎలాంటి ఆటంకమూ కలిగించలేదు. పైగా పండగో, పబ్బమో జరిగినప్పుడు పిల్లలు ఎంతగా ఆనందిస్తారో అతడు కూడా పెళ్ళిమాట విని అంతగా సంబరపడిపోయాడు. బహుశా ఈ విషయమై ఆయన జగన్మాతను అడిగి, ఆమె అంగీకారం పొంది ఉంటారు. లేకపోతే ఆయన ఆనందంగా ఉండడానికి కారణం కనిపించదు. ఈ విషయాన్ని మరోచోట (III.4) మేము వివరంగా చర్చించాం.
8. వధువును తానే ఎంపిక చేయడం
శ్రీరామకృష్ణులకు వివాహం చేయడం కోసం చుట్టుప్రక్కల గ్రామాల్లో వధువు కోసం తెగ ప్రయత్నించారు. కాని తగిన సంబంధం ఏదీ కుదరలేదు. ఒకచోట పెళ్ళికూతురు నచ్చినా, కన్యాశుల్కం ఎక్కువ అడిగేవారు. అంత పైకం ఇచ్చే స్థితిలో చంద్రాదేవి లేదు. ఆమె కుమారుని వివాహ విషయమైన చింతలో మునిగివుండేది. ఇలాంటి స్థితిలో ఒక రోజు శ్రీరామకృష్ణులు హఠాత్తుగా భావావేశంలో, “అక్కడ, ఇక్కడ వెతికి ప్రయోజనం లేదు. జయరామ్బాటిలో శ్రీరామచంద్ర ముఖోపాధ్యాయ ఇంట్లో వధువు ఉంది. ‘గడ్డిపోచతో కట్టి’* ఆమెను నా కోసమే భద్రంగా ఉంచారు. వెళ్ళి మాట్లాడండి” అని చెప్పారు.
9. వివాహం
శ్రీరామకృష్ణుల మాటలను వారంతగా పట్టించుకోలేదు. అయినా ఒకమారు చూసి వస్తే ఏం పోయింది అనుకుని, జయరామ్బాటికి మనిషిని పంపించారు. ఆ మనిషి తిరిగి వచ్చి, “అన్నీ సరిగానే ఉన్నాయి. అయితే ఆ అమ్మాయి మాత్రం మరీ చిన్న పిల్ల” అని చెప్పాడు. ఆ పిల్లకు ఐదేళ్ళట. అయినా వధువు లభించింది కాబట్టి, ఆ పిల్లతోనే గదాయ్కు వివాహం చేయ నిశ్చయించారు. ఒక శుభముహూర్తంలో రామేశ్వర్, తమ్మునితోపాటు జయరామ్బాటికి వెళ్ళాడు. ఆ ఊరు కామార్పుకూర్కు పడమట నాలుగు మైళ్ళ దూరంలో ఉంది. శ్రీరామచంద్ర ముఖోపాధ్యాయకు, కన్యాశుల్కం క్రింద మూడు వందల రూపాయలు ఇచ్చి, వివాహం చేయించాడు. ఈ వివాహం మే, 1859 వ సంవత్సరం, వైశాఖమాసం చివరి రోజుల్లో జరిగింది. అప్పుడు శ్రీరామకృష్ణుల వయస్సు 24 సంవత్సరాలు.
10. వివాహానంతరం చంద్రాదేవి, శ్రీరామకృష్ణుల ప్రవర్తన
కుమారునికి వివాహం కావడంతో చంద్రాదేవి మనస్సు చాలావరకు కుదుటపడింది. వివాహం, ఇతర వ్యవహారాల్లో తన కొడుకు తాను చెప్పినట్లు వినడం చూసి, ఇంత కాలానికి దేవుడి అనుగ్రహం కలిగిందని ఆమె సంతోషించింది. సంసారమంటే ఏమీ పట్టనట్లుండే కుమారుడు ఇంటికి తిరిగి వచ్చాడు. ఉత్తమవంశానికి చెందిన అమ్మాయి తనకు కోడలిగా లభించింది. డబ్బు కొరత కూడ తీరిపోయింది. భగవంతుని కృప లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి? కాబట్టి కల్లాకపటం తెలియని చంద్రాదేవి హృదయం ఇంతకాలానికి ఆనందంతో నిండిపోయింది. కాని వివాహం అయిన కొన్ని రోజులకే తన పేదరికాన్ని తలచుకుని ఆమె మళ్ళీ వ్యథ చెందవలసి వచ్చింది. గదాయ్ వివాహం ఘనంగా జరిపించాలని, కుటుంబ గౌరవాన్ని నిలపాలని ఆమె, తన కుటుంబ మిత్రుడు జమీందారు లాహాబాబు నుండి ఆభరణాలను ఎరవు తీసుకుని, వాటిని వధువుకు అలంకరించింది. వివాహమయ్యాక వాటిని తిరిగి ఇచ్చివేయవలసి వచ్చింది. అదే ఆమె దుఃఖానికి కారణమైంది. వివాహం ముగిశాక కోడల్ని ఆమె తన సొంత కుమార్తెలా చూసుకోసాగింది. కుమార్తె వద్ద నుండి ఏ తల్లయినా పెట్టిన ఆభరణాలు ఎలా లాక్కోగలదు? కాని తప్పదు! అవన్నీ ఎరవు ఆభరణాలు కదా! ఏం చేయాలో పాపం ఆ వృద్ధురాలికి అంతుబట్టలేదు. లోలోనే బాధపడుతూ ఉండిపోయింది. ఆ విషయం ఆమె ఎవరికీ చెప్పలేదు. అయినా శ్రీరామకృష్ణులు ఎలాగో ఆ విషయాన్ని తెలుసుకున్నారు. వెంటనే ఒకరాత్రి నిద్రపోతున్న వధువు ధరించిన ఆభరణాలను నెమ్మదిగా తొలగించి, తల్లికిచ్చారు. ఆ విషయం ఆ అమ్మాయికి అసలే తెలియదు. ఉదయం మేల్కొని “నేను ధరించిన నగలన్నీ ఏమైనాయి?” అని బాల శారద అడిగింది. అప్పుడు కంట తడిపెట్టుకొని చంద్రాదేవి ఆ అమ్మాయిని తన ఒడిలోకి తీసుకుని, “అమ్మా! ఆ ఆభరణాల కన్నా మంచివాటిని గదాయ్ నీకు చేయిస్తాడు కదా” అని ఊరడించింది. కాని ఈ కథ ఇంతటితో అయిపోలేదు. ఆ అమ్మాయి చిన్నాన్న, కూతుర్ని చూడడానికి వచ్చి, విషయమంతా విని ఎంతో కోపంతో ఆ అమ్మాయిని తోడ్కొని వెళ్ళిపోయాడు. దాంతో చంద్రాదేవి మరింత వ్యథ చెందింది. ఆ విషయం తెలిసిన గదాధర్, ఆ సంఘటనను చాలా తేలికగా తీసుకుని, “అయితే ఏం! వివాహం జరిగిపోయిందిగా, ఇప్పుడు వారెంత ఆవేశపడినా వివాహాన్ని మాత్రం రద్దుచేయలేరుగా!” అంటూ ఆమెకు ఊరట కలిగించాడు.
11. శ్రీరామకృష్ణులు కలకత్తాకు తిరిగి వెళ్ళడం
వివాహం అయిన తర్వాత దాదాపు ఒక సంవత్సరం ఏడు నెలల వరకు శ్రీరామకృష్ణులు కామార్పుకూర్లో ఉన్నారు. చాలాకాలం తర్వాత కొడుకు తిరిగి రావడం, పైగా కలకత్తాకు వెళ్ళితే మళ్ళీ ఎక్కడ పిచ్చిపడుతుందో నన్న భయం వల్ల శ్రీరామకృష్ణులను, తల్లి కలకత్తాకు తిరిగి వెళ్ళనివ్వలేదు. పెళ్ళి కుమార్తెకు ఇప్పుడు ఏడేళ్ళు వచ్చాయి. ఆచార ప్రకారం శ్రీరామకృష్ణులు మామగారింటికి వెళ్ళి కొన్ని రోజులుండి భార్యతో సహా తిరిగి వచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన కలకత్తాకు తిరిగి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. మరికొంత కాలం ఉండమని తల్లి, అన్న బలవంతం చేశారు. కాని ఆయనకు తమ పేదరికం, కుటుంబ స్థితిగతులు తెలుసుకదా! అందుచేత శ్రీరామకృష్ణులు వారిని ఒప్పించి, తిరిగి కలకత్తాకు వచ్చేశారు. మళ్ళీ కాళికాలయంలో పూజారిగా సేవలు కొనసాగించారు.
12. రెండవమారు శ్రీరామకృష్ణుల దివ్యోన్మాదం
కొన్ని రోజులు జగజ్జనని పూజను కొనసాగించారో లేదో శ్రీరామకృష్ణులు దాన్లో పూర్తిగా సంలీనమైపోయారు. కామార్పుకూర్, తల్లి, అన్న, భార్య, లోక వ్యవహారాలు, పేదరికం మొదలైనవన్నీ ఆయన మనస్సు నుండి అదృశ్యమై పోయాయి. సదా, సర్వవేళలా, సర్వులలో జగజ్జననిని దర్శించడం ఎలా అన్న భావన ఒక్కటే ఆయన మనస్సును పూర్తిగా ఆక్రమించి వేసింది. అవిచ్ఛిన్న జప ధ్యానాదుల వల్ల ఆయన ఛాతీ మళ్ళీ ఎర్రబారింది. లోకం, లౌకిక ప్రసంగాలు ఆయనకు విషతుల్యంగా కనిపించసాగాయి. ఆ తీవ్రమైన దేహమంటలు మళ్ళీ మొదలైనాయి. నిద్ర కరువైపోయింది. కాని ఆయన అటువంటి శారీరక మానసిక స్థితిని అంతకు మునుపే అనుభవించి ఉండడం వల్ల, ఈసారి వాటి ఉద్ధృతాన్ని నిభాయించుకోగలిగారు.
హృదయ్ మాకు ఇలా తెలియచేశాడు: మథుర్బాబు నిర్దేశం మేరకు కలకత్తాలోని సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడైన గంగాప్రసాద్ సేన్, గురుదేవుల రుగ్మతకు చికిత్స మొదలుపెట్టాడు. నిద్రలేమికి, వాతప్రకోపానికి, ఒంటి మంటలకు అతడు చతుర్ముఖ గుళికలు, మధ్యమనారాయణ మొదలైన తైలాల ఔషధ నిర్ణయం చేశాడు. ఆ చికిత్స వెంటనే సత్ఫలితాన్ని ఇవ్వకున్నప్పటికీ, హృదయ్ నిరాశ చెందలేదు. అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులతోపాటు కలకత్తాలోని ఆ వైద్యుని ఇంటికి తనుకూడ వెళ్ళేవాడు. ఒకరోజు హృదయ్తో వెళ్ళినప్పుడు గంగాప్రసాద్ సేన్ తనను జాగ్రత్తగా పరీక్షించి కొత్త ఔషధాలను నిర్ణయించాడని శ్రీరామకృష్ణులు చెప్పారు. అప్పుడు అక్కడ తూర్పు వంగదేశపు వైద్యుడు ఒకరున్నారు. శ్రీరామకృష్ణుల దృక్కులకు ఆకర్షితుడైన ఆ వైద్యుడు, ఆయన రుగ్మత గురించి లోతుగా యోచించి, ఇలా అన్నాడు: “రోగ లక్షణాలను బట్టిచూస్తే ఈయన దివ్యోన్మాద స్థితిలో ఉన్నట్లు కనబడుతూన్నది. ఇది ఔషధాలకు నయం కాదు.”* ఈ వైద్యుడే రుగ్మతగా కానవచ్చే తన శారీరక మార్పులకు అసలు కారణాన్ని కనుగొన్న మొదటి వ్యక్తి అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. కాని ఆ వైద్యుడి మాటలు అప్పుడు ఎవరూ విశ్వసించలేదు. ఆ విధంగా కొంత కాలం గడిచింది. మథుర్బాబు, ఇతర శ్రేయోభిలాషులు ఎంతో ఆతురత చెంది, ఆ అసాధారణ వ్యాధికి నానారకాల చికిత్సలు చేయించసాగారు. కాని వ్యాధి తగ్గుముఖం పట్టకపోగా, ఉద్ధృతం కాసాగింది.
13. చంద్రాదేవి ప్రాయోపవేశం
శ్రీరామకృష్ణుల వ్యాధి విషయం అలా అలా చంద్రాదేవి చెవిన పడింది. ఆమె ఎంతో ఆందోళన చెందింది. ఆమెకు ఏమీ పాలుపోలేదు. అందుచేత తన కుమారుని ఆరోగ్యం కోసం నిద్రాహారాలుమాని మహాదేవుని ప్రార్థించసాగింది. కామార్పుకూర్లో ‘బుడోశివ్’ అనే ఆలయముంది. అది (పురాతన) శివాలయం. ఆ దేవుడు ‘జాగృత’ దేవుడని ప్రసిద్ధి. ఆమె ఆ గుడిలోకి వెళ్ళి ‘ప్రాయోపవేశం’ చేపట్టింది. అలా దీక్షలో ఉండగా ఆమెకు ‘ముకుందపుర్’ శివాలయానికి వెళ్ళమని దైవాదేశం అయింది. ఆమె అలాగే అక్కడికి వెళ్ళి, ఆ దీక్ష పూనింది. తమ కోరికలకోసం ఎవరూ ఇదివరకు ఈ గుడిలో ప్రాయోపవేశం చేయలేదు. అది తెలిసినప్పటికి, దైవాదేశాన్ని ఏమాత్రమూ సందేహించక వెళ్ళి ఆమె దీక్ష పూనింది. రెండు మూడు రోజుల తర్వాత ఆమెకు ఒక దివ్యస్వప్నం కలిగింది. ఆ స్వప్నంలో జటాజూటధారీ, వ్యాఘ్రచర్మాంబరధారీ అయిన పరమేశ్వరుడు దర్శనమిచ్చి, “భయపడవద్దు. నీ కొడుకు పిచ్చివాడు కాదు. భగవదావేశం వల్ల అతడికలాంటి స్థితి ఏర్పడింది” అని శాంతపరిచాడు. ఆ మాటతో ఆమె ఉపశమనం పొంది, పరిపూర్ణ భక్తి నిండిన హృదయంతో మహాదేవుణ్ణి పూజించి, ఇంటికి తిరిగివచ్చింది. కొడుకు ఆరోగ్యంకోసం కులదైవం శ్రీరఘువీరుని, శీతలాదేవిని శ్రద్ధతో సేవించసాగింది. ముకుందపురం గుడిలో ఆమెకు దైవాజ్ఞ లభించడం చూసి, అప్పటి నుండి ఆ గుడికి కూడ పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ప్రతి సంవత్సరం ఎంతోమంది స్త్రీ – పురుషులు అక్కడ ప్రాయోపవేశ వ్రతాన్ని పూనసాగారు. ఈ విషయం మేము విన్న సంగతే మీకు వివరించాం.
14. ఈ సమయంలో శ్రీరామకృష్ణుల స్థితి
ఆ సమయంలో తనకు కలిగిన దివ్యభావాన్ని గుర్తుకు తెచ్చుకుని, గురుదేవులు మాకెన్నోసార్లు ఇలా చెబుతుండేవారు. “ఆధ్యాత్మిక భావ ప్రాబల్యంతో సామాన్యుల మనశ్శరీరాల్లో అలాంటి అవస్థ ఏర్పడడం సంగతి అలా ఉంచుదాం. కనీసం దానిలో పావుభాగం కలిగినా, వారి ప్రాణాలు నిలవవు. రాత్రింబవళ్ళూ ఎక్కువకాలం అమ్మ దర్శనాన్ని ఏదో ఒక రూపంలో పొందుతూ, సర్వం మరిచి ఉండేవాడిని నేను. అందుకే జీవించగలిగాను. లేకపోతే (తన శరీరాన్ని చూపిస్తూ) ఈ ‘ఒర’ ఎప్పుడో రాలిపోయేది. అప్పటి నుండి ఆరు సంవత్సరాల సుదీర్ఘకాలం వరకూ, నాకు అసలు నిద్రంటూ లేకుండా పోయింది. కనురెప్పలకు మూతపడే శక్తిపోయింది. ఎంత ప్రయత్నించినా కళ్ళు మూసుకోవడం సాధ్యమయ్యేది కాదు. కాలం ఎలా సాగిపోయిందో నాకేమాత్రమూ తెలిసేది కాదు. శరీరాన్ని బ్రతికించి ఉంచాలన్న ధ్యాసకూడ ఉండేది కాదు. ఎప్పుడైనా శరీరంపైకి చూపు మరలితే దాని అవస్థ చూసి భయం వేసేది. నాకు పిచ్చిగాని పట్టలేదు కదా! అని ఆందోళన చెందేవాడిని. అద్దం ముందు కూర్చుని, కనురెప్పలు మూత పడతాయో, లేదోనని కంటిలో వ్రేలుపెట్టి పరీక్షించుకునేవాణ్ణి. అలా చేసినా ఫలితం ఉండేది కాదు. తెరిచిన కళ్ళు తెరిచినట్లే ఉండిపోయేవి. భయంతో ఏడుస్తూ తల్లితో, ‘అమ్మా! నువ్వే నా సర్వస్వమని నమ్మి, నీ మీదే భారం వేసి, నిన్ను ప్రార్థిస్తున్నందుకు ఇదా ఫలం?’ అని అడిగేవాడిని. ‘ఇంతటి ఘోరమైన రోగం ఎందుకు ఇచ్చావమ్మా’ అంటూ నిలదీసేవాణ్ణి. అయితే మరుక్షణమే ‘అమ్మా! ఏమైనా, ఈ శరీరం పోతే పోనీ! కాని నన్ను మాత్రం నువ్వు వదలవద్దు సుమా’ అంటూ ప్రార్థించేవాడిని. ‘అమ్మా! నాకు నీ దర్శనమివ్వు, నాపై కృప చూపు. నీ పాదాలు తప్ప నాకు మరేదీ శరణ్యం కాదు. నువ్వు తప్ప నాకు మరే గతీ లేదు’ అంటూ విలపించేవాణ్ణి. అలా విలపిస్తూ ఉంటే మనస్సు మళ్ళీ ఎంతో ఉత్సాహ పూరితమయ్యేది. శరీరం ఎంతో తుచ్ఛమైనదిగా కనిపించేది. అప్పుడు అమ్మ దర్శనమయ్యేది. అమ్మ దివ్యవాణి వినిపించేది. దానితో ఉపశమనం పొందేవాణ్ణి” అని విశదీకరించారు.
15. శ్రీరామకృష్ణులలో శివ–కాళీలను మథుర్ దర్శించడం
జగన్మాత దివ్యసంకల్పం రీత్యా, ఈ సమయంలో ఒకరోజు మథుర్బాబుకి ఒక దివ్యదర్శనం కలిగింది. శ్రీరామకృష్ణులలో అతడు శివుణ్ణి, కాళీమాతను – ఇద్దరినీ దర్శించి, అద్భుత ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆ తర్వాత శ్రీరామకృష్ణులను అతడు భగవంతునిగానే పూజింపసాగాడు. ఈ విషయాన్ని మేం మరోచోట వివరించాం.* దాని ప్రభావంగా మథుర్బాబు ఆ క్షణం నుంచి గురుదేవులను భగవత్ దృష్టితో చూస్తూ, ఆయన పట్ల అనన్య భక్తి శ్రద్ధావిశ్వాసాలు కలిగి ఉండసాగాడు. ఇలాంటి అద్భుత సంఘటన జరగడం చూస్తే, ఒక విషయం మనకు స్పష్టమవుతుంది. ఆ క్షణం నుంచి శ్రీరామకృష్ణుల సాధక జీవితంలో మథుర్బాబు సహాయ సహకారాలు విశేషంగా ఉంటాయన్నదే అది. అందుకే ఇచ్ఛాశక్తితో జగన్మాత వారినిద్దర్ని కూడ అభేద్య ప్రేమబంధంతో గాఢంగా బంధించింది. అజ్ఞేయవాదం, భౌతికవాదం, నాస్తికవాదం వీటితో నిండివున్న నేటి యుగంలో ఏర్పడిన ధర్మగ్లానిని నాశనం చేసి, అత్యంత శక్తిమంతమైన ఆధ్యాత్మిక శక్తిని సంక్రమింప చేయడానికి, శ్రీరామకృష్ణుల మనశ్శరీరాలనే యంత్రాన్ని జగన్మాత ఎంతో ప్రయత్నంతో, ఎంతటి అద్భుత ఉపాయంతో నిర్మాణం చేసిందో కదా! ఈ విషయాన్ని ఆయా సంఘటనలే తెలియజేస్తున్నాయి. వాటిని చూసి మనం అవాక్కై తీరాల్సిందే!.