1. సాధనకాల పూర్వాపర్యత
శ్రీరామకృష్ణులు సాధనలు చేసిన కాలం గురించి తెలుసుకోవాలంటే దాని గురించి వారు చెప్పిన మాటలు మొదట గుర్తుకు తెచ్చుకోవాలి. దాదాపు 12 సంవత్సరాలు నిరంతరాయంగా తాను వివిధ మతాల సాధనలు చేసినట్లు ఆయనే మాకు చెప్పారు. రాణీ రాస్మణి దక్షిణేశ్వర ఆలయాన్ని కులగురువుకు దానం చేస్తూ, ఒక దానపత్రం రాయించింది. దాని ప్రకారం 1855 సం ॥, మే 31, గురువారం నాడు శ్రీకాళీదేవి ప్రతిష్ఠ జరిగింది. ఆ సంవత్సరమే శ్రీరామకృష్ణులు కూడ అర్చకులయ్యారు. కాబట్టి 1856 నుండి 1867 వరకు వారు సాధనలు చేసారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ 12 సంవత్సరాలను ఆయన ‘సాధన కాలం’ అని ప్రత్యేకించి పేర్కొంటాం. కాని ఆ తర్వాత కూడ ఆయన తీర్థయాత్రలకు వెళ్ళి, ఆ ప్రాంతాల్లో మరికొన్ని సాధనలు చేశారు. దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చిన తర్వాత కూడ ఆయన అప్పుడప్పుడు మళ్ళీ సాధనలు చేశారు. ఈ విషయం గూర్చి తర్వాత చెప్పుకుందాం.
2. సాధనకాల మూడు ప్రధాన విభాగాలు
పన్నెండు సంవత్సరాల ఈ సాధన కాలాన్ని మూడు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. ఒక్కొక్క భాగాన్ని లోతుగా అధ్యయనం చేద్దాం. మొదటి భాగం 1856 నుండి 1859 వరకు. ఈ భాగంలోని సంఘటనలు గూర్చి మనం ఇదివరకే చెప్పుకున్నాం. 1860 – 1863 వరకు సాధనలో రెండవ భాగం. ఈ నాలుగు సంవత్సరాలలో భైరవీ బ్రాహ్మణి ఆధ్వర్యవంలో శ్రీరామకృష్ణులు 64 తంత్రాలలో సాధన చేసి సిద్ధి పొందారు. వీటిని గోకుల వ్రతంతో మొదలుపెట్టారు. శాస్త్రరీత్యా గోవుకు గడ్డి పెట్టడం, ఈ వ్రతం. 1864 – 1867 వరకు సాధనలో మూడవ భాగం. ఈ కాలంలో శ్రీరామకృష్ణులు ‘బాలరామ’ (రామ్‌లాలా) సాధన చేశారు. ‘జటాధారి’ అనే రామోపాసక సాధువు నుండి రామమంత్రాన్ని, బాలరామ విగ్రహాన్ని పొంది, సాధన చేశారు. తర్వాత ‘మధురభావ’ సాధనలో సిద్ధులయ్యారు. దీని కోసం ఆయన ఆరు నెలలు స్త్రీవేషం వేసుకున్నారు. భగవంతుడు పురుషుడు, నాయకుడు అయితే భక్తులు స్త్రీలు – నాయికలు అన్నది ఈ మధురభక్తి మార్గం. కాబట్టి ఈ మార్గంలోని భక్తులంతా విధిగా స్త్రీత్వాన్ని ఆపాదించుకుని పురుషునికి సర్వసమర్పణ చేయాలి. ఈ సాధన తర్వాత తోతాపురి అనే సన్న్యాసి ఆధ్వర్యవంలో అద్వైత సాధనలో సన్న్యాసియై సాధనచేసి నిర్వికల్పసమాధి పొందారు. చివరికి ‘గోవింద్’ అనే సూఫీ ఫకీరు నుండి ఇస్లాం దీక్ష పొంది, సాధన చేశారు.
ఈ పన్నెండు సంవత్సరాలలో ముఖ్యసాధనలే కాక, మరికొన్ని సాధనలు కూడ చేశారు. ‘సఖ్యభావ సాధన’, ‘కర్తాభజా – నవరసిక్’ వైష్ణవ సాధనలు వాటిలో కొన్ని. వైష్ణవ సంప్రదాయ సాధనలన్నింటిలో గురుదేవులు నిష్ణాతులు. వైష్ణవ చరణ్ మొదలైన వైష్ణవసంప్రదాయ సాధకులు, సాధన సమయంలో సహాయం పొందడానికి గురుదేవుల వద్దకు వచ్చేవారు. ఇదే దానికి ఋజువు. ఇలా శ్రీరామకృష్ణుల సాధన కాలాన్ని త్రిభాగ యుక్తంగా లోతుగా పరిశీలన చేస్తే, మొదటి విభాగంలోని సాధనలకు, తక్కిన రెండు విభాగాలలోని సాధనలకు స్పష్టమైన తారతమ్యం మనకు కనిపిస్తుంది.
3. తొలి నాలుగు సంవత్సరాల సాధనానుభూతుల సింహావలోకనం
శ్రీరామకృష్ణులు సాధన చేయడానికి మొదలుపెట్టినప్పుడు, ఆయనకు ఒకే ఒక సహాయం అందింది. శ్రీ కేనారామ్ భట్టాచార్యులు, ఆయనకు శక్తి మంత్ర దీక్షను ఇచ్చారు. తద్ద్వారా భగవత్ సాక్షాత్కారం కోసం ఆయనలో ఆంతరికంగా తీవ్రతపన బయలుదేరింది. ఈ తపన తీవ్ర తరం అవుతున్నకొద్దీ, ఆయన శరీరం, మనస్సు అనేక మార్పులకు లోనయ్యాయి. ఆయనలో ఇష్టదేవత పట్ల పరమప్రేమ జనించింది. ‘వైధీభక్తి’ పరిధిని ఆయన దాటేశారు. రాగాత్మికభక్తిలో ముందుకు పురోగమించారు. జగన్మాత సాక్షాత్కారం అయింది. యోగశక్తులన్నీ ఆయన పరమయ్యాయి.
4. జగన్మాత సాక్షాత్కారానంతరం కూడా శ్రీరామకృష్ణులు ఇంకా సాధనలు ఎందుకు చేశారు?
‘శ్రీరామకృష్ణులు భగవత్ సాక్షాత్కారాన్ని పొందారు. సకల సిద్ధులూ ఆయనకు లభించి కృతార్థులయ్యారు కదా! మరింకా ఆయన చేయవలసిందేముంది?’ అని పాఠకులు అనవచ్చు. దానికి మా సమాధానం: ఒకవైపు ఈ ప్రశ్న సమంజసమే. కాని ఇంకా సాధన చేయవలసి ఉంది. “మొక్కలకు మొదట పువ్వులు, తర్వాత కాయలు కాయడం సహజం. కాని కొన్నింటిలో ముందు పిందెలు వేసి, తర్వాత పూలు పూస్తాయి” అని శ్రీరామకృష్ణులు చెబుతారు. శ్రీరామకృష్ణుల సాధన వికాసం కూడ రెండవదాని మాదిరిగానే సాగింది. సాధన ఆరంభంలోనే ఆయనకు దివ్యానుభూతులు, జగన్మాత దర్శనం అయ్యాయి. అయితే ఇవి ఎంతవరకు నిజం? ఎంతవరకు భ్రమ అన్నది ఆయనకు తేలలేదు. దానికోసం పూర్వసాధకుల సిద్ధి అనుభవాలతో తన అనుభవాలను పోల్చిచూసుకోవలసిన అవసరం ఏర్పడింది. అవన్నీ శాస్త్రాలలో ఉన్నాయి మరి! తాను పొందిన అనుభూతులు శాస్త్రోక్తసాధనల వల్ల కలుగలేదు; కేవలం తీవ్ర తపన – భక్తి వలన కలిగాయి. కాబట్టి ఆ అనుభూతులను శాస్త్రోక్త సాధనల ద్వారా కూడ పొందడం అత్యవసరమైంది. లేకపోతే వాటి నిజానిజాలు తనకెలా తెలుస్తాయి?
గురువులు తెల్పిన వారి వారి అనుభూతులు, శాస్త్రాలలో ఉన్న సాధకుల అనుభూతులు, సాధన ఫలంగా తాను పొందిన స్వానుభవాలు, ఈ మూడూ ఒక్కటే, వేర్వేరు కావు అని నిశ్చయంగా తెలియాలి. అప్పుడే తన సాధన సఫలమయినట్లు తెలుస్తుంది. ఆయన సందేహాలన్నీ నివృత్తమౌతాయి. ఆయన పరిపూర్ణ శాంతిని అనుభవిస్తాడు.
5. శుకుని సాదృశ్యం
పైన చెప్పిన విషయానికి ఒక ఉదాహరణగా శుకదేవుని జీవితంలో జరిగిన ఒక సంఘటనను పేర్కొనవచ్చు. వ్యాసుని కుమారుడైన శుకుడు పరమహంసలలో ప్రథమగణ్యుడు. మాయకు అతీతుడు. జన్మతః దివ్యదర్శనాలు, అనుభూతులు పొందుతూ ఉండేవాడు. అవి యథార్థాలో కావో, తాను గమ్యం చేరుకొన్నాడో లేదో నిర్థారించుకోవడానికి శుకుడు వేదాలు, షడ్దర్శనాలు, తదితర శాస్త్రాలు అధ్యయనం చేశాడు. పిదప తన తండ్రిని ఇలా అడిగాడు: “తండ్రీ! శాస్త్రోక్త సాధనలన్నీ జన్మతః నాకు సిద్ధించి ఉన్నాయి. అయినా నేనింకా ఆత్మజ్ఞానిని కానేమో అని సందేహంగా ఉంది. నా సందేహాన్ని నివృత్తి చేయి.” అప్పుడు వ్యాసుడు అనేక విధాలుగా చెప్పి, “నువ్వు ఆత్మజ్ఞుడివే. సందేహంలేదు.” అని వివరించాడు. అయినా శుకునికి ఇంకా అవగాహన కాలేదు. అప్పుడు వ్యాసుడు ‘మరొక ఆత్మజ్ఞాని ద్వారా తప్ప ఇతడి సందేహం తీరదు’ అనుకుని, జనకుని వద్దకు శుకుణ్ణి పంపించాడు. శుకుడు, జనకుని కలుసుకొన్న తరువాత స్వానుభవ విషయంలో సందేహం తీరిపోయింది. ఇలా గురూపదేశం, శాస్త్రబోధ, స్వానుభూతి – మూడూ ఒక్కటేనని తెలిసిన తర్వాత, అతడు పరమశాంతిని పొందాడు.
6. ఇతరుల కోసమే శ్రీరామకృష్ణులు సాధనలు చేశారు
గురుదేవుల సాధనల ప్రయోజనం స్వార్థలాభం ఎంతమాత్రమూ కాదు. ఇతరుల కోసమే! కేవలం తానొక్కడే తరించిపోవాలని ఆయనెప్పుడూ ఆశించ లేదు. జగన్మాత ఆయనను లోకకల్యాణం కోసం అవతరింపచేసింది. అందుకే మతాలన్నీ పరస్పరం సంఘర్షించుకొంటుంటే, వాటిలోని సత్యాసత్యాలను ఋజువు చేయడానికి శ్రీరామకృష్ణులు అసాధారణ ప్రయత్నాలు చేయడం కనిపిస్తుంది. అన్ని మతాల సాధనల్లో ప్రావీణ్యం సాధించవలసిన అవసరం ఆయన కెందుకు కలిగిందంటారా? ఆధ్యాత్మిక ప్రపంచ ఆచార్యత్వం నిమిత్తమే! అంతేకాదు, సత్యానుభూతికి, విద్వత్తుకు సంబంధం లేదని, సాధన చేస్తే విద్యాగంధం లేనివారు సైతం సత్యదర్శనం చేయవచ్చునని నిరూపించడానికే జగన్మాత, శ్రీరామకృష్ణుల ద్వారా ఈ సాధనలన్నీ అనుష్ఠింపజేసింది. శ్రీరామకృష్ణుల జీవితాన్ని లోతుగా అధ్యయనం చేస్తే, మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. జగన్మాత, శ్రీరామకృష్ణులను ఆధ్యాత్మిక జగద్గురువుగా రూపొందించడానికి అన్ని రకాల సహాయాలూ అందించింది. ఆయా మతాల సిద్ధపురుషులను, పండితులను సమయానుకూలంగా ఆయన వద్దకు పంపించింది. వారి ద్వారా దీక్షలను ఇప్పించి సాధనలు చేయించి, కృతకృత్యులయ్యేలా చేసింది.
అందుకే కాలాంతరంలో అన్నిరకాల సాధకులకూ శ్రీరామకృష్ణులు మార్గ దర్శకులయ్యారు. పైగా ఎవరికి ఏ సాధన అవసరమో, ఆ సాధనే వారికి చెప్పి చేయించి వారు సిద్ధత్వం పొందేలా చేశారు. అన్ని సాధనా మార్గాలపై అవగాహనగల సిద్ధుడే, ఎవరికి ఏమార్గం తగినదో నిర్ణయించగలడు. శ్రీరామకృష్ణులు అలాంటి సర్వసాధన సిద్ధుడైన జగద్గురువు. ఆధ్యాత్మిక పథ నిర్దేశకులు.
7. శ్రీరామకృష్ణుల నిక్కమైన తపన భగవత్సాక్షాత్కారం
మొదటి నాలుగు సంవత్సరాల సాధనకు, శ్రీరామకృష్ణులకు మూలాధారంగా ఉన్నది అంతర్గత హృదయావేదన; దైవసాక్షాత్కారార్థమైన మహా తపనే. ఆ సమయంలో ఆయన వద్దకు ఏ గురుమా రాలేదు. ఏ గురుమా సాధనాపథం బోధించలేదు. ఆయనలోని తీవ్రాతి తీవ్ర తపనే, ఆయనతో అన్ని సాధనలూ చేయించింది. చివరికి జగన్మాత సాక్షాత్కారం కూడ అయింది. దీన్నిబట్టి ఏ సాధనా మార్గాన్ని అనుసరించినా, అనుసరించకున్నా బాహ్యసహాయం లేకపోయినా, సాధకునిలో దైవాన్ని పొందాలన్న తీవ్ర తపన ఒక్కటి ఉంటే చాలు, తప్పక సిద్ధి సాధ్యమవుతుంది – అన్న నిజం మనకు తెలుస్తోంది. కాని తీవ్ర తపన మాత్రం అవసరం. మామూలు తపన సరిపోదు. శ్రీరామకృష్ణుల సాధనామయ జీవితమే ఇందుకు తార్కాణం. ఈ తీవ్ర తపన వల్ల శ్రీరామకృష్ణులకు జగన్మాత చింతన – స్మరణ – తపన తప్ప మరేమీ గుర్తుండేది కాదు. ఆహారం – నిద్ర – సిగ్గు – భయం మొదలైన శారీరక అవసరాలు, మానసిక వికారాలు ఏవీ ఆయనకు తోచేవి కావు. వాటి గురించి ఆలోచనే ఉండేది కాదు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అన్న విషయం అటుంచండి; అసలు ప్రాణరక్షణ కోసం కూడ ఆయన పూనుకునేవారుకారు. అప్పటి తన దశ గురించి, శ్రీరామకృష్ణులు, “శరీర విషయమై స్మరణే ఉండేది కాదు. ఆ కారణంగా జుట్టు పెరిగిపోయి, దుమ్ముకొట్టి, మట్టి, మట్టిగా, జడలుగా మారిపోయేది. ధ్యానానికి కూర్చోగానే, శరీరం బిర్రబిగుసుకుపోయేది. శిలలా మారిపోయేది. పక్షులకు అది ఒక మనిషి శరీరం అన్న స్పృహే ఉండేది కాదు. నిర్భయంగా వచ్చి అవి నా తల మీదే కూర్చునేవి. తలలో బియ్యం మొదలైన గింజల కోసం ముక్కులతో పొడిచేవి. అది అలా ఉండేదా! ఒక్కోసారి తీవ్రవిరహం కలిగేది. విరహంతో తపిస్తూ, జగన్మాత కోసం ముఖాన్ని నేలకేసి రుద్దుకునేవాడిని. ముఖమంతా రక్తసిక్తమయ్యేది. ధ్యానం – భజన – ప్రార్థన – ఆత్మసమర్పణలతో పగలంతా ఎలా గడిచిపోయేదో తెలిసేదే కాదు. సాయం సంధ్యలో ఆలయం నుండి శంఖధ్వానాలు వినిపించేవి. ఆ ధ్వని వినగానే, ‘అయ్యో, రోజు గడిచింది. మరొక్క దినం వ్యర్థంగా గడిచిపోయింది. జగజ్జనని దర్శనం ఈ రోజు కూడ కాలేదు’ అని దుఃఖీంచేవాడిని. ఆ దుఃఖం దుర్భరంగా ఉండేది. గుండెలు పగిలేలా ఉండేది. అస్థిరచిత్తంతో వ్యథ చెందేవాడిని. నేల మీద పడి పొర్లుతూ ‘అమ్మా, అమ్మా ఇవ్వాళ కూడ నువ్వు కనిపించలేదు. కనిపించవా, అసలు కనిపించవా, ఎప్పుడూ కనిపించవా, కరుణించవా’ – అని బిగ్గరగా ఏడ్చేవాడిని. అలా ఏడ్చే నన్ను చూసి జనులు, – ‘అయ్యో పాపం, కడుపులో శూలతో బాధపడుతున్నాడు కాబోలు, బాధకు తట్టుకోలేక అలా ఏడస్తున్నాడు’ అని సానుభూతిగా అనుకునేవారు” అని చెప్పేవారు.
మేము శ్రీరామకృష్ణుల సమక్షంలో ఉన్నప్పుడు భగవత్సాక్షాత్కారం కోసం ఎంత తపించవలసి ఉంటుందో మాకు చెప్పేవారు. ఆ సందర్భంలోనే తన సాధనకాల తపోమయ జీవితాన్ని వర్ణించి చెప్పేవారు. పై విషయాలు అలాంటప్పుడు చెప్పినవే. “చూడండి, భార్యాబిడ్డలు చనిపోతే, ఆస్తులు పోతే, ఈ జనం కన్నీరు ప్రవాహం కట్టేటట్లు ఏడుస్తారు. కాని దేవుడు కనిపించలేదే అని ఎవరైనా ఏడుస్తారా? పైగా ఇంతగా ప్రార్థించాం, కాని దైవదర్శనం కానే లేదు అని కూడ నిందిస్తారు. వారిని ఒక్కసారి పరమ వ్యాకులతతో విలపించమనండి. భగవంతుడు ఎందుకు ప్రత్యక్షం కాడో నేను చూస్తాను” అని విచారం వెలిబుచ్చుతూ చెప్పేవారు. ఆ వచనాలు విన్న మాకు, అంత నిశ్చయంగా చెబుతున్నారంటే ఆయన జీవితంలో ఆ సత్యాలను ఆవిష్కరించుకొన్నారని స్పష్టమౌతున్నది.
8. శ్రీరామకృష్ణుల దాస్యభావ సాధన
సాధనకాలం మొదటి నాలుగు సంవత్సరాల్లో శ్రీరామకృష్ణులు జగన్మాత సాక్షాత్కారంతోనే తృప్తి పొందలేదు. జగన్మాత దర్శనాన్ని భావముఖంగా* పొందిన తర్వాత, ఆయన శ్రీరఘువీరుని పట్ల ఆకర్షితులయ్యారు. శ్రీరఘువీరుడు వారి కులదైవం. రాముని దర్శనం హనుమంతుని వంటి దాస్యభక్తి ద్వారానే సాధ్యం అని ఆయన గ్రహించారు. అందుచేత తనలో హనుమంతుణ్ణి ఆవాహన చేసుకున్నారు. ఆ భావంలో కొంతకాలం గడిపారు. అనుక్షణం హనుమత్ చింతన, స్మరణ, ధ్యానంలో ఉండడంవల్ల, శ్రీరామకృష్ణుల సొంతవ్యక్తిత్వం క్రమంగా అదృశ్యమైంది. “ఆ సమయంలో హనుమంతుని లాగే ఆహార విహారాలన్నీ జరిగిపోయేవి. కావాలని చేసేవాడిని కాను. సహజంగా అవి జరిగిపోయేవి. అప్పుడు వెనుక తోకలా బట్టను వ్రేలాడదీశాను. కోతి మాదిరే గెంతుతూ నడిచేవాణ్ణి. పళ్ళు, దుంపలు తప్ప మరేమీ రుచించేవి కావు. కోతి మాదిరే తొక్క తీయకుండానే వాటిని తినేవాడిని. చాలావరకు ఎప్పుడూ చెట్ల మీదనే ఉండేవాడిని. అనుక్షణం గంభీరంగా ‘రఘువీర, రఘువీర’ – అనేవాడిని. కోతి కళ్ళ మాదిరే నా కళ్ళు కూడ చంచలమయ్యాయి, ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వెన్నెముక క్రిందిభాగం ఒక అంగుళం పెరిగింది” అని అప్పటి తన స్థితిని వర్ణించి చెప్పేవారు శ్రీరామకృష్ణులు.
చివరి వర్ణన విన్న తర్వాత, “మహాశయా, ఆ పెరిగిన వెన్నెముక ఇంకా అలాగే ఉందా?” అని అడిగాం. అది విని ఆయన నవ్వి, “లేదులే, ఆ భావం మనస్సులో ఎప్పుడైతే సమసిపోయిందో అది మళ్ళీ మామూలుగా అయిపోయింది” అని చెప్పారు.
9. సీతామాత దర్శనం
దాస్యభావ సాధన చేస్తున్న కాలంలో శ్రీరామకృష్ణులకు ఒక దివ్యదర్శనం, దివ్యానుభవం కలిగాయి. ఈ దర్శన అనుభూతులు ఇంతకు పూర్వం పొందిన అనుభూతుల వంటివి కావు. క్రొత్తరకం అనుభూతులు ఇవి. కాబట్టే ఆ దర్శనం, ఆ అనుభూతి ఆయన చిత్తంలో గాఢంగా ముద్రించుకుపోయాయి. ఆ అనుభూతిని వివరిస్తూ, శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు: “ఆ సమయంలో, ఒకరోజు నేను పంచవటి క్రింద కూర్చున్నాను. ధ్యానం – చింతన ఇలాంటివి ఏమీ చేయడం లేదు. ఊరకనే అలా కూర్చుని ఉన్నాను. అంతలో చూస్తుండగానే ఒక స్త్రీ ఆకారం కనిపించింది. సాటిలేని తేజస్సుతో ఆమె సౌందర్యం వెలిగిపోతోంది. ఆమె చుట్టూ ఉన్న పరిసరాలు ఆమె దివ్యకాంతితో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. పంచవటిలోని చెట్లూ, చేమలు, రాళ్ళూ, మొక్కలు, గంగానది ఇవన్నీ మామూలుగానే కనిపిస్తున్నాయి. వీటితోపాటుగా, ఆ దివ్యస్త్రీ కూడ కనిపిస్తోంది. ఆమె మానవకాంతయే అని గ్రహించాను. ఎందుకంటే ఆమెకు మూడు కళ్ళుగానీ, నాలుగు చేతులుగానీ, ఎక్కువ తలలుగానీ లేవు. మానవకాంతకు మాదిరే కళ్ళు, శరీర అవయవాలున్నాయి. కాని దేవతా స్త్రీలలో లేని విశిష్టత ఆమెలో గోచరించింది. ఆమె వదనం నుండి ప్రేమ, దయ, కరుణ, సహనం, విషాదం, ఇవన్నీ ఒక్కుమ్మడిగా వర్షిస్తున్నాయి. ఆ దివ్య మానవకాంత నన్ను ప్రసన్నంగా చూస్తూ, నా వైపుకు గంభీరంగా నెమ్మదిగా చిన్నచిన్న అడుగులు వేస్తూ వస్తోంది. ఉత్తరదిశ నుండి దక్షిణదిశకు – నావైపు వచ్చింది. నా వైపు ఆమె రావడం చూసి, పరమాశ్చర్యంలో మునిగిపోయాను. ఎవరీ దివ్యకాంత? అని అనుకుంటున్నంతలో, హఠాత్తుగా ఎక్కడి నుండో ఒక కోతి దూకి అక్కడికి వచ్చింది. కిచకిచలాడుతూ ఆమె పాదాల చెంత కూర్చున్నది. అంతలో నా అంతరంగంలో ఒక స్ఫురణ కలిగింది – ఈమె సీత. జీవితంలో చాలాకాలం దుఃఖాలు అనుభవించిన సీతామాత. జనకుని ముద్దుల రాకుమారి. రాముని కోసమే జీవించిన సీతాసతి. ఆ స్ఫురణ రాగానే ‘అమ్మా, అమ్మా’ అంటూ ఆమె పాదాలపై పడబోయాను. కాని మరుక్షణమే ఆమె మెరుపుతీగలా వేగంగా వచ్చి దీనిలో (తన శరీరాన్ని చూపిస్తూ) ప్రవేశించింది. నేను ఆశ్చర్యానందాలతో నిండిపోయాను. బాహ్యస్మృతి కోల్పోయి పడిపోయాను. ధ్యానం, చింతనలు లేకుండానే ఇలాంటి దర్శనాలు నా కెప్పుడూ కలుగలేదు. జన్మించినప్పటి నుండి దుఃఖాలే అనుభవించిన సీతాదేవిని మొట్టమొదటిసారిగా దర్శించినందుకే నేమో, నేను కూడ జీవితమంతా దుఃఖాలే అనుభవిస్తున్నాను.”*
10. శ్రీరామకృష్ణులు స్వయంగా పంచవటి నాటడం
తపస్సుకు యుక్తమైన పవిత్రస్థలం శ్రీరామకృష్ణులకు అవసరమనిపించింది. అందుకే కొత్త పంచవటిని* స్థాపించాలనుకున్నారు. ఈ విషయం గురించి హృదయ్ మాకిలా చెప్పాడు: పంచవటికి దగ్గరలో హంస్పుకుర్ (బాతుల కొలను) ఉంది. దాన్ని త్రవ్వి పెద్దది చేశారు. త్రవ్వగా వచ్చిన మట్టితో పాత పంచవటి దగ్గర ఉన్న దిగుడు ప్రదేశాన్ని పూడ్చారు. అలా సమతలంగా చేయడంతో శ్రీరామకృష్ణులు తరచూ దేనికింద ధ్యానం చేసేవారో, ఆ ఉసిరి చెట్టు నష్టమైపోయింది. ఇప్పుడు మనం చూస్తున్న సాధన కుటీరానికి పడమరగా, శ్రీరామకృష్ణులు స్వయంగా ఒక రావిచెట్టు (అశ్వత్థం) నాటారు. హృదయ్ చేత మర్రి – అశోక – మారేడు – ఉసిరిక మొక్కలను నాటింపజేశారు. వాటితోపాటు తులసి, అపరాజిత* అనే మొక్కలను చుట్టూ నాటింపజేశారు. ఈ మొక్కలను మేకలు, ఆవులు మొదలైన పశువులు మేయకుండా, ఒక గట్టి కంచెను* వేయించారు. ఈ నిర్మాణమంతా అనుకోకుండా, అద్భుతంగా నెరవేరింది. ఆ వివరాలు మరోచోట (III.2) చెప్పి ఉన్నాం. శ్రీరామకృష్ణులు రోజూ తులసి, అపరాజిత మొదలైన మొక్కలకు నీరుపోస్తూ, చక్కగా చూసుకునేవారు. ఆ కారణంగా అవి త్వరలోనే పెరిగి పెద్దవయ్యాయి. ఎవరైనా వాటి మధ్య కూర్చుని ధ్యానం చేస్తుంటే, వారు ఇతరులకు ఎవరికీ కనిపించేవారు కారు.
11. శ్రీరామకృష్ణుల హఠయోగ అభ్యాసం
రాణీ రాస్మణి కాళికాలయాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత పూరి, గంగాసాగర్ దర్శించడానికి వెళ్ళే అనేకమంది సాధు సన్న్యాసులు, భక్తురాలైన రాణీ రాస్మణి ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించేవారు. ఆ యాత్రకుపోతూ వస్తూ ఉండేటప్పుడు ఆ సాధు సన్న్యాసులు దక్షిణేశ్వర ఆలయంలో కొన్నిరోజులు విశ్రాంతి తీసుకునేవారు. ఆ సమయం నుండి అనేకమంది గొప్పసాధకులు, సిద్ధపురుషులు వస్తూవుండేవారని గురుదేవులు చెప్పారు. వారిలో ఒకరి ఉపదేశంపై ఆయన ప్రాణాయామం, హఠయోగ సాధనలు చేస్తుండేవారు. ఒకరోజు వారు ఈ హఠయోగ సాధన గురించి తెలియజేస్తూ హలధారిని గురించిన సంఘటన వివరించారు. తరువాత మమ్మల్ని హఠయోగసాధనను చేయవద్దని నిషేధించారు. ఎందుకంటే దాన్ని ఆయన స్వయంగా ఆచరించి, దాని ఫలితాన్ని తెలుసుకున్నారు కనుక. కొంతమంది ఈ విషయమై ఆయనను సంప్రతించగా ఆయన ఇలా చెప్పారు: “ఈ సాధనలు ఈ కాలానికి కాదు. కలియుగంలో జీవులు అల్పాయుష్కులు. వారి జీవితాలు కేవలం వారు తీసుకునే ఆహారం మీదనే ఆధారపడి ఉంటాయి. అలాంటప్పుడు, ముందు హఠయోగాభ్యాసంతో శరీరాన్ని దృఢం చేసుకొని, ఆ తర్వాత రాజయోగ సాధనతో భగవత్ ధ్యానం చేయడానికి సమయం ఎక్కడ ఉంటుంది?
హఠయోగంలో చెప్పిన క్రియలనన్నింటినీ పూర్ణంగా సాధించాలంటే హఠయోగంలో సంపూర్ణసిద్ధి పొందిన యోగ్య గురువును ఆశ్రయించాలి. ఆయన వద్దే నివసించాలి. ఆయన ఉపదేశాన్ని అనుసరించి ఆహార విహారాది కఠోర నియమాలెన్నో పాటించాలి. నియమాలు ఏ కొంచెం తప్పినా, శరీరం రోగగ్రస్తమవుతుంది. ఒక్కోసారి చావు కూడ సంభవిస్తుంది. కాబట్టి అవన్నీ చేయనవసరం లేదు. ప్రాణాయామం, కుంభకం – ఇవన్నీ దేనికంటావా? మనస్సును వశంలోకి తెచ్చుకోవడానికే కదా! భక్తితో భగవద్ధ్యానం చేస్తే, మనస్సు, ప్రాణం సహజంగానే వశంలోకి వస్తాయి. కలియుగంలో మనిషి ఆయువు అల్పం. అతడి శక్తి కూడ అల్పమే. కాబట్టే కరుణామయుడైన భగవంతుడు ముక్తిమార్గం సులువు చేశాడు. భార్యాబిడ్డలు పోయినప్పుడు మనిషికి ఎంత వియోగం ఏర్పడుతుందో, ఎంత పరితాపం కలుగుతుందో తెలుసు కదా! అంతటి పరితాపాన్ని భగవంతుడి కోసం, ఒక్క రోజయినా పడితే, సాధకుడికి భగవత్సాక్షాత్కారం తప్పక లభిస్తుంది.”
సాధకులు (పురుషులు) ఈ కాలంలో స్మృతులను అనుసరిస్తూ తంత్ర శాస్త్ర ప్రకారం సాధనలు చేసేవారు. ఈ సాధనలు చేసే వైష్ణవులు పరకీయ ప్రేమను ఎక్కువగా సాధన చేస్తూంటారు. ఈ విషయం ఈ పుస్తకంలో వేరే అధ్యాయాలలో (IV-1-27) వివరించాం.
12. హలధారి పెట్టిన శాపం
హలధారి వైష్ణవమార్గ సాధకుడు. శ్రీరాధాగోవింద ఆలయ పూజారి. అతడు రహస్యంగా ఈ పరకీయ ప్రేమసాధన చేయసాగాడు. ఈ విషయం తెలిసిన జనం పైకి అనలేక, లోలోపలే దీన్ని గూర్చి గుసగుస లాడుకునేవారు. వారికి అతడంటే భయం. అతడికి వాక్ శుద్ధి ఉందని, అతడు ఏ మాట అన్నా నెరవేరుతుందని వారికి తెలుసు. అందుకే అతడి సాధన గూర్చి నవ్వుకునేవారే తప్ప, బాహాటంగా ఆట పట్టించేవారు కాదు. ఈ విషయం శ్రీరామకృష్ణులకు తెలిసింది. హలధారి, ఆయనకు అన్న వరుస అవుతాడు. ఒక రోజు శ్రీరామకృష్ణులు హలధారికి జనం విషయం చెప్పి, కాస్త జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. అది విని హలధారి ఉగ్రుడైపోయాడు. “గదాయ్! నువ్వు నా కన్నా చిన్నవాడివి. ఆ విషయం మరిచి, నన్నే హెచ్చరిస్తావా? చూస్తూండు, రక్తం కక్కుకుంటావు” అని శపించాడు. శ్రీరామకృష్ణులు ఎన్నోవిధాల నచ్చచెప్పారు, వేడుకున్నారు. అయినా హలధారి అవేవీ వినిపించుకోలేదు.
13. శాప ఫలితం
ఇది జరిగిన కొన్ని రోజులకు, ఒకరోజు రాత్రి శ్రీరామకృష్ణుల గొంతులో ఏదో ద్రవం లాంటిది ఊరింది. నోటి నుండి ధారగా పడింది. అది రక్తం! నిజం గానే శాపం ఫలించింది. “ఆ రక్తం ఎలా ఉందో తెలుసా, నల్లగా, చిక్కుడు ఆకుల రసంలా ఉంది. చాలా చిక్కగా ఉంది. అందువలన కొంత క్రిందపడినా, మిగతాది మాత్రం నోటి నుండి క్రిందికి వ్రేలాడుతూనే ఉంది. ధోవతి అంచుతో అదిమిపట్టి రక్తాన్ని ఆపే ప్రయత్నం చేశాను. కాని లాభం లేకపోయింది. రక్తస్రావం ఆగలేదు. నాకెంతో కంగారు పుట్టింది. అంతా నా చుట్టూ చేరి ఆందోళనగా చూస్తున్నారు. హలధారి కూడ కంగారుగా పరిగెత్తుకొచ్చాడు. అతణ్ణి చూడగానే, ఏడుపు ముంచుకొచ్చింది. ‘అన్నా! చూడు నీ శాపం ఎంతపని చేసిందో?’ అన్నాను. అది చూసి అతడూ ఏడ్చేశాడు.
“ఆ సమయంలో ఆలయంలో ఒక వృద్ధ సాధువు వచ్చి ఉన్నాడు. అతడు కూడ వచ్చి నన్ను పరీక్షగా చూశాడు. ‘మంచి పని జరిగింది. ఈ రక్తం ఇలా రావడం మేలైంది. నువ్వు హఠయోగ సాధన చేశావు కదా! సాధనానంతరం జడసమాధి (యోగ శాస్త్ర ప్రకారం నిర్వికల్ప సమాధికి మరోపేరు) కలుగుతుంది. నీ విషయంలో అదే జరిగింది. సుషుమ్నా ద్వారం తెరుచుకొంది. రక్తం తల వైపు ప్రవహిస్తూ వస్తున్నది. అది నీ తలలోకి చేరితే మాత్రం, నీకిక స్పృహ ఉండదు. జడసమాధి సిద్ధిస్తుంది. కాని జగన్మాత ఆశయం వేరుగా ఉంది. నీ ద్వారా లోకకల్యాణం చేయించాలనుకుంటోంది. అందుకే అమ్మ నిన్నిలా రక్షించింది’ అని సాధువు వివరించాడు. అది విని ‘హమ్మయ్యా! గండం తప్పింది’ అనుకున్నాను” అంటూ గురుదేవులు కాలాంతరంలో మాకు వివరించారు.
ఇలా మనిషి శాపం, దైవం మూలంగా వరంగా పరిణమించింది.
14. శ్రీరామకృష్ణులను గూర్చి హలదారి వైఖరి
హలధారి పట్ల శ్రీరామకృష్ణుల ప్రవర్తనలో ఒక మధురమైన మర్మం ఇమిడివుంది. హలధారి, శ్రీరామకృష్ణుల చిన్నాన్న కుమారుడు. అన్న వరుస. 1858 సం ॥ లో దక్షిణేశ్వరాలయానికి వచ్చి ఉంటాడు. 1865 సం ॥ వరకు శ్రీరాధాగోవింద పూజారిగా ఉన్నాడు. కాబట్టి గురుదేవుల రెండవ భాగ సాధనకాలం, ఆ తర్వాత మరికొంతకాలం అతనక్కడున్నాడన్న మాట. ఆ కారణంగా శ్రీరామకృష్ణులను సన్నిహితంగా చూసే అవకాశం అతడికి కలిగింది. కాని శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక వికాసం గూర్చి అతడు కచ్చితంగా ‘ఇది’ అని తెలుసుకోలేకపోయాడు. హలధారి శాస్త్రాలపై గట్టి నమ్మకం ఉన్నవాడు. విద్వాంసుడు కూడ. శాస్త్రీయ నియమనిష్ఠలను తు.చ. తప్పకుండా పాటించేవాడు. అందుకే భావసమాధి అవస్థలో శ్రీరామకృష్ణులు తన వస్త్రాలను, జందేన్ని తీసి పారేస్తే, అతడు గట్టిగా అధిక్షేపించాడు. శ్రీరామకృష్ణులు పిచ్చివాడని, సంప్రదాయ వ్యతిరేకి అని భావించాడు. ఈ విషయమై హృదయ్ ఇలా చెప్పాడు: “హలధారి నాతో – ‘చూడు హృదూ, తమ్ముడు ఎలా ప్రవర్తిస్తున్నాడో! బట్టలు తీసేస్తాడు, జందేన్ని తీసేస్తాడు. ఇది అపచారం కదా! ఎన్నో జన్మలకు గాని, బ్రాహ్మణ జన్మ లభించదు కదా! మరి ఇతడేమో బ్రాహ్మణత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఇతడేమైనా అత్యున్నత అవస్థకు, తురీయస్థితికి చేరుకున్నాడా ఏమిటి? హృదూ, అతడు నీ మాట వింటాడు. అతడు ఇలాంటి అపచారం చేయకుండా చెప్పి చూడు. అతణ్ణి కట్టిపడేసి అయినా, ఇలాంటి నికృష్టపు పనులు చేయకుండా చూడు’, అన్నాడు.”
ఇలా శ్రీరామకృష్ణులను విమర్శించేవాడే అయినా మళ్ళీ పూజాసమయంలో శ్రీరామకృష్ణుల కళ్ళ నుండి ప్రేమబాష్పాలు వర్షించడం, భగవన్నామాన్ని వింటూ ఆయన పరవశులై ఆనందాబ్ధిలో మునిగిపోవడం, జగన్మాత సాక్షాత్కారం కోసం పరితపించడం చూసి, హలధారి ఆశ్చర్యంతో ముగ్ధుడయ్యేవాడు. ‘తమ్మునిలో తప్పకుండా దైవావేశం ఉంది. మామూలు భక్తునిలో ఇలాంటి లక్షణాలు ఏమీ ఉండవు’ అని అనుకునేవాడు. కొన్ని సమయాలలో హృదయ్‌తో, “హృదూ! శ్రీరామకృష్ణునిలో నువ్వు ఏదో అసాధారణ శక్తిని చూసేవుంటావు! లేకుంటే అతణ్ణి అంత విశ్వసనీయంగా సేవించి ఉండవు” అని చెప్పేవాడు.
15. హలధారి పాండిత్యాహంకారం
సదా సంశయగ్రస్తుడైన హలధారి మనస్సు శ్రీరామకృష్ణుల యథార్థ స్థితిని గురించి ఒక నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయింది. అతడి మనస్సు గౌరవం, జాలి మధ్య ఊగిస లాడుతూ ఉండేది. శ్రీరామకృష్ణులు ఇలా విశదంగా చెప్పారు: “నా పాండిత్యాహంకారం పూజను చూసిన తర్వాత, – ‘తమ్ముడూ! నీ విషయం తెలిసిపోయింది’ – అనేవాడు. ఇలా ఎన్నోసార్లు అన్నాడు. మళ్ళీ విమర్శించేవాడు. ఈ మాటలు అతడి నుండి విన్నప్పుడల్లా – ‘అన్నా! జాగ్రత్త, మళ్ళీ భ్రమకు లోనయ్యేవు’ అనేవాడిని. అది విని – ‘తమ్ముడూ, ఇక నువ్వు నన్ను భ్రమ పెట్టలేవు. నీలోని భక్తి పరాకాష్ఠకు చేరింది’ అని పొగిడేవాడు. – ‘చూస్తానుగా! ఈ మాట మీద నువ్వెంతకాలం నిలబడతావో’ – అని ఆట పట్టించేవాణ్ణి నేను.”
“అతడు తన పూజ ముగించి, నస్యాన్ని గట్టిపట్టు పట్టేవాడు. తర్వాత గీత, భాగవతం, ఆధ్యాత్మ రామాయణం – ఈ గ్రంథాలలో ఏదో ఒకటి అధ్యయనం చేసేవాడు. దాంతో అతడిలో అహంకారం పెరిగేది. తాను జ్ఞానిని అనుకునేవాడు. నేనతడి వద్దకు వచ్చి ‘అన్నా! ఈ గ్రంథాలలో ఉన్న అవస్థలన్నీ నేను స్వయంగా పొందాను’ అనేవాడిని – ‘నాకు అవన్నీ చక్కగా అర్థమవుతాయి’ అని చెప్పేవాడిని. అది వినగానే అతడు రెచ్చిపోయేవాడు. ‘ఓరి మూర్ఖుడా! నువ్వెక్కడ, ఈ శాస్త్రాలు ఎక్కడ? విద్యాగంధంలేని చవటవు, నీకు ఈ విషయాలు అర్థమవుతాయా?’ అని మండిపడేవాడు. నేను ‘అన్నా! నిజం. దీనిలో (తన శరీరం చూపిస్తూ) ఉండేవాడు నాకు అన్నీ తెలియచేస్తున్నాడు. నాలో ఏదో భక్తి ఉందన్నావే ఆ భక్తే నాకు అవన్నీ బోధిస్తోంది’ అని వివరించేవాడిని. ఆ మాటలతో అతడు మరింత రెచ్చిపోయేవాడు. ‘అవివేకీ! పో అవతలకు. ఈ కలికాలంలో కల్కి అవతారం ఒక్కటే ఉంది. ఇంకో అవతారం ఉందని ఏ శాస్త్రంలో ఉందో చెప్పు. నీకు బుర్ర చెడింది. అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు’ అని రోషంగా అనేవాడు. నాకు నవ్వు వచ్చేది. ‘అన్నా! అదుగో మళ్ళీ భ్రమలో పడుతున్నావు’ అనేవాడిని. కాని నా మాటలు అతనెందుకు వింటాడు? – ఇలా అతడితో ఈ నాటకం ఎన్నోసార్లు, ఎంతోకాలం జరిగింది. ఒక రోజు నేను భావావస్థలో దిగంబరిగా చెట్టు మీద కూర్చుని, చిన్న పిల్లవాడిలా మూత్ర విసర్జన చేస్తున్నాను. హలధారి అది చూసి వెర్రెత్తిపోయాడు. నన్ను బ్రహ్మరాక్షసి ఆవహించిందని నిశ్చయించుకున్నాడు.’
16. హలధారి కాళీ భావన
విచిత్ర పరిస్థితులలో హలధారి కుమారుడు మరణించాడని మునుపే తెలిపివున్నాం. సంకుచిత వైష్ణవుడు కావడం చేత కాళీమాత తామసి అనే గట్టి నమ్మకం అతడికి కలిగింది. శ్రీరామకృష్ణులతో ఒక రోజు ఈ మాట చెప్పాడు. “అలాటి తమోప్రధాన దేవతను ఉపాసిస్తే, ఆధ్యాత్మిక ప్రగతి ఎలా కలుగుతుంది? కలగదు. కాబట్టే ఆ దేవతను పూజించకు” అని సూచించాడు. శ్రీరామకృష్ణులు అందుకు బదులేమీ చెప్పలేదు. కాని తన ఇష్టదైవమైన జగన్మాతను హలధారి తామసి అనడం విని చాలావ్యథ చెందారు. కాళికాలయానికి వెళ్ళారు. అమ్మ ముందు మోకరిల్లి, కన్నీరు స్రవిస్తూ, అమాయకంగా తన వ్యథను వెళ్ళబోసుకొన్నారు. “అమ్మా! హలధారి శాస్త్రాలు తెలిసిన పండితుడు. అతడు నిన్ను ‘తామసి’ అంటున్నాడు. నిజమా? కాదు గదా!” అని అడిగారు. జగన్మాత అప్పుడు తన నిజతత్త్వాన్ని స్పష్టం చేసింది. తన త్రిగుణాతీత మూలతత్త్వాన్ని ఆయనకు తెలియజేసింది. అది విని శ్రీరామకృష్ణులు పసిపిల్లవాడిలా సంతోషంతో పొంగిపోయారు. పరిగెత్తుకెళ్ళి హలధారి భుజాల పైకెక్కి కూర్చున్నారు. “అన్నా! అమ్మను తమోగుణి అంటావా? అమ్మ తామసియా? అమ్మ ఎవరో తెలుసా? ఆమె త్రిగుణమయి, త్రిగుణాతీతురాలు. శుద్ధసాత్విక స్వరూపిణి. తెలుసా?” అని పదేపదే ఉత్తేజంతో చెప్పారు.
భావపరవశులైన శ్రీరామకృష్ణుల దివ్యవాణి, ఆయన పవిత్ర స్పర్శతో హలధారి అంతర్చక్షువు తెరుచుకొంది. అప్పుడతడు పూజాపీఠంపై కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణుల మాటలను హృదయపూర్వకంగా అంగీకరించాడు. జగన్మాత శ్రీరామకృష్ణులలో అభివ్యక్తమై ఉండడం దర్శించాడు. వెంటనే పరమ భక్తిప్రపత్తులతో ఆయన పాదాలను పుష్పచందనాదులతో పూజించాడు. కొంత సేపటికి హృదయ్ అక్కడికి వచ్చాడు. “మామను ఏదో బ్రహ్మరాక్షసి ఆవహించిందని నువ్వు చెప్పావు కదా! మరి ఆయనను ఎందుకు పూజించావు?” అని హలధారిని అడిగాడు. “ఏమోమరి! నాకు అర్థం కావడంలేదు. అలా ఎందుకు అతడు కాళికాలయం నుండి సరాసరి నా వద్దకు వచ్చాడో, వచ్చి నన్నతడు ఏం చేశాడో తెలియదు. కాని అతడిలో నాకు దైవాంశ కనిపించింది. అందుకే పూజించాను. మరొక్క విషయం, హృదూ! కాళికాలయానికి అతనెప్పుడు వెళ్ళినా, అతడు నన్నిలాగే మాయ చేస్తుంటాడు. ఈ రహస్యం ఏమిటో మరి!!” అంటూ హలధారి ఉన్న విషయం చెప్పాడు.
17. శ్రీరామకృష్ణులు ఉచ్చిష్ట భక్షణం చూసి హలధారి కోపోద్రిక్తుడు కావడం – శ్రీరామకృష్ణుల జవాబు
హలధారి అలా ఎన్నోసార్లు శ్రీరామకృష్ణుల దివ్యత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించాడు. కాని అదేమి చోద్యమో, అతడు ముక్కుపొడుం పట్టించి శాస్త్ర అధ్యయనం చేయడానికి ఉపక్రమించగానే, పాండిత్యాభిమానం అతణ్ణి ముంచెత్తేది; ఆ అహంకారంతో అతడు మళ్ళీ మామూలు మనిషి అయిపోయేవాడు. ‘ఆ రామకృష్ణకు వెర్రిపట్టింది’ అనుకొనే వాడు. బాహ్యశౌచం, సదాచారం ఇలాంటివి ఎన్నెన్ని ఉన్నా సరే, మనస్సు కామినీ కాంచన ఆసక్తి నుండి వైదొలగనంత వరకూ సాధకుడికి అంత ప్రయోజనం ఉండదు. ఈ విషయం హలధారి జీవితం ద్వారా ఋజువవుతున్నది. పై అలంకారాలు ఎన్ని ఉన్నా, అవి సత్యానుభూతిని కలిగించలేవు.
శ్రీరామకృష్ణులు సర్వులలో భగవంతుణ్ణి ప్రత్యక్షంగా దర్శించేవారు. ముఖ్యంగా ఆలయానికి వచ్చే బీదా బిక్కీలను నారాయణ స్వరూపులుగానే గాంచేవారు. వారు గ్రహించిన ప్రసాద ఉచ్ఛిష్టాన్ని శ్రీరామకృష్ణులు భగవత్ప్రసాదంగా భావించి తినేవారు. ఈ విషయం మేము మునుపే పేర్కొన్నాం. దాన్ని హలధారి చూసి చాలా చిరాకుపడ్డాడు. వెర్రి ఆవేశంలో శ్రీరామకృష్ణులతో, “గదాయ్! నువ్వు నీ పిల్లలకు పెళ్ళి ఎలా చేస్తావో అది చూస్తాను” అన్నాడు. హలధారిని కొద్దో గొప్పో జ్ఞానిగా శ్రీరామకృష్ణులు భావించేవారు. ఆ మాటలు విన్న తర్వాత శ్రీరామకృష్ణులకు అతడిపై ఆ గౌరవం కూడ పోయింది. శ్రీరామకృష్ణులకు ఆవేశం వచ్చింది. “ఓరీ, ధూర్తుడా! ఇదేనా నీ పాండిత్యం? శాస్త్రాన్ని వివరిస్తూ, ఈ జగత్తంతా మిథ్య, మాయ. జీవులంతా బ్రహ్మస్వరూపులు. అందరినీ బ్రహ్మంగా దర్శించాలని చెబుతావే, మరి అదంతా వట్టిదేనా? జగత్తు మిథ్య అంటూనే, పిల్లలను వరుసగా కంటూ ఉంటావే? నీ శాస్త్రజ్ఞానం మీద మూత్రవిసర్జన చెయ్యాలి” అని గట్టిగా మందలించారు.
18. హలధారి విమర్శ: భావముఖంలో నెలకొని ఉండమన్న అమ్మ ఆదేశం
శ్రీరామకృష్ణులది శిశువు స్వభావం. కల్లాకపటం ఎరుగని అమాయకులు. ఆయన హలధారి పాండిత్యం కారణంగా అప్పుడప్పుడు ఆందోళన చెందేవారు. నిజానిజాలు తెలుసుకోవడానికి జగన్మాత వద్దకు పరిగెత్తుకు వెళ్ళి మొరపెట్టుకొనేవారు. ఒకరోజు హలధారి భగవంతుని ఉనికి గురించి శ్రీరామకృష్ణులతో చర్చించ సాగాడు. ‘ఉన్నాడు – లేడు’ అనే వాటికి భగవంతుని తత్త్వం అతీతమని శాస్త్రాలను ఉదాహరించాడు. కాబట్టి శ్రీరామకృష్ణులకు భావసమాధి కలగడం, ఆయన దివ్యదర్శనాలు, దివ్య అనుభూతులు అన్నీ అసత్యాలని, భ్రాంతులని ఋజువు చేయడానికి ప్రయత్నించసాగాడు.
దాంతో శ్రీరామకృష్ణుల మనస్సు అయోమయం అయింది. ఆయనే కాలాంతరంలో ఈ సంఘటనను తెలుపుతూ ఇలా అన్నారు: “నాలో గొప్ప ఆందోళన చెలరేగింది. మరి నా దివ్యదర్శనాలు, నేను పొందిన అనుభవాలన్నీ కేవలం భ్రాంతులేనా అని కంగారుపడ్డాను. అంటే అమ్మ నన్ను వంచించిందా? అని వ్యథ చెందాను. ఆ ఆవేదనతో అమ్మకు అంతా చెప్పుకొన్నాను – ‘అమ్మా! నాకు చదువు సంధ్యలు లేవని ఎంచి, నన్ను వెర్రివాణ్ణి చేసి, ఇలా మోసం చేస్తావా?’ – అంటూ ఏడ్వసాగాను. కొంతకాలం అలా ఏడుస్తూనే ఉండి పోయాను. ఇంతలో నాకెదురుగా భూమిలో నుండి తెల్లని పొగమంచులాంటి పొర పైకివచ్చి, ఆ ప్రాంతాన్నంతా కమ్ముకుంది. చూస్తూండగానే ఆ పొగ మంచులో బంగారువర్ణంలో మెరసిపోతున్న ఒక తేజోమూర్తి కనిపించింది. ఆ మూర్తి తదేకంగా నన్నే చూస్తూ ‘వత్సా! చింతించకు… నువ్వు భావముఖంలోనే ఉండు’ అంటూ ముమ్మార్లు పలికింది. తర్వాత నెమ్మదిగా ఎలా వచ్చిందో అలాగే పొగమంచు మూర్తితోపాటు కరిగిపోయింది. దాంతో నా మనస్సు సందేహరహితమై శాంతించింది.”
మరొక సందర్భంలో శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు: ఒకరోజు నాకు హలధారి అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చి, అదే సంశయం మళ్ళీ నా మనస్సులో తలెత్తింది. పూజలో కూర్చుని ఈ సమస్యకు పరిష్కారం చూపమని అమ్మను ప్రార్థిస్తూ విలపించాను. అప్పుడు జగజ్జనని ‘రతి తల్లి’ రూపంలో దర్శనమిచ్చి, భావముఖంలో నెలకొని ఉండమని చెప్పింది. ఈ సంఘటనను స్వామి ప్రేమానందకు ఆయనే స్వయంగా విశదీకరించారు.
తోతాపురి, శ్రీరామకృష్ణులకు దీక్షనిచ్చి వెళ్ళిపోయిన తర్వాత, శ్రీరామకృష్ణులు ఆరు నెలల కాలం నిర్వికల్పసమాధిలో ఉండిపోయారు. ఆరవ నెల చివరలో ఆయన సమాధి భగ్నమైంది. జగన్మాత వాణి వినిపించింది. – ‘నాయనా! ఈ సమాధిలో కాదు, నువ్వు భావముఖంలోనే ఉండాలి’ అని ఆదేశించింది.
19. దక్షిణేశ్వరంలో హలధారి వసించిన కాలగడువు
దక్షిణేశ్వరాలయంలో హలధారి దాదాపు ఏడు సంవత్సరాలు వసించాడు. కాబట్టి ఆ కాలంలో శ్రీరామకృష్ణుల చెంతకు వచ్చిన గురువులను, మహాత్ములను అతడు స్వయంగా చూశాడు. పిశాచంలా కనిపించే బ్రహ్మజ్ఞుడైన సాధువు, వసించిన కాలగడువు భైరవీ బ్రాహ్మణి, జటాధారి, తోతాపురి వీరంతా క్రమంగా ఒకరి తర్వాత ఒకరు రావడం హలధారికి ప్రత్యక్షంగా తెలుసు. తోతాపురితో హలధారి ఆధ్యాత్మ రామాయణం చదివేవాడని శ్రీరామకృష్ణులే మాకు చెప్పారు. ఇదివరకు మేము అప్పుడొకటిగా జరిగాయి. కాని వాటినన్నిటినీ పాఠకుల సౌకర్యార్ధం ఒకే చోట చేర్చి తెలిపాం.
20. శ్రీరామకృష్ణుల దివ్యోన్మాదం గురించి చర్చ
మనం ఇంతవరకు శ్రీరామకృష్ణుల సాధనామయ జీవితాన్ని తరచి చూశాం కదా! మనకు తద్ద్వారా కొన్ని సత్యాలు స్పష్టమయ్యాయి. అవేమిటంటారా? ఆలయంలోని వారి కందరికీ శ్రీరామకృష్ణులు వెర్రివెంగళాయిలా కనిపించేవారు. అది నిజం కాదని, ఆయనకు పిచ్చి లేదని, అది దివ్యభావం అని స్పష్టమైంది. కొందరు ఆయన బుర్ర చెడిందన్నారు. శరీర రుగ్మత కారణంగా మతి చలించిందన్నారు. అవి నిజం కాదని తేలిపోయాయి.
ఆయనలో భగవత్సాక్షాత్కారానికై తీవ్రతపన, వ్యాకులత కలిగాయి. వాటి కారణంగానే ఆయన తనను తాను నియంత్రించుకోలేకపోయారు. అందుకే ఉన్మాదిలా కనిపించేవారు. కాని అది ఉన్మాదం ఎంతమాత్రమూ కాదు. ఆయన హృదయం, దైవదర్శనం కోసం తీవ్రమైన ఆరాటంతో జ్వలిస్తూ ఉండేది. అందుకే అందరిలా ఆయన ప్రవర్తించ లేకపోయేవారు. ఆ కారణంగా, తమలా మామూలు వ్యక్తిలా లేకపోయేసరికి, ఆయనను పిచ్చి వాడన్నారు. కాని ఎవరికి పిచ్చో వారికి తెలియదు. దివ్యోన్మాదంతో పూర్ణుడైనవాడు, మామూలు వ్యక్తిలా ఎలా మసలుకోగలడు?
ఆయనకు కలిగిన తీవ్రమైన హృదయపరితాపం సాధారణ మనుషుల స్థాయిని అధిగమించినప్పుడు, అంతరంగంలో ఒకటి ఆలోచించి పైకి మరొకటి చెప్పే సాధారణ మనుషుల్లా వారు ఎలా ఉండగలరు? కొద్దిపాటి సుఖదుఃఖాలు వచ్చినా కొందరు తలక్రిందు లౌతారు. కొందరు ఎంత తీవ్రదుఃఖం, మహాసుఖాలు ఎదురైనా ఏ మాత్రం చలించకుండా సముద్రగర్భంలా సుస్థిరంగా ఉంటారు.
మరి శ్రీరామకృష్ణులకి ఉన్న సహనశక్తి ఏపాటిది? ఆయన జీవిత సంఘటనలను పరిశీలించి చూస్తే ఆయన సహనశక్తి అసాధారణమని మనకు తెలుస్తుంది. పన్నెండు సంవత్సరాలు సరిగ్గా తినకుండా, సరిగ్గా నిద్ర లేకుండా స్థిరంగా ఉండగలిగారు. అలా ఎవరైనా ఉండగలరా? అనేక సందర్భాలలో అపార సంపదలు ఆయనను వెతుక్కొంటూ వచ్చాయి. కాని అవి భగవత్సాక్షాత్కారానికి ఆటంకాలని తెలుసుకొని, వాటిని ఆయన తృణప్రాయంగా తిరస్కరించారు. ఆయన సహన శక్తి, తితిక్ష ఎంతటిదో చెప్పడం కష్టం. అసాధారణం అని మాత్రం చెప్పవచ్చు. దీన్ని స్పష్టంచేసే సంఘటనలు ఆయన జీవితంలో కోకొల్లలు.
21. దాన్ని రుగ్మతగా ఎంచడంలోని యుక్తిదోషం
కాంచనోన్మత్తులు, సంసార లంపటులు అయిన అజ్ఞానులకు శ్రీరామకృష్ణుల దివ్యోన్మాదం ఎలా అర్థమవుతుంది? అందుకే వారు శ్రీరామకృష్ణులకు ఏదో జబ్బు ముదిరిందనే వారు. ఒక్క మథుర్బాబు మాత్రం అలా అనుకోలేదు. తనకు ఎంచడంలోని యుక్తిదోషం తెలిసిన శాస్త్రజ్ఞానంతో, తర్కంతో ఆలోచించి, అది జబ్బు మాత్రం కాదని అర్థం చేసుకొన్నాడు. శ్రీరామకృష్ణుల నిజస్థితిని అంచనా వేయగలిగే మరోవ్యక్తి ఎవ్వరూ ఆ సమయంలో లేరు. కేనారామ్ భట్టాచార్య ఉంటే, అతడు కనిపెట్టేవాడు. అతడే శ్రీరామకృష్ణులకు శక్తి మంత్రోపదేశం చేశాడు. దీక్ష ఇచ్చిన తర్వాత అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎవరికీ తెలియదు. హృదయ్ గాని, మరోవ్యక్తిగాని అతణ్ణి గూర్చి ఏమీ చెప్పలేకపోయారు. కాళికాలయంలో పనిచేసే ఉద్యోగుల విషయం వేరే చెప్పాలా? వారంతా కేవలం ప్రాపంచికులు, సంసార లంపటులు. అలాంటి వారికి శ్రీరామకృష్ణుల వాస్తవిక స్థితి ఎలా అర్థమవుతుంది? పైగా వారే ఆయనను పిచ్చివాడని, ఆయనకు జబ్బు ఉందని విమర్శించారు.
అందుచేత అప్పటి శ్రీరామకృష్ణుల యథార్థస్థితిని తెలుసుకోవాలంటే, మనకు ఆ కాలంలో దక్షిణేశ్వరానికి వేంచేసిన మహాత్ముల, సాధకుల ఉవాచలే ఆధారం. అవే మనకు పరమ ప్రమాణం. వారి విషయం గురించి శ్రీరామకృష్ణులే మాకు స్వయంగా చెప్పేవారు. ఇతరులు కూడ ఆయన మాటలను బలపరచి ఉన్నారు. శ్రీరామకృష్ణులు చెప్పినదాన్నిబట్టి చూస్తే, ఆ మహాత్ములు, సాధకులు శ్రీరామకృష్ణులను పిచ్చివాడని అసలు అనుకోలేదని, పైగా వారిది అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాలను చేరుకొన్న స్థితి అనుకునేవారని స్పష్టమవుతుంది.
22. అప్పటి శ్రీరామకృష్ణుల ప్రవర్తన ఆ నిర్ణయాన్ని ఖండిస్తుంది
సాధనకాలంలోని శ్రీరామకృష్ణుల ఘటనలను పరిశీలిస్తే, మనకు కొన్ని విషయాలు స్పష్టమవుతాయి. దైవసాక్షాత్కారం కోసం ఆయన అత్యంత తీవ్రంగా పరితపించేవారు. అలాంటి సమయాల్లో అప్పుడప్పుడు ఆయన బాహ్యస్మృతిని పూర్తిగా కోల్పోయేవారు. కాని, మిగతా సమయాల్లో ఆయన తన ఆరోగ్యం విషయమై ఎంతో జాగ్రత్త వహించేవారు. ఎవరు ఎలాంటి వైద్యసలహా ఇచ్చినా పాటించేవారు. పదిమందీ చికిత్స చేయించుకోమని చెబితే, వెంటనే ఒప్పుకున్నారు. తల్లి వద్దకు, కామార్పుకూర్ వెళితే మంచిదంటే, అలాగే వెళ్ళారు. పిచ్చి కుదరాలంటే పెళ్ళి చేయాలన్నారు కొంతమంది. శ్రీరామకృష్ణులు దానికీ అంగీకరించారు. శ్రీరామకృష్ణులు ఇంత ఎరుకతో, జాగరూకతతో ఉన్నప్పుడు, ఆయనకు పిచ్చని చెప్పడం ఎలా సాధ్యమవుతుంది.
మరో విషయం దైవోన్మత్త స్థితిలో ఉన్నకాలంలో ఆయన ప్రాపంచికతకు – ప్రాపంచిక విషయాలకు, వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉండేవారు. కాని భక్తులంతా కలిసి సంకీర్తనలు చేస్తున్నప్పుడు మాత్రం వారికి దూరంగా ఉండక, వారితోపాటు సంకీర్తనల్లో పాల్గొనాలని అనుకునేవారు.
బారానగర్‌లోని దశమహావిద్యలను దర్శించడం, కాళీఘాట్‌లోని కాళిని దర్శించడం, దాదాపు ప్రతి సంవత్సరం పానీహాటీ వైష్ణవోత్సవంలో పాల్గొనడం – ఈ సంఘటనలు పై విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఆ క్షేత్రాల్లో ఆయన శాస్త్రకోవిదులైన వారితో మాట్లాడేవారు కూడ. ఈ సంభాషణల విషయమై మాకు తెలిసింది స్వల్పమే. అయినా ఆ శాస్త్రకోవిదులు శ్రీరామకృష్ణులను ఎంతో గౌరవంతో ఆదరించేవారన్న విషయం నిశ్చయంగా తెలిసింది.
23. శ్రీరామకృష్ణులతో వైష్ణవచరణ్ తొలి సమావేశం
ఇక్కడ వైష్ణవచరణ్ విషయం ప్రస్తావిద్దాం. 1858 సం ॥ లో పానీహాటీలో జరిగిన వార్షికోత్సవంలో శ్రీరామకృష్ణులు పాల్గొన్నారు. అప్పుడు ఉత్సవానంద గోస్వామి కుమారుడైన వైష్ణవచరణ్ను మొదటిసారిగా శ్రీరామకృష్ణులు చూశారు. ఈ సంఘటనను హృదయ్ నుండి మాలో కొందరం విన్నాం. శ్రీరామకృష్ణులు కూడ ఈ విషయం మాకు స్వయంగా చెప్పారు. ఆయన ఆ రోజు మణిమోహన్ సేన్‌కు చెందిన దేవాలయంలో కూర్చుని ఉన్నారు. అక్కడికి వైష్ణవచరణ్ వచ్చి శ్రీరామకృష్ణులను చూశాడు. చూసిన వెంటనే, ఆయన సామాన్యుడు కాదని, అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించినవారని గ్రహించాడు. ఆ రోజు అతడు శ్రీరామకృష్ణులతోనే ఎక్కువ సేపు గడిపాడు. స్వయంగా అటుకులు, బెల్లం, మామిడిపండ్లు, మిఠాయి కొన్నాడు. వాటిని భగవంతునికి నివేదించాడు. తర్వాత శ్రీరామకృష్ణులకు, ఇతర భక్తులకు ఆ ప్రసాదాన్ని పెట్టి, తను స్వీకరించి ఎంతో ఆనందించాడు.
వార్షికోత్సవం ముగిసిన తర్వాత వైష్ణవచరణ్ కలకత్తాకు తిరిగి వెళుతూ రాణీ రాస్మణి ఉద్యాన గృహానికి, శ్రీరామకృష్ణుల దర్శనార్థమై వచ్చాడు. శ్రీరామకృష్ణులు ఉత్సవం నుంచి అప్పటికి ఇంకా తిరిగి రాలేదని తెలుసుకొని, ఎంతో నిరాశతో వెళ్ళిపోయాడు.
ఈ సంఘటన జరిగిన తర్వాత మూడు సంవత్సరాలకు మళ్ళీ వైష్ణవచరణ్, శ్రీరామకృష్ణులను కలుసుకొన్నాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధం నెలకొంది. ఈ వివరాలన్నీ మేము ‘గురుభావం, ఉత్తరార్ధం IV.1’ లో చెప్పివున్నాం.
24. విచిత్ర సాధనలు
ఈ నాలుగు సంవత్సరాల కాలంలో శ్రీరామకృష్ణులు కొన్ని విచిత్ర సాధనలు కూడ చేశారు. మనస్సును ధనతృష్ణా రహితం చేయదలచుకున్నారు. దానికోసం రూపాయి నాణాలను, మట్టిముద్దలను చేతుల్లోకి తీసుకునే వారు. వాటి సత్యాసత్యాల గూర్చి విచారణ చేసేవారు. దైవదర్శనమే ఏకైక లక్ష్యమై ఉన్న వ్యక్తికి మట్టి ఎంతగా సహాయపడుతుందో, ధనంకూడ అంతేనని తెలుసుకున్నారు. అంటే మట్టి సహాయం చేయలేదు, ధనమూ సహాయం చేయలేదు. రెండూ వ్యర్థమే. కాబట్టి ఆయనకు ఆ రెండూ సమానమైన విలువగలవిగానే తోచాయి. ఈ నిజం చిత్తంలో దృఢం చేసుకోవడానికి, ‘మట్టి – రూపాయి; రూపాయి – మట్టి’ అంటూ ధనాసక్తితోపాటు రూపాయిలను, మట్టిని గంగలో పారవేశారు.
బ్రహ్మ మొదలు ఈ విశ్వంలో ఉన్న జడ – చేతన పదార్థాలన్నీ భగవంతుని విభూతులేనని, భగవదంశలేనని దృఢం చేసుకోవడానికి కూడ సాధన చేశారు. దాని కోసం ముష్టివారి ఎంగిలి మెతుకులు తిన్నారు. వారు తిన్న స్థలాన్ని శుభ్రం చేశారు. అందరూ అసహ్యించుకొనే పాకీవారి కన్నా తాను ఏమంత గొప్పవాడు కాదన్న సత్యాన్ని దృఢం చేసుకోవడానికి, తన అహంకారాన్ని నాశనం చేయడానికి, శ్రీరామకృష్ణులు వారి మరుగుదొడ్లను స్వయంగా శుభ్రం చేశారు.
గంధం మొదలు మలం వరకూ అన్నీ పంచభూతాల వికారాలేనని, వాటిలో ‘ఇవి స్వీకరింపదగ్గవి, ఇవి స్వీకరింపదగనివి’ అంటూ తేడాలు లేవన్న భావనను సాధన చేశారు. దాని కోసం ఆయన ఇతరుల మలాన్ని, నిర్వికారంగా తన నాలుకతో స్పర్శించారు!
ఇలాంటి కనీవినీ ఎరుగని సాధనల నన్నింటినీ శ్రీరామకృష్ణులు మొదటి నాలుగు సంవత్సరాల సాధనా కాలంలోనే సాధించారు. ఆయన ఈ మొదటి నాలుగు సంవత్సరాల సాధనలను, అనుభూతులను, దివ్యదర్శనాలను పరిశీలిస్తే ఆయన అంతరంగ తపన సుస్పష్టమవుతుంది. దైవసాక్షాత్కారం కోసం ఆయన ఎంత తీవ్రాతితీవ్రంగా తపించారో, ఎంత పట్టుదల, ఆత్మవిశ్వాసాలతో ఆయన తన సాధనాపథంలో పురోగమించారో మనకు విశదమవుతుంది. మరొక్క విశేషం ఉంది. ఆయన ఎవరి సహాయ సహకారాలూ ఆశించకుండా, కేవలం తీవ్ర తపనతో జగన్మాత పరిపూర్ణ దర్శనానుభవాన్ని పొందారు. అలా ఆప్తకాములయ్యారు. సాధన చరమ ఫలాన్ని పొందారు.
తదనంతరకాలంలో కూడ ఆయన సాధనలను చేయడానికి కారణం ఉంది. గురూపదేశాలు, శాస్త్ర వచనాలతో తన అనుభవాలను సరిపోల్చుకోవడానికే ఆయన తన సాధనలను కొనసాగించారు.
25. మనసే (అంతరాత్మ) గురువు
“అనుక్షణం వైరాగ్యం వహించి, ఇంద్రియ సంయమాన్ని సాధన చేస్తుంటే, సాధకుడి మనస్సు క్రమంగా పరిశుద్ధమవుతుంది. అది అతడి స్వాధీనమవుతుంది. అప్పుడిక ఆ మనస్సే సాధకుని గురువు అవుతుంది” అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. ఆ శుద్ధ మనస్సులో కలిగే భావాలు, ఆలోచనలు సాధకుణ్ణి ఏమాత్రం పతనం చేయవు. పైగా అతణ్ణి గమ్యానికి చేరుస్తాయి. శ్రీరామకృష్ణుల మనస్సు జన్మతః పరిశుద్ధమైనది. కాబట్టి ఆ శుద్ధ మనస్సే ఆయనకు గురువై, సాధన మార్గాన్ని చూపి మొదటి నాలుగు సంవత్సరాలలోనే ఆయనకు భగవత్సాక్షాత్కారాన్ని కలిగించింది. ఆయన శుద్ధమనస్సే ఏది చేయాలో, ఏది చేయకూడదో నిశ్చయించి ఆయనకు చెప్పేది. అంతేకాదు. అది మానవరూపం దాల్చి శ్రీరామకృష్ణులను సాధన మార్గంలో ప్రోత్సహించేది. ఆయనకు విశేషసాధన గురించి చెప్పేది. దాని ఫలం వివరించేది. ఆ సాధనను అనుష్ఠింపచేసేది. ఆయన సాధనలో లీనం కాకపోతే, భయపెట్టి మరీ చేయించేది.
ఆ కాలంలో శ్రీరామకృష్ణులు ధ్యానానికి కూర్చున్నప్పుడు, తరుణప్రాయంలో ఉన్న ఒక సన్న్యాసి వాడియైన త్రిశూలాన్ని ధరించి కనిపించేవాడు. అతడు శ్రీరామకృష్ణుల దేహం నుండే బయటికి వచ్చేవాడు. ధ్యానం సరిగా చేయకపోతే, ఆ త్రిశూలంతో ఆయనను పొడుస్తానని హెచ్చరించేవాడు.
ఒకమారు శ్రీరామకృష్ణుల శరీరం నుండి ఒక నల్లని పురుషుడు బయటకు వచ్చాడు. అతడు భోగమయుడు, వాసనాయుతుడైన పాపపురుషుడు. ఆ పాప పురుషునితోబాటు ఈ త్రిశూలధారియైన సన్న్యాసి కూడ వచ్చాడు. వచ్చి త్రిశూలంతో పొడిచి ఆ పాపపురుషుణ్ణి చంపేశాడు. ఇదంతా శ్రీరామకృష్ణులు స్పష్టంగా దర్శించారు.
శ్రీరామకృష్ణులకు అప్పుడప్పుడు దూరక్షేత్రాల్లోని దేవతలను దర్శించాలని అనిపించేది. లేదా దూరప్రాంతాల్లో జరిగే కీర్తనలను వినాలనిపించేది. అప్పుడు ఈ త్రిశూల సన్న్యాసియే బయటికి వచ్చి, తేజోమార్గంలో ఆయా ప్రాంతాలకు వెళ్ళేవాడు. దేవతలను దర్శించి, లేదా కీర్తనలు వింటూ కొంతసేపు ఉండేవాడు. తర్వాత తిరిగివచ్చి, శ్రీరామకృష్ణులలో కలిసిపోయేవాడు.
ఇవన్నీ శ్రీరామకృష్ణులు మాకు స్వయంగా చెప్పినవే!
దాదాపు సాధన ప్రారంభకాలం నుండే శ్రీరామకృష్ణులు ఈ త్రిశూల సన్న్యాసిని దర్శించేవారు. అతడు అచ్చం శ్రీరామకృష్ణులను పోలి ఉండేవాడు. ఆ తన ప్రతిరూపం సలహాలపైనే శ్రీరామకృష్ణులు తన కార్యాలను, సాధనలను చేసేవారు. ఆనాటి తన అపూర్వ సాధనానుభవాల గూర్చి మాకు ఇలా చెప్పేవారు:
“అచ్చం నాలాగా ఉండే ఒక తరుణప్రాయపు సన్న్యాసి, నాలో నుండి బయటికి వచ్చేవాడు. నాకన్ని విషయాలూ బోధించేవాడు. అతడలా బయటికి వస్తున్నప్పుడు, ఒక్కొక్కసారి నాకు కొద్దిగా బాహ్యస్మృతి ఉండేది. మరొకప్పుడు బాహ్యస్మృతిని పూర్తిగా కోల్పేయేవాడిని. ఒక జడపదార్థం మాదిరిగా, అతడి కార్యకలాపాలను చూస్తూ ఉండేవాడిని, అతడి మాటలు వినేవాడిని. అతడు తెలిపిన తాత్త్విక విషయాలనే, తదనంతర కాలంలో భైరవీ బ్రాహ్మణి, నాగసాధు (తోతాపురి* ) మళ్ళీ నాకు ఉపదేశించారు. నాకు తెలిసిన వాటినే వారు మళ్ళీ చెప్పారు. కాబట్టి కేవలం శాస్త్రమర్యాదను పాటించడం కోసమే, జగన్మాత వారిని నాకు ‘గురువులు’ గా ఏర్పాటు చేసింది. (‘సాధకునికి బాహ్యగురువు అవసరం’ అన్నది శాస్త్రమర్యాద. అది మామూలు సాధకుల విషయంలో తప్పనిసరి. కాని శ్రీరామకృష్ణుల లాంటి అత్యున్నత సాధకులకు, బాహ్యగురువుల అవసరం ఉండదు. కాని లోకమర్యాదను, గురు శిష్యసంప్రదాయాన్ని గౌరవించడం కోసం శ్రీరామకృష్ణులు బాహ్యగురువులను స్వీకరించారు. – అనువాదకుడు) లేకపోతే వారిని నేను గురువులుగా స్వీకరించవలసిన అవసరమేమిటి? నా కన్నీ తెలుసు కదా!”
మొదటి నాలుగు సంవత్సరాల సాధన అంతిమ భాగంలో శ్రీరామకృష్ణులు కొంతకాలంపాటు కామార్పుకూర్లో ఉన్నారు. అప్పుడాయనకు ఒక అపూర్వ దివ్యదర్శనం కలిగింది. కామార్పుకూర్కు దగ్గరలో ఉన్న గ్రామం సిహోర్. అది హృదయ్ జన్మస్థలం. ఒకసారి శ్రీరామకృష్ణులు పల్లకీలో ఈ గ్రామానికి వెళుతున్నారు. అప్పుడే ఆయన దివ్యదర్శనాన్ని కాంచారు. “పైన విశాల నీలాకాశం ఉంది. క్రింద సువిశాల మైదానం ఉంది. చుట్టూ పచ్చని పైరులు కదలాడుతున్నాయి. రావి, మర్రిలాంటి చెట్లపైన చేరి పక్షులు కిలకిలారావాలు చేస్తున్నాయి. పూలమొక్కలలోని పువ్వులు సువాసనలను, మధువులను వెదజల్లుతున్నాయి. ఈ ప్రకృతి రమణీయతను చూస్తూ పరవశుడనై పోయాను. అప్పుడు హఠాత్తుగా ఈ దేహం (తన) నుండి ఇద్దరు కౌమారప్రాయంలో ఉన్న బాలకులు బయటికి వచ్చారు. వారెంతో అందంగా, ఆకర్షణీయంగా ఉన్నారు. అలా వచ్చి ఎంతెంతో దూరం వెళ్ళేవారు. అంతలోనే పల్లకీ పక్కన నడుస్తూ కనిపించేవారు. నవ్వేవారు. పరిహాసాలాడేవారు. అలా సరదాగా గడిపేవారు. అలా చాలాసేపు సరదాగా ఆనందించి, వారిద్దరూ మళ్ళీ ఈ దేహంలోకే వెళ్ళిపోయారు” అంటూ మాకు ఆ దర్శనం గూర్చి శ్రీరామకృష్ణులు వివరించి ఉన్నారు.
ఈ దర్శనం తర్వాత ఒకటిన్నర సంవత్సరాల తదుపరి భైరవీ బ్రాహ్మణి దక్షిణేశ్వరానికి వచ్చింది. ఒకరోజు శ్రీరామకృష్ణులు తన దివ్యదర్శనాల గూర్చి ఆమెకు చెప్పారు. అవన్నీ విని, “నాయనా! అవన్నీ వాస్తవాలే. ఈ మారు నిత్యానందుని శరీరం లోపల శ్రీచైతన్యుడు అభివ్యక్తమయ్యాడు. వారిద్దరూ ఒకరై నీలో నెలకొని ఉన్నారు. అదే ఆ నీ దివ్యదర్శనం” అని సమర్థించింది.
ఆమె అప్పుడు శ్రీచైతన్య భాగవతంలోని రెండు పద్యాలు చదివింది. హృదయ్ ఈ వివరాలు చెప్పాడు. ఆ పద్యాలు ఇవి–
అద్వైతేర్ గోలా ధరి కోహెన్ బార్బార్
పునః జే కొరిబో లీలామోర్ చమత్కార్ ।
కీర్తనే ఆనందరూప్ హోయిబే ఆమార్ ॥
అధ్యావధి గౌర్ లీలా కోరేన్ గౌర్ రాయ్
కోనో కోనో భాగ్యవాన్ దేఖీబారే పాయ ॥
శ్రీచైతన్యుడు, అద్వైతుని కౌగలించుకొని ఇలా అంటున్నాడు – “మళ్ళీ అద్భుత లీల సలుపుతాను. భగవత్ కీర్తనానందంలో మునిగిపోతాను. అదే నా రాబోయే కాలపు అవతారం. ఇప్పుడు కూడ గౌరాంగుని లీలలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు అరుదైన భాగ్యవంతులు ఈనాటికీ ఆ లీలలు దర్శిస్తున్నారు.”
26. పై దర్శన ఆంతర్యం
ఒకరోజు గురుదేవులను పై దర్శన ఆంతర్యం గురించి అడిగాం. అందుకు ఆయన, “నిజమే, నేను చూశాను. బ్రాహ్మణి కూడ అలాగే చెప్పింది. కాని దాని ఆంతర్యం నాకు కూడ అంతుబట్టలేదు” అన్నారు. సరే, ఈ దర్శనాల విషయంవల్ల ఒకటి స్పష్టమవుతున్నది. ఈ విశ్వంతో సుపరిచితుడైన మహాత్ముడెవరో ఏదో మహత్కార్యాన్ని సాధించడానికి, శ్రీరామకృష్ణుల మనోదేహాలను వాడుకుంటున్నాడన్నదే అది. శ్రీరామకృష్ణులకు కూడ ఈ భావన ఉంది. ఇలా తన నిజ వ్యక్తిత్వం గూర్చి ఆయనకు సూచన కలిగింది. ఈ అలౌకిక సూచన క్రమంగా స్పష్టరూపం దాల్చింది. దానితో పూర్వం ధర్మసంస్థాపనార్థం అయోధ్యలో రాముడుగా అవతరించినవాడు, బృందావనంలో శ్రీరాధారమణుడుగా అవతరించినవాడు, ఇప్పుడు మళ్ళీ భారతదేశంలోనే కాక ప్రపంచమంతటా ఆధ్యాత్మిక స్రవంతిని ప్రవహింపచేయడానికి తన శరీరంలో అవతరించాడని శ్రీరామకృష్ణులకు స్పష్టమయింది. అందుకే, “ఎవడు రాముడో, ఎవడు కృష్ణుడో, అతడే ఇప్పుడు ఈ ఒరలో (తన శరీరంలో) అవతరించాడు. రాజు అప్పుడప్పుడు నగర పర్యవేక్షణకై మారువేషంలో వెళుతుంటాడు కదా! అలాగే ఈ గుప్తవేషంలో ఆ పురుషుడు మళ్ళీ అవతరించాడు” అని తరచూ ఆయన చెప్పేవారు.
27. శ్రీరామకృష్ణుల దివ్యదర్శనాలు ఎన్నడూ అసత్యాలు కావు
తన ఈ అవతార రహస్యాన్ని శ్రీరామకృష్ణులు తన ఆంతరంగిక భక్తులకు పదేపదే చెప్పేవారు. అది ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి, మనకు వేరే ఆధారం ఏమీ లేదు. – శ్రీరామకృష్ణుల మాటలు విశ్వసించక తప్పదు. దీన్ని అలా వదిలేస్తే, ఆయనకు కలిగిన దర్శనాలన్నీ సత్యమే అని దృఢంగా చెప్పవచ్చు. కారణం మా స్వానుభవమే. మేము ఆయనను దర్శించడానికి వెళ్ళేవారం కదా! ఆ సమయంలో ఆయనకు ఇలాంటి దర్శనాలు ప్రతినిత్యం ఎన్నో కలిగేవి. ఈ అనుభవాలు, అనుభూతులపై అనుమానంతో ఎన్నోసార్లు పరీక్షించిన ఆంగ్లవిద్యను అభ్యసించిన శిష్యులు పరాజితులయ్యారు. ఆశ్చర్యంతో వారికి ఒప్పుకోక తప్పేది కాదు. ఇందుకు సంబంధించిన కొన్ని సంఘటనలను మేము ‘గురుభావం, ఉత్తరార్ధం (IV.4)’ లో వివరించాం. ఇక్కడ ఒక సంఘటన గూర్చి చెబుతాం.
28. సురేశ్చంద్రమిత్ర ఇంట్లో కలిగిన దర్శనం
1885 లో ఆశ్వయుజ (సెప్టెంబర్, అక్టోబర్) మాసంలో దుర్గా పూజోత్సవాలు ఆనందంగా చేసుకొంటున్నారు. శ్రీరామకృష్ణుల శిష్యుల్లో కూడ ఈ ఆనందం వెల్లివిరిసింది. కాని బాహాటంగా కనిపించలేదు. కారణం వారందరి ప్రియతమ గురువు జబ్బుతో మంచం పట్టి ఉన్నారు. శ్రీరామకృష్ణులు గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు, చికిత్స కోసం భక్తులంతా కలిసి, శ్యాంపుకూర్లో ఒక రెండంతస్తుల భవంతిని అద్దెకు తీసుకొని గురుదేవుల బసను అక్కడకు మార్చి నెలరోజులయింది. పేరుగాంచిన హోమియో వైద్యుడు మహేంద్రలాల్ సర్కార్ చికిత్స చేస్తున్నాడు.
ఎంత చికిత్స చేసినా వ్యాధి తగ్గుముఖం పట్టలేదు. పైగా ముదిరింది. గృహస్థభక్తులు రోజూ గురుదేవుల ఆరోగ్య విషయాన్ని తెలుసుకొంటూ కనుగొంటూ, తగిన ఏర్పాట్లు చేసేవారు. శ్రీరామకృష్ణుల యువ శిష్యులు (వారిలో చాలామంది విద్యార్థులే) భోజనానికి మాత్రం ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి, గురుసేవలో ఉండిపోయేవారు. కొందరైతే అక్కడే ఉండిపోయేవారు.
‘అధికంగా మాట్లాడినా, పదే పదే సమాధిలోకి వెళ్ళినా ప్రమాదం’ అని డాక్టర్ హెచ్చరించాడు. కాబట్టి ఆ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండమని శిష్యులకు సలహా ఇచ్చాడు. శ్రీరామకృష్ణులు వైద్యుని సలహా పాటించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. కాని వీలుపడలేదు. మొదటి నుండి కూడ ఆయన తన శరీరానికి అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. దాన్ని రక్తమాంసయుత ఎముకల గూడుగానే పరిగణించారు. అలాంటిది ఒక్కమారుగా శరీరానికి ప్రాధాన్యం ఇవ్వడం, శరీరంకోసం జీవించడం ఆయనకు సాధ్యం కాకపోయింది. భగవద్విషయ ప్రస్తావన వస్తే తన శరీరాన్ని, దాని రక్షణను కూడ మరిచిపోయి, భగవంతుని గూర్చి మాట్లాడుతూ ఉండిపోయేవారు. దానితోపాటు ఆయనకు సమాధి స్థితులు కూడ కొనసాగాయి.
అంతేకాదు, ఇంతకుముందెప్పుడూ శ్రీరామకృష్ణులను దర్శించుకోని భక్తులెందరో, శ్రీరామకృష్ణుల దర్శనం కోసం రాసాగారు. వారంతా భక్తి, ప్రేమలతో తనవద్దకు వస్తే, గురుదేవులు ఊరకే ఎలా కూర్చుంటారు? వారితో భగవద్విషయాలు మాట్లాడేవారు. సాధనా మార్గాలను ఉపదేశించేవారు. ఆయనలోని ఆ ఉత్సాహాన్ని, ఆనందాన్ని చూసిన తర్వాత శ్రీరామకృష్ణుల వ్యాధి అంత తీవ్రమైనది కాదని, త్వరలో నయమౌతుందని భక్తులు అనుకొనేవారు. క్రొత్తగా తన వద్దకు వచ్చేవారిని అనుగ్రహించడానికే, సాధ్యమైనంత ఎక్కువ మందికి భగవంతుని విషయం తెలియచేయడానికే శ్రీరామకృష్ణులు కావాలనే ఈ వ్యాధిని కోరి తెచ్చుకొన్నారని మరికొందరు భక్తులు తలచారు. తన ఆశయం నెరవేరగానే, తనంతట తానే ఈ వ్యాధిని నయం చేసుకుంటారని వారు అందరికీ నచ్చచెప్పేవారు.
డాక్టర్ సర్కార్ ప్రతిరోజూ ఉదయమో, సాయంత్రమో ఎప్పుడో ఒకసారి వచ్చి శ్రీరామకృష్ణుల రోగస్థితిని గమనించేవాడు. తగిన మందులు ఇచ్చేవాడు. ఆ పని అయిపోయిన తర్వాత శ్రీరామకృష్ణులతో భగవంతుని చర్చలో మునిగిపోయేవాడు. శ్రీరామకృష్ణులు భగవద్విషయాలు చెబుతూ ఉంటే పరవశుడై వింటూ ఉండిపోయేవాడు. అప్పుడతడికి సమయం కూడ తెలిసేది కాదు. రెండు మూడు గంటలు గడిచినా లక్ష్యపెట్టేవాడు కాదు. సంశయాలు వ్యక్తం చేసేవాడు. గురుదేవుల నుండి సరియైన సమాధానాలు పొంది ఆనందించేవాడు. అలా చాలాసేపు గడిచేది. అతడు తాను పెట్టిన నియమాన్ని తానే అలా ఉల్లంఘించి పశ్చాత్తాపం చెందేవాడు. గురుదేవులతో, “ఈ రోజు మిమ్మల్ని చాలా మాట్లాడించాను. సరే, ఇక ఈ రోజు మీరు మరెవ్వరితోనూ మాట్లాడవద్దు. అనర్థం జరిగిపోతుంది. మీ మాటల్లో చాలా ఆకర్షణ ఉంది. అందుకే మీతో మాట్లాడుతూ, దాదాపు మూడు గంటలు నా వైద్యశాలను కూడ మరిచిపోయి ఉంటున్నానంటే, ఆ ఆకర్షణ ఎంతటిదో కదా! సరేలే, అయిందేదో అయింది. ఇక మీరు ఎవ్వరితోనూ మాట్లాడకండి. మాట్లాడినా ఎక్కువసేపు మాట్లాడ వద్దు. నేను వచ్చినప్పుడు నాతో ఎంతసేపైనా మాట్లాడవచ్చు. ఫరవాలేదు” అని చెప్పేవాడు. ఆ మాటలకు అక్కడున్న వారంతా హాయిగా నవ్వుకునేవారు.
సురేంద్రనాథ్ మిత్రను శ్రీరామకృష్ణులు, ‘సురేశ్మిత్ర’ అని పిలిచేవారు. అతడు ఆ సంవత్సరం తన ఇంట్లో దుర్గాపూజ చేస్తున్నాడు. అతడి ఇల్లు, సిమ్లా అనే పేటలో ఉంది. అంతకు పూర్వం ఆ కుటుంబంలో ప్రతి ఏటా దుర్గాపూజ జరుపుకొనేవారు. కాని ఒకసారి ఏదో అనర్థం జరిగింది. దాంతో పూజచేయడం ఆపేశారు. సురేంద్ర, శ్రీరామకృష్ణుల భక్తుడు, నిర్భయుడు, గురుదేవుల పట్ల భక్తి విశ్వాసాలు ఉన్నవాడు. అతడు ఏదైనా పనిని చేయాలనుకొంటే, వెంటనే ఆ పనిని చేసివేసినాడే తప్ప దేనికీ భయపడేవాడు కాదు. ఎవరు కాదన్నా, ఏమన్నా పట్టించుకొనేవాడు కాదు. భూత, ప్రేత పిశాచాది క్షుద్రశక్తులను అసలు లక్ష్యపెట్టేవాడు కాదు.
శ్రీరామకృష్ణులపైన అపారనమ్మకంతో, అనుమతితో అతడు తన ఇంట్లో మళ్ళీ దుర్గాపూజను చేయడానికి ఈ సంవత్సరం సిద్ధపడ్డాడు. కుటుంబ సభ్యులు అతణ్ణి పూజ కూడదని వారించారు. చేయవద్దని నిషేధించారు. కాని అతడు తన పట్టు సడలించలేదు. గురుదేవుల అనుమతితో, దుర్గామాత పూజకు పూనుకొన్నాడు. ఖర్చంతా తానొక్కడే భరించాడు. పూజ చేశాడు. అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాని ఒకే ఒక్క లోటు, నిరాశ అతడిలో చోటు చేసుకొన్నాయి – తన ప్రియతమ గురుదేవుడు, తన పూజ ఉత్సవంలో పాల్గొనక పోవటమే అది.
సురేంద్రుని పూజాకార్యక్రమం, కొందరి నిందలకు కారణమైంది. అతడు తన ఇంట్లో పూజచేయదలచుకొన్న కొన్ని రోజులకు ముందే, అతడి బంధువులు కొందరు రోగగ్రస్తులయ్యారు. అందుకు సురేంద్రునిపై దోషారోపణ చేశారు. కుటుంబ సభ్యులు కూడ అతణ్ణి ఆక్షేపించారు. పూజ చేయవద్దని వారించారు. కాని అతడు ఎవర్నీ, దేన్నీ లెక్కచేయలేదు. సోదరశిష్యుల నందరినీ ప్రేమతో ఆహ్వానించాడు. పరమభక్తితో దుర్గామాత పూజను కొనసాగించాడు.
సప్తమీపూజ అయింది. మహాష్టమిరోజు చాలామంది భక్తులు శ్యాంపుకూర్లో శ్రీరామకృష్ణుల వద్దకు చేరారు. భగవంతుని విషయం మాట్లాడుతూ, కీర్తనలు పాడుతూ ఆనందించసాగారు. సాయంకాలం డాక్టర్ సర్కార్ అక్కడికి వచ్చాడు. అప్పుడు నరేంద్ర (వివేకానంద) భక్తి కీర్తన గానం చేస్తున్నాడు. అతడి మధుర గానానికి భక్తులంతా పరవశులయ్యారు. శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు డాక్టర్‌కు పాటల అర్థం వివరిస్తూ, మధ్య మధ్యలో సమాధిస్థితులవుతూ ఉండి పోయారు. భక్తిపారవశ్యంలో కొంతమంది భక్తులు కూడ, ఆ రోజు బాహ్యస్మృతి కోల్పోయారు.
ఆ గదంతా ఆనందంతో నిండిపోయింది. దాదాపు రాత్రి ఏడున్నర ప్రాంతంలో డాక్టర్ పరవశత్వం నుండి బయటపడ్డాడు. నరేంద్రుణ్ణి తన కొడుకులా కౌగలించుకొన్నాడు. శ్రీరామకృష్ణుల వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళడానికి లేచాడు. అతడి గౌరవార్థం శ్రీరామకృష్ణులు కూడ నవ్వుతూ లేచి నిలబడ్డారు. అంతే, వెంటనే ప్రగాఢ సమాధిలో మగ్నులైపోయారు.
అది సంధిపూజా ముహూర్తం* , అందుకే ఆయన సమాధిమగ్నులయ్యారు. భక్తులు ఆశ్చర్యంతో చూస్తూండిపోయారు. అరగంట తర్వాత ఆయన స్పృహలోకి వచ్చారు. డాక్టర్ సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు.
ఆ అరగంటలో ఏం జరిగిందో శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు: “ఈ చోటు నుండి, సురేంద్రుని ఇంటిదాక, ఒక తేజోమార్గం ఏర్పడింది. సురేంద్రుని భక్తికి సంతుష్టురాలై జగన్మాత అతడు పూజించే ప్రతిమలో అభివ్యక్తం కావడం నేను చూశాను. అమ్మ మూడవ నేత్రం నుండి కాంతికిరణం బయల్వెడలింది. జగన్మాత ఎదుట ఎన్నో దివ్వెలు వెలిగించారు. అమ్మ ముందు కూర్చుని సురేంద్రుడు – ‘అమ్మా, అమ్మా’ అంటూ పరితాపంతో విలపిస్తున్నాడు.”
అలా చెప్పి “వెంటనే మీరంతా సురేంద్రుని ఇంటికి వెళ్ళండి. మిమ్మల్ని చూసి అతడు కొంత శాంతిస్తాడు” అని ఆదేశించారు.
వివేకానందాది శిష్యులు, ఇతర భక్తులంతా కలిసి శ్రీరామకృష్ణులకు ప్రణామంచేసి, సురేంద్రుని ఇంటికి వెళ్ళారు. సురేంద్రుణ్ణి అడిగి ఇంతకు మునుపు శ్రీరామకృష్ణులు చెప్పినవన్నీ నిజమేనని ప్రత్యక్షంగా తెలుసుకొన్నారు. శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనప్పుడు, సురేంద్రుడు వరండాలో అమ్మ ఎదురుగా కూర్చొని, పిల్లవాడిలా ‘అమ్మా, అమ్మా’ అని విలపించిన మాట నిజమేనని తెలుసుకొన్నారు.
ఇలా శ్రీరామకృష్ణులు చూసిన దర్శనం నిజమేనని తేలింది. అది తెలిసి అంతా ఆశ్చర్యచకితులయ్యారు.
29. రాస్మణి, మథుర్ల తప్పుడు అభిప్రాయాలు
శ్రీరామకృష్ణుల దివ్య ఆధ్యాత్మిక స్థితిని ఒక సందర్భంలో రాణీ రాస్మణి, ఆమె అల్లుడు మథుర్బాబు కూడ సరిగ్గా అవగాహన చేసుకోలేకపోయారు. అఖండ బ్రహ్మచర్యం పాటిస్తున్నారు కాబట్టి ఆయన మెదడు చెడిందని, అందుకే అలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని అనుకొన్నారు. ఆయన బ్రహ్మచర్యాన్ని భంగపరిస్తే, ఆయన మామూలు మనిషి అవుతారని నిశ్చయించుకున్నారు.
అందుకని వారు లక్ష్మీబాయి మొదలైన అందగత్తెలయిన వేశ్యలతో శ్రీరామకృష్ణులను ప్రలోభానికి లోనుచేయడానికి దక్షిణేశ్వరంలోనూ, మెచువా బజార్‌లోని ఒక ఇంట్లో ప్రయత్నించారు. కాని శ్రీరామకృష్ణులకు ఆ వేశ్యల రూపంలో జగన్మాత దర్శనమే అయింది. వారిని చూసి ‘అమ్మా, అమ్మా’ అంటూ బాహ్యస్మృతి కోల్పోయారు. ఈ విషయం వివరిస్తూ, “అప్పుడు నా పురుషాంగం తాబేలు అవయవంలా శరీరంలోకి ముడుచుకుపోయింది” అని చెప్పారు.
పసివాడిలా ఉన్న శ్రీరామకృష్ణుల అమాయక ప్రవర్తనను చూసి, ఆ వేశ్యలు విస్మయం చెందారు. వారి మనస్సులు మాతృప్రేమ, వాత్సల్యాలతో నిండిపోయాయి. అలాంటి మహాత్ముణ్ణి పతనం చేయడానికి వచ్చి తాము ఎంతో అపచారం చేశామని బాధపడ్డారు. ఏడుస్తూ తమను క్షమించమని శ్రీరామకృష్ణులను వేడుకొన్నారు. ఆయనకు నమస్కరించి వెళ్ళిపోయారు.