1. ప్రథమ దివ్య దర్శనానంతరం శ్రీరామకృష్ణుల స్థితి
జగన్మాత ప్రథమ దర్శనంతో శ్రీరామకృష్ణులు మహదానందంలో లీనమై పోయారు. ఆ కారణంగా కొన్నిరోజుల వరకు ఆయన ఏ పనీ చేయలేకపోయారు. విధివిహితంగా పూజాదులను చేయడం ఆయనకు అసంభవమైపోయింది. అందుచేత హృదయ్ మరొక బ్రాహ్మణుని సహాయంతో వాటిని ఎలాగో ముగించే వాడు. తన మామ వాతప్రకోపంతో బాధపడుతున్నాడని ఎంచి, ఆయనకు చికిత్స చేయించసాగాడు. భూకైలాస సంస్థాన రాజకుటుంబ వైద్యులొకరితో అతడికి ఎలాగో పరిచయమయింది. అతడితోనే శ్రీరామకృష్ణులకు చికిత్స చేయించసాగాడు. కాని రోగం అంత త్వరగా నయం కావడం సాధ్యం కాదని గ్రహించి ఆ విషయాన్ని కామార్పుకూర్కు కబురు చేశాడు.
2. ఈ కాలంలో శ్రీరామకృష్ణుల శారీరక, మానసిక భావనలు మరియు దర్శనాలు
భగవద్దర్శనం కోసం అత్యంత వ్యాకులతతో ఉండని రోజు, బాహ్యస్మృతి అంతగా కోల్పోని రోజు మాత్రం శ్రీరామకృష్ణులు యథాప్రకారం పూజ చేయడానికి పూనుకునేవారు. పూజ, ధ్యానాదులు చేస్తున్నప్పుడు తమ ఆలోచనలు, అనుభూతులు ఎలా ఉండేవో, ఆయన అప్పుడప్పుడు మాకు చెబుతూ ఉండేవారు. “అమ్మ భవతారిణి ఆలయానికి ఎదురుగా నాట్యశాల ఉండేది. ఆ నాట్యశాల పిట్టగోడ మీద ధ్యానంలో ఉన్న భైరవ విగ్రహం ఒకటుండేది. ధ్యానం చేయబోతున్నప్పుడు దాన్ని చూపి నా మనస్సుకు, ‘నువ్వలా నిశ్చలంగా, నిశ్శబ్దంగా కూర్చుని అమ్మ పాదారవిందాలను ధ్యానించాలి’ అంటూ చెప్పేవాడిని. నేను ధ్యానానికి కూర్చోగానే, శరీరంలోని అవయవాల కీళ్ళను, పాదాల నుండి పైదాకా ‘ఖట్ – ఖట్’ అనే ధ్వనితో లోనుండి ఎవరో ఒకటొకటి తాళంవేసి బిగిస్తున్నట్లు అనిపించేది. ధ్యానిస్తున్నంత వరకు శరీరాన్ని కదిలించేందుకు, ఆసనాన్ని మార్చేందుకు, లేదా ధ్యానం వదిలి ఇచ్ఛ వచ్చినట్లు మరెక్కడికైనా వెళ్ళి, మరేమైనా చేయడానికి సాధ్యమయ్యేది కాదు. మళ్ళీ ‘ఖట్ – ఖట్’ శబ్దాలతో పై నుండి కిందికి కీళ్ళ తాళాలన్నీ తెరిచేదాకా, నన్నెవరో బలవంతంగా అదిమి కూర్చోబెట్టినట్లు అనిపించేది.
“ధ్యానానికి కూర్చున్న తర్వాత ముందుగా మిణుగురు పురుగుల లాంటి జ్యోతిబిందువులను గాంచేవాణ్ణి. మరోమారు, మంచులా జ్యోతి దొంతరలు నలువైపులా వ్యాపిస్తూ కనిపించేవి. మరోసారి కరిగిన వెండిలా ధగధగ మెరిసే తరంగాలు సర్వత్రా వ్యాప్తమై ఉన్నట్లనిపించేది. ఇవన్నీ కొన్నిసార్లు కళ్ళు మూసికొని ధ్యానించేటప్పుడు, మరికొన్ని సార్లు కళ్ళు తెరిచినప్పుడు కూడా కలగుతూ ఉండేవి. వాటి అర్థమేమిటో, వాటి దర్శనం మంచిదో కాదో నాకు తెలిసేది కాదు. అందుచేత పరమ వ్యాకులతతో అమ్మను ‘నాకేమవుతున్నదో అర్థం కావడం లేదు. నిన్ను పిలిచే మంత్రతంత్రాదులేవీ నాకు తెలియవు. నీ దర్శనం నా కెలా కలుగుతుందో, ఆ మార్గాన్ని నువ్వే నాకు బోధించు అమ్మా! నువ్వు తప్ప నాకు మరెవరు నేర్పుతారు? నువ్వు తప్ప నాకు మరి దిక్కెవ్వరు? మరెవ్వరు సహాయం చేస్తారు?’ అంటూ ఏకాగ్రచిత్తంతో ప్రార్థించేవాణ్ణి. దుఃఖం ఎక్కువైతే బిగ్గరగా విలపించేవాడిని.”
3. జగన్మాత దర్శనానంతరం శ్రీరామకృష్ణుల భావనల, చర్యలలో మార్పు
ఈ సమయంలో శ్రీరామకృష్ణుల పూజాధ్యానాదులు ఒక కొత్తరూపాన్ని దాల్చాయి. ఆ అద్భుత తన్మయత్వం, జగన్మాతను పసివాడిలా ఆశ్రయించిన ఆ సరళత, ఆ అపార విశ్వాసం, ఆమెపై ఆధారపడి ఉండడంలోని మాధుర్యం – వీటిని ఇతరులకు అర్థమయ్యేటట్లు చెప్పడం చాలకష్టం. వయోజనులలో కనిపించే గాంభీర్యం, దేశకాలపాత్రాను గుణమైన విధినిషేధాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇహపరాల్లో వ్యవహరించడం – ఇవేవీ శ్రీరామకృష్ణుల ఆచరణలో కనిపించేవి కావు. కాళీమాతను ఆయన చూసినప్పుడల్లా, “అమ్మా! నిన్నే శరణుపొందిన ఈ బిడ్డతో ఏం మాట్లాడాలో అలా మాట్లాడించు. ఏం చేయాలో అలా చేయించు” అన్న ఆశ్రితభావం కనిపించేది. ఇచ్ఛామయి జగన్మాత ఇచ్ఛలో, తన ఇచ్ఛను, అహంకారాన్ని పూర్తిగా లయం చేసి ఆమె చేతిలో కీలుబొమ్మగా మారి వారిప్పుడు అన్ని పనులు చేయసాగారు. అలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజల నమ్మకాలకు, కార్యాలకు; శ్రీరామకృష్ణుల ప్రవర్తన, ఆచరణలకు మధ్యన ఒక పెద్ద తేడా కనిపించేది. వారి ఆచరణను చూసి, ఎంతోమంది రకరకాలుగా గుసగుసలాడేవారు. తర్వాత బహిరంగంగా పలకసాగారు. కాని శ్రీరామకృష్ణులు వీటిని అసలు లెక్కపెట్టలేదు. వారు ఇప్పుడు జగజ్జనని కనుసంజ్ఞల ఆదేశం ప్రకారం వర్తిస్తున్నారు కదా! ఆ క్షుద్ర ప్రాపంచిక కోలాహలాలు వారి చెవులను ఎలా తాకుతాయి? ప్రపంచంలో ఉన్నా, వారిలో ప్రాపంచికత ఉండేది కాదు. బాహ్యప్రపంచం వారికిప్పుడు స్వప్నతుల్యంగా కనిపించసాగింది. ఎంత ప్రయత్నించినా అది ‘వాస్తవం’ అన్న బోధ ఆయనకు కలిగేది కాదు. జగన్మాత ఆనందఘన చిన్మయమూర్తి ఒక్కటి మాత్రమే వారికి ఏకైక సత్యంగా గోచరించేది.
4. శ్రీరామకృష్ణుల పూజ–దర్శనాదుల్లో మునుపటికి ఇప్పటికి మధ్య కనిపించే వ్యత్యాసం
పూర్వం పూజ ధ్యానాదులు చేస్తున్నప్పుడు ఒక్కోమారు తల్లి చేతినో, కాంతిమంతమైన అమ్మ సుకోమల పాదాన్నో, సౌమ్యాతి సౌమ్యమైన, చిరుమందహాసంతో ఉన్న జగన్మాత చిన్మయ చంద్రముఖాన్నీ శ్రీరామకృష్ణులు దర్శిస్తుండేవారు. ఇప్పుడు మాత్రం పూజ ధ్యానాది సమయాల్లోనే కాకుండా, ఇతర సమయాల్లో సైతం అతిలోక సౌందర్యంతో విరాజిల్లే జ్యోతిర్మయి జగన్మాతను దర్శించసాగారు. ఆమె నవ్వడం, మాట్లాడడం, తనను అదీ ఇదీ చేయమనడం, తనను అంటిపెట్టుకుని ఉండడం – ఇవన్నీ అనుభూతం చేసుకోసాగారు.
పూర్వం తల్లికి నైవేద్యం అర్పించినప్పుడు, అమ్మ నేత్రాల నుండి ఒక అపూర్వకాంతి ధగధగా మెరుస్తూ వెలువడి, ఆ నివేదిత పదార్థాలనన్నింటినీ స్పర్శించి వాటి సారాన్ని గ్రహించి, తిరిగి ఆమె కళ్ళల్లోకే తిరోహితమయ్యేది. ఇప్పుడు మాత్రం నైవేద్యాన్ని సమర్పించినంతనే, లేదా అంతకు ముందే తన దివ్యతేజస్సుతో ఆలయాన్నంతా ప్రకాశమానం చేస్తూ, భుజించడానికి సాక్షాత్తూ అమ్మే కూర్చోవడం శ్రీరామకృష్ణులు దర్శించసాగారు. హృదయ్ నుండి మేమీ క్రింది విషయం విన్నాం:
ఒక రోజు హృదయ్ పూజాసమయానికి అక్కడికి వెళ్ళాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు మందార పువ్వుల, బిల్వపత్రాల అర్ఘ్యాన్ని చేతిలోకి తీసుకుని, నైవేద్యాన్ని అమ్మకు అర్పించబోతూ మంత్రపఠనం చేయబోతున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా శ్రీరామకృష్ణులు, ‘ఉండమ్మా, ఉండు. ముందు మంత్రాన్ని చదవనీ, ఆ తర్వాత తిందువుగాని’ అని అనడం విన్నాడు. అలా అంటూ లేచి, పూజ పూర్తి కాకుండానే నైవేద్యాన్ని నివేదించారు.
పూర్వం పూజాసమయాల్లో కాళీ విగ్రహంలో ఒక సజీవ చైతన్యమూర్తిని దర్శించే వారు. ఇప్పుడు అసలు ఆలయంలో రాతివిగ్రహం వారికి గోచరమయ్యేది కాదు. జగత్తునంతా తన చైతన్యంతో, చైతన్యమయం చేసే ఆ చిద్ఘనరూపిణి, ఆ చైతన్యమయి వరాభయహస్తాలతో శోభిస్తూ సర్వదా వారికి ప్రత్యక్షమవసాగింది. “అమ్మ ముక్కువద్ద చేయిపెట్టిచూస్తే నిజంగానే ఆ తల్లి ఊపిరి పీలుస్తున్నట్లుండేది” అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. “రాత్రివేళ దీపకాంతిలో తల్లి దివ్యదేహపు నీడ గోడ మీద పడుతుందేమోనని ఎంత సూక్ష్మంగా పరిశీలించినా, అది కనిపించేది కాదు. నేను నా గదిలో ఉండగా, అమ్మ కాలి అందెల ‘ఘల్లు – ఘల్లు’ రవళులు నా చెవినబడేవి. అమ్మ చిన్నపిల్లలా గెంతుతూ ఆనందంతో పైకి వెళ్ళేది. నేనది విని వెంటనే గది బయటికి వచ్చి చూసేవాణ్ణి. నిజంగానే అమ్మ ఆలయం రెండవ అంతస్తు వరండాలో నిలబడి శిరోజాలు ఆరపెట్టుకొంటూ కలకత్తా వైపు, గంగానది వైపు చూస్తూ కనిపించేది” అని వివరించేవారు.
5. ఈ సమయంలో శ్రీరామకృష్ణుల పూజ గురించి హృదయ్ దృక్పథం
హృదయ్ ఇలా చెబుతుండేవాడు: “శ్రీరామకృష్ణులు ఆలయంలో ఉన్నప్పుడు సరే సరి, ఆయన ఆలయంలో లేని సమయంలో కూడ, ఆలయంలోకి ప్రవేశిస్తే తక్షణమే ఏదో అనిర్వచనీయ దివ్యపారవశ్యంతో దేహం జలదరించేది. పూజాసమయంలో శ్రీరామకృష్ణులు ఎలా ప్రవర్తిస్తుంటారో చూద్దామన్న కుతూహలాన్ని ఆపుకోలేకపోయేవాణ్ణి. చాలా సార్లు అక్కడికి హఠాత్తుగా వెళ్ళి చూసేవాడిని. ఆ దృశ్యం చూసి నేను భక్తివిస్మయాలకు లోనయ్యేవాడిని. కాని బయటికి రాగానే మళ్ళీ సందేహం కలిగేది. ‘మామ నిజంగానే పిచ్చివాడైపోయాడేమో’ అని అనుకునేవాణ్ణి. లేకపోతే పూజాసమయంలో ఇలా విపరీతంగా ఎందుకు ప్రవర్తిస్తాడు? ఈ పూజను గూర్చి రాణిగారికి లేదా మథుర్బాబుకు తెలిస్తే వారేమనుకుంటారో అని భయపడేవాడిని. కాని మా మామ మనస్సులో అలాంటి తలంపు ఉండేదే కాదు. చెప్పినా వినేవాడు కాదు. ఆయనతో ఎక్కువగా మాట్లాడడం కూడ నాకు సాధ్యమయ్యేది కాదు. ఏదో ఒక తెలియరాని భయం, సంకోచం నన్ను అడ్డుకొనేవి. అంతేకాక నాకూ ఆయనకూ మధ్య ఎంతో దూరం ఉన్నట్లు అనిపించేది. అందుచేత మరేమీ చేయలేక, మౌనంగా వారి సేవచేస్తూ ఉండిపోయేవాణ్ణి. కాని ఎప్పుడో ఒకసారి మామ ఏదో విపరీతం చేస్తాడని మాత్రం అనిపించేది.”
పూజాసమయంలో హఠాత్తుగా గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు శ్రీరామకృష్ణుల ప్రవర్తనను చూసి, తాను భక్తి – విస్మయ – భయాలతో ఉండేపోయేవాణ్ణి అంటూ హృదయ్ ఇంకా ఇలా చెప్పాడు:
“మందారపుష్పాల, బిల్వపత్రాల అర్ఘ్యాన్ని మామ ముందుగా తన తలపై పెట్టుకునేవాడు. ఆ అర్ఘ్యంతో తన వక్షాన్ని, శరీర అవయవాలను స్పృశించి, తన కాళ్ళను కూడా స్పృశించిన తరువాత దాన్ని అమ్మ పాదపద్మాలవద్ద అర్పించేవాడు. బాగా తాగిన వాడి మాదిరిగా ఆయన వక్షస్థలం ఎర్రబారి ఉండేది. తూలుతూ ఉండేవాడు. అలా తూలుతూ దేవి పీఠాన్ని ఎక్కి, చుబుకాన్ని పుచ్చుకొని బుజ్జగించేవాడు. పాటలు పాడేవాడు. ఛలోక్తులు ఆడేవాడు. ఆమెతో మాట్లాడేవాడు. అమ్మ చేతిని పుచ్చుకుని నృత్యం చేసేవాడు. ఇవన్నీ నేను కళ్ళారా చూశాను.
“అమ్మకు నైవేద్యం అర్పిస్తూ, హఠాత్తుగా లేచి నిలబడేవాడు. ఒక అన్నం ముద్దను తీసుకుని, వేగంగా వేదికనెక్కి, అమ్మ నోట్లో అన్నం పెట్టి – ‘తినమ్మా, తిను బాగా తిను తల్లీ’ – అంటూ చెప్పేవాడు. కాసేపాగి – ‘ముందు నన్ను తినమంటావా? సరే, అలాగే, ఇదుగో తింటున్నాను’ – అని, కొంత తాను తినేవాడు. మిగిలిన దాన్ని మళ్ళీ అమ్మ నోట్లోపెట్టి – ‘నేను తిన్నాగా, ఇక నువ్వు తిను’ – అనేవాడు.
“ఒకరోజు నైవేద్యం పెట్టే సమయంలో గర్భగుడిలోకి ఒక పిల్లి దూరింది. ‘మ్యావ్ –మ్యావ్’ అని అరవసాగింది. అది చూసి, – ‘అమ్మా అన్నం తింటావా, తినమ్మా – అంటూ ఆయన ఆ నైవేద్యాన్నంతా పిల్లికి తినిపించాడు. ఒకరోజు అమ్మను శయనింపచేశాడు. – ‘నన్నుకూడ నీ ప్రక్కనే పడుకోమంటావా, సరే అలాగే’ అంటూ, అమ్మ వెండిమంచంపైన తను కాసేపు పడుకొన్నాడు. ఆయన పూజకు సిద్ధమై ధ్యానం చేస్తూ, చాలాసేపటి వరకు అందులో లీనమైపోయేవాడు. అమ్మకు మాలలు తయారు చేయడంకోసం తెల్లవారు ఝామునే లేచి, పూలు కోసుకునేవాడు. ఆ సమయంలో ఆయన ఎవరితోనో మాట్లాడుతూ, నవ్వుతూ, బుజ్జగిస్తూ, హాస్యం చేస్తూ ఉండేవాడు. రాత్రిపూట అసలు నిద్రపోయేవాడు కాదు. ఆయనెప్పుడూ భావావేశంలో ఉంటూ మాట్లాడుతూ – పాటలు పాడుతూ ఉండేవాడు లేదా పంచవటికి వెళ్ళి ధ్యానం చేసుకునేవాడు.”
6. శ్రీరామకృష్ణుల విపరీత చేష్టలను చూసి ఆలయ ఉద్యోగులు మథుర్బాబుకు విన్నవించడం
“మా మామ విపరీత చేష్టలను చూసి ఎంతో కంగారుపడేవాణ్ణి. ఈ విషయం గూర్చి ఎవరికైనా ఎలా చెప్పాలి? ఎవరికైనా తెలిస్తే, విషయం పైవారికి తెలుస్తుంది. అప్పుడు మా మామకు హాని కలుగవచ్చు” అని చెప్పాడు హృదయ్. ఒకటి రెండు రోజుల మాట కాదు గదా! ప్రతిరోజూ జరుగుతున్న విషయమే! ఎంతకాలం దాగుతుందది? హృదయ్లాగే మరికొందరు కూడ శ్రీరామకృష్ణుల విపరీత చేష్టలను చూసి, ఆ విషయం ఆలయ ఉద్యోగులకు ఫిర్యాదుచేశారు. ఆ ఉద్యోగులు స్వయంగా వచ్చి, ఆ విషయాన్ని రూఢిపరచుకొన్నారు. కాని దేవీ భావనలో ఉన్నా, నిస్సంకోచంగా వ్యవహరిస్తూ, సర్వం మరిచివున్న శ్రీరామకృష్ణుల ఆకృతి చూసి వారు ధైర్యంగా ఆయనను ఏమాత్రమూ హెచ్చరించలేకపోయారు. కాని తమలో తాము సంప్రతించుకుని, వారంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ‘భట్టాచార్యు (పూజారి)లకు పిచ్చిపట్టింది. లేదా ఏదో క్షుద్రదేవత అతణ్ణి ఆవహించింది. లేకపోతే శాస్త్రవిరుద్ధంగా పూజను ఎవరైనా చేస్తారా? ఏది ఎలా ఉన్నా, దేవీపూజ – నైవేద్యాదులు సముచితంగా జరగడం లేదు. భట్టాచార్యులు అంతా అపవిత్రం చేసేస్తున్నాడు. మనం ఇంకా ఊరకుంటే బాగుండదు. వెంటనే ఆలయ యజమానులకు తెలియచేద్దాం’ అని నిర్ణయించుకున్నారు.
మథుర్బాబుకు శ్రీరామకృష్ణుల విపరీత పూజల గురించి వర్తమానం పంపారు. అతడు అంతా చూసి, అందుకు జవాబుగా ఇలా వ్రాసి పంపాడు. “సరే, వీలు చూసుకుని త్వరలో స్వయంగా నేనే వచ్చి అంతా పరిశీలిస్తాను. చూశాక ఏం చేయాలో ఆలోచిస్తాను. కాని అంతవరకు భట్టాచార్యులను ఎవరూ ఏమీ అనకండి. వారెలా పూజ చేస్తున్నారో అలాగే చేయనివ్వండి.”
ఆ తర్వాత ఆలయ ఉద్యోగులు మథుర్బాబు రాక కోసం ఆతురతతో ఎదురు చూడసాగారు. ‘ఇక భట్టాచార్యుల పని అయినట్టే. అతణ్ణి తప్పకుండా సాగనంపుతారు. లేకపోతే ఇంత అనాచారం చేస్తాడా? దేవి మాత్రం ఎంతకాలం సహిస్తుంది?’ అని అనుకున్నారు.
7. మథుర్బాబు శ్రీరామకృష్ణుల పూజాదులను చూసి ముగ్ధుడవడం
చెప్పినట్లే మథుర్బాబు ఒక రోజు హఠాత్తుగా ఆలయానికి వచ్చాడు. శ్రీరామకృష్ణుల పూజాకార్యాన్నంతా పరిశీలించసాగాడు. అలా చాలాసేపు చూశాడు. ఆధ్యాత్మిక తన్మయావస్థలో, సర్వం మరిచిన శ్రీరామకృష్ణులకు అతడి రాక విషయం ఎలా తెలుస్తుంది? పూజలో, తల్లి భావనలో లీనమైపోయి ఎవరు వస్తున్నారో వెళుతున్నారో తెలుసుకొనే స్థితిలో వారుంటే కదా! మథుర్బాబు, శ్రీరామకృష్ణుల తన్మయత్వాన్ని గమనించాడు. అమ్మను పసిబిడ్డలా బుజ్జగించడం, ప్రేమ – వాత్సల్యాలతో మాట్లాడడం చూసి మథుర్బాబు, అది అనన్యభక్తితో కలిగిన ప్రేమ అనే విషయం గ్రహించాడు. ఇలాంటి నిర్మల నిశ్చల అనన్యభక్తి విశ్వాసాలతో కాక, మరి దేనివల్ల అమ్మ దర్శనం కలుగుతుంది? అని అనుకొన్నాడు. పూజ చేస్తున్న సమయంలో భట్టాచార్యుల కళ్ళ నుండి కన్నీరు ధారకట్టడం, పరమోత్సాహంతో ఉండిపోవడం చూశాడు. అప్పుడప్పుడు ఆయన జడస్థితిలో నిశ్చలంగా ఉండిపోవడం, బాహ్యస్మృతిని పూర్తిగా కోల్పోవడం గమనించాడు. అదంతా చూసిన మథుర్ హృదయం దివ్యానందసంభరితమైంది. ఆలయం దేవీ ఆవిర్భావంతో భాసిస్తున్నట్లు అతడు అనుభూతి చెందాడు. భట్టాచార్యులవారు జగన్మాత దర్శన లాభాన్ని పొంది కృతార్థుడయ్యాడనే దృఢనమ్మకం అతడికి కలిగింది. దాంతో అతడు భక్తిపునీత హృదయంతో, సజలనయనాలతో జగన్మాతకు, ఆమె అపూర్వ అర్చకునికి దూరం నుండే పదేపదే వందనాలు చేశాడు. ఇంతకాలానికి దేవీ ప్రతిష్ఠ సార్థకమైంది. నిజంగానే దేవి ఇక్కడ ఆవిర్భూతమైంది అనుకొని ఆనందించాడు. ఇంతకాలానికి ఆలయంలో అమ్మ పూజాదికార్యాలు ఆధ్యాత్మిక భావంతో జరుగుతున్నాయని సంతోషించాడు.
మథుర్బాబు అంతా చూసి, ఆలయోద్యోగులకు ఏమీ చెప్పకుండానే ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటిరోజు ఆలయ ప్రధానోద్యోగికి, “భట్టాచార్య మహాశయుల పూజకు ఎవరూ ఎలాంటి అడ్డూ చెప్పవద్దు. ఆయన ఇచ్ఛ మేరకు ఆయనను పూజ చేసుకోనివ్వండి. ఎవరైనా ఆయనకు ఆటంకం కలిగిస్తే ఊరుకునేది లేదు” అంటూ ఆదేశం పంపించాడు.
8. శ్రీరామకృష్ణులు రాగాత్మికభక్తిని సంతరించు కోవడం
పై సంఘటనలు విన్న శాస్త్రపారంగతుడైన పాఠకుడు ఒక్క విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంటాడు. అది – శ్రీరామకృష్ణులలో కలిగిన అద్భుత పరిణామం. ఆయన మనస్సు అప్పుడు శాస్త్రవిహిత విధులనన్నింటినీ అతిక్రమించి, అహేతుక ప్రేమభక్తి అనే ఉన్నతమార్గంలో ప్రచండవేగంతో పరుగులు పెట్టసాగింది. ఈ పరిణామం ఎంత సులభంగా, ఎంత సహజంగా జరిగిందంటే, ఇతరుల మాట విషయం అటుంచి, స్వయంగా శ్రీరామకృష్ణులే దీన్ని అర్థం చేసుకోలేకపోయారు. వారికి అర్థమయ్యిందేమంటే జగన్మాత పట్ల తనకున్న అపరిమితభక్తి ప్రేరణవల్ల తానావిధంగా ప్రవర్తించకుండా ఉండలేకపోతున్నానని, ఎవరో బలవంతంగా తనతో అలా చేయిస్తున్నారని మాత్రమే! కాబట్టే నాకిలా ఎందుకవుతోంది? నేను సరైన మార్గంలోనే ఉన్నాను కదా! అన్న సందేహం అప్పుడప్పుడు ఆయన మనస్సులో కలుగుతూ ఉండేది. అందుకే ఆయనెంతో వ్యాకులతతో, “అమ్మా! నా కిలాంటి అవస్థ ఎందుకు కలిగిందో నాకేం అర్థం కావడం లేదు. నేనేం చేయాలో, అది నువ్వే నాతో చేయించు. నేనేం నేర్చుకోవాలో అది నువ్వే నాకు నేర్పించు. నీ దర్శనం నా కివ్వు. నిరంతరం నా చేతిని వదిలిపెట్టకుండా పుచ్చుకుని ఉండు” అంటూ ప్రార్థించేవారు.
కామకాంచనాలు – పేరు ప్రతిష్ఠలు – ఇహపర సర్వభోగభాగ్యాలు – వీటన్నింటి నుండి మనస్సును ఉపసంహరించి, ఆయన జగన్మాతను ప్రార్థించేవారు. జగజ్జనని కూడ తన ప్రియాతిప్రియమైన కుమారుని చేతిని పుచ్చుకుని, ఆయనను అన్ని విధాలా సంరక్షిస్తూ, ఆయన ప్రార్థనను అనుగ్రహించింది. ఆయన ఆధ్యాత్మిక జీవితం పరిపూర్ణం కావడానికి ఏ సమయంలో ఏం కావాలో, ఏ వ్యక్తులు అవసరమో, ఆ సమయంలో ఆయా వస్తువులను, వ్యక్తులను అయాచితంగా వారికి చేకూర్చేది. అలా వారిని సులభంగా, సహజంగా శుద్ధజ్ఞానభక్తి చరమసీమను అధిరోహింపచేసింది. భగవద్గీతలో భగవంతుడు భక్తుడికై ఇలా ప్రతిజ్ఞ చేశాడు.
“అనన్యా శ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే ।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ॥ (9–22)
“ఇతర చింతనలనన్నింటినీ వదిలిపెట్టి, నిశ్చల సమాహిత చిత్తంతో నన్ను మాత్రమే పరమభక్తి శ్రద్ధలతో భజిస్తూ, నన్నే సంపూర్ణంగా శరణు పొందిన భక్తులకు ఇహపర లోకాల్లో వారికేం కావాలో అవన్నీ నేనే సమకూర్చిపెడతాను.”
ఈ కాలఘట్టపు శ్రీరామకృష్ణుల జీవితాన్ని చక్కగా అధ్యయనం చేస్తే భగవంతుని ఆ ప్రతిజ్ఞ ఆయన జీవితంలో అక్షర సత్యం కావడం చూస్తాం. అది మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తుంది. కామకాంచనాలు మాత్రమే ఏకైకలక్ష్యంగా ఉండి, స్వార్థపరత్వంతో నిండివున్న ఈ వర్తమానయుగంలో భగవంతుని ఆ ప్రతిజ్ఞ ‘సత్యం’ అని మళ్ళీ స్పష్టపరచవలసిన అవసరం ఏర్పడింది. ఆధ్యాత్మిక పురుషులు ప్రతి యుగంలో కూడ, ‘సబ్చోడే, సబ్పాబే’ – భగవంతునికోసం అన్నింటినీ వదిలిపెట్టినా, అవసర వస్తువుల లోటు వారికెప్పుడూ ఏర్పడదనే విషయాన్ని మనుషులకు పదే పదే ఉపదేశిస్తున్నారు. అయినా దుర్బలుడు, విషయలోలుడు అయిన మనిషి ప్రస్తుత యుగంలో దాన్ని మళ్ళీ ప్రత్యక్షంగా, పూర్ణంగా చూసేదాకా నమ్మలేకపోతున్నాడు. కాబట్టే ఈ శాస్త్రవచనాల సత్యాన్ని మనిషికి ఋజువు చేయడం కోసమే అనన్యచిత్తంతో, మనోవాక్కాయాలతో తనను సంపూర్ణంగా శరణు పొందిన శ్రీరామకృష్ణులను నిమిత్తం చేసుకుని జగన్మాత అద్భుతమైన ఈ లీలానాటకాన్ని ఆడింది. ఓ మానవా! పవిత్రహృదయంతో ఈ విషయాన్ని ఆలకించి, నీకు సాధ్యమైనంతవరకూ త్యాగపథంలో ముందుకు సాగిపో.
9. అవతారపురుషులు: రాగాత్మికభక్తి
ఆధ్యాత్మిక భావాల మహాప్రవాహం అకస్మాత్తుగా మనుషుల జీవితాల్లో తటస్థించి నప్పుడు వాటిని తట్టుకోవడానికి వెయ్యి ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు. సామాన్య మానవుల జడదేహం, వాటి ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక, తక్షణం ముక్కచెక్కలవుతుంది. ఎంతమందో సాధకులు ఇలా మృత్యు ముఖంలో పడిపోతారు. పూర్ణజ్ఞాన, పూర్ణభక్తి ప్రచండ ధాటిని తట్టుకోవడానికి తగిన శరీరం ఎంతో అవసరం. ఇంతవరకూ కేవలం అవతారపురుషులనే మహాత్ములు మాత్రమే తమ జీవితాల్లో ఆధ్యాత్మిక భావతరంగాల పూర్ణవేగాన్ని సర్వదా అరికట్టుకుని, ప్రపంచంలో జీవిస్తుండడం చూస్తాం. కాబట్టే భక్తిశాస్త్రాలు, ఈ అవతారపురుషులను శుద్ధసత్వసంపన్నులని పదేపదే అభివర్ణిస్తూ ఉంటాయి.* శుద్ధసత్వగుణంతో మాత్రమే నిర్మితమైన శరీరాలను ధరించి, వారు ఈ జగత్తులో అవతరిస్తుంటారు. కాబట్టే ఉవ్వెత్తున లేచే ఆ ఆధ్యాత్మిక భావాలను తట్టుకోవడంలో వారు సమర్థులౌతారు. అలాంటి శరీరం కలిగిన తర్వాత కూడా చాలాసార్లు వారీ భావవేగాలను తట్టుకోలేకుండా ఉండడం చూస్తుంటాం. విశేషంగా భక్తిమార్గంలోవున్న అవతారపురుషుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. భావభక్తి ప్రాబల్యం వల్ల ఏసుక్రీస్తు, శ్రీచైతన్యదేవుల శరీరంలోని కీళ్ళు సడలిపోయి ప్రతి రోమకూపం నుండి రక్తం చుక్కలు చుక్కలుగా స్రవించడం – మొదలైన సంఘటనల గూర్చిన శాస్త్రవర్ణనల నుండి ఈ విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఇలాంటి శారీరక మార్పులు ఎంతో బాధతో కూడినవన్న విషయంలో సందేహంలేదు. అయినా వీటి సహాయంతోనే వారి శరీరాలు భక్తిజనిత అసాధారణ మానసిక వేగాన్ని తట్టుకోవడంలో సమర్థవంతమౌతాయి. తర్వాత క్రమక్రమంగా ఆ భావ వేగాన్ని తట్టుకోవడానికి అలవాటుపడిన శరీరాల్లో అలాంటి పరిణామాలు పూర్వంలా అంతగా కనిపించక, తగ్గిపోతాయి.
10. పాపపురుషుని అనుభూతి
ఆ రాగాత్మిక భక్తి ప్రభావం మూలంగా శ్రీరామకృష్ణుల శరీరంలో ఇప్పటి నుండి రకరకాల విచిత్ర పరిణామాలు కలగసాగాయి. సాధన మొదలైనప్పటి నుండి కారం నూరి పోసినట్లు శరీరమంతటా భరించలేని మంట కలిగిందని ఇంతకు పూర్వం చెప్పుకున్నాం. ఈ మంట ఎక్కువ కావడం మూలంగా ఆయన ఎంతో బాధపడవలసి వచ్చింది. దీనికి గల కారణాన్ని గురుదేవులే స్వయంగా మాకు చాలాసార్లు చెప్పారు: “పూజాసంధ్యాదులను చేస్తున్నకాలంలో శాస్త్రవచనం రీత్యా లోపల ఉన్న పాపపురుషుడు దగ్ధమయ్యాడని భావించేవాడిని. శరీరంలో నిజంగానే పాపపురుషుడున్నాడని, నిజంగానే అతణ్ణి దగ్ధంచేసి నాశనం చేయవచ్చని ఎవరికి తెలుసు? సాధనను మొదలుపెట్టినప్పటి నుండే శరీరంలో మంట ప్రారంభమైంది. మళ్ళీ ఇదేమి జబ్బో అనుకున్నాను. క్రమంగా అది ఎక్కువై భరించరానిది అయ్యింది. వైద్యుల సలహా మేరకు రకరకాల తైలాలను మర్దన చేయించుకున్నాను. అయినా మంట ఏమాత్రమూ తగ్గలేదు. ఒకరోజు పంచవటి క్రింద కూర్చున్నాను. అప్పుడొక వింత చూశాను. బొగ్గులా, కారునలుపు శరీరంతో, చింత నిప్పుల్లా మెరిసే ఎర్రని కళ్ళతో, భయంకర ఆకారుడైన పురుషుడొకడు త్రాగినవాడిలా తూలుతూ దీనిలో (తన శరీరాన్ని చూపిస్తూ) నుండి బయటికి వచ్చాడు. ఆ మరుక్షణమే కాషాయవస్త్రాలు ధరించి త్రిశూలం చేతపట్టుకొన్న సౌమ్య పురుషుడొకడు దీనిలో నుండే బయటికి వచ్చి, ఆ నల్లని ఆకారంగల వాణ్ణి ఎదుర్కొని చంపేశాడు. ఆ క్షణం నుండి మంట తగ్గిపోయింది. దీనికి ముందు ఆరు నెలల దాకా ఆ మంటతో ఎంతో కష్టం అనుభవించాను.”
పాపపురుషుడు ఆ విధంగా దగ్ధమయ్యాక శరీరంలోని మంట తొలగిపోయినా, మరికొంత కాలానికి మళ్ళీ ఆ మంట ప్రారంభమైందని గురుదేవులు చెప్పారు. ఈ సమయంలో వారు వైధీభక్తి పరిమితులను అధిగమించి రాగాత్మిక భక్తిమార్గంలో పయనిస్తూ జగన్మాత పూజాదుల్లో నిమగ్నులై ఉండేవారు. ఆ మంట అలా ఎంత ఉద్ధృతమైనదంటే తడితువ్వాలును తలపై పెట్టుకుని మూడు, నాలుగు గంటలదాకా గంగానదిలో కూర్చుని ఉన్నా ఏమాత్రమూ ఉపశమనం కలిగేది కాదు. తదనంతర కాలంలో భైరవీ బ్రాహ్మణి* వచ్చి, భగవంతుని పరిపూర్ణ దర్శనం కోసం ఆయనలో కలిగిన వ్యాకులత, విరహవేదనల నుండే ఆ మంట కలిగిందని గుర్తించి, ఎంతో సహజోపాయాలతో దానిని ఎలా దూరం చేసిందో, ఆ విషయాన్ని మేము మరోచోట వివరించాం.* దాని తర్వాత గురుదేవులు మధురభావ సాధన చేస్తున్నప్పుడు మళ్ళీ అదే మంటతో బాధపడ్డారు. హృదయ్ ఇలా చెప్పేవాడు: “శరీరం లోపల, మండే కుంపటి ఉంచితే ఎలాంటి మంట, బాధ కలుగుతాయో, శ్రీరామకృష్ణులు ఆ కాలంలో అంతటి బాధను అనుభవించారు. ఆ తర్వాత కూడ ఆ మంట అప్పుడప్పుడు కలుగుతూ చాలాకాలం వరకూ ఆయనను బాధించింది. తర్వాత సాధనలన్నీ ముగిసిన కొన్ని సంవత్సరాల తర్వాత బారాసాత్ గ్రామనివాసి అయిన వకీలు కనాయ్లాల్ ఘోషాల్ గారితో ఆయనకు పరిచయం ఏర్పడింది. వీరు గొప్ప శాక్తేయ సాధకులు. శ్రీరామకృష్ణులు అలా మంటతో బాధపడుతున్నారన్న విషయం వీరు విని, తమ ఇష్టదేవతా కవచాన్ని శరీరం మీద ధరించమని సలహా ఇచ్చారు. వారి సలహాననుసరించి కవచాన్ని ధరించినప్పటి నుండి, మరెప్పుడూ ఆ మంట బాధించలేదు.”
11. రాణీ రాస్మణిని శిక్షించడం
మథుర్బాబు, జాన్బజార్లోని తన ఇంటికి వెళ్ళి శ్రీరామకృష్ణుల పూజా పద్ధతిని (తన అత్తగారైన) రాణీ రాస్మణికి వివరంగా తెలిపాడు. అది విని భక్తురాలైన ఆమె ఎంతో ఆనందించింది. భట్టాచార్యుల మధుర స్వరయుక్త భజనలు విని ఆమె ఇదివరకే ఆయన పట్ల అభిమానం పెంపొందించుకొంది. శ్రీ గోవిందుని విగ్రహం విరిగినప్పుడు ఆయన భావపారవశ్యాన్ని, ఆయన వివేకాన్ని గ్రహించి ఆశ్చర్యపోయింది.* కాబట్టే శ్రీరామకృష్ణుల వంటి పవిత్రహృదయులకు జగన్మాత కృప లభించడం సంభవమే అని నిశ్చయించుకొంది. కాని ఈలోపు ఒక వింత సంఘటన జరిగింది. రాణి, మథుర్బాబుల ఆ విశ్వాసం సడలిపోయే ఘటన అది.
ఒక రోజు జగన్మాతను పూజించడం కోసం రాణి కాళికాలయానికి వెళ్ళింది. ఆమె ఆలయంలో జగన్మాతను దర్శించుకొని శ్రీరామకృష్ణులను ఒక దేవీకీర్తన పాడి వినిపించమని కోరింది. శ్రీరామకృష్ణులు అలాగే జగన్మాతపై భక్తిగీతాన్ని పరవశులై ఆలపిస్తున్నారు. రాణి మాత్రం ఆ గీతాభావంలో మనస్సును నిలపక, తన ఆస్తి విషయమైన దావా గురించి ఆలోచించసాగింది. ఆమె మనస్సులోని ఆలోచనలు శ్రీరామకృష్ణులు గ్రహించారు. జగన్మాత సమక్షంలో జగన్మాతపై మనస్సును లగ్నం చెయ్యక ఇతర విషయాలపై మనస్సును పోనివ్వడం చూసి, ‘ఛీ, ఇక్కడా ఆ పాడు ఆలోచనలేనా?’ అంటూ ఆయన భావావేశంలో రాణి చెంపపైన కొట్టారు. అది ఆమెకు సరైన శిక్షణ ఇవ్వడానికే సుమా! జగన్మాత కృపాపాత్రురాలు, సాధకురాలు కాబట్టి రాణి తన తుచ్ఛమనోదౌర్బల్యాన్ని తెలుసుకుని ఎంతో పశ్చాత్తాపం చెందింది. పైగా ఈ సంఘటనతో శ్రీరామకృష్ణుల పట్ల ఆమెకు మరింత భక్తిశ్రద్ధలు పెరిగాయి. ఈ విషయాలను మేము మరోచోట విపులంగా తెలిపాం.*
12. భక్తిపరిపక్వత – శ్రీరామకృష్ణుల బాహ్యపూజ సహజంగా ఆగిపోవడం
ఇది జరిగిన కొంతకాలం తర్వాత శ్రీరామకృష్ణుల భక్త్యానందాలు ఎంత అధిక మయ్యాయంటే, జగన్మాత నిత్యనైమిత్తిక పూజా, సేవాది కార్యకలాపాలను ఆయన కొన సాగించలేని స్థితి వచ్చింది. ఆధ్యాత్మిక మార్గంలో పురోభివృద్ధి చెందేకొద్దీ శాస్త్రాలు విధించే కర్మలన్నీ వాటంతట అవే సహజంగా తొలగిపోతాయి. గురుదేవులు ఈ విషయాన్ని చక్కని ఉదాహరణతో వివరించేవారు. “కోడలు గర్భం ధరించనంతకాలం ఏ పనులుచేసినా, ఏ విధమైన ఆహారం తిన్నా అత్త అడ్డుకోదు. కోడలికి నెలతప్పిందని తెలిసినప్పటి నుండి అత్త, ఆమె విషయంలో జాగ్రత్త వహిస్తుంది. నెలలు నిండేకొద్దీ, కోడలికి పని తగ్గిస్తుంది. ఇక ప్రసవకాలం దగ్గర పడగానే, కడుపులో బిడ్డకు అనర్థం వాటిల్లుతుందేమో అన్న ఉద్దేశంతో అత్త, కోడలికి ఏ పనీ చెప్పదు. బిడ్డ పుట్టిన తర్వాత, కోడలికి ఆ బిడ్డ ఆలనాపాలనా చూడడం ఒక్కటే పని.”
శ్రీరామకృష్ణుల బాహ్యపూజ, జగజ్జనని సేవాది కార్యకలాపాలన్నింటి విషయంలో కూడ ఇలాగే జరిగింది. అవన్నీ ఎంతో సహజంగా వైదొలగిపోయాయి. సదా భావ పారవశ్యంలో ఉండే శ్రీరామకృష్ణులు ఇప్పుడు తల్లిని తన ఇచ్ఛ మేరకు (హృదయపూర్వకంగా) సేవించడం మొదలుపెట్టారు. పూజ చేయడానికి ముందే నైవేద్యం అర్పించేవారు. ధ్యానమగ్నులై తానూ, తల్లీ ఒక్కరే అనే జ్ఞానంతో దేవీ అర్చన కోసం ఉన్న గంధపుష్పాదులతో తన దేహాన్నే అలంకరించుకునేవారు. బాహ్యాంతరాలలో నిరంతరం ఆయన జగన్మాతనే దర్శించడంవల్ల గురుదేవుల చేష్టలన్నీ ఇలా కొనసాగేవన్న విషయాన్ని గురుదేవుల ముఖతా మేం ఎన్నోసార్లు విన్నాం. అంతేకాదు, ఆయన తన్మయత్వం ఏ కొంచెం తగ్గినా, తల్లి దర్శనంతో ఏమాత్రం ఎడబాటు కలిగినా, ఆయన హృదయం దుర్భర వేదనతో నిండిపోయేది. ఆయన నేలపై పడి పసిపిల్లవాడిలా దొర్లుతూ, ముఖాన్ని నేలకేసి రాస్తూ, తీవ్రంగా విలపించేవారు. ఊపిరి ఆగిపోయినంత పని అయ్యేది. శరీరమంతా గాయాలతో రక్తసిక్తమైపోయేది. ఇదంతా వారికేమీ తెలిసేది కాదు. తాము నీళ్ళలో పడుతున్నారో, నిప్పులో పడుతున్నారో కూడ ఆయనకు స్పృహ ఉండేది కాదు. కాని జగన్మాత దర్శనం పొందడంతో ఆయన పరితాపం తగ్గిపోయేది. ఆయన ముఖం దేదీప్యమానంగా ప్రకాశించేది. ఆయనలో ఆనందం పెల్లుబికేది. ఆయన మరో వ్యక్తిగా కనిపించేవారు.
13. ‘పూజాకార్యాలు ఆగిపోవడం’ గూర్చి హృదయ్ కథనం; ఆ అవస్థను చూసి మథుర్ సంశయం
శ్రీరామకృష్ణులు పూజ చేయలేని స్థితికి వచ్చేదాకా, ఆయనతోనే పూజాదులను మథుర్ ఎలాగో చేయిస్తూ వచ్చాడు. కాని ఆ స్థితి రాగానే, పూజ కోసం వేరే ఏర్పాట్లు చేయడానికి నిశ్చయించుకొన్నాడు. “మథుర్బాబు అలా నిశ్చయించు కోవడానికి మరో కారణం కూడ ఉంది. శ్రీరామకృష్ణులు ఒకరోజు భావావేశంలో హఠాత్తుగా పూజాపీఠం నుండి లేచి గుడిలో నన్నూ, మథురబాబును చూశారు. చూసి వెంటనే నా చేయి పుచ్చుకుని, నన్ను పూజాపీఠంపై కూర్చోబెట్టారు. మథుర్బాబుతో, ‘ఇక నుండి హృదయ్ పూజ చేస్తాడు. నా పూజను అంగీకరించినట్లే, అమ్మ హృదయ్ పూజను కూడ అంగీకరిస్తుంది. ఈ విధంగా అమ్మే చెబుతున్నది’ అన్నారు. మథుర్బాబు ఆయన పలుకులను దేవీ ఆదేశంగానే భావించాడు” అని హృదయ్ చెప్పాడు. కాని హృదయ్ కథనం ఎంతవరకు నిజమో చెప్పలేం. కాని ఆ స్థితిలో నిజంగానే శ్రీరామకృష్ణులు పూజాదులు చేసే స్థితిలో లేరని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఆ విషయాన్ని మథుర్బాబు కూడ చక్కగా అర్థం చేసుకున్నాడు.
14. శ్రీరామకృష్ణులకు ఆయుర్వేద వైద్యుడు గంగాప్రసాద్ సేన్ చికిత్స
మొదటిసారి చూడగానే మథుర్, శ్రీరామకృష్ణుల పట్ల ఆకర్షితుడైనాడని చెప్పుకున్నాం. అప్పటి నుండి వారిని దక్షిణేశ్వరంలోనే ఉండిపోయేలా చేయడానికి అతడు సర్వవిధాలా ప్రయత్నించసాగాడు. అన్ని అడ్డంకులనూ తొలగించసాగాడు. తర్వాత ఆయనలోని ఉదాత్త గుణాలు చూసి అతడు మరింత చేరువయ్యాడు. ఆయనను సేవించసాగాడు. ఇతరులు ఆయనకు ఎలాంటి హానీ చేయకుండా రక్షించసాగాడు. శ్రీరామకృష్ణులకు వాతప్రకోపం అన్న విషయం తెలిశాక దాని ఉపశమనం కోసం ఆయనకు ప్రతిరోజూ పటికబెల్లం పానకాన్ని ఏర్పాటు చేశాడు. రాగాత్మికభక్తి కారణంగా ఆయన పూజ విచిత్రంగా కొనసాగుతుంటే, ఇతరులు అపార్థం చేసుకుని ఆయనకు ఇబ్బంది కలిగించకుండా అతడు కాపాడాడు. ఇలాంటి మరికొన్ని సంఘటనలను మేము మరోచోట చెప్పాం.*
ఇంతగా ఆకర్షితుడైనప్పటికీ రాణీ రాస్మణిని, శ్రీరామకృష్ణులు కొట్టిన విషయం తెలిసిన తర్వాత, మథుర్కు కాస్త సందేహం ఏర్పడింది. శ్రీరామకృష్ణులు ఎంతటి ఉత్తమ సాధకులైనా, ఆయనలో కూడ వేపకాయంత పిచ్చి ఉందేమో అనుకున్నాడు. ఎంతైనా మథుర్ ప్రాపంచిక జీవియే కదా! శ్రీరామకృష్ణులను పరిపూర్ణంగా ఎలా అర్థం చేసుకోగలడు? అందుచేత శ్రీరామకృష్ణుల పిచ్చిని నయం చేయాలని, అతడు కలకత్తాలోని సుప్రసిద్ధ వైద్యుడైన గంగాప్రసాద్ సేన్‌తో వారికి చికిత్స చేయించే ఏర్పాటు చేశాడు. అంతమాత్రంతో అతడు తృప్తిచెందలేదు. శ్రీరామకృష్ణులకు తర్కయుక్తంగా సాధన విషయమై సలహా కూడ ఇవ్వ బోయాడు. దైవసంకల్పం ముందు మనిషి తర్కం ఎందుకూ పనికిరాదని, దైవం తలచుకొంటే అసంభవం కూడ సంభవమౌతుందని శ్రీరామకృష్ణులు నచ్చచెప్పారు. కాని అతడు వినలేదు. అప్పుడు శ్రీరామకృష్ణులు తోటలో ఒక మొక్కకు పూచిన పూలకొమ్మను తెచ్చి చూపారు. ఆ మొక్క తెల్లని పువ్వులనే పూస్తుంది. కాని శ్రీరామకృష్ణులు తెచ్చిన కొమ్మకు ఒకటి తెల్లని పువ్వు, మరొకటి ఎర్రని పువ్వు ఉంది. అది చూసి మథుర్కు దైవసంకల్పం అమోఘం అన్న విషయాన్ని అంగీకరించక తప్పిందికాదు. ఈ విషయాన్ని మరోచోట విశదం చేశాం.*
శ్రీరామకృష్ణులు ఇక నిత్యపూజ చేయలేరని తెలిసిన పిదప, మథుర్ ఆ పూజ కోసం వేరే ఏర్పాట్లు చేశాడని చెప్పుకున్నాం కదా! పూజానిర్వహణ రామ్‌తారక్ ఛటోపాధ్యాయ అనే అతడికి అప్పగించాడు. రామ్‌తారక్, శ్రీరామకృష్ణుల పినతండ్రి కుమారుడు. ఉద్యోగం కోసం దక్షిణేశ్వరానికి వచ్చిన అతణ్ణి, మథుర్ కాళీపూజకు నియోగించాడు. ఈ సంఘటనలు 1858 వ సంవత్సరంలో జరిగాయి.
15. దక్షిణేశ్వరానికి హలధారి రాక
రామ్తారక్ను శ్రీరామకృష్ణులు ‘హలధారి’ అని పిలిచేవారు. హలధారి శ్రీరామకృష్ణులకు వరుసకు అన్న అవుతాడు. గురుదేవులు అతణ్ణి గురించి మాకు అనేక విషయాలు చెప్పేవారు. హలధారి మంచిపండితుడు, నిష్ఠగల సాధకుడు. అతడు శ్రీమద్భాగవతం, అధ్యాత్మ రామాయణం మొదలైన గ్రంథాలను నిత్యం పఠిస్తూ ఉండేవాడు. అతడికి విష్ణువంటే అమిత భక్తిప్రేమలు. దేవి అన్నా ఇష్టమే! కాని విష్ణువుపైన ఉన్నంత భక్తిలేదు. అలా అని వ్యతిరేకభావం కూడ లేదు. అందుకే మథుర్ కోరితే, జగన్మాతకు అర్చకుడిగా ఉండడానికి సమ్మతించాడు. అతడు స్వయంగా వండు కొనేవాడు. అది చూసి మథుర్ “మీ తమ్ముడైన శ్రీరామకృష్ణులు, హృదయ్ ఆలయ ప్రసాదాన్నే తీసుకుంటున్నారు కదా! మరి మీ కెందుకీ అభ్యంతరం” అని అడిగాడు. అందుకు హలధారి, “మా తమ్ముడు ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించాడు. ఆలయ ప్రసాదం స్వీకరించడం వల్ల అతడికి ఏ దోషమూ అంటదు. కాని నా స్థితి అలా కాదు గదా! నే నింకా అంత ఉన్నత స్థాయికి ఎదగలేదు. కాబట్టి నాకు దోషం ఏర్పడుతుంది” అని జవాబు చెప్పాడు. మథుర్కు ఆ జవాబు బాగా నచ్చింది. హలధారికి స్వయంపాకం చేసుకోవడానికి ఏర్పాటు చేశాడు. హలధారి పంచవటి కింద వంట చేసుకుని భుజించేవాడు.
‘శక్తి’ పూజకు హలధారికి ఎలాంటి అభ్యంతరమూ ఉండేది కాదు. కాని జంతుబలి అంటే అతడికి గిట్టేది కాదు. జగన్మాతకు పర్వదినాల్లో జంతుబలి ఇచ్చే ఆచారం చాలాకాలం నుండి వస్తోంది. హలధారి ఆ దినాల్లో మాత్రం జగన్మాతను శ్రద్ధగా పూజించలేకపోయేవాడు. ఒకమారు అతడు అలా ఒక నెలరోజులు అన్యమనస్కుడిగా పూజించాడట. అప్పుడు ఒకసారి సంధ్యావందనం చేస్తున్నప్పుడు, దేవి భయంకర ఆకారంతో కనిపించి, “నువ్విక నా పూజ చేయనవసరం లేదు. నన్నిలా అశ్రద్ధతో పూజిస్తే, నీ వంశాన్ని సర్వనాశనం చేస్తాను” అని హెచ్చరించిందట. అదంతా తన భ్రమగా భావించి అతడు ఆ హెచ్చరికను లక్ష్యపెట్టక పూజ చేయడం కొనసాగించాడట. దాని ఫలితంగా, అతి స్వల్పకాలంలో అతడి చిన్నకొడుకు నిజంగానే చనిపోయాడు. అది చూసి, హలధారి వెంటనే శ్రీరామకృష్ణులకు జరిగినదంతా వివరించి జగన్మాత పూజను మానుకున్నాడు. ఆ తర్వాత అతడు శ్రీరాధాగోవిందుని ఆలయంలో పూజ చేయసాగాడు. హృదయ్, కాళీకాదేవిని అర్చించసాగాడు. ఇదంతా మేము హృదయ్ తమ్ముడు రాజారామ్ చెప్పగా విన్నాం.