1. మొదటిసారి చూసినప్పటి నుండి శ్రీరామకృష్ణుల పట్ల మథుర్బాబు ఆకర్షణ
దేవాలయ ప్రతిష్ఠాపన జరిగిన కొన్ని వారాలలోపే శ్రీరామకృష్ణుల సౌమ్యమూర్తిత్వం, కోమల స్వభావం, ధర్మనిష్ఠ, చిన్నవయస్సు రాణీ రాస్మణి అల్లుడైన మథుర్బాబును అమితంగా ఆకర్షించాయి. జీవితంలో దీర్ఘకాలం ఎవరితో గాఢసంబంధం కలుగబోతోందో అటువంటి వ్యక్తిని మొదటిసారి చూసీ చూడగానే మానవ హృదయంలో ఒక ప్రేమాకర్షణ కలగడం మనకు కని పిస్తుంది. పూర్వజన్మలలో కలిగిన సంబంధ సంస్కారాల నుండి అది కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీరామకృష్ణులను చూసినప్పుడు మథుర్బాబు మనస్సులో కూడ బలీయమైన ఒక అలౌకికాకర్షణ కలిగిందనే సంగతి తదనంతర కాలంలో వారిద్దరి మధ్య ఒక సుదృఢ ప్రేమసంబంధం ఏర్పడడం చూసి మనం నిశ్చయంగా గ్రహించగలం.
ఆలయ ప్రతిష్ఠాపన అనంతరం తమ కర్తవ్యమేమీ నిశ్చయించుకోలేక అన్న సలహా ప్రకారం ఒక నెలరోజులు శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలోనే ఉండి పోయారు. మథుర్బాబు ఈలోపు దేవిని బంగారు ఆభరణాలతో అలంకరించే పనిలో ఆయనను నియుక్తం చేయాలని సంకల్పించి రాంకుమార్‌కు ఆ విషయం తెలిపాడు. అతడప్పుడు తన తమ్ముడి మానసికావస్థను గురించి మథుర్బాబుకు వివరించి, అతణ్ణి ఆ విషయంలో నిరుత్సాహపరిచాడు. కాని తన పట్టుదలను అంత తేలికగా విడిచిపెట్టే వ్యక్తి కాదు మథుర్. అతడావిధంగా తాత్కాలికంగా నిరాకరింపబడినా తన సంకల్పాన్ని కార్యరూపంలో నెరవేర్చడానికి తగిన అదను కోసం ఎదురుచూడసాగాడు.
2. శ్రీరామకృష్ణుల మేనల్లుడైన హృదయ్
*శ్రీరామకృష్ణుల జీవితంతో గాఢసంబంధం కలిగిన మరో వ్యక్తి ఇప్పుడు దక్షిణేశ్వరానికి వచ్చాడు. అతడే శ్రీమతి హేమాంగిని (ఈమె శ్రీరామకృష్ణుల మేనత్త అయిన శ్రీమతి రామ్శీల కుమార్తె) కుమారుడైన హృదయ్రాం ముఖోపాధ్యాయ్! పైన వర్ణించిన సంఘటనకు కొన్ని నెలల క్రితం ఇతడు పనికోసం వెదకుతూ బర్ద్వాన్ పట్టణానికి వచ్చాడు. అతడి వయస్సు అప్పుడు పదహారేళ్ళు! ఈ యువకుడు అక్కడ పరిచితులైన తన గ్రామస్థుల వద్ద ఉంటూ ఏదైనా పని దొరుకుతుందేమోనని ప్రయత్నం చేశాడు. కాని సఫలుడు కాలేదు. రాణీ రాస్మణి కొత్తగా నిర్మించిన దేవాలయంలో తన మేనమామలు గౌరవప్రదంగా ఉంటున్నారని అతడికి తెలిసింది. కనుక అక్కడికి వెళితే తన కోరిక నెరవేరగలదని భావించాడు. ఇక ఆలస్యం చేయక వెంటనే హృదయ్ దక్షిణేశ్వరానికి వచ్చి, చిన్ననాటి నుండి సుపరిచితుడు, సమవయస్కుడు, తనకు మేనమామ అయిన శ్రీరామకృష్ణులతో ఆనందంగా కాలం గడపసాగాడు!
హృదయ్ స్ఫురద్రూపి, సుందరుడు, బలిష్ఠుడు. దేహం ఎలా సుదృఢంగా ఉందో అలాగే అతడి మనస్సు కూడ చురుకైనది, భయరహితమైనది. అతడు కఠోరమైన పరిశ్రమ చేయగలడు. పరిస్థితుల కనుగుణంగా తన ప్రవర్తనను సులభంగా మార్చుకోగలడు. సమస్యలు ఎదురైనప్పుడు అతడు ఏ ఆందోళనా చెందక స్థిరంగా నిలబడడమేగాక వాటిని అతిక్రమించడానికి అద్భుతమైన ఉపాయాలు పన్నడంలో బహునేర్పరి. తన చిన్నమామను (శ్రీరామకృష్ణులను) అతడు హృదయపూర్వకంగా ప్రేమించాడు. ఆయనను సుఖపెట్టడానికి శారీరక యాతనల నెన్నిటినైనా అనుభవించడానికి వెనుకాడేవాడు కాదు. సర్వదా క్రియాశీలుడైన హృదయ్‌లో ధ్యానం చేసే భావం అణుమాత్రమైనా లేదని చెప్పవచ్చు. కనుక ప్రాపంచికులలా అతడి మనస్సు కూడ స్వార్థప్రయత్నం నుంచి ఎప్పటికీ విడివడలేక పోయేది. ఇప్పటి నుండి శ్రీరామకృష్ణులతో అతడికి ఏర్పడిన సంబంధాన్ని గురించి మనం ఎంత ఆలోచిస్తామో మనకంత స్పష్టమయ్యే సంగతి – తదనంతర కాలంలో అతడి జీవితంలో కనిపించే కొద్దిపాటధ్యానశీలత, స్వార్థరాహిత్యం – ఇవి అతనిలో కలగడం భావమయులైన శ్రీరామకృష్ణులతోడి నిత్యసాంగత్యం, అప్పుడప్పుడు అతడు వారి చేష్టలను అనుకరించడానికి చేసిన ప్రయత్నాల ఫలితమే అని. ఆహారవిహారాది అన్నివిధాలైన శారీరక వ్యవహారాల్లో పూర్తి ఉదాసీనత, సర్వదా చింతనాశీలత్వం, లేశమైనా స్వార్థపరత్వం లేనటువంటి శ్రీరామకృష్ణుల సాధనా జీవితం కొనసాగుతున్న సమయంలో శ్రద్ధావంతుడు, ధైర్యశాలి, ఉద్యమశీలుడు, కార్యదక్షుడు అయిన హృదయ్ వంటి ఎవరో ఒక వ్యక్తి సహాయం అత్యంత ఆవశ్యకం. జగన్మాత శ్రీరామకృష్ణుల సాధన కాలంలో హృదయ్ వంటి వ్యక్తిని వారితో అత్యంత సన్నిహిత సంబంధంతో అనుబంధం చేయడం ఈ కారణం వల్లనేమో? హృదయే లేకపోతే సాధన కాలంలో తమ శరీరం రక్షింపబడడం అసంభవమనే సంగతిని శ్రీరామకృష్ణులు మాకెన్నోసార్లు చెప్పారు. కనుకనే శ్రీరామకృష్ణుల జీవితంతోపాటు హృదయ్ పేరు కూడ చిరస్థాయిగా నిలిచిపోయింది. కాబట్టే మా హృదయపూర్వక శ్రద్ధాంజలికి అతడు అర్హుడు.
3. శ్రీరామకృష్ణుల సహచరునిగా మారిన హృదయ్
హృదయ్ దక్షిణేశ్వరానికి వచ్చిన నాటికి శ్రీరామకృష్ణుల వయస్సు ఇరవై సంవత్సరాలపైన కొన్ని నెలలు. హృదయ్‌ను తన సహచరునిగా పొందడంతో ఆయన దక్షిణేశ్వర జీవితం చాలా సులభమై ఉంటుందని మనం ఊహించవచ్చు. ఇప్పటి నుండి ఇక తినడం, తిరగడం, పడుకోవడం, కూర్చోవడం మొదలైన పనులన్నీ ఆయన, హృదయ్ సహాయంతో చేయసాగారు. సదా బాలుని స్వభావంగల శ్రీరామకృష్ణుల చర్యలన్నీ సాధారణ లోకుల దృష్టిలో అర్థరహితంగా కనిపించేవి. కాని హృదయ్ మాత్రం వాటిని విమర్శించక పోవడమేకాక హృదయపూర్వకంగా వాటిని ఆమోదించేవాడు. ఆయన పట్ల సానుభూతి చూపేవాడు. తద్ద్వారా అతడు శ్రీరామకృష్ణులకు అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు.
4. శ్రీరామకృష్ణుల పట్ల హృదయ్ ప్రేమ
హృదయ్ స్వయంగా మాకిలా చెప్పాడు: “ఇప్పటి నుండి శ్రీరామకృష్ణుల పట్ల నేనొక అనిర్వచనీయమైన ఆకర్షణను అనుభవిస్తుండేవాడిని. సర్వదా నీడలా వారిని అనుసరిస్తూండేవాడిని. ఒక్క క్షణమైనా వారిని విడిచి ఎక్కడైనా ఉండాలంటే ఎంతో కష్టంగా ఉండేది. నిద్రించడం, తిరగడం, కూర్చోవడం – అన్నిటినీ ఒకేసారి చేసేవాళ్ళం. కేవలం మధ్యాహ్నం మాత్రం కాసేపు ఇద్దరం వేరయ్యేవారం. ఎందుకంటే శ్రీరామకృష్ణులు ఆహారపదార్థాలు (బియ్యం, కూరగాయలు) తీసుకుని పంచవటిలో స్వయంగా వండుకుని తినేవారు. నేనేమో ఆలయంలో ప్రసాదాన్ని తినేవాణ్ణి. అయినా వారి వంటకు నేను అంతా సిద్ధంచేసిన తర్వాతే వెళ్ళేవాణ్ణి. ఆయన ఇలా స్వయంగా వండుకొని భోజనం చేసినా కూడా ఆయన మనస్సు శాంతిని పొందేది కాదు. ఆహార విషయంలో ఆయన నిష్ఠ అంత కఠోరంగా ఉండేది. మధ్యాహ్నం ఆయన వండుకున్నా కూడ రాత్రి మాత్రం మా మాదిరిగానే జగజ్జననికి నివేదించిన లూచీ ప్రసాదాన్నే* తినేవారు. ఆ విధంగా లూచీలను తింటూ తింటూ ఆయన కళ్ళు నీళ్ళతో నిండడం నేను ఎన్నో సందర్భాలలో చూశాను. అంతేకాదు విచారంగా జగన్మాతనుద్దేశించి ‘అమ్మా! నాచే కైవర్తక (అగ్నికులక్షత్రియుల) అన్నాన్ని తినిపించావే’ అంటూ వాపోయేవారు.
గురుదేవులు అప్పుడప్పుడు తానే స్వయంగా ఆ సమయంలో జరిగిన విషయాలు మాకు ఈ విధంగా తెలిపేవారు: “కైవర్తకుల అన్నాన్ని తినాలనే భావన మనస్సులో మహాకష్టం కలిగించేది. ఆ కారణంగా రాస్మణి గుడికి తినడానికి బీదసాదలు ఎక్కువమంది వచ్చేవారు కాదు. తినడానికి ఎక్కువ మంది రాకపోవడంతో అన్న ప్రసాదాన్ని ఎన్నోరోజులు ఆవులకు వేసేవారు. ఇంకా మిగిలినదాన్ని గంగలో పారవేయవలసివచ్చేది.” అలా వండుకుని తినవలసిన ఆవశ్యకత ఎంతో కాలం ఉండలేదని గురుదేవులు, హృదయ్ల నుండి మేం విన్నాం. కాళికాలయంలో పూజారి పదవిని ఎంతకాలం వరకు శ్రీరామకృష్ణులు స్వీకరించలేదో అంతకాలం దాకా ఆయన అలా చేసివుంటారనే మా అభిప్రాయం. ఆలయ ప్రతిష్ఠాపన జరిగిన రెండు మూడు నెలల తర్వాత ఆయన కాళికాలయ పూజారి అయ్యారు.
5. శ్రీరామకృష్ణుల చర్యలను అవగతం చేసుకోలేని హృదయ్
శ్రీరామకృష్ణులు తననెంతో ప్రేమించే వారనే సంగతి హృదయ్‌కు తెలుసు. కాని ఆయన గురించి ఒక్క విషయం మాత్రం అర్థం కాలేదు. అదేమిటంటే – తాను, పెద్దమామ అయిన రాంకుమార్‌కు ఏదైనా పనిలో సహాయం చెయ్యడానికి వెళ్ళిన సమయంలో, మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత విశ్రాంతి తీసుకునేటప్పుడు, సాయంకాలం తాను ఆరాత్రిక దర్శనానికి పోయినప్పుడు కొంతసేపు వరకు శ్రీరామకృష్ణులు ఎక్కడో మాయమైపోయేవారు. ఎంత వెతికినా కనిపించేవారు కాదు. ఒకటి రెండు గంటల తర్వాత ఆయన తిరిగొచ్చినప్పుడు అడిగితే ఇక్కడే ఉన్నానంటూ అస్పష్టంగా జవాబు చెప్పేవారు. ఒక్కోరోజు ఆయనను వెదకుతూ ఉన్నప్పుడు పంచవటి దిశ నుండి ఆయన తిరిగిరావడం గమనించి బహుశా బహిర్భూమికి వెళ్ళి ఉంటారేమోనని భావించి మరింకేమీ అడిగేవాడు కాదు హృదయ్.
6. శ్రీరామకృష్ణులు రూపొందించిన శివ విగ్రహాన్ని మథుర్ ప్రశంసించడం
హృదయ్ మాకు ఇలా చెప్పాడు: “ఈ సమయంలో శివుణ్ణి పూజించాలనే కోరిక శ్రీరామకృష్ణులకు కలిగింది. బాల్యంలో కామార్పుకూర్లో అప్పుడప్పుడు ఆయన అలా చేస్తూవుండేవారని మేం ఇంతకు మునుపే తెలిపాం. మనస్సులో ఈ కోర్కె కలిగిన వెంటనే గంగానది నుండి మట్టిని తీసుకుని నంది, డమరుకం, త్రిశూల సమేతంగా ఒక చక్కని శివప్రతిమ చేసి ఆయన పూజించసాగారు. మథుర్బాబు ఆ సమయంలో వాహ్యాళిగా అటువైపు వచ్చినప్పుడు శ్రీరామకృష్ణులు తన్మయులై ఎవరిని పూజిస్తున్నారో చూడాలనే కుతూహలం అతడికి కలిగింది. దాంతో దగ్గరకు వచ్చి ఆ మూర్తిని చూశాడు. పెద్దది కాకపోయినా ఆ ప్రతిమ ఎంతో అందంగా రూపొందించ బడింది. మథుర్ దానిని చూసి విస్మితుడయ్యాడు. దైవీభావం ఉట్టిపడుతోన్న మూర్తిని చూసి అటువంటిది బజారులో లభ్యం కాదని గ్రహించాడు. కుతూహలంతో హృదయ్‌ను “ఈ మూర్తి ఎక్కడి నుండి తెచ్చారు. ఎవరు చేశారు?” అని అడిగాడు. హృదయ్ సమాధానం ద్వారా శ్రీరామకృష్ణులు దేవతావిగ్రహాలు చెయ్యగలరని, విరిగిపోయిన మూర్తులను అందంగా కూడ అతికించగలరనే సంగతి తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. పూజ అయిన తర్వాత ఆ ప్రతిమను తన కిమ్మని మథుర్ అడిగాడు. హృదయ్ సమ్మతించి పూజ అయిన వెంటనే శ్రీరామకృష్ణులకు చెప్పి, ఆ విగ్రహాన్ని మథుర్బాబుకు అందచేశాడు. మథుర్ ఆ మూర్తిని చేతుల్లోకి తీసుకుని అతిసూక్ష్మంగా పరీక్షించసాగాడు. అంతేకాక ముగ్ధుడై దానిని రాణి దగ్గరకు పంపాడు. రాణి కూడ ప్రతిమను చూసి దానిని చేసిన శిల్పిని ప్రశంసించింది. దానిని చేసింది శ్రీరామకృష్ణులేనని తర్వాత తెలుసుకుని మథుర్లా ఆమె కూడ ఎంతో ఆశ్చర్యపోయింది.* శ్రీరామకృష్ణులను దేవాలయ కార్యంలో నియమించాలనే కోరిక మథుర్కు మొదట్లోనే ఉంది. ఆయన ఈ సాధన చూశాక ఆ కోర్కె మరింత బలీయమైంది. మథుర్ తన కోర్కెను కొంతకాలం క్రితం తన అన్న దగ్గర వ్యక్తం చేసిన సంగతి శ్రీరామకృష్ణులు విన్నారు. కాని ఒక్క భగవంతుణ్ణి సేవించడం తప్ప మరెవరి వద్దా ఉద్యోగం చెయ్యకూడదనే సంకల్పం చిన్నప్పటినుండి ఆయనలో దృఢంగా నాటుకు పోయింది. అందుకే వారు ఆ మాటలను లక్షించలేదు.
7. ఉద్యోగం చేయడంపై శ్రీరామకృష్ణుల అభిప్రాయం
ఉద్యోగం చేయడం గురించి గురుదేవులు అటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చడం మేం చాలాసార్లు విన్నాం. క్లిష్టపరిస్థితులు ఎదురై ఉద్యోగం చేయవలసిన అగత్యం ఉన్నప్పుడు తప్ప, ఉద్యోగం చేసే ఎవరిపట్ల కూడ శ్రీరామకృష్ణులకు సదభిప్రాయం ఉండేది కాదు. ఒకసారి యువభక్తులలో ఒకరు* ఉద్యోగం చేస్తున్నాడని తెలిసి ఆయన చాలాబాధ పడ్డారు. ఆయన ఇలా అనడం విన్నాం: “అతడు మరణించాడనే వార్త వినడం కన్నా ఉద్యోగం చేస్తున్నాడన్న వార్త నన్ను మరింత బాధకు లోనుచేస్తుంది.” ఆ తరువాత అతడు ఆయనను దర్శించడానికి వచ్చినప్పుడు, వృద్ధురాలు, నిస్సహాయురాలు అయిన తల్లి పోషణార్థం అతడు ఉద్యోగం చేయవలసి వచ్చిందని తెలుసుకొన్నారు. అనురాగంతో అతడి తలను, శరీరాన్ని నిమురుతూ, “అందులో దోషం లేదు. ఆ ఉద్దేశంతో ఉద్యోగం చేసినందున నిన్ను తప్పు పట్టకూడదు. కాని తల్లి కోసం కాకుండా కేవలం ధనసంపాదన నిమిత్తం నువ్వు ఉద్యోగం చేసివుంటే నిన్నిక స్పృశించలేకపోయేవాణ్ణి సుమా! అందుకే నా నిరంజన్‌లో లవలేశమైనా అంజనం (అంటే మరక) లేదని అంటున్నాను” అని అన్నారు.
నిరంజన్ను ఉద్దేశించి గురుదేవులు పలికిన మాటలు విని అక్కడున్న నూతన దర్శనార్థులు ఆశ్చర్యపోయారు. వారిలో ఒక వ్యక్తి సూటిగా ఇలా అడిగాడు కూడ: “మహాశయా! ఉద్యోగం చేయడాన్ని మీరు ఖండిస్తున్నారు. కాని ఉద్యోగం చేయకుండా మా కుటుంబాలను ఎలా పోషించగలం?” అందుకు శ్రీరామకృష్ణులు, “(ఉద్యోగం) చేయదలచుకొన్న వారు చేయవచ్చు. ప్రతి ఒక్కరినీ చేయవద్దని నిషేధించడం లేదే! నేను చెప్పేది వీరి (నిరంజన్ తదితర యువకులైన భక్తులను చూపుతూ) కోసమే. వారి సంగతే వేరు.” గురుదేవులు ఈ భక్తుల జీవితాలను ఆధ్యాత్మిక మార్గంలో మలుస్తున్నారు. పరిపూర్ణ ఆధ్యాత్మిక భావన, ఉద్యోగం మధ్య ఏనాడూ సామరస్యం కుదరదనే అభిప్రాయంతోనే ఆయన అలా పలికారని చెప్పడం అనవసరం.
8. మథుర్ను కలుసుకోవడానికి రామకృష్ణుల సంకోచం
తన అన్న రాంకుమార్ నుండి మథుర్బాబుకున్న ఉద్దేశాన్ని తెలుసుకున్నప్పటి నుండి సాధ్యమైనంతవరకు మథుర్ దృష్టి నుండి దూరంగా ఉండటానికే ప్రయత్నించారు శ్రీరామకృష్ణులు. కారణమేమంటే మనోవాక్కాయ కర్మల ద్వారా సత్యాన్ని, ధర్మాన్ని పరిపాలించడంలో ఆయన ఎప్పుడూ ఎవరినీ ఎలా లక్షించేవారు కాదో అదే విధంగా మళ్ళీ విశేషమైన కారణం లేకుండా ఎవరినైనా ఉపేక్షించడానికి గానీ లేదా ఊరకే కష్టపెట్టడానికిగానీ జీవితాంతం వెనుకాడుతూ ఉండేవారు. అంతేకాక ఎటువంటి ప్రతిఫలాన్ని మనస్సులో ఎంచక మాననీయుల సుగుణాలను ఆదరించడం, స్వాభావికంగా మర్యాదస్థులను గౌరవించడం వారి స్వభావం. కనుక ఆలయంలో పూజారి పదవిని స్వీకరించడమా? మానడమా? అనే ప్రశ్నకు తగిన సమాధానం పొందనంతకాలం మథుర్ ఆ ఉద్యోగం చేయమని తనను బ్రతిమాలుతూ కూర్చుంటే గత్యంతరంలేక నిరాకరించి అతడి మనస్సును కష్టపెట్టాలేమో అన్న ఆ సందేహమే శ్రీరామకృష్ణుల ఈ ప్రవర్తనకు మూల కారణమై ఉంటుందని మనం గ్రహించవచ్చు. పైగా తానప్పుడు ఒక ఊరు పేరు లేని యువకుడు. మరి మథుర్బాబు, రాణీ రాస్మణికి కుడిభుజం వంటివాడు, గొప్పవ్యక్తి. అటువంటి స్థితిలో అతడి అభ్యర్థనను త్రోసిపుచ్చడం మూర్ఖత్వంగానే పరిగణింపబడుతుంది గదా! కాని కాలం గడుస్తున్నకొద్దీ శ్రీరామకృష్ణులకు దక్షిణేశ్వరం మరింత ఆనందదాయకం కాసాగింది. అంతర్దృష్టి సంపన్నులైన గురుదేవులకు తమ ఈ మనోభావన అవగతం కాకుండా ఉండకపోదు. ఎలాంటి బరువుబాధ్యతలూ మీద పడకుండా ఉంటే దక్షిణేశ్వరంలో నివసించడానికి మొదట్లో ఉన్న ఆక్షేపణ ఇప్పుడు వారి మనస్సు నుండి తొలగిపోయిందని, జన్మస్థలమైన కామార్పుకూర్కు తిరిగి వెళ్ళాలనే తహతహ ఇప్పుడు వారిలో లేదనే విషయాన్ని ఈ కాలఘట్టంలో జరిగిన సంఘటనల ద్వారా మనం చక్కగా గ్రహించవచ్చు.
9. రామకృష్ణులు పూజారి పదవిని స్వీకరించడం
గురుదేవులు అనుమానించిందే ఒక రోజు జరిగింది. మ్రొక్కడానికి గాను మథుర్బాబు ఒకరోజు ఆలయానికి వచ్చి దూరం నుండి శ్రీరామకృష్ణులను చూసి, పిలవనంపాడు. ఆయన అప్పుడు హృదయ్‌తో నడుస్తూ దూరం నుండే మథుర్బాబును చూచి అక్కడనుండి వెళ్ళిపోబోతున్నప్పుడు పనివాడు వచ్చి “బాబు పిలుస్తున్నారు” అని చెప్పాడు. మథుర్బాబు దగ్గరకు వెళ్ళడానికి శ్రీరామకృష్ణులు తటపటాయించడం చూసి కారణమేమిటని అడిగాడు హృదయ్. సమాధానంగా “నేను పోగానే ఉద్యోగం చేస్తూ ఇక్కడే ఉండిపొమ్మని అతడు అడుగుతా” డని చెప్పారు గురుదేవులు. “దాన్లో తప్పేముంది? ఇంత మంచి స్థలంలో, ఒక పెద్ద మనిషి వద్ద పనిచెయ్యడం మంచిది కాదా? ఇక ఆలోచనెందుకు?” అని హృదయ్ అన్నాడు. శ్రీరామకృష్ణులు అతడితో “జీవితాంతం ఉద్యోగంలో బందీగా ఉండడం నా ఆశయం కాదు. అంతేకాక, పూజచేసే పనిని స్వీకరిస్తే దేవికి అలంకరింపబడే ఆభరణాల బాధ్యత అంతా నా మీదే పడుతుంది. అదొక పెద్ద తలనొప్పి. నాకది సాధ్యంకాదు. కాని నువ్వా బాధ్యతను పుచ్చుకొంటే పూజ చేయడానికి నాకు ఎటువంటి ఆక్షేపణా లేదు” అన్నారు.
నిజానికి హృదయ్ ఇక్కడకు వచ్చింది పని కోసమే. కనుక శ్రీరామకృష్ణుల షరతుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. గురుదేవులు అప్పుడు మథుర్బాబు వద్దకు వెళ్ళారు. ఆలయంలో పూజారి ఉదోగ్యం స్వీకరించమని మథుర్ ఆయనను అర్థించాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు తన షరతు గురించి అతడికి చెప్పారు. మథుర్ తక్షణం ఆయన చెప్పిన షరతుకు ఒప్పుకున్నాడు. ఆ రోజు నుండే కాళికాలయంలో వస్త్రాభరణాదులతో ‘అమ్మ’ ను అలంకరించే పనిలో శ్రీరామకృష్ణులను, ఆయనకు రాంకుమార్‌కు సహాయం చేసే పనిలో హృదయ్‌ను మథుర్ నియమించాడు. మథుర్ అభ్యర్థనతో తమ్ముడలా పనిలో నియుక్తుడు కావడం చూసి రాంకుమార్ నిశ్చింతుడయ్యాడు.
10. గోవిందుని విగ్రహం పగిలిపోవడం
పైన చెప్పిన సంఘటనలన్నీ ఆలయ ప్రతిష్ఠాపన జరిగిన మూడు నెలలలోపే సంభవించాయి. 1855 వ సంవత్సరాంతం. శ్రీకృష్ణజన్మాష్టమికి సంబంధించిన ఉత్సవ సన్నాహాలు ముందురోజే చేసేశారు. నందోత్సవం మధ్యాహ్నం శ్రీ రాధ – గోవింద ప్రత్యేకపూజ జరిగిపోయింది. పూజారి క్షేత్రనాథ్, రాధారాణిని మరో గదిలో శయనింపచేసి వచ్చాడు. తర్వాత గోవిందుని శయనింప జేయడానికి తీసుకుని వెళుతున్నప్పుడు కాలుజారి పడ్డాడు. ఆ పడిపోవడంలో విగ్రహం కాలు ఒకటి విరిగిపోయింది. ఆ సంఘటన ఆలయంలో ఒక సంచలనాన్ని సృష్టించింది. ఎందరో పండితుల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత చివరకు శ్రీరామకృష్ణుల సలహాను అనుసరించి విరిగిపోయిన విగ్రహపు కాలును చక్కగా అతికించిన తర్వాత యథాప్రకారం పూజ కొనసాగింది.* శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు భావసమాధి పొందడం చూసి మథుర్బాబు విరిగిన విగ్రహస్థానంలో కొత్తవిగ్రహాన్ని ప్రతిష్ఠించడం గురించి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఆరాటపడ్డాడు. మథుర్కు సలహా ఇవ్వడానికి మునుపు శ్రీరామకృష్ణులు భావసమాధిలోకి వెళ్ళారని, బాహ్యస్మృతి వచ్చిన తర్వాత మరో విగ్రహం పెట్టే అవసరం లేదని అతడికి తెలిపారని హృదయ్ చెప్పాడు. విరిగిపోయిన విగ్రహాలను అందంగా అతికించడంలో శ్రీరామకృష్ణులు మంచి నేర్పరి అనే సంగతి మథుర్కు తెలియని విషయం కాదు. కనుక మథుర్ అభ్యర్థనతో గురుదేవులు అప్పుడు గోవిందుని విగ్రహం కాలుని చక్కగా అతికించారు. ఆ అతికింపు ఎంత కౌశలంగా చేశారంటే సూక్ష్మంగా పరిశీలించినా ఆ విగ్రహం ఒకప్పుడు విరిగిపోయినదనే సంగతి ఎవరూ ఇప్పటికీ తెలుసుకోలేరు.
ఆ విధంగా శ్రీరాధాగోవిందుని విగ్రహపు కాలు విరిగిపోయిన తర్వాత అటువంటవిగ్రహం పూజించడానికి పనికిరాదని లోకులు ఏమేమో అనేవారు. కాని రాణీ రాస్మణి, మథుర్బాబులు మాత్రం శ్రీరామకృష్ణుల యుక్తియుక్తమైన సలహాలను దృఢంగా నమ్మి లోకుల మాటలను పెడచెవిన పెట్టారు. ఏది ఏమైనా అజాగ్రత్త వల్ల అపరాధం చేసిన క్షేత్రనాథ్ను పూజారి పదవి నుండి తొలగించారు. అప్పటి నుండి శ్రీ రాధాగోవిందుని పూజించే బాధ్యత శ్రీరామకృష్ణుల మీదనే పడింది. ఇక హృదయ్ కూడ పూజాసమయంలో శ్రీ కాళీమాతను ఆభరణాదులతో అలంకరించి రాంకుమార్‌కు తోడ్పడసాగాడు.
11. విరిగిన విగ్రహపూజను గురించి శ్రీరామకృష్ణుల ఉవాచ
విగ్రహం విరిగిన సంఘటన గురించి హృదయ్ మరో సందర్భంలో మరో విషయం చెప్పాడు. కలకత్తాకు కొన్నిమైళ్ళ దూరంలో ఉత్తరంగా బారానగర్ కుటీఘాట్కు సమీపంలో నడాల్ సంస్థాన ప్రసిద్ధ జమీందారు రతన్రాయ్కి చెందిన ఒక ఘాట్వుంది. ఈ ఘాట్ దగ్గర ఒక ఆలయం ఉంది. దీనిలో శ్రీదశ మహావిద్యా (దేవి) మూర్తి ప్రతిష్ఠితమై ఉంది. పూర్వం ఈ గుడిలో పూజాది సేవలకు మంచి ఏర్పాట్లే చేయబడ్డాయి. కాని శ్రీరామకృష్ణుల సాధనకాలం నాటికి ఇవి శోచనీయస్థితికి దిగజారాయి. కాలక్రమంలో శ్రీరామకృష్ణులపై మథుర్ భక్తిశ్రద్ధలు అధికమైన తర్వాత ఒకానొక సమయంలో వారిద్దరూ కలిసి ఈ ఆలయ దర్శనానికి వెళ్ళారు. ఆలయ దీనావస్థను గమనించి శ్రీరామకృష్ణులు మథుర్బాబుకు చెప్పి నెలనెలా రెండు రూపాయలు, రెండు మణుగుల బియ్యం ఇప్పించే ఏర్పాటు చేయించారు. అప్పటి నుండి శ్రీ దశ మహావిద్యాదేవిని దర్శించడానికి గురుదేవులు అప్పుడప్పుడు అక్కడకు వెళుతూ ఉండేవారు. ఒకరోజు ఆ విధంగా దేవిని దర్శించుకొని తిరిగి పోతున్నప్పుడు ఆ ప్రాంతపు సుప్రసిద్ధ జమీందారైన జయనారాయణ్ వంద్యోపాధ్యాయ తాను నిర్మించిన ఘాట్ దగ్గర పలువురితో కలసి నిలబడి ఉండడం చూశారు. పరిచితుడవడం వల్ల ఆయనను కలుసుకోవడానికి శ్రీరామకృష్ణులు వెళ్ళారు. జయనారాయణ్ ఆయనకు నమస్కరించి సాదరంగా ఆహ్వానించి తన తోటివారికి పరిచయం చేశాడు. తర్వాత మాటల సందర్భంలో రాణీ రాస్మణి కాళికాలయ ప్రస్తావన లేవనెత్తి శ్రీరామకృష్ణులను, “మహాశయా! అక్కడ గోవిందుని విగ్రహం పగిలిపోయిందట కదా?” అని అడిగాడు. అందుకు జవాబుగా గురుదేవులు ఇలా అన్నారు: “ఎటువంటి బుద్ధి నీది? అనంతుడు, అఖండుడు అయిన వాడు పగిలిపోవడ మేమిటి?” పిదప జయనారాయణ్ ప్రశ్నతో నిరర్థకమైన నానావిషయాలు లేవగలవనే అనుమానంతో శ్రీరామకృష్ణులు ఆ ప్రస్తావన మార్చి అన్ని విషయాలలోను ముఖ్యాంశాన్ని మాత్రమే గ్రహించి సారహీనమైన వాటిని విడిచి పెట్టాలని అతడికి ఉపదేశించారు. బుద్ధిమంతుడైన జయనారాయణ్బాబు కూడ శ్రీరామకృష్ణుల పరోక్ష సూచనను అర్థం చేసుకుని అటువంటి వ్యర్థప్రశ్నలు వేయడం మానుకొన్నాడు.
12. శ్రీరామకృష్ణుల సంగీత ప్రతిభ
శ్రీరామకృష్ణులు చేసే పూజ చూడవలసిన ఒక అపూర్వదృశ్యం! దాన్ని చూసినవారు మంత్ర ముగ్ధులయ్యేవారు. ఇక ఆయన పాటలు: భక్తిభావంతో హృదయం పెల్లుబుకుతుండగా గంధర్వులు సైతం అసూయాపరులయ్యే విధంగా మధుర కంఠంతో ఆయన పాడేపాటలను ఒక్కసారి విన్నవాటిని ఎన్నడూ మరువలేక పోయేవారు. వాటిలో సంగీత విద్వాంసుల కృత్రిమ ఆలాపనలేవీ ఉండవు. కాని పాటలలోని భావంతో వారు సంపూర్ణంగా తన్మయులై విశుద్ధ రాగ తాళ లయబద్ధంగా ఆ భావాలను యథాతథంగా తమ మధురకంఠంతో గానం చేస్తూవుంటే, అవి వినేవారి హృదయాంతరాళాల లోకి చొచ్చుకుపోయి రూప భావ తరంగాలను మేల్కొలిపేవి. భావమొక్కటే సంగీతానికి ప్రాణం అనే సంగతి ఆయన పాటలో కనిపించేది. అలాగే తాళం, లయ విశుద్ధంగా లేకపోతే ఆ భావం చక్కగా అభివ్యక్తం కాజాలదనే సంగతి శ్రీరామకృష్ణుల ముఖతా వెలువడిన సంగీతాన్ని విని దానిని ఇతరుల సంగీతంతో పోల్చి చూసిన వారికి స్పష్టంగా అర్థమయ్యేది. రాణీ రాస్మణి దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడల్లా శ్రీరామకృష్ణులను పిలిచి ఆయన పాటలను వింటూవుండేది. ఈ క్రింది పాట ఆమెకు విశేషంగా ప్రియమైంది.
కోన్ హిసాబే హరహృదే దాడియే చో మా పద దియే ।
సాధ కరె జిబ్ బడాయేచో జేనకొతో న్యాకామేయే
జేనేచి జేనేచి తారా,
తారా కా తోర్ ఎమ్‌ని ధారా
తోర్ మాకి తోర్ బాపేర్ బుకే దాడియేఛిలో అమ్నికరే ॥
దక్షిణేశ్వర రాధాకాంతాలయంలోని శ్రీకృష్ణ విగ్రహం
శ్రీరామకృష్ణులు అతికించిన కృష్ణుని విరిగిన పాదం
భావం: అమ్మా! ఏమనుకొని నువ్వు శివుని హృదయ స్థానం మీద కాళ్ళుపెట్టి నిలబడ్డావు. మళ్ళీ ఏమీ తెలియనిదానిలా పెద్దగా నాలుక చాచిపెట్టావే? (తప్పు తెలుసుకుని సిగ్గుపడిన దానిలాగా!) నా కిప్పుడు అర్థమైంది. ఓ తారా, ‘ఇదంతా నీ వంశపారంపర్యంగా వస్తున్న పద్ధతేనా నీ తల్లి కూడ నీ తండ్రి గుండెమీద ఇలాగే నిలబడిందా ఏమిటి?”*
శ్రీరామకృష్ణుల పాటలంత మధురంగా ఉండడానికి కారణం కూడ ఉంది. పాడేటప్పుడు ఆ పాటల భావంలో వారు ఎంత తన్మయులై పోయేవారంటే ఇతరుల మెప్పును పొందడానికి పాడుతున్నాననే స్పృహ వారి నుండి పూర్తిగా తొలగిపోయేది. పాట పాడుతున్నప్పుడల్లా శ్రీరామకృష్ణులలా తన్మయులయ్యే వారిని మరెవ్వరినీ మేం జీవితంలో చూడలేదు. భావుకులైన గొప్ప గాయకులు సైతం శ్రోతల నుంచి ఏ కొంచెమైనా ప్రశంస పొందాలనే కోరుకుంటారు. కాని గురుదేవుల పాటలు విని ముగ్ధులై, ఎవరైనా వారిని ప్రశంసిస్తే, “ఈ వ్యక్తి పాటలోని భావాన్నే ప్రశంసిస్తున్నాడు గాని, నిజంగా ఆ గొప్పతనంలో బిందు మాత్రమైనా నాకు చెంద” దని వాస్తవికంగానే వారనుకొనేవారు. మేం కేవలం దీన్ని శ్రీరామకృష్ణులలోనే చూశాం.
13. పూజ చేస్తున్నప్పుడు శ్రీరామకృష్ణులకు కలిగిన ప్రథమ దివ్యదర్శనం
హృదయ్ ఇలా చెప్పేవాడు: “ఈ కాలంలో భక్తిగీతాలు పాడుతూ పాడుతూ కన్నీళ్ళతో వారి వక్షస్థలం తడిసిపోయేది. పూజ చేస్తున్నప్పుడు ఎంత తన్మయులై చేసేవారంటే ‘ఆ చోటికి అప్పుడు ఎవరైనా వచ్చినా లేదా దగ్గరకొచ్చి మాట్లాడినా వినబడేదే కాదు’ అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. కరన్యాసం, అంగన్యాసం మొదలైన పూజావిధులు నిర్వర్తించేటప్పుడు ఆయా మంత్రవర్ణాలు తమ దేహంలో ఉజ్జ్వలకాంతితో ప్రత్యక్షమౌతూ ఉండడం తమ కళ్ళతో నిజంగానే చూసేవారమని గురుదేవులు చెప్పారు. మళ్ళీ కుండలినీ శక్తి సర్పాకృతితో సుషుమ్నా మార్గం ద్వారా సహస్రారానికి ఎక్కడం, అలా ఎక్కుతున్నప్పుడు శరీరంలోని ఏ ఏ అంగాలను ఆ శక్తి విడిచి పోతుందో ఆయా అంగాలు తక్షణం స్పందనరహితాలై మృతప్రాయంగా అవడం ఆయన యథార్థంగా చూసేవారు. మళ్ళీ పూజాపద్ధతిని అనుసరించి “ ‘రం’ ఇతి జలధారయాం వహ్ని ప్రాకారం విచింత్య” – అంటే “రం” అనే బీజమంత్రాన్ని ఉచ్చరిస్తూ నలుదిక్కులా నీళ్ళను చిలకరిస్తూ పూజారి భావించాలి. దుర్భేద్యమైన అగ్నికుడ్యం పూజాస్థలాన్ని చుట్టి అన్ని విఘ్నాల నుండి ఆ స్థలాన్ని రక్షిస్తున్నదని అర్థం. శ్రీరామకృష్ణులు అలా చేసినప్పుడు నిజంగానే శత జిహ్వలతో విస్తరిస్తున్న అగ్నిప్రాకారం తమను, పూజస్థలాన్ని చుట్టుముట్టి అన్ని విధాలైన విఘ్నాల నుండి రక్షిస్తూండడం దర్శించేవారు. పూజాసమయంలో శ్రీరామకృష్ణులు తేజోమయ శరీరాన్ని, తన్మయత్వాన్ని చూసిన ఇతర బ్రాహ్మణులు ‘సాక్షాత్తూ నారాయణుడే మానవశరీరాన్ని దాల్చి పూజ చేయడానికి కూర్చున్నట్లు కన్పిస్తున్నా’ రని పరస్పరం చెప్పుకునేవారు.”
14. రాంకుమార్ శ్రీరామకృష్ణులకు వివిధ దేవతల పూజాపద్దతులు నేర్పడం
దేవీ భక్తుడైన రాంకుమార్ దక్షిణేశ్వరానికి వచ్చినప్పటి నుండి కుటుంబపు జరుగుబాటు సమస్య నుండి చాలావరకు నిశ్చింతుడయ్యాడు. కాని మరో చింత అప్పుడప్పుడు అతణ్ణి బాధిస్తుండేది. అది చిన్న తమ్ముడైన శ్రీరామకృష్ణుల గురించి! ఎందుకంటే అక్కడికి వచ్చినప్పటి నుంచి తమ్ముడిలో ఏకాంతవాస ప్రియత్వం పెరగడం, సంసార విషయాలపై ఉదాసీనుడవడం రాంకుమార్ దృష్టికొచ్చింది. ప్రాపంచికోన్నతి కలిగించే ఏ పనిలోనైనా అతడు పూర్తిగా ఉదాసీనుడిగా ఉంటున్నాడు. ఎందుకంటే ఉదయం, సాయంకాలం ఎప్పుడంటే అప్పుడు అతడు ఆలయానికి దూరంగా గంగాతీరానికి పోయి ఒక్కడే అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు. లేదా పంచవటి వద్ద స్థిరంగా కూర్చొని ఉండేవాడు. లేదా పంచవటికి నలువైపులా వ్యాపించివున్న చిట్టడవిలో ప్రవేశించి చాలాసమయం అక్కడ గడిపి మళ్ళీ బయటికి వచ్చేవాడు. ఇదంతా రాంకుమార్ గమనించాడు. మొదట్లో ఇలా అతడనుకునేవాడు: ‘బహుశా పిల్లవాడు కామార్పుకూర్లో ఉన్న తల్లి దగ్గరకు తిరిగి వెళ్ళకోరుతున్నాడేమో, అందుకే దానిని గురించి సర్వదా చింతిస్తున్నాడేమో!’ కాని చాలాకాలం గడిచినా ఇంటికి వెళ్ళాలన్న కోరికను శ్రీరామకృష్ణులు ఏనాడూ వెల్లడించలేదు. కొన్నిసార్లు రాంకుమార్ తమ్ముణ్ణి అడిగి, అతడిలో అటువంటి కోరిక లేదని గ్రహించి, ఇంటికి పంపాలనే ఆలోచనను మానుకొన్నాడు. అయినా రాంకుమార్ తనలో తానిలా వితర్కించుకోసాగాడు: “నాకు వయస్సయింది. రోజురోజుకూ శరీరం దుర్బలమౌతోంది. జీవితం ఎప్పుడు అంతమౌతుందో ఎవరికెరుక? కనుక సమయాన్నిక వృథా చెయ్యకూడదు. నేను బతికున్నప్పుడే తమ్ముడు తన కాళ్ళమీద తాను నిలబడి రెండు కాసులు ఆర్జించి సంసారాన్ని నడుపుకోనేలా తయారు చేయడం ఏకైక కర్తవ్యం.” కనుక తమ్ముణ్ణి ఆలయం పనిలో చేర్చాలనే అభిప్రాయాన్ని మథుర్బాబు తనతో వ్యక్తం చేసినప్పుడు చాలా సంతోషించాడు రాంకుమార్. కొంతకాలం తర్వాత మథుర్ అభ్యర్థనతో శ్రీరామకృష్ణులు మొదట్లో దేవికి అలంకారం చేసే పనిని, ఆ తర్వాత రాధాగోవిందుని పూజించే పనిని అంగీకరించడంతో చాలావరకు అతడు నిశ్చింతుడయ్యాడు. అప్పటి నుండి అతడు తమ్ముడికి చండీ పాఠం, కాళీపూజతో పాటు ఇతర దేవతల పూజలన్నీ నేర్పాడు. శ్రీరామకృష్ణులు ఆ విధంగా సంస్కార సంపన్నులైన బ్రాహ్మణులు విధ్యుక్తంగా నేర్చుకోవలసిన వాటిని సత్వరమే నేర్చుకున్నారు. శక్తిమంత్రంతో దీక్షితుడు కాకుండా దేవిని పూజించడం సముచితం కాదని విని దీక్షను పొందాలని సంకల్పించుకున్నారు.
15. శ్రీ కేనారామ్ భట్టాచార్యుల నుండి శ్రీరామకృష్ణుల శక్తిదీక్ష స్వీకారం
కేనారామ్ భట్టాచార్యుడనే గొప్ప శక్తిసాధకుడొకరు ఆ కాలంలో కలకత్తాలో బైఠక్ఖానా బజారులో నివసిస్తుండేవాడు. ఆయన అప్పుడప్పుడు దక్షిణేశ్వర కాళికాలయానికి వస్తూవుండే వాడు. మథుర్బాబు, రాణి కుటుంబ సభ్యులతో అతడికి పరిచయం ఉండవచ్చనిపిస్తోంది. దేవీభక్తుడవడం వల్ల తెలిసినవారు ఆయన పట్ల అమిత గౌరవభావం చూపుతుండేవారు. ఆయనకు శ్రీరామకృష్ణుల అన్న రాంకుమార్ భట్టాచార్యులతో పూర్వం నుంచే పరిచయముంది. ఆయన నుంచి దీక్షను పొందాలని గురుదేవులు సంకల్పించుకున్నారు. దీక్ష పుచ్చుకున్న తక్షణమే శ్రీరామకృష్ణులు భావపరవశులై సమాధిమగ్నులైనారని, కేనారామ్ అనన్యమైన వారి భక్తిని చూచి ముగ్ధులై వారికి ‘ఇష్టదేవతాదర్శనమవుగాక’ అని హృదయ పూర్వకంగా ఆశీర్వదించాడని మేం విన్నాం.
16. రాంకుమార్ మరణం
తన శరీరం దుర్బలమవడంచేత గానీ లేదా శ్రీరామకృష్ణులకు అభ్యాస మౌతుందని తలంచి రాంకుమార్ ఆ కాలంలో శ్రీ రాధాగోవిందుని పూజలు చేస్తూ, శ్రీ కాళికాదేవి పూజాకార్యక్రమాన్ని శ్రీరామకృష్ణులకు అప్పగించాడు. మథుర్బాబుకు ఆ సంగతి త్వరలోనే తెలియవచ్చింది. దేవీపూజలో శ్రీరామకృష్ణులప్పుడు ప్రావీణ్యం సంపాదించారని తెలుసుకొని, అప్పటి నుండి రాంకుమార్‌ను విష్ణుపూజ చేయవలసిందిగా అభ్యర్థించాడు మథుర్. కనుక ఆ కాలం నుంచి శ్రీరామకృష్ణులు కాళికాలయంలో పూజారిగా నియుక్తులయ్యారు. పెద్దవాడవుతున్న రాంకుమార్ శరీరం మరింత క్షీణించడం వల్ల ఎంతో కష్టమైన కాళికాలయ పని అతడు చేయడం అసాధ్యమని భావించే మథుర్ అలాంటి ఏర్పాటు చేసివుంటాడు. ఈ ఏర్పాటు రాంకుమార్‌కు ఎంతో సంతోషం కలిగించింది. తమ్ముడికి అతడు ఆలయంలో చేయవలసిన పూజ, సేవాది కార్యాలన్నింటినీ క్షుణ్ణంగా నేర్పి, నిశ్చింతుడయ్యాడు. కొంతకాలం గడచిన తర్వాత, ఆయన మథుర్బాబుకు చెప్పి శ్రీ రాధాగోవిందుని పూజాకార్యక్రమంలో హృదయ్‌ను నియుక్తం చేశాడు. సెలవు పుచ్చుకుని కొన్ని రోజులు ఇంటికి వెళ్ళే ఏర్పాట్లు చేసుకోసాగాడు. కాని ఈ లోపల ఏదో పని మీద కలకత్తాకు ఉత్తరంగావున్న శ్యామ్‌నగర్ మూలాజోడ్ అనే చోటికి వెళ్ళాడు; అతడక్కడే హఠాత్తుగా మరణించాడు.
రాణీ రాస్మణి దేవాలయ ప్రతిష్ఠాపన జరిపిన తర్వాత శ్రీజగన్మాత పూజ చేస్తూ రాంకుమార్ జీవించింది ఒక్క సంవత్సర కాలం మాత్రమే. కాబట్టి, బహుశా ఆయన 1856 సంవత్సర మధ్యకాలంలో మరణించాడు.