1. రాంకుమార్ కలకత్తాలో సంస్కృత పాఠశాలను ప్రారంభించడానికి కారణం
రాంకుమార్ కలకత్తాలో 1850 వ సంవత్సరంలో సంస్కృత పాఠశాలను ప్రారంభించాడు. అప్పటికి బహుశా అతడి వయస్సు 45 ఏళ్ళు ఉండవచ్చు. రాంకుమార్ కలకత్తాకు వెళ్ళకముందు, కుటుంబ పరిస్థితులు అతణ్ణి కలవరపరిచాయి. ఏకైక పుత్రుడు అక్షయ్‌ను ప్రసవించిన పిదప అతడి భార్య చనిపోయింది. తన భార్య ప్రసవం తర్వాత ఇక బ్రతకదని సాధకుడు రాంకుమార్ ముందే భవిష్యద్వాణిగా గ్రహించి ఆ విషయాన్ని తన కుటుంబంలోని కొందరికి తెలిపాడు. అప్పటికి శ్రీరామకృష్ణులకు పధ్నాలుగేళ్ళు నిండాయి. సంపదలతో కూడిన కలకత్తా నగరంలో పలువురు ధనికులు, మధ్య తరగతికి చెందినవారు జీవిస్తున్నారు. శాంతిస్వస్త్యయనాది క్రియలు చేయడం, ధార్మిక సమస్యల గురించి శాస్త్రాభి ప్రాయాలు వ్రాసివ్వడం, తన పాఠశాలకొచ్చే విద్యార్థులకు చక్కగా విద్య నేర్పడం వంటి వాటి ద్వారా ఆర్థికపరిస్థితులను మెరుగుపరచుకుని మానసిక చింతల నుంచి స్వేచ్ఛ పొంద వచ్చని రాంకుమార్ కలకత్తాకు వచ్చివుండవచ్చు. లేదా భార్యావియోగం జీవితంలో ఏర్పరచిన శూన్యం కారణంగా ఏదైనా దూరప్రాంతానికి వెళ్ళి వివిధ పనుల్లో నిమగ్నమైవుంటే మనస్సుకు కొంత శాంతి కలుగుతుందనే భావంతోనైనా వచ్చివుండవచ్చు. ఏది ఏమైనా (కలకత్తా) ఝామాపుకూర్లో పాఠశాలను ప్రారంభించిన కొన్ని సంవత్సరాల తర్వాత రాంకుమార్ శ్రీరామకృష్ణులను ఎందుకు కలకత్తాకు తోడ్కొనివచ్చాడో, 1852 లో కలకత్తాకు వచ్చిన తర్వాత మూడేళ్ళు గురుదేవులు ఎలా గడిపారో పాఠకులకు మేమింతకు మునుపే చెప్పాం.
2. రాణీ రాస్మణి
ఇక అప్పటినుండి శ్రీరామకృష్ణుల జీవితంలో జరిగిన సంఘటనల గురించి తెలుసు కోవాలంటే మన దృష్టిని మరోవైపుకు మరల్చాలి. ఆర్థికంగా పుంజుకోవడానికి రాంకుమార్ అప్పట్లో ఛాటుబాబు బృందంలో చేరి తన సంస్కృత పాఠశాల అభివృద్ధికి ప్రయత్నించాడు. ఈ సమయంలో, భగవత్ కృప కారణంచేత, దక్షిణ కలకత్తాలోని పేరుగాంచిన కుటుంబంలో కొన్ని సంఘటనలు చోటుచేసుకొన్నాయి. ఇప్పుడు పాఠకులు వాటిపై దృష్టి సారించాలి.
3. రాణి దేవీభక్తి
రాణీ రాస్మణి దక్షిణ కలకత్తాలో జాన్బజార్ అనే ప్రాంతంలో వసించేది. ఆమెకు నలుగురు కుమార్తెలు. 44 వ ఏట ఆమె భర్తను కోల్పోయింది. భర్త శ్రీ రాజ్చంద్రదాస్ నుండి అపరిమిత సంపద ఆమెకు సంక్రమించింది. ఆ ఆస్తిపాస్తులను సక్రమంగా చూసుకొని అనతికాలంలోనే కలకత్తాలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకుంది. ఆమె పేరుప్రతిష్ఠలు నలుదిశలా వ్యాపించడానికి కార్యదక్షత ఒక్కటే కారణం కాదు. భగవద్భక్తి, ధైర్యసాహసాలు,* బీదసాదలపట్ల అపరిమిత సానుభూతి* , దానధర్మాలు, పుణ్యకార్యాల ద్వారా ఆమె పేరుప్రతిష్ఠలు సముపార్జించుకొంది. బెస్తకులంలో జన్మించినప్పటికీ సద్గుణాలతో ‘రాణి’ అనే బిరుదాన్ని సార్థకం చేసుకొంది. కులభేదం పాటించక సర్వులు ఆమె పట్ల మర్యాదమన్నన చూపేవారు. ఆమె కుమార్తెలందరికీ పెళ్ళిళ్ళయిపోయాయి. సంతానవతులు అయ్యారు కూడ. ఒకే ఒక్క కుమారుణ్ణి కని రాణీ మూడవ కుమార్తె మరణించింది. అందగాడు, కార్యదక్షుడు అయిన మూడవ అల్లుడు శ్రీ మథురమోహన్ (మథురనాథ్ విశ్వాస్)కు రాణీ రాస్మణి తన నాలుగవ కుమార్తె జగదంబను ఇచ్చి వివాహం చేసింది. రాణీ రాస్మణి నల్గురు కుమార్తెల వంశీయులు ఈనాటికీ ఉన్నారు.*
సద్గుణశీలి రాణీ రాస్మణి కాళికాదేవి భక్తురాలు. జమీకి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాల మీద వేయడానికి గాను తయారుచేసిన ముద్ర మీద “కాళీ పదాభిలాషిణి శ్రీమతి రాస్మణి దాసి” అనే అక్షరాలు చెక్కబడ్డాయి. రాణి ప్రగాఢ భగవద్భక్తి ఇలా అన్ని విషయాల్లోనూ వ్యక్తమై ఉండేదని గురుదేవుల (శ్రీరామకృష్ణుల) ముఖతా మేము విన్నాం.
4. ఆలయం గురించి దైవాదేశం
కాశీక్షేత్రానికి వెళ్ళి శ్రీ విశ్వనాథుని, అన్నపూర్ణాదేవిని సందర్శించి పూజించాలనే కోరిక ఆమెకు చాలాకాలంగా ఉంది. అందుకోసం ఆమె ఎంతో డబ్బు కూడ కేటాయించింది. కాని భర్త హఠాత్తుగా చనిపోవడంతో ఇంటి భారమంతా ఆమె మీద పడింది. దాంతో అప్పట్లో తన కోరిక తీర్చుకోలేకపోయింది. కాని రోజులు గడిచేకొద్దీ తన అల్లుళ్ళు ముఖ్యంగా మథురమోహన్ ఆమెకీ విషయంలో తోడ్పడడంతో 1847 లో కాశీ యాత్రకు సిద్ధమైంది. ఇక మరుసటి రోజు బయలుదేరవలసి ఉండగా ముందురోజు రాత్రి దేవి ఆమెకు కలలో దర్శనమిచ్చి “కాశీకి పోనవసరం లేదు. భాగీరథీతీరాన ఒక చక్కని ప్రదేశంలో నా శిలావిగ్రహాన్ని ప్రతిష్ఠించి, పూజతో పాటు అన్న నైవేద్యాలను ఏర్పాటు చెయ్యి, అదే చాలు. నే నా విగ్రహంలో అభివ్యక్తమై నిత్యం నీ సేవాదులు స్వీకరిస్తా” నని* ఆదేశించిందట! దాంతో ఆమె పరమానందభరితురాలై వెంటనే కాశీయాత్ర మానుకొని దేవీ ఆలయ నిర్మాణానికి సంకల్పించింది.
రాణీ రాస్మణి (1793 -1861) : దక్షిణేశ్వర కాళికాలయ నిర్మాత
మథురనాథ్ విశ్వాస్ (1817- 1871) : రాణీ రాస్మణి అల్లుడు, ఆమె జమీ నిర్వాహకుడు.
5. కాళికాలయ నిర్మాణం
ఈ విధంగా జగజ్జనని మీద ఎంతో కాలం నుంచి ఉన్న దైవభక్తి ఇప్పుడు కార్యరూపంలోకి వచ్చింది. గంగానదీ తీరంలో ఒక విశాలమైన స్థలం కొనుగోలుచేసి,* పెద్దమొత్తంలో ధనం వెచ్చించి తొమ్మిది గోపురాలతో కూడిన పెద్దఆలయం, చిన్న దేవాలయాలు, అలాగే ఒక చక్కని పూలతోట నిర్మాణానికి పనులు చేపట్టింది. కాని ఆ పని 1855 సం ॥ కి కూడ పూర్తికాలేదు. దాంతో ఆమె మనస్సులో, ‘జీవితం అనిశ్చితం. ఆలయ నిర్మాణానికి చాలాకాలం పడుతోంది. కనుక జగన్మాతను ప్రతిష్ఠించాలన్న తన కోరిక ఈ జన్మలో నెరవేరదేమోనని మదన పడింది’ కాని జగజ్జనని కృపతో ఆ ఏడాదే మే 31 వ తేదీ (జగన్నాథ స్నానయాత్ర పండుగరోజు) జగన్మాత ప్రతిష్ఠాపనోత్సవాన్ని ఘనంగా జరిపింది. అయితే అంతకు ముందు జరిగిన కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం అవసరం.
6. అన్న నైవేద్య సేవలో ఎదురైన సమస్య
జగన్మాత నుండి ఆదేశాన్ని పొందో లేక హృదయపూర్వక అభిలాషతోనో భక్తులు తమ ఇష్టదేవతను సర్వదా సేవించాలని కోరుకుంటారు. జగన్మాతకు అన్న నైవేద్యమివ్వాలనే కోరికతో రాణి హృదయం పరితపించింది. ‘ఇచ్ఛానుసారం ఆలయాల నిర్మాణం జరిగిపోయింది. సేవాదులు నిర్విఘ్నంగా జరపడానికి తగిన ఆస్తులు ఏర్పాటుచేశాను. ఇంతచేసి కూడ మనసారా జగన్మాతకు నిత్యం అన్న నైవేద్యాదులు సమర్పించుకోలేకపోతే అంతా వృథానే కదా’ అని అనుకుంది రాణీ రాస్మణి. “హే జగదంబా! సారహీనాలైన పేరుప్రతిష్ఠలనిచ్చి నా ఈ కోరికను వమ్ముచేయవద్దు. నువ్విక్కడ నిత్యం అభివ్యక్తమై, దయచేసి ఈ దాసి ప్రాణాభిలాషను ఈడేర్చు తల్లీ!” అని ప్రార్థించింది.
7. ఈ సమస్యపరంగా పండితుల ప్రతికూల అభిప్రాయాలు
దేవికి అన్న నైవేద్యాలర్పించాలనే ఆమె కోరికకు ముఖ్యమైన రెండు అంతరాయాలు: తన నిమ్నజాతి, శాస్త్ర నిషేధం అని రాణి గమనించింది. ఇలా అంతరాయాలు ఎదురైనా కూడ జగన్మాత తన అన్న నైవేద్యాన్ని స్వీకరించదనే సందేహం ఆమె హృదయంలో ఎప్పుడూ పొడసూపలేదు. ఆ ఆలోచన రావడమే తరువాయి ఆమె హృదయం ఆనందంతో నిండిపోవడం తప్ప ఏనాడూ సంకోచించేది కాదు. అలాంటప్పుడు ఈ విపరీత శాస్త్ర నిషేధం ఎందుకో? శాస్త్రకారులు హృదయరహితులా? లేదా స్వార్థప్రేరితులై జగన్మాత వద్ద కూడ అగ్రవర్ణాలకే అధికారాలుండాలనే వ్యవస్థను రూపొందించారా? ఒకవేళ తన అంతఃప్రేరణనే అనుసరించి వ్యాప్తిలోవున్న ఆచారానికి విరుద్ధంగా అన్న నైవేద్యాలర్పిద్దామా అంటే భక్తులైన బ్రాహ్మణులు, సజ్జనులు దేవాలయానికి వచ్చి ప్రసాదాన్ని స్వీకరించరు కదా! ఇక మార్గం? అలా భావించి దేవికి నిత్యం అన్ననైవేద్యాన్ని సమర్పించే వ్యవస్థ కోసం వివిధ ప్రాంతాల నుండి శాస్త్రకోవిదులైన పండితుల అభిప్రాయాలను సేకరించసాగింది రాణి. ఈ విషయంలో వారెవ్వరూ ఆమెను ప్రోత్సహించలేదు.
దక్షిణేశ్వరాలయ ఉద్యానవన రేఖా చిత్రం
గంగానదికి అభిముఖంగా కోలువుతీరి ఉన్న దక్షిణేశ్వరకాళికాలయ ఉద్యానం.ఎడమ నుంచి కుడికి: నహబత్, శ్రీరామకృష్ణుల గది, ద్వాదశ శివాలయాలు, కార్యాలయ భవనం, నహబత్.
8. రాంకుమార్ అభిప్రాయం
ఆ విధంగా ఆలయం, విగ్రహ నిర్మాణం పూర్తికావచ్చినా రాణి కోరిక మాత్రం నెరవేరే మార్గం కనబడలేదు. చిన్నాపెద్దా పండితులందరి నుండి లిఖీతపూర్వక శాస్త్రాభిప్రాయాలు తీసుకున్నా తన కోరిక నెరవేరే మార్గం కనిపించక ఆశ అడుగంటుతున్న సమయంలో ఒకరోజు ఝామాపుకూర్ చతుష్పాఠి (వేదపాఠశాల) నుండి ఒక లిఖీతాభిప్రాయం వచ్చింది. ఆలయం నిర్మించడానికి ముందు ఆలయ సంపదనంతా రాణి ఎవరో ఒక బ్రాహ్మణుడికి దానం చేయాలి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆలయంలో దేవిని ప్రతిష్ఠింపజేసి అన్న నైవేద్యాన్ని అర్పించే వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. అలా చేయగలిగితే శాస్త్ర నియమం పాటించినట్లవుతుంది. బ్రాహ్మణాది అగ్రవర్ణాలవారు దేవాలయంలో ప్రసాదం స్వీకరించినా వారికి దోషం అంటదు.
9. ఆలయ ప్రతిష్ఠాపనకు రాణి సంకల్పం
ఈ అభిప్రాయం చూడగానే రాణి హృదయంలో ఆశ మళ్ళీ చిగురించసాగింది. తన గురువు పేరుతో ఆలయ ప్రతిష్ఠాపన చేసి, ఆయన అనుమతితో భగవత్సేవాకార్యాలన్నీ సక్రమంగా నెరవేరడానికి తాను కార్యనిర్వాహకురాలి పదవిని వహించాలని రాణి సంకల్పించుకుంది. రాంకుమార్ భట్టాచార్యులు ఇచ్చిన లిఖీతాభిప్రాయాను సారం కార్యక్రమాన్ని కొనసాగించాలనే రాణి దృఢసంకల్పాన్ని గ్రహించి పండితులందరూ “ఆ విధంగా చేయడం సాంఘికాచారానికి విరుద్ధంగా ఉందని, అలా చేస్తే బ్రాహ్మణ సజ్జనులు ఆ స్థలంలో ప్రసాదాదులు స్వీకరించలే” రని పరోక్షంగా దుయ్యబట్ట సాగారు. కాని శాస్త్ర నిర్దేశాలకది విరుద్ధంగా ఉందని బాహాటంగా చెప్పే ధైర్యం వారెవరికీ లేకపోయింది.
10. రాంకుమార్ సర్వతోముఖత్వం
పై సంఘటనతో రాణి దృష్టి రాంకుమార్ భట్టాచార్యుని వైపుకు ఆకర్షించ బడిందని ఊహించవచ్చు. ఆలోచించి చూస్తే ఆ రోజులలో రాంకుమార్ అటువంటి అభిప్రాయాన్ని వెల్లడించడం సామాన్యమైన విషయం కాదు. సంఘనేతలైన బ్రాహ్మణ పండితుల మనస్సులు ఆ సమయంలో అత్యంత సంకుచిత వలయంలోనే తిరుగుతూవుండేవి. ఆ చక్రం నుంచి బయటకొచ్చి శాస్త్రనిర్దేశాలలో ఉదారభావాలను చూసి పరిస్థితులకు అనుగుణంగా వాటిని మలచి, రాసి ఇచ్చే సమర్థులు వారిలో ఏ కొద్దిమందో ఉన్నారు. ఇందుకు పర్యవసానంగా జనసామాన్యం ఈ సంకుచిత అభిప్రాయాలను త్రోసిరాజని తమ ఉద్దేశాలనే నెరవేర్చుకోవడం జరిగేది.
11. యోగ్యుడైన పూజారికోసం రాణి అన్వేషణ
రాంకుమార్‌తో రాణి సంబంధం అంతటితో ఆగిపోలేదు. తన కులగురువు యొక్క కుటుంబ సభ్యులపట్ల సముచిత గౌరవమర్యాదలు చూపినప్పటికీ తెలివైన రాణి, వారి శాస్త్ర అజ్ఞానాన్ని, వారి అభిప్రాయం మేరకు పూజాదులు నిర్వహింప తన అనర్హతను స్పష్టంగా అవగతం చేసుకొన్నది. కొత్తగా నిర్మించిన మందిరంలో పూజాసేవాది కార్యాలన్నింటినీ పండితులు, సదాచార సంపన్నులైన బ్రాహ్మణుల ద్వారానే కొనసాగించాలని నిశ్చయించుకుంది. అందుకు తగిన ఏర్పాట్లు ఆమె చేయసాగింది. ఇక్కడ కూడ ప్రచలితంగా ఉన్న సామాజికాచారం ఆమెకు అడ్డుగోడైంది. ఆ రోజులలో సద్వంశాలలో పుట్టి ఆచారనిష్ఠులైన బ్రాహ్మణులు శూద్రుల చేత ప్రతిష్ఠింపబడిన దేవాలయాలలోని దేవతలను పూజించే వారు కాదు. చివరికి నమస్కారం కూడ చేసేవారు కారు. అంతేకాక, రాణి కులగురువు వంశానికి చెందినటువంటి (అంటే శూద్రులపై యాజమాన్యం చేసే) బ్రాహ్మణులను సైతం పతితులుగా, శూద్రసమానులుగా భావించేవారు.
కాబట్టి రాణి దేవాలయంలో అర్చకత్వం నిర్వహింప, సదాచార సంపన్నులైన, బ్రాహ్మణులెవరూ అంగీకరించలేదు. కాని రాణి మాత్రం తన ఆశ కోల్పోక పూజారుల వేతనాన్ని, పారితోషికాదులను అధికంచేసి వారికై పలుచోట్ల అన్వేషించసాగింది.
12. మహేశ్‌చంద్ర ఛటోపాధ్యాయ పూజారులను సమకూర్చే బాధ్యత వహించడం
శ్రీరామకృష్ణుల వరుసకు సోదరియైన శ్రీమతి హేమాంగినీదేవి ఇల్లు కామార్పుకూర్కు సమీపంలోని ఉన్న సిహార్ గ్రామంలో ఉంది. అక్కడ చాలా మంది బ్రాహ్మణులుండేవారు. ఈ గ్రామానికి చెందిన మహేశ్‌చంద్ర ఛటోపాధ్యాయ అనే బ్రాహ్మణుడు ఆ కాలంలో రాణి వద్ద ఉద్యోగిగా పనిచేసేవాడు. రాణీ రాస్మణి దేవాలయానికి పూజారులను, వంటవారిని వెతికి సమకూర్చితే నాలుగు డబ్బులు తనకు లభించవచ్చని భావించో ఏమో, ఆ పనిని చేయడానికి అతడు ముందుకు వచ్చాడు. రాణిగారి దేవాలయంలో పనిచేయడం అనుచితం కాదనే సంగతి గ్రామంలోని బ్రాహ్మణులకు తెలుపడానికి మొట్టమొదట అతడు తన అన్న క్షేత్రనాథ్ను శ్రీశ్రీ రాధాగోవింద మందిరంలో పూజారిగా నియమించాడు. ఇలా తన కుటుంబానికే చెందిన ఒక వ్యక్తిని రాణి కొలువులో నియమించడం ద్వారా ఇతర బ్రాహ్మణులను తీసుకొచ్చే పని చాలావరకు సులభమైంది. కాని ఎంత ప్రయత్నించినా కాళికాలయంలో పూజ చేయడానికి యోగ్యుడైన పూజారి లభించక ఎంతో ఆదుర్దాపడ్డాడు.
13. పూజారి బాధ్యత వహించమని రాణి, రాంకుమార్‌ను కోరడం
రాంకుమార్ భట్టాచార్యతో మహేశ్‌కు చాలాకాలం నుండి పరిచయముంది. గ్రామ ఆచారం మేరకు వారి మధ్య ఒక విధమైన పరిచయం ఏర్పడి ఉంటుందని ఊహించవచ్చు. రాంకుమార్ ఆధ్యాత్మిక సాధకుడని, శక్తిమంత్ర దీక్షను స్వీకరించాడనే విషయం మహేశ్‌కు తెలియకుండా ఉండదు. అలాగే అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి కూడ మహేశ్‌కు కొంచెం తెలిసేవుంటుంది. కనుక కాళీ దేవాలయ పూజారికోసం వెతుకుతున్నప్పుడు అతడి దృష్టి రాంకుమార్ వైపు మళ్ళింది. కాని మరుక్షణమే అతడికి రాంకుమార్ శూద్రుల యజమాన్యాన్ని ఒప్పుకొనే బ్రాహ్మణుడు కాడనే విషయం తట్టింది. అతడు కలకత్తాకు వచ్చి దిగంబర్మిత్ర మొదలైన కొందరి ఇళ్ళల్లో పూజాదులు చేయడానికి సమ్మతించినా కైవర్తక (అగ్నికులక్షత్రియ) జాతిలో జన్మించిన రాణి దేవాలయంలో పూజ చేయడానికి ఒప్పుకుంటాడా? సందేహమే! ఆలయ ప్రతిష్ఠాపనోత్సవ దినం సమీపించింది. కాని యోగ్యుడైన పూజారి ఎవరూ కన్పించలేదు. అంతా ఆలోచించి కనీసం ఒక్కసారైనా ప్రయత్నించి చూడడం యుక్తమని భావించాడు మహేశ్. కాని ఈ విషయంలో స్వయంగా ముందుకుపోక, అతడు మొదట రాణి దగ్గరకు వెళ్ళి విషయాలన్నింటినీ వివరించి కనీసం ప్రతిష్ఠాపన దినోత్సవం రోజైనా వచ్చి పూజారి పదవి స్వీకరించి ప్రతిష్ఠాపనోత్సవ కార్యక్రమాలన్నింటినీ చక్కగా ముగించడానికి రాంకుమార్‌ను ఆహ్వానించవలసిందని ఆమెతో చెప్పాడు. రాంకుమార్ నుండి శాస్త్రాభిప్రాయాన్ని పొందినప్పటి నుండి అతడి యోగ్యతపట్ల ఎంతో గౌరవభావం రాణి మనస్సులో నెలకొంది. కనుక అతడిప్పుడు పూజారి పదవిని వహించే అవకాశం ఉండడం చూసి ఎంతో ఆనందించి, ఎంతో వినయంతో అతడికి ఇలా లేఖ వ్రాసింది: “మీరు వెలిబుచ్చిన శాస్త్రాభిప్రాయం మద్దతుతోనే జగన్మాతను ప్రతిష్ఠించడానికి నేను ముందడుగు వేస్తున్నాను. రానున్న స్నానయాత్ర పండుగ నాడు ఈ పుణ్యకార్యాన్ని నిర్వర్తింప సన్నాహాలన్నీ సిద్ధం చెయ్యడమైంది. రాధాగోవింద ఆలయానికి పూజారి లభించాడు. కానీ, కాళికామాత పూజారి పదవి వహించి ప్రతిష్ఠాపనోత్సవాన్ని నెరవేర్చడంలో నాకు సహాయం చేయడానికి యోగ్యుడైన బ్రాహ్మణుడు ఎవడూ ముందుకు రావడంలేదు. కనుక ఈ విషయంలో మీరే సత్వరం ఒక దారి చూపి నన్ను గట్టెక్కించాలి. మీరు పండితులు, శాస్త్రజ్ఞులు. కనుక యోగ్యతలేని వారిని పూజారులుగా నియమించకూడదనే విషయం మీకు చెప్పనక్కర్లేదు.”
రాణి వ్రాసిన ఆ అభ్యర్థన లేఖను తీసుకుని మహేశ్ స్వయంగా రాంకుమార్ వద్దకు వెళ్ళి పరిస్థితులను అతడికి ఎన్నోరీతుల నచ్చజెప్పి తగిన పూజారి దొరికే వరకు ఆ బాధ్యత నిర్వహించడానికి అతణ్ణి ఒప్పించాడు. భక్తితత్పరుడు, లోభరహితుడైన రాంకుమార్ జగన్మాత ప్రతిష్ఠాపనోత్సవం ఆగిపోరాదనే ఉద్దేశంతో మొదటిసారిగా దక్షిణేశ్వరానికి వచ్చాడు.* తర్వాత అతడు రాణి, మధురనాథ్లు వినయపూర్వకంగా బ్రతిమలాడడంతోనూ, యోగ్యుడైన పూజారి ఇంకా దొరకకపోవడం చూసీ జీవితాంతం అక్కడే ఉండిపోయాడు. ఈ ప్రపంచంలో ప్రతి కార్యం జగన్మాత ఇచ్ఛానుసారమే జరుగుతుంది. దేవీభక్తుడైన రాంకుమార్ తాను ఆలయ పూజారిని కావడం జగన్మాత ఇచ్ఛగా భావించి ఒప్పుకున్నాడేమో ఎవరు చెప్పగలరు?
14. జగన్మాత ప్రతిష్ఠాపన
ఇలా తలవని తలంపుగా రాంకుమార్‌ను పూజారిగా పొంది 1855 వ సంవత్సరం మే 31 వ తేదీ గురువారం స్నానయాత్ర పండుగ దినాన రాణీ రాస్మణి కొత్త ఆలయంలో జగన్మాత ప్రతిష్ఠాపనోత్సవాన్ని ఆనందోత్సాహంతో జరిపింది. ఆ సందర్భంగా అక్కడ “దీయతాం, భుజ్యతాం” (ఇవ్వండి, తినండి) అనే కేకలతో రాత్రి, పగలు ఎడతెరిపి లేకుండా ఆలయమంతా కోలాహలంతో వెల్లివిరిసింది. రాణీ రాస్మణి ఆ సమయంలో వేలాది రూపాయలు ఖర్చుపెట్టి అతిథులందర్నీ సమానంగా ఆదరించి ఆనందించిందని మేం విన్నాం. రాణిచే ఆహ్వానితులైన పలువురు వేదపండితులు, బ్రాహ్మణులు శాస్త్రాలు నేర్చుకోవడానికి నిలయాలుగా పేరొందిన కన్యకుబ్జ, వారణాసి, షిలెట్, చిట్టకాంగ్, ఒరిస్సా, నవద్వీప మొదలైన ప్రాంతాల నుండి దక్షిణేశ్వరానికి వేంచేశారు. ఆ రోజున వారిలో ప్రతి ఒక్కరూ పట్టువస్త్రం, ఉత్తరీయం, దక్షిణ రూపంగా ఒక బంగారు నాణెం పొందారు. దేవాలయ నిర్మాణానికి, ప్రతిష్ఠాపనోత్సవానికి 9 లక్షల రూపాయలు రాణి ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఆమె 2 లక్షల 26 వేల రూపాయలకు త్రైలోక్యనాథ్ ఠాకూర్ నుండి దినాజ్‌పూర్ జిల్లాలో ఠాకూర్ తాలుకాలోని శాల్బారీ పరగణా కొనుగోలుచేసి కాళికాలయాదుల పూజాసేవాదుల కోసం దానిని దానపత్రంగా వ్రాసి ఇచ్చింది.
15. ప్రతిష్ఠాపన రోజున శ్రీరామకృష్ణుల ప్రవర్తన
రాంకుమార్ భట్టాచార్య ఆ రోజు బియ్యం, పప్పు మొదలైన ఆహార పదార్థాలను ఆలయ భాండారం నుండి పుచ్చుకొని గంగానదీతీరాన స్వయంగా వంట చేసుకుని, దానిని తన ఇష్టదేవతకు నివేదించి తర్వాత ప్రసాదాన్ని ఆరగించాడని కొందరంటారు. కాని మాకు ఇది అసంభవంగా తోచింది. ఎందుకంటే అతడు దేవీ భక్తుడు. అంతేకాక, ఈ విషయాన్ని గురించి లిఖీతపూర్వకంగా శాస్త్రవిధానాన్ని అతడే స్వయంగా ఇచ్చాడు. అలాంటప్పుడు తానే దేవి కర్పించిన ప్రసాదాన్ని నిరాకరించి తన అభిప్రాయానికి, భక్తిశాస్త్రాలు నిర్దేశించిన మార్గానికి విరుద్ధమైన పనిని చేసివుంటాడని భావించడం ఎంతో అసమంజసం. శ్రీరామకృష్ణుల నుండి కూడ మేం అటువంటిదేమీ వినలేదు. కనుక పూజ ముగిసిన తరువాత జగన్మాత ప్రసాదాన్ని అతడు మహదానందంతో స్వీకరించాడనే మా అభిప్రాయం. శ్రీరామకృష్ణులు ఆ ఆనందోత్సవంలో హృదయపూర్వకంగా పాల్గొన్నారు. కాని భోజన విషయంలో మాత్రం తన నియమాన్ని ఆయన సడలించలేదు. ఆనాటి సాయంకాలం ఆయన సమీప బజారు నుండి మరమరాలు, బెల్లం కొనుక్కుని తిని ఝామాపుకూర్ బడికి నడిచివెళ్ళి రాత్రి అక్కడే విశ్రమించారు.
16. కాళికాలయ ప్రతిష్ఠాపన గురించి శ్రీరామకృష్ణుల అభివర్ణన
దక్షిణేశ్వరంలో రాణీ రాస్మణి కాళికాలయ నిర్మాణం గురించి గురుదేవులు స్వయంగా మా కెన్నో సందర్భాల్లో ఎన్నో విషయాలు చెబుతుండేవారు. “రాణీ రాస్మణి కాశీక్షేత్రానికి పోవడానికి ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకుంది. బయలుదేరడానికి ఒక మంచిరోజు కూడ నిర్ణయించుకుంది. ఆవశ్యకమైన వస్తు సంబారాలను తీసుకువెళ్ళడానికిగాను చిన్నాపెద్ద దాదాపు వంద పడవలు ఘాట్‌లో నిలిచిఉన్నాయి. కాని నిర్ణీత దినానికి ముందురోజు రాత్రి తీర్థయాత్రకు వెళ్ళవద్దనే దేవి ఆదేశం పొంది రాణి తన సంకల్పాన్ని విడిచిపెట్టింది. తర్వాత ఆమె ఆలయ నిర్మాణానికి అనువైన స్థలం కోసం ప్రయత్నించసాగింది” అని శ్రీరామకృష్ణులే ఇలా కొనసాగించారు.
“గంగానది పశ్చిమతీరం కాశీతో సమానం అనే నమ్మకంతో మొదట ఆమె బాలి, ఉత్తర పాడా మొదలైన పశ్చిమతీర గ్రామాలలో వెతకసాగింది. కాని స్థలం లభించలేదు! ఎంత ధనం కావలసినా ఇవ్వడానికి రాణి సిద్ధంగా ఉన్నా అక్కడి భూస్వాములు తమ స్థలాలను అమ్మడానికి అంగీకరించలేదు.* ఎందుకంటే తమ స్థలాల్లో ఇతరులు గంగానదిలో నిర్మించిన స్నానఘట్టాలకు వెళ్ళడం వారికి ఇష్టం లేదు. కనుక గత్యంతరంలేక గంగానదికి తూర్పు దిశన ఉన్న ఈ స్థలాన్నే రాణి కొనుగోలు చేయవలసి వచ్చింది.
“రాణి ఎన్నుకొన్న ఈ స్థలంలోని కొంతభాగం ఒక ఆంగ్లేయునికి చెందినది. మిగిలిన భాగంలో మహమ్మదీయుల శ్మశానం ఒకటి ఉండేది. అది మహమ్మదీయ ఫకీరుకు చెందినది. ఈ స్థలం తాబేలు వెన్ను వంటి ఆకారంలో ఉంది. తంత్రశాస్త్రాల ప్రకారం అటువంటి స్థలం శక్తిప్రతిష్ఠకు, దేవీసాధనలకు అత్యంత ప్రశస్తమైంది. కనుక భగవదేచ్ఛతోనే రాణి ఆ స్థలాన్ని కొనుగోలు చేసిందని భావించవచ్చు.”
మళ్ళీ అదే విషయం ప్రస్తావిస్తూ దేవీప్రతిష్ఠాపనను శాస్త్రాలు నిర్దేశించిన ఇతర ప్రశస్తదినాలలో చేయక విష్ణువుతో సంబంధించిన స్నానయాత్ర పండుగ రోజు రాణి చేయడానికి కారణం గురించి ఆయన అప్పుడప్పుడు చెప్పేవారు. “దేవీ విగ్రహాన్ని రూపొందించడానికి మొదలుపెట్టిన రోజు నుంచి రాణి కఠోర తపస్సు చేయసాగింది. త్రిసంధ్యలలో స్నానం, హవిష్యాన్నం, నేల మీద పరుండడం, సాధ్యమైనంత వరకు పూజ, జప, ధ్యానాదులు చేయసాగింది. ఆలయం, దేవీ విగ్రహం నిర్మాణాలు పూర్తయినా; ప్రతిష్ఠాపనోత్సవం కోసం మంచిరోజును నిర్ణయించడం నెమ్మదిగా జరుగుతూవచ్చింది. ఏ విధమైన ఆటంకమూ వాటిల్లకుండా ఉండడానికి దేవీవిగ్రహం ఒక పెట్టెలో భద్రపరచబడింది. కాని ఏదో ఒక కారణంగా విగ్రహం చెమర్చింది. స్వప్నంలో రాణికి దేవి ఆదేశమిచ్చింది: “ఎంతకాలం నన్నిలా కట్టివుంచుతావు? నాకు ఊపిరాడడం లేదు. వీలైనంత త్వరలో నన్ను ప్రతిష్ఠించు.” ఈ విధంగా దేవి ఆజ్ఞాపించడంతో దేవిని ప్రతిష్ఠించడానికి రాణి ఆందోళనపడింది. మంచి రోజు కోసం తాపత్రయపడింది. ఇలా స్నానయాత్ర, పూర్ణిమ దినానికి ముందు మరో శుభముహూర్తమేదీ లేకపోవడంతో ఆ రోజే దేవీ ప్రతిష్ఠాపన చేయడానికి ఆమె సంకల్పించింది.”
శ్రీరామకృష్ణులు పూజించిన దక్షిణేశ్వరంలో వెలసిన భవతారిణి కాళీ
ఈ విషయాలే కాకుండా దేవికి అన్న నైవేద్యాన్ని అర్పించడం కోసం మందిరాన్ని రాణి తన గురువుగారి పేరిట సంప్రోక్షించడం వంటి మరెన్నో సంగతులు గురుదేవుల ముఖతా మేం విన్నాం. హృదయ్రాం ముఖోపాధ్యాయ నుండి రెండు విషయాలను గురించి మాత్రమే విన్నాం. అవి: ఆలయ ప్రతిష్ఠాపనకు సంబంధించిన శాస్త్రీయవిధానాన్ని మాత్రమే రాంకుమార్ ఇచ్చాడనీ, రెండవది రాంకుమార్ తాను దేవి ఆలయంలో పూజారి బాధ్యతను స్వీకరించడం ధర్మ సమ్మతమే అనీ శ్రీరామకృష్ణులకు నచ్చచెప్పడానికిగాను ‘ధర్మపత్ర’ ను ఉపయోగించాడనీ!
దక్షిణేశ్వరంలోని కాళికాలయంలో చిరకాలం పూజారిగా ఉండే ఉద్దేశం రాంకుమార్ భట్టాచార్య మనస్సులో మొదట్లో లేదనే సంగతి మనం ఈ సమయంలో శ్రీరామకృష్ణుల ప్రవర్తన చూసి తెలుసుకోవచ్చు. కొంచెం ఆలోచించి చూస్తే సరళ హృదయుడైన రాంకుమార్ కూడ ఆ విషయాన్ని అప్పుడు అర్థం చేసుకోలేదని మనం గ్రహించగలం. దేవికి అన్ననైవేద్యం సమర్పించే విషయంలో శాస్త్రీయవిధానాన్ని ఇచ్చి, ప్రతిష్ఠాపన దినాన మాత్రం స్వయంగా వండిన అన్ననైవేద్యం దేవికి సమర్పించి, ఆ తర్వాత ఝామాపుకూర్కు తిరిగివెళ్ళిపోవాలనే అతడు భావించాడు. దేవికి అన్ననైవేద్యం నివేదించడంలో అతడికి ఎలాంటి సంకోచమూలేదని, తానెటువంటి తప్పుగానీ శాస్త్రవిరుద్ధమైన కార్యంగానీ చేస్తున్నాననే తలంపూ అతడిలో కలగలేదనే సంగతిని ఆ సమయంలో రాంకుమార్ తన చిన్నతమ్ముడితో మెలగిన విధానాన్నిబట్టి మనం సులభంగా గ్రహించవచ్చు.
ప్రతిష్ఠ జరిగిన మరుసటి ఉదయమే అన్ని విషయాలూ తెలుసుకోవడానికో లేదా ఇంకా మిగిలివున్న ప్రతిష్ఠాపన కార్యాలను చూడాలనో శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి వచ్చారు. కొంతసేపు అక్కడున్న తర్వాత అన్న ఆ రోజు ఇక ఝామాపుకూర్కు తిరిగి వచ్చే అవకాశం లేదని గ్రహించారు. కనుక ఆ రోజు అక్కడే ఉండిపొమ్మని అన్న ఎంత చెప్పినా వినక భోజన సమయానికల్లా ఆయన ఝామాపుకూర్కు తిరిగి వెళ్ళారు. దీని తర్వాత అయిదారు రోజుల వరకు వారు మళ్ళీ దక్షిణేశ్వరానికి వెళ్ళలేదు. ఆలయ ప్రతిష్ఠాపన కార్యాలన్నీ పూర్తిచేసుకుని అన్న యథాసమయంలో ఝామాపుకూర్ తిరిగివస్తాడని భావించి అక్కడే ఉండిపోయారు. కాని వారం రోజులు గడచినా అన్న, తిరిగి రాకపోవడంతో పరిపరి ఆలోచనలతో మనస్సు ఆందోళనపడింది. దాంతో ఉండబట్టలేక మళ్ళీ దక్షిణేశ్వరం వచ్చారు. రాణీ రాస్మణి ప్రోద్బలంతో జగజ్జనని పూజారిగా అక్కడే జీవనం గడపడానికి అన్న అంగీకరించాడనే వార్త శ్రీరామకృష్ణుల చెవిన పడింది. ఆయన మనస్సులో అప్పుడెన్నో ఆలోచనలు చెలరేగాయి. తమ తండ్రి శూద్రుల యాచకత్వాన్ని ఏనాడూ చేయలేదని, విచక్షణ లేకుండా అందరి నుండి దానాదులు గ్రహించేవారు కాదనే సంగతిని ఆయన అన్నకు జ్ఞప్తికి తెచ్చారు. అన్న పూజారి పదవిని స్వీకరించకుండా ఉండేందుకు ప్రయత్నించారు. అప్పుడు రాంకుమార్ తను చేసింది శాస్త్రయుక్తమేనని చెప్పడానికి ప్రయత్నించాడని వినికిడి. కాని ఎంత చెప్పినా అది శ్రీరామకృష్ణుల హృదయానికి హత్తుకోకపోవడంతో తుదకు ‘ధర్మపత్ర’* అనుష్ఠాపనపు సరళోపాయాన్ని అనుసరించారు. రాంకుమార్ పూజారి పదవి అంగీకరించి ఎటువంటి నిందిత కర్మా చేయలేదు, అది అందరికీ మంగళకరం అనే తీర్పు ధర్మపత్ర నుండి లభించిందని విన్నాం.
17. ఆహార విషయంలో గురుదేవుల కఠోర నియమం
ధర్మపత్ర నిర్ణయాన్ని స్వీకరించడంవల్ల ఆ విషయాన్ని గురించిన వ్యధ గురుదేవుల మనస్సు నుండి తొలగిపోయింది. కాని మరో చింత ఆవరించింది. పూజారి పదవిని అన్న స్వీకరించడంతో ఆయన స్థాపించిన పాఠశాల ఇప్పుడు మూత బడింది. ఇక తానక్కడ చేయగలిగినదేమిటి? అనే సంగతి ఆలోచిస్తూ ఆయన ఆ రోజు దక్షిణేశ్వరంలోనే ఉండిపోయారు. కాని అన్న ప్రేమగా ఎంత బ్రతిమలాడినా కూడ ఆలయంలో ప్రసాదం స్వీకరించడానికి మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. “ఇది దేవాలయం. ఆహారం గంగాజలంతో వండి జగజ్జననికి అర్పించబడింది. కనుక నువ్వు ప్రసాదం తీసుకోవడంలో దోషమేమీలేదు” అని రాంకుమార్ నచ్చజెప్ప చూశాడు. కాని అన్న మాటలను శ్రీరామకృష్ణులు పట్టించుకోలేదు. “అలా అయితే మందిరభాండారం నుంచి ఆహారపదార్థాలు తీసుకుని గంగాతీరాన పంచవటి కింద నువ్వే వండుకుని తిను. గంగాతీరంలోని వస్తువులన్నీ పవిత్రాలవుతాయని నువ్వు అంగీకరిస్తావు గదా?” అని రాంకుమార్ అన్నాడు. ఆహారాన్ని గురించి గురుదేవుల కఠోర నియమం ఇప్పుడు ఆయన గంగపట్ల గల భక్తి ముందు తల వంచుకోవలసి వచ్చింది. పండితుడైన రాంకుమార్ యుక్తితర్కాలచే చేయలేకపోయిన కార్యాన్ని గంగానదిపట్ల గల శ్రీరామకృష్ణులకున్న భక్తిప్రపత్తులు చేయగలిగాయి. అన్న చెప్పిన దానికి అంగీకరించి రోజూ స్వయంగా వండుకుని గురుదేవులు దక్షిణేశ్వరంలో ఉండసాగారు.
18. శ్రీరామకృష్ణుల గంగాభక్తి
జీవితాంతం శ్రీరామకృష్ణులకు గంగానదిపై ప్రగాఢ భక్తి ఉండేది. గంగా జలాన్ని ఆయన ‘బ్రహ్మవారి’ – “నిత్యశుద్ధ బ్రహ్మమే జీవుణ్ణి పవిత్రం చేయడానికి నీళ్ళరూపం దాల్చింది అని” చెబుతుండేవారు. “గంగాతీరాన నివసించేవారి మనస్సులు దేవతల మనస్సులలా అవుతాయి. వారిలో ఆధ్యాత్మికత సహజంగానే పెంపొందుతుంది. గంగానది పవిత్ర బాష్పకణాలతో నిండిన గాలి రెండు తీరాలలో ఎంతదూరం వీస్తుందో ఆ ప్రదేశమంతా పవిత్రమౌతుంది. అంతేకాదు. ఆ ప్రదేశవాసుల జీవితాలలో సదాచారం, భగవద్భక్తి, ఆధ్యాత్మికనిష్ఠ, దానశీలత, తపస్సు మొదలైన సద్గుణాలు గంగాదేవి అనుగ్రహంతో, కృపతో సహజంగానే అభివ్యక్తమవుతాయి” అని చెప్పేవారు. చాలాసేపు ప్రాపంచిక విషయాలు మాట్లాడి వచ్చిన వాడిని గానీ లేదా ప్రాపంచికుల సంసర్గం చేసి వచ్చిన వాడిని గానీ చూస్తే, ‘కొంచెం గంగాజలాన్ని తాగిరా’ అని గురుదేవులు అనేవారు. భగవద్భక్తిలేని ప్రాపంచికుడైనవాడు ఆలయంలో ఎక్కడైనా కూర్చుని ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ ఆ స్థలాన్ని కలుషితం చేస్తే ఆ చోట గంగాజలాన్ని చిలకరించేవారు. ఎవరైనా శౌచకర్మలకు గంగాజలాన్ని ఉపయోగిస్తే శ్రీరామకృష్ణులు ఎంతో బాధపడేవారు.
19. శ్రీరామకృష్ణులు స్వయంగా వండుకుని జీవించడం
మనోహరమైన గంగానదీ తీరం, పక్షుల కిలకిలారావాలతో కూడిన పంచవటి చుట్టూ రమణీయమైన ఉద్యానవనం, సువిశాల సుందర దేవాలయంలో పరమభక్తుడు, సాధకుడైన రాంకుమార్ నిర్వర్తిస్తున్న దేవీ పూజాదిసేవలు, ధార్మికుడైన పెద్దన్న పవిత్రప్రేమ, పరమభక్తురాలు దేవ ద్విజ భక్తి పరాయణురాలైన రాణీ రాస్మణి, ఆమె అల్లుడు మథుర్బాబుల శ్రద్ధాభక్తులు – వీటితో కూడిన దక్షిణేశ్వర కాళికాలయం త్వరలోనే శ్రీరామకృష్ణులకు రెండవ కామార్పుకూర్లా అగుపడసాగింది. మరికొంత కాలం వరకు ఆయన స్వయంగా వండుకుని భోజనం చేస్తూ ఆనందంగా గడపసాగారు. భవిష్యత్ కర్తవ్యాన్ని గురించి మొదట్లో ఆయనకున్న చింత ఇప్పుడు తొలగిపోయింది.
పైన తెలిపిన ఆహారవిషయంలో శ్రీరామకృష్ణులకున్న నియమం విని కొందరు ఇలా అనుకోవచ్చు: ‘అటువంటి సంకుచిత భావం సాధారణంగా మనవంటి వారిలో కనిపిస్తూ ఉంటుంది. శ్రీరామకృష్ణులలో కూడ ఆ సంకుచిత భావం ఉందని పేర్కొనడం ద్వారా ఈ విధమైన సంకుచితత్వం లేకపోతే ఆధ్యాత్మిక మార్గపు చరమలక్ష్యాన్ని చేరడం అసంభవం అని మాతో చెప్పదలిచారా? ఏమిటి?’
20. సంకుచితత్వం, ధార్మికనిష్ఠ – వీటి తారతమ్యం
అందుకు మా సమాధానం: “సంకుచితత్వం, ధార్మిక నిష్ఠ – ఈ రెండూ వేర్వేరు విషయాలు. సంకుచితత్వానికి మూలం అహంకారం. అది ఆవరించినప్పుడు మనిషి తానేది అర్థం చేసుకుంటాడో, తానేమి చేస్తుంటాడో అదే సర్వో త్తమమైనదనే భ్రమలోపడి తనచుట్టూ తానే ఒక పరిధిని గీసుకుని నిశ్చింతుడై దాన్లోనే ఉండిపోతాడు. కాని ధార్మికనిష్ఠ తద్విరుద్ధం. శాస్త్రాలు, మహాత్ములు నిర్దేశించినదాన్ని విశ్వసించడం ద్వారా ఈ నిష్ఠ కలుగుతుంది. తన హృదయంలో నిష్ఠ ఉదయించడం ద్వారా మనిషి తన అహంకారాన్ని నిర్మూలనం చేసి ఆధ్యాత్మిక జీవనంలో ముందడుగువేస్తూ పరమసత్యాన్ని సాక్షాత్కరించుకుంటాడు. క్రమంగా ఈ నిష్ఠ ప్రాధాన్యం వహించినప్పుడు మనిషి మొదట్లో కొంతకాలం దాకా సంకుచితుడిగానే కనిపిస్తాడు. కాని దాని సహాయంతో తన జీవనమార్గంలో క్రమక్రమంగా స్పష్టమైన వెలుగును గాంచుతాడు. తన సంకుచితత్వం దానంతట అదే అంతరించిపోతుంది. కనుక ఆధ్యాత్మిక ప్రగతి మార్గంలో ధార్మికనిష్ఠ అత్యంత ఆవశ్యకం అని గ్రహించాలి. పైన చెప్పినట్టు శ్రీరామకృష్ణుల జీవితంలో ఉన్నటువంటి ధార్మికనిష్ఠను చూసి మనం స్పష్టంగా అర్థం చేసుకోవలసిందేమిటంటే శాస్త్రాలు నిర్దేశిస్తున్న శాసనాలమీద ప్రగాఢ నిష్ఠావంతులమై మనం ఆధ్యాత్మిక సత్యాలను ప్రత్యక్షం చేసుకోవడానికి ఉత్సాహంతో ముందుకు వెళితే కాలక్రమంలో యథార్థమైన ఉదారతకు అధికారులమై పరమశాంతిని పొందగలం. అటువంటి నిష్ఠ మృగ్యమైనప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ముందంజ వేయలేం. శ్రీరామకృష్ణులు ఉపదేశించినట్లు ఒక ముల్లును ఇంకొక ముల్లుతో తీసెయ్యాలి. నిష్ఠను పాటించే మనం వాస్తవికమైన ఉదారత పొందగలం. నియమాలను, శాసనాలను అనుసరించడం ద్వారానే వాటికి అతీతమైన స్థితిని చేరగలం.”
శ్రీరామకృష్ణుల జీవిత యౌవనావస్థలో ఈ అసంపూర్ణతను గమనించి బహుశా కొందరిలా అనవచ్చు: “అయితే ఆయనను అవతార పురుషుడనడం ఎందుకు? మనిషి అంటే చాలదా? లేదా ఆయనను అవతారమూర్తిగా చేయాలనే అనుకుంటే ఆ అసంపూర్ణతను కప్పిపెట్టడమే మంచిది.” అందుకు మా సమాధానం: “సోదరా! దేవుడు మానవరూపాన్ని దాల్చి అవతరించడం సంభవమని కలలోనైనా మేం కూడ నమ్మలేని కాలం ఒకటి ఉండేది. కాని ఆయన అహేతుక కృప వల్ల అది సంభవమని మాకు వారు విశదపరిచినప్పుడు మానవ శరీరం ధరించినప్పుడు శారీరక దోషాలూ, మానసిక లోపాలూ వారు స్వీకరిస్తారన్న విషయాన్ని గ్రహించగలిగాం. ‘ఏదైనా మరో లోహంతో మిశ్రితం చేయకుండా వట్టి బంగారంతో ఆభరణాలు చేయడం కష్టం. అలాగే విశుద్ధ సత్వగుణంతో ఏ కొంతవరకైనా రజస్తమో గుణాలను కలపకపోతే మన శరీరాలను నిర్మించడం అసంభవం’ అని గురుదేవులు అంటుండేవారు.
“గురుదేవులు తమ జీవితంలోని అసంపూర్ణతలను మా నుంచి ఏనాడూ దాచు కోవడానికి ప్రయత్నించి ఎరుగరు. అయినా పదేపదే వారు మా కెన్నోసార్లు ఇలా చెప్పేవారు: ‘పూర్వయుగాలలో ఎవడు రాముడు, కృష్ణుడు, మొదలైన రూపాలలో అవతరించాడో అతడే ఇప్పుడు (తమ శరీరాన్ని చూపిస్తూ) ఈ ఒరలో అవతరించాడు. కాని ఈసారి, రాజు మారువేషం ధరించి నగర సంచారం చేసే రీతిలో గుప్తరూపంలో అవతరించాడు.’”