1. శ్రీరామకృష్ణుల బాల్యంలో భావపారవశ్యాలను తెలిపే ఇతర సంఘటనలు
పైన పేర్కొన్న సంఘటనలేకాక శ్రీరామకృష్ణులు తమ బాల్యంలో ఆధ్యాత్మిక భావ పారవశ్యాన్ని పొందుతుండేవారనే సంగతిని ఇతర ఘటన లెన్నో స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ వారి ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తాయి. సంఘటన 1 : శివుడు, దుర్గ మొదలైన దేవతల విగ్రహాలను ఓ కుమ్మరి చేస్తూ ఉన్నాడు. ఒకసారి శ్రీరామకృష్ణులు మిత్రులతో కలసి వాహ్యాళికై వెళుతూ అక్కడికి చేరుకున్నారు. కుమ్మరి చేసిన విగ్రహాలను కాసేపు చూసిన తర్వాత “అదేమిటి? దేవుడి కళ్ళు ఇలా ఉంటాయా? చూడు. ఈ విధంగా చేయాలి” అని చెప్పి ఎలా చేస్తే అపార కరుణ, అంతర్ముఖత్వం, ఆనందం, దివ్యశక్తి ఇవన్నీ ఒకేసారి కళ్ళలో ఉట్టిపడతాయో, విగ్రహాలు జీవంతో దైవత్వాన్ని ఎలా ప్రకటిస్తాయో శ్రీరామకృష్ణులు కుమ్మరికి చెప్పారు. విగ్రహాలు తయారుచేయడంలో ఎలాంటి శిక్షణా పొందకుండానే బాల గదాధర్ విషయాన్ని గ్రహించి బోధించడం చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. కాని కారణాన్ని మాత్రం కనుక్కోలేకపోయారు.
సంఘటన 2 : క్రీడాపరవశుడై స్నేహితులతో కలసి ఒకానొక దేవతను పూజించాలనే కోరికతో బాల గదాయ్ మట్టితో దేవతా విగ్రహాన్ని చేసేవాడు. లేదా కాన్వాస్ పైన ఎంతో అందంగా చిత్రించేవాడు. దాన్ని చూసినవారు ఇదెవరో నేర్పరి అయిన కుమ్మరో లేదా చిత్రకారుడో ఆ పని చేసివుండవచ్చని అనుకునేవారు.
సంఘటన 3 : మళ్ళీ అడిగేంత లోపలే గదాయ్ ఒకరికి ఓ విషయాన్ని అనుకోకుండా చెప్పి ఆ వ్యక్తి మనస్సును దీర్ఘకాలంగా వేధిస్తున్న సందేహాన్ని తీర్చేవాడు. దాంతో తన భవిష్యజ్జీవనాన్ని కొనసాగించే శక్తి, మార్గం అతడికి గోచరించేది. ఆశ్చర్యపరవశుడై తన ఇష్టదేవత కరుణించి బాల గదాయ్ రూపంలో తనకు ఆ మార్గాన్ని చూపినట్లు ఆ వ్యక్తి భావించేవాడు.
సంఘటన 4 : పండితులకు కొరకరానికొయ్యగా మారిన క్లిష్టశాస్త్రాంశాన్ని బాల గదాయ్ ఒక్క మాటతో పరిష్కరించి అందర్నీ విస్మయపరిచేవాడు.
2. శ్రీరామకృష్ణుల జీవితంలో జరిగిన సంఘటనలను ఆరు కోవలుగా వర్గీకరించవచ్చు
గురుదేవుల బాల్యంలో జరిగినవన్నీ, మేము విన్నటువంటి అద్భుత సంఘటనలన్నీ కూడ ఉన్నత భావభూములను అధిరోహించడం ద్వారా ప్రకటితమైన వారి దివ్యశక్తికి నిదర్శనమనడం సరికాదు. కొన్ని సంఘటనలు మాత్రమే ఈ విధంగా జరిగాయి. కాని తక్కినవాటిని మనం ఇదమిత్థంగా ఆరు కోవలుగా విభజించవచ్చు. అవి: 1. అసాధారణ జ్ఞాపకశక్తి, 2. విచక్షణ జ్ఞానం, 3. నిష్ఠ, పట్టుదల, 4. అపరిమిత ధైర్యసాహసాలు, 5. వినోదప్రియత్వం, 6. అపారప్రేమ, అనంత కరుణ.
పైన పేర్కొన్న ఈ ఆరు తరగతుల, సంఘటనలన్నింటి మూలంగా గురుదేవుల మనస్సులో అసాధారణ విశ్వాసం, పవిత్రత, నిస్వార్థం సమ్మిళితమై ఉండడం మనకు కనిపిస్తుంది. స్వాభావికంగానే ఆయన మనస్సు ఈ మూడింటితో రూపుదిద్దుకుంది. ఈ జగత్తులో సంభవించే క్రియ, ప్రతిక్రియల ద్వారా ఆయన మానస సరోవరంలో స్మృతి, బుద్ధి, పట్టుదల, సాహసం, వినోద ప్రియత్వం, ప్రేమ, కరుణ రసాలనే తరంగాలు ఉప్పొంగుతున్నాయా అని మనకు అనిపిస్తుంది. ఈ క్రింద ఇచ్చిన కొన్ని ఉదాహరణల ద్వారా పాఠకుడు, మేం చెప్పినదాన్ని అర్థం చేసుకోగలడు.
3. అద్భుత జ్ఞాపక శక్తికి ఒక దృష్టాంతం
ఒకసారి గ్రామంలో శ్రీరాముని లేదా శ్రీకృష్ణుని గురించిన నాటకం జరిగింది. ఇతరులతోపాటు గదాయ్ కూడ ఆ నాటకం చూశాడు. మరుసటి రోజు దాదాపు అందరూ నాటకంలోని పాటలను, పురాణకథ సన్నివేశాలను మరచిపోయి ఎప్పటిలాగే తమ తమ దైనందిన కార్యక్రమాల్లో మునిపోయారు. కాని బాల గదాధర్ మనస్సులో అవి ఉసిగొల్పిన ఆధ్యాత్మిక భావతరంగాలకు అంతులేదు. వాటినన్నింటిని మరోసారి స్మరించి ఆనందాన్ని అనుభవించాలనే ఆలోచనతో గదాయ్ స్నేహితులను దగ్గర్లోనేవున్న మామిడి తోటలోకి తీసుకుపోయి వారందరికీ ఒక్కో పాత్ర ఇచ్చి, ఆయా పాత్రలకు సంబంధించిన సంభాషణలను నేర్పించి, తాను స్వయంగా ప్రధానపాత్ర ధరించాడు. ఇక నాటకం మొదలైంది. ఇరుగుపొరుగు పొలాలలో పనిచేసుకొనే రైతులు, పిల్లలు వేస్తున్న నాటకాన్ని చూసి ముగ్ధులై ‘ఒక్కసారి మాత్రమే నాటకాన్ని చూసిన వీళ్ళంతా ఎలా నాటకంలోని సంభాషణలు, పాటలు నేర్చుకోగలిగారా?’ అని ప్రశ్నించుకున్నారు.
4. సడలని పట్టుదలకు ఒక ఉదాహరణ
ఉపనయనం జరుగుతున్న రోజు గదాధర్ తమ కుటుంబం, సమాజం అనుసరించే సంప్రదాయానికి విరుద్ధంగా ‘ధని’ అనే కమ్మరి స్త్రీని తన భిక్షామాతగా ఎన్నుకోవాలని పట్టుపట్టాడు. ఆమె ప్రేమ వాత్సల్యాలకు ముగ్ధులై ఆమె అంతరంగంలోని కోరికను తెలుసుకుని సామాజిక నిషేధాన్ని త్రోసి రాజని, నిమ్న జాతికి చెందిన ఆ స్త్రీ వండిన ఆహారాన్ని లాక్కొని తిన్నాడు. దాంతో ఆమె భయపడి అలా చేయవద్దని ఎంత వారించినా గదాయ్ పట్టించుకోలేదు.
5. అఖండ సాహసానికి ఒక ఉదాహరణ
ఒళ్ళంతా బూడిద పూసుకుని, జటలు కట్టిన శిరస్సుతో తిరిగే నాగా ఫకీరులను చూస్తే చాలు పట్టణాల, గ్రామాల పిల్లల గుండెలు దడదడ కొట్టు కుంటాయి. ఈ ఫకీరులు చిన్నపిల్లలను మాయం చేసి తీసుకుపోతారనీ, లేదా అవకాశం దొరికితే బలవంతంగా దూరప్రదేశాలకు ఎత్తుకుపోయి తమ బృందంలో చేర్చు కుంటారనీ ఓ వదంతి వంగదేశంలో ఉంది. కామార్పుకూర్కు దక్షిణంగా పూరీ జగన్నాథానికి పోయే దారి ఒకటుంది. సాధువులు, బాబాలు, ఫకీరులు, బైరాగులు ఎప్పుడూ ఈ దారినే నడుస్తుంటారు. వారు గ్రామంలో భిక్షమెత్తుకుని ఒకటి రెండు రోజులు అక్కడున్న ధర్మసత్రంలో విశ్రాంతి తీసుకుని మళ్ళీ తమ గమ్యానికి సాగిపోయేవారు. గదాయ్ మిత్రులు ఆ వదంతి విని భయపడి పారిపోయేవారు. కాని గదాధర్ మాత్రం భయపడేవాడు కాడు. ఫకీరుల గుంపును చూచిన తక్షణం అతడు వారితో కలిసి తన తీయని మాటలతో, సేవలతో వారిని ఇట్టే ఆకర్షించి వారి ఆచారవ్యవహారాలు గ్రహించడానికి వారితో ఎక్కువ సమయమే గడిపేవాడు. ఒక్కోరోజు దేవునికి నివేదించిన వారి అన్నాన్ని తిని ఇంటికి వచ్చి తల్లికంతా వివరించేవాడు. సాధువుల మీద ఉన్న ప్రీతితో వారిలా వేషం వేసుకోవాలనే కోరికతో ఒళ్ళంతా భస్మం పూసుకునేవాడు. తల్లిదండ్రులిచ్చిన కొత్త బట్టలను చింపి కౌపీనంగా, పైబట్టగా మార్చి వాటిని ధరించి తల్లి ముందు నిలబడేవాడు.
6. వినోదప్రియత్వానికి ఒక తార్కాణం
గ్రామంలో ఉండే నిమ్నజాతులకు చెందిన వారిలో చాలామందికి రామాయణం, మహాభారతం చదవడం వచ్చేది కాదు. వాటిని వినాలనే కోరిక కలిగినప్పుడు చదివి, అర్థం చెప్పగలిగే వారిని ఒకర్ని ఆశ్రయించేవారు. ఆ వ్యక్తి రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు, పొగత్రాగడానికి పొగాకుతో నింపిన ఒక కొత్త హుక్కా, కూర్చొని చదవడానికి ఒక మంచి ఆసనం లేదా ఒక కొత్త చాప భక్తి పూర్వకంగా అందించేవారు. ఈ మర్యాదలన్నీ చేయించుకున్న పిదప ఆ వ్యక్తి గర్వంతో, అహంకారంతో పొంగిపోయి ఎలా ఆసనాన్ని అలంకరిస్తాడో, అస్వాభావికమైన చేష్టలతో, ఏవగింపు కలిగించే స్వరవైఖరులతో పురాణ పఠనం చేస్తూతన గొప్పతనాన్ని వెలిబుచ్చడానికి పడే తాపత్రయాన్ని గదాయ్ సూక్ష్మంగా పరిశీలించేవాడు. పిదప గదాయ్ ఇతరుల ఎదుట మహాగంభీరంగా వాటినన్నిటినీ అనుకరించి హాస్యతరంగంలో ముంచెత్తేవాడు.
7. శ్రీరామకృష్ణుల స్వాభావిక మనో నిర్మాణం
శ్రీరామకృష్ణుల బాల్యావస్థలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే ఎటువంటి మనస్సుతో ఆయన సాధనలో అగ్రగణ్యులయ్యారో మనకు అవగతమవుతుంది. అటువంటి మనస్సు తాను సంకల్పించినదంతా చేసే తీరుతుందని, విన్నదానిని ఎప్పుడూ అది మరచిపోదని, గమ్యానికి వెళ్ళే మార్గంలో దేనిని ఆటంకం అని అర్థం చేసుకుంటుందో దానిని నిర్దాక్షిణ్యంగా విసిరిపారేస్తుందని మనకు అర్థం అవుతుంది. అలాంటి హృదయం భగవంతుని మీద, తన మీద, మనుష్యు లందరిలో నిహితంగా ఉన్న దివ్యత్వరింపై విశ్వాసాన్ని ఉంచి ప్రపంచంలోని కార్యాలన్నింటినీ నిర్వహిస్తుందని, అటువంటి హృదయంలో క్షుద్ర అపవిత్ర భావనలు ఉండడం అసంభవమని తెలుస్తుంది. లేశమైనా సంకీర్ణత్వం ఉన్నట్లుగా కనిపించిన భావాలన్నింటినీ త్రోసిరాజంటుందని, సర్వకాలాల్లోనూ, అన్ని విషయాల్లోనూ పవిత్రత, ప్రేమ, కారుణ్యం – ఇవే దాని వ్యవహారాన్ని నడపగలవని మనకు అర్థం కాగలదు. వీటితో పాటు మరొక్క సంగతి కూడ మనకు విదిత మవుతుంది. అదేమంటే తనలోగానీ లేదా ఇతరులలోగానీ ఏ భావమైనా సరే తన అసలు రూపాన్ని మారువేషంతో కప్పుకుని వచ్చి వారి మనోహృదయాన్ని ఎన్నటికీ మోసం చేయలేదు. గురుదేవుల అంతరంగం గురించి ఈ విషయం విశేషంగా జ్ఞాపకం పెట్టుకుని ముందుకు వెళ్ళినప్పుడే వారి సాధన జీవితపు అలౌకికత్వరిం మనకు చక్కగా అవగతమౌతుంది.
8. సాధనా జీవితంలో తొలి అభివ్యక్తీకరణ: పొట్టకూటి విద్య పట్ల ఏహ్యత-పార మార్థిక జీవనం పట్ల ప్రీతి
శ్రీరామకృష్ణుల జీవితంలో సాధనభావపు తొలి అభివ్యక్తీకరణ ఆయన కలకత్తాలో అన్న రాంకుమార్ సంస్కృత పాఠశాలలో ఉన్నప్పుడు మనకు కనిపిస్తుంది. ఒకరోజు రాంకుమార్ అతణ్ణి చదువుపై దృష్టిని కేంద్రీకరించమని మందలించి నప్పుడు “ఈ పొట్టకూటి విద్య నా కక్కర్లేదు. యథార్థ జ్ఞానాన్నిచ్చే విద్యనే నేను కోరుకొంటాను” అని శ్రీరామకృష్ణులు సమాధానమిచ్చారు. అప్పుడాయన వయస్సు పదిహేడేళ్ళు. ఆధ్యాత్మిక పరాయణుడైన రాంకుమార్ స్మృతి, జ్యోతిశ్శాస్త్రాలను చక్కగా నేర్చుకున్నవాడు. ఆయన ఝామపుకూర్లో దిగంబరమిత్ర అనే వారింటికి సమీపంలో సంస్కృత పాఠశాలను ప్రారంభించి విద్యార్థులకు పాఠాలు చెబుతుండేవాడు. అంతేకాకుండా దిగంబరమిత్ర, తదితర సంపన్నుల ఇళ్ళల్లో ప్రతిదినం దేవతార్చనలు నిర్వహించేవాడు. ఒకవైపు ఎక్కువ సమయం పిల్లలకు పాఠాలు చెప్పడంలోనే గడచిపోయినా ముందే ఒప్పుకున్నట్లు సంపన్నుల ఇళ్ళల్లో పూజాది కార్యక్రమాలు మాత్రం కష్టమైనా విడిచిపెట్టేవాడు కాడు. విద్యాదానం రూపంలో వచ్చే ఆదాయం తక్కువ కావడమే అందుకు కారణం. కొద్దిరోజులలోనే ఆ ఆదాయం కూడా తగ్గుతూ వచ్చింది. ఆ స్థితిలో భగవత్పూజాదికాల ద్వారా వచ్చే రాబడిని వదులుకుంటే ఎలా అని ఆలోచించి శ్రమకు ఓర్చుకుని రెండు కార్యాలు చేస్తే తప్ప లాభం లేదనుకున్నాడు. పరిపరి విధాల ఆలోచించిన తర్వాత ఆయన తన చిన్నతమ్ముణ్ణి తీసుకువచ్చి దేవతార్చన పని అతడికి అప్పగించి తానేమో బడి పనులకు అంకితమయ్యాడు.
9. ఝామపుకూర్ పాఠశాలలో శ్రీరామకృష్ణులు
గదాధర్ ఝామాపుకూర్కు వచ్చినప్పటి నుంచి తనకత్యంత ప్రియమైన దేవతార్చనని ఆనందంతో నిర్వర్తిస్తూ వచ్చాడు. పెద్దన్నను సేవిస్తూనే మరోవైపు ఒకింత పాఠాలు కూడా నేర్చుకున్నాడు. సద్గుణ సంపన్నుడు, ప్రియదర్శనుడైన గదాయ్ అచిర కాలంలోనే అందర్నీ ఆకర్షించి వారి ప్రేమాభిమానాలకు పాత్రుడయ్యాడు. కామార్పుకూరులో లాగే ఇక్కడ కూడ ఉన్నత కుటుంబాలకు చెందిన స్త్రీలు, గదాయ్ భగవద్భక్తికి, నిష్కాపట్యానికి, సరళవ్యవహారానికి ఆకర్షితులై కలసిమెలసి ఉండసాగారు. అతడికి చిన్నచిన్న పనులు పురమాయించేవారు, అతడి మృదుమధుర కంఠం నుండి భజనలు విని తృప్తిపడేవారు. కామార్పుకూరులో లాగే ఇక్కడ కూడ తన చుట్టూ సదా కొందరు భక్తులు పోగవుతూండడం చేత గదాయ్ చదువు సంధ్యలు అనుకున్న ప్రకారం సాగలేదు. ఈ విషయం గ్రహించి కూడ రాంకుమార్ తమ్ముణ్ణి వెంటనే ఏమీ అనలేకపోయాడు. ఎందుకంటే తన తల్లి ప్రేమనుంచి వేరుచేసి తనకు అనుకూలంగా ఉంటాడనే కారణంగా రాంకుమార్, ఝామాపుకూర్కు తమ్ముణ్ణి తీసుకొచ్చాడు. అప్పుడిక తన తమ్ముడి సద్గుణాలకు ఆకర్షితులైనవారు తమ తమ ఇళ్ళకు ప్రేమతో ఆహ్వానించి తీసుకుపోతుంటే రాంకుమార్ అతణ్ణి వెళ్ళవద్దని ఎలా ఒత్తిడి చేయగలడు? అసలు కుటుంబంలో దారిద్ర్యమే లేకపోతే అతణ్ణి ఇక్కడికి తీసుకువచ్చేవాడు కాడుగా! అలాగని తీసుకురాకపోయి ఉంటే గదాయ్ కామార్పుకూరులోనే ఉండి తల్లిప్రేమ పొందుతూ మరోవైపు విద్యాభ్యాసం కూడ కొనసాగించే వాడుగా? అందుకే కొంతకాలం వరకు రాంకుమార్ తన తమ్ముడు గదాయ్ని ఏమీ అనలేదు. కాని ఒకరోజు తన కర్తవ్యం తలచుకుని చదవడం ముఖ్యమని, గదాయ్ని చదువుపై మనస్సు లగ్నం చెయ్యమని మందలించాడు. ఎందుకంటే అమాయకంగా ఉంటూ ఎప్పుడూ మైమరచి ఉండే తన తమ్ముడు ఎప్పుడో అప్పుడు సంసారబంధంలోకి అడుగుపెట్టవలసివస్తుంది కదా! ఆనాడు ప్రాపంచిక స్థితిగతులు తెలుసుకోవడం ముఖ్యంగదా అనే ఆలోచనతో రాంకుమార్ అలా మందలించాడు.
10. గదాయ్ దృక్పథం గుర్తించలేని రాంకుమార్
స్వార్థంతో కూడిన సంసారపు చట్రంలో పడి కష్టాలు అనుభవించిన రాంకుమార్ తన తమ్ముడు గదాయ్ అసాధారణ మనస్తత్త్వాన్ని గ్రహించలేక పోయాడు. పిన్నవయస్సులోనే లోకంలోని మనుష్యుల వ్యవహారసరళి, జీవితచక్రాన్ని లాగించడానికి చేసే కఠోరపరిశ్రమ కారణాన్ని గ్రహించిన గదాయ్ – పేరుప్రతిష్ఠలు, భోగసుఖాలు, లాభాలు పొందడం వంటివన్నీ తుచ్ఛమని భావించాడు. అందుకే మానవ జీవితోద్దేశం భగవత్సాక్షాత్కారమే అని నిశ్చయించుని దానికే అధిక సమయం వెచ్చించడం మొదలుపెట్టాడు. గదాయ్ ఆలోచనలను రాంకుమార్ కలలో కూడ ఊహించలేదు. ఒకసారి “పొట్టకూటి కోసం పనికొచ్చే విద్య నేను అభ్యసించ” నని గదాయ్ చెప్పిన వాస్తవాన్ని గ్రహించలేకే రాంకుమార్ తమ్ముణ్ణి చదువుకోమని మందలించాడు. కాని అల్లంతలోనే రాంకుమార్ పశ్చాత్తాపపడి వందరెట్లు ఎక్కువగా గదాయ్పై ప్రేమ చూపించసాగారు. ఆ రోజు గదాయ్, అన్న రామకుమార్తో పొట్టకూటి విద్యపట్ల ఆసక్తి లేదని చెప్పడానికి ఎంతో ప్రయత్నించాడు. అయితే బాలుడి మాటలు ఎవరు వింటారు. ఎవరెన్ని చెప్పినా గదాయ్ మాత్రం భగవత్సాక్షాత్కారానికే మనస్సు లగ్నం చేశాడన్నది ఆయన ఆచరించిన కార్యాలను చూస్తే విశదమవుతుంది.
11. రాంకుమార్ సాంసారిక పరిస్థితులు
పై సంఘటన జరిగిన రెండు సంవత్సరాల కాలంలో శ్రీరామకృష్ణ, రాంకుమార్ల జీవిత చక్రంలో పెనుమార్పులు జరిగాయి. రాంకుమార్ ఆర్థికపరిస్థితి నానాటికీ దిగజారుతూ వచ్చింది. ఎంత ప్రయత్నించినా ఏపాటి ఉన్నతీ పొందలేక పోయాడు. బడిని మూసివేసి వేరే ఉద్యోగం చూసుకోవడం మంచి దేమోననుకున్నాడు. కాని ఏ నిర్ణయానికీ రాలేకపోయాడు. ఒక్కటి మాత్రం గ్రహించాడు. ఏదో ఒక ఉపాయం ఆలోచించకుండా ఉంటే కాలం గడిచేకొద్దీ చివరికి అప్పుల ఊబిలో కూరుకు పోవడం తప్పదనుకున్నాడు. పౌరోహిత్యం, పూజచేయడం, చదువు చెప్పడం మినహా మరో వృత్తంటూ ఏదీ నేర్చుకోలేకపోయిన రాంకుమార్కు ఈ వయస్సులో ఆదాయం పెంచుకొనే మరో వృత్తిని నేర్చుకొనే శక్తి, పట్టుదల ఉన్నాయా? ఒకవేళ అలా నేర్చుకొని మరింత ఆదాయానికి ప్రయత్నించినా, తన పూజాదికాలకు, దైనందిన ఇతర కర్మకలాపాలకు సమయం కేటాయించడం కుదిరేపని కాదు. కనుక రఘువీరుని మీదే భారం వేసి, ఆ ఆలోచనల నుండి మనస్సును తిప్పి, నిరాశతోనే ఇంతకాలం చేస్తున్న వృత్తినే కొనసాగించ సాగాడు. రాంకుమార్ భగవంతునిపట్ల అచంచల విశ్వాసం కలవాడు. అల్పసంతోషియైన అతడు- లౌకిక జీవితంలో చొరవతో చొచ్చుకుపోగల వ్యక్తి కాడని తేటతెల్లమౌతున్నది.
కాని భగవత్సంకల్పం వల్ల ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన రాంకుమార్ను అనిశ్చిత స్థితి నుండి, ఆందోళనల బారి నుండి విముక్తుణ్ణి చేసింది.