మథుర్ గతించాడు. కానీ దక్షిణేశ్వర కాళికాలయంలోని జీవన వాహిని మునుపటమాదిరే సాగిపోతోంది. రోజులు, నెలలు గడిచిపోయి 1872 వ సంవత్సరం ఫాల్గుణ మాసం అరుదెంచింది. శ్రీరామకృష్ణుల జీవితంలో ఆ సమయంలో ఒక గొప్ప విశేష సంఘటన జరిగింది. ఈ ప్రత్యేక సంఘటనకు దారితీసిన సంఘటనల పరంపరను అర్థం చేసుకోవడానికి జయరాంబాటీలోని శ్రీరామకృష్ణుల అత్తగారింటికి మన దృష్టిని ఇప్పుడు సారించాలి.
1. వివాహానంతరం మొట్టమొదటిసారి శ్రీరామకృష్ణులతో మాతృదేవి సమావేశం
భైరవీ బ్రాహ్మణి, హృదయ్లను తోడ్కొని 1867 వ సంవత్సరం శ్రీరామకృష్ణులు తమ స్వగ్రామమైన కామార్పుకూర్కు వెళ్ళినప్పుడు బంధుగణంలోని స్త్రీలు ఆయన భార్యను అక్కడకు రప్పించిన విషయం ఇంతకు మునుపే తెలిపాం. నిజానికి వివాహానంతరం మాతృదేవి* మొట్టమొదటిసారిగా భర్తనుచూడటం ఇప్పుడే. కలకత్తాలాంటి నగరాలలోని బాలికలను కామార్పుకూర్ వంటి గ్రామీణ ప్రాంత బాలికలతో పోల్చి చూసిన వ్యక్తికి ఒక్క విషయం సుస్పష్టమౌతుంది – నగర బాలికల మనశ్శరీరాలు, గ్రామీణ బాలికల కన్నా పిన్న వయస్సులోనే అభివృద్ధి చెంది ఉంటాయి. గ్రామాలలో పధ్నాలుగు, పదిహేను లేదా పదహారేళ్ళ వయస్సయినా బాలికల శరీరాలలో యౌవనారంభ లక్షణాలు అంతగా కనిపించవు. శరీరాల మాదిరే వారి మానసిక వికాసం కూడా ఆలస్యంగానే జరుగుతుంది. పంజరంలోని పక్షుల్లా పరిమిత పరిసరాలలో, చిన్న ఆవాసాలలోమాత్రమే పెరిగి పెద్దవారయ్యే గతి పట్టకపోవడమే గ్రామీణ బాలికల ఆరోగ్యాంశానికి బహుశా కారణం అయ్యుండవచ్చు. పరిశుద్ధమైన గాలిని పీల్చుకొంటూ, స్వేచ్ఛగా గ్రామాలలో తిరుగాడుతూ స్వాభావిక పరిసరాలలో వారు జీవిస్తారు.
2. అప్పటి మాతృదేవి మనోవైఖరి
కాబట్టి తన పధ్నాలుగవ ఏట భర్తను మాతృదేవి నిజానికి ప్రప్రథమంగా చూసి నప్పుడు ఆమెను పసిబాలిక అనే చెప్పాలి. వైవాహిక జీవిత మహత్తర ఆదర్శ కర్తవ్యాలను అవగతం చేసుకొనే శక్తి అప్పుడే ఆమెలో అంకురించసాగింది. దేహ స్పృహరహితులైన శ్రీరామకృష్ణుల దివ్యసాంగత్యంలో, నిస్వార్థ ప్రేమ రక్షణలో పవిత్ర హృదయురాలైన ఆ బాలిక, పరమానందాన్ని పొందగలిగింది. అప్పుడు తనలో జనించిన ఆ ఉల్లాసాన్ని గురించి కాలాంతరంలోశ్రీరామకృష్ణుల భక్తురాండ్రతో అనేక సందర్భాలలో ఆమె “ఆనందపూర్ణమైన ఒక పెద్ద కుంభం నా అంతరంగంలో ప్రతిష్ఠాపితమైనట్లు అప్పటినుండి నాకు అనుభూతమవుతూ ఉంది. వర్ణించనలవిగాని ఎడతెగని దివ్యానందంతో నా హృదయం పరిపూర్ణమై ఉండేది” అని చెప్పేది.
3. జయరాంబాటీలో ఆమె జీవితం
కొన్ని నెలలు కామార్పుకూర్లో గడిపిన తరువాత శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళారు. అనంత పరమానంద సంపత్తుకు అధికారిణి అయ్యానని భావిస్తూ ఆ బాలిక పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ దివ్యానంద భావన ఆమె ప్రవర్తనలో, మాటలో, పని తీరుతెన్నులలో ఒక మార్పును తీసుకువచ్చింది. కానీ జనసామాన్యం ఈ మార్పును గమనించారో లేదో చెప్పడం కష్టం. ఎందుకంటే ఆ అనుభూతి ఆమెలో చపలత్వాన్ని కాక శాంతస్వభావాన్ని అధికం చేసింది. దుడుకుదనాన్ని కాక ఆలోచనాపరత్వాన్ని ద్విగుణీకరించింది. స్వార్థాన్ని అణిచి నిస్వార్థురాలినిగా మార్చింది. వీటన్నిటికీ మించి తన అంతరంగంలోని అన్ని రకాల కోర్కెలనూ తొలగించివేసి, మానవాళియాతనల, దుఃఖాల పట్ల అనంత సానుభూతిని ఆమె అలవరచుకొంది. క్రమంగా ఆమె మూర్తీభవించిన కరుణా స్వరూపిణిగా పరిణమించింది. ఆ మానసికానంద ప్రభావంతో ఎడతెగని శారీరక కష్టాలు కూడా ఆమెకు ఇప్పుడు అప్రధానమైపోయాయి; పైగా ఇతరుల పట్ల తాను చూపుతున్న ఆదరాభిమానాలకు వారి నుండి ఎలాంటి ప్రతిఫలమూ లభించక పోయినా కూడా ఆమె కష్టపెట్టుకొనేది కాదు. ఆ విధంగా అతిస్వల్ప భౌతిక ఆవశ్యకాలతో సంతృప్తురాలై ఆమె తనలో తాను మగ్నురాలై పుట్టింట కాలం గడపసాగింది. భౌతికంగా ఆమె పుట్టింట ఉన్నప్పటికీ ఆమె మనస్సు మాత్రం దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల పాదపద్మాల వద్దే వసించసాగింది. పతిదేవుని చూడాలనే బలీయమైన కోరిక ఆమెలో అప్పుడప్పుడు చెలరేగుతున్నప్పటికీ ప్రయత్నపూర్వకంగా ఆ కోర్కెను అణచుకొని, ఓర్పు వహించింది. ప్రథమ సమావేశంలోనే తనను సాదరంతో ప్రేమించి ఆహ్వానించిన తన భర్త తనను మరచిపోరు, సముచిత సమయంలో తప్పకుండా తమ వద్దకు పిలుచుకొనిపోతారని ఆమె తలపోయసాగింది. ఆ రీతిలో రోజులు గడిచిపోసాగాయి. అంతరంగంలో ప్రగాఢ విశ్వాసంతో పతిసాన్నిధ్యాన్ని చేరుకొనే శుభ ముహూర్తం కోసం మాతృదేవి నిరీక్షించసాగింది.
4. ఆమె మనోవ్యథ – సంకల్పం
నాలుగు సంవత్సరాలు దీర్ఘంగా గడచిపోయాయి. కానీ ఆమె మనస్సులో ఆశ, అపేక్ష అనే ఉద్ధృత ప్రవాహం సరిసమానంగానే పారసాగింది. కానీ మనస్సు ఆమె శరీరం తీరులోనే నెలకొనలేదు. దినదినాభివృద్ధి గాంచుతూ 1872 వ సంవత్సరం పుష్య మాసానికి ఆమెను పద్ధెనిమిదేళ్ళ నవయౌవనవతిగా రూపొందించింది. భగవంతునిపోలిన భర్తను కలుసుకొన్న ఆ తొలి సమావేశంలో పొందిన పరమానందం జీవితంలోని దైనందిన సుఖదుఃఖాల నుండి దూరంగా ఆమెను ఎంతో ఊర్ధ్వస్థితిలో నిలిపి ఉంచింది; కానీ ప్రతికూలమైన, నిర్దయా పూరితమైన లోకం పోకడల చొరబాటు ఉండనే ఉంది కదా! గ్రామంలోని పురుషులు తమ ఉబుసుపోక కబుర్లలో తన భర్తను పిచ్చివాడని, ధరించిన వస్త్రాన్ని ఊడదీసి దిగంబరంగా ‘హరి, హరి’ అంటూ తిరుగుతున్నాడని వ్యాఖ్యానించసాగారు. సహ వయస్కులైన స్త్రీలు ‘పిచ్చివాడి పెళ్ళా’ మని వ్యంగ్యంగా సూచిస్తూ జాలిగొలిపే దృక్కులతో ఆమెను చూడసాగారు. వీటిని చూసి ఆమె నొచ్చుకున్నదే తప్ప ఏమీ మారుమాట్లాడలేదు. శ్రీరామకృష్ణుల ధ్యాసలోనే ఆమె మగ్నురాలై ఉన్నప్పటికీ, ఆమెలో సందేహాలు చోటు చేసుకున్నాయి. “ఆయన నేను గతంలో చూసిన అదే వ్యక్తి కారా? జనం చెప్పుకొంటూ ఉన్న మార్పు ఆయనలో కలిగిందా? విధివశాత్తు అలా నిజంగా జరిగివుంటే, నేను ఇక్కడ ఎంతమాత్రమూ ఉండరాదు. ఆయన ప్రక్కనే ఉండి, సేవించడం నా కర్తవ్యం కదా!” ఆమెలో ఇలాంటి భావాలు మెదలసాగాయి. దీర్ఘంగా యోచించి, స్వయంగా దక్షిణేశ్వరం వెళ్ళి నిజానిజాలు తెలుసుకొని, ఆ తరువాత పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చింది మాతృదేవి.
5. సంకల్ప కార్యాచరణ
శ్రీచైతన్యులు ఫాల్గుణ మాసం పౌర్ణమినాడు జన్మించారు. ఆనాడే ‘డోలా యాత్ర’ (శ్రీకృష్ణుని ఉయ్యాలలూగించే) పండుగ జరుపుకొంటారు. ఆ సందర్భంలో పావన గంగానదిలో స్నానమాచరించడానికి వంగదేశం మూలమూలల నుండి జనం తండోప తండాలుగా కలకత్తా నగరానికి ప్రతీ ఏటా వస్తారు. జయరాంబాటీలోని మాతృదేవి దూరపు బంధువులైన స్త్రీలు కొందరు ఆ సందర్భంలో కలకత్తాకు వెళ్ళాలని ఇంతకు మునుపే నిశ్చయించుకొన్నారు. మాతృదేవి వారి వద్దకు వెళ్ళి తాను కూడా గంగాస్నానం చేయాలనే ఆకాంక్షను వెలిబుచ్చింది. ఆమె తండ్రి అనుమతి లేకుండా ఆమెను తమతో తీసుకొనివెళ్ళడం భావ్యంకాదని ఆ స్త్రీలు మాతృదేవి తండ్రియైన రామచంద్ర ముఖోపాధ్యాయుని ఆ విషయం అడిగారు. తెలివైన ఆ తండ్రి తన కుమార్తె కలకత్తాకు ఎందుకిప్పుడు వెళ్ళగోరుతున్నదో వెంటనే గ్రహించాడు. స్వయంగా తానే ఆమెను కలకత్తాకు తోడ్కొని వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లూ చేయించాడు.
శ్రీశారదాదేవి జన్మస్థలం: జయరాంబాటి (1920 సం ॥ లో)
జయరాంబాటిలో మాతృమూర్తి శ్రీశారదాదేవికి అంకితమయిన ఆలయం (1923)
6. కాలినడకన తండ్రితో దక్షిణేశ్వరానికి
రైలుబళ్ళ పుణ్యమా అని సుదూరంలో ఉన్న కాశీ, బృందావనం వంటి స్థలాలు సైతం చేరుకోవడంలో పట్టే కాలవ్యవధి పరిగణనలో – కలకత్తాకు చేరువైనాయి. కానీ ఆనాడు శ్రీరామకృష్ణుల జన్మ స్థలమైన కామార్పుకూర్, మాతృదేవి జన్మస్థలమైన జయరాంబాటీ గ్రామాలు అంత అదృష్టానికి నోచుకోలేదు. అవి కలకత్తాకు ఎప్పటి మాదిరే అంతే దూరంలో ఉన్నాయి. ఇప్పటి* స్థితి కూడా అలాగే ఉన్నదంటే, ఆ నాటి స్థితి గురించి చెప్పనవసరం లేదు. ఆ రోజుల్లో విష్ణుపూర్ మీదుగా గాని లేదా తారకేశ్వర్ మీదుగా గాని రైలు మార్గం వేయబడలేదు. అలాగే కలకత్తా – ఘటాల్ నడుమ పడవ ప్రయాణ సౌకర్యమూ లేదు. కాబట్టి ఆ గ్రామాల ప్రజలు పల్లకీలలోనో లేదా కాలినడకనో పయనించడం తప్ప మరో గత్యంతరం లేదు. జమీందార్లు, సంపన్నులు తప్ప మిగిలిన జనసామాన్యానికి కాలినడకే గతి.
అనుక కుమార్తెను, ఇతర స్త్రీలను తోడ్కొని రామచంద్ర ముఖోపాధ్యాయ కాలినడకన ఆ దీర్ఘప్రయాణం సాగించాడు. కన్నల పండువ గొల్పుతున్న వరిపొలాలను ఒక్కొక్కటి దాటుకొంటూ, తామరపువ్వులతో నిండి మనోజ్ఞంగా ఉన్న తటాకాలను చూస్తూ, రావి, మఱ్ఱి లాంటి విశాల వృక్షాల నీడలలో విశ్రమిస్తూ ఆ బృందం నడిచిపోసాగింది. మొదటి రెండు మూడు రోజులు ఆనందంగా గడిచిపోయాయి. కానీ గమ్యస్థానం దాకా ఆ ఆనందం కొనసాగలేదు. సుదీర్ఘ ప్రయాణాల అలుపునకు అలవాటుపడని మాతృదేవి మార్గమధ్యంలో ఒకచోట తీవ్ర జ్వరపీడితురాలైంది. తండ్రి రామచంద్రుడు ఎంతో కలతచెందాడు. కుమార్తె అటువంటి ఆందోళనకర పరిస్థితిలో ఉండటంతో ముందుకు పయనించడం ఇక అసంభవమని గ్రహించి రామచంద్రుడు అక్కడకు సమీపంలో ఉన్న ఒక చిన్న సత్రం వద్ద ఆగి, అక్కడ బసచేశాడు.
7. జ్వరపీడితురాలైన మాతృదేవికి కలిగిన అద్భుత దర్శనం
ప్రయాణం మధ్యలో అలా జ్వరపీడితురాలు కావడం మాతృదేవికి ఎంత హృదయా వేదనను కలిగించిందో చెప్పనలవి కాదు. కాని ఆ స్థితిలో కలిగిన ఒక అద్భుత దర్శనం ఆమెను ఎంతో ఊరడించింది. ఆ దర్శనం గురించి కొన్ని సందర్భాలలో ఆమె తన భక్తురాండ్రకు ఇలా వర్ణించి చెప్పేవారు: “తీవ్ర జ్వరంతో అప్పుడు ఒళ్ళు తెలియక పడివున్నాను. ఒంటి మీది దుస్తులు అస్తవ్యస్తంగా ఉండడంకూడా నాకు తెలియలేదు. అప్పుడు ఒక బాలిక వచ్చి నా పక్కన కూర్చోవడం నేను చూశాను. ఆమె మేని ఛాయ కారు నలుపు. కాని అంతటి సౌందర్యవతిని నేను ఎన్నడూ చూసింది లేదు. ఆమె నా పక్కన కూర్చుని తన చేతులతో సుతిమెత్తగా నా తలను, శరీరాన్ని నిమరసాగింది. ఆమె చేతులు ఎంత మృదువుగా, చల్లగా ఉన్నాయంటే, నా శరీర ఉష్ణోగ్రత, మంటలు తగ్గిపోసాగాయి. ఆమెను ఆప్యాయంగా, ‘నువ్వు ఎక్కడనుండి వస్తున్నావు?’ అని అడిగాను.
‘దక్షిణేశ్వరం నుండి’ అని జవాబిచ్చిందామె. ఆ జవాబుకు నివ్వెరబోయి, ‘దక్షిణేశ్వరం నుండా! నేను వారిని (శ్రీరామకృష్ణులను) చూడాలని, వారికి సేవ చేయాలని దక్షిణేశ్వరానికే వెళుతున్నాను. కాని దారి మధ్యలో ఈ జ్వరం రావడంతో నాకు భాగ్యం దక్కలేదు’ అన్నాను నేను. ‘ఎందుకు దక్కదు? నువ్వు తప్పక దక్షిణేశ్వరం వెళ్ళగలవు. జ్వరం తగ్గిపోగానే అక్కడకు వెళ్ళి వారిని చూడగలవు. నీ కోసమే కదా నేను వారిని అక్కడ ఆపివుంచాను’ అన్నదామె. ‘అవునా! మాకు నువ్వు బంధువువా, చెప్పు’ అన్నాను నేను. ‘నేను నీ సోదరిని’ అన్నదామె. ‘నిజమా! అందుకే నువ్వు ఇలా వచ్చావు’ అన్నాను నేను. ఇలా ఆమెతో మాట్లాడుతూ నేను నిద్రలోకి జారుకొన్నాను” అని ఆ అద్భుత దర్శనాన్ని మాతృదేవి వివరించేవారు.
8. మాతృదేవి దక్షిణేశ్వర ఆగమనం: శ్రీరామకృష్ణుల ప్రవర్తన
రామచంద్ర తెల్లవారి లేవగానే కుమార్తె జ్వరం తగ్గిపోయి ఉండడం చూశాడు. నిస్సహాయ స్థితిలో అలా మార్గమధ్యంలో పడివుండడం కన్నా ఆమెను తోడ్కొని నెమ్మదిగా ప్రయాణం చేయటమే సబబుగా తోచింది అతడికి. గతరాత్రి కలిగిన అద్భుత దర్శనంతో ఉత్తేజితురాలైన మాతృదేవి తండ్రి యోచనను ఆమోదించింది. వాళ్ళు కాస్త దూరం కాలినడకన వెళ్ళారో లేదో ఒక పల్లకీ దొరికింది. మాతృదేవికి మళ్ళీ జ్వరం వచ్చింది. కాని గతరాత్రిలా జ్వరం తీవ్రం కాకపోవడంతో ఆమె ఆ పరిస్థితిని సంబాళించుకోగలిగింది. దీన్ని గురించి ఆమె ఎవరితోనూ ప్రస్తావించలేదు. క్రమంగా వాళ్ళు గమ్యం చేరుకున్నారు. రాత్రి తొమ్మిది గంటలకు మాతృదేవి దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల వద్దకు చేరుకొన్నది.
9. ఆనందభరితురాలైన మాతృదేవి
జ్వరంతో అలా బాధపడుతూ వచ్చిన ఆమెను చూసి శ్రీరామకృష్ణులు కలత చెందారు. బయటి చలి కారణంగా ఆమె జ్వరం ప్రకోపిస్తుందని ఎంచి, శ్రీరామకృష్ణులు, ఆమెకు తమ గదిలోనే ప్రత్యేకంగా పడక ఏర్పాటు చేయించారు. తరువాత ఆయన నిట్టూరుస్తూ “చివరకు నువ్వు వచ్చేశావు. అయ్యో, నా మథుర్ ఇప్పుడు లేకపోయాడే! అతడు ఉండివుంటే నీకు ఎన్ని సౌకర్యాలు చేయించి ఉండేవాడో కదా!” అని అన్నారు. అయినప్పటికి పథ్యపానాదులకు, మందులకు చక్కని ఏర్పాట్లు చేయబడటంతో మాతృదేవి మూడు నాలుగు రోజులలోనే బాగా కోలుకోగలిగింది. శ్రీరామకృష్ణులు ఆమెను తమ గదిలోనే ఉంచుకొని ప్రతి విషయం స్వయంగా తామే చూసుకొన్నారు. ఆ తరువాత నహబత్లో ఉంటున్న తమ తల్లితో కలిసి ఆమె వసించడానికి ఆయన ఏర్పాటు చేశారు.
వదంతుల మూలంగా పుట్టిన చింతలన్నీ తొలగిపోయాయి. తన విశ్వాసాన్ని క్రమ్ముకు వస్తున్న సందేహమనే దుమ్మూధూళి ఇప్పుడు నలువంకలా చెల్లాచెదరై అదృశ్యమైంది. శ్రీరామకృష్ణులు పూర్వం ఎలా ఉన్నారో ఇప్పుడూ అట్లే ఉండివుంటారన్న ఆమె విశ్వాసాన్ని, ఆయన ఆమె పట్ల తీసుకుంటున్న శ్రద్ధ, కనబరుస్తున్న ప్రేమలు రూఢి చేశాయి. విచక్షణ రహితంగా లోకులే ఈ వదంతులు ప్రచారం చేశారని ఆమె గ్రహించింది. తన ‘ప్రభువు’ మునుపు తాను చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారని నిర్థారించుకొంది. ఆమెను మరచిపోక పోవడమే కాదు, మునుపటిలా ఆమె పట్ల కృపాళువై కూడా ఉన్నారు. కనుక ప్రస్తుత తన కర్తవ్యాన్ని ఆమె నిర్ణయించుకొంది. ఆనందంతో నహబత్లో ఆమె వసిస్తూ శ్రీరామకృష్ణులకు, ఆయన తల్లికి సేవలందించడంలో నిమగ్నురాలైపోయింది. కుమార్తె సంతోషంగా ఉండడంతో ఆమె తండ్రి ఆనందభరితుడై కొన్ని రోజులు అక్కడ గడిపి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు.
10. స్వీయ బ్రహ్మజ్ఞానాన్ని శ్రీరామకృష్ణులు పరీక్షించుకోవడం
1867 వ సం ॥ లో శ్రీరామకృష్ణులు కామార్పుకూర్లో ఉన్నప్పుడు మాతృదేవిని అక్కడకు తోడ్కొని రాగా అప్పుడు ఆయనలో జనించిన ఆలోచనా సరళిని గురించి పాఠకులకు తెలిపే ఉన్నాం. బ్రహ్మజ్ఞానికి దేహచైతన్యం మీద ఆధారపడిన స్త్రీ పురుష విభేదం ఉండదన్న తోతాపురి మాటలు అప్పుడు ఆయనకు జ్ఞాపకానికి వచ్చాయి. స్వీయ జ్ఞాన పరీక్షకు, తమ భార్య పట్ల నిర్వర్తించవలసిన కర్తవ్య నిర్వహణకు ఆ పరిస్థితిని వినియోగింప సన్నద్ధులయ్యారు. ఆ రెండు లక్ష్యాలను సాధింప కార్యారంభులు కాగానే కలకత్తాకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు ఆమె తన ప్రక్కనే ఉండడంతో ఆ లక్ష్య సాధనకు ఉద్యుక్తులయ్యారు.
11. మాతృదేవి రాకకు ముందే ఎందుకు పరీక్షించుకోలేదు
భార్యను దక్షిణేశ్వరానికి రావింపక మునుపే తమ జ్ఞానాన్ని పరీక్షించుకొని ఉండవచ్చు కదా, అలా ఎందుకు చెయ్యలేదు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. సాధారణ వ్యక్తి నిస్సందేహంగా అలాగే చేసివుండేవాడని అందుకు జవాబు చెప్పవచ్చు. కాని శ్రీరామకృష్ణులు సాధారణ వ్యక్తుల కోవకు చెందరు. కనుక ఆయన విభిన్నంగా వర్తించారు. సదా సర్వవేళలా సంపూర్ణంగా భగవంతుని మీదే ఆధారపడుతూ ప్రతి పనీ చేసేవారు. తాము చేయనెంచిన వాటిని ఒక పథకం వేసుకొని చేయరు. స్వకీయ శ్రేయస్సును కోరిగాని లేదా పరుల శ్రేయస్సుకోసం గాని మనలాంటి వారి అల్ప పరిమిత బుద్ధిబల సహాయాన్ని అపేక్షించక, వారు సహాయ మార్గదర్శికత్వాలకై పరమాత్ముని విరాట్ బుద్ధిని అపేక్షిస్తారు. కాబట్టే చొరవచేసుకొని పరీక్షించుకోడానికి వారెప్పుడూ పరాఙ్ముఖులుగానే ఉండిపోతారు. వారు భగవదిచ్ఛానుసారం వర్తిస్తూపోతారు. తమ ప్రమేయం లేకుండానే పరీక్షా సమయం ఆసన్నమైనప్పుడు, వారు ఆ పరీక్షకు సంతోషంగా లోనవుతారు. శ్రీరామకృష్ణులు తమ సంకల్పం మేరకు స్వీయ దివ్యజ్ఞానాన్ని పరీక్షింప తాను సిద్ధపడలేదు. కాని సతీమణి కామార్పుకూర్లో తమ వద్దకు వచ్చినప్పుడు ఆమె పట్ల తమకున్న కర్తవ్యం నిర్వహించాలంటే తాము ఆ పరీక్షకు నిలబడాలనీ, తరువాత మాత్రమే తమ జ్ఞాన పరీక్షకు పూనుకోవడానికి సంసిద్ధులవాలనీ గ్రహించారు. మళ్ళీ, భగవత్సంకల్పం మేరకు పరిస్థితిలో మార్పువచ్చి తాము సతీమణి నుండి దూరంగా కలకత్తాకు తిరిగి వెళ్ళిపోయి జీవించవలసి వచ్చినప్పుడు ఆయన తనంత తానుగా ఆమెను తమ వద్దకు రప్పించుకోగోరలేదు. మాతృదేవి తానుగా దక్షిణేశ్వరానికి రానంత కాలం ఆమెను రప్పించుకోవాలనే స్వల్ప ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. మాతృదేవి పట్ల శ్రీరామకృష్ణుల ప్రవర్తన దశలలోని ఈ న్యాయాన్యాయాలను మనం ఈ విధంగా మన సామాన్య బుద్ధితో కనుగొనగలం. అయినా మరొక విషయం మనం స్పష్టంగా గ్రహించాలి – తాము అలా ఆచరించడమే భగవత్సంకల్పంగా ఆయన తమ యోగదృష్టితో గ్రహించగలిగారు.
12. మాతృదేవి పట్ల ఆయన బోధన విధానం
ఇప్పుడు తమ సతీమణి పట్ల తమ కర్తవ్య నిర్వహణను ఒనరుస్తూ పరీక్షకు లోను కావలసిన సమయం మళ్ళీ ఆసన్నమైనదని గ్రహించిన శ్రీరామకృష్ణులు, అందుకు సంసిద్ధులయ్యారు. అవకాశం లభించినప్పుడల్లా మాతృదేవికి మానవజీవిత లక్ష్యం, కర్తవ్యాలను గురించి క్షుణ్ణంగా బోధిస్తూవచ్చారు. ఈ కాలంలో ఆయన మాతృదేవికి ఇలా “చందమామ పిల్లలందరికీ మామ అయినట్లుగానే భగవంతుడు ఎల్లరికీ ఆత్మబంధువు. ఆయన్ను ప్రార్థించే హక్కు అందరికీ ఉంది; హృదయపూర్వకంగా ప్రార్థించే వారికి ఆయన దర్శనమిచ్చి తరింప చేస్తాడు. నువ్వు కూడా ఆయనను ప్రార్థిస్తే, ఆయన దర్శనం పొందగలవు” అని చెప్పినట్లు తెలియవస్తోంది. శ్రీరామకృష్ణుల బోధన కేవలం ఉపదేశాలతో కూడుకొన్నది మాత్రమే కాదు. శిష్యుని తమ చెంత ఉంచుకొని, ప్రేమ వాత్సల్యాదులతో అన్ని విధాల అతణ్ణి తన సొంతమనిషిగా చేసుకొని, పిదప ఉపదేశించేవారు. అంతటితో ఆగిపోరు. శిష్యుడు ఉపదేశాలను సక్రమంగా ఎంతవరకు ఆచరణలో పెట్టాడో ఒక కంట కనిపెడుతూ ఉంటారు. శిష్యుడు పొరపాటున తమ ఉపదేశాలకు విరుద్ధంగా వెళితే, అతడి తప్పిదాన్ని చూపి, సవరించేవారు. మాతృదేవి విషయంలో కూడా అదే విధానాన్ని పాటించారు. మొట్టమొదటి రోజునుండే ప్రేమ ద్వారా ఆమెను ఎంతవరకు తమ సొంత దానినిగా చేసుకొన్నారనే సంగతి ఆమె దక్షిణేశ్వరం రాగానే ఆమెకు తమ గదిలో పడక ఏర్పాటు చేయడం, ఆమె జ్వరం నుండి కోలుకొన్నాక ప్రతీ రోజు రాత్రి తన పక్కనే పడుకోవడానికి ఆమెకు అనుమతి ఇవ్వడం ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు. మాతృదేవి పట్ల శ్రీరామకృష్ణుల పవిత్ర, కచ్చితమైన ఆనాటి వర్తనం గురించి పాఠకులకు మేం మరోచోట* తెలిపివున్నాం. కనుక ఇక్కడ దాన్ని మళ్ళీ చెప్పడం అనవసరం. అక్కడ ప్రస్తావించిన విషయాలకు ఒకటి రెండు ముక్కలు ఇక్కడ జోడిస్తున్నాం.
13. మాతృదేవిని ఏ దృష్టితో శ్రీరామకృష్ణులు చూసేవారు?
ఈ సమయంలో ఒక రోజు శ్రీరామకృష్ణుల పాదాలు ఒత్తుతూ మాతృదేవి, “మీరు నన్ను ఏ దృష్టితో చూస్తారు?” అని అడిగింది. అందుకు ఆయన, “ఏ జనని ఆలయంలో ఆవిర్భవించి ఉన్నదో, ఏ జనని ఈ శరీరానికి జన్మనిచ్చి ప్రస్తుతం నహబత్లో వసిస్తూ ఉన్నదో, అదే జనని ఇప్పుడు నా కాళ్ళు ఒత్తుతూ ఉన్నది. నిజానికి నిన్ను సర్వదా ఆనందమయ స్వరూపిణియైన సాక్షాత్తూ జగజ్జనని అవతారంగా చూస్తూ ఉంటాను” అని జవాబిచ్చారు.
14. తన ఆత్మ సంయమాన్ని శ్రీరామకృష్ణులు పరీక్ష చేసుకోవడం
మరో సందర్భంలో, మాతృదేవి తమ పక్కన నిద్రిస్తూ ఉండడం చూసి శ్రీరామకృష్ణులు తమ మనస్సును సంబోధిస్తూ ఇలా వివేచింపసాగారు: “ఓ మనసా, ఇదొక స్త్రీ శరీరం. లోకులు దీన్ని గొప్ప భోగవస్తువుగా ఎంచుతారు, దీన్ని అనుభవించడానికి పడిగాపులు కాస్తారు. కాని దానికోసం పోతే, దేహచైతన్య భావంలోనే పాతుకుపోతారు. దాన్ని దాటిపోయి సచ్చిదానంద ఘనుడైన పరమాత్మను అనుభూతి చేసుకోలేరు. ఓ మనసా! లోపల ఒక భావనకు ఆశ్రయం ఇచ్చి, బయట తద్విరుద్ధ వైఖరిని ప్రకటించకు. నిజం చెప్పు, నీకు ఈ శరీరం కావాలా? భగవంతుడు కావాలా? నువ్వు దీనినే కోరే పక్షంలో, ఇదుగో నీ ముందే ఉంది, అందుకో.” ఇలా వివేచిస్తూ మాతృదేవి దేహాన్ని స్పృశించాలనే భావన ఆయనమనస్సులో వచ్చీ రాకమునుపే, ఆయన మనస్సు కుదించుకు పోయి ప్రగాఢ ‘సమాధి’ లో విలీనమై పోయింది; ఆ రాత్రి మామూలు భావభూమికి అది దిగిరాలేదు. మరునాడు భగవన్నామాన్ని పదేపదే ఉచ్చరించిన పిదప, ఎంతో ప్రయత్నం మీదట ఆయనకు బాహ్యస్మృతి తెప్పించగలిగారు.
15. కనీవినీ ఎరుగని శ్రీరామకృష్ణుల అనుపమాన ప్రవర్తన
ఆ విధంగా పూర్ణ యౌవనంలో ఉన్న శ్రీరామకృష్ణులు, నవయవ్వన సంపన్నురాలైన మాతృదేవి శారదాదేవి – ఈ దివ్యదంపతుల దివ్యలీలా విలాసాలను గురించి శ్రీరామకృష్ణుల ముఖతా మేము విన్న విషయాలు ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో మరే అవతార పురుషుని జీవితంలోనూ జరిగినట్లు తెలియరాదు. ఆ విషయాలు విన్న మానవ హృదయం ముగ్ధమై, సహజంగానే వారి దివ్యత్వం పట్ల విశ్వాసాన్ని పొందుతుంది. హృదయాంతరాళం నుండి వారి పాదపద్మాల పట్ల భక్తిప్రపత్తులను ప్రదర్శిస్తుంది. దేహస్మృతి లేని శ్రీరామకృష్ణులు ఈ కాలంలో రాత్రుళ్ళు పూర్తిగా సమాధిమగ్నులై గడపడం జరిగింది. సమాధి స్థితి నుండి బాహ్యచైతన్య స్థాయికి దిగివచ్చిన పిదప కూడ ఆయన మనస్సు ఎంతటి సమున్నత భూమిలో నెలకొని ఉండేదంటే, సామాన్యునికి ఉండే దేహాత్మ బుద్ధి ఒక్క ముహూర్త మాత్రం కూడ వారిలో జనించేది కాదు.
16. మాతృదేవి అసాధారణ ప్రవృత్తి గురించి శ్రీరామకృష్ణులు
ఆ విధంగా రోజులు, నెలలు దొర్లి ఒక సంవత్సర కాలం గడిచి పోయింది. ఐనప్పటికీ అద్భుతమైన శ్రీరామకృష్ణుల, అపురూపమైన మాతృదేవి యొక్క మనోసంయమనం లేశమాత్రమూ సడలలేదు. పొరపాటుగానైనా ఒక్క క్షణమాత్రం కూడ శారీరక సంయోగం కోరదగిందనే, సంతోషదాయకమనే తలంపే అసలు వారి మనస్సులలో మెదలలేదు. ఆ రోజుల్లో జరిగిన విషయాలు జ్ఞప్తికి తెచ్చుకొని శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు మాతో ఇలా “ఆమె (మాతృదేవి) అంతటి పవిత్రురాలు కాకపోయినట్లయితే, తనను తాను మరిచిపోయి నన్ను వేధించివుంటే నా సంయమం నీరుగారి, దేహబుద్ధి అంకురించేదేమో? నా వివాహానంతరం ఆమె (మాతృదేవి) మనస్సును కామగంధరహితం చేయమని జగజ్జననిని అర్థించాను. ఆమెతో కలిసి ఆ సమయంలో వసించిన తరువాత జగజ్జనని నా మొర ఆలకించిందని గ్రహించాను” అని చెప్పేవారు.
17. పరీక్షానంతరం శ్రీరామకృష్ణుల సంకల్పం
సంవత్సరకాలం తరువాత కూడా శ్రీరామకృష్ణుల మనస్సులో ఎలాంటి దైహికమైన కోరిక కనీసం క్షణకాలంపాటు కూడా ఉదయించలేదు. తమ సతీమణి శారదను, జగజ్జనని అంశగానే చూశారు. కొన్ని సమయాలలో సచ్చిదానంద స్వరూపబ్రహ్మంగా గాంచేవారే తప్ప మరి ఏవిధమైన ఆలోచనలు ఆయన మనస్సులోకి రాలేదు. జగజ్జనని కృపాకటాక్షంతో తాము ఈ అగ్నిపరీక్షలో కృతకృత్యుడనైనానని ఆయన గ్రహించారు. ఇప్పుడు ఆయన మనస్సు స్వాభావికంగానే దివ్య ఆధ్యాత్మిక భూమిలో ప్రతిష్ఠితమైపోయింది. జగజ్జనని అనుగ్రహంతో తమ సాధన పరిపూర్తి అయిందనీ, తమ మనస్సు ఇప్పుడు జగజ్జనని పాదపద్మాలలో ఎంతగా లీనమైపోయినదంటే, తెలిసిగాని తెలియకగాని తల్లి సంకల్పానికి విరుద్ధమైన భావనలు ఏవీ తమ మనస్సులో మెదలవనీ ఆయన హృదయాంతరాళంలో గ్రహించారు. జగజ్జననిచే నిర్దేశితులైన ఆయన హృదయంలో ఇప్పుడు ఒక అసాధారణ కోర్కె ఉదయించింది; కించిత్తు తటపటాయింపు కూడ లేకుండా ఆ అభిలాషకు కార్యరూపం సంతరింప పూనుకొన్నారు. శ్రీరామకృష్ణుల మాతృదేవి ముఖతా అప్పుడప్పుడు మేము విన్న విషయాలను అనుసంధానపూర్వకంగా పాఠకులకు ఇప్పుడు తెలుపుతున్నాం.
18. షోడశీ పూజకు సన్నాహాలు
1873 వ సం ॥ జ్యేష్ఠమాసం సగంపైగా గడచిపోయింది. నాడు (మే 25 వ తేదీ)* అమావాస్య; పవిత్రమైన ఫలహారిణి కాళీపూజ పర్వదినం. దక్షిణేశ్వర ఆలయంలో ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వర్తింపబడతాయి. జగజ్జననిని పూజించగోరి నాడు శ్రీరామకృష్ణులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లు ఆలయంలో కాకుండా ఆయన ఇచ్ఛ మేరకు ఆయన గదిలో గోప్యంగా జరిగాయి. పూజా సమయంలో దేవిని ఆశీనురాలిని చేయడానికిగాను పసుపు కుంకు మాదులతో అలంకరింపబడిన ఒక కొయ్యపీఠం అర్చకుని కుడివైపున అమర్చబడింది. సూర్యాస్తమయం అయింది. అమావాస్య చిమ్మచీకట్లు క్రమంగా నలుదిక్కులా అలము కోసాగాయి. శ్రీరామకృష్ణుల మేనల్లుడైన హృదయ్ నాటి రాత్రి కాళికాలయంలో విశేషపూజ నిర్వర్తించవలసివుంది. కాబట్టి సాధ్యమైనంతవరకు శ్రీరామకృష్ణుల పూజా సన్నాహాలు చేశాక కాళికాలయానికి వెళ్ళిపోయాడు. రాధాగోవింద ఆలయ రాత్రిపూజ, సేవాదులను పూర్తి చేసుకొని పూజారి దీను వచ్చి శ్రీరామకృష్ణుల పూజ ఏర్పాట్లలో తోడ్పడసాగాడు. దేవిని అలా గోప్యంగా పూజించడానికైన ఈ ఏర్పాట్లన్నీ పూర్తయ్యేటప్పటికి రాత్రి తొమ్మిది గంటలయింది. ఈలోపు శ్రీరామకృష్ణులు, పూజాసమయంలో అక్కడ (ఆయన గదిలో) ఉండవలసిందిగా మాతృదేవికి కబురు పంపారు. ఆమె అక్కడకు వచ్చాక ఆయన పూజకు ఉపక్రమించారు.
19. మాతృదేవికి అభిషేకం చేసి ఆమెను శ్రీరామకృష్ణులు అర్చించడం
పూజోపకరణాలన్నీ మంత్రపూత జలంతో పవిత్రీకరింపబడి పూజ యొక్క పూర్వాంగాలన్నీ పూర్తయ్యాయి. కుంకుమాదులతో అలంకృతమైన దేవీపీఠం మీద కూర్చో వలసిందిగా మాతృదేవికి సైగచేత శ్రీరామకృష్ణులు సూచించారు. పూజా కార్యాక్రమాన్ని తిలకిస్తూ ఉండగానే ఆమె అర్ధబాహ్యచైతన్య స్థితిని చేరుకొన్నది. కాబట్టి తాను ఏం చేస్తున్నానో అన్న ఎరుక లేకుండానే మంత్రముగ్ధలా పూర్వాభిముఖంగా కూర్చున్న శ్రీరామకృష్ణులకు కుడివైపున ఉన్న దేవీపీఠం మీద ఉత్తరాభిముఖంగా ఆమె కూర్చున్నది. తమ ముందున్న చెంబులోని మంత్రపూరిత జలాన్ని శాస్త్రనిర్దేశానుసారం పదేపదే మాతృదేవిపై ప్రోక్షించారు శ్రీరామకృష్ణులు. పఠించవలసిన మంత్రాలను చదివాక ఆవాహన మంత్రాలను ప్రారంభించారు.
“ఓ బాలా! సర్వశక్త్యధీశ్వరీ, మాతా, త్రిపురసుందరీ! నాకై సిద్ధి ద్వారాన్ని తెరువు. ఈమె (మాతృదేవి) మనశ్శరీరాలను పవిత్రీకరించి, ఈమెలో అభివ్యక్తీకరించి సర్వకల్యాణ సాధనభూతవుగా.”
20. శ్రీరామకృష్ణుల సమాధి, జపతపాదుల సమర్పణ
ఆవాహనం ముగించాక మాతృదేవి దేహంలో మంత్రపాఠంతో న్యాసక్రియను ముగించి షోడశోపచారాలతో (అంటే అర్ఘ్యపాద్యాదులనే పదహారు ఉపచారాలతో నిర్వర్తింపబడే పూజ) యథావిధిగా ఆమెను సాక్షాత్తూ జగజ్జననిగా అర్చించారు. పిదప నైవేద్యం అర్పించి, దాన్లో ఒకింత తమ చేతులతో ఆమె నోటికి అందించారు. ఈలోపు మాతృదేవి బాహ్యచైతన్యాన్ని పూర్తిగా కోల్పోయి సమాధిమగ్నురాలైంది. శ్రీరామకృష్ణులు కూడ అర్ధబాహ్యస్మృతిలో మంత్రోచ్చారణ చేస్తూ సంపూర్ణ సమాధిలో లీనమైపోయారు. సమాధిమగ్నుడైన అర్చకుడు సమాధిస్థితిలో విలీనమైన దేవితో తదాత్మ్యం చెందాడు.
చాలసేపు గడచిపోయింది. రాత్రి రెండవ జాము గడిచి మూడవ జాములో కూడ ఎంతోసేపు గడచిపోయింది. ఆత్మారాములైన శ్రీరామకృష్ణులలో ప్రస్తుతం బాహ్యస్మృతి చిహ్నాలు ఒకింత కనిపించసాగాయి. మునుపటి అర్ధబాహ్యస్మృతిని పొంది ఆయన దేవికి ఆత్మనివేదనం చేయసాగారు; తమతోబాటు తమ జపమాలనూ, సమస్త సాధనాఫలాలనూ శాశ్వతంగా దేవి పాదపద్మాల కడ సమర్పించి మంత్రాలు ఉచ్చరిస్తూ ఆమెకు ప్రణమిల్లారు:
ఓం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే ।
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోఽస్తుతే ॥
ఎడమ: నహబత్ లేక వాద్యమంటపం ఇక్కడే దిగువున శ్రీశారదాదేవి, పై అంతస్థులో ఆమె అత్తగారు చంద్రమణిదేవి నివసించేవారు. కుడి:అర్ధ చంద్రాకార మొగసాలతో కూడియున్న శ్రీరామకృష్ణుల గది.
షోడశీపూజ పరిసమాప్తమైంది. మూర్తీభవించిన సకల విద్యారూపిణి అయిన ఒక నారీ శరీరం ద్వారా జగదీశ్వరి ఉపాసనతో శ్రీరామకృష్ణుల సాధనలు చరమావస్థను చేరుకొన్నవి. సర్వతోముఖ పరిపూర్ణత్వాన్ని ఆ మహనీయుడు సంతరించుకొన్నారు.
21. శ్రీరామకృష్ణులు తరచూ సమాధిమగ్నులు కావడం, శారదాదేవి కామార్పుకూర్కు తిరిగి వెళ్ళడం
షోడశీపూజ అనంతరం మాతృదేవి దాదాపు ఐదు నెలలు శ్రీరామకృష్ణుల వద్ద వసించింది. మునుపటిలా ఆమె శ్రీరామకృష్ణులను, ఆయన తల్లి చంద్రాదేవిని సేవిస్తూ పగటివేళ నహబత్లోనే గడుపుతూ, రాత్రి శ్రీరామకృష్ణుల తోనే శయనిస్తూ వచ్చింది. శ్రీరామకృష్ణులు రేయింబవళ్ళు ఎడతెగని భావసమాధిలో మగ్నులై ఉండసాగారు. కొన్ని వేళల్లో ఆయన హఠాత్తుగా నిర్వికల్ప సమాధిలో మగ్ను లయ్యేవారు. ఆ సమయంలో ఆయన శరీరంలో మృత్యు లక్షణాలు పొడసూపేవి. ఆయనకు ఎప్పుడు ఎటువంటి సమాధి స్థితి కలుగుతుందో అనే భయంతో మాతృదేవికి రాత్రి నిద్రపట్టేది కాదు. ఒకనాటి రాత్రి ఎంతసేపు గడచిపోయినా శ్రీరామకృష్ణులకు సమాధి భంగం కాకపోవడం చూసి ఎంతో భయపడి ఏం చేయడానికీ పాలుబోక మాతృదేవి, హృదయ్ను ఇతరులను నిద్ర నుండి లేపింది. హృదయ్ వచ్చి ఆయన చెవిలో చాలసేపు భగవన్నామం ఉచ్చరించిన తరువాతనే శ్రీరామకృష్ణులు సమాధిస్థితి నుండి దిగివచ్చారు. సమాధిస్థితి నుండి దిగి వచ్చిన పిదప జరిగినదంతా తెలుసుకొని మాతృదేవికి నిద్రాభంగ మౌతూన్నదని గ్రహించి తల్లితోబాటు నహబత్లో ఆమె నిద్రించడానికి ఆయన ఏర్పాటు చేశారు. ఈ తీరులో ఒక సంవత్సరం నాలుగు నెలలు దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులతో నివసించి 1873 వ సంవత్సర కార్తీకమాసంలో (అక్టోబర్) కామార్పుకూర్కు మాతృదేవి తిరిగి వెళ్ళిపోయింది.