1. శ్రీరామకృష్ణులలో దైవ, మానవ భావాల మేళనం
దివ్యమూర్తులైన శ్రీ గురుదేవుల సాంగత్య లబ్ధి పొంది, కృతార్థులమై మేము వారి జీవితాన్ని – శీలాన్ని ఏకాగ్రంగా పరికించేకొద్దీ, వారిలో దైవమానవ భావాలు రెండు కూడ అద్భుతరీతిలో మేళనం చెందివుండడం చూసి మేమెంతో ముగ్ధులమయ్యేవారం. పరస్పర విరుద్ధ భావాలు అలా ఏక కాలంలో ఒకే వ్యక్తిలో అంత మధురంగా, అంత సమరసంగా ఉండగలవన్న విషయాన్ని మేము వారిని చూడక పోయినట్లయితే అర్థం చేసుకోగలిగేవారం కాము. అలా మేము చూశాం. కాబట్టే ఆయన దేవ మానవుడన్న నమ్మకం; పరిపూర్ణ దైవత్వ లక్షణాలు, దైవీశక్తి మానవభావమనే ఆవరణ ద్వారా పూర్తిగా అభివ్యక్తమయ్యాయి. ఆ విధంగా మేము చూశాం కాబట్టే, ఆ రెండు భావాల్లో దేన్ని కూడ వారు నటించలేదని, లోకానికి మేలు చేయడం కోసం వారు మానవభావాన్ని యథార్థంగానే స్వీకరించి దైవత్వానికి చేరే మార్గాన్ని మనందరికీ చూపించి వెళ్ళారన్న విషయాన్ని మేము అవగతం చేసుకోగలిగాం. మేము వారిని నిశితంగా పరిశీలించాం కాబట్టే, పూర్వయుగాల్లోని అవతార పురుషులందరి జీవితాల్లో కూడ దైవ – మానవ భావాలు రెండూ కలిసి అభివ్యక్తమై ఉండేందుకు అవకాశముందని మేము గ్రహించగలిగాం.
2. అవతార పురుషులందరి విషయం కూడా అలాగే ఉంటుంది
శ్రద్ధాభక్తులతో ఏ ఒక్క అవతారపురుషుని జీవితాన్ని అధ్యయనం చేసి పరిశీలించినా, మనకు ఈ సత్యం గోచరిస్తుంది. ఒక్కోమారు వారు మానవస్థాయిలో ఉంటూ, అన్ని వస్తువులు – వ్యక్తులతో కూడ సరిగ్గా మనలాగే వ్యవహరిస్తూ ఉండడం మనకు కనిపిస్తుంది. మరోసారి ఉన్నత భావభూమిలో విహరిస్తూ మనకు తెలియని, మనకు పరిచయంలేని గంభీరమైన ఆధ్యాత్మిక, సత్యాలను మనకు తెలియపరచడం కనబడుతుంది. వారు కోరకున్నా సరే, ఏదో ఒక అజ్ఞాతశక్తి అన్నింటినీ చక్కగా అమర్చి వారితో అలా చేయిస్తూ ఉంటుంది. పసితనం నుండి కూడ వారి జీవితంలో అలాగే జరుగుతూ వస్తుంది. కాని చిన్నవయసులోనే వారికి ఆ శక్తిని గూర్చిన ఎరుక అప్పుడప్పుడు కలుగుతున్నా, అది తమ సొంతశక్తేనని, అది తమలోనే అంతర్గతంగా ఉందన్న విషయం వారికప్పుడు తెలియదు. అంతేకాదు, తమ ఇచ్ఛానుసారంగా ఆ శక్తిని ఉపయోగించుకుని ఉన్నత ఆధ్యాత్మిక స్థాయిలను అధిరోహించి, ఆ దైవీభావ దృష్టితో లోకంలోని వస్తువులను, వ్యక్తులను చూస్తూ, తదనుగుణంగా వ్యవహరిస్తూ ఉండడం కూడ వారికప్పుడు సాధ్యం కాదు. కాని వారు పెద్దవారవుతున్నకొద్దీ వారిలోని ఆ శక్తి కూడ ఇనుమడిస్తూ అభివ్యక్తమవుతూ వస్తుంది. అలా పదేపదే తమకు ప్రత్యక్షమౌతున్న ఆ శక్తితో పరిచితులై, దాన్ని పూర్తిగా తెలుసుకోవాలన్న ఆకాంక్ష వారిలో ఉదయిస్తుంది. చివరికి ఆ కోరికే అవతార పురుషులను అలౌకికానురాగ సంపన్నులుగా రూపొందించి, సాధనలు అనుష్ఠించడానికి వారిని ప్రోత్సహిస్తుంది.
3 అవతార పురుషులకు స్వార్థ సుఖ భావనలుండవు
అవతారపురుషుల ఆ ఆకాంక్షలో స్వార్థపరత్వం లేశమాత్రమైనా ఉండదు. ఈ లోకంలో గానీ, పరలోకంలో గానీ ఎలాంటి సుఖాభోగాలను పొందాలన్న కోరికా వారిలో కలగడం అంటూ ఉండదు. ‘ఇతరులకేమైనా కానీ, నేను మాత్రం ముక్తుడనై పరమానందాన్ని అనుభవిస్తాను’ అన్న భావం కూడ వారి కోరికలో కనిపించదు. మరి వారి కోరికకు ప్రధాన ప్రేరేపణ ఏమిటి? ఏ అజ్ఞాత దివ్యశక్తి నిర్దేశంతో పుట్టుక నుంచి వారు అసాధారణ దివ్యానుభవాలను అనుభవిస్తున్నారో, ఏ దివ్యశక్తి ద్వారా ప్రగాఢ భావసమాధులను, భగవత్ రూపాలను కాంచడం; బాహ్యప్రపంచ వస్తువులు ఎంత సత్యమో ఇవీ అంతే సత్యమనే విషయం అనుభూతమవుతూ ఉంటుందో, అలాంటి దివ్యశక్తి ఈ జగత్తులో ఉందా? లేక అది కేవలం తన ఊహాజనితమేనా? – అన్నదాని నిజానిజాలను తెలుసుకోవాలనుకోవడమే వారి కోరికకు ప్రేరేపణ. వారు సాధారణ వ్యక్తుల జ్ఞానాన్ని, అనుభవాలను తమ జ్ఞానానుభవాలతో పోల్చి చూసుకొన్నప్పుడు వారికొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ‘ప్రాపంచిక వస్తువులను, వ్యక్తులను తామెలా చూస్తుంటారో, ఇతరులు వాటిని అలా చూడడం లేదని, సాధారణ వ్యక్తులకు ఉన్నతస్థాయిలను అధిరోహించి ప్రపంచాన్ని పరికించే శక్తి దాదాపు శూన్యమన్న విషయం వారికి విస్పష్టమవుతుంది.
4. అవతారపురుషుల కారుణ్యం, సాధనలు ఇతరుల మేలుకే
అంతేకాదు, పై పోలికలో వారికి మరో విషయం కూడ సుస్పష్టమౌతుంది. సాధారణ, దివ్యస్థాయిల నుండి ఈ ప్రపంచాన్ని రెండు రకాలుగా చూడడం ద్వారా మూన్నాళ్ళ ముచ్చటైన ఈ క్షణిక జీవితంలో, క్షణిక సుఖాల నిచ్చే రూపరసాది విషయభోగాలు సామాన్యులను ప్రలోభింప జేసినట్లు తమను ప్రలోభపరచలేని విషయం వారికి అర్థమవుతుంది. అలాగే, నిత్యపరిణామ శీలమైన ఈ సంసారంలో కష్టాలు ఎదురైనప్పుడు నిరాశ, అశాంతులు వారి బుద్ధిని ఎప్పుడూ కూడ కప్పివేయలేవు. కాబట్టి పైన పేర్కొన్న దివ్యత్వం పూర్తిగా తమ సొంతం చేసుకుని, తమ ఇచ్ఛానుసారంగా ఉన్నత ఆధ్యాత్మిక భూములను ఎలా అధిరోహించాలో, కోరినంతకాలం అక్కడ ఉండగలగడం ఎలాగో అన్న చింతనలో అవతారపురుషులుంటారు. అంతేకాక సామాన్యులందరికీ ఈ విధానాన్ని బోధించి, వారంతా శాంతిని ఎలా పొందగలరో అన్న విషయం గూర్చి కూడ కరుణార్ద్రచిత్తులైన అవతారపురుషులు చింతన చేస్తూ ఉంటారు. అందుకే సాధన – కారుణ్యం ఈ రెండూ వారి జీవితాల్లో ప్రక్కప్రక్కనే నిరంతరం ప్రవహించడం కనిపిస్తుంది. సామాన్యుల అవస్థతో తమ అవస్థను వారు పోల్చిచూసుకున్నప్పుడు, వారిలోని కారుణ్యం నూరింతలౌతుంది. అంతమాత్రాన వారి కారుణ్యం, ఆ పోలిక నుండి పుట్టిందని చెప్పరాదు. ఆ కారుణ్యంతోనే వారు ఈ లోకంలోకి వస్తారు. దీనికి దృష్టాంతంగా శ్రీరామకృష్ణులు చెప్పిన ఈ కథను జ్ఞాపకం చేసుకుందాం.
5. ఆనంద వన దృష్టాంతం
ఒకప్పుడు ముగ్గురు స్నేహితులు సరదాగా షికారుకు బయలుదేరారు. కొంతదూరం వెళ్ళిన తర్వాత వారికి మధుర సంగీతం వినిపించింది. వారిలో కుతూహలం పెరిగి ఆ సంగీతం వినవస్తున్న ప్రాంతానికి వచ్చారు. అక్కడ వారికి బాగా ఎత్తయిన ప్రహరీగోడ కనిపించింది. ఆ గోడకు ఆవలివైపు నుండి వారికి ఆ మధుర సంగీతం వినిపిస్తోంది. వారిలో మరింత కుతూహలం కలిగింది. ఆవలి వైపు అసలేం జరుగుతున్నదో చూద్దామన్న కోరిక పుట్టింది. వెంటనే వారు గోడ చుట్టూ తిరిగివచ్చారు. వారికి గోడలో ఎక్కడా ప్రవేశ ద్వారం కనిపించలేదు. లోపలికి వెళ్ళాలన్న కోరిక వారిలో మరింత తీవ్రమైంది. వారు ప్రయత్నించి, ఒక నిచ్చెనను సంపాదించి, ఆ గోడకు వేశారు. ముందుగా ఒకడు నిచ్చెన ఎక్కి, అటువైపు జరుగుతున్న ఆనందోత్సవాన్ని తిలకించి ఆనందంతో పరవశించి, ఆవలి వైపుకు దూకేశాడు. అది చూసి మిగతా ఇద్దరికీ మరింత ఆతురత కల్గింది. అటువైపు నిజంగా ఏదో అద్భుతం జరుగుతూందనుకున్నారు. ఈసారి రెండవవాడు పైకి ఎక్కి, ఆవలివైపు దృశ్యాన్ని చూశాడు. చూసీ చూడగానే ఆనందంతో పరవశుడై ఆవలి వైపుకు దూకేశాడు. మూడవ వ్యక్తిలో మరింత కుతూహలం పెరిగింది. అతడు కూడ పైకి ఎక్కి ఆవలివైపు ‘ఆనందాన్ని’ పరికించాడు. చూడగానే అతడి మనస్సు కూడ దూకడానికి ఉరకలు వేసింది. కాని అతడు ఒక క్షణం ఆగి ఆలోచించాడు. ‘నేను కూడ దూకేస్తే, ఇక్కడ ఇంత మహదానందం ఉందన్న విషయం ఇతరులకెలా తెలుస్తుంది? ఇతరులు కూడ ఈ ఆనందాన్ని అనుభవించాల్సిందే. కాబట్టి నేను దిగివెళ్ళి అందరికీ ఈ సమాచారం తెలుపుతాను. అందరినీ ఇక్కడికి తోడ్కొని వస్తాను. అందరితో పాటు ఈ ఆనందాన్ని నేనూ అనుభవిస్తాను’ అనుకున్నాడు. వెంటనే క్రిందికి దిగి అతడు అందరికీ ఆ ఆనందవనం విషయం చెప్పాడు. అందరినీ అక్కడికి తోడ్కొని వెళ్ళాడు. అందరితోపాటే తానూ ఆనందాన్ని అనుభవించాడు.
అందరితోపాటు కలిసి ఆనందాన్ని అనుభవిద్దామన్న కోరిక, మరి ఈ మూడవ వ్యక్తికి ఎందుకు కలిగిందో మనం చెప్పలేం. అలాగే లోకానికి మేలు చేయాలన్న ఆకాంక్ష అవతారపురుషుల్లో బాల్యం నుండే ఎందుకు ఉంటుందో ఆ విషయంకూడ మనం చెప్పలేం. వారిలో అది సహజంగానే ఉంటుంది. అంతే.
6. ఆత్మసంయమం
పై వివరణను చూసి, ‘అయితే మనలాగే అదుపు తప్పిన ఇంద్రియాలతో పోరాడే అవసరం అవతార పురుషులకు ఉండదేమో! బుద్ధిమంతులైన బాలుర మాదిరిగా అవి నిరంతరం వారి వశంలోనే ఉంటాయేమో! అందుకే రూపరసాది విషయభోగాల నుండి వారు తమ చిత్తాలను అలవోకగా మరల్చి పరమాత్మలో నిమగ్నం చేయగలుగుతారు’ అని చాలామంది అనుకోవచ్చు. కాని ఇది ఎంతమాత్రమూ నిజం కాదు. వారు కూడ సామాన్య మానవులలాగే సాధనలు చేయవలసి ఉంటుంది. వారు కూడ మనలాగే ఇంద్రియాలతో సంఘర్షణ పడవలసి ఉంటుంది. అలా పోరాడుతూనే వారు తమ లక్ష్యం వైపు సాగవలసి ఉంటుంది.
7. మనస్సులోని అపరిమిత కోరికలు
ఈ మానవ మానసం అగాధమైంది. దీని స్వరూప స్వభావాలను తెలుసుకోవాలని ప్రయత్నించే వ్యక్తికి దీని అంతు ఒక పట్టాన దొరకదు. స్థూలం – సూక్ష్మం – సూక్ష్మతరం – సూక్ష్మతమం – సూక్ష్మాతిసూక్ష్మతమం – ఇలా అనేక స్థాయిల్లో మనస్సు వ్యాప్తమై ఉంటుంది. అన్ని స్థాయిల్లోనూ వాసనలు అపరిమితంగా ఉంటాయి. ఎంతో కష్టపడి మనిషి, మనస్సు స్థాయినొకదాన్ని దాటితే, వెంటనే మరొక స్థాయి ఎదురౌతుంది. దానిని ఎలాగో జయించినా, మరొకటి అడ్డు వస్తుంది. స్థూలాన్ని దాటితే, సూక్ష్మం ఎదురౌతుంది. దాన్ని కూడ గెలిచివెళితే సూక్ష్మతరం అడ్డుగా నిలుస్తుంది. కామేచ్ఛను వదలిపెడితే ధనపిశాచి నిన్ను పట్టుకుంటుంది. కామకాంచనాల నుంచి కొంచెం విడుపుకోగలిగితే, అందచందాలు, పేరు ప్రతిష్టల వైపు మనస్సు పరుగు పెడుతుంది. జాగ్రత్తగా ప్రాపంచిక ఆసక్తిని తగ్గించుకొంటే సోమరితనం లేకపోతే మోహంతో నిండిన కరుణ, మనస్సును ఆక్రమిస్తుంది.
8. “వాసనలనన్నింటినీ త్యజించాలి” – గురువుల బోధ
అత్యంత ప్రమాదకరమైన ఈ మనస్సు స్వభావాన్ని గూర్చి గురుదేవులు పదేపదే హెచ్చరిస్తూండేవారు. వాసనలనన్నింటినీ త్యజించమని ఆయన మాకు చెబుతూండేవారు. తమ జీవితంలో జరిగిన సంఘటనలను దృష్టాంతంగా ఉదహరిస్తూ, తానప్పుడు ఎలా ప్రవర్తించేవారో, ఎలా ఆలోచించే వారో, వ్యవహరిస్తుండేవారో తెలిపి తమ బోధను మా హృదయాల్లో నాటుకునేలా చేసేవారు. పురుషులకే కాదు, భక్తురాండ్రకు కూడ సర్వవాసనాత్యాగం చేయమని చెప్పేవారు. స్త్రీలలో సైతం భగవత్ ప్రీతిని ఉద్దీపన చేసేవారు.
ఉదాహరణగా ఒకనాటి సంఘటనను వివరిస్తాం.
9. వాసనాత్యాగం చేయమని భక్తురాండ్రకు ఉపదేశం
శ్రీరామకృష్ణులను దర్శించిన స్త్రీ పురుషులంతా, ఆయన అమాయకత, సరళత, లేశమైనా కామగంధంలేని వారి అపూర్వప్రేమ మొదలైన సుగుణాలకు ఎంతగానో ఆకర్షితులయ్యేవారు. వారి హృదయాలను ఆయన చూర గొనేవారు. అందుచేత అవకాశం లభించినప్పుడల్లా, ఆయన దర్శనం చేసుకోవాలని ఉబలాట పడుతుండేవారు. అంతేనా, తాము మాత్రమే దర్శనం చేసుకుని తృప్తి చెందేవారు కారు, తమకు తెలిసిన వారిని కూడ గురుదేవుల వద్దకు తీసుకుని వచ్చేవారు. వారు కూడ శ్రీరామకృష్ణుల దర్శనం చేసుకుని, తరించి ఆనందం పొందాలని వారి సదాశయం.
ఒకమారు మాకు తెలిసిన ఒక భక్తురాలు మధ్యాహ్నం పూట గురుదేవుల దర్శనార్థం వచ్చింది. ఆమెతోపాటు ఆమె సవతి చెల్లెలు, ఆ చెల్లెలి మరదలు కూడ ఉన్నారు. వారు గురుదేవులకు ప్రణామం చేసి కూర్చున్నారు. గురుదేవులు వారి బాగోగులు గురించి అడిగారు. తరువాత ‘భగవంతునిపై ప్రీతిని పెంపొందించుకోవడమే మానవజీవిత ఏకైక లక్ష్యం కావాలి’ అంటూ ఉపదేశింపసాగారు.
“భగవంతుణ్ణి శరణు పొందడం అంత సులభమా? మహామాయ ప్రభావం మనలను అలా చేయనిస్తుందా? మూడులోకాల్లో కూడ ‘నా’ అనేవారు ఎవరూలేకున్న వారిని కూడ ఆ మహామాయ మోహంలో పడవేస్తుంటుంది. వారు ఒక పిల్లిని పెంచుకునేలా చేస్తుంది. అదే వారికిక సంసారమవుతుంది. ఆ పిల్లి పోషణలోనే వారు తిరుగుతుంటారు. ‘అయ్యో! మా పిల్లికి చేపలు, పాలు లేకపోతే ఇంకేమైనా ఉందా?’ అంటూ వారు వాపోతుంటారు. మరొక రకం వారుంటారు, వారు సుసంపన్న కుటుంబంలోనే జన్మిస్తారు. ఆ స్త్రీలకు భర్త, పిల్లలు అందరూ చనిపోయివుంటారు. వారికి మరే బాదరాబందీ ఉండదు. అయినా ఆ వితంతువులు మాత్రం తమకు చావనేదే లేనట్లుగా ప్రవర్తిస్తారు. వారి ఇల్లంతా పాడుబడిపోయి ఉంటుంది. ఈ ప్రక్కన గోడలన్నీ కూలిపోయే ఉంటాయి, ఆ వైపు కూలడానికి సిద్ధంగా ఉంటాయి. ఇంటి కప్పు మీద మర్రి మొక్కలు మొలుస్తుంటాయి. వాటి ప్రక్కే కొన్ని తోటకూర కాడలు కూడా పెరుగుతుంటాయి. ఆ వితంతువులు ఆ మొక్కలతోనే కూర వండుకొని తింటూ సంసారంలో మునిగిపోతుంటారు. వారి స్థితి ఇంత దీనంగా ఉన్నా, ప్రపంచాన్ని మాత్రం వారు వదలిపెట్టరు. ఎందుకని? వారు భగవంతుణ్ణి ప్రార్థించ రెందుకని? భగవంతుణ్ణి వారెందుకు శరణు పొందరూ? ఇంకా వారికి సమయం రాలేదంటారా? ఆ తలమాసిన వారు అలా చేయరెందుకనీ?”
గురుదేవులు తమ ఉపదేశాన్ని కొనసాగించారు:
“మరో స్త్రీ ఉంటుంది. ఆమెకు వివాహం కాగానే వైధవ్యం ప్రాప్తిస్తుంది. బాల వితంతువు. ఆమెకు పిల్లాజెల్లా ఎవరూ ఉండరు. అయినా ఆమె దేవుణ్ణి మాత్రం ప్రార్థించదు, ఎందుకు ప్రార్థించదు? ప్రార్థించదు అంతే! పైగా అన్న ఇంట్లో పెత్తనం చలాయిస్తుంటుంది. తలకొప్పు గట్టిగా ముడేసుకుని, చీరకొంగున తాళంచెవుల గుత్తి కట్టుకుని రెండు చేతులు ఊపుకుంటూ అందరిమీద పెత్తనం చలాయిస్తుంటుంది. ఆ మహంకాళిని చూస్తే, ఊరంతా గజగజలాడిపోతుంది. ఎప్పుడు ఎవరి మీదికి వచ్చి పడుతుందోనని భయపడిపోతుంటారు. ఆ విధవరాలు ఏమంటుందో తెలుసా? ‘అమ్మో, నేను లేకపోతే ఇంకేమైనా ఉందా? మా అన్నకు భోజనం ఎవరు పెడతారు?’ అంటుంది. పిచ్చిది కాకపోతే తన గతి ఏమవుతుందో ఆ విషయమై ఆలోచించదేం? ఇలా ఊడిగం చేస్తే ఆమెకు ఏమి లభిస్తుందీ?”
ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. శ్రీరామకృష్ణులను దర్శించడానికి వచ్చిన ఆ ముగ్గురు స్త్రీలలో మూడవ స్త్రీ మాత్రం అక్కడికి మొదటిసారిగా వచ్చింది. గురుదేవులు చెప్పిన సంఘటనలో ‘బాలవితంతువు’ కోవకు ఈమె చెందుతుంది. ఈమె కూడ అలాగే అన్న ఇంట్లో పెత్తనం చేస్తున్న బాలవితంతువే. ఈ విషయం గురుదేవులకు ముందుగా ఎవరూ చెప్పలేదు. మాటల సందర్భంలో గురుదేవులే ఆ విషయం ఎత్తుకున్నారు. తద్ద్వారా మనస్సు లోపలిపొరల్లో వాసనలు ఎంత గాఢంగా నిక్షిప్తమై ఉంటాయో, వాటికెంత ప్రాబల్యం ఉంటుందో వివరించసాగారు. వారి మాటలు ఆ వితంతు స్త్రీ హృదయంలోకి తప్పకుండా చొచ్చుకుపోయి ఉంటాయి. అందులో సందేహం లేదు.
ఆయన మాటలు విన్న తర్వాత మాకు తెలిసిన భక్తురాలితో, ఆమె సవతి చెల్లెలు, “అక్కా, ఎంత విడ్డూరం చూడు! గురుదేవుల నోట ఈ రోజే ఈ మాటలు రావాలా? ఈ మాటలు విని మా మరదలు ఎంత అపార్థం చేసుకుంటుందో నన్ను” అంది మెల్లగా. అది విని ఆ భక్తురాలు, “మనమేం చేయగలం చెప్పు. అది వారి ఇష్టం. వారికేమైనా మనం ముందే చెప్పామా ఏమిటి?” అని శాంతపరిచింది.
10. అవతారపురుషులు సైతం సూక్ష్మవాసనలతో పోరాడవలసిందే!
మానవస్వభావాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఒక విషయం స్పష్టమవుతుంది. ఒక వ్యక్తి మనస్సు ఉన్నతోన్నత దశలకు అధిరోహిస్తున్నకొద్దీ, సూక్ష్మవాసనలు అతణ్ణి మరింత ఉద్ధృతంగా బాధిస్తూ ఉంటాయి. దొంగతనం, అసత్య భాషణం, వ్యభిచరించడం ఇలాంటి వాటిని పదేపదే చేసే వ్యక్తి, వీటిని మరొకమారు చేయవలసివస్తే కూడ ఏమంతగా బాధపడడు. కాని నీతిపరుడు, నిజాయతీగలవాడు, సుగుణశీలి, సత్ప్రవర్తన గలవాడు అయిన వ్యక్తి మనస్సులో కనీసం అలాంటి ఆలోచన వచ్చినా కూడ భరించలేడు. తానేదో మహాపాపం చేస్తున్నట్లు విపరీతంగా బాధపడతాడు. అవతార పురుషులు తమ జీవితాల్లో ప్రాపంచిక విషయ భోగాలను బాహ్యంగా త్యాగం చేయడం మనం చూస్తుంటాం. కాని వారూ మనతో సమానంగానే, మనోగత సూక్ష్మవాసనలతో ఘోరంగా పోరాడుతుంటారని, తమ మనస్సులో వాటి రూపాలను చూసి మనకన్నా వేయిరెట్లు ఎక్కువగా బాధపడుతుంటారని, వారే స్వయంగా స్పష్టంగా ఒప్పుకున్నారు. కాబట్టి, రూపరసాది విషయాల నుండి తమ ఇంద్రియాలను మరలించడానికి వారు చేసే పోరాటం కేవలం ఒక నటన అని మనమెలా అనగలం?
11. అవతారపురుషులలో మానవ భావాలుంటాయి – అన్న ఆక్షేపణకు ఖండన
శాస్త్రీయంగా ఆలోచించే పాఠకులు ఇలా అడగవచ్చు: “మీరు చెప్పేదాన్ని ఎలా అంగీకరిస్తాం? అద్వైతాచార్యుడు శ్రీ శంకరుడు తన గీతాభాష్యభూమికలో శ్రీకృష్ణపరమాత్మ జన్మ – శరీర ధారణల గూర్చి చెప్పిన విషయం గమనించండి. ‘నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు, జన్మరహితుడు, అవ్యయుడు, సర్వజీవి నియామకుడైన ఈశ్వరుడు లోకాలను అను గ్రహించడం కోసం తన మాయాశక్తి సహాయంతో జన్మించిన వానిలా, దేహధారిలా కనిపిస్తాడు’ – అని తెలిపారు.* ఆచార్యుడే స్వయంగా ఇలా చెబుతుంటే, మరి మీ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి?”
శంకరాచార్యులు అలా చెప్పారు, నిజమే. అయినా మా మాటలు కూడా యుక్తి యుక్తాలే. ఆచార్యులు చెప్పినదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే, మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈశ్వరుడు మానవ దేహధారణ చేయడం, నామరూపాల్లో పరిమితుడై ఉండడం, ఇదంతా ఒక నటన అని ఆచార్యుడు చెబుతున్నట్లే, మీరు, నేను, ఈ ప్రపంచమంతా కూడ, ప్రపంచంలోని ప్రతివస్తువు, వ్యక్తి నామరూపాల గురించి కూడ ‘ఇవేవీ నిజంకాదు, మిథ్య – నటన’ అని కూడ ఆయనే చెబుతాడు. ఈ జగత్తంతా బ్రహ్మవస్తువుతో కల్పితమైన ఒక అధ్యాస అని, వాస్తవానికి దానికో అస్తిత్వం లేదని ఆయన చెబుతాడు. కాబట్టి ఆయన చెప్పిన ఈ రెండు వాక్కులను కూడ మనం ఒకేరీతిగా గమనించినప్పుడే, మన సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుంది. కాబట్టి అవతారపురుషులు దేహధారణ, సుఖదుఃఖాది అనుభవాలు ‘నటన’ అని, మనందరి దేహధారణ, సుఖదుఃఖాదులు వాస్తవమని ఆచార్యుని అభిప్రాయంకాదు. మనం చూసే విషయాలు, అనుభవాలు సత్యమని చెబితే, అవతార పురుషులు చూసేవి కూడ సత్యమనే స్వీకరించాలి. కాబట్టి పైన మేము చెప్పిన విషయం యుక్తివిరుద్ధం కాదు.
12. పై విషయాన్నే మరో దృక్కోణం నుండి చూద్దాం
పై విషయాన్ని మరో దృక్కోణం నుండి పరికించినప్పుడది మరింత విశదమౌతుంది. ప్రపంచాన్ని గురించి మనకు రెండు రకాలైన భావాలు కలుగుతుంటాయని శాస్త్రాలు చెబుతాయి: ఒకటి అద్వైత స్థాయి నుండి చూసినప్పుడు, రెండు సాధారణ లేదా ద్వైతస్థాయి నుండి చూసినప్పుడు. అద్వైతస్థాయి నుండి చూసినప్పుడు ప్రపంచం ఎంతవరకు సత్యమని పరిశీలనచేస్తే, అదసలు లేదని, ఏ కాలంలోనూ ఉండలేదని, ‘ఏకమేవాద్వితీయం’ – ఆ ఒక్క బ్రహ్మం తప్ప మరేమీ లేదని తెలుస్తుంది. ద్వైతస్థాయిలో ఉంటున్నప్పుడు మాత్రం ఈ జగత్తును చూస్తే, అనంత నామరూపాలతో కూడిన ఈ సమష్టి అంతా సత్యమని నిత్యవర్తమానమని అనిపిస్తుంది. మనలాంటి సామాన్యులకు ఇది ప్రతిక్షణం అనుభవమౌతున్న విషయమే. శరీరాలున్నప్పుడు కూడ వాటితో ఎలాంటి సంబంధంలేని ‘విదేహావస్థ’ కలిగిన అవతారపురుషులు, జీవన్ముక్తులు అధికకాలం అద్వైతస్థాయిలోనే జీవిస్తూ ఉంటారు. కాబట్టి ద్వైత స్థాయిలో వసిస్తున్న సమయాల్లో కూడ వారికి ఈ జగత్తు ఒక స్వప్నంలాగానే కనిపిస్తూ ఉంటుంది. జాగ్రదావస్థతో పోల్చిచూసినప్పుడు స్వప్నం మిథ్యగా తోచినా, స్వప్నం చూస్తున్నప్పుడది పూర్తిగా మిథ్య అని చెప్పజాలం. అలాగే అవతార పురుషులు, జీవన్ముక్తులు బ్రహ్మలీనులై ఉండేటప్పుడు వారికి ఈ జగత్తు మిథ్యగా తోస్తుంది. కాని వారు సమాధి నుండి క్రిందికి దిగి వచ్చినప్పుడు ఈ ప్రపంచం వారికి పూర్తి మిథ్యగా తోచదు.
13. ఉన్నత భావస్థాయిల నుండి చూస్తే, ఈ జగత్తు ఆయా స్థాయిలకు అనుగుణంగా గోచరిస్తుంది
పైన చెప్పినట్లు రెండు స్థాయిల నుండి ఈ జగత్తు రెండు రకాలుగా గోచరిస్తున్నట్లే, ప్రపంచంలోని ఏ వ్యక్తి అయినా ఇలాగే రెండు రకాలుగా కనిపించే అవకాశముంది. ద్వైత దృష్టితో చూస్తే ఆ వ్యక్తి ‘బద్ధజీవుడి’ గా కనిపిస్తాడు. అద్వైత దృష్టి నుండి చూస్తే, అతడే నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూప్థ బ్రహ్మగా గోచరిస్తాడు. భావరాజ్యంలో పూర్ణ అద్వైత భూమి సర్వోన్నత భూమి. సాధనల కన్నింటికీ లక్ష్యమైన ఆ అద్వైత శిఖరాన్ని అధిరోహించడానికి ముందు మానవ మానసం ఉన్నత, మహోన్నత వివిధ స్థాయిలను అధిరోహించవలసి ఉంటుంది. ఆ వివిధ స్థాయిలను అధిరోహిస్తున్న కొద్దీ, ఈ ప్రపంచం, దానిలోని వ్యక్తులు, సాధకులకు ఆయా స్థాయిల కనుగుణంగా గోచరిస్తారు. ఒక్కో స్థాయిని అతిక్రమించేకొద్దీ, జగత్తును గూర్చిన సాధకుని పూర్వాభిప్రాయాలు మారుతూ ఉంటాయి. అప్పుడతడికి ఈ జగత్తు (నామరూపరహిత) భావనలుగానే తోచవచ్చు. లేదా వ్యక్తులు శరీరం నుండి వేరైనవారుగా, అపూర్వ శక్తిమంతులుగా లేదా మనోమయులుగా లేదా జ్యోతిర్మయులుగా – ఇలా విభిన్న రీతులుగా గోచరిస్తూ ఉంటారు.
14. అవతారపురుషుల శక్తి ద్వారా మనిషి ఉన్నత భావస్థాయిలకు అధిరోహించి, వారిని మానవస్వభావ రహితులుగా దర్శిస్తాడు
అవతార పురుషులను శ్రద్ధాభక్తులతో సమీపించే సాధకుడు కూడా తనకు తెలియకుండానే, ఉన్నత – ఉన్నతతర ఆధ్యాత్మిక భావస్థాయిలను అధిరోహించ గలుగుతాడు. అవతార పురుషుల మహాశక్తి ప్రభావం వల్లే అతడలా అధిరోహిస్తాడు. అలా ఆ ఉన్నతస్థాయిల నుండి ఆ సాధకుడు అవతారపురుషులను, వారి ప్రభావాన్ని దర్శిస్తాడు. వారు మహాశక్తి సంపన్నులని, దైవీభావం మాత్రమే వారి వాస్తవిక స్వరూపమని గుర్తిస్తాడు. ఇతర సమయాల్లో వారిలో కనిపించే మానవ స్వభావాన్ని చూసి, కృపతో వారలా నటిస్తున్నారని ఆ సాధకుడు తప్పుగా అర్థం చేసుకుంటాడు. అయితే అతడి భక్తి, సాధన పెరిగేకొద్దీ భగవద్భక్తుల గూర్చి, సమస్త ప్రపంచం గూర్చి అద్వైతభావం దృఢమవుతుంది; అంటే అద్వైతభావంలో నానాత్వం కనిపిస్తున్నా, చివరికి నిలిచేది అద్వయబ్రహ్మం మాత్రమేనని అతడికి అర్థమవుతుంది.
15. అవతారపురుషుల మనో పరిణామ క్రమం
ప్రపంచంలో కనిపించే వస్తువుల, వ్యక్తుల అస్తిత్వం ‘నిజం’ అనే అనుభవం ఎలా కలుగుతుందో, అలాగే మనస్సులోని ఉన్నత భావభూములను అధిరోహించి, అక్కడ కానవచ్చే విషయాల అస్తిత్వం కూడ అంతే నిజమన్న అనుభవం అవతార పురుషులకు వారి జీవితాల్లో చిన్నప్పటి నుండే అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుందన్న విషయాన్ని మొదట్లోనే చెప్పుకున్నాం. తర్వాత నిత్యం ఎన్నెన్నో దివ్యదర్శనాలు అనుభవం అవుతుండటం వలన ఈ బాహ్యప్రపంచ అస్తిత్వం కన్నా, ఆ భావప్రపంచ అస్తిత్వమే ఎక్కువ నిజం అన్న నమ్మకం వారిలో క్రమంగా అధికమౌతూ ఉంటుంది. చివరికి, ఏ అద్వితీయ బ్రహ్మం నుండి అనంత నామరూపయుక్త ఈ విచిత్ర ప్రపంచం బహిర్గతమైందో వారా బ్రహ్మసాక్షాత్కారాన్ని పొంది ఆప్తకాములవుతారు. జీవన్ముక్తుల విషయంలో కూడ ఇలాగే జరుగుతూ ఉంటుంది. కాని చిన్న తేడా ఉంటుంది. అవతార పురుషులు అత్యంత స్వల్పకాలంలో పొందితే, సామాన్యులు మాత్రం జీవితాంతం సాధనచేసి పొందవలసి ఉంటుంది. ఒకవేళ వారు ఈ సాక్షాత్కారాన్ని సత్వరమే పొందినా, ఇతరులను తురీయావస్థకు చేర్చేశక్తి, అవతారపురుషుల శక్తికన్నా చాలా తక్కువగా వారికి ఉంటుంది. ఈ విషయంలో శ్రీరామకృష్ణులు చెప్పిన మాటను గుర్తుకు తెచ్చుకోవాలి: “జీవుడికి, అవతార పురుషునికి మధ్యన ఉండే తేడా కేవలం శక్తి తారతమ్యం మాత్రమే.”
16. దేవమానవుడైన అవతారపురుషుడు – సర్వజ్ఞుడు
ఇలా అద్వైతస్థాయిలో కొంతకాలం ఉండి, జగత్కారణ పరబ్రహ్మ సాక్షాత్కారం ద్వారా బ్రహ్మానందాన్ని అనుభవించి, అవతార పురుషులు మళ్ళీ నిమ్నభూములకు దిగివస్తారు. సామాన్యులకు అప్పుడు వారు మామూలు వ్యక్తులుగానే కనిపించినా, నిజానికి వారిప్పుడు దేవమానవులే. వారికప్పుడు ఈ జగత్తు, దాని కారణాల (బ్రహ్మం) ప్రత్యక్షజ్ఞానం ఉంటుంది. ఆ అవస్థలో వారికి బాహ్యాభ్యంతరయుక్త ఈ జగత్ అస్తిత్వం ఒక నీడలా అనుభూతమవుతుంది. ఈ అనుభవం సర్వకాలాల్లో సర్వత్రా వారికి కలుగుతూ ఉంటుంది. అలాంటి స్థితిలో అసాధారణ ఉన్నత ఆధ్యాత్మిక శక్తులు లోకహితం కోసం వారిలో సర్వదా అభివ్యక్తమవుతుంటాయి. ప్రపంచగత వస్తువులన్నింటి ఆది – మధ్య – అంతాల గూర్చిన పూర్ణజ్ఞానం, సర్వజ్ఞత్వం వారికి లభిస్తాయి. స్థూలదృష్టి మాత్రమే ఉండే మనలాంటి దుర్బల మానవులం అప్పుడు వారి అలౌకిక చరిత్రను, కర్మలను ప్రత్యక్షంగా చూసి, వారిని శరణువేడి, ఆ కరుణామయుల కృపతో మళ్ళీ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాం. మనస్సు బహిర్ముఖంగా ఉన్నంతవరకూ, బాహ్యజగత్తులో కనిపించే వస్తువుల, వ్యక్తుల సాంగత్యాన్ని సంపూర్ణంగా త్యజించి, మనస్సును అంతర్ముఖం చేయనంతవరకూ సత్యాన్ని, భగవత్ సాక్షాత్కారాన్ని పొంది చివరికి శాంతిని పొందలేమన్న విషయాన్ని తెలుసుకుంటాం.
17. ప్రాపంచిక జ్ఞానంలో ఉన్న మనస్సు జగత్కారణాన్ని అర్థం చేసుకోలేదు
పాశ్చాత్య విద్యాపారంగతుడైన పాఠకుడు, “మీ మాటలన్నీ అసంబద్ధప్రలాపాలు. బాహ్యజగత్తులోని వస్తువులను, వ్యక్తులను అన్వేషిస్తూ నేటి విజ్ఞానం ఎంత ముందంజ వేసిందో, నిత్యం మరెంతగా ప్రగతి సాధిస్తున్నదో, తెలిసిన వారెవ్వరూ మీలా చెప్పరు” అని ఆక్షేపించవచ్చు. అందుకు మేము, “భౌతికవిజ్ఞానం విషయంలో మీరు చెబుతున్నది నిజమే. కాని దాని మూలంగా చరమసత్యం ఎప్పటికీ లభించదు” అని జవాబిస్తాం. ఎందుకంటే ఈ విజ్ఞానశాస్త్రం జగత్ కారణం ‘జడం’ అని, అది మనందరికన్నా నీచం – నికృష్టం అని మనకు తెలియపరుస్తుంది. అలాంటి జడవిజ్ఞానం ఎంత అభివృద్ధి అవుతుందో, మనమంత బహిర్ముఖులమౌతాం. అంత అధికంగానే, రూపరసాది భోగసుఖాలే మన జీవిత ఏకైక లక్ష్యం అనుకుంటాం. కాబట్టి ఈ జగత్తంతా ఒక్క జడవస్తువునుండే ఉత్పన్నమయిందని నిరూపించినా, సూక్ష్మపారమార్థిక జగత్తులోని విషయాలన్నీ మనకు అజ్ఞాతంగానే, నిరూపణ కాకుండానే మిగిలిపోతాయి. భోగవాసనలన్నిటినీ సంపూర్ణంగా త్యజించి, మనస్సును పూర్తిగా అంతర్ముఖం చేయడం ఒక్కటే ముక్తికి మార్గమనే సంగతి మనకు అవగతం కానంత వరకు, దేశకాలాతీత ఆ అఖండసత్యాన్ని సాక్షాత్కరించుకోలేం. పరమశాంతిని పొందలేం.
18. బాల్యం నుండే అవతార పురుషులు ఆధ్యాత్మిక భావతన్మయులై ఉంటారు
అవతారపురుషులందరూ బాల్యం నుండే అప్పుడప్పుడు ఆధ్యాత్మిక భావతన్మయత్వాన్ని పొందుతూ ఉంటారనే విషయం మనకు తెలియవస్తున్నది. ఉదాహరణకు శ్రీకృష్ణుడు తన బాల్యంలోనే దివ్యత్వాన్ని తల్లితండ్రులకు, బంధు మిత్రులకు ఎన్నోసార్లు వెలిబుచ్చాడు. బుద్ధుడు ఉద్యానంలో నడుస్తూ, బోధివృక్షం కింద కూర్చుని, సమాధిస్థితుడై దేవతల, మనుష్యుల దృష్టిని ఆకర్షించాడు. ఏసుక్రీస్తు బాల్యంలో తన దివ్యప్రేమతో వన్యపక్షులను ఆకర్షించి, తన చేతులతో వాటికి ఆహారంపెట్టాడు. శంకరాచార్యుడు తన దివ్యశక్తి ప్రభావంతో తల్లిని ముగ్ధురాలిని చేసి, ఆమెను ఓదార్చి, చిన్నప్పుడే సంసారత్యాగం చేశాడు. శ్రీ చైతన్య మహాప్రభువు బాల్యంలోనే ఆధ్యాత్మిక భావపరవశుడై, ‘భగవత్ ప్రేమికుడు, మంచీ చెడులన్నిట్లో కూడ దైవత్వాన్నే పరికిస్తాడు’ అని చూపించాడు. శ్రీరామకృష్ణుల జీవితంలో కూడ ఇలాంటి ఘటనలెన్నో మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు కొన్నింటిని దిగువ తెలియ చేస్తున్నాం. వీటిని స్వయంగా ఆయన ముఖతా విన్నాం. వాటి ద్వారా పిన్నవయస్సులోనే మొదటి ఆధ్యాత్మిక భావతన్మయత ఆయనకు కలిగిందని మేం గ్రహించాం. ఆ సంఘటన గూర్చి వారిలా చెప్పారు:
19. ఆరేళ్ళ ప్రాయంలో శ్రీరామకృష్ణుల భావపారవశ్యం
“ఆ ప్రాంతాల్లో (కామార్పుకూర్లాంటి ప్రాంతాల్లో) చిన్నపిల్లలకు చిన్నచిన్న బుట్టల్లో మరమరాలు పెట్టి తినడానికిస్తారు. అలాంటి బుట్టలు లేనివారు పిల్లల బట్టకొంగుల్లో కడతారు. పొలాల్లో తిరుగుతున్నప్పుడు పిల్లలు ఆ బుట్టల నుండో లేదా కొంగుల నుండో మరమరాలు తీసుకుని తింటూ కాలక్షేపం చేస్తుంటారు. నాకప్పుడు ఆరు లేక ఏడేళ్ళు ఉంటాయేమో. ఒకరోజు ఉదయం పొలంగట్టు మీద నడుస్తూ, బుట్ట నుండి మరమరాలు తింటూ తిరుగుతున్నాను. అది జ్యేష్ఠమో, ఆషాఢమో! అప్పుడు ఆకాశంలో ఓ వైపు నల్లని అందమైన మబ్బు కనిపించింది. దాన్ని చూస్తూ ఉండిపోయాను. కొద్దిక్షణాల్లోనే ఆ మబ్బు విస్తృతమై ఆకాశాన్నంతా ఆవరించింది. ఆ క్షణంలో పాలలాంటి తెల్లని కొంగలబారు ఒకటి ఆ నల్లని మబ్బు కింద నుండి ఎగురుతూ వెళ్ళింది. అదెంత మనోహర దృశ్యమో చెప్పలేను. అలా దాన్ని చూస్తూండగా, నా మనస్సు అపూర్వ భావపరవశతను పొందింది. నేను బాహ్యస్మృతి కోల్పోయి క్రిందపడిపోయాను. మరమరాలన్నీ గట్టుమీద చెదరిపోయాయి. ఆ స్థితిలో ఎంతసేపు ఉన్నానో చెప్పలేను. కొంతమంది నన్ను చూసి ఎత్తుకొని ఇంటికి తీసుకొని వెళ్ళారు. అలా భావసమాధిలో తన్మయుడనై, బాహ్యస్మృతిని కోల్పోడం నాకదే మొదటిసారి.”
20. విశాలాక్షీదేవిని దర్శింప వేళ్ళే సమయంలో గురుదేవులు రెండవ మారు భావ సమాధి పొందడం
శ్రీరామకృష్ణుల జన్మస్థలం కామార్పుకూర్కు రెండు మైళ్ళ ఉత్తరంగా ‘ఆనూర్’ గ్రామం ఉంది. ఆ గ్రామదేవత విశాలాక్షి* , జాగ్రత్ దేవత. చుట్టుపట్ల గ్రామప్రజలు ఈ దేవికి మ్రొక్కు కుంటూ ఉంటారు. తమ కోరికలు ఫలిస్తే, ఆనూర్ గ్రామానికి వచ్చి, ఈ దేవికి తమ మ్రొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. అలా వచ్చే భక్తుల్లో స్త్రీలే ఎక్కువ అని వేరే చెప్పనవసరం లేదు. ఆ భక్తురాండ్రలో సైతం తమ రోగాలను నయం చేయమని మ్రొక్కడానికి వచ్చేవారే అధికం. ఉన్నత కులాలకు చెందిన స్త్రీలు కూడ గుంపులుగా దేవీ దర్శనం కోసం వస్తుంటారు. దేవీ ఆవిర్భావం, అభివ్యక్తీకరణ గూర్చి కథలు చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ నిర్భయంగా, నిస్సంకోచంగా మైదానం దాటి, దేవి వద్దకు వస్తారు. దేవీ దర్శనం చేసుకొని వెళతారు. నేటికి కూడ సంప్రదాయస్థులైన స్త్రీలు ఇలా దేవీ దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళడం కనిపిస్తుంది. శ్రీరామకృష్ణుల బాల్యకాలంలో కామార్పుకూర్, దాని పరిసర గ్రామాలు నేటికన్నా ఎక్కువ జనాభాను కలిగివుండేవని, అధిక సమృద్ధిమంతమై ఉండేవని తెలుస్తుంది. ఎందుకంటే నేటి చిట్టడవులమధ్య పడిపోయిన ఇటుక ఇళ్ళూ, పాడుపడిన దేవాలయాలు, రాసమంచెలు (నర్తన వేదికలు) కనిపించి ఈ విషయాన్ని ధ్రువీకరిస్తుంటాయి. కాబట్టే ఆకాలంలో ఆనూర్ దేవీ దర్శనార్థం పలువురు యాత్రికులు వస్తూ ఉండేవారని చెప్పవచ్చు.
దేవి మైదానం మధ్యలో వెలసి ఉంటుంది. ఆమెకు పైన ఏ కప్పూ ఉండదు. ఆకాశమే కప్పు. ఎండ నుండి, వర్షం నుండి ఆమెకు రక్షణగా రైతులు ఆకులతో పందిరి లాంటిది ఏర్పాటు చేస్తుంటారు. ఒకప్పుడు ఈ దేవికి ఇటుకలతో కట్టిన గుడి ఉండేదని అనిపిస్తుంది. ఎందుకంటే, ప్రక్కనే పాత ఇటుకల కుప్పలు కనిపిస్తాయి. ఈ గుడి విషయం గ్రామస్థులను అడిగాం. వారు దేవియే తన సంకల్పానుసారంగా నిర్మించిన గుడిని పడగొట్టిందని చెప్పారు. వారి కథనం ఇలా ఉంది:
దేవికి గోపబాలురంటే ఎంతో ప్రీతి. తెల్లవారేసరికి ఆ పిల్లలు, గోవులను అక్కడికి తోలుకువచ్చి, వాటిని మేతకు వదిలేవారు. తామంతా ఈ దేవి వద్ద కూర్చుని కథలు చెప్పుకుంటూ, ఆటలాడుకుంటూ గడిపేవారు. పాటలు పాడుతూ, అడవి పూలతో దేవిని అలంకరిస్తూ ఉండేవారు. యాత్రికులు లేదా బాటసారులు ఇచ్చిన తీపిపదార్థాలు, వారిచ్చిన కాసులు పుచ్చుకొనేవారు. ఆ పిల్లల ఆటపాటలు చూస్తూ, దేవి మురిసిపోయేదట. ఒకసారి ఒక గ్రామానికి చెందిన శ్రీమంతుడు, తన కోరిక ఈడేరడంతో, ఆ దేవికి గుడి కట్టించాడు. దేవిని గుడిలోపల ప్రతిష్ఠింపచేశాడు. గుడిలో దేవీ నిత్యపూజల కోసం అతడొక పూజారినికూడ నియమించాడు. ఆ పూజారి ప్రతిరోజు ఉదయ సాయంకాలాల్లో వచ్చి పూజచేసి, ఆ తర్వాత తలుపులకు తాళంవేసి వెళ్ళిపోయేవాడు. ఇతర సమయాల్లో దర్శనంకోసం వచ్చేవారు మాత్రం, కటకటాల బయటినుండే దేవిని చూసి, తమ నైవేద్యాలను, కానుకలను లోపల వేసి వెళ్ళిపోయేవారు. అందుచేత గోపబాలురకు పూర్వంలా దక్షిణ డబ్బులు, నైవేద్యాలు దొరకడం తగ్గాయి. తమకు దొరికిన డబ్బులతో మిఠాయిలు కొని, దేవికి నివేదించి, తినేవారు. ఇప్పుడా అవకాశం పోవడంతో, ఆ పిల్లలు ఎంతో వ్యధ చెందారు. “అమ్మా! నువ్వు గుడి లోపలికి వెళ్ళికూర్చుని మా ఆహారాన్ని నిలిపేశావు కదా! నీ దయతో పూర్వం పండ్లు, జిలేబీలు తినేవాళ్ళం. ఇప్పుడు మా కవన్నీ ఎవరిస్తారు?” అంటూ మొరపెట్టుకున్నారు.
అమాయకులైన ఆ పిల్లల మొర విని, ఆ దేవి నాటి రాత్రే గుడిని పడ గొట్టింది. తెల్లారిచూస్తే గోడలు బీటలువారి, గుడి పడిపోయేలా కనిపించింది; వెంటనే పూజారి దేవిని బయటకు తెచ్చి, పూర్వస్థానంలోనే అమర్చాడు. అప్పటి నుండి గుడి కట్టడానికి ఎవరు ప్రయత్నించినా, అది తన కిష్టంలేదని కలలో కనిపించో, మరో విధంగానో దేవి తెలియచేసేది. తమలో కొందరిని దేవి అలా బెదిరించిందని, తాము గుడికట్టకుండా అడ్డుకుందని ఆ గ్రామస్థులు చెప్పారు. వారికి కలలో కనిపించి “మైదానం మధ్యలో, ఈ గోపబాలురతో నేను హాయిగా ఉంటున్నాను. ఎవరైనా నన్ను గుడిలో ప్రతిష్ఠింప ప్రయత్నిస్తే, వారిని సర్వనాశనం చేస్తాను, జాగ్రత్త! వారి వంశంలో ఎవరూ బ్రతకరు” అని హెచ్చరించేదట.
శ్రీరామకృష్ణులకు అప్పుడు ఎనిమిదేళ్ళ వయస్సు. ఇంకా ఉపనయనం కాలేదు. ఒకరోజు పలువురు కులీన స్త్రీలు బృందంగా తమ మ్రొక్కుబడులను చెల్లించుకోవడానికి విశాలాక్షి గుడికి బయలుదేరారు. గురుదేవుల కుటుంబంలో ఒకరిద్దరు, ధర్మదాస్ లాహా వితంతు సోదరి ప్రసన్నమయి కూడ ఆ బృందంలో ఉన్నారు. ప్రసన్నమయి సరళత, పవిత్రత, ఆధ్యాత్మికత, అమాయకత్వాలను చూసి గురుదేవులు ఆమెను ఎంతో గౌరవించేవారు. అన్ని విషయాల్లోనూ ఆమెను సంప్రతించి, ఆమె సలహా ప్రకారం నడచుకోవాలని ఆయన చాలాసార్లు శారదాదేవికి చెప్పేవారు. ఆమె గూర్చి అప్పుడప్పుడు తమ భక్తురాండ్రకు కూడ చెప్పేవారు. ప్రసన్నమయి కూడ చిన్నప్పటి నుండి గురుదేవులను ఎంతో అభిమానించేది. చాలాసార్లు అతణ్ణి వాస్తవంగా గదాధర్గానే భావించేది. అత్యంత సరళచిత్తురాలైన ఆమె, గదాధర్ ముఖతా దేవీదేవతల పుణ్యచరిత్రలను, భక్తిపూరిత సంగీతాన్ని విని ముగ్ధురాలై చాలాసార్లు అతణ్ణి “ఓ గదాయ్! నువ్వు దేవుడవనే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటావు?” అని అడిగేది. గదాధర్ ఆమె మాటలు విని, మధురంగా మందహాసంచేస్తూ మౌనంగా ఉండి పోయేవాడు. లేదా మాట మార్చి మరో విషయంలోకి వెళ్ళిపోయేవాడు. అయినా ఆమె మాత్రం గంభీరంగా “నువ్వేమైనా చెప్పు, నువ్వు మాత్రం మానవమాత్రుడవు కావు” అనేది.
ప్రసన్నమయి రాధాకృష్ణుని విగ్రహ ప్రతిష్ఠాపన చేసి నిత్యం తానే స్వయంగా సేవలన్నీ చేస్తూండేది. పండగల్లో, పర్వాల్లో, ఉత్సవాల్లో ఆ గుళ్ళో పాటలతో కూడిన నాటక ప్రదర్శనలు జరుగుతూ ఉండేవి. అయితే ప్రసన్నమయి వాటిని ఎక్కువగా వినేది కాదు. ఎవరైనా అడిగితే, “గదాయ్ పాటలతో నా చెవుల్ని పాడుచేశాడు” అనేది.
ఈ విషయాలన్నీ కాలాంతరంలో జరిగాయి.
గ్రామస్త్రీలు అలా వెళుతూండడం చూసి, బాల గదాయ్ తాను కూడ వారితోపాటు వస్తానన్నాడు. అంతదూరం చిన్నపిల్లవాడు నడవలేడని ఎంచి, ఆ స్త్రీలు మొదట్లో వారించారు. కాని గదాయ్ వినక వారి వెంట బయలుదేరాడు. ఆ స్త్రీలకది విసుగు కలిగించలేదు. పైపెచ్చు వారికది సంతోషాన్నే కలిగించింది. వినోదప్రియుడు, ఎప్పుడూ ఆనందోల్లాసాలతో ఉండే పిల్లవాడు ఎవరి మనస్సుల నైనా ఆకర్షిస్తాడు. పైగా ఆ చిన్నవయస్సులోనే వివిధ దేవీదేవతలకు సంబంధించిన పద్యాలు, పాటలు ఎన్నో అతడికి కంఠస్థం. తాము కోరితే దారిలో తప్పకుండా కొన్ని పాటలను పాడి వినిపిస్తాడు కదా! మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అతడికి ఆకలైనా ఫరవాలేదు. ఎందుకంటే అప్పుడు తమ వద్ద దేవికి అర్పించిన పాలు, పండ్లు, మిఠాయిలు వగైరా ఉంటాయి కదా! ఇక పిల్లవాడిని తీసుకెళ్ళడంలో ఇబ్బందేముంది? అని అనుకుని ఆ స్త్రీలు నిస్సంకోచంగా గదాయ్ను తమతో తోడ్కొని వెళ్ళారు. అతడు కూడ వారు కోరినట్లే సంతోషంగా కథలు చెబుతూ, పాటలు పాడుతూ వారి వెంట బయలుదేరాడు.
అలా వారంతా విశాలాక్షి వెలసివున్న మైదానంలోకి వచ్చారు. మైదానాన్ని దాటక మునుపే, హఠాత్తుగా ఒక సంఘటన జరిగింది. పాడుతున్న గదాయ్, ఉన్నట్టుండి పాడడం ఆపివేశాడు. అతడి శరీరం, అవయవాలన్నీ కర్రలా బిగుసుకుపోయాయి. కళ్ళ నుండి కన్నీరు ధారగా స్రవించసాగింది. అది చూసిన స్త్రీలందరూ గాబరాపడిపోయి, “ఏమైంది గదాయ్” అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. గదాయ్ మాత్రం బదులేమీ పలుకక అలాగే ఉండిపోయాడు. అలవాటు లేని కారణంగా నడిచి నడిచి అలసిపోయి ఉంటాడని, వడదెబ్బ తగిలి ఉంటుందని ఆ స్త్రీలు భయపడ్డారు. వెంటనే ప్రక్క చెరువు నుండి నీళ్ళు తెచ్చి, గదాయ్ ముఖం మీద, తల మీద చిలకరించారు. ఎంతచేసినా గదాయ్ మాత్రం మామూలు స్థితికి రాలేదు. అతడికి బాహ్యస్మృతి కలగలేదు. దానితో ఆ స్త్రీలు ఎంతో ఆందోళన చెందారు. ఏం చేయాలో వారికేమీ పాలుబోలేదు. తమ మ్రొక్కుబడులను తీర్చుకుని, దేవిని ఎలా ఆరాధించాలో వారికి తోచలేదు. వారితోపాటు మగమనిషి అంటూ మరెవ్వరూ లేరు. వారికి అదొక పెద్దసమస్య అయిపోయింది. వారు దేవీదేవతల విషయం మరిచిపోయి అతడి చుట్టూ మూగి కూర్చున్నారు. కొందరు విసరసాగారు. కొందరు నీళ్ళు చిలకరించసాగారు. కొందరు అతణ్ణి బిగ్గరగా పేరుపెట్టి పిలువసాగారు.
అలా కొంతసేపు గడిచింది. హఠాత్తుగా ప్రసన్నమయి మనస్సులో ఏదో స్ఫురించింది: ‘దేవి అంటే ఎంతో భక్తిశ్రద్ధలున్న ఈ సరళహృదయుణ్ణి దేవి ఆవహించిందేమో! సరళ, శుద్ధహృదయులైన పిల్లలపైన, స్త్రీపురుషులలో దేవీదేవతల ఆవేశం కలుగుతుందని నేను విన్నాను కదా!’ అని ఆమె అనుకుంది.
వెంటనే ఆమె తన మనస్సులోని మాట ఇతరులకు చెప్పింది. గదాయ్ను పిలువకుండా ఏకాగ్రచిత్తంతో విశాలాక్షిదేవిని పిలవమని కోరింది. పుణ్యశీలి ప్రసన్నమయి అంటే ఆ స్త్రీలకు ఎంతో భక్తి, గౌరవాలున్నాయి. అందుచేత ఆమె మాటలు విశ్వసించి వెంటనే, “అమ్మా! దేవీ, విశాలాక్షీ, ప్రసన్నంకా తల్లీ, రక్షించు తల్లీ, అమ్మా! మమ్ములను కృపతో చూడవమ్మా, మాకో గతిని చూపించు తల్లీ” అని వ్యాకులహృదయంతో ప్రార్థించారు.
ఆశ్చర్యం! కొంతసేపు అలా వారు ప్రార్థించగానే, గదాయ్లో మార్పు కనిపించింది. ముఖంలో మందహాసం వికసించింది. బాహ్యస్మృతి కూడ మెల్లగా రాసాగింది. దానితో మహిళలంతా ఊరడిల్లారు. నిజంగానే దేవి అతణ్ణి ఆవేశించిందని నిశ్చయించుకొన్నారు. పదేపదే ‘అమ్మా – అమ్మా’ అంటూ పిలుస్తూ అతణ్ణి వేడుకోసాగారు.*
అలా క్రమంగా అతడికి బాహ్యస్మృతి కలిగింది. అతడు మామూలు స్థితిని పొందాడు. కాని విచిత్రంగా అతడిలో, ఆ విస్మృతి కారణంగా ఎలాంటి అలసటగానీ, బలహీనతగానీ ఏర్పడలేదు. ఆ తర్వాత భక్తిప్రపూర్ణులైన ఆ మహిళలంతా దేవీదర్శనం చేసుకున్నారు. సముచితంగా ఆమెను ఆరాధించారు. ఇంటికి తిరిగివచ్చి, జరిగిన విషయాన్నంతా చంద్రాదేవికి వివరంగా తెలిపారు. అది విని ఆమె ఎంతో ఆందోళన చెందింది. గదాయ్ శ్రేయస్సు కోసం తమ కులదైవం శ్రీరఘువీరునికి విశేషపూజలు చేయించింది. విశాలాక్షికి పదేపదే ప్రణామాలర్పించింది. ఆమెకు కూడ విశేషపూజ చేయిస్తానని మ్రొక్కుకున్నది.
బాల్యకాలం నుండే అప్పుడప్పుడు ఉన్నత ఆధ్యాత్మిక భూములను అధిరోహించేవాడన్న విషయాన్ని ధ్రువపరిచే మరొక సంఘటన శ్రీరామకృష్ణుల జీవితంలో జరిగింది. దాని వివరాలు ఇలా ఉన్నాయి:
కామార్పుకూర్లో శ్రీరామకృష్ణుల ఇంటికి కాస్తదూరంలో నైరుతీ దిశలో కంసాలి* కుటుంబం ఒకటి వసించేది. వీరి ఇంటి పేరు ‘పాయిన్’. ఈ ‘పాయిన్’ లు ఒకప్పుడు ఎంతో సంపన్నులుగా ఉండేవారనడానికి, వారు కట్టించిన శిల్పాలతో కూడిన సుందరమైన శివాలయమే సాక్ష్యం. ఆ కుటుంబంవారు ఒకరిద్దరు ఇప్పటికీ ఉన్నారు. పూర్వీకులు కట్టిన వారిండ్లన్నీ ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి. ఆ కాలంలో (శ్రీరామకృష్ణుల బాల్యంలో) వీరు చాలా సంపన్నులుగా ఉండేవారని గ్రామస్థులు చెబుతుంటారు. ఆ ఇల్లంతా ఆ కుటుంబం వారితోనే నిండి ఉండేది. వారికి పశువులు, పొలాలు, నాగళ్ళూ అనేకం ఉండేవి. వారు భూస్వాములు. అంతేకాదు, బంగారం వ్యాపారంతో వారు బాగానే గడిస్తూ ఉండేవారు. కాని ఈ పాయిన్లు అటు జమీందారులు కాక, ఇటు మహాధనికులు కాక, మధ్యస్థంగా ఉండేవారు. ఒకరకంగా చెప్పాలంటే, మధ్యతరగతిలో ఉన్నతస్థాయికి చెందిన శ్రీమంతులు వారు.
ఈ పాయిన్ కుటుంబ పెద్ద ఎంతో ధార్మిక పరాయణుడు. సామర్థ్యం ఉన్నా అతడు తన ఇంటిని ఇటుకల కట్టడంగా మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. మట్టితో కట్టిన రెండంతస్తుల మేడతోనే సంతుష్టుడై ఉండేవాడు. కాని అతడు ఇటుకలు కాల్పించి, ఒక మంచి శివాలయాన్ని మాత్రం కట్టించాడు. అతడి పేరు రసిక్లాల్. అతడికి పుత్ర సంతానం లేదు. అందరూ కుమార్తెలే. వివాహానంతరం కూడ కుమార్తెలందరూ పుట్టింట్లోనే ఎందుకు వసిస్తున్నారో మాకు తెలియరావడం లేదు. శ్రీరామకృష్ణులకు పది లేక పదకొండేళ్ళ వయస్సప్పుడు పాయిన్ కుటుంబంలోని ఆఖరి కుమార్తె పెద్దమనిషి అయిందని మాకు తెలియవచ్చింది. కుమార్తెలందరూ అందంగా ఉండేవారు. దైవభక్తి, బ్రాహ్మణులపట్ల ఆదర గౌరవాలు గలవారు. పొరుగింట్లోనే ఉండే గదాయ్ అంటే వారందరికీ ఎంతో ప్రేమ! చిన్నతనంలో ఎక్కువ సమయం గదాయ్ ఈ ధార్మిక కుటుంబంతోనే గడిపేవాడు. అతడు ఉన్నత భావస్థితుల్లో ఉంటూ పాయిన్ల ఇంట్లో చేసిన లీలలను ఇప్పటికీ గ్రామంలో చెప్పుకుంటూ ఉంటారు. ఈ దిగువ సంఘటనను మేము శ్రీరామకృష్ణుల ముఖతా విన్నాం.
కామార్పుకూర్లో శైవ, వైష్ణవభక్తులు ఎలాంటి పరస్పర ద్వేషభావాలూ లేకుండా కలసిమెలసి జీవిస్తూ ఉండేవారు. ప్రతి సంవత్సరం ఈ ఊళ్లో ఎంతో బ్రహ్మాండంగా శివారాధన ఉత్సవాలు, విష్ణు ఆరాధన ఉత్సవాలు జరుగుతూ ఉండేవి. ఉత్సవరోజులలో మూడురోజులపాటు అఖండ హరినామ సంకీర్తన ఏర్పాటు చేసేవారు. అయినా విష్ణ్వాలయాలతో పోల్చిచూస్తే, శివాలయాలు ఇక్కడ ఎక్కువే ఉన్నాయని చెప్పవచ్చు. పైన పేర్కొన్న కంసాలి కుటుంబాలలో ఎక్కువమంది దురభిమానులైన వైష్ణవులే. (శ్రీ చైతన్యమహాప్రభువు సహచరుడైన) శ్రీ నిత్యానంద ప్రభువు, శ్రీ ఉద్ధారణదత్త* అనే వ్యక్తికి మంత్రదీక్ష నిచ్చిన కాలం నుండి ఈ కులంలో వైష్ణవ ప్రాబల్యం పెరిగింది. కాని, కామార్పుకూర్కు చెందిన పాయిన్లు మాత్రం వైష్ణవభక్తి, శైవభక్తి రెండూ కలిగివుండేవారు. వృద్ధుడైన పాయిన్ కుటుంబపెద్ద ఒకవైపు నిత్యం త్రిసంధ్యల్లో హరినామం చేస్తూ ఉండేవాడు. మరోవైపు శివుణ్ణి ప్రతిష్ఠించి, ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసేవాడు. రాత్రి జాగరణకు దోహదం చేస్తుందని తన ఇంట్లో ‘యాత్ర’ (నాటకం) కూడ ఏర్పాటు చేసేవాడు.
21. శివరాత్రినాడు శ్రీరామకృష్ణులకు కలిగిన మూడవ భావ సమాధి
ఒక శివరాత్రినాడు మామూలుగానే పాయిన్ ఇంట్లో ‘యాత్రా వీథి నాటకం’ ఏర్పాట్లు జరిగాయి. సమీప గ్రామంలోని ఒక నాటక బృందం ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నారు. శివమహిమను తెలిపే నృత్యగానాలుంటాయి. అయితే చీకటి పడుతుండగా నాటకంలో శివుని పాత్రను పోషించే పిల్లవాడికి హఠాత్తుగా జబ్బు చేసింది. ఆ పాత్రను పోషించేవారు మరెవ్వరూ ఎంత వెదకినా లభించలేదు. మరేదారీ లేక నాటకబృందం యజమాని నాటకాన్ని ఆపివేయక తప్పదని వర్తమానం పంపించాడు.
అయితే మరెలా? శివరాత్రి జాగరణ చేయడం ఎలా? గ్రామంలోని పెద్దవారంతా కలసి సంప్రతించుకుని, నాటకసూత్రధారుని వద్దకు ఒక మనిషిని పంపించి, “శివపాత్రధారి ఎవరైనా దొరికితే నాటకం కొనసాగించగలవా?” అని అడిగించారు. “అలాగే” అంటూ అతడు జవాబు పంపించాడు. గ్రామపెద్దలు మళ్ళీ సంప్రతించుకున్నారు. ఆ శివపాత్రను ఎవరు పోషించగలరు? బాగా ఆలోచించిన తర్వాత వారికి ‘గదాయ్’ ఆ పాత్రను పోషించ గలడని అనిపించింది. గదాయ్ చిన్నవాడైనా, అతడికి శివభజనలు ఎన్నో తెలుసు. శివుని వేషం ధరిస్తే చూడముచ్చటగా కూడ ఉంటాడు. అందుచేత గదాయ్ను ఎన్నుకున్నారు. నటన సమయంలో ఏవైనా రెండుమూడు మాటలు మాట్లాడవలసివస్తే ఆ పని యజమాని తెలివిగా సరిచేసుకోగలడు. గదాయ్ కూడ గ్రామస్థుల కోరిక మేరకు శివపాత్రను వేయటానికి ఉత్సాహంగా సిద్ధమయ్యాడు. కాస్త చీకటి పడ్డాక నాటకం మొదలైంది.
గ్రామ జమీందారు ధర్మదాస్ లాహాకు, గదాయ్ తండ్రి క్షుదిరామ్కు మంచి స్నేహం ఉండడంవల్ల, జమీందార్ పెద్దకుమారుడు గయావిష్ణువు, గదాయ్ ప్రాణమిత్రులయ్యారు.తన స్నేహితుడు శివుడుగా నటిస్తున్నాడని విని, గయావిష్ణువు తన మిత్రులందరితో వచ్చి గదాయ్ను ‘శివుడి’ గా అలంకరించాడు. సమయం రాగానే గదాయ్ శివవేషంలో రంగస్థలం మీదికి వచ్చాడు. ఆలోగానే అతడి మనస్సు శివభావంలో నిండిపోయింది. అతడు వాస్తవంగానే అంతర్ముఖుడైపోయాడు. ఆ భావతన్మయత్వంలోనే రంగస్థలం మీదికి వచ్చి స్థిరంగా నిలబడిపోయాడు.
నెమ్మదిగా, స్థిరంగా అతడు అడుగులు వేస్తూ రావడాన్ని, సుస్థిరంగా రంగస్థలం మధ్యలో నిలబడడాన్ని చూసి ప్రేక్షకులు ఎంతో ముగ్ధులయ్యారు. అతడి అంతర్ముఖత్వాన్ని తెలిపే అర్ధనిమీలిత నేత్రాలను, నిశ్చలదృష్టిని, మధుర మందహాసాన్ని చూసి ఎంతో ఆనందించారు. ఆ ఆనందంలో వారంతా గట్టిగా ‘శివ శివ’ అంటూ శివనామాన్ని ఉచ్చరించసాగారు. కొంతమంది స్త్రీలు ‘ఊళలు’ వేశారు. కొందరు శంఖధ్వానాలు చేశారు.
అలా కొంతసేపు గడిచింది. తర్వాత మళ్ళీ పరమ ప్రశాంతత నెలకొంది. అప్పుడు నాటకసంస్థ యజమాని శివస్తోత్రాన్ని మొదలుపెట్టాడు. శివస్తోత్రం వింటూ గ్రామస్థులు, “మన గదాయ్ ఎంత చక్కగా నప్పాడో, నిజంగా శివుడిలాగే కనిపిస్తున్నాడు సుమా!” అని అనుకోసాగారు.
కాని గదాయ్ మాత్రం శివతన్మయత్వంలో మైమరచి, రంగస్థలం మీద స్థాణువులా నిలబడిపోయాడు. అతడి కళ్ళ నుండి జలజల కన్నీరు కారుతోంది. అది ఆనంద పరవశత్వానికి గుర్తు. అలా చాలసేపు గడిచింది. అయినా గదాయ్ కదలక మెదలక అలాగే ఉండిపోయాడు. అది చూసి నాటకబృందం యజమాని, గ్రామపెద్దలు కంగారుపడి దగ్గరకు వెళ్ళి కుదిపి చూశారు. అలా చూసినప్పుడు గదాయ్ కాళ్ళు చేతులు ప్రతిస్పందన లేకుండా ఉండడం గమనించారు. ఆ పిల్లవాడు పూర్తిగా బాహ్యస్మృతిని కోల్పోయాడు. అదంతా చూసి వారెంతో ఆందోళన చెందారు. “నీళ్ళు చల్లండి”, “విసనకర్రతో విసరండి”, “శివనామం ఉచ్చరించండి” అంటూ ప్రేక్షకుల నుండి గోల బయలుదేరింది. “ఈ కుర్రాడు వినోదాన్నంతా పాడుచేశాడు. ఇక నాటకం ఏం జరుగుతుంది?” అని మరి కొంతమంది నిరాశపడ్డారు.
ఎంత ప్రయత్నించినా, గదాయ్కు బాహ్యస్మృతి రాకపోయేసరికి, నాటకాన్ని అంతటితో ఆపివేశారు. ప్రేక్షకులు ఎవరింటికి వారెళ్ళిపోయారు. కొంత మంది గదాయ్ను ఎత్తుకుని ఇంటికి చేర్చారు. ఆ నాటి రాత్రంతా గదాయ్ ఆ భావపారవశ్యంలోనే ఉండిపోయాడు. అది చూసి ఇంట్లోవారంతా ఎంతో కంగారుపడ్డారు.
మరుసటిరోజు సూర్యోదయం అయిన తర్వాత గదాయ్ ఆ పారవశ్యస్థితి నుంచి బాహ్యస్మృహలోకి వచ్చాడు.