1. శ్రీరామకృష్ణుల తీర్థయాత్ర నిర్ణయమవడం
మథుర్బాబు, అతడి భార్య భారతదేశపు వాయవ్య ప్రాంతంలోని ముఖ్య తీర్థాలను సందర్శింప సన్నద్ధులవుతున్నారు. జనవరి నెలలో ప్రయాణానికి ఒక సుముహూర్తంకూడా నిర్ణయించారు. మథుర్తోబాటు అతడి గురువు కుమారుడు, ఇంకా అనేకులు కూడా వెళ్ళనున్నారు. తమతోబాటు రావలసిందిగా మథుర్ బాబు, అతడి భార్య శ్రీరామకృష్ణులను ఎంతో ప్రాథేయపడ్డారు. పర్యవ సానంగా వృద్ధురాలైన తమ తల్లి* , మేనల్లుడైన హృదయ్‌లను తోడ్కొని వారితోపాటు తీర్థ యాత్రలకు వెళ్ళటానికి శ్రీరామకృష్ణులు అంగీకరించారు.
2. తీర్థయాత్రకు బయలుదేరిన రోజు
మథుర్బాబు 1868 వ సం ॥ జనవరి 27 వ తేదీ శుభ దినాన శ్రీరామకృష్ణులు, తదితరులతో తీర్థయాత్రకు బయలుదేరాడు. శ్రీరామకృష్ణుల తీర్థ యాత్రావిశేషాలను మేం మరొకచోట* వర్ణించాం. కాబట్టి హృదయ్ నుంచి మేం విన్న బయలుదేరిన రోజుసంగతులను మాత్రమే ఇక్కడ తెలుపుతున్నాం.
3. తీర్థయాత్రా ఏర్పాట్లు
శ్రీరామకృష్ణులు, ఆయన తల్లి, మథుర్ దంపతులు, వారి కోడలు, మథుర్ గురువుగారి కుమారుడు, హృదయ్, ఒక వంట బ్రాహ్మణుడు, ఒక ద్వారపాలకుడు, ఆడ మగ పనివాళ్ళు – మొత్తం దాదాపు నూట ఇరవై ఐదుమంది బయలుదేరారు. ఒక రెండవ తరగతి పెట్టె, మూడు మూడవ తరగతి పెట్టెలు వీరందరికోసం రైలు కంపెనీవారు కేటాయించారు. అంతేకాక కలకత్తా – కాశీ మధ్య మార్గంలో ఈ నాలుగు పెట్టెలు కావలసిన చోట వేరుచేయడానికి అనువుగా ఏర్పాటు చేసుకొన్నారు.
4. వైద్యనాథ్ సందర్శనం – దరిద్రనారాయణ సేవ
దేవఘర్ వద్ద వైద్యనాథ్ శివుని దర్శనం చేసుకొని అక్కడ కొన్నిరోజులు విశ్రమించారు. అక్కడ ఒక ముఖ్య సంఘటన జరిగింది. అక్కడి ఒక గ్రామంలోని స్త్రీ, పురుషుల దైన్యావస్థను చూసి శ్రీరామకృష్ణుల హృదయం చలించిపోయింది. మథుర్ బాబుకు చెప్పి వారందరికీ ఒకరోజు కడుపారా భోజనం పెట్టించి, ఒక్కో వస్త్రాన్ని ఆయన ఇప్పించారు* .
5. దారిలో ఊహించని ఘటన
వైద్యనాథ్ నుండి తిన్నగా కాశీకి బయలుదేరాడు మథుర్బాబు. దారిలో చెప్పుకోదగ్గ విశేషం ఏదీ జరుగలేదు. కాని కాశీకి సమీపంలోని ఒక స్టేషన్లో బండి నుంచి దిగిన శ్రీరామకృష్ణులు, హృదయ్ మళ్ళీ బండిలోకి ఎక్కేలోపునే రైలు బయలుదేరింది. దానితో మథుర్ గాబరాపడి మరుసటి రైలులో వారిని పంపించివేయమని కాశీ నుంచి తంతివార్త పంపించాడు. కాని అదృష్టవశాత్తు వారు మరుసటి రైలుకోసం వేచివుండనవసరం లేకపోయింది. ఆ సమయంలో రాజేంద్రలాల్ వంద్యోపాధ్యాయ అనే ఆ రైలు కంపెనీవారి ఉన్నతోద్యోగి ప్రత్యేక రైలులో పర్యవేక్షణ నిమిత్తం అక్కడకు వచ్చాడు. వీరిని ఆ దురవస్థలో చూసి తన రైలులో ఎక్కించుకొని కాశీకి తోడ్కొనిపోయాడు. రాజేంద్రలాల్ వంద్యోపాధ్యాయ కలకత్తాలోని బాగ్‌బజార్ నివాసి.
6. కేదార్ఘాట్ వద్ద బస చేయడం
కాశీ చేరుకోగానే కేదార్ ఘాట్ వద్ద ప్రక్కప్రక్కనే ఉన్న రెండు ఇళ్ళను మథుర్ అద్దెకు తీసుకొన్నాడు. అన్ని విధాల అతడు యువరాజులా అక్కడ మెలగాడు. అతడు బయటకు వెళ్ళినప్పుడల్లా ముందూ వెనుకా పరిజనం ఛత్ర చామరాదులు పుచ్చుకొని నడిచేవారు. అతడి తలపై సదా ఒక వెండి గొడుగును తెరచి పట్టుకొనేవారు. ఈ ఆర్భాటాన్నంతా చూసి జనం అతణ్ణి ఒక మహారాజుగా భావించారు.
కాశీలో బసచేసినప్పుడు దాదాపు ప్రతిరోజు శ్రీరామకృష్ణులు ఒక పల్లకీలో వెళ్ళి శ్రీవిశ్వనాథుని దర్శించారు. హృదయ్ కాలినడకన ఆయనను అనుసరించేవాడు. ఆలయానికి వెళ్ళే దారిలోనే ఆయన భావపరవశులయ్యేవారంటే ఇక భగవద్దర్శన సమయంలో మాట చెప్పనక్కరలేదు. ఇలా దేవాలయాలన్నిటిలోను ఆయన భావపరవశులయినప్పటికీ, కేదారేశ్వర ఆలయంలో ఆయన విశేషంగా భావపారవశ్యం చెందటం తటస్థించింది.
దేవఘర్ వైద్యనాథ్ శివాలయం: ఇక్కడే శ్రీరామకృష్ణులు మథుర్చే పట్టుపట్టి అన్నదానం చేయించారు.
గంగ నుంచి వారణాసి దృశ్యం, ఇక్కడి పవిత్ర ప్రదేశాలను శ్రీరామకృష్ణులు 1860 సం ॥ లో దర్శించారు
7. శ్రీరామకృష్ణులు – త్రైలింగస్వామి
ఒక వంక దేవాలయాలను సందర్శిస్తూ మరోవంక శ్రీరామకృష్ణులు కాశీలోని సుప్రసిద్ధులైన సాధుపుంగవులను కూడా దర్శించారు. సదా హృదయ్ ఆయన వెంటే ఉండేవాడు. పరమహంస శ్రేష్ఠుడైన త్రైలింగస్వామిని ఆయన పలుమార్లు దర్శించారు. ఆ సమయంలో త్రైలింగస్వామి మౌనవ్రతం పాటిస్తూ మణికర్ణికాఘట్టం వద్ద వసించేవారు. శ్రీరామకృష్ణులు ఆయనను దర్శింప వెళ్ళిన మొట్టమొదటరోజున, త్రైలింగస్వామి తమ ముక్కుపొడి డబ్బాను శ్రీరామకృష్ణుల ముందు ఉంచి సాదరంగా ఆహ్వానించారు. శ్రీరామకృష్ణులు, స్వామి శారీరక లక్షణాలను పరీక్షించి హృదయ్‌తో, “ఈయనలో నిజమైన పరమహంస లక్షణాలన్నీ కనబడుతున్నాయి. ఈయన సాక్షాత్తూ విశ్వేశ్వరుడు” అని చెప్పారు. త్రైలింగస్వామి మణికర్ణిక వద్ద ఒక స్నానఘట్టం నిర్మింప సంకల్పించుకొన్నారు. శ్రీరామకృష్ణుల ఆదేశం మేరకు హృదయ్ కొన్ని పారల మట్టిని ఆ స్థలంలో వేశాడు. ఒకరోజు శ్రీరామకృష్ణులు, త్రైలింగ స్వామిని మథుర్బాబు నివాసానికి ఆహ్వానించి, తమ స్వహస్తాలతో ఆయనకు క్షీరాన్నం తినిపించారు.
8. ప్రయాగలో శ్రీరామకృష్ణుల ప్రవర్తన
శ్రీరామకృష్ణులు కాశీలో అయిదారు రోజులు బసచేసి తరువాత మథుర్తోబాటు ప్రయాగకు వెళ్ళారు. త్రివేణీ సంగమంలో స్నానం చేసి, అక్కడ మూడు రాత్రులు గడిపారు. మథుర్ తదితరులు అక్కడ శిరోముండనం చేయించుకున్నారు. శ్రీరామకృష్ణులు చేయించుకోలేదు. “నేను చేయించుకోవలసిన అవసరం లేదు” అని చెప్పారు. ప్రయాగ నుండి కాశీకి తిరిగి వచ్చి అక్కడ పదిహేను రోజులు గడిపిన తరువాత బృందావనానికి బయలుదేరారు.
9. బృందావనంలోని నిధువనం మొదలైన స్థలాల సందర్శనం
బృందావనంలో మథుర్ నిధువనానికి సమీపంలో బస చేశాడు. కాశీలో మాదిరే ఇక్కడ కూడా అతడు తన వైభవ దర్పాలను ప్రదర్శించాడు. భార్యతోపాటు ఆలయాలు దర్శించి కొన్ని బంగారు కాసులు అర్పించి ప్రణామాలు చేశాడు. నిధువనం మొదలైన నిధివనంతోబాటు శ్రీరామకృష్ణులు రాధాకుండ్, శ్యామకుండ్, గోవర్ధన గిరిని సందర్శించారు. భావపారవశ్యంలో ఆయన గోవర్ధన గిరిని ఆరోహించారు. బృందావనంలో వసిస్తూ ఉన్న సాధుపుంగవుల గురించి విని, వారిని దర్శించారు. నిధివనంలో వసిస్తున్న సాధ్వి ‘గంగామాత’ ను దర్శించినప్పుడు ఆయన పరమానంద భరితులయ్యారు. ఆమె మేని లక్షణాలను సూచించి హృదయ్‌తో, “ఈమె అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని పొందినది” అన్నారు శ్రీరామకృష్ణులు.
10. కాశీకి తిరిగి రాక
దాదాపు ఒక పక్షం రోజులు బృందావనంలో గడిపి మథుర్ తదితరులు కాశీకి తిరిగి వచ్చారు. విశేష వేషభూషణాల అలంకారంలో విశ్వేశ్వరుని దర్శింపగోరి వారందరూ వైశాఖ మాసం వరకు కాశీలోనే ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు ఈ సమయంలో అన్నపూర్ణాదేవి సువర్ణ ప్రతిమను దర్శించారు.
11. కాశీలో భైరవీ బ్రాహ్మణిని కలుసుకోవడం
శ్రీరామకృష్ణులు కాశీలో యోగేశ్వరి భైరవీ బ్రాహ్మణిని కలుసుకొన్నట్లు హృదయ్ తెలిపాడు. ఆయన ఆమె వసించే ‘చౌషట్టీ (అంటే అరవై నాలుగు) యోగినీ’ అనే బసకు పలుమార్లు వెళ్ళారు. బ్రాహ్మణి అప్పుడు ‘మోక్షదా’ అనే స్త్రీతో కలిసి నివసిస్తూ ఉంది. మోక్షదా భక్తివిశ్వాసాలను గాంచి శ్రీరామకృష్ణులు చాల సంతోషించారు. బ్రాహ్మణి కూడా శ్రీరామకృష్ణులతోబాటు బృందావనానికి వచ్చింది. ఇక అక్కడే ఆమెను ఉండిపొమ్మన్నారు ఆయన. బృందావనం నుండి శ్రీరామకృష్ణులు తిరిగి వచ్చేసిన స్వల్పకాలంలోనే బ్రాహ్మణి అక్కడే మరణించింది.
12. వీణావాదకుడైన మహేశ్‌ను చూడ వెళ్ళటం
బృందావనంలో బసచేసి ఉన్నప్పుడు వీణావాదాన్ని వినాలనే ఆకాంక్ష శ్రీరామకృష్ణులకు కలిగింది. కాని ఆ సమయంలో వీణ వాయించేవారు ఎవరూ అక్కడ లేక పోవటంతో ఆయన కోరిక తీరలేదు. కాశీకి తిరిగి వచ్చాక మళ్ళీ ఆయనలో ఆ కోర్కె జనించింది. కాశీలో మహేశ్‌చంద్ర సర్కార్ అనే వీణాపండితుడు ఉండేవాడు. శ్రీరామకృష్ణులు ఒకరోజు హృదయ్‌ను తోడ్కొని మహేశ్ ఇంటికి వెళ్ళి వీణ వాయించమని అతణ్ణి అభ్యర్థించారు. మహేశ్ ‘మదన్ పురా’ అనే ప్రాంతంలో వసిస్తూన్నాడు. శ్రీరామకృష్ణుల అభ్యర్థన మేరకు నాడు మహేశ్ మహోల్లాసంతో చాలాసేపు వీణ వాయించాడు. సుమధుర వీణానాదాన్ని వింటూనే శ్రీరామకృష్ణులు భావపరవశులయ్యారు. ఒకింత బాహ్యస్మృతి కలుగగానే, “అమ్మా! నాకు బాహ్యస్మృతిని ఇవ్వు. సావధానంగా నేను వీణానాదం వినగోరుతున్నాను” అంటూ జగజ్జననిని ప్రార్థించటం వినవచ్చింది. వెంటనే ఆయన బాహ్యభావభూమిలో నెలకొనగలిగారు. మహదానందంతో వీణానాదాన్ని వింటూ, అప్పుడప్పుడు వీణానాదానికి అనుగుణంగా తమ గాత్రాన్ని జోడించి పాడారు కూడా! ఆయన సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆనందంగా అక్కడ గడిపారు. మహేశ్ సమర్పించిన ఉపాహారాన్ని స్వీకరించి మథుర్బాబు వద్దకు తిరిగి వచ్చేశారు. మహేశ్ నాటి నుండి అనునిత్యం శ్రీరామకృష్ణుల దర్శనార్థం వెళ్ళసాగాడు. శ్రీరామకృష్ణులు అతణ్ణి గురించి, “వీణను వాయిస్తూ ఉన్నప్పుడు అతడు తనను మరచిపోయేవాడు” అని చెప్పారు.
13. దక్షిణేశ్వరానికి తిరిగి రావడం: తదనంతర కార్యాలు
కాశీ నుండి గయాక్షేత్రానికి వెళ్ళాలనే కోర్కె మథుర్ వెలిబుచ్చాడు. కాని శ్రీరామకృష్ణులు అందుకు ససేమిరా సమ్మతించక పోవడంతో మథుర్ ఆ ఆలోచన మానుకొని కలకత్తాకు తిరిగి వచ్చేశాడు. ఆ విధంగా దాదాపు నాలుగు నెలల కాలం ముఖ్యమైన పుణ్యతీర్థాలను సేవించుకొని శ్రీరామకృష్ణులు 1868 వ సం ॥ మధ్య కాలంలో (జ్యేష్ఠ మాసంలో) దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారని హృదయ్ తెలిపాడు. ఆయన బృందావనంలోని రాధాకుండ్, శ్యామకుండ్ నుండి కొంత మట్టీ, ధూళి తీసుకువచ్చారు. దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చాక హృదయ్ సహాయంతో ఆయన దాన్లో కొంతభాగాన్ని పంచవటి చుట్టూ వెదజల్లి, మిగిలిన దానిని తమ సాధన కుటీరంలో స్వయంగా తామే త్రవ్వి పాతిపెట్టారు. “నేటి నుండి ఈ స్థలం బృందావనం లాగా పవిత్రభూమి కాగలదు” అని ప్రకటించారు. కొన్ని రోజులు గడిచాక విభిన్న ప్రాంతాల నుండి వైష్ణవ గోస్వాములను, భక్తులను ఆహ్వానించమని శ్రీరామకృష్ణులు, మథుర్ను కోరారు. వారందరూ వచ్చారు. శ్రీరామకృష్ణులు పంచవటిలో ఒక ఉత్సవాన్ని జరిపించారు. ఆ సందర్భంలో మథుర్, అక్కడకు వచ్చిన గోస్వాములు ఒక్కొక్కరికి పదహారు రూపాయలు, భక్తులకు తలా ఒక రూపాయి చొప్పున దక్షిణ ఇచ్చాడు.
14. హృదయ్ భార్య మరణం
తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చిన కొద్దికాలం లోపునే హృదయ్ భార్య మరణించింది. ఈ దుర్ఘటనతో హృదయ్ మనస్సు కొంతకాలం వరకు వైరాగ్యంతో నిండిపోయింది. హృదయ్ ధ్యానపరాయణ ప్రవృత్తి గలవాడు కాడనే సంగతి మునుపే చెప్పుకొన్నాం. తన ప్రాపంచిక స్థితిగతులను పెంపొందించుకొని సాధ్యమైనంత వరకు సుఖీంచాలన్నదే ఆతడి జీవితాదర్శం. శ్రీరామకృష్ణుల నిరంతర సాహచర్యం కారణంగా అతడిలో ఆధ్యాత్మిక భావాలు జనించినా అవి ఎక్కువ కాలం నిలిచి ఉండలేదు. సుఖీంచే సదవకాశం చేజిక్కినప్పుడల్లా సమస్తం విస్మరించి, దానినే వెంబడించేవాడు. దాన్ని సాధించే వరకు అతడి మనస్సులో మరొక ఆలోచనే వచ్చేది కాదు. అందుచేతనే శ్రీరామకృష్ణుల అపూర్వ దివ్యసాధనలన్నీ హృదయ్ దక్షిణేశ్వరంలో వసిస్తూన్న కాలంలోనే అనుష్ఠింప బడినప్పటికీ, శ్రీరామకృష్ణులలో తాను గాంచిన తీవ్రదివ్య పరితాపం చేత హృదయ్ కించిత్తు కూడ ప్రభావితం కాలేదు. అయినప్పటికీ హృదయ్ యథార్థంగానే తన మామను ప్రేమించాడు. ఏ సమయంలో సేవ అవసరమైనప్పటికీ ఆయనను సేవించడంలో హృదయ్ ఎన్నడూ వెనుకంజవేయలేదు. తత్ఫలితంగా అతడు సాహసం, దక్షత, తెలివితేటలు పెంపొందించు కొన్నాడు. సాధుపుంగవుల నుండి తన మామ అలౌకిక మహత్వాన్ని వినేకొద్దీ, ఆధ్యాత్మిక సాధనాకాలంలో ఆయనలో అపూర్వ దైవీశక్తుల వ్యక్తీకరణను తాను ప్రత్యక్షంగా పరిశీలించేకొద్దీ, తన లోలోపలి బలాన్ని హృదయ్ మరింతగా అనుభూతం చేసుకోగలిగాడు. శ్రీరామకృష్ణులతో అతడి సాన్నిహిత్యం చలవ వల్లనే ఇది సాధ్యమైంది. తను ఒనరించిన సేవల కారణంగా ఆయన సాన్నిహిత్యాన్ని పొందాననుకోవడం – ఆయన తన సొంత మనిషి, ఆయనకు తాను ఇష్టుడనీ భావించడం – శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక సాధనా విజయాలు ఒక రకంగా తనవి కూడా అని హృదయ్‌ను అనుకొనేలా చేశాయి. ఎప్పటికన్నా వాటిని తను పొందడానికి ప్రయత్నిస్తే, తన దివ్యశక్తులచే శ్రీరామకృష్ణులు వాటిని తనకు లభింపచేస్తారని అతడు తలపోశాడు. కనుక ఇప్పటినుండే ఆందోళన చెందవలసిన అవసరం తనకు లేదని హృదయ్ భావించాడు. ముందు ఒకింత లౌకిక సుఖాలను అనుభవించి, ఆ తరువాత పరాన్ని గురించి తాపీగా యోచించవచ్చు అనుకొన్నాడు. అప్పటి వరకు జీవితం పట్ల అతడి వైఖరి ఈ రీతిలోనే ఉండేది.
భార్య మరణంతో శోకపూరితుడైన హృదయ్ ఇప్పుడు తన జీవిత వైఖరి, విధానాలలో మార్పు తెచ్చుకోవడానికి తగిన సమయం ఆసన్నమైనదనుకొన్నాడు. అతడు అప్పటి నుండి వెనుకటి కన్నా మరింత నిష్ఠతో జగజ్జననిని పూజింప ఉపక్రమించాడు. శ్రీరామకృష్ణులను అనుకరిస్తూ, ధరించిన వస్త్రాన్ని, జంధ్యాన్ని ఆవలపెట్టి ధ్యానం చేయసాగాడు. శ్రీరామకృష్ణులు అనుభూతం చేసుకొన్న ఆధ్యాత్మిక అనుభూతులు తాను కూడా పొందేలా తనకు సహాయం చేయమని ఆయనను అర్థించాడు. అతడికి సాధనలు చేయవలసిన అవసరం ఎంతమాత్రం ఉండదని శ్రీరామకృష్ణులు నొక్కి చెప్పారు. తనను సేవించటం ద్వారానే ఆ ఫలితాలు అతడు పొందగలడని భరోసా ఇచ్చారు.
తాము ఇద్దరూ రేయింబవళ్ళు భగవద్భావంలో మగ్నులై, ఆహార నిద్రాది శారీరక అవసరాలను విస్మరిస్తే, తమలో ఒకరు మరొకరిని చూసుకోవడం ఎలా కుదురుతుందని శ్రీరామకృష్ణులు, హృదయ్‌కు నచ్చచెప్ప చూశారు. కాని హృదయ్ ఆ మాటలకు చెవి ఒగ్గలేదు. చివరకు శ్రీరామకృష్ణులు గత్యంతరంలేక సమ్మతిస్తూన్న ధోరణిలో ఇలా అన్నారు: “సరే, అమ్మ సంకల్పమే నెరవేరుతుంది. నా సంకల్పంతో ఏదైనా జరుగుతుందా? అమ్మే నా మనస్సును మరల్చి, నన్ను ఆ అవస్థలోకి తీసుకువచ్చి, అద్భుత అనుభూతులను అనుగ్రహించింది. అమ్మ సంకల్పిస్తే నీకూ ఆ అనుభూతులను అనుగ్రహిస్తుంది” అని అన్నారు.
15. హృదయ్ భావపారవశ్యం
ఈ మాటలు జరిగిన కొన్ని రోజుల తరువాత పూజ చేస్తూ ఉన్నప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు హృదయ్‌కు జ్యోతిర్మయ దేవతామూర్తుల దర్శనాలు కలగసాగాయి. ఆ సమయంలో అతడు భావావిష్టుడై అర్ధబాహ్యస్మృతి పొందేవాడు. ఇలా ఉండగా ఒకరోజు మథుర్బాబు భావావస్థలో ఉన్న హృదయ్‌ను చూడడం తటస్థించింది. వెంటనే అతడు శ్రీరామకృష్ణులను, “బాబా! హృదయ్‌కు మళ్ళీ ఏమైంది?” అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, మథుర్కు ఇలా చెప్పారు: “హృదు నడవడిక బూటకం కాదు. దివ్యదర్శనాలు చూపించమని జగజ్జననిని పట్టుపట్టాడు. అందుకే వాటిని పొందుతున్నాడు. ఒకింత వాటి రుచి చూపించిన పిదప జగజ్జనని, అతణ్ణి మామూలు స్థితికి తీసుకువస్తుంది.” ఆ మాటలు విని మథుర్ ఇలా అన్నాడు: “బాబా! ఇదంతా నీ లీల. నువ్వే హృదయ్‌కు అటువంటి స్థితిని కలిగించావు. కనుక నువ్వే అతడికి ఉపశమనం కలిగించు. నంది భృంగులవలె మేం ఇద్దరం కలిసి నిన్ను సేవించుకొంటాం. ఈ అసాధారణ స్థితులు మా కెందుకు?”
16. హృదయ్ చూసిన అద్భుత దర్శనం
మథుర్, శ్రీరామకృష్ణుల మధ్య ఈ సంభాషణ జరిగిన కొన్ని రోజులకు ఒకనాటి రాత్రి శ్రీరామకృష్ణులు పంచవటి వైపుకు వెళ్ళటం హృదయ్ చూశాడు. ఆయనకు అవసరమౌతాయని నీటిచెంబు, తువ్వాలు పుచ్చుకొని హృదయ్ ఆయనను అనుసరించాడు. అలా పోతూవున్నప్పుడు హృదయ్ ఒక అత్యద్భుత దర్శనం గాంచాడు. శ్రీరామకృష్ణులు రక్తమాంసాలతో కూడిన దేహధారియైన మానవుడుగా హృదయ్‌కు గోచరించలేదు. ఆయన దేహం నుండి ప్రసరిస్తూ ఉన్న అపూర్వ కాంతితో పంచవటి దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఆయన నడుస్తున్నప్పుడు జ్యోతిర్మయమైన ఆయన పాదాలు నేలను స్పృశించక, గాలిలో తేలుతూ ఆయన్ను ముందుకు తీసుకు పోతున్నాయి. కళ్ళు భ్రమించాయేమో ననుకొని హృదయ్ కళ్ళు నులుముకుని మరీమరీ చూశాడు. ఊహూఁ! చెట్లు, లతలు, గంగానది, కుటీరం మొదలైనవన్నీ సహజసిద్ధంగానే కనబడుతూ ఉన్నప్పటికీ శ్రీరామకృష్ణులు మాత్రం జ్యోతిర్మయ రూపంలోనే కనిపించారు. దీనిని చూసి అమితాశ్చర్యానికి లోనైన హృదయ్ తన మనస్సులో ఏదైనా మార్పు జరిగిందేమోనని భావించాడు. ఇలా అనుకొని హృదయ్ తన దేహం వంక చూసుకొన్నాడు; తానుకూడ జ్యోతిర్మయ దేహం ధరించిన పురుషుడనని, భగవంతుని అనుచరుడనని, సాక్షాత్తు భగవంతుని వద్ద శాశ్వతంగా ఉంటూ ఆయనకు సేవలు ఒనరుస్తున్నానని అతడికి అనిపించింది. ‘తాను భగవంతుని జ్యోతిర్ఘన అంగం నుండి జన్మించిన అంశరూపుడనని, భగవంతుని సేవార్థమే మరొక దేహాన్ని దాల్చి ఆయన నుండి విడిగా ఉన్నానని’ అతడు అనుకొన్నాడు. అటువంటి దివ్యదర్శనం గాంచి, తన జీవిత మర్మాన్ని తెలుసుకొన్న హృదయ్ హృదయం పరమానందంతో పొంగిపొరలింది. అతడు తనను మర్చిపోయాడు, ప్రపంచాన్నే మర్చి పోయాడు, లోకులు తనను పిచ్చివాడని పిలుస్తారేమోనన్న సంగతినీ మర్చిపోయాడు. అర్ధబాహ్య పారవశ్యంలో పిచ్చివాడిలా, “ఓ రామకృష్ణా! ఓ రామకృష్ణా! మనం మానవులం కాము. మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం? దేశదేశాలూ తిరుగుతూ జీవులను ఉద్ధరిద్దాం, పద. నువ్వు ఎవరివో నేనూ అతడినే” అంటూ బిగ్గరగా కేకలు పెట్టసాగాడు.
శ్రీరామకృష్ణులు మాతో ఇలా చెప్పారు: “అతడి కేకలు విని నేను, ‘ఒరే, ఆగు ఆగు! ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు? ఏదో ఆపద సంభవించినదని జనం ఇక్కడకు పరిగెత్తుకు వస్తారు’ అన్నాను. కాని అతడు నా మాటలు వింటాడా? పరుగున అతడి వద్దకు వెళ్ళి, అతడి హృదయాన్ని స్పృశించి, ‘అమ్మా! వీణ్ణి జడునిగా చేసివెయ్యి’ అన్నాను.
17. హృదయ్ మనస్సు మందగించడం
శ్రీరామకృష్ణులు అలా పలుకగానే తన దివ్యదర్శనం, పరమానందం శూన్యంలో మాయమైపోయి మళ్ళీ పూర్వపు మాదిరిగా అయిపోయానని హృదయ్ మాతో చెప్పాడు. అలా పారవశ్య స్థితి నుండి హఠాత్తుగా క్రిందికి పడిపోవడంతో హృదయ్ ఖీన్నుడయ్యాడు. అతడు విలపిస్తూ శ్రీరామకృష్ణులతో, “మామా! నువ్వెందుకు అలా చేశావు? మంద బుద్ధిని అయిపోవాలని ఎందుకు పలికావు? నాకు ఇక ఎన్నటికీ అట్టి పరమానంద దర్శనం కలుగదు” అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “నువ్వు శాశ్వతంగా మంద బుద్ధిని అయిపోవాలని నేను అన్నానా? కాస్త స్థిమితంగా ఉండు. ఆ చిరు దర్శనానికే నువ్వింతగా కేకలు పెట్టావే! అందుకే నేను అలా పలికాను. ఇరవై నాలుగు గంటలూ ఎన్ని దివ్యదర్శనాలు, దివ్యానుభూతులు నేను పొందు తున్నాను! కాని నేను అలా కేకలు పెడుతున్నానా? అట్టి దివ్యదర్శనాలు పొందడానికి నీకు ఇంకా సమయం ఆసన్నం కాలేదు. ప్రస్తుతం శాంతంగా ఉండు. సమయం వచ్చినప్పుడు నువ్వు వివిధ దర్శనాలు, అనుభూతులు పొందగలవు” అని హామీ ఇచ్చారు.
18. హృదయ్ సాధనలకు విఘ్నం
శ్రీరామకృష్ణుల మాటలు విని హృదయ్ మౌనం పాటించినా, అతడు ఎంతో బాధపడ్డాడు. అహంకారపూరితుడై ఎలాగైనా ఆ దివ్యదర్శనాన్ని మళ్ళీ పొంద ప్రయత్నించాలని హృదయ్ సంకల్పించాడు. ఆ సంకల్పం మేరకు అతడు జపధ్యానాలలో ఎక్కువ కాలం గడపసాగాడు. అంతేగాక రాత్రివేళ పంచవటికి వెళ్ళి పూర్వం శ్రీరామకృష్ణులు ఏ చెట్టుక్రింద కూర్చుని జపధ్యానాలు అనుష్ఠించారో అదే చెట్టు క్రింద తాను కూర్చుని జగజ్జననిని ప్రార్థించాలని తలపోశాడు. అనుకొన్నట్లే ఒకనాటి అర్ధరాత్రి వేళ పంచవటికి వెళ్ళి శ్రీరామకృష్ణులు సాధనలు అనుష్ఠించిన స్థలంలో ధ్యానం చేయడానికి కూర్చున్నాడు. విచిత్రంగా శ్రీరామకృష్ణులకు కూడా అదే సమయంలో పంచవటికి వెళ్ళాలనే ఆకాంక్ష జనించింది. అక్కడకు ఆయన చేరుకొన్నారో లేదో, “మామా! నన్ను రక్షించు, నన్ను రక్షించు. కాలిపోతూ చస్తున్నాను” అన్న హృదయ్ దీనారావాలు ఆయన విన్నారు. వడివడిగా ముందుకు వెళ్ళి హృదయ్ వద్దకు వచ్చి, “ఏమైంది హృదయ్?” అని అడిగారు. బాధతో అశాంతుడైన హృదయ్, “మామా! ఇక్కడ ధ్యానానికి కూర్చున్నానో లేదో ఎవరో కణకణ మండుతున్న బొగ్గులను నా ఒంటి మీద పోసినట్లయింది. నేను భరించలేని మంటతో బాధపడుతున్నాను” అన్నాడు. శ్రీరామకృష్ణులు అతడి ఒంటిని తన చేతులతో నిమురుతూ, “భయపడకు, చల్లారుతుందిలే. అయినా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నా సేవతోనే నువ్వు సమస్తం సాధించగలవని నీకు పదేపదే చెప్పాను కదా!” అన్నారు. శ్రీరామకృష్ణుల చేతులు తనను స్పృశించగానే ఒంటి మంటలు చల్లారిపోయాయని హృదయ్ చెబుతూ ఉండేవాడు. ఆ తరువాత అతడు ధ్యానం చేయడానికి మరెన్నడైనా పంచవటికి వెళితే ఒట్టు! శ్రీరామకృష్ణుల సలహాకు విరుద్ధంగా తాను ఏం చేసినా తనకు మంచి జరగదని హృదయ్‌కు గట్టి నమ్మకం కుదిరింది.
19. హృదయ్ ఇంట్లో శ్రీశ్రీ దుర్గాపూజ మహోత్సవం నిర్వర్తించడం
శ్రీరామకృష్ణుల మాటలతో హృదయ్ ఒక రకంగా శాంతి పొందాడనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాని దేవాలయ దైనందిన కర్తవ్యాలు మునుపటి మాదిరి అతడికి రుచించడం లేనట్లే కనిపించాయి. తాను ఆనందం పొందగలిగే ఏదో ఒక వినూత్న ప్రక్రియకై అతడి మనస్సు అన్వేషించ సాగింది. 1868 వ సం ॥ శరత్కాల ఆగమనం దృష్టిలో ఉంచు కొని, తన ఇంట్లో శ్రీశ్రీ దుర్గాపూజ మహోత్సవం నిర్వర్తించాలని హృదయ్ సంకల్పించాడు. హృదయ్ సవతి అన్నగారైన గంగా నారాయణ్ అప్పటికే గతించాడు. మరో బంధువైన రాఘవ్, మథుర్ బాబు జమీలో శిస్తు వసూలుచేసే ఉద్యోగిగా నియమించబడి బాగానే సంపాదిస్తున్నాడు. కాలం కలిసి రావడంతో హృదయ్ కుటుంబం ఉన్నతి నొందింది. ఇంటి వద్ద కొత్త చండీ మండపం (పూజాదులు నిర్వర్తించబడే పెద్ద చావడి) కట్టించారు. జగజ్జననిని ఒకసారి ఆ మండపంలో ఆరాధించాలనే కోర్కెను గంగా నారాయణ్ వెలిబుచ్చాడు. కాని ఆ కోర్కె తీర్చుకొనే అవకాశం రాకుండానే అతడు మరణించాడు. తన అన్నగారి కోరిక గుర్తున్న హృదయ్ దానిని నెరవేర్చాలని సంకల్పించాడు. చేతల మనిషి అయిన హృదయ్‌కు ఆ పూజా కార్యం శాంతిని ఇవ్వగలదని ఎరిగిన శ్రీరామకృష్ణులు అందుకు సమ్మతించారు. మథుర్బాబు ఈ ఉత్సవానికి కొంత ధన సహాయం చేశాడు. శ్రీరామకృష్ణులను తోడ్కొని వెళ్ళి ఉత్సవ సమయంలో తన ఇంట్లో గడిపేటట్లు చేయాలని హృదయ్ ఎంతో అభిలషించాడు. కాని ఆ సమయంలో శ్రీరామకృష్ణులు తనతోనే ఉండిపోవాలని మథుర్బాబు ఆకాంక్షించాడు. ఈ వ్యవహారంలో తన వైఫల్యానికి ఖీన్నుడైన హృదయ్ శ్రీశ్రీ దుర్గాపూజకు ఒంటరిగానే ఇంటికి వెళ్ళడానికి తయారయ్యాడు. అలా కుంగిపోయిన హృదయ్‌ను చూసి శ్రీరామకృష్ణులు, ఓదారుస్తూ ఇలా అన్నారని హృదయ్ మాకు తెలిపాడు: “ఎందుకు బాధపడతావు? సూక్ష్మ శరీరంతో రోజూ నీ పూజను తిలకించడానికి నేను వస్తాను. నువ్వు తప్ప నన్ను ఎవరూ చూడలేరు. తంత్రధారకుని (ప్రధానాచార్యుడు)గా ఒక బ్రాహ్మణుని నియుక్తం చేసుకొని భక్తి శ్రద్ధలతో జగజ్జననిని అర్చించు. కఠోర ఉపవాసం చేయనవసరం లేదు. అందుకు మారుగా మధ్యాహ్నం పాలు, గంగాజలం, కలకండ పానకం పుచ్చుకో. ఈ రీతిలో నువ్వు పూజిస్తే, జగజ్జనని నిశ్చయంగా నీ పూజను స్వీకరిస్తుంది” అని పిదప శ్రీరామకృష్ణులు ఎవరిచే ప్రతిమను తయారుచేయించాలో, ఎవరిని తంత్రధారకునిగా నియమించాలో, తక్కిన ఏర్పాట్లు ఎలా చేయించాలో తనకు విశదీకరించినట్లు హృదయ్ తెలియచేశాడు. తరువాత హృదయ్ శ్రీశ్రీ దుర్గాపూజ నిర్వర్తించడానికి మహదానందంతో ఇంటికి బయలుదేరాడు.
20. హృదయ్‌కు శ్రీరామకృష్ణుల దర్శనం
హృదయ్ ఇంటికి వెళ్ళి శ్రీరామకృష్ణుల సూచనల మేరకు అన్ని ఏర్పాట్లూ చేసుకొన్నాడు. అలా షష్ఠి రోజున దేవి ప్రతిష్ఠ, మేలుకొలుపు మొదలైన క్రియలు పూర్తి చేసుకొని స్వయంగా పూజావ్రతాన్ని చేపట్టాడు. సప్తమి పూజ సాంగోపాంగంగా పూర్తయింది. రాత్రివేళ దేవికి హారతి ఇస్తూ ఉన్నప్పుడు దివ్యజ్యోతిర్మయ దేహంతో దేవీప్రతిమ ప్రక్కన శ్రీరామకృష్ణులు భావావిష్టులై నిలబడి ఉండడం హృదయ్ చూశాడు. అలా ప్రతిరోజూ రాత్రి హారతి సమయంలో, సంధి పూజాకాలంలో (అష్టమి, నవమి తిథుల సంధికాలం విశేష శుభకాలంగా పరిగణింపబడి శ్రీశ్రీ దుర్గాదేవికి ప్రత్యేక పూజ జరుపబడుతుంది) శ్రీరామకృష్ణుల దివ్యదర్శనం పొంద, శ్రీశ్రీ దుర్గాపూజ మహోత్సాహంతో నిర్వర్తింపబడినదని హృదయ్ మాకు తెలిపాడు. దుర్గాదేవి ఉత్సవం పూర్తిచేసిన కొన్ని రోజులకే హృదయ్ దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చి జరిగినదంతా శ్రీరామకృష్ణులకు నివేదించాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు అతడితో ఇలా అన్నారు: “హారతి, సంధిపూజా సమయాలలో నీ పూజను చూడాలని గొప్ప ఆకాంక్ష కలిగేది. భావపారవశ్య స్థితిలోకి వెళ్ళిపోయేవాడిని. జ్యోతిర్మయ దేహం దాల్చి జ్యోతిర్మయ మార్గం గుండా నీ పూజామండపానికి వెళ్ళినట్లు అనుభూతి చెందాను” అని తెలియజేశారు.
21. దేవీ నవరాత్రోత్సవ కడపటి సందర్భం
శ్రీరామకృష్ణులు భావపారవశ్య స్థితిలో ఒకసారి, “నువ్వు ఏటా జరిపే శ్రీశ్రీ దుర్గాపూజ మూడుసార్లు చేస్తావు” అని భవిష్యద్వాణి పలికారు. అది అక్షర సత్యమైంది. శ్రీరామకృష్ణుల వాక్కులను పెడచెవిన పెట్టి హృదయ్ నాలుగవ సారి శ్రీశ్రీ దుర్గాపూజ చేయ పూనుకొన్నప్పుడు ఒకదాని వెంట మరొకటిగా ఎన్నో విఘ్నాలు ఎదురయ్యేసరికి ఆ ప్రయత్నం విరమించాడు. మొదటి సంవత్సరం పూజ జరిగిన కొద్దికాలంలోనే హృదయ్ పునర్వివాహం చేసుకొని, మునుపటిలా దక్షిణేశ్వర కాళికాలయంలో ఉంటూ శ్రీరామకృష్ణులను సేవించడంలో నిమగ్నుడయ్యాడు.