1. శ్రీరామకృష్ణుల తీవ్రవ్యాధి: ఆయన అసదృశ వైఖరి
శ్రీరామకృష్ణులు, జగదంబా దాసి ప్రాణాంతక వ్యాధిని నయం చేసిన కారణాన అయితేనేం లేదా ఎడతెగక ఆరు సుదీర్ఘ నెలల కాలం పాటు అద్వైత భూమిలో నెలకొని ఉండడం కోసమై చేపట్టిన నిర్విరామ సాధనల ప్రయత్నాల ఫలితంగా అయితేనేం శ్రీరామకృష్ణుల దార్యశరీరం ఛిన్నాభిన్నమై కొన్ని నెలలుగా వ్యాధిగ్రస్తమై ఉన్నది. తీవ్ర గ్రహణి రోగం వాతబడినట్లు ఆయన ముఖతా మేం విన్నాం. మేనల్లుడైన హృదయ్ రేయింబవళ్ళు ఆయనకు శుశ్రూషలు చేశాడు. చికిత్సకై సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడైన గంగాప్రసాద్ సేన్‌ను నియమించి, పథ్యాదులకు ప్రత్యేక ఏర్పాట్లు గావించాడు మథుర్. ఆయన శరీరం తీవ్రవ్యాధికి గురైనప్పటికీ, దేహ చైతన్యానికి అతీతంగా ఆయన మనస్సు అనుభవించిన అపురూప ప్రశాంతత, నిరవచ్ఛిన్న దివ్యానందం వర్ణనాతీతం. ఆయన మనస్సు దేహం నుండి, వ్యాధి నుండి, సకల లౌకిక వస్తువుల నుండి కించిత్ సూచన మేరకే విడివడిపోయి, రివ్వున పైకెగసి క్షణంలో ఆ ఊర్ధ్వ నిర్వికల్పభూమిని చేరుకొనేది. బ్రహ్మ, ఆత్మ లేక ఈశ్వరుడు వంటి పదాలు స్ఫురణకు వచ్చిన మరుక్షణమే తక్కిన విషయాలనన్నిటిని మరచిపోయి ఆ భావనలో లీనమైపోగా, ఆయన ప్రత్యేక అస్తిత్వం పూర్తిగా మరుగైపోయేది. కాబట్టి వ్యాధి తీవ్రత కారణంగా దేహంలో భరించలేని బాధ కలిగినా ఆ బాధను ఆయన లేశమాత్రంగానే అనుభవించే వారని స్పష్టమవుతోంది. కాని వ్యాధిజనితమైన ఆ బాధ కొన్ని సమయాలలో తమ మనస్సును ఆధ్యాత్మికానుభూతుల సమున్నత భూముల నుండి దిగువకు తీసుకువచ్చి దేహచైతన్యాన్ని కల్పించేదని ఆయన నుండే మేం విని ఉన్నాం. వేదాంత మార్గాన్ని అనుసరించే పరమహంస పరివ్రాజకాచార్యులు ఈ కాలంలో తమ వద్దకు వచ్చి ఉన్నారని శ్రీరామకృష్ణులు తెలిపారు. ఆ కాలంలో ‘నేతి, నేతి’, ‘అస్తి – భాతి – ప్రియం’* , ‘అయమాత్మా బ్రహ్మ’ ఇత్యాది ప్రసిద్ధ వేదాంత తత్త్వ విచారణ పలుకులతో సర్వదా ఆయన గది మారుమ్రోగుతూ ఉండేది.* ఆ అత్యున్నత వేదాంత తాత్త్విక చర్చలలో వారు ఎలాంటి తుది నిర్ణయానికీ రాలేకపోయినప్పుడు, శ్రీరామకృష్ణులే మధ్యవర్తులై పరిష్కరించేవారు. సామాన్యులలా ఆయన కూడ వ్యాధి బాధతో మనోవ్యాకులత పొందివుండే పక్షంలో దురవగాహమైన ఆ తాత్త్విక చర్చలలో సర్వదా పాల్గొనడం ఎన్నటికీ ఆయనకు సాధ్యపడేది కాదని చెప్పడం అనవసరం.
2. ‘నిర్వికల్ప సమాధి’ లో నెలకొని ఉండడం గురించిన శ్రవణ సంబంధిత అనుభవం: తత్ఫలితం
నిర్వికల్ప సమాధి స్థితిలో ఆయన అలా నిరవచ్ఛిన్నంగా నెలకొని ఉన్న కాలం ఆఖరున శ్రీరామకృష్ణులకొక శ్రవణ సంబంధిత దివ్యానుభూతి కలిగిందని వేరొకచోట* మేం తెలియజేశాం. ‘భావముఖం’ లో నెలకొని ఉండు అని మూడవసారి ఆయన ఆదేశం పొందడమే ఆ అనుభూతి. శ్రవణ సంబంధిత అనుభూతి అని మేం పేర్కొంటున్నప్పటికీ, ఆయన హృదయాంత రాళాలలో అనుభూతం చేసుకొన్నదిగా దానిని పాఠకులు గ్రహించాలి. కారణం : మొదటి రెండుసార్లు జరిగినట్లు ఈసారి ఆ ఆదేశాన్ని ఏ మూర్తి ముఖతా ఆయన విని ఉండలేదు. కాని తురీయ అద్వైత భూమిలో సంపూర్ణంగా ఐక్యం చెందక మునుపు ఆయన మనస్సు సర్వదా ఆ తత్త్వం నుండి కించిత్తు విడివడి, ఒకింత దిగువకు వచ్చి తనను సగుణబ్రహ్మగానో లేక విరాట్ బ్రహ్మగానో లేదా జగజ్జనని అంశగానో భావిస్తూ ఉంటూ ఉండేదో, అట్టి అవస్థలో ‘భావముఖంలో వసించు’ అనే భావన లేదా సంకల్పం ఆ విరాట్పురుషుని విశ్వమానసంలో జనించి ఉండడం శ్రీరామకృష్ణులు ప్రత్యక్షంగా అనుభూతం చేసుకొన్నారు. తత్ఫలితంగా ఆయన భవిష్యత్ జీవితోద్దేశం స్పష్టంగా ఆయన కళ్ళ ముందు గోచరమైంది.
శరీరాన్ని ఉంచుకోవాలనిగాని లేదా జీవించి ఉండాలని గాని కించిత్తు కోరికా ఆయనలో లేకున్నప్పటికీ అతిగూఢమైన జగజ్జనని సంకల్పంతో భావముఖంలో నెలకొని ఉండమని పదే పదే ఆదేశాన్ని పొంది స్వప్రయోజనం ఏమీ లేకున్నప్పటికీ భగవల్లీలా ప్రయోజనార్థం తమ శరీరాన్ని పరిరక్షించుకోవాలని, నిర్వికల్ప స్థితిలో పరబ్రహ్మతో తాదాత్మ్యం చెంది ఉంటే శరీరం ఉండడం అసంభవమని, కాబట్టే తామిప్పుడు అలా ఆదేశితులైనారని స్పష్టంగా శ్రీరామకృష్ణులు గ్రహించారు. ‘జాతిస్మరత్వం’* ద్వారా ఆయన ఇప్పుడు చక్కగా ఇలా అర్థం చేసుకొన్నారు: తాము నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావులైన అవతార పురుషులమని, ప్రస్తుత యుగంలో ఏర్పడ్డ ధర్మగ్లానిని తొలగించివేసి లోకకల్యాణం సాధించే నిమిత్తమే తాము మానవరూపు దాల్చి కఠోర తపస్సు చేయవలసి వచ్చిందనీ! అంతేగాక జగజ్జనని ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనార్థమే తనను ఈసారి బాహ్య ఐశ్వర్యాడంబర రహితునిగా, విద్యావిహీనునిగా, ఒక పేదబ్రాహ్మణ కుటుంబంలో జన్మింప చేసిందనీ, ఆ లీలా రహస్యం (అంటే తానొక అవతారపురుషుడననే) తమ జీవితకాలంలో కొద్దిమంది మాత్రమే గ్రహించ గలరనీ, తమ మనఃశరీరాల ద్వారా మహాప్రబల ఆధ్యాత్మిక తరంగాలు ఉత్పన్నమై అవి మహా వేగగతిన ఎగసి చిరకాలం మానవాళికి శ్రేయస్సు ఒనగూర్చగలవని శ్రీరామకృష్ణులు ఇప్పుడు చక్కగా తెలుసుకొన్నారు.
3. బ్రహ్మజ్ఞాన అనుభూతికి ముందు గతజన్మల స్మృతి కలగడం – శాస్త్రాల ప్రమాణం
శ్రీరామకృష్ణులకు ఈ విధమైన అసాధారణ అనుభూతులు ఎలా కలిగినవో మనం అర్థం చేసుకోవాలంటే శాస్త్రాలు వక్కాణిస్తున్న కొన్ని విషయాలను మనం స్మరించాలి. జ్ఞానమార్గాన్ని అనుసరించి నిర్వికల్ప అద్వైతానుభూతిలో సంపూర్ణంగా నెలకొని ఉండడానికి మునుపు సాధకుడికి గత జన్మలను అనుభూతి చేసుకొనే శక్తి జనిస్తుందని శాస్త్రాలు* చెబుతున్నాయి. అద్వైతభావం పరిపూర్ణదశకు చేరినప్పుడు సాధకుడి స్మృతిశక్తి ఎంత అధికరిస్తుందంటే ఇంతకు మునుపు అతడు ఎక్కడ, ఎలా, ఎన్నిసార్లు ఏయే శరీరాలు ధరించి జన్మించాడో, ఏ పాపపుణ్య కర్మలను నిర్వర్తించాడో – తన ఆ సాంసారిక చరిత్ర యావత్తూ కళ్ళకు కట్టినట్లు అతడి స్మృతిపథంలో స్పష్టంగా మెదలుతుంది. తత్ఫలితంగా సాంసారిక విషయాలన్నిటి అనిత్యత, రూప రసాదిభోగాలకై పరుగులెత్తుతూ పదే పదే జన్మించడంలోని నిష్ప్రయోజనం అతడికి సుబోధకమవుతుంది. అప్పుడు అతడి మనస్సులో ఉత్పన్నమైన తీవ్ర వైరాగ్యం కారణంగా అతడు కామవాసనలన్నిటనుండి సంపూర్ణంగా విడివడతాడు.
4. సంకల్పాలన్నీ సత్యం అయ్యే స్థితి
బ్రహ్మజ్ఞానుల సంకల్పాలన్నీ సత్యమై తీరుతాయని ఉపనిషత్తులు* చాటుతున్నాయి. అతడు దర్శించగోరే దేవలోకం, పితృలోకం ఇత్యాది ఏ లోకాన్ని అయినా సమాధి ద్వారా మనస్సుతో సందర్శించగలడు. అటువంటి జ్ఞానికి నానాయోగ విభూతులు, అణిమాది అష్టసిద్ధులు అప్రయత్నంగానే సిద్ధిస్తాయని పతంజలి మహర్షి తన యోగసూత్రాలలో ప్రస్తావించాడు. వాసనారాహిత్యం, సిద్ధులు పొంది ఉండడం – ఈ పరస్పర విరుద్ధమైన రెండూ అట్టి బ్రహ్మజ్ఞానిలో ఏకకాలంలో నెలకొని ఉండడం ఎలా పొసగుతుందనే ప్రశ్నకు, అద్భుతమైన శక్తులు సిద్ధించినా కూడ వారిలో లేశమైనా కామ (కోరిక)లు ఉండకపోవడం చేత ఆ జ్ఞానులు ఆ శక్తులను ఎన్నడూ స్వకీయార్థం ఉపయోగించరని పంచదశి రచయిత శ్రీ విద్యారణ్యులు సమన్వయం చేశారు. ఏ ప్రాపంచిక పరిస్థితిలో ఉంటూ సాధకుడు బ్రహ్మజ్ఞానాన్ని సంతరించుకొన్నాడో, జ్ఞానార్జనానంతరం కూడ అతడు అదే పరిస్థితులలో ఉంటూ కాలాన్ని గడుపుతాడు. అంటే అతడు తన స్థితిగతులను మార్చడానికి, మెరుగు పరచుకోవడానికి ససేమిరా ప్రయత్నించడు. అతడి మనస్సులో ఎలాటవాసనలూ, కామనలూ లేకపోవడమే ఇందుకు కారణం. కాని ఆధికారిక పురుషులు, అవతార పురుషులు నిరపేక్షంగా భగవదేచ్ఛాధీనులై ఉంటూ బహుజన హితార్థం, లోకశ్రేయస్సు నిమిత్తం అవసరమైన సందర్భాలలో ఆ సిద్ధులను ఉపయోగించటం కద్దు.
5. శాస్త్రబోధనల వెలుగులో శ్రీరామకృష్ణుల అసాధారణ అనుభూతులు
పైన ఉటంకించిన శాస్త్రబోధనల వెలుగులో ఈ కాలఘట్టంలో శ్రీరామకృష్ణుల జీవితాన్ని అధ్యయనం చేసినప్పుడు వారికి కలిగిన అసాధారణ అనుభూతులన్నీ కాకపోయినా చాలావరకు తేటతెల్లమవుతాయి. త్రికరణ శుద్ధిగా తమ సర్వస్వాన్ని ఆయన భగవంతుని పాదపద్మాలకు సమర్పించిన ఫలితంగా వాసనారహితులు కావడం చేతనే అంత స్వల్ప కాలంలో నిర్వికల్ప అద్వైత స్థితిని చేరి, దానిలో దృఢంగా ప్రతిష్ఠితులు కాగలిగారని మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. జాతిస్మరత్వ శక్తిని పొందిన తరువాత గత యుగాలలో ఎవడు శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా అవతరించి లోకహితాన్ని చేకూర్చాడో అతడే ప్రస్తుత యుగంలో శ్రీరామకృష్ణుడిగా దేహధారణ చేసి అవతరించాడని స్పష్టంగా ప్రత్యక్షం చేసుకొన్నారు. కాబట్టే లోకకల్యాణార్థం సాధనానంతర జీవితంలో దైవీశక్తులు ప్రతినిత్యం ఆయనలో అభివ్యక్తం అవుతూ ఉన్నప్పటికీ ఆయన తన సుఖం కోసం వాటిని ఎన్నడూ ఉపయోగించకపోవడం మనం అవగతం చేసుకోవచ్చు. నిగూఢ ఆధ్యాత్మిక తత్త్వాలను సాక్షాత్కరించుకోగల శక్తి సంకల్పమాత్రాన ఆయన ఇతరులలో ఎలా జాగృతం చేయగలిగారో మనం అర్థం చేసుకోగలం. అంతేగాక ఆయన అసాధారణ దివ్యప్రభావం నానాటికీ ప్రపంచమంతటా ఎందుకు పరివ్యాప్తం చెందుతూ ఉన్నదో అవగాహన చేసుకోగలం.
6. పైన పేర్కొన్న అనుభూతులన్నీ ఏకకాలంలో కలుగకపోవడానికి హేతువు
అద్వైత భూమిలో దృఢంగా ప్రతిష్ఠితులైన పిదప, అక్కడ నుంచి మళ్ళీ భావరాజ్యానికి దిగివస్తూ ఉన్న సమయంలో శ్రీరామకృష్ణులు పైన పేర్కొన్న విధంగా తమ భూత భవిష్యత్తుల గురించి చక్కగా ఎరిగి ఉన్నారు. కాని ఆయనకు ఆ అనుభూతులన్నీ హఠాత్తుగా ఒక్క రోజులోనే కలిగినవని అనుకోవడం సమంజసం కాదు. భావభూమికి దిగివచ్చిన ఒక ఏడాది పిదప ఈ విషయాల గురించిన పరిపూర్ణ జ్ఞానం ఆయన సంతరించుకొన్నారని ఊహించ వలసి ఉంటుంది. ఆ కాలఘట్టంలో జగజ్జనని ఒకటి వెంట ఒకటిగా ఆయన కళ్ళ ఎదుట నుంచి తెరలను తొలగించి రోజువారీగా ఆయనకు ఈ విషయాలను విస్పష్టం చేయసాగింది. ఆ విషయాలన్నీ ఆయన మనస్సుకు ఏకకాలంలో ఎందుకు స్ఫురించలేదు? అనే ప్రశ్నకు సమాధానం ఇది: అద్వైత భూమిలో వసిస్తూ వర్ణనాతీతమైన బ్రహ్మానందానుభావంలో ఆయన ఆ కాలంలో సదా మునిగి ఉన్నారు.కనుక ఆయన మనస్సు మళ్ళీ బహిర్ముఖం కానంతవరకు ఆ విషయాలనన్నిటినీ తెలుసుకోవాలన్న ఆకాంక్ష గాని, వ్యవధిగాని కలుగలేదు. ఆధ్యాత్మిక సాధనల ప్రారంభంలో, “అమ్మా! ఏం ఆచరించాలో నా కేమీ తెలియదు. స్వయంగా నువ్వు ఏం బోధిస్తావో దానినే నేర్చుకొంటాను” అని ఆయన జగజ్జననిని ప్రార్థిస్తూ, వేడుకొన్నారు. ఆయన మొర అక్షరాలా నెరవేరింది.
7. సాధనలన్నిటి చరమలక్ష్యం అద్వైత సాక్షాత్కారమే
అద్వైత భూమిలో సుస్థాపితులైన శ్రీరామకృష్ణులు ఈ కాలంలో మరో అనుభూతిని కూడ చవిచూశారు. అద్వైత సాక్షాత్కారాన్ని పొంది దాన్లో సుప్రతిష్ఠితం కావడమే నానారకాల సాధనల చరమోద్దేశం అని ఆయన అంతరాంతరాళాల్లో గ్రహించారు. భారతదేశంలో వాడుకలో ఉన్న ప్రధాన మత సంప్రదాయాలనన్నిటినీ సాధన చేసి, వాటిలో ప్రతిదీ సాధకుణ్ణి చివరకు అద్వైత స్థితికే చేరుస్తుందనే సాక్షాత్కారాన్ని ఆయన ఇంతకు మునుపే పొంది ఉండడమే తత్కారణం. అద్వైత స్థితిని గురించి ప్రశ్నించినప్పుడు ఆయన పదే పదే మాకు ఇలా చెబుతూ ఉండేవారు: “నాయనలారా అది కడపటిది, పరాకాష్ఠ. భగవత్ప్రేమ పరిపక్వమైనప్పుడు చిట్టచివరికి ఆ అనుభూతి సాధకులందరి జీవితాల్లోనూ స్వతహాగా కలిగి తీరుతుంది. అద్వైత సాక్షాత్కారమే మతాలన్నిటి చరమ అనుభూతి. మతాలు, మార్గాలు మాత్రమే (గమ్యం కాదు).”
8. పైన పేర్కొన్న శ్రీరామకృష్ణుల అనుభూతి, న భూతో న భవిష్యతి
ఆ రీతిగా ప్రత్యక్ష అద్వైత సాక్షాత్కారాన్ని పొందిన శ్రీరామకృష్ణుల మనస్సు అపరిమితమైన ఉదారభావంతో పొంగిపొరలింది. భగవత్సాక్షాత్కారాన్నే మానవ జీవితోద్దేశంగా బోధించే మత సంప్రదాయాలన్నిటిపట్ల ప్రస్తుతం ఆయన అసామాన్య సానుభూతిని వ్యక్తం చేయ సాగారు. కాని అటువంటి మహోదారత, సానుభూతి – ఇవి తమ స్వకీయ ఆవిష్కారాలని, గతంలో ఏనాడూ ఏ సాధక శ్రేష్ఠుడూ వాటిని అంత సమగ్రంగా సంతరించుకోవడం జరగలేదనే సంగతిని మొదట గ్రహించలేదు. దక్షిణేశ్వర కాళికాలయంలోనూ, ఇతర సుప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలోను నానా సంప్రదాయాలకు చెందిన ఉదాత్త సాధకులతో సాన్నిహిత్యం కలిగిన పిమ్మటే ఆయనకు ఆ విషయం (అంటే మతాలన్నీ మార్గాలనీ, కాబట్టి అన్ని మతాల పట్ల ఉదారత, సానుభూతి కనబరచాలనే తమ విశిష్టానుభూతి) క్రమంగా అవగతం కాసాగిందని మేం అభిప్రాయపడుతున్నాం. కాబట్టే అప్పటి నుండి మత వైఖరిలో ఏకపక్ష పోకడ ఎదురైనప్పుడు ఆయన దాన్ని తక్షణమే ఖండిస్తూ, ఆ సంకుచిత వైఖరిని తొలగింప అన్ని విధాలా ప్రయత్నించడం జరిగింది.
9. శ్రీరామకృష్ణుల ఇస్లాం మతసాధన ఆయన ఉదారతకు ఒక దృష్టాంతం
అద్వైత జ్ఞానంలో సుప్రతిష్ఠితులైన శ్రీరామకృష్ణుల మనస్సు ఇప్పుడు ఎంత ఉదారతతో నిండి ఉన్నదో ఈ కాలపు ఒక సంఘటన నుండి మనం స్పష్టంగా అవగతం చేసుకోవచ్చు. నిర్వికల్ప స్థితి నుండి దిగి వచ్చిన పిదప శ్రీరామకృష్ణులు అనారోగ్యానికి గురి అయి కొన్ని నెలల పాటు బాధపడ్డారనే సంగతి మనకు విదితమే. రోగబాధ ఉపశమించిన పిదపే ఈ సంఘటన జరిగింది. ఈ ఉదంతం జరగడానికి కొంత మునుపు ఆధ్యాత్మిక అభిరుచి గల గోవిందరాయ్ అనే వ్యక్తి దక్షిణేశ్వరానికి వచ్చాడు. పుట్టుకతో అతడు క్షత్రియుడని హృదయ్ చెప్పాడు. బహుశా అతడు అరబ్బీ, పారశీక భాషలు నేర్చి ఉండవచ్చు. విభిన్న మత సిద్ధాంతాలను అధ్యయనం చేసి, వివిధ మత సంప్రదాయస్థులతో సన్నిహితంగా మెలగిన పిదప, చివరకు అతడు మహమ్మదీయ మతంలోని ఉదారత పట్ల ఆకర్షితుడై, నియమం ప్రకారం మహమ్మదీయ మతం పుచ్చుకొన్నాడు. ధార్మిక పిపాసువైన గోవింద, మహమ్మదీయ మతాన్ని పుచ్చు కొన్నప్పటికీ అతడు మహమ్మదీయ సామాజిక ఆచార వ్యవహారాలను ఎంత వరకు అనుసరించాడో చెప్పడం కష్టం. కాని ఇస్లాం మత దీక్షను పుచ్చుకొన్నాక అతడు ఉత్సాహభరితంగా ఖురాన్ పఠించడంలోను, ఆ మతానుసారంగా సాధనాదులను నిర్వర్తించడంలోను నిమగ్నుడైనాడనే సంగతి మేం విన్నాం. గోవింద గొప్ప భగవద్భక్తుడు. ఇస్లాం అంతశ్శాఖలలో ఒకటైన సూఫీ సంప్రదాయంలో బహుళ వ్యాప్తంగా ఉన్న ఉపదేశాల మానసిక వైఖరుల ప్రకారం భగవంతుని ఆరాధించే విధానం అతడి మనస్సును ఆకట్టుకొని ఉండవచ్చు. ఎందుకంటే, సూఫీ సాధువులలా భక్తిభావ సాధనల్లో అతడు రేయింబవళ్ళు మునిగి ఉన్నాడు.
10. సూఫీ సాధకుడు గోవిందరాయ్ ఆగమనం
ఎలాగో గోవింద రాయ్ దక్షిణేశ్వర కాళికాలయానికి రావటం తటస్థించింది. ప్రశాంతమైన పంచవటి ప్రాంతం సాధనలకు సానుకూలంగా ఉంటుందని భావించి ఆ నీడన తన ఆసనాన్ని పరచుకొని కాలం గడపసాగాడు. రాస్మణి నిర్మిత కాళికాలయంలో సంసారాన్ని పరిత్యజించిన హైందవ సాధువులకూ, మహమ్మదీయ ఫకీర్లకూ సరిసమానమైన ఆతిథ్యం ఒసగబడేది. అందుచేత కాళికాలయంలో వసిస్తూన్న గోవిందకు భిక్షకై బయటకు వెళ్ళవలసిన అగత్యం కలుగలేదు. అందుకే అతడు నిశ్చింతతో ఇష్టదేవతా ధ్యానంలో రోజులు ఆనందంగా గడపసాగాడు.
11. గోవిందతో మాట్లాడిన పిదప శ్రీరామకృష్ణుల సంకల్పం
భక్తుడైన గోవిందను చూసి శ్రీరామకృష్ణులు అతడిపట్ల ఆకర్షితులైనారు. అతడితో సంభాషించి, గోవిందలో చిత్తశుద్ధితో కూడిన విశ్వాసం, భగవద్భక్తిని గాంచి ముగ్ధులయ్యారు. ఈ విధంగా శ్రీరామకృష్ణుల మనస్సు మహమ్మదీయ మతం వైపు ఆకర్షింపబడింది. ఆయన ఇలా భావించారు: ‘భగవత్ సాక్షాత్కారానికి ఇది కూడా ఒక మార్గమే. అనంత లీలా విలాసినియైన అమ్మ ఈ మార్గం ద్వారా కూడా తన పాదపద్మాలను చేరుకోవడానికి అనేకులను దీవిస్తూ ఉంది. తనను శరణుజొచ్చిన వారిని ఆమె ఈ మార్గం ద్వారా ఏ రీతిలో ధన్యులను గావిస్తూ ఉన్నదో నేను చూసి తీరాలి. గోవింద నుండి దీక్ష పుచ్చుకొని ఈ పథంలో సాధన అనుష్ఠించాలి’ అని నిశ్చయించుకున్నారు.
12. గోవింద నుండి దీక్ష – తత్సాధనలో సిద్ధి
తన సంకల్పాన్ని తక్షణమే కార్యాచరణలో పెట్టారు శ్రీరామకృష్ణులు. గోవిందకు తన ఆకాంక్షను తెల్పి, అతడి నుండి దీక్ష పుచ్చుకొని, విధ్యుక్తంగా ఇస్లాం మత సాధనను అనుష్ఠించసాగారు. దాన్ని గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు: “ఆ సమయంలో సభక్తికంగా ‘అల్లా’ మంత్రాన్ని జపించేవాణ్ణి. మహమ్మదీయునిలా వస్త్రధారణ చేసేవాణ్ణి. ప్రతినిత్యం మూడుసార్లు నమాజు చేసేవాణ్ణి. ఆ సమయంలో హైందవ భావనలు అడుగంటి మనస్సు నుండి అదృశ్యమైపోయాయి. హిందూదేవీ దేవతలకు మ్రొక్కడం మాట అటుంచి, వారిని దర్శించడానికి కూడ అనిష్టం జనించింది. ఆ భావనలో మూడు రోజులు గడిపాను. ఆ మత సంప్రదాయపు సాధనాఫలాన్ని అనుభూతం చేసుకొన్నాను.” ఇస్లాం సాధనను అనుష్ఠిస్తూ ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులకు మొదట పొడవాటి గడ్డంతో, అతి గంభీరుడైన ఒక తేజోమయ పురుషుని దివ్యదర్శనం కలిగింది. పిదప సగుణ బ్రహ్మ దర్శనం పొంది, చివరకు నిర్గుణ నిర్విశేష బ్రహ్మలో ఆయన మనస్సు లీనమైపోయింది.
13. ఇస్లాం ధర్మ సాధనాకాలంలో శ్రీరామకృష్ణుల ప్రవర్తన
ఇస్లాం మత సాధనానుష్ఠాన కాలంలో మహమ్మదీయులకు ప్రీతికరమైన ఆహారాన్ని, చివరకు గోమాంసాన్ని కూడ తినాలనే కోర్కె శ్రీరామకృష్ణులకు కలిగిందని హృదయ్ చెప్పాడు. మథుర్బాబు అక్కరతో చేసిన అభ్యర్థన ఆయనను ఆ కార్య విముఖుని చేసింది. కాని బాలక స్వభావులైన శ్రీరామకృష్ణుల అభిలాషను కొంతలో కొంత అయినా తీర్చకుంటే ఆయన దాని నుండి వైదొలగరని భావించి మథుర్ ఆ సమయంలో మహమ్మదీయ వంటవాణ్ణి ఒకణ్ణి రప్పించాడు, అతడి నిర్దేశంతో మహమ్మదీయులు వండే తీరులో ఒక బ్రాహ్మణుడు వండగా ఆ ఆహారం శ్రీరామకృష్ణులకు సమర్పించారు. ఇస్లాం మత సాధన చేస్తూ ఉన్న రోజుల్లో శ్రీరామకృష్ణులు ఒక్కసారి కూడ కాళికాలయంలోకి అడుగిడలేదు. ఆలయ ప్రాంగణానికి వెలుపల ఉన్న మథుర్ భవనంలో ఉండిపోయారు.
14. ఇస్లాం మతసాధన దాని ప్రాధాన్యం
పైన ఉదాహరించిన సంఘటన నుంచి అద్వైత వేదాంత సాధనలో సంపూర్ణత్వం సంతరించుకొన్న తరువాత శ్రీరామకృష్ణుల మనస్సు ఇతర మత సంప్రదాయాలపట్ల ఎంత సానుభూతి చెందిందో స్పష్టమౌతోంది. అంతేకాక కేవలం వేదాంత విజ్ఞానంలో విశ్వాసం కలిగి ఉండడం ద్వారానే భారతదేశంలోని హిందువులు, మహమ్మదీయులు ఒకరిపట్ల ఒకరు సానుభూతి వహించి, సోదరభావం పెంపొందించుకోగలరనే సంగతీ విశదమౌతూ ఉంది. లేకపోతే శ్రీరామకృష్ణులు చెబుతూ ఉన్నట్లు “హిందూ మహమ్మదీయుల నడుమ కొండంత తారతమ్యం నెలకొని ఉంటుంది. ఇరువురి ఆలోచనా సరళి, విశ్వాసాలు, కార్యకలాపాలు, నడవడికలు – సుదీర్ఘకాలంగా వారు కలసి జీవిస్తూ ఉన్నప్పటికీ పరస్పర దురవగ్రాహ్యంగానే ఉండిపోతాయి.” అన్న విషయం ఏదో ఒకనాడు ఆ కొండంత తారతమ్యం తొలగిపోయి హిందువులు, మహమ్మదీయులు ప్రేమాస్పదులై ఆలింగనం చేసుకొంటారని ఈ యుగావతారులైన శ్రీరామకృష్ణుల ఇస్లాం మత సాధన సూచిస్తూ ఉన్నదేమో?
15. శ్రీరామకృష్ణులలో అద్వైత స్మృతి ప్రగాఢత
నిర్వికల్ప భూమిలో ఉన్న ఫలితంగా ప్రస్తుతం ద్వైత భూమి పరిధిలో ఉన్నటువంటదృశ్యాలనుగాని, వ్యక్తులనుగాని చూసి పలుమార్లు హఠాత్తుగా ఆయనలో అద్వైతస్మృతి జాగృతం అయ్యేది. వెంటనే ఆయన ఆ తురీయభావంలో లీనమయ్యేవారు. కావాలని కోరకపోయినా సామాన్యమైన ఉద్దీపనతోనో, సూచనతోనో ఆయనకు అట్టి స్థితి కలగడం మేం చూశాం. కాబట్టి ఇక సంకల్పించుకొన్న మాత్రానే ఆయన ఆ అద్వైత స్థితిని పొందగలిగేవారని చెప్పడం అనవసరం. అద్వైతభావం ఎంత విస్తృతి మేరకు ఆయనకు స్వభావసిద్ధం అయిపోయిందో ఈ క్రింది సంఘటనలు, విస్పష్టం చేస్తాయి.
16. (i) కొన్ని ఉదాహరణలు గడ్డికోసే ముసలివాడు
దక్షిణేశ్వర కాళికాలయపు ఉద్యానవనం విశాలమైనది. వర్షాకాలంలో గడ్డి ఏపుగా పెరగడంతో ఉద్యానవనంలో కూరగాయ మొక్కలు నాటడానికి తోటమాలులకు ఎంతో అసౌకర్యంగా ఉండేది. కనుక ఆ సమయంలో ఉచితంగా గడ్డి కోసుకొని పట్టుకుపోవడానికి అనుమతి పొందిన ఒక ముసలి వాడు ఒకరోజు అక్కడికొచ్చి గడ్డి కోసుకోసాగాడు. కోసిన గడ్డిని పెద్దమోపుగా కట్టి బజారుకు తీసుకొనిపోయి అమ్ముకోవడానికి అతడు సిద్ధం కాసాగాడు. దురాశతో అతడు ఎంత గడ్డి కోసుకొన్నాడంటే ఆ మోపును మోసుకుపోవడం మాట అలా ఉంచి దాన్ని కనీసం ఎత్తడం కూడ అతడి శక్తికి మించిన పని అని శ్రీరామకృష్ణులు గమనించారు. కానీ ఆ ముసలివాడు దాన్ని గ్రహించే స్థితిలో లేడు. ఆ పెద్దమోపును తల పైకెత్తుకోవడానికి నానావిధాల ప్రయత్నించాడు. కానీ, అతడి ప్రయత్నాలు ఫలించలేదు. ఆ దృశ్యాన్ని తదేకంగా చూస్తూ శ్రీరామకృష్ణులు భావపారవశ్యం చెందారు. “లోపల పరిపూర్ణజ్ఞాన స్వరూపంతో ఆత్మ ప్రకాశిస్తూ ఉంటే, వెలుపల ఎంత మూర్ఖత్వం, అవివేకం” అనే భావన జనించి “ఓ రామా! నీ లీలావిలాసం ఎంత విచిత్రమైనదయ్యా” అని వ్యాఖ్యానిస్తూ ఆయన సమాధి మగ్నులయ్యారు.
(ii) గాయపడిన సీతాకోక చిలుక
మరొకనాడు, తోకకు గుచ్చుకుని ఉన్న ఒక చిన్నపుల్లతోసహా ఒక సీతాకోక చిలుక ఎగురుకొంటూ రావడం శ్రీరామకృష్ణులు చూశారు. తుంటరి పిల్లవాడెవడో అలా చేసివుంటాడని భావించి ఆయన మొదట చాలా బాధపడ్డారు. కాని మరుక్షణమే భావావిష్టులై, “ఓ రామా! ఈ దుఃస్థితిని నీకు నువ్వే కల్పించుకొన్నావు” అంటూ పకపక నవ్వుకోసాగారు
(iii) కాళ్ళ క్రింద త్రొక్కివేయబడిన లేతపచ్చిక
ఒక సమయంలో కాళికాలయపు తోటలో ఒక ప్రత్యేక స్థలంలో లేత దూర్వాగ్రాసం పెరిగి చూడముచ్చటగా ఉంది. శ్రీరామకృష్ణులు ఆ లేతపచ్చిక స్థలాన్ని చూస్తూ ఉన్నప్పుడు భావావిష్టులై ఆ స్థలంతో తాదాత్మ్యం చెందారు. అదే సమయంలో ఒక వ్యక్తి ఆ లేతపచ్చిక మీదుగా నడిచి వెళ్ళడం తటస్థించింది. దాంతో, శ్రీరామకృష్ణులు ఛాతీలో భరించలేని బాధను కలిగించిన భావనకు లోనై అశాంతచిత్తులైనారు. ఆ సంఘటనను ప్రస్తావిస్తూ తదనంతరం మాతో ఇలా అన్నారు: “ఛాతీపై ఎవరైనా త్రొక్కితే ఎలాంటి బాధ కలుగుతుందో, సరిగ్గా అటువంటి బాధనే ఆ సమయంలో నేను అనుభవించాను. అట్టి భావావస్థ ఎంతో బాధాకరం. ఆ స్థితిలో నేను ఆరు గంటలసేపు మాత్రమే ఉన్నప్పటికీ, ఆ బాధను భరించలేకపోయాను.”
(iv) పడవల వాళ్ళు కలహించుకోవడం శ్రీరామకృష్ణుల వీపు వాచిపోవడం
ఒకరోజు శ్రీరామకృష్ణులు భావపారవశ్యులై విశాలమైన ద్వార మండపం వద్ద నిలబడి గంగానదిని తిలకిస్తున్నారు. ఆ సమయంలో ఆ ఘట్టం వద్ద రెండు పడవలు లంగరు దించబడి ఉన్నాయి. ఏదో పేచీ వచ్చి ఆ పడవలవాళ్ళు ఇద్దరూ కలహించుకోసాగారు. క్రమంగా కలహం పోరాటంలోకి దిగింది. అప్పుడు ఆ ఇద్దరిలోనూ బలాఢ్యుడైనవాడు రెండవవాడి వీపు మీద గట్టిగా ఒక దెబ్బ వేశాడు. దాంతో శ్రీరామకృష్ణులు హఠాత్తుగా బాధతో కేకలు పెట్టారు. కాళికాలయంలో ఉన్న హృదయ్ ఆ కేకలు విని పరుగున వచ్చి, శ్రీరామకృష్ణుల వీపు కందిపోయి, వాచిపోయి ఉండడం చూశాడు. అప్పుడు హృదయ్ పదే పదే ఆయనను, “మామా! నిన్నెవరు కొట్టారో చూపించు. అతగాడి తల నరికేస్తాను” అంటూ అడిగాడు. ఒకింత సేపయ్యాక శ్రీరామకృష్ణులు తెప్పరిల్లాక, ఆ సంఘటనను ఆయన నుంచి విని హృదయ్ ఆశ్చర్యచకితుడైపోయి, ‘ఇలా జరగడం సంభవమేనా?’ అని తలపోశాడు. గిరీశ్చంద్రఘోష్ ఈ సంఘటనను శ్రీరామకృష్ణుల ముఖతా విని మాకు తెల్పాడు. శ్రీరామకృష్ణులను గురించిన ఇలాంటి సంఘటనలు ఎన్నైనా పేర్కొనవచ్చు.