1. ఆధ్యాత్మిక భావాలలో నెలకొని ఉండడమే శ్రీరామకృష్ణుల స్వాభావికత
సాధకుడు కాని వ్యక్తికి సాధకుల జీవితాలను అవగతం చేసుకోవడం ఎంతో కష్టం. కారణం, సాధనలు అనేవి అతిసూక్ష్మమైన ఆధ్యాత్మిక రాజ్యానికి చెందిన అంశాలు కనుక. మానవులను సమ్మోహితులను గావించే రూప రసాది విషయాలకు చెందిన స్థూలరూపాలు అక్కడ గోచరించవు. బాహ్యవస్తువులు, వ్యక్తిపరంగా జరిగే ఘటనా పరంపరలు, విచిత్ర కార్య కారణ పరంపరలు ఆ సీమలో కానరావు. లేదా రాగద్వేషాది ద్వంద్వాలతో నిండిన మానవ మనస్సు గత సంస్కారాల ప్రేరణతో అస్థిరమై, ఇతరులనందరినీ అణగద్రొక్కి కేవలం తాను మాత్రమే ఈ ప్రాపంచిక భోగాలను అనుభవించడానికి విశ్వప్రయత్నం చేస్తుంటుందో, ఏ ప్రయత్నాలను విషయ విముగ్ధమైన ఈ లోకం – వీరత్వంగా, మహత్వంగా కొనియాడుతుందో అలాంటి ఉన్మత్త ప్రయత్నం ఆ భావరాజ్యంలో అణుమాత్రమైనా అభివ్యక్తం కాదు. అక్కడ నెలకొన్నవి కేవలం సాధకుడి మనస్సు, దాన్లోని జన్మజన్మాంతరాల నుంచి ప్రోగవుతూ వస్తూన్న అనంత సంస్కారాల ప్రవాహం. ఆ భావరాజ్యంలో మనకు కనిపించేవి ఈ బాహ్యజగత్తులో ఫలానా వస్తువులతో లేదా ఫలానా వ్యక్తులతో జరిగిన సంఘర్షణ ఫలితంగా మనస్సు ప్రపంచంపట్ల విముఖమై, సాధకుడు ఉన్నత ఆశయాలకు, ఉన్నత లక్ష్యాలకు ఆకర్షితుడై, తన గమ్యాన్ని చేరడానికై మనస్సును పరిపూర్ణంగా ఏకాగ్రం చేయడానికి చేసే అనంత ఉద్యమం. ఆ ప్రయత్నానికి ఆటంకం కల్పించే తన మనస్సులోనే ఉన్న ప్రతికూల సంస్కారాలతో వెనుకంజవేయని అనంత సంగ్రామం. క్రమంగా ముందుకుపోతూ సాధకుడి మనస్సు పూర్తిగా బాహ్యవిషయాల నుంచి విముఖమై, తన వ్యక్తిత్వంలో ప్రగాఢంగా పాదుకొని, తాదాత్మ్యమై, ఆ అనంతరాజ్య గభీర, గభీరతర ప్రదేశాలకు దిగి సూక్ష్మ, సూక్ష్మతర భావస్తర అనుభూతులను పొందడం మనం చూడవచ్చు. ఇలా క్రమంగా ముందుకు పోయి పోయి ఆఖరుకు దేని నుంచి ‘అహం’ జ్ఞానంతోకూడిన సమస్త భావాలు ఉత్పన్నమవుతాయో, ఏది ‘అశబ్ద మస్పర్శ మరూప మవ్యయమేకమేవాద్వితీయం’ – శబ్దస్పర్శరూపరసగంధ విహీనం, నాశరహితం, రెండవదంటూలేని ఏకైక సత్యమో ఆ చరమస్థితికి, తన అస్తిత్వపు ఆ గభీరతమ ప్రాంతానికి చేరడం, చేరి దానిలో పూర్తిగా ఐక్యమై ఉండిపోవడమే సమాధిస్థితి. ఆ పిదప సంస్కార సమూహాలన్నీ పూర్తిగా నాశనమయ్యే వరకు, మనస్సు ఏ మార్గాన్ని అనుగమించి పైన పేర్కొన్న అద్వైతస్థితికి చేరిందో, మళ్ళీ ఆ మార్గాన్నే అనుసరించి ఆ సమాధిస్థితి నుంచి ఈ బాహ్యప్రపంచానికి దిగి వస్తుంది. ఈ రీతిలో సాధకుడి మనస్సు సంస్కారాలన్నీ సమూలంగా నశించే వరకు బాహ్య జగత్తుకు రాకపోకలు సాగిస్తూంటుంది. పైన వర్ణించిన ఆ భావ రాజ్యంలో మనకు కనిపించేవి ఈ విషయాలే.
2. నిర్వికల్ప సమాధి – అసాధారణ సాధకులు
కాని పైన వర్ణించిన అద్వయ సమాధిస్థితి ఎవరి స్వతఃసిద్ధ వాసస్థానమో అటువంటి కొందరి సాధకుల గురించి – అతి ప్రాచీన కాలం నుంచి నేటివరకు అరుదైన అలాటి సాధకులు ఏ కొద్దిమంది మాత్రమో ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్ర నమోదు చేసివుంచింది. మానవాళి శ్రేయస్సుకై వీరు కొంతకాలం బాహ్యజగత్తులో ఏదో విధంగా తమను నిర్బంధించుకొని నివసించడం జరుగుతుంది. శ్రీరామకృష్ణుల సాధన చరిత్రను మనం ఎంతగా అధ్యయనం చేస్తామో అంతగా వారి మనస్సు పై కోవకు చెందినదని మనకు అవగతమవుతుంది. వారి జీవిత చరిత్రను చదువుతున్న పాఠకుల మనస్సులను ఆ విశ్వాసం ఆకట్టుకోని పక్షంలో అందుకు బాధ్యత రచయిత లోపమే అని గ్రహించాలి. ఎందుకంటే శ్రీరామకృష్ణులు పదే పదే మాతో ఇలా అనేవారు: “ఒకటి రెండు అల్ప కోరికలను బలవంతంగా కల్పించుకొని వాటి ద్వారా మీ అందరి కోసం మనస్సును నిమ్నస్థాయిలో ఉంచేవాణ్ణి. లేకుంటే అఖండంతో కలిసి తాదాత్మ్యం కావడమే దాని స్వాభావిక ప్రవృత్తి.”
3. ‘శూన్యం’, ‘పూర్ణం’ – యథార్థానికి ఒక్కటే
నిర్వికల్ప సమాధిలో అనుభూతమయ్యే అఖండ అద్వైత వస్తువును ప్రాచీన ఋషిసత్తములు కొందరు సమస్త భావాల అస్తిత్వంలేని ‘శూన్యం’ అనీ, మరికొందరు సమస్త భావాలు సమ్మిళితమయ్యే ‘పూర్ణం’ అనీ పేర్కొన్నారు. కాని వారంతా సూచిస్తూన్నది ఆ ఒకే వస్తువును గురించే. అందరు కూడ ఆ అఖండ వస్తువును సమస్తభావాల ఉత్పాదక, లయస్థానం అని వర్ణించడమే అందుకు కారణం. సమస్త భావాలు లయమయ్యే ఏ నిర్వాణభూమిని బుద్ధ భగవానుడు ‘శూన్యం’ అని నిర్దేశించాడో, దాన్నే శ్రీ శంకరాచార్యులు సమస్త భావాల సమ్మేళన భూమి అయిన ‘పూర్ణం’ గా అభివర్ణించాడు. తదనంతర కాలపు బౌద్ధమతాచార్యుల అభిప్రాయాలను ఆవలకుపెట్టి, బుద్ధుణ్ణి, శంకరుణ్ణి అధ్యయనం చేసినప్పుడు వారిద్దరూ వర్ణిస్తూన్నది ఒకే విషయం అన్న తిరుగులేని నిర్ణయానికి మనం వస్తాం.
4. అద్వైత స్వరూపం
‘శూన్యం’ అనో లేదా ‘పూర్ణం’ అనే పేర్కొనబడే అద్వైత స్థితినే ఉపనిషత్తులు, వేదాంతం ‘భావాతీత అవస్థ’ అని వర్ణిస్తున్నాయి. కారణం ఏమిటంటే నిర్దుష్టంగా దీన్లో సుప్రతిష్ఠితమైనప్పుడు సాధకుడి మనస్సు సగుణబ్రహ్మను అంటే ఈశ్వరుని సృష్టి స్థితి లయాలనే లీలాజనితమైన సమస్త భావభూములను అతిక్రమించి దానిలో ఐక్యమైపోతుంది. కాబట్టి పరిమితమైన మానవ మస్తిష్కం ఆధ్యాత్మిక రాజ్యంలో ప్రవేశించి శాంత దాస్యాది పంచభావాలను అనుసరించి ఈశ్వరుడితో ఏ నిత్యసంబంధాన్ని కల్పించుకొంటుందో, వాటన్నిటి నుంచి అద్వైతం అనబడే భూమి పూర్తిగా వేరైన ఒక అపార్థివ వస్తువు అని మనకు స్పష్టమౌతోంది. సాధకుడు ఇహపర సుఖభోగాల పట్ల పరిపూర్ణంగా విరక్తుడై, పవిత్రతాబలంతో దేవతలను సైతం మించిన పదాన్ని పొందినప్పుడు, అప్పుడు మాత్రమే అతడికి అద్వైతభావం (అంటే అద్వైతమార్గాన్ని అనుసరించడానికి వలసిన ప్రగాఢ జిజ్ఞాస, ఆధికారికత) ప్రాప్తిస్తుంది. అంతేగాక అతడు ఆ అద్వైతభావ సహాయంతో ఈ విశ్వబ్రహ్మాండంతోపాటు సృష్టి స్థితి లయకారుడైన ఈశ్వరుడు దేన్లో నిత్య ప్రతిష్ఠితుడై నెలకొనివుంటాడో, ఆ నిర్గుణబ్రహ్మ పదార్థాన్ని ప్రత్యక్షంగా సాక్షాత్కారం చేసుకొని, తరిస్తాడు.
5. పంచభావాలు – భగవత్సాక్షాత్కారం
అద్వైతభావం, తద్ద్వారా లభించే నిర్గుణబ్రహ్మ వస్తువుల విషయం ఆవలికి పెడితే, ఆధ్యాత్మిక జగత్తులో మనకు కానవచ్చేవి శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధురభావాల. వ్యక్తీకరణ. ఈ పంచభావాలలో ప్రతీభావం యొక్క సాధ్య వస్తువు ఈశ్వరుడు లేదా సగుణబ్రహ్మ, అంటే నిత్యశుద్ధముక్త స్వభావుడు, సర్వశక్తిమంతుడు, సర్వనియంత అయిన ఈశ్వరుడిపట్ల సాధకుడు ఈ ఐదు భావాలలో ఏదో ఒక భావాన్ని ఆరోపించుకొని, ఆయనను ప్రత్యక్షం చేసుకోవడంలో అగ్రే సరుడవుతాడు. సర్వాంతర్యామి, సమస్త భావాలకు ఆధారభూతుడు అయిన భగవంతుడు కూడ భక్తుడి తత్పరతను, భగవద్భక్తిని చూసి, అతడి భావాన్ని పరిపుష్టి గావించే నిమిత్తం అతడు ఈ భావానికి తగిన రీతిలో రూపాల్ని దాల్చి, ప్రత్యక్షమై అతడి ఆకాంక్షను నెరవేరుస్తాడు. ఈ విధంగా విభిన్న యుగాలలో చిద్ఘనుడైన భగవంతుడు నానాభావాలతో కూడుకొన్న రూపాలతో ఆవిర్భవించాడనీ, అంతేకాక ఆయన మానవుడిగా కూడా అవతరించి భక్తుల అభీష్టాలను నెరవేర్చాడని శాస్త్రాలలో మనం చూస్తాం.
6. ఈ పంచభావాలు మనిషి పురోగతికి ఎలా తోడ్పడతాయి?
దైనందిన జీవితంలో మనుష్యులు పరస్పరం ఏ ఐహిక సంబంధాలతో కట్టుపడి ఉంటారో ఆ సంబంధాల యొక్క సూక్ష్మ పరిశుద్ధ స్వరూపాలే ఈ శాంతదాస్యాది పంచభావాలు. ఈ లోకంలో మనం తల్లి, తండ్రి, భార్య, భర్త, ప్రభువు, భృత్యుడు, మిత్రుడు, మిత్రురాలు, కుమారుడు, కుమార్తె, రాజు, ప్రజలు, గురువు, శిష్యుడు మొదలైన ఒక్కొక్కరితో ఒక్కో ప్రత్యేక సంబంధాన్ని కల్పించుకొని ప్రవర్తిస్తూంటాం. అలాగే శత్రువులు కాని ఇతరులందరితో శాంత, గౌరవాస్పద వైఖరిలో వర్తిస్తూంటాం. ఈ సంబంధాలన్నిటినీ భక్తి బోధకులందరూ శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య (లేదా అపత్య), మధుర (లేదా కాంతాభావం) భావాలుగా వర్గీకరించారు. అంతేకాక ఆధికారిక భేదాన్ని అనుసరించి వీటిలో ఏదో ఒకదాన్ని ప్రధానభావంగా అవలంబించి, ఆ భావంతో భగవంతుడితో ప్రేమాస్పద సంబంధం కలిగించుకొని సాధనలో ముందంజవేయమని ప్రబోధిస్తూన్నారు. కారణం శాంతాది ఈ పంచభావాలతో జీవుడు నిత్యపరిచితుడు కావడం వల్ల వాటినే అవలంభించి భగవత్సాక్షాత్కారం కోసం ముందంజవేయడం అతడికి సుగమమవుతుంది కనుక. అంతేకాదు, ప్రవృత్తి మూలకాలైన ఈ ఐహిక సంబంధాలకు చెందిన ఏ దాస్యాది భావాల స్ఫూర్తి జీవుడి మనస్సులో రాగ ద్వేషాలను జనింపచేసి, సంసారంలో గతాన అతడి ద్వారా నానాపాప కార్యాలను చేయిస్తూ వుందో, ఆ భావాలే మళ్ళీ భగవంతుడి దిశగా త్రిప్పబడిన పిమ్మట, అతడి మనస్సులో వివిధ వృత్తులను ఉత్పన్నం చేస్తూన్నప్పటికీ, ఇప్పుడవి నిర్నిరోధ వేగంతో అతణ్ణి భగవద్దర్శనమనే లక్ష్యం వైపుకే మళ్ళిస్తాయి. ఉదాహరణకు అనర్థాలన్నిటికీ మూలమైన కామాన్ని తీసుకోండి. ఇదొక మానసిక రుగ్మత అని చెప్పవచ్చు. కాని సాధకుడు ఇప్పుడు దాన్ని భగవత్సాక్షాత్కారంలో నియుక్తం చేస్తాడు. ఆ సాక్షాత్కారానికి ఆటంకాలైన వస్తువుల మీద, వ్యక్తుల మీద అతడు కోపం చేసుకొంటాడు. ఈశ్వరుడి నిరతిశయ నిరుపమాన ప్రేమ – సౌందర్య ఆనంద లబ్ధిలో అతడు సమ్మోహితుడై, పిచ్చివాడవుతాడు. అదే విధంగా లోభాన్ని గురించి భగవంతుడి పావన దర్శనం పొంది, కృతకృత్యులైన మహనీయులందరి ధన్యతను గాంచి, అతడూ దాన్ని పొందే నిమిత్తం తీవ్ర పరితాపం పొందుతాడు.
7. భగవంతుడి ప్రేమ – వ్యక్తిత్వం
భగవంతుడితో ప్రేమాస్పద సంబంధాన్ని కల్పించే శాంతదాస్యాది ఈ ఐదు భావాల గురించిన సాధనానుసరణను ఒక ఫలానా బోధకుడు ఒక ఫలానా సమయంలో ప్రకటించడం జరిగిందని మనం ఇదమిత్థంగా చెప్పలేం. విభిన్న కాలాలలో ఎందరో మహాపురుషులు ఈ భారతావనిలో ఉద్భవించి, ఈ ఐదు భావాలలో ఒకటో, రెండో లేదా కొన్నిటినో అవలంబించి, భగవత్సాక్షాత్కారం కోసం సాధన చేసి కేవలం ‘ప్రేమ’ తోనే ఆయనను తనవాడిగా చేసుకొని, తదనుసారంగా చేయమని జనబాహుళ్యానికి ఉపదేశించారు. అలాటి ఆచార్యపురుషుల అపూర్వ జీవితాలను అధ్యయనం చేసినప్పుడు ఆయా భావసాధనలకన్నిటికీ మూలస్వరూపంగా, ప్రాణస్వరూపంగా ఉన్నది ఒక్క ‘ప్రేమ’ మాత్రమే అనీ, అంతేగాక ఆ ప్రేమ యొక్క లక్ష్యవస్తువు భగవంతుడి అనంత రూపాలలో ఒకానొక రూపమే అని మనకు విస్పష్టం అవుతుంది. అందుకు కారణం ‘అద్వైత’ సత్యం మనిషికి అనుభూతం కానంతవరకు అతడు భగవంతుడి ఫలానా పరిమితమైన, సాకార వ్యక్తిత్వాన్ని గురించి మాత్రమే ఊహించుకోగలడు, అనుభూతం చేసుకోగలడు.
8. ప్రేమ ద్వారా అపరిమిత శక్తుల చైతన్య నిర్మూలనం
ప్రేమికులిద్దరి మధ్య నెలకొన్న ప్రేమస్వరూపాన్ని అధ్యయనం చేసినప్పుడు అది వారిద్దరి నడుమగల లౌకిక స్థాయిల, శక్తుల తారతమ్యాలను ఎలా క్రమంగా రూపుమాపు తుందో మనకు అవగతమవుతుంది. అదే రీతిలో భావసాధనలో నియుక్తుడైన సాధకుడి మనస్సు నుంచి కూడ ఈ ప్రేమ, భగవంతుడు అనంతశక్తి సంపన్నుడు అన్న జ్ఞానాన్ని తొలగించివేసి, భగవంతుణ్ణి తన ప్రేమాస్పదుడన్న భావనను కలుగజేస్తుంది. కాబట్టే ఈ మార్గాన్ని అనుసరించే సాధకుడు ప్రేమద్వారా భగవంతుణ్ణి పూర్తిగా ‘తనవాడు’ గా చేసుకొని, అతణ్ణి బ్రతిమలాడడానికి, విసిగించడానికి, పైపెచ్చు దుర్భాషలాడడానికి కూడ వెనుదీయకపోవడం మనం చూస్తూ ఉంటాం. సాధకుడిచే భగవంతుడి అనంతశక్తులను మరపింపచేసి, కేవలం ఆయన ప్రేమ, మాధుర్యాలను అనుభూతం చేయడంలో పైన పేర్కొన్న పంచభావాలలో ఏది ఎంతదాక సమర్థనీయమో, ఆ భావం ఆ మార్గంలో అంతవరకు ‘ఉన్నత’ భావంగా పరిగణించబడుతుంది. కేవలం ఈ దృక్కోణంలోనే ఆ పంచభావాల మధ్యవుండే తారతమ్యాలను భక్తి బోధకులు పరిశీలించి, మధురభావానికి అగ్రతాంబూలం ఇచ్చారు. కాకపోతే ప్రతి భావమూ కూడ సాధకుడికి భగవత్సాక్షాత్కారం కలిగించగలదనే అంశాన్ని ఆ ఆచార్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.
9. ప్రతి భావం యొక్క స్వావలంబన
పంచభావాలలో ప్రతి ఒక్కటి కూడ పరాకాష్ఠను చేరుకొన్నప్పుడు సాధకుడు మైమరచిపోయి, తన ‘ప్రాణ ప్రియుడి’ ఆనందంలోనే తాను ఆనందపడుతున్నట్లు భావిస్తాడు. అంతేకాక విరహ సమయంలో భగవచ్చింతనతో తరచు తన ఉనికినే విస్మరిస్తాడు. ఆధ్యాత్మిక చరిత్రను అధ్యయనం చేసినప్పుడు పై విషయాలు మనకు తెలియవస్తాయి. బృందావన గోపికలు ఆ విధంగా తమ స్వకీయ ఉనికినే మరచిపోవడమేగాక వాస్తవానికి కొన్ని సందర్భాలలో తమ ప్రాణప్రియుడైన శ్రీకృష్ణుడితో తాదాత్మ్యం చెందేవారని శ్రీమద్భాగవతం మొదలైన భక్తి గ్రంథాలను చదివినప్పుడు మనకు తెలియవస్తుంది. మానవ కల్యాణం కోసం శిలువ వేయబడుతున్నప్పుడు ఏసుక్రీస్తు భరించరాని ఏ మహాబాధను అనుభవించాడో దాన్ని గురించి తదేకంగా ధ్యానిస్తూ కొందరు సాధకులు తాదాత్మ్యయం చెందడంతో వారి దేహాలపై శిలువ వేయబడిన గుర్తులు ఏర్పడి, వాటి గుండా రక్తం స్రవించిన ప్రసిద్ధ సంఘటనలు క్రైస్తవ భక్తి గ్రంథాలలో మనకు కానవస్తున్నాయి.* కాబట్టి శాంత దాస్యాది పంచ భావాలలో ఏ ఒక్కదాన్లోనైనా పరాకాష్ఠను చేరుకొన్నప్పుడు సాధకుడు తన ప్రేమాస్పదుడైన భగవంతుడి చింతనలో తన్మయుడై ఆ మహాప్రేమోద్వేగంలో అతడితో కలిసి, తాదాత్మ్యం చెంది చివరకు అద్వైతానుభూతిని పొందడం జరుగుతుంది. శ్రీరామకృష్ణుల అపూర్వ ఆధ్యాత్మిక సాధన జీవితం ఈ అంశం మీద అద్భుత కాంతిని ప్రసరింపజేస్తోంది. పంచభావాల్లో ప్రతి భావాన్ని ఆయన అవలంబించి, ప్రతి దాన్లోను తన ప్రేమాస్పదుడి ప్రేమలో విలీనుడై, తన స్వీయ ఉనికినే పూర్తిగా మరచిపోయి అద్వైత భావాన్ని సాక్షాత్కరించుకొన్నారు.
ఇక్కడొక ప్రశ్న ఎదురవుతుంది. అన్ని భావాలకూ అతీతమైన అద్వయ స్థితికి శాంతదాస్యాది భావాల సహాయంతో మానవ మస్తిష్కం ఎలా చేరగలదు? కారణం ఏ భావమైనా ఉదయించి, నెలకొని పెంపొందాలంటే ఇద్దరు వ్యక్తులు ఉండాలి కదా?
10. పంచభావాల ద్వారా అద్వయ స్థితిని పొందటం
నిజమే, ఏదేని ఒక భావం ఎంతగా పురోభివృద్ధి గాంచుతుందో, అది తన ప్రభావాన్ని అంతగా విస్తృతం చేసి సాధకుడి మనస్సు నుంచి తద్విరుద్ధంగా వుండే భావాలనన్నిటినీ క్రమంగా తొలగించివేస్తుంది. మళ్ళీ ఆ భావం పరిపూర్ణంగా వృద్ధిగాంచినప్పుడు ఏకాగ్రమైన సాధకుడి మనస్సు ధ్యాన సమయంలో, అంతకుమునుపు దాన్లో కనబడుతున్న ‘నువ్వు’ (సేవ్య), ‘నేను’ (సేవక), ఈ రెంటినడుమ నెలకొనిన దాస్యాది సంబంధాన్ని ఒక్కొక్కప్పుడు విస్మరించి, కేవలం ‘నువ్వు’ అని సూచించే ‘సేవ్య’ (భగవంతుడు) వస్తువుతో ప్రేమ ద్వారా తాదాత్మ్యం చెంది, సుస్థిరంగా నెలకొంటుంది.
మనస్సుకు ఏకకాలంలో ‘నువ్వు’, ‘నేను’, ఈ రెంటి నడుమనున్న ప్రేమ సంబంధం ఎన్నటికీ ఎరుకవుండదని భారతీయ మహాచార్యులు అభిప్రాయ పడుతున్నారు. మనస్సుకు ఒక క్షణం ‘నువ్వు’ గురించిన ఎరుక, మరుక్షణం ‘నేను’ గురించిన ఎరుక ఉంటుంది. కాని మనస్సు ఈ రెండు భావాల మధ్యే డోలాయమానమౌతూన్నందున, దాన్లో (మనస్సులో) ఈ రెంటి మధ్య ఒక భావ సంబంధం వృద్ధి చెందుతుంది. తదుపరి మనస్సుకు ఏకకాలంలో ఈ రెండు భావాల, వాటి మధ్యగల సంబంధం గురించిన ఎరుక కలుగుతుంది. పరిణతి చెందిన మధురభావ ప్రభావంతో మనస్సులోని అశాంతత నశించిపోతుంది. అప్పుడు పైన పేర్కొన్న సత్యాన్ని అది క్రమంగా కనుగొనగలుగుతుంది. ధ్యానం ఎంత గంభీరమౌతుందో మనస్సు అంత వృత్తిహీనమవుతుంది, నిజానికి ఉన్నది ఒకే ఒక్క ‘అద్వయ’ పదార్థమనీ, ఆ అద్వయ పదార్థాన్నే రెండు దృక్కోణాల నుంచి పరికిస్తూ ‘నువ్వు’, ‘నేను’ అనే రెండు విభిన్న పదార్థాలుగా (ఇంతకాలం) కల్పించుకొంటూ వస్తున్నానని వృత్తిహీనం అయ్యేకొద్దీ మనస్సుకు విస్పష్టమౌతుంది.
11. విభిన్న యుగాలలో వేర్వేరు సాధనలు
శాంతదాస్యాది భావాలలో ప్రతీభావం పరాకాష్ఠకు చేరినప్పుడు పైన చెప్పబడినట్లు మనస్సుకు అద్వైతానుభూతిని కలిగించడానికి ఎందరి సాధకుల, ఎంతటి మానవాతీత ప్రయత్నాలు ఆవశ్యకమయినవో అనే విషయాన్ని యోచించి నప్పుడు ఆశ్చర్యపోక తప్పదు. ఒక్కో యుగంలో శాంతదాస్యాది భావాలలో ఒక్కోభావం ప్రధానమైన సాధనామార్గంగా అవలంబనీయంగా ఉండటమూ, ఆ యుగానికి చెందిన విఖ్యాత సాధకులెందరో ఆ మార్గాన్ని అనుసరించి భగవత్సాక్షాత్కారాన్ని పొందడమూ, అంతేగాక వారిలో ఏ ఒకరిద్దరో అఖండ, అద్వయ పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని సైతం పొందడమూ జరిగింది. శాస్త్రరూపేణా లభ్యమౌతున్న ఆధ్యాత్మిక చరిత్రను అధ్యయనం చేసినప్పుడు ఈ సంగతులు మనకు స్పష్టం అవుతాయి.
వైదిక యుగంలోను, బౌద్ధయుగంలోను శాంతభావం ప్రాధాన్యతను సంతరించుకొంది. అద్వయానుభూతిలో పరాకాష్ఠను చేరుకొంది. ఉపనిషద్యుగంలో దాస్యభావం, అపత్యభావం* ప్రముఖంగా ఉండడం జరిగింది. రామాయణం, మహాభారత యుగాలలో (ఇతిహాస యుగాలలో) శాంతభావం, నిష్కామకర్మతో మిశ్రితమైన దాస్యభావం; తాంత్రిక యుగంలో భగవంతుణ్ణి ‘తల్లి’ గా గాంచే మాతృభావం, పాక్షిక మధురభావం; వైష్ణవ యుగంలో సఖ్యభావ, వాత్సల్యభావ, మధురభావ సంపూర్ణ ప్రకటన – ఇలా వేర్వేరు యుగాలలో కొన్ని కొన్ని భావాలు ప్రధాన సాధనామార్గాలు కావడం మనకు తెలియవస్తోంది.
12. భారతదేశంలోను విదేశాలలోను పంచభావాల వికాసం
భారతదేశపు ఆధ్యాత్మిక చరిత్రను పరికిస్తే శాంతదాస్యాది పంచభావాలు అద్వయానుభూతితోపాటు వికాసం చెందివుండడం మనకు కానవస్తుంది. కాని విదేశాలలో సంగతి ఇలా కాదు. ఇతర దేశ మతసంప్రదాయాలలో శాంత, దాస్య, అపత్య (భగవంతుణ్ణి తండ్రిగా భావించే) భావాలు మాత్రమే వర్ధిల్లడం మనం చూడగలం. సఖ్య, మధురభావాలతో కూడిన రాజర్షి సాలమాన్ గీతాలు, యూదియా, క్రైస్తవ, ఇస్లాం మతాలలో చెక్కుచెదరక ఉన్నప్పటికీ, వాటిలోని భావాలను వారు అవగతం చేసుకోలేక, ఆ గీతాలకు విభిన్న అర్థాలను కల్పించుకొన్నారు. మహమ్మదీయ మతశాఖ అయిన ‘సూఫీ’ సంప్రదాయంలో సఖ్య, మధుర భావాలు చాలా మేరకు మిగిలి ఉన్నప్పటికీ, సాధారణ మహమ్మదీయులు అటువంటి భగవదుపాసనను తమ పవిత్ర ఖురాన్ ఆదేశాలకు విరుద్ధమనే పరిగణిస్తారు. అదే విధంగా క్యాథలిక్ క్రైస్తవ సంప్రదాయంలో ఏసుక్రీస్తు తల్లి మేరీ ప్రతిమ ద్వారా భగవంతుడి మాతృభావపూజ పరోక్షంగా ప్రచలితంగా ఉన్నప్పటికీ అది భగవంతుడి మాతృ భావంతో బాహాటంగా అంగీకృతం కాలేదు. ఫలితంగా భారతదేశంలో బహుళ వ్యాప్తిలోవున్న జగన్మాత పూజలా ఫలవంతమై అది అఖండ సచ్చిదానందానుభూతిని కలిగించడానికి గాని, ప్రతి స్త్రీని దైవాంశ సంభూతురాలిగా దర్శింపచేయడానికిగాని సమర్థం కాలేకపోయింది. క్యాథలిక్ క్రైస్తవ సంప్రదాయంలో ఆ మాతృభావ ప్రవాహం ‘ఫల్గుణీ’ నదిలా మార్గ మధ్యంలో ఇంకిపోయింది.
13. భావ ప్రగాఢతను తెలిపే సూచికలు
సాధకుడి మనస్సు ఏదో ఒక భావమార్గాన్ని అవలంబించి భగవంతుడి పట్ల ఆకర్షితమౌతుందనీ, క్రమంగా అది భావంలో లీనమై బాహ్యప్రపంచం నుండి వెనక్కు తిరిగి తన ఆత్మలో విలీనం అవుతుందనీ ఇంతకు మునుపే చెప్పడం జరిగింది. మనస్సు ఆ విధంగా విలీనం కానున్నప్పుడు దానిలోని పూర్వసంస్కారాలన్నీ తలెత్తి ఆ మార్గానికి అవరోధం కల్పించి, మనస్సును పైకి త్రోసి, మళ్ళీ దాన్ని బహిర్ముఖం గావించడానికి సకల ప్రయత్నాలూ చేస్తాయి. కాబట్టే ప్రబలమైన పూర్వ సంస్కార భారాన్ని వహిస్తున్న అతిసామాన్యుల మానసం, యావజ్జీవితం విశ్వప్రయత్నం చేసినా ఒక్క భావంలోనైనా లీనం కాకపోవడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు సాధకుడు మొదట నిరుత్సాహపడతాడు. పిమ్మట సాధనానుష్ఠానాన్నే విడనాడతాడు. తుదకు తన లక్ష్యంపట్ల విశ్వాసాన్ని కోల్పోతాడు. తదనంతరం బాహ్య ప్రపంచంలోని రూప, రసాది భోగాలనే ప్రశస్తంగా ఎంచి, వాటికోసం అర్రులు చాస్తాడు. కనుకనే భోగవిషయాల పట్ల పూర్తి విరక్తి, ప్రేమాస్పదుడి (భగవంతుడి) ధ్యానంలో విలీనం, ఆ భావసాధనలో జనించే పరవశత్వం, వీటినే తన లక్ష్యం వైపుగా సాధకుడు ఎంత పురోగమించాడో తెలియచేసే కొలబద్దగా భక్తిరంగంలో పరిగణిస్తారు.
14. ఈ భావాలన్నింటిలోను శ్రీరామకృష్ణుల అనుపమాన సాఫల్యం
ఏదో ఒక్క భావాన్ని అనుగమించి దానిలో తల్లీనం కావడానికి యత్నించి, లోపల నిబిడంగా ఉన్న పూర్వజన్మ సంస్కారాల ప్రబల ఆటంకాలను ఏ వ్యక్తి అనుభవించలేదో, అలాంటి వ్యక్తి (అంటే సాధన చేయని వ్యక్తి) సదరు సాధకుడి మనస్సులో జరిగే తీవ్రపోరాటాన్ని గురించి కించిత్తు కూడ అవగతం చేసుకోలేడు. మానవ జీవితంలో భావతన్మ యత్వాన్ని పొందడానికి ఎన్ని కష్టాలు, యాతనలకు లోనుకావాలో అనుభవపూర్వకంగా తెలుసుకొన్న వాడు ఒక్క సాధకుడు మాత్రమే. శ్రీరామకృష్ణులు అతిత్వరలో ఒకదాని పిమ్మట మరొకటిగా సకల భావాలలో తన్మయత్వ సిద్ధి పొందడం చూసి, విస్మయుడై, ఇలా జరగడం మానవాతీతశక్తికి మాత్రమే సాధ్యమనే నిశ్చయానికి వస్తాడు.
15. సాధకవీరుల ఆధ్యాత్మిక సాధనల నమోదు కొరత
సాధారణ మనస్కులు ఆధ్యాత్మిక భూమికి చెందిన సూక్ష్మతత్త్వాలను అవగాహన చేసుకోలేకపోవడమే అవతారపురుషులుగా పేర్కొనబడే సాధకవీరుల సాధన చరిత్రలు యథో చితంగా నమోదు చేయబడకుండడానికి కారణం ఏమో! ఎందుకంటే వారి సాధన చరిత్రలను చక్కగా అధ్యయనం చేసినప్పుడు సాధన మార్గంలో ప్రవేశించడానికి మునుపు వారికి ఉండిన త్యాగవైరాగ్యాలు, సాధనలో సిద్ధిని పొందిన పిమ్మట సంసారమోహితులైన మానవాళి శ్రేయస్సుకై వారి ద్వారా ఏ అద్భుతశక్తి ప్రకటితమైనదో, ఆ సంగతులు మాత్రమే విపులంగా చర్చించబడడం మనకు కానవస్తుంది. మనస్సులోని గత సంస్కారరాసులను దగ్ధం చేసి, కూకటి వ్రేళ్ళతో సహా వాటిని పెకలించివేసి, తమ మీద నిరంకుశాధికారత్వాన్ని పొందడానికై సాధన కాలంలో ఆ యుగపురుషులు ఏ అపూర్వ అంతఃపోరాటంలో నిమగ్నులై ఉండడం జరిగిందో, ఆ వివరాలు చూచాయగా మాత్రమే గ్రంథాలలో ఉటంకింపబడినాయి లేదా ఆ పోరాటాన్ని గురించిన వివరణ రూపకాలంకారం ద్వారా, ఉపమానం ద్వారా, అతిశయోక్తుల ద్వారా ఎలా వివరించబడినదంటే, ఆ వివరాలలో దాగున్న అణుమాత్రపు నిజాన్ని వెతికి కనుగొనడం కూడ దాదాపు అసాధ్యమనే చెప్పాలి. క్రింద ఇచ్చిన ఉదాహరణం నుండి పాఠకులు మేం చెప్పదలచుకొన్న భావాన్ని అవగాహన చేసుకోగలరు.
16. i. ఉదాహరణలు శ్రీకృష్ణుని గురించి
లోకకళ్యాణార్థం ఆవశ్యకమైన విశేష శక్తుల సముపార్జనకై భగవాన్ శ్రీకృష్ణుడు అనేకసార్లు తపస్సు చేయడం జరిగింది. విశేష శక్తుల సముపార్జనలో అతడు నీటినో లేక గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరించి, కొంతకాలం ఒంటి కాలి మీద నిలబడి తపమాచరించాడని మాత్రమే తెలియవస్తోంది. కాని ప్రాపంచిక సంస్కారాల నుంచి ముక్తుడు కావడం కోసం అతడు ఒనరించిన అంతస్సమర వివరాలు మాత్రం తెలియరావడం లేదు.
ii. బుద్ధదేవుని గురించి
బుద్ధదేవుని గురించి కూడ తీవ్రవైరాగ్య సంపన్నుడై అతడు లోకాన్ని పరిత్యజించి వెళ్ళిపోవడం, నిర్వాణానుభూతిని పొందిన పిమ్మట అతడు ధర్మచక్ర ప్రవర్తనం గావించడం ఈ సంగతులు మాత్రమే విశదంగా తెలియవస్తున్నాయి. కాని అతడి సాధన చరిత్ర అంత ఇదమిత్థంగా తెలియరావడం లేదు. అయినప్పటికీ ఇతర అవతార పురుషుల సాధనలు బొత్తిగా తెలియరాని స్థితిలో ఉన్నప్పుడు, బుద్ధ దేవుడి సాధన గురించి ఏవో కొన్ని వివరాలైనా మనకు తెలియవస్తున్నవి. ఉదాహరణకు: సాధనలో సిద్ధి పొందడం కోసం స్థిరసంకల్పుడై అన్నపానీయాలను విసర్జించి ఆరేళ్ళకాలంపాటు ఆసనం నుండి కదలక ధ్యానమగ్నుడై ఉండిపోవడం జరిగిందనీ, అంతఃపవనాన్ని నిరోధించి, ‘ఆష్ఫానక’ మనే ఒక విశేష ధ్యానాన్ని అభ్యసించి సమాధిమగ్నుడై ఉండిపోయాడనీ మనకు తెలియవస్తోంది. కాని చిత్త సంస్కార సమూహాలను దగ్ధం చేయడానికై ఆతడు ఒనరించిన మానసిక సమరాన్ని గురించి వర్ణిస్తూన్నప్పుడు గ్రంథకారుడు దాన్నొక ఐహిక ఘటన మాదిరి ‘మారుని’* తో యుద్ధం చేసినట్లు చిత్రించాడు.
iii. ఏసును గురించి
ఏసుక్రీస్తు సాధనలను గురించి ఒక్కముక్క కూడ నమోదైనట్లు కానరావడం లేదు. పన్నెండేళ్ళ వరకు అతడి బాల్య జీవితంలోని కొన్ని సంఘటనలు, తదనంతరం ఆయన తన ముప్పయ్యవ ఏట జాన్ అనబడే సాధువు ద్వారా ‘జ్ఞానస్నానం’ (మంత్రదీక్ష లాంటిది) చేయించుకోవడం, పిమ్మట ఒంటరిగా ఎడారిలో ప్రవేశించి నలభై రోజులు తీవ్ర తపఃప్రార్థనలతో గడపటం, అక్కడ ‘సైతాన్’ ప్రలోభాలకు లోనుగాక విజయోపేతుడై తిరిగి రావడం, ఆ తరువాత లోకహితార్థం ధర్మమార్గాన్ని ప్రచారం చేయడం వంటి కొన్ని వివరాలు మాత్రమే అతడి జీవిత చరిత్రకారుడు వర్ణించాడు. ఏసుక్రీస్తు అలా జీవించింది మూడు సంవత్సరాల వరకే. కాబట్టి పన్నెండవ ఏట నుండి ముప్ఫయ్యవ ఏట వరకు, అంటే పద్దెనిమిది సంవత్సరాల కాలం అతడు ఎలా గడిపాడో మనకు తెలియరావడం లేదు.
iv. శంకరుల గురించి
శంకరాచార్యుల జీవితంలోని అనేక సంఘటనల వివరాలు లభిస్తున్నాయి. కాని ఆయన ఒనరించిన సాధనలను గురించి అప్పటి ఆయన మానసిక అవస్థలను గురించి కొన్ని సంఘటనల ద్వారా ఊహించడం తప్ప గత్యంతరం కనబడడం లేదు.
v. చైతన్యుల గురించి
శ్రీ చైతన్య మహాప్రభువు సాధన చరిత్రాంశాలు చాలావరకు నమోదు కాబడి ఉన్నాయి. కాని లవలేశమైనా కామగంధం లేని ఆయన మహోన్నత భగవత్ప్రేమ, రాధాకృష్ణుల ప్రణయ విరహ కథల ద్వారా రూపకాలంకారంలో వర్ణింపబడడం వలన సామాన్యులు అనేక సందర్భాలలో దానిని యథాతథంగా అర్థం చేసుకోలేక పోతున్నారు. అయినా సఖ్యభావం, వాత్సల్య భావం ప్రత్యేకించి మధురభావం, ఈ భావాలను అనుసరించి చేస్తూన్న సాధన గురించి, సాధన ప్రారంభదశ నుంచి పరిపూర్ణ దశకు చేరేవరకు సాధకుడి మనస్సులో ఏఏ మార్పులు, స్థితులు ఏర్పడతాయో వాటిని గురించి సాధకాగ్రగణ్యుడైన శ్రీ చైతన్య మహాప్రభువు, ఆయన ప్రధాన శిష్యులు, అనుయాయులు చక్కగా విపులీకరించడం జరిగింది. ఈ విపులీకరణ ఎక్కువగా రూపకాలంకారంలోనే ఉంది. కాని పైన పేర్కొన్న సఖ్య, వాత్సల్య, మధురభావాలలో ప్రతి ఒక్క భావసాధన కూడ పరాకాష్ఠకు చేరుకొన్నప్పుడు, ఆ స్థితిలో సాధకుడి మనస్సు తన ప్రేమాస్పదుడితో (భగవంతుడు) తాదాత్మ్యం చెంది, అద్వయ వస్తువులో, పరబ్రహ్మతత్త్వంలో విలీనమై పోతుందనే చరమ సత్యాన్ని వారు వ్యక్తపరచలేదు. లేదా ఆ చరమ స్థితిని గురించి ఏ కాస్తో ఇంగితం చేసినా అది హీనావస్థ అనీ, కనుక సాధకుడు దాన్ని గురించి అప్రమత్తంగా* మెలగాలనీ ఉపదేశించారు వారు.
vi. మధురభావ చరమ తత్త్వాన్ని గురించి శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణుల అనుపమాన జీవితం, అసాధారణమైన వారి సాధనలు ఈ ఆధునిక యుగంలో సాధనలన్నిటి చరమతత్వాన్ని గురించి అతి విపులంగా మనకు శిక్షణ గరపు తున్నాయి; లోకంలోని ప్రతిమతమూ, ప్రతి సాధనా మార్గమూ, సంప్రదాయమూ చివరికి ఈ అద్వైత స్థితికే, ఈ ఏకైక లక్ష్యానికే కొనిపోతున్నవనే సంగతిని విస్పష్టంగా, సందేహానికి తావు లేకుండా అవగాహన చేసుకోవడానికి తోడ్పడుతున్నవి. ఆయన జీవితం నుంచి నేర్వదగిన ఇతర అంశాలను ఆవలపెట్టినా, సర్వమత సమన్వయాన్ని స్థాపించగలిగిన ఆయన సువిశాల ఆధ్యాత్మిక దృష్టికి యావత్ప్రపంచమూ ఋణపడి ఉన్నదన్న సంగతి నిస్సందేహం.
17. మధురభావం: వైష్ణవాచార్యులు
శ్రీ చైతన్య మహాప్రభువు, తదితర వైష్ణవాచార్యులు ఆధ్యాత్మిక జగత్తుకు ఒసగిన మహోన్నత వరప్రసాదం ‘మధురభావం’ అనే సంగతి మొదట్లోనే చెప్పుకొన్నాం. వారు ఈ మార్గాన్ని చూపించకుంటే భగవల్లాభం నిమిత్తం అది ఎందరో సాధకులకు అవలంబనీయమై, వారికి శాంతి, విమలానంద ప్రదాయకం కాలేకపోయేది. శ్రీకృష్ణుడి బృందావనలీల నిరర్థకంగా జరిపింపబడలేదనే సంగతిని వారు మొదట అర్థం చేసుకొని, ఇతరులు కూడ ఆ నిజాన్ని గ్రహించడంలో ఎంతో కృషి చేశారు. శ్రీ చైతన్య మహాప్రభువులు జన్మించని పక్షంలో బృందావనం నేడు ఊరు పేరు లేని ఒక అరణ్యంగా మిగిలి ఉండేది.
18. బృందావన లీలల చారిత్రకత గురించి
పాశ్చాత్యాన్ని అనుకరిస్తూ కేవలం బాహ్య సంఘటనలను మాత్రమే నమోదు చేయడానికి ప్రయత్నిస్తూన్న ఆధునిక చరిత్రకారులు ఇలా అనవచ్చు: “మీరు అంటున్నట్లు బృందావన లీల ‘యథార్థంగా’ జరిగినదనడానికి ఎలాంటి దాఖ లాలూ కానరావడం లేదు. కనుక మీరు అనుభూతం చెందుతున్న ఆనంద విలాపాలు ఆ మహాభావం ఇవన్నీ నిరాధారాల మీద ప్రతిష్ఠితమైనవే.” ఈ ఆక్షేపణకు వైష్ణవాచార్యుల ప్రత్యుత్తరం ఇది: “మేం నమ్ముతున్నట్లు పురాణాలలో వర్ణింపబడిన సంఘటనలు సంభవించలేదని రూఢిగా చెప్పటానికి నువ్వు ఎలాంటి ప్రమాణాన్ని చూపగలవు? నీ చరిత్ర ఆ అతి ప్రాచీనయుగ ద్వారాన్ని తెరిచిందనే నిస్సందేహ ప్రమాణాన్ని నువ్వు చూప లేనంత వరకూ నీ సందేహం కూడ నిరాధారాల మీద ప్రతిష్ఠితమైనదనే మేం అనగలం. ఒక వేళ ఏనాడైనా నువ్వు అలాటి ప్రమాణాన్ని చూపగలిగినా మా విశ్వాసానికి ఎలాంటి హానీ వాటిల్లదు. నిత్యం బృందావనంలో జరిగే భగవంతుడి నిత్యలీలను అది స్పృశించలేదు. ఆధ్యాత్మిక జగత్తులో ఆ రహస్య లీలను చూడకోరితే మొట్టమొదట మనోవాక్కాయాలతో కామగంధహీనుడవవ్వు. ఆ పిమ్మట శ్రీమతి (రాధాదేవి) చెలికత్తెలలో ఒకరి అడుగుజాడలలో నిస్వార్థంగా సేవలందించడం నేర్చుకో. అప్పుడు, కేవలం అప్పుడు మాత్రమే శ్రీహరి లీలాభూమి అయిన శ్రీ బృందావనం నీ హృదయంలో చిరప్రతిష్ఠితమై ఉండడమూ, నీతో సహా ఆ దివ్యలీల నిత్యం అక్కడ అభినయింపబడడమూ నువ్వు దర్శించగలవు, అనుభవించనూ గలవు.”
19. బృందావన లీలలపై శ్రీరామకృష్ణులు నుడివినది
ఆధ్యాత్మిక జగత్తు యథార్థమనే అనుభూతిని పొందడం ద్వారా ఎవడు బాహ్య ప్రపంచంలోని ఘటనల పట్ల ఉదాసీనంగా ఉండడం నేర్వడో, భక్తి భావాల చరిత్రను విశుద్ధ హృదయంతో అధ్యయనం చేయడం నేర్వడో, అతడు ఏనాటికీ బృందావన లీల యొక్క యథార్థ సత్యాన్నీ, మాధుర్యాన్ని చవిచూడలేడు. మహోత్సాహాలతో శ్రీరామకృష్ణులు ఆ బృందావన లీలను వర్ణిస్తూవుంటే, ఆయన వద్ద కూర్చుని ఉన్న ఆంగ్ల విద్యనభ్యసించిన యువకులకు అది అంతగా రుచించక పోవడం ఆయన గుర్తించేవారు. అప్పుడాయన ఇలా అనేవారు: “మీరు ఆ లీలలో శ్రీకృష్ణుని పట్ల శ్రీమతికి ఉన్న ఆ ఆకర్షణను గ్రహించలేకున్నారెందుకు? భగవంతుడి పట్ల మనస్సులో అటువంటి ఆకర్షణ కలిగినప్పుడు భగవత్సాక్షాత్కారం కలుగుతుంది. భర్త, పిల్లలు, కుటుంబం, కులం, శీలం, మానం, అవమానం, లజ్జ, ఘృణ, ప్రజాభిప్రాయం పట్ల భీతి, సమాజభయం, సర్వస్వాన్నీ విడిచిపెట్టిన గోపికలు గోవిందుడి కోసం ఎలా పిచ్చివారైపోయారో చూడండి. ఎవరైనా అలా చేయగలిగితే వారికి భగవత్సాక్షాత్కారం తథ్యం.” తిరిగి కొనసాగిస్తూ ఆయన ఇలా అనేవారు: “పూర్తిగా కామహీనులు కాకపోతే మహాభావమయిన శ్రీరాధాదేవి ప్రేమభావాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి చూడగానే గోపికల మనస్సులు కోటానుకోట్ల రత్యానందం కంటే అధికానందంతో పొంగిపొరలేవి. అలాంటప్పుడు పరమ తుచ్ఛమైన ఈ దైహిక రతిసుఖాన్ని గురించి వారి మనస్సులు ఎలా యోచిస్తాయి? శ్రీకృష్ణుని దేహం నుండి వెలువడిన దివ్యజ్యోతి వారి శరీరాలను స్పృశించి ప్రతి ఒక్క రోమకూపం ద్వారా రతిసుఖం కంటే అనంతమైన ఆనందాన్ని అనుభవింపచేసేది.”
ఒకప్పుడు స్వామి వివేకానంద శ్రీరామకృష్ణుల వద్ద శ్రీ రాధాకృష్ణుల బృందావన లీల యొక్క చారిత్రక ప్రామాణికతను గురించి ఆక్షేపణ లేవదీసి దాన్ని పుక్కిటి పురాణంగా ఋజువు చేయటానికి యత్నించారు. అప్పుడు శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “మంచిది, రాధాదేవి అంటూ ఏ వ్యక్తీ ఎన్నడూ లేదనీ, ప్రేమిక సాధకుడెవరో రాధాదేవిని ఊహించి కల్పించాడనీ అనుకొందాం. కాని రాధాదేవి పాత్రను చిత్రీకరిస్తున్నప్పుడు ఆ సాధకుడు తనను మరచిపోయి రాధాదేవి భావంలో పూర్తిగా లీనమైపోయి తాను ‘రాధ’ గా అయిపోయాడని నువ్వు అంగీకరింపక తప్పదుగదా! ఆ విధంగా బృందావన లీలాభినయం బాహ్యంగానూ జరిగి ఉండటం సత్యమని ఋజువు అవుతోంది.”
బృందావనంలో భగవంతుడు సలిపిన రాసలీలను గురించి శతకోటి ఆక్షేపణలు లేవనెత్తినా, శ్రీ చైతన్య మహాప్రభువు మొదలైన వైష్ణవాచార్యుల ద్వారా ప్రథమంలో కనుగొనబడి పరమపావనమైన వారి జీవితాలలో అభివ్యక్తమైన మధురభావం చిరతర సత్యంగానే నిలిచిపోతుంది. ఆ మార్గాన్ని అనుసరించడానికి అర్హుడైన సాధకుడు తననొక స్త్రీగా భావించి భగవంతుణ్ణి తన పతిగా ఎంచి భగవంతుడి పావన దర్శనాన్ని పొంది ధన్యుడవుతాడు. అంతేగాక ఆ భావం పరిపూర్ణ వికాసం చెందినప్పుడు ఆ సాధకుడు శుద్ధాద్వైత బ్రహ్మస్వరూపంలో ప్రతిష్ఠితుడవుతాడు.
20. శ్రీ చైతన్యులు – మధురభావం
భగవంతుడి పట్ల పతి భావాన్నీ ఆరోపించుకొని సాధనామార్గంలో ముందంజ వేయడం స్త్రీలకు స్వాభావికమూ, సుగమమూకూడ. కాని పురుష దేహాధారులకు అది అస్వాభావికంగానే అనిపిస్తుంది. అలాంటప్పుడు శ్రీకృష్ణ చైతన్య దేవులు ఈ అస్వాభావిక సాధనామార్గాన్ని లోకంలో ఎందుకు ప్రవేశపెట్టారు? అనే ప్రశ్న మనస్సులో తలెత్తక మానదు. యుగావతార పురుషులు ఒనరించే కార్యాలన్నీ లోకశ్రేయస్సుకే అని మనం జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. శ్రీ చైతన్యులు ప్రవేశపెట్టిన ఆ మధురభావ సాధనమార్గం కూడా ఈ ప్రయోజనార్థమే. ఆ కాలం నాటి సాధకులు ఏ ఆధ్యాత్మిక ఆదర్శాన్ని సాధింప సుదీర్ఘకాలం ఉత్కంఠతో కృషిసల్పారో ఆ విషయాన్ని గుర్తించే చైతన్యులు సాధకులను మధురభావ సాధనాపథంలో పురోగమింప చేశారు. నిత్యముక్తులూ అవతారపురుషులూ అయి శ్రీ గౌరాంగ మహాప్రభువులు* కేవలం తన పురోగతి నిమిత్తం ఏ సాధనామార్గాన్ని అవలంబించారో, దానినే లోకం యావత్తుకూ ఆదర్శప్రాయమైనదని నెలకొల్పారనడం సబబు కాదు. అందు గురించి శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు: “ఏనుగుకు శత్రువులను ఎదుర్కోటానికి బయట దంతాలు, ఆహారాన్ని నమిలి శరీరాన్ని పోషించే నిమిత్తం లోపలి దంతాలు ఇలా రెండు రకాలైన దంతాలు ఉంటాయి. ఆ రీతిలోనే శ్రీ గౌరాంగునిలో లోపల ఒక భావం, బయట ఒక భావం – రెండు రకాల భావాలు అభివ్యక్తమయ్యేవి. బాహ్యమైన మధురభావ సహాయంతో ఆయన లోకశ్రేయస్సును ఒనగూర్చేవారు. భగవత్ప్రేమ ఫలసిద్ధితో బ్రహ్మభావంలో సుప్రతిష్ఠులై స్వయంభూమానందాన్ని ఆస్వాదిస్తూ అంతరంగాన అద్వైత భావంలో ఉండేవారు.”
21. శ్రీ చైతన్యులు సమకాలీన ఆధ్యాత్మిక స్థితిగతులు
బౌద్ధయుగ అవసానకాలంలో దేశంలో ‘వజ్రాయాన’* మనే మార్గాన్ని బోధించే ప్రచారకులు బయలుదేరారని చరిత్రకారులు పేర్కొంటున్నారు. వారిలా ప్రచారం చేయసాగారు: “నిర్వాణాన్ని పొందాలని ప్రయత్నిస్తున్న మనస్సు వాసనాజాలం నుండి దాదాపుగా తప్పించుకొని, ధ్యానం సహాయంతో మహా శూన్యంలో విలీనమవబోతున్న సమయంలో ‘నిరాత్మ’ అనే దేవి వారి ముందు ప్రత్యక్షమై, శూన్యంలో వారు విలీనం కాకుండా ఆపి తన దేహంలో వారిని ఐక్యం చేసి ఉంచుతుంది. ఆ స్థితిలో సాధకులకు బాహ్యసుఖాలను అనుభవించడానికి వలసిన భౌతికదేహాలు ఉండకపోయినా, సూక్ష్మశరీరాలు ఉండడం వల్ల ఆ దేవి వారిచేత నిత్యం సూక్ష్మరూపంతో సమస్త ఇంద్రియ భోగాల సారాన్ని అనుభవింప చేయిస్తూవుంటుంది. కాబట్టి స్థూల విషయభోగాల నన్నిటినీ త్యాగం చేస్తే, భావ రాజ్యంలో ఎడతెగని సూక్ష్మ భోగానందం ప్రాప్తిస్తుంది.” ఈ మతాన్ని వజ్రయాన బోధకులు ప్రజలలో ప్రచారం చేశారు. ఈ రీతిలో ప్రచారం గావించబడిన మతం కాలక్రమంలో అపార్థానికి గురై, ఎడతెగని విషయ వాంఛే మత, సాధనల గమ్యంగా పరిణామం చెందడం, తత్ఫలితంగా దేశంలో విశృంఖల వ్యభిచారం విస్తృతి గాంచడం విచిత్రం అవబోదు. శ్రీ చైతన్య మహాప్రభువు అవతరించిన కాలంలో విద్యావిహీనులైన దేశవాసులు అపార్థం పాలైన ఈ బౌద్ధ సిద్ధాంతాన్ని అవలంబించి విభిన్న రహస్య శాఖల క్రింద విభజించబడ్డారు. బ్రాహ్మణాది అగ్రవర్ణాల వారు కూడా అనేకులు జుగుప్సాకరమైన ఈ తాంత్రిక వామాచార మార్గాలను అనుసరిస్తూ జగన్మాత యొక్క సకామపూజ, ఉపాసనల ద్వారా అణిమాది శక్తుల సముపార్జన నిమిత్తమూ, నిరవచ్ఛిన్న భోగసుఖప్రాప్తికోసమూ కృషి చేస్తూ, మతం అంటే అదే అని భావించారు. ఈ విధంగా ఈ వికృతిమార్గం మతం క్రింద ప్రచారం కాసాగింది. ఈ మతశాఖల ముమ్మరంలో పవిత్ర ఆధ్యాత్మిక భావాలలో ఏదో ఒక భావాన్ని అవలంబించి నిరవచ్ఛిన్న బ్రహ్మానంద ప్రాప్తిని పొందగోరే యథార్థ సాధకులు మార్గదర్శకత్వం కొరవడి నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితిలోనే శ్రీ చైతన్య మహాప్రభువు అవతరించారు. మొదట్లో శ్రీ చైతన్యులు అద్భుతమైన త్యాగవైరాగ్యాలను తమ జీవితంలో ఆచరించి తదాదర్శాలను శ్రద్ధాళువులైన ఆ సాధకులకు చూపారు. పిదప త్యాగ వైరాగ్యాదర్శంలో దృఢంగా పాదుకొన్నాక అత్యంత శుద్ధచిత్తుడైన తననొక స్త్రీగా భావించుకొని భగవంతుని పతిగా ఆరాధించినప్పుడు జీవుడికి సూక్ష్మభావ రాజ్యంలో నిరవచ్ఛిన్న దివ్యానందానుభూతి నిజంగానే లభిస్తుందని ఆ సాధకులకు కనబరచారు. ఇది ఉన్నతులైన సాధకులకు మాత్రమే ఉపయుక్తమైన మార్గం. కాని జనసామాన్యానికి శ్రీ చైతన్యులు భగవంతుడి నామమహాత్మ్యాన్ని చాటి, నామజప సంకీర్తనాదులలో వారిని నియుక్తులను గావించారు. ఇంకా కలుషితంగాని, లక్ష్యచ్యుతి నొందని అనేక బౌద్ధ సంప్రదాయావలంబులు శ్రీ చైతన్యుల కృపతో మళ్ళీ నిజమైన ఆధ్యాత్మిక మార్గం పట్టగలిగారు. వికృత వామాచారాన్ని అవలంబించే వర్గాలు మొదట్లో బాహాటంగా చైతన్యులను ధిక్కరించాయి. కాని అనుపమానమైన ఆయన జీవితాదర్శం పట్ల విశేష ఆకర్షణకు లోనై, ఆత్మఖండన చేసుకొని నిష్కామభావంతో ఆరాధించి జగజ్జననీ దర్శన లబ్దికై ప్రయత్నించసాగారు. అనుపమానమైన శ్రీ చైతన్యుల జీవిత ఘట్టాలను నమోదు చేసే సందర్భంలో కొందరు రచయితలు* శూన్యవాద సిద్ధాంతం ప్రతిపాదించిన బౌద్ధులు శ్రీ చైతన్యుల జనన సమయంలో ఆనందించారని వ్రాయడానికి హేతువు ఇదే.
22. మధురభావ సారతత్త్వం
సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్ముడొక్కడే పురుషుడు. జగత్తులోని సమస్త స్థూల, సూక్ష్మ జీవజాలం మహాభావ రూపి అయిన అతడి ప్రకృతి అంశాలు కనుకనే అతడి భార్యలు. కనుక పవిత్ర హృదయులై జీవులు అతణ్ణి స్వామిగా, పతిగా భావించి త్రికరణశుద్ధిగా ఆరాధించగలిగితే భగవత్కృపతో సత్వరమే తమ లక్ష్యమైన ముక్తిని పొంది నిరవచ్ఛిన్న బ్రహ్మానందాన్ని అనుభవించగలరు. ఇది చైతన్య మహాప్రభువుల ద్వారా ప్రచారం గావించబడిన మధురభావ మూలతత్త్వం, సారాంశం. శాంత దాస్యాది ఇతర భక్తి భావాలన్నీ ఒక గొప్ప భావంలో ఇమిడివున్నప్పుడు దాన్ని మహాభావంగా పేర్కొంటారు. గోపికలలో ప్రధానురాలైన రాధాదేవి మహాభావ స్వరూపిణి. ఇతర గోపికలు ప్రతి ఒక్కరూ ఈ మహాభావాంతర్గతమైన ఇతర భావాలలో ఒకటో లేక అంతకంటే ఎక్కువ భావాల మూర్తులు. కాబట్టి సాధకుడెవడైనా ఈ గోపికల భావాలను అనుసరించి సాధన చేసి ఆయా భావాలలో పరిపూర్ణత్వం సాధించి చిట్టచివరకు ఆ మహాభావం నుండి జనించే మహదానందాన్ని లిప్తకాలం చవిచూసి ధన్యుడౌతాడు. ఈ విధంగా మహాభావ స్వరూపిణి* అయిన రాధాదేవి భావాన్ని ధ్యానిస్తూ, తన స్వకీయ సుఖానికైన కోరికలను ఆసాంతం పరిత్యజించి మనోవాక్కాయాల ద్వారా సర్వతోభావంగా శ్రీకృష్ణుని సుఖంలోనే తన సుఖాన్ని పొందడం – ఈ భావమార్గం అనుసరించే సాధకుడి చరమలక్ష్యం.
23. ప్రియుడిపైగల యావత్తు ప్రేమనూ భగవంతుడిపై ఆరోపితం చేయడం
సామాజిక నియమానుసారం వివాహమాడిన ప్రేమిక దంపతుల ప్రేమ యథేచ్ఛగా వ్యక్తం కాదు. జన్మ, జాతి, కులం, శీలం, సదాచారం, లోకనింద, సమాజ భీతి తదితర బాహ్యపరిస్థితుల చేత చాలా మేరకు ఆ ప్రేమ పరిమితం చేయ బడుతుంది. అలాంటి ప్రేమికులు కర్తవ్యాకర్తవ్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ నియమాల హద్దులలోనే ఉంటూ పరస్పర సుఖం నిమిత్తం యథాసాధ్యంగా త్యాగాన్ని పరిగ్రహిస్తూ ఉంటారు. వివాహితురాలైన స్త్రీ కఠోరమైన కట్టుబాట్లను తగిన రీతిలో పాటించబోయి అనేక సందర్భాలలో ప్రియుడిపై తనకున్న ప్రేమను విస్మరించడానికి లేక చాలావరకు తగ్గించుకోవడానికి వెనుకాడదు. కాని అక్రమ ప్రియుడి విషయంలో ఈ ప్రవర్తన పూర్తి భిన్నం. ప్రేమోద్వేగ కారణాన ఆమె సామాజిక సంప్రదాయాలను త్రోసిరాజని, తన సామాజిక భద్రతను పణంగా పెట్టి తన ప్రియుణ్ణి కలుసుకోవడానికి కించిత్తు అయినా వెనుకంజవేయదు. ఇలాంటి ప్రేమో ద్వేగాన్ని భగవంతుడిపట్ల కల్పించుకోమని వైష్ణవాచార్యులు సాధకులకు ప్రబోధిస్తూంటారు. కనుకనే బృందావన మహారాజ్ఞి అయిన శ్రీ రాధాదేవి వివాహిత అయినప్పటికీ, శ్రీకృష్ణుడి ప్రేమకై తన సర్వస్వాన్ని త్యజించిన భావమయిగా అభివర్ణించబడింది.
24. అన్ని ఇతర భావాలూ వెరసినా మధురభావమే మిన్న
శాంత, దాస్య, సఖ్య, వాత్సల్యభావాల సమష్టి సారం మధురభావం అనీ, ఇంకా చెప్పాలంటే – అంతకంటే అధికమైనదేననీ వైష్ణవాచార్యులు అభివర్ణించారు. ప్రేమికురాలైన నాయిక బానిసలా ప్రియుణ్ణి సేవిస్తుంది. నేస్తంలా సర్వావస్థల్లోనూ సముచిత సలహాలనిస్తుంది. అతడి సుఖంలోనే తన సుఖం ఉన్నట్లు భావిస్తుంది. అతడి బాధలు తన బాధలుగా స్వీకరిస్తుంది. అతడి శారీరక, మానసిక పోషణ బాధ్యతను తల్లిలా స్వీకరిస్తుంది. సర్వదా అతడి శ్రేయస్సు గురించే యోచిస్తూ ఉంటుంది. కనుకనే మధురభావం మిన్నగా పరిగణించబడుతోంది. ఈ రీతిలో సకల విధాలా తనను తాను పూర్తిగా మరచిపోయి ప్రియతముడి శ్రేయాన్ని ఆకాంక్షిస్తూ అతడి మనస్సుకు సర్వదా వినోదాన్ని కలిగిస్తూ, మనస్సును అపూర్వ శాంత్యానందాలతో నింపుతూ ఉంటుంది. ఏ నాయిక అలా తనను తాను ప్రేమ ప్రాబల్యంలో సంపూర్ణంగా మరచిపోయి ప్రియుడి శ్రేయస్సు ఆనందాల నిమిత్తం శాయశక్తులా పాటుపడుతూవుంటుందో ఆమె ప్రేమయే సర్వోత్కృష్టమైనదనీ, పైగా ఆమే ‘సమర్థ ప్రేమిక’ అనీ భక్తి గ్రంథాలలో వర్ణింపబడివుంది. స్వార్థంతో కలుషితమైన ఇతర ప్రేమలన్నీ ‘సమంజస’, ‘సాధారణి’ కోవలలో చేర్చబడ్డాయి. ‘సమంజస’ కోవకు చెందిన నాయిక ప్రియుడి సుఖానికై ఎంత తాపత్రయ పడుతుందో, స్వీయసుఖం కోసమూ అంతగానే తాపత్రయ పడుతుంది. ఇక ‘సాధారణి’ కి చెందిన నాయిక కేవలం తన స్వీయ సుఖం కోసమే నాయకుణ్ణి ప్రేమిస్తుంది.
25. మధురభావం ద్వారా చైతన్యులు చేసిన సేవలు
ఇంద్రియ సుఖాలను విషంలా విడనాడి ఆత్మసంయమంతో జీవితాన్ని గడుపుతూ, ప్రేమలో తనను తాను శ్రీకృష్ణుని ప్రేయసి స్థానంలో ఉన్నట్లు భావించుకోమని చైతన్యులు సాధకులకు ప్రబోధించారు. భగవన్నామ మహాత్మ్యాన్ని ప్రచారం చేసి సమాజంలో ఆ కాలఘట్టంలో మితిమీరిపోతూన్న (వామాచార తంత్రాల ద్వారా) వ్యభిచారాన్ని ఆ విధంగా అరికట్టగలిగారు. ఆయన సాధకులకు అందించిన భక్తిభావం, ఉపదేశం ప్రజానీకానికి చిరతర శ్రేయాన్ని కలిగించాయి. మార్గ భ్రష్టులను సన్మార్గంలో పెట్టగలిగాయి. అదేవిధంగా అస్పృశ్యులుగా, సమాజం నుండి వెలివేయబడినట్లుగా పరిగణింపబడే వారినందరినీ తిరిగి సమాజంలోకి చేర్చారు. అన్ని సంప్రదాయాలవారి ఎదుట త్యాగవైరాగ్యాలనే పవిత్ర ఉన్నత ఆదర్శాన్ని నిలబెట్టి అశేష లోకహితాన్ని చైతన్యులు చేకూర్చారు.
అంతేకాదు జగన్నాథుడైన భగవంతుని గాఢంగా ధ్యానించి తద్వారా పవిత్ర చిత్తుడైన సాధకుడిలో మానసిక శారీరక వికారాలనబడే ‘ఎనిమిది సాత్విక వికారాలు’* నిజంగానే కలుగుతాయనే విషయం చైతన్య మహాప్రభువు నిస్సందేహంగా నిరూపించి చూపారు. దాని సహాయంతో వైష్ణవ సంప్రదాయం ద్వారా ప్రచారం కాబడుతూన్న మధురభావం ఆనాటి అలంకార శాస్త్రాన్ని ఆధ్యాత్మిక శాస్త్రాలలో ఒకటిగా చేర్చి, అశ్లీల వాక్యాలన్నిటినీ ఉన్నత పవిత్ర ఆధ్యాత్మిక భావంతో రంజితం చేసి సాధక మనస్సులకు వాటిని ఆనందదాయకాలుగా, ఉన్నతి విధాయకాలుగా చేసింది. అంతేగాక శాంతభావ సాధనకు ఆటంకాలుగా పరిగణింపబడే కామక్రోధాదులను – భగవంతుణ్ణి తనవాడిగా చేసుకొని అతడికోసం, పైగా అతడి మీదనే వాటినన్నిటినీ ప్రయోగించడం నేర్పించి సాధన మార్గాన్ని సుగమం చేసింది చైతన్యుల మధురభావ బోధన.
26. వేదాంతులు – మధురభావం
ఆధునిక విమర్శకుల దృష్టిలో పురుష దేహధారులు మధురభావ సాధనను అవలంబించడం అస్వాభావికమూ, అనౌచిత్యంగానూ కనిపించవచ్చు. కాని వేదాంతవాదులకు దాని యౌక్తికతను, ప్రయోజనాన్ని నిర్ధారణ చేయడానికి అంత సమయం పట్టదు. దీర్ఘకాల అభ్యాస ఫలితంగా ఆలోచనలన్నీ మనస్సులో దృఢమైన సంస్కారాలుగా మారడం అతడు కనిపెడతాడు. జన్మజన్మాంతరాల ఈ సంస్కారాల ప్రాబల్యం చేతనే మనిషి ఒక్క అద్వయ బ్రహ్మవస్తువునే ఈ అనంత నానాత్వమయ ప్రపంచంగా కాంచుతూ ఉంటాడు. పరమేశ్వరుడి అనుగ్రహంతో ఒకవేళ అతడు ఎప్పుడైనా ప్రపంచం మిథ్య అని తెలుసుకోగలిగితే, ఆ క్షణంలోనే అతడి కళ్ళ ఎదుటే అది శూన్యంలో అదృశ్యమైపోతుంది. ప్రపంచం గోచరమవుతోంది. నేను పురుషుడను అని భావించడం వల్లనే నేను పురుషుడనైనాను. అలాగే తాను స్త్రీ అవడం సంభవిస్తోంది. మళ్ళీ మానవ హృదయంలో ఏదైనా ఒక భావం ప్రబలమై నెలకొంటే ఆ భావం తద్వ్యతిరిక్త భావాలనన్నిటినీ త్రోసివేసి, క్రమంగా వాటిని నాశనం చేయడం మన దైనందిన జీవితంలో అనుభవైకవేద్యమే. కనుక భగవంతుడితో మధురభావ సంబంధాన్ని కలిగించుకొని క్రమంగా అది ప్రాబల్యం వహించడంతో ఇతర భావాలనన్నిటినీ ఆవరించి పిదప వాటి నన్నిటినీ పీకిపారవేయడానికై చేయబడే ఈ సాధనను వేదాంతులు చక్కగా అర్థం చేసుకోగలరు. దాన్ని, కాలులో గ్రుచ్చుకొన్న ముల్లును మరొక ముల్లుతో తీసివేయడం వంటి ప్రయత్నంగా వారు వివేచిస్తారు. మనస్సులోని సంస్కారాలన్నింటికీ ముఖ్యావలంబనం ‘నేను దేహిని లేదా నేను శరీరధారిని’ అనే జ్ఞానం. మళ్ళీ ఈ దేహంతో సంయుక్తమైన ‘నేను పురుషుణ్ణి లేదా స్త్రీని’ అనే సంస్కారం ఇతర సంస్కారాలన్నిటికంటే అతి ప్రాబల్యం వహిస్తుంది. కాబట్టి భగవంతుడి పట్ల పతి భావాన్ని ఆరోపించుకొని ‘నేను స్త్రీని’ అని సదా భావిస్తూ సాధన పురుషుడు ఎప్పుడు ‘తన పుం భావాన్ని’ మరచిపోవడంలో కృతకృత్యుడవుతాడో అప్పుడతడు ‘నేను స్త్రీని’ అనే భావాన్ని కూడ సులువుగానే అతిక్రమించి భావాతీత స్థితికి చేరగలడని చెప్పడం అనవసరం. కనుక మధురభావ సాధనలో పరిపూర్ణుడైనప్పుడు సాధకుడు భావాతీత భూమికి అతిసామీప్యానికి చేరగలడనే సంగతి వేదాంతవాది దృష్టికి సర్వదా యుక్తియుక్తంగా కనబడుతూ ఉంటుంది.
27. మధురభావం శ్రీమతి ప్రేమభావ స్థితి
రాధాదేవి (శ్రీమతి) యొక్క ప్రేమభావ స్థితిని పొందడమే సాధకుడి లక్ష్యమా? అనే ప్రశ్న తలఎత్తవచ్చు. కాని వైష్ణవాచార్యులు ఈ సాధనను ఒప్పనొల్లరు. రాధాదేవి స్థితిని ఎవ్వరూ పొందజాలరనీ, సాధకుడు రాధాదేవి సఖీభావ స్థితిని మాత్రమే పొందగలడనీ వారు వక్కాణిస్తారు. అయినప్పటికీ శ్రీమతి భావాన్ని పొందడమే సాధకుడి చరమగమ్యంగా మనం స్వీకరించాలి. ఎందుకంటే శ్రీమతికి, ఆమె సఖీమణులకు మధ్య ఉండేది గుణగత భేదం కాదు, పరిమాణ భేదం మాత్రమే. వారూ శ్రీమతిలానే సచ్చిదానందఘనుడైన శ్రీకృష్ణుని పతిగా భావించి భజించేవారే. అంతేగాక రాధాదేవితో కలిసినప్పుడు శ్రీకృష్ణుడు అధికానందాన్ని పొందడం గాంచి అతణ్ణి సుఖీంప జేయగోరి రాధాకృష్ణుల సంగమం కోసం సర్వదా ప్రయత్నిస్తూ ఉండడం కానవస్తోంది. అదే విధంగా మనకు కనిపిస్తున్న మరొక విషయం ఏమిటంటే రూపగోస్వామి, సనాతన గోస్వామి, జీవగోస్వామి ప్రభృత వైష్ణవ గోస్వాములు ప్రతి ఒక్కరూ తమ తమ మధురభావాన్ని పరిపుష్టం చేసుకోవడానికై వేర్వేరు శ్రీకృష్ణ ప్రతిమలను సేవిస్తూ తమ బృందావన జీవితాన్ని గడిపారు. కాని శ్రీకృష్ణునితోబాటు శ్రీ రాధాదేవి ప్రతిమను కూడ ప్రతిష్ఠించి సేవించడానికి పూనుకోలేదు. కారణం ఏమిటంటే తమను తాము రాధాదేవి స్థానంలో ఊహించుకొని సాధన కొనసాగించినందునే వారు ఆమెను అలా పూజించలేదని మనం ఊహించవలసి ఉంది.
వైష్ణవ మత గ్రంథాలు అభివర్ణిస్తూన్న ఈ మధుర భావాన్ని గురించి అధ్యయనం చేయగోరేవారు శ్రీరూప, సనాతన, జీవగోస్వామి* మొదలైన తొలి వైష్ణవాచార్యులు వ్రాసిన భక్తిగ్రంథాలను, అలాగే శ్రీవిద్యాపతి, చండీదాస్* ప్రభృత భక్త కవిశ్రేష్ఠులచే విరచితమైన పూర్వరాగం, దానం, మానం, అభిమానం, మాధురం* ఇత్యాది భావాలు వర్ణింపబడిన పదావళి* గ్రంథాలను బాగా చదవాలి. మధుర భావనను చేపట్టి దానిలో ఏ పరాకాష్ఠ స్థితికి శ్రీరామకృష్ణులు చేరుకొన్నారో ఆ విషయం సుబోధకమవుతుందనే ఉద్దేశంతోనే మేం దాని సారాంశాన్ని ఇక్కడ సంక్షిప్తంగా చర్చించడం జరిగింది.