శ్రీరామకృష్ణులను ఆధ్యాత్మిక సాధకుడిగా అర్థం చేసుకోవాలంటే సాధన అంటే ఏమిటి? అన్న విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి. అనాదిగా భారతదేశంలోని ప్రజలు ఆధ్యాత్మిక సాధనలను ఏదో ఒక రూపంలో అనుష్టిస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు ‘సాధన’ గూర్చి మళ్ళీ విస్తృత వివరణతో గ్రంథ పరిమాణాన్ని పెంచడమెందుకు? ఆధ్యాత్మిక రాజ్యంలోని సత్యాలనన్నింటినీ సాక్షాత్కరించుకోవడం కోసం, భారతీయులు సుదీర్ఘకాలం నుండి తమ శక్తులనన్నింటినీ వినియోగించారు. నేడు కూడ అదే కొనసాగిస్తున్నారు. ప్రపంచంలోని మరే ఇతర దేశమైనా అలా చేస్తున్నదా? ఈ దేశంలో ఉద్భవించినంత మంది అవతార పురుషులు, బ్రహ్మజ్ఞులు మరే దేశంలోనైనా జన్మించారా? అందుచేత ఆధ్యాత్మిక సాధన మూల సూత్రాలతో ఇదివరకే మనం చక్కగా పరిచితులమై ఉండగా, మళ్ళీ వాటిని గూర్చి చర్చించటం దేనికీ? అని అనేకులు ఆక్షేపించవచ్చు.
1. సాధన విషయమై సామాన్యుల భ్రాంతి, భావన
పై ఆక్షేపణలో సత్యం లేకపోలేదు. అయినా దాన్ని గురించి మళ్ళీ ఒకమారు చక్కగా ఆలోచించడం మంచిది, ఎంతో అవసరం కూడ. ఎందుకంటే, జనసామాన్యానికి ‘సాధన’ విషయమై చిత్రవిచిత్ర అభిప్రాయాలుండడం చూస్తుంటాం. ఆధ్యాత్మిక సాధనల లక్ష్యాన్ని మరిచిపోయి, కఠిన తపస్సులను, దుర్లభ వస్తువులతో – దుర్లభ స్థానాల్లో చేసే చిత్రవిచిత్రమైన పనికిమాలిన చేష్టలను – ముక్కు బిగించి శ్వాసను ఆపడాన్ని – చివరికి మతి చెడినవారి పిచ్చిపిచ్చి కార్యకలాపాలు – ఇలాంటి వాటినన్నింటినీ అద్భుతసాధన విశేషాలని ఎంతోమంది భ్రమ పడుతుంటారు. అంతేకాదు, దుష్టసంస్కారాలు, దుర్వ్యసనాలుగల వారిని స్వస్థత పరచడానికి మహాత్ములు బోధించే విచిత్ర ప్రక్రియలను కూడ ‘సాధనలు’ గా భావిస్తారు. అంతటితో తృప్తి పొందక అవన్నీ జనులందరికీ ఉపయోగపడతాయని వారు ప్రచారం చేస్తారు. చేయడమే కాదు వాటిని అభ్యాసం కూడ చేయిస్తుంటారు. మరికొందరుంటారు, వారికి ఏమాత్రం వైరాగ్యం ఉండదు. రూప రసాది పంచేంద్రియ విషయభోగాలను ఆశిస్తూ, వాటికోసం అనేక క్రియాకలాపాలు చేస్తుంటారు. మంత్రం – ఓషధులతో పాములను వశం చేసుకునేలా, జగత్కారణ ఈశ్వరుణ్ణి తమ వశం చేసుకోవాలన్న ఆశతో మంత్ర తంత్రాది విచిత్ర వ్యర్థక్రియలతో కాలక్షేపం చేస్తుంటారు. కాబట్టి యుగయుగాల నుండి భారతదేశ ఋషులు, మహాత్ములు తీవ్రకృషితో కనుగొని, ఉపదేశించిన సాధనతత్త్వాల గూర్చి ఒకమారు క్లుప్తంగా చెప్పుకోవడం అప్రస్తుతం కాబోదు.
2. సకల జీవాల్లో బ్రహ్మదర్శనానికి – సాధనే ఉపాయం
“అన్ని జీవరాశుల్లో బ్రహ్మాన్ని లేదా భగవంతుణ్ణి దర్శించడమే, సాధన చరమ దశ” అని శ్రీరామకృష్ణులు చెబుతూ ఉండేవారు. సాధన చరమదశలో మాత్రమే సాధకుని భాగ్యంగా ఈ సర్వభూతస్థ బ్రహ్మసాక్షాత్కారస్థితి లభిస్తుంది. హిందువులకు సర్వోత్కృష్ట ప్రామాణిక శాస్త్రాలైన వేదోపనిషత్తులు ఈ విషయాన్నే నొక్కి వక్కాణిస్తాయి. ఈ ప్రపంచంలో స్థూల, సూక్ష్మ, జడ, చేతనాలు; ఇటుకలు, కొయ్యలు, మట్టి, రాయి, పశువులు, పక్షులు, చెట్లు, పురుషులు, దేవతలు అన్నీ కూడా ఒకే ఒక ‘అద్వయ బ్రహ్మం’ అని అవి స్పష్టం చేస్తుంటాయి. ఉన్న ఆ ఒక్క బ్రహ్మాన్నే నువ్వు నానారూపాలతో, నానాభావాలతో చూస్తుంటావు, వింటూంటావు! పంచేంద్రియాలతోనే కార్యకలాపాలను నిర్వర్తిస్తూ ఉంటావు – అంటే బ్రహ్మం యొక్క సహాయంతోనే దైనందిన జీవితంలో పనులను చేస్తూ ఉంటాం. కానీ నీకా విషయం అవగతం కాకపోవడంచేత; వివిధ వ్యక్తులు, వస్తువులతో నీవు వ్యవహరిస్తున్నట్లుగా భావిస్తావు.
ఈ విషయాన్ని విన్న తర్వాత మనలో ఎన్నో సందేహాలు తలెత్తుతాయి. వాటిని తొలగించడానికి శాస్త్రీయ సమాధానాలను ప్రశ్నోత్తరాల రూపంలో పాఠకులకు అందిస్తే, విషయం సులభంగా అర్థమవుతుందని మా భావన.
ప్రశ్న: ఆ విషయం (ప్రపంచం నిజానికి బ్రహ్మమే అన్న విషయం) మనకు ప్రత్యక్షానుభవంలోకి రాకపోవడానికి కారణం ఏమిటి?
జవాబు: భ్రమ. మీరిప్పుడు భ్రమలో ఉన్నారు. ఆ భ్రమ తొలగనంతవరకూ, అది ‘భ్రమ’ అన్న విషయం ఎలా అర్థమౌతుంది? బాహ్యాభ్యంతరాలకు చెందిన ఏ భ్రమల గురించి అయినా, అవి కేవలం ‘భ్రమలు’ అని మనం తెలుసుకోవాలంటే వాటిని యథార్థ వస్తువులతో, అవస్థలతో పోల్చినప్పుడు అది సాధ్యమవుతుంది. అలాగే పైన చెప్పిన మీ భ్రాంతి (నానాత్వాన్ని చూడడం) తొలగాలంటే, సరైన (అద్వయ బ్రహ్మ) జ్ఞానం అవసరం.
ప్రశ్న: సరే. మరి ఆ భ్రమ కలగడానికి హేతువు ఏమిటి? అది మనలో ఎప్పుడు ప్రారంభమైంది?
3. భ్రమ, సత్యాన్ని మరుగుపరుస్తుంది: భ్రమకు హేతువు ఒక మర్మం
జవాబు: సర్వత్రా భ్రమకు ఏది కారణమో, ఇక్కడ కూడ అదే! అంటే అజ్ఞానమే దానికి కారణం. ఆ అజ్ఞానం ఎప్పుడు నిన్ను పట్టుకుందో నీకెలా తెలుస్తుంది? నువ్వు అజ్ఞానంలో ఉన్నంతకాలం, దాన్ని తెలుసుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమే అవుతాయి. కలను చూస్తున్నంత కాలం, అది నిజమే అనిపిస్తుంది. మేల్కొన్న తర్వాత, ఆ స్వప్నాన్ని జాగ్రదావస్థతో పోల్చి చూసుకున్న తర్వాతే అది ‘కల’ అన్న విషయం స్పష్టమవుతుంది. ఈ విషయంలో నువ్వో ఆక్షేపణ చేయవచ్చు – కలలు కంటున్నప్పుడుకూడ కొంతమందికి ‘ఇది కల’ అనే జ్ఞానముంటుందని. దానికి ఒకటే సమాధానం: ‘ఇది కల’ అని వారికి కలిగే జ్ఞానం కూడ నిజానికి జాగ్రత్ స్మృతి నుండే కలుగుతుంది. అలాగే జాగ్రదవస్థలో జగత్తును ప్రత్యక్షంగా అనుభూతం చేసుకొంటున్నప్పుడు కూడ కొంతమందికి (జ్ఞానులకు) ఆ అద్వయ బ్రహ్మ స్మృతి కలుగుతూ ఉంటుంది.*
ప్రశ్న: మరైతే (భ్రాంతి నశించడానికి) మార్గం ఏమిటి?
జవాబు: అజ్ఞానాన్ని నాశనం చేయడమే దానికి ఉపాయం. ఆ భ్రమ లేదా అజ్ఞానం తొలగిపోతుందని నేను నిశ్చయంగా చెబుతున్నాను. పూర్వం ఎంతమందో ఋషులు దాన్ని నశింప జేసుకున్నారు. మనకు కూడ మన అజ్ఞానాన్ని నశింపచేసుకొనే మార్గాన్ని చూపించి వెళ్ళారు.
ప్రశ్న: సరే. ఆ మార్గాన్ని తెలుసుకునే ముందు, మేం ఒకటి రెండు ప్రశ్నలు వేయదలిచాం. మొదటిది – మేమింతమందిమి దేన్ని (ఏ నానాత్వాన్ని) చూస్తున్నామో, ప్రత్యక్షంగా అనుభవిస్తున్నామో, దాన్ని ‘భ్రమ’ అని నువ్వంటున్నావు. మళ్ళీ ఏ కొద్దిమంది ఋషులో ఈ జగత్తును గ్రహిస్తున్న (అద్వయ బ్రహ్మ వస్తువుగా) దాన్నే ‘సత్యం’ అంటున్నావు. మరి ఆ కొద్దిమంది చూస్తున్నదే ‘భ్రాంతి’ ఎందుకు కాకూడదు?
4. ఋషులు జగత్తును ఎలా కాంచారో అదే సత్యం: అందుకు కారణం
జవాబు: ఎక్కువమంది నమ్మేదే ‘సత్యం’ కావాలన్న నియమమేమీ లేదు. ఋషులు ప్రత్యక్షం చేసుకున్నదే ‘సత్యం’ అని నేను చెప్పగలను. ఎందుకంటే, ఆ సత్యసాక్షాత్కారం ద్వారా వారు సకల దుఃఖాలు, భయాల నుండి విముక్తు లయ్యారు. పరిపూర్ణ శాంతిని పొందారు. అంతేకాదు. నిశ్చితమృత్యువుతో అంతమయ్యే మానవ జీవిత ప్రయత్నాల కన్నింటికీ వెనుకవున్న ఒక మహదాశయాన్ని (బ్రహ్మ దర్శనాన్ని) కనుగొన్నారు. పైగా నిజమైన జ్ఞానం మనిషిలో సహనం, సంతోషం, దయ, వినయం, మొదలైన సద్గుణాలను పెంపొందిస్తుంది. అది మనిషిని అద్భుత ఉదారసంపన్నుడిగా చేస్తుంది. ఋషుల జీవితాల్లో అలాంటి అసాధారణ సద్గుణాలు, శక్తులుండడం మనకు శాస్త్రాల నుండి తెలుస్తూ ఉంది. వారి అడుగుజాడల్లో నడిచి, సిద్ధి పొందిన వారి జీవితాల్లో కూడ అలాంటి గుణాలుండడం మనం చూస్తూనే ఉంటాం.
5. అనేకులకు ఒకే రకం ‘భ్రమ’ కలుగుతున్నా, ఆ భ్రమ ‘సత్యం’ కాబోదు
ప్రశ్న: అదిసరే, మరి మనమంతా కూడ ఒకేరకమైన భ్రమలో ఉండటానికి కారణం ఏమిటి? ఉదాహరణకు, ఒకదాన్ని నేను ‘పశువు’ గా తెలుసుకుంటే, నువ్వు కూడా దాన్ని పశువుగానే గుర్తిస్తున్నావు తప్ప, మరో విధంగా కాదు. ఇతర విషయాల్లో కూడ ఇంతే. ఇలా ఏకకాలంలో అన్ని విషయాల్లోనూ అందరూ ఒకే రకమైన భ్రాంతికి లోనుకావడం చాలా ఆశ్చర్యం కదా! కొంతమంది ఏదో ఒక విషయంలో భ్రాంతికి లోనైనా, ఇతరులకు ఆ విషయంలో సమ్యక్జ్ఞానం ఉండడం సర్వత్రా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాని ఇక్కడ ఆ నియమం చెల్లుబాటు కావడం లేదు. అందుచేత నువ్వు చెబుతున్నది సముచితంగా కనిపించడం లేదు.
6. సర్వులకూ ఒకే భ్రమ కలగడం ఎందుకు?
జవాబు: ‘చాలామంది’ అని నువ్వు పేర్కొన్న వారిలో, ఋషులను నువ్వు చేర్చలేదు. అందుకే నియమం పొసగడం లేదని నీ కనిపిస్తున్నది. లేకపోతే, నువ్వాశించే సమాధానం నీ ప్రశ్నలోనే ఉంది. అయినా నీ ప్రశ్నకు సమాధానం చెబుతున్నాను. జనులంతా ఒకే భ్రాంతికి లోనయ్యే విషయంలో శాస్త్రం చెబుతున్న దేమిటి? ‘అపరిమిత అనంత విశ్వమానసంలో, ఈ జగత్తు ఒక కల్పనగా – ఒక భావనగా ఉదయిస్తుంది’ – అని శాస్త్రం చెబుతోంది. నీ, నా, ఇతర జనులందరి వ్యష్టి మనస్సులన్నీ, ఆ విరాట్ పురుషుని మనస్సులో భాగాలుగా, అంశాలుగా ఉన్నాయి. అందుచేత మనమంతా కూడ భావాలనన్నింటినీ ఒకేరకంగా అనుభవిస్తూ ఉంటాం. ఆ కారణంగానే మనం ఒక పశువును పశువుగా తప్ప, మన ఇష్టానుసారం మరోరకంగా భావించలేం. కాబట్టి మనలో ఎవరైనా ఆత్మసాక్షాత్కారాన్ని పొంది, సర్వ భ్రమల నుండి ముక్తులైనా, మిగతావారంతా వెనుకటి భ్రమలోనే ఉంటారు. మరో విషయం. విరాట్ (ఈశ్వరుని) పురుషుని మనస్సులో జగత్తు అనే భావన ఉదయించినా, అతడు మనలా భ్రాంతిబంధనంలో చిక్కుకోడు. ఎందుకంటే సర్వజ్ఞుడైన ఈశ్వరుడు, అజ్ఞానం నుండి జనించిన ఈ జగత్తు లోపల, వెలుపల, సర్వత్రా కూడా ఆ ఒక్క అద్వయ బ్రహ్మమే వ్యాప్తమై ఉండడం ప్రత్యక్షంగా చూస్తూంటాడు. మనం అలా చూడలేం. అందుకే మనకు ఈ భ్రాంతి తప్పదు. ప్రభావానికి లోనుగాని దివ్యపురుషుని నైజాన్ని శ్రీరామకృష్ణులు ఇలా విశదీకరించేవారు: “పాము నోట్లో విషం ఉంటుంది. అది ఆ నోటితోనే ఆహారం గ్రహిస్తూ ఉంటుంది. కాని దానికెలాంటి హానీ వాటిల్లదు. కాని పాము ఎవర్ని కాటువేస్తుందో, వారికి మాత్రం మృత్యువు తప్పదు.”
7. జగత్తు అనే భావం దేశకాలాలకు అతీతమైంది; ప్రకృతికూడ అనాదే!
కాబట్టి శాస్త్రానుసారం చూస్తే, విరాట్ పురుషుని మనస్సులో లేదా విశ్వ మానసంలో కల్పనగా ఉదయించిన ఈ జగత్తు ఒకరకంగా మనందరి మనోకల్పనే అని స్పష్టమవుతున్నది. ఎందుకంటే, శరీరానికి, దాని వివిధ అవయవాలకు మధ్య ఉండే అవిచ్ఛేదక సంబంధంలాగే, మనందరి వ్యక్తిగత అల్ప మనస్సులన్నీ కూడ, ఆ విశ్వమానసంలో అంశాలుగా నిత్య సంబంధం కలిగివుంటాయి. కాని ఈ విశ్వమానసంలో ఈ జగత్తు ఒకప్పుడుండి, మరొకప్పుడు లేకుండా పోతుందని చెప్పడం కూడ తగదు. ఎందుకంటే, ఏ నామరూపాలు లేకపోతే ఈ నానాత్వయుక్త విచిత్రసృష్టి అసంభవమో, ఆ నామరూపాలు లేదా దేశకాలాలు రెండు కూడ ఆ ‘జగత్తు’ అనే కల్పనలోని భాగాలే. ఆ జగత్ కల్పనలో అవి అవిచ్ఛిన్నంగా సర్వదా ఉంటాయి. కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే, ఈ సృష్టికంతా మూలభూతమైన ప్రకృతి లేదా మాయ అనాది అని, లేదా కాలాతీతమైనదని వేదాదిశాస్త్రాలు ఎందుకు చెబుతున్నాయో అన్న విషయాన్ని పాఠకుడు చక్కగా అర్థం చేసుకోగలుగుతాడు. మరి జగత్తు మనస్సు ద్వారా కల్పితమైనది అయితే మనం దేన్ని కాలం అని అంటున్నామో, ఆ కాలంలో ఈ జగత్ కల్పన ప్రారంభం కాకపోతే, చివరికి ఒక విషయం తేలిపోతున్నది – అదేమిటంటే, కాలం అనే కల్పన కూడ (ఒకేమారు) దానికాశ్రయమైన విశ్వమానసంలో ఉండే ఉంటుంది. మన పరిమిత వ్యష్టి మనస్సుల్లో ఈ జగత్ భావన ఎంతో కాలం నుండి ఉంటూరావడంవల్ల, ‘జగత్తు సత్యం’ అన్న భావన మనలో స్థిరపడిపోయింది. అలాగే ఈ కల్పనకు అతీతమైన అద్వయబ్రహ్మ సాక్షాత్ దర్శనం మనకు చాలాకాలంగా కలగకపోవడంవల్ల కూడ ‘ఈ జగత్తు కేవలం ఒక మనోకల్పన మాత్రమే’ అన్న విషయాన్ని మరిచి, భ్రమలో పడిపోయామన్న సంగతిని మనం గ్రహించలేకుండా ఉన్నాం. దీనికి కారణం ఏమిటో ముందే చెప్పాం – “సత్యవస్తువుతో, అవస్థతో పోల్చి చూసినప్పుడు మాత్రమే మనం బాహ్యాభ్యంతరాల భ్రమను అర్థం చేసుకోగలం.”
8. దేశకాలాలకు అతీతమైన జగత్ కారణాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే ‘సాధన’
కాబట్టి, ఈ జగత్తును గూర్చి ప్రస్తుతం మనకున్న భావాలు, అనుభవాలు అన్నీ సుదీర్ఘకాలంగా వస్తూన్న మన అభ్యాసాల ఫలితమేనని మనకిప్పుడు స్పష్టమవుతున్నది కదా! మనం ఈ జగత్తు వాస్తవ స్వరూపాన్ని గూర్చి (అంటే అది సత్యమా, భ్రమా? సత్యమైతే దాని స్వరూపం ఏమిటి? మొదలైన వాటిని గూర్చి) తెలుసుకోవాలంటే, మనకిప్పుడు ఉన్నవాటన్నింటికీ అతీతంగా ఉన్న దాన్నిగూర్చి తెలుసు కోవలసి ఉంటుంది. అలా తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలనే వేదాది శాస్త్రాలు ‘సాధన’ అంటాయి. స్త్రీ, పురుషుల్లో ఎవరైనాసరే తెలిసో తెలియకో ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటే, వారినే భారతదేశంలో ‘సాధకులు’ అని పేర్కొంటారు.
9. ‘నేతి, నేతి’ – ‘ఇతి, ఇతి’ సాధన మార్గాలు
మామూలుగా చెప్పాలంటే, జగత్తుకు అతీతంగా ఉన్న ఆ నిత్యవస్తువును తెలుసుకోవడానికి చేసే సాధన, రెండు మార్గాలను అనుసరిస్తూ వస్తున్నది. శాస్త్రాలు ఆ – మార్గాలను 1. నేతి, నేతి (ఇదికాదు, ఇదికాదు) అని లేదా జ్ఞానమార్గమని, 2. ఇతి, ఇతి (ఇదే, ఇదే) అని లేదా భక్తిమార్గం అని పేర్కొంటాయి. ఈ రెండు మార్గాల సాధకుల మధ్య ఉన్న తేడా ఒక్కటి మాత్రమే. జ్ఞానమార్గాన్ని అవలంబించే సాధకుడికి తన చరమలక్ష్యం గూర్చిన అవగాహన ఉంటుంది. దాన్ని సదా దృష్టిలో ఉంచుకుని పూర్తి ఎరుకతో దానివైపు అతడు క్రమక్రమంగా పురోగమిస్తుంటాడు. కాని భక్తిమార్గాన్ని అనుసరించే సాధకుడికి చివరికి తానెక్కడికి చేరతాడో అన్న విషయం తరచూ తెలియకుండా ఉంటుంది. అతడు సాధన చేస్తూ చేస్తూ ఉన్నత లక్ష్యాలను ఒకదాని తర్వాత మరొకదాన్ని పొందుతూ చిట్టచివరికి జగదతీతమైన ఆ అద్వయబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. కాని ప్రపంచ విషయంలో సామాన్యులకుండే భావనలన్నింటినీ, ఈ రెండు మార్గాలను అనుసరించే సాధకులిద్దరూ కూడా వదలిపెట్టవలసి ఉంటుంది. ఈ ఇద్దరికి తేడా ఒకటి ఉంది. జ్ఞానమార్గావలంబి మొదటి నుండే దాన్ని సంపూర్ణంగా పరిత్యాగం చేసే ప్రయత్నం చేస్తాడు. కాని భక్తుడు మాత్రం కొద్ది కొద్దిగా త్యాగం చేస్తూ సాధన కొనసాగిస్తాడు. కాని చివరికి అతడు కూడ జ్ఞానిలా సర్వాన్ని త్యజించి ‘ఏకమేవాద్వితీయం’ అనే తత్త్వాన్ని సమీపిస్తాడు. స్వార్థపరాయణులైన ప్రాపంచికులకు ఈ జగత్తులో సుఖభోగాలొక్కటే ఏకైక లక్ష్యంగా ఉంటాయి. ఈ సుఖభోగ లక్ష్యాన్ని పరిత్యాగం చేయడాన్నే శాస్త్రం ‘వైరాగ్యం’ అంటుంది.
సదా మారుతూ, నిశ్చిత మృత్యువుతో అంతమయ్యే మానవజీవితంలో ‘ప్రపంచం అత్యంత అనిత్యం’ అనే జ్ఞానం సహజంగానే కలుగుతుంది. ఈ కారణంగానే జగత్తును గూర్చి కలిగే సామాన్యభావన (అంటే ప్రపంచం సదా సుఖస్థానంగా ఉంటుందనే సామాన్యుల భ్రాంతిభావన)ను త్యజించి, జగత్కారణాన్నిగూర్చి తెలుసుకోవడానికై ప్రాచీనులు (ఋషులు) ముందుగా ‘నేతి – నేతి’ అనే జ్ఞానమార్గాన్ని అవలంబించి ఉంటారని అనిపిస్తున్నది. అందుకే భక్తి, జ్ఞాన మార్గాలు రెండూ ఏకకాలంలో ప్రచారంలో ఉన్నా, భక్తిమార్గం పూర్తిగా పురోభివృద్ధి చెందేందుకు ముందుగానే జ్ఞానమార్గం చక్కగా అభివృద్ధి చెంది ఉంటుందని తెలుస్తున్నది.
10. ‘నేతి, నేతి’ అనే జ్ఞానమార్గ లక్ష్యం – ‘నేను ఎవరిని?’ అన్న దాన్ని తెలుసుకోవడమే!
‘నేతి – నేతి’ – సత్యజగత్కారణం ఇదికాదు, ఇది కాదు – అంటూ నిత్య సత్యంకాని తత్త్వాన్ని ప్రతిదాన్నీ వదలివేస్తూ, ముందుకు వెళుతూ, అనతి కాలం లోనే మనిషి అంతర్ముఖుడు అవగలిగాడు అనడానికి ఉపనిషత్తులు సాక్ష్యం ఇస్తున్నాయి. బాహ్య వస్తువులన్నింటికన్నా – అన్నింట్లో తన మనశ్శరీరాలే తనకు ప్రధానంగా ప్రపంచంతో సంబంధబాంధవ్యాలు ఏర్పరస్తున్నాయన్న విషయాన్ని మనిషి అర్థం చేసుకున్నాడు. అందుకే ఈ మనశ్శరీరాలనే ఆధారం చేసుకుని జగత్కారణ అన్వేషణకు పూనుకుంటే, అది సత్వరమే తెలిసే అవకాశముందని కూడ అతడు గ్రహించాడు. పాత్రలోని ఒక్క మెతుకును పట్టి చూస్తే, పాత్రలోని అన్నమంతా ఉడికిందీ లేనిదీ ఎలా తెలుస్తుందో, అలాగే నిత్యజగత్కారణ బ్రహ్మను అంతర్గతంలో దర్శించుకొంటే, తర్వాత దాన్ని సర్వత్రా, సర్వవస్తువుల్లో, సర్వప్రాణుల్లో సాక్షాత్కరించుకోవచ్చు. అందుచేత జ్ఞానమార్గ సాధకుడికి ‘నేను ఎవరినీ?’ అన్న విషయాన్ని శోధించడమే ఏకైక లక్ష్యంగా ఉంటుంది.
11. నిర్వికల్ప సమాధి
జ్ఞాని, భక్తుడు – ఇద్దరు కూడ జగత్ విషయమై సామాన్యులకుండే భావనను పరిత్యజించవలసి ఉంటుందని ఇదివరకే చెప్పుకున్నాం. అలాంటి భావనను పరిత్యజించడం ద్వారా, మనిషి మనస్సు సర్వవృత్తి రహితమై, సమాధిని పొందేందుకు యోగ్యమౌతుంది. అలాంటి సమాధినే శాస్త్రాలు ‘నిర్వికల్ప సమాధి’ అంటాయి. జ్ఞానమార్గ సాధకుడు ‘నే నెవరిని’ అన్న శోధన చేస్తూ చివరికి ఎలా నిర్వికల్ప సమాధిని పొందుతాడో, ఆ విషయాన్ని మేము మరోచోట వివరించాం.* ప్రస్తుతం భక్తి మార్గగామి ఆ నిర్వికల్పసమాధిని ఎలా చేరుకుంటాడో వివరించే ప్రయత్నం చేస్తాం.
భక్తిమార్గాన్నే ‘ఇతి – ఇతి’ సాధన మార్గమంటామని చెప్పాం కదా! ఎందుకంటే, భక్తిమార్గావలంబికి ప్రపంచం అనిత్యమన్న అవగాహన ఉన్నా, సృష్టికర్త అయిన ఈశ్వరుడు ఒకడున్నాడన్న విషయాన్ని అతడు విశ్వసిస్తాడు. కాబట్టి ఆయన సృజించిన ఈ ప్రపంచం కూడ సత్యమని, దాని ఉనికి కూడ నిజమని నమ్ముతాడు. భక్తుడు ఈ ప్రపంచాన్ని, దానిలోని వస్తువులను, ప్రాణులను అన్నింటినీ భగవంతునికి సంబంధించినవిగా చూస్తూ, మొత్తం ప్రపంచాన్నే ‘తనది’ గా చేసుకునే ప్రయత్నం చేస్తాడు. సర్వాన్ని ఇలా భగవన్మయంగా దర్శించడంలో అతడి ప్రయత్నాలకు అడ్డువచ్చేవాటి నన్నింటినీ అతడు పరిత్యాగం చేస్తాడు. భగవంతుణ్ణి ఏదో ఒక రూపాన్ని తన ఇష్టదైవంగా ఎంచి, దానిపట్ల ప్రేమ పెంపొందించు కోవడం, ఆ రూప ధ్యానంలోనే తన్మయుడవడం, ఆ ఇష్టదేవత ప్రీత్యర్థమే సర్వకార్యాలనూ చేయడం – ఇదే భక్తుని తక్షణ లక్ష్యమౌతుంది.
12. ‘ఇతి, ఇతి’ సాధనామార్గం ద్వారా నిర్వికల్పసమాధి
భక్తిమార్గాన్ని అవలంబించి, భగవత్రూప ధ్యానంలో తన్మయత్వాన్ని పొంది, జగత్ ఉనికినే విస్మరించి నిర్వికల్పస్థితికి చేరడం ఎలాగో మన మిప్పుడు పరిశీలిద్దాం. ముక్తికి, సత్యసాక్షాత్కారానికి ప్రధాన సహాయసాధనగా భక్తుడు తనకు ప్రియమైన భగవంతుని ఏదో ఒక రూపాన్ని ఎన్నుకొంటాడు. దాన్నే చింతన చేస్తూ, ధ్యానిస్తూ ఉంటాడు. మొదట్లో ధ్యానంలో అతడు తన ఇష్టదేవత పూర్తి రూపాన్ని దర్శించడంలో అసమర్థుడై ఉంటాడు. మొదట్లో అతడికి అంగాంగ దర్శనమే సాధ్యమవుతుంది. ఇష్టదేవత చేతులనో – పాదాలనో – ముఖాన్నో – వక్షస్థలాన్నో ఇలా ఒక్కోమారు ఒక్కో అవయవాన్ని మాత్రం దర్శించగలుగుతాడు. సంపూర్ణ స్వరూపాన్ని మొదట్లోనే దర్శించలేడు. ఈ అవయవ దర్శనం కూడ స్థిరంగా ఉండదతనికి. క్షణకాలం ఉండి, ఆ తర్వాత అదృశ్యమైపోతుంటుంది. కాని క్రమం తప్పక అభ్యాసం చేస్తున్నకొద్దీ, ధ్యానం గాఢమౌతున్నకొద్దీ ఆ ఇష్టదేవతామూర్తి సర్వాంగ స్వరూపం భక్తుని మనోఫలకం మీద అప్పుడప్పుడు దర్శనం అవుతూ ఉంటుంది. ధ్యానం మరింత గాఢతరం అయ్యేకొద్దీ, ఆ స్వరూపం మళ్ళీ మనస్సు చంచలమయ్యేదాకా స్థిరంగా నిలచివుంటుంది. తర్వాత ధ్యానగాఢతను బట్టి, ఆ ఇష్టదేవతాస్వరూపం స్థిరంగా నిలిచి ఉంటుంది. ఎక్కువకాలం స్థిరంగా ఉండడమే కాకుండా, ఆ మూర్తి నవ్వడం, మాట్లాడడం, చివరికి స్పర్శించడం, ఇలాంటి అనుభవాలన్నీ భక్తునికి కలుగుతాయి. అప్పుడా దివ్య మంగళమూర్తి అన్ని విధాలా చైతన్యవంతమై కనిపిస్తుంది. భక్తుడు కళ్ళు మూసుకున్నా, తెరచుకున్నా, ధ్యానం చేస్తున్నా, చేయకున్నా, అతడు ఏ అవస్థలో ఉన్నా, ఆ ఇష్టదేవతే, తన ఇచ్ఛానుసారంగా నానారూపాలను దాలుస్తుందన్న దృఢ నమ్మకం భక్తుడికి ఏర్పడుతుంది. దానితో ఆ భక్తుడు, తన ఇష్ట దేవతలో రకరకాల దివ్యస్వరూపాలను దర్శిస్తాడు. “సాధకుడు భగవంతుని ఒక్క స్వరూపాన్నైనా అలా చైతన్యమయంగా దర్శించగలిగితే, అతడికి ఇతర రూపదర్శనాలు సహజంగానే కలుగుతాయి” అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు.
పై విషయాల ద్వారా ఒక సంగతి మనకు స్పష్టమౌతున్నది. అలా సచేతన దైవస్వరూప దర్శన భాగ్యానికి నోచుకున్న భక్తుడికి జాగ్రదవస్థలోని ప్రపంచ వస్తువుల అస్తిత్వం ఎంత నిజమని తోస్తుందో, అతడు ధ్యానావస్థలో దర్శించే భావరాజ్యానికి చెందిన ఆ దేవతల రూపాల అస్తిత్వం కూడ అంతే నిజమని అనిపిస్తుంది. అలా బాహ్య, భావ ప్రపంచాల సమాన అస్తిత్వబోధ ఎక్కువయ్యే కొద్దీ, అతడి మనస్సులో బాహ్యజగత్తు మనోకల్పితమన్న ధారణ దృఢమౌతూ ఉంటుంది. గాఢధ్యానంలో భక్తుడి మనస్సులో భావరాజ్య అనుభవం ఎంత అధికంగా ఉంటుందంటే, ఆ సమయంలో అతనికి బయటిప్రపంచానికి సంబంధించిన ఎరుక పూర్తిగా తొలగిపోతుంది. భక్తుడి ఈ మానసిక అవస్థను శాస్త్రాలు ‘సవికల్ప సమాధి’ గా అభివర్ణిస్తాయి. ఆ సవికల్ప సమాధి కాలంలో భక్తుడి మానసికశక్తి ప్రభావంతో, అతడి మనస్సు నుండి బాహ్యప్రపంచం పూర్తిగా తొలగిపోయినా, భావరాజ్యం మాత్రం అట్లే భాసిస్తూ ఉంటుంది. బాహ్యప్రపంచంలో వ్యక్తులతో, వస్తువులతో వ్యవహరిస్తున్నప్పుడు మనం ఎలా సుఖదుఃఖాలను అనుభవిస్తూ ఉంటామో, సవికల్ప సమాధి స్థితిలో భక్తుడు తన ఇష్టదేవతతో వ్యవహరిస్తున్నప్పుడు కూడ అలాంటి అనుభవాలనే పొందుతుంటాడు. ఆ అవస్థలో అతడి మనస్సు కేవలం తన ఇష్టదేవతను ఆశ్రయించే సంకల్ప – వికల్పాలతో నిండి ఉంటుంది. కేవలం ఒకే ఒక విషయాన్ని మాత్రమే ప్రధాన రూపంగా అవలంబనం చేసుకుని భక్తుడి మనస్సులో ఆ సమయంలో నానావృత్తులు ఉదయిస్తూ ఉంటాయి. శాస్త్రాలు ఈ అవస్థను ‘సవికల్ప సమాధి’, అంటే వికల్పాలతో కూడివున్న సమాధి అని పేర్కొంటాయి.
ఈ విధంగా ఆధ్యాత్మిక భావరాజ్యంలో మనస్సు విహరిస్తున్నప్పుడు భక్తుడి మనస్సు నుండి బాహ్యప్రపంచ స్ఫురణ పూర్తిగా తొలగిపోతుంది. భావరాజ్యంలో కూడ ఒకే విషయం ప్రాబల్యం వహించడంతో, ఇతర భావాలన్నీ అదృశ్యమైపోతాయి. ఇంతవరకూ ప్రగతి సాధించిన భక్తుడికి నిర్వికల్పసమాధి మరెంతో దూరంలో ఉండదు. దీర్ఘకాల అభ్యాసఫలంగా వస్తున్న బాహ్యప్రపంచపు ఉనికి సత్యమన్న జ్ఞానం ఇప్పుడు పూర్తిగా తొలగిపోవడం మూలంగా, భక్తుడి మనస్సు ఎంతో శక్తిమంతం, మరెంతో దృఢసంకల్పయుక్తం అవుతుంది. తన మనస్సును ఇక సంపూర్ణంగా వికల్పరహితం చేయగలిగితే, తన ఆనందం మరింత అధికమౌతుందన్న భావన అతడికి దృఢమవుతుంది. అప్పుడిక పరమోత్సాహంతో అతడి మనస్సు ఆ లక్ష్యం వైపు ముందుకు సాగుతుంది. అతడిక గురువు – భగవంతుల అనుగ్రహంతో త్వరలోనే భావరాజ్య చరమభూమిని అధిరోహించి, అద్వైతజ్ఞానంలో ప్రతిష్ఠితుడై పరమశాంతిని పొందుతాడు. మరోరకంగా చెప్పాలంటే, తన ఇష్టదేవత యందు అతడికున్న పరమ ప్రీతే, అతడికి ఆ చరమస్థితిని ప్రసాదించగా, దానితో ప్రేరితుడై బృందావన గోపికల మాదిరి భక్తుడు తన ఇష్టదైవంతో తాదాత్మ్యం చెందుతాడని చెప్పవచ్చు.
13. దైవీ–మానవ భావాల సంయోగమే అవతారపురుషులు
జ్ఞాని, భక్తుడు తమ చరమలక్ష్యాలను చేరడానికి శాస్త్రాలు పై రెండు మార్గాలను చెబుతున్నాయి. కాని అవతారపురుషులందరి జీవితాలలో దైవ, మానవ భావాలు రెండూ కలిసివుండడం వల్ల, సాధనలు చేస్తున్నకాలంలో సైతం వారు శక్తిమంతులుగా, తేజోవంతులుగా ప్రకాశిస్తుంటారు. ఎందుకంటే దేవ, మానవ భూముల్లో దేనిలోనైనా తమ ఇచ్ఛానుసారం సంచరించే సహజశక్తి వారిలో ఉంటుంది కనుక! లేదా అంతర్గతంగా ఉన్న దైవీభావం వారి స్వాభావిక స్థితిగా ఉండటంవల్ల, అది వర్తమానంలో ఉన్న మానవభావం అనే బయటి కప్పును చీల్చుకుని, బహిర్గతమై సహజంగానే విరాజిల్లుతూ ఉంటుంది. ఏది ఏమైనా అవతార పురుషులందరి జీవితాల్లో వ్యక్తమయ్యే అలాంటి సంఘటనలు (వారి దైవీభావాన్ని వ్యక్తం చేసే సంఘటనలు) మానవబుద్ధికి దుర్భేద్య రహస్యాలుగానే మిగిలిపోతాయి. ఆ రహస్యాలు ఎప్పటికీ మనకు అర్థం అయ్యే అవకాశం లేదని మాకు తోస్తున్నది. అయినా శ్రద్ధాభక్తులతో వారి జీవితాలను అధ్యయనం చేయడం ద్వారా మానవులకెంతో మేలు చేకూరుతుందన్న విషయంలో మాత్రం సందేహం లేదు. ప్రస్తుత సందర్భంలో ఆ అవతారపురుషుల చరిత్రలను మేం క్షుణ్ణంగా పరిశీలించి, వాటిలో ఆ రెండు భావాలు ఏకకాలంలో సరిసమానంగా ఉండగలవన్న విషయాన్ని పాఠకులకు వివరించడానికి ప్రయత్నిస్తాం. దేవమానవుడైన శ్రీరామకృష్ణుల పావనదర్శనం మా జీవితకాలంలో కలుగకపోయినట్లయితే, అవతారపురుషుల చరిత్రను ఆ రీతిలో అర్థంచేసుకోవడం మాకు కూడ సాధ్యమయ్యేది కాదని చెప్పడం అనవసరమేమో!