సాధకునిగా అవతారపురుషుడు
1. అవతారపురుషుల సాధన వృత్తాంతాల అలభ్యత
ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్ర అధ్యయనం వల్ల ఒక విషయం స్పష్టమౌతున్నది. బుద్ధభగవానుణ్ణి, శ్రీ చైతన్య మహాప్రభువును తప్పించి, మిగతా అవతారపురుషుల సాధనల గూర్చి మనకు విపులంగా వివరాలు లభించడం లేదు. ఎంత ఆసక్తితో, ఎంత ఉత్సాహంతో, ఎంత హృదయ వేదనతో వారు సత్య సాక్షాత్కారం కోసం పూనుకున్నారో, ఆ ప్రయత్నంలో ఏ మేరకు పురోగమించారో మనకు తెలియదు. ఆ సత్యశోధన యత్నంలో వారు ఆశ – నిరాశ, భయం – విస్మయం, వ్యాకులత – ఆనందం మొదలైన మనోవృత్తులకు లోనై ఉంటారు; ఒకప్పుడు ఆహ్లాదం చెందడం, మరొకప్పుడు విషాదగ్రస్తులు కావడం జరిగివుంటుంది. అయినాసరే తాము చేరాలనుకున్న గమ్యాన్ని, ఒక్క క్షణం కూడా దృష్టిపథం నుండి వారు తప్పించి ఉండరు. అలా చివరి వరకూ వారు అంత తీవ్రంగా ఎలా సాధన చేయగలిగారో వివరంగా వారి జీవితాల్లో కానరాదు. అలాగే, ఆ సాధక జీవితం తర్వాత వారు చేసిన అపూర్వ కార్యాలకు, బాల్యంలో వారికి లభించిన శిక్షణ, వారి ప్రయత్నాలకు మధ్యన ఉన్న కార్యాకారణ సంబంధం లేదా పూర్వాపర సంబంధంకూడ మనకు ఎంత శోధించినా కనిపించదు.
ఉదాహరణకు: బృందావన గోపికా మనోహరుడైన కృష్ణుడు, తర్వాత ద్వారకాధీశుడై – ధర్మసంస్థాపకుడిగా ఎలా పరిణమించాడో మనకు స్పష్టం కాదు. అట్లే క్రీస్తు ముప్ఫై సంవత్సరాల అద్భుత జీవితంలో మనకు ఏ రెండు మూడు సంఘటనలో మాత్రమే తెలియ వస్తున్నాయి. అలాగే జగద్గురు శంకరాచార్యుల సాధనల కన్నా, వారి దిగ్విజయ వృత్తాంతమే ఎక్కువగా నమోదైంది. ఇతర మహాపురుషుల జీవితాల్లో కూడ అలాగే చాలాకొద్ది వివరాలు మాత్రమే లభ్యమవుతున్నాయి.
2. భక్తుల మూఢత్వం
పై విషయానికి కారణం తెలుసుకోవడం కష్టమైన పని. భక్తుల అతిశయ భక్తి కారణంగా ఆ వివరాలన్నీ బహుశా గ్రంథస్థం కాకుండా ఉండిపోయాయేమో! సామాన్య మానవులకు ఉండే బలహీనతలను, ఆ మహాపురుషులకు ఆపాదించడానికి సంకోచించి, వాటిని అందరి దృష్టికి తీసుకురాకుండా ఉండడమే మంచిదని వారు భావించి ఉంటారు. లేదా ఈ మహాపురుషులు ఏ అలౌకిక సాధనలు అనుష్ఠించి సర్వాంగ సంపూర్ణ భావాలను, ఆదర్శాలను సాక్షాత్కరించుకున్నారో, ఆ సాధనల చరిత్రను పరిశోధించడంకన్నా, వారు సాక్షాత్కరించుకొన్న ఆ ఉదాత్త ఆదర్శాలను మాత్రమే మానవులకు తెలియచేయడం వల్ల ఎక్కువ లోకకల్యాణం జరుగుతుందని అనుకొని ఉంటారు. అందుచేత వారి సాధనల గూర్చి వ్రాయడం అనవసరమని భక్తులు భావించి ఉంటారు.
భక్తులు తమ గురువులను సదా పరిపూర్ణులుగా చూడాలనే అనుకుంటారు. మానవదేహం ధరించినా, మనిషిలో కనిపించే బలహీనతలు, అంతర్దృష్టి లేకపోవడం, అల్పశక్తి మొదలైనవన్నీ ఏ కొంచెమైనా, ఏ కాలంలోనైనా వారిలో ఉంటాయన్న విషయాన్ని భక్తులు ససేమిరా ఒప్పుకోరు. బాలగోపాలుని నోట బ్రహ్మాండాలను చూడడానికే వారు ప్రయత్నిస్తారు. శిశువుల అర్థరహిత పసితనపు చేష్టల్లో కూడ పెంపొందిన మానవబుద్ధి కౌశల్యాన్ని, దూరదృష్టిని చూసే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు వారిలో సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, విశ్వజనీనప్రేమ, ఔదార్యం మొదలైన ఉదాత్త గుణాలను చూడడానికి ఉత్సాహపడతారు. అందుచేతనే, ఆ అవతార పురుషులు తమ భగవత్ స్వరూపాన్ని సామాన్యులకు తెలియకుండా దాచిపెట్టడం కోసం, తమ సాధన, భోజనాదులను, ఇతర మానసిక వృత్తులను, తినడం, నిద్రించడం, అలసిపోవడం, రోగగ్రస్తులు కావడం – చివరికి చనిపోవడం మొదలైన శారీరక క్రియలను కేవలం నటిస్తారన్న నిర్ణయానికి భక్తులు వస్తారనడంలో ఆశ్చర్యం లేదు. శ్రీరామకృష్ణుల శారీరక రుగ్మతను చూసి, వారి ప్రధాన భక్తులెంతోమంది ‘అదంతా ఒక నటన – నిజం కాదు’ అని భావించడం మేము స్వయంగా చూశాం.
3. భక్తుల అభిప్రాయాలు, ప్రాథమిక స్థాయి, కాలక్రమంలో వచ్చేమార్పు
భక్తులు అలాంటి నిర్ణయానికి రావడానికి కారణం వారి బలహీనతే. సామాన్యుల సాధన, ప్రయత్నం, ఉద్దేశాలను వారు అవతారపురుషులకు ఆపాదింప ఇష్టపడరు. అలాంట తలంపులు తమ భక్తికి చెరుపు చేస్తాయని వారి అభిప్రాయం. అందుచేత వారికి వ్యతిరేకంగా మేము ఏమీ చెప్పవలసింది లేదు. కాని భక్తి ఇంకా పరిపక్వం కాని దశలోనే ఇలాంటి దుర్బలత ఉంటుందన్నది మాత్రం నిజం. భక్తి ప్రాథమికస్థాయిలో ఉన్నప్పుడు, భక్తుడు భగవంతుణ్ణి ఐశ్వర్యరహితునిగా భావించలేడు. కాని కాలక్రమంలో భక్తి ఓ మేరకు పక్వమైనప్పుడు, భగవంతుని మీద ప్రేమ ప్రగాఢమైనప్పుడు, భగవదైశ్వర్యాన్ని గూర్చిన తలంపే భక్తిమార్గంలో ఒక విఘ్నమని భక్తుడికి తోస్తుంది. అలాంటి స్థితిలో అతడు ఆ తలంపులను ప్రయత్నపూర్వకంగా తొలగించుకుంటాడు. భక్తిశాస్త్రాలన్నీ ఈ విషయాన్ని ముక్తకంఠంతో ఘోషిస్తాయి. శ్రీకృష్ణుని తల్లి యశోదాదేవి అడుగడుగునా బాలకృష్ణుని దివ్య లీలలను చూస్తూ కూడ, అతణ్ణి తన కొడుకుగా భావించి పెంచి పెద్ద చేయడం మనంచూస్తాం. శ్రీకృష్ణుడు జగత్కారణ భగవంతుడని గోపికలు ఎరిగి కూడ, అతణ్ణి తమ ప్రియతమునిగానే భావించారు తప్ప, మరోవిధంగా భావించలేకపోయారు. ఇతరత్రా కూడ ఇలాగే కనిపిస్తుంది.
4. శ్రీరామకృష్ణుల ఉపదేశం: ఈశ్వరుని మాహాత్మ్య జ్ఞానం ఉన్నంత వరకూ, ‘నువ్వూ–నేను’ అన్న ఆత్మీయ ప్రేమసంబంధం ఏర్పడదు; ఎవరి ఆధ్యాత్మిక భావాన్నీ భగ్నం చేయకు!
భగవంతుని విశిష్టశక్తులను వ్యక్తం చేసే ‘దర్శనాల’ ను తమకు కలిగించమని పట్టుబట్టే భక్తులతో గురుదేవులు ఎన్నోమార్లు ఇలా చెప్పేవారు: “నాయనలారా! అలాంటి దర్శనాలను కోరడం ఏమంత మంచిది కాదు. ఆయన శక్తి దర్శనం భయాన్ని కలిగిస్తుంది. దానితో భగవంతునితో ప్రేమ సంబంధం ‘నువ్వూ, నేను’ అనే ఆత్మీయభావం మరుగునపడుతుంది.” ఆ మాటలు విని, “గురుదేవులకు మాకలాంటి దర్శనాలు చేయించడం ఇష్టం లేదు. అందుకే ఇలా మాయ మాటలు చెబుతున్నారు” అని ఎంతో వ్యథ చెందేవారం. కాని ఎవరైనా భక్తులు మరింత మొండిపట్టుపట్టి, “మీ దయ ఉంటే అసంభవం కూడ సంభవమౌతుంది. దయచేసి మా కలాంటి దర్శనాలు కలిగించండి” అని బలవంతం చేస్తే, గురుదేవులు ఎంతో వినయభావంతో, “నే నేమైనా చేయగలనా? అమ్మ సంకల్పం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది” అని చెప్పేవారు. వారలా చెప్పిన తర్వాత కూడ, మళ్ళీ “మీ సంకల్పమే అమ్మ సంకల్పం” అని భక్తులు ఒత్తిడి చేసేవారు.వారికి అప్పుడు నచ్చచెబుతూ, “మీకు అన్నిరకాల దర్శనాలూ కలగాలని నేనూ కోరుకుంటాను. కాని అదెలా జరుగుతుందీ?” అని చెప్పేవారు. ఆ మాటలు విని కూడ సంతృప్తిపడక భక్తులు ఇంకా బలవంతం చేస్తే, మౌనం వహించి, చిరునవ్వుతో ప్రేమగా వారివైపు గురుదేవులు చూస్తూ ఉండిపోయేవారు. లేదా ఒక్కోసారి “నేను ఇంకేం చెప్పగలను? అమ్మ సంకల్పమే నెరవేరుగాక!” అనేవారు. ఇలా ఎంత ఒత్తిడి చేసినా, ఆ భక్తుని భ్రాంతియుత దృఢనమ్మకాన్ని వమ్ము చేసేవారు కాదు. అతడి ఆధ్యాత్మిక భావానికి హాని కలిగించేవారు కారు. గురుదేవులు అనేకసార్లు అలా ప్రవర్తించడం మేం కళ్ళారా చూశాం. “ఎవరి ఆధ్యాత్మిక భావాన్ని కూడ భగ్నం చేయవద్దు” అని అనడం విన్నాం.
5. ఆధ్యాత్మిక భావాన్ని భగ్నపరచడాన్ని గూర్చి ఒక ఉదాహరణ: కాశీపూర్‌లో శివరాత్రి నాడు జరిగిన ఒక సంఘటన
ఈ ఉపోద్ఘాత విషయానికి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా, పై అంశాన్ని చెప్పాం కాబట్టి, దాన్ని వివరించడానికి ఒక ఉదాహరణను ఇవ్వదలిచాం. కేవలం సంకల్పంతో లేదా స్పర్శతో ఇతరులకు ఆధ్యాత్మికానుభూతిని కలిగించే శక్తి, కొందరు మహాత్ములకు మాత్రమే సాధ్యం. కాలక్రమంలో వివేకానందులకు అలాంటి శక్తి లభిస్తుందని, దాంతో ప్రపంచానికి అతడు ఎంతో మేలు చేస్తాడని గురుదేవులు మాకు తరచూ చెబుతుండేవారు. వివేకానందుల వంటి ఉత్తమాధికారి ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటాడని, అతడు పరిచయమైనప్పటి నుండే గురుదేవులు గ్రహించారు. అందుకే ఆ క్షణం నుండి ఆయన అతడి ప్రతి చేష్టను ఆ ఉత్తమాధికారికి తగినట్లుగా మలచసాగారు. అతణ్ణి, అద్వైతజ్ఞానంలో ఉన్నతిని సాధించడానికి ప్రోత్సహించేవారు. వివేకానందుడు బ్రహ్మసమాజ ఉపదేశానుసారం ద్వైతభావంతో బ్రహ్మోపాసన చేస్తుండే వాడు. అలాంటి అతడికి ‘సోహం’ (నేను బ్రహ్మను) అన్న అద్వైత భావం పాపంగా, దైవాపచారంగా అనిపించేది. అయితే అతడు ఆ అద్వైతభావ సాధనను చేయడానికి గురుదేవులు అన్ని విధాలా ప్రయత్నించేవారు. ఆ విషయమై తదనంతర కాలంలో వివేకానందులే స్వయంగా ఇలా చెప్పేవారు.
“నేను దక్షిణేశ్వరానికి వెళ్ళగానే, ఇతరుల కెవ్వరికీ చదవడానికి ఇవ్వని – నిషేధిత పుస్తకాలను గురుదేవులు నాకిచ్చి చదవమని చెప్పేవారు. వారి గదిలో ఆ పుస్తకాలతోపాటు, ‘అష్టావక్ర సంహిత’ కూడ ఉంది. అయితే ఎవరైనా దాన్ని చదవడానికి తీసుకుంటే, వద్దని చెప్పి, అందుకు బదులుగా గీతనో, పురాణాన్నో, ‘ముక్తిమార్గం’ అనే పుస్తకాన్నో ఇచ్చి చదువుకోమని చెప్పేవారు. కాని నేను వెళ్ళీ వెళ్ళగానే ఆ సంహితను నా చేతికిచ్చి నన్ను చదవమని చెప్పేవారు. లేదా అద్వైతపరమైన అధ్యాత్మ రామాయణాన్ని ఇచ్చి, దానిలో ఏదో ఒక భాగాన్ని చదవమనేవారు. నేను అభ్యంతరం చెబుతూ, ‘ఇలాంటి పుస్తకాలను చదవడం ఎందుకూ? నేను భగవంతుణ్ణి – అన్న ఆలోచన మహాపాపం. అలాంటి పాపపు విషయాలున్న పుస్తకాలను తగలెయ్యాలి’ అనేవాణ్ణి. అది విని గురుదేవులు నవ్వుతూ, ‘నీకోసం చదవమని అంటున్నానా? నాకు కాస్త చదివి వినిపించు. అలా చేస్తే, నేను భగవంతుణ్ణి అని భావించే అవసరం నీకుండదు’ అని చెప్పేవారు. దానితో కొద్దిగా చదివి వినిపించేవాడిని.”
వివేకానందస్వామిని ఇలా అద్వైతజ్ఞానిగా తయారుచేస్తున్నా, బ్రహ్మానందాది ఇతర శిష్యులు కొందరికి సాకారోపాసనాన్ని, మరికొందరికి నిరాకార సగుణోపాసనాన్ని, కొందరికి శుద్ధభక్తి మార్గాన్ని, కొందరికి జ్ఞానయుక్త భక్తిమార్గాన్ని – ఇలా రకరకాల మార్గాలను బోధిస్తూ వారందర్నీ ఆధ్యాత్మికపరంగా పురోగమింప చేస్తుండేవారు. స్వామి వివేకానంద – ఇతర శిష్యులూ దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల వద్దే ఉండేవారు. అక్కడే ఆహార శయనాదులు చేసేవారు. ఆధ్యాత్మిక విషయాలను చర్చించుకునేవారు. అలా అంతా కలిసే ఉన్నా, గురుదేవులు మాత్రం ఎవరిని ఎలా తయారుచేయాలో వారిని అలా తయారుచేస్తుండేవారు.
1886 వ సంవత్సరం మార్చి నెలలో ఒక సంఘటన జరిగింది. కాశీపూర్ ఉద్యాన గృహంలో గురుదేవులుంటున్న రోజులవి. కంఠవ్రణంతో రోగగ్రస్థులై ఉన్నారు. ఎంతో బలహీనులైపోయారు. అయినా పూర్వం కంటే అధికోత్సాహంతో తన శిష్యులను, ముఖ్యంగా వివేకానందస్వామిని మలచసాగారు. స్వామీజీకి సాధనమార్గాన్ని ఉపదేశించి, దాన్ని ఆచరణలో పెట్టడానికి అన్నివిధాలా దోహదం చేసేవారు. ప్రతిరోజు సాయంకాలం అందర్నీ బయటికి పంపించి, స్వామీజీని మాత్రమే తన దగ్గరికి పిలిపించుకునేవారు. ‘తన ఇతర శిష్యులను తన తదనంతరం మళ్ళీ సంసారంలో ప్రవేశించకుండా ఉంచడం ఎలా? – వారికి తగిన శిక్షణను ఎలా ఇవ్వడం? వారికి మార్గదర్శకత్వం ఎలా వహించడం’ మొదలైన విషయాల గురించి ఏకధాటిగా రెండు మూడు గంటలవరకూ అతడికి బోధించేవారు. అప్పుడప్పుడు అతణ్ణి ‘యోచన’ కు గురిచేసేవారు.
గురుదేవుల మాటలను, చేష్టలను చూసి చాలామంది భక్తులు, ‘మా (భక్త) సంఘాన్ని సుప్రతిష్ఠం చేయడం కోసమే వారిలా కంఠరోగాన్ని నటిస్తున్నారు. వారి ఆ ఆశయం నెరవేరగానే వారు మళ్ళీ స్వస్థులౌతారు’ అని అనుకునేవారు. కాని స్వామి వివేకానందకు* (స్వామీజీ) మాత్రం అంతరాంతరాళాల్లో, ‘గురుదేవులు భక్తుల నుండి శాశ్వతంగా సెలవు పుచ్చుకొనే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే అన్నింటిని చక్కబరుస్తున్నారు’ అన్నది అనుభూతమయ్యేది కాని ఈ విషయాన్ని అన్ని సమయాల్లోనూ అతడు నమ్మివుంటాడనడం కూడా కాస్త సందేహమే!
సాధన ఫలంగా, ఇతరులను స్పర్శించి, వారిలో ఆధ్యాత్మికశక్తిని ప్రసరింపచేసే శక్తి, వివేకానందునిలో అప్పుడప్పుడే జాగృతమౌతూన్నది. ఆ విషయం అతడికి తెలిసేది. కాని ఇతరులను స్పర్శించి, దాని నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం అంతవరకు చేయలేదు. వేదాంత అద్వైత సిద్ధాంత యథార్థాన్ని అతడు ఎన్నో విధాలుగా ధ్రువీకరించుకున్నాడు. తర్క – యుక్తులతో ఆ సిద్ధాంతాన్ని సాధించి దృఢచిత్తుడయ్యాడు. ఆ అద్వైత తత్త్వాన్ని పిన్నలు, పెద్దలు, యువకులు, గృహస్థులు – అందరికీ అనుభూతం చేయాలని ప్రయత్నించ సాగాడు. ఇతడి ప్రయత్నం భక్తులందరిలో తీవ్రమైన భేదాభిప్రాయాలకు దారితీసింది. వారిలో పెద్ద అలజడి పుట్టించింది. స్వామీజీ స్వభావం చాలా విచిత్రమైంది. తనకు ఏది సత్యమని అనిపిస్తుందో, దాన్ని నిర్భయంగా, బాహాటంగా భేరీమ్రోగించి మరీ ప్రకటిస్తాడు. అంతే కాదు, తర్కయుక్తులను ప్రయోగించి ఇతరులు కూడ దాన్ని ఒప్పుకునేలా చేస్తాడు. ఇది అతడి నైజం. కాని ఈ లోకంలో స్థితిగతులు, అధికారభేదంతో సత్యం అనేకరకాలుగా వ్యక్తమయ్యే అవకాశం ఉందన్న సంగతి, ఇంకా పిన్నవాడైన వివేకానందకు తెలియరాలేదు.
ఆ రోజు శివరాత్రి, మాఘమాసం. స్వామీజీతోపాటు మరి నలుగురు బాలభక్తులు ఉపవాసం ఉన్నారు. శివార్చన చేస్తూ, రాత్రంతా జాగరణ చేయాలని వారి సంకల్పం. పూజాదులవల్ల కలిగే శబ్దాలవల్ల గురుదేవుల విశ్రాంతికి భంగం కలుగుతుందన్న ఉద్దేశంతో, వసతి గృహానికి కాస్త దూరంలో ఉన్న వంట ఇంట్లోని ఒక గదిలో పూజ ఏర్పాట్లను చేసుకున్నారు. సాయంకాలం తర్వాత మంచివర్షం కూడ పడింది. కొత్త మబ్బులతో నిండిన ఆకాశంలో అప్పుడప్పుడు మెరుపులు మెరుస్తూంటే, అవి శివుని జటాజూటంలోని గంగాధారలను జ్ఞప్తికి తెస్తున్నాయి.
రాత్రి పదిగంటల తర్వాత మొదటి ప్రహారపూజ, జపధ్యానాలను ముగించి, పూజాపీఠంపై కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ స్వామీజీ మాట్లాడసాగాడు. అక్కడున్న వారిలో ఒకరు స్వామీజీకి హుక్కా తయారుచేసి తీసుకురావడానికి బయటికి వెళ్ళాడు. మరొకరు ఏదో పని మీద వసతిగృహానికి వెళ్ళాడు. ఆ సమయంలో తనలో తీవ్రంగా ‘ఆ శక్తి’ జాగృతమౌతున్నట్లు స్వామీజీ అనుభూతి చెందాడు. ఆ శక్తిని ఆ రోజు పరీక్షించాలన్న తలంపు అతడికప్పుడు కలిగింది. ప్రక్కనే స్వామి అభేదానంద కూర్చుని ఉన్నాడు. అతణ్ణి పిలిచి, “నన్ను కొంతసేపు తాకు” అని చెప్పాడు. అభేదానంద అలాగే చేశాడు. అంతలో బయటికి వెళ్ళిన భక్తుడు ఆలోగా హుక్కా తయారుచేసుకుని లోపలికి వచ్చాడు. అప్పుడు వివేకానంద గాఢధ్యానంలో మునిగివుండడం, అభేదానంద తన కుడిచేతితో వివేకానంద కుడికాలును తాకి, కళ్ళు మూసుకుని కూర్చుని ఉండడం చూశాడు. అప్పుడు అభేదానంద చెయ్యి తీవ్రంగా వణకడం గమనించాడు. రెండు మూడు నిమిషాల తర్వాత స్వామీజీ ధ్యానం నుండి మేల్కొన్నాడు. “ఇక చాలు. ఇప్పుడు చెప్పు. నీ కెలా అనిపించింది?” అని అభేదానందను అడిగాడు.
“విద్యుత్ బ్యాటరీని తాకితే, ఆ ఆఘాతానికి ఏదో లోపలికి వెళుతున్నట్లుగా ఒళ్ళంతా జలదరించిపోతున్నట్లు ఉంటుంది కదా! నిన్ను తాకినప్పుడుకూడ నా కలాగే అనిపించింది” అని అభేదానంద చెప్పాడు.
అక్కడున్న మరొకరు, “స్వామీజీ తాకినప్పుడు నీ చెయ్యి దానంతట అదే వణికిందా?” అని అభేదానందను అడిగాడు.
“ఔను, కదలకుండా ఉంచడానికి ప్రయత్నించాను కాని సాధ్యం కాలేదు” అని చెప్పాడు అభేదానంద.
ఆ విషయమై ఇక ఏ మాటలూ జరగలేదు. స్వామీజీ హుక్కా పీలుస్తూ ఉండి పోయాడు. ఆ తర్వాత అంతా రెండవ ప్రహరపూజ, ధ్యానంలో నిమగ్నులయ్యారు. అభేదానంద అప్పుడు ఎంతో గంభీర ధ్యానంలో నిమగ్నుడైనాడు. అంతకు ముందెప్పుడూ అతడికి అంత ప్రగాఢ ధ్యానం కలగడం మే మెప్పుడూ చూడలేదు. అతడి మెడ, తల కాస్త వంగి ఉన్నా, శరీరమంతా కర్రలా బిగుసుకుపోయింది. కాసేపటికి అతడు బాహ్యస్మృతిని పూర్తిగా కోల్పోయాడు. అంతకు పూర్వం అతడు స్వామీజీని తాకడం వల్లనే, అతడికిప్పుడు ఇలాంటప్రగాఢ ధ్యానస్థితి కలిగిందని అంతా అర్థం చేసుకున్నారు. స్వామీజీ కూడ, అతడి ఆ స్థితిని గమనించి, ప్రక్కన ఉన్న సహచరుడికి సంజ్ఞ చేసి చూపించాడు.
రాత్రి నాల్గవ ప్రహరపూజ ముగిసిన తర్వాత, రామకృష్ణానందస్వామి ఆ పూజగదిలోకి వచ్చాడు. “గురుదేవులు రమ్మంటున్నారు” అని స్వామీజీతో చెప్పాడు. వెంటనే స్వామీజీ వసతిగృహం రెండవ అంతస్తులో ఉన్న శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళాడు. రామకృష్ణానందస్వామి కూడ అతణ్ణి అనుసరించాడు.
స్వామి వివేకానందను చూడగానే, శ్రీరామకృష్ణులు, “ఏమోయ్! కాస్త కూడబెట్టావో లేదో అప్పుడే అంతా ఖర్చుచేస్తావా? మొదట ఆ శక్తిని నీలో చక్కగా పెంపొందనివ్వు. ఆ తర్వాత దాన్ని ఎక్కడ ఎలా ఖర్చుపెట్టాలో నీకే తెలుస్తుంది. అమ్మే నీకు తెలుపుతుంది. ఆ పిల్లవాడిలో (అభేదానందస్వామి) నీ మనోభావాన్ని ప్రవేశపెట్టి, అతడికి ఎంత హాని చేశావో నీకేమైనా తెలుసా? ఆ అబ్బాయి ఇంతకాలం ఒక సాధనా పద్ధతిలో వికాసం చెందుతున్నాడు. ఆరు నెలల కడుపు గర్భస్రావం అయినట్లు ఇప్పుడు పాపం అదంతా నష్టమైపోయింది. సరే అయిందేమో అయింది. ఇక నుండి అనాలోచితంగా ఇలాంటి పనులు చేయవద్దు. అయినా, ఆ కుర్రాడి అదృష్టం బాగుంది. అతడికి ఏమంత ఎక్కువ హాని జరగలేదులే” అని మందలించారు.
స్వామీజీ మాతో, “అదంతా విని నేనప్పుడు తెల్లబోయాను. పూజాసమయంలో క్రింద ఆ గదిలో మేం ఏమేం చేసామో అదంతా ఆయనకు తెలుస్తూనే ఉందన్నమాట! ఇంకేమి చేసేది? నేను ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను” అని చెప్పాడు.
పై సంఘటన ఫలితంగా అంతవరకు అభేదానందలో నెలకొనివున్న ఆధ్యాత్మిక భావం నశించింది. అంతేకాదు అవగతం చేసుకొని జీర్ణించుకోవడానికి ఎంతో కష్టమైన అద్వైతభావం అతడిలో ప్రవేశించింది. పైగా అతడు దాన్ని అపార్థం చేసుకొన్నాడు. అద్వైతం పేరున అతడు నాస్తికుడిగా ప్రవర్తించసాగాడు. కొన్ని సమయాల్లో శాస్త్రాదేశాలకు భిన్నంగా వ్యవహరించేవాడు.
పై సంఘటన తర్వాత గురుదేవులు, అభేదానందకి అద్వైతాన్ని బోధించసాగారు. దైనందిన జీవితంలో అద్వైతం పేరుతో అతడు చేస్తున్న పొరపాట్లను ప్రేమతో చూపి, సరిదిద్దసాగారు. కాని గురుదేవుల దేహత్యాగం తర్వాత ఎంతో కాలం గడిచాకే తన దైనందిన జీవితాన్ని అద్వైతభావానికి అనుగుణంగా సమన్వయించుకోవడంలో అతడు కృత కృత్యుడయ్యాడు.
6. అవతారంలో భగవంతుడు మానవ మాత్రునిగా ప్రవర్తిస్తాడు
సత్యదర్శనం చేసి తమ జీవితాల్లో దాన్ని పూర్తిగా అభివ్యక్తం చేయడం కోసం అవతారపురుషులు అనుష్ఠించే సాధనలు, ప్రయత్నాలు అన్నీ కేవలం నటనలే అని ఒక వర్గం భక్తుల అభిప్రాయం. అలాంటి వారికి మా సమాధానం ఇది: శ్రీరామకృష్ణులు ఎన్నడూ అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మేం వినలేదు. పైగా “దేవుడు మనిషిగా అవతరించినప్పుడు, అతడి పనులన్నీ సామాన్య మానవుడివిగానే ఉంటాయి. మానవ దేహాన్ని దాల్చిన భగవంతుడు మనిషిలాగే సుఖదుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. అతడు కూడ మనిషిలా పురుష ప్రయత్నం, ప్రయాస, తపస్సు ద్వారా ప్రతివిషయంలో పూర్ణత్వాన్ని పొందవలసి ఉంటుంది” అని తరచూ చెబుతుండగా మేం విన్నాం. ప్రపంచ మత చరిత్రలన్నీ కూడ ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. అలా చేయకపోతే భగవంతుడు మనిషిగా అవతరించిన ఉద్దేశం, ప్రయోజనం నిష్ప్రయోజనాలవుతాయి.
7. స్వప్రయత్నం భగవత్కృప విషయంలో శ్రీరామకృష్ణుల అభిప్రాయం
స్వప్రయత్నం, భగవత్కృప గురించి శ్రీరామకృష్ణుల ఉపదేశాలను రెండు కోవలుగా వర్గీకరించవచ్చు. ఒక వంక ఆయన భక్తులతో ఇలా అంటూ ఉండడం మనం చూడవచ్చు: “(నేను) అన్నం వండాను. ఇక మీరంతా కూర్చుని భోజనం చేయండి.” “మూస తయారైంది. మీరిక మీ మనసులను దానిలో పోతపోసుకోండి.” “మీరేమీ చేయలేకపోతే మీ ముక్త్యారునామాను నాకు అప్పగించండి.”
మరోవైపు ఇలా ఉపదేశించేవారు: “కోరికలన్నింటినీ ఒక్కొక్కటిగా వదలి పెట్టండి. అప్పుడే సిద్ధిని పొందుతారు.” – “గాలిలో ఎగిరే ఎండుటాకులా ఉండండి.” – “కామకాంచనాలను పరిత్యజించి, భగవంతుణ్ణి ప్రార్థించండి.” – “నేను (రూపాయలో) పదహారణాలు (సాధన) చేశాను. మీరు ఒక్క అణా (సాధన) అయినా చేయండి.”
భగవత్కృప–స్వప్రయత్నం; శరణాగతీ–సాధన వంటి రెండు రకాల భావాలతో కూడుకొన్న గురుదేవుల ఉపదేశ ప్రాధాన్యాన్ని సరిగ్గా సమతౌల్యం చేసుకోలేకపోవడమే మనం జీవితంలో పురోగమించలేకపోవడానికి ప్రధాన కారణంగా తోస్తుంది.
“మనిషికి స్వతంత్రేచ్ఛ ఏదైనా ఉందా?” అనే విషయమై మా మిత్రుడైన స్వామి నిరంజనానందతో మేమొకరోజు దక్షిణేశ్వరంలో చాలాసేపు చర్చించాం. చివరికి దాని నిజానిజాలను తెలుసుకోవడానికి శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళాం. విషయం చెప్పాం. బాలకులమైన మా వాదోపవాదాలను కాసేపు ఆయన వినోదంగా విన్నారు. తర్వాత గంభీరంగా, “స్వతంత్రేచ్ఛ లాంటిది ఎవరికైనా ఉంటుందంటారా? అనాదిగా అంతా ఈశ్వరేచ్ఛ వల్లే జరుగుతూ వస్తున్నది. ఇకముందు జరగబోతోంది కూడ. చివరికి తప్పకుండా మనిషి ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటాడు. అయినా మనిషికి స్వతంత్రేచ్ఛ కొంతమేరకు ఉంటుంది. అది గుంజకు పొడవైన తాడుతో కట్టివేసిన పశువుకున్న స్వేచ్ఛ వంటిదే. గుంజనుండి పశువు మూడు మూరల దూరం వరకూ తిరగవచ్చు. లేదా తాడు ఎంత పొడవుంటుందో, అంతదూరం ఇచ్ఛమేరకు తిరగవచ్చు. మనిషి స్వేచ్ఛ కూడ ఇంతే. తాడు పొడవు మేరలో పశువు తన ఇష్టం వచ్చినట్లు ఏమైనా చేసుకోవచ్చు. పడుకోవచ్చు, తిరగవచ్చు. నిలబడవచ్చు, అలాంటస్వేచ్ఛ దానికి ఇవ్వాలనే మనిషి దాన్నలా కట్టివేశాడు. అలాగే భగవంతుడు కూడ మనిషికి కొంతమేరకు శక్తిని ఇస్తాడు. దాన్నతడు ఎలాగైనా, ఏ మోతాదులోనైనా ఉపయోగించుకునే స్వేచ్ఛనిస్తాడు. అంతమాత్రం చేత తాను ‘స్వతంత్రుడను’ అన్న భ్రమకు మనిషి లోనౌతాడు. కాని తాడు గుంజకు కట్టివేయబడివుంటుంది సుమా! ఒక విషయముంది – మనిషి ఆర్తుడై భగవంతుణ్ణి ప్రార్థిస్తే, భగవంతుడు మరోచోట ఆ బంధం వేయగలడు. లేదా తాడును మరింత పొడిగిస్తాడు. లేదా ఆయనకు ఇష్టమైతే మెడకు తగిలించిన ఆ బంధాన్ని పూర్తిగా తొలగించివేస్తాడు కూడ!” అని అన్నారు.
ఆయన మాటలు విన్న తర్వాత, “అయితే సాధన, భజనలను చేయడం మనిషి వశంలో లేదంటారా? అలాంటప్పుడు ‘నేను చేస్తున్నదంతా భగవదేచ్ఛతోనే చేస్తున్నాను’ అని అందరూ అనడానికి వీలుంటుంది కదా?” అని అడిగాం.
అందుకు ఆయన ఇలా అన్నారు: “అవన్నీ కేవలం నోటిమాటలే! ముల్లూలేదూ, గుచ్చుకోనూ లేదు – అని అనడంవల్ల ఏమిటి లాభం? ముల్లు గుచ్చుకోగానే ‘అబ్బా’ అని కేకపెడతావు. సాధన చేయడం మనిషి చేతిలో ఉంటే, అందరూ సాధన చేస్తారు కదా! మరి అలా చేయడం లేదేమిటి? కాని ఒక్కటి మాత్రం నిజం. భగవంతుడు నీ కిచ్చిన శక్తిని నువ్వు సక్రమంగా వినియోగించుకోలేకపోతే, ఆయన నీ కిక అదనపు శక్తి నివ్వడు. కాబట్టి పురుషకారం లేదా పురుషప్రయత్నం అవసరం. భగవంతుడి కృప పొందాలంటే, కొద్దో గొప్పో అందరూ ప్రయత్నం చేయాల్సిందే. అలా ప్రయత్నం చేస్తే, దైవకృప వల్ల పది జన్మల్లో పొందే అనుభవాల నన్నింటినీ, ఒక్కజన్మలోనే పొందవచ్చు. అయితే ఎంతో కొంత ప్రయత్నం మాత్రం అందరూ తప్పక చేయాల్సిందే. ఒక కథను వినండి.
8. ఈ అంశంపై విష్ణు – నారద సంవాదోపాఖ్యానం
“ఒకప్పుడు గోలోకంలో విష్ణువుకు నారదునిపై ఏ కారణంగానో కోపం వచ్చింది. వెంటనే ‘నరకవాసం’ చేయమని నారదుణ్ణి శపించాడు. ఆ శాపం విని నారదుడు ఎంతో ఆందోళన చెందాడు. భగవంతుణ్ణి ఎన్నో విధాలుగా స్తుతించి, ప్రసన్నం చేసుకున్నాడు. “ప్రభూ! నరకం ఎక్కడ – ఎలా – ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది. దయచేసి తెలియపరచండి” అని ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు ఒక సుద్దముక్క తీసుకుని, నేలమీద భూమి – నరకం – స్వర్గం చిత్రంగీసి, ఏవేవి ఎక్కడుంటాయో వివరించాడు. ‘ఇదయ్యా నరకం. ఇక్కడ స్వర్గం ఉంటుందయ్యా’ అని చెప్పాడు. ‘అలాగా, అయితే ఇంకేం, నేను నరకవాసం చేసేస్తాను’ అంటూ నారదుడు ‘నరకం’ బొమ్మమీద పడిదొర్లాడు. దొర్లి, పైకిలేచి ప్రణామం చేశాడు.
అది చూసి విష్ణువు నవ్వి, ‘ఇదేమిటీ, ఇది నరకవాసం ఎలా అవుతుందీ?’ అన్నాడు.
‘ఎందుక్కాదు? స్వర్గ – నరకాలు నీ సృష్టే కదా! నువ్వు గీసి చూపించి, ‘ఇది నరకం’ అన్నప్పుడు అది నిజంగానే నరకం అవుతుంది. అంతేకాదు, నేను దానిపై దొర్లినప్పుడు నిజంగానే నేను నరకయాతనను అనుభవించాను’ అని నారదుడు ప్రగాఢ విశ్వాసంతో చెప్పాడు.
అతడి విశ్వాసం చూసి విష్ణువు కూడ, ‘తథాస్తు’ అన్నాడు. కాని భగవంతునిపైన ప్రగాఢ విశ్వాసంతో, కనీసం ఆ బొమ్మనరకం పైన అయినా దొర్లవలసి వచ్చింది నారదుడికి! ఆ మాత్రం ప్రయత్నం చేయడం వల్లే అతడి కర్మ తీరిపోయింది.” కాబట్టి భగవంతుడి కృపారాజ్యంలో సైతం పురుషప్రయత్నానికి, పురుషకారణానికి స్థానముందన్న విషయాన్ని గురుదేవులు ఇలాంటి కథల ద్వారా అప్పుడప్పుడు తెలియపరుస్తూ ఉండేవారు.
9. అవతారపురుషులు ముక్తి మార్గాలను ఆవిష్కరిస్తారు
మానవదేహాలను ధరించి, మానవులుగానే ప్రవర్తించే అవతారపురుషులు కూడ, మనలాగే అనేక విషయాల్లో అల్పదృష్టి, పరిమిత జ్ఞానం కలిగివుంటారు. మనలాగే వారు కూడ సాధనలు, ప్రయత్నాలు చేస్తూ, అజ్ఞానాంధకారం నుండి బయటపడే మార్గాన్ని కనుగొనవలసి ఉంటుంది. వారు ఆ మార్గాన్ని కనుగొనేదాకా, అంతర్గతంగా ఉండే వారి దివ్యనైజం అప్పుడప్పుడు, చూచాయగా, కొన్ని క్షణాల పర్యంతం భాసించినా – అది వెంటనే మళ్ళీ మరుగునపడిపోతూ ఉంటుంది. ఇలా ‘బహుజనహితం కోసం’ మాయ అనే ఆవరణాన్ని స్వీకరించిన అవతార పురుషులుకూడ, మనలాగే ఈ వెలుగు చీకట్ల రాజ్యంలో మార్గం కోసం తడుముకోవలసి ఉంటుంది. కాని స్వార్థగంధం ఏమాత్రం వారిలో ఉండకపోవడంచేత, జీవనమార్గంలో వారు మనకంటే అధిక ప్రకాశాన్ని గాంచుతారు. అంతేకాదు, తమలో అంతర్గతంగా ఉన్న శక్తులనన్నింటినీ అలవోకగా ఏకాగ్రం చేసుకొని, అతి స్వల్పకాలంలోనే జీవిత సమస్యలను పరిష్కరించి లోక కల్యాణంలో నిమగ్నులై కాలం గడుపుతుంటారు.
10. అవతారపురుషులను మానవులుగా భావించకుంటే ఆ భావన ప్రాధాన్యాన్ని కోల్పోతుంది
దివ్యమానవుడైన గురుదేవులు, నిజంగానే మానవుల అసంపూర్ణత్వాన్ని (స్వయంగా) స్వీకరించారు. కాబట్టి ఆయన మానవ భావాలను చక్కగా అధ్యయనం చేయడం వల్ల మనకు ఎంతో మేలు ఒనకూరుతుంది. అందుకే ఆయన మానవ భావాలను ముందుంచుకొనే, ఆయన దైవీభావాన్ని అధ్యయనం చేయమని పాఠకులను మేము కోరుతున్నాం. మనలో ఒక మనిషిగా ఆయనను మనం స్వీకరించకపోతే సాధన కాలంలో ఆయన అనుష్ఠించిన అలౌకిక సాధనల ప్రయత్నాల ఆంతర్యం మనం అవగతం చేసుకోలేం. అయితే నిత్యపూర్ణుడు, సత్యదర్శనం కోసం మళ్ళీ ప్రయత్నం చేయడమేమిటీ? అన్న ప్రశ్న ఎదురౌతుంది. మరలా ‘జీవితాంతం వారు చేసిన ఈ ప్రయత్నం కేవలం నాటకీయం’ అనిపిస్తుంది. అంతే కాదు భగవత్సాక్షాత్కారం కోసం, తమ జీవితంలో ఉన్నతాదర్శాలను సుప్రతిష్ఠించుకోవడం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు, పాటించిన నియమనిష్ఠలు, మహా త్యాగాలు – ఇవన్నీ మనలాంటి వారిని ఉత్తేజపరచవు. పైగా అందుకు విరుద్ధంగా మనలను తీవ్రనిరాశకు లోనుచేస్తాయి. మన జీవితం నుండి అజ్ఞానం తొలగిపోవడం అసంభవం అనిపించేలా చేస్తాయి.
11. బద్ధజీవి అవతార పురుషుణ్ణి మానవ మాత్రుడిగానే పరిగణిస్తాడు
మనం గురుదేవుల కృపాభాగ్యాన్ని ఆశిస్తున్నా, మనం వారిని కూడ మనలాంటి మనోభావాలతో కూడిన మానవుడిగా అంగీకరించవలసిందే. ఎందుకంటే, ఆయన కూడ మనతో సరిసమానంగా దుఃఖాలను, యాతనలను అనుభవించి, ఆ తర్వాత మన దుఃఖాలను కడతేర్ప ముందుకు వచ్చారు. కాబట్టి ఏ కోణంలో చూసినా, ఆయనను మానవ మాత్రుడిగానే మనం భావించడం తప్ప మరో మార్గంలేదు. నిజానికి మనం ఎంతవరకైతే సకల బంధాల నుండి విముక్తులం కామో, నిర్గుణ పారమార్థిక సత్యంలో ప్రతిష్ఠితులమై ఉండమో, అంతవరకూ ఈశ్వరుణ్ణి, ఈశ్వరిరావతార పురుషులను మానవులుగానే భావిస్తూ, స్వీకరించాల్సిందే. “దేవోభూత్వా దేవం యజేత్” – దేవుడవై దేవుణ్ణి పూజించు – అన్నమాట ముమ్మాటికీ సత్యం. నువ్వు సమాధిని అభ్యాసం చేసి, నిర్విరికల్పసమాధి భూమిని అధిరోహించినప్పుడే, భగవంతుని యథార్థ స్వరూపాన్ని ప్రత్యక్షం చేసుకుంటావు. అర్థం చేసుకొంటావు. ఆయనను వాస్తవికంగా ఆరాధించగలుగుతావు. అప్పటిదాకా నీ పూజ, ఆ దేవభూమిని అధిరోహించడానికి, భగవంతుని యథార్థపూజకు నిన్ను అర్హుణ్ణి చేయడానికి పనికివచ్చే ప్రయత్నం మాత్రమే సుమా! అయితే అంతవరకు కూడ, జగత్కారణుడైన ఈశ్వరుని గురించి ఆయనొక విశిష్ట శక్తి సంపన్నుడైన మానవుడే – అన్న తలంపు మాత్రమే నీకు సహజంగా కలుగుతూ ఉంటుంది.
12. మానవాళిపట్ల కరుణ మూలంగా భగవంతుడు మానవ మాత్రుడిగా అవతరిస్తాడు
కాని ఆ దేవత్వస్థితిని పొంది అలా మాయాతీత ఈశ్వర స్వరూపాన్ని యథార్థంగా పూజించగలిగేవారు బహు అరుదుగా ఉంటారు. కాబట్టి మనలాంటి సాధారణ వ్యక్తుల మీద కరుణతో, మన హృదయపూర్వక పూజలను గ్రహించడానికే భగవంతుడు ఈ మర్త్యలోకాన అవతరిస్తుంటాడు. మానవదేహాన్ని ఆశ్రయించి, మానవభావాన్ని అవలంబించి, దేవమానవుడుగా వ్యవహరిస్తూంటాడు. పూర్వయుగాల్లో అవతరించిన ఆయా దేవమానవులతో పోల్చి గనుక చూసుకుంటే, మనం ఎంతో అదృష్ట వంతులం అని అనుకోవలసి ఉంటుంది. ఆ దేవమానవుల జీవిత చరిత్రలను చదివే అవకాశం మనకు లేదు; కాని శ్రీరామకృష్ణుల సాధనకాల చరిత్రను పఠించే సదవకాశం మాకు ఎంతో లభించింది. ఎందుకంటే తరచూ ఆయన స్వయంగా ఆ సాధనకాలం నాటి తమ జీవిత సంఘటనలను ఎన్నింటినో మాకు వివరిస్తూ చెప్పేవారు. అందుచేత వారి సాధనల సజీవ చిత్రం మా మనోఫలకంపై గాఢంగా ముద్రితమైపోయింది. మేము ఆయన వద్దకు రాకపోకలు మొదలుపెట్టడానికి కొద్దికాలం క్రితమే, దక్షిణేశ్వర కాళికాలయ భక్తజనుల ముందు వారి అపూర్వ సాధనాభినయం జరిగిపోయింది. ఆయన సాధనలను కళ్ళారా చూసినవారిలో చాలామంది అప్పుడు అక్కడే జీవిస్తూ ఉండేవారు. వారి ముఖతా కూడ గురుదేవుల సాధనల గూర్చి కొంతలో కొంత వినే అవకాశం మాకు లభించింది. ఏది ఏమైనా ఆ విషయాన్ని ఆలోచించడానికి ముందు, స్థూలంగా ‘సాధన’ గురించిన మూలతత్త్వాలను ఒకమారు సింహావలోకనం చేసుకోవడం మంచిది. కాబట్టి ఆ విషయం ఒకింత చర్చిద్దాం.