1. కలకత్తాలో రాంకుమార్ సంస్కృత పాఠశాలను ప్రారంభించడం
భార్య మరణానంతరం కూడ రాంకుమార్‌ను దురదృష్టం వెన్నంటే రాసాగింది. అతడు మరింత పేదరికం అనుభవించసాగాడు. స్వాస్థ్యయనాది కార్యాలు జరిపించడం మూలంగా వచ్చే రాబడికూడ బాగా తగ్గిపోయింది. తమ చిన్ని పొలం లక్ష్మీజల నుండి పండే ధాన్యం తమ కుటుంబానికి సరి పోయినప్పటికీ, నిత్యావసరాలు సమకూర్చుకోవడం ఎంతో కష్టమవసాగింది. వృద్ధురాలైన తల్లికి, తల్లిలేని బిడ్డ అక్షయ్‌కు కావలసిన పాలు అప్పుచేసి కొనుగోలు చేయవలసివచ్చేది. ఆ విధంగా రాంకుమార్ అప్పుల్లోపడ్డాడు. ఆ అప్పులు రోజురోజుకూ పెరగసాగాయి. మరోచోట మరింత ఎక్కువ ఆదాయం లభించవచ్చనే మిత్రుల సలహా మేరకు రాంకుమార్, కామార్పుకూర్ వదలి వెళ్ళాలని సన్నాహాలు చేసుకోసాగాడు. భార్య మరణం కూడ ఈ స్థలమార్పుకు దోహదం చేసింది. అలా వెళ్ళటం వలన తనకు కొంత మనశ్శాంతి కూడ లభిస్తుందని ఆశించాడు. కలకత్తా లేక బర్డ్వాన్లలో ఎక్కడ ఆదాయం అధికంగా వస్తుందా అని తర్జనభర్జనలు చేశాడు. చివరకు కలకత్తాకే వెళ్ళడానికి నిర్ణయించాడు. శిహోర్ వాస్తవ్యుడైన మహేశ్‌చంద్ర ఛటోపాధ్యాయ్, దేస్రా వాస్తవ్యుడు రామధన్ ఘోష్ మొదలైన తాను ఎరిగిన వ్యక్తులు కలకత్తాకు ఇది వరకే వలసపోయి ఆర్థికంగా బాగా నిలదొక్కుకోగలిగారని రాంకుమార్ మిత్రులు సూచించడమే కారణం కావచ్చు. పైగా పైన పేర్కొన్న వ్యక్తులు తెలివితేటలలోను, చదువులోను, శీలసంపదలోను రాంకుమార్‌కు తీసికట్టే. ఈ విషయాలన్నీ బాగా యోచించి, కుటుంబ బాధ్యతను రామేశ్వర్‌కు అప్పగించి, రాంకుమార్ కలకత్తాకు వెళ్ళాడు. అక్కడ ఝాంపుకూర్ అనే పేటలో ఒక సంస్కృత పాఠశాలను ప్రారంభించి, పిల్లలకు సంస్కృతం నేర్పసాగాడు.
2. కుటుంబంపై రాంకుమార్ భార్య మరణం చూపిన ప్రభావం
రాంకుమార్ భార్య మరణం ఆ కుటుంబంలో అనేక మార్పులు కొనితెచ్చింది. రాంకుమార్ పసిబిడ్డ అక్షయ్ బాధ్యతతో సహా ఇంటి విధులన్నీ ఇప్పుడు చంద్రాదేవి నిర్వహించవలసి వచ్చింది. రామేశ్వర్ భార్య తన శక్తి మేరకు అత్తగారికి సహాయపడినప్పటికీ, మరీ చిన్నపిల్ల కావడంచేత ఆమె సహాయం అంతంత మాత్రమే. కనుక రఘువీరుని పూజాదికాలు, అక్షయ్ ఆలనాపాలనా, వంటావార్పు మొత్తం చంద్రాదేవియే చూసుకోవలసిన అగత్యం ఏర్పడింది. దీనితో ఆమెకు క్షణం తీరిక ఉండేదికాదు. యాభై ఎనిమిదేళ్ళ* ఆమెకు ఇలా ఇంటి పనులన్నీ చూసుకోవడం ఎంతో కష్టంగానే ఉండేది. కాని శ్రీరఘువీరుని సంకల్పం అలా ఉందని గ్రహించి ఆమె దాని గురించి ఎలాటి బాధనూ వ్యక్తం చేసేది కాదు.
3. రామేశ్వర్ ఉదంతం
కుటుంబ ఆదాయ వ్యయాలను చూసుకోవలసిన బాధ్యత ఇప్పుడు రామేశ్వర్‌పై పడింది. కాని అతడి చదువు సంధ్యలు ఎన్నడూ అతడికి మంచి సంపాదనను అందివ్వలేక పోయాయి. పైగా పరివ్రాజకులైన సాధుసన్న్యాసులు తారసపడ్డప్పుడు వారితో మాట్లాడుతూ ఎంతో సమయం వెచ్చించడమే కాక, వారి అవసరాలను తీర్చడంలోనూ వెనుకాడేవాడు కాదు. అందుచేత ఇంతకు మునుపుకంటే అతడి సంపాదన మెరుగుపడ్డా అతడు కుటుంబం అప్పు తీర్చలేకపోయాడు. కుటుంబపు అత్యావశ్యకాలు మాత్రం తీర్చగలిగేవాడు. ఎన్నడూ డబ్బు పొదుపు చేయలేకపోయాడు. కొన్ని సందర్భాలలో రాబడిని మించిన ఖర్చులు చేసి స్వేచ్ఛాజీవనం గడుపుతూ, ‘శ్రీరఘువీరుడే ఏదో విధంగా కుటుంబాన్ని రక్షిస్తాడు’ అనుకొనేవాడు.
4. గదాధర్ గురించి రామేశ్వర్ ఆలోచనలు
తన చిన్న తమ్ముడైన గదాధర్‌ను, రామేశ్వర్ ప్రేమించినప్పటికీ, చదువుసంధ్యల్లో అతడి పురోగతిని గురించి ఎన్నడూ శ్రద్ధవహించి ఎరుగడు. అటువంటి శ్రద్ధవహించే మనస్తత్వం రామేశ్వర్‌కు లేకపోవడమే కాక, ధనార్జన నిమిత్తం అతడు పలుచోట్లకు తిరగవలసిన అగత్యం కూడ ఒకటి ఉంది. ఆ విధంగా అతడికి తమ్ముడి చదువు గురించి పట్టించుకొనే ఆసక్తిగాని, తీరికగాని ఉండేది కాదు. పైగా గదాధర్ వివేచనాత్మక ప్రవృత్తి అతణ్ణి ఎన్నటికీ చెడుత్రోవ తొక్కనివ్వదని రామేశ్వర్ ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే అంత పిన్న వయస్సులోనే అద్భుత ఆధ్యాత్మిక భావ వికాసం అతడిలో చూశాడు. గ్రామంలోని స్త్రీపురుషులందరూ గదాధర్పట్ల ప్రగాఢ విశ్వాసం కలిగివుండి అతణ్ణి ఎంతగానో ప్రేమించడం చూసిన రామేశ్వర్ విశ్వాసం మరింత ప్రగాఢమైంది. అందుచేత నిజంగా మంచివాడు, సచ్చరిత్రుడు కానివాడెవ్వడూ అంతటి ప్రశంసలను అందుకోజాలడని, అందరి హృదయాలను ఆకర్షించలేడని అతడు అవగాహన చేసుకున్నాడు. దానితో తమ్ముని గూర్చి ఎక్కువగా ఆందోళన పడకుండా, అతడి భావిమహోదయం కోసం ఆనందంతో ఎదురు చూడసాగాడు. రాంకుమార్ కలకత్తాకు వెళ్ళినప్పుడు గదాధర్ వయసు 13 ఏళ్ళు. ఇప్పుడు అతణ్ణి నియంత్రించేవారెవ్వరూ లేకపోవడంవల్ల, తన ఇచ్ఛమేరకు మసలే అవకాశం గదాధర్‌కు వచ్చింది.
5. ఈ సమయంలో గదాధర్ మానసిక స్థితి, వైఖరి
ఇంత చిన్నవయసులో గదాధర్ ఆంతరికదృష్టి ఎంతో వికసించిందని, ఇతరుల కార్యకలాపాల వెనుక నున్న వారి వారి ఉద్దేశాలను అతడు చక్కగా తెలుసుకునేవాడని మనం ఇదివరకే చెప్పుకున్నాం. బడికి వెళ్ళి చదువుకోవడం, సంస్కృతంలో పారంగతుడై బిరుదులు పొందడం – వీటన్నింటి వెనుక ఒకే ఒక లక్ష్యం ఉందని – అది ‘డబ్బు సంపాదనే’ అని అతడు గ్రహించాడు. అతడి మాటల్లో చెప్పాలంటే, ఆ లక్ష్యం ‘బియ్యం – అరటికాయలను మూటకట్టుకోవడం’. సాంసారిక సుఖభోగాల కోసం తమ శక్తిసంపదలనన్నింటినీ వ్యయంచేసే వారెవ్వరూ, తమ తండ్రిలా సత్యనిష్ఠులు, సచ్చరిత్రులు కాలేరని, వారు భగవద్దర్శనాన్ని పొందలేరని అతడు తెలుసుకున్నాడు. స్వార్థంతో అంధులైనవారు, భూమి కోసం లేదా ఇతర సంపదల కోసం పరస్పరం పోట్లాడుకోవడం, న్యాయస్థానాల చుట్టూ తిరగడం అతడు గమనించాడు. వారు ఇళ్ళను, భూములను కొలిచి, ‘ఈ భాగం నీది, ఈ భాగం నాది’ అని పంచుకోవడం అతడు గమనించాడు. వారు తమది అనుకున్న భాగాన్ని కొన్నిరోజులు అనుభవించగానే వారిని మృత్యువు స్వాహా చేసేది. ఇలాంటి సంఘటనలను కొన్నింటిని గదాధర్ కళ్ళారా చూశాడు. దానితో ‘ధనం, భోగేచ్ఛ’ లే మనిషి జీవితంలోని అనర్థాలన్నింటికీ కారణమన్న నిర్ణయానికి వచ్చాడు. అందుచేత ధనసంపాదనే ప్రధాన లక్ష్యమైన చదువు మీద అతడికి రోజురోజుకూ ఏవగింపు అధికరించిందంటే దానిలో విడ్డూరమేమీలేదు. అందుకు బదులుగా భగవంతునిపట్ల భక్తిప్రేమలను పెంపొందించు కోవడమే మానవజీవిత ప్రధాన లక్ష్యమనే నిర్ణయానికి వచ్చాడు. దానితో తండ్రిలా మామూలు వస్త్రాలతో, అంటే జీవించడానికి కావలసిన అత్యవసర వస్తువులతో సంతుష్టుడై ఉండసాగాడు. కాని మిత్రులపైనున్న ప్రేమకొద్దీ బడికి వెళ్ళడం కొంత కాలం వరకు కొనసాగించాడు. ఇప్పుడు అతడు శ్రీరఘువీరుని పూజలో, ఇంటిపనుల్లో తల్లికి తోడ్పడుతూ ఎక్కువకాలం గడపసాగాడు. ఈ పనులన్నీ అయ్యేవరకు అతడు ఇంట్లోనే ఉండవలసి వచ్చేది. అప్పటికే మధ్యాహ్నమయ్యేది.
6. గ్రామంలోని స్త్రీల కోసం గదాధర్ పురాణ పఠనం, సంకీర్తనాదులు
గదాధర్ ఇప్పుడు చాలావరకు ఇంట్లోనే ఉండడంవల్ల గ్రామంలోని మహిళలకు అతణ్ణి చూసే మంచి అవకాశం లభించింది. వారు తమ ఇంటిపనుల్లో ఏమాత్రం తీరిక చిక్కినా, చంద్రాదేవి వద్దకు వచ్చేవారు. అప్పుడు గదాధర్ అక్కడ ఉంటే, అతణ్ణి పాటలు పాడమని అడిగేవారు. కొన్నిసార్లు పురాణ కథలను చదివి వినిపించమని కోరేవారు. అవకాశ మున్నంత వరకూ అతడుకూడ వారి కోరికలను నెరవేర్చేవాడు. ఒకవేళ ఆ సమయాల్లో అతడు తల్లికి ఇంటి పనుల్లో తోడ్పడుతుంటే వారంతా కలసి ఆ పనులు చేసిపెట్టి, అతడికి తీరిక కల్పించి అతడి పాటలూ, కథలూ వినేవారు. వారందరికీ ఇది దాదాపు ఒక దైనందిన కార్యక్రమమై పోయింది. ఆ మహిళలు అతడి సమక్షంలో శ్రవణం చేస్తూ ఎంతో ఆనందించేవారు. అందుచేత అతడి పాటలను, కథలను చాలాసేపటి వరకు విని, ఆనందించేందుకు వారు తమ ఇంటి పనులను సాధ్యమైనంత త్వరగా ముగించుకునేవారు.
గదాధర్ ఆ గ్రామీణ స్త్రీలకు పాటలు, కథలు వినిపించి ఆనందింప చేయడమేకాక, వారిని ఇతర విధాలకూడ ఆనందింపచేసేవాడు. అప్పుడు ఆ గ్రామంలో ‘యాత్ర’ (వీథినాటకాలు) ఆడడానికి మూడు బృందాలుండేవి. ‘బావుల్’ పాటగాళ్ళు, ‘కవులు’ కూడ ఉండేవారు. ఆ ఊళ్ళో చాలామంది వైష్ణవులుండేవారు. వారింట్లో దాదాపు ప్రతి రాత్రీ భాగవత పఠనమో, హరినామ సంకీర్తనమో జరుగుతూ ఉండేది. గదాధర్ ఏకసంథాగ్రాహి. ఒకమారు వింటేచాలు, అతనికది జ్ఞాపకం ఉండిపోయేది. అలా చిన్నప్పటినుండి తాను విన్న సంగీత రచనలు, నాటకాలు, పాటలు, స్తోత్రాలు మొదలైనవెన్నో అతడికి కంఠస్థం అయిపోయాయి. అందుచేత అతడు వినోదంలో ప్రత్యేకత కోసం ఒకమారు ‘యాత్ర’ నాటకం వేసేవాడు. మరొకమారు పాటలు పాడేవాడు. మరోసారి సంకీర్తనం చేసేవాడు. నాటకంలో వివిధ పాత్రలను తానొక్కడే పోషించేవాడు. అంటే బహుపాత్రలను తానే ధరించి, పాడి చూపేవాడు. ఆయా పాత్రలకనుగుణంగా, తన కంఠస్వరాలను మారుస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా తల్లిగాని, మరెవ్వరైనా స్త్రీగాని విషాదవదనంతో కనిపిస్తే, నాటకంలోని హాస్యపాత్రలను అభినయించి వారి విషాదాన్ని పోగొట్టే ప్రయత్నం చేసేవాడు. లేకపోతే ఊళ్ళోని అందరికీ తెలిసిన ఎవరో ఒక వ్యక్తిని అనుకరించి చూపేవాడు. ఆ అనుకరణ ఎంత సహజంగా ఉండేదంటే, దాన్ని చూసిన వారంతా కడుపుబ్బ నవ్వేవారు.
7. గదాధర్ పట్ల గ్రామంలోని స్త్రీల భక్తిప్రపత్తులు
ఇలా గదాధర్ ఆ గ్రామంలోని స్త్రీలందరి పైన ఒక అపూర్వ ప్రాబల్యాన్ని సంపాదించుకున్నాడు. అతడి జనన సమయంలో అతడి తల్లికి విచిత్రస్వప్నాలు రావడం, దివ్యదర్శనాలు కలగడం వారికి తెలుసు. అతడు ఆయాదేవతల భావావేశం పొందినప్పుడు, అతడి మనశ్శరీరాలు అద్భుతరీతిలో మార్పులు చెందడం వారు చూసివున్నారు. అంతేకాక అతడికున్న ప్రగాఢ భగవద్భక్తి, పురాణ పఠనంలో అతని తన్మయత, అతి మధురంగా అతడు పాడేపాటలు, తమతో ఎలాంటి అరమరికలూ లేకుండా పరమ ఆత్మీయతతో మెలగడం, ఆప్యాయంగా ఉండడం – ఇవన్నీ ఆ స్త్రీల కోమల హృదయాల్లో అతడిపట్ల అపూర్వ భక్తిప్రేమలను కలిగించాయనడంలో సందేహం లేదు. ధర్మదాస్ లాహా సోదరి ప్రసన్నమయి, ఇతర స్త్రీలు అతడిలో బాలగోపాలుని దివ్యచైతన్యాన్ని చూసి, తమ బిడ్డలకన్నా ఎక్కువగా అతణ్ణి ప్రేమించేవారని మేము విన్నాం. అలాగే యువతులు అతణ్ణి శ్రీకృష్ణాంశ సంభూతునిగా భావించి సఖీభావంతో ప్రేమిస్తూ ఉండేవారు. వారిలో చాలామంది వైష్ణవ కుటుంబాల్లో జన్మించినవారే. వారి ఆధ్యాత్మిక జీవనంలో వారి సరళమైన విశ్వాసం ప్రధానమైన అంశం. కాబట్టి సద్గుణసంపన్నుడు, ప్రియదర్శనుడైన గదాధర్‌ను వారు దైవసమానంగా భావించడంలో ఆశ్చర్యంలేదు. అతడిపై వారికి అంతగా నమ్మకం ఉండడంవల్లే, తమ అంతరంగపు ఆలోచనల నన్నింటినీ వారు దాచుకోకుండా అతడికి చెప్పేవారు. అతడి సలహాలను పొందేవారు, పాటించేవారు. అలాంటి సమయాల్లో గదాధర్ కూడ ఆ స్త్రీలలో ఒకతెగా ప్రవర్తించేవాడు.*
8. స్త్రీ వేషధారణలో గదాధర్
గదాధర్ అప్పుడప్పుడు స్త్రీ వేషభూషణాదులను ధరించి ప్రసిద్ధ స్త్రీ పాత్రలను అభినయించేవాడు. తన మహిళా నేస్తాలు కోరినప్పుడు అతడు శ్రీమతి రాధారాణి పాత్రనో, ఆమె ప్రధాన సఖీపాత్రనో అభినయించేవాడు. అలాంటి సమయాల్లో అతడి అంగభంగిమలు, హావభావాలు, కంఠస్వరం అచ్చు స్త్రీల మాదిరిగానే ఉండేది. అలాంటప్పుడు అతణ్ణి గుర్తించటం ఎవరికీ సాధ్యం అయ్యేది కాదని ఆ స్త్రీలు చెబుతూండేవారు. స్త్రీల ప్రవర్తనారీతులను గదాధర్ ఎంత సూక్ష్మంగా పరిశీలించాడో దీని ద్వారా వెల్లడవుతుంది. వినోద ప్రియుడైన గదాధర్ స్త్రీవేషం ధరించి, చంకలో బిందె నుంచుకుని నీళ్ళు తీసుకురావడానికి పురుషుల ముందునుండే హల్దార్పకూర్ చెరువుకు నడచి వెళుతున్నప్పుడు అతడు గదాధరుడేనని అనుమానం ఎవరికీ కలిగేది కాదు.
9. సీతానాథ్ పాయిన్ కుటుంబంతో గదాధర్కున్న స్నేహం
గ్రామంలోని సంపన్న గృహస్థుడైన సీతానాథ్ పాయిన్ గూర్చి ముందే చెప్పివున్నాం. అతనికి ఏడుగురు కుమారులు, ఎనిమిదిమంది కూతుళ్ళు ఉండేవారు. పెళ్ళయిన తర్వాత కూడా వారంతా అతడి ఇంట్లోనే ఉమ్మడి కుటుంబంగా ఉండే వారు.ఆ కుటుంబం ఎంత పెద్దదంటే, వంటలో తాలింపు కోసం కావలసిన దినుసులను పొడిచేయడానికి రోజూ పది రుబ్బురోళ్ళను ఉపయోగించేవారట! సీతానాథ్ దూరపు బంధువులు చాలామంది కూడ అతడి ఇంటికి దగ్గరలోనే ఇళ్ళు కట్టుకుని నివసించేవారు. కాబట్టే వారుండే పేటకు ‘వణిక్పల్లె’ (వ్యాపారుల పేట) అనే పేరొచ్చింది. వారి ఇళ్ళు క్షుదిరామ్ ఇంటికి దగ్గరలోనే ఉండేవి. అందువల్ల ఆ కుటుంబాలకు చెందిన పలువురు స్త్రీలు, ముఖ్యంగా సీతానాథ్ భార్య, కూతుళ్ళు చంద్రాదేవి దగ్గరకు సమయం దొరికినప్పుడల్లా వస్తూ ఉండేవారు. ఇలా గదాధర్‌కు, వారికి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వారతణ్ణి చాలాసార్లు తమ ఇంటికి తీసుకునిపోయేవారు. అతణ్ణి స్త్రీ వేషం వేసుకోమని, ఆ వేషంలో అభినయించమని అర్థించేవారు. సీతానాథ్ బంధువులంతా, తమ స్త్రీలను సీతానాథ్ ఇంటికి తప్ప మరెక్కడికీ వెళ్ళవద్దని కట్టడి చేసేవారు. కాబట్టి వేరేచోట వారికి గదాధర్ పురాణపఠనం, కీర్తనలు వినే అదృష్టం ఉండేది కాదు. అందుచేత వారిలా అతణ్ణి తమ ఇళ్ళకు తీసుకుని వెళ్ళి విని ఆనందించేవారు. చంద్రాదేవి వద్దకు వెళ్ళలేని చాలామంది స్త్రీలు, సీతానాథ్ ఇంట్లో గదాధరుణ్ణి చూసి ఎంతో ముగ్ధులయ్యేవారు. గదాధర్ సీతానాథ్ ఇంట్లో ఉన్నాడన్న విషయం తెలిస్తే చాలు వారు వెంటనే అక్కడికి వెళ్ళి, అతడి పురాణ పఠనాన్ని – పాటలను వింటూ, అతడి అభినయాన్ని, పాత్రానుకరణనూ చూస్తూ ఎంతో ఆనందించేవారు. గృహ యజమాని సీతానాథ్ అతణ్ణి ఎంతో అభిమానించేవాడు. అంతేకాదు, వణిక్పల్లెలోని చాలామంది మగవారికి అతడి సద్గుణాల గురించి చక్కగా తెలుసు. అందుకే తమ ఇంటి స్త్రీలు అతడి వద్దకు వెళ్ళి, అలా శ్రవణం, దర్శనం చేస్తూన్నా ఎలాంటి అభ్యంతరం చెప్పేవారు కాదు. కాని దుర్గాదాస్ పాయిన్ అనే ఒక వ్యక్తిమాత్రం అభ్యంతరం చెప్పేవాడు. అతడికి కూడ గదాధర్ పట్ల సదభిప్రాయం ఉంది, అతడంటే ఇష్టమూవుంది. కాని స్త్రీలను ఇచ్ఛ వచ్చినట్లు పంపించే విషయంలో మాత్రం, తమ కుటుంబ ఆచార రీత్యా ఒప్పుకునేవాడు కాదు. తమ కుటుంబంలోని స్త్రీలను ఎప్పుడూ, ఎవరూ చూసి ఎరుగరని, తన ఇంటి అంతఃపుర విషయాలు ఎవరికీ తెలియవని సీతానాథ్, ఇతర బంధువుల ముందు అతడు గర్వంగా ప్రగల్భాలు పలికేవాడు. పైగా తన (కుటుంబ స్త్రీల) మాదిరి పరదా పద్ధతిని కచ్చితంగా అమలుపరచనివారిని అతడు చులకనభావంతో చూసేవాడు.
10. దుర్గాదాస్ గర్వభంగం
దుర్గాదాస్ ఒకరోజు ఒక బంధువు ముందు ఇలా బడాయికి పోతున్నాడు. అప్పుడే గదాధర్ అక్కడికి వచ్చాడు. ఆ బడాయి మాటలు విన్నాడు. “పరదాలో ఉంచి ఎవరైనా స్త్రీలను కాపాడగలరా? సచ్ఛీలం – భగవద్భక్తి, ఇవి మాత్రమే వారిని రక్షిస్తాయి. నేను తలచుకుంటే, మీ అంతఃపురాన్నే కాదు, అక్కడ ఉండే స్త్రీల నందరినీ చూడగలను” అని చెప్పాడు. ఆ మాటలు విని దుర్గాదాస్ మరింత గర్వంతో, “చూద్దాం. నువ్వు అంతఃపురంలోకి ఎలా వెళతావో?” అని అన్నాడు. గదాధర్ కూడా “అలాగే” అంటూ వచ్చేశాడు.
ఇది జరిగాక ఒకరోజు మధ్యాహ్నం పూట ఎవరితోనూ ఏమీ చెప్పకుండా గదాధర్ ఒక మాసిన ముతకచీర కట్టుకున్నాడు, చేతులకు వెండి కడియాలు ధరించాడు. అలా ఒక సాలె యువతి వేషం ధరించాడు. చీకటి పడడానికి కాస్తముందుగా నెత్తి మీద ముసుగువేసుకుని, చంకలో ఒక బుట్ట పుచ్చుకుని, బజారుదారిన దుర్గాదాస్ ఇంటికి వచ్చాడు. దుర్గాదాస్ ఇంటి వసారాలో కూర్చుని కొంతమంది స్నేహితులతో మాట్లాడుతున్నాడు. గదాధర్ అతడి వద్దకు వచ్చి, తానొక సాలె స్త్రీనని, నూలు అమ్మడానికి సంతకు వచ్చానని, అయితే దురదృష్టం కొద్దీ తన స్నేహితురాళ్ళు తనను వదలిపెట్టి వెళ్ళిపోయారని చెప్పుకున్నాడు. ఆ రాత్రికి తనకు అక్కడ ఆశ్రయం ఇవ్వమని అడిగాడు. దుర్గాదాస్ ఆమె గ్రామం పేరు వగైరా వివరాలు అడిగాడు. ఆమె తెలిపిన జవాబులతో సంతృప్తుడయి “సరే, లోనికి వెళ్ళి ఆడవాళ్ళతోపాటు ఉండు” అని చెప్పాడు. గదాధర్ కృతజ్ఞత చెప్పి, తల వంచుకొని లోపలికి వెళ్ళాడు. తన ‘కథను’ అతడు అక్కడి స్త్రీలకు చెప్పి, వారితో కబుర్లలో పడ్డాడు. అంతచిన్నవయసులో ఉన్న ఆమెను చూసి, ఆమె తియ్యని పలుకులు విని వారు ఎంతో మురిసిపోయి, ఆమెను తమతోపాటుగా ఉండనిచ్చారు. ఆమెకో చోటు చూపి, పడుకోమని చెప్పారు. అక్కడ కూర్చుని, అటుకులు తింటూ లోపలి గదుల నన్నింటినీ, అందరినీ నిశితంగా అతడు పరిశీలించాడు. వారు మాట్లాడుకునే మాటలన్నీ విన్నాడు. వారి కబుర్లలో తానూ పాల్గొన్నాడు. అప్పుడప్పుడు వారిని కొన్ని ప్రశ్నలు కూడ అడిగాడు. ఇలా రాత్రి చాలాసేపు గడిచిపోయింది.
అంత రాత్రి పొద్దుపోయినా గదాధర్ ఇంటికి రాకపోవడంతో తల్లి చంద్రాదేవి కంగారుపడి, రామేశ్వర్‌ను వెదకడానికి పంపించింది. అతడు తరచూ వణిక్పల్లె వెళతాడు కాబట్టి, అక్కడే వెదకమని చెప్పింది. రామేశ్వర్ మొదట సీతానాథ్పాయిన్ ఇంటికి వెళ్ళాడు. గదాధర్ అక్కడ లేకపోవడంతో, అతడు దుర్గాదాస్ ఇంటి వద్దకు వచ్చి, బిగ్గరగా తమ్ముణ్ణి పిలవసాగాడు. అన్న పిలుపు విని, అప్పటికే చాలా రాత్రయిందని గదాధర్ గ్రహించాడు. వెంటనే జవాబుగా “అన్నా! ఇదిగో వచ్చేస్తున్నా” అని లోపలి నుండే అరుస్తూ బయటకు వచ్చాడు. దుర్గాదాస్‌కు అప్పుడు స్పష్టంగా జరిగింది తెలిసిపోయింది. తాను, తన కుటుంబం ఇలా పూర్తిగా మోసపోవడం చూసి మొదట చాలా కోపానికి, సిగ్గుకు లోనయ్యాడు. కాని మరుక్షణమే గదాధర్ ఆ సాలెస్త్రీ పాత్రను ఎంత చక్కగా అభినయించాడో గుర్తుతెచ్చుకుని హాయిగా నవ్వుకున్నాడు. మరునాడు జరిగిన సంఘటన అంతా విని దుర్గాదాస్ గర్వాన్ని గదాధర్ అలా భంగపరచడం చూసి సీతానాథ్, అతడి బంధువులంతా ఎంతో సంతోషించారు. అప్పటి నుండి గదాధర్, సీతానాథ్పాయిన్ ఇంటికి వచ్చినప్పుడల్లా, దుర్గాదాస్ ఇంటి స్త్రీలు కూడ అక్కడికి రాసాగారు.
11. గదాధర్ పట్ల వణిక్పల్లెలోని వైశ్య స్త్రీల భక్తి విశ్వాసాలు
ఇలా సీతానాథ్ కుటుంబానికీ, వణిక్పల్లెలోని స్త్రీలందరికీ గదాధర్ పట్ల క్రమంగా అనురాగం అధికం కాసాగింది. ఏ కారణంగానైనా వారతణ్ణి కొన్నిరోజులు వరుసగా చూడకపోతే, మనిషిని పంపించి అతణ్ణి తమ ఇళ్ళకు పిలిపించుకునే వారు. సీతానాథ్ ఇంట్లో పురాణం పఠిస్తున్నప్పుడుగానీ, లేదా పాటలు పాడుతున్నప్పుడుగానీ అతడు ఒక్కోమారు భావసమాధి పొందుతూ ఉండేవాడు. అలాంటి స్థితుల్లో అతణ్ణి చూసిన తర్వాత అతడిపట్ల వారి భక్తిభావం మరింత ఇనుమడించింది. అలా అతడు భావసమాధి పొందిన సమయాల్లో అతణ్ణి సచేతన శ్రీకృష్ణునిగానో, శ్రీచైతన్యమహాప్రభువుగానో ఎంచి, వారిలో పలువురు అతణ్ణి పూజించేవారని, అతడి నృత్యానికి అనుగుణంగా ఒక బంగారు పిల్లనగ్రోవిని, స్త్రీపురుష పాత్రలకు యుక్తమైన ఆభరణాలు కొన్నింటిని వారతడి కోసం చేయించారని మేము విన్నాం.
12. గదాధర్ గురించి శ్రీమతి రుక్మిణి వివరణ
గదాధర్ ఆధ్యాత్మికత, పవిత్రత, నిశితబుద్ధి, ప్రేమ, అమాయకత్వం, సరళ ప్రవర్తన ఇవన్నీ నాటి కాలపు గ్రామీణ స్త్రీలపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయో, ఆ విషయమై వారిలో కొందరు స్వయంగా చెప్పగా వినే అవకాశం అప్పు డప్పుడు మాకు కలిగింది. 1893 వ సంవత్సరంలో స్వామి రామకృష్ణానందతో పాటుగా మేము కొంతమందిమి కామార్పుకూర్ వెళ్ళాం. అప్పటికి అరవైఏళ్ళు నిండిన శ్రీమతి రుక్మిణీదేవిని దర్శించాం. ఆమె శ్రీ సీతానాథ్ పాయిన్గారి కుమార్తె. ఆమె మాకు చెప్పిన విషయాన్ని చదివాక పాఠకులు గదాధర్ ప్రభావాన్ని అర్థం చేసుకోగలరు.
ఉత్తరదిక్కుగా చూపిస్తూ, రుక్మిణీదేవి ఇలా చెప్పింది:
“అదిగో అటు చూడండి. అక్కడే మా పాత ఇల్లు ఉండేది. మా కుటుంబానికి చెందిన వారెవ్వరూ దాదాపుగా ఇప్పుడు లేరనే చెప్పవచ్చు. అందుకే అక్కడ ఎవరూ ఉండడం లేదు. ఇప్పుడదంతా శిథిలమైపోయింది. అయితే నాకు పదిహేడు, పద్ధెనిమిదిఏళ్ళ ప్రాయంలో, ఆ ఇల్లు ఒక శ్రీమంతుల భవనంలా కళకళలాడుతూ ఉండేది. మా నాన్న పేరు శ్రీ సీతానాథ్పాయిన్. మా పెద్దనాన్న, చిన్నాన్న కూతుళ్ళతో సహా మేమంతా పదిహేడు – పద్ధెనిమిదిమంది అక్కాచెల్లెళ్ళం. ఓ నాలుగైదు ఏళ్ళ తేడాతోతప్ప, మేమంతా అప్పటికి యౌవనంలో ఉన్న కన్యలమే. గదాధర్ చిన్నప్పటి నుండి మాతో కలసి ఆడుతూ, పాడుతూ తిరిగేవాడు. అందుచేత అతడికి, మాకు మధ్య మంచి స్నేహం ఉండేది. మేము యౌవనంలోకి వచ్చినా, అతడు మా ఇంటికి వస్తూ, వెళ్ళుతూ ఉండేవాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత కూడ అతడు మా ఇంటి అంతఃపురంలోకి రాకపోకలు చేస్తుండేవాడు. మా నాన్నకు అతనంటే ఎంతో ప్రేమ. తన ఇష్టదైవంలా అతడిపట్ల మా నాన్న భక్తిప్రపత్తులు చూపేవాడు. ఇరుగు పొరుగులు కొందరు నాన్నను, ‘మీ ఇంట్లో అంతమంది ఎదిగిన కూతుళ్ళున్నారు కదా! గదాధర్ కూడ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. మరి అతణ్ణింకా మీ ఇంట్లోకి రానిస్తున్నావేమిటీ?’ అని అడిగేవారు. అది విని మా నాన్న, ‘గదాధర్ గూర్చి నాకు బాగా తెలుసు. మీరు నిశ్చింతగా ఉండండి’ అని చెప్పేవాడు. దానితో వారి నోళ్ళు మూతబడిపోయేవి. గదాధర్ మా ఇంట్లోకి వచ్చి, ఎన్నెన్నో పురాణకథలు చెప్పేవాడు. నవ్వుతూ, నవ్వించేవాడు. ప్రతిరోజూ ఇలా అతడి మాటలు, హాస్యాలు వింటూ మేమంతా మా పనులను ఆనందంగా చేసుకునేవాళ్ళం. అతడు మా వద్ద ఉన్నప్పుడు సమయం ఎంతో ఆహ్లాదంగా గడిచిపోయేది. దాన్ని ఎలా వర్ణించగలను? ఒక్కోరోజు అతడు రాకపోతే, అతడికి ఒంట్లో బాగాలేదేమోనన్న ఊహతో ఎంతో కలవర పడేవాళ్ళం. నీటి కోసమనో లేదా మరో నెపంతోనో ఎలాగో మాలో ఒకరం ఆ రోజు బ్రాహ్మణి (చంద్రాదేవి) ఇంటికి వెళ్ళి, అతడి విషయం కనుక్కుని వచ్చేవరకూ, మా మనసులు శాంతించేవి కావు. అతడి ప్రతిమాట మాకు అమృతంలా అనిపించేది. అందుచేత అతడు మా ఇంటికి రాని రోజున, అతణ్ణి గురించే మాట్లాడుకుంటూ మేము ఆరోజు గడిపేవాళ్ళం” అంటూ రుక్మిణీ దేవి వివరించింది.
13. గదాధర్ పట్ల గ్రామస్థులందరి ప్రేమ
గదాధర్ స్నేహం ఆ గ్రామ స్త్రీలకే పరిమితం కాలేదు. అతడి బహుముఖ ప్రతిభ, అతడి మనోజ్ఞమైన వ్యవహారదక్షత ఆ గ్రామంలోని ఆ బాలవృద్ధులందరినీ ఆకట్టుకుంది. అతడితో వారందరికీ ఒక ప్రగాఢ సంబంధాన్ని ఏర్పరచింది. ప్రతి సాయంకాలం అతడు భాగవతాది పురాణాలు పఠించడానికి గాని, భగవత్ సంకీర్తన చేయడానికిగాని పూనుకునేవాడు. వాటిని వినడానికి చిన్నా – పెద్దా, గ్రామస్థులంతా సమావేశమయ్యేవారు. గదాధర్ ఏ రోజు, ఎక్కడ తన ఈ కార్యక్రమం నిర్వహిస్తాడో, ఆ రోజు అక్కడ ఆనందస్రవంతి ప్రవహించేది. కారణమేమంటే, అతడిలా పురాణాలను చక్కగా చదవడంగానీ, లేదా గంభీర ఆధ్యాత్మిక తత్త్వాలను అంత భక్తిపూర్వకంగా వివరించడంగానీ మరెవ్వరికీ సాధ్యమయ్యేది కాదు. అలాగే సంకీర్తన సమయంలో అతడి దివ్యభావావేశానికి, ఆధ్యాత్మిక భావాలను ప్రేరేపించేలా అప్పటికప్పుడు అనుపల్లవులను సృష్టించే అతడి శక్తికిగానీ ఎవరూ సాటివచ్చేవారు కారు. అతడి మధురకంఠం మరెవ్వరికుందనీ! భావపారవశ్యంతో అతడు చేసే మనోహర నృత్యాన్ని మరెవ్వరు చేయగలరూ! అంతేకాదు, హాస్యం పట్టించే సమయంలో, అతడిలా హాస్యపాత్రలను నటించడంలో, స్త్రీ పురుషుల రకరకాల హావభావాలను ప్రదర్శించడంలో అతణ్ణి ఎవరు మించగలరూ! అలాగే సమయానుకూలంగా, కొత్త కొత్త కథలను అల్లడంలో, కొత్తపాటలను పాడటంలో కూడ అతనిదే అగ్రతాంబూలం. కాబట్టే చిన్నాపెద్దా అంతా కూడ అతడి పట్ల ఎంతగానో ఆకర్షితులై, ప్రతి సాయంకాలం అతడి రాక కోసం ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తూ ఉండేవారు. గదాధర్కూడ ఒక్కోరోజు ఒక్కోచోట వారిని కలుస్తూ వారికి ఆనందాన్ని కలిగిస్తూ ఉండేవాడు.
అంత పిన్నవయసులో కూడ అతడిలో ఎంతో నిశిత వివేచనాశక్తి ఉండేది. అందుకే గ్రామస్థుల్లో అనేకులు తమ కుటుంబ సమస్యలను అతడికి చెప్పుకుని, పరిష్కారం పొందుతుండేవారు. అలాగే సాధకులు కూడ అతడి పవిత్రశీలాన్ని చూసి, భగవన్నామ సంకీర్తన సమయంలో అతడు భావసమాధి పొందడం చూసి, అతడి సలహాలు పొంది పురోగతి సాధిస్తుండేవారు. కేవలం వంచకులు, దుర్మార్గులు మాత్రం అతడి నుండి తప్పుకుని దూరంగా ఉండేవారు. ఎందుకంటే, గదాధర్ నిశితదృష్టి వారి పైపై వేషాలను దాటి, వారి అంతరంగంలోకి చొచ్చుకుపోయి, వారి కుట్రలను, జిత్తులమారి చేష్టలను పసిగట్టేది. సత్యనిష్ఠుడు, ఉన్నది ఉన్నట్లు ముఖం మీద చెప్పేవాడు అయిన బాల గదాధర్, ఒక్కోసారి అందరి ముందు వారి పన్నాగాలను, కుటిల యోచనలను వెల్లడించి, సిగ్గుతోవారు తలలు దించుకునేలా చేసేవాడు. అతడి వినోద ప్రియత్వంకూడ వారి కుటిల చేష్టలను అందరిముందూ అనుకరించేలా చేసేది. ఇది వారికి ఎంతో కోపం తెప్పించేది. కాని అందరూ గదాధర్ పక్షం వహించడం వల్ల ఏమీ చేయలేక వాళ్ళు నోరు మూసుకుని ఉండవలసి వచ్చేది. అందుచేత ఆ వంచకులకు ఆ అవమానం నుండి తప్పించుకోవటానికి ఒకే మార్గం కనిపించేది – గదాధర్ కరుణాస్వభావానికి శరణువేడడం. తనను ఆశ్రయించినవారి పట్ల అతడు ప్రసన్నుడౌతాడని వాళ్ళందరికీ తెలుసు.
14. పొట్టకూటి చదువు పట్ల గదాధర్ విరక్తి
సమవయస్కుల పట్లగల ప్రేమ కారణంగా, గదాధర్ బడికి వెళుతూ ఉండేవాడని మొదట్లోనే చెప్పుకున్నాం కదా! కాని అతడికి పధ్నాలుగేళ్ళు వచ్చేసరికి అతడి దైవభక్తి, ఆధ్యాత్మిక భావాలు తీవ్రమయ్యాయి. దానితో పొట్టకూటికి పనికివచ్చే చదువు తనకు అవసరం లేదన్న నిశ్చయానికి అతడు వచ్చాడు. తన జీవితం మరొక ఉన్నత ప్రయోజనాన్ని సాధించడానికి కేటాయించబడిందన్న భావన అప్పటి నుండే అతడికి కలిగింది. అందుచేత తన శక్తిసామర్థ్యాల నన్నింటిని భగవత్సాక్షాత్కారం కోసం మాత్రమే వినియోగించాలని అతడు నిశ్చయించుకున్నాడు. అతడి మనఃఫలకం మీద తరచూ ఆ జీవితలక్ష్యం అస్పష్టంగా గోచరిస్తూ ఉండేది. కాని అది ఇంకా పూర్తిగా స్పష్టం కాకపోవడంవల్ల, ఆ లక్ష్యాన్ని అతడు చక్కగా అర్థం చేసుకోలేకపోయేవాడు. అయినప్పటికీ అతడిలో తన భావిజీవితాన్ని ఎలా గడపాలన్న ప్రశ్న ఉదయించినప్పుడల్లా, అతడి యోచనాయుక్త మేధస్సు పూర్తిగా భగవంతుణ్ణి ఆశ్రయించి జీవించమని సూచించేది. అతడి భావనాశక్తి కాషాయాంబరాలను ధరించి, పవిత్ర ధుని ముందు ధ్యానిస్తూ భిక్షతో లభించే మధుకరాన్ని సేవిస్తూ స్వేచ్ఛగా పరివ్రాజక జీవితాన్ని గడపడం ఆయన మనోఫలకం మీద కనిపించేది. కాని మరుక్షణమే తన తల్లి, అన్న, ఇంటి పేదరికం జ్ఞాపకం రావడంతో ప్రేమరసార్ద్రమైన అతడి కోమలహృదయం, పై మార్గంలో జీవనయాత్ర చేయాలన్న మనోరథం నుండి వెనక్కు మరలేది. అంతేకాదు, తన తండ్రిలా భగవంతుని శరణుజొచ్చి, సంసారంలోనే ఉంటూ తనకు సాధ్యమైనంత వరకూ వారికి తోడ్పడవలసిందిగా, అది అతణ్ణి ప్రేరేపించేది. తన మనోబుద్ధులు ఇలా పరస్పర వ్యతిరేక మార్గాలను సూచిస్తూ ఉంటే, భగవంతుని నిర్దేశం కోసం ఎదురుచూస్తూ, శ్రీ రఘువీరుని మీదే భారమంతా వేసి అతడు జీవించసాగాడు. శ్రీ రఘువీరుని పట్ల భక్తితో అతడి హృదయం నిండివుండేది. అందుకే ఆ భగవంతుణ్ణి నిరంతరం తనవాడిగా అతడు భావించేవాడు. కాబట్టి సరైన సమయంలో శ్రీ రఘువీరుడే తన చిక్కుముడులను విప్పుతాడన్న విశ్వాసం పెరిగింది. దానితో అతడి సందేహాలన్నీ సమసిపోయాయి. అతడి హృదయం, బుద్ధీ రెండూ పరస్పరం వ్యతిరేకించినప్పుడల్లా, అతడి హృదయమే నెగ్గుతూ ఉండేది. అప్పటి నుండి అతడు ప్రతి కార్యాన్నీ హృదయ ప్రేరేపణతోనే చేయసాగాడు.
15. గదాధర్ నిస్వార్థపరత్వం
అసాధారణ అనుభూతిలో పూర్ణమై ఉన్న అతడి హృదయంలో, ఆ సమయంలో మరొక కొత్త భావన ఉదయించేది. గ్రామంలోని స్త్రీ పురుషు లందరితో అతడికి ఎంత అవినాభావ సంబంధం ఏర్పడిందంటే, వారినందర్నీ అతడు తన ఆత్మీయులుగా భావించేవాడు. వారి సుఖదుఃఖాలను తనవిగా అనుభూతి పొందుతుండేవాడు. కాబట్టి సన్న్యసించాలన్న భావన అతడిలో ఉదయించినప్పుడల్లా, సరళహృదయులు, ప్రేమపూరితులు అయిన ఆ గ్రామస్థులు, వారు తనపట్ల చూపే అఖండవిశ్వాసం జ్ఞాపకం వచ్చేవి. అంతేకాదు, తన జీవితాన్ని ఎలా మలచుకుంటే వారంతా తనను ఆదర్శంగా ఎంచుకొని తమ జీవితాలను ఉన్నతాదర్శవంతంగా చేసుకుంటారో, ప్రస్తుతం తనతో వారికున్న సంబంధం, శాశ్వత పారమార్థిక సంబంధంగా ఎలా మారుతుందో అలా జీవించడం తన జీవితాశయమని కూడ అతడు గ్రహించసాగాడు. ఆవగింజంత కూడ స్వార్థం లేని అతడి హృదయం, “కేవలం నీ ఒక్కడి ముక్తికోసమే సంసారాన్ని త్యాగం చేయడం స్వార్థమే సుమా! పరులందరి శ్రేయస్సుకు కూడ తోడ్పడే కర్మను మాత్రమే నువ్వు ఆచరించు” అంటూ అతడికి చెబుతూండేది.
16. గదాధర్ బడికి వెళ్ళక, మిత్రులతో నాటకాలు ఆడడం
అప్పుడు బడిలో అతడు నేర్చుకొంటున్న చదువు గూర్చి, మున్ముందు నేర్చుకొనే సంస్కృతవిద్య గూర్చి అతడి హృదయం – బుద్ధి ఏకమై, “పొట్టకూటి విద్య, ఎందుకూ పనికిరాదు” అంటూ నొక్కిచెప్పాయి. అయినాసరే, బడిలోని తన మిత్రులు బాధపడతారని అతడు వెంటనే బడి మానివేయలేదు. గయావిష్ణువు, ఇతర స్నేహితులు అతణ్ణి ఎంతగానో ప్రేమించేవారు. అతడి తెలివితేటలను, ధైర్యసాహసాలను చూసి, అతణ్ణి తమ నాయకునిగా భావించేవారు. కాని బడిని వదిలిపెట్టడానికి చివరికి అతడికి ఒక మంచి అవకాశం లభించింది. గదాధర్లోని అభినయ కౌశల్యాన్ని గుర్తించిన అతడి మిత్రులు, ఒక రోజు ఒక విషయాన్ని గదాధర్ ముందుకు తెచ్చారు. “మనమంతా ఒక నాటకబృందంగా ఏర్పడదాం. దానిలో శిక్షణ నిచ్చే బాధ్యతను నువ్వు స్వీకరించాలి” అని చెప్పారు. గదాధర్ అందుకు అంగీకరించాడు. కాని తమ పెద్దలు ఎక్కడ తమను తప్పుపడతారోనన్న సంశయం వారికి ఉంది. అందుచేత వారికి తెలియకుండా శిక్షణ కార్యక్రమం కొనసాగించేందుకు తగిన స్థలాన్ని వెదకసాగారు. ధీమంతుడైన గదాధర్ చివరికి మాణిక్‌రాజ్‌కు చెందిన మామిడితోపును అందుకు తగిన స్థలంగా ఎన్నుకున్నాడు. ఆ తర్వాత ప్రతిరోజు వారిలో కొంతమంది బడి ఎగ్గొట్టి, నిర్ణీతసమయంలో తోపుకు రావాలని నిశ్చయించుకున్నారు. అలాగే వారు దాన్ని వెంటనే అమల్లోపెట్టారు.
గదాధర్ శిక్షణలో ఆ బాలురు తమ పాత్రలను, పాటలను చక్కగా నేర్చుకుని నటించసాగారు. కొన్నిరోజులకే, ఆ మామిడితోపు శ్రీరామచంద్రుని, శ్రీకృష్ణుని జీవనఘట్టాల అభినయాలతో మారుమ్రోగసాగింది. ప్రతి నాటకంలోను, అందుకు కావలసిన వివరాలను గదాధరే తన కల్పనాశక్తితో సమకూర్చేవాడు. అంతేకాదు, ప్రధానపాత్రలను తానే స్వయంగా పోషించేవాడు. ఆ నాటకబృందం ఏ ఘర్షణలూ లేకుండా సాఫీగా కొనసాగడంతో, ఆ బాలురు ఎంతో ఆనందించేవారు. మామిడితోపులో ఈ నాటకాలు జరుగుతున్నప్పుడు, అప్పుడప్పుడు గదాధర్ భావసమాధులు పొందుతూ ఉండేవాడని మేము విన్నాం.
17. లలితకళలలో గదాధర్ అభినివేశం
గదాధర్ భక్తి కీర్తనలు గానం చేయడంలో, నాటకాలు ఆడడంలో ఎక్కువకాలం గడుపుతూ ఉండేవాడు. ఈ రెండు కళల్లోనే కాదు, చిత్రకళలోకూడ నైపుణ్యం ఉంది. ఒకనాడతడు గౌర్హాటి గ్రామంలోని చెల్లెలు సర్వమంగళ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో ఆమె ఆనందంతో భర్తను సేవించడం చూశాడు. తర్వాత ఆ దృశ్యాన్ని అతడు చిత్రంగా గీశాడు. సజీవంగా కనిపించే ఆ చిత్రాన్ని చూసి కుటుంబంలోని వారంతా ఎంతో ఆశ్చర్యం చెందారని మేము విన్నాం.
చిత్రాలు వేయడంలోనే కాదు, విగ్రహాలు మలచడంలో కూడ గదాధర్‌కు నైపుణ్యం ఉండేది. వివిధ దేవతల విగ్రహాలను ఎంతో అద్భుతంగా అతడు మలచేవాడు. అతడి సహజ ఆధ్యాత్మిక ప్రవృత్తియే, అతణ్ణి ఆ విగ్రహాల తయారీకి పురికొల్పేది. అతడు స్నేహితులతో కలిసి ఆ విగ్రహాలను శాస్త్రోక్తంగా పూజించేవాడు.
బడి మానుకొన్న తర్వాత అతడు ఇంట్లో తల్లికి సహాయపడుతూ ఉండేవాడు. అక్షయ్ అతడి అన్నకుమారుడు. పసితనంలోనే తల్లిని కోల్పోయిన ఆ అబ్బాయంటే గదాధర్‌కు ఎనలేని ప్రేమ. తన తల్లి ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు, ఈ శిశువు బాధ్యత తాను వహించేవాడు. ఆ శిశువును ఆడిస్తూ ఉండేవాడు. ఇది అతడి నిత్యకార్యక్రమంలో భాగమై ఉండేది.
అలా మూడు సంవత్సరాలు గడిచాయి. గదాధర్‌కు పదిహేడేళ్ళ వయస్సు వచ్చింది. కలకత్తాలో రాంకుమార్ నిర్వహిస్తున్న సంస్కృత పాఠశాల కూడ కాస్త పుంజుకోసాగింది. అతడి ఆదాయం కూడ ఒకింత మెరుగైంది.
రాంకుమార్ ఎక్కువకాలం కలకత్తాలోనే ఉండేవాడు. కాని సంవత్సరానికి ఒకసారి తప్పక కామార్పుకూర్ వచ్చి, కొన్ని వారాలు అక్కడ గడిపి వెళుతుండేవాడు. ఈమారు కూడ వచ్చాడు. వచ్చినప్పుడు చదువు విషయంలో గదాధర్కున్న ఉదాసీన వైఖరిని గమనించాడు. ఎంతో ఆందోళన చెందాడు కూడ. ఆ తర్వాత తన చిన్నతమ్ముడు తన సమయాన్ని ఎలా గడుపుతున్నాడో పరిశీలించాడు.
తరువాత తల్లితో సంప్రతించి గదాధర్‌ను తనతో పాటు కలకత్తా తీసుకు పోవడానికి నిర్ణయించుకొన్నాడు. తన సంస్కృత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అధికరించడంతో, పాఠశాల నిర్వహణలో ఒక సహాయకుడు అవసరమై ఉండడంచేత, తమ్ముణ్ణి కలకత్తా తీసుకుపోవడం సబబుగానే తోచింది రాంకుమార్‌కు. కాబట్టి గదాధర్ కలకత్తా వెళ్ళి అన్నగారికి కొంతలో కొంత సహాయపడుతూ, అతడి వద్దే ఇతర విద్యార్థులతోపాటు చదువుకోవచ్చని గూడా వారు నిర్ణయించారు. ఈ ప్రతిపాదన గురించి చెప్పినప్పుడు గదాధర్ కించిత్తు కూడ అయిష్టత వ్యక్తం చేయలేదు. తాను తండ్రిలా గౌరవించే అన్నగారికి తను ఈ రకంగా సహాయపడగలనని అతడు గ్రహించడమే ఇందుకు కారణం. ఒక శుభముహూర్తాన రాంకుమార్, గదాధర్లు తమ కులదైవం శ్రీరఘువీరునికి పూజాదిసేవలు ఒనరించి, తల్లి పాదధూళి స్వీకరించి కలకత్తాకు బయలుదేరారు. కామార్పుకూర్లో సంతోషాల సంతకు తెరపడింది. చంద్రాదేవి, ఇతర స్త్రీలు అతడి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకొంటూ, అతడి భవిష్యత్తు, సంక్షేమాన్ని తలచుకొంటూ కుదుటపడసాగారు.
బాల్య భావం సమాప్తం