1. క్షుదిరామ్ మరణంతో కుటుంబంలో ఏర్పడ్డ పరిణామాలు
క్షుదిరామ్ మరణం అతడి కుటుంబంలో చాలా మార్పులు తెచ్చింది. సుమారు నలభై నాలుగు సంవత్సరాల కాలం శ్రీమతి చంద్రాదేవి సుఖ దుఃఖాలలో అతడు ఆమెకు జీవన సహచరుడిగా ఉన్నాడు. అందుకే అతడు లేని లోటు ఆమెకు కొట్టవచ్చినట్లు కనిపించింది. ఆమెకు భర్తలేని ఈ ప్రపంచం శూన్యంగా తోచింది. అది సహజమే కదా!
మామూలుగానే ఆమె ఎప్పుడూ శ్రీ రఘువీరుని పాదపద్మాలను శరణు వేడుతూ ఉండేది. భర్త పోవడంతో ఇప్పుడామెకు ప్రపంచాసక్తి బొత్తిగా లేకుండా పోయింది. దానితో ఆమె మనస్సు ఇప్పుడు ఎల్లవేళలా ఆ దేవుని పాదాలనే ఆశ్రయించ సాగింది. అయితే మనిషి ఎంతగా కోరుకుంటున్నా, సమయం రానిదే సంసార బంధం అంత సులభంగా వీడిపోదు సుమా! ఏడేళ్ళ పిల్లవాడు గదాయ్, నాలుగు సంవత్సరాల కూతురు సర్వమంగళ ఆమెను అలా నిరాసక్తురాలిగా ఉంచలేకపోయారు. వారి మూలంగా మళ్ళీ ఆమెను, సంసారం తన వైపు లాక్కుంది. మళ్ళీ ఆమె సుఖ దుఃఖమయ జీవితానికి వశవర్తియైంది. అలా ఆమె శ్రీ రఘువీరుని సేవిస్తూ, తన చిన్నబిడ్డలను పోషిస్తూ దుఃఖమయ శేషజీవితాన్ని ఎలాగో గడపసాగింది.
ఇక సంసార భారమంతా ఇప్పుడు పెద్దకుమారుడు రాంకుమార్‌పై పడింది. దానితో శోకంతో దినాలను వ్యర్థంగా గడపడానికి అతడికి అవకాశం లేకపోయింది. దుఃఖీతురాలైన తల్లిని, చిన్నపిల్లలయిన తమ్ముణ్ణి, చెల్లెలిని చూడవలసిన బాధ్యతను అతడు గ్రహించాడు. అతడి పెద్ద తమ్ముడు రామేశ్వర్ స్మృతి, జ్యోతిశ్శాస్త్రాల అధ్యయనం పూర్తిచేశాడు. అతడు కుటుంబానికి ఆర్థికంగా ఎలా సహాయపడగలడో, ఆ విషయం కూడా చూడవలసి ఉంది. రామేశ్వర్‌కు ఇప్పుడు పద్ధెనిమిది ఏళ్ళు. అతడికి ఏదైనా పని చూపించడమే గాక, తాను కూడా ఇప్పుడు మరికాస్త ఎక్కువగా సంపాదించవలసిన అవసరం ఏర్పడింది.
ఇలాంటి అనేక సమస్యలు రాంకుమార్‌ను చుట్టుముట్టాయి. కుటుంబం కోసం చింతిస్తూ రాంకుమార్ కాలం గడపసాగాడు. అతడి భార్య ఎంతో యోగ్యురాలు, బుద్ధిమంతురాలు. అత్త చంద్రాదేవి వెనుకటిలా పనులు చేయక పోవడం చూసి, తానే చాలావరకూ అన్ని పనులు చేయడానికి పూనుకుంది. వంటా, వార్పూ మొదలైన ఇంటి పనులన్నీ తానే ఎక్కువగా చూసుకోసాగింది.
2. తండ్రి మరణంతో గదాధర్ మానసిక స్థితి
పసితనంలో తల్లి పోవడం, బాల్యంలో తండ్రి పోవడం, యౌవనంలో భార్య పోవడం – ఇవి మనిషి జీవితాన్ని శూన్యం చేసినట్లుగా, మరే ఇతర సంఘటనలూ చేయజాలవని విజ్ఞులంటారు. పసిబిడ్డకు తల్లి ప్రేమ వాత్సల్యాలే ప్రధానాశ్రయాలు. అందుచేత పసితనంలో తండ్రి చనిపోయినా, పసివానికి అంత బాధ ఏర్పడదు. కాని పసివాడు పెరిగి పెద్దవాడవుతున్నకొద్దీ, అతడి బుద్ధి వికసిస్తున్నకొద్దీ, అతడు తండ్రికి చేరువవుతుంటాడు. తండ్రి ప్రేమను పొందుతుంటాడు. తాను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే తల్లి కూడా తన అన్ని అవసరాలూ తీర్చజాలదని, తండ్రి మాత్రమే వాటిని పూరించగలడని తెలుసుకుంటాడు. ఆ స్థితిలో ఆ బిడ్డ మనస్సు తండ్రి వైపుకు ఆకర్షింపబడుతుంది. అలాంటి దశలో తండ్రి చనిపోతే, ఆ బిడ్డ మనస్సు దాన్ని తట్టుకోలేదు.
క్షుదిరామ్ మరణం కూడా గదాధర్‌కు ఇలాంటి తీవ్రబాధనే కలిగించింది. ప్రతిరోజూ అనేక చిన్న చిన్న సంఘటనలు అతడికి తండ్రిని జ్ఞాపకం చేస్తుండేవి. దానితో అతడి అంతరంగం ఎప్పుడూ ఒకానొక విషాదంతో నిండిపోయి ఉండసాగింది. కాని అతని మనోబుద్ధులు వయస్సుకు మించి పక్వమై ఉండేవి. కాబట్టి తన మనస్సులోని చింతలను బయటకు వ్యక్తం చేసేవాడు కాడు. అందరికీ అతడు వెనకటి చలాకీ గదాయ్గానే కనిపించేవాడు. నవ్వుతూ, ఆడుతూ, వినోదిస్తూ ఉండేవాడు. కాని గదాయ్ అప్పుడప్పుడు శ్మశానంలోకి, మాణిక్రాజా మామిడి తోపు లాంటి నిర్జన ప్రాంతాలకు వెళుతూ ఉండేవాడు; ఇతరులు అది గమనించినా, ఏమీతోచక అటువైపు వెళ్ళివుంటాడులే అని సరిపెట్టుకునేవారు. అందుకు మరోకారణం ఏదైనా ఉందేమోనన్న విషయం ఆ గ్రామస్థులకు తట్టేది కాదు.
గదాయ్ క్రమంగా గంభీరంగా ఉండడానికి, నిర్జన ప్రదేశాల్లో గడపడానికి ఎక్కువగా ఇష్టపడసాగాడు. అంతేకాదు, ఇప్పుడతడిలో పరిశీలనాశక్తి కూడా పెంపొందింది. లోకులను విమర్శనాత్మకంగా, నిశితంగా గమనించసాగాడు. వారి ప్రవర్తనలను సూక్ష్మంగా పరీక్షించ సాగాడు.
3. ఇప్పుడు తల్లిపట్ల గదాయ్ ప్రవర్తన
ఒకే విధమైన దుఃఖాన్ని, బాధలను అనుభవించేవారంతా పరస్పరం సన్నిహితులవు తారని అంటారు. ఇప్పుడు గదాధర్, తల్లికి మరింత సన్నిహితుడయ్యాడు. కారణం ఇదేనేమో! ఇప్పుడు ఎక్కువ కాలం అతడు తల్లి వద్దే గడపసాగాడు. దైవ పూజాసేవల్లో, ఇతర ఇంటి పనుల్లో యథాశక్తి తల్లికి తోడ్పడసాగాడు. అలా చేయడంలో ఎంతో ఆనందించేవాడు. తాను తల్లివద్ద ఉన్నంతకాలం, ఆమె తన బాధను చాలావరకు మరచిపోయేదన్న విషయాన్ని అతడు త్వరలోనే గ్రహించాడు
తల్లిపట్ల అతడు ప్రవర్తించే తీరులో కూడ కాస్త మార్పు వచ్చింది. ఇంతకు ముందు అది కావాలని, ఇది కావాలని తల్లి దగ్గర మంకుపట్టు పట్టేవాడు. ఇప్పుడలా మొండికేయడం లేదు. తాను కోరింది ఆమె ఇవ్వలేకపోతే, ఆమె చాలాబాధ పడుతుందని అతడు గ్రహించాడు. ఆమెను బాధపెట్టడం ఇష్టంలేక, గదాధర్ తన మొండితనాన్ని వదులుకున్నాడు. తండ్రి పోవడం వల్ల, ఇక తల్లిని అన్నివిధాలా తానే ‘కాపాడాలి’ అన్న భావం అతడి హృదయంలో జనించింది.
4. సాధువులతో గదాధర్ సాంగత్యం
గదాధర్ మళ్ళీ బడికి వెళ్ళసాగాడు. పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కాని పాఠాలకంటే పురాణ కథలు, నాటకాలలోని పాటలు వినడంలో అతనెక్కువ ఆసక్తి చూప సాగాడు. రకరకాల దేవతా విగ్రహాలను తయారు చేస్తూండే వాడు. వీటిలోనే అతడికి ఎక్కువ ఆనందం లభించేది. ఇలా తండ్రి లేని లోటును మరచిపోవచ్చని, వీటిపై అతడు ఎక్కువ మక్కువ చూపసాగాడు.
అతడి అసాధారణ స్వభావం, అతడి దృష్టిని మరొక కొత్త విషయం వైపు మరల్చింది. అదే సాధుసాంగత్యం. ఆ ఊరి జమీందారులు లాహాబాబులు. వారు తమ ఊరికి ఆగ్నేయంలో, పూరీ క్షేత్రానికి వెళ్ళే దారిపక్కన, యాత్రికుల సౌకర్యార్థం ఒక చక్కని సత్రాన్ని కట్టించివున్నారు. పూరీ జగన్నాథస్వామిని దర్శించడానికి వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు చాలామంది సాధువులు, బైరాగులు ఈ సత్రంలో కొంతకాలం గడుపుతూ ఉండేవారు. ఆ సమయంలో వారు ఊళ్ళోకి వచ్చేవారు. ఇంటింటా భిక్ష గ్రహించి వెళ్ళుతుండేవారు.
సంసారం ఎంత అశాశ్వతమో ఇదివరకే గదాధర్ వినివున్నాడు. తండ్రి మరణంతో ఆ విషయం అతడికిప్పుడు రూఢి అయింది. అనిత్యమైన ఈ సంసారాన్ని త్యజించి, భగవత్సాక్షాత్కారం కోసం సాధనలు చేయడానికే సాధువులు, బైరాగులు తమ కాలాన్ని వినియోగిస్తారనీ, అలాంటి సాధుపుంగవుల సాన్నిధ్యం మానవులకు పరమశాంతిని ప్రసాదిస్తుందనీ, పురాణాల ద్వారా గదాధర్ గ్రహించివున్నాడు. అందుచేత సాధుసాంగత్యం చేయాలన్న కోరికతో, అప్పుడప్పుడు గదాయ్ సాధువులు బసచేసే ఆ సత్రానికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఉదయసాయంకాలాల్లో వారు పవిత్ర ‘ధుని’ (మంట) రగిలించేవారు. ఆ ‘ధుని’ చుట్టూ కూర్చుని వారు భగవద్ధ్యానం చేసేవారు. ఆ సాధువులు భిక్షలో తమకు లభించిన మామూలు ఆహారాన్నే తమ ఇష్టదేవతలకు సమర్పించి, ఆ ప్రసాదాన్ని పరమానందంతో ఆరగించి తృప్తిపడేవారు. వారు తామెప్పుడైనా తీవ్రరోగాలకు గురి అయితే, తమ మొత్తం భారాన్ని భగవంతునిపై మోపి, ఆ రోగబాధలను ఎంతో శాంతంగా సహించేందుకు ప్రయత్నించేవారు. తమ అవసరాల కోసం ఇతరులకు శ్రమనివ్వడం కూడ వారు ఇష్టపడేవారు కారు.
గదాధర్ సాధువుల జీవితాలను ఇలా క్షుణ్ణంగా పరిశీలించేవాడు. ఈ పరిశీలనలో అతడికి మరో సత్యం కూడ తెలియవచ్చింది. కొంతమంది వంచకులు కూడా తమ స్వార్థసిద్ధి కోసం సాధువుల వేషాలు ధరించి, నిజమైన సాధువుల్లా నటిస్తూ, మోసాలు చేస్తూ, సదాచారాలను పాడు చేస్తుండేవారు. అలాంటి దొంగ సాధువుల విషయం కూడా గదాధర్‌కు తెలిసివచ్చింది.
అలా గదాధర్ నిజమైన సాధువులు ఎవరో, దొంగ సాధువులు ఎవరో తేలికగా గ్రహించే శక్తి సంపాదించాడు. నిజమైన సాధువులు కనిపిస్తే మాత్రం, వారికి వంటచెరకు, మంచినీళ్ళు తెచ్చివ్వడం, చిన్న చిన్న ఇతర పనులు చేసిపెట్టడం చేసేవాడు. వారితో సన్నిహితంగా మెలగేవాడు. ఆ సాధువులు కూడా ఈ ముద్దుల బాలుని సేవలకు, శుశ్రూషలకు ఎంతో సంతోషించేవారు. అతడికి తమకు తెలిసిన చక్కని భజనలు, కీర్తనలు నేర్పించేవారు. మంచి మంచి బోధనలు చేసేవారు. నివేదన చేసిన తమ భిక్షాన్నంలో కొంత అతడికి పెట్టి, అతనితోపాటు తామూ తింటూ తృప్తిపడేవారు.
కాని గదాయ్ అందరితోనూ ఇలా ఉండే అవకాశం లేకపోయింది. అనేక కారణాల రీత్యా, సత్రంలో బసచేసే సాధువులతోనే అతడు సన్నిహితంగా ఉండేవాడు.
5. ఈ సందర్భంగా చంద్రాదేవిలో జనించిన భయం తొలగిపోయిన తీరు
గదాధర్‌కు ఎనిమిదవ సంవత్సరం నడుస్తోంది. ఒక రోజు ఆ సత్రంలోకి కొంతమంది సాధువులు వచ్చి బసచేశారు. వారు చాలా దూరప్రయాణం చేసి ఉంటారు; అలసిపోయారు. ఎందుకో తెలియదు కాని, ఆ సత్రంలో వారు చాలా రోజులవరకు ఉండిపోయారు. గదాయ్ వారితోపాటు ఉంటూ, వారికి సేవలు చేస్తూ, త్వరలోనే వారి ప్రేమకు పాత్రుడయ్యాడు. వారితో గదాయ్ కలిసి ఉంటున్నాడన్న విషయం మొదట్లో ఎవరికీ తెలియదు. కాని రోజులు గడుస్తున్నకొద్దీ, ఆ విషయం ఊరంతా తెలిసిపోయింది. గదాయ్ ఎక్కువ కాలం వారితోనే గడుపుతున్నాడన్న సంగతి అందరూ గ్రహించారు.
ఒకరోజు గదాయ్ వారివద్ద చాలాసేపు గడిపి, ఇంటికి తిరిగివచ్చాడు. ఆ రోజు ఇంట్లో ఏమీ తినలేదు. తల్లి కారణం అడిగితే, సాధువుల వద్ద తిని వచ్చానని చెప్పాడు. ఆ రోజు చంద్రాదేవి ఆ విషయం అంతగా పట్టించుకోలేదు. అలా చాలాసార్లు జరిగింది. సాధువులకు తన కొడుకంటే ప్రీతి ఏర్పడడం చూసి, ఆమె సంతోషించింది తప్ప, ఏమాత్రమూ కీడు శంకించలేదు. సాధువుల ఆశీస్సులు తన కుమారుడికి లభించడం చూసి, ఆనందంతో కుమారుడి ద్వారా వారికి తినుబండారాలు, ఇతర అవసర వస్తువులు కూడా పంపించేది.
కాని క్రమంగా ఆమెలో కాస్త అలజడి ఏర్పడింది. అప్పుడప్పుడు గదాయ్ ఒళ్ళంతా భస్మం (బూడిద) పూసుకుని వచ్చేవాడు. ఒక రోజు తిలకం పెట్టుకుని కనిపించేవాడు. ఒకోరోజు తన బట్టలనే చింపి, కౌపీనంగా ధరించి వచ్చేవాడు. “అమ్మా, అమ్మా! చూడు, సాధువులు నన్నెలా అలంకరించారో!” అంటూ ఆనందంగా చూపించేవాడు.
ఆ వేషాలు చూసి చంద్రాదేవి కలవరపడింది. సాధువులు తన గదాయ్ను మాయ మాటలు చెప్పి ఎత్తుకుపోతారేమోనని భయపడింది. ఒక రోజు గదాయ్కు తన భయం చెప్పి, వలవలా ఏడ్చింది. అతడు తల్లిని శాంతింపచేయడానికి ఎంతో ప్రయత్నించాడు. కాని ఆమెలోని భయం, ఆందోళన దూరం కాలేదు. తల్లి బాధ చూసి, తానిక సాధువుల వద్దకు వెళ్ళనని తల్లికి మాటఇచ్చాడు. దానితో ఆమె మనస్సు కాస్త కుదుటపడింది.
తన మాటను ఆచరణలో పెట్టడానికి ముందు, చివరిసారిగా సాధువుల వద్దకు వెళ్ళాడు. వారికి విషయం చెప్పి, తానిక వారి వద్దకు రానని చెప్పాడు. వెంటనే సాధువులు గదాయ్తోపాటు చంద్రాదేవి వద్దకు వచ్చారు.
“అమ్మా! నువ్వు గదాయ్ విషయమై భయపడవలసిన అవసరం లేదు. అతణ్ణి మా వెంట తీసుకొనిపోవాలని మే మెప్పుడూ అనుకోలేదు. దైవసాక్షిగా మాకు అలాంటి ఆలోచన ఏమాత్రమూ లేదు. పైగా ఇంత చిన్నపిల్లవాడిని, తల్లిదండ్రుల అనుమతి లేకుండా తీసుకు వెళ్ళడం దొంగతనమే అవుతుంది. అలాంటి పాపం మేమెలా చేస్తామమ్మా! అది మహాపరాధం తల్లీ! కాబట్టి నువ్వేం భయపడకు” అంటూ రకరకాలుగా ఆమెకు నచ్చజెప్పారు.
వారి మాటలు విన్న తర్వాత చంద్రాదేవి మనస్సు నుండి ఆ భయం పూర్తిగా తొలగిపోయింది. సాధువులు కోరినట్లుగానే వెనుకటిలాగే తన కొడుకును వారి వద్దకు పంపసాగింది.
6. రెండవసారి గదాధర్‌కు భావసమాధి
ఈ దశలో గదాయ్కు జరిగిన మరో సంఘటన చూసి తల్లి ఎంతో ఆందోళనకు గురైంది. ఆ సంఘటన హఠాత్తుగా జరిగిందని అందరూ అనుకున్నారు. కాని మాకు అలా అనిపించడం లేదు. ఆ బాలునిలో వికసిస్తున్న ఆధ్యాత్మిక భావం, గంభీర చింతనల ఫలితంగానే అది జరిగిందని మేము అనుకొంటున్నాం.
ఇక ఆ సంఘటన గూర్చి చెప్పుకొందాం.
కామార్పుకూర్కు ఉత్తరంగా రెండుమైళ్ళ దూరంలో ‘అనూర్’ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోని విశాలాక్షి* దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఒకరోజు గదాయ్ ఆ దేవి దర్శనార్థం ఆ ఊరు వెళ్ళుతున్నాడు. కాని మధ్య దారిలోనే బాహ్యస్మృతి కోల్పోయాడు. ఆ రోజు అతడితో ఉన్నవారిలో ధర్మదాస్ లాహా సోదరి ప్రసన్నమయి కూడ ఉంది. ఆమె దైవభక్తి పరాయణురాలు. గదాధర్ స్థితి చూసి, ఆధ్యాత్మిక భావావేశం వల్లనే అతడికి అలా జరిగిందని ఆమె మాత్రమే గ్రహించింది. ఆమె మాటలను చంద్రాదేవి నమ్మలేదు. వాతరోగం వల్లగానీ, మరేదో గాలి సోకడం వల్లగాని తన గదాయ్కు అలా జరిగిందని ఆమె అనుకుంది. ఆందోళన చెందింది. కాని దేవిని ధ్యానిస్తూండడం వల్ల, ఆమె పవిత్ర పాదపద్మాల్లో తన మనస్సు లయించడం వల్ల తనకా అవస్థ కలిగిందని గదాయ్ తల్లికి చెప్పాడు.
7. గదాధర్ ఆప్తమిత్రుడు గయావిష్ణు
అలా మరి రెండేళ్ళు గడిచిపోయాయి. గదాధర్‌కు క్రమంగా ‘తండ్రిలేమి’ మరుగున పడింది. సుఖ దుఃఖాలతో కూడిన మామూలు జీవితంలో అతడు నిమగ్నుడైపోయాడు. ధర్మదాస్ లాహా, క్షుదిరామ్కు ప్రాణస్నేహితుడని చెప్పుకున్నాం కదా! గయావిష్ణు ఆ ధర్మదాస్ కుమారుడే. అతడికీ, గదాయ్కూ మంచి స్నేహం కుదిరింది. వారిద్దరూ కలసిమెలసి ఆడుకునేవారు, పాఠాలు నేర్చుకునేవారు. వారు సదా ఒకరిని వదలి మరొకరుండేవారే కాదు.
గ్రామంలోని స్త్రీలు మునుపటిలాగే గదాధర్‌ను భోజనానికి పిలుచుకుని వెళ్ళేవారు. కాని తన స్నేహితుడు లేకుండా గదాయ్ వెళ్ళేవాడు కాడు. ‘ధని’ మంచి పిండివంటలు, మిఠాయిలు అతడికి ఇస్తే, వాటిలో కొంత స్నేహితుడికి పెట్టిన తరువాతే గదాయ్ తినేవాడు.
8. గదాధర్ ఉపనయనం
గదాయ్కు ఇక తొమ్మిదవ సంవత్సరం వస్తుందని, అతని పెద్దన్న రాంకుమార్ గ్రహించాడు. కాబట్టి అతడికి ‘ఉపనయన సంస్కారం’ చేయడానికి ఏర్పాట్లు చేయసాగాడు. కమ్మరి కులానికి చెందిన ‘ధని’ అంతకు ముందే, ఎంతోకాలం క్రితం గదాయ్ను ఒక కోరిక కోరివుంది. ఉపనయనంలో మొదటి భిక్ష తన నుండి స్వీకరించాలని తనను ‘అమ్మా’ అని పిలవాలని, అలా తనను తరింపచేయాలని కోరుకుంది. ఆమె మాతృప్రేమకు కరిగిపోయి “తప్పకుండా నీ కోరిక తీరుస్తాను” అని గదాయ్ మాట ఇచ్చాడు. ఆ పేదరాలు ఆ పిల్లవాని మాటలు నమ్మి, ఆనాటి నుండి కొంత కొంతగా డబ్బును ప్రోగుజేసుకుంది. ఇతర వస్తువులను సమకూర్చుకుంది. అలా ఏర్పాటు చేసుకుని, ఆ శుభముహూర్తం కోసం ఎదురుచూడసాగింది.
ఇప్పుడా సమయం రానే వచ్చింది. గదాయ్ తాను ధనికి ఇచ్చిన మాట గురించి తన అన్నకు చెప్పాడు. అది విని, అది కుదరని విషయం అన్నాడు రాంకుమార్.
“మన వంశంలో ఇలాంటి అనాచారం ఎప్పుడూ లేదు” అని కాదన్నాడు.
కాని గదాయ్ మాత్రం తాను ధనికి మాట ఇచ్చానని, దాన్ని తప్పక నెరవేరుస్తానని పట్టుపట్టాడు.
“లేకపోతే నేను అసత్యవాది నౌతాను. అసత్యం చెప్పేవాడు బ్రాహ్మణునికి అర్హమైన యజ్ఞోపవీతాన్ని ధరించడానికి యోగ్యుడు కాడు” అని అన్నాడు.
ఉపనయనానికి అన్ని ఏర్పాట్లూ ఇదివరకే జరిగిపోయాయి. గదాధర్ మాట వినకుంటే, ఆ ఏర్పాట్లన్నీ వమ్మయిపోయే ప్రమాదం ఏర్పడింది. ధర్మదాస్ లాహాకు విషయం తెలిసింది. అతడు వచ్చి అన్నదమ్ముల తగాదాను పరిష్క రించడానికి ప్రయత్నించాడు.
“రాంకుమార్! ఇలాంటి ఆచరణ ఇంతకు ముందు మీ వంశంలో ఎప్పుడూ జరగలేదన్నది నిజమే. కాని ఇతర సద్బ్రాహ్మణుల కుటుంబాలలో అప్పుడప్పుడు ఇలా జరగడం ఉంది. కాబట్టి ఇదేమంత అనాచారం కాదు. పైగా తమ్ముడు మాట ఇచ్చాడు. అతడి మాటను నిలబెట్టవలసి కూడా ఉంది కదా! అతణ్ణి సంతోషింపజేయడంలో తప్పేమీ లేదు” అంటూ రాంకుమార్‌కు అతను నచ్చచెప్పాడు.
పెద్దవాడు, తండ్రికి ప్రాణస్నేహితుడు అయిన ధర్మదాస్ లాహా మాటను రాంకుమార్ కాదనలేకపోయాడు. ఒప్పుకున్నాడు.
గదాయ్ ఆనందంతో శాస్త్రోక్తంగా యజ్ఞోపవీతాన్ని ధరించాడు. ధని వద్ద నుండి మొదటి భిక్ష గ్రహించి ఆమెతో మాతృసంబంధం కల్పించుకున్నాడు. ఆ క్షణం నుండి సంధ్యావందనాది ద్విజోచిత కర్మలను అతడు ఎంతో శ్రద్ధతో ఆచరించసాగాడు.
అతడితో ఏర్పడిన ఈ నూతన సంబంధంతో తాను తరించానని భావించి ధని ఆనందంతో పొంగిపోయింది.
ఉపనయనం జరిగిన కొంత కాలానికి గదాధర్ పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు.
9. పండిత సమావేశంలో వివాదాస్పద శాస్త్రాంశాన్ని గదాధర్ పరిష్కరించడం
ఆ పదవ ఏటే, గదాధరుని అసాధారణ ప్రజ్ఞ వెల్లడయ్యే సంఘటన ఒకటి జరిగింది. అది వారినందరినీ అద్భుతాశ్చర్యానికి లోనుచేసింది. జమీందారు లాహా గృహంలో ఒక విశేష శ్రాద్ధకర్మ జరిగింది. ఆ సందర్భంలో అతడొక పెద్ద పండిత సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. పండితులు శాస్త్ర విషయాల గురించి చర్చిస్తున్నారు. పైగా పండితులు తర్క యుక్తంగా, ప్రమాణ యుక్తంగా, శాస్త్రాలను ఉదాహరిస్తూ వాదోపవాదాలు చేస్తున్నారు. శాస్త్రాల్లో ప్రవేశమున్నవారికే, ఆ విషయాలు అర్థమౌతాయి, ఆసక్తి గొల్పుతాయి. పదేళ్ళ గదాధర్ వారి చర్చలను పరమాసక్తితో, ఏకాగ్రతతో వింటున్నాడు. వారిని గంభీరంగా పరిశీలిస్తున్నాడు. అంతలో ఆ పండితుల మధ్య ఒక జటిల సమస్య వచ్చిపడింది. దాని గురించి చాలా లోతుగా వాదోపవాదాలు చేసుకున్నారు. అయినా వారికి తృప్తికరమైన సమాధానం రాలేదు. అంత శ్రద్ధగా వింటున్న గదాధరుడు నెమ్మదిగా – ‘మీ సమస్యకు ఇది జవాబు కాదా?’ – అంటూ పరిష్కారం చెప్పాడు. ఆ పరిష్కారం ఆ సమస్యకు కచ్చితంగా సరిపోయింది. జటిలమైన శాస్త్ర విషయానికి బాలుడు, శాస్త్రజ్ఞానంలేని పిల్లవాడు అంత శాస్త్రీయ సమాధానం చెప్పేసరికి పండిత సమూహమంతా విస్మయం చెందింది. ఆ తర్వాత గదాయ్ని ఎంతో ప్రశంసించారు. మనసారా ఆశీర్వదించారు.
10. మూడవసారి గదాధర్‌కు భావసమాధి
యజ్ఞోపవీతాన్ని ధరించిన తర్వాత గదాధర్ ఎంతో సంతోషించాడు. అతడు మనసారా కోరుకొంటున్న దైవపూజాదులను చేయడానికి ఇప్పుడతడికి అర్హత, అవకాశాలు లభించాయి కదా! శ్రీ రఘువీరుని చైతన్యమయ శిలావిగ్రహం తండ్రికి స్వప్నంలో సాక్షాత్కరించిన వైనం, శ్రీ రఘువీరుడు తమ ఇంట కొలువు చేసిన తర్వాత ‘లక్ష్మీజల’ అనే తమ కొద్దిపాటి పొలం సమృద్ధిగా పండుతున్న విషయం, దాంతో తమ కుటుంబ అవసరాలు తీరడం; కరుణామయియైన తన తల్లి అతిథి అభ్యాగతులను ఆదరించేటందుకు ఆ ధాన్యం తోడ్పడడం – ఈ విషయాలన్నీ గదాధర్‌కు తెలియవచ్చాయి. అందుకే మొదటి నుండి తమ కులదైవం శ్రీ రఘువీరుడంటే అతడికి అమిత శ్రద్ధాభక్తులు ఏర్పడ్డాయి. అలాంటి శ్రీ రఘువీరుణ్ణి స్మరించి, పూజించే సదవకాశం అతడికిప్పుడు లభించింది. దాంతో అతడి హృదయం వినూత్న భక్తిభావంతో నిండిపోయింది. సంధ్యావందనాదులు ముగించి, ఆ తర్వాత గదాధర్ పూజకు కూర్చునేవాడు. అప్పుడు చాలాసేపటి వరకు పూజ ధ్యానాలలోనే గడిపేవాడు. శ్రీ రఘువీరుడు తన తండ్రికి దర్శనం ఇచ్చినట్లుగానే, తనకూ ఇవ్వాలని, తనను కూడా ఆదేశిస్తూ ఉండాలని గదాధర్ ఆకాంక్ష. అందుకే అతడు పరమ నిష్ఠతో, భక్తిప్రపత్తులతో భగవదారాధన చేయసాగాడు. రఘువీరుడినే కాదు, రామేశ్వర శివుణ్ణి, శీతలాదేవిని కూడ సేవించసాగాడు. ఎంతో శ్రద్ధగా, భక్తిప్రపత్తులతో చేస్తున్న అతడి పూజలు సత్వరమే ఫలితాన్ని చూపాయి. గదాధర్ అంతఃకరణం శుద్ధిచెంది, అది భగవంతుని పూజలో పూర్తిగా నిమగ్నం కాసాగింది. అలాంటి దశలో అతడు భావ సమాధిని (సవికల్ప సమాధి) పొందసాగాడు. అంతేకాదు, అతడికి అప్పుడప్పుడు దివ్య దర్శనాలు కూడ కలుగసాగాయి. ఆ ఏడు శివరాత్రి నాడు అతడు ఇలాంటి సమాధిని, శివదర్శనాన్ని పొందాడు.
ఆ శివరాత్రినాడు గదాధర్ ఉపవాసం చేశాడు. ఎంతో నిష్ఠతో, భక్తితో మహాదేవుణ్ణి పూజిస్తున్నాడు. అతడి స్నేహితులు గయావిష్ణు మొదలైనవారు కూడ ఉపవాసం ఉన్నారు. పొరుగునే ఉన్న సీతానాథ్ పాయిన్ ఇంట్లో ఆ రాత్రి శివమహిమను తెలిపే ‘యాత్ర’ (వీథి నాటకం) జరుగుతోంది. వారంతా ఆ నాటకం చూస్తూ జాగరణ చేయదలిచారు.
గదాధర్ మొదటి ప్రహర పూజను ముగించాడు. శివధ్యానంలో నిమగ్నుడై వున్నాడు. ఆ స్థితిలో ఉండగా గయావిష్ణు మొదలైన స్నేహితులు అతడి దగ్గరకు వచ్చారు.
“గదాయ్! గొప్ప సమస్య వచ్చిపడింది. నాటకంలో శివుని వేషం వేసే వ్యక్తికి జ్వరం వచ్చిందట, అతడు రాలేదు. శివుని వేషం ధరించడానికి మరెవ్వరూ లేరు. నువ్వు ఆ శివుని వేషం ధరించాలి. ఏమంత కష్టం కాదులే! రెండు మూడు సంభాషణలే. నువ్వు అలవోకగా చేసేస్తావు. కనుక వెంటనే రా” అంటూ పట్టుబట్టారు.
“అబ్బే! ఇప్పుడెలా కుదురుతుందీ? నేను శివపూజలో ఉన్నాను కదా! పూజకు విఘ్నం కలగదా!” అంటూ గదాయ్ అభ్యంతరం చెప్పాడు. అతడి మాటలు వారు పట్టించుకోలేదు.
“మరేం ఫరవాలేదు. శివుని వేషం వేసే వ్యక్తి, శివుడిలా ధ్యానం చేయవలసి ఉంటుంది. కాబట్టి అది శివపూజే అవుతుంది. పైగా నీ మూలంగా, ఎంతోమందికి నిరాశ తప్పి ఆనందం కలుగుతుంది. లేకపోతే నాటకం చూడాలని వచ్చిన జనం నిరాశ, అసంతృప్తితో తిరిగి పోవలసి వస్తుంది. కాబట్టి అంతమంది భక్తులను ఆనందపరచేందుకైనా నువ్వు వచ్చి శివపాత్ర పోషించాల్సిందే. పైగా మేము కూడ ఉపవాసం ఉన్నాం. జాగరణ చేయాలి కదా! మాకోసమైనా ఒప్పుకోవా?” అంటూ వారు గదాయ్ను ఎంతో బలవంతపెట్టారు.
చివరికి గదాయ్ వారి కోరికను మన్నించాడు. వారి వెంట వెళ్ళాడు. వారు గదాయ్ను అద్భుతంగా అలంకరించారు. అచ్చు శివునిలాగే కనిపించేలా చేశారు.
తలపై జటాజూటాలు, మెడలో, ఇతర అంగాల్లో రుద్రాక్షమాలలున్నాయి. ఒళ్ళంతా విభూతి. ఆ అలంకరణతో అతడు ‘శివుని’ గా రంగస్థలం మీదికి వచ్చాడు. వచ్చి ధ్యానంలో కూర్చున్నాడు. ఆ రూపం, ఆ ధ్యానం చూసి జనమంతా ఎంతో ఆనందించారు. కాని గదాధర్ కృత్రిమ ధ్యానం పాటించడం లేదన్న సంగతి ఎవరికీ తెలియదు. నిజంగానే ధ్యానంలో లీనమైపోయాడు. అతడి మనస్సు భావసమాధిని పొందింది. అలా చాలాసేపు గడిచింది. ఎంతసేపటికీ అతడికి బాహ్యస్మృతి రాలేదు. అది చూసి, అంతా ఆందోళన చెంది, ఆ రాత్రికి ఆ వీథినాటకాన్ని మధ్యలోనే ఆపివేశారు.
11. గదాధర్‌కు పదేపదే భావసమాధులు కలగడం
అప్పటి నుండి గదాధర్‌కు ఇలాంటి సమాధులు తరచూ కలుగసాగాయి. ధ్యానం చేస్తున్నప్పుడు, భగవంతుని కీర్తనలు, స్తోత్రాలు చేస్తున్నప్పుడు, అతడు పరవశత్వం చెందేవాడు. ఆ సమాధిలో అతడి మనస్సు అంతరంగంలో లీనమయ్యేది. లీనమై ఉన్నంతకాలం అతడికి బాహ్యవిషయస్ఫురణ ఉండేది కాదు! ఈ పరవశత్వం అప్పుడప్పుడు మరింత ప్రగాఢమయ్యేది. ఆ స్థితిలో అతడు ఒక శిలావిగ్రహంలా కనిపించేవాడు. బాహ్యస్మృతి వచ్చిన తర్వాత అతణ్ణి ఆ పరవశత్వం గురించి ఇతరులు అడిగేవారు. “నేను ఏ దేవుణ్ణి ధ్యానం చేస్తుంటానో లేదా ఏ దేవీదేవతల కీర్తనలను వింటానో, ఆ దేవీదేవతల దర్శనం నాకు కలుగుతుంటుంది. ఆ సమయంలో వర్ణనాతీతమైన దివ్యానందంలో ఉండిపోతాను” అని చెప్పేవాడు.
అతడి ఈ ధ్యానపారవశ్యస్థితులు, భావసమాధులు చంద్రాదేవికి కుటుంబ సభ్యులకు చాలాకాలంవరకు భయాన్నే కలిగించాయి. కాని వాటివల్ల అతడి ఆరోగ్యం చెడకుండటం, పైగా అతడు తన పనులను మామూలుగానే చేసుకోవడం చూసి, వారు భయపడడం మానేశారు. అతడు మామూలుగానే ఉల్లాసంగా ఉండడం చూసి వారి భయం తీరిపోయింది.
ఇలాంటి భావసమాధులు తరచూ కలుగుతూండటం చేత గదాధర్ వాటికి అలవాటుపడిపోయాడు. అంతేకాదు, ఆ స్థితి అతడికి ‘ఇచ్ఛాధీనం’ అయింది. దానితో అతడు సూక్ష్మ ఆధ్యాత్మిక విషయాలను, రకరకాల దేవతల గురించిన సత్యాలను ప్రత్యక్షంగా తెలుసుకోసాగాడు. కాబట్టి ఆ భావసమాధులు అతడికి సంతోషాన్నే కలిగించేవి. భయం కలిగించేవి కావు.
అలా అతడి ఆధ్యాత్మిక ప్రవృత్తి మరింత ప్రగాఢమైంది. శ్రీహరినామ సంకీర్తనం, మానసాదేవి పూజ, ధర్మదేవతార్చన – ఇలా గ్రామంలో జరిగే ప్రతి ధార్మిక కార్యంలో అతడు పాల్గొనడం మొదలుపెట్టాడు. హృదయపూర్వకంగా ఆయా పూజాకార్యకలాపాలను చేసేవాడు.
అతడి ధార్మిక ప్రవృత్తి మహా ఉదారమైనది. అందుకే రకరకాల దేవతలను పూజించే భక్తులనంతా ఒకటిగానే చూసేవాడు. ఎవరినీ ద్వేషించేవాడు కాడు. అందరితో ఒకేవిధమైన మైత్రీభావంతో మెలగేవాడు. ఈ గ్రామంలో మొదటి నుండి వస్తున్న సంప్రదాయం కూడా, అతడి ప్రవృత్తికి దోహదం చేసిందని చెప్పవచ్చు. ఇతర గ్రామాల్లోలా కాక, ఈ గ్రామంలో శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, ఇలా అన్ని సంప్రదాయాలకు చెందిన వారంతా కలసిమెలసి ఉండేవారు. ఎవరికీ మరొకరిపై ఎలాంటి వైషమ్యమూ ఉండేది కాదు. పరస్పరం మైత్రితో మసలు కుంటూ, జీవిస్తూ ఉండేవారు.
12. చదువు విషయంలో గదాధర్ ఉదాసీనత
గదాధర్లో ఆధ్యాత్మిక వికాసం కలుగుతున్నా, అతడు చదువు విషయంలో ఎలాంటి ఉత్సాహమూ చూపలేదు. ‘పండిత’, ‘భట్టాచార్య’ మొదలైన బిరుదాంకితుల దైనందిన జీవితాలను అతడు పరిశీలించి చూసేవాడు. వారెంత విద్యా వంతులైనా మామూలు జనం మాదిరే జీవించేవారు. లౌకిక సుఖభోగాలకు, ధనసంపదలకు అర్రులు చాచేవారు. చదువుకున్నవారు కూడ అలా ప్రాపంచిక ప్రాయులుగా ఉండడం చూసి, గదాధర్‌కు విద్య అంటే క్రమంగా ఉదాసీనత ఏర్పడింది. మనుషులు ఏ ఆశయంతో పనులు చేస్తూంటారో, అతనికా ఆశయం తీవ్రపరిశీలన ద్వారా తెలిసిపోతుండేది. ఆ ఆశయాన్ని తన తండ్రి జీవితాదర్శంతో పోల్చిచూసుకునేవాడు. తన తండ్రికి ఉన్న వైరాగ్యం, దైవభక్తి, సత్యనిష్ఠ, సదాచారం, ఆధ్యాత్మికత, వీటితో బేరీజు వేసుకొని చూసుకునేవాడు. అలా వివేచించి చూశాక అతడికో సత్యం తెలిసింది: ‘చాలావరకు ప్రపంచంలో అందరి ప్రధాన ఆశయం ఒక్కటే: అదే భౌతికత’ – ఈ సత్యం తెలిసి ఎంతో ఆశ్చర్యపోయేవాడు.
“అయ్యో! అనిత్యమైన ఈ సంసారాన్ని నిత్యమని భావించి మోహగ్రస్తులౌతున్నారే! ఆ మోహంలో పడిపోయి అనుక్షణం దుఃఖాలను అనుభవిస్తున్నారే!” అన్న విషయం తెలుసుకొని గదాధర్ ఎంతో వ్యథ చెందేవాడు. అందుచేత తన జీవితానికి మరొక మలుపు ఇవ్వదలిచాడు. ఇలా అతడు సంకల్పించుకోవడంలో వింతేమీలేదు కదా!
పదకొండేళ్ళ బాలుడికి అంతటి ఆంతరిక అవలోకన, వివేచన సాధ్యమా? – అన్న సందేహం రావడం సహజమే. కాని గదాధర్ మామూలు పిల్లలలాంటి సాధారణ బాలుడు కాడన్న విషయం మనం ముందు గ్రహించాలి. అతడు అసాధారణ ప్రతిభాసంపన్నుడు, అద్భుత మేధాశక్తియుక్తులు కలవాడు. అంతేకాదు, అతడు విశుద్ధ సంస్కారంతో జన్మించాడు. కాబట్టి వయసులో చిన్నవాడైనప్పటికీ అతడికి ఆ గంభీర పరిశీలనాశక్తి ఉండడంలో మనం ఆశ్చర్యచకితులం కానక్కరలేదు.
మరొక విషయం. ఎవరు ఏ విధంగా భావించినా, నిజాలను జరిగినవి జరిగినట్లు చెప్పటమే మా కర్తవ్యం. వాటిని మేము సంపూర్ణంగా పరిశీలించి, అవి నిజమేనని రూఢి అయిన తర్వాతనే వాటిని తెలియజేస్తున్నాం.
13. గదాధర్ విద్యాభ్యాస పురోగతి
సరే, ఏది ఏమైనా అప్పటికే అమలులో ఉన్న చదువుపట్ల గదాధర్‌కు క్రమేణా ఉదాసీనత ఏర్పడింది. అది రోజురోజుకూ ఎక్కువ కాసాగింది. అయినా అతడు మామూలుగా రోజూ బడికి వెళ్ళడం మాత్రం మానలేదు. ఆ పాఠాలు నేర్చుకునేవాడు కూడ. మాతృభాషలో అచ్చయిన పుస్తకాలను చక్కగా చదువు కునేటంత భాషా సామర్థ్యం అతడికి అలవడింది. మాతృభాషలో చక్కగా రాయగలిగేవాడు కూడ. ఆ మాత్రం భాషాజ్ఞానంతో అతడు రామాయణ, భారతాది ఆధ్యాత్మిక గ్రంథాలను చక్కగా చదివేవాడు. అతడు చదువుతుంటే వినేవారు ఎంతో ముగ్ధులయ్యేవారు. అందుచేత అక్షరజ్ఞానంలేని ఆ గ్రామస్థులు, ఆ పవిత్ర గ్రంథాలను అతడి ముఖతా వినేందుకు ఉవ్విళ్ళూరేవారు. అతడు కూడ ఎంతో ఆనందంతో చదివి వినిపించేవాడు. సీతానాథ్ పాయిన్, మధుజుగి, మరికొందరు పెద్దమనుషులు గదాధర్‌ను తమ ఇళ్ళకు ఆహ్వానించేవారు. అప్పుడు గ్రామంలోని స్త్రీ – పురుషులు పలువురు వారి ఇళ్ళకు వెళ్ళి, గదాధర్ చదివే పురాణాదులను వినేవారు. రామాయణ భారతాదుల నుండి అతడు తన మధుర కంఠంతో ప్రహ్లాద ధ్రువ చరిత్రలను, ఇతర కథలను చదివి వినిపిస్తూంటే, వారెంతో భక్తిపరవశులై ఆనందించేవారు.
రామాయణ – మహాభారతాలే కాకుండా, అతడు ఇతర గ్రంథాలను కూడ చదివి వినిపించేవాడు. ఆ ప్రాంతంలో ప్రజాకవులు రచించిన వివిధ దేవతల కథాకావ్యాలుండేవి. అవి సరళ పద్యాలలో మనోహరంగా రచించబడ్డవి. ఆ ప్రాంతాల్లో వాటికి జనాదరణ ఎక్కువగా ఉండేది. అవి కామార్పుకూర్లో అచ్చుపుస్తకాలుగా దొరికేవి. వాటిలో దేవతల స్వరూప మహిమలు, అలౌకిక కర్మల కథలు ఉండేవి. ‘తారకేశ్వర శివ ప్రకటన’, ‘యోగాద్యా మహిమ ప్రకటన సంగీత కావ్యం’, ‘వన విష్ణుపూర్‌లోని మదనమోహన కథ’ – మున్నగునవి ఆ పుస్తకాల్లో కొన్ని. గదాధర్ వీటిని వినేవాడు. విన్న వెంటనే అతడికి మొత్తం కంఠస్థం అయిపోయేది. తాను విన్నవాటిని, తన దగ్గరున్న పుస్తకాల్లోని కథలను శ్రావ్యంగా చదివి వినిపించేవాడు. అంతేకాదు, గదాధర్ కొన్ని రచనలను స్వదస్తూరీలో రాసుకునేవాడు. అతడి దస్తూరీ ముత్యాల్లా గుండ్రంగా అందంగా ఉండేది. దొరికిన వ్రాతప్రతులకు, పుస్తకాలకు ప్రతులు వ్రాసి పెట్టుకునేవాడు. గదాధర్ స్వయంగా తన చేతివ్రాతతో వ్రాసుకున్న ‘రామకృష్ణాయణం, యోగాద్యాకావ్యం, సుబాహు కావ్యం’ మొదలైన వాటిని మేము కామార్పుకూర్లోని అతడి ఇంట్లో చూశాం. అతడి చేతివ్రాతను పరిశీలించి, అవి అతడు రాసినవేనని తెలుసుకున్నాం.
గ్రామంలోని స్త్రీ పురుషులు కోరినప్పుడల్లా అతడు ఈ కావ్యాలను ఎన్నోసార్లు మధురంగా చదివి వినిపించి ఉంటాడు. అందులో ఏమాత్రమూ సందేహం లేదు.
గణితమంటే అతడికి మొదటి నుండీ ఏవగింపు ఉండేదని చెప్పుకున్నాం కదా! అయినా, బడికి వెళుతూ ఉండడం వల్ల, ఈ గణితంలో కూడా అతడు కొంత అభినివేశం సంపాదించాడు. లెక్కల పట్టీలను, భూకొలతల పట్టీలను కంఠస్థం చేశాడని వినికిడి. గుణకారం, భాగహారం, కూడిక, తీసివేతల్లాంటి వాటిని కూడ కొంతవరకు నేర్చుకున్నాడట.
అతడు పదవ ఏట నుండి భావసమాధులకు లోనుకావడం చూసి, అతడి పెద్దన్న రాంకుమార్, అతడికి బడికి ఎప్పుడైనా వెళ్ళే స్వేచ్ఛనిచ్చాడు. అంటే ఇష్టం వచ్చినప్పుడు బడికి వెళ్ళడం, ఇష్టం వచ్చిన పాఠాలు నేర్చుకోవడంలో గదాయ్కు స్వాతంత్ర్యం ఇచ్చాడు. గదాధర్లో వాతం ప్రకోపించిందని అతడు అనుకున్నాడు. అందుచేత తమ్ముణ్ణి బలవంతం చేయకూడదనుకున్నాడు. అంతేకాదు, ఉపాధ్యాయుడు కూడ గదాధర్‌ను ఎక్కువగా ఒత్తిడి చేసేవాడు కాదు. అతడు పాఠాల విషయంలో ప్రగతి చూపకపోయినా, ఉపాధ్యాయుడు శిక్షించేవాడు కాదు.
అందుకే గదాధర్ చదువు, అప్పటి నుండి నత్తనడకనే సాగిందనాలి. అంటే అతడి చదువు అంతగా పురోగమించలేదు.
14. రామేశ్వర్, సర్వమంగళల వివాహాలు
రెండు సంవత్సరాలు అలాగే దొర్లిపోయాయి. గదాధర్‌కు పన్నెండేళ్ళు వచ్చాయి. అతడి రెండవ అన్న రామేశ్వర్. అతడికి ఇరవై రెండేళ్ళు. అతడి చెల్లెలు సర్వమంగళకు తొమ్మిదేళ్ళు. రామేశ్వర్ యుక్తవయస్కుడు కావడం చూసి, రాంకుమార్ అతడి వివాహానికి ప్రయత్నం చేయసాగాడు. కామార్పుకూర్కు దగ్గరలో ‘గౌర్ హాటి’ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో రామ్సదయ్ వంద్యోపాధ్యాయ అనే వ్యక్తికి ఒక చెల్లెలుంది. ఆమెను రామేశ్వర్‌కు కుదిర్చాడు. చెల్లెలు సర్వమంగళకు రామ్సదయ్తో వివాహం చేయడానికి ముందుకు వచ్చాడు. ఇలా కుండమార్పిడి సంబంధాలు కావడం చేత ‘కన్యాశుల్కం’ ఇచ్చే బాధ తప్పింది రాంకుమార్‌కు. అలా వారిద్దరి పెళ్ళిళ్ళు జరిగిపోయాయి.
ఈ రోజుల్లోనే మరో ముఖ్య సంఘటన జరిగింది. రాంకుమార్ కుటుంబంలో, రాంకుమార్ భార్యకు చాలాకాలంగా సంతానం కలుగలేదు. ఇక ఆమెకు పిల్లలు పుట్టరనీ, ఆమె గొడ్రాలనీ అందరూ భావించారు. కాని, ఆశ్చర్యంగా ఆమె ఇప్పుడు గర్భం ధరించింది. దానితో ఇంట్లోవారంతా ఎంతో సంతోషించారు. సంతోషంతో పాటు వారికి అది విషాదాన్ని కూడ కలిగించింది. ఎందుకంటే, ఆమె గనుక గర్భం ధరిస్తే, బిడ్డను కని చనిపోతుందని రాంకుమారే జోస్యం చెప్పివున్నాడు. అతడి జోస్యం చాలావరకూ కచ్చితంగా జరుగుతూండేది.
15. గర్భిణిగా ఉన్నప్పుడు రాంకుమార్ భార్య ప్రవర్తనలో మార్పు
భార్య గర్భం ధరించింది మొదలు, రాంకుమార్‌ను దురదృష్టం పట్టుకొంది. అతడి ఆదాయం సన్నగిల్లింది; అతడి ఆరోగ్యం కూడ క్షీణించసాగింది. అంతేకాదు, పనులు చేసుకోవడంలో అతడికున్న శక్తి సామర్థ్యాలు కూడ తగ్గ సాగాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే, అతడి భార్య ప్రవర్తన మరో ఎత్తయింది. ఆమెలో విపరీతమైన మార్పు వచ్చింది. ఇంట్లో కులదైవం శ్రీరఘువీరుని పూజ ముగిసేదాకా, ఉపనయనం జరగని చిన్నపిల్లలు, రోగులు తప్ప మిగతావారెవ్వరూ పచ్చి మంచినీళ్ళు కూడ ముట్టేవారు కారు. అది క్షుదిరామ్ కాలంనుండి వస్తున్న నియమం. అంతకాలం ఆమె కూడ ఆ నియమాన్ని పాటించింది. కాని గర్భవతి అయిన తర్వాత ఎందుకో ఆ నియమాన్ని ఉల్లంఘించడం మొదలుపెట్టింది. అది చూసి ఏదైనా అనర్థం వాటిల్లుతుందేమోనని భయపడి ఇంట్లోవారు ఆమెను అలా చేయవద్దని ఎంతగా వారించినా, నచ్చచెప్పినా ఆమె వారి మాటలు ఖాతరు చేయలేదు. అంతేగాక చిన్న చిన్న విషయాలలో ఇంట్లోవారందరితో గిల్లికజ్జాలు పెట్టుకోసాగింది. ఈమె ఈ ప్రవర్తన మూలంగా కుటుంబం చింతాక్రాంతమైంది. ఆమె విపరీత ప్రవర్తనకు అటు భర్త రాంకుమార్, ఇటు అత్తగారు చంద్రాదేవి తమ అసమ్మతి వ్యక్తంచేసినా ఆమె ధోరణి మారలేదు. గర్భం ధరించాక కొందరి స్త్రీలలో తరచూ అటువంటి పరిణామాలు కలగడం సహజమేమోనని భావించి, వారు ఆమె విషయంలో సర్దుకుపోయారు. అయినప్పటికీ శాంతికి నెలవైన ఆ ధార్మిక కుటుంబంలో ఆ సమయంలో సదా అశాంతి మాత్రమే వాసం చేయసాగింది.
16. రాంకుమార్ ఆర్థిక దుఃస్థితి
రాంకుమార్ పెద్దతమ్ముడికి చాలినంత చదువు ఉన్నప్పటికీ, సంపాదనలో అంతంత మాత్రంగానే ఉన్నాడు. కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడం, ఆదాయం తగ్గడంతో ఒడుదొడుకులు లేకుండా కుటుంబం గడవడం కష్టమైపోయింది. ఈ ఆర్థిక దుఃస్థితి చూసి రాంకుమార్ ఎంతో ఆందోళన చెందాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అందుకు ప్రతిక్రియ చేయలేకపోయాడు. ఏదో ఒక అదృశ్యశక్తి అతడి ప్రయత్నాలను వమ్ముచేస్తూన్నట్లుగా తోచేది. ఆ తీరని చింతలతో, వ్యథలతో అతడికి జీవితమే భారమై పోయింది. రోజులు, నెలలు గడిచేకొద్దీ, అతడి భార్య ప్రసవించే సమయం దగ్గర పడేకొద్దీ, భార్య గురించిన తన జోస్యం జ్ఞాపకం చేసుకొంటూ రాంకుమార్ మరింత ఖీన్నుడవసాగాడు.
17. రాంకుమార్ భార్య మరణించడం
చిట్టచివరకు రాంకుమార్ భార్య 1849 వ సం ॥ లో ముద్దులు మూటగట్టే మగబిడ్డను ప్రసవించి, ఆ బిడ్డడి ముఖం వంకే చూస్తూ ప్రాణాలు విడిచింది. ఆ పేదకుటుంబంలో మళ్ళీ దుఃఖం అలముకొంది.