1. అవతారమూర్తుల జననకాలంలో వారి తల్లిదండ్రుల దివ్యానుభూతులు
జగత్పావనులైన మహాత్ములు జన్మించబోయే కాలంలో వారి తల్లిదండ్రుల జీవితాల్లో అసాధారణమైన ఆధ్యాత్మికానుభూతులు, దివ్యదర్శనాలు కలుగుతూండేవని ప్రపంచంలోని జాతులన్నిటి మతగ్రంథాలలో నమోదు చేయబడింది. మహామహిమో పేతులైన శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ, మాయాదేవి పుత్రుడైన గౌతమ బుద్ధుడు, మేరీమాత తనయుడైన ఏసుక్రీస్తు, శంకరాచార్యుడు, చైతన్యమహాప్రభు తదితర ఏ మహాపురుషులు సమస్త మానవజాతిచే భక్తి శ్రద్ధలతో పూజింపబడుతున్నారో వారందరి తల్లి తండ్రులను గురించి అటువంటి సంగతులు శాస్త్రాలలో కానవస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా కొన్ని సంఘటనలు క్రింద పొందుపరుస్తున్నాం.
దశరథుడి ముగ్గురు భార్యలూ యజ్ఞానంతరం పాత్రలో మిగిలివున్న దేవప్రసాదితమైన పాయసాన్ని ఆరగించిన తరువాత వారికి శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు జన్మించారని రామాయణం చదివిన అందరికీ తెలిసిన సంగతే. అంతేగాక జన్మించటానికి మునుపే వారు జగద్రక్షకుడైన మహావిష్ణువు యొక్క దివ్యాంశసంభూతులనీ, దివ్యశక్తి సంపన్నులనీ తల్లిదండ్రులకు ఎరుకే అన్న సంగతి రామాయణంలో పేర్కొనబడే ఉంది.
శ్రీకృష్ణుడి తల్లితండ్రులు అతడు తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు, జన్మించిన తక్షణము షడైశ్వర్య సంపన్నుడైన భగవంతుడే తమ కుమారుడుగా అవతరించాడని గ్రహించారు. అంతేగాక అతడు పుట్టిన నాటి నుంచీ ప్రతిరోజూ అద్భుత సంఘటనల నెన్నిటినో తమ కళ్ళారా వారు చూడటం శ్రీమద్భాగవతాది పురాణాలలో వివరించబడివుంది.
బుద్ధ భగవానుడు అవతరించనున్నప్పుడు దివ్యపురుషుడొకడు జ్యోతిర్మయమైన తెల్లని ఏనుగు రూపం దాల్చి తన గర్భంలో ప్రవేశించటం, ఇంద్రాది దేవత లందరూ తన గొప్ప అదృష్టాన్ని గాంచి తన పట్ల భక్తిప్రపత్తులు కనబరచటం మాయాదేవి దర్శించింది.
ఏసుక్రీస్తు జననానికి ముందు అతడి తల్లి మేరీ, తన భర్త జోసెఫ్తో దైహిక సంబంధం లేకున్నప్పటికీ తాను గర్భం ధరించినట్లు భావించింది. ఎన్నడూ కనీ వినీ ఎరుగని దివ్య తేజస్సు సంతరించుకొన్నదై, తాను దివ్యగర్భాన్ని ధరించినట్లు తెలుసుకొన్నది.
దేవాదిదేవుడైన మహాదేవుడి దివ్యదర్శనాన్ని పొంది ఆయన ఒసగిన వరం ద్వారా తాను గర్భవతినైనట్లు శ్రీ శంకరుల తల్లికి తెలిసింది. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుల తల్లియైన శచీదేవి జీవితంలో కూడ పైన వర్ణించినట్టి దివ్యానుభవాలు కలిగినవని శ్రీ చైతన్య చరితామృతం మొదలైన గ్రంథాలలో మనం చూడవచ్చు.
హిందూ, బౌద్ధ, క్రైస్తవాది మతాలన్నీ ప్రగాఢ భక్తితో భగవంతుణ్ణి ఆరాధించడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని సులువుగా పొందవచ్చునని ఘంటాపథంగా చాటిచెబుతున్నాయి. ఆ మతాలన్నీ ఈ విషయాన్ని ఇంతగా నొక్కి చెబుతున్నప్పుడు నిష్పక్షపాతియైన పరిశోధకుని మనస్సులో సహజంగా తలఎత్తే ప్రశ్న ఏమంటే: పై విషయంలో ఆలంబనంగా సత్యం ఏదైనా ఉందా? ఉంటే, పై కథనంలోని ఏ విభాగాలను స్వీకరించాలి, వేటిని నిరాకరించాలి? అన్న విషయం ఆలోచనకు వస్తుంది.
2. యుక్తి సహితం శాస్త్రవాక్యాన్ని బలపరుస్తూ ఉంది
మరోవైపు నుండి చూస్తే యుక్తికూడ పై శాస్త్రవాక్యంలో కొంత సత్యం ఉండి ఉండవచ్చునని సూచిస్తోంది. ఎందుకంటే ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడ సుగుణ సంపన్నులైన తల్లితండ్రులకు ఉత్కృష్టశీలురైన పిల్లలు జన్మిస్తారని అంగీకరిస్తూ ఉంది కనుక అలాంటప్పుడు శ్రీకృష్ణుడు, బుద్ధుడు, ఏసుక్రీస్తు మొదలైన మహాపురుషుల తల్లితండ్రులు కూడ అతిశయ సద్గుణ సంపన్నులనే సంగతిని అంగీకరించాలి. ఆ మహాపురుషులందరి జనన కాలంలో వారి తల్లిదండ్రుల మనస్సులు సాధారణ మానవులకు శక్యంకాని అత్యున్నత స్థితులలో నెలకొని ఉండినవనడం స్పష్టం. ఇదే వారిని అనుపమాన దివ్యదర్శనాలు, దివ్యానుభూతులు పొందడానికి అర్హులను చేసింది.
3. ఆ దివ్యదర్శనాలు నమ్మశక్యం కానప్పటికీ శాస్త్రవాక్యాన్ని కొట్టివేయలేం
పురాణేతిహాసాలు అలాటి దివ్యానుభూతుల దృష్టాంతాలను అనేకం నమోదు చేసివున్నప్పటికీ, తర్కానికి అవి ప్రతికూలాలు కాకపోయినప్పటికీ మనిషి మనస్సు వాటిని పూర్తిగా విశ్వసించలేదు. ఇంద్రియ సముపార్జిత జ్ఞానం పట్ల మాత్రమే నమ్మకం ఉంచిన అతడి మనస్సు ఆత్మ, ఈశ్వరుడు, ముక్తి, పరలోకం ఇత్యాది అతీంద్రియ సత్యాలను గురించి వాటి ప్రత్యక్షానుభూతిని పొందేవరకు నిస్సందేహంగా నమ్మజాలదు. ఇది నిజమైనా కూడా నిష్పాక్షిక పరిశోధకుడు అలౌకికము లేదా అసాధారణమంటూ ఏ అనుభవాన్నీ త్రోసిపుచ్చడు. అలాకాక స్వయం సాక్షీభూతుడుగా ఆ అనుభవాలకు చెందిన అనుకూల, ప్రతికూల ప్రమాణాలను ఓపికగా సేకరించి, చివరికి ఆ సేకరించిన యథార్థాన్ని ఆధారంగా వాటిని నిరాకరించడమో లేక అంగీకరించడమో చేస్తాడు.
ఏది ఏమైనప్పటికీ ఏ మహాపురుషుని జీవిత చరిత్రను మేము రచింప ఉపక్రమించామో, ఆయన జనన కాలంలో ఆయన తల్లిదండ్రులు కూడ పలు దివ్యదర్శనాలు, అపూర్వానుభూతులు పొందారన్న విషయం అతి విశ్వసనీయ ఆధారాల నుండి మేము తెలుసుకొన్నాము. కనుక ఆ విషయాలను పొందుపరచడం తప్ప మాకు మరో ప్రత్యామ్నాయం కనబడలేదు. వెనుకటి అధ్యాయంలో క్షుదిరామ్కు కలిగిన దివ్యానుభూతులు కొన్నిటిని పాఠకులకు తెలిపి ఉన్నాం. ఇప్పుడు చంద్రాదేవి పొందిన దివ్యానుభూతులు కొన్నిటిని తెలుపనున్నాము.
4. చంద్రాదేవిలో కలిగిన మానసిక మార్పును క్షుదిరామ్ గుర్తించడం
ఇంటికి తిరిగి వచ్చాక గయలో తాను గాంచిన స్వప్నవృత్తాంతం ఎవ్వరికీ చెప్పకుండా ఏం జరుగనున్నదో అని క్షుదిరామ్ నిరీక్షించసాగాడు. మొట్టమొదటి విషయం అతడు గమనించింది చంద్రాదేవిలో కలిగిన అపూర్వ పరిణామం. అతడి దృష్టిలో ఆమె ఒక సామాన్య స్త్రీలా కాక ఒక దేవతగా కనిపించసాగింది. ఒకరకమైన సర్వజనాకర్షక ప్రేమ వెల్లువ ఆమె హృదయాన్ని నింపివేసి లౌకిక వాంఛితాలన్నిటికీ అతీతమైన ఉత్కృష్ట స్థానంలో ఆమెను నిలిపివుంచింది. ఇప్పుడు ఆమె తన కుటుంబం కంటే ఇరుగుపొరుగువారి అవసరాలను గురించే ఎక్కువగా పట్టించుకోసాగింది. తన ఇంటి పనులలో సతమతమౌతూ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు వెళ్ళి వారి అవసరాలను తీర్చడం ఆమెకు పరిపాటి అయింది. ఆహారపదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువులు తన ఇంటి నుంచి తీసుకువెళ్ళి వాటి అవసరం ఉన్న వారికి రెండో కంటికి తెలియకుండా ఇవ్వసాగింది. శ్రీ రఘువీరుని పూజాకార్యం ముగించాక భర్తకు, పిల్లలకు భోజనం వడ్డించేది. పిదప అప్పటికే ఆలస్యం అయినప్పటికీ, తను భోజనం చేసేముందు ఇరుగుపొరుగు ఇళ్ళకు వెళ్ళి వారి భోజనాలు అయినవో లేవో కనుగొని వచ్చేది. ఏనాడైనా ఏదో కారణాన ఎవరికైనా భోజనం లేదని తెలియగానే ఆప్యాయంగా ఆ సదరు వ్యక్తిని తన ఇంటికి ఆహ్వానించి తన వంతు భోజనాన్ని అతడికి వడ్డించేది. మిగిలివున్న నాలుగు మెతుకులను తాను తిని సంతృప్తితో ఆ ప్రొద్దు గడిపేది చంద్రాదేవి.
5. చంద్రాదేవి మాతృప్రేమ విస్తృతి
ఇరుగుపొరుగు వారి బిడ్డల నందరినీ సదా తన సొంత బిడ్డలగానే ప్రేమించే చంద్రాదేవి ఇప్పుడు దేవతల పట్ల కూడ మాతృప్రేమను వ్యక్తం చేయడం క్షుదిరామ్ గమనించాడు. కులదైవమైన రఘువీరుని కన్న కుమారునిగా చూడసాగింది. అట్లే శీతలాదేవిని, బాణేశ్వర శివలింగాన్ని తన సొంత బిడ్డలుగా పరిగణించసాగింది. ఇంతకు మునుపు ఆ దేవతల సేవ, పూజాదులు నిర్వర్తింపబడుతున్నప్పుడు ఆమె హృదయం భక్తిపూర్వకమైన భీతితో నిండిపోయేది. మాతృప్రేమ ఇప్పుడు ఆ భీతిని పూర్తిగా తరిమివేసింది. వారి సాన్నిధ్యంలో ఇప్పుడామెకు ఎలాంటి జంకుగాని, సంకోచంగాని లేవు. వారి నుండి దాచుకోవలసిందిగాని, కోరవలసిందిగాని ఏదీ లేదు. అందుకు మారుగా ఆ దేవతలు తన సొంత బిడ్డలకంటే మరింత సన్నిహితులనే నమ్మకం, వారి సుఖంకోసం తన సర్వస్వాన్ని త్యజించాలనే తీవ్ర ఆకాంక్ష, వారితో శాశ్వతమైన బంధంతో కట్టువడి ఉన్నాననే పరమానందం ఆమెలో పొంగిపొరిలాయి.
6. ఆమెను గురించి క్షుదిరామ్ ఆదుర్దా
దేవతల పట్ల చంద్రాదేవి నిష్కపట భక్తి, వారి ఎడ కలిగిన అతి సాన్నిహిత్య సంబంధం వలన జనించిన ఆనందం సరళ హృదయురాలైన చంద్రాదేవిని మరింత సరళతమం చేయడం క్షుదిరామ్ గమనించాడు. ఆపైన ఎవరినీ సందేహించడం గాని, ఎవరినీ అపరిచితునిగా గాని చూడలేకపోయింది. ‘స్వార్థపూరిత ప్రపంచం అటువంటి నిష్కాపట్యాన్ని ప్రశంసించకపోవడం అటుంచి ఆమెను వెర్రిదాని క్రిందో, పిచ్చిదాని క్రిందో జమకడుతుంది’ అని క్షుదిరామ్ తలపోశాడు. ఈ విషయంగా ఆమెను హెచ్చరించడానికి సరైన అవకాశం కోసం అతడు ఎదురు చూడసాగాడు.
7. చంద్రాదేవి విచిత్ర స్వప్నం
త్వరలోనే ఆ అవకాశం వచ్చింది. అమాయకురాలైన చంద్రాదేవి భర్త నుంచి ఏ ఒక్క ఆలోచననూ దాచుకొనేది కాదు. తరచు ఆమె తన ఆలోచనలను స్నేహితురాళ్ళతో దాపరికం లేకుండా చెప్పుకొనేది. అలాంటప్పుడు ప్రపంచంలో అందరి కన్నా తనకు ఆప్తునిగా భగవంతుడు నియామకం చేసిన భర్త నుంచి ఎలా దాచగలదు? క్షుదిరామ్ గయ నుంచి తిరిగి రాగానే అతడు అక్కడ లేనప్పుడు తాను చూసిన దివ్యదర్శనాలు, పొందిన అనుభూతుల గురించి సందర్భం దొరికినప్పుడు ఆతడితో చెప్పాలనుకొన్నది. అవకాశం చూసుకొని ఒకరోజు అతడితో ఇలా చెప్పింది: “మీరు ఇక్కడ లేనప్పుడు ఒకరోజు రాత్రి నా కొక విచిత్రమైన కల వచ్చింది. దాన్లో జ్యోతిర్మయుడైన ఒక దివ్యపురుషుడు నా మంచం మీద పడుకొని ఉండటం చూశాను. మొదట మీరేమో అనుకొన్నాను. కాని వెంటనే మానవ మాత్రుడికి అటువంటి దివ్యరూపం ఉండటం అసంభవమని తోచింది. పిదప నిద్ర నుంచి లేచాను; కాని ఆ దివ్యపురుషుడు ఇంకా పక్కమీదనే ఉన్నట్లు అనిపించింది. మరుక్షణమే మరో ఆలోచన వచ్చింది. ‘దివ్యపురుషుడు ఎప్పుడైనా మనిషి ముందు ఈ విధంగా కనబడతాడా?’ అని ఆలోచించిన తరువాత నాకు ఇలా అనిపించింది: ‘దుష్టుడు ఎవడైనా ఏదైనా దురుద్దేశంతో గదిలోకి ప్రవేశించాడేమో, బహుశా అతడి అడుగుల సవ్వడి విని నాకు అలాటి కల వచ్చిందేమో!’ అన్న గొప్ప భయం నన్ను ఆవహించింది. వెంటనే దీపం వెలిగించాను. గదిలో ఎవరూ లేరు. వేసిన తలుపు గడియ వేసినట్లే ఉంది. కాని భయం ఆ రాత్రి నన్ను జాగారం చేయించింది. నేను ఇలా అనుకొన్నాను: ‘తలుపు గడియ తీసి ఎవరైనా గదిలోకి ప్రవేశించి నేను మేల్కొని ఉండటం చూసి మళ్ళీ తెలివిగా గడియ వేసి పారిపోయాడేమో!’ అని అనుకొని తెల్లవారగానే ధనికామారిణిని, ధర్మదాస్లాహా చెల్లెలు ప్రసన్నను పిలువనంపాను. జరిగినదంతా వారికి చెప్పాక వారిని ఇలా అడిగాను: ‘నిజంగానే ఎవడైనా నా గదిలోకి వచ్చాడంటారా? గ్రామంలో ఎవరితోనూ నాకు విరోధం లేదే! ఏదో స్వల్ప విషయంగా ఆ రోజు మధుయుగి, నేను మాట మాట అనుకొన్నాం, అంతే! కక్షకట్టి అతడేమన్నా నా గదిలోకి ప్రవేశించి ఉంటాడా?’ అన్న నా మాటలకు వారిద్దరూ పకపక నవ్వి నన్ను ఇలా మందలించారు: ‘వెర్రిదానా! ముసలితనం నీ బుర్రను పాడుచేస్తోందా? నీ కల గురించి ఎందుకు అలా విశ్లేషిస్తావు? ఎవరైనా దీన్ని గురించి వింటే ఏమంటారో కాస్త యోచించు! ఇది అపవాదుకు దారితీస్తుంది. మళ్ళీ ఈ సంగతి మరెవరితోనైనా ప్రస్తావిస్తే నిన్ను ఎగతాళి పట్టిస్తారు.’ అని వారు అన్నారు. వారి మాటలు విని, ‘అలా అయితే నిజంగా అదొక కలే. ఇక దీన్ని గురించి ఎవరితోనూ ప్రస్తావించను, మీరు తిరిగి వచ్చాక మీతోనే చెప్తాను’ అని అనుకొన్నాను.
8. శివాలయంలో చంద్రాదేవి దివ్యదర్శనం, దివ్యానుభూతి
“మరో సందర్భంలో యుగుల శివాలయం ఎదుట ధనితో మాట్లాడుతున్నప్పుడు మహాదేవుని పావన విగ్రహం నుండి దివ్యజ్యోతి ఒకటి ప్రసరించడం నేను చూశాను. ఆ దివ్యజ్యోతి ఆలయాన్ని క్రమ్మివేసి తరంగాకృతిలో నాకేసి వేగంగా రాసాగింది. ఆశ్చర్యచకితనై నే నా విషయం ధనితో చెప్పబోతూ ఉండగా హఠాత్తుగా ఆ దివ్యజ్యోతి నన్ను ముంచివేసి వడిగా నాలో ప్రవేశించింది. ఆశ్చర్యంతో స్తంభించిపోయి, స్పృహకోల్పోయి క్రిందపడిపోయాను. ధని శుశ్రూష చేయగా బాహ్యచైతన్యం పొంది, జరిగినదంతా ఆమెతో చెప్పాను. మొదట ఆమె ఆశ్చర్యం వెలిబుచ్చింది. పిదప, ‘నీకు అపస్మారకం కలిగింది’ అన్నది. కాని అప్పటి నుంచి ఆ జ్యోతి నా గర్భంలో ఉన్నట్లు, నేను గర్భవతి నైనట్లు అనిపిస్తూ ఉంది. ఈ విషయం కూడా ధనికి, ప్రసన్నకు చెప్పాను. కాని వాళ్ళు ‘మూర్ఖురాలు, వెఱ్ఱిది’ అంటూ నన్ను కసురు కొన్నారు. నా అనుభూతి భ్రాంతిజనితమో లేక వాతం వల్ల కలిగిందో అని వారు నిర్ణయించారు. ఈ విషయం నాకు అర్థం అయ్యేట్లు నానావిధాల ప్రయత్నించి, ఈ సంఘటనను మరెవ్వరికీ వెల్లడించవద్దని నన్ను హెచ్చరించారు. మీకు తప్ప మరెవరికీ చెప్పకూడదని ఇప్పటిదాక మౌనం వహించాను. సరే, మీకు ఏమనిపిస్తోంది? భగవత్కృపతో అలా అయిందా లేక వాతం కమ్మి అలా జరిగిందా? ఇప్పటికీ నేను గర్భవతిననే నాకు అనిపిస్తున్నది” అని వివరించింది
9. చంద్రాదేవిని ముందు జాగ్రత్తగా క్షుదిరామ్ హెచ్చరించడం
చంద్రాదేవి చెబుతున్నదంతా వింటున్న క్షుదిరామ్ గయాక్షేత్రంలో తనకు వచ్చిన కలను జ్ఞప్తికి తెచ్చుకొన్నాడు. నీకు కలిగిన అనుభూతి అనారోగ్యం కారణంగా వచ్చింది కాదని ఎన్నోవిధాలుగా చెప్పి ఇలా అన్నాడు: “ఇక నుంచి అట్టి దర్శనాలు, అనుభూతుల గురించి నాతో తప్ప ఎవరితోనూ మాట్లాడబోకు. శ్రీ రఘువీర్ కృపతో ఏం దర్శింప చేస్తాడో అదంతా మన మేలుకే అనుకొని నిశ్చింతగా ఉండు. గయాధామంలో బసచేసి ఉన్నప్పుడు మళ్ళీ మనకు పుత్రోదయం కానున్నట్లు శ్రీ గదాధరుడు అలౌకిక రీతిలో నాకు వెల్లడించాడు.” అని తన అనుభవాన్ని ఆమెకు చెప్పాడు. దైవసమానుడైన భర్త పలుకులు విని చంద్రాదేవి మనస్సు కుదుటపడింది. భర్త ఆజ్ఞానుసారం అప్పటి నుండి తన భారాన్నంతా సంపూర్ణంగా శ్రీ రఘువీరుని మీదనే వేసి కాలం గడపసాగింది. ఆ బ్రాహ్మణ దంపతులు ఇలా మాట్లాడుకొన్న తరువాత మూడు నాలుగు నెలలు గడచిపోయాయి. నలభై ఐదేళ్ళ చంద్రాదేవి నిజంగానే గర్భవతి అయిందని అప్పటికి ప్రతి ఒక్కరికీ తెలిసిపోయింది. గర్భం ధరించినప్పుడు స్త్రీల రూపలావణ్యాలు ఇనుమడిస్తాయని చెప్పుకొంటారు. చంద్రాదేవిలో కూడా ఈ మార్పు కనిపించింది. ఇదివరలో గర్భం ధరించినప్పటి కంటే ఈసారి ఆమె రూప లావణ్యాలు మిక్కుటమయ్యాయని ధని, ఇతర గ్రామ స్త్రీలు వ్యాఖ్యానించారు. ఈ వార్త వ్యాపించగానే కొందరు స్త్రీలు తమలో తాము ఇలా “ఈ వయస్సులో ఒక స్త్రీ గర్భం ధరించడమూ, ఇంత రూపలావణ్యాలు సంతరించుకోవడమూనా! పురిట్లో ఆమె బహుశా బ్రతకదేమో!” నని గుసగుసలాడుకొన్నారు.
కామర్పుకూర్లోని శ్రీరామకృష్ణుల కుటీరం ప్రక్కనే ఉన్న యోగి శివాలయం
యోగి శివాలయం అంతర్భాగంలోని శివలింగం
10. గర్భవతి అయ్యాక చంద్రాదేవి దివ్యదర్శనాలు
గర్భవతి అయిన తరువాత చంద్రాదేవి దివ్యదర్శనాలు, అనుభూతులు రోజురోజుకూ ఎక్కువయ్యాయి. ఈ కాలంలో దాదాపు నిత్యం ఆమెకు దేవీదేవతల దర్శనాలు కలుగు తూండేవట. ఆ దేవీదేవతల పవిత్ర దేహాలు వెదజల్లే సుగంధం ఇంట్లో యావత్తూ వ్యాపించడం ఆమెకు ఎరుకే! మరొకప్పుడు దైవవాణిని ఆలకిస్తూ ఆమె స్తంభించిపోయేది. కొన్ని సమయాల్లో ఆ దేవీదేవతల పట్ల జనించిన మాతృప్రేమ ఆమె హృదయంలో పొంగిపొరలేదట. దాదాపు ప్రతిరోజు తన భర్తకు ఈ దివ్యదర్శనాలు, అనుభూతుల గురించి తెలిపి, తనకు అవి ఎందుకు కలుగు తున్నాయని ప్రశ్నించేది. క్షుదిరామ్ గాబరా చెందవద్దని ఆమెను ఎన్నో విధాల ఊరడించేవాడు. ఆ సమయంలో జరిగిన ఒక సంఘటనను ఇక్కడ తెలుపుతున్నాం. చంద్రాదేవి ఆ సంఘటనను భీతితో ఇలా వర్ణించి చెప్పిందని మేము విన్నాం: “ఓ స్వామీ! శివాలయం ఎదుట జ్యోతిదర్శనం అయినప్పటి నుండి అప్పుడప్పుడు ఎంతమంది దేవీదేవతల దర్శనం నాకు కలుగుతున్నదో లెక్కేలేదు. వారిలో అనేకుల మూర్తులను నేను ఇంతవరకు కనీసం చిత్తరువులలో కూడ చూసివుండలేదు. ఈ రోజు ఒక దేవుడు హంస వాహనం మీద రావడం చూశాను. మొదట నేను బెదిరిపోయాను. కాని ఎండ వేడిమికి ఆతడి ముఖం ఎర్రబారి ఉండటం చూసి నా మనస్సు చివుక్కుమన్నది. ఆతణ్ణి పిలిచి, ‘నాయనా, ఓ హంస వాహన దేవా! ఎండకు నీ ముఖం కమిలిపోయి ఉంది. ఇంట్లో చద్ది అన్నం ఉంది. రెండు ముద్దలు తిని సేద తీర్చుకొని వెళుదువు గాని’ అని అన్నాను. నా మాటలు విని అతడు నవ్వాడు. కాని వెంటనే మాయమై పోయాడు. ఇలాంటి ఎందరో మూర్తులు నాకు కనిపిస్తూ ఉంటారు. వారిని అర్చించను, వారిని ధ్యానించను; అయినా వారిని పగలు లేక రాత్రి ఏ వేళలోనన్నా చూడగలుగుతున్నాను. కొన్ని వేళల్లో వారు మానవ రూపంలో నా ముందుకు వచ్చి, పిదప గాలిలో కలిసి అదృశ్యులైపోతారు. నాకీ దర్శనాలు ఎందుకు కలుగుతున్నాయో మీరు చెప్పగలరా? ఇది ఏదన్నా రోగమా? గోసైన్* దయ్యమేమైనా నన్ను ఆవహించిందా అని అప్పుడప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను” అని అన్నది. క్షుదిరామ్ మళ్ళీ ఆమెకు గయలో తాను కన్న కల గురించి చెప్పి, పురుషోత్తముణ్ణి గర్భంలో ధరిస్తున్న ఆమె నిజానికి ఎంతో అదృష్టవంతురాలనీ, ఆయన పావన సంస్పర్శ ఫలితంగానే ఆమెకు ఈ దివ్య దర్శనాలు కలుగుతున్నవనీ సూచన ప్రాయంగా తెలిపాడు. భర్త మాటల పట్ల ప్రగాఢ విశ్వాసం ఉన్న చంద్రాదేవికి ఆతడి ఈ వివరణ ఆమె హృదయాన్ని పరమభక్తితో నింపివేసింది. క్రొత్తబలం పుంజుకొన్న ఆమె ఇప్పుడు నిశ్చింతురాలైంది.
కాలం దొర్లిపోసాగింది. క్షుదిరామ్, సుగుణాలరాశియైన చంద్రాదేవి రఘువీరుని సంపూర్ణంగా శరణుజొచ్చి, ఎవరి శుభాగమనంతో తమ జీవితాలు భగవద్భక్తితో పరిపూర్ణమైనవో ఆ మహనీయ తనయుని ముఖారవిందాన్ని దర్శిస్తూ కాలం గడపసాగారు.