1. పేదకుటుంబంలో భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు?
భగవదవతారాలుగా లోకంలో నేటికీ పూజింపబడుతున్న వారిలో శ్రీరామచంద్రుడు, బుద్ధుడు మినహా తక్కిన అవతారమూర్తులందరూ పేదరికంలోను, కష్టపరంపరలోను జన్మించారు. ఉదాహరణకు క్షత్రియ కులభూషణుడైన శ్రీకృష్ణుడు కారాగారంలో జన్మించి, తల్లిదండ్రుల నుంచి దూరమై బాల్యాన్నంతా ఒక చిన్న గొల్లపల్లెలో గడిపాడు. పేదలైన తల్లిదండ్రులను అమరజీవులుగా చేసిన ఏసుక్రీస్తు జన్మించింది ఒక గుర్రాల చావడిలో. శంకరభగవత్పాదులు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయారు. చైతన్యదేవుడు జన్మించినది సామాన్య కుటుంబంలోనే. అయినప్పటికీ ఈ అవతారమూర్తులందరూ దుః ఖదారిద్ర్యాల పరిధిలో ఉన్నప్పటికీ సంతృప్తి, సంతోషాలు ఉన్నచోట; కష్టాలున్నప్పటికీ ప్రేమ, స్వార్థరాహిత్యాలున్న చోట; తల్లిదండ్రులు పేదలైనా త్యాగం, పవిత్రత, దయాదాక్షిణ్యాది సుగుణాలున్నచోట మాత్రమే జన్మించారు.
మనం లోతుగా ఆలోచించి చూస్తే వారు జన్మించిన పేదరిక పరిస్థితులకూ, వారి భావి జీవితాలకూ మధ్య నిగూఢమైన సంబంధం కానవస్తుంది. లేకుంటే బాల్యంలో వారు పేదసాదల, అణగారిన, దుఃఖీతుల స్థితి ఎరిగి వారిపట్ల సానుభూతి ప్రకటించని పక్షంలో, పెరిగి పెద్దవారయ్యాక ఆ ప్రజల కన్నీళ్ళను తుడిచి వారి హృదయాలను ఎలా శాంతితో నింపగలిగేవారు? అవతారమూర్తుల రాక అదొక్క కార్యసాధనకు మాత్రమే కాదు, ప్రధానంగా ధర్మగ్లానిని అరికట్టటానికే వారు అవతరిస్తారు. ఈ కార్యాన్ని నెరవేర్చాలంటే తొలుత వారు పూర్వపు ఆధ్యాత్మిక మార్గాలలో సుపరిచితులు కావాలి. వాటి క్షీణతకు గల కారణాలను తెలుసుకొని, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఆ ఆధ్యాత్మిక మార్గాలకు క్రొత్తదనాన్ని ఇవ్వాలి. వీటిని గురించిన వాస్తవికతలు పేదవారి పూరిళ్ళలోనేగాని, రాజప్రాసాదాలలో లభించవు. ఎందుకంటే ప్రాపంచిక సుఖభోగాలకు నోచుకోని పేదవారే భగవంతుణ్ణి, ఆయన వితరణను తమ జీవిత ముఖ్యావలంబనంగా ఎంచుతారు. కాబట్టి ధర్మగ్లాని సర్వత్రా కానవస్తున్నా కూడ, పూర్వం ఆచరణలో ఉండిన ధార్మిక బోధలు ఒకింత అయినా యథాతథంగా అనుసరించబడుతూ ఉండేది ఈ బీదసాదల ఇళ్ళలోనే. జగద్గురువులైన మహాపురుషులందరూ జన్మించేటప్పుడు పేదల పూరిళ్ళకే ఆకర్షితులవుతూ ఉండటానికి బహుశ ఇదే కారణం కావచ్చు.
2. కామార్పుకూర్ – శ్రీరామకృష్ణుల జన్మస్థలం
ఏ మహాపురుషుడి చరితాన్ని మేం చెప్ప పూనుకొన్నామో ఆయన కూడా ఇదే పరిస్థితులలో జన్మించటం జరిగింది. హుగ్లీ జిల్లా పశ్చిమోత్తర ప్రాంతం బంకురా, మేదినీపూర్ జిల్లాలతో కలిసే చోటుకు సమీపంలో ఒక త్రికోణాకృతిలో నెలకొన్న మూడు చిన్న గ్రామాలు ఉన్నాయి. గ్రామస్థులు వీటిని శ్రీపూర్, కామార్పుకూర్, ముకుందపూర్లుగా పేర్కొంటున్నా, ఇవి ఎంత దగ్గరగా ఉన్నాయంటే బాటసారికి అవి ఒకే గ్రామంలోని మూడు పేటలుగా తోస్తాయి. స్థానిక జమీందార్లు కామార్పుకూర్లో అనేక తరాలుగా నివసిస్తూండిన కారణం చేత కాబోలు చుట్టుపట్ల గ్రామస్థులు ఈ మూడు గ్రామాలను కలిపి ‘కామార్పుకూర్’ గా పిలుస్తూండేవారు. మన కథాకాలం నాటికి ఈ కామార్పుకూర్ బర్ద్వాన్ మహారాజుల రాజగురువు కుటుంబానికి చెందిన శిస్తు చెల్లించని జమీలో ఒక భాగంగా ఉంది. ఆ గురువు వంశీయుల సంతతిలోని శ్రీ గోపీలాల్ గోస్వామి, శ్రీ సుఖలాల్ గోస్వామి, తదితరులు* అప్పుడక్కడ నివసిస్తూండేవారు.
బర్ద్వాన్ పట్టణం కామార్పుకూర్కు ఉత్తరంగా ముఫ్ఫై రెండు మైళ్ళ దూరంలో నెల కొనివుంది. ఇక్కడ నుంచి వేయబడిన కంకర బాట, కామార్పుకూర్ మీదుగా పూరీ దాకా వెళుతుంది. పూరీ జగన్నాథుణ్ణి దర్శించటానికి చాలామంది సాధువులు, పేద యాత్రీకులు ఈ బాట మీదుగానే కాలినడకన వస్తూ పోతూ ఉండేవారు. సుప్రసిద్ధ తారకేశ్వర్ శివాలయం కామార్పుకూర్కు ఉత్తరంగా 19 లేక 20 మైళ్ళ దూరంలో ఉంది. ద్వారకేశ్వర్ నదీ తీరంలోని జహానాబాద్ లేక ఆరాంబాగ్ పట్టణాల మీదుగా వెళ్ళే బాట తారకేశ్వర్ను కామార్పుకూర్తో కలుపుతుంది. అంతేగాక 18 మైళ్ళు దక్షిణంలోవున్న ఘటాల్ నుంచి, 26 మైళ్ళు పశ్చిమంలోవున్న వనవిష్ణుపూర్ నుంచి రెండు రహదార్లు కామార్పుకూర్లో ప్రవేశించేవి.
శ్రీరామకృష్ణుల జన్మస్థలం: కామార్పుకూర్ గ్రామం
3. కామార్పుకూర్ ప్రాంతాల్లో ఆనాటి సుభిక్షత : నేటి స్థితిగతులు
1867 వ సం ॥ లో మలేరియా జ్వరం సర్వనాశనం చేయటానికి మునుపు వ్యవసాయమే ప్రధానంగావున్న బెంగాల్ పల్లెలలో వెల్లివిరిసిన ప్రశాంతత వర్ణనాతీతం. పచ్చని పైర్లతో కళకళలాడుతూండే పొలాల మధ్య హుగ్లీ జిల్లాలోని ఈ పల్లెలు పచ్చని పైరు పొలాలతో కన్నుల పండువ చేసేవి. సారవంతమైన భూములు కావటంతో పంటలు సమృద్ధిగా పండేవి. స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ పగటి వేళల్లో పొలాలలో పరిశ్రమిస్తున్నందున ఇక్కడి ప్రజలు బలారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవనం సాగించేవారు. ఈ గ్రామాలు జనాభాతో క్రిక్కిరిసి ఉండేవి. వ్యవసాయంతోపాటు జనులు వివిధ లఘుపరిశ్రమలలో నిమగ్నులై ఉండేవారు. కామార్పుకూర్ జిలేబీలకు, నబత్ (ఒక రకమైన మిఠాయి) తయారీకీ నేటికీ ప్రసిద్ధం. ఈనాటికీ ఇక్కడి ప్రజలు ఎబొనీ (ఒక రకం కలప)తో హుక్కా గొట్టాలను తయారుచేసి, కలకత్తాకు సరఫరా చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు ఈ గ్రామం నూలు, ధోవతులు, తువ్వాళ్లు ఇత్యాది చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి పొందినది. విష్ణుచాప్డి మొదలైన పేరుగాంచిన వస్త్ర వ్యాపారులు ఈ పల్లెలో నివసిస్తూ కలకత్తాతో వ్యాపారం సాగించేవారు. ఈనాటికీ ప్రతి మంగళ, శనివారాలలో ఇక్కడ సంత జరుగుతుంది. చుట్టుపట్ల గ్రామాల నుంచి ప్రజలు నూలు, ధోవతులు, తువ్వాళ్ళు, వంటపాత్రలు, కుండలు, బుట్టలు, చాపలు, ఆహారపదార్థాలు ఇత్యాది నిత్యోపయోగ వస్తువులను విక్రయించటానికి సంతకు తీసుకువస్తూంటారు. అనేక పండుగలు, ఉత్సవాలు ఇప్పటికీ ఇక్కడ జరుపుకుంటూనే ఉన్నారు. నేటికీ చైత్ర మాసంలో మానసపూజ, శివపూజ; వైశాఖ, జ్యేష్ఠాలలో మూడు రోజులపాటు జరుపుకొనే హరి భజనలతో కామార్పుకూర్ సందడిగా ఉంటుంది. వీటితోపాటు జమీందారుగారి ఇంట్లో సంవత్సరం పొడవునా అష్టమీ, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమికి చెందిన విశేషోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిష్ఠింపబడిన ఆలయాలలో నిత్యనైమిత్తిక పూజలు జరిపించబడుతూనే ఉంటాయి. ఈ గ్రామంలో నెలకొన్న దారిద్ర్యం కారణంగా ఈ ఉత్సవాలలో అనేకం ఇప్పుడు ఆగిపోయాయి.
4. ఆ ప్రాంతాలలో ‘ధర్మం’ యొక్క ఆరాధన
ఒకప్పుడిక్కడ బౌద్ధుల త్రిరత్నాలలో ఒకటైన ధర్మం ఆరాధన ప్రతి ఏటా వైభవోపేతంగా జరుపబడుతూండేది. అవన్నీ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ ధర్మం ప్రస్తుతం విష్ణుమూర్తి అవతారాలలో రెండవదైన కూర్మావతారంగా చూడబడి, ఇక్కడి ప్రాంతాలలో నిరాడంబరంగా పూజలందు కొంటూంది. బ్రాహ్మణులు కూడ ఆ దేవతా ప్రతిమను పూజించటం కద్దు. ఈ ధర్మ దేవత వేర్వేరు పేర్లతో, వివిధ గ్రామాలలో పేర్కొనబడటం మనం వినవచ్చు. ఉదాహరణకు కామార్పుకూర్లో ధర్మ దేవత రాజాధిరాజుగా పేర్కొనబడుతోంది. శ్రీపూర్‌లో ప్రతిష్ఠితమైన ఈ ధర్మమే యాత్రాసిద్ధిరాజ అనీ, ముకుందపూర్కు సమీపంలోవున్న మధువతిలో సన్యాసిరాజ అనీ పిలువబడుతూ ఉన్నది. కామార్పుకూర్లో ఈ ధర్మదేవత ‘రథోత్సవం’ ఒకప్పుడు ఆడంబరంగా జరుపబడేది. తొమ్మిది స్తంభాలతో చెక్కబడిన ఆ దేవుడి పెద్ద రథం ఆలయ సమీపంలో కానవస్తుంది. కాని అది విరిగిపోయినప్పటనుండి మళ్ళీ బాగుచేయబడలేదు. మరమ్మత్తులకు నోచుకోని ఆ ఆలయం ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నది. దేవతా విగ్రహాన్ని పూజారి యజ్ఞేశ్వర తన స్వగృహానికి తరలించాడు.
5. హల్దార్చెరువు: ‘భూతి’ వాగు: మామిడితోట
బ్రాహ్మణులు, కాయస్థులు, సాలెవారు, గొల్లవారు, కమ్మరులు, కుమ్మరులు, బెస్తవారు, మాదిగవారు – ఇలా వివిధ కులాలకు చెందినవారు కామార్పుకూర్లో నివసిస్తూండేవారు. ఈ గ్రామంలో మూడు నాలుగు చెరువులున్నవి. వాటిలో హల్దార్పుకూర్ పెద్ద చెరువు. వీటితోపాటు ఎన్నో గుంటలు ఉన్నాయి. కొన్నిటిలో శతదళ పద్మాలు, తెల్ల కలువపువ్వులు పూచి, చూడ ముచ్చటగొలిపేవి. పూర్వం ఇటుకలతో కట్టబడిన ఇళ్ళు, సమాధులు ఎన్నో ఉన్నప్పటికీ, ఇప్పటికీ అనేకం కానవస్తున్నవి. శిథిలావస్థలోవున్న రామానంద శాంఖారి ఆలయం, క్షీణ దశలో ఉన్న ఫకీర్ దత్తుడి రాసమంచె, పెరిగిన తుప్పలతో కప్పబడిన ఇటుకల గుట్టలు, ఆలనాపాలనాలేని ఆలయాలు – ఇవన్నీ కామార్పుకూర్ గత వైభవాన్ని చాటుతున్నాయి. ఊరికి వాయవ్యంలో ‘బుధుయి మొరల్’, ఈశాన్యంలో ‘భూతిర్ ఖాల్’ (ఖాల్ అంటే కాలువ అని అర్థం) అనే రెండు శ్మశానవాటికలున్నాయి. భూతిర్ ఖాల్కు పశ్చిమాన పశువులు మేసే పచ్చిక మైదానం, మణిక్రాజాచే నాటబడిన ఒక మామిడితోపు, ఆమోదర్ నది ఉన్నాయి. భూతిర్ కాలువ దక్షిణంగా ప్రవహిస్తూ ఊరికి ఒకింత దూరంలో అమోదర్ నదిని చేరుతోంది.
6. భూర్సుబో వాస్తవ్యుడు మణిక్రాజా
కామార్పుకూర్కు ఒక మైలు ఉత్తరంలో ‘భూర్సుబో’ అనే గ్రామం ఉంది. మణిక్చంద్ర వందోపాధ్యాయ అనే గొప్ప ధనవంతుడు ఆ గ్రామంలో నివసించేవాడు. చుట్టుపక్కల గ్రామాలన్నిటిలో ఇతడు ‘మణిక్ రాజా’ గా పిలువబడేవాడు. పైన పేర్కొన్న మామిడితోపే కాక ‘సుఖ సాయర్’, ‘హాథీ సాయర్’ (సాయర్ అంటే సముద్రం; హాథీ అంటే ఏనుగు) అనే చెరువులు తవ్వించి కీర్తి గడించాడితడు. అనేక సందర్భాలలో ఇతడి ఇంట్లో ఒక లక్షమంది బ్రాహ్మణులు ఆహ్వానింపబడి, భోజనం చేశారని వినికిడి.
7. మందారణ్ కోట
కామార్పుకూర్కు ఆగ్నేయంలో మందారణ్ గ్రామం నెలకొనివుంది. ఇరుగుపొరుగు గ్రామ ప్రజలను శత్రు దాడుల నుంచి రక్షించటానికి ఏనాడో ఇక్కడొక పటిష్ఠమైన కోట కట్టబడింది. కోట చుట్టూవున్న అగడ్తలోనికి నీళ్ళు రావటానికి సమీపంలోని ఆమోదర్ నదీప్రవాహాన్ని చాకచక్యంగా మళ్ళించారు.
8. ఉచాలన్ చెరువు – మొగల్ మారి యుద్ధభూమి
శిథిలావస్థలోవున్న మందారణ్ కోట సింహద్వారం, గోపురం, అగడ్త, కోటకు సమీపంలోని శైలేశ్వర శివాలయం – నేటికీ కానవస్తున్నాయి. పఠానుల పరిపాలనా కాలంలో వీటి ప్రాధాన్యాన్ని అవి చెప్పక చెబుతున్నాయి. బర్ద్వాన్కు వెళ్ళే కాలిబాట ఈ మందారణ్ కోట పక్కనుంచి పోతుంది. ఈ బాటకు ఇరువైపులా ఎన్నో పెద్ద చెరువులు కానవస్తాయి; ఈ కోటకు ఉత్తరంగా 18 మైళ్ళ దూరంలో ఉన్న ఉచాలన్ అనే స్థలంలోవున్న చెరువే అన్నిటికంటే పెద్దది. ఈ దారిలో ఒకచోట పాడుబడిన ఒక గజశాల కూడ ఉన్నది. వీటన్నిటిని చూసినప్పుడు యుద్ధ, కల్లోల సమయాలలో సైనికుల సౌకర్యార్థం ఈ బాట నిర్మించబడినదని స్పష్టమౌతుంది. ఈ బాటకు ప్రక్కనున్న ‘మొగల్ మారి’ యుద్ధభూమి ఇందుకు సాక్ష్యంగా నిలబడివుంది.
9. దేరే గ్రామ జమీందారు – రామానందరాయుని కథ
కామార్పుకూర్కు రెండు మైళ్ళు పశ్చిమంలో సాత్బేరీ, నారాయణ్‌పూర్, దేరే అనబడే మూడు గ్రామాలు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. దేరే గ్రామంలోని చెరువు, దాని ప్రక్కనే నెలకొన్న ఆలయం తదితరమైనవి ఆ గ్రామాల గతించిపోయిన సిరి సంపదలను చాటుతున్నాయి. మనం ప్రస్తుతిస్తున్న కాలం నాటికి ఈ మూడు గ్రామాలు మూడు విభిన్న జమీలలో ఉండేవి. దేరే గ్రామ జమీందారు రామానందరాయ్. ఇతడు సాత్బేరీ గ్రామంలో నివసిస్తూండేవాడు. ఇతడు అంత ధనవంతుడు కాకపోయినా ప్రజలను పీడించే పరమ దుర్మార్గుడు. కారణంవున్నా లేకపోయినా ఎవరిమీదైనా కోపం వస్తే చాలు, అతణ్ణి సర్వనాశనం చేయటానికి వెనుకాడేవాడు కాడు ఈ రామానందరాయ్. అతడి కొడుకులూ, కూతుళ్ళూ ఎక్కువ కాలం జీవించలేదు. ప్రజలను పీడించిన పాపం కారణంగా అతడి వంశం నిర్వంశమైనదని చెప్పుకొనేవారు. అతడి మరణానంతరం ఆస్తిపాస్తులు పరాయివారి చేతుల్లోకి జారిపోయాయి.
10. దేరే గ్రామ వాస్తవ్యుడు మాణిక్రాం ఛట్టోపాధ్యాయ
సుమారు నూటయాభై ఏళ్ళ క్రితం, మధ్యతరగతికి చెందిన ధార్మిక బ్రాహ్మణ కుటుంబం ఒకటి ఈ దేరే గ్రామంలో నివసిస్తూండేది. వీరు సదాచార పరాయణులు, కులీనులు, శ్రీరామచంద్రుని భక్తులు. వీరు నిర్మించిన శివాలయం, దాని ప్రక్కనే ఉన్న ‘చాటుర్జీ’* కోనేరు నేటికీ వారి జ్ఞాపకార్థంగా మిగిలివున్నాయి. ఆ కుటుంబానికి చెందిన శ్రీమాణిక్రాం ఛటోపాధ్యాయ్కి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. వీరిలో పెద్దవాడైన క్షుదిరాం బహుశ 1775 వ సం ॥ లో జన్మించి వుండవచ్చును. అతడి తర్వాత రాంశీలా అనే కుమార్తె, నిధిరాం, కనాయ్రాం అనే కుమారులు జన్మించారు.
11. మాణిక్రాం కుమారుడు క్షుదిరామ్
జీవనోపాధినిచ్చే విద్యనేదైనా క్షుదిరాం నేర్చాడా అన్న సంగతి ఇదమిత్థంగా తెలియరావటం లేదు. సత్యనిష్ఠ, సంతృప్తి, క్షమాగుణం, పరిత్యాగం మొదలైన ఏ ఉదాత్త గుణాలు నిజమైన బ్రాహ్మణుడికి స్వాభావికాలని శాస్త్రాలు అభి వర్ణిస్తున్నాయో, ఆ గుణగణాలన్నిటిని భగవంతుడు అతడికి ప్రసాదించాడు. క్షుదిరాం స్ఫురద్రూపి. పచ్చని శరీరచ్ఛాయ, ఆకర్షవంతమైన చూపులతో చూడ ముచ్చటగొలిపేవాడు. కులదైవమైన శ్రీరామచంద్రుని మీద అతడికి ప్రగాఢ భక్తి ప్రపత్తులుండేవి. అనునిత్యం సంధ్యావందనాది నిత్యకర్మానుష్ఠానాలను నిర్వర్తించి, పువ్వులను సేకరించి శ్రీ రఘువీరుని పూజ ముగించిన తరువాతనే అతడు ఏదైనా ఆహారం స్వీకరించేవాడు. శూద్రుల వద్ద నుంచి ఎన్నటికీ దానాలు పట్టేవాడు కాడు. శూద్రుల ఇళ్ళలో కర్మకాండలను నిర్వర్తించే బ్రాహ్మణుల ఆహ్వానాలను సైతం అతడు తిరస్కరించేవాడు. కన్యాశుల్కం పుచ్చుకున్న బ్రాహ్మణులు స్పృశించిన మంచినీళ్ళను సైతం అతడు తాగేవాడు కాడు. అద్భుతమైన క్షుదిరాముడి సదాచారపరాయణతను చూసి, గ్రామస్థులు ముగ్ధులై అతడిపట్ల విశేష గౌరవాభిమానాలను చూపించేవారు.
12. క్షుదిరామ్ భార్య చంద్రాదేవి
తండ్రి మరణానంతరం కుటుంబ ఆస్తిపాస్తులు, నిర్వహణభారం క్షుదిరామ్ మీద పడింది. ధర్మమార్గం నుంచి తొలగకుండా తన శక్తి మేరకు అతడు ఈ కర్తవ్యాలను నిర్వర్తించ సాగాడు. కొంతకాలం క్రితమే ఇతడికి వివాహం అయింది. కాని పిన్నవయస్సులోనే భార్య మరణించింది. ఇరవై ఐదు సంవత్సరాల వయస్సులో అతడు పునర్వివాహం చేసుకొన్నాడు. ఈ రెండవ భార్య పేరు చంద్రమణి. కాని ఆమెను అందరూ ‘చంద్రా’ అంటూ క్లుప్తంగా పిలిచేవారు. ఆమె పుట్టిల్లు ‘సరాటి మాయాపూర్’ అనే గ్రామంలో ఉన్నది. చూపులకు అందంగా కనిపించే చంద్రాదేవి అమాయకురాలు. దేవుడంటేనూ, బ్రాహ్మణులంటేనూ ఆమెకు పరమభక్తి. ధార్మిక విశ్వాసం, ప్రేమ – ఇవి ఆమె లోని విశిష్ట గుణాలని చెప్పవచ్చు. ఈ కారణంగానే ఆమె అందరికీ ప్రేమపాత్రురాలయింది.బహుశా ఆమె 1791 వ సం ॥ లో జన్మించి ఉండవచ్చు. 1799 వ సం ॥ వివాహం జరిగినప్పుడు ఆమెకు ఎనిమిదేళ్ళు. ఆమె మొదటి కుమారుడు రాంకుమార్ 1805 లో పుట్టి ఉండవచ్చు. ఐదేళ్ళ తరువాత కాత్యాయని అనే కుమార్తె, 1826 లో రామేశ్వర్ అనే రెండవ కుమారుడు జన్మించారు.
13. జమీందారుతో వివాదం: క్షుదిరామ్ ఆస్తిపాస్తుల్ని కోల్పోవటం
ధర్మమార్గం నుంచి వైదొలగకుండా సంసారాన్ని నడపటం ఎంత కష్టతరమో తెలుసుకోవటానికి క్షుదిరామ్కి ఎంతోకాలం పట్టలేదు. కుమార్తె కాత్యాయని పుట్టిన ఒకింత కాలంలోనే అతడు ఒక అగ్నిపరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది. గ్రామ జమీందారు రామానందరాయ్ ప్రజాకంటకుడనే సంగతి ముందే చెప్పటం జరిగింది. అతడు దేరే గ్రామస్థుడొకడి మీద ఏదో కారణంగా ఆగ్రహం పూని, అతడిపై తప్పుడు వ్యాజ్యెం తెచ్చాడు. వాజ్యెంలో గెలవటానికి కీర్తిప్రతిష్ఠలున్న సాక్షి అవసరమొచ్చి, తన పక్షంలో తప్పుడు సాక్ష్యం ఇవ్వమని క్షుదిరామ్ను రామానందరాయ్ కోరాడు. ధర్మపరాయణుడైన క్షుదిరామ్కు వ్యాజ్యాలన్నా, న్యాయస్థానాలన్నా భయమూ, జంకూను! న్యాయం తన పక్షానవున్నాకూడ అతడు ఏనాడూ ఎవరికీ వ్యతిరేకంగా న్యాయస్థానానికి వెళ్ళలేదు. కాబట్టి జమీందారు కోరిక అతడికొక విషమ సమస్యగా తయారయింది. తప్పుడు సాక్ష్యం చెప్పకపోతే జమీందారు పగపడతాడని అతడికి బాగా తెలుసు. కూట సాక్ష్యం ఇవ్వటానికి అతడు ససేమిరా నిరాకరించాడు. అలాంటి సందర్భాలలో అనివార్యంగా జరిగేదే యిక్కడా జరిగిపోయింది. జమీందారు, క్షుదిరామ్ మీద న్యాయస్థానంలో ఒక తప్పుడు వ్యాజ్యాన్ని బనాయించి, గెలిచాడు. తాతదండ్రుల నుంచి సంక్రమించిన క్షుదిరామ్ యావదాస్తినీ వేలంలో జమీందారు కైవసం చేసుకొన్నాడు. ఫలితంగా దేరే గ్రామంలో క్షుదిరామ్కు చిల్లిగవ్వ కూడ మిగలలేదు. గ్రామస్థులంతా ఆ మహానుభావుడికి వాటిల్లిన కష్టానికి కన్నీరు కార్చారేగాని, జమీందారు భయంతో ఏ రకంగా తోడ్పడటానికీ వారు సాహసించలేకపోయారు.
14. క్షుదిరామ్ దేరే గ్రామాన్ని విడిచి వెళ్ళడం
నలభై ఏళ్ళ వయస్సులో క్షుదిరామ్ ఇలా ఒక్క క్షణంలో తన సర్వస్వాన్ని కోల్పోయాడు. తాత తండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తితో* పాటు తను స్వయంగా సంపాదించిన ఆస్తి పెనుగాలి తాకిడికి చెదరిపోయిన మబ్బు తునక మాదిరి హఠాత్తుగా అదృశ్యమై పోయింది.
15. క్షుదిరామ్ కామార్పుకూర్కు వలస పోవటం
కామార్పుకూర్లోని సుఖలాల్ గోస్వామిని గురించి ఇంతకు మునుపే చెప్పుకొన్నాం. అతడు, క్షుదిరామ్ సన్నిహితులైన చిరకాల మిత్రులు. ఇద్దరూ ఒకే స్వభావం గలవారు. తన మిత్రుడికి వాటిల్లిన ఈ ఆపద అతణ్ణి ఎంతో కదిలించి వేసింది. తనకు చెందిన కొన్ని చావళ్ళను అతడు వెంటనే ఖాళీచేయించి, కామార్పుకూర్కు వచ్చి నివసించమని క్షుదిరామ్ను ఆహ్వానించాడు. ‘తుపానులో తీరం’ చేరిన చందమయింది క్షుదిరామ్కు. ఈ ఆహ్వానాన్ని దైవలీలగా ఎంచి, ఆనందంగా అంగీ కరించాడు. అతడి హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. కామార్పుకూర్కు వలసవచ్చి, ఆనాటి నుంచి అక్కడే నివసించసాగాడు. తన మిత్రుణ్ణి అమితంగా ప్రేమిస్తూన్న సుఖలాల్ కూడా మిత్రుడి రాకతో ఎంతో ఆనందించాడు. అతడి కుటుంబ నిర్వహణ నిమిత్తం ఒక బీఘా పది ఛట్కాల* భూమిని క్షుదిరామ్కు శాశ్వతంగా ధారాదత్తం చేశాడు.
క్షుదిరామ్ స్వస్థలమయిన, దేరేగ్రామంలో వెలసి ఉన్న శ్రీరామకృష్ణుల దేవాలయం
కామార్పుకూర్లోని శ్రీరామకృష్ణుల కుటుంబ స్వగృహం