1. ఆధునిక కాలంలో మానవశక్తి – ప్రగతులు
విజ్ఞానం, సంపద, స్వయంకృషి – వీటి ఆసరాతో ప్రతి రంగంలోను మనిషి ఎలా ముందంజ వేస్తున్నాడో అతిసామాన్యుడు కూడా తెలుసుకోగలడు. జీవితంలోని ఏ క్షేత్రంలోనైనా ఈ ప్రగతి కొక పరిధిని గీసుకోవడానికి మనిషి ఇచ్ఛగించడం లేదని తోస్తోంది. నేలమీద, నీటిమీద పయనించటంతోనే సంతృప్తి పడక అతగాడు ఆకాశంలో ఎగరడానికీ ఒక యంత్రాన్ని కనుగొన్నాడు. సాగర గర్భంలోకి చొచ్చుకొనిపోయి ప్రజ్వలించే అగ్నిపర్వతాల అన్వేషణకు అతడిలోని జిజ్ఞాస వెన్నుతట్టింది. నిరంతరం మంచుతో కప్పబడిన పర్వతాలను అధిరోహించాడు, సముద్రాలను దాటాడు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల అద్భుతాలను సూక్ష్మావలోకనం చేశాడు. లతలు, మొక్కలు, చెట్లలోకూడ తనలోవున్న ప్రాణమే స్పందిస్తోందని కనుగొన్నాడు. ప్రాణికోటిని ప్రయోగ పరిశీలనలకు గురిచేసి తన విజ్ఞానాన్ని విస్తృతం చేసుకొన్నాడు. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాల మీద ఆధిపత్యాన్ని సాధించి మనం నివసించే భూమికి సంబంధించిన అసంఖ్యాక వాస్తవాలను తెలుసుకొన్నాడు. అంతటితో తృప్తిపడలేదు. అనంత దూరాలలోని గ్రహ, నక్షత్రాల రహస్యాలను ఆవిష్కరించటంలో ఉత్సుకత చూపాడు – తన అన్వేషణలో ఇప్పటికే కొంతమేరకు విజయాన్ని సాధించాడు. అంతర్జగత్తు నియమాలను దర్యాప్తు చేయటంలో అతడి ప్రయత్నలోపం కానరాదు. ప్రయోగ పరిశోధనలతో అతడు ఆ క్షేత్రంలో నిరంతరం నూతన సత్యాలను కనుగొంటూనే ఉన్నాడు. ఒక జాతి మరో జాతిగా పరిణమిస్తుందనే నిర్ణయానికి వచ్చాడు. మనస్సు ఆది, అంతం ఉన్న సూక్ష్మపదార్థమని అర్థం చేసుకొన్నాడు. బాహ్యప్రపంచంలో మాదిరే మానసిక ప్రపంచంలో కూడా ప్రతీ సంఘటన ఒక అనుల్లంఘనీయ నియమావళి మేరకు జరుగుతోందన్న నమ్మకానికి వచ్చాడు. అంతేకాదు, ఆత్మహత్య చేసుకోవాలనే విపరీతపు చర్యను ప్రేరేపించే మానసిక ప్రవృత్తుల నియమాలతో అతడు చిరపరిచితుడయినాడు. మరణానంతరం జీవి అస్తిత్వ విషయంగా ఖచ్చితమైన ప్రమాణం లభించకపోయినా జాతీయ జీవనం కొనసాగటమేకాక పరిణామం కూడా చెందుతుందని చరిత్ర అధ్యయనం అతణ్ణి విశ్వసింపజేసింది. ఇలా వ్యక్తిగత జీవితం జాతీయ జీవనంలో సార్థకమవటం గాంచి దాన్ని మరింత ఫలవంతం చేయటానికి విజ్ఞానం సహకార కార్యకలాపాల సాయంతో అజ్ఞానాన్ని పారదోలటానికి నిరంతర పోరాటం సాగిస్తున్నాడు. ఇలా అనుక్షణం పోరాటం చేస్తూ, బాహ్యాభ్యంతరాల నిగూఢ క్షేత్రాలను కనుగొంటూ, శాశ్వత ప్రగతిని గురించిన ఊహల్లో తేలిపోతూ, అంతులేని కోరికలనే మహాప్రవాహంలో తన జీవన నౌకను జలప్రవేశం చేయించాడు.
2. శక్తి ప్రగతుల విస్తరణ–పాశ్చాత్యం నుంచి ప్రాచ్యానికి
కోరికలను అధికరించుకొంటూపోయే భౌతికవాద జీవన ప్రగతి ప్రధానంగా పాశ్చాత్యంలో ఉద్భవించింది. కాని భారతదేశంలోను, ఇతర ప్రాచ్య దేశాలలోను దాని తాలూకు ప్రభావం చాలామేరకు కానవస్తోంది. విజ్ఞాన పురోభి వృద్ధితో ప్రాచ్య పాశ్చాత్యాలు ప్రతిరోజు చేరువ అవుతున్నకొద్దీ ప్రాచ్య జీవన సరళి మార్పుకు లోనై పాశ్చాత్య విధానానికి అద్దం పడుతోంది. పర్షియా, చైనా, జపాన్, భారతదేశం, తదితర ప్రాచ్యదేశాల చరిత్రలను అధ్యయనం చేస్తే మనకీ విషయం స్పష్టమవుతుంది. మంచికో, మరి చెడుకో పాశ్చాత్య భావాల ప్రభావం ప్రాచ్యం మీద పడిందన్న విషయంలో ఈషణ్మాత్రమూ సందేహం లేదు. అంతేకాదు, కాలగమనంలో ఈ పాశ్చాత్య భావాలు ప్రపంచం యావత్తు వ్యాపిస్తాయని స్ఫురిస్తోంది.
3. పర్యవసానంగా పాశ్చాత్య జీవన సరళి, ప్రగతికి ప్రమాణ మవుతుంది
పైన చెప్పిన జీవన ప్రగతి మంచి చెడులను నిర్ణయించాలంటే మనం ప్రత్యేకంగా పాశ్చాత్యానికి వెళ్ళాలి. అక్కడ మనం దీని మూలాన్ని, స్వభావాలను కనుగొనవచ్చు. అలాంట దర్యాప్తు – పాశ్చాత్యుల తొలకరి భావనలు ప్రగతిగాములా లేక తిరోగాములా; మనిషికి ప్రాప్తించే మొత్తం సుఖంలో లాభదాయకాలా, నష్టదాయకాలా అనే విషయం మనకు తెలియచేస్తుంది. ఇలా వ్యష్టిగా సమిష్టిగా పాశ్చాత్య జీవనంలో ఆ ప్రగతి ఫలితాలను ఒక్కమారు నిర్ణయించగలిగితే, అదే ప్రక్రియను సులభంగా ఇతర దేశాలకూ వర్తించుకోవచ్చు. అలా చేసేటప్పుడు ఈ ఆధునిక ప్రభావాలకు ఆ దేశాలు ఎంత కాలంగా గురి అయినవో గణనలోకి తీసుకోవాలి.
4. పాశ్చాత్యంలోని ఈ ప్రగతికి కారణం, దాని చరిత్ర
పాశ్చాత్య దేశాలలో నెలకొన్న భరించరాని శీతలం అక్కడి మనిషిని ప్రాచీన కాలం నుంచీ తీవ్ర దేహస్మృతిగామిగా రూపొందించినదని చరిత్ర స్పష్టంగా నమోదు చేసింది. ఇది అతణ్ణి స్వార్థపరుణ్ణి చేసింది. కాని అదే సమయంలో వ్యక్తిగత స్వార్థసిద్ధి సమష్టి కృషితోనే సుసాధ్యం అని అతడు గుర్తించాడు. ఈ గుర్తింపు అతణ్ణి దేశభక్తుడిగా రూపొందించింది. ఈ స్వార్థపరత్వమూ, దేశభక్తీ కాలక్రమంలో మొక్కవోని సాహసంతో పరాయి దేశాలను ఆక్రమించి, వాటి సంపదలను కొల్లగొట్టటంలో అతడికి దోహదకారులయ్యాయి. తదనంతరం అతడి జీవనపోరాటం సుగమం అయింది. క్రమంగా దృష్టిని తనకేసి మళ్ళించుకొనే సమర్థత గడించాడు; ఫలితంగా పాండిత్యం, కులీన లక్షణాలు సముపార్జించే ప్రయత్నంలో పడ్డాడు. కేవలం జీవన సమరాన్ని మించిన ఉన్నత అంశాలకేసి అతడు మరింతగా చేరువ కాసాగాడు. కాని ఇప్పుడతడు అవరోధాలను ఎదుర్కోవలసి వచ్చింది. మత విశ్వాసాలు, మత దురభిమానులైన పురోహితవర్గం పురోగమన పథానికి అడ్డుగోడలుగా నిలిచాయి. విద్యా సముపార్జనకు ఎవడైనా పూనుకొంటే అతగాడు నిశ్చయంగా నరకానికి వెళ్ళక తప్పదు అంటూ బెదిరించటంతో మాత్రమే ఊరుకోలేదు ఆ పురోహితుడు. మరింత ముందుకు వెళ్ళి, ఆ ప్రగతిమార్గంలో ఎవడూ ముందుకుపోకుండా నివారించటానికై మోసం, శక్తి, కపటోపాయాలు ప్రయోగించాడు. కాని స్వార్థపరత్వం సాధించటానికి అలవాటుపడ్డ పాశ్చాత్యుడికి ఈ అవరోధాలను అధిగమించటానికి ఎక్కువ సమయం పట్టలేదు. తను ప్రయాణించే మార్గం నుంచి పురోహితుణ్ణి బలవంతంగా తొలగించి, ముందంజ వేశాడు. ధర్మశాస్త్ర గ్రంథాలను, మతాన్ని త్రోసిరాజనీ, పురోహితుణ్ణి ధిక్కరించీ ఒక కొత్తబాటలో తన జీవితాన్ని నిర్దేశించుకొన్నాడు. ఇంద్రియాతీతమైన దేనినీ విశ్వసించకూడదనీ, స్వీకరించ కూడదనీ నిర్ణయించుకొన్నాడు.
పంచేంద్రియాలతో ప్రత్యక్షంగా అనుభూతమై, హేతువాదానికి నిలబడేదే ‘సత్యం’ గా పాశ్చాత్యం ఎంచుకొంది; అప్పటినుంచి పాశ్చాత్యం కనపడే (యుష్మదీ ప్రత్యయగోచరమైన – అంటే నేను తప్ప తక్కిన దానినంతా) ఈ విషయాలన్నిటినీ పదార్థంగా భావించి, దానినే ఆరాధించసాగింది. అంతేగాక అస్మత్ ప్రత్యయ గోచరమైన (అంటే నేను అనే ఎరుకను) విషయాన్ని కూడ ఇతర విషయాలలో మరొకటిగా భావించసాగింది. కనుక ఈ విషయాన్ని కూడ అది ఇంద్రియాల చేత ప్రత్యక్షంగా అనుభూతమయ్యే ఇతర పదార్థాలను పరిశోధించినట్లే పరిశోధించసాగింది. ఇలా గత నాలుగు వందల సంవత్సరాల నుంచి పాశ్చాత్యుడు విశ్వంలోని ప్రతిదానినీ ప్రత్యక్ష ప్రమాణం ద్వారానే స్వీకరించసాగాడు. ఈలోపు తన శైశవదశలోని లోపాలను, పరిమితులను అధిగమించి, పెరిగి పెద్దదై – బలం, ఆశావాదం, ఉత్సాహం, శక్తితో కూడుకొన్న యౌవనంలోకి అడుగుపెట్టింది విజ్ఞానశాస్త్రం.
5. ఆత్మజ్ఞానం పట్ల అజ్ఞానం: తత్ఫలితంగా అసంతృప్తి
విజ్ఞానశాస్త్రంలో మరింత పురోభివృద్ధి గాంచటంలో సమర్థుడైనప్పటికీ, పైన తెల్పిన విధానం పాశ్చాత్యుణ్ణి ఆత్మజ్ఞానం కేసి దారితీయించలేకపోయింది. ఎందువల్లనంటే – ఆత్మజ్ఞానమనేది ఆత్మసంయమం, స్వార్థత్యాగం, అంతర్ముఖత్వం ద్వారా మాత్రమే పొంద గలుగుతాం. పైగా సంపూర్ణంగా నియంత్రించబడిన వృత్తులతో కూడిన మనస్సే ఈ ఆత్మ జ్ఞానానికి దోహదపడే ఏకైక పరికరం. కాబట్టే కేవల బహిర్ముఖుడైన పాశ్చాత్యుడు ఆత్మజ్ఞాన మార్గభ్రష్టుడై భౌతికవాదిగా, దేహాత్మ వాదిగా మారిపోవటంలో ఆశ్చర్యపడనక్కర్లేదు. అందుకే కాబోలు ప్రాపంచిక సుఖాలనే పరమార్థాలుగా ఎంచుతూ, వాటిని పొందటంలో తన సర్వశక్తులనూ వినియోగించసాగాడు. విజ్ఞానశాస్త్రం మూలంగా భౌతిక పదార్థాలను గురించి గడించిన జ్ఞానాన్ని అతగాడు తన భోగసాధనకై ఉపయోగించసాగాడు. ఫలితంగా అతడు స్వార్థపరుడూ, మహాదాంభికుడూ అయ్యాడు. కనుకనే పాశ్చాత్యంలో సంపద మీద ఆధారపడిన సాంఘిక వ్యవస్థను మనం గమనించవచ్చు. ప్రళయకాలంలో వినవచ్చే బీభత్స వాదాలతో సరిపోయే మారణాయుధాలను మనం అక్కడ చూడవచ్చు. దీనితోపాటు అంతులేని సౌభాగ్యం ప్రక్కనే నెలకొన్న పేదరికపు అసంతృప్తినీ, ఐశ్వర్యం కొఱకు తీరని దాహాన్ని, పరాయి దేశాల దురాక్రమణ, అణచివేతలను కూడా అక్కడ మనం చూడగలం. మళ్ళీ ఈ భోగలాలసత కారణంగా సుఖభోగాలు చరమసీమకు చేరినా కూడ పాశ్చాత్య స్త్రీపురుషుల హృదయాలలో ఒక అగాధమైన వెలితి అలాగే ఉండిపోయింది. వ్యక్తిగతంగా తాము మరణించినా జాతిపరంగా తాము ఉంటామనే నమ్మకం కూడ వారిలో ఎలాంటి సంతోషాన్నీ కలిగించలేకపోయింది. సావధాన పరిశోధనానంతరం పాశ్చాత్యుడికి పంచేంద్రియాలు ఉత్పాదించే జ్ఞానం దేశ కాలాతీతమైన సత్యాన్ని గురించిన జ్ఞానాన్ని ఇవ్వజాలదని అర్థమైంది. భౌతికవిజ్ఞానం ఆ సత్యం ఉనికిని సూచించటంతో ఆగిపోతుంది. కారణం ఆ సత్యం భౌతిక జ్ఞానానికి అతీతమైనది కాబట్టి! ప్రాపంచిక జ్ఞానమనే ఏ దేవత సహాయంతో అతడు ఇంత బలవంతుడూ శక్తిమంతుడూ అయినాడో, ఏ దేవత అతడికి భోగభాగ్యాలను అనుగ్రహించిందో, ఆ సదరు దేవత తనకు ఈ విషయంలో ఉపకరించలేదని అతడు అర్థంచేసుకొన్నాడు. అతడి హృదయం ఇప్పుడు నిరాశానిస్పృహలతో, అంతులేని బాధతో నిండిపోయింది.
6. ప్రాచ్యంకూడ పాశ్చాత్యంలా ‘పురోగమించా’ లంటే అది స్వార్థాన్ని, భోగలాలసను అలవరచుకోవాలి
ఆ విధంగా మతవిశ్వాసరాహిత్యం, స్వార్థపరత్వం, భోగాసక్తి అనే పునాదుల మీద పాశ్చాత్య నాగరికత నిర్మితమైనదని చరిత్ర అధ్యయనం తెలుపుతుంది. కాబట్టి ఏ వ్యక్తిగాని, దేశంకాని పాశ్చాత్యం సముపార్జించిన ఫలాలను తానూ పొందాలని ఆకాంక్షిస్తే ఇష్టానిష్టలతో నిమిత్తం లేకుండా ఆ పునాదుల మీదనే తమ జీవన సరళిని నిర్మించాలి. అందుకే పాశ్చాత్య భావాలను అనుకరించి తమ జాతీయ జీవనాన్ని దిద్దుకొన్న జపాన్ మొదలైన ప్రాచ్యదేశాలలో కూడ – అవి తమ దేశాలను ఎంత ప్రేమిస్తూన్నా కూడ – పైన పేర్కొన్న చెడులు తప్పటం లేదు. పాశ్చాత్య భావాలు, ఆదర్శాల స్ఫూర్తి ఫలితమే ఈ అనర్థం. ఈ సంగతి పాశ్చాత్యంతో భారతీయ జీవన సరళి సంపర్కం పొందిన తదనంతర కాలచరిత్రను అధ్యయనం చేస్తే స్పష్టమవుతుంది.
7. ధార్మికత: భారతీయుల ప్రాచీన జాతీయజీవన పునాది
పాశ్చాత్యంతో సంసర్గం కలగటానికి మునుపు భారతదేశంలో ‘జాతీయ జీవనం’ అంటూ ఒకటి ఉండేదా? అందుకు జవాబు, ‘జాతీయ జీవనం’ పేరిట అలా ఒకటి ఉండకపోయినా, నిస్సందేహంగా అది ఉండినదనటం యథార్థమే. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఐదు ‘గ’ కారాల – అంటే 1. గురువు 2.గంగ 3. గాయత్రి 4. గీత (భగవద్గీత) 5. గోవు (ఆవు) –పట్ల శ్రద్ధాభక్తులు గలిగినవారై పూజిస్తూండటం ప్రతిచోటా మనకు కానవస్తున్నది. అలాగే రామాయణం, మహాభారతం తదితర ధార్మిక గ్రంథాలలోని పవిత్ర ఆదర్శాలు, ప్రతివ్యక్తి జీవితానికీ ప్రేరణనిచ్చి మార్గదర్శకాలైనవి. అట్లే దేవభాష అయిన సంస్కృతం విద్యావంతులకు వాడుకభాష అయినది. ఇలా వారిని సమైక్యమొనర్చే అంశాలు ఎన్నో ఉన్నప్పటికీ, ధార్మికాదర్శాలు, ధర్మానుష్ఠానం నిస్సంశయంగా ఆ సమైక్యతకు పునాది అని చెప్పక తప్పదు.
8. ప్రాపంచిక భోగాలను భారతదేశం ఎన్నడూ ఆదర్శంగా తీసుకోలేదు
భారతదేశ జాతీయ జీవన పునాది ధార్మికత మీద ప్రతిష్ఠితం కావటంతో, దాని నాగరికత అపూర్వంగా రూపుదిద్దుకొంది. వ్యక్తిపరమైన, జాతిపరమైన నడవడిని నియంత్రించే ఆత్మసంయమమే ఈ నాగరికత యొక్క ముఖ్య లక్షణం. భోగం త్యాగానికి దారి తీయటానికే, ఐహిక జీవనం పరలోక జీవనం నిమిత్తమే – అనే సిద్ధాంతాన్ని సర్వులకూ జ్ఞప్తిచేస్తూ వచ్చిందీ సంస్కృతి. ఈ మహోత్తమ ఆదర్శమే వ్యక్తిగత లేక జాతీయ జీవనానికి ప్రాణనాడిగా పనిచేసింది. కాబట్టే కుల లేక వర్ణ విధానం సుదీర్ఘకాలం పరస్పర విభేదాలనుగాని, అసంతృప్తిని గాని సమాజంలో కల్పించలేదు. ఎందుకంటే ప్రతివ్యక్తీ జన్మతో నిమిత్తం లేకుండా కులం లేక వర్ణానికి చెందిన కర్తవ్యాలను నిస్వార్థంగా నిర్వర్తించి మోక్షాన్ని పొందవచ్చు. అలాంటప్పుడు అసంతృప్తికి చోటెక్కెడ? సుఖీంచటానికి సమాన అవకాశాల హక్కు ప్రాతిపదిక మీద నెలకొన్న పాశ్చాత్య సమాజంలో సంభవించిన దానికి విరుద్ధంగా, ముక్తిని పొందటానికి సమాన అవకాశాలు కల్పించిన ప్రాచీన భారతీయ సమాజంలో సాంఘిక వర్గాలలో ఎలాటి అసంతృప్తి జనించలేదు. పాశ్చాత్య సాన్నిహిత్య ఫలితంగా భారతదేశ జాతీయ జీవనంలో వచ్చిన పరిణామాలు ఈ దిగువన చర్చించబడినవి.
9. పాశ్చాత్యుల భారతదేశ ఆక్రమణ –తత్ఫలితాలు
పాశ్చాత్యం భారతదేశాన్ని ఆక్రమించుకొన్న ఫలితంగా జాతీయ సంపద పంపిణీలో అనేక మార్పులు సంభవించటం సహజమూ, అనివార్యమూను! కాని పాశ్చాత్య ప్రభావం అక్కడితో ఆగక, మరింత ముందుకు చొచ్చుకుపోయింది. అనాదిగా స్త్రీ, పురుషులకు జాతీయ జీవన విధానానికి మార్గదర్శకాలుగా ఉన్న వేళ్ళూనిన విశ్వాసాలలో ఆ ప్రభావం విపరీత పరిణామాలను తీసుకువచ్చింది. తత్ఫలితంగా – భోగం త్యాగం నిమిత్తమే – అంటే సుఖీంచే ఉద్దేశం ఆఖరుకు దాన్ని త్యజించటానికే అనే సిద్ధాంతం స్వార్థాన్వేషకులైన పురోహితుల మిథ్యాకల్పన అనీ, మరణానంతరం ఆత్మ ఉంటుందనే భావన, కవుల ఊహాగానమనీ భారతీయులు ఇప్పుడు దృఢంగా విశ్వసించసాగారు. ఒక వ్యక్తి ఏ జాతిలో, ఏ అంతస్తులో జన్మిస్తాడో జీవితాంతం అతడు దాన్లోనే ఉండిపోవాలనటం కంటే అన్యాయమైన విషయం మరొకటి ఏం ఉంటుంది? ఇలా క్రమక్రమంగా పాశ్చాత్య వశీకరణకు లోనవుతూ త్యాగం, ఆత్మసంయమం అనే ఆదర్శాలను త్రోసిపుచ్చి, ప్రాపంచిక భోగాలకేసి భారతదేశం పరుగులెత్తసాగింది. ఈ వైఖరి వలన ప్రాచీన విద్యాశిక్షణా విధానం కనుమరుగై పోవడం ప్రారంభించింది. అంతేగాక నాస్తికత్వం, అనుకరణపట్ల ప్రీతి, ఆత్మవిశ్వాసరాహిత్యాలను పెంపొందించసాగింది. ఆ విధంగా భారతదేశం తన వెన్నెముకనే కోల్పోయింది. సుదీర్ఘకాలంగా తాము విశ్వసిస్తూ వస్తూన్న నమ్మకాలు, అనుష్ఠానాలు తప్పుల కుప్పలనీ, పాశ్చాత్యం తన అద్భుత విజ్ఞాన పరిజ్ఞానంతో భారతీయ సంప్రదాయాలు మొరటువని, అనాగరికాలని ప్రకటించటంతో భారతీయులు కూడ అలాగే భావించసాగారు. భోగాసక్తతతో అంధురాలై భారతదేశం తన ప్రాచీన సంస్కృతీ వైభవాలను మరచిపోయింది. ఈ మరపు దాని అవగాహనాశక్తిని అస్తవ్యస్తపరచింది. అప్పుడు దాని జాతీయ అస్తిత్వమే ప్రమాదంలో పడింది. ప్రాపంచిక సుఖాలకు కూడ ఇతరులపైనే ఆధారపడవలసిన కారణంగా నిరాశాభావం చోటుచేసుకుంది. ఆ విధంగా రెంటికీ చెడ్డ రేవడిలా భుక్తిని, ముక్తిని రెండిటినీ కోల్పోయినా, ఇతరులను అనుకరించటాన్ని వీడక, భోగవాసనలనే అలల్లో చిక్కువడిన సరంగులేని నావ మాదిరి దేశం అల్లకల్లోలితం కాసాగింది. అటువంటప్పుడు నాల్గుమూలల నుండి పెద్ద కలవరం చెలరేగింది: “భారతదేశంలో జాతీయ జీవన మనేది ఎన్నడూ ఉండివుండలేదు. పాశ్చాత్యుల పుణ్యమా అంటూ ఇప్పుడది కానవస్తూన్నా, పూర్తిగా అదింకా వ్యక్తం కావటానికి ఎన్నో అడ్డంకులున్నాయి. ముఖ్యంగా వేళ్ళూనిన మతవిశ్వాసాలు, దానిని పూర్తిగా చంపివేశాయి. విగ్రహారాధన – అసంఖ్యాక దేవీదేవతల పూజ ఆ జాతీయ జీవనాన్ని ఎదగకుండా నిలు వరించింది. కాబట్టి దీన్ని నాశనం చెయ్యి, సంప్రదాయాన్ని కూకటివేళ్ళతో సహా పెరికివెయ్యి, అప్పుడే భారతీయ స్త్రీ పురుషులందరిలో సజీవత్వం కొత్తగా నెలకొంటుంది.”
దీనితోపాటు క్రైస్తవమతం, దానికి అనుకరణగా ఏకేశ్వరవాదం* ప్రచారంలోనికి వచ్చాయి. రాజకీయాల మీద, సాంఘికశాస్త్రం మీద, స్త్రీ స్వాతంత్ర్యంమీద, వితంతు పునర్వివాహాల మీద పాశ్చాత్య పద్ధతిలో బహిరంగ సభలలో ఇచ్చే ప్రసంగాలను సాగిలబడి భారతదేశం ఆలకించసాగింది. ఇంత జరిగినప్పటికీ నిరాశా నిస్పృహలు తగ్గటానికి బదులుగా అవి మరింత పెరగసాగాయి. పాశ్చాత్య నాగరకతా ఉత్పాదకాలైన రైళ్ళు, టెలిగ్రాఫ్లు ఉపయోగంలోనికి వచ్చాయి. ఇవీ పరిస్థితులను చక్కదిద్దలేక పోయాయి. అందుకు కారణం – జాతీయ జీవన ఆదర్శాలను అవి స్పృశించ లేకపోవడం, ప్రేరణను కలిగించలేకపోవడమే. సరైన చికిత్స చేయనిదే, రోగం నయం కాదుగదా! భారతదేశపు ఆత్మ, మతంలో, ధార్మికతలో నెలకొని ఉంది. ఆ ధార్మికతను మేలుకొల్పలేనప్పుడు దేశం ఎలా సజీవం కాగలదు? పాశ్చాత్య భావాల ప్రభావమే ఈ పతనానికి మూలకారణం. అలాంటప్పుడు నాస్తికత్వంతో కూడిన పాశ్చాత్యం దాన్నెలా పునరుజ్జీవింప చేయగలదు? స్వయంగా లోపభూయిష్ఠమైన పాశ్చాత్యం మరొక దేశాన్ని ఎలా ఉద్ధరించగలదు?
10. భారత జాతీయ జీవనం: గుణదోషాలు
పాశ్చాత్యుల ఆగమనానికి పూర్వం భారత జాతీయ జీవనంలో లోపాలు లేవనటం కూడా సబబు కాదు. కాని నాడు జాతీయ జీవనం జీవంతో ఉండటంతో తన దోషాలను స్వయంగా సరిదిద్దుకోవటానికి అది సర్వదా ప్రయత్నిస్తూనే ఉన్నది. కాని ప్రస్తుతం జాతిలోను, సమాజంలోను ఆ ప్రయత్నం కాన రావటం లేదు. తత్ఫలితంగా పాశ్చాత్య భావాలు, ఆదర్శాల వ్యాప్తి, రోగాన్ని నయం చేయటానికి మారుగా రోగినే చంపపూనుతున్నది.
11. ప్రస్తుత ధర్మగ్లానికి పాశ్చాత్య భావనలే కారకాలు
కనుక పాశ్చాత్యంలో జరిగిన ధర్మగ్లాని భారతదేశంలోను దాని ప్రభావం చూపినదనటం స్పష్టం. ప్రస్తుత కాలంలో ఈ ధర్మగ్లాని ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా పాకిపోయిందో ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి ధార్మికత అనేది ఏదైనా ఒకటి ఉంటే, భగవంతుడి కృపతో మనిషి దాన్ని సాక్షాత్కరించుకుంటే భోగ పరాయణుడైన అతగాడు ఈ ఆధునిక యుగంలో దాన్ని వీడి సుదూరం వెళ్ళాడనటం నిస్సంశయం. నూతన ప్రక్రియలతో సరికొత్త భోగాలను మానవుడికి అందించి తద్ద్వారా అతడి జీవితాన్ని సుసంపన్నం చేస్తున్నానని భావించే విజ్ఞానశాస్త్రం, మానవుడికి శాంతిని ప్రసాదించటంలో పరాజయాన్నే చవిచూసింది. ఈ శోచనీయ స్థితిలో మానవుడికి చేయూత నిచ్చేదెవరు? మానవ ఆత్మ అనుభవిస్తూన్న ఈ అశాంతి, ఆవేదనలకు చలించిపోయి, ఈ యుగానికి అనుకూలించేదీ, మనిషిని ఈ ఇంద్రియభోగాల ఉచ్చునుంచి కాపాడగల ఒక మతాన్ని అందించే ఆధ్యాత్మిక శక్తి ఒకటి లేదా? ప్రాచ్య పాశ్చాత్యాలలో దిగజారిపోతూన్న ఆధ్యాత్మిక విలువలను తిరిగి ఉన్నతస్థాయికి తీసుకొచ్చి, మనిషిని మళ్ళీ శాంతిమయ జీవనాన్ని గడిపే మార్గంలోపెట్టే శక్తి ఏది?
భగవద్గీతలో భగవానుడు, ‘లోకంలో ధర్మం క్షీణించినప్పుడు తన మాయ ద్వారా మానవరూపంలో అవతరించి, అధర్మాన్ని అరికట్టి, తిరిగి మనిషికి శాంతిమార్గం చూపిస్తా’ నని వాగ్దానం చేశాడు. అంతులేని ఈ సమకాలీన ఆవేదన – ఈ యుగావశ్యకత – అతడి కరుణను ఉప్పొంగనీయదా? మనిషి పొందుతున్న నిస్సహాయత, నిస్పృహ అతణ్ణి మళ్ళీ అవతరించటానికి పురికొల్పదా?
12. ధర్మ సంరక్షణార్థం భగవానుడు మళ్ళీ అవతరించాడు
ఓ పాఠక మహాశయా! ఈ యుగ ఆవశ్యకత ఈ కార్యాన్ని మళ్ళీ నిర్వర్తింపచేసింది; భగవానుడు జగద్గురువు రూపంలో మళ్ళీ నిజంగానే అవతరించాడు. విశ్వాసంతో అతడి పవిత్ర వాణిని శ్రద్ధతో ఆలకించు: “ఎన్ని మతాలో, అన్ని మార్గాలు”, “శ్రద్ధతో ఆచరించిన ఏ ఆధ్యాత్మిక సాధనతోనైనా భగవత్సాక్షాత్కారం పొందగలవు.” కోల్పోయిన ఆ పరావిద్యను తీసుకురావటానికై అతడు ఆచరించిన కనీ వినీ ఎరుగని పరిత్యాగ తపోసాధనల గురించి ముగ్ధుడవై ఆలకించి, మననం చెయ్యి. లవలేశమైనా కామగంధంలేని ఆ మహనీయుడి పావన చరితాన్ని చర్చించుకొంటూ, ధ్యానిస్తూ మనమూ పవిత్రులమవుదాం, పదండి!