ప్రస్తావన
ఇది శ్రీరామకృష్ణ పరమహంస గ్రంథంలో ఐదవ భాగం. దీన్లో బ్రహ్మ సమాజ భక్తులతో ప్రప్రథమంగా పరిచయం కావడం నుండి, కంఠవ్యాధి చికిత్స నిమిత్తం కలకత్తాలోని శ్యాంపుకూర్లో నివసించినప్పటి వరకు శ్రీరామకృష్ణుల జీవితంలో జరిగిన సంఘటనలను సాధ్యమైనంతదాకా పొందుపరిచాం. ఈ కాలఘట్టంలో శ్రీరామకృష్ణులు దివ్యభావంలో పూర్తిగా సుప్రతిష్ఠితులై మెలిగారు; భక్తులతో మెలగడం, ఆయన చేసిన ప్రతీపని ఈ భావంలో నెలకొని ఉండే చేశారు. పైగా ఆయన జీవితం, నరేంద్రుడి (స్వామి వివేకానంద) జీవితంతో శాశ్వత మధురానుబంధంతో ముడి వేయబడింది కూడా ఈ కాలఘట్టంలోనే. శ్రీరామకృష్ణుల ఈ కాలఘట్ట జీవితాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, నరేంద్రుని జీవిత గాథ కూడా ఏకకాలంలో మనకు ద్యోతకమౌతుంది. అందువలననే ఈ గ్రంథ విభాగాన్ని ‘దివ్యభావం – నరేంద్రుడు’ గా పేర్కొన్నాం.
శ్రీరామకృష్ణులు సలిపిన దివ్యలీలను రచింప ప్రారంభించినప్పుడు, ఇంతవరకు పురోగమించగలమని ఎన్నడూ మేం ఊహించలేదు. అనూహ్యమైన గురుదేవుల అనుగ్రహం వలననే ఇది సాధ్యమైందని మా గట్టి నమ్మకం. కాబట్టి ఆయన పాదపద్మాలకు పదేపదే ప్రణామం చేస్తూ, ఈ ఐదవ భాగాన్ని వినమ్రంగా పాఠకుల ముందు సమర్పిస్తున్నాం.
శుక్లపక్ష తదియ,
ఫాల్గుణం, 1919
– రచయిత
(స్వామి శారదానంద)