ప్రస్తావన
‘గురుభావం’ రెండవ భాగం ప్రచురితమైంది. దీనిలో శ్రీరామకృష్ణుల జీవిత మధ్యకాలం మాత్రమే పొందుపరచబడి ఉండడం చూసి పూర్వాపర్యక్రమం పాటించలేదే? పుట్టినప్పటి నుండి సాధనలు ముగించే వరకూ జరిగిన వారి జీవితాన్ని ముందుగానే తెలుపకుండా, సాధన సిద్ధులైన పిదప జరిగిన సంఘటనల వివరాలతో ఎందుకు ప్రారంభించారు? అని పాఠకులు ప్రశ్నించవచ్చు!*
అందుకు మా సమాధానం :
లోకోత్తర పురుషులైన శ్రీరామకృష్ణుల జీవిత చరిత్రను రచించాలనే ఎలాంటి ఆలోచనా మాకు ఇంతకుమునుపు లేదు. సమగ్రమైన ఆయన జీవిత చరిత్రను యథాతథంగా వ్రాయడం, మాబోటి సామాన్యులకు సాధ్యం అనే అడియాసకు మేం ఏనాడూ మనస్సులో చోటు ఇవ్వలేదు. కారణాంతరాల ప్రోద్బలం వలన ఆయన జీవితంలోని కొన్ని సంఘటనలను ‘ఉద్బోధన్’ మాసపత్రిక పాఠకులకు తెలియచేయాలనే ఉద్దేశంతో మాత్రమే మేం ఈ పనికి ఉపక్రమించాం.
ఇంతవరకూ పురోగమిస్తామని మేం అప్పుడు అనుకోలేదు. అందువలననే తరువాత కాలంలో జరిగిన సంఘటనలు తొలికాలపు సంఘటనల కంటే ముందుగా వివరింపబడ్డాయి.
శ్రీరామకృష్ణుల జీవితంలోని అద్భుత సంఘటనలను, ఆయన అపూర్వ సాధన వృత్తాంతాన్ని మాకంటే ముందే పలువురు నమోదు చేయ ప్రయత్నించారు. అక్కడక్కడ వారు నమోదు చేసిన భాగాలలో తప్పులు దొర్లినప్పటికీ, మొత్తంమీద శ్రీరామకృష్ణుల జీవితంలోని సంఘటనలన్నీ దాదాపు ప్రచురింపబడ్డాయి. ఆ అంశాలనే మళ్ళీ నమోదుచేసి మా శక్తిని వృథా చేసుకోవడం కంటే, మునుపు ఎన్నడూ వివరింపబడని శ్రీరామకృష్ణుల అసాధారణ దివ్యభావాలు, ఆశయాలను వివరించడం సముచితమని మేం భావిస్తున్నాం. ‘భావముఖం’ లో ఆయన సుస్థిరులైనారంటే ఏమిటో, ‘గురుభావం’ ఆయనలో సహజంగానే అభివ్యక్తమైందంటే ఏమిటో అవగతం చేసుకోలేకపోతే శ్రీరామకృష్ణుల అద్భుత వ్యక్తిత్వాన్ని, అసామాన్య చర్యలను, అనుపమాన భావాల ఆశయాలను ఎవరూ అర్థంచేసుకోలేరు. కనుకనే ప్రారంభంలోనే పాఠకులకు వీటిని విశదపరచడానికి ప్రయత్నించాం.
బహుశా కొందరు ఇలా ఆక్షేపణ లేవదీయవచ్చు :
“మీ పుస్తకంలో విభిన్న చోట్ల శ్రీరామకృష్ణుల ప్రత్యేక మనోభావాలను, చర్యలనూ విశదీకరిస్తున్నప్పుడు, వాటిని ఏ రీతిలో మీరు అర్థం చేసుకొన్నారో ఆ రీతిలోనే వివరింప ప్రయత్నించారు. పర్యవసానంగా మీ తెలివీ, వివేచనాశక్తే దురవగాహమైన ఆయన వ్యక్తిత్వానికి, భావాలకు గీటురాయిగా మారింది. మీ తెలివీ, వివేచనాశక్తీ దురవగాహమైన శ్రీరామకృష్ణులను గ్రాహ్యం చేసుకోగలవని పరోక్షంగా చెప్పక చెబుతూ జనుల దృష్టిలో ఆయనను తక్కువ చేయడం లేదా? అలా చేయకుండా ఆయన జీవితంలోని సంఘటనలను యథాతథంగా అభివర్ణించి ఊరకుంటే ఎంతో బాగుండేదేమో? అలా చేసి ఉంటే శ్రీరామకృష్ణులను తక్కువ చేసినట్లు ఉండేది కాదు; ఆయన భావాలు, చర్యల అర్థాన్ని జనులు తమ ధోరణిలో తాము అవగతం చేసుకొని ఉండేవారేమో!”
ఈ ఆక్షేపణ పైకి యుక్తంగా కనిపిస్తున్నా, నిజానికి అది సారరహితమైనది. కారణం ఏమిటంటే, ఏ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నా తన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి సహాయాన్నే మనిషి తీసుకోక తప్పదు, మరో మార్గం లేదు. అయినా ఏ విషయాన్ని తాను అర్థం చేసుకోగోరుతున్నాడో దానికంటే తన మనస్సు, బుద్ధి ఉన్నతమైనవని దీని ద్వారా ఋజువు కావడం లేదు. కాలం, దేశం, విశ్వం, ఆత్మ, ఈశ్వరుడు మొదలైన అనంత పదార్థాలన్నీ తన మనోబుద్ధులకు అతీతమైనవని తెలిసి కూడా; వాటిని తన మనోబుద్ధుల ద్వారా అవగాహన చేసుకోవడానికి సర్వదా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాని వాటిని తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్పు అని గాని, లేదా ఆ ప్రయత్నం పరిమితమైనదని గాని భావించడు. ఈ ప్రయత్నం ఆతడి మనోబుద్ధులను విస్తృతపరుస్తుంది, ఎంతో మేలు ఒనగూరుస్తుంది.
అదేవిధంగా లోకోత్తరులైన మహాపురుషుల అసాధారణ భావాలనూ, చర్యలనూ మనం అధ్యయనం చేస్తే, అది మనకెంతో మేలు ఒనగూరుస్తుంది; తద్ద్వారా అవి పరిమితం చేయబడవు లేక కుదింపబడవు. సాధన చేయడం మూలంగా ఎవరి మనస్సు ఎంత పవిత్రమౌతుందో, ఎవరి గ్రహణశక్తి ఎంత అధికతరమౌతుందో తదనుగుణంగానే ప్రతి ఒక్కరూ ఎక్కువగానో తక్కువగానో ఆ మహాపురుషుల దివ్యభావాలనూ, చర్యలనూ అవగతం చేసుకోవడంలోను, ఇతరులకు వివరించడంలోను సమర్థులౌతారు. ఆధ్యాత్మిక సాధనలను తీవ్రంగా అనుష్ఠించిన వ్యక్తి, శ్రీరామకృష్ణులను మాకంటే సమగ్రంగా అర్థం చేసుకోగలుగుతాడు. కనుక ఆ దివ్యపురుషుణ్ణి అర్థం చేసుకోవడం కోసం మన మనస్సును, వివేకాన్ని వినియోగించడంలో తప్పేమీ లేదు. కేవలం ఒక్క విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి; శ్రీరామకృష్ణులను ఆమూలాగ్రం అర్థం చేసుకోగలిగామనే భ్రమలో పడరాదు. ఈ అంశాన్ని మనం సదా మనస్సులో నిలుపుకొని ఉంటే మరే సంశయాలు తలెత్తే అవకాశం ఉండదు.
– రచయిత
(స్వామి శారదానంద)