అష్టాంగాల్లో ప్రాణాయామం తర్వాత వచ్చేది ప్రత్యాహారం. ప్రత్యాహార మంటే ఏమిటి? ఇంద్రియానుభవాలు ఎలా కలుగుతున్నాయో మీకు తెలుసు. బాహ్యేంద్రియాలకు వెనక అంతరింద్రియా లుంటాయి. ఇవి మెదడులోని కేంద్రాల ద్వారా పనిచేస్తుంటాయి. ఈ అంతరింద్రియాల వెనక మనసుంటుంది. ఒక బాహ్యవిషయంతో వీటికి సన్నికర్షం ఏర్పడితే, ఆ విషయం అనుభవ మౌతుంది. అయితే చిత్తాన్ని ఏకాగ్రం చేసి ఒకే ఇంద్రియంతో దాన్ని సంయోగం చేయటం చాలా కష్టం. మనసు విషయాలకు బానిస కదా!
“మంచిగా ఉండు – మంచిగా ఉండు!” అంటూ ప్రపంచమంతటా ప్రబోధించటం మనం వింటూ ఉంటాం. “చౌర్యం చేయకు – అసత్యమాడకు” అనే హితాలను ప్రపంచంలో పిల్లలందరికీ చెబుతూనే ఉన్నారు. ఇలాంటి నీతులు ఎందుకూ పనికిరావు. ఎందుకు దొంగతనం చేయవద్దూ? దొంగతనం చేయకుండా ఉండటం ఎలా సాధ్యమో మనం చెప్పం. కానీ “దొంగతనం చేయకు” అని మాత్రం ఆదేశిస్తాం. బయటి – లోపలి పనులన్ని ఇంద్రియాలతో మనసు కలవటం వల్లనే జరుగుతుంటాయి. ఇష్టంగానో, అయిష్టంగానో మనసు ఇంద్రియాలకు ఆకర్షితమౌతుంది; వాటితో సంయోగం చెందుతుంది. మనుషులు మూర్ఖపు పనులు చేస్తారు, ఆపై దుఃఖీస్తారు. దాని క్కారణం ఇదే. మనసు వారికి వశమై ఉండదు; ఉంటే అవా మూర్ఖంగా ప్రవర్తించరు.
మనసును నిగ్రహిస్తే లాభమేమిటీ? మనసు ఇంద్రియాలతో సంయోగం చెందదు; కాబట్టి రాగం – కామం మన వశమై ఉంటాయి. అర్థమయింది కదా! మరి ఇది సాధ్యమా అంటారేమో! పూర్తిగా సాధ్యమే. నేడు ఇది సాధ్యపడటం చూస్తూనే ఉన్నారు కదా! దుఃఖాన్ని -బాధను తప్పును, అసలు అవి లేనేలేవు అంటూ నిరాకరించమని విశ్వాసచికిత్సకులు బోధిస్తుంటారు. వీరి తత్త్వమంతా చుట్టూ తిరిగి చివరికి యోగంలోకే ఇమిడిపోతుంది. ఈ యోగపద్ధతి వీరికి ఎలాగో పట్టుపడింది. “నీకు బాధలేద” ని నమ్మించి, రోగి బాధను వీరు తొలగిస్తుంటారు. ఆ స్థితిలో ఇంద్రియాలను నిర్లక్ష్యం చేసేంత మానసికశక్తి రోగికి ఏర్పడుతుంది; ఇలా ప్రత్యాహారంలో ఒకభాగాన్ని వీరు ఉపయోగిస్తున్నారు. హిప్నాటిస్టులు చేసేది కూడా ఇదే; రోగికి సూచనలిచ్చి ఒకరకమైన వికృత ప్రత్యాహారాన్ని తాత్కాలికంగా అతనిలో కలిగిస్తారు. వీరి సూచనలు బలహీనమయిన మనసు గలవారిపైననే పని చేస్తాయి. సూటిగా చూస్తూనో, మరోరకంగానో హిప్నాటిస్టు వ్యక్తి మనసును నిశ్చలం చేస్తాడు; ఆ తర్వాత తనకు అనుకూలంగా మలచుకొంటాడు. అప్పుడే అతని సూచనలను ఆ వ్యక్తి పాటిస్తాడు.
హిప్నాటిస్టు, ఫేత్హీలర్ – ఇద్దరూ తాత్కాలికంగా ఇంద్రియనిగ్రహాన్ని రోగికి కలిగిస్తారు; కాని ఇది చివరికి రోగికి కీడు చేస్తుంది; అందుకని వీరి పద్ధతులను అంగీకరించకూడదు. ఈ పద్ధతిలో రోగి తన మనసును తన సంకల్పంతో నిగ్రహింపడు. మరొకరి సంకల్పానికి వశుడై హఠాత్తుగా మనసును స్తంభించుకుంటాడు. ఎంతో వేగంతో గుర్రాలు పరిగెత్తుతున్నాయనుకోండి; వాటిని ఆపటానికి ఇక్కడ సారథి తన స్వశక్తిని ఉపయోగించడు, పగ్గాలను లాగడు, కాని ఇతరులతో వాటి ముఖాలపై కొట్టిస్తాడు. ఆ బాధకు అవి తాత్కాలికంగా ఆగిపోతాయి. హిప్నాటిస్టు ఫేత్ హీలర్ల నిగ్రహం కూడా ఇలాంటిదే. ఇలాంటి చికిత్సాపద్ధతుల్లో, అన్నిట్లోకూడా వ్యక్తికి మనసు పూర్తిగా వశం కాదు. పైగా అతని మానసికశక్తి క్షీణిస్తుంది. మనసు చాలావరకు పాడైపోతుంది. చివరికి అతనికి పిచ్చాసుపత్రే దిక్కవుతుంది.
తానుగా కాక, మరొకరిద్వారా మనసును నిగ్రహించుకోవటం చాలా హానికరం. అంతేకాదు, దీనిద్వారా తన కార్యం కూడా చెడిపోతుంది. స్వేచ్ఛ, స్వాధీనత – ఇవే ప్రతిజీవి పరమలక్ష్యాలు. ప్రకృతి, ఆలోచనల బానిసత్వం నుండి స్వేచ్ఛ పొందాలి. బయటి లోపలి ప్రకృతులను స్వాధీనం చేసుకోవాలి. మరొకరి సంకల్పంతో ఇంద్రియాలను సూటిగా నిగ్రహించటం; మనసును నిగ్రహించటం ఈ విధంగా మనకు బంధం నుండి స్వేచ్ఛ లభించదు. పైగా పూర్వసంస్కారాలతో, మూఢత్వంతో ఏర్పడిన మన భవబంధాలను ఈ పద్ధతులు మరింత బిగిస్తాయి. కాబట్టి ఇతరులకు వశం కావద్దు; మీ మనసును ఇతరులకు అప్పగించవద్దు; జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియకుండానే తద్వారా ఇతరులకు ప్రమాదం చేసే వీలుంది, కాబట్టి జాగ్రత్త.
కొంతమంది హిప్నాటిస్టులు మనిషి మనసుకు క్రొత్త సూచనలు చేసి, చాలా మందికి మంచి చేస్తున్నారు. నిజమే. అయితే అదే సమయంలో వారు లక్షలాది మందిని నాశనం చేసిన వారౌతున్నారు. తమ అజ్ఞాత సూచనలతో స్త్రీ పురుషుల మనసులను రోగగ్రస్థంగా మోహవశంగా మారుస్తూ, చివరికి వారిని మృతప్రాయులుగా మార్చివేస్తున్నారు. కాబట్టి, తనను గ్రుడ్డిగా నమ్మండని చెప్పేవారెవరైనా, తన గొప్పసంకల్పశక్తితో ఇతరులను నియంత్రించి, వారిని తనవెంట లాక్కుపోయే వారెవరైనాసరే, అలాంటివారు మానవజాతికే హాని చేస్తుంటారు; వారు ఈ పనిని కావాలని చేయకపోవచ్చు.
కాబట్టి మీ మనసుపై మీ స్వేచ్ఛను వదలకండి. మీరు స్వయంగా మీ మనసును ఉపయోగించుకోండి. మీ మనసును- దేహాన్ని మీరే స్వయంగా నియంత్రించుకోండి; మీరు రోగులు అయితే తప్ప, బాహ్యసంకల్పాలేవి మీపై పనిచేయవన్న నిజాన్ని గ్రహించండి. గ్రుడ్డిగా తనను నమ్మమని చెప్పేవారికి దూరంగా ఉండండి; వారు ఎంత గొప్పవారైనా, ఎంత మంచివారైనాసరే. ఈ ప్రపంచంలో ఆడే, ఎగిరిగంతులు వేసే, అరిచే శాఖలెనో ఉన్నాయి. వారు ఆడుతూ, పాడుతూ ప్రవచనం చేస్తూ అంటువ్యాధిలా వ్యాపించిపోతున్నారు. వీరుకూడా ఒకరకమైన హిప్నాటిస్టులేసుమా! కోమల మనసుగలవారిని అప్పటికి మాత్రం వీరు తమవశం చేసుకుంటారు. ఇలా చివరికి వీరు మొత్తం మానవజాతినే నాశనం చేయబోతున్నారు కదా! ఇలాంటి బాహ్యనియంత్రణం ద్వారా మంచివారుగా కనబడే కన్నా, ఒక వ్యక్తిగాని, జాతిగాని చెడుగా ఉండటమే మేలని చెప్పవచ్చును. వీరి ఉద్దేశం మంచిదే కావచ్చు; కాని బాధ్యతారహిత, మతావేశపూరిత ఈ దురభిమానులు మానవజాతికి చేసిన హానిని తలచుకుంటే మాత్రం గుండె తరుక్కుపోతుంది. ఆటపాటలతో చెప్పేవాడి బోధలు విని హఠాత్తుగా ఆధ్యాత్మిక స్థాయిని అందుకుంటారు జనులు. కాని ఆ స్థాయి తాత్కాలికమే. ఈ స్థాయిని అందుకున్న మనుషులు చివరికి మందబుద్ధులు, శక్తిహీనులు, స్తబ్ధులుగా మారిపోతారు. దానితో ఎలాంటి చెడుప్రేరణకైన సులభంగా వశమైపోతారు. ఈ విషయం, ఈ మతావేశపరులు కాస్తకూడా గుర్తించటం లేదు. ఆకాశంలో ఉండే ఏ దివ్యపురుషుడో, మనిషి హృదయాన్ని మార్చే అద్భుతశక్తిని తమకు ప్రసాదించాడని వీరనుకుంటారు. ఆ శక్తి తమకు లభించినందుకు తమను తామే అభినందించుకొంటారు. తమవల్ల సాటిమానవులకు పతనం, ఉన్మాదం – చివరికి మరణం కూడా సంభవిస్తుందన్న విషయాన్ని ఈ మూఢులు, ఈ భ్రాంతచిత్తులు కలలో కూడా ఊహించరు కదా!
కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ స్వేచ్ఛను ఎవరుకూడా అపహరింపకుండా చూసుకోండి. బానిసతనం హానికరం సుమా! పూర్తిశక్తితో ఈ హానిని దూరంగా ఉంచండి; మీ స్వేచ్ఛను కాపాడుకోండి.
అనుకున్న వెంటనే ఇంద్రియాలతో మనసును కలపాలి; అలాగే మనసును వాటినుండి విడదీయగల్గాలి; ఇలాంటి సామర్థ్యం ఉన్నవ్యక్తికే ప్రత్యాహారం సిద్ధిస్తుంది. ప్రత్యాహారమంటే మనశ్శక్తులను ప్రోగుచేసుకోవటం. బాహ్యంగా వర్తించే మనోవ్యాపారాలను అరికట్టటం -మనసును ఇంద్రియదాస్యం నుండి విముక్తం చేయటం అని అర్థం. ఇలా చేసినప్పుడే మనకు నిజమైనశీలం ఏర్పడుతుంది. అప్పుడే మనం స్వేచ్ఛకు చేరువ అవుతాం. అంతవరకూ మనం కేవలం జడప్రాయ యంత్రాలమే.
మరి మనోనిగ్రహం అంత సుళువా? కాదు, అది చాలా చాలా కష్టం. పిచ్చిపట్టిన కోతి లాంటిది ఈ మనసు. ఒక కోతి ఉండేది. అన్ని కోతులలాగే అదికూడా మహాచంచలంగా ఉండేది. అది గొంతుదాకా కల్లు తాగింది. దానితో దాని చపలత్వం మరీ ఎక్కువైంది. ఆ దశలో దాన్ని తేలు కుట్టింది. మనకు తేలు కుడితే ఆ రోజంతా మనం పిచ్చిగంతులు వేస్తాం కదా! మరి అది కోతి. అది ఇంకా ఎంత పిచ్చిగా గంతులు వేయాలో! అలాగే అరుస్తూ, గెంతుతూ అది ఉండిపోయింది. అది చాలదన్నట్లుగా, అప్పుడే దాన్ని దయ్యం పట్టుకుంది. ఇక అదెంత చంచలంగా ఉంటుందో ఊహించండి.
మన మనసు సరిగ్గా ఈ కోతి లాంటిదే. క్షణం కూడా స్థిరంగా ఉండదు; ఎప్పుడూ ఎటెటో పరుగులు పెడుతూనే ఉంటుంది. విషయవాంఛ అనే కల్లు ఇది త్రాగిందనుకోండి. దాని పరుగులు తీవ్రమైపోతాయి. తర్వాత ఆసూయ అనే తేలు దాన్ని కుట్టిందనుకోండి. దాని సంక్షోభం ఇక చెప్పలేం. చివరికి “అహంభావం” అనే పిశాచం ఆవేశించిందనుకోండి; అందరికన్నా నేనే గొప్పవాణ్ణి అన్న గర్వంతో ఆ మనసు చిందులు వేస్తుంది. మరి ఇలాంటి చిందులు త్రొక్కే మనసును నిగ్రహించటం మాటలా? ఎంత కష్టమో, మీరే ఆలోచించండి.
మరి ఉపాయం ఏమిటీ? మొదట ఒకచోట సుఖంగా కూర్చోండి; మనసును దానిమానాన దాన్ని వదలివేయండి; దానిని ఎక్కడికైన పరుగులు పెట్టనివ్వండి. మనోనిగ్రహానికి ఇది మొదటి ఉపాయం. అలా కూర్చున్నప్పుడు మనసు గంతులు వేస్తూ ఉంటుంది; నిలుకడలేని కోతిలా పరుగులు పెడుతుంది; కోతిలాంటి ఈ మనసును యథేచ్ఛగా గంతులు వేయనివ్వండి; అయితే మీరు మాత్రం దాని కోతిచేష్టలనన్నింటినీ జాగ్రత్తగా పరీక్షిస్తూనే ఉండాలి సుమా! దాన్ని సాక్షీమాత్రంగా చూస్తుండాలి.
“జ్ఞానమే శక్తి” అనే మాట పచ్చినిజం. మనసు ఎలా ప్రవర్తిస్తూ ఉంటుందో ముందు మీకు బాగా తెలియాలి. అప్పుడే మనసును నిగ్రహించటం సాధ్యమవుతుంది. మనసును దానిష్టం వచ్చినట్లు తిరగనివ్వండి. అసహ్యమైన ఆలోచనలు చాలా వస్తుంటాయి. అలాంటి ఆలోచనలు రావటం చూచి మీరే ఆశ్చర్యపోతారు. అయినా బెంబేలు పడవద్దు. దినాలు గడుస్తున్నకొద్దీ, క్రమంగా ఈ చాంచల్యం తగ్గిపోతూ ఉంటుంది. మనసులో శాంతి ఏర్పడుతూ ఉంటుంది. మొదట్లో కొన్నినెలల దాకా మనసులో అంతులేని వృత్తులున్నట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత అవి క్రమంగా తగ్గిపోతాయి. చివరికి మనసు పూర్తిగా మన వశమౌతుంది.
అయితే, ప్రతిరోజూ పూనికతో మనం సాధన చేయాలి సుమా! సహనం కూడా బాగా ఉండాలి. ఆవిరిని వదిలినంతనే, యంత్రం పనిచేస్తుంది. అలాగే విషయాలు ఎదుట పడగానే, అవి మన ఇంద్రియాలకు గోచరిస్తాయి. తాను నిర్జీవయంత్రాన్ని కాదు- అని నిరూపించాలంటే, మనిషి తన స్వేచ్ఛను వ్యక్తం చేయాలి. ఇదే మనోనిగ్రహం. మనసును ఇంద్రియాలతో చేరనివ్వకపోవటమే ప్రత్యాహారం.
మరి ఈ ప్రత్యాహారాన్ని ఎలా సాధించాలీ? ఇది చాలా దుస్సాధ్యకార్యం. ఒక్కదినంలో దీన్ని సాధించలేం. ఓపికతో సంవత్సరాల తరబడి నిరంతరం కృషిచేయాలి. అప్పుడే ప్రత్యాహారం మనకు సిద్ధిస్తుంది.
కొంతకాలం ఇలా ప్రత్యాహారాన్ని సాధనచేయాలి. అది పట్టుబడిన తర్వాత ‘ధారణ’ ను అభ్యాసం చేయాలి. ఒక లక్ష్యంమీద చిత్తాన్ని నిలపాలి; ఇదే ధారణ. దేహంలో కొన్ని భాగాలు ఎన్నుకోండి. ఆ భాగాల్లోనే దేహానుభవం కలుగుతున్నట్లుగా మనసును నియంత్రించండి. దేహంలోని మిగతా భాగాలను లక్ష్యపెట్టకూడదు. అదేలాగో చెబుతాను.
దేహంలో కుడిచేతిని తీసుకోండి. మిగతా దేహాన్నంతా మరచిపోండి.ఆ చేతితో మాత్రమే స్పర్శను అనుభవిస్తున్నట్లు తలచుకోండి. ఇలా ఒకస్థానంలో నిలిచిన మనసు, అక్కడి నుండి తొలగిపోకుండా ఉండటమే ‘ధారణ.’
‘ధారణ’ చాలా రకాలు. భావనాశక్తి ధారణకు మరింత దోహదం చేస్తుంది. హృదయంలో ఒకస్థానాన్ని భావిస్తూ, మనసును అక్కడ నిలపాలి; అదే భావనాయుక్తధారణ. ఇది కష్టమే. అయితే హృదయంలో ఒక పద్మాన్ని భావించుకుంటే, ఈ ధారణ కాస్త సులువౌతుంది. దివ్యకాంతితో ఆ పద్మం వెలుగుతున్నట్లు భావిస్తూ, మనసును అక్కడే నిలపండి. అలాగే మెదడులో సహస్రదళపద్మాన్ని తేజోమయంగా భావిస్తూ, చిత్తాన్ని అక్కడ నిలపవచ్చు. అలాగే సుషుమ్నా మార్గంలో శక్తిచక్రాలను భావించి, వాటిపై చిత్తాన్ని ధారణ చేయవచ్చు.
యోగి, అనుక్షణం సాధన చేస్తూనే ఉండాలి. సాధ్యమైనంతవరకూ ఏకాంతంగా ఉండాలి. రకరకాల మనస్తత్వాలు, ప్రవర్తనలు కలిగిన వ్యక్తులుంటారు; అలాంటి వారితో కలసి ఉంటే మనసు వికలమౌతూ ఉంటుంది. కాబట్టి అలాంటివారికి దూరంగా ఉండాలి. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకూడదు. అలాచేస్తే మనసు చెదరిపోతుంది. ఎక్కువగా పరిశ్రమించవద్దు; మనసు చపలమౌతుంది. దినమంతా కష్టపడి పనిచేస్తే, మనసు నిద్రను కోరుతుంది; అప్పుడు దాన్ని నిగ్రహించలేము. కాబట్టి అతి పరిశ్రమకూడా యోగికి పనికిరాదు.
ఈ నియమాలు పాటిస్తూ సాధన చేస్తే, యోగం సిద్ధిస్తుంది. యోగాన్ని ఏ మాత్రం సాధన చేసినా కూడా, మనకెంతో మేలు కలుగుతుంది. యోగమహిమ అలాంటిది మరి! యోగం వల్ల ఎవ్వరికీ ఎలాంటి కీడు కల్గదు. అందరికీ శ్రేయస్సునే ఇస్తుంది. యోగాన్ని సాధన చేస్తూ ఉంటే, నాడుల బలహీనతవలన కలిగే ఉద్రేకం నశిస్తుంది; ప్రశాంతత చేకూరుతుంది. యోగం పరిశీలనా శక్తిని కూడా పెంచుతుంది. వ్యక్తి గుణ, శీలాలను యోగం సరిచేస్తుంది; ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. దృఢచిత్తం, సొంపైన కంఠం యోగం సిద్ధిస్తున్నదనటానికి సూచనలు. కంఠస్వరంలోని లోపాలు తొలగిపోతాయి. నిష్టగా యోగసాధన చేస్తే, ఇంకా చాలా సూచనలు కనిపిస్తాయి. ఏవేవో ధ్వనులు వినిపిస్తాయి. దూరంలో గంటలు గణ, గణ మ్రోగుతున్నట్లు అనిపిస్తుంది. కాంతి కణాలు తేలుతూ క్రమంగా పెద్దగా మారుతున్న అనుభూతి కలుగుతుంది. ఇలాంటసూచనలన్నీ సాధన తీవ్రంగా – సరిగా సాగుతున్నదనటానికి గుర్తని తెలుసుకోవాలి.
తీవ్రంగా యోగసాధన చేయాలనుకుంటే, కొన్ని ఆహారనియమాలు కూడా పాటించాలి. ఏదో కొంత, మామూలు జీవితం కోసం సాధన చేయాలనుకుంటే, ఈ నియమాలు అక్కర్లేదు. వారు ఏమైనా తిననీ, త్రాగనీ! కాని అతిగా తినటం మాత్రం ఎవరికీ మంచిది కాదు.
తీవ్రసాధకులు మాత్రం ఆహారనియమాలు తప్పక పాటించాలి. మొదట్లో కొన్నినెలల దాకా పాలూ, కాయ ధాన్యాలనే గ్రహిస్తే బాగుంటుంది. సూక్ష్మదేహస్థితి ఏర్పడుతున్న దశలో చాలా జాగ్రత్తగా ఉండాలి: ఆహారనియమాన్ని తు.చ. తప్పకుండా పాటించాలి. ఉల్లంఘిస్తే శరీరస్థితి చెడిపోతుంది. చిత్తం పూర్తిగా అదుపులోకి వచ్చేదాకా, ఒకముద్ద ఎక్కువైనా తగ్గినా శరీరస్థితి తారుమారవుతుంది. చిత్తం పూర్తిగా స్వవశం అయితే, అప్పుడు యోగి ఏమైనా, ఎంతైనాతినవచ్చు. దానికి తట్టుకోగల శక్తి, సామర్థ్యాలు అతనికి లభిస్తాయి.
చిత్తం ఏకాగ్రం అవుతున్నదశలో, సూదిపడినా ఆ శబ్దం ఉరుములా మెదడును బ్రద్దలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంద్రియాలు సూక్ష్మం అవుతుంటే, ఇంద్రియానుభవాలు కూడా సూక్ష్మమౌతూ ఉంటాయి. ఈ స్థితుల నన్నింటినీ యోగసాధకుడు దాటిపోవాలి. యోగాన్ని దీక్షగా సాధన చేస్తే, ఎవరికైనా అది సిద్ధిస్తుంది. యోగసాధకులు వాదం చేయవద్దు. మనసును వ్యాకులం చేసే విషయాలకు దూరంగా ఉండాలి. పనికిరాని వాదాలవల్ల లాభమేముంటుంది? వాటితో మనసు అశాంతిపాలే అవుతుంది. చిత్తం క్షోభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలు చాలా సూక్ష్మమైనవి; అనుభవిస్తే తప్ప వాటిని మనం తెలుసుకోలేం. ఇది చాలా భారీవ్యవహారం. మాటలతో ఇది సిద్ధిస్తుందా మరి? కాబట్టి పనికిరానిమాటలను త్యాగం చేయాలి. ఆత్మానుభూతి పొందిన మహాత్ములు రాసిన గ్రంథాలను మాత్రమే చదవాలి.
సముద్రంలో ముత్యపుచేప ఉంటుంది. యోగసాధకుడు దానిలా వ్యవహరించాలి. స్వాతిలో వర్షపుబిందువు ముత్యపుచిప్పలో పడితే, అది ముత్యంగా తయారౌతుందని, భారతదేశంలో అనుకుంటారు. స్వాతినక్షత్రం వెలుగుతున్నప్పుడు ముత్యపుచేపలు నీటిపైకి వస్తాయి. అతివిలువైన వర్షపుబిందువు కోసం ఎదురుచూస్తుంటాయి. ఒక బిందువు పడగానే, అవి తమ చిప్పలను మూసుకుని అడుగు భాగానికి వెళ్ళిపోతాయి. ఆ బిందువును ముత్యంగా మారుస్తాయి. యోగి ఈ ముత్యపుచేపలా సాధన చేయాలి. మొదట తత్త్వాన్ని చక్కగా విని, అవగాహన చేసుకోవాలి. తర్వాత మనసును వ్యాకులం చేసే బాహ్యవిషయాలను త్యాగం చేసి, సత్యదర్శనం కోసం దీక్ష వహించాలి. ఒక కొత్తవిషయాన్ని చూస్తాం, వ్యామోహితులమై దానివెంట పడతాం; అంతలో మరో కొత్తవిషయం కనిపిస్తుంది; దీన్ని వదలి దాని వెంటపడిపోతాం. ఇలా చేస్తూపోతే మన శక్తిసామర్థ్యాలన్నీ వ్యర్థమైపోతాయి. కాబట్టి యోగసాధకుడు ఇలాంటి భ్రాంతిలో పడవద్దు. మొదటనే చక్కగా ఆలోచించి, ఒక భావాన్ని స్వీకరించాలి; దాని అంతు చూసేదాక, ఇక దాన్ని వదలిపెట్టనే వద్దు. ఇలా ఒక భావాన్ని దృడంగా సాధన చేసేవారికే, వికాసం కలుగుతుంది. కనిపించే వాటినన్నింటినీ రుచిచూచేవారికి, అసలు ఆకలే తీరదు. చపలచిత్తం గలవారికి క్షణకాలం భావోద్రేకం కలుగుతుంది; మరుక్షణం ఆ పొంగు చల్లారిపోతుంది. ఇలాంటివారు ఎప్పటికీ ప్రకృతికి దాసులై ఉంటారు; ఇంద్రియాలను ఎప్పటికీ జయించలేరు.
నిజంగానే యోగి కావాలనుకుంటే, ఇలాంటి చాపల్యాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. ఒక భావాన్ని స్వీకరించండి. దాన్నే మీ జీవితసమస్యగా చేసుకోండి. దాన్నే మననం చేయండి. దాన్నే కలగనండి. దానిలోనే పరవశులై జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతిభాగం కూడా ఆ భావంతో తన్మయం కావాలి. ఇదే కార్యసిద్ధికి దారి. ఈ విధానమే అలౌకిక గుణాఢ్యులైన ఆధ్యాత్మిక మహాత్ములను ప్రభవింప చేసింది. సాధనకు పూనుకోనివారంతా మాట్లాడే యంత్రాలుగా మిగిలి పోతారు. మనం ధన్యులమై – ఇతరులను ధన్యులుగా చేయాలంటే, పూనికతో మనం సాధన చేయాలి. మనసును కలతకు గురిచేయవద్దు; కలతపరిచే భావాలు గలవారితో సావాసం చేయవద్దు; సిద్ధికిది మొదటి ఉపాయం. కొంతమందిని చూస్తే, కొన్ని స్థలాలకు వెళితే, కొన్నితినేపదార్థాలు కనిపిస్తే మనకు చిరాకు కలుగుతుంది; ఈ విషయం మీ కంతా తెలుసు. అలాంటి వాటినన్నింటిని వదలివేయాలి. అత్యుత్తమ స్థితిని పొందగోరేవారు అన్ని సంసర్గాలను త్యాగం చేయాలి; అది దుస్సాంగత్యమైనా, సత్సాంగత్యంమైనా సరే. వారు తీవ్రసాధననే చేయాలి. ఆ సాధనలో చచ్చినా, బ్రతికినా సరే. ఫలం గూర్చి ఆలోచించక, కార్యంలోనే మునిగిపోవాలి. మీరు ధీరులైతే, ఆర్నెల్లకే మీరు పూర్ణయోగు లౌతారు.
అన్ని పనులతోపాటే, యోగాన్ని కూడా వాటిలో ఒకపనిగా అభ్యాసం చేస్తే లాభం లేదు. వారికి ఎలాంటి అభివృద్ధి కలగదు. యోగసాధన పాఠాలను నేర్చుకుంటే చాలదు; వాటిని సాధన చేయాలి. తమోమయులు, అజ్ఞానులు, స్తబ్ధులు ఏ భావంలో కూడా స్థిరంగా మనసును నిలపనివారు, వేడుకకోసం ఏదో యోగసాధనను చేయాలనుకునేవారు ఇలాంటివారి కంతా మతం, వేదాంతం అంతా కూడా కేవలం ఒక వినోదప్రాయంగా కనిపిస్తుంది. వీరు కార్యనిరతులు కాలేరు. వీరు ఒక ప్రవచనం వింటారు; చాలా బాగుందంటారు; ఇంటికి వెళ్ళేలోపలే దాన్ని పూర్తిగా మరచిపోతారు.
కార్యసిద్ధి కావాలంటే, సుస్థిరదీక్షను మీరు పూనాలి. అద్వితీయ ప్రజ్ఞను దాల్చాలి. “సముద్రాన్నే తాగేస్తాను; నేను తలుచుకుంటే – పర్వతం కూడా పొడి పొడి కావలసిందే!” అని కార్యతత్పరు డంటాడు. ఇలా వీర్యోత్సాహంతో దృఢసంకల్పంతో తీవ్రసాధన చేయండి. తప్పక గమ్యాన్ని చేరుకుంటారు. పరమావధిని పొందుతారు.