వెన్నెముకలో ‘ఇడ – పింగళ’ అనే రెండు నాడు లున్నాయని యోగు లంటారు. వెన్నెముక ఈ చివరి నుండి ఆ చివరి వరకూ మధ్యలో బోలుగా ఉంటుంది. దానికి చివరి భాగంలో ‘కుండలినీ చక్ర’ ముంది. ఈ చక్రం లేదా పద్మం త్రికోణాకారంగా ఉంటుందట. యోగపరిభాష ప్రకారం ఈ పద్మంలో ‘కుండలినీ’ అనే శక్తి చుట్ట చుట్టుకుని ఉందంటారు. ఈ శక్తి మేలుకొన్న వెంటనే, సుషుమ్నా నాడిలో ప్రవేశించి, పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఇలా పైకి వెళుతున్నకొద్దీ, మనసు పొరలు ఒకటొకటిగా తొలగిపోతాయి. యోగికి రకరకాల దివ్యదర్శనాలు కలుగుతాయి; అద్భుతశక్తులు సంక్రమిస్తాయి. ఈ శక్తి మెదడును చేరగానే, మనశ్శరీరాల నుండి యోగి పూర్తిగా విముక్తుడైపోతాడు; ఆత్మ స్వాతంత్ర్యాన్ని పొందుతాడు.
వెన్నుపాము చాలా విచిత్రనిర్మాణం కలిగి ఉంటుంది. అది మనకు తెలుసు. ఎనిమిది అంకెను అడ్డంగా (∞) వేస్తే, రెండు భాగాలు మధ్యలో అతికినట్లుంటుంది. ఈ అంకెను అడ్డంగానే ఒకదానిమీద మరొకటి పేర్చుతూ వెళ్ళండి; అప్పుడది వెన్నుపామును సూచిస్తుంది. దీన్లో ఎడమవైపున ‘ఇడనాడి’ ఉంటుంది. కుడివైపున ‘పింగళనాడి’ ఉంటుంది. ఈ రెంటి మధ్యలోనున్న కాలువ భాగం సుషుమ్నా. వెన్నుపూసలు ‘త్రోటిక’ అనే కటి ప్రదేశంలో అంతమౌతాయి. అప్పుడు వాటినుండి ఒక సన్నని తంతువు క్రిందికి వెళుతుంది. దీన్లో కూడా సుషుమ్నాద్వారముంటుంది.కాని ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది. దాని క్రింది చివర మూసుకుని ఉంటుంది. ఈ చివర నుండే తంతుసముదాయం త్రికోణాకృతిగా కనిపిస్తుందని శరీరశాస్త్రజ్ఞులంటారు. సుషుమ్నా ద్వారంలో యోగులు కొన్నిచక్రాలను లేదా పద్మాలను దర్శిస్తుంటారు. వెన్నెముకలో ఆయాస్థానాల్లో ఉండే నాడీసముదాయాలకు ఈ చక్రాలు సరిపోతాయి.
మూలాధారం నుండి మెదడులోని సహస్రారం లేదా సహస్రదళపద్మం వరకూ, సుషుమ్నలో కొన్ని కేంద్రాలు లేదా పద్మాలున్నాయని యోగులు చెబుతారు. పై నాడీసముదాయాలే ఈ కేంద్రాలు. అప్పుడు నూతన శరీరశాస్త్రపరిభాష ప్రకారం యోగుల భావం మనకు సులభంగా అర్థమౌతుంది. ఈ నాడుల్లో రెండు రకాల క్రియలు జరుగుతుంటాయి. వీటిలో ఒకటి అంతర్ముఖమై ఉంటే, రెండవది బహిర్ముఖమై ఉంటుంది. ఒకటి జ్ఞానకారకమైతే, రెండవది చలనకారకం. ఒకటి కేంద్రంవైపు తిరిగి ఉంటే, రెండవది కేంద్రానికి పెడముఖమై ఉంటుంది. బయటి వార్తలను ఒకటి మెదడుకు అందిస్తుంది; మెదడు నుండి సూచనలను రెండవది బయటికి తెస్తుంది. నాడీస్పందనాలన్నీ కూడా మెదడుతో సంబంధం కలిగియుంటాయి. ముందు ముందు మనం చెప్పుకునే విషయాలు మనకు చక్కగా అర్థం కావాలంటే, ఇంకా చాలా విషయాలను మనం తెలుసుకోవాలి. వెన్నెముక మెదడుని కలిసేచోట ఒక దుంపవంటి ఆకారాన్ని కలిగి ఉండి, మెదడులోని ద్రవపదార్థంలో తేలుతూ ఉంటుంది. తలకు దెబ్బతగిలినా దీని వలన దానికి ఎలాంటి ప్రమాదం కలగదు. ఈ అంశాన్ని మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే చక్రాల్లో మూలాధారం – మెదడులోని సహస్రారం – నాభిలోని మణిపూరం – వీటిని ప్రధానంగా గమనించాలి.
పదార్థవిజ్ఞానశాస్త్రం నుండి ఒకవిషయాన్ని తీసుకుందాం. విద్యుచ్ఛక్తి, ఇతరశక్తుల గూర్చి మనకు తెలుసు కదా! నిజంగా విద్యుచ్ఛక్తి ఎలాంటిదో ఎవరికీ సరిగా తెలియదు. తెలిసినంతవరకూ ఇది ఒక చలనం. ప్రపంచంలో ఇంకా ఎన్నో చలనాలున్నాయి. మరి విద్యుచ్ఛక్తికి వీటికి భేదమేమిటీ? ఈ బల్ల కదలుతున్నదనుకుందాం. అంటే బల్లగా రూపొందిన పరమాణువులు అన్ని వైపులకూ కదలుతుంటాయి. విద్యుచ్ఛక్తితో ఈ పరమాణువులనన్నింటినీ ఒకేవైపు కదల్చవచ్చు. అంతేకాదు, ఏ పదార్థంలోని పరమాణువులనైనా సరే విద్యుచ్ఛక్తితో ఒకేవైపు చలింప చేయవచ్చు. ఒక గదిలోని వాయుపరమాణువుల నన్నింటినీ ఒకేవైపు కదిలింపచేయండి; అప్పు డా గది బ్రహ్మాండమైన విద్యుత్ యంత్రమౌతుంది. శరీరశాస్త్రం నుండి మనం మరోవిషయాన్ని కూడా గమనించాలి. శ్వాసకోశాన్ని నడిపే కేంద్రానికి నాడీకోశం ఒకవిధంగా ఆధీనమై పనిచేస్తూ ఉంటుంది.
సరే, శ్వాసనియంత్రణం ఎందుకు చేయాలో ఇప్పుడు చెప్పుకుందాం. మొదటగా మనము ఒక విషయం తెలుసుకోవాలి. క్రమగతిలో శ్వాసిస్తే, శరీరంలోని పరమాణువులన్నీ ఒకేవైపుకు కదిలేందుకు సిద్ధమై ఉంటాయి. మనసు సంకల్పంగా మారినప్పుడేం జరుగుతుందీ? విద్యుచ్ఛక్తిలాంటి చలనంలోకి నాడీవాహినులు మారతాయి. ఎందుకంటారా? నాడులపై విద్యుత్తును ప్రసరింప చేస్తే, నాడులు ధ్రువాభిముఖత్వాన్ని చూపుతాయని వైజ్ఞానికులు నిరూపించారు. సంకల్పం నాడీప్రవాహంగా రూపొందినప్పుడు, అది విద్యుత్తులాంటి ఒకశక్తిగా మారుతూ ఉంటుందని మనకు దీనివల్ల తెలుస్తోందికదా! శరీరంలోని చలనాలన్నీ పూర్తిగా క్రమగతిలో జరుగుతూ ఉంటే, అప్పుడు ఈ శరీరం సంకల్పమనే భారీవిద్యుత్ యంత్రంగా తోస్తుంది. ఇలాంటి మహాసంకల్పశక్తినే, యోగి పొందాలనుకుంటాడు. కాబట్టి శారీరక శాస్త్రదృష్టితో చూచినా, శ్వాసనియంత్రణాన్ని అభ్యాసం చేయటం ఎంత అవసరమో తెలుస్తోంది. శ్వాస నియంత్రణం శరీరంలో ఒక క్రమగతిని ఏర్పరుస్తుంది. కాబట్టి శ్వాసకోశం ద్వారా – ఇతర కోశాలను కూడా వశం చేసుకోవటానికి ఈ శ్వాసనియంత్రణం మనకెంతో దోహదం చేస్తుంది. మూలాధారంలో నిద్రాణమై ఉన్న కుండలినీశక్తిని జాగృతం చేయటమే, ప్రాణాయామం వల్ల మన కిక్కడ కలిగే పరమ ప్రయోజనం.
చూడటం, భావించటం – కలకనటం ఇలాంటి అనుభవాలన్నీ మనకు ఒక సామాన్య ప్రదేశంలోనే సంభవిస్తాయి. ఆ సామాన్య ప్రదేశాన్నే మహాకాశము అని అంటారు. అదే భౌతికదేశం. యోగులు తమ సంకల్పాలను స్వప్నరూపంలో చూస్తుంటారు; అతీంద్రియ విషయాలను కూడా దర్శిస్తుంటారు. ఇలాంటి అనుభవాలను వారు మరోప్రదేశంలో పొందుతుంటారు; అదే మానసిక దేశం; అదే చిత్తాకాశము. నిర్విషయ జ్ఞానావస్థలో ఆత్మ స్వయంజ్యోతియై ప్రకాశిస్తూ ఉంటుంది. అదే జ్ఞానదేహము, అదే చిదాకాశం.
కుండలినీ జాగృతమై సుషుమ్నలో ప్రవేశించేటప్పుడు కొన్ని అనుభవాలు కలుగుతాయి; అవన్నీ చిత్తాకాశానికి సంబంధించినవి. కుండలినీ సుషుమ్నను దాటి మెదడులోకి వెళ్ళగానే, నిర్విషయజ్ఞానం కలుగుతుంది. ఇది చిదాకాశానికి సంబంధించి యుంటుంది.
ప్రకృతిని, విద్యుత్తును పోల్చి చూద్దాం. మనిషి విద్యుత్తును తీగల ద్వారానే పంపగలడు; కాని తన శక్తులను ప్రసారం చేయటానికి ప్రకృతికి ఎలాంటి తీగలవసరం లేదు. కాబట్టి శక్తిప్రసారానికి తీగల ఆవశ్యకత లేదు; కాని మనకింకా ఆ సామర్థ్యం రాలేదు కాబట్టి విద్యుత్తుప్రసారానికి తీగలను ఉపయోగిస్తున్నాం.*
అలాగే, దేహంలో కలిగే ఇంద్రియానుభవాలు, చలనాలు నాడీ తంతులనే తీగల ద్వారా మెదడులోకి వెళతాయి; మరల బయటికి వస్తుంటాయి. ఈ తంతువులన్నీ వెన్నుపాములో ఉంటాయి; వీటిలో జ్ఞానాన్ని కల్గించే తంతువులు, క్రియలను కల్గించే తంతువులు ఉంటాయి. మొదటి రకం తంతువులు ఇడానాడి అని, రెండవ రకం తంతువులు పింగళనాడి అని యోగు లంటారు. కేంద్రంవైపు వెళ్ళే వాహినులు మెదడుకు వార్తలను తీసుకవెళతాయి. కేంద్రం నుండి దూరంగా వెళ్ళే వాహినులు మెదడు నుండి వార్తలను వెలుపలికి తెస్తాయి. ఈ రెండురకాల వాహినులు ముఖ్యంగా ఈ ఇడా – పింగళనాడీ మార్గంలోనే పయనిస్తుంటాయి. అయితే ఈ తంత్రుల సహాయం లేకుండా వార్తలను పంపటం, గ్రహించటం మనసుకు ఎందుకు సాధ్యం కాకూడదూ? ప్రకృతిలో ఇలా జరుగుతోంది కదా! దీన్ని గనక మీరు సాధించగల్గితే, మీరు ప్రకృతికి దాస్యం చేయనక్కర్లేదని యోగులు చెబుతారు. మరి దీన్ని ఎలా సాధించాలీ? సంకల్ప ప్రవాహాన్ని సుషుమ్నామార్గంలో పంపగల్గితే, మీరు దీన్ని సాధించవచ్చు. నాడీకోశమనే ఈ తంతు సమూహాన్ని మనసే నిర్మాణం చేసుకున్నది. తంత్రుల అవసరం లేకుండా వర్తించాలంటే, మనసే ఈతంతిసమూహాన్ని భేదించాలి. ఈ కార్యాన్ని సాధిస్తే చాలు, జ్ఞానమంతా మన వశమౌతుంది. శరీరానికి ఇక దాస్యం చేయనవసరం లేదు. కాబట్టి సుషుమ్నను వశం చేసుకోవటం చాలా అవసరం. నాడీతంతులనే తంత్రులు లేకుండానే మనం సంకల్పప్రవాహాన్ని సుషుమ్నద్వారా పంపితేచాలు, మన సమస్య తీరుతుంది; మన కార్యం నెరవేరుతుంది – అని యోగులు చెబుతారు.
సామాన్యుల్లో సుషుమ్న క్రింది కొన మూసుకుని ఉంటుంది. ఆ స్థితిలో అది క్రియారహితమై ఉంటుంది. ఈ కొసను తెరచి, నాడీప్రవాహాన్ని సుషుమ్న ద్వారా పంపాలి; దీనికోసం యోగులు ఒక సాధనావిధానం చెబుతారు. నాడీకేంద్రానికి ఒక వార్త వెళితే, ఆ కేంద్రంలో ప్రతిక్రియ కలుగుతుంది. ప్రతిక్రియ కల్గిన వెంటనే స్వయంచాలిత కేంద్రంలో చలనం ఏర్పడుతుంది. ఈ ప్రతిక్రియ జ్ఞానకేంద్రాల్లో ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా విషయజ్ఞానం, తర్వాత చలనం కల్గుతాయి. బాహ్యప్రపంచం నుండి కలిగే క్రియకు ప్రతిక్రియ జరగటం ద్వారా మనకు విషయజ్ఞానం కలుగుతూ ఉంటుంది. మరి స్వప్నంలో విషయజ్ఞానం ఎలా కలుగుతుందీ? స్వప్నంలో బాహ్యప్రపంచ వ్యాపారం ఏదీ లోనికి రాదు; అయితే జ్ఞానేంద్రియ వ్యాపారాలు గుప్తంగా అణగి యుంటాయి. నే నొక నగరాన్ని చూస్తున్నాననుకోండి; ఆ నగరానికి చెందిన బాహ్యవిషయస్పర్శలకు తగిన ప్రతిక్రియ నా మనసుకు కలిగితే, వెంటనే ఆ నగరం నాకు కనిపిస్తుంది. అంటే నగరంలోని బాహ్యవిషయాలతో మెదడుకు వార్తలను తీసుకువెళ్ళే నాడులకు చలనం కలుగుతుంది; ఈ చలనంతో మెదడులోని పరమాణువులకు ఒకవిధమైన చలనం ఏర్పడుతుందని గ్రహించాలి. కాబట్టి చాలాకాలం తర్వాత కూడా నేనా నగరాన్ని జ్ఞాపకం చేసుకోగలను. స్మృతి అనేది ఇలాగే కలుగుతుంటుంది. అయితే ప్రత్యక్షానుభవం కన్నా స్మృతి అనుభవం మందంగా ఉంటుంది. మరైతే, ప్రత్యక్షానుభవంలో మాదిరే మెదడులో స్పందనాలు ఎలా కలుగుతుంటాయి? అక్కడ ప్రత్యక్షానుభవం లేదుకదా! కాబట్టి ఈ స్పందనాలు ఎక్కడో అణగి ఉంటాయి. వాటివల్లనే స్వప్నం అనే మంద ప్రతిక్రియ కలుగుతూ ఉంటుందని అనుకోవాలి. ఈ శేషించిన స్పర్శలన్నీ మూలాధారమనే కేంద్రంలో ప్రోగై యుంటాయి. దానిలో అణగి ఉన్న క్రియాశక్తే కుండలిని. కుండలిని అంటే చుట్టుకొనియున్నది అని అర్థం. ఏకాగ్రంగా అధ్యయనం చేస్తున్నప్పుడు, ఒక విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు మూలాధార ప్రాంతంలో వేడి పుడుతుంది. కాబట్టి శేషించిన చలనశక్తి అంతా దేహంలో ఈ మూలాధార కేంద్రంలోనే కూడియుందని సహేతుకంగా తెలుస్తోంది. కుండలినీ శక్తిని మేల్కొల్పి, ప్రాణవంతం చేసి, సుషుమ్నలో పైకి వెళ్ళేలా చేస్తే, అప్పుడు ఈ శక్తి ఒక చక్రం తర్వాత మరొక చక్రంపై తన ప్రభావం చూపుతుంది. ఆ స్థితిలో అత్యద్భుత ప్రతిక్రియ కలుగుతుంది. కుండలినీ శక్తిలో ఒక సూక్ష్మాంశం నాడీతంతువు నుండి వెళితే, ఆయా కేంద్రస్థానాలు ప్రతిక్రియ చేస్తాయి. అప్పుడే మనకు స్వప్నం లేదా మానసిక కల్పనలు కలుగుతాయి. అయితే చాలాకాలం ధ్యానం చేస్తే ఎంతో బలం లభిస్తుంది; ఆ బలంతో కుండలినీ శక్తిని మొత్తం సుషుమ్నద్వారా పైకి పంపించవచ్చు; అప్పు డా శక్తి అలా పైకి వెళుతూ, ఆయాకేంద్రాలను తాకుతుంది. అప్పుడు స్వప్నాదుల కన్నా గొప్ప ప్రతిక్రియ ఏర్పడుతుంది. అదే అతీంద్రియ జ్ఞానం. మెదడు ఇంద్రియానుభవాలకు కేంద్రస్థానం. కుండలినీశక్తి దీన్ని చేరగానే, మెదడంతా ప్రతిస్పందిస్తుంది. దానితో పూర్ణచైతన్యప్రకాశ ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. కుండలినీశక్తి పైకి వెళుతూ ఒక్కొక్క చక్రాన్నే దాటుతూ ఉంటుంది. అలా దాటుతున్నప్పుడు మనసులోని పొరలు ఒకటొకటిగా తొలగిపోతుంటాయి. అప్పుడు యోగులు విశ్వసూక్ష్మరూపాన్ని లేదా కారణరూపాన్ని దర్శిస్తారు. శబ్దాది విషయాల్లో, ఇంద్రియానుభవాల్లో వ్యక్తమయ్యే జగత్కారణాలను ప్రత్యక్షంగా చూస్తారు. జగత్కారణాలు తెలిస్తే చాలు – కార్యజ్ఞానం తప్పక కలుగుతుంది.
కాబట్టి అతీంద్రియ జ్ఞానం, దివ్యజ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే కుండలినీశక్తిని జాగృతం చేయటం తప్ప మరోమార్గం లేదు. తాత్త్విక విశ్లేషణతో – నిత్యానిత్యవస్తు వివేకంతో, ఈశ్వరప్రేమతో, సిద్ధపురుషుల అనుగ్రహంతో ఇంకా అనేక మార్గాల్లో కుండలినీశక్తిని జాగృతం చేయవచ్చు. ప్రకృతి కతీతంగా అలౌకిక జ్ఞానశక్తులు అక్కడక్కడా వ్యక్తమవుతుంటాయి. అలా వ్యక్తమయ్యే చోట తప్పక సుషుమ్నలో కొద్దిగానైనా కుండలినీశక్తి ప్రవేశించిందని చెప్పాలి. ఇలాంటి సందర్భాల్లో కుండలినీశక్తిలోని అల్పాంశాన్ని జాగృతం చేసే సాధనను ఏదో ఒకదాన్ని జనులు తమకు తెలియకుండగానే ఆచరిస్తుంటారు. తెలిసి చేసినా, తెలియక చేసినా, ఉపాసన ఫలం తప్పక ఉంటుంది. ఎవరివల్లో తన ప్రార్థనలు ఫలిస్తున్నాయి అని అనుకునేవారికి, ఆ సిద్ధి తనలోనుండే కలుగుతున్నదని తెలియదు. ప్రార్థనపూర్వక మనశ్శక్తితో తనలో నిద్రాణమై ఉన్న అనంతశక్తిలో, ఆవగింజంత శక్తిని జాగృతం చేశానన్న సంగతి అతనికి తెలియదు.
ప్రతిజీవిలోనూ కుండలినీశక్తి నిద్రాణమై ఉంది. దాని అనుగ్రహాన్ని పొందే మార్గం తెలియగానే, మనకు శాశ్వతానందం కలుగుతుంది. అజ్ఞానంతో భయభ్రాంతులకు లోనై అనేక నామాలతో జనులు ఆరాధించేది ఈ కుండలినీశక్తినే అని యోగులంటారు.
అన్ని ఉపాసనలకు – అన్ని ప్రార్థనలకు – అన్ని శాస్త్రవిధులకు -అన్ని క్రియాకలాపాలకు ఆధారభూత మూలతత్త్వాన్ని నిరూపించే మతతత్త్వశాస్త్రమే ఈ రాజయోగం.