మన జ్ఞానానికి, అంతా అనుభవమే మూలాధారం. దృష్టిని కొన్ని ప్రత్యేకాంశాలపై నిలిపి విశ్వజనీన సిద్ధాంతాన్ని కనుగొనుట, సర్వజనీన సిద్ధాంతం నుండి ఒక ప్రత్యేకాంశాన్ని నిర్థారించుట; దీన్ని మనం ‘అనుమానిక జ్ఞానం’ అంటాం. అనుమానిక పరిజ్ఞానం, అనుభూతి మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి అనుభవాలకు సరిరావటం వల్లనే, నిశ్చిత శాస్త్రాలు అనే భౌతిక విజ్ఞాన శాస్త్రాల్లోని సత్యాన్ని జనులు సులభంగా గ్రహిస్తున్నారు. ప్రకృతి శాస్త్రవేత్త దేన్నిగానీ నిర్హేతుకంగా నమ్మాలని మీకు చెప్పడు. స్వానుభవఫలితంగా అతనికి కొన్ని సిద్ధాంతాలేర్పడతాయి. ఆ స్వానుభవాల మీద హేతువిమర్శ చేసి, తన సిద్ధాంతాలను నమ్మాలని శాస్త్రవేత్త మనకు చెప్పేటప్పుడు, ఏదో ఒక సర్వజన సామాన్యానుభవాన్ని ఊతగా గ్రహిస్తాడు. ప్రతి నిశ్చితశాస్త్రంలో ఇలాంటి సర్వజన సామాన్య మూలాధార మొకటుంటుంది. దాన్నిబట్టి అతని సిద్ధాంతాల సత్యాసత్యాలను మనం వెంటనే కనుక్కోవచ్చు.
మరి మతానికి అలాంటి మూలాధారము ఉన్నదా? – అన్న ప్రశ్న వస్తుంది. దీనికి నేను ‘ఉందీ – లేదు’ అని అంటాను.
మతం అన్నది భక్తివిశ్వాసాలపై ఆధారపడి ఉందని అంటారు. సాధారణంగా లోకంలో మతం గూర్చి ఇలాగే చెబుతున్నారు. దీనితోపాటు, అనేక సందర్భాల్లో మతం అన్నది, కేవలం వివిధ సిద్ధాంతాల సంపుటిగా ఉంది. మతాలన్నిట్లో అంతఃకలహాలు ఉండటానికి కారణం ఇదే అని మనం గ్రహించవచ్చు. ఈ సిద్ధాంతాలు తిరిగి విశ్వాసంపై ఆధారపడి ఉంటాయి. అంతరిక్షంలో ఎక్కడో కూర్చుని, బ్రహ్మాండాలనన్నింటినీ పాలించే వ్యక్తి ఒకడు ఉన్నాడని ఒక వ్యక్తి నాకు చెబుతాడు. తానలా రూఢీగా చెప్పటమే ఆగమ ప్రమాణంగా అంగీకరించి, నేను తన మాటలను నమ్మాలట! ఇదేవిధంగా నాకు కొన్ని అభిప్రాయాలుంటాయి. వాటిని ఇతరులు నమ్మాలని అంటాను. ఎందుకు నమ్మాలని నన్ను వారడిగితే, కారణం చెప్పలేను! కాబట్టే, ఈ రోజుల్లో మతం అన్నా, వేదాంతం అన్నా దురభిప్రాయం కలుగుతున్నది. “ఓహో, ప్రతివ్యక్తి కూడా, తనకు నచ్చిన ఊహలను బోధిస్తున్నాడు. వాటి మంచీ – చెడులను నిర్ణయించటానికి ఒక ప్రమాణమంటూ లేదు. ఈ మతాలన్నీ వట్టి సిద్ధాంతాల కట్టలు” అని విద్యాధికుల అభిప్రాయంగా అనిపిస్తున్నది. అయినా, భిన్నదేశాల్లో, భిన్నమతస్థుల, భిన్నాభిప్రాయాలనే కాక, భిన్నసిద్ధాంతాలను కూడా సమన్వయం చేస్తూ, ఆస్తికతకు సర్వజన సామాన్యమై ఉన్న మూలాధారము ఒకటి ఉంది. మూలానికి వెళ్ళి చూస్తే, అవికూడా సర్వజనసామాన్య అనుభూతి మీదనే ఆధారపడి ఉన్నట్లు కనుక్కోవచ్చు.
ప్రపంచంలో ఉన్న వివిధ మతాలనన్నింటినీ విభజించి చూస్తే, ఆగమప్రామాణ్యం లేదా గ్రంథప్రామాణ్యం గలవి, లేనివి అని రెండు తరగతులుగా ఉన్నట్లు తోస్తుంది. గ్రంథప్రామాణ్యమున్న మతాలు ప్రబలాలవ్వటంవల్ల, చాలామంది వాటిని అవలంబిస్తున్నారు. ఆ ప్రామాణ్యం లేని మతాలు చాలావరకు నశించాయి. ఇక క్రొత్తగా వెలసిన ఇలాంటి కొన్ని మతాలను అవలంబించేవారు, చాలా తక్కువగా ఉన్నారు. అయితే, ఈ మతాలు బోధించే తత్త్వాలన్నీ ప్రత్యేక వ్యక్తుల అనుభవ ఫలితాలన్న విషయంలో ఈ మతాలన్నీ ఏకీభవిస్తున్నట్లు కానవస్తాయి. తన మతాన్ని నమ్మమని క్రైస్తవుడు మీకు చెబుతాడు. అతని మాటలు విని మీరు క్రీస్తులో, క్రీస్తు అవతారంలో, దేవునిలో, జీవునిలో, జీవుని భవిష్యత్ ఉత్తమస్థితిలో విశ్వాసం పూనాలట! ‘కారణమేమిటీ’ అని నేనడిగితే, అది తన నమ్మకమంటాడు. కాని, మీరు క్రైస్తవమత మూలానికి వెళ్ళిచూస్తే, అనుభూతే దానికి ఆధారం అని గ్రహిస్తారు. క్రీస్తు తాను భగవంతుడిని చూశానని చెప్పాడు. అతని శిష్యులు తాము భగవంతుని అనుభూతిని పొందామని చెప్పారు. ఇలాగే బౌద్ధమతంలో కూడా బుద్ధుని అనుభూతే ప్రధానంగా ఉంది. బుద్ధుడు కొన్ని సత్యాలను ఆత్మానుభూతివల్ల గ్రహించాడు. వాటిని అవలోకించాడు. వాటి సన్నిహిత సంపర్కంలో ఉన్నాడు. అతను తత్త్వదర్శియై లోకానికి తత్త్వోపదేశం గావించాడు. హిందువుల విషయం కూడా ఇలాంటిదే. స్మృత్యాదులను రచించిన ఋషులు తాము తత్త్వదర్శనం చేశామని చాటుతూ, తాము దర్శించిన తత్త్వాలనే లోకానికి బోధిస్తున్నారు. జ్ఞానానికి అంతా ప్రత్యక్షానుభూతే పునాది. ప్రపంచ మతాలన్నింటికీ వజ్రసదృశమైన ప్రత్యక్షానుభూతే మూలాధారమై ఉందని మనకు దీనిద్వారా స్పష్టమవుతున్నది. మతప్రవక్తలంతా భగవంతుని దర్శించినవారే. ఆత్మద్రష్టలై, త్రికాలజ్ఞులై, తమ శాశ్వత తత్త్వాన్ని దర్శించి తాము చూచినదాన్ని వారు లోకానికి బోధించారు. ఈ అనుభూతులు నేడు అసాధ్యాలని, మొదట మతాలను స్థాపించిన ఏ కొంతమందికో అవి సాధ్యమయ్యాయని (వారి తర్వాత వారి మతాలు వారి పేర్లతో ఉండి పోయాయని), ముఖ్యంగా ఈ రోజుల్లో అనేక మతాలనుండి ఒక విచిత్ర వాదన వెలువడుతున్నది. ఈ అనుభూతులు ప్రస్తుతకాలంలో చెల్లవట! అందుకని మతానికి నమ్మకం కన్నా మరో ఆధారం ఏదీ లేదట! ఈ సిద్ధాంతాన్ని నేను సమూలంగా ఖండిస్తాను. ఏ విజ్ఞానంలోనైనా సరే, ఈ లోకంలో ఒక అనుభవం సిద్ధిస్తే, అంతకుముందు అనేక కోట్ల పర్యాయాలు ఆ అనుభవం సిద్ధించి ఉందని, శాశ్వతంగా మరల మరల సిద్ధిస్తుందన్న విషయం నిరాఘాటంగ ఏర్పడుతుంది. ఒకప్పుడు సంభవమైనది, సర్వదా సంభవమై ఉంటుంది. ఈ ఏకరూపత్వం నిరంతర ప్రకృతిశాసనం.
కాబట్టి, ప్రాచీనకాలంలో సిద్ధించిన అనుభూతిమీదనే, మతం ఆధారపడి ఉండటమేగాక, అలాంటి స్వానుభవం కలిగితే కానీ, మనిషి పారమార్థికుడు కానేరడని యోగశాస్త్రాచార్యులు చాటుతున్నారు. మనకీ అనుభూతి కలిగే విధానాన్ని బోధించే శాస్త్రమే యోగశాస్త్రం. స్వానుభవం లేనిదే మతం గూర్చి ప్రసంగించటం నిష్ప్రయోజనం. భగవంతుని పేర ఇంత కల్లోలం, ఇంత గందరగోళం, ఇంత కలహం ఎందుకు సంభవిస్తున్నాయి? మూలకారణాన్ని గ్రహించలేక జనులు తమ తాత ముత్తాతల ఆచారాలకు తలలూపుటతో సంతృప్తి నొంది, ఇతరులు కూడా తమను అనుసరించాలని భావించి ఉండటంవల్ల, దేవుని పేర జరిగినంత రక్తపాతం మరొక విషయ నిమిత్తం జరగలేదు. స్వానుభవం లేనిదే, ‘ఆత్మ ఉంది’ అనటానికి, చూడనిదే ‘దేవుడున్నాడు’ అనటానికి మనిషికి ఏమి హక్కుందీ? భగవంతుడు ఒకడు ఉన్నాడంటారా, అయితే, మనం అతడిని చూడాలి. ఆత్మ ఉందంటారా, అయితే దాన్ని మనం దర్శించాలి. లేకపోతే నమ్మకుండా ఉండటమే మేలు.
ఆస్తికుడను కపటవేషం వేసేకన్నా, బాహాటంగా నాస్తికుడు కావటమే మంచిది. నవీన ‘విద్యాధికులు’, మతం – వేదాంతం – పారమార్థిక చింతన అన్నవి వ్యర్థాలని తలుస్తారు. ఇక ఇవన్నీ కేవలం నిరాధారాలని, లోకహితం చేయటానికి మనలను ప్రేరేపించటం కన్నా, వీటికి మరో ప్రయోజనం అన్నది ఏదీలేదని అల్పవిద్యావంతుల అభిప్రాయమై ఉన్నట్లు కనిపిస్తుంది. జనులు ఆస్తికతను అవలంబించటం వల్ల యోగ్యులు, నీతి పరులు, సత్పురుషులు కావటానికి కొంత అవకాశం ఏర్పడుతున్నదట! ఇలా ఊహిస్తున్నందుకు వీరిని నిందించవలసిన పనిలేదు. ఎందుకంటే, నిస్సారప్రలాపాలను నమ్ముతుంటే చాలని వీరు పొందే బోధలన్నింటి సారాంశం. మాటలను పట్టుకుని ప్రాకులాడుతూ ఉండమని వీరికి ఉపదేశించారు. కానీ, వీరిలా కాలక్షేపం చేయగల్గితే, మానవస్వభావంపై నాకిక కొంచమైన గౌరవమూ ఉండదు. మనిషి ఎప్పుడూ సత్యాన్నే కోరుతుంటాడు. దాని అనుభవం కోసం అతని మనసు పరితపిస్తూ ఉంటుంది. సత్యాన్ని గ్రహించి, అంతరాత్మలో దాని అనుభవాన్ని పొంది, సత్యసందర్శనం చేసినప్పుడే సమస్త సంశయాలు తెగి అజ్ఞానం నాశనమై సమస్త కర్మలూ నశిస్తాయని వేదాలు చాటుతున్నాయి.* “దివ్యలోక నివాసులైన ఓ అమృత పుత్రులారా! (మోక్షమార్గాన్ని) వినండి. ఈ అజ్ఞానసముద్రాన్నుండి తరించే మార్గం ఒకటి ఉంది. అజ్ఞానాంధకారానికి అవతల వెలుగొందే పరమపురుషుని కనుగొనుటే ఆ మార్గం. వేరొక మార్గం లేదు.”*
ఈ తత్త్వదర్శనార్థం శాస్త్రసిద్ధరాజమార్గాన్ని మానవకోటికి చూపటమే రాజయోగాశయం. ప్రతిశాస్త్రానికి స్వతంత్ర శోధన పద్ధతి ఒకటి కావాలి. జ్యోతిశ్శాస్త్రజ్ఞుడవు కాదలిస్తే, ఒకచోట కూర్చుని, “ఓ జ్యోతిశ్శాస్త్రమా! జ్యోతిశ్శాస్త్రమా!” అని ఎన్నిసార్లు మొరపెట్టినా, అది నీవద్దకు ఎప్పటికీ రాదు. రసాయన శాస్త్ర విషయం కూడా ఇలాంటిదే. దానికి మనం ఒక పద్ధతిని అనుసరించాలి. పరిశోధనశాలకు వెళ్ళి, భిన్నద్రవ్యాలను తీసుకుని, వాటిని చేర్చి, సక్రమంగా సంయోగం చేసి, పరిశోధనలు సాగించాలి. ఇన్నింటి ఫలితంగా రసాయన శాస్త్రజ్ఞానం కలుగుతుంది. జ్యోతి శ్శాస్త్రజ్ఞుడవు కాదలిస్తే, నక్షత్ర పరిశీలనశాలకు వెళ్ళి, దూరదర్శన యంత్రంతో, నక్షత్ర, గ్రహాదులను పదే పదే పరిశోధించగా చివరికి జ్యోతిష సిద్ధాంతివవుతావు. ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క పద్ధతి కావాలి. మతధర్మాల గూర్చి నేను వేలకొలది ఉపన్యాసాలను ఇస్తాను; దానికి సరైన మార్గాన్ని అవలంబించకుంటే, మీకు పారమార్థిక జీవితం అలవడదు. సర్వకాలాల్లో, సర్వదేశాల్లో లోకకళ్యాణం కన్నా మరో సంకల్పం లేని పవిత్రచరితులైన ఋషులు చెప్పిన మాటలివి. ఇంద్రియగ్రాహ్యసత్యం కన్నా, మహత్తర తత్త్వాన్ని తాము కనుగొన్నామని ఘోషించుటే కాక, తమ సిద్ధాంతంలోని సత్యాసత్యాలను పరిశోధించటానికి తాము ఆవిష్కరించిన సిద్ధాంతం సత్యమైందని దృష్టాంతపూర్వకంగా దృఢం చేయటానికి వారు మనల్ని ఆహ్వానిస్తున్నారు. తాము చెప్పిన మార్గాన్ని స్వీకరించి, సత్యనిష్ఠతో సాధన చేయమని మనల్ని హెచ్చరిస్తున్నారు. అనుష్ఠించిన అనంతరం, ఈ పరమసత్యం కనిపించకపోతే, వారి వాదం ‘కల్ల’ అనటానికి మీకు అధికారం ఉంది. అయితే అంతకుముందే దాన్ని నిరాకరించటం వివేక లక్షణం కాదు. కాబట్టి నియమిత విధులను అనుసరించి శ్రద్ధతో కృషిచేయటం మనకు విధాయకమై ఉంది. దానిచే తప్పక వికాసం కలుగుతుంది.
జ్ఞానాన్ని అలవరచుకునే సమయంలో మనం సామాన్యీకరణాన్ని ఉపయోగించుకుంటాం. ఇది పరిశీలనపై ఆధారపడి ఉంటుంది. మొదట మనం విషయాలను పరిశీలించి, సామాన్య ధర్మాలను నిర్ణయించి అనంతరం సిద్ధాంతాలను ఏర్పరుస్తాం. ముందు అంతరంగంలోని విషయాలను గమనించే శక్తిని సంపాదించనంత వరకు మనసు గూర్చి, మనిషి ఆంతర ప్రకృతిగూర్చి, భావనాతత్త్వం గూర్చి, జ్ఞానం ఎన్నటికీ కలగదు. అనేక సాధనాలుండటంవల్ల, వాటిసాయంతో బాహ్యప్రపంచ విషయాలను పరిశీలించటం కొంతవరకు సులభమని చెప్పవచ్చు. కాని ఆంతర ప్రపంచాన్ని శోధించటానికి మనకిలాంటి సాధనాసంపత్తి ఏదీలేదు. అయినా, నిజమైన శాస్త్రం ఏర్పడటానికి పరిశీలన ఆవశ్యకం అని మనకు తెలుసు. విషయవిశ్లేషణాసహిత పరిశోధన లేనిదే భౌతికశాస్త్రం అనేది ఏదీ నిలవజాలదు. అందుకే మానసిక శాస్త్రజ్ఞుల్లో పరిశీలనా సాధనాలను కనుగొన్న ఏ కొద్దిమందో తప్ప, మిగతావారంతా సృష్ట్యాదినుండి తమలో తాము తగువులాడుకొంటున్నారు.
ఆంతర స్థితులను పరిశీలించటానికి ఇలాంటి సాధనలను మనకు చూపటమే రాజయోగ ప్రథమాశయం. మనసే దీనికి సాధనం. ఏకాగ్రతా శక్తిని సక్రమ మార్గానికి తెచ్చి, ఆంతరిక ప్రపంచం వైపుకు మరల్చినప్పుడు, అది మనసును విమర్శించి, అంతకు ముందు మనకు తెలియని విషయాలను ప్రకాశింప చేస్తున్నది. చెదరిన సూర్యకిరణాలను కేంద్రీకరించినప్పుడు అవి తీక్షణంగా వెలుగుతాయి. ఇలాగే ఏకాగ్రతవల్ల మనశ్శక్తులు దీప్తిచెందుతాయి. జ్ఞానానికి ఇదే సాధనం. బాహ్యాంతర ప్రపంచాలు రెంటియందు కూడా ప్రతిమనిషి ఏకాగ్రతాశక్తిని వినియోగిస్తూనే ఉన్నాడు. ఈ కర్తవ్యనిర్వహణానికి విశేష అభ్యాసం కావలసి ఉంది. చిన్ననాటినుండీ ఆంతరప్రపంచ విషయాలను వదిలి, బాహ్యవిషయాలనే నేర్చుకొని ఉన్నందువల్ల, మనలో చాలామందికి మనోయంత్రం ఎలానడుస్తుందో గమనించేశక్తి చాలావరకు నశించింది. చిత్తవృత్తులనరికట్టి, మనస్సును అంతర్ముఖం చేసి, సర్వమానసిక శక్తులను ఏకాగ్రతకు తెచ్చి, మనసుపై నిలిపి, మనసును విమర్శించి, మనసు వల్లనే మనసు స్వభావాన్ని గ్రహించటం అన్నది అంత సులభ సాధ్యమయిన పని కాదు. అయినా, అలాంటి విషయ విమర్శనమే శాస్త్రీయపద్ధతి. అదితప్ప మరొకటి లేదని చెప్పాలి.
ఇక ఇలాంటి జ్ఞానంవల్ల ప్రయోజనమేమిటీ? అని అడుగుతారేమో!! జ్ఞానసాధనతో పొందదగిన పరమపురుషార్థం జ్ఞానోపలబ్ధే. అంతేకాదు, జ్ఞానసాధనంతో ఒక ప్రయోజనం కూడా సిద్ధిస్తుంది. జ్ఞానంవల్ల సర్వ దుఃఖాలు నివృత్తమౌతాయి. అంతఃకరణాన్ని శోధించి, తన్మూలంగా, నాశరహిత, స్వతస్సిద్ధ, నిత్య, నిష్కళంక, పరిపూర్ణ వస్తువును ప్రత్యక్షంగా దర్శించినవానికి ఇక శోక, మోహా లెక్కడివీ? భయం, తీరని కోరిక ఇవే దుఃఖాలకు పుట్టినిల్లు. మృత్యువు అన్నది మిథ్య అని తెలియగానే, మనిషికి మరణభయం తొలగిపోతుంది. తాను పరిపూర్ణుడనని గ్రహించగానే, మనిషికి వ్యర్థవాంఛలు అంతరిస్తాయి. ఈ హేతువులు రెండూ తొలగి పోవటం వల్ల సర్వదుఃఖాలు నశించి, సంపూర్ణానందం లభిస్తుంది.
ఈ జ్ఞానాన్ని పొందటానికి ‘ఏకాగ్రత’ అనే దానికన్నా వేరే సాధన లేదు. రసాయన శాస్త్రవేత్త, తన మానసిక శక్తులనన్నింటినీ, ఏకాగ్రస్థితికి తెచ్చి, వాటిని తాను పరిశోధించే పదార్థాలపై పెట్టి, వాటి రహస్యాలను తెలుసుకొంటాడు. జ్యోతిశ్శాస్త్రవేత్త, తన మానసిక శక్తులను అన్నింటినీ కేంద్రీకరించి, దూరదర్శకయంత్రం ద్వారా ఆకాశం మీదినిలిపితే, సూర్య చంద్ర నక్షత్రాదులు తమ రహస్యాలను అతనికి వెల్లడిచేస్తాయి. మీకు చెబుతున్న విషయాలను గురించి, నా భావాలను ఎంతెంతగా నేను ఏకాగ్రం చేయగలుగుతానో, విషయం అంతగా మీకు సుబోధక మవుతుంది. నా మాటలను వింటున్న మీరు, మీ భావాలను ఎంతెంతగా ఏకాగ్రతకు తెస్తారో, నేను చెప్పవలసిన విషయాన్ని అంత స్పష్టంగానూ గ్రహిస్తారు.
లోకంలో మనకు లభించే జ్ఞానమంతా చిత్తఏకాగ్రత వల్ల కలిగిన జ్ఞానమే. ప్రయత్నించే పద్ధతిని తెలుసుకుంటే, సాధనావిధానాన్ని గ్రహిస్తే, లోకం తన రహస్యాలను వెలివరచటానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి సాధనకు కావలసిన శక్తి సామర్థ్యాలు ఏకాగ్రతవల్ల కలుగుతాయి. మనిషి సంకల్పశక్తికి పరిమితి లేదు. మనసు ఎంతెంత ఏకాగ్రత చెందుతూ ఉంటుందో, అంతంత విషయ పరిశీలనాశక్తి కలుగుతూ ఉంటుంది. ఇదే రహస్యం.
మనసు సహజంగా బాహ్యప్రవృత్తి కలిగి ఉండటంవల్ల, బాహ్యవిషయాల్లో మనసును నిలపటం సులభం. కాని మతం, మానసికశాస్త్రం, వేదాంతం అనే విషయాల్లో చూచే దృక్, కనిపించే దృశ్యం ఒకే వస్తువు అవటంవల్ల మనసును ఏకాగ్రం చేయటం సులభసాధ్యంకాదు. మనసే విషయమై ఉంది. అందులోనూ అది అంతరింద్రియం. పరిశీలించేది, పరిశీలింపబడేది మనసే. సాధనాంతరం లేనందువల్ల మనసు చేతనే మనసును శోధించాలి. కాబట్టి చిత్తఏకాగ్రత మానసిక శాస్త్రాదుల విషయంలో కష్టసాధ్యమై ఉంది. మనసుకు, పర్యాలోచనశక్తి ఉందని మనకు తెలుసు. నేను మీతో మాట్లాడుతూ, అదే సమయంలో ఇంకొక వ్యక్తివలె ప్రక్కన నిలచి, చెప్పే విషయాన్ని వింటూ గ్రహిస్తుంటాను. మీరు పనిచేస్తూ ఆలోచిస్తుంటే, ఏకకాలంలో, మీ మనసులో ఒక భాగం మాటి మాటికి నిలచి మీరాలోచించే విషయాన్ని గమనిస్తూ ఉంటుంది. మనశ్శక్తులను ఏకాగ్రపరచి, మరల మనసుపై లగ్నం చేయాలి. తీక్ష్ణ సూర్యకిరణాలముందు, చిమ్మచీకటిలో ఉన్న రహస్యాలు కూడా, బట్టబయలవుతాయి. అలాగే, ఏకాగ్రచిత్తం ముందు, అంతరాత్మలోని గూఢవిషయాలైనా, నిర్భిన్నాలై వెలువడతాయి. విశ్వాసానికి మూలాధారమైన యథార్థ మతాన్ని మనం ఈ విధంగా చేరుకోగలం.
జీవాత్మ సత్యమా? అసత్యమా? జీవితం మూన్నాళ్ళముచ్చటా, లేక కలకాలం ఉండేదా? లోకంలో దేవుడనేవాడు ఒకడు ఉండటం యథార్థమా? మిథ్యయా? అనే ఇలాంటి విషయాల్లో ఉన్న సత్యాసత్యాలను తెలపడమే రాజయోగం యొక్క ఆశయం.
చిత్తాన్ని ఏకాగ్రం చేసేందుకు ఉపాయమేమిటీ? ఆ తర్వాత అంతరంగంలోని పరమరహస్యాలను ఎలా గ్రహిస్తాం? ఆ వెనక మనో ధర్మాలను ఎలా నిర్ణయిస్తాం? – అనే ఈ అంశాలనన్నింటినీ బోధించటమే రాజయోగం ముఖ్యోద్దేశం. అయితే దానికి, “మీ మతం ఏదీ? మీరు ద్వైతులా? నాస్తికులా? క్రైస్తవులా? యూదులా? బౌద్ధులా?” అని రాజయోగం మనల్ని ఎన్నడూ అడగదు. మనం మానవులం అనే అర్హత్ చాలు. మనిషి అయిన ప్రతివానికీ తత్త్వాన్వేషణ చేసే అధికారం ఉంది; సామర్ధ్యం కూడా ఉంది. శ్రమించటానికి సంసిద్ధుడై ఉంటే, జిజ్ఞాసతో సమాధానం పొందటానికి ప్రతిమనిషికీ హక్కుంది.”
ఇంతవరకూ, రాజయోగ జిజ్ఞాసకు నమ్మిక అన్నది అనవసరమని తెలిసింది. నీ అంతట నీకు గోచరం కానిదే దేన్నికూడా నమ్మకు అని రాజయోగం చెబుతుంది. సత్యం నిలవటానికి దానికి ఎలాంటి చేయూత అక్కర్లేదు. జాగ్రదవస్థలో మనకు ప్రత్యక్షంగా ఉన్న విషయాలను నిరూపించటానికి స్వప్నాలు, ఊహలు అవసరమా? లేదు.
రాజయోగాన్ని సాధించటానికి చాలాకాలం పడుతుంది. నిరంతర అభ్యాసం కావాలి. కొంతవరకు శరీర సంబంధంగా ఉన్నా, ఈ అభ్యాసం ముఖ్యంగా మానసికం. మనశ్శరీరాలకు ఎంతటి సన్నిహిత సంబంధ ముందో ముందు ముందు మనకు తెలుస్తుంది. సూక్ష్మశరీరాంశమే మనస్సవుతున్నదని, మనసులో ఎలాంటి మార్పు కలిగినా, తదనుగుణమైన మార్పు శరీరంలో కనిపిస్తుందని విశ్వసిస్తే, శరీరంలో కలిగే మార్పులకు అనుగుణమైనవి మనసులో కలగాలని నమ్మటం యుక్తివిరుద్ధం కాదు. శరీరంలో స్వస్థత లేకుంటే, మనసులో కూడా అస్వస్థత కలుగుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే, మనసులో బలము, ఆరోగ్యాలు ఏర్పడతాయి. ఒక వ్యక్తికి కోపం వస్తే, అతని మనసు క్షోభిస్తుంది. ఇదేవిధంగా మనసులో కలత కలిగితే శరీరంలో కూడా కలత కలుగుతుంది. జనసామాన్యంలో మనోవికాసం చాలాస్వల్పంగా ఉండటంవల్ల, మనసు విశేషంగా శరీరాధీనమై ఉంటుంది. దాదాపు చాలామంది మృగప్రాయులుగా జీవిస్తున్నారు. అంతేకాదు, వారి మనోనిగ్రహశక్తి, క్షుద్రజంతువుల నిగ్రహశక్తి కన్నా విశేషమైంది కాదని అనేక సందర్భాల్లో వెల్లడి అవుతూ ఉంటుంది. మనసుమీద మనకు అంతగా పెత్తనం లేదు. కాబట్టి, ఇలాంటి స్వాధీనత కలగటానికి, మనశ్శరీరాలను వశపరచుకొనటానికి, శారీరక సహాయాన్ని కొంతవరకు పొందవలసి ఉంది. తగినంత శరీర స్వాధీనత సంపాదించినప్పుడు, మనసును నేర్పుతో త్రిప్పేయత్నం చేయవచ్చు. ఇలాంటి నేర్పుతో మనసును స్వాధీనం చేసుకుని మన ఇష్టానుసారంగా దాన్ని వర్తింపచేయగలం. మనం కోరిన రీతిన తన శక్తులను ఏకాగ్రం చేసేలా మనం మనసును నిర్బంధించగలం.
రాజయోగుల ప్రకారం, ఆంతరప్రపంచం యొక్క ఘనీభవించిన రూపమే (సూక్ష్మప్రపంచం) బాహ్యప్రపంచంగా కనిపిస్తుంది. స్థూలం ఎప్పుడు కూడా కార్యమే; సూక్ష్మం కారణం. కాబట్టి బాహ్యప్రపంచం కార్యం, అంతర ప్రపంచం కారణం. ఇలాగే బాహ్యశక్తులు స్థూలాంశాలు, అంతశ్శక్తులు వాటి సూక్ష్మాంశాలు. అంతశ్శక్తుల్ని కనిపెట్టి, వాటిని నేర్పుతో నడపగలిగేవారికి, ప్రకృతి అంతా స్వాధీనమవుతుంది. మొత్తం ప్రపంచాన్ని, మొత్తం ప్రకృతిని తన వశం చేసుకోవటం అనే బ్రహ్మాండకార్యాన్ని సాధించటానికి యోగి సంకల్పిస్తాడు. ప్రకృతి శాసనాలు తనపై ఆధిపత్యం సాధించలేని స్థితిని, సమస్త ప్రకృతి నియమాలను అతిక్రమించగల్గిన స్థితిని పొందటమే, యోగి లక్ష్యం. అప్పుడతను ప్రకృతి అంతటికి ప్రభువు అవుతాడు (బాహ్యంలోనూ, అంతరం లోనూ). నాగరికత, మానవజాతి పురోభివృద్ధి అంటే ఇదే, ప్రకృతిని వశం చేసుకోవడమే.
ప్రకృతిని నిరోధించగల శక్తి కోసం వివిధజాతుల వారు వివిధ మార్గాలను అవలంబిస్తున్నారు. ఒకే సంఘంలో, కొంతమంది బాహ్యప్రకృతిని, మరికొంత మంది, ఆంతరప్రకృతిని వశం చేసుకునేప్రయత్నం చేసినట్లుగా, కొన్ని జాతులవారు ఆంతరప్రకృతిని, మరికొన్ని జాతులవారు బాహ్యప్రకృతిని స్వాధీనం చేసుకోవాలనుకుంటారు. కొంతమంది ఆంతర ప్రకృతి నిరోధంవల్ల సమస్తాన్ని నిగ్రహించవచ్చంటారు. మరికొంత మంది బాహ్యప్రకృతి నిరోధంవల్ల సర్వం చేజిక్కునంటారు. ప్రకృతిలో బాహ్యం – అంతరం అనే విభజన లేనందువల్ల, పర్యవసానంలో ఈ రెండు వాదాలు న్యాయసమ్మతాలే. బాహ్యాంతరాలన్నవి కేవలం కల్పిత పరిమితులే. బాహ్యాంతరవాదులిరువురూ, తమ తమ విజ్ఞానపు అవధులను చేరునప్పుడు ఒక్కచోటనే కలవడం విధివిహితం. పదార్థవిజ్ఞాన శాస్త్రవేత్త తన విజ్ఞాన పరమావధిని సమీపించగానే, విజ్ఞానం తత్త్వశాస్త్రంలో లయించి పోతున్నట్లు కనుగొంటాడు. ఇలాగే, వస్తువు ఒక్కటే కాబట్టి, తత్త్వశాస్త్రవేత్త తాను మనఃప్రకృతులని చెప్పే తత్త్వాలు కేవలం బాహ్యభేదాలే అని, సద్వస్తువు ఒక్కటే అని గ్రహిస్తాడు.
ఏకం అయినప్పటికీ, ఏది అనేకంగా ప్రకాశిస్తున్నదో, దేనిలోనుండి అనేకత్వం నిర్మాణమవుతున్నదో, అలాంటి ఏకత్త్వాన్ని కనుగొనటమే సమస్తశాస్త్రాల పరమావధి.
అంతర ప్రపంచాన్నుండి ప్రారంభించి, అంతరప్రకృతిని పరిశోధించి, తన్మూలంగా బాహ్యాంతర ప్రకృతినంతా వశం చేసుకోవటమే రాజయోగ ఆశయం. ఇది చాలా పురాతన యత్నం. ముఖ్యంగా హిందూదేశం ఈ సాధనకు పట్టుకొమ్మ అయినా ఇతర దేశస్థులు కూడా ఈ విషయంలో కృషి చేశారు. పాశ్చాత్యదేశాల్లో దీన్ని ఏదో గూఢవిద్యగా భావించి, ఇలాంటి సాధన చేసేవారిని మాంత్రికులని, తాంత్రికులని తలచి వారిని మంటల్లోకి నెట్టి చంపారు. హిందూదేశంలోనైతే ఇది అనేక కారణాలవల్ల న్నార్థపరుల పాలయింది. వారు ఈ విద్యను నూటికి తొంబదిపాళ్ళు ధ్వంసం చేసి, మిగిలిన దానిని రెండవ కంటికి తెలియని పరమ రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. నేడు పాశ్చాత్యదేశాల్లో గురువుల పేర చాలామంది బయలు దేరారు. హిందూదేశంలో కూడా ఇలాంటి ఉపదేశకులు బయలుదేరినప్పటికీ, వారికి ఈ విషయంలో కొంత పరిజ్ఞానం ఉండటం వల్ల, ఏమీ తెలియని ఈ నవీన వ్యాఖ్యాతలకన్నావారు యోగ్యులేనని చెప్పవచ్చు.
ఈ యోగపద్ధతుల్లో ఏది గుప్తంగా ఉంటుందో, పరమరహస్యంగా ఉంటుందో, దాన్ని వెంటనే పరిత్యజించాలి. జీవయాత్రలో బలమే మనకు సరైన త్రోవ చూపుతుంది. సమస్త విషయాల్లో మిమ్ము బలహీనులుగా చేసేవాటిన్నన్నిటిని విసర్జించేలా, పారమార్థిక విషయాల్లో కూడా అలాంటి వాటిని విసర్జించాలి. వాటితో మీకెలాంటి జోక్యం ఉండకూడదు. మంత్ర తంత్ర బంధుర విషయాన్వేషణల వల్ల మనిషి బుద్ధి బలహీనమవుతుంది. ‘శాస్త్రాల కెల్లా మేలిమి బంగారు’ అనదగ్గ యోగశాస్త్రం దీనివల్ల ఇంచుమించుగా ధ్వంసమైపోయింది. నేటికి నాలుగువేల సంవత్సరాలకు పూర్వం నిర్మాణమైనది మొదలు, ఋషులు యోగశాస్త్రాన్ని హిందూదేశంలో విశిష్ట ఆకృతికి తెచ్చి, సూత్రీకరించి బోధించారు. వ్యాఖ్యాత క్రొత్త వాడవుతున్నకొద్దీ, వ్యాఖ్యానంలో దోషాలు అధికంగా దొర్లటం, గ్రంథకర్త ప్రాచీనుడైనకొద్దీ, వ్యాఖ్యానం హేతుబద్ధమై, సమంజసమై ఉండటం స్పష్టం. నవీన గ్రంథకర్తల్లో అనేకమంది ఏమేమో అగమ్యగోచర రహస్యాలగూర్చి చెబుతుంటారు. దివ్యలోకసందీప్తమై ప్రకాశించటానికి బదులు, యోగం ఇలా ఏ కొందరి చేతుల్లోనో పడటంవల్ల వారు యోగసిద్ధులకు తామేపట్టాభిషిక్తులం కావాలని భావించి, దాన్ని పరమరహస్యంగా ఉంచారు. ఆ శక్తులు తమకే దక్కాలన్న ఉద్దేశంతో వారలా చేశారు.
నేను చేస్తున్న బోధల్లో మర్మమేదీలేదని తెలుసుకోండి. నాకు తెలిసినంతవరకూ, మీకు చెబుతాను. హేతువిమర్శ చేసి నిరూపించ గల్గినంతదాకా, నిరూపిస్తాను. నాకు తెలియని వాటికి, గ్రంథాలు ఏమి చెబుతున్నాయో చెప్పి ఊరుకుంటాను. అంధప్రాయంగా నమ్మటం సరికాదు. మీ విమర్శన శక్తిని వినియోగించి, సత్యదృష్టితో సాధనచేసి, ఈ సంగతులు జరుగుతాయా, లేదా చూడాలి. ఇతర శాస్త్రాలను నేర్వటంలో ఎలాంటి విధానాన్ని మీరు అవలంబిస్తారో సరిగా ఆ విధానాన్నే అవలంబించి, ఈ శాస్త్రాభ్యాసాన్ని చేయాలి. ఇందులో ఎలాంటి రహస్యంగానీ, ప్రమాదం గానీ లేవు. ఈ శాస్త్రం యథార్థమై ఉన్నంతదాకా నడివీధుల్లో బాహాటంగా బోధించాలి. ఈ విషయాలను రహస్యంగా ఉంచి భ్రమింప చేయటానికి ఏమాత్రం ప్రయత్నించినా అలాంటి ప్రయత్నం వల్ల మహావిపత్తు సంభవిస్తుంది.
విషయంలో ప్రవేశించటానికి ముందు రాజయోగానికి అసలు మూలాధారమైన సాంఖ్యదర్శనాన్ని గూర్చి కొంత చెప్పాలి. సాంఖ్య దర్శనం ప్రకారం ఇంద్రియానుభవ ఉత్పత్తిక్రమం ఇలా ఉంటుంది.
బాహ్యవిషయాల వల్ల కలిగే స్పర్శలు వాటి బాహ్యోపకరణాలద్వారా వాటి ఇంద్రియాల వద్దకు చేరతాయి. ఇంద్రియాలు ఈ స్పర్శలను మనసుకు అందచేస్తాయి. మనసు వాటిని బుద్ధికి అందిస్తుంది. బుద్ధినుండి వాటిని పురుషుడు (ఆత్మ) గ్రహిస్తాడు. అప్పుడే ఇంద్రియానుభవం కలుగుతుంది. అప్పుడు పురుషుడు చేయవలసిన పనికి కర్మేంద్రియాలను నియమిస్తాడు. పురుషుడు తప్ప ఇవన్నీ ప్రకృతి సంబంధ తత్త్వాలే. అయితే బాహ్యేంద్రియాల కన్నా, మనసు సూక్ష్మతర ప్రకృతివల్ల నిర్మితమై ఉంది. మనసుకు కారణమైన తత్త్వంవల్లే, తన్మాత్రలనే సూక్ష్మభూతాలు ఏర్పడుతున్నాయి. ఇవి మరల స్థూలభూతాలై వాటివల్ల బాహ్యప్రకృతి ఏర్పడుతున్నది. ఇది సాంఖ్యప్రోక్త మనశ్శాస్త్రవిషయం. దీనివల్ల బాహ్యస్థూల ప్రకృతికి, బుద్ధికి స్థితినిబట్టి భేదమే తప్ప వస్తుతః భేదం లేదని తెలుస్తున్నది. పురుషుడు (ఆత్మ) తప్ప, మిగిలిన దంతా జడప్రకృతి, బాహ్యవిషయాలను గ్రహించటానికి మనసు, ఆత్మచేతిలో ఉన్న సాధనమని చెప్పవచ్చు. మనసు అనుక్షణం సంకల్ప, వికల్పాలతో మారుతూ ఉన్నా, సిద్ధావస్థలో ఇంద్రియాల్లో కొన్నింటితో గానీ, ఒకదానితో గానీ సంయోగం పొందటానికి, ఏ ఇంద్రియంతో కూడా సంయోగం చెందకుండా ఉండటానికి సమర్థమై ఉంటుంది. దీనికి ఒక దృష్టాంతాన్ని చూద్దాం. ఈ గడియారం చేసే శబ్దాన్ని నేను శ్రద్ధగా వింటూ ఉంటే, కన్నులు తెరచుకొని ఉన్నా నాకేమీ కనిపించకపోవచ్చు. అంటే, నా మనసు కర్మేంద్రియంతో సంయోగం చెందినప్పుడు, నేత్రేంద్రియంతో సంయోగం చెందదని స్పష్టమవుతున్నది కదా! కాని పూర్ణావస్థను పొందిన మనసు ఏక కాలంలో సకలేంద్రియాలతో సంయోగం చేయవచ్చు. మనసుకు ఆంతరావలోకనశక్తి ఉంది. ఈ శక్తివల్ల మనసు తన లోతు తాను తెలుసుకుంటుంది. యోగి కూడా ఈ అంతరావలోకన శక్తినే పొందాలనుకుంటాడు.
మనసు, శక్తులను ఏకాగ్రం చేసి, అంతర్ముఖంచేసి లోపల ఏమి జరుగుతున్నదో యోగి గ్రహిస్తాడు. ఇదంతా తత్త్వశాస్త్రవేత్తలు పరిశోధించి తేల్చిన సారాంశం. అంతేకాని, వట్టి నమ్మకంమీద ఆధారపడియున్న విషయం కాదని గ్రహించండి. నవీన శరీరశాస్త్రజ్ఞులు, నేత్రేంద్రియం కంటిలో లేదని, మెదడులోని నాడీకేంద్రాల్లో ఒకదానిలో ఈ నేత్రేంద్రియం ఏర్పడి ఉందని, ఇతరేంద్రియాల విషయం కూడా ఇంతేనని చెబుతారు. అంతేకాదు, మెదడు ఏ పదార్థంతో నిర్మాణమవుతున్నదో, ఆ పదార్థం ద్వారానే ఈ నాడీకేంద్రాలు కూడా నిర్మాణం అవుతున్నాయని వారంటారు. సాంఖ్యులు చెప్పే విషయం కూడా ఇదే. ఈ ప్రతిపాదనల్లో ఒకటి శారీరకంగా, మరొకటి మానసికంగా వర్తిస్తున్నాయి. అయినాసరే, ఈ రెంటి అభిప్రాయం ఒకటే. మరి మనం పరిశీలించవలసిన విషయం, ఈ మనసు, శరీరాలకు రెంటికీ అతీతమై ఉంది.
ఏ సూక్ష్మావలోకన స్థితిని పొందటంవల్ల, వివిధ మానసిక అవస్థలన్నీ కంటికి కట్టినట్లు గోచరిస్తాయో, అలాంటి సూక్ష్మావలోకన స్థితిని పొందటానికి యోగి సంకల్పించుకుంటాడు. మనోనేత్రంతో ఈ స్థితులనన్నింటినీ చూడాలి. ఇంద్రియాలకు బాహ్యవిషయ సంసర్గం ద్వారా కలిగే స్పర్శగమనం ఎలా ఉంటుంది? ఆ స్పర్శను మనసు ఏ విధంగా గ్రహిస్తుంది? బుద్ధి దాన్ని ఏ విధంగా నిర్థారణ చేస్తుంది? తర్వాత ఈ నిర్థారణాన్ని పురుషునికి (ఆత్మకు) ఎలా తెలియచేస్తుంది? ఈ విషయాలన్నీ యోగికి కళ్ళెదుట కనిపిస్తాయి. ఏ భౌతిక శాస్త్రాభ్యాసం చేయటానికైనా కొంత సాధనార్హతను సంపాదించి, ఆ శాస్త్రానికి నియమితమై ఉన్న పద్ధతినిబట్టి కృషిచేస్తేగానీ, ఆ శాస్త్రజ్ఞానం కలగదు. రాజయోగంలో కూడా ఈ నియమం వర్తిస్తుందని వేరే చెప్పనక్కర్లేదు కదా!
మొదట ఆహారవిషయంలో కొన్ని నియమాలు పాటించాలి. మనసును సత్త్వగుణప్రధానంగా చేసే ఆహారాన్నే మీరు గ్రహించాలి. జంతుప్రదర్శనశాలకు పోయి చూస్తే, మీకు ఈ విషయమై నిదర్శనం కనిపిస్తుంది. ఏనుగులను చూడండి. అవి భారీజంతువులై ఉన్నా, సాధుస్వభావం కలిగి శాంతంగా ఉంటాయి. పులులూ, సింహాలున్న బోనులవైపు మరలండి. ఆ జంతువులకు విశ్రాంతి అన్నది లేదేమోనని అనిపిస్తుంది. చూశారా, ఆహారం వల్ల కలిగే మార్పు! మన శరీరంలోని శక్తులన్నీ ఆహారంవల్లే కలుగుతుంటాయి. ప్రతిదినం ఈ విషయం మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఉపవాసం చేయటానికి ప్రారంభించగానే మొదట మీ శరీరం నీరసిస్తుంది. శరీరశక్తులు సన్నగిల్లుతాయి. కొన్నాళ్ళకు మీ మనశ్శక్తులు కూడా క్రుంగిపోతాయి; ముందుగా జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది, తర్వాత ఆలోచించటానికి కూడా శక్తిలేని స్థితి ప్రాప్తిస్తుంది. ఆ స్థితిలో ఒక విషయాన్ని గూర్చి హేతువిమర్శ చేయటానికి తగిన సామర్థ్యం అంతకుముందే అంతరిస్తుంది. కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్త కలిగియుండటం అవసరం. తగినంత బలాన్ని చేకూర్చుకుని, సాధనలో అభివృద్ధి పొందిన తర్వాత ఆహారవిషయాన్ని గూర్చి అంతగా నియమాలు పాటించ నవసరంలేదు. అపాయాన్ని వారించటానికి, ఎదిగే మొక్కచుట్టూ కంచె వేయాలి. చెట్టు ఎదిగిన తర్వాత కంచెను ఊడదీస్తారు. అప్పుడెట్టి తాకుడు కలిగినా, ఎదిర్చి నిలవటానికి చెట్టుకు తగినంత చేవ చేకూరుతుంది.
ఒకవైపు భోగలాలసతను, మరొకవైపు ఉగ్రతపశ్చర్యలను యోగసాధకుడు విసర్జించాలి. యోగాభ్యాసకుడు నిరాహారియై శరీరాన్ని హింసించకూడదు. అలాంటివాడు యోగి కానేరడని భగవద్గీత (6–16, 17) తెలుపుతుంది. గీతాశాస్త్రవాక్కులను గమనించండి:
“అర్జునా! ఎక్కువగా భుజించేవానికి ధ్యానం (సమాధి) కుదరదు.అదే విధంగా ఏమీ తినని వానికి కూడా అది లభించదు. ఎక్కువగా నిద్రించేవానికిని, అమితంగా మేల్కొని ఉండేవానికి కూడా ధ్యానం కుదరదు.”
“పరిమితమైన ఆహారవిహారాలు కలిగి, జపతపాది కర్మలందు పరిమితమైన ప్రయత్నం కలిగి, నియమితమైన (నిర్దిష్టమైన కాల పరిణామాలు కలిగిన) నిద్రాజాగరణాలు కలిగి ఉండేవానికి సంసార దుఃఖాన్ని పోగొట్టే ధ్యానం కుదురుతుంది.”