ఈ అధ్యాయంలో యోగసిద్ధులను వివరిస్తారు.
1. దేశబంధశ్చిత్తస్య ధారణా.
ఏదో ఒకచోట చిత్తాన్ని నిలపటమే ధారణ.
శరీరంలో గానీ, బాహ్యంలో గానీ ఒకానొక అవలంబనాన్ని ఆశ్రయించి మనస్సు నిలకడ చెందియుండుట ధారణ.
2. తత్ర ప్రత్యయైకతానతా ధ్యానమ్.
అలాంటి అవలంబనంలో ఏకభావ ప్రవాహరూప జ్ఞానమే ధ్యానం.
శిరస్సు పైభాగంలో గానీ, హృదయం మొదలైన వాటిలోగానీ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని, శరీరంలోని మరేతర భాగం నుండిగాక, ఆ లక్ష్యభాగం నుండే స్పర్శానుభవాన్ని పొందగలిగితే, ఆ స్థితి ధారణ అంటారు. అలా కొంతకాలం వరకూ చిత్తం నిలవగలిగితే, అది ధ్యానమవుతుంది.
3. తదేవార్థమాత్రనిర్బాసం స్వరూపశూన్యమివ సమాధిః.
రూపాలను వదలి అర్థాన్ని మాత్రమే భాసింపచేస్తుంటే, దాన్ని సమాధి అంటారు.
ధ్యానంలో ధ్యేయరూప బాహ్యభాగాన్ని విసర్జించినప్పుడు సమాధి ఏర్పడుతుంది. ఎలా అంటారా, నేను ఒక పుస్తకాన్ని భావిస్తూ, దాని మీద మనస్సును ఏకాగ్రం చేయగల్గాననుకోండి. అప్పుడు బాహ్యంగా ఉన్న రూపం అదృశ్యమై, అర్థం మాత్రం భాసించే స్థితే సమాధి.
4. త్రయమేకత్ర సంయమః.
ఒకేవిషయంలో (ధ్యానధారణ సమాధులు) ఈ మూడింటిని సంయమ మంటారు.
ఒకవ్యక్తి తన మనస్సును ఒక విషయంపై పెట్టి, దానిలోనే మనస్సును నిలిపి, ఆ విషయాంతర్భాగం నుండి దాన్ని వేరుచేసి, అలా చాలాసేపు మనస్సును నిలిపి ఉంచటాన్నే, ధ్యానధారణ సమాధులు ఒకదానివెంట ఒకటిగా మూడూ ఏకమగుటనే సంయమమంటారు. ఈ స్థితిలో విషయరూపం అదృశ్యమై, అర్థం మాత్రమే మనస్సులో నిలచి ఉంటుంది.
5. తజ్జయాత్ ప్రజ్ఞాఽఽలోకః.
దాన్ని జయిస్తే జ్ఞానప్రకాశం కలుగుతుంది.
ఇలాంటి సంయమాన్ని చేయగల్గిన యోగికి, సిద్ధులన్నీ వశమౌతాయి. ఇది యోగులకు గొప్ప కీలకం. విషయాలు స్థూలాలు, స్థూలతరాలు, స్థూలతమాలు అని; సూక్ష్మం సూక్ష్మతరం సూక్ష్మతమం అని అనంతంగా ఉన్నాయి. మొదట స్థూలవిషయాలమీద సంయమం చేస్తూ, స్థూలవిషయ జ్ఞానం కలగటం మొదలు పెట్టగానే, క్రమంగా సూక్ష్మవిషయాలమీద సంయమం చేస్తూరావాలి.
6. తస్య భూమిషు వినియోగః.
దాన్ని (సంయమనాన్ని) క్రమానుసారంగా వినియోగించాలి.
సంయమనాన్ని త్వరపడి సాధించే యత్నం చేయవద్దని ఈ సూత్రం మనల్ని హెచ్చరిస్తున్నది.
7. త్రయమంతరంగం పూర్వేభ్యః.
ఇంతకు క్రితం చెప్పినవానికన్నా ఈ మూడూ విశేషంగా అంతరంగాలై ఉన్నాయి.
ధ్యాన ధారణ సమాధులకు బాహ్యాంగాలైన ప్రాణాయామ, ఆసన, నియమాలను గూర్చి ఇంతకు క్రితం చర్చించాం. ఈ మూడింటిని పొందిన మనిషి, సర్వశక్తిమంతుడై సర్వజ్ఞుడైన ముక్తుడు మాత్రం కాడు. ఈ మూడూ మనస్సును నిర్వికల్పం చేయలేవు; పైగా మరల శరీరాన్ని పొందటానికి కర్మబీజాలను శేషింపచేస్తున్నాయి. యోగులు చెప్పినట్లు ఈ బీజాలు దహనమైనప్పుడు మాత్రమే, మరల ఇవి మొలకెత్తుటకు అవకాశం ఉండదు. అణిమాదిసిద్ధులు కర్మబీజాలను నశింపచేయలేవు.
8. తదపి బహిరంగం నిర్బీజస్య.
అవికూడా నిర్బీజ సమాధికి బాహ్యాంగాలే అవుతాయి.
నిర్బీజ సమాధిలో పోల్చిచూస్తే, ఈ ధ్యానధారణ సమాధులు మూడూ బాహ్యాంగాలే అవుతాయి. సర్వోత్తమ నిర్వికల్పసమాధిని మనమింకా చేరలేదు. అయితే సిద్ధులతో కూడిన జగత్తును భాసింపచేసే క్రింది తరగతి సమాధి గూర్చి మాత్రమే మనమింతదాకా తెలుసుకున్నాం.
9. వ్యుత్థాన – నిరోధ సంస్కారయోరభిభవ – ప్రాదుర్బావౌ నిరోధక్షణచిత్తాన్వయో నిరోధపరిణామః.
చిత్తంలో విక్షేపం పొందిన సంస్కారాలను నిరోధించటం వల్ల, నిరోధసంస్కారం జనించటం వల్ల, నిరోధ శక్తులను పొందినదై మనస్సు నిరోధసంస్కారాలను పొందినదని అంటారు.
సమాధి ప్రథమావస్థలో చిత్తవృత్తులు సంపూర్ణంగా నిరోధం కావు. అయినా చాలావరకూ నిరోధితమవుతాయి. సంపూర్ణనిరోధం లభించిననాడు, సంస్కారాలన్నవి లేకుండా ఉండాలి. ఇంద్రియాల ద్వారా మనసును బాహ్యప్రపంచంలో చిత్తవృత్తులు ప్రవేశింపచేసే సమయంలో యోగి వాటిని నిరోధించే ప్రయత్నం చేస్తాడు. ఈ నిరోధమే ఒక చిత్తవృత్తి అవుతుంది. ఒక చిత్తవృత్తిని మరొకటి నిరోధిస్తుంది. ఇలా వృత్తులన్నీ చివరికి శాంతిస్తే తప్ప నిజమైన సమాధి కలగదు. అయినా మనస్సు ప్రబలవేగంతో విషయాల్లో ప్రవేశించే స్థితికన్నా, ఈ క్రింది తరగతి సమాధి ఉత్తమనిర్వికల్ప సమాధికి సన్నిహితంగా ఉంటుంది.
10. తస్య ప్రశాంతవాహితా సంస్కారాత్.
సంస్కార బలంవల్ల మనోనిగ్రహం ప్రవాహరూపంలో ప్రశాంతంగా ఉంటుంది.
నిత్యం యోగాన్ని అభ్యాసం చేస్తే, మనోనిగ్రహం ప్రవాహరూపంలో ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది. మనస్సుకు నిరంతర ఏకాగ్రత కలగుతుంది.
11. సర్వార్థతైకాగ్రతయోః క్షయోదయౌ చిత్తస్య సమాధి పరిణామః.
(సర్వవిషయాల్లో చర్చించుట అనే) సర్వార్థత నశించి, (ఏక విషయంలో నిలుచుట అనే) ఏకాగ్రత కలిగినంతనే చిత్తం సమాధి పరిణామాన్ని పొందుతుంది.
మనస్సు నానావిషయాల్లో తగులుకొంటూ సకల విషయాల్లో సంచరిస్తూ ఉంటుంది. ఇది మనస్సు సామాన్యస్థితి. ఒకే విషయాన్ని గ్రహించి, మిగిలిన వాటి నన్నింటినీ విసర్జించే ఉన్నతావస్థ మనసుకు ఉంది. అలాంటి ఉన్నతావస్థ పరిణామమే సమాధిస్థితి.
12. శాంతోదితౌతుల్యప్రత్యయౌ చిత్తస్యైకాగ్రతా పరిణామః.
పూర్వకాలం, వర్తమానకాలం ఒకటిగా చేరి నిలవటమే చిత్తఏకాగ్రతా పరిణామం.
చిత్తఏకాగ్రత కలిగిందని మనమెలా గ్రహించాలీ? కాలాన్ని గూర్చిన భావన మనకు ఏమాత్రం కలుగకుండటం వల్ల, మనకు తెలియకయే కాలం ఎంత గడుస్తుందో, అంత ఏకాగ్రత మనకు ఏర్పడుతున్నదని మనం గ్రహించాలి. మనమొక పుస్తకాన్ని చదువుతూ, దానిలో నిమగ్నులమైనప్పుడు, కాలం విషయమై మనకేమాత్రం తలపే ఉండక, పుస్తకాన్ని చదవటం ముగించినప్పుడు, ఎన్ని గంటలు గడిచిందో అని ఆశ్చర్యం చెందుతూ ఉంటాం. ఇది మన నిత్యజీవితంలో జరిగే అనుభవమే కదా! కాలం మొత్తం వర్తమానంలోకి వచ్చి నిలిచే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి భూతవర్తమాన కాలాలు ఏకమై నిలవటాన్నే చిత్తఏకాగ్రత అంటారు.
13. ఏతేన భూతేంద్రియేషు ధర్మలక్షణావస్థాపరిణామా వ్యాఖాతాః.
దీనివల్ల (స్థూల, సూక్ష్మమైన) భూతాల్లో ఇంద్రియాల్లో కలిగే ధర్మపరిణామం, లక్షణపరిణామం, అవస్థాపరిణామం విశదమౌతాయి.
ఈ సూత్రం వల్ల రూపకాలస్థితులకు సంబంధించిన చిత్తవికారాలు, స్పష్టమవుతున్నాయి. చిత్తం వృత్తులలోకి పరిణమించునప్పుడు, అది వృత్తి రూపమై వికారాన్ని పొందుతుంది. చిత్తవికారాలను వర్తమానకాలంలో నిలపగలుగుట కాల సంబంధపరిణామం. ఇంతక్రితం సూత్రాల్లో వివరించిన ఏకాగ్రతారూపాలు, యోగికి స్వేచ్ఛాపూర్వకంగా చిత్తవికారాలను నిరోధించటానికి తోడ్పడతాయి. ఈ అధ్యాయంలో నాల్గవ సూత్రంలో చెప్పిన సంయమం, ఇలాంటి నిరోధం వల్లే యోగికి సాధ్యమవుతుంది.
14. శాంతోదితావ్యపదేశ్యధర్మానుపాతీ ధర్మీ.
భూత భవిష్యత్ వర్తమాన కాలపరిణామాలవల్ల వికారాన్ని పొందేదే ధర్మీ.
అంటే, కాలంవల్ల, సంస్కారం వల్ల సదా వికారాలను పొందుతూ, మరల మరల వ్యక్తమయ్యే వస్తువే ధర్మీ అని భావం.
15. క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతుః.
క్రమంలోని భిన్నత్వం, పరిణామంలోని భిన్నత్వానికి (వరుసగా అనేక వికారాలు కలగటానికి) హేతువవుతుంది.
16. పరిణామత్రయసంయమాదతీతానాగతజ్ఞానమ్.
(ధర్మలక్షణావస్థలు అనే) ఈ పరిణామాలు మూడింటిలో సంయమం చేయటం వల్ల భూత, భవిష్యత్ జ్ఞానం కలుగుతుంది.
సంయమానికి మొదట చెప్పుకున్న నిర్వచనాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. విషయబాహ్యరూపాన్ని వదలి, అంతర్భాగంతో మనస్సు ఏకమై, చిరకాలానుగత అభ్యాసంతో ఆ అనుభవాన్ని తనలో పదిలపరచుకుని, తలచినంతనే తిరిగి ఆ అనుభవాన్ని పొందగల్గటమే సంయమం. ఇలాంటి స్థితిలో యోగి భూత భవిష్యత్ జ్ఞానాన్ని పొందగోరితే, సంస్కారాల మార్పులపై అతను సంయమం చేయాలి. (313) కొన్ని సంస్కారాలు ఇప్పుడు అనుభవంలో ఉన్నాయి. మరికొన్ని ఇదివరకే అనుభూతమయ్యాయి; ఇంకా కొన్ని అనుభవానికి రావటానికి వేచి ఉన్నాయి. కాబట్టి వీటిమీద సంయమం చేయటంవల్ల భూతభవిష్యత్ జ్ఞానం కలుగుతుంది.
17. శబ్దార్థ ప్రత్యయానామితరేతరాధ్యాసాత్ సంకరస్తత్ ప్రవిభాగసంయమాత్ సర్వభూతరుతజ్ఞానమ్.
(ఇది శబ్దం – ఇది అర్థం – ఇది ప్రత్యయం అనే విభేదజ్ఞానం లేకుండటంవల్ల) సాధారణ అనుభవంలో సాంకర్యం పొందే శబ్దార్ధ ప్రత్యయా (జ్ఞానా)ల్లో సంయమం చేయటంవల్ల, సర్వప్రాణుల ధ్వని (భాషా) జ్ఞానం కలుగుతుంది.
బాహ్యకారణమే శబ్దం. ఇంద్రియాల మూలంగా మెదడును చేరి, బాహ్యస్పర్శలను మెదడుకు అందచేసే అంతరస్పందనమే అర్థం. మనస్సువల్ల కలిగే ప్రతిక్రియయే ప్రత్యయం; లేదా జ్ఞానం. ఈ జ్ఞానానికి వెంటనే విషయం గోచరిస్తుంది. మన అనుభవంలో ఈ మూడూ సాంకర్యం చెంది విషయాలౌతున్నాయి. నేనో మాటను వింటున్నాననుకోండి; దీన్లో మొదటిది బాహ్యస్పందనం. రెండవది శ్రవణేంద్రియం మనస్సుకు తీసుకువెళ్ళే అంతరస్పర్శ. ఈ స్పర్శకు మనస్సు ప్రతిక్రియచేయటం వల్ల నాకా మాట తెలుస్తుంది. నేను వింటున్న ఈ శబ్దం, స్పందన స్పర్శా ప్రతిక్రియలనే ఈ మూడింటి సమ్మేళనం. సాధారణంగా ఈ మూడింటినీ మనం ఒకదాన్నుండి మరొకదాన్ని వేరుచేయలేకపోయినా, యోగులు వీటిని విభజించి గ్రహిస్తారు. ఈ స్థితిని పొందిన వ్యక్తి, ఏ ధ్వనిలోనైనా దాన్ని మనిషి చేసినా జంతువు చేసినాసరే, సంయమం చేస్తే ఆ ధ్వని నిర్దిష్ట అర్థాన్ని గ్రహిస్తాడు.
18. సంస్కారసాక్షాత్కరణాత్ పూర్వజాతిజ్ఞానమ్.
సంస్కారాలను కనుగొనటం వల్ల పూర్వజన్మ జ్ఞానం (కలుగుతుంది).
మనం పొందే ప్రతి అనుభవం కూడా, చిత్తంలో ఒక వృత్తి రూపంలో కలుగుతుంది. ఈ వృత్తి చిత్తంలో అణగి క్రమక్రమంగా అతిసూక్ష్మమైపోతుందే తప్ప నశించదు. ఇలాంటి చిత్తవృత్తిని (సూక్ష్మ వృత్తిని) మేలుకొల్పి జ్ఞానావస్థను తీసుకుని రాగలిగితే, అది మరల స్మృతి అవుతుంది. కాబట్టి తన చిత్తంలో అణగియుండే పూర్వసంస్కారాలమీద, యోగి సంయమం చేయగలిగితే, అతను తన పూర్వజన్మలను జ్ఞాపకం చేసుకోగలడు.
19. ప్రత్యయస్య పరచిత్తజ్ఞానమ్.
పరుల శరీరంలోని (ప్రత్యేక) లక్షణాలపై సంయమం చేయటంవల్ల వారి చిత్తాన్ని గూర్చిన జ్ఞానం కలుగుతుంది.
ప్రతి మనిషిశరీరంలో, అతన్ని ఇతరులనుండి వేరుచేసి గ్రహించేందుకు, అనువైన ప్రత్యేకలక్షణాలుంటాయి. ఈ లక్షణాలమీద యోగి సంయమం చేస్తే, ఆ వ్యక్తి మనస్స్వభావాలను గ్రహిస్తాడు.
20. న చ తత్ సాలంబనం తస్యావిషయీభూతత్వాత్.
ఆ చిత్తాలంబనాన్ని (అంటే చిత్తానికి ఆశ్రయమై ఉన్న భావాలను) మాత్రం, అవి సంయమ విషయాలు కాకపోవటం వల్ల, గ్రహించలేము.
శరీరం మీద యోగి సంయమం చేస్తే, ఆ వ్యక్తి మనోభావాలను గ్రహించలేడు. కాబట్టి, మొదట శరీరంలోని లక్షణాలపై, తర్వాత చిత్తంలో ఇలా ద్వివిధ సంయమం చేయాల్సి ఉంటుంది. దానితో మనస్సులోని ప్రతివిషయాన్ని యోగి గ్రహిస్తాడు.
21. కాయరూప సంయమాత్తద్గ్రాహ్యశక్తి స్తంభే చక్షుః ప్రకాశ సంయోగేఽంతర్థానమ్.
శరీర రూపంలో సంయమం చేస్తే, రూపగ్రాహ్యశక్తి ప్రతిబంధిత మవుతుంది. దానివల్ల నేత్రేంద్రియంలోని ప్రకాశకశక్తి వేరవటంవల్ల యోగి శరీరం అదృశ్యమవుతుంది.
ఈ గదిలో మన ఎదుట ఉన్న యోగి అదృశ్యం కాగలడు. నిజంగా అతను ఇక్కడే ఉన్నా, ఎవరికీ కనిపించడు. ఒకదానినుండి మరొకటి వేరవుతున్నది. రూపాన్ని, అది ఆశ్రయించే వస్తువు నుండి వేరుచేసే ఏకాగ్రతను పొందితే తప్ప యోగికి ఈ కార్యం సాధ్యం కాదని జ్ఞాపకం పెట్టుకోవాలి. రూపం రూపొందిన వస్తువుల సంయోగం వల్ల రూపదర్శన శక్తి కలుగుతుంది. కాబట్టి రూపం మీద అతను సంయమం చేయగానే రూపగ్రాహ్యశక్తి ప్రతిబంధితమవుతుంది.
22. ఏతేన శబ్దాద్యంతర్థానముక్తమ్.
దీనివల్లే (రూపాదృశ్యకరణోపాయం వల్లే) శబ్దాదులను తెలియకుండా చేయడం తెలుపడమవుతుంది. (శబ్దాదులను తెలియనీయకుండా చేయటానికి ఇదే ఉపాయం)
23. సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్సంయ మాదపరాంత జ్ఞాన మరిష్టేభ్యో వా.
కర్మం సోపక్రమం నిరుపక్రమం (శీఘ్రంగా ధరించటానికి ఉపక్రమించేది, ఉపక్రమించనిది) అని రెండు రకాలు. వీటిలో సంయమం చేయటం వల్లగాని, అరిష్ట సూచనల* వల్లగాని మరణం ఎప్పుడు కలుగుతుందో తెలుస్తుంది.
యోగి తన కర్మ అంటే ప్రస్తుతం కర్మానుభవాలను కలగచేసే సంస్కారాలపై, అనుభవానికి రావటానికి వేచియున్న సంస్కారాలపై సంయమం చేస్తే, నిరుపక్రమ సంస్కారాల జ్ఞానం వల్ల, సరిగ్గా తనకెప్పుడు శరీరపతనం కలుగుతుంతో తెలుస్తుంది. తాను ఎప్పుడు ఏ గంటలో ఏ నిముషంలో చనిపోతాడో కనుగొంటాడు. అంత్యకాలంలో కలిగే భావాలు పునర్జన్మను నిర్ణయించటానికి ప్రబలాధారాలని గీత చెబుతుంది. అందుకని హిందువులు పూర్వజన్మ జ్ఞానాన్ని మహత్తర జ్ఞానంగా పరిగణిస్తారు.
24. మైత్ర్యాదిషు బలాని.
మైత్రి కరుణ మొదలైన గుణా (133) ల్లో సంయమం చేస్తే, ఆ గుణాలు వృద్ధిపొందుతాయి.
25. బలేషు హస్తిబలాదీని.
ఏనుగు సింహం మొదలైనవాటి బలంలో సంయమం చేస్తే, ఆ బలాలు యోగికి కలుగుతాయి.
ఇలాంటి సంయమం సిద్ధిస్తే, బలాన్ని ఆశించి యోగి గజబలంమీద సంయమం చేస్తే, ఆ బలం అతనికి ప్రాప్తిస్తుంది. ప్రతి మనిషికీ అపార బలం ఉంది. దాన్ని ఎలా పొందాలో, ఆ విధానాన్ని గ్రహించటమే మనకవసరం. యోగికి ఆ విధానం తెలుసు.
26. ప్రవృత్త్యాలోకన్యాసాత్ సూక్ష్మ – వ్యవహిత – విప్రకృష్ణ జ్ఞానమ్.
దివ్యజ్యోతిమీద సంయమం చేస్తే, (136 జ్యోతిష్మతీ ప్రవృత్తివల్ల) సూక్ష్మాలైన, ప్రతిబంధితాలైన, అతి దూరస్థాలైన వస్తువుల జ్ఞానం కలుగుతుంది.
హృదయంలోని దివ్యజ్యోతిమీద సంయమం చేస్తే, ఎక్కడో అతిదూరంలో జరిగే విషయాలు, పర్వతప్రతిబంధత వస్తువులు, అతి సూక్ష్మవస్తువులు యోగికి గోచరిస్తాయి.
27. భువనజ్ఞానం సూర్యే సంయమాత్.
సూర్యునిలో సంయమం చేస్తే, (భూ భువ మొదలైన పద్నాలుగు) లోకాల జ్ఞానం (కలుగుతుంది).
28. చంద్రే తారామ్యాహజ్ఞానమ్.
చంద్రునిలో (సంయమం చేస్తే) నక్షత్రసమూహ జ్ఞానం (సిద్ధిస్తుంది).
29. ధ్రువే తత్గతిజ్ఞానమ్.
ధ్రువునిలో (సంయమం చేస్తే) గ్రహనక్షత్రాల సంచారజ్ఞానం (కలుగుతుంది).
30. నాభిచక్రే కాయవ్యూహజ్ఞానమ్.
నాభిచక్రంలో (సంయమం చేస్తే) శరీర సంస్థితి (శరీరేంద్రియాల) జ్ఞానం (కలుగుతుంది).
31. కంఠకూపే క్షుత్పిపాసావివృత్తిః.
కంఠం లోపలిభాగంలో (సంయమం చేస్తే) ఆకలి దప్పులు నివారణమౌతాయి.
ఆకలి ఎక్కువగా వేస్తుంటే, కంఠరూపంలో సంయమం చేస్తే ఆకలి శాంతిస్తుంది.
32. కూర్మనాడ్యాం స్థైర్యమ్.
కూర్మనాడిలో (సంయమం చేస్తే) శరీర స్థెర్యం (కలుగుతుంది).
సాధన సమయంలో శరీరం కలత చెందదు.
33. మూర్ధజ్యోతిషి సిద్ధ దర్శనమ్.
శిరస్సు (సుషుమ్నాంతం) నుండి వెలవడే తేజస్సులో (సంయమం చేస్తే) సిద్ధపురుష దర్శనం (కలుగుతుంది).
సిద్ధులంటే, దయ్యాల కన్నా కాస్త ఉన్నతస్థితిలో ఉన్నవారు. యోగి తన శిరస్సు ఉపరిభాగంలో సంయమం చేస్తే, ఇలాంటి సిద్ధపురుషులను చూస్తాడు. సాధారణంగా ‘సిద్ధుడు’ అనే పదం ‘ముక్తుడు’ అన్న అర్థంలో ఉపయోగిస్తారు. ఇక్కడ మాత్రం ‘సిద్ధ’ పద అర్థం అదికాడు.
34. ప్రాతిభాద్వా సర్వమ్.
లేదా, ప్రతిభాశక్తి* తో సమస్తజ్ఞానం యోగికి సిద్ధిస్తుంది.
విశుద్ధవర్తనంతో జ్ఞానప్రకాశ ప్రతిభాశక్తిని పొందిన వారికి, ఇవన్నీ ఎలాంటి సంయమం లేకుండానే, సిద్ధిస్తాయి. ఉన్నత ప్రతిభాస్థితి పొందిన వానికి ఇలాంటి దివ్యప్రకాశం కలుగుతుంది. సమస్తం అతనికి ప్రత్యక్షంగా గోచరిస్తుంది. సంయమం చేయకుండానే, సర్వం సహజంగానే అతనికి చేకూరుతుంది.
35. హృదయే చిత్తసంవిత్.
హృదయంలో (సంయమం చేయటంవల్ల) మనస్సుల (మనోభావాల) గూర్చి జ్ఞానం కలుగుతుంది.
36. సత్త్వపురుషయోరత్యంతాసంకీర్ణయోః ప్రత్యయావిశేషాద్ భోగః పరార్థత్వాత్ స్వార్థసంయమాత్ పురుషజ్ఞానమ్.
(పరస్పరం) వేరువేరుగా ఉండే సత్త్వం (బుద్ధిత్వం), పురుషుల గూర్చిన వివేకజ్ఞానం లేకపోవటంవల్ల భోగం (విషయానుభవం) కలుగుతుంది. పురుషునికై వర్తించే సత్యం వేరు; స్వార్థతత్త్వం వేరు. స్వార్థంలో సంయమం చేస్తే, పురుషుని జ్ఞానం కలుగుతుంది.
ప్రకృతి వికారం చెంది, ప్రకాశం ఆనందం లక్షణాలుగల పురుషుని కోసం వర్తిస్తుంది. పురుషుని విశుద్దజ్ఞానంతో ప్రకాశించే సత్త్వం, అహంరహితమై స్వతంత్రంగా ఉండటంవల్ల దాన్ని స్వార్థతత్త్వమంటారు.
37. తతః ప్రాతిభశ్రావణ వేదనా దర్శాస్వాదవార్తా జాయంతే.
దీని (స్వార్థసంయమం) వల్ల ప్రతిబంధాలైన దివ్యశ్రవణ, దివ్యస్పర్శ, దివ్యరూప, దివ్యరస, దివ్యగంధ జ్ఞానాలు కలుగుతాయి.
38. తే సమాధావువసర్గా వ్యుత్థానే సిద్ధయః.
ఇవి (ఈ సిద్ధులు) సమాధికి ప్రతిబంధకాలు. (అయినా) సమాధిని వదిలిన కాలంలో వ్యావహారిక స్థితిలో సిద్ధులుగా ఉంటాయి.
ఐహికవిషయాలు పురుషమానస సంయోగం వల్ల గోచరిస్తాయి. ప్రకృతి పురుషుల వేరు వేరు అనే జ్ఞానంమీద సంయమం చేస్తే, పురుష జ్ఞానం కలుగుతుంది. దానివల్ల వివేకం సిద్ధిస్తుంది. ఇట్టి వివేకాన్ని పొందగానే యోగి అఖండప్రభావంతుడౌతాడు. అయినా, ఈ సిద్ధులన్నీ, పరమావధి అయిన విశుద్ధజ్ఞానానికి, మోక్షానికి ప్రతిబంధకాలే. ఇలాంటి సిద్ధులని యోగి విసర్జిస్తే, గమ్యస్థానాన్ని చేరుతాడు. ఈ సిద్ధుల మోహంలో చిక్కుకున్న వారి పురోభివృద్ధి అక్కడితో ఆగిపోతుంది.
39. బంధకారణ శైథిల్యాత్ ప్రచార సంవేదనాచ్చ చిత్తస్య పరశరీరావేశః.
బంధకారణం సడలిపోవటం వల్ల, ఇంద్రియాల ద్వారా విషయాల్లో ప్రసరించే జ్ఞానం కలిగియుండుట (లేదా, శరీరంలోని నాడులను గ్రహించటం) వల్ల, యోగి మరొకని శరీరంలో ప్రవేశిస్తాడు.
స్వయంగా తాను ఒక శరీరంలో వర్తిస్తున్నా, యోగి ఒక శవంలో ప్రవేశించి, అది లేచి కదిలేలా చేయగలడు. లేదా ఒక సజీవశరీరంలో ప్రవేశించి, ఆ శరీర మనస్సును, ఇంద్రియాలను నిరోధించి, తాత్కాలికంగా ఆ శరీరం ద్వారా వర్తించగలడు. ప్రకృతిపురుష వివేకాన్ని సాధించిన యోగే దీనికి సమర్థుడు. యోగుల ననుసరించి, ఆత్మయే కాక, మనస్సు కూడా సర్వగతం కావటంవల్ల, అతను మరొకని శరీరంలో ప్రవేశించాలనుకుంటే, ఆ శరీరంపై సంయమం చేసి, దానిలో ప్రవేశిస్తాడు. ‘మహత్’ అనే విశ్వమానసంలో యోగి మానసం ఒక అంశం. అయినా, ఈ శరీరంలో నాడీప్రవాహ మూలంగానే మనస్సు వర్తిస్తుంది. అయితే, ఈ నాడీవాహినుల నుండి స్వేచ్ఛ పొందగానే, ఇతర మార్గాల్లో యోగులు వర్తించగలుగుతారు.
40. ఉదానబయాజ్జలపంకకంటకాదిష్వసంగ ఉత్క్రాంతిచ్చ.
ఉదానవాయువును జయించటం (స్వాధీనం చేసుకోవటం) వల్ల యోగి నీటిలో గానీ, అడుసులో గానీ మునగకుండా ఉంటాడు; అతను ముండ్లమీద నడుస్తాడు; తన ఇష్టం వచ్చినప్పుడు మరణిస్తాడు.
శ్వాసకోశం, శరీరంలోని ఊర్ద్వభాగాలు ఉదాననాడికి వశమై ఉంటాయి. ఈ నాడిని స్వాధీనం చేసుకుంటే, యోగి శరీరం తేలిక అవుతుంది. అతనిక నీటిలో మునగడు; ముండ్లమీద – వాడికత్తులమీద నడవగలడు. అగ్నిలో నిలవగలడు, తన ఇచ్ఛానుసారంగా ఈ ఉపాధిని వదలటానికి సమర్థుడై ఉంటాడు.
41. సమానజయాత్ ప్రజ్వలనమ్.
సమాన వాయువును జయిస్తే, దేదీప్యకాంతి కలుగుతుంది. యోగి కోరినప్పుడల్లా అతని శరీరం నుండి కాంతి వెలువడుతుంది.
42. శ్రోత్రాకాశయోః సంబంధసంయమాద్దివ్యం శ్రోత్రమ్.
శ్రోత్రానికి, ఆకాశానికి గల సంబంధంలో సంయమం చేస్తే, దివ్య శ్రవణశక్తి అలవడుతుంది. దాంతో యోగి సమస్తాన్ని వింటాడు. మైళ్ళదూరంలో చేసిన ధ్వనిని గానీ, మాటలను గానీ యోగి వింటాడు.
43. కాయాకాశయోః సంబంధసంయమాల్లఘు తూలసమాపత్తేశ్చాకాశగమనమ్.
శరీరాకాశాల సంబంధంలో సంయమం చేస్తే, శరీరం ప్రత్తిలా తేలికయై యోగి ఆకాశంలో సంచరిస్తాడు.
ఆకాశంవల్లనే ఈ శరీరనిర్మాణం జరిగింది. ఒక రూపం లేదా స్థితిలో ఉన్న ఆకారమే శరీరంగా మారుతుంది. తన శరీరంలోని ఆకాశంలో యోగి సంయమం చేస్తే, శరీరానికి ఆకాశపు లఘుత్వం సిద్ధిస్తుంది. ఈ స్థితిలో యోగి తాను తలచిన చోటికి వాయుమార్గంలో పోగలడు.
44. బహిరకల్పితా వృత్తిర్మహావిదేహా తతః ప్రకాశావరణక్షయః.
శరీరం వెలుపల మహావిదేహమనే యథార్థ చిత్తవృత్తిలో సంయమం చేస్తే, ప్రకాశ ఆవరణం తొలగిపోతుంది.
అజ్ఞానంతో మనస్సు, ఈ శరీరవ్యాపారాలను తానే చేస్తున్నట్లు తలస్తూ ఉంటుంది. మనస్సు సర్వవ్యాపకమైతే, ఒక ప్రత్యేక నాడీమండలంతో నేనెందుకు బద్ధుడను కావాలీ? ఆ ఒక్క శరీరంలో మాత్రమే “నేను” అనే అనుభవాన్ని ఎందుకు కలిగియుండాలీ? నేనిలా బంధితుడైయుంటే, యోగి తాను కోరిన చోటనెల్లా “నేను” అనే అనుభవాన్ని పొందాలనుకుంటాడు. శరీరంలో అహంకారం లేనప్పుడుదయించే చిత్తవృత్తులను ‘అకల్పిత లేదా యథార్థవృత్తులు’ అని లేదా ‘మహావిదేహమని’ అంటారు. ఈ వృత్తులపై యోగి సంయమం చేస్తే, జ్ఞానతేజాన్ని ఆవరించియున్న మాలిన్యాలు తొలగి, అజ్ఞానాంధకారం సంపూర్ణంగా నశిస్తుంది. ఈ స్థితిలో యోగికి సమస్తం జ్ఞానమయమై తోస్తుంది.
45. స్థూలస్వరూప సూక్ష్మాన్వయార్థవత్త్వ సంయమాత్ భూతజయః.
స్థూలస్వరూపాలు మొదలుకుని సూక్ష్మతన్మాత్రల వరకూ ఉన్న (పృథివ్యాది) భూతాల్లో (క్రమంగా) సంయమం చేస్తే, (పంచ) భూతాల జయం కలుగుతుంది.
యోగి మొదట స్థూలభూతాల్లో, క్రమంగా సూక్ష్మతన్మాత్రల్లో సంయమం చేస్తాడు. బౌద్ధుల్లో ఒక సంప్రదాయముంది. వారు ఇలాంటి సంయమాన్ని ఎక్కువగా అవలంబించేవారు. వీరు ఒక మట్టిముద్దను తీసుకుని దానిమీద సంయమం చేస్తూ, క్రమంగా దానిలోని తన్మాత్రలనుబట్టి, దానిలోని పరమాణువులను కనుగొనేవారు. దానిలోని పరమాణువుల నన్నింటినీ గ్రహించగానే, ఆ మహాభూతం వారికి వశమయ్యేది. ఇదే విధంగా భూతాలనన్నింటినీ వారు వశం చేసుకునేవారు. ఇలా యోగి అన్ని భూతాలను జయిస్తాడు.
46. తతోఽణిమాదిప్రాదుర్బావః కాయసంపత్రద్ధర్మానభి ఘాతశ్చ.
దానివల్ల (భూతజయం వల్ల) అణిమాది అష్టసిద్ధులు, శరీర సంబంధ సంపదలు, దేహరూపాదులకు వినాశనం లేకుండటం కలుగుతాయి.
అంటే, యోగి అష్టసిద్ధులను పొందుతాడని భావం, ఆ యోగి అణువంత అవుతాడు. అనుకుంటే పర్వతమంత అవుతాడు. భూమి అంత బరువు గలవాడవుతాడు. వాయువులా తేలిక అవుతాడు. కోరిన వాటినన్నింటినీ పొందుతాడు. సంకల్పించిన దానినెల్లా జయిస్తాడు. సింహం అతని ఎదుట మేకపిల్లలా కూర్చుంటుంది. ఇచ్ఛామాత్రంతో అతని కోరికలన్నీ నెరవేరుతాయి.
47. రూప–లావణ్య–బల–వజ్రసంహననత్వాని కాయసంపత్.
రూపం, లావణ్యం, బలం, వజ్రం కూడ ఛేదించలేని కాఠిన్యం: వీటిని కాయ సంపద అంటారు.
యోగి శరీరం వజ్రకాయ మవుతుంది. ఆ శరీరాన్ని ఏది కూడా ఏమీ చేయలేదు. యోగి సంకల్పిస్తే తప్ప దానికేదీ కాదు. “కాలదండాన్ని భేదించి అతడీ లోకంలో శాశ్వతంగా తన శరీరంతో జీవిస్తాడు.” బాధ – రోగం మరణం యోగిని సమీపించలేవు అని వేదంలో ఉంది.
48. గ్రహణ – స్వరూపాస్మితాన్వయార్థ వత్త్వ సంయమాదింద్రియ జయః.
ఇంద్రియాల బాహ్యవృత్తిలో, విషయాలను ప్రకాశింపచేసే, ఇంద్రియశక్తిలో, అస్మిత (అహంకారం)లో ఇంద్రియాల్లోని గుణస్థితిలో, ఆత్మానుభవం అనే ఇంద్రియ ప్రయోజనంలో (క్రమంగా) సంయమం చేస్తే, ఇంద్రియ జయం కలుగుతుంది.
ఇంద్రియాలు మనస్సును వదిలి విషయాల వైపు వెళతాయి. వెంటనే విషయాల జ్ఞానం కలుగుతుంది. ఈ వ్యాపారంలో అహం తత్త్వం చేరియుంది. వీటిలో మిగిలిన రెంటిలో క్రమంగా సంయమం చేస్తే, యోగి ఇంద్రియాలను జయిస్తాడు. ఏదైన ఒక వస్తువును (ఉదా: పుస్తకాన్ని) తీసుకొని మొదట మనస్సును దానిమీద కేంద్రీకరించాలి. ఆ తర్వాత ఆ పుస్తకరూపాన్ని పొందిన జ్ఞానంపైన, ఆ పుస్తకాన్ని చూసే, అహం తత్త్వంలో ఇలా క్రమంగా సంయమం చేస్తే, ఇంద్రియాలన్ని వశమవుతాయి.
49. తతో మనోజవిత్వం వికరణ భావః ప్రధానజయశ్చ.
దాని (ఇంద్రియజయం) వల్ల, శరీరానికి మనస్సులాగే, శీఘ్రగమన శక్తి శరీర సహాయం లేకుండానే, ఇంద్రియాలకు స్వయంశక్తిత్వం, ప్రకృతి వశీకరణం కలుగుతాయి.
భూతజయం వల్ల శరీరవైభవం కలుగుతుంది. ఇలాగే ఇంద్రియ జయం వల్ల పైన చెప్పిన సిద్ధులన్నీ లభిస్తాయి.
50. సత్త్వపురుషాన్యతాఖ్యాతిమాత్రన్య సర్వభావాధిష్ఠాతృత్వం సర్వజ్ఞాతృత్వం చ.
సత్త్వం – పురుషుడు వేరు – వేరు అనే (వివేక) జ్ఞానం మీద సంయమం చేస్తే, సర్వశక్తిత్వం, సర్వేంగితజ్ఞత్వం కలుగుతాయి.
పురుషునికీ ప్రకృతికీ భేదం గ్రహించి పురుషుడు అవినాశి – నిర్మలుడు అని తెలుసుకుని ప్రకృతిని జయించటం వల్ల, యోగికి సర్వశక్తిత్వం, సర్వేంగితజ్ఞత్వం అలవడతాయి. అంటే సమస్తశక్తులు, సర్వం తెలియటం చేకూరుతాయి.
51. తద్వైరాగ్యాదపి దోషబీజక్షయే కైవల్యమ్.
ఈ సిద్ధులను కూడా విసర్జించటం వల్ల, దోషంలేని క్లేశం (సమూలంగా) నష్టమై కైవల్యం (ముక్తి) సిద్ధిస్తుంది.
యోగికి ఆత్మస్వాంత్యమైన కైవల్యం సిద్ధిస్తుంది. ముక్తి కరతలామలకం అవుతుంది. సర్వజ్ఞాతృత్వాన్ని, సర్వశక్తిత్వాన్ని విసర్జించే వ్యక్తి సర్వభోగాలను కూడా పరిత్యజించిన వాడవుతాడు. అతను, తనను మోహింపచేయ దేవతలు చూపే స్వర్గసౌఖ్యాలను క్రీగంటకూడా చూడడు. ఇలాంటి సిద్ధులను పొంది, వాటిని పరిత్యజిస్తే, యోగి పరమావధిని పొందుతాడు. సిద్ధులంటే ఏమిటీ? కేవల దృశ్యాలు. కలల కన్నా ఇవేమి ఘనమైనవి కావు. సర్వశక్తిత్వం కూడా స్వప్నతుల్యమే. సర్వశక్తిత్వం మనస్సుమీద ఆధారపడియుంది. మనస్సు ఉన్నంతవరకే, సర్వజ్ఞాత్వాదిశక్తులుంటాయి. మనస్సును అతిక్రమించటమే యోగి పరమావధి.
52. స్థాన్యుపనిమంత్రణే సంగస్మయాకరణం పునరనిష్ట ప్రసంగాత్.
(యోగి తన యెదుట) దేవతలు చేసే ప్రస్తావనల ప్రార్థనవల్ల అభిలాషను గర్వాన్ని పొందరాదు. అభిలషిస్తే తిరిగి అనర్థం సంభవిస్తుంది.
వేరే అపాయాలు కూడా ఉన్నాయి. దేవతలు యక్షులు మొదలైన వారు యోగులను తమ మాయలో పడవేయటానికి వస్తారు. ఎవరు కూడా పూర్తిగా ముక్తుడు కావటం వారికిష్టం ఉండదు. మనలాగే వారు కూడా, ఒక్కోమారు మనకన్నా నికృష్టంగా పరుల శ్రేయస్సును చూసి ఓర్వరు. తమ పదవులకు ఎక్కడ ముప్పువస్తుందోనని వారి భయం. ముక్తులు కాని యోగులు మరణానంతరం దేవతలౌతారు. చక్కని రాజమార్గం వదలి, సందుగొందుల్లో పడి వారు ఈ సిద్ధులను చేపడతారు. వీరు మరల జన్మించవలసి ఉంటుంది. ఈ వ్యామోహాలకు లోబడక ధైర్యంతో వాటి నెదుర్కొని, సూటిగా గమ్యస్థానం చేరే వారే ముక్తులౌతారు.
53. క్షణ తత్క్రమయోః సంయమాద్వివేకజం జ్ఞానమ్.
‘క్షణం’ లో దాని ముందటి ‘క్షణం’ లో సంయమం చేస్తే, వివేక జనిత జ్ఞానం కలుగుతుంది.
ఈ దేవతలను, స్వర్గాలను, సిద్ధులను మనం ఎలా నిర్వర్తించుకోవాలి? నిత్యానిత్యవస్తువివేకం వల్ల. ఇదే దానికి ఉపాయం. వివేకాన్ని దృఢం చేసుకోవటానికి, ఇక్కడ ఒక సంయమాన్ని చెబుతున్నారు. ‘క్షణ’ కాలంలో, దానిముందటి తర్వాతి క్షణాల్లో సంయమం చేయాల్సి ఉంటుంది.
54. జాతి – లక్షణ – దేశై రన్యతాఽనవచ్చేదాత్తుల్యయోస్తతః ప్రతిపత్తిః.
జాతి లక్షణ దేశా (స్థాన)లతో విభజనకాని, సమానంగా ఉండే వస్తువులు సైతం వేరువేరు అనే జ్ఞానం పై సంయమం వల్ల కలుగుతుంది.
మన దుఃఖాలు అజ్ఞానం, యుక్తాయుక్త వివేక జ్ఞానం లేకపోవటం వల్ల కలుగుతున్నాయి. అయోగ్యాన్ని యోగ్యంగా, స్వప్నాన్ని యథార్థంగా, మనం భావిస్తున్నాం. ఆత్మ మాత్రమే నిత్యం. ఈ విషయాన్ని మనం మరచిపోయాం. శరీరమనేది క్షణభంగుర స్వప్నం. అయినా మనం దేహమే అని భ్రాంతి పొందుతున్నాం. ఇలాంటి అవివేకమే అజ్ఞానమే దుఃఖాలకు పుట్టినిల్లు. వివేకం మనకు బలాన్ని ఇస్తుంది. అప్పుడే మనం ఈ శరీరాలను స్వర్గాలను దేవతలను ఒక్కసారిగా త్రోసివేస్తాం. జాతిలక్షణ దేశాలతో వస్తువులను విభజించటంవల్లనే ఈ జ్ఞానం కలుగుతుంది. ఉదాహరణానికి ఒక ఆవును తీసుకుందాం. జాతివల్ల ఆవు కుక్క వేరువేరని తెలుసుకుంటాం. మరి ఆవుల్లోనే ఒక ఆవు మరొక ఆవు వేరు వేరని ఎలా నిర్ణయిస్తాం? లక్షణం వల్ల. రెండు వస్తువులు సరిగ్గా, ఒకేవిధంగా ఉంటే, అవి వేరు – వేరుచోట్ల ఉండటం వల్ల వాటిని విభజించి తెలుసుకుంటాం. ఈ భేదాలు కూడా మనకు తోడ్పడలేనంత అవిభాజ్యంగా వస్తువులు కలిసిపోయి ఉంటే, పై సంయమం వల్ల వాటిని విభజించటానికి సమర్థులమౌతాం. పురుషుడు పరిశుద్ధుడు పరిపూర్ణుడు జగత్తులో ఒక్క పురుషుడే కేవలుడు అని చెప్పే సిద్ధాంతమే మహత్తర యోగతత్త్వానికంతా మూలాధారం. మనశ్శరీరాలు ప్రకృతి పురుషుల సంయోగంవల్ల కలిగియున్నా, మనం మనస్సుతో శరీరంతో తాదాత్మ్యం పొందుతుంటాం. (మనశ్శరీరాలే మనం అని భావిస్తుంటాం.) ప్రకృతి వేరు పురుషుడు వేరు అనే వివేకం లేకపోవటమే గొప్ప ప్రమాదం. ఇలాంటి వివేచనాశక్తి కలిగిన వెంటనే, మనస్సంబంధమైనదైనా శరీరసంబంధమైనదైనా, ప్రపంచంలో ఉన్న ప్రతివస్తువు కూడా సంయోగజనితం అని, ఆ కారణంగా అది పురుషతత్త్వం కానేరదని గ్రహిస్తాం.
55. తారకం సర్వవిషయం సర్వథావిషయమక్రమంచేతి వివేకజం జ్ఞానమ్.
వివిధ పరిణామాల్లో ఉన్న (మహదాది) సమస్త (తత్త్వ) విషయాలను ఏకకాలంలో ఆవరించే వివేకజన్య జ్ఞానాన్ని తారక (రక్షక) జ్ఞానం అంటారు.
జనన మరణయుక్త సంసారసముద్రం నుండి యోగిని తరింప చేస్తుంది కాబట్టి, ఈ జ్ఞానాన్ని తారకమంటారు. ఈ జ్ఞానం స్థూల సూక్ష్మస్థితులను పొందిన సమస్త ప్రకృతిని గ్రహిస్తుంది. ఈ జ్ఞానానుభవంలో క్రమమంటూ ఉండక, చూసిన వెంటనే సర్వం ఒక్కుమ్మడిగా గ్రహీతమవుతుంది.
56. సత్త్వపురుషయోః శుద్ధిసామ్యే కైవల్యమితి.
సత్త్వంలో పురుషుల్లోనైర్మల్యం ఏకరీతిగా ఉండటం వల్ల కైవల్యం ప్రాప్తిస్తుంది.
దేవతలు మొదలు అత్యల్ప పరమాణువుల వరకూ ఉన్న వస్తువుల్లో, దేనిలోకూడా తాను ఆధారపడి ఉండేవాడు కాదని పురుషుడు గ్రహించే స్థితియో కైవల్యం లేదా ముక్తి. సత్త్వం లేదా బుద్ధితత్త్వం పరిశుద్ధత, అపరిశుద్ధతల సమ్మేళనం. ఈ సత్త్వం పురుషునితో సమానమై, నిర్మలం కాగానే, కైవల్యం లభిస్తుంది. దానితో శుద్ధసత్త్వరూపుడైన పురుషుణ్ణి, సత్త్వం తనలో ప్రతిఫలింపచేస్తుంది.