శ్రీ స్వాములవారు మద్రాసులో ఉన్నప్పుడు, చెన్నపురి అన్నదాన సమాజమనే ధార్మికసంస్థ వార్షికసభకు అధ్యక్షత వహించారు. ఒక ఉపన్యాసకుడు శ్రీవారికంటె ముందుగా మాట్లాడుతూ, బ్రాహ్మణులకు ఇతర కులాలవారికంటె, ప్రత్యేకంగా దానాలివ్వడం తగదని చెప్పాడు. ఆ మాటలను స్వామివారు విమర్శించారు. వాని సలహావల్ల లాభం, నష్టం కూడ కలుగుతాయని వారన్నారు. నిజానికి మన జాతిలోవున్న సంస్కృతి అంతా బ్రాహ్మణులలోనే నెలకొని ఉంది. మన జాతిలోని యోచనా పరులు కూడా వారే! వారు చింతాపరులు కావడానికి అవకాశాన్ని కల్పించిన జీవనోపాధిని వారికి లభించకుండా చేస్తే మనజాతే మొత్తంమీద నష్టపడుతుంది. ఇతరజాతుల న్యాయస్మృతి సంబంధమైన దాన విధానంతో మన భారతదేశంలోని విచక్షణా శూన్యమైన దాన విధానాన్ని పోల్చి శ్రీవారిలా చెప్పారు. “ఇతర దేశీయులవలంబించే దారిద్ర్య నివారణ పద్ధతుల ఫలితాన్ని గమనించండి. మన దేశంలోని సోమరిపోతు, ఇచ్చినదాన్నే సంతోషంతో పుచ్చుకొని సంతుష్టుడై ప్రశాంతంగా జీవిస్తాడు. పశ్చిమదేశాల్లోని సోమరిపోతైతే, మనిషికి తిండిమీద కన్న స్వాతంత్ర్యం మీద ప్రేమ ఎక్కువ అనే సూత్రాన్ని అనుసరించి, దరిద్రశరణాలయానికి పోవడానికిష్టపడడు; కాబట్టి దోపిడిగాడై సంఘానికి శత్రువవుతాడు. దండననీతి, రక్షకపద్ధతి (పోలీసు), కారాగారాలు, ఇలాంటి వ్యవస్థలకు అతడెంతో అవసరం కల్పించాడు. భారతదేశంలో విచక్షణాశూన్యమైన దానపద్ధతి ఉంది. నిజమే! కానీ, ఇక్కడి సన్న్యాసులు నిష్కపట పురుషులు కాకున్నా, తమ సద్గ్రంథంలోని విషయాన్ని ఏ కొంచెమో తప్పక నేర్చి తీరాలి! లేకుంటే ఒక్కముద్ద అన్నం కూడ వారికి దొరకదు; పాశ్చాత్య జాతులలో విచక్షణా యుతమైన దానపద్ధతి ఉంది. నిజమే! కాని దానివల్ల దారిద్ర్య నివారణ శాసనమనే అతివ్యయకారణమైన సంప్రదాయం అవసరమైంది. ఇంతచేసీ, చివరికి వాళ్ళు ముష్టివారిని అపరాధులుగా మార్చిన వారయ్యారు!”
🪷 Join WhatsApp Channel:
https://whatsapp.com/channel/0029VaBgXhxIt5s1ZImBn637
🪷 Join WhatsApp Group:
https://chat.whatsapp.com/GqF8WtETv0O9hDdPUB4ir4