8.1 ప్రథమ పరిచ్ఛేదం
ఆదివారం, ఫిబ్రవరి 18, 1883
అప్పుడు ఉదయం ఏడు లేక ఎనిమిది గంటలు అయి ఉంటుంది. శ్రీరామకృష్ణులు కలకత్తా సమీపంలోగల బేల్ఘరియాలోని గోవింద ముఖర్జీ ఇంటికి వేంచేశారు. నరేంద్రుడు, రామ్ తదితర భక్తులతో పాటు గోవిందుని ఇరుగు పొరుగువారు కూడా హాజరయ్యారు. సంకీర్తన సాగుతోంది. శ్రీరామకృష్ణులు భక్తి పారవశ్యంలో నరేంద్రాదులతో కలిసి నృత్యం చేశారు.
8.1.1 బేల్ఘరియా వాసులకు ఉపదేశం – భక్తియోగావశ్యకత
సంకీర్తనానంతరం అందరూ కూర్చున్నారు. పలువురు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశారు. అప్పుడప్పుడు ఆయన “భగవంతుని ముందు ప్రణామం చెయ్యండి” అంటున్నారు.
తరువాత శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు: “సర్వత్రా భగవంతుడే విరాజిల్లుతున్నాడు. కాని కొన్నిచోట్ల, ఉదాహరణకు సాధువులలో ఆయన అభివ్యక్తీకరణ అత్యధికంగా ఉంటుంది.
“దుష్టులు కూడా ఉన్నారని మీరనవచ్చు. అది నిజమే. పులులు, సింహాలు ఉన్నట్లే. అలాగని, ‘పులి నారాయణుని’ కౌగిలించుకోనక్కరలేదు. దానినుంచి వైదొలగి, దూరంనుంచి ప్రణామం చేస్తే చాలు. ఉదాహరణకు, నీటిని తీసుకోండి. కొన్ని రకాల నీరు త్రాగటానికి, కొన్ని పూజకు, కొన్ని స్నానానికి, మరి కొన్ని పాత్రలు తోముకోవటానికి ఉపయోగపడుతున్నాయి.”
ఒక పొరుగు వ్యక్తి: స్వామీ! వేదాంత సిద్ధాంతాలు ఏవి?
శ్రీరామకృష్ణులు: వేదాంతవాదులు ‘సో-హం’, ‘బ్రహ్మ సత్యం, జగన్మిథ్య’ అంటారు. ‘నేను’ అనేది కూడా మిథ్యే. కేవలం బ్రహ్మమే సత్యం. కాని ఈ ‘నేను’ తొలగిపోదు. కాబట్టి ‘నేను భగవంతుడి దాసుడను, ఆయన కుమారుడను, ఆయన భక్తుడను’ అనే భావం కలిగి ఉండటం ఉత్తమం.
“ఈ కలియుగానికి భక్తి మార్గమే శ్రేష్ఠం. భక్తి ద్వారా కూడా భగవత్సాక్షాత్కారం పొందవచ్చు. దేహబుద్ధి నెలకొని ఉన్నంత కాలం విషయబుద్ధీ ఉంటుంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు – ఇవన్నీ విషయాలు. విషయబుద్ధిని నశింపచేసుకోవటం చాలాకష్టం. విషయబుద్ధి నెలకొని ఉన్నంతవరకు ‘సో-హం’ భావం కలుగదు.
“సన్న్యాసులకు విషయబుద్ధి తక్కువగా ఉంటుంది. కాని సంసారులు సర్వకాల సర్వావస్థలలో విషయచింతనలోనే మునిగి ఉంటారు. అందుచేత సంసారులకు తగినది ‘దాసోఽహం’.”
8.1.2 పాపాలు – నివారణోపాయాలు
పొరుగు వ్యక్తి: అయ్యా! మేం పాపులం. మా గతి ఏమిటి?
శ్రీరామకృష్ణులు: భగవన్నామ గుణ కీర్తనలు చేస్తే దేహపు పాపాలన్నీ ఎగిరి పోతాయి. దేహమనే వృక్షంపై పాపాలనే పక్షులు వాసం చేస్తాయి. భగవన్నామ కీర్తన, చేతులతో చప్పట్లు కొట్టటం లాంటిది. చేతులతో చప్పట్లు కొట్టగానే చెట్ల మీది పక్షులు ఎగిరిపోయేట్లు, భగవన్నామ గుణ సంకీర్తనమనే చప్పట్లకు పాపాలన్నీ పలాయనమవుతాయి.
“ఇంకా విను. మైదానంలో తవ్విన పుష్కరిణిలోని నీరు సూర్య కిరణాల వేడిమికి ఆవిరైపోతుంది. అదేవిధంగా పాపమనే పుష్కరిణిలోని నీరు భగవన్నామ గుణ సంకీర్తనల ద్వారా ఎండిపోతుంది.
“అనునిత్యం మీరు అభ్యాసం చేయాలి. ఆ రోజు సర్కస్‌లో అమిత వేగంగా పరుగెత్తుతున్న గుర్రం మీద ఒక ఆంగ్ల వనిత ఒంటికాలిపై నిలబడి ప్రదర్శన లివ్వటం నేను చూశాను. ఆ కౌశలం గడింప ఆమె ఎంతకాలం అభ్యాసం చేసి ఉంటుందో కదా!
“భగవత్సాక్షాత్కారానికై కనీసం ఒక్కసారైనా విలపించు.
“ఈ రెండే ఉపాయాలు ఉన్నాయి; అభ్యాసం, అనురాగం అంటే భగవద్దర్శనానికై వ్యాకులత.
8.1.3 బేల్ఘరియా భక్తుని గానం – శ్రీరామకృష్ణుల సమాధి
తరువాత మేడ మీది గది వసారాలో శ్రీరామకృష్ణులు భక్తులతో ప్రసాదం ఆరగించారు. అప్పుడు సమయం ఒంటి గంట అయివుంటుంది. విందు ముగిసీముగియగానే క్రింద ప్రాంగణం నుంచి ఒక భక్తుడు ఇలా పాడ నారంభించాడు:
మేలుకో మా యమ్మ మేలుకో ఓ జనని
మేలుకోవే తల్లి మేలుకో
మూలాధారచక్రమందెంత కాలము
ముకుళించి నిదురింతు వీవు॥ మే ॥
శిరమందు శివుడుండు వేయిదళ పద్మమున
చేర నాతని వేగలెమ్ము
గోపనీయమైన నీ గూఢకార్యము
ఫలకారి గావించుకొనుము॥ మే ॥
షట్చక్ర భేదనము సత్వరము చేయము
చైతన్య రసరూపరాశీ
దూరముగా నాదు దుఃఖభారమును
తొలగంగద్రోయ జేసీ॥ మే ॥
ఆ పాట వినటంతోనే శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనారు. ఆయన దేహం నిశ్చలమై పోయింది; కంచంలో ఉన్న చెయ్యి స్థిరంగా అందులోనే ఉండిపోయింది. ఇక ఆయన ఏమీ తినలేకపోయారు. చాలాసేపటికి ఆయన మనస్సు ఇంద్రియ జగత్తులోకి పాక్షికంగా దిగిరాగానే “నేను క్రిందకు పోతాను” అన్నారు. ఒక భక్తుడు కూడావుండి ఆయనను జాగ్రత్తగా క్రిందికి తీసుకుని వచ్చాడు.
ఉదయం భక్తులతో శ్రీరామకృష్ణులు ఆనందంగా ఆడి, పాడిన చోట వేసిన జంపఖానా ఇప్పుడూ అట్లే ఉన్నది. శ్రీరామకృష్ణులు ఇంకా పారవశ్య స్థితిలోనే ఉన్నారు. గాయకుని ప్రక్కన కూర్చున్నారు. గాయకుడు అప్పుడు పాడటం ఆపాడు. తక్షణమే శ్రీరామకృష్ణులు ఆ గాయకునితో ఎంతో వినమ్రంగా, “అయ్యా, దేవిని గురించిన పాటను మరొకసారి వినగోరుతున్నాను” అన్నారు.
గాయకుడు మళ్లీ పాడసాగాడు:
మేలుకో మా యమ్మ మేలుకో ఓ జనని
మేలుకోవే తల్లి మేలుకో
మూలాధారచక్రమందెంత కాలము……….
పాటను విన్న శ్రీరామకృష్ణులు మళ్ళీ భావపరవశులైనారు.
8.2 ద్వితీయ పరిచ్ఛేదం రాఖాల్, రామ్, నిత్యగోపాల్, చౌధరీ ప్రభృతులతో శ్రీరామకృష్ణులు
ఫిబ్రవరి 25, 1883
మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చుని మాట్లాడుతున్నారు. రాఖాల్, హరీశ్, లాటు, హాజ్రా శ్రీరామకృష్ణుల వద్దనే నివసిస్తున్నారు. కలకత్తానుంచి రామ్, కేదార్, నిత్యగోపాల్, ‘మ’ వచ్చారు. చౌధరీ అనే వ్యక్తీ వచ్చి ఉన్నాడు.
చౌధరీ భార్య ఇటీవలే మరణించింది. మనశ్శాంతికై అతడు శ్రీరామకృష్ణులను దర్శింప తరచూ ఇక్కడకు వస్తున్నాడు. అతడు విశ్వవిద్యాలయ పట్టాలు నాలుగైదు సముపార్జించాడు, ప్రభుత్వోద్యోగి.
శ్రీరామకృష్ణులు (రామ్ తదితర భక్తులతో): రాఖాల్, నరేంద్రుడు, భవనాథ్ నిత్యసిద్ధుల కోవకు చెందుతారు. జన్మతః వీరు ఆధ్యాత్మిక చైతన్యవంతులు. ఆధ్యాత్మిక ప్రకాశాన్ని ఇతరులకు అందించే నిమిత్తమే వీరు దేహధారులైనారు.
“ ‘కృపా సిద్ధులు’ గా పేర్కోబడే మరొక తరగతికి చెందిన భక్తులున్నారు. వీరు ఉన్నతస్థాయికి చెందిన వారు. హఠాత్తుగా దైవకృప వీరిపై ప్రసరించి భగవత్సాక్షాత్కారం, జ్ఞానం వీరికి సిద్దిస్తాయి. వేయి సంవత్సరాల కాలంగా ఒక గది అంధకారబంధురమై ఉండి, ఒక్క దీపం వెలిగించగానే, కాస్తకాస్తగా కాక తక్షణమే ఆ వెలుతురుతో నిండిపోతుంది కదా! అలాంటి వారే ఈ కృపాసిద్ధులు.
“సంసార జీవితం గడిపే వ్యక్తి ఆధ్యాత్మిక సాధనలు తప్పక అనుష్ఠించాలి; ఏకాంతంలో వ్యాకుల మానసంతో భగవంతుణ్ణి ప్రార్థించాలి. (చౌధరీతో) పాండిత్యంతో భగవత్సాక్షాత్కారం పొందలేవు. విచారణ ద్వారా భగవంతుణ్ణి ఎవరు తెలుసుకోగలరు? తెలుసుకోలేరు. ప్రతి ఒక్కరూ భగవంతుని పాదపద్మాల పట్ల భక్తిప్రపత్తులకై పాటుపడటమే మంచిది. భగవంతుని మహిమ అపరిమితం. దాన్ని తెలుసుకోవటం ఎవరి తరం? ఆయన లీలావిశేష అంతరార్థాన్ని ఎవరు తెలుసుకోగలరు?
8.2.1 భీష్ముని కన్నీరు – దివ్యచక్షువులు – ‘ఫిలాసఫీ’
“సాక్షాత్తూ అష్టవసువులలో ఒకడు భీష్ముడు; కాని అతడు కూడా అంపశయ్యపై కంట నీరు పెట్టాడు. ‘ఎంత ఆశ్చర్యం! సాక్షాత్తూ భగవంతుడే పాండవుల సహచరుడైనప్పటికీ వారి కష్టాలకూ, దుఃఖానికీ అంతే లేకున్నది!’ అన్నాడు భీష్ముడు. భగవల్లీలను ఎవరు అవగాహన చేసుకోగలరు?
“కొందరు ఇలా అనుకుంటారు; ‘నేను కొంత జప తపాలు అనుష్ఠించాను; కాబట్టి నేను ఇతరుల మీద విజయాన్ని సాధించాను.’ కాని జయాపజయాలు భగవంతునిపై ఆధారపడి ఉన్నాయి. గంగానదిలో పడి మరణిస్తున్న ఒక వేశ్య చివరి వరకు చైతన్యంలో* ఉండటం నేను చూశాను.”
చౌధరీ: భగవంతుని దర్శించటం ఎలా?
శ్రీరామకృష్ణులు: ఈ కళ్ళతో చూడలేవు. భగవంతుడు దివ్యచక్షువులను ప్రసాదిస్తాడు; అప్పుడు మాత్రమే భగవంతుని దర్శించగలుగుతావు. భగవంతుడు అర్జునుడికి దివ్యచక్షువులు ప్రసాదించినందునే అతడు ఆయన విశ్వరూపాన్ని సందర్శించ గలిగాడు.
“మీ ఫిలాసఫీ కేవలం ఊహాజనితం. అది తర్కం మాత్రం చేస్తుంది. ఆ మార్గంలో భగవత్సాక్షాత్కారం పొందలేరు.
8.2.2 అహేతుక భక్తి – రాగ భక్తి
“నీలో రాగభక్తి ఉదయించినప్పుడు భగవంతుడు దర్శనం ఇవ్వక ఎలా ఉండగలడు? తన భక్తుల ప్రేమపట్ల భగవంతుడికి ఎంత మక్కువో నీకు తెలుసా? పశుగ్రాసం, తెలకపిండి మిశ్రమం పట్ల ఆవుకు ఎంత మక్కువో అంత. ఆ మేతను ఆవు గబుక్కున తినివేస్తుంది.
“భగవంతుడి పట్ల గల పరిశుద్ధమైన అహేతుక భక్తినే ‘రాగభక్తి’ అంటారు; ఈ భక్తి భగవంతుణ్ణి తప్ప ఏ లౌకిక వస్తువునూ కాంక్షించదు. ప్రహ్లాదునికి ఈ రాగభక్తి ఉండేది.
“నువ్వు ఒక పెద్దమనిషి ఇంటికి ప్రతి రోజూ వెళతావు అనుకుందాం; కాని అతడి నుండి ఏమీ కోరవు; అతడిని కేవలం చూసే నిమిత్తమే నువ్వు వెళ్ళేది. అతడు నీ కేదన్నా అనుగ్రహించబోతే, నువ్వు ఇలా అంటావు: ‘వద్దండీ నా కేదీ అవసరం లేదు. మిమ్మల్ని కేవలం చూసిపోదామనే నేను వస్తున్నాను.’ ఇటువంటిదే అహేతుక భక్తి. వీరు భగవంతుణ్ణి ప్రేమిస్తారు, అంతే కాని ఆయన నుండి ప్రతిఫలంగా ఏదీ కోరటం ఉండదు.”
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పాడసాగారు:
ముక్తి నొసగ వెరువగాని
(శుద్ద) భక్తి నొసగ వెరతు నేను
భక్తి నొందియున్నవాడు
ఎన్న మిన్న అందరికన్న
వందనీయు డందరకును
మూడు లోకముల జయించు॥ ము ॥
వినవె చంద్రావళీ నీవు
ప్రేమ విషయ మెరుగజేతు
ముక్తి పొందగలవెగాని
భక్తి బడయ దుర్లభంబు॥ ము ॥
ఒక్క శుద్ధభక్తి కొరకే
బలికి కావలి వాడనగుచు
ఎంతో క్రింది పాతాళమున
అతని ఇల్లు కాచుచుంటి॥ ము ॥
దొరకదెందు శుద్ధభక్తి
బృందావనమునందెగాక
గోపగోపీ కాంత లొకరె
దాని మర్మమెరుగు వారు॥ ము ॥
ఒక్క శుద్దభక్తి కొరకె
నంద గృహమునందునుంటి
తండ్రియనుచు అతని భార
ములను శిరముపైన మోసి॥ ము ॥
శ్రీరామకృష్ణులు సంభాషణను కొనసాగించారు: “ఈ మొత్తంలోని సారాంశం ఏమిటంటే – భగవంతునికై తీవ్ర వ్యాకులతను పెంపొందించుకోవాలి; వివేక వైరాగ్యాలను అలవరచుకోవాలి.”
చౌధరీ: అయ్యా, గురువు సహాయం లేనిదే భగవద్దర్శనం కలుగదా?
శ్రీరామకృష్ణులు: సచ్చిదానందుడే గురువు. శవసాధన పరిసమాప్తిలో ఇష్టదేవతా దర్శనం అయ్యే సమయంలో గురువు దర్శన మిచ్చి, ‘చూడు, ఇదుగో నీ ఇష్టదేవత’ అంటాడు. తరువాత ఇష్టదేవతలో గురువు విలీనమవుతాడు. ఎవరు గురువో ఆయనే ఇష్టదేవత కూడా. ఇష్టదేవత వద్దకు చేర్చే మార్గగామియే గురువు. స్త్రీలు అనంతుడి నోములు నోచుతారు. కాని పూజచేసేదేమో విష్ణువుకు. అంటే, విష్ణువులోనే భగవంతుడి అనంత రూపాలు నెలకొని ఉన్నాయి.
8.2.3 శ్రీరామకృష్ణుల సర్వధర్మ సమన్వయం
(రామ్ తదితరులతో) “ఏ మూర్తిని మేం ధ్యానించాలి అని నన్ను అడిగితే నే నిలా అంటాను: ‘నీకు అమిత ఇష్టమైన మూర్తిపై నీ దృష్టిని కేంద్రీకరించు; కాని అన్ని రూపాలూ ఒకే భగవంతుడి రూపాలే అని కచ్చితంగా తెలుసుకో.’
“ఏ మూర్తిపట్లా ద్వేషం వహించకు. శివుడు, హరి, కాళి – ఇవన్నీ ఒకే మూర్తి విభిన్న రూపాలు. వీరందరూ ఒక్కరే అని గ్రహించిన వాడే ధన్యజీవి.
బయటి కతడు శివభక్తుడు
మనసు కాళిపూజ సేయు
నాల్కపల్కు హరినామము
(భిన్నరూపులొకే బ్రహ్మ)
“కామక్రోధాదులు లేశమైనా లేకుంటే దేహం నిలవదు. అందుచేత మీవంటి వారు వాటిని కనిష్ఠ పరిమాణంలోకి తగ్గించుకోవాలి.”
కేదార్ వంక చూస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “ఇతడు మంచి వాడు. నిత్యాన్ని అంగీకరిస్తాడు, లీలనూ అంగీకరిస్తాడు. నిర్గుణ పరబ్రహ్మాన్నే కాక అవతార లీలల నన్నిటినీ అంగీకరిస్తాడు.”
శ్రీరామకృష్ణులు కూడా అటువంటి ఒక అవతారమని కేదార్ అభిప్రాయం.
8.2.4 సన్న్యాసి – స్త్రీ భక్తులు
నిత్యగోపాల్ వైపు చూస్తూ శ్రీరామకృష్ణులు భక్తులతో “ఇతడు ఉన్నత భావంలో నెలకొని ఉన్నాడు” అన్నారు.
(నిత్యగోపాల్తో) “అక్కడకు తరచూ పోవద్దు. ఎప్పుడో ఒకసారి వెళ్లు. ఆమె భక్తురాలే కావచ్చు. కాని ఆమె ఒక స్త్రీ కూడా. కనుకనే నిన్ను హెచ్చరిస్తున్నాను.
“సన్న్యాసుల నియమాలు చాలా కఠినమైనవి. వారు స్త్రీ చిత్తరవుకేసి కూడా చూడరాదు. కాని ఈ నియమం సంసారులకు వర్తించదు. సాధకుడు ఒక స్త్రీతో – ఆమె పరమ భక్తురాలైనప్పటికీ – సహచర్యం నెరపరాదు. సన్న్యాసి ఇంద్రియాలను జయించినప్పటికీ ఈ నియమాల్ని పాటిస్తూ సంసారులకు ఉదాహరణగా ఉండాలి.
“సన్న్యాసి సర్వసంగ పరిత్యాగం చూసి లౌకికులు పరిత్యాగం నేర్చుకుంటారు; కాకుంటే వారు ఊబిలో మరింతగా కూరుకుపోతారు. సన్న్యాసి జగద్గురువు సుమా!”
శ్రీరామకృష్ణులు, భక్తులు లేచి నడవసాగారు. ‘మ’, ప్రహ్లాదుని చిత్తరువు ముందు నిలబడి దాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రహ్లాదుడి అహేతుక భక్తి గురించి శ్రీరామకృష్ణులు చెప్పారు కదా!
8.3 తృతీయ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో భక్తులతో – రాఖాల్పై గోపాల భావం
శుక్రవారం, మార్చ్ 9, 1883
ఉదయం సుమారు ఎనిమిది లేక తొమ్మిది గంటల వేళ శ్రీరామకృష్ణులు తమ గదిలో రాఖాల్, ‘మ’, మరికొందరు భక్తులతో ఆసీనులై ఉన్నారు. ఆ రోజు అమావాస్య.
అటువంటి రోజులలో శ్రీరామకృష్ణులకు జగన్మాతృ ఉద్దీపన కలుగుతుంది. ఆయన భక్తులతో ఇలా అన్నారు: “భగవంతుడే వాస్తవం, తక్కినవన్నీ అవాస్తవాలు. జగజ్జనని తన మహామాయ ద్వారా లోకులను మోహముగ్ధులను చేసింది. మానవుల వంక చూడండి. వారిలో అత్యధికులు బద్ధజీవులే. వారు ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ కామినీకాంచనాల పట్ల అదే మోజును కలిగి ఉంటారు. ఒంటె ముళ్లకంపను తింటుంది, దాని నోటి నుండి రక్తం ప్రవాహమై కారుతుంది. అయినప్పటికీ ముళ్లకంపను తినటం అది మానదు. ప్రసవ వేదన సమయంలో స్త్రీ ‘అయ్యో! ఇక భర్త దరికి మళ్ళీ పోతే ఒట్టు’ అంటుంది. కాని తరువాత ఆమె దాన్ని మరిచిపోతుంది.
“ఇలా చూడండి. భగవంతుడి కోసం ఎవరూ అన్వేషించరు. జనులు అనాసపండును వదలిపెట్టి దాని ముళ్ళ ఆకులను తింటారు.”
భక్తుడు: మహాశయా, భగవంతుడు మమ్మల్ని ఈ సంసారంలో ఎందుకు దింపాడు?
8.3.1 నిష్కామకర్మ చిత్తశుద్ధి కొరకే
శ్రీరామకృష్ణులు: సంసారం కర్మక్షేత్రం. కర్మల ద్వారా జ్ఞానం సముపార్జించవచ్చు. చేయవలసిన కర్మల, చేయరాని కర్మల గురించి గురువు ఉపదేశిస్తాడు. అంతేగాక నిష్కామకర్మ చేయమని గురువు శిష్యులకు బోధిస్తాడు. కర్మ ఒనరించే కొద్దీ మనోమాలిన్యం నశిస్తుంది. సమర్థుడైన వైద్యుడి సలహా మేరకు ఔషధం పుచ్చుకుని రోగాన్ని నయంచేసుకోవటం లాంటిది ఇది.
“భగవంతుడు మనలను సంసారం నుండి ఎందుకు విముక్తులను చేయకున్నాడు? రోగ నివారణానంతరం ఆయన మనలను విముక్తులను గావిస్తాడు. ఈ కామినీకాంచనాలను అనుభవించాలన్న కోర్కె వదలిపోయినప్పుడు మనలను ఆయన సంసారం నుండి విముక్తుని చేస్తాడు. ఒకసారి ఆసుపత్రిలో పేరును నమోదు చేసుకున్నాక ఆ సదరు వ్యక్తి అక్కడ నుండి పారిపోలేడు. రోగం నయం కానిదే అతడు వెళ్ళటానికి డాక్టరు అనుమతి ఇవ్వడు.”
ఈ రోజులలో శ్రీరామకృష్ణులు యశోదవలె వాత్సల్య భావంలో నెలకొని ఉన్నారు. అందుచేత రాఖాల్ను తమతోపాటు ఉంచుకొన్నారు. బిడ్డ తల్లిని ఎలా భావిస్తుందో, శ్రీరామకృష్ణుల పట్ల రాఖాల్ అదే భావంలో ఉన్నాడు. తల్లి ఒడిలో పాలు త్రాగటానికి పసిబిడ్డ పడుకొన్నట్లుగా రాఖాల్, శ్రీరామకృష్ణుల ఒడిలో ఒదిగిపోయేవాడు.
8.3.2 గంగానదిలో పోటు
శ్రీరామకృష్ణులు ఆ భావంలో కూర్చున్న సమయంలో ఒక భక్తుడు గదిలోకి వచ్చి గంగానదిలో పోటు వస్తున్నదని చెప్పాడు. ఆ మాట వినగానే శ్రీరామకృష్ణులు, రాఖాల్, ‘మ’ తదితరులు దాన్ని చూడటానికి పంచవటి కేసి పరుగుతీశారు. అప్పుడు ఉదయం పదిన్నర గంటలు అయి ఉంటుంది. ఆ పోటు ప్రభావంలో ఒక పడవ అటూ ఇటూ ఊగుతూ ఉండటం చూసి శ్రీరామకృష్ణులు “ఓ, అటు చూడు! ఆ పడవ స్థితి చూడు. దానికి ఏం జరుగదని ఆశిస్తాను” అన్నారు.
తరువాత అందరూ పంచవటిలో కూర్చున్నారు.
నదిలో పోటు ఏర్పడటానికి కారణం వివరించమని శ్రీరామకృష్ణులు, ‘మ’ ను అడిగారు.
‘మ’ నేల మీద సూర్యుడు, చంద్రుడు, భూమి బొమ్మలను గీచి భూమ్యాకర్షణ శక్తి, ఆటు పోటు, వెల్లువ, అమావాస్య, పౌర్ణమి, గ్రహణం మొదలైన వాటి గురించి వివరించసాగాడు.
కాసేపు ‘మ’ చెబుతున్నది విన్న శ్రీరామకృష్ణులు ‘మ’ తో ఇలా అన్నారు: “ఇక ఆపు! నువ్వు వివరించేది నాకు అర్థం కావటం లేదు. నా తల తిరుగుతోంది. సూదితో పొడుస్తూన్నట్లు ఉంది. సరే, ఇంత సుదూర విషయాలు వారెలా తెలుసుకుంటున్నారు?
“చిన్నతనంలో నేను బాగా బొమ్మలు గీచేవాడిని; కాని ఎక్కాలు తీసుకొంటేనే తల తిరిగిపోయేది. లెక్కలు వెయ్యటం నేర్చుకోలేకపోయాను.”
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు తమ గదికి తిరిగి వచ్చారు. అక్కడ గోడకు తగిలించివున్న యశోద చిత్తరువును చూస్తూ ఆయన ఇలా అన్నారు: “ఈ చిత్తరువు బాగాలేదు. యశోద పుష్పలావికలా ఉంది.”
8.3.3 అధర్ సేన్ ప్రథమదర్శనం – జంతుబలి – అహింస
మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. అధర్, ఇతర భక్తులు క్రమంగా వచ్చి చేరారు. అధర్సేన్ శ్రీరామకృష్ణులను దర్శింప రావటం ఇదే మొదటిసారి. ఆతడి ఇల్లు బెనెటోలాలో ఉంది. అతడు డిప్యూటీ మేజిస్ట్రేటు. వయస్సు దాదాపు ముప్ఫై ఏళ్ళు.
అధర్ (శ్రీరామకృష్ణులతో): మహాశయా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఉంది. దేవీ ప్రతిమల ముందు జంతు బలులు ఇవ్వటం సబబేనా? అది జీవహింస కదా?
శ్రీరామకృష్ణులు: ప్రత్యేక సందర్భాలలో శాస్త్రాలు బలిని విధిస్తున్నాయి. శాస్త్రాలు బలిని విధించిన కాలాలలో బలి ఇవ్వడం దోషం కాదు. ఉదాహరణకు అష్టమినాడు మేకను బలి ఇవ్వటం లాంటిది. అయితే అన్ని కాలాలలోనూ కూడదు. ప్రస్తుతం నా మనస్సు ఉన్న స్థితిలో నేను బలిని చూడలేను. జగజ్జననికి నివేదించిన మాంస ప్రసాదాన్ని తినలేను. కాబట్టి నా వేలితో ఆ ప్రసాదాన్ని తాకి, వేలిని నా తలకు తాకిస్తాను; లేకుంటే ఆమె నా పట్ల ఆగ్రహించవచ్చు.
“ఒకానొక మనఃస్థితిలో ఒక జీవి మరణించటం కనుక చూస్తే, మరణం దేహానికే గాని, ఆత్మ జననమరణాలకు అతీతమైనదనే భావనతో సాంత్వనం చెందుతాను.
8.3.4 అధర్కు ఉపదేశం – అతిగా విచారణ కూడదు
“అతిగా విచారణ చేయరాదు; జగజ్జనని పాదపద్మాల పట్ల భక్తిప్రపత్తులు కలిగితే చాలు. అతిగా విచారణ మనస్సును గందరగోళంలోకి దింపుతుంది. మడుగు ఉపరితలంలోని నీరు త్రాగితే, స్ఫటికంలాటి నీరు లభిస్తుంది. చేతులతో ఎక్కువ లోతుగా కుదుపుతే బురద నీరు వస్తుంది. కాబట్టి భక్తిని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించండి.
“ధ్రువుడిది సకామ భక్తి. తన తండ్రి రాజ్యం పొందగోరి తపస్సు చేశాడు. కాని ప్రహ్లాదుడిది నిష్కామ, అహేతుక భక్తి.”
ఒక భక్తుడు: మహాశయా, ఏ విధంగా భగవత్సాక్షాత్కారం పొందగలం?
శ్రీరామకృష్ణులు: ఈ విధమైన భక్తి ద్వారానే. కాని ఆయన వద్ద గట్టిగా పంతంపట్టాలి. భగవంతుణ్ణి ఇలా అడగాలి: ‘ఓ భగవంతుడా! నాకు దర్శనం ఇవ్వవా? లేకుంటే కత్తితో నా గొంతు కోసుకొంటాను.’ దీనినే తామసిక భక్తి అంటారు.
భక్తుడు: భగవంతుణ్ణి దర్శించగలమా?
శ్రీరామకృష్ణులు: తప్పక దర్శించవచ్చు. సాకారం, నిరాకారం – రెండింటినీ దర్శించవచ్చు. భగవంతుని సాకారమైన చిన్మయరూపం దర్శింపవచ్చు. మానవ రూపం దాల్చిన భగవంతుని ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చు. అవతారమూర్తిని దర్శించటం సాక్షాత్తూ భగవంతుణ్ణి దర్శించినట్లే అవుతుంది. ప్రతి యుగంలోనూ భూమిపై భగవంతుడు మానవుడుగా అవతరిస్తున్నాడు సుమా!
8.4 చతుర్థ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల జన్మదిన వేడుకలు
(వేకువజామునే భక్తులతో)
ఆదివారం, మార్చ్ 11, 1883
నేడు శ్రీరామకృష్ణుల జన్మదినం. శిష్యులు, భక్తులు ఆయన జన్మదిన వేడుకలను దక్షిణేశ్వర ఆలయంలోని ఆయన గదిలో జరుపుకోదలచారు.
వేకువజాము నుండి భక్తులు ప్రవాహంగా రాసాగారు. భవతారిణీ ఆలయంలో ఉదయకాల హారతులు ముగిశాక నహబత్ నుంచి మధుర సంగీతం వినవచ్చింది. అది వసంత కాలం. చెట్లు, లతలు, మొక్కలు నవపల్లవాలతో, పువ్వులతో శోభిల్లుతున్నాయి. గాలి ఆహ్లాదకరంగా వీస్తోంది. ఈ శుభదినాన భక్తుల హృదయాలు ఆనందంతో పులకించిపోయాయి.
వేకువనే శ్రీరామకృష్ణుల గదికి వచ్చిన ‘మ’ అక్కడ భవనాథ్, రాఖాల్, భవనాథ్ మిత్రుడైన కాళీకృష్ణ తదితరులు వచ్చి ఉండటం చూశాడు. శ్రీరామకృష్ణులు చిరునవ్వులు చిందిస్తూ తూర్పు వసారాలో కూర్చుని మాట్లాడుతున్నారు. అక్కడకు వచ్చిన ‘మ’ శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నువ్వు రావడం నాకు సంతోషం.
(భక్తులతో) లజ్జ, ద్వేషం, భయం – ఈ మూడు ఉండరాదు. నేడు ఎంత మహదానందమైన రోజు. కాని హరినామంలో ఉన్మత్తులై పాడుతూ, నృత్యం చేయజాలని మూర్ఖులకు ఈ ఆనందం ఉండదు. భగవన్నామ సంకీర్తన చేయటానికి లజ్జ, భీతి ఎందుకు? ఊ, ఇప్పుడు మీరు పాడండి.
భవనాథ్, అతడి మిత్రుడు కాళీకృష్ణ కలిసి ఇలా పాడారు:
ఈ భారత భువిలోన
ఈ పావన దేశాన
ఈ సంతోష దినాన
ఈ శుభ సమయాన
నీ నిజ ధర్మాన్ని
ఏకంగా ఎలుగెత్తి
మేమంతా చాటుటకై
ఓ దేవా! మమ్మంతా
ఒక్కటిగా ఒనరింపుము॥ ఈ ॥
వసియింతువు నీ వందరి
హృదయాంతర్వర్తివిగా
నీ నామము నింగి నాల్గు
చెరగులను వ్యాపించును
మరల మరల మార్మోగును॥ ఈ ॥
నిస్తులమౌ నీ ఘనతను
నీ భక్తులు ఈనాడు
ప్రకటింతురు ప్రసరింతురు
బాహాటము గావింతురు॥ ఈ ॥
ఓ దేవా మే మసలు
కోరము ఏ సంపదను
మిత్రులను ప్రఖ్యాతిని
ఏ ఆశయు మాకు లేదు
నీ కొరకే నీ భక్తులు
పరవశమౌ భక్తితోడ
వాపోవుచున్నారు
వాంఛింపరు దేనినైన॥ ఈ ॥
నీ పాదపు నీడలలో
నిశ్చింతగయుండు మాకు
చావైనా గండమైన
భయమున్నదె ఎన్నడైన॥ ఈ ॥
కనుగొంటిమి అమృతత్వపు
వాహినినే కనుగొంటిమి
జయ జయ జయ జయ దేవా
జయ జయ జయ ఓ దేవా!
శ్రీరామకృష్ణులు ముకుళిత హస్తాలతో పాట ఆలకిస్తూవుండగా ఆయన మానసం ఏదో దివ్యలోకంలో విహరించింది. ఎండిన అగ్గిపుల్ల వంటి ఆయన మనస్సులో చిరు ఉద్దీపన చాలు, చైతన్యం జాగృతమవుతుంది. సామాన్యుల మనస్సు చెమ్మగిల్లిన అగ్గిపుల్ల వంటిది. ఎంత గీసినా మండదు. కారణం, వారి మనస్సు సంసారంలో మునిగి ఉండటమే.
8.4.1 మొదట హరినామం – తరువాతే పనులన్నీ
చాలాసేపు ఆయన ధ్యానంలో లీనమైపోయారు. కాసేపయ్యాక కాళీకృష్ణ, భవనాథ్తో గుసగుసగా ఏదో చెప్పారు. తరువాత అతడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి, లేచి నిలబడ్డాడు. శ్రీరామకృష్ణులు ఆశ్చర్యపోయారు. “ఎక్కడకు వెళుతున్నావు?” అని అడిగారు.
భవనాథ్: అతడికి కొంచెం పని ఉంది.
శ్రీరామకృష్ణులు: ఏం పని?
భవనాథ్: అతడు బారానగర్ కార్మిక సంస్థకు వెళుతున్నాడు. (కాళీకృష్ణ వెళ్ళిపోయాడు)
శ్రీరామకృష్ణులు: అతడి నుదుట వ్రాసిలేదు. నేడు హరినామంతో పరమానందం ప్రవహించనుంది. అతడి అదృష్టం అంతే!
8.5 పంచమ పరిచ్ఛేదం భక్తులతో ఉత్సవంలో – సన్న్యాసులకు కఠిన నియమాలు
శ్రీరామకృష్ణులకు ఆ రోజు ఒంట్లో కాస్త నలతగా ఉంది; అందుచేత గంగలో స్నానంచేయ వెళ్ళలేదు. అప్పుడు సమయం ఎనిమిదిన్నర లేక తొమ్మిది గంటలు అయి ఉంటుంది. శ్రీరామకృష్ణుల గదికి తూర్పున ఉన్న వసారాలో కొన్ని బిందెలలో గంగాజలం తీసుకువచ్చి పెట్టారు. శ్రీరామకృష్ణులు స్నానం చేశారు. భక్తులు అందుకు సహాయం చేశారు. స్నానం చేస్తూన్న శ్రీరామకృష్ణులు “ఒక చెంబునీటిని విడిగా పెట్టండి” అని అన్నారు. చివరగా ఆ నీటిని తలపై పోసుకొన్నారు. ఆయన ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఒక చెంబునీటికంటే ఎక్కువ ఆయన తలపై పోసుకోలేదు.
భగవన్నామ సంకీర్తన చేస్తూ స్నానానంతరం ఆయన నూతన వస్త్రాలు ధరించారు. ఒకరిద్దరు శిష్యులు వెంటరాగా ప్రాంగణంలోని కాళికాలయానికి ఆమె పవిత్రనామం జపిస్తూ వెళ్ళారు. గ్రుడ్లు పొదిగేటప్పుడు పక్షుల దృక్కులను పోలిన అంతర్ముఖ దృష్టి ఆయనది.
ఆలయంలో ప్రవేశించి కాళీ విగ్రహం ఎదుట ప్రణామం చేసి అర్చించారు. కాని ఆయన ఎలాంటి శాస్త్రానుసార నియమావళినీ పాటించలేదు. తరువాత విగ్రహం పాదాల వద్ద పువ్వులు, చందనం అర్పించి, తరువాత వాటిని తమ తలపై వేసుకొన్నారు. తమదైన ప్రత్యేక రీతిలో పూజను ముగించాక, అమ్మకు నైవేద్యంగా సమర్పించిన లేత కొబ్బరి కాయను పుచ్చుకురమ్మని భవనాథ్తో చెప్పారు.
మళ్ళీ తమ గదికి బయలుదేరారు శ్రీరామకృష్ణులు. ‘మ’, భవనాథ్లు ఆయనతోపాటు వచ్చారు. భవనాథ్ చేతుల్లో లేత కొబ్బరికాయ ఉంది. దారిలో కుడివైపు రాధాకాంత ఆలయం ఉంది. అక్కడకు వెళ్లి రాధా కృష్ణులకు ప్రణామం చేశారు. ఎడమ వైపు ద్వాదశ శివాలయాలు ఉన్నాయి. మనస్సులో పరమేశ్వరుని ధ్యానించి, ప్రణామం చేశారు.
శ్రీరామకృష్ణులు తమ గదిలోకి రాగానే రామ్, నిత్యగోపాల్, కేదార్ ఛటర్జీ తదితరులు వచ్చి ఉండటం చూశారు. వారంతా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశారు; ఆయన సాదరంగా వారిని అభినందించారు.
నిత్యగోపాల్ను “ఇప్పుడు నువ్వు ఏమైనా తింటావా?” అని ప్రేమగా అడిగారు. అవునన్నాడు అతడు. నిత్యగోపాల్ ఇరవై మూడు లేక ఇరవై నాలుగు ఏళ్ళవాడు, అవివాహితుడు. అతడిది పిల్లవాడి స్వభావం. అతడి మనస్సు సర్వదా ఆధ్యాత్మిక లోకంలో సంచరిస్తూ ఉంటుంది. అతడు కొన్ని సమయాల్లో ఒంటరిగానూ, మరికొన్ని సందర్భాలలో రామ్‌తో కలిసి శ్రీరామకృష్ణులను సందర్శించ వస్తుంటాడు. శ్రీరామకృష్ణులు అతడి పారవశ్య స్థితులను అవలోకించి అతడి పట్ల అనురాగం పెంచుకున్నారు. నిత్యగోపాల్ది పరమహంస స్థితి అని ఆయన తరచూ చెప్పేవారు. నిత్యగోపాల్ను ఆయన బృందావన గోపాలునిగా పరిగణించేవారు.
8.5.1 నిత్యగోపాల్కు ఉపదేశం – సాధువులకు స్త్రీ సాంగత్య నిషేధం
నిత్యగోపాల్ తిన్నాక శ్రీరామకృష్ణులు గంగకు అభిముఖంగా తమ గదికి ఆనుకొనివున్న అర్ధచంద్రాకార మొగసాలలోకి అతణ్ణి తీసుకుని వెళ్ళి అతడితో మాట్లాడసాగారు.
ముప్ఫై ఒక్క సంవత్సరాల వయస్కురాలైన ఒక గొప్ప భక్తురాలు, శ్రీరామకృష్ణుల పట్ల అత్యున్నత భక్తిప్రపత్తులతో తరచూ ఆయనను సందర్శించేది. నిత్యగోపాల్ ఆధ్యాత్మిక స్థితిని చూసి ముగ్ధురాలై, అతణ్ణి తన సొంత కుమారునిగా భావించి, తరచూ అతణ్ణి తన ఇంటికి ఆహ్వానించేది.
శ్రీరామకృష్ణులు(నిత్యగోపాల్తో): నువ్వు అక్కడకు వెళుతున్నావా?
నిత్యగోపాల్ (పిల్లవాడిలా): అవును, వెళుతున్నాను. ఆమె నన్ను ఆహ్వానిస్తున్నది.
శ్రీరామకృష్ణులు: ఓ సాధూ, జాగ్రత్త! ఎప్పుడో ఒక్కసారి వెళ్ళు, కాని తరచూ మాత్రం కాదు; అలా కాకుంటే నీ ఆదర్శం నుండి దిగజారిపోతావు. కామినీ కాంచనాలే మాయ. సాధువులు స్త్రీలకు దూరంగా ఉండి జీవించాలి. అందరూ దాన్లోనే మునిగిపోతారు. బ్రహ్మ విష్ణువులు కూడా ఆ సుడిగుండంలో మునిగి కొట్టుమిట్టాడు తూంటారు.
నిత్యగోపాల్
ఈ పలుకులను నిత్యగోపాల్ శ్రద్ధగా విన్నాడు.
‘మ’ (తనలో): “ఎంత ఆశ్చర్యం! ఈ యువకుడు పరమహంస స్థితిని పెంపొందించుకున్నాడు. శ్రీరామకృష్ణులు తరచూ ఆ మాటే అన్నారు. సమున్నత ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉన్నప్పటికీ ఇతడు పతితుడయ్యే సంభావ్యత ఉందా? సాధువు విషయంలో శ్రీరామకృష్ణులు ఎంతటి కఠోర నియమాలు విధించారు! స్త్రీల సాంగత్యంతో సాధువు తన ఆదర్శం నుండి దిగజారిపోతాడు. అంతటి సమున్నత ఆదర్శాన్ని పాటించి చూపకుంటే సామాన్యుడు ఎలా ఉద్ధరింపబడతాడు? ఆమె పరమభక్తురాలే అయినప్పటికీ ప్రమాదం ఉండనే ఉంది.
“చైతన్య మహాప్రభువు తన శిష్యుడైన చిన్న హరిదాసును అంత కఠినంగా శిక్షించినది ఎందుకో నా కిప్పుడు అవగతమైంది. చైతన్యులు నిషేధించినప్పటికీ చిన్న హరిదాసు భక్తురాలైన ఒక వితంతువుతో మాట్లాడాడు. కాని హరిదాస్ ఒక సాధువు కదా! అందుచేత చైతన్యులు అతణ్ణి బహిష్కరించారు. ఎంతటి కఠోర శిక్ష! సన్న్యాసికి ఎంతటి కఠోర నియమావళి! శ్రీరామకృష్ణులకు నిత్యగోపాల్పై ఎంతటి ప్రేమ! భవిష్యత్తులో అతడికి ఎటువంటి ప్రమాదం వాటిల్లుతుందో అని ముందుగానే హెచ్చరిస్తున్నారు.”
భక్తులు దిగ్భ్రమ చెంది కూర్చుని ఉన్నారు. ‘ఓ సాధూ, జాగ్రత్త!’ శ్రీరామకృష్ణుల ఈ పలుకులు భక్తుల హృదయాలలో ఉరుము ఉరిమినట్లు ప్రతిధ్వనించాయి.
8.6 షష్ఠ పరిచ్ఛేదం సాకార నిరాకారాలు -రామనామంతో శ్రీరామకృష్ణుల సమాధి
తరువాత భక్తులతో కలిసి శ్రీరామకృష్ణులు తమ గదికి ఈశాన్యం వైపున ఉన్న వసారాలోకి వెళ్ళారు. ఆ భక్తులలో వేదాంతం అధ్యయనం చేసిన దక్షిణేశ్వర నివాసియైన ఒక గృహస్థుడు కూడా ఉన్నాడు. శ్రీరామకృష్ణుల సమక్షంలో అతడు, కేదార్‌తో ‘ఓం’ గురించి చర్చిస్తున్నాడు.
8.6.1 శ్రీరామకృష్ణులు : అవతారవాదం – సర్వధర్మ సమన్వయం
అతడిలా అన్నాడు: “ఈ అనాహత శబ్దం లోపలా బయటా సదా వినపడుతూ ఉంటుంది.”
శ్రీరామకృష్ణులు: కేవలం శబ్దం వింటే మాత్రం చాలదు. శబ్దాన్ని సూచించేది ఏదో ఒకటి ఉండి తీరాలి. నీ పేరు మాత్రం వింటే నాకు ఆనందం కలుగదు కదా! నిన్ను కళ్ళారా చూసినప్పుడు మాత్రమే కదా నాకు పూర్తి ఆనందం కలిగేది.
భక్తుడు: ఆ అనాహత శబ్దమే బ్రహ్మం.
శ్రీరామకృష్ణులు (కేదార్‌తో): ఓ, ఇప్పుడు అర్థమైందా? ఇతడిది ఋషుల మతం. ఋషులు శ్రీరాముడితో ఒకసారి ఇలా అన్నారు: ‘ఓ రామా! నిన్ను దశరథనందనుడిగానే మేము ఎరుగుదుం. కాని భరద్వాజాది మునులు నిన్ను అవతారమూర్తిగా పూజిస్తారు. మేము అఖండ సచ్చిదానంద బ్రహ్మోపలబ్ధినే ఆకాంక్షిస్తున్నాం.’ ఈ మాటలు విని రాముడు మందహాసంచేసి వెళ్ళిపోయాడు.
కేదార్: ఆ ఋషులు, శ్రీరాముణ్ణి అవతారమూర్తిగా గుర్తించలేకపోయారు. వారు ఎంతటి అవివేకులో గదా!
శ్రీరామకృష్ణులు (గంభీరంగా): నువ్విలా మాట్లాడవద్దు. తమ అభిరుచీ, ప్రవృత్తీ బట్టి జనులు భగవంతుణ్ణి ఆరాధిస్తారు. ఒకే చేపను తల్లి విభిన్న రీతులలో వండుతుంది, తన పిల్లల రుచి, జీర్ణశక్తి మేరకు. పిల్లలలో కొందరికి పలావ్ చేస్తుంది కాని పిల్లలందరూ ఆ వంటకాన్ని జీర్ణించుకోలేరు. జీర్ణశక్తి తక్కువగా ఉన్న పిల్లలకు ఆమె పులుసు వండిపెడుతుంది. పిల్లలలో కొందరికి చేప వేపుడు లేక చేపలతో పచ్చడి రుచిస్తుంది. (అందరూ నవ్వారు) అది అభిరుచిపైన ఆధారపడిన విషయం.
“ఆ ఋషులు జ్ఞానమార్గాన్ని అనుసరించారు. అందుచేత వారు అఖండ సచ్చిదానంద బ్రహ్మాన్నే కోరుకున్నారు. కాని భక్తిమార్గాన్ని అనుసరించేవారు భక్తి మాధుర్యాన్ని ఆస్వాదించాలని మానవ రూపంలోని భగవదవతారాన్నే కోరుకుంటారు. భగవత్సాక్షాత్కారానంతరం మనస్సులోని అజ్ఞానాంధకారం పటాపంచలవుతుంది. శ్రీరాముడు సభలో ప్రవేశించగానే వెయ్యి సూర్యులు ఒక్కసారే ఉదయించిన ప్రకాశం ఏర్పడినట్లు పురాణాలలో ప్రస్తావించబడింది. అలా అయితే సభాసదులు కాలి, బూడిద కాలేదా అని అడగవచ్చు. అందుకు జవాబు– శ్రీరాముని తేజస్సు జడ తేజస్సు కాదు. సూర్యోదయం కాగానే కమలాలు వికసించే రీతిలో, సభాసదుల హృదయ కమలాలు ఒక్కసారిగా వికసించాయి.”
భక్తుల ముందు నిలబడి ఈ మాటలు పలుకుతూ ఉండగానే శ్రీరామకృష్ణులు హఠాత్తుగా భావపారవశ్యత నొందారు. బాహ్యదృష్టిని వదలిపెట్టి ఆయన మనస్సు అంతర్ముఖమయింది. ‘హృదయ కమలాలు వికసించాయి’ అని పలుకుతూ ఉండగానే ఆయన ప్రగాఢ సమాధిలోకి వెళ్ళిపోయారు.
శ్రీరామకృష్ణులు సమాధిలో ఉండిపోయారు. భగవద్దర్శనం పొంది ఆయన హృదయ కమలం వికసించింది. చిత్తరువులా నిలబడి ఉన్నారు.అయితే బాహ్యస్మృతి లేదు. ముఖం దివ్యతేజస్సుతో ప్రకాశిస్తోంది, పెదవులు చిరునవ్వుతో విచ్చుకుని ఉన్నాయి. భక్తులు కొందరు నిలబడి ఉన్నారు, కొందరు కూర్చుని ఉన్నారు. ప్రేమ సామ్రాట్టు ఆ అద్భుత రూపాన్ని ఇంతవరకు కాంచని సమాధి స్థితిని అందరూ తదేకంగా చూడసాగారు.
చాలాసేపయ్యాక ఆయన బాహ్యస్మృతిలోకి వచ్చారు. భారంగా ఊపిరి పీల్చి ‘రామ్, రామ్’ అనసాగారు. ఆయన అంటున్న ప్రతి మాటా భక్తుల హృదయాలలో అమృతం కురిపిస్తోంది. తరువాత ఆయన కూర్చున్నారు. భక్తులందరూ ఆయనను పరివేష్టించి కూర్చుని, ఆయన్నే చూస్తూ ఉండిపోయారు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): జనసామాన్యం భగవదవతారమూర్తి రాకను గుర్తించజాలదు. ఆయన గోప్యంగా వస్తాడు. ఆంతరంగిక శిష్యులు ఏ కొద్దిమందో ఆయన్ను గుర్తించగలుగుతారు. శ్రీరాముడు పరబ్రహ్మమనీ, మానవ రూపంలోని భగవదవతారమూర్తి అనీ కేవలం పన్నెండు మంది ఋషులు మాత్రమే తెలుసుకోగలిగారు. ఇతర ఋషులు, రాముడితో ‘రామా! దశరథ నందనుడిగానే నువ్వు మాకు తెలుసు’ అన్నారు.
“అఖండ సచ్చిదానంద బ్రహ్మాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించగలరా? నిత్యస్థితిని పొందాక భగవల్లీలను అనుభవించటానికి లీల స్థితిలో ఎవరు నెలకొని ఉన్నారో, అతడు మాత్రమే పరిపూర్ణ భక్తిని పొందిన వాడు. క్వీన్ (విక్టోరియా మహారాణి)ని గతంలో ఆంగ్లేయుల దేశం (ఇంగ్లండు)లో సందర్శించిన వ్యక్తి మాత్రమే ఆమె విధానాల, కార్యకలాపాలను గురించి వర్ణించగలడు. అటువంటప్పుడు మాత్రమే క్వీన్ గురించిన అతడి వర్ణన కచ్చితంగా ఉంటుంది. భరద్వాజాది మునులు రాముని స్తుతిస్తూ ఇలా అన్నారు: ‘ఓ రామా! అఖండ సచ్చిదానంద స్వరూపుడవు నువ్వే. నువ్వు మా ఎదుట మానవరూపంలో అవతరించావు. స్వకీయ యోగమాయను ఆశ్రయించినందునే మానవుడిలా వర్తిస్తున్నావు.’ ఈ మునులు శ్రీరాముని పరమభక్తులు, భగవంతుడి పట్ల పరిపూర్ణ భక్తి గలవారు.”
8.7 సప్తమ పరిచ్ఛేదం భజనానందంలో – సమాధిలో
భక్తులు ఈ అవతారతత్త్వాన్ని విభ్రమంగా వింటున్నారు. ఏం ఆశ్చర్యం! వేదాలు ఎవరిని అఖండ సచ్చిదానందంగా పేర్కొంటూన్నాయో, ఎవరిని అవాఙ్మానసగోచరుడని తెలుపుతూన్నవో ఆ పరమపురుషుడు మూడున్నర మూరల పొడవు గల మానవ రూపంలో వస్తున్నాడని శ్రీరామకృష్ణులే చెబుతున్నారు. కనుక అది యథార్థమే అయి ఉండాలి. లేకుంటే ‘రామ్ రామ్’ అంటూ ఉచ్చరిస్తూనే వీరికి సమాధి స్థితి కలుగుతోందే! ‘వీరు కచ్చితంగా, తమ హృదయ కమలంలో శ్రీరాముణ్ణి దర్శించారు’ అని కొందరు భక్తులు భావించుకోసాగారు.
ఆ సమయంలో కోన్నగర్ నుండి కొందరు భక్తులు మృదంగ తాళవాయిద్య సమేతంగా సంకీర్తన చేస్తూ అక్కడకు వచ్చారు. మనోమోహన్, నవాయ్ మొదలైన భక్తులు పలువురు శ్రీరామకృష్ణుల గదికి ఈశాన్యంలో ఉన్న వసారాలోకి వెళ్లారు. శ్రీరామకృష్ణులు భగవత్ ప్రేమానంద ఉన్మత్తులై వారితోపాటు సంకీర్తన చేస్తూ నృత్యం చేయసాగారు. మధ్య మధ్యలో శిలావిగ్రహంలా నిలబడిపోయి సమాధిస్థితిలోకి వెళుతున్నారు. ఇటువంటి ఒకానొక సమాధిస్థితిలో ఆయన ఉన్నప్పుడు భక్తులు భారీ మల్లెపూల మాలలతో ఆయన కంఠసీమను అలంకరించారు. శ్రీ చైతన్యులే ప్రగాఢ పారవశ్యంలో తమ ఎదుట నిలబడి ఉన్నట్లు భక్తులకు తోచింది.
శ్రీరామకృష్ణులు ఒకసారి అంతర్ముఖ స్థితిలో ఉంటారు. జడంలా, సంపూర్ణ బాహ్యస్మృతిని కోల్పోయి చిత్తరువులా ఉంటారు. కొన్ని వేళల్లో అర్ధబాహ్యస్థితిలో – ప్రేమపారవశ్యంలో నృత్యం చేస్తారు. కొన్ని సందర్భాలలో శ్రీ చైతన్యుల్లా బాహ్యచైతన్యంలో; ఆ స్థితిలో భక్తులతో కలిసి సంకీర్తన చేస్తారు.
శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులై పశ్చిమదిశకేసి నిలబడి ఉన్నారు. ఆయన క్రింద పడిపోకూడదనే తలంపుతో భక్తుల్లో ఒకరు ఆయన్ను పట్టుకున్నారు. ఆయన దృష్టి తదేకమైంది. కంఠంనుంచి పువ్వులమాలలు వ్రేలాడుతూ ఉండగా, ఆయన ముఖారవిందం భక్తిపారవశ్యంలో ప్రకాశిస్తూ ఉండగా భక్తులు మృదంగం తదితర తాళవాయిద్యాలతో ఆయన చుట్టూ కీర్తనలు పాడి నృత్యం చేయసాగారు.
భక్తులు ఆ ఆనందమూర్తిని చాలాసేపు చూస్తూ ఉండిపోయారు. ఆయన సమాధి నుండి బాహ్యచైతన్యంలోకి వచ్చారు. అప్పటికి చాలా ప్రొద్దు ఎక్కింది. కాసేపట్లో కీర్తన ముగిసింది. శ్రీరామకృష్ణుల భోజన ఏర్పాట్లలో భక్తులు మునిగిపోయారు.
శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. తరువాత ఒక క్రొత్త పీతాంబరాన్ని ధరించి చిన్నమంచంపై కూర్చున్నారు. ఆనందమయమైన, ప్రకాశవంతమైన భక్తుల హృదయాలను దోచుకొనే ఆ పీతాంబరధారియైన మహాపురుషుణ్ణి భక్తులు చూస్తూ ఉండిపోయారు. దేవతలు సైతం చూడ నోచుకోని పావనమైన ఆ సుందరరూపాన్ని ఎంతచూసినా వారికి తనివి తీరలేదు. ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఆ సుందరరూప సాగరంలో కరిగిపోవాలనే వారి మనస్సులు ఆకాంక్షించాయి.
శ్రీరామకృష్ణులు భోజనానికి కూర్చున్నారు. భక్తులూ ఆయనతో ఆనందంగా ప్రసాదం తిన్నారు.
8.8 అష్టమ పరిచ్ఛేదం గోస్వామితో సర్వధర్మ సమన్వయంపై ప్రసంగం
భోజనానంతరం ఆయన చిన్నమంచంపై విశ్రమించారు. గదిలో జనం ఎక్కువయ్యారు. బయటి వసారాలలోనూ జనం నిండిపోయారు. గదిలో భక్తులు నేల మీద కూర్చుని తదేకంగా ఆయన్నే చూస్తూ ఉన్నారు. కేదార్, సురేశ్, రామ్, మనోమోహన్, గిరీంద్ర, రాఖాల్, భవనాథ్, ‘మ’ మొదలైన వారు అక్కడే ఉన్నారు. రాఖాల్ తండ్రీ ఉన్నారు.
వైష్ణవ గోస్వామి ఒకరు ఆ గదిలో ఆసీనుడై ఉన్నాడు. శ్రీరామకృష్ణులు ఆతణ్ణి చూసి మాట్లాడసాగారు. గోస్వామిని చూస్తే శ్రీరామకృష్ణులు తలవంచి నమస్కరిస్తారు. కొన్ని సందర్భాల్లో సాష్టాంగనమస్కారం కూడా చేస్తారు.
8.8.1 నామ జపమే కాదు, ప్రగాఢ ప్రేమ కూడా ఉండాలి – అజామిళుడు
శ్రీరామకృష్ణులు: మంచిది, మీరు ఏమంటారు? మార్గం ఏమిటి?
గోస్వామి: అయ్యా భగవన్నామ జపంతోనే అన్నీ జరుగుతాయి. కలియుగంలో భగవన్నామ జపం మహిమను సంతరించుకున్నది.
శ్రీరామకృష్ణులు: అవును. నామానికి మహిమ ఉంది. అది నిజమే. కాని ప్రగాఢప్రేమ లేకుండా ఏం ప్రయోజనం? భగవంతుడి కోసం పరితపించడం ఎంతైనా అవసరం. ఒక ప్రక్క నామజపం జరుగుతోంది, మనస్సో కామినీకాంచనాలలో కొట్టుమిట్టాడుతోంది. దీనివల్ల ఏం ఒరుగుతుంది? తేలు లేదా మండ్రగబ్బ కాటువేసినప్పుడు కేవలం మంత్రం ఉచ్చరిస్తే మాత్రం ప్రయోజనం లేదు. ఆవు పేడను మంటబెట్టి, కాటువేసిన చోట ఆ పొగను పట్టాలి.
గోస్వామి: అలాంటప్పుడు అజామిళుని ఉదంతం గురించి మీరేమంటారు? అతడు మహాపాపి; అతడు చేయని పాపం అంటూ ఏదీ లేదు. మరణ శయ్యపై తన కుమారుణ్ణి ‘నారాయణా’ అని పిలుస్తూ భగవంతుని నామాన్ని ఉచ్చరించాడు. అంతమాత్రం చేతనే అతడు తరించలేదా?
శ్రీరామకృష్ణులు: బహుశా అజామిళుడు గత జన్మలలో అనేక సత్కర్మలు చేసివుంటాడు. ఒకప్పుడతడు తపశ్చర్యలు అనుష్ఠించాడనీ చెప్పబడి ఉంది; పైగా అవి అతడి జీవితపు ఆఖరి ఘడియలు. ఏనుగుకు స్నానం చేయించటం వల్ల ఏం ప్రయోజనం? అది మళ్ళీ మళ్ళీ ఒంటిని మలినం చేసుకుంటుంది. కాని ఏనుగు, గజశాలలోకి వెళ్ళే ముందు దాని ఒంటి మీది ధూళిని తొలగించి, స్నానం చేయిస్తే, అప్పుడది పరిశుభ్రంగా ఉంటుంది.
“ఒక వ్యక్తి భగవన్నామ స్మరణ మహిమచేత పునీతుడవుతాడనుకుందాం; కాని వెంటనే అనేక పాపకార్యాలకు ఒడిగడతాడు. అతడికి మనోబలం ఉండదు. పాపాలను మళ్లీ చేయనని అతడు శపథం పూనడు. గంగాస్నానం సమస్త పాపాలను ప్రక్షాళన చేస్తుంది. అయితే ఏమిటి ప్రయోజనం? గంగానది తీరం వెంబడి ఉన్న చెట్ల పైకెక్కి కూర్చున్న పాత పాపాలు అతడి భుజాలపై దూకుతాయి. (అందరూ నవ్వారు) ఆ పాత పాపాలే అతణ్ణి ఆవహిస్తాయి. అతడు నీటినుండి బయటకు వచ్చీ రాక మునుపే పాపాలు అతడి మీద పడతాయి.
“కాబట్టి భగవన్నామ స్మరణ చేయమని నేను అంటున్నాను; దానితోపాటు భగవంతుడి పట్ల భక్తిప్రపత్తులు కలిగేటట్లు ప్రార్థించండి. మూన్నాళ్ళ ముచ్చటే అయిన సంపద, పేరుప్రతిష్ఠలు, భోగవిలాసాల పట్ల మీ అనురక్తి రోజురోజుకీ తగ్గిపోయేట్లుగా చేయమని భగవంతుణ్ణి ప్రార్థించండి.
8.8.2 వైష్ణవధర్మం – సర్వధర్మ సమన్వయం
(గోస్వామితో) “త్రికరణశుద్ధి కలిగితే సర్వమతాల ద్వారా భగవత్సాక్షాత్కారం పొందవచ్చు. వైష్ణవులు భగవత్సాక్షాత్కారం పొందుతారు, అలాగే శాక్తేయులు, వేదాంతులు, బ్రహ్మసమాజస్థులూను. అదేవిధంగా మహమ్మదీయులు, క్రైస్తవులు కూడా భగవత్సాక్షాత్కారం పొందుతారు. ఏ మతావలంబులైనా హృదయపూర్వకంగా పరితపించినట్లయితే భగవల్లబ్ధి తప్పక పొందుతారు.
“కొందరు ‘మా శ్రీకృష్ణుని పూజించనిదే దేన్నీకూడా సాధించలేరు’ అంటూ తగాదాల్లోకి దిగుతారు. లేదా ‘మా కాళిని పూజించలేనిదే ఏదీ సాధించలేరు’ లేదా ‘క్రైస్తవ ధర్మం స్వీకరించనిదే ఎవరూ ఉద్ధరింపబడరు’ అంటూ ఉంటారు. ఇది కేవలం మతదురభిమానం. మత దురభిమాని ‘నా మతం మాత్రమే సత్యమైనది, ఇతర మతాలన్నీ బూటకాలు’ అని పలుకుతాడు. ఇది అనుచిత వైఖరి. విభిన్న మార్గాలలో భగవంతుణ్ణి చేరవచ్చు.
“మతాల గురించేకాక కొందరు భగవంతుడు సాకారుడని, నిరాకారుడని కూడా చెబుతూ ఉంటారు. ఆ విధంగా వారు కలహించుకోవటం ప్రారంభిస్తారు. వైష్ణవుడు, వేదాంతవాదితో తగవులాడతాడు.
“భగవద్దర్శనానంతరమే భగవంతుని గురించి కచ్చితంగా మాట్లాడగలం. భగవంతుని దర్శించిన వ్యక్తి మాత్రమే యథార్థంగా భగవంతుడు సాకారుడనీ, నిరాకారుడు కూడా అనీ తెలుసుకుంటాడు. ఆయన రూపాలు ఇంకా ఏవేవి ఉన్నాయో వర్ణించజాలం.
“కొందరు గుడ్డివారు ఒక ఏనుగు వద్దకు వెళ్లటం తటస్థించింది. అది ఏనుగని వారికి ఎవరో చెప్పారు. ఆ గుడ్డివాళ్ళను ఏనుగు ఎలా ఉంటుందో వివరించమని అడిగారు. ఈ గుడ్డివాళ్లు దాని దేహాన్ని స్పృశించసాగారు. వారిలో ఒకడు ఏనుగు స్తంభంలాంటిది అని చెప్పాడు; అతడు దాని కాలును మాత్రమే తడిమి చూశాడు. మరో గుడ్డివాడు అది పెద్దచాట వంటిది అన్నాడు; అతడు దాని చెవిని మాత్రం తాకి చూశాడు. ఈ రీతిలో తక్కినవారు దాని తోక, పొట్ట మొదలైన అంగాలను స్పృశించి విభిన్న విధాల ఏనుగును వర్ణించారు. అదే విధంగా భగవంతుని ఒకే విభూతిని దర్శించిన వ్యక్తి భగవంతుణ్ణి అంతటితోనే పరిమితం చేస్తాడు. భగవంతుడు అది తప్ప అన్యమేదీ కాదని భావిస్తాడు.
“బయలుకి వెళ్లి వచ్చిన ఒక వ్యక్తి ‘చెట్టు క్రింద అందమైన ఎర్రని ప్రాణిని చూశాను’ అని అన్నాడు. మరొకడు ‘నేను నీకంటే ముందే ఆ చెట్టు క్రిందికి వెళ్లాను. అది ఎర్రని రంగులోనా ఉంది? ఆకుపచ్చ రంగులో ఉండటం స్వయంగా నా కళ్లతో చూశాను’ అని చెప్పాడు. ఇంకొకడు ‘మీకంటే ముందుగానే నే నక్కడకు వెళ్లి వచ్చాను. ఆ ప్రాణిని నేనూ చూశాను. అది ఎరుపు రంగులోనూ లేదు, ఆకుపచ్చ రంగులోనూ లేదు. నీలం రంగులో ఉండటం నా రెండు కళ్ళతోనూ చూశాను’ అని చెప్పాడు. ఇంకా అక్కడ ఉన్న ఇద్దరు ‘అది పసుపు పచ్చ రంగులో ఉన్నది’ అనీ ‘బూడిదరంగులో ఉన్నది’ అనీ తెలిపారు. ఇదే విధంగా పలురంగులు. చివరికి అందరూ తగాదాలోకి దిగారు. ‘నేను చూసిందే సరైనది’ అంటూ ప్రతి ఒక్కరూ అనుకొన్నారు. వారి తగాదాలను గమనిస్తూ ఉన్న ఒక వ్యక్తి, ‘సంగతి ఏమిటి?’ అని అడిగాడు, వారు చెప్పిన వివరాలు విని ఆ వ్యక్తి ‘నేను ఆ చెట్టుక్రిందే నివసిస్తున్నాను. ఆ ప్రాణి ఏదో నాకు తెలుసు. మీరు ప్రతి ఒక్కరూ ఏం చెప్పారో అవి అన్నీ నిజాలే. అదొక ఊసరవెల్లి. ఒకసారి ఆకు పచ్చగా ఉంటుంది. మరొకప్పుడు నీలం రంగులో ఉంటుంది. అది పలురంగులు సంతరించుకుంటుంది. కొన్ని సమయాల్లో అది ఏ రంగూ లేకుండా వర్ణరహితంగా ఉండటమూ నేను చూశాను’ అని వివరించాడు.
8.8.3 సాకారం – నిరాకారం
(గోస్వామితో) “కాబట్టి భగవంతుడు కేవలం సాకారమూర్తే అని చెప్పటంలో ప్రయోజనం ఏమిటి? భగవంతుడు కృష్ణుడి మాదిరి మానవరూపంలో ఈ భూమిపై అవతరించాడన్నదీ సత్యమే. భగవంతుడు తన భక్తులకు నానా రూపాలలో దర్శనమిస్తాడనటం కూడా సత్యమే. అదే సమయంలో భగవంతుడు నిరాకారుడు అనటం కూడా వాస్తవమే; ఆయన అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడు. వేదాలు ఆయనను నిర్గుణుడుగాను, సగుణుడుగాను అభివర్ణించాయి. భగవంతుడు నిరాకారుడుగా, సాకారుడుగా వేదాలలో వర్ణింపబడి ఉంది.
“ఎలాగో నీకు అర్థమైందా? సచ్చిదానందం ఒక అనంత సాగరం. తీవ్రమైన శీతలం నీటిని మంచుగడ్డలుగా ఘనీభవింపచేస్తుంది. ఈ మంచుగడ్డలు విభిన్న ఆకృతులలో సాగర ఉపరితలంలో తేలుతూ ఉంటాయి. అదేవిధంగా భక్తియొక్క శీతల ప్రభావం చేత, భగవద్రూపాలను సచ్చిదానంద సాగరంలో కానవచ్చు. ఈ భగవత్ రూపాలు భక్తుల కొరకే సుమా! కాని జ్ఞానభాస్కరుడు ఉదయించినప్పుడు మంచు కరగిపోతుంది. పూర్వంలా అదే నీరుగా మారుతుంది. పైన నీరు, క్రింద నీరు – ఎటు చూసినా నీరే.
“కనుకనే ఒక భాగవత శ్లోకం ఇలా చెబుతోంది : ‘ఓ భగవంతుడా, నువ్వు సాకారుడవు, నిరాకారుడవు కూడా. నువ్వు మా ఎదుట మానవ రూపంలో నడయాడుతావు; మళ్ళీ, వేదాలు నిన్ను మనోవాక్కులకు అతీతునిగా అభివర్ణిస్తున్నాయి.’
“కాని కొంతమంది భక్తులకోసం భగవంతుడు నిత్య రూపాలను ధరిస్తాడని నువ్వు అనవచ్చు. సముద్రంలో కొన్ని ప్రాంతాలలో మంచు కరుగనే కరుగదు. అది శిలాస్ఫటిక రూపును సంతరించుకుంటుంది.
కేదార్: తాను ఒనరించిన మూడు అపరాధాలను మన్నించమని వ్యాసుడు, భగవంతుణ్ణి ప్రార్థించినట్లు భాగవతంలో పేర్కోబడివుంది. ఆయన ఇలా అన్నాడు: ‘ఓ భగవంతుడా! నువ్వు నిరాకారుడవు; కాని నా ధ్యానంలో నిన్ను సాకారమూర్తిగా భావించాను. నువ్వు వాక్కుకు అతీతుడవు; కాని నేను నిన్ను స్తోత్రాలలో గానం చేశాను. నువ్వు సర్వాంతర్యామివి; కాని నేను పుణ్యస్థలాలకు తీర్థయాత్రలు చేశాను. నన్ను కరుణించు ఓ దేవా, నా ఈ మూడు అపరాధాలను మన్నించు.’
శ్రీరామకృష్ణులు: అవును, భగవంతుడు నిరాకారుడు, సాకారుడు కూడా అంతేగాక ఆయన సాకార నిరాకారాలకు అతీతుడు కూడా. ఆయనను ఎవరూ పరిమితం చేయలేరు.
8.9 నవమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు – నిత్యసిద్ధులు, కౌమార వైరాగ్యం
ఆ సమయంలో రాఖాల్, శ్రీరామకృష్ణులతో ఉంటున్నాడు. రాఖాల్ తల్లి మరణానంతరం, అతడి తండ్రి పునర్వివాహం చేసుకున్నాడు. రాఖాల్ ఇక్కడ ఉన్నందున అప్పుడప్పుడు రాఖాల్ తండ్రి దక్షిణేశ్వరానికి వచ్చేవాడు, శ్రీరామకృష్ణులతో తన కుమారుడు వసించటం పట్ల ఆయన అంతగా అభ్యంతరం చెప్పలేదు. బాగా సంపన్నుడు కావటంతో ఆయన సర్వదా వ్యాజ్యాలలో మునిగి ఉండేవాడు. శ్రీరామకృష్ణులను సందర్శించే వారిలో న్యాయవాదులు, డిప్యూటీ మేజిస్ట్రేటులు ఉండేవారు. తన ఆస్తి వ్యవహారాలలో వారి సలహాలను పాటించటం హితంగా ఉండవచ్చునని రాఖాల్ తండ్రి వారితో పరిచయం పెంచుకోవటం లాభదాయకమని ఎంచాడు. ఆ రోజు ఆయన కూడా వచ్చి ఉన్నాడు.
మధ్యమధ్యలో శ్రీరామకృష్ణులు, రాఖాల్ తండ్రివైపు తమ దృక్కులను పరపుతున్నారు. రాఖాల్ తమతోపాటు దక్షిణేశ్వరంలోనే ఉండిపోవాలన్నది శ్రీరామకృష్ణుల మనోవాంఛితం.
శ్రీరామకృష్ణులు (రాఖాల్ తండ్రి, ఇతర భక్తులతో): ఆహా, రాఖాల్ ఎంత చక్కటి ప్రవర్తనను అలవరచుకున్నాడో! అతడి ముఖం కేసి పరికించండి; అప్పుడప్పుడు అతడి పెదవులు కదులుతూ ఉంటాయి. లోలోన భగవన్నామం జపిస్తూ ఉండటం చేతనే అతడి పెదవుల ఆ కదలిక.
“అతడివంటి యువకులు నిత్యసిద్ధుల కోవకు చెందుతారు. భగవత్ చైతన్యంతోనే వారు జన్మిస్తారు. వారు కాస్త ఎదగగానే, సంసారంలో చిక్కుకుంటే ఇక వేరే దిక్కు ఉండదని గుర్తిస్తారు. వేదాలలో హోమపక్షి గురించి ఒక దృష్టాంతం ఉంది. ఈ పక్షి ఆకాశంలో అత్యంత ఎత్తున వసిస్తుంది, ఎన్నడూ భూమ్మీదకు దిగిరాదు. అది ఆకాశంలోనే గుడ్డు పెడుతుంది; ఆ గుడ్డు క్రిందపడిపోనారంభిస్తుంది. హోమపక్షి ఆకాశాన సమున్నత ఎత్తులో నివసించటం చేత గుడ్డు భూమ్మీద పడేలోపలే పొదుగబడి పక్షిపిల్ల బయటకు వస్తుంది. పక్షిపిల్ల కూడా క్రింద పడిపోనారంభిస్తుంది. కాని అది ఇంకా అత్యున్నత ఎత్తులో ఉండటం చేత పడిపోతున్నప్పుడే దానికి రెక్కలు మొలిచి, అది కళ్ళు తెరుస్తుంది. అప్పుడా పక్షిపిల్లకు తాను భూమ్మీద పడబోతున్నాననీ, పడీపడగానే చావు తథ్యమనీ ఎరుక కలుగుతుంది. అది నేలను గాంచిన క్షణంలోనే, రివ్వున వెనక్కు తిరిగి ఆకాశంలోని తల్లికేసి పైకెగురుతుంది. అప్పడు దాని ఏకైక లక్ష్యం – తల్లిని చేరుకోవటమే.
“రాఖాల్ వంటి యువకులు ఆ పక్షిలాంటివారు. చిన్ననాటి నుండీ సంసారం అంటే వారు భీతి చెందుతారు. అమ్మను ఎలా చేరుకోవాలి, ఎలా భగవత్సాక్షాత్కారం పొందాలి అనేదే వారి ఏకైక ఆలోచన.
రాఖాల్ (స్వామి బ్రహ్మానంద)
“మీరు ఇలా ప్రశ్నించవచ్చు: ‘సంసారం చేస్తున్న తల్లితండ్రులకు జన్మించిన, సంసారాసక్తుల మధ్యలో నివసిస్తూ ఉన్న ఈ యువకులకు అంతటభక్తి జ్ఞానాలు పెంపొందించుకోవటం ఎలా సాధ్యం?’ – దాన్ని ఇలా వివరించవచ్చు: ఒక బఠాణి గింజ ఒక పేడ గుట్టలో పడ్డప్పుడు, అందుండి ఒక బఠాణి మొక్క అంకురిస్తుంది. ఆ మొక్క నుండి లభించే బఠాణి గింజలు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. పేడలో నాటినందున ఆ గింజనుండి మరొక రకమైన మొక్క అంకురిస్తుందా?
“ఆహా! ఈ రోజుల్లో రాఖాల్ స్వభావం ఎంత మధురంగా మారిపోతున్నది! అలా ఉండకుండా ఎలా ఉంటుంది? పెండలం మంచిదైతే దాని అంకురాలు కూడా మంచివిగానే ఉంటాయి (అందరూ నవ్వారు) తండ్రిని పోలిన తనయుడు.”
‘మ’ (ఏకాంతంలో, గిరీంద్ర వైపు తిరిగి): భగవంతుని సాకార నిరాకారాలను గురించి
ఆయన ఎంత బాగా వివరించారు. వైష్ణవులు భగవంతుణ్ణి సాకారునిగానే విశ్వసిస్తారా?
గిరీంద్ర: బహుశా అంతేనేమో. వారు ఏకపక్షవాదులు.
‘మ’ : భగవంతుడి ‘నిత్య సాకారం’ అన్న భావన నీకు అవగతమైనదా? ఆ శిలాస్ఫటికం ఉదాహరణ నేను గ్రహించుకోలేకున్నాను.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): అవునూ, మీరు దేన్ని గురించి గుసగుస లాడుకుంటున్నారు?
‘మ’, గిరీంద్రుడు నవ్వి, మౌనం పాటించారు.
పనిమనిషి బృంద (రామ్‌లాల్‌తో): ఇప్పుడు వీరికి భోజనం ఇవ్వండి; నాకు తరువాత ఇచ్చినా ఫరవాలేదు.
శ్రీరామకృష్ణులు: ఏమిటి, బృంద ఇంకా భోజనం చేయలేదా?
8.10 దశమ పరిచ్ఛేదం పంచవటి వద్ద భజనానందంలో
తరువాత మధ్యాహ్నం భక్తులు పంచవటి వద్ద సంకీర్తన చేయసాగారు; వారితో శ్రీరామకృష్ణులు జతకలిపారు. వారంతా కలిసి జగజ్జననిని నుతిస్తూ ఇలా పాడటం ప్రారంభించారు:
మాయమ్మ పదస్వర్గ మం దున్నతంబుగా
పయనించె నొక గాలిపడగలా నా మది
పాపంపు సుడిగాలి బలముగా వీచుచు
వడివడిగ భువివైపు పడద్రోసె దానిని॥ మా ॥
ఒక వైపు క్రిందికి వంచుచు మాయయె
కలచె యా నిశ్చల గమనంబు నించుక
నేనెంత శ్రమపడి ఎగురింపజూచిన
మరి దాని నింగికి మరలింపలేనైతి॥ మా ॥
దారాసుతాదు లందలి ప్రేమదారము
పెనవేసి విడరాని పీటముడి పడిపోవ
నా గాలిపడగలా నడిమికి రెండుగా
చిక్కుబడి దానిలో చినిగిపోయినదయ్యో॥ మా ॥
విజ్ఞాన మను పాగ వీడి పడిపోయెను
నే దాని విడువగా నేల మీదికి దూకె
ఏ రీతి మరి ఇది ఎగురును నింగికి
తునకలై దాని తల తునిగిపోయిన పిదప॥ మా ॥
భక్తి మాత్రము చేత బంధింపబడి కూడ
ఇటు ఆడినందున మిగిలె దుఃఖమె తనకు
అతినీచ స్థితిలోకి ఆర్వురు సమకూడి
పడత్రోసి వైచిరి బలమైన శత్రులు॥ మా ॥
అటు నవ్వు ఇటు యేడ్పు లందించు ఆటను
ఆడినందుకు దిగులునంది నరేశ్‌చంద్ర
ఈ ఆట తా నసలు ఆడకుండిన నెంత
బాగుండునో యని భావింపగా సాగె॥ మా ॥
పాట కొనసాగుతోంది. శ్రీరామకృష్ణులు, భక్తులతో కలిసి నృత్యం చేశారు. వారిలా పాడారు:
నల్లనిదౌ నా మానస మధుపము
ఉల్లాసంబుగ లాగివేయబడె
తల్లి శ్యామ పదనీరజమునకు
ఉల్లము రంజిలజేయు విధమున॥ న ॥
నీలకంధరుని రాణియె కాళి
నీల కమలమె కాళిపాదము
గ్రోలిన మధుకరి రుచిలేకుండుటచే
వ్రాలదు వాంఛాసుమముల మీదకు॥ న ॥
నల్లగ నుండును అమ్మ పాదములు
నల్లనిదే నా మానస మధుపము
నల్లని వొకటైయున్న మర్మము
అల్లనగని నా కన్నులు మరలెను॥ న ॥
అంతమునందు తీరెను కమలా
కాంతుని ఆశలు సుఖదుఃఖములచే
నెంతయు కదలక వోలలాడెను
అంతములేని ఆనందాంబుధి॥ న ॥
కీర్తన ఇలా కొనసాగింది:
ఏమిటే ఈ కీలుబొమ్మా! ఓ యమ్మా
ఎటువంటి దానిని ఏర్పరచినావు
ఏడు జానల బొమ్మ! ఎగిరెగిరి పడు బొమ్మ
బొమ్మతో ఆటలు నీ వెన్ని ఆడెదవు॥ ఏ ॥
చేత సూత్రము బూని నీవు! ఓ యమ్మ
దానిలోపల దాగినావు
దీని తెలియని కీలుబొమ్మ
తానె కదలెదనని తలపోయునమ్మ॥ ఏ ॥
అమ్మ నెవ్వరు చూచినారొ । వారలు
బొమ్మ భావము వీడుతారు
భక్తిసూత్రము చేత కొన్ని బొమ్మలే
అమ్మను బంధించివేయు॥ ఏ ॥
భక్తులు ఆనందంలో ఓలలాడారు. పాడటం ఆగిపోగానే శ్రీరామకృష్ణులు అక్కడనుంచి లేచారు. ఆయన గదిలోను, చుట్టూ ఉన్న ప్రాంతంలోను భక్తులు ఇంకా ఉన్నారు.
శ్రీరామకృష్ణులు పంచవటినుంచి తమ గదికేసి వస్తున్నారు. ఆయనతో బాటు ‘మ’ కూడా ఉన్నాడు. కాస్త దూరం వచ్చాక పొగడ చెట్టు క్రింద త్రైలోక్యుణ్ణి ఆయన కలుసుకున్నారు. త్రైలోక్యుడు, శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు.
శ్రీరామకృష్ణులు (త్రైలోక్యుడితో): పంచవటిలో వారంతా సంకీర్తన చేస్తున్నారు. కాస్త పోయి చూడు.
త్రైలోక్యుడు: నేను వెళ్లి ఏం చేసేది?
శ్రీరామకృష్ణులు: ఎందుకు, సంగీతం విని ఆనందించవచ్చు.
త్రైలోక్యుడు: నేను ఒకసారి చూసే వచ్చాను.
శ్రీరామకృష్ణులు: అలాగైతే మంచిదే.
8.11 ఏకాదశ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు – గృహస్థధర్మం
అప్పుడు సాయంత్రం ఐదు, ఆరు గంటలు అయి ఉండవచ్చు. శ్రీరామకృష్ణులు, భక్తులతో కలిసి తమ గదికి ఆగ్నేయం వైపునున్న వసారాలో కూర్చుని ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (కేదారాదులతో): సంసార త్యాగం చేసిన సాధువు భగవన్నామ స్మరణ తప్పక చేస్తాడు. అది సహజమే. అతడికి వేరే విధులంటూ ఏవీ ఉండవు. అతడు భగవద్ధ్యానంలో నిమగ్నుడై ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. అందుకు మారుగా అతడు భగవంతుని గురించి యోచించక లేక భగవన్నామ స్మరణ చేయకుంటే జనం అతణ్ణి నిందిస్తారు.
“కాని గృహస్థుడు భగవన్నామ స్మరణ గావిస్తే, అందులో ఎంతటి గొప్పతనం ఇమిడి ఉందో కదా! జనకమహారాజు విషయమే తీసుకోండి. అతడు ఎంతటి ధీరుడో! అతడు కర్మ, జ్ఞానం అనే రెండు కత్తులతో సాము చేశాడు. అతడు ఒక వంక పూర్ణబ్రహ్మజ్ఞాని. అయినప్పటికీ అతడు సంసార విధులనూ నిర్వర్తించాడు. నీతిబాహ్యురాలైన స్త్రీ ఇంటి పనులనన్నిటినీ ఎంతో శ్రమకోర్చి చేస్తుంటుంది. కాని ఆమె మనస్సు మాత్రం సర్వదా తన ప్రియుడి మీదనే మగ్నమై ఉంటుంది.
“నిరంతరం సాధు సాంగత్యం చేయటం అత్యావశ్యకం. సాధువులు, సామాన్యులకు భగవంతునితో పరిచయం కల్పిస్తారు.”
కేదార్: అవునండీ. జీవుల ఉద్ధరణకే మహానుభావుడు ఈ భువిపై అవతరిస్తాడు. ఒక రైలు ఇంజను తనతో కూడా అనేక రైలు పెట్టెలు గల పొడవైన రైలును లాగుకొనిపోయేటట్లుగానే మహానుభావుడు ఇతరులను భగవంతుని దరికి తీసుకునిపోతాడు. అనేకుల దాహాన్ని తీర్చే ఒక నది లేక తటాకం వంటి వాడు అతడు.
భక్తులు తమ ఇళ్లకు తిరిగి పోవటానికి సన్నద్ధులైనారు. ఒక్కరొక్కరుగా శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి, ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు. భవనాథ్ను చూడగానే శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “నేడు నువ్వు ఇంటికి వెళ్ళబోకు. నువ్వు కళ్ళపడినంత మాత్రానే నాలో భగవదుద్దీపన జనిస్తోంది.”
భవనాథ్కు ఇంకా వివాహం కాలేదు. అతడికి పందొమ్మిది లేక ఇరవై ఏళ్ళు ఉంటాయి. చక్కని మేని ఛాయతో అందంగా ఉంటాడు. భగవన్నామం అతడి చెవిని సోకినంత మాత్రానే ఆనందాశ్రువులు స్రవిస్తాయి. శ్రీరామకృష్ణులు అతణ్ణి సాక్షాత్తూ నారాయణ అంశగా భావిస్తారు.
8.12 ద్వాదశ పరిచ్ఛేదం అమృతుడు, త్రైలోక్యుడు ప్రభృత బ్రహ్మసమాజస్థులతో
గురువారం, మార్చ్ 29, 1883
మధ్యాహ్నం రెండు గంటలు. దక్షిణేశ్వర ఆలయంలోని శ్రీరామకృష్ణుల గది. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. గదికి ఎదురుగా పశ్చిమాన గంగానది. నదిలో పోటు ప్రారంభమైంది. ఇంతలో కలకత్తా నుంచి కొందరు భక్తులు వచ్చారు. వారిలో బ్రహ్మసమాజపు అమృతుడు, ప్రఖ్యాత గాయకుడైన త్రైలోక్యుడు కూడా ఉన్నారు. త్రైలోక్యుడు బ్రహ్మసమాజంలో ఎన్నోసార్లు భగవల్లీలా గుణగానం చేసి ఆబాలగోపాలాన్ని ముగ్ధులను చేశాడు.
రాఖాల్కు ఒంట్లో బాగాలేదు. రాఖాల్ ఆరోగ్యం గురించి శ్రీరామకృష్ణులు మాట్లాడుతున్నారు.
శ్రీరామకృష్ణులు: చూడండి, రాఖాల్కు అనారోగ్యంగా ఉంది. సోడా త్రాగితే నయమవుతుందా? ఏం అవుతుందో తెలియటం లేదు. నాయనా రాఖాల్! పూరీ జగన్నాథ ఆలయ ప్రసాదం స్వీకరించు.
ఇలా అంటూనే శ్రీరామకృష్ణులు అద్భుత పారవశ్యస్థితిలోకి వెళ్ళారు. సాక్షాత్తూ నారాయణుడే రాఖాల్ రూపంలో చిన్నపిల్లవాడిగా ఎదురుగా ఉండటం ఆయన చూస్తూన్నట్లు ఉంది. ఒక వంక, కామినీకాంచనాలు త్యజించిన పరిశుద్ధ యువకుడైన రాఖాల్; మరో వంక రేయింబవళ్ళు ప్రేమోన్మత్తతలో ఉన్న శ్రీరామకృష్ణులు. కనుకనే సహజంగానే ఆయనలో వాత్సల్యభావం కలిగింది. ఆయన రాఖాల్ పట్ల మాతృవాత్సల్యం చూపుతూ ‘గోవిందా, గోవిందా’ అంటూ ప్రేమాతిశయంతో ఉచ్చరించసాగారు. శ్రీకృష్ణుని పట్ల యశోదకు ఎటువంటి భావం ఉండినదో అలాంటి భావమే ఇదీను, అని తోచింది. భక్తులు ఈ అద్భుతాన్ని విస్తుపోయి చూస్తూ ఉన్నారు. హఠాత్తుగా అంతా నిశ్శబ్దమైపోయింది.
భక్తులకై అవతరించిన శ్రీరామకృష్ణులు గోవింద నామాన్ని ఉచ్చరిస్తూనే హఠాత్తుగా సమాధిమగ్నులైనారు. చిత్తరువు వలె ఆయన దేహం నిశ్చలమయింది; ఇంద్రియాలు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయినట్లు తోచింది. దృష్టి నాసికాగ్రంపై కేంద్రీకృతమయింది. ఆయన శ్వాసిస్తూ ఉన్నారో లేదో కూడా తెలియరావటం లేదు. దేహం మాత్రం ఈ లోకంలో ఉంది. ఆత్మపక్షి దివ్య చైతన్య సీమలలో ఎగురుతోంది. తల్లి వలె భక్తులకై ఇంతసేపూ వ్యాకులత చెందిన ఆయన మనస్సు ఇప్పడు ఎక్కడ ఉంది? ఈ అద్భుతమైన స్థితే సమాధియా?
ఆ సమయంలో కాషాయవస్త్రాలు ధరించిన ఒక అపరిచిత బెంగాలీ వ్యక్తి గదిలోకి వచ్చి నేలమీద కూర్చున్నాడు.
8.13 త్రయోదశ పరిచ్ఛేదం కాషాయవస్త్రం, సన్న్యాసి – బూటకం, అబద్ధాలు
కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ।
ఇంద్రియార్థాన్విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే ॥(గీత 3 : 6)
ఈ లోపు శ్రీరామకృష్ణుల మనస్సు బాహ్యచైతన్యంలోకి దిగి రాసాగింది. ఆ స్థితిలోనే ఆయన మాట్లాడసాగారు. తమలో తామే మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (కాషాయ వస్త్రాలు కళ్లబడటంతో): ఎందుకీ కాషాయ వేషం? కాషాయం ధరిస్తే అంతా జరిగిపోతుందా? ఒక వ్యక్తి ఒకసారి ఇలా అన్నాడు: ‘చండీ (దేవీ మాహాత్మ్యం)ని ఇచ్చి మద్దెల తీసుకొన్నాను.’ మొదట్లో అతడు చండీ స్తోత్రాలను గానం చేసేవాడు; ఇప్పు డతడు మద్దెల వాయిస్తున్నాడు. (అందరూ నవ్వారు)
“మూడు లేక నాలుగు రకాల వైరాగ్యాలు ఉన్నాయి. సంసారాగ్ని జ్వాలలకు తాళజాలక సంసారం త్యజించి కాషాయం ధరించటం; కాని ఈ వైరాగ్యం ఎక్కువ కాలం నిలువదు. పనీపాటులు లేనందున ఒక వ్యక్తి కాషాయ వస్త్రం ధరించి కాశీకి వెళతాడు. మూడు నెలల తరువాత ఆ వ్యక్తి ఇంటికి ఇలా జాబు వ్రాస్తాడు: ‘నాకిక్కడ ఒక ఉద్యోగం దొరికింది. కొద్ది రోజులలో ఇంటికి వస్తాను. నా గురించి ఆదుర్దా పడవద్దు.’ మరో తరగతి వైరాగ్యం: ఒక వ్యక్తికి ఎలాంటి లోటూ లేదు; ఏది కావాలంటే అది దక్కుతుంది. కాని అతడు వాటిని అనుభవించడంలో ఆనందం పొందడు. అతడు భగవంతుడి కోసమే విలపిస్తాడు. అదే యథార్థమైన వైరాగ్యం.
“బూటకం ఎన్నటికీ మంచిది కాదు. బూటకపు వేషధారణ మంచిది కాదు. మనస్సు వేషానికి తగ్గట్లు కనుక లేనట్లయితే, అది క్రమేణా పతనం చెందుతుంది. అబద్ధపు మాటలు పలుకుతూ బూటకపు చేష్టలు చేస్తూపోతే క్రమంగా ఆ జంకు పోతుంది. గృహస్థులు తెల్లని వస్త్రం ధరించటం అత్యుత్తమం. సంసారం పట్ల అనురక్తి, ఆదర్శం నుండి అప్పుడప్పుడు పతనం చెందటం, బాహ్యంగా కాషాయ వస్త్రాలు – ఎంతటి ఘోరమైనవి.
8.13.1 కేశవ్ ఇంట్లో ‘నవబృందావనం’ నాటకం
“నీతిమంతుడైన వ్యక్తి ఒక నాటకంలోని పాత్రలో సైతం అసత్యం పలుకటం, అధర్మంగా వర్తించటం మంచిది కాదు. ఒకసారి నేను కేశవ్ ఇంటికి ‘నవ బృందావనం’ అనే నాటక ప్రదర్శన చూడటానికి వెళ్లాను. వారు రంగస్థలం మీదికి ‘శిలువ’ ను తీసుకువచ్చారు. మరొక నటుడు నీరు సంప్రోక్షించాడు; దానిని వారు ‘శాంతిజలం’ గా పేర్కొన్నారు. మరొక నటుడు తూలుతూ, తడబడుతూ త్రాగుబోతు పాత్ర పోషించాడు.”
బ్రహ్మసమాజ భక్తుడు: అతడు ‘కు. బాబు.’
శ్రీరామకృష్ణులు: ఒక భక్తుడు ఇటువంటి పాత్రలు పోషించటం మంచిది కాదు. ఎక్కువసేపు అటువంటి విషయాలపై మనస్సు నెలకొనటం హానికరం. మనస్సు అప్పుడే చలువచేసిన ధవళ వస్త్రం లాంటిది; దాన్ని ఏ రంగులో ముంచితే ఆ రంగును సంతరించుకుంటుంది. అసత్యంలో మనస్సును ఎక్కువసేపు ముంచితే అసత్యపు మరకనే పొందుతుంది. (BG 2.62-63)
“మరొక రోజు నేను కేశవ్ ఇంటికి ‘నిమాయ్ సన్న్యాస’ మనే నాటక ప్రదర్శన తిలకించటానికి వెళ్లాను. కేశవ్ శిష్యభట్రాజులు కొందరు కలిసి మొత్తం ప్రదర్శనను పాడుచేశారు. వారిలో ఒకడు కేశవ్‌ను ‘మీరు కలియుగ చైతన్యులు’ అంటూ పొగిడాడు. కేశవ్ నన్ను చూపుతూ, ‘మరి ఈయన ఎవరు?’ అని నవ్వుతూ అడిగాడు. అందుకు నేను ఇలా జవాబిచ్చాను: ‘నేను మీ దాసానుదాసుడను. మీ పాదధూళిలో ఒక రేణువును.’ కేశవ్‌కి పేరు ప్రఖ్యాతులపట్ల మోజు ఉంది.
8.13.2 నరేంద్రాదులు నిత్యసిద్ధులు
(అమృత్, త్రైలోక్యులతో) “నరేంద్రుడు, రాఖాల్ మొదలైన కుర్రవాళ్ళు నిత్య సిద్ధులు. జన్మజన్మాంతరాలుగా వారు దైవభక్తులు. ఒక సామాన్యుడు తపశ్చర్యలతోను, కఠోర సాధనల ద్వారాను కొద్దిపాటి భక్తిని సముపార్జించుకుంటాడు. కాని ఈ యువకులు జన్మతః భక్తిని కలిగి ఉంటారు. ‘స్వయంభు శివలింగం’ (స్వతస్సిద్ధంగా వెలసినది) లాగా వీరి భక్తి స్వతస్సిద్ధం.
“నిత్యసిద్ధులు తమకు తామే ఒక శ్రేణిని రూపొందించుకుంటారు. అన్ని పక్షుల ముక్కులు వంకరగా ఉండవు కదా! నిత్యసిద్ధులు ఎన్నటికీ సంసారాసక్తులు కాజాలరు. ప్రహ్లాదుడు ఇందుకు చక్కని దృష్టాంతం.
“సామాన్య మానవులు ఆధ్యాత్మిక సాధనలు చేస్తారు; భగవంతుడి పట్ల భక్తిని పెంపొందించు కుంటారు. వారు సంసారాసక్తులై కామినీకాంచనాల వ్యామోహంలో కూడా పడిపోతారు. వారు ఈగల వంటివారు; ఈగలు పువ్వుల మీద, తీపి పదార్థాలపై వ్రాలతాయి; మరుక్షణమే మలం పైన కూడా వ్రాలతాయి. (అంతా మౌనంగా వింటున్నారు.)
“కాని నిత్యసిద్ధులు తేనెటీగల వంటివారు; అవి పువ్వుల మీద మాత్రమే వ్రాలి మకరందాన్ని గ్రోలుతాయి. నిత్యసిద్ధులు భగవదానంద రసాన్ని గ్రోలుతారు. వారు విషయ రసాన్ని కన్నెత్తి కూడా చూడరు.
“కఠోరసాధనానుష్ఠానాల ఫలంగా ఆర్జించుకున్న సామాన్యభక్తి లాంటిది కాదు నిత్యసిద్ధుల భక్తి. నియమిత జపధ్యానపూజాదికాల ద్వారా లభించే భక్తి ‘వైదీభక్తి.’ ఇది పైరు కోయక మునుపు గనిమల మీదుగా చుట్టుతిరిగి పొలాన్ని దాటి పోవటం లాంటిది. సమీప గ్రామాన్ని పడవలో నది మీదుగా చుట్టుతిరిగి చేరుకోవటం లాంటిది ఈ వైధీభక్తి.
“ప్రేమభక్తి లేక రాగభక్తి జనించి భగవంతుడు తనకు సొంతవాడనే ప్రేమ అలవడినప్పుడు విధినియమాలు, పూజా విధానాలు అంటూ ఏవీ ఉండవు. అప్పుడది కోతలు పూర్తయ్యాక పొలంమీదుగా తిన్నగా పోవటం లాంటిది, చుట్టు తిరిగి పోనక్కరలేదు. ఏ దిశలోనైనా తిన్నగా పొలం మీదుగా పోవచ్చు.
“వరదలొచ్చి గ్రామసీమ నీటిలో మునిగి ఉన్నప్పుడు, నది మీదుగా చుట్టు తిరిగి పోనక్కరలేదు. అప్పుడు పొలాలు నీటిలో మునిగి ఉంటాయి కనుక, పడవపై పొలాల మీదుగా తిన్నగా నీ గ్రామాన్ని చేరుకోవచ్చు.
“అలాంటి రాగభక్తి, అనురాగం, ప్రేమ కలుగనిదే భగవత్సాక్షాత్కారం లభించదు.”
8.13.3 సమాధి తత్త్వం – సవికల్పం, నిర్వికల్పం
అమృతుడు: అయ్యా, సమాధిస్థితిలో మీరెలా భావిస్తారు?
శ్రీరామకృష్ణులు: ఇది భ్రమరకీటక న్యాయం లాంటిది సుమా! కీటకం భ్రమరాన్నే తదేకంగా చింతన చేస్తూ భ్రమరంగా రూపాంతరీకరణం చెందుతుంది. ఆ సమయంలో నే నెలా భావిస్తానో నీకు తెలుసా? కడవలోని చేపను గంగాజలాలలో విడిచిపెడితే ఆ చేప ఎలా భావిస్తుందో నేనలా భావిస్తాను.
అమృతుడు: అట్టితరి జాడమాత్రమైన అహంకారం కూడా మీలో ఉండదా?
శ్రీరామకృష్ణులు: అవును, నాకు సామాన్యంగా రవ్వంత మిగిలి ఉంటుంది. గీటురాయిపై ఒక గింజ పరిమాణపు బంగారాన్ని ఎంతగా రుద్దినప్పటికీ ఒక తునక మిగిలే ఉంటుంది. లేకపోతే దావాగ్నిని ఉదాహరణగా తీసుకో. దాన్లోని ఒక ‘స్ఫులింగం’ లాంటిది అహంకారం. సమాధి స్థితిలో నాకు బాహ్యచైతన్యం ఉండదు; కాని భగవంతుడు జాడమాత్రమైన అహంకారాన్ని నాలో నిలిపి ఉంచుతాడు. దైవ సంసర్గంలోని ఆనందాన్ని అనుభవించే నిమిత్తం ‘నేను’, ‘నువ్వు’ అనే భావాలు మిగిలి ఉన్నప్పుడే ఆనందం అనుభూతమౌతుంది.
“ఒక్కోసారి భగవంతుడు జాడమాత్రమైన ఆ ‘నేను’ ను కూడా తొలగించి వేస్తాడు. అప్పుడు జడసమాధి లేక నిర్వికల్ప సమాధి సిద్ధిస్తుంది. ఆ అనుభవం వర్ణింప తరంకాదు. ఉప్పుబొమ్మ ఒకటి సముద్రపు లోతును కొలవటానికి పోయింది. నీళ్లలో కాస్త లోతుకు వెళ్లగానే అది కరిగిపోయింది. సముద్రపు నీటితో పూర్తిగా ఐక్యమైపోయింది. అలాంటప్పుడు వెనక్కు తిరిగి వచ్చి సముద్రపు లోతును తెలిపేవారెవరు?”