7.1 ప్రథమ పరిచ్ఛేదం ముక్తపురుషుని దేహత్యాగం ఆత్మహత్య అవుతుందా?
న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః ।
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ॥(గీత 2 : 20)
గురువారం, డిసెంబరు 14, 1882
అప్పుడు మధ్యాహ్న సమయం. దక్షిణేశ్వర దేవాలయం. విజయ్‌కృష్ణ గోస్వామి, శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు బ్రహ్మ సమాజస్థులుకూడా అతడితో కలసి వచ్చారు. వారు కలకత్తా నుంచి ఒక పడవలో శ్రీరామకృష్ణులకు పరమభక్తుడైన బలరాంతో కలసి వచ్చారు. శ్రీరామకృష్ణులు కాస్సేపు విశ్రాంతి తీసుకున్నారు.
ఆదివారాల నాడు భక్తులు అనేకులు వస్తారు. శ్రీరామకృష్ణులతో ఏకాంతంగా మాట్లాడ గోరేవారు సామాన్యంగా ఆదివారం కానిరోజుల్లో వస్తారు.
శ్రీరామకృష్ణులు మంచంమీద కూర్చుని ఉన్నారు. విజయ్, బలారాం, ‘మ’, మరికొందరు భక్తులు తూర్పుముఖంగా శ్రీరామకృష్ణులను చూస్తూ చాపమీద, మరికొందరు నేలమీద కూర్చుని ఉన్నారు. గది పశ్చిమద్వారం గుండా గంగానదిని చూడవచ్చు. శీతకాలపు గంగ ప్రశాంతంగా స్వచ్ఛమైన నీటితో ప్రవహిస్తోంది. పశ్చిమ ద్వారం తలుపుకు ఆవల అర్ధచంద్రాకార వసారా, దాని తరువాత పువ్వుల తోట, ఆ పైన గంగానది గట్టు, దానికి ఆవల కాళీ ఆలయాన్ని స్పృశిస్తూ ఆనందంగా ప్రవహిస్తూ సర్వ పాపాలను ప్రక్షాళన చేసే పవిత్రగంగ.
శీతకాలం కావడంచేత అందరూ ఉన్ని శాలువలు కప్పుకుని ఉన్నారు. విజయ్ కడుపు నొప్పితో బాధపడుతున్నాడు; తనతో కూడా సీసాలో ఔషధం తెచ్చుకున్నాడు. కాలానుగుణంగా ఔషధం పుచ్చుకుంటాడు. విజయ్ సాధారణ బ్రహ్మసమాజంలో జీతం పుచ్చుకునే ఆచార్యుడు. సమాజపు వేదిక పైకెక్కి ఉపన్యాసాలు ఇవ్వటం అతడి పని. ప్రస్తుతం బ్రహ్మ సమాజపు పలు సిద్ధాంతాలతో అతడికి అభిప్రాయ భేదాలు ఏర్పడి ఉన్నాయి. కానీ ఏం చెయ్యగలడు? జీతం పుచ్చుకుని పనిచేసే అతడికి తన అభిప్రాయాలను వ్యక్తం చేయటానికో, ఇచ్ఛానుసారం ప్రవర్తించటానికో వీలులేదు.
విజయ్ కులీన వంశానికి చెందినవాడు. అద్వైత గోస్వామి వంశజుడు. అద్వైత గోస్వామి ఒక జ్ఞాని. ఆయన నిరాకార పరబ్రహ్మాన్ని ధ్యానించేవాడు. శ్రీచైతన్య మహాప్రభువుల సన్నిహిత సహచరులలో ఆయన ఒకడు; హరిప్రేమోన్మాదంలో తనను మరిచి నాట్యం చేసేవాడు. అలా నాట్యం చేసేటప్పుడు, ధరించిన వస్త్రం జారిపోతున్నా కూడా ఆయనకు ఆ స్పృహే ఉండేది కాదు. విజయ్ నిరాకార పరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ వచ్చాడు. అయితే మహాభక్తుడైన అద్వైత గోస్వామి రక్తం అతడి నరనరాల్లో ప్రవహిస్తోంది కదా! కనుకనే అతడిలోని హరిప్రేమ అనే బీజం మొలకెత్తటానికి సిద్ధంగా ఉంది; అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంది, అంతే. అందుచేతనే అతడు దేవతలక్కూడా కానరాని శ్రీరామకృష్ణుల హరిప్రేమ దైవోన్మత్త స్థితిని గాంచి దాన్లో తనను మరచిపోయాడు. పాము ఎలా మంత్రగాడి మంత్రానికి ముగ్ధమై అతడి ప్రక్కనే పడివుంటుందో అదే విధంగా విజయ్ కూడా పరమహంస దేవుల వచనామృతాన్ని గ్రోలి, దాన్లోనే తనను విస్మరించి ఆయన ప్రక్కనే కూర్చుని ఉంటాడు. ఆయన హరిప్రేమలో మునిగిపోయి బాలునివలె నాట్యం చేసేటప్పుడు ఆయనతో కలిసి నాట్యం చేస్తాడు.
అరియదాహా (దక్షిణేశ్వరానికి ప్రక్కనున్న ఒక గ్రామం)లో నివసిస్తూన్న విష్ణు అనే బాలుడు ఇటీవల కత్తితో గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకొన్న విషయం ప్రస్తావనలోనికి వచ్చింది.
శ్రీరామకృష్ణులు (‘మ’, విజయాది భక్తులతో): ఆ బాలుడు దేహత్యాగం చేశాడన్న వార్త విన్నప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. అతడు ఒక పాఠశాలలో చదువుకునేవాడు; ఇక్కడకు తరచూ వస్తూవుండేవాడు. ఈ లౌకిక జీవితం తనకు రుచించదని తరచూ చెప్పుకునేవాడు. అతడు ఎవరో బంధువులతో పశ్చిమ ప్రాంతాల్లో (బెంగాల్‌కు పశ్చిమంగా అంటే, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ ప్రాంతాలు) కొద్దిరోజులు నివసించాడు. ఆ సమయంలో మైదానాలలో, కొండలలో, అడవులలో సర్వదా ఏకాంతంగా కూర్చుని ధ్యానం చేసేవాడు. అనేక దైవ స్వరూపాల దర్శనాలు తనకు కలిగినవని నాతో చెప్పాడు. బహుశా ఇదే అతడి చివరి జన్మ అయివుంటుంది. గత జన్మలోనే దాదాపు అన్ని కర్మలు అతడు పూర్తి చేసుకుని ఉంటాడు. కొద్దిగా మిగిలిన కర్మ ఈ జన్మలో పూర్తిచేసి ఉంటాడు.
“పూర్వజన్మ సంస్కారాలు సంక్రమిస్తాయని ఒప్పుకోవలసిందే. శవసాధన* అనుష్ఠించిన వ్యక్తి కథ ఒకటి ఉంది. ఒక వ్యక్తి కీకారణ్యంలో దేవిని ఆరాధిస్తూ శవసాధన ప్రారంభించాడు. మొదట్లో అతడికి అనేక భయానక దృశ్యాలు గోచరించాయి. చివరకు ఒక పెద్దపులి అతడి మీద పడి చంపేసింది. ఆ సమయంలో ఆ దారినపోతూన్న మరొక వ్యక్తి పులిని చూసి గభాలున ఒక చెట్టుపైకి ఎక్కేశాడు. పులి వెళ్లిపోయాక ఈ వ్యక్తి చెట్టుదిగి పూజకై సరంజామా అంతా సిద్ధంగా ఉండటం చూశాడు. ఆచమనం చేసి శవం మీద ఆసీనుడైనాడు. ఒకింతసేపు జపం చేయటంతోనే దేవి ప్రత్యక్షమై ఇలా పలికింది : ‘నాయనా! నీపట్ల నేను ప్రసన్నురాలనైనాను. నానుంచి ఏదైనా వరం కోరుకో.’ దేవి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేసి అతడిలా అన్నాడు: ‘తల్లీ! నిన్నొక ప్రశ్న అడగవచ్చునా? ఈ నీ ప్రవర్తన నన్ను అద్భుతంలో ముంచి అవాక్కుని చేసింది. ఆ వ్యక్తి ఎంతో శ్రమకోర్చి పూజోపకరణాలను సేకరించి, నిన్ను ఎన్నో రోజులుగా ఆరాధిస్తూన్నాడు. కాని అతడిపట్ల నీ దయ ప్రసరించలేదు. నేనో! భజనహీనుడను, సాధనహీనుడను, జ్ఞానహీనుడను, భక్తిహీనుడను; నీ ఉపాసనా విధులేవీ తెలియనివాడను. అటువంటి నేను నీ దయకు ఇంత పాత్రుడను అవుతున్నానే!’ దేవి చిరుదరహాసంతో ఇలా పలికింది: ‘కుమారా! నీ గతజన్మల స్మృతి నీకు లేదు. పెక్కు జన్మలుగా జపతపాలతో నన్ను ఉపాసించి ఉన్నావు. ఆ తపోబలం కారణంగా అప్రయత్నంగానే నీకీ అవకాశం కలిగింది; నా దర్శనభాగ్యం పొందగలిగావు. ఇప్పుడు ఏం వరం కావాలో కోరుకో.’”
ఒక భక్తుడు: ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని విని భయం వేస్తోంది.
శ్రీరామకృష్ణులు: ఆత్మహత్య మహాపాపం. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తి ఈ లోకంలో బాధలు అనుభవించాలి. కాని భగవత్సాక్షాత్కారానంతరం ఒక వ్యక్తి దేహత్యాగం చేసుకొంటే, దానిని ఆత్మహత్య అని చెప్పరాదు. ఆ రీతిలో దేహత్యాగం చేసుకొనటంలో దోషం ఏమీ ఉండదు. జ్ఞానోపలబ్ధి తదనంతరం కొందరు శరీరాన్ని చాలించుకుంటారు. మట్టి మూసలో బంగారు ప్రతిమ రూపొందాక ఆ మూసను పదిలపరచుకోవచ్చు లేదా విరగగొట్టి పారవెయ్యనూవచ్చు.
“చాలా సంవత్సరాల క్రితం సుమారు ఇరవై ఏళ్ల యువకుడొకడు బారానగర్ నుండి దక్షిణేశ్వరానికి వస్తూవుండేవాడు. అతడి పేరు గోపాల్ సేన్. ఇక్కడకు వచ్చేటప్పుడు అతడు తీవ్ర భావపారవశ్యం పొందేవాడు. ఆ భావపారవశ్యంలో అతడు క్రిందపడి కాళ్లు విరుగగొట్టు కుంటాడేమోననే భయంతో హృదయ్ అతడికి ఆసరాగా నిలబడేవాడు. ఇలావుండగా అతడొక రోజు నా కాళ్ళు స్పృశించి ఇలా అన్నాడు: ‘మహాశయా! ఇకమీదట మీ దర్శనార్థం నేను రాలేను. అందుకే మీనుంచి సెలవు పుచ్చుకుంటున్నాను.’ కొన్ని రోజుల తరువాత అతడు శరీరత్యాగం చేశాడని నాకు తెలిసింది.
7.2 ద్వితీయ పరిచ్ఛేదం నాలుగు రకాల జీవులు – కామినీ కాంచనాలు బద్ధజీవుల లక్షణాలు
అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్ ॥(గీత 9 : 33)
శ్రీరామకృష్ణులు: “బద్ధులు, ముముక్షువులు, ముక్తులు, నిత్యముక్తులు అనే నాలుగు తరగతులుగా జీవులను వర్గీకరించవచ్చు.
“ఈ సంసారం చేపల వల వంటిది. జీవులు చేపలు; ఎవరి మాయతో ఈ సంసారం సృజించబడిందో ఆ భగవంతుడు జాలరి. జాలరి వలలో చేపలు పడినప్పుడు కొన్ని చేపలు వలను కొరికి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాయి. అటువంటి వారినే ముముక్షువు లంటారు.
“అయితే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న చేపలు అన్నీ తప్పించుకోలేవు. వాటిలో కేవలం ఏ మూడో నాలుగో మాత్రమే వలనుండి బయటకు గెంతి, తప్పించుకోగలవు; అప్పుడు జనం ‘అదుగో! ఓ పెద్ద చేప తప్పించుకుంటోంది!’ అంటారు. అదే విధంగా ముగ్గురో నలుగురో మాత్రమే జీవన్ముక్త స్థితి నొందుతారు, వీరిని ముక్తజీవులు అంటారు.
“కొన్ని చేపలు ఎంతో జాగ్రత్త వహించి ఎప్పటికీ వలలో చిక్కుకోవు; నారదాది పురుషులు ఎన్నటికీ ఈ సంసారజాలంలో చిక్కుకోరు. ఈ కోవకు చెందిన వారిని నిత్యముక్తులంటారు.
“కాని చేపలలో అత్యధికాంశం వలలో చిక్కుకుంటాయి. వాటికి వలను గురించీ, ఆసన్నమవుతున్న చావు గురించీ ఎరుకే ఉండదు. అవి ఆ వలలోనే క్రీడిస్తూ, వలలోనే ఇంకా లోతుకు పోయి బురదలో దాగుకోవడానికి ప్రయత్నిస్తాయి. తప్పించుకోవటానికి కనీస ప్రయత్నమన్నా చేయవు. పైగా మరింతగా బురదలో కూరుకుపోవటానికే యత్నిస్తాయి. ఈ చేపలు బద్ధజీవుల వంటివి. అవి ఇంకా వలలోనే ఉన్నప్పటికీ తాము సురక్షితంగా ఉన్నామని భావిస్తాయి.
“భ్రష్టత అనే రొంపిలో పూర్తిగా కూరుకుపోయి బద్ధజీవి కామినీ కాంచనాలలోనే మునిగిపోయి ఉంటాడు. అయినప్పటికీ అతగాడు తాను ఆనందంగా, సురక్షితంగా ఉన్నాననే భావిస్తాడు. ముముక్షువులూ, ముక్తజీవులూ సంసారాన్ని పాపకూపంగానే చూస్తారు. వారికి సంసారం రుచించదు. అందుచేతనే జ్ఞానలబ్ధి నొందాక, ఆత్మసాక్షాత్కారానంతరం వారు శరీరాన్ని చాలిస్తారు. కాని అలా శరీరత్యాగం చేయడమనేది అరుదు.
“బద్ధజీవులు, అంటే సంసారజీవులు ఏ విధంగానూ చైతన్యం చెందరు. వారు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తారు, ఎన్నో ఆపదలను ఎదుర్కొంటారు; అయినప్పటికీ వారికి బుద్ధిరాదు.
“ఒంటెకు ముళ్లకంపలంటే బహు ప్రీతి. అయితే అది ఎంత ఎక్కువగా ముళ్లను తింటుందో అంతగా దాని నోటి నుండి ‘గడ గడ’ రక్తం కారుతుంది. ఐనప్పటికీ అది ముళ్ళకంపలనే తింటుంది, మానుకోదు! సంసారులు ఎంతగానో శోకతాపాలను అనుభవిస్తారు. అయితే వాటినంతా కొద్ది రోజుల్లోనే విస్మరించి మళ్ళీ పాత జీవితాన్నే ప్రారంభిస్తారు. ఒక వ్యక్తికి భార్య మరణించినప్పుడో లేక అతడిపట్ల అవిశ్వాసురాలైనప్పుడో ఆమెను వదలి వేసి అతడు పునర్వివాహం చేసుకుంటాడు. కుమారుడు మరణించినప్పుడు తల్లి దుఃఖంతో క్రుంగిపోతుంది; కొన్ని రోజుల గడిచాక ఆమె ఆ సంఘటన గురించి పూర్తిగా మరిచిపోతుంది. కాని కొన్నిరోజుల క్రితం దుఃఖసాగరంలో మునిగి పోయిన ఆ తల్లి ఇప్పుడు జడ వేసుకొని, పువ్వులు అలంకరించుకుని, నగలు ధరిస్తుంది. ఇదే విధంగా కుమార్తె వివాహం జరిపి దివాలా ఎత్తాక కూడా ఆ తండ్రి ఏటా పిల్లలను కంటూనే ఉంటాడు. వ్యాజ్యాలలో చితికిపోయినప్పటికీ జనం న్యాయస్థానాలకు ఎక్కుతూనే ఉంటారు. పుట్టిన బిడ్డలకు సరిగ్గా తిండి పెట్టలేరు, చదివించలేరు, సరైన రీతిలో పెంచనూలేరు; అయినా కూడా ప్రతి ఏటా పిల్లలను కంటూనే ఉంటారు.
“సంసారాసక్తుడు చుంచెలుకను మ్రింగ ప్రయత్నించే పాము వంటివాడు. పాము చుంచెలుకను మ్రింగాలేక క్రక్కాలేక అవస్థపడుతుంది. బద్ధజీవి అంటే సంసారి కూడా అదే కోవకు చెందుతాడు. పుల్లమామిడిలో టెంక, చెక్కు తప్ప సారం ఏమీ లేనట్లే సంసారంలో సారం ఏమీలేదని ఎరిగినప్పటికీ అతడు దాన్ని త్యజించి తన మనస్సును భగవంతుడి వైపు మరల్చడు.
“నేనొకసారి కేశవసేన్ బంధువు ఒకరిని కలిశాను. అతడికి ఏభై ఏళ్లు ఉంటాయి, పేక ఆడుతూ ఉన్నాడు – భగవంతుని స్మరించే సమయం ఇంకా ఆసన్నం కానట్లు.
“బద్ధజీవుడి లక్షణం మరొకటి ఉంది. అతణ్ణి లౌకిక పరిసరాల నుండి తొలగించి, ఆధ్యాత్మిక వాతావరణంలోకి ప్రవేశపెడితే అతడు క్రమేణా కృశించిపోతాడు. మురుగులో పెరిగే పురుగు అక్కడ నివసించటంలో ఆనందిస్తుంది, పుష్టి నొందుతుంది. ఆ పురుగును అన్నపు కుండలో ఉంచితే అది మరణిస్తుంది.” (అందరూ మౌనంగా ఉండిపోయారు)
7.3 తృతీయ పరిచ్ఛేదం తీవ్రవైరాగ్యం – బద్ధజీవి
అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలమ్ ।
అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే ॥(గీత 6 : 35)
విజయ్: ముక్తిని సాధించడానికి బద్ధజీవుడి మనస్సు ఏ స్థితిలో ఉండాలి?
శ్రీరామకృష్ణులు: భగవత్కృపచేత తీవ్ర వైరాగ్యం కలిగితే, ఈ కామినీ కాంచనాల పట్లగల అనురక్తి నుండి విడివడవచ్చు. తీవ్రవైరాగ్యం అంటే ఏమిటి? మంద వైరాగ్యం ఉన్న వ్యక్తి, ‘సరే, జరగవలసింది ఏమిటో జరుగుతుంది; భగవన్నామ స్మరణ చేస్తూవుంటే చాలు’ అంటాడు. కాని తీవ్ర వైరాగ్యం గల వ్యక్తి, తల్లి తన బిడ్డకై వ్యాకులత చెందేట్లు, భగవంతుడికై వ్యాకులతతో తల్లడిల్లిపోతాడు; భగవంతుని తప్ప అన్యం దేన్నీ ఆకాంక్షించడు. అట్టి వ్యక్తి ఈ సంసారాన్ని మృత్యుకూపంగా పరిగణిస్తాడు, దాన్లో తాను మునిగిపోతానేమో అని భావిస్తాడు. తన బంధువులను కాలసర్పాల క్రింద పరిగణిస్తాడు; వారి బారి నుండి పారిపోవాలనుకుంటాడు, పారిపోతాడు కూడా. ‘ముందు నా కుటుంబానికి తగిన ఏర్పాట్లు చేసి ఆ తరువాత భగవత్ చింతన చేస్తాను’ అని అతడు ఎన్నడూ తలపోయడు. అతడికి గొప్ప ఆంతరిక స్థైర్యం ఉంటుంది.
“తీవ్ర వైరాగ్యం గురించి కథ ఒకటి మీకు చెబుతాను; దేశంలోని ఒక ఫలానా ప్రాంతంలో ఒకప్పుడు అనావృష్టి సంభవించింది. చాలా దూరంలోని ఏటి నుండి తమ పొలాలలోకి నీరు పారటానికి రైతులు కాలువలను త్రవ్వ సమకట్టారు. ఒక రైతు మాత్రం దృఢనిశ్చయుడై ఉన్నాడు. తన పొలంలోకి ఏటి నీరు పారేటంత వరకు, అంటే కాలువ, ఏటిని కలిసే వరకు తను కాలువను త్రవ్వటం ఆపనని శపథం పూని త్రవ్వటానికి ఉపక్రమించాడు. అతడు స్నానం చేసే వేళ అవటంతో అతడి భార్య, కుమార్తెతో నూనె పంపించింది. ‘నాన్నా! ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఒంటికి నూనె పట్టించుకొని స్నానం చేయి’ అంది కుమార్తె. ‘వెళ్ళిపో ఇక్కణ్ణుంచి. ఇంకా ఎంతో పని చేయాల్సి ఉంది’ అంటూ గద్దించాడు ఆ రైతు. మధ్యాహ్నం దాటిపోయినా రైతు ఇంకా పొలంలోనే ఉండిపోయాడు. అతడు తన స్నానం గురించి కూడా యోచించలేదు. అప్పుడు అతడి భార్య పొలానికి వచ్చి ఇలా అంది: ‘నువ్వింకా స్నానం ఎందుకు చేయలేదు? అన్నం చల్లారిపోతోంది. అన్నీ నువ్వు అతిగా చేస్తావు. మిగిలిన పనిని రేపు చేసుకోవచ్చు లేదా భోజనానంతరం చేసుకోవచ్చు.’ ఆ రైతు కోపావేశంలో ఆమెను తిట్టి, పలుగు పార పుచ్చుకొని ఆమెను తరుముతూ ఇలా గద్దించాడు ‘ఏమిటీ? నీకు బుద్ధి అంటూ ఏమైనా ఉందా? వర్షాలు బొత్తిగా లేవు. పంటలు ఎండిపోతున్నాయి. పిల్లలు ఏం తింటారు? మీరంతా పస్తుండి చావాల్సి వస్తుంది. ఈ రోజు పొలంలోకి నీరు తీసుకురాకుండా నేను స్నానం, భోజనం గురించి యోచించనని శపథం పూనాను.’ భర్త పట్టుదల చూసి భయంతో భార్య అక్కడ నుండి పరుగెత్తిపోయింది. రైతు ఆ పగలంతా నిర్విరామంగా శ్రమించి సాయంకాలానికి తాను త్రవ్విన కాలువను ఏటితో కలుపగలిగాడు. తరువాత మర్మర ధ్వనితో నీరు తన పొలంలోకి పారటం ఆ రైతు తాపీగా కూర్చుని చూడసాగాడు. అతడి మనస్సు శాంత్యానందాలతో నిండిపోయింది. అతడు ఇంటికి వెళ్ళి, భార్యను పిలిచి ‘ఇప్పుడు ఆ నూనె పట్రా, హుక్కా సిద్ధం చేయి’ అన్నాడు. తరువాత ప్రశాంతంగా అతడు స్నానం చేసి, తృప్తిగా భోజనం చేసి చీకుచింతాలేక హాయిగా నిద్రపోయాడు. ఆ రైతు కనబరచిన దృఢసంకల్పం తీవ్రవైరాగ్యానికి ఒక ఉదాహరణ.
“అదే ప్రాంతపు మరొక రైతు తన పొలంలోకి నీరు పారటానికి ఒక కాలువను త్రవ్వుతున్నాడు. అతడి భార్యకూడా పొలానికి వచ్చి ఇలా అంది: ‘ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇంటికి రా. అతిగా పనిచేయాల్సిన అగత్యం ఏమీలేదు.’ ఆమె మాటలకు అతడు అంతగా ఎదురాడక పలుగు, పార ప్రక్కన పెట్టి భార్యతో ఇలా అన్నాడు: ‘సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇంటికి వస్తున్నాను.’ (అందరూ నవ్వారు) ఆ రైతు తన పొలానికి నీరు పారించుకొనటంలో ఎన్నటికీ సాఫల్యం చెందలేదు. ఇదే మంద వైరాగ్యానికి ఒక ఉదాహరణ.
“దృఢసంకల్పం కొరవడి ఈ రైతు తన పొలానికి నీరు పారించుకొనలేనట్లే తీవ్రవ్యాకులత లేకుండా మనిషి భగవత్సాక్షాత్కారం పొందలేడు.”
7.4 చతుర్థ పరిచ్ఛేదం కామినీ కాంచనాల వల్లే బంధం
ఆపూర్యమాణమచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ ।
తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే స శాన్తిమాప్నోతి న కామకామీ ॥(గీత 2 : 70)
శ్రీరామకృష్ణులు: (విజయ్‌తో) “ఇదివరలో మాదిరి ఇప్పుడు నువ్వు ఎందుకు తరచూ రావటం లేదు?”
విజయ్: ఇక్కడకు రావాలనే అభిలాష ఉంది కానీ నేను స్వతంత్రుణ్ణి కాను. బ్రహ్మసమాజంలో పనికి కుదిరాను గదా!
శ్రీరామకృష్ణులు: కామినీ కాంచనాలే జీవుణ్ణి బద్ధుని చేసి అతడి స్వేచ్ఛను హరించివేస్తాయి. కామం కారణంగానే కాంచనం (ధనం) ఆవశ్యకత కలుగుతుంది. అందుచేతనే మరొకరికి బానిస అవటం జరుగుతుంది. తత్ఫలితంగా అతడు తన స్వతంత్రాన్ని కోల్పోతాడు. ఆ తరువాత తన ఇచ్ఛానుసారం ప్రవర్తించలేడు.
“జైపూర్‌లోని గోవిందజీ ఆలయ పూజారులు మొదట్లో అవివాహితులుగా ఉండేవారు. ఆ సమయంలో వారు మంచి తేజస్వులై భాసిల్లారు. ఇలా ఉండగా ఒక సందర్భంలో జైపూర్ రాజు వారిని తన వద్దకు రమ్మని కబురు పంపాడు. కాని వారు రాజు కబురును పట్టించుకోకపోగా ఆ కబురు తెచ్చిన వ్యక్తితో ‘ఆ రాజునే వచ్చి మమ్మల్ని కలుసుకోమను’ అని జవాబు చెప్పారు. రాజు, మంత్రులతో సంప్రతించి ఆ పూజారులకు వివాహాలు చేయించాడు. ఆనాటి నుండి రాజు ఆ పూజారుల కోసం కబురు పంపవలసిన అగత్యం ఏర్పడలేదు. పూజారులే తమకు తామై రాజు వద్దకు వచ్చి ఇలా అనేవారు: ‘మహారాజా! తమరిని ఆశీర్వదించే నిమిత్తం వచ్చాం. ఆలయంలో పూజించిన పుష్పాలు ఇవిగో, దయతో స్వీకరించండి.’ అప్పటి నుండి ఏదో ఒక కార్యార్థం – గృహ నిర్మాణానికి, పిల్లల అన్నప్రాసనకు, అక్షరాభ్యాసానికి అంటూ – ధనం అవసరమై ఆ పూజారులు రాజభవనానికి సదా రాసాగారు.
“పన్నెండు వందలమంది వైష్ణవ సన్న్యాసుల, పదమూడు వందల మంది సన్న్యాసినుల గురించిన ఒక కథ ఉంది. నిత్యానంద గోస్వామి తనయుడైన వీరభద్రుడికి పదమూడు వందల మంది సన్న్యాస శిష్యులు ఉండేవారు. ఆ శిష్యులు గొప్ప ఆధ్యాత్మిక శక్తిని సంతరించుకున్నారు. అది గురువుకు భయహేతువైనది. అతడు ఇలా ఆలోచించాడు: ‘నా శిష్యులు గొప్ప ఆధ్యాత్మిక శక్తులను సముపార్జించుకున్నారు. వీరు జనానికి ఏం చెబితే అది జరిగి తీరుతుంది. వీరు ఎక్కడకు వెళ్ళినా భయం కలిగించే పరిస్థితులు కల్పిస్తున్నారు; ఎందుకంటే, నేరక వీరిని ఉల్లంఘించినా జనులకు దుఃఖం వాటిల్లుతుంది.’ ఈ విధంగా ఆలోచించి వీరభద్రుడు ఆ శిష్యులను తన వద్దకు పిలిపించి ‘గంగాతీరంలో మీ సంధ్యావందనాది కార్యక్రమాలను పూర్తిచేసుకుని నన్ను వచ్చి కలుసుకోండి’ అని వారితో చెప్పాడు. ఈ శిష్యులు ఉన్నత ఆధ్యాత్మిక ప్రవృత్తి గలవారు. వీరు ధ్యానం చేస్తూ సమాధి స్థితి నొందేవారు. నది పోటు సమయంలో వీరి తలల మీదుగా నీరు ప్రవహించటంగాని, తరువాత నది పాటు కాలంలో ఆ నీరు వెనక్కు పోవటంగాని వారికి ఎరుకే ఉండేది కాదు.
“ఈ సందర్భంలో, వీరిలో నూరుమంది శిష్యులు తమను గురువు ఏం అడగబోతాడో ముందుగానే గ్రహించారు. ఆయన సమక్షానికి వెళితే ఆయన ఆజ్ఞను పాటించవలసి వస్తుంది కాబట్టి వారు అక్కడ నుండి వెంటనే కనుమరుగయ్యారు. కాబట్టి వీరు, తక్కిన శిష్యులతోపాటు వీరభద్రుని వద్దకు తిరిగి వెళ్ళలేదు. తమ ధ్యాన కార్యక్రమాన్ని పూర్తిచేసుకొని తక్కిన పన్నెండు వందల మంది శిష్యులూ గురువు సమక్షానికి వెళ్ళారు. అప్పుడు వీరభద్రుడు వారి నుద్దేశించి ఇలా అన్నాడు: “ఈ పదమూడు వందల మంది సన్న్యాసినులు మిమ్మల్ని సేవిస్తారు. మీరు వీరిని వివాహం చేసుకోండి.” అందుకు ఆ శిష్యులు ‘గురువర్యా! తమ ఇచ్ఛానుసారమే చేసుకుంటాం. కాని మాలో నూరుమంది వెళ్ళిపోయారు’ అని విన్నవించారు. నాటినుంచి ఈ పన్నెండు వందల మంది శిష్యులు ప్రతి ఒక్కరికీ భార్యలు ఏర్పడ్డారు. పర్యవసానంగా వారందరూ తమ ఆధ్యాత్మిక తేజాన్ని కోల్పోయారు, వారి తపోబలం అడుగంటింది. స్త్రీ సాంగత్యం వారి స్వాతంత్ర్యాన్ని అపహరించి వారి ఆధ్యాత్మికతను హరించివేసింది.
(విజయ్‌తో) “ఇతరుల వద్ద పనికి కుదురుకున్నందున నువ్వు ఎంతగా దిగజారిపోయావో నీకే తెలిసివుంటుంది. మళ్ళీ, విశ్వవిద్యాలయ పట్టాలు అనేకం పుచ్చుకున్న వ్యక్తులు, ఆంగ్ల విద్యావిధానంలో పండితులైనవారు ఆంగ్లేయుల వద్ద కొలువులో చేరి అనుదినం వారి చెప్పుల క్రింద కుక్కిన పేనుల్లా పడివుండటం చూస్తూనేవున్నాం. దీని కంతటికీ కామమే ఏకైక కారణం. వీరు వివాహం చేసుకుని భార్య పిల్లలతో ‘సుఖప్రద’ సంసారాన్ని నెలకొల్పుతారు. ఎంతగా గింజుకున్నా ఇప్పుడు వారు వెనక్కు వెళ్ళలేరు. ఇందువల్లనే బానిసలై ఈ అవమానాలూ, తిరస్కృతులూ, బాధలూ సహిస్తూ ఉండటం.
7.4.1 భగవద్దర్శనానంతరం స్త్రీని మాతృభావంతో పూజించడం
“తీవ్రవైరాగ్యం ద్వారా భగవత్సాక్షాత్కారం పొందిన తరువాత ఆ వ్యక్తికి స్త్రీ పట్ల అనురక్తి ఉండదు. గృహస్థ జీవితాన్ని గడుపుతూన్నప్పటికీ అతడు కామినీ బంధం నుండి భయరహితుడవుతాడు. రెండు అయస్కాంతాలు ఒకటి పెద్దది, రెండవది చిన్నది ఉన్నాయనుకోండి. వీటిలో ఇనుమును ఏది ఆకర్షిస్తుంది? కచ్చితంగా పెద్దదే. భగవంతుడే ఆ పెద్ద అయస్కాంతం. ఆయనతో పోల్చినప్పుడు ‘కామిని’ చిన్న అయస్కాంతం. అటువంటప్పుడు ‘కామిని’ ఏం చేయగలదు?”
ఒక భక్తుడు: మహాశయా! అటువంటప్పుడు మేం స్త్రీని ద్వేషించాలా?
శ్రీరామకృష్ణులు: భగవత్సాక్షాత్కారం పొందిన వ్యక్తి స్త్రీని భోగదృష్టితో కాంచడు; కనుక ఆమెను గురించి భయపడడు. అతడు స్త్రీల నందరినీ యథార్థంగా జగజ్జనని అంశలుగా చూస్తాడు. అందుకనే అమ్మా అంటూ వారినందరినీ పూజిస్తాడు. (విజయ్‌తో) అప్పుడప్పుడు ఇక్కడకు వస్తూవుండు. నిన్ను చూడాలని ఎంతగానో అభిలషిస్తూ ఉంటాను.
7.5 పంచమ పరిచ్ఛేదం భగవదాదేశం పొందిన వ్యక్తే నిజమైన ప్రబోధకుడు
విజయ్: బ్రహ్మసమాజంలో అనేక విధులు నిర్వర్తించాలి; అందుచేతనే ఎల్లప్పుడూ ఇక్కడకు రాలేకున్నాను. వీలు ఉన్నప్పుడల్లా మీ దర్శనార్థం వస్తూవుంటాను.
శ్రీరామకృష్ణులు (విజయ్‌తో): ఇలా చూడు, మతాచార్యుడి కార్యభారం నిజానికి ఎంతో సంక్లిష్టమైనది. భగవంతుడి నుండి ఆదేశం పొందకుండా ఎవరూ ఎవరికీ ఉపదేశించరాదు. అలాంటి ఆదేశం లేకుండా ఉపదేశం ఇస్తే జనం పట్టించుకోరు. అటువంటి ఉపదేశానికి ఎలాంటి శక్తీ ఉండదు. ఆధ్యాత్మిక సాధనల ద్వారా లేక తదితర మార్గాల ద్వారా ముందుగా భగవల్లబ్ధి పొందాలి. ఆ విధంగా భగవంతుడి నుండి ఆదేశం పొందాక లెక్చర్లు ఇవ్వవచ్చు.
“కామార్పుకూర్లో ఒక కొలను ఉంది. దాని పేరు హల్దార్పుకూర్. దాని గట్టున జనం రోజూ బయలుకుపోతూ ఉండేవారు. ఉదయాన అక్కడకు వెళ్లేవారు వారిని తిట్టి కేకలు పెట్టేవారు. కాని ఆ కేకల వల్ల ఏ ప్రయోజనమూ లేకపోయింది. మరునాడూ అదే కథ. చివరికి కంపెనీ (పురపాలక శాఖ) మనిషి ఒకడు వచ్చి ‘ఇక్కడ ఎవరూ అశుద్ధపరచకూడదు. చేస్తే దండన విధింపబడుతుంది’ అని నోటీసు వ్రేలాడదీశాడు. అంతే. కొలను గట్టున బయలుకు వెళ్ళడం ఆగిపోయింది.
“భగవంతుడి నుండి ఆదేశం పొందిన తరువాత ఆ వ్యక్తి ప్రబోధకుడవవచ్చు. ఎక్కడైనా లెక్చర్లు ఇవ్వవచ్చు. భగవదాదేశం పొందిన వ్యక్తి ఆయన్నుండి శక్తినీ పొందుతాడు. ఆ తరువాత మాత్రమే అతడు సంక్లిష్టమైన ప్రబోధకుని కర్తవ్యాలను నిర్వర్తించగలడు.
“సన్నకారు కౌలుదారు ఒకడు ఒకప్పుడు ఒక పెద్ద భూస్వామితో వ్యాజ్యెంలో దిగాడు. ఆ కౌలుదారు వెనుక ఒక శక్తిమంతుడైన ఆసామి ఉన్నట్లు జనం గ్రహించారు. బహుశా అతడి వెనుకనుండి మరొక పెద్ద భూస్వామి ఆ వ్యాజ్యెం నడిపిస్తూ ఉండవచ్చు. మనిషి ఒక అల్పప్రాణి. ఇతగాడు ప్రత్యక్షంగా భగవంతుడి నుండి శక్తి, అండను పొందకుండా సంక్లిష్ట ప్రబోధక కార్యభారాన్ని నిర్వహించలేడు.”
విజయ్: మహాశయా, బ్రహ్మసమాజపు ఉపదేశాల ద్వారా లోకులు ముక్తిని పొందలేరా?
7.5.1 సచ్చిదానందుడే గురువు, అతడే ముక్తిదాత
శ్రీరామకృష్ణులు: సంసార బంధం నుండి ఒక వ్యక్తిని విముక్తుని చేయటం మరొక వ్యక్తికి సాధ్యమా? ఈ భువనమోహన మాయను కల్పించిన ఆ భగవంతుడొక్కడే జీవులను ఈ మాయనుండి పరిరక్షించగలడు. సచ్చిదానంద గురువు శరణ్యమే తప్ప మరొక ఉపాయం లేదు. భగవల్లబ్ధి లేక భగవదాదేశం పొందనివారు, దైవీసంపత్తితో శక్తిమంతులు కానివారు ఈ సంసారబంధం నుండి ఇతరులను విముక్తులను చేయటం ఎలా సాధ్యం?
“నే నొకరోజు పంచవటిగుండా సరుగుడు తోపువైపు పోతున్నప్పుడు ఒక కప్ప దీనారావం వినవచ్చింది. అది పాము నోట పడిందనుకున్నాను. చాలాసేపు గడిచాక నేను తిరిగి ఆ దారిన వస్తున్నప్పుడు ఆ కప్ప భయానక దీనారావం వినవస్తూనేవుంది. విషయం ఏమిటో చూద్దును కదా – ఒక నీటిపాము, కప్పను నోట కరచుకొని ఉంది. ఆ పాము కప్పను మ్రింగాలేక కక్కాలేక అవస్థపడుతోంది. ఆ కప్ప యాతనకు అంతం కానరావటం లేదు. ఈ కప్పే కనుక నాగుపాము నోట్లో చిక్కివుంటే మూడు అరుపుల లోపే దాని కథ ముగిసేది. అది నీటిపాము అవటంచేత రెంటికీ చెడ్డ కష్టమే!
“సద్గురువు చేతుల్లో పడినప్పుడు శిష్యుడి అహంకారం మూడు గుక్కలలోనే నిర్మూలమవుతుంది. కాని ఆ గురువు పరిపక్వతలేని వాడైతే అటు గురుమా, ఇటు శిష్యుడూ అంతులేని బాధలకు లోనవుతారు. ఆ శిష్యుడు తన అహంకారాన్ని, ఈ సంసార బంధనాలను వదిలించుకోలేడు. పరిపక్వతలేని గురువు చేతుల్లో పడ్డ శిష్యుడికి ముక్తి లభించదు.”
7.6 షష్ఠ పరిచ్ఛేదం మాయ (అహం) తొలగితేనే ముక్తి లేదా భగవద్దర్శనం
అహఙంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే ।(గీత 3 : 27)
విజయ్: మహాశయా! మేం ఎందుకు ఇలా బద్ధులమై ఉన్నాం? భగవంతుని ఎందుకు కాంచలేకున్నాం?
శ్రీరామకృష్ణులు: జీవుల అహంకారమే మాయ. ఈ అహంకారమే సమస్తాన్ని తెరలా మూసి ఉంచుతుంది. ఈ ‘నేను’ నశించినప్పుడు అన్ని అనర్థాలు తొలగిపోతాయి. భగవత్కృపతో ఒక వ్యక్తికి తాను కర్తను కాననే ఎరుక కలిగిన మరుక్షణంలోనే అతడు జీవన్ముక్తుడవుతాడు. దేహంలో వసిస్తున్నప్పటికీ అతడు ముక్తి నొందినవాడే. అతడు భయం చెందవలసిన అవసరమే ఉండదు.
“ఈ మాయ, అంటే అహం మేఘం లాంటిది. ఒక చిన్న మేఘం అడ్డు వచ్చినా సూర్యుని చూడజాలం. మేఘం తప్పుకొంటే చూడగలం. గురుకృపతో ఒకసారి ఈ అహంబుద్ధి తొలగిపోతే భగవద్దర్శనం కలుగుతుంది.
“సాక్షాత్తూ భగవంతుడైన శ్రీరాముడు రెండున్నర మూరల దూరంలోనే ఉన్నప్పటికీ లక్ష్మణుడు ఆతణ్ణి చూడలేకపోయాడు. కారణం వారి నడుమ సీత ఉండటమే. లక్ష్మణుని జీవుడితోను, సీతను మాయతోను పోల్చవచ్చు. మాయ అనే అడ్డుగోడ కారణంగా మనిషి భగవంతుని కాంచలేకపోతున్నాడు. ఈ ఉదాహరణ చూడండి: ఈ తువ్వాలుతో నా ముఖం కప్పుకొన్నాను. నేను మీకు అతిసమీపంలో ఉన్నప్పటికీ మీరు నన్ను చూడలేరు. అదే విధంగా భగవంతుడు అందరికీ అత్యంత సమీపంలోనే ఉన్నప్పటికీ మాయ ఆవరణచేత ఆయనను దర్శించలేం.
“జీవుడు ఎవరో కాదు, సచ్చిదానంద స్వరూపుడే. కాని ఈ మాయ లేక అహంకారం విభిన్న ఉపాధులను కల్పించటంతో అతడు తన స్వస్వరూపాన్ని మరచిపోతాడు.
“ప్రతి ఉపాధి జీవుని స్వభావాన్ని మార్చివేస్తుంది. అతడు చక్కని నల్ల అంచు ధోవతిని ధరించితే వెంటనే అతడు నిధుబాబు ప్రేమగీతాలు కూనిరాగం తీస్తూవుండటం నువ్వు గమనించవచ్చు. తరువాత పేక ఆడుతూండటం, వాహ్యాళికి వెళ్ళినప్పుడు చేతిలో ఊతకర్ర కూడా చూడవచ్చు. ఒక జబ్బు మనిషి కూడా ఎత్తు మడమల బూట్లు ధరిస్తే, అతగాడు ఆంగ్లేయునిలా ఒక మెట్టు నుండి మరొక మెట్టుపై దూకుతూ, ఈలవేసుకొంటూ మేడమెట్లు ఎక్కుతాడు. ఒక వ్యక్తి కలాన్ని చేత పుచ్చుకొన్నాడంటే కనపడ్డ కాగితం మీదల్లా గిలికిరాస్తాడు – కలం శక్తి అంతటిది!
“ధనంకూడా ఒక గొప్ప ఉపాధియే. ధనం మనిషిలో కొట్టొచ్చిన మార్పును తెస్తుంది. అతడు మునుపటి వ్యక్తిగా ఉండటం జరుగదు. ఒక బ్రాహ్మణుడు తరచూ ఇక్కడకు వస్తూండేవాడు. బయటికి వినమ్రంగా అగుపించేవాడు. ఒక నాడు నేను హృదయ్‌తో కలిసి కొన్నగర్కు వెళ్ళటం తటస్థించింది. పడవ దిగటంతోనే గంగ ఒడ్డున కూర్చునివున్న ఆ బ్రాహ్మణుని చూశాం. అతడు స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఆహ్లాదంలో ఉన్నాడనుకున్నాం. మమ్మల్ని చూస్తూ ‘ఏమోయ్ పూజారీ! కుశలమా?’ అని అడిగాడు. అతడి కంఠస్వరంలోని మార్పును గుర్తించి నేను హృదయ్‌తో ఇలా అన్నాను: ‘అరే హృదూ! ఇతడికి ఏదో సిరి అబ్బినట్టుగా ఉంది. అందుచేతనే అలా పలుకుతున్నాడు.’ హృదయ్ పగలబడి నవ్వాడు.
“ఒక కప్ప వద్ద ఒక రూపాయి ఉండేది; ఆ రూపాయిని అది తన కలుగులో పదిలపరచింది. ఒక రోజు ఏనుగొకటి ఆ కలుగు మీదుగా వెళ్ళసాగింది. తక్షణమే కోపోద్రేకంతో కప్ప కలుగునుండి బయటికి వచ్చి, ఏనుగును తన్నటానికా అన్నట్లు కాలు పైకెత్తి, ‘నా తల మీదుగా పోవటానికి నీ కెంత సాహసం’ అంది. ధనం కొనితెచ్చే అహంకారం అలాంటిది!
7.6.1 సప్తమ భూమి – అహంకారం తొలగేదెలా? – బ్రహ్మజ్ఞాని స్థితి
“జ్ఞానోదయం అయ్యాక అహంకారం సమసిపోతుంది. జ్ఞాన సముపార్జనానంతరం మనిషి సమాధి స్థితిలోకి వెళతాడు, అహంకారం అదృశ్యమవుతుంది. కాని అలాంటి జ్ఞానం లభించటం అతిదుర్లభం.
“మనస్సు సప్తమ భూమిని చేరుకున్నప్పుడు మనిషి సమాధి స్థితి నొందుతాడని వేదాలలో పేర్కోబడివుంది. సమాధి స్థితిలోకి ప్రవేశించినప్పుడే వ్యక్తిలోని అహంకారం అదృశ్యమౌతుంది. సామాన్యంగా మనస్సు ఎక్కడ వాసం చేస్తుంది? మొదటి మూడు నిమ్న భూములలో వసిస్తుంది. అపాన స్థానం, లింగం, నాభి వద్ద మొదటి మూడు భూములు నెలకొని ఉంటాయి. మనస్సు ఈ మూడు భూములలో వాసం చేస్తూ ఉన్నప్పుడు అది లౌకిక వ్యవహారాలలో – కామినీ కాంచనాలలో మునిగి ఉంటుంది. చతుర్థ భూమిలో నెలకొన్న హృదయం వద్ద మనస్సు వాసం చేస్తూవున్నప్పుడు అతడు భగవజ్జ్యోతిని గాంచుతాడు. ఆ జ్యోతిని దర్శించి ‘ఇదేమిటి? ఇదేమిటి?’ అంటూ ఆశ్చర్యపోతాడు. తరువాతి భూమిక కంఠం వద్ద నెలకొని ఉంటుంది. మనస్సు అక్కడ వాసం చేస్తూ ఉన్నప్పుడు అతడు కేవలం భగవద్విషయాల గురించే వినాలనీ, మాట్లాడాలనీ అభిలషిస్తాడు. మనస్సు తదుపరి భూమిని – భ్రూమధ్యాన నెలకొన్న చోటును – చేరుకొన్నప్పుడు అతడు సచ్చిదానంద రూపాన్ని దర్శిస్తాడు. ఆ రూపాన్ని స్పృశించి, కౌగిలించుకోవాలని ఆకాంక్షిస్తాడు. కాని అతడలా చేయలేకపోతాడు. లాంతరు లోపల వెలుగుతున్న జ్యోతిని చూడగలమే కాని స్పృశించలేం కదా! ఆ వెలుగుతూన్న జ్యోతిని స్పృశిస్తున్న భావన నీలో కలుగుతుంది కాని వాస్తవానికి దాన్ని నువ్వు స్పృశించలేవు. మనస్సు సప్తమ భూమిని చేరుకొన్నప్పుడు అహంకారం పూర్తిగా సమసిపోతుంది; అతడు సమాధిస్థితిలోకి పోతాడు.”
విజయ్: సప్తమ భూమిని చేరుకొని, బ్రహ్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాక మనిషి ఏం దర్శిస్తాడు?
శ్రీరామకృష్ణులు: మనస్సు సప్తమ భూమిని చేరుకున్నాక ఏం జరుగుతుందో నోటితో వర్ణించనలవికాదు. సముద్రంలోని ‘కాలాపానీ’* లోకి ఓడ ప్రవేశించాక తిరిగి రావటం అంటూ ఉండదు. ఆ తరువాత ఆ ఓడ అతీగతీ ఎవరికీ తెలియరాదు. కాబట్టి ఆ ఓడ, సముద్రం గురించిన ఎలాంటి సమాచారాన్ని మనకు అందివ్వలేదు.
“ఒకప్పుడు ఒక ఉప్పుబొమ్మ సముద్రపు లోతును కొలవటానికి బయలుదేరింది. ఆ బొమ్మ నీళ్ళలోకి దిగగానే కరిగిపోయింది. సముద్రం లోతు ఎంతో ఇప్పుడెవరు చెబుతారు? సప్తమ భూమిని చేరగానే మనస్సు ధ్వంసం అయిపోతుంది; మనిషి సమాధిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడతడికి కలిగే అనుభవాలను మాటలతో వర్ణించలేడు.
7.6.2 అహం మాత్రం పోదు – ‘దుష్ట అహం’ – ‘సేవక అహం’
“ఒకరిని లౌకిక వ్యక్తిగా రూపొందించి, కామినీ కాంచనాలకు బద్ధుణ్ణి చేసే ‘అహం’ ‘దుష్ట అహం’. ఈ ‘అహం’ జోక్యం జీవ, ఆత్మల నడుమ వ్యత్యాసాన్ని కల్పిస్తుంది. ఒక కొయ్యను నీటికి అడ్డంగా ఉంచినప్పుడు ఆ నీరు రెండు భాగాలు అయినట్లుగా అగుపిస్తుంది. కాని వాస్తవానికి ఒకే నీరు మాత్రమే ఉంది. ఈ కొయ్య కారణంగా నీరు రెండు భాగాలుగా కనిపిస్తుంది. ఈ ‘అహ’ మే ఆ కొయ్య. కొయ్యను తొలగించగానే మునుపటిలా ఒకే నీరు ఉంటుంది.
“ఈ ‘దుష్ట అహం’ అంటే ఏమిటి? ‘ఏమిటీ? నేనెవరో వారికి తెలియదా? నాకు పుష్కలంగా ధనం ఉంది. నా కంటే సంపన్నుడెవడు?’ – ఇలా చాటుకునే అహంకారమే ‘దుష్ట అహం’. అటువంటి వ్యక్తి నుండి ఒక దొంగ కేవలం పది రూపాయలు అపహరించాడనుకోండి. ఆ దొంగ వద్దనుండి మొదట ఆ పదిరూపాయలు బలవంతంగానైనా గుంజుకొని తరువాత అతగాడికి దేహశుద్ధి చేస్తాడు. విషయం అంతటితో ఆగదు; ఆ దొంగ పోలీసులకు అప్పగించబడి ఆఖరికి చెరసాల పాలవుతాడు. ఆ ‘దుష్ట అహం’ ఇలా అంటుంది: ‘ఏమిటీ? ఎవరి నుండి అపహరించాడో ఆ ధూర్తుడికి తెలియదా? నా పది రూపాయలు అపహరించటమా! ఎంత సాహసం వాడికి?’”
విజయ్: అహాన్ని నిర్మూలించుకోనిదే సంసారానురక్తి వదలిపోదు; పర్యవసానంగా సమాధి స్థితిని పొందలేమని సెలవిచ్చారు కదా! అలాంటప్పుడు సమాధి స్థితిని పొందడానికి బ్రహ్మజ్ఞాన మార్గం అనుసరించటం వివేకవంతమైన పని కదా! భక్తియోగంలో అహంబుద్ధి నశించని పక్షంలో జ్ఞానయోగం చేపట్టటమే శ్రేయోదాయకం కదా!
శ్రీరామకృష్ణులు: సమాధిస్థితి ద్వారా ఏ ఒకరో ఇద్దరో ఈ అహాన్ని పూర్తిగా తొలగించుకో గలుగుతారు; కాని ఇలా జరగటం ఎంతో అరుదు. నువ్వు ఎంతగా విచారణ చేసినప్పటికీ ఈ ‘అహం’ మళ్ళీ ప్రత్యక్షమౌతుంది. రావి చెట్టును మొదలుకంటా కొట్టివేసినప్పటికీ మర్నాడు మొలకెత్తటం గమనించవచ్చు. కనుక ‘అహం’ అడుగంటా నశించదు. కాబట్టి ఈ ‘అహం’ నెలకొనే ఉంటే, ఈ వెధవను ‘సేవక అహం’ గా ఉండిపోనివ్వు. నీ జీవితాంతం ‘ఓ భగవంతుడా! నువ్వు ప్రభువ్వి, నేను నీ భృత్యుడను’ అనే భావంతో ఉండు. ‘నేను భగవంతుడి భృత్యుడను, నేను ఆయన భక్తుడను’ అని భావించుకునే ‘అహం’ లో దోషం లేదు. మధుర భక్ష్యాలు కడుపులో ఆమ్లజనిత రుగ్మతకు కారకాలు; కాని పటికబెల్లం తద్విరుద్ధం.
“జ్ఞానయోగం ఎంతో కఠినమైనది. దేహాత్మబుద్ధి నశించకుండా జ్ఞానం లభించదు. ఈ కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు. దేహాత్మబుద్ధి, అహంబుద్ధి నశించవు. అందుచేత ఈ యుగానికి భక్తిమార్గమే అనుసరణీయం. ఇది సుగమ మార్గం. అంతరంగాన వ్యాకులతతో భగవన్నామ గుణగానం చేస్తే, ఆయనను ప్రార్థిస్తే ఆయనను ప్రాప్తించుకోవచ్చు. దీన్లో సందేహానికి తావే లేదు.
విజయ్‌కృష్ణ గోస్వామి
“ఒక వెదురు బొంగుతో నీటిపై ఒక గీత గీచావనుకో. నీరు రెండుగా విభజింపబడ్డట్లు అగుపిస్తుంది; కాని ఆ గీత ఎంతోసేపు ఉండదు. ‘నేను దాసుడను’, ‘నేను భక్తుడను’, ‘నేను బిడ్డను’ – అనేవి అహం యొక్క గీతలు మాత్రమే, అవి యథార్థాలు కావు.”
7.7 సప్తమ పరిచ్ఛేదం భక్తియోగమే ఈ యుగధర్మం – ‘అహం’
క్లేశోఽధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసామ్ ।
అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ॥(గీత 12 : 5)
విజయ్ (శ్రీరామకృష్ణులతో): మహాశయా! మీరు ‘దుష్ట అహాన్ని’ త్యజించమని సెలవిచ్చారు గదా! ‘నేను దాసుడ’ ననే అహంలో దోషం ఏమీ లేదా?
శ్రీరామకృష్ణులు: అవును, ‘నేను దాసుడను’ – అంటే, నేను భగవంతుని దాసుడను, నేను భగవంతుని భక్తుడను అనే భావన ఉండాలి. ఇందులో దోషం ఏమీ లేదు. పైగా భగవత్సాక్షాత్కారానికి అది దోహదం చేస్తుంది కూడా.
విజయ్: సరేనండి, ‘నేను దాసుడ’ ననే భావం గల వ్యక్తి యొక్క కామక్రోధాదులు ఏ రూపం సంతరించుకుంటాయి?
శ్రీరామకృష్ణులు: యథార్థంగా అట్టి భావం కలిగితే ఆ వ్యక్తి కామక్రోధాదులు నామమాత్రమే. భగవత్సాక్షాత్కారం సిద్ధించాక ఆ వ్యక్తి తనను భగవంతుని దాసుడు లేక భక్తుడుగా పరిగణించుకుంటాడు; అప్పుడతడు ఎవరికీ హాని కలిగించడు. పరుసవేదిని తాకి ఇనుప కత్తి బంగారంగా మారిపోతుంది. కత్తి ఆకారం ఉంటుంది. కాని హాని కలిగించదు.
“కొబ్బరి మట్ట ఎండి, రాలిపోయాక మానుపై గుర్తు పడివుంటుంది. ఆ గుర్తును బట్టి మునుపు ఇక్కడొక మట్ట ఉండేదని తెలియ వస్తుంది. అదే రీతిలో భగవత్సాక్షాత్కారం పొందిన వ్యక్తి అహం ఆకారమాత్రమే; అతడి కామక్రోధాదులు చూపు మాత్రంగానే మిగిలి ఉంటాయి. అతడు పసిబాలుడిలా మారతాడు. సత్త్వరజస్తమో గుణాల పట్ల బాలుడికి అనురక్తి ఉండదు. పసిబాలుడు ఒక వస్తువు పట్ల ఎంత త్వరితంగా అనురక్తి ఏర్పరచుకుంటాడో అంత సత్వరమే దానిపట్ల అనాసక్తత పొందుతాడు. అయిదు రూపాయలు ఖరీదు చేసే వస్త్రానికి బదులు అణా విలువచేసే బొమ్మనిచ్చి అతణ్ణి బుజ్జగించవచ్చు. మొదట అతడు దృఢనిశ్చయంతో ‘లేదు, దాన్ని ఇవ్వనే ఇవ్వను. నా కోసం మా నాన్న కొని తెచ్చాడు’ అంటాడు. పిల్లవాడికి అందరూ సమానమే. వ్యక్తులలోని తారతమ్యాల గురించిన భావన పిల్లవాడికి ఉండదు. కాబట్టి అతడికి కుల విచక్షణ ఉండదు. పిల్లవాడి తల్లి ‘ఫలానా వ్యక్తి నీ అన్న’ అని చెబితే, ఆ ఫలానా వ్యక్తి అస్పృశ్యుడైనా సరే, ఈ పిల్లవాడు అతడితో కలసి ఒకే కంచంలో భుజిస్తాడు. పిల్లవాడు ద్వేషం అంటే ఏమిటో ఎరుగడు; శుచి, అశుచి – వీటి ఎరుకే ఉండదు. మలవిసర్జన చేశాక చేతులు కడుక్కోకుండా వచ్చేస్తాడు.
“సమాధి స్థితి పొందిన తరువాతకూడా కొందరు ‘నేను దాసుడను’ లేక ‘నేను భక్తుడను’ అనే అహాన్ని నిలుపుకునే ఉంటారు. భక్తుడు ‘నేను’ అనే చైతన్యాన్ని ఉంచుకునే ఉంటాడు. అతడిలా అంటాడు: ‘ఓ భగవంతుడా! నువ్వు ప్రభువ్వి, నేను నీ దాసుడను; నువ్వు భగవంతుడివి, నేను నీ భక్తుడను.’ భగవత్సాక్షాత్కారానంతరం కూడా అతడలా భావిస్తాడు. అతడిలోని ‘నేను’ పూర్తిగా తొలగిపోదు. మళ్ళీ, నిరంతరం ఇటువంటి ‘నేను’ అనే భావనను అభ్యసించేకొద్దీ భగవల్లబ్ధి చేకూరుతుంది. దీనినే భక్తియోగం అంటారు.
“భక్తిమార్గం అవలంబించి బ్రహ్మజ్ఞానాన్ని కూడా సముపార్జించవచ్చు. భగవంతుడు సర్వశక్తిమంతుడు. భగవంతుడు అభిలషిస్తే, తన భక్తులకు బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడు. కాని భక్తుడు సామాన్యంగా బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్ఛగించడు. ‘నేను దాసుడను, నువ్వు ప్రభువ్వి’, ‘నేను బిడ్డను, నువ్వు తల్లివి’ – ఇటువంటి అహంకారాన్ని కలిగి ఉండటానికే అభిలషిస్తాడు.”
విజయ్: వేదాంతవిచారణ చేసేవారు కూడా చివరకు భగవత్సాక్షాత్కారం పొందుతారు కదా!
శ్రీరామకృష్ణులు: అవును, విచారణ మార్గం ద్వారానూ ఆయనను పొందవచ్చు. దీనినే జ్ఞానయోగం అంటారు. కాని ఈ మార్గం ఎంతో కష్టభరితమైనది.
“నీకు సప్తభూముల గురించి ఇంతకు మునుపే చెప్పాను కదా! మనస్సు సప్తమభూమి (సహస్రారం)ని చేరినప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. ‘బ్రహ్మ సత్యం – జగన్మిథ్య’ అనే తత్త్వం యథార్థంగా బోధపడితే ఆ వ్యక్తి మనస్సు సమాధిలో మగ్నమవుతుంది. కాని కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు. అలాంటప్పుడు ‘బ్రహ్మ సత్యం – జగన్మిథ్య’ భావం పొసగటం ఎలా? దేహబుద్ధి నశించకుండా ఇట్టి భావం ఏర్పడదు. ‘నేను దేహం కాదు, మనస్సు కాదు, చతుర్వింశతి తత్త్వాలు కాదు. నేను సుఖదుఃఖాలకు అతీతుడను. రోగశోక జరా మృత్యువులు నన్ను అంటవు.’ కలియుగంలో ఇటువంటి భావాలు జనించడం ఎంతో కష్టం. ఎంతగా విచారణ చేసినప్పటికీ దేహాత్మబుద్ధి ఏదో ఒక మూలనుంచి తలెత్తుతుంది. రావి చెట్టును మొదలంటా నరికివేసినా మరునాడే మోడునుంచి అంకురించడం నువ్వు గమనించవచ్చు. అలాగే దేహాత్మబుద్ధి సమసిపోదు సుమా! కనుకనే భక్తియోగం ఈ కలియుగానికి సరియైనదీ, సుగమమూ కూడా.
“ ‘నేను చక్కెరగా మార ఇష్టపడను; చక్కెరను తినటానికే ఇష్టపడతాను.’ ‘నేనే బ్రహ్మాన్ని’ అని పలకాలన్న ఇచ్ఛ నాకు ఎన్నడూ కలుగనైనా కలుగదు. నేను, ‘నువ్వు భగవంతుడవు, నేను నీ దాసుడను’ అంటాను. ఒక పడవ రెండు స్థానాల మధ్య తిరుగాడుతూండేట్లు మనస్సు పంచమ, షష్ఠ భూముల మధ్య తిరుగూతూండటమే మంచిది. ఆరవ భూమిని అధిగమించి సప్తమ భూమిలో ఎక్కువ సమయం మనస్సును నిలుపటం నాకిష్టం లేదు. భగవంతుని నామగుణసంకీర్తన చేయటమే నా ఆకాంక్ష. సేవ్య సేవక భావం నాకు నచ్చింది. అలలు గంగానదికి చెందినవంటారు కాని ఎవరూ గంగానది అలలకు చెందినదని చెప్పరు. ‘అహం బ్రహ్మా-స్మి’ అనే భావన మంచిది కాదు. దేహాత్మబుద్ధి నెలకొని ఉండగా ‘నేనే బ్రహ్మ’ మని పలకటం ఎంతో హానికరం. అటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో పురోగమించలేడు; క్రమంగా అధోగతి పాలవుతాడు. అటువంటి వ్యక్తి ఇతరులనే కాక తనను కూడా వంచించుకొంటాడు. తన మనోస్థితిని గురించిన అవగాహన అతడికి ఉండదు.
7.7.1 రెండు రకాల భక్తి – ఉత్తమ అధికారి – భగవత్ప్రాప్తికి మార్గం
“ప్రతి రకమైన భక్తీ భగవత్సాక్షాత్కారానికి దోహదం చేయదు. ప్రేమభక్తి లేకుంటే భగవల్లబ్ధి కలుగదు. ప్రేమభక్తినే రాగభక్తి అని కూడా పేర్కొంటారు. ప్రేమ, అనురాగం లేకుండా భగవత్సాక్షాత్కారం దుర్లభం. భగవంతుని ప్రేమించటం నేర్వకుండా ఆయనను సాక్షాత్కరించుకోవటం అసంభవం.
“మరొక రకమైన భక్తి ఉంది, దీనిని వైధీభక్తి (విధివిహితమైనది) అంటారు. జపం, ఉపవాసాలు, తీర్థయాత్రలు, నివేదనతో కూడిన భగవదారాధన మొదలైన ప్రక్రియలన్నీ ఈ వైధీభక్తికి చెందుతాయి. వీటిని చేయగా చేయగా, క్రమంగా రాగభక్తి ఏర్పడుతుంది. రాగభక్తి జనించకుండా భగవత్సాక్షాత్కారం కలుగదు. భగవంతుడి పట్ల ప్రేమ కలగాలి. విషయబుద్ధి పూర్తిగా తొలగిపోయి, మనస్సు నూటికి నూరుపాళ్ళు భగవంతుని మీద లగ్నమైనప్పుడే భగవత్సాక్షాత్కారం కలుగుతుంది.
“కాని కొందరికి రాగభక్తి దానంతట అదే కలుగుతుంది. వారిలో అది స్వతఃసిద్ధంగా ఉంటుంది. వారిలో బాల్యంనుంచీ అది నెలకొని ఉంటుంది. అటువంటి వారు పసితనంలోనే భగవంతునికై విలపిస్తారు. అటువంటి భక్తిని ప్రహ్లాదునిలో చూడవచ్చు. గాలికోసం విసనకర్ర విసరటం వంటిది వైధీభక్తి. గాలి కావాలంటే విసనకర్ర అవసరం. భగవంతుని పట్ల ప్రేమ జనించటానికి జప, తప, ఉపవాసాదులు అనుష్ఠించాలి. కాని మందమారుతం వీచ నారంభించగానే విసనకఱ్ఱను ఆవల పడవేస్తారు. భగవంతుని పట్ల ప్రేమ, అనురక్తి స్వాభావికంగా జనించటంతో జపతపాదులు నిష్క్రమిస్తాయి. హరిప్రేమలో ఉన్మత్తత కలిగితే, ఇక వైధీ కర్మలను ఎవరు నిర్వహిస్తారు?
“భగవంతుడిపట్ల ప్రేమ కలుగనంత వరకు భక్తి అపరిపక్వంగా ఉంటుంది. అది పెంపొంది ప్రేమానురాగాలు సంతరించుకున్నాక భక్తి పరిపక్వమవుతుంది.
“అపరిపక్వ భక్తిగల వ్యక్తి ఆధ్యాత్మిక ప్రవచనాలు, బోధనలను అంతర్లీనం చేసుకోలేడు; కాని పరిపక్వ భక్తి గల వ్యక్తి చేసుకోగలడు. (సిల్వర్ నైట్రేట్) పూతగల ఫలకం మీదనే ప్రతిబింబం శాశ్వతంగా నిలుస్తుంది. తద్విరుద్ధంగా వట్టి గాజు మీద వెయ్యి ప్రతిబింబాలు ప్రతిఫలించినా సరే, వాటిలో ఒక్కటీ శాశ్వతంగా నిలిచిపోదు. వస్తువు కదలిపోగానే గాజు పూర్వం మాదిరిగానే ఉండిపోతుంది. భగవత్ప్రేమ పెంపొందకుంటే ఎవరూ ఆధ్యాత్మిక బోధనలను జీర్ణించుకోలేరు.”
విజయ్: మహాశయా! భగవద్దర్శనానికి కేవలం భక్తి ఒక్కటే చాలా?
శ్రీరామకృష్ణులు: అవును. భక్తి ద్వారా మాత్రమే భగవద్దర్శనం కలుగుతుంది. కాని ఆ భక్తి పరిపక్వత చెందివుండాలి; అంటే ప్రేమభక్తి లేక రాగభక్తి ఉండాలి. అటువంటి భక్తి కలిగివుండే వ్యక్తి తల్లి బిడ్డను ప్రేమించేట్లు, బిడ్డ తల్లిని లేక భార్య భర్తను ప్రేమించేట్లుగా భగవంతుణ్ణి ప్రేమిస్తాడు. భగవంతుడిపట్ల అటువంటి ప్రేమభక్తి, అనుబంధం కలిగి ఉన్నప్పుడు భార్యాపిల్లల, బంధువుల, మిత్రుల పట్ల మాయాకర్షణ కలుగదు. వీరి పట్ల సానుభూతి మాత్రం ఉంటుంది. అటువంటి వ్యక్తికి ఈ సంసారం పరాయి దేశంగా గోచరిస్తుంది; కేవలం కర్మభూమిగా తోస్తుంది. ఇల్లూవాకిలి గ్రామంలో ఉండగా ఉద్యోగార్థం కలకత్తాకు వచ్చి అద్దె ఇంట్లో బసచేస్తున్నట్లుగా ఉంటుంది ఇది. భగవంతుడి పట్ల ప్రేమ కలిగిన పక్షంలో ఒక వ్యక్తి సంసారానురక్తి, విషయబుద్ధి అడుగంటా తొలగిపోతాయి.
“లేశమాత్రం విషయబుద్ధి ఉన్నాకూడా భగవద్దర్శనం కలుగదు. చెమ్మగిల్లిన అగ్గిపుల్లలను వేయిమార్లు గీచినా వెలుగవు. ఒక గుట్ట పుల్లలు వృథా అవుతాయి. విషయాసక్తమైన మనస్సు చెమ్మగిల్లిన అగ్గిపుల్లలాంటిది.
“ఒకసారి రాధ తన చెలులతో సర్వమూ తాను – కృష్ణమయంగా దర్శిస్తున్నానని చెప్పింది. అందుకు ఆ చెలులు ఇలా అన్నారు: ‘మేం ఎందుకు అతణ్ణి చూడలేకున్నాం? నువ్వు భ్రమలో గాని ఉన్నావా?’ ‘నేస్తాల్లారా! మీరు దివ్యప్రేమ అనే కాటుకను కళ్లకు రాచుకొని చూస్తే అతణ్ణి చూడగలరు’ అన్నది రాధ.
(విజయ్‌తో) “మీ బ్రహ్మసమాజ గీతంలో ఇలా చెప్పబడింది:
‘యజ్ఞయాగములు ఎన్నయినా చేయుదురు గాక! ఓ ప్రభూ! అనురాగం లేకుండా నిన్నెవరు తెలుసుగొనగలరు?’
“భగవంతుడిపట్ల ఇటువంటి అనురాగం, ప్రేమ, పరిపక్వభక్తి ఒక్కమారు అనుభవించినా భగవంతుడి సాకార నిరాకార సాక్షాత్కారాలు రెండూ కలుగుతాయి.”
7.7.2 భగవద్దర్శనం – ఆయన కృప లేనిదే సాధ్యం కాదు
విజయ్: భగవద్దర్శనం ఎలా లభిస్తుంది?
శ్రీరామకృష్ణులు: హృదయపావనత్వం లేకుంటే భగవద్దర్శనం కలుగదు. కామినీ కాంచనాల పట్ల అనురక్తితో మనస్సు కళంకమై ఉన్నది. మట్టిచే కప్పబడ్డ సూదిని అయస్కాంతం ఆకర్షించుకోలేదు; మట్టిని కడిగివేసిన తరువాత ఆకర్షించుకుంటుంది. అదేవిధంగా మనోమాలిన్యాన్ని అశ్రువులతో కడిగివేసుకోవచ్చు. పశ్చాత్తాపంతో ‘ఓ భగవంతుడా! నేనిక ఎన్నడూ అటువంటి పనిచేయను’ అంటూ అశ్రుధారలు కురిపిస్తే ఈ మనోమాలిన్యం తొలగిపోతుంది. ఆ తరువాత అయస్కాంత మనే భగవంతుడు సూది అనే భక్తుని మనస్సును ఆకర్షించుకుంటాడు. ఆపైన సమాధి స్థితి కలుగుతుంది. భగవద్దర్శనం పొందుతాడు.
“నువ్వు వేలాదిసార్లు ప్రయత్నించినా ఆయన కృప లేనిదే దేనినీ సాధించలేవు. భగవత్కృప లేనిదే ఎవరూ భగవంతుని దర్శించుకోలేరు. భగత్కృప అంత సులభంగా దక్కుతుందా ఏమిటి? అహంకారాన్ని సమూలంగా త్యజించాలి; ‘నేను కర్తను’ అనే భావం ఉన్నంతవరకు భగవత్సాక్షాత్కారం కాదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి సరకుల గది బాధ్యతను వహించాడనుకొందాం; తరువాత ఎవరైనా ఇంటి యజమానిని ‘అయ్యా! మీ సరకుల గదిలోనుంచి ఏదైనా మీరే స్వయంగా తీసి ఇవ్వగలరా?’ అని అడిగితే, యజమాని ఇలా అంటాడు; ‘సరుకుల గది వద్ద ఫలానా వ్యక్తి ఉన్నాడు కదా! అలాంటప్పుడు నాకు అక్కడ పని ఏముంది?’ తనకు తానే కర్త అనుకునే వ్యక్తి హృదయంలో భగవంతుడు సులభంగా సాక్షాత్కరించడు.
“కాని భగవత్కృప వర్షించినప్పుడే భగవంతుని దర్శనమవుతుంది. భగవంతుడు జ్ఞానభాస్కరుడు. ఆయన నుండి ప్రసరించిన ఒక్క కిరణం జ్ఞానప్రకాశంతో లోకాన్ని తేజోమయం గావిస్తుంది. ఆయన దివ్యప్రభ మూలంగానే మనం పరస్పరం చూడగలుగుతున్నాం, విభిన్న రకాల జ్ఞానాన్ని సముపార్జించుకుంటున్నాం. భగవంతుడు తన ప్రకాశాన్ని తన వదనారవిందం కేసి ప్రసరింప చేసినప్పుడే మనం ఆయన్ను దర్శించగలం.
“రాత్రివేళ పోలీసు సార్జెంటు లాంతరు* చేత పుచ్చుకొని వీథులలో గస్తీ తిరుగుతూంటాడు కదా! దానినుండి వచ్చే వెలుతురుతో సార్జంటు ఇతరుల ముఖాలు చూడగలుగుతాడు; ఇతరులు పరస్పరం చూసుకోగలుగుతారు. సార్జంటు ముఖం చూడాలనుకొంటే ‘అయ్యా! లాంతరు వెలుగును మీ ముఖం కేసి త్రిప్పండి; మీ ముఖం చూడనివ్వండి’ అంటూ అతణ్ణి వేడుకోవాలి. అదే రీతిలో భగవంతుణ్ణి ‘ఓ ప్రభూ! కృపాళువై నీ జ్ఞానప్రకాశాన్ని ఒక్కసారి నీ వంక ప్రసరింపచేయి, నీ ముఖారవిందాన్ని అప్పుడు తిలకించగలుగుతాను’ అంటూ ప్రార్థించాలి.
“దీపంలేని ఇల్లు పేదరికాన్ని సూచిస్తుంది. కాబట్టి హృదయంలో జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలి. ఒక పాటలో ఇలా వ్రాసివుంది.
వెలిగించుము జ్ఞానదీపము హృదయ గృహమున
దర్శింపుము బ్రహ్మమయి వదనారవిందమును.”
విజయ్ తనతో కూడా ఔషధం తెచ్చుకున్నాడు; ఒక భక్తుణ్ణి అతడికి మంచి నీళ్లు తెచ్చియిమ్మన్నారు శ్రీరామకృష్ణులు. ఆయన కరుణాసింధువు. పడవలోనో, బండిలోనో బాడుగ చెల్లించి విజయ్ రాలేడు. అందుచేతనే శ్రీరామకృష్ణులు తరచూ ఆతడికి కబురు పంపి రమ్మంటారు. ఈసారి బలరామ్‌ను అందుకై ఏర్పాటు చేశారు. బలరామ్ బండి బాడుగ ఇచ్చేస్తాడు. ప్రస్తుతం బలరామ్తోనే, విజయ్ వచ్చి ఉన్నాడు.
సాయంత్రం అయింది. విజయ్, నవకుమార్, విజయ్ మిత్రులు బలరాం పడవలో ఎక్కారు. బలరాం బాగ్‌బజార్‌లో తన ఇంటి సమీపంలో దిగాడు. అప్పుడు చంద్రోదయం అయింది. శీతకాలం కావటంతో చలి మొదలైంది. శ్రీరామకృష్ణుల అమృత వచనాలను నెమరువేసుకుంటూ, ఆయన ఆనందమయమూర్తిని హృదయంలో నిలుపుకుని, విజయ్, బలరాం, ‘మ’ మొదలైనవారు ఇంటి ముఖంపట్టారు.
7.8 అష్టమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో ప్రాణకృష్ణ, ‘మ’ ప్రభృతులతో
సోమవారం, జనవరి 1, 1883
అప్పుడు సమయం ఉదయం ఎనిమిది గంటలు. దక్షిణేశ్వర కాళికాయలంలోని తమ గదిలో శ్రీరామకృష్ణులు భక్తులతో కూర్చుని ఉన్నారు. అహర్నిశలూ హరిప్రేమలో, జగజ్జనని ప్రేమలో మునిగి ఉండిపోయారు ఆయన.
నేల మీద చాప పరచి ఉంది. శ్రీరామకృష్ణులు చాపమీదనే కూర్చుని ఉన్నారు. శీతకాలం కావటంతో శాలువ కప్పుకుని ఉన్నారు. ప్రాణకృష్ణ, ‘మ’ ఆయన ముందు కూర్చుని ఉన్నారు. రాఖాలూ ఉన్నాడు. హాజ్రా గదికి వెలుపలి ఆగ్నేయ వసారాలో కూర్చుని ఉన్నాడు.
శ్రీరామకృష్ణుల ఆంతరంగిక భక్తులలో పలువురు ఇప్పుడు ‘మ’ కు పరిచితులైపోయారు. దాదాపు ఒక సంవత్సరకాలంగా నరేంద్రుడు, రాఖాల్, భవనాథ్, బలరామ్, ‘మ’, బాబురామ్, లాటూ మొదలైన వారు తరచూ వస్తూ పోతూ ఉన్నారు. మనోమోహన్, సురేంద్రుడు, కేదార్ ప్రభృతులు ఏడాదికి పైబడే వస్తూ ఉన్నారు.
ఐదు నెలల క్రితం శ్రీరామకృష్ణులు, విద్యాసాగర్ ఇంటికి వెళ్లటం జరిగింది. రెండు నెలలకు మునుపే విజయ్ మొదలైన బ్రహ్మసమాజ భక్తులు కేశవసేన్ మొదలైన వారితో స్టీమర్లో కలకత్తా వరకు వెళ్లివచ్చారు.
ప్రాణకృష్ణ ముఖోపాధ్యాయ్ కలకత్తాలోని శ్యాంపుకూర్ ప్రాంతంలో వసిస్తున్నాడు. అతడు జనాయీ గ్రామానికి చెందినవాడు. ప్రభుత్వ వస్తువులను వేలం వేసే అధికారిగా ఉన్నత పదవిలో ఉన్నాడు. మొదటి భార్య వలన సంతానం కలుగనందున ఆమె సమ్మతితో అతడు ద్వితీయ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య వలన ఒక కుమారుడు కలిగాడు. శ్రీరామకృష్ణుల పట్ల అతడికి అమిత భక్తిప్రపత్తులున్నాయి. అతడు స్థూలకాయుడు కావటంతో శ్రీరామకృష్ణులు అతణ్ణి ‘లావు బ్రాహ్మణుడు’ అంటూ సంబోధించేవారు. అతడు సజ్జనుడు. అతడి ఆహ్వానం మేరకు దాదాపు తొమ్మిది నెలల క్రితం అతడి ఇంటికి భక్తులతో శ్రీరామకృష్ణులు వెళ్ళారు. నాడు ప్రాణకృష్ణ కూరలు, పప్పు, తీపి తినుబండారాలతో చక్కని విందు చేశాడు.
ఒక భక్తుడు శ్రీరామకృష్ణులకోసం బుట్టలో జిలేబీలు తీసుకువచ్చి, ఆయన ప్రక్కన పెట్టాడు. ఒక జిలేబీ ముక్కను తింటూ ఆయన ప్రాణకృష్ణ మొదలైన వారితో ఇలా అన్నారు: “చూడండి, నేను జగజ్జనని నామాన్ని స్మరిస్తూ ఉంటాను కదా! అందుకే ఈ తినుబండారాలన్నీ లభిస్తున్నాయి. (అందరూ నవ్వారు) కాని ఆమె సొర, గుమ్మడి వంటి ఫలాల నివ్వదు. జ్ఞానం, వివేకం, ప్రేమ, వైరాగ్యం మొదలైన అమృత ఫలాలను ప్రసాదిస్తుంది సుమా!”
ఇంతలో ఆరు లేక ఏడు సంవత్సరాల బాలుడొకడు గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణులు తాను బాలుడే అయ్యారు. ఒక పిల్లవాడు తన వద్దనున్న తీపిపదార్థాలను మరొక పిల్లవాడు చూసినప్పుడు అతడు లాగుకొంటాడనే భయంతో వాటిని దాచిపెడతాడు. అదే విధంగా శ్రీరామకృష్ణులు బుట్టలోని జిలేబీలు కనబడకుండా తమ అరచేతిని వాటిపై మూసివుంచారు. తరువాత ఆ బుట్టను ప్రక్కన పెట్టారు.
ప్రాణకృష్ణ గృహస్థు అయినప్పటికీ వేదాంతాన్ని అధ్యయనం చేశాడు. ‘బ్రహ్మసత్యం జగన్మిథ్య’ ‘సోఽహం’ అనే వేదాంత వాక్యాలను పలుకుతూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు అతడితో, ‘కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు. కలియుగంలో కావలసింది నారదీయ భక్తియే’ అంటారు.
హఠాత్తుగా శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులై అదే స్థితిలో చాలాసేపు కూర్చుండిపోయారు. ఆయన శరీరంలో కదలిక లేదు; కళ్లు విప్పారి ఉన్నాయి, రెప్పలు వాలటం లేదు; ఊపిరి ఆడుతున్నదో లేదో కూడా తెలియని స్థితి అది. చాలాసేపయ్యాక ఆయన భారంగా ఊపిరిపీల్చి బాహ్యస్థితిలోకి వచ్చారు.
7.9 నవమ పరిచ్ఛేదం భావస్థితి – రూపదర్శనాలు
శ్రీరామకృష్ణులు (ప్రాణకృష్ణతో): నా జగజ్జనని నిరాకారియే కాదు, ఆమె సాకారమూర్తి కూడా. ఆమె రూపాలను దర్శించవచ్చు. ప్రేమభక్తి ద్వారా నిరుపమానమైన ఆమె సౌందర్యాన్ని తిలకించవచ్చు. జగజ్జనని తన భక్తులకు పలురూపాలలో దర్శనం ఇస్తుంది. ఆమెను నిన్న నేను దర్శించాను. ఆమె కాషాయాంబరాలు ధరించి ఉంది; నాతో మాట్లాడింది కూడా. మరొక రోజు ఆమె ఆరేళ్ల మహమ్మదీయ బాలిక రూపంలో నాకు దర్శనమిచ్చింది. నొసట తిలక మిడుకొని, దిగంబరియై ఉన్నది. చిన్నపిల్లల మాదిరి గంతులు వేస్తూ, పరిహాసాలాడుతూ నాతోపాటు నడిచింది.
7.9.1 గౌరాంగ దర్శనం – రతి తల్లి రూపంలో జగజ్జనని దర్శనం
“హృదయ్ ఇంటివద్ద నా కొకసారి నల్ల అంచు ధోవతి ధరించిన గౌరాంగ ప్రభువు దర్శనమైంది.
“భగవంతుడు ‘భావాభావాలకు అతీతుడు’ అని హలధారి చెప్పేవాడు. నేను అమ్మకు దీన్ని గురించి తెల్పి, ఆమెను ‘తల్లీ, నీ ఈ దివ్యదర్శనాలన్నీ భ్రమ మాత్రాలా?’ అని అడిగాను. అప్పుడు అమ్మ రతి తల్లి రూపంలో నాకు దర్శనమిచ్చి ‘నువ్వు భావస్థితిలోనే నెలకొని ఉండు’ అన్నది. నే నా మాట హలధారితో చెప్పాను.
“ఒక్కోసారి ఆమె ఆదేశాన్ని మరచిపోవటంతో ఇక్కట్ల పాలయ్యేవాణ్ణి. ఒకసారి భావస్థితిలో నెలకొని ఉండనందున పళ్ళు విరగగొట్టుకున్నాను. అందుచేత దైవ అనుజ్ఞ లేకున్నప్పుడు లేక ప్రత్యక్ష అనుభూతి పొందకున్నప్పుడు నేను అదే భావంలో నెలకొని ఉంటాను. నేను భక్తి మార్గాన్నే అనుసరిస్తాను. నువ్వేమంటావు?”
ప్రాణకృష్ణ: అవునండీ, నిజమే.
7.9.2 భక్తి ప్రాశస్త్యం – శరణాగతి
శ్రీరామకృష్ణులు: దీన్ని గురించి నిన్ను అడగవలసిన పనేముంది? దీని (నా) లోపలే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడే అన్ని పనులూ నా ద్వారా చేయిస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు దైవభావం నాలో నెలకొనివున్న సమయంలో పూజింపబడనిదే నాకు శాంతి చేకూరేది కాదు.
“నేను యంత్రాన్ని, ఆమె దాన్ని నియంత్రించేది. ఆమె చేయమన్నట్లే నేను చేస్తాను, ఆమె పలుకమన్నట్లే నేను పలుకుతాను.
భవసాగరంలో తన నావతో నెలకొని ఉండమన్నాడు రాంప్రసాదు,
పోటులో పైకి వెళతావు, పాటులో క్రిందకు కూలబడతావు.
“పెనుగాలి వీచటానికి మునుపు వీథిలోని ఆకు పరిస్థితి వంటిది ఇది; గాలి వీచే దిశనుబట్టి కొన్ని సమయాల్లో ఈ ఆకు మంచి ప్రదేశాలకు కొట్టుకొనిపోతుంది, మరికొన్ని సందర్భాలలో మురికికూపంలోకి కొట్టుకుపోతుంది.
“ ‘బందిపోటు దొంగలు – సాలెవాడు’ కథలో సాలెవాడు అన్నట్లు – ‘రాముని ఇచ్ఛమేరకు దొంగతనం జరిగింది, రాముని ఇచ్ఛానుసారం పోలీసువారు నన్ను బంధించారు, రాముని ఇచ్ఛవల్ల నన్ను విడిచిపెట్టారు.’
“హనుమంతుడు ఒకసారి రాముడితో ఇలా అన్నాడు: ‘ఓ రామా! శరణాగతుడను. నీ పాదపద్మాల వద్ద శుద్ధభక్తి కలిగేటట్లు అనుగ్రహించు; నీ భువనమోహన మాయలో పడిపోకుండా నన్ను అనుగ్రహించు.’
“చావసిద్ధంగా ఉన్న కప్ప ఒకటి రాముడితో ఇలా అన్నది: ‘ఓ రామా! పాము వాతబడ్డప్పుడు రక్షణార్థం నీ కోసం కేకలు పెట్టాను. కాని ప్రస్తుతం నీ వింటి మొన తగిలి చీరబడి చచ్చిపోతున్నాను. కనుక మౌనం దాల్చాను.’
“మిమ్మల్ని చూస్తూన్నట్లే భగవంతుణ్ణి ఇదే కళ్లతో ప్రత్యక్షంగా దర్శించే వాడిని. ప్రస్తుతం నేను భావావస్థలో దైవదర్శనాలను కాంచుతున్నాను.
“భగవత్సాక్షాత్కారానంతరం బాలుని స్వభావం కలుగుతుంది. అట్టి స్థితిలో ఆ వ్యక్తి ఏ వస్తువును ధ్యానిస్తాడో దాని నైజాన్ని సంతరించుకుంటాడు. భగవంతుడిది పిల్లవాడి స్వభావం. పిల్లవాడు బొమ్మరిల్లు కట్టిన తరువాత దాన్ని కూల్చి వేస్తాడు. అదే విధంగా భగవంతుడు సృష్టి స్థితి లయాలను గావిస్తూ ఉంటాడు. పిల్లవాడు ఏ గుణాలకూ వశుడు కాడు; అట్లే భగవంతుడు కూడా సత్వరజస్తమో గుణాలకు అతీతుడు. అందుచేతనే తమలో పిల్లల స్వభావం కల్పించుకునే నిమిత్తం పరమహంసలు అయిదు లేక పదిమంది పిల్లలను తమతో ఉంచుకొంటారు.”
గదిలో నేల మీద ఆగర్పారా నుండి వచ్చిన ఇరవై రెండేళ్ల యువకుడు ఒకడు కూర్చుని ఉన్నాడు. అతడు దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడల్లా శ్రీరామకృష్ణులను సైగతో ప్రక్కకు తీసుకువెళ్లి తన మనోభావాలను గుసగుసలుగా ఆయనకు విన్నవించేవాడు. అతడు ఈ మధ్యే శ్రీరామకృష్ణుల వద్దకు వస్తున్నాడు. నేడు అతడు శ్రీరామకృష్ణుల ప్రక్కనే నేల మీద కూర్చున్నాడు.
7.9.3 స్త్రీ భావం : కామ జయం – నిష్కాపట్యం : భగవల్లాభం
శ్రీరామకృష్ణులు (ఆ యువకుడితో): మరొకరి స్వభావాన్ని ఆరోపింపచేసుకోవడం ద్వారా ఒక వ్యక్తి తన స్వభావాన్ని మార్చుకోవచ్చు. పురుషుడు, స్త్రీ భావాన్ని ఆరోపించుకుని క్రమంగా కామాది శత్రువులను తొలగించుకోవచ్చు. అతడు అచ్చం స్త్రీ మాదిరిగానే ప్రవర్తిస్తాడు. వీథి నాటకాలలో స్త్రీ పాత్రలు ధరించే పురుషులు స్త్రీ మాదిరిగానే మాట్లాడతారు లేదా స్నానం చేసేటప్పుడు స్త్రీ లాగానే పండ్లు తోముకుంటారు. నువ్వు మంగళవారం కాని లేక శనివారం కాని రా.
(ప్రాణకృష్ణతో) “బ్రహ్మం, శక్తి అభిన్నం. నువ్వు శక్తిని అంగీకరించకుంటే జగత్తు యావత్తు – నేను, నువ్వు, ఇల్లు, కుటుంబం – మిథ్య అయిపోతుంది. ఆద్యాశక్తి ఉన్నందుననే జగత్తుకు అస్తిత్వం ఏర్పడుతుంది. దుర్గాదేవి ప్రతిమను తయారుచేయాలంటే మొదట వెదురుబొంగు నొకదాన్ని ఆధారం చేసుకొని ఒక చట్రం నిర్మించాలి. ఈ చట్రం లేకుండా సుందరమైన దుర్గ ప్రతిమ తయారు కాదు.
“విషయబుద్ధిని త్యజించనిదే ఆధ్యాత్మిక చైతన్యం జాగృతం కాదు, భగవత్సాక్షాత్కారం లభించదు. విషయబుద్ధి కారణంగానే కపట స్వభావం కలుగుతుంది. నిష్కపట స్వభావి కానంతవరకూ ఎవరూ భగవంతుణ్ణి పొందలేరు.”
ఐసీ భక్తి కరో ఘట్ భీతర్, ఛోడ్ కపట చతురాఈ ।
సేవా వందనా ఔర్ అధీనతా వో, తో సహజ్ మిలే రఘురాఈ ॥
(భావం: కాపట్యం, మోసకారితనములను వదలి అంతరంగాన భక్తిని పెంపొందించుకో; సేవ, ఆరాధన, కైంకర్యాల ద్వారా రఘువీరుని సులభంగా పొందవచ్చు.)
“ఆఫీసులలో ఉద్యోగం, వ్యాపారం మొదలైన లౌకిక కార్యకలాపాలలో నిమగ్నులైనప్పటికీ కూడా సత్యవాదిగానే ఉండాలి. ఈ కలియుగంలో సత్యసంధత తపస్సు క్రిందికి వస్తుంది.”
ప్రాణకృష్ణ: అవునండీ. మహానిర్వాణ తంత్రలో ఇలా చెప్పబడి ఉంది:
అస్మిన్ ధర్మే మహేశి స్యాత్ సత్యవాదీ జితేంద్రియః ।
పరోపకారనిరతో నిర్వికారిః సదాశయః ॥
(అర్థం: ఓ దేవీ! సత్యవాదిగా, జితేంద్రియుడిగా, పరోపకారిగా, నిర్వికారిగా, సదాశయునిగా ఉండమని ధర్మం నిర్దేశిస్తున్నది.)
శ్రీరామకృష్ణులు: అవును. ఈ భావాలను చక్కగా జీర్ణించుకోవాలి.
7.10 దశమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల యశోదా భావం – సమాధి
శ్రీరామకృష్ణులు తమ చిన్నమంచం మీద ఆసీనులైనారు. పారవశ్య భావంలో నెలకొని, రాఖాల్ వైపు చూశారు. హఠాత్తుగా ఆయనలో తమ యువ శిష్యుడైన రాఖాల్ పట్ల మాతృవాత్సల్యం పొంగిపొరలింది. ఆయన అప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. భక్తులు అవాక్కై, సంభ్రమాశ్చర్యాలతో ఆయన కేసి చూడసాగారు.
కొంతసేపటికి పాక్షికంగా బాహ్యచైతన్యంలోకి వచ్చి శ్రీరామకృష్ణులు ఇలా పలికారు: “రాఖాల్ను చూసీచూడగానే నాలోని ఆధ్యాత్మికత ఎందుకు ఇలా ఉద్దీపన చెందుతోంది? భగవంతుణ్ణి సమీపించే కొద్దీ భగవత్ వైభవాలు, మహత్వం గాంచటం తగ్గిపోతుంది. సాధకుడు మొదట్లో దశభుజ* ఈశ్వరమూర్తిని దర్శిస్తాడు. ఆ మూర్తిలో విభూతి అత్యధికంగా కనిపిస్తుంది. ఆపైన ద్విభుజమూర్తి దర్శనం అవుతుంది. ఈ మూర్తిలో విభిన్న శస్త్రాస్త్రాలు ధరించిన పది చేతులు ఉండవు. తరువాత సాధకుడు గోపాలమూర్తిని దర్శిస్తాడు. ఈ మూర్తిలో ఎటువంటి శక్తి వ్యక్తీకరణా ఉండదు. కేవలం పసిబాలుని మూర్తి. ఆ తరువాత ఇతర దర్శనాలు గాంచుతాడు. అటుపైన సాధకుడు జ్యోతిని మాత్రమే దర్శిస్తాడు.
7.10.1 సమాధితోనే బ్రహ్మజ్ఞానం – విచక్షణ విచారణల త్యాగం
“భగవత్సాక్షాత్కారానంతరం, సమాధిలో భగవత్ సంసర్గం పొందాక విచక్షణ–విచారణలు నశిస్తాయి. ఎంతకాలం మనిషి విచక్షణ విచారణలు చేయగలడు? ఈ జగత్తును నానావిధాలుగా చూసేవరకు – నేను, నువ్వు – ఇవి ఎరుక ఉన్నంత వరకే విచక్షణ, విచారణలు చేస్తాడు. ఏకత్వాన్ని యథార్థంగా గ్రహించిన నాడు అతడు అంతర్ముఖుడై, మౌనం పాటిస్తాడు. ఇట్టి స్థితి పొందిన వ్యక్తికి ఉదాహరణ త్రైలింగస్వామి.*
“బ్రాహ్మణ సంతర్పణ జరిగేటప్పుడు నువ్వు గమనించలేదా? మొదట గొప్ప గడబిడ చెలరేగుతుంది. వారి పొట్టలు ఆహారంతో నిండేకొద్దీ రణగొణధ్వని తగ్గుముఖం పడుతుంది. చివరకు పెరుగు వడ్డించినప్పుడు పెరుగన్నం జుర్రుకొనే శబ్దం మాత్రమే వినవస్తుంది. తరువాత నిద్రావస్థ – సమాధి. గడబిడ సద్దుమణుగుతుంది.
(‘మ’, ప్రాణకృష్ణులతో) “అనేకులు బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడతారు; కాని వారి మనస్సులు సదా ఇల్లు, భవనాలు, ధనం, పేరుప్రతిష్ఠలు, ఇంద్రియ సుఖాలు మొదలైన అధో విషయాలతోనే నిండి ఉంటాయి. మాన్యుమెంటు* పాదం వద్ద నిలబడినంతసేపు గుర్రాలు, బళ్ళు, దొరలు, దొరసానులను చూడగలవు. కాని మాన్యుమెంట్ పైకెక్కి చూస్తే అనంతం వరకూ విస్తరిస్తూ ఉన్న ఆకాశాన్ని, సముద్రాన్ని తిలకించగలవు. అప్పుడు నువ్వు భవనాలు, బళ్ళు, గుర్రాలు లేక మనుష్యులను చూడటంలో ఆనందం పొందలేవు. అవి చీమల్లాగా కనిపిస్తాయి.
“బ్రహ్మజ్ఞానం పొందగానే సంసారానురక్తీ, కామినీ కాంచనాలపట్ల వ్యామోహమూ మొదలైనవి అదృశ్యమవుతాయి. సకల వాంఛలకూ తెరపడుతుంది. కొయ్యదుంగ మండేటప్పుడు చిటపట మనే శబ్దం వస్తుంది. మండటం పూర్తయి బూడిద మాత్రం మిగిలాక ఎలాంటి శబ్దమూ రాదు. అనురక్తి నశించగానే ఆరాటమూ అదృశ్యమవుతుంది. చివరకు శాంతి చేకూరుతుంది.
“భగవంతుడి సమీపానికి పోయేకొద్దీ మరింత శాంతిని పొందుతావు. శాంతిః శాంతిః శాంతిః ప్రశాంతిః. గంగానదిని సమీపించేకొద్దీ అంతగా దాని చల్లదనాన్ని అనుభవిస్తావు. గంగలో మునకవేశాక పూర్తిగా ఉపశమనం పొందుతావు.
“జీవులు, జగత్తు, చతుర్వింశతి తత్త్వాలకు అస్తిత్వం భగవంతుడి ఉనికి చేతనే. భగవంతుణ్ణి తొలగిస్తే ఏదీ మిగలదు. ఒకటి అంకె తరువాత సున్నాలు పెడుతూ ఉంటే అంకె విలువ పెరుగుతూ పోతుంది; కాని ఆ ఒకటి అంకే లేకుంటే ఈ సున్నాలకు విలువంటూ ఏదీ ఉండదు.”
ప్రాణకృష్ణకి తెలుపటానికి శ్రీరామకృష్ణులు తమ స్థితినే పరోక్షంగా చెబుతున్నారా?
శ్రీరామకృష్ణులు కొనసాగించారు: “బ్రహ్మజ్ఞానం పొంది అత్యున్నతమైన సమాధి స్థితి సంతరించుకున్నాక కూడా కొందరు ‘విద్యా నేను’ ను, ‘భక్తి నేను’ ను ఆశ్రయించి మనస్సును దిగువ స్థితిలో నిలిపి ఉంచుతారు. అదెలాగంటే – బజారు మూసివేశాక కూడా కొందరు తమ ఇచ్ఛానుసారం అక్కడే పచార్లు చేస్తూ ఉంటారు. నారదాది మహర్షుల విషయం ఇటువంటిదే. వారు ‘భక్తి నేను’ ను లోకోపదేశార్థం నిలుపుకొని ఉన్నారు. అదే ప్రయోజనానికై శంకరాచార్యులు ‘విద్యానేను’ ను ఆశ్రయించి ఉన్నారు.
“విషయానురక్తి జాడమాత్రంగా ఉన్నాకూడా భగవత్సాక్షాత్కారం లభించదు. దారానికి అతిచిన్న పోగు అంటిపెట్టుకొని ఉన్నా ఆ దారాన్ని సూది బెజ్జంలోకి ఎక్కించలేము.
“భగవల్లాభం పొందిన వారి కామక్రోధాలు నామమాత్రాలే. అవి కాలిపోయిన త్రాడు లాంటివి. అది ఆకృతిలో తాడులా కనిపించినా, ఉఫ్ అని ఊదగానే చెల్లాచెదరైపోతుంది.
“మనస్సు విషయానురక్తినుండి విముక్తం కాగానే భగవత్సాక్షాత్కారం కలుగుతుంది. శుద్ధ మానసంలో కానవచ్చేదంతా భగవద్వాణియే. శుద్ధ మానసం, శుద్ధ బుద్ధి ఒక్కటే; శుద్ధ ఆత్మ కూడా అదే – ఎందుకంటే భగవంతుడు తప్ప పరిశుద్ధమైనది ఏదీ ఉండదు కనుక. భగవత్సాక్షాత్కారం పొందితే ధర్మాధర్మాలకు అతీతంగా ఉండవచ్చు.”
ఇలా అంటూ సుమధుర కంఠంతో శ్రీరామకృష్ణులు రామప్రసాద్ గీతం పాడసాగారు:
రావే మనసా షికారు పోదము
కాళీకల్ప ద్రుమంబునకు
ప్రోగుచేయు చెట్టు క్రిందను
నాలుగు పురుషార్థంబులును…….
7.11 ఏకాదశ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల రాధా భావం
శ్రీరామకృష్ణులు లేచి వెళ్ళి తమ గదికి ఆగ్నేయ మూలలో ఉన్న వసారాలో కూర్చున్నారు. ప్రాణకృష్ణ, తదితర భక్తులు ఆయనను అనుసరించారు. హాజ్రా కూడా అక్కడ కూర్చుని ఉన్నాడు. ప్రాణకృష్ణతో నవ్వుతూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “హాజ్రా తక్కువైన వాడా ఏమిటి? ఇక్కడ (తమను ఉద్దేశిస్తూ) పెద్ద దర్గాను చూశారంటే, చిన్న దర్గా హాజ్రాయే కదా!” శ్రీరామకృష్ణుల పలుకులకు అందరూ నవ్వారు.
అప్పుడు నవకుమార్ వచ్చి ద్వారం వద్దే నిలబడ్డాడు. భక్తబృందాన్ని చూడగానే అతడు తక్షణమే వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. “ఆహా! మూర్తీభవించిన అహంకారం!” అంటూ శ్రీరామకృష్ణులు వ్యాఖ్యానించారు.
దాదాపు ఉదయం తొమ్మిదిన్నర సమయంలో ప్రాణకృష్ణ, శ్రీరామకృష్ణుల నుంచి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు.
ఆ తరువాత ఒక గాయకుడు తంబూర మీటుతూ కొన్ని భక్తి గీతాలు పాడాడు. శ్రీరామకృష్ణులు ఆ గీతాలు వింటూ ఉండగా గృహస్థ భక్తుడైన కేదార్ ఛటర్జీ గదిలోకి వచ్చాడు. అతడు తన కార్యాలయ ఉడుపులు ధరించి ఉన్నాడు. అతడిది భక్తి ప్రాధాన్యమైన ప్రవృత్తి; బృందావన గోపికల వైఖరిని ఇచ్ఛగిస్తాడు. భగవత్ ప్రసంగం అతడి కంట అశ్రువులు తెప్పిస్తుంది.
కేదార్‌ను చూడగానే శ్రీరామకృష్ణులకు శ్రీకృష్ణుని బృందావన లీలలు స్ఫురణకు వచ్చాయి. దివ్యప్రేమోన్మత్తులై ఆయన లేచి నిలబడి కేదార్‌ను ఉద్దేశిస్తూ పాడ నారంభించారు:
సఖీ నాకు చెప్పవే ఇక నెంత దూరమే
నా వంశీమోహనుడు నర్తించు ఆ వనము॥ స ॥
ఇచ్చోటికి గూడ వచ్చి చేరుచునుండె
ఆ మోహనుని మేను సౌగంధ సౌరభము॥ స ॥
కాని నే పూర్తిగా గాసిల్లిపోయితిని
ఇక సాగదే కాలు ఇక నెంత మాత్రము॥ స ॥
ఈ పాట పాడుతూ శ్రీరామకృష్ణులు, కృష్ణుని పట్ల రాధ కనబరచే వైఖరిని తమలో ఆరోపించుకొని గాఢసమాధి మగ్నులైనారు. కిత్తనార బట్టపై చిత్రించిన చిత్తరువులా శ్రీరామకృష్ణులు దివ్యానంద బాష్పాలు చెక్కిళ్ల నుండి స్రవిస్తూ ఉండగా అలాగే నిలబడి ఉన్నారు.
కేదార్ శ్రీరామకృష్ణుల మ్రోల వ్రాలాడు. ఆయన పాదాలను స్పృశిస్తూ ఇలా స్తుతించాడు:
హృదయ కమల మధ్యే నిర్విశేషం నిరీహం ।
హరిహరవిధివేద్యం యోగిభిర్ధ్యానగమ్యమ్ ॥
జననమరణ భీతిభ్రంసి సచ్చిత్స్వరూపమ్
సకలభువనబీజం బ్రహ్మచైతన్యమీడే ॥
కొంతసేపటికి శ్రీరామకృష్ణులు బాహ్యచైతన్యంలోకి వచ్చారు. కేదార్ తన సొంత ఊరు అయిన హాలిశహర్ నుండి కలకత్తాలోని తన కార్యాలయానికి వెళతాడు. దారిలో శ్రీరామకృష్ణుల దర్శనార్థం కాళీ ఆలయానికి వచ్చాడు. కాసేపు అక్కడ ఉండి కేదార్ వెళ్లిపోయాడు.
మధ్యాహ్నం అయ్యేసరికి కాళికాలయంలో నివేదించిన ప్రసాదాన్ని రాంలాల్ ఒక పళ్లెంలో శ్రీరామకృష్ణుల కోసం తీసుకువచ్చాడు. తమ గదిలో దక్షిణాభిముఖంగా కూర్చుని శ్రీరామకృష్ణులు ప్రసాదం ఆరగించారు. పిల్లవాడి మాదిరి ప్రతి పదార్థం కాస్త కాస్త తిన్నారు. భోజనానంతరం విశ్రాంతికై చిన్నమంచంపై పడుకున్నారు.
7.12 ద్వాదశ పరిచ్ఛేదం అభ్యాసయోగం – విచారణ, భక్తి
మధ్యాహ్నం మూడు గంటలకు కొందరు మార్వాడీ భక్తులు శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చారు. నేల మీద కూర్చుని శ్రీరామకృష్ణులను ప్రశ్నలు అడుగుతున్నారు. అప్పుడు రాఖాల్, ‘మ’ కూడా గదిలో కూర్చుని ఉన్నారు.
మార్వాడీ భక్తుడు: అయ్యా, తరణోపాయం ఏమిటి?
శ్రీరామకృష్ణులు: రెండు మార్గాలున్నాయి. ఒకటి విచారణ మార్గం, రెండవది అనురాగం లేక భక్తిమార్గం. విచారణ మార్గం: సదసద్విచారణ; భగవంతుడు మాత్రమే సత్యం, నిత్యవస్తువు. తక్కినదంతా అసత్యం, అనిత్యం. ఐంద్రజాలికుడు మాత్రమే సత్యం, ఇంద్రజాలం మిథ్య. విచారణ అంటే ఇదే.
“వివేకం, వైరాగ్యం; ఈ సదసద్విచారణను వివేకం అంటారు. వైరాగ్యం అంటే సంసారంలోని వస్తువుల పట్ల విరక్తి నొందటం. ఈ వైరాగ్యం హఠాత్తుగా జనించదు సుమా! అనునిత్యం అభ్యసించటం ద్వారానే అది అలవడుతుంది. ప్రథమంలో కామినీకాంచనాలను మానసికంగా త్యజించాలి. ఆ తరువాత, భగవదేచ్ఛతో వాటిని మానసికంగాను, బాహ్యంగాను పరిత్యజించ గలుగుతావు. భగవంతునికై కలకత్తా వాసులను సమస్తం త్యజించమని అడగటం అసాధ్యం. మానసికంగా వాటిని త్యజించమని చెప్పవచ్చు.
“అభ్యాసయోగం ద్వారా కామినీకాంచనాల పట్ల గల అనురక్తి త్యజించనగును. అదే భగవద్గీత చెబుతోంది. అభ్యాసయోగం ద్వారా మనస్సులో అసాధారణ శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడు ఇంద్రియాలను సంయమం చేయటం సులభం; కామ క్రోధాదులను నియంత్రించడంలో కష్టం ఏమీ కలుగదు. అటువంటి వ్యక్తి తాబేలులా ప్రవర్తిస్తాడు; తాబేలు తన అవయవాలను లోపలకు ముడుచుకొన్నాక, వాటిని వెలుపలికి తీసే ప్రసక్తే ఉండదు; గొడ్డలితో ముక్కలుగా నరికినా, దాని అవయవాలను బయటకు రప్పించలేవు.”
మార్వాడీ భక్తుడు: మహరాజ్! మీరు రెండు మార్గాలను సూచించారు. రెండవ మార్గం ఏది?
శ్రీరామకృష్ణులు: అనురాగం లేక భక్తి మార్గం; భగవంతుడి పట్ల హృదయపూర్వకమైన ప్రేమ. ఏకాంతంలో గోప్యంగా వ్యాకుల మనస్కుడవై భగవద్దర్శనార్థం ఒకసారి విలపించు. ‘దర్శనం ఇవ్వు’ అని పలుకు.
అమ్మా! శ్యామా! యని నీ వార్తితో
ఆక్రోశించిన ఓ మనసా
ఆవేదనగని ఆగగల్గునా
అమ్మ శ్యామ నీ కగుపడకుండ….”
మార్వాడీ భక్తుడు: అయ్యా! సాకార పూజ అంటే అర్థం ఏమిటి? నిరాకారోపాసన అంటే అర్థం ఏమిటి?
శ్రీరామకృష్ణులు: తండ్రి ఛాయాచిత్రాన్ని చూడగానే తండ్రి జ్ఞప్తికి వస్తాడు కదా! అదేవిధంగా దేవతా విగ్రహాన్ని అర్చించిన మరుక్షణంలోనే వాస్తవమైన భగవంతుని ఉద్దీపన కలుగుతుంది.
“సాకారరూపం ఎలాటిదో తెలుసా? అనంత జలరాశిలో అప్పుడప్పుడు బుడగలు లేచినట్లు మహాకాశం – చిదాకాశంలో విభిన్న రూపాలు పైకి లేవడం కానవస్తుంది. అట్లే అవతారం కూడా ఒకానొక రూపం. అవతార పురుషుని లీల ఆద్యాశక్తి ఆటయే సుమా!
7.12.1 పాండిత్యం – నేనెవరిని? – నేనే నీవు
“కేవలం పాండిత్యం వలన ప్రయోజనం ఏముంది? వ్యాకుల మనస్కుడవై విలపిస్తే భగవంతుణ్ణి పొందవచ్చు. నానా విషయాలను గురించి తెలుసుకోవలసిన అవసరం ఏముంది?
“ఆచార్యుడైన వ్యక్తే అనేక విషయాలు ఎరిగి ఉండాలి. పరులను చంపటానికి కత్తి, డాలు కావలసి ఉంటుంది. కాని తనను తాను చంపుకోవాలంటే ఒక సూది లేదా చిరుకత్తి మాత్రం చాలు.
“ ‘నేను’ అన్నది ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో చివరకు భగవంతుణ్ణి కనుగొంటావు. ఈ ‘నేను’ అనేది ఏమిటి? మాంసమా, ఎముకలా, రక్తమా, లేక మజ్జయా? అది మనస్సా లేక బుద్ధియా? ఇలా విశ్లేషించుకుంటూ పోతే ‘నేను’ అనేది వీటిలో ఏదీ కాదని నువ్వు గ్రహిస్తావు. దీనినే ‘నేతి, నేతి’ (ఇది కాదు, ఇది కాదు) విధానమంటారు. ఆత్మను అర్థం చేసుకోలేము, తాకనూలేము. అది నిర్గుణం, ఉపాధిరహితం.
“కాని భక్తిమార్గం ప్రకారం చూస్తే భగవంతుడు సగుణుడు. భక్తునికి కృష్ణుడు చిన్మయశ్యాముడు, చిన్మయధాముడు; సర్వం చిన్మయం.”
తరువాత మార్వాడీ భక్తులు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి, సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు.
7.12.2 దక్షిణేశ్వరంలో సంధ్యాహారతి
సాయంకాలం అవుతూ ఉండగా గంగానదిని తిలకించే నిమిత్తం శ్రీరామకృష్ణులు గది బయటకు వచ్చారు. ఆయన గదిలో దీపం వెలిగించారు. శ్రీరామకృష్ణులు మంచంపై కూర్చుని జగన్మాత పవిత్రనామాన్ని జపిస్తూ, ఆమెను ధ్యానించసాగారు.
తరువాత వివిధ ఆలయాలలో సాయంకాల హారతులివ్వసాగారు. గంగాతీరంలోను, పంచవటిలోను ఉన్న భక్తులు దూరం నుంచి దీపారాధన సుమధుర నాదాన్ని విన్నారు. ఆటు బయలుదేరటంతో గంగ గలగల ధ్వనితో ఉత్తరం వైపుగా ప్రవహించసాగింది. సాయంకాల దీపారాధన గంటల నాదం గాలిలో తేలుతూ గంగానది గలగల ధ్వనులలో మిళితమై సుమధురతను ఇనుమడింప చేసింది. ఆ రమ్యమైన వాతావరణంలో ప్రేమోన్మత్తులైన శ్రీరామకృష్ణులు గదిలో ఆసీనులై ఉన్నారు. హృదయం ఆనందమయమైంది! సర్వత్రా ఆనందమే!