6.1 ప్రథమ పరిచ్ఛేదం బ్రహ్మసమాజపు అర్ధవార్షికోత్సవంలో శ్రీరామకృష్ణులు
28, అక్టోబర్, 1882
అది శనివారం. బ్రహ్మసమాజపు అర్ధవార్షికోత్సవం, ఉత్తర కలకత్తాకు మూడు మైళ్ల దూరంలోని సింథి ప్రాంతంలోని వేణిమాధవ పాల్ ఉద్యాన గృహంలో జరుపబడుతోంది. ఈ అర్ధవార్షికోత్సవం ప్రతీ శరత్కాలంలోను, వసంతకాలంలోను జరుపుతారు. ఈ ఉద్యానగృహం, ధ్యానానికి అనువుగా ఒక నిర్జన ప్రాంతంలో ఉంది. పువ్వుల చెట్లతో, పచ్చిక గట్లుగల కృత్రిమ సరోవరాలతో, పచ్చని పొదరిళ్లతో ఆ ప్రాంతపు అందం ద్విగుణీకృతమవుతోంది. అస్తమిస్తూన్న సూర్యుని కాంతిలో మృదుల మేఘాలు బంగారు వర్ణాలు ఈనుతూన్న సమయంలో పరమ గురువు శ్రీరామకృష్ణులు అక్కడకు వేంచేశారు.
అనేకమంది భక్తులు ప్రాతఃకాలపు ఉపాసనా కార్యక్రమాలలో పాల్గొన్నారు. మధ్యాహ్నం కలకత్తా, చుట్టుపట్ల గ్రామాలనుండి కూడా జనం వచ్చారు. శ్రీరామకృష్ణుల అనురాగానికి పాత్రుడైన గొప్ప బ్రహ్మసమాజ భక్తుడు శివనాథ్ కూడా ఆ భక్తసందోహంలో ఉన్నాడు. వీరందరూ శ్రీరామకృష్ణుల రాకకై ఆతురతతో ఎదురుచూస్తున్నారు.
శ్రీరామకృష్ణులను, మరి కొందరు భక్తులను తీసుకువస్తున్న బండి ఉద్యాన గృహాన్ని చేరుకోగానే, ఆయనకు స్వాగతం తెలుపుతూ అందరూ గౌరవపూర్వకంగా లేచి నిలబడ్డారు. నాటక ప్రదర్శనశాలలో తెర ఎత్తబోయే ముందు రాజ్యం చేసే నిశ్శబ్దం లాంటిది అప్పుడక్కడ హఠాత్తుగా నెలకొంది. అప్పటిదాకా పరస్పరం మాట్లాడుకుంటూన్న భక్తులు తమ దృక్కులను శ్రీరామకృష్ణుల ప్రశాంత వదనారవిందంపై కేంద్రీకరించారు. ఆయన పెదవులనుండి జాలువారబోయే ఒక్క మాటనుకూడా వినకుండా వదలరాదనే ఆతురతతో వారున్నారు.
6.2 ద్వితీయ పరిచ్ఛేదం భక్తులతో సంభాషణ
మాం చ యోఽవ్యభిచారేణ భక్తియోగేన సేవతే ।
స గుణాన్సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ॥(గీత 14 : 26)
శివనాథ్‌ను చూసీచూడగానే శ్రీరామకృష్ణులు సంతోషంగా ఇలా కేకవేశారు: “ఆహా! ఇదుగో శివనాథ్! చూడు, నువ్వు భగవంతుడి భక్తుడవు. నిన్ను చూడటమే నా హృదయాన్ని ఆనందమయం చేస్తుంది. గంజాయి త్రాగేవాడు మరొక గంజాయి త్రాగేవాణ్ణి కలుసుకోవటంలో ఎంతో సంతోషిస్తాడు. తరచూ ఆనందాతిశయంలో వారు పరస్పరం కౌగలించుకోవటం కూడా పరిపాటి.”
భక్తులు పొట్ట చెక్కలయ్యేట్లు నవ్వారు.
శివనాథ్
6.2.1 లౌకికుల స్వభావం – నామమాహాత్మ్యం
శ్రీరామకృష్ణులు: దక్షిణేశ్వర ఆలయ ఉద్యానవనాన్ని అనేకులు సందర్శిస్తారు. సందర్శకులలో కొందరు భగవంతుడిపట్ల అనాసక్తులుగా ఉండటం నేను గమనిస్తే వారితో ‘మీరు కాస్త దూరంగా పోయి కూర్చోండి’ అనేవాణ్ణి. కొన్ని సందర్భాలలో ‘అటు వెళ్ళి మంచి భవంతులను చూడండి’ అనేవాణ్ణి. (నవ్వులు)
“కొన్ని సమయాలలో భక్తులతో కలిసి అయోగ్యులు కూడా రావటం నేను గమనించాను. వీరు లోకాభిరామాయణంలో మునిగిపోయి ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల పూర్తిగా విముఖులై ఉంటారు. భక్తులు నాతో చాలాసేపు భగవత్ప్రసంగాలు చేస్తూవుంటే, వీరు అశాంతచిత్తు లవుతారు. ఇక అక్కడ కూర్చోవటం వారికి అసాధ్యం కాగా భక్తులైన తమ మిత్రులతో ఇలా గుసగుసలాడతారు: ‘మనం ఎప్పుడు బయలుదేరుతున్నాం? ఇంకా ఎంతసేపు మీరిక్కడ ఉంటారు?’ అందుకు భక్తులు ‘ఓ క్షణం ఆగండి. కొంచెంసేపట్లో బయలుదేరుదాం’ అంటారు. అప్పుడీ లౌకిక జనం, కంఠంలో విసుగు ధ్వనించేలా, ‘సరే, మీరు మాట్లాడుకోండి. మీ కోసం పడవలో నిరీక్షిస్తూవుంటాం’ అంటారు. (అందరూ నవ్వారు)
“ఈ లౌకిక వ్యక్తులతో సమస్తాన్ని త్యజించమని, మనస్ఫూర్తిగా భగవంతుడికి అంకితం అవమని చెబితే ససేమిరా వినరు. అందుచేతనే చైతన్య నిత్యానందులు బాగా యోచించి ఈ లౌకిక జనాన్ని ఆకర్షించే నిమిత్తం ఒక ఏర్పాటు చేశారు. ఆ వ్యక్తులను సమీపించి ‘రండి, హరినామస్మరణ చేయండి. ‘మాగూర్’ చేపల* పులుసు, యువతి ఆలింగనం మీకు దక్కుతాయి,’ అనేవారు. అనేకులు ఈ చేప, యువతి పట్ల ఆకర్షితులై భగవన్నామ సంకీర్తన చేసేవారు. భగవంతుడి పవిత్ర నామామృతాన్ని కొంత రుచి చూశాక నిజానికి ‘ఈ చేప పులుసు’ ను భగవత్ప్రేమలో తాము స్రవించే కన్నీరుగా వారు గుర్తిస్తారు; ‘యువతి’ పృథివిని సూచిస్తుందని వారికి ఎరుక కలుగుతుంది. యువతి ఆలింగనం భగవత్ప్రేమలో పరమానందంతో నేలపైపడి దొర్లటంగా అర్థం చేసుకుంటారు.
“జనులు హరినామస్మరణ చేయటం కోసం నిత్యానందుడు ఏవేవో మార్గాలను చేపట్టేవాడు. భగవన్నామానికి ఎంతో మహత్వం ఉందని చైతన్యుడు అనేవాడు. అది తక్షణమే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చును కాని ఏదో ఒక రోజు ఫలాన్ని తప్పక అందిస్తుంది. ఒక భవనం గోడ మీద వదలివేయబడిన విత్తనం వంటిది అది. చాలా రోజులు గడిచాక భవనం కూలిపోయి, విత్తనం నేల మీద రాలుతుంది. తరువాత అంకురించి, చివరికి ఫలవంతమవుతుంది.
6.2.2 మానవప్రవృత్తి, మూడుగుణాలు – సత్త్వ, రజో, తమో భక్తులు
“సంసారులలో సత్త్వరజస్తమస్సులనే గుణాలు ఉన్నట్లే భక్తికూడా ఈ గుణాలచే చిత్రీకరించబడింది.
“సంసారులలో సత్త్వగుణంగల వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? బహుశా అతడి ఇల్లు కొంతమేర జీర్ణావస్థలో ఉంటుంది. దాని మరమ్మతు గురించి అతడు పట్టించుకోడు. దేవుడింటిలో పావురాళ్ల రెట్టలు, ముంగిట పాచిపట్టి ఉంటుంది. వీటి గురించి అతడికి ధ్యాసే ఉండదు. ఇంట్లోని కుర్చీలు వగైరాలు పాతవై ఉంటాయి. వాటికి పాలిష్ చేసి శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచనే అతడికి రాదు. ధరించే ఉడుపుల గురించి అసలు పట్టించుకోడు; ఏదో ఒకటి ధరించి సరిపెట్టుకుంటాడు. కాని వ్యక్తి మాత్రం శాంత స్వభావి, నెమ్మదస్థుడు, దయాళువు, వినమ్రుడు; ఎవ్వరికీ హాని తలపెట్టడు.
“మళ్ళీ సంసారులలో రజోగుణ లక్షణాలుగల వ్యక్తులు కొందరు ఉంటారు. అలాంటి వ్యక్తి గొలుసున్న చేతిగడియారం, వేళ్ళకు రెండు మూడు ఉంగరాలు ధరిస్తాడు. ఇంట్లో సామాను అందంగా, పొందికగా అమర్చబడి ఉంటుంది. గోడలకు మహారాణి, రాకుమారుడు తదితర ప్రముఖుల తైలవర్ణ చిత్రాలు వ్రేలాడుతూ ఉంటాయి; ఇల్లు చక్కగా సున్నం కొట్టబడి ఉంటుంది. నానారకాల దుస్తులు అతడికి ఉంటాయి. సేవకులకు కూడా తగినట్లు దుస్తులు అమరి ఉంటాయి.
“సంసారులలో తమోగుణ లక్షణాలుగల వ్యక్తిలో నిద్ర, కామం, క్రోధం, అహంకారం మొదలైనవి ఉంటాయి.
“అదే రకంగా భక్తికి సత్త్వగుణం ఉంటుంది. సత్వగుణంగల భక్తుడు ఎంతో గోప్యంగా, బహుశా తన దోమతెరలో భగవద్ధ్యానం చేస్తాడు. అతడు నిద్రిస్తున్నాడని ఇతరులు భావిస్తారు. ఉదయం అతడు కాస్త ఆలస్యంగా నిద్రలేవటం చేత, రాత్రి బాగా నిద్రపోయి ఉండడని అనుకుంటారు. ఆకలి తీర్చుకోవటం – అదీ ఏదో పచ్చడి మెతుకులతోనే – అంతవరకే అతడికి దేహం పట్ల ధ్యాస ఉంటుంది. అతడికి పంచభక్ష్యపరమాన్నాలు అక్కర్లేదు; ఆడంబరమైన దుస్తులతో పనిలేదు; ఇంట్లో సామాన్ల ప్రదర్శన ఉండదు. అంతేగాక ధనంకోసం ఎవ్వరినీ ముఖస్తుతి చేయడు.
“రజోగుణ లక్షణాలుగల భక్తుడు నుదుట తిలకం దిద్దుకుంటాడు. మెడలో రుద్రాక్షమాల ధరిస్తాడు. ఆ మాలలో అక్కడక్కడ బంగారుపూసలు కూడా ఉంటాయి. (అందరూ నవ్వారు) పట్టుపంచె ధరించి పూజ చేస్తాడు.
6.3 తృతీయ పరిచ్ఛేదం
క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే ।
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరన్తప ॥(గీత 2 : 3)
శ్రీరామకృష్ణులు: “తామసిక లక్షణాలున్న భక్తుడికి ప్రగాఢవిశ్వాసం ఉంటుంది. గజదొంగ ఒక వ్యక్తిపైబడి బలాత్కారంగా దోచుకొనేట్లుగా ఈ తామసిక భక్తుడు భగవంతుడి నుండి వరాలను వసూలు చేసుకొంటాడు. కొట్టు, చంపు – అదే అతడి మార్గం, గజదొంగ మార్గం.”
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు ప్రేమానందంలో మధుర స్వరంలో ఇలా పాడసాగారు:
నేనెందుకు పోవలె కాశీ కంచీ గంగా గయ ప్రభాసముకూ
కాళీ నామమును కలవరించుచు
కడపటి శ్వాసను వదులుచుండగా॥ నే ॥
కర్మకలాపపు పనియేమున్నది
భక్తివిధానము లిక నెందులకు
మాతృభజనము మూడు సంధ్యల
మానక మనుజుడు చేయుచుండగ॥ నే ॥
కర్మలు మనుజుని వెంటనంటుచు
వెంబడి తరుమగ గలవేగాని
ఎంతమాత్రము ఆతని దాటి
ముందుకు పోవగ జాలనె జాలవు॥ నే ॥
మదనుని మనసున కసలు నచ్చవు
దానము ధర్మములాది దీక్షలు
బ్రహ్మానందము చిందెడు తల్లి
పదపద్మములె అతని సాధనలు॥ నే ॥
తరమే ఏరికినైననుగాని
తల్లి నామమహిమంబు తెలియగ
ఊహలకైనను తలపులకైనను
దాని భావమును తలపోయంగ॥ నే ॥
తానే స్వయముగ పాడును శివుడు
పరమేశ్వరుడు దేవదేవుడు
పంచముఖంబుల అమ్మ నామము
పారవశ్యమున ప్రస్తుతి చేయుచు॥ నే ॥
శ్రీరామకృష్ణులు జగజ్జనని ప్రేమలో ఉన్మత్తులయ్యారు. తీవ్ర వ్యాకులతతో మళ్లీ పాడనారంభించారు.
6.3.1 నామ మాహాత్మ్యం – మూడు రకాల ఆచార్యులు
ఓ దుర్గా యని పిలచుచు
అసువులు నే బాసినచో
ఎటులీయవు ముక్తి నాకు
ఎంతటి పాతకినైన నేను…..
తరువాత శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “గట్టి పట్టుదల ఉండాలి. ‘ఏమిటి? నేను అమ్మ నామాన్ని స్మరించాను. ఇక మీదట నే నెలా పాపిని అవుతాను? నే నామె బిడ్డను, ఆమె ఐశ్వర్యానికి నేను వారసుడను.’
“మీ తామస గుణానికి ఆధ్యాత్మిక మలుపు కల్పిస్తే, దాని సహాయంతో భగవత్సాక్షాత్కారం పొందవచ్చు. భగవంతుణ్ణి గట్టిగా పట్టుపట్టి అడగండి. ఆయన మనకు పరాయి మనిషి ఏమీ కాదు. ఆయన మన సొంత మనిషే.
“మళ్ళీ, చూడండి ఇతరుల హితానికై తామస లక్షణాన్ని చక్కగా ఉపయోగించవచ్చు. వైద్యులలో మూడు తరగతులవారు – ఉత్తమ, మధ్యమ, అధమ – ఉన్నారు. రోగి నాడి పరీక్షించి, ‘ఈ ఔషధం నియమంగా పుచ్చుకో’ అని మాత్రం చెప్పే వైద్యుడు అధమ వర్గానికి చెందుతాడు. రోగి వాస్తవానికి మందు పుచ్చుకున్నాడో లేదో కూడా ఇతడు విచారించడు. మధ్యమ తరగతికి చెందిన వైద్యుడు, రోగిని పరిపరి విధాల బుజ్జగించి ఔషధం పుచ్చుకోమంటాడు. రోగితో తియ్యగా ఇలా అంటాడు: ‘మంచివాడివి కదూ! ఔషధం పుచ్చుకోకుంటే రోగం ఎలా నయమవుతుంది? నీ కోసం నేనే స్వయంగా తయారు చేశాను’. రోగి ససేమిరా ఔషధం పుచ్చుకోవటం లేదని తెలియగానే అతడి గొంతులో బలవంతంగా, అవసరమైతే రోగి ఛాతీ మీద తన మోకాలు ఆనించి మందు పోసి, త్రాగించే వైద్యుడే ఉత్తమ తరగతికి చెందిన వైద్యుడు. ఈ సందర్భంలో ఆ వైద్యుడి తమోగుణం ప్రదర్శితమౌతోంది. ఇది రోగికి హాని కలిగించదు; పైగా అతడికి మేలునే చేస్తుంది.
“వైద్యులలో మాదిరే ఆధ్యాత్మిక గురువులలోనూ మూడు వర్గాలవారు ఉన్నారు. అధమ తరగతికి చెందిన గురువు, శిష్యులకు ధర్మోపదేశం మాత్రం చేస్తాడు; కాని వారి పురోగతిని గురించి పట్టించుకోడు, విచారించడు. శిష్యుడి మేలుగోరి పదేపదే అతడికి స్ఫూర్తినిస్తూ, తన బోధనలను జీర్ణించుకోమని వేడుకొనే గురువే మధ్యమ తరగతికి చెందిన గురువు. కాని మరొక తరగతికి చెందిన గురువులుంటారు. అలాంటి వారు శిష్యుడు ఎంతకీ లొంగిరాకుంటే బలప్రయోగంచేసి అయినా దారికి తెస్తారు. అటువంటి గురువులే ఉత్తమ తరగతికి చెందుతారు.”
6.4 చతుర్థ పరిచ్ఛేదం బ్రహ్మస్వరూపాన్ని నోటితో వర్ణించలేం!
“యతో వాచో నివర్తన్తే । అప్రాప్య మనసా సహ ।”(తైత్తిరీయోపనిషత్తు 2 : 4)
బ్రహ్మసమాజ భక్తుడు: భగవంతుడు సాకారుడా లేక నిరాకారుడా?
శ్రీరామకృష్ణులు: ఆయన ఫలానా అని ఎవరూ నిశ్చయంగా చెప్పలేరు. ఆయన సాకారుడు, నిరాకారుడు కూడాను. భక్తుడికి ఆయన సాకారుడు. ‘జగత్ స్వప్నవత్’ అని తలచే జ్ఞానులకు ఆయన నిరాకారుడు. భక్తుడు తాను వేరు, జగత్తు వేరుగా భావిస్తాడు. కనుకనే భగవంతుడు వ్యక్తిమాత్రుడుగా అతడికి దర్శనమిస్తాడు. కాని జ్ఞాని లేక వేదాంతి ‘నేతి, నేతి’ అని సర్వదా విచారణ చేస్తూనే ఉంటాడు. ఈ విచారణ ద్వారా తన ఆంతరిక గ్రహణశక్తితో ‘నేను అనేది మిథ్య, జగత్తు మిథ్య’ అనే ఎరుక అతడికి కలుగుతుంది. తదుపరి జ్ఞానికి బ్రహ్మతత్త్వం బోధపడుతుంది. కాని బ్రహ్మం ఎలాంటిదో అతడు వర్ణింపజాలడు.
“నా భావం అర్థమైందా? బ్రహ్మాన్ని గురించి ఆలోచించండి – అనంత సచ్చిదానంద సాగరం తీరమే లేనిది. భక్తుల ప్రేమ ప్రభావంతో శీతలమై నీరు అక్కడక్కడ ఘనీభవించి మంచుగడ్డవలె తయారవుతుంది. మరో విధంగా చెబితే భగవంతుడు తన భక్తులకోసం నానారూపాలు దాల్చి వ్యక్తిమాత్రుడుగా వారికి దర్శనమిస్తాడు. కాని జ్ఞానభాస్కరుడు ఉదయించగానే మంచుగడ్డలు కరిగిపోతాయి. తరువాత భగవంతుడు వ్యక్తిమాత్రుడుగా లేదా నానారూపాలలో ఉన్నట్లుగా భావించనవసరం ఉండదు. ఆయన ఏమిటి? అని వర్ణించలేం. ఎవరు భగవంతుణ్ణి వర్ణించగలరు? అలా వర్ణించగలిగినప్పుడు ‘నేను’ అనే అహం మాయమవుతుంది.
“విచారణ చేసుకుంటూపోతే ‘నేను’ అనేది ఏదీ కనిపించదు. ఉదాహరణకు ఒక ఉల్లిపాయ తీసుకోండి. ఉల్లిపాయను ఒలిచేటప్పుడు మొదట ఎర్రపొర తరువాత తెల్లపొరలు వస్తాయి. ఈ తెల్లపొరలను ఒకదానివెంట ఒకటిగా ఒలిచివేస్తే చివరకు ఏమీ కనబడదు.
“అటువంటి స్థితిలో ఎంత వెదకినా అహంకారం అంటూ ఏమీ కనిపించదు. దాన్ని వెదకటానికి ఇక ఎవరు మిగిలివుంటారు? ఆ స్థితిలో, తన పరిశుద్ధ చైతన్య స్థితిలో బ్రహ్మస్వరూపం గురించి తానెలా భావిస్తాడో ఎవరు వర్ణించగలరు? ఒకసారి సముద్రపు లోతును కనుగొనటానికి ఒక ఉప్పుబొమ్మ సముద్రంలోకి వెళ్ళింది. ఆ బొమ్మ నీళ్ళలోకి వెళ్ళగానే కరిగిపోయింది. ఇక సముద్రపు లోతును చెప్పేవారు ఎవరు?
“పూర్ణ జ్ఞానానికి ఒక సంకేతం ఉంది. పూర్ణజ్ఞానం పొందినప్పుడు మనిషి మౌనం వహిస్తాడు. తదుపరి ‘నేను’ అనే ఉప్పుబొమ్మ సచ్చిదానంద సాగరంలో కరిగిపోయి దాన్లో తాదాత్మ్యం చెందుతుంది. భేదబుద్ధి కించిత్తుకూడా మిగిలి ఉండదు.
“విచారణ చేయడం పూర్తికానంత వరకు మనిషి అతిశయంతో తర్కిస్తూ ఉంటాడు. విచారణ పూర్తికాగానే అతడు మౌనం వహిస్తాడు. ఖాళీ కడవను నీళ్ళతో నింపాక కడవలోని నీరు, బయటవున్న తటాకంలోని నీటితో ఒకటైనప్పుడు శబ్దం వినరాదు. కడవలో పూర్తిగా నీరు నిండనంత వరకు శబ్దం వస్తూనే ఉంటుంది.
“సముద్రపు కాలాపానీలో ప్రవేశించిన పడవ ఇక తిరిగి రాదని ప్రాచీన పెద్దలు చెప్పేవారు.”
6.4.1 ‘అహం’ పోదు
“ ‘అహం’ అనేది నశించినప్పుడే అన్ని చిక్కులూ, బాధలూ సమసిపోతాయి. నువ్వు వెయ్యిసార్లు విచారణ చెయ్యి, ఆ ‘అహం’ మటుకు పోదు. నీలాంటి నాలాంటి వాళ్ళకు ‘నేను భగవంతుడి భక్తుడను’ అనే భావం ఉండటం మంచిది.
“భక్తులకు సగుణబ్రహ్మం కేటాయించబడింది. అంటే భగవంతుడు గుణాలు గలవాడనీ, రూపాన్ని ధరించి వ్యక్తిమాత్రుడుగా దర్శనమిస్తాడని భక్తుడు విశ్వసిస్తాడు. మన ప్రార్థనలను ఆయనే ఆలకిస్తాడు. నువ్వు చేసే ప్రార్థనలన్నీ ఆయనకే నిర్దేశితాలు. మీరు భక్తులు; జ్ఞానులు లేక వేదాంతులు కారు. భగవంతుణ్ణి సాకారునిగా గాని లేక నిరాకారునిగా గాని అంగీకరించటం ఒక ప్రశ్న కాబోదు. భగవంతుడు మన ప్రార్థనలను ఆలకించే వ్యక్తి అనీ, సృష్టిస్థితిలయాలను గావిస్తున్నాడనీ, అతడు అనంతశక్తి స్వరూపుడనీ మనం భావించుకుంటే చాలు.
“భక్తిమార్గంలో భగవత్సాక్షాత్కారం పొందటం సులభం.”
6.5 పంచమ పరిచ్ఛేదం భగవద్దర్శనం – సాకారమా? నిరాకారమా?
భక్త్యా త్వనన్యయా శక్య అహమేవంవిధో-ర్జున ।
జ్ఞాతుం ద్రష్టుఞ్చ తత్త్వేన ప్రవేష్టుం చ పరన్తప ॥(గీత 11 : 54)
బ్రహ్మసమాజ భక్తుడు: మహాశయా! భగవంతుణ్ణి చూడటం సాధ్యమేనా? సాధ్యమే అయితే, మేం ఆయనను ఎందుకు చూడలేకున్నాం?
శ్రీరామకృష్ణులు: అవును, ఆయన్ను తప్పక చూడవచ్చు. ఆయన్ను సాకారరూపంలో చూడవచ్చు; నిరాకారంలోనూ కాంచవచ్చు. నీకు దాన్నెలా వివరించగలను?
బ్రహ్మసమాజ భక్తుడు: భగవంతుణ్ణి ఎలాంటి సాధనలచే చూడవచ్చు?
శ్రీరామకృష్ణులు: ఆయనకై తీవ్రపరితాపంతో నువ్వు విలపించగలవా? లోకులు దారాపుత్రులకోసం, ధనంకోసం కడివెడు కన్నీరు కారుస్తారు. భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు? పిల్లవాడు బొమ్మల ఆటలో లీనమైవున్నంత వరకు తల్లి వంట తదితర ఇంటిపనులు చేసుకుంటూ ఉంటుంది. కాని పిల్లవాడికి ఇక బొమ్మల ఆట రుచించనప్పుడు వాటిని ప్రక్కకు విసిరివేసి తల్లి కోసం గావుకేకలు పెడతాడు. తక్షణమే తల్లి సగం ఉడికిన అన్నపు పాత్రను పొయ్యి నుండి దింపి, పరుగున వెళ్ళి పిల్లవాణ్ణి అక్కున చేర్చుకొంటుంది. (BG 18.66)
బ్రహ్మసమాజ భక్తుడు: మహాశయా! భగవంతుడి స్వరూపాన్ని గురించి ఇన్ని విభిన్న అభిప్రాయాలు ఎందుకున్నాయి? కొందరు భగవంతుడు సాకారుడనీ, మరికొందరు నిరాకారుడనీ అంటారు. మళ్ళీ, భగవంతుడు సాకారుడని పేర్కొనేవారు ఆయన విభిన్న రూపాలను గురించి మనకు చెబుతారు. ఎందుకీ వివాదం అంతా?
శ్రీరామకృష్ణులు: భక్తుడు భగవంతుణ్ణి ఏ రకంగా చూస్తాడో భగవంతుడు ఆ రూపులో ఉంటాడనే తలుస్తాడు. వాస్తవానికి భగవంతుణ్ణి గురించి ఎలాంటి గందరగోళమూ లేదు. ఏదో విధంగా భగవత్సాక్షాత్కారం కలిగినప్పుడు భగవంతుడే స్వయంగా భక్తుడికి దీన్ని గురించి వివరించి చెబుతాడు. మీరు ఆ మార్గంలో మీ పాదాన్ని మోపలేదు. అలాంటప్పుడు భగవంతుణ్ణి గురించి సమస్తం తెలుసుకోగలం అని ఎలా ఆశిస్తారు?
“ఒక కథ చెబుతా వినండి: ఒకప్పుడు ఒక వ్యక్తి అడవిలో ప్రవేశించి ఒక చెట్టు మీద ఒక చిన్న జంతువును చూశాడు. అతడు తిరిగివచ్చి మరొక వ్యక్తితో తాను ఆ ఫలానా చెట్టు మీద అందమైన ఎరుపురంగులోని ఒక జంతువును చూశానని చెప్పాడు. ఆ రెండవ వ్యక్తి ఇలా అన్నాడు: ‘నేను ఆ అడవిలోకి వెళ్ళినప్పుడు, ఆ జంతువును చూడటం జరిగింది. కాని దాని రంగు ఎరుపు అని ఎందుకు అంటున్నావు? అది ఆకుపచ్చరంగుది.’ ఆ సందర్భంలో అక్కడేవున్న మూడవ వ్యక్తి ఆ ఇద్దరి జవాబును ఖండిస్తూ, ఆ జంతువు రంగు పసుపుపచ్చ అని బల్లగుద్ది చెప్పాడు. ఈలోపు మరికొందరు అక్కడ గుమిగూడారు. అందులో ఒకడు నీలం అనీ, మరొకడు గచ్చకాయరంగు అనీ ఇలా తలా ఒక విధంగా చెప్పసాగారు. చివరికి వారి మధ్య ఆ జంతువు రంగు గురించి దెబ్బలాట మొదలైంది. ఈ వివాదాన్ని పరిష్కరించే నిమిత్తం అందరూ కలిసి ఆ చెట్టు వద్దకు వెళ్లారు. అప్పుడు ఆ చెట్టు క్రింద ఒక వ్యక్తి కూర్చుని ఉండటం వీరు చూశారు. తమ వివాదం గురించి అతడికి చెప్పగా అతడు ఇలా జవాబు చెప్పాడు: ‘అవును, నా మకాం ఈ చెట్టు క్రిందే, నాకు ఆ జంతువు గురించి బాగా తెలుసు. మీ అందరి వర్ణనలూ నిజమే. కొన్ని సమయాల్లో ఆ జంతువు ఎరుపు రంగులోను, మరికొన్ని సందర్భాలలో పసుపుపచ్చ రంగులోను, ఇంకా కొన్ని సమయాల్లో నీలం, గచ్చకాయరంగు మొదలైన రంగుల్లోను కనబడుతుంది. అదొక ఊసరవెల్లి. కొన్ని సందర్భాలలో అది వర్ణరహితంగా కూడా ఉంటుంది. ఇప్పుడు దానికి రంగు ఉంది, మరొకప్పుడు ఏ రంగూ ఉండదు.
“ఇదే విధంగా భగవంతుణ్ణి గురించి అహర్నిశలూ చింతన చేసే వ్యక్తికి భగవంతుడి యథార్థ స్వరూపం ఎలాంటిదో అవగతమవుతుంది. భగవంతుడు నానారూప గుణాత్మకంగా భక్తులకు దర్శనమిస్తాడని అతడికొక్కడికే తెలుసు. భగవంతుడు సగుణుడు; అదే సమయంలో నిర్గుణుడు కూడా. ఆ చెట్టు క్రింద నివసిస్తున్న వ్యక్తికే ఊసరవెల్లి అనేక రంగులలో కనబడుతుందని తెలుస్తుంది. అంతేకాక ఆ ఊసరవెల్లి ఒక్కో సమయంలో వర్ణరహితంగా కూడా కనబడుతుందనీ అతడు ఎరుగును. ఇతరులు కేవలం తర్కవిచారణలు, వాదాలు చేస్తూ దుఃఖం అనుభవిస్తూంటారు.
“కబీరు ఇలా చెప్పేవాడట: ‘నిరాకార దైవం నా తండ్రి, సాకార దైవం నా తల్లి.’
“భక్తుడు ఏ రూపాన్ని ఇష్టపడతాడో భగవంతుడు ఆ రూపంలోనే దర్శనం ఇస్తాడు. ఆయన భక్తవత్సలుడు. తన వీరభక్తుడైన హనుమంతుడి కోసమే భగవంతుడు రాముడిగా అవతరించాడని పురాణంలో పేర్కోబడి ఉంది.
6.5.1 కాళీ, శ్యామా రూపాలు – అనంతుణ్ణి తెలుసుకోలేం
“భగవంతుడి రూపగుణాలు వేదాంతం ప్రకారం వివేచించినప్పుడు అదృశ్యమవుతాయి. ఆ వివేచనపు అంతిమ సిద్ధాంతం ఇదే – బ్రహ్మసత్యం, నామరూపయుక్తమైన ఈ జగత్తు మిథ్య. తాను భక్తుడననే చైతన్యం ఉన్నంత వరకూ అతడికి భగవంతుడి రూపాలను దర్శించటానికి లేక భగవంతుణ్ణి వ్యక్తి మాత్రుడుగా భావించటానికి వీలుపడుతుంది. ఆ వివేచనా దృక్పథం నుండి ఈ ‘భక్తుడననే అహం’ అతణ్ణి భగవంతుడి నుంచి కొంతదూరంగానే ఉంచుతుంది.
“శ్రీకృష్ణ లేక కాళి విగ్రహాలు మూడున్నర మూరల ఎత్తులో ఎందుకు ఉంటాయో మీకు తెలుసునా? దూరం కారణంగానే! దూరంలో ఉండటం చేతనే సూర్యుడు చిన్నగా కనిపిస్తాడు కాని దగ్గరకు వెళ్లి చూశారంటే చూడనలవి కానంత పెద్దగా కనిపిస్తాడు. కృష్ణ, కాళీ విగ్రహాలు నీలిరంగులో ఎందుకు ఉంటాయి? అదీ దూరం కారణంగానే; జలాశయంలోని నీరు దూరం నుంచి ఆకుపచ్చ, నీలం లేక నలుపు రంగులో కనబడే విధంగా. దగ్గరికి వెళ్లి ఆ నీటిని అరచేతిలోకి తీసుకుని చూడండి. ఆ నీటికి రంగు ఏదీ ఉండకపోవటం చూస్తారు. దగ్గరకు వెళ్ళి చూస్తే వర్ణరహితంగా కనిపిస్తుంది.
“కనుక నేను చెబుతున్నదేమంటే వేదాంత శాస్త్రాల దృక్పథం చూసినప్పుడు బ్రహ్మం నిర్గుణం. బ్రహ్మం స్వరూపం ఏమిటో నోటితో చెప్పలేము. అయితే నువ్వు ఉన్నంతవరకూ ఈ జగత్తూ వాస్తవమే; భగవంతుడి నానా రూపాలు, భగవంతుడు వ్యక్తిమాత్రుడు అనే భావన (సాకార భావన) కూడా సత్యమే.
“మీది భక్తిమార్గం. అది చాలా మంచిది; అది సులభమార్గం కూడా. అనంతరూపుడైన ఆ భగవంతుణ్ణి ఎవరు పూర్తిగా అర్థం చేసుకోగలరు? ఆయనను అర్థం చేసుకోవలసిన అవసరం కూడా ఏమున్నది? అతి దుర్లభమైన ఈ మానవజన్మ లభించాక మనకు కావలసింది భగవంతుడి పాదపద్మాలపట్ల భక్తి ఒక్కటే.
“ఒక చెంబు నీటితోనే దాహం తీరిపోతున్నప్పుడు, జలాశయంలో ఎంత నీరు ఉన్నదో కొలవటం ఎందుకు? సగం సీసా మద్యంతోనే నాకు బాగా మత్తెక్కినప్పుడు సారాదుకాణంలో ఎంత సరుకు ఉన్నదో గణించటంలో ప్రయోజనం ఏమిటి? అనంతుని సంపూర్ణంగా తెలుసుకోవలసిన అవసరం ఏముంది?
6.6 షష్ఠ పరిచ్ఛేదం భగవద్దర్శన లక్షణాలు – సప్తభూములు – బ్రహ్మజ్ఞానం
యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ।
ఆత్మన్యేవ చ సన్తుష్టస్తస్య కార్యం న విద్యతే ॥(గీత 3 : 17)
శ్రీరామకృష్ణులు: “వేదాలలో బ్రహ్మజ్ఞాని వివిధ మనోస్థితులు వర్ణించబడ్డాయి. జ్ఞానమార్గం ఎంతో కష్టమైనది. కామినీ కాంచనాల పట్ల అనురక్తి, విషయబుద్ధి జాడ మాత్రంగా ఉంటే కూడా జ్ఞానం కలుగదు. కలియుగానికి ఈ జ్ఞానమార్గం సరిపడదు.
“మనస్సు వాసంచేసే సప్తభూములను గురించి వేదాలు పేర్కొంటున్నాయి. సంసారంలో మనస్సు మునిగి ఉన్నప్పుడు అది అధోభూములలో – నాభి, లింగ, అపాన స్థానాల్లో వాసం చేస్తుంది. ఆ స్థితిలో మనస్సు ఉన్నత దృష్టిని కోల్పోతుంది; కామినీ కాంచనాలపైన నిలిచివుంటుంది. మనస్సు యొక్క నాలుగవ భూమి – హృదయం. మనస్సు అక్కడ వాసం చేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక చైతన్యపు తొలి భావాలు అంకురిస్తాయి. సాధకుడు తన చుట్టూ జ్యోతిని గాంచుతాడు. అంతట ఆ వ్యక్తి నలువైపులా జ్యోతి దర్శనం గాంచి, ఆశ్చర్యంతో మూగవోయి, ‘ఇదేమిటి? ఇదేమిటి?’ అంటాడు. ఆ స్థితిలో అతడి మనస్సు అధోముఖంగా, సంసారం కేసి పోజాలదు.
“మనస్సు యొక్క ఐదవ భూమి కంఠస్థానంలో నెలకొని ఉంది. మనస్సు ఈ స్థానానికి చేరుకున్నప్పుడు, సాధకుడు అవిద్య, అజ్ఞానం నుండి విముక్తుడవుతాడు. భగవత్ ప్రసంగం తప్ప మరేదీ అతడు వినడు, మాట్లాడడు. లౌకిక విషయాల గురించి ఎవరైనా మాట్లాడితే అతడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
“మనస్సు యొక్క ఆరవ భూమి భ్రూమధ్యంలో ఉన్నది. మనస్సు ఇక్కడకు చేరుకున్నప్పుడు సాధకుడు అహర్నిశలు భగవద్రూపాన్ని గాంచుతాడు. అప్పటికీ అతడిలో ‘అహం’ జాడమాత్రంగా మిగిలి ఉంటుంది. భగవంతుడి ఆ నిరుపమాన రూపాన్ని దర్శించగానే సాధకుడు ఉన్మత్తుడైపోతాడు; ఆ రూపాన్ని స్పృశించి, ఆలింగనం చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ ప్రయత్నం ఫలించదు. లాంతరు లోపల వత్తి వెలుగుతోంది. ఆ వెలుగును స్పృశించాలని అనుకొంటాం గాని, గాజు చిమ్నీ మధ్యలో ఉండటంతో ఆ వెలుగును తాకలేము.
“మనస్సు యొక్క సప్తమ భూమి శిరస్సున ఉన్నది. మనస్సు అక్కడకు ఎగసినప్పుడు, సాధకుడు సమాధిలోకి వెళతాడు. అప్పుడు ఆ బ్రహ్మజ్ఞానికి బ్రహ్మం ప్రత్యక్ష దర్శనం అవుతుంది. కాని ఆ స్థితిలో అతడి దేహం ఎక్కువ రోజులు నిలిచివుండదు. బాహ్యప్రపంచం పట్ల అతడికి స్పృహే ఉండదు. ఆహారం ఏమీ స్వీకరించజాలడు. అతడి నోట పాలు పోసిన పక్షంలో, పాలు బయటకు వచ్చేస్తాయి. ఈ చైతన్య భూమిలో వాసం చేసినప్పుడు, ఇరవై ఒక్క రోజులలో మరణం సంభవిస్తుంది. ఇదే బ్రహ్మజ్ఞాని స్థితి. కాని మీది భక్తిమార్గం. అది ఎంతో శ్రేష్ఠమైనది, పైగా సుగమం కూడా.
6.6.1 సమాధి స్థితితో కర్మత్యాగం – శ్రీరామకృష్ణుల ‘గళితహస్తం’
“ఒకప్పుడు ఒక వ్యక్తి నాతో, ‘మహాశయా! మీరంటున్న సమాధి స్థితిని నాకు త్వరగా నేర్పించగలరా?’ అని అడిగాడు. (అందరూ నవ్వారు)
“సమాధిస్థితి పొందిన తరువాత అతడికి సర్వకర్మత్యాగం కలుగుతుంది. విషయ కర్మలేగాక పూజ జపాది కర్మలు కూడా అంతరిస్తాయి. మొదట్లో కర్మ కోలాహలం అధికంగా ఉంటుంది. భగవంతుడి వైపుగా ఎంతగా పురోగమిస్తూ ఉంటావో అంతమేరకు కర్మాడంబరాలు తగ్గిపోతూ ఉంటాయి. భగవంతుని నామగుణగానం కూడా అతడు చేయలేకపోతాడు అంటే అతిశయోక్తి కాబోదు. (శివనాథ్‌తో) నువ్వు ఈ సభకు రానంత వరకు నీ సుగుణాలను గురించే ప్రస్తావిస్తూ, చర్చిస్తూ ఉంటారు. కాని నీ రాకతో అంతా ఆగిపోతుంది. నిన్ను చూడటంతోనే అందరూ ఆనందిస్తారు. ఇప్పుడు జనం ‘ఆహా! ఇదుగో శివనాథ్ బాబు’ అని మాత్రమే అంటారు. నిన్ను గురించిన సంభాషణ అంతా ఆగిపోతుంది.
“సమాధిస్థితి పొందిన తరువాత నేను ఒకసారి తర్పణం విడవటానికి గంగకు వెళ్ళాను. అరచేతుల్లోకి నీరు తీసుకోగా వ్రేళ్ళ సందుల నుండి నీళ్ళు కారిపోయాయి. విలపిస్తూ అప్పుడు హలధారితో ‘అన్నా! ఇదేమిటి? ఇలా అవుతోంది!’ అన్నాను. అందుకు హలధారి ‘దీనినే గళితహస్తం అంటారు’ అన్నాడు. భగవత్సాక్షాత్కారం కలిగిన తరువాత తర్పణాది కర్మలు ఆచరించ సాధ్యం కాదు.
“సంకీర్తన జరుగుతున్నప్పుడు భక్తుడు మొదట ‘నితాయ్ ఆమార్ మాతా హాథీ’ అంటూ పాడతాడు. భక్తి పారవశ్యం అధికరించగానే భక్తుడు ‘హాథీ! హాథీ!’ అని మాత్రమే అంటూవుంటాడు. తదనంతరం ‘హాథీ’ అన్న మాట కేవలం నోట్లోనే ఉంటుంది. చిట్టచివరకు ‘హా’ అని మాత్రమే అంటూ భావసమాధి మగ్నుడవుతాడు. అప్పటిదాకా పాడుతూన్న ఆ వ్యక్తి మూగవోతాడు.
“బ్రాహ్మణ సమారాధన సమయంలో ఎంత కోలాహలంగా ఉంటుందో గమనించలేదా? విస్తళ్లు వేశాక, అతిథులు వాటి ముందు కూర్చున్న తరువాత శబ్దం చాలావరకు అణగిపోతుంది. కేవలం ‘పూరీలు పట్రా’ అనే కేకలు మాత్రం వినవస్తాయి. పూరీలు, తదితర వంటకాలు తిన్న తరువాత మూడువంతుల శబ్దం అణగిపోతుంది. చివరికి పెరుగు వడ్డించాక పెరుగన్నం జుర్రుకొంటున్న శబ్దం మాత్రమే వినగలం. (అందరూ నవ్వారు) తరువాత మచ్చుకికూడా శబ్దం ఉండదు. తదనంతరం అంతా నిద్రకు ఉపక్రమిస్తారు. అప్పుడు పూర్తిగా నిశ్శబ్దం రాజ్యం చేస్తుంది.
“అందుచేత నేను చెబుతున్నదేమంటే – ఆధ్యాత్మిక జీవిత ప్రారంభ దశలో కర్మకలాపాల ఆర్భాటం అధికంగా ఉంటుంది. కాని భగవన్మార్గంలో ఎంతగా పురోగమిస్తే అంతగా ఈ ఆర్భాటం తగ్గసాగుతుంది. చిట్టచివరకు కర్మపరిత్యాగం జరిగి సమాధిస్థితి కలుగుతుంది.
“ఇంటి కోడలు గర్భవతి అయినప్పుడు, అత్తగారు ఆమె పనులను తగ్గించి వేస్తుంది. నెలలు నిండాక దాదాపు ఏ పనీ చేయవలసి ఉండదు. బిడ్డపుట్టాక ఆమెకు ఇంటిపని ఏదీ ఉండదు; కేవలం బిడ్డను చూసుకుంటూ గడుపుతుంది. ఇంటి పనులను అత్తగారు, ఆడపడుచు, తోడికోడలు మొదలైనవారు చేస్తారు.
6.6.2 సమాధి స్థితి తరువాత అవతార పురుషుల శరీరం – లోక శిక్షణార్థమే
“సామాన్యంగా సమాధిస్థితి పొందిన తరువాత దేహంలో జీవం నిలిచి ఉండదు. కాని నారదాది ఋషులకు ఈ నియమం వర్తించదు; లోకుల ఉపదేశార్థం వీరు సజీవులై ఉంటారు. భగవదవతారమూర్తులైన చైతన్య మహాప్రభువు వంటివారి విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. బావి త్రవ్వటం పూర్తికాగానే పార, పలుగు, బుట్ట పారవేయటం జరుగుతుంది. కాని కొందరు ఈ పనిముట్లను ఇరుగుపొరుగుల ఉపయోగార్థం పదిలపరుచుకుంటారు. సమాధి అనంతరం తమ దేహాలను నిలుపుకొనివుండే మహాపురుషులు దుఃఖీతులైన జీవులపట్ల కనికరం చెందుతారు. తమకు కలిగిన జ్ఞానంతోనే తృప్తిచెందే స్వార్థపరులు కారు వీరు. స్వార్థపరుల నైజం గురించి మీకు చక్కగా తెలిసే ఉంటుంది. వారిని ఫలానా చోట మీరు ఉమ్మివేయమని అడిగితే, అందువల్ల మీకు ఏదో మేలు జరుగవచ్చునని, ఆ పని చేయరు. అంగడి నుండి ఒక పైసా మిఠాయి తీసుకురమ్మంటే, వీరు దాన్ని నాకుతూ తీసుకువస్తారు. (అందరూ నవ్వారు)
“విభిన్న జీవులలో దైవీశక్తి వ్యక్తీకరణలు విభిన్నాలుగా ఉంటాయి. సర్వ సామాన్యులు ఇతరులకు బోధించటానికి జంకుతారు. తేలికయైన కొయ్య ఏదో రకంగా నీళ్ళపై తేలుతుంది కాని ఒక పక్షి దానిమీద వ్రాలిన మాత్రాన ఆ కొయ్య నీళ్ళలో మునిగిపోతుంది. కాని ఒక భారీకొయ్యదుంగ స్వయంగా తాను నీళ్ళపై తేలటమేగాక తనతోకూడా మనుషులను, పశువులను, ఏనుగులను సైతం తీసుకుపోగలదు. నారదుని వంటి మహర్షులు భారీ కొయ్యదుంగలలాంటి వారు.
6.7 సప్తమ పరిచ్ఛేదం బ్రహ్మసమాజ ప్రార్థనా విధానం – భగవంతుని ఐశ్వర్యం
అదృష్టపూర్వం హృషితోఽస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే ।
తదేవ మే దర్శయ దేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస ॥(గీత 11: 45)
(శివనాథ్ ప్రభృత బ్రహ్మసమాజ భక్తులతో) “మీరెందుకు భగవంతుడి శక్తి వైభవాల గురించి అంతగా నొక్కివక్కాణిస్తారో నాకు చెప్పగలరా? కేశవ్‌ను కూడా ఇలాగే అడిగాను. ఒకనాడు కేశవ్ తన బృందంతో దక్షిణేశ్వరానికి వచ్చాడు. వారు ఎలా ప్రసంగిస్తారో వినాలని ఉందని వారితో చెప్పాను. గంగ ఒడ్డున స్నానఘట్టం ఎగువన ఉన్న ఆరుబయలులో ఒక సమావేశం ఏర్పాటయింది. అక్కడ కేశవ్ ప్రసంగించాడు. అతడు చక్కగా మాట్లాడాడు. నేను సమాధిస్థితి నొందాను. ప్రసంగానంతరం కేశవ్‌తో నేనిలా అన్నాను: ‘మీరు తరచు, “ఓ భగవంతుడా! నువ్వు ఎలాంటి అందమైన పుష్పాలను సృష్టించావు! ఓ ఈశ్వరా, నువ్వు స్వర్గాలను, నక్షత్రాలను, సముద్రాలను సృజించావు!” అలా ఎందుకు అంటూ ఉంటారు.’ ఐశ్వర్యాన్ని ఇష్టపడేవారే భగవంతుడి ఐశ్వర్యాన్ని గురించి వర్ణించటంలో మక్కువ చూపుతారు.
6.7.1 1869 లో రాధాకాంత ఆలయంలో చోరీ
“ఒకప్పుడు దక్షిణేశ్వరంలోని రాధాకాంత ఆలయంలోని దేవుడి ఆభరణాలు దొంగలించుకు పోయారు. మథుర్బాబు (రాణీ రాస్మణి అల్లుడు) ఆలయంలోకి వచ్చి, దేవుడితో ఇలా అన్నాడు: ‘ఓ భగవంతుడా! ఎంత సిగ్గుచేటు. నీ సొంత నగలను నువ్వు రక్షించుకోలేకపోయావు.’ అప్పుడు నేను అతడితో ఇలా అన్నాను: ‘మహాలక్ష్మీ స్వయంగా ఎవరికి పాదసేవ చేస్తూ ఉంటుందో ఆయన ఐశ్వర్యానికి లోటు ఉంటుందా? ఈ ఆభరణాలు నీకు అతివిలువైనవి కావచ్చు. కాని భగవంతుడికివి మట్టిబెడ్డలతో సమానం. నువ్వే సిగ్గుపడాలి. నువ్వు అంత హీనంగా మాట్లాడివుండరాదు. ఆ భగవంతుడి వైభవాన్ని ఇనుమడింప చేయటానికి నువ్వు ఏం సంపద లివ్వగలవాడివి?’
“కాబట్టి, మనిషికి ఎవరిని చూస్తే ఆనందం కలుగుతుందో అతణ్ణే కోరతాడు. కాని అతడు ఎక్కడ నివసిస్తాడు, అతడికి ఎన్ని గృహాలున్నాయి, ఎన్ని తోటలు, ఎందరు బంధుగణం, ఎందరు సేవకులు, ఎంత సంపద ఉన్నాయని అడగటం ఎందుకు? నేను నరేంద్రుణ్ణి చూడగానే సర్వం మరచిపోతాను. ఎన్నడూ, ఏమరచి కూడా అతడెక్కడ నివసిస్తాడు, తండ్రి ఏం చేస్తాడు, ఎందరన్నదమ్ములు మొదలైన ప్రశ్నలు అడిగి ఎరుగను.
“భగవంతుడి మాధుర్య రసంలో మునిగిపో. ఆయన అనంత సృష్టి, అపరిమిత వైభవాల గురించి తెలుసుకోవలసిన అవసరం మనకు ఏముంది?”
ఇలా అని, శ్రీరామకృష్ణులు పాడసాగారు:
మునుగవే లోతుకు మునుగవే మనసా
సర్వేశు సౌందర్య సంద్రంబునందు
అట్టడుగు లోతులను అందగలవేని
ప్రభు ప్రేమరత్నము పొందెదవచట॥ ము ॥
వెదుకవే హృదయాన వెదుకవే మనసా
వెదుకవే దానిలో బృందావనంబు
శ్రీకృష్ణచంద్రుండు క్రీడించునెపుడు
భక్తబృందము కూడి పాడియాడుచును॥ ము ॥
వెలిగింపవే మనస వెలిగింపు జ్యోతి
వెలిగింపవే నిత్య విజ్ఞానదీప్తి
ఆరకుండగజేయు మా దీపశిఖను
నిరతము కదలక నీ డెందమందు॥ ము ॥
నీ పడవ నెవ్వరు నెట్టుచున్నారు
గట్టిదౌ నేలపై పట్టి త్రోయుచును
అతడె నీ గురువని అనియె కుబీరు
భావింపు మా గురుపద పద్మములను॥ ము ॥
శ్రీరామకృష్ణులు (కొనసాగిస్తూ): భగవద్దర్శనానంతరం కొందరు భగవల్లీలా వీక్షణాభిలాష కలిగివుండటం కూడా నిజమే. శ్రీరాముడి చేతుల్లో రావణుడు సంహరింపబడ్డ తరువాత, రావణుడి తల్లి నికషా (కేకసి) ప్రాణభయంతో పారిపోసాగింది. అప్పుడు లక్ష్మణుడు, రాముడితో ఇలా అన్నాడు: ‘అన్నా! ఏమిటీ వింత? నాకు వివరించి చెప్పు. ఈ వృద్ధురాలు అనేక మంది పుత్రులను కోల్పోయి పుత్రశోకం అనుభవిస్తూ ఇప్పుడు స్వీయ ప్రాణరక్షణార్థం ఇలా ఎందుకు పారిపోతోంది?’ శ్రీరాముడు, రావణుని తల్లికి అభయం ఇచ్చి తన వద్దకు ఆమెను రావించి, ఆమె అలా పారిపోవటానికి గల కారణం ఏమిటని అడిగాడు. అందుకు నికషా ఇలా బదులిచ్చింది: ‘ఓ రామా! నేను జీవించి ఉన్నందునే నీ ఈ లీలలను తిలకించగలుగుతున్నాను. ఈ భూమ్మీద నువ్వు జరపబోయే అనేక లీలలను చూడగోరి ఇంకా కొంతకాలం జీవించాలని అభిలషిస్తున్నాను.’ (అందరూ నవ్వారు)
(శివనాథ్‌తో) “నిన్ను చూడాలనే ఇచ్ఛ కలుగుతుంది. పవిత్రాత్ములైన భక్తులను చూడకుండా నేనెలా జీవించగలను? నా గత జన్మలో పవిత్రాత్ములు నాకు మిత్రులై ఉండివుంటారని నాకు తోచుతోంది.”
ఒక బ్రహ్మసమాజ భక్తుడు: మహాశయా! మీరు పునర్జన్మ సిద్ధాంతం నమ్ముతారా?
6.7.2 పునర్జన్మ – “బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున”
శ్రీరామకృష్ణులు: ఆ, అలాంటిది ఉంటుందని విన్నాను. మన చిన్ని బుర్రలకు భగవంతుడి విధానాలు ఎలా తెలియగలవు? పునర్జన్మలను గురించి అనేకులు ప్రస్తావించి ఉన్నారు; కాబట్టి నేను అపనమ్మకం పెట్టుకోను. భీష్ముడు అంపశయ్యపై మరణించే సందర్భంలో ఆయన చుట్టూ శ్రీకృష్ణుడు, పంచపాండవులు నిలబడ్డారు. ఆ మహావీరుడి కళ్ళనుండి అశ్రువులు స్రవించటం వారు గమనించారు. అది చూసి అర్జునుడు, కృష్ణుడితో ఇలా అన్నాడు: ‘సఖా, ఎంత విచిత్రంగా ఉంది! పితామహులైన భీష్ములు – సత్యవాది, జితేంద్రియుడు, పరమజ్ఞాని, అష్టవసువులలో ఒకరు – మరణ సమయంలో మాయలోపడి దుఃఖీస్తున్నారెందుకు?’ దీన్ని గురించి కృష్ణుడే, భీష్ముణ్ణి అడిగాడు. అందుకు భీష్ముడు ఇలా జవాబిచ్చాడు: ‘ఓ కృష్ణా! నేనందుకు దుఃఖీంచటం లేదని నీకు బాగా తెలుసు. స్వయంగా భగవంతుడే పాండవులకు సారథిగా ఉన్నప్పటికీ వారి కష్టాలకు అంతులేకుండా ఉందే! ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి లీలలను నేను కించిత్తూ తెలుసుకోలేకుండా ఉన్నానే అని తలచుకొని దుఃఖీస్తున్నాను.’”
6.7.3 భజనానందంలో భక్తులతో
ప్రార్థనా మందిరంలో రాత్రి ఎనిమిదిన్నరకు ఉపాసన ప్రారంభమైంది. శరత్కాల గగనాన చంద్రుడు ఉదయించి ఉద్యానవనంలోని చెట్టు, లతలను తన వెలుగుతో నింపేశాడు. ఉపాసనానంతరం భక్తులు పాడసాగారు. శ్రీరామకృష్ణులు భగవత్ ప్రేమోన్మత్తులై నృత్యం చేయసాగారు. బ్రహ్మసమాజ భక్తులు మృదంగ తాళాల వంతపాటతో ఆయన చుట్టూ నృత్యం చేశారు. అందరూ ఆనందాబ్ధిలో ఓలలాడుతూన్నట్లుగా తోచుతోంది. ఆ ప్రదేశం భగవన్నామంతో ప్రతిధ్వనిస్తోంది.
సంగీతం ఆగిపోగానే శ్రీరామకృష్ణులు జగజ్జననికి సాష్టాంగ దండప్రణామాలు ఆచరించి ఇలా అన్నారు: “భాగవతం – భక్తుడు – భగవంతుడు! జ్ఞానుల చరణాలకు నా ప్రణామాలు. భక్తుల చరణాలకు నా ప్రణామాలు. నిరాకారవాదులైన భక్తుల చరణాలకు ప్రణామాలు! పూర్వకాలంలో వసించిన బ్రహ్మజ్ఞానులకు నా ప్రణామాలు! బ్రహ్మసమాజపు ఆధునిక బ్రహ్మజ్ఞానులకు నా ప్రణామాలు!”
తదనంతరం శ్రీరామకృష్ణులు, ఇతర భక్తులు వేణీమాధవ్ ఏర్పాటు చేసిన పంచభక్ష్య పరమాన్నాలతో కూడిన విందుభోజనం సంతోషంగా ఆరగించారు.
6.8 అష్టమ పరిచ్ఛేదం సర్కస్ ప్రదర్శన – శ్రీరామకృష్ణులు
బుధవారం, నవంబరు 15, 1882
శ్రీరామకృష్ణులు రాఖాలాది భక్తులతో దక్షిణ్వేరం నుండి బండిలో కలకత్తాలోని, ‘మ’ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న పాఠశాలకు వచ్చారు. అక్కడ ‘మ’ ను కూడా బండిలో ఎక్కించుకొని గఢ్ మైదానం వైపుగా బయలుదేరారు. శ్రీరామకృష్ణులు విల్సన్ సర్కస్ ప్రదర్శన తిలకించగోరారు. బండి జనసమ్మర్దం అధికంగావున్న చిత్పూర్ రహదారిగుండా పోతూన్నప్పుడు ఆయన పొందుతూన్న ఆనందం వర్ణనాతీతం. పసిబాలుడిలా ఆయన మొదట బండి ఒక వైపు నుండి తొంగిచూస్తూ, తరువాత రెండవ వైపునుండి తొంగిచూస్తూ దారినపోయే వారిని ఉద్దేశిస్తున్నట్లుగా తనలో మాట్లాడుకోసాగారు. ‘మ’ కేసి తిరిగి ఇలా అన్నారు: “జనం దృష్టి లౌకిక వస్తువులపైనే స్థిరపడినట్లుగా నాకు అగపడుతోంది. పొట్టపోసుకొనే ప్రయత్నంలోనే వారంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఏ ఒక్కరిలోనూ భగవత్ చింతన మృగ్యం.”
వారు సర్కస్ ప్రదర్శనశాల చేరుకున్నారు. ధర తక్కువ టిక్కెట్లు కొన్నారు. భక్తులు శ్రీరామకృష్ణులను ఎత్తయిన గ్యాలరీకి తోడ్కొని పోయి, తామందరూ ఒక బల్ల మీద కూర్చున్నారు. అప్పుడు శ్రీరామకృష్ణులు ఆనందంగా “ఆ! ఇది చక్కని చోటు. ఇక్కడ నుండి ప్రదర్శనను బాగా తిలకించవచ్చు” అన్నారు. సర్కస్ ప్రారంభమైంది. అనేక విన్యాసాలు ప్రదర్శించారు. ఒక గుర్రం వృత్తాకార మార్గంలో పరిగెడుతూ ఉంది. ఈ మార్గంలో పెద్ద ఇనుపవలయాలు ఎత్తులో ఎడం ఎడంగా అమర్చబడి ఉన్నవి. గుర్రం మీద ఒంటి కాలిపై నిలబడి ఒక ఆంగ్ల స్త్రీ, గుర్రం వలయం క్రిందనుండి పోతూన్నప్పుడు చెంగున ఎగిరి ఆ వలయం గుండా దూరి మళ్ళీ గుర్రంపై ఒక్క కాలిపై నిలబడి ప్రదర్శనలివ్వసాగింది. ఈ ప్రదర్శనలో ఆమె ఒక్కమారు కూడా గుర్రాన్ని వదలి విఫలురాలు కాలేదు, సమతౌల్యాన్ని కోల్పోనూలేదు.
సర్కస్ ప్రదర్శన ముగిసిన తరువాత శ్రీరామకృష్ణులు, భక్తులు ఆరుబయట బండి సమీపంలో నిలబడ్డారు. అది చలిరాత్రి కావటంతో ఆయన ఆకుపచ్చరంగు ఉన్నిశాలువ కప్పుకొని ఉన్నారు.
6.8.1 మొదట భగవంతుడు, తరువాత సంసారం – అభ్యాసయోగం
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): చూశావా ఆ ఆంగ్ల స్త్రీ ఒంటి కాలి మీద మెరుపు వేగంతో పరుగెత్తుతూన్న గుర్రం మీద ఎలా నిలబడిందో? ఎంత కష్టమైన విన్యాసం అది! ఆమె సుదీర్ఘకాలం అభ్యాసం చేసివుంటుంది. కాస్త పొరపాటు జరిగితే కాళ్లు చేతులు విరగటమేగాక, మరణం కూడా సంభవించవచ్చు. సంసారంలో కూడా ఇటువంటి కష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కొందరు భగవత్కృపతో, ఆధ్యాత్మిక సాధనాఫలితంతో విజయం సాధిస్తారు. కాని అనేకులు విఫలులౌతారు. అనేకమంది సంసారంలో ప్రవేశించి అధిక బంధాలలో చిక్కుకుంటారు; వారు సంసారంలో మునిగిపోయి మరణ వేదనలు అనుభవిస్తారు. జనక మహారాజు వంటి ఏ కొద్దిమందో తమ తపోశక్తితో, సంసారులుగా మనగలుగుతూనే ఆధ్యాత్మిక జీవితం గడిపి విజయోపేతులు కాగలుగుతున్నారు. కాబట్టే ఆధ్యాత్మిక సాధనలు ఆవశ్యకం; లేకుంటే సంసారంలో సదాచారంతో జీవించలేరు.”
శ్రీరామకృష్ణులు భక్తులతో బండి ఎక్కి బలరామ్ బోసు ఇంటికి వెళ్ళారు. ఆయనను భక్తులతో సహా మేడ మీదికి తోడ్కొనిపోయారు. అప్పుడు సమయం సాయంకాలం; దీపాలు వెలిగించారు. సర్కస్ ప్రదర్శనలో తాము చూసిన విన్యాసాలను గురించి శ్రీరామకృష్ణులు వర్ణించారు. క్రమంగా ఇతర భక్తులు కూడా అక్కడకు చేరుకున్నారు. అప్పుడు శ్రీరామకృష్ణులు వారితో భగవద్విషయాల గురించి మాట్లాడసాగారు.
6.8.2 కులవ్యవస్థ నిర్మూలనకు మార్గం
కులవ్యవస్థ గురించిన ప్రస్తావన వచ్చింది. శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు: “ఈ కులవ్యవస్థను నిర్మూలించడానికి ఒక్కటే మార్గం – అదే భగవద్భక్తి. భగవద్భక్తులు ఏ కులానికీ చెందరు. భక్తి ద్వారా ఒక వ్యక్తి దేహం, మనస్సు, ఆత్మ పరిశుద్ధమవుతాయి. చైతన్య నిత్యానందులు హరినామాన్ని నిమ్నజాతి వారికి సైతం ప్రచారం చేశారు, వారిని ఆలింగనం కూడా చేసుకున్నారు. భగవద్భక్తి లేని బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కాడు. భగవద్భక్తిగల నిమ్నజాతివాడు అటుపై నిమ్నజాతివాడు కాడు. భక్తి ద్వారా అంటరానివాడు కూడా పరిశుద్ధుడై ఔన్నత్యం పొందుతాడు.”
6.8.3 సంసారులు – బద్ధజీవులు
తరువాత సంసారంలో బద్ధులైవున్న గృహస్థులను గురించి ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “వారు పట్టుపురుగు వంటివారు. వారు తలచుకొంటే సంసారమనే పట్టుపురుగు గూటినుండి బయటకు రాగలరు. కాని శ్రమతో తీర్చిదిద్ది అందంగా నిర్మించుకున్న గూటిని వీడి బయటకు రావటం వారికి సుతరామూ మనస్కరించదు. కనుక వారక్కడే మరణిస్తారు. లేక వారిని వలలో చిక్కిన చేపతో పోల్చవచ్చు. వలలో ప్రవేశించిన మార్గం గుండానే వారు బయటకు రావచ్చు. కాని వల లోపల ఇతర చేపలతో క్రీడిస్తూ, నీటి మర్మరధ్వనికి ముగ్ధులవుతూ సర్వాన్ని విస్మరిస్తారు. ఆ వలనుండి బయటపడటానికి కనీస ప్రయత్నం కూడా చేయరు. పసిపిల్లల వచ్చీరాని ముద్దుపలుకులు నీటి మర్మర ధ్వనిలాంటివి; బంధుమిత్రులు తక్కిన చేపల వంటివారు. వారిలో ఏ ఒకరో ఇద్దరో తప్పించుకుని పారిపోతారు. వారే ముక్తజీవులు.” ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పాడనారంభించారు.
మహామాయ వ్యామోహమున జగమె భ్రమజెంది
వివేకహీనుడుగ బ్రహ్మ గావింపబడ
చైతన్యరహితుడై చలగంగ విష్ణువు
మరి ఆశ ఏముండు మానవుల కింక?॥ మ ॥
ఇరుకుగా కాలువ ఏర్పరుపబడియుండి
తీరైన వల యచట దిద్దబడియుండగా
వచ్చుటకు మార్గము వద్దనే యున్నాము
లోనజొచ్చిన మీను వెనుదిరిగి మరిరాదు॥ మ ॥
ఓర్మితో పట్టుపురుగొక గూడు అల్లుచు
వెనుదిరుగు మార్గము కనుపించుచున్నను
కట్టుకొను గూటినే కట్టుబడిపోవుచు
మరి దాననేయుండు మరణించు కొరకు॥ మ ॥
శ్రీరామకృష్ణులు (కొనసాగిస్తూ): మనిషిని ధాన్యంతో పోల్చవచ్చు. ధాన్యం తిరగలిలో వేసి త్రిప్పితే నలిగి పిండిపిండి అవుతుంది. కాని కొన్ని ధాన్యం గింజలు పిడిని అంటుకొన్నవి తప్పించుకొంటాయి. కాబట్టి మనుష్యులు పిడి వద్ద శరణు పొందాలి. అంటే భగవంతుని కడ అని అర్థం. భగవంతుణ్ణి స్మరించండి. భగవన్నామస్మరణ ద్వారా మీరు ముక్తి పొందుతారు. లేకుంటే మృత్యురూపమైన తిరగలిలో నలిగి నశించిపోతారు.
ఇలా పలికి శ్రీరామకృష్ణులు తిరిగి పాడనారంభించారు.
కాపాడరావా! కరుణామయీ! మాయీ!
భవనీరధిన నాదు పడవ మునుగగ సాగె!॥ కా ॥
భయమైన పెనుగాలివాన యెల్లెడల రేగె
కర్ణధారుడు మనసు కరడుగట్టినవాడు
కామ క్రోధాదులా గడుసరులు ఆర్గురు
తెడ్డు వేయక నాకు అడ్డుపడుచున్నారు॥ కా ॥
ప్రబల వాయువునందు పడవ సాగించితిని
మున్నీటిలో నిపుడు మునిగిపోవుచునుంటి
భక్తియను చుక్కాని బద్దలైపోయినది
శ్రద్ధయను తెరచాప చినిగి పీలికలయ్యె॥ కా ॥
నీరెక్కుచున్నది నిండుగా పడవలో
ఇకనేమి సేయుదును ఎరిగింపవే జననీ
గతి తప్పి కన్నులు మూతపడుచున్నవి
అంధకారము వినా అన్య మగుపింపదు॥ కా ॥
ఈ అలలో చిక్కి ఈదులాడుచునుందు
ఒప్పుగా నీ నామమను తెప్ప పట్టుకొని
కాపాడరావె కరుణామయీ! మాయీ!
భవనీరధిన నాదు పడవ మునిగినదే జననీ!॥ కా ॥
6.8.4 భార్యాపిల్లల పట్ల బాధ్యత
విశ్వాస్బాబు చాలాసేపు గదిలో కూర్చున్నాడు; ఇప్పుడే వెళ్ళిపోయాడు. ఒకప్పుడతడు గొప్ప ధనవంతుడు. చెడు అలవాట్ల మూలంగా సర్వస్వం కోల్పోయాడు. చిట్టచివరకు భార్యాబిడ్డలను పట్టించుకోవటం కూడా మానివేశాడు. విశ్వాస్ గురించి ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “అతడు దురదృష్ట జాతకుడైన దౌర్భాగ్యుడు. గృహస్థు నిర్వర్తించవలసిన కర్తవ్యాలు ఉంటాయి, తీర్చవలసిన ఋణాలు ఉంటాయి: దైవఋణం, పితౄణం, ఋషి ఋణం – ఆ పైన కుటుంబ ఋణం కూడా ఉంటుంది. భార్య నిష్కళంక అయితే భర్త ఆమెను పోషించాలి; పిల్లలు పెద్దవారయ్యే వరకు వారిని పెంచి పెద్దచేయాలి. సన్న్యాసి మాత్రం సంచయం చేయకూడదు. పక్షీ, సన్న్యాసీ రేపటికి ఏర్పాట్లు చేసుకోరాదు. కాని పక్షి కూడా, పిల్లలున్నప్పుడు సంచయం చేసుకుంటుంది. తన పిల్లలకు ముక్కున కరచి ఆహారం తీసుకువస్తుంది.”
బలరాం: ప్రస్తుతం విశ్వాస్ సాధుసాంగత్యం చేయగోరుతున్నాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): సాధువు కమండలం నాలుగు ధామాలు (హిమాలయాల్లోని కేదార్నాథ్, పశ్చిమంలోని ద్వారక, దక్షిణంలోని రామేశ్వరం, తూర్పున పూరీ) ప్రదక్షిణ చేసి వచ్చినా దాని చేదు పోదు. మలయమారుతం వీచి అన్ని చెట్లను చందనపు చెట్లుగా మారుస్తుందని అంటారు. కాని కొన్ని చెట్లు – బూరుగ, అశ్వత్థం, మారేడు మాత్రం చందనం కానేరవు.
“కొందరు గంజాయి త్రాగే నిమిత్తం బైరాగులతో సాంగత్యం చేయగోరతారు. (నవ్వులు) బైరాగులలో అనేకులకు గంజాయి అలవాటు ఉంటుంది. ఈ గృహస్థులు ఆ బైరాగులతో ఉండి, వారికి గంజాయి తయారుచేసి ఇచ్చి, బైరాగి పుచ్చుకొన్నాక, తామూ ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు.” (అందరూ నవ్వారు)
6.9 నవమ పరిచ్ఛేదం రాజ్ మోహన్ ఇంటికి శుభాగమనం – నరేంద్రుడు
గురువారం నవంబరు 16, 1882
శ్రీరామకృష్ణులు కలకత్తాకు వచ్చారు. సాయంత్రం ఆయన బ్రహ్మ సమాజ సభ్యుడైన రాజ్‌మోహన్ ఇంటిని పావనం చేశారు. నరేంద్రుడు మొదలైన యువమిత్రులు ఈ రాజ్‌మోహన్ ఇంట్లో సమావేశమై బ్రహ్మసమాజపు పద్ధతిలో ఉపాసన చేస్తూవుంటారు. శ్రీరామకృష్ణులు వీరి ఉపాసనా పద్ధతిని చూడాలని అభిలషించారు. ఆయనతో బాటు ‘మ’ తదితర భక్తులు కూడా వచ్చారు.
శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి చూడగానే ఎంతో ఆనందించి, ఈ యువకుల ఉపాసనా విధానాన్ని చూడాలనే కోర్కె వ్యక్తం చేశారు. నరేంద్రుడు పాడగా, ఉపాసన ప్రారంభమైంది. వారిలో ఒక యువకుడు ఉపాసనా తంతును నిర్వహించసాగాడు. అతడు ఇలా ప్రార్థించాడు: “ఓ భగవంతుడా! సర్వం త్యజించి మా మనస్సులు నీలో లగ్నం అయ్యేట్లు అనుగ్రహించు!” బహుశా శ్రీరామకృష్ణుల ఉనికిచే స్ఫూర్తి చెంది ఆ యువకుడు సర్వసంగ పరిత్యాగం గురించి మాట్లాడుతున్నాడేమో! శ్రీరామకృష్ణులు “అలాగే జరుగవచ్చు సుమా!” అని గుసగుస ధోరణిలో అన్నారు.
ఉపాసన అనంతరం శ్రీరామకృష్ణులకు రాజ్‌మోహన్ ఉపాహారం సమర్పించాడు.
6.10 దశమ పరిచ్ఛేదం మనోమోహన్, సురేంద్రుల ఇళ్ళల్లో శ్రీరామకృష్ణులు
ఆదివారం, నవంబరు 19, 1882
నేడు జగద్ధాత్రీపూజ పర్వదినం. కలకత్తాలోని సురేంద్రుని ఇంటికి శ్రీరామకృష్ణులను ఆహ్వానించారు; కాని ముందుగా శ్రీరామకృష్ణులు అక్కడికి పొరుగున ఉన్న మనోమోహన్ ఇంటికి వెళ్లారు.
శ్రీరామకృష్ణులు మనోమోహన్ ఇంటి చావడిలో ఆసీనులైనారు. శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “పశుగ్రాసం, గానుగపిండి ఆవుకు రుచించే విధంగా భగవంతుడికి పేదల, దీనుల భక్తి ఎంతో రుచిస్తుంది. రారాజు దుర్యోధనుడు శ్రీకృష్ణుడికి తన సిరిసంపదల వైభవాన్ని చూపినప్పటికీ శ్రీకృష్ణుడు పేదయైన విదురుడి ఆతిథ్యాన్నే స్వీకరించాడు. భగవంతుడు భక్తవత్సలుడు. దూడ వెంట పరుగులిడే ఆవులా భగవంతుడు భక్తుడి వెంటబడి పోతూవుంటాడు.” ఇలా పలికి శ్రీరామకృష్ణులు పాడసాగారు. పాట భావం: ‘ఆ ప్రేమ నిమిత్తం యోగులు యుగయుగాల పర్యంతం యోగం అభ్యసిస్తారు. ఆ ప్రేమ ఉద్దీపనమైనప్పుడు భగవంతుడు అయస్కాంతంలా నిన్ను తన వద్దకు లాక్కుంటాడు.’
తరువాత ఆయన ఇలా అన్నారు: “శ్రీకృష్ణుడి నామాన్ని ఆలకించిన మాత్రానే చైతన్య మహాప్రభువుకు కళ్ళనుండి ఆనందబాష్పాలు స్రవించేవి.” భగవంతుడే సత్యం, తక్కినదంతా అసత్యం. మానవుడు తలచుకొంటే భగవత్సాక్షాత్కారం పొందగలడు; కాని అతడు కామినీ కాంచన భోగాలలోనే ఉన్మత్తుడై ఉండిపోతాడు. సర్పం తలపైన అమూల్యమైన మాణిక్యం ఉంటుంది. కాని ఆ సర్పం కేవలం కప్పను భక్షించే తృప్తిచెందుతోంది.
“భక్తియే సారం. విచారణ ద్వారా భగవంతుణ్ణి ఎవరు తెలుసుకోగలుగుతారు? నాకు కావలసింది భగవంతుడిపట్ల భక్తే. ఆ భగవంతుడి అనంత వైభవాల గురించి తెలుసుకోవలసిన అగత్యం నాకెందుకు? ఒక్క ముంత కల్లుతో మత్తెక్కిపడిపోయే నాకు గిడ్డంగిలో ఎంత కల్లు నిల్వవున్నదో తెలుసుకోగోరటం నిరర్థకమే కదా! నా దాహం తీర్చుకోవటానికి ఒక చెంబు నీరు సరిపోతున్నప్పుడు ఈ భూమ్మీద ఎంత జలరాశి ఉందో తెలుసుకోవటంలో ప్రయోజనం ఏముంది?”
మనోమోహన్
సురేంద్రనాథ్ మిత్ర్
6.10.1 సురేంద్రుని అన్న – కులవ్యవస్థ – దివ్యజ్ఞాన సమాజం
శ్రీరామకృష్ణులు సురేంద్రుడి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ అనేక మంది భక్తులు సమావేశమై ఉన్నారు. వారిలో సురేంద్రుడి అన్నగారు కూడా ఉన్నారు. ఆయన ఒక న్యాయమూర్తి.
శ్రీరామకృష్ణులు (సురేంద్రుడి అన్నతో): మీరు ఒక న్యాయమూర్తి. అది చాలా మంచిది. కాని ఒకటి గుర్తుంచుకోండి, సమస్తం భగవంతుడి శక్తి ద్వారానే జరుగుతుంది. మీకు ఈ ఉన్నత స్థానాన్ని ప్రసాదించింది ఆయనే; అందుచేతనే మీరు న్యాయమూర్తి పదవిని అలంకరించారు. తామే మహోన్నతులమని జనం భావిస్తూవుంటారు. సింహపు తల ఆకారంలో ఉన్న నీటిగొట్టపు చివరనుండి ఇంటి పైకప్పు నుండి నీరు ప్రవహిస్తుంది. సింహం తన నోటిగుండా నీరు బయటకు పంపిస్తున్నట్లుగా ఉంటుంది ఆ దృశ్యం. కాని నిజానికి నీళ్ళు ఎక్కడ నుండి వస్తున్నాయి? ఆకాశంలో మేఘం ఏర్పడి అందుండి వర్షం వచ్చి మేడ పైకప్పు మీద పడుతుంది; తరువాత ఆ నీరు గొట్టంగుండా ప్రవహించి చివరకు ఈ సింహపు తలనుండి బయటకు వస్తుంది.
సురేంద్రుని సోదరుడు: స్త్రీ స్వాతంత్ర్యాన్ని, కులవ్యవస్థ నిర్మూలననూ బ్రహ్మసమాజం బోధిస్తోంది కదా! ఈ విషయాల పట్ల మీ అభిప్రాయం ఏమిటి?
శ్రీరామకృష్ణులు: భగవంతుడి పట్ల అనురాగం పెంపొందించుకునే ప్రారంభదశలో జనం అలాగే భావిస్తారు. గాలివాన కురుస్తున్న సమయంలో ఊగుతూవున్న చెట్లలో మామిడి, చింత, వేప చెట్లు ఏవో గుర్తించటం కష్టం. కాని గాలివాన వెలసిన తరువాత, ఏది ఏ చెట్టో స్పష్టంగా తెలుస్తుంది. మొదట భగవత్ ప్రేమానురాగపు తుపాను అణగిపోగానే, క్రమంగా భగవంతుడొక్కడే అత్యున్నత శ్రేయోదాయి అనీ, నిత్య స్వరూపుడనీ, తక్కినదంతా అనిత్యమనీ బోధపడుతుంది. సాధుసాంగత్యం, తపస్సు లేనిదే ఈ విషయాలు గ్రహించటం కల్ల. కేవలం మద్దెల మ్రోత తాళమును పురశ్చరణ చేయటం వల్ల ప్రయోజనం ఏమిటి? ఆచరణలో మద్దెల వాయించి చూపటం ఎంతో కష్టం. కేవలం లెక్చర్లతో ఏం సాధించగలం? తపస్సాధనలే అవసరం, దానితో మాత్రమే గ్రహించుకోగలం.
“కులభేదాల గురించి మీరు అడిగారు. ఈ కులభేదం సమసిపోవటానికి ఒకే ఒక్క మార్గం ఉంది; అదే భక్తిమార్గం. భక్తులకు కులం ఉండదు. ఈ భగవత్ భక్తి ద్వారా అస్పృశ్యుడు పవిత్రుడవుతాడు; చండాలునికి భక్తి కలిగితే ఆపైన అతడు చండాలుడిగా ఉండబోడు. చైతన్య మహాప్రభువు అస్పృశ్యులతో సహా అందరినీ ఆలింగనం చేసుకున్నాడు.
“బ్రహ్మసమాజస్థులు హరి నామస్మరణ చేస్తారు. ఇది చాలా మంచిది. వ్యాకులతతో ప్రార్థిస్తే భగవంతుడి కృప పొంది, భగవత్సాక్షాత్కారం కలుగుతుంది. భగవత్సాక్షాత్కారం అన్ని మార్గాల ద్వారా పొందవచ్చు. ఒకే భగవంతుణ్ణి అనేక పేర్లతో ప్రార్థించవచ్చు.”
సురేంద్రుని సోదరుడు: మహాశయా! దివ్యజ్ఞానం (థియోసఫీ) గురించి మీ అభిప్రాయం ఏమిటి?
శ్రీరామకృష్ణులు: దాని ద్వారా మనిషి అలౌకిక శక్తులను సముపార్జించి, అద్భుతాలు ప్రదర్శించగలడని నేను విన్నాను. ఒక దయ్యాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్న వ్యక్తిని నేను కళ్ళారా చూశాను. తన యజమానికి ఆ దయ్యం వివిధ వస్తువులను సమకూర్చిపెట్టేది. ఆ అలౌకిక శక్తులతో నేను ఏం చేసుకోను? వాటి ద్వారా భగవత్సాక్షాత్కారం ఎవరైనా పొందగలరా? భగవత్సాక్షాత్కారం కలగని పక్షంలో ఇవన్నీ వ్యర్థమే!
6.11 ఏకాదశ పరిచ్ఛేదం మణిమల్లిక్ బ్రహ్మోత్సవంలో శ్రీరామకృష్ణులు
నవంబరు, 1882
సాయంత్రం నాలుగు గంటల వేళ శ్రీరామకృష్ణులు కలకత్తాలోని మణిలాల్ మల్లిక్ గృహంలో జరుగనున్న బ్రహ్మసమాజపు వార్షికోత్సవ వేడుకలు తిలకించటానికి విచ్చేశారు. ‘మ’ తదితర భక్తులతోపాటు విజయకృష్ణ గోస్వామి, ఆయనతోపాటు బ్రహ్మసమాజస్థులనేకులు అక్కడ హాజరైనారు. ఈ ఉత్సవ వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహింప విస్తృత ఏర్పాట్లు గావింపబడ్డాయి.
ప్రహ్లాద చరిత్ర హరికథ ప్రారంభమైంది. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు రాక్షసేంద్రుడు. భగవంతుడి పట్ల ఇతడు విపరీతమైన ద్వేషం పెంచుకున్నాడు; భక్తిమార్గం అనుసరిస్తున్న తన సొంతకుమారుడు ప్రహ్లాదుణ్ణి, హిరణ్యకశిపుడు నానావిధాలుగా హింసించాడు. తండ్రి చేత బాధలు అనుభవిస్తూన్న ప్రహ్లాదుడు భగవంతుణ్ణి ఇలా ప్రార్థించాడు: “ఓ శ్రీహరీ! నా తండ్రికి సద్బుద్ధిని ప్రసాదించు.”
ఈ మాటలు వినగానే శ్రీరామకృష్ణులు విలపించారు. క్రమేణా ఆయనకు భావావస్థ కలిగింది. కాసేపటికి తేరుకొని భక్తులతో మాట్లాడసాగారు.
6.11.1 విజయ్ ప్రభృత బ్రహ్మసమాజస్థులకు ఉపదేశం – భగవద్దర్శనానంతరమే ఇతరులకు బోధన
శ్రీరామకృష్ణులు: భక్తి ఒక్కటే అత్యావశ్యకమైనది. భగవన్నామగుణ కీర్తనలు సర్వదా చేస్తూవుంటే క్రమేణా భక్తిపొందవచ్చు. ఆహా! శివనాథ్ ఎలాంటి భక్తుడో గదా! చక్కెర పాకంలో గులాబ్జాం మునిగివున్న రీతిలో అతడు భక్తిరసంలో మునిగివున్నాడు.
“ ‘నా మతమే సరియైనది, ఇతర మతాలు తప్పు’ అని ఎవరూ భావించరాదు. అన్ని మార్గాల ద్వారా భగవత్సాక్షాత్కారం పొందవచ్చు. భగవంతుడి పట్ల చిత్తశుద్ధిగల వ్యాకులత ఉంటే చాలు. అనంత మార్గాలు, అనంత మతాలు.
“చూడండి, మీకొక విషయం చెబుతున్నాను. భగవంతుణ్ణి తప్పక దర్శించవచ్చు. భగవంతుడు అవాఙ్మానసగోచరుడని వేదాలు వచిస్తున్నాయి. విషయాసక్తమైన మనస్సుకు భగవంతుడు అగోచరుడని దీనికి అర్థం. ‘భగవంతుడు శుద్ధ మనస్సుకు, శుద్ధబుద్ధికి గోచరుడు’ అని అంటూండేవాడు వైష్ణవచరణ్. అందుచేత సాధుసాంగత్యం, భగవత్ప్రార్థన, గురూపదేశాలు – ఇవన్నీ అనివార్యాలు. ఇవి చిత్తశుద్ధిని కలిగిస్తాయి. తదనంతరం భగవద్దర్శనం అవుతుంది. నీటిలోవున్న మాలిన్యాన్ని చిల్లగింజల ద్వారా తొలగించవచ్చు. తరువాత ఆ నీళ్లలో స్పష్టంగా మీ ప్రతిబింబం కనిపిస్తుంది. అద్దంపై మురికి పేరుకొన్నప్పుడు మన ముఖం స్పష్టంగా కనిపించదు కదా!
“చిత్తశుద్ధి ఏర్పడ్డాక భక్తి ఉదయిస్తుంది. తరువాత భగవంతుడి కృపతో భగవత్సాక్షాత్కారం కలుగుతుంది. అనంతరం ఆయన ఆదేశం పొంది ఇతరులకు బోధింప ఉపక్రమించవచ్చు. అంతేగాని భగవత్సాక్షాత్కారం కాకుండా ‘లెక్చర్’ ఇవ్వడం మంచిది కాదు.”
ఈ పాటలో ఇలాంటి భావాలు ఉన్నాయి, వినండి:
ఇది ఏమిర మందమతీ!
విగ్రహమా నెలకొల్పవు
(మలినమునా తొలగింపవు)
ఆలయమున శంఖూదుచు
గగ్గోలును గావింతువు॥ ఇ ॥
అహర్నిశంబాగకుండ
ఏకాదశ గబ్బిలములు
కీకర బీకర మనుచు॥ ఇ ॥
(గందరగోళము చేయును)
“మీ హృదయ మందిరాన్ని మొదట పరిశుద్ధం చేసుకోవాలి. ఆపైన దేవతా ప్రతిమను దాన్లో ప్రతిష్ఠించి పూజకై ఏర్పాట్లు గావించాలి. అదేమీ చేయకుండానే శంఖం పూరించి పెద్దగా శబ్దం చేసినంత మాత్రాన ఏం సాధించగలవు?”
విజయకృష్ణ గోస్వామి వేదిక మీద కూర్చుని బ్రహ్మసమాజ నియమానుసారం ఉపాసన చేశాడు. ఆ తరువాత వేదిక దిగివచ్చి శ్రీరామకృష్ణుల వద్ద కూర్చున్నాడు.
శ్రీరామకృష్ణులు (విజయ్‌తో): నాకొక విషయం చెబుతారా? మీరు పాపం గురించి పదే పదే ప్రస్తావిస్తా రెందుకు? నూరుసార్లు ‘నేను పాపిని’ అని అనుకుంటే నిజానికతడు పాపాత్ముడే అవుతాడు. ‘నేను భగవన్నామం జపించాను; నేను పాపిని ఎలా అవుతాను?’ ఇలా పలుకగల విశ్వాసం కుదరాలి. భగవంతుడు మన తల్లీ, తండ్రీ కూడా. ‘ఓ భగవంతుడా! నేను పాపాలు చేశాను; మళ్ళీ తిరిగి ఎన్నటికీ చేయను’ అంటూ ఆయనకు విన్నవించుకో. భగవన్నామస్మరణతో నీ దేహాన్నీ, మనస్సునూ పవిత్రీకరించుకో. భగవంతుడి పవిత్రనామాన్ని గానం చేస్తూ నీ జిహ్వను పరిశుద్ధ మొనరించు.
6.12 ద్వాదశ పరిచ్ఛేదం బాబూరామ్ ప్రభృతులతో – స్వతంత్రేచ్ఛ – తోతాపురి ఆత్మహత్యాయత్న సంఘటన
డిసెంబరు, 1882
నేటి మధ్యాహ్నం శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరాలయ ఉద్యానంలోని తమ గదికి పడమటివైపు వసారాలో కూర్చుని ఉన్నారు. ఇతర భక్తులతో పాటు బాబూరామ్, రాందయాళ్, ‘మ’ కూడా అక్కడ హాజరైనారు. పై ముగ్గురూ నాటి రాత్రి శ్రీరామకృష్ణులతో గడపనున్నారు. క్రిస్మస్ సెలవులు గనుక ‘మ’ ఆ మర్నాడు కూడా అక్కడే గడప అభిలషించాడు. బాబూరామ్ ఈ మధ్యే శ్రీరామకృష్ణుల దర్శనార్థం వస్తున్నాడు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): భగవంతుడే సమస్తానికి కర్త అనే జ్ఞానం కలిగితే మనిషి ఈ జీవిత కాలంలోనే జీవన్ముక్తుడవుతాడు. ఒకసారి కేశవ్, శంభుమల్లిక్తో ఇక్కడకు వచ్చాడు. ‘భగవదాజ్ఞ లేనిదే ఒక్క ఆకుకూడా కదలదు’ అని అతడితో నేను చెప్పాను. అలాంటప్పుడు స్వతంత్రేచ్ఛ ఎక్కడ? అందరూ భగవదాధీనులు. నాంగ్టా (తోతాపురి) మహాజ్ఞాని, కాని తాను గంగలో పడి మునిగిపోవాలని అనుకున్నాడు. దక్షిణేశ్వరంలో ఆయన పదకొండు నెలలు గడిపాడు. ఒకప్పుడాయన భరించలేని కడుపునొప్పితో బాధపడ్డాడు. భరించలేని ఆ బాధ ఆయనను అదుపు తప్పించినందున గంగలోపడి మునిగిపోవాలనుకొన్నాడు. స్నానఘట్టం వద్ద సుదీర్ఘంగా ఇసుక మేటవేసి ఉంది. నదిలోకి ఎంతదూరం పోయినా నీరు మోకాలు దాటలేదు. అప్పుడు తోతాపురికి సర్వం అవగతమై, వెనక్కు తిరిగి వచ్చేశాడు* . ఒకప్పుడు నేను తీవ్ర రోగానికి గురై కత్తితో గొంతు కోసుకోబోయాను. కాబట్టే నేనిలా అంటున్నాను: ‘ఓ జననీ! నేను యంత్రాన్ని, నువ్వు యంత్రం నడిపే దానివి. నేను రథాన్ని, నువ్వు రథ సారథివి. నువ్వు నడిపించేటట్లు నేను నడుచుకుంటాను. నువ్వు ఎలా చేయిస్తావో నేను అలాగే చేస్తాను.’”
భక్తులు శ్రీరామకృష్ణుల గదిలో కీర్తన గానంచేశారు:
(హే) భక్త ప్రియా (హే) మాధవా!
హృదయంబను నా బృందావనిలో
విహరించుమురా విచ్చలవిడిగా!
నీ ప్రియరమణీ రాధారాణీ
నీకై నే పడు భక్తియె కాదా!॥ భ ॥
నా తనువగు నీ నందన గృహము
నా వాత్సల్యము మాత యశోద
ముక్తి కొరకు నే పడు నిర్వేదము
ముగ్ధ వధువులా గోపతరుణులు॥ భ ॥
పాప పర్వతమె గోవర్ధనము
గోట లీలగా నెత్తు గొడుగువలె
సంహరించు నా శత్రులార్వురను
కంసుడంపిన ఘోరరాక్షసులు॥ భ ॥
నా జీవన మను పచ్చిక బయలులో
కరుణా మురళీ కలవరమున నా
మానస మనియెడి పాడియావును
మేపుచు మచ్చిక చేయగదోయి॥ భ ॥
పరితాపంబను యమునా తటిపై
వాంఛావట తరుఛాయలందున
నీ దాసునిపై కరుణ కురియుచు
విహరించుమురా ప్రేమమాధవా!॥ భ ॥
గోప బాలకుల ప్రేమ పాశములు
బృందావనిలో బంధించినచో
చరణదాసుడగు దాశరథిని యొక
గోపబాలుడుగ మననీయుమురా॥ భ ॥
పాడవే కోయిలా పాడవే గీతి
పాడవే భగవంతు భవ్యప్రశస్తి॥ పా ॥
నా హృదయ కుహరమందణగియుండెడు దాన
బ్రహ్మమను తరువుపై వ్రాలుచుండెడు దాన
ధర్మార్థ కామ మోక్షములను నాల్గు
కల్పతరు ఫలములని రుచిచూచి పాడు॥ పా ॥
అత్యద్భుతంబగు నా జీవధనమ
గొంతెత్తి గుండెలో కూయవే బాగ
నా యాత్మ కాతడే సౌఖ్యమని పాడు
అతడె నా జీవనానందమని పాడు॥ పా ॥
మేఘంబులోనున్న వర్షబిందువు కోరి
తృష్ణాతురంబైన చాతకము రీతి
కూయవే మరి మరి ఎడతెరిపిలేక
ఆపకుండగ పాడు అంతులేకుండ॥ పా ॥
నందన్బాగాన్ వాస్తవ్యుడైన ఒక భక్తుడు తన మిత్రులతో గదిలోకి వచ్చాడు. అతణ్ణి తేరిపార చూసి శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “అద్దాల తలుపుగుండా ఒక గదిలోని వస్తువులను చూసేట్లుగానే ఇతడి కళ్ళగుండా ఇతడి అంతరంగం లోనిదంతా చూడగలుగుతున్నాను.” ఈ భక్తుడు, అతడి సోదరులు నందన్బాగాన్లోని తమ స్వగృహంలో బ్రహ్మసమాజ వార్షికోత్సవాలు జరుపుకొనేవారు. శ్రీరామకృష్ణులు కూడా ఈ వేడుకలలో పాల్గొన్నారు.
దేవాలయాలలో సాయంకాల హారతులు ప్రారంభమయ్యాయి. తమ గదిలోని చిన్న మంచం మీద శ్రీరామకృష్ణులు కూర్చుని ధ్యానమగ్నులై ఉన్నారు. ఆయన భావావస్థలోకి వెళ్ళి, తదనంతరం ఇలా అన్నారు: “అమ్మా! అతణ్ణి నీ వద్దకు లాక్కో. అతడు వినయశీలి, నిగర్వి. నీ దర్శనానికి వస్తూనే ఉన్నాడు.” కాలాంతరంలో తమ శిష్యాగ్రగణ్యులలో ఒకడు కాబోయే బాబూరాం గురించి ప్రస్తావిస్తున్నారా ఏమిటి?
శ్రీరామకృష్ణులు విభిన్న సమాధి తత్త్వాల గురించి వర్ణించారు. తరువాత, సంభాషణ జీవితంలోని సుఖదుఃఖాల వైపు మళ్ళింది. భగవంతుడు ఎందుకు అన్ని కష్టాలను కల్పిస్తున్నాడు?
6.12.1 విద్యాసాగర్, చెంఘిజ్ ఖాన్ : భగవంతుడు కఠినాత్ముడా? – శ్రీరామకృష్ణుల జవాబు
‘మ’ : ఒకమారు విద్యాసాగర్ కోపంగా ఇలా పలికాడు: ‘భగవంతుణ్ణి స్మరించటంలో ప్రయోజనం ఏముంది? ఈ సంఘటన గుర్తు తెచ్చుకోండి: ఒకానొక సందర్భంలో చెంఘిజ్‌ఖాన్ ఒక దేశాన్ని కొల్లగొట్టి అనేకులను బంధించాడు. బందీలు క్రమంగా దాదాపు లక్షకు పెరిగారు. సేనాధిపతి అతడితో ఇలా చెప్పాడు: “మహారాజా! బందీలకు తిండి ఎలా పెట్టడం? మనతో వీరిని అట్టేపెట్టుకోవటం ప్రమాదం; వారిని విడిచిపెట్టడం కూడా అంతే ప్రమాదం. కర్తవ్యం ఏమిటి?” అందుకు చెంఘిజ్‌ఖాన్ ఇలా అన్నాడు: “ ‘నువ్వన్నది నిజమే. ఏం చేయాలి? సరే వారినందరినీ వధించండి.” బందీల నందరినీ తెగ నరకటానికి ఆజ్ఞ ఇవ్వబడింది. ఈ హత్యాకాండను భగవంతుడు చూడలేదా? కాని ఆయన ఏ విధంగానూ దీన్ని ఆపలేదు. కాబట్టి నాకు భగవంతుడితో అవసరం లేదు, ఆయన ఉన్నా, లేకున్నా. ఆయన నుండి నేను ఎలాంటి మేలు ఆశించటంలేదు.’
శ్రీరామకృష్ణులు: భగవంతుడి చేతలు, ఉద్దేశాలు అర్థం చేసుకోవటం సాధ్యమా? సృష్టి స్థితి లయాలను ఆయనే గావిస్తున్నాడు. ఆయన ఎందుకు సంహార కార్యం చేపడుతున్నాడో మనం తెలుసుకోగలమా? నేను జగజ్జననితో ఇలా అంటాను: ‘అమ్మా! నేను ఏమీ తెలుసుకోనక్కర్లేదు. నీ పాదపద్మాల పట్ల భక్తిని ప్రసాదించు.’ మానవ జన్మ లక్ష్యం భక్తిని పొందటమే. ఇతర విషయాలన్నీ తల్లికే ఎరుక. తోటకు మామిడిపళ్ళు తినటానికి వచ్చాను. తోటలోని చెట్లను, కొమ్మలను, ఆకులను లెక్కించటంలో నాకు ప్రయోజనం ఏముంది? మామిడిపళ్ళు తినటానికే నేను వచ్చింది; ఎన్ని చెట్లు, ఎన్ని ఆకులు ఉన్నయో తెలుసుకోవలసిన అవసరం నాకు లేదు.
ఆనాటి రాత్రి బాబూరామ్, ‘మ’, రాందయాళ్లు శ్రీరామకృష్ణుల గదిలోనే నేల మీద పడుకొని, నిద్రపోయారు.
అప్పుడు తెల్లవారుజాము రెండు లేక మూడు గంటలు అయివుంటుంది. ఇంకా గదిలో చీకటిగానే ఉంది. శ్రీరామకృష్ణులు తమ పరుపు మీద కూర్చుని అప్పుడప్పుడు భక్తులతో మాట్లాడుతున్నారు.
6.12.2 బాబురామ్, ‘మ’ ప్రభృతులతో – దయ, మాయ – భగవద్దర్శనం
శ్రీరామకృష్ణులు: దయ, మాయ అనేవి రెండు విభిన్న విషయాలని గుర్తుంచుకోండి. తన బంధువులపట్ల మమకారం కలిగి ఉండటమే మాయ. అంటే: తల్లితండ్రి, భార్యాపుత్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ పట్ల మమతానురాగమే. సర్వభూతాలపట్ల ప్రేమ, సమదృష్టి కలిగి ఉండటమే దయ. విద్యాసాగర్‌లో మాదిరి ఇంకెవరిలోనైనా దయ ఉండటం మీరు చూస్తే, అది భగవంతుడి దయ కారణంగానే అని తెలుసుకోండి. దయ మూలంగానే సర్వభూతాలకు సేవలందించగలం. మాయకూడా భగవంతుడినుండే కల్పించబడింది. మాయ ద్వారా భగవంతుడు సొంత బంధువుల సేవలనే ఒనరించేటట్లు చేస్తాడు. కాని ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మాయ మనలను అజ్ఞానంలో పడవేసి లౌకిక వ్యాపారాలలో బంధిస్తుంది; కాని దయ మన హృదయాలను పవిత్రీకరించి క్రమంగా మన బంధాలను తెంచివేస్తుంది.
“చిత్తశుద్ధి లేకుండా భగవత్సాక్షాత్కారం పొందలేం. కామక్రోధ లోభాదులను జయిస్తేనే భగవత్కృప పొందగలం. తదనంతరమే భగవద్దర్శనం. ఇప్పుడు నేను మీకు ఓ గోప్యమైన విషయాన్ని తెలుపుతున్నాను. ఈ కామాన్ని జయించడానికి నేను అనేక సాధనామార్గాల ననుసరించాను. అది ఎంతవరకంటే, ఆనందాసనానికి* నలువైపులా ‘జై కాళీ’ అంటూ అనేకసార్లు ప్రదక్షిణలు చేశాను.
“పది లేక పదకొండేళ్ల బాలుడుగా కామార్పుకూర్లో ఉన్నప్పుడు నేను మొదటిసారి సమాధిస్థితి నొందటం జరిగింది. వరి పొలాలగుండా పోతూ ఉన్నప్పుడు నేను దేనినో చూసి వివశుడనైపోయాను. భగవద్దర్శనానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. జ్యోతి దర్శనం కలుగటం లేదా ఆనందం కలుగటం, ఛాతీ భాగం నుండి మహావాయువు తారాజువ్వలా సరసరమని పైకి ఎగయటం లాంటివి.”
మర్నాడు బాబూరామ్, రాందయాళ్లు కలకత్తాకు వెళ్లిపోయారు. ‘మ’ పగలూ, రాత్రీ శ్రీరామకృష్ణులతోనే గడిపాడు.
6.13 త్రయోదశ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో మార్వాడీ భక్తులతో శ్రీరామకృష్ణులు
డిసెంబరు, 1882
అప్పుడు సమయం మధ్యాహ్నం వేళ. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలోని తమ గదిలో ఆసీనులైవున్నారు. ‘మ’ తో బాటు ఒకరిద్దరు భక్తులు కూడా అక్కడ ఉన్నారు. అప్పుడే కొందరు మార్వాడీ భక్తులు గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశారు. వారు ఆయనను తమకు ఆధ్యాత్మిక ఉపదేశం చేయమని అభ్యర్థించారు. ఆయన నవ్వారు.
శ్రీరామకృష్ణులు (మార్వాడీ భక్తులతో): ‘నేను’ ‘నాది’ అని భావించటం అజ్ఞాన ఫలితం. ‘ఓ భగవంతుడా! నువ్వే కర్తవు. ఇవన్నీ నీకు చెందినవే’ అనే భావన జ్ఞాన సూచన. ఒక ఫలానా వస్తువు ‘నాది’ అని ఎలా చెప్పగలవు? తోట కాపలావాడు ‘ఇది నా తోట’ అంటాడు. కాని ఏదో దుర్వర్తన కారణంగా యజమాని అతణ్ణి పనినుండి తొలగించివేస్తే, పనికిమాలిన తన సొంత మామిడి చెక్కల పెట్టెనుకూడా తోటలో నుండి తీసుకుపోయే సాహసం చేయడు. కామక్రోధాదులు నశించవు. వాటిని భగవంతుడి వైపు మరలించు. నీలో కోర్కె, లోభం ఉన్నట్లయితే భగవత్సాక్షాత్కారాన్ని కోరుకో; భగవంతుడికై లోభత్వం వహించు. వివేచనతో లౌకిక వస్తువులనుండి మోహాన్ని పారద్రోలు. ఇతరుల తోటలోని అరటిచెట్టు తినటానికి ఏనుగు తొండం చాచితే మావటివాడు తక్షణమే అంకుశంతో దాన్ని పొడుస్తాడు. (BG 6.26)
“మీరు వ్యాపారస్థులు. మీ వ్యాపారాన్ని క్రమంగా ఎలా అభివృద్ధి చేయాలో మీకు తెలుసు. మీలో కొందరు ఆముదం ఉత్పత్తి చేసే కర్మాగారం ప్రారంభిస్తారు. దాన్లో కొంత లాభం సముపార్జించాక ఒక బట్టల దుకాణం తెరుస్తారు. ఇదే తీరులో భగవంతుడి వైపుగా కూడా ముందుకు సాగాలి. వీలు కుదిరినప్పుడు అప్పుడప్పుడు మీరు ఏకాంతవాసం చేస్తూ ఎక్కువ సమయం దైవప్రార్థనకు కేటాయించండి.
“కాని ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, సముచితకాలం ఆసన్నం కాకుండా దేన్నీ సాధించలేరు. కాని అనేక అనుభవాలను చవిచూసి అనేక లౌకిక కర్తవ్యాలను నిర్వర్తించిన తరువాతనే కొందరి దృష్టి భగవంతుడికేసి మరలుతుంది. ఒకసారి ఒక పిల్లవాడు తల్లితో ఇలా అన్నాడట: ‘అమ్మా! నేను నిద్రపోబోతున్నాను. నాకు బయలుకు వచ్చే సమయంలో నన్ను నిద్రలేపు.’ అందుకు తల్లి ఇలా అంది: ‘నాయనా! అది వచ్చే సమయానికి నువ్వే లేచి కూర్చుంటావు. నేను లేపనక్కరలేదు.’”
6.13.1 వ్యాపారంలో అసత్యం – రామనామ స్మరణ
మార్వాడీ భక్తులు సామాన్యంగా పండ్లు, కలకండ, తీపి తినుబండారాలు శ్రీరామకృష్ణుల కోసం తీసుకువస్తూవుంటారు. కాని శ్రీరామకృష్ణులు వాటిని తినలేకపోయేవారు. “వారు అసత్య మార్గంలో ధనం సంపాదిస్తారు. కనుక వారు తెచ్చే పదార్థాలను నేను తినలేను” అనేవారు. ఆయన మార్వాడీలతో ఇలా అన్నారు: “చూడండి, సత్యాన్ని అంటిపెట్టుకొని వ్యాపారం చేయలేరు. వ్యాపారంలో ఎగుడు దిగుళ్లు ఉంటాయి. నానక్ ఒకసారి ‘అపవిత్రులు సమర్పించిన ఆహారం తినబోగా, ఆ తినుబండారాలు రక్తసిక్తమై ఉండటం చూశాను’ అన్నాడు. అందుచేత సాధువులకు పరిశుద్ధ ఆహారాన్ని మాత్రమే సమర్పించాలి. కపటంతో సంపాదించినట్టి ఆహారాన్ని సమర్పించ కూడదు. సత్యమార్గాన్ని అనుసరించే భగవత్సాక్షాత్కారం పొందగలం. సర్వదా భగవన్నామ స్మరణ చేయాలి. పనిపాటులు చేసుకుంటున్న వేళల్లోనూ మనస్సును భగవంతుని పాదపద్మాలపైనే కేంద్రీకరించాలి. నా వీపు మీద రాచపుండు బయలుదేరిన దనుకోండి. నేను నా పనులు చేసుకొంటూన్నప్పటికీ మనస్సు మాత్రం రాచపుండు మీదనే ఉంటుంది. రామనామ స్మరణ చేయటం మంచిది. ఏ రాముడు దశరథనందనుడో అతడే ఈ జగత్తును సృజించాడు. అతడే సర్వభూతాలలోనూ నెలకొని ఉన్నాడు. అతడు మనకు అతిసమీపంలో ఉన్నాడు. బాహ్యాంతరాలలో వ్యాపించి ఉన్నాడు.”