ఆర్యసమాజం : 19 వ శతాబ్దంలో ఉద్భవించిన మత సంస్కరణోద్యమాలలో ముఖ్యమైనది. దీని స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి (1824 – 1883). వేదశాస్త్ర పారంగతుడైన దయానంద సరస్వతి 1875 సం ॥ బొంబాయిలో ఈ సమాజాన్ని స్థాపించాడు. సాకారోపాసనను తీవ్రంగా నిరసించిన ఈయన వేదాలలోని ప్రతి మాటనూ సత్యంగా విశ్వసించాడు. మహమ్మదీయ, క్రైస్తవ మతాల పరివ్యాప్తిని నిరోధించటంలో ఆర్యసమాజం పాలు అత్యధికం. దీని సనాతన వైఖరి అనేకులకు నచ్చింది. ఆర్య సమాజం అనేక సాంఘిక సంస్కరణలను చేపట్టింది. కుల విచక్షత, స్త్రీలను అణగద్రొక్కటం వంటి దురాచారాలను తీవ్రంగా ఖండించి, ఎదుర్కొంది. పంజాబ్లో ఈ సమాజం అత్యధిక ప్రాబల్యాన్ని చూరగొన్నది. నిద్రావస్థలో ఉన్న హైందవ సమాజం దీని తాకిడితో జాగృతమైంది. బ్రహ్మసమాజంలా కాక పామరులను సైతం ఇది ప్రభావితం చేయగలిగింది. ఇదొక ప్రజోద్యమంగా పరిణమించినదనే చెప్పుకోవచ్చు. కాని తన లక్ష్యమే సరైనది, తక్కినవి సరికావని ఆర్యసమాజం మొండిపట్టుతో వ్యవహరించింది; వాటిని తీవ్రంగా ఎదిరించటానికీ వెనుకాడలేదు. దయానంద సరస్వతి కలకత్తాకు వచ్చినప్పుడు శ్రీరామకృష్ణులు వెళ్ళి ఆయన్ను కలుసుకోవటం జరిగింది.
కర్తాభజా, నవరసిక్: వైష్ణవ సంప్రదాయంలోని చిన్ని శాఖలు. స్త్రీలు పురుషులు ప్రేమ బంధంతో కలిసి జీవించాలి, కాని పరస్పరం దైవంగా భావించుకోవాలి, క్రమక్రమంగా మానవప్రేమ దివ్యప్రేమగా రూపు చెందుతుందని ఇవి బోధించాయి.
బ్రహ్మసమాజము : 19 వ శతాబ్దంలో ఉద్భవించిన మత సంస్కరణోద్యమాలలో ప్రధానమైన వాటిలో ఇది ఒకటి. దీని వ్యవస్థాపకుడు రాజారాంమోహన్ రాయ్ (1774 – 1833). ఈయన ఒక వైదిక బ్రాహ్మణుడై ఉండికూడా బౌద్ధ, ఇస్లాం, క్రైస్తవ మతాలపట్ల ఆసక్తి కనబరిచాడు. అయినప్పటికీ తన సిద్ధాంతాలకు వేదాలనే మూలంగా గ్రహించటం జరిగింది. 1828 లో ఈయన బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు. ఏకేశ్వరోపాసనను ప్రతిపాదించిన బ్రహ్మసమాజంలో కులమత జాతి విచక్షతలేక అందరూ సభ్యులు కావచ్చు.
బ్రహ్మసమాజ వ్యవస్థాపకుడు రాజారాంమోహన రాయ్ అయినప్పటికీ దీనిని ఒక సమాజంగా తీర్చిదిద్దిన వ్యక్తి మహర్షి దేవేంద్రనాథ్ టాగూర్ (1817 – 1905). ఈయన విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ తండ్రి. సంస్కృత పాండిత్యం, ఆధ్యాత్మికోన్నతి గడించిన ఈయన నాటి విద్యావంతులైన వంగదేశీయులలో మహానాయకుడై వెలుగొందాడు. ఈయన ఉపనిషత్తుల నుంచే ప్రేరణను సంతరించుకొన్నాడు. సాకారోపాసనను తీవ్రంగా ఖండించిన దేవేంద్రనాథ్ టాగూర్ సమాజంలోకి ఇస్లాం, క్రైస్తవ భావనలు చొరబడకుండా గట్టిగా ప్రయత్నించాడు.
బ్రహ్మసమాజపు తదుపరి నాయకుడుగా వచ్చిన వ్యక్తి కేశవచంద్ర సేన్ (1838 – 1884). ఆంగ్లవిద్యాభ్యాసం చేసినవాడు. ఈయన సంస్కృతం నేర్చుకోలోకపోయాడు. ఆంగ్లవిద్యాభ్యాస కారణంగా క్రైస్తవ మతం పట్ల ఇతడు ఎంతో ఆసక్తి కనబరిచాడు. అందుకే ఏసుక్రీస్తును బ్రహ్మసమాజంలో చొప్పింప యత్నించాడు. ఈ కారణంగా మహర్షితో అభిప్రాయభేదాలు తప్పలేదు. అందుచేత ఈతడు తన అభిప్రాయాలతో ఏకీభవించే వారితో కలిసి ఇండియా బ్రహ్మ సమాజం అనే క్రొత్త సమాజాన్ని స్థాపించాడు. బ్రహ్మసమాజం, ఆది బ్రహ్మ సమాజం పేరిట కొనసాగింది.
కేశవచంద్రసేన్ శ్రీరామకృష్ణుల సహచర్యం పొందిన పిదప ఆతడి అభిప్రాయాలు సత్వరం మారసాగాయి. మత సామరస్య భావన అతిముఖ్యమైనదయింది. ఈ భావన, ఇటువంటి పలు నవీన విశాల భావనలు కలగలసి ఇండియా బ్రహ్మసమాజం తదనంతరం ‘నవవిధాన్’ పేరిట వ్యవహరించింది.
స్త్రీల వివాహ వయస్సు విషయంలో సమాజం విధించిన వయోపరిమితిని కేశవసేన్ తన కుమార్తె వివాహంలో మీరినందున కొందరు విడిపోయి సాధారణ బ్రహ్మసమాజం అనే సమాజాన్ని నెలకొల్పారు. విజయకృష్ణ గోస్వామి, శివనాథ్ శాస్త్రి వంటివారు సాధారణ బ్రహ్మసమాజ నాయకులైనారు.
శ్రీరామకృష్ణుల జీవిత కాలంలో బ్రహ్మసమాజం ఇన్ని శాఖలుగా విడిపోయింది.