‘మ’ రచించిన అయిదు సంపుటాల బెంగాలీ కథామృతం పూర్వాపర్య క్రమంలో (chronological order) లేదు. మొదటి నాలుగు సంపుటాల చివర, గురుదేవుల శిష్యుల గురించీ, బారానగర్లో గురుదేవుల మహాసమాధి అనంతరం వెలసిన మఠం గురించీ కొంత సమాచారాన్ని జోడించారు. కొన్ని సంవత్సరాల క్రితం కొందరు పరిశోధకులు ‘మ’ దినచర్య పుస్తకంలోని నాలుగు ఆరోపాలు (entries) (25 ఆగష్ట్ 1886, 2 సెప్టెంబర్ 1886, 12 అక్టోబర్ 1886, 17 ఫిబ్రవరి 1887) నవ్యభారత్ అనే మాసపత్రికలో 1904 లో ప్రచురితమైనట్లు కనుగొన్నారు. బహుశా ‘మ’ ఈ ఆరోపాలను ఐదవ సంపుటం చివర చేర్చదలచుకొని ఉంటారు. కాని దురదృష్టవశాత్తు ఆ సంపుటం ‘మ’ మరణానంతరమే వెలుగు చూసింది. ఈ క్రొత్తగా కనుగొన్న విషయాంశాలను నేను బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువదించాను… ఈ అమూల్యమైన చారిత్రక దాఖలా నుంచి మనకు ఒక విషయం తెలియవస్తున్నది: 1886 అక్టోబర్ 12 వ తేదీకి మునుపే బారానగర్ మఠం స్థాపించబడింది.
[స్వామి చేతనానంద రచించిన How to Live with God, In the Company of Sri Ramakrishna (తెలుగు శ్రీరామకృష్ణ లీలామృతం) నుంచి పొందుపరచబడినది.]
బుధవారం, 25 ఆగష్ట్ 1886
శ్రీరామకృష్ణులు తమ భక్తులను వదలిపెట్టి నిజ ధామానికి వెళ్లిపోయి ఇప్పటికి పది రోజులయింది. వైరాగ్య మనస్కులైన నరేంద్రుడు అతడి సోదర శిష్యులు తీవ్ర సాధనలలో మునిగిపోయారు.
కలకత్తాలో బలరామ్ బాబు ఇంట్లో నరేంద్రుడు, గురుదేవుల భక్తులు సమావేశమయ్యారు. వారు తల్లిని కోల్పోయిన అనాథల్లా ఉన్నారు. గురుదేవుల మహాసమాధి వలన జనించిన తీవ్ర దుః ఖం వారి ముఖాల్లో ద్యోతకమవుతోంది. ఒకే ఆలోచన వారి మనస్సులను ఆవరించి వేసింది; గురుదేవులు తమ నిజ ధామానికి వెళ్లిపోయారు; మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ యువశిష్యులు బసచేయడానికి భక్తులు ఒక ప్రత్యేకమైన చోటు ఏదీ చూపలేదు. శిష్యులు గత్యంతరంలేక తిండికి, నిద్రకి ప్రతిరోజు ఇంటికి వెళ్లవలసి వచ్చింది. ముత్యాలను హారంగా కలిపిన దారం తెగిపోయింది. ఆ బృందం చెల్లాచెదరయ్యే పరిస్థితి ఎదురయింది. మనం ఎక్కడకు వెళ్లాలి? మనం ఏం చేయాలి? ఇదే ఆలోచన శిష్యుల మనస్సును నింపివేస్తున్నది. ఏకాంతంలో కూర్చుని వారు గురుదేవులను గురించి యోచిస్తూ ఆయన కోసం విలపించసాగారు.
నరేంద్రుడు, రాఖాల్, కాళీ, శరత్, శశి, తారక్, గోపాల్, భవనాథ్, ‘మ’ ముందుగా వచ్చారు. కాస్త ఆలస్యంగా నిరంజన్ వచ్చాడు.
ప్రతి ఒక్కరూ నరేంద్రుడి వంకే చూశారు. తన సోదర శిష్యులలో కొందరిని బృందావనానికి పంపాలని అతడు యోచిస్తున్నాడు. కనుక భక్తుల నుంచి కొంత పైకం సేకరిస్తున్నాడు.
శ్రీరామకృష్ణుల ఉపదేశం – కామినీకాంచన త్యాగం
కొందరు సోదరశిష్యులతో పాటు నరేంద్రుడు ప్రక్కనే ఉన్న గిరీశ్ ఇంటికి బయలుదేరాడు. అతడు, ‘మ’ మాటల్లో పడ్డారు.
నరేంద్రుడు (‘మ’ తో): మహాశయా, బాబూరామ్ కు ఒకవైపు ప్రయాణ ఖర్చు మీరు ఇవ్వండి.
‘మ’ : తప్పకుండా ఇస్తాను.
నరేంద్రుడు: మీరు ఇవ్వగలిగితే ఇప్పుడే, దయచేసి.
‘మ’ : ఇప్పటికిప్పుడా?
బృందావనానికి వెళ్లడానికి ఎంపిక అయిన వారిలో బాబూరామ్ ఒకడు. భక్తబృందం గిరీశ్ ఇంట్లో సమావేశమయింది. నరేంద్రుడు, గిరీశ్ను డబ్బు అడిగాడు.
గిరీశ్: ప్రస్తుతం నా వద్ద ఎక్కువగా డబ్బు లేదు. మీరు కావాలంటే ఇప్పటికిప్పుడే 10 లేక 11 రూపాయలు ఇవ్వగలను.
నరేంద్రుడు (గంభీరంగా) : కామినీ కాంచనాలను త్యజించమని మాకు గురుదేవులు చెప్పారు.
ఒకభక్తుడు: నువ్వు కూడా వెళ్లిపోతున్నావా?
నరేంద్రుడు: ఇంటిని ముందు త్యజించాలి. ఇంట్లో నేను చూడవలసిన వ్యవహారం కొంత ఉంది. వ్యాజ్యం ఇంకా పరిష్కారం కాలేదు. (క్షణం యోచించి) వాజ్యం దాని దారిన అది పోతుంది. సత్యాన్ని నేను అర్థం చేసుకోలేదు. ఈ కుటుంబ వ్యవహారంలో తలదూర్చడం నిష్ప్రయోజనం.
రాఖాల్: నేను ఇక్కడే ఉండిపోతే, నా కుటుంబం నన్ను లాగుతుంది.
నరేంద్రుని తండ్రి మరణించారు. అతడికి ఇద్దరు తమ్ముళ్లు, కొందరు సోదరీమణులు ఉన్నారు. వారికి సంరక్షకుడులేడు, ఆహార వస్త్రాదులకు ధనం లేదు. నరేంద్రుడు బి.ఏ. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అతడు తలచుకొంటే కుటుంబ పోషణార్థం అతడికి ఉద్యోగం దొరక్కపోదు. రాఖాల్కు తండ్రి, భార్య, చిన్నపిల్లవాడు ఇంట్లో ఉన్నారు.
కాంకూర్గాఛి ఉద్యాన గృహం (శ్రీరామకృష్ణుల అస్థికలు ప్రతిష్ఠించిన స్థలం) ప్రస్తావన వచ్చింది. ధర్మకర్తల నియామకం గురించి వారు చర్చించారు.
రాఖాల్: నరేంద్రుణ్ణి ఒక ధర్మకర్తగా చేస్తే మాకు సంతోషం.
నరేంద్రుడు: లేదు, లేదు. ఉండడంలో ఏం మంచి ఒనగూరుతుంది?
అందరూ నరేంద్రుణ్ణి ధర్మకర్తగా ఉండమని కోరినప్పుడు, అతడు గిరీశ్తో ఇలా చెప్పాడు: “సరే, అలాగే కానివ్వండి.” కాని నరేంద్రుడి నియామకం జరగలేదు.
గురుదేవుల నిర్యాణం – భక్తుల దుఃఖం
గిరీశ్ గదిలో మణి* మరో భక్తుడు మాటల్లో పడ్డారు. ఆ భక్తుడు భారంగా నిట్టూర్చి ఇలా చెప్పాడు: ‘దేని కోసమూ గురుదేవులను ప్రార్థించను.” అని చెప్పి, ఆ భక్తుడు మళ్లీ భారంగా నిట్టూర్చాడు.
మణి : దేని కోసం కూడా?
భక్తుడు: లేదు, నేను దేనికోసమూ ప్రార్థించను – భక్తి కోసం కాని లేదా నా కుటుంబం కోసంగాని ప్రార్థించను.
అని చెబుతూ, ఆ భక్తుడు మళ్లీ నిట్టూర్చాడు.
భక్తుడు: గురుదేవులు ఇలా చెప్పారు: ‘ఎందుకు ఇన్ని పాలు? భక్తులకు కుటుంబాలు ఉన్నాయి; వారెలా ఈ ఖర్చు భరించగలరు? ఎంత బాధాకరం! నేను ఎన్నటికీ దీనిని మరిచిపోలేను.’
కాశీపూర్ ఉద్యాన గృహంలో గురుదేవులు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతు న్నప్పుడు, గురుదేవుల సేవకయ్యే ఖర్చు అంతా గృహస్థ భక్తులు భరించారు. వారు మరీ దుబారాగా డబ్బు ఖర్చు పెట్టకుండా గురుదేవులు సదా ఒక కంట కనిపెట్టి ఉండేవారు.
భక్తుడు: గురుదేవుల చికిత్సకై ప్రత్యేకంగా ఒక వైద్యుణ్ణి నియమించాలను కున్నాను. కాని చెయ్యలేకపోయాను.
కాసేపు మౌనం వహించి మళ్లీ అతడే ఇలా చెప్పాడు: “సరే, గురుదేవుల నామజపం చేసి నా కుటుంబ స్థితిగతులను మెరుగుపరచడానికి నేను ప్రయత్నిస్తానని నువ్వు భావిస్తున్నావా? జనులు నన్ను సజ్జనుడని లేదా నీతిమంతుడని పేర్కొన్నా పేర్కోపోయినా ఫరవాలేదు.
గురువారం, 2 సెప్టెంబర్ 1886
కలకత్తాలోని గురుప్రసాద్ చౌధురీ వీథిలో ఉన్న ‘మ’ ఇంటికి శశి వచ్చాడు. అతడు, ‘మ’ ఒక కొయ్య మంచం మీద కూర్చున్నారు. శశి, శరత్ పాటల్డంగాలో తమ స్వగృహాల్లో నివసిస్తున్నారు. నేడు శశి పరిశుభ్రమైన దుస్తులు వేసుకొని, ఒక కొత్త గొడుగు చేత్తో పుచ్చుకువచ్చాడు. గురుదేవుల గురించి శశి, ‘మ’ మాట్లాడు కోసాగారు.
‘మ’ : బృందంలో నరేంద్రుడు ప్రధాన శిష్యుడని గురుదేవులు నాతో చెప్పారు.
శశి : నరేంద్రుడే మన నాయకుడని గురుదేవులు చెప్పడం నాకు బాగా జ్ఞాపకం.
‘మ’ : చదువులు కొనసాగించడం గురించి గురుదేవులు ఏం చెప్పారో నీకు గుర్తుందా?
శశి (నవ్వుతూ) : అవును, నాకు బాగా గుర్తు. గురుదేవులు నరేంద్రుడితో ఒక రోజు, ‘వారిని (యువశిష్యులు) ఇక మీదట ఏ పాఠశాలలోనూ చదువు కొనసాగించడానికి అనుమతించకు’ అని చెప్పారు.
‘మ’ : కాళీ సంగతి ఏమిటి?
శశి : అవును, గురుదేవులు కాళీని, ‘నువ్వు ఇక్కడ చదువులు ప్రవేశపెట్టావు’ అని చీవాట్లు పెట్టారు. పారశీకం అధ్యయనం మొదలుపెట్టగానే నేను ఆయన నుంచి చీవాట్లు తిన్నాను.
ఈలోగా శరత్, నరేంద్రుడు వచ్చారు. గురుదేవుల సందేశాన్ని బోధించడం గురించి వారంతా చర్చించనారంభించారు. మొదట ఎవరు బోధించాలి?
‘మ’ : ఎవరు గురుదేవులను అర్థం చేసుకొన్నారు? వైష్ణవచరణ్ వ్రాతల గురించి గురుదేవులు ఏం చెప్పారో మీకు గుర్తుందా?
శరత్ : అవును, నాకు గుర్తుంది. గురుదేవులు ఇలా చెప్పారు: “వైష్ణవచరణ్ నా ప్రతి ఒక్క ఆధ్యాత్మిక అనుభూతినీ అర్థం చేసుకున్నాడు. అతడే వాటిని మొదట లోకవిదితం చేయాలని భావిస్తున్నాను.”
నరేంద్రుడు : గురుదేవులు నాతో ఇలా చెప్పారు: “బ్రహ్మజ్ఞానమే లక్ష్యం. వైష్ణవచరణే సందేశాన్ని మొదట వ్యాపింపచేయవలసి ఉంది. కాని అది జరగలేదు. ఆ సందేశాన్ని మొదట లోకవిదితం చేసింది కేశవ్సేన్ మహాశయుడే.”
మంగళవారం, 12 అక్టోబర్ 1886
బారానగర్లో మొదటి రామకృష్ణ మఠం
తమ భక్తులను ప్రేమపాశంతో బద్ధులను చేసి గురుదేవులు ఈ లోకాన్ని వదలి దాదాపు రెండు నెలలు కావస్తోంది. ప్రస్తుతం వారు ఎక్కడకు వెళ్లగలరు? తమ ఇళ్లల్లో ఇకపై ఆనందంగా ఉండలేరు. రేయింబవళ్లు గురుదేవులను గురించే ఆలోచిస్తూ ఆయన గురించే మాట్లాడుకుంటూ సదా కలిసికట్టుగా ఉండాలని వారి అభిమతం. ఇద్దరు ముగ్గురు శిష్యులకు ఇళ్లు లేవు. ఈ సందిగ్ధ తరుణంలో సురేంద్ర ముందుకు వచ్చి ఇలా చెప్పాడు: “సోదరులారా, మీకు ఉండడానికి చోటులేదు. మీ హృదయాలకు శాంతమిచ్చే చోటు మీకు లేదు. బారానగర్లో ఒక ఇల్లు బాడుగకు తీసుకుందాం. అక్కడ మీరు నివసించవచ్చు, మేం అప్పుడప్పుడు అక్కడకు వస్తూ ఉంటాం.”
కాశీపూర్ ఉద్యానగృహంలో గురుదేవుల సేవకై సురేంద్ర ప్రతి నెల యాభై రూపాయలు (నిజానికి ఎనభై) ఇచ్చేవాడు. ఇప్పుడు అతడు ఇలా చెప్పాడు: “సోదరులారా, గురుదేవుల సేవార్థం నేను ఏదో కొద్ది పైకం ఇస్తూ ఉండేవాణ్ణి. ఈ బారానగర్ ఇంటి ఖర్చుల నిమిత్తం నేను ఆ మొత్తాన్ని ఇప్పుడు ఇస్తాను.”
క్రమంగా నరేంద్రుడు, గురుదేవుల అవివాహిత శిష్యులు బారానగర్ మఠంలోకి వచ్చి చేరుకున్నారు. వారు ఇంటికి తిరిగి వెళ్లలేదు. అనతికాలంలోనే సన్న్యాస సోదర శిష్యుల సంఖ్య పెరిగింది. చివరకు ప్రతి నెలా సురేంద్ర నూరు రూపాయలు ఇవ్వసాగాడు.
ధన్యాత్ముడు సురేంద్ర! ఈ మొదటి మఠానికి నువ్వు పునాది వేశావు. నీ శుభాకాంక్షలే ఈ ఆశ్రమ స్థాపనకు మూలాధారాలు! తమ ఉపదేశ సారాంశమైన ‘కామినీకాంచన పరిత్యాగానికి’ ప్రతిరూపంగా ఈ లోకంలో తమ శిష్యులు జీవించడానికి అవకాశాన్ని గురుదేవులే నీ ద్వారా కల్పించారు. పరిత్యాగమూర్తులైన నరేంద్రాది యువ శిష్యుల మూలంగా సనాతన హైందవ ధర్మాన్ని ప్రజలకు ప్రదర్శించారు.నీ ఋణాన్ని ఎవరు తీర్చగలరు? సన్న్యాస సోదరులు మఠంలో అనాథ బాలల్లాగా జీవించారు. కొన్ని సమయాలలో ఇంటి అద్దె చెల్లించడానికి డబ్బు ఉండేది కాదు, కొన్ని సమయాలలో ఆహారం ఉండేది కాదు. నువ్వు వచ్చి ఈ ఇబ్బందులను పరిష్కరిస్తావని నిరీక్షించేవారు. నీ నిస్వార్థ ప్రేమను తలచుకొన్నప్పుడు ఎవరి కళ్లు చెమ్మగిల్లవు!
నరేంద్రుడు- జ్ఞానయోగం
బారానగర మఠం. ఈ వెన్నెల రాత్రి నరేంద్రుడు, మణి గురుదేవుల పూజామందిరానికి తూర్పున ఉన్న వసారాలో పచార్లు చేస్తున్నారు. అది పౌర్ణమి, లక్ష్మీ పూజ పర్వదినం. గురుదేవుల గురించీ, జ్ఞానయోగం, భక్తియోగం గురించీ నరేంద్రుడు, మణి, సంభాషించుకొంటున్నారు.
మణి: గురుదేవులు రెండు మార్గాలు – జ్ఞాన, భక్తి – వివరించారు. అవి రెండూ ఒకే లక్ష్యానికి చేరుస్తాయని చెప్పారు. జ్ఞానమార్గగాములూ భక్తిమార్గగాములూ ఒకే చరమ గమ్యం చేరుకొంటారు.
నరేంద్రుడు: కాని గురుదేవులు నాతో ఇలా చెప్పారు: “బ్రహ్మజ్ఞానమే లక్ష్యం. భక్తి జీవితం బాహ్యాంశాన్ని కొనసాగించడానికి సాధనం. ఏనుగుకి బాహ్యదంతాలు, లోపలి దంతాలు కూడా ఉంటాయి. బాహ్యదంతాలు కేవలం అలంకార ప్రాయమైనవి. కాని ఏనుగు లోపలి దంతాలతోనే ఆహారాన్ని నమిలి తింటుంది.”
మణి: బ్రహ్మజ్ఞానాన్ని భక్తిమార్గం ద్వారా కూడా పొందవచ్చని కూడా గురుదేవులు చెప్పారు. బ్రహ్మజ్ఞానాన్ని జ్ఞాన భక్తి మార్గాల రెండింటి ద్వారా పొందవచ్చు. బహుశా నీకు గుర్తు ఉండే ఉంటుంది, గురుదేవులు ఇలా కూడా చెప్పారు: “బ్రహ్మజ్ఞానం పొందిన తరువాత, కొందరు భక్తిని ఆశ్రయించి లోకంలో జీవిస్తారు. అప్పుడు వారు లీల నుంచి నిత్య స్థితికి ఆరోహిస్తారు, నిత్యం నుంచి లీలకు అవరోహిస్తారు.”
నరేంద్రుడు: కాశీపూర్ ఉద్యాన గృహంలో ఆ రోజు గురుదేవులు బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడినప్పుడు మీరున్నారా?
మణి: ఆ సమయంలో నే నక్కడ లేను. కాని ఆయన చాలాసేపు దానిని గురించి మాట్లాడారని మటుకు విన్నాను. శుకమహర్షి గురించి ఏమన్నారో నీకు జ్ఞాపకం ఉందా?
నరేంద్రుడు: లేదు, నాకు జ్ఞాపకం లేదు.
మణి : ఆ రోజు గురుదేవులు ఇలా చెప్పారని విన్నాను: “శుకమహర్షి, ఆయన లాంటి మహర్షులు పెద్ద చీమలలాంటి వారు; అయినప్పటికీ మహా అయితే కొన్ని చక్కెర కణాలను మాత్రమే మోసుకుపోగలరు. శివుడు సచ్చిదానంద సాగరాన్ని స్పృశించాడు లేదా గుక్కెడు నీటిని త్రాగి ఉంటాడు.” నువ్వు అలాంటి విషయాలు విన్నావా?
నరేంద్రుడు: అవును, గురుదేవులు ఆ రోజు అలాంటి విషయాలెన్నో చెప్పారు.
నరేంద్రుడు చూసిన దృశ్యం: అహంకార త్యాగం
మఠ సోదరుల గురించి మణి, నరేంద్రుడు చర్చించుకొంటున్నారు.
మణి: ఇప్పుడు సమస్తం నీ మీదనే ఆధారపడి ఉంది. నువ్వే వారిని కనిపెట్టి ఉండాలి.
నరేంద్రుడు: అహంకారం బాగా ఇబ్బంది పెడుతోంది. ఆ రోజు తృష్ణీ భావంతో ‘హ’ ను చీవాట్లుపెట్టాను. వెంటనే నాకు గురుదేవుల దర్శనం కలిగింది. ఆయన ఏం చెప్పారో తెలుసా? ఆయన ఇలా చెప్పారు : “నువ్వు ఏమనుకొంటున్నావు? మీలోని అత్యల్పుణ్ణి మహోన్నతుణ్ణిగా చేయగలను, మహోన్నతుడైన వ్యక్తిని అత్యల్పుడిగా దిగజారుస్తానని తప్పక తెలుసుకో.” ఆ దృశ్యం కనిపించిన తరువాత నేనెంతో అప్రమత్తంగా ఉంటున్నాను. అత్యల్పుడు మహోన్నతుడు, మహోన్నతుడు అత్యల్పుడు.’
మణి: నువ్వు సరిగ్గా చెప్పావు. ఆయన అనుగ్రహంతోనే భగవత్సాక్షాత్కారం లభిస్తుంది. ఒక వ్యక్తిని మహోన్నతుణ్ణి, అత్యల్పుణ్ణి కూడా ఆయన చేయగలరు. తమ స్వప్రయత్నాలతో ఎవరన్నా భగవంతుణ్ణి పొందగలరా? ఆయన అనుగ్రహం తప్పక అవసరం.
భగవత్సాక్షాత్కారానికై నరేంద్రుడి వ్యాకులత
నరేంద్రుడు గదిలోకి వచ్చాడు. భగవత్సాక్షాత్కారం పొందగలననే ఆశ అతడిలో కాస్త సన్నగిల్లింది. అతడు పాడ నారంభించాడు:
సాధ్యమేనా శ్యామదర్శనం ప్రతివారికీ
లభ్యమేనా కాళిసంపద ప్రతివారికీ
సత్యమేదో ఏల చూడదు నా పిచ్చి మనసు
సాధ్యమేనా శ్యామదర్శనం నాకెన్నడైనా
తపములెన్నో చేసియుండియు సదాశివుడు
శ్యామపాద అరుణ దర్శనం చేయంగలేక
మనోమోహనమైన దర్శనం ఎవ్వరికైనా
అమ్మ పాద ధ్యానపరునకు విలువేమి లేదు
సర్వమిచ్చు ఇంద్రభోగము విలువేమి లేదు
శ్యామ కృపావీక్షణంబులు పైబడినవాడు
బ్రహ్మానందమందు ఈదును ఆ ధన్యజీవి
అమ్మపాదపద్మ ధ్యానము చేతనగునె
దేవతాధిపతికినైనను సాధ్యమగునె
యోగయోగేశుకైనను అతిదుర్లభంబు
సాధ్యమేనా శ్యామదర్శనం ప్రతివారికీ
దీనుడైన కమలాకాంతుడు ఇది తెలిసికూడ
అమ్మ దివ్య పాదపద్మము కాంక్షించుచుండు.
నరేంద్రుడు మఠంలోని మరో గదిలోకి వెళ్లాడు. అతడు ఏం ఆలోచిస్తూన్నాడు? శ్రీరామకృష్ణుల ప్రేమమయ రూపం హఠాత్తుగా అతడి హృదయంలో జీవం పోసుకుందా? మళ్లీ అతడు పాడసాగాడు:
మడిమైలలు నా మతముతోగూడ స
మాప్తమయ్యె సఖుడా
అమ్మ శ్యామకును అర్చన నేనిక
ఆచరింపగా జాలనురా
చెప్పలేను నా మది నిగ్రహము
చేయ నెదురు తిరిగె
సిగ్గు సిగ్గు నే నవమానముచే
చిమిడిపోదు నకటా!
కరమున ఖడ్గము యురమున శిరముల
హారము దాల్చిన కాళి ధ్యానము
కరిగినప్పుడే విరుల దామమును
యురమున దాల్చుచు మురళి మావిపై
మోపెడు మోహన శ్యామమోహనుడు
కన్నుల ముందట కన్పడు కాంతతో
త్రిలోచనిని నే తలచుచుండగా
వాలుకన్నుల వాడు గానబడ
పరవశనై నే మరతు సర్వమును
సిగ్గుచెంది నే చిమిడిపోవుదును
మాత పాదముల నెత్తావి గొల్పు సుమ
మంజరు లర్పణ చేయబోవగా
మదన మోహనుని మోహ భావమున
మది పరవశమై చెదరిపోవురా
కాంచన చేలము గాంచినంతనే
శ్యామగూర్చి నే చేయు ధ్యానములు
చల్లగ మెల్లగ కాంచనచేలుడు
ఒకటి నొకటిగా దాటవేసెరా.
ఈ పాట పాడి నరేంద్రుడు కాసేపు మౌనం వహించాడు. ఆ తరువాత హఠాత్తుగా, “శ్మశానవాటికకు పోదాం.” అని చెప్పాడు. అనంతరం ఇలా వ్యాఖ్యానించాడు: “ఆహా! అది ఒక చావడిలా కనిపిస్తున్నదేగాని శ్మశానవాటిక కాదు.” (అందరూ నవ్వారు)
మఠానికి సమీపంలో పరమాణిక్ ఘట్టం ఉంది. శ్మశానవాటిక దానికి సమీపంలో ఉంది. శ్మశానవాటిక చుట్టూ గోడలున్నాయి. మూడు గదుల ఒక ఇటుకరాతి కట్టడం తూర్పు చివరన ఉంది. కొన్ని సమయాలలో నరేంద్రాదులు రాత్రివేళలప్పుడు అక్కడకు ఒంటరిగా వెళ్లి సాధనలు అనుష్ఠించే వారు.
మాతృదేవి ప్రస్తుతం బృందావనంలో బసచేసి ఉన్నారు. నరేంద్రుడు, ‘మ’ ఆమెను గురించి మాట్లాడుకోసాగారు: కాశీపూర్ ఉద్యాన గృహంలో ఒక రోజు, యువ శిష్యులు గురుదేవులతో తమ పట్ల మాతృదేవికి ఉన్న వాత్సల్యం గురించి చెప్పారు. ఆ సమయంలో ఆమె గురుదేవుల సేవకై ఉద్యానగృహంలోనే ఉంటున్నారు. అంతటి విశాల హృదయం ఉన్న స్త్రీని తాము ఇంత వరకు చూడలేదని శిష్యులు, గురుదేవులతో చెప్పారు.
‘మ’ : గురుదేవులు ఏం చెప్పారు?
నరేంద్రుడు: గురుదేవులు నవ్వసాగారు. తరువాత ఇలా చెప్పారు: “ఆమె నా శక్తి. అందుకే అందరినీ ప్రేమిస్తుంది.”
శుక్రవారం, 17 ఫిబ్రవరి 1887
బారానగర్ మఠం. సమయం మధ్యాహ్నం 12.30. నరేంద్రుడు, తక్కిన సోదర సన్న్యాసులు మఠంలోనే నివసిస్తున్నారు. అప్పుడు హరమోహన్, ‘మ’ వచ్చారు. శశి గురుదేవుల ఆరాధనలో నిమగ్నుడై ఉన్నాడు. నరేంద్రుడు స్నానానికి గంగకు పోబోతున్నాడు.
నరేంద్రుడు : గీతలో కృష్ణుడు జపం, తపశ్చర్యల గురించే ప్రధానంగా చర్చించాడు.
‘మ’ : అదెలా? అటువంటప్పుడు అర్జునుడికి అంతగా ఎందుకు ఉపదేశించాడు?
నరేంద్రుడు: కుటుంబ కర్తవ్యాలు నిర్వహించమని కృష్ణుడు అర్జునుడికి చెప్పలేదు కదా?
‘మ’ : కృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధం చెయ్యమన్నప్పుడు, అర్జునుడు ఒక గృహస్థు. కనుక నిర్లిప్తంగా తన కుటుంబ కర్తవ్యాలను నిర్వహించమని అర్జునుడికి బోధించాడు.
(కాలాంతరంలో నరేంద్రుడు ఈ అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. అమెరికాలో పర్యటించినప్పుడు ఆయన కర్మయోగం గురించి ప్రసంగించి, తన విద్యార్థులను నిర్లిప్తంగా కర్మలు ఆచరించమని బోధించారు. నరేంద్రుడు మొదట సన్న్యాస ప్రతిజ్ఞలు చేసినప్పుడు, ప్రాపంచిక కర్తవ్యాల పట్ల ఎంతో విసిగిపోయి ఉన్నాడు. కనుకనే గీతలో ప్రధానాంశం జపం, తపశ్చర్యలు అని చెప్పారు.)
ఆ సమయంలో ఒక గృహస్థ భక్తుడు, ఒక సోదర సన్న్యాసితో మాట్లాడుతున్నాడు. ఆ భక్తుడు మఠంలో ఉండాలనుకుంటున్నాడు. మఠంలోని ఆధ్యాత్మిక వాతావరణం. అతడికి బాగా నచ్చింది. అతడికి సంసార జీవితం రుచించడం లేదు. వంటింటికి దక్షిణం వైపు ఉన్న వసారాలో వాళ్లు మాట్లాడుకుంటున్నారు. అక్కడే నిరంజన్ పని చేసుకుంటున్నాడు.
భక్తుడు: నేను మఠంలో ఉంటే, కుటుంబాన్ని పట్టించుకోలేదనే నిందకు నేను గురి అవుతానా?
సన్న్యాసి : నువ్వు ఉండడం వలన నిన్ను ఎవరూ నిందించరు. కాని నీ కుటుంబాన్ని చూసుకోవలసిన బాధ్యత ఉంది కదా!
నిరంజన్ (వంటింట్లో నుంచి) : ఓ సోదరా! నువ్వు ఏం చేస్తున్నావు? ఏ విధమైన సలహా అతడికి ఇస్తున్నావు? (అందరూ నవ్వారు)
ఇంతలో నరేంద్రుడూ, కాళీ గంగలో స్నానాలు ముగించి తిరిగి వచ్చారు. కాళీ సదా వేదాంతాధ్యయనంలో మునిగి ఉంటాడు. “నువ్వు నా ప్రభువు నేను నీ భక్తుణ్ణి” అనే వైఖరి అతడికి సుతరామూ నచ్చదు. ఎడతెగకుండా అతడు ఇలా చెప్పేవాడు: “నేనే బ్రహ్మాన్ని నాకు నామరూపాలు లేవు.” స్నానం ముగించి వచ్చిన తరువాత అతడు తన గదిలోకి వెళ్లి ఇలా పునరుచ్చరించసాగాడు: “నేను నామ రూపాలకు అతీతుడను. నేనే పరబ్రహ్మాన్ని. మీకు ప్రణామం, మీకు ప్రణామం, మీకూ నాకూ ప్రమాణం.”
భోజనానికి భక్తులు కూర్చున్నారు. మఠంలో వంటమనిషి ఒక్కడే. భోజనానంతరం ఎవరి విస్తరాకులు వారు తీసివేశారు. కాని నరేంద్రుడు ‘మ’ విస్తరాకును స్వయంగా తానే తీసివేశాడు. అందుకు ‘మ’ ఆక్షేపించినప్పుడు, “ఇక్కడ అందరూ సమానులు” అని నరేంద్రుడు జవాబిచ్చాడు.
భోజనానంతరం అందరూ చావడి గదిలో సమావేశమయ్యారు. కొందరు తాంబూల సేవనం చేస్తున్నారు, మరికొందరు పొగత్రాగుతున్నారు.
రాఖాల్ (‘మ’ తో) : నేను మీ వద్దకు ఒక రోజు రావాలనుకుంటున్నాను. గురుదేవుల గురించి మీరు ఏం వ్రాస్తున్నారో వినాలని కుతూహలంగా ఉంది.
‘మ’ : నా జీవితం పూర్తిగా పరివర్తన చెందే దాకా నేను ఆ ఉపదేశాలను ఎవరితోనూ ముచ్చటించకూడదని నిర్ణయించుకున్నాను. గురుదేవుల ప్రతి వచనమూ ఒక మంత్రం. ఆ ఉపదేశాలను జీవితంలో అనుసరించడం మంచిది కాదా?
రాఖాల్: అవును, నిజం. సరే, సంసార జీవితాన్ని మీరెలా ఇష్టపడుతున్నారు?
శశి: చూడండీ సోదరులారా, రాఖాల్ ఉపన్యాసం దంచుతున్నాడు.
రాఖాల్ (నవ్వుతూ, ‘మ’ తో) : ఇంతకు మునుపు ఇక్కడికి రావడానికి అంతగా మనస్కరించలేదు. ఇప్పుడు సోదరుల సాంగత్యం ఎంతో హితకరంగా ఉంది.
నరేంద్రుడు: మనుష్యుల్లో యథార్థ సారం ఎక్కడుంది? ఒక్కరిని తప్ప నేను ఎవరినీ లక్షించను. (శ్రీరామకృష్ణులను సూచిస్తున్నట్లు ఉన్నది.) ఎవరికి సొంత శక్తి ఉంది? ప్రతి ఒక్కరూ పరిస్థితులకు అధీనులైన వారే – మాయకు బానిసై లొంగి పోయిన వారే.
రాఖాల్ నవ్వి, హరమోహన్ చెవిలో గుసగుసలో ఏదో చెప్పాడు. రాఖాల్ ప్రేరణతో హరమోహన్, “సోదరుడు x గురించి ఏమిటి?” అని ప్రశ్నించారు.
నరేంద్రుడు : సోదరుడు x ఒక దౌర్భాగ్యుడు. సన్న్యాసి కావాలని ఉన్నప్పుడు డబ్బు ఎందుకు పొదుపు చేస్తున్నాడు? ఒక సాధువు నిర్ధనుడుగా ఉండాలి.
ఒక సన్న్యాసి: ప్రతి ఒక్కడూ దౌర్భాగ్యుడు, నీవు మాత్రం మహనీయుడు అని పరిగణించు కుంటున్నావు.
నరేంద్రుడు: నేనూ దౌర్భాగ్యుణ్ణే. నేను పరిస్థితులకు బానిసను. నాకు ఏదన్నా శక్తి అంటూ ఉందా?
‘మ’ (తనలో) : పరిస్థితులా లేక భగవంతుడా? గురుదేవులు, “సమస్తమూ రాముని సంకల్పం మేరకే జరుగుతుంది” అని చెప్పేవారు.
నరేంద్రుడు: డబ్బున్న వ్యక్తి సన్న్యాసి ఎలా కాగలడు? పైగా, అతడు జనులకు ఉపన్యాసాలిస్తాడు. బోధించడానికి అతడు సిగ్గుపడడా?
నరేంద్రుడు – బుద్ధుడు
హరమోహన్: సరే, ఒక వ్యక్తి కనుక భావపారవశ్య స్థితిని లేదా సమాధి స్థితిని పొందితే, అతడు మహాత్ముడే కదా!
నరేంద్రుడు : వెళ్లి బుద్ధుణ్ణి అధ్యయనం చెయ్యి. శంకరుల ప్రకారం ఆధ్యాత్మిక అనుభూతికి పరాకాష్ఠ నిర్వికల్ప సమాధి. బుద్ధుడు సంతరించుకొన్న తొలిస్థితి అది.
ఒక భక్తుడు : నిర్వికల్ప సమాధి తొలి స్థితి అయినప్పుడు, దానికన్న ఉన్నతమైన స్థితులు ఉండి ఉండాలి. వాటిలో కొన్నిటి గురించి నువ్వు మా కెందుకు విశదీకరించకూడదు? బుద్ధుడు దానిని గురించి ఏదో చెప్పి ఉంటాడు.
నరేంద్రుడు: నాకు తెలియదు.
ఒక భక్తుడు: బుద్ధుడు పొందిన అనుభూతులలో నిర్వికల్ప సమాధి తొలి స్థితి అయినట్లయితే, ‘అహింసయే పరమ ధర్మం’ అనే సిద్ధాంతాన్ని కాలాంతరంలో ఆయన ఎందుకు బోధించాడు?
నరేంద్రుడు: ఈ దృక్పథాన్ని అవగతం చేసుకోవడం చాలా కష్టం. కాని వైష్ణవులు తమ అహింసా భావనను బుద్ధుని నుంచి నేర్చుకున్నారు.
ఒక భక్తుడు: బుద్ధుని నుంచీ అహింసా భావాన్ని నేర్చుకోవలసిన అగత్యం ఉందా? ఎవరి నుంచి ఎలాంటి ఆదేశం లేకుండానే చేపలు తినడం మానుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. వైష్ణవులు తమ అహింసా భావనను బుద్ధుడి నుంచీ అలవరచుకున్నారనడంలో నిజం లేదు.
నరేంద్రుడు: ఎవరి ప్రోద్బలం లేకుండా జంతువులను వధించడం ఒక వ్యక్తి మానుకుంటే, దానిని వారసత్వంగా సంక్రమించిన నైజంగా భావించవచ్చు.
ఒక భక్తుడు: జంతువులను వధించడం మానుకున్న ఐరోపాలోని జనులను గురించి ఏం చెబుతారు? వారు ఒకప్పుడు గొడ్డుమాంస భక్షకులు. వారు బుద్ధుడి నుంచి నేర్చుకోలేదు.
నరేంద్రుడు: ఏది ఏమైనప్పటికీ, ఈ మార్గాన్ని బుద్ధుడు కనుగొన్నాడు.
‘మ’ (తనలో) : అద్భుతం! గురుదేవుల ప్రతి శిష్యుడూ ఒక నాయకుడు ప్రతి ఒక్కరూ స్వతంత్ర చింతనాశీలురు, నరేంద్రుడు ఒక్కడే కాదు. ఎందుకు కాదు? అందరూ గురుదేవుల శిష్యులే, వారికి స్వయంగా ఆయనే శిక్షణనిచ్చారు.
నరేంద్రుడు గీత పఠిస్తూ, సోదర శిష్యులకు వివరిస్తున్నాడు. గీతలోని ఈ శ్లోకాలకు (5:79) వివరణ నిస్తున్నాడు: “కర్మాచరణ పరాయణత చేత పావనత చెందిన మనస్సు, వశీకృతమైన దేహం, నిగ్రహించబడిన ఇంద్రియములు కలిగి, సమస్త జీవుల ఆత్మను తన ఆత్మగానే చూస్తూ కర్మయోగి కర్మలు ఒనరించినా వాటి చేత బద్ధుడు కాడు, అంటుపడడు. సత్యానుభూతి పొందిన కర్మయోగి ఆత్మయందు సుప్రతిష్ఠితుడై, చూస్తూ, వింటూ, తాకుతూ, వాసనచూస్తూ, తింటూ, నడుస్తూ, నిద్రిస్తూ, గాలిపీలుస్తూ, మాట్లాడుతూ, విసర్జిస్తూ, పరిగ్రహిస్తూ, కళ్లు తెరుస్తూ, మూస్తూ, ఉన్నప్పటికీ ‘ఇంద్రియాలు ఇంద్రియవిషయాలలో ప్రవర్తిస్తున్నవి, నేనేమీ చేయడం లేదు’ అని భావిస్తాడు.”
కాసేపు గీతాపఠనంఅయిన తరువాత నరేంద్రుడు ఇలా చెప్పాడు: “నేను వెళుతున్నాను; ఇప్పుడు ఆనందదాయకమైన ‘మ’ సాంగత్యం చవిచూడండి.” కాని నరేంద్రుడు వెళ్లలేకపోయాడు.
బాబూరామ్: గీత, తక్కిన శాస్త్రాలు నాకు అర్థం కావడం లేదు. గురుదేవులు సరైన విషయాన్నే చెప్పారు: ‘త్యజించు, త్యజించు,’
శశి: ‘త్యజించు’ అనే పదానికి నిజమైన అర్థం ఏమిటో నీకు తెలుసా? భగవంతుని చేతిలోని పరికరంలా ప్రపంచంలో జీవించు అని అర్థం.
కాళీ గదిలో ప్రసన్న గీతాధ్యయనం మొదలు పెట్టాడు; శరత్ కూడా అక్కడే లూయీస్ హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ చదువుతూ ఉన్నాడు, మరో సన్న్యాసి గురుదేవుల పూజామందిరంలో ధ్యానం చేస్తున్నాడు.
నరేంద్రుడు – భగవద్దర్శనం
చర్చ భగవద్దర్శనం మీదకు మళ్లింది.
నరేంద్రుడు : భగవద్దర్శనం ఒక రకమైన మిథ్యాస్ఫురణ.
రాఖాల్: నువ్వు ఏమంటున్నావు? అది నీకు అనుభవమయిందా?
నరేంద్రుడు (నవ్వుతూ) : విభ్రాంతి చెందిన మెదడు అస్తవ్యస్తతల కారణంగా అటువంటి దర్శనాలు కలుగుతాయి.
మణి : సోదరా, నువ్వు ఏం చెప్పినప్పటికీ, గురుదేవులకు దివ్యదర్శనాలు కలిగాయి; కనుక ఎలా దానిని మెదడు యొక్క అస్తవ్యస్తతగా చెప్పగలవు? నీకు జ్ఞాపకం ఉందా! గురుదేవుల సమాధి స్థితిని శివనాథ్ నరాల క్రమరాహిత్యం లేదా మానసిక రుగ్మతగా వ్యాఖ్యానించినప్పుడు, గురుదేవులు ఇలా చెప్పారు: ఎవరన్నా చైతన్యాన్ని చింతన చేస్తూ అచేతనులు అవుతారా?”
నరేంద్రుడు ఇతర సోదర శిష్యులు ఒక చావడి గదిలో సమావేశమయ్యారు. కొందరు తాంబూల సేవనం చేస్తున్నారు. మరికొందరు పొగత్రాగుతున్నారు.అది వసంత కాలం. ప్రకృతి ఆనందంతో తాండవిస్తోంది. సన్న్యాస శిష్యులు కూడా ఆనందంగా ఉన్నారు. వారు బ్రహ్మచర్య వ్రతమూ పరిత్యాగమూ పాటిస్తూ, అహర్నిశలూ భగవత్ చింతనలో మునిగి ఉన్నారు. సదా సర్వవేళలా వారి ఎదుట వారి మహోన్నత ఆదర్శం, వారి గురువు, శ్రీరామకృష్ణులు ద్యోతకమవుతున్నారు. కొన్ని సమయాలలో సమధికోత్సాహంతో సిక్కుల గొప్ప నినాదం, ‘వహ్ గురూజీకి ఫటె!’ – జై గురుదేవా! అని అరిచేవారు. ముందు ‘ఓం’ చేర్చి నరేంద్రుడు వారికి ఈ మంత్రాన్ని నేర్పాడు.
‘జై గురుదేవా!’ అంటూ నూరుసార్లు పునరుచ్చరించడంలో శరత్ను తనతో జత కలపమని ‘మ’ అడిగారు. అది ఆయనకు సంతోషదాయకం.
నరేంద్రుడు : ఉత్తరువు ఇవ్వడంతో పని కాదు. ఒకరు మంత్రాన్ని పునరుచ్చరిస్తూ ఉండాలి. తరువాత ఇతరులు జత కలపాలి.
బలరామ్ మధురభక్ష్యాలూ, ఇతర పదార్థాలూ తన ఇంట్లో నుంచి పంపించాడు. కఛూరీలు బాగా రుచికరంగా ఉన్నాయి. సోదరులంతా వాటిని ఆనందంగా తిన్నారు. ఒక సోదరుడు తన వంతుకన్నా ఎక్కువ తినబోయాడు.
నరేంద్రుడు (అతడితో) : ధూర్త లోభీ! ఎక్కువగా తినడం మంచిది కాదు.
మఠంలో హారతి
సాయంత్రం అయింది. శశి ధూపం వెలిగించి, గురుదేవులను స్తుతిస్తూ ప్రణామం చేశాడు. తరువాత అతడు ప్రతి గదిలో ఉన్న దేవీదేవతల చిత్తరువుల ముందు వారిని సంబోధిస్తూ హారతి పట్టాడు, తరువాత తన శ్రావ్య కంఠంతో ఇలా ఉచ్ఛరించాడు: “జై గురు,” “జై కాళీ”, “రామ కృష్ణ రూపాల్లోని చైతన్యులకు జై” ; “రాధ కృష్ణులకు జై” ; రాధ ప్రియతముడికి జై” ; “అద్వైత ఆచార్యులకూ వారి భక్తులకూ జై” ; “గోపాలునికీ, తల్లి యశోదకూ జై” ; “రామ లక్ష్మణులకు జై” ; “విశ్వామిత్రుడికి జై.”
పెద్ద గోపాల్ దీపం తిప్పుతూ హారతి ఇచ్చాడు. భక్తులు శ్రద్ధగా దానిని తిలకించారు. నరేంద్రుడు, ‘మ’ ప్రధాన చావడి గదిలోకి వచ్చారు. ‘మ’ నరేంద్రుణ్ణి హారతిలో పాల్గొనమన్నారు కాని ఏదో పని వల్ల అతడు పాల్గొనలేదు.
హారతి కార్యక్రమం పూర్తి కాగానే భక్తులు శివస్తుతి గానం చేయసాగారు: “జయ శివ ఓంకారా, భజ శివ ఓంకారా; బ్రహ్మ విష్ణు సదాశివ, హర హర శంభో మహాదేవా!”
రాత్రి అయింది బాబూరామ్ వడ్డిస్తుంటే అందరూ తేలికగా భోజనం చేశారు. ప్రతి ఒక్కరికీ కొన్ని చపాతీలు, ఏదో కాయగూర, బెల్లపు పాకం వడ్డించబడ్డాయి. ‘మ’, నరేంద్రుడి ప్రక్కన కూర్చుని వారితో కలిసి భోజనం చేశాడు. ‘మ’ కంచంలో బాగా మాడిపోయిన చపాతీలు కనిపించగానే నరేంద్రుడు వాటిని తీసివేసి వాటి స్థానే మంచి చపాతీలు ఉంచాడు. నరేంద్రుడు ప్రతి విషయాన్ని సునిశితంగా పరికిస్తాడు.
భోజనానంతరం అందరూ చావడి గదిలో కూర్చున్నారు. ఒక సన్న్యాసి సోదరుడు ‘మ’ తో ఇలా చెప్పాడు: “ఈ మధ్యలో జగజ్జనని మీద పాటలు మాకు కరవయ్యాయి. గురుదేవులకు ఇష్టమైన ఆ పాటను మీరు పాడరాదా?”
‘మ’ పాడనారంభించారు:
మాతా శ్యామా! మంగళ నామా!
మదిరా దివ్యతరంగిత మత్తా!
భువి నీ లీలలు ఎవరికి తెలుసు
ఏఏ వేళల ఏమి ఒనర్తువో
నీ వీక్షణముల హావభావముల
కామదేవుని గర్వమణంతువు
వదనభీకరీ! అసికరధారీ!
మాతా శ్యామా! మంగళ నామా!
నీ దూకుడులకు నీ నడకలకు
కంపించును భువి కదలును అటునిటు
త్రైగుణి! శంకరి! ఉద్ధారి! భయంకరి
మాతా శ్యామా! మంగళనామ!
భక్తుల మొర విని రూపులు దాల్తువు
ముదమున నాడుచు హృదయ పద్మమున
శ్యామా! మాయీ! నిత్య బ్రహ్మమయీ!
మాతా శ్యామా! మంగళ నామా!
‘మ’ తో మాట్లాడుతున్నప్పుడు రాఖాల్ ఇలా చెప్పాడు: “నేను కాశీ సందర్శించా లనుకుంటున్నాను. ఒంటరిగానే వెళ్లాలని ఉంది.”
రాఖాల్కు ఇంట్లో తండ్రి, భార్య, కుమారుడు ఉన్నారు. కాని భగవత్సాక్షా త్కారార్థం అతడు అందరినీ, అన్నిటినీ త్యజించాడు. అతడిలో వైరాగ్య జ్వాల రగులుతోంది. సర్వ వేళలా అతడి మనస్సు భగవంతునికై వ్యాకులత చెందుతోంది. కనుకనే అతడు ఒంటరిగా పర్యటించగోరాడు.