51.1 ప్రథమ పరిచ్ఛేదం నరేంద్రుడు – భగవంతుని అస్తిత్వం
బుధవారం, ఏప్రెల్ 21, 1886
నరేంద్రుడు, ‘మ’ కాశీపూర్ గృహోద్యానంలో పచార్లు చేస్తున్నారు. కుటుంబ ఆర్థిక సమస్యలను ఇంకా చక్కదిద్దలేకపోయానని నరేంద్రుడు వ్యధ చెందుతున్నాడు.
నరేంద్రుడు: విద్యాసాగర్ స్కూలు ఉద్యోగం నాకు అక్కరలేదు. నేను గయ వెళదామను కుంటున్నాను. అక్కడ ఒక జమీందారు జమీ వ్యవహారాలు చూసుకోవడానికి ఒక మేనేజర్ కావాలట.
“దేముడు గీముడు అంటూ ఎవరూ లేరు.”
‘మ’ (నవ్వుతూ): ప్రస్తుతం నువ్వు అలాగే మాట్లాడవచ్చు. కాని తరువాత నువ్వే మరోవిధంగా మాట్లాడతావు. ఆధ్యాత్మిక పథంలో సంశయాత్మకత అనేది ఒక దశ మాత్రమే. ఈ దశలన్నిటినీ అతిక్రమించి పోయినప్పుడే భగవత్సాక్షాత్కారం లభిస్తుంది. శ్రీరామకృష్ణులు కూడా ఇదే చెబుతుంటారు.
నరేంద్రుడు: నేను ఈ చెట్టును చూస్తున్నట్లుగా భగవంతుణ్ణి చూసినవారు ఎవరైనా ఉన్నారా?
‘మ’ : అవును, శ్రీరామకృష్ణులు చూశారు.
నరేంద్రుడు: అది ఆయన మనోభ్రమ కావచ్చు.
‘మ’ : ఏఏ స్థితులలో ఎవరెవరు ఏమేమి చూస్తారో ఆ స్థితులలో వారికి అది సత్యమే. ఉదాహరణకు, నువ్వు తోటలోకి వెళ్ళినట్లు కలగన్నావనుకో. కల కంటున్నంతవరకు తోట కూడా యథార్థమే. కాని నీ మనోస్థితిలో మార్పు వచ్చినప్పుడు అంటే నువ్వు జాగ్రదావస్థకు వచ్చినప్పుడు అంతకు మునుపు కలలో చూసిన వాటిని భ్రమగా భావిస్తావు. ఏ స్థితిలోనైతే భగవద్దర్శనం పొందగలమో ఆ స్థితి పొందినప్పుడు భగవంతుడు సత్యమనే తెలుస్తుంది.
నరేంద్రుడు: నాకు Truth (సత్యం) కావాలి. ఆ రోజు పరమహంస మహాశయులతోనే నేను ఈ విషయమై తీవ్రంగా వాదించాను.
‘మ’ (నవ్వుతూ): తరువాత ఏమయిందేమిటి?
నరేంద్రుడు: ‘కొందరు నన్ను భగవంతుడంటారు’ అన్నారాయన. అందుకు నేను ‘వెయ్యిమంది మిమ్మల్ని భగవంతుడనవచ్చుగాక! కాని అది సత్యమని స్వయంగా దాన్ని ఎరుగనంతవరకు నేను మాత్రం అలా పలకను’ అన్నాను. ‘అనేకులు ఏదయితే చెబుతారో అదే సత్యం, అదే ధర్మం’ అన్నారాయన. అప్పుడు నేను ‘ఇతరులు దాన్ని సత్యంగా వక్కాణిస్తారు గాక, కాని నా అంతట నేనే దాన్ని సత్యంగా కనుగొననంతవరకు వారి మాటలను నేను లక్ష్యపెట్టను’ అన్నాను.
‘మ’ (నవ్వుతూ): నీ వైఖరి పాశ్చాత్య విద్యాంసులైన కోపర్ని కస్, (Copernicus), బర్క్లీ (Berkeley) వైఖరిలా ఉంది. పరిభ్రమిస్తోంది సూర్యుడేనని ప్రపంచమంతా చెబుతున్నప్పటికీ కోపర్నికస్ దాన్ని పట్టించుకోలేదు. External world (బాహ్యజగత్తు) సత్యమని అందరూ చెవిలో గూడు కట్టుకొని చెప్పినప్పటికీ బెర్క్లీ వారి మాటలను తృణీకరించాడు. అందుకే లెవిస్ (Lewis) ఇలా అన్నాడు: ‘Why was Berkeley not a philosophical Copernicus? (బెర్క్లీను తత్త్వశాస్త్రపు కోపర్నికస్గా ఎందుకు పరిగణించకూడదు?)’
నరేంద్రుడు: History of Philosophy (తత్త్వశాస్త్రపు చరిత్ర) పై నాకు ఏదైనా పుస్తకం ఇవ్వగలరా?
‘మ’ : ఎవరిది, లెవిస్ రచించినదా?
నరేంద్రుడు: కాదు, నాకు Uberweg (యుబెర్వెగ్) వ్రాసింది కావాలి. నేను జర్మన్ తత్త్వవేత్త వ్రాసింది చదవాలనుకుంటున్నాను.
‘మ’ : ఇందాక నువ్వు అన్నావు కదా – ‘ఎదురుగా ఉన్న ఈ చెట్టును చూసినట్లుగా భగవంతుణ్ణి చూసిన వారెవరైనా ఉన్నారా?’ అని. భగవంతుడు మానవ రూపంలో నీ వద్దకు వచ్చి ‘నేను భగవంతుణ్ణి’ అన్నట్లయితే నువ్వు దాన్ని విశ్వసిస్తావా? లాజరస్ (Lazarus) కథ నీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. మరణానంతరం పరలోకం వెళ్ళాక లాజరస్ అబ్రహాంతో ‘నేను మళ్ళీ భూలోకం వెళ్ళి నా మిత్రులతో, బంధువులతో నరకం, పరలోకం అనేవి నిజంగానే ఉన్నాయని చెప్పి వస్తా’ నన్నాడు. అందుకు అబ్రహం ఇలా అన్నాడు: ‘నువ్వు అలా వెళ్ళి చెప్పినా వారు నిన్ను నమ్ముతా రనుకుంటున్నావా? ఎవరో మోసగాడు వచ్చి అలా మాట్లాడుతున్నాడనుకుంటారు వాళ్ళు.’ విచారణ ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోలేమని శ్రీరామకృష్ణులు అంటుంటారు. జ్ఞానం కానివ్వు విజ్ఞానం కానివ్వు – విశ్వాసం ద్వారానే సమస్తం సాధించగలవు. భగవంతుణ్ణి దర్శించడం ఆయనతో సాన్నిహిత్వం ఏర్పరచుకోవడం – ఇవన్నీ కూడా విశ్వాసం ద్వారానే.
51.1.1 పూర్ణుని బండి బాడుగ – సురేంద్రుని వట్టివేళ్ళ చాపలు
అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలవుతోంది. శ్రీరామకృష్ణులు మంచంమీద కూర్చుని ఉన్నారు. దక్షిణేశ్వరంనుండి వచ్చిన రామ్‌లాల్ ఆయన పాదాలు ఒత్తుతున్నాడు. ‘మ’, సింథీకి చెందిన గోపాల్ కూడా గదిలో ఉన్నారు.
కిటికీలు మూసివేసి తమ పాదాలను ఒత్తమని ‘మ’ కు చెప్పారు శ్రీరామకృష్ణులు.
శ్రీరామకృష్ణుల అభ్యర్థన మేరకు పూర్ణుడు బాడుగబండిలో ఉద్యాన గృహానికి వచ్చి ఆయన్ను దర్శించి వెళ్ళిపోయాడు. ఆ బాడుగను ‘మ’ చెల్లించ వలిసి ఉంది. ‘మ’ వద్ద నుండి ఆ పైకం తీసుకున్నావా అన్నట్లుగా శ్రీరామకృష్ణులు, గోపాల్‌ను సైగచేసి అడిగారు. ‘ఆ, తీసుకున్నా’ నని బదులిచ్చాడు గోపాల్.
రాత్రి తొమ్మిది గంటలకు సురేంద్రుడు, రామ్ తదితరులు కలకత్తాకు తిరిగిపోనున్నారు. అది వేసవికాలం అయినందున పగటిపూట శ్రీరామకృష్ణుల గది చాలా వేడిగా ఉంటోంది. కిటికీలకు వ్రేలాడగట్టడం ద్వారా గది చల్లగా ఉంటుందనే ఉద్దేశంతో వట్టివేరు చాపలు కొన్ని తీసుకువచ్చాడు సురేంద్రుడు.
సురేంద్రుడు: ఏదీ, వట్టివేరు చాపలు ఎవరూ వ్రేలాడగట్టనే లేదే! ఇక్కడి విషయాల గురించి ఎవరూ శ్రద్ధ వహించడం లేదు.
ఒక భక్తుడు (నవ్వుతూ): భక్తులందరు బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉన్నారు. అందరూ ‘సోఽహం’ అని భావిస్తున్నారు. వారికి జగత్తు మిథ్యే. వారు కాస్త దిగువస్థాయికి వచ్చి ‘ఓ భగవంతుడా, నువ్వు ప్రభువ్వి, నేను దాసుణ్ణి’ అనే భావంలోకి వచ్చినప్పుడు మాత్రమే వారు ఈయనకు సేవ చేయగలరు. (అందరూ నవ్వారు)
51.2 ద్వితీయ పరిచ్ఛేదం ‘మ’, రాఖాల్, శశిల సంభాషణ – శ్రీరామకృష్ణులు, డాక్టరు
గురువారం, ఏప్రెల్ 22, 1886
సాయంకాలం. రాఖాల్, శశి, ‘మ’ లు ఉద్యానవనంలో పచార్లు చేస్తున్నారు.
‘మ’ : శ్రీరామకృష్ణులు చిన్న పిల్లవాడిలా ఉంటారు, మూడు గుణాలకూ అతీతంగా.
శశి, రాఖాల్: ఈ మాట ఆయనే స్వయంగా చెప్పారు.
రాఖాల్: ఆయన ఒక ఎత్తైన గోపురంమీద కూర్చున్నట్లు ఉంటారు. అక్కడ నుండి ఆయనకు అన్ని విషయాలు తెలుస్తాయి, అన్నిటినీ చూడగలరు. కాని ఆయన వద్దకు ఎవరూ వెళ్ళలేరు.
‘మ’ : ‘ఆ స్థితిలో భగవంతుణ్ణి సర్వదా దర్శిస్తూనే ఉంటాము’ అని ఆయనే చెప్పారు కదా! ఆయనలో విషయాసక్తి కించిత్తూ లేదు.
శశి: బుద్ధి విభిన్న రకాలుగా ఉంటుందని ఆయన చారు (ఒక భక్తుడు) తో చెప్పారు. ఏ బుద్ధితోనైతే భగవంతుణ్ణి పొందగలమో అదే సరైన బుద్ధి. ఏ బుద్ధితో ధనం, ఇల్లు, డిప్టీ పదవి లేక వకీలు పని లభింప చేసుకుంటామో అది చౌకబారు బుద్ధి; అది నీళ్ళు కలిపిన పెరుగు వంటిది. ఆ పెరుగు అటుకులను నానబెడుతుందేగాని అంతకు మించి వాటికి ఎలాంటి రుచీ ఇవ్వలేదు. చిక్కగా ఉన్న శ్రేష్ఠమైన పెరుగులాంటిది కాదు అది. ఏ బుద్ధితో భగవంతుణ్ణి పొందగలమో, అది చిక్కని పెరుగులాంటిది.
‘మ’ : ఆహా! అమూల్య వచనాలు!
శశి: ఆయనతో కాళీ ఇలా అన్నాడు: ‘ఆనందంగా ఉండడంవల్ల ఏం ఒరుగుతుంది? భిల్లులు కూడా ఆనందంగానే ఉన్నారు. సభ్యతాసంస్కారం లేని వారు విచ్చలవిడిగా ఆడుతూ, పాడుతూ ఆనందిస్తారు.’
రాఖాల్: అందుకు ఆయన కాళీతో ఇలా అన్నారు: ‘ఏమిటీ, బ్రహ్మానందం, విషయానందం ఒక్క టైపోతాయా ఏమిటి? జీవులు విషయానందం తోటే సంతృప్తి చెందుతారు. విషయాసక్తిని సంపూర్ణంగా త్యజించనిదే బ్రహ్మానందం లభించదు. ఒక వైపు ధనంతో కలిగే ఆనందం, ఇంద్రియ సుఖాల ఆనందం ఉంది; మరో వైపు భగవదానందం – ఏనాటికైనా ఇవి రెండూ సరి సమానమవుతాయా ఏమిటి? ఋషులు బ్రహ్మానందాన్ని అనుభవించేవారు.
‘మ’ : ఈ మధ్య కాళీ, బుద్ధుని గురించి చింతన చేస్తున్నాడు. అందుకే అలా ఆనందానికి ఆవలనున్న స్థితిని గురించి అతడు మాట్లాడుతున్నాడు.
రాఖాల్: అవును, శ్రీరామకృష్ణుల వద్ద కూడా బుద్ధుడి గురించి కాళీ మాట్లాడి ఉన్నాడు. అందుకు ఆయన ఇలా అన్నారు: ‘బుద్ధుడు భగవంతుడి అవతారం. ఇతరులతో ఆయన్ను ఎలా పోల్చగలం? ఆయన ఎంత గొప్పవాడో ఆయన ఉపదేశాలు కూడా అంతే గొప్పవి.’ కాళీ ఇలా అన్నాడు: ‘సర్వం భగవంతుడి శక్తి అభి వ్యక్తీకరణే. విషయానందం, బ్రహ్మానందం రెండూ ఆయన శక్తితోకలిగినవే’.
‘మ’ : అందుకు శ్రీరామకృష్ణులు ఏమన్నారు?
రాఖాల్: ఆయన, ‘అదేం మాట? సంతానోత్పత్తి చేసే శక్తి, భగవత్సాక్షాత్కారం పొందే శక్తి – రెండూ ఒక్కటేనా ఏమిటి?’ అన్నారు.
51.2.1 కామినీ కాంచనాలే పెద్ద గండం
రెండవ అంతస్తులోని గదిలో శ్రీరామకృష్ణులు కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు, రాఖాల్, శశి, సురేంద్రుడు, ‘మ’, భవనాథ్ మరికొందరు భక్తులు అక్కడ ఉన్నారు. శ్రీరామకృష్ణుల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించడానికి డా ॥ మహేంద్ర సర్కార్, డా ॥ రాజేంద్ర దత్తా కూడా వచ్చి ఉన్నారు. ఆయన పరిస్థితి రోజు రోజుకూ క్షీణించిపోతోంది.
ఇంటి అద్దె 60 లేక 65 రూపాయలు. ఖర్చులన్నీ అధికపాలు సురేంద్రుడే భరిస్తున్నాడు. ఇల్లు కూడా అతడి పేరు మీదనే అద్దెకు తీసుకున్నారు. తక్కిన గృహస్థ భక్తులు కూడా తమ తమ స్తోమతకు తగ్గట్లు ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఒక వంట బ్రాహ్మణుని, ఒక పనిమనిషిని నియమించారు.
శ్రీరామకృష్ణులు (డా ॥ సర్కార్ తదితరులతో): ఖర్చులు పెరిగిపోతున్నాయి.
డా ॥ సర్కార్ (భక్తులను చూపుతూ): కాని వాటిని భరించడానికి వీరు సిద్ధంగా ఉన్నారు. డబ్బు ఖర్చుపెట్టడానికి వీరికి ఎటువంటి సంకోచమూ లేదు.
(శ్రీరామకృష్ణులతో) “చూశారు కదా, కాంచనం అవసరమే సుమా!”
శ్రీరామకృష్ణులు (నరేంద్రుడితో): నువ్వు ఏమీ మాట్లాడవేమిటి?
నరేంద్రుడు మౌనం వహించాడు. డా ॥ సర్కార్ సంభాషణ కొనసాగించాడు.
డా ॥ సర్కార్: కాంచనం అవసరమే. అలాగే, కామినీ కూడా.
రాజేంద్ర: అవును, వీరి (శ్రీరామకృష్ణుల) భార్య ఈయన కోసం భోజనం వండుతోంది.
డా ॥ సర్కార్ (శ్రీరామకృష్ణులతో): చూశారు కదా?
శ్రీరామకృష్ణులు (మందహాసం చేస్తూ): అవును, ఇదంతా పెద్ద జంజాటం.
డా ॥ సర్కార్: జంజాటం లేనట్లయితే అందరూ పరమహంసలు అయిపోగలరు.
శ్రీరామకృష్ణులు: నా దేహాన్ని స్త్రీ తాకితే నాకు పెద్ద బాధే కలుగుతుంది. తాకి నచోట ముల్లు గుచ్చుకున్నట్లు నొప్పి పుడుతుంది.
డా ॥ సర్కార్: మీరు చెప్పేది నేను నమ్ముతాను. కాని స్త్రీ లేకుండా మీరు ఎలా ఉండగలరు?
శ్రీరామకృష్ణులు: చేతిలో ధనం పుచ్చుకొంటే చెయ్యి వంకర్లు తిరిగి పోతుంది, ఊపిరి ఆగిపోతుంది. కాని ధనం ద్వారా ఎవరైనా విద్యాసంసారం నిర్వహిస్తే అంటే భగవంతుడి సేవ, సాధువుల భక్తుల సేవ ఒనగూరిస్తే అందులో తప్పులేదు.
“స్త్రీ ద్వారా పురుషుడు మాయాసంసారంలో చిక్కువడిపోతాడు. ఎవరైతే ఈ జగత్తుకు అమ్మఅయినదో ఆమే ఈ మాయారూపం అంటే స్త్రీ రూపం ధరించి ఉంది. ఈ విషయాన్ని యథార్థంగా తెలుసుకుంటే, అటు పిమ్మట మాయాసంసారం చేయాలన్న సంకల్పం జనించదు. స్త్రీలందరూ జగజ్జనని రూపాలే అని యథార్థంగా ఎరిగినప్పుడు మాత్రమే విద్యాసంసారం చేయాలన్న సంకల్పం కలుగుతుంది. భగవద్దర్శనం కలుగకుండా స్త్రీ అంటే ఏమిటో అర్థం చేసుకోలేము.”
హోమియోపతి చికిత్స కారణంగా శ్రీరామకృష్ణుల ఆరోగ్యం కొద్దిగా మెరుగయింది.
రాజేంద్ర (నవ్వుతూ శ్రీరామకృష్ణులతో): వ్యాధి నయం అయ్యాక మీరు కూడా హోమియోపతి వైద్యం మొదలుపెట్టాలి. లేకుంటే ఈ మానవజీవిత ప్రయోజనం ఏమిటి? (అందరూ నవ్వారు)
నరేంద్రుడు: Nothing like leather (అందరూ నవ్వారు.) చర్మంతో చెప్పులు కుట్టేవాడు ‘ప్రపంచంలో చర్మం కంటే ఉత్కృష్టమైన వస్తువు ఏదీ లే’ దంటాడు.
కాసేపటి తరువాత వైద్యులు వెళ్ళిపోయారు.
51.3 తృతీయ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల కామినీ కాంచన త్యాగం
శ్రీరామకృష్ణులు ‘మ’ తో మాట్లాడసాగారు. స్త్రీపట్ల తమకున్న భావం ఏమిటో ఆయన ‘మ’ తో చెబుతున్నారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): కామినీ కాంచనాలు లేకుండా ఎలా జీవించ గలవని వారు అడుగుతారు. అయితే నా మనోస్థితి ఏమిటో వారికి తెలియదాయె.
“స్త్రీని తాకిన వెంటనే నా చెయ్యి మొద్దుబారిపోతుంది, నొప్పి వేస్తుంది. స్త్రీతో అత్మీయతా భావంతో దగ్గర కూర్చుని మాట్లాడితే మా నడుమ ఒక అడ్డుగోడ పెట్టినట్లు భావిస్తాను. అడ్డుగోడను దాటడం నాకు సాధ్యం కాని పని.
“గదిలో ఒంటిరిగా ఉన్నప్పుడు ఎవరైనా స్త్రీ కనుక వచ్చినట్లయితే, వెంటనే నాకు పసిబాలుడి స్థితి ఏర్పడుతుంది. ఆ స్త్రీ తల్లి అన్న భావం కలుగుతుంది.”
శ్రీరామకృష్ణుల మనోస్థితులను గురించిన ఈ పలుకులు ‘మ’ శ్రద్ధాభక్తులతో వింటున్నాడు. భవనాథ్, నరేంద్రుడు కాస్త దూరంగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. భవనాథ్కు పెళ్ళి అయింది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. అందువలన శ్రీరామకృష్ణులను దర్శించడానికి తరచూ రాలేకపోతున్నాడు. అతడు ‘మ’ ను ఇలా అడిగి ఉన్నాడు: “విద్యాసాగర్ కొత్త స్కూలు నొకదానిని ప్రారంభిస్తున్నాడట కదా! అందులో నాకు ఏదైనా ఉద్యోగం లభించే అవకాశం ఉందంటారా?” సాంసారిక జీవితంలో భవనాథ్ చిక్కువడిపోవడం చూసి శ్రీరామకృష్ణులు అమితంగా వ్యధ నొందారు. అప్పుడు భవనాథ్ వయస్సు 23 లేక 24 సంవత్సరాలు ఉంటుంది.
శ్రీరామకృష్ణులు (నరేంద్రుడితో): అతడికి ధైర్యం బాగా నూరిపొయ్యి. నరేంద్రుడు, భవనాథ్లు ఇద్దరూ నవ్వారు. సైగలు చేయడం ద్వారా శ్రీరామకృష్ణులు భవనాథ్తో ఇలా అన్నారు: “వీరుడవై ఉండు. ముసుగు వేసుకొని ఆమె ఏడుస్తుండటం చూసి నిన్ను నువ్వు మరచిపోవద్దు. ఓహ్! స్త్రీలు ఎంతగా ఏడుస్తారని! ముక్కు చీదేటప్పుడు కూడా వారు ఏడుస్తూనే ఉంటారు. (నరేంద్రుడు, భవనాథ్, ‘మ’ లు నవ్వారు.)
“భగవంతుని మీద నీ మనస్సును స్థిరంగా నిలుపు. స్త్రీతో వసిస్తూకూడా ఆమెతో శరీరక సుఖాలలో పాల్గోనివాడే వీరుడు. భార్యతో కేవలం భగవంతుని విషయాలే మాట్లాడుతూ ఉండు.”
కాసేపటి తరువాత భవనాథ్కు సైగ చేస్తూ శ్రీరామకృష్ణులు “ఇవాళ ఇక్కడే భోజనం చెయ్యి” అన్నారు.
భవనాథ్: అలాగేనండి. అయ్యా, నేను బాగానే ఉన్నాను. నా గురించి మీరు ఏ చింతా పెట్టుకోవద్దు.
సురేంద్రుడు వచ్చి కూర్చున్నాడు. ప్రతిరోజూ సంధ్యానంతరం భక్తులు శ్రీరామకృష్ణులకు పువ్వుల మాలలు సమర్పిస్తున్నారు. ఆయన వాటిని తన కంఠంలో ధరిస్తారు. సురేంద్రుడు మౌనంగా ఉన్నాడు. శ్రీరామకృష్ణులు ఆనంద భావనలో అతడికి రెండు మాలలు ఇచ్చారు. ఆయనకు ప్రణామం చేసి సురేంద్రుడు ఆ మాలలను తన మెడలో వేసుకొన్నాడు.
అందరూ తదేకంగా శ్రీరామకృష్ణులనే చూస్తున్నారు. మళ్ళీ ఆయనకు ప్రణామం చేసి సురేంద్రుడు లేచి నిలబడ్డాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయే ముందు భవనాథ్తో వట్టివేరు చాపలు కట్టమని చెప్పాడు.
51.4 చతుర్థ పరిచ్ఛేదం హీరానందుడు ప్రభృతులతో
ఇద్దరు మిత్రులతో కలిసి హీరానందుడు గదిలోకి వచ్చాడు. అతడు కలకత్తాకు 2,200 మైళ్ల దూరంలో ఉన్న సింధ్* ప్రాంతానికి చెందినవాడు. 1883 లో కలకత్తాలో కళాశాల చదువులు పూర్తి చేశాక అతడు సింధ్ ప్రాంతానికి తిరిగి వెళ్ళి అక్కడ “సింధ్ టైమ్స్”, “సింధ్ సుధార్” అనే పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించాడు. కలకత్తాలో చదువుకునేటప్పుడు అతడు కేశవ్ సేన్ వద్దకు తరచూ వెళుతూండేవాడు. అతడితో సాన్నిహిత్యం ఏర్పరచుకున్నాడు. హీరానందుడు శ్రీరామకృష్ణులను గతంలో దక్షిణేశ్వర కాళీఆలయంలో కలుసుకుని ఉన్నాడు. అప్పుడప్పుడు రాత్రిళ్ళు అక్కడే బసచేశాడు కూడా. శ్రీరామకృష్ణులు అనారోగ్యంగా ఉన్నారని విని, ఆయన్ను చూడడానిక్సింధ్ నుంచి కలకత్తా వచ్చాడు. అతణ్ణి చూడాలని శ్రీరామకృష్ణులు కూడా ఎంతో ఆతురత కనబరిచారు.
హీరానందుణ్ణి చూపుతూ శ్రీరామకృష్ణులు సైగల ద్వారా ‘మ’ తో “ఇతడు చాలా మంచి కుర్రాడు. ఇతడు నీకు తెలుసా?” అన్నారు.
‘మ’ : ఆ, తెలుసునండి.
శ్రీరామకృష్ణులు (హీరానందుడు, ‘మ’ లతో): మీ రిద్దరూ కాసేపు మాట్లాడుకోండి. మీరు మాట్లాడుతూ ఉంటే నాకు వినాలని ఉంది.
‘మ’ ఏమీ మాట్లాడకపోయేసరికి శ్రీరామకృష్ణులు అతడితో “నరేంద్రుడు ఉన్నాడా? అతణ్ణి పిలువు” అన్నారు.
51.4.1 హీరానందుడు, నరేంద్రుల సంభాషణ
హీరానందుడు
నరేంద్రుడు గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణులకు సమీపంలో కూర్చున్నాడు.
శ్రీరామకృష్ణులు (హీరానందుడు, నరేంద్రులతో): మీరిద్దరూ మాట్లాడుతూ ఉంటే వినాలని ఉంది.
హీరానందుడు కాసేపు మౌనంగా ఉన్నాడు. తరువాత ఎంతో సంకోచంతో సంభాషణ ప్రారంభించాడు.
హీరానందుడు (నరేంద్రుడితో): భక్తుడికి కష్టాలు ఎందుకు కలుగుతాయి?
అతడి మాటలు ఎంతో మధురంగా ఉన్నాయి. అతడి హృదయం ప్రేమతో పరిపూర్ణమై ఉందని అక్కడ ఉన్నవారందరికీ అనిపించింది.
నరేంద్రుడు: ఈ ప్రపంచ ధోరణి చూస్తే పైశాచికంగా ఉంది. ఇంతకంటే మంచి ప్రపంచాన్ని నేను సృష్టించగలిగి ఉండేవాడిని.
హీరానందుడు: దుఃఖం లేకుండా సుఖం అంటే ఏమిటో తెలుసుకోగలమా?
నరేంద్రుడు: ప్రపంచాన్ని సృష్టించాలన్న విషయమై నేను క్రొత్త ప్రణాళిక ఏదీ చెప్పడం లేదు. కాని ప్రస్తుతం ఉన్న ప్రపంచాన్ని గురించి నా అభిప్రాయం తెలియచేస్తున్నాను, అంతే. కాని ఈ సమస్యలన్నిటికీ సమాధానం – Pantheism, అంటే సర్వమూ భగవంతుడే అనే విశ్వాసం కలిగిఉండడం. అలాంటి విశ్వాసం కలిగి నప్పుడు సంశయాలన్నీ సమసిపోతాయి. అంతా చేస్తోంది ఆ భగవంతుడే.
హీరానందుడు: అలా చెప్పడం చాలా సులభం.
తరువాత శంకరాచార్యులు రచించిన నిర్వాణషట్కాన్ని నరేంద్రుడు స్వరయుక్తంగా గానం చేశాడు:
ఓం మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం
న శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే ।
న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయు–
శ్చిదానందరూపః శివోఽహమ్ శివోఽహమ్॥ 1 ॥
న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః
న వా సప్త ధాతుర్నవా పంచకోశః ।
న వాక్పాణి పాదౌం న చోపస్థపాయూ
చిదానందరూపః శివోఽహమ్ శివోఽహమ్ ॥॥ 2 ॥
న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో న చార్థో న కామో న మోక్ష
శ్చిదానందరూపః శివోఽహం శివోఽహం ॥॥ 3 ॥
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః ।
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోఽహం శివోఽహమ్ ॥॥ 4 ॥
న మృత్యు ర్న శంకా న మే జాతిభేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య
శ్చిదానందరూపః శివోఽహం శివోఽహవ్ ॥॥ 5 ॥
అహం నిర్వి (ల్పీ)ల్పో నిరాకారరూ(పీ)పో
విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్!
న చా సంగతం నైవ ముక్తిర్న మేయ
శ్చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ ॥॥ 6 ॥
హీరానందుడు: ఆహా!
శ్రీరామకృష్ణులు (సైగచేస్తూ, హీరానందుడితో): అతడికి సమాధానం ఇవ్వు.
హీరానందుడు: గదిని ఒక మూల నుండి చూసినా లేక గది మధ్యలో నుండి చూసినా, అంతా ఒక్కటే. ‘ఓ ప్రభూ, నేను దాసుణ్ణి’ అన్నా లేక ‘సోఽహం’ అన్నా అందరూ అనుభూతి నొందే ఆ భగవత్ చైతన్యం ఒక్కటే. ఒకే గదిని పలు ద్వారాల గుండా ప్రవేశించవచ్చు.
అందరూ మౌనంగా ఉన్నారు. హీరానందుడు, నరేంద్రుడితో “ఇంకా ఏమైనా పాడండి” అన్నాడు. నరేంద్రుడు శంకరాచార్య విరచిత కౌపీనపంచకం గానం చేశాడు:
వేదాన్తవాక్యేషు సదా రమన్తః
భిక్షాన్న మాత్రేణ చ తుష్టమన్తః ॥
విశోక మన్తఃకరణే రమన్తః
కౌపినవన్తః ఖలు భాగ్యవన్తః ॥॥ 1 ॥
మూలం తరోః కేవల మాశ్రయన్తః
పాణిద్వయం భోక్తుమమంత్రయంతః ।
శ్రియం చ కంథా మివ కుత్సయన్తః
కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః ॥॥ 2 ॥
దేహాదిభావం పరిమార్జయన్తః
ఆత్మానమాత్మ నవలోకయన్తః ।
నాన్తం న మధ్యం న బహిః స్స్మరన్తః
కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః ॥ ॥॥ 3 ॥
‘అహర్నిశం బ్రహ్మణి యే రమంతః (అహర్నశలు బ్రహ్మంలోనే నెలకొని ఉంటాడు.) అని వినగానే శ్రీరామకృష్ణులు మెల్లమెల్లగా ‘ఆహా!’ అనసాగారు. సైగ చేస్తూ, యోగుల లక్షణం ఇదే అని సూచించసాగారు. నరేంద్రుడు కౌపీనపంచకం పాడడం కొనసాగించాడు:
స్వానన్దభావే పరితుష్టిమన్తః
సంశాన్త సర్వేంద్రియదృష్టిమన్తః ।
అహర్నిశం బ్రహ్మణి యే రమన్తః
కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః ॥ ॥॥ 4 ॥
పంచాక్షరం పావనముచ్చరన్తః
పతిం పశూనాం హృది భావయన్తః ।
భిక్షాశనా దిక్షు పరిభ్రమన్తః
కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః ॥॥ 5 ॥
నరేంద్రుడు తరువాత ఇలా పాడాడు:
(ధ్యాయేత్ పూర్ణం పరానందం
జగన్మూలం నిరన్జనం)
శ్రోతస్య శ్రోతం మనసో మనో
యద్వాచో హవాఙ్ఞ్ స ఉ
–ప్రాణస్య ప్రాణః
శ్రీరామకృష్ణులు (నరేంద్రుడితో): ఆ పాట పాడు నాయనా –
‘నా హృదయము నీతోనే తన్మయముగ గావించితి’ అనే పాట నరేంద్రుడు పాడసాగాడు:
ఉండేది నీ వొకడవె
ఈ సర్వము నీ మయమే
నా హృదయము నీతోనే
తన్మయముగ గావించితి ॥ ఉం ॥
నిన్నొకనినె కనుగొంటిని
ఉండేది నీ వొకడవె
ఓ దేవా! హృదయేశా ।
సర్వైకావాసగృహా! ॥ ఉం ॥
నీ ఉండని దే హృదయము?
వసియించెద వందరిలో
ఉండేది నీ వొకడవె
ఈ సర్వము నీ మయమే ॥ ఉం ॥
పండితుడో పామరుడో
హిందువుడో ముస్లిముడో
నీ తలచిన రీతిగనే
వారందరి నొనరింతువు ॥ ఉం ॥
కైలాసమొ కాబాయొ
వసియించెద వంతటను
కావున నీ కొక్కనికే
మ్రొక్కెద రందరు మ్రోల ॥ ఉం ॥
భువినుండి దివి దాక
దివి నుండి పాతాళము
ఏ చోటుల నే జూచిన
నిన్నే చూచెద నచ్చట ॥ ఉం ॥
ధ్యానించి కనుగొంటిని
నిస్సందేహముగా గంటిని
లే దొకటి నీ సామ్యం
బని జాఫరునకు తెలిసెను ॥ ఉం ॥
‘వసియించెద వందరిలో’ అన్న చరణం వింటూనే ఆయన సైగ చేస్తూ “భగవంతుడు అంతర్యామి. ఆయన హృదయాలలోను వసిస్తున్నాడు” అన్నారు.
నరేంద్రుడు ‘ఏ చోటుల నే జూచిన నిన్నే చూచెద నచ్చట’ అని పాడగానే హీరానందుడు, అతడితో “అవును, ‘నిన్నే చూచెద నచ్చట.’ మళ్ళీ నువ్వే ‘నువ్వే నేను, నేనే నువ్వు. నేను తప్ప అన్యమైనది ఏదీ లేదు’ అంటూంటావు” అన్నాడు.
నరేంద్రుడు అష్టావక్ర సంహిత నుండి కొన్ని శ్లోకాలు వల్లించాడు. గదిలో మళ్ళీ నిశ్శబ్దం నెలకొంది.
శ్రీరామకృష్ణులు (నరేంద్రుణ్ణి చూపుతూ, హీరానందుడితో): ఇతడు ఒరనుండి తీసిన ఖడ్గాన్ని చేతపట్టిన వాడిలా నడుస్తుంటాడు. (హీరానందుణ్ణి చూపుతూ, ‘మ’ తో) ఎంత శాంతంగా ఉన్నాడు! మంత్రగాడి ముందు నాగుపాము పడగవిప్పి నిశ్చలమై పోయినట్లు.
51.5 పంచమ పరిచ్ఛేదం ఆత్మపూజ – ‘మ’, హీరానందులతో సంభాషణ
శ్రీరామకృష్ణులు అంతర్ముఖులయ్యారు. హీరానందుడు, ‘మ’ లు ఆయనకు సమీపంగా కూర్చుని ఉన్నారు. గదిలో చీమ చిటుక్కుమన్నాకూడా వినిపించేటంత నిశ్శబ్దం నెలకొని ఉంది. వ్యాధి కారణంగా శ్రీరామకృష్ణులకు నొప్పి కలుగుతోంది. భక్తులు ఈ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. వారి హృదయాలు తల్లడిల్లి పోతున్నాయి. కాని శ్రీరామకృష్ణులు వారిని ఆ విషయం మరిపింప చేస్తున్నారు. సుందర దరహాస వదనులై కూర్చుని ఉన్నారు. ముఖంలో తేజస్సు ఉట్టిపడుతోంది. వ్యాధి తాలుకు చిహ్నాలు ఏవీ ఛాయమాత్రంగా కూడా కానరావడం లేదు.
భక్తులు పువ్వులు, మాలలు భక్తిపూర్వకంగా ఆయన ఎదుట సమర్పించారు. ఒక పుష్పాన్ని తీసుకొని ఆయన దానితో తమ శిరస్సు, కంఠం, హృదయం, నాభిని స్పృశించారు. భక్తులకు ఆయన పువ్వులతో అడుకుంటున్న చిన్నపిల్లవాడిలా గోచరించారు.
తమకు ఆధ్యాత్మిక దర్శనాలు, అనుభూతులు కలిగినప్పుడు శరీర మధ్యంలో మహావాయువు ఊర్ధ్వగమనం చేసేదని ఆయన చెబుతుండేవారు.
ప్రస్తుతం ఆయన ‘మ’ తో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: వాయువు ఊర్ధ్వగమనం ఎప్పుడు చేసిందో తెలియదు. ప్రస్తుతం నేను బాలక భావంలో ఉన్నాను. అందుకే పువ్వులతో ఇలా ఆడు కుంటున్నాను. ప్రస్తుతం నేను ఏం చూస్తున్నానో తెలుసా? ఈ దేహాన్ని వెదురుబద్దలతో చేసినట్లు, దాన్ని గుడ్డతో కప్పి ఉన్నట్లు చూస్తున్నాను. అదే తిరుగుతోంది, లోపల ఎవరో వసించడం వల్లనే అది అలా తిరుగుతోంది.
“ఇంకా, నేను ఈ దేహాన్ని విత్తనాలు తీసివేసిన గుమ్మడిపండులా చూస్తున్నాను. ఈ దేహం లోపల కామం, ఆసక్తి ఏదీ లేదు. లోపల అంతా శుభ్రంగా ఉంది. ఇంకా–”
అటుపైన మాట్లాడడానికి ఆయనకు చాలా బాధాకరంగా తోచింది. ఆయన ఎంతో బలహీనంగా ఉన్నారు. ఆయన చెప్పదలుచుకున్నదేమిటో ‘మ’ వెంటనే ఊహించాడు. “ఇంకా, లోపల మీరు భగవంతుణ్ణి దర్శిస్తున్నారు” అన్నాడు.
శ్రీరామకృష్ణులు: లోపలా, బయటా. ఆ అఖండ సచ్చిదానందాన్ని నేను లోపలా, బయటా రెండు చోట్లా చూస్తున్నాను. అది ఈ కోశాన్ని (అంటే తమ దేహాన్ని) కేవలం ఆధారంగా మాత్రమే చేసుకొని, ఈ కోశం లోపలా బయటా ఉంటోంది. దీన్ని నేను స్పష్టంగా చూస్తున్నాను.
శ్రీరామకృష్ణుల బ్రహ్మదర్శనం గురించిన ఈ అద్భుత వచనాలను ‘మ’ హీరానందుడు ఆశ్చర్యచకితులై వింటున్నారు. కాసేపటి తరువాత వాళ్ళవంక చూసి ఆయన సంభాషణ మళ్ళీ కొనసాగించారు.
51.5.1 శ్రీరామకృష్ణుల యోగస్థితి – అఖండ దర్శనం
శ్రీరామకృష్ణులు: మీరందరూ నాకు ఆత్మీయులుగా తోస్తున్నారు. మీలో ఎవర్నీ నేను పరాయి వాడిగా భావించడం లేదు.
“మిమ్మల్నందరినీ నేను వేర్వేరు కోశాలుగా చూస్తున్నాను. వాటిలో శిరస్సులు ఊగుతున్నాయి.
“నా మనస్సు భగవంతునితో యోగం చెందినప్పుడు దేహానికి చెందిన ఈ కష్టం ఒక వైపు పడివున్నట్లుగా చూస్తున్నాను.
“ప్రస్తుతం నేను చూస్తోంది ఇదే: అఖండ సచ్చిదానందం చర్మంతో కప్పబడి ఉంది; కంఠంలోని వ్రణం ఒక వైపు పడివుంది.”
శ్రీరామకృష్ణులు మళ్ళీ మౌనంగా ఉండిపోయారు. కాసేపటి తరువాత ఇలా అన్నారు: “జడపదార్థపు సత్తా చైతన్యం మీదా, చైతన్యపు సత్తా జడంమీదా ఆపాదించబడి ఉన్నవి. అందుకే దేహానికి జబ్బు చేసినప్పుడు మనిషి ‘నాకు జబ్బు చేసింది’ అంటాడు.”
శ్రీరామకృష్ణులు చెప్పింది ఏమిటో హీరానందుడు సరిగ్గా అర్థం చేసుకో లేకపోయాడు. అతడితో ‘మ’ ఇలా అన్నాడు. “వేడినీటిలో చెయ్యి పెట్టినప్పుడు కాలుతుంది కదా! నీరు చేతిని కాల్చిందని జనులు అంటారు.కాని అసలు విషయం ఏమిటంటే, చెయ్యి కాలింది వేడిమి కారణంగానే.”
హీరానందుడు(శ్రీరామకృష్ణులతో): భక్తుడికి కష్టాలు ఎందుకు కలుగుతాయో చెప్పండి.
శ్రీరామకృష్ణులు: ఆ కష్టాలు దేహానికి చెందినవి.
శ్రీరామకృష్ణులు ఇంకా ఏదో చెప్పబోతున్నట్లుగా ఉంది. ‘మ’ హీరానందులు ఆయన పలుకులుకోసం ఆతురతగా ఎదురుచూస్తున్నారు.
శ్రీరామకృష్ణులు “అర్థమయిందా?” అని అడిగారు.
హీరానందుడితో ‘మ’ మెల్లగా ఇలా అన్నాడు: “ఈయన దేహం బాధపడుతోంది లోకశిక్షణ నిమిత్తమే. మనకందరికీ ఈయన జీవితం ఒక ఉదాహరణ. దేహం ఇంతగా బాధపడుతున్నప్పటికీ ఈయన మనస్సు మాత్రం భగవంతునితో నూటికి నూరుపాళ్ళు యోగం చెందివుంది.”
హీరానందుడు: అవును, అది ఏసుక్రీస్తును సిలువ వేయడం (Crucifixation) లాంటిది. కాని ఈయనకు ఇంతటి కష్టం రావడంలోని అంతరార్థం మాత్రం విశదపడడం లేదు.
‘మ’ : అది జగజ్జనని సంకల్పం అని ఈయన అంటుంటారు. ఈయన దేహం ద్వారా జగజ్జనని ఈ విధమైన లీలను ప్రదర్శిస్తోంది. ‘యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే.’
వీరిద్దరూ ఇలా గుసగుసలాడుకోవడం చూసి ‘మ’ ఏం చెబుతున్నాడని శ్రీరామకృష్ణులు, హీరానందుణ్ణి సైగ చేసి అడిగారు. హీరానందుడు ఆ సైగను అర్థం చేసుకోలేకపోవడంతో ఆయన మళ్ళీ సైగచేస్తూ ‘మ’ ఏం చెబుతున్నాడని అడిగారు.
హీరానందుడు: మీ వ్యాధి లోకశిక్షణ నిమిత్తమే అని ఈయన అంటున్నారు.
శ్రీరామకృష్ణులు: అది అతడి ఊహాగానం మాత్రమే.
(‘మ’, హీరానందులతో) “ప్రస్తుతం నా స్థితి మారుతోంది. ‘నీ చైతన్యం జాగృతమగుగాక!’ అని అందరికీ చెప్పరాదనుకుంటున్నాను. కలియుగంలో పాపం అధికం. వారందరి చైతన్యం జాగృతం చేస్తే వారి పాపమంతా నా మీదకు వచ్చి పడుతుంది.”
‘మ’ (హీరానందుడితో): తగిన సమయం రాకుండా ఈయన జనుల చైతన్యం జాగృతం చెయ్యరు. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారి చైతన్యాన్ని మాత్రమే జాగృతం చేస్తారు.
51.6 షష్ఠ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు – హీరానందుడు
శుక్రవారం, ఏప్రెల్ 23, 1886
నేడు గుడ్‌ఫ్రైడే (Good Friday). హీరానందుడు కాశీపూర్ ఉద్యాన గృహంలోనే మధ్యాహ్నం భోజనం చేశాడు. సమయం ఒంటి గంట కావస్తోంది. హీరానందుడు శ్రీరామకృష్ణుల పాదాలు ఒత్తుతున్నాడు. సమీపంలో ‘మ’ కూర్చుని ఉన్నాడు. లాటూ, మరి ఒకరిద్దరు భక్తులు గదిలోకి వస్తూపోతూ ఉన్నారు. హీరానందుడు కొంతసేపు అక్కడే ఉద్యాన గృహంలోనే ఉండాలన్నది శ్రీరామకృష్ణుల కోరిక.
శ్రీరామకృష్ణుల పాదాలను ఒత్తుతూ హీరానందుడు ఆయనతో మాట్లాడు తున్నాడు. పసిపిల్లవాణ్ణి ఓదారుస్తున్నట్లుగా అతడు శ్రీరామకృష్ణులతో అతి మధురంగా మాట్లాడుతున్నాడు.
హీరానందుడు: మీరు అంతగా బాధపడడం ఎందుకు? వైద్యుడి మీద విశ్వాసం ఉంచితే నిశ్చింతగా ఉండవచ్చు. మీరు బాలుడిలా ఉంటారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): వైద్యుడి మీద నేను ఎలా నమ్మకం ఉంచగలను? ఈ వ్యాధి నయం కాదని డా ॥ సర్కార్ చెప్పేశాడు.
హీరానందుడు: కాని దాని గురించి అంతగా యోచించడం ఎందుకు? ఏది ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది.
‘మ’ (హీరానందుడితో, ప్రక్కకు తిరిగి): ఈయన యోచిస్తోంది తమ కోసం కాదు. ఈయన దేహసంరక్షణ భక్తుల హితం కోరే.
వేసవికాలం కావడంతో గది చాలా వేడిగా ఉంది. వట్టివేరు చాపలు కిటికీలకు వ్రేలాడగట్టి ఉన్నారు. హీరానందుడు లేచి వాటిని సరిగ్గా సర్దాడు. శ్రీరామకృష్ణులు అతడి వంక చూశారు.
శ్రీరామకృష్ణులు (హీరానందుడితో): పైజామాలు పంపించడం మరచి పోవద్దు.
సింధు ప్రాంతపు పైజమాలు ధరిస్తే సౌకర్యంగా ఉంటుందని హీరానందుడు, శ్రీరామకృష్ణులకు చెప్పి ఉన్నాడు. అందుకే ఆయన ఈ విషయం అతడికి గుర్తు చేస్తున్నారు.
హీరానందుడు భోజనం సరిగ్గా చేయలేదు. అన్నం బాగా ఉడకలేదు. ఈ విషయమై శ్రీరామకృష్ణులు చాలా బాధపడ్డారు. మళ్ళీ మళ్ళీ “తినుబండారాలు ఏమైనా తింటావా?” అని అతణ్ణి అడిగారు. వ్యాధి కారణంగా మాట్లాడడం ఆయనకు చాలా కష్టమైపోతోంది. అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు. లాటూతో “నువ్వు కూడా ఆ అన్నం తిన్నావా?” అని అడిగారు.
శ్రీరామకృష్ణులు తమ దేహం మీద వస్త్రం నిలుపుకోలేకపోతున్నారు. పసి పిల్లవాడిలా దాదాపు దిగంబరంగానే ఉన్నారు. హీరానందుడితో పాటు ఒకరిద్దరు బ్రహ్మసమాజ సభ్యులు కూడా వచ్చారు. అందుకనే, ఆయన మధ్య మధ్యలో వస్త్రాన్ని నడుంపైకి లాక్కుంటున్నారు.
శ్రీరామకృష్ణులు (హీరానందుడితో): నా పంచె జారిపోయినట్లయితే మీరు నన్ను అనాగరకునిగా భావిస్తారా?
హీరానందుడు: మీ కేమిటి? మీరు బాలుడిలాంటివారు.
శ్రీరామకృష్ణులు (బ్రహ్మసమాజ భక్తుణ్ణి చూపుతూ): కాని ఈయన అలా భావించవచ్చు.
హీరానందుడు సెలవు తీసుకోనున్నాడు. కొన్ని రోజుల్లో అతడు సింధ్‌కు బయలుదేరనున్నాడు.
శ్రీరామకృష్ణులు (హీరానందుడితో): నువ్వు సింధ్‌కు వెళ్ళకపోతే మాత్రం ఏమవుతుందేమిటి?
హీరానందుడు (నవ్వుతూ): కాని అక్కడ నా పనులు చెయ్యడానికి వేరే ఎవరూ లేరు. పైగా, ఉద్యోగం చేస్తున్నాను కదా!
శ్రీరామకృష్ణులు: నెలకు ఎంత సంపాదిస్తావు?
హీరానందుడు (నవ్వుతూ): నేను చేస్తున్న పనిలో జీతం తక్కువ.
శ్రీరామకృష్ణులు: ఎంత?
హీరానందుడు నవ్వి ఊరుకున్నాడు.
శ్రీరామకృష్ణులు: నువ్వు ఇక్కడే ఉండిపోకూడదా?
హీరానందుడు బదులు పలుకలేదు.
శ్రీరామకృష్ణులు: నువ్వు ఉద్యోగం వదిలిపెడితే ఏమవుతుందేమిటి?
హీరానందుడు ఏం మాట్లాడలేదు. బయలుదేరడానికి సిద్ధమయ్యాడు.
శ్రీరామకృష్ణులు: మళ్ళీ నువ్వు నన్ను ఎప్పుడు కలుసుకుంటావు?
హీరానందుడు: సోమవారం సింధ్‌కు వెళ్ళిపోతున్నాను. ఆ రోజు ఉదయమే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను.
హీరానందుడు వెళ్ళిపోయాడు.
‘మ’ శ్రీరామకృష్ణుల ప్రక్కన కూర్చుని ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఎంత మంచి కుర్రాడో కదా!
‘మ’ : అవునండి. అతడిది ఎంతో మధురమైన స్వభావం.
శ్రీరామకృష్ణులు: సింధ్ ప్రాంతం ఇక్కడనుండి 2, 200 మైళ్ల దూరమని చెప్పాడు. అంత దూరంనుండి నన్ను చూడడానికి వచ్చాడు.
‘మ’ : అవునండి. నిజమైన ప్రేమ లేకుంటే అలా రావడం సాధ్యం కాదు.
శ్రీరామకృష్ణులు: నన్ను సింధ్‌కు తీసుకువెళ్ళాలని అతడు ఎంతగానో అనుకున్నాడు.
‘మ’ : అయితే ప్రయాణం ఎంతో కష్టమైనదండి. రైలులో నాలుగైదు రోజులు పడుతుంది.
శ్రీరామకృష్ణులు: అతడికి మూడు విశ్వవిద్యాలయ పట్టాలు ఉన్నాయి.
‘మ’ : అవునండి.
శ్రీరామకృష్ణులు అలసిపోయి ఉన్నారు. కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. కిటికీ తలుపులు తెరిచి, పక్కమీద చాప పరచమని ‘మ’ కు చెప్పారు. ‘మ’ ఆయనకు విసనకర్ర వీస్తున్నాడు. కాసేపటి తరువాత ఆయనకు కాస్త నిద్ర పట్టింది.
కాసేపు నిద్రపోయాక మళ్ళీ లేచి ‘మ’ తో “నేను నిద్రపోయానా?” అని అడిగారు.
‘మ’ : ఆ, కొద్దిగా.
51.7 సప్తమ పరిచ్ఛేదం నరేంద్రుడు, శరత్ ప్రభృత భక్తులతో శ్రీరామకృష్ణులు
తరువాత ‘మ’ క్రిందకు వెళ్ళి నరేంద్రుడు, శరత్‌లను కలుసుకున్నాడు. వారు ముగ్గురు మాటల్లోపడ్డారు.
నరేంద్రుడు: ఎంత ఆశ్చర్యం! సంవత్సరాల తరబడి పుస్తకాలు చదివి నప్పటికీ నేర్చుకొనేది అంటూ ఏమీ ఉండదు. ఏదో రెండు మూడు రోజులు సాధన చేసి భగవత్సాక్షాత్కారం ఎలా పొందగలరు? ఆయన్ను సాక్షాత్కరించు కోవడం అంత సులభమా ఏమిటి? (శరత్‌తో) నీకు శాంతి లభించింది. ‘మ’ కు కూడా లభించింది. కాని నాకు మాత్రం శాంతి లభించడం లేదు.
సాయంకాలమయింది. భక్తులు పలువురు శ్రీరామకృష్ణుల గదిలో కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు, శరత్, శశి, లాటూ, నిత్యగోపాల్, గిరీశ్, రామ్, ‘మ’ సురేష్ మొదలైనవారు అక్కడ ఉన్నారు.
కేదార్ గదిలోకి వచ్చాడు. చాలా రోజుల తరువాత అతడు మళ్ళీ శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చాడు. అతడు తన ఉద్యోగ బాధ్యతల దృష్ట్యా ఢాకాలో ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు వ్యాధితో బాధపడుతున్నారని విన్నాడు. గదిలోకి రాగానే ఆయన పాదధూళిని గైకొని శిరస్సున ధరించాడు. తరువాత ఆనందంగా దానిని తక్కిన భక్తులకు ఇచ్చాడు. శిరస్సులు వంచి భక్తులు దాన్ని స్వీకరించారు. పాదధూళిని కేదార్, శరత్‌కు కూడా ఇవ్వబోయాడు. కాని శరత్ తానే స్వయంగా శ్రీరామకృష్ణుల పాదధూళిని స్వీకరించాడు. అది చూసి ‘మ’ నవ్వాడు. శ్రీరామకృష్ణులు కూడా ‘మ’ వంక చూసి చిరునవ్వు నవ్వారు. భక్తులు ఉలుకుపలుకు లేకుండా నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు భావావస్థలోకి వెళ్తున్నట్టున్నారు. మధ్యమధ్యలో గాఢంగా నిట్టూరుస్తూ, భావాన్ని నిగ్రహించు కుంటున్నట్టున్నారు. సైగ చేస్తూ కేదార్‌తో “గిరీశ్‌తో వాదన చెయ్యి” అన్నారు.
గిరీశ్, కేదార్‌తో ఇలా అన్నాడు: “అయ్యా, మీరు నన్ను క్షమించండి. మొదట్లో మీరెవరో తెలియక నేను మీతో వాదించేవాడిని. కాని ఇప్పుడు సంగతి వేరు.”
శ్రీరామకృష్ణులు నవ్వారు.
కేదార్‌కు నరేంద్రుణ్ణి చూపుతూ ఆయన ఇలా అన్నారు: “ఈతడు సర్వస్వం పరిత్యజించాడు. (భక్తులతో) ఒకసారి కేదార్, నరేంద్రుడితో ‘ఇప్పుడు నువ్వు వాదోపవాదాలు, విచారణలు చెయ్యవచ్చు కాని చివరికి నువ్వు హరినామం ఉచ్చరిస్తూ నేల మీద పడి దొర్లుతావు’ అన్నాడు. (నరేంద్రుడితో) కేదార్ పాదధూళిని తీసుకో”.
కేదార్ (నరేంద్రుడితో): ఈయన పాదధూళినే స్వీకరించు. దానితోనే సరిపోతుంది.
సురేంద్రుడు భక్తులకు వెనుక కూర్చుని ఉన్నాడు. అతణ్ణి చూసి నవ్వుతూ శ్రీరామకృష్ణులు కేదార్‌తో “ఆహా! అతడిది ఎంత మధుర స్వభావం!” అన్నారు. శ్రీరామకృష్ణుల ఉద్దేశం అర్థం చేసుకుని కేదార్, సురేంద్రుడి వద్దకు వెళ్ళాడు.
సురేంద్రుడు అతి సున్నిత స్వభావం కలవాడు. ఉద్యాన గృహపు ఖర్చుల నిమిత్తం కొందరు భక్తులు గృహస్థ భక్తులనుండి ధనం సేకరిస్తున్నారు. అది చూసి సురేంద్రుడు ఎంతగానో నొచ్చుకున్నాడు. ఖర్చులలో అధికపాలు అతడే భరిస్తున్నాడు.
సురేంద్రుడు (కేదార్‌తో): నాకు ఇంత మంది సాధువులకు సమీపంలో కూర్చునే అర్హత ఉందా? కొన్ని రోజుల క్రితం కొంతమంది (నరేంద్రుణ్ణి ప్రస్తావిస్తూ) కాషాయ వస్త్రాలు ధరించి బోధ్ గయకు వెళ్ళారు. వారు అక్కడకు వెళ్ళి గొప్ప సాధువులను చూద్దామనుకున్నారు.
సురేంద్రుణ్ణి సముదాయిస్తూ శ్రీరామకృష్ణులు “నువ్వు చెప్పింది నిజమే. అయితే వారు ఇంకా చిన్న పిల్లలు. ఏది మంచో వారికి ఇంకా తెలియదాయె” అన్నారు.
సురేంద్రుడు (కేదార్‌తో): మన ఆంతరంగిక భావాలు ఏమిటో మన గురుదేవులకు (శ్రీరామకృష్ణులకు) తెలియదా ఏమిటి? ఆయన ధనాన్ని లక్ష్యపెట్టరు. ఆయన్ను సంతోషపెట్టేది మన ఆంతరంగిక వైఖరి మాత్రమే.
శ్రీరామకృష్ణులు అంగీకార సూచకంగా తల ఊపారు.
శ్రీరామకృష్ణుల కోసం భక్తులు పలురకాల తినుబండారాలు తెచ్చారు. వాటినన్నిటినీ వారు ఆయన ఎదుట సమర్పించారు. వాటిలో ఒక్కింత తమ నోట్లో వేసుకొని ఆయన ఆ పళ్లెరాన్ని సురేంద్రుడికి ఇచ్చివేశారు. వాటిని భక్తులకు పంచిపెట్టమన్నారు. ఆ ప్రసాదాన్ని తీసుకుని సురేంద్రుడు క్రిందకు వెళ్ళాడు.
శ్రీరామకృష్ణులు (కేదార్‌తో): నువ్వు క్రిందకు వెళ్ళి సురేంద్రుడికి విశద పరచడం మంచిది. వాళ్ళు ఎలాంటి వాదోపవాదాలు చేయకుండా చూడు.
‘మ’ శ్రీరామకృష్ణులకు విసురుతున్నాడు. అతడితో “నువ్వు ఏమి తినవా ఏమిటి?” అన్నారాయన. తరువాత ‘మ’ ను కూడా క్రిందకు పంపారు.
సంధ్యాకాలం కానున్నది. ఉద్యాన గృహంలోని చిన్న కొలను వద్ద ‘మ’ గిరీశ్‌లు పచార్లు చేస్తున్నారు.
గిరీశ్: అవునూ, శ్రీరామకృష్ణుల గురించి నువ్వు ఏదో వ్రాస్తున్నావట*
అది నిజమేనా?
‘మ’ : ఎవరు చెప్పారు?
గిరీశ్: ఎవరో చెప్పగా విన్నాను. నువ్వు దాన్ని నాకు ఇస్తావా?
‘మ’ : ఊహూ, అలా ఇవ్వడం సరైనదే అనిపిస్తే తప్ప నేను దానిని ఎవరికీ ఇవ్వను. నేను అది వ్రాస్తోంది నా కోసమే కాని ఇతరుల కోసం కాదు.
గిరీశ్: ఏమిటి నువ్వు అంటున్నది?
‘మ’ : నా మరణానంతరం నువ్వు దాన్ని తీసుకోవచ్చు.
51.7.1 అమృతుని పట్ల శ్రీరామకృష్ణుల ప్రేమ
సంధ్యాకాలం. శ్రీరామకృష్ణుల గదిలో దీపం వెలిగించారు. బ్రహ్మసమాజ భక్తుడైన అమృత బసు వచ్చాడు. అతణ్ణి కలుసుకోవాలని శ్రీరామకృష్ణులు ఆరాటపడ్డారు. ‘మ’, మరికొందరు భక్తులు అక్కడ ఉన్నారు. ఆయనకు ఎదురుగా ఒక అరటి ఆకులో మల్లెపువ్వుల మాల ఒకటి ఉంది. గదిలో నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. మాలను కంఠంలో ధరించనున్నట్లుగా శ్రీరామకృష్ణులు మధ్యమధ్యలో దానిని చేత పట్టుకుంటున్నారు.
అమృత (వినయపూర్వకంగా): అయ్యా, మాలను వేయమంటారా?
శ్రీరామకృష్ణులు మాలను స్వీకరించారు. తరువాత అమృతతో చాలాసేపు మాట్లాడారు. అతడు వెళ్ళబోతుండగా అతడితో “మళ్ళీ రా” అన్నారు.
అమృత: అవునండి, నాక్కూడా రావాలనే ఉంది. కాని నేను చాలా దూరంలో నివసిస్తున్నాను. అందువల్లనే తరచూ రాలేకపోతున్నాను.
శ్రీరామకృష్ణులు: నువ్వు వస్తూ ఉండు. బండి బాడుగను ఇక్కడనుండే పుచ్చుకో.
అమృత పట్ల శ్రీరామకృష్ణుల ప్రేమను చూసి భక్తులు నివ్వెరబోయారు.
51.7.2 ‘మ’ భార్యపై కృపాకటాక్షాలు
మరుసటి రోజు తన భార్య, కుమారుడితో పాటు ‘మ’ ఉద్యాన గృహానికి వచ్చాడు. ఆ అబ్బాయి వయస్సు ఏడు సంవత్సరాలు. శ్రీరామకృష్ణుల సూచన మేరకు ‘మ’ తన భార్యను అక్కడకు తీసుకువచ్చాడు. ఏడాది క్రితం ఎనిమిది సంవత్సరాల కుమారుడొకడు మరణించడంతో ఆమె ఆ దుఃఖంతో దాదాపు పిచ్చిదే అయిపోయింది.
ఈ రోజు తమకు సేవ చేయడానికి శ్రీరామకృష్ణులు ‘మ’ భార్యకు అనేక సార్లు అవకాశమిచ్చారు. మాతృమూర్తి శారదాదేవి రాత్రి భోజనం తీసుకువచ్చినప్పుడు ‘మ’ భార్యకూడా దీపం పట్టుకుని ఆమె వెంట వచ్చింది. ఆమె ఇంటి విషయాల గురించి శ్రీరామకృష్ణులు ఆమెను ఆప్యాయంగా ప్రశ్నించారు. ఉద్యాన గృహానికి మళ్ళీ ఒకసారి వచ్చి కొన్నిరోజులపాటు ఇక్కడే మాతృమూర్తితో బసచేయమని చెప్పారు. ఆమెతో పాటు ఆమె కుమార్తె మానమయిని కూడా తోడ్కొని రమ్మన్నారు. ఆయన భోజనం పూర్తి చేశాక ఆమె కంచాన్ని తీసివేసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసింది. తరువాత ఆయన ఆమెతో కాసేపు మాట్లాడారు.
రాత్రి తొమ్మిది గంటలు. శ్రీరామకృష్ణుల గదిలో భక్తులు కూర్చుని ఉన్నారు. ఆయన కంఠంలో పువ్వులమాల ఒకటి ఉంది. తన భార్యను ఉద్యాన గృహంలో మాతృమూర్తితో పాటు కొన్ని రోజులు బసచేయమని చెప్పమని ‘మ’ కు చెప్పారాయన. ఆయన చూపుతున్న దయ, అనురాగం చూసి ‘మ’ చలించిపోయాడు.
‘మ’ ఆయనకు విసురుతున్నాడు. తమ కంఠంలోని మాలను తీసి చేత బట్టుకొని ఆయన తమలో తామే ఏదో మాట్లాడుకున్నారు. తరువాత కృపాళువై ఆ మాలను ‘మ’ కు ఇచ్చారు.