44.1 ప్రథమ పరిచ్ఛేదం భక్తులతో దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులు
ఆదివారం, ఆగష్టు 9, 1885
శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో తమ గదిలో కూర్చుని ఉన్నారు. రాఖాల్, ‘మ’, ద్విజుడు, ద్విజుడి తండ్రి, తదితర భక్తులు అక్కడ ఉన్నారు. అప్పుడు సమయం మధ్యాహ్నం దాదాపు నాలుగు గంటలు అవుతోంది.
బృందావనం నుండి తిరిగి వచ్చాక రాఖాల్ కొన్ని రోజులు తన ఇంట్లోనే గడిపాడు. ప్రస్తుతం అతడు శ్రీరామకృష్ణులతోనే ఉంటున్నాడు. లాటూ, హరీశ్, రామ్‌లాల్‌లు కూడా అక్కడే ఉంటున్నారు.
శ్రీరామకృష్ణుల ఆరోగ్యం బాగుండడం లేదు. గొంతు క్యాన్సర్ ప్రథమ సూచనలు ఇప్పుడు కానవస్తున్నాయి. కాని ఆయన ప్రశాంతతకు ఏమాత్రం భంగం వాటిల్లలేదు. రాత్రింబవళ్ళు ఆయన ‘తమ భక్తులు ఆధ్యాత్మికోన్నతిని ఎలా పొందగల’ రనే చింతనలోనే మునిగి ఉన్నారు. వారిని భగవన్మార్గంలో పయనించేలా చేస్తున్నారు; భక్తి జ్ఞానాలను అలవరచుకోమని ఉద్బోధిస్తూ, కామినీ కాంచనాల విషయమై అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. వ్యాధిని ఎంతమాత్రం లక్ష్యపెట్టకుండా తాము ఏ కార్యం నిమిత్తం వచ్చారో దాన్ని నెరవేర్చడంలో పూర్తిగా నిమగ్నులయ్యారు.
44.1.1 ద్విజుడి తండ్రి – శ్రీరామకృష్ణులు
ద్విజుడి వయస్సు పదహారు సంత్సరాలు ఉంటుంది. అతడి తల్లి మరణించిన తరువాత తండ్రి పునర్వివాహం చేసుకున్నాడు. ద్విజుడు ‘మ’ తో పాటు తరచూ దక్షిణేశ్వరానికి వస్తుంటాడు. కాని అతడి తండ్రికి ఇది ఎంతమాత్రం ఇష్టంలేదు. శ్రీరామకృష్ణులను దర్శింప వస్తానని ద్విజుడి తండ్రి చాలా రోజులుగా చెబుతున్నాడు. ఇవాళే వీలుచిక్కింది. కలకత్తాలోని ఒక వ్యాపార సంస్థలో ఆయన మేనేజరుగా పనిచేస్తున్నారు. ఆయన న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు కూడా.
శ్రీరామకృష్ణులు (ద్విజుడి తండ్రితో) : మీ పిల్లలు ఇక్కడకు రావడం గురించి మీరు విచారించవద్దు.
“చైతన్యం జాగృతమయ్యాక వెళ్ళి సంసారంలో వసించండి అని నేను జనులకు చెబుతుంటాను. ఎంతో శ్రమపడ్డాక బంగారాన్ని వెలికి తీశామనుకుందాం.అప్పుడు దాన్ని మట్టిలో ఉంచవచ్చు. లేకపోతే పెట్టెలో ఉంచవచ్చు, లేకుంటే నీటిలోనైనా ఉంచవచ్చు. అయితే బంగారానికి మాత్రం ఏమీ కాదు.
“అనాసక్తులై సంసారంలో ఉండండి అని నేను చెబుతుంటాను. నూనె రాచుకొన్నాక పనసతొనలు వొలిచినట్లయితే చేతులకు జిగురు అంటుకోదు.
‘అపరిపక్వ’ మనస్సును సంసారంలో ఉంచినట్లయితే అది మలినమై పోతుంది. జ్ఞానాన్ని ప్రాప్తించుకున్న పిదపే సంసారంలో గడపాలి.
“నీళ్ళలో పాలు పోస్తే, ఆ పాలు కలసిపోతాయి. కాని పాల నుండి వెన్న తీసి దాన్ని నీళ్ళలో వేసినప్పుడు ఏ సమస్యా ఉండదు.”
ద్విజుడి తండ్రి: అవునండీ, నిజమే.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): మీ పిల్లలను మీరు ఎందుకు మందలిస్తుంటారో నేను అర్థం చేసుకోగలను. మీరు వారిని ఊరకే భయపెడుతుంటారు. బ్రహ్మచారి ఒక పాముతో ఇలా అన్నాడు: ‘నీకు బొత్తిగా తెలివిలేదు. నేను నీకు కాటు వెయ్యవద్దని చెప్పానే కాని బుసకొట్టవద్దని చెప్పలేదే! నువ్వు కనుక బుసకొట్టివుంటే నీ శత్రువులు నిన్ను ఇలా బాదివుండేవారు కాదు.’ మీరు పిల్లలను మందలించడం కేవలం బుసకొట్టడం లాంటిదే. (ద్విజుడి తండ్రి నవ్వసాగాడు)
“సజ్జనుడైన కుమారుడు కలగడం తండ్రి చేసుకున్న పుణ్యాన్ని సూచిస్తుంది. చెరువు త్రవ్వినప్పుడు చక్కటి నీరు కనుక లభ్యమైతే అది చెరువు యజమాని చేసుకున్న పుణ్యానికి గుర్తు.
“కుమారుణ్ణి ‘ఆత్మజుడు’ (తండ్రే కుమారుని రూపంలో తిరిగి జన్మించిన వాడు అని అర్థం) అంటారు. మీకూ, మీ కుమారుడికీ ఎలాటి తేడా లేదు. ఒక విధంగా మీరే మళ్ళీ మీ కుమారుడిగా జన్మించారు. ఒక రూపంలో మీరు లౌకిక వ్యక్తి; ఆఫీసులో పనిచేస్తుంటారు, గృహస్థ జీవితాన్ని గడపుతుంటారు. మరో రూపంలో అంటే మీ కుమారుడి రూపంలో మీరు భక్తుడిగా ఉంటున్నారు. మీరు పూర్తిగా లౌకిక ప్రవృత్తి కలవారని విన్నాను. కాని చూడబోతే మీరు అలాంటివారు కాదని తెలుస్తోంది. (నవ్వుతూ) ఇవన్నీ మీకు తెలిసినవే. మీరు ఎంతో సావధానంగా ఉంటారని తెలుస్తోంది. అందుకే నేను చెప్పేవాటి నన్నిటికీ ‘అవును’, ‘అవును’ అంటున్నారు. (ద్విజుడి తండ్రి మందహాసం చేశాడు) మీ పిల్లలు ఇక్కడకు రావడం వల్ల మీరు ఎలాంటివారో వారు తెలుసుకోగలరు. తండ్రి ఎంతటి అమూల్యమైన వాడని! తల్లితండ్రులను మోసగించి ధార్మిక జీవనం గడిపే వాడికి దొరకేది బూడిదే.
“మనిషికి ఎన్నో ఋణాలు ఉన్నవి – పితౄణం, దేవఋణం, ఋషి ఋణం. ఇంకా మాతౄణం కూడా ఉన్నది. పైగా భార్య పట్ల కూడా ఋణం ఉంటుంది – ఆమెను పోషించవలసి ఉంటుంది; శీలవతి అయిన పక్షంలో తన మరణానంతరం ఆమె పోషణకు ఏ లోటూ రాకుండా భర్త ఏర్పాట్లు చేయాలి.
“మా అమ్మ కారణంగా నేను బృందావనంలో నివసించలేకపోయాను. దక్షిణేశ్వర కాళీ ఆలయంలో మా అమ్మ ఉంటోందన్న తలంపు రాగానే నా మనస్సు బృందావనంలో మరి ఉండలేకపోయింది.
“నేను వీరితో ‘సంసారంలోనూ ఉండండి, భగవంతుడి పట్లా మనస్సునుంచండి’ అంటూంటాను. సంసారాన్ని వదిలిపెట్టమని చెప్పను. ‘ఇదీ చేయండి, అది కూడా చేయండి’ అంటూ ఉంటాను.”
ద్విజుడి తండ్రి: నేను మా పిల్లలతో చదువుల్లో బాగా రాణించాలని చెబుతుంటాను. మీ వద్దకు వెళ్ళడానికి వారికి అభ్యంతరం చెప్పను. కాని తోటి పిల్లలతో కలిసి కాలక్షేపం చేస్తూ సమయం వృథా చేసుకోవద్దని మాత్రం హెచ్చరిస్తుంటాను.
శ్రీరామకృష్ణులు (ద్విజుణ్ణి ప్రస్తావిస్తూ): ఈ అబ్బాయి మంచి సంస్కారాలతో జన్మించాడు. ఇతడి సోదరులు ఇద్దరు ఇతడికంటే భిన్నంగా ఉన్నారెందుకని? ఇతడు మాత్రమే ఆధ్యాత్మిక ప్రవృత్తిని కలిగి ఉన్నాడెందుకని? బలవంతంగా మీరు ఇతణ్ణి ఇక్కడకు రాకుండా చేయగలరా? ఎవరికి ఎలాంటి సంస్కారాలు ఉంటాయో అలాగే జరుగుతుంది.
ద్విజుడి తండ్రి: ఆ, ఆ మాట నిజమేనండి.
శ్రీరామకృష్ణులు నేల మీద పరచిన చాపపై ద్విజుడి తండ్రికి సమీపంగా కూర్చున్నారు. ఆయనతో మాట్లాడుతూ మధ్యమధ్యలో ఆయన శరీరాన్ని నెమ్మదిగా నిమురుతున్నారు.
సాయంకాలం కానున్నది. శ్రీరామకృష్ణులు ‘మ’ తదితరులతో “ఈయనకు ఆలయాలనన్నింటిని చూపించండి. నాకు స్వస్థతగా ఉండి ఉంటే నేనే వచ్చి చూపించి ఉండేవాడిని” అన్నారు. పిల్లలకు మిఠాయిలు పెట్టమని ఎవరికో పురమాయించారు. ద్విజుడి తండ్రితో “వీరిని ఏమైనా తిననివ్వండి. నోటిని తీపి చేసుకోవాలి” అన్నారు.
ద్విజుడి తండ్రి ఆలయాలను, ఆలయ మూర్తులను సందర్శించిన పిదప తోటలో అటూ ఇటూ పచార్లుచేస్తున్నాడు. శ్రీరామకృష్ణులు తమ గదికి ఆగ్నేయంలో ఉన్న మొగసాలలో భూపేన్, ద్విజుడు, ‘మ’ తదితరులతో ఆనందంగా మాట్లాడు తున్నారు. వారితో పరాచికాలాడుతూ ఆయన ఉల్లాసంగా భూపేన్, ‘మ’ ల వీపుల మీద చరిచారు. నవ్వుతూ ద్విజుడితో “ఏమోయ్, మీ నాన్నగారితో ఎలా మాట్లాడాను?” అన్నారు.
సంధ్యాకాలం తరువాత ద్విజుడి తండ్రి మళ్ళీ శ్రీరామకృష్ణుల గదిలోకి తిరిగి వచ్చాడు. కాసేపట్లో ఆయన బయలుదేరనున్నాడు. ఉక్కపోస్తున్నందున శ్రీరామకృష్ణులే స్వయంగా ఆయనకు విసనకర్రతో విసరసాగారు. ఆయన బయలుదేరేటప్పుడు శ్రీరామకృష్ణులు లేచి నిలబడి ఆయనకు వీడ్కోలు పలికారు.
44.2 ద్వితీయ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు అవతారమా?
సమయం రాత్రి ఎనిమిది గంటలు అవుతోంది. శ్రీరామకృష్ణులు, మహిమాచరణ్తో మాట్లాడుతున్నారు. రాఖాల్, ‘మ’ ఇంకా మహిమాచరణ్ స్నేహితులు ఒకరిద్దరు కూడా గదిలో ఉన్నారు. మహిమాచరణ్ ఈ రోజు రాత్రి దక్షిణేశ్వరంలోనే బస చేయనున్నాడు.
శ్రీరామకృష్ణులు: అది సరే, కేదార్ సంగతి ఏమిటాంటావు? అతడు పాలు చూడటమేనా లేక త్రాగాడు కూడానా?
మహిమా: ఆ, అతడు దివ్యానందాన్ని అనుభవిస్తున్నాడు.
శ్రీరామకృష్ణులు: మరి నిత్యగోపాల్ సంగతి?
మహిమా: అతడు ఉన్నతస్థితిలో ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు: అవును. గిరీశ్ ఘోష్ ఎలా ఉన్నాడు?
మహిమా: అతడుకూడా ఎంతగానో పురోగమించాడు. కాని అతడు వేరే తరగతికి చెందినవాడు.
శ్రీరామకృష్ణులు: మరి నరేంద్రుడు?
మహిమా: పదిహేను సంవత్సరాల క్రితం నేను ఎలాంటి స్థితిలో ఉండేవాడినో ప్రస్తుతం అతడు అలాంటి స్థితిలో ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు: చిన్న నరేంద్రుడి విషయం ఏమిటి? అతడు ఎంతటి సరళ హృదయుడో కదా!
మహిమా: అవునండి. అతడు అతిసరళ స్వభావం గలవాడు.
శ్రీరామకృష్ణులు: సరిగ్గా చెప్పావు. (కాసేపు ఆలోచించి) ఇంకా ఎవరున్నారు చెప్మా.
“ఇక్కడకు వచ్చే కుర్రవాళ్ళు రెండు విషయాలు తెలుసుకుంటే చాలు. వాటిని తెలుసుకున్నట్లయితే వారికి ఇక ఎక్కువగా సాధనలు చేయవలసిన అవసరం ఉండదు. మొదటిది, నేను (శ్రీరామకృష్ణులు) ఎవర్ని అనేది; రెండవది, వారు ఎవరు అన్నది. ఈ కుర్రవాళ్ళలో చాలామంది అంతరంగిక శ్రేణికి చెందినవారు.
“అంతరంగిక శ్రేణికి చెందినవారు ముక్తిని పొందరు. వాయవ్య ప్రాంతాన నేను మరోసారి దేహాన్ని ధరించవలసి ఉంటుంది.
“ఈ కుర్రవాళ్ళను చూసినప్పుడల్లా నాకు ప్రాణం లేచివచ్చినట్లనిపిస్తుంది. పిల్లలను పుట్టించి, వ్యాజ్యాలలో పడి అటూ ఇటూ తిరుగుతూ కామినీ కాంచనాలలో మునిగివున్న వారిని చూసి నేనెలా ఆనందించగలను? పవిత్ర హృదయులను చూడకుండా నేనెలా జీవించగలను?”
44.2.1 ఐదు రకాల సమాధి స్థితులు – కుండలినీ – షట్చక్రాలు
తరువాత మహిమాచరణ్ శాస్త్రాలలోని శ్లోకాలను కొన్నింటిని పఠించాడు. పిదప తంత్రశాస్త్రంలోని పలురకాల ముద్రల గురించి కాసేపు మాట్లాడాడు.
శ్రీరామకృష్ణులు: అది సరే, సమాధి స్థితిలో నా ఆత్మ మహాకాశంలో పక్షిలా విహరిస్తూ ఉంటుందని కొందరు అంటుంటారు.
“హృషీకేశ్కు చెందిన సాధువొకరు ఒకసారి ఇక్కడకు వచ్చాడు. అతడు నాతో ఇలా అన్నాడు: ‘సమాధి ఐదు విధాలుగా ఉంటుంది. నువ్వు వాటినన్నిటినీ అనుభూతం చేసుకొన్నావని తెలుస్తోంది. ఈ సమాధి స్థితులలో మహావాయువు గమనం చీమలాగా, చేపలాగా, కోతిలాగా, పక్షిలాగా లేక పాములాగా ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది.’
“ఒక్కోసారి వాయువు వెన్నెముకలో చీమలాగా ప్రాకుతూ పైకి వెళుతున్నట్లు అనుభూతమౌతుంది.
“మరోసారి సమాధి స్థితిలో, భావ సముద్రాన ఆత్మ చేపలా ఈదు లాడుతుంటుంది.
“కొన్ని సందర్భాలలో నేను ప్రక్కకు తిరిగి పడుకొని ఉన్నప్పుడు మహావాయువు కోతిలా నన్ను తోస్తూ నాతో ఆడుకుంటున్నట్లు తోస్తుంది. అప్పుడు నేను నిశ్చలంగా ఉండిపోతాను. అదే వాయువు కోతిలా హఠాత్తుగా ఒక్క గెంతుతో సహస్రారాన్ని చేరుకొంటుంది. అందుకే నేను గెంతుతూ లేవడం మీరు చూస్తుంటారు.
“మళ్ళీ ఒక్కోసారి, మహావాయువు పక్షిలా ఈ కొమ్మనుండి ఆ కొమ్మకు, ఆ కొమ్మనుండి ఈ కొమ్మకు ఎగురుతూ ఉంటుంది. అది ఏ కొమ్మమీద కూర్చుంటుందో ఆ చోటు అగ్నిలా మాడిపోతున్నట్లు అనిపిస్తుంది. అది బహుశా మూలాధారం నుండి స్వాధిష్ఠానం, స్వాధిష్ఠానం నుండి హృదయానికి, ఇదే క్రమంలో శిరస్సులోకి ఎగబ్రాకుతూ ఉంటుంది.
“ఒకోసారి మహావాయువు తిర్యక్గతిలో పాములా మెలికలు తిరుగుతూ వెళుతూ ఉంటుంది. ఈ విధంగా పోతూపోతూ చివరకు శిరస్సును చేరేసరికి సమాధిస్థితి కలుగుతుంది.
“కుండలినీశక్తి జాగృతమవకుండా చైతన్యం కలుగదు.
“కుండలినీశక్తి మూలాధారంలో నెలకొని ఉంటుంది. చైతన్యం కలిగినప్పుడు అది సుషుమ్నానాడి ద్వారా స్వాధిష్ఠానం, మణిపూరం ఇత్యాది చక్రాలన్నిటిని భేదించి చివరకు శిరస్సులోకి వచ్చి చేరుతుంది. దీనినే మహావాయుగతి అంటారు. ఆఖరికి సమాధిస్థితి కలుగుతుంది.
“కేవలం పుస్తకాలు చదివినంత మాత్రాన చైతన్యం కలుగదు. భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఆయన కోసం వ్యాకులత చెందినప్పుడు కుండలినీ జాగృత మవుతుంది. జ్ఞానం గురించి కేవలం వినడమో లేక పుస్తకాలలో చదవడం వల్లనో ఏమిటి ప్రయోజనం?
“నాకు ఈ స్థితి కలగడానికి ముందు కుండలినీ ఎలా జాగృతమవుతుందో నాకు వెల్లడిచేయబడింది. క్రమక్రమంగా పద్మాలన్నీ విచ్చుకున్నాయి. పిదప సమాధిస్థితి ఏర్పడింది. ఇది అతి గుహ్యమైన విషయం. అచ్చం నాలాగే ఉన్న 22 లేక 23 సంవత్సరాల కుర్రవాడు సుషుమ్నానాడి లోనికి ప్రవేశించి జిహ్వ ద్వారా యోనిలాంటి పద్మాలతో రమించడం చూశాను. మొదట అపానస్థానం, తరువాత లింగం, నాభి – ఈ క్రమంలో, చతుర్దళ, షడ్దళ, దశదళ పద్మాలన్నీ అధోముఖంగా ఉన్నవి. అవన్నీ ఊర్ధ్వముఖమైపోయాయి.
“హృదయంలోకి వచ్చినప్పుడు – నాకు బాగా గుర్తుంది –అతడు జిహ్వ ద్వారా రమించాక అధోముఖమై ఉన్న ద్వాదశదళ పద్మం ఊర్ధ్వముఖమై విచ్చుకొంది. ఆ తరువాత కంఠంలో షోడశ దళ పద్మం, లలాటంలో ద్విదళ పద్మం, చివరకు శిరస్సులో సహస్రదళ పద్మం విచ్చుకొన్నవి. అప్పటి నుండి నేను ఈ స్థితిలో ఉండిపోయాను.”
44.3 తృతీయ పరిచ్ఛేదం గోప్య విషయాలు – శ్రీరామకృష్ణుల స్వీయ అనుభూతులు
శ్రీరామకృష్ణులు ఈ విధంగా మాట్లాడుతూ మహిమాచరణ్కు సమీపంగా నేలమీద కూర్చున్నారు. ‘మ’, రాఖాల్తోపాటు ఒకరిద్దరు భక్తులు కూడా అక్కడ ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (మహిమాతో): నా ఆధ్యాత్మిక అనుభూతుల గురించి మీకు చెప్పాలని నేను చాలా కాలంగా అనుకుంటున్నాను. కాని చెప్పలేకపోయాను. ఇవాళ చెబుదామనుకుంటున్నాను.
“సాధనలు చేయడం ద్వారా నేనున్న స్థితిని పొందవచ్చని మీరు అంటుంటారు కదా! అయితే అసలు సంగతి వేరే, ఇందులో (తమను సూచిస్తూ) ఒక విశేషం ఉన్నది.”
‘మ’ రాఖాల్ తదితర భక్తులు శ్రీరామకృష్ణులు ఏం చెబుతారా అని ఆతురతతో చూస్తున్నారు.
శ్రీరామకృష్ణులు: (భగవంతుడు) నాతో మాట్లాడాడు! కేవలం దర్శనం మాత్రమే కాదు, మాట్లాడాడు కూడా. (ఆయన) గంగానదిలోనుండి రావడం నేను మర్రిచెట్టు క్రింద నుండి చూశాను. తరువాత ఎన్ని నవ్వులని! ఆటలాడుతూ, (ఆయన) నా వ్రేళ్ళ మెటికలు విరిచాడు. అటు తరువాత మాట్లాడాడు; అవును, మాట్లాడాడు!
“మూడు రోజులపాటు ఎడతెరపి లేకుండా విలపించాను. అప్పుడాయన వేదాలు, పురాణాలు, తంత్రాలు మొదలైన శాస్త్రాలలో ఏముందో నాకు వెల్లడి చేశాడు.
“మహామాయ యొక్క మాయ ఏమిటో కూడా ఆయన ఒక రోజు నాకు చూపించాడు.గదిలో చిరు జ్యోతి ఒకటి క్రమక్రమంగా పెరగసాగింది. చివరకు ఆ జ్యోతి యావత్తు జగత్తును ఆవరించింది.
“ఇంకా, నాచుతో కప్పబడిన ఒక పెద్ద చెరువును ఆయన చూపించాడు. గాలికి నాచు కొద్దిగా ప్రక్కకు తొలగింది. తక్షణమే నీరు కానవచ్చింది. కాని చూస్తూండగానే నలువైపులనుంచి నాచు నాట్యంచేస్తూ వచ్చి మళ్ళీ నీటిని కప్పి వేసింది. నీరు సచ్చిదానందంవంటిదని, నాచు మాయ వంటిదని ఆయన నాకు వెల్లడిచేశాడు. మాయ కారణంగా సచ్చిదానందం కానరావడం లేదు. ఒక్కోసారి కనిపించినా అది లిప్తకాలం మాత్రమే; మళ్ళీ అది మాయతో ఆచ్ఛాదితమైపోతుంది.
“ఎలాంటి వ్యక్తులు ఇక్కడకు వస్తారో వారు రావడానికి ముందే నాకు వెల్లడింపబడుతుంది. పంచవటి సమీపంలో మర్రిచెట్టు, పొగడచెట్టు నడుమ చైతన్యుల బృందం సంకీర్తన, నృత్యం చేస్తూ కనిపించింది. ఆ బృందంలో నేను బలరామ్‌ను చూశాను. లేకుంటే పటికబెల్లం మొదలైనవి నాకు ఎవరు సరఫరా చేస్తారు? ఇంకా ఇతణ్ణి (‘మ’) కూడా చూశాను.
“కేశవ్ సేన్‌ను కలుసుకోవడానికి మునుపే నేను అతణ్ణి చూశాను; కేశవ్సేన్, అతడి బృందాన్ని సమాధిస్థితిలో చూశాను. ఒక గదినిండా మనుష్యులు నా ఎదుట కూర్చుని ఉన్నారు. కేశవ్ పురివిప్పిన నెమలిలా అగుపించాడు. పురి అంటే అర్థం అతడి అనుచరుల సమూహం. కేశవ్ తల మీద ఎర్రటి మణిని చూశాను. అది రజోగుణానికి చిహ్నం. కేశవ్ తన శిష్యులతో ‘ఈయన (శ్రీరామకృష్ణులు) ఏం చెబుతారో మీరంతా వినండి’ అన్నాడు. నేను అమ్మతో ‘అమ్మా, వీరిది ఆంగ్లేయుల ధోరణి. నేను వీరితో ఎందుకు మాట్లాడాలి?’ అన్నాను. అప్పుడు, కలికాలంలో ఇలాగే ఉంటుందని అమ్మ నాకు వివరించింది.
“పిదప కేశవ్, అతడి అనుచరులు ఇక్కడ (శ్రీరామకృష్ణుల) నుండి హరినామం, జగజ్జనని నామం స్వీకరించారు. అందుకే అమ్మ, కేశవ్ బృందం నుండి విజయ్ను దూరంచేసింది. కాని అతడు ఆదిసమాజంలో చేరలేదు.
(తమను చూపుతూ) “ఇందులో విశేషమైనది ఏదో ఒకటి ఉండి ఉండాలి. చాలా కాలం క్రితం గోపాల్సేన్ అనే యువకుడు ఇక్కడకు వచ్చేవాడు. ఇందులో ఉన్న వ్యక్తి గోపాల్ ఛాతీమీద పాదం మోపాడు. అప్పుడు గోపాల్ భావావస్థలో ఇలా అన్నాడు: ‘మీరు ఇంకా వేచి ఉండవలసివుంది. నేను లౌకిక వ్యక్తులతో ఇక ఎంతమాత్రం ఉండలేను.’ ఆ పిదప పోతున్నాను అని చెప్పి అతడు ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత అతడు దేహత్యాగం చేశాడని విన్నాను. బహుశా అతడే నిత్యగోపాల్గా జన్మించి ఉండవచ్చు.
“అద్భుత దర్శనాలు ఎన్నో కలిగాయి. అఖండ సచ్చిదానందుడి దర్శనం కలిగింది. అందులో రెండు తరగతులకు చెందిన వారు కంచెకు చెరొకవైపున విడివిడిగా ఉన్నారు. ఒక వైపు కేదార్, ఛునీ తదితర సాకారవాద భక్తులు ఉన్నారు. మరోవైపు ఎర్రటి ఇటుకరాయిపొడి గుట్టలా జ్యోతి ఉన్నది. దాని నడుమ నరేంద్రుడు కూర్చుని ఉన్నాడు, సమాధిమగ్నుడై ఉన్నాడు!
“ధ్యానంలో నిమగ్నుడై ఉండటం చూసి ‘ఓ నరేంద్రా’ అని పిలిచాను. అతడు కొద్దిగా కళ్ళు తెరిచాడు. అతడే ఒక రూపంలో సిమ్లా (కలకత్తాలో నరేంద్రుడు జన్మించిన ప్రాంతం)లో కాయస్థ కుటుంబంలో జన్మించినట్లు అర్థం చేసుకున్నాను. అప్పుడు నేను అమ్మతో ‘అమ్మా, అతణ్ణి మాయలో బంధించి వెయ్యి. లేకుంటే అతడు సమాధిస్థితుడై దేహత్యాగం చేస్తాడు’ అన్నాను. సాకారాన్ని విశ్వసించే కేదార్ తొంగి చూసి వణికిపోతూ పారిపోయాడు.
“అందుకే దీనిలో (తమలో) అమ్మ స్వయంగా నెలకొని ఉండి భక్తులతో లీలను నిర్వర్తిస్తోందని అనుకుంటాను. నాకు మొదటిసారి ఈ స్థితి కలిగినప్పుడు నా దేహం జ్యోతిలా ప్రకాశించేది, ఛాతీ ఎర్రబారేది. అప్పుడు అమ్మతో ‘అమ్మా, వెలుపల ప్రకాశించవద్దు. లోపలకు వెళ్ళిపో, లోపలకు వెళ్ళిపో’ అన్నాను. అందుకే ఈ దేహం రంగు ఇప్పుడు పేలవంగా ఉంది. లేకుంటే జనం నన్ను పీడించి ఉండేవారు. తేజోమయ దేహాన్ని చూసి జనం ఇక్కడ గుంపుగా మూగేవారు. ఇప్పుడు వెలుపలి ప్రకాశం లేదు. దీనితో కలుపుమొక్కలు (ఊరకే చూడవచ్చేవారు) ఇక్కడ నిలువజాలరు. ఎవరైతే శుద్ధభక్తులో కేవలం వారు మాత్రమే ఉంటారు. నాకు ఈ వ్యాధి ఎందుకు కలిగిందో తెలుసా? దానిలో ఓ అంతరార్థం ఉంది. ఈ వ్యాధిని చూసి సకామభక్తి ఉన్నవాళ్ళు పారిపోతారు.
“నాకు ఒక కోరిక ఉండేది. అమ్మతో ‘అమ్మా, నేను భక్తులకు రాజును కావాలి’ అన్నాను.
“మళ్ళీ నా మనస్సులో ఒక ఆలోచన తలెత్తింది. ఎవరైతే హృదయపూర్వకంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తారో వారు ఇక్కడకు తప్పక రావలసి ఉంటుంది, తప్పక రావాలి. చూడు, అలాగే జరుగుతోంది. అందరూ అలాంటి వారే వస్తున్నారు.
“ఇందులో ఏముందో నా తల్లితండ్రులకు తెలుసు. మా తండ్రిగారికి గయలో రఘువీరుడు స్వప్నంలో కనిపించి ‘నేను నీ కుమారుడిగా జన్మిస్తాను’ అన్నాడు. ఇందులో ఉన్నది ఆయనే (భగవంతుడే). కామినీ కాంచనాల (ఎంతటి నిరుపమాన) త్యాగం! ఇది నేను సాధించా ననుకుంటున్నారా? నేను స్వప్నంలో కూడా స్త్రీ సంభోగం చేయలేదు.
“నాంగ్టా నాకు వేదాంతాన్ని బోధించాడు. మూడు రోజుల్లోనే సమాధిస్థితి కలిగింది. మాధవీలత క్రింద నా సమాధిస్థితిని చూసి అతడు చకితుడైపోయాడు. ‘అరే, ఇదేమిటి?’ అన్నాడు. అప్పుడు అతడు ఇందులో ఏముందో తెలుసుకోగలిగాడు. నాతో ‘నన్ను వెళ్ళనివ్వు’ అన్నాడు. ఆ మాటలు విని నేను భావావస్థలోకి వెళ్ళిపోయాను. ఆ స్థితిలో నేను ‘నాకు వేదాంతం బోధ పడనిదే (వేదాంత రీత్యా సత్యాన్ని సాక్షాత్కరించుకోనిదే) నువ్వు వెళ్ళజాలవు’ అన్నాను.
“అప్పుడు నేను రాత్రింబవళ్ళు అతడితోనే ఉండేవాడిని. మేం కేవలం వేదాంతం గురించి మాత్రమే మాట్లాడుకొనేవాళ్ళం. బ్రాహ్మణి నాతో ఇలా అంది: ‘నాయనా, నువ్వు వేదాంతం వినవద్దు. అది నీ భక్తికి హాని కలిగిస్తుంది.’
“అమ్మతో ఇలా అన్నాను: ‘అమ్మా! ఈ దేహాన్ని నేను ఎలా రక్షించుకోగలను? సాధువులు, భక్తులను నా వద్ద ఎలా నిలుపుకోగలను? ఒక సంపన్నుణ్ణి నా వద్దకు పంపించు.’ అందుకే మథుర్బాబు నాకు పద్నాలుగు సంవత్సరాల పాటు సేవ చేశాడు.
“నా వద్దకు ఎలాంటి భక్తులు వస్తారో ఇందులో ఉన్న వ్యక్తి ముందుగానే తెలియజేస్తాడు. గౌరాంగుడి రూపదర్శనం అవగానే, వెంటనే గౌరాంగుడి భక్తులు వస్తున్నారని అర్థం చేసుకుంటాను. ఎవరైనా శాక్తేయులు వస్తున్న పక్షంలో శక్తి రూపం అంటే కాళీరూప దర్శనం కలుగుతుంది.
“సాయంకాల హారతి సమయంలో కుఠీ మీదికి వెళ్ళి ‘అరే, మీరంతా ఎక్కడున్నార్రా? రండి!’ అంటూ కేకలు పెట్టేవాడిని. చూడు, ఇప్పుడు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి చేరుతున్నారు.
“ఇందులో స్వయంగా భగవంతుడే విరాజిల్లుతున్నాడు. ఆయనే స్వయంగా భక్తులందరితో పనిచేస్తున్నాడు.
“ఒక్కో భక్తుడు ఎంతటి అద్భుత స్థితిలో ఉన్నాడని! చిన్న నరేంద్రుడికి కుంభకం దానంతట అదే ఏర్పడుతుంది, పిదప సమాధిస్థితి కలుగుతుంది. ఒక్కోసారి రెండున్నర గంటలపాటు, మరికొన్ని సార్లు ఇంకా ఎక్కువసేపు సమాధిస్థితిలోనే ఉంటాడు. ఎంత ఆశ్చర్యకరం!
“ఇక్కడ అన్ని రకాల సాధనలూ జరిగాయి – జ్ఞానయోగం, భక్తియోగం, కర్మయోగం. ఆయుస్సు పెంపొందించుకొనే నిమిత్తం హఠయోగం కూడా అభ్యసించాను. ఇందులో మరో వ్యక్తి ఉన్నాడు. లేకుంటే సమాధి స్థితి పిదప భక్తిని ఆశ్రయించుకొని భక్తులతో ఎలా వసించగలను? కువర్ సింగ్ ఇలా అనేవాడు: ‘సమాధిస్థితి అనంతరం తిరిగి వచ్చిన వ్యక్తిని నేను ఎన్నడూ చూడనేలేదు. మీరు సాక్షాత్తూ గురునానకే.’
“నలువైపులా లౌకిక వ్యక్తులు, నలువైపులా కామినీ కాంచనాలు – వీటన్నిటి మధ్యా వసిస్తూ కూడా నా మనఃస్థితి ఇలా ఉంది – సమాధిస్థితి, భావావస్థలు నిరంతరం నెలకొనే ఉన్నాయి. అందుచేతనే ప్రతాప్ (బ్రహ్మసమాజ సభ్యుడైన ప్రతాప్‌చంద్ర మజుందార్) కుక్ సాహెబ్‌తో ఇక్కడకు వచ్చినప్పుడు – నౌక మీద నా స్థితిని చూసి ‘అమ్మో! భూతం ఆవహించినట్లుగా ఉంది’ అన్నాడు.”
రాఖాల్, ‘మ’, ప్రభృతులు అవాక్కయి శ్రీరామకృష్ణుల ఈ అద్భుత దర్శనాల ఉదంతం వింటున్నారు.
శ్రీరామకృష్ణులు సూచిస్తున్న విషయాన్ని మహిమాచరణ్ అర్థం చేసుకోనట్లు ఉంది. అంతా విని అతడు ఇలా అన్నాడు: “అయ్యా ప్రారబ్ధవశాత్తు మీకు ఇవన్నీ సంభవించాయి.” శ్రీరామకృష్ణులు ఒక సాధువో లేక భక్తుడో అనేదే అతడి తలంపు. అతడి మాటలను అంగీకరిస్తూ ఆయన ఇలా అన్నారు: “ఆ, గతకర్మల ఫలం! అనేక భవంతులు కలిగివున్న సుసంపన్నుడి లాంటివాడు భగవంతుడు. ఇది ఆయనకు కచ్చేరి చావడిలాంటిది. భక్తుడు భగవంతుడి కచ్చేరిచావడి.”
44.4 చతుర్థ పరిచ్ఛేదం బ్రహ్మచక్రం – నిశీథిలో అనాహత శబ్దం
సమయం రాత్రి తొమ్మిది గంటలవుతోంది. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణుల సమక్షంలో బ్రహ్మచక్రం (తంత్ర శాస్త్రాలకు సంబంధించినది) వేయాలన్నది మహిమాచరణ్ ఇచ్ఛ. అతడు రాఖాల్, ‘మ’, కిశోరీ ఇంకా ఒకరిద్దరు భక్తులతో నేల మీద చక్రం వేశాడు. వారందరినీ ధ్యానించమని చెప్పాడు. రాఖాల్ భావావస్థలోకి వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణులు లేచి అతడి ఛాతీ మీద చెయ్యి వేసి జగజ్జనని నామాన్ని ఉచ్చరించసాగారు. రాఖాల్కి బాహ్యస్పృహ కలిగింది.
సమయం రాత్రి ఒంటిగంట కావస్తోంది. నేడు కృష్ణపక్ష చతుర్దశి. నలువైపులా దట్టంగా చీకటి అలుముకొని ఉంది. ఒకరిద్దరు భక్తులు గంగానది గట్టున పచార్లు చేస్తున్నారు. శ్రీరామకృష్ణులు లేచి బయటకు వచ్చారు. భక్తులతో ఇలా అన్నారు: “ఈ సమయంలో, ఇలాంటి నిశీథి సమయంలో అనాహత శబ్దం వినవస్తుందని నాంగ్టా అనేవాడు.”
తెల్లవారుజామున మహిమాచరణ్, ‘మ’ లు ఇద్దరూ శ్రీరామకృష్ణుల గదిలో నేలపైనే పడుకున్నారు. రాఖాల్ మడత మంచంమీద పడుకొని ఉన్నాడు. మధ్యమధ్యలో శ్రీరామకృష్ణులు అయిదు సంవత్సరాల బాలుడివలె దిగంబరంగా గదిలో పచార్లు చేస్తున్నారు.
సోమవారం, ఆగష్టు 10
ప్రాతఃకాలాన శ్రీరామకృష్ణులు జగజ్జనని నామాన్ని ఉచ్చరిస్తున్నారు. పశ్చిమాన ఉన్న మొగసాలలోకి వెళ్లి గంగామాతను దర్శించారు. గదిలోని దేవీదేవతల పటాలన్నిటి వద్దకు వెళ్ళి వాటికి నమస్కరించారు. భక్తులు లేచి ఆయనకు ప్రణామంచేసి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళారు.
కాసేపటి తరువాత శ్రీరామకృష్ణులు పంచవటికి వెళ్ళి ఒక భక్తుడితో మాట్లాడసాగారు. అతడు స్వప్నంలో చైతన్యదేవులను దర్శించాడట.
శ్రీరామకృష్ణులు (పారవశ్యంతో): ఆహా! ఆహా!
భక్తుడు: కాని అది కేవలం స్వప్నం మాత్రమే కదండీ.
శ్రీరామకృష్ణులు: స్వప్నం ఏమైనా సామాన్య విషయమనుకుంటున్నావా?
శ్రీరామకృష్ణుల కళ్ళలో నీళ్ళు తిరిగాయి, గొంతు గద్గదమయింది.
ఒక భక్తుడికి జాగ్రదవస్థతో దివ్యదర్శనం కలిగిందన్న విషయం విని ఆయన “ఆ, అందులో ఆశ్చర్యం ఏముంది? ఇటీవల నరేంద్రుడు కూడా భగవద్రూపాలను దర్శిస్తున్నాడు” అన్నారు.
మహిమాచరణ్ స్నానాదులు పూర్తిచేసుకొని కాళీ ఆలయానికి పశ్చిమంగా ఉన్న ద్వాదశ శివాలయాలలో ఒకదాన్లోకి వెళ్ళి ఏకాంతంలో వేదపఠనం చేస్తున్నాడు.
సమయం ఎనిమిది గంటలు అవుతోంది. ‘మ’ గంగాస్నానం చేసి శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చాడు. బాగ్ బజారుకు చెందిన బ్రాహ్మణ వితంతువు కూడా ఆయన దర్శనార్థం వచ్చింది.
శ్రీరామకృష్ణులు (బ్రాహ్మణితో): ఇతడికి (‘మ’ కు) తినడానికి ప్రసాదం ఇవ్వవమ్మా. గూట్లో పూరీ ఉండాలి, చూడు.
బ్రాహ్మణి: ముందుగా మీరు స్వీకరించండి. తరువాత అతడు తింటాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నువ్వు ముందుగా జగన్నాథుని ప్రసాదం పుచ్చుకో. తరువాత ప్రసాదం ఆరగించు.
ప్రసాదం స్వీకరించాక ‘మ’ శివాలయాలకు వెళ్ళి దైవదర్శనం చేసుకున్నాడు. మళ్ళీ శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి ప్రణామం చేశాడు. బయలుదేరడానికి సిద్ధమయ్యాడు.
శ్రీరామకృష్ణులు (ఆప్యాయంగా): నువ్విక బయలుదేరు. మళ్ళీ నీ పని కోసం వెళ్ళవలసి ఉంది కదా!
44.5 పంచమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల మౌనవ్రతం – సర్వమూ మాయే!
మంగళవారం, ఆగష్టు 11
శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చుని ఉన్నారు. ఉదయం ఎనిమిది గంటల నుండి ఆయన మౌనవ్రతం పాటిస్తున్నారు. ఆయన వ్యాధి ప్రారంభమయింది. అనతి కాలంలోనే తాము దేహత్యాగం చేసి మళ్ళీ జగన్మాత ఒడిలోకి వెళ్ళిపోతానని ఆయన ఎరిగినట్లున్నారు. అందుకేనా మౌనం పాటిస్తున్నారు? ఆయన మౌనాన్ని చూసి శారదామాత విలపిస్తున్నారు. రాఖాల్, లాటూలు కూడా విలపించారు. బాగ్బజార్‌కు చెందిన బ్రాహ్మణి వచ్చి ఉంది. ఆమెకూడా శ్రీరామకృష్ణుల అనూహ్య మౌనాన్ని చూసి కంటనీళ్ళు పెట్టుకుంది. భక్తులు మధ్యమధ్య ఆయన్ను “ఇక మీరు ఎల్లవేళలా మౌనం పాటిస్తారా?” అని అడిగారు. అందుకు ఆయన ‘లేదు’ అన్నట్లుగా సైగ చేశారు.
మధ్యాహ్నం మూడుగంటలకు నారాయణ్ వచ్చాడు. “అమ్మ నిన్ను చల్లగా చూడుగాక!” అని శ్రీరామకృష్ణులు అతణ్ణి ఆశీర్వదించారు. శ్రీరామకృష్ణులు మాట్లాడారన్న విషయాన్ని నారాయణ్ తక్కిన భక్తులందరికీ తెలిపాడు. రాఖాల్ తదితర భక్తులు గుండెల మీద నుండి పెద్ద బరువు తొలిగిపోయినట్లు ఊపిరి పీల్చుకున్నారు. వారందరూ గదిలోకి వచ్చి ఆయనకు సమీపంగా నేల మీద కూర్చున్నారు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): సర్వమూ మాయేనని అమ్మ నాకు చూపించింది. కేవలం ఆమె మాత్రమే సత్యం, తక్కినదంతా ఆమె మాయయొక్క వైభవమే.
“మరో సంగతి కూడా వెల్లడైంది. భక్తులు ఎవరెవరు ఎంతవరకు పురోగమించారన్నది చూశాను.”
నారాయణ్ తదితర భక్తులు: అయ్యా, అది కాస్త మాకు తెలియచేయండి.
శ్రీరామకృష్ణులు: నిత్యగోపాల్, రాఖాల్, నారాయణ్, పూర్ణుడు, మహిమా చక్రవర్తి – వీరందరి గురించి తెలిసింది.
44.6 షష్ఠ పరిచ్ఛేదం గిరీశ్, శశధర్ ప్రభృతులతో శ్రీరామకృష్ణులు
ఆదివారం, ఆగష్టు 16, 1885
శ్రీరామకృష్ణుల వ్యాధి గురించిన సమాచారం కలకత్తా భక్తులకు అందింది. అది ఏదో మామూలు గొంతుపుండు లాంటిదేనని వారు అనుకున్నారు. గిరీశ్, రామ్, నిత్యగోపాల్, మహిమాచక్రవర్తి, కిశోరీ, పండిట్ శశధర తర్కచూడామణి తదితర భక్తులు ఆయన్ను దర్శించే నిమిత్తం దక్షిణేశ్వరం వచ్చారు.
శ్రీరామకృష్ణులు మునుపటిలాగే ఆనందంగా భక్తులతో మాట్లాడుతున్నారు.
శ్రీరామకృష్ణులు: అమ్మకు నా వ్యాధి గురించి చెప్పలేను. అలా చెప్పడానికి సిగ్గుపడతాను.
గిరీశ్: భగవంతుడు మీ వ్యాధి నయమయ్యేలా చేస్తాడు.
రామ్: అవునండీ. మీకు బాగయిపోతుంది.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఆ, మీరంతా అలాగే ఆశీర్వదించండి. (అందరూ నవ్వారు)
గిరీశ్ క్రొత్తగా వస్తూ ఉన్న వ్యక్తి. శ్రీరామకృష్ణులు అతడితో ఇలా అన్నారు: “నీకు ఎన్నో పనులు ఉంటాయి. వాటన్నిటితో నువ్వు సతమతమవుతూ ఉంటావు. ఇంకో మూడుసార్లు నువ్వు ఇక్కడకు రా.”
44.6.1 బ్రహ్మం, ఆద్యాశక్తి అభిన్నం
(శశధర్తో) “ఆద్యాశక్తి గురించి కాస్త చెప్పు.”
శశధర్: అయ్యా, నాకేం తెలుసునని మీరు అలా అడుగుతున్నారు?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఫలానా మనిషిని ఎవరో వ్యక్తి అమితంగా గౌరవించేవాడట. హుక్కాకోసం నిప్పు తీసుకురమ్మని ఆ మనిషి ఆ వ్యక్తికి చెప్పాడు. అందుకు ఆ వ్యక్తి “అయ్యా మీ కోసం నిప్పు తీసుకురావడానికి నేను అర్హుడనా ఏమిటి” ? అన్నాడు. చివరకు నిప్పు తీసుకురానేలేదు. (అందరూ నవ్వారు.)
శశధర్: ఆద్యాశక్తే ఈ జగత్తుకు నిమిత్త కారణం, ఉపాదాన కారణం కూడా. ఆమే జీవజగత్తులను సృష్టిస్తోంది. మళ్ళీ ఆమే జీవజగత్తులుగా అయి ఉంటోంది. ఉదాహరణకు సాలీడు – గూడును అదే స్వయంగా తయారు చేస్తుంది (నిమిత్త కారణం). పైగా, అది గూడును తన శరీరంలో నుండే బయటకు తీస్తుంది (ఉపాదాన కారణం).
శ్రీరామకృష్ణులు: మరో విషయం – ఎవరైతే పురుషుడో ఆయనే ప్రకృతి కూడా. ఎవరైతే బ్రహ్మమో ఆయనే శక్తికూడా. ఆయన నిష్క్రియుడై ఉన్నప్పుడు, సృష్టి స్థితిలయాలను నిర్వర్తించనప్పుడు ఆయన్ను బ్రహ్మం అంటాను, పురుషుడు అంటాను. మళ్ళీ ఈ కార్యాలన్నిటినీ నిర్వర్తించేటప్పుడు ఆయన్ను శక్తి అంటాను, ప్రకృతి అంటాను. కాని ఎవరైతే బ్రహ్మమో ఆయనే శక్తి, ఎవరైతే పురుషుడో ఆయనే ప్రకృతిగా అయివుంటున్నాడు. నీరు స్థిరంగా ఉన్నప్పుడూ నీరే, కదులుతూన్నప్పుడు కూడా నీరే. పాము మెలికలు తిరుగుతూ వెళ్ళినప్పుడూ పామే, చుట్టచుట్టుకొని నిశ్చలంగా ఉన్నప్పుడు కూడా పామే.
44.6.2 బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ సమాధి స్థితి – భోగలాలస, కర్మలు
“బ్రహ్మం అంటే ఏమిటో నోటితో చెప్పలేం. అక్కడ నోరు మూతపడిపోతుంది. కీర్తనలో గాయకులు మొదట “నిమాయి మేరా మత్వాలా హాథీ” (‘నా నిమాయీ మదుపుటేనుగులా నాట్యం చేస్తాడు’ అని అర్థం) అని పాడతారు. ఇలా పాడుతూ పాడుతూ చివరకు పూర్తి చరణం పాడలేరు. కేవలం ‘హాథీ’ అంటుంటారు. అటుపైన ‘హథీ, హథీ’ అంటూ ఆఖరికి కేవలం ‘హా’, హా’ అని మాత్రమే పలుకుతారు. చివరకు అదికూడా పలకలేరు, పూర్తిగా బాహ్యజ్ఞానాన్ని కోల్పోతారు.”
ఇలా పలుకుతూ శ్రీరామకృష్ణులు సమాధిస్థితిలోకి వెళ్ళిపోయారు. నిలబడే సమాధిస్థితిలో ఉన్నారు. బాహ్యస్పృహలోకి వచ్చాక ఇలా అన్నారు:
“క్షర, అక్షరాలకు అతీతమైన దానిని నోటితో చెప్పలేం.”
భక్తులు అందరూ మౌనంగా ఉండిపోయారు. మళ్ళీ శ్రీరామకృష్ణులే మాట్లాడుతూ ఇలా అన్నారు: “భోగాలు మిగిలి ఉన్నంతవరకు లేక కర్మలు మిగిలి ఉన్నంతవరకు సమాధి స్థితి కలుగదు.”
(శశధర్తో) “భగవంతుడు ప్రస్తుతం నీతో లెక్చర్లు ఇవ్వడం మొదలైన కర్మలు చేయిస్తున్నాడు. నువ్వు వీటినన్నిటినీ నిర్వర్తించవలసి ఉంది.
“ఈ కొద్దిపాటి కర్మలు తీరిపోయాక నీకు శాంతి లభిస్తుంది. ఇల్లాలు ఇంటి పనులు నన్నిటినీ ముగించుకున్నాక స్నానం చేయడానికి పోతుంది. పిదప ఎన్నిసార్లు పిలిచినా సరే ఆమె మాత్రం తిరిగి రాదు.”
44.7 సప్తమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు – పండిత్ శ్యామాపద భట్టాచార్య
గురువారం, ఆగష్టు 27, 1885
శ్రీరామకృష్ణులు ఒకరిద్దరు భక్తులతో తమ గదిలో కూర్చుని ఉన్నారు. అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటలు అవుతోంది. భక్తులు వచ్చినప్పుడు ఆయన తమ వ్యాధిని ఏమాత్రం లక్ష్యపెట్టకుండా దాదాపు రోజంతా వారితో సంభాషించడం, గానం చేయడంలోనే మునిగి ఉంటారు.
డా ॥ మధు, శ్రీరామకృష్ణులకు చికిత్స చేస్తున్నాడు. అతడు తరచూ పడవలో కలకత్తా నుండి దక్షిణేశ్వరం వచ్చి ఆయనకు చికిత్స చేస్తున్నాడు. శ్రీరామకృష్ణుల ఆరోగ్య విషయంలో భక్తులు చింతాక్రాంతులై ఉన్నారు. డాక్టరు ప్రతిరోజూ వచ్చి ఆయన్ను చూడాలన్నది భక్తుల ఆకాంక్ష. ‘మ’ శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు: “అతడు బాగా అనుభవజ్ఞుడైన డాక్టరు. ప్రతిరోజూ వచ్చి చూస్తే బాగుంటుంది.”
ఆంట్పూర్కు చెందిన పండిట్ శ్యామాపద భట్టాచార్య వచ్చాడు. సంధ్యాకాలం కావడంతో అతడు సంధ్య వార్చుకొనే నిమిత్తం గంగానది ఒడ్డున ఉన్న చాందినీ ఘాట్‌కు వెళ్ళాడు. సంధ్య వారుస్తూ అతడు అనేక అద్భుత దర్శనాలను గాంచాడు. తరువాత శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చి నేల మీద కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు జగజ్జనని నామోచ్చారణ, ధ్యానం ముగించి తమ ఆసనం పైన కూర్చుని ఉన్నారు. ‘మ’ కాలిపట్టా మీద కూర్చుని ఉన్నాడు. రాఖాల్, లాటూ తదితరులు గదిలోకి వస్తూ పోతున్నారు.
44.7.1 ‘సప్త ద్వారాల ఆవల ఉన్న రాజు’ దృష్టాంతంతో సమాధి స్థితి
శ్రీరామకృష్ణులు (పండితుణ్ణి చూపిస్తూ, ‘మ’ తో): ఇతడు ఉత్తముడు. (పండితుడితో) ‘నేతి, నేతి’ విచారణ చేస్తూపోయినప్పుడు మనస్సుకు ఎక్కడయితే శాంతి లభిస్తుందో, అక్కడే పరబ్రహ్మం ఉన్నది.
“సప్త ద్వారాలకు ఆవల రాజు వసిస్తున్నాడు. మొదటి ద్వారం వద్దకు వెళ్ళి చూసేసరికి సుసంపన్నుడైన వ్యక్తి ఒకరు ఎంతో ఆడంబరంగా అనేకులతో పరివేష్టితుడై కూర్చుని ఉన్నాడు. రాజును దర్శింపవచ్చినవాడు తన సహచరునితో “ఈయనేనా రాజు?” అని అడిగాడు. సహచరుడు ముసిముసి నవ్వులు నవ్వి “కాదు” అన్నాడు.
“రెండవ ద్వారం వద్దా, ఇంకా తక్కిన ద్వారాలవద్దా రాజును చూడవచ్చిన వాడు తన సహచరుణ్ణి అలాగే అడిగాడు. అతడు ఎంతగా ముందుకు వెళితే ఐశ్వర్యం కూడా అదేలా ఇనుమడిస్తోంది, హంగూ ఆడంబరాలు కూడా అదే విధంగా మిరుమిట్లు గొల్పుతున్నాయి. సప్త ద్వారాలు దాటాక అతడు తన సహచరుణ్ణి మరి ఏమి అడగలేదు. రాజుగారి అపార ఐశ్వర్యాన్ని చూశాక అతడికి నోరు పెగల్లేదు, స్థాణువైపోయాడు. రాజుగారు ఈయనే అని అర్థం చేసుకున్నాడు. ఈ విషయంలో మరే సందేహం లేదు.”
44.7.2 భగవంతుడు, ఈశ్వరుడు – అధ్యాత్మ రామాయణం
పండితుడు: మాయను అతిక్రమించి వెళ్ళినప్పుడు మాత్రమే మనం భగవంతుణ్ణి చూడగలం.
శ్రీరామకృష్ణులు: భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్నాక ఆయనే ఈ మాయ, జీవజగత్తులుగా అయివున్నట్లు గాంచుతాం. ‘నేతి, నేతి’ విచారణ చేసేటప్పుడు ఈ సంసారం ‘మాయాభవనం’ గా స్వప్నం లాంటిదిగా తోస్తుంది. కాని భగవత్సాక్షాత్కారానంతరం ఈ సంసారమే ‘ఆనందసౌధ’ మైపోతుంది.
“కేవలం శాస్త్ర పఠనం వల్ల ఏమిటి ప్రయోజనం? పండితులు కేవలం విచారణలోనే మునిగి ఉంటారు.”
పండితుడు: ఎవరైనా పండితుడని నన్ను సంబోధిస్తే నాకు చిర్రెత్తుకు వస్తుంది.
శ్రీరామకృష్ణులు: నువ్వలా అంటున్నావంటే దానికి భగవత్కృప ఉండి ఉండాలి. పండితులు కేవలం విచారణలోనే మునిగి ఉంటారు. ఒకరు పాలను గురించి విని ఉంటారు, మరొకరు పాలను తాగి ఉంటారు. అయితే భగవత్ సాక్షాత్కారానంతరం సర్వమూ నారాయణుడిగానే దర్శిస్తావు. నారాయణుడే సర్వమూ అయివున్నాడు.”
పండితుడు నారాయణ స్తోత్రం ఒకటి పఠించాడు. శ్రీరామకృష్ణులు ఆనందంతో పరవశులయ్యారు. పిదప పండితుడు గీతలోని శ్లోకాన్ని ఉదహరించాడు: “సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని । ఈక్షతే యోగ యుక్తాత్మా సర్వత్ర సమదర్శనః” ॥ (గీత – 6:29)
అర్థం: అన్నిట్లోను సమభావంతో వర్తించే యోగి సర్వప్రాణులలోను తనను గాంచుతాడు. అట్లే తనలోనే అన్ని ప్రాణులను చూస్తాడు. ఆత్మను పరమాత్మలో లగ్నంచేసే యోగి సకల భూతకోటిలోను పరమాత్మ స్వరూపాన్ని గాంచగలడు.
శ్రీరామకృష్ణులు: మీరు అధ్యాత్మ రామాయణం చదివారా?
పండితులు: ఆ, కొద్దిగా చదివానండి.
శ్రీరామకృష్ణులు: అది పూర్తిగా భక్తిజ్ఞానాలతో నిండివుంది. శబరి ఉపాఖ్యానం, అహల్య గానంచేసిన స్తోత్రం – అవన్నీ భక్తిపూరితాలు.
“కాని ఒక విషయం గుర్తు పెట్టుకోండి. విషయాసక్తికి భగవంతుడు ఎంతో దూరం.”
పండితుడు: అవునండీ. విషయాసక్తి ఉన్న చోటుకు భగవంతుడు ఎంతో దూరంలో ఉంటాడు. అది లేని చోటుకు ఆయన అతి సమీపం. ఉత్తరపారాకు చెందిన జమీందారు ఒకరిని చూశాను. ముఖర్జీ వంశీయుడు. వృద్ధాప్యం వచ్చేసింది. కాని ఆయన కేవలం నవలలు, కథలు మాత్రమే వింటుంటాడు.
శ్రీరామకృష్ణులు: అధ్యాత్మ రామాయణంలో మరో విషయం ఉంది. భగవంతుడే జీవజగత్తులుగా అయివున్నాడు.
పండితుడు ఆనందభరితుడయ్యాడు. భాగవతం దశమస్కంధంలో ఈ భావానికి చెందిన స్తవం గానంచేశాడు.
కృష్ణ! కృష్ణ! మహాయోగింస్త్వమాద్యః పురుషః పరః ।
వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రాహ్మణ విదుః ॥
త్వమేకం సర్వభూతానాం దేహస్వాత్మేంద్రియేశ్వరః ।
త్వమేవ కాలో భగవాన్ విష్ణురవ్యయః ఈశ్వరః ॥
త్వం మహాన్ ప్రకృతిః సూక్ష్మా రజఃసత్త్వతమోమయీ ।
త్వమేవ పురుషోఽధ్యక్షః సర్వక్షేత్ర వికారవిత్ ॥
44.7.3 హృదయ పూర్వకంగా జపధ్యానాదులు చేసిన వారందరూ ఇక్కడకు వచ్చి తీరాలి
స్తవం వింటూ శ్రీరామకృష్ణులు నిలబడే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. పండితుడు కూర్చుని ఉన్నాడు. పండితుడి ఒడిలోనూ, ఛాతీ మీదా తమ పాదాన్ని మోపి శ్రీరామకృష్ణులు నవ్వారు.
పండితుడు ఆయన పాదాన్ని పట్టుకొని “గురో చైతన్యం దేహి” అన్నాడు. పిదప శ్రీరామకృష్ణులు చిన్నమంచం మీద కూర్చున్నారు.
పండితుడు వెళ్ళిపోయాక ‘మ’ తో ఇలా అన్నారు: “చూశావా, నేను చెప్పినదంతా నిజమవుతోంది. హృదయపూర్వకంగా జపధ్యానాలు చేసిన వారందరూ ఇక్కడకు వచ్చితీరాలి.”
అప్పుడు సమయం రాత్రి పది గంటలవుతోంది. శ్రీరామకృష్ణులు కొద్దిగా రవ్వపాయసం సేవించి పడుకున్నారు. ‘మ’ ను కాస్త కాళ్ళు పట్టమన్నారు. కాసేపటి తర్వాత రామ్‌లాల్‌తో, “కావాలంటే ‘మ’, రాఖాల్లు గదిలోనే నిద్రపోవచ్చు” అన్నారు.
44.8 అష్టమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు – ఏసుక్రీస్తు
శుక్రవారం, ఆగష్టు 28
ప్రత్యూష వేళ. శ్రీరామకృష్ణులు లేచి జగజ్జననిని ధ్యానిస్తున్నారు. జబ్బు కారణంగా భక్తులకు ఆయన ముఖతా జాలువారే మధుర నామోచ్చారణను వినే అవకాశం దక్కడం లేదు. కాలకృత్యాలు తీర్చుకొని ఆయన గదిలో చిన్న మంచంపై ఆసీనులయ్యారు. ‘మ’ ను “అది సరే, నాకు ఈ రోగం ఎందుకు సంక్రమించిందో చెబుతావా?” అని అడిగారు.
‘మ’ : అన్ని విషయాలలోనూ సామాన్యులవలె కనిపించకపోతే జనం మీ వద్దకు రావడానికి సాహసించరు. కాని ఇంతటి అనారోగ్య పరిస్థితిలో కూడా మీరు సర్వదా భగవచ్చింతనలో మునిగి ఉండటం చూసి వారు అబ్బురపడి పోతున్నారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): బలరామ్ కూడా, “మీకే అలా అయినప్పుడు మరి మా కెందుకు కాదు?” అన్నాడు.
“సీత కోసం దుఃఖీస్తూ రాముడు తన ధనుస్సు కూడా ఎత్తలేక పోవడం చూసి లక్ష్మణుడు అచ్చెరువొందాడు. ‘పంచభూతాల వలలో చిక్కుకొని బ్రహ్మం కూడా విలపించింది.’”
‘మ’ : భక్తుల కష్టాలను చూసి ఏసు క్రీస్తు కూడా సామాన్యునిలా విలపించాడు.
శ్రీరామకృష్ణులు: ఏమిటా కథ?
‘మ’ : మార్థా, మేరీలు ఇద్దరూ అక్కచెల్లెళ్ళు. లాజరస్ వారి సోదరుడు. వారు ముగ్గురు ఏసుప్రభువు భక్తులు. లాజరస్ మరణించాడు. ఏసుక్రీస్తు ఆ సమయంలో వారి ఇంటికి వెళుతున్నాడు.మేరీ పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాల వద్ద మోకరిల్లింది. విలపిస్తూ ఇలా అంది: ‘ప్రభూ నువ్వు కనుక వచ్చి ఉంటే, మా సోదరుడు మరణించేవాడు కాదు.’ ఆమె విలాపం చూసి ఏసుక్రీస్తు కూడా కళ్ళనీళ్ళపర్యంతమయ్యాడు.
“తరువాత ఆయన, గోరీ వద్దకు వెళ్ళి లాజరస్ను పేరు పెట్టి పిలిచాడు. వెంటనే లాజరస్ మళ్ళీ సజీవుడై ఆయన వద్దకు వచ్చాడు.”
శ్రీరామకృష్ణులు: కాని నేను అలాంటివి చేయజాలను.
‘మ’ : అయితే అవన్నీ మీరు మీ ఇచ్ఛ మేరకే చేయడం లేదు. అవన్నీ సిద్ధులు; అందుకే మీరు వాటిని చేయడం లేదు. అలాంటి శక్తులను ప్రదర్శించడం వల్ల జనం ఆసక్తి వారి దేహంవైపుకు మరలుతుంది; శుద్ధభక్తి వైపు మరలదు. అందుకే మీరు అటువంటి అద్భుతాలు ప్రదర్శించటం లేదు.
“కాని మీకు, ఏసుక్రీస్తుకు చాలా పోలికలు ఉన్నాయి.”
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఇంకా ఏయే పోలికలు ఉన్నాయి?
‘మ’ : మీరు భక్తులను ఉపవసించమనో లేక మరేదైనా కఠోర నియమాలను పాటించమనో చెప్పరు. ఆహారం విషయంలో మీరు ఎలాంటి కఠిన నిబంధనలు విధించరు. ఏసుక్రీస్తు శిష్యులు ఆదివారంనాడు నియమానుసారం ఉపవాసం (సబ్బాథ్) చెయ్యలేదు, అందువల్ల శాస్త్రానుసారం వర్తించే వాళ్ళు (ఫారసీలు) వారిని చీవాట్లు పెట్టారు. అందుకు ఏసుక్రీస్తు ఇలా అన్నాడు: “వారు తినడంవల్ల మంచిపనే చేశారు. మగపెళ్ళివారు పెళ్ళికొడుకుతో ఉన్నంతకాలం నవ్వులు, కేరింతలతో వేడుక చేసుకుంటారు.”
శ్రీరామకృష్ణులు: దీని అర్థం ఏమిటి?
‘మ’ : దీని అర్థం – అవతార పురుషుని శిష్యులు ఆయనతో ఉన్నంతకాలం అమితోత్సాహంతో ఉంటారు. వారెందుకు దుఃఖంలో ఉండాలి? కాని ఆయన స్వధామానికి వెళ్ళిపోయినప్పటినుండి వారికి కష్టకాలం మొదలవుతుంది.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఇంకా ఏమైనా పోలికలు ఉన్నాయా?
‘మ’ : మీరు అంటుంటారే – ‘బాలురలో కామినీ కాంచనాలు ఇంకా ప్రవేశించలేదు, వారు ఉపదేశాలను చక్కగా అర్థం చేసుకోగలరు. కొత్త కుండలో పాలను ఉంచవచ్చు. కాని ఇదివరకు పెరుగు తోడు పెట్టబడిన కుండలో పాలను ఉంచినట్లయితే అవి విరిగిపోవచ్చు’ అని. క్రీస్తు కూడా అలాగే చెప్పాడు.
శ్రీరామకృష్ణులు: ఆయన ఏమనేవాడు?
‘మ’ : పాత సీసాలో క్రొత్త మద్యాన్ని పెట్టినట్లయితే సీసా పగిలి పోవచ్చు. పాత వస్త్రాన్ని క్రొత్త వస్త్రంతో అతుకువేసి కుట్టితే పాతవస్త్రం చిరిగిపోతుంది.
“పైగా మీరు చెబుతుంటారు కదా – ‘నేను, అమ్మ ఒక్కటే’ నని. అలాగే, క్రీస్తుకూడా ‘నేను, నా పిత ఒక్కడే’ అనేవాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఇంకా ఏమైనా ఉందా?
‘మ’ : మీరు అంటుంటారే – ‘వ్యాకులచిత్తంతో ప్రార్థించినట్లయితే భగవంతుడు తప్పక ఆలకిస్తాడు’ అని. ఏసుక్రీస్తు కూడా ‘వ్యాకులతతో తలుపు తట్టండి, తలుపు తెరవబడుతుంది’ అనేవాడు.
శ్రీరామకృష్ణులు: అది సరే, నువ్వు చెబుతున్నట్లు భగవంతుడే మళ్ళీ అవతరించాడంటే, అది పూర్ణావతారమా లేక కళా లేక అంశావతారమా?
‘మ’ : అయ్యా! పూర్ణమా, అంశా లేక కళా అన్న విషయం నాకు అర్థం కావడంలేదు కాని మీరు చెప్పినట్లు గోడలోని గుండ్రని రంధ్రం విషయం మాత్రం అర్థం చేసుకున్నాను.
శ్రీరామకృష్ణులు: అదేమిటో కాస్త చెప్పు.
‘మ’ : గోడలో ఒక గుండ్రని రంధ్రం ఉన్నది. ఆ రంధ్రంగుండా గోడకు ఆవల ఉన్న మైదానం కొంత కనిపిస్తుంది. అదే విధంగా మీలో నుండి ఆ అనంత భగవత్స్వరూపాన్ని కొద్దిగా చూడగలం.
శ్రీరామకృష్ణులు: అవును. ఒక్కసారిగా రెండు మూడు క్రోసుల దూరం వరకు చూడవచ్చు.
‘మ’ లేచి చాందినీఘాట్కు వెళ్ళాడు. గంగాస్నానం చేసి తిరిగి గదిలోకి వచ్చాడు. అప్పుడు సమయం ఉదయం ఎనిమిది గంటలవుతోంది. ‘మ’ లాటూను జగన్నాథస్వామి అన్నప్రసాదం ఇవ్వమని అడిగాడు. శ్రీరామకృష్ణులు ‘మ’ ప్రక్కన నిలబడి ఇలా అన్నారు: “ఈ ప్రసాదాన్ని క్రమం తప్పకుండా పుచ్చుకుంటూ ఉండు. భక్తులైన వారు ప్రసాదం తినకుండా తక్కిన ఆహారమేదీ తినరు.”
‘మ’ : నిన్న నేను బలరామ్ బాబు ఇంట్లో నుండి జగన్నాథస్వామి ప్రసాదం తీసుకున్నానండి. దానినే రోజూ ఒకటి రెండు పలుకులుగా నోట్లో వేసుకుంటున్నాను.
శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి ‘మ’ సెలవు పుచ్చుకున్నాడు. ఆయన ఆప్యాయంగా ‘మ’ తో ఇలా అన్నారు: “నువ్వు రేపు పెందలాడే రా. భాద్రపదం ఎండలు ఒంటికి మంచివి కావు.”
44.9 నవమ పరిచ్ఛేదం పూర్ణుని ఉత్తరం – గంగాధర్, సుబోధ్
సోమవారం, ఆగష్టు 31, 1885
శ్రీరామకృష్ణులు తమ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. సమయం రాత్రి ఎనిమిది గంటలు అవుతోంది. రోగగ్రస్తమై ఉన్నప్పటికీ ఆయన సర్వదా తమ భక్తుల శ్రేయస్సు గురించే ఆలోచిస్తున్నారు. ఒక్కోసారి ఆయన బాలుడిలా అశాంతికి లోనవుతారు. మళ్ళీ, తమ వ్యాధిని పూర్తిగా విస్మరించి భగవత్ప్రేమలో ఉన్మత్తులవుతారు. భక్తులపట్ల ఆయన ప్రేమ బిడ్డలపట్ల తల్లికి ఉన్న ప్రేమ లాంటిది.
రెండు రోజుల క్రితం అంటే, శనివారం రాత్రి ఆయన పూర్ణుడి నుండి ఒక ఉత్తరం అందుకున్నారు. అందులో పూర్ణుడు ఇలా వ్రాశాడు: ‘నేను పరమానందంలో పరవశించిపోతున్నాను. ఒక్కోసారి ఈ ఆనందం కారణంగా రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు.’ ఉత్తరంలోని విషయాన్ని విన్న తరువాత శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “ఇది వింటుంటే నాకు రోమాంచితమవుతోంది. ఇదే ఆనందావస్థ అతడిలో భవిష్యత్తులో కూడా నెలకొంటుంది. ఏదీ, ఒకసారి ఉత్తరం చూడనివ్వు.” ఉత్తరాన్ని చేతిలో అదిమిపెట్టుకొని ఆయన ఇలా అన్నారు: “సాధారణంగా నేను ఉత్తరాలను స్పృశించలేను. కాని ఇది చాలా మంచి ఉత్తరం.”
అదే రాత్రి విశ్రమించినప్పుడు శ్రీరామకృష్ణులకు హఠాత్తుగా చెమటలు పట్టసాగాయి. ఆయన ప్రక్కమీద నుండి లేచి “ఈ రోగం నయం కాదని నాకు అనిపిస్తోంది” అన్నారు. ఈ మాట వినగానే భక్తుల గుండెలు గుభిల్లుమన్నాయి. శ్రీరామకృష్ణుల సేవార్థం శారదామాత దక్షిణేశ్వర కాళీ ఆలయానికి వచ్చి ఉన్నారు; నహబత్తులో వసిస్తున్నారు. నహబత్తులో ఆమె ఉన్నట్లు ఏదో ఒకరిద్దరు భక్తులకు తప్ప మరెవ్వరికి తెలియదు. ఒక భక్తురాలు (గోలప్ మా) ఎన్నో రోజులుగా నహబత్తులో శారదామాతతో పాటు బస చేస్తోంది. ఆ భక్తురాలు శ్రీరామకృష్ణులను దర్శించే నిమిత్తం తరచూ ఆయన గదికి వస్తూ ఉంది. ఆయన ఒక రోజు ఆమెతో “నువ్వు చాలా రోజులుగా ఇక్కడ ఉంటున్నావు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? పదిరోజుల పాటు నువ్వు ఇంటికి వెళ్ళిరావడం మంచిది” అన్నారు.
శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద దక్షిణం వైపు తలపెట్టి ప్రక్కకు తిరిగి పడుకున్నారు. సంధ్య వ్రాలాక కలకత్తానుండి గంగాధర్, ‘మ’ వచ్చారు. గంగాధర్ శ్రీరామకృష్ణుల పాదాల వద్ద కూర్చున్నాడు. ఆయన ‘మ’ తో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: ఆ రోజు ఇక్కడకు ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చారు. వారిలో ఒకడు శంకర్ ఘోష్ మునిమనుమడు (సుబోధ్). మరొకడు అతడి ప్రక్కింటి అబ్బాయి (క్షీరోద్). ఇద్దరూ మంచి కుర్రవాళ్ళు. వారితో నేను ‘ప్రస్తుతం నాకు అస్వస్థతగా ఉన్నది’ అన్నాను. పిదప నీ వద్దకు వెళ్ళి ఏమైనా ఉపదేశం పొందమని చెప్పాను. నువ్వు వారిపట్ల కొద్దిగా ధ్యాస ఉంచు.
గంగాధర్ (స్వామి అఖండానంద)
సుబోధ్ (స్వామి సుబోధానంద)
‘మ’ : అలాగేనండీ. వారు మా పొరుగింటివారే.
శ్రీరామకృష్ణులు: ఆ రోజు మళ్లీ చెమటలు పట్టడంతో నిద్రాభంగం అయింది. ఈ వ్యాధి ఏమిటో అంతుపట్టడం లేదు.
‘మ’ : అయ్యా, మిమ్మల్ని ఒకసారి భగవాన్ రుద్రకు చూపించాలని నిర్ణయించుకున్నాం. అతడు ఎం.డి. చేసినవాడు. బాగా అనుభవంవున్న వైద్యుడు.
శ్రీరామకృష్ణులు: ఎంత తీసుకుంటాడేమిటి?
‘మ’ : మామూలుగా అయితే ఇరవై లేక పాతిక రూపాయలు పుచ్చుకుంటాడు.
శ్రీరామకృష్ణులు: అయితే వద్దులే.
‘మ’ : లేదండి. మనం కేవలం నాలుగు లేక అయిదు రూపాయలు మాత్రమే చెల్లిస్తాము.
శ్రీరామకృష్ణులు: ఒకవేళ అతడితో ‘దయ ఉంచి ఆయన్ను వచ్చి చూడండి’ అంటే ఎలా ఉంటుంది? అతడు ఇక్కడి (శ్రీరామకృష్ణుల) విషయాలు ఏవీ వినలేదా?
‘మ’ : విన్నట్టే ఉన్నాడండీ. దాదాపుగా రుసుం ఏమీ పుచ్చుకోననే అన్నాడు. కాని మేమే ఇవ్వాలనుకున్నాము. అప్పుడు అతడు మళ్ళీ ఇక్కడకు వస్తాడు.
శ్రీరామకృష్ణులు: నితాయ్ డాక్టర్‌ను కూడా రమ్మనమని చెప్పు. అతడు మంచి డాక్టరు. కాని ఈ డాక్టర్లు ఏం చేస్తారో తెలియదు? ఊరకే గొంతును అదుముతూ వ్యాధిని మరింత ప్రకోపింప చేస్తారు.
సమయం రాత్రి తొమ్మిది గంటలవుతోంది. శ్రీరామకృష్ణులు కొద్దిగా రవ్వపాయసం సేవించారు. దాన్ని సేవించడంలో ఆయనకు ఏ ఇబ్బందీ కలుగలేదు. ఆ మాత్రానికే ఆయన ఎంతగానో సంబరపడిపోతూ ‘మ’ తో ఇలా అన్నారు: “కొద్దిగా తినగలిగాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది.”
44.10 దశమ పరిచ్ఛేదం జన్మాష్టమి రోజున భక్తులతో
మంగళవారం, సెప్టెంబర్ 1
శ్రీరామకృష్ణులు స్నానం చేయనున్నారు. దక్షిణ వసారాలో ఆయనకు ఒక భక్తుడు నూనె రాస్తున్నాడు. ‘మ’ గంగాస్నానం చేసి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. పిదప శ్రీరామకృష్ణులు స్నానం చేసి ఒంటికి ఒక తువ్వాలు చుట్టుకొన్నారు. వసారాలోనుండే చేతులు జోడించి ఆలయాల వైపుకు తిరిగి ఆలయమూర్తులకు నమస్కరించారు. జబ్బు కారణంగా ఆయన ఆలయాలకు వెళ్ళలేదు.
నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి. రామ్ తదితర భక్తులు శ్రీరామకృష్ణుల కోసం నూతన వస్త్రాలు – బృందావనం ధోవతి, పట్టుతో నేసిన ఎరుపు ఉత్తరీయం తీసుకువచ్చారు. శ్రీరామకృష్ణులు వాటిని ధరించి శోభాయమానంగా కనిపించారు. నూతన వస్త్రాలు ధరించాక ఆయన మళ్ళీ ఆలయాల వైపుకు తిరిగి నమస్కరించారు.
కామార్హాటీకి చెందిన గోపాల్-మా ఇంటినుండి తన గోపాలుడి కోసం* ఏదో తినుబండారం తయారుచేసి తీసుకువచ్చింది. దుఃఖంతో వగచుతూ ఆమె శ్రీరామకృష్ణులతో “కాని నువ్వు ఇవేవీ తినవే” అన్నది.
శ్రీరామకృష్ణులు: నాకు అస్వస్థతగా ఉంది కదా!
గోపాల్ మా: ఏం చేసేది, అది నా దౌర్భాగ్యం. కాస్త నీ చేతిలోకి తీసుకో.
శ్రీరామకృష్ణులు: నువ్వు నన్ను ఆశీర్వదించు.
ఒక భక్తుడు పటికబెల్లం తీసుకువచ్చాడు. “నేను దాన్ని నహబత్తుకు తీసుకుపోతాను” అంది గోపాల్ మా. శ్రీరామకృష్ణులు, “వద్దు, వద్దు. దాన్ని ఇక్కడే ఉండనివ్వు. చీటికీమాటికీ దానికోసం నహబత్తుకు ఎవరు పోతూ ఉంటారు? దాన్ని ఇక్కడే ఉంచు” అన్నారు.
సమయం ఉదయం పదకొండు గంటలు అవుతోంది. క్రమక్రమంగా భక్తులు రాసాగారు. బలరామ్, నరేంద్రుడు, చిన్న నరేంద్రుడు, నవగోపాల్, కాటోవాకు చెందిన వైష్ణవుడు వచ్చారు. రాఖాల్, లాటూలు శ్రీరామకృష్ణులతోనే ఉంటున్నారు. పంజాబీ సాధువు ఒకాయన కొన్ని రోజులుగా పంచవటిలో ఉంటున్నాడు.
చిన్న నరేంద్రుడికి నుదుట కంతి లేచింది. శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు పంచవటిలో అటూ ఇటూ నడుస్తున్నారు. చిన్న నరేంద్రుడితో ఇలా అన్నారు. “నువ్వు నీ కురుపును తీసివేయించుకో. అది ఉన్నది కంఠంలో కాదు కదా! నుదుటనే. అది ఏమంత పెద్దపని కాదులే. జనులు వృషణాల వాపును కూడా తీసివేయించుకుంటారు.” (నవ్వులు)
పంజాబీ సాధువు తోట బాటగుండా వెళుతున్నాడు. శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “నేను అతణ్ణి ఆకర్షించలేను. అతడిది జ్ఞాని వైఖరి. అతడు నాకు ఎండుకట్టెలా తోస్తున్నాడు.”
భక్తులతో శ్రీరామకృష్ణులు గదిలోకి తిరిగివచ్చారు. సంభాషణ శ్యామపద భట్టాచార్య వైపుకు మరలింది.
బలరామ్: శ్యామపదుడు ఇలా అన్నాడు: ‘శ్రీరామకృష్ణులు నరేంద్రుడి ఛాతీపై పాదం ఉంచినప్పుడు అతడికి భావావస్థ కలిగింది. కాని నాకు మాత్రం అలా కలగలేదు!’
శ్రీరామకృష్ణులు: అసలు సంగతి ఏమిటో చెప్పనా? మనస్సు కామినీ కాంచనాలపై మగ్నమై ఉన్నప్పుడు చెల్లాచెదరైన మనస్సును ఒకచోటకు ప్రోది చేయడం చాలా కష్టమైన పని. తాను వెళ్ళి పంచాయతీలు చెయ్యవలసి వస్తుందని పండితుడు నాతో అన్నాడు. పైగా, అతడికి తన పిల్లాజెల్లా గురించిన కలత కూడా ఉంది. కాని నరేంద్రుడు మొదలైనవారి మనస్సులు ఆ విధంగా చెల్లాచెదరవ లేదు. వారిలోకి ఇంకా కామినీకాంచనాలు ప్రవేశించలేదు. కాని శ్యామపదుడు సజ్జనుడు.
కాటోవాకు చెందిన వైష్ణవుడు శ్రీరామకృష్ణులను ఏదో అడుగుతున్నాడు. ఆ వైష్ణవుడిది మెల్లకన్ను.
44.10.1 పునర్జన్మ – మానవ జన్మ భగవత్ప్రాప్తి కొరకే
వైష్ణవుడు: మహాశయా! మళ్ళీ జన్మంటూ ఉంటుందంటారా?
శ్రీరామకృష్ణులు: మరణకాలంలో మనిషి ఎలాంటి ఆలోచనలతో దేహాన్ని వదిలిపెడతాడో మళ్ళీ అవే భావాలతో జన్మిస్తాడని గీత చెబుతోంది. భరత మహారాజు తన జింక గురించి యోచిస్తూ ప్రాణాలు వదలడంవల్ల మరుజన్మలో జింకగా పుట్టాడు.
వైష్ణవుడు: ఎవరైనా స్వయంగా చూసి చెబితే తప్ప నేను పునర్జన్మను విశ్వసించను.
శ్రీరామకృష్ణులు: దాని సంగతి ఏమిటో నాకు తెలియదు నాయనా! నేను నా రోగాన్నే నయం చేసుకోలేకపోతున్నాను. నువ్వేమో మరణానంతరం ఏమవుతుందని అడుగుతున్నావు?
“నువ్వు మాట్లాడేదంతా నీ అల్పబుద్ధిని సూచిస్తుంది. భగవంతుడి పట్ల భక్తిని అలవరచుకోవడం ఎలాగో ప్రయత్నించు. మనిషిగా జన్మించింది భక్తిని సంపాదించుకోవడానికే. మామిడి పళ్ళను తినడానికి తోటకు వచ్చావు. తోటలో కొమ్మలు ఎన్ని వేలు, ఆకులు ఎన్ని లక్షలు – వీటన్నిటిని తెలుసుకోవలసిన అవసరం ఏముంది? మరణించిన తరువాత ఏమవుతుందో తెలుసుకోవాలా?”
44.10.2 గిరీశ్, శ్రీరామకృష్ణులు – ‘నువ్వే పుర్ణబ్రహ్మానివి!
గిరీశ్ ఘోష్ ఒకరిద్దరు మిత్రులతో బండిలో వచ్చాడు. అతడు త్రాగి ఉన్నాడు, ఏడుస్తూనే గదిలోకి ప్రవేశించాడు. శ్రీరామకృష్ణుల పాదాలపై శిరస్సు వాల్చి ఏడ్వసాగాడు.
శ్రీరామకృష్ణులు ఆప్యాయంగా అతడి వీపు తట్టి ఒక భక్తుడితో ఇలా అన్నారు: “ఇతడికోసం హుక్కా సిద్ధం చేయవోయ్.”
గిరీశ్ తల పైకెత్తి చేతులు జోడించి ఇలా అన్నాడు: “నువ్వే పూర్ణబ్రహ్మానివి. అలా కానట్లయితే అంతా మిథ్యే, నిన్ను సేవించలేనందుకు నాకు ఎంతో వ్యధగా ఉన్నది.”
గిరీశ్ ఎంతటి ఉద్విగ్నతతో ఈ మాటలు పలికాడంటే, అది చూసి ఒకరిద్దరు భక్తలుకూడా ఏడ్వడం మొదలుపెట్టారు. గిరీశ్ కొనసాగించాడు: “ఓ భగవాన్, ఏడాదిపాటు నిన్ను సేవించేలా వరమివ్వు. ముక్తి ఎవడిక్కావాలి? అది ఎక్కడపడితే అక్కడ లభిస్తుంది. దానిమీద నేను ఉమ్మేస్తాను. ప్రభూ! చెప్పండి, నేను మిమ్మల్ని ఏడాదిపాటు సేవిస్తాను.”
శ్రీరామకృష్ణులు: ఇక్కడి వారు మంచివారు కారు. వారేమైనా అంటారు.
గిరీశ్: దాన్ని నేను లెక్క చేయను.మీరు
శ్రీరామకృష్ణులు: సరేలే. నీ ఇంటికి వచ్చినప్పుడు –
గిరీశ్: ఊహూ, అది కాదు. నేను మిమ్మల్ని ఇక్కడే సేవించుకోవాలి.
గిరీశ్ మొండిపట్టుదల చూసి శ్రీరామకృష్ణులు “సరేలే, అది భగవదేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది” అన్నారు. ఆయన వ్యాధిని ప్రస్తావిస్తూ గిరీశ్ “అయ్యా, ఇది నయమవుతుంది అని చెప్పండి. సరేలే, నేనే ఈ వ్యాధిని దులిపి వేస్తాను. కాళీ! కాళీ!” అన్నాడు.
శ్రీరామకృష్ణులు: నాకు దెబ్బతగిలేను సుమా!
“రోగం నయమైపోవు గాక!” అంటూ గిరీశ్ ఏదో మంత్రం వేస్తున్నట్లు చేతులు ఊపాడు. మళ్ళీ ఇలా అన్నాడు: “ఏమిటి, నయం కాలేదా? మీ పాద పద్మాలపట్ల నాకు ఒకింతైనా భక్తి ఉన్నట్లయితే ఈ రోగం నయమైపోవుగాక! చెప్పండి, నయమవాలని చెప్పండి.”
శ్రీరామకృష్ణులు (విసుగుతో): వెళ్ళవయ్యా, వెళ్ళు. నేను అలా చెప్పలేను. రోగం నయం చేయమని అమ్మతో నేను చెప్పజాలను.
“సరే, భగవదేచ్ఛ ఉన్నట్లయితే నయమైపోతుందిలే.”
గిరీశ్: ఆహా, మీ మాటలు నా వద్దా? అంతా మీ ఇచ్ఛ మీదనే ఆధారపడి ఉంది.
శ్రీరామకృష్ణులు: ఛీ! అలాంటి మాటలు మాట్లాడరాదు. భక్తవత్ న చ కృష్ణవత్ (అంటే నన్ను నేను కృష్ణుడి భక్తుడిగా భావించుకుంటాను కాని కృష్ణుడిగా కాదు) –నీకెలా అనిపిస్తే అలా భావించుకో. నీ గురువును నువ్వు భగవంతుడిగా భావించుకోవచ్చు. కాని అలా మాట్లాడటం మాత్రం తప్పు. ఆ విధంగా మాట్లాడరాదు.
గిరీశ్: ఈ జబ్బు నయమవాలని చెప్పండి.
శ్రీరామకృష్ణులు: మంచిది, అది నీకు సంతోషమైతే.
గిరీశ్ ఇంకా త్రాగుడు మైకంలోనే ఉన్నాడు. మధ్యమధ్యలో శ్రీరామకృష్ణులతో ఇలా అంటున్నాడు: “అయ్యా ఈసారి మీరు దివ్యరూపంలో ఎందుకు జన్మించలేదు?” కాసేపటి తరువాత “ఈసారి వంగదేశం ఉద్ధరించబడుతుంది” అన్నాడు. ఒక భక్తుడు తనలో తాను ఇలా అనుకున్నాడు: ‘వంగదేశం మాత్రమే ఎందుకు? యావత్ ప్రపంచం ఉద్ధరింపబడుతుంది.’
తరువాత గిరీశ్ భక్తులనందరినీ ఉద్దేశిస్తూ ఇలా అన్నాడు: “ఈయన ఇక్కడ ఎందుకు ఉన్నారో తెలుసా? జీవుల దుఃఖాలను చూసి ద్రవించిపోయి వారిని ఉద్ధరించడానికి వచ్చారు.”
బండివాడు గిరీశ్ఘోష్ను పిలుస్తున్నాడు. గిరీశ్ లేచి బండివాడి వద్దకు వెళ్ళసాగాడు. శ్రీరామకృష్ణులు, ‘మ’ తో “నువ్వు కూడా వెంటవెళ్ళి ఎక్కడకు వెళుతున్నాడో చూడు. బండివాడిని కొట్టడమైతే చేయడు కదా!” అన్నారు. ‘మ’ లేచి గిరీశ్ వెంట వెళ్లాడు.
కాసేపటి తరువాత గిరీశ్ తిరిగి వచ్చి శ్రీరామకృష్ణులను ఇలా ప్రార్థించసాగాడు: “ఓ భగవాన్! ఎన్నడూ లేశమాత్రమైనా పాపచింతన అనేది లేకుండా నాకు పవిత్రత నివ్వు.”
శ్రీరామకృష్ణులు: నువ్వు పవిత్రుడివే కదా! నీకు ఎంతటి భక్తి విశ్వాసాలు ఉన్నాయని! నువ్వు ఆనందంగా ఉంటున్నావు, కాదంటావా?
గిరీశ్: లేదండీ, మనస్సు బాగోలేదు. అశాంతితో నిండి ఉంది. అందుకే తప్ప త్రాగాను.
కాసేపటి తరువాత గిరీశ్ మళ్ళీ ఇలా అన్నాడు: “భగవాన్! ఆఖరికి నేను కూడా పూర్ణబ్రహ్మ భగవంతుణ్ణి సేవిస్తున్నందుకు ఆశ్చర్యంగా ఉంది. నేనంతటి తపస్సు ఏం చేశానని నాకు మిమ్మల్ని సేవించే భాగ్యం లభించింది.”
శ్రీరామకృష్ణులు మధ్యాహ్న భోజనం ఆరగించారు. వ్యాధి కారణంగా స్వల్పంగా మాత్రమే పుచ్చుకొన్నారు. శ్రీరామకృష్ణుల మనస్సు సర్వదా భావావస్థలో విహరిస్తూ ఉంటుంది. ఎంతో ప్రయత్నంమీద ఆయన దేహాన్ని గుర్తించగలిగే స్థాయికి తమ మనస్సును తీసుకువస్తారు. కాని పసిపిల్లవాడిలా ఆయన కూడా దేహాన్ని సంరక్షించుకోలేరు. పసిపిల్లవాడిలా ఆయన ఇలా అన్నారు: “కొద్దిగా తిన్నాను, ఇప్పుడు కాసేపు విశ్రమిస్తాను. మీరు బయటకు వెళ్ళి కూర్చోండి.” ఇలా పలికి ఆయన కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. తరువాత భక్తులు గదిలోకి తిరిగి వచ్చారు.
44.10.3 గురువు, ఇష్టదైవం
గిరీశ్: గురువు – ఇష్టదైవం. నాకు గురురూపం బాగా నచ్చుతుంది. అసలు భయపడను.అయితే భావావస్థను చూస్తే మాత్రం ఆమడదూరం పరుగుపెడతాను. భావావస్థను చూస్తే భయం వేస్తుంది.
శ్రీరామకృష్ణులు: ఎవరైతే ఇష్టదైవమో ఆయనే గురురూపంలో వస్తాడు. శవసాధన అనంతరం ఇష్టదైవాన్ని దర్శించినప్పుడు గురువే స్వయంగా అగుపడి శిష్యుడికి ఇష్టదైవాన్ని చూపుతూ అతడితో “ఇదే అది” అంటాడు. ఈ విధంగా పలుకుతూ గురువు ఇష్టదైవంలో లీనమైపోతాడు. అటుపైన శిష్యుడు గురువును మరిచూడజాలడు. పూర్ణజ్ఞానం కలిగినప్పుడు మరి గురువు ఎవరు, శిష్యుడు ఎవరు? అదే సందిగ్ధ పరిస్థితిని సృష్టిస్తుంది. అక్కడ గురుశిష్యులు ఒకరి నొకరు చూసుకోరు.
ఒక భక్తుడు: గురువు శిరస్సు, శిష్యుడు పాదాలు.
గిరీశ్ (ఆనందంతో): అవునవును.
నవగోపాల్: దీని అర్థం వినండి. శిష్యుడి శిరస్సు గురువుకు చెందినది. గురువు పాదాలు శిష్యుడికి చెందుతాయి. ఏమంటావ్?
గిరీశ్: అదికాదు దాని అర్థం. తండ్రి భుజాలమీద కుమారుడు కూర్చోడా ఏమిటి? అందుకే శిష్యుడికి పాదాలు అని ప్రస్తావించబడింది.
నవగోపాల్: కాని అప్పుడు శిష్యుడు కూడా పసిపిల్లవాడిలా భావించుకోవాలి.
44.10.4 రెండు రకాల భక్తులు : ‘పిల్లి పిల్ల’, ‘కోతి పిల్ల’
శ్రీరామకృష్ణులు: భక్తులు రెండు రకాలుగా ఉంటారు. ఒక రకం వారు పిల్లి కూనల స్వభావాన్ని కలిగి ఉంటారు. పిల్లికూన తన తల్లిమీదే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. తల్లి తన్ను తన ఇష్టం వచ్చినట్లు చూసుకోనీ అనే ఉద్దేశంతో పిల్లికూన కేవలం ‘మ్యావ్, మ్యావ్’ అని మాత్రమే అంటుంది. ఎక్కడకు వెళ్ళాలి, ఏం చేయాలి – ఈ విషయాలేవీ దానికి తెలియవు. తల్లి దాన్ని ఒక్కోసారి పొయ్యిదగ్గర పడేస్తుంది. మరోసారి ప్రక్కమీద ఉంచుతుంది. అదే విధంగా భక్తుడు కూడా భగవంతుడికి ముఖ్త్యారునామా ఇచ్చివేస్తాడు. ముఖ్త్యారునామా నిచ్చి నిశ్చింతగా ఉంటాడు.
“సిక్కులు ఒకసారి ‘భగవంతుడు దయాళువు’ అన్నారు. నేను వారితో ఇలా అన్నాను: ‘భగవంతుడు మనకు తల్లీ తండ్రీ. మరి ఆయన్ను దయాళువు అనడం ఏమిటి? బిడ్డకు జన్మనిచ్చాక తల్లితండ్రులు అతడి ఆలనా పాలనా చూడరా? లేకుంటే బ్రాహ్మణపేటలోని వారు వచ్చి పిల్లవాడి బాగోగులు చూస్తారా ఏమిటి?’ ఈ రకానికి చెందిన భక్తులకు భగవంతుడే మనకు తల్లి, తండ్రి అని యథార్థ విశ్వాసం ఉంటుంది.
“మరో రకం భక్తులు ఉన్నారు. వారి స్వభావం కోతిపిల్లలాంటిది. కోతిపిల్ల తానే స్వయంగా ఏదో విధంగా తల్లిని పట్టుకొని ఉంటుంది. ఈ రకానికి చెందిన భక్తులకు కొద్దిగా కర్తృత్వ భావన ఉంటుంది. వారి భావం ఇలా ఉంటుంది: ‘నేను తీర్థయాత్రలు చేయాలి, జపతపాలు అనుష్ఠించాలి, షోడశోపచార పూజలు చేయాలి. అప్పుడే భగవంతుణ్ణి పొందగలను.’
“రెండు రకాలవారూ భక్తులే. (భక్తులతో) మీరు ఎంతగా ముందుకు పోతే అంతగా భగవంతుడే సర్వమూ అయివున్నట్లు, సమస్తమూ ఆయనే చేస్తున్నట్లు గాంచగలరు. గురుమా ఆయనే, ఇష్టదైవమూ ఆయనే. భక్తి జ్ఞానాలన్నిటినీ ఇచ్చేది ఆయనే.
“ముందుకు వెళ్ళేకొద్దీ చందన వనాలకు ఆవల కూడా ఎన్నో వస్తువులు ఉన్నట్లు చూడగలరు – వెండి గనులు, బంగారు గనులు, మణిమాణిక్యాలు. అందుకే ముందుకు వెళ్ళండి.
“కాని ముందుకు వెళ్ళమని జనానికి ఎలా చెప్పగలను? గృహస్థులు ఎక్కువగా ముందుకు వెళ్ళేకొద్దీ వారికి సంసారం అంటూ ఏమీ నిలవదు. కేశవ్సేన్ ఉపాసన చేసేటప్పుడు ‘ఓ భగవంతుడా, నన్ను నీ భక్తివాహినిలో మునిగిపోయేలా చెయ్యి’ అన్నాడు. ఉపాసన పూర్తయ్యాక నేను కేశవ్‌తో ఇలా అన్నాను: ‘ఏమయ్యా, నువ్వు భక్తివాహినిలో పూర్తిగా ఎలా మునిగిపోగలవు? అలా మునిగిపోతే తెర వెనుక కూర్చున్నవారి (ఇంటి స్త్రీల) పరిస్థితి ఏమిటి? కాని ఒక పని చెయ్యి – మధ్యమధ్యలో మునకవేస్తూ ఉండు, మళ్ళీ ఒడ్డుకు వస్తూ ఉండు.’” (అందరూ నవ్వారు.)
44.10.5 వాదప్రతివాదాలు వ్యర్థం -సాధన, వ్యాకులతలే ప్రధానం
కాటోవా బ్రాహ్మణుడు ఏదో వాదిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు అతడితో ఇలా అన్నారు: “నువ్వు ఈ విధంగా చిటపటలాడటం వదిలిపెట్టు. వెన్న కాస్తూ ఉన్నప్పుడు మొదట ఆ శబ్దం వస్తుంది.
“ఒక్కసారి భగవదానందాన్ని చవిచూస్తే వాదప్రతివాదాలపట్ల మోజు సమసిపోతుంది. మధుపానంలోని ఆనందం పొందాక భ్రమరం మరి రొద చెయ్యదు. పుస్తకాలు చదివి అనేక విషయాలు ఉదాహరించడం వల్ల ప్రయోజనం ఏమిటి? పండితులు ‘శీర్ణా గోకులమండలీ’ అంటూ ఎన్ని శ్లోకాలు వల్లె వేస్తుంటారని?’
“ఊరకే ‘భంగు, భంగు’ అని నోటితో పలకడం వల్ల ఏమవుతుంది? దాన్ని నోట్లో వేసుకొని పుక్కిలించినా కూడా ఏమీ కాదు. అది కడుపులోకి పోవాలి. అప్పుడే మత్తు కలుగుతుంది. ఏకాంత ప్రదేశంలో భగవంతుణ్ణి వ్యాకుల చిత్తంతో ప్రార్థించనిదే ఈ విషయాలన్నిటినీ అవగతం చేసుకోలేరు.”
శ్రీరామకృష్ణులను పరీక్షింప డాక్టర్ రాఖాల్ వచ్చారు. ఆయన డాక్టరుతో, “రండి, కూర్చోండి” అంటూ మర్యాదలు చేస్తూ ఇబ్బంది పడిపోయారు.
వైష్ణవుడి తోటి సంభాషణ కొనసాగింది.
శ్రీరామకృష్ణులు: మనిషి – మాన్, హోశ్ (పరువు, అప్రమత్తతలు) – ఎవరికైతే చైతన్యం కలుగుతుందో అతడే పరువు, అప్రమత్తతలు కలిగివుంటాడు. చైతన్యం కలుగనిదే మనుష్యజన్మ వ్యర్థం.
44.10.6 భగవత్సాక్షాత్కారానికి మార్గాలు – సత్యం, శరణాగతి, మాతృభావం
“కామార్పుకూర్లో బానపొట్టలతో బుర్ర మీసాలు ఉన్న వ్యక్తులు అనేకులు ఉన్నారు. అయితే వివాదాలు తీర్చే నిమిత్తం ఊరివారు పది క్రోసుల దూరం నుండి ధర్మవర్తనులను పల్లకీలలో ఎందుకు తీసుకువస్తారు? వారు ధర్మపరాయణులు, సత్యనిష్ఠ కలవారు కాబట్టి. ఊరివారు వట్టి పండితులను తీసుకురారు.
“కలియుగానికి సత్యం పలకడం తపస్సు. ‘సత్యం పలకడం, భగవంతుని పట్ల శరణాగతి, పరస్త్రీలను తల్లిగా భావించడం’ – ఇవన్నీ భగవత్సాక్షాత్కారానికి మార్గాలు.”
శ్రీరామకృష్ణులు బాలుడిలా డాక్టరుతో, “అయ్యా, దీన్ని నయం చేయండి” అన్నారు.
డాక్టర్: నేను నయం చేయగలనంటారా?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): డాక్టరు కూడా స్వయంగా నారాయణుడే. నేను అందరినీ గౌరవిస్తాను. అందరినీ నారాయణులుగానే భావించినట్లయితే, మరి నేను మౌనం వహించాలని నువ్వు అనవచ్చు. కాని నేను ‘మావటి నారాయణుడి’ పలుకులను అంగీకరిస్తాను.
“శుద్ధ మనస్సు, శుద్ధ ఆత్మలు రెండూ ఒక్కటే. శుద్ధమనస్సులో మెదలేదంతా భగవద్వాణియే. భగవంతుడు ఒక్కడే మావటి నారాయణుడు.
“భగవంతుడి మాటలను నేనెందుకు వినాలి? ఆయనే కర్త. ఆయన ఈ ‘నేను’ ను నిలిపినంత కాలం ఆయన ఆదేశాలను విని అందుకు తగ్గట్టు నడుచుకోవాలి.”
ప్రస్తుతం డాక్టరు, శ్రీరామకృష్ణుల కంఠాన్ని పరీక్షించనున్నాడు. శ్రీరామకృష్ణులు డాక్టరుతో ఇలా అన్నారు: “డా ॥ మహేంద్ర సర్కార్ నా నాలుకను ఆవు నాలుకను అదిమినట్లు అదిమిపట్టాడు.” ఆయన మళ్ళీ చిన్న పిల్లవాడిలా డాక్టర్‌తో “అయ్యా, అయ్యా, మీరు దీన్ని బాగు చెయ్యండి!” పిదప లారింగో స్కోపును (స్వరపేటికను పరీక్షించే అద్దపు పరికరం) చూసి నవ్వుతూ “అర్థమయింది. దీనిలో ప్రతిబింబాన్ని చూస్తారు కదా!” అన్నారు.
తరువాత నరేంద్రుడు పాడాడు. కాని శ్రీరామకృష్ణుల జబ్బు కారణంగా ఎక్కువసేపు పాడలేదు.
44.11 ఏకాదశ పరిచ్ఛేదం డా ॥ భగవాన్ రుద్ర – శ్రీరామకృష్ణులు
బుధవారం, సెప్టెంబరు 2
మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు చిన్న మంచంమీద కూర్చుని డా ॥ భగవాన్ రుద్ర, ‘మ’ లతో మాట్లాడుతున్నారు. గదిలో రాఖాల్, లాటూ తదితరులు ఉన్నారు. శ్రీరామకృష్ణులు జబ్బు గురించి డాక్టరు ఆసాంతం విన్నాడు. పిదప శ్రీరామకృష్ణులు మంచం మీదనుండి క్రిందకు దిగి డాక్టర్ ప్రక్కన నేల మీద కూర్చున్నారు.
శ్రీరామకృష్ణులు: చూడవయ్యా, నా దేహస్వభావం భిన్నమైనది. ఔషధం ఒంటబట్టదు.
“అది సరే, దీనిగురించి నీ అభిప్రాయమేమిటి? ఒక నాణేన్ని తాకగానే నా చేయి కొంకర్లు తిరిగిపోతుంది. శ్వాస ఆగిపోతుంది. పైగా నేను ధోవతికి ముడి వేసుకున్నట్లయితే (డబ్బు ఉంచడానికి వేసుకొనే ముడిలాంటిది), ఆ ముడి విప్పనంతవరకు శ్వాస ఆగిపోతుంది.”
ఇలా పలికి శ్రీరామకృష్ణులు ఒక భక్తుడితో ఒక రూపాయి నాణేన్ని తీసుకురమ్మని చెప్పారు. శ్రీరామకృష్ణుల చేతిలో నాణెం పెట్టగానే చేయి వంకర్లు తిరిగిపోతుంది, ఊపిరి ఆగిపోయింది. చేతిలో నుండి నాణెం తీసివేశాక ఆయన మూడుసార్లు గాఢంగా ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు ఆయన చెయ్యి మళ్ళీ మామూలుగా అయింది. ఇదంతా చూస్తూ డాక్టరు నివ్వెరపోయాడు. ‘మ’ తో “Action on the nerves (నరాల మీద ప్రభావం చూపుతోంది)” అన్నాడు.
శ్రీరామకృష్ణులు (డాక్టరుతో): నాకు మరో స్థితికూడా కలుగుతుంది. నేను దేన్నీ కూడబెట్టలేను. ఒకసారి శంభుమల్లిక్ తోటకు వెళ్ళాను. అప్పుడు ఉదర వ్యాధితో ఎంతగానో బాధపడుతూండేవాడిని. ‘అప్పుడప్పుడు కొద్దికొద్దిగా నల్ల మందు పుచ్చుకుంటే వ్యాధి తగ్గిపోతుంది’ అన్నాడు శంభు. ఇలా అంటూ అతడు నా ధోవతి అంచున కొద్దిగా నల్లమందు పెట్టి ముడివేశాడు. నేను తిరిగి వచ్చేటప్పుడు, అదేమిటో కాని ముఖద్వారం వద్ద కళ్ళు తిరగసాగాయి. ఎంతగా వెదకినప్పటికీ దారి కనబడటం లేదు. అప్పుడు నల్లమందును పారేశాక మళ్ళీ నాకు మామూలు స్థితి కలిగింది. అప్పుడు తోటనుండి తిరిగి వచ్చేశాను.
“కామార్పుకూర్లో ఒకసారి నేను మామిడిపళ్ళను కోసి తీసుకువస్తున్నాను. కాని నడవలేకపోయాను, అలాగే నిలబడిపోయాను. ఆ పళ్లను ఒక గోతిలో పడేశాకనే కదలగలిగాను. అది సరే, దీని గురించి ఏమంటావు?”
డాక్టరు: దీనికి వెనకాల ఒక విశేష శక్తి ఉండాలి – మనశ్శక్తి.
‘మ’ : ఈయన (శ్రీరామకృష్ణులు) దాన్ని భగవంతుడి శక్తి అంటారు. మీరు మనశ్శక్తి అంటున్నారు.
శ్రీరామకృష్ణులు (డాక్టర్‌తో): నాకు ఒక్కోసారి మరో స్థితికూడా కలుగుతూ ఉంటుంది. ఎవరైనా ‘బాగయిపోయింది’ అంటే చాలు, వెంటనే నాకు చాలా వరకు బాగయిపోయినట్లు తోచేది. ఆ మధ్యన ఒకసారి బ్రాహ్మణి నాతో ‘వ్యాధి సగం వరకు తగ్గిపోయింది’ అన్నది. వెంటనే నేను నాట్యం చేయసాగాను.”
డాక్టరు స్వభావాన్ని చూసి శ్రీరామకృష్ణలు సంతుష్ణులయ్యారు. అతడితో ఇలా అన్నారు: “నీ స్వభావం మంచిది. జ్ఞానానికి రెండు గుర్తులుంటాయి. శాంత స్వభావం, అహంకారరాహిత్యం.”
‘మ’ : ఈయనకు (డాక్టరుకు) సతీవియోగం సంభవించింది.
శ్రీరామకృష్ణులు (డాక్టరుతో): ఈ మూడు రకాల ఆకర్షణలు ఏకమై, ఆ ఆకర్షణ భగవంతుడిపట్ల కలిగితే ఆయన లభ్యమవుతాడు. అవి తల్లికి బిడ్డపట్ల ఉన్న ఆకర్షణ, పతివ్రతకు భర్తపట్ల ఉన్న ఆకర్షణ, లౌకిక వ్యక్తికి ప్రాపంచిక వస్తువుల పట్ల ఉన్న ఆకర్షణ. ఏది ఏమైనా నా రోగాన్ని నయం చెయ్యి బాబూ!
డాక్టరు శ్రీరామకృష్ణుల కంఠాన్ని పరీక్షించనున్నాడు. శ్రీరామకృష్ణులు పశ్చిమంగా ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలో కుర్చీ మీద కూర్చుని ఉన్నారు. డా ॥ సర్కార్ గురించి ప్రస్తావిస్తూ ఆయన “వెధవది! ఆవు నాలుకను నొక్కినట్టు నొక్కివేశాడనుకో” అన్నారు.
డాక్టరు: కావాలని చేసుండడు లెండి.
శ్రీరామకృష్ణులు: ఆ, బాగా పరీక్షించాలనే ఉద్దేశంతోనే అతడు అలా నొక్కేశాడు.
44.12 ద్వాదశ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల అనారోగ్యం – కీర్తనలు, నృత్యం
ఆదివారం, సెప్టెంబర్ 20, 1885
శ్రీరామకృష్ణులు భక్తపరివేష్టితులై గదిలో కూర్చున్నారు. నవగోపాల్, హరలాల్, రాఖాల్, లాటూ తదితరులు అక్కడ ఉన్నారు. కీర్తనలను గానం చేసే గోస్వామి ఒకాయన కూడా అక్కడ ఉన్నారు.
‘మ’ బౌబజార్‌కు చెందిన డా ॥ రాఖాల్ను వెంటబెట్టుకొని వచ్చాడు. డాక్టరు శ్రీరామకృష్ణులను పరీక్షించసాగాడు. డాక్టరు చేతివ్రేళ్ళు కాస్త మందంగా ఉన్నాయి.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ, డాక్టరుతో): నీ వ్రేళ్ళు కుస్తీ పట్టేవారి వ్రేళ్ళలా ఉన్నాయి. నన్ను మహేంద్ర సర్కార్ కూడా పరీక్ష చేశాడు. అతడు నా నాలుకను ఎంత గట్టిగా నొక్కాడంటే, ఆవు నాలుకను నొక్కినట్టు నొక్కాడనుకో! బాగా నొప్పి వేసింది.
డాక్టర్: నేను మీకు నొప్పి కలుగకుండా పరీక్షిస్తానులెండి.
44.12.1 శ్రీరామకృష్ణుల రోగం ఎందుకు?
డాక్టర్ పరీక్షించడం పూర్తి చేశాక శ్రీరామకృష్ణులు మళ్ళీ సంభాషించసాగారు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): ఈయన ఇంత పెద్ద సాధువు అయివుండి కూడా ఇలా వ్యాధితో బాధ పడుతున్నారెందుకని జనులు అడుగుతుంటారు.
తారక్: భగవాన్‌దాస్ బాబాజీ రోగగ్రస్తుడై చాలా రోజుల పాటు మంచంపట్టి ఉండేవాడండి.
శ్రీరామకృష్ణులు: అయితే మధు డాక్టరు సంగతి చూడు. అరవై ఏళ్ళ వయస్సులో కూడా ఆతడు తన ఉంపుడుగత్తె కోసం భోజనం పట్టుకెళ్తాడు. అయినప్పటికీ అతడికి ఏ రోగమూ రాలేదు.
గోస్వామి: అయ్యా, మీకు కలిగిన వ్యాధి ఇతరుల కోసమే. మీ దగ్గరకు వచ్చే వారి పాపాలను మీరు భరించవలసి ఉంటుంది. వారి పాపాలను మీరు స్వీకరించడం మూలానే మీకు ఈ వ్యాధి సంక్రమించింది.
ఒక భక్తుడు: ‘అమ్మా, ఈ రోగం నయం చెయ్యి’ అని గనుక మీరు అమ్మను ప్రార్థిస్తే మీ రోగం శీఘ్రంగా నయమైపోతుంది.
44.12.2 ఎంత వెదికినా ‘నేను’ అనేది కనిపించడమే లేదు
శ్రీరామకృష్ణులు: రోగం నయం చెయ్యమని నేను ప్రార్థించజాలను. పైగా, ప్రస్తుతం సేవ్యసేవక భావం నాలో తగ్గిపోతోంది. ఒక్కోసారి ‘అమ్మా, కత్తి ఒరను (తమ దేహాన్ని ప్రస్తావిస్తూ) కొద్దిగా మరమ్మత్తు చెయ్యి’ అంటుంటాను. కాని అలాంటి ప్రార్థనలు తగ్గిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో ఎంతగా వెదకినా సరే ‘నేను’ అనేది కనిపించడమే లేదు. భగవంతుడే ఈ ‘ఒర’ లో వసిస్తున్నట్లుగా గాంచుతున్నాను.
కీర్తనలు గానం చేసే నిమిత్తం గోస్వామి ఆహ్వానింపబడ్డాడు. “కీర్తనలు ఉండవా?” అని ఒక భక్తుడు అడిగాడు. కీర్తనల కారణంగా శ్రీరామకృష్ణులు భావావస్థకు లోనయితే వ్యాధి ప్రకోపిస్తుందేమోనని భక్తుల ఆదుర్దా.
శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “కాసేపు కీర్తనలు అవనివ్వండి. నేను భావావస్థలోకి వెళ్తానేమోనని భక్తుల భయం. భావం కలిగితే అది కంఠానికి చెరుపు కలిగిస్తుంది.”
గోస్వామి కీర్తనలు ప్రారంభించాడు. శ్రీరామకృష్ణులు తమ్ము తాము సంబాళించుకోలేకపోయారు. లేచి నిలబడి భక్తులతో కలిసి నాట్యం చేయసాగారు. ఈ మొత్తం సన్నివేశాన్నంతా డా ॥ రాఖాల్ మౌనంగా చూశాడు.
డాక్టర్ కోసం బాడుగ బండి ఒకటి వేచి ఉంది. డాక్టరు, ‘మ’ లు కలకత్తాకు బయలుదేరనున్నారు. వారిద్దరు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశారు. ఆయన ‘మ’ తో ఆప్యాయంగా “నువ్వు భోజనం చేశావా?” అని అడిగారు.
44.12.3 దేహం కేవలం తొడుగు మాత్రమే!
గురువారం, సెప్టెంబర్ 24, 1885
పౌర్ణమి రాత్రి. శ్రీరామకృష్ణులు చిన్నమంచం మీద కూర్చుని ఉన్నారు. ఆయనకు ఎంతో అస్వస్థతగా ఉంది. ‘మ’ తదితర భక్తులు నేలమీద కూర్చుని ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): అప్పుడప్పుడు, ఈ దేహం కేవలం తొడుగు లాంటిదేనని నాకు అనిపిస్తుంటుంది. ఇందులో ఆ అఖండ సచ్చిదానందుడు మినహా మరేమీ లేదు. భావావస్థలోకి వెళ్ళినప్పుడు ఈ కంఠరోగం (నా నుండి తొలగి) ఒక వైపున పడి ఉంటుంది. ప్రస్తుతం నాకు కొద్దికొద్దిగా ఆ భావం కలుగుతోంది. నవ్వు వస్తోంది.
ద్విజుడి ఇంటికి చెందిన స్త్రీలు కొందరు వచ్చారు. వారు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఒక మూల కూర్చున్నారు. వారిలో ఒకరిని చూపుతూ శ్రీరామకృష్ణులు “ఎవరీమె? ద్విజుణ్ణి పెంచింది ఈమేనా? ద్విజుడు ఏక్తారా (ఒంటి తీగ సితారా) ఎందుకు కొన్నాడు?” అని అడిగారు.
‘మ’ : దానికి రెండు తీగలు ఉన్నాయండి.
శ్రీరామకృష్ణులు: ద్విజుడి తండ్రి ద్విజుడి అభిప్రాయాలను అంగీకరించడు. తక్కినవారు ద్విజుణ్ణి విమర్శించవచ్చు. అందుకే ద్విజుడు గోప్యంగా భగవంతుణ్ణి ప్రార్థించడం మంచిది.
శ్రీరామకృష్ణుల గదిలో గౌరాంగుడు, నితాయిల చిత్రపటం ఒకటి గోడకు వ్రేలాడుతోంది. వారిద్దరు తమ సహచరులతో కలిసి నవద్వీపంలో సంకీర్తనలు చేస్తున్న దృశ్యం అది.
రామ్‌లాల్ (శ్రీరామకృష్ణులతో): ఈ చిత్రపటాన్ని నేను ఈయనకు (‘మ’ కు) ఇవ్వనా?
శ్రీరామకృష్ణులు: ఆ.
శ్రీరామకృష్ణులు కొన్ని రోజులుగా డా ॥ ప్రతాప్ ఔషధం పుచ్చుకుంటున్నారు. ఆయన అర్ధరాత్రి లేచి ఎంతో అశాంతికి లోనయ్యారు. ఆయనకు సేవ చేస్తున్న హరీశ్ అదే గదిలో ఉన్నాడు. రాఖాల్ కూడా ఉన్నాడు. రామ్‌లాల్ వసారాలో పడుకొని ఉన్నాడు. తదనంతరం శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “నేను ఎంతో అశాంతికి లోనయ్యాను. హరీశ్‌ను ఆలింగనం చేసుకుందామనుకున్నాను. నా తలమీద ఔషధతైలం రాసేసరికి సర్దుకొన్నాను. పిదప నేను నాట్యం చేయసాగాను.”