42.1 ప్రథమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు – పూర్ణుడు, చిన్న నరేంద్రుడు, గోపాల్-మా
సోమవారం, జూలై 13, 1885
శ్రీరామకృష్ణులు బలరామ్బోసు ఇంటి అతిథుల గదిలో భక్తులతో పాటు ఆసీనులై ఉన్నారు. అప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటలు కావస్తోంది. మర్నాడు పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర దినోత్సవం. ఆ సందర్భంగా బలరామ్ తన ఇంట్లో ఉత్సవం జరుపనున్నాడు. అతడి ఇంట్లో జగన్నాథస్వామికి నిత్యపూజలు జరుగుతాయి; రథయాత్ర నిర్వహించే నిమిత్తం ఇంట్లో ఒక చిన్న రథం కూడా ఉంది. రథయాత్ర నాడు దాన్ని ఇంటి వసారాలో తిప్పుతాడు. ఈ ఉత్సవం కోసం బలరామ్ శ్రీరామకృష్ణులను ప్రత్యేకంగా ఆహ్వానించాడు.
శ్రీరామకృష్ణులు ‘మ’ తో మాట్లాడుతున్నారు. నారాయణ్, తేజచంద్ర, బలరామ్ తదితర భక్తులు పలువురు గదిలో ఉన్నారు. సంభాషణ పూర్ణుడి గురించి నడుస్తోంది. పూర్ణుడు పదిహేనేళ్ల బాలుడు. అతణ్ణి చూడాలని శ్రీరామకృష్ణులు ఎంతగానో ఆరాటపడుతున్నారు.
42.1.1 పూర్ణుని గురించి సంభాషణ
శ్రీరామకృష్ణులు(‘మ’ తో): అది సరే కాని పూర్ణుడు నన్ను చూడడానికి ఏ వీథి గుండా వస్తాడు? అతణ్ణి ద్విజుడికి పరిచయం చెయ్యి. సమ వయస్కులైన ఇద్దరు వ్యక్తులు ఒకే స్వభావం కలిగినవారైతే నేను వారిని కలుసుకునేలా చేస్తాను. దీన్లో ఒక అంతరార్థం ఉంది. అలా చేయడం ద్వారా ఇద్దరూ ఉన్నతి నొందుతారు. భగవంతుడి కోసం పూర్ణుడు ఎంతగా ఆరాటపడతాడో చూశావు కదా!
‘మ’ : అవునండీ. ఒక రోజు నేను ట్రామ్‌లో పోతూన్నప్పుడు పూర్ణుడు నన్ను చూసి ఇంటి డాబాపై నుండి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అమితోత్సాహంతో నాకు నమస్కారం చేశాడు.
శ్రీరామకృష్ణులు: ఆహా! ఆహా! అలా ఎందుకు చేశాడో తెలుసా? అతడు పరమగమ్యాన్ని చేరటానికి తోడ్పడేలా నువ్వు అతడికి నాతో పరిచయం కల్పించావు కాబట్టి. భగవంతుడి కోసం వ్యాకులత లేకుండా అలా చేయజాలడు.
“నరేంద్రుడు, చిన్న నరేంద్రుడు, పూర్ణుడు – వీరు ముగ్గురూ పురుష స్వభావం కలవారు.కాని భవనాథ్ సంగతి వేరు. అతడిది ప్రకృతి (స్త్రీ) స్వభావం.
“పూర్ణుడు ఉన్న స్థితి ఎలాంటిదంటే, ఆ స్థితిలో అతడు త్వరలోనే దేహత్యాగం చేయవచ్చు; భగవత్సాక్షాత్కారానంతరం దేహం నిష్ప్రయోజనం. లేకుంటే కొన్ని రోజులలోనే అతడి ఆంతరంగిక స్వభావం ఉద్ధృతంగా బహిర్గతమవుతుంది.
“పూర్ణుడు దైవీ స్వభావి, దేవతా లక్షణాలున్నవాడు. అందువల్ల జనులంటే భయం తక్కువగా ఉంటుంది. కంఠంలో మాల వేయడమో లేక శరీరానికి చందనం పూయడమో లేక ఎదురుగా ధూపం వేయడమో చేస్తే అతడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు నారాయణుడే లోన ఉన్నట్లు, నారాయణుడే దేహధారణ చేసినట్లు అతడు యథార్థంగా తెలుసుకుంటాడు.
“దక్షిణేశ్వరంలో నాకు మొదటిసారి భగవదనుభూతి కలిగిన పిదప కొన్ని రోజులకు, ఉన్నత కుటుంబానికి చెందిన బ్రాహ్మణ స్త్రీ ఒకామె వచ్చింది. సుగుణాల రాశి! కంఠంలో మాలవేసి ఎదుట ధూపం వేయగానే ఆమె సమాధి స్థితి పొందింది. కొన్ని క్షణాల తరువాత ఆమె కళ్ళ నుండి పరమానందాశ్రువులు జాలువారాయి. అప్పుడు నేను ఆమెకు ప్రణామం చేసి ‘అమ్మా, నేను సాధించగలనా?’ అని అడిగాను. ఆమె ‘ఆ’ అంది.
అందుకే నాకు మరోసారి పూర్ణుణ్ణి చూడాలని ఉంది. కాని అతణ్ణి చూడటం సాధ్యపడటం లేదే! అతడు భగవంతుడి కళగా తోస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం! కేవలం అంశమాత్రమే కాదు, కళ సుమా! పైగా ఎన్ని తెలివితేటలని! చదువుల్లో కూడా మేటియేనట. అందుకే నేను సరిగ్గా అర్థం చేసుకున్నాను.
42.1.2 తపశ్శక్తితో భగవంతుణ్ణి సంతానంగా పొందవచ్చు – రంజిత్ రాయ్ కుమార్తెగా జగజ్జనని
“తపశ్శక్తితో నారాయణుణ్ణి పుత్రుడిగా పొందవచ్చు. కామార్పుకూర్కు వెళ్ళేదారిలో, రహదారి ప్రక్కన రంజిత్ రాయ్‌కు చెందిన పెద్ద కొలను ఒకటి ఉంది. రంజిత్ రాయ్ ఇంట్లో జగజ్జనని అతడి కుమార్తెగా జన్మించింది. ఆమె గౌరవార్థం ఇప్పుడు కూడా అక్కడ చైత్రమాసంలో జాతర జరుగుతుంది. అక్కడకు వెళ్ళాలని నాకు ఎంతో కోరికగా ఉంది.
“రంజిత్రాయ్ అక్కడి జమీందారు. తపశ్శక్తి ద్వారా జగజ్జననిని కుమార్తెగా పొందాడు. కుమార్తె అంటే అతడికి ఎంతో అనురాగం. ఆమె కూడా ఎప్పుడూ తండ్రినే అంటిపెట్టుకొని ఉండేది; అతణ్ణి వదిలేది కాదు. ఒక రోజు రంజిత్రాయ్ తన జమీ వ్యవహారాలలో తలమునకలై ఉన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి పసిపిల్లలకు సహజమైన స్వభావంతో, ‘నాన్నగారూ! అదేమిటి, ఇదేమిటి’ అంటూ విసిగిస్తోంది. రంజిత్రాయ్ మంచి మాటలతో ఆమెకు నచ్చచెప్పాలని చూశాడు.ఆమెతో ‘అమ్మా, ప్రస్తుతం నువ్వెళ్ళు. నాకు ఎన్నో పనులు ఉన్నాయి’ అన్నాడు. కాని ఆ అమ్మాయి వదలడం లేదు. చివరకు రంజిత్ రాయ్ అన్యమనస్కంగా ‘నువ్విక్కడ నుంచి వెళ్ళిపో’ అనేశాడు. అదే సాకుతో ఆమె ఇంటిని వదలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ సమయంలో గాజులు అమ్మేవాడొకడు దారిలో పోతున్నాడు. ఆ అమ్మాయి అతడి వద్ద కొన్ని గాజులు తీసుకొని వాటిని ధరించింది. డబ్బు అడిగేసరికి, ‘ఇంట్లో ఫలానా పెట్టెలో డబ్బులున్నా’ యని చెప్పి ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయింది; తరువాత కనిపించనే లేదు. గాజులు అమ్మేవాడు రంజిత్రాయ్ ఇంటికి వచ్చి గాజులకు డబ్బివ్వమన్నాడు. అమ్మాయి ఇంట్లో కనిపించక పోయేసరికి ఇంట్లో వారందరూ గాభరా పడిపోయారు; ఆమె కోసం వెదుకసాగారు. రంజిత్రాయ్ నలువైపులకూ తన మనుషులను పంపాడు. గాజులమ్మేవాడికి ఇవ్వవలసిన డబ్బు ఆ అమ్మాయి చెప్పినట్లు పెట్టెలో ఉంది. రంజిత్రాయ్ భోరున విలపించసాగాడు. అప్పుడు ఎవరో వ్యక్తి వచ్చి కొలనులో ఏదో కనిపిస్తోందని చెప్పాడు. అందరూ కొలను వద్దకు వెళ్ళి చూసేసరికి గాజులు ధరించిన చెయ్యి ఒకటి నీటిపైన అటూ ఇటూ ఊగుతూ కనిపించింది; కొన్ని క్షణాల తరువాత మరేమీ కనిపించలేదు. ఇప్పుడు కూడా అక్కడి ప్రజలు జాతర నాడు ఆమెను జగజ్జననిగా ఆరాధిస్తారు. (‘మ’ తో) ఇదంతా నిజమే.”
‘మ’ : అవునండీ.
శ్రీరామకృష్ణులు: ప్రస్తుతం నరేంద్రుడు వీటినన్నిటినీ విశ్వసిస్తున్నాడు. పూర్ణుడు విష్ణువు అంశతో జన్మించినవాడు. అతణ్ణి నేను బిల్వపత్రాలతో మానసికంగా పూజించాను. కాని ఆ పూజ అంగీకరింపబడలేదు. తులసిదళాలు, చందనంతో పూజించేసరికి అంతా సరిపోయింది. భగవంతుడు నానారూపాల్లో దర్శనం ఇస్తాడు – ఒక్కోసారి నరరూపంలో, మరోసారి చిన్మయ దైవీరూపంలో దర్శనమిస్తాడు. దైవీరూపాలను అంగీకరించవలసిందే, ఏమంటావు?
‘మ’ : అవునండీ.
42.1.3 గోపాల్-మా గాంచిన దర్శనాలు
గోపాల్-మా (అఘోరమణి దేవి)
శ్రీరామకృష్ణులు: కామార్హాటీకి చెందిన బ్రాహ్మణ స్త్రీ (గోపాల్-మా) ఎన్ని దర్శనాలు గాంచేదని! గంగానది ఒడ్డున నిర్జన ప్రదేశంలో ఉన్న ఒక ఇంట్లో ఆమె ఒంటరిగా నివసిస్తూ జపం చేసుకొనేది. బాలగోపాలుడు ఆమె వద్ద నిద్రిస్తాడు (ఇలా అంటూ శ్రీరామకృష్ణులు త్రుళ్ళిపడ్డారు.) అది ఊహ కాదు సుమా! వాస్తవం. గోపాలుడి చేతులు ఎరుపు రంగులో ఉండటం ఆమె చూసింది. గోపాలుడు ఆమెతో పాటు తిరుగాడుతూండేవాడు, స్తనపానం చేసేవాడు. ఆమెతో మాట్లాడుతూండేవాడు. నరేంద్రుడు ఈ విషయం విని విలపించాడు. నేను కూడా మొదట్లో పలు దర్శనాలు గాంచేవాడిని. కాని ప్రస్తుతం ఉన్న భావంలో నేను అన్ని దర్శనాలు గాంచడం లేదు. ఇప్పుడు నాలోని స్త్రీ స్వభావం తగ్గిపోయింది, పురుషభావం వస్తోంది. అందుకే నేను నా భావాలను నియంత్రించుకోగలుగుతున్నాను. వాటిని వెలుపలకు అభివ్యక్తం చేయడం లేదు.
“చిన్న నరేంద్రుడు పురుష స్వభావం గలవాడు. అందుకే అతడు ధ్యానంలో పూర్తిగా లీనమైపోతాడు. నిత్యగోపాల్ది స్త్రీ స్వభావం. అందుచేతనే భావావస్థలో అతడి దేహం వంకర్లు తిరుగుతుంది; దేహం ఎర్రబారుతుంది.
42.2 ద్వితీయ పరిచ్ఛేదం కామినీ కాంచన త్యాగం
శ్రీరామకృష్ణులు (‘మ’ తో) : “అదిసరే, లోకులు తూచి తూచి త్యాగం చేస్తారు. కాని ఈ కుర్రవాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో చూడు!
“వినోద్ నాతో ఒకసారి ఇలా అన్నాడు: ‘భార్యతోపాటు పడుకోవలసి వస్తుంది. దానితో మనస్సు ఎంతగానో పాడయిపోతుంది’. శారీరక సంబంధం ఉన్నా సరే లేకున్నా సరే, (సాధకుడు) భార్యతో కలిసి పడుకోవడం కూడా హేయమైనదే. కలిసి పడుకుంటే శారీరక ఒరపిడి, వెచ్చదనం ఉంటాయి.
“ద్విజుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడని! అతడు నా సమక్షంలో ఉన్నప్పుడు అతడి శరీరంలో కేవలం కదలిక ఉంటుంది కానీ దృష్టి యావత్తు నా మీదే ఉంటుంది. ఇదేమైనా సామాన్య విషయమా? మనస్సు నంతటినీ కూడదీసుకొని నా మీద నిలిపినట్లయితే సర్వమూ సిద్ధించినట్లే.
42.2.1 శ్రీరామకృష్ణులు అవతారమా?
“అయినా నే నెవర్ని? సర్వమూ ఆయనే. నేను యంత్రం, ఆయన యంత్రాన్ని నడిపేవాడు. దీనిలో (అంటే, శ్రీరామకృష్ణులలో) భగవంతుడి ఉనికి ఉంది. అందుకే ఇంతమంది మరింతగా ఆకర్షితులవుతున్నారు. స్పర్శమాత్రానే ఆధ్యాత్మిక చైతన్యం జాగృతమవుతోంది. ఆ లాగుదల శక్తి, ఆకర్షణ అంతా భగవంతుడి ఆకర్షణే కాని మరేదీ కాదు.
“బేల్ఘరియాకు చెందిన తారక్ దక్షిణేశ్వరం నుండి ఇంటికి పోతున్నప్పుడు దీనిలో నుండి (అంటే శ్రీరామకృష్ణుల దేహంలో నుండి) జ్వాల వంటిది ఏదో వెలువడి అతణ్ణి వెంబడించింది. కొన్ని రోజుల తరువాత తారక్ మళ్ళీ దక్షిణేశ్వరం వచ్చాడు. అప్పుడు ఇందులో వసించేవాడు సమాధి స్థితిలో అతడి ఛాతీమీద తన పాదం మోపాడు.”
“అది సరే, అలాంటి కుర్రవాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా?”
‘మ’ : మోహిత్ మంచి కుర్రవాడే. మీ వద్దకు ఒకటి రెండుసార్లు వచ్చాడు. విశ్వవిద్యాలయ పరీక్షలు రెండింటిలోనూ ఉత్తీర్ణుడవడానికి చదువుకుంటున్నాడు. అతడు కూడా భగవంతునికై తీవ్రవ్యాకులత చెందుతూ ఉంటాడు.
శ్రీరామకృష్ణులు: అయి ఉండవచ్చు, కాని అతడు ఉన్నత స్థాయికి చెందినవాడు మాత్రం కాదు. శరీర లక్షణాలు కూడా అంత బాగా లేవు – చప్పిడి ముఖంవాడు. కాని ఈ బాలురు ఉన్నత స్థాయికి చెందినవారు.
“దేహాన్ని ధరించినందుకు గాను ఎన్నో ఇక్కట్లను ఎదుర్కోవలసి వస్తుంది. పైగా, శాపానికి గురైతే ఏడు జన్మలపాటు రావలసి వస్తుంది. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కోరికలు లేశమాత్రమున్నా సరే మళ్ళీ దేహధారణ చేయవలసి ఉంటుంది.”
ఒక భక్తుడు: అవతార పురుషులకు కూడా కోరికలు ఉంటాయా?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నా కోరికలన్నీ పూర్తిగా తొలగిపోలేదని తెలుస్తోంది. ఒకసారి ఒక సాధువు శాలువా కప్పుకోవడం చూసి నాక్కూడా అలాంటి శాలువా వేసుకోవాలని కోరిక కలిగింది. ఆ కోరిక ఇంకా ఉంది. మళ్ళీ రావలసి ఉంటుందేమో తెలియదు.
బలరాం (నవ్వుతూ): మరి మీరు శాలువా కోసమని మళ్ళీ జన్మఎత్తుతారా?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): మంచి కోరిక ఒకదాన్ని ఉంచుకోవాలి. దేహత్యాగం చేసేటప్పుడు దాని గురించి చింతన చేయవచ్చు. సాధువులు సందర్శించవలసిన ధామాలు నాలుగు ఉన్నాయి. వారు వాటిలో మూడింటిని మాత్రమే సందర్శించి ఒక దాన్ని వదలిపెట్టేస్తారు. చాలామంది పూరీ జగన్నాథ క్షేత్రాన్ని వదలిపెట్టేస్తారు. అందువల్ల వారు జగన్నాథస్వామి గురించి చింతన చేస్తూ చేస్తూ దేహత్యాగం చేయగలరు.
ఇంతలో కాషాయ వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. అతడు రహస్యంగా శ్రీరామకృష్ణులను విమర్శిస్తుంటాడు. అందుకే బలరామ్ అతణ్ణి చూసి నవ్వాడు. శ్రీరామకృష్ణులు ఎదుటి మనిషి ఆలోచనలను చదువగలరు కదా! బలరామ్‌తో “విచారించవద్దు. అతడు నన్ను మోసగాడు అంటే అననివ్వు” అన్నారు.
42.2.2 శ్రీరామకృష్ణులు, తేజ్చంద్ర
శ్రీరామకృష్ణులు తేజచంద్రతో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: నేను నీ కోసం చాలాసార్లు కబురంపాను. నువ్వు రావెందుకని? జపధ్యానాలు బాగానే చేస్తున్నావు కదా! నువ్వలా చేస్తూన్నట్లయితే నాకు తృప్తిగా ఉంటుంది. నిన్ను నేను నా సొంతమనిషిగా చూస్తున్నాను. అందుకే నీ కోసం కబురంపుతుంటాను.
తేజచంద్ర: అయ్యా, ఆఫీసుకు వెళ్ళవలసి ఉంది. అక్కడ పని ఒత్తిడి అధికం.
‘మ’ (నవ్వుతూ): ఇంట్లో వివాహ వేడుకలు జరుపుకుంటున్న కారణంగా ఇతడు పది రోజులు సెలవు తీసుకున్నాడు.
శ్రీరామకృష్ణులు: నీకు తీరిక లేదని అంటుంటావు. ఇందాక సంసారాన్ని త్యజించివేస్తా నన్నావే!
నారాయణ్: ‘మ’ గారు ఒకసారి మాతో World is a Wilderness (ఈ సంసారం ఓ మరుభూమి లాంటిది) అని చెప్పారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నువ్వు వీళ్ళకు ‘ఔషధం పుచ్చుకొని స్పృహకోల్పోయిన శిష్యుడి’ కథ చెప్పు.
“గురువు వచ్చి ఆయన ఇచ్చిన గుళికను ఎవరైనా సేవిస్తే శిష్యుడి ప్రాణాలు దక్కుతాయన్నాడు. కాని ఇందులో వచ్చిన చిక్కేమిటంటే, శిష్యుడైతే బ్రతుకుతాడు కాని గుళికను సేవించే వ్యక్తి మాత్రం మృతి చెందుతాడు.
ఇంకా, భార్యాబిడ్డలను తన సొంతజనంగా భావించిన హఠయోగి కథ కూడా చెప్పు. అతడి శరీరం పలు వంకర్లు తిరిగి బిగుసుకుపోయింది. ఇటువంటి కథలు వినడం వల్ల వీరికి మేలు చేకూరుతుంది.”
మధ్యాహ్నమయింది. శ్రీరామకృష్ణులు బలరామ్ బోసు ఇంట్లో జగన్నాథ స్వామికి నివేదించబడిన ప్రసాద భోజనం తిన్నారు. ‘బలరామ్ ఇంట్లోని భోజనం పరిశుద్ధమైనది’ అని శ్రీరామకృష్ణులు తరచూ చెబుతుంటారు. భోజనం తరువాత ఆయన కాసేపు విశ్రమించారు.
సాయంకాలమయ్యాక శ్రీరామకృష్ణులు అతిథుల గదిలో భక్తులతోపాటు ఆసీనులయ్యారు. అక్కడ కర్తాభజా శాఖకు చెందిన చంద్రబాబుతో పాటు ఒక బ్రాహ్మణుడు కూడా ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఒక విదూషకుని లాంటివాడు. అతడి మాటలు అందరికీ నవ్వు తెప్పిస్తాయి.
శ్రీరామకృష్ణులు కర్తాభజా మతస్థుల ప్రవర్తన, స్వభావం మొదలైనవాటి గురించి పలు విషయాలు చెప్పారు.
సాయంత్రం ఆరు గంటకు గిరీశ్ సోదరుడు అతుల్తోపాటు తేజచంద్ర సోదరుడు వచ్చాడు. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు భావసమాధి మగ్నులై ఉన్నారు. కాసేపటి తరువాత ఇలా అన్నారు: “చైతన్యాన్ని చింతన చేస్తూ అచైతన్యులం కాగలమా? భగవంతుని చింతన చేయడం ద్వారా బుర్ర పాడవుతుందా ఏమిటి? ఆయన బోధస్వరూపుడు – నిత్యశుద్ధ బోధస్వరూపుడు.”
42.2.3 ‘నవ్వులలో కాలం వృధా చేయకు!’ – ‘ముందుకు సాగిపో!’
విదూషక బ్రాహ్మణుడితో శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “సామాన్యమైన సాంసారిక విషయాల గురించి రాత్రింబవళ్ళు నవ్వులు సృష్టించుకుంటూ నువ్వెందుకు కాలం వృథా చేసుకుంటావు? నీ మనస్సును భగవంతుడి వైపుగా మళ్లించు. ఉప్పు గురించి లెక్కలు కట్టేవాడు కలకండ గురించి కూడా లెక్కలు కట్టగలడు.”
బ్రాహ్మణుడు (నవ్వుతూ): మీరే నన్ను లాగేసుకోండి.
శ్రీరామకృష్ణులు: నేనేం చేయగలను? అంతా నువ్వు చేసే ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. నీ మనస్సు నీదే కదా! నిష్ప్రయోజనమైన విదూషక వ్యవహారాలు కట్టిపెట్టి భగవంతుడి వైపుకు సాగిపో. నువ్వు ఆ మార్గంలో ముందుకు పోవచ్చు; ఇంకా ముందుకు పోవచ్చు. బ్రహ్మచారి, కట్టెలు కొట్టేవాడిని ముందుకు సాగిపొమ్మని చెప్పాడు. అతడు ముందుకు పోగా మొదట చందన వృక్షాలను చూశాడు; ఇంకా ముందుకు పోగా వెండి గనులు, తరువాత బంగారు గనులు, అటు పిదప వజ్రవైడూర్యాలను చూశాడు.
బ్రాహ్మణుడు: ఈ మార్గానికి అంతం లేదు.
శ్రీరామకృష్ణులు: శాంతిని ఎక్కడ పొందుతామో అదే అంతం.
శ్రీరామకృష్ణులను చూడటానికి క్రొత్తగా వస్తున్న ఒక వ్యక్తి గురించి ఆయన ఇలా అన్నారు: “అతడిలో నేను కించిత్తు అయినా సత్తా చూడలేకపోయాను. వట్టి పనికిమాలిన వాడిలా అగుపించాడు.”
సంధ్యాకాలం అయింది. గదిలో దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణులు తమ మధుర కంఠంతో జగన్మాత నామాన్ని గానం చేస్తున్నారు. భక్తులు ఆయన చుట్టూ కూర్చుని ఉన్నారు. మరుసటి రోజు బలరామ్బోసు తన ఇంట్లో రథయాత్ర ఉత్సవాన్ని నిర్వర్తించనున్నాడు. అందుకోసమే శ్రీరామకృష్ణులు ఆ రాత్రికి అక్కడే బస చేస్తున్నారు. ఇంట్లోపలకు వెళ్ళి కొద్దిగా ఉపాహారం స్వీకరించి మళ్ళీ అతిథుల గదిలోకి తిరిగివచ్చారు. అప్పుడు సమయం రాత్రి పది గంటలు అయింది. శ్రీరామకృష్ణులు, ‘మ’ తో “ఆ గదిలో నుండి నా తువ్వాలు తీసుకురా” అన్నారు.
ప్రక్కనే ఉన్న చిన్న గదిలో శ్రీరామకృష్ణులకు పక్క వేశారు. పదిన్నరకు ఆయన నిద్రకు ఉపక్రమించారు. వేసవికాలం కావడంతో ఉక్కగా ఉంది. ‘మ’ తో “విసనకర్ర తీసుకు రా” అన్నారు. తరువాత అతణ్ణి తమకు విసరమన్నారు. రాత్రి పన్నెండు గంటలకు ఆయనకు మెలకువ వచ్చింది. ‘మ’ తో “చలి వేస్తోంది. ఇక విసిరే పని లేదు” అన్నారు.
42.3 తృతీయ పరిచ్ఛేదం రథయాత్ర ఉత్సవం – భక్తులతో శ్రీరామకృష్ణులు
మంగళవారం, జూలై 14, 1885
నేడు రథయాత్ర ఉత్సవం. పెందలకడనే నిద్ర లేచి శ్రీరామకృష్ణులు తమ గదిలో ఒంటరిగా భగవన్నామ సంకీర్తన చేస్తూ నృత్యం చేస్తున్నారు. ‘మ’ వచ్చి ఆయనకు ప్రణామం చేశాడు. తక్కిన భక్తులు ఒక్కరొక్కరుగా రాసాగారు.
శ్రీరామకృష్ణులు పూర్ణుణ్ణి చూడాలని ఎంతగానో తహతహలాడుతున్నారు. అతడి గురించి ‘మ’ తో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: పూర్ణుణ్ణి కలుసుకొన్నప్పుడు నువ్వు అతడికి ఏమైనా ఉపదేశం ఇస్తుంటావా?
‘మ’ : అవునండీ. చైతన్య చరితామృతం చదవమని చెప్పాను. ప్రస్తుతం అతడికి అందులోని విషయాలన్నీ సుపరిచితమే. మీరు సత్యాన్ని పట్టుకొని ఉండమని చెబుతుంటారని కూడా చెప్పాను.
శ్రీరామకృష్ణులు: ‘ఆయన భగవదవతారం’ అని నువ్వు నా గురించి అన్నప్పుడు అతడు ఏమన్నాడు?
‘మ’ : నేను ‘చైతన్య దేవుల వంటి వ్యక్తిని చూడాలంటే నాతో రా’ అన్నాను.
శ్రీరామకృష్ణులు: ఇంకా ఏమైనా?
‘మ’ : చిన్న మడుగులోకి ఏనుగు దిగితే నీరంతా చెల్లాచెదురైపోతుంది. ‘ఆధారం’ చిన్నదైనప్పుడు లోపలనున్న భావం వెలుపలకు ప్రవహిస్తుందని మీరు చెబుతుంటారే, ఆ మాటే చెప్పాను.
“అతడు చేపలు తినడం మానివేయడం గురించి ‘అలా ఎందుకు చేశావు? ఆ కారణంగా ఇంట్లో గొడవ తలెత్తవచ్చు’ అన్నాను.
శ్రీరామకృష్ణులు: ఇదే మంచిది. తన భావాలను లోపల ఉంచుకోవడమే మంచిది.
42.3.1 భూకంపం – పూర్ణజ్ఞానికి చావటం, చంపడం రెండూ ఒకటే!
సమయం ఉదయం ఆరున్నర గంటలయింది. బలరామ్ ఇంటి నుండి ‘మ’ గంగా స్నానానికి వెళుతూండగా భూకంపం వచ్చింది. వెంటనే అతడు శ్రీరామకృష్ణుల గదికి తిరిగి వచ్చాడు. వారందరూ భూకంపం గురించి చర్చిస్తున్నారు. భూకంపం కాస్త తీవ్రంగా ఉండటంతో చాలామంది భక్తులు భయభ్రాంతు లయ్యారు.
‘మ’ : మీరందరూ క్రిందకు వెళ్ళి ఉండవలసింది.
శ్రీరామకృష్ణులు: మనిషి ఏ ఇంట్లోనైతే వసిస్తాడో ఆ ఇంటి పరిస్థితే ఇలా ఉంది. అయినప్పటికీ లోకులు అహంకార పూరితులవుతారు. (‘మ’ తో) ఆశ్వయుజ మాసంలో వచ్చిన పెనుతుపాను నీకు జ్ఞాపకముందా?
‘మ’ అవునండీ. అప్పుడు నా వయస్సు తొమ్మిది లేక పది సంవత్సరాలు. ఆ సమయంలో నేను ఒక గదిలో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఒంటరిగా ఉన్నాను.
‘మ’ : ఆశ్చర్యంతో తనలో తాను ఇలా అనుకోసాగాడు: ‘శ్రీరామకృష్ణులు ఉన్నట్టుండి ఆశ్వయుజ మాసపు పెనుతుపాను గురించి ఎందుకు అడిగారు? ఆ సమయంలో నేను ఒంటరిగా ఏడుస్తూ భగవంతుణ్ణి ఆర్తితో ప్రార్థిస్తూ ఉన్నానని ఆయనకు తెలుసా? ఇదంతా ఆయనకు ఎరుకేనా? నా పుట్టుక నుంచీ ఆయన గురురూపంలో నన్ను రక్షిస్తున్నారా?’
శ్రీరామకృష్ణులు: దక్షిణేశ్వరంలో ఆ రోజు చాలా పొద్దుపోయాక గాలివాన మొదలైంది. తరువాత వారు ఏదో విధంగా వంట వండారు. చెట్లన్నీ కూకటి వేళ్లతో పెకలించివేయబడ్డాయి. చూశావా, మనిషి నివసించే ఇంటి పరిస్థితే అలా ఉంటుంది.
“కాని పూర్ణజ్ఞానం కలిగినప్పుడు చావడం, చంపడం రెండూ ఒకటిగానే తోస్తాయి. అప్పుడు చచ్చినప్పటికీ యథార్థంగా చావడు; చంపినప్పటికీ యథార్థంగా చంపడు. లీల ఎవరికైతే చెందినదో నిత్యం కూడా ఆయనకే చెందినది. ఆయనే ఒక రూపంలో నిత్యంగానూ, మరో రూపంలో లీలగానూ ఉన్నాడు. లీల నశించినప్పటికీ నిత్యం సర్వదా ఉండనే ఉంటుంది. స్థిరంగా ఉన్నప్పటికీ, తరంగరూపంలో ఉన్నప్పటికీ నీరు నీరే. తరంగాలన్నీ ఆగిపోయినప్పుడు కూడా అదే నీరు.”
శ్రీరామకృష్ణులు భక్తులతోపాటు అతిథుల గదిలో కూర్చునివున్నారు. మహేంద్ర ముఖర్జీ, హరి, చిన్న నరేంద్రుడు తదితర భక్తులు పలువురు అక్కడ ఉన్నారు. హరి (కాలాంతరంలో స్వామి తురీయానంద) ఒంటరిగా జీవిస్తూ వేదాంత విచారణ చేస్తున్నాడు. వయస్సు దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు; అవివాహితుడు. శ్రీరామకృష్ణులకు అతడంటే ఎంతో ఇష్టం. హరి తమ వద్దకు తరచూ వస్తూ ఉండాలన్నదే ఆయన ఆకాంక్ష; కాని హరి ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతాడు. అందువల్ల అతడు శ్రీరామకృష్ణుల వద్దకు తరచూ రావటం లేదు.
42.3.2 హరికి ఉపదేశం – అద్వైత విశిష్టాద్వైతాలు – విజ్ఞానం
శ్రీరామకృష్ణులు (హరితో): ఏమయ్యా, నువ్వు చాలా రోజులుగా రానేలేదే?
ఇలా చూడు, భగవంతుడు ఒక రూపంలో నిత్యంగానూ, మరో రూపంలో లీలగానూ ఉంటున్నాడు. వేదాంతం ఏం బోధిస్తోంది? బ్రహ్మసత్యం జగన్మిథ్య, అదే కదా! కాని ‘భక్తుడిననే నేను’ ను భగవంతుడు ఉంచినంత వరకు లీల కూడా సత్యమే. ఆయన ఈ ‘నేను’ ను పూర్తిగా తుడిచివేసినప్పుడు, ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. దానిని నోటితో వర్ణించజాలం. కాని భగవంతుడు ‘నేను’ ను ఉంచినంత వరకు అన్నింటినీ అంగీకరించాల్సిందే. అరటిచెట్టు వెలుపలి పొరలను తొలగిస్తూ పోతే లోపలి దవ్వను చేరుకుంటాము. అరటిచెట్టుకు వెలుపలి పొరలు ఉన్నంత వరకు లోపలి దవ్వ కూడా ఉంటుంది. అదే విధంగా దవ్వ ఉన్నంతవరకు వెలుపలి పొరలు కూడా ఉంటాయి. పొరలు దవ్వకు చెందినవే; దవ్వ పొరలకు చెందినదే. నిత్యం ఉన్నందుననే లీల ఉన్నట్లు అర్థమవుతుంది. లీల ఉండడం వల్లనే నిత్యం గురించి తెలియవస్తుంది.
“భగవంతుడే జీవజగత్తులుగా అయివున్నాడు, ఇరవై నాలుగు తత్త్వాలుగా అయివున్నాడు. ఆయన నిష్క్రియుడై ఉన్నప్పుడు నేను ఆయన్ను బ్రహ్మం అంటాను; సృష్టి స్థితి లయాలను నిర్వర్తించేటప్పుడు ఆయన్ను శక్తి అంటాను. బ్రహ్మం, శక్తి రెండూ వేర్వేరు కాదు. నీరు స్థిరంగా ఉన్నా నీరే, ప్రవహిస్తూ ఉన్నాకూడా నీరే.
“ఈ ‘నేను’ అనే ఎరుక పోదు. ఈ ‘నేను’ అనే ఎరుక ఉన్నంతవరకు జీవజగత్తులు మిథ్య అనడం సబబు కాదు. బిల్వఫలం పెంకు, విత్తనాలను పారేసి కేవలం కండ బరువును మాత్రమే తూచినట్లయితే దాన్ని బిల్వఫలం యొక్క బరువుగా పరిగణించం కదా!
“ఏ ఇటుకలు, సున్నం, బంకమన్నుతో అయితే మెట్లు నిర్మింపబడి ఉన్నవో, వాటితోనే డాబా కూడా నిర్మితమై ఉంది. బ్రహ్మం అని ఏదైతే ఉందో దాని కారణంగానే జీవజగత్తులు కూడా ఉన్నాయి.
“భక్తులు–అంటే విజ్ఞానులు–నిరాకార సాకారాలు రెండిటినీ అంగీకరిస్తారు; వారు భగవంతుణ్ణి రూపం కలవాడిగానూ, రూపరహితుడిగానూ కూడా భావిస్తారు. తీరమంటూలేని సముద్రంలో – అనంత జలరాశిలో అతిశీతలం కారణంగా అక్కడక్కడ మంచుగడ్డలు తయారవుతాయి. అదే విధంగా భక్తుడి భక్తి తీవ్రతరమైనట్లయితే, ఆ భక్తి యొక్క శీతల ప్రభావం కారణంగా ఆ అనంత స్వరూపుడైన భగవంతుడు సాకారరూపాన్ని ధరించి భక్తుడికి ఆ రూపంలో దర్శన మిస్తాడు. మళ్ళీ, సూర్యుడు ఉదయించగానే మంచు అంతా కరిగిపోయినట్లు, జ్ఞానభాస్కరుడు ఉదయించగానే సాకారరూపం కరిగి మళ్ళీ అదే అనంత, నిరాకార స్వరూపంలోకి లీనమైపోతుంది.
42.3.3 మనోనాశనంతోనే బ్రహ్మజ్ఞానం
“మనస్సుతో విచారణ చేస్తున్నంత కాలం నిత్యాన్ని చేరలేం. మనస్సుతో విచారణ చేయడం ద్వారా జగత్తును వదలించుకోలేం; రూప రస గంధ స్పర్శ శబ్దాలనే విషయవాసనలను వదిలించుకోలేం. విచారణ ఆగిపోయినప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఈ మనస్సు ద్వారా ఆత్మను సాక్షాత్కరించుకోలేము. ఆత్మను ఆత్మ ద్వారా మాత్రమే సాక్షాత్కరించుకోగలం. శుద్ధ మనస్సు, శుద్ధ బుద్ధి, శుద్ధాత్మ – ఇవన్నీ ఒక్కటే.
“ఒక వస్తువును చూడాలంటే అవసరమైనవి ఏమిటో నువ్వే చూడు. అందుకు కళ్ళు ఉండాలి, వెలుతురు ఉండాలి, మనస్సూ ఉండాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టినా ఆ వస్తువును చూడలేము. ఈ మనస్సు పనిచేస్తున్నంత సేపు ‘జగత్తు లేదు’, ‘నేను అనేది లేదు’ అని ఎలా చెప్పగలం?
“మనస్సు నశించిపోయినప్పుడు, సంకల్ప వికల్పాలు అన్నీ తొలగిపోయి నప్పుడు సమాధిస్థితి కలుగుతుంది; బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. కాని ఒక్క విషయం – స రి గ మ ప ద ని అని సప్తస్వరాలు ఉన్నాయి కదా! వీటిలో ‘ని’ మీద స్వరాన్ని ఎక్కువసేపు నిలపలేము.”
చిన్న నరేంద్రుణ్ణి చూస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “భగవంతుడు ఉన్నాడు అని ఊరకే అంతర్బుద్ధితో తెలుసుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? భగవంతుడి దర్శనం కలగగానే అంతా అయిపోయిందని అనుకోరాదు. ఆయన్ను ఇంటికి తీసుకురావాలి, ఆయనతో సంభాషించాలి.
“కొందరు పాలను గురించి విన్నారు, కొందరు పాలను చూశారు, మరి కొందరు పాలు త్రాగారు. రాజుగారిని కొందరు దర్శించటం జరిగింది; కాని ఏ ఒకరిద్దరు మాత్రమే. ఆయనను ఇంటికి తీసుకువచ్చి అన్నపానాదులతో సత్కరించగలరు.”
‘మ’ గంగాస్నానం చేయడానికి వెళ్ళిపోయాడు.
42.4 చతుర్థ పరిచ్ఛేదం కాశీలో శివ, అన్నపూర్ణల దర్శనం – సాలగ్రామం
అప్పుడు సమయం పది గంటలు అవుతోంది. శ్రీరామకృష్ణులు భక్తులతో మాట్లాడుతూనే ఉన్నారు. స్నానం ముగించాక ‘మ’, బలరామ్బోసు ఇంటికి తిరిగి వచ్చాడు. శ్రీరామకృష్ణులకు ప్రణామంచేసి ఆయన ప్రక్కన కూర్చున్నాడు.
శ్రీరామకృష్ణులు తీవ్ర భావంలో మునిగి ఉన్నారు. ఆయన ముఖతా వచనామృతం జాలువారుతోంది. మధ్యమధ్యలో తమ ఆధ్యాత్మిక అనుభూతుల గురించి అతి గుహ్యమైన విషయాలు కొన్ని చెబుతున్నారు.
శ్రీరామకృష్ణులు: ఒకసారి నేను మథుర్బాబుతో పాటు కాశీ వెళ్ళాను. మేము పయనిస్తున్న పడవ మణికర్ణికా ఘట్టానికి సమీపంగా వెళ్ళేటప్పుడు నాకు హఠాత్తుగా శివదర్శనం కలిగింది. నేను పడవ అంచు వద్దకు వచ్చి నిలబడ్డాను; అలా నిలబడే సమాధి స్థితిలోకి వెళ్లిపోయాను. నేను పడిపోతానేమోననే భయంతో పడవ నడిపేవాడు హృదయ్‌తో “పట్టుకో, పట్టుకో” అన్నాడు. అక్కడ నేను శివుణ్ణి జగత్తులోని గాంభీర్యమంతా రూపుదాల్చినట్లుగా గాంచాను. ముందుగా నేను ఆయన్ను దూరంగా నిలబడి ఉన్నట్లు చూశాను; తరువాత దగ్గరకు రావడం చూశాను. అటుపిమ్మట ఆయన నాలో కలసిపోయాడు.
“మరోసారి భావావస్థలో ఒక సన్న్యాసి నన్ను చేయి పట్టుకొని తీసుకువెళ్ళడం చూశాను. మేమిద్దరం ఒక ఆలయంలోకి ప్రవేశించాము; అక్కడ బంగారంతో రూపొందివున్న అన్నపూర్ణాదేవి దర్శనం కలిగింది.
“భగవంతుడే సమస్తం అయివున్నాడు. కాని ఆయన కొన్ని వస్తువుల్లో అధికంగా అభివ్యక్తమవుతాడు.
(‘మ’ తో) “బహుశా నువ్వు సాలగ్రామాలను విశ్వసించకపోవచ్చు. ‘ఇంగ్లీషు మ్యాన్లు’ వాటిని విశ్వసించరు. వాటిని మీరు నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు.శుభ లక్షణాలున్న సాలగ్రామం కావాలంటే అందులో చక్రం గుర్తు ఉండాలి, గోముఖీ ఉండాలి. అప్పుడు అది పూజార్హమవుతుంది.
‘మ’ : అవునండీ. శుభ లక్షణాలున్న మనిషిలో భగవంతుడు అధికంగా అభివ్యక్తమవడం లాంటిది అది.
శ్రీరామకృష్ణులు: నరేంద్రుడు మొదట్లో వాటిని చిత్తభ్రమలు అనేవాడు. కాని ప్రస్తుతం వాటి నన్నిటినీ అంగీకరిస్తాడు.
“భగవద్దర్శనం గురించిన విషయాలు మాట్లాడుతూ శ్రీరామకృష్ణులు సమాధిస్థితి పొందారు. భక్తులు ఆయన్ను తదేకంగా చూస్తూండిపోయారు. చాలాసేపటి తరువాత ఆయన బాహ్యస్పృహలోకి వచ్చి భక్తులతో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నేను ఏం చూశాననుకుంటున్నావు? నేను బ్రహ్మాండాన్ని యావత్తు ఒక సాలగ్రామంగా దర్శించాను. అందులో నీ కళ్ళు రెండింటినీ చూశాను.
శ్రీరామకృష్ణుల అద్భుతమైన ఈ దర్శన వృత్తాంతాలను భక్తులందరూ ఆశ్చర్యభరితులై వింటున్నారు. ఆ సమయంలో శారదాప్రసన్న (కాలాంతరంలో స్వామి త్రిగుణాతీతానంద) అనే బాల భక్తుడు గదిలోకి వచ్చాడు, శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నాడు.
శారదాప్రసన్న (స్వామి త్రిగుణాతీతానంద)
శ్రీరామకృష్ణులు (ప్రసన్నతో): నువ్వు దక్షిణేశ్వరానికి ఎందుకు రావు? నేను కలకత్తాకు వచ్చిన ప్పుడు కూడా వచ్చి నన్ను ఎందుకు కలుసుకోవు?
ప్రసన్న: మీరు వస్తున్నట్లు ఎవరైనా చెబితే కదా?
శ్రీరామకృష్ణులు: ఈసారి వచ్చినప్పుడు నీకు తెలియబరుస్తాను. (‘మ’ తో, నవ్వుతూ) ఈ కుర్రవాళ్ళందరి జాబితా ఒకటి తయారుచెయ్యి. (‘మ’ తదితర భక్తులు నవ్వారు)
42.4.1 పూర్ణుడు, నరేంద్రుడు, గోపాల్-మా
ప్రసన్న: ఇంట్లో వాళ్ళు నాకు వివాహం చేయాలనుకుంటున్నారు. వివాహం చేసుకోవద్దని పలుమార్లు ఈయన (‘మ’) మమ్మల్ని చీవాట్లుపెట్టారు.
శ్రీరామకృష్ణులు: ఇప్పుడే వివాహం చేసుకోవడం ఎందుకు? (‘మ’ తో) ప్రస్తుతం ప్రసన్న మనోస్థితి చాలాబాగా ఉంది. మొదట్లో సంకోచిస్తూ ఉండేవాడు; అయితే ఇప్పుడు అతడి ముఖం ఆనందంతో ప్రకాశిస్తోంది.
శ్రీరామకృష్ణులు ఒక భక్తుడితో, “నువ్వు వెళ్ళి పూర్ణుణ్ణి పిలుచుకు వస్తావా?” అని ఆర్తితో అడిగారు.
ఇంతలో నరేంద్రుడు వచ్చాడు. శ్రీరామకృష్ణులు ఒక భక్తుడితో నరేంద్రుడి కోసం ఉపాహారం తీసుకురమ్మని చెప్పారు. నరేంద్రుణ్ణి చూడగానే ఆయన ఆనందంతో ఉప్పొంగిపోయారు. నరేంద్రుడికి ఉపాహారం తినిపిస్తూ సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడికి తినిపిస్తున్నట్లుగా భావించారు. పిదప అతడి దేహాన్ని మృదువుగా, ప్రేమపూర్వకంగా నిమరసాగారు.
కాసేపటి తరువాత గోపాల్మా గదిలోకి వచ్చింది. శ్రీరామకృష్ణులు, బలరామ్ ద్వారా కామార్హాటీకి చెందిన ఒక వ్యక్తిని పంపి ఆమెను రమ్మని కబురు పంపారు. ఆమె బాలగోపాలుడి భక్తురాలు; అనేక ఆధ్యాత్మిక అనుభూతులను పొందివుంది. గదిలోకి రాగానే ఆమె “ఆనందం పట్టలేక నాకు కన్నీళ్ళు వస్తున్నాయి” అంది. ఇలా అంటూ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసింది.
శ్రీరామకృష్ణులు: ఇదేమిటి? నువ్వు నన్ను గోపాలుడంటావు. మళ్ళీ ఇలా నమస్కరిస్తావేమిటి? వెళ్ళు, ఇంట్లోపలికి వెళ్ళి నా కోసం ఏదైనా కూరవండు. ఇక్కడి దాకా ఘాటు వచ్చేలా పోపు పెట్టు. (అందరూ నవ్వారు)
గోపాల్ మా: ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో?
గోపాల్ మా ఆ ఇంటికి కొత్త. అందువలన తాను వేరే విధంగా వండితే ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని తటపటాయిస్తోంది. ఇంట్లోకి వెళ్తూ ఉద్వేగంగా ఆమె నరేంద్రుడితో ఇలా అంది: “నాయనా! నేను గమ్యాన్ని చేరుకున్నానా? లేకపోతే ఇంకా చాలాదూరం గమించాలా?”
నేడు రథయాత్ర. అందువల్ల బలరామ్బోసు ఇంట్లో పూజ ముగిసేసరికి కాస్త ఆలస్యమయింది. పూజ ముగిశాక శ్రీరామకృష్ణులు ఇంటి లోపలకు భోజనానికి వెళ్ళారు. లోపల ఉన్న భక్తురాండ్రు ఆయన్ను దర్శించి, ప్రణామం చేసుకోవాలని ఆరాటపడుతున్నారు.
శ్రీరామకృష్ణులకు పలువురు భక్తురాండ్రు ఉన్నారు. కాని ఆయన సాధారణంగా వారి గురించి పురుషుల ముందు ప్రస్తావించేవారు కాదు. ఎవరైనా పురుషులు భక్తురాండ్ర వద్దకు తరచూ వెళుతూ ఉన్నట్లయితే ఆయన వారిని “ఎక్కువగా పోవద్దు. లేకుంటే కాలుజారే ప్రమాదముంది” అని హెచ్చరించేవారు. భక్తులతో ఆయన “ఎవరైనా స్త్రీ భక్తితో నేలమీద పడి దొర్లుతున్నా సరే, ఆమె వద్దకు వెళ్ళవద్దు సుమా!” అనటం కద్దు. భక్తురాండ్రు, భక్తులు వేర్వేరుగా ఉండాలన్నది ఆయన ఆకాంక్ష; ఆ విధంగా వారందరూ శ్రేయస్సు నొందగలరు. భక్తురాండ్రు పురుషుల పట్ల అధికంగా గోపాలభావం, అంటే వాత్సల్యభావం ప్రదర్శించడాన్ని ఆయన నిరసించేవారు. ఎందుకంటే ఆ వాత్సల్య భావమే క్రమంగా ‘తాచ్ఛల్య భావం’ గా పరిణమిస్తుంది, అంటే పతనమైపోయే ప్రమాదం ఉందనేవారు.
42.5 పంచమ పరిచ్ఛేదం రథయాత్ర – నరేంద్రుడు ప్రభృతులతో భజనానందంలో
మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు భక్తులతోపాటు అతిథుల గదిలో కూర్చున్నారు. అప్పుడు సమయం ఒంటి గంట కావస్తోంది. ఒక భక్తుడు పూర్ణుణ్ణి అతడి ఇంటి నుండి తోడ్కొని వచ్చాడు. పూర్ణుణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు ఆనందం పట్టలేకపోయారు. ‘మ’ తో “ఇదిగో! పూర్ణుడు వచ్చాడు” అన్నారు. నరేంద్రుడు, చిన్న నరేంద్రుడు, నారాయణ్, హరిపదుడు మొదలైన భక్తులు ఆయనతో మాట్లాడుతున్నారు.
42.5.1 స్వతంత్రేచ్ఛ – నరేంద్రుని గానం
చిన్న నరేంద్రుడు: అయ్యా, మనకు స్వతంత్రేచ్ఛ (Free Will) అనేది ఉందంటారా?
శ్రీరామకృష్ణులు: ఈ ‘నేను’ ను కాస్త వెదికి చూడు. ‘నేను’ ను వెదుకుతూపోతే ‘ఆయన’ బయటపడతాడు. ‘నేను యంత్రం. ఆయన యంత్రం నడిపేవాడు.’ ఉత్తరం చేతపట్టుకొని దుకాణంలోకి వెళ్ళిన కీలుబొమ్మ గురించి వినే ఉంటావు కదా! నువ్వు అలాంటి కీలుబొమ్మవు మాత్రమే. భగవంతుడే కర్త. నిన్ను నువ్వు అకర్తగా ఎరిగి ఈ ప్రపంచంలో కర్తలా పనులు చెయ్యి.
“ఉపాధి ఉన్నంతవరకు అజ్ఞానం ఉంటుంది. నేను పండితుణ్ణి, నేను జ్ఞానిని, నేను ధనవంతుణ్ణి, నేను మాననీయుడను, నేను కర్తను, తండ్రిని, గురువును – ఈ భావాలన్నీ అజ్ఞాన జనితాలు. ‘నేను యంత్రం, నువ్వు యంత్రాన్ని నడిపేవాడవు’ – ఇది జ్ఞానం. ఈ జ్ఞానావస్థలో తక్కిన ఉపాధులన్నీ తొలగిపోతాయి. కట్టె పూర్తిగా దహించుకుపోయినప్పుడు ఎలాంటి శబ్దమూ ఉండదు; సెగ కూడా ఉండదు. అంతా చల్లారిపోతుంది – శాంతిః శాంతిః శాంతిః.
(నరేంద్రుడితో) “కాస్త పాడు నాయనా!”
నరేంద్రుడు: నేను ఇంటికి వెళ్ళాలండీ. చాలా పనులు ఉన్నాయి.
శ్రీరామకృష్ణులు: అవునండీ, మేం చెప్పిన మాటలు మీరు ఎందుకు వింటారు? ‘కర్ణాభరణాలు ధరించిన వాడి మాటలు అమూల్యాలు. కాని చిరిగిపోయిన గోచీ కట్టుకున్న వాడి పలుకులను ఎవరూ ఖాతరు చెయ్యరు.’ (అందరూ నవ్వారు)
“నువ్వు గుహ కుటుంబానికి చెందిన ఉద్యాన గృహానికి తరచూ వెళుతుంటావని వింటున్నాను. ‘నరేంద్రుడు ఎక్కడున్నాడు?’ అని అడగడమే తరువాయి ‘అతడు గుహ కుటుంబం వారి ఉద్యాన గృహానికి వెళ్ళాడండి’ అన్న సమాధానం ఎదురవుతుంది. ఈ విషయాలన్నీ నేను నీకు చెప్పకుండా ఉండాల్సింది. కాని నువ్వే ఈ మాటలను బయటపడేలా చేశావు.”
నరేంద్రుడు కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తరువాత “ప్రక్కవాయిద్యాలు ఏవీ లేవే? ఊరకే పాట ఒక్కటే పాడమంటారా?” అన్నాడు.
శ్రీరామకృష్ణులు: నాయనా! ఏం చేద్దాం, మన పరిస్థితి ఇలాంటిది. బలరామ్ చేసే ఏర్పాట్లు ఎలాంటివో తెలిసిందే కదా! ఇలాగే నువ్వు పాడగలిగితే పాడు.
“బలరామ్ నాతో ‘మీరు దక్షిణేశ్వరం నుండి వచ్చేటప్పుడు పడవలోనేరండి. మరీ ఇక గత్యంతరం లేదంటేనే బండి కట్టించుకొని రండి’ అంటుంటాడు. (అందరూ నవ్వారు) చూడండి, ఇవాళ అతడు మనందరికీ భోజనం పెట్టించాడు కదా! అందుకని ఈ సాయంత్రం మనతో నాట్యం చేయిస్తాడు. (అందరూ నవ్వారు) ఒక రోజు అతడు నా కోసం ఇక్కడనుండి దక్షిణేశ్వరానికి బండి కట్టించాడు. బండి కిరాయి పన్నెండు అణాలని చెప్పాడు. నే నడిగాను ‘పన్నెండు అణాలకు దక్షిణేశ్వరానికి ఎవరు వస్తారు’ అని. అందుకు అతడు ‘ఓ! అదే ఇంకా ఎక్కువండీ’ అన్నాడు. బండి పోతూపోతూ దక్షిణేశ్వరం చేరడానికి ముందుగానే ఒకవైపు విరిగి పడిపోయింది. (అందరూ నవ్వారు) పైగా, గుర్రం మధ్యమధ్యలో కదలకుండా అలాగే మొరాయించి నిలబడిపోయింది. బండి తోలేవాడు మాటిమాటికీ దాన్ని చెర్నాకోలుతో కొట్టసాగాడు. అప్పుడది కొంతదూరం పరిగెత్తింది; మళ్ళీ నిలబడిపోయింది (అందరూ నవ్వారు). ఈ రోజు సాయంకాల కార్యక్రమం ఏమిటంటే – రామ్ తబలా వాయిస్తాడు, దానికి అనుగుణంగా మనమంతా నాట్యం చెయ్యాలి. అయితే రామ్‌కు తాళం బొత్తిగా తెలియదాయె. (అందరూ నవ్వారు) ‘పాటలూ మీరే పాడుకోండి, నాట్యమూ మీరే చేసుకోండి; మళ్ళీ మీరే సంతోషంగా కూడా ఉండండి’ – ఇదీ బలరాం వైఖరి.”
క్రమంగా భక్తులందరూ రాసాగారు. మహేంద్ర ముఖర్జీ దూరం నుండే శ్రీరామకృష్ణులకు నమస్కారం చేశాడు. ఆయన కూడా మహేంద్రకు ప్రతినమస్కారం చేశారు; ఆయన మళ్ళీ మహమ్మదీయుల్లా సలాం చేసి దగ్గరలో ఉన్న ఒక బాలభక్తుడితో “నేను సలాం చేశానని మహేంద్రకు చెప్పవోయి. అతడు ఎప్పుడు చూసినా ‘అల్కాట్, అల్కాట్* ’ అంటుంటాడు.” (అందరూ నవ్వారు).
పలువురు గృహస్థ భక్తులు సతీసమేతులై వచ్చారు. వారందరూ శ్రీరామకృష్ణులను దర్శించి రథం ఎదుట జరుగబోయే ఆయన కీర్తనానందాన్ని చూడాలని ఉత్సుకతతో ఉన్నారు. రామ్, గిరీశ్ తదితర భక్తులు క్రమక్రమంగా అక్కడకు చేరుకున్నారు. చాలామంది బాలభక్తులు కూడా అక్కడున్నారు.
నరేంద్రుడు పాడసాగాడు:
ఎన్నడు ఆ దిన మేగుదెంచునో
ఎన్నడు శుభ విభవోదయమగునో
ఎన్నడు హృదిలో ప్రేమ మేల్కొనునో
ఆ తరుణం బెప్పుడవతరించునో ॥ ఎ ॥
ప్రభు హరినామము పాడచుండగా
ఆగక కన్నులు అశ్రులు గురియుచు
పరితాపమునకు పరిణతి నిచ్చుచు
సఫలత జేసెడు చక్కని తరుణము ॥ ఎ ॥
ఎన్నడు నా తను మాన ప్రాణములు
పావనత్వమున భాసించెడునో
ఎన్నడు పావన బృందావనమున
అంతిమమున నే నేగ గల్గుదునో ॥ ఎ ॥
భవపాశంబులు పటాపంచలై
వక్రదృష్టిని సక్రమపరచుచు
నేత్ర రుగ్మతను నిర్మూలించెడు
జ్ఞానాంజనమును కన్నులనుంతునో ॥ ఎ ॥
పరుసవేది సంస్పర్శచేత నా
తుచ్ఛలోహమగు దేహమెన్నడు
చిన్మయమగు బంగారు తునకగా
మార్చివేయు రసవిద్య నెరిగెడు ॥ ఎ ॥
కానుపించు ఈ జగజ్జాలమును
దేవదేవుడుగ తేరిజూచుచు
ప్రేమయనెడు ఆ రాజమార్గమున
పొరలి నే పరవశించెడు ॥ ఎ ॥
జాతి తలపులను జాతి ధర్మమును
శ్రోత్రియత్వమును పూర్తిగా మరచుచు
సిగ్గు బిడియమును చీకు చింతలను
విశ్వాసంబును విసిరివేయగల ॥ ఎ ॥
భక్తధూళి నా తనువును దాల్చుచు
త్యాగి జోలెను దాల్చి భుజంబున
ఉజ్జీవనమౌ యమునా తోయము
త్రాగెద దోసిట తనివితీరగా ॥ ఎ ॥
ఆ సమయములో ఆనందములో
ప్రేమపిచ్చితో నేడ్చుచు నవ్వుచు
సచ్చిదానందపు సాగరంబులో
తేలెద నీదెద సోలెద మునిగెద ॥ ఎ ॥
పరమేశ్వరుని భక్తి గ్రోలుచు
నావలె నితరుల త్రాగించుచు నే
నాడెద శ్రీహరి పాదసన్నిధిని
ఆనందముతో ననవరతంబున ॥ ఎ ॥
రూపులేని నీ అందము
దట్టమైన చీకటిలో
మెరయుచు స్పందించుచుండె
అందువలన అంధకార
కొండగుహన యోగివరులు
ధ్యానింతురు నిన్ను జనని….
బలరామ్ నేడు వైష్ణవచరణ్ సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేశాడు. వైష్ణవచరణ్ పాడసాగాడు:
పాటభావం: ఓ రసనమా? సర్వదా దుర్గానామాన్ని జపించు. ఈ దుర్గమ మార్గం దాటడానికి దుర్గానామం కంటే మరో మార్గం లేదు…
ఈ పాటలోని ఒకటి రెండు చరణాలు వినగానే శ్రీరామకృష్ణులు లేచి నిలబడి అలాగే సమాధిస్థితులైపోయారు. ఆయన పడిపోకుండా చిన్న నరేంద్రుడు గట్టిగా పట్టుకున్నాడు. ఆయన వదనారవిందం చిరుదరహాసంతో తేజోవిరాజమానమై ఉంది. క్రమక్రమంగా ఆయన శరీరం నిశ్చలమైపోయింది; మనస్సు ఎక్కడో ఊహాతీత లోకాలలో విహరిస్తున్నట్లుంది. భక్తులందరూ ఈ అద్భుత దృశ్యాన్ని నివ్వెరపాటుతో దర్శిస్తున్నారు. భక్తురాండ్రు తెర వెనుకనుండి చూస్తున్నారు. భగవంతుణ్ణి ప్రేమించడం ఎలా అనే విషయాన్ని మానవాళికి నేర్పించడానికి స్వయంగా ఆ భగవంతుడే దివినుండి భువికి దిగివచ్చాడన్నట్లు భక్తులు ఆయన వంక చూస్తున్నారు.
చాలాసేపటి తరువాత శ్రీరామకృష్ణులు భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ బాహ్య చైతన్యంలోకి వచ్చారు. ఆయన ఆసీనులవగానే వైష్ణవచరణ్ మళ్ళీ పాడటం అరంభించాడు:
పాడవే! ఓ వీణా! ప్రభు నామ గానము శ్రీహరి నామ గానము
హరిచరణ కృపలేక పరతత్వమగుపడదు….
మధ్యాహ్న సమయం. ఇంట్లోని వారు జగన్నాథస్వామి రథాన్ని పూల మాలలతోనూ, ధ్వజ పతాకాలతోనూ చక్కగా అలంకరించి వసారాలోకి తీసుకు వచ్చారు. జగన్నాథస్వామి, సుభద్ర, బలరాముల విగ్రహాలను పూలమాలల తోనూ, వస్త్రాభరణాలతోనూ శోభాయమానంగా అలంకరించారు. శ్రీరామకృష్ణులు లేచి వసారాలోకి వచ్చారు; భక్తులు కూడా ఆయన్ను అనుసరించారు. ఆయన రథం మోకు పట్టుకొని కొద్దిగా లాగారు. అటుపిమ్మట భక్తులతో కలసి రథం ఎదుట నృత్యం చేస్తూ సంకీర్తనలు చేయసాగారు:
అరుగో ఇద్దరు సోదరులు
హరిని పాడుచు అశ్రులు గార్తురు
ఆనందముతో ఆడుచు జగమును
హరిభజనములో నాడచేయుదురు….
గౌరాంగుడి ప్రేమ ప్రవాహములో
నదియా ఎట్లు తలడిల్లుచున్నదో గాంచుము….
42.6 షష్ఠ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల ప్రేమోన్మత్తత, నృత్యం
భక్తులు వసారాలో రథాన్ని లాగుతూ నృత్యం చేస్తున్నారు, సంకీర్తనలు చేస్తున్నారు. మృదంగ నాదంతో కూడిన ఈ సంకీర్తనలు విని ఇంటి చుట్టు ప్రక్కల వారందరు కూడా వసారాలోకి వచ్చారు. శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై ఉన్నారు. భక్తులు కూడా ఉన్మత్తులై ఆయనతో పాటు రథం ఎదుట నృత్యగానాలు చేస్తున్నారు. పిదప శ్రీరామకృష్ణులు గదిలోకి తిరిగివచ్చారు. ‘మ’ తదితర భక్తులు ఆయన పాదాలు ఒత్తసాగారు.
నరేంద్రుడు భావపరవశుడై తంబురా మీటుతూ పాడసాగాడు:
అమ్మారమ్మా బంగరుబొమ్మా
అమ్మా హృదయము రంజిలునమ్మా
నా హృదయములో నిలువగదమ్మా
నీ ముఖ వీక్షణ చేయుదునమ్మా….
నీవే ముక్తిదాయినివి
నీవే త్రిగుణాధారిణివి
హే మహితోన్నత మహితా
దయనీయా దుఃఖహరా….
నా జీవమునకు నిన్ను ధ్రువతారగా చేసికొంటి
పెడదారిని పట్టనీక ఘోర భవాబ్ధినుండి….
ఏ సమయము నందిచ్చట పెడదారిన తిరిగినచో
ఏమాత్రము కాంతి విడని నీ తేజము గానుపించు ॥ నా ॥
నీ కరుణా కాంతిపూర తేజము ఈ వ్యధజెందెడు
జీవికి కన్నీరుగారకుండ జేయుచుండు దేవ ॥ నా ॥
హృదయాంతర్మందిరమున రాజిల్లెడు నీ వదనము
ఏ క్షణమున నగుపించదొ ఆ క్షణమే నా జీవము
దుఃఖావేశము చేత వ్యధ జెందును దేవదేవ ॥ నా ॥
ఎన్నడు నిను విడనాడి నా చంచల మనసరుగునొ
నీ ఆనన మగుపించి నా కెంతో గడ్డిపెట్టు ॥ నా ॥
ఒక భక్తుడు నరేంద్రుడితో “ఆ పాట పాడమా – ‘అంతరాత్మవై నడిపెడు మాతా! అనయమునా హృదయమునందు మేల్కొనుము’ అనే పాట” అన్నాడు.
శ్రీరామకృష్ణులు: వద్దు వద్దు. ప్రస్తుతం అలాంటి పాట ఎందుకు? ఇప్పుడు పాడవలసింది భగవదానందం గురించిన పాటలు. ‘మాతా శ్యామా! మంగళనామా మదిరా దివ్యతరంగ మత్తా’ వంటి పాటలు.
నరేంద్రుడు పాడసాగాడు:
మాతా శ్యామా! మంగళనామా!
మదిరా దివ్యతరంగిత మత్తా!
భువి నీ లీలలు ఎవరికి తెలుసు
ఏఏ వేళల ఏమి ఒనర్తువొ ॥ మా ॥
నీ వీక్షణముల హావభావముల
కామదేవుని గర్వమణంతువు
వదనభీకరీ! అసికరధారిణి!
మాతా శ్యామా! మంగళనామా! ॥ మా ॥
నీ దూకుడులకు నీ నడకలకు
కంపించును భువి కదలును అటునిటు
త్రైగుణి! శంకరి! ఉద్ధారి! భయంకరి
మాతా శ్యామా! మంగళనామా! ॥ మా ॥
భక్తుల మొర విని రూపులు దాల్తువు
ముదమున నాడుచు హృదయపద్మమున
శ్యామా! మాయీ! నిత్యబ్రహ్మమయీ!
మాతా శ్యామా! మంగళనామా! ॥ మా ॥
భావంలో ఉన్మత్తుడై నరేంద్రుడు ‘ముదమున నాడుచు హృదయ పద్మమున, శ్యామా! మాయీ! నిత్యబ్రహ్మమయీ!’ అనే చరణాలను మళ్ళీ మళ్ళీ పాడాడు.
శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై నృత్యం చేయసాగారు; మధ్యమధ్యలో ‘అమ్మా, పూర్ణబ్రహ్మ సనాతనీ’ అంటూ గానం చేస్తున్నారు.
ఈ విధంగా చాలాసేపు నృత్యం చేసిన తరువాత శ్రీరామకృష్ణులు మళ్ళీ కూర్చున్నారు. నరేంద్రుడు భావపరవశుడై అశ్రునయనాలతో గానం చేయడం చూసి ఆయన ఎంతగానో ఆనందించారు.
సమయం రాత్రి తొమ్మిది గంటలు అవుతోంది. భక్తులు ఇంకా అక్కడే కూర్చొని ఉన్నారు. వైష్ణవచరణ్ గౌరాంగుడి గురించి ‘శ్రీ గౌరాంగ సుందర నవనటవర’ అనే పాట పాడాడు.
తరువాత అతడు శ్రీకృష్ణుడి గురించి పాడాడు. శ్రీకృష్ణుడు బృందావనం వదలిపెట్టి మధురలో రాజ్యం చేస్తున్నాడు. ఒక గోపిక ఆతణ్ణి మధురలో కలుసుకొని ఇలా అడుగుతోంది:
మరచావా! హరి! మరచావా
ఏలాగు నిన్నిపు డెరుగగలము?
గుర్తుపట్టుటే కష్టమైనది ॥ మ ॥
మథురానగరిన దొరవలె తిరుగుచు
పూర్తిగ మమ్ము మరచావా ॥ మ ॥
దొరగా ఠీవితొ ఏనుగు నిప్పుడు
ఎక్కి తిరుగుచు మరచావా! మము ॥ మ ॥
నీ వేవిధముగ బృందావనిలో
గోవులగాచిన మాటే పూర్తిగ ॥ మ ॥
వ్రజమున దొంగగ కపటమెరుగని
గొల్లపడుచుల వెన్న తిన్నది ॥ మ ॥
దాదాపు పదకొండు గంటలకు భక్తులందరు శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి ఒక్కరొక్కరుగా సెలవు పుచ్చుకుంటున్నారు.
శ్రీరామకృష్ణులు: సరే, మీరందరూ బయలుదేరండి. (నరేంద్రుడు, చిన్న నరేంద్రులను చూపిస్తూ) వీరిద్దరూ ఉంటే చాలు. (గిరీశ్‌తో) నువ్వు ఇంటికి వెళ్ళి భోంచేస్తావా, కాసేపు ఆగరాదూ, హుక్కా త్రాగుతావా? అయితే బలరామ్ నౌకరు అచ్చం బలరామ్ లాంటివాడే. హుక్కా ఇమ్మని అతడిని ఒకసారి అడిగి చూడు; అతడు ఇస్తే ఒట్టు. (అందరూ నవ్వారు) నువ్వు హుక్కా త్రాగకుండా వెళ్ళవద్దు.
గిరీశ్ తనతోపాటు కళ్ళజోడు ధరించిన స్నేహితు డొకణ్ణి తోడ్కొని వచ్చాడు. అతడు ఈ సంభాషణంతా విన్నాడు; తరువాత మౌనంగా వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణులు గిరీశ్‌తో ఇలా అన్నారు: “నేను ఈ విషయం నీతో పాటు అందరికీ చెబుతున్నాను. మీరు ఎవర్నీ బలవంతపెట్టి ఇక్కడకు తీసుకురాకండి. సమయం రాకుండా ఏమీ జరుగదు.”
ఒక భక్తుడు ప్రణామం చేసి సెలవు పుచ్చుకుంటున్నాడు. అతడితోపాటు ఒక బాలుడు కూడా ఉన్నాడు. శ్రీరామకృష్ణులు ఆ భక్తుడితో ఆప్యాయంగా “నీతోపాటు ఈ కుర్రవాడు కూడా ఉన్నాడు కదా! నువ్విక బయలుదేరు, ఆలస్యమవుతోంది” అన్నారు. నరేంద్రుడు, చిన్న నరేంద్రుడు మరికొందరు భక్తులు కాసేపు ఉండి తరువాత వెళ్ళిపోయారు.
42.7 సప్తమ పరిచ్ఛేదం ప్రాతఃసంధ్యలో శ్రీరామకృష్ణుల నామసంకీర్తన, నృత్యం
బుధవారం, జూలై 15, 1885
సమయం ఉదయం నాలుగు గంటలవుతోంది. శ్రీరామకృష్ణులు అతిథుల గదికి పశ్చిమంగా ఉన్న చిన్నగదిలో మంచం మీద కూర్చుని ఉన్నారు. గదికి దక్షిణంగా ఉన్న వసారాలో ‘మ’ ఒక చిన్న బల్లపై కూర్చుని ఉన్నాడు. కాసేపటి తరువాత శ్రీరామకృష్ణులు వసారాలోకి వచ్చారు. ‘మ’ ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు.
శ్రీరామకృష్ణులు: నేను ఇంతకు మునుపే ఒకసారి లేచాను. అది సరే, దక్షిణేశ్వరానికి ఉదయంపూటే వెళ్ళిపోదామా?
‘మ’ : ఉదయంపూట గంగలో అలల తాకిడి తక్కువ.
క్రమంగా తెల్లవారుతోంది. ఇంకా భక్తులు ఎవరూ రాలేదు. శ్రీరామకృష్ణులు ముఖప్రక్షాళన చేసుకొని గదికి ఉత్తరంగా ఉన్న ద్వారం వద్ద నిలబడి భగవన్నామాలను ఉచ్చరించసాగారు. ‘మ’ కూడా ఆయనకు సమీపంగా నిలబడి ఉన్నాడు. కాసేపటి తరువాత గోపాల్-మా వచ్చి అక్కడే నిలబడింది. నదియాలో తెరచాటు నుండి గౌరాంగుణ్ణి దర్శించిన భక్తురాండ్రలా ఒకరిద్దరు భక్తురాండ్రు ఇంటిలోపలి తలుపుల నుండి శ్రీరామకృష్ణుల వంక చూస్తున్నారు.
రామనామాన్ని ఉచ్చరించిన తరువాత శ్రీరామకృష్ణులు కృష్ణనామాన్ని ఉచ్చరించసాగారు. “కృష్ణా! కృష్ణా! గోపీ కృష్ణా! గోపీ! గోపీ! రాఖాల జీవన కృష్ణా! నందనందన కృష్ణా! గోవిందా! గోవిందా!” అనసాగారు. పిదప ఆయన గౌరాంగుని నామం కీర్తించారు. “శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద! హరే కృష్ణ హరే రామ, రాధే గోవింద!” అన్నారు. అటుపిమ్మట “అలఖ్ నిరంజన్” అనసాగారు, “నిరంజనా” అంటూ విలపించసాగారు. హృదయాలను కదలించివేసే ఆయన విలాపాన్ని చూసి అక్కడ ఉన్న భక్తులు కూడా ఆయనతోపాటు విలపించసాగారు. కన్నీళ్ళతో ఆయన ఇలా అన్నారు: “హే నిరంజన్! రా నాయనా! రా! వచ్చి ఇది తిను! నీకు ఏదైనా తినిపించి నా జన్మ ధన్యం చేసుకొనే దెప్పుడు? నా కోసమే నువ్వీ మానవదేహం ధరించి వచ్చావు.” తరువాత జగన్నాథస్వామిని ఎంతో ఆర్తితో ఇలా ప్రార్థించారు: “జగన్నాథా! జగత్బంధూ! దీనబంధూ! నేను కూడా ఈ జగత్తులోని వాడినే కదా! నామీద కూడా దయ చూపించు.” ప్రేమోన్మత్తులై ‘ఒరియా దేశపు జగన్నాథ స్వామిని భజియించుము, ఆనందంలో ఓలలాడుము మనసా!’ అంటూ పాడసాగారు.అటుపైనా “శ్రీమన్నారాయణా! శ్రీమన్నారాయణా! నారాయణా! నారాయణా!” అంటూ నారాయణ నామాన్ని స్తుతిస్తూ నాట్యం చేయసాగారు.
తరువాత నాట్యం చేస్తూనే ‘ఓ సఖీ, ఎవరి కోసమైతే పిచ్చిదానినైతినో ఆతడు నాకు లభించనేలేదే’ అనే పాట పాడారు. పాట ముగిశాక శ్రీరామకృష్ణులు భక్తులతోపాటు చిన్నగదిలో ఆసీనులయ్యారు. అయిదు సంవత్సరాల బాలుడివలె ఆయన పూర్తిగా దిగంబరంగా ఉన్నారు. ‘మ’, బలరామ్ మరికొందరు భక్తులు అక్కడ ఉన్నారు.
42.7.1 భగవద్రూప దర్శనం – పవిత్ర హృదయులైన యువకులను ఎందుకు ప్రేమిస్తానో తెలుసా?
శ్రీరామకృష్ణులు: భగవద్రూపాలను దర్శించవచ్చు. ఉపాధులన్నీ తొలగిపోయినప్పుడు, విచారణ ఆగిపోయినప్పుడు భగవద్దర్శనం కలుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి నోటమాట రాకుండా సమాధిస్థితిలోకి వెళ్ళిపోతాడు. థియేటర్‌కు వెళ్ళాక జనులు ఎన్ని రకాల మాటలు మాట్లాడుతుంటారు! కాని ఒకసారి తెర లేవగానే, మాటలన్నీ ఆగిపోతాయి. రంగస్థలంపై తాము చూస్తున్న దృశ్యాలలో లీనమైపోతారు.
“మీకు అతి గోప్యమైన విషయం ఒకటి చెప్పాలి. పూర్ణుడు, నరేంద్రుడు మొదలైన కుర్రవాళ్ళను నేను ఇంతగా ఎందుకు ప్రేమిస్తానో తెలుసా? ఒకసారి మధురభావంలో నేను జగన్నాథస్వామిని ఆలింగనం చేసుకోబోయి చెయ్యి విరగ్గొట్టుకున్నాను. అప్పుడు నాకు ఇలా వెల్లడయింది: ‘నువ్విప్పుడు మానవదేహం ధరించి ఉన్నావు. కాబట్టి మానవులతో సఖీభావం, వాత్సల్యభావం మొదలైన భావాలను ఏర్పరచుకొని ఉండు.’
“నాకు రామ్‌లాలా (బాలరాముడు) పట్ల ఎలాంటి భావాలు కలిగేవో ప్రస్తుతం పూర్ణుడు మొదలైన వారిని చూసినప్పుడు కూడా అలాంటి భావాలే కలుగుతున్నాయి. నేను రామ్‌లాలాకు స్నానం చేయించేవాడిని, అన్నం తినిపించే వాడిని, పడుకోబెట్టేవాడిని; వెంటబెట్టుకొని అటూ ఇటూ తిరుగుతూండేవాడిని. రామ్లాలాకోసం విలపించేవాడిని. ప్రస్తుతం ఈ అబ్బాయిల పట్ల నాకు సరిగ్గా అలాంటి భావమే కలుగుతోంది. నిరంజన్ విషయమే తీసుకో. అతడు ఎంత నిర్లిప్తంగా ఉంటాడని! పేదవాళ్ళను డాక్టరు వద్దకు తీసుకువెళ్ళి వారికి తన సొంత డబ్బుతో వైద్యం చేయిస్తాడు. పెళ్ళిమాట ఎత్తగానే ‘అయ్య బాబోయ్! అది విశాలాక్షి* లోని సుడిగుండం లాంటిది’ అంటాడు. అతడు ఒక జ్యోతి మీద కూర్చొని ఉన్నట్లుగా నేను గాంచుతుంటాను.
“పూర్ణుడు సాకారోపాసనలో అత్యున్నత స్థాయికి చెందినవాడు. అతడు విష్ణువు అంశతో జన్మించినవాడు. ఆహా! భగవంతుడి కోసం ఎలాంటి వ్యాకులత చెందుతాడు.
(‘మ’ తో) “అతడు నిన్ను తన సోదర శిష్యుడిగా, తన సొంత మనిషిగా చూడటం నువ్వు గమనించలేదా? అతడు నన్ను మళ్ళీ కెప్టెన్ ఇంట్లో కలుసుకుంటానని చెప్పాడు.
42.7.2 నరేంద్రుడు సహస్రదళ పద్మం
“నరేంద్రుడు అత్యున్నత స్థాయికి చెందినవాడు; నిరాకారానికి చెందినవాడు. అతడిది పురుష స్వభావం. ఇక్కడకు ఎంతోమంది భక్తులు వస్తూవుంటారు. కాని అతడిలాంటి వారు మరెవరూ లేరు.
“అప్పుడప్పుడు నేను ఈ భక్తులలో ఎవరెవరు ఏ స్థాయికి చెందినవారని గణిస్తూ ఉంటాను. వారిలో కొందరు దశదళ పద్మాలవంటి వారు; కొందరు పదహారు దళాలున్న పద్మాలవంటివారు; మరికొందరు శతదళ పద్మాలవంటి వారు. కాని పద్మాలన్నిటిలోనూ నరేంద్రుడు సహస్రదళ పద్మం లాంటివాడు.
“తక్కిన భక్తులందరూ చిన్నచిన్న పాత్రలు లేక కుండల వంటివారు. కాని నరేంద్రుడు ఏకంగా ఒక పెద్ద పీపాలాంటివాడు.
“తక్కిన వారందరూ చిన్న చిన్న మడుగుల వంటివారు. కాని నరేంద్రుడు హల్దార్పుకుర్లా ఒక పెద్ద చెరువు లాంటివాడు.
“చేపలలో నరేంద్రుడు ఎర్రకళ్ళున్న పెద్ద బేడిస చేపలాంటివాడు. మిగిలిన వారందరూ చిన్నచిన్న చేపలవంటివారు. బేల్ఘరియాకు చెందిన తారక్ చిన్న మృగేల్ చేపలాంటివాడు.
“నరేంద్రుడు ‘చాలా పెద్ద ఆధారం’ ; అనేక వస్తువులను అందులో ఉంచవచ్చు. అతడు లోపల డొల్లభాగం అధికంగా ఉన్న వెదురుగడలాంటివాడు.
“నరేంద్రుడు దేని వశంలోనూ ఉండడు. ఆసక్తి, ఇంద్రియసుఖాలకు అతడు వశవర్తి కాడు. అతడు మగపావురం లాంటివాడు. మగపావురం ముక్కును పట్టుకున్నట్లయితే అది బలవంతంగా ఆ పట్టును వదిలించివేసుకొంటుంది. కాని ఆడ పావురం కదలకమెదలక నిశ్చలంగా కూర్చుండిపోతుంది.
“నరేంద్రుడు పురుష స్వభావం కలవాడు. అందుకే అతడు బండిలో కుడివైపు కూర్చుంటాడు. భవనాథ్ది స్త్రీ స్వభావం. అందుకే నేను అతణ్ణి మరోవైపు కూర్చోబెడతాను.
“ఏదయినా సమావేశంలో నరేంద్రుడు నాతోపాటు ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది.”
సమయం ఉదయం ఎనిమిది గంటలవుతోంది. మహేంద్ర ముఖర్జీ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లాడు. హరిపదుడు, తులసీరాం తదితర భక్తులు క్రమంగా వచ్చి ఆయనకు ప్రణామం చేసి కూర్చున్నారు. బాబూరామ్ జ్వరంతో పడకబెట్టినందున రాలేకపోయాడు.
శ్రీరామకృష్ణులు(‘మ’ ప్రభృతులతో): చిన్న నరేంద్రుడు రాలేదా? బహుశా నేను వెళ్ళిపోయాననుకొని ఉంటాడు. (ముఖర్జీతో) ఎంత ఆశ్చర్యమో చూడు! పసితనంలో స్కూలు నుండి వచ్చాక అతడు భగవంతుడి కోసం విలపించేవాడు. భగవంతుడికై విలపించటమంటే సామాన్య విషయమా ఏమిటి? పైగా, అతడు ఎంతో తెలివైనవాడు కూడా. లోపల డొల్లభాగం అధికంగా ఉన్న వెదురగడ లాంటివాడు అతడు. అంతేకాదు, అతడి మనస్సంతా నా పైనే లగ్నమై ఉంది. గిరీశ్ ఘోష్ ఒకసారి నాతో ఇలా అన్నాడు: ‘ఒకరోజు చిన్న నరేంద్రుడు నవగోపాల్ ఇంటికి కీర్తన జరిగేటప్పుడు వెళ్ళాడు. లోపలకు వెళ్ళగానే “ఆయన ఎక్కడ?” అని అడగసాగాడు. పిదప పరిసరాల గురించి బాహ్యస్మృతిని కోల్పోయాడు. అక్కడ కూర్చున్నవారి మీద కాళ్ళుపెట్టి నడవసాగాడు.’ పైగా, ఇంట్లో వాళ్ళు చీవాట్లు పెడతారనే భయంకూడా లేదు. ఒక్కోసారి వరుసగా మూడు రాత్రుళ్ళు దక్షిణేశ్వరంలోనే ఉండిపోయేవాడు.
42.8 అష్టమ పరిచ్ఛేదం భక్తి యోగ నిగూఢత్వం – జ్ఞాన భక్తిల సమన్వయం
ముఖర్జీ: నిన్న మీరు చెప్పిన దాన్ని విని హరి నోటమాట రాకుండా నిశ్చేష్టుడైపోయాడట. నాతో ఇలా అన్నాడు: ‘ఆయన పలుకులలోని అంతరార్థాన్ని మనం సాంఖ్యం, పాతంజలం, వేదాంతాలలోనే చూడగలం. ఆయన సామాన్య వ్యక్తి కాదు.’
శ్రీరామకృష్ణులు: కాని సాంఖ్యం, వేదాంతాల నన్నిటినీ ఎన్నడూ నేను చదవనే లేదే!
“పూర్ణజ్ఞానం, పూర్ణభక్తి రెండూ ఒక్కటే. ‘నేతి, నేతి’ అంటూ విచారణ అంతమైనప్పుడు బ్రహ్మజ్ఞానం జనిస్తుంది. అప్పుడు అతడు మొదట్లో దేన్నయితే పరిత్యజించాడో దానినే మళ్ళీ స్వీకరిస్తాడు. మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి. అయితే ఒకసారి మెట్లు ఎక్కి డాబా మీదకు పోయాక డాబా ఏ వస్తువులతో అయితే అంటే ఇటుకలు, సున్నం, బంకమన్నుతో తయారయిందో మెట్లు కూడా అవే వస్తువులతో తయారై ఉన్నట్లు అతడు గాంచుతాడు.
“ఉచ్చం గురించి ఎరుక ఉన్నవాడికి నీచం గురించిన ఎరుక కూడా ఉంటుంది. జ్ఞానసముపార్జనానంతరం ఉచ్చనీచాలు రెండూ ఒకటిగానే తోస్తాయి.
“ప్రహ్లాదుడు జ్ఞానావస్థలో ఉండేటప్పుడు ‘సోఽహం’ భావంలో ఉండేవాడు. కాని దేహబుద్ధి కలిగినప్పుడు అతడు ‘దాసోఽహం భావంలో ఉండే వాడు; ‘నేను నీ దాసుణ్ణి’ అనేవాడు.
“హనుమంతుడు ఒక్కోసారి ‘సోఽహం’ భావంలో, మరోసారి ‘నేను దాసుణ్ణి’ అనే భావంలో, మరికొన్ని సందర్భాలలో ‘నేను నీ అంశను’ అనే భావంలో ఉండేవాడు.
“మనిషి భక్తిని ఎందుకు కలిగివుండాలి? అలా లేనట్లయితే మనిషి దేన్ని ఆధారంగా చేసుకొని రోజులు వెళ్ళబుచ్చుతాడు.
“ఈ ‘నేను’ అనేది పోయేది కాదు. ‘నేను’ అనే కుండ (అంటే దేహభావన) ఉన్నంతవరకు ‘సో-హం’ భావం కలుగదు. సమాధి స్థితిని పొందినప్పుడు ‘నేను’ అనేది సమూలంగా తుడిచిపెట్టుకు పోతుంది. అప్పుడు ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. రాంప్రసాద్ ఇలా అనేవాడు: ‘అమ్మా! నాకు జ్ఞానం కలిగాక నేను మంచివాడినా లేక నువ్వు మంచిదానివా అన్న సంగతి నీకే తెలియాలి.’
“ ‘నేను’ అనే భావన ఉన్నంతవరకు ‘నేను భక్తుణ్ణి’ అనే భావాన్ని ఆశ్రయించుకొని ఉండటమే మంచిది. ‘నేను భగవంతుణ్ణి’ అన్న భావం మంచిది కాదు. దేహాత్మబుద్ధి కలిగివున్న వ్యక్తి తాను కృష్ణుణ్ణి అన్న భావం ఉంచుకోరాదు, అందుకు మారుగా తాను కృష్ణుడి భక్తుణ్ణి అన్న భావం నిలుపుకోవాలి. కాని భగవంతుడే స్వయంగా భక్తుణ్ణి లాక్కొన్నపుడు అది వేరే సంగతి. ఇది యజమాని తన సేవకుడితో ‘రావయ్యా రా, వచ్చి నాకు దగ్గరగా కూర్చో. నువ్వు నేను ఒక్కటే’ అనడం లాంటిది.
“తరంగాలు గంగానదికి చెందుతాయే కాని గంగానది తరంగాలకు చెందదు.
శివుడికి రెండు రకాల స్థితులూ ఉన్నాయి. ఆత్మారాముడై ఉండేటప్పుడు ఆయన ‘సోఽహం’ భావంలో ఉంటాడు; ఆ యోగంలో (మనోదేహాలు) అన్నీ స్థిరంగా ఉంటాయి. కాని ఈ ‘నేను’ అనేది వేరైనది అన్న ఎరుక ఉన్నప్పుడు ఆయన ‘రామ, రామ’ అంటూ నృత్యం చేస్తుంటాడు.
“ఏదైతే అచలమో అది చలిస్తుంది కూడా. ఈ క్షణంలో నువ్వు స్థిరంగా ఉన్నావు. కాని కొన్ని క్షణాల తరువాత నువ్వే ఏదైనా పని చేస్తుంటావు.
“జ్ఞాని, భక్తుడు ఇద్దరూ ఒక్కటే. తేడా ఏమిటంటే, ఒక వ్యక్తి ‘నీరు’ అంటాడు; మరో వ్యక్తి ‘మంచుగడ్డ’ అంటాడు.
42.8.1 రెండు రకాల సమాధి స్థితులు – కామినీ కాంచనాలే సమాధికి అవరోధాలు
“సామాన్యంగా చెప్పాలంటే, సమాధి స్థితి రెండు రకాలుగా ఉంటుంది. జ్ఞానమార్గంలో విచారణ చేస్తూ పోయినప్పుడు అహం నశించిపోయాక కలిగే సమాధిని స్థిరసమాధి లేక జడసమాధి (నిర్వికల్ప సమాధి) అంటారు. భక్తి మార్గంలో కలిగే సమాధిని భావసమాధి అంటారు. ఈ సమాధిలో భక్తుడు భగవదానందాన్ని అనుభవించటానికి, ఆయన లీలను ఆస్వాదించటానికి వీలుగా రేఖామాత్రంగా కొద్దిపాటి ‘అహం’ ఉంటుంది. కాని కామినీ కాంచనాలలో ఆసక్తి ఉన్నట్లయితే వీటినన్నిటినీ అవగతం చేసుకోలేము.
“కేదార్‌తో నేను ‘కామినీ కాంచనాల పట్ల మనస్సు లగ్నమై ఉంటే యోగం సిద్ధించదు’ అని చెప్పాను. అతడి ఛాతీని ఒకసారి చేత్తో నిమురుదా మనిపించింది. కాని అలా చేయలేకపోయాను. అతడి లోపల ఎన్నో ముడులు, మెలికలు ఉన్నాయి. దుర్గంధభూయిష్ఠమై ఉన్న ఇంట్లోకి వెళ్ళలేం కదా! అలాంటి దన్నమాట. కాశీ వరకు వేళ్ళు పాతుకుపోయిన స్వయంభూలింగంలా అతడి విషయాసక్తి వేళ్ళూని ఉంది. సంసారం పట్ల అనురక్తి – కామినీ కాంచనాలపట్ల అనురక్తి ఉన్నట్లయితే యోగం సిద్ధించదు.
“ఈ కుర్రవాళ్ళను కామినీ కాంచనాలు ఇంకా స్పృశించలేదు. అందుకే నేను వీరిని అంతగా ప్రేమిస్తాను. హాజ్రా నాతో, ‘కుర్రవాళ్ళు ధనవంతుల కుటుంబాలకు చెందినవారయిన పక్షంలో లేదా వారు అందగాళ్లైన పక్షంలో మీరు వారిని ప్రేమిస్తారు’ అన్నాడు. మరి అలాంటి పక్షంలో నేను హరీశ్, లాటూ, నరేంద్రుడు మొదలైనవారిని ఎందుకు అభిమానిస్తాను? నరేంద్రుడికి అన్నంలో ఉప్పు వేసుకొని తినడానికి కావలసిన డబ్బు కూడా లేదు.
“ఈ కుర్రవాళ్ళలో విషయాసక్తి ఇంకా ప్రవేశించలేదు. అందుకే వీరు అంతరంగాన అంతగా పరిశుద్ధులై ఉన్నారు. పైగా, వీరిలో చాలామంది నిత్యసిద్ధులు. పుట్టుకతోనే భగవంతుడిపట్ల ఆకర్షణ కలిగి ఉన్నారు. ఇది ఎలాంటిదంటే – నువ్వొక తోటను ఖరీదు చేశావనుకో. తోటను శుభ్రం చేస్తూండగా ఒక చోట ఇదివరకే వేయబడి ఉన్న నీటిగొట్టం ఒకటి తారసపడింది. నువ్వు ఏ ప్రయత్నం చేయకుండానే నీరు ఎగజిమ్ముతూ వస్తుంది.”
42.8.2 నిరంజన్ మాతృసేవ
బలరామ్: మహాశయా, సంసారం మిథ్య అనే జ్ఞానం పూర్ణుడికి ఇలా ఉన్నట్టుండి ఎలా కలిగింది?
శ్రీరామకృష్ణులు: అతడికి ఆ జ్ఞానం పూర్వజన్మల నుండి సంక్రమించింది. గతజన్మలలో అతడు అనేక సాధనలు చేసి ఉన్నాడు. బాల్యం, వృద్ధాప్యం – ఇవన్నీ దేహానికే కాని ఆత్మకు కాదు.
“ఈ కుర్రవాళ్ళు ఎలాంటి వారో తెలుసా? పిందెవేసి తరువాత పువ్వు పూసే మొక్కలలాంటివారు వీళ్ళు. వీరికి ముందుగానే భగవంతుడి దర్శనం కలుగుతుంది; తరువాత ఆయన మహిమలను, గుణాలను శ్రవణం చేస్తారు; అటు తరువాత భగవంతుడిలో ఐక్యం చెందుతారు. నిరంజన్ విషయమే తీసుకో. అతడికి ఒకరితో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారమే లేదు. ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు వెళ్ళిపోగలడు. కాని కన్నతల్లి ఉన్నంతవరకు ఆమె బాగోగులు చూడవలసి ఉంటుంది. నేను మా అమ్మను పువ్వులు, చందనంతో పూజించేవాడిని. ఆ జగన్మాతే కన్నతల్లిగా వస్తుంది.
“తన దేహం, దాని బాగోగుల గురించి ఎరుక ఉన్నంత వరకు అమ్మ బాగోగులను గురించి కూడా పట్టించుకోవలసి ఉంటుంది. అందుకే నేను హాజ్రాతో ఇలా అన్నాను: ‘నీకు జలుబు చేయగానే నువ్వు మిరియాలు, పటికబెల్లం, ఉప్పు సమకూర్చుకుంటావు. నువ్వు నీ దేహాన్ని సంరక్షించుకోవాలి అని తలచినంత కాలం తల్లి సంరక్షణ గురించి కూడా ఆలోచించాలి.’
“కాని నువ్వు నీ దేహాన్ని పూర్తిగా మరచిపోయినప్పుడు అది వేరే సంగతి. అప్పుడు స్వయంగా భగవంతుడే నీ భారాన్ని స్వీకరిస్తాడు. యుక్తవయస్సు రాని పిల్లలు (మైనర్లు) తమ భారాన్ని తాము స్వీకరించలేరు కదా! అందుకనే వారికోసం సంరక్షకుణ్ణి (guardian) నియమిస్తారు. చైతన్యదేవులు, అటువంటి పిల్లవాడిలాగా తమను సంరక్షించుకోలేకుండేవారు.”
42.9 నవమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల అద్భుత దర్శనాలు – శ్రీరామకృష్ణుల జాతకం
ఆ తరువాత ‘మ’ గంగాస్నానం ఆచరించడానికి వెళ్ళాడు. స్నానం చేశాక తిరిగి వచ్చి చూసేసరికి శ్రీరామకృష్ణులు అదే చిన్న గదిలో భక్తులతో సంభాషిస్తూ ఉన్నారు. మహేంద్ర, బలరామ్, తులసి, హరిపదుడు, గిరీశ్ తదితర భక్తులు నేల మీద కూర్చుని ఉన్నారు. గిరీశ్, శ్రీరామకృష్ణుల కృపకుపాత్రుడై, గత ఏడెనిమిది నెలలుగా ఆయన వద్దకు వస్తూ ఉన్నాడు. ‘మ’ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఆయనకు సమీపంలో కూర్చున్నారు. ప్రస్తుతం శ్రీరామకృష్ణులు అద్భుతమైన తమ భగవత్ దర్శన వృత్తాంతాలను తెలుపుతున్నారు.
శ్రీరామకృష్ణులు: ఒక రోజు కాళీ ఆలయంలో హలధారి, నాంగ్టాలు ఇరువురూ అధ్యాత్మ రామాయణం పఠించేటప్పుడు నేను హఠాత్తుగా ఒక నదిని చూశాను. దానికి రెండు వైపులా వనాలు ఉన్నాయి. చెట్లు, మొక్కలు అన్నీ పచ్చపచ్చగా ఉన్నాయి. రామలక్ష్మణులు ఇరువురూ లాగులు తొడుక్కొని వెళ్తున్నారు. మరోనాడు ఆలయ కార్యాలయం ఎదురుగా అర్జునుడి రథాన్ని చూశాను. అందులో శ్రీకృష్ణుడు సారథిగా కూర్చుని ఉన్నాడు. అది నా కింకా గుర్తుంది. ఇంకో రోజు, కామార్పుకూర్లో కీర్తనలను వినేటప్పుడు ఎదురుగా గౌరాంగుణ్ణి చూశాను.
“ఆ సమయంలో దిగంబరంగా ఉన్న వ్యక్తి ఒకరు నా దేహం నుండి బయటకు వచ్చి నాతోపాటు తిరుగుతూ ఉండేవాడు. నేను అతడితో పరాచికాలాడేవాడిని. అతడు బాలుడిలా అగుపించే పరమహంస. ఆ సమయంలో నేను చూసిన భగవద్రూప దర్శనాలన్నిటినీ తెలియపరచటం సాధ్యం కాదు. అప్పుడు నేను అజీర్తి రోగంతో బాధపడేవాడిని. ఏవైనా దర్శనాలను గాంచినట్లయితే ఆ రోగం ప్రకోపించేది. అందువల్ల భగవద్రూపాలను చూసినప్పుడల్లా నేను నేల మీదకు ‘థూ, థూ’ అని ఉమ్మివేసి వాటిని వదిలించుకోడానికి ప్రయత్నించే వాడిని. కాని అవి భూతాల్లాగా వెంటపడి మళ్ళీ మళ్ళీ నన్ను పట్టుకొనేవి. నేను భావావస్థలో ఉన్మత్తుడనై ఉండేవాడిని. రాత్రింబవళ్ళు ఎలా గడిచేవో తెలిసేది కాదు. అయితే అలాంటి భావం కలిగిన తరువాత మరుసటి రోజు విరేచనమై భావాలన్నీ జారిపోయేవి. (నవ్వులు)
గిరీశ్: అయ్యా, నేను మీ జాతకం చూస్తున్నాను.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నేను శుక్లపక్ష విదియనాడు జన్మించాను. జన్మ సమయంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడి స్థానాలు నా జాతకం చూపుతుంది. అంతకు మించి మరే సమాచారం లేదు.
గిరీశ్: మీరు కుంభరాశిలో జన్మించారు. రాముడు, కృష్ణుడు కర్కాటక, వృషభ రాశులలో జన్మించారు. చైతన్యదేవులు సింహరాశిలో జన్మించారు.
42.9.1 శ్రీరామకృష్ణుల రెండు కోరికలు – సాధనావశ్యకత
శ్రీరామకృష్ణులు: నాకు రెండు కోర్కెలు ఉండేవి. ఒకటి, భక్తులందరికి రాజును కావాలి. రెండు, శుష్కమైన సాధువును కాకూడదు.
గిరీశ్ (నవ్వుతూ): మీరు సాధనలు ఎందుకు చేయవలసి వచ్చింది?
శ్రీరామకృష్ణులు: భగవతీ దేవి శివుడి కోసం అనేక కఠోరసాధనలు చేసింది; పంచాగ్ని తపస్సు, చలికాలంలో శరీరాన్ని నీటిలో ముంచి ఉంచడం, తదేకంగా సూర్యుడి వంకే చూస్తూండిపోవటం – ఇవన్నీ చేసింది. స్వయంగా కృష్ణుడే రాధా యంత్రంలో ఎన్నో సాధనలు చేసేవాడు – యంత్రం బ్రహ్మయోని. దాన్ని పూజించి ధ్యానించేవాడు. ఆ బ్రహ్మయోని నుండే కోటానుకోట్ల బ్రహ్మాండాలు ఉత్పన్నమవుతాయి.
42.9.2 బిల్వ వృక్షం క్రింద తంత్ర సాధన
“అతి గుప్తమైన విషయాలు సుమా! బిల్వవృక్షం క్రింద నేను ఉజ్జ్వల దర్శనాలు గాంచాను. అక్కడే నేను అనేక తాంత్రిక సాధనలు చేశాను. అందుకోసం మానవ కపాలం మొదలైన వస్తువులు కావలసి వచ్చేది. బ్రాహ్మణి (భైరవీ బ్రాహ్మణి) వాటినన్నిటినీ సమకూర్చేది. అక్కడ ఎన్నో ఆసనాలను కూడా అభ్యసించాను.
“అప్పుడు మరో స్థితి కలుగుతూ ఉండేది. ఎన్నడైనా అహంకారం కలిగినట్లయితే మరుసటి రోజు అనారోగ్యానికి గురయ్యేవాడిని.”
శ్రీరామకృష్ణుల అద్భుత దర్శనాలను గురించిన వివరాలు విని ‘మ’ నిశ్చేష్టుడై రాతిబొమ్మలాగా స్థిరంగా కూర్చుండిపోయాడు. భక్తులు కూడా మాటపలుకు లేకుండా నిశ్చేష్టులైపోయారు. గదిలో నిశ్శబ్దం తాండవిస్తోంది.
తులసీ(‘మ’ ను చూపుతూ): ఈయన ఎప్పుడూ నవ్వనే నవ్వడు.
శ్రీరామకృష్ణులు: కాని అతడు అంతరంగాన నవ్వుతూ ఉంటాడు. ఫల్గు నదికి ఉపరితలాన ఇసుక ఉంటుంది. దాన్ని తవ్వగానే నీరు బయటపడుతుంది.
(‘మ’ తో) “నువ్వు నాలుకను గీచుకోవా? నాలుకను రోజూ గీచుకొంటూ ఉండు.”
బలరామ్: అదిసరే, ఈయన (‘మ’) ద్వారా పూర్ణుడు మీ గురించిన విషయాలు అనేకం విన్నాడు.
శ్రీరామకృష్ణులు: బహుశా నాకు కలిగిన తొలి అనుభూతుల గురించి చెప్పాడేమో!
బలరామ్: పూర్ణుడు సహజసిద్ధుడైనట్లయితే మరి ఈయన (‘మ’) సంగతి ఏమిటి?
శ్రీరామకృష్ణులు: ఇతడు నిమిత్తమాత్రుడు.
సమయం తొమ్మిది గంటలయింది. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి బయలు దేరనున్నారు. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాగ్‌బజార్‌లోని అన్నపూర్ణా ఘట్టం వద్ద పడవ నొకదానిని సిద్ధం చేశారు. శ్రీరామకృష్ణులకు ఒక్కరొక్కరుగా భక్తులు సాష్టాంగ ప్రణామం చేశారు.
శ్రీరామకృష్ణులు ఒకరిద్దరు భక్తులతో పాటు వెళ్ళి పడవలో కూర్చున్నారు. వారితోపాటు గోపాల్-మా కూడా పడవ ఎక్కింది. దక్షిణేశ్వరంలో కాస్త విశ్రాంతి తీసుకొని అక్కడ నుండి సాయంత్రం కామార్హాటీకి కాలినడకన వెళ్ళాలని ఆమె ఉద్దేశం. దక్షిణేశ్వరంలో రాఖాల్ ఉపయోగించే క్యాంప్ కాట్ (camp cot)ను మరమ్మత్తుల నిమిత్తం కలకత్తాకు పంపారు. ప్రస్తుతం దాన్ని కూడా పడవలోకి ఎక్కించారు.
నేడు మఖ నక్షత్రం; శుభకరమైనది కాదు. అందువల్ల మళ్ళీ వచ్చే శనివారం నాడు బలరాం బోస్ ఇంటికి వెళ్ళి తిరుగు ప్రయాణాన్ని శుభప్రదమైన రోజున చేయాలని శ్రీరామకృష్ణులు నిర్ణయించారు.