3.1 ప్రథమ పరిచ్ఛేదం విద్యాసాగర్ ఇల్లు
శనివారం, ఆగష్టు 5, 1882
శ్రీరామకృష్ణులు బాడుగ బండిలో దక్షిణేశ్వరం నుండి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఇంటికి బయలుదేరారు. భవనాథ్, ‘మ’, హాజ్రా ఆయనతో ఉన్నారు.
శ్రీరామకృష్ణులు హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ గ్రామంలో జన్మించారు. కామార్పుకూర్కు సమీపంలోని వీరసింహమనే గ్రామంలో విద్యాసాగర్ జన్మించాడు. శ్రీరామకృష్ణులు బాల్యం నుండి విద్యాసాగర్ దయాగుణాన్ని గురించి వినివున్నారు, శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలో ఉంటున్నప్పుడు విద్యాసాగర్ దయాగుణాన్ని, పాండిత్యాన్ని గురించి విని ఆయనను చూడాలని అనేక రోజులుగా ఎదురుచూస్తున్నారు. విద్యాసాగర్ పాఠశాలలో ‘మ’ ఉపాధ్యాయుడుగా ఉంటున్నాడని విని, తనకు విద్యాసాగర్‌ను కలుసుకోవాలనే కోరిక ఉందని, తనను వారి వద్దకు తీసుకెళ్లగలవా అని శ్రీరామకృష్ణులు ‘మ’ ను అడిగారు.
శ్రీరామకృష్ణుల కోరికను ‘మ’, విద్యాసాగర్‌కు తెలిపాడు. అందుకు విద్యాసాగర్ సంతోషంగా సమ్మతించి శ్రీరామకృష్ణులను ఒక శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పిలుచుకొని రమ్మన్నాడు. “ఆయన ఎలాటి పరమహంస? కాషాయాంబరధారుడా?” అని విద్యాసాగర్ ‘మ’ ను అడిగాడు. అందుకు ‘మ’ ఇలా అన్నాడు: “లేదండి… ఆయన ఒక అసామాన్య వ్యక్తి. ఎర్ర అంచుపంచె, చొక్కా ధరిస్తారు. పాలిష్ చేసిన పాదరక్షలు ధరిస్తారు. రాస్మణి నిర్మించిన కాళికాలయంలోని ఒక గది ఆయన నివాసం. ఆయన గదిలో ఒక మంచం, దాని మీద పరుపు, దోమతెర ఉంటాయి. ఆ పరుపు మీద ఆయన నిద్రపోతారు. ఆయనలో ఎలాంటి బాహ్యచిహ్నాలు ఉండవు. ఆయనకు భగవంతుడు తప్ప మరేమీ తెలియదు. అహర్నిశలూ భగవచ్చింతనలోనే గడుపుతారు.”
శ్రీరామకృష్ణుల బండి దక్షిణేశ్వర కాళికాలయం నుండి బయలుదేరింది. బండి శ్యామ్‌బజార్ దాటి ఆమ్హర్ట్ వీధిని చేరుకొంది. అప్పుడు భక్తులు “మనం ‘బాదుర్బాగాన్’ దగ్గరకు వచ్చేశాం” అన్నారు. శ్రీరామకృష్ణులు బాలుడి మాదిరి ఆనందంతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆమ్హర్ట్ వీథిగుండా పోతూవుంటే హఠాత్తుగా శ్రీరామకృష్ణులకు భావపరివర్తనమయింది. పారవశ్యస్థితి కలిగింది. బండి రాజారామ్మోహన్ రాయ్ నివసించిన ఇంటి మీదుగా పోతూవుంటే, శ్రీరామకృష్ణుల భావావస్థ్ధను గమనించకుండానే ‘మ’ ఆ ఇంటిని చూపిస్తూ “ఇది రామ్మోహన్ రాయ్ నివసించిన ఇల్లు” అన్నాడు. శ్రీరామకృష్ణులు విసుగు వ్యక్తం చేస్తూ “అలాంటి సంగతులు నా కిప్పుడు పట్టవు” అన్నారు. ఆయన భావోన్మత్తులవుతున్నారు.
బండి విద్యాసాగర్ ఇంటి ముందు ఆగింది. అది ఆంగ్లేయుల పద్ధతిలో నిర్మించిన రెండంతస్తుల మేడ. ఆవరణ మధ్యలో ఇల్లు కట్టబడింది. చుట్టూ ప్రహరీగోడ ఉంది. ఇంటికి పడమర వైపుగా ముఖద్వారం ఉంది. పడమరవైపు ప్రహరీగోడకు, ఇంటికి నడిమి స్థ్ధలంలో పువ్వులతోట వుంది. కింది అంతస్తు పడమరలో ఉన్న గదిలోనుండి మేడ మీదికి వెళ్ళటానికి మెట్లున్నాయి. రెండవ అంతస్తులో విద్యాసాగర్ నివాసం. రెండో అంతస్తులో ఉత్తరం వైపు ఒక గది, తూర్పువైపు ఒక హాలు ఉన్నాయి. ఆగ్నేయ మూలలోని గదిలో విద్యాసాగర్ శయనిస్తాడు. దక్షిణం వైపు మరో గది ఉంది. విలువైన పుస్తకాలతో అన్ని గదులూ నిండి ఉన్నాయి. గోడలకు షెల్ఫ్‌లు బిగించి వాటిలో వరుసక్రమంలో చక్కగా బైండ్ చేయించిన పుస్తకాలు అమర్చబడి ఉన్నాయి. హాల్లో తూర్పు వైపున ఒక బల్ల, కుర్చీ ఉన్నాయి. విద్యాసాగర్ ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు పశ్చిమాభిముఖుడై ఉంటాడు. విద్యాసాగర్‌ను చూడవచ్చిన వారు బల్లముందున్న కుర్చీల్లో కూర్చుంటారు. ఆ బల్ల మీద కలం, కాగితాలు, సిరాబుడ్డి, బ్లాటింగ్, అనేక ఉత్తరాలు, జమాఖర్చుల పుస్తకాలు, విద్యాసాగర్ రచించిన కొన్ని పాఠ్యపుస్తకాలు ఉన్నాయి. ఈ కుర్చీకి దక్షిణం వైపున్న గదిలో మంచం, పరుపు ఉన్నాయి. ఆయన వాటిపై నిదురిస్తాడు.
ఇంకా అనేకమంది నానారకాలైన సహాయాలు కోరుతూ విద్యాసాగర్‌కి రాసిన ఉత్తరాలు ఉన్నాయి. ఆ ఉత్తరాలలో ఒకటి వితంతువు తన పిల్లలను పోషించే వసతిలేక వారిని సంరక్షించే భారాన్ని స్వీకరించవలసిందని విద్యాసాగర్‌ను ప్రార్థిస్తూ వ్రాసివుండొచ్చు. ఒక విద్యార్థి విద్యాసాగర్ పాఠశాలలో ఉచితంగా చదువుకొంటూ, పుస్తకాలు కొనటానికి డబ్బు లేనందున, తనకు పుస్తకాలను ఇప్పించవలసిందిగా వ్రాసి ఉంటాడు. ఉద్యోగం ఇప్పించమనీ, తమ వివాదాలను తీర్పమనీ తమతమ కష్టాలను తెలుపుకొంటూ నిరంతరం విద్యాసాగర్‌ను సహాయం కోరుతూ అనేక ఉత్తరాలు వస్తూంటాయి.
విద్యాసాగర్ పాఠశాలలోని ఉపాధ్యాయుడు ఒకరు తన సోదరి వితంతు వైనందున ఆమె పోషణభారాన్ని తాను స్వీకరించాలి కాబట్టి, వచ్చే జీతం సరిపోదని వ్రాసివుండవచ్చును. విద్యాసాగర్ బయట ఊరికి వెళ్ళినందున తనకు ఆయన సకాలంలో పంపే నెలసరి మాన్యం రాకపోవటంతో తాను కష్టపడుతున్నానని మరొకరు వ్రాసి ఉండవచ్చు.
శ్రీరామకృష్ణులు ఎర్రంచు పంచె, లాంగ్‌క్లాత్ చొక్కా ధరించారు. పంచె చెంగును భుజం మీద వేసుకున్నారు. పాదాలకు పాలిష్ చేయబడి ధగధగ మెరుస్తున్న చెప్పులు వేసుకున్నారు. శ్రీరామకృష్ణులు ‘మ’ చెయ్యి అందివ్వగా బండి దిగారు. ప్రాంగణంలో నానారకాల పువ్వుల మొక్కలున్నాయి. ‘మ’ దారి చూపిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు ఇంట్లోకి అడుగులు వేస్తూ పిల్లవాడి మాదిరి తమ చొక్కాగుండీని చూపిస్తూ “నా చొక్కాగుండీ ఊడిపోయింది. విద్యాసాగర్ దీన్ని తప్పుగా భావిస్తారా?” అని అడిగారు. “లేదండీ, దీన్ని గురించి పట్టించుకోవద్దు. మీ గురించి ఏదీ మరోవిధంగా తీసుకోరు” అన్నాడు ‘మ’. చిన్నపిల్లవాడికి ఒక విషయాన్ని గురించి భరోసా ఇస్తే ఎలా నిశ్చింతగా ఉంటాడో అలాగే శ్రీరామకృష్ణులు ‘మ’ ఇచ్చిన భరోసాకు నిశ్చింతులైనారు.
3.2 ద్వితీయ పరిచ్ఛేదం విద్యాసాగర్ వ్యక్తిత్వం
శ్రీరామకృష్ణులు భక్తులతో మెట్లెక్కి రెండవ అంతస్తులోని ఉత్తరంవైపు గదిలోకి వచ్చారు. అప్పుడు విద్యాసాగర్ నాలుగు మూలలున్న పొడవైన పాలిష్ చెయ్యబడ్డ బల్లముందున్న కుర్చీలో దక్షిణాభిముఖుడై కూర్చునివున్నాడు. ఆ బల్లకు తూర్పుగా ఆనుకునేందుకు వీలుగా ఒక కొయ్య బెంచీ ఉంది. బల్లకు పడమర, దక్షిణాలలో కుర్చీలున్నాయి. విద్యాసాగర్ తన మిత్రులతో మాట్లాడుతున్నాడు.
శ్రీరామకృష్ణులను చూడగానే ఆయన్ను ఆహ్వానించటానికి విద్యాసాగర్ లేచి నిలబడ్డాడు. శ్రీరామకృష్ణులు బెంచీకి తూర్పువైపు పడమర ముఖంగా నిలబడ్డారు. బల్ల మీద ఎడమ చెయ్యి ఆన్చి, చిరపరిచయస్థుడిగా ఆయన విద్యాసాగర్‌ను తదేకంగా చూస్తున్నారు; భావావస్థలో చిరునవ్వు నవ్వారు.
విద్యాసాగర్ వయస్సు సుమారు అరవై రెండు లేక అరవై మూడు ఏళ్లు ఉంటాయి. శ్రీరామకృష్ణుల కంటే పదహారు లేక పదిహేడేళ్లు పెద్ద. కోరా ధోవతి చొక్కా ధరించాడు, పాదాలకు చెప్పులు వేసుకున్నాడు. ఒరిస్సా ప్రాంతస్థుల్లా తలమీద పెద్ద ఒత్తైన పిలక మాత్రమే వుంది. ఆయనది తెల్లని పళ్ల వరుస. కాని అవి కట్టుడు పళ్లు. పరిమాణంలో తల పెద్దది. సమున్నతమైన లలాటం. కాస్త పొట్టి ఆకృతి. ఆయన బ్రాహ్మణుడు. మెడలో జందెం ఉంది.
విద్యాసాగర్‌లో అనేక సుగుణాలున్నాయి. మొదటిది – విద్యానురాగం. ఒక రోజు ‘మ’ తో మాట్లాడుతూ “నాకు విద్యాధ్యయనం చెయ్యాలనే ఆసక్తి ఎంతో ఉండేది. ఈ సంసారంలోపడి విరామంలేక అవకాశాన్ని కోల్పోయాను” అని వాపోయాడు.
ఆయనలోని రెండవ గుణం – భూత దయ. విద్యాసాగర్ దయా సాగరుడు. లేగదూడలకు కడుపారా పాలు లభించవనే కారణంగా తను పాలు తాగటం మానేశాడు. కాలాంతరంలో జబ్బు పడినప్పుడు పాలు తాగటం తప్పనిసరైనందున తిరిగి తాగటం ప్రారంభించాడు. ఎడ్లకు, గుఱ్ఱాలకు శ్రమగా ఉంటుందని ఎడ్లబండిలోగాని, గుర్రపు బండిలోగాని ఎక్కేవాడు కాడు. ఒక రోజు మూటలు మోసే కూలివాడొకడు దారిలో పడిపోయివుండటం చూశాడు. అతడి పక్కన మూటపడివుంది. వాడు కలరాతో బాధపడుతున్నాడు. ఆలస్యం లేకుండా ఆ కూలివాణ్ణి స్వయంగా ఎత్తుకొని తన ఇంటికి తీసుకెళ్ళి సేవలు చేశాడు.
ఆయనలోని మూడో గుణం – స్వాధీన ప్రియత. సంస్కృత కళాశాల అధికారులతో కలిగిన అభిప్రాయ భేదాలతో రాజీ పడకుండా, కళాశాల ప్రధానోపాధ్యాయ పదవికి రాజీనామా ఇచ్చాడు.
నాలుగవ గుణం – నిరభిమానత. తన కింది పనిచేస్తున్న ఒక బీద ఉపాధ్యాయుడి కుమార్తె వివాహానికి తానే స్వయంగా వెళ్ళి, వధువుకు ఒక చీరను వివాహకానుకగా ఇచ్చాడు.
ఐదవ గుణం – మాతృభక్తి, మనోబలమూ. కన్నతల్లి “ఈశ్వర్! నువ్వు సోదరుడి వివాహానికి రాకపోతే నేను ఎంతో విచారిస్తాను” అని కబురు పంపింది. తక్షణమే మరో ఆలోచన లేకుండా కాలినడకన కలకత్తా నుండి బయలుదేరాడు. దారిలో దామోదర్ నదిని దాటాలి. ఒక్క పడవ కూడా కనబడలేదు. ఈదుకుంటూనే ఆ నదిని దాటి తడిదుస్తులతో వివాహంనాటి రాత్రి సరైన సమయానికి వీరసింహ గ్రామాన్ని చేరుకొని “అమ్మా! వచ్చాను” అన్నాడు.
3.2.1 శ్రీరామకృష్ణులకు విద్యాసాగర్ స్వాగత సత్కారాలు – సంభాషణ
శ్రీరామకృష్ణులు భావావేశులవుతున్నారు. ఆ స్థితిలో కొంతసేపు నిలబడేవున్నారు. మనస్సును ఉన్నత ఆధ్యాత్మికస్థితి నుండి సామాన్యస్థితికి తీసుకురావటానికి “మంచినీళ్ళు తాగుతాను” అంటున్నారు.
ఇంతలో, ఇంట్లో ఉండే పిల్లవాళ్ళు, స్నేహితులు అక్కడికి వచ్చి నిలబడ్డారు.
శ్రీరామకృష్ణులు భావావేశులై ఒక బెంచీ మీద కూర్చున్నారు. ఆ బెంచీ మీదనే ఒక మూల పదహారు పదిహేడు సం ॥ ల బాలుడొకడు కూర్చుని ఉన్నాడు. అతడు తన చదువు నిమిత్తం ధనసహాయం కోరటానికి విద్యాసాగర్ వద్దకు వచ్చాడు.
శ్రీరామకృష్ణులు పూర్తిగా భావావిష్టులైనారు. ఋషితుల్యులైన శ్రీరామకృష్ణులు ఆ బాలుడి మనోస్థ్ధితిని అంతర్దృష్టితో గ్రహించారు. కాస్త దూరంగా జరిగి “అమ్మా! ఈ బాలుడు సంసారాసక్తుడు. నీ అవిద్యా సంసారానికి చెందినవాడు. నీ అవిద్యా బాలుడు” అన్నారు.
ఆ మాటలు విని ‘మ’ ఇలా తలపోశాడు: ‘బ్రహ్మవిద్య కోసం వ్యాకులత చెందక కేవలం కూటికోసం లౌకిక విద్యకై పాటుపడే వ్యక్తి అనర్థాలైన దుఃఖభోగాల పాలవుతాడని శ్రీరామకృష్ణులు సూచిస్తున్నారా ఏమిటి?’
విద్యాసాగర్ ఎవరినో మంచినీళ్ళు తెమ్మని చెప్పి ‘మ’ తో శ్రీరామకృష్ణులు ఏమైనా తీసుకొంటారా అని అడిగాడు. ‘మ’ ఆ మాటకు అడ్డు చెప్పకపోవటంతో విద్యాసాగర్ స్వయంగా తానే లోపలికి వెళ్ళి మధురభక్ష్యాలు తీసుకువచ్చాడు. “ఇవి బర్డ్వాన్ నుండి వచ్చాయి” అంటూ వాటిని శ్రీరామకృష్ణుల ముందు ఉంచాడు. భవనాథ్, హాజ్రాలు తమ వంతు స్వీకరించారు. ‘మ’ కు వాటిని ఇవ్వబోతూంటే విద్యాసాగర్ ఇలా అన్నాడు: “ఓ, ఇతడు ఈ ఇంటి మనిషే. ఇతడి గురించి పట్టించుకోనక్కర్లేదు.”
ఒక యువభక్తుణ్ణి గురించి చెబుతూ శ్రీరామకృష్ణులు విద్యాసాగర్‌తో ఇలా అన్నారు: “ఇతడు మంచి యువకుడు. లోన మంచి సారం వుంది. ఇతడు ఫల్గు నది వంటివాడు. ఉపరితలం ఇసుకతో కప్పబడి ఉంటుంది; కాని కాస్త తవ్వితే లోపల నీటి ప్రవాహం కానవస్తుంది.”
కొన్ని మధురభక్ష్యాలు ఆరగించిన తరువాత, చిరునవ్వుతో శ్రీరామకృష్ణులు విద్యాసాగర్‌తో మాట్లాడసాగారు. ఈలోపు గదంతా మనుషులతో నిండిపోయింది; కొందరు నిలబడివున్నారు. కొందరు కూర్చున్నారు.
శ్రీరామకృష్ణులు: ఆహా, చివరికి సాగరం వద్దకు వచ్చాను. ఇప్పటి వరకు కాలువలు, మడుగులు మహా అయితే ఒక నదిని చూశాను. కాని నేడు ఒక సాగరంతో ముఖాముఖీగా ఉన్నాను. (అందరూ నవ్వారు)
విద్యాసాగర్ (చిరునవ్వుతో): అలాగయితే ఉప్పునీటిని కొంచెం ఇంటికి తీసుకెళ్లండి.(నవ్వులు)
శ్రీరామకృష్ణులు: ఓ, కాదు! ఉప్పు నీరెందుకు? మీరు అవిద్యాసాగరులు కాదు కదా. మీరు విద్యాసాగరులు. మీరు క్షీరసాగరం. (అందరూ నవ్వారు)
విద్యాసాగర్: సరే మీరలాగే భావించుకోండి.
3.2.2 విద్యాసాగరుని సాత్త్విక కర్మలు – ‘నీమా సిద్ధుడవే’
విద్యాసాగర్ మౌనం వహించాడు, శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు: “మీరు ఆచరించేవన్నీ సాత్త్వికకర్మలు. అవి రజోగుణ ప్రవృత్తాలైనా సాత్త్వికగుణ ప్రేరితాలు. సత్త్వగుణం నుండే దయ పెల్లుబుకుతుంది. ఇతరులకు మంచి ఒనగూర్చే కార్యాలు రాజసికాలైనా, ఈ రజస్సుకు సత్త్వం మూలం కాబట్టి చెఱుపు ఏమీ చెయ్యదు.
విద్యాసాగర్
“శుకదేవుడు (శుక మహర్షి) ప్రభృతులైన మునులు జనానికి మతపరమైన శిక్షణను, భగవంతుణ్ణి గురించిన జ్ఞానాన్ని అందించటం కోసం తమలో దయను నిలుపుకున్నారు. మీరు అన్నదానం, విద్యాదానం చేస్తున్నారు. ఇది చాలా మంచిపని. ఇలాంటి కార్యకలాపాలు నిష్కామదృష్టితో చేస్తే అవి భగవంతుడి వద్దకు తీసుకువెళతాయి. కాని అత్యధిక సంఖ్యాకులు పేరు, పుణ్యాల కోసం చేస్తారు. వారి కార్యకలాపాలు నిష్కామాలు కావు. పైగా ఇప్పటికే మీరు సిద్ధులు.”*
విద్యాసాగర్: అదెలా మహాశయా?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): బంగాళాదుంపలు, ఇతర కూరగాయలు ఉడకబెట్టినప్పుడు మెత్తబడతాయి. మీరు అలాంటి మృదు ప్రవృత్తి గలవారు. మీలో పూర్తిగా దయ నిండి ఉంది.
విద్యాసాగర్ (నవ్వుతూ): మినుములు నూరి ఉడకబెడితే గట్టిపడతాయి (అందరూ నవ్వారు).
శ్రీరామకృష్ణులు: ఆహా! మీరు ఆ రకానికి చెందరు. కేవలం పాండిత్యం ఉన్న వారు పురుగుపట్టిన పండులాంటి వాళ్లు. అలాంటి పండు గట్టిపడుతుంది, పండదు. అలాంటి పండుకు, కాయకున్న తాజాదనం ఉండదు, పండుకు ఉన్న రుచీ ఉండదు. అటూ కాదు, ఇటూ కాదు. రాబందులు ఆకాశంలో ఎంతో ఎత్తులో ఎగురుతుంటాయి. కాని వాటి చూపు నేల మీద కుళ్లిన శవాల మీదనే. పుస్తక పాండిత్యం ఉన్నవారు పేరుకు మాత్రమే వివేకవంతులు. వారు కామినీ కాంచనాలకు వశులు. రాబందుల మాదిరి వారు కుళ్ళిపోయిన కళేబరాలను వెదకులాడుతుంటారు. అవిద్యాజగత్తుకు వారు బంధితులు. దయ, భక్తి, వైరాగ్యం–నిజమైన జ్ఞానానికి వైభవోపేతాలు.
విద్యాసాగర్ మౌనంగా ఈ మాటలు విన్నాడు. తక్కినవారూ తదేకంగా శ్రీరామకృష్ణులనే చూస్తూ ఆయన వాక్కులను శ్రద్ధతో విన్నారు.
3.3 తృతీయ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు – జ్ఞానయోగం, వేదాంత విచారణ
విద్యాసాగర్ సంస్కృత కళాశాలలో చదువుకొనేటప్పుడు శ్రేష్ఠతమ విద్యార్థిగా పేరుపొందాడు. ప్రతి పరీక్షలోనూ అతడికి స్వర్ణపతకం లభించింది. ఉపకార వేతనం కూడా ఇచ్చేవారు. చదువు పూర్తయ్యాక సంస్కృత కళాశాల ప్రధానోపాధ్యాయుడుగా నియమించబడ్డాడు. సంస్కృత వ్యాకరణంలోను, కావ్యాల్లోను ఎంతో ప్రతిభావంతుడు. స్వయంకృషితో ఆంగ్లాన్ని నేర్చాడు.
ధర్మసంబంధిత బోధనలు విద్యాసాగర్ చెయ్యడు. కాని ఆయన తత్త్వ శాస్త్రాలను అధ్యయనం చేశాడు. ఒక రోజు ‘మ’ “హైందవ దర్శనశాస్త్రాల గురించి మీ అభిప్రాయం ఏమిటి?” అని విద్యాసాగర్‌ను అడిగాడు. “వేదాంతులు తమ మనోభావాలను వెల్లడించ ప్రయత్నించారు. కాని విఫలులైనారు” అని జవాబు ఇచ్చాడు. విద్యాసాగర్ సదా శాస్త్ర విహితమైన కర్మానుష్ఠానాలను ఆచరించేవాడు; జందెం ధరించేవాడు. మాతృభాషలో ఉత్తరాలు రాసేటప్పుడు ముందుగా ‘శ్రీశ్రీ హరిః శరణమ్’ అని వందన వచనాలతో ప్రారంభించేవాడు. “భగవంతుణ్ణి గురించి మీ అభిప్రాయం ఏమిటి?” అని మరోనాడు ‘మ’ విద్యాసాగర్‌ను అడిగాడు. “భగవంతుణ్ణి ఎరిగే మార్గమే లేదే” అన్నాడు విద్యాసాగర్. “అలా ఐతే మన కర్తవ్యం ఏమిటి?” అని ప్రశ్నించగా, “మన జీవనసరళి ఎలా ఉండాలంటే, ఇతరులు మనలను ఉదాహరణగా అనుసరించితే ఈ ఇలయే స్వర్గలోకం కావాలి. ప్రతి వ్యక్తీ లోకోపకారం కోసం శాయశక్తులా ప్రయత్నించాలి” అని బదులు చెప్పాడు.
విద్య, అవిద్య విషయాల గురించి ముచ్చటిస్తూ శ్రీరామకృష్ణులు బ్రహ్మజ్ఞానుల విషయం తెలిపారు.
శ్రీరామకృష్ణులు: బ్రహ్మం విద్య అవిద్యలకు అతీతం. అది మాయకు అతీతమైనది.
3.3.1 బ్రహ్మం నిర్లిప్తం – దుఃఖాదులు జీవుడికే
శ్రీరామకృష్ణులు: ఈ లోకంలో విద్యామాయ, అవిద్యామాయ రెండూ ఉన్నాయి. జ్ఞానం, భక్తి ఉన్నాయి. అలాగే కామినీ కాంచనాలు కూడా ఉన్నాయి. ధర్మాధర్మాలు, మంచి చెడ్డలు ఉన్నాయి. కాని బ్రహ్మం నిర్లిప్తం, మంచి చెడ్డలు జీవుల పట్లే సుమా! ధర్మాధర్మాలు కూడా జీవులపట్లే! బ్రహ్మాన్ని ఇవేవీ అంటవు. ఒకే దీపం వెలుగులో ఒకడు భాగవతాన్ని చదువుతాడు; మరొకడు దొంగ సంతకాలు చేస్తాడు. కాని దీపం నిర్లిప్తమే సుమా! సూర్యుడు సజ్జనుల మీదా దుర్జనుల మీదా ఒకే రీతిలో ప్రకాశిస్తాడు.
“దుఃఖం, పాపం, అశాంతి ఇవన్నీ ఏమిటని అడుగుతావా – ఇవన్నీ జీవుడిపట్లనే! బ్రహ్మం నిర్లిప్తం. పాముకు విషం ఉంది. అది కాటువేస్తే మరణిస్తారు. కాని పాముకు ఏ హానీ వాటిల్లదు.
3.3.2 బ్రహ్మం అనిర్వచనీయం
“బ్రహ్మం ఏమిటో నోటితో చెప్పలేం. వేదాలు, పురాణాలు, షడ్దర్శనాలు అన్నీ నాలుకతో ఉచ్చరించబడినవి. అందుచేత ఎంగిలి అయినవి. బ్రహ్మం ఒక్కటే ఎంగిలి కాని వస్తువు. బ్రహ్మం ఏమిటో నేటిదాకా ఎవరూ చెప్పలేక పోయారు.
విద్యాసాగర్ (తన మిత్రులతో) : ఆహా! ఎంత మంచిమాట! ఆహా! ఈ రోజు నేనో కొత్త విషయాన్ని తెలుసుకొన్నాను.
శ్రీరామకృష్ణులు: ఒక తండ్రికి ఇద్దరు కుమారులుండేవారు. బ్రహ్మవిద్య నేర్వటానికి ఇద్దరినీ ఒక గురువు వద్ద ఉంచాడు. కొన్ని ఏళ్లు గడిచాక వారిద్దరూ గురుకులవాసం నుండి తిరిగివచ్చి, తండ్రికి నమస్కరించారు. వీరికి ఎలాంటి బ్రహ్మజ్ఞానం కలిగిందో తెలుసుకోవాలని తండ్రి పెద్దకుమారుణ్ణి దగ్గరకు పిలిచి, ‘నాయనా! నువ్వు శాస్త్రాలన్నీ చదివావు కదా! బ్రహ్మం ఎలాంటిదో కాస్త వర్ణించు’ అన్నాడు. అప్పుడు ఆ పెద్ద కుమారుడు వేదాలనుండి అనేక శ్లోకాలను వల్లిస్తూ బ్రహ్మస్వరూపాన్ని వర్ణించసాగాడు. తండ్రి మౌనంగా విన్నాడు. ఆ తరువాత చిన్నకుమారుణ్ణి అలాగే ప్రశ్నిస్తే, అతడు తలవంచుకొని మౌనం పాటించాడు. నోటినుండి ఒక్కమాటైనా వెలువడలేదు. చిన్నకుమారుడి ఈ ప్రవర్తనకు తండ్రి ఎంతో ఆనందించి అతడితో ‘నాయనా! బ్రహ్మాన్ని గురించి నువ్వు కొంత తెలుసుకోగలిగావు. బ్రహ్మం ఎలాంటిదో నోటితో చెప్పలేం’ అన్నాడు.
“భగవంతుణ్ణి తెలుసుకొన్నాం అనుకొంటారు మనుషులు. చీమ ఒకటి చక్కెర పర్వతం వద్దకు వెళ్లింది. ఒక్క చక్కెర కణం తినగానే దాని కడుపు నిండిపోయింది. మరో కణాన్ని నోట కరుచుకొని ఇంటి దారిపట్టింది. దార్లో అది ‘ఈసారి వచ్చి పర్వతాన్నంతా తీసుకెళతాను’ అంటూ తలపోయసాగింది. అల్పజీవులు కూడా బ్రహ్మం విషయంలో ఇలాగే భావిస్తారు. బ్రహ్మం అవాఙ్మానస గోచరమని ఎరుగరు. ఎంత గొప్పవాడైనా బ్రహ్మాన్ని తెలుసుకోగలడా? శుకమహర్షి ప్రభృతులు గండుచీమల వంటివారు. ఏడో, ఎనిమిదో లేక పదో కణాలు నోట్లో పెట్టుకోగలరు. అంతమాత్రమే.
3.3.3 బ్రహ్మం సచ్చిదానందస్వరూపం – నిర్వికల్ప సమాధి, బ్రహ్మజ్ఞానం
“వేదాల్లో, పురాణాల్లో బ్రహ్మాన్ని గురించిన వర్ణన ఎలాంటిదో తెలుసా? సముద్రాన్ని చూసివచ్చిన ఒకణ్ణి, సముద్రం ఎలావుంటుందని మరొకడు అడిగాడు. వెంటనే వాడు ‘ఆ’ అంటూ నోరు తెరచి “ఆహా! ఏం చెప్పను? ఆ అల లేమిటి, ఆ శబ్ద మేమిటి!” అన్నాడు. శాస్త్రాల్లో బ్రహ్మాన్ని గురించిన వర్ణనకూడా అటువంటిదే. వేదాలు ఆయన ఆనందస్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడని తెలిపివున్నాయి.
“శుకదేవాదులు ఈ బ్రహ్మసాగరతీరాన నిలబడి ఆ జలరాశిని దర్శించారు, స్పృశించారు. వారు ఈ సాగరంలో దిగనే లేదనీ, ఇందులో దిగితే తిరిగి రాలేరని ఒక వేదాంతశాఖవారు అంటారు.
“సమాధిస్థితి పొందితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, బ్రహ్మ సాక్షాత్కార మౌతుంది. ఇలాంటి స్థితిలో విచారణ పూర్తిగా ఆగిపోతుంది. మనిషి మూగవోతాడు. బ్రహ్మ ఎటువంటి పదార్థమో చెప్పటానికి శక్తి ఉండదు.
“ఉప్పుబొమ్మ ఒకటి సముద్రం లోతు కనుగొనటానికి బయలుదేరింది. (అందరూ నవ్వారు) నీళ్ళలో దిగగానే అది కరిగిపోయింది. ఇక సముద్రం లోతు తెలుపడానికి ఎవరు ఉన్నారు?”
ఇంతలో ఒక వ్యక్తి శ్రీరామకృష్ణులను ఇలా అడిగాడు: “సమాధిస్థ్ధితిలో బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తి మాట్లాడనే మాట్లాడడా?”
శ్రీరామకృష్ణులు: శంకరాచార్యులవారు లోక శిక్షణార్థం ‘విద్యా – నేను’ నిలుపుకున్నారు. లేకుంటే సామాన్యులు బ్రహ్మజ్ఞానం పొందాక ఇక మాట్లాడరు. దర్శనం లభించనంత వరకే విచారణ. వెన్నను కాచేటప్పుడు చిటపట శబ్దం వస్తుంది – నీరు ఇగిరి నెయ్యి తయారైతే చిటపట శబ్దం ఆగిపోతుంది. ఆ నెయ్యిలోనే పూరీ వేస్తే మళ్ళీ చిటపట శబ్దం ఆరంభమౌతుంది. పూరీ కాలిన తరువాత ఇక శబ్దం ఉండదు. అలాగే సమాధిస్థితి పొందిన వ్యక్తి లోకోపదేశార్థం మళ్ళీ కిందికి దిగివచ్చి భగవంతుడి గురించి సంభాషిస్తాడు.
“పువ్వు మీద వాలే వరకే తేనెటీగ ‘ఝూంఝూం’ అంటూ రొద పెడుతుంది. పువ్వు మీద వాలి తేనె తాగటం ఆరంభిస్తే ఇక శబ్దం రాదు. అయితే తేనె తాగాక అది మత్తెక్కి ఒక్కోసారి ఝంకారం చేస్తూంటుంది. బిందెను నీళ్ళలో ముంచేటప్పుడు బుడబుడ శబ్దం వస్తుంది. బిందె నీళ్ళతో నిండాక శబ్దం రాదు. (అందరూ నవ్వారు) ఆ బిందెలోని నీళ్ళు మరో బిందెలో పోస్తే మళ్ళీ శబ్దం వస్తుంది. (నవ్వులు)
3.4 చతుర్థ పరిచ్ఛేదం జ్ఞానం, విజ్ఞానం – ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాల సమన్వయం
ఋషులకు బ్రహ్మజ్ఞానం కలిగింది. విషయతృష్ణ ఈషణ్మాత్రమైనా ఉంటే బ్రహ్మజ్ఞానం కలుగదు. ఋషులు ఎంతగా శ్రమపడేవారు! వేకువనే నిద్రలేచి ఆశ్రమాన్ని వదిలి వెళ్లేవారు. పగలంతా ఏకాంతంలో బ్రహ్మధ్యాన చింతనలలో గడిపేవారు. రాత్రి ఆశ్రమానికి తిరిగివచ్చి, కందమూలాలను ఆహారంగా ఆరగించేవారు. శబ్దస్పర్శ రూపరస గంధాది విషయాల బారినుండి మనస్సును దూరంగా ఉంచేవారు. అప్పుడే వారు బ్రహ్మాన్ని తమ ఆంతరంగిక చైతన్యంగా బోధ నొందేవారు.
“కలికాలంలో జీవులు అన్నగత ప్రాణులు – దేహాభిమానం నశించదు. అలాంటి స్థ్ధితిలో ‘సో-హం’ అనటం మంచిది కాదు. అన్ని పనులూ చేస్తూ ‘నేనే బ్రహ్మం’ అనటం ఉచితం కాదు. విషయబుద్ధి త్యజించలేని వారికి ‘నేను భగవద్భక్తుణ్ణి, దాసుణ్ణి’ అనే భావం నిలుపుకోవటం మంచిది. భక్తిమార్గం అనుసరించి కూడా భగవద్దర్శనం పొందవచ్చు.
“జ్ఞాని అయినవాడు ‘నేతి’ (ఇది కాదు, ఇది కాదు) విచారణ చేస్తూ విషయబుద్ధిని పూర్తిగా త్యజిస్తాడు. అప్పుడే బ్రహ్మాన్ని తెలుసుకోగలుగుతాడు. ఒక్కొక్క మెట్టును వదలుతూ మేడ మీదికి చేరుకోవడం లాంటిది ఇది. కాని విజ్ఞాని అయినవాడు, అంటే విశేషంగా తెలుసుకున్నవాడు మరింత ఎక్కువగా దర్శించ గలుగుతాడు. మెట్లు ఎలాగైతే ఇటుకలు, బంకమన్ను, సున్నంతో తయారైనాయో, మేడకూడ ఆ వస్తువులతోనే తయారైనదని తెలుసుకుంటాడు. ‘నేతి, నేతి’ అంటూ బ్రహ్మజ్ఞానం ఆర్జించాక మళ్ళీ ఆ బ్రహ్మమే ఈ జీవజగత్తులుగా ఉన్నట్లు తెలుస్తుంది. విజ్ఞాని అయినవాడు నిర్గుణ పరబ్రహ్మాన్ని సగుణ బ్రహ్మంగా కూడా దర్శిస్తాడు.
“జనులు ఇంటి మేడ మీదనే ఎక్కువసేపు ఉండలేరు. మళ్ళీ దిగి రావలసే ఉంటుంది. సమాధిస్థితి కలిగి, బ్రహ్మదర్శనం పొందినవారు కూడా దిగివచ్చాక జగత్తు, జీవులను భగవంతుడిగానే చూస్తారు.
“ ‘స, రి, గ, మ, ప, ద, ని’ – ‘ని’ లో ఎక్కువసేపు నిలబడలేరు. ‘నేను’ అనేది పోదు. అప్పుడు ఆయనే నేను, ఆయనే జగత్తూ, జీవులూను; ఇలాంటి జ్ఞానానికే విజ్ఞానమని పేరు.
“జ్ఞానమార్గం, జ్ఞాన–భక్తి మార్గం, భక్తిమార్గం – ఇవన్నీ భగవంతుణ్ణి చేరే మార్గాలే. జ్ఞానయోగం, భక్తియోగం అన్ని సత్యాలే – మార్గాలన్నీ ఆయన వద్దకు చేర్చేవే. ‘నేను’ అనే భావన ఉన్నంత వరకు భక్తిమార్గమే సులభం.
“విజ్ఞాని అయినవాడు బ్రహ్మాన్ని, సుమేరు పర్వతంలా నిశ్చలంగా, నిష్క్రియంగా గాంచుతాడు. ఈ లోకం ఆయన త్రిగుణాలైన సత్త్వరజస్తమో గుణాల ద్వారా ప్రభవించింది. కాని ఆయన నిర్లిప్తుడు. విజ్ఞాని అయినవాడు బ్రహ్మాన్ని భగవంతుడిగా దర్శిస్తాడు. ఎవరైతే గుణాతీతుడో ఆయన్నే షడైశ్వర్య సంపన్నుడైన భగవంతుడిగా చూస్తాడు. ఈ బ్రహ్మాండం, మనస్సు, బుద్ధి, భక్తి, వైరాగ్యం, జ్ఞానం అన్నీ ఆయన సంపదలే. (నవ్వుతూ) ఇల్లు, వాకిలి లేనివాణ్ణి ఎవరైనా జమీందారు అని అంటారా? (అందరూ నవ్వారు). ఈశ్వరుడు (భగవంతుడు) షడైశ్వర్యపూర్ణుడు. లేకుంటే ఎవరూ ఆయన మాట వినరు. (అంతా ఫక్కున నవ్వారు)
3.4.1 విభు రూపంలో ఏకమే – కాని శక్తిలో తారతమ్యం
“చూడండి ఈ సృష్టి వైచిత్ర్యాన్ని! ఎన్ని వస్తువులున్నాయో! సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నానారకాలైన జీవులు ఉన్నాయి. మళ్ళీ వాటిలో మంచి, చెడ్డ; చిన్న, పెద్ద; అంతేగాక కొందరు అధిక శక్తిపరులు, కొందరు అల్ప శక్తిపరులు.”
విద్యాసాగర్: భగవంతుడు కొందరికి అధికశక్తి, కొందరికి అల్పశక్తి ప్రసాదించాడా?
శ్రీరామకృష్ణులు: విభు రూపంలో ఆయన సర్వభూతాల్లో నెలకొని ఉన్నాడు. ఆబ్రహ్మపిపీలికాపర్యంతం ఆయనే విరాజిల్లుతున్నాడు. కాని శక్తి తారతమ్యం ఉంది. లేకపోతే ఒక్కడు పదిమందినెలా పోరాటంలో ఓడిస్తాడు? ఇంకొకడు ఒక మనిషిని చూసే భయపడి పలాయనం చిత్తగిస్తాడు. అలాకాకపోతే మిమ్మల్నెందుకు అందరూ ఇంతగా గౌరవిస్తారు? మీకేమైనా రెండు కొమ్ములు మొలిచాయా? (నవ్వు) మీకు దయాగుణం ఉంది. మీకు విద్యాబుద్ధి ఉంది. అందుకే ఇతరుల కంటే లోకులు మిమ్మల్ని ఎక్కువగా గౌరవిస్తున్నారు. మిమ్మల్ని చూడ్డానికి వస్తారు. ఈ విషయాన్ని మీరు ఒప్పుకొంటారు కదా? (విద్యాసాగర్ చిరునవ్వు నవ్వాడు)
3.4.2 శుష్క పాండిత్యం అసారం – భక్తే సారం
“కేవలం పాండిత్యంలో ఏదీ లేదు. భగవంతుణ్ణి గురించి తెలుసుకునే, లేదా ఆత్మసాక్షాత్కారాన్ని పొందే – సాధనాలు కనుగొనటానికే పుస్తక పఠనం. ఒక సాధువు వద్ద ఒక పుస్తకం ఉండేది. ఆ పుస్తకం ఏమిటని ఒకడు ఆ సాధువుని అడగ్గా ఆయన ఆ పుస్తకాన్ని తెరిచి చూపించాడు. ప్రతి పుటలోను ‘ఓం రామ’ అని రాసివుంది. ఇంకేమీ లేదు.
“గీత ప్రాధాన్యం ఏమిటి? పదిసార్లు గీతా గీతా అని పలికితే చివరికి తాగీ తాగీ (త్యాగీ త్యాగీ) అవుతుంది. గీత బోధ ఏమిటంటే: ఓ జీవుల్లారా! సమస్తాన్నీ త్యజించి భగవంతుణ్ణి పొందటానికి ప్రయత్నించండి. సన్న్యాసి అయినా సంసారి అయినా మనస్సులో నుండి అనురక్తు లన్నిటినీ త్యజించాలి.
శ్రీచైతన్యులు తన దక్షిణదేశ తీర్థాటనంలో ఒక చోట భగవద్గీతను చదువుతున్న ఒక వ్యక్తిని చూశారు. దగ్గర్లోనే మరో వ్యక్తి కూర్చుని గీతను వింటూ, విలపిస్తున్నాడు. అతడు ఏకధారగా కన్నీళ్లు స్రవిస్తున్నాడు. శ్రీచైతన్యులు గీతను ఆలకిస్తున్న ఆ వ్యక్తి దగ్గరకెళ్లి ‘నీకు ఇదంతా అర్థమౌతోందా?’ అని అడిగాడు. అందుకు అతడు ‘స్వామీ! ఈ శ్లోకాల్లో ఒక్కమాట కూడా అర్థం కావటం లేదు’ అన్నాడు. ‘అలా అయితే నువ్వెందుకు ఏడుస్తున్నావు?’ అని చైతన్యులు అడిగారు. అందుకా వ్యక్తి ఇలా బదులిచ్చాడు: ‘స్వామీ! నా ముందు అర్జునుడి రథాన్ని చూస్తున్నాను. శ్రీకృష్ణుడు, అర్జునుడు రథంలో కూర్చుని మాట్లాడుకోవటం చూస్తున్నాను. ఇది చూసి కన్నీళ్ళు స్రవిస్తున్నాయి.’
3.5 పంచమ పరిచ్ఛేదం భక్తియోగ రహస్యం
“విజ్ఞాని ఎందుకు భక్తిని అవలంబిస్తాడు? ఎందుకో తెలుసా? దీనికి జవాబు – ‘నేను’ అనే అహంబుద్ధి పోజాలదు కాబట్టి. సమాధిస్థితిలో అహంబుద్ధి తొలగిపోతుంది కాని మళ్ళీ వచ్చి చేరుతుంది. సామాన్యులకు అహంబుద్ధి ఎన్నటికీ పోనేపోదు. రావిచెట్టును ఈ రోజు నరికివేస్తే మర్నాడు తిరిగి అంకురిస్తుంది. (అందరూ నవ్వారు)
“జ్ఞానలబ్ధి పొందాక కూడా ‘అహం’ బుద్ధి ఎక్కడ నుంచో వచ్చిపడుతుంది. కలలో పులిని చూశాక, మెలకువ వచ్చాక కూడా గుండె దడదడమని కొట్టుకుంటుంది. ప్రాణికోట్లు ‘అహంభావం’ తో అనేక అగచాట్లకు లోనౌతారు. ఎద్దు ‘అంబా, అంబా’ (అహం, అహం) అంటూ అరుస్తుంది. అందుకే అన్ని ఇక్కట్ల పాలబడుతుంది. నాగలికి కడతారు. భూమిని దున్నే సమయంలో దెబ్బలు తింటుంది. ఎండకు ఎండి, వానకు తడిసి కష్టపడుతుంది. ముసలిది అయ్యాక కసాయివాడు దాన్ని నరికి, దాని తోలు వలిచి, దాంతో చెప్పులు కుడతాడు, డోలు చేస్తాడు. అప్పటికీ దెబ్బలు తప్పవు. (నవ్వు) దాని కష్టాలకు అంతేలేదు. ఆ తరువాత దాని పేగులు, నరాలు చీల్చి, దూది ఏకేవాడి పనిముట్టు తయారవుతుంది. దూదేకేవాడు దూది ఏకుతూంటే అప్పటికి తెలివివచ్చి ‘తుహుం’ ‘తుహుం’ అంటుంది. అంటే ‘నువ్వే’ ‘నువ్వే’. అప్పుడే దాని కష్టాలు తీరతాయి. ఓ భగవంతుడా! నేను నీ దాసుణ్ణి, నువ్వు ప్రభువ్వు; నేను బిడ్డను, నువ్వు తల్లివి.
“ఒకసారి శ్రీరాముడు ఆంజనేయుణ్ణి ఇలా అడిగాడు: ‘మారుతీ! నువ్వు నన్నెలాంటి భావంతో చూస్తావు?’ అందుకు హనుమంతుడు ఇలా జవాబిచ్చాడు: ‘రామచంద్రా! ఎప్పుడైతే నాలో ‘నేను’ అనే భావం ఉంటుందో అప్పుడు నువ్వు పూర్ణుడవు – నేను నీ అంశను – నువ్వు ప్రభువ్వి, నేను దాసుణ్ణ్ణి. కాని ఓ రామా! తత్త్వజ్ఞానం కలిగినప్పుడు – నువ్వే నేను – నేనే నువ్వుగా గాంచుతాను.’
“సేవ్య సేవక భావం మంచిది. ‘నేను’ అనే అహంబుద్ధి పోదు కాబట్టి వెధవను, దాసుడిననే ‘నేను’ గా ఉండనివ్వు.
3.5.1 విద్యాసాగర్‌కి బోధ – ‘నేను, నాది’ ఇదే అజ్ఞానం
నేను, నాది ఈ రెండూ అజ్ఞానం. నా ఇల్లు, నా డబ్బు, నా విద్య, నా సంపద – ఈ భావాలన్నీ అజ్ఞాన జనితాలు. ఓ భగవంతుడా! నువ్వే కర్తవు. ఈ వస్తువులన్నీ – ఇల్లు, వాకిలి, భార్యాపుత్రులు, బంధువులు, స్నేహితులు – ఇవన్నీ నీకు చెందినవే. ఇలాంటి భావం జ్ఞానం ద్వారానే కలుగుతుంది.
“ఎల్లప్పుడూ మృత్యువును జ్ఞాపకం ఉంచుకోవాలి. మరణించాక ఉండేదేమీ లేదు. గ్రామం నుండి కలకత్తా నగరానికి ఉద్యోగం చెయ్యటానికి వచ్చినట్లుగా, ఏదో కొన్ని కర్మలు నిర్వర్తించటానికై ఈ లోకంలోకి వస్తాం. యజమాని తోటను చూడ్డానికి ఎవరైనా వస్తే తోటమాలి – వారిని వెంటబెట్టుకొని ఇది మా తోట, ఇది మా తటాకం అని తోటంతా చూపిస్తాడు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు యజమాని, తోటమాలిని పనినుండి తొలగించివేస్తే – మామిడి చెక్కతో చేసిన తన పెట్టెకూడా తీసుకుపోయే అధికారం అతడికుండదు. ద్వార కాపలావాడిచేత రహస్యంగా తెప్పిస్తాడు. (అందరూ నవ్వారు)
“భగవంతుడు రెండు సందర్భాలలో నవ్వుతాడు. రోగి తల్లితో, ‘ఏం భయం లేదమ్మా! నీ బిడ్డకు నయం చేస్తాను’ అని వైద్యుడు అంటాడు. అది విన్న భగవంతుడు ‘నేను చంపబోతున్నాను. వైద్యుడు తానే రక్షించేవాణ్ణని భావిస్తున్నాడు!’ అంటూ ఒకసారి నవ్వుతాడు. వైద్యుడు ‘నేనే కర్తను’ అని తలపోస్తున్నాడు. భగవంతుడే కర్త అనే సంగతిని అతడు మరిచిపోయాడు. ఇద్దరన్నదమ్ములు భూమి పంచుకుంటూ, ఈ వైపు నాది, ఆ వైపు నీది అంటున్నప్పుడు ‘నా ఈ జగద్బ్రహ్మాండాన్ని వాళ్లు నాది, నీది అంటున్నారు’ అనుకొని భగవంతుడు నవ్వుతాడు.
3.5.2 భక్తి విశ్వాసాలే మార్గం
“కేవలం విచారణ వల్ల భగవంతుణ్ణి పొందగలమా ఏమిటి? ఆయన దాసుడవై, ఆయన్ను శరణుజొచ్చి, ఆయన్ను స్మరించు. (నవ్వుతూ విద్యాసాగర్ వైపు తిరిగి) ‘మీ భావం ఏమిటి?’ అని అడిగారు.
విద్యాసాగర్ (చిరునవ్వుతో): ఆ విషయం నేను మీకు మరో రోజు ఒంటరిగా ఉన్నప్పుడు చెబుతాను. (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు (చిరునవ్వుతో): కేవలం పాండిత్యం ద్వారా విచారణ చేస్తూ భగవంతుణ్ణి తెలుసుకోవటం అసంభవం.
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై పాడనారంభించారు:
3.5.3 భగవంతుడు అపారుడు
ఎరుగగ తరమె ఏరికినైనా
తల్లి కాళి నిజతత్వ మించుక?
షడ్దర్శనములె శక్తిహీనములు
తల్లి విషయము తెలియచేయుటకు॥ ఎ ॥
అంతర మందున ఆత్మానందము
ఆస్వాదించెడు ఆత్మయోగికి
ఆమెయె వెల్గును అంతరాత్మయై
సర్వశాస్త్రములు సన్నుతిజేయును॥ ఎ ॥
ఎల్లప్రాణుల ఉల్లమునందున
ఆమె వశించును ఐచ్ఛికముగనే
ఆమె గర్భమున అమరియున్నవి
పిండాండంబులు బ్రహ్మాండంబులు॥ ఎ ॥
అంత విశాలము ఆమె గర్భము
నీవు దానిని అవలోకింతువె?
మూలాధార సహస్రారముల
ఆమెను యోగి ధ్యానము సేయును॥ ఎ ॥
ఆమె ఎట్టిదో అసలు ఎవ్వరో
శివుడుగాక మరి ఎవరు చూచెదరు
పద్మవనములో పతి సన్నిధిలో
హంసి హంసతో ఆటలాడును॥ ఎ ॥
అమ్మ నెరుగ నెవడాశించినను
రవ్వ చేయును రామప్రసాదు
ఆమె నెరుగవలె ననుచు తలచుట
నవ్వులాట సాగరము నీదుట॥ ఎ ॥
మది ఎరిగినను హృది ఎరుగక
అందమైన యా చందమామను
పట్టుకొనుటకై కొట్టుకొనెడు మరు
గుజ్జు వానివలె కోరుచున్నది॥ ఎ ॥
“చూశారా – ‘ఆమె గర్భమున అమరియున్నవి పిండాండంబులు’. ఇంకా, ‘షడ్దర్శనములె శక్తిహీనములు తల్లి విషయమును తెలియచేయుటకు.’
కేవలం పాండిత్యం భగవత్ సాక్షాత్కారాన్ని కలిగించదు.
3.5.4 విశ్వాస బలం – భగవంతునిపై విశ్వాసం – మహాపాతకి
“భక్తి విశ్వాసాలు కావాలి. విశ్వాసం యొక్క శక్తిని చూడండి. ఒకడు లంక నుండి సముద్రాన్ని దాటాలనుకొన్నాడు. అప్పుడు విభీషణుడు అతడికి ఒక వస్తువునిచ్చి “దీన్ని నీ ఉడుపుల చెంగుకు కట్టుకో. అప్పుడు నువ్వు నిర్విఘ్నంగా సముద్రాన్ని దాటగలవు. సముద్రంపై నువ్వు నడిచే వెళ్ళగలవు. కాని ముడిని మటుకు విప్పి చూడొద్దు. అలా చేస్తే తక్షణమే మునిగిపోతావు” అని హెచ్చరించాడు. ఈ విశ్వాస బలంతో అతడు అవలీలగా సముద్రం మీద సాగిపోతున్నాడు. కొంతదూరం వెళ్ళాక విభీషణుడు తనకు ఇచ్చిన వస్తువు ఏమిటో చూడగోరి ముడిని విప్పి చూశాడు. అందులో ఒక ఆకు మీద రామనామం రాసివుంది. దాన్ని చూసి ‘ఓస్ ఇంతేనా’ అని అతడు అనుకొంటూండగానే, సముద్రంలో బుడుంగుమని మునిగిపోయాడు.
“ ‘హనుమంతుడు రామనామం మీది విశ్వాసబలం చేతనే సముద్రాన్ని లంఘించ గలిగాడు? కాని సాక్షాత్తూ శ్రీరాముడు సముద్రాన్ని దాటటానికి వారధిని నిర్మించవలసి వచ్చింది’ అనే లోకోక్తి ఉంది కదా!
“యథార్థంగా భగవంతుడి మీద విశ్వాసం కలిగితే పాపం చేసినా, మహాపాతకం చేసినా అతడికి ఎలాంటి భయమూ ఉండదు.”
ఇలా విశ్వాసం మాహాత్మ్యాన్ని తెలుపుతూ శ్రీరామకృష్ణులు ఉన్మత్తులై భక్తితో పాడనారంభించారు.
ఓ దుర్గా యని పిలుచుచు,
అసువులు నే బాసినచో
ఎటు లీయవు ముక్తి నాకు
ఎంతటి పాతకినైన నేను…
3.6 షష్ఠ పరిచ్ఛేదం భగవత్ప్రేమే జీవితోద్దేశ్యం
శ్రీరామకృష్ణులు ప్రసంగాన్ని కొనసాగించారు: “విశ్వాసం, భక్తి! భక్తి ద్వారా భగవంతుణ్ణి సులభంగా పొందగలం. ఆయన్ను ప్రేమపారవశ్యంతో పొందగలం.”
ఈ మాటలంటూ శ్రీరామకృష్ణులు తిరిగి పాడసాగారు.
దేవదేవు తత్త్వమేమొ
తెలియకెట్లు పాటుపడెదు
చీకటింట చిక్కు పిచ్చి
వానివలెను వెదకె దీవు॥ దే ॥
పరవశించు భక్తి వలన
తెలియబడును దేవు డసలు
అట్టి భక్తిలేక ప్రభుని
తత్త్వమెట్లు తెలియగలవు॥ దే ॥
వేదములును తంత్రములును
దర్శనములు తెలుపలేవు
‘అస్తి’ మార్గమునను తప్ప
‘నేతి’ వలన తెలియలేవు॥ దే ॥
భక్తి సుధామధురిమచే
భగవంతుడు ప్రీతుడగును
శాశ్వతానందమందు
దేహగుహన దేవుడుండు॥ దే ॥
భక్తి కొరకు యుగయుగాలు
యోగు లభ్యసించుచుంద్రు
భక్తి కలుగ ప్రభుడు లాగు
నాత్మ నయస్కాంతమట్లు॥ దే ॥
పలుకుచుందు రాంప్రసాదు
‘బ్రహ్మ’ యనుచు పిలచువాని
దరికి నేను చేరుకొంటి
‘అమ్మ’ యనుచు పిలచుచుండి॥ దే ॥
అతినిగూఢమైన దాని
సంతలోన చెప్పవలెనె
ఊహచేయు మతని
సూచించిన సూచనముల॥ దే ॥
3.6.1 సమాధిలో శ్రీరామకృష్ణులు
పాట పాడుతూ శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనారు. ఆయన బల్ల మీద ఆసీనులైవున్నారు. చేతులు జోడించి ఉన్నాయి. శరీరం నిటారుగా, నిశ్చల స్థ్ధితిలో ఉంది. కళ్ళ రెప్పలు క్రిందికి వ్రేలాడి ఉన్నవి. అందరూ ఈ అద్భుతదృశ్యాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నారు. విద్యాసాగర్ కూడా తదేకదృష్టితో మాట పలుకూ లేకుండా చూస్తున్నాడు.
శ్రీరామకృష్ణులు కొంతసేపటికి మామూలు స్థితికి వచ్చి, దీర్ఘ నిశ్వాసం విడిచి చిరునవ్వుతో తిరిగి మాట్లాడసాగారు: “భగవద్దర్శనానికి కావలసింది భావప్రేమ, భక్తి. భగవంతుణ్ణి ప్రేమించాలి. ఎవరైతే బ్రహ్మమో ఆయన్ను ‘అమ్మా’ అని పిలవాలి.”
ఇలా అంటూ ఈ పాటను పాడారు.
3.6.2 మొదట విశ్వాసం, తరువాత భక్తి
పలుకుచుందు రాంప్రసాదు
‘బ్రహ్మ’ యనుచు పిలచువాని
దరికి నేను చేరుకొంటి
‘అమ్మ’ యనుచు పిలచుచుండి
అతినిగూఢమైన దాని
సంతలోన చెప్పవలెనె
ఊహచేయు మతని
సూచించిన సూచనముల
“రాంప్రసాద్ తన మనస్సును భగవత్ తత్త్వాన్ని ఊహించమంటున్నాడు. వేదాల్లో ఎవరిని బ్రహ్మమని సంబోధిస్తారో ఆయన్నే నేను ‘అమ్మా’ అని సంబోధిస్తున్నట్టు అర్థం చేసుకొమ్మని తన మనస్సుతో అంటున్నాడు. ఎవరు నిర్గుణుడో ఆయనే సగుణుడు. ఆయనే బ్రహ్మం. ఆయనే శక్తి. నిష్క్రియావస్థలో బ్రహ్మమని చెబుతారు. సృష్టి, స్థ్ధితి, ప్రళయాల్లో ఆద్యాశక్తి లేక కాళీమాత అని పిలుస్తారు.”
“బ్రహ్మం, శక్తి అభిన్నం. అదెలాంటిదంటే – అగ్ని, దాని దాహకశక్తి వంటిది. దాహకశక్తిని గురించి చెబితే అగ్నిని గురించి చెప్పినట్లే – అలాగే అగ్నిని గురించి చెబితే దాహకశక్తిని గురించి చెప్పినట్లే. చివరికి రెండూ ఒకటే – వేరు కావు.
“బ్రహ్మమే ‘అమ్మా’ అని సంబోధింపబడుతోంది. అమ్మ అంటే ఎంతో ప్రియమైన వస్తువు కదా! భగవంతుణ్ణి ప్రేమించగలిగితే ఆయన తప్పక లభిస్తాడు. కావలసినవి: భావం, భక్తి. ప్రేమ, విశ్వాసాలు. ఒక పాట వినండి:
నీ ధ్యాన మే విధమొ నీ భావ మా విధము
నీ భావమునుబట్టి నీకుండు భక్తి॥ నీ ॥
భక్తి ఏ రీతియొ ఫలమగును ఆ రీతి
ఫలము లన్నిటికి మూల మా శ్రద్ధయే॥ నీ ॥
కాళికాపద సుధారసమున నాదు
మది మునిగి నిండార మధురూపమై దనర
బలులకు పూజలకు బహుయజ్ఞములకును
లేదు పని వానితో లేదసలు లేదమ్మ॥ నీ ॥
“కావలసింది చిత్తం తద్గతమవటం (అంటే ఆయనలో లీనమవడం). భగవంతుణ్ణి ఎంతగానో ప్రేమించాలి. సుధాపుష్కరిణి అంటే అమృత సరోవరం. అందులో మునకవేస్తే మానవుడు మరణించడు. అమరుడవుతాడు. అధికంగా భగవంతుణ్ణి తలపోస్తూవుంటే పిచ్చిపడుతుందని కొందరి అభిప్రాయం. కాని అలా తలచటం పొరపాటు. ఇది అమృత సరోవరం. సుధాసాగరం. వేదాల్లో దీన్ని ‘అమృత’ మంటారు. అందులో మునిగితే మరణించరు; అమరులవుతారు.
3.6.3 నిష్కామకర్మ లేదా కర్మయోగం – లోకహితం – Sri Ramakrishna and the European ideal of work
“పూజ, హోమం, యాగం, యజ్ఞాలు నిష్ప్రయోజనాలు. భగవంతుడి మీద ప్రేమ కలిగితే ఇలాంటి కర్మలు ఆచరించటానికి ఎక్కువ అవసరం ఉండదు. గాలి వీచనంతవరకే విసనకర్ర ప్రయోజనం. దక్షిణపుగాలి వీచనారంభిస్తే విసనకర్ర అవసరం లేదు.
(విద్యాసాగర్‌తో) “మీరు చేసే పనులన్నీ సత్కర్మలే, కాని ‘నేను కర్తను’ అనే అహాన్ని వదలిపెట్టి నిష్కామంగా చెయ్యగలిగితే ఎంతో మంచిది. ఇలాంటి నిష్కామకర్మ చేస్తూంటే భగవద్దర్శనం కలుగుతుంది.
“భగవంతుడిపట్ల భక్తి ప్రేమలు ఎంతగా అధికమవుతాయో అంతగా మీ పనులు తగ్గిపోతాయి. ఇంటి కోడలు గర్భవతి అయితే ఆమెకు మెల్లమెల్లగా ఇంటి పనులు తగ్గిపోతాయి. నెలలు నిండుతున్నకొద్దీ అత్తగారు కోడలు చేసే పనులను తగ్గిస్తుంది. నెలలు నిండితే ఆమెతో పనులేమీ చేయించక అన్నీ తనే చేసుకుంటుంది. గర్భస్థ శిశువుకు ఎలాంటి హాని వాటిల్లకుండా సుఖప్రసవం అయ్యేట్లు అత్తగారు చూసుకుంటుంది.
“మీరు చేసే కర్మలు మీకే మేలు కలిగిస్తాయి. నిష్కామ భావనతో కర్మలు ఆచరిస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. భగవంతుడిపట్ల ప్రేమ జనిస్తుంది. భగవంతుణ్ణి ప్రేమించగలిగితే ఆయన్ను పొందగలవు. మానవుడు ఏనాటికీ లోకహితం చెయ్యలేడు. ఆయనే అన్నీ చేస్తున్నాడు. ఎవడు సూర్యచంద్రాదులను సృజించాడో, తల్లితండ్రులను సృష్టించి వారిలో వాత్సల్యభావం నింపాడో, మహాత్ముల హృదయాల్లో దయ, సాధుభక్తుల హృదయసీమల్లో భక్తిని ప్రసాదించాడో ఆ భగవంతుడే లోకహితాన్ని ఒనగూర్చుతున్నాడు. కోరికలు లేకుండా కామరహితుడై కర్మలు చేసే వ్యక్తి తనకే మేలు చేసుకుంటున్నాడు.
3.6.4 నిష్కామకర్మ ఉద్దేశ్యం – భగవత్సాక్షాత్కారం
“మీ లోపల మేలిమి బంగారం ఉంది. మీకింకా దాని జాడ తెలియలేదు. కాస్త మట్టితో కప్పబడివుంది. ఒక్కసారి దాని ‘జాడ’ తెలుసుకుంటే ఇతర పనులన్నీ తగ్గిపోతాయి. ఇంటి కోడలికి బిడ్డ పుడితే ఆ బిడ్డ సంరక్షణాభారం తప్ప ఇతరమైన ఇంటిపనులు ఆమెచేత అత్తగారు చేయించదు (అందరూ నవ్వారు).
“ఇంకా ముందుకు పో. కట్టెలు కొట్టేవాడు అడవిలోకి కట్టెలు కొట్టడానికి వెళ్లాడు. అక్కడొక బ్రహ్మచారి కనిపించి అతడితో ‘ఇంకా ముందుకు పో’ అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాగే అతడు ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే, అతడికి మంచిగంధం చెట్లు దక్కాయి. ఇది జరిగిన కొన్ని రోజులకు అతడు ఇలా ఆలోచించాడు: ‘ఆ బ్రహ్మచారి నన్ను ఇంకా ముందుకు పో అని చెప్పాడేగాని గంధం చెట్ల వరకే వెళ్ళమనలేదు గదా!’ ఇలా యోచించి అతడు ఇంకా ముందుకు పోగాపోగా అతడికి వెండి గని కనిపించింది. అదే రీతిలో కొన్ని రోజుల తర్వాత మరింత ముందుకు వెళ్ళి చూస్తే బంగారు గని, ఆపైన వజ్రవైడూర్యాలు కనబడ్డాయి. వాటి నన్నిటిని పొంది అతడు అపర కుబేరుడయ్యాడు.
“నిష్కామకర్మ ఆచరించగలిగితే భగవంతుడి పట్ల ప్రేమ ఉదయిస్తుంది. క్రమేణా ఆయన కృపతో ఆయన్ను పొందవచ్చు. భగవంతుడితో మాట్లాడవచ్చు కూడా.” (ఈ మాటలు విని అంతా స్తబ్ధులైనారు)
3.7 సప్తమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు అహేతుక కృపాసింధువు
అక్కడున్న వారంతా స్తబ్ధులై, నిశ్చేష్టులై ఈ అమృతవాక్కులను వింటున్నారు. సాక్షాత్తూ సరస్వతీ దేవి శ్రీరామకృష్ణుల నాలుక మీద కూర్చుని, విద్యాసాగర్‌ని వంకగా గైకొని లోకకళ్యాణార్థం ఈ మాటలు పలుకుతోందా అన్నట్లుగా ఉంది.
ఇలా సంభాషణ రాత్రి తొమ్మిది గంటల దాకా సాగింది. ఇక శ్రీరామకృష్ణులు బయలుదేర నున్నారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ విద్యాసాగర్‌తో): మీతో మాట్లాడినవన్నీ నిజానికి చెప్పి ఉండకూడదు. అవి మీకు తెలిసిన విషయాలే కదా! కాని అవన్నీ జ్ఞాపకంలో లేవు. అంతే. (అందరూ నవ్వారు) వరుణుడి ఖజానాలో లెక్కలేనన్ని రత్నరాశులున్నాయి. కాని అతడికి వాటి ఎరుక లేదు.
విద్యాసాగర్ (నవ్వుతూ): మీరు ఎలా అంటే అలాగే.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): కొంతమంది సంపన్నులకు వారి ఇళ్ళలో పనివాళ్ళ అందరి పేర్లూ తెలియవు. (అందరూ నవ్వారు) అంతేకాదు ఇంట్లో ఎక్కడ ఏ విలువైన వస్తువులున్నాయో కూడా తెలియదు.
శ్రీరామకృష్ణుల సంభాషణ అందరినీ ఆనందింపచేసింది. అంతా కాసేపు మౌనం వహించారు. శ్రీరామకృష్ణులు విద్యాసాగర్‌తో నవ్వుతూ, “ఒకసారి ఆలయోద్యానాన్ని చూడ్డానికి రండి. నేనంటున్నది రాస్మణి ఉద్యానం గురించి. చాలా రమ్యమైన ప్రదేశం” అన్నారు.
విద్యాసాగర్: తప్పక వస్తాను. మీరింత దూరం ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీ వద్దకు రాకుండా ఉండగలనా?
శ్రీరామకృష్ణులు: నన్ను చూడ్డానికి రావటమా! అలా ఎప్పుడూ ఆలోచించవద్దు.
విద్యాసాగర్: ఎందుకండి, అలా ఎందుకు అంటున్నారు?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): మే మేదో పల్లెవాళ్ళ చిన్న తెప్పలం. (అందరూ నవ్వారు) పెద్ద నదుల్లో చిన్నకాలువల్లో, పెద్దకాలువల్లో, కూడా పోగలం. మీరు పెద్ద ఓడ. అందువల్ల మీరు ఈ చిన్న జలరాశిలో పోతే బురదలో కూరుకుపోతారేమోనని భయం.
విద్యాసాగర్ మందహాసం చేస్తూ మౌనం వహించాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ) : ఈ ఋతువులో ఓడ కూడా పోతే పోవచ్చును.
విద్యాసాగర్ (చిరునవ్వుతో) : ఇది వర్షాకాలం కదా! (అందరూ నవ్వారు)
‘మ’ తనలో: అవును. నూతనమైన ప్రేమవర్షం. క్రొత్త ప్రేమలో మానావమానాలకు తావు ఉండదు కదా!
శ్రీరామకృష్ణులు భక్తులతో కలసి లేచి నిలబడ్డారు. విద్యాసాగర్, ఇంట్లోని వారూ అంతా కలిసి శ్రీరామకృష్ణులను బండి వరకు సాగనంపటానికి లేచి నిలబడ్డారు.
శ్రీరామకృష్ణులు అదే చోట నిలబడి మహామంత్రాన్ని జపిస్తూ భావపరవశులైనారు. అహేతుక కృపాసింధువులైన శ్రీరామకృష్ణులు తాము సెలవు తీసుకోవటానికి ముందు విద్యాసాగర్ ఆధ్యాత్మికోన్నతి కోరుతూ జగన్మాతను ప్రార్థిస్తున్నారేమో!
శ్రీరామకృష్ణులు ఒక భక్తుని చెయ్యి అందుకొని మెల్లగా మెట్లు దిగసాగారు. విద్యాసాగర్ తన పరిజనంతో లాంతరు దీపం చూపిస్తూ ముందు నడుస్తున్నాడు.
కృష్ణాష్టమి తిథి అయినందున చంద్రోదయం ఇంకా కాలేదు. ఆ చీకట్లో మిణుకు మిణుకు దీపపు వెలుగును అనుగమిస్తూ అంతా ఉద్యానవనాన్ని దాటి, ముఖద్వారం వద్దకొచ్చారు.
ముఖద్వారం వద్దకు రాగానే అంతా అక్కడొక అద్భుత దృశ్యాన్ని చూశారు. వారి ముందు 36, 37 ఏళ్ల వయస్కుడైన ఒక బెంగాలీబాబు నిలబడి ఉన్నాడు. అతడికి గడ్డం ఉంది. సిక్కుల మాదిరి తలపాగా చుట్టుకొని ఉన్నాడు. శ్రీరామకృష్ణులను చూడగానే ఆ వ్యక్తి సాష్టాంగ ప్రణామంచేసి నిలబడ్డాడు.
“ఎవరది? బలరామ్, నువ్వా! ఇంత పొద్దుపోయి వచ్చావా?” ఆ వ్యక్తిని చూస్తూ అడిగారు శ్రీరామకృష్ణులు.
బలరామ్ (నవ్వుతూ): నే నిక్కడ చాలాసేపటి నుండి వేచివున్నాను.
శ్రీరామకృష్ణులు: లోపలికి ఎందుకు రాలేదు?
బలరామ్: అంతా మీ మాటలను శ్రద్ధగా ఆలకిస్తున్నారు. నేను లోపలికి వచ్చి అంతరాయం కలిగించదలుచుకోలేదు.
శ్రీరామకృష్ణులు భక్తులతోపాటు బండిలో ఎక్కారు.
విద్యాసాగర్ (మెల్లగా ‘మ’ తో): బండి బాడుగ ఇవ్వనా?
‘మ’ : వద్దండీ! ఇచ్చెయ్యటమయింది.
విద్యాసాగర్ ప్రభృతులు శ్రీరామకృష్ణులకు ప్రణామాలు చేశారు. బండి దక్షిణేశ్వర కాళికాలయం వైపుగా బయలుదేరింది. అక్కడ నిలబడ్డ వారంతా బండి కనుమరుగయ్యేంతవరకూ చూస్తూ నిలబడ్డారు. ‘ఈ మహాపురుషుడెవరు? భగవంతుడి పట్ల ఎంత ప్రేమ! ఈయన జీవుల ఇళ్లకు పోతున్నారు. భగవంతుణ్ణి ప్రేమించటమే జీవితోద్దేశమని చాటుతున్నారు!’ అని వారంతా తలపోస్తున్నారు.