28.1 ప్రథమ పరిచ్ఛేదం
దక్షిణేశ్వరంలో ముఖర్జీ సోదరులు, బాబూరామ్, లాటూ ప్రభృతులతో
శుక్రవారం, సెప్టెంబర్ 19, 1884
మహాలయ అమావాస్య, మధ్యాహ్నం రెండు గంటల వేళ. మహేంద్ర ముఖర్జీ, అతడి సోదరుడు ప్రియముఖర్జీ, ‘మ’, బాబూరామ్, హరీశ్, కిశోరీ, లాటూ మొదలైన వారితో శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చుని ఉన్నారు. భక్తులు కొందరు నిలబడి ఉన్నారు, కొందరు గదిలోకి వస్తూ పోతూన్నారు. హాజ్రా వసారాలో కూర్చుని ఉన్నాడు. రాఖాల్ బృందావనంలో బలరామ్‌తో ఉంటున్నాడు.
28.1.1 కెప్టెన్ భక్తి, అతని తల్లితండ్రులు
శ్రీరామకృష్ణులు (మహేంద్రాది భక్తులతో): కలకత్తాలో కెప్టన్ ఇంటికి వెళ్లి ఉన్నాను. తిరిగి వచ్చేటప్పటికి రాత్రి చాలా ప్రొద్దుపోయింది. కెప్టన్‌ది ఎంత చక్కటి స్వభావం! ఎంతటి భక్తి! ఒక చిన్నతుండును ధరించి హారతి ఇచ్చాడు. మొదట మూడు తిరులున్న దీప హారతి, పిదప ఏక తిరి దీపహారతి. చివరగా కర్పూర హారతి. అప్పుడు అతడు మాట్లాడలేదు. సైగ చేసి నన్ను ఆసనంలో కూర్చోమన్నాడు. పూజ చేసేటప్పుడు అతడి కళ్లు కందిరీగ కుట్టినట్లు ఎర్రబారి ఉన్నాయి. అతడు పాడలేడు కాని శ్లోకాలు చక్కగా వల్లిస్తాడు. తల్లిని ఆసనంలో కూర్చోబెట్టి తను నేల మీదే కూర్చుంటాడు.
“ఆతడి తండ్రి ఆంగ్లేయ సేనలో హవల్దారుగా ఉండేవాడు. ఒక చేతిలో తుపాకీ పుచ్చుకొని, మరొక చేతిలో శివలింగ ఆరాధన చేసేవాడు. అతడి దళం వారు అతడికి శివలింగం చేసి ఇచ్చేవారు. శివపూజ చేయనిదే మంచినీళ్లు కూడా ముట్టుకోడు. అతడి సంవత్సర ఆదాయం ఆరు వేల రూపాయలు.
“కెప్టెన్ తన తల్లిని తరచూ కాశీయాత్రకు పంపుతాడు. అక్కడ పన్నెండు లేక పదమూడు మంది నౌకర్లు ఆమెకు సేవ లొనరుస్తారు. ఎంతో ఖర్చు అవుతుంది. కెప్టెన్‌కు వేదాంతం, గీత, భాగవతం అన్నీ కంఠోపాఠం. కలకత్తా పెద్ద మనుష్యులు మ్లేచ్ఛుల అలవాట్లను అనుసరిస్తారంటాడతడు. మునుపు హఠయోగం అభ్యసించాడు. ఆ కారణంగానే నేను సమాధిస్థితిలోనో, పారవశ్య స్థితిలోనో ఉన్నప్పుడు సుతిమెత్తగా నా తలను నిమురుతాడు.
“కెప్టెన్ భార్యకు ఇష్టదైవం వేరు. ఆమె గోపాలుణ్ణి ఆరాధిస్తుంది. ఈసారి ఆమె అంతగా పిసినారితనం కనబరచలేదు. ఆమెకు కూడా గీత మొదలైనవి తెలుసు. వారికి ఎంత భక్తిప్రపత్తులు!
“వాళ్ళు మేక మాంసం వండుతారు. ‘అది పదిహేను రోజులు చెడకుండా ఉంటుంది’ అన్నాడు కెప్టెన్. వెంటనే అతడి భార్య, ‘కాదు, కాదు ఏడు రోజులే’ అన్నది. కాని వంట అద్భుతంగా ఉంది. పదార్థాలు కొంచెంగానే వడ్డిస్తారు. నేను ఎక్కువ తినటం వలన ఇప్పుడల్లా నాకు ఎక్కువగానే వడ్డిస్తారు. భోజనం పూర్తి కాగానే కెప్టెనో, అతడి భార్యో నాకు విసురుతారు.
28.1.2 జంగ్ బహదూర్ – నేపాలీ భక్తురాలు
“ప్రగాఢ భక్తి గలవారు, సాధువులను ఎంతో గౌరవిస్తారు. ఉత్తర భారత వాసులకు సాధువుల పట్ల గొప్ప భక్తి ఉంది. ఒకసారి నేపాల్‌కు చెందిన జంగ్ బహదూర్ కుమారులు, మేనల్లుళ్ళు ఇక్కడకు వచ్చారు. ప్యాంట్లు విప్పివేసి, మరో వస్త్రం ధరించి భయభక్తులతో నన్ను చూడవచ్చారు.
“కెప్టెన్‌తో నేపాల్‌కు చెందిన ఒక యువతి వచ్చింది. గొప్ప భక్తురాలు, అవివాహిత. ఆమెకు గీతగోవిందం కంఠస్థం. ఆమె పాటను వినటానికి ద్వారికాబాబు మొదలైనవారు వచ్చారు. నేను ఆమెతో, ‘వీరందరూ నీ పాట వినటానికి వచ్చి ఉన్నారు. వీరంతా సజ్జనులు, పాడు’ అన్నాను. ఆమె గీత గోవిందం అష్టపదులు పాడినప్పుడు ద్వారికాబాబు కళ్ల వెంట అశ్రువులు స్రవించాయి, పదేపదే రుమాలుతో కన్నీటిని తుడుచుకున్నాడు. ‘నువ్వెందుకు వివాహం చేసుకోలేదు!’ అని అడిగినందుకు ఆమె, ‘నేను భగవంతుని దాసిని. ఇక వేరే ఎవరికి దాస్యత్వం చేయగలను?’ అన్నది. శాస్త్రాలలో పేర్కోబడినట్లు అందరూ ఆమెను దేవతగా భావించారు.
(మహేంద్రాదులతో) “మీరంతా ఇక్కడకు వస్తూ పోతూ ఉన్నారు, ఇందువల్ల మీకు ఏదైనా మేలు జరుగుతోందా? అలా ఏమైనా జరిగివుంటే విని నేను ఎంతో ఆనందిస్తాను. (‘మ’ తో) లోకులు ఇక్కడకు ఎందుకు వస్తున్నారు. నాకు చదవడం, వ్రాయడం కూడా రాదే!
‘మ’ : మహాశయా! గోపబాలురను, ఆవులను బ్రహ్మ అంతర్ధానం చేసినప్పుడు కృష్ణుడు తానే గోపబాలురుగాను, ఆవుదూడలుగాను మారిపోయాడు. ఈ క్రొత్త పిన్నలు ఇంటికి వచ్చిన పిదప వీరి తల్లులు యశోద ఇంటికి వెళ్లటం మానుకున్నారు. ఆవుదూడలు అంబారావం చేస్తూ ఉన్నప్పుడు ఆవులూ ఈ క్రొత్త దూడల వెనువెంటనే తిరిగాయి.
శ్రీరామకృష్ణులు: అయితే ఏమిటి?
‘మ’ : భగవంతుడే సమస్తమూ అయివున్నాడు కదా, అందుకే అంతటి ఆకర్షణ. భగవత్ సాన్నిధ్యం ఉంటేనే, అక్కడకు మనస్సు ఆకర్షింపబడుతుంది.
28.1.3 కృష్ణలీల – గోపికల ప్రేమ – వస్త్రాపహరణం
శ్రీరామకృష్ణులు: ఇది యోగమాయ ఆకర్షణ. మనిషిని మాయలో ముంచివేస్తుంది. జటిలపట్ల గల భయం కారణంగా రాధ మారువేషం ధరించి వెళ్లింది. కాని ఆమె యోగమాయను శరణుజొచ్చి నప్పుడు ఆ జటిలయే ఆమెను ఆశీర్వదించింది. భగవంతుని లీలలు మాయ సహాయంతో జరుగుతాయి.
“గోపికల ప్రేమ, స్త్రీకి తన అక్రమ ప్రియుడి పట్ల గల ప్రేమ వంటిది. కృష్ణునిపై వాళ్లు ప్రేమోన్మాదం కలిగి ఉన్నారు, భర్తల కోసం కూడా వాళ్లు అంత వ్యాకులత చెందలేదు. నీతిబాహ్యురాలైన స్త్రీతో, ‘ఇదుగో! నీ భర్త వచ్చి ఉన్నాడు’ అని చెబితే, ‘రానీ, ఏమిటి? వంటగదిలో భోజనం ఉంది. తానే వడ్డించుకుని తింటాడు’ అంటుంది. కాని ఒక రసికుడు, స్ఫురద్రూపి, సంభాషణా చతురుడు వచ్చాడు అని వింటేనే చాలు, ఉరుకులు పరుగులే! తలుపు వెనుక దాగుకొని తొంగి చూస్తుంది.
“మేం భగవంతుని గాంచలేదే, గోపికల వలె ఆయన పట్ల మాకు ఆకర్షణ ఎట్లా కలుగుతుందని మీరు అడగవచ్చు. ఆయన్ను గురించి వినడం వల్ల కూడా ఆ ఆకర్షణ కలుగుతుంది – ‘అతణ్ణి గురించి తెలియదు, పేరు మాత్రం విన్నాను. అంతమాత్రానే నా మనస్సు అతడిపై కేంద్రీకృతమైంది.’”
ఒక భక్తుడు: కృష్ణుడు గోపికావస్త్రాపహరణం చేయటంలోని అంతరార్థం ఏమిటి?
శ్రీరామకృష్ణులు: అష్టపాశాలు ఉన్నాయి కదా! గోపికల విషయంలో ఈ పాశాలు అన్నీ తొలగిపోయాయి కాని లజ్జ మాత్రం ఉండిపోయింది. కృష్ణుడు దాన్నీ తొలగించివేశాడు. భగవద్దర్శనం లభిస్తే పాశాలన్నీ తొలగిపోతాయి.
28.1.4 యోగభ్రష్టునికి భోగానంతరమే భగవత్ప్రాప్తి
(మహేంద్ర ముఖర్జీ తదితరులతో) “భగవంతుని పట్ల ఆకర్షణ అందరికీ కలుగదు. ఇది మనోపరిపక్వతను బట్టి ఉంటుంది, మంచి సంస్కారాలు ఉంటే కలుగుతుంది. లేకుంటే, బాగ్‌బజార్‌లో ఎందరో ఉండగా మీరు మాత్రమే ఇక్కడకు ఎందుకు రావాలి? పెంటకుప్పలలో పెద్దగా దేన్నీ ఆశించలేం. మలయమారుతం వీస్తే అన్ని వృక్షాలు చందన వృక్షాలుగా మారిపోతాయి. కాని మర్రిచెట్టు, రావిచెట్టు, ప్రత్తిచెట్టు వంటి చెట్లు మారవు.
“మీకు డబ్బు చిక్కులు లేవు. సామాన్యంగా యోగభ్రష్టులైనవారు ధనవంతుల ఇళ్లలో జన్మిస్తారు, తరువాత భగవంతుని పొందగోరి మళ్లీ తీవ్రసాధనలలో నిమగ్నులవుతారు.
మహేంద్ర ముఖర్జీ: మనిషి యోగభ్రష్టుడు ఎందుకు అవుతాడు?
శ్రీరామకృష్ణులు: పూర్వజన్మలో సాధనానుష్ఠాన సమయంలో హఠాత్తుగా భోగలాలస కలిగి ఉండవచ్చు. అలా కలిగితే యోగభ్రష్టులవుతారు. వాళ్లు మరుజన్మలో మళ్ళీ అదే విధంగా జన్మిస్తారు.
మహేంద్ర: అటువంటప్పుడు మార్గాంతరం?
శ్రీరామకృష్ణులు: కోర్కెలున్నంత వరకు, భోగలాలస ఉన్నంత వరకు ముక్తి లేదు. కాబట్టి ఆహారం, దుస్తులు, సంభోగ సుఖం అన్నీ అనుభవించివేయి. (నవ్వుతూ) నువ్వేమంటావు? సంభోగం భార్యతోనా లేక పరాయి స్త్రీతోనా?(‘మ’, ముఖర్జీ సోదరులు నవ్వారు)
28.2 ద్వితీయ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల కోర్కెలు
శ్రీరామకృష్ణులు: “భోగలాలస ఉండటం మంచిది కాదు. అందుకే మనస్సులో ఏఏ కోర్కెలు జనించేవో వాటిని అప్పటికప్పుడే తీర్చుకున్నాను. బడా బజారులో రంగురంగుల మిఠాయిని చూడగానే, దాన్ని తినాలనే కోర్కె కలిగింది; నాకు కొని ఇచ్చారు, కడుపునిండా తిన్నాను. పిదప, కడుపు పాడైంది.
“చిన్నతనంలో గంగలో స్నానం చేయడానికి వెళ్లాను. అప్పుడు నాథ్ వంశీయుల తోటలో ఒక పిల్లవాడు బంగారు మొలత్రాడు ధరించటం చూశాను. ఈ స్థితులు కలిగాక నాకూ అట్టి మొలత్రాడు ధరించాలనే కోర్కె కలిగింది. అది లభించింది కాని ఎక్కువసేపు దాన్ని ధరించలేక పోయాను. ధరించగానే లోపల వాయువు సరసరమంటూ పైకెగసి వెళ్లింది, ఒంటిని బంగారం తాకింది కదా! కాసేపు ధరించాక దాన్ని తీసిపారవేశాను. లేకుంటే తెంపి పారవేయవలసి వచ్చేది.
“ధన్ఖాలీలోని మరమరాల ఉండలు, కృష్ణనగర్‌లోని పాలకోవా అన్నీ తినాలనే కోర్కె కలిగింది.
(అందరూ నవ్వారు)
28.2.1 శంభు, రాజ్నారాయణ్ల పారాయణం – శ్రీరామకృష్ణుల సాధుసేవ
“శంభు దేవీమాహాత్మ్య పారాయణం వినాలనే కోర్కె జనించింది. అది విన్నాను. పిదప రాజ్ నారాయణ్ పారాయణాన్నీ వినాలనిపించింది, అదీ విన్నాను.
“ఆ రోజుల్లో ఇక్కడకు పలువురు సాధువులు వచ్చేవారు. వారికి ఆహారం సమర్పింప ఒక ప్రత్యేక భాండాగారం ఏర్పాటు చేయించాలనే సంకల్పం కలిగింది. మథుర్బాబు దానికి ఏర్పాటుచేశాడు. ఆ భాండాగారం నుంచి సాధువులకు బియ్యం, వంట చెరకు అన్నీ అందచేస్తారు.
చక్కని సరిగంచు శాలువను కప్పుకోగోరాను. దానికి తోడు వెండి హుక్కాతో పొగత్రాగ కోర్కె కలిగింది. మథుర్బాబు అన్నీ కొనియిచ్చాడు. శాలువను కప్పుకున్నాను, హుక్కాతో పలు విధాలుగా పొగత్రాగసాగాను – ఈ ప్రక్క ఒకసారి, ఆ ప్రక్క ఒకసారి, పైకి చూస్తూ, క్రిందికి చూస్తూ – ఇలా వేర్వేరు భంగిమలలో పొగత్రాగాను. మనస్సుతో, ‘ఓ మనసా! వెండి హుక్కాతో పొగత్రాగటం అంటే ఇదే’ అని చెప్పాను. అలా చెబుతూనే హుక్కాను ఆవల పారవేశాను, శాలువనూ కాస్సేపట్లోనే విప్పి పారవేశాను, దాన్ని కాళ్లతో త్రొక్కసాగాను. దానిపై ఖాండ్రించి ఉమ్మివేశాను. ‘ఇదే సరిగంచు శాలువ, దీనివలన రజోగుణం జనిస్తుంది’ అనుకున్నాను.
28.2.2 బృందావనంలో బలరామ్, రాఖాల్ – రాఖాల్ ప్రథమ భావపారవశ్యం (1881)
రాఖాల్ విషయమై శ్రీరామకృష్ణులు కలత చెందుతున్నారు. రాఖాల్, బలరామ్‌తో బృందావనంలో ఉన్నాడు. మొదట్లో బృందావనాన్ని ప్రశంసిస్తూ జాబు వ్రాశాడు. ‘మ’ కు వ్రాసిన జాబులో, ‘ఇదొక విశిష్టమైన స్థలం. మీరొకసారి రండి. నెమళ్లు పురులు విప్పి మనోహరంగా నాట్యం చేస్తున్నాయి. ఆనందమయమైన నృత్యగానాలు సాగుతున్నాయి’ అని వ్రాసి ఉన్నాడు. పిదప అతడు అస్వస్థుడైనాడు, జ్వరం వచ్చిందని జాబు వచ్చింది. అది విని శ్రీరామకృష్ణులు ఎంతో ఆదుర్దాకు లోనయ్యారు. అతడికోసం కాళీమాతకు మ్రొక్కుకొన్నారు. రాఖాల్ గురించి మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: ఇక్కడ కూర్చుని నా కాళ్లు ఒత్తుతూ ఉండగా అతడికి ప్రప్రథమంగా భావపారవశ్యం కలిగింది. ఆ సమయంలో ఒక భాగవతుడు ఈ గదిలో కూర్చుని భాగవత కథలు చెబుతున్నాడు. ఆ కథలు వింటూవున్న రాఖాల్కు మధ్య మధ్యలో దేహం కంపించింది, తరువాత ఒకేసారి నిశ్చలుడై పోయాడు.
“రెండవసారి బలరాం ఇంట్లో అతడికి భావపారవశ్యస్థితి కలిగింది, నేలపై పడుకొన్నాడు. రాఖాల్ సాకారోపాసకుడు, నిరాకారోపాసన గురించి వింటే, లేచి వెళ్లిపోతాడు.
“అతడి కోసం కాళీమాతకు మ్రొక్కుకొన్నాను. అతడు ఇల్లూ వాకిలీ అన్నీ త్యజించి నన్ను శరణుజొచ్చాడు! అతడిలో భోగలాలస ఒకింత మిగిలి ఉంది. కనుకనే నేను అతణ్ణి, అప్పుడప్పుడు అతడి భార్య వద్దకు పంపేవాణ్ణి.
“బృందావనం నుండి, ‘ఇది చక్కని ప్రదేశం. నెమళ్లు నాట్యం చేస్తున్నాయి’ అంటూ ఇతడికి (‘మ’ కు) జాబు వ్రాసి ఉన్నాడు. ఇప్పుడు అతడి యోగక్షేమాలను ఆ నెమళ్ళే చూసుకోనివ్వు. కాని నన్ను మాత్రం ఇరకాటంలో పడేశాడు. అక్కడ బలరామ్‌తో పాటు బసచేసి ఉన్నాడు.
“ఆహా! బలరామ్ది ఎంతటి మంచి స్వభావం! నా నిమిత్తం ఆ ప్రాంతానికి (ఒరిస్సాలో ఉన్న తన ఎస్టేటుకు) పోకుండా ఉన్నాడు. అతడి సోదరుడు నెలసరి డబ్బు పంపటం కూడా ఆపివేశాడు. ‘నువ్వు ఇక్కడకు వచ్చి మాతో ఉండు, వ్యర్థంగా ఎందుకంత డబ్బు ఖర్చు చేయాలి?’ అని వ్రాశాడు. కాని బలరామ్ ఆ మాటలు వినలేదు. నన్ను చూసే నిమిత్తమే కలకత్తాలో ఉంటున్నాడు.
“ఎంత మంచి స్వభావం! రేయింబవళ్లు భగవత్ చింతన. పువ్వుల మాలలు కట్టటమే అతడి తోటమాలుల పని. కాస్త ఖర్చు తగ్గించటానికి నాలుగు నెలలు బృందావనంలో గడుపుతాడు. నెలకు రెండువందల రూపాయలు పంపుతారు.
28.2.3 నరేంద్రునికై వ్యాకులత – నరేంద్రుని ప్రథమ దర్శనం (1881)
“బాలురనే నేనెందుకు ఇష్టపడతానో తెలుసా? వారి మనస్సులలో కామినీ కాంచనాలు ఇంకా ప్రవేశించలేదు! వీరిని నేను నిత్యసిద్ధులుగా గాంచుతున్నాను.
“మొట్టమొదటిసారి నరేంద్రుడు ఇక్కడకు వచ్చినప్పుడు మాసిన బట్టలు ధరించి ఉన్నాడు. కాని అతడి కళ్లూ, ముఖం చూసినప్పుడు అతడిలో సారం ఉందని తెలుసుకున్నాను. అప్పుడు అతడికి అన్ని పాటలు తెలియవు. ‘మరలు మనసా మన నిజనికేతనంబునకు’, ‘ఇలాగు వ్యర్థముగ నా దినము లన్నియు’ అనే ఒకటి రెండు పాటలే పాడాడు.
“అతడు ఇక్కడకు వచ్చినప్పుడు, గది నిండా భక్తులు ఉన్నప్పటికీ అతడితోనే మాట్లాడతాను. ‘వీళ్లతో మాట్లాడండి’ అంటా డతడు. అప్పుడే తక్కిన వారితో మాట్లాడతాను.
యదుమల్లిక్ తోటలోకి వెళ్లి విలపించేవాడిని. అతణ్ణి చూడగోరి నాకు దాదాపుగా పిచ్చే పట్టినట్లయింది. ఇక్కడ భోలానాథ్ చేయి పట్టుకొని ఏడ్చేవాడిని! వెంటనే భోలానాథ్, ‘ఒక కాయస్థ పిల్లవాడి కోసం మీరు ఇలా విలపించటం తగదు’ అన్నాడు. లావు బ్రాహ్మణుడు (ప్రాణకృష్ణ) ఒక రోజు చేతులు జోడించుకొని నాతో, ‘స్వామీ! అతడు ఏదో సామాన్యంగానే చదువుకొన్నాడు. అతడి కోసం మీ రెందుకు ఆరాటం చెందుతున్నారు?’ అని అడిగాడు.
“నరేంద్రుడు, భవనాథ్ పురుషుడు – స్త్రీవలె చక్కని జంట. అందుకే నరేంద్రుని ఇంటికి సమీపంలో భవనాథ్ను వసించమన్నాను. వారిద్దరూ నిరాకారవాదులు.
28.2.4 ఘోష్పారా సంప్రదాయ సాధన -ప్రస్తుతం కావలిసింది త్యాగమే!
“ఈ యువకులు స్త్రీలతో ఎక్కువసేపు గడపటమో లేక వారి వద్దకు తరచూ వెళుతూండడమో నేను అనుమతించను. హరిపదుడు, ఘోష్పారా సంప్రదాయానికి చెందిన ఒక స్త్రీ వలలో చిక్కుకున్నాడు. ఆమె వాత్సల్య భావాన్ని ప్రకటిస్తుంది. హరిపదుడు అభం శుభం ఎరుగని పిల్లవాడు. ఆ స్త్రీలు యువకులను చూస్తే ఈ విధంగా మెలగుతారు. హరిపదుడు ఆమె ఒళ్లో పడుకుంటాడని విని ఉన్నాను. ఆమె తన చేతులతో హరిపదునికి తినిపిస్తుందట. ఇదంతా మంచిది కాదని అతడికి చెప్పనున్నాను. ఈ వాత్సల్య భావమే తాచ్ఛల్యభావంగా (అంటే, నీతి బాహ్యభావంగా) పరిణమిస్తుంది.
“ఆ సంప్రదాయానికి చెందిన స్త్రీలు పురుషునితో కలిసి సాధనలు చేస్తారు, పురుషుణ్ణి కృష్ణునిగా పరిగణిస్తారు; అతణ్ణి రాగకృష్ణు డంటారు. ‘రాగ కృష్ణుడు దొరికాడా?’ అని గురువు అడుగుతాడు. ‘ఆ, దొరికాడు’ అంటుంది శిష్యురాలు.
“నాడు ఆ స్త్రీ ఇక్కడకు వచ్చింది. చుట్టూ ఆమె పరపిన దృక్కులు సరి అనిపించలేదు. ఆమెతో, ‘నువ్వు హరిపదునితో ఏం చేసినా సరే, నీతిబాహ్య భావనలను మాత్రం అతడిలో చొప్పించకు’ అన్నాను.
“ఈ యువకులు ఇప్పుడు సాధన స్థితిలో ఉన్నారు; ప్రస్తుతం వారికి అవసరమైనది కేవలం త్యాగం మాత్రమే. స్త్రీల చిత్తరువులను కూడా సన్న్యాసి చూడరాదు. నేను వీరితో, ‘స్త్రీలు, భక్తురాండ్రైనప్పటికీ, కూర్చుని వాళ్లతో మాట్లాడకండి, నిలబడే ఒకటి రెండు మాటలు చెప్పి పంపించివేయండి’ అంటూ ఉంటాను.
“సిద్ధులైనప్పటికీ ఇట్లే ప్రవర్తించాలి – స్వకీయ క్షేమానికీ, ఇతరులకు ఉదాహరణగా ఉండటానికీను. నేను కూడా, స్త్రీలు వచ్చినప్పుడు కాసేపయ్యాక, ‘ఆలయానికి వెళ్లండి’ అంటాను. వారు లేవకుంటే నేనే లేస్తాను. నన్ను చూసి ఇతరులూ నేర్చుకుంటారు.
28.2.5 అవతారం పట్ల ఆకర్షణ – శ్యాంబజార్లో దర్శనం (1880)
“అది సరేకాని, ఈ యువకులు ఇక్కడకు వస్తున్నారు. మీరందరూ వస్తూ ఉన్నారు. దీని అర్థం ఏమిటి? దీన్లో (తనలో) కచ్చితంగా ఏదో ఉంది. లేకుంటే ఏ విధంగా ఆకర్షణ కలుగుతుంది – ఎందుకు ఆకర్షణ కలగాలి?
“సిహోర్‌లో హృదయ్ ఇంట ఉన్నప్పుడు నన్ను శ్యాంబజార్కు తీసుకువెళ్లారు. వాళ్లు చైతన్య భక్తులని తెలియవచ్చింది. గ్రామంలోకి ప్రవేశించక మునుపే నాకు దర్శనం కలిగింది, చైతన్యులను గాంచాను! ఎంతటి ఆకర్షణ! ఏడు రోజులు రేయింబవళ్లు ఒక్కటే జనసందోహం! నిర్విరామంగా పాటలూ నృత్యాలూను! గోడపై మనుష్యులు! చెట్ల మీద జనం!
“నటవర్ గోస్వామి ఇంట్లో బసచేశాను. అక్కడా అహర్నిశలూ జన సందోహమే. ఉదయం పరుగున తప్పించుకుని ఒక సాలెవాని ఇంట్లో ఒకింత విశ్రాంతి తీసుకునేవాణ్ణి. కాసేపటికల్లా జనం అక్కడ కూడా గుంపులుగా తయారయ్యే వారు. చేత మృదంగ తాళాలతో వచ్చేవారు, మళ్లీ ‘తకిట తకిట’ ప్రారంభమవుతుంది. భోజనం మధ్యాహ్నం మూడు గంటల పిదపే!
ఏడుమార్లు మరణించి మళ్లీ బ్రతికిన ఒక అద్భుత వ్యక్తి వచ్చి ఉన్నాడనే వదంతి వ్యాపించింది. ఎక్కడ నాకు వేడి చేస్తుందో, దాని కారణంగా తలతిరగటం సంభవిస్తుందోనని భయపడి, హృదయ్ నన్ను ఆరుబయటకు లాక్కొని పోయే వాడు. అక్కడా చీమల బారులా మా వెంట జనప్రవాహం; మద్దెల, తప్పెటల నుండి ‘తకిట తకిట’ శబ్దమే వినవస్తుంది. ‘మేం సంకీర్తనలు వినలేదనుకున్నారా?’ అంటూ హృదయ్ వారిని గద్దించేవాడు.
“అక్కడ ఉన్న గోసాయీలు దెబ్బలాటకు వచ్చారు. వారికి అందవలసిన దక్షిణను గుంజుకోవటానికి మేం వచ్చామని వారు భావించారు. కాని నేను ఒక చిన్న గుడ్డముక్కను కూడా, దారపు పోగును సైతం తాకలేదని తెలుసుకున్నప్పుడు ఎవరో ఒకడు నన్ను బ్రహ్మజ్ఞాని అన్నాడు. ఆ మాట విన్న ఆ గోసాయిలు నన్ను పరీక్షించగోరారు. వారిలో ఒకడు, ‘ఈయనకు జపమాల, తిలకం లేదే’ అన్నాడు. వారిలో మరొకడు, ‘కొబ్బరి మట్ట దానంతట అదే రాలిపోయింది’ అన్నాడు. కొబ్బరిమట్ట ఉపమానాన్ని నేను అక్కడే నేర్చుకున్నాను. జ్ఞానోదయమైతే ఉపాధులు తమంతట తామే తొలగిపోతాయి.
“దూరగ్రామాల నుంచి జనం వచ్చి గుమిగూడారు. రాత్రుళ్లూ అక్కడే బసచేశారు. నేను బసచేసి ఉన్న ఇంటి ప్రాంగణంలో రాత్రిపూట అనేకమంది స్త్రీలు పడుకున్నారు. హృదయ్ రాత్రి లేచి మూత్రవిసర్జనకై బయటకు వెళ్లాడు. అప్పుడు వాళ్లు, ‘ఇక్కడే ప్రాంగణంలో చోటు ఉంది’ అన్నారు.
“ఆకర్షణ అంటే ఏమిటో అక్కడే తెలుసుకున్నాను. యోగమాయ సహాయంతో భగవల్లీలకై ఆకర్షణ కలుగుతుంది; లోకులు మంత్రముగ్ధులవుతారు.”
28.3 తృతీయ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు – రాధికా గోస్వామి
సమయం మూడు గంటలయింది. ముఖర్జీ సోదరులతోను, తక్కిన భక్తులతోను శ్రీరామకృష్ణులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో రాధికా గోస్వామి వచ్చాడు. శ్రీరామకృష్ణులను అతడు దర్శించటం ఇదే మొదటిసారి. అతడికి వయస్సు ముప్ఫై ఏళ్ళు ఉండవచ్చు. అతడు శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి కూర్చున్నాడు.
శ్రీరామకృష్ణులు: మీరు అద్వైత గోస్వామి వంశజులా?
గోస్వామి: అవునండీ.
అది వినగానే శ్రీరామకృష్ణులు చేతులు జోడించి నమస్కరించారు.
28.3.1 మహాపురుషుల వంశంలో జన్మ – బ్రాహ్మణులు పూజార్హులు
శ్రీరామకృష్ణులు: అద్వైత గోస్వామి వంశమా? వంశ లక్షణాలు ఉండనే ఉంటాయి. రసాల మామిడిచెట్టుకు రసం మామిడిపళ్లే కాస్తాయి; (భక్తులు నవ్వారు) నాసిరకం పళ్లు కాయవు! కాని భూసారం కారణంగా పళ్లు కాస్త పెద్దవీ చిన్నవీగా ఉండవచ్చు. మీ రేమంటారు?
గోస్వామి (వినయంగా): స్వామీ, నాకేం తెలుసు?
శ్రీరామకృష్ణులు: నువ్వు ఏం చెప్పినా తక్కినవారు వదలిపెడతారా? బ్రాహ్మణులలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ, వారు భారద్వాజ గోత్రానికో లేక శాండిల్య గోత్రానికో చెందినందున పూజార్హులు అవుతున్నారు. (‘మ’ తో) శంఖచీలుని కథ చెప్పు.
‘మ’ మౌనంగా ఉండిపోవటం చూసి శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు.
శ్రీరామకృష్ణులు: ఒక వంశంలో మహాపురుషుడు జన్మిస్తే వేయి దోషాలున్నప్పటికీ ఆతడు ఆ వంశజులను ఉద్ధరిస్తాడు. కౌరవులను గంధర్వుడు బంధించినప్పుడు యుధిష్ఠిరుడు వెళ్లి వారిని విడిపించాడు. యుధిష్ఠిరుడి పట్ల దుర్యోధనుడు అంతటి పగను ప్రదర్శించాడు, అతడి కారణంగానే యుధిష్ఠిరుడు అడవుల పాలయ్యాడు; ఆ దుర్యోధనుణ్ణే ఆతడు విముక్తుని చేశాడు.
“అదేకాక కాషాయానికి గౌరవం చూపాలి. వారి వేషం చూసినప్పుడు అది సద్వస్తువు ఎరుకను జాగృతం చేస్తుంది. చైతన్యులు ఒకసారి ఒక గాడిదకు కాషాయం కట్టబెట్టి దానికి సాష్టాంగప్రణామం చేశారు. శంఖచీలుని చూస్తే ఎందుకు ప్రణామా లర్పిస్తున్నారు? కంసుడు చంపబోగా భగవతి, శంఖచీలునిగా రూపుదాల్చి ఎగిరిపోయింది. అందుకే ఇప్పుడు ఆ పక్షిని చూస్తే జనులు ప్రణామాలు చేస్తున్నారు.
“చానక్లోని సేనాశిబిరంలోకి ఆంగ్లేయు డొకడు వెళ్లాడు. అతణ్ణి చూసి సిపాయిలు సలాం చేశారు. కువర్‌సింగ్ నాతో, ‘మన దేశాన్ని ప్రస్తుతం ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు. అందుకే ఆంగ్లేయుణ్ణి చూస్తే సలాం చేయాలి’ అని వివరించాడు.
28.3.2 శాక్తేయులు – వైష్ణవులు
“శాక్తేయులది తంత్రమార్గం. వైష్ణవులది పురాణమార్గం. వైష్ణవుడు అనుష్ఠిస్తూ ఉన్న సాధనలను బాహాటంగా చెప్పటంలో తప్పులేదు. కాని తంత్ర మార్గంలో అంతా గోప్యమే. అందుచేతనే తంత్ర మార్గావలంబులను సరిగా అర్థం చేసుకోలేం.
(గోస్వామితో): “మీరంతా సజ్జనులు. ఎంత జపం చేస్తారు! ఎంత హరినామ స్మరణ చేస్తారు!”
గోస్వామి (వినమ్రంగా): స్వామీ, మేం అలా ఏం చేస్తున్నాం? నేను అధముడను.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): మీలో వినమ్రత ఉంది. అది మంచిదే. దానికి తోడు మరొకటి కూడా ఉండాలి – ‘నేను హరినామం జపిస్తున్నాను; నా కేమిటి, పాపం ఏమిటి!’ అనే భావన. ఎవరు అహర్నిశలు, ‘నేను పాపిని, నేను పాపిని; నేను అధముడను, నేను అధముడను’ అంటూ ఉంటాడో, అతడు అట్లే అయిపోతాడు. ఏమిటీ, అవిశ్వాసమా! అదెలా సాధ్యం? భగవన్నామాన్ని ఇంతగా జపించి మళ్ళీ ‘పాపం, పాపం’ అనుకోవటమా?
గోస్వామి ఈ అమృత వచనాలను దిగ్భ్రమతో వింటున్నాడు.
28.3.3 బృందావనంలో శ్రీరామకృష్ణుల వైష్ణవ వేషధారణ (1864)
శ్రీరామకృష్ణులు: బృందావనంలో నేనూ వైష్ణవ వేషం ధరించాను; పదిహేను రోజులు అట్లే ఉండిపోయాను. (భక్తులతో) అన్ని భావసాధనలను కొన్ని రోజులు చేపట్టాను. ఆ పిదపే నా మనస్సు శాంతించింది. (నవ్వుతూ) నేను అన్ని రకాల సాధనలను అనుష్ఠించాను, అన్ని సంప్రదాయాలను అంగీకరిస్తాను. శాక్తేయులను ఒప్పుకుంటాను, వైష్ణవులను ఒప్పుకుంటాను, వేదాంతులను ఒప్పుకుంటాను. అందుకే అన్ని మతాలవారూ ఇక్కడకు వస్తున్నారు. ప్రతి ఒక్కరూ నేను తన మతానికి చెందినవాడిననే అనుకుంటున్నారు. నేను ఆధునిక బ్రహ్మ సమాజస్థులను సైతం అంగీకరిస్తాను.
“ఒక ఫలానా వ్యక్తి వద్ద ఒక తొట్టెలో అద్దకపు ద్రావణం ఉండేది. ఆ తొట్టె యొక్క ఆశ్చర్యకరమైన లక్షణం ఏమిటంటే: ఏ రంగు కోరి వస్త్రాన్ని దాన్లో ముంచి తీస్తామో ఆ రంగు, వస్త్రానికి అలదుకొంటుంది. ఆ తతంగమంతా చూస్తూ ఉన్న బుద్ధిశాలి ఒకడు అతడి వద్దకెళ్లి, ‘ఈ నానా రంగులను ఏ రంగుతోనైతే అద్దకం చేస్తున్నారో, నాకు ఆ రంగు వేసి ఇవ్వండి’ అని అడిగాడు. (శ్రీరామకృష్ణులూ, తక్కినవారూ నవ్వారు)
“నేను ఏకపక్ష పోకడలతో ఎందుకు ఉండాలి? ‘అలా అయితే ఈ ఫలానా సంప్రదాయస్థులు రాజాలరే’ అన్న భయం ఏదీ నాకు లేదు. ఎవరు వచ్చినా సరే, రాకున్నా సరే, నేను ఇసుమంతయినా లక్ష్యపెట్టను. ‘ఫలానా వ్యక్తిని చేతి క్రింద ఎలా ఉంచుకోవాలి’ అన్న యోచన నాకు ఎన్నడూ రాలేదు. అధర్సేన్ పెద్ద ఉద్యోగం కోసం అమ్మను ప్రార్థించమని నన్ను కోరాడు. అతడికి అది దొరకలేదు. అందుచేత అతడు నన్ను గురించి మరోవిధంగా తలపోసినా ఖాతరు చేయను.
28.3.4 విజయ్‌తో గదాధరుని పాఠశాల సందర్శించిన సంఘటన
“కేశవ్ ఇంటికి వెళ్లినప్పుడు ఒక రకమైన మనోస్థితి కలిగింది. వాళ్లు నిరాకారం, నిరాకారం అంటూ ఉంటారు. అందుచేత భావపారవశ్యతలో నేను అమ్మతో, ‘అమ్మా! ఇక్కడకు రాబోకు. వీళ్లు నీ రూపం – గీపం దేన్నీ అంగీకరించరు’ అని అన్నాను.”
మత సహనాన్ని ప్రోత్సహిస్తూ శ్రీరామకృష్ణులు చెప్పిన మాటలు విని గోస్వామి మౌనంగా ఉండిపోయాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): విజయ్ మనోస్థితి ఇప్పుడు బాగుంది. ‘హరి, హరి’ అంటూ నేలమీద పొర్లుతున్నాడు! వేకువన నాలుగు గంటల వరకు కీర్తన, ధ్యానం మొదలైన వాటిలో మునిగిపోయి ఉంటాడు. ఇప్పుడు కాషాయ వస్త్రాలు ధరిస్తున్నాడు. దేవతా విగ్రహాలను చూసినదే తడవు సాష్టాంగ ప్రణామాలు చేశాడు. ఒకసారి గదాధరుని (వైష్ణవ సాధువు) పాఠశాలకు నాతోపాటు వచ్చాడు. ‘ఇక్కడే ఆయన ధ్యానం చేసేవాడు’ అన్నాను. వెంటనే ఆ చోటుకు సాష్టాంగ ప్రణామం ఆచరించాడు. చైతన్యదేవుల చిత్రపటం ఎదుట మళ్లీ సాష్టాంగ ప్రణామం చేశాడు.
గోస్వామి: రాధాకృష్ణుల విగ్రహం ఎదుట ప్రణామం చేశాడా?
శ్రీరామకృష్ణులు: అవును, సాష్టాంగ ప్రణామం చేశాడు. విజయ్, విధి విహిత ఆచారాలను కూడా అనుష్ఠిస్తుంటాడు.
గోస్వామి: అలాగైతే వైష్ణవ సమాజంలో ఆతణ్ణి చేర్చుకోవచ్చు.
శ్రీరామకృష్ణులు: లోకులు ఏమనుకుంటున్నారనే విషయం గురించి అతడు అంతగా పట్టించుకోడు.
గోస్వామి: నేను దాన్ని గురించి చెప్పటం లేదు. ఇటువంటి వ్యక్తిని చేర్చుకోవటం వలన వైష్ణవ సమాజం కృతార్థ మవుతుందని చెబుతున్నాను.
శ్రీరామకృష్ణులు: నన్ను చాలా గౌరవిస్తాడు. ఆతణ్ణి పట్టుకోవటమే కష్టం; నేడు ఢాకా నుంచి ఆహ్వానం, రేపు మరో చోటు నుంచి. విశ్రాంతి లేక తిరుగుతూంటాడు. వారి సాధారణ బ్రహ్మసమాజంలో ఒకటే గందరగోళం.
గోస్వామి: ఎందుకండీ?
శ్రీరామకృష్ణులు: ‘మీరు సాకారవాదులతో కలిసి తిరుగుతున్నారు, కనుక మీరూ సాకారవాదే’ అని వారు అతడితో అంటున్నారు. విజయ్ నిజాయతీపరుడు, సరళ స్వభావుడు. సరళ స్వభావం లేకుండా భగవత్కృప కలుగదు.
28.3.5 ముఖర్జీ సోదరులకు ఉపదేశం – “ముందుకు వెళ్ళు” – అభ్యాసయోగం
శ్రీరామకృష్ణులు, ముఖర్జీ సోదరులతో మాట్లాడనారంభించారు. పెద్దవాడైన మహేంద్రుడు సొంతంగా వ్యాపారం చేస్తున్నాడు. తమ్ముడు ప్రియనాథ్, ఇంజనీర్; కొంత సంపాదించుకున్నాక ఆ ఉద్యోగం వదలిపెట్టేశాడు. మహేంద్ర వయస్సు ముప్ఫై లేక ముప్ఫైఐదు ఉండవచ్చు. వారి స్వగ్రామం కేదేటి – కలకత్తాలోని బాగ్‌బజార్‌లో ఒక ఇల్లు ఉంది.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఏదో ఒకింత భగవదుద్దీపన జనించింది కదా అని ఊరకే ఉండకు. ముందుకు వెళ్ళు. చందనవనం తరువాత వెండి గని, బంగారు గని మొదలైనవి ఎన్నో ఉన్నాయి.
ప్రియనాథ్(నవ్వుతూ): అవునండీ, కాని కాళ్లకున్న బంధాలు ముందుకు పోనివ్వకుండాఉన్నాయి.
శ్రీరామకృష్ణులు: కాళ్లకు బంధాలు ఉంటే మాత్రం ఏమిటి? మనస్సే కదా ప్రధానం! బద్ధుడవటమూ, ముక్తుడవటమూ రెండూ మనస్సు ద్వారానే. ఒకప్పుడు ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఒకడు వెలయాలి ఇంటికి వెళ్లాడు. మరొకడు పురాణ శ్రవణం చేశాడు. మొదటి వాడు, ‘ఛ, ఏం మూర్ఖత్వం? మిత్రుడు హరికథ వింటున్నాడు, నేను ఇక్కడ పడివున్నాను!’ అని కుమిలిపోయాడు. అదే సమయంలో రెండవవాడు, ‘ఛ, ఛ! ఎంతటి మూఢుణ్ణి నేను! నా మిత్రుడు అక్కడ సుఖాల్లో తేలిపోతూ ఉన్నాడు; కాని నేనో? నేను నిష్ప్రయోజకుణ్ణి’ అని తనను తాను నిందించుకున్నాడు. మరణానంతరం మొదటివాణ్ణి విష్ణుదూతలు వైకుంఠానికి తోడ్కొనిపోయారు. రెండవవాణ్ణి యమకింకరులు ఈడ్చుకుపోయారు.
ప్రియనాథ్: కాని మనస్సు నా స్వాధీనంలో లేదే?
శ్రీరామకృష్ణులు: ఎందుకు అలా అంటున్నావు? అభ్యాస యోగం ఉంది కదా! అభ్యాసం చెయ్యి. ఆ తరువాత మనస్సును ఏ వైపుకు తీసుకుపోతావో, ఆ వైపుకే అది పోవటం నువ్వు చూడవచ్చు. మనస్సు, చలువచేసిన వస్త్రం వంటిది; దాన్ని ఎరుపురంగులో ముంచితే అది ఎర్రగా మారుతుంది, నీలం రంగులో ముంచితే నీలంగా మారుతుంది. ఏ రంగులో ముంచితే ఆ రంగును సంతరించుకుంటుంది. (గోస్వామితో) మీరు ఏమన్నా చెప్పగోరుతున్నారా?
గోస్వామి (వినమ్రంగా): లేదండీ, మీ దర్శనం అయింది. దానికి తోడు మీ ఉపదేశాలూ విన్నాను.
శ్రీరామకృష్ణులు: ఆలయాలకు వెళ్లి రండి.
గోస్వామి (వినమ్రంగా): శ్రీ చైతన్య మహాప్రభువుల గురించి కాస్త పాడి వినిపించరా?
శ్రీరామకృష్ణులు పాడసాగారు:
ఏమి చిత్రము! ఇదేమి చోద్యము
మేలి పసిడి కాంతి మించి మేను మెరసెను….
* * *
అందమైన బృందావనము
అట్టె పారజూచు గోరా
కనులవెంట ధారగట్టి
కారు నీరు కాల్వలుగ
అమితమైన సంతసమున
ఆడు, పాడు, నవ్వు ఏడ్చు ॥ అం ॥
అడవి దలచు బృందావనిగ
కడలి దలచు యమునా నదిగ
చేరి శ్రీహరి భక్తి గోరి
దొరలు, పుడమిపైన బడుచు ॥ అం ॥
28.3.6 సర్వధర్మ సమన్వయంపై గోస్వామికి ఉపదేశం
పాటలు పూర్తి కాగానే శ్రీరామకృష్ణులు మాటలు కొనసాగించారు.
శ్రీరామకృష్ణులు (గోస్వామితో): ఇప్పుడు మీకోసం వైష్ణవ గీతాలు పాడాను. ఒకవేళ శాక్తేయులో, ఘోష్పారా సంప్రదాయస్థులో వస్తే ఏం చెయ్యాలి? వైష్ణవులు, శాక్తేయులు, కర్తాభజాలు, వేదాంతులు, బ్రహ్మసమాజస్థులు మొదలైన వారందరూ ఇక్కడకు (శ్రీరామకృష్ణుల వద్దకు) వస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ అన్ని రకాల భావనలూ నెలకొని ఉన్నాయి.
“భగవంతుని సంకల్పం కారణంగానే పలు మతాలు, పలు మార్గాలు ఏర్పడ్డాయి. కాని వారివారి మనోపరిపక్వతను బట్టి వీటిని ఆయన వర్గీకరించి ఇచ్చివున్నాడు. పిల్లలందరికీ తల్లి చేప పలావు పెట్టదు. అందరూ దాన్ని జీర్ణించుకోలేరు. కనుకనే కొందరికి చేపపులుసు చేసి పెడుతుంది. ఎవరికి ఏది తగినదో, ఎవరి భావన ఎటువంటిదో అతడు ఆ మార్గంలో వెళ్లాలి.
“బారోయారిలో రాధాకృష్ణులు, శివపార్వతులు, సీతారాములు మొదలైన అనేక విగ్రహాలను తయారుచేస్తున్నారు. అందుకే విభిన్న సంప్రదాయస్థులు అక్కడకు వెళుతున్నారు. వేర్వేరు విగ్రహాలు వేర్వేరు చోట్ల అమర్చబడి ఉన్నాయి. ప్రతి విగ్రహం ఎదుట పలువురు గుమిగూడి ఉంటారు. సామాన్యంగా వైష్ణవులు రాధాకృష్ణుల విగ్రహం ప్రక్కన నిలబడి చూస్తూ ఉంటారు. శాక్తేయులు శివపార్వతుల వద్ద, రామభక్తులు సీతారాముల వద్ద. కాని ఏ దైవం పట్లా భక్తిప్రపత్తులు లేని వారి సంగతి వేరే. ఒక వెలయాలు తన విటుని చీపురుకట్టతో కొడుతున్న ప్రతిమలనూ బారోయారిలో తయారుచేస్తున్నారు. కొందరు ఆ ప్రతిమల ముందు నోరు తెరచి చూస్తూ ఉంటారు; తన మిత్రులను, ‘ఏమోయ్, ఇక్కడకు రా, అక్కడ ఏం చూస్తున్నావు; ఇక్కడకు వచ్చి చూడు’ అంటూ పిలుస్తారు.” (అందరూ నవ్వారు)
గోస్వామి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాడు.
28.4 చతుర్థ పరిచ్ఛేదం కాళికాలయంలో జగజ్జననితో సంభాషణ – “నన్నెందుకు విచారణ చేయిస్తున్నావు?”
సాయంత్రం ఐదు గంటలయింది. శ్రీరామకృష్ణులు పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకారమొగసాలలో ఉన్నారు. ఆయనతో బాబూరామ్, లాటూ, ముఖర్జీ సోదరులు, ‘మ’ మొదలైనవారు ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (‘మ’, ప్రభృతులతో): ఏకపక్ష పోకడలో ఎందుకు ఉండాలి? వాళ్లు వైష్ణవులు, పాత పద్ధతుల్లో ఊరిపోయినవారు; తమ మార్గమే సరైనది, ఇతరాలన్నీ తప్పు త్రోవలని తలుస్తారు. నేను చెప్పినవన్నీ అతడికి బాగా ఎక్కి ఉంటాయి. (నవ్వుతూ) ఏనుగు కుంభస్థలంపై అంకుశంతో పొడవాలి. ఏనుగుకు కుంభస్థలం అతిసున్నితమైన భాగం! (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు తరువాత యువకులతో హాస్యంగా మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): నేను యువకులకు కేవలం శాకాహారం మాత్రమే ఇవ్వటం లేదు. అప్పుడప్పుడు చేపల సూపు కూడా ఒకింత ఇవ్వటం కద్దు. లేకుంటే వీరెందుకు వస్తారు?
ముఖర్జీ సోదరులు తోటలో పచార్లు చేయటానికి లేచారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నేను…. అంటూ జపం చేసేవాడిని. సమాధి మగ్నుడనైపోయేవాడిని. ఇదెలాంటి భావన?
‘మ’ (గాంభీర్యంగా): మంచిదేనండీ.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): సరి సరి, కానీ ముఖర్జీ సోదరులు ఏమనుకుంటారు?
‘మ’ : అనుకోవటానికి ఏముంది? కెప్టెన్ చెప్పే ఉన్నారు కదా, మీ స్వభావం పసిబాలుని వంటిదని. భగవద్దర్శనానంతరం పసిబాలుని స్వభావం వచ్చేస్తుంది.
శ్రీరామకృష్ణులు: అవును. బాల్య, కౌమార, యౌవనస్థితులు; కౌమార స్థితిలో వేళాకోళా లాడుతాడు, నోట బూతుమాటలు కూడా వస్తూండవచ్చు. యౌవన స్థితిలో సింహపరాక్రముడై లోకులకు ఉపదేశం చేస్తాడు. కావాలంటే వారికి నువ్వు నా మనోస్థితిని వివరించు.
‘మ’ : అక్కర్లేదండీ. వాళ్లకి తెలియదా ఏమిటి?
మళ్లీ శ్రీరామకృష్ణులు యువకులతో పరాచికాలాడసాగారు. ఒక భక్తుడితో, “నేడు అమావాస్య, కాళికాలయానికి వెళ్లు” అన్నారు.
మునిమాపు వేళ అయింది. ఆలయాలలో హారతి గంటానాదాలు వినవచ్చాయి. శ్రీరామకృష్ణులు బాబూరామ్‌తో, “పద నాయనా, కాళికాలయానికి వెళ్దాం” అన్నారు. పిదప అతడితో కలసి కాళికాలయానికి బయలుదేరారు. ‘మ’ కూడా వెంట వెళ్లాడు. మొగసాలలో హరీశ్ కూర్చుని ఉండటం చూసిన శ్రీరామకృష్ణులు, “ఇతడికి పారవశ్య స్థితి కలిగిందా ఏమిటి?” అని అన్నారు.
ఆలయ ప్రాంగణం గుండా పోతూవున్నప్పుడు శ్రీరాధాకాంతుల హారతిని ఒకింతసేపు నిలబడి చూశారు. పిదప కాళికాలయం కేసి సాగారు. నడుస్తూనే చేతులు జోడించుకుని, “అమ్మా! తల్లీ బ్రహ్మమయీ!” అంటూ ఉచ్చరిస్తూ ఉన్నారు.
ఆలయం ముందు వైపు మెట్ల మీదుగా పైకి వెళ్లి జగజ్జననికి సాష్టాంగ ప్రణామం ఆచరించారు. దేవికి హారతి జరుగుతూ ఉంది. శ్రీరామకృష్ణులు గర్భగుడిలోకి వెళ్లి దేవికి వింజామరం వీచసాగారు.
హారతి పూర్తికాగానే భక్తులు అందరూ నేల మీద పడి మ్రొక్కారు. శ్రీరామకృష్ణులు బయటకు వచ్చి మ్రొక్కారు. మహేంద్ర ముఖర్జీ తదితర భక్తులూ మ్రొక్కారు.
అమావాస్య రోజు. శ్రీరామకృష్ణులు భావపారవశ్య స్థితిలో ఓలలాడారు. భావోన్మత్త స్థితి. బాబూరామ్ చేయి పుచ్చుకుని, త్రాగుబోతులా తూలుతూ గదికి వెళ్లారు.
శ్రీరామకృష్ణుల గదికి పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలో పరిచారకుడు దీపం వెలిగించాడు. శ్రీరామకృష్ణులు అక్కడకు వచ్చి కూర్చున్నారు. ఆయన “హరి ఓం! హరి ఓం! హరి ఓం!” అని స్మరించి, మరికొన్ని తాంత్రిక బీజమంత్రాలను ఉచ్చరించసాగారు. కాసేపయ్యాక గదిలోకి వచ్చి చిన్నమంచం మీద తూర్పుముఖంగా ఆసీనులయ్యారు. ఇంకా ప్రగాఢ భావపారవశ్య స్థితిలోనే ఉన్నారు.
ముఖర్జీ సోదరులు, బాబూరామ్ మొదలైన భక్తులు నేల మీద కూర్చుని ఉన్నారు.
శ్రీరామకృష్ణులు పారవశ్య స్థితిలో జగజ్జననితో మాట్లాడుతున్నారు: “అమ్మా! నేను చెప్పి నువ్వు చేయటమా! అందులో అర్థం లేదు. మాట్లాడటం అంటే ఏమిటి? అది వట్టి సూచన మాత్రమే కానీ మరేదీ కాదు! ‘నేను తింటాను’ అంటాడొకడు, మరొకడు, ‘పో, నేను వినను’ అంటాడు. అమ్మా! సరే, ‘నేను తింటాను’ అని చెప్పలేదనుకో. మరి అటువంటప్పుడు నాకు ఆకలి వెయ్యదా ఏమిటి? నీతో మొరపెట్టుకొంటేనేనా నువ్వు వినేది! అంతరంగాన ఉన్న వ్యాకులతను అర్థం చేసుకోవా, అలా జరగటం సాధ్యమా? తల్లీ, నువ్వు ఎలా ఉన్నావో, అట్లే ఉన్నావు. అటువంటప్పుడు నేనెందుకు మొరపెట్టుకోవాలి, ప్రార్థించాలి? ఓ! ఎలా చేయిస్తావో అట్లే చేస్తాను. థూ, ఏం గందరగోళం! నన్నెందుకు ఇలా విచారణ చేయనిస్తున్నావు?”
28.4.1 తపస్సు, సాధుసేవల ప్రయోజనం
ఇలా శ్రీరామకృష్ణులు జగజ్జననితో మాట్లాడుతూ ఉన్నారు. భక్తులు దిగ్భ్రమచెంది వింటున్నారు. శ్రీరామకృష్ణుల దృష్టి భక్తుల మీద పడింది.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): భగవంతుణ్ణి పొందాలంటే మంచి సంస్కారం ఉండాలి. ఏదో కొంత అనుష్ఠించి ఉండాలి. తపస్సు చేసి ఉండాలి – అది ఈ జన్మలోనే కావచ్చు, లేక పూర్వ జన్మలోనైనా కావచ్చు.
“ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఆర్తితో ఆమె ఎలుగెత్తి ప్రార్థించటం విని శ్రీకృష్ణుడు ఆమెకు దర్శనమిచ్చాడు; ఆమెతో, ‘నువ్వు ఎవరికైనా ఎన్నడైనా వస్త్రం ఇచ్చి ఉన్నావా, జ్ఞాపకం చేసుకో. ఇచ్చి ఉంటే నీ మానం సంరక్షింపబడుతుంది’ అన్నాడు. అందుకు ద్రౌపది, ‘అవును, జ్ఞాపకం ఉంది. ఒక ముని నదిలో స్నానం చేస్తూ ఉండగా ఆయన కౌపీనం ప్రవాహంలో కొట్టుకు పోయింది. నేను నా వస్త్రాన్ని చింపి ఆయనకు ఇచ్చాను’ అన్నది. అది విని శ్రీకృష్ణుడు, ‘అలా అయితే నీకేమీ భయం లేదు’ అన్నాడు.
‘మ’ శ్రీరామకృష్ణులకు సమీపంగా తూర్పుముఖంగా కాలిపట్టా మీద కూర్చుని ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నీ కది అర్థమైందా?
‘మ’ : అవునండీ, సంస్కారం గురించి మీరు చెప్పారు.
శ్రీరామకృష్ణులు: నేను ఏం చెప్పానో చెప్పు, చూద్దాం.
‘మ’ : ద్రౌపది స్నానార్థం వెళ్లటం మొదలైనదంతా.
28.5 పంచమ పరిచ్ఛేదం హాజ్రా
ఇంతలో హాజ్రా లోపలకు వచ్చాడు. హాజ్రా రెండు సంవత్సరాలుగా శ్రీరామకృష్ణులతో వసిస్తూ ఉన్నాడు. అతడు శ్రీరామకృష్ణుల జన్మస్థలమైన కామార్పుకూర్కు సమీపంలోని సిహోర్ గ్రామంలో 1880 లో ప్రప్రథమంగా ఆయనను కలుసుకున్నాడు. ఈ గ్రామంలోనే శ్రీరామకృష్ణుల మేనత్త కుమార్తె అయిన హేమాంగినీదేవి కుమారుడు హృదయ్ నివసించేవాడు. శ్రీరామకృష్ణులు ఆ సమయంలో అతడి ఇంట్లో బసచేసి ఉన్నారు. సిహోర్కు సమీపంలోని మోరాగోడ్ గ్రామంలో హాజ్రాకు ఇల్లు ఉంది. అక్కడ అతడికి కొంత పొలం ఉంది, భార్యాబిడ్డలు వసిస్తూ ఉన్నారు. రాబడికీ ఖర్చులకూ సరిపోయేది, సుమారు వేయి రూపాయల అప్పు కూడా ఉంది.
చిన్ననాటి నుంచి అతడిలో వైరాగ్యం ఉండేది. సాధువులను, భక్తులను దర్శింప తిరిగేవాడు. మొదట్లో దక్షిణేశ్వర కాళికాలయానికి వచ్చి అక్కడ బసచేయ నెంచాడు. శ్రీరామకృష్ణులు అతడి భక్తి, గ్రామంలోని పరిచయం కారణంగా తమతో బసచేయ అనుమతించారు.
హాజ్రా జ్ఞానమార్గావలంబి. శ్రీరామకృష్ణుల భక్తీ, యువకుల కోసం ఆయన ఆరాటపడటమూ హాజ్రాకు నచ్చలేదు. శ్రీరామకృష్ణులను కొన్ని సమయాల్లో మహాపురుషునిగా పరిగణించేవాడు, మరి కొన్ని సమయాల్లో సామాన్య వ్యక్తిగా ఎంచేవాడు. శ్రీరామకృష్ణుల గదికి ప్రక్కన ఉన్న ఆగ్నేయ వసారాలో కూర్చుని ఉంటాడు. జపమాల త్రిప్పుతూ చాలాసేపు జపం చేస్తాడు. రాఖాల్ మొదలైన భక్తులు ఎక్కువసేపు జపం చేయటం లేదని ఇతరులతో విమర్శిస్తూ మాట్లాడతాడు. ఆచార అనుష్ఠానాల్లో మునిగి ఉంటాడతడు. ఆచారం ఆచారం అంటూ ఒక రకంగా దానికే బానిస అయిపోయాడు. అతడి వయస్సు ముఫ్పై ఎనిమిదేళ్లు ఉండవచ్చు.
ఒకింత పారవశ్య స్థితిలో ఉన్న శ్రీరామకృష్ణులు గది లోపలికి వచ్చిన హాజ్రాతో మాట్లాడసాగారు.
28.5.1 భగవంతుడు ప్రార్థనలను వింటాడా? – కామార్పుకూర్వాసి – భగవంతునికై ఆరాటం
శ్రీరామకృష్ణులు: నువ్వు చేసేది అంతా బాగానే ఉంది కానీ అది సరిగ్గా కుదరడం లేదు. పరనింద వద్దు, ఒక పురుగును గురించి కూడా హీనంగా మాట్లాడకు. లోమసముని కథ నువ్వే తరచూ చెబుతూ ఉంటావు కదా! భక్తికై భగవంతుని ఎలా ప్రార్థిస్తున్నావో అదే విధంగా, పరనింద చేయకుండేలా కూడా ప్రార్థించు.
హాజ్రా: భక్తికై ప్రార్థిస్తే భగవంతుడు దాన్ని వింటాడా?
శ్రీరామకృష్ణులు: వింటాడు, నూరుసార్లు చెబుతాను, భగవంతుడు వింటాడు – కాని ఆ ప్రార్థన యథార్థమైనదిగా ఉండాలి, హృదయాంతరాళాలలో నుంచి వచ్చినదై ఉండాలి. విషయాసక్తుడు భార్యాబిడ్డలకై ఎలా విలపిస్తాడో అలా భగవంతునికై ఎవరు విలపిస్తున్నారు? కామార్పుకూర్లో ఒక ఫలానా వ్యక్తి భార్యకు జబ్బు చేసింది. ఆమె బ్రతకదనుకొని అతడు గజగజ వణకిపోయి స్పృహ తప్పి క్రింద పడిపోయాడంటే మరేం చెప్పాలి! భగవంతునికై ఎవరు ఇలా ఆరాటం చెందుతున్నారు?
హాజ్రా, శ్రీరామకృష్ణుల పాదధూళి తీసుకోబోయాడు.
శ్రీరామకృష్ణులు (సంకోచంతో): ఏమిటి, ఏం చేస్తున్నావు?
హాజ్రా: ఎవరైతే నన్ను సంరక్షిస్తూ ఉన్నారో ఆయన పాదధూళిని స్వీకరించకూడదా ఏమిటి?
శ్రీరామకృష్ణులు: భగవంతుని సంతృప్తుని గావించు, అందుచేత అందరూ సంతృప్తులవుతారు – తస్మిన్ తుష్టే జగత్ తుష్టమ్. శ్రీకృష్ణుడు ద్రౌపది పాత్రకు అంటుకుని ఉన్న ఒక మెతుకును తిని, ‘నేను తృప్తిచెందాను’ అన్నాడు. వెంటనే జగత్తులో ప్రాణికోటి యావత్తూ తృప్తి చెందింది, త్రేన్చింది. కాని మునులు ఆరగించినప్పుడు జనులు ఆ విధంగా సంతుష్టి చెందారా, త్రేన్చారా?
లోకులకు దృష్టాంతంగా కర్మ చేయటంలోని ఆవశ్యకాన్ని శ్రీరామకృష్ణులు వివరించారు.
28.5.2 పంచవటీలో సాధువు గురుపాదుక, సాలగ్రామ పూజ
శ్రీరామకృష్ణులు (హాజ్రాతో): జ్ఞానం సముపార్జించుకొన్న పిదప కూడా లోకశిక్షణ నిమిత్తం కొందరు పూజాదికాలు అనుష్ఠిస్తూ ఉంటారు. నేను కాళికాలయానికి పోతాను, గదిలోని ఈ చిత్తరువులన్నిటినీ మ్రొక్కుతాను. దీన్ని చూసి తక్కిన వారు కూడా ఇలాగే చేస్తున్నారు. ఇలా అలవాటు ఏర్పడ్డాక, చేయకపోతే మనస్సు అదోలా ఉంటుంది.
“ఒక రోజు పంచవటిలో నేనొక సాధువును చూశాను. అతడు ఒక ఆసనంపై గురువు పాదుకలు ఉంచి, ఆ ఆసనంలోనే సాలగ్రామాన్ని ఉంచి పూజ చేస్తూవున్నాడు. అతడితో నేను, ‘ఇంత జ్ఞానం సముపార్జించాక పూజలెందుకు?’ అని అడిగాను. అందుకు అతడు, ‘ఎన్నో పనులు చేస్తున్నాను, దాన్లో ఒకటిగా దీన్నీ చేస్తూ ఉన్నాను. కొన్ని వేళల్లో పువ్వులను ఈ పాదుకలకు సమర్పిస్తాను, దేహం ఉన్నంతవరకు కర్మత్యాగం చేయలేం. చెరువు అడుగున బురద ఉన్నంతవరకు బుడగలు లేస్తూనే ఉంటాయి’ అని బదులు పలికాడు.
28.5.3 శాస్త్రం, గురువాక్యం – సాధన, ప్రత్యక్ష దర్శనం
‘(హాజ్రాతో) “ ‘ఏకం’ గురించి జ్ఞానం ఉన్నప్పుడు ‘అనేకం’ గురించిన జ్ఞానం కూడా ఉంటుంది. కేవలం శాస్త్రాధ్యయనంతో ప్రయోజనం ఏమిటి? శాస్త్రాలలో ఇసుక, చక్కెర కలిసి ఉంటాయి; చక్కెరను మాత్రం తీసుకోవటం కష్టం. కనుకనే శాస్త్రాల మర్మాలను సాధువుల నుంచి, గురువు నుంచి అడిగి తెలుసుకోవాలి. ఆ తరువాత శాస్త్రాలతో పని ఏమిటి?
“ఒక వ్యక్తి, తనకు వచ్చిన జాబును ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఆతురతతో దానికోసం ఇక్కడా అక్కడా వెతికాడు. చాలాసేపు వెతికిన తరువాత ఏదో విధంగా అది దొరికింది. అది చదివి చూశాడు. ఐదు సేర్ల మిఠాయి, ఒక పంచె పంపమని దాన్లో వ్రాసి ఉంది. చదివాక జాబును పారవేశాడు. ఆ జాబుతో ఇక పనేమిటి? ఇప్పుడు మిఠాయి, పంచె కొని పంపితే చాలు.
(ముఖర్జీ, బాబూరామ్, ‘మ’ ప్రభృతులతో) “సమాచారాన్నంతా సేకరించి, పిదప అందులోకి పూర్తిగా దూకి వెయ్యాలి. చెరువులో ఒక చోట బిందె పడిపోయిందనుకోండి. చోటును ఖచ్చితంగా తెలుసుకున్న పిదప అక్కడ దుమకవలసి ఉంటుంది.
“శాస్త్ర మర్మాలను గురుముఖతా శ్రవణం చేసి సాధనానుష్ఠానాలు ఒనరించాలి. సాధన చక్కగా కుదిరినప్పుడే ప్రత్యక్ష దర్శనం కలుగుతుంది. అందులోకి పూర్తిగా దుమికినప్పుడే కదా సాధన సవ్యంగా కుదిరేది. ఊరకనే కూర్చుని శాస్త్రాలలో పేర్కొన్న వాటిని కేవలం విచారణ చేస్తూ ఉంటే ఏం ప్రయోజనం? వెళ్లే మార్గం గురించే నిష్ప్రయోజకులు వాదించుకుంటూ ఉంటారు. పోతే పోనివ్వు. వీరు మునగనే మునగరు!
“మునిగినప్పటికీ సొరచేపలు, మొసళ్ళు అంటే కామక్రోధాదుల భయం ఉన్నదే అని అడగవచ్చు. ఒంటికి పసుపు రాసుకొని దుముకు. అప్పుడు అవి నీ సమీపంలోకి రాలేవు. వివేక వైరాగ్యాలే పసుపు.
28.6 షష్ఠ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల వివిధ సాధనలు
శ్రీరామకృష్ణులు: “జగజ్జనని నన్ను పలు రకాల సాధనలు అనుష్ఠింప చేసింది. మొదట పురాణ మార్గాన్ననుసరించి, పిదప తాంత్రిక మార్గానుసారం, ఆ తరువాత వేదమార్గంగా. మొదట పంచవటిలో సాధనలు చేశాను. తులసితోట వేసి, దాని మధ్య కూర్చుని ధ్యానం చేశాను. కొన్ని వేళల్లో మనోవ్యాకులతతో ‘అమ్మా! అమ్మా’ అనో, ‘రామ్, రామ్’ అనో ప్రార్థించేవాణ్ణి.
“రామనామం జపించినప్పుడు హనుమంతుని భావనను ఆపాదించుకుని ఒక తోకను కట్టుకున్నాను. పిచ్చిపట్టిన స్థితి! ఆ కాలంలో పట్టువస్త్రం ధరించి పూజించాను. ఆ పూజలో అనిర్వచనీయ ఆనందం!
“తాంత్రిక సాధన బిల్వవృక్షం క్రింద చేశాను. ఆ రోజుల్లో తులసిదళాలు, మునగ ఆకులు నాకు ఒక్కలాగునే కానవచ్చేవి. ఆ స్థితిలో నక్కలు తిని వదలి వేసిన ఆహారం తిన్నాను* , అది రాత్రంతా పడివుంటుంది, పాము లేదా మరో ప్రాణి కూడా నాకి ఉండవచ్చునేమో! ఆ ఎంగిలి తిన్నాను. కుక్క మీద ఎక్కి కూర్చుని, పూరీ దానికి తినిపించి మిగిలిన దాన్ని నేను తిన్నాను. ‘సర్వం విష్ణుమయం జగత్’ నేలపై నిలిచివున్న నీటిలోనే ఆచమనం చేసేవాడను, కొన్ని సమయాల్లో చెరువు నీరు పట్టుకొచ్చి నేల మీద పోసి, పిదప ఆ నీటిని తీసుకొని ఆచమనం చేసేవాడను.
“అవిద్య నశింపచేసుకోకుంటే ఏమీ సాధించలేం. అందుచేత ఒక పులి భావనను ఆపాదించుకుని, అవిద్యను అట్లే కబళించివేసేవాడిని.
“వైదిక మత సాధన సమయంలో సన్న్యాసం పుచ్చుకున్నాను. అప్పుడు చాందినీ వద్ద పడి ఉండేవాణ్ణి. హృదయ్‌తో, ‘నేను సన్న్యాసినై పోయాను. ఇక్కడ ఉండే తింటాను’ అనేవాణ్ణి.
28.6.1 వేదాల, పురాణాల, తంత్రాల మర్మాలను గురించి జగజ్జనని ఉపదేశం
“అమ్మా నాకు దర్శనం కనుక ఇవ్వకపోతే గొంతుకోసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను! ‘అమ్మా! నేను మూర్ఖుణ్ణి. వేదాలు, పురాణాలు, తంత్రాలు మొదలైన వాటిలోని మర్మాలను నాకు తెలియజేయి’ అని ఆమెతో మొరపెట్టుకున్నాను.
“అమ్మ ఇలా పలికింది: ‘వేదాంత సారం బ్రహ్మసత్యం, జగన్మిథ్య, ఏ సచ్చిదానంద బ్రహ్మం గురించి వేదాలు పేర్కొంటున్నవో దానిని తంత్రశాస్త్రాలు సచ్చిదానంద శివుడని పేర్కొంటున్నాయి. దానినే పురాణాలు సచ్చిదానంద కృష్ణుడని వక్కాణిస్తున్నాయి.’
“గీతా అంటూ పదిసార్లు వల్లిస్తే ఏం వస్తుందో, అదే గీత సారం; అది త్యాగీ త్యాగీ అని వస్తుంది.
“భగవదనుభూతి పొందిన పిదప వేద వేదాంతాలు, పురాణాలు, తంత్రాలు అన్నీ సర్వసామాన్యమైనవిగా కానవస్తాయి.
(హాజ్రాతో) “సమాధి స్థితిలో ఓంకారం ఉచ్చరించలేకపోతున్నాను. అది ఎందుకు? ఆ స్థితి నుంచి ఎంతో క్రిందకు దిగి రాకుండా ఓంకారాన్ని ఉచ్చరించలేను.
“భగవద్దర్శనానంతరం శాస్త్రాలు పేర్కొంటున్న స్థితులు అన్నీ నాకు కలిగాయి. పసిబిడ్డవంటి, ఉన్మాదివంటి, పిశాచం వంటి, జడుని వంటి స్థితులు. శాస్త్రాలు అభివర్ణించే దర్శనాలు కలిగాయి. కొన్ని వేళల్లో జగత్తు యావత్తు నిప్పుకణాలతో నిండి ఉన్నట్లుగా గాంచేవాణ్ణి. కొన్ని సందర్భాలలో, నాలుగు వైపులా పరివ్యాప్తం చెందుతూ మిలమిల మెరసే పాదరస తటాకాన్ని చూసేవాణ్ణి. మరి కొన్ని సమయాల్లో వెండి ద్రావణంలా గాంచేవాణ్ణి. మరికొన్ని వేళల్లో అలంకార దీపాలు వెలగటం గాంచేవాడను. ఈ విధంగా నా అనుభవాలు శాస్త్రాలతో సరిపోలి ఉన్నాయి.
28.6.2 శ్రీరామకృష్ణుల స్థితి
“ఇంకా, భగవంతుడే జీవజగత్తులుగా, ఇరవై నాలుగు తత్త్వాలుగా అయి ఉండటం నాకు గోచరమైనది. డాబాను చేరుకున్నాక మెట్లగుండా దిగటం లాంటిది ఇది. అనులోమం, విలోమం.
“ఆహా! ఏ ఏ స్థితులలో జగజ్జనని నన్ను ఉంచింది! ఒక స్థితి పోయేది, మరొక స్థితి వచ్చేది. రోకలి మారిమారి పడేట్లు – ఒక ప్రక్క క్రిందకు వస్తే మరో ప్రక్క పైకి వెళ్లేది. అంతర్ముఖుడ నయ్యేటప్పుడు, సమాధిస్థితిలోను భగవంతుణ్ణి కాంచేవాణ్ణి; మనస్సు బాహ్య ప్రపంచానికి వచ్చినప్పుడూ ఆయన్నే దర్శించేవాణ్ణి. అద్దం ముందువైపు చూసేటప్పుడు భగవంతుడే, వెనుక వైపు చూసేటప్పుడు అదే భగవంతుడే.”
ముఖర్జీ సోదరులు, బాబూరామ్ మొదలైన భక్తులు ఆశ్చర్యచకితులై వింటూ ఉన్నారు.
28.7 సప్తమ పరిచ్ఛేదం శంభుమల్లిక్ అనాసక్తి – భక్తులపై శ్రీరామకృష్ణుల వాత్సల్యం
శ్రీరామకృష్ణులు (ముఖర్జీ సోదరులు, తదితరులతో): కెప్టెన్ సరిగ్గా సాధక స్థితిలో ఉన్నాడు.
“సిరిసంపదలుంటే దానిపట్ల ఆసక్తి ఉండే తీరుతుందనే నియమం ఏమీ లేదు. శంభుమల్లిక్, ‘హృదూ, నేను మూటముల్లె కట్టుకొని సిద్ధంగా ఉన్నాను’ అని హృదయ్‌తో అన్నాడు. అందుకు నేను, ‘ఎందుకిలా అమంగళకరంగా పలుకుతున్నావు?’ అని అడిగాను. ‘అలా ఏమీ లేదు. వీటి నన్నిటిని పారవేసి భగవంతుని వద్దకు వెళ్లేట్లు నన్ను ఆశీర్వదించండి’ అని అన్నాడు.
“భగవంతుని భక్తునికి భయం లేదు. భక్తుడు భగవంతుని ఆత్మబంధువు. భగవంతుడు భక్తుని ఆపద్బాంధవుడు. దుర్యోధనాదులు గంధర్వులచే బంధింప బడినప్పుడు యుధిష్ఠిరుడే వారిని విముక్తులను చేశాడు! ‘మన బంధుగణానికి ఇట్టి స్థితి ఏర్పడితే మనకు అవమానం’ అన్నాడతడు.”
రాత్రి దాదాపు తొమ్మిది గంటలయింది. ముఖర్జీ సోదరులు కలకత్తాకు తిరిగి పోవడానికి సంసిద్ధులయ్యారు. శ్రీరామకృష్ణులు లేచి గదిలోను వసారాలో పచార్లు చేస్తూ విష్ణ్వాలయం నుండి పెద్దగా వినవస్తూవున్న కీర్తనలు వినసాగారు. ఆ కీర్తన బృందంలో లాటూ, హరీశ్ ఉన్నారని ఒక భక్తుడన్నాడు. శ్రీరామకృష్ణులు ఆ మాట విని “ఓ! అందుకే” అన్నారు.
28.7.1 విష్ణ్వాలయంలో కీర్తనలు
శ్రీరామకృష్ణులు విష్ణ్వాలయానికి వెళ్లారు. భక్తులూ వెంట వెళ్లారు. శ్రీరామకృష్ణులు రాధాకాంతునికి సాష్టాంగ ప్రణామం ఆచరించారు. ఆలయానికి చెందిన బ్రాహ్మణులు అంటే వంట బ్రాహ్మణులు, నైవేద్యం సమర్పించేవారు, భక్తులకు ఆహారం వడ్డించేవారు కీర్తనలో పాల్గొని ఉండటం ఆయన చూశారు. అక్కడ కాసేపు నిలబడి పాటలు విన్నారు. ఆయన రాక పాడేవారిని ఉత్సాహపరచింది.
తమ గదికి తిరిగి వస్తూ శ్రీరామకృష్ణులు భక్తులతో, “ఇలా చూడండి వీరిలో కొందరు వెలయాలి ఇళ్లకు వెళ్లేవారు, కొందరు పాత్రలు మెరుగుపెట్టే వారు” అన్నారు. గదిలోకి వచ్చి చిన్నమంచం మీద ఆసీనులైనారు. సంకీర్తన చేసిన వారు అక్కడకు వచ్చి ఆయనకు ప్రణమిల్లారు. ఆయన వారితో ఇలా అన్నారు: “ధనం కోసం చెమటోడ్చి శ్రమిస్తున్నారు. ఆ విధంగా హరినామ సంకీర్తన చేసి నృత్యం చేస్తూ, పాడుతూ చెమటోడ్చాలి. నేనూ మీతో జతకట్టి నృత్యం చేయాలని అనుకున్నాను. కాని అక్కడకు వచ్చి చూసినప్పుడు అవసరమైన మసాలా దినుసులు అన్నీ చేర్చి పక్వంగా తాళింపువేసి అంతా సిద్ధంగా ఉంది. మెంతులు కూడా వేసి ఉన్నాయి.(అందరూ నవ్వారు) నేను చేర్చటానికి ఏదీ కొరత పడలేదు. మీరు తరచూ ఇలా హరినామ సంకీర్తన చేయండి.”
ముఖర్జీ సోదరులు, తదితరులు శ్రీరామకృష్ణులకు ప్రణామాలు అర్పించి సెలవు పుచ్చుకున్నారు. ఆయన గదికి ఉత్తరాన ఉన్న చిన్న వసారా ప్రక్కన ముఖర్జీల బండి వచ్చి ఆగింది. బండిలో దీపం వెలుగుతూ ఉంది.
శ్రీరామకృష్ణులు ఆ వసారా ఈశాన్య మూలన ఉత్తరాభిముఖంగా నిలబడి ఉన్నారు. ఒక భక్తుడు చేత దీపం పుచ్చుకుని దారి చూపుతూ వచ్చాడు, భక్తులు బండిలో ఎక్కారు.
అమావాస్య, చిమ్మచీకటి. శ్రీరామకృష్ణులకు ఎడమవైపున గంగానది. ఎదుట నహబత్, పువ్వులతోట, ఉద్యానగృహం మొదలైనవి ఉన్నాయి. ముఖద్వారం కేసి వెళ్లే బాట శ్రీరామకృష్ణులకు కుడివైపుగా వెళుతోంది. భక్తులు ఒక్కొక్కరుగా ఆయనకు ప్రణామం చేసి బండిలో ఎక్కారు.
ఆయన ఒక భక్తుడితో, “అతడి విషయమై ఈశాన్కు ఒకమారు గుర్తుచేయి” అన్నారు.
బండిలో మనుష్యులు ఎక్కువ, లాగటానికి గుర్రం కష్టపడుతుందని గ్రహించి శ్రీరామకృష్ణులు, “బండి ఇంతమందిని మోయగలదా?” అని అడిగారు.
శ్రీరామకృష్ణులు నిలబడి ఉన్నారు. ఆ భక్తవత్సలుని రెప్పవాల్చక చూస్తూ భక్తులు కలకత్తాకు పయనమయ్యారు
28.8 అష్టమ పరిచ్ఛేదం రాఖాల్, నారాయణ్, నిత్యగోపాల్, చిన్నగోపాల్ల గురించి సంభాషణ
ఆదివారం, సెప్టెంబర్ 21, 1884
శ్రీరామకృష్ణుల గదిలో పలువురు భక్తులు ఉన్నారు. వారిలో రామ్, మహేంద్ర ముఖర్జీ, ఛునీలాల్, ‘మ’ కూడా ఉన్నారు. ఛునీలాల్ ఈ మధ్యనే బృందావనం నుంచి తిరిగి వచ్చాడు. రాఖాల్, బలరామ్‌లతో కలిసి అతడు బృందావనం వెళ్లి ఉన్నాడు. రాఖాల్, బలరామ్ ఇంకా అక్కడ నుంచి తిరిగి రాలేదు. నిత్యగోపాల్ కూడా అక్కడే ఉన్నాడు. శ్రీరామకృష్ణులు ఛునీలాల్తో బృందావనం గురించి మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: రాఖాల్ ఎలా ఉన్నాడు?
ఛునీలాల్: స్వామి, ప్రస్తుతం కులాసాగానే ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు: నిత్యగోపాల్ తిరిగి రాలేదా?
ఛునీలాల్: అతడు అక్కడే ఉన్నాడు, చూసేవచ్చాను.
శ్రీరామకృష్ణులు: నీ కుటుంబాన్ని ఎవరు తోడ్కొని వస్తారు?
ఛునీలాల్: బాధ్యతాయుతమైన వ్యక్తితో పంపిస్తానని బలరామ్బాబు చెప్పారు. అతడెవరో చెప్పలేదు.
తరువాత మహేంద్ర ముఖర్జీతో నారాయణ్ గురించి శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. నారాయణ్ పాఠశాల విద్యార్థి, పదహారు లేక పదిహేడేళ్ళ వయస్సు ఉంటుంది. శ్రీరామకృష్ణులను చూడడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఆయన అతణ్ణి ఎంతో అభిమానిస్తారు.
శ్రీరామకృష్ణులు: నారాయణ్ సరళ స్వభావి కదా?
సరళ స్వభావి అన్నప్పుడు శ్రీరామకృష్ణులు పరమానందం చెందినట్లుగా కనిపించారు.
మహేంద్ర: అవునండీ. అతడు సరళ స్వభావి.
శ్రీరామకృష్ణులు: అతడి తల్లి ఆ రోజు ఇక్కడకు వచ్చింది. అహంకారి, నాకు కాస్త భయం వేసింది. ఆ రోజు మీరు, కెప్టెన్ విశ్వనాథ్ తదితరులంతా వచ్చి ఉండటం ఆమె గమనించింది. ఇక్కడకు వచ్చేది తానూ, నారాయణ్ మాత్రమే కాదని గ్రహించింది! (అందరూ నవ్వారు) గదిలో ఉన్న పటికబెల్లం చూసి, ‘ఆహా! మంచి పటిక బెల్లమే!’ అని వ్యాఖ్యానించింది. దాని నుంచి ఇక్కడ తిండికి ఏ లోటూ లేదని గ్రహించింది! ఆమె ఎదుటే నేను బాబూరామ్‌తో, ‘నారాయణ్‌కు నీకూ ఈ మిఠాయి తీసి ఉంచు’ అని చెప్పాను. ‘అబ్బబ్బ, ఇక్కడకు రావటానికి పడవ బాడుగ కోసం నారాయణ్ తన తల్లిని ఎన్ని పాట్లు పెడుతున్నాడో తెలుసా!” అని గణు తల్లి, ఇతరులు నాతో చెప్పారు. ‘వివాహం చేసుకోమని నారాయణ్‌కు చెప్పండి’ అని అతడి తల్లి నాతో అంది. అందుకు నేను, ‘ఇవన్నీ వారి వారి విధివ్రాతను బట్టి ఉంటాయి. దీన్లో నే నెందుకు తలదూర్చాలి?’ అని చెప్పాను. (అందరూ నవ్వారు) ఆమె వదలిపెట్టలేదు. ‘ఇతడు శ్రద్ధగా చదువుకోవటం లేదు. శ్రద్ధగా చదువుకోమని చెప్పండి’ అంది. వెంటనే నేను నారాయణ్‌తో, ‘రేయ్, శ్రద్ధగా చదువు!’ అని చెప్పాను. అప్పటికీ ఆమె, ‘ఇంకా కాస్త గట్టిగా చెప్పండి!’ అన్నది, చూడండి. (అందరూ నవ్వారు)
(ఛునీలాల్తో) “ఏమోయ్, గోపాల్ రావటం లేదు, ఎందుకు?
ఛునీలాల్: అతడికి రక్తవిరేచనాలు.
శ్రీరామకృష్ణులు: ఔషధం పుచ్చుకుంటున్నాడా?
28.8.1 చైతన్యలీల నాటకం, వేశ్యలూ జగజ్జనని స్వరూపాలే
-త్రిభంగిగా నిలబడ్డ ఆంగ్లేయ బాలుణ్ణి చూసి శ్రీకృష్ణుని ఉద్దీపన
ఆ రోజు శ్రీరామకృష్ణులు కలకత్తాలోని స్టార్ థియేటర్లో చైతన్య లీల నాటకం తిలకించ వెళ్లనున్నారు. ఆయన్ను మహేంద్ర ముఖర్జీ తమ బండిలో తోడ్కొని వెళతాడు. ఎక్కడ కూర్చుంటే బాగా చూడవచ్చో అని మాట్లాడుకుంటున్నారు. రూపాయి క్లాసులో నుంచి బాగా చూడవచ్చు అన్నారు కొందరు. కాని రామ్, “ఎందుకు, ఆయన బాక్స్‌లో కూర్చుంటారు” అని అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వారు.
“నాటకంలో వేశ్యలు నటిస్తున్నారు. చైతన్య, నిత్యానందుల వంటి పాత్రల నన్నిటినీ వారే పోషిస్తున్నారు” అన్నారు కొందరు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): నేను వారిని జగజ్జనని స్వరూపిణులుగానే గాంచుతాను. వాళ్లు చైతన్యునిగా నటిస్తే దాన్లో ఏం తప్పు ఉంది? కొయ్యతో చేసిన సీతాఫలాన్ని చూసినప్పుడు నిజమైన సీతాఫలం జ్ఞాపకానికి వస్తుంది.
“ఒకసారి భక్తుడొకడు దారివెంట పోతూ ఉన్నప్పుడు ఒకచోట కొన్ని తుమ్మచెట్లను చూశాడు. వాటిని చూడగానే అతడు భక్తిపారవశ్యంలో మునిగిపోయాడు. శ్యామసుందర ఆలయపు తోట పార చేతిపిడిని ఈ చెట్టు కలపతోనే చేశారన్న విషయం అతడికి జ్ఞాపకం వచ్చింది. దానితోపాటు కృష్ణుని జ్ఞాపకమూ వచ్చింది.
“బెలూన్ ఎగురవేయటం చూపటంకోసం నన్ను కలకత్తా మైదానానికి పిలుచుకుని వెళ్లారు. అక్కడ ఒక ఆంగ్లేయ బాలుడు చెట్టుకు ఆనుకుని నిలబడి ఉన్నాడు. అతడు త్రిభంగిగా నిలబడి ఉన్నాడు. అతణ్ణి ఆ స్థితిలో చూడగానే నాకు శ్రీకృష్ణుని ఉద్దీపన కలిగింది, అట్లే సమాధిమగ్నుడనైనాను.
“చైతన్యులు ఒకసారి ఒక గ్రామం గుండా వెళుతూ ఉన్నారు. ఆ గ్రామపు బంకమట్టితోనే ఖోల్ వాయిద్యం తయారుచేస్తారని ఆయనకు తెలియవచ్చింది. ఆ మాట విన్నంతనే భావపరవశులయ్యారు.
“కారుమేఘాన్నో, నెమలి కంఠాన్నో చూస్తూనే రాధ తనను నిగ్రహించుకోలేకపోయేది. శ్రీకృష్ణుని ఉద్దీపన కలిగి బాహ్యస్మృతిని కోల్పోయేది.”
శ్రీరామకృష్ణులు కొంతసేపు మౌనంగా ఉండిపోయారు, తరువాత మాట్లాడ నారంభించారు:
“రాధది మహాభావం. గోపికల ప్రేమ కామనారహితమైనది. నిజమైన భక్తుడు ఏ కోర్కెనూ కోరడు; అతడు పరిశుద్ధమైన భక్తినిమ్మనే ప్రార్థిస్తాడు. ఎటువంటి అద్భుత శక్తులను, సిద్ధులను అతడు కోరడు.
28.9 నవమ పరిచ్ఛేదం అష్టసిద్ధులు భగవత్ప్రాప్తికి ఆటంకాలు
“సిద్ధులు ఉంటే బాధలు తప్పవు. నాంగ్టా దీన్ని నాకు బోధించాడు: ఒక సిద్ధుడు సముద్ర తీరంలో కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా గాలివాన ప్రారంభమైంది. గాలివాన అతడికి ఇబ్బంది కలిగించటంతో అతడు, ‘గాలివాన ఆగిపోవు గాక!’ అని ఆజ్ఞాపించాడు. సిద్ధుని మాట జరిగి తీరుతుంది కదా! వెంటనే గాలివాన ఆగిపోయింది. సముద్రంలో ఒక ఓడ తెరచాపలన్నీ తెరచుకొని పయనిస్తూ ఉంది. గాలి హఠాత్తుగా ఆగిపోవటంతో ఓడ తలక్రిందులై సముద్రంలో మునిగిపోయింది. ఓడతోపాటు ప్రయాణీకులందరూ సముద్రంలో మునిగిపోయి మరణించారు. ఇంత మందిని చంపిన పాపం ఆ సిద్ధుని చుట్టుకుంది. ఆ పాపఫలంగా అతడు సిద్ధు లన్నిటినీ కోల్పోయాడు; తరువాత నరకానికి కూడా పోవలసి వచ్చింది.
“ఒకప్పుడు ఒక సాధువుకు అద్భుత సిద్ధులు కొన్ని లభించాయి. ఆ కారణం చేత అతడు అహంకారపూరితుడయ్యాడు. అయినప్పటికీ అతడు సజ్జనుడు, తీవ్రంగా తపస్సు చేసినవాడు. ఒక రోజు భగవంతుడు ఒక సన్న్యాసి రూపంలో ఆ సాధువు వద్దకు వెళ్లి, ‘స్వామీ! మీకు అష్టసిద్ధులు లభించాయని విని ఉన్నాను’ అని చెప్పాడు. సాధువు ఆ సన్న్యాసిని సాదరంగా ఆహ్వానించి, ఆసీనుని చేశాడు. అప్పుడు ఆ దారిన ఒక ఏనుగు పోతూవుండటం తటస్థించింది. దాన్ని చూసిన సన్న్యాసి, సాధువుతో, ‘స్వామీ! తలచుకుంటే ఈ ఏనుగును చంపగలరు కదా?’ అని అడిగాడు. అందుకు ఆ సాధువు, ‘ఓ! సాధ్యమే’ అని జవాబిచ్చాడు. పిదప కొంచెం ధూళి చేతబట్టి ఏనుగుపై చల్లాడు. ఏనుగు గిలగిల కొట్టుకొని చచ్చి క్రిందపడింది. ఇదంతా చూస్తూ ఉన్న సన్న్యాసి, ‘ఆహా! ఇదెక్కడి అమోఘశక్తి! ఒక ఏనుగునే చంపివేయగలిగారు!’ అంటూ ప్రశంసించాడు. అది విని సాధువు నవ్వాడు. తరువాత సన్న్యాసి ఆతణ్ణి చూసి, ‘సరే, ఈ ఏనుగును మళ్లీ బ్రతికించగలరా?’ అని అడిగాడు. ‘అదీ చేయగలను’ అంటూ సాధువు మునుపటిలాగే కొంచెం ధూళి చేతిలో తీసుకొని ఏనుగుపై చల్లాడు. మరుక్షణంలోనే ఏనుగు ఒళ్ళు విరుచుకుని లేచి నిలబడింది.
“అప్పుడు సన్న్యాసి ఆ సాధువుతో, ‘స్వామీ! మీ శక్తి అమోఘమైనదే. కాని మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలచుకున్నాను. మీరు ఏనుగును చంపారు, తరువాత బ్రతికించారు. దీనివల్ల మీకు ఏం లాభం ఒనగూరింది? మీకు ఏం ఉన్నతి కలిగింది? దీనివల్ల మీరు భగవంతుని పొందగలిగారా?’ అని అడిగి, అంతర్ధానమయ్యాడు.
“ధర్మమార్గం ఎంతో సూక్ష్మమైంది. జాడమాత్రమైన కోర్కె ఉన్నా భగవంతుని పొందలేం. ఒక పోగు విడివడివున్నా దారాన్ని సూదిలోకి పోనివ్వలేం.
“మిత్రమా, నువ్వు నన్ను పొందగోరితే, నీకు అష్ట సిద్ధులలో ఒక్క సిద్ధి ఉన్నా నీ కోర్కె తీరదు’ అని శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పాడు. విషయం ఏమిటో తెలుసా? సిద్ధులు లభిస్తే అహంకారం జనిస్తుంది. అతడు భగవంతుణ్ణి మరచిపోతాడు.
“ ‘మెల్లకన్ను ఉన్న ధనవంతుడొకడు ఇక్కడకు వచ్చాడు. అతడు నాతో, ‘మీరు పరమహంసలు, మంచిది, మీరు నాకోసం స్వస్త్యయనం (అంటే, స్వస్తి వచనం) చేయండి’ అన్నాడు. ఎంత అల్పబుద్ధి! పరమహంస అని సంబోధించాడు. అదే సమయంలో స్వస్త్యయనం చేయాలట! స్వస్త్యయనం నిర్వర్తించి మేలు జరిగేలా చేయటం ఒక రకమైన సిద్ధి.
“అహంకారం ఉంటే భగవద్దర్శనం కలుగదు. అహంకారం ఎటువంటిదో తెలుసా? అది ఒక గుట్ట వంటిది, అక్కడ వర్షపు నీరు నిలువదు. క్రిందికి దిగి పోతుంది. పల్లంలోనే నీరు నిలుస్తుంది. అక్కడే మొక్కలు పెరుగుతాయి, చెట్లుగా ఎదుగుతాయి, పళ్లను ఇస్తాయి.
“అందుకే నేను హాజ్రాతో, ‘నేను సర్వజ్ఞుడను, తక్కిన వారంతా మూర్ఖులు అని అనుకోవద్దు. అందరినీ ప్రేమించాలి. ఎవరూ పరాయివారు కారు, సకల భూతకోటిలో ఆ హరియే ఉన్నాడు, ఆయన తప్ప మరేదీ లేదు’ అని చెప్పాను. ప్రహ్లాదునితో శ్రీహరి, ‘ఏదైనా వరం కోరుకో’ అని చెప్పాడు. అందుకు ప్రహ్లాదుడు, ‘ప్రభో! మీ దర్శనభాగ్యం అబ్బింది. నాకు మరేదీ అక్కర్లేదు’ అని జవాబిచ్చాడు. కాని భగవంతుడు వదలిపెట్టలేదు. అందుకే ప్రహ్లాదుడు, ‘ప్రభూ! వరం ఇచ్చే తీరాలనుకుంటే, నన్ను బాధలు పెట్టినవారు ఏ శిక్షకూ గురి కారాదు’ అన్నాడు. దీని అర్థం ఏమిటో తెలుసా?హరియే వారి రూపాలలో తనకు కష్టం కలిగించారు.కనుక వారిని శిక్షిస్తే హరికే దుఃఖం కలుగుతుంది అని. (BG 13.29)
28.10 దశమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల ప్రేమోన్మాదం – కుల విచక్షత లుప్తమైన సంఘటనలు
“రాధకు ప్రేమోన్మాదం కలిగింది. అలాగే భక్తి ఉన్మాదం అనేది కూడా ఉంది – హనుమంతునికి ఉన్నట్లుగా. సీతాదేవి అగ్నిప్రవేశం చేయటం చూసి రాముణ్ణే కొట్టబోయాడతడు. జ్ఞానోన్మాదమూ ఉంది. ఉన్మాది వంటి ఒక జ్ఞానిని చూసి ఉన్నాను. కాళికాలయ ప్రతిష్ఠానంతరం వచ్చాడు. జనం అతడు రామమోహన్‌రాయ్ బ్రహ్మసభకు చెందిన వాడని చెప్పారు. ఒక కాలికి తెగిన చెప్పు, ఒక చేత వెదురు కర్ర, మరో చేతిలో మామిడి మొక్క ఉన్న పిడత. గంగలో ఒక మునక వేశాడు, తిన్నగా కాళికాలయానికి వెళ్లాడు. హలధారి కాళికాలయంలో కూర్చుని ఉన్నాడు. ఆ ఉన్మాది తీవ్ర ఆవేశంతో, ‘క్షౌం క్షౌం ఖట్వాంగ ధారిణీమ్’ అంటూ స్తుతించసాగాడు.
“తరువాత అతడు ఒక కుక్క ప్రక్కకెళ్లి, దాని చెవి పుచ్చుకుని, దానితో కలిసి ఎంగిలి అన్నం తిన్నాడు. ఆ కుక్క కూడా మొరగలేదు.
“ఆ రోజుల్లో నాకూ అట్టి ఉన్మాదస్థితి ప్రారంభమైంది. నేను హృదయ్ మెడచుట్టూ చేతులు పెనవేసి, ‘అరే హృదూ, నాకూ అటువంటి కర్మ పడుతుందా?’ అని వాపోయాను.
“నాకూ ఉన్మాదస్థితి కలిగింది. నారాయణ్శాస్త్రి వచ్చి చూశాడు, భుజం మీద వెదురుగడ నొకదాన్ని ఉంచుకుని తిరుగుతూ ఉన్నాను. వెంటనే అతడు ఇతరులతో, ‘ఇతడు ఉన్మాది’ అని చెప్పాడు. ఆ స్థితిలో కుల విచక్షత ఒకింత కూడా నాలో లేకుండా పోయింది. నిమ్నజాతికి చెందిన ఒక వ్యక్తి భార్య ఆకుకూర వండి నాకు పంపించేది, నేనూ తిన్నాను.
“కాళికాలయంలో బిచ్చగాళ్లు తిని వెళ్ళిపోతారు; వారి ఎంగిలి ఆకులు ఎత్తి నా తలతోను, నోటితోను స్పృశించాను. ఇది చూసి హలధారి నాతో, ‘నువ్వు ఏం పని చేస్తున్నావు! బిచ్చగాళ్ల ఎంగిలి తిన్నావే! నీ పిల్లాజల్లాకు ఎలా వివాహం జరుగుతుంది?’ అని అడిగాడు. నాకు కోపం వచ్చింది. హలధారి వరుసకు నా అన్న. అయితేనేం? అతడితో, ‘ఒరేయ్ వెధవా! గీత, వేదాంతం అన్నీ పఠించేది ఇందుకేనా? బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటూ బోధించేది నువ్వే కదా! నేను పిల్లాజల్లా కంటానని అనుకొంటున్నావా? గీత పఠించే నీ నోట్లో అగ్గిపడ’ అంటూ కేకలు పెట్టాను.
(‘మ’ తో) “ఇలా చూడు. కేవలం పుస్తక పఠనంతో ఏ ప్రయోజనమూ లేదు. స్వరం పలకటం సులభమే కాని దరువు వెయ్యటం చాలాకష్టం.”
శ్రీరామకృష్ణులు తమ దైవోన్మాద స్థితిని గురించి చెప్పటం కొనసాగించారు:
28.10.1 మథుర్‌తో నవద్వీప దర్శనం – కామార్పకూర్ చినే శాంఖరి
“గాలిమార్పు కోసం కొన్ని రోజులు మథుర్బాబుతో పడవలో పయనం చేశాను. నవద్వీపానికి వెళ్లాం. పడవ నడిపేవారు పడవలోనే వంట చేశారు. నేను వారి ప్రక్కన నిలబడ్డాను. అది చూసి మథుర్బాబు నాతో, ‘బాబా, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు?” అని అడిగాడు. నేను నవ్వుతూ, ‘పడవ నడిపేవాని వంట చాలా బాగుంది’ అన్నాను. ఎక్కడ ఆ పడవ నడిపేవారి నుంచి తీసుకొని తింటానో అనుకుని అతడు వెంటనే నాతో, ‘బాబా, ఇక్కడకు వచ్చేయ్, వచ్చేయ్’ అని అన్నాడు.
“ఇప్పుడు అలా చేయటం నాకు సాధ్యం కాదు, ఆ స్థితి ఇప్పుడు లేదు. ప్రస్తుతం బ్రాహ్మణుడు వంట చేయాలి, అతడు ఆచారశీలుడై ఉండాలి, అది దేవుడికి నైవేద్యం చేసినదై ఉండాలి. ఆ అన్నాన్ని మాత్రమే నేను తినగలను.
“ఓహ్, ఏఏ స్థితులలో గడిపి వచ్చాను? కామార్పుకూర్లో చినే శాంఖరి మొదలైన బాల్య మిత్రులతో, ‘మిత్రులారా! మీ పాదాలపై పడతాను. హరినామం జపించండి’ అని ప్రాధేయపడుతూ వారి పాదాలపై పడబోయాను. వెంటనే చినే ‘నాయనా, ఇప్పుడు నీలో ప్రప్రథమంగా అనురాగం ఉదయిస్తూ ఉన్నది. అందుకే నువ్వు అందరినీ సమానంగా చూస్తున్నావు’ అని చెప్పాడు. గాలివాన ప్రారంభమై దుమ్ముధూళి చెలరేగినప్పుడు మామిడి చెట్టు, చింతచెట్టు అన్నీ ఒక్క మాదిరిగానే కనబడతాయి.”
28.10.2 సంసారమా? లేక సర్వసంగ పరిత్యాగమా?
ఒక భక్తుడు: గృహస్థ జీవితం గడుపుతూ ఉన్న వ్యక్తికి ఈ భక్తి ఉన్మాదం, ప్రేమోన్మాదం, జ్ఞానోన్మాదం కలిగితే అతడు సంసార విధులు ఎలా నెరవేర్చగలడు?
శ్రీరామకృష్ణులు (ఆ గృహస్థ భక్తుని చూస్తూ): యోగులు రెండు రకాలు – వ్యక్తయోగి, గుప్తయోగి. సంసారంలో గుప్తయోగిలా జీవించవచ్చు. అతణ్ణి ఎవరూ గుర్తించరు. సంసార జీవితంలో పరిత్యాగం మానసికంగానే ఉండాలి, బాహ్యత్యాగం కూడదు.
రామ్: మీరు చెబుతూ ఉన్నది పిల్లలను ఊరడించేట్లుగా కదా ఉన్నది! గృహస్థుడు జ్ఞాని అయితే కావచ్చుగాని, ఏనాటికీ విజ్ఞాని కాలేడు.
శ్రీరామకృష్ణులు: చివరకు విజ్ఞాని కావచ్చు. సంసారాన్ని బలవంతంగా త్యజించటం మంచిది కాదు.
రామ్: ‘ఎందుకు ఈయన (శ్రీరామకృష్ణుల) వద్దకు జనం గుంపులుగా పోతున్నారు? ఏదో ఒక రోజు కాటువేస్తాడు. అప్పుడు పారిపోతారు’ అనేవాడు కేశవ్సేన్.
శ్రీరామకృష్ణులు: నే నెందుకు కాటు వేయాలి? ‘ఇదీ చేయండి, అదీ చేయండి; కర్తవ్యాలనూ నిర్వర్తించండి, భగవంతునీ ప్రార్థించండి’ అనే కదా నేను లోకులకు చెబుతున్నాను. సమస్తం త్యజించమని చెప్పటం లేదే! (నవ్వుతూ) కేశవ్సేన్ ఒక రోజు లెక్చర్ ఇస్తున్నాడు. ‘ఓ పరమేశ్వరా! మేం భక్తివాహినిలో మునిగిపోయి సచ్చిదానంద సాగరాన్ని చేరుకునేట్లు అనుగ్రహించు’ అని అన్నాడతడు. స్త్రీలందరూ పరదా వెనుక కూర్చుని ఉన్నారు. నేను కేశవ్‌తో, ‘ఎల్లరూ ఒకేసారి మునిగిపోతే ఎలా? ఈ స్త్రీల గతి ఏమవుతుంది? మధ్యమధ్యలో తీరానికి రండి. పిదప మళ్లీ మునిగిపోండి, మళ్లీ తీరానికి రండి’ అని చెప్పాను. కేశవ్, మిగిలినవారూ పెద్దగా నవ్వారు.
“రజోగుణం గలవారిని అంటే ధనికులను, పెద్దమనుష్యులను మాత్రమే నువ్వు ఎక్కువగా అభిమానిస్తావు అంటాడు హాజ్రా నాతో. అలా అయితే హరీశ్, నోటో (లాటూ) అందరినీ ఎందుకు అభిమానిస్తున్నాను? నరేంద్రుని ఎందుకు ప్రేమించాలి? కాల్చిన అరటికాయకు నంచుకోవటానికి అతడికి ఉప్పుకు కూడా గతిలేదు.”
శ్రీరామకృష్ణులు తమ గది నుంచి బయటకు వచ్చారు. ‘మ’ తో మాట్లాడుతూ సరుగుడు తోపు వైపు వెళ్లారు. తుండుగుడ్డ, చెంబులో నీరు పుచ్చుకుని ఒక భక్తుడు ఆయన వెన్నంటి వస్తున్నాడు. ఆ రోజు శ్రీరామకృష్ణులు చైతన్యలీల నాటకం చూడ్డానికి కలకత్తా వెళ్లనున్నారు. ఆ విషయం గురించి ప్రస్తావించారు.
శ్రీరామకృష్ణులు (పంచవటి సమీపంలో ‘మ’ ను చూసి): రామ్ చెప్పేదంతా రజోగుణ వ్యక్తులకే అనువర్తిస్తుంది. ఇంత ఎక్కువ డబ్బు పోసి కూర్చోవలసిన అవసరం ఏమిటి?
థియేటర్లో బాక్స్‌లో కూర్చోవటం గురించి శ్రీరామకృష్ణులు ఆ మాట అన్నారు.
28.11 ఏకాదశ పరిచ్ఛేదం మహేంద్ర ముఖర్జీ ప్రభృత భక్తులతో
శ్రీరామకృష్ణులు మహేంద్ర ముఖర్జీ బండిలో దక్షిణేశ్వరం నుంచి కలకత్తాకు వస్తూ ఉన్నారు. అప్పుడు సాయంత్రం దాదాపు ఐదు గంటలు అయివుంటుంది. బండిలో ఆయనతో మహేంద్ర ముఖర్జీ, ‘మ’, ఒక భక్తుడు కూర్చుని ఉన్నారు. బండి కాస్త దూరం వెళ్లగానే శ్రీరామకృష్ణులు ధ్యానంలో మునిగిపోయి సమాధిమగ్నులైనారు.
చాలసేపయ్యాక శ్రీరామకృష్ణులకు బాహ్యస్మృతి కలిగింది. “ఆ ధూర్తుడు! హాజ్రా నాకు పాఠాలు నేర్పుతున్నాడు” అన్నారాయన. కాసేపటి తరువాత “మంచినీళ్లు త్రాగుతాను” అని అన్నారు. మనస్సును బాహ్య ప్రపంచంలోకి దింపటానికి ఆయన ఇలా పలుకటం పరిపాటి.
మహేంద్ర ముఖర్జీ (‘మ’ తో): అలా అయితే తినుబండారాలు ఏవైనా తీసుకురానా?
‘మ’ : వద్దు, ఆయన ఇప్పుడు తినరు.
శ్రీరామకృష్ణులు (పారవశ్య స్థితిలో): నేను తింటాను, బయలుకు పోతాను.
మహేంద్ర ముఖర్జీకి హాథీబాగాన్లో పిండిమిల్లు ఒకటి ఉంది. ఆ మిల్లుకే అతడు శ్రీరామకృష్ణులను తోడ్కొనిపోతున్నాడు. అక్కడ కాసేపు విశ్రమించి, స్టార్ థియేటర్‌కు చైతన్యలీల తిలకించటానికి వెళతారు. మహేంద్రముఖర్జీ ఇల్లు బాగ్‌బజార్‌లోని మదన్ మోహన ఆలయానికి ఒకింత ఉత్తరం వైపుగా ఉంది. మహేంద్రుని తండ్రి శ్రీరామకృష్ణులను ఎరుగడు. అందుకే మహేంద్రుడు శ్రీరామకృష్ణులను ఇంటికి తీసుకువెళ్లలేదు. మహేంద్రుని రెండవ సోదరుడు ప్రియనాథ్ కూడా శ్రీరామకృష్ణుల భక్తుడు.
మహేంద్రుని మిల్లులో ఒక మంచంపై జంపఖానా పరచి ఉంది. దాని మీద కూర్చుని శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (‘మ’, మహేంద్రులతో): హాజ్రా ఒకప్పుడు శ్రీ చైతన్య చరితామృతాన్ని విని, ‘ఇవన్నీ శక్తి లీలలు; సర్వాంతర్యామియైన బ్రహ్మం విషయం దీన్లో లేదు’ అని అన్నాడు. బ్రహ్మాన్ని వదలిపెట్టి శక్తి ఒంటరిగా ఉండటమా! ఇక్కడి (అంటే తమ) ఉపదేశాన్ని కొట్టివేయాలని హాజ్రా ప్రయత్నిస్తుంటాడు.
28.11.1 భగవంతుడు సర్వాంతర్యామి – శుద్ధభక్తుడు షడైశ్వర్యాలను కోరడు
“బ్రహ్మం, శక్తి అభేదాలని నాకు తెలుసు – నీరు దాని తడితనంలా, అగ్ని దాని దహనశక్తిలా. భగవంతుడు సర్వాంతర్యామిగా సకల భూతాలలోను ఉన్నాడు. కాని కొన్నిచోట్ల ఎక్కువ శక్తితోను, కొన్నిచోట్ల తక్కువ శక్తితోను ప్రకాశిస్తూ ఉన్నాడు. హాజ్రా మరొకటి కూడా చెబుతున్నాడు: భగవద్దర్శనమైతే భగవంతునిలా షడైశ్వర్య సంపన్నుడౌతాడు; వాటిని ఉపయోగించుకున్నా సరే, లేకున్నా సరే అవి ఉండే తీరుతాయి.”
‘మ’ : షడైశ్వర్యాలు కైవసంలో ఉంటే మంచిది! (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు (చిరునవ్వుతో): అవును, అవును. కైవశంలో ఉంటే మంచిదట! ఎటువంటి హీనబుద్ధి! అధికారాన్ని, సంపదలను అనుభవించని వ్యక్తి మాత్రమే ధనం పదవులంటూ జపిస్తూ అసహనంగా ఉంటాడు. నిజమైన భక్తుడు ఎప్పుడూ ఐశ్వర్యం కోసం భగవంతుణ్ణి ప్రార్థించడు.
పిండిమిల్లులో తాంబూలం ఉంచలేదు. “తాంబూలం పట్రా” అన్నారు శ్రీరామకృష్ణులు. ఆయన బహిర్భూమికి పోగోరారు. మహేంద్ర ముఖర్జీ ఒక చెంబులో నీరు తెప్పించి, తానే ఆ చెంబును చేత్తో పుచ్చుకున్నాడు. శ్రీరామకృష్ణులను అతడు బహిర్భూమికి తీసుకు వెళ్లబోయాడు. ఎదుట ‘మ’ నిలబడి ఉండటం చూసిన శ్రీరామకృష్ణులు మహేంద్రునితో, “నువ్వు రావద్దు. ఇతడికి చెంబును ఇవ్వు” అని చెప్పారు. ‘మ’ చెంబును మహేంద్ర నుంచి తీసుకొని, శ్రీరామకృష్ణులతో పిండిమిల్లు వెనుక వైపుకు వెళ్లాడు.
శ్రీరామకృష్ణులు ముఖం కడుగుకున్న పిదప పొగత్రాగటానికి హుక్కా సిద్ధపరిచారు. ఆయన ‘మ’ తో, “సంధ్యాసమయం అయిందా? అలా అయితే హుక్కా త్రాగను. సంధ్యాసమయం అవగానే పనులన్నిటిని ఆవలకు పెట్టి, భగవచ్చింతన చేయాలి” అన్నారు.
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు తమ చేతి మీది రోమాలను చూశారు. ఆ వెలుగులో రోమాలను లెక్కించ సాధ్యమా కాదా అని ఆయన గమనించారు. లెక్కించలేకపోతే సంధ్యాసమయం అయిందని అర్థం.
28.12 ద్వాదశ పరిచ్ఛేదం
స్టార్ థియేటర్లో చైతన్యలీల నాటకం
శ్రీరామకృష్ణుల బండి కలకత్తాలోని బీడన్ వీథిలో ఉన్న స్టార్ థియేటర్ ముందు ఆగింది. రాత్రి దాదాపు ఎనిమిదిన్నర గంటలు. శ్రీరామకృష్ణులతోపాటు ‘మ’, బాబూరామ్, మహేంద్ర ముఖర్జీ, ఒకరిద్దరు కూడా ఉన్నారు. టిక్కెట్లు కొనే ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడు థియేటర్ నిర్వాహకుడైన గిరీశ్ చంద్రఘోష్ సిబ్బందితో బండి వద్దకు వచ్చాడు. శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి, గౌరవ పురస్కరంగా మేడ మీదికి తోడ్కొని వెళ్లాడు. ఆయన గురించి గిరీశ్ విని ఉన్నాడు. ఆయన చైతన్యలీల నాటకం తిలకింప రావటం గిరీశ్‌కు ఎంతో ఆనందదాయకమైంది.
శ్రీరామకృష్ణులను నైరుతి మూలనున్న బాక్స్‌లో ఆసీనులను చేశారు. ఆయన ప్రక్కన ‘మ’ కూర్చున్నాడు. అతడి వెనుక బాబూరామ్, ఇంకా ఒకరిద్దరు భక్తులు కూర్చున్నారు.
థియేటర్ ప్రకాశవంతంగా ఉంది. క్రింది భాగంలో జనసమూహం! శ్రీరామకృష్ణులకు ఎడమ వైపున తెర ఉంది. దాదాపు అన్ని బాక్సులూ జనంతో నిండిపోయాయి. ప్రతి బాక్స్‌లోని ప్రేక్షకులకు పంకా విసరటానికి ఒక పరిచారకుడు నిలబడి ఉన్నాడు. శ్రీరామకృష్ణులకు విసరటానికి గిరీశ్ ఒక మనిషిని ఏర్పాటు చేసి వెళ్లాడు.
థియేటర్‌ను కలయచూసి శ్రీరామకృష్ణులు చిన్నపిల్లవాడిలా సంబరపడి పోయారు. (‘మ’ ను చూస్తూ, నవ్వుతూ) “ఆహా! ఈ చోటు ఎంతో బాగుంది! నేను రావటం మంచిదైంది! జనం సమూహంగా గుమిగూడి ఉండటం నన్ను పారవశ్యంలో ముంచివేస్తూ ఉంది. భగవంతుడే ఇన్ని రూపాల్లో వెలసి ఉన్నాడని స్పష్టంగా చూస్తున్నాను” అన్నారు.
‘మ’ : అవునండీ, నిజమే.
శ్రీరామకృష్ణులు: ఈ బాక్స్‌కు ధర ఎంత?
‘మ’ : వాళ్లు డబ్బు ఏదీ తీసుకోరు. మీరు రావటమే వాళ్లకు మహదానందం.
శ్రీరామకృష్ణులు: అంతా తల్లి మాహాత్మ్యమే!
తెర పైకి లేచింది. అందరి చూపులు ఒకే సమయంలో రంగస్థలంపై ప్రసరించాయి.
మొదటి దృశ్యం: పాపం మరియు ఆర్గురు శత్రువుల సభ. పిదప, అడవి బాటలో వివేకం, వైరాగ్యం, భక్తి సంభాషిస్తూ ఉన్న దృశ్యం.
భక్తి: గౌరాంగుడు నదియాలో అవతరించాడు. ఆయన దర్శనార్థం విద్యాధర స్త్రీలు, మునులు, ఋషులు మారువేషాల్లో వచ్చి ఉన్నారు.
ధన్య ధన్య మీ ధారుణి ధన్యము
మాయాపురమున గోరా పుట్టెను ॥ ధ ॥
రథారూఢులై విద్యాధరులు
ఆరాధించగ నదిగో వచ్చిరి ।
ప్రేమ మంత్ర సంకృష్టచిత్తులై
గన నేతెంచిరి మునులు ఋషులు ॥ ధ ॥
ఋషులు మునులు విద్యాధరులు
పరమాత్మ అవతార మాతడని
గౌరాంగునిపై గానమొనర్చెద
రదిగో గాంచుడు అదిగో గనుడు ॥ ధ ॥
విద్యాధర స్త్రీలు, మునులు గౌరాంగుణ్ణి అవతార పురుషునిగా స్తుతించసాగారు.
శ్రీరామకృష్ణులు వీరిని చూసి భావపారవశ్యంలో మునిగిపోయారు. ‘మ’ ను చూస్తూ, “ఆహా! చూడు చూడు, ఎంత బాగుందో” అన్నారు.
విద్యాధర స్త్రీలు, మునులు ప్రశంసిస్తూ పాడసాగారు.
| ఋషులు: | ఓ కేశవా! బృందావనాంతర లతానికుంజ వినోదవిహార! కేశవా! | ||
| దేవతలు: | హే మాధవా! ఓ మధుర మనోహర! మురళీవాలా! మానసచోరా! | ||
| అందరు: | బోలో హరినామ్! హేమన గావో శ్రీహరినామ్! గంభీర స్వర్మే భజో ప్రభు హరినామ్ | ||
| ఋషులు: | నిత్యయౌవనా! హే వ్రజబాలా! కాళీయదమనా! ఆర్తిహరా! | ||
| దేవతలు: | కపటలోచనా! కామితవదనా! బర్హీ బర్హావతంసా! రాధారమణీ హృదయ మనోహర! | ||
| ఋషులు: | హే బృందావన గోపకామినీ కేళీలోలా! శ్యామల వర్ణా | ||
| అందరు: | బోలో హరినామ్! హేమన! గావో శ్రీహరినామ్! గంభీరస్వర్మే భజో ప్రభు హరినామ్! |
విద్యాధర స్త్రీలు ‘బర్హీ బర్హావతంసా’ అని గానం చేస్తూ ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు గాఢసమాధి మగ్నులైనారు. వాయిద్యాలు మ్రోగుతూ ఉన్నాయి. శ్రీరామకృష్ణులకు బాహ్యప్రపంచ స్పృహే లేదు.
28.13 త్రయోదశ పరిచ్ఛేదం చైతన్యభావంలో శ్రీరామకృష్ణుల భావావస్థ, సమాధి
మరొక దృశ్యం: చైతన్యుల తండ్రియైన జగన్నాథ మిశ్ర గృహానికి అతిథి ఒకరు వచ్చారు. బాలుడైన నిమాయ్ సమవయస్కులైన మిత్రులతో పాడుతూ ఉన్నాడు.
చెప్పుమురా! ఎక్కడుండిరో చెప్పుమురా!
అందమైన నా బృందావనము
మాత యశోదాదేవి ఎచ్చట? ॥ చె ॥
నాన్న నందుడు అన్న బలాయీ
నల్ల తెల్లని ఆవుల జంట
ఎక్కడున్నవో వేగ చెప్పరా ॥ చె ॥
మోహన మురళి ఎక్కడున్నది?
సఖులు సుదామ శ్రీదాము లెచ్చట?
నా వట మేదీ? యమునా తటి ఎట? ॥ చె ॥
గోప కన్యలు రాధారాణి
ఎచ్చటుండిరి? ఎందు దాగిరి?
వేగ చెప్పరా! నాకు చెప్పవా?
అతిథి కళ్లు మూసుకుని భగవంతుడికి నైవేద్యం సమర్పిస్తున్నాడు. ఆడుకుంటూ ఉన్న నిమాయ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ నైవేద్యాన్ని తినేశాడు. ఆ విధంగా అతణ్ణి సాక్షాత్తూ భగవంతుడని గుర్తించిన అతిథి దశావతార స్తోత్రం గానం చేసి నిమాయ్ను సంతోష పరిచాడు. మిశ్రా దంపతుల వద్ద సెలవు పుచ్చుకునేటప్పుడు మళ్లీ అతడొక పాట పాడి నిమాయ్ను స్తుతించాడు.
జయ గౌరాంగ! జయ గౌరాంగ
జగదోద్ధారా! పరమాధారా!
దీనబాంధవా! ప్రాణాధారా
భీకర భీషణ భీతిహరా ॥ జ ॥
వ్యక్తములగు నీ నూతన లీలలు
సదా క్రొత్తవౌ నూతన రీతులు
యుగములు మరలుచు యుగము దొరలగా
ఆలోకింతు నీ లీలా విభవము ॥ జ ॥
లోకమంతట భారము మ్రోతువు
కురియుము మాపై ప్రేమామృతము
బాధల వ్యధలను పారద్రోలుము
ప్రేమ కోనలో వరలెడు వాడా ॥ జ ॥
ఆర్తజనావన పాప శిక్షకా
దుష్టవిదూరా! విజయము నీకు ॥ జ ॥
ఈ స్తవం వింటూ శ్రీరామకృష్ణులు మళ్లీ భావావిష్టులయ్యారు.
నవద్వీపంలో గంగాతీరం: బ్రాహ్మణ పురుషులు, స్త్రీలు గంగలో స్నానం చేశాక స్నానఘట్టం మెట్లపై కూర్చుని పూజలు చేస్తున్నారు. నిమాయ్ నైవేద్యాలను దొంగిలించి తింటున్నాడు. ఒక బ్రాహ్మణుడది చూసి కోపంతో, “ఓరేయ్, దొంగ వెధవా, పాతకా, మహావిష్ణువుకు అర్పించనున్న నైవేద్యాన్ని తినివేశావే! నువ్వు నాశనమైపోతావు!” అని నిమాయ్ను తిట్టాడు. అయినప్పటికీ నిమాయ్ నైవేద్యాన్ని చేత పుచ్చుకుని ఉడాయించాడు. పలువురు స్త్రీలు నిమాయ్ను ఎంతో ప్రేమిస్తున్నారు. అతడు అక్కడ నుంచి పారిపోవటం సహించలేక బిగ్గరగా అతణ్ణి, “ఓ నిమాయ్! తిరిగి రా! ఓ నిమాయ్! వెళ్లకు, తిరిగి రా!” అని పిలిచారు. నిమాయ్ వారి పిలుపులు పెడచెవిన పెట్టాడు.
నిమాయ్ను తిరిగి రప్పించే మహామంత్రం ఆ స్త్రీలలో ఒకామెకు తెలుసు. ఆమె ‘హరి, హరి’ అంటూ పెద్దగా ఉచ్చరించసాగింది. నిమాయ్ కూడా ‘హరి హరి’ అంటూ తిరిగి వచ్చాడు.
‘మ’, ‘శ్రీరామకృష్ణుల ప్రక్కనే కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు, “ఆహా!” అన్నారు. అంతకుపైన ఆయన తనను నిగ్రహించుకోలేకపోయారు. “ఆహా!” అంటూ ‘మ’ వైపుకు తిరిగారు. ఆయన కళ్ల నుంచి ప్రేమాశ్రువులు స్రవిస్తున్నాయి.
శ్రీరామకృష్ణులు (బాబూరామ్, ‘మ’ లతో): ఇలా చూడండి! నాకు భావపారవశ్యతో, సమాధిస్థితో కలిగితే మీరు గొడవ చేయకండి. లోకులు ఇదో బూటకంగా భావిస్తారు.
నిమాయ్ ఉపనయనం: నిమాయ్ సన్న్యాసి వేషంలో నిలబడి ఉన్నాడు. అతడి తల్లి శచీదేవి, ఇరుగు పొరుగు స్త్రీలు నలువంకలా నిలబడి ఉన్నారు. నిమాయ్ పాడుతూ భిక్ష నర్థించాడు:
భిక్షాందేహి భవతీ
నా కాపాత్ల్రో ॥ భి ॥
యోగి నగుచు నూతనముగ
జగతీ రహదారులలో
ఏగుచుంటి నేకాకిగ
భగవతి నా కిమ్ము భిక్ష ॥ భి ॥
వ్రజవాసులగు మీపై
నిజముగ నా ప్రేమ కలదు
వ్రజమున కా కారణమున
నే జనియించితి మరల మరల ॥ భి ॥
కుక్షిని నింపుటకై నే
భిక్షార్థిగ ఇంటింటికి
భిక్షా పాత్రను గొని
భిక్షాటనకై ఏగెద ॥ భి ॥
చేరవలయు నికుంజము
పారెడు యమునా తటిని
బిరబిర సూర్యుండరుగగ
జారుచునున్నది దినము ॥ భి ॥
గలగల మని పారెడు
సలిలపు ధ్వని చెలరేగగ
రాలుచునున్నవి నా అశ్రు
జలములు యమునాంబువుల ॥ భి ॥
అక్కడున్న వారందరూ వెళ్లిపోయారు. నిమాయ్ మాత్రం ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అప్పుడు దేవతలు బ్రాహ్మణ స్త్రీ పురుష రూపాల్లో వచ్చి నిమాయ్ను స్తుతించారు.
| పురుషులు: | కరగు వెన్నెలగ మెరయు నీ మేను మరుగుజ్జు మనిషిగ ముసుగు తొడిగితివి ఓ దేవా! మా వందన మిదిగో! | |
| స్త్రీలు: | గోప భామినీ మానసచోరా! ఓ బృందావన కుంజ విహారా! | |
| నిమాయ్: | జయ శ్రీ రాధా! జయ రాధా! | |
| పురుషులు: | వ్రజగోపాలురు నీ సఖులు మదనుని మదమును మాపుదువు | |
| స్త్రీలు: | (నీ) ప్రేమ వెర్రులై మార గోపికలు పరవశించెను యమున చకితయై! | |
| పురుషులు: | దానవదమన ఓ నారాయణా! అనిమిష భయహర! ఆర్తత్రాణా! | |
| స్త్రీలు: | ఓ వ్రజరమణా! ఓ వ్రజతరుణీ రమణీ కరుణా ప్రేమ పిపాసీ! | |
| నిమాయ్: | జయ శ్రీ రాధా! జయ రాధా! |
ఈ పాట వింటూనే శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులయ్యారు. తెర దించారు. వాద్యాలు మ్రోగుతూ ఉన్నాయి.
మరొక దృశ్యం: అద్వైతాచార్యుని ఇంటి ముందు శ్రీవాసుడు, తక్కిన భక్తులు మాట్లాడుకుంటున్నారు. ముకుందుడు శ్రావ్యంగా పాడసాగాడు:
చాలునే నీ నిద్ర చాలునే మనసా
ఇక నెంత కాలము నిదురపోయెదవు?
మాయ కౌగిలిలోన మగతలో చిక్కి
కనుమూసి యెన్నాళ్లు కునుకుచుండెదవు?
ఏల పుట్టితి వీవు యెవరవే నీవు?
నీ రూప మసలేమో మరచిపోయితివి
నీ కనులు విప్పవే ఇకనైన మనస
చెడు కలలలో నుండి వడి మేలుకొనుము
నీ యందె నిత్యమౌ ఆనందముండ
తరలిపోయెడు బయటి తళుకులకు భ్రమసి
బుద్ధిలేకను నీవె బద్ధవైనావు
వెడలి చీకటి నుండి వెలుపలికి రమ్ము
తెలివిమాలినదాన! మలిన మానసమ
వేగమె వెలుపలికి వెడలిరావమ్మ
ఉదయాద్రిపై నుండి ఉదయించు రవికి
చేయెత్తి వందనము చేయరావమ్మ
ముకుందునిగా నటించిన వ్యక్తి కంఠస్వరం ఎంతో శ్రావ్యంగా ఉంది. దాన్ని శ్రీరామకృష్ణులు ‘మ’ తో ప్రశంసిస్తూ చెప్పారు.
మరో దృశ్యం: నిమాయ్ ఇంట్లో ఉన్నాడు. అతణ్ణి చూడడానికి శ్రీవాసుడు వచ్చాడు. మొదట అతడు శచీదేవిని కలుసుకుంటాడు. శచీదేవి విలపిస్తూ శ్రీవాసునితో, “నా కొడుకు గృహస్థ జీవనంలో పాల్గోటం లేదు! నా పెద్ద కుమారుడు విశ్వరూపుడు ఇంతకు మునుపే సన్న్యాసం పుచ్చుకుని వెళ్లిపోయాడు. అన్నను వెన్నంటి ఇతడు కూడా ఎక్కడ సన్న్యాసి అయిపోతాడోనని నా హృదయం ఆవేదనతో అల్లాడిపోతోంది” అంది.
ఆ సమయంలో నిమాయ్ అక్కడకు వచ్చాడు. శచీదేవీ, శ్రీవాసునితో, “అదుగో, అతణ్ణి మీరే చూడండి! అతడి ఈ పిచ్చివాలకాన్ని మీరే చూడండి. కన్నీటి ధారలతో అతడి చెక్కిళ్లు, ఛాతీ తడిసి ఉండటం చూడండి. దీన్నుండి ఇతణ్ణి ఎలా విడిపించాలి? ఇవన్నీ ఇతడి నుండి ఎప్పుడు తొలగిపోతాయో చెప్పండి!” అంటూ విలపించసాగింది.
శ్రీవాసుని చూడగానే నిమాయ్ ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని, ఏడుస్తూ ఇలా అన్నాడు: “హా, స్వామీ, ఎక్కడ? ఎక్కడ నా కృష్ణభక్తి? నా ఈ మానవ జన్మ వ్యర్థమైపోతూ ఉందే! నా కృష్ణుడెక్కడ? ఆయన్ను నే నెక్కడ గాంచగలను? వనమాలిని దర్శించేట్లు మీ పాదధూళిని ఒసగి నన్ను ఆశీర్వదించండి.”
శ్రీరామకృష్ణులు ‘మ’ కేసి తిరిగి ఏదో చెప్ప ప్రయత్నించారు, కాని సాధ్యం కాలేదు. ఆయన కంఠం గద్గదమైంది. కళ్ళవెంట అశ్రుధారలు స్రవిస్తున్నాయి. నిమాయ్ శ్రీవాసుని కాళ్ళు పట్టుకుని, “స్వామీ, ఇంకా నాకు కృష్ణభక్తి జనించలేదే!” అంటూ ఉన్న దృశ్యం తదేకంగా చూస్తూ ఉన్నారు.
28.13.1 విషయాసక్తుల బోధ ‘ఇదీ చేయి, అదీ చేయి’
తరువాతి దృశ్యం: నిమాయ్ ఒక పాఠశాల ప్రారంభించాడు. కాని అతడు సరిగ్గా విద్యార్థులకు బోధించలేకపోతున్నాడు. గంగాదాస్ అనే వ్యక్తి వద్ద నిమాయ్ విద్యార్థిగా ఉండేవాడు. సాంసారిక విధులను నిర్వర్తించమని నచ్చచెప్పటానికి ఆతడు వచ్చి ఉన్నాడు.
శ్రీవాసునితో, గంగాదాస్ ఇలా అన్నాడు: “అయ్యా శ్రీవాసుల వారూ! మనమూ బ్రాహ్మణులమే కదా! విష్ణువును పూజిస్తూ వస్తున్నాం. మీరందరూ కలిసి నిమాయ్ సంసార జీవితాన్ని పాడుచేస్తూ ఉన్నట్లుగా తోస్తోంది.’
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): విషయాసక్తుల ఉపదేశాలు ఇలాంటివే – ‘ఇదీ చేయి, అదీ చేయి’. విషయాసక్తుడు బోధించేటప్పుడు రెండిట్లోను జీవించమనే చెబుతాడు.
మ’ : అవునండీ.
గంగాదాస్ మళ్ళీ నిమాయ్తో ఇలా అన్నాడు: “నిమాయ్! నీకు శాస్త్ర పరిజ్ఞానం ఉంది. నాతో వాదించు. గృహస్థ ధర్మం కంటే ఉన్నతమైన ధర్మం మరొకటి ఏదో నాకు వివరించు! నువ్వు ఒక గృహస్థుడవు. గృహస్థుల విధ్యుక్త ధర్మాలను త్రోసిరాజని నువ్వెందుకు ఇతరుల విధులను అనుసరింప ప్రయత్నిస్తున్నావు?
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): గమనించావా? రెండిటిలోనూ జీవించమని చెబుతున్నాడు, చూడు. ‘మ’ : అవునండీ.
నిమాయ్, గంగాదాస్తో ఇలా అన్నాడు: “కావాలని నేను సంసార ధర్మాన్ని త్యజించటం లేదు. మారుగా అన్నిటితోను సహజీవనం చేయాలనే వాంఛిస్తున్నాను. కాని స్వామీ! కారణం ఏమిటో తెలియరావటం లేదు. నా మనస్సును ఎవరో నలిపి వేస్తున్నారు. ఏం చెయ్యను? నేను ఏం చెయ్యగలను? తీరంలో ఉండాలనే తహతహ లాడుతున్నాను, సాధ్యం కావటం లేదు. మనస్సు తల్లడిల్లిపోతూ ఉంది, ఏమీ అర్థం కావటం లేదు. తీరమే కానరాని సముద్రంలో దూకటానికి నా మనస్సు సర్వదా తహతహ చెందుతూ ఉంది! ఏం చేయగలను!”
శ్రీరామకృష్ణులు: ఆహా!
28.14 చతుర్దశ పరిచ్ఛేదం నిత్యానంద గోస్వామి వంశజుని చూసి శ్రీరామకృష్ణుల అమితానందం
దృశ్యం మారింది: నిత్యానందుడు నవద్వీపానికి వచ్చాడు. అతడు నిమాయ్ను వెదకులాడుతున్నాడు. పిమ్మట నిమాయ్ను కలుసుకున్నాడు. నిమాయ్ కూడా నిత్యానందుని చూడాలనే తహతహలాడుతున్నాడు. ఇద్దరు కలుసుకున్న పిదప నిమాయ్ ఇలా అన్నాడు: “నా జీవితం సార్థకమైంది, నా స్వప్నం ఫలించింది. నా స్వప్నంలో వచ్చినట్లు వచ్చి మాయమైపోయావు!”
శ్రీరామకృష్ణులు (గద్గద స్వరంలో ‘మ’ తో): నిత్యానందుణ్ణి స్వప్నంలో చూసినట్లు నిమాయ్ చెబుతున్నాడు!
షడ్భుజమూర్తిగా చైతన్యుల దర్శనం శ్రీవాసునికి కలిగింది. అతడు స్తుతి చేయసాగాడు.
శ్రీరామకృష్ణులూ భావపారవశ్య స్థితిలో మునిగిపోయి, ఆ షడ్భుజమూర్తిని దర్శించారు!
చైతన్యుడు పారవశ్యస్థితిని పొందాడు. ఆ స్థితిలో అతడు అద్వైతాచార్యుడు, శ్రీవాసుడు, హరిదాసులతో మాట్లాడసాగాడు.
చైతన్యుల పారవశ్య స్థితిని అవగతం చేసుకొన్న నితాయ్ పాడనారంభించాడు:
కృష్ణుడేడి నా కృష్ణుడేడి
నా కృష్ణుడేడి సఖులారా!
వాడు లేడు ఆ వనములోన గన
కృష్ణు నిటకు గొనితెండు నా దరిని
కృష్ణుగాక మరి ఏదిగాని
ఆ రాధ ఎరుగదొ సఖులారా!
తెండు కృష్ణు గొనిరండు మీరు
నా కృష్ణు నిటకు ఓ ప్రియులారా!
ఈ పాట వింటూనే శ్రీరామకృష్ణులు గాఢ సమాధిమగ్నులైనారు. చాలాసేపు ఆ స్థితిలోనే ఉండిపోయారు. వాయిద్యాలు మ్రోగుతూ ఉన్నాయి.
శ్రీరామకృష్ణులు బాహ్యచైతన్యంలోకి వచ్చారు. ఈ మధ్యలో, నిత్యానంద గోస్వామి వంశజుడూ, ఖార్దహాకు చెందిన వాడూ అయిన ఒక వ్యక్తి వచ్చి శ్రీరామకృష్ణులు ఆసీనులై ఉన్న కుర్చీ వెనుక నిలబడ్డాడు. అతడికి ముప్ఫై నాలుగు, ముప్ఫైఐదేళ్ళు ఉండవచ్చు. అతణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు అమితానందం పొందారు. అతడి చెయ్యి పుచ్చుకుని అనేక విషయాలు మాట్లాడసాగారు. మధ్య మధ్యలో అతడితో, “నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు ఇక్కడ ఉంటే నాలో భగవదుద్దీపన జనిస్తుంది” అంటున్నారు. వాత్సల్యంతో అతడి చెయ్యి పుచ్చుకుని శ్రీరామకృష్ణులు ఆడుకుంటూ ఉన్నట్లుగా తోస్తోంది, ఆతడి చుబుకాన్ని మెల్లగా నిమిరారు.
అతడు వెళ్ళిపోయాక శ్రీరామకృష్ణులు ‘మ’ తో ఇలా అన్నారు: “ఇతడు గొప్ప పండితుడు. ఇతడి తండ్రి పరమ భక్తుడు. ఖార్దహాలోని శ్యామసుందర ఆలయాన్ని దర్శింప నేను వెళ్ళినప్పుడల్లా, నూరు రూపాయలు ఇచ్చినా లభించని ప్రసాదాలు నాకు సమర్పించి తినిపించేవాడు ఇతడి తండ్రి. ఈ యువకుడు సులక్షణ సమన్వితుడుగా ఉన్నాడు. కాస్త కదిలిస్తే చాలు, చైతన్యం జాగృత మవుతుంది. అతణ్ణి చూస్తూండగానే నాలో ఉద్దీపన కలుగుతుంది. ఇంకా కాసేపు అతడు ఇక్కడే నిలబడి ఉంటే నేను భావపారవశ్యంలో లేచి నిలబడి ఉండేవాణ్ణి.”
తెర పైకి లేచింది.
రాజవీథిలో నిత్యానందుడు తలపై చెయ్యి ఉంచుకుని, అదిమి రక్తం కారటం
ఆపటానికి ప్రయత్నిస్తున్నాడు, కుండపెంకుతో మాధాయ్ అతడి తలపై కొట్టినప్పటికీ
అతడు మాధాయ్ని కోపగించుకోలేదు. భగవత్ప్రేమలో అతడు తనను మరచిపోయాడు.
శ్రీరామకృష్ణులు భావపారవశ్యంలో మునిగిపోయారు.
దృశ్యం: దుర్మార్గులైన జగాయ్, మాధాయ్లను నిత్యానందుడు ఆలింగనం చేసుకున్నాడు.
నితాయ్ పాడసాగాడు:
రండి రండిరా! రండి ఆడగా!
రార జాగాయ్! రారా మాధాయ్!
రండి రండి రా!
హర్ష మొప్ప హరిని బాడ
రండి రండి రా ॥ రం ॥
ఏమి యగును నన్ను కొట్ట
ఏమి యగునురా?
భజోహరి భజోహరి
భజోహరినామ్ ।
బోల్ హరి బోల్ హరి
బోల్ హరి నామ్ ॥ రం ॥
కూడి యాడి పాడ రండు
ప్రేమ మయుని పిలువ హరిని
ప్రేమ పరత లోన బిగియ
కౌగలించురా!
దిక్కు లందు అతని పేరు పిక్కటిల్లురా! ॥ రం ॥
పారవశ్యమనగ నేమొ
ఎరుగరైతి రింత వరకు
ఏడ్పుతోనె విభు విభజన
చేయరండిరా!
హరిని బాడ ఆత్మచంద్రు
డపుడె దోచురా! ॥ రం ॥
అతని గాంచి పరవశించి
హరిని భజన చేయరండి
నామ భజన కోరి మీకు
ప్రేమ నిత్తురా
అతని ప్రేమ మీకు పంచ
నితాయి పిలుచురా ॥ రం ॥
నిమాయ్ తన తల్లి శచీదేవితో తాను సన్న్యాసం స్వీకరించబోతున్నట్లు తెలుపుతాడు. శచీదేవి ఆ మాట వినగానే మూర్ఛపోయింది.
శచీదేవి మూర్ఛనొంది నేలమీద పడిపోవటం చూసి, ప్రేక్షకులలో పలువురు హాహాకారాలు చేశారు. శ్రీరామకృష్ణులు నిశ్చలంగా తదేక దృష్టితో చూస్తున్నారు. కళ్లవెంట ఒక కన్నీటి చుక్క మాత్రమే వచ్చింది.
28.15 పంచదశ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల ప్రేమాతిశయం
నాటక ప్రదర్శన ముగిసింది. శ్రీరామకృష్ణులు బండిలో కూర్చున్నారు. ఒక భక్తుడు ఆయనతో, “నాటకం ఎలా ఉన్నదండీ?” అని అడిగాడు. ఆయన చిరునవ్వుతో, “అసలు, నకళ్లను ఒక్కటిగానే చూశాను” అన్నారు.
బండి మహేంద్ర ముఖర్జీ పిండిమిల్లుకేసి పోతోంది. హఠాత్తుగా శ్రీరామకృష్ణులు భారపారవశ్యం పొందారు. కాసేపట్లో ప్రేమాతిశయంతో తమలో తామే మాట్లాడారు: “హా కృష్ణా! హే కృష్ణా! జ్ఞాన కృష్ణా, ప్రేమ కృష్ణా! మనోకృష్ణా! ఆత్మకృష్ణా! దేహకృష్ణా! ప్రాణ హే గోవిందా, మమజీవన!”
బండి మహేంద్ర ముఖర్జీ పిండిమిల్లు చేరింది. మహేంద్రుడు అమిత ప్రీత్యాదరాలతో శ్రీరామకృష్ణులకు ఆహారం సమర్పించాడు. ‘మ’ శ్రీరామకృష్ణుల ప్రక్కన కూర్చున్నాడు. ఆయన ప్రేమాస్పదంగా, “నువ్వు కొంచెం తిను!” అంటూ కొంత మిఠాయి అతడి చేతిలో ప్రసాదంగా పెట్టారు.
శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయానికి బయలుదేరారు. బండిలో మహేంద్ర ముఖర్జీ, ఇద్దరు ముగ్గురు భక్తులూ ఆయనతో పాటు ఉన్నారు. మహేంద్రుడు కొంచెం దూరం కలిసి వెళతాడు! శ్రీరామకృష్ణులు ఆనందంగా వెళుతూ ఉన్నారు. అప్పుడు ఇలా పాడారు:
ఓ గౌరు ఓ నిత్తాయి మీరు
ధన్యజీవులు, పావన జన్ములు
కరుణాపూరితులని విని నే మీ
చెంతజేరితిని చింతను మాని…..
శ్రీరామకృష్ణులతో కలిసి ‘మ’ కూడా పాడాడు.
మహేంద్రుడు తీర్థయాత్రలకు పోవనున్నాడు. దాన్ని గురించి అతడు శ్రీరామకృష్ణులతో చెబుతున్నాడు.
శ్రీరామకృష్ణులు (చిరునవ్వుతో మహేంద్రునితో): ఇప్పుడే నీలో భక్తి మొలకెత్తింది, అన్నీ వాడి పడిపోతాయి. శీఘ్రంగా తిరిగి వచ్చెయ్యి. ఆహా, నీ ఇంటికి రావాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి చూసేశాను, చాలా ఆనందంగా ఉంది.
మహేంద్రుడు: మహాశయా, నా జన్మ సార్థకమైంది.
శ్రీరామకృష్ణులు: ఇంతకు మునుపూ సార్థకమై ఉంది. నీ తండ్రి సజ్జనుడు. ఆ రోజు నేను చూశాను, ఆయనకు అధ్యాత్మ రామాయణంలో విశ్వాసం ఉంది.
మహేంద్రుడు: భక్తి కలిగేట్లు నన్ను ఆశీర్వదించండి.
శ్రీరామకృష్ణులు: నువ్వు ఉదారుడవు, సరళస్వభావుడవు. ఉదారత సరళత లేకుండా భగవంతుని పొంద సాధ్యం కాదు. కుటిల వర్తనులకు భగవంతుడు సుదూరంలో ఉంటాడు.
శ్యామ్బజార్కు సమీపంలో మహేంద్రుడు సెలవు పుచ్చుకున్నాడు. బండి ముందుకు సాగిపోయింది.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో) : యదుమల్లిక్ ఏం చేశాడు?
‘మ’ (స్వగతం): శ్రీరామకృష్ణులు అందరి యోగక్షేమాల గురించి చింతన చేస్తున్నారు! చైతన్యుల వలె, ఈయన కూడా భక్తి గరపేటందుకే దేహం దాల్చి వచ్చారా?