27.1 ప్రథమ పరిచ్ఛేదం
రామ్, బాబూరామ్, ‘మ’, చునీలాల్, అధర్, భవనాథ్, నిరంజన్ ప్రభృతులతో
ఆదివారం, సెప్టెంబర్ 7, 1884
శ్రీరామకృష్ణులు తమ గదిలో చిన్నమంచం మీద కూర్చుని ఉన్నారు. సమయం పదకొండు గంటలు అయివుంటుంది. ఇంకా మధ్యాహ్న భోజనం చేయలేదు.
నిన్నటి రోజు శ్రీరామకృష్ణులు భక్తులతోబాటు అధర్సేన్ ఇంటికి వెళ్ళి ఉన్నారు. హరినామసంకీర్తనలో భక్తులు ఆనందంతో నాట్యం చేశారు. నేడు ఇక్కడ శ్యామాదాస్ పాడవలసి ఉంది. కీర్తనలో ఆనందిస్తూ ఉన్న శ్రీరామకృష్ణులను దర్శింప భక్తులు గుంపులుగా వచ్చి ఉన్నారు. మొదట బాబూరామ్, ‘మ’, శ్రీరాంపూర్‌కు చెందిన బ్రాహ్మణుడు, మనోమోహన్, భవనాథ్, కిశోరీ, పిదప ఛునీలాల్, హరిపదుడు మొదలైనవారు వచ్చారు. క్రమంగా ముఖర్జీ సోదరులు, రామ్, సురేంద్రుడు, తారక్, అధర్, నిరంజన్ తదితరులు వచ్చారు. లాటూ, హరీశ్, హాజ్రాలు దక్షిణేశ్వరంలోనే ఉంటున్నారు. రామ్‌లాల్ కాళికాలయంలో పూజలు నిర్వర్తిస్తూ శ్రీరామకృష్ణుల బాగోగులను చూసుకుంటున్నాడు.
రామ్ చక్రవర్తి విష్ణ్వాలయంలో పూజచేసి వచ్చాడు. ఇతడూ మధ్యమధ్యలో వచ్చి శ్రీరామకృష్ణుల అవసరాలను చూసుకుంటాడు. లాటూ, హరీశ్‌లు శ్రీరామకృష్ణుల సేవ చేస్తూ ఉన్నారు.
‘మ’ వచ్చి ఆయనకు ప్రణామం చేశాడు. అతడితో, “ఏమిటి నరేంద్రుడు రాలేదా?” అని అడిగారాయన.
నరేంద్రుడు నేడు రాలేకపోయాడు.
శ్రీరాంపూర్‌కు చెందిన బ్రాహ్మణుడు రాంప్రసాద్ పాటల పుస్తకాన్ని తీసుకువచ్చాడు. దాన్లో నుండి కొన్ని పాటలు చదివి శ్రీరామకృష్ణులకు వినిపించాడు.
శ్రీరామకృష్ణులు (బ్రాహ్మణునితో): కొంచెం చదువు, చూద్దాం.
బ్రాహ్మణుడు: వలువలు ధరించు, అమ్మా నీ వలువలు ధరించు, అమ్మా వలువలు ధరించు.
శ్రీరామకృష్ణులు: ఆపవయ్యా, ఈ వలువలు – గిలువలు పాటలు విడిచి పెట్టి భక్తిని జాగృతం చేసే పాటలు చదువు.
బ్రాహ్మణుడు: ఎరుగగ తరమె ఏరికినైన, తల్లి కాళి నిజతత్త్వమించుక?
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నిన్న అధర్సేన్ ఇంట్లో భావపారవశ్య స్థితిలో ఒకేవైపుగా కూర్చున్నందున కాలు చాలానొప్పి చేసింది. కాబట్టి ఇక మీద ఎక్కడకు పోయినా బాబూరామ్ను తోడ్కొని వెళ్లాలి, అతడు అర్థం చేసుకోగలడు.
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పాడసాగారు:
మదివిప్పి నేనెట్లు చెప్పగలనొ సఖా ।
చెప్పరాదని నోరు నొక్కబడియుండగా
నా బాధ తెలియగల దయశాలి గనలేక
మరణించు స్థితిలోన మనినాడ నిప్పుడు॥ మ ॥
అతని చూపులలోకి చూచినంతనె చాలు
నా హృదయసఖుడెవరొ కనిపెట్టజాలుదును
దివ్యప్రేమోత్తుంగ పర్వమున ఆనంద
తన్మయత నీదెడు వాడు గానగరాడు॥ మ ॥
శ్రీరామకృష్ణులు: బావుల్ శాఖకు చెందినవారు ఇటువంటి పాటలు పాడతారు. వేరే పాటలూ ఉన్నాయి –
ఎన్ని చోటులో ఎపుడు గ్రుమ్మరుచు
అరుగుచుండునో పరివ్రాజకా ।
నీదు పయనమిట నొక్క గడియయే
నిలువగదోయీ సాధుసత్తమా॥ ఎ ॥
చేతనున్న నీ భిక్షాపాత్రతో
కాంతివంతమై మెరసిపోవు నీ
వదనరాజ మొకసారి దర్శనము
చేయనిమ్ము ఓ సాధుపుంగవా॥ ఎ ॥
“శాక్త సంప్రదాయంలో సిద్ధులను “కౌల్” అంటారు, వేదాంతులు ‘పరమహంస’ అంటారు. బావుల్ వైష్ణవులు ‘సాయి’ అంటారు. ‘సాయికి పైన ఏదీ లేదు’ అని వారు పేర్కొంటారు.
“బావుల్ సిద్ధుడవుతే సాయి అవుతాడు. అప్పుడు అతడికి ఎటువంటి భేదభావమూ ఉండదు, అంతా ఏకమైపోతుంది. అతడు ధరించిన మాలలో ఒక సగం తులసీపూసలు, మరో సగం ఆవు ఎముకల పూసలు ఉంటాయి. హైందవుల నీరు, మహమ్మదీయుల పీరు.
27.1.1 ‘అలేఖ్’ – ‘వాయువు’ – ‘అంతస్తు’
“ ‘సాయి’ లు అలేఖ్, అలేఖ్ అంటారు! వేదాంతుల బ్రహ్మాన్ని వారు అలేఖ్ అంటారు. జీవుల గురించి ప్రస్తావించేటప్పుడు, ‘జీవాత్మ అలేఖ్ నుంచి వచ్చింది, అలేఖ్కు పోతుంది’ అంటారు. అంటే జీవాత్మ అవ్యక్త స్థితి నుండి వచ్చి దాన్లోనే లయం అవుతుంది.
“వాయువు గురించి తెలుసా అని అడుగుతారు. అంటే వారు అడిగేది కుండలినీ జాగృతమైతే ఇడ, పింగళ, సుషుమ్నా నాడుల ద్వారా పైకెగసే మహావాయువు గురించే. ‘నువ్వు ఏ అంతస్తులో ఉన్నావు?’ అని అడుగుతారు. అంటే వారు అడుగుతున్నది షడ్చక్రాలలో ఎందులో నెలకొన్నావనే. ‘ఐదవ అంతస్తులో ఉన్నా’ నంటే, అతడి మనస్సు విశుద్ధచక్రంలోకి ఎగసి ఉన్నదని అర్థం. (‘మ’ తో) అప్పుడు నిరాకారానుభూతి కలుగుతుంది. ఒక పాటలో ఈ విషయం ఉంది.
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పాడసాగారు:
కంఠస్థానము నందు షోడశదళ పద్మమున
పొగరంగు దళములలో సూక్ష్మాకాశము గలదు
దానిని దాటిన వాడు విశ్వంబరాకాశములో
లీనంబై కరగుటను, నిరవధిగా తాగాంచు.
27.1.2 బావుల్లతో సంభాషించిన సంఘటనలు
“ఒకప్పుడు ఒక బావుల్ ఇక్కడకు వచ్చాడు. అతడితో, ‘నీ రసం పాకాన పడిందా? కుండను దించివేశావా?’ అని అడిగాను. రసాన్ని ఎంతగా కాచితే అది అంతగా రిఫైన్ (శుద్ధి) అవుతుంది. మొదట చెరకు రసం, పిదప బెల్లం, తరువాత చక్కెర, ఆ తరువాత పటికబెల్లం. క్రమక్రమంగా మరింత శుద్ధీకరింపబడుతుంది.
“కుండను ఎప్పుడు దింపుతావు అంటే అర్థం సాధనలు ఎప్పుడు పూర్తి అవుతాయి అని. అవి పూర్తికావటం ఇంద్రియాలను జయించినప్పుడే. జలగ పట్టును వదలించటానికి సున్నంపట్టీ వేసినట్లు సాధనలచే ఇంద్రియాల పాటవం సడలుతుంది. స్త్రీ సాన్నిధ్యంలో జీవించినా రమించాలన్న కోర్కె ఉండదు.
“బావుల్లలో అత్యధికులు రాధాతంత్రాన్ని అనుసరిస్తారు. పంచతత్త్వాలతో సాధనలు చేస్తారు. పృథ్వి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశతత్త్వం – అంటే మలం, మూత్రం, రజస్సు, వీర్యం మొదలైన వాటితో సాధనలు చేస్తారు. ఇవన్నీ అపరిశుద్ధ సాధనలు. ఇటువంటి సాధనలు చెయ్యడం దొడ్డిగుమ్మం గుండా ఇంట్లోకి వెళ్లటం వంటిది.
“ఒక రోజు నేను వసారాలో భోజనం చేస్తూ ఉన్నాను. అప్పుడు ఘోష్పారా బావుల్ ఒకడు వచ్చాడు. అతడు నాతో, ‘నువ్వు తింటున్నావా లేక ఎవరికైనా తినిపిస్తున్నావా?’ అని అడిగాడు. అంటే అంతరంగంలో భగవంతుడు వసించటం సిద్ధుడు గాంచుతాడు.
“ఈ సంప్రదాయ సిద్ధులు ఇతర సంప్రదాయస్థులను ‘జీవు’ లని సంబోధిస్తారు. ఇతర మతస్థులతో మాట్లాడరు. ‘ఇక్కడ జీవుడు ఉన్నా’ డని చెప్పుకుంటారు.
“ఇటువంటి ఒక బావుల్ను నేను కామార్పుకూర్లో చూశాను. ఆమె పేరు సరీ (సరస్వతి) పాథర్. వీళ్లు తమ సంప్రదాయస్థుల ఇళ్లలోనే భోజనం చేస్తారు, ఇతర సంప్రదాయస్థుల ఇళ్లలో తినరు. మల్లిక్ వంశజులు సరీపాథర్ ఇంట్లో భోజనం చేశారు, కాని హృదయ్ ఇంట్లో భోజనం చేయలేదు, హృదయ్‌ను జీవుడన్నారు. (నవ్వు)
“నే నొకరోజు హృదయ్‌తో ఆమె ఇంటికి వెళ్లాను. ఆమె అనేక తులసి మొక్కలు నాటి ఉంది. నాకు బఠాణీలు చేర్చిన మరమరాలు పెట్టింది. నేను కాస్త తిన్నాను. హృదయ్ ఎక్కువగానే తిన్నాడు, అందుచేత అస్వస్థతకు గురయ్యాడు.
“వాళ్ళు సిద్ధావస్థను ‘సహజ’ స్థితి అంటారు. ఒక శాఖవారు సహజ్, సహజ్ అంటూ తిరుగుతూ ఉంటారు. ‘సహజ్’ స్థితికి రెండు లక్షణాలున్నాయి. ఒకటి, ఆ స్థితి పొందినవారి దేహంలో కృష్ణ గంధం ఉండదు. రెండవది వారు పువ్వు మీద వాలినప్పటికీ తేనె గ్రోలని తుమ్మెదలలాగా ఉంటారు. కృష్ణగంధం ఉండదు అంటే భగవద్భావాలన్నీ అంతర్ముఖమై ఉంటాయి, ఇవేవీ బయటకు కానరావు; హరినామం కూడా ఉచ్చరించరు. రెండవది స్త్రీపట్ల ఎలాటి ఆసక్తీ ఉండదు, జితేంద్రియులు.
“వీళ్లు దైవపూజ, విగ్రహారాధన లైక్ చేయరు (ఇష్టపడరు). జీవమున్న మనిషిని ఇష్టపడతారు. అందుకే వారిలో ఒక శాఖను ‘కర్తాభజా’ అంటారు. కర్త అంటే గురువు – గురువును భగవంతునిగా భావించటం, పూజించటం.
27.2 ద్వితీయ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు సర్వధర్మ సమన్వయం
“చూశావా, ఎన్ని రకాల మతాలు! ఒక్కో మతం ఒక్కో మార్గం. అసంఖ్యాక మతాలు, అసంఖ్యాక మార్గాలు.”
భవనాథ్: దీన్లో దారి ఏది?
శ్రీరామకృష్ణులు: ఏదో ఒకదాన్ని గట్టిగా పట్టుకోవాలి. డాబాపైకి మెట్ల ద్వారా వెళ్ళవచ్చు, నిచ్చెన ద్వారా పోవచ్చు, తాళ్లనిచ్చెన ద్వారానో, కేవలం తాడు ద్వారానో, వెదురుబొంగు పుచ్చుకొనో వెళ్లవచ్చు. కాని అక్కడొక కాలు ఇక్కడొక కాలు వేస్తే ప్రయోజనం లేదు, ఒకదాన్ని మాత్రమే గట్టిగా పట్టుకోవాలి. భగవత్సాక్షాత్కారం పొందగోరితే ఏదో ఒక మార్గాన్ని గట్టిగా పట్టుకోవాలి.
“ప్రతీ మతం ఒక మార్గమని అవగతం చేసుకో. నా మార్గమే సరైనది, ఇతరుల మార్గాలేవీ సరైనవి కావు అనే తలంపు ఉండరాదు, ద్వేషం పూనరాదు.
27.2.1 నా మార్గం ఏది? – కేశవ్, శశధర్, విజయ్‌ల అభిప్రాయం
“సరే, నా మార్గం ఏది? కేశవ్ నాతో, ‘మీరు మా మార్గగాములే, నిరాకారాన్ని క్రమేణా అంగీకరిస్తూ ఉన్నారు’ అనేవాడు. నేను వారికి చెందిన వాడని అంటున్నాడు శశధర్. విజయ్ కూడా నేను ఆతడి సంప్రదాయాన్ని అనుసరిస్తున్నానని చెబుతున్నాడు.”
సకల మతాల ననుసరించి భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలిగానని శ్రీరామకృష్ణులు తెలియపరుస్తున్నారా ఏమిటి? ఆయనకు సర్వమతసారం తెలుసును కదా! ఈ కారణం చేతనే విభిన్న మతస్థులు ఆయన వద్దకు వచ్చి సాంత్వనం పొందుతున్నారు.
27.2.2 గంగలో పోటు పాట్లు
‘మ’, ఒకరిద్దరు భక్తులతో శ్రీరామకృష్ణులు ముఖప్రక్షాళనకై పంచవటి కేసి బయలుదేరారు. పగలు పన్నెండు గంటల వేళ. గంగలో పోటు ప్రారంభమయ్యే సమయం. ఆ హోరు వినగోరి శ్రీరామకృష్ణులు పంచవటిలో కాసేపు వేచి ఉన్నారు. భక్తులతో ఇలా అన్నారు: “ఈ పోటు పాట్లు ఎంత విచిత్రమైనవి. ఇక్కడ ఒకటి గమనించాలి. ఇవన్నీ సాగర సమీపంలోనే నదిలో ఏర్పడతాయి. సముద్రానికి దూరంగా ఉన్నప్పుడు నది ఏక దిశగా ప్రవహిస్తూ ఉంటుంది. దీని అర్థం ఏమిటి? ఆధ్యాత్మిక జీవితంలో దీని ప్రత్యేకతను అనువర్తించుకుని చూడండి. భగవంతునికి సమీపంలో ఉండే వారికే భక్తిపారవశ్యతలన్నీ ఏర్పడతాయి. ఈశ్వరకోటికి చెందిన ఎవరో ఒక రిద్దరు మాత్రమే మహాభావం, ప్రేమ పొందగలరు.
(‘మ’ తో) “అది సరే, పోటు పాట్లు ఎందుకు ఏర్పడుతున్నాయి?”
‘మ’ : సూర్యచంద్రుల ఆకర్షణ శక్తి వలన ఇవి సంభవిస్తున్నాయని పాశ్చాత్య ఖగోళశాస్త్రం పేర్కొంటోంది.
ఇలా పలికి ‘మ’ నేల మీద భూమి, చంద్రుడు, సూర్యుడు బొమ్మలు గీచి వాటి చలనాలను వివరించాడు. శ్రీరామకృష్ణులు ఒకింతసేపు చూసి, పిదప, “చాలు, ఆపు! వీటిని చూసి నా తల గిర్రున తిరుగుతోంది” అన్నారు.
ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, పోటు ప్రారంభమైంది. హోరుమని అలల తాకిడి శబ్దం వినవస్తోంది. జలం ఆలయపు ఒడ్డును ఉద్ధృతంగా ఢీకొని ఉత్తర దిశకేసి ప్రవహించసాగింది.
శ్రీరామకృష్ణులు తదేకంగా నదిని చూస్తూ ఉన్నారు. దూరంలో ఒక పడవ ఊగులాడటం చూసి ఆయన పసిబాలునిలా, “అదుగో చూడు, అదుగో ఆ పడవను చూడు! ఏమవుతుందో తెలియటం లేదు!” అంటూ అరిచారు.
‘మ’ తో మాట్లాడుతూనే శ్రీరామకృష్ణులు పంచవటి వద్దకు వచ్చారు. ఆయన చేతిలో గొడుగు ఉంది. దాన్ని పంచవటి అరుగు మీద పెట్టారు. పాఠశాల విద్యార్థి నారాయణ్ ప్రస్తావన వచ్చింది. శ్రీరామకృష్ణులు అతడిలో సాక్షాత్తూ నారాయణుని గాంచారు కాబోలు, అందుకే అతణ్ణి అమితంగా ప్రేమించారు.
27.2.3 ‘మ’ కు ఉపదేశం – నారాయణ్ గురించి ప్రస్తావన
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నారాయణ్ స్వభావం గమనించావా? పిన్నలతో, పెద్దలతో బాగా కలిసిపోతాడు. ప్రత్యేకమైనశక్తి లేకుంటే ఇది సాధ్యం కాదు, అందరూ అతణ్ణి ప్రేమిస్తున్నారు. అతడు నిజంగానే సరళ హృదయుడేనా, ఏమంటావు?
‘మ’ : అవునండీ, అలాగే తోస్తున్నది.
శ్రీరామకృష్ణులు: నీ వద్దకు అతడు వస్తూంటాడట గదా?
‘మ’ : అవునండీ, ఒకటి రెండుసార్లు వచ్చాడు.
శ్రీరామకృష్ణులు: అతడికి నువ్వు ఒక రూపాయి ఇస్తావా? లేక కాళీని ఇవ్వమని చెప్పనా?
‘మ’ : వద్దు, నేనే ఇస్తాను.
శ్రీరామకృష్ణులు: మంచిది. భగవంతుని పట్ల అనురాగం గలవారికి ఇవ్వటం మంచిది. దానితో ధనం సద్వినియోగ మవుతుంది. గడించినదంతా కుటుంబానికే ఖర్చు చేసివేస్తే ఏం ప్రయోజనం?
కిశోరీకి పిల్లాజల్లా అంతా ఉన్నారు. ఆదాయం తక్కువ, కుటుంబ పోషణ కష్టంగా ఉంది. శ్రీరామకృష్ణులు, ‘మ’ తో “అతడికి ఒక ఉద్యోగం ఇప్పిస్తానని నారాయణ్ చెప్పి ఉన్నాడు. నారాయణ్‌కు ఆ విషయం ఒకసారి జ్ఞాపకం చెయ్యి” అన్నారు.
‘మ’ పంచవటిలో నిలబడి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు సరుగుడు తోపుకు వెళ్లి, కాసేపట్లో తిరిగి వచ్చారు. ‘మ’ తో, “నువ్వు వెళ్లి నా గది బయట ఒక చాప పరచమని ఎవరికైనా చెప్పు. కాసేపట్లో అక్కడకు వస్తాను, కొంచెంసేపు పడుకోవాలి” అన్నారు.
శ్రీరామకృష్ణులు గదికి తిరిగి రాగానే ఇలా అన్నారు: “గొడుగు తీసుకు రావటం మీ రందరూ మరచిపోయారు. (అందరూ నవ్వారు) చంచల మనస్కులై హడావుడిగా ఉండే వ్యక్తులకు కళ్ల ముందు ఉండేవి కూడా కానరావు.
“ఒకడు చుట్ట ముట్టించుకోవటానికై నిప్పు కోసం పొరుగింటికి వెళ్లాడు, కాని అతడి చేతిలోనే లాంతరు దీపం వెలుగుతూ ఉంది. మరొకడు తువ్వాలు కానరాక అక్కడా ఇక్కడా వెదకసాగాడు, చివరికి చూస్తే అది అతడి భుజం మీదే ఉంది.”
27.2.4 మధ్యాహ్న ప్రసాదం – బాబూరామ్‌తో శ్రీరామకృష్ణులు
కాళికాలయం నుంచి వచ్చిన అన్నప్రసాదాన్ని శ్రీరామకృష్ణులు భుజించారు. అప్పుడు సమయం దాదాపు ఒంటి గంట అయివుంటుంది. పిదప కాసేపు విశ్రమించ తలచారు. గదిలో భక్తులు ఇంకా కూర్చునే ఉన్నారు. హరీశ్, నిరంజన్, హరిపదుడు మొదలైనవారు ప్రసాదానికై ఆలయ భోజనశాలకు వెళ్లనున్నారు. హరీశ్‌తో శ్రీరామకృష్ణులు, “మీకోసం ఈ మామిడి తాండ్రను తీసుకు వెళ్లండి” అన్నారు.
తరువాత ఆయన ఒకింతసేపు పడుకున్నారు. బాబూరామ్‌తో “బాబూరామ్, నా ప్రక్కన వచ్చి కూర్చో” అన్నారు. అందుకు బాబూరామ్, “నేను తమలపాకులు చుడుతున్నాను” అన్నాడు.
శ్రీరామకృష్ణులు: అది ఉండనీ.
శ్రీరామకృష్ణులు విశ్రమించారు.
ముఖర్జీ సోదరులు, ఛునీలాల్, హరిపదుడు, భవనాథ్, తారక్ మొదలైన భక్తులు పంచవటిలోని పొగడచెట్టు క్రింద కూర్చుని ఉన్నారు. తారక్ బృందావనం నుండి తిరిగి వచ్చాడు. బృందావనం గురించి భక్తులతో కబుర్లు చెబుతున్నాడు. అతడు నిత్యగోపాల్తో బృందావనంలో బసచేసి ఉన్నాడు.
27.3 తృతీయ పరిచ్ఛేదం భక్తులతో భజనానందం – భావపారవశ్యంలో నృత్యం
శ్రీరామకృష్ణులు విశ్రమించి ఉన్నారు. సంప్రదాయ రీతిలో శ్యామదాస్ గోపికల విరహ గీతాలు పాడనారంభించాడు. రాధా విరహవేదనను విన్న శ్రీరామకృష్ణులు భావపరవశులైనారు. ఆయన చిన్నమంచం మీద కూర్చుని ఉన్నారు. నేల మీద బాబూరామ్, నిరంజన్, రామ్, మనోమోహన్, ‘మ’, సురేంద్రుడు, భవనాథ్ ప్రభృతులు కూర్చుని ఉన్నారు. పాట మనస్సును ఆకట్టుకోలేకపోయింది.
కొన్నగర్కు చెందిన నవాయ్ చైతన్యుని పాడమని శ్రీరామకృష్ణులు కోరారు. ఇతడు మనోమోహన్ పినతండ్రి, పింఛను పుచ్చుకుంటూ కొన్నగర్లో గంగాతీరాన ఆధ్యాత్మిక సాధనలలో కాలం గడుపుతూ ఉన్నాడు. తరచూ శ్రీరామకృష్ణుల దర్శనార్థం వస్తూంటాడు.
నవాయ్ బిగ్గరగా పాడసాగాడు. శ్రీరామకృష్ణులు లేచి నిలబడి నృత్యం చేయసాగారు. నవాయ్, తక్కిన భక్తులూ పాడుతూ ఆయన చుట్టూ నృత్యం చేశారు. పాట చక్కగా కుదిరింది. మహిమాచరణ్ కూడా ఆయనతో బాటు నృత్యం చేయసాగాడు.
కీర్తన పూర్తికాగానే శ్రీరామకృష్ణులు తమ ఆసనంలో కూర్చున్నారు. హరినామ సంకీర్తన పిదప ఆనందమయి అయిన జగజ్జననిపై పాట ప్రారంభమైంది. శ్రీరామకృష్ణులు పరవశులై గిపాడ నారంభించారు. ఆయన దృష్టి ఊర్ధ్వాభిముఖమై ఉంది.
ఆనందమయి మాతా వెనుకాడకే ।
నీ నిర్భాగ్య శిశువునకు ఆనందమీయగ॥ ఆ ॥
(నీ) పాదములు తప్ప మది అన్యమెరుగదు
వెనుకాడకే । ఆనందమయి మాత । వెనుకాడకే॥ ఆ ॥
భయముగా మృత్యువు పండ్లు కొరుకుచునుండ
బదులు నేనేమని పలుకవలె చెప్పవే….
నీ ధ్యాన మే విధమొ నీ భావ మా విధము
నీ భావమును బట్టి నీ కుండు భక్తి॥ నీ ॥
భక్తి యే రీతియో ఫలమగును ఆ రీతి
ఫలము లన్నింటికిని మూలమా శ్రద్ధయే॥ నీ ॥
కాళికాపద సుధా కాసారమున నాదు
మది మునిగి నిండార మధురూపమై దనర
బలులకు పూజలకు బహుయజ్ఞములకును
లేదు పని వానితో లేదసలు లేదమ్మ॥ నీ ॥
(నీ) ఉన్మత్తాలయ మమ్మా లోకము
ఏమని (నీ) సుగుణము లెంచి చెప్పుదు ॥
ఏనుగుపై నీ వేగుట మాని
చరణము పైనే తిరుగుచుందువు
మానిరత్నములు మౌక్తికములును
కపాలహారము దాల్తు కంఠమున ॥
స్వేచ్ఛామయి! హే! శంకరి! భగవతి!
స్వైరవిహారిణి! శ్యామా! కాళీ!
రామప్రసాదుకు రక్షణ మొసగు
మత్యంత ఘోరభవారణ్యము నుండి ॥
నేనెందుకు పోవలె కాశీ, కాంచీ, గంగా గయ ప్రభాసముకూ
కాళీనామమును కలవరించుచు కడపటి శ్వాసను వదలుచుండగా….
ఉండు మనస నీలో నుండవే
ఏ వేళనైన ॥
చేరవద్దు పరుల పంచ
చేరి నీలో చూచుకొనిన
కోరి వెదకుచున్నవెల్ల
దొరకు నీకు దాని యందు……
నల్లనిదౌ నా మానస భ్రమరము
ఉల్లాసంబుగ లాగి వేయబడె
తల్లి శ్యామ పద నీరజమునకు
ఉల్లము రంజిల జేయు విధమున……
పదిల పరచవే మనసా! అమ్మ శ్యామను
అతి ప్రియమగు నా అమ్మ శ్యామను
నిలుపుము నీలో అతి భద్రముగా
పరులెవ్వరిని చేరనీయకుము
మన మిరువురమే ఆమెను చూతము….
ఈ పాటను పాడుతూ శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. జగజ్జనని ప్రేమోన్మత్తతలో మునిగిపోయి, ‘పదిల పరచవే మనసా! అమ్మ శ్యామను’ అనే పాదాన్ని భక్తులకు పదే పదే చెబుతూ ఉన్నట్లు పాడారు. మధువు గ్రోలి మత్తులో మునిగి పోయినట్లుగా ఉన్నారు.
నృత్యం చేస్తూ మళ్లీ పాడారు:
నా మాయీ నల్లనిదా? నల్లనిదా నిజముగనే ।
శ్యామాంగీ, దిగంబరీ, హృదయాబ్జపు ఉద్దీపని…..
ఇలా పాడుతూ నృత్యం చేస్తూ శ్రీరామకృష్ణులు తూలుతూ ఉండటం చూసిన నిరంజన్ ఆయనను పట్టుకోవడానికి ప్రక్కకు వెళ్ళాడు. ఆయన మృదువైన కంఠస్వరంలో, “ఒరేయ్, నన్ను తాకకు!” అన్నారు. ఆయన నృత్యం చేయటం చూసి భక్తులూ లేచి నిలబడ్డారు. ఆయన ‘మ’ చెయ్యిపుచ్చుకుని, “ఒరేయ్, నుమ్వా నృత్యం చేయి” అన్నారు.
27.3.1 మహిమాచరణ్ నృత్యం, శ్రీరామకృష్ణుల సంతోషం
నృత్యం చేశాక ఆయన కూర్చున్నారు. ప్రగాఢ భావపారవశ్య స్థితి నుండి క్రమంగా సహజస్థితికి రాసాగారు. “ఓం ఓం ఓం ఓం ఓం ఓం కాళీ” అంటూ ఉచ్చరించారు. కాసేపయ్యాక, “పొగ త్రాగుతాను” అన్నారు. భక్తులు నిలబడి ఉన్నారు. మహిమాచరణ్ ప్రక్కన నిలబడి ఆయనకు విసనకర్ర వీస్తున్నాడు.
శ్రీరామకృష్ణులు: అందరూ కూర్చోండి (మహిమాతో) మీరు వేదాల నుండి ఏమైనా వల్లించండి.
మహిమాచరణ్ మొదట ‘జయ యజ్వమాన’ వంటివి వల్లించాడు. పిదప మహానిర్వాణ తంత్రం నుండి పలు శ్లోకాలను పఠించాడు.
ఓం నమస్తే సతే జగ్కారణాయ
నమస్తే చితే సర్వలోకాశ్రయాయ ।
నమోఽద్వైత తత్త్వాయ ముక్తిప్రదాయ
నమో బ్రహ్మణే వ్యాపినే నిర్గుణాయ ॥
త్వమేకం శరణ్యం త్వమేకం వరేణ్యం
త్వమేకం జగత్కారణం విశ్వరూపమ్ ।
త్వమేకం జగత్కర్తృ పాతృ ప్రహర్తృ
త్వమేకం పరం నిష్కళంకం నిర్వికల్పం ॥
భయానాం భయం భీషణం భీషణానాం
గతిః ప్రాణినాం పావనం పావనానామ్ ।
మహోచ్చైః పదానాం నియంతృ త్వమేకం
పరేశాం పరం రక్షకం రక్షకాణామ్ ॥
పరేశ ప్రభో సర్వరూపావినాశినీ
ఆనిర్దేశ్య సర్వేంద్రియా గమ్య సత్య ।
అచింత్యాక్షర వ్యాపక వ్యక్తతత్త్త్వ
జగద్భాసకాధీశ పాయాదపాయాత్ ॥
తదేకం స్మరామస్తదేకం భజామ
స్తదేకం జగత్సాక్షి రూపం నమామః ।
సదేకం నిధానం నిరాలంబమీశం
భవాంభోధి పోతం శరణ్యం వ్రజామః ॥
శ్రీరామకృష్ణులు చేతులు జోడించుకుని ఆలకించసాగారు. స్తోత్రం పూర్తి కాగానే భక్తితో ప్రణామం చేశారు. భక్తులూ చేతులు జోడించి ప్రణామం చేశారు.
అధర్ కలకత్తా నుంచి వచ్చాడు, శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నేడు ఎంతో ఆనందం కలిగింది. మహిమాచరణ్ కూడా ఈ దార్లోకి వచ్చేశాడే! హరినామంలోని ఆనందం ఎలా ఉంది? చాలాబాగుంది కదా!
‘మ’ : అవునండీ.
మహిమాచరణ్ జ్ఞానమార్గావలంబి. నేడు అతడు హరినామ సంకీర్తనలో పాల్గొన్నాడు, నృత్యం కూడా చేశాడు. ఇది చూసి శ్రీరామకృష్ణులు చాలా సంతోషించారు.
సాయంకాలమైంది. భక్తులు ఒక్కొక్కరుగా శ్రీరామకృష్ణుల నుండి సెలవు పుచ్చుకున్నారు.
27.4 చతుర్థ పరిచ్ఛేదం ప్రవృత్తి, నివృత్తి – విషయలాలసుల ఉపాసన – ఉద్యోగం
శ్రీరామకృష్ణుల గదికి దక్షిణాన ఉన్న పొడవైన వసారాలోనూ, పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలోను దీపాలు వెలిగించారు. గదిలో కూడా దీపం వెలిగించి, సాంబ్రాణి ధూపం వేశారు. కాసేపటికల్లా చంద్రోదయమయింది. ఆలయ ప్రాంగణం, తోట బాట, గంగాతీరం, పంచవటి, వృక్షాగ్రాలు అన్నీ వెన్నెల కాంతిలో చిరునవ్వులు చిందిస్తున్నాయి.
శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చుని జగజ్జనని నామాన్ని జపిస్తూ ధ్యానంలో ఉన్నారు.
ఇంతలో అధర్ వచ్చి కూర్చున్నాడు. గదిలో ‘మ’, నిరంజన్లు ఉన్నారు. శ్రీరామకృష్ణులు అధర్తో మాట్లాడ నారంభించారు.
శ్రీరామకృష్ణులు: ఏమిటి, ఇప్పుడేనా రావటం? ఇవాళ ఎన్ని నృత్యగీతాలు జరిగాయని! రామ్ సంగీత గురువైన శ్యామదాస్ పాడాడు. కాని అంతగా నచ్చలేదు, లేచి నృత్యం చేయాలనే భావనే జనించలేదు. ఆ వ్యక్తి కథను తరువాతనే విన్నాను. అతడి నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని స్త్రీ సంబంధాలు అతడికి ఉన్నవట; గోపీదాసుకు మారుగా ఒకరు వచ్చాడే, అతడు చెప్పాడు. (అందరూ నవ్వారు) (అధర్తో) అవునూ, నీకా ఉద్యోగం దొరకలేదా?
అధర్ ఒక డిప్యూటీ మేజిస్ట్రేటు. నెల జీతం మూడు వందల రూపాయలు. కలకత్తా పురపాలక సంఘం వైస్–ఛైర్మన్ పదవికి దరఖాస్తు పెట్టాడు. దానికి నెల జీతం వెయ్యి రూపాయలు. ఆ ఉద్యోగార్థం అతడు కలకత్తాలోని పలువురు ప్రముఖుల సిఫారసు కోరాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’, నిరంజన్‌లతో): ‘అధర్కు ఈ ఉద్యోగం లభించాలని మీరు జగజ్జననిని ప్రార్థించండి’ అని హాజ్రా నాతో చెప్పాడు. అధర్ కూడా చెప్పి ఉన్నాడు. నేనూ అమ్మను, ‘అమ్మా! ఇతడు నీ వద్దకు వస్తూపోతున్నాడు. నీకు సమ్మతమైతే అతడికి ఆ ఉద్యోగం లభించనీ’ అని ప్రార్థించాను. అదే సమయంలో దానితో బాటే ఇదీ చెప్పాను: ‘అమ్మా, ఇతడిది ఎంత అల్పబుద్ధి! భక్తిజ్ఞానాలు కోరక ఇవన్నీ కోరుతున్నాడు!’
(అధర్తో) “ఈ అల్పుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? నువ్వెంతో చూసావు, ఎంతో విని ఉన్నావు. రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్లుంది! ఫలానా మల్లిక్ ఉన్నాడే, అతడిది అల్పబుద్ధి. నేను ఒక గ్రామానికి వెళ్లటానికి పడవ ఏర్పాటు చేశాడు. అతడి ఇంటికి వెళ్తూనే హృదయ్‌తో, ‘హృదూ, బండి ఏర్పాటు చేసివేశాను కదూ!’ అన్నాడు.
అధర్: సంసార జీవితం గడిపేవాడు ఇలా చేయకుండా జరుగదు. ఇవన్నీ వలదని మీరూ అడ్డుచెప్పలేదే!
27.4.1 భగవదున్మత్త స్థితి – శ్రీరామకృష్ణుల ప్రార్థన
శ్రీరామకృష్ణులు: నివృత్తియే మంచిది. ప్రవృత్తి మంచిది కాదు. నేను భగవదున్మత్త స్థితిలో ఉన్నప్పుడు అందరూ చేస్తున్నట్లు నన్ను కూడా సంతకం చేసి జీతం పుచ్చుకోమని ఆలయ నిర్వహణాధికారి పిలువనంపాడు. అందుకు నేను, ‘అది నా వల్ల కాదు’ అన్నాను. ‘నేను డబ్బు కోరటం లేదే, కావాలంటే ఇంకెవరికైనా ఇచ్చుకో’ అన్నాను.
“నేను భగవంతునికి మాత్రమే సేవకుణ్ణి, ఇంకెవరికి సేవకుడను కావాలి?
“నా భోజనం ఆలస్యమౌతోందని గుర్తించిన మల్లిక్ ఒక వంటవాణ్ణి ఏర్పాటు చేశాడు. అతడికి నెలకు ఒక రూపాయ ఇచ్చాడు. నాకు సిగ్గేసింది. అతడు పిలువనంపితే నేను పరుగెత్తాలి; నేనుగా వెళ్లటం అనేది వేరే సంగతి. అల్పబుద్ధులకు సేవ చేయటం! సంసారం అంటే ఇవన్నీ! ఇంకా ఎన్నో?
“ఈ ఉన్మత్త స్థితి కలుగనారంభించాక నా చుట్టూ జరుగుతూ ఉన్నది చూసి నేను అమ్మతో ఇలా అన్నాను: ‘అమ్మా! ఈ క్షణమే మనస్సును త్రిప్పివేయి. తేనెలొలికే మాటలు పలికే వ్యక్తుల ఆహారం ఇక వద్దు తల్లీ, వద్దు! తిన్నది బయటకు వచ్చివేస్తోంది, మరేమిటి?’ (అందరూ నవ్వారు)
27.4.2 ఉద్యోగం, ధనం గురించి శ్రీరామకృష్ణులు
(అధర్తో) “నీకున్న ఉద్యోగంతో సంతృప్తి చెందు. యాభై, నూరు రూపాయల ఉద్యోగానికే జనం అర్రులుచాచే కాలం ఇది! మరి నువ్వో, మూడు వందలు సంపాదిస్తున్నావు! కామార్పుకూర్లో ఒక డిప్టీ (డిప్యూటీ మేజిస్ట్రేటు)ని చూశాను. అతడి పేరు ఈశ్వర్ ఘోషాల్. తలపాగ ఉంటుంది. అతణ్ణి చూస్తేనే జనం గడగడ వణకిపోతారు. నా చిన్నతనంలో చూశాను. డిప్టీ అంటే సామాన్యమైన విషయమా?
“ఎవరి వద్ద పనిచేస్తున్నావో ఆతడి వద్ద కొనసాగించు. ఒకడి క్రింద పని చేస్తేనే మనస్సు పాడైపోతుంది. దీన్లో అయిదు మంది క్రింద పనిచేయడమా?
“ఒక స్త్రీ ఒక మహమ్మదీయునిపై మక్కువ పడింది. అతడితో గడపడానికి అతణ్ణి ఆహ్వానించింది. కాని ఆ మహమ్మదీయుడు ధర్మపరాయణుడు. ఆమెతో, ‘నేను మూత్ర విసర్జన చేయాలి, నా చెంబు కోసం ఇంటికి వెళ్ళాలి’ అన్నాడు. అందుకు ఆమె, ‘ఇక్కడే పోవచ్చును, నేను చెంబు ఇస్తాను’ అంది. వెంటనే అతడు, ‘అది సాధ్యం కాదు. ఏ చెంబు వద్ద నేనొకసారి సిగ్గు విడిచిపెట్టివేశానో ఆ చెంబునే ఉపయోగిస్తాను. క్రొత్తగా మరో చెంబువద్ద సిగ్గు విడిచిపెట్ట నేను సిద్ధంగా లేను’ అన్నాడతడు. ఇలా అంటూ, వేగంగా వెళ్ళిపోయాడు. ఆమెకు బుద్ధివచ్చింది. క్రొత్త చెంబు అంటే అర్థం విటుడని ఆమె గ్రహించింది.”
నరేంద్రుడు తన తండ్రి మరణానంతరం ఆర్థికంగా చాలా కష్టపడుతున్నాడు. తల్లి, తోబుట్టువులను పోషించే భారం అతడిపైన పడింది. అందుకే ఉద్యోగం కోసం తిరుగుతూ ఉన్నాడు. విద్యాసాగర్ యొక్క బౌబజార్ పాఠశాలలో కొన్ని రోజులు హెడ్–మాస్టర్‌గా పనిచేశాడు.
అధర్: నరేంద్రుడు ఉద్యోగం చేస్తాడా?
శ్రీరామకృష్ణులు: ఊ, చేస్తాడు, తల్లీ, తోబుట్టువులూ ఉన్నారు కదా!
అధర్: అవును, నరేంద్రునికి యాభై రూపాయలు లభిస్తే చాలు, నూరు రూపాయలు లభించినా చాలు. నూరు రూపాయల ఉద్యోగానికి ప్రయత్నించడా?
శ్రీరామకృష్ణులు: విషయాసక్తులు ధనాన్ని గౌరవిస్తారు, ధనానికి మించిన మహాభాగ్యం మరొకటి లేదనుకుంటారు. శంభు ఒకసారి, ‘నా ఆస్తిపాస్తులన్నీ భగవంతుని పాదపద్మాల వద్ద సమర్పించి, కన్నుమూయాలన్నదే నా కోర్కె’ అని చెప్పాడు. భగవంతుడు ధనాన్ని కాంక్షిస్తాడా? ఆయన కోరేదంతా జ్ఞానం, భక్తి, వివేక వైరాగ్యాలను మాత్రమే.
“విష్ణ్వాలయంలో ఆభరణాలు దొంగతనం జరిగినప్పుడు మథుర్బాబు, ‘ఓ విష్ణుమూర్తీ! నీ ఆభరణాలు నువ్వు సంరక్షించుకోలేకపోయావా? చూడు, హంసేశ్వరి ఎంత బాగా సంరక్షించుకున్నదో?’ అన్నాడు. ఒకసారి మథుర్ కొంత భూమిని నా పేరిట వ్రాసి ఇవ్వదలచాడు. ఆ విషయమై హృదయ్‌ను సంప్రదించాడు. ఇది కాళికాలయంలో ఉన్న నా చెవినబడింది. నేను మథుర్ వద్దకెళ్లి, ‘ఇదుగో చూడు, అలా ఏదీ చేయవద్దు. నాకు చాలా కష్టం వేస్తుంది’ అన్నాను.”
అధర్: సృష్ట్యారంభం నుంచి ఐదారుమంది మాత్రమే మీబోటివారు జన్మించి ఉండవచ్చు.
శ్రీరామకృష్ణులు: ఏమంటున్నావు! ఎందరో త్యాగధనులు ఉన్నారే! సిరిసంపదలు త్యజించినప్పుడే అతణ్ణి గురించి జనం తెలుసుకుంటున్నారు. ఎవరికీ తెలియకుండా పలువురు ఉండవచ్చు. ఉత్తర భారతదేశంలో ఎంతోమంది త్యాగధనులు ఉన్నారు కదా!
అధర్: కలకత్తాలో ఒకరి గురించి నాకు తెలుసు. ఆయన దేవేంద్రనాథ్ టాగూర్.
శ్రీరామకృష్ణులు: ఏమన్నావు? ఆయనలా సుఖాలను అనుభవించిన దెవరు? ఒకసారి మథుర్బాబుతో అతడి ఇంటికి వెళ్లాను, ఇంట్లో గంపెడుమంది పిల్లలు. వైద్యుడు వచ్చి వారికి మందుల చీటీలు వ్రాసి ఇస్తున్నాడు. ఎనమండుగురు సంతానం గలవాడు భగవంతుని తలచుకోక మరెవరిని తలచుకుంటాడు? ఇంత సుఖభోగాలు అనుభవించీ భగవత్ చింతన చేయకుంటే జనం అతణ్ణి ఈసడించుకుంటారు.
నిరంజన్: అయితే తన తండ్రి అప్పుల నన్నిటినీ ఆయనే తీర్చాడు.
శ్రీరామకృష్ణులు: ఆ కథలన్నీ కట్టిపెట్టు. ఇక నన్ను విసిగించకు. తాహతు ఉండి కూడా తండ్రి అప్పులు తీర్చకుంటే అతడు మనిషా ఏమిటి? సామాన్యంగా సంసారులు ఏకమొత్తంగా మునిగిపోయి ఉంటారు. వారితో పోలిస్తే దేవేంద్రనాథ్ టాగూర్ ఎంతో మేలు. ఇతడి నుంచి వాళ్లు ఎంతో నేర్చుకోవచ్చు.
27.4.3 యథార్థమైన సన్న్యాసి భక్తుడు – గృహస్థ భక్తుడు
“యథార్థమైన సన్న్యాసి భక్తునికీ, గృహస్థ భక్తునికీ హస్తిమశకాంతరం ఉంది. నిజమైన సన్న్యాస భక్తుడు తేనెటీగ వంటివాడు. తేనెటీగ పువ్వుల మీద తప్ప మరి దేనిమీదా వ్రాలదు, తేనెను తప్ప మరి దేన్నీ ఆస్వాదించదు. సంసారియైన భక్తుడు సామాన్యమైన ఈగ వంటివాడు. అది మిఠాయిపై వ్రాలుతుంది, చీముకారే పుండు మీదా వ్రాలుతుంది. ఇటువంటి వాడు ఒక్కోసారి భగవద్భావంలో ఆనందం పొందుతాడు, మరుక్షణం కామినీ కాంచనాలలో మునిగి ఆనందిస్తాడు.
“యథార్థమైన సన్న్యాస భక్తుడు చాతకపక్షి లాటివాడు. అది స్వాతి వాన నీటినే తప్ప మరి ఏ నీటినీ త్రాగదు. చుట్టూ సప్త సముద్రాలు, నదులూ నీటితో పొంగి పొరలుతూ ఉన్నప్పటికీ అది ఆ నీటిని త్రాగదు. అదే విధంగా యథార్థ సన్న్యాసి కామినీ కాంచనాలను స్పృశించడు; ఎక్కడ ఆసక్తి జనిస్తుందో అని వాటి సమీపానికి కూడా వెళ్లడు.”
27.5 పంచమ పరిచ్ఛేదం చైతన్యులు – శ్రీరామకృష్ణులు
అధర్: చైతన్యదేవులు కూడా భోగాలను అనుభవించారు కదా?
శ్రీరామకృష్ణులు (ఆశ్చర్యంతో): ఏ భోగాలను అనుభవించాడు?
అధర్: పాండిత్యం! ఖ్యాతి!
శ్రీరామకృష్ణులు: ఇతరులకి అది గొప్పగా తోచవచ్చు. కాని ఆయన దృష్ట్యా అది ఏమీ కాదు.
“నుమ్వా నన్ను గౌరవిస్తున్నావు, నిరంజన్ కూడా గౌరవిస్తున్నాడు – నిజం చెబుతున్నాను నాకు అన్నీ ఒకటే. ఒక ధనవంతుణ్ణి వశం చేసుకోవాలనే భావన నా మనస్సులో ఎన్నడూ మెదలలేదు. ‘రాఖాల్ ఈయనతో వసిస్తున్నాడు. ఈ విషయమై రాఖాల్ తండ్రి ఈయనపై వ్యాజ్యెం వేయవచ్చు’ నని సురేంద్రుడు అన్నట్లు మనోమోహన్ నాతో చెప్పాడు. అందుకు నేను, ‘ఈ సురేంద్రుడెవడు? అతడి చాప, దిండు ఇంకా ఇక్కడ ఉన్నాయి; ఏదో కొంత డబ్బు ఇస్తున్నందున ఇలా చెప్పటమా?’ అన్నాను.
అధర్: నెలకు పది రూపాయలు ఇస్తుంటాడు కదా?
శ్రీరామకృష్ణులు: పది రూపాయలు రెండు నెలల ఖర్చుకు సరిపోతుంది. భక్తులు ఇక్కడ బసచేస్తున్నారు, అతడు భక్తుల సేవకై ఖర్చుపెడుతున్నాడు. అది అతడికే పుణ్యం! దానివల్ల నాకేమిటి? రాఖాల్, నరేంద్రుడు – వీరిని నేను ప్రేమిస్తున్నాను. అది నా స్వప్రయోజనానికా?
‘మ’ : తల్లి ప్రేమలా.
శ్రీరామకృష్ణులు: తల్లిప్రేమకు వెనుక కూడా, ‘నా ముసలితనంలో వీడు పనిచేసి నాకు తిండి పెడతాడు’ అని తలచి తల్లి అన్నీ చేసిపెడుతుంది. నేను వీరిని ప్రేమించేది వీరిలో సాక్షాత్తూ నారాయణుని దర్శిస్తున్నాను కనుకనే. ఇవి వట్టి మాటలు కావు.
27.5.1 ‘అనన్యాశ్చిన్తయన్తోమాం’ – భిక్షార్థం వెళ్ళిన బాల సన్న్యాసి కథ
(అధర్తో) “విను! దీపం వెలిగిస్తే, దీపపు పురుగులకు కొదువ ఉండదు. భగవంతుని పొందితే ఆయన సమస్తం సమకూర్చి పెడతాడు, ఏ లోటూ ఉండదు. హృదయంలో ఆయన సుప్రతిష్ఠితుడైతే సేవలు చేయటానికి పలువురు వచ్చి చేరతారు.
“ఒక బాలసన్న్యాసి భిక్షార్థం ఒక ఇంటికి వెళ్లాడు. అతడు జన్మతః సన్న్యాసి. సంసారం గురించి అతడికి ఏమీ తెలియదు. ఆ ఇంట్లో నుంచి ఒక యువతి వచ్చి అతడికి భిక్ష వేసింది. అప్పుడతడు ఆ యువతి తల్లితో, ‘అమ్మా! ఈమె ఛాతీపై వ్రణాలు లేచినవా?’ అని అడిగాడు. అందుకు ఆమె, ‘లేదు నాయనా, ఆమె కడుపున పిల్లలు పుడతారని ఎంచి భగవంతుడు ఆమెకు పాలిండ్లను ప్రసాదించాడు. వాటిలోని పాలను బిడ్డ త్రాగుతాడు’ అన్నది. ఈ మాటలు విని ఆ సన్న్యాసి, ‘అలా అయితే ఇక చింతించటం ఎందుకు? నే నెందుకు భిక్షాటన చేయాలి? నన్ను సృష్టించిన వాడే నాకు అన్నం పెడతాడు’ అని అన్నాడు.
“విను. ప్రియుడి కోసం సర్వం త్యజించి వచ్చే స్త్రీ అవసరమయితే ఆతడితో, ‘విశ్వాసఘాతకుడా! నీ గుండె మీద కూర్చుని నిన్ను దిగమింగుతాను’ అని కూడా చెప్పగలదు కదా!
“ఒకసారి నాంగ్టా ఇలా చెప్పాడు: ‘ఒక రాజు బంగారు పళ్లెరంలో, బంగారు గ్లాసులో సాధువులకు భోజనం పెట్టాడు. కాశీలో మఠాధిపతులకు ఎంత గౌరవం, ఎంత మర్యాద! ఉత్తర భారతానికి చెందిన సేఠ్లు (సంపన్నులు) ఎంతో మంది వారి ముందు చేతులు కట్టుకుని నిలబడి, వారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటారు.’
“కాని నిజమైన సాధువు, నిజమైన సన్న్యాసి బంగారు పళ్లెరాన్నీ కోరడు, గౌరవమర్యాదలనూ కాంక్షించడు. భగవంతుడూ వారికి ఏ కొరతా ఉంచడు. తనను పొందటానికి కావలసినవన్నీ వారికి ఆయనే చేకూరుస్తాడు. (అందరూ మౌనంగా ఉన్నారు)
“నువ్వొక కార్యనిర్వహణాధికారివి. నేను ఏం చెప్పగలను! ఏది సబబుగా తోస్తుందో దాన్ని చెయ్యి. నేనొక నిరక్షరాస్యుణ్ణి.”
అధర్ (నవ్వుతూ భక్తులతో): ఆయన నన్ను ఇప్పుడు పరీక్షిస్తున్నారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నివృత్తి మార్గమే మంచిది. చూడు, నేను జీతం కోసం సంతకం చెయ్యలేదే! భగవంతుడే సత్యం తక్కినదంతా అసత్యం.
27.5.2 ‘భక్తుడు – సోఽహం’
ఇంతలో హాజ్రా వచ్చి భక్తులతోపాటు నేల మీద కూర్చున్నాడు. అతడు అప్పుడప్పుడు, ‘సోఽహం, సోఽహం’ అంటూంటాడు. లాటూ మొదలైన భక్తులతో, ‘భగవంతుని ఆరాధించటంలో ఏం ప్రయోజనం? ఆయన వస్తువులనే ఆయనకు సమర్పించటమా?’ అంటూ ఉంటాడు. ఒక రోజు నరేంద్రునితో కూడా అతడు అలాగే మాట్లాడాడు.
శ్రీరామకృష్ణులు (హాజ్రాతో): భక్తుని ఆరాధ్య వస్తువు ఏమిటో లాటూకు తెలిపాను.
హాజ్రా: నిజానికి భక్తుడు తనను తానే ప్రార్థిస్తున్నాడు.
శ్రీరామకృష్ణులు: అది చాలా ఉన్నత స్థితి. బలి చక్రవర్తితో బృందావళి, ‘అన్నింటిలోను ఉన్నతుడైన భగవంతునికి నువ్వు ఏం సమర్పించగలవు?’ అని అడిగింది. నువ్వు చెబుతున్నావే ఆ స్థితిని పొందటానికే తపోసాధనలు, భగవంతుని నామగుణ కీర్తనలన్నీ. తనలో తనను కనుగొంటే అంతా సాధించినట్లే. దాన్ని గాంచటానికే సాధన! ఆ సాధన కోసమే దేహం. బంగారు ప్రతిమ పోతపోయనంత వరకు మట్టి మూస ఉండాలి. ప్రతిమ తయారైన పిదప మూసను పారవేస్తారు. భగవత్సాక్షాత్కారానంతరం దేహాన్ని వదిలివేయవచ్చు.
“భగవంతుడు కేవలం అంతర్యామియే కాదు. ఆయన అంతరంలోను, బాహ్యంలోను ఉన్నాడు. సమస్తం చిన్మయంగా ఉండటం కాళికాలయంలో ఒకసారి అమ్మ నాకు చూపించింది. ఆమే సమస్తంగాను ఉన్నది – విగ్రహం, నేను, పూజాపాత్రలు, వేదిక, చలువరాళ్లు అన్నీ చిన్మయమే!
“దీన్ని అనుభూతం చేసుకోవటానికే భగవంతుణ్ణి ప్రార్థించటం, సాధనలు చేయటం, తపస్సు చేయటం, ఆయన నామగుణ కీర్తనలు చేయటం అన్నీను. ఆయన పట్ల భక్తి కలిగి ఉండటమూ ఇందుకోసమే. వీరు (లాటూ ప్రభృతులు) ఒక స్థితిని చేరుకున్నారు, ఇంకా అంత ఉన్నత స్థితిని చేరుకోలేదు. వీరు భక్తి మార్గంలో సాధనలు చేస్తూ ఉన్నారు. అందుకే వీరితో, ‘సోఽహం’ లాంటివి చెప్పవద్దు.”
తల్లిపక్షి తన పిల్లలను రెక్కలు కప్పి సంరక్షించేట్లుగా కృపాసింధువైన శ్రీరామకృష్ణులు తమ భక్తులను కాపాడుతున్నారు.
అధర్, నిరంజన్లు ఫలహారానికై వసారాలోకి వెళ్లారు; ఫలహారం చేసి తిరిగి వచ్చారు. ‘మ’ నేల మీద శ్రీరామకృష్ణుల ప్రక్కన కూర్చున్నాడు.
27.5.3 నాలుగు పట్టాలు పుచ్చుకున్న యువకుడు
అధర్ (నవ్వుతూ): మనం ఎంత మాట్లాడాం. అయితే ఈయన (‘మ’) ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు.
శ్రీరామకృష్ణులు: కేశవ్సేన్ సమాజంలో నాలుగు పట్టాలు పుచ్చుకున్న యువకుడొకడు ఉండేవాడు. అందరూ నాతో వాదించటం చూసి నవ్వుకునే వాడు; ‘ఏమిటీ, ఈయనతో వాదించటమా?’ అనేవాడు. పిదప కేశవ్‌తో అతణ్ణి మరొకసారి చూశాను, అప్పుడు అతడిలో మునుపటి కళ లేదు.
విష్ణ్వాలయ పూజారియైన రామ్ చక్రవర్తి గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణులు అతడితో, “ఇలా చూడు రామ్, నువ్వు పటికబెల్లం గురించి దయాళ్‌తో చెప్పావా? వద్దు, వద్దు. ఇక చెప్పి ప్రయోజనం లేదు. ఎన్నోసార్లు చెప్పటం జరిగింది” అన్నారు.
27.5.4 శ్రీరామకృష్ణుల రాత్రి భోజనం – “ప్రతి వ్యక్తీ ఇచ్చే పదార్థాలను తినలేకున్నాను”
శ్రీరామకృష్ణుల రాత్రి భోజనం – కాళీమాతకు నివేదించిన ఒకటి రెండు లూచీలు (పూరీలు), కొంచెం రవ్వ పాయసం మాత్రమే. భోజనానికి ఆయన నేల మీద కూర్చున్నారు. ప్రక్కనే ‘మ’ ఉన్నాడు. లాటూ కూడా గదిలోనే ఉన్నాడు. భక్తులు పలురకాల మిఠాయిలు తెచ్చి ఉన్నారు. ఒక మిఠాయిని తాకి ఆయన లాటూతో, “దీన్ని తెచ్చినది ఆ వెధవే కదూ!” అంటూ దాన్ని గిన్నె నుండి తీసి పారవేశారు. (‘మ’, లాటూలతో) “నాకు అంతా తెలుసు. అతగాడు – ఆనంద ఛటర్జీ కుమారుడు. అతడు ఘోష్పారా వెలయాళ్ల ఇళ్లకు వెళ్తుంటాడు” అన్నారు.
లాటూ: ఈ మిఠాయి ఇవ్వనా?
శ్రీరామకృష్ణులు: కిశోరీ తెచ్చాడా?
లాటూ: దీన్ని తింటారా?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఆ.
‘మ’ ఆంగ్ల విద్యాభ్యాస్యం చేసినవాడు. అతణ్ణి చూసి శ్రీరామకృష్ణులు, “ప్రతి వ్యక్తీ తీసుకువచ్చే పదార్థాలను తినలేకున్నాను. నువ్వు దీన్ని విశ్వసిస్తావా?” అని అడిగారు.
‘మ’ : అవునండీ, క్రమక్రమంగా విశ్వసించే తీరాలి.
శ్రీరామకృష్ణులు చేతులు కడుక్కోటానికి పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలోకి వెళ్లారు. ‘మ’ ఆయన చేతులపై నీరు పోశాడు.
శరత్కాలం. నిర్మల నీలాకాశంలో చంద్రోదయం కాగానే ఆకాశమూ, గంగానదీ నిగనిగలాడసాగాయి. గంగలో పోటు బయలుదేరింది, దక్షిణాభిముఖంగా గంగ ప్రవహించసాగింది.
ముఖం కడుక్కుంటూ శ్రీరామకృష్ణులు ‘మ’ తో, “అలా అయితే నారాయణ్‌కు రూపాయి ఇస్తావు కదూ?” అని అడిగారు.
‘మ’ : కచ్చితంగా ఇస్తానండీ.
27.6 షష్ఠ పరిచ్ఛేదం ముఖర్జీ సోదరులు, జ్ఞాన్బాబు, చిన్నగోపాల్, పెద్దకాళీ, నరేంద్రుడు, భవనాథ్లతో
ఆదివారం, సెప్టెంబర్ 14, 1884
శ్రీరామకృష్ణులు మధ్యాహ్న భోజనానంతరం తమ గదిలో విశ్రమించి ఉన్నారు. నరేంద్రుడు, భవనాథ్ మొదలైన భక్తులు కలకత్తా నుంచి వచ్చి ఉన్నారు. ముఖర్జీ సోదరులు, జ్ఞాన్బాబు, చిన్నగోపాల్, పెద్దకాళీ మొదలైన వారూ వచ్చి ఉన్నారు. రాఖాల్, బలరామ్‌తో బృందావనంలో ఉన్నాడు. అతడికి జ్వరం వచ్చిందని కబురు అందినది.
నరేంద్రుడు తన తండ్రి మరణానంతరం తల్లిని, సోదరులను పోషించటంలో నానాకష్టాలు పడుతున్నాడు. అతడు చట్ట పరీక్షలకు చదువుతున్నాడు.
27.6.1 జ్ఞానం, అజ్ఞానం – శుష్క జ్ఞానం
జ్ఞాన్బాబు నాలుగు విశ్వవిద్యాలయ పట్టాలు పుచ్చుకున్న వ్యక్తి, ప్రభుత్వోద్యోగంలో ఉంటున్నాడు. అతడు పది లేక పదకొండు గంటల ప్రాంతంలో వచ్చాడు.
శ్రీరామకృష్ణులు (జ్ఞాన్బాబుతో): ఏమిటోయ్, హఠాత్తుగా ఈ జ్ఞానోదయం!
జ్ఞాన్ (నవ్వుతూ): అవునండీ, ఎంతో పుణ్యం చేసుకుంటేనే కదా జ్ఞానోదయం కలుగుతుంది.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నువ్వే జ్ఞానమై ఉన్నప్పుడు నీలో అజ్ఞానం ఎక్కడ? ఓహో! అర్థమైంది. అజ్ఞానం ఉండేది జ్ఞానం ఉన్నచోటనే. వసిష్ఠుడు అంత గొప్పజ్ఞాని అయి ఉండీ పుత్రశోకంతో విలపించాడు! అందుకే నువ్వు జ్ఞానాజ్ఞానాలకు అతీతుడవైపో. అజ్ఞాన ముల్లు కాలిలో గుచ్చుకుంది, దాన్ని తీసి వేయటానికి జ్ఞాన ముల్లు అవసరం. పిదప రెండు ముళ్లనూ పారవేస్తారు.
“ఈ సంసారం మాయామందిరం అంటాడు జ్ఞాని. కాని జ్ఞానం, అజ్ఞానం రెంటికీ అతీతుడైనవాడు దీనిని ఆనంద సౌధం అంటాడు! భగవంతుడే జీవజగత్తులుగా, ఇరవై నాలుగు తత్త్వాలుగా అయివుండటం అతడు గాంచుతాడు.
“భగవల్లబ్ధి పొందిన పిదప సంసారంలో ఉండవచ్చు. అప్పుడే నిర్లిప్తుడై మనగలం. గ్రామ ప్రాంతాలలో వడ్రంగి స్త్రీలు రోలులో అటుకులు దంచటం చూసి ఉన్నాను. ఆ స్త్రీలు ఒక చేత్తో వడ్లను ఎగదోస్తూ ఉంటారు. మరో చేత్తో పసిబిడ్డకు పాలుపడుతూంటారు. అదే సమయంలో ఖాతాదార్లతో, ‘నువ్వు ఇంకా రెండున్నర రూపాయలు బాకీ ఉన్నావు. దాన్ని ఇచ్చెయ్యి’ అంటూ మాటలూ సాగిస్తారు. కాని రోకలి ఎక్కడ చేతిపై పడుతుందో అన్న భయంతో ముప్పావువంతు ధ్యాస చేతి మీదనే ఉంటుంది. ముప్పావు వంతు మనస్సును భగవంతునిపై నిలిపి, పావు భాగం మనస్సుతో కర్తవ్యాలను నిర్వర్తించుకో.”
శశధర్ పండితుని గురించి ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “అతణ్ణి చూశాను, అతడు ఒకే భావం పట్టుకుని వ్రేలాడుతూ శుష్కవేదాంత చర్చలలో కాలం గడుపుతున్నట్లు కనిపించాడు.
“ఎవరు నిత్యాన్ని పొంది, లీలలో ఉన్నాడో, మళ్లీ లీలలో నుంచి నిత్యానికి చేరుకునే సమర్థుడో ఆతడిదే పరిపక్వమైన జ్ఞానం, పరిపక్వమైన భక్తి. నారదాది మహర్షులు బ్రహ్మజ్ఞానం పొందిన పిదప భక్తిని ఆశ్రయించి జీవించారు. దీనినే విజ్ఞానం అంటారు.
“వట్టి శుష్కజ్ఞానమా! అది సామాన్యమైన తారాజువ్వ. ఏవో రంగుల పువ్వులు కొన్నిటిని వెదజల్లి వెంటనే తుస్సుమని ఆరిపోతుంది. కాని నారదుడు, శుకదేవుడు వంటి వారి జ్ఞానం శ్రేష్ఠతమ తారాజువ్వ వంటిది. మొదట కొన్ని పువ్వులు వెదజల్లి ఆరుతుంది, పిదప కొంగ్రొత్త పువ్వులను వెదజల్లుతుంది, పిదప ఆరుతుంది, మళ్లీ క్రొత్త పువ్వులను విరజిమ్ముతుంది.
“నారదుడు, శుకదేవుడు మొదలైన వారికి భగవంతునిపై ప్రేమ జనించింది. ప్రేమయే సచ్చిదానంద స్వరూపుని కట్టువడజేసే రజ్జువు.”
27.6.2 శ్రీరామకృష్ణుల భావపారవశ్యం
మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు.
పొగడ చెట్టు క్రింద కూర్చోటానికి అనువుగా అరుగువంటివి అమరి ఉన్నాయి. అక్కడ కూర్చుని భవనాథ్, ముఖర్జీ సోదరులు, ‘మ’, చిన్న గోపాల్, హాజ్రా మొదలైన వారు మాట్లాడుకుంటున్నారు. శ్రీరామకృష్ణులు సరుగుడు తోపు కేసి వెళ్లారు. దారిలో అక్కడకు వచ్చి భక్తులతోపాటు కూర్చున్నారు.
హాజ్రా (చిన్న గోపాల్‌తో) : ఈయన పొగత్రాగటానికి కాస్త ఏర్పాటు చెయ్యండి.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నీకు కావాలని చెప్పవచ్చు కదా! (అందరూ నవ్వారు)
ముఖర్జీ (హాజ్రాతో) : మీరు వీరి నుంచి ఎంతో నేర్చుకుని ఉంటారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ) : లేదు, చిన్నతనం నుంచీ ఇతడు (హాజ్రా) ఇంతే. (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు సరుగుడుతోపు నుంచి తిరిగి వస్తూ ఉండటం భక్తులు చూస్తున్నారు. ఆయన భావపారవశ్యంలో ఉన్నారు, త్రాగుబోతులా తూలుతూ ఉన్నారు. గదిలోకి వెళ్లిన తరువాతనే సాధారణ స్థితికి వచ్చారు.
27.7 సప్తమ పరిచ్ఛేదం కొన్నగర్ భక్తులతో – నరేంద్రుని గానం, శ్రీరామకృష్ణుల సమాధి
గదిలో అప్పటికే పలువురు భక్తులు చేరి ఉన్నారు. కొన్నగర్కు చెందిన భక్తులలో ఒకరు సాధకుడు. క్రొత్తగా వచ్చాడు, వయస్సు యాభై పైబడే ఉంటుంది. ఒకింత పాండిత్యాహంకారం ఉన్నట్లు కనిపించాడు. మాటల మధ్యలో అతడు, “పాలసముద్రాన్ని చిలకటానికి మునుపు చంద్రుడు లేడా ఏమిటి? దీనికి సమాధానం ఎవరు చెబుతారు?” అని అడిగాడు.
‘మ’ (సాధకునితో): ‘బ్రహ్మాండమే లేని సమయంలో, ముండమాల ఎక్కడ నుంచి పొందావు’ అని ఒక పాటలో ఉంది.
సాధకుడు (కాస్త కోపంగా): అది వేరే సంగతి.
గది మధ్యలో నిలబడి ఉన్న శ్రీరామకృష్ణులు, ‘మ’ వైపుగా తిరిగి హఠాత్తుగా, “అతడు వచ్చేశాడు. నారాయణ్ వచ్చేశాడు” అన్నారు.
నరేంద్రుడు వసారాలో హాజ్రా తదితరులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటల శబ్దం గదిలో కూడా వినబడింది.
శ్రీరామకృష్ణులు: వాగుడుకాయ, ప్రస్తుతం కుటుంబ చింతలో చిక్కువడి ఉన్నాడు.
‘మ’ : అవునండీ.
శ్రీరామకృష్ణులు: దుఃఖాలను వరాలుగా పరిగణిస్తూ ఉన్నట్లుగా ఒకసారి చెప్పాడు కదా!
‘మ’ : అవునండీ, గొప్ప మనోస్థైర్యం ఉన్నవాడు.
పెద్దకాళీ: దేన్లోనూ తక్కువ లేదు.
కొన్నగర్కు చెందిన భక్తు డొకడు శ్రీరామకృష్ణులతో, “స్వామీ, ఈ సాధకుడు మీ దర్శనార్థం వచ్చాడు. ఇతడు ఏదో అడగాలనుకుంటున్నాడు” అన్నాడు.
సాధకుడు తలను పైకెత్తి తిన్నగా కూర్చుని, “స్వామీ, మార్గోపాయం ఏమిటి? అని అడిగాడు.
27.7.1 భగవల్లబ్ధికి మార్గం గురువాక్యాలపై విశ్వాసం – శుష్క పాండిత్యంతో సిద్ధి లభించదు
శ్రీరామకృష్ణులు: గురువాక్యాల పట్ల విశ్వాసం. ఆయన ఉపదేశాలను అనుసరిస్తే భగవల్లబ్ధి చేకూరుతుంది. తాడు పుచ్చుకుని వెళితే, దానికి కట్టబడి ఉన్న వస్తువును చేరుకున్నట్లుగానే.
సాధకుడు: భగవంతుని దర్శించగలమా?
శ్రీరామకృష్ణులు: విషయాసక్తమై ఉన్న బుద్ధికి ఆయన అగోచరుడు. కామినీ కాంచనాలపట్ల ఆసక్తి జాడమాత్రంగా ఉన్నా ఆయనను పొందలేవు. కాని విషయాసక్తి లేశమాత్రమూ ఉండని మనస్సుకు, బుద్ధికి అంటే శుద్ధ మనస్సుకు, శుద్ధ బుద్ధికి ఆయన గోచరమవుతాడు. శుద్ధ మనస్సు, శుద్ధ బుద్ధి, శుద్ధ ఆత్మ – ఇవన్నీ ఒక్కటే.
సాధకుడు: కాని, ‘యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సః’ – ఆయన అవాఙ్మానసగోచరుడని శాస్త్రాలు పేర్కొంటున్నాయి కదా!
శ్రీరామకృష్ణులు: ఓ, చాలు చాలు! సాధనలు అనుష్ఠించకుండా శాస్త్రమర్మాలు తెలుసుకోలేవు. ‘సిద్ధి, సిద్ధి’* అనటంతో ఏదైనా సంభవిస్తుందా? పండితులు శ్లోకాలను గడగడ ఒప్పగిస్తారు. కానీ ఏం ప్రయోజనం? ‘సిద్ధి’ ని దేహం మీద పూసుకొన్నప్పటికీ ఏమీ జరుగదు, దానిని మ్రింగాలి. పాలలో వెన్న ఉంది, పాలలో వెన్న ఉంది అంటూ పదేపదే పలుకటం వల్ల ప్రయోజనం ఏమిటి? ముందుగా పాలను పెరుగుగా తోడుబెట్టు. తరువాత దానిని చిలికి తియ్యి, అప్పుడే కదా వెన్న లభిస్తుంది!
సాధకుడు: వెన్నను తీయటం గురించి మీరు చెప్పింది కూడా శాస్త్రాలలో ఉన్నదే కదా!
శ్రీరామకృష్ణులు: శాస్త్రాలలో ఉన్నది చెప్పటం వల్లనో, వినటం వల్లనో ఏం ప్రయోజనం? వాటిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఇరవై పదునుల వర్షం పడుతుందని పంచాంగంలో వ్రాసి ఉంది, అందుకని పంచాంగాన్ని పిండితే ఒక చుక్క నీరు కూడా రాలదు!
సాధకుడు: వెన్న తీయాలన్నారే, మరయితే మీరు తీశారా?
శ్రీరామకృష్ణులు: నేను ఏం చేశాను, ఏం చేయలేదు అన్న విషయం అసంగతం. వీటిని చెప్పి విశదీకరించటం చాలా కష్టం. నేతి రుచి ఎలా ఉంటుందో అని ఎవరైనా అడిగితే నేతి రుచి నేతిలా ఉంటుందనే కదా దానికి బదులు చెప్పగలం? వీటి నన్నిటిని అవగాహన చేసుకోవాలంటే సాధుసాంగత్యం ఆవశ్యకం. ఏది కఫనాడి, ఏది పిత్తనాడి, ఏది వాయునాడి అని తెలుసుకోవాలంటే వైద్యునితో కలిసి వసించాలి.
సాధకుడు: ఇతరులతో వసించటం కొందరు ఇష్టపడరు.
శ్రీరామకృష్ణులు: అది జ్ఞానం పొందిన తరువాత, భగవద్దర్శనానంతరం. అంతకు మునుపు సాధుసాంగత్యం ఆవశ్యకం కదా?
సాధకుడు మౌనంగా ఉండిపోయాడు. కాసేపయ్యాక కాస్త చిరచిరలాడుతూ, “ప్రత్యక్షంగాగాని లేక పరోక్షంగాగాని మీరు భగవంతుని అనుభూతం చేసుకున్నారో లేదో చెప్పండి. ఇష్టం ఉంటే చెప్పండి లేకుంటే వద్దు” అన్నాడు.
శ్రీరామకృష్ణులు (చిరునవ్వుతో): ఏమని చెప్పను? ఏదో సూచనమాత్రంగానే చెప్పనగును.
సాధకుడు: అదే తెలుపండి.
నరేంద్రుడు పాడ సంసిద్ధుడయ్యాడు. “తబలా తీసుకుని రాలేదా?” అని అడిగాడు.
చిన్నగోపాల్: మహిమాచరణ్ది ఒకటి ఉన్నది.
శ్రీరామకృష్ణులు: వద్దు, ఆతడి దేదీ తీసుకురాకు.
మొదట కొన్నగర్కు చెందిన భక్తుడు ధ్రుపద సంగీతం ఆలపించాడు. శ్రీరామకృష్ణులు మధ్యమధ్యలో సాధకుణ్ణి క్రీగంట చూశారు.
గాయకుడు, నరేంద్రుడు సంగీతం గురించి తీవ్రంగా వాదించుకుంటున్నారు.
సాధకుడు (గాయకునితో): నువ్వు వదలిపెట్టే రకం కాదు! ఇట్టి వాదనల వలన ఏం ప్రయోజనం?
మరో భక్తుడూ ఈ వాదంలో పాల్గొన్నాడు. దాన్ని చూసి శ్రీరామకృష్ణులు సాధకునితో, “మీరు అతణ్ణీ కాస్త మందలించ లేదు ఎందుకని?” అన్నారు.
శ్రీరామకృష్ణులు (కొన్నగర్ భక్తులతో): మీతో కూడా ఈయనకు సఖ్యత ఉన్నట్లు లేదు.
నరేంద్రుడు పాడసాగాడు:
ఈలాగు వ్యర్థముగ నా దినములన్నియు
గడుపవలసినదేన దేవా
రాత్రింబగళ్లు నే నార్తితో కాచితిని
ఆశాపథము వైపు దేవా…….
పాటను వింటూనే సాధకుడు ధ్యానంలో మునిగిపోయాడు. శ్రీరామకృష్ణులు మంచం మీద దక్షిణాభిముఖంగా కూర్చుని ఉన్నారు. సమయం మూడు లేక నాలుగు గంటలు అయివుంటుంది. అస్తమిస్తున్న సూర్యుని కిరణాలు సాధకునిపై పడ్డాయి. శ్రీరామకృష్ణులు వెంటనే ఒక గొడుగును విప్పి సాధకునిపై ఎండ పడకుండా దాన్ని పశ్చిమాన పెట్టారు.
నరేంద్రుడు మళ్లీ పాడాడు:
ఏ రీతి నీ దరి చేరుదునో దేవా ।
ఈ రీతి భౌతిక మలినమగు మనసుతో
మంట బడియును మసియుగాక
కంటబడునె గడ్డిపరక
మంచియనియెడు మంట నీవు
పాపమనియెడి పరక నేను॥ ఏ ॥
ఘోరపాపులైన తరియింపజేయు నీ
పావనమగు నామ ప్రాభవమందురు
అదియు తెలిసియు నీదు నామము
మొదలుపెట్టిన తక్షణంబే
గట్టిగా నా గుండె దడ దడ
కొట్టుకొనుచు భయముచేత॥ ఏ ॥
ఏపగిది నిన్ను నే నారాధించగలను
పాపంపు బానిసగ ప్రాయమంతయు గడపి
ఎటుల శరణము పొందగలను
జటిలమగు నీ మార్గమందున
జుట్టుపట్టి ఈడ్చి పాపిని
పెట్టుకొను దయపాద సన్నిధి॥ ఏ ॥
27.8 అష్టమ పరిచ్ఛేదం నరేంద్రాదులకు ఉపదేశం – వేదవేదాంతాలు కేవలం సూచనలు
నరేంద్రుడు పాడుతున్నాడు:
మధురం, మధురం, నీ శుభనామం
మధురం, మధురం, నీ నామం
దీన జనాపన దీన శరణ్యా
మధురం, మధురం, నీ శుభనామం
మధురం, మధురం, నీ నామం॥ మ ॥
కర్ణపేయమై కర్ణపుటంబుల
మధురసుధారస మది కురియించును
మధురం, మధురం, నీ శుభనామం
మధురం, మధురం, నీ నామం॥ మ ॥
హే ప్రాణప్రియ, ప్రియతమ సదయ
మధురం, మధురం, నీ నామం
మధురం, మధురం, నీ శుభనామం
మధురం, మధురం నీ నామం॥ మ ॥
శాంతి సౌఖ్య సందాయకము
మధురం, మధురం, నీ నామం
మధురం, మధురం, నీ శుభనామం
మధురం, మధురం నీ నామం॥ మ ॥
అమూల్యమగు నీ నామ నిధానం
అమృతత్వ ఆనంద నికేతం
మధురం, మధురం, నీ శుభనామం
మధురం, మధురం నీ నామం॥ మ ॥
అమరుండగు నీ నామ జపి
(అజరుండగు నీ నామభజి)
మధురం, మధురం, నీ శుభనామం
మధురం, మధురం నీ నామం॥ మ ॥
వీనుల శోకిన నీ శుభనామం
హృదయావేద విదారకరం
మధురం, మధురం, నీ శుభనామం
మధురం, మధురం నీ నామం॥ మ ॥
మధురం, మధురం నీ నామం
హృదయానంద సంపూర్ణ ఘనం
మధురం, మధురం, నీ శుభనామం
మధురం, మధురం నీ నామం॥ మ ॥
నరేంద్రుడు ఈ పాట పాడుతూ ఉండగానే శ్రీరామకృష్ణులు సమాధి మగ్నులైనారు. సమాధి స్థితి ప్రారంభంలో ఆయన చేతి వ్రేళ్లు, ముఖ్యంగా బొటన వ్రేళ్లు వణికాయి. కొన్నగర్ భక్తులు శ్రీరామకృష్ణుల సమాధి స్థితిని చూసి ఎరుగరు. వారు మౌనంగా ఉండిపోయారని భావించి అక్కడ నుంచి బయటకు వెళ్లటానికి లేచారు. భవనాథ్ వారితో, “కూర్చోండి. ఇది వీరి సమాధి స్థితి” అన్నాడు. కొన్నగర్ భక్తులు కూర్చున్నారు. నరేంద్రుడు పాట కొనసాగించాడు:
పగలనకను రేయనకను
పలు విధముల పాటుపడుచు
నీ కొరకై నిర్మించితి
గుడి యొకటి గుండెలోన
దయయుంచి దానిలోకి
దయసేయవ? దేవ! దేవ!
ఇంకా భావపారవశ్య స్థితిలోనే ఉన్న శ్రీరామకృష్ణులు క్రిందికి వచ్చి నరేంద్రుని ప్రక్కన కూర్చున్నారు. నరేంద్రుడు పాడసాగాడు:
విజ్ఞాన గగనమున
ప్రేమచంద్రుడు పూర్ణ
బింబమున ఉదయించెను……
చివరి చరణం వింటూ ఉండగానే శ్రీరామకృష్ణులు లేచి నిలబడి సమాధి మగ్నులయ్యారు. చాలాసేపటి తరువాత బాహ్యస్మృతి నొంది మళ్లీ చాప మీద కూర్చున్నారు. నరేంద్రుడు పాటలు ముగించాడు. తంబురాను యథాస్థానంలో ఉంచారు. శ్రీరామకృష్ణులు ఇంకా భావపారవశ్యంలోనే నెలకొని ఉన్నారు. ఆ స్థితిలోనే మాట్లాడసాగారు:
“అమ్మా! ఇదేమిటో నాకు తెలియజేయి. పెరుగును చిలికి, వెన్న తీసి నోటికి అందించాలా? చెరువులో ఎరను వెయ్యరు. దాన్ని పట్టుకుని ఒడ్డున వేచి ఉండరు. కాని చేపను పట్టి వారి చేతుల్లో పెట్టాలి! ఎంత కష్టం! అమ్మా, ఇక మీదట వాదనలు వింటూ ఉండటం నా వల్ల కాదు. ఈ ధూర్తులు అంత భారాన్ని నా మీదే మోపుతున్నారు. ఎంత కష్టం! అన్నిటినీ విదిలించుకుంటాను.
“భగవంతుడు వేదాలకు అతీతుడు. వేదవేదాంతాలు అధ్యయనం చేసి ఆయనను పొందనగునా? (నరేంద్రునితో) అర్థమైందా? వేదాలు సూచనలు మాత్రం ఇస్తాయి.” (Katha Upanishad 1.2.23)
మళ్లీ పాడటానికి నరేంద్రుడు తంబురా తీసుకురమ్మన్నాడు. శ్రీరామకృష్ణులు, “నేను పాడతాను” అన్నారు. భావపారవశ్యంలోనే పాడసాగారు:
అమ్మా! అమ్మా! నన్నీ ఖేదము
వ్యధతో హృదయము పిండుచున్నదే….
పాట పూర్తయ్యాక “అమ్మా, నన్నెందుకు వాదింప చేస్తూన్నావు?” అని శ్రీరామకృష్ణులు అడిగారు.
మళ్లీ పాడసాగారు:
తెలిసికొంటి తెలిసికొంటి
తెలియదగినదెల్ల ఎపుడు
సర్వమెరుగు నొకనినుండె
భావమర్మ మెరిగినాను….
శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “నేను స్పృహలోనే ఉన్నాను!” కానీ భావపారవశ్య స్థితిలోనే ఈ పాట పాడారు.
నేను గ్రోలెడి మద్య మెట్టిదో
ఎరుగ గోరుదురే నరులారా?…….
తరువాత “అమ్మా వాదనలను ఇకపై నేను వినలేను” అన్నారు శ్రీరామకృష్ణులు.
నరేంద్రుడు పాడసాగాడు:
వెర్రివానిని చేయవే నీ ప్రేమలోన
పిచ్చివానిని చేయవే ననుగన్న తల్లి….
శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, “అమ్మా! నన్ను పిచ్చివాణ్ణి చేసివేయి! జ్ఞాన విచారణ చేసి, శాస్త్ర విచారణ చేసి భగవల్లాభం పొందలేం” అన్నారు.
కొన్నగర్ గాయకుని శాస్త్రీయ సంగీతాన్ని, రాగాలాపనను విని శ్రీరామకృష్ణులు ఆనందించారు. వినయంగా గాయకుణ్ణి, “అయ్యా, ఆనందమయి అయిన జగజ్జననిపై ఒక పాట పాడు” అని కోరారు.
గాయకుడు: మహాశయా, మన్నించండి.
శ్రీరామకృష్ణులు (చేతులు జోడించి పదే పదే నమస్కరిస్తూ గాయకునితో), “లేదయ్యా, ఈ విషయంలో నేను నిన్ను బలవంత పెట్టవచ్చు” అంటూ గోపికా భావంలో పాడారు:
ఆ విధముగ పలుకవచ్చు
అధికారముతోడ రాధ
కునుకనునదిలేక రాత్రి
కృష్ణునకై కాచియుండె॥ ఆ ॥
ఇల్లు వాకిలి విడనాడి
తన వారికి కానరాక
రాత్రింబవలిచ్చటనే
వేగివేగి లేచియుండె॥ ఆ ॥
కోపపడ, తాపపడ
అదరింప, బెదరింప
వ్యసనమున కసరుకొన
రాధకు కలదధికారము॥ ఆ ॥
(పిదప గాయకునితో), “అయ్యా, నువ్వు బ్రహ్మమయి తనయుడవు. ఆమె ప్రతి జీవిలోనూ వసిస్తూ ఉంది. నిన్ను కోరే హక్కు ఉంది. పల్లెటూరి వాడొకడు గురువుతో, ‘మిమ్మల్ని కొట్టి మంత్రదీక్ష పుచ్చుకుంటాను’ అని అన్నాడు.”
గాయకుడు (నవ్వుతూ): చెప్పుతో కొట్టా?
శ్రీరామకృష్ణులు నవ్వుతూ, “అంతదూరం పోనక్కర్లేదు” అన్నారు.
మళ్లీ పారవశ్య స్థితిలో మునిగిపోయి, “ప్రవర్తకుడు, సాధకుడు, సిద్ధుడు, సిద్ధసిద్ధుడు” అన్నారు. “నువ్వు సిద్ధుడవా, సిద్ధసిద్ధుడవా? పోనీ, నువ్వు పాడు.”
గాయకుడు రాగాలాపన చేసి ఒక పాట పాడాడు.
శ్రీరామకృష్ణులు: అయ్యా, దీని వలనా ఆనందం కలుగుతోంది.
పాట పూర్తయింది. కొన్నగర్ భక్తులు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నారు. సాధకుడు కూడా చేతులు జోడించి ప్రణామం చేసి, “గోసాయిగారూ!* వెళ్లివస్తాను” అన్నాడు.
శ్రీరామకృష్ణులు ఇంకా పారవశ్య స్థితిలోనే ఉండి జగజ్జననితో మాట్లాడుతున్నారు: “అమ్మా, నేనా లేక నువ్వా? నేను ఏం చేయను? కాదు కాదు, నువ్వే. వాదాలను ఇంతసేపు నువ్వు విన్నావా లేక నేను విన్నానా? కాదు, నేను కాదు. నువ్వే విన్నావు.”
27.8.1 తమోగుణ సాధువు
శ్రీరామకృష్ణులు సాధారణ స్థితికి వచ్చారు. నరేంద్రుడు, భవనాథ్, ముఖర్జీ సోదరులు మొదలైన భక్తులతో మాట్లాడారు. సాధకుని గురించిన ప్రస్తావన వచ్చింది.
భవనాథ్ (నవ్వుతూ): అతడు ఎటువంటి వ్యక్తి?
శ్రీరామకృష్ణులు: తామసిక భక్తుడు.
భవనాథ్: అనేక శ్లోకాలు అప్పగిస్తున్నాడు.
శ్రీరామకృష్ణులు: ఒక సాధువు గురించి నేను, ‘అతడు రాజసిక సాధువు, అతడికి ఆహారం అదీ ఇదీ ఎందుకు పెట్టాలి’ అన్నాను. అందుకు మరో సాధువు, ‘అలా అనకండి. సాధువుల్లో మూడు రకాలవారు ఉన్నారు –సత్త్వగుణ సాధువు, రజోగుణ సాధువు, తమోగుణ సాధువు’ అంటూ నాకు పాఠం గరిపాడు. ఆనాటి నుండి నేను అన్ని రకాల సాధువులనూ గౌరవిస్తాను.
నరేంద్రుడు (నవ్వుతూ): ఎట్లా! ఏనుగు నారాయణుని వలెనా? అందరూ నారాయణులే కదా!
శ్రీరామకృష్ణులు (నవ్వి): విద్య, అవిద్య రూపాలలో భగవంతుడే లీలలు జరుపుతున్నాడు. రెంటికీ నేను నమస్కరిస్తాను. ‘జగజ్జననియే లక్ష్మి, దౌర్భాగ్యుల ఇళ్లలో ఆమే దరిద్రదేవత’ అని దేవీమాహాత్మ్యం పేర్కొంటోంది (భవనాథ్తో) విష్ణుపురాణంలో ఈ విషయం ఉందా?
భవనాథ్ (నవ్వుతూ): నాకు తెలియదండీ. మీరు సమాధిమగ్నులై ఉన్నప్పుడు ఆ స్థితిని అర్థం చేసుకోలేక కొన్నగర్ భక్తులు వెళ్ళిపోబోయారు.
శ్రీరామకృష్ణులు: వారిని కూర్చోమని చెప్పిందెవరు?
భవనాథ్ (నవ్వుతూ): నేనే.
శ్రీరామకృష్ణులు: జనులను తోడ్కొని రావటంలోనూ, అదే విధంగా బయటకు పంపటంలోనూ నువ్వు ఘటికుడవే!
27.8.2 నరేంద్రునికి ఉపదేశం – సత్త్వంలో తమస్సు – హరినామ మాహాత్మ్యం
గాయకునితో నరేంద్రుడు వాదించటం గురించిన ప్రస్తావన వచ్చింది.
ముఖర్జీ: నరేంద్రుడూ వదలిపెట్టలేదు.
శ్రీరామకృష్ణులు: అవును, ఇటువంటి దృఢమైన పట్టుదల ఉండాలి. దీన్నే సత్త్వంలో తమోగుణం అంటారు. జనం చెప్పేదాన్ని అట్లే వినాలా? ‘నీకు ఏది ఇష్టమో అది చెయ్యి’ అని ఒక వెలయాలితో చెప్పాలా ఏమిటి? ఆమె పలుకులు వినాలా ఏమిటి? ఒకసారి రాధకు కోపం వచ్చింది. ఒక సఖీ, “రాధకు అహంకారం వచ్చేసింది” అన్నదట. అందుకు మరో సఖీ, “ఈ ‘అహం’ ఎవరిదను కుంటున్నావు? ఇది శ్రీకృష్ణుడి అహమే సుమా? ఆమె కృష్ణుని అహం చేత గర్వితురాలు అయింది” అని అన్నది.
తరువాత హరినామ మాహాత్మ్యాన్ని గురించిన ప్రస్తావన వచ్చింది.
భవనాథ్: హరినామ స్మరణతో నా దేహం అట్లే తేలిక అయినట్లుగా తోస్తూన్నది.
శ్రీరామకృష్ణులు: పాపాన్ని పరిహరించే దెవరో, ఆయనే హరి. హరి త్రితాపాలను* హరిస్తాడు. చైతన్య మహాప్రభువు హరినామాన్ని ప్రచారం చేశాడు, అందుచేత అది మంచిదే అయి ఉండివుండాలి. ఆయన ఎంత గొప్ప పండితుడు, అవతార పురుషుడు కూడా! ఆయన ప్రచారం చేసినందున అది మంచిదే. (నవ్వుతూ) ఒకప్పుడు పల్లెటూరి వాళ్ళు కొందరు ఒక విందుకు హాజరైనారు. వారిని, ‘మీరు మారేడుపండు పచ్చడి తింటారా?’ అని అడిగేసరికి వారు, ‘పెద్ద మనుష్యులు తిన్నారా? అలా అయితే మాకు వడ్డించండి. వాళ్లు తిని ఉంటే, అది తప్పక రుచికరంగానే ఉంటుంది’ అని అన్నారు. (అందరూ నవ్వారు).
శ్రీరామకృష్ణులు శివనాథశాస్త్రిని చూడగోరారు. అందుకే ముఖర్జీతో, “ఒకసారి శివనాథ్‌ను చూసి రావాలి. మీ బండిలో నన్ను తోడ్కొని వెళితే బాడుగ బండిని ఏర్పాటు చేసుకోవడం తప్పుతుంది” అన్నారు.
ముఖర్జీ: అలాగేనండి. ఒక రోజు ఏర్పాటు చేస్తాం.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): మంచిది. వాళ్లు నన్ను లైక్ చేస్తారా? వాళ్లు (బ్రహ్మసమాజస్థులు) సాకారవాదులను విమర్శిస్తారే!
మహేంద్ర ముఖర్జీ తీర్థయాత్రలకు పోవనున్నాడు. ఆ సంగతి శ్రీరామకృష్ణులకు తెలిపాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అదెలా? భక్తి మొలక కనిపించీ కనిపించకుండా ఉన్నది. అంతలోనే వెళ్లబోతున్నావా? మొదట మొలక, పిదప చెట్టు, ఆ తరువాత పళ్లు. ఇప్పుడే నీతో నాలుగు మాటలు మాట్లాడాను.
మహేంద్ర: స్వామీ, కాస్త తిరిగి రావాలనే ఆసక్తి వచ్చేసింది. త్వరలోనే తిరిగివస్తాను.
27.9 నవమ పరిచ్ఛేదం నరేంద్రుని భక్తి – యదుమల్లిక్ తోటలో శ్రీరామకృష్ణులు
సాయంత్రం ఐదు గంటలు అయివుంటుంది. శ్రీరామకృష్ణులు లేచారు. భక్తులు తోటలో పచార్లు చేస్తూ ఉన్నారు. పలువురు సెలవు పుచ్చుకోనున్నారు.
శ్రీరామకృష్ణులు ఉత్తరం వైపునున్న వసారాలో హాజ్రాతో మాట్లాడుతూ ఉన్నారు. గుహ వంశానికి చెందిన అన్నదా గుహ వద్దకు కొద్దిరోజులుగా నరేంద్రుడు తరచూ పోయివస్తున్నాడు.
హాజ్రా: గుహవంశానికి చెందిన వాడు అన్నదా. కఠోర సాధనలు అనుష్ఠించినట్లుగా విన్నాను. ఆహారం అతి స్వల్పంగా తింటాడట. అన్నం నాలుగు రోజులకు ఒకసారేనట.
శ్రీరామకృష్ణులు: అలాగా! ‘ఏ వేషంతో భగవంతుని పొందాలో ఎవరికి తెలుసు?’
హాజ్రా: నరేంద్రుడు ఆగమనీ* పాడాడు.
శ్రీరామకృష్ణులు (ఉత్కంఠతో): ఎలా ఉన్నాయి.
కిశోరీ ప్రక్కన నిలబడి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు అతడితో, “ఏం నాయనా, బాగున్నావా?” అని అడిగారు.
శ్రీరామకృష్ణులు పశ్చిమాన ఉన్న మొగసాలలో నిలబడి ఉన్నారు. అది శరత్కాలం. కాషాయ రంగు ఫ్లానల్ చొక్కా ధరించి ఉన్నారు. నరేంద్రుడితో, “నువ్వు ఆగమనీ పాడావా?” అని అడుగుతూ మొగసాల నుండి క్రిందికి దిగి నరేంద్రుడితో గంగాతీరానికి వెళ్లారు. ‘మ’ వెంట ఉన్నాడు.
నరేంద్రుడు ఆగమనీ పాడసాగాడు:
మా యమ్మ ఉమ నాకు మనసిచ్చి చెప్పు
నే నడుగు విషయముల విశదంబుగాను॥ మా ॥
ఎన్నడెరుగని వాని ఇంట నొంటరిగ
ఏలాగు కాపురము వెలిగించినావు?
లోకులు మిము గూర్చి పలికెడి పలుకు
వినలేక అవమానమున మ్రగ్గుచుంటి॥ మా ॥
అదియేమె అల్లుడు ఆ వల్లకాటి
బూడిదని పులుముకొని ఊరేగునంట!
అపరంజి బొమ్మవు అమ్మ నీవుగూడ
వానివలె బూడిద పులుముదువంట॥ మా ॥
బిచ్చమెత్తుకు కూడు భక్షించునంట!
నీ అమ్మనై దీని నే నెట్లు భరియింతు?
ఈ మారు నిను పంపమని వచ్చినపుడు
‘అమ్మాయి ఉమ లేదు, పొమ్మందు’ నతని॥ మా ॥
శ్రీరామకృష్ణులు నిలబడే పాటను వింటున్నారు. అలాగే సమాధిమగ్నులైనారు.
ఇంకా చీకటి పడలేదు. సూర్యుడు పశ్చిమాన కొద్దిగా కనబడుతున్నాడు. శ్రీరామకృష్ణులు పారవశ్య స్థితిలో నిలబడి ఉన్నారు. ఆయన సమీపంలో ఉత్తర దిశగా గంగ ప్రవహిస్తూ ఉంది. కాసేపటి క్రితమే నదిలో పోటు ప్రారంభమైంది. ఆయనకు వెనుక వైపు పువ్వులతోట, కుడివైపు నహబత్, పంచవటి. ప్రక్కన నరేంద్రుడు నిలబడి పాడుతున్నాడు.
సంజె చీకట్లు అలుముకుంటున్నాయి. నరేంద్రాది భక్తులు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నారు. శ్రీరామకృష్ణులు గదికి తిరిగి వచ్చి జగజ్జనని నామాన్ని ఉచ్చరిస్తూ ఆమె ధ్యానంలో మునిగిపోయారు.
ప్రక్కన ఉన్న తన ఉద్యాన గృహానికి ఆ రోజు యదుమల్లిక్ వచ్చి ఉన్నాడు. వచ్చినప్పుడల్లా ఒకరిని పంపి శ్రీరామకృష్ణులను అక్కడకు రమ్మని ఆహ్వానించేవాడు. అలవాటు ప్రకారం ఆ రోజు కూడా మనిషిని పంపించాడు. శ్రీరామకృష్ణులూ వెళ్లాలనుకున్నారు. అప్పుడు కలకత్తా నుంచి అధర్సేన్ వచ్చి ఆయనకు ప్రణామం చేశాడు.
యదుమల్లిక్ తోటకు బయలుదేరిన శ్రీరామకృష్ణులు లాటూతో, “లాంతరు వెలిగించి నాతో పాటు రా” అన్నారు.
శ్రీరామకృష్ణులు లాటూతో ఒంటరిగా బయలుదేరారు, ‘మ’ వెనుకగా వస్తున్నాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నారాయణ్‌ని ఎందుకు నీతో తోడ్కొని రాలేదు?
‘మ’ : నేనూ మీతో పాటు రానా?
శ్రీరామకృష్ణులు: వస్తావా? అధర్ ప్రభృతులు ఇక్కడ ఉన్నారు కదా!… ఫర్వాలేదు, పద.
దారిలో ముఖర్జీ సోదరులు నిలబడి ఉన్నారు. శ్రీరామకృష్ణులు ‘మ’ తో, “వాళ్లలో ఎవరైనా వస్తున్నారా?” అని అడిగారు.
శ్రీరామకృష్ణులు (ముఖర్జీ సోదరులతో): సరే, రండి. అందరూ వెళితే సత్వరం తిరిగి రావచ్చు.
శ్రీరామకృష్ణులు యదుమల్లిక్ ఇంటి ముంగిటి గదిలో కూర్చున్నారు. గది అందంగా అలంకరించబడి ఉంది. గదిలోను, వసారాలోను దీపాలు వెలుగుతున్నాయి. యదుమల్లిక్ చిన్నపిల్లలతోను, స్నేహితులతోను ఆనందంగా కూర్చుని ఉన్నాడు. పనివాళ్లు కొందరు ఆయన ఆజ్ఞలకై వేచివున్నారు, కొందరు విసురుతున్నారు. యదు నవ్వుతూ కూర్చుని శ్రీరామకృష్ణులతో మాట్లాడాడు. చిరపరిచితుడిలా ప్రవర్తించాడు.
యదు, చైతన్యదేవుల భక్తుడు. అతడు స్టార్ థియేటర్లో చైతన్య లీల అనే నాటకాన్ని చూసివచ్చాడు. దాన్ని గురించి శ్రీరామకృష్ణులతో ప్రస్తావించాడు. “చైతన్య లీల అనే క్రొత్త నాటకం వేశారు, బాగుంది” అన్నాడు.
శ్రీరామకృష్ణులు ఆనందంగా చైతన్య లీల కథ వింటూ ఉన్నారు. మధ్య మధ్యలో ఆ పిల్లల చేతులు పుచ్చుకుని ఆడుతున్నారు. ‘మ’, ముఖర్జీ సోదరులు ప్రక్కన కూర్చుని ఉన్నారు.
అధర్సేన్ కలకత్తా పురపాలక సంఘంలో వైస్ ఛైర్మన్ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ఉద్యోగానికి నెల జీతం వేయి రూపాయలు. అధర్ వయస్సు ముప్ఫై ఏళ్లు.
శ్రీరామకృష్ణులు (యదుతో): ఏమయ్యా, అధర్కు ఆ ఉద్యోగం దొరకలేదా?
అధర్కు అందుకుతగ్గ వయస్సు కాలేదని యదు, అతడి మిత్రులు చెప్పారు. కాసేపయ్యాక యదు శ్రీరామకృష్ణులతో, “భగవంతుని గురించి ఏమైనా పాట పాడండి” అన్నాడు.
శ్రీరామకృష్ణులు చైతన్యుని గురించి పాడారు.
నా గౌరాంగుని నాట్యము గనుడు
శ్రీవాసుని గృహప్రాంగణంబున…..
అందమైన బృందావనము
అట్టె పారజూచు గోరా!॥ అం ॥
కనులవెంట ధారగట్టి
కారు నీరు కాల్వలగుచు
అమితమైన సంతసమున
ఆడు, పాడు, నవ్వు, ఏడ్చు॥ అం ॥
అడవి దలచు బృందావనిగ
కడలి దలచు యమునా నదిగ
చేరి శ్రీహరి భక్తిగోరి
దొరలు, పుడమి పైనబడుచు॥ అం ॥
27.10 దశమ పరిచ్ఛేదం రాఖాల్ కొరకు కలత – యదుమల్లిక్, భోలానాథ్
పాటలు పూర్తికాగానే ముఖర్జీ సోదరులు లేచారు. శ్రీరామకృష్ణులూ లేచారు, కాని భావపారవశ్య స్థితిలో ఉన్నారు. వరండాలోకి రాగానే సమాధిమగ్నులై అట్లే నిలబడిపోయారు. అక్కడ దీపాలు వెలుగుతున్నాయి.
తోట కావలివాడు ఒక భక్తుడు. అతడు కొన్ని వేళల్లో శ్రీరామకృష్ణులను ఆహ్వానించి ఆహారం సమర్పించటం కద్దు. శ్రీరామకృష్ణులు సమాధి స్థితిలో నిలబడి ఉండటం చూసి అతడు వచ్చి పెద్ద విసనకర్రతో ఆయనకు విసిరాడు.
తోట పర్యవేక్షకుడు రతన్ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు.
శ్రీరామకృష్ణులు మామూలు స్థితిలోకి వచ్చారు. నారాయణా, నారాయణా అంటూ వారితో మాట్లాడారు. తరువాత భక్తులతో కలిసి దక్షిణేశ్వర ఆలయంలోకి ప్రధాన ద్వారం గుండా వెళ్లారు. ఈలోపు ముఖర్జీ సోదరులు అక్కడకు వచ్చి నిలబడి ఉన్నారు.
అధర్ శ్రీరామకృష్ణులను వెదుకుతూ ఉన్నాడు.
ముఖర్జీ (నవ్వుతూ): మహేంద్రబాబు పరుగున వచ్చేశాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ ముఖర్జీతో): ఇతడితో (‘మ’ తో) సన్నిహితంగా మెలగండి.
ప్రియ ముఖర్జీ (నవ్వుతూ): ఇకమీదట ఈయనే మాకు ఉపాధ్యాయుడు.
శ్రీరామకృష్ణులు: గంజాయి త్రాగే వ్యక్తి అటువంటి మరో వ్యక్తిని చూస్తే సంతోషిస్తాడు. పెద్ద మనుష్యులు వచ్చినా కూడా పట్టించుకోడు. కాని గంజాయి త్రాగే వాడు వస్తే మాత్రం, అతడు అతిబీదవాడైనా సరే అతణ్ణి అట్లే ఆలింగనం చేసుకుంటాడు. (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు తోట బాటగుండా పశ్చిమం వైపు నడుస్తూ తమ గదికి వస్తున్నారు. దారిలో, “యదు ఒక మంచి హైందవుడు. భాగవతంలో నుంచి అనేక విషయాలు చెబుతాడు” అన్నారు.
‘మ’ కాళికాలయానికి వెళ్లి జగజ్జననికి మ్రొక్కి చరణామృతాన్ని పుచ్చుకున్నాడు. శ్రీరామకృష్ణులు కూడా వచ్చి జగజ్జననికి ప్రణమిల్లారు.
రాత్రి దాదాపు తొమ్మిది గంటలయింది. ముఖర్జీ సోదరులు శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి సెలవు పుచ్చుకున్నారు. అధర్, ‘మ’ నేల మీద కూర్చుని ఉన్నారు.
శ్రీరామకృష్ణులు అధర్తో రాఖాల్ గురించి చెప్పసాగారు. రాఖాల్ బలరామ్‌తో బృందావనంలో ఉన్నాడు. అతడికి సుస్తీగా ఉన్నదని జాబు వచ్చింది. ఈ వార్త విని, రెండు మూడు రోజులుగా శ్రీరామకృష్ణులు కలతచెంది ఉన్నారు; మధ్యాహ్న భోజన సమయాల్లో హాజ్రా వద్దకెళ్లి, “అతడికి ఏదైనా జరుగుతుందా?” అని అడిగి పసిపిల్లవాడిలా ఏడ్చారు. అధర్, రాఖాల్కు రిజిస్టరు ఉత్తరం వ్రాశాడు. కాని నేటి వరకు ఎలాటి బదులూ రాలేదు.
శ్రీరామకృష్ణులు (అధర్తో): నారాయణ్‌కు బదులు వచ్చింది, నీకు మాత్రం రాలేదా?
అధర్: అవునండీ, ఇంకా రాలేదు.
శ్రీరామకృష్ణులు: ‘మ’ కు కూడా వచ్చింది.
చైతన్య లీల నాటకాన్ని శ్రీరామకృష్ణులు చూడటాన్ని గురించి ప్రస్తావన వచ్చింది.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): రూపాయి కుర్చీలో కూర్చుంటేనే చాలు, బాగా చూడవచ్చునని యదు చెప్పాడు.* ఒకసారి మేము పానీహాటీకి వెళ్ళాలని మాట్లాడుకుంటున్నాం. ప్రయాణీకులతో బాగా క్రిక్కిరిసి ఉన్న పడవలోనే వెళ్దామని వాదిస్తాడు యదు. (అందరూ నవ్వారు)
“ఇంతకు మునుపు భగవంతుని గురించిన విషయాలు ఒకింత వినేవాడు. ఒక భక్తుడు అతడి వద్దకు తరచూ వెళ్లేవాడు. ఇప్పుడల్లా యదును ఎక్కువగా చూడలేకపోతున్నాను. కొందరు భట్రాజులు సదా అతణ్ణి పరివేష్టించి ఉన్నారు. వాళ్లు ఇతణ్ణి పూర్తిగా పాడుచేశారు.
“యదు పరమ పిసినారి. ఇంటికి వెళ్లగానే బండి బాడుగ ఎంత అని అడుగుతాడు. అందుకు నేను “దాన్ని తెలుసుకుని నువ్వేం చేస్తావు? నువ్వు రెండున్నర రూపాయలు ఇస్తే చాలు” అంటాను. అది వినగానే బదులు చెప్పక డబ్బు ఇచ్చేస్తాడు – రెండున్నర రూపాయలే.” (అందరూ నవ్వారు)
కాళికాలయ దక్షిణపు వైపు ఒక మరుగుదొడ్డి కట్టదలచారు. ఆ విషయంగా యదుమల్లిక్తో గొడవ జరిగింది. మరుగుదొడ్డిని ఆనుకొనే యదు తోట ఉంది.
ఆలయ కోశాధికారియైన భోలానాథ్ న్యాయమూర్తి వద్దకు వ్యాజ్యెం తెచ్చాడు. అయితే వ్యాజ్యెం తెచ్చాక అతడికి భయం పట్టుకుంది. అతడు శ్రీరామకృష్ణులతో దీన్ని గురించి తెలిపాడు. అందుకు ఆయన “అధర్ డిప్యూటీ మేజిస్ట్రేటు. అతడు వచ్చినప్పుడు అడుగుతానులే” అన్నారు. రామ్ చక్రవర్తి, భోలానాథ్‌ను శ్రీరామకృష్ణుల వద్దకు తీసుకువచ్చి అంతా వివరంగా తెల్పి, “వ్యాజ్యెం పెట్టినప్పటి నుండి ఇతడికి భయం పట్టుకుంది” అన్నాడు.
శ్రీరామకృష్ణులు కలతతో పడకనుంచి లేచి నిలబడి, “మీరు వివరంగా అంతా అధర్కు చెప్పండి” అన్నారు. అధర్, అంతా విని, “ఏమి లేదు, కొద్ది కష్టంతో బయటపడవచ్చు” అన్నాడు. శ్రీరామకృష్ణులకు పెద్ద భారం దించినట్లయింది.
రాత్రి చాల ప్రొద్దుపోయింది. శ్రీరామకృష్ణులకు నమస్కరించి అధర్ సెలవు పుచ్చుకున్నాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నారాయణ్‌ని తోడ్కొనిరా.