18.1 ప్రథమ పరిచ్ఛేదం రామచంద్రదత్తా తోటలో భక్తులతో శ్రీరామకృష్ణులు
బుధవారం, డిసెంబర్ 26, 1883
రాంచంద్రదత్తా క్రొత్త తోటను సందర్శింప శ్రీరామకృష్ణులు వెళ్లారు. శ్రీరామకృష్ణులను అవతారపురుషునిగా రామ్ పరిగణిస్తాడు. దక్షిణేశ్వరానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఈ మధ్యే అతడు సురేంద్రుని తోటకు ప్రక్కన ఒక తోటను కొనుగోలు చేశాడు.
బండిలో మణిలాల్ మల్లిక్, ‘మ’, ఒకరిద్దరు భక్తులు ఉన్నారు. మణిమల్లిక్ బ్రహ్మసమాజ సభ్యుడు. బ్రహ్మసమాజస్థులు అవతారతత్త్వాన్ని అంగీకరించరు.
శ్రీరామకృష్ణులు (మణిలాల్‌తో): భగవంతుని ధ్యానించగోరితే, మొదట ఆయనను ఉపాధిరహితునిగా ధ్యానించ ప్రయత్నించటం మంచిది. ఆయన ఉపాధిరహితుడు, మనోవాక్కులకు అతీతుడు. కాని ఈ ధ్యానంలో పరిపూర్ణత్వం సిద్ధించటం ఎంతో కష్టం.
“భగవంతుడు మానవుడిగా అవతరిస్తే అప్పుడు (ఆయనను ఆ రూపంలో) ధ్యానించటం ఎంతో సులభం. మానవులలో నారాయణుడు ఉన్నాడు. దేహం ఒక తెర మాత్రమే – లాంతరులో దీపం వెలుగుతున్నట్లు; లేక అద్దాల అలమారలో అతివిలువైన వస్తువులు ఉన్నట్లుగా.”
శ్రీరామకృష్ణులు బండి నుండి దిగగానే మొదట రామ్ తదితర భక్తులతో తులసివనం చూడబోయారు. అక్కడకు వెళ్లగానే, “ఆహా, సుందరమైన ప్రదేశం. ఇక్కడ చాలా బాగా భగవత్ చింతన జరుగుతుంది” అన్నారు.
తరువాత శ్రీరామకృష్ణులు కొలనుకు దక్షిణాన ఉన్న గదిలో కూర్చున్నారు. రామ్ ఒక పళ్లెంలో దానిమ్మ, కమలాలు మొదలైన పళ్లను, కొన్ని మధుర భక్ష్యాలను శ్రీరామకృష్ణులకు సమర్పించాడు. ఆయన వాటిని భక్తులతో కలిసి ఆనందంగా ఆరగించారు. కాసేపయ్యాక తోటను పూర్తిగా తిరిగి చూశారు. తరువాత ప్రక్కనే ఉన్న సురేంద్రుని తోటకు బయలుదేరారు. కాస్త దూరం నడిచి, పిదప బండిలో అక్కడకు వెళ్లాలి.
భక్తులతో కలిసి నడుస్తూ పోతూ ఉన్నప్పుడు ఒక చెట్టు క్రింద ఒక సాధువు ఒంటరిగా మంచం మీద కూర్చుని ఉండటం చూశారు. వెంటనే ఆతడి వద్దకెళ్లి ఆనందంగా హిందీలో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (సాధువుతో): మీరు ఏ సంప్రదాయానికి చెందినవారు? గిరి, పురి లాంటి వాటిలో ఏ సంప్రదాయం?
సాధువు: జనం నన్ను పరమహంస అని పిలుస్తారు.
శ్రీరామకృష్ణులు: భేష్, భేష్! శివోఽహం – అది మంచిది. కాని ఒక విషయం గుర్తుంచుకోండి. అహర్నిశలూ ఈ సృష్టి స్థితి లయాలన్నీ జరుగుతూ ఉన్నవే, ఇవన్నీ ఆయన శక్తి వల్లనే జరుగుతున్నాయి. ఈ ఆద్యాశక్తీ, బ్రహ్మమూ అభిన్నులు. బ్రహ్మం లేకుండా శక్తి లేదు. ఇది ఎలాంటిదంటే, నీరు లేకుండా అలలు ఉండవు, వాద్యం లేకుండా వాయిద్యం ఉండదు. అదే విధంగా ఈ జగల్లీలలో భగవంతుడు మనలను ఉంచినంత వరకు ద్వైతం అనే భావనా ఉంటుంది. శక్తిని అంగీకరిస్తే బ్రహ్మాన్నీ అంగీకరించవలసిందే. రాత్రి అనే ఎరుక కలుగగానే పగలు అనే ఎరుకా కలుగుతుంది. జ్ఞానమనే ఎరుక ఉంటే, అజ్ఞానం ఎరుకా ఉంటుంది.
జ్ఞానం, అజ్ఞానం వీటికి అతీతమైనది బ్రహ్మం – ఈ స్థితినీ భగవంతుడు మనకు చూపుతాడు. దానిని నోటితో చెప్పజాలం. ఏది ఉన్నదో, అది ఉన్నది.
ఇలా కాసేపు మాట్లాడి శ్రీరామకృష్ణులు బండికేసి వెళ్లారు. సాగనంపటానికి శ్రీరామకృష్ణులతో బండి దాకా సాధువు వచ్చాడు. ఇద్దరూ చిరకాల మిత్రుల్లా భుజాల మీద చేతులు వేసుకొని నడిచివెళ్లారు.
శ్రీరామకృష్ణులను సాగనంపి సాధువు తన చోటుకి తిరిగి వెళ్లాడు.
శ్రీరామకృష్ణులు సురేంద్రుని తోటలోకి వచ్చి కూర్చోగానే ఆ సాధువు గురించి మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: ఆ సాధువు చాలా మంచివాడు. (రామ్‌తో) నువ్వు దక్షిణేశ్వరానికి వచ్చేటప్పుడు ఆతడినీ తోడ్కొనిరా. అతడు ఉత్తముడు. ‘మంచివాడు కాకుంటే మంచివాణ్ణి తెలుసుకోలేడు’ అని ఒక పాటలో వస్తుంది.
“అతడు నిరాకారవాది. అది మంచిదే. భగవంతుడు సాకారుడు, నిరాకారుడు, ఇంకా ఎన్నో రూపాలు ఉన్నవాడు. నిత్యం ఎవరికి చెందినదో ఆయనదే లీల కూడా. మనోవాక్కులకు అతీతమైన ఆయనే పలు రూపాలు ధరించి కార్యాలు నిర్వహిస్తున్నాడు. ఆయనే ఓం నుంచి ‘ఓం శివ’, ‘ఓం కాళి’, ‘ఓం కృష్ణ’ అయి ఉన్నాడు. విందుకు అతిథులను తోడ్కొని రావటానికి యజమాని తన పిల్లవాణ్ణి పంపుతాడు అనుకోండి. ఆ పిల్లవాని పట్ల వారు ఎంతో ప్రేమ కనబరుస్తారు! ఎందుకంటే అతడు ఆ పెద్దమనిషి కుమారుడో, మనుమడో కదా!”
సురేంద్రుని తోటలోనూ శ్రీరామకృష్ణులు కాస్త ఉపాహారం స్వీకరించారు. తరువాత భక్తులతో దక్షిణేశ్వరానికి బయలుదేరారు.
18.2 ద్వితీయ పరిచ్ఛేదం ఈశాన్ ఇంటికి శుభాగమనం
గురువారం, డిసెంబర్ 27, 1883
దక్షిణేశ్వర కాళికాలయంలో మంగళహారతుల సుమధుర నాదం వినవస్తోంది. దానితోబాటు నహబత్తులో నుండి ఉదయరాగాలతో సంగీత వాయిద్యాలు మ్రోగసాగాయి. శ్రీరామకృష్ణులు లేచి తమ మధుర కంఠస్వరంతో భగవన్నామాలను ఉచ్చరించసాగారు. గదిలోని దేవీదేవతల చిత్రపటాలకు ప్రణామం చేశారు. గదికి పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలోకి వెళ్లి గంగానదిని దర్శించారు. కొందరు భక్తులు దక్షిణేశ్వరంలోనే బసచేసి ఉన్నారు. కాలకృత్యాలు తీర్చుకుని వారు ఒక్కొక్కరుగా వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశారు. రాఖాల్ శ్రీరామకృష్ణులతో అక్కడే ఉన్నాడు. బాబూరాం గత సాయంత్రం వచ్చాడు. ‘మ’ రెండు వారాలుగా అక్కడే బసచేసి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు స్నానం చేసి కలకత్తాకు వెళ్లటానికి సిద్ధంగా ఉన్నారు.
శ్రీరామకృష్ణులు ‘మ’ ను పిలిచి, “ఈశాన్ నన్ను ఆహ్వానించాడు. బాబూరాం నాతోబాటు వస్తున్నాడు. నువ్వు కూడా రా” అన్నారు. శ్రీరామకృష్ణులతో బయలుదేర ‘మ’ తయారయ్యాడు.
అప్పుడు సమయం ఉదయం ఎనిమిది గంటలు. శ్రీరామకృష్ణులను తీసుకు వెళ్లటానికి బండి నహబత్తు సమీపంలో ఆగింది. నాలుగు వైపులా పువ్వుల మొక్కలు. కంటికి ఎదురుగా గంగానది. అన్ని దిశలూ ఆనందమయంగా ఉన్నాయి. శ్రీరామకృష్ణులు దేవీదేవతల చిత్రపటాలకు ప్రణమిల్లారు. తరువాత జగజ్జనని నామాన్ని జపిస్తూ బండిలో ఎక్కారు. ‘మ’, బాబూరామ్లు ఆయన వెంట వెళ్ళారు. శ్రీరామకృష్ణుల ఉన్ని శాలువ, టోపీ, మసాలా దినుసుల సంచీ పుచ్చుకొన్నారు. శీతకాలం కావటంతో సాయంత్రం పూట కప్పుకోవటానికి ఆయనకు శాలువా కావలసి ఉంది.
శ్రీరామకృష్ణులు దరహాస వదనంతో ఆనందంగా మాట్లాడుతూ బయలుదేరారు. తొమ్మిది గంటలకు బండి కలకత్తా చేరుకుంది. శ్యాంబజారు మీదుగా మెఛువా బజారు కూడలి వద్దకు వచ్చింది. ‘మ’ కు ఈశాన్ ఇల్లు తెలుసు. కూడలిలో తిరిగి బండిని ఈశాన్ ఇంటి ముందు నిలపమని చెప్పాడు.
ఈశాన్ వికసిత వదనంతో శ్రీరామకృష్ణులను ఆహ్వానించి అతిథుల గదిలోకి తీసుకుని వెళ్లాడు. అతడితో అతడి బంధువులూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు భక్తులతో వెళ్లి కూర్చున్నారు.
యోగక్షేమాలు విచారించుకున్నాక శ్రీరామకృష్ణులు ఈశాన్ కుమారుడు శ్రీశ్తో మాట్లాడ సాగారు. అతడు ఎం.ఏ., బి.ఎల్. పట్టాలు పుచ్చుకుని అలీపూర్‌లో న్యాయవాదిగా ఉంటున్నాడు. ఎంట్రన్స్, ఎఫ్.ఎ.లో విశ్వవిద్యాలయంలో ప్రప్రథముడుగా ఉత్తీర్ణుడయ్యాడు. నిరాడంబరంగా ఉన్నాడు. అతణ్ణి చూస్తే అతడికి ఏమీ తెలియదని అనుకుంటారు. అతడికి దాదాపు ముప్ఫై ఏళ్లు ఉంటాయి. చేతులు జోడించి అతడు శ్రీరామకృష్ణులకు నమస్కరించాడు. ఇటువంటి శాంత స్వభావంగల వాణ్ణి చూడనే లేదని ‘మ’ అతణ్ణి శ్రీరామకృష్ణులకు పరిచయం చేశాడు.
18.2.1 కర్మ బంధనాలకు, పాపకర్మలకు దివ్యౌషధం కర్మయోగం
శ్రీరామకృష్ణులు (శ్రీశ్తో): నువ్వు ఏం చేస్తూవుంటావు నాయనా?
శ్రీశ్: నేను అలీపూర్‌లో న్యాయవాదిగా ఉంటున్నాను.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఇటువంటి వ్యక్తి న్యాయవాదిగా ఉండటమా?
(శ్రీశ్తో): నువ్వు ఏదన్నా అడగాలనుకుంటున్నావా? ‘సంసారంలో అనాసక్తుడై జీవించడం ఎలా?’ వంటి ప్రశ్నలు ఏవన్నా అడగాలా?
శ్రీశ్: సంసారంలో కర్మలు చేస్తూ లోకులు అనుచిత కార్యాలకు పాల్పడతారు. కొందరు పాపకర్మలను, కొందరు పుణ్యకర్మలను చేస్తున్నారు. ఇదంతా పూర్వకర్మల ఫలితమా? దేని కారణంగా అలా చేయవలసి వస్తుంది?
శ్రీరామకృష్ణులు: కర్మలు నిర్వర్తించటం ఎన్ని రోజుల వరకు? భగవంతుణ్ణి పొందనంత వరకే. ఆయనను పొందితే అన్నీ తొలగిపోతాయి. అప్పుడు మనిషి పాపపుణ్యాలకు అతీతుడవుతాడు. పండు కానరాగానే పువ్వు రాలిపోతుంది. ఫలం నిమిత్తమే పువ్వు పూస్తూ ఉంది.
“సంధ్యాది కర్మలు ఎంతవరకూ? భగవన్నామం ఉచ్చరించగానే రోమాంచితం కావటం, కళ్లల్లో అశ్రుధారలు స్రవించటం జరుగనంతవరకే. ఇవన్నీ భగవదనుభూతి లక్షణాలు, భగవంతుడి పట్ల శుద్ధభక్తి పొందినందునకైన లక్షణాలు. భగవంతుణ్ణి తెలుసుకోవటంతో పాపపుణ్యాలకు అతీతుల మవుతాము.
ప్రసాదు పలుకును ‘నేను భక్తి ముక్తులు
రెంటినీ శిరమున ధరియింతును
నేను కాళీ, బ్రహ్మముల మర్మమును గ్రహించి
ధర్మాధర్మముల నన్నిటినీ వదలివేచితిని.’
“భగవంతుణ్ణి ఎంతగా సమీపిస్తావో ఆ మేరకు కర్మలను ఆయనే తగ్గించి వేస్తాడు. కోడలు గర్భం ధరిస్తే అత్తగారు ఆమె పనులను క్రమక్రమంగా తగ్గించి వేస్తుంది; పది నెలలు నిండగానే పనులను పూర్తిగా తగ్గించి వేస్తుంది. బిడ్డ పుట్టిన తరువాత కోడలు బిడ్డ ఆలనాపాలనలోనే మునిగి ఉంటుంది. బిడ్డతోనే ఆనందం చెందుతూ ఉంటుంది.
శ్రీశ్: సంసారంలో ఉంటూ భగవంతుని వైపుగా సాగటం ఎంతో కష్టం.
18.2.2 గృహస్థులకు బోధ – అభ్యాసయోగం, ఏకాంత సాధన
శ్రీరామకృష్ణులు: ఎందుకు? అభ్యాస యోగం ఉంది కదా! కామార్పుకూర్లో వడ్రంగి కుటుంబాల స్త్రీలు అటుకులు అమ్ముతారు. వాళ్లు తమ పని చేసుకుంటూ ఎన్ని విషయాలు గమనిస్తూ ఉంటారో తెలుసా? రోకలి, రోలులో పడుతూ ఉంటుంది; ఒక చేత్తో వడ్లను త్రోస్తూ ఉంటారు; మరో చేత్తో బిడ్డను ఒడిలో ఉంచుకొని పాలుపడుతూ ఉంటారు. ఈ మధ్యలో ఖాతాదారులు వస్తూ ఉంటారు. ఇక్కడ రోకలి పడుతూ ఉంటుంది, అదే సమయంలో వాళ్లు వారితో బేరం చేస్తూనే ఉంటారు; ‘మీరు ఇవ్వవలసిన బాకీ ఇచ్చివేసిన తరువాతనే సరుకులను తీసుకువెళ్ళండి’ అంటుంటారు.
“చూశావా! పాలు పట్టడం, రోకలి వేయటం, రోలులోనికి వడ్లను త్రోస్తూండటం, బియ్యం నుండి నూకను వేరుచేసి భద్రపరచటం వీటన్నిటికీ తోడు ఖాతాదారులతో మాట్లాడటం – ఈ కార్యాలన్నీ ఏకకాలంలో చేస్తూ ఉంటారు. ఇదే అభ్యాసయోగం. రోలులో చేతిని పోనిస్తారు; కాని రోకలి చేతి మీద పడకుండా ఉండాలి కదా, కనుక వారి మనస్సు పదహారులో పదిహేను వంతులు రోకలి మీదే ఉంటుంది.* తక్కిన ఒక వంతులో బిడ్డకు పాలు పట్టడం, ఖాతాదారులతో మాట్లాడటం మొదలైనవి. అదే విధంగా సంసారంలో ఉన్నవాళ్లు పదహారులో పదిహేను వంతులు మనస్సును భగవంతునిపైన నిలపటం మంచిది. లేకుంటే సర్వనాశనం అయిపోతుంది; యముడి చేతిలో చిక్కుకుంటారు. ఒక వంతు మనస్సుతో ఇతర పనులన్నీ చేసుకోవాలి.
“జ్ఞానం పొందిన తదనంతరం సంసారంలో ఉండవచ్చు. కాని మొదట జ్ఞానం సముపార్జించాలి. సంసారమనే నీటిలో మనస్సు అనే పాలను ఉంచితే అవి కలిసిపోతాయి; కనుక మనస్సు అనే పాలను పెరుగుగా మార్చి ఏకాంతమైన చోట ఉంచి చిలికి, వెన్న తీసి, దాన్ని సంసారమనే నీటిలో ఉంచాలి.
“ఇలా చేశాక భయం ఉండదు. అందుచేతనే సాధన అవసరం. ప్రాథమిక దశలో ఏకాంతవాసం చేయటం ఎంతో ఆవశ్యకం. రావిచెట్టు మొక్కగా ఉన్నప్పుడు దాని చుట్టూ కంచె కట్టాలి. లేకుంటే ఆవులు, మేకలు మేసి వేస్తాయి. కాని చెట్టు బోదె ముదిరిన తరువాత కంచెను తీసివేయవచ్చు. అప్పుడు దానికి ఒక ఏనుగును కట్టివేసినా చెట్టుకు ఏమీ అవదు.
“కాబట్టి ప్రారంభదశలో అప్పుడప్పుడు ఏకాంతంలో గడపాలి. సాధన అవసరం. అన్నం తినాలి; ఊరకే కూర్చుని, ‘కట్టెలలో అగ్ని ఉంది, ఆ అగ్నితో బియ్యం ఉడుకుతుంది’ అంటూ ఉంటే బియ్యం ఉడుకుతుందా? మొదట రెండు కట్టెలను తీసుకువచ్చి ఒకదానితో ఒకటి రుద్దాలి. అప్పుడే కదా అగ్ని రాజుకుంటుంది.
సిద్ధి* త్రాగితే మత్తు కలుగుతుంది. ఆనందం కలుగుతుంది. కాని దాన్ని త్రాగనూ లేదు, ఏమీ చేయనూ లేదు; ఊరకే కూర్చుని ‘సిద్ధి సిద్ధి’ అంటున్నావు. అందుచేత మత్తు కలుగుతుందా? ఆనందం కలుగుతుందా?
18.2.3 భగవంతుణ్ణి తెలిపేదే జ్ఞానం, తక్కినదంతా మిథ్యయే – “పాలు త్రాగాలి”
వేలాది పుస్తకాలు చదువవచ్చు. భగవంతుని పట్ల భక్తి కలుగకుంటే, ఆయనను పొందాలనే అభిలాష లేకుంటే అంతా మిథ్యయే. వివేక వైరాగ్యాలు లేని కేవల పండితుడి దృష్టి కామినీకాంచనాలపైనే ఉంటుంది. రాబందు ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటుంది, కాని దాని దృష్టి క్రిందపడి ఉన్న శవాల మీదనే ఉంటుంది.
“ఏ జ్ఞానాన్ని పొందితే భగవంతుణ్ణి తెలుసుకోగలమో అదే జ్ఞానం, తక్కినవన్నీ మిథ్యయే. సరే, భగవంతుని గురించి నువ్వు ఏమనుకుంటున్నావు?”
శ్రీశ్: మహాశయా, సర్వం తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారనే మేరకు ఏదో అర్థం అవుతోంది. ఆయన సృష్టిని చూసినప్పుడు ఆయన గురించిన జ్ఞానం తెలియవస్తుంది. ఒక ఉదాహరణ చెబుతాను. శీతల ప్రాంతాలలో చేపలు మొదలైన నీటి జంతువులు జీవించటానికైన అద్భుత ఏర్పాట్లు చూడండి. చలి పెరిగేకొద్దీ నీరు సంకోచిస్తుంది. దీన్లో ఆశ్చర్యం ఏమిటంటే మంచుగడ్డగా మారటానికి కాస్త మునుపు నీరు తేలిక అవుతుంది, వ్యాకోచిస్తుంది. వాతావరణం అతిశీతలమైనప్పటికీ నీటిలో చేపలు అనాయాసంగా జీవించవచ్చు. నీటి ఉపరితలం శీతల కారణంగా ఘనీభవిస్తుంది. కాని క్రింది భాగం నీరు ద్రవరూపంలోనే ఉంటుంది. చలిగాలి వీచితే దాని ప్రభావం మంచుపొర మీద మాత్రమే పడుతుంది, క్రింది నీరు వెచ్చగానే ఉంటుంది.
శ్రీరామకృష్ణులు: జగత్తును చూస్తేనే భగవంతుడు ఉన్నాడని తెలియవస్తుంది. కాని భగవంతుని గురించి వినటం ఒకటి, ఆయనను చూడటం మరొకటి, దానిని కూడా మించినది ఆయనతో మాట్లాడటం. పాలను గురించి కొందరు విని ఉంటారు; కొందరు చూసి ఉంటారు; కొందరు త్రాగి ఉంటారు. చూస్తే ఆనందం కలుగుతుంది; అయితే పాలను త్రాగితేనే కదా బలం వస్తుంది, ఒంటికి పుష్టి చేకూరుతుంది! భగవద్దర్శనం కలిగితేనే కదా ప్రశాంతత దక్కుతుంది! ఆయనతో మాట్లాడితేనే కదా ఆనందం కలుగుతుంది, బలం అధికరిస్తుంది!
18.2.4 అంతా సకాలంలో జరుగుతుంది – ముఖ్తార్నామా – మర్కట, మార్జాల కిశోర న్యాయాలు
శ్రీశ్: భగవంతుణ్ణి ప్రార్థించటానికి తీరిక దొరకటం లేదే!
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అది నిజమే. వేళ రాకుండా ఏదీ జరుగదు. ఒక బిడ్డ నిద్రపోయే ముందు తల్లితో, ‘అమ్మా, నాకు బయలుకు వచ్చేటప్పుడు నన్ను లేపు’ అన్నది. అందుకు తల్లి బిడ్డతో, ‘నాయనా, ఆ ఎరుకే నిన్ను లేపుతుంది. నేను లేపనక్కర లేదు’ అన్నది.
“ఎవరికి ఏమి ఇవ్వాలో భగవంతుడు నిర్ణయించే ఉన్నాడు. ఒక అత్తగారు తన కోడళ్లకు ఒక మట్టిపాత్రతో అన్నం కొలిచి పెట్టేది. ఎప్పుడు చూసినా తక్కువగానే పెడుతుండేది. ఒక రోజు ఆ మట్టిపాత్ర విరిగిపోయింది. కోడళ్లు ఎంతగానో సంబరపడిపోయారు. వెంటనే అత్తగారు, ‘అమ్మాయిలూ, మీరు అలా ఎగిరి గెంతులు వెయ్యకండి. అరచేతితోనే నేను అదే కొలతలో అన్నం పెట్టగలను’ అన్నది.
(శ్రీశ్తో) “నువ్వు ఏం చెయ్యగలవు? భగవంతుని పాదపద్మాల వద్ద అన్నిటిని సమర్పించు. ఆయనకు ముఖ్తార్నామా ఇవ్వు. ఆయన ఏది మంచిదిగా భావిస్తాడో దాన్ని చేయనివ్వు. ఎవరైనా పెద్దమనిషికి బాధ్యత ఒప్పగిస్తే ఆయన ఎన్నటికీ వంచించడు.
“సాధనల వల్ల ప్రయోజనం ఉండనే ఉంది. కాని రెండు రకాలైన సాధకులు ఉన్నారు. ఒక రకం సాధకులు మర్కట కిశోర స్వభావులు; మరొక రకం వారు మార్జాల కిశోర స్వభావులు. మర్కట కిశోరం ఎలాగో శ్రమపడి తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. అదే విధంగా కొందరు సాధకులు ఇంత జపం చేయాలి, ఇంత ధ్యానం చేయాలి, ఇంత తపస్సు చేయాలి, అప్పుడే భగవంతుని దర్శించగలమని భావిస్తూ ఉంటారు. ఇట్టి సాధకులు స్వయంకృషితో భగవంతుని అందుకోవటానికి పాటుపడుతూ ఉంటారు.
“కాని మార్జాల కిశోరం తానే స్వయంగా తల్లిని పట్టుకోలేదు. అది నేల మీదే పడి ఉండి, మ్యావ్ మ్యావ్ అంటూ అరుస్తూంటుంది; తల్లే ఏమైనా చేయనీ అని తల్లి మీద భారం వదలివేస్తుంది. తల్లిపిల్లి కొన్ని సమయాలలో కూనను పరుపు మీద పెడుతుంది, కొన్ని సందర్భాలలో డాబాపై కట్టెలగుట్ట చాటున పెడుతుంది. తల్లి పిల్లి, కూనను నోటితో కరుచుకొని ఎక్కడెక్కడికో తీసుకుపోయి పెడుతుంది. కూనలకు స్వయంగా తల్లిని పట్టుకోవటం తెలియదు. అదే విధంగా కొందరు సాధకులు ఇంత జపం, ఇంతసేపు ధ్యానం అని లెక్కలు వేసుకొని సాధన చేయలేరు. వీరు కేవలం వ్యాకులతతో విలపిస్తూ భగవంతుని ప్రార్థిస్తారు. భగవంతుడు వీరి విలాపాన్ని వింటూ ఉపేక్షించలేడు. వచ్చి దర్శనం ఇస్తాడు.”
18.3 తృతీయ పరిచ్ఛేదం
భోజనం సమయం అయింది. శ్రీరామకృష్ణుల భోజన ఏర్పాట్లలో ఈశాన్ సతమతమవు తున్నాడు; ఇంటి లోపలికి వెళ్లి ఏర్పాట్లనన్నిటినీ పర్యవేక్షిస్తున్నాడు. సమయం గడచిపోతూ ఉంది. అందుచేత శ్రీరామకృష్ణులూ ఒకింత అసహనంగా కనిపించారు. గదిలో ఆయన పచార్లు చేస్తున్నారు. కానీ మందహాస వదనంతోనే కీర్తనలను గానం చేసే కేశవ్ అనే వ్యక్తితో మధ్యమధ్యలో మాట్లాడుతున్నారు.
18.3.1 భగవంతుడే కర్త
గాయకుడు కేశవ్: భగవంతుడే కరణం (పరికరం), కారణం (దాన్ని ఉపయోగించేవాడు) కూడాను. దుర్యోధనుడు కృష్ణుడితో ‘త్వయా హృషీకేశ హృదిస్థితేన యథా నియుక్తో-స్మి తథా కరోమి’ (నా హృదయసీమలో నెలకొని ఉన్న కృష్ణా! నువ్వు ఎలా చేయిస్తావో అట్లే నేను చేస్తాను) అన్నాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అవును. భగవంతుడు సమస్తం చేయిస్తూ ఉన్నాడు అనటం నిజమే. ఆయనే కర్త, మానవులు యంత్రాలవంటివారు. అదే సమయంలో కర్మఫలం ఉండటమూ యథార్థమే. మిరపకాయ తింటూనే కడుపులో మంట పుడుతుంది. మిరపకాయ తినడం కడుపులో మంటను కలిగిస్తుందనేది భగవంతుని ఆదేశం. పాపం చేస్తే అందుకైన ఫలాన్ని అనుభవించే తీరాలి.
“కాని సిద్ధుడు, అంటే భగవద్దర్శనం పొందిన వ్యక్తి పాపం చేయలేడు. ప్రతిభావంతుడైన నాట్యకారుడు తప్పటడుగు వేయడు. శిక్షణ పొందిన గళం నుండి సరిగమలు సరైన శ్రుతిలోనే వస్తాయి.”
భోజనం సిద్ధమైంది. శ్రీరామకృష్ణులు, భక్తులు లోపలకు వెళ్లి భోజనం చేశారు. పంచభక్ష్య పరమాన్నాలతో చక్కని విందు భోజనం పెట్టాడు ఈశాన్.
మధ్యాహ్నం మూడు గంటలయింది. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు ఈశాన్ ఇంట్లోని అతిథుల గదిలోకి వచ్చి కూర్చున్నారు. శ్రీశ్, ‘మ’ లు ప్రక్కన కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు, శ్రీశ్తో మళ్లీ మాట్లాడసాగారు.
18.3.2 గృహస్థులకు దాస్యభావం మంచిది
శ్రీరామకృష్ణులు: నీ మనోవైఖరి ఏమిటి – ‘సో-హం’ భావమా లేక ‘సేవ్య – సేవక’ భావమా? సంసారులకు సేవ్య – సేవక భావం చాలా మంచిది. అన్నీ చేస్తూ ఉంటాడు, ఈ స్థితిలో ‘నేనే ఆతణ్ణి’ అన్న భావన అతడికి ఎలా కలుగుతుంది? ‘నేనే – ఆతణ్ణి’ అని చెప్పేవాడికి ఈ జగత్తు స్వప్నం లాంటిది. అటువంటి వ్యక్తికి తన దేహం, మనస్సు కూడా స్వప్నసదృశ్యాలు. అతడికి ‘నేను’ అన్న భావన కూడ కలవంటిదే. అందుకనే అతడు గృహస్థ కర్తవ్యాలను నిర్వర్తించలేడు. కనుక సేవక భావం, దాస్యభావం చాలా మంచిది.
“హనుమంతుడికి దాస్యభావం ఉండేది. అతడు రాముడితో ఇలా అన్నాడు: ‘ఓ రామా! కొన్ని సమయాల్లో నువ్వు పూర్ణం, నేను నీ అంశను అనీ; కొన్ని సమయాల్లో నువ్వు ప్రభువు, నేను దాసుడననీ భావిస్తాను. కాని తత్త్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వే నేను, నేనే నువ్వుగా గాంచుతాను.’
“తత్త్వజ్ఞానం కలిగినప్పుడు, సోఽహం స్థితి రావచ్చు, కాని అది సుదూరపు విషయం.”
శ్రీశ్: అవునండీ. దాస్యభావంలో మనిషి నిశ్చితంగా ఉండవచ్చు. ప్రభువుపై పూర్తిగా భారంవేసి జీవిస్తాడు. కుక్కకు యజమాని పట్ల ఎంతో భక్తివిశ్వాసాలు. కనుకనే అది తన యజమానిని నమ్ముకొని నిశ్చింతగా ఉంటుంది.
18.3.3 ఎవరు సాకారమో ఆయనే నిరాకారం – నామ మాహాత్మ్యం
శ్రీరామకృష్ణులు: మంచిది, నీకు సాకారం నచ్చుతుందా? లేక నిరాకారమా? విషయం ఏమిటో తెలుసా? ఎవరు నిరాకారుడో ఆయనే సాకారుడు కూడా. భక్తులకు ఆయన సాకారుడిగా దర్శనం ఇస్తాడు. తీరమే లేని అనంతంగా విస్తృతమై ఉంది మహాసాగరం. ఆ జలరాశిలో కొన్ని చోట్ల మంచుగడ్డలు రూపొందుతాయి. ఇందుకు అతిశీతలమే కారణం. అదే విధంగా భక్తి అనే శీతలం కారణంగా సాకార రూపదర్శనం కలుగుతుంది. సూర్యోదయం కాగానే మంచుగడ్డలు కరిగిపోతాయి; మునుపటిలా నీరైపోతుంది. జ్ఞానమార్గం, విచారణ మార్గం అనుసరించే వాడికి సాకారరూప దర్శనం కలుగదు. అక్కడ నిరాకారస్థితి. జ్ఞానభాస్కరుడు ఉదయించగానే సాకారమైన మంచు కరిగిపోతుంది. కాని ఒక సంగతి; నిరాకారం ఎవరిదో, ఆయనదే సాకారం కూడా.
మునిమాపు వేళ కాసాగింది. శ్రీరామకృష్ణులు లేచారు. ఆయన దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్లాలి. అతిథుల గదికి దక్షిణాన ఉన్న వసారాలో నిలబడి ఈశాన్తో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఎవరో, ‘భగవన్నామం ఉచ్చరిస్తే సర్వదా ఫలితం దక్కుతుందని చెప్పలేం’ అన్నారు.
ఈశాన్: ఇవి ఏం మాటలు? రావిచెట్టు విత్తనం చాలా చిన్నది కదా! కాని దాన్లో మహావృక్షం దాగుకొని ఉంది. కొంతకాలం వేచివుంటే వృక్షాన్ని చూడవచ్చు.
శ్రీరామకృష్ణులు: అవును, అవును. వేచివుంటే ఫలితం కలుగుతుంది.
18.3.4 ఈశాన్ సంసారంలో నిర్లిప్తుడు – పరమహంస అని ఎవరినంటాం?
ఈశాన్ ఇంటికి ప్రక్కనే ఆతడి మామగారు క్షేత్రనాథ్ ఛటర్జీ ఇల్లు ఉంది. రెండు ఇళ్లకు మధ్యన పోయిరావటానికి దారి ఉంది. శ్రీరామకృష్ణులు ఆ ఇంటి వాకిలి వద్దకు వచ్చి నిలబడ్డారు. ఈశాన్, అతడి బంధువులు శ్రీరామకృష్ణులను సాగనంపటానికి వచ్చారు.
శ్రీరామకృష్ణులు (ఈశాన్తో): నువ్వు సంసారంలో బురదచేపలా జీవిస్తున్నావు. బురదచేప చెరువులోని బురదలో ఉంటుంది కాని దాని ఒంటికి బురద అంటుకోదు. ఈ మాయాజగత్తులో విద్య అవిద్యలు రెండూ ఉన్నవి. పరమహంసలని ఎవరిని పేర్కొంటాం? పాలూ నీరూ కలిసి ఉన్నప్పటికీ హంసలా నీటిని వదలిపెట్టి పాలను మాత్రం గ్రహించే వారిని; చక్కెర, ఇసుకా కలిసి ఉన్నప్పటికీ చీమలా ఇసుకను వదలివేసి చక్కెరను మాత్రం తీసుకునే వారిని.
18.4 చతుర్థ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల ధర్మసమన్వయం – ఈశ్వరకోటులు అపరాధానికి అతీతులు
సాయంత్రం గడిచిపోతోంది. శ్రీరామకృష్ణులు రామ్‌చంద్ర దత్త ఇంటికి అరుదెంచారు. అక్కడ నుండి దక్షిణేశ్వరం వెళతారు. రామ్ ఇంట్లో అతిథుల గదిలో శ్రీరామకృష్ణులు, మహేంద్ర గోస్వామితో మాట్లాడుతున్నారు. గోస్వామి ఇల్లు ఆ ప్రాంతంలోనే ఉంది. శ్రీరామకృష్ణులకు ఆతడంటే అభిమానం. రామ్ ఇంటికి శ్రీరామకృష్ణులు వస్తే సామాన్యంగా గోస్వామి వచ్చి ఆయనను దర్శించుకుంటాడు.
శ్రీరామకృష్ణులు: వైష్ణవులు, శాక్తేయులు అందరూ చేరుకునే గమ్యం ఒక్కటే కాని మార్గాలు వేరు. నిజమైన వైష్ణవులు శాక్తేయులను నిందించరు.
గోస్వామి (నవ్వుతూ): శివపార్వతులు మన తల్లితండ్రులు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): థ్యాంక్యూ; తల్లితండ్రులు – మంచిది.
గోస్వామి: అదే కాదు. ఎవరినీ నిందించకూడదు. అందులోనూ వైష్ణవుణ్ణి నిందించటం అపరాధం; వైష్ణవాపరాధం. అన్ని అపరాధాలకు క్షమార్పణ ఉంది. కాని వైష్ణవాపరాధానికి క్షమార్పణే లేదు.
శ్రీరామకృష్ణులు: అపరాధం అందరికీ వర్తించదు. ఈశ్వరకోటులు అపరాధానికి అతీతులు. చైతన్యదేవుల వంటి అవతారపురుషులు ఇందుకు ఉదాహరణ.
“బిడ్డ తండ్రి చేయి పుచ్చుకొని గట్టు మీద నడుస్తూ ఉంటే ఒకవేళ పడిపోవటం జరుగవచ్చు. కాని తండ్రి బిడ్డ చేయి పుచ్చుకొని ఉంటే ఆ బిడ్డ ఎన్నటికీ పడిపోదు.
“నేను జగజ్జననిని శుద్ధభక్తి కోరాను. ‘అమ్మా! ఇదుగో, నీ ధర్మం తీసుకో; ఇదుగో, నీ అధర్మం తీసుకో. నాకు శుద్ధభక్తిని ప్రసాదించు. ఇదుగో, నీ శుచి తీసుకో; ఇదుగో, నీ అశుచి తీసుకో. నాకు శుద్ధభక్తిని ప్రసాదించు. అమ్మా, ఇదుగో, నీ పాపం తీసుకో; ఇదుగో, నీ పుణ్యం తీసుకో. నాకు శుద్ధభక్తిని ప్రసాదించు’ అని ప్రార్థించాను.”
గోస్వామి: అవునండీ.
శ్రీరామకృష్ణులు: అన్ని మతాలను గౌరవించాలి. కాని నిష్ఠాభక్తి అని ఒకటి ఉంది. అందరికీ ప్రణామం చేయాలి. సరైనదే; కాని ఒకదాన్ని ప్రాణప్రదంగా ప్రేమించాలి. అదే నిష్ఠ.
“రాముని స్వరూపం తప్ప వేరే ఏ స్వరూపమూ హనుమంతుడికి నచ్చలేదు. ద్వారకలో, తలపాగా ధరించిన కృష్ణుణ్ణి దర్శింప గోపికలు ఇష్టపడలేదు; వారి నిష్ఠ అటువంటిది.”
“గృహిణి తన బావ, మరిది తతిమ్మా వ్యక్తులకు కాళ్లు చేతులు కడుగుకోవటానికి నీళ్లు ఇవ్వటం, ఆసనం వెయ్యటం మొదలైన సేవలు అందిస్తుంది. కాని భర్తను సేవించినట్లు ఆమె మరెవరినీ సేవించదు. భర్తతో ఆమెకు ఉన్న సంబంధమే ప్రత్యేకమైనది.”
శ్రీరామకృష్ణులను రామ్ మధురభక్ష్యాలతో సేవించాడు. తరువాత ఆయన దక్షిణేశ్వరానికి బయలుదేరారు. ‘మ’ నుండి శాలువా, టోపీ తీసుకొని ధరించారు. భక్తులతో బండిలో ఎక్కి కూర్చున్నారు, రామ్ ప్రభృతులు ఆయన బండి ఎక్కటంలో సహాయం చేశారు. ‘మ’ కూడా బండిలో ఎక్కాడు. దక్షిణేశ్వరం కేసి బండి బయలుదేరింది.
శనివారం, డిసెంబర్ 29, 1883
నేడు అమావాస్య. శ్రీరామకృష్ణులు కాళీఘాట్ కాళికాలయానికి వెళ్లనున్నారు. దారిలో అధర్సేన్ ఇంటికి వెళతారు. అధర్ కూడా అక్కడ నుండి కాళికాలయానికి వారి వెంట వెళతాడు. బండి శ్రీరామకృష్ణుల గదికి ఉత్తరాన గల మొగసాల వద్దకు వచ్చి నిలిచింది. సమయం ఒంటి గంట కావస్తోంది. ‘మ’ బండి ప్రక్కన నిలబడి ఉన్నాడు.
‘మ’ (శ్రీరామకృష్ణులతో): మహాశయా, నేనూ రానా?
శ్రీరామకృష్ణులు: ఎందుకు?
‘మ’ : దారిలో ఒకసారి ఇంటికి వెళ్లిరావాలని అనుకుంటున్నాను.
శ్రీరామకృష్ణులు (ఒకింత యోచించి): ప్రస్తుతం వెళ్లాలా? ఇక్కడ సుఖంగానే ఉన్నావు కదా! ‘మ’ కాసేపు ఇంటికి వెళ్లి రావాలనుకున్నాడు. కాని శ్రీరామకృష్ణులు అందుకు సమ్మతించలేదు. దక్షిణేశ్వర ఆలయం నుండి బండి బయలుదేరింది.
18.5 పంచమ పరిచ్ఛేదం రాఖాల్, రామ్, కేదార్ ప్రభృత భక్తులతో – వేదాంత సాధువు, బ్రహ్మజ్ఞానంపై సంభాషణ
ఆదివారం, డిసెంబర్ 30, 1883
దక్షిణేశ్వర ఆలయంలో ఒక చెట్టు క్రింద ‘మ’ పచార్లు చేస్తున్నాడు. అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలు. ఒక భక్తుడు అక్కడకు వచ్చి ‘మ’ తో పరమహంస దేవులు పిలుస్తున్నారని చెప్పాడు. శ్రీరామకృష్ణులు భక్తులతో తమ గదిలో కూర్చుని ఉన్నారు. ‘మ’ ఆయనకు ప్రణామం చేశాక భక్తులతో క్రింద కూర్చున్నాడు.
కలకత్తా నుండి రామ్, కేదార్ మొదలైన భక్తులు వచ్చివున్నారు. వేదాంత వాదియైన సాధువు ఒకరు వారితో వచ్చివున్నాడు. శ్రీరామకృష్ణులు రామ్ తోటకు వెళ్లినప్పుడు ఈ సాధువును కలుసుకున్నారు. ఆనాడు ఒక చెట్టు క్రింద ఒంటరిగా ఒక మంచం మీద ఈ సాధువు కూర్చొని ఉన్నాడు. శ్రీరామకృష్ణుల కోర్కె మేరకు రామ్ ఆయనను దక్షిణేశ్వరానికి తోడ్కొని వచ్చాడు. సాధుమా శ్రీరామకృష్ణులను చూడడానికి కుతూహలపడ్డాడు.
శ్రీరామకృష్ణులు మంచం మీద తమ ప్రక్కన ఆ సాధువును కూర్చోబెట్టుకుని ఆయనతో ఆనందంగా మాట్లాడసాగారు. సంభాషణ హిందీలో సాగింది.
శ్రీరామకృష్ణులు: ఇదంతా మీకు ఎలా అనిపిస్తుంది?
సాధువు: అంతా స్వప్నం లాంటిది.
శ్రీరామకృష్ణులు: బ్రహ్మసత్యం జగన్మిథ్య, అంతేకదా? మంచిది. బ్రహ్మం ఎటువంటిది?
సాధువు: శబ్దమే బ్రహ్మం, అంటే అనాహత శబ్దం.
శ్రీరామకృష్ణులు: కాని ఈ శబ్దానికి ప్రతిపాద్యం ఒకటి ఉంటుంది కదా! ఏమంటారు?
సాధువు: వాచ్యం ఆయనే, వాచకమూ ఆయనే.*
ఆ పలుకులు వినటంతోనే శ్రీరామకృష్ణులు సమాధి స్థితి నొందారు. నిశ్చలంగా చిత్తరువులా కూర్చుని ఉన్నారు. సాధుమా, భక్తులూ ఆశ్చర్యచకితులై శ్రీరామకృష్ణుల ఆ సమాధి స్థితిని చూస్తూ ఉన్నారు. “ఇదుగో చూడండి. దీనినే సమాధి అంటారు” అని సాధువుతో, కేదార్ చెప్పాడు. సాధువు శాస్త్రాలలోనే సమాధి గురించి చదివి ఉన్నాడు. ఎప్పుడూ చూసి ఉండలేదు.
శ్రీరామకృష్ణులు మెల్లమెల్లగా బాహ్యస్మృతిలోకి వచ్చారు. జగన్మాతతో ఇలా అంటున్నారు: “అమ్మా! నేను సాధారణ స్థితిలో ఉండాలి. నన్ను బాహ్యస్మృతి రహితునిగా చేయకు. సాధువుతో సచ్చిదానందం గురించి మాట్లాడి ఆనందం పొందగోరుతున్నాను.” శ్రీరామకృష్ణుల స్థితిని చూసి, మాటలను విని ఆ సాధువు ఆశ్చర్యచకితుడైనాడు.
సాధువుతో శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “ప్రస్తుతం సో-హంను వదలిపెట్టు. ఇప్పుడు నేను – నువ్వు అనే భావనలో ఆనందిద్దాం.”
నేను – నువ్వు భావన ఉన్నంత వరకు అమ్మ కూడా ఉంటుంది. రా, అమ్మతో ఆనందంగా ఉందామనా శ్రీరామకృష్ణులు చెబుతున్నారు!
కాసేపటి తరువాత శ్రీరామకృష్ణులు పంచవటిలో నడుస్తూ ఉన్నారు. రామ్, కేదార్, ‘మ’ ప్రభృతులు ఆయనతో ఉన్నారు.
18.5.1 కేదార్‌కు ఉపదేశం – సంసారత్యాగం
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఆ సాధువును గురించి ఏమనుకుంటున్నావు?
కేదార్: శుష్కవేదాంతం! పొయ్యి మీద ఎసరు పెట్టడమయింది కాని కుండలో ఇంకా బియ్యం వేయలేదు!
శ్రీరామకృష్ణులు: అది నిజమే, కాని అతడొక సన్న్యాసి. ఎవరైతే సంసారాన్ని త్యజించాడో, ఆతడు బాగా పురోభివృద్ధి చెందినవాడు సుమా! ఈ సాధువు ఒక ప్రవర్తకుడు. భగవంతుని పొందకుంటే ఏ ప్రయోజనమూ ఉండదు. భగవత్ప్రేమలో ఉన్మత్తుడై ఉన్నప్పుడు మరేదీ సంతోషాన్ని కలిగించదు. అప్పుడు:
పదిలపరచవే మనసా! అమ్మ శ్యామను
అతి ప్రియమగు నా అమ్మ శ్యామను
నిలుపుము నీలో అతి భద్రముగా
పరులెవ్వరిని చేరనీయకుము
మన మిరువురమే ఆమెను చూతము.
శ్రీరామకృష్ణుల భావనకు తగినట్లు కేదార్ ఒక పాట పాడాడు:
మదివిప్పి నేనెట్లు చెప్పగలనో సఖా!
చెప్పరాదని నోరు నొక్కబడియుండగా
నా బాధ తెలియగల దయశాలి గనలేక
మరణించు స్థితిలోన మనివాడ నిప్పుడు………….
శ్రీరామకృష్ణులు తమ గదికి తిరిగి వచ్చారు. అప్పుడు సాయంత్రం నాలుగు గంటలయింది. కాళికాలయం తెరిచారు. శ్రీరామకృష్ణులు సాధువును తోడ్కొని కాళికాలయానికి వెళ్లారు. ‘మ’ కూడా వెంట ఉన్నాడు. ఆలయంలోకి వెళ్లగానే ఆయన జగజ్జననికి భక్తిప్రపత్తులతో ప్రణమిల్లారు. సాధువు చేతులు జోడించి, తలవంచి పదే పదే జగజ్జననికి ప్రణామం చేశాడు.
శ్రీరామకృష్ణులు: స్వామి, దర్శనం ఎలా ఉంది?
సాధువు (భక్తితో): కాళి! మహాదేవి ఆమె.
శ్రీరామకృష్ణులు: కాళీ, బ్రహ్మమూ అభిన్నులు. అంతేకదా?
సాధువు: మనస్సు బహిర్ముఖమై ఉన్నంతవరకు కాళిని అంగీకరించవలసిందే. బహిర్ముఖమైనప్పుడు మంచి, చెడు అనే విచక్షణ చేయవలసిందే; మంచిని స్వీకరించి చెడును వదలిపెట్టాలి. ఇదుగో చూడండి. నామరూపాలన్నీ భ్రాంతి జనితాలు. అయినప్పటికీ మనస్సు బహిర్ముఖమై ఉన్నంతవరకు స్త్రీ వాంఛను వదలిపెట్టే తీరాలి. సాధక దశలో మంచి, చెడు అన్నవి ఉంటాయి. లేకుంటే అధోగతి పొందుతాం.
ఈ రీతిలో మాట్లాడుతూ శ్రీరామకృష్ణులు, సాధువు గదిలోకి వచ్చారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నువ్వొకటి గమనించావా? ఆ సాధువు ఆలయంలో కాళికాదేవికి ప్రణమిల్లాడు!
‘మ’ : అవునండీ.
సోమవారం, డిసెంబర్ 31, 1883
18.5.2 హలధారిని శ్రీరామకృష్ణులు చీవాట్లు పెట్టిన సంఘటన
అప్పుడు సాయంత్రం నాలుగు గంటలయింది. బలరామ్, ‘మ’, రాఖాల్, లాటు, హరీశ్ మొదలైన భక్తులతో శ్రీరామకృష్ణులు గదిలో కూర్చుని ఉన్నారు.
శ్రీరామకృష్ణులు ‘మ’, బలరామ్లను ఉద్దేశిస్తూ ఇలా అన్నారు: “హలధారి జ్ఞానమార్గం అనుసరించేవాడు. రాత్రింబవళ్లు అధ్యాత్మ రామాయణం, ఉపనిషత్తులు పఠించేవాడు. భగవంతుడు సాకారుడనే మాట వింటేనే ముఖం ముడుచుకునేవాడు. ఒకసారి నేను బిచ్చగాళ్ల ఎంగిలి ఆకుల నుండి కాస్త తీసుకొని తిన్నప్పుడు అతడు, ‘నువ్వు ఇలా చేస్తే ఎలా? నీ పిల్లలకు వివాహం ఎలా జరుగుతుంది?’ అని అడిగాడు. వెంటనే నేను, ‘ఛీ! ధూర్తుడా! నాకేమిటి, పిల్లలు పుట్టడమేమిటి! గీత, వేదాంతం పఠించే నీ నోట్లో అగ్గిపడ’ అన్నాను. చూడండి, ఒక వంక జగత్తు మిథ్య అంటాడు. అక్కడ విష్ణ్వాలయంలోకి వెళ్లి ముక్కు మూసుకొని ధ్యానమూ చేస్తాడు.
సాయంకాలం అయింది. బలరామ్ తదితర భక్తులు కలకత్తాకు వెళ్ళిపోయారు. శ్రీరామకృష్ణులు గదిలో జగజ్జనని చింతనలో మగ్నులై ఉన్నారు. కాసేపట్లో ఆలయంలో హారతుల సుమధుర నాదాలు వినవచ్చాయి.
18.5.3 జగజ్జననితో శ్రీరామకృష్ణుల సంభాషణ
రాత్రి ఎనిమిది గంటలయింది. శ్రీరామకృష్ణులు భావపారవశ్య స్థితిలోనే తీయని స్వరంలో జగజ్జననితో మాట్లాడుతున్నారు. ‘మ’ ప్రక్కనే నేల మీద కూర్చుని వింటున్నాడు.
హరి ఓం! హరి ఓం! అంటూ మధుర కంఠంతో ఉచ్చరించి శ్రీరామకృష్ణులు జగజ్జననితో మాట్లాడ నారంభించారు: “అమ్మా! నా తల్లీ! బ్రహ్మజ్ఞానంతో నన్ను బాహ్యస్మృతి శూన్యునిగా చేయవద్దు. నేను బ్రహ్మజ్ఞానం ఇచ్ఛగించను. నేను లీలలు చూసి ఆనందింపగోరుతాను. అమ్మా! నాకు వేదాంతం తెలియదు, తెలుసుకోగోరటమూ లేదు. నిన్ను ప్రాప్తించుకుంటే వేదవేదాంతాలన్నీ నిమ్నాతి నిమ్నాలు అయిపోతున్నాయి!
“కృష్ణా! నా మాట విను. తిను. తీసుకో, నాయనా! కృష్ణా! నా బంగారూ! నీతో చెబుతున్నాను విను. నా నిమిత్తం నువ్వు మానవదేహం ధరించి వచ్చావు.”
18.6 షష్ఠ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో భక్తులతో
బుధవారం, జనవరి 2, 1884
మధ్యాహ్నం మూడు గంటలు. రాఖాల్, లాటు, హరీశ్, రామ్‌లాల్, ‘మ’ ప్రభృతులు అప్పుడు దక్షిణేశ్వరంలోనే బస చేసి ఉన్నారు. శ్రీరామకృష్ణుల దర్శనార్థం ‘మ’ బిల్వవృక్షం క్రింది నుండి వస్తున్నాడు. గదికి పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలో శ్రీరామకృష్ణులు ఒక తాంత్రిక భక్తుడితో కూర్చుని ఉన్నారు. ‘మ’ అక్కడకు వచ్చి శ్రీరామకృష్ణులకు సాష్టాంగదండప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు ‘మ’ ను తన ప్రక్కన కూర్చోమన్నారు. తాంత్రిక భక్తుడితో మాట్లాడటం ద్వారా ‘మ’ కు ఉపదేశించటానికి అతణ్ణి అక్కడ కూర్చోమని చెప్పారేమో! మహిమాచక్రవర్తి ఆ తాంత్రిక భక్తుణ్ణి శ్రీరామకృష్ణుల వద్దకు పంపించాడు. భక్తుడు కాషాయాంబరాలు ధరించి ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు (తాంత్రిక భక్తుడితో): కపాలంలో మద్యం పోసుకుని త్రాగటం తాంత్రిక సాధన అంగాలలో ఒకటి. దీన్ని కారణవారి (కారణ జలం) అంటారు. అంతేకదా?
తాంత్రికుడు: అవునండీ.
శ్రీరామకృష్ణులు: పదకొండు పాత్రలు అవసరం, కదా?
తాంత్రికుడు: మూడు దశల ప్రమాణాలు. ఇవి అన్నీ శవసాధన కోసం.
శ్రీరామకృష్ణులు: మద్యాన్ని స్పృశించడం కూడా నా వల్ల కాదు.
తాంత్రికుడు: మీరు సహజానంద స్థితిలో నెలకొని ఉన్నారు. అది లభిస్తే మరేదీ అక్కర్లేదు.
శ్రీరామకృష్ణులు: ఇంకా విను, నాకు జపతపాదులు ఏవీ నచ్చవు. కాని సర్వదా భగవత్ స్మరణ, మననాలలో ఉన్నాను. అది సరే, షడ్చక్రాలు అంటే ఏమిటి?
తాంత్రికుడు: అయ్యా, అవి పలు విధాలైన పుణ్యతీర్థాల వంటివి. ప్రతి చక్రంలోను శివుడు, శక్తి ఉన్నారు. ఆ చక్రాలను ఈ కళ్ళతో చూడలేం; ఖండించినా బయటకు తీయలేము. ఈ పద్మాల పైమొగ్గ శివలింగం; క్రింది భాగం ఆద్యాశక్తి, యోని వంటిది.
‘మ’ మౌనంగా అంతా వింటూ ఉన్నాడు. ‘మ’ ను చూస్తూ శ్రీరామకృష్ణులు తాంత్రిక భక్తుని, “బీజమంత్రోపదేశం లేకుండా సిద్ధత్వం పొంద సాధ్యమా?” అని అడిగారు.
తాంత్రికుడు: సాధ్యమే. అయితే అందుకు విశ్వాసం ఉండాలి. అంటే గురువాక్యంలో విశ్వాసం ఉండాలి.
శ్రీరామకృష్ణులు (‘మ’ వైపు తిరిగి అతడితో): విశ్వాసం.
తాంత్రిక భక్తుడు సెలవు పుచ్చుకుని వెళ్లిపోయాడు. తరువాత బ్రహ్మసమాజానికి చెందిన జయగోపాల్ సేన్ వచ్చాడు. శ్రీరామకృష్ణులు అతడితో మాట్లాడసాగారు. రాఖాల్, ‘మ’ ప్రభృతులు ప్రక్కన ఉన్నారు. మధ్యాహ్నం వేళ.
శ్రీరామకృష్ణులు (జయగోపాల్‌తో): ఎవరినీ, ఏ మతాన్నీ ద్వేషించకూడదు. నిరాకారవాది, సాకారవాది అందరూ భగవంతుని వైపుగానే వెళుతున్నారు. జ్ఞాని, యోగి, భక్తుడు అందరూ అన్వేషించేది భగవంతుణ్ణే. జ్ఞానమార్గగాములు ఆయనను బ్రహ్మం అంటారు; యోగులు ఆత్మ, పరమాత్మ అంటారు; భక్తులు భగవాన్ అంటారు. ఇంకా నిత్య భగవంతుడు, నిత్యసేవకుడు అని పేర్కొనటమూ కద్దు.
జయగోపాల్: అన్ని మార్గాలూ సత్యం అని ఎలా తెలుసుకోవటం?
శ్రీరామకృష్ణులు: ఏదో ఒక మార్గంలో సరిగ్గా పయనించగలిగితే ఆయనను పొందవచ్చు. అప్పుడు అన్ని మార్గాల గురించీ తెలుసుకోగలవు. ఎలాగైనా ఒకసారి డాబాను చేరుకుంటే పిదప చెక్కమెట్ల గుండాను క్రిందికి దిగి రావచ్చు, మంచి మెట్ల గుండాను క్రిందికి దిగిరావచ్చు; ఒక వెదురుగడ ద్వారా క్రిందికి దిగవచ్చు, తాడు పుచ్చుకుని కూడా దిగవచ్చు.
“భగవత్కృప కలిగితే భక్తుడు సకలం తెలుసుకోగలగుతాడు. ఒకసారి ఆయనను పొందితే సర్వం తెలుసుకోవచ్చు. పేరుమోసిన ధనవంతుణ్ణి ఒకసారి ఏదో విధంగా కలుసుకోవాలి; ఆతడితో మైత్రిని ఏర్పరచుకోవాలి. అప్పుడు తనకు ఎన్ని తోటలు ఉన్నాయో, ఎన్ని చెరువులు ఉన్నాయో, ఎన్ని కంపెనీ పత్రాలు (రొక్క పత్రాలు) ఉన్నాయో ఆతడే తెలుపుతాడు.”
18.6.1 భగవత్ప్రాప్తికి మార్గం
జయగోపాల్: భగవదనుగ్రహం ఎలా కలుగుతుంది?
శ్రీరామకృష్ణులు: ఆయన నామగుణకీర్తనలు సర్వదా చేస్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు విషయ చింతనలను త్యజించాలి. పైరు నిమిత్తం పొలంలోకి ఎంతో శ్రమించి నీరు పారిస్తావు. కాని కలుగుల ద్వారా నీరు బయటకు పోతుంది. కాలువ త్రవ్వి నీరు పారించి ఏం ప్రయోజనం? అంతా వృథా అవుతుంది.
“చిత్తశుద్ధి కలిగి, విషయాసక్తి తొలగిపోతే వ్యాకులత కలుగుతుంది. అప్పుడు నీ ప్రార్థన భగవంతుణ్ణి చేరుతుంది. ‘టెలిగ్రాఫ్’ తీగలో మరో వస్తువు చేరిక ఉన్నప్పుడు లేక పగులు ఉన్నప్పుడు సమాచారం చేరదు.
“నేను వ్యాకులతతో ఏకాంతంలో వెక్కివెక్కి ఏడ్చేవాడిని. ‘నారాయణుడెక్కడ? నారాయణుడెక్కడ?’ అంటూ విలపిస్తూ బాహ్యచైతన్యాన్ని కోల్పోయేవాణ్ణి – (నా మనస్సు) మహావాయువులో లీనమైపోయేది.
“యోగం ఎలా సిద్ధిస్తుంది? టెలిగ్రాఫ్ తీగలో వేరే వస్తువు చేరిక ఉండరాదు, తీగలో పగులు లేకుండా ఉండాలి; విషయాసక్తిని అడుగంటా త్యజించాలి. ఏ విధమైన కోరికా ఉండరాదు. కోర్కెలతో కూడుకున్న భక్తిని ‘సకామభక్తి’ అంటారు. నిష్కామ భక్తిని ‘అహేతుక’ భక్తి అంటారు. ‘భగవంతుడా! నీకు ఇష్టమైతే నన్ను ప్రేమించు, లేదంటే లేదు. అయితే నేను మటుకు నిన్ను ప్రేమిస్తాను’ – ఇదే అహేతుక భక్తి.
“అసలు విషయం ఇదే – భగవంతుణ్ణి ప్రేమించాలి. ఆ ప్రేమ తీవ్రమైనప్పుడు ఆయన దర్శనం కలుగుతుంది. పతివ్రతకు భర్త పట్ల గల ఆకర్షణ, తల్లికి బిడ్డపట్ల గల ఆకర్షణ, విషయాసక్తునికి విషయ వస్తువుల పట్ల గల ఆకర్షణ – ఈ మూడు ఆకర్షణలు ఒకటై భగవంతుని దిశగా మరలినప్పుడు, భగవంతుని దర్శనం కలుగుతుంది.”
జయగోపాల్ ప్రాపంచిక వ్యక్తి. అందుకేనా శ్రీరామకృష్ణులు అతడికి ఇలా ఉపదేశం చేస్తున్నారు?
18.7 సప్తమ పరిచ్ఛేదం జ్ఞానమార్గం, విచారణమార్గం – భక్తియోగం, బ్రహ్మజ్ఞానం
రాత్రి ఎనిమిది గంటలయింది. శ్రీరామకృష్ణులు గదిలో కూర్చుని ఉన్నారు. రాఖాల్, ‘మ’ కూడా ఉన్నారు. గడిచిన ఇరవై ఒక్క రోజులుగా ‘మ’ ఇంటికి వెళ్లలేదు. శ్రీరామకృష్ణులు ‘మ’ తో విచారణబుద్ధిని వదలిపెట్టమన్నారు.
శ్రీరామకృష్ణులు (రాఖాల్తో): అతిగా విచారణ చేయటం మంచిది కాదు. మొదట భగవంతుడు, తరువాత జగత్తు. భగవంతుని పొందితే ఆయన జగత్తు గురించీ తెలుసుకోవచ్చు. (‘మ’ రాఖాల్లతో) యదుమల్లిక్తో మాట్లాడితే అతడికి ఎన్ని ఇళ్లు, ఎన్ని తోటలు, ఎన్ని కంపెనీ పత్రాలు (రొక్కపత్రాలు) ఉన్నాయో అన్నీ తెలుసుకోవచ్చు. అందుకే ఋషులు వాల్మీకిని ‘మరా మరా’ అంటూ జపం చేయమన్నారు. దీనికొక కారణం ఉంది. మ అంటే భగవంతుడు. రా అంటే జగత్తు, మొదట భగవంతుడు తరువాత జగత్తు.
18.7.1 కృష్ణకిశోర్ – ‘మరా’ మంత్రం
“కృష్ణకిశోర్ ఇలా అన్నాడు: ‘ఋషి (నారద ఋషి) ఉపదేశించటం వలన మరా, మరా ఒక పవిత్రమంత్రం.’ ‘మ’ అంటే భగవంతుడు, ‘రా’ అంటే జగత్తు.
“కనుక మొదట వాల్మీకిలా సమస్తం త్యజించి, ఏకాంతంలో గోప్యంగా మనోవ్యాకులతతో వెక్కివెక్కి ఏడ్చి భగవంతుని ప్రార్థించాలి. మొదట కావలసింది భగవద్దర్శనం. ఆ తరువాత శాస్త్రాలను గురించీ, జగత్తును గురించీ విచారణ చేయవచ్చు.
18.7.2 “అమ్మా నా విచారణబుద్ధిని వజ్రాయుధంతో ఖండించివేయి” – శ్రీరామకృష్ణుల ప్రార్థన
(‘మ’ తో) “అందుకే, ఇకపై విచారణ చేయవద్దని నీకు చెబుతున్నాను. ఈ సంగతి నీకు చెప్పటానికే ఇప్పుడు సరుగుడు తోపు నుండి నేను వచ్చాను. అతిగా విచారణ చేస్తే చివరకు హాని వాటిల్లుతుంది – ఆఖరికి నుమ్వా హాజ్రాలా తయారవుతావు. మునుపు నేను రాత్రిళ్ళు ఏకాంతంలో కాలిబాటలో విలపిస్తూ పచార్లు చేస్తూ ఉండేవాణ్ణి. జగజ్జననితో, ‘అమ్మా! నా విచారణ బుద్ధిని వజ్రాయుధంతో ఖండించివేయి’ అని ప్రార్థించేవాణ్ణి.
(‘మ’ తో) “ఇక విచారణ జోలికి పోనని నాకు వాగ్దానం చేయి.”
‘మ’ : అలాగేనండి ఇకపై విచారణ చేయను.
శ్రీరామకృష్ణులు: భక్తి ద్వారానే సకలం సిద్ధిస్తుంది. బ్రహ్మజ్ఞానం కోరేవారు సైతం భక్తిమార్గాన్ని చేపడితే, వారికి బ్రహ్మజ్ఞానమూ కలుగుతుంది. భగవదనుగ్రహం ఉంటే జ్ఞానానికి కొదువ ఉంటుందా ఏం? గ్రామాలలో వడ్లు కొలుస్తుంటారు. ఒక కుప్ప తగ్గితే వెంటనే ఒకడు మరొక కుప్పను ముందుకు త్రోసి ఇస్తాడు. జగజ్జనని జ్ఞానరాశిని త్రోసి ఇస్తుంది.
“భగవంతుని పొందిన పిదప పండితులు గడ్డిపోచలవలె తోస్తారు. ‘మీతో బెస్తవాని ఇంట్లో సమావేశానికి కూడా నేను రావటానికి సిద్ధం. దాన్లో ఏ తప్పు ఉంది? మీతో పాకీవాని ఇంట్లో భోజనం కూడా నేను చేయగలను’ అని పద్మలోచన్ అన్నాడు.
“భక్తి ద్వారానే సకలం సిద్ధించుకోవచ్చు. భగవంతుని ప్రేమించగలిగితే తరువాత ఏ కొరతా ఉండదు. పార్వతి ప్రక్కన వినాయకుడు, కుమారస్వామి కూర్చుని ఉన్నారు. పార్వతి మెడలో ఒక రత్నాలహారం ధరించి ఉంది. ఆమె వారితో, ‘మీ ఇద్దరిలో ఎవరైతే మొదట ఈ బ్రహ్మాండానికి ప్రదక్షిణ చేసి వస్తారో, అతడికి ఈ రత్నాలహారాన్ని బహుమతిగా ఇస్తాను’ అంది. కుమారస్వామి క్షణం కూడా ఆలస్యం చేయలేదు, నెమలిని అధిరోహించి బయలుదేరాడు. వినాయకుడు మెల్లగా తల్లికి ప్రదక్షిణ చేసి ప్రణమిల్లాడు. ఆమెలోనే బ్రహ్మాండం యావత్తూ నెలకొని ఉందని అతడెరుగును. పార్వతి పరమానందం చెంది రత్నాలహారాన్ని వినాయకుని మెడలో వేసింది. చాలసేపైన తరువాత తిరిగి వచ్చిన కుమారస్వామి, వినాయకుని మెడలో రత్నాలహారం ఉండటం చూశాడు.
“నేను విలపిస్తూ అమ్మతో, ‘అమ్మా! వేదవేదాంతాలలో ఏం ఉన్నదో నాకు తెలుపు’ అని ప్రార్థించాను. జగజ్జనని ఒకటి వెంట ఒకటిగా అన్నిటినీ నాకు తెలియపరచింది. అవును ఆమె అన్నిటినీ తెలిపింది. ఎన్నో విషయాలను నాకు వెల్లడించింది.
18.7.3 సాధనకాలంలో దర్శనాలు – గురువే సరంగు
“ఒక రోజు నాలుగు దిశలా శివుణ్ణి, శక్తిని చూపింది – శివశక్తుల సంసర్గం చూశాను. మనిషి, జీవరాసులు, చెట్టుచేమలు అన్నిట్లోనూ అదే శివ–శక్తి. అదే పురుషుడు – ప్రకృతి. వారి సంసర్గాన్ని ప్రతిచోటా గాంచాను.
“మరో రోజు మనుష్యుల పుర్రెల కుప్పను చూపింది. ఆ కుప్ప కొండంత ఎత్తు ఉంది. వేరే ఏదీ లేదు! వాటి మధ్య నేను ఒంటరిగా కూర్చుని ఉన్నాను!
“ఇంకొక రోజు ఒక మహాసముద్రాన్ని చూపించింది! నేను ఉప్పుబొమ్మగా మారి లోతు కొలవటానికి వెళ్లాను. కొలవడానికి వెళ్లినప్పుడు గురువు కృపచే రాయిగా మారిపోయాను. అప్పుడు ఒక ఓడను చూశాను! వెంటనే దాన్లోకి ఎక్కాను! గురువే సరంగు.
(‘మ’ తో) “ప్రతిరోజు ఉదయాన సచ్చిదానంద గురువును నువ్వు ప్రార్థిస్తున్నావా?”
‘మ’ : అవునండీ.
శ్రీరామకృష్ణులు: గురువు సరంగు. అప్పుడు ‘నేను’ ‘నువ్వు’ అనేవి వేర్వేరని తెలుసుకున్నాను. మళ్లీ సముద్రంలోకి దూకి చేపగా మారిపోయాను. చూసే సరికి ఆ స్థితిలో సచ్చిదానంద సాగరంలో ఆనందంగా ఈదుతూ ఉన్నాను. ఇవన్నీ అతిగోప్యమైన విషయాలు. విచారణ చేసి ఏం తెలుసుకుంటావు? ఆయన చూపించినప్పుడు అన్నీ అర్థమవుతాయి, ఏ కొరతా ఉండదు.
18.8 అష్టమ పరిచ్ఛేదం
శుక్రవారం, జనవరి 4, 1884
అప్పుడు సమయం సాయంత్రం నాలుగు గంటలయి ఉంటుంది. శ్రీరామకృష్ణులు పంచవటిలో కూర్చుని ఉన్నారు. దరహాసవదనం. ఆయనతో ‘మ’, హరిపదుడు ప్రభృతులు ఉన్నారు. హరిపదుడితో ఆనంద ఛటర్జీ గురించీ, ఘోష్పాడా శాఖలో జరిగే సాధన నియమాలను గురించీ శ్రీరామకృష్ణులు మాట్లాడారు.
కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు తమ గదికి వచ్చారు. ‘మ’, హరిపదుడు, రాఖాల్ మొదలైన భక్తులూ వచ్చి కూర్చున్నారు. ‘మ’ ఎక్కువసేపు బిల్వవృక్షం క్రిందనే గడిపాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఇకమీదట విచారణ చెయ్యకు. దానివల్ల చివరికి హాని వాటిల్లుతుంది. భగవంతుని ప్రార్థించేటప్పుడు సఖీ, దాస్య, సంతాన భావం, లేకుంటే వీరభావం – ఏదో ఒక భావం ఆరోపించుకోవాలి.
“నాది సంతాన భావం. ఈ భావాన్ని చూసి మాయాదేవి లజ్జచేత దారి వదులుతుంది.
“వీరభావం ఎంతో కష్టం. శాక్తేయులు, వైష్ణవులు దీన్ని అనుసరిస్తారు. ఈ భావంలో సరిగ్గా నెలకొని ఉండటం ఎంతో కష్టం. శాంత దాస్య సఖ్య వాత్సల్య మధురాది భావాలూ ఉన్నాయి – మధుర భావనలో అన్ని భావాలూ ఇమిడి ఉన్నవి.
(‘మ’ తో) “నీకు ఏది నచ్చుతుంది?”
‘మ’ : అన్నీ నచ్చుతాయి.
శ్రీరామకృష్ణులు: “సిద్ధుడయ్యాక ఆ స్థితిలో అన్ని భావాలూ నచ్చుతాయి. ఆ స్థితిలో కామం జాడమాత్రంగా కూడా ఉండదు. వైష్ణవ శాస్త్రాలలో చండీదాస్ – రజకస్త్రీ కథ ఉంది. వారి ప్రేమ అణుమాత్రం కూడా కామం లేనిది.
“ఆ స్థితిలో ప్రకృతి (స్త్రీ) భావం వస్తుంది, తానొక పురుషుడననే ఎరుక ఉండదు. మీరాబాయి ఒక స్త్రీ అనే కారణంగా ఆమెను చూడ రూపగోస్వామి నిరాకరించాడు. అందుకు మీరాబాయి, ‘బృందావనంలో శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు, తక్కిన వారందరూ ఆ పురుషుడికి దాసీలే. రూపగోస్వామి తనను పురుషునిగా భావించుకోవటం సబబా?’ అని చెప్పి పంపింది.
రాత్రి కాబోతోంది. ‘మ’ శ్రీరామకృష్ణుల పాదాల వద్ద కూర్చుని ఉన్నాడు. కేశవ్ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉంది అన్న సమాచారం తెలిసింది. కేశవ్ గురించీ, అతడి సమాజాన్ని గురించీ శ్రీరామకృష్ణులు ప్రస్తావించారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): అక్కడ ఉత్త లెక్చర్ మాత్రమేనా? లేక ధ్యానం కూడా ఉందా? వారు తమ పూజావిధానాన్ని బహుశా ఉపాసన అంటుంటారు. మునుపు కేశవ్ క్రైస్తవ మతాన్ని, దాని దృక్పథాలను గురించీ ఎక్కువగా చింతన చేసేవాడు. అప్పుడు, అంతకు మునుపు అతడు దేవేంద్రనాథ్ టాగూర్ సమాజంలో ఉండేవాడు.
‘మ’ : కేశవ్ బాబు మొదట్లోనే ఇక్కడకు వచ్చివుంటే ఈ రకమైన సామాజిక సంస్కరణలలో దిగి ఉండడు. కుల విచక్షతను రద్దుపరచటం, వితంతు పునర్వివాహం, కులాంతర వివాహం, స్త్రీ విద్య మొదలైన సామాజిక కార్యకలాపాలలో ఇంతగా పాల్గొని ఉండడు.
శ్రీరామకృష్ణులు: కేశవ్ ఇప్పుడు కాళీని అంగీకరిస్తున్నాడు; ఆమె చిన్మయమూర్తి, ఆద్యాశక్తి అని ఒప్పుకుంటున్నాడు. పైగా అమ్మా, అమ్మా అంటూ ఆమె నామ మహిమలను కీర్తిస్తూ ఉన్నాడు.
“అది సరే, బ్రహ్మసమాజం భవిష్యత్కాలంలో సంస్కరణోద్యమ సమాజంగా పురోగతి చెందుతుందని నువ్వు భావిస్తున్నావా?”
‘మ’ : ఈ దేశం మట్టి అలాంటిది కాదు. నిజమైనది ఏదో అదే స్థిరంగా నిలుస్తుంది.
శ్రీరామకృష్ణులు: అవును. ఋషులు నెలకొల్పిన సనాతన ధర్మమే స్థిరంగా నిలిచి ఉంటుంది. కాని బ్రహ్మసమాజం, అటువంటి తదితర సంప్రదాయాలు కూడా కాస్తోకూస్తో నిలచి ఉంటాయి. అంతా భగవంతుని సంకల్పం మేరకు జరుగుతోంది.
మధ్యాహ్నం పలువురు భక్తులు కలకత్తా నుంచి వచ్చారు. వారు శ్రీరామకృష్ణుల కోసం అనేక పాటలు పాడారు. వాటిలో ఒక పాట భావం ఇది: అమ్మా! నువ్వు ఎర్రటి ఆటబొమ్మలతో మమ్మల్ని మరపించావు. మేము ఆటబొమ్మలను విసిరికొట్టి నీ కొరకు ఆక్రందనలు చేస్తే, నువ్వు మా వద్దకు తప్పక పరుగెత్తుకుంటూ వస్తావు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): వారు ఎరుపు బొమ్మలను గురించి ఎలా పాడారో విన్నావా!
‘మ’ : అవునండీ. మీరు కేశవ్సేన్తో ఎరుపు బొమ్మల గురించిన ఈ విషయాన్ని చెప్పి ఉన్నారు.
శ్రీరామకృష్ణులు: అవును. ‘చిదాకాశం’ గురించీ, ఇంకా పలు విషయాల గురించీ మాట్లాడుకున్నాం; ఎంత ఆనందంగా ఉండేదో! ఎన్నో పాటలు పాడి నృత్యం చేశాం కూడా.
18.9 నవమ పరిచ్ఛేదం సాధనకాలంలో బిల్వవృక్షం క్రింద శ్రీరామకృష్ణుల ధ్యానం (1859 – 61) – కామినీకాంచన త్యాగం
శనివారం, జనవరి 5, 1884
అప్పుడు సమయం మధ్యాహ్నం దాదాపు ఒంటి గంట. శ్రీరామకృష్ణులు భోజనం చేశారు. నేటికి ఇరవై మూడు రోజులుగా ‘మ’ శ్రీరామకృష్ణుల వద్ద నివసిస్తూ ఉన్నాడు. భోజనానంతరం ‘మ’ నహబత్లో ఉన్నాడు. హఠాత్తుగా ఎవరో తన పేరు మూడు నాలుగుసార్లు పిలవటం విని బయటకు వచ్చి చూసినప్పుడు శ్రీరామకృష్ణులు తమ గది ఉత్తర వసారాలో నిలబడి పిలుస్తూ ఉండటం చూశాడు. వెంటనే వేగంగా వచ్చి ఆయనకు ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు దక్షిణ వసారాలోకి వెళ్లారు. నేల మీద కూర్చుని ‘మ’ తో మాట్లాడ నారంభించారు.
శ్రీరామకృష్ణులు: నువ్వు ధ్యానం ఎలా చేస్తున్నావు? బిల్వవృక్షం క్రింద నేను స్పష్టంగా వివిధరూపాలను దర్శించేవాడిని. ఒక రోజు నా ఎదుట ధనం, శాలువ, మిఠాయి, ఇద్దరు స్త్రీలను చూశాను. వెంటనే నేను మనస్సును, ‘మనసా! నీకు వీటిలో ఏదన్నా కావాలా?’ అని అడిగాను. అంతే; మిఠాయి అమేథ్యంగా కానవచ్చింది, స్త్రీలలో ఒకామె పెద్ద ముక్కు నత్తు ధరించి ఉంది. వారి లోపల బయటా అంతా కనిపించింది – ప్రేగులు, మలమూత్రాలు, ఎముకలు, మాంసం, రక్తం. నా మనస్సు వాటిలో దేన్నీ కోరలేదు. భగవంతుని పాదపద్మాలలోనే అది స్థిరంగా ఉండిపోయింది.
“త్రాసులో పైనా క్రిందా రెండు ముళ్లు ఉంటాయి, మనస్సు క్రింది ముల్లు. పై ముల్లు అయిన భగవంతుని నుండి మనస్సు వైదొలగకూడదని భయపడుతూ ఉంటాను. చేత శూలంతో ఒక వ్యక్తి సదా నా ప్రక్కన కూర్చుని ఉండటమూ చూస్తూ ఉంటాను. క్రింది ముల్లు, పై ముల్లు నుంచి వైదొలగితే శూలంతో పొడిచి వేస్తానని ఆ వ్యక్తి బెదిరిస్తాడు.
18.9.1 రఘువీరుని స్థలం రిజిస్ట్రేషన్ సంఘటన
“కాని కామినీకాంచనాలను త్యజించకుండా ఆధ్యాత్మిక పురోగతి సాధ్యపడదు. నేను మూడింటిని త్యజించాను – భూమిని, స్త్రీని, ధనాన్నీ. మా కులదైవం అయిన రఘువీరుని పేరిట ఉన్న భూమిని గ్రామంలో రిజిస్టరు చేయ వెళ్ళాను. నన్ను సంతకం చేయమన్నారు. నేను చేయలేదు. ‘నా భూమి’ అన్న ఎరుకే నాలో లేదు. కేశవ్ గురువునని నా పట్ల వారు ఎంతో గౌరవం చూపించారు. మామిడిపళ్లు తెప్పించి ఇచ్చారు. కాని వాటిని తీసుకువెళ్ళలేకపోయాను. సన్న్యాసి సంచయం చేయరాదు.
“త్యాగం లేకుండా భగవంతుని ఎలా పొందగలం? ఒక వస్తువుపై మరో వస్తువు ఉన్నప్పుడు పై వస్తువును తీయకుండా క్రింద ఉన్న వస్తువును ఎలా తీయటం?
“నిష్కామ చిత్తంతో భగవంతుణ్ణి ప్రార్థించాలి. కాని సకామ ప్రార్థన చేయగా చేయగా, క్రమేణా అది నిష్కామంగా మారిపోతుంది. ధ్రువుడు రాజ్యం పొందగోరే తపస్సు చేశాడు. కాని దాని కారణంగా భగవంతుణ్ణే పొందగలిగాడు; ‘గాజు పూసలను వెదకుతూ ఉంటే బంగారం దొరికితే దాన్ని ఎందుకు వదలి పెట్టాలి?’ అన్నాడతడు.
18.9.2 దయ, దానం – శ్రీరామకృష్ణులు – చైతన్యుల దానం
“సత్త్వగుణం కలిగినప్పుడే భగవంతుని పొందవచ్చు. గృహస్థులు చేసే దానధర్మాలన్నీ సాధారణంగా సకామమై ఉంటాయి. కాని అది మంచిది కాదు. నిష్కామంగా చేస్తే అది మంచిది. కాని నిష్కామకర్మ చేయటం ఎంతో కష్టం.
“నీకు భగవద్దర్శనం కలిగినప్పుడు ఆయనతో, ‘నేను ఇన్ని చెరువులు, స్నాన ఘట్టాలు, బాటలు, డిస్పెన్సరీలు (ఔషధ శాలలు), ఆసుపత్రులు నెలకొల్పాలి. ఓ ప్రభూ! అందు నిమిత్తంగా వరం అనుగ్రహించు’ అనా ప్రార్థిస్తావు? ఆయన దర్శనం కలిగితే అటువంటి వాసనలన్నీ ఒక మూలకు పోతాయి.
“అలా అయితే దయాదాక్షిణ్యాలు చూపరాదని, దానధర్మాలేవీ చేయకూడదని అర్థమా? అలా కాదు. నీ కళ్ల ముందు ఎవరైనా కష్టపడటం చూసినప్పుడు, నీ వద్ద ధనం ఉండే పక్షంలో అతడికి సహాయం చేయటం మంచిది. ‘ఇవ్వు, ఇవ్వు వీరికి ఏదైనా ఇవ్వు’ అంటాడు జ్ఞాని; అయితే అంతరంగాన ‘నేను ఏం చేయగలను? భగవంతుడే కర్త. తక్కినవారు అందరు అకర్తలే’ అనే బోధ ఉంటుంది ఆతడికి.
“మహాత్ములు జీవుల దుఃఖాలతో చలించిపోయి భగవన్మార్గం చూపుతారు. శంకరాచార్యులు జీవులకు ఉపదేశార్థం ‘విద్యా – నేను’ ను ఉంచుకున్నారు. అన్నదానం కంటే జ్ఞానదానం మంచిది, భక్తిదానం ఇంకా శ్రేష్ఠమైనది. కనుకనే చైతన్యుడు చండాలురకు సైతం భక్తిని పంచిపెట్టాడు. దేహం ఉంటే సుఖ దుఃఖాలు అనివార్యం. మామిడి పండు తినవచ్చావు, మామిడి పండు తిని వెళ్లిపో. కావలసినవి భక్తి జ్ఞానాలు మాత్రమే. భగవంతుడొక్కడే సత్యం, తక్కినదంతా అసత్యం.
18.9.3 స్వతంత్రేచ్ఛ గురించి శ్రీరామకృష్ణులు
“సర్వం భగవంతుడే చేస్తున్నాడు అన్నట్లయితే మానవులు నిరభ్యంతరంగా పాపాలు చేయవచ్చుగా అని నువ్వు అనవచ్చు. కాని అది సరికాదు. ‘భగవంతుడే కర్త, నేను అకర్తను’ అని స్పష్టంగా ఎరిగిన వ్యక్తి ఎన్నటికీ తప్పటడుగు వెయ్యడు.
“ఇంగ్లీషు మేన్లు* స్వతంత్రేచ్ఛ అని దేనినంటున్నారో ఆ స్వతంత్రేచ్ఛ అనే బోధను భగవంతుడే ప్రసాదిస్తాడు. భగవద్దర్శనం కానివారికి ఈ స్వతంత్రేచ్ఛ భావం ఆయన ప్రసాదించకుంటే పాపకార్యాలు అధికరిస్తాయి. స్వయంకృతాపరాధాలన్న భావనను భగవంతుడు కలిగించకుంటే పాపకార్యాలు మితిమీరిపోతాయి. కాని భగవంతుని ప్రాప్తించుకున్న వారికి ఈ స్వతంత్రేచ్ఛ అనేది కేవలం చూపు మేరకే; నిజానికి భగవంతుడే యాంత్రికుడు, నేను యంత్రాన్ని; ఆయన చోదకుడు, నేను వాహనం అన్న విషయం వారికి తెలుసు.”
18.10 దశమ పరిచ్ఛేదం భక్తుల నిమిత్తం శ్రీరామకృష్ణులు విలపిస్తూ జగజ్జననికి ప్రార్థన
సాయంకాలం నాలుగు గంటలు. రాఖాల్ ఒకరిద్దరు భక్తులు పంచవటి కుటీరంలో ‘మ’ పాడుతూ ఉండగా వింటున్నారు. పాటను విని రాఖాల్ పారవశ్యం చెందాడు. కాసేపట్లో శ్రీరామకృష్ణులు పంచవటికి వచ్చారు. ఆయనతో బాబూరామ్, హరీశ్ మొదలైనవారూ వచ్చారు.
రాఖాల్: ఈ రోజు ‘మ’ చక్కగా పాడి మమ్మల్నందరినీ ఆనందంలో ఓలలాడించారు.
శ్రీరామకృష్ణులు భావపారవశ్యంలో పాడ నారంభించారు:
కృష్ణనామము నా చెవిని సోకగనే
పరవశమొందితి ఆ పావన క్షణమున…..
(‘మ’ తో) “ఇటువంటి పాటలను పాడు. భక్తి, భక్తుల సహవాసాలకు మించి మరేం కావాలి?
18.10.1 రాధా యశోదల సంవాదం – శ్రీరామకృష్ణుల “ఆత్మీయులు”
“శ్రీకృష్ణుడు మథురకు వెళ్లినప్పుడు యశోద రాధ వద్దకు వచ్చింది. రాధ అప్పుడు ధ్యానంలో ఉంది. తరువాత రాధ ఇలా అంది: ‘నేను ఆద్యాశక్తిని. ఏదైనా వరం కోరుకో.’ అందుకు యశోద, ‘నేను ఏ వరం కోరుకుంటాను? మనోవాక్కాయ కర్మలచే నేను భగవంతుని సేవించాలి. ఈ కళ్లతో భక్తులను దర్శించాలి; మనస్సుతో ఆయన గురించి ధ్యానచింతనలు చేయాలి; నాలుకతో ఆయన నామగుణకీర్తన చేయాలి. అలా అనుగ్రహించు!’ అన్నది.
“కాని పరిపక్వం చెందిన వారికి భక్తుల సహచర్యం లేకున్నా ఫరవాలేదు. కొన్ని సందర్భాలలో వారు భక్తుల సహచర్యం అంతగా ఇష్టపడరు. ఆలుచిప్పలు పొదుగబడిన గోడకు సున్నం వేస్తే అది నిలవదు. అంటే అంతరంలోనూ బాహ్యంలోనూ భగవంతుణ్ణి గాంచే వ్యక్తి స్థితి ఇట్టిది.”
సరుగుడు తోపు నుంచి తిరిగి వచ్చిన శ్రీరామకృష్ణులు పంచవటి ప్రక్కకు వచ్చినప్పుడు ‘మ’ తో ఇలా అన్నారు: “నీ కంఠస్వరం స్త్రీ కంఠస్వరంలా ఉంది. ఇటువంటి పాటలను నువ్వు పాడగలవా? –
సఖీ నాకు చెప్పవే ఇక ఎంత దూరమే
నా వంశీమోహనుడు నర్తించు ఆ వనము………..
(బాబురామ్ను చూపుతూ ‘మ’ తో) “చూశావా! రామ్‌లాల్, తదితర నా బంధువులు పరాయివారుగా తోస్తూన్నారు; పరాయివారు నా సొంతవాళ్లు అయిపోయారు. చూడు, బాబూరామ్‌తో, ‘బయటకు వెళ్లిరా. ముఖం కడుక్కో’ అని చెబుతూ ఉంటాను. ఇప్పుడు భక్తులే ఆత్మీయులు.”
‘మ’ : అవునండీ.
18.10.2 పంచవటిలో ఉన్మాద స్థితిలో సాధన (1857-58) – చిత్‌శక్తి, చిదాత్మ
శ్రీరామకృష్ణులు (పంచవటిని చూస్తూ): ఈ పంచవటిలోనే కూర్చుని ఉండేవాణ్ణి. కాలక్రమాన ఉన్మాదుణ్ణి అయ్యాను. ఆ స్థితీ తొలగిపోయింది.
“కాళుడే బ్రహ్మం. కాళునితో క్రీడించేది ఎవరో ఆమె కాళి, ఆద్యాశక్తి; అచరాలను చరాలుగా చేసేది.”
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పాడసాగారు:
గతియే కాదా కాళీమాయీ
మదిలో కాళీమాయి మర్మము
తలచిన మదియే నిలిచిపోవగా….
(‘మ’ తో): “నేడు శనివారం. కాళికాలయానికి పోయిరా.”
పొగడచెట్టు వద్దకు వచ్చినప్పుడు శ్రీరామకృష్ణులు ‘మ’ తో ఇలా అన్నారు: “చిదాత్మ, చిత్‌శక్తి – చిదాత్మ పురుషుడు, చిత్‌శక్తి ప్రకృతి. చిదాత్మ శ్రీకృష్ణుడు, చిత్‌శక్తి శ్రీరాధ. భక్తులు ఈ చిత్‌శక్తి యొక్క విశేష రూపాలు. భక్తులు సఖీ భావమో, దాస్యభావమో అవలంబించాలి. ఇదే సారం.”
సాయంకాలం అయ్యాక శ్రీరామకృష్ణులు కాళికాలయానికి వెళ్లారు. ‘మ’ అక్కడ కూర్చుని ధ్యానం చేస్తూ ఉండటం చూసి ఆయన ఆనందించారు.
18.10.3 భక్తుల నిమిత్తం జగజ్జనని వద్ద విలపించడం – భక్తులకు ఆశీర్వాదం
దేవాలయాలలో సంధ్యాహారతులు ముగిశాయి. శ్రీరామకృష్ణులు మంచం మీద కూర్చుని జగజ్జననిని స్మరిస్తూ ఉన్నారు. ‘మ’ మాత్రం నేల మీద కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనారు. కాసేపటికి సమాధిస్థితి నుండి ఒకింత బాహ్యస్మృతిలోకి వచ్చారు. కాని భావపారవశ్యంలోనే ఉన్నారు; బిడ్డ, తల్లితో మంకుపట్టు పట్టేట్లు, హృదయం ద్రవించేలా జగజ్జననితో మాట్లాడారు: “అమ్మా! నీ భువనమోహన రూపాన్ని ఎందుకు చూపించలేదు? నేను ఎన్నోసార్లు బ్రతిమాలుకున్నాను. నేను ఎంత బ్రతిమాలినా నువ్వు వినలేదే! నువ్వు ఇచ్ఛామయివి.”
ఆర్ద్రహృదయంతో శ్రీరామకృష్ణులు జగజ్జననితో మాట్లాడుతున్న తీరు రాళ్లను సైతం కరిగించేట్లు ఉంది. శ్రీరామకృష్ణులు కొనసాగించారు: “అమ్మా! నేను విశ్వాసం కోరుకుంటాను. ఈ విచారణభూతం పారిపోనివ్వు. విశ్వాసం కావాలి. గురువు ఉపదేశంలో విశ్వాసం! పిల్లవాడికి ఉన్న విశ్వాసం లాంటిది కావాలి, ‘అక్కడ భూతం ఉంది’ అని తల్లి చెబుతుంది. అవును, ఉన్నది అని వాడు అట్లే విశ్వసిస్తాడు. ‘ఈతడు నీ అన్న’ అంటుంది తల్లి. వాడు నూటికి నూటయిరవై ఐదు పాళ్ళు అట్లే విశ్వసిస్తాడు. విశ్వాసం కావాలి.
“కాని అమ్మా, వీరి దోషం ఏమిటి? వీరు ఏం చేస్తారు, పాపం? ఒకసారి విచారణ చేయవలసిందే కదా! చూడు, నాడు అతడితో ఎంతో చెప్పాను! కాని ఏ ప్రయోజనమూ లేదు. నేడు ఒక్కసారిగా అన్నీ…………!”
శ్రీరామకృష్ణులు విలపిస్తూ జగజ్జననిని ప్రార్థించారు. ఏం ఆశ్చర్యం! భక్తుల కోసం విలపిస్తున్నారు. “అమ్మా! నీ వద్దకు వచ్చేవారి మనోవాంఛితాలను ఈడేర్చు. సర్వమూ త్యజించేలా చేయవద్దు, తల్లీ; చివరకు నీ అభీష్టం మేరకే చేయి.
“అమ్మా! వీరిని సంసారంలో ఉంచితే, అప్పుడప్పుడు వీరికి దర్శనం ఇస్తూవుండు. లేకుంటే వారెలా జీవిస్తారు? అప్పుడప్పుడైనా నిన్ను చూడకుంటే వారికి ఎలా ఉత్సాహం కలుగుతుంది? తరువాత చివరకు నీ ఇచ్ఛమేరకు చేయి.”
శ్రీరామకృష్ణులు ఇంకా భావపారవశ్యంలోనే ఉన్నారు. ఆ స్థితిలో హఠాత్తుగా ‘మ’ తో ఇలా అన్నారు: “చూడు! నువ్వు ఎక్కువగా విచారణ చేసేశావు. ఇక అక్కర్లేదు! ఇక చెయ్యబోను అని చెప్పు.”
‘మ’ (చేతులు జోడించుకొని): చేయనండీ.
శ్రీరామకృష్ణులు: ఎక్కువయిపోయింది! ‘నీ చోటు ఏది’ అన్నది నువ్వు మొదటిసారి వచ్చినప్పుడు చెప్పావే! నాకు అంతా తెలుసు.
‘మ’ (చేతులు జోడించుకొని): అవునండీ.
శ్రీరామకృష్ణులు: నీ చోటు, నువ్వెవరు? నీ అంతరం, బాహ్యం, గడచిపోయిన నీ విషయాలు, భవిష్యత్తు – ఇవన్నీ నాకు తెలిసినవే.
‘మ’ (చేతులు జోడించుకుని): అవునండీ.
శ్రీరామకృష్ణులు: నీకు కుమారుడు ఉన్నాడని విని చీవాట్లు పెట్టాను. ఇప్పుడు వెళ్లి ఇంట్లో జీవించు. వారు నిన్ను తమ సొంతమనిషిగా తలచేట్లు నడుచుకో. కాని అంతరంగంలో, ‘వారు నా సొంతమనుష్యులు కారు, నేను వారి మనిషిని గాను’ అని తెలుసుకో.
‘మ’ మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామకృష్ణులు కొనసాగించారు: “ఇప్పుడు ఎగరటం నేర్చుకున్నావు. నీ తండ్రితో ప్రేమగా ఉండు. ఆయనకు సాష్టాంగదండప్రణామం చేయరాదా!”
‘మ’ (చేతులు జోడించుకుని): ప్రణామం చేస్తానండీ.
శ్రీరామకృష్ణులు: నీకు చెప్పటానికి ఇంకా ఏముంది? నీకే అన్నీ తెలుసు. అంతా బోధపడింది కదా?
‘మ’ మౌనంగా ఉండిపోయాడు.
శ్రీరామకృష్ణులు: అంతా అర్థం అయిందా?
‘మ’ : ఒకింత బోధపడుతోంది స్వామి.
శ్రీరామకృష్ణులు: ఎక్కువే అర్థం చేసుకున్నావు. రాఖాల్ ఇక్కడ ఉండటం ఆతడి తండ్రికి సంతోషమే.
‘మ’ చేతులు జోడించుకునే మౌనంగా ఉండిపోయాడు.
శ్రీరామకృష్ణులు మళ్లీ, “నువ్వు ఏమనుకుంటున్నావో అదీ జరుగుతుంది” అన్నారు.
18.10.4 భక్తులతో భజనానందంలో – జగజ్జనని, జనని
కాసేపయ్యాక మామూలు స్థితికి వచ్చేశారు. గదిలో రాఖాల్, రామ్‌లాల్ ఉన్నారు. రామ్‌లాల్‌ను పాడమన్నారు. రామ్‌లాల్ పాడనారంభించాడు:
వినరా సోదర దేవి చరితము ।
వీనుల విందుగ తందానతాన…
యుద్ధభూమిలో చిచ్చుపెట్టెడు
యువతి ఎవ్వరచట? తందానతాన………..
ఎవరూ! ఆ భీకర మానిని ఎవరూ?
అర్ధనిశీథపు ఆకాశమువలె
గభీరవర్ణపు కాళరూపిణి……
శ్రీరామకృష్ణులు: జగజ్జనని – జనని (కన్నతల్లి). జగత్తు రూపంలో సర్వవ్యాపియై వర్ధిల్లుచున్నదే జగజ్జనని. జనని మనకు జన్మనిస్తూంది. నేను అమ్మా, అమ్మా అంటూనే సమాధిస్థితి నొందేవాణ్ణి. బెస్తవాడు వల విసిరి, కాసేపయ్యాక వలను లాగినట్లు నేను అమ్మా, అమ్మా అని పిలుస్తూ జగజ్జననిని పట్టుకొని లాక్కొని వస్తాను. వలను లాగుతున్నప్పుడు పెద్ద చేపలు వలలో చిక్కువడి ఉంటాయి.
18.10.5 గౌరీ పండితుడు – కాళీ, చైతన్యులు అభిన్నం
“గౌరీ పండితుడు ‘కాళీ, చైతన్యులు ఒక్కరే అని తెలుసుకుంటే యథార్థ జ్ఞానం వచ్చిందనే అర్థం’* అని అనేవాడు. ఏదైతే బ్రహ్మమో అదే శక్తి (కాళీ). ఆమే మానవరూపంలో చైతన్యునిగా అవతరించింది.”
ఆద్యాశక్తియైన కాళియే మానవదేహం ధరించి శ్రీరామకృష్ణులుగా అవతరించినది అని ఆయన సూచిస్తున్నారా?
రామ్‌లాల్ శ్రీరామకృష్ణుల కోర్కె మేరకు మళ్లీ పాడసాగాడు. ఇప్పుడు చైతన్యుల గురించిన పాట:
ఏమా దర్శనం ఏమి దర్శనం
కేశవ భారతి కుటీరంబున….
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నిత్యం ఎవరికి చెందినదో, ఆతనిదే లీల కూడా. భక్తుల కోసమే లీల. మానవరూపంలో గాంచితేనే కదా భక్తులు ఆయనను ప్రేమించగలరు! అప్పుడే కదా సోదరి, సోదరుడు, తల్లి, తండ్రి, సంతానం లాటి బంధుత్వంతో ఆయనను ప్రేమించగలం!
“భక్తులను ప్రేమించడానికే భగవంతుడు తనను చిన్నవాణ్ణి చేసుకొని లీలలు ప్రదర్శింప వస్తున్నాడు!”